మాయమ్మ నవ్వింది!

Kadha-Saranga-2-300x268

 

సాయంత్రం స్కూలు గంట కొట్టగానే ఏదో కొంపలు  ముంచుకపోతున్నట్టు సర్రన ఇంటికి పరిగెత్తుకొచ్చి  పుస్తకాలు దబే..ల్మని ఇంట్లో మూల పడేసి  రచ్చ దగ్గర ఆడుకోడానికి గడప దాటుతుండగా….. రేయ్  యాడకి పోతుండా …మీ నాయనొచ్చి లేవని తెలిస్తే కుంగా తంతాడ్లే …నాకెందుకులే  నాయనా పో…నువ్వు సెప్తే వినే బిడ్డవికాదు…  అమ్మ తొట్టి దగ్గర్నుంచి దబర్లు తోముతూ అరవగానే విని విననట్టు  ఒక్క వుదుటున రచ్చ దగ్గర్కొచ్చేసి తోటి సావాసగాళ్ళతో ఆటల్లొ మునిగిపోయాను రోజు మాదిరే…..కాని ఒకపక్క  నాయన కొడతాడని  కడుపులో భయం  ఇంకోపక్క ఆడుకోవాలని ఆశ .

నేనెప్పుడూ సదువుతుండాలని నాయన కోరిక ,   స్కూల్లో సదివింది సాలు ఇంట్లో కూడా సదువుకోవాలా.. మా నాయన లాంటోడు ఇంకెవరికి ఉండకూడదనుకుంటున్న సమయంలోనే దూరం నుంచి ఒకాయన ఇనప డబ్బాను కొట్టుకుంటూ వీధిలోకొచ్చి అరిశాడు .  ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశా మా నాయననుకొని.. తీరా సూస్తే మా వూరి యెట్టాయన దండోర యేసుకుంటూ  స్టోర్లో బియ్యం.. సక్కెర.. గోదుంలు.. కిరసనాయలొచ్చింది కావల్సినోల్లు తెచ్చుకోవచ్చహో… అని కేకేసేసరికే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లైంది నాకు.

ఒరేయ్ మీ నాయన పిలుస్తున్నాడ్రారా అమ్మ నుంచి మరొ పిలుపు రాగానే  జింకెగిరినట్టు చెంగుమని అమ్మ దగ్గరకి గంతేసి కొంగుపట్టుకొని.. మ్మో.. నాయన కోపంగ వున్నాడా లేదా మావులుగా వున్నాడా?  యేమ్మా.. కొడ్తాడా నాయన …? “అహా కొట్టకుండా ముద్దుపెట్టుకుంటాడ్లే అంత భయం ఉన్నొడివి ఇంటికాడుండొచ్చుగదా  ఈ యాలకి మీ నాయన ఇంటికొచ్చేది తెలుసుగదా.. ఆడుకోకబోతే యేంవే.. నువ్వు తన్నించుకుంటావ్ నన్నూ తన్నిస్తావ్.. పొగులుపొద్దస్తం కష్టం జెయ్యాల ఇంటికొచ్చిన తరువాత మీ నాయన చేత నేను కూడా తన్నులు తినాల .. యిట్ట రాసిపెట్టుంది నాకు యేంజేద్దం నా కర్మ”  అమ్మ తిట్టినట్టుమాట్లాడగానే నాయన కొట్టకుండా ఉంటాడా… సంపేస్తాడనుకుంటూ అమ్మ యెనకాలే దాక్కొని ఇంటికొచ్చాను. నన్ను వదిలేసి సుట్టింట్లోకి బోయి  శాట్లో బియ్యం సెరుగుతూ రాల్లేరుకుంటూ కూర్చుంది అమ్మ.

పొద్దస్తమానం రెడ్డోరింటిదగ్గర  రెక్కల కష్టం సేసి, వాళ్ళు బెట్టిన పాసిపోయిన అన్నం తిని , వాళ్ళుతిట్టిన ఏకవచన తిట్ట్లతో పుట్టెడు శోకాన్ని కడుపులో ఉంచుకొని ఆ కసిని అమ్మ పైనా నాపైన తీర్చుకోవడానికన్నట్లు  నులక మంచం మీద కుచ్చోని బీడీ  తాగుతున్న మా నాయన కెదురుగా యెల్లి నిలబడ్డా. కనుగుడ్లు పెద్దవి చేసి పొగను పీల్చి వదులుతూ…

