తూరుపు గాలులు -చివరి భాగం

3

దీపాంకరుడు ఉత్తారారామానికివచ్చి రెండేళ్ళుదాటింది. కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, కొత్త విషయాలు; నేర్చుకోవడానికి అంతులేని అవకాశాలు. వీటిమధ్య రోజులు ఇట్టే గడిచిపోయాయి. సింహళభాష బాగాపట్టుబడింది. శిష్యుల సహకారంతో ఉచ్ఛారణ లోపాలు కూడా సరిదిద్దుకున్నాడు. తనకు సాయంగా నియమించబడిన శిష్యుడు ధర్మపాలుడితో అతనికి బాగా సఖ్యత కుదిరింది. ఉత్తరారామంలో దీపాంకరుడికి అన్నిటికన్నా ఆనందం కలిగించినదేమంటే దంతమందిరానికి సంవత్సరంపొడుగునా వచ్చేభక్తుల సందడి, అక్కడ ఉత్సాహపూరితంగాజరిగే పండగలు, పూజలు, దైనందిన కార్యక్రమాలు. నాలందాలోకూడా అతడటువంటి బౌద్ధ జనసందోహాన్ని చూడలేదు. వరసగా రెండేళ్లపాటు అన్ని పూజలనూ, పండగలనూ దగ్గరగా పరిశీలించినమీదట  అతనికి తోచిన విషయాలను వైశాఖ పూర్ణిమనాడు ఈవిధంగా తన జ్ఞాపకసంపుటిలో వ్రాసుకున్నాడు:

మరో బుద్ధజయంతి పండగ వచ్చి వెళ్ళిపోయింది. మొత్తానికి ఈ రెండేళ్లలో చాలా సంగతులే తెలియవచ్చాయి. ఉదాహరణకి సింహళదేశం కూడా బ్రాహ్మణపౌరోహిత కులం, రాజ, వైశ్య కులాలు, భూమిమీద, వ్యవసాయంమీద ఆధిపత్యం కలిగిన గోవి కులం, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ అనేక కులాలు, ఛండాల కులం – ఇలా చాలా కులాలున్నాయని తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది. అనురాధపురంలోనూ, పొలోన్నరువలోని దంతమందిరంలోనూ వంశపార్యంపరంగా పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు భారతదేశంనుండి మహేంద్రుడు, సంఘమిత్రలతో బాటుగా వచ్చారంటారు. (ఈ ఆచారం నిలబడిందిగాని, సంఘమిత్ర స్థాపించిన భిక్షుణిల విహారం ఎందుచేత మూతబడిందో? ఆ మాటకొస్తే నాలందాలో కూడా అంతా భిక్షువులేగాని, భిక్షుణిలు లేరు).

దంతమందిరానికి వచ్చే భక్తులను చూస్తూంటే, వాళ్లతో మాట్లాడుతూంటే తథాగతుడు దుఖాన్ని సార్వజనీన మానవజీవన విషాదంగా, నాలుగు మహాసత్యాల్లో మొదటిదానిగా ఎందుకు గుర్తించాడో వాస్తవరూపంలో కళ్ళముందు కదలాతుడుతుంది. సంతానం కలగలేదని విలవిలలాడుతూన్న దంపతులు, సంతానంపెట్టే బాధలుభరించలేకపోతూన్న తల్లిదండ్రులు, యుద్ధంలో మరణించిన సైనికుని భార్య, ఆత్మీయుల దీర్ఘకాలిక అనారోగ్యంతో వ్యధ, దగ్గరవారు చేసిన ద్రోహానికి తట్టుకోలేకపోయిన వంచితులు, వర్షాలులేక పంట చేజారిన రైతులు, భాగస్వాముల చేతిలో మోసపోయి వీధినపడ్డ వ్యాపారి, పైఅధికారుల ఆగ్రహానికి గురైన చిరుఉద్యోగి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూన్న యువతీ యువకులు….వీళ్ళందరితోనూ మాట్లాడుతూంటే తమ బాధల్ని చెప్పుకోవడంలోనే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారనిపిస్తుంది. వాళ్ళ మొహాల్లో చిగురించే ఆశాభావం ఉత్సాహం కలిగిస్తుంది. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి, దంతాన్ని భద్రపరచిన ధాతుపేటికను కడిగిననీళ్ళను తీర్థంగా స్వీకరించి, తథాగతునిపై భారంవేసి, ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో దైనందిన జీవనపోరాటాలని కొనసాగించడానికి తిరిగివెళ్తున్నారు. వారి విశ్వాసబలం చూస్తే ఆనందం కలుగుతుంది. నాలందాలో ఉండగా ఒక చీనావిద్యార్థి  ఏదో సందర్భంలో బౌద్ధధర్మంపై పాళీభాషలో అల్లిన ఒక కవిత చదివాడు. దాని సారాంశం ఇలా ఉంటుంది: ధర్మంఅంటే అంధకారంలో నిత్యంవెలిగే ఒక అద్భుత ఆశాకిరణం; భూత, భవిష్యత్తుల అవిరామ పదఘట్టనలో నలిగిపోయేవారి వర్తమానానికి అర్థంకల్పించే ఏకైక ఆధారం; విధివంచితుల వేడుకోలు; ప్రజానీకం భక్తి పారవశ్యంతో గొంతెత్తి పాడుకొనే పాట.

అప్పుడు తెలియలేదుగానీ, నాలందా విధ్వంసం తరువాత సాధువులతో చేసిన తిరుగుప్రయాణం ఒక గొప్ప అనుభవం. ఇప్పుడు కళ్ళారాచూస్తూన్న విశ్వాసబలమే ఆ సాధువులను అత్యున్నతస్థాయిలో ఆవహించిందనిపిస్తోంది. వారి భక్తివిశ్వాసాలకుమూలం,  జీవితం విరజిమ్మే వర్తమాన భయాందోళనలు కావు. వారిది మూర్ఖవిశ్వాసంకాదు; నిస్వార్థమైన, భయరహితమైన భక్తి; ప్రకృతినీ, మాననవాతీత శక్తులను నమ్రతతో గౌరవించి ఆరాధించే భావన; బాహ్య, అంతర్గత సౌందర్యాలను అవలీలగా సంధించగల శక్తి.

ఇక బౌద్ధం విషయానికి వస్తే భక్తిమార్గంలో, విశ్వాసాలతో మొదలుపెట్టినవారిని  జ్ఞానమార్గంలో, హేతుబద్ధత వైపు ప్రయాణింపజేయడమే బౌద్ధధర్మ విశిష్టత. అంతిమంగా ఎవరి కర్మలకువారినే బాధ్యులనిచేసి, ఎవరి దారిని వారే వెతుక్కోవాలంటుంది బౌద్ధం. మనుషులకే అన్ని నిర్ణయాలనూ వదిలిపెట్టిన తథాగతుడు గొప్ప ఆశావాది అయిఉంటాడు. ఎన్నుకున్న మార్గం ఏదైనా ప్రయాణారంభం మాత్రం మనుషులందరికీ ఒకటే.

పుట్టుక, నిత్యజీవన సంఘర్షణ, ఉన్నదిపోతుందేమోనని భయం, కోరుకున్నది లభించదేమోనని ఆందోళన, బాధనుండి విముక్తికోరుకోవడం, ఆనందాన్నిమాత్రమే ఆశించడం, అనారోగ్యం, వార్ధక్యం; చివరికి మృత్యువువాత పడటం, అక్కడకూడా ఆందోళనే – అనామకులుగా కాలగర్భంలో కలసిపోతామేమోననే ఆందోళన – ఇదే ప్రతిఒక్కరి జీవితానుభవం; అన్ని ప్రశ్నలకూ, అన్వేషణలకూ మూలం  ఇదే. ఈ విశ్వవ్యాపిత మౌలికతనుండే బౌద్ధం పుట్టింది. [బహుశా అందుకే తథాగతుడు తన మొదటి ప్రవచనమైన దమ్మచక్కపవత్తన సూత్త (ధర్మచక్ర ప్రవర్తన సూత్రం)లోనే ఈ పరమసత్యాన్ని ప్రస్తావించాడు].

భక్తులందరూ తమ సాంసారిక బాధలనుండి, దుఖమయ జీవితాలనుండి విముక్తిని కోరుకొనేవాళ్ళే. అయితే వాళ్ళ దుఃఖాలను తెలుసుకున్నప్పుడు కరుణాభావం కలగకపోతే అట్టివ్యక్తి భిక్షువుకాదుకదా, మనిషినని చెప్పుకోవడానికి కూడా అనర్హుడు. అయితే కరుణఅనేది భావంగానే, లోలోపలే ఉండిపోతే సరిపోతుందా? నిత్యజీవనాచరణలో ప్రతిఫలించాలి కదా? అందుకనే తథాగతుడు మేత్త (మైత్రి)ని నిత్యం ధ్యానం ద్వారా అధ్యయనం చేయవలసిన అంశంగా, ఆచరించవలసిన ఆదర్శంగా అనేకసందర్భాల్లో పేర్కొన్నాడు. థేరవాదం ఈ అంశానికి అత్యున్నతమైన ప్రాధాన్యతనిస్తుంది. థేరవాద భిక్షువులు నిత్యం జనసమూహాలకుచేసే ప్రవచనాల్లో, పఠించే సూత్తాల్లో తరచూ వినిపిస్తుంది. రోగికి వ్యాధినిబట్టి తగిన మోతాదులో మందిచ్చేవాడే సరైన వైద్యుడు. (జనులందరినీ అనుక్షణం బాధించే నిర్దిష్టమైన సమస్యల్ని పక్కనపెట్టి శూన్యత, ఆత్మ, అనాత్మ, కర్మ, పునర్జన్మ, ద్వైతం, అద్వైతం – ఇటువంటి అమూర్తమైన విషయాలమీద ఉపన్యసించి ఊదరగొట్టడం అర్థరహితం. ఎవరికోతప్ప వీటిపై అందరికీ ఆసక్తీ ఉండదు).

దుఃఖం, కరుణ, మైత్రి ఈ మూడు అంశాలపైనా, వాటిమధ్యగల మానవీయసంబంధంపైనా గ్రంధాలలో ఎంత చదివినా, ఎంత చర్చించినా తెలియనిలోతు ఇప్పుడు సాధారణజనులతో మాట్లాడుతూంటే తెలిసివస్తున్నది. ఈ సంబంధాన్ని సరళంగా, అర్థవంతంగా తెలియజెప్పగలగడమే ఉత్తమబౌద్దాచార్యుని లక్షణం, ధర్మం. లక్షలసంఖ్యలో జనులకు ఈ సంబంధాన్ని విడమరచిచెప్పగలిగితే, వారిలోంచి వేలకొద్దీ ఉత్తమస్థాయి ఉపాసకులూ, ఉపాసికలూ, ఆచార్యులూ ఉదయిస్తారు. వీరే బౌద్ధానికి భవిష్యదూతలు. ఇలా ఆలోచిస్తే సామాన్యప్రజలనే లక్ష్యం చేసుకోవాలని మొదట్లో ఎన్నుకున్నమార్గమే సరైనదనిపిస్తున్నది. (ఏది ఏమైనా ప్రశ్నలు మాత్రం అవే; చుట్టూతిరిగి స్ఫురించే సమాధానాలుకూడా అవే. అయితే వాటినే మరింత లోతుగా, అర్థవంతంగా చర్చించడం సాధ్యపడుతున్నది. ఈ విషయంపై శాంతిదేవుడు ఏమంటాడో?).

శాంతిదేవుడిని కలుసుకోవడం, అతనితో పూర్వంరోజుల్లోమాదిరిగా సంభాషించడం, చర్చించడం నానాటికీ దుర్లభంగా ఉన్నది. అతడు ఎక్కువకాలం సంఘపరిషత్తు సమావేశాల్లోనూ, రాజభవనంలో జరుగుతూన్న  సంప్రదింపుల్లోనూ గడుపుతూన్నట్లుగా తోస్తున్నది. ఇదేమాట దీపాంకరుడు తనశిష్యుడు ధర్మపాలునితో అంటే – అతడు,

“అవును, ఆచార్యా! శాంతిదేవథేరోవారిని సంఘరాజాగా నియమిస్తూ రెండుమూడు రోజుల్లో రాజభవనంనుండి ప్రకటన విడుదల కావచ్చు. మేమంతా ఆ శుభఘడియ కోసమే ఎదురుచూస్తున్నాం. మీరు ఆయనతో సమావేశంకావాలని కోరుకుంటూన్న సంగతి ఆయనకు తెలియజేస్తాను”. అన్నాడు.

“తొందరేమీలేదు. ఆయనకు తీరుబడి దొరికినప్పుడేలే” అన్నాడు దీపాంకరుడు.

***

శాంతిదేవునితో సంభాషించే అవకాశం బుద్ధజయంతి వెళ్ళిన వారంరోజులకుగాని లభించలేదు. అయితే ఆరోజున అతడు తీరుబడిగా, ఉల్లాసంగా ఉన్నట్టుగా అగుపించాడు.

“ఏదో మాట్లాడాలన్నవుటకదా? మనం మాట్లాడుకొని చాలారోజులైంది. నీకిక్కడ ఎలాఉంది? నువ్వనుకున్నవన్నీ సాధించగలుగుతున్నావా? ఏమైనా సాయంకావాలా? చెప్పు”.

“పనులన్నీ సవ్యంగానే సాగుతున్నాయి, ఆచార్యా. గ్రంధాలప్రతులను వ్రాసిపెట్టుకోవడానికిమాత్రం  అనుకున్నదానికన్నా ఎక్కవ సమయంపడుతున్నది. ఇంకో సంవత్సరంగడువు ఉన్నదిగనుక ఆపని కూడా పూర్తవుతుందనే అనుకుంటున్నాను. కాకపోతే ఒక విషయం మీతో చర్చించాలనుకుంటున్నాను”.

“అలాగే, చెప్పు. నాకు తెలిస్తే చెబుతాను”

“మీకు గుర్తుండే ఉంటుంది – నేనిక్కడికి రావడానికి మీరిచ్చిన సూచనే కారణం. నాలందాలో నిలిపివేసిన అధ్యయనాన్ని కొనసాగించడం, ఉత్తరారామాన్ని ఉత్తమబోధనాకేంద్రంగా తీర్చిదిద్దడానికి మీరుచేస్తున్న కృషిలో పాలుపంచుకోవడం – ఇవేకాక మరో రెండు లక్ష్యాలను కూడా సాధించాలని అనుకున్నాం కదా! మొదటిది పాలకుల సమర్థన, సహకారం కలిగినఉన్నచోట్ల బౌద్ధం ఏవిధంగా వికసిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం, రెండోది జనబాహుళ్యంలో బౌద్ధం ఆచరించే దేశాన్ని సమీపంగా పరిశీలించడం. ఈ రెండు లక్ష్యాలనీ సాధించగలననే అనుకుంటున్నాను. అయితే మా దేశంలో ఈ రెండు అనుకూలతలూ లేవు. మాకున్న కొద్దిపాటి వనరుల్నీ ఎక్కడ కేంద్రీకరించాలి? అన్న ప్రశ్నే మళ్ళీమళ్ళీ  ముందుకొస్తోంది”.

“అర్థమైంది. మొదట కొన్నివిషయాలు చెప్పాలి. అనుకూలతలు అనేమాటవాడావు. నిజమే, మీకులేని అనుకూలతలు కొన్ని మాకున్నాయి. అయితే వాటిమూలంగా వచ్చే సమస్యలుకూడా అనేకం”

“నాకు అర్థంకాలేదు, ఆచార్యా”

“మొదట జనబాహుళ్యంలో బౌద్ధాన్ని తీసుకుందాం. మహిమలు, పూజలూ, తంతులు – వీటిని కోరుకోనేవారూ, నమ్మేవారూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు; ఎప్పుడూ ఉంటారు. వీరి మూలంగా థేరవాదం తన మూలస్వరూపాన్ని, తాత్విక స్వచ్ఛతను కోల్పోయి, ఆచరణలో మహాయాన, వజ్రయానాలవైపు మళ్ళిపోయే ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. ధర్మబోధకుని పనికూడా గొర్రెలకాపరిచేసే పనే. గొర్రెల్ని అప్పుడప్పుడూ అదిలిస్తూ, సరైనతోవలో నడిపిస్తూండాలి. ఒకటిరెండు గొర్రెలు దారితప్పాయంటే మొత్తం మందంతా వాటివెంట పారిపోయే ప్రమాదం ఉన్నది”.

గొర్రెలు, గొర్రెలకాపరి – ఈ ఉపమానం దీపాంకరుడికి అంతగా రుచించలేదు. అయినా కిమ్మనకుండా వినసాగాడు.

“ఇక రెండో అనుకూలత రాజుల సమర్థన, సహకారం. ఇదికూడా ఒక సమస్యే. ఏ ఇద్దరు రాజులూ ఒక మాదిరిగా ఉండరు. ఒక్కొక్కడికీ ఒక్కో పిచ్చి; ఎవడిపిచ్చి వాడికానందం అన్నారు. అందుచేత ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బౌద్ధాన్ని కాపాడుకోవడమంటే కత్తిమీద సామువంటిదే”.

‘పిచ్చిమారాజులు’, ‘కత్తిమీదసాము’ ఈ పదప్రయోగాలు దీపాంకరుడికి ఆశ్చర్యం కలిగించాయి. శాంతిదేవుడు చెప్పుకుపోతున్నాడు.

