అతనూ నేనూ

నాకేం తొందరలేదు అతని లాగే

నన్ను నేను పరుచుకుని కూర్చున్నాను తననే  చూస్తూ
నాలోంచి చూపుల్ని వెనక్కి లాక్కుని
రెప్పల కింద అతను దాచుకున్నపుడు
కొలుకుల్లోంచి కణతల మీదుగా నాచు పట్టిన చారికలు
మళ్ళీ కొత్తగా తడిసిన చప్పుడు
ఉండుండీ  అతని లోపలి కఫపు అలికిడి
మా చుట్టూ కోట కట్టుకున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ
ఏ జ్ఞాపకాలు ఆత్రంగా తడుముకున్నాయో
వట్టి పోయిన  పెదాల మీద చెమ్మ చెమ్మగా చిరునవ్వు
గుప్పెడు గుండె చేస్తున్న ఒంటరి పోరాటం
అతని మెదడు మెలికల్లోకి మంచి రక్తాన్ని ఎగదోస్తూ
చిక్కుల దొంతరల మధ్యన ఆశగా నిలబడి
ఓర్పు పాఠాన్ని దొంగిలిస్తున్న నేను
శరీరం పై తేరిన ముడతల అడుగున
వయసుతో బరువెక్కిన అతని స్పష్టమైన చరిత్ర
వేళ్ళ వంకర్ల మధ్య నుండి స్వేచ్ఛగా
రాక పోకల్ని సాగిస్తూ గాలీ వెలుతురూ
ఇద్దరివీ ఎదురు చూపులే
తన ప్రాణాన్ని తీసుకెళ్ళే యమ పాశం కోసం అతను
నాకోసం ప్రాణాలిచ్చే అల్ప జీవి కోసం నేను
ఎటొచ్చీ అతనిది ముసలి శరీరం, నాది బలమైన సాలె గూడు అంతే తేడా
                                                             – సాయి కిరణ్