నీ పర్యాయ పదం నేను…

 

-మిథిల్ కుమార్

~

1.
ఇలా ఓ తప్త ప్రవాహం,

నీలోకి నేను బట్వాడా అవ్వడం
నన్ను నువ్వు అనువదించుకోవడం
పరస్పరంగా గుండె చప్పుళ్ళని పంచుకోవడం,
ఒక రాప్చిక్ క్షణమే  కదూ…

ఒకలాంటి లిప్తకాంతి
ఇరు మనసుల రాపిడిలో వెలిగి,
నీలిమంటొకటి రాజుకుంటుంది.
అదొక వింటేజ్ దృశ్యం.

2.
కొన్ని ఉద్వేగాలు విరహంలో
ఊగిసలాడుతూ,
తడి పలకరింపుల తచ్చాటలో
తనువుల గుసగుసలు.

భావ సంపర్కాల జుగల్బందిలో
రేయింబవళ్ళు క్షణాల్లో ఇమిడిపోయే యుగాలే మరి

అలా
వ్యాప్తమవుతున్న విరహ కంపనాల్ని
పుట్టించే మది లోలకం.

తెలిసమయాన
మంచుదుప్పటి కప్పుకున్న
పత్తిపువ్వులం మనమిప్పుడు

ఆహ..! ఎంత బావుంది ఇలా చెప్పుకోవడం….

3.
నీ ఉనికి,
చిక్కటి మంచు తెరల్లో
నగ్నదేహపు విహారంలాంటిది నాకు.

మబ్బు నురగల్లో
మునిగి తేలుతున్నట్టి
ఒక రప్చర్  ఇది.

ఇక నా పిడికిలిలోనున్న
సింధూరప్పొడిని
నీ నొసటన పూయడానికి ఆయత్తమవుతున్నాను…….

inamorata..!!!

నేను రాసుకునే స్వప్నలిపిలో
సుధీర్ఘ అధ్యాయానివి నువ్వు,
నీకొక పర్యాయపదాన్ని నేను…….

*