“మా దేశంలోని రాజవంశాలన్నీ కళింగ, చోళ, పాండ్య రాజ్యాలతో పెనవేసుకుపోయాయి. బౌద్ధం స్వీకరించి పూర్తిగా స్థానికులుగా మారినవారూ ఉన్నారు. యుద్దాలుచేసి ఆక్రమణదారులుగానే మిగిలిపోయినవాళ్ళూ ఉన్నారు. విదేశీయులతో యుద్ధాలు జరిగినప్పుడల్లా బౌద్ధం, సింహళ జాతీయవాదానికి ప్రతీకగా నిలిచింది. ఏదైనా సంక్షోభం మీదపడినప్పుడు ప్రజల్ని సమీకరించడానికి బౌద్ధమే శరణ్యం. అటువంటప్పుడు ధర్మం, సంఘం ఒక స్థాయివరకే; ఆ తరువాత అంతా రాజకీయప్రమేయం, ఆధిపత్యపోరాటమే. ఇది మా రాజులందరికీ తెలుసు. అందుకే అన్ని వ్యవహారాల్లోనూ మామాటకు విలువనిస్తారు. అందుచేత నీ ప్రశ్నకి సమాధానం ఏమంటే – మీరిప్పుడు సామాన్య ప్రజలమీదనే దృష్టిపెట్టాలి; తప్పీజారీ ఒకరిద్దరు పాలకులెవరైనా బౌద్ధానికి అనుకూలురుగా ఉంటేగనక ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. ఈ రెండు అనుకూలతల కన్నాకూడా మరో ముఖ్యమైన విషయం ఉన్నది. ఈ మధ్యంతా మీ దేశంలో ఉన్నానుకాబట్టి నాకర్థమైన సంగతి ఒకటి చెబుతాను”.

“చెప్పండి, ఆచార్యా”

“మీ దేశంలో బౌద్ధం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. ఇప్పట్లో పరిష్కారమంటూ ఏమీలేదు. ఎన్నో ఆరామాలు మూతపడ్డాయి. భిక్షువుల సంఖ్య రోజురోజుకీ క్షీణించి పోతున్నది. పైగా ఈ తురుష్కుల ఆక్రమణ. అందుచేత మీరిప్పుడు చెయ్యవలసిందల్లా మిగిలిన ఆరామాల్లోనయినా మూలగ్రంధాలను కాపాడుకోవడం, ధర్మవాణి పూర్తిగా మూగబోకుండా రక్షించుకోవడం. మన తరం చెయ్యవల్సిందీ, చెయ్యగలిగిందీ – ఇదొక్కటే”.

శాంతిదేవుడు కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడతాడని తెలుసుగానీ – మరీ ఇంత సూటిగా, నిర్మొహమాటంగా ఉండడం చూడలేదు. బహుశా ప్రతీదీ విడమర్చిచెప్పడానికి వ్యవధిలేకపోవడంవల్ల కావచ్చు అనుకున్నాడు దీపాంకరుడు.  

“తురుష్కుల ఆక్రమణ గురించి ప్రస్తావించారు. వారినుండి ఎప్పటికైనా విముక్తి ఉంటుందంటారా?”

“నాకు తెలిసి వాళ్ళను ఉత్తరభారతదేశంనుండి ఇప్పట్లో కదిలించగల వాళ్ళెవరూలేరు. దక్షిణదేశాన్నయినా కాపాడుకోగలిగితే అదే గొప్పవిజయం. తురుష్కులధర్మం వేరుకావచ్చు, వారి పద్ధతులు అత్యంత క్రూరమైనవీ, హేయమైనవీ కావచ్చుగానీ రాజులందరూ సామ్రాజ్యవిస్తరణకై యుద్ధాలుచేసినవాళ్ళే, అశోకునితో సహా”.

దీపాంకరుడు నివ్వెరపోయాడు. “తురుష్కులను అశోకునితో ఎలా సరిపోలుస్తున్నారో అర్థంకావటం లేదు, ఆచార్యా”

“నిజమే. కళింగయుద్ధం తరువాత అశోకునిలో ఉదయించిన పశ్చాతాపం, వైరాగ్యం మరే చక్రవర్తిలోనూ చూడం. అదొక్కటే అతనిలోని అపూర్వమైన విశిష్టత. అదే అతడిని బౌద్ధంవైపుగా మళ్ళించింది. దానిఫలితంగానే అతడు చరిత్రలో శాశ్వతమైనస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఒకేఒక్క ప్రత్యేకతని మినహాయిస్తే అతడూ రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిన పాలకుడే; అత్యంతక్రూర హింసాకాండకు వెనుదీయని పోరాటయోధుడే”.

అశోకుడ్ని ఈ కొత్తకోణంలో చూడడం దీపాంకరుడికి కొరుకుడుపడలేదు.

ఇంతలో శాంతిదేవుని ప్రధానశిష్యుడైన గుణసేనుడు వచ్చి అతని చెవిలో ఏదో చెప్పాడు. శాంతిదేవుడు లేచినిలబడి,

“దీపాంకరా, నేను బయల్దేరాలి. రాజభవనంనుండి  పిలుపువచ్చింది. మరోరోజున మనచర్చని కొనసాగిద్దాం” అని వడివడిగా వెళ్ళిపోయాడు.

దీపాంకరుడికి శాంతిదేవునితీరు కొత్తగా అనిపించింది. ఇన్నాళ్ళూ శాంతిదేవుడతనికి ఒక ఉత్తమథేరవాద ఆచార్యునిగా, బౌద్ధచరిత్రకారుడిగా మాత్రమే తెలుసు. ఈరోజున అతడు లోకంపోకడను కాచివడపోసిన కార్యదక్షుడిగా, గొప్ప నాయకత్వలక్షణాలు కలిగిన కర్మయోగిగా కనిపించాడు. ఇదేమాట శిష్యుడు ధర్మపాలునితోఅంటే అతడు నవ్వి,

“ఆచార్య శాంతిదేవథేరోకు చాలా పార్శ్వాలున్నాయి. మనకు కనిపించేవి కొన్ని మాత్రమే” అన్నాడు.

ఆరోజున జరిగిన చర్చపై దీపాంకరుడు ఈవిధంగా వ్రాసుకున్నాడు:

ఈ రోజున శాంతిదేవునితో ఆసక్తికరమైన చర్చజరిగింది. అతడి దృష్టిలో ఇవాళ్టి భారతదేశ పరిస్థితుల్లో బౌద్ధధర్మరక్షణ, వికాసం, విస్తరణ ఎలా సాధ్యం – కిందనుండి పైకా లేక పైనుండి కిందకా? అన్న ప్రశ్నలు అంత ప్రధానమైనవికాదు. బౌద్ధానికి ఇప్పుడు ఏర్పడిన ప్రమాదం అత్యంత తీవ్రమైనది. మొత్తం తుడిచిపెట్టుకుపోకుండా ఎలా కాపాడుకోవడం? – అనేదే ముఖ్యమైన ప్రశ్న. అతనితో మాట్లాడాక ఎప్పుడూ కలిగే నిబ్బరానికి బదులుగా భవిష్యత్తుపై ఆందోళన పెరిగిపోయింది. ఏదిఏమైనా ఇక్కడ తలపెట్టిన పనులన్నింటిలోకీ మూలగ్రంధాల ప్రతులను వ్రాసిపెట్టుకోవడమే అత్యంత కీలకమైనదని బోధపడింది. వాటిని యదాతథంగా రాబోయేతరాలకు అందజేయగలిగితే అవే వారికి మార్గదర్శకాలు అవుతాయి. లేదంటే భవిష్యత్తు అంధకారమే.  (నాలందాలో అగ్నికిఆహుతైన జ్ఞానసంపందను తలచుకుంటే కన్నీళ్లు ధారలుకట్టాయి. రాత్రంతా నిద్రలేదు).

***

 

దుర్దినాన తెల్లవారుఝామునజరిగే ప్రార్థనలో పాల్గొనడానికి దీపాంకరుడు వెళ్తూంటే విషాదవదనుడైన ధర్మపాలుడు ఎదురై, రాత్రి శాంతిదేవుడు మరణించాడని చెప్పాడు. పిడుగులాంటి ఆ వార్తవిని దీపాంకరుడు నిశ్చేష్టుడయ్యాడు. మెదడు మొద్దుబారిపోయింది. యాంత్రికంగా ధర్మపాలునివెంట విహారప్రాంగణంవైపు నడిచాడు. అప్పటికే అక్కడ చాలామంది భిక్షువులు గుమిగూడి ఉన్నారు. మృతదేహం చుట్టూ కొంతమంది కూర్చొని ఉన్నారు. మంద్రస్వరంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఊదొత్తులు, ప్రమిదలు వెలుగుతున్నాయి; పూలదండల మధ్య శాంతిదేవుని శరీరం నిశ్చలంగా, నిద్రపోతున్నట్లుగా ఉంది. అతని మొహం ప్రశాంతంగా, చిరునవ్వు చిందిస్తున్నట్టుగా ఉన్నది. దీపాంకరుడికిదంతా ఒక పీడకలలా ఉందితప్ప నిజమని నమ్మలేకపోతున్నాడు. తదేకంగా శాంతిదేవుని ముఖంలోకి చూశాడు. ఇతడేనా నిన్నగాకమొన్న నాతో అన్నివిషయాలు చర్చించింది? ఇంతలోకే ఎలా మృత్యువాతపడ్డాడు? ఏదో  చెప్పాలని ప్రయత్నిస్తూన్నట్లుగా ఉంది శాంతిదేవుని ముఖం చూస్తూంటే. లేక అంతా తన ఊహేనా? మళ్లీమళ్లీ చూశాడు. ‘నేను చెయ్యగలిగింది చేశాను; ఇక మీ పైనే మొత్తం భారంపెట్టి వెళ్తున్నాను. ఏం చేస్తారో, మీ ఇష్టం’ అంటున్నట్టుగా తోచింది.   ఇక అక్కడ నిలబడలేక దూరంగావెళ్లి రాతి మంటపస్తంభానికి జేరబడి మెట్లమీద కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. బాగా ఎండెక్కింది. అతన్ని వెతుక్కుంటూ శిష్యుడు ధర్మపాలుడు వచ్చాడు. చిన్న మట్టిముంతతో – చిటికెడు ఉప్పుకలిపినగంజి ఇచ్చి తాగమన్నాడు; అది తాగాక దీపాంకరుడికి కాస్త సత్తువ వచ్చింది. లేచినిలబడ్డాడు. అప్పటికి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అందరూ కంటతడిపెడుతున్నారు; పైకి ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. శాంతిదేవునికి ఇంతమంది సన్నిహితులూ, అనుచరులూ ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది.

“ఎలా జరిగింది?” అని ధర్మపాలుడిని ప్రశ్నించాడు.

“రాత్రి పడుకోనేటప్పుడే ఒంట్లో నలతగా ఉందని గుణసేనుడితో అన్నారట. వైద్యుడిని పిలిపిద్దామంటే అవసరంలేదు, పొద్దున్న చూద్దాంలే అన్నారట. అంతే, నిద్రలోనే పోయారు”.

చుట్టూ మూగిన జనాన్ని తప్పించుకుంటూ అంతిమ దర్శనంకోసం శాంతిదేవుని శరీరాన్ని ఉంచిన ప్రాంగణం వైపు ఇద్దరూ నడుస్తున్నారు. శాంతిదేవుని శిష్యుడైన గుణసేనుడు ఎదురై,

“ఆచార్యా, పొద్దుటనుండీ మీకోసం తెగవెతుకుతున్నాను. మీతో మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది – పదండి” అని చెయ్యపట్టుకొని గుంపునుండి దూరంగా లాక్కుపోయాడు.

అతడి గురువులానే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గుణసేనుడి మోహంలో ఆందోళన, తీవ్రమైన ఆదుర్దా కనిపించేసరికి దీపాంకరుడుకూడా కంగారుపడ్డాడు. చుట్టూ ఎవరూలేరు.

“ఏమైంది గుణసేనా?”

“ఎవరితోనూ అనకండి, ఆచార్యా. విషప్రయోగం జరిగింది. కిట్టనివాళ్ళు శాంతిదేవథేరోని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. రాజభవనంలో ఇప్పుడు వాళ్ళదే పైచేయిగా ఉంది”. గుణసేనుడి కండ్లవెంట నీళ్ళు.

“అంత ఖచ్చితంగా ఎలాచెప్పగలవు?”

“రెండురోజుల క్రితం ఆయనే స్వయంగా నాతో అన్నారు”

“ఏమని?”

“నామీద హత్యాప్రయత్నం జరగవచ్చు అన్నారు. ఒకవేళ అనుకోనిదేమైనా జరిగితే ఏం చెయ్యాలోకూడా చెప్పారు”

“ఏం చెప్పారు?’

“చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయంలేదు. మీకు సంబంధినది మాత్రం చెబుతాను”

“చెప్పు”

“మీరు వెంటనే బయల్దేరి మీ దేశం వెళ్లిపోవాలి”

“అర్థంకాలేదు”

గుణసేనుడు అసహనంగా “దీంట్లో అర్థంకాకపోవడానికి ఏముంది? ఈరోజే బయల్దేరి మీదేశం వెళ్ళిపొండి” అన్నాడు.

“ఈ రోజే?”

“అవును. ఈ రాత్రికల్లా మీరు పొలోన్నరువ వదిలి వెళ్లిపోవాలి, ఆచార్యా”.

“అసాధ్యం. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాననుకున్నావు? అయినా ఎందుకు వెళ్ళాలి? నాకేం అర్థంకావడం లేదు”.

“వివరంగా చెప్పేటంత వ్యవధిలేదు. మీరు శాంతిదేవథేరో తీసుకొచ్చిన మనిషనీ, కళింగరాజ్యంకోసం పని చేస్తున్న గూఢచారులనీ, అందుకే సింహళభాషని అంతత్వరగా నేర్చుకొని స్థానికులతో సంబంధాలు పెట్టుకుంటున్నారనీ, ఇంకా చాలా ఆరోపణలున్నాయి.  ఏ నిముషంలోనైనా రాజభటులువచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు”.

దీపాంకరుడికి తలతిరిగిపోయింది. నెమ్మదిగా అన్నాడు –

“గ్రంధాల ప్రతులు?…..ఇంకా పూర్తికావల్సినవి చాలా ఉన్నాయి….. ఇప్పటివరకూ చేసినవో?”

“అవన్నీ మేంచూసుకుంటాం. మాకొదిలెయ్యండి. జాబితా నాకివ్వండి. పూర్తికాగానే మీవిహారానికి పంపే ఏర్పాటు చేస్తాను. మీగదికి వెళ్దాం పదండి”. ఆచార్యుల వసతిపైపు నడుస్తున్నారు. ధర్మపాలుడు ఇంకా ఏదో అంటున్నాడు –

“అందరూ అంత్యక్రియల సన్నాహాల్లో ఉన్నారు. మీరు వెంటనే బయిల్దేరితే రేపటివరకూ ఎవరూ గమనించరు”.  

దీపాంకరుడికేమీ అర్థంకావడంలేదు. అతని గదిని చేరుకున్నారు.

“మీ వస్తువులు తీసుకోండి”

చుట్టూచూసాడు దీపాంకరుడు. ఒక భిక్షువు తన వెంటతీసుకుపోయే వస్తువులేముంటాయి? భిక్షాపాత్ర, చేతికర్ర, భుజానికి తగిలించుకొనే చిన్నమూట – అంతే. ప్రతులను తయారుచేసుకోవడానికి వ్రాసుకున్న గ్రంధాల జాబితాగల తాళపత్రాలను వణుకుతూన్న చేతులతో, మౌనంగా గుణసేనుడికి అందజేసి,  

“ఎక్కడికి వెళ్ళాలి?” అని దీపాంకరుడు అయోమయంగా అడిగాడు.

“ఏర్పాట్లన్నీ చేసేశాం. మీరు ఎలాగైనా వారంరోజులలో ఉత్తరతీరంలోఉన్న యాపనయపట్టన (జాఫ్నాపట్నం) చేరుకోవాలి. దారిలోతగిలే ఆరామాలన్నీ మన సానుభూతిపరులవే. ఎవరైనా అడిగితే బౌద్ధక్షేత్రాలు దర్శించడానికి భారతదేశానికి వెళ్తున్నామని చెప్పండి. వీలైనంతవరకూ సింహళభాషలోనే మాట్లాడండి. మీవెంట ఒక శిష్యుడు వస్తాడు. యాపనయపట్టనలో మిమ్మల్ని మత్స్యకారుల పడవనెక్కిస్తాడు. అక్కడనుండి దక్షిణభారత తీరానికి ఒక్కపూటలో చేరుకోవచ్చు”.

గదిబయటకు నడిచారు. గుణసేనుడికి తను మరీ కర్కశంగా, ముక్తసరిగా ఉన్నానేమోఅని అనుమానం కలిగింది. నచ్చజెప్పే స్వరంలో, మృదువుగా –

“నేనే మీతో వద్దామనుకున్నాను, ఆచార్యా. కానీ నేనిప్పుడిక్కడ కనబడకపోతే అంతా అనుమానిస్తారు” అన్నాడు. మౌనంగా నడుస్తున్నారు. గుణసేనుడు తటాలున ఆగి –

“నేనిక్కడినుండి ప్రాంగణంవైపు వెళ్తాను. మీరు స్నానాలకోనేరు పక్కనేఉన్న మామిడిచెట్టుకింద ఉండండి. ఇప్పుడక్కడ ఎవరూ ఉండరు. శిష్యుడిని పంపిస్తాను. ముఖద్వారం వైపుగా కాకుండా పెరటిదారిన వెళ్ళిపోవడం ఉత్తమం”.