యేం రా ….యాడికి పోయావా..?
ఆడుకోడానికి.
తాటిబద్ద తీసుకొని రెండు వాయించొదిలిపెట్టి  మళ్ళీ మంచం మీద కూచొని  ఆ కాళ్ళకి మట్టేందిరా …? యెళ్ళి కడుక్కొ రా పో…. తొట్టి దగ్గరికి పోయి రెండు చెంబులు గబ గబా కాళ్ళ మీద గుమ్మరించుకొనొచ్చి మళ్ళీ అదే ప్లేసు లో నిలబడ్డా. భయం ఉంద్రా నీకస్సలా..చెప్పరా.. మౌనమే నన్ను ఆవహించింది. భయంతో వణుకుతూ వున్నాను.. యెన్ని సార్లు జెప్పాల్రా … నీకా… పాసి పొల్లుతో సదువుకొం టే సదువొస్తాదనా…

శూద్రోల్ల పిలకాయలు సూడ్రా  యెంత సుద్దంగా ఉంటారో..
మట్లో ఆడబాకరా అం టే ఆడ్తావ్… పొద్దన్నే లేసి సదవ్ మంటే సదవ్వూ …
మాస్టీల్నాకొడికివిరా నువ్వు ….నీకు యెన్ని సా..ర్లు జెప్పినా సిగ్గు లేదు… నువ్వు సదవవ్ పోరా  బర్లికాడికేపో …..ఛ …పొ… సెప్పి సెప్పి నా నోరు పోతుందె…. సందు లేకుండా తిట్టేసి ఆరిపొయిన బీడీ ముక్కని మళ్ళీ యెలిగించి ఒక్క దమ్ము లాగి వదిలితే గూడ్సు రైలు  పొగొచ్చినట్టు నా మొహాన్ని ఆవరించింది. దాన్ని ఒక చేత్తొ పక్కకు నెట్టి  యదా విధిగా మా నాయన సాయే సూస్తూ మా నాయన నన్ను యిడిపిస్తే పంజరం  యిడిసిన పక్క్షి లాగ యెగిరిపొవాలనిపించింది. రేయ్ యెల్లి సదువ్కో…తేప తేపకు సెప్పించుకోబాక నా సేత యిదే లాస్టు  సారి నీకు సెప్టం. తెల్లారకుముందే లేసి నన్ను అగ్గిపెట్టి అడిగి  దీపం బుడ్డి యెలిగించుకొని  సదువుకొవాలా సరేనా.. లేదంటే సేద్యంలో పెట్టాస్తా …అవతల నీ బతుకు నువ్ బతుక్కుంటావ్ అని మంచం మీద నించి లేచి అన్నం వండుతున్న అమ్మను ఒమే… ఊళ్ళోకి బోయి రెడ్డోరికి పాల బూతు లో పాలు పోసేసొస్తా పొద్దుబోతుంది లేదంటే రెడ్దమ్మ తిడ్తాది …. నేనొచ్చే లోకే రూపాయికి బీడీలు తెచ్చిపెట్టిండు …. అయ్యో  నయ్యా పైసా లేదయ్య స్టోర్లో బియ్యం, కిరసనాయిలు వచ్చాయంట ..నాకు కూల్డబ్బులు కూడా రాలా తెచ్హుకుందామంటేనా….ఈడ మొదులు లేకపోతే నీకు బీడీలు కావాలా..? ఒసేయ్ ఉంటాయ్ సూడో  అని నాయన బయటికెళ్ళిపోయాడు.

కొద్ది సేపు గోతాం యేసుకొని సదువుకొంటూ నాయన యెళ్ళిపొయిన కొద్దిసేపటికి లేసి అమ్మ యేడ్నీళ్ళు తోడితే  పైకి బోసుకొని యెన్నెల కింద మంచం యేసుకొని సెల్లెలు నేను కబుర్లు జెప్పుకుంటూ అన్నం తినకుండానే నిద్ర బొయ్యాం.

యెప్పుడొచ్చాడో తెలీదు పెద్ద పెద్ద అరుపులు యినిపిస్తున్నాయ్. యింటి పక్కలోల్లు మా యింటికొచ్చి వొద్దు రావయ్య వద్దు.. మా మాట యిను  అంటూ అగ్గిపెట్టి తీసి యింటికి నిప్పు అంటించబోతున్న నాయన్ని ఆపే ప్రయత్నం జేస్తున్నారు. యేమైందోనని సగం నిద్రలో ఉన్న మేము ఉలిక్కి పడి లేసేసరికే అమ్మ ఒక మూల నాయన కొట్టిన దెబ్బలకి వోర్చుకోలేక గుంజను పట్టుకొని  లెయ్యలేక లేసే ప్రయత్నం జేస్తుంది యిద్దరిమి అమ్మ దగ్గరికెళ్ళి నేనొక రెక్క చెల్లెలొక రెక్క పట్టుకొని అమ్మను లేవదీసి యింట్లోకి తీసుకొని పోతుండగా …చంపేస్తా లంజా ముండని… చంపేస్తా దాన్ని.. ఈ రోజు అదన్నా ఉండాలా.. నేనన్నా ఉండాల.. లేదంటే ..కూరాకు లో ఉప్పు ఎక్కువేస్తదా అదా..? ఎంత కొవ్వు దానికి …తిడుతూ అమ్మను కొట్టబోయి పుల్లుగా తాగి ఉండడం వల్ల మంచం కాడికి తట్టుకొని పడిపోయాడు. పక్కింటి పెద్దాయనొచ్చి నాయన్ని లేపి మంచం మీద పడుకోబెట్టి యెళ్ళిపోయాడు.

మా నాయన్ని చంపేయాలంత కోపం వచ్చింది కాని యేంవీ జెయ్యలేని పరిస్తితి. పెద్దవాడ్ని అయితే అపుడు సూస్తా మా నాయన సంగతనుకొని అమ్మను యింట్లోకి తీసుకొని  బోయి అన్నం పెట్టి  మేం గూడా రెండు ముద్దలు తిని అమ్మ పాత చీరలు కింద పర్చుకొని ముగ్గరిమిపొడుకొన్నాం. పొద్దన్నే లేసి సదవకపొతే నన్ను కూడా తంతాడు..  కళ్ళాపి సల్లేటప్పుడు నన్ను గూడా లేపు .. యేమి ఆలొసించకుండ పడుకొ అని అమ్మకి సెప్పేసి పడుకున్నా.పొద్దున్నే లేసి దీపం బుడ్డి యెలిగించుకొని పుస్తకం  తీసి సదువుకుంటుంటే బుర్రకి యేమీ యెక్కడం లేదు. రాత్రి జరిగిన సన్నివేశం పదే పదే జ్ఞాపకమొస్తుంది.. యెన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అన్ని గుర్తుకొస్తున్నాయి మరిసిపొయే సంగటనలు యెప్పుడూ జరగలేదు మా యింట్లో. ప్రతిరోజు ఒక చేదు జ్ఞాపకమే…జ్ఞాపకం అనే దానికంటే అనుభవం అంటే బాగుంటాదనుకుంటా.  ఆకలి… ఆరాటం.. యేడుపులు… అన్ని అన్ని అనుభవాలే… తాగుడుకు డబ్బులు యియ్యకపోయినా.. కూరలో ఉప్పు యెక్కువైనా…కూట్లో సిన్న యెంటిక పడినా అమ్మను తన్నటమే తప్ప వోదార్చడం తెలియని తాగుబోతు తండ్రి చేస్టలు గుర్తుకొస్తున్నాయి… ఇలాయెన్నోసంఘటనలు తలచుకొని నిద్రపోని రాత్రులెన్నో…. .. దాపరికాలు లేని జీవితాలు కదా ..ఇట్లానే తెల్లారతాయి… ఒక పక్క కసితో రగులుతున్న ఆలోచనలు మరో పక్క అమ్మ జీవితం యెప్పుడు బాగు పడుతుందాని ఆవేదన… అమ్మ అమాయకపు నవ్వు యెప్పుడు కనిపిస్తుందోనని …అయ్యా అని నాయ్యన్ని యెప్పుడు ఆప్యాంగా పిలుస్తుందో అని ఆశ అందరి బిడ్దలకి మల్లే చిన్ని ఆశ.. ఆ ఆశకు కూడా అవకాశం రాల నాకు.

నాయన నిద్రలేస్తున్నాడని తెలిసి మళ్ళీ పుస్తకం మీదే ద్యాస…. తెల్లారింది… నాయన రెడ్డోరింటికి యెల్లి పోయాక దీపం ఆర్పి పైకి లేశా ఇంతలో  అమ్మ మంచి నీళ్ళ బిందె యింట్లో దించి ‘పొల్లు తోంకోండి నాయనా సద్దికూడు తిందురు’ అని పొయ్యి దగ్గరికి బోయి ఉడుకుతున్న యెసురులో నానిని బియ్యం బోసి మండుతున్న కట్టిపుల్లల్ని పొయ్యిలోకి యెక్కదోసి అక్కడే కూర్చొని పచ్చడిచెయ్యడానికి చింతపండు, టమాటాలు వున్నయా లేవా అని చిన్న బుట్టలో యెతుకుతుంది. పుస్తకాన్ని మూసి చెక్కమీద పెట్టేసరికే దానికానుకోనొన్న మరో చెక్క మీదున్న గిన్నెలు చెంబులు కింద పడి పెద్ద శబ్దం చేశాయి …నాయన నాయన నువ్వు ఒక్క పని చెయ్యవు రా… పుస్తకాలు అక్కడ పెట్టకుంటే కింద పెట్టుకోవచ్చు కదా….చెక్క మీదే పెట్టాలా ఒకాలా చెప్పో…నేను పెడ్తాను పో …నువ్వు బొయ్యి పొల్లు తోముకొని సద్దికూడు తిను నేను పనికి పోవాల లేదంటే మేస్త్రొచ్చి అరస్తాది. ..కోపంగా చెప్తూ కింద పడిన గిన్నెల్ చెంబుల్ని చెక్క మీద పెట్టి  పొయ్యి కాడకొచ్చి కూర్చొంది.

బొగ్గుతో గబ గబా పొల్లు తోముకొని అమ్మ దగ్గరికొచ్చి కూచ్చొన్న. అమ్మ మౌనంగా ఉంది. రోజూ అట్టుండదమ్మ.. యేదొ ఒకటి జెప్పి నన్ను చెల్లెల్ని నవ్విస్తూ వుంటాది. కొన్ని సార్లు పాటలు కూడా పాడతాది. పొలంలో కూడా నారేతేసేటప్పుడు బాగా పాడుతుందని యెనకింటి చెన్నవ్వ సెప్తే వి న్నాను.

పొలంలో నడుం నొప్పి పోవటానికి అమ్మకు పాటుంది ..కాని తాగొచ్చిన భర్త తన్నిన నొప్పికి అమ్మకి యేపాటాలేదు…యేడుపు పాట తప్ప.
యేమ్మా..అట్టుండావా..?
యేం నాయన నేను బాగనే ఉళ్ళా.
అయితే యేం మాట్లాడకుండా ఉన్నావ్..?
యేంలేదు వర్షం పడేట్టుంది పనుంటుందా ఉండదా అని ఆలోచిస్తున్నాన్లే అని మాట దాటేసి కూచోడానికి నాకు పీటిచ్చి సద్ది కూడు యెసుకోరాడానికి సుట్టింట్లొకెళ్ళింది..నాకర్ధమైంది అమ్మ అట్టా యెందుకంటుందో.. లోపల ఎంతో బాధున్నప్పటికి నాకు తెలిస్తే బాధపడ్తానని కడుపులో మింగేసి సంతోషంగా ఉన్నట్టు నా ముందు నటించిందని. చిన్న దబరలో సద్దెన్నం యేసుకొని నిప్పులో కాలబెట్టిన యెండి చేప తీసుకొని దాని పైనున్న మసి పోడానికి నేల మీద రెండు సార్లు తట్టి అది నా ముందు పెట్టి తినేసి బడికి పోండిద్దరు అని తన పైట కొంగులో కట్టుకున్న ముడినిప్పి ఇరవై పైసలు బిళ్ళను నా యెడంసేతిలో పెట్టి నువ్వు పది పైసలు సెల్లెలు పది పైసలు తీసుకోండని గబ గబా పచ్చడి చెసేసి చిన్న కాడగిన్నెలో సద్దెన్నం పెట్టుకొని జాగ్రత్తలు జెప్పి కూలోల్లో కలిసిపోయి పనికెళ్ళిపోయింది.

కొద్దిసేపటి తర్వాత యెనక్కొచ్చి నాయనా అని పిలిచింది యెప్పుడూ పేరుపెట్టి పిలిచింది లేదమ్మ. నాయనా.. లేదంటే కొడుకా అని పిలుస్తుంది. యెనక్కి తిరిగి ..యేమ్మా మళ్ళీ వచ్చావా..? వర్షం పడేట్టుంది ఇల్లురురస్తాదేమో నాయనో.. ఒకరవ్వ సుట్టింట్లో పొయ్యి దగ్గరొక గిన్ని, సూరికిందొక దబర పెట్టిపో అవతల కూలోలెల్లిపోయారు వాళ్ళలో కలిసెల్లిపోవాలి అని యెల్లిపోతూ …సెప్పటం మర్సిపోయా మీ నాయన సద్ది కూటికొస్తే యెండుసేపకొటి కాల్చియ్యి లేదంటే నంచుకోను లేకపోతే సంపేస్తాడు నన్ను అంటూ బతుకు పోరాటానికెళ్ళిపోయింది. సద్దెన్నం తింటూ ఆలోచనలో పడిపోయాను.. నాయన యెంత కొట్టినా కొట్టించుకుంటాది ..కాని యెప్పుడూ యెదురు మాట్లాడ్డం సూడ్లేదు వొకేల అలా చేసుంటే ఇంకా కొట్టేవాడేమో……యెన్ని తన్నులు తిన్నా కూడా నాయన మీద అమ్మకు ఇంత ప్రేమ యెందుకో అర్ధం కాలేదు. యెక్కడో బడి గంట శబ్ధం యినబడతాఉంది. తినేసి చెల్లిని తీసుకొని బడికెల్లిపోయాను.

బళ్ళోకూడా అమ్మ జీవితం యెప్పుడు బాగుపడుతుందా.. అమ్మ యెప్పుడు సంతోషంగా ఉంటుందా అని ఆలోచనలు వెంటాడుతున్నాయి నన్ను…  అందరి తల్లులాగే నా తల్లి కూడా బోగి పండక్కి యెప్పుడు కొత్త కోక కడ్తుందా అని…అందరి బిడ్దలకి లాగే తన బిడ్డల్ని కిరసనాయిలు బుడ్డి యెలుతురులో కాక కరెంటు బుడ్దీ యెలుతురులోఎప్పుడు చూస్తుందా….

అమ్మ పని నుంచి యెప్పుడొచ్చిందో గానిమేం  బడినుండి ఇంటికొచ్చేసరికే కసువు కూడా చిమ్మకుండా యేదో ఆలోచిస్తూ కూచొని ఉంది. యేమ్మా ఆలోచిస్తున్నావా? యేమైంది అని అడిగా… మీ నాయన పొద్దన్నుంచి ఇంటికొచ్చినట్టులేడు.. కూటి కుండలో కూడు అట్నే ఉంది.. యెక్కడ కల్లు సెట్ల కింద తాగి పడిపోయుంటాడో తీసుకొద్దాం పా…   అని నన్ను తీసుకొని కయిల్లో పోతాఉంది…మాకెదురొచ్చిన పతొక్కర్ని మా నాయనెక్కడన్నా కనిపించాడాని ఆడిగి తెలుసుకొంటాఉంది…యేమ్మావా.. మా ఆయనేమన్నా కనబడ్డాడా నీకా …లేదే… వస్తాడులేమే…పొద్దుబోయి నువ్వెక్కడెతకతావా వాడ్ని.. రాడా… రండి పోదాం అని మాకు తెలిసిన ఒకాయన అనేసరికే.. లేదు మావా ఇక్కడదాక పోయేసొస్తాం అంది అమ్మ.

అల నడ్సుకుంటూ… దారిలో కనిపించిన పతొక్కర్ని అడుక్కుంటూ రెడ్ల పొలాల చివ్వర్నున్న తాటిసెట్లు కనిపించెంత వరకు యెల్లాం…అక్కడికెల్తే యిక్కడికెందుకొచ్చారని నాయన కొడ్తాడని అమ్మకొకపక్క భయం…కొట్టినా సరే మా నాయన కనబడితే చాలనుకుందేమో.. గెనింమీద నా చేయి పట్టుకొని పడ్తావ్ నాయనా భద్రం అంటూ తాటిసెట్లున్న సోటుకి తీసుకుపోయింది. తాటిసెట్లకింద కూచోని యెవరితోనో మాట్లాడుతున్నట్లు చూశాం నాయన్ని ఇద్దరం. అమ్మ కళ్ళలో చెప్పలేని ఆనందం వచ్చేసింది..అమ్మ సంతోషంగా ఉందనుకొని కొంచెం గాలి పీల్చి వదిలా.. దూరం నుంచి వీళ్ళెవరాన్నట్టు చూస్తున్నాడు… దగ్గరకెళ్ళి యేంవయ్యా ..పొద్దుపోలా నీకా…? ఉదయం నుంచి కూటిక్కూడా రాలేదా… రా పోదాం..అని భయం భయం గానే అంది అమ్మ. మీరెందుకొచ్చారుమే ఇక్కడికా… రానా… యెక్కడికిపోతానా పోండొస్తున్నా..అన్నాడు నాయనా. వెంటనే ఇద్దరం యింటికి వచ్చేసాం. నాయన మీద యింత ప్రేమ చూపిస్తుందే అమ్మ…యెప్పుడన్నా అమ్మ మీద ప్రేమ చూయించాడా నాయన..? మనసులొ ప్రశ్నించుకున్నా.. పతిరోజు కూలి పని జేసి అమ్మ యింటికి రావడం. తాగొచ్చిన నాయన అమ్మను కొట్టడం…యిదే తంతు.. రోజులు గడుస్తున్నాయి…కాని పరిస్తితులు మాత్రం మారడం లేదు.

అలా కాల ప్రయాణంలో నా అయిదో తరగతి పూర్తయి ఆరో తరగతికి గురుకుల పాఠశాలలో సీటొచ్చింది. వూర్లో మొత్తం పన్నెండు మందిమి ప్రవెశపరీక్ష రాస్తే  నాకొక్కడికే సీటొచ్చింది. అమ్మ సంతోషంతో వచ్చి నన్ను ముద్దు పెట్టుకొంది. మా నాయన సంతోషపడ్డాడో లేదో నాకైతే తెలియదు. కాని ఆ రోజు రాత్రి పడుకోబోయేముందు మా నాయన నాతో…”నాయన యిక్కడెట్లా సదివావో హాస్టల్కెళ్ళిన తర్వాత కూడా అట్టాగే సదవాలా…” ఆప్యాంగా అన్న మాటలు సంతోషంతో నన్ను కంట తడిని పెట్టించాయి.అమ్మ నవ్వుతూ ముద్దుపెట్టడం శాలా రోజుల తర్వాత చూశాననుకొని హ్యాపీగా నిద్రపోయా. మరుసటిరోజు ఉదయం హాస్టల్కెళ్ళేటప్పుడు  తన బొడ్లో నుండి తీసిన ముక్కుపొడిని బుగ్గన పెట్టుకుంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చడం గమనించాను… యిప్పటిదాకా తన సెంతనున్నకన్న కొడుకు దూరంగా బోతున్నాడనో లేక నాయన తన్నేటప్పుడు నాకెవరడ్దొస్తారని యేడ్చుకొంటుందో అర్దం కాలేదు కాని రెండో దాని కోసమే యేడుస్తొందనుకొని…కడుపులో వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని “పొయ్యొస్తామా”  నువ్వు జాగ్రత్త …నాయన కొడ్తే పల్లెత్తి మాటనకనేసరికే యిద్దరం దుఃఖం ఆపుకోలేక పెద్దగా యేడ్చేశాం. యెందుకసే.. శుభమా అంటూ బిడ్డ పోయేటప్పుడు యేడిపిస్తావా.. నాయాన కసిరేసరికే అమ్మ భయం భయంగా యేడుపుని దిగమింగుకని జాగ్రత్త.. బాగా సదవలా…దిగులుపడమాకా…వచ్చే ఆదివారం వస్తానని అమ్మ సాగనపింది.

ఒక పక్క పుట్టెడు దుఃఖంతోమరో పక్క గెబ్బెడు సంతోషంతో హాస్టల్కెళ్ళిపోయాను… మొదటి వారం రోజులు అమ్మ మీద దిగులుతో యేడ్చుకున్నాను…  మమ్మల్నెప్పుడూ అమ్మ కొట్టిందిలేదు… ఆమె ప్రేమనంతా మా పైనే గుమ్మరించేది…. అప్పుడప్పుడు అమ్మను ఆటపట్టించేవాళ్ళం.

మా అవ్వ కల్లాంలో యేరుకొచ్చిన పరిగిమూట కావాలనే మా మీదేసుకొని  మూట మా మీద పడిపోయినట్టు “అమ్మా”  .. అని అరిస్తే తొట్టిదగ్గర గిన్నెల్ చెంబులు తోముకుంటున్న అమ్మ కంగారుపడి యేమైంది  నాయన అని యేడ్చుకుంటూ వచ్చేది మా  దగ్గరికి…  తర్వాత  తమాషాకిలేమ్మా అనే వాళ్ళం… అమ్మ నవ్వుకుంటూ యెళ్ళిపోయేది.

మా యింటి సుట్టుపక్కల పిల్లకాయల అమ్మలయితే వాళ్ళ బిడ్డల్ని బాగా తన్నేవారు. మేము యెంత తులిపిపనులు జేసినా కూడా అమ్మ మమ్మల్ని ఒక్క మాట కూడా అనేది లేదు.”నాగమణే.. నీ పిలకాయలంటే యెంత ముద్దమ్మే నీకా..” అని ఇంటి  సుట్టుపక్కలోల్లు అనేవాళ్ళు అమ్మని.  అమ్మ జ్ఞాపకాలన్ని నెమరేసుకొనేవాణ్ణి. అట్టా హాస్టల్లో నా రోజులు గడిచిపోతూ పై తరగత్లకు యెదుగుతూ తొమ్మిదో తరగతిలో ఉండగా మా చెల్లెనించి ఉత్తరం… యెప్పుడూ మా చెల్లెలు ఉత్తరం రాసింది లేదు…కొత్తగా ఉంది… యింటిదగ్గర్నించి….అది కూడా చెల్లెలు రాసిందా అని….
“అన్నా.. యెలా ఉన్నావు..? యిక్కడ అందరు బాగున్నారు.
నాయన యింట్లోకి కంజీ మంచం, బీరువా, టీవి తెచ్చాడు..
యిప్పుడు మన యింట్లో కరెంటు పోయినప్పుడు మాత్రమే దీపం బుడ్డి..
ట్యూబ్ లైట్ కింద యిప్పుడు మనిల్లు భలే యెలుతురొస్తుంది.
అన్నా చెప్పడం మర్సిపోయా…
నాయన యిప్పుడు అమ్మను కొట్టడం లేదు.
నాయన మారిపోయాడు…”

నువ్వు దిగులుపెట్టుకోకుండా బాగ సదువ్కోమని సెప్పమంది అమ్మ     వుంటాను…… టాటా.

చివ్వరి మూడు లైన్లు యెన్ని సార్లు సదువుకొన్నానో నాకే తెలియదు. ఆ మూడు లైన్లు సదువుతున్నప్పుడల్లా అమ్మ మొహమే జ్ఞాపకమొచ్చేది. దసరా సెలవులకి యింటికి పోయిందాక ఆ మూడు లైన్లు పదే పదే సదువుకొన్నా.
సెలవులకి యింటికెల్లగానే గుడ్దలు పులుంతున్న అమ్మ నన్ను సూడగానే లేసొచ్చి సేతులుకున్న చెమ్మను పైట కొంగుతో తుడుసుకొని నా కొడుకొచ్చేశాడు.. నా ముద్దుల కొడుకొచ్చాశాడమ్మా అంటూ నన్ను యెత్తుకొని రెండు ముద్దులు పెట్టి నా నూనూగు మీసాలు జూసి నా కొడిక్కి మీసాలు కూడా వస్తున్నయమ్మా అని కొడుకు పెద్దవాడవుతున్నాడనే సంతోషంతో మురిసి పోతూ యింట్లోకెళ్ళి దింపి దింపగానే.. నేను బాగున్నాన్నాయనా… మీ నాయన యిప్పుడు కొట్టడం లేదు…వెరే వాళ్ళ పొలం కవులుకు తీసుకొన్నాడా… ఈ సారి బాగ పండిందా….ఈయన్ని తెచ్చాడు…యిహన యెరే వాళ్ళింటికిబోయి టీవి సూడబల్లెదులే..యిదిగో టీవి కూడా తెచ్చాడని అమ్మ అంటుండగానే… చెల్లి నవ్వుతూ..

అన్నో ఎప్పుడొచ్చావన్నా..?

యిప్పుడే.

నాకు తెలియదే..నువ్వొచ్హినట్టా.

యాడకిపోయిండేవా..?

ఆడుకోడానికి.

అన్నా నాయన మనిద్దరికి గుడ్డలు తెచ్చాడు తెలుసా..?

నీకొక సొక్కా..నాకొక గౌను.

యింకోటేంది తెల్సా..?

యేందా..?

అమ్మకోక్కోక గూడా తెచ్చాడు నాయన.

అమ్మ సాయ జూశా..ముసి ముసి నవ్వు నవ్వుతూ అవునన్నట్టు తలూపింది అమ్మ. హమ్మయ్య మా యమ్మ నవ్వింది శాలా రోజులకనుకొన్నా. ఊళ్ళో నుంచొచ్చిన నాయన నన్ను సూడగానే నవ్వుతూ యెప్పుడొచ్చావ్ రా ..

యిప్పుడే..

యెన్ని రోజులిచ్చార సెలవలా…?

పదిరోజులు.

నాగమణే..సద్దికూడెయ్ ..పోవాల..

అమ్మ సద్దికూడేసి యర్రగడ్డిచ్చేదా..సేప గాల్చిచ్చేదయ్యా..?

ఏదోకటీమే…

అమ్మ సద్ది కూడేసిచ్చిన వెంటనే మా దగ్గరకొచ్చి  నాయనా నువ్వూ అమ్మి టీవి పెట్టుకొని సూస్తా వుండండి గుడ్దలుతికేసొచ్చి కూడేస్తా. అని అమ్మ తొట్టి దగరకెల్లి పోయింది. నాయన అమ్మను పేరు పెట్టి పిలవడం..అమ్మ నాయన్ని అయ్యా అని ఆప్యాంగా పిలుసుకోవడం సూసి సెప్పలేని ఆనందంతో కంజీ మంచం మీద తలవాల్చి…కరెంటు బుడ్డి యెలుతురులో అమ్మ నవ్వును తల్సుకుంటూ  ఒక్క సారిగా గాలి పీల్చి వదిలా…..

*

మీ మాటలు

  1. Karunakar Kondamarri says:

    Idi maa chittoor jilla konni areas lo matlaadee yaada. Chinnavayasulo gnapakalu gurthukochaayi. Nenu gurukula school lo chadivaa..Naa lifelo konni sangatanalaki daggara ga unnayi.. Malli nenu 5 classloki vellipoyara mee valla

  2. SUBRAHMANYAM AVULA says:

    గ్రామీణ వాతావరణం కళ్ళకు కట్టినట్టు UNDI

  3. pedapudi Vijaya Kumar says:

    నాగమణే.. నీ పిలకాయలంటే యెంత ముద్దమ్మే నీకా…….
    మా అమ్మ ప్రేమ గుర్తొచ్చింది…….మంచి కథ, మన ప్రమణాల్లో ఉన్న కథ, …….
    అనగనగా ఒక పేద బ్రహ్మణుడు…..లాంటి కథ కాదు…..
    మరిన్ని కథలు నీ కలం నుంచి రావాలి….. పల్లె బ్రతుకు చిత్రీకరణ , అంటే రాయుడుగారు, రెడ్డిగారు, చౌదరి గారిదిమాత్రమే కాదు……..
    సుబ్బయ్యదీ, రామయ్యదీ, అక్కమ్మదీ, పెంటమ్మదీ, యేసుగాడిదీ, యేసోబుగాడిదీ కుద….అని తెలిసేలా రాయాలి…..
    పల్లెబ్రతుకు చిత్రీకరణ అంటే నాయుడు బావ ఎంకి రాసలీలలే కాదు, దలిత స్త్రీ జీవన పోరాటం , దలిత జీవుల వెట్టి చాకిరీ కూడా అని తెలియచెప్పాలి… ,
    పల్లెల్లో వాడలు కుద ఉన్నాయని……మూస దొంతరలను చీల్చివేసే విధంగా రాయాలి…..
    నీ కథకు జైభీములు…….నీల్ సలాములు .

  4. Suresh Kalluru says:

    Wow!! Nice story

  5. Venkateswarlu Yerukala says:

    అన్న చాలా ఆనందంగా ఉంది, కళ్ళల్లో నీళ్లు ఆగటంలేదు, మా యమ్మ గుర్తుకొస్తుంది, నువ్వు రాసవనగానే ఏదో విషయముంటుంది అనుకున్న, తెలుగు చదవడం కష్టంగా ఉన్న పూర్తిగా చదివా ఎక్కడ కష్టంగా అనిపించలేదు, నీ జీవిత కథ నా జీవిత కథ ను గుర్తు చేసింది, కాకపోతే నీది ఒక దళిత కథ నాది ఒక ఆదివాసీ కథ కానీ అనుభవాలు మాత్రం ఒక్కటే. విజయ్ అన్న చెప్పినట్టు పల్లెటూరి కథలు అంటే కేవలం పెద్దరాయుడు, చిన్నరాయుడు, లేక ఇంకేదో చౌదరో, రెడ్డో మాత్రమే కాదు. దళిత, ఆదివాసుల జీవితాలు,వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కన్నీళ్లు చాల ఉంటాయిఅని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి ఎన్నో అనుభవాలని రాయాలని కోరుకుంటూ, మా యమ్మ ని గుర్తు చేసిన మీ యమ్మ నాగమనికి పాదాభివందనం ……..జై భీం నీల్ సలాం అన్న ………వెంకటేశ్వర్లు ఎరుకల

  6. చాలా…….బాగుంది.మీరు రాసే విధానం ఇంకా బాగుంది.ఎప్పటికి ఎన్ని సార్లు చదివానో తెలియదు.అంత నచ్చింది .superrrrrr …..

  7. Bhargav chippada says:

    Hai andi.. na peru bhargav nadhi vizianagaram jilla..
    Nenu kuda alanti kutumbam loni putti periga vadine prathi sangatana lo ma amma,nanna ni nannu nenu chuskunnattu vundhi naku telisi meeru pedha kutumbamlonchi vachina varu ani anukunta chala chala bagundhi

మీ మాటలు

*