ఓ జాబిలి…ఓ వెన్నెలా…

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

ఒంటరి ఆకాశంలో
నువ్వున్నప్పుడు
జంటగా నిన్ను చూస్తూ
చలించిపోతుంటా!

 

మౌనంగా కళ్ళు
నీ వెన్నెల నింపుకుని
మాటలకందని భావాలు
ఊయలలూపుతుంటే
మనసును తడుముతూ
నన్ను చూస్తూ

 

తెలియనట్టుగా
మబ్బులచాటుకు వెళ్ళిపోతావు చూడూ!
అక్కడే తపన!!

 

నిన్ను వెదికేందుకు
మల్లె తీగలను బ్రతిమాలుకుంటా
పువ్వుల వాన కురిపించమని!

విరజాజులతో జాతర నవుతా
నీ ఆనవాళ్ళను రప్పించడానికి!

 

పచ్చని చెట్ల కొమ్మల చాటున
దిగులుగా ఒదిగిపోయి
నీకై యెదురుచూసే విపంచినవుతుంటా!

 

లోపలి వినీలాకాశంలో
విశాల కాంక్షలలో
ఎప్పుడో
నన్నెప్పుడో నీవెన్నెల కౌగిట్లో
బంధించిన జ్ఞాపకాలను నెమరువేస్తూ
వలపుల తలపులలో ప్రేమగీతికనవుతుంటా!

 

మబ్బు తెరలను తుంచుకొని
నువు మనో విహంగమై చేరినప్పుడు
కాసింత కన్నెర్రజేసినా
లోలోపల నవ్వుకుంటా!

 

నీప్రేమపూర్వక ఆహ్వానంలో
తన్మయత్వంలో కరిగిపోయి
మరోమారు దూరమవకుండా
మనసుతోనే నిను కట్టేస్తా!

 

పిల్లగాలిలా చల్లగా వచ్చి చేరుతావు!
చిరునవ్వులు కురిపిస్తావు
మబ్బులను తరిమే
మహోన్నత వ్యక్తిత్వానివవుతావు

 

నీమాటలతోటలో
పదాల పల్లవినై
పెదవులపై వాలే
నవ్వులను …నిన్నూ వదిలి నడిచినా
నువ్వు నాలో తోడై నడిచే సుగంధానివి
వెన్నెల కౌగిళ్ళ వాకిళ్ళు తెరచే
నా ఉఛ్చ్వాసానివి!
కరచాలనానికి అందనంత చీకటిని
వెలుగుగా మార్చే నా ప్రియతమ హృదయానివి!
నాలోని కవితాంతరంగానివి!

*

కృత్రిమ నక్షత్రం

mandira1

Art: Mandira Bhaduri

 

-అరుణ నారదభట్ల

~

మనసు ఓ అంతరిక్షకేంద్రం
స్పందనలన్నీ బంధనాలు
సృష్టితత్వం బోధపడ్డట్టు జీవనసరళి
అంతటా జ్ఞానోదయపు రావిచెట్లు
అవసరాల ప్రేమ భాషణాలు

కంప్యూటర్ చిప్ లా
ఎన్ని జ్ఞాపకాలనో పోగేస్తూ వస్తున్నాం
నచ్చనివి డిలిట్ చేయడానికి
తేలికపాటి కీబోర్డ్ కాదు నడక
ఎన్నిసార్లు రీఫ్రెష్ నొక్కినా
రీసైకిల్ బిన్ ఒకటుంటుంది
వైరస్ ని సృస్టించడానికి

ఆక్సీజన్ సరిపోదక్కడ
శూన్యం ఆవహిస్తుంది
ప్రాణాయామం చేయాలనుకుంటాం
కార్బన్ మొనాక్సైడ్ నరనరాల్లోని
రక్తంలో జీర్ణించుకుపోయి
ఊపిరాడదు

నైట్రస్ ఆక్సైడ్ విడుదల్లయ్యే సన్నివేశాలు
కేంద్రానికి అందనంత దూరంలో
కనిపెట్టలేని ఉల్కాపాతాలు
అదే సూర్యుడు అవే నక్షత్రాలు
అవే గ్రహాలు
మార్పులన్నీ దూరభారాలు

గ్రహశకలల్లాంటి కొన్ని
అనుకోని సంఘటనలు
కృత్రిమంగా మెరిసే
అంతరిక్ష నక్షత్రం
నిరంతరం స్కానింగ్

ఆకాశంలోకి విసిరేసిన బంతి మనసు
మళ్ళీ భూమినే చేరుతుంది
గురుత్వాకర్షణ సిద్ధాంతం నమ్ముకున్నాం గనక
భూమికీ మనకూ తేడా ఏం లేదు
అదే మట్టి దేహం
అవే నీళ్ళు
అదే అగ్ని
అదే మనసు గాలి

మొక్కలను నరికేస్తే పడే బాధే మనసుది
నచ్చదు కదా
ఊష్ణం…లోనంతా ఊష్ణం పైనంతా ఊష్ణం
పచ్చదనం కరువయ్యాక
భూమి అక్కడక్కడా బద్దలవుతూ
లావాను సునామీలనూ సృష్టిస్తునే ఉంటుంది
ఇలా ఎంతదాకా అంటావా
గురుత్వాకర్షణ ఉన్నంతవరకు

*

డే

అరుణ నారదభట్ల

 

మనది కాదు నిజమే

మరి మనకే సంస్కృతి  శాశ్వతం

మనమే పాలనలకు దాసోహం?!

ఇప్పుడు వ్యాపారానికే కదా అమ్ముడుపోయింది

ఈ దేశపు ద్వారాన్ని తెరిచింది

భూగోళమంతా వెదికి తలగడలో కుదించాము

ప్రపంచ దేశాలను గుండెలకూ పొదువుకున్నాము

విశాల ఆకాశానికి మేధస్సునమ్ముకున్నాం

గట్టిదనుకున్న భవనం పేకముక్కల్లా రాలిపోయింది

ఇప్పుడు మిగలని శూన్యంలో ఏం నిలబెడుతున్నావ్

ఓ కొవ్వొత్తో గ్రీటింగ్ కార్డో

ఓ కేకుముక్కో ఓ పిజ్జాహాటో నీదికాదు నిజమే

మరి దివారాత్రాలు అనుభవిస్తున్న జీవితం నీదేనా.

పాటించే పాలన మొత్తంగా మనదేనా

పద్ధతి మనదేనా.

ధరించే వస్త్రం..కొత్త రుచులు

ఏది నిక్కచ్చిగా నీది

కేవలం పుట్టిన చోటు మాత్రమే నీదైతే

అరగజం జరిగినా అది నీ సంసృతి కాదు.

చరిత్ర తెలియనిదెవరికీ…

నాటి శకుంతలా దుశ్శంతులదే ప్రేమ…సహజీవనం

భార్యనమ్మిన హరిశ్చంద్రుడే సత్యానికి పునాది

సీతను అనుమానించిన రాముడే ఆదర్శ పురుషుడు

అమ్మమాట అన్న పేరుతో

మనసెరుగక మగువను పంచుకున్న

పాండవులే ఘనచరితులు.

ఇప్పుడు ద్వారం తెరిచే ఉన్నది

అంతా నీదే…అంతా మనదే

మూడుకోతుల ముసుగోటి ఉండనే ఉందికదా

వింటే ఓకే…వినకున్నా ఓకే!

వసుదైక కుటుంబం మరి.

కేవలం నీకేనా చోటులేనిది

ఔను! ఇప్పుడు   నీ ఆధీనంలో

అణచివేతనుంచే  ప్రేమకు కొత్తపాఠాలు నేర్చుకోవాలి.

ahaa