“అంత్యక్రియలు…?”

“సూర్యాస్తమయంలోగా అయిపోవాలి. మీరు రాకపోవడమే ఉత్తమం” అని దీపాంకరుడికి నమస్కరించి పెద్దపెద్ద అంగలువేస్తూ హడావుడిగా ప్రాంగణంవైపు వెళ్ళిపోయాడు.

దీపాంకరుడు స్నానాలకోనేరు దిశగా నడిచాడు. సూర్యుడు పశ్చిమదిశకు మళ్లిపోయాడు. ఉత్తరారామంతో తనకు ఋణంతీరిపోయిందంటే నమ్మలేకున్నాడు. ప్రాంగణంలోకివెళ్లి, ఆఖరుసారిగా శాంతిదేవుడిని దర్శించుకోవాలనీ, విద్యాధరబుద్ధుడి విగ్రహానికి నమస్కరించాలనీ, నిర్వాణబుద్ధుడ్నీ, చేతులుకట్టుకొని పక్కననిలబడ్డ ఆనందుడినీ మరోసారి చూసిరావాలనీ అతనికి బలమైనకోరిక కలిగింది.  అన్నికోరికల్నీ వదులుకొని ఒంటరిగా పెరటిదారిన బయట పడ్డాడు.

మూడువారాల్లో దీపాంకరుడూ, అతని శిష్యుడూ యాపనపట్టణం చేరుకున్నారు. దీపాంకరుడిని తమిళజాలరుల పడవనెక్కించి శిష్యుడు వెనుతిరిగాడు. సింహళతీరం అదృశ్యమవుతూండగా తను వ్రాసుకుంటూన్న జ్ఞాపకాల సంపుటి ఉత్తరారామంలోనే మర్చిపోయిన సంగతి దీపాంకరుడికి తటాలున గుర్తుకొచ్చింది. మనసు చివుక్కుమంది. గుణసేనుడు గ్రంధాల ప్రతులతోబాటు అందజేస్తాడులెమ్మని సరిపెట్టుకున్నాడు.

***

పాండ్య, కాకతీయరాజ్యాలగుండా ప్రయాణించి పంపావిహారానికి చేరడానికి దీపాంకరుడికి ఆరునెలలపైనే  పట్టింది. అతడు ప్రయాణించిన దారిలో మూడు బౌద్ధ ఆరామాలు కనిపించాయి. ఒక ఆరామం పాడుబడి ఉంది; అక్కడ ఎవరూ లేరు. రెండవ ఆరామంలో ఆరుగురు భిక్షువులు కనిపించారు. వారిలో ముగ్గురు వయోవృద్ధులు. మిగతా ముగ్గురూ వారికి సేవచేస్తూ చెంతనే ఉండిపోయిన శిష్యులు. దీపాంకరుడినిచూడగానే వారందరికీ ప్రాణం లేచివచ్చింది; నాలందాలో చదువుకున్నాడనీ, సింహళదేశంలో ఆచార్యునిగా పనిచేసి వస్తున్నాడనీ తెలుసుకొని ఎంతో సంతోషించారు. తమతోబాటు ఉండమని అభ్యర్ధించారు. వాళ్లమాట కాదనలేక దీపాంకరుడు వారందినాలు  అక్కడేగడిపాడు. ఇక మూడవది ధాన్యకటకవిహారం; అక్కడి పరిస్థితి ఆశాజనకంగా ఉన్నది. వందకుపైగా  భిక్షువులూ, నలుగురు ఆచార్యులూ ఉన్నారు. తెలుగుమాటలు వినబడుతూంటే దీపాంకరుడికి వీనులవిందుగా ఉన్నది. థేరవాదులుకూడా ఉన్నప్పటికీ, మహాయాన, వజ్రయానాలను అనుసరించేవారు ఎక్కువగా ఉన్నట్టు తోచింది. నాగార్జునిబోధనల ప్రభావం బలంగాఉన్నది. దీపాంకరుడు ఈ విహారానికిరావడం అది రెండోసారి. ఆరేడేళ్లక్రితం, నాలందా వెళ్ళేదారిలో రెండురోజులు అక్కడ బసచేసాడు. అప్పుడుకూడా మంచిఅభిప్రాయమే కలిగింది. అక్కడి శిల్పసంపద అతన్ని ముగ్ధుడ్ని చేసింది.  దీపాంకరుడి గురించి తెలుసుకున్న ప్రధానాచార్యుడు అతన్ని వర్షావాసం అక్కడేగడపమనీ, తనకుతోచిన విషయాలపై ప్రసంగించమనీ కోరాడు. దీపాంకరుడు అంగీకరించాడు.

రెండోరోజున, ఉదయపు ప్రార్థనలు పూర్తికాగానే ఆ విహారపు ప్రత్యేకత అయిన కాలచక్రస్థూపాన్ని దర్శించేందుకు దీపాంకరుడు బయలుదేరాడు. స్థూపంచుట్టూ ఉన్న సువిశాలమైన తోటపై సూర్యుని తొలికిరణాలు ప్రసరిస్తూండగా పక్షుల కిలకిలలతో మర్మోగుతున్నదా ప్రదేశం.

తథాగతుడే స్వయంగా సుచంద్రుడనే రాజుకీ, ఇతరులకూ ఈ ధరణికోటలోనే కాలచక్రతంత్రాన్ని బోధించాడని వజ్రయానంలో ఒక కథ ప్రచారంలో ఉన్నది. కొన్నివందల ఏళ్ల తరువాత శంభాల రాజవంశీకులు ఆ తంత్రపుసారాన్ని విమలప్రభ అనే రచన ద్వారా అందరికీ అర్థంఅయ్యేట్టుగా వివరించారని అంటారు. యుగాంతంలో బౌద్దులకూ, మ్లేచ్చులకూ ఘోరమైనయుద్ధం జరుగుతుందనీ, బౌద్ధులదే అంతిమవిజయం అవుతుందని కాలచక్రతంత్రంలో ఉందని దీపాంకరుడు నాలందాలోఉండగా వజ్రయాన తరగతుల్లో  తెలుసుకున్నాడు. థేరవాది కావటంమూలాన అప్పట్లో వజ్రయానంలో ఏమంత ఆసక్తి ప్రదర్శించకపోయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మయుద్ధాలు, అంతిమ విజయాలు ఇటువంటి అంశాలపట్ల అతనిలో మొదటిసారిగా కుతూహలం కలుగుతున్నది. కాలచక్రతంత్రం సూచించే అంతిమవిజయం బౌద్ధమనుగడకు ఆఖరిఆధారం కావచ్చునేమోనని ఎక్కడో ఒక చిన్న ఆశ.

చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాక కాలచక్రస్థూపానికి మరోసారి నమస్కరించి బయలుదేరబోతూంటే వెనకనుంచి ఎవరో, “నీకోసమే ఎదురుచూస్తున్నాను, దీపాంకరా” అన్నారు. చూడబోతే చిరునవ్వులు చిందిస్తూ ప్రజ్ఞామిత్రుడనే వజ్రవాద ఆచార్యుడు. వయసు ఏభైపైనే ఉండొచ్చు. అయినా యవ్వనకాలపు చురుకుచూపు, పెంకితనపు నవ్వు.  క్రిందటిసారి అతన్ని చూశాడుగాని పెద్దగా పరిచయంలేదు.

‘ఈయన నాకోసం ఎదురుచూడడం ఏమిటి?’ అనుకుంటూ అభివాదం చేశాడు. ప్రజ్ఞామిత్రుడు అతని ఆలోచనలను గ్రహించినట్టుగా –

“థేరవాదులు కొట్టిపారేస్తారుగానీ, నిరంతరధ్యానం సృష్టించే ప్రగాఢ నిశ్శబ్దంలోంచి రహస్యసంకేతాలు వెలువడుతూనే ఉంటాయి – జాగ్రత్తగా వింటే” అన్నాడు.

దీపాంకరుడు మౌనం వహించాడు. ఇద్దరూ విహారంవైపు నడుస్తున్నారు. మొదట ప్రజ్ఞామిత్రుడే మాట్లాడాడు –

“అజ్ఞానంనుండి జ్ఞానంవైపు ఎంతదూరం  ప్రయాణించినాకూడా తెలుసుకున్నది పరిమితమైనదీ, తెలియనిది అపరిమితమైనదీ, అనంతమైనదీ అని మొదట అంగీకరించాలి”

“నిజమే, ఆచార్యా! మనల్ని నడిపించేది పరిమితమైన వర్తమాన జ్ఞానమే కావచ్చు; కాని అజ్ఞానం మాత్రం కారాదు”.

ప్రజ్ఞామిత్రుడు కొంటెగా నవ్వి, “జ్ఞానం, అజ్ఞానం వీటి మధ్య అందరికీ వర్తించే లక్ష్మణరేఖ ఏదీ ఉండదు. ఎక్కడ జ్ఞానం అంతమవుతుందో, ఎక్కడ అజ్ఞానం మొదలవుతుందో నిర్ణయించడం కష్టం. ఒకవేళ నిర్ణయించినా అది తాత్కాలికమే. ఆ సరిహద్దు స్థిరంగా ఉండదు. కదులుతూ ఉంటుంది. అయినా మాటలకు అందేది పాక్షిక సత్యమే”.

“ఆచార్యా! మీరేమి చెప్పదల్చుకుంటున్నారో అర్థంకావటం లేదు”.

“ఏమీలేదు. వజ్రయానతరగతులు నడుస్తున్నాయి. వారంరోజుల పాటు నువ్వుకూడా వచ్చి మా శిష్యులతోబాటు కూర్చొనివింటే సంతోషిస్తాను. చివరిలో అభ్యాసం కూడా ఉంటుంది”.

“అభ్యాసం అంటే?”

“నువ్వే చూస్తావు”

“తప్పకవస్తాను. కాలచక్రతంత్రంపై మీతో చర్చించవలసిన విషయాలుకూడా కొన్ని ఉన్నాయి”.

ఆ వారం రోజుల్లో వజ్రయానంగురించీ, కాలచక్రతంత్రంగురించీ దీపాంకరుడు చాలా తెలుసుకున్నాడుగాని ఈ మ్లేచ్చులు ఎవరు? వాళ్ళతో యుద్ధం ఎప్పుడు జరగబోతోంది? బౌద్ధులకెవరు నాయకత్వం వహిస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరకలేదుగాని చివరిరోజున ప్రజ్ఞామిత్రుడు నిర్వహించిన ఆచరణాత్మక అభ్యాసంలో అతడికి ఊహించని కనువిప్పు కలిగింది. తన అనుభవాన్ని ఈ విధంగా వ్రాసుకున్నాడు:

ఉదయపు ప్రార్థనలు పూర్తికాగానే ప్రజ్ఞామిత్రుడు నన్నుతన గదిలోకి తీసుకుపోయాడు. మా వెంట అతని శిష్యుడొకడున్నాడు. ముగ్గురం ముఖాలకు ఇత్తడి తొడుగులు ధరించాం. ఎందుకని అడిగితే – మన ప్రస్తుత రూపాలనుండి వేరుపడి దూరంగా ప్రయాణించడానికి అన్నాడు. శిష్యుడు ఊదొత్తులు వెలిగించాడు ఒకే ఒక్క ప్రమిదను వెలిగించి, తెరలుమూసి చీకటిచేశాడు. ప్రజ్ఞామిత్రుడు నన్ను తనతోబాటుగా ధ్యానంచెయ్యమని అడిగాడు. ఇద్దరం చాలాసేపు ధ్యానంచేసాం. నాకలవాటేగనుక ఏ విధమైన ఇబ్బందీ కలుగలేదు. తనతోబాటుగా ఊపిరితీసుకొని వదలమన్నాడు. అలాగేచేశాను. ఇరువురి సన్నటి ఊపిరిశబ్దం మినహా అంతటా నిశ్శబ్దం. పిదప నన్ను శవాసనంలో పడుకోమన్నాడు. దీర్ఘనిద్రలోకి వెళ్ళమనిసూచించాడు. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. తెలివివచ్చేటప్పటికి మధ్యాహ్నమయింది. ప్రజ్ఞామిత్రుడి శిష్యుడు వ్రాసిపెట్టుకున్న వివరాలను బట్టి క్రింది సంభాషణ జరిగినట్టుగా తెలిసింది:

ప్రజ్ఞామిత్రుడు: నీవు విహారంలో కొత్తగా ప్రవేశించిన రోజుల్ని గుర్తుచేసుకో. ఆరోజులు నీకు బాగా గుర్తొస్తున్నాయి. ఇప్పుడేం కనిపిస్తోంది?

దీపాంకరుడు: అప్పుడునేనొక చిన్నపిల్లవాడిని. పదేళ్ళుంటాయేమో. ఒక భిక్షువు నా చెయ్యపట్టుకొని నడిపిస్తున్నారు. ఉత్సాహంగా వెళ్తున్నాను. ఒక చెట్టుకింద కూర్చోబెట్టి గుండుగీసారు. భయంవేసింది. కాషాయిబట్టలిచ్చి కట్టుకోమన్నారు. ఏడుపొస్తోంది. మా ఇంటికి, అమ్మ వద్దకు వెళ్ళిపోతానన్నాను”.

ప్ర: మీ అమ్మ అక్కడలేదా?

దీ: అక్కడే ఉంది. ‘ఇది నీ బడి. ఇక్కడుంటే నీకు చదువుచెబుతారు. ఈయన నీకు గురువులు; వారు చెప్పినట్టుగా చెయ్యి. నీకు బాగా చదువొస్తుంది. గొప్పవాడివి అవుతావు’ అని అంటోంది ఆమె నాతో.

ప్ర: తరవాత ఏమైంది?

దీ: గురువుగారు మా అమ్మని వెళ్ళిపొమ్మని అంటున్నారు. మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేనూ ఏడుస్తున్నాను. గురువుగారు ఓదారుస్తున్నారు.

ప్ర: మీ నాయిన లేడా?

దీ: ఏమో, తెలీదు. కనబడడం లేదు.

ప్ర: ఇంకా వెనక్కి, ఇంకా చిన్నతనంలోకి వెళ్తున్నావు. ఇప్పుడేమి చూస్తున్నావు?

దీ: మా నాయినను అరుగుమీద పడుకోబెట్టారు. అమ్మ ఏడుస్తున్నది. ‘మాకు దారిచూపించి వెళ్ళిపో’ అంటున్నది. ఇంకా ఎవరో చాలామందే ఉన్నారు.

ప్ర: మీ నాయిన ఏమంటున్నాడు?

దీ: ఏమీ మాట్లాడడం లేదు.

ప్ర: మీ నాయన ఏమిచేస్తుంటాడు?

దీ: రాచకొలువులో నియోగిగా (కరణీకం) చేస్తూంటాడు.

ప్ర: ఏ ఊళ్ళో?

దీ: తెలియదు.

ప్ర: మీ ఊళ్ళో ఏముంది?

దీ:  మా ఊళ్ళో నృసింహస్వామి ఆలయం ఉంది. ఊరవతల నది ఉంది. తెల్లవారుఝామున మా నాయినతో వెళ్లి నదిలో స్నానంచేస్తున్నాను. అబ్బో చలి! నీళ్ళు చల్లగా ఉన్నాయి. కార్తీకమాసం. మా నాయిన మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నడవలేనంటే నన్ను భుజంమీదఎక్కించుకొని ఇంటికొచ్చాడు. మాఅమ్మ మాకోసం చక్కెరపొంగలి చేసింది.

ప్ర: ఆ నది పేరేమి?

దీ: బాహుదా నది.

ప్ర: కళింగరాజ్యంలో ఉన్నది. అదేనా?

దీ: ఏమో, తెలియదు.

ప్ర: ఇంకా వెనక్కి, ఇంకా చిన్నతనంలోకి వెళ్ళు. ఇప్పుడేమి చూస్తున్నావు?

దీ: ఏమీ కనబడటంలేదు. చీకటి. అయినా ఎంతో వెచ్చగా, ప్రశాంతంగా ఉన్నది. ఆనందంగా ఉన్నది.

ప్ర: నీ తల్లి గర్భంలో ఉన్నావు. అవునా?

దీ: ఏమో, తెలియదు.

ప్ర: గాఢనిద్రనుండి బయటకు వస్తున్నావు. మళ్ళీ ఇప్పటికాలంలోకి వస్తున్నావు. కళ్ళు తెరిచిచూడు.

ఈ అనుభవంతో దీపాంకరుడు చలించిపోయాడు. అతనికి లీలగా గుర్తున్నవిషయాలూ, పూర్తిగా మర్చిపోయిన విషయాలూ అనేకం జ్ఞాపకానికిరాసాగాయి. ఈ ప్రయోగాన్ని ఇంకా పొడిగిస్తే దీపాంకరుడు తన గతజన్మల గురించి తెలుసుకోవచ్చన్నాడు ప్రజ్ఞామిత్రుడు. ఈ విషయమై దీర్ఘంగా ఆలోచించాక దీపాంకరుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

“మళ్ళీ ఎప్పుడు కూర్చుందాం?” అని ప్రజ్ఞామిత్రుడు అడిగినప్పుడు,

“ఈ జన్మ యిచ్చిన విషాదాన్ని భరించడమే కష్టంగా ఉన్నది. గతజన్మల విషాదాన్నికూడా తవ్వుకోవాలనుకోవడం నాకు అర్థరహితంగా కనబడుతున్నది – జన్మరాహిత్యంవైపుగా ప్రయాణించాలని బయల్దేరినవాడిని” అన్నాడు.

