‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

egire-pavuramaa-19

(గూడు చేరిన పావురం..)

 

శ్రావణ శుక్రవారం తొమ్మిదికి ముందే నేను, ఉమమ్మ ఒకేసారి కోవెలకి వచ్చాము. అల్లంత దూరాన్నుంచే, నన్ను చూసి చేయి ఊపి గుడిలోకి వెళ్ళిందామె.

పుస్తకాలయంలో గల్లాపెట్టె సర్డుతున్న నేను, “గాయత్రీ,” అన్న ఉమమ్మ పిలుపుకి తలెత్తి చూశాను. “సోమవారం ఇక్కడ శెలవు చెప్పు. నీకు జరగవలసిన వైద్య పరీక్షలకి మల్లిక్ గారు వాళ్ళ ఆసుపత్రిలో సమయం కేటాయించారు,” అంది ఉమమ్మ.

 

అలాగేనని తలాడించాను. ‘ఇప్పటికీ నామీద అదే శ్రద్ధ, అదే ఆపేక్ష ఆమెకి. కాలం గడిచినా, చెక్కు చెదరని ఆమె అంకితభావం నమ్మలేకపోయాను. ఆమె నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది’ అనుకున్నాను.

 

‘ఎప్పుడు వచ్చినా ఓ మంచి వార్తో, మంచి తలంపో వెంట తెస్తుంది ఉమమ్మ. ఆమె కలిసిన ప్రతిసారి నా మెరుగు కోసమే తాపత్రయ పడుతుంది. ఆమె ఋణం తీర్చుకోలేనిదే’ అనుకుంటూ పని మొదలెట్టాను.

**

గుంటూరులోని మల్లిక్ గారి కొత్త హాస్పిటల్లోనే నా వైద్య పరీక్షలు జరిగాయి. నాలుగేళ్ళ క్రితం వంశీ సంస్థ వారు జరిపిన పరీక్షల ఆధారంగా – మరిన్ని పరిశోధాత్మక విధానాలు జరిపించారు అక్కడి నిపుణులు.

 

కాళ్ళల్లో కదలిక విషయంగా – మరింత వైజ్ఞానిక పరిశీలన జరిపించారు.

మాట విషయంగా – నాదతంత్రులుండే స్వరపేటిక పరీక్ష’ నిర్వహించారు.

‘ఇంద్రియ సమన్వయ పరిశీలనా పరీక్షలు’ కూడా జరిపారు.

**

మళ్ళీ వారం, నాకు జరిపిన ఆ సూక్ష్మమైన పరీక్షల వివరణ పత్రం ఇచ్చారు…

 

పసితనంలో కలిగిన తీవ్ర అఘాతము వల్లనే నాకీ అంగవైకల్యం ఏర్పడి ఉండవచ్చని భావించారు.

నడక, మాట కూడా చికిత్సతో తిరిగి వచ్చే అవకాశముందని చెప్పారు ఆ నిపుణులు.

కదలిక విషయంగా – కాళ్ళకి కనీసం నాలుగు ఆపరేషన్లు తప్పవన్నారు. ఆ తరువాత వ్యాయామం, కాయకల్ప చికిత్స కూడా కొంతకాలం జరిపిస్తే క్రమేపీ నడక వస్తుందన్నారు. కమలమ్మ పెట్టించిన కుత్రిమ కుడి కాలు మాత్రం అలాగే ఉంటుందన్నారు.

వాక్చిత్సలో భాగంగా వాక్‌ శిక్షణ, వాక్ పునరుద్ధరణతో పాటు ఆధార-సలహా సమావేశాలు నిర్వహిస్తే మాట సమర్థత ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా తప్పక నా అవిటితనాన్ని అధిగమించగల అవకాశం మెండుగా ఉందని అభిప్రాయ పడ్డారు.

 

ఆ వివరణ విని, తాత అనుకున్నట్టుగానే నేను అందరిలా నడిచి మాట్లాడగలిగే అవకాశం ఉందన్నారు అందరూ.

నాకు వైద్యం త్వరలో మొదలవ్వాలని పట్టుదలగా ఉంది ఉమమ్మ.

**

శ్రీ గాయత్రి పుస్తకాలయం’ జమాఖర్చులుతో పాటు కోవెల జమా-ఖర్చులు కూడా నా బాధ్యతగా చూసుకొమ్మన్నారు పూజారయ్య. పుస్తకాలయంలో, అప్పుడే ఆరునెల్లగా నా విధులని సవ్యంగా, శ్రద్దగా నిర్వహిస్తున్నాను.

అప్పుడప్పుడు ఓ క్షణం కమలమ్మ గుర్తొచ్చి వెన్నులోంచి దడ పుడుతుంది.   ఎప్పుడూ తటస్థంగా ఉండే గోవిందు, ఊహించని విధంగా, సమయానికి   నాకు సాయం చేయబట్టే, నా జీవనం నేనాశించిన గమ్యం చేరింది.

మా జీవితాలని మూడేళ్ళ పాటు తన గుప్పిట్లో పెట్టుకున్న జేమ్స్ కూడా గుర్తొస్తాడు.

తండ్రి వయస్సున్న జేమ్స్, నా సంగతంతా తెలుసుకున్నాకయినా, నా పట్ల ఒకింత సానుభూతితో, మానవతతో, నేను తాత వద్దకు చేరడానికి   సహాయ పడుంటే, మరోలా ఉండేది కదా అనిపిస్తది.

**

మరో వారం రోజుల్లో, ఆదివారం నాడు ఉమ్మమ్మ వాళ్ళ ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ వారి కార్యక్రమం జరగబోతుందని ఊళ్ళో సందడి మొదలయ్యింది. ఉచిత వైద్యశిబిరం గురించి అందరికీ తెలియజేసి, ఊరంతా నమోదు పత్రాలు పంచారు.

**

“నీతో ఓ ముఖ్యమైన పనే ఉంది,” అంటూ ఉమమ్మ పుస్తకాలయంకి   వచ్చి, నా ఎదురుగా చెక్క కుర్చీ మీద కూచుంది. వెంట రాములు కూడా ఉంది.

జరగబోయే సమావేశం గురించి మాకు అర్ధమయ్యేలా చెప్పింది ఉమమ్మ.

“స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించి ఈ సమావేశం జరుగుతుంది.

భ్రూణ హత్యలు, శిశు హత్యలు, ఆడపిల్లల్ని నిర్దాక్షణ్యంగా త్యజించడాలు – మానవజాతికి ముప్పుగా మారుతున్నాయన్న విషయం ప్రస్తావిస్తారు. ప్రసంగించేవారిలో రాజకీయ నాయకుడు, టివి నటి, సంఘకర్తలు ఉండవచ్చు,” అంటూ నా వంక చూసింది ఉమమ్మ.

 

“గాయత్రీ, ఈ సందర్భంగా – నీ సంగతి – అంటే – పసిగుడ్డువైన నిన్ను నీ కన్నతల్లి త్యజించిన వైనం, దాని పర్యవసానం, తాత నిన్నాదుకున్నప్పటి నీ పరిస్థితి గురించి మీటింగులో నేను మాట్లాడవచ్చా?” అని అడిగింది.

 

తదేకంగా ఆమెనే చూస్తూ ఆమె చెప్పేది వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. నన్నే గమనిస్తున్న ఉమమ్మ వైపు తలెత్తి చూశాను.

కూర్చున్న స్థానం నుంచి లేచి ఆమె చేయందుకున్నాను.   నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టు తల ఊపి హామీ ఇచ్చాను. పక్కనే ఉన్న నోటుపుస్తకం అందుకొని,

‘నేను మీ మనిషిని ఉమమ్మా, మీరు నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. మీకు ఈ కార్యంలో నేను ఏ విధంగా పనికి రాగలిగినా నాకు సంతోషమే’.

అని రాసి అమెకందించాను.

 

“అంతేకాదు గాయత్రీ. నీకు చెప్పాల్సింది మరో విషయం ఉంది,” అంటూ లేచి దగ్గరగా వచ్చి, నన్ను నా స్టూలు మీద కూచోబెట్టింది. నా చేయి తన చేతిలోకి తీసుకుంది.

 

“మన సంక్షేమ సంస్థ సహకారంతో, నీ గతం గురించిన కొని వివరాలు కూడా సేకరించగలిగాము,” అన్న ఉమమ్మ మాటకి మళ్ళీ ఉలిక్కిపడి ఆమె వంక చూసాను.

 

“పందొమ్మిదేళ్ళ క్రితం, జూన్ లో ఓ మూడురోజుల పాటు ఇక్కడ ఉధృతమైన వాతావరణం నెలకొన్నుందంట. ఆ సమయంలో మన ఊళ్ళో జన్మించిన ఆరుగురు పసివాళ్ళలో,   ఐదుగురి ఆచూకి ఉంది.   ఒరిస్సా నుండి పక్క ఊరికి వచ్చున్న మరో స్త్రీ కూడా, ఇక్కడ ఆడపిల్లని కన్నట్టు నమోదైన సమాచారం తప్ప, ఆచూకి లేదు.

కన్న మూడోరోజున పసిబిడ్డని తీసుకొని, ఆ ఉద్రిక్త వాతావరణంలోనే ఆ బాలింత వెళ్ళిపోయిందని మన చిన్నాసుపత్రి సమాచారం. ఆమే పసిబిడ్డని త్యజించి ఊరెళ్ళిపోయుంటుందని అంచనా,” ఆగింది ఉమమ్మ.

 

“ఆ బిడ్డవి నువ్వేనని ఆధారాలున్నాయని తెలిసింది. నీ ఇష్టం. నీకు కావాలంటే   ఆ వివరాలు, ఆధారాలు అడిగి తీసుకోవచ్చు,” అందామె భుజం మీద చేయి వేస్తూ.

మౌనంగా ఉండిపోయాను…

“బాధ పడకు… అలోచించు.. వివరాల వల్ల మనకి ఉపయోగమే లేదు… పైగా అసలావిడ ఈ చుట్టుపక్కల్లో   ఉండే మనిషి కాదు కూడా.     ఆమెకి పక్క ఊళ్ళో ఉన్న బంధువు ఆమె అమ్మమ్మట. ఆ అమ్మమ్మ చనిపోయి కూడా చాలా కాలం అయిందట. …

నీకెందుకు మళ్ళీ జీవితంలో ఓ అయోమయం, అన్వేషణ? సమయం వృధా చేయకుండా, చదువుకొని నీవు ఎదగాలి గాయత్రీ,” అంటూ సముదాయించింది…

**

అలజడి, ఆవేశం, దుఃఖం, అసహనం నన్ను చుట్టేసాయి.

రాత్రంతా కంటి మీద కునుకులేకుండా గడిపాను.

తెల్లారే సమయానికి మనసు కుదుటపడింది.   ‘అయితే ఏమిటి? అది గతం. ఎన్నడూ నాకు అమ్మగా నిలవని ఆమె కోసం పాకులాడే ప్రశక్తే లేదు. అలాగని ద్వేషించి సాధించేదేమీ లేదు’. ‘నాకు తెలియని ‘అమ్మ’ – ఆ స్త్రీ గురించి, నిన్న నేను విన్నది, తెలుసుకున్నదీ నాకు అనవసరం. అదంతా మరిచిపోవడమే నాకు శ్రేయస్కరం,’ అనుకొని పక్క మీద నుండి లేచాను…

**

egire-pavuramaa18-banner

ఆదివారం సమావేశానికి అనుకున్న దానికంటే ఎక్కువమందే హాజరయ్యారు. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, పత్రికా విలేఖరులు వచ్చారు. నటి మంజరి వచ్చింది. వారందరి ఉపన్యాసాల వల్ల కొన్ని విషయాలు తెలిశాయి.

వారిలో ఓ సంఘకర్త మాట్లాడుతూ, ఓ పత్రిక నుండి సమాచారం చదివి వినిపించారు…..

‘ఆడశిశువు పుడితే పీక పిసికి చెత్తకుండిలోనో, పొదల్లోనో, డ్రైనేజీలోనో పడేయడం పరిపాటైపోయింది. ఈ క్రియ చదువుకున్నవాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కొడుకే తలకొరివి పెట్టాలన్న మూఢాచారంతో మగ పిల్లాడిని వారసునిగా ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో స్త్రీ గర్భం దాల్చాక స్కానింగ్ ఇతరత్రా పరీక్షలద్వారా లింగ నిర్ధారణ చేసుకుని ‘ఆడపిల్ల’ అని తేలితే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన అమానవీయత, మూఢాచారాలవల్ల ‘స్త్రీ’ భ్రూణహత్యల పరంపర కేవలం తెలుగు నాట 2005 నుండి 2013 కి ఎనభై లక్షలని కొత్తగా వెలువడిన ప్రభుత్వ సర్వే తెలియజేసింది.

అంటూ ఆమె ప్రసంగం ద్వారా తెలిపారు.

మరో యువ రాజకీయ నాయకుడు, దానికి కొనసాగింపుగా ..

“ఈ మధ్యన తేలిన విషయం – తల్లిగా స్త్రీని గౌరవించుకునే విషయంలో – భారత దేశం 39 వ స్థానంలో, అదీ పాకిస్తాన్ కంటే ఐదు స్థానాలు దిగువలోనే ఉందని తేలడం విచారకరం. ఏదైనా ‘స్త్రీ-శిశు సంక్షేమం’ అనేది ఓ నిర్విరామ బృహత్తర కార్యక్రమం. ఉమాదేవి చుట్టుప్రక్కల ఎన్నో తాలూకాల్లో ఈ విషయంగా ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం వారు ఆమెకి మరింత సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాము,”

అని ముగించాడు ఆయన.

 

ఉమమ్మ వంతు వచ్చింది. ఆమెదే ముగింపు ఉపన్యాసం. నేనూ అందరితో పాటు శ్రద్ధగా వింటున్నాను.

 

“తన జీవితానికి అడ్డమ్మొచ్చిందనో, తన కష్టం తీరుతుందనో, కన్నబిడ్డని త్యజించే ముందు – ఆ చర్య వల్ల బిడ్డ భవిష్యత్తు శాపగ్రస్తమౌనేమోనని ఆలోచించవలసిన బాధ్యత ఆ ‘అమ్మ’ కే ఉంది.

ఒక్కోసారి ఆడశిశువు పట్ల వివక్షతో కన్నతల్లే కసాయిలా మారి, ఆ బిడ్డని త్యజించో, విక్రయించో, గొంతు నులిమో వదిలించుకుంటే?

రంగుల హరివిల్లులా అనిపించే ఊసరవెల్లి సమాజంలో, అమ్మ ఆదరణ లేని అడశిశివు యొక్క మనుగడ ఏ రంగు పులుముకుంటుందో? అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత ఆ తల్లిదే కాదా?.

మీ అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చెబుతాను.

‘గాయత్రి’ అని ఓ ఆడబిడ్డ మా కోవెల్లోనే పెరిగింది. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడతి. ఆమె తల్లి ఆమెని రోజుల పిల్లప్పుడే నిర్దయగా వదిలేసింది. కేవలం ఆ తల్లి నిర్లక్ష్య, అనాలోచిత చర్య వల్ల ఆ పసిదానికి అవిటితనం ఏర్పడింది. ఓ దయగల పెద్దాయన, ఆ బిడ్డని తెచ్చుకుని, పెంచి పెద్ద చేసాడు. అయినా తల్లి చర్య వల్ల, తల్లి ఆదరణ లేని లోటు వల్ల ఆమె ఇంత చిన్న వయసులోనే జీవితకాలం పాటి కష్టనష్టాలని అనుభవించింది.

మా ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ ప్రయత్నం వల్ల గాయత్రి కన్నతల్లి విషయంగా కొంత సమాచారం సేకరించాం. మొగపిల్లవాడు – వారసుడు కావాలనుకునే ఆమె భర్త, అతని పరివారం నుండి తిరస్కారానికి భయపడి, ఆమె బిడ్డని వదిలివేసుంటుందని అంచనా. అప్పటికే   ఇద్దరాడపిల్లల తల్లి అయిన ఆమె, బరంపురం తిరిగివెళ్ళి బిడ్డ పురిట్లోనే పోయిందని చెప్పినట్టు సమాచారం.

ఎంతో వొత్తిడికి లోనయి ఆ తల్లి అలా చేసుండవచ్చని అనుకున్నా, బాధ్యతా రహితమైన చర్య అని భావించక తప్పదు. ఏమయినా, త్యజించబడిన ఆ నాటి ఆడశిశువే మన ఈ గాయత్రి అని నిర్ధారణకొచ్చాము.  

ఈమెకి మాత్రం – ప్రేమ గల పెద్దాయన ప్రాపకం, శ్రేయోభిలాషుల ఆశ్రయం దొరకడం గొప్ప అదృష్టం.  

అయితే ఇటువంటి అదృష్ట, అవకాశాలు త్యజించబడ్డ మరో బిడ్డకి దొరక్కపోవచ్చు. మరి ఆ బిడ్డల జీవితాలు ఎలా ఉండగలవో ఆలోచించండి,” అని క్షణమాగింది ఉమమ్మ.

అమ్మతనం అద్భుత వరమే! బాధ్యతల వలయం కూడా. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, కన్న బిడ్డకి కనీసం రక్షణ కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ తల్లికే ఉంది. బిడ్డ బాధ్యత చేపట్టలేని ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురైతే, బిడ్డ క్షేమం కోరి కనీసం సమాజంలో ఉన్న సహాయ, అవకాశాలని ఆమె అంది పుచ్చుకోవాలి.

నేటి పురోగామిక సమాజంలో ఆ అవకాశం మెండుగా ఉంటుందామ్మకు…

ప్రభుత్వ సంస్థల చేయూత సైతం సులువుగా లభ్యమవుతుంది కూడా,” అంటూ,…..

 

”పోతే గాయత్రి ఎవరో కాదు, వాకిట్లో మిమ్మల్ని సాదరంగా నవ్వుతూ లోనికి ఆహ్వానించి, మీ నుండి సంతకం తీసుకుని, మీకు కార్యక్రమ పత్రాలు అందజేసిన ఆ చురుకైన అమ్మాయే,”

అంటూ ఉపన్యాసం ముగించింది ఉమమ్మ.

ఆమె కొత్తగా నా గురించి, నాకు జన్మనిచ్చి వదిలేసిన ఆ తల్లి గురించి చెప్పిన విషయం విన్నాను. నాలో పెద్దగా ఎటువంటి స్పందనా కలగలేదు. ఉదాసీనతే తోచింది.

జరుగుతున్న మిగతా కార్యక్రమం చూడసాగాను.

 

….సంఘం లోని కుళ్ళుని కడిగేయాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యవచ్చు? అన్న విషయం మొదలుకొని, ప్రభుత్వం నుండి సహాయం ఎలా పొందాలో తెలియజేసే మిగతా వారి ప్రసంగాలతో విజయవంతంగా ముగిసింది ఆ నాటి కార్యక్రమం……

ఆఖరున ప్రభుత్వ సహాయకారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

**

నా జీవితం, గురించి ప్రస్తావన ఈ విధంగా ఉమమ్మ చేస్తున్న మంచి పనికి సహాయ పడితే నా జన్మ ధన్యమైనట్టేనని భావించాను. నాకు నిజంగా మాట్లాడగల స్థితి వస్తే ఉమమ్మకి నావంతు సహకారాన్ని మాటల ద్వారా కూడా అందించాలని నిర్ణయించుకున్నాను.

అవకాశం అంది పుచ్చుకొని ఉమమ్మలా ‘ప్రత్యేక విద్యా విధానం’ లో పై చదువులు సాగించాలని కూడా ఆశ కలిగింది నా మనస్సులో.

**

కోవెల పైమెట్టు మీదనే నాకలవాటైన నా స్థలం, పురాతన రావిచెట్టు నీడన నేను కూర్చునే నాకిష్టమైన నా స్థానం. శ్రీ గాయత్రి పుస్తకాలయంలోని కొలువునే గౌరవంగా నిలుపుకుంటాను.

తాత ఏర్పరిచిన నా జీవితం నాకు ఒక స్వర్గమే అని భావిస్తాను.

    సమాప్తం

   ***************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘ఎగిరే పావురమా!’ – 17

egire-pavuramaa17-banner

 

తాత కన్ను మూసి రెండు నెల్లవుతున్నా, బాధ నుండి తేరుకోలేక పోతున్నాను.

పిన్ని, బాబాయి, రాములు బేషరుతుగా నన్ను ఆదరించారు. ఎవ్వరూ నా మీద కోపతాపాలు చూపించలేదు. చంద్రం పిన్ని, బాబాయి నా విషయాలన్నింటా సాయం చేస్తున్నారు. రోజుకోసారన్న కొట్టాంకి వచ్చి నా బాగోగులు చూస్తుంటుంది పిన్ని.

 

నాకు తోడుగా నాకోసం కొట్టాంలోనే ఉంటున్న రాములు కళ్ళల్లో, చేష్టల్లో నాకు కాస్త ఓదార్పు దొరికింది. నా పట్ల అదే మునపటి చనువుతో ప్రేమగా మసులుతుంది ఆమె.

**

‘పాలెం వచ్చిన కాడినుండి, నా మనస్తాపాల్లోనే సమయం గడిచింది.   ఏనాడూ రాములు మంచిచెడ్డలు కనుక్కోలేదు’ అనిపించింది.

తాత ఆఖరి శ్వాసవరకు అన్ని విషయాల్లో – తాతకి తోడుగా ఉంది రాములే నని చెప్పింది పిన్ని. ఇప్పుడు గుళ్ళో కూడా ఎన్నో పనులు చక్కబెడుతూ, అజమాయిషీ చేసేది కూడా రాములేనట.

నిద్రబోయే ముందు, కొట్టాం తలుపు వేసొస్తున్న రాముల్ని పిలిచి పక్కన కూచోమన్నాను.

కృతజ్ఞతా భావంతో నా కళ్ళు చమర్చాయి. ఆమె రెండు చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను.

‘తాతకి నీవు దగ్గిరుండి సేవ చేసినందుకే కాదు, ఇప్పుడు నాకు తోడుగా ఉంటున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని సైగలతో తెలియజెప్పాను రాములుకి.

 

“పిచ్చిపిల్లా, నువ్వింకా చిన్నదానివే గాయత్రీ. పెద్ద మాటలు ఎందుకులేరా?

అయినా అట్టాగంటే, మరి సత్యమన్న నాకు చేసిన మేలుకి నేనేమనాలి? ఎన్నో తడవలు నన్నాదుకున్నాడు. ఆ రుణమే నేను తీర్చుకుంటున్నా అనుకో,” అంది రాములు.

‘ఇంతకీ నీ జీవనం ఎలా సాగింది? కోవెల్లో మళ్ళీ కొలువు ఎప్పటినుండి చేస్తున్నావు?’ అడిగాను రాములుని.

 

ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది రాములు.

“ఏమనాలిరా గాయత్రీ, అంతా నా తల రాత. నా మామకి ఆరోగ్యం బాగోక నేను అప్పట్లో ఊరెళ్ళిన ఇషయం నీక్కూడా తెలుసుగా.

రెండున్నరేళ్ళకి పైగానే దగ్గరుండి పసిపిల్లాడికిమల్లే సేవ చేసినా, మామని కాపాడుకోలేక పోయాను. రోగం ముదిరి నా చేతుల్లోనే చనిపోయాడు మామ.

ఆ బాధ ఓ ఎత్తైతే, భరణం ఇవ్వలేదన్న కోపంతో వాడిని నేనే చంపానని నింద మోపి పోలీసు కేసు పెట్టింది నా సవితి,” ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది.

“సత్యమయ్య, పూజారయ్య తంటాలు పడి వకీలు సాయంతో నా సమస్యని ఓ కొలిక్కి తెచ్చారు. ఈడ కొలువులో పెట్టారు. నాకు డబ్బు సాయం కూడా చేసి నిలబెట్టారనుకో,” అని వివరించింది.

రాములు కూడా తన జీవితంలో ఎంతగానో నష్టపోయిందని, ఆమె మాటల్లోనే తెలిసింది.

విని బాధపడ్డాను.

కాని మనిషి మాటతీరులో, నడవడిలో, వేషభాషల్లో మార్పు తెలుస్తుంది.   మునుపు లేని పెద్దరికం వచ్చేసింది….

**

పొలం కౌలుకిప్పించాడు రాంబాబాయి. తాత పింఛను రాడం మొదలైంది. కొట్టాంలో చాలా మటుకు అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, మనిషి సాయం ఉండాలంటూ రాగిణి అనే ఆయాని పనిలో పెట్టింది పిన్ని.

నా మటుకు నాకు ఏదైనా చదువో, కొలువో ఉండాలనిపిస్తుంది.

ఉమమ్మని, పూజారయ్యని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళని చూడాలని ఉన్నా, నా అంతట నేను వెళ్ళడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు.

‘ఉమమ్మ నన్ను రమ్మని పిలిస్తే బాగుణ్ణు’ అనుకున్నాను మనస్సులో. కబురంపినా చాలు, ధైర్యం వస్తుంది. నా పావురాళ్ళని చూడాలనుంది.

‘నా చదువు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది’ అనుకున్నాను.

**

కోవెల నుండి తెచ్చిన ప్రసాదాలు కంచంలో పెట్టి నా పక్కనొచ్చి కూచుంది రాములు.

కోవెల ఊసులు చెప్పసాగింది…..

 

ఇంతలో, “గాయత్రీ,” అంటూ కొట్టాం తలుపు తీసుకొని పిన్ని లోనికొచ్చింది.

ఆమె కూచోడానికి తన పక్కనే పీట వేసి, తెచ్చిన ప్రసాదం కాస్త పిన్నికి కూడా పెట్టింది రాములు.

 

ప్రసాదం తింటూ, “నీకోసమే వచ్చా రాములు. పొద్దున్న నీ స్నేహితురాళ్ళు కలిశారు. వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం సంగతి ఆలోచించావా? అడిగింది పిన్ని.

“అతన్ని, నేనూ చూసాను. అన్ని విధాల మంచి సంబంధం అంటున్నారు.

నువ్వు కలుస్తానంటే మనింటికైనా వస్తాన్నాడంట పెళ్ళికొడుకు. కలిసి మాట్లాడు. నచ్చితే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయచ్చు కదా. మరి ఏమంటావ్?” అడిగింది పిన్ని రాముల్ని.

 

“చూద్దాములే చంద్రమ్మా, నాక్కాస్త సమయం కావాలి,” అంది రాములు తలొంచుకుని.

“దేనికి సమయం? మరీ ఆలస్యం చేయకు. త్వరగా ఆలోచన కానీయ్. నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాం,” నవ్వింది పిన్ని.

 

వాళ్ళ మధ్య స్నేహభావం మెండుగా ఉందని అర్ధమయ్యి బాగనిపించింది. ఎంత కాలంగానో ఒకరికొకరు తెలిసినా, ఈ మధ్య తాత అనారోగ్య విషయంగానే వీళ్ళిద్దరూ దగ్గరయ్యారనిపించింది.

సుబ్బీ, మాణిక్యం, చంద్రం పిన్ని కూడా రాములు పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారని అర్ధమయ్యింది.

‘అయితే, రాములు పునర్వివాహం కూడా మంచి పరిణామమే’ అనిపించింది…..

egire-pavurama-18

**

రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి.

వెంట తెచ్చిన పుస్తకాలు దులిపి తిరగేస్తున్నాను.

 

గోవిందు అప్పట్లో నాకు తెచ్చిచ్చిన తెలుగు నవల చదువుతూ, వాకిట్లో కూచున్నాను.

 

సాయంత్రం ఎనిమిదింటికి ఇల్లు చేరుతూనే నాకు కమ్మని కబురందించింది రాములు.

పూజారయ్య, ఉమమ్మ నా గురించి అడిగారని. నన్ను వచ్చి కలవమన్నారని చెప్పింది.

తాత పోయిన ఆరు నెలలకి, నేను ఎదురు చూసిన ఆ పిలుపు ఆఖరికి రానే వచ్చింది.

అంటే సరిగ్గా నేను తిరిగి తాత గూడు చేరిన ఆరు నెలలకి నన్ను కోవెలకి రమ్మన్నారు పూజారయ్య, ఉమమ్మ. చాల సంతోషమైంది.

 

“మన కోవెల ఎంతలా అభివృద్ధి పొందిందో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వచ్చినప్పుడు చుస్తావుగా! రేపే బయలుదేరు. మనం పొద్దున్నే వెళితే నీ వెంటే ఉండడానికి నాకు సమయముంటుంది,” అంది రాములు ఉషారుగా…

 

పరితప్త హృదయంతో, తల్లివొడి చేరబోయే బిడ్డలా ‘శ్రీ గాయత్రీ కోవెల’ లో అడుగు పెట్టబోతున్న ఆనందంతో నిద్రే పట్టలేదు ఆ రాత్రి…

**

మరునాడు పెందరాళే, చిన్నప్పటిలా తలార స్నానం చేసి, తడి జుట్టు ముడేసి కోవెలకి తయారయ్యాను.

తాత పటానికి దణ్ణం పెట్టుకున్నాను.

చంద్రం పిన్నికి చెప్పి రాములుతో బయలుదేరాను.

**

మేము వెళ్ళేప్పటికి, అమ్మవారి అభిషేకం ముగించుకొని గుడి మెట్ల మీద కూచునున్నారు పూజారయ్య, ఉమమ్మ. దగ్గరగా వెళ్ళి పూజారయ్య పాదాలంటి నమస్కరించాను. వారికాడ నా దుఃఖం ఆగలేదు. ఉమమ్మ నన్ను దగ్గరికి తీసుకుని సముదాయించింది.

 

“బాధపడకమ్మా గాయత్రీ, మీ తాత ఆపరేషనదీ అయిన కొంత కాలానికి కోలుకొని బాగానే ఉన్నాడు. రోజంతా గుళ్ళోనే గడిపేవాడు. వద్దని వారించినా ఎంతో పని చేసేవాడు. నీ గురించే ఆలోచించి, ఆవేదన చెందేవాడు. వాడి మనస్సుని కాస్త వేదాంతం వైపుగా మళ్ళించాలని ప్రయత్నించాను,” అని పూజారయ్య ఓదార్పుగా మాట్లాడారు.

 

నా భుజం మీద చేయి వేసింది ఉమమ్మ. “ఏయ్ గాయత్రి, బాధపడకు.

నువ్వు మాకు ఎప్పటికీ మా చిన్న గాయత్రివే. మూడేళ్లలో ఎంతో జీవితాన్ని చూశావు. కాస్త ఎదిగావు. ‘చక్కనమ్మ చిక్కినా’ అన్న సామెతగా కొండపల్లి బొమ్మలా ఉన్నావు,” అంది ప్రేమగా.

ఆమె ఆప్యాయతకి నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

 

“ఇక్కడ నీ కోసం అదే స్థానం, అదే అరుగు, అదే కొలువు అలాగే ఉన్నాయి. కోవెల్లో అన్ని సదుపాయాలు ఇంకా మెరుగయ్యాయి. కాకపోతే అప్పట్లో ఇక్కడ నువ్వు చేసింది స్వచ్చంద సేవే.

ఇకముందు కోవెల సిబ్బందితో పాటుగా జీతం పుచ్చుకునే ఓ కార్మికురాలువి,” అంటూ నన్నాట పట్టించింది ఉమమ్మ.

నా మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది.

“అసలు మన కోవెల ఎంతగా మారిందో అంతటా తిరిగి చూడు,” అంది ఆమె మళ్ళీ..

 

“రేపు మంచి రోజే, పదింటి వరకు శుభఘడియలున్నాయి. పొద్దున్నే మన కోవెల పుస్తకాలయానికి పనికి వచ్చేయమ్మా, గాయత్రి,” అన్నారు పూజారయ్య.

 

“కోవెలకి కలిసొచ్చిన కొత్త భూములు, తోటల నుండి మొదలెట్టి చుట్టూ చూపిస్తాను ఉమమ్మా,” అని నా చేయందుకుంది రాములు.

**

అమ్మవారి కోవెల్లో నుండి ఆవరణలోకి అడుగు పెట్టిన నాకు రాములు అన్నట్టుగానే ఎన్నో మార్పులు – చేర్పులు తోచాయి.

 

రావి చెట్టు కింద పూజసామాను, పుస్తకాల అమ్మకాలకి చక్కగా అలమారాలు అమర్చారు. అరుగుని మరింత విస్తరించి…విశాలమైన అరుగు ఎత్తుమీద, రావిచెట్టు చుట్టూరా ఓ అద్దాల స్టాల్లా తయారు చేసారు. ఇప్పుడు దాన్ని ‘శ్రీ గాయత్రి పుస్తకాలయం’ అంటారు. లోపల కూడా దీపాలతో వెలిగిపోతుంది.

పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటలవరకు వస్తువుల అమ్మకాలు జరుగుతాయి. రాములు అజమాయిషీలోనే ఉంది అక్కడి వ్యవహారం. ఓ పెద్దాయన మాత్రం పుస్తకాలయం అమ్మకాలు, లెక్కల విషయాల్లో సాయంగా ఉన్నాడు.   పొద్దున్నే స్టాల్, గుడి ఆఫీస్ తలుపులు తెరిచి, ఆఫీసు పని, మళ్ళీ రాత్రి క్లోజింగ్ వరకు ఆయనే చేస్తాడట..

అరుగులకి పక్కగా పావురాళ్ళకి ప్రత్యేకంగా స్థలం కేటాయించి చుట్టూ జల్లి అమర్చారు. అందులో ఓ పక్కగా గింజలకి, నీళ్ళకి కూడా ఏర్పాటు చేశారు.

ఎప్పటిలా రెండు సార్లు వచ్చి గింజలు తిని, కాసేపు తచ్చట్లాడి దూసుకొని పోతాయట పావురాళ్ళు. కోవెల్లోకి వాటి రాక, వాటి ఉనికే ఆలయానికి గొప్ప మేలు చేసిందని జనం అంటున్నారంట.

తోటలో ఇప్పుడు మరెన్నో రకరకాల పువ్వులు పూయిస్తున్నారు. పూల దిగుబడి కూడా రెట్టింపయ్యిందంట. పూల విషయంలో సాయం చేయడానికి రమణమ్మ ఉందంట. దండలు అందంగా కడుతుందంట.

గుడిలోని దేవుని మూర్తులకి ఇవ్వంగా మిగిలిన వాటిని కర్వేపాకు, కొబ్బరిచెక్కలతో పాటు కోవెల బడ్డీలో, అమ్మకాలకి పెడుతుందంట….

 

నాయుడన్న కూడా కనపడ్డాడు. ఎంతో ఆప్యాయంగా నా కాడికి వచ్చి పలకరించాడు. యోగక్షేమాలు అడిగి కనుక్కున్నాడు.

పంతులుగారికి పని సాయం చేసే కృష్ణ కనబడ్డాడు. కాస్త పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పదవ తరగతి చదువుతూ, పంతులుగారి కాడ పౌరోహిత్యం చేస్తున్నాడంట.

**

పోతే, కోవెల పరిధిలోకి ఓ ముఖ్యమైన చేరిక ‘సమాజ సంక్షేమ సేవ’ అని అర్ధమయ్యింది. అందుకోసం ఆవరణలో ప్రభత్వం వారి సహకారంతో ‘స్త్రీ సంక్షేమ సంస్థ’కి గాను ఓ కట్టడం, దానికి ఆనుకొని మరో చిన్న ‘ఫలహార శాల’ నిర్మించబడ్డాయి. సంస్థ హాల్లో కనీసం వంద మంది జనం పడతారు. గుడికి సంబంధం లేకుండా దాని ద్వారం రోడ్డు వైపుకే ఉంది.

ఉమమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆ సంస్థ కార్యక్రమాల బాధ్యతలు రాములు, కృష్ణ కూడా పంచుకుంటారంట.

ఏడాదికి రెండు సార్లు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, బీదవారికి ఉచిత వైద్యచికిత్స చేస్తుందట ఆ సంస్థ.

**

అంతటా తిరిగి చూసాక, మేము అరుగుల మీద పుస్తకాలయం కాడ కూచున్నాము.

“ఇక నీ పావురాలని చూసి, పంతులుగారిని కలిస్తే పనయినట్టే. రేపటినుంచి ఎలాగూ ఇక్కడే ఉంటావుగా,” అని రాములు అంటుండగానే, బారులు తీరిన పావురాలు దూసుకొచ్చి మమ్మల్ని దాటుకొని వెళ్లాయి. మేము వాటిని అనుసరించాము.

తిన్నగా వాటికని కేటాయించిన స్థలంలో కాసేపు విహరించి, గింజలు తినేసి, వాటినే గమనిస్తున్న మా మీదగా ఆకాశంలోకి ఎగిసిపోయాయి.

 

నా చిన్నతనంలో ఆ పావురాల రాకపోకలు నాకెంత ఆనందాన్నిచ్చేవో గుర్తొచ్చింది.

నాకు పక్కగా వచ్చి నా భుజం మీద తట్టింది రాములు.

“నా ప్రకారంగా నువ్వూ ఓ పావురానివే గాయత్రీ. అమాయకురాలివి. ఏదో బాధతో గూడు వీడినా, నీ తాత ఆశీర్వాదం, దేవుని దయ వల్ల ఓ శాంతి పావురంలా తిరిగి నీ గూడు చేరడం నాకు సంతోషంగా ఉందిరా,” అంటూ కళ్ళు తుడుచుకొంది, రాములు.

నిజమే అన్నట్టు తలూపాను.

**

“ఏమ్మా గాయత్రి,” అన్న పంతులుగారి పిలుపుకి ఇద్దరం వెను తిరిగాము. “పూజ ముగించి, నువ్వు వచ్చావని తెలిసి ఇటుగా వచ్చాను. ఏమంటున్నాయి నీ పావురాలు? అడిగాడాయన నవ్వుతూ.

చేతులు జోడించి నమస్కరించాను.

 

“బాగున్నావా తల్లీ?” అని అడిగాడాయన ఆప్యాయంగా.

“ఇప్పటికీ తాత పోయిన దుఃఖంలో ఉన్నావు. మనస్సుని కుదుట పరుచుకో తల్లీ. అంతా దైవేచ్ఛ,” , “నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి,” అన్నాడు పంతులుగారు.

 

తాత మాట వింటూనే నా కళ్ళల్లో నీళ్ళు నిండడం గమనించి, మాట మార్చాడాయన. మాతో పాటు పుస్తకాలయం దిశగా నడిచాడు.

“నీవు ఇక్కడ కొలువు చేయబోతావని విన్నాను. చాలా సంతోషం గాయత్రి,” అన్నాడాయన. “చూశావా? ఉమమ్మ అదృష్టరేఖే మన కోవెల వృద్ధికి ఎలా కారణమయిందో. ఆమె ఎంచుకున్న చదువులు, సరోజినీ గారి చేయూత, వారి ప్రోత్సాహం అన్నీ కలిసొచ్చాయనుకో.

ప్రభుత్వ దేవాదాయ పరిషత్తు వారు, అభివృద్ధికి మన కోవెలని కూడా ఎన్నుకోబట్టి, ఇదంతా సాధ్యమయింది. లేదంటే, మన కోవెల్లో ఇంత మందికి ఉపాధి కల్పించగలగడం మాటలు కాదుగా! ఇదంతా మనందరి పూర్వజన్మ సుకృతం తల్లీ,” అన్నాడాయన.

 

నిజమేగా!, ఔనని తలూపాను.

ఆయన కాడ సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.

**

పనిలో జేరడానికి పోద్దున్నే కోవెలకి బయలుదేరాను.

శ్రీ గాయత్రి పుస్తకాలయం లో అడుగుపెట్టగానే ‘నాలుగేళ్ల తరువాత మళ్ళీ ఈ కోవెల్లో నేను’ అని అనుకుంటూ తాతని తలుచుకున్నాను.

 

తాత ఆత్మకి శాంతి కలిగించే కార్యాలు చేసి, ఆయన ఋణం తీర్చుకోవాలని ఆలోచిస్తూ, కొత్తగా వచ్చిన పూజావస్తువుల డబ్బా విప్పి సర్దడం మొదలెట్టాను.

కాస్త దూరంలోనే వెనుక నుండి ఉమమ్మ మాట వినబడింది. వెను తిరిగి చూసాను. పాలనురుగు లాంటి తెల్లని జరీ అంచు చీర కట్టుకొని ఓ అప్సరలా ఉంది ఉమమ్మ.

 

కాసేపటికి నా ఎదురుగా వచ్చి, చేతిలోని మల్లెచెండు నాకందిస్తూ, “గాయత్రీ, ఆరువారాల్లోనే నీ ఎనిమిదో తరగతి పరీక్షలు. శ్రద్ధగా చదవాలి మరి,” అని గుర్తు చేసింది.

“ఈ పరీక్షలు పాస్ అయిపోతే, సమయం తీసుకొని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకి సిద్ధమవ్వచ్చు,” అంటూ నేను సర్దుతున్న పూజా పుస్తకాల నుండి రెండింటిని చేతిలోకి తీసుకుని బయటకి నడిచింది…

 

సమయానికి ఉమమ్మ నాకు చదువు విషయం గుర్తు చేసింది. ‘తాతకి నేను చదువుకోడం చాలా ముఖ్యం అని చటక్కున తోచింది. అదే చేస్తా.’ తాత కోసం ఏమి చేయాలా అని అనుకుంటున్న నాకు నా నిర్ణయం సంతోషమనిపించింది.

ఉమమ్మ వెళ్ళిన దిశగా చూస్తే, చేతిలోని పుస్తకం తిరగేస్తూ రాములుతో మాట్లాడుతుంది ఆమె.

నా వంక చూసి, రమ్మని పిలిచింది.

అప్పుడే వచ్చిన గుమస్తా గారికి చెప్పి, రద్దీ ఏమీ లేకపోవడంతో, వెళ్ళి వాళ్ళకి కొద్ది దూరంలో కూచున్నాను.

 

ఉమమ్మని “పెళ్ళి పనులన్నీ అవుతున్నాయా?” అని సైగలతో అడిగాను.

 

“ఈ సైగలు కొద్దికాలానికి మాటల్లోకి మారుతాయేమోలే గాయత్రి. ఆ ప్రయత్నంగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నానని చెప్పడానికే పిలిచాను. జరపవలసిన వైద్య పరీక్షలన్నీ త్వరలో చేయించుదాము. నీ అవిటితనం పోయి, నీ నోటివెంట వచ్చే మాట వినాలని మీ తాత ఎంత అల్లాడిపోయాడో కదా! అసలు సత్యమయ్య కోసమే ఈ విషయంగా నా గట్టి ప్రయత్నమనుకో, ” అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది ఉమమ్మ.

 

“ఓహ్, మర్చిపోయాను,” అంటూ తన పర్సు నుండి వెండి కాలి పట్టాలు తీసి, రిపైర్ చేసిమ్మంటూ రాములుకందించి, నా వంక చూసిందామె.

”నా పెళ్ళి పనుల గురించి అడిగావా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. మన గుడిలోనేగా పెళ్ళి. అన్ని పనులు నాన్నగారు, మల్లిక్ చూస్తున్నారులే,” అంటూ నవ్వేసింది ఉమమ్మ.

 

మా మాటలు వింటున్న రాములు గబుక్కున అందుకుంది.

“అయినా అంతా ఉమమ్మ కనుసైగల్లోనే నడుస్తారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటరా గయిత్రీ. మల్లిక్ బాబు మొన్ననే అమెరికా నుండి తిరిగొచ్చాడు.

అంత దూరాన ఉండగానే మన ఉమమ్మంటే నిండా ప్రేమలో పడిపోయాడు. అక్కడినుంచే అన్నీ కుదేర్చేసుకొని ముహూర్తాలు కూడా పెట్టించేశాడనుకో,” అంది నవ్వుతూ రాములు.

 

ఉమమ్మ ముఖం సిగ్గులతో నిండిపోయింది.

“సరేలే, అతిగా నీ కబుర్లు,” అంటూ కసిరిందామె.

ఇంతలో, మా పావురాలు అందంగా దూసుకొచ్చాయి. పూజాసామాగ్రి కోసం భక్తులు రావడంతో, నేను అటుగా నడిస్తే, దానా డబ్బాతో రాములు, ఉమమ్మ పావురాలని అనుసరించారు…

**

పుస్తకాలయం సర్దుతూ దూరాన్నించే రాములు, ఉమమ్మల్ని గమనించాను కాసేపు.

ఉమమ్మ, తాననుకున్నది సాధించుకొంది. హైదరాబాదుకి కూడా వెళ్లి రెండేళ్లు ‘ప్రత్యేక విద్యావిధానం’ లో ఉత్తీర్ణురాలై ఉపాధ్యాయ పట్టా పొందిందంట. సరోజినీ గారి ప్రోత్సాహంతో, ప్రభుత్వం వారి సహకారంతో, గుడి ఆవరణలోనే   ‘మహిళా సంక్షేమ సంస్థ’ ప్రారంభించి, సమాజసేవ చేస్తున్న ఆమెని చుట్టూ గ్రామాల్లోని వారు ఎంతో గౌరవిస్తున్నారట.

 

ఉమమ్మ పెళ్ళి చూడ్డానికి, ఇప్పుడు ఊరంతా ఎదురు చూస్తుంది. పెళ్లయ్యాక ఉపాధ్యాయినిగా పనిచేస్తూనే ఇక్కడ పాలెంలోని ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ కూడా నిర్వహిస్తుందంట.

ఇకపోతే, ఉమమ్మకి కాబోయే భర్త కూడా, మాకు ఆప్తుడైన డాక్టర్. మల్లిక్ గారే. గుంటూరులో ‘శారద సత్య స్పెషాల్టీ హాస్పిటల్ ’ ద్వారా పేదలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారంట.

 

‘ఉమమ్మ నాకు తెలిసినప్పటి నుండి ఇతరులకి సేవ చేయాలన్న తపనతో మసలడం, నా లాంటి వారి అదృష్టమే అనుకుంటాను. ఆమెకి తగిన భర్తని, చక్కటి జీవితాన్ని ప్రసాదించింది ఆ తల్లి గాయత్రి అమ్మవారు.

 

“మళ్ళీ వస్తాను గాయత్రి. మొదలెట్టి పరీక్షలకి చదువు, మళ్ళీ మళ్ళీ పునరీక్షించు, వింటున్నావా?” అంటూన్న ఉమమ్మ మాటలకి ఆమె వంక చూశాను. ‘అలాగే’ అన్నట్టు తలాడించాను.                                                            (ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 16

egire-pavuramaa16-banner

నేను కళ్ళు తుడుచుకొని బాబాయి వంక సూటిగా చూసాను…

‘చూడు రాంబాబాయి’ అన్నట్టు అతని చేతిని వేళ్ళతో తట్టాను..

కమలమ్మని, గోవిందుని చూపిస్తూ – ‘మూడేళ్లగా వీళ్ళతో కలిసున్నానని, బాగానే ఉన్నానని’ సైగ చేసాను….

జేమ్స్ ని చూపించాను…’అతని వద్ద క్యాంటీన్ లో ‘వంటా-వార్పు’ చేస్తున్నానని’ చెప్పాను…

‘ఆ కొలువు చేయబట్టే, నా కాలి చికిత్స జరిగిందని, ఇంకా నాలుగే వారాల్లో చికిత్స కూడా పూర్తవుతుందని’ తెలియజెప్పాను.

నేనిప్పుడు చాలా మెరుగ్గా కదలగలుగుతున్నానని చెప్పాను…

 

తాత ఉత్తరం తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. తాత మీద ప్రేమ, బెంగా ఉన్నాయని తెలియజేశాను….

ఆయన రాసిందంతా నేను అర్ధం చేసుకున్నానని తాతకి చెప్పమన్నాను.

నా చదువు కూడా కొనసాగిస్తున్నానని,   నేను అన్నీ ఆలోచించి   మళ్ళీ ఉత్తరం రాస్తానని తెలియజేయమన్నాను. తాతని, పిన్నిని అడిగానని చెప్పమన్నాను.

 

ఆఖరికి, చేతులు జోడించి, ఇక బయలుదేరమన్నాను…

రాంబాబాయి కూడా నాతోపాటే ఏడ్చేశాడు…

నాచేతులు తన చేతుల్లో పట్టుకుని, “సుఖంగా ఉండు గాయత్రి. నీవన్నవన్నీ తాతకి చెబుతాలే,” అని వెనుతిరిగాడు..

బాబాయిని సాగనంపడానికి, గోవిందు వెంట నడిచాడు.

కన్నీళ్ళతో   మసకబారిన   చూపుతో వెళ్లిపోతున్న ఆయన్ని చూస్తుండిపోయాను……..

**

కిచెన్లో – పొయ్యిల మీద గుండిగలో కుర్మాకూర కలుపుతున్నాను. వెనుక నుండి జేమ్స్ గొంతు వినవచ్చింది….

కాసేపటికి నా పక్కకొచ్చాడు.

“నీలో మునుపు లేని ఉషారు, ముఖంలో ఓ వెలుగు కనబడుతున్నాయి గాయత్రీ. పోయిన వారం నీ కాలు వైద్యం ముగిసిందని, డాక్టరమ్మ మన జలజ మేడంకి సమాచారం ఇచ్చారు… ఇకపోతే, రేపటిరోజున మళ్ళీ ఒక్కసారి వెళతావంటగా! చికిత్స కొనసాగింపు కాగితాలమీద నీ సంతకాలు కావాలన్నారంట,”… అన్నాడు.

 

తల వంచుకొని పనిచేసుకుంటూ వింటున్నాను….

మరో నిముషానికి నా ముందుకి వచ్చి నిలుచున్నాడు.

 

“గోవిందుతో నీ పెళ్ళికి సరిగ్గా పది రోజుల టైం ఉంది. చాపెల్ బుక్ చేయించింది కమలమ్మ. మిగతా ఏర్పాట్లు నేనే చెయ్యాలి. నీ వాలకం నాకు అర్ధం అవడంలేదు,” క్షణమాగాడు.

“నేను రెండురోజులు మా ఊరికి పోయొస్తా. వచ్చాక మళ్ళీ కనబడతా. ఈ రెండు రోజుల్లో సరయిన నిర్ణయం చేసుకొని నాకు మంచి వార్త చెప్పాలి నువ్వు. లేదంటే నువ్వు, గోవిందు కష్టపడాల్సి వస్తది,” అంటూ నా భుజాన చేత్తో నొక్కాడు.

వాడి చేయి విదిలించి వెనక్కి తిరిగేప్పటికి పక్క వాకిట్లోంచి గోవిందు లోనికొచ్చాడు.

 

అదాట్టుగా అతను ఎదురుపడ్డంతో, ఒక్కక్షణం జేమ్స్ తత్తరపడ్డాడు.

వెంటనే తేరుకొని, “ఏమిరా గోవిందు, నేను రెండు రోజులు ఊరికి పొతున్నా. రేపు కమలమ్మని తోడిచ్చి గాయత్రిని ఆసుపత్రికి పంపించు.   చిన్న పనే అక్కడ. ఏవో సంతకాలు చేయాలంట.. ఈడ నేను లేనప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకో,” అని ఆర్డర్ వేసి వెళ్లాడు తలతిక్క జేమ్స్.

**

“అక్కా, ఇయ్యాల మార్కెట్ నుండి సామాను దింపాక, గాయత్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు జేమ్స్. వాడు ఊళ్ళో లేడుగా! ఏవో కొన్ని ఎగస్ట్రా పనులు సెప్పాడులే.   ఆసుపత్రికి పోడం చికిత్సకి కాదంట! ఆడేదో కాగితాల పైన సంతకాల పనుందంట. మేమెళ్ళి తొరగానే వస్తాములే,” అని కమలమ్మతో అంటూ, పొద్దున్నే   రోజూ కంటే ముందే ఇంటినుండి బయలుదేరాడు గోవిందు.

**

డాక్టరమ్మని కలిసి, కాగితాలు సంతకాలు చేసిచ్చాను. ఓ కట్ట కాగితాలు ‘మదర్ తెరెసా’ జలజ గారికిమ్మని నాకందించిందామె.

ఇప్పుడు నా కదలిక మునుపెన్నడూ లేనంత సులువుగానే ఉందని చెప్పాను….

క్రచస్ వాడుతునే ఉండమంది.

ఆమె కాడ శలవు తీసుకొని బయటికి వస్తున్న నాకు ఎదురొచ్చాడు గోవిందు.

“కాసేపు గుడికెళ్ళి కూకుందాము రా,” అంటూ అటుగా తీసుకెళ్ళాడు.

**

గుడిలోకి వెళ్ళగానే, “ముందు మొహాన బొట్టెట్టుకో. ఇయ్యాల నుండి నువ్వు బొట్టు తీసే పనే లేదు,” అన్నాడు గోవిందు.

తలెత్తి నవ్వి ఊర్కున్నాను.

దేవుడి కాడ దణ్ణమెట్టుకుని,  దేవుని కుంకుమెట్టుకొని, ఎదురుగా కాస్త ఎడంగా ఉన్న మెట్ల మీద కూచున్నాము.

గోవిందు వెళ్ళి, తినడానికి పులిహోర ప్రసాదం తెచ్చాడు.

 

“గాయత్రీ, ఈడ ఇయ్యాల బెల్లం పాయసం కూడా ఉంది తెలుసా,” అంటూ మళ్ళీ వెళ్ళి రెండు దొన్నెల్లో పాయసం కూడా తెచ్చాడు.

తిని నీళ్ళు తాగాము.

ఎడంగా కూచున్న గోవిందు, లేచి వచ్చి పక్కన కూచున్నాడు.

“నీతో మాట్లాడాలి గాయత్రీ,” అన్నాడు….

 

‘ఏంటో చెప్పమన్నాను’ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి…

నాకు ఈ పెళ్ళీ వద్దు, ఇక్కడి జీవనం వద్దు, నా తాత కాడికి వెళ్లిపోతానని నా మనస్సు పడుతున్న ఆవేదన కన్నీళ్ళగా మారింది……..

 

“ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి కావాలో నాకు తెలుసు… కళ్ళు తుడుచుకో,” అని ఆగాడు.

“…చూడు… నీకు ఎంతో అన్యాయం జరిగిపోయింది గాయత్రి… పాపం మీ తాత, పిన్ని, బాబాయి ఎంత కష్టపడ్డారో!… ఏమైనా కమలమ్మ సేసింది పెద్ద తప్పు.. నేను కూడా ఏం సేయలేను. నాదీ తప్పే… ఇక ఆ గుంటనక్క జేమ్స్ ఇషయం కూడా నాకెరకే…

నీ కష్టం, ఇబ్బంది అన్నీ తెలుసు…నాక్కూడా ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ వద్దు… ఈడనే ఉంటే, ఆ జేమ్స్ గాడు నిన్ను బతకనివ్వడు,” క్షణమాగి సూటిగా నా వంక చూసాడు.

“ఇప్పుడైతే ఊళ్లోనే లేడు. అందుకని,” చెప్పడం ఆపాడు నేనేమంటానోనని..

 

నా కళ్ళకి గోవిందు దేవుడిలా కనబడ్డాడు. ఆగని కన్నీళ్ళే గోవిందుకి   నేను చెప్పగల కృతజ్ఞతలు.

 

“నీ పుస్తకాలు, బట్టలు కూరల సంచీలో పెట్టి తెచ్చాను…

ఆసుపత్రి కాంపౌండులో వాన్ పెట్టి, ఆటోలో రైల్వే స్టేషన్ కెళదాము. గంటలో పాలెంకి రైలుంది. నేను టికెట్లు తీసే పెట్టాను. మీ ఊళ్ళో దిగాక నిన్ను మీ కొట్టాం దారి పట్టించే వరకు నేను తోడుంటాను,” అన్నాడు గోవిందు….

egire-pavurama14

**

అరపూట ప్రయాణమయ్యాక పాలెం చేరాము…..

“మీ తాత కొట్టాంలో ఉంటాడా? లేక గుడిలోనా ?” అంటూ కొట్టాం వైపే మళ్ళించాడు ఆటోరిక్షాని గోవిందు.

పది నిముషాల్లో కొట్టాంకి కాస్త పక్కగా ఆగింది ఆటో.   దిగి గోవిందు వైపు చూసాను. ఏమనాలో తోచలేదు. “ఇక లోనికెళ్ళు,” అంటూ నా బ్యాగు ఆటో డ్రైవర్ భుజాన వేసాడు.

 

కదిలి వెళ్ళి కొట్టాం వాకిట్లో ఆగాను. లోన అలికిడిగానే ఉంది…బ్యాగు లోపల పెట్టి ఆటోడ్రైవర్ వెళ్ళిపోయాడు.

కొద్ది క్షణాలాగి కొట్టాంలో అడుగు పెట్టాను.

**

లోన పదిమంది వరకు జనం ఉన్నారు. చుట్టూ చూస్తే ఎక్కడా తాత జాడ లేదు. ఓ వైపుగా పిన్ని, బాబాయి అటుగా తిరిగి చాప మీద కూచుని, కళ్ళు మూసి చేతులు జోడించి ఉన్నారు. వారికి కాస్త వెనుకగా రాములు కూడా కూచునుంది. సాతానయ్య మంత్రాలు చదువుతున్నాడు. నాకు గుండె జారినట్టయింది. నా కట్టెకాలు సాయంతో మరో నాలుగడుగులు ముందుకేశాను.

అప్పుడు కనబడింది. నేల మీద ముగ్గు మధ్యగా పరచిన బియ్యం మీద తాత పటం పెట్టుంది. పటానికి పూల మాల వేసుంది. పటం ముందు దీపం వెలిగించుంది.

పిన్ని, బాబాయి చేతులు జోడించింది తాత చిత్రపటం ముందని అర్ధమయింది.

గుండెలు పగిలేలా ఆక్రోశించింది నా ప్రాణం. “తాతా ! నీ కోసమే నేనొచ్చాను,

నువ్వు రమ్మన్నావని నేనొచ్చాను,” అని గుండెల్లోంచి బిగ్గరగా కేకపెట్టాను.

నా కేకకి నా గుండెలవిసిపోయాయి. నేలమీద కుప్పలా కూలిపోయాను.

నా ఆసరా కర్రలు కూడా నన్నాదుకోలేక పోయాయి.

కింద పడ్డ నా కర్రల చప్పుడుకి పిన్ని, బాబాయి వెనుతిరిగి చూశారు.

పరుగున నా వద్దకు వచ్చింది పిన్ని…

**

నా కోసం, నా రాక కోసం పరితపించిన తాత, నెల రోజులుగా ఆహారమే తీసుకోలేదంట. ఆరునెల్లగా తాత కంటి చూపుతో పాటు ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందంట. తీవ్ర ఆమ్లత వల్ల కడుపు నొప్పితో బాధపడ్డాడంట. ఆఖరి వారం రోజుల పాటు ఏ మందులకీ ఆగని వాంతులతో చాలా నీరసించి చనిపోయాడంట తాత.­­

 

రాత్రింబగళ్ళు బాధతో, దుఃఖంతో గడిపేస్తున్నాను… రాములు, పిన్ని పక్కనే ఉండి ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

**

తాత చనిపోయి పన్నెండు రోజులయింది. ఇవాళ తాత తద్దినాలు. నిద్రపట్టక, తెల్లారుజామునే లేచి మంచం మీద కూచుండి పోయాను. పదమూడో రోజు కొట్టాంలోనే శాంతిభోజనాలు పెడుతున్నారు పిన్ని, బాబాయి వాళ్ళు.

చంద్రం పిన్ని నా కాడికి వచ్చి, నా మంచానికి ఎదురుగా ఉన్న చెక్క బీరువా నుండి చీర, గాజులు తీసి కట్టుకోమని మంచం మీదెట్టింది.

తలెత్తి పిన్ని వంక చూసాను. పక్కన కూర్చుని నా భుజాల చుట్టూ చేయి వేసింది.

ఇద్దరం దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము.

 

పిన్నే ముందు తేరుకుంది.

“తాత నీ పద్దెనిమిదో పుట్టినరోజుకని ఈ చీర కొని ఉంచాడురా, గాయత్రి.

అంతే కాదు. గత మూడేళ్ళగా నీ పుట్టిన రోజుకని చీరలు, గాజులు కొనిపెడుతూనే ఉన్నాడు.

అందుకే తాత ఆత్మశాంతికి ఇయ్యాళ ఇది కట్టుకొని ఈ గాజులేసుకో,” అంది పిన్ని.

 

నాలుగేళ్ళగా నా పుట్టినరోజుకంటూ చీర, సారె కొని ఉంచిన తాత నాపై ఎంత ఆపేక్ష పెంచుకున్నాడో అర్ధమయి కుమిలిపోయాను.

తాత పెద్దదినం అయ్యేంత వరకు, ఓ ప్రాణమున్న శిలలా భారంగా గడిపాను. తాత పట్ల నేను వ్యవహరించిన తీరుకి నాలో గూడుకట్టుకున్న పశ్చాత్తాపం వెల్లువైంది.

**

రాములు నన్ను కనిపెట్టుకొని ఉంటుంది.   వంట చేసి, నాకు చెప్పి పొద్దున్నే గుడికి వెళుతుంది. సాయంత్రం చీకటయ్యాక ప్రసాదాలు తీసుకొనొస్తుంది.

నాకు రోజంతా తోచకుండా అయిపొయింది… బయట కొట్టాం చుట్టూ, రెండు మూడు సార్లు తిరిగొస్తున్నాను…..

 

గత మూడేళ్ళగా, కొట్టాం కూడా మరమత్తులు చేయించి, వీలుగా ఉండేలా కొద్ది మార్పులు చేయుంచాడు, తాతని తెలుస్తూనే ఉంది.

తడికలు తీసి చెక్కలు, పెట్టించాడు.

గదిలో చెక్క బీరువా, పక్కనే నిలువాటి అద్దంతో సహా పెట్టించాడు.

పొయ్యి కాడ స్థలం, ఎనకాతల స్నానాల గది కూడా మెరుగయ్యాయి.

కొట్టాం చుట్టూ రాళ్ళతో అరగోడ కట్టించి చిన్న గేటు, గొళ్ళెం కూడా పెట్టించాడు.

 

అరుగు మీద కూచుని, రాములు తెచ్చిన సనక్కాయలు వోలుస్తుండగా వొచ్చింది చంద్రం పిన్ని.

పొయ్యుకాడ నుండి చాటలో బియ్యం తెచ్చుకుని, ఎదురుగా కూచుంది.

“మెల్లగా నీ దుఃఖాన్ని మరిచిపోవాలి. నీ వెంట బోలెడన్ని పుస్తకాలున్నాయిగా! చదవడం మొదలెట్టు… బాబాయికి చెప్పి ఇంకా పుస్తకాలు తెచ్చుకునే దారి చూద్దాం. సరేనా?” అంది.

అలాగేనని తలూపాను…

 

“అసలు ముఖ్యమైన సంగతి ఒకటుందిరా గాయత్రీ. మీ తాత గురించే. ఈ మూడేళ్ళు, ఆ మాత్రమన్నా ఉన్నాడంటే, ఆ పూజారయ్య చలవేరా. సత్యమన్న పట్ల జాలితో, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, గుడిలోనే నీడ పట్టున పూజాసామగ్రి అమ్మకాలికి కూర్చోబెట్టి, అందుగ్గాను గుడి నుండి జీతం ఏర్పాటు చేసాడాయన.

పింఛను కూడా కలిపితే మెరుగ్గానే బతికాడు తాత. తన తదనంతరం ఆ పింఛను నీకు అందేలా రాసి ఏర్పాటు చేశాడు. కొట్టాంలో ఈ మరమత్తులు కూడా చేయించాడు,” అంది పిన్ని.

 

“అప్పట్లో రాంబాబాయితో నువ్వు వెనక్కి వచ్చేసి ఈడ సుఖంగా ఉంటావని ఆశపడ్డాడు సత్యమన్న. కానీ, నువ్వు రాకపోయేప్పటికి కృంగిపోయాడు పాపం. తన బాధ పైకి తెలీనివ్వలేదు.

“నా చిట్టితల్లి తప్పక తిరిగి వస్తది. తిరిగొచ్చాక మాత్రం, దాని బాధలు పోగొట్టి, దాని ఆశలు తీర్చాలి.

మీరంతా కూడా దాన్ని ఎప్పటిలా ప్రేమగా చూసుకోవాలి,” అని మాకు మంచి చెప్పాడు కూడా. నిన్నొక్క మాట అననివ్వడుగా నీ తాత,” అంటూ కంటతడి పెట్టింది పిన్ని.

**

(ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 15

egire-pavuramaa15-banner

ఇప్పుడిప్పుడే నా కొత్త కాలితో నడవగలుగుతున్నాను. రోజూ కాళ్ళకి వ్యాయామం చేస్తూ, ఇదివరకటి కంటే బాగానే కదులుతున్నాను. ఇంకా కనీసం నెలరోజుల వైద్యం మిగిలి ఉంది. కాలు సెప్టిక్ అవకుండా ఇంకా మందులు, వారం వారం ఎక్సరేలు అవుతున్నాయి.

 

మునుపటిలా గోవిందు టెంపోలో కాకుండా, కొత్తకాలి ఆసరాతో, క్రచస్ సహాయంతో, క్యాంటీన్ కి నడిచి వెళ్ళి వస్తున్నాను. నెమ్మదిగా కుంటుతూనే అయినా, కనీసం ఇట్లాగైనా   కదలగలగడం కొత్త శక్తిని, తృప్తిని కలిగించింది.

ఈ రోజుకి ఆపరేషనయ్యి సరీగ్గా ఐదో వారం. కొత్తకాలు వచ్చి మూడో వారం.

మళ్ళీ నెలకి, చర్చ్ లో గోవిందుతో నా పెళ్ళి ఏర్పాట్లు చేసింది కమలమ్మ.

 

రెండు రోజులకోసారి జేమ్స్ వచ్చి నా నిర్ణయం ఏమిటని అడిగి వెళుతున్నాడు. పది రోజుల టైం ఇచ్చాడు వాడు.

వాడు చెప్పిన మూడు దారుల్లో – నాకు మంచిది, శ్రేయస్కరమైనది తాతతో జీవితమే. నేను ఆయనకి చేసిన అన్యాయం, ఆయన మనస్సుని గాయపరిచిన తప్పిదం సరిదిద్దుకునే అవకాశం కావాలి.

కాని, అసలెలా అది సాధ్యమౌనో తెలీడం లేదు.

నాకీ జన్మకి పెళ్ళిగాని, మరొకరి సాంగత్యం గానీ అవసరం లేదు… నాచిన్నప్పటి జీవితం నాకు చాలు…అనిపిస్తుంది…

 

తాతకి నేను రాసిన ఉత్తరానికి జవాబుగా – రాంబాబాయి నాకోసం వచ్చాడని తెలిసిన రోజే, నా మనస్సు పశ్చాత్తాప సందేశంతో, ‘శాంతి పావురంలా’ తాత వద్దకి వెళ్ళిపోయింది.

దానికి మినహా నేనేమి చేయగలను? నా జీవితాన్ని, తప్పుల్ని ఎలా సరిదిద్దుకోగలను? అని నిత్యం మదనపడుతున్నాను. ఏదో ఒక మూల నుండి సహాయం దొరకాలి…

గాయత్రీ అమ్మవారిని నమ్ముకోమని పంతులుగారు అన్నది గుర్తే…..ఆ అమ్మవారినే మననం చేసుకుని ప్రార్ధించుకుంటాను. అలాగే ఆదివారాలు ‘మదర్ తెరెసా’ చర్చికెళ్ళి, ఆ ప్రభువు కాడ నా గోడు చెప్పుకుంటాను…నాకు ధైర్యాన్నిమ్మని ప్రార్దిస్తాను…

 

రాంబాబాయి ఎప్పుడొస్తాడాని ఎదురు చూస్తున్నాను.

రాంబాబాయిని కూడా తిట్టి గోలచేసే కమలమ్మ వైఖరిని ఎలా ఎదుర్కోవాలి? పోనీ ఆమెకి మంచిగా చెప్పి ‘నా దారిన నేను పోతానని నచ్చచెప్పగలనా? ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు.

కాలం నత్త నడకలు నడుస్తుంది…

**

పనయ్యాక సాయంత్రం ఏడు గంటల సమయంలో వాకిట్లో అడుగుపెట్టగానే… ఎదురుగా కనిపించాడు…రాంబాబాయి. వాకిలెదురుగా రేకు కుర్చీలో కూర్చుని ఉన్నాడు…

ఇది ..నిజమా? భ్రమ పడుతున్నానా? అనిపించింది ఓ క్షణం…

లేచి నా వైపు వచ్చాడు బాబాయ్…

ఉద్వేగాన్ని ఆపుకోలేక పోయాను..

ఆయన కూడా కళ్ళు తుడుచుకున్నాడు…

“ఎదిగిపోయావు గాయత్రీ… ఎలా ఉన్నావు? రా కూచో,” అంటూ నాకు దారిస్తూ, పక్కకి జరిగాడు.

 

లోపల, కమలమ్మ, గోవిందు, జేమ్స్ ఉన్నారు. పంచాయతీ పద్దతిలో బాబాయి ఎదురుగా కూర్చుని నాకోసమే చూస్తున్నరులా ఉంది.

 

లోనికొచ్చి, మంచినీళ్ళు తాగిన   కాసేపటికి, వెళ్ళి స్థిమితంగా బాబాయి పక్కన కూచున్నాను.

దాదాపు రెండు నెలల క్రితం నేను తాతకి రాసిన ఉత్తరం గురించి మాట్లాడాడు బాబాయి.

ఆ విషయంగా – కమలమ్మ, జేమ్స్ నుండి, నేను   విన్న విషయాలే మళ్ళీ చెప్పాడు. స్వార్జితమైన తాత పొలం, ఇంటి కొట్టాంల పైన ఆయనకి తప్ప, ఇతర వ్యక్తులకి ఎటువంటి హక్కు ఉండదని చెప్పి, క్షణమాగి, నా వంక చూశాడు రాంబాబాయి…

egire-pavuramaa-15

“చూడు గాయత్రి, ఇలా నలుగురిలో పంచాయతి పెట్టుకునే అవసరమేముంది చెప్పు. నీకు ఆయన తాత. నీ కోసమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నాడు. నీ మంచి కోరే ఏదైనా చేసాడు. చేస్తాడు కూడా. కాబట్టి నీవిప్పుడు చేరవలసింది సత్యమయ్య కాడికే.. అలోచించి ఏ సంగతీ చెప్పు… నా వెంట వచ్చెయ్యి,” అన్నాడు బాబాయ్…

 

“ఇదిగో రాంబాబు…ఏంది నీ మాటలు? మేము ఎంత కష్టపడితే, ఈ మూడేళ్ళు బతుకెళ్ళదీసింది నీ గాయత్రి? వైద్యం సేయించి బాగుసేసినంక, పిట్టలాగా ఎగరేసుకుపోదామని సూస్తుండావా?

ఆ పిల్లకి భరోసా ఇచ్చి, ఆ పొలం-కొట్టాం దానికి కట్టబెట్టి, నిలబడి పెళ్ళి సేయండ్రి. పెళ్ళి కుదిరిపోయింది గాయత్రికి.   వచ్చే నెలలో ఈడనే పెళ్ళి. మర్యాదేమన్నా తెలుసా మీకు?

ఈడనుండి తీసుకెళ్ళతానంటావ్? మళ్ళీ ఆ అమ్మాయిని గుడి మెట్ల మీద అడక్కతినిపిస్తారా? దాని ఆదాయం కోసమేగా ఆ తాత పన్నాగం,” అరిచి వెనక్కి పడినంత పనిచేసింది కమలమ్మ.

 

“అక్క, ఏందే నీ అరుపులు? నెమ్మదిగా ఉండు. పిచ్చి వాగుడు నువ్వూ…మరోమాట మాట్టాడితే ఊర్కోను,” ఆమెని గదమాయించాడు గోవిందు.

వాళ్ళ మాటలతో చెవులు తూట్లు పడుతున్నాయి…

గదిలో కాసేపు….నిశ్శబ్దంగా అయింది..

“చూడు రాంబాబు, …అందరి మాటలు విను. ఆలోచించు…ఏది ఏమైనా గాయత్రికి ఇంకా నెలరోజుల వైద్యం ఉంది.. ఇంతా చేసాక, అది సరిగ్గా పూర్తయ్యేలా చూడ్డం కూడా అవసరం…

ఇప్పుడు గాయత్రి మేజర్.   పెళ్ళి విషయంతో పాటు మరే విషయమైనా ఆమె ఇష్టానుసారమే జరుగుతుంది. ఆమెకి సమయం ఇవ్వండి. తెలివిగా నిర్ణయం తీసుకోనివ్వండి,”…అంటూ ఆగాడు…జేమ్స్.

కాసేపు ఎవ్వరూ ఏమీ అనలేదు…

బాబాయే నోరు విప్పాడు. నావంక సూటిగా చూసాడు.

 

“సరే, గాయత్రి, నిన్ను దేనికీ బలవంత పెట్టద్దని, ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోవద్దని, సత్యమయ్య నాకు మరీ మరీ చెప్పి పంపాడు.

నిన్నల్లరి పెట్టడం ఇష్టంలేకే అప్పట్లో, పోలీస్ రిపోర్ట్ కూడా వద్దన్నాడు,” అంటూ క్షణమాగి, తన జేబు నుండి ఓ కవర్ తీసి నాకిచ్చాడు.

 

“ఉమమ్మ చేత రాయించిన ఈ ఉత్తరం నీకివ్వమన్నాడు తాత…. నా ఎదురుగా చదువుకో… నీవు చదివాకే నేను వెళతాను…ఆ కింద ఉమమ్మ ఫోన్ నంబర్ ఉంది. నా నంబర్ ఉంది. గుడి పంతులుగారి నంబర్ కూడా ఉంది. నీకోసం రాములు, ఉమమ్మ, మీ పిన్ని కూడా ఎదురు చూస్తున్నారు మరి…,” అని ముగించాడు….

 

అదురుతున్న గుండెలతో ఉత్తరం చదవసాగాను.

 

ప్రియమైన గాయత్రీ,

ఇంతకాలానికి నీ నుండి వచ్చిన ఉత్తరం నాకు పట్టలేని ఆనందాన్నిచ్చింది తల్లీ. నీ కాలుకి చికిత్స జరుగుతున్నందుకు కూడా సంతోషం తల్లీ…

మూడేళ్లగా నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆరోగ్యం చెడి ఆశ సన్నగిల్లింది. చూపు ఆనడం లేదు. నిన్ను చూడలేని కంటిచూపు అవసరం లేదులేమ్మా.  

మొదటిసారి నిన్ను చూసింది మాత్రం పెనుతుఫానులో కాలవగట్టున చలికి వణుకుతున్న పసిబిడ్డగా. ఆ రూపం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటాది…

గాలిలో కొట్టుకుంటున్న నీ బుజ్జి చేతులని కాసింత దూరాన్నించి చూడగలిగాను. దగ్గరగా వచ్చి చూస్తే – కక్కటిల్లి నువ్వు ఏడుస్తున్నా, బయటకి వినబడని రోదనే. నిన్ను కదలనివ్వని నలిగి నెత్తురోడుతున్న నీ పాదాలు, కాళ్ళు చూసి, బాధతో తట్టుకోలేకపోయానమ్మా..

 

అరవై ఏళ్ళ ఏకాకినైన నాకు అనాధగా దొరికావు. కళ్ళల్లో దీపాలెట్టుకుని పెంచాను. నీ జీవితంలో పువ్వులు పూయించాలనే, నీ ముఖాన నవ్వులు చిందించాలనే పూజారయ్యని ఆశ్రయించాను. ఆరోగ్యం బాగోక బతుకుతెరువు లేని నాకు, కోవెల్లో కొలువిప్పించి ఆదుకున్నాడాయన.

నువ్వు నాకు దొరికిన రోజే నీ పుట్టిన రోజుగా, నన్ను నీ శ్రేయోభిలాషిగా తాలుకాఫీసులో నమోదు చేయించాడు పూజారయ్య. ‘గాయత్రి’ అని నామకరణం చేసి, కోవెల్లో ఓ స్థానమిచ్చి, నీకు ఓ గౌరవమైన జీవనం కల్పించింది కూడా పూజారయ్యే.

 

నిన్ను చదివించాలని ఆశపడ్డాను. చెప్పుడు మాటలు నమ్మి నన్ను వదిలి వెళ్ళిపోయావు. దగాకోర్ల నుండి నిన్ను కాపాడలేక పోయానే అని కుమిలిపోతుండాను.

 

ఇకపోతే, నీ అవిటితనం నయమయ్యే అవకాశం ఉందని నా నమ్మకం. నీది పసితనంలో అఘాతం వల్ల ఏర్పడ్డ అవిటితనం అని నా గట్టి నమ్మకం. జరగవలసిన నీ వైద్యం కోసం, నీ సొమ్ము కూడా పక్కకెట్టే ఉంచానమ్మా.

అంతేగానీ నువ్వనుకున్నట్టు నీ అవిటితనం మీద యాపారం చేసి బతకాలని కాదు – అని నీకు తెలియ జెప్పాలనే నా తాపత్రయం. పనిచేయలేని పరిస్థితిలో కూడా ఫించను మొదలయ్యాక గాని ఆటో నడపడం మానలేదు. నీ తాత మీద నీకున్న అనుమానం దూరం చెయ్యాలనే ఈ గోడు చెప్పడం.

 

 

ఇప్పటికైనా పాలెంకి తిరిగొచ్చి నేను ఆశ పడుతున్నట్టుగా అందరి మధ్య గౌరవంగా బతుకుతావని ఆశిస్తాను.

నాదైన పొలం-కొట్టాం, అనుభవించే హక్కు పూర్తిగా నీదే తల్లీ.

నీకు కొదవలేకండా ఉండేలా, చేతనైనంతలో   కొన్ని ఏర్పాట్లు చేసాను గాయత్రీ. చదువుకున్నదానివి కనుక నీకు అన్నీ అర్ధమవుతాయి.

నువ్వు అవస్థలు పడవద్దు. అలోచించి తిరిగి వచ్చేయి తల్లీ.

నిన్ను ఈ కళ్ళతో చూసుకునే అదృష్టం నాకు ఉందో లేదో మరి.   ఆ అమ్మవారి కనికరం నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను…

ప్రేమతో,

తాత….(తాత మాటలు రాసింది ఉమమ్మ)

కళ్ళ నుండి తెగబడే నీళ్ళని ఆపుకుంటూ తాత రాసిన ఉత్తరం చదవడం ముగించాను. ఇలాటి దేవుడినా అనుమానించి, అవమానించి పారిపోయాను?

నేనేదో అన్యాయమైపోయానని, తాత నన్ను అవిటిని చేసి, నా సంపాదన తింటున్నాడని అపోహతో మానసికంగా బాధపడ్డ నాది మూగవేదనా?

లేక అనాధనైన నన్ను దగ్గరికి తీసి, గొప్పగా పెంచి ఓ గౌరవమైన జీవితాన్ని ఇవ్వాలనుకుని నా వల్ల మనక్షోభ అనుభవించిన తాతది మూగవేదనా?

నా మేలు తప్ప వేరే ఆలోచనే లేకుండా గత పద్దెనిమిదేళ్ళగా నా ధ్యాసతోనే జీవించి నా మూలంగా ఈ వయస్సులో కూడా వేదన అనుభవించడంలేదా?

ఎన్నో ప్రశ్నలు నన్ను చుట్టేశాయి. ఉత్తరం చదివేసాక కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఉండిపోయాను…

 

అంత వరకు ఎట్లాగో ఓపిగ్గా ఉన్న కమలమ్మ మళ్ళీ నోరెత్తింది.

“సుఖంగా ఉన్న పిల్లని అడ్డమైన ఉత్తరాలతో, మాటలతో ఎంత కష్టపెడతారయ్యా? ఇగ బయలుదేరండి. కాలు బాగయి పిల్లకి పెళ్ళి కూడా అవబోతుందని సెప్పండి… దాని డబ్బు, ఆస్థి ఇస్తామని సత్యమయ్యని కబురెట్టి పెళ్ళికి రమ్మను…,” అంటూ నావంక చూసింది..

“మీ బాబాయేగా, సెప్పు గాయత్రీ,” అంది…

(ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 14

egire-pavuramaa14-banner

డాక్టర్ తో మాట్లాడి, పది నిముషాల్లో తిరిగొచ్చాడు జేమ్స్…

“అంతా సెటిల్ అయింది, నీ కొత్తకాలు కూడా రెండు వారాల్లో వచ్చేస్తుందట. మన ‘అనాధాశ్రమం’ నర్సుతో కూడా మాట్లాడింది డాక్టరమ్మ. నీతో రోజూ వ్యాయామం చేయించమని, అవసరాన్ని బట్టి కట్టు మార్చమని చెప్పింది,” అన్నాడు.

 

“అన్నీ హ్యాపీ న్యూసులే,” నవ్వుతూ తను తెచ్చిన జిలేబి ప్లేట్లో పేర్చాడు.

ఆ ప్లేటు నాకందిస్తూ, “మంచి అవకాశం – కరెక్ట్ సమయం నీతో మాట్లాడ్డానికి,” అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూచున్నాడు.

 

“చూడు గాయత్రి, నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి కోరిక. మొదట్లో తెలీకుండానే, నీకు కిచన్ లో పనిచ్చి, ఆకలిదప్పుల నుండి కాపాడాను.   లేదంటే, నిన్ను రైల్వే స్టేషన్లోనో, గుడిమెట్ల పైనో ఓ బోర్డ్ పెట్టి బిక్షాటన చేయించేది కమలమ్మ.

తరువాత కూడా నిన్ను ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా కాపాడాను. ఎలా అంటే విను.

నీకు ఆ   దద్దమ్మ గోవిందుతో పెళ్ళి చేస్తానంటే, పద్దెనిమిదేళ్ళు నిండని పిల్లకి పెళ్ళి చేసి కష్టాల పాలవ్వద్దని కమలమ్మకి చెప్పి ఆ పెళ్ళి ఆపించానని   నీకూ తెలుసుగా.

మీ తాత నుండి ఆస్తిపై హక్కుకి గాని, పెళ్ళికి గాని మేజర్ అయి ఉండాలన్న విషయం ఆమెకలా చెప్పి, భయపెట్టి, నిన్ను మూడేళ్ళు కాపాడుకున్నాను.

ఇక మూడోది. నాకు ‘మదర్ తెరెసా’ వాళ్ళ పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చాక కూడా, నిన్ను నా కళ్ళెదుట ఉంచుకోడానికనే మీ అందరికీ క్యాంటీన్ లో కొలువులిచ్చి,   నాకాడే పెట్టుకున్నా,” క్షణం ఆగాడు.

 

నా మీదకి వంగి, నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తాడు. నా కళ్ళలోకి చూస్తూ, “వింటున్నావా? నువ్వంటే నాకెంత ఇష్టమో అర్ధమయిందా? ఇంకా చెప్పాలా?” అడిగాడు.

 

దుఖాన్నిఆపుకోవడానికి ప్రయత్నిస్తూ తల వంచుకున్నాను.

నడవలేను, పలకలేను. అలాంటి నాకు ఏమిటీ గోల??? నాకంటే సరయిన ఆడపిల్లే దొరకలేదా వీడికి? వీడి బుద్ధి వక్రించింది.   మామూలు ఆలోచన కాదు వీడిది, అని భయము, గుబులు కలిగాయి….

గొంతు సవరించి మళ్ళీ మొదలెట్టాడు.

“ముఖ్యంగా నీ కాళ్ళకి చికిత్స గురించి   ఆలోచన చేసాను. మనం పనిచేస్తున్నది ధార్మిక సంస్థ కాబట్టి, ముందుగానే, అర్జీ పెట్టి నీ విషయం చర్ఛ్ ఫాదర్లతో మాట్లాడాను. నువ్వు నా సొంత మనిషివని, నేను తప్ప నీకు ఆసరా లేదనీ   వాళ్ళకి చెప్పాను. నీకు కాళ్ళకి వైద్యం అవసరమని విన్నవించాను…

నువ్వు మతం పుచ్చుకొని, నామమాత్రపు జీతానికి రెండేళ్లు పనిచేస్తావని వాళ్ళకి నేను హామీ ఇచ్చాను. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని ఈ కాడికి తెచ్చాను,” అంటూ   మళ్ళీ నా వంక చూసాడు.

 

“ఇకపోతే, అతి ముఖ్యమైన విషయం… నాకు రాబడుంది. ఊళ్ళో రెండు క్యాంటీన్ల అద్దెలొస్తాయి. నేవేసుకున్న నగలు నీకు క్షణంలో ఇచ్చేస్తా. నీకిప్పుడు పద్దెనిమిదేళ్ళు. నువ్వు నా సొంతమవ్వాలి. నిన్ను నాకాడ ఉంచుకొని రాత్రింబవళ్ళు ప్రేమిస్తా, కామిస్తా.

నీవు కుంటివి, మూగవి అయినా పర్వాలేదు. నిన్ను ఉద్దరిస్తాను. నన్ను ప్రేమించి ‘సరే’ అను. చాలు,”   అంటూ ముగించాడు.

లేచి మంచం చుట్టూ పచార్లు చేయసాగాడు…….

 

తమ తమ స్వార్ధాల కోసం కమలమ్మ, జేమ్స్ – వారి ఇష్టానుసారంగా నన్ను బంధించాలని చూడ్డం ఏమిటి…ఈ రకమైన ఇక్కట్లతో బతకాలని కూడా అనిపించడంలేదు.

 

“ఎల్లుండి నేను మళ్ళీ రావాలి ఇక్కడికి. నీ బిల్లు సెటిల్ చేయడానికి జలజ మేడమ్ నన్నే పంపుతారు. ఈ లోగా, నేను చెప్పే మరో సంగతి కూడా విని, మన విషయంగా నీ నిర్ణయం తీసుకో…” అన్నాడు జేమ్స్ మంచానికి దిగువున నిలబడి….

 

చుట్టూ చూశాను. ఎవ్వరూ లేరు.. మూలనున్న ఇద్దరు ముసలి రోగులు కదలకుండా అటు తిరిగి పడుకునున్నారు.

‘ఇంకా ఏమి సంగతని’ వింటున్నాను….

 

తిరిగొచ్చి, జేమ్స్ మళ్ళీ నా మంచం పక్కన కుర్చీలో కూచున్నాడు.

“నీవు ఇక్కడ ఆసుపత్రిలో చేరిన రెండోరోజు, మీ రాంబాబాయి ఈ ఊరొచ్చాడు. కమలమ్మతో గొడవ పెట్టుకొన్నాడు. చిన్నపిల్లవైన నిన్ను తప్పుడు దోవ పట్టించిందని కేకలేశాడు.

మీ తాత పొలం, కొట్టాం స్వార్జితమంట. కాబట్టి   పోట్లాడి దక్కించుకునే అవకాశం నీకైనా లేదని,   ఏదేమైనా నిన్ను వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళతానని ఆమెతో బాగా గొడవపడి గాని ఈడనుండి వెళ్లలేదు,” చెప్పడం ఆపి నా చేయి తన చేతిలోకి తీసుకోబోయాడు.

చేయి వెనక్కి లాక్కున్నాను.

 

ఓ క్షణం మౌనం తరువాత నా వంక సూటిగా చూసాడు….

“అంటే, నీ ముందు మూడే దారులున్నాయి…మార్పే లేకుండా – మీ తాతతో అదే పాత బికారి జీవితం. లేదా నా కింద నౌకరీ చేస్తున్న ఆ దద్దమ్మ గోవిందుని పెళ్ళాడి, బతుకుతెరువు కోసం నా క్యాంటీన్ లో చాకిరీ కొనసాగింపు. ఈ రెండూ కాదని, తెగించి నాకాడ నా ప్రియురాలిగా మంచి రంజైన జీవితం… ఏది కావాలో ఎన్నుకో,” అన్నాడు వికారంగా నవ్వుతూ వాడు.

“పోతే, మీ బాబాయికి నీ కాలు-చికిత్స గురించి వివరించి, మళ్ళీ నాలుగు వారాలకి రమ్మన్నాను. సర్దిచెప్పి నేనే ఆ రోజు బస్ స్టాండు వరకు దింపానతన్ని. లేదంటే ఇక్కడే తిష్టేసి కమలమ్మతో యుద్దానికి సిద్దమయ్యాడు,” చెప్పడం ముగించి, మళ్ళీ ఎల్లుండి కనబడుతానంటూ వెళ్ళిపోయాడు… జేమ్స్ గాడు….

 

నా మనస్థితి అల్లకల్లోలమయ్యింది…రాంబాబాయి రాక, జేమ్స్ పోకడ – అంతా అయోమయం. … తాత ఎలా ఉన్నాడో? ఎవరు చెబుతారు? కమలమ్మతో బాబాయి గొడవపడ్డాడా? ఏమన్నాడో? నెల రోజులకి తిరిగి మళ్ళీ వస్తాడా బాబాయి?

తాతదంతా స్వార్జితమంటే? చెప్పుడు మాటలు నమ్మి, అప్పట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానా? నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నానా?

‘తాత నుండి మళ్ళీ కబురు’ అంటూ మొన్న గోవిందు ఏదో అనబోయాడు … అని గుర్తొచ్చింది.

గోవిందు ఏమన్నా చెబుతాడేమో…. అడగాలి… ఆగి చూడాలి ఏమి జరుగుతుందో?

వళ్ళంతా చెమటలు పట్టేసింది…

egire-pavuramaa-14

“ఇదిగో పట్టమ్మాయి, కాస్త నీ అంతట నువ్వు పక్కకి తిరగ్గలవేమో చూడు, కాఫీ తాగి మందేసుకో,” అంటూ వచ్చింది ఆయమ్మ.

**

వారం రోజులుగా మళ్ళీ క్యాంటీన్ పనిలోకొచ్చాను.   కాలు నొప్పి తగ్గింది. మరో వారమో రెండో గడిస్తే, నాకు కొత్తకాలు కూడా వస్తుంది.

రోజూ మార్కెట్ నుండి కూరలు, వెచ్చాలు దింపి వెళ్ళిపోయే గోవిందు, ఇప్పుడు కిచెన్లో నా కాడికొచ్చి, ఎలా ఉన్నానని కనుక్కుని పోతున్నాడు.

అనాధాశ్రమం నర్స్ వచ్చి రోజూ నా కాలు ఓ మారు చూసి, డాక్టరమ్మ సూచనలందుకొని బ్యాండేజీ మార్చి వెళుతుంది.

జేమ్స్ మాత్రం రెండు రోజులుకోసారి దగ్గరగా వచ్చి, నా భుజం మీద చేయి వేసి, “ఎలా ఉంది కాలు నొప్పి,” అంటూ నా కాలు, పాదాలు వొత్తి పళ్ళికిలించి వెళ్తున్నాడు.

నేనేదో తన సొంత ఆస్థినన్నట్టు మాట్లాడి కళ్ళెగరేసి పోతాడు.

 

ఓ మధాహ్నం గోవిందుని దగ్గరికి రమ్మని పిలిచాను…వచ్చి పక్కనే నిలుచున్నాడు.

“తాతనుండి ఏదన్నా జవాబు వచ్చిందా? బాబాయి ఓ సారి వచ్చెళ్ళాడని తెలుసు… మళ్ళీ కబురేమన్నా అందిందా?” సైగలతో వాకబు చేసాను.

 

“ఇదిగో, సూడు, నీవేమీ బెంగెట్టుకోకు. మీ బాబాయి మళ్ళీ తప్పక   వస్తాడు.   అన్నీ సర్దుకుంటాయి,” అనగానే ఒక్కసారిగా ఏడ్చేసాను.

నన్ను ఓదార్చడానికి చాలా కష్టపడ్డాడు గోవిందు….

“ఏడవమాకు గాయత్రీ.   అన్నీ బాగానే ఉంటాయిలే. నేను సెపుతున్నాగా. నా మాట ఇని కళ్ళు తుడుచుకో,” అంటూ సముదాయించాడు గోవిందు.

**

నాకు కొత్త కాలు పెట్టే రోజు.

కమలమ్మని తోడు తీసుకొని, ‘అనాధాశ్రమం’ వారి వాన్ లో ఆసుపత్రికి బయలుదేరాను. ‘మదర్ తెరెసా’ వారి ఇతరత్రా పనులు కూడా ఉన్నాయంటూ జేమ్స్ కూడా ఆఖరి నిముషంలో వాన్ ఎక్కాడు.

కొంత దూరం వెళ్ళాక మాటలు మొదలు పెట్టింది కమలమ్మ.

 

“చూడు గాయత్రీ, నీవు రాసిన ఉత్తరం అందుకొని మీ బాబాయిని పంపాడు మీ తాత. నీవు ఆపరేషనయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చి సచ్చాడులే మీ రాంబాబాయి.   కల్లు తాగిన కోతిలాగా నానా యాగీ చేసి నా మీద రంకలేసి పోయాడు. నీ తాత ముసలాడు నీకు ఒక్క కానీపైసా కూడా ఇచ్చేది లేదంట,” కోపంతో ఊగిపోయింది కమలమ్మ.

 

మంచినీళ్ళు సీసా అందించి, ఆమెని నెమ్మది పరిచే ప్రయత్నం చేసాడు జేమ్స్…నీళ్ళ సీసాలో నుండి గుక్కెడు తాగిందామె.

 

“వాడట్టా అన్నంతమాత్రాన ఏంకాదు… నువ్విప్పుడు మేజర్ కాదా…నివ్వు గట్టిగా నీ మాట మీద నిలబడితే, ఆ దిక్కుమాలిన పొలం, కొట్టాం నీకొచ్చి తీరుతాది… నువ్వు గాక ఎవరున్నారు వాడికి?” క్షణమాగింది..

 

“అయినా గాయత్రి, ఇదంతా ఒకెత్తైతే – నేను, గోవిందు ఎంత త్యాగం సేసి నిన్ను ఈ కాడికి తెచ్చామో నువ్వు గుర్తెట్టుకోడం మరో ఎత్తనుకో….నీ డబ్బు, దస్కం వచ్చాక కూడా నీ కాడ ఊడిగం సేస్తాం మేము. ఇప్పటి వరకు మేము సేసిన కష్టం మరిసిపోమాకు.

మళ్ళీ ఎప్పుడో దాపురిస్తాడు నీ బాబాయి.   గట్టిగా తిప్పికొట్టి రానని నిక్కచ్చిగా సెప్పేయి. నీ డబ్బు ఇప్పించుకో,” అని ముగించింది…

అలిసిపోయి వెనక్కి వాలింది.

 

“ఆ అమ్మాయికి అన్నీ అర్ధమవుతాయిలే కమలం.   సరయిన నిర్ణయం తీసుకుంటుంది,”   నా వంక చూసి కన్ను గీటి ఇకిలించాడు జేమ్స్.

నేనూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను.

 

కమలమ్మ మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి.

‘నాకన్నీ గుర్తే కమలమ్మా’ అనుకున్నాను.   మరువలేని సంఘటనలు ఒకటా రెండా?’ ఈ ఊరు చేరిన మొదటి వారం, ఎప్పటికైనా మరువగలనా?

కొత్తూళ్ళో రైలు దిగి సత్రంలో చేరాక,   మొదటి రెండు రోజులు మాత్రమే నాతో మామూలుగా మసిలారు అక్కాతముళ్ళు. తరువాత నా పాటికి నన్నొదిలి రోజంతా వెళ్ళిపోయేవారు….

వారం పాటు ఆకలితో మాడిపోయాను…గది బయట ఉన్న నీళ్ళకుండ నుండి తాగునీరుతో దప్పిక, ఆకలి కూడా తీర్చుకున్నాను.

 

వారమయ్యాకే నోరు విప్పి నాతో మాట్లాడింది కమలమ్మ.

నాకు మేలు చేయాలని ఉన్నట్టుండి అన్నీ వదిలి ఊరు మారడంతో, తమ జీవనం దిక్కులేకుండా అయిందని, అందుకే బతకుతెరువు వెతుక్కోడానికి తిరుగుతున్నామని, ఎడంగా కూచుని పెద్ద గొంతుతో   చెప్పింది.

 

నీరిసించిపోయున్న నన్ను, ఆ రోజు గోవిందే దగ్గరగా వచ్చి పలకరించాడు. తనకి సత్రంలోనే ఏదో పని దొరికేలా ఉందని చెప్పి, తన వద్దున్న అరడజను అరటిపళ్ళ నుండి రెండు నాకిచ్చాడు.

నాకు తెలిసి వారంపాటు తిండిలేకుండా ఉన్నది అదే మొదటి సారి..

 

ఆ రాత్రి పడుకునే ముందు నా పక్కన చేరింది కమలమ్మ…

”ఇదో సూడు గాయత్రీ, వాడా ఏదో సంపాదిస్తాడు. నేను పక్కనే ఉన్న అమ్మగార్ల కాన్వెంట్ లో స్వీపర్ గా సేరాను. నన్నాడ కొలువులో పెట్టినాయన ప్రహ్లాద జేమ్స్. ఆయన ఈడ సత్రం కాంటీన్ తో పాటు ఎదురుగా ఉన్న టీ బడ్డీ కూడా నడుపుతాడు. అతనే సొంతదారు, వంటవాడు కూడా.

అతని కాడ వంటింట్లో నీవు పని సేస్తావని ఒప్పుకున్నాను. అలాగైతే, మనకి రెండు పూటలా తిండి ఆడనుండే ఇస్తాన్నాడు. కాఫీలు టిఫిన్లు అన్నీ ఫ్రీ. రేపు పొద్దున్న ఐదు గంటలనుండే పప్పులు రుబ్బడంతో నీపని మొదలని అన్నాడు.   ఇక పడుకో,” అంటూ నా పక్కనే అటు తిరిగి పడుకొంది.

అట్లా ప్రహ్లాద్ జేమ్స్ మా జీవితాల్లో ప్రవేశించాడు….

 

శబ్దం చేస్తూ వాన్ ఆసుపత్రి ముందు ఆగడంతో నా ఆలోచనల నుండి బయట పడ్డాను.

**                                                                          (ఇంకా ఉంది)

 

 

ఎగిరే పావురమా! – 13

egire-pavuramaa13-banner

ఆలోచిస్తూ ఆయమ్మ పెట్టెళ్ళిన బన్ను తిని నీళ్ళు తాగాక వెనక్కి జారిగిల బడ్డాను…

 

మొదటినుండీ నా పట్ల ఈ అక్కాతమ్ముళ్ల వైఖరి తలుచుకొని మనసంతా హైరానాగా అయిపొయింది….

పాలెం వదిలేసి, రైలెక్కి అరపూట ప్రయాణం చేసాక, ‘రాణీపురం’ అనే ఈ ఊళ్ళో దిగిన దగ్గరినుండి…వారి పోట్లాటలు, వాదులాటలతో మనసుకి శాంతన్నది లేకపోవడం ఒకెత్తయితే, నేనెదుర్కున్న ఇబ్బందులు, నిస్సహాయతలు మరో ఎత్తు.

గుర్తు చేసుకోగానే, కన్నీళ్లు ఆగలేదు……

 

“ఏమ్మాయి చాలా నొప్పిగా ఉందా కాలు? ఏడ్చేస్తున్నావు,” అంటూ మందులందించింది ఆయా.

 

‘డాక్టరమ్మ వచ్చే టైం’ అంటూ నా కాలి కట్టు మార్చి వెళ్ళిందామె.

**

పొద్దున్న తొమ్మిదవుతుండగా, నన్ను డాక్టరమ్మ పరీక్ష చేసేప్పుడు వచ్చారు కమలమ్మ, గోవిందు. కాస్త ఎడంగా బెంచీ మీద కూచున్నారు.

 

తను రాసిన కొత్త మందులు వెంటనే మొదలెట్టమని నర్సుకి చెప్పి,

“మీ పెద్దవాళ్ళెవరన్నా వచ్చారా?” అనడిగింది డాక్టరమ్మ.

అది విన్న కమలమ్మ లేచి గబగబా మంచం కాడికొచ్చింది….

 

“చూడండమ్మా, అమ్మాయి ఆరోగ్యంగా ఉంది కాబట్టి బాగానే కోలుకుంటుంది.. ఎల్లుండి ఇంటికి వెళ్ళవచ్చు… మళ్ళీ వారానికి తీసుకు రండి. చూస్తాను. ఆ పై వారానికి కొత్తకాలు కూడా వచ్చేస్తుంది… అంతా బాగుంటే, దాన్ని అమర్చే విషయం చూడవచ్చు,” అందామె కమలమ్మతో…..

 

“పోతే గాయత్రి, కూర్చుని ఏ పనైనా ఎంత సేపైనా చేయవచ్చు.   అప్పుడప్పుడు మాత్రం నీ క్రచ్చస్ తోనే కాస్త తేలిగ్గా అటు ఇటూ మెసలాలి. మందులు   మాత్రం ఇంకా వేసుకోవాలి. నీకు సాయం చేయడానికి ఎవరైనా ఉంటారుగా!” అడిగిందామె నన్ను.

 

“ఎందుకుండమూ? ఎవరో ఒకరు కంటికి రెప్పలా కాసుకునుంటామమ్మా,” పలికింది కమలమ్మ.

డాక్టరమ్మ వెళ్ళాక నా దగ్గరగా వచ్చాడు గోవిందు.

“ఈడ ఉన్నన్నాళ్ళు నీకు పొద్దుపోతదని ఈ పుస్తకాలు తెచ్చా,” అంటూ రెండు పత్రికలందించాడు.

 

ఎదురుగా కూచుని నా చేయి తన చేతిలోకి తీసుకొంది కమలమ్మ…

“ఇదో గాయత్రి, రెండు రోజులు కాస్త నిమ్మళంగా ఈడనే ఉంటావుగా!

బాగయిపోతావుగా! నువ్వు క్యాంటీన్ లో పనికి లేవని, పాపం జేమ్స్ ఇబ్బంది పడుతున్నాడు…

ఇయ్యాల జేమ్స్ అసలు మాతో రావాల్సింది. నిన్ను చూడలేదని చాలా ఆతృత పడుతున్నాడు.   ఏదో పని తగిలిందంట. తనకోసం ఆగొద్దని మమ్మల్ని పంపాడు.   మేము తిరిగెళ్ళి   అతనికి వాన్ అప్పజెప్పాక, ఏదో ఒక టైంకి వస్తాన్నాడు,” అంది.

 

….ప్రహ్లాద్ జేమ్స్… నన్ను చూడ్డానికి ఒక్కడే వస్తాడనగానే, నాకు కడుపులో తిప్పేసింది…

అందరితో కలిసి ఎందుకు రాలేదు? అట్లా రాడు. శని లాగా ఒక్కడే వస్తాడు. అవకాశం దొరికితే వెకిలి వాగుడుతో నరకం చూపిస్తాడు కూడా అని తలుచుకోగానే మనసంతా అసహ్యంతో నిండిపోయింది…

‘నేను ఒంటరిగా దొరికితే, వాడి వెటకారం నుండి, వాడి అసభ్యకర మాటల నుండి ఎలా తప్పించుకోవాలి?… నాలాంటి అవిటిని కూడా వేధించే వాడిది ఎంతటి దిగజారిన మనస్థితి!!…

కోపంతో నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

“ఏందాలోచిస్తుండావు? ఏమన్నా తింటావా?” అడిగాడు గోవిందు మంచం ఎదురుగా నిలబడి..

ఏమొద్దని సైగ చేసాను…

అయినా, ఇప్పుడే వస్తానని బయటకి పోయాడు గోవిందు.

కాస్త అవతలికి పోయి, చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లల్లో పడ్డది కమలమ్మ. ఆమె గొంతు బిగ్గరగా వినబడుతూనే ఉంది.

నన్ను జేమ్స్ కాడ పనికి పెట్టిన ఆమెకి గాని, టెంపోలో కూరలు, సామగ్రి తెచ్చాక, రోజూ క్యాంటీన్ లోనే తినెళ్ళే గోవిందుకి గాని – జేమ్స్ మాటలతో నన్ను వేధిస్తాడని – తెలీదు..

రోజూ సాయంత్రం ఏడింటికి, అతికష్టంగా పని ముగించి, మా ముగ్గురికి రాత్రికి సరిపడా తిండి తీసుకొని బయటపడేదాన్ని మొదట్లో, సత్రం క్యాంటీన్ లో పని చేసినన్నాళ్ళూ.

 

సాగుతున్న ఆలోచనలు గోవిందు పిలుపుతో ఆగాయి…. ఎదురుగా చేతిలో తిండి పోట్లాలతో నిలబడి ఉన్నాడు…

పక్కనే ఉన్న గుడి నుండి పులిహోర, దద్దోజనం ప్రసాదాల ప్యాకట్లంట, మంచం పక్కన స్టాండ్   మీదెట్టాడు.

వాటితోపాటు తెచ్చిన కుంకుమ వీభూతి పొట్లాలు మాత్రం నాచేతుల్లో పెట్టాడు.

ఎంతో అపురూపంగా అనిపించింది దేవుని కుంకుమ బొట్టు.

 

క్రైస్తవ మతం పుచ్చుకొని, ‘మదర్ తెరెసాలో’ పని చేయడం మొదలైనాక మొహాన బొట్టు పెట్టనే లేదు.

కుంకుమ నుదిటిపై   పెడుతూ తాతని గుర్తు చేసుకున్నాను….

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….

“మీ తాతకి ఉత్తరం రాసావుగా! నీ కొత్తకాలు పెట్టే లోగా ఆడనుండి మళ్ళీ ఏదో ఒకటి తెలుస్తాదిలే…,” అంటూ గోవిందు ఇంకా ఏదో చెప్పేలోగా కమలమ్మ వచ్చింది.

 

“ఇక పోవాలిరా గోవిందూ,” అంటూ దగ్గరగా వచ్చి నా పక్కన కూచుంది. కమలమ్మ…

 

నా వంక చూస్తూ, ”ఇదో గాయత్రీ, జేమ్స్ వచ్చినప్పుడు, ఇక మూడు రోజులకి పనిలోకొస్తాని అతనికి భరోసా ఇవ్వు…. సైగలతోనే మంచిగా సెప్పు. మేము మళ్ళీ రేపో ఎల్లుండో కనబడతాము,” ఒకింత ఆగి, నా వంక తేరిపార చూసింది.

“బొట్టెడితే మునపటి గాయత్రిలాగే ఉన్నావు. ఇక్కడున్న ఈ రెండురోజులు సక్కగా పెట్టుకో,” అంటూ లేచి గోవిందుతో పాటు వెనుతిరిగింది కమలమ్మ.

 

ఆమైతే, ఏనాడూ బొట్టు, పూలు పెట్టదు. గుళ్ళో కొలువుకొచ్చాకే, చిన్న నల్ల బొట్టెడం మొదలెట్టానంది అప్పట్లో.

ఊరు దాటగానే అదీ తీసేసింది. తనకసలు బొట్టు, పూలు, పెళ్ళి, పిల్లలు, సంసారం అంటే గిట్టదని ఓ మారు మాటల్లో అన్నది కూడా….

 

అన్నీ ఎడమతం చేష్టలు, వింత పోకడలే కమలమ్మవి. అందుకే జేమ్స్ కి నేను మంచిగా భరోసా ఇవ్వాలని చెప్పి మరీ వెళుతుంది. అవసరమా? తెలిసిందేగా నేను వెంటనే ఆ కిచెన్లో వంట-వార్పు – చాకిరీ మొదలెట్టాల్సిందేనని…మళ్ళీ భరోసా ఇచ్చేదేముంది!

 

గుండెలు, కడుపు రగిలిపోతుంటే గబగబా గుడి పులిహోర తిని, నర్సు ఇచ్చిన నీళ్ళ కాఫీతో కొత్త మందు వేసుకుని వాకిలి వైపుగా తలగడ మీదకి ఒరిగాను.

 

జేమ్స్ మీద అసహ్యం, వాడు ఎప్పుడొస్తాడో అన్న భయంతో అయోమయంగా అనిపించింది.

అసలతను మా జీవితాల్లోకి ఎలా వచ్చాడని గుర్తు చేసుకున్నాను.

సత్రంలో క్యాంటీన్ వోనర్ అయిన జేమ్స్ కాడికెళ్ళి, ఊరికి కొత్తగా వచ్చిన మాకు దారి చూపెట్టమని కమలమ్మ మొర పెట్టుకోడం, లేదనకుండా అతను ముగ్గురికీ బతుకుతెరువు చూపించడంతో మొదలైంది, అతనితో సంబంధం.

egire-pavurama-13

ఇంకేముంది….నా గురించిన సంగుతులన్నీ కమలమ్మ నుండి విన్నాక, జేమ్స్ మా అందరి బలహీనతలు తెలుసుకుని చనువు తీసుకున్నాడు. మొదట్లో జాలిగా ఉన్నా, నాపట్ల వైఖరి మారింది. చెప్పుకోలేని ఇబ్బందులు మొదలయ్యాయి.

టైం దొరికితే పుస్తకాలు-పత్రికలూ చదవాలనుకునే నాకు, పక్కన చేరి, తను భార్యని ఎందుకు వదిలేసాడో, మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదో చెప్పడం మొదలెట్టాడు. అతని సొంత విషయాలు వినడానికి విసుగ్గా ఉండేది.

జేమ్స్ చేయి తిరిగిన వంటవాడే. కొత్తల్లో నాకు వంట నేర్పించే సాకుతో అవసరానికి మించి చేరువగా ఉండేవాడు.

నాతో పాటు పనిచేసే ‘జాన్వి’ టిఫిన్ పొట్లాలు టీ బడ్డీకి జారవేసే సమయాల్లో నాతో బాతాఖానీ వేసేవాడు…. చేతులు, మెడలు పడతానని వెంట పడేవాడు. నా రంగు, నా జుట్టు, నా తేనె రంగు కళ్ళని పొగిడేవాడు.

కొత్తపత్రికల మధ్యలో అసభ్యకరమైన బూతు పుస్తకాలు పెట్టి చదువుకోమని ఇచ్చేవాడు.

ఇలాంటివన్నీ వార్తల్లో, పత్రికల్లో చదువుతూనే ఉన్నాను.   నా పట్ల అతడి వెకిలితనం అర్ధమయిపోయింది…

 

ఇట్లాంటి అడ్డమైన పన్లు   చేస్తున్నా, వాడిని ఏమీ చేయలేక పోయాను. ఎవరికి ఎలా చెప్పగలను. నేను చెప్పినా కమలమ్మ నమ్మదు. కమలమ్మకి జేమ్స్ దేవుడుతో సమానం.

అతడు నా భుజం మీద చేయి వేస్తే, ఒకటి రెండు సార్లు విదిలించాను. దూరంగానే ఉండమని తెలియజెప్పాను. అంతకంటే ఏమి చేయలేని దుస్థితి నాది…

పైగా ఆ కొలువు చేయకపోతే, నా గతేంటి?.. ఆ కొలువు వల్లే మాకు తిండి ఖర్చు లేకపోగా, మొదట్లో ఏడాదిపాటు టీ బడ్డీ వెనకాతల ఉన్న ఓ రేకుల గది, వంటిల్లు బాత్ర్రూం సహా మాకు ఉండడానికి ఇచ్చాడు. …..

 

వాడి ఆగడాల్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి, సత్రం కొలువుతో మొదలైంది.

రెండేళ్లగా మాత్రం ‘మదర్ తెరెసా’ కిచెన్లో, హెల్పర్స్ ఉండడంతో, వాడికి నన్ను వేధించే అవకాశాలు తగ్గాయి.

 

ఇలా ఆలోచనలు సాగుతున్నా, కళ్ళు మూసుకుపోతున్నాయి..కాలు నొప్పి కాస్త తగ్గినట్టే అనిపించింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను…

**

“గాయత్రీ, ఇక లే మరి. చాలా సేపయిందట నీవు నిద్రకి పడి,” అంటూ నా చెవిదగ్గరగా వినిపించడంతో, మెల్లగా కళ్ళు తెరిచాను. నా భుజంపై చేయి వేసి రాస్తూ మంచానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు జేమ్స్…

ఒక్కసారిగా కుంచించుకుపోయాను.

భుజం మీద చేయి తీసేసి, లేచి కూచోవాలని ప్రయత్నించాను. కుదరలేదు.   ఆయమ్మ కోసం, చేతికందిన సత్తు గ్లాసుతో బల్లమీద నాలుగు సార్లు శబ్దం వచ్చేలా గట్టిగా కొట్టాను.

నా చేతి నుండి గ్లాసందుకొని, “చూడు, లంచ్ చేసి రమ్మని నేనే ఆయాని పంపాను. నేనొచ్చి ఇరవై నిముషాలయింది. పక్కకొదిగి, ముద్దుగా గువ్వపిట్టల్లే పడుకున్న నిన్ను   చూస్తూ కూర్చున్నాను. బొట్టు పెట్టుకొని చాలా కళగా ఉంది నీ ఫేస్.

ఈ రోజున, మన అసిస్టెంట్ కి డ్యూటీ అప్పజెప్పి సెలవు తీసుకున్నా. ఆయమ్మ రాగానే నిన్ను కూర్చోబెట్టి, లంచ్ తినిపిస్తూ కబుర్లు చెబుతా కూడా,” జేమ్స్ అంటుండగానే వచ్చింది ఆయా.

 

చేతిలో నోట్లు అతినికందించి, “ఏం చేయమంటారు సారూ,” అడిగింది.

ఇద్దరూ కలిసి నన్ను పైకి లేపి కూర్చోబెట్టారు..చుట్టూ కలియజూసాను. గది సగానికి పైగానే ఖాళీ అయింది. దూరంగా ఇద్దరు ముసలాళ్ళు పడుకునున్నారు. మిగతా రోగులు డిస్చార్జ్ అయ్యారేమో!

 

“తిని మందేసుకున్నాక, ఆయాని నీ పక్క మార్చమంటావా లేక ఇప్పుడే సర్దమంటావా? నేను పక్కకెల్తాలే,” అన్నాడు జేమ్స్….

 

‘లేదు తిని మందేసుకుంటానని’ సైగ చేసాను. నేను తినేస్తే, వాడు త్వరగా పోతాడేమోనని..

 

“సరే అయితే. గాయత్రికి నేను తినిపిస్తాలే, నువెళ్ళి పక్కనే ఉండు,” అన్నాడు ఆయాతో.

తెచ్చిన క్యారేజీ విప్పాడు. ప్లేట్, గ్లాస్, ఫ్లాస్క్ బ్యాగ్ నుండి తీసాడు.

 

“సేమియా ఉప్మా, పెరుగువడ, జిలేబి…నీకోసం…స్వహస్తాలతో పోద్దుటినుండి నేనే చేశా,” అంటూ ప్లేట్లో సర్డాడు.

నాకు దగ్గరగా చేరి, తినిపించసాగాడు. రెండు సార్లు అయ్యాక, నేనే తింటానని పళ్ళెం లాక్కున్నాను.

“సరే, అంతా తింటే గాని ఒప్పుకోను,” అన్నాడు జేమ్స్ నవ్వుతూ నా ఎదురుగా కూచుని.

 

వాడెందుకలా మెడలో లావుపాటి బంగారు గొలుసు, పది వేళ్ళకి బంగారు ఉంగరాలు, ఓ చేతికి బంగారు కడియం, మరో చేతికి బంగారు రంగు రిస్ట్ వాచి అలంకరించాడో తెలియడం లేదు.   తెల్లటి సిల్క్ లాల్చీ వేసాడు. వాడి దగ్గర ఘాటుగా అత్తర్ల వాసనలు…

పెద్ద పొట్ట, వెకిలి నవ్వు, బట్టతల, చెంప మీద కత్తి గాటు. పెద్ద రౌడీలా ఉంటాడు.

వాడి రూపం, వేషం కడుపులో తిప్పేస్తుంది.

ఎలాగో తినడం ముగించాను…

 

“నే వెళ్ళి డాక్టర్ని కలిసొస్తాను, నీవీలోగా మందేసుకొని పక్క మార్పించుకో,” అని ఆయాని పిలిచాడు వాడు.

**                                                                 (ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 10

egire-pavuramaa10-banner
సినిమా కథ మొదట్లో అంతగా అర్ధం కాలేదు. సినిమాలో ఓ కొండంత మీసాలవాడు అనాధ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చుకొని, కొన్నాళ్ళు సాకిన తరువాత వాళ్ళని అవిటిగానో, మూగగానో, గుడ్డివాళ్లగానో చేస్తాడు.
ఆ తరువాత ఇక వాళ్ళని బిచ్చగాళ్ళగా మార్చి, ఆ అవిటోళ్ళతో బిక్షాటన చేయించే యాపారం మొదలెడతాడు. ఆ మీసాలాడి నుండి తప్పించుకొని పారిపోయిన ఇద్దరబ్బాయిల కథే ఆ సినిమా.

నాకు అస్సలు నచ్చలేదు. సినిమా అయ్యాక ఇంటికెళ్ళినంత సేపూ సినిమాలో నాకు నచ్చని ఆ మీసాల వాడి కథే గుర్తుండిపోయి చాలా విసుగ్గా, కోపంగా అనిపించింది.

“ఏమో గుబులుగా ఉన్నావే గాయత్రి? సినిమా నచ్చలేదా? అడిగింది కమలమ్మ.
నా ఆలోచనలో నేనున్నాను.

“ఏం సినిమానే పాడు సినిమా. అట్టా ఏడన్నా జరుగాతాదా?” అన్నాడు రిక్షా నడుపుతున్న గోవిందు, మాకు వినబడేలా ఓ మారు ఎనక్కి తిరిగి..

“పిచ్చోడా, విజయవాడ లాంటి నగరాల్లో అవిటి యాచకుల నెలసరి సంపాదన నాలుగైదు వేల రూపాయలంట. ఈ రోజుల్లో బతుకుతెరువు కోసం యాచించే వాళ్ళు, వడ్డీలకి అప్పులిచ్చే స్థాయిలో ఉండారంట. అందుకే ఈ సినిమాలో మల్లేనే ఇట్టాంటివన్నీ నిజంగానే జరుగుతున్నాయిరా,” అంది కమలమ్మ పెద్దగా గొంతెత్తి, గోవిందుకి వినబడేలా.

“సరేలేవే అక్కా, ఇట్టాంటి సినిమా సూపించాలా ఏంది?” విసుక్కున్నాడు గోవిందు.
“పోనీలే గాని, ఆ సినిమాలో అమ్మాయి కంటే మన గాయత్రి ఎంతో అందంగా కళగా ఉందా లేదా? నువ్వు సెప్పు. నాకైతే, సినిమా యాక్టర్ కంటే గాయత్రి సక్కంగా ఉంది. వైద్యం చేయించి నడక వచ్చేస్తే,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా….
అవసరం లేని మాటలు ఆమెకి అలవాటే అని చిరాగ్గా అనిపించింది.

“అరేయ్ గోవిందు, ఈ సారి మన కొత్తపాక సూపెట్టాల గాయత్రికి,” అంది మళ్ళీ పెద్దగా…నవ్వుతూ కమలమ్మ.
రద్దీ లేని దోవవడంతో ఆమె గొంతు ఆమడ దూరానికి వినబడుతుంది….
“సర్లేవే, ఓ తడవ ఆదివారం అట్టాగే సూపెడదాములే,” అన్నాడతను.
మరి కాసేపటికి, నన్ను కొట్టాంలో వదిలెళ్ళారు కమలమ్మా వాళ్ళు.

సినిమా గురించి తెలీజెయ్యాలని తాత కోసం చూస్తే, నులక మంచం మీద అటు తిరిగి తొంగొనున్నాడు. నేనొచ్చేవరకు కాసుకొని ఉండకుండా తొంగున్నాడని కాస్త బాధేసింది.
తాతకి ఇష్టంలేని మనిషితో తిరగడం నాకూ కష్టంగానే ఉంది. ‘తాతకి కమలమ్మ మీద కోపం పోతే బాగుణ్ణు’ అనుకుంటూ సినిమా గురించే ఆలోచిస్తూ నేనూ పక్క మీద చేరాను.
**
పొద్దున్నే గుడికి బయలుదేర బోతుంటే తాత కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయాడు. దగ్గు, వాంతులు ఒకదాని వెంట ఒకటి తాతని ముంచెత్తాయి. పిన్ని, బాబాయి తాతని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నన్ను గుడికి వెళ్ళిపొమ్మన్నారు.
‘తాత మళ్ళీ నీరసించాడన్నమాట. అందుకేనేమో రాత్రి అలా పెందరాళే తొంగున్నాడు.
**
దినమంతా తాత విషయం చాల దిగులుగా ఉంది. మధ్యానం నాలుగింటికి గుడికొచ్చిన చంద్రం పిన్ని ముఖంలో ఆదుర్దా, బాధ, నిరాశ కనిపించాయి. నాలో కూడా తాత గురించి గుబులు, భయం పెరిగాయి.
“తాత వారం రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఉన్న రోగాలకి తోడు చిన్నపేగు మెలిక పడిందంట. పెద్దాపరేషను చేసి లోపలి మెలిక తీయాల్సిందేనంట. నేను తాతకి తోడుగా ఆడనే ఉండాలి. ఈ వారం రోజులూ నీకు పగళ్ళు సాయంగా, రాత్రిళ్ళు తోడుగా మనోళ్ళు ఎవరన్నా ఉండేలా సూడాలి.
నీకీ విషయం చెప్పి పెందరాళే తీసుకెడదామని ఈడకొచ్చా. పనయ్యాక రాత్రికి తాత కాడికెళ్తాను,” అని చెబుతూ నన్ను బయలుదేర దీసింది పిన్ని.

అన్నీ వింటున్న కమలమ్మ, “అయ్యో అదేంది? నేను లేనా? మా గాయత్రిని నేను సూసుకోలేనా? తాతని మీరు బాగు చేసి ఇంటికి తెండి. గాయత్రికి నేనుంటాను తోడుగా.
రేపటినుంచి నా మకాం గాయత్రి దగ్గరే. సొంత బిడ్డలా సూసుకుంటాను. సరేనా? ఇక మీరెళ్ళండి. నేను అవసరమైనవి సర్దుకొని రేత్రికి వస్తాలే,” అంది చంద్రం పిన్నితో.
**
మౌనంగా కొట్టాం చేరాము. నాకు దిగులుగా ఉంది. రాగి జావ కాసి పళ్ళెంలో పోసి తెచ్చిచ్చింది పిన్ని.

“ఇదిగో గాయత్రి, మాకు ఈ కమలమ్మ యవ్వారం, మాట నచ్చవు. చాలా బధ్రంగా ఉండు ఆమెతో. గత్యంతరం లేక ఈ ఒక్క తడవ నీకు తోడుగా ఉండనీ,” అంది తాత బట్టలు సంచికేస్తూ ఆమె.
అర్ధమయింది అన్నట్టు తల ఊపాను.
ఇంకా అప్పటికి బట్టలవీ తెచ్చుకొస్తానన్న కమలమ్మ రాలేదు.
కొట్టామంతా ఓ సారి చీపురుతో చిమ్మింది. మరచెంబుడు నీళ్ళు నాకు తెచ్చిచ్చి కమలమ్మ కోసం చూస్తూ, పక్కనే కూచుంది పిన్ని.
తాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంటికాడ నేను తీసుకోవల్సిన జాగ్రత్తలు మళ్ళీ చెప్పింది.

మరో ఐదు నిముషాలకి పెట్టెబేడాతో కమలమ్మ వచ్చాకే పిన్ని వెళ్ళింది.

egire-pavuramaa-10
**
తాత ఆసుపత్రిలో జేరి వారమయింది. తాత దగ్గరలేని వెలితి బాగా తెలుస్తుంది.
రోజు మార్చి రోజు తాతని చూడ్డానికి, పిన్నితోనే ఆసుపత్రికి పోతున్నాను. నాలుగు రోజులైనా తాత మగతలోనే ఉన్నాడని చంద్రం పిన్నికి గాబరాగా ఉంది. నాకైతే ఏమీ తోచడం లేదు.
**
గుడి నుంచి కొట్టాం చేరి పుస్తకాలు ముందేసుకొని చదువుతూ కూచున్నా. మనసు లగ్నం చేయలేక చదువు సాగడం లేదు.

చీకటి పడ్డాక చంద్రం పిన్నొచ్చింది. “ఈ పూటే తాత లేచి మాట్లాడుతున్నాడంట. రాంబాబాయి ఇప్పుడే తాతని చూసొచ్చాడు. ఇక నీకోసం అడుగుతాడు. పద చూసొద్దాము,” అని నన్ను బయలుదేరదీసింది.
**
మేమెళ్ళేప్పటికి తాత తెలివిగానే ఉన్నాడు. మమ్మల్ని చూసి ఆనందపడ్డాడు.
మందులకి బిల్లు కట్టాలని నర్సు చెబితే, తాతని పలకరించి బయటకెళ్ళింది చంద్రమ్మ.

“ఈ పూటే కాస్త కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు మీ తాత,” అంది తాతకి బ్యాండేజీ మార్చడం ముగించిన నర్సు.

“కట్టు మార్చానులే. ఇక్కడకొచ్చి కూర్చో. నీ గురించే చెబుతున్నాడు. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నట్టున్నాడు. అదృష్టవంతురాలివే గాయత్రి,” అంటూ తాతతో మందు మింగించి వెళ్ళిందామె.
తాత మంచం కాడికెళ్ళి కూచున్నాను. గోడకి నిలబెడితే జారుతాయని ఊతకర్రలు తాత మంచమెనక్కి పెట్టాను.

మెల్లగా లేచి తలగడ కానుకుని కూర్చున్నాడు తాత.
“నా ఆరోగ్యం అంతంతగా ఉంది తల్లీ. నీ గురించేనమ్మా నా దిగులు. ఈ వారంలో ‘వంశీ వికలాంగుల సంస్థ’ వాళ్ళు మన ఊరికి రావచ్చు. వాళ్ళ రాక విషయం పూజారయ్యకి ముందుగానే తెలుస్తుంది. మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మన కాడికి వస్తామన్నారులే.
నిన్ను చూసి, వాళ్ళ వైద్యుల చేత పరీక్ష చేయించాకే – నీ చికిత్స విషయంగా సాయం చేయగలరంట,” అని వివరంగా చెప్పాడు తాత.
విని సరేనని తలూపాను.
**
మరునాడు పూలపని చేస్తుండగా, పూజారయ్య వచ్చి నాకెదురుగా అరుగు మీద కూచున్నారు. నా పక్కనే తమలపాకులు శుభ్రం చేస్తున్న కమలమ్మ, తన పనిని కాస్త దూరంగా వెనక్కి జరుపుకొంది.
“చూడమ్మా గాయత్రి, “ ‘వంశీ’ సంస్థ వారు రేపు మన ఊళ్ళోకి వస్తున్నారు. మీ తాత వెళ్ళి వాళ్ళతో నీ విషయం మాట్లాడిన సంగతి తెలుసుగా! తీరా వాళ్ళు మన దగ్గరికి వచ్చే సమయానికి ఇలా ఆసుపత్రిలో ఉన్నాడు పాపం సత్యం. అయినా పర్వాలేదులే. నేను, ఉమా ఉన్నాముగా నీకు సాయం,” అన్నారాయన.
ఔననట్టుగా తలూపి వింటున్నాను.

“వాళ్ళ వైద్యుల్ని వెంట బెట్టుకొని మరీ వస్తారుట. ఇక్కడ మన గుడి ఆవరణలోనే వాళ్ళ బస్సు పెట్టుకుంటారు. మన పల్లెలో ఇంకా అంగవైకల్యం ఉన్న పసివాళ్లని కొందరిని చూస్తారట.
నువ్వైతే రెడీగా ఉండు,” అంటూ తాత గురించి అడిగారు పూజారయ్య.

“మీ రాంబాబాయి వచ్చి వెళ్ళాడులే. నిన్ననే కళ్ళు తెరిచాడటగా సత్యం? వంశీ సంస్థతో మన పని కూడా అయ్యాక, అతన్ని చూడ్డానికి వెళతాము,” అంటూ లేచి గుడిలోకి వెళ్లారు పూజారయ్య.
**
తరువాత అరగంటకి ఉమమ్మ వచ్చింది. “నీ పనులన్నీ మెల్లగా ఒక్కోటి అవుతున్నాయిగా! రేపు నీకు వైద్యపరీక్షలు జరిగే అవకాశం ఉందంట. నేను ఆ సమయానికి నీతోనే ఉంటానులే,” అంటూ నా పక్కనే కూచుందామె.

శుభ్రం చేసిన తమలపాకులు లోనికి తీసుకెళుతూ కమలమ్మ మా కాడికి వచ్చింది. మరునాడు సంస్థ వాళ్ళు వచ్చే సమయానికి ఏ సాయం చేయడానికైనా, తను అందుబాటులోనే ఉంటానని ఉమమ్మకి, నాకు చెప్పి వెళ్ళింది.

ఎప్పటిలా పర్సు నుండి చాక్లెట్టు తీసిస్తూ, “మాస్టారుగారు పంపిన కొత్త పుస్తకాలు ఇవ్వడానికే వచ్చాను,” అంటూ సంచి నుండి ఒక్కో పుస్తకం నా చేతుల్లో పెట్టింది ఉమమ్మ.
“ఇవి ఏడవ తరగతి లెక్కలు, సాంఘికం, సైన్స్ పుస్తకాలు. రెండో తరగతి ఇంగ్లీష్ కూడా తెచ్చాను. ఎల్లుండి నుంచి మొదలు ఈ చదువు,” అని నా భుజం మీద తట్టింది మెచ్చుకోలుగా.

సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఆశించినట్టు వంశీ వారు మా ఊరు రావడం, నేనేమో ఏడవ తరగతి చదువు మొదలెట్టడం, రెండు సంగతులూ తాతకి ఆనందాన్ని కలిగించేవే….రేపే చెప్పాలి అనుకున్నాను.
**
సాయంత్రం ఇంటికాడ పనులు చేసుకొని కొత్త పుస్తకాలు ముందేసుకోగానే చంద్రం పిన్నొచ్చింది.

“గండం నుండి బయటపడి మొత్తానికి తాత మరో మూడురోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు,” అని చెపుతూ నా పక్కనే కూచుని, సంతోషంతో నా చెంపలు నొక్కి ముద్దెట్టుకుంది.
‘ఎప్పటిలా మా కొట్టాంలో, మళ్ళీ తాత నా కళ్ళ ముందు’ అన్న తలంపే ఎంతో తృప్తిగా అనిపించింది.

“నాకూ కాస్త ఈ తిరగడం తగ్గుతుందిలే. మళ్ళీ రేపొస్తా ,” నవ్వుతూ పనుందంటూ వెళ్ళింది పిన్ని.

ఇదంతా చూస్తూ, మా మాటలు వింటూ వంట ముగించిన కమలమ్మ నన్ను బువ్వ తినడానికి రమ్మంది. పుస్తకాలు పక్కనెట్టి వెళ్ళి తినడానికి కూచున్నా.
కమలమ్మ కొసరి కొసరి వడ్డించింది.
“చూడు గాయత్రి, ఎప్పటినుంచో నేను తెలుసుకొన్న కొన్ని ఇషయాలు నీకు సెప్పాలనుకున్నా. ఇప్పటివరకు నోరు తెరవలేదు. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు,” అని తానొక ముద్ద తిని నీళ్ళు తాగి మళ్ళీ మొదలెట్టింది కమలమ్మ.
ఆమె అనేది వింటూ తింటున్నాను.

“ఇది నీ అవిటితనం గురించి, నీ బతుకుతెరువు గురించి, నువ్వు దేవుడనుకుంటున్న నీ తాత గురించి,” మళ్ళీ ఆగి నా వంక చూసింది.

“మీ తాత ఉప్పరోడిగానో, రిక్షావాడిగానో బతికే టైములో నువ్వు దొరికావంట. దిక్కులేని దానవేనంట. ఎత్తుకొచ్చుకొని సాకాడు, సరే! ఎందువల్లో మరి నీకు నడక, మాట రాడం ఆలస్యమయితే, వైద్యం సేయించాల్సింది పోయి, అవిటిదని ముద్రేసి, ఆ నాటి నుంచి ఈ నాటి వరకు, నిన్ను ఆ గుడి మెట్ల మీద కూకోబెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు.
అసలు నన్నడిగితే, ఆ ముసలాడే నిన్ను కసాయి ముఠా వాళ్ళ చేత అవిటిదానిగా సేయించుంటాడు.. మనం మొన్న చూసిన సినిమాలో లాగా,” అన్న కమలమ్మ మాటలకి ముద్ద మింగుడు పడలేదు నాకు.

తల వంచుకునే ఉన్నాను. గుండెలు బరువెక్కి, కడుపులో దేవేసినట్టయింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.
నా వంక చూస్తూనే మళ్ళీ మొదలెట్టిందామె.
“ఎంతో కాలంగా మీ తాత స్నేహితులే ఆ కూరలబడ్డీ వాళ్ళు, నాయుడన్న వాళ్ళు. వాళ్ళ మాటల్ని బట్టే తెలిసింది.
మీరుండే కొట్టాం కాక ఆరెకరాల వరిపొలం ఉందంట నీ తాతకి.
నీ డబ్బుతోనే కాదా ఇంత మంచి కొట్టాం, పొలం సంపాదించుకున్నాడు ఆ ముసలాడు?.
కాని ఏదీ నీది కాదు. ఇన్నేళ్ళ నీ చాకిరీ ఏమైంది? నీ వైద్యానికి సరిపడా డబ్బు ఉన్నా, ఉచిత వైద్యం కోసం వికలాంగుల సంస్థకి నిన్ను అప్పజెప్పాలని చూస్తున్నాడంట ఆ ముసలాడు,” క్షణం ఆగింది.

నేనేమి వింటున్నానో, అర్ధమవుతుందో లేదో కూడా తెలీడం లేదు…

“మొన్ననెళ్ళి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడంట నీ తాత. ఆ సంస్థ వాళ్ళేమో తిన్నగానే ఉన్న నీ కాళ్ళని మోకాళ్ళ వరకు తీసేసి, కుత్రిమంగా కాళ్ళు పెట్టి నీతో వెట్టి చాకిరీ చేయిస్తారంట.
అందుగ్గాను మీ తాతకి డబ్బులిస్తారంట,” నా వంక సూటిగా చూసింది.
ఆపుకోలేని కన్నీళ్ళని తుడుచుకోను ప్రయత్నిస్తున్నాను…
“అసలా ముసలాడు చేసేది పెద్ద నేరమంట. పసిపిల్లతో పని చేయించి డబ్బులు దోచుకుంటున్నాడని నా బోటిది ఫిర్యాదు చేస్తే, ‘బాల కార్మికం’ నేరం మీద పోలీసోళ్ళు నీ తాతని జైల్లో తోస్తారంట కూడా,” అంది ఆవేశంగా.
ఆమె మాటలతో నా కడుపు ఉడికిపోయింది. నా గుండె ఆగిపోతుందేమో అన్నంత బాధ కలిగింది. చేతినున్న మెతుకులని పళ్ళెంలోకి వదిలేసి ఎడమ చేత్తో ఆగని కన్నీళ్లు తుడుచుకున్నాను.

మళ్ళీ అందుకుందామె.
“ఇయ్యాలో రేపో అన్నట్టయిపోయాడు నీ తాత. నీ సంపాదన, తోడు లేందే ఆ ముసలాడి జీవనం జరగదు. ఆయన చికిత్స, మందులు అంతా నీ సంపాదనే. పూజరయ్యకి కూడా ఇందులో భాగముందని నా అనుమానం,” అన్న ఆమె మాటలకి తల మొద్దెక్కిపోయింది.

నా కింద భూమి జారినట్టయింది. ఎలాగో అక్కడి నుంచి జరిగాను.
ఇంక చాలు అన్నట్టు కమలమ్మని వారించబోయాను. నా చేయి ఆమెవైపు చాచి, ‘ఇంకేమీ నాకు చెప్పొద్దన్నాను.
నా చేయి తన చేతిలో బిగించింది కమలమ్మ.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా!-9

egire-pavuramaa9-banner

నా కోసం ఎవరో మనిషి ‘ఊతకర్రలు’ తెస్తారని తెలుసును గాని ఇలా డాక్టరుగారు, ఓ పెద్దావిడ కూడా వస్తారని ఊహించని మేము ఆశ్చర్య పోయాము.
**
అదే సమయానికి ఉమమ్మ కూడా వచ్చి వారికి ఎదురెళ్ళింది. తాత భుజం మీద చేయి వేసి నా దిశగా నడిపించుకు వచ్చారు డాక్టరుగారు. అంతా కలిసి నేనున్న రావి నీడకి చేరారు.

“అమ్మా, ఈమె ఉమాదేవి, వీళ్ళ నాన్నగారే ఈ గుడి బాధ్యతలు నిర్వహించేది,” అంటూ ముందుగా ఉమమ్మని, తరువాత నన్ను, తాతని కూడా వాళ్ళమ్మగారికి పరిచయం చేసారు డాక్టరుగారు.
హుందాగా, అందంగా ఉన్న ఆ పెద్దావిడకి అందరం నమస్కారం చేసాము.

“మా అమ్మగారు. పేరు సరోజిని దేవి. అమ్మకి దేవాలయాలు, పూజలు అంటే శ్రద్ధ. ఇక్కడ ఈ గుడి ఉందని తెలుసును గాని చూడలేదట.
అందుకే ఈ గుడి చూస్తారని అమ్మని కూడా ఇలా తీసుకొచ్చాను.
గాయత్రి కోసం నేను అడిగిన ‘ఊతకర్రలు’ కూడా రావడంతో, స్వయంగా చూసి అమర్చవచ్చని వచ్చాను,” అంటూ మాకు వివరించారాయన.

“అయ్యో ఎంత మాట. మీరు రావడం మాకు చాలా సంతోషం. నాన్నకి మంగళగిరి గుడిలో హోమం ఉండడంతో అక్కడికి వెళ్లారు. మీరు వచ్చినందుకు సంతోషిస్తారు. పదండమ్మా దేవుడిని చూద్దురుగాని,” అంటూ సరోజినిగారితో ఉమమ్మ గుడివైపుకి దారి తీసింది.

“రాజమ్మా, నువ్వు పెట్టిలోంచి ‘క్రచ్చస్’ తీసి, గాయత్రికి సరిగా ఉన్నాయో లేదో చూడు. నేనిప్పుడే వస్తా,” వెంట వచ్చిన స్త్రీకి పురమాయించారు డాక్టరుగారు.
**
రాజమ్మ ప్యాకేజీ ఇప్పి ‘ఊతకర్రలు’ బయటకి తీసి, పరిశీలించింది.
కొలతలు సరిచేయ్యాలంటూ డ్రైవరుకి మరలు పెట్టమని పురమాయించి, తాతతో మాట కలిపింది.
సరిజిని గారి ‘శ్రీ సత్యశారద చారిటీ’ కి ఇరవై ఏళ్లగా పని చేస్తుందంట ఆమె.

“అస్పత్రులకి వచ్చే ఎందరో బీదవారికి సహాయం చేస్తారు మా మేడం సరోజినమ్మ, సార్ జనార్ధన్ గార్లు. వారు గుంటూరు వైద్య కళాశాల యజమానులు.
ఈ సంస్థ ద్వారానే గుంటూరు శివారుల్లో పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నారు మా అయ్యగారు,”
గర్వంగా చెప్పింది రాజమ్మ.
నేను, తాత వింటున్నామో లేదో అని ఓ సారి మా వంక చూసిందామె.

“వారి రెండో అబ్బాయే, డాక్టరు మల్లిక్ బాబు.
ఆయన అసలు పేరు మల్లికార్జునరావు,” అందామె.
త్వరలో మల్లిక్ గారు అమెరికా వెళ్ళబోతున్నారని, చెప్పింది.

ఇలా రాజమ్మ మాటల్లో, డాక్టరు మల్లిక్ గురించి, ఆయన కుటుంబం గురించి, ఎన్నో సంగతులు తెలిసాయి మాకు.
మరలు బిగించిన ‘ఊతకర్రలు’ నా పక్కగా ఉంచెళ్ళాడు డ్రైవర్.
**
ఇంతలో ఉమమ్మ వాళ్ళు తిరిగొచ్చారు. నాకు సాయంపట్టి నిలబెట్టి, ఊతకర్రలు సరిచేసి, వాటి సాయంతో ఎలా కదలాలో, ఎంత ప్రయత్నం చెయ్యాలో చూపించారు డాక్టరుగారు. వాటితో అరుగు మీదనుండి లేవడం, కూచోడం, ఎంతో వీలుగా, సుళువుగా ఉందనిపించింది నాకు. కొంత ఉషారుగా అనిపించింది కూడా.

కొబ్బరి ప్రసాదాలు తింటూ నా ఎదురుగా అరుగు మీద కూచున్నారందరు. ఇంతలో అతిధుల్ని చూడాలన్నట్టు మా పావురాళ్ళు కూడా వచ్చాయి. అరుగులకి కాస్త దూరంగా వయ్యారంగా గింగిరాలు తిరుగుతూ కువకువలాడాయి. ఉమమ్మతో పాటు సరోజినిగారు కూడా వాటికి పిడికిళ్ళతో గింజలు జల్లారు.
సరదాగా తలా ఓ మాట, ఓ కబురు చెబుతున్నారు. నేను వింటూ కూచున్నాను.
“చూడండి ఉమాగారు, మీరు ప్రస్తావించిన ‘ప్రత్యేక విద్యావిధాన క్రమం’ ప్రాధమికంగా మన గుంటూరు కాలేజీల్లో ఉన్నాయట. వాటి తరువాత హైదరాబాదులో మరో రెండేళ్ళ చదువు కూడా పూర్తిచేసి పట్టా పొందాలట. మా అమ్మగారు చెప్పారు.
ఈ కవర్లో మీకు కాలేజీ దరఖాస్తు, సమాచారం ఉన్నాయి. అమ్మే తెప్పించారు,” అంటూ రాజమ్మ దగ్గరున్న బ్యాగు నుండి ఉమమ్మకి ఓ పెద్ద కవరు అందించారు మల్లిక్ గారు.
కవరందుకొని సరోజినిగారికి కృతజ్ఞతలు చెప్పింది ఉమమ్మ.

“అవునమ్మా ఉమా, నీకు ఈ విషయంలో ఏ సహాయం కావాలన్నా నేను చేయగలను. అసలు ఈ చదువు ఎన్నుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీకు లాగ సేవా దృక్పథంతో అలోచించి ఉన్నత విద్యలను ఎన్నుకునేవారు అరుదుగా ఉంటారు.
మల్లిక్ బాబు వచ్చే నెలలో అమెరికా వెళతాడు. అక్కడ చదువు ముగించుకొని ముడేళ్ళకి వస్తాడు. ఈ లోగా నీకు గాని, గాయత్రికి గాని ఏ సహాయం కావాలన్నా నా వద్దకు రండి. నా ఫోను నంబర్లు ఇస్తాను,” అన్నారు ఉమమ్మతో సరోజినిగారు.

తరువాత మా వంక చూసారు ఆమె. “ఇక పోతే, గాయత్రి విషయంలో – ఇక్కడ మీకు దగ్గర్లోనే డాక్టరు శివారెడ్డి ఉన్నారు. ఆయన వద్దనుండి ఓ మనిషి ఇంటికే వచ్చి నెల రోజులపాటు గాయత్రి కాళ్ళకి చికిత్స, వ్యాయామం చేయించేలా ఏర్పాటు చేయించాము,” అన్నారు సరోజినిగారు.
“మా సంస్థ వాళ్ళు ఇవన్నీ ఎప్పుడూ చేసేవే. మీరేమీ మొహమాట పడవద్దు,” అని కూడా అన్నారామె.
ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తాత. అందరి వద్ద శెలవు తీసుకొని మల్లిక్ గారు, సరోజినిగారు వెళ్ళిపోతుండగా వచ్చింది కమలమ్మ.
**
మరునాటి నుండి, సరోజినిగారు అన్నట్టుగానే ఓ ఆయా కొట్టాంకి వచ్చి నా కాళ్ళని రకరకాల నూనెలతో మర్దనా చేసిన తరువాత వ్యాయామం, కర్రల సాయంతో పైకి లేచి కొంత దూరం మెసలడం కూడా చేయిస్తుంది.
అలా నెలరోజులు పాటు జరిగింది ఆ చికిత్స.
నాకు సహాయపడిందనే అనిపించింది అందరికీ.

“ఇకనుండి ఈ కర్రలే నీకు సహకరించే కాళ్ళ లాటివి కాబట్టి, ఎప్పుడూ మనిషిలో భాగంగా నీ వెంటే ఉండాలి. గుర్తుపెట్టుకో. నూటికి నూరుపాళ్ళు వాడాలి వీటిని,” అని కూడా చెప్పింది వెళ్లేముందు ఆయమ్మ.

illustration 9
**
మల్లిక్ గారిని, సరోజినిగారిని, వారి మంచితనాన్ని, తాత తలవని రోజుండదు.
ఈ నెలలోపే సొంతగా ఊతకర్రల సాయంతో పైకి లేవడం, నిలదొక్కుకొని మెల్లగా ముందుకు కదలడం మొదలెట్టాను.
అరికాళ్ళు ఒక్కోటి నేల మీద ఆన్చి ముందుకు కదలాలని కూడా ప్రయత్నిస్తున్నాను. కర్రల సాయంతో నిలబడినప్పుడు సరిగ్గా ఉమమ్మంత ఎత్తు ఉన్నాననుకుని గర్వంగా అనిపించింది.
**
కొత్తగా ఊతకర్రల సాయంతో నేను కదలగలగడం చూస్తే కమలమ్మ ఆశ్చర్య పోతుందేమో నని అనుకుంటూ మొదటిసారి కర్రలని తీసుకొని గుడికి బయలుదేరాను రిక్షాలో. దారిపొడవునా ఆమె గురించే ఆలోచించాను.

నెలక్రితం మల్లిక్ గారు గుడికి వచ్చెళ్ళారని తెలిసినప్పటి నుండి, వారి వివరాలు, వచ్చిన కారణాలు కమలమ్మ నన్ను ఎన్నోరకాల అడిగింది.
సమాధానంగా – వచ్చినాయన నాకు వైద్యం చేసిన డాక్టరని, నాకు ఊతకర్రలు ఇప్పించినవారని, వాళ్ళమ్మగారితో ఈ గుడి చూడ్డానికి వచ్చారని తెలియజెప్పాను. ఎప్పటిలాగానే నేను చెప్పింది చాల్లేదు ఆమెకి.
**
నేను సొంతంగా పైకి లేచి మెసల గలగడం చూసి, నేననుకున్నంత ఆశ్చర్యపోలేదు కమలమ్మ.
“ఇట్టా కాదుగా నేననుకున్నది. నీ కాళ్ళు నేలమీద ఆనించి నడవ గలుగుతావని కదా నేనానుకున్నా,” అని పెదవి విరిచింది.
‘ఈమె అనుకున్నంత మార్పు రావడం అయ్యేనా? అట్లా వస్తే ఎంత బావుండునో’ అనుకున్నాను.
**
మళ్ళీ ఆదివారం. మళ్ళీ మధ్యానం. ఈ సారి కూడా కమలమ్మ గుళ్ళో లేకుండా పోయినప్పుడే – డాక్టర్ మల్లిక్ గారు కార్లో వచ్చి దిగారు.
ఈ మారు ఉమమ్మ, పూజారయ్య కూడా ఆయనకి ఎదురెళ్ళారు.

నాకు అమడ దూరంలోనే వాళ్ళతో మాట్లాడుతూ నా వంక చూసి, ‘నేనే అక్కడికి వస్తా’నని సైగ చేసారు డాక్టర్ గారు. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి.

డాక్టరుగారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు పూజారయ్య.
“మా గాయత్రికి, ఉమాకి కూడా మీరు, మీ అమ్మగారు అందించిన సహాయ సలహాలకి ధన్యవాదాలు డాక్టరుబాబు,” అన్నారాయన.

ఆ మాటలకి ఆయన చేతులు జోడించి, “అంత మాటెందుకు సోమయాజులుగారు? నా వృత్తి ధర్మం అది. ఎల్లుండి అమెరికా ప్రయాణమయ్యే ముందు గాయత్రిని చూసి, మిమ్మల్నందరిని కలిసి, చెప్పి వెళదామని వచ్చాను,” అంటూ తన చేతిలోని తెల్లని కవర్ పూజారయ్యకి అందించారు.

పూజారయ్య అది విప్పి చదువుతూ, “సంతోషం బాబు. ఈ ఆహ్వానంకి ధన్యవాదాలు. మీకు మా శుభాకాంక్షలు, ” అంటూ దాన్ని ఉమమ్మ చేతికందించారు.

“నా ప్రయాణంకి ముందుగా ఎల్లుండి మంగళవారం నాడు, ఇంట్లో వ్రతం, భోజనాలు ఏర్పాటు చేసారు అమ్మావాళ్ళు.
మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించాలని కూడా వచ్చాను. మీరంతా తప్పక రావాలి,” అన్నారు మల్లిక్ గారు పూజారయ్యతో.

ఉమమ్మ వంక చూస్తూ, “మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, అలాగే ఎల్లుండి పొద్దునే తొమ్మిదింటికి కారు ఏర్పాటు చేశామని కూడా చెప్పమంది అమ్మ,” అన్నాడాయన.

“ఇక గాయత్రి సంగతికి గాని, మీ కాలేజి సంగతి గాని, మొహమాట పడకుండా ఎప్పుడైనా అమ్మకు ఫోను చెయ్యండి. పర్వాలేదు,” అంటూ వారిద్దరితో పాటు నా అరుగుల కాడికి వచ్చారు మల్లిక్ గారు.

నా అంతట నేను కర్రల సాయంతో లేచి నిలబడ్డం చూసి ఆయన సంతోషించారు.
డాక్టరుగారిని కలవడానికని తాత కూడా బయటనుండి వచ్చాడు. డాక్టరు బాబుకి దణ్ణాలెట్టి కృతజ్ఞతలు చెప్పాము.
రెండు నిముషాలు మాతో మాట్లాడి, దేవుడి దర్శనం చేసుకొని మా అందరి వద్ద శలవు తీసుకొని వెళ్ళారాయన.
**
మళ్ళీ తాను లేనప్పుడే, డాక్టరుగారు వచ్చి వెళ్ళారని తెలిసిన కమలమ్మ చాలా కష్టపెట్టుకుంది. చాలాసేపు మాట్టాడకుండా ఉండిపోయింది.
**
మరునాడు మధ్యానం నేను, తాత సెనగలు తింటుండగా మా కాడికి వచ్చి కూచుంది కమలమ్మ.
“నాతో పాటు ఈ వారంలో గాయత్రిని మంచి సినిమాకి తీసుకెడతానన్నా,” అని తాత సమ్మతి అడిగింది.
తాత కిమ్మనలేదు. కొబ్బరినీళ్ళు తాగి ఏమనకుండానే వెళ్ళిపోయాడు.

“అసలు దేనికీ మాట్లాడడు సత్యమన్న. అంటే సరేనని అన్నట్టే లెక్క,” అనుకుంటూ వెళ్ళింది కమలమ్మ.

సాయంత్రమయ్యాక కాలేజీ నుండి వెళ్తూ, ఉమమ్మ నా వద్దకి వచ్చింది. కాడలు తీసిన గులాబీలు, చేమంతులతో ఓ పూలబుట్ట తయారుగా ఉంచితే, మరునాడు తాము సరోజినీగారింటికి పూజకి వెళ్తూ తీసుకుంటామంది.
**
పొద్దున్నే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. పుజసామాను కొనుగోళ్ళతో హడావిడిగా గడిచింది కాసేపు.
తొమ్మిది గంటల సమయంలో ఉమమ్మ, పూజారయ్యలు కారులో గుడి ముందాగారు.

ఉమమ్మ వచ్చి నాకాడనున్న పువ్వులబుట్ట తీసుకొంది. నేను సొంతగా తయారుచేసిన ఓ మల్లెలదండతో పాటు ఆమె అడిగిన గులాబీలు, చేమంతులతో నింపే ఉంచాను.

చూసేవాళ్ళ కళ్ళు చెదిరిపోయేంత అందంగా ముస్తాబయ్యింది ఆమె. ఆకుపచ్చ రంగు చీర, బంగారు రంగు రవిక వేసుకొంది. పచ్చని పూసల దండ, జుమ్కాలు, చేతులకి బంగారు గాజులు ఎంతో బాగున్నయి.
కమలమ్మయితే చేతిలోని పని కూడా మానేసి ఉమమ్మని చూస్తూండిపోయింది. వాళ్ళు కారులో వెళ్ళిపోయేంత మటుకు కిమ్మనలేదు కమలమ్మ.

ఆ తరువాత తేరుకుని, “ఉమమ్మ కన్ను చెదిరే అందచందాల అప్సరస” అంటూ ఆపకుండా మెచ్చుకొంది. “కథల్లో యువరాణిలా ఉందామె,” అంది.
**
భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయం. సందడిగా గడిచింది పగలంతా.
సాయంత్రం ఐదయ్యాక గాని సద్దుమణగి కాస్త ఊపిరి సలపలేదు. వెనక్కి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు తీసుకొని తాగాను.
చీకటి పడుతుండగా పుస్తకం చేత పట్టుకొని తాత కోసం చూస్తున్న నా వద్దకి పరుగున వచ్చింది కమలమ్మ.

“పద, పద, మీ తాతకి కబురెట్టానులే. గుడిలో మన పని ముగిసిందిగా! ఇయ్యాల నిన్ను ఓ మాంచి సినిమాకి తీసుకెడతానని తాతకెరుకే.
సినిమాకి టైమయ్యింది. గోవిందు టికెట్లు తీసుకొన్నాడు. నీ లాటి వారి గురించి కూడా ఉండాది ఆ సినిమాలో,” అంటూ నన్ను హడావిడిగా బయలుదేర తీసింది ఆమె.
తాత కోసం గేటు వైపు చూస్తున్న నన్ను, “తాతకి, కబురంపానని చెబుతున్నాగా! పద టైం లేదు మనకి,” అంటూ తొందర చేసింది….
**
దారిపొడుగునా, తాను గుల్బర్గాలో ఉన్నప్పుడు హిందీ సినిమాలు చూసానని, అప్పుడు చూసిన సినిమానే ఇప్పుడిక్కడ ఆడుతుందని, పెద్ద పేరున్న సినమాని చెప్పింది. అన్నట్టే నన్నేదో హిందీ సినిమాకి తీసుకెళ్ళింది. అంత రద్దీగా లేదు. అదే మొదటిసారి నేను సినిమా చూడ్డం. ఏ భాషైనా పర్లేదులే అనుకున్నా. కమలమ్మ పట్ల కృతజ్ఞతగా అనిపించింది. ఉడికించిన వేరుసెనగలు, నిమ్మకాయి సోడా తెప్పించింది. సినిమా మొదలయిన క్షణం నుండీ కళ్ళు పెద్దవిగా చేసుకొని చూసాను.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా! -7

egire-pavuramaa-7

సమాచారం దాఖలు చేసి, ఉమమ్మ అందించిన కాగితాలు తీసుకుని నర్సు చేతికిచ్చారు డాక్టరుగారు.

“గాయత్రిది జబ్బు కాదు. ఆమె స్థితిని అంగవైకల్యంగా పరిగణిస్తారు.
ఆసుపత్రి చేయగలిగిందల్లా సులువైన పద్ధతిలో, కనీసం ఒక కాలైనా మోకాలు వరకు తీసేసి కుత్రిమ కాలు అమర్చవచ్చు. దానికైనా గాయత్రికి పద్దెనిమిదేళ్ళు నిండితేనే మంచిది,” అని ఓ క్షణమాగారు ఆయన.

“ఇకపోతే, గాయత్రి మూగతనం పోయి మాట వస్తుందా? అని నిర్ధారించేవి మాత్రం, కొన్ని సున్నితమైన ‘స్వరపేటిక పరీక్షలు’. ప్రభుత్వాసుపత్రిలో అవి కుదరకపోవచ్చు. ఆ విషయంగా, ఇక్కడి పెద్ద డాక్టర్ గారు మిమ్మల్ని గుంటూరు లేదా హైదరాబాదులోని నిపుణల వద్దకు వెళ్ళమని సూచనలిస్తారు. ఎంతో సమయం, వ్యయం అవ్వొచ్చు,” అంటూ తాతకి నెమ్మదిగా వివరించారాయన.
అందరం శ్రద్ధగా వింటున్నాము.

క్షణమాగి మా వంక సూటిగా చూసారాయన.
“పోతే గాయత్రికి వినికిడితో పాటు మిగతా ప్రమేయాలన్నీ మామూలుగా ఉన్నాయి. బాగానే చదువుకుంటుందని కూడా తెలిసింది. కాబట్టి, సరయిన పద్ధతిలో వైద్యం అందితే ఆమె స్థితి మెరుగవుతుందనే ఆశించవచ్చు, ఆశిద్దాము,” అన్నారు డాక్టర్ గారు.

తాత ఉమమ్మ వంక చూసాడు.
“అయితే మీరు ఏమంటున్నారో దయచేసి మాకు అర్ధమయ్యేలా చెప్పండి. ‘క్రచ్చస్’, అదే ‘ఊతకర్రలు’ వాడమంటున్నారు, మరి తరువాత జరపవలసిన పరీక్షలవీ ఎప్పుడు? ఎక్కడ?” అని ఆగింది ఉమమ్మ.

“చూడండి ఉమాగారు, నేను ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్ని. ముందు ‘ఊతకర్రల’ కి నర్సుని అవసరమైన వివరాలు, కొలతలు తీసుకోనివ్వండి. ఈ ఆసుపత్రి అనుబంధ సంస్థ ‘శ్రీ సత్య శారద చారిటీ’’ నుండి వారంలోగా గాయత్రికి వాడుకోడానికి ‘ఊతకర్రలు’ మీ చిరునామాకే వస్తాయి.

ఇకపోతే, గాయత్రి విషయమంతా దాఖలు చేసి మా పెద్ద డాక్టరుగారికి పంపిస్తాను. మీరు మళ్ళీ కొంత ఆగి, ఇక్కడ ఆసుపత్రిలో ఆయన్ని కలవచ్చు,” అని ముగించాడాయన.

ఆయన వద్ద సెలవు తీసుకొని, నర్సుకి కావలసిన కొలతలు, వివరాలిచ్చి బయటపడ్డాము.
**
తాత కూడా తన విషయంగా వైద్యుడిని చూశాడు. ఆయన ఆరోగ్యం బాగా పాడయిందని, ఎక్సురే తీసి, రక్తపరీక్షలు చేసారు. కడుపులో ఆమ్లత ఎక్కువుగా ఉందని, దాంతో కడుపులో వ్రణాల ఉదృత వల్ల కూడా బాగా కడుపు నొప్పి, మంట, వాంతులు తరుచుగా అవ్వొచ్చని చెప్పారు.
ఆమ్లతకి వెంటనే చికిత్సతో పాటు శ్రద్ధగా మందులు వాడకం, మంచి ఆహారం, విశ్రాంతి అవసరమని చెప్పారు. జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చారు.
అవి తీసుకొని ఇంటిదారి పట్టాము.
**
తాత దిగులుగా కనబడ్డాడు. కారులో తలా ఒక మాట మాట్లాడుతుంటే తాత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
చంద్రం పిన్ని తాతకి మంచినీళ్ళ చెంబు అందించింది. నీళ్ళు తాగి మరచెంబు నాకందించాడు.

”గాయత్రి విషయంలో డాక్టరుగారు చేసే సాయం ఏదైనా మంచిదే, ఉమమ్మా. అయినా నా ప్రయత్నంగా మాత్రం పూజారయ్య చెప్పిన వికలాంగుల సంస్థని కూడా కలుస్తానమ్మా,” అని ఆమెతో అంటూ ఇంకాస్త ముందుకెళ్ళాక, పనుందని కారు దిగిపోయాడు తాత.

కాసేపటికి మమ్మల్ని కూడా కొట్టాం కాడ దింపేసి కారు ఉమమ్మ ఇంటి వైపు మళ్ళింది.
**
కొట్టాం చేరాక, పిన్నిచ్చిన గంజి తాగి, పుస్తకం చదువుతూ కూచున్నాను.
టీ కాచి తెచ్చుకొని, పక్కనే కూచుంది పిన్ని.

“మా కొట్టాంకెళ్ళి కాసేపట్లో మళ్ళీ నీ ముందుంటా. మీకు ఈ పూటకి కాస్త పప్పు, రొట్టెలు కూడా తెస్తా. ఈ లోగా అవసరం వస్తే పొయ్యికవతల కట్టిన గంట మోగించు,” అని మరి కాసేపటికి పిన్ని తమ కొట్టాంకి వెళ్ళింది.
**
సాయంత్రం చీకటి పడుతుండగా తాత రిక్షాలో దిగాడు. రిక్షాబ్బాయి సాయంతో లోనికొచ్చాడు. తాత ముఖం మీద, బట్టల మీద రక్తపు మరకలు చూసి భయపడిపోయాను.
తాతని పట్టుకు కుదుపుతూ ఆదుర్దాగా ఏమయిందని అడిగాను. వకీలు ఇంటినుండి రిక్షాలో వస్తున్న తాతకి విపరీతంగా దగ్గు మొదలయ్యిందంట. ఆ వెంటనే రక్తం కక్కుకున్నాడంట.
రిక్షాబ్బాయి సాయం చేసి మెల్లగా ఇంటికి చేర్చాడంట.

తాత ముఖం కడుక్కొని, బట్టలు మార్చి వచ్చేలోగానే పిన్నొచ్చింది. ఆమెని చూడగానే ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేసాను. తాత పడక పక్కనే కూచున్న నా కాడికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొంది.

అంతలో స్నానాల గది నుండి బయటపడి, కాళ్ళీడ్చుకుంటూ వచ్చి తన నులక మంచం మీద కూచున్నాడు తాత. సత్తువ లేకుండా అయిపోయిన తాతని చూసి మేమిద్దరం దిగాలు పడ్డాము.

కాస్తాగి పిన్ని వంక చూసాడు తాత. “పోతే చంద్రమ్మా, వికలాంగుల సంస్థ యజమాన్ని కలిసి గాయత్రి కోసం అర్జీ పెట్టాను. వకీలుని కలిసి పొలం విషయం మాట్లాడి, లంచాలకంటూ ముందస్తు డబ్బులు నా కాడ లేవని వివరించాను. చూడాలి దేవునిదయ. నా చేతుల్లో ఇకేమీ లేదమ్మా,” అంటూ మంచం మీద తొంగున్నాడు తాత.

తాత చెప్పింది ఒపిగ్గానే విన్నది పిన్ని.
”ఏదేమైనా విశ్రాంతి లేకుండా వొళ్ళు పాడయ్యేటంతగా అలిసిపోడం మంచిది కాదన్నా నీకు. ఇలా రక్తం కక్కుకోడం, నీరసం వచ్చి పడిపోడం డెబ్బైయేళ్ళ వయసులో ఏ రకంగా నీకు, నీ గాయత్రికి మంచిదో సెప్పు,” కోపంగా మాటలంటూనే పోయింది చంద్రం పిన్ని.

పిన్ని చెప్పేదంతా వింటూ కిక్కురు మనకుండా పడుకుండి పోయాడు తాత.
**
మరసటి రోజు పావుగంట ముందే నేను గుడికెళ్ళాను.

నన్ను చూస్తూనే గబగబా పరిగెత్తుకొనొచ్చింది కమలమ్మ.
“అబ్బో పిల్లా, వచ్చేశావా? ఒకే ఒక్కరోజు పువ్వుల్లాంటి నీ నవ్వులు సూడకపోతే పొద్దు పోలేదనుకో. నీ తానంలో నేను కూకుంటే గుడికోచ్చే నీ అభిమానులకి నచ్చలేదనుకో.
మా గాయత్రి ఎప్పుడొస్తుంది? అని ఒకటే గోల. నీ అందం అసుమంటిది మరి. నీ అవిటితనం పోతే అసలు నీ లెవెలే మారిపోతాదిలే,” గంటలా గణగణా మోగింది కమలమ్మ గొంతు.
నవ్వేసి ఊర్కున్నాను. పూజసామాను సర్దుతూ నాతో మళ్ళీ మాట కలిపింది కమలమ్మ. ఈ సారి నా విషయంలో డాక్టర్లు ఏమన్నారనడిగింది. తాతెందుకు రాలేదని అడిగింది.

‘నాకు ఇంకా వైద్య పరీక్షలు ఉంటాయని, తాతకి వొంట్లో బాగోక రాలేదని’ తెలియజెప్పాను.
నేను చెప్పిన వివరాలు చాల్లేదామెకి.
“మీ తాత కనపడ్డప్పుడు అడిగి తెలుసుకుంటాను. నీకేం తెలుస్తాదిలే? చిన్నపిల్లవి,” అంటూ కాస్త విసురగా అవతలకి వెళ్ళబోయింది.

వెళుతున్న ఆమెని చేయి పట్టి ఆపాను.
‘నిన్నటి రోజున పావురాళ్ళు వచ్చాయా? గింజలేసావా?’ అని సైగలతో అడిగాను.

“ఆ ఆ, ఎందుకు వేయను? బాగానే ఒకటికి రెండు మార్లు వచ్చి గింజలు మెక్కి, కావలసినంత గోల చేసి మరీ వెళ్ళాయిలేమ్మా,” రుసరుసమంటూ కదిలిందామె.
**
గుడిలో మధ్యాహ్నం రద్దీ తగ్గాక నా కాడ చేరింది కమలమ్మ. నా కిష్టమైన బెల్లం పాయసం అంటూ గ్లాసు అందించింది.

“మా గోవిందు, ఊరికి కాస్త దూరంగా విశాలమైన పాక కిరాయికి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు ఎవరితోనో కలిసి సత్రంలోలా ఉండేవాడుగా!. ఇప్పుడు వాడి సొంత పాకలో కాస్త అదీ ఇదీ సర్ది, వాడికిష్టమైంది వండి పెడదామని, ఆదివారాలు మధ్యాహ్నాలు కాసేపు ఎళ్ళొస్తున్నా. నాకు కొడుకైనా, తమ్ముడైనా వాడేగా,” అని వివరించింది.

‘ఊ’ కొడుతూ వింటున్నాను. పాయసం బాగుందని సైగ చేసాను.
కబుర్లు చెబుతూనే ఉంది కమలమ్మ.
“ఈడ నుండి విశ్రాంతి కావాలంటే, హాయిగా గోవిందు పాకకి పోవడమే,” అన్నది మళ్ళీ సంబరంగా కమలమ్మ.
**
ఒక్కింత ఓపిగ్గానే ఉందంటూ ఖాయిలా పడి లేచిన మూడోరోజు చీకటితో నా రిక్షా వెనకాలే నడుస్తూ పనికొచ్చాడు తాత.
పూజసామాను సర్దుతున్న తాతతో మాట కలపాలని ఆత్రుతగా వచ్చింది కమలమ్మ.

“అయితే అన్నా, మరి డాక్టరు ఏమన్నాడు? మా గాయత్రికి మాట, నడక ఎప్పుడొస్తాయన్నాడు? మాకు తెలిసిన ఒకమ్మాయికి ఇలాగే ఉండేది. పట్నం డాక్టర్లు వైద్యం చేసి ఇప్పుడు చకచకా నడిపిస్తున్నారు. మన గాయత్రి లాగానే అప్సరసనుకో.
ఇక కాలు బాగయిన రెండేళ్ళకి ఓ గొప్పింటి కుర్రాడు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడు సత్యమన్నా. నిజ్జంగా, అమ్మతోడు,” అంది తల మీద చెయ్యెట్టుకొని నవ్వుతూ కమలమ్మ.
తాత కిమ్మనలేదు.
తన మాట చెప్పుకుంటూ పోయిందే గాని తాతకి నోరు విప్పి మాట్లాడే సందు ఇవ్వదుగా కమలమ్మ.
నాకేమో ఆ అమ్మాయికి వైద్యం చేసిన డాక్టర్లు ఎవరని కనుక్కుంటే బాగుండుననిపించింది.
egire-pavurama-7-revised
**
మధ్యాహ్నం పొంగలి ప్రసాదం తిని తాత కూరల బడ్డీ వైపు వెళ్ళగానే కమలమ్మ నా కాడికొచ్చి కూచుంది.
నడకొచ్చిన ఆ చుట్టాలమ్మాయి గురించి ఎలాగైనా అడగాలని అనుకుంటుండగా, ఆమే అందుకుంది.

“నే చెప్పేది నిజమేనే తల్లీ, నీకిప్పుడు పదిహేనేళ్ళు కదా! ఐదేళ్ల వయసు నుండి ఈడ ఇలా కొలువు చేస్తివి కదా! నీ హుండీ డబ్బే బోలెడంత కూడుకొనుంటుంది మీ తాత కాడ.
ఆ డబ్బు పెట్టి వైద్యం చేయిస్తే పోలా?
ఎంచక్కా మా చుట్టాలమ్మాయి లాగా బాగయిపోయి ఎవరినో ఎందుకు?
నీకు తెలిసిన నా తమ్ముణ్ణి పెళ్ళి చేసుకోవచ్చు,” క్షణమాగి నా వంక చూసింది…
ఏమంటుందో అర్ధం అవ్వలేదు నాకు…

“సవితితల్లి కొడుకన్న మాటేగాని, నా బిడ్డ లాంటోడేగా గోవిందు. కాస్త రంగు తక్కువేమో గాని బాగుంటాడు వాడు. ఆటో కూడా చేతికొచ్చేస్తే, రాజాలా సంపాదిస్తాడు.
వాడు ఒప్పుకోవాలే గాని, మంచి మొగుడౌతాడు నా తమ్ముడు,” నోటికొచ్చింది అంటూనే ఉంది కమలమ్మ.

నా తల గిర్రున తిరిగినట్టయింది. నా కాళ్ళ వైద్యం నుంచి పెళ్ళి వరకు వెళ్ళిపోయిన కమలమ్మ మాటల్లో నిజం ఉందా అనిపించింది.

ఆలోచనలో పడ్డాను.
‘అసలీ బుర్రలేని పెళ్లి మాటలేంటి? పిన్నికి, తాతకి అందుకే నచ్చదేమో కమలమ్మ తీరు’ అనుకుంటుండగా ……
“ఏమోలే, నువ్వా నోరులేని దానివి. ఇలాంటి ఇషయాలు మీ తాతతో, ఎలాగైనా నువ్వే తేల్చుకోవాలి. నిన్ను చూస్తే చానా కష్టంగా ఉంది. వైద్యం చేయిస్తే మాములు మనిషయ్యి చక్రం తిప్పగలవు నువ్వు,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా నవ్వుతూ.

ఆమె మాటలకి ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఇట్టాగే మాట్లాడుతుంది.

“అయ్యో నీతో మాటల్లో పడి మరిచేపొయ్యా. ఇయ్యాళ ఆదివారం కదా. ఈ సమయానికి మా తమ్ముడు వచ్చుంటాడు. వాడి పాక వరకు ఎళ్ళి గుడి తెరిచేలోగా, నాలుగింటికంతా వచ్చేస్తానే,” అంటూ రిక్షా ఆగే చోటు – గుడి వెనక్కి పరుగు తీసింది కమలమ్మ.
**
బయట సన్నగా తుప్పర పడుతుంది. ఇంకా తెల్లారలేదు. ఈ మధ్యనే నా కోసం తాత వేసిన కొత్త పరుపు మీద బాగా నిద్ర పడుతుంది. అయినా చీకటితో లేచి కూచున్నాను.
పరీక్షల భయం పట్టుకుంది. నాలుగు రోజుల్లో మాష్టారు పెట్టబోయే పరీక్షలు మునపటికన్నా మెరుగ్గా రాయాలంది ఉమమ్మ.

చదువుతూ ఆలస్యంగా తొంగోడంతో బద్ధకంగా ఉంది.
తాత లేచాడో లేదో తెలీలేదు.. పడక మీదనుండి లేవబోయాను….

కొట్టాం తలుపు తెరిచిన చప్పుడయింది. చూస్తే, చేతిలో ఎర్ర మందార పువ్వులతో, పిన్ని లోనికి వచ్చింది….

“లేరా గాయత్రి, ఇవాళ ‘అట్లతద్ది’. త్వరగా లేచి స్నానం చేసి తయారవ్వు. తాత కుట్టించిన కొత్త పరికిణీ వోణీ వేసుకో. నీ తలదువ్వి రెండు జడలు వేద్దామని వచ్చాను.
నీ జుట్టు పెద్దపని కదా. టైం పడుతుంది,” అంటూ నా ఎదురుగా చతికిల పడింది పిన్ని.
రాములు వెళ్లిపోయాక పండగలప్పుడు తప్పనిసరిగా నాకు రెండు జడలు వేస్తుందామె.
**
పొద్దున్నే, గుడికి రిక్షా అల్లంత దూరముండగానే సంతోషంగా ఎదురొచ్చింది కమలమ్మ. నాకు చేయందిస్తూ “ఈ రోజు ‘అట్లతద్ది’ ఆడపిల్లల పండుగ. పిండి రుబ్బి అట్లు వేయలేను గాని మధ్యానం బయట హోటలు నుండి మనకి అట్లు తెప్పిస్తాను గోవిందుతో,” అంది సంబరంగా కమలమ్మ.
ఒక్కోసారి కమలమ్మ చేసే హడావిడి తలనొప్పిగా ఉంటుంది నాకు.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా! – 6

egire-pavuramaa-tytle-6th-p

రాములు వెళ్ళిపోయిన మూడో రోజు గుడి ‘స్వీపరు’గా కమలమ్మ కొలువులో చేరింది. రాములు ఉండెళ్ళిన పెంకుటింట్లోనే ఇప్పుడు ఆమె ఉంటుంది. నన్ను రోజూ కోవెలకి తిప్పే రిక్షాబ్బాయి గోవిందుకి అక్క కమలమ్మ.

 నా విషయం, నా అవసరాలు ఆమెకి వివరించి, నేను గుడిలో ఉన్నంత సేపు కాస్త సాయం చేయాలని ఆమెని అడిగాడు తాత. నెలకి యాభై రుపాయలిస్తే సాయమందిస్తానందంట. వేరే గత్యంతరం లేక తాత ఒప్పుకున్నాడంట.

 సాయం చేయమంటే యాభై రూపాయలు అడగడం ఏమిటని, పిన్ని గోలెట్టింది. ఆఖరికి ‘గాయత్రి హుండీ’ నుండి నెలకి ఆ యాభై   కమలమ్మకిచ్చేలా ఆలోచించారు. కొత్తగా కొలువులో కొచ్చింది, గోవిందు అక్కని తాత చెపితేనే పిన్నికి తెలిసింది.

మళ్ళీ వారానికి ‘కృష్ణ’ అనే పదేళ్ళ అబ్బాయిని కూడా పనికి పెట్టుకున్నాడు పంతులుగారు. మాకు మల్లేనే రోజూ పొద్దుటే కోవెలకి వస్తాడాబ్బాయి. శ్లోకాలు చదువుకుంటూ పూజసామాను తోమి, గర్భగుడిలో సైతం శుభ్రం చేసి, విగ్రహాలకి పూల మాలలు అలంకరిస్తాడు కృష్ణ.

పంతులుగారికి దూరపు చుట్టమంట. పనయ్యాక బట్టలు మార్చుకొని, కృష్ణ బడికి వెళ్ళిపోతాడు కూడా.

**

పొద్దున్నే, పూలబుట్ట నా ముందుంచి వెళుతున్న కమలమ్మని చూడగానే, చంద్రం పిన్ని అన్న మాటలు గుర్తొచ్చాయి.

…… “కమలమ్మ గురించి ఆరా తీసానురా గాయత్రీ, ఆమె అదోరకం మనిషని విన్నాను. తగువులు పెడుతుందంట. బద్రంగా ఉండాలి ఆమెతో. అయినా గుళ్ళో కమలమ్మ నీకు చేసేది మొక్కుబడి సాయమేలే,” అని చంద్రమ్మ అనడం అక్కడే ఉన్న తాత విన్నాడు.

“ఆ కమలమ్మతో, నువ్వూ కాస్త ఓపిగ్గా ఉండాలి, గాయత్రి,” అన్న తాత మాటలు కూడా గుర్తు చేసుకుంటూ పూల పని ముగించాను.

కాసేపటికి తిరిగొచ్చిన కమలమ్మకి పూలబుట్ట అందివ్వబోతే, నా జాకెట్టు కుట్టు పిగిలింది. తన చీర ఒకటి తెచ్చి నాకు కప్పి, నా వెనుక కూచుని సూది-దారంతో గబగబా నాలుగు కుట్లేసింది కమలమ్మ.

ఈ మధ్య నా బట్టలు కురచైపోతున్నాయి. బిగుతుగా కూడా తోస్తున్నాయి. చంద్రం పిన్ని గమనించి రెండుజతల బట్టలు కొని కుట్టించుకొచ్చింది. ఉమమ్మ కూడా తనకి కురచైపోయిన పరికిణీ జుబ్బాలు తెచ్చిచ్చింది.

నేను అందంగా, ఆరోగ్యంగా ఎదుగుతున్నానని, అందరి కళ్ళు నా మీదే ఉంటున్నాయనంటూ, పొద్దుటే చంద్రం పిన్ని చేత్తోనే  ఈ మధ్య మురిపెంగా దిష్టిచుక్కెట్టిస్తున్నాడు తాత.

“అన్నా, గాయత్రితో రిక్షాలో కూచుని గుడికెళ్ళరాదా? అని మళ్ళీ చంద్రమ్మ ఎంతడిగినా ససేమిరా వినలేదు. తాత కాలినడకనే గుడికి వస్తాడు, పోతాడు.

**

గుళ్ళో రాములు లేని లోటు, కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ కలివిడిగా పనులు కలిపించుకుంటూ, అందరికి సాయం చేస్తుండే రాములు లేని లోటు మాకే కాదు – పూజారయ్య, ఉమమ్మలకి కూడా అనిపిస్తుందంట.

ఉమమ్మ కలిసిన ప్రతిసారి రాముల్ని తలుచుకుంటున్నాము. ఆమె పెనిమిటికి ఆరోగ్యం ఇంకా బాగవలేదని మాత్రం తాత మాతో అన్నాడు.

పావురాళ్ళకి గింజలెయ్యడం, వాటి వెనువెంటే శుభ్రం చేయడం తన వల్ల కాదని గొడవ చేసింది కమలమ్మ ఓ సారి.

గుడికి పావురాళ్ళ రాక ఎప్పటినుంచో ఉన్నదేనని, అవి వచ్చి వెళ్ళాక అరుగులు రెండు పూటలా శుభ్రం చేయడం, కోవెలనాశ్రయించిన పక్షులకి, పశువులకి దానా వేయడం, ఆమె పనిలో భాగమే అని పంతులుగారు చెప్పాక గాని కమలమ్మ పావురాళ్ళ మీద విసుగ్గోడం మానలేదు.

కమలమ్మకి – రాములికి అసలు ఏ విషయంలోనూ పోలిక లేదనిపించింది.

**

మరో నెల రోజుల్లో నాకు పదమూడేళ్ళు నిండుతాయని ముందుగానే కొత్త పరికిణి, జాకెట్టుతో ఈ తడవ వోణి, గాజులు తీసుకున్నాడు తాత.  మరో రెండు జతలు బట్టలు తీసాడు. అందుకోసం పూజారయ్య కాడ  అప్పు కూడా చేసాడు.

ఉమమ్మ ఇచ్చిన వాటితో కలుపుకొని ఇప్పటికే సరిపడా బట్టలున్నాయని తాతకి తెలియజెప్పాను. అప్పు చేయవద్దని గొడవపడ్డాను.

“నిన్ను గొప్పగా చూడాలని ఉంటాదమ్మా.  పెద్దదానివౌతున్నావు. తొందరగా నడవగలగాలని, చదువుకొని నువ్వు స్వతంత్రంగా బతకాలని నా కోరిక,” అన్నాడు తాత చమర్చిన కళ్ళతో.

నన్ను కన్న వాళ్ళు ఎలా దూరమయ్యారో కాని,  తాత లేకపోతే నేనేమయ్యేదాన్నో తెలీదు.

మొత్తానికి అలా నా పదమూడవ పుట్టిన రోజు నుండి పైట వెయ్యడం మొదలెట్టాను.

పూజారయ్య భార్య మంగళమ్మగారితో సహా పంతులుగారి భార్య, నాయుడన్న భార్య కూడా నాకు పుట్టినరోజు కానుకగా పరికిణీ, వోణీలు పంపారు.

**

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉమమ్మ రెండు పుస్తకాల సంచులు తీసుకొని వచ్చింది.

‘ఏమిటా? ఇన్ని పుస్తకాలు ఉమమ్మ చేతుల్లో! అసలు ఇవాళ ఆమె మాములుగా వచ్చే రోజు కూడా కాదే ’ అని కుతూహలంగా ఉంది.

గట్టి అట్ట పుస్తకాలు ఎన్నో! పక్కనే కూచుని వరసగా పుస్తకాలని తీసి నా ముందు పేర్చింది ఆమె.

నా వంక చూసి, “ఇప్పటినుంచి ఈ పుస్తకాలతోనే నీ అస్సలు చదువు మొదలవుతుంది,” అంది ఉమమ్మ.

అర్ధమవ్వక, ‘అంటే’ అన్నట్టు చూసాను ఆమెని.   నా ముఖంలో గాబరాని చూసి ఫక్కున నవ్విందామె.

“ఏం లేదురా గాయత్రీ, లెక్కలు, సాంఘికం, తెలుగు, కాస్త ఆంగ్లం మాత్రమే చదువుతున్నావు ఇప్పటి వరకు. పబ్లిక్ పరీక్షలకి కూడా నిన్ను తయారు చేయాలి కదా!” నా వంక చూసింది.

“అంటే, సైన్స్ – భూగోళ శాస్త్రం- ఆల్జీబ్రా – లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నాలుగవ తరగతి నుండి మొదలవుతాయి. అందుకే నీకు ఆ సబ్జెక్ట్లు – నాలుగు, ఐదు, ఆరవ తరగతుల పాఠ్య పుస్తకాలు తెచ్చాను.

నీకు రెండేళ్ళ సమయం ఉంది. మూడు నెల్లకోసారి ఈ సబ్జక్టుల్లో పరీక్షలు రాయవచ్చు,” చెప్పడం ఆపి నా వంక చూసి, సరేనా?” అంది ఆమె.

‘అర్ధమయ్యింది’   అని తలూపాను.

“ఈ సారి నుంచి ఓ పథకం ప్రకారం ఈ పుస్తకాలే విప్పుదాము,” అని ముగించింది ఉమమ్మ.

కొత్త పుస్తకాలని చూస్తే, నాకు ఉత్సాహంగా ఉన్నా , భయంగా కూడా అనిపించింది.

“సరే, కొత్తగా వచ్చిన కమలమ్మ సాయంగా ఉంటుందా?” ఆరా తీసింది ఉమమ్మ.

సన్నగా నవ్వాను.

“ఇంకా కొత్త కదా! చనువు లేదుగా. దూరంగానే మసులుతున్నట్టుగా ఉంది. మంచిదేలే. వచ్చే రెండేళ్లు గట్టిగా చదువు మీద దృష్టి పెట్టు గాయత్రీ, నేను రెండు రోజుల్లో వస్తా. ఈ లోగా కొత్త పుస్తకాలు తిరగేయి,” అంటూ వెళ్ళింది ఉమమ్మ.

**

యేడాదిన్నర సమయం ఇట్టే గడిచిపోయింది. చాలా కష్టపడి చదువుతున్నాను. ఆ చదువు అర్ధమయ్యి, నేర్చుకుని, పరీక్షలు రాయడం లోనే ఎక్కడి సమయం చాలడం లేదు. ఇంకొక్క వరస పరీక్షలైతే, నేను పూర్తిగా అరవ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నట్టే లెక్క అంది ఉమమ్మ.

అందుకే, సమయం దొరకగానే పుస్తకాలతో గడిపేస్తున్నాను.

కమలమ్మ అప్పుడప్పుడు అలుగుతూ, అలసిపోతూ, పంతులుగారితో చెప్పించుకుంటూ, పని చేసుకుంటుంది.

నాతో ఇప్పుడిప్పుడే కాస్త ఓపిగ్గా మాట్లాడుతుంది.

తాతతో మాట కలపాలని చూస్తుంది కమలమ్మ. తాత తలొంచుకుని తన పని చేసుకోడమే తప్ప రాములుతో లాగా మాట్లాడడు.   ఎప్పుడన్నా తాతకి నలతగుండి పనిలోకి రాకపోతే, ఆ పని కూడా తన మీద పడిందని అందరికీ తెలిసేలా రుసరుసలాడుతుంది కమలమ్మ.

ఆమె, గుడికి ఎదురుగా ఉండే కూరలబడ్డీ సీతమ్మ దగ్గర కబుర్లకి కూచుంటుందని, మధ్యాహ్నాలు అక్కడే భోజనం చేస్తూ, తాతని కూడా తమతో కూచోమని పిలుస్తుందని చెప్పాడు తాత.

నాయుడన్న భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి కమలమ్మతో మాట్లాడి పోతుంటది.

**

గుడిలో ఒక్కోసారి కుర్రోళ్ళు కొందరు పూజసామాను కొనే సాకుతో మాటలు సాగిస్తూ, నన్ను అల్లరి పెట్టడం మొదలెట్టారు.

కమలమ్మ ఒకటి రెండు సార్లు వాళ్ళని తిట్టి పంపేసింది.

“నీకు నేను తోడుంటాలే గాయత్రి,” అంటూ నా కాడ కూచుంది కొన్ని మార్లు.   “వోణి యేశాక ఎక్కడిలేని అందం వచ్చింది నీకు గాయత్రి. నీ నవ్వులు, నీ చూపుల కోసం కుర్రాళ్ళు బారులు కడుతున్నారా? ఒక్క అవిటితనమే నీ లోపమిప్పుడు,” అంది కమలమ్మ.

ఆమె మాటలు నాకు నచ్చలేదు. అసలా సంగతులేవీ తాతకి చెప్పలేదు.

**

నిద్రపోయే సమయానికి హడావిడిగా చంద్రం పిన్నొచ్చింది.

“అన్నా, ఈ వారంలో గాయత్రిని మంగళగిరి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి, పూజారయ్య బండి కావాలన్నారుగా.

మా ఆయన, వాళ్ళ రవాణ ఆఫీసు బండి ఏర్పాటు చేశాడు.

ఎల్లుండి పొద్దున్న తొమ్మిదికంతా బయలుదేరుదామన్నా.

రేపు గుడి కాడికొచ్చి అన్ని విషయాలు మాట్లాడుదాములే, వస్తానే,” అంటూ వచ్చినంత హడావిడిగా వెళ్ళిందామె.

**

egire-pavurama-6

అనుకున్నట్టే పొద్దున్న పదిగంటలకి మంగళగిరి ధర్మాసుపత్రికి తాత, చంద్రమ్మ, ఉమమ్మ, నేను బయలుదేరాము. మొదటి సారిగా నేను కారెక్కాను.

మాకు కావలసిన సాయం చెయ్యమని, తెలిసిన ఆసుపత్రి సిబ్బందికి ముందే కబురంపారంట పూజారయ్య.   దాంతో నాకు ఆసుపత్రి వారి చక్రాలబండి ఏర్పాటు, వైద్య నిపుణుల సంప్రదింపులు సులువుగా అయ్యాయి. నా విషయంగా మొత్తం ముగ్గురు వైద్యులని చూసాము.

ఆఖరున డాక్టరు మల్లిక్ గారిని కలిసాము.

ఆయన నన్ను పరీక్షించి, ఊతకర్రల సాయంతో నిలదొక్కుకొని కొంత మేర సులువుగా కదలవచ్చన్నారు.

నాతో మాట్లాడుతూ, “చూడు గాయత్రి, చక్రాల పీటలవీ చిన్న పిల్లలు కొద్ది రోజుల వాడకానికి పర్వాలేదు.

కానీ, నీవిక ఈ వయస్సుకి ఊతకర్రల సాయంతో కదలడం అలవరచుకోవాలి.

లేదంటే నీ ఎదుగుదలకి మంచిది కాదు. వెన్నెముకతో పాటు కదలిక మరింత స్తంభించే అవకాశముంది.

అసలిప్పటికే నీవు కర్రలు వాడుతుండవలసింది,” అంటూ సమయం తీసుకొని, నాకు ఆరోగ్యం పట్ల ఉండవలసిన సామాన్య శ్రద్ధ గురించి వివరించారు.

నన్ను, ఉమమ్మని తన ఆఫీసులో కలవమని చెప్పి వెళ్ళారు డాక్టరుగారు.

**

మేము వెళ్ళేప్పటికి అటుగా తిరిగి ఫోనులో మాట్లాడుతున్న ఆయన మమ్మల్ని కూచోమని సైగ చేసారు. ఆ గదిలో, ఓ పక్కగా రకరకాల కొలతల్లో ఊతకర్రలు, చెక్క కాలితొడుగులు ఉన్నాయి.

ఫోనులో కూడా డాక్టరుగారు ఊతకర్రల గురించే ఎవరితోనో మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది. ఆయనకెదురుగా బెంచీ మీద కూర్చుని, చిన్న సైజు బూట్లకొట్టులా ఉన్న ఆ గదిని కలయజూసాము.

ఫోన్ పెట్టేసాక, ఆయన మావైపు తిరిగారు.

“చూడండి మేడమ్, గాయత్రికి వెంటనే ఊతకర్రలు తెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాను. మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు? మీరంతా ఎక్కడ వుంటారు? గాయత్రి వైద్యసహాయ విషయమై కాగితాలు మీరే చూస్తారా?” అని ఉమమ్మని అడిగాడు డాక్టర్ గారు.

“గాయత్రి విషయమై కాగితాలు నాకు ఇవ్వచ్చు. నా పేరు ఉమాదేవి సోమయాజులు. పాలెం లోని మా ‘శ్రీ గాయత్రి’ కోవెల్లోనే వాళ్ళ తాత సత్యం సాయిరాం కొలువు చేస్తున్నారు. గాయత్రికి మేము శ్రేయోభిలాషులం అనుకోండి. ఆమె తాత, పిన్నమ్మ మా కూడా వచ్చారు. బయట కూర్చున్నారు,” అని ముగించింది ఉమమ్మ.

“అలాగా,” అంటూ తాతావాళ్ళ కోసం కబురంపి, ఊతకర్రల విషయంగా నా గురించిన సమాచారం, చిరునామా రాయమని ఉమమ్మకి కొన్ని కాగితాలు ఇచ్చారు డాక్టరుగారు.

తన కాడ ఉన్న నా వివరాల పత్రాలు మరోసారి పరిశీలించి, లోనికొచ్చి కూర్చున్న తాత, చంద్రమ్మల వంక చుసారాయన.

“చూడండి సత్యంగారు, గాయత్రి ఎదుగుదల, కదలికకి సహాయపడాలంటే వీలయినంత త్వరలో ఆమె ‘ఊతకర్రలు’ వాడకం అలవాటుగా మొదలుపెట్టాలి.

ఆసుపత్రి ద్వారా అయితే, దానికి కొంత సమయం, మీకు కొంత ఖర్చు అవుతుందట.

నేనిప్పుడే కనుక్కున్నాను. మా ‘ధార్మిక సంస్థ’ ద్వారా మీకు ఉచితంగా వాటిని ఏర్పాటు చేయించగలను,” అంటూ వాళ్ళకి ఓపిగ్గా వివరించారు.

తాత మాత్రం అర్ధం కానట్టుగా చూసాడు డాక్టరు వంక.

“అదేమిటి బాబు. ఆసుపత్రి వాళ్ళు చేయవలసినది, మీరు మీ సొంతంగా చేయడమేమిటి?

అసలు గాయత్రికి మాట, నడక స్వతహాగా వస్తాయేమోనని పరీక్షించి చెప్పలేరా బాబు? అని అడిగాడు.

(ఇంకా ఉంది)

 

 

ఎగిరే పావురమా! ఐదవ భాగం

serial-banner5

ఐదవ భాగం

గడిచిన రెండేళ్ళల్లో, రాములు నాలుగు తడవలన్నా వాళ్ళ మామని చూడ్డానికని ఊరికి పోయింది. ఎప్పుడెళ్ళినా పొద్దున్నే పోయి సాయంత్రానికి తిరిగొచ్చేస్తది.

 

వచ్చాక మాత్రం ప్రతిసారి రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉంటది.

నాకు రాములుని అట్టా చూడ్డం కష్టంగా అనిపిస్తది.

తాతైతే ఇంకా ఎక్కువే బాధపడతాడు.

 

నెలకిందట  రాములు ఊరికి పోయొచ్చాక మాత్రం తాత ఆమెని కోప్పడ్డాడు.

 

“ఎందుకు పోయి భంగపడి వస్తావే? నీకు కనీసం ఒక్కపూట తిండి కూడా పెట్టించే ధైర్యం చేయని పెనిమిటి కోసం ఏందే నీ పరుగులు రాములు? “ అన్నాడు తాత కఠినంగా.

 

“కాదు సత్యమయ్యా, మామ నా ఇషయంలో చేసిన తప్పు తెలుసుకున్నాడు. బాధ పడుతున్నాడు. ఆరోగ్యం బాగా చెడింది. మనిషి సగమయ్యాడయ్యా.

తాగుడు, పొగాకు బాగా వ్యసనమైపోయాయి వాడికి.   ఏమౌతాడో?

ఆరోగ్యం చెడినా సంపాదన తగ్గద్దని, ఇంకా రేత్రిళ్ళు లారీ నడుపుతున్నాడు.

మామకి కాపలాగా తమ్ముణ్ణి పెట్టింది ఆ పెళ్ళాం. అందుకే నేనే పోయి కనీసం కళ్ళతో మామని చూసుకొనొస్తున్నా,” అంది రాములు తాతతో.

 

ఓపిగ్గానే విని, “ఈ తడవ నాకు నీ కష్టం చెప్పమాకు, నా కాడ ఏడవమాకు. నేనూ బాధపడాలా?” అన్నాడు తాత విసుగ్గా.

**

తాత ఈ మధ్య బాగా నీరసపడ్డాడు. తినడం బాగా తగ్గించాడని పిన్ని కూడా గోలెడుతుంది.. గత ఆర్నెల్లలో తాత రెండు తడవలు జబ్బుపడ్డాడు. బాగా చిక్కిపోయాడు.

మూన్నెళ్ళ కిందట ఆసుపత్రి వైద్యులు మందులిచ్చిన కాడినుండి గంజి, మజ్జిగల మీదే తాత బతుకుతున్నాడు.

 

తాతనట్టా చూడ్డం చాల దిగులుగా ఉంది.  నీరసించి, చేతనవక వారమేసి రోజులు ఇంటికాడే ఉండిపోతున్నాడు.

తోడుగా ఉంటానని నేను అడిగినా, “అమ్మో నువ్వు లేకపోతే పూజసామాను కాడ ఎవరుంటారు? పూజారయ్య ఊరుకోడు తల్లీ. నువ్వెళ్లాల్సిందే,” అని నన్ను గుడికి పంపేస్తున్నాడు తాత.

**

పొద్దున్నే పడక మీంచి లేస్తూనే, తాతకి కడుపులో మంట, దగ్గు, తట్టుకోలేనంతగా ఎక్కువయ్యాయి. ఎప్పటిలా బలవంతంగా నన్ను గుడికి పంపేసి చంద్రమ్మతో హడావిడిగా ఆసుపత్రికి పోయాడు తాత.

**

పగలంతా తాత గురించే గుబులు పడ్డాను. పనయ్యాక తాతని చూడాలని ఆదుర్దాగా కొట్టాం చేరేప్పటికి, తాత బయట నులక మంచం పైన తొంగొనున్నాడు. కాస్త ఎడంగా కూచుని చాటలో రాగులు చెరుగుతూ పిన్ని తాతతో గొడవ పడుతుంది.

 

తాత కాడికెళ్ళి కూచున్నాను. మాటలాపి చాట తీసుకొని పిన్ని లోనికెళ్ళింది.

తాతని చేత్తో తట్టి, “నొప్పి తగ్గిందా? మందులేసుకొన్నావా?” అని సైగతో అడిగాను. లేచి కూచున్నాడు తాత. నా చేయందుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు.

 

“అయ్యో చిట్టితల్లీ, బాగున్నానే. పనికెళ్ళలేక ఇప్పటికే చానా రోజులయింది. ఖర్చుకి, తిండికి, నా వైద్యానికే డబ్బులన్నీ అయిపోతున్నాయే,” అన్నాడు తాత దిగులుగా.

‘పర్లేదు తాత, నేనున్నాగా. చంద్రం పిన్ని ఉందిగా,’ అని సైగ చేసాను.

egire-pavurama5

 

ఉడికించిన అలసందలు ఉప్పేసి తెచ్చి తాత కందించింది పిన్ని.

“అన్నా, ఇటు నా మాట కాస్త విను. ఇక నీవిలా కష్టపడి పని చేయడానికి లేదు. డబ్బు లేదంటూ దిగులు పడుతూ మందులు కొనడానికి వెనకాడితే నేనూరుకోను. చేతనయినన్నాళ్ళు బాధ్యతలు మోసావు,” అంటూ నన్ను కాస్త జరగమని, నాకు – తాతకి మధ్యన చతికిల పడింది పిన్ని.

“ఇటు సూడన్నా, నువ్వే కాదా మాకున్న పెద్ద దిక్కు?

నీకేమన్నా అయితే నేనూ, గాయత్రి ఏమవ్వాలి?” అంది పిన్ని దిగులుగా.

 

“పోతే, వకీలు నీ వరిపొలం విడిపించగానే అమ్మేద్దాములే. నీ వైద్యానికి, అవసరాలకి అక్కరకొస్తుంది,” అని తాతతో అంటూ నా వైపు తిరిగింది చంద్రమ్మ.

 

“నీ కోసం రాగి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు మూతేసి పొయ్యి కాడ ఉంచానురా. నువ్వు తిన్నాక, గిన్నెలోకి తీసిపెట్టిన రాగిజావ తాత చేత తాగించు,” అంటూ తాతని లేపి, మెల్లగా కొట్టాంలోకి సాయం పట్టింది పిన్ని.

 

“నేనెళ్ళి ధర్మాస్పత్రిలో అన్నకి మందులు తీసుకొని రేపొస్తా. ఆడైతేనే కాస్త చవక. ఉచిత వైద్యమే ఐనా మనకీ ఖర్చవుతుంది,” అంటూ గబగబా వెళ్ళిపోయింది పిన్ని.

కాసేపు తాత కాడ కూచుని, పుస్తకం చదువుకున్నాకే, నేను తిని తాతతో జావ తాపించాను.

**

తెల్లారకముందే తడికలవతల వైపు నుండి పిన్ని మాట వినిపించింది. కళ్ళు విప్పి తొంగి చూస్తే వాకిట్లో కూచునున్నారు తాత, పిన్ని. తాత టీ తాగుతూ ఆమె చెప్పేది వింటున్నాడు.

“అన్నా, రేత్రి మా ఆయనతో మాట్లాడాను. నీ పొలం విడిపించడానికి డబ్బు ఖర్చవుతదంట. నీతిమాలిన నీ సవిత్తల్లి, పొలం కబ్జా చేయడంతో నీకీ దరిద్రం పట్టింది.

నువ్వేమో గాయత్రి డబ్బు దేనికీ ముట్టుకోనంటావు. పసిబిడ్డగా కాపాడి, పెంచి పెద్ద చేసి, దానికి ఒక బతుకు తెరువు కూడా ఏర్పాటు చేసావు.

ఇకనైనా గాయత్రి చింత మాని, నీ బాగోగులు చూసుకోవయ్యా.

నీ ఫించను డబ్బులున్నా, రోగం ముదిరితే మాత్రం, నీ మందులకి కూడా కష్టమౌతాదేమో,” అంది చంద్రం పిన్ని.

 

ఆమె మాటలు మెదలకుండా విన్నాడు తాత.

“లేదులేవే చంద్రం. నేను పనిలోకెడతా. గాయత్రి డబ్బు అలాగే ఉండనీ. పద్నాలుగేళ్ళు నిండాక గాయత్రిని పట్నంలో వైద్యుల కాడ సూపెట్టాలన్నారు పూజారయ్య. బోలెడంత ఖర్చవుతుందంట.

గాయత్రి విషయంగా పట్నంలో ఏదో వికలాంగుల సంస్థ ఉందంట. ఈ నెలలో ఆడికి కూడా పోయి మాట్లాడి వస్తాలే. నా పొలం సంగతికి నేనెళ్ళి వకీలు బాబుని కలుస్తాలే,” అన్నాడు తాత..

 

“అది కాదన్నా నేననేది,” అంటున్నామెని ఆపాడు తాత.

“అయినా ఆ పసిదాన్ని ఇంటికి తెచ్చినప్పటి పరిస్థితి నీ కెరుకే.

కన్నతల్లో, మరెవరైనా కసాయో? ఆ పసిదాని గొంతుకి గుడ్డ చుట్టి మరీ కాలువ గట్టున వదిలేసారు. అట్టాగని, పెంచిన నేను దాన్ని గాలికొదిలే లేనుగా!.

ఆ తల్లి దయలేని చర్య వల్లే, ఆ అఘాతం వల్లే, బిడ్డకి మాట రాకుండా అయిపోయిందని నా అనుమానం. ఆ పసిది పాపం! నలిగి నెత్తురోడే కాళ్ళతో, ఆ తుఫానులో ఒక్కరోజన్నా అలా పడుందేమో కదా,” అని కళ్ళు తుడుచుకున్నాడు తాత.

“అందుకే, నా ఊపిరి ఉన్నంత దాకా బిడ్డ జీవనం సరిచెయ్యాలనే ప్రయత్నం చేస్తానే చంద్రమ్మా. అయినా నా చిట్టితల్లి చిరునవ్వులు, నీ ఆప్యాయత చాలు – నా జీవనానికి,” అంటూ నన్ను నిద్ర లేపడానికన్నట్టుగా పైకి లేచి నా వైపుకి నడిచాడు తాత.

 

‘నన్ను కన్నతల్లి వదిలించుకుందని, తాత నన్నాదుకుని ఇంటికి తెచ్చాడని అప్పుడప్పుడు పిన్ని మాటల్లో ఇదివరకే తెలుసును.   కాని ఇప్పుడు తాత నా గురించి అన్నది వింటుంటే, పసిపిల్లగా అట్టాంటి బాధలో దొరికానా తాతకి? అని చానా కష్టమనిపించింది…..

 

ఇక పిన్ని కూడా ఏమనలేక పోయింది. “సరేలే అన్నా మళ్ళీ పనిలోకెడుతుండావు. రవ్వంత గమనించుకొని విశ్రాంతిగా ఉండు,” అంటూ లోనికొచ్చి పొయ్యి కాడికెళ్ళింది.

**

ఎన్నో రోజుల తరువాత పనిలోకొచ్చాడు తాత. కోవెల ఆవరణంతా ఊడ్చి వచ్చిన తాతకి, మంచి నీళ్ళిచ్చి పక్కనే కూచుంది రాములు.

 

క్షణమాగి, “అయ్యా, నేను నా మామ కాడికి ఎళ్ళిపొతున్నా. మంచాన ఉండాడంట.   వాడిని చూసుకోడానికి నన్ను రమ్మని ఇన్నాళ్ళకి ఆడి పెళ్ళాం కబురెట్టింది.   ఎళ్ళడం మటుకేనయ్యా. మరి మళ్ళీ ఎప్పుడొస్తానో, అసలొస్తానో లేదో తెలీదయ్యా. కాళ్ళాడ్డం లేదు,” అంది రాములు జీరబోయిన గొంతుతో.

 

తాత జవాబుగా ఏమంటాడో అని వింటున్నా. నిట్టూర్చాడు.

“వెళ్ళిరాయే. చూద్దాం ఏదేమవుతాదో.   పదైదేళ్ళగా ఓ బిడ్డలా మెలిగావు. గాయత్రికి ఇన్నేళ్ళగా తోడు-నీడ అయ్యావు. నువ్వు లేకుండా మా జీవనం ఈడ ఎలా సాగుతుందో ఇకపైన చూడాలి మరి,” అన్నాడు దిగులుగా.

‘నిజమే, అసలు ఎట్టా?’ తాత మాటలు విన్న నాకూ అనిపించింది. రాములు అన్నిటికి మాకు సాయపడ్డం, నన్ను ప్రేమగా చూసుకోడం తలుచుకున్నాను. మరి ఇప్పుడు రాములు వెళ్ళిపోతే ఎట్టా? అని దిగులేసింది.

కన్నీళ్లు పెటుకున్న రాములుని సముదాయించాడు తాత.

**

మధ్యాహ్నం, ప్రసాదం తినేసి తాత బడ్డీకి పోబోతుండగా, ఉమమ్మ హడావిడిగా వచ్చింది మా కాడికి.

 

“శుభాకాంక్షలు సత్యమయ్యా, మన గాయత్రి ఐదవ తరగతి లెక్కలు, తెలుగు, సాంఘికం, యాభై శాతం మార్కులతో పాసయింది తెలుసా? నా మొదటి శిష్యురాలు. చాలా గర్వంగా ఉంది. ఇంతకన్నా సంతోషం నాకైతే లేదు,” అంటూ నిలుచునున్న తాతని నా పక్కనే కూచోబెట్టింది ఉమమ్మ.

 

నాయుడన్న, పంతులుగారినే కాక వాళ్ళ నాన్నగారిని కూడా అరుగు కాడికి రమ్మని రాములు చేత కబురెట్టింది.

 

ఉమమ్మ చేస్తున్న హడావిడికి పూజారయ్య సైతం మా కాడికి చేరాక, అందరినీ చుట్టూ కూచోబెట్టి మరోసారి నేను పరీక్షలు పాసయిన విషయం చెప్పిందామె.

“గత వారం గాయత్రికి మాస్టారు పెట్టిన ఐదో తరగతి పరీక్షా ఫలితాల పత్రం ఇదిగో,” అంటూ మార్కుల పత్రం నాకిచ్చి, తాను తెచ్చిన లడ్డు అందరికి పంచింది. తాత చాలా ఆనందపడ్డాడు.

చేతిలోని లడ్డు కొద్దికొద్దిగా తింటూన్న వాళ్ళ నాన్నగారి పక్కనే వెళ్ళి కూచుంది ఉమమ్మ.

“నాన్నా, నేను రెండు నెలల్లో మంగళగిరి డిగ్రీ కాలేజీకి వెళతాను కదా!

అక్కడే  బి.ఇ.డి కూడా చేసి ఉపాధ్యాయిని అవ్వాలని నిశ్చయించుకున్నాను. ఆ తరువాత వికలాంగులకి ప్రత్యేక విద్యాభ్యాస విధానంలో పై చదువులకి వెళతాను.

గాయత్రి లాంటి తెలివైన వారికే కాదు, ఇంకా ప్రత్యేకమైన అవసరాలున్నవారికి నా వంతు సేవ, సాయం చేయాలనుంది. నానమ్మకి చెపితే సంతోషించింది. అమ్మ నేనేమన్నా ఒప్పుకుంటుందని తెలుసుగా,” అంది ఉమమ్మ ఒకింత సంబరంగా.

 

కూతురి వంక చూసి, “ఇంకా సమయం ఉందిగా! ఆ విషయం మాట్లాడుదాములే,” అన్నారు ఓపిగ్గా పూజారయ్య.

 

ఇంతలో అందరికీ మంచినీళ్ళు తెచ్చిచ్చింది రాములు.

మరో రెండు రోజుల్లో రాములు ఊరికెడుతుందని, అందునా ఆరోగ్యం బాగోలేని పెనిమిటికి సేవ చేయడానికని విని సానుభూతి చూపించారందరూ. అతని పేరిట ప్రత్యేక పూజ చేయించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలు తీసుకెళ్ళమన్నారు పంతులుగారు.

 

ఇంతలో ‘మీ సంబరంలో మేము కూడా’ అన్నట్టు దూసుకొచ్చాయి పావురాళ్ళు.

 

“అబ్బో మీ గువ్వల సంఖ్య పెరిగిందే? శాల్తీలు కూడా మారాయి,” అంది ఉమమ్మ.

 

“అలవాటుగా వచ్చేవి పదికి పైనే ఉన్నాయి, ఉమమ్మా. చిట్టి పావురాళ్ళు కూడా ఎకువయ్యాయి ఈ మధ్య,” అంటూ పక్కనే ఉన్న గింజల డబ్బా అందుకుని కాస్త దూరంగా పావురాళ్ళ వైపు వెళ్ళింది రాములు.

**

కాసేపు ఆ మాట, ఈ మాట చెప్పి అందరూ తిరిగి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. కొళాయి వద్ద చేతులు కడుక్కుని, నా కాడికి వచ్చి కూచుంది ఉమమ్మ.

కొత్త పుస్తకాలున్న సంచి నా కందించింది.

“ఇందులో ఆరో తరగతి పుస్తకాలతో పాటు ఆంగ్లభాష అక్షరాల పుస్తకం కూడా ఉంది,” అన్నది ఆమె నా భుజం మీద తడుతూ. నాకెంతో గర్వంగా అనిపించింది.

 

“నువ్వు సంతకం చేయడం కూడా నేర్చుకోవాలి. ఇంకెవ్వరూ కాపీ చెయ్యకుండా ఉండాలి. నీ సంతకం నీ ఇష్టం.   నీకు నచ్చింది ఒకటి కాస్త సాధన చేయి.

పోతే, నాకు కాలేజీ మొదలయ్యాక కూడా, ఇప్పటి లాగే బుధవారం, ఆదివారం రాగలుగుతాను. నీ చదువు ఆటంకం లేకుండా సాగుతుందిలే,” అంది ఉమమ్మ.

**

తెల్లారితే రాములు ప్రయాణమనగా రాత్రి నాకు నిద్ర పట్టలేదు. సాయంత్రం ఆరింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది రాములు.

రాములు కోసమని చంద్రం పిన్ని చేత తెప్పించిన ఎర్రరంగు చీర, రవిక, గాజులు సంచిలో సర్దుకొని పొద్దున్నే కోవెల చేరాము.

**

ఎప్పటిలా మేము పూలపని చేస్తుండగా, ఊరెళుతున్న రాముల్ని చూడ్డానికి సుబ్బి, మాణిక్యం వచ్చారు.

ఎదురుగా అరుగు మీద కూచుని, పెనిమిటి ఆరోగ్యం కుదుట పడగానే జాప్యం చేయకుండా తిరిగొచ్చేయమని రాములికి చెప్పారు.

 

“మరీ బెంబేలెత్తకు రాములు. మీ మామకి సేవ చెయ్యి. అసలు నిన్ను అధోగతి పట్టించింది అతనేనని మాత్రం మరవకు. అతను నిన్నొగ్గేసినందుకే, గతిలేక నువ్వీడ స్వీపరుగా కొలువు చేస్తున్నావనీ మరవకు. వీలయినంత త్వరగా నీ బతుకు నువ్వు చూసుకో,” అంది సుబ్బి.

రాములు ఏదో అనబోయేలోగా, “నువ్వు బాధపడకు రాములు. ఊరికి పోయిరా. సుబ్బి అంటున్నది కూడా నిజమే కదా. మేమే నీకు మళ్ళీ మనువు చేస్తాము,” అంటూ రాముల్ని సముదాయించింది మాణిక్యం.

దుఃఖంలో ఉన్న రాములు మాట పెంచలేదు.

**

నా చేత రాములికి చీర ఇప్పించాడు తాత. రాములు బయలుదేరే సమయానికి ఉమమ్మ, చంద్రం పిన్ని కూడా గుడికొచ్చి, ఆమెని సాగనంపారు. నా తల మీద ముద్దెట్టుకుని, కన్నీళ్ళతో వెళ్ళింది రాములు. నా మనసంతా గుబులుగా అయిపోయింది.

(ఇంకా ఉంది)

 

 

ఎగిరే పావురమా ! – 4 వ భాగం

serial-banner4

( గత వారం తరువాయి )

నాల్గవ భాగం

పిన్ని కాడనుండి కదిలి, గుడికి తయారవుతుండగా, కొట్టాం బయట “సత్యమన్నా,” అని ఎవరిదో పిలుపు. ఇంత పొద్దున్నే ఎవరా! అనుకుని పిన్ని వంక చూసాను. తాత లేచి వెళ్ళి వారగా వేసి ఉన్న కొట్టాం తలుపు తీశాడు.

“నువ్వా వెంకటేశం? రా లోనికి రావయ్యా. నిజంగానే వచ్చావన్నమాట?” అంటూ ఒకతన్ని కొట్టాం లోనికి తెచ్చాడు. వచ్చినాయన చేతిలో ఒక చక్రాల పీట ఉంది.

“చంద్రమ్మా ఈడ చూడవమ్మా. ఇతనే వెంకటేశం. పక్క ఊళ్ళోనే ఉంటాడు. నడక రాని వారికి పనికొచ్చే బండ్లు, పీటలు చేస్తుంటాడు. వాటిని వాడే విధానం కూడా నేర్పిస్తాడు.
మన గాయత్రికి కూడా ఒకటి చేసి ప్రత్యేకంగా ఈ రోజు తెమ్మని అడిగాను. ఇంత పొద్దున్నే మన కోసం ఇలా వచ్చాడు,” అంటూ పిన్నిని పిలిచాడు తాత.

“వెంకటేశం, నువ్వు చేసిన పీట గాయత్రికి చూపిద్దాం. ఈ రోజు చిట్టితల్లి పుట్టినరోజు తెలుసా?” అంటూ అతని చేతిలోని పీట తీసుకొని, నేల మీద ఉంచాడు తాత.

జాలీ చెక్కపీటకి నాలుగు రబ్బరు చక్రాలు ఉన్నాయి. నేల మీద నుంచి పీట కాస్త ఎత్తుగానే ఉంది. ఒక పక్కగా చేత్తో పట్టుకోడానికి పొడవాటి పిడి బిగించి ఉంది.

“గాయత్రికి అది ఎలా పని చేస్తుందో చెప్పవయ్యా వెంకటేశా,” అన్నాడు తాత.

నేను, పిన్ని కూడా చాలా శ్రద్ధగా విన్నాము. కూసేపు ఆ పీట నాకు ఎంతగా పనికొస్తుందో, దాన్ని ఎలా వాడాలో, ఎలా నడపాలో, ఎలా ఆపాలో చెప్పాడు వెంకటేశం.
నా పుట్టినరోజుకి తాత తెప్పించిన చక్రాల పీట బాగుంది. నాకు నచ్చింది.

“తాత నీ గురించి అలోచించి అన్నీ చేస్తాడని చెప్పానా?” అంది పిన్ని నా చెవిలో.
కొద్దికాలం గుంటూరు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశాడంట వెంకటేశం. ఈ పీటలు వాడే నా ఈడు పిల్లల కన్నా, నేను బలంగా, మెరుగ్గా ఉన్నానన్నాడు.

“ఆ దేవత కూడా కనికరిస్తే మా గాయత్రి అవిటితనం పోయి మాములుగా నడుస్తుందిలే, వెంకటేశం. ఆ ప్రయత్నమే చెయ్యాలి,” అంటూ వెంకటేశంని సాగనంపాడు తాత.

**

రోజూ దేవత కాడ నా సంగతి మొరెట్టుకో మన్నాడు తాత. ‘నేనూ అందరి మల్లే నడవాలని, మాట్లాడాలని’ ఆ దేవతని వేడుకోడం మొదలెట్టాను.
అట్టాగే ప్రతిరోజు చక్రాలపీట కూసేపు వాడుతుంటే అలవాటయి, కొట్టాంలో నా కదలిక సుళువయ్యింది. చిన్న పనులు నా అంతట నేనే చేసుకోడం మొదలెట్టాను.

సాయంత్రం కొట్టాంలో మెసులుతూ, దండెం మీద నుండి తీసిన బట్టలు మడతేస్తుండగా వచ్చింది చంద్రం పిన్ని. తన సంచి నుండి తాతకని తెచ్చిన మందులు తీసి తాత పడక కాడెట్టమని నాచేతి కిచ్చింది.
వాకిట్లోకెళ్ళి తాతకాడ కూకుని కబుర్లు చెబుతూ, నా కోసం చక్రాల పీట చేయించినందుకు తాతని మెచ్చుకుంది.

“అన్నా, చెప్పడం మరిచిపోతానేమో! రేపటి నుంచి గోవిందు అనే మరో రిక్షాబ్బాయి వస్తాడు. ఇప్పుడున్నోడిక్కూడా ఆటోరిక్షా వచ్చేసింది. ఇక అతను రాడు. ‘గోవిందు’ ని నేను చూసి మాట్లాడానులే అన్నా,” అని చెబుతూ లేచెళ్ళి – కంచాలు, మంచినీళ్ళెట్టి, మా కోసం చేసి అట్టే పెట్టిన సంకటి, చింతపండు మిరపకాయ పప్పు వడ్డించింది పిన్ని.
**
నా చక్రాల పీటని నాతో పాటే రిక్షాలో గుడికి తెచ్చుకోడం మొదలెట్టాను. పీట సాయంతో అరుగు చుట్టూ కొంత దూరం మెసలడం, నీళ్ళకి కొళాయి కాడికెళ్లడం చేస్తున్నా. అమ్మవారి గుడికాడికెళ్ళి, ప్రసాదాలు తెచ్చుకోడం కూడా చేస్తున్నా.

గుడికొచ్చే భక్తుల్లో నవ్వుతూ పలకరించి, ‘గాయత్రి’ అని రాసున్న చెక్క హుండీలో డబ్బులు వేసేవారు కొందరైతే, “ఇలా మూగ, కుంటిని కూర్చోబెట్టి పూజాసామాను అమ్మించాలా? పక్కనే మరో హుండీ కూడానా అడుక్కోడానికి?” అంటూ నా ముఖం మీదే అనేవారు మరికొందరు.
ఒక్కోప్పుడు  ఆ ఈసడింపులు, చీదరింపులు కష్టమనిపిస్తది.
**
కొత్త పుస్తకాల సంచీ తీసుకొని మూడింటికి వచ్చింది ఉమమ్మ. నా పక్కన కూకుని ఓ బొమ్మల పుస్తకం నాకందించి, నా చేతిలోని పలక, నోటు పుస్తకం తీసుకొని చూసింది.

“పర్వాలేదే, ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. నా చేతివ్రాత కంటే నీది వందరెట్లు అందంగా ఉంది గాయత్రి.
మా అందరి పేర్లు కూడా రాయగలుగుతున్నావు,” అంటూ నా తల మీద తట్టింది ఉమమ్మ.

“సరే, ఇక నీ పూర్తి పేరు రాయడం కూడా నేర్చుకోవాలి. నీ పేరు చిన్నదే. మూడే అక్షరాలు. ‘గాయత్రి’ అని. పూర్తి పేరు అంటే మాత్రం నీ పేరు వెనక ‘సత్యం’ లేదా ‘సాయిరాం’ అని తాత పేరు కలిపి రాయాలి. ఇలా అన్నమాట,” అని ‘గాయత్రి సాయిరాం’ అని రాసి చూపింది ఉమమ్మ.

పేరు వినడానికి – బాగుందన్నారు అక్కడే ఉన్న తాత, రాములు.
‘అమ్మో’ ఇంత పొడుగు పేరా?’ అన్నట్టు చూశాను ఆమె వంక.
నా ముఖం చూసి ఉమమ్మ ఫక్కున నవ్వింది.
“అయినా పెద్ద తొందర లేదులే. మెల్లగా రోజూ చదువు అయ్యాకే పేరు రాయడం సాధన చెయ్యి,” అందామె.
నేనూ నవ్వేశాను.

“నీవు చదివే ప్రతి పాఠం మన స్కూల్లోని శ్రీనివాసు మాస్టారు సాయంతో నీ కోసం అలోచించి తయారు చేసేదే. నీ పరీక్షలు కూడా ఆయన పథకం ప్రకారమే జరుగుతాయి,” అంటూ నా చేతికిచ్చిన కొత్త బొమ్మల పుస్తకం తీసుకొని పేజీ తిరగేసింది ఉమమ్మ.

“ఈ పుస్తకంలో చూడు. ప్రతి పేజీలో బొమ్మ కింద రెండేసి వాఖ్యాలు – వివరణ ఉంటుంది, అన్నీ చిన్న మాటలే. మాటలు విరిచి గుణించుకుంటూ చదవచ్చు. ఇలా,” అని నా వేలుతో అక్షరాలని చూపుతూ నాకు తెలిసేలా చదివింది ఉమమ్మ.

“ఇలాటివే నంబర్లు వేసి మరో మూడు పుస్తకాలున్నాయి ఈ సంచిలో.
మొదటిది పూర్తయ్యాక, రెండోది చదవడం తేలికవుతుంది.
తరువాత మూడో పుస్తకం చదవగలిగే వరకు వస్తే నీకు చదవడం వచ్చేసిందన్నమాట. ఇక నీ తీరికని బట్టి సాధన చెయ్యి,” అంటూ కూడికలు, తీసివేతలు రాసిచ్చి, కొత్త పుస్తకాల సంచి కూడా నా చేతికిచ్చి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది ఉమమ్మ.

illustration4

 

**

కొత్త పుస్తకం చదివే ప్రయత్నం సరదాగుంది. నాలో చదవాలన్న కోరిక పెరిగింది. పూలపని అవుతూనే వీలున్నప్పుడల్లా కొత్త బొమ్మల పుస్తకం చేత పట్టుకుంటున్నాను.

మొదట్లో కష్టమనిపించినా, ఎలా చదవాలో తెలిసింది. కాస్త సులువు వచ్చాక, మొదటి పుస్తకం సగమవ్వడానికి మూడు వారాలు పట్టింది.

**

రుద్రాక్షలు, రంగురంగుల పూసలతో నిండిన పళ్ళెం తెచ్చుకొని నా పక్కనే కూకుంది రాములు. పుస్తకం మూసేసి నేను కూడా వాటిని వేరు చేయడం మొదలెట్టాను.

“ఏమో, ఈ సారి ఉమమ్మిచ్చిన పుస్తకాలు వదలకుండా ఉన్నావే? ఎప్పుడూ నీ మొహంకి పుస్తకం అడ్డం. నీ పావురాళ్ళు కూడా అలిగి రాడం మానేస్తాయేమో సూడు,” అంది రాములు.

ఫక్కుమని నవ్వాను. ‘అయితే పుస్తకాల్లో మునిగి ఉంటున్నానని రాములు అలిగిందన్నమాట’ అనుకున్నాను.

‘నేను నీకు చదువు చెబుతాను. నా లాగా నువ్వూ పుస్తకాలు చదివేయచ్చు,’ అని సైగ చేసాను.

“నాకా? సదువా?” అంది రాములు. కొద్ది క్షణాలాగి, “మా అమ్మ చనిపోకుండా ఉంటే, అమ్మమ్మ కాడికి ఎళ్ళకుండా ఈడనే ఉండి సుబ్బి, మాణిక్యం లాగా బుద్ధిగా సదువుకునుంటే బాగానే ఉండేదిరా,” అంది నా జడ లాగి.
“అంతే కాదు, మా అమ్మమ్మ అతిగారాంతో, ‘ఆడపిల్లకి సదువేంది? ఏమవసరం?’ అని నన్ను పాడుచేసింది. నా కన్నా పెద్దోడు, నా మామతో కలిసి పుట్లెంట, గట్లెంట తిరిగి సెడాను… సదువు కాదు కదా, కనీసం వంటా-వార్పు అయినా వంటబట్టాయి కాదు నాకు,” అంది దిగులుగా రాములు.
ఆమె వంకే చూస్తూ ఆమె చెబుతున్నది వింటున్నాను.
“ప్చ్, ఎవర్నని ఏమి లాభంలే! అమ్మ, అమ్మ ప్రేమ, మంచి-చెడు సెప్పే అమ్మ ఆదరణ లేని జీవనం, అందుకే ఇలాగయ్యింది,” అని బాధపడుతూ తిరిగి పూసలు వేరుచేసే పనిలో పడింది రాములు.
**
శనివారం నాడు కొబ్బరులమ్మి పెందరాళే వచ్చాడు తాత. రాములికి, నాకు కాసిన్ని ద్రాక్షపళ్ళు తెచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి పైమెట్టు మీద నా పక్కనే చెట్టునానుకొని కూకున్నాడు.

“రాములూ, ఇలా రాయే. ఈ ద్రాక్షలు కడిగి ఇద్దరు తినండి,” అంటూ ఎనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు.

ఐదు నిముషాలైనా రాములు రానేలేదు. నా కర్ర తీసుకొని చెట్టుకు కట్టిన గంటని మెల్లగా కొట్టాను. అవసరం వస్తే రాములు కోసం అట్టా పిలవడం నాకలవాటే.

మరో రెండు నిముషాలకి వచ్చింది రాములు. మొహం దిగులుగా ఉంది. తాతని, ద్రాక్షని చూపెట్టా. ద్రాక్ష తీసుకొని లోనికెళ్ళి కాసేపటికి తాతకి టీ కూడా తెచ్చింది.
నాకు ద్రాక్ష, తాతకి టీ గ్లాసు అందించి తాత కాడనే కూకుంది.

“ఏమయిందే రాములు? బాగా ఏడ్చినట్టున్నావు. నీ పెనిమిటి సంగతేమయింది?” టీ తాగుతూ రాముల్ని అడిగాడు తాత.

బొళ్లున ఏడ్చేసింది రాములు. “వాడికి వ్యాధి ముదిరిందంటయ్యా. వాడి రెండో భార్య వాడి కాడ డబ్బులు తీసుకోడమే కాని, వాడి సంగతే పట్టించుకోదంట. మామని ఎవరితోనూ కలవనివ్వదంటయ్యా.
మామని చూడ్డానికి, చివరికి నేనెల్లినా, వాడ్ని చంపేస్తానందంటయ్యా,” అంది వెక్కుతూ ఆమె.

“బంగారం లాంటి నిన్ను పిల్లలు పుట్టలేదన్న పిచ్చి సాకుతో వదిలేసి, తెలిసి తెలిసి అసుమంటి దాన్ని మారు మనువాడితే, బాధలు పడక తప్పుతాదా? అది మాత్రం కన్నదా పిల్లల్ని? లేదే.
పైగా ఇద్దరూ కలిసి తాగుడికి బానిసయ్యారంట. వాడి ఖర్మ. నువ్వు బాధపడమాకు. నీ చేతుల్లో ఏం లేదే,” అంటూ రాముల్ని ఓదార్చాడు తాత.
ఖాళీ అయిన టీ గ్లాసు పక్కకెట్టి నిముషం ఆగాడు..

“అయినా, నువ్వు కూడా మొండిగా, వయసులో పెద్దోడైన నీ మేనమామనే మనువాడుతానని గోలెడితివే? చదువుకోకుండా, మాటినకుండా నీ అయ్య పక్షవాతంతో మంచాన పడేవరకు బాధపెడితివి… ఇప్పుడు నువ్వేడుస్తుండావు. నీ కష్టం చూసి నా గుండె కలిచేస్తుంది రాములు,” అన్నాడు తాత బాధగా.

**

రెండు రోజులయినా రాములు దిగులుగానే ఉంది. ఆమెని మాట్లాడించాలనే ప్రయత్నం చేస్తున్నా.

రాములట్టా మాటలేకుండా ఉంటే రోజంతా అస్సలు తోచడం లేదు. చేసేది లేక ఇంకింతసేపు పుస్తకం చదవటం చేస్తున్నా.

రెండో పుస్తకం సగమయ్యేప్పటికి చుట్టూ ఉన్న ప్రపంచం అక్షరమయంగా తోచింది నాకు. ఎక్కడ అక్షరాలు కనబడ్డా చదవడం సంతోషంగా ఉంది. చిన్న సాదా మాటలు గుణించుకొనే పనిలేకుండా చదవగలను. ఇప్పుడు చిన్న తరగతి పుస్తకాలు చదివి, లెక్కలు కూడా చేస్తున్నా.
**
మరో రెండు ఎండాకాలాలు, రెండు చలికాలాలు గడిచాయి. నాకు పన్నెండేళ్ళు నిండాయి.
గడిచిన రెండేళ్ళల్లో నా చదువు విషయంగా ఉమమ్మ నన్ను మెచ్చుకొంది.
నా మీద నాకు నమ్మకం, ధైర్యం వచ్చాయి.
‘ఇప్పుడు నాకు మాట వస్తే కాస్త చక్కంగానే మాట్లాడగలను కూడా!’ ఉమమ్మకి మల్లే …..అనుకున్నాను.
ఏదైనా బాగానే చదవగలను. రాయగలను. పెద్ద పదాలు కూడా అర్ధమవుతున్నాయి.

ముందుగా నా వెనుక రావి చెట్టునున్న బోర్డుల మీద వివరాలు సుళువుగా చదివాను.
‘విన్నపము’ అని రాసున్న బోర్డు మీద నా పేరు, నా పేరుతో పాటున్న వివరాలు ముందుగా చదివాను……
‘గాయత్రి’ అనే ఈ అమ్మాయి – మాట, నడక లేని అభాగ్యురాలు. జీవనాధారం లేని ఈ చిన్నారికి వైద్య సహాయార్ధం దయతో మీ విరాళాన్ని ‘గాయత్రి’ హుండీలో వేయ ప్రార్ధన.
ధన్యవాదములు…. – ఇట్లు ఆలయ నిర్వాహకులు ….

అక్కడినుండే అందరికీ నా పేరుతో పాటు పూర్తిగా నా గురించి తెలుస్తుందన్న సంగతి అర్ధమయ్యింది.

పోతే, పైన ఉన్నది పూజా వస్తువుల వివరాలు, ఖరీదుల పట్టికలు, డబ్బు చెల్లించే పద్ధతి….

‘ఆలయ నిధుల కోసం పూజాసామగ్రిని మీ వీలు కోసం విక్రయిస్తున్నది గాయత్రి. వస్తువులు కొన్నవారు నిధులని పక్కనే ఉన్న ‘గుడి’ హుండీలో వేయ ప్రార్ధన – ఇట్లు ఆలయ నిర్వాహకులు’
ఆరు నెల్లక్కోసారి ఆ పలకలకి, బోర్డులకి రంగులు వేయించి తిరిగి కొత్తగా రాయిస్తుంటారు పూజారయ్య.
(ఇంకా ఉంది )