శివసాగర్ జాంబవసాగర్ కాలేకపోవడం విషాదం

Shivasagar_Colour_01

(ఏప్రిల్ 17 ప్రసిద్ధ కవి శివసాగర్ ప్రథమ వర్థంతి)

మన దేశంలో అన్ని రకాల విప్లవాలను సవర్ణులు గుత్తబట్టిండ్రు. నూతన ప్రజాస్వామిక / ప్రజాతంత్ర / వ్యవసాయిక / సోషలిస్టు / సాంస్కృతిక విప్లవాలతో పాటు వాటి రాజకీయాలను, వ్యూహాలను, నాయకత్వాలను ఇంకా సవర్ణ పాములకిరవైనట్లు అర్ధమయ్యాక తను ఇమడలేని, ఇమడనియ్యని పరిస్థితులనుంచి కవి శివసాగర్ (కె.జి. సత్యమూర్తి) నిరసన నిష్క్రమణ చేశాడు.

విప్లవ కవి శివసాగర్ అజ్ఞాత చీకట్ల నుంచి దళిత ఐడెంటిటీతో వచ్చాడంటే అభిమానంతో వెళ్ళి పలకరిస్తుండేవాణ్ని.  దళితుడు, విద్యాధికుడు, కవి ప్రముఖుడు, సీనియర్ విప్లవ నాయకుడూ అయిన అలాంటి పెద్దమనిషితో ముచ్చటించే అవకాశం ఉండేదంటే వ్యవస్థ సమూలంగా మారాలని కోరుకునే  నాలాంటి కార్యకర్తకు అంతకంటే పండగ ఇంకేముంటుంది?

బంజారాహిల్స్ శరత్ వాళ్లింట్లో కొన్నిసార్లు, రాంనగర్ ఎస్సార్పీ క్వార్టర్‌లో కొన్నిసార్లు వెళ్ళి ఆయన్ని కలిసేవాణ్ని. విశేషమైన అనుభవాల్లోంచి వచ్చిన ఆయన విశ్లేషణలు, కవిత్వం, మాటలు, రాతలు వింటుంటే వెచ్చటి నల్ల తిన్నంత సంబరంగుండేది.

ప్రేమనీ,నిప్పునీ ప్రభావశీలంగా, ఆలోచనీయంగా కురిపించే శివసాగర్ కవిత్వం, మాటలు బలంగా ఆకర్షించేవి. తిమ్మ సముద్రం దళిత ఉద్యమం సందర్భంలో ఆయనా, పార్వతి, బాంబుల అంకమ్మ, గాయకుడు డప్పు ప్రకాష్, శరత్, బాబూరావు తదితరులతో కలిసి పని చేసే అవకాశం  నాకు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలకెళ్లి దళిత పల్లెల్లో సమావేశాలు నిర్వహించి చైతన్యపరిచే కార్యక్రమాలు చేసేవాళ్ళం.

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావుగారి నాయకత్వంలో 1992 – 93 లలో గుంటూరు కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల రాజకీయ పార్టీ కోసం సన్నాహక అవగాహన సమావేశాలు జరిగేవి, గుంటూరు జిల్లా దళిత మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నా అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగేవి. ఈ సమావేశాల్లో శివసాగర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతులచ్చన్న, శీలం ప్రభుదాస్ తదితర ప్రముఖులు పాల్గొంటుండేవారు.

1996 ఫిబ్రవరి 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎమ్మార్పీయస్ రాష్ట్ర కో కన్వీనర్‌నైన నా అధ్యక్షతన “ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల అమలులో లోపాలు – వర్గీకరణ” అంశంపై జరిగిన సెమినార్‌లో టి.ఎన్.సదాలక్ష్మి, కంచ ఐలయ్యతో పాటు శివసాగర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కులాలవారికి రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం జరగవల్సిన ఆవశ్యకత గురించి రిజర్వేషన్ల వర్గీకరణకు మద్ధతుగా శివసాగర్ ఆనాటి సెమినార్‌లో ప్రసంగించారు. ఇంతే కాక నిజాం కాలేజీ బయట జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద మాదిగలం ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వంచే రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిశీలన కోసం విచారణా కమీషన్‌ను సాధించుకున్నాం. ఆ సందర్భంలో కూడ శివసాగర్ వచ్చి మాదిగ దండోరా ఉద్యమానికి సంఘీభావం తెలిపి వెళ్లారు. ఇందుకు ఆయన్ని మేము (మాదిగలం) అభినందించాము.

జాఫ్నా కేంద్రంగా సాగిన ప్రత్యేక  తమిళదేశ సాధనోధ్యమంపై ‘నేను జాఫ్నాలో చనిపోయాను’ అని శివసాగర్ సంఘీభావ కవిత్వం రాశారు. దక్షిణాఫ్రికాలో తెల్ల జాత్యహంకార ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న నల్లజాతి విముక్తి సైన్యానికి మద్ధతుగా శివసాగర్ కవిత్వం రాశారు. వివక్షా వ్యతిరేక ఉద్యమాలపై  ఆయన కవిత్వం చదివినప్పుడల్లా చాలా సంతోషమనిపించేది. కాని, ఆశ్చర్యకరంగా తన మాల పల్లెకి పక్కనున్న గుడిసెల్లో, పొరుగునున్న మాదిగ గూడేలలో మనుషులుగా గుర్తింపుకోసం ఆక్రందిస్తూ, ఆకలితో న్యాయం కోసం వెయ్యి తప్పెట్లై ఉద్యమించిన మాదిగల కోసం శివసాగర్ ఏనాడూ కవిత్వం/పాట/అక్షరాల ద్వారా సంఘీభావం ప్రకటించలేదు.

మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల,మెహతార్, రెల్లి, తోటి, గొడగలి, గొదారి, పాకీ, పంచములు – సాటి సహబాధిత కులాలవారు మానవహక్కుల కోసం, విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో దామాషా  ప్రాతినిధ్యం కోసం చేసిన ఉద్యమాల పట్ల సానుకూల బాధ్యత లేకుండా శివసాగర్ పెన్ను మూసుకుపోయిందేమిటబ్బా అని చాలా విచారించే వాళ్లం. చాలా నిరసనతో ఉండేవాళ్లం.

జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలోని 61 ఎస్సీ కులాలవారు ఎవరి వాటా రిజర్వెషన్లు వారు పొందగలిగే ఏర్పాటు ఉండాలనేది మాదిగలు ముందుకు తెచ్చిన డిమాండు.

మాల నాయకులు పైకి ఏం చెబుతున్నప్పటికీ, సాంకేతికమైన సాకులు, తొండి వాదనలతో దండోరా ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండుని ఫలప్రదం కానీయకుండా అడ్డుకున్నారు. 61 కులాలకి అందే విధంగా రిజర్వేషన్ల కుండని భాగించకూడదని మునుపు దోచుకు తిన్నట్టే ఇకపైన అఏ కులం బలమైనదైతే ఆ కులమే (మాల కులమే) దోచుకు తినాలనే అసాంఘిక వైఖరి కొందరు మాల నాయకుల్లో ప్రబలించి. మాల కులంలోని ఇలాంటి దళిత వ్యతిరేక, అసాంఘిక శక్తులు బలంగా ఉన్న కారణంగా చాలామంది మాల అధికారులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు తటస్థులయ్యారు. శివసాగర్ కవి కూడా ఈ కుల ప్రభావాన్నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కారణం చేతనే సాహిత్య సౌహార్ద్రతలను దండోరా ఉద్యమానికి ప్రకటించలేకపోయాడు. శివసాగర్ పెన్ను శాశ్వతంగా మూసుకుపోయింది.

సవర్ణ కవి రేణువుల మధ్య ఆఫ్రికా వజ్రం లాంటి కవి శివసాగర్. “స్వార్ధం శిరస్సును గండ్ర గొడ్డలితో నరకగలిగినవాడే నేటి హీరో” అని నినాదమై మెరిసి, మెదళ్లలో ప్రసారమై నిలిచి, రక్తాన్ని మరిగించి, రోమాల్ని నిగిడించి యువతరాన్ని విప్లవం వైపు మార్చింగ్ చేయించిన గొప్పకవి శివసాగర్. సందేహమే లేదు. కోటిమంది సవర్ణ కవుల కంటే గొప్పకవి శివసాగర్. ఐతే, మాదిగలకేంటి? సామాజిక ఉద్యమ నాయకుడు కె.జి.సత్యమూర్తి పాక్షికంగా దండోరా ఉద్యమాన్ని బలపరిచాడు. కాని, కవి శివసాగర్ పాక్షికంగా కూడా దండోరా ఉద్యమాన్ని బలపరచలేదు. పైగా “మండే మాదిగ డప్పును, సిర్రా, చిటికెన పుల్ల”ల్ని మాదిగ గూడెంలోంచి ఎత్తుకుపోయి మాదిగేతర రాజకీయ, సాంస్కృతికాంశాలకి వాయించాడు. ఇది శానా తప్పు గురూ. మాలత్వం ఐడెంటిటీ కాదు, ఆధిక్యాలను)వొదులుకున్న కుల ప్రజాస్వామ్య శివసాగర్ మాదిగలకు కావాలి. శివసాగర్ సాహిత్యంలో జాంబవసాగర్ కాలేకపోవడం పెద్ద విషాదం.