అక్కడితో ఆ చర్చ ముగిసింది. వారంరోజుల తరువాత ప్రజ్ఞామిత్రుడు కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకొని వజ్రయానాన్ని అధ్యయనం చెయ్యడానికని తిబెత్తుదేశానికి బయలుదేరాడు. మరో రెండువారాల తరువాత దీపాంకరుడు పంపావిహారానికి ప్రయాణంకట్టాడు.

***

దీపాంకరుడు పంపావిహారం చేరేనాటికి శిశిరం వెళ్ళిపోయి వసంతఋతువు ప్రవేశిస్తున్నది.  కొండల్లో  పచ్చదనం, చల్లదనం ఇంకా మిగిలిఉన్నవి. అల్లంతదూరాన పచ్చని విహారపు కొండలు కనబడగానే దీపాంకరుడి ఉత్సాహం రెట్టింపయింది. అడుగులు వడివడిగా పడుతున్నాయి. చెమటలుకక్కుతూ విహారప్రాంగణం చేరుకున్న దీపాంకరుడికి నిరాశే ఎదురైంది. అక్కడ మనుష్యసంచారం లేదు. పరిసరాలను పరికిస్తే అక్కడ చాలాకాలంగా ఎవరూ అడుగుపెట్టిన సూచనలు లేవు. ఎటుచూసినా దుమ్మూ, ధూళీ, ఎండుటాకులు, పిచ్చిమొక్కలు. దీపాంకరుడికి విపరీతమైన దాహం వేస్తున్నది. మెట్లమీద ఉండే మంచినీళ్ళ కుండలు అడవిజంతువులేవో వాటిని పడదోసినట్టు ముక్కలై ఉన్నాయి. కోయిలల పిలుపులతో లోయంతా మార్మోగిపోతోంది. వేడిగాలి మోసుకొస్తూన్న మామిడిపూత వాసన గుప్పుమంటోంది. విహారపు గుహలోపలికి నడిచాడు. నిర్మానుష్యంగా ఉన్నది. ‘అక్కడసలు మనుషులు ఉండేవారా ఎప్పుడైనా?’ అని సందేహం కలిగేట్టుగా ఉంది. అతడిరాకతో మేల్కొన్న గబ్బిలం ఒకటి కీచుమని అరుస్తూ అతని తలమీదుగా బయటకు ఎగిరిపోయింది. కాసేపు తను చూస్తున్నది పీడకలా నిజమా అని దీపాంకరుడికి అనుమానం కలిగింది. ప్రాంగణంలోకి వచ్చి మర్రిచెట్టుకింద కూర్చున్నాడు. అప్పటికే సన్నబడిన పంపానదిలో ఎప్పటిలానే చాకళ్ళు బట్టులుతుకుతున్నారు. బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. కోయిలల సందడి దీపాంకరుడి చెవులకు అసందర్భంగా వినిపిస్తున్నది.

ఎంతసేపలా కూర్చుండిపోయాడో అతనికే తెలియదు. మధ్యాహ్నమైంది; భిక్షాటనకు వెళ్ళాల్సిన సమయం మించిపోయింది. దాహానికి ఆకలి తోడైంది. గుడిగంట వినబడింది. ఆదిక్కుగా చూశాడు. శివుడి కోవెలగా మారిన విహారపు గుహనుండి. ఇదివరకెన్నడూ అక్కడ్నించి గుడిగంటలు వినరాలేదు. చూడబోతే జనసంచారం ఉన్నట్టుగానే అనిపించింది. లోయలోకి దిగాడు. ఒక వేపచెట్టువద్ద గ్రామదేవత గుడిముందు అలంకరించిఉన్న మేకలను బలివ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డప్పులు మోగుతున్నాయి. అక్కడ మూగిన మనుషుల్నిదాటి ముందుకి నడిచాడు; కొండపైకి ఎక్కి శివకోవెలగా మారిన విహారపుగుహని చేరుకున్నాడు. అక్కడంతా భక్తులతో సందడిగా ఉంది; ఇదివరకులేని బ్రాహ్మణపూజారి కనిపించాడు. శివలింగరూపమెత్తిన అసంపూర్ణ స్తూపానికెదురుగా కొత్తగా వచ్చిచేరిన రాతిమంటపంలో నందివిగ్రహం. పూజారినడిగితే గ్రామపెద్దకు ఈశ్వరుడు కలలోకనిపించి నందీశ్వరుడిని ప్రతిష్టించమని కోరాడని చెప్పాడు. పూజారినడిగి మంచినీళ్ళు తాగాడు. ప్రసాదంఇస్తే తన బిక్షాపాత్రలో వెయ్యమన్నాడు. పక్కకు వెళ్లి ఒక రాతిమీద కూర్చొని ప్రసాదం తిన్నాక పూజారిని అడిగాడు –

“పక్కనున్న కొండపైన విహారంలో ఉండే భిక్షువులు ఏమయ్యారో తెలుసా?”

పూజారి నోరువిప్పేలోగా పక్కనున్న భక్తుడు సమాధానం చెప్పాడు, “గుండు సాధువులేనా? వాళ్ళ పెద్దగురువు పోయి ఏడాదిపైనే అవుతుంది. ఆయనపోయాక వాళ్ళెవరూ ఇటు రావడంలేదు”.

“అంటే భద్రపాలుడుగారు పోయారా?”

“పేరు తెలియదు స్వామీ. పసరువైద్యం చేస్తూండేవారు కదా – పెద్దాయన. ఆయన పోయాడు”

దీపాంకరుడు ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయాడు.

“మొన్నటి వర్షాకాలంలో ఎవరైనా ఇటు వచ్చారా?”

“అబ్బే, ఎవరూ రాలేదు, స్వామీ”

భిక్షాటనకు మాత్రం ఊళ్లోకి వెళ్ళివస్తూ విహారంలో ఒంటరిగా వారంరోజులు గడిపాక దీపాంకరుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడిక చెయ్యగలిగేదేమీ లేదు. గ్రంధాలకు ప్రతులు వ్రాసిపెట్టడంలోనూ, అవకాశంఉన్న మేరకు యువభిక్షువులకు బోధనలు చెయ్యడంలోనూ గడిపితేనే శేషజీవితం సార్థకమవుతుంది. ఇందుకుగాను ధాన్యకటక విహారానికి మరలిపోవడమే  ఉత్తమం అనిపించిది. ఏ కష్టాలూ, ఇబ్బందులూ ఇకపై అతన్నితాకబోవనీ,  అతని లక్ష్యాన్ని ఛేదించలేవనీ అతనికి స్పష్టమైపోయింది.

దీపాంకరుడు ధాన్యకటక విహారం చేరుకున్నప్పుడు ప్రధానాధ్యాపకుడు అతనికి ఎంతో ఆదరంగా స్వాగతంపలికాడు. దీపాకరుడు తలపెట్టిన మహాత్కార్యాలకు విహారం తప్పకుండా సహకరిస్తుందని అభయమిచ్చి కలకాలం గుర్తుండిపోయే ఒక మాటన్నాడు:

“బౌద్ధానికి కాలంచెల్లిపోయిందని కొంతమంది ప్రచారంచేస్తున్నారు. ఇప్పటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నమాట వాస్తవమే. మానవజీవితం దుఃఖభరితంగా ఉన్నంత కాలం, అజ్ఞానంఅనే అంధకారం చుట్టూతా ఆవహించినంత కాలం, చావనే అంతుతెలియని అగాధం మనుషులకెదురుగా నిలిచిఉన్నంత కాలం, బౌద్ధం ఒక ఉత్తమ మోక్షసాధనంగా ఉంటూనేఉంటుంది; సత్యం, కరుణ, మైత్రి – వీటివైపు మనుషుల్ని నడిపిస్తూనే ఉంటుంది”.

దీపాంకరుడు మరో ఇరవైఏళ్లపాటు తనవంతు కృషిచేసి, ధాన్యకటకవిహారంలోనే తనువుచాలించాడు. అతడు కోరుకున్నట్లుగానే అతని చితాభస్మాన్ని కళింగదేశ సరిహద్దుల్లోని బాహుదానదిలో కలిపారు. ఆ మారుమూల ప్రాంతంలో, చిన్న వాగులాంటి నదిని ఆచార్యులవారు ఎందుకు ఎన్నుకున్నారో శిష్యులకు తెలియలేదు. అయినప్పటికీ దీపాంకరునిపై ఉన్న గౌరవంతో అతని ఆఖరి కోరికని నెరవేర్చారు.

oOo

ఉణుదుర్తి సుధాకర్

తూరుపు గాలులు ( పెద్ద కథ – రెండో భాగం )

2

వంశధారనది ఒడ్డునేఉన్న శాలివాటిక (శాలిగుండం, శాలిహుండం) విహారంలో బసచేసి కళింగపట్నంనుండి సింహళద్వీపానికి వెళ్ళే ఓడల నిమిత్తమై భోగట్టాచెయ్యగా, కొద్దిరోజుల క్రితమే వాడబలిజీలఓడ ఒకటి సింహళదేశపు తూర్పుతీరానికి పయనమైపోయిందనీ, అయితే ఓ పారశీక ఓడ, నబోపాడా (నౌపాడా) ఉప్పుగల్లీలలో పండిన ఉప్పుని నింపుకొంటున్నదనీ, మరోరెండువారాల్లో త్రికోణమలై (ట్రింకోమలీ)కి బయిల్దేరబోతున్నదనీ తెలియవచ్చింది. ఆ తరువాత మళ్ళీ ఇప్పట్లో సింహళదేశంవెళ్ళే ఓడలేవీ లేవన్నారు. ప్రయాణానికయ్యే కేవు తాము చెల్లిస్తామని స్థానికవర్తకులు ముందుకొచ్చారు. పారశీక నఖోడా (ప్రధాన వర్తకుడు, ఓడ యజమాని) కేవు తీసుకోకుండా ముగ్గురుభిక్షువుల్నీ త్రికోణమలైవరకూ తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. లంగరెత్తి, పైకి మడిచికట్టిఉన్న తెరచాపల్నిదింపి గాలివాటానికి అనుకూలంగా తిప్పగానే అవి పూర్తిగా విచ్చుకున్నాయి. ఓడ నైరుతిదిశగా రివ్వున ప్రయాణించసాగింది. తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి.

ఆచార్యశాంతిదేవునికీ అతనిశిష్యుడు గుణసేనుడికీ సముద్రప్రయాణం చేసిన అనుభవం ఉన్నదిగాని, దీపాంకరుడికది పూర్తిగాకొత్త. మొదటిరెండురోజులూ నౌకఊగిసలాటతో అతడు చాలాఇబ్బందిపడ్డాడు. తిన్నా, తినకపోయినా వాంతులయ్యాయి. నీరసంగా పడుకున్నాడు. రెండురోజులూ రెండుయుగాల్లా గడిచాయి. ‘భగవంతుడా, ఇంకా ఎన్నాళ్ళిలా?’ అనుకున్నాడు. మధ్యమధ్యలో  నఖోడావచ్చి భిక్షువుల యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నాడు. అరబ్బుసరంగు అబూ సయ్యద్ నిమ్మకాయి ముక్కలు తెచ్చిచ్చాడు. వాటిని చప్పరిస్తే వాంతులు కట్టేస్తాయన్నాడు.

“పైకివచ్చి చూడు, సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో” అన్నాడు సరంగు – సంభాషణ అంతా సైగలతోనే.

మూడోరోజున ధైర్యంచేసి తమకిచ్చిన చీకటిగది నుంచి బయటకువచ్చి సముద్రాన్ని పరికించాడు. అరబ్బు, పారశీక నావికులు అతన్నిచూసి నవ్వుతూ పలకరించారు. పల్చని నీలాకాశపు పైకప్పుకింద కనుచూపుమేర అన్నివైపులా గాఢనీలిరంగులో పరుచుకున్న  సముద్రం; అక్కడక్కడా తెల్లటినురగలుకక్కుతూ చిరుకెరటాలు.  ఉప్పుగాలి దీపాంకరుడి మొహాన్ని మెత్తగా తాకుతూంటే అతనికొక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. తన జీవితంలో ఒక నూతనాధ్యాయం తెరుచుకోబోతున్నదనే భావన అతనిలో బలంగామెదిలింది. మొదటిసారిగా పరిసరాలను ఆసక్తిగా గమనించసాగాడు. సముద్రతలాన్ని చీలుస్తూ ఓడ ముందుకుసాగుతూంటే గలగలమంటూ పక్కగాతాకే కెరటాల సవ్వడి, గాలివేగంలో, దిశలో మార్పులువచ్చినప్పుడల్లా తెరచాపలు కాసేపు కొట్టుకొని మళ్ళీ పూర్తిగా తెరుచుకునేటప్పుడు చేసే ‘ఫట్, ఫట్’ మనే శబ్దం,  ఓడ నెమ్మదిగా ఊగుతూంటే తడిసిన కొయ్యపలకలు, తెరచాపస్తంభాలు, కప్పీలూ, మోకులూ కలిసికట్టుగా ‘కీ…..కట…కట…కట…..కీ…..’మంటూ రాత్రనక, పగలనక నిరంతరంగా చేసే మూలుగుధ్వనులు, నావికులకు సరంగు అబూ సయ్యద్ చేసే హెచ్చరింపులు, నఖోడా, మౌలీంల ఆదేశాలు, నావికుల జవాబులు, తెరచాపల్ని గాలివాటాన్నిబట్టితిప్పి, తిరిగికడుతున్నప్పుడల్లా  “అరియా ……అబీస్……..వదార్”  – ఇవన్నీ నేపధ్యంలో వినిపిస్తున్నాయి.

ఇంతలో చుక్కానిపట్టుకున్న నావికులు కేక పెట్టారు, “కిర్రష్!, కిర్రష్!! (సొరచేపలు! సొరచేపలు!!)”

దీపాంకరుడు అటుగా చూశాడు. ఉదయపుటెండలో వెండిమెరుపుల్లా గిరికీలుకొడుతూవచ్చి ఓడను చుట్టుముట్టిన సొరచేపల గుంపు.  అంతవరకూ తెరచాపలు బాగుచేసుకుంటూ, తాళ్ళుపేనుతూ, వంటవాడికి సాయంచేస్తూ తమతమ పనుల్లోఉన్న ఓడకళాసులందరూ హడావిడిగా లేచివచ్చి గుమిగూడారు. వాళ్ళఅరుపులతో, కేకలతో వాతావరణం ఉద్రిక్తమైంది.  ఒక యువకళాసీ తెరచాపకి అడుగుభాగానఉండే రాటమీదెక్కి దానిఅంచువరకూ నడుచుకుంటూ వెళ్ళాడు. మిగతావాళ్ళు కేరింతలతో, హర్షధ్వానాలతో అతన్ని ప్రోత్సహిస్తున్నారు. ముదుసలి సరంగు అబూ సయ్యద్ మాత్రం కొన్నిదశాబ్దాలుగా ఉప్పుగాలితాకి నెరిసిన గెడ్డంతో, ముడుతలుపడ్డ తన మొహంలో ఏ భావనాలేకుండా, కుళ్లాయి (ముసల్మానులు ధరించే చిన్న అల్లికటోపీ)ని తీసి గుండునిమురుకుంటూ గమనిస్తున్నాడు; అతడిలాంటివి చాలా చూశాడు. తెరచాప అంచుకిచేరి తాడు పట్టుకొని రాటమీద నిల్చున్న ఆ యువకుడికి ఎవరో ఒక ఈటెను అందించారు. ఆ ఈటెకు ఒకతాడు వదులుగా కట్టిఉన్నది. నౌక ఊగుతున్నది. ఆ సాహసి కాలుజారిపడ్డాడంటే తిన్నగావెళ్లి సొరచేపల మధ్యలో పడతాడు. అతడు గురిచూసి విసిరిన ఈటె నేరుగా ఒక సొరచేప పొట్టను ఛేదించింది. నీళ్ళలో రక్తం చిమ్మింది. సొరచేప కొట్టుకుంటూ ఉంటే నురగ. నావికుల ఉత్సాహం, కేరింతలు. కొంతమంది చివరన వలకట్టిఉన్న పొడుగాటికర్రని తీసుకొచ్చి నీటిమట్టానికి చేరువగా నిలిపారు. యువకుడు ఈటెను పైకి లాగి ఒక్క ఊపుతో సొరచేపను నావలోనికి విసిరాడు. వల అవసరంలేకపోయింది. చెక్కబల్లలపైనపడ్డ చేపబలంగా కొట్టుకోసాగింది. నావికులు ఉడుపుగా దాని తోకనుపట్టుకొని, తలను కాళ్ళతో తొక్కిపట్టి కట్టడిచేశారు. అలాగే మరో రెండు చేపల్ని పట్టుకున్నారు. నాలుగవది ఈటెదెబ్బ తినికూడా తప్పించుకొని పారిపోయింది. సొరచేపలగుంపు వచ్చినంత అకస్మాత్తుగానే మాయమైంది. ఆరోజు దొరికిన చేపల్నికోసి, పులుసు వొండే కార్యక్రమంలో నిమగ్నమైనారు – వంటవాడూ, అతని సహాయకులూ.

ఆరోజున సాయింత్రం కూడా దీపాంకరుడు పైకి వచ్చి పడమటిదిక్కున సూర్యాస్తమయం సృష్టించిన అద్భుత దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోయాడు. అటుగా వెళ్తూన్న మౌలీం (ప్రధాన నావికాధికారి, కప్తాను) దీపాంకరుడిని చిరునవ్వుతో పలకరించాడు. అతడు చాలాసార్లు కళింగపట్నం, మచిలీపట్నం వెళ్లి ఉన్నాడు; తెలుగు కొద్దిగావచ్చు.

“నీటి రంగు మారింది, చూశారా?” అన్నాడు.

నిజమే, దీపాంకరుడు గమనించనే లేదు. “ఎందుచేత?” అనడిగాడు. మౌలీం చాలా కష్టపడి ఒక పక్క సౌంజ్ఞలు చేస్తూ వచ్చీరాని తెలుగులో చెప్పిన బదులుకి సారాంశం: “నరసాపురం, అంతర్వేది దాటుతున్నాం; గోదావరి సముద్రంలో కలిసే చోటు. పెద్దనదులు సముద్రంలోకలిసేచోట్ల నీటిరంగు కొంచెం బురదగాఉన్నట్టు కనిపిస్తుంది – ఆ నదులు మోసుకొచ్చే ఒండ్రుమట్టి మూలంగా”.

“అంటే మనం తీరానికి బాగా దగ్గరలోనే ఉన్నామా?”.

“అవును”.

“అయినా ఎటుచూసినా సముద్రం; ఎక్కడున్నామో మీకెలా తెలుస్తుంది?”.

“తీరానికి దగ్గరలోఉన్నప్పుడు తరచూ కొండలూ, గుట్టలూ, చెట్లూ, చేమలూ  కానవస్తాయి. ఈ ప్రాంతంలోలేవుగాని, కళింగపట్నం నుండి కోరంగివరకూ కొండలు కనిపిస్తూనే ఉన్నాయి; మీరప్పుడు పైకిరానేలేదు. ఒక్కోచోట స్తూపాలూ, గుళ్ళూ, గోపురాలూ ఉంటాయి. నీటిరంగునుబట్టి, నీటిలోకొట్టుకొచ్చే చెట్లకొమ్మల్నిచూసి, పక్షుల్ని, అవిఎగిరే దిశల్ని గమనించి, గాలివాటంలో వచ్చేమార్పుల్నిబట్టి, ప్రవాహాలను పరిశీలించి, దొరికేచేపల్నిబట్టి, లోతుని కొలిచికూడా తీరానికి ఎంతదూరంలోఉన్నామో అంచనావెయ్యవచ్చు. ఇంకాచాలా సూచనలుంటాయి”.

దీపాంకరుడిలో కుతూహలం పెరిగింది. “తీరానికి బాగాదూరంగా, నడిసముద్రంలో ఉంటేనో?”.

“నావికుడి నైపుణ్యానికి అత్యున్నతమైన పరీక్ష అదే. ముఖ్యంగా రాత్రిపూట. అలాంటప్పుడు నక్షత్రాలను చూసి తెలుసుకుంటాం. మేఘాలుకమ్ముకుంటే అది సాధ్యంకాదు. మీకు అర్థంఅయ్యేలాచెప్పాలంటే చాలారోజులు పడుతుంది. సాయింత్రపు నమాజ్ కాగానే సొరచేప పులుసుతో భోజనం చెయ్యడానికి వంటవాళ్లు రమ్మంటున్నారు. మీరూ పదండి”. అన్నాడు మౌలీం నవ్వుతూ.

“సూర్యాస్తమయం తరవాత మేము ఏమీ తినం. అయినా నేను శాకాహారిని. మన్నించండి”.

మౌలీం చుక్కానివైపుగా వెళ్ళిపోయాడు. పడమటివైపున సూర్యుడు అస్తమించాకకూడా నారింజకాంతులు మేఘాలను ముద్దాడుతున్నాయి. తూర్పువైపున చీకట్లు ముసురుకుంటున్నాయి; తొలిచుక్కలు మిణుక్కుమంటున్నవి. మౌలీం ఆదేశంమేరకు సరంగు అబూ సయ్యద్ చుక్కానివద్దనున్న గంటనుమోగించి మక్కా వైపుగా చెయ్యెత్తి చూపించాడు. నావికులందరూ అటువైపుగా తిరిగి, చాపలుపరుచుకొని ప్రార్థనకుపక్రమించారు. కొద్దినిముషాల్లో నమాజ్ పఠనం పూర్తయింది. “అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్” అని బిగ్గరగాఅంటూ ప్రార్థనలు ముగించారు. నూనెదీపాలు వెలిగించి అవిర్లుకక్కుతూన్న వేడివేడి వరన్నంతో కమ్మటివాసనలను వెదజిమ్ముతూన్న సొరచేపలపులుసు తినేటందుకు కలిసికూర్చున్నారు. వాళ్ళ హాస్యాలూ, నవ్వులూ లీలగా వినిపిస్తున్నాయి.

దీపాంకరుడికి అంతవరకూతెలియని ఒక కొత్తప్రపంచానికి తెరతీసిన ఆ నావికులపట్ల అతనికుండిన గౌరవం పదింతలు పెరిగిపోయింది. ‘భిక్షువుని కాకపోయుంటేగనక నావికుడినై సముద్రాల్నిశోధించి ఉందును’ అనుకున్నాడు – తమకిచ్చిన కొట్టుగదికి వెళ్తూ. భోజనాలుకాగానే ఒకనావికుడు తంబూరావాయిస్తూ తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ ఒళ్లెరగని పారవశ్యంతో ఓ పారశీక విరహగీతాన్ని పాడసాగాడు. రోజంతాపడ్డ కష్టాన్నిమరచి మిగతావాళ్ళు ఉత్సాహంగా వంతపాడుతున్నారు. బాగా నానిపోయిన కొయ్యపలకలూ, తెరచాపస్తంభాలూ, కప్పీలూ, మోకులూ సమిష్టిగా నేపధ్యసంగీతాన్ని ఆలాపిస్తున్నవి – ‘కీ……కట…కట…కట…కీ……’. నావ సుతారంగా ఊగిసలాడుతూ, చీకటిసముద్రాన్ని చీలుస్తూ ముందుకి కదులుతోంది.

***

ముగ్గురుభిక్షువులూ తమకిచ్చిన చిన్నగదిలోనే తామువెంటతెచ్చుకున్న చిన్న బుద్ధవిగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. రోజుకి మూడుసార్లు ప్రార్థనల్లోనూ, మిగతా సమయం ధ్యానంలోనూ గడపసాగారు. ఆచార్యశాంతిదేవుడే ప్రార్థనలను జపించడంలో ముందున్నాడు. మంద్రస్థాయిలో అతడు ఉచ్ఛరించే ప్రార్థనలు మొదట్లో దీపాంకరుడికి బొత్తిగా అర్థంఅయ్యేవికావు. అతనికి తెలిసిన ప్రార్థనలకు భిన్నమైనవిగా వినిపించాయి. వారంరోజులపాటు వినగా, వాటిల్లో పాళీభాషాపదాలు ధ్వనిస్తున్నట్టుగా అతనికి తోచింది. అదేమాట శాంతిదేవునితో అంటే, అతడు నవ్వి,

“మొత్తం అంతా పాళీ భాషే, అయితే సింహళయాసతో మేళవించిన పాళీ” అన్నాడు – దీపాంకరుడిని ఆశ్చర్యపరుస్తూ.

“అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏదీలేదు. తథాగతుని బోధనలను, త్రిపిటికానియామాలనూ వాటి మూల రూపాన్ని, సారాన్ని కాపాడుకుంటూ, ఎటువంటి మార్పులూచేర్పులూ చెయ్యకుండా అత్యంతస్వచ్ఛమైన ప్రామాణికతను కాపాడుకుంటూ వస్తూన్నది సింహళ థేరవాదమే. ఈ విషయంలో సింహళభిక్షువులు, పౌరులూ కూడా ఎంతో గర్వపడుతూంటారు; కొద్ది రోజుల్లో నువ్వే చూస్తావు”.

దీపాంకరుడు పూర్తిగాకోలుకున్నాడని గమనించిన శాంతిదేవుడు, తమ దేశంలోని సమకాలీన పరిస్థితులగురించి, బౌద్ధసంప్రదాయాలగురించి కొన్నివివరాలు అతనికి తెలియజేయ్యాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు.

“పద, ఈ చీకట్లోంచి పైకిపోదాం, మంచిగాలీ, వెలుతురూ ఉంటాయి” అన్నాడు.

శాంతిదేవుని వెంట నడిచాడు దీపాంకరుడు.

“మౌర్యవంశాన్ని అంతంచేసి చక్రవర్తిగా ప్రకటించుకున్న  బ్రాహ్మణసేనాపతి పుష్యమిత్ర శుంగుడు అశ్వమేధయాగం చేసి మీదేశంలో బౌద్ధాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు అనేకవిధాలుగా ప్రయత్నించాడని మనగ్రంధాలు తెలుపుతున్నాయి. భిక్షువుల తలలునరికి తెచ్చినవాళ్ళకు బహుమతులు ప్రకటించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొదట పుష్యమిత్రశుంగుడు, ఆ తరవాత – వంగదేశానికి చెందిన మరో బ్రాహ్మణరాజైన శశాంకుడు బౌద్ధాన్ని అన్నివిధాలా తొక్కిపెట్టారు. పురాతన బోధివృక్షాన్ని నాశనం  చేశారు; మీదేశస్థులు దానికొమ్మల్ని మళ్ళీమళ్ళీ పాతుకుంటూ కాపాడుకున్నారు. అయితే మాదేశంలోమాత్రం అశోకుని సంతానమైన మహేంద్రుడు, సంఘమిత్రలు తీసుకొచ్చిపాతిన మహాబోధివృక్షపు అంటు మహావృక్షంగామారి ఇప్పటికీ అనురాధపురంలో సురక్షితంగా, సజీవంగా ఉన్నది. దాని మహిమలు అన్నీఇన్నీ కావు”.

ఈ విషయాలన్నీ దీపాంకరుడు విన్నవీ, చదివినవీ;  నాలందాలో ఉండగా బౌద్ధచరితాధ్యయనంలో భాగంగా తెలుసుకున్నవీ. అయనా శాంతిదేవుడు చెబుతూన్నతీరుకు ముగ్ధుడై, ‘ఇతడు మంచి అధ్యాపకుడు’ అని మనసులోఅనుకుంటూ వింటున్నాడు. ఎవరెంత ప్రయత్నించినా నాశనంకాకుండా నిలిచి, వేళ్ళూని, సదా విస్తరించే  బోధివృక్షం బౌద్ధానికి చిహ్నంగా, ప్రతీకగా ఎందుకు నిలిచిందో అతనికి మరోకోణంలో అర్థంఅయింది. ఆచార్య శాంతిదేవుడు చెప్పుకుంటూ పోతున్నాడు –

“….అందుచేత చెప్పొచ్చేదేమంటే ఏవిధంగా చూసినా బౌద్ధం తన మూలస్వరూపాన్ని సింహళదేశంలోనే నిలబెట్టుకుంది. అంతేకాదు సింహళంనుండీ, భారతఖండపు తూర్పుతీరంనుండీ జావా, సుమాత్రా దీవులకీ,  శ్యామదేశానికీ (సయాం, థాయ్ లాండ్), బాగాన్ రాజ్యానికీ (బర్మా, మియన్మార్) థేరవాద విస్తరణ జరిగింది – దాన్ని కొందరు హీనయానంఅని తప్పుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మేము ఆచరిస్తున్నదే అసలుసిసలైన బౌద్ధం. అందుకే ఆ బౌద్ధాన్నికాపాడడం తమకు ప్రసాదించబడిన పవిత్రమైన బాధ్యతఅని మాపాలకులు భావిస్తారు. అలాగే మా రాజులు తథాగతుని దంతాన్ని వెయ్యికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్నారు. అది ఎవరి ఆధీనంలోఉంటే వాళ్ళే సింహళదేశ పాలకులు అవుతారు. ఇది నమ్మకం మాత్రమేకాదు, వాస్తవం కూడా”.

“ఆచార్యా, నాలందానుపోలిన మహోన్నతజ్ఞానకేంద్రాన్ని స్థాపించాలని మీరెందుకంతగా తపిస్తున్నారో నాకిప్పుడు బాగా అర్థంఅవుతోంది. మీవిహారంలోని బోధనాకేంద్రంగురించి, అందులో నేనుచేపట్టాల్సిన బాధ్యతలగురించి చెప్పండి” అన్నాడు దీపాంకరుడు ఉత్సాహంగా.

“చెబుతాను. అయితే అంతకన్నా ముందుగా మరికొన్ని విషయాలు చెప్పాలి. సుమారు వందేళ్ళక్రితం సింహళదేశం మూడురాజ్యాలుగా ముక్కలైంది. ఏభైఏళ్ళపాటు అంతర్యుద్ధం చెలరేగింది. పొలోన్నరువపట్టణం ఒక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ రాజ్యపురాజు, పరాక్రమబాహుడనే సార్థకనామధేయుడైన చక్రవర్తి,  మళ్ళీ దేశాన్ని ఐక్యపరచి తన పాలనకిందికి తీసుకొచ్చాడు. చోళులకు శత్రువులైన పాండ్యరాజులపక్షాన నిలబడి బాగాన్ రాజ్యంపై తన నౌకలతో దాడిచేసి ఆరాజ్యాన్ని నియంత్రించాడు. ఎన్నో ప్రజాహితకార్యక్రమాలు చేపట్టాడు. ఇప్పుడు మేముండే ఉత్తరారామాన్ని అతడే స్థాపించాడు. అనురాధపురాన్ని పునరుద్ధరించాడు. తథాగతుని దంతాన్ని అనురాధపురం నుండి పొలోన్నరువకు తీసుకొచ్చి దానికొక గుడి కట్టించాడు. ముఖ్యంగా బౌద్ధం విషయానికివస్తే, ఎంతో దూరదృష్టితో ముక్కలైన బౌద్ధధర్మాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చాడు. బిక్షువులు పాటించవలసిన నియమాలను ప్రకటించాడు. దుర్మార్గులైన, అవినీతిపరులైన భిక్షువులను వెళ్ళగొట్టాడు, శిక్షించాడు”.

“భిక్షువుల్లో దుర్మార్గులూ, అవినీతిపరులూనా?” దీపాంకరుడి ఆశ్చర్యానికి అంతులేదు.

“భిక్షువులుకూడా మనుషులే. మనుషులన్నాక అన్నిరకాలవాళ్ళూ ఉంటారు. అందరిలాగే పరిస్థితులనుబట్టి నడుచుకుంటారు. ముఖ్యంగా రాజపోషణ, రాజ్యాధికారాలకు దగ్గరవుతున్నకొద్దీ ఆధిపత్యం కోసం జరిగే పెనుగులాటలో కలుగజేసుకొనే అవకాశాలు, అవసరాలు ఏర్పడతాయి. వాటికి సామాన్యప్రజల నిత్యజీవితాల్ని శాసించగల పరిస్థితులు తోడ్పడతాయి. సన్మార్గంనుండి దూరంకావడానికీ, అవినీతికి లొంగిపోవడానికీ ఆకర్షణలు కూడా ఎక్కువవుతాయి. ఇటీవలకాలంలో తగ్గుముఖం పట్టిందిగాని, పరాక్రమబాహుడు సంస్కరణలు అమలుచేసే నాటికి బౌద్ధసంఘం అస్తవ్యస్తంగా మారింది. స్త్రీలతో సాంగత్యంచేసి పిల్లల్నికన్న భిక్షువులూ, ఆచార్యులూ తయారయ్యారు. చాలామంది భిక్షువులు విసిగిపోయి సంఘాన్ని విడిచిపెట్టి సంసారులుగా మారిపోయారు. మీ దేశంలో బౌద్ధానికి ఈమధ్యకాలంలో అధికారపీఠానికి చేరువలో మెలిగే పరిస్థితులుగాని, జనబాహుళ్యంలో సంచరించే సందర్భాలుగాని  లేకపోయాయిగనుక మీకెవ్వరికీ ఈ దుర్గతి అనుభవంలోకి రాలేదు”.

శాంతిదేవుని మాటలు దీపాంకరుడికి కొత్తగా ఉన్నాయి. అర్థంఅవుతున్నట్టుగానే ఉన్నాయిగాని పూర్తిగా తెలియ రావడంలేదు. ఏమనాలో తోచలేదు. కాసేపుఆగి, “ప్రస్తుతం అధికారంలో ఉన్నది పరాక్రమబాహుడేనా?” అన్నాడు.

“కాదు. దురదృష్టవశాత్తూ ఆయన సుమారు ఇరవైఏళ్లక్రితం చనిపోయాడు. ఇప్పుడు తిరిగి కొంత అనిశ్చిత, సంక్షోభం ఏర్పడ్డాయి. దక్షిణభారతదేశాన్నిపాలించే  పాండ్యరాజుల దృష్టి మాదేశంపైన పడింది. పూర్వం చోళుల ఆక్రమణ నుండి బయటపడ్డాం; ఇప్పుడు పాండ్యులు దాడికి సిద్ధమౌతున్నారనే వదంతులు వింటూన్నాం. ఏదిఏమైనా, బౌద్ధాన్ని కాపాడే రాజులు బలంగా ఉండాలి; వారి రాజవంశాలు చిరకాలం కొనసాగాలి. వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మం వాళ్ళని రక్షించాలి. అందుచేత ఏదో ఒకమేరకు ఉన్నతస్థాయిలోని బౌద్ధనాయకత్వానికి రాజకీయ చదరంగంలో, ఎత్తుగడల్లో తలదూర్చడం తప్పనిసరి అవుతుంది”.

‘రాజవంశాల్నికాపాడడం?……బౌద్ధనాయకత్వం?…..రాజకీయ చదరంగం?….ఎత్తుగడలు?’ దీపాంకరుడి అంతా అయోమయంగా ఉంది. అతడు చదివిన బౌద్ధగ్రంధాలలో గాని, నాలందాలోచేసిన అధ్యయనంలోగాని ఈ విషయాలు ఎన్నడూ ప్రస్తావించబడలేదు. దీపాంకరుడి మొహంలో సందేహఛాయల్ని గమనించిన శాంతిదేవుడికి అవసరమైనదానికన్నా  ఎక్కువగా మాట్లాడానేమో అని అనుమానం కలిగింది. సర్దిచెప్పడానికి –

“అయితే ఈ విషయాలన్నీ మనబోంట్లకు ముఖ్యంకాదు; మనం పట్టించుకోనక్ఖరలేదు. వాటిని పట్టించుకొనే వాళ్ళు వేరేఉంటారు. మనదృష్టిని కేవలం అధ్యయనంమీదా, బోధనాకేంద్ర నిర్మాణంమీదా పెడితే సరిపోతుంది” అన్నాడు.

“అవిమాత్రం రాజుల సహకారం, నిధులులేకుండా సాధ్యం అవుతాయా?” అన్నాడు దీపాంకరుడు. అతనికి కాస్తంత బోధపడుతున్నది. చుట్టుపక్కలఉన్న వందగ్రామాల నుండేవచ్చే ఆదాయాన్ని నాలందాకు ధారాదత్తంచేస్తూ హర్షవర్ధనుడు శాసనం ప్రకటించాడని వినిఉన్నాడు. అదీగాక, రెండువందలగ్రామాల ప్రజలని భిక్షువులకు నిత్యం అవసరమయ్యే బియ్యం, పాలు ఇత్యాది సామగ్రిని ప్రతీరోజూ అందజేయమని కూడా హర్షుడు ఆదేశించాడని తెలుసు.

“సరిగ్గా అదే నీకూ, నాకూ సంబంధించిన అంశం; మనం పట్టించుకోవలసిన విషయం. మిగతావి మనకి అనవసరం” అన్నాడు శాంతిదేవుడు.

శాతిదేవుని శిష్యుడైన గుణసేనుడువచ్చి ప్రార్థనకు వేళయిందని సూచించాడు. ముగ్గురూ లోపలికి నడిచారు. దీపాంకరుడి మస్తిష్కంలో ఎన్నెన్నో సందేహాలు ముసురుకున్నాయి. ‘ఏదిఏమైనా ఇదంతా ఒక కొత్త అనుభవం; నేర్చుకోవలసిన విషయాలు చాలాఉన్నాయి’ అనుకుంటూ శాంతిదేవునివెంట తమ గదివైపు నడిచాడు. దారిలో ఎదురైన సరంగు అబూ సయ్యద్ వారికి సలాం చేశాడు.

***

ఉదయాన్నే త్రికోణమలై రేవుచేరిన ఓడ లంగరుదించింది. కళింగపట్నంనుండి మోసుకొచ్చిన ఉప్పుబస్తాల్ని చిన్నపడవల్లోకిదించే ఏర్పాట్లు నావికులు చెయ్యగానే ముగ్గురు భిక్షువులూ అందరివద్దా సెలవుతీసుకున్నారు. సరంగు అబూ సయ్యద్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడుగాని అర్థంకాలేదు. మౌలీం తన వచ్చీరాని తెలుగులోకి అనువదించగా అల్లా తమను సురక్షితంగా, క్షేమంగా ఉండేటట్టు కరుణించాలని కోరుకుంటున్నాడని బోధపడింది. ఓడ దిగుతూంటే నవ్వుతూ నావికులంతా చేతులూపుతున్నారు. అందరిలోనూ ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అదే మాట మౌలీంతో అంటే,

“అవును. ఈ రేవులోనే బియ్యం ఎక్కించుకొని బస్రా వెళ్తాం. దాంతో ఈ యాత్ర ముగుస్తుంది. నావికులంతా సెలవుమీద తమతమ దేశాలకు, ఇళ్ళకు వెళ్ళిపోతారు. అందుకనే ఈ ఉత్సాహం” అన్నాడు.

తీరానికి పయనంకట్టిన ఒక పడవనెక్కి భిక్షువులు ఒడ్డుచేరారు. రేవులోనూ, గోదాములవెంటా నడుస్తూంటే సింహళభాష దీపాంకరుని చెవినపడింది. అది కాస్తోకూస్తో తెలుగులా ధ్వనించింది. సింహళలిపిని కూడా చూడడం తటస్థించింది. అక్షరాలన్నీ గుండ్రంగా తెలుగులిపికి దగ్గరగా ఉన్నట్లు కనిపించాయిగాని ఏమీ చదవలేకపోయాడు. దీన్ని గమనించిన శాంతిదేవుడు తన వివరణ ఇచ్చాడు.

“సింహళలిపి కూడా తమిళం, కన్నడం, తెలుగు, మలయాళ లిపుల మాదిరిగా బ్రాహ్మీలిపి నుండి వచ్చినదే.  ఇంకా చెప్పాలంటే ప్రాచీన కన్నడ, తెలుగుభాషలు వినియోగించిన కదంబ అక్షరమాలే మా లిపికి మూలం. మాకు వంగ, కళింగదేశాలతోనూ, ముఖ్యంగా దక్షిణభారతదేశంతోనూ అనాదిగా సంబంధాలున్నాయని  మా ప్రాచీనగ్రంథాల్లో చెప్పబడింది. వ్యాపారసంబంధాలు, ఓడవర్తకమూ ఎప్పటినుండో నడుస్తున్నాయి. అంతెందుకు? హేమమాలిఅనే ఒక కళింగదేశపు యువరాణి తథాగతుని దంతాన్ని రహస్యంగా తనకేశాలలో దాచిపెట్టి ఆనాటి సింహళరాజుకు అందజేసింది. సింహళభాషపైన ద్రావిడభాషలప్రభావం మొదటినుండీ ఉంటూవస్తున్నది. అశోకునికాలంనుండి పాళీ, సంస్కృతభాషలుకూడా వచ్చిచేరాయి. మావిహారంలో ప్రధానబోధనాభాషలు అవే. తమిళులు ఎంతోకాలం మా దేశంలోని ముఖ్యప్రదేశాల్ని పాలించారుకూడా. కాకపోతే చోళరాజులతో యుద్ధాలుకూడా చేశాం. చోళులును ఓడించినప్పటినుండీ మారాజులు తమిళులను బానిసలుగా వినియోగిస్తున్నారు”.

“బానిసలా? పరాక్రమబాహుడు కూడానా?” దీపాంకరుడు సందేహం వెలిబుచ్చాడు.

“అవును. పరాక్రమబాహుడు కూడా. నిజానికి అతడు కట్టించిన ప్రజాహిత నిర్మాణాలన్నిట్లోనూ, ఉత్తరారామ నిర్మాణంతో సహా – తమిళుల బలవంతపు చాకిరీని విరివిగా వినియోగించాడు”.

“మరి బ్రహ్మజాలసూత్రం (పాళీలో బమ్మజాలసుత్త) లోని స్థూలశీల (పాళీలో చూలసీల) ప్రవచనంలో బౌద్ధులు బానిసల సేవలను వినియోగించరాదని తథాగతుడు స్పష్టంగా చెప్పిఉన్నాడే?”

“సాధారణ బౌద్దులకూ, సామాన్య ఉపాసకులకు అన్ని సూత్తాలను వర్తింపజేయడం సరికావచ్చుగాని రాజులకు చక్రవర్తులకూ అన్నీవర్తించవు. బానిసలూ, పనివాళ్ళూ, ఉద్యోగులూ, సైనికులూ, మందీమార్బలం లేకపోతే పరాక్రమబాహుడు అంతటి బ్రహ్మాండమైన కట్టడాలు నిర్మించగలిగేవాడా? కట్టినా వాటిని కాపాడగలిగేవాడా? అతిత్వరలో నువ్వేచూస్తావు – వాటి విశిష్టత ఏమిటో స్వయంగా తెలుసుకుంటావు”.

దీపాంకరుడు మౌనంవహించాడు. త్రికోణమలై ఊరుదాటారు. పొలోన్నరువదిశగా నడుస్తున్నారు. ఎటుచూసినా పచ్చదనం; కొబ్బరి, అరటి, పనస చెట్లు; ఇళ్ళముందు మందార, బంతి, చేమంతి, సన్నజాజి పూలమొక్కలు. కళింగతీరంలో ఉన్నట్లుగానేఉందితప్ప మరోదేశానికి వచ్చామని అనిపించడంలేదు దీపాంకరుడికి. వాతావరణంకూడా ఉక్కగా, గాలిఆడకుండాఉంది. నాలుగేళ్ళతరవాత వాళ్ళదేశానికి తిరిగివస్తూన్న ఆనందం శాంతిదేవునిలోనూ గుణసేనుడిలోనూ ప్రస్ఫుటం అవుతున్నది. ఇన్నాళ్ళూ దీపాంకరుడి ఊహల్లో పొలోన్నరువ ఒక వినూత్న ప్రపంచపు ముఖద్వారం; ఇప్పుడది వాస్తవరూపంలో కళ్ళముందుకు రాబోతోంది. తన జీవితాన్ని బౌద్ధధర్మపథంలో సార్థకంచేసుకొనే అవకాశం. నాలాందాలో తురుష్కులచేతిలో శిరచ్చేదానికిగురైన పాళీభాషాబోధకుడు గుర్తుకొచ్చాడు; అతనిమదిలో రవ్వంత విషాదం చోటుచేసుకున్నది. మరోపక్క ముందుముందు ఏమిజరుగబోతోందో అని కాస్తంత ఆందోళన.

శాంతిదేవుని గంభీరవదనం చూస్తూంటే అతడికి తనగురువూ, పితృసమానుడూ అయిన భద్రపాలుడు గుర్తుకొచ్చాడు. భద్రపాలుడు పిన్నవయసులో ఇప్పటి శాంతిదేవునిలానే ఉండిఉంటాడనిపించింది; ఏదో మొండిధైర్యం అతన్ని ఆవహించింది.  ముగ్గురుభిక్షువులూ చెమటలు కక్కుతూనే అడుగులు వడిగా వేస్తున్నారు. మార్గమధ్యానఉన్న విహారాల్లోమజిలీలుచేస్తూ, రోజుకోపర్యాయం స్థానికభిక్షువులతోబాటుగా సమీపగ్రామాల్లో  భిక్షాటన చేసుకుంటూ ముప్ఫైకోసులదూరంలోఉన్న పొలోన్నరువ చేరడానికి నాలుగురోజులు పట్టింది.

ఉత్తరారామం చేరేసరికి చీకటిపడింది.  ఆచార్యశాంతిదేవుడూ, అతని శిష్యుడు గుణసేనుడూ ఎప్పుడు వస్తారాఅని కళ్ళుకాయలుకాచేలా ఎదురుచూస్తున్నవందలకొద్దీ భిక్షువులు వారికి ఘనంగా స్వాగతంపలికారు. ఆర్భాటాలేవీలేనప్పటికీ, వారిలోవిరిసిన సంతోషం, ఆప్యాయత దీపాంకరుడ్ని కదిలించాయి. నాలందాని మినహాయిస్తే అతడు ఇంతమంది భిక్షువులున్న ఆరామాన్ని ఎన్నడూచూడలేదు. నాలందాలో మాదిరిగానే ఇక్కడకూడా నిబద్ధతకలిగిన జ్ఞానాన్వేషణ, క్రమశిక్షణతోకూడిన యువశక్తి ఉన్నట్టుగా అతడికి తోచింది. ‘ఇక్కడ నాకు మంచి అనుభవం ఎదురౌతుంది’ అనే ఆశాభావం కలిగింది. యువభిక్షువులు దీపాంకరుడిని చుట్టుముట్టారు. ఎన్నోప్రశ్నలు వేశారు. కొన్నాళ్ళపాటు తమతోబాటు ఉంటాడని తెలుసుకొని  సంతోషం వ్యక్తపరిచారు. ప్రతిఒక్కరూ పాళీపదాలు జోడించిన చక్కటి సంస్కృతం మాట్లాడుతున్నారు. బాగా పొద్దుపోయింది. శాంతిదేవుడు కలుగజేసుకొని,

“ఇవాళ్టికి మీ ప్రశ్నలు చాలు. ఆయన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. ఒక యువభిక్షువుని ఉద్దేశించి,

“ధర్మపాలా, దీపాంకరుడి వసతిఏర్పాట్లు చూడు. ఈ రోజునుండీ ఆయన బాగోగులు చూసుకుంటూ ఉండు” అన్నాడు.

అధ్యాపకుల వసతివైపు దారితీశాడు ధర్మపాలుడు. దీపాంకరుడి గది చూపించాడు. నూనెదీపం వెలిగించాడు. మంచినీళ్ళకూజా తెచ్చిపెట్టాడు. కప్పుకోనేందుకు దుప్పటి ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుఝామునే వస్తానని చెప్పి బయల్దేరబోతూంటే దీపాంకరుడు సందేహిస్తూనే అడిగాడు – “నాలందాలో ఏమైందో మీకు తెలిసిందా?”.

“తెలిసింది. కొందరు భిక్షువులు, తీర్థయాత్రలకని బౌద్ధక్షేత్రాలకు వెళ్ళిన ఉపాసకులు ఆ దుర్వార్తని మోసుకొచ్చారు. ఆచార్యలు తిరిగివస్తారనే ఆశ వదులుకున్నాం. మాఅందరికీ ఈరోజు ఎంతటి శుభదినమో మాటల్లో చెప్పలేను”

ధర్మపాలుడు వెళ్ళిపోయాడు. అంతటా నిశ్శబ్దం. ఎక్కడా మనుషుల అలికిడిలేదు. నేపధ్యంలో కీచురాళ్ళ రొద. దీపంచుట్టూ పురుగులు చేరాయి. బాగా అలిసిపోయిన దీపాంకరుడు నిద్రలోకి జారుకున్నాడు.

***

శిష్యగణం తనను ‘ఆచార్యా’అని సంబోధిస్తూంటే దీపాంకరుడికి మొదట్లో కొత్తగా అనిపించినా క్రమేపీ అలవాటైంది.  ఆచార్యశాంతిదేవథేరోకు (ఉత్తరారామంలో శాంతిదేవుడిని అలాగే పిలుస్తారు) సహాయకుడిగా వ్యవహరిస్తూ పాళీ మూలగ్రంధాలలోని కొన్నిసూత్రాలను (సూత్తాలను) విద్యార్థులకు వివరించే తరగతులను అతనికి అప్పగించారు. అదేమంత కష్టమైనపని కాదనుకున్నాడుగానీ దిగాకే లోతుతెలిసింది. శాంతిదేవుడిని సంప్రదించాడు. అంతా విని అతడిలా అన్నాడు –

“అధ్యాపకుని పాత్ర నీకు కొత్త. మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బోధనకూడా ఒక కళ. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళంతా ఉత్తమ ఉపాధ్యాయులయితీరాలనే నియమం ఏదీలేదు. నాలందాలో గమనించిఉంటావు; అక్కడున్న వాళ్ళంతా మహాపండితులేకాక, అత్యుత్తమ ఉపాధ్యాయులుకూడా. మనకెంత జ్ఞానం ఉన్నదనేదొక్కటే ముఖ్యంకాదు. మొదట బోధించే విషయంపట్ల విద్యార్థుల జీవితకాలమంతా వారిని అంటిపెట్టుకొనేటంత ఆసక్తిని, కుతూహలాన్ని, ఉత్సుకతని రేకెత్తించాలి. వారిస్థాయికివెళ్లి చెయ్యిపుచ్చుకొని నడిపించగలగాలి. అంటే వాళ్ళతోబాటు నాలుగడుగులు వేసి ఆ తరువాత వాళ్ళనే శోధించమనాలి. ఒకవేళ దారితప్పితేగనక సరైనమార్గాన్ని సూచించాలి; అంతేగాని దారిపొడుగునా మనంవారివెంట నడవాలనుకోకూడదు. ఒక్కముక్కలోచెప్పాలంటే మనం మార్గసూచకులం మాత్రమే, సహయాత్రీకులంకాదు. బౌద్ధంలో ఇదిముఖ్యం. ఎవరి మోక్షానికివాళ్ళే స్వయంగా కృషిచెయ్యాల్సి ఉంటుంది. ఎవరి అన్వేషణ వారేచేసుకోవాలి. వారివారి అనుభవాలకు, అవగాహనకు విషయసారాన్ని అన్వయించుకోవాలి. తథాగతుడి కాలామసూత్తను గుర్తుంచుకుంటే మనపాత్ర స్పష్టమౌతుంది”.

ఇదీ ఉత్తరారామంలో అడుగుపెట్టాక దీపాంకరుడు శాంతిదేవునివద్ద నేర్చుకున్న మొదటిపాఠం. అక్కడున్న మూడేళ్ళలోనూ శాంతిదేవునివద్దా, మిగతా ఆచార్యులవద్దా, ముఖ్యంగా శిష్యులనుండీ చాలా నేర్చుకున్నాడు. ఒకోసారి అతనికి అనిపిస్తుంది – నేర్పినదానికన్నా నేర్చుకున్నదే చాలాఎక్కువ అని.

ఆరామజీవనానికి దీపాంకరుడు తొందరగానే అలవాటుపడ్డాడు. అతని నాలందా అనుభవం అన్నివిధాలా అక్కరకు వచ్చింది. మొదటి మూడునెలలూ పని ఒత్తిళ్ళతోనే గడిచిపోయింది. పరిసరాలను పట్టించుకొనే అవకాశం చిక్కలేదు. బోధనాంశాలపై కాస్తంత పట్టుచిక్కాక ఒక్కొక్కొటిగా మిగతా విషయాలను గమనించనారంభించాడు. ఉత్తరారామాన్ని నాలందాతో పోల్చడం అతనికి అనివార్యం అయింది. అతనికి తెలిసింది నాలందాయే మరి. ఆచార్యుల నిబద్ధత, విద్యార్థుల త్రికరణశుద్ధి పోల్చదగినవిగా ఉన్నాయి. అయితే బోధనాంశాల విస్తృతి, విహారపు విస్తీర్ణం, సదుపాయాలూ, గ్రంధాలయాలూ – వీటన్నిటిలోనూ నాలందా అనేక శతాబ్దాలముందుగానే అత్యున్నతస్థాయిని చేరుకున్నదనడంలో సందేహంలేదు. అసలు నాలందాని అందుకోవాలని అనుకోవడమే ఒక మూర్ఖత్వం అవుతుందని దీపాంకరుడికి బలంగా అనిపించసాగింది. అయితే ఆ మహావిహారాన్ని ఆదర్శంగా, స్ఫూర్తిగా భావించి ఉత్తరారామంలో చెయ్యవలసిన కృషిచేస్తూపోవడమే బుద్ధిమంతుల లక్షణం అనుకున్నాడు. ఈమాట శాంతిదేవునితోఅంటే అతడు నవ్వి,

“నాకు తెలియదనుకున్నావా? నాలందాకున్న విశిష్టత, చరిత్ర ఏంచేసినా తిరిగిరావు. అలాగని ఊరుకోలేకనే ఈ ప్రయత్నం. ఇప్పుడు మొదలుపెడితే ఎప్పటికో ఒకప్పటికి ఒకస్థాయికి చేరుకోగలం. ఆ రోజుని నువ్వూనేనూ చూడం. మహావిహారాలచరిత్రలో ఒక జీవితకాలం అంటే క్షణకాలమే”.

దీపాంకరుడికి భద్రపాలుడు తరచూవాడే మాట జ్ఞాపకం వచ్చింది: ‘కాలం విధించిన కర్తవ్యం’. ఉత్తరారామ చరిత్రలో తనకూ ఒకచిన్నపాత్ర ఉందనుకోవడం అతనికి ఆనందం కలిగించింది. ఆవెంటనే ‘నావల్ల అవుతుందా?’ అనే  సందేహం అతన్ని కలవరపరచింది. ఏదిఏమైనా, తనవంతు ప్రయత్నం చేసితీరాలనీ, తనకు ప్రసాదించబడిన ఈ అవకాశాన్నీ, మూడేళ్ళ వ్యవధినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలనీ దృఢనిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట బోధనకుమాత్రమే పరిమితంకాకుండా మూడులక్ష్యాలను సాధించాలని తీర్మానించుకున్నాడు. మొదటిది సింహళభాష నేర్చుకోవడం – ముఖ్యంగా మాట్లాడడం. తద్వారా స్థానికప్రజలతోనూ, శిష్యులతోనూ వారిభాషలో సంభాషించడానికీ, వారికి మరింతచేరువ కావడానికీ, అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికీ సాధ్యపడుతుంది. రెండోది – వీలు చిక్కినప్పుడల్లా ఆరామపు గ్రంధాలయానికివెళ్లి అరుదైన బౌద్ధగ్రంధాల ప్రతులను తయారుచేసుకోవడం. చివరిగా – చుట్టుపక్కలఉన్న ప్రదేశాలతో మొదలుపెట్టి ఒక్కటొకటిగా ఆ దేశపు బౌద్ధక్షేత్రాలను సందర్శించి వాటివివరాలను జ్ఞాపకార్థం ఒకచోట వ్రాసిపెట్టుకోవడం. తన నాలందా జ్ఞాపకాలను ఒకచోట రాసిపెట్టుకోకుండా గడిపివేసినందుకు అతనికి విచారంగా ఉంది. ఈ పర్యాయం మాత్రం అనుకున్నదే తడవుగా దీపాంకరుడు తన తీర్మానాలను ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు.

దీపాంకరుడు సింహళభాష నేర్చుకోవదానికి అతనికి శిష్యుడిగా, సహాయకుడిగా నియమింపబడిన ధర్మపాలుడి తోడ్పాటు చాలా ఉన్నది; నెల్లాళ్ళలోనే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడగలిగాడు. అంతకన్నా ముఖ్యంగా సింహళ భిక్షువుల మాటలు కొద్దికొద్దిగా అర్థంఅవుతూవచ్చాయి. మిగతా శిష్యులుకూడా సహకరించారు; చిరునవ్వులతో తప్పులను సవరించారు. తమలో ఒకనిగా దీపాంకరుడ్ని స్వీకరించడానికి వారికి ఎన్నోరోజులుపట్టలేదు. వాళ్ళు అతనితో తమ వ్యక్తిగత సమస్యలనుండి రాజకీయ పరిణామాలవరకూ ప్రతీదీ చర్చించడం మొదలుపెట్టారు. శిష్యులతో అతడు గడిపే సమయం బాగా ఎక్కువైంది. అయినప్పటికీ దీపాంకరుడు అధ్యయనానికీ, గ్రంధాలయానికీ, కొంత సమయం కేటాయిస్తూ వచ్చాడు. నాలందాగ్రంధాలయాలతో పోలిస్తే బాగాచిన్నదే అయినప్పటికీ  ఉత్తరారామంలోని పుస్తకసముదాయం అతన్ని ఆశ్చర్యపరచింది. అరుదైనగ్రంధాల జాబితాను తయారుచేసుకొని ప్రతులు తయారుచెయ్యడం మొదలుపెట్టాడు. ఈపనిలో దీపాంకరుడికి సహకరించేందుకు నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఈ బృహత్కార్యానికి శాంతిదేవుడు తన ఆమోదం తెలియజేసాడు. మరో నలుగురు భిక్షువులను ఈ పనికి నియమించాడు. అయితే, దీపాంకరుడు వ్రాసిపెట్టుకున్న జాబితానిచూసి పెదవివిరిచాడు. వాటినన్నిటినీ వెంటతీసుకు పోవాలంటే ప్రత్యేకించి ఒక ఓడ, రెండువందల గాడిదలూ ఉండాలని చమత్కరించాడు.

“ఎన్ని ప్రతులను నీతో తీసికెళ్ళడం సాధ్యమవుతుందో నిశ్చయించుకొని అప్పుడు మొదలుపెట్టు” అని సూచించాడు.

శాంతిదేవుని ముందుచూపుకు సింహళభాషలో కృతఙ్ఞతలు తెలియజేసి ఆయన్ను ఆశ్చర్యపరిచాడు దీపాంకరుడు. దీపాంకరుడ్ని వెంటతీసుకురావడం సరైననిర్ణయంఅని శాంతిదేవునికి బలంగాఅనిపించిది. అనాటినుండీ దీపాంకరుడిపట్ల మరింత సుముఖంగా, అభిమానంగా ఉండనారంభించాడు.

ఇక బౌద్ధక్షేత్రాల సందర్శనానికివస్తే ఉత్తరారామం, పొలోన్నరువలతో మొదలుపెట్టాలని దీపాంకరుడు నిశ్చయించుకున్నాడు. తను కన్నవీ, విన్నవీ, వ్యాఖ్యాసహితంగా ఈవిధంగా రాసుకోవడం ఆరంభించాడు:

‘సుమారు వందేళ్ళక్రితం దక్షిణభారతదేశానికి చెందిన చోళులు స్థానిక సింహళరాజులను ఓడించి, రాజధానిని అనురాధపురంనుండి పొలోన్నరువకుమార్చి ఏభైఏళ్లపాటు పాలించారు. విజయబాహుఅనే సింహళ రాజవంశీకుడు చోళుల్ని తరిమివేశాడు. అయితే భౌగోళికంగానూ, ధర్మంపరంగానూ సింహళదేశ ఏకీకరణ తరువాత వచ్చిన పరాక్రమబాహునిద్వారానే సాధ్యంఅయింది. ఇతడిని ఈ దేశస్థులు అశోకునితో సమానంగా గౌరవిస్తారు.

పరాక్రమబాహుడు అధికారం చేపట్టేనాటికి సింహళదేశపు బౌద్ధం అభయగిరివిహార, జేతవనవిహార, మహావిహార అనే  మూడు నియాక సమూహాలుగా చీలిపోయిఉన్నది. అతడు ఈ మూడు సమూహాల ప్రతినిధుల్నీ ఉత్తరారామానికి పిలిపించి సమావేశపరిచాడు. భ్రష్టుపట్టిన, అవినీతిపరులైన భిక్షువుల్ని సంఘంనుండి బహిష్కరించాడు. సాధారణపౌరులుగా మార్చివేశాడు. (ఇక్కడ మరికొన్ని వివరాలు అవసరం). మహావిహారసంఘాన్ని సమర్థించి మిగతా రెండుసమూహాల్ని, అంటే అభయగిరి, జేతవన సంఘాలను నామరూపాలు లేకుండాచేశాడు.  థేరవాదబౌద్ధానికి పెద్దపీటవేసి మహాయాన, వజ్రయాన ధోరణులను పూర్తిగా అరికట్టాడు. భిక్షువులు పాటించవలసిన నియమాలను పునర్లిఖింపజేసి వాటిని ఉత్తరారామంలో శిలాశాసనంగా ప్రకటించాడు. (వినయపీటికఉండగా మళ్ళీ ఇదిఎందుకు అవసరమైందో తెలియరాలేదు). సంఘానికి పెద్దగా, నాయకునిగా, ప్రతినిధిగా వ్యవహరించేదుకు సంఘరాజా అనే పదవిని సృష్టించాడు. అతనికి సహాయకులుగా ఇద్దరు ఉపసంఘరాజాలు ఉండేటట్టు ఏర్పాటు చేసాడు.

పరాక్రమబాహుడు మరణించాక గద్దెనెక్కిన కళింగవంశప్రభువు నిస్సంకమల్లుడే స్వయంగా పూనుకొని శాంతిదేవుడిని నాలందాకు పంపాడని శిష్యుడు ధర్మపాలుడిద్వారా తెలిసింది. శాంతిదేవుడు నాలందా చేరకముందే నిస్సంకమల్లుడు మరణించాడు. రాజ్యం పరిస్థితి గందరగోళంగా మారింది; రాజభవనంలో కుట్రలూ, కుతంత్రాలూ పరాకాష్టకు చేరుకున్నాయని వినవస్తున్నది. సర్వత్రా వదంతులు వ్యాపిస్తున్నాయి. (నాలందానుండి తిరిగివచ్చాక శాంతిదేవుడు ఉపసంఘరాజాగా  నియమించబడ్డాడు. త్వరలో అతడే సంఘరాజా పదవిని చేపడతాడని వినికిడి. అయితే అతని నియామకాన్ని కొందరు రాజవంశీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. తుదిపరిణామాలు ఎలాఉంటాయో వేచిచూడాలి. పరాక్రమబాహుడు బౌద్ధసంఘ పునరుజ్జీవనానికీ, అనురాధపుర  పునర్నిర్మాణానికి, ఉత్తరారామ ప్రశస్తికి చేసిన కృషినిగురించి తెలుసుకున్నాక అతనిపాలనలో నిర్మితమైన  కట్టడాలను మరింత ఆసక్తిగా పరిశీలించ సాగాను).

కొండరాతి పార్శ్వతలాన జీవకళ ఉట్టిపడేట్టుగాచెక్కిన నాలుగు పెద్ద ఏకశిలా బుద్ధవిగ్రహాలు ఉత్తర ఆరామపు ముఖ్య ఆకర్షణలు. కొండరాతినిదొలిచి సృష్టించిన విజ్జాధరగుహ (విద్యాధర గుహ)లో  ధ్యానముద్రలో ఉన్న తథాగతుడు దర్శనమిస్తాడు. తలపై గొడుగుతో, అటూఇటూ బ్రహ్మ, విష్ణువుల ఆశీర్వాదంతో సింహాసనంపై కూర్చున్నట్టుగా బుద్ధుని రూపకల్పన చేశాడు శిల్పి. ధ్యానముద్రలోనే ఉన్న పదిహేను అడుగుల ఎత్తైన మరో పెద్ద బుద్ధ విగ్రహం కూడా ఉన్నది. ఇక మూడవది – నిర్యాణానికి ముందు కుడివైపు తిరిగి చేతిపై తలనానించుకొని పడుకొని ప్రశాంతవదనంతో ఆఖరి ప్రవచనం చేస్తున్నతథాగతుడి శిల్పం. ఇది సుమారు ఏభై అడుగుల పొడవైన బ్రహ్మాండమైన కళాసృష్టి. పక్కనే ఆనందుడు విషాదవదనంతో చేతులుకట్టుకొని నిలుచున్నట్టుగా చెక్కారు. శయనభంగిమలోఉన్న తథాగతుని విగ్రహం ఎంతసహజంగా ఉందంటే, ఆయన తలఆనించిన దిండు మెత్తగా, ఒకవైపు కొద్దిగా నొక్కబడినట్టుగా అగుపిస్తుంది. విగ్రహాలన్నిటి పైనా బంగారురేకు తాపడాలున్నాయి.  అన్ని విగ్రహాలకూ వాటిని ఆనుకొని చెక్కలతో నిర్మించిన ఆలయాలున్నాయి. [శిల్పశాస్త్రం గురించి నాకేమీ తెలియదుగాని ఇక్కడి శిల్పాలను చూస్తూంటే నాలందా వెళ్ళేదారిలో ధాన్యకటకం (అమరావతి)లో చూసిన విగ్రహాలు ఎంతగానో జ్ఞాపకంవచ్చాయి. రెంటికీ చాలాపోలికలున్నాయి. కారణం ఏమైఉంటుంది? ఎవరైనా శిల్పశాస్త్రప్రవీణులను  సంప్రదించాలి].

పరాక్రమబాహుడు తనపాలనలో చేబట్టిన ప్రజాహిత నిర్మాణాలనుగురించి వ్రాసిపెట్టుకోకపొతే ఈ జ్ఞాపక సంపుటి అసంపూర్ణంగా ఉండిపోతుంది. తన రాజ్యంలో వర్షించిన ఒక్క నీటిబొట్టునుకూడా వృధాగా పోనివ్వనని శపథంచేసి శాసనం ప్రకటించాడు. సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంకలిగిన పరాక్రమసముద్రం అనే బ్రహ్మాండమైన సరస్సుని సృష్టింపజేశాడు. దానిమూలంగా ఇరవైవేలఎకరాలు సశ్యశ్యామలంగా మారాయి. దిగువగ్రామాల్లో తాగునీటి సమస్యకూడా తీరిపోయింది. ఇటువంటి ఆనకట్టల నిర్మాణాల్ని రాజ్యమంతటా చేయించాడు. మనుష్యులకేకాకుండా పశువులకుకూడా వైద్యశాలలు ఏర్పాటుచేసాడు. అవన్నీ నేటికీ చక్కగా పనిచేస్తున్నాయి. ఇక్కడి ప్రజలు పరాక్రమబాహుడిని అశోకుడంతటి గొప్ప చక్రవర్తిగా గౌరవిస్తున్నారంటే అందులో ఆశ్చర్యపడవలసిందేమీలేదు. (బౌద్ధాన్ని కాపాడుకోవాలంటే సానుకూలురైన, ప్రజాహితులైన, సైనికబలం కలిగిన, దృఢచిత్తులైన  పాలకులు ఉండితీరాలని ఈమధ్య కాలంలో – అంటే పొలోన్నరువ రాజ్యానికి వచ్చిన నాటినుండి – బలంగా అనిపిస్తున్నది. రాజ్యాధికారంతో ప్రమేయం లేకపోతే బౌద్ధం నిలువదేమో. అలాగని రాజులమీదే పూర్తిగా ఆధారపడటంకూడా సరికాదు. ఒక్కోరాజూ ఒక్కోతీరుగా ఉంటాడు. ఈ విషయంపై శాంతిదేవునితో చర్చించాలి).

***

(మూడో భాగం -వచ్చే వారం )

ఉణుదుర్తి సుధాకర్

తూరుపు గాలులు ( పెద్ద కథ – మొదటి భాగం )

 

1

వి వర్షావాసపు తొలిరోజులు. ఎక్కడోవర్షించి, తేలిపోయివచ్చిన దూదిమేఘాలు ఆకాశమార్గాన పరుగులు పెడుతున్నాయి. ఉండీఉడిగీ చిరుజల్లులూ, వెంబడే ఉక్కపోత; అంతేగాని భారీవర్షాలింకా మొదలుకాలేదు. సాయింత్రంపూట సముద్రంమీదనుండి చల్లనిగాలివీచినప్పుడే కాస్తంత ఉపశమనం. భద్రపాలుడు ఆమధ్యాహ్నంపూట విహారప్రాంగణంలోని మర్రిచెట్టునీడలో, రాతిగట్టుమీద కూర్చొని, కుడిచేతిని నుదిటిపైన ఆనించి,  కళ్ళుచిట్లించి లోయలోకి చూస్తున్నాడు. చాకలివాళ్ళు లోయలో ఎండలకిచిక్కి సన్నబడిన వాగులోనే బట్టలుతుకుతున్నారు. వర్షాలుపడ్డాక ఆ చిన్నారివాగే పంపానదిగామారి పరవళ్ళు తొక్కుతుంది. చాకళ్ళు బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. ఎక్కడ్నించో మొగనెమళ్ళు ఆత్రుతగా, సుదీర్ఘంగా పిలుస్తున్నాయి; ఆడనెమళ్ళు మాత్రం బెట్టుచేస్తూ, అప్పుడప్పుడు క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుంటున్నవి. ఉన్నట్టుండి చాకలివాళ్ళ వెంటవచ్చే కుక్కలన్నీ కలసికట్టుగా మొరగనారంభించాయి; ఆ వెంటనే బెదిరినట్టుగా చాకళ్ళ గాడిదలు గుంపుగా ఓండ్రపెట్టాయి.

భిక్షాటనకని వెళ్ళిన భిక్షువులబృందం ఇంకా తిరిగిరాలేదు. వాళ్లు తెచ్చిపెడితే తినాలి. ఈ మధ్యంతా ఇదే తంతు. ఆరోగ్యం బాగోలేక విహారంవిడిచి వెళ్ళలేకపోతున్నాడు. దృష్టి బాగామందగించింది. శృంగవృక్షం గ్రామంలోనే వాళ్ళకి కావలసినంత భిక్ష దొరికిపోతుంది. మధ్యమధ్యలో ఎవరోఒకరువచ్చి పళ్ళు, ఫలాలు ఇచ్చిపోతుంటారు. గ్రామపెద్దలూ, ఒకటిరెండు కుటుంబాలవాళ్ళు, సంవత్సరానికొకటి రెండుసార్లువచ్చి చీవారాలు (భిక్షువులు ధరించే కాషాయి వస్త్రాలు) ఇస్తూంటారు. అందుచేత తిండికీ, బట్టకీ ఇబ్బందిలేదు.  భద్రపాలునివద్దకు వైద్యంకోసం గ్రామస్థులు వస్తూంటారు. అతనిచ్చే వేర్లు, ఆకుపసర్లు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. వైద్యుడిగా అతడికి మంచిపేరే ఉంది.

భద్రపాలుడికి చావంటే భయంలేదు గాని ‘ఇంకా ఏమేమి చూడాలో’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. దీపాంకరుడికి విహారబాధ్యతలు అప్పగించి వెళ్ళిపోగలిగితే బాగుండునని అతనికి తరచూఅనిపిస్తోంది. దీపాంకరుడు ఎప్పటికైనా తిరిగిరాకపోతాడా అనేఆశ అతనిలో ఇంకామిగిలిఉంది. ఇప్పటికే నాలుగేళ్ళు గడిచిపోయాయి. భద్రపాలుడే పట్టుబట్టి అతడినీ, అతడి శిష్యుడినీ  నాలందా మహావిహారానికి పంపించాడు. మూడేళ్ళల్లో తిరిగి రావాల్సింది.  ఏమైపోయాడో? ఇక్కడ విహారం పరిస్థితి చూస్తే ఏడాదికేడాది దిగజారుతున్నది.

ఈ ఏడాది వర్షావాసానికి పన్నెండుమంది భిక్షువులు మాత్రమే విహారానికి చేరారు. వాళ్ళంతా ప్రతీ సంవత్సరం వచ్చే వాళ్ళే.  మరో పదిమందైనా రావాలి. వస్తారో లేదో; ప్రతీ ఏడూ ఇలాగే ఎదురుచూడడం. విహారంచేరే భిక్షువుల సంఖ్య తగ్గిపోతోంది. ఏ అడవిజంతువు వాళ్ళని కబళించిందో  లేక జబ్బుపడి ఏ మార్గమధ్యాన మరణించారో? దీపాంకరుడి విషయంలోనూ అలాంటి ఉపద్రవమేదైనా జరిగిందా? అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాజ్యాల్లో ఏమి జరుగుతోందో? వచ్చేపోయే వాళ్లులేక ఏ సంగతీ తెలియరావడం లేదు. కళింగపట్నం, కోరంగిరేవుల మీదుగా వస్తూపోయే సింహళ భిక్షువులుకూడా ఈమధ్య ఇటుగా రావడంలేదు.

భద్రపాలుడు యువకుడుగా ఉన్నప్పుడు వర్షావాసాల్లో వందలకొద్దీ భిక్షువులతో కళకళలాడిన విహారం ఇప్పుడు పూర్తిగా  బోసిపోయింది. చుట్టుపక్కల మూడు కొండలకి విస్తరించిఉన్న విహారపుగుహల్లో ఇదొక్కటే వాడుకలో మిగిలింది. ఒకటి పూర్తిగా పాడుబడి గబ్బిలాలనిలయంగా మారిపోయింది. శిల్పులు అసంపూర్ణంగా వదిలిపెట్టిన మూడోగుహలోని స్తూపానికి గతపదేళ్లుగా శివలింగం రూపంలో పూజలూ, జంతుబలులూ జరుగుతున్నాయి. అక్కడ శివరాత్రినాడు జాతరకూడా జరుగుతుంది; ఆరోజున చుట్టుపక్కల గ్రామస్థులు చాలామంది జాతరకని వస్తారుగాని, విహారం జోలికిరారు. ఎప్పుడైనా భిక్షువులు ఎదురుపడితే సాధువులని భావించి భక్తిగా దండంపెడతారు; ఆపాటి గౌరవంఉంది. దగ్గరలో ఉన్న నాలుగు గ్రామాల్లో ఏ గ్రామానికి భిక్షాటనకి వెళ్ళినా ఆ పూటకి సరిపడా భిక్ష దొరికిపోతుంది. ఉండే భిక్షువులే పది, పన్నెండుమంది. కొత్త భిక్షువులు వచ్చిచేరడం ఎప్పుడో ఆగిపోయింది. దీపాంకరుడి తరవాత ఒకరో, ఇద్దరో.

కుక్కలు ఎందుకు మొరిగాయో భద్రపాలుడికి బోధపడింది. ఒక సాధువులగుంపు విహారంవైపుగా వస్తున్నది. పది మంది ఉంటారేమో. ఏదో తత్వం పాడుకుంటూ సునాయాసంగా కొండెక్కుతున్నారు. వాళ్ళ పాట అస్పష్టంగా వినబడుతున్నది. ఎప్పుడైనా ఒకరిద్దరు సాధువులువచ్చి, ఒకటిరెండు రాత్రుళ్ళు తలదాచుకొని వెళ్లిపోవడం చూశాడుగాని ఇంతమంది గుంపుగా ఎప్పుడూ రాలేదు. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? సాధువులు మర్రిచెట్టుని సమీపిస్తూనే భద్రపాలుడికి నమస్కరించి మంచినీళ్ళడిగారు. గుహలకి దారితీసే రాతిమెట్లకి ఒకవైపున పేర్చిఉన్న కుండలకేసి చూపించాడు. నీళ్ళుతాగి, మర్రిచెట్టుకింద కూర్చున్నారు. సాధువుల్లోని పెద్దాయన అన్నాడు:

“స్వామీ, మేమంతా కాశీనుండి వస్తున్నాం; రామేశ్వరం వెళుతున్నాం. కాశీలో మాకీయన తటస్థపడ్డాడు. ఉజ్జయని మీదుగాకాకుండా తూర్పుగాంగుల రాజ్యంలోంచి, కళింగదేశం మీదుగా తీరంవెంబడి వెళ్తున్నాంఅనంటే మాతోబాటు వస్తానన్నాడు. గోదావరి సమీపంలోని పంపానదీతీరానఉన్న బౌద్ధవిహారానికి వెళ్ళాలన్నాడు; సరే, రమ్మన్నాం. దారిలోఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ, మజిలీలుచేస్తూ వచ్చేసరికి ఏడాది దాటింది. కాశీలో కలసినప్పుడే మీవాడు చాలా  ముభావంగా ఉన్నాడు.  మహానదిదాటి కళింగదేశం చేరేనాటికి బొత్తిగా మాట్లాడడం మానేశాడు. ఆరోగ్యం బాగోలేదు; మతికూడా చలించినట్టుంది”.

భద్రపాలుడికి నెమ్మదిగా అర్థంఅయింది. సాధువులందర్నీ మార్చిమార్చిచూడగా, గొంతుక్కూర్చొని నేలమీద వేలితో గీతలుగీస్తున్న యువకుడు దీపాంకరుడు అయిఉండవచ్చని ఊహించాడు. మిగతా సాధువుల్లాగే గెడ్డం, మీసాలు, జడలుకట్టిన జుత్తు. భద్రపాలుడి గొంతుక ఎండిపోయింది. అతి కష్టంమీద అతనిగొంతు పెగిలింది.

“అవును, ఇతను దీపాంకరుడు. నాలందామహావిహారానికి పంపించాం. ఎప్పుడొస్తాడాఅని ఎదురుచూస్తున్నాం”.

“మీరు వినలేదా? తురుష్కులదాడితో నాలందా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వందలమంది భిక్షువుల్ని వెంటతరిమి ఊచకోత కోశారు. మిగిలినవాళ్ళు తలోదిక్కూ పారిపోయారు. కాశీలో కలిసినప్పుడు మీవాడిని అడిగితే వివరాలేవీ చెప్పలేకపోయాడుగాని, ఆప్రాంతాల్లో అందరికీ తెలుసు. మేం కాశీలో బయిల్దేరేనాటికి తురుష్కులు తగులబెట్టిన తాళపత్రగ్రంధాలు మూడునెలలపాటు మండుతూనే ఉన్నాయని అంతా అనుకుంటున్నారు”.

చాలాసేపు అంతా మౌనంగా ఉండిపోయారు. రివ్వుమని నీటిమీది గాలి వీచసాగింది – రాబోయే వర్షానికి సూచనగా. నల్లనిమేఘాలు కమ్ముకొచ్చాయి. మర్రిచెట్టు చిటారుకొమ్మలు, ఊడలు ఊగసాగాయి. భూమిలోంచి, కొండరాళ్ళలోంచి  వేడి, పైన రొజ్జగాలి. టపాటపా పెద్ద చినుకులు పడనారంభించాయి. చీకటవుతున్న ఆకాశాన్ని చీలుస్తూ మెరుపుతీగె వెలిగింది; దగ్గరలోనే ఎక్కడో పిడుగు పడింది; కొండలనడుమ ప్రతిధ్వనిస్తూ ఉరుము.

“మేమింక బయిల్దేరాలి…. వర్షాల్లో గోదావరి దాటడం కష్టం” అన్నాడు సాధువుల పెద్ద. సాధువులంతా లేచినిలబడ్డారు.

“దీపాంకరుడివెంట అతని శిష్యుడు ఒకడు ఉండాలే?” అతి కష్టం మీద అన్నాడు, భద్రపాలుడు.

“అవును. కళింగదేశంలో ప్రవేశించిన కొద్దిరోజులకే జ్వరంసోకి ప్రాణంవిడిచాడు. మా సాధువులిద్దరుకూడా పోయారు. అప్పటినుండి ఈయన ప్రవర్తన మరింత దిగజారింది”.

దీపాంకరుడిని తీసుకొచ్చి అప్పజెప్పినందుకుగాను కృతజ్ఞత తెలియపరచాలని భద్రపాలుడికి చాలా అనిపించింది కాని నోరుపెగల్లేదు. వర్షం పెద్దదయ్యేలాగా ఉంది, కాసేపు ఆగమందామా అనుకున్నాడు. ఏదోఒకటి అనేలోగా సాధువులు వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయారు. కొండదిగుతూ, చదునుగా ఉన్నచోటున ఆగి, మళ్ళీ తత్వం అందుకున్నారు; గుండ్రగా తిరుగుతూ, నవ్వుకుంటూ, తడిసిముద్దవుతూ, చప్పట్లుచరుస్తూ, తన్మయత్వంతో పాడుతున్నారు.

నీటిబొట్టువు, నీటిబొట్టువు

నింగినుండీ నేలరాలిన – నీటిబొట్టువు – నీటిబొట్టువు

ఒకటి రాలెను కొండమీదా

ఒకటి కురిసెను వాగులోనా  – నీటిబొట్టువు, ….

ఒకటి చేరెను రాజు ఇంటా

ఒకటి పోయెను పేద వెంటా – నీటిబొట్టువు, ….

ఒకటి మిగిలెను చేనులోనా

ఒకటి ఉన్నది అడవి నడుమా – నీటిబొట్టువు, ….

ఒకటి ఇంకీ నేలచేరెను

ఒకటి దప్పికతీర్చి పోయెను – నీటిబొట్టువు, …..

చెరువులోనా, నూతిలోనా

చేదలోనా, కుండలోనా  – నీటిబొట్టువు, …..

వాగులోనా, వరదలోనా

పొలంలోనా, పుట్టలోనా  – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు రాలిపడెనో?

ఏది ముందుగ ఆవిరగునో? – నీటిబొట్టువు,…

చివరికన్నీ గంగచేరును

కడలి కడుపున కలసిపోవును – నీటిబొట్టువు, ….

మేఘమందున మంచినీరే

కమండలమున మంచినీరే – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు ఎక్కడున్నది?

ఏది ఎప్పుడు ఎచటచేరును? – నీటిబొట్టువు, ….

ఎవరుముందో, ఎవరు వెనకో?

నీవు ఎవరో, నేను ఎవరో? – నీటిబొట్టువు, ….

అన్నిదిక్కుల ఉన్నదొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

చివరికదియే నిలిచి వెలుగును

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

విశ్వనాథుని రూపమొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె

దూరంగా కూర్చున్న దీపాంకరుడుకూడా పరధ్యానంగా వంతకలుపుతూ అదేతత్వం పాడుతున్నాడు. సర్వసంగ పరిత్యాగి, గొప్పజ్ఞాని అయిన  భద్రపాలుడి కనులవెంట ఏకధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కానీ అతని మొహంలో ఏ భావనాలేదు; అతని గంభీరదుఃఖానికీ, నిశ్శబ్దరోదనకూ కారణం ఇదీ అనిచెప్పడం కష్టం. దీపాంరుడు గురువుగారివంక కాస్తంత ఆశ్చర్యంగా చూసి, లేచివచ్చి పక్కనే కూర్చున్నాడు. వర్షం పెద్దదైంది. దీపాంకరుడి చెయ్యిపట్టుకొని నెమ్మదిగా లేచాడు భద్రపాలుడు. ఇద్దరూ గుహలోపలికి నడిచారు.

***


వర్షాకాలమంతాకూడా విహారంలోని భిక్షువులమధ్య ఒకేచర్చాంశం. శాశ్వతంగా నిలిచిపోతుందనుకున్న నాలందా మహావిహారంలో అంతటి ఘోరం ఎలాజరిగింది? ఎవరీ తురుష్కులు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి మరీ చంపారు? వాళ్ళకేంకావాలి? ఇంకా ఏంజరగబోతోంది? తన తరువాత వెయ్యిసంవత్సరాల్లో బౌద్ధం అది పుట్టిన గడ్డనుండి నిష్క్రమిస్తుందని తథాగతుడు స్వయంగా అన్నాడంటారు; అదే నిజమవుతోందా?   నాలందా మళ్ళీ ఎప్పటికైనా నిలదొక్కుకుంటుందా?…..ఇవే ప్రశ్నల్ని మళ్ళీమళ్ళీ వేసుకుంటూ అదేపనిగా చర్చించుకోవడమేగాని ఎవరికీ సమాధానాలు తట్టడంలేదు. సాధువులనోట భద్రపాలుడు విన్నసమాచారం తప్ప మరేవివరాలు తెలియలేదు. దీపాంకరుడు ఏమీ చెప్పడు. అతన్ని ప్రశ్నలతో వేధించవద్దని భద్రపాలుడి ఆదేశం. భిక్షువులకు ఎటూ తోచడంలేదు. వాళ్ళ గుండెలనిండా అపారమైన దిగులు.  ముఖ్యంగా భిక్షువుల మూకుమ్మడి హత్యల్ని, గ్రంధాలయాల్ని తగులబెట్టడాన్ని తట్టుకోలేకపోయారు.

దీపాంకరుడి పరిస్థితి మెరుగుకావడానికి చాలాకాలమే పట్టింది. భద్రపాలుడి వైద్యం, సాటి  భిక్షువుల శుశ్రూష అతన్ని కోలుకొనేలా చేశాయి. ఇప్పుడు స్వయంగా భిక్షాటనకు వెళ్తున్నాడు. అయినా చాలాతక్కువగా మాట్లాడుతాడు. నాలందాలో ఏమైందని ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు.  అతడూ ఆ విషయాలు ఎత్తుకోలేదు. భద్రపాలుడు అతడిచేత ముఖాముఖీ మాట్లాడించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ వర్షావాసం నిరాశ, నిస్పృహల నడుమ ముగియవచ్చింది.

అది అశ్వయుజ పౌర్ణమి. వర్షావాసపు అంతాన్ని సూచించే పవరన ఉపోసత (సంస్కృతంలో ప్రవరణ ఉపవాసథ) నాడు పాటించే పతిమోక్ఖా (సం. ప్రతిమోక్షా) దినం. వర్షావాస సహవాసంలో భిక్షువులు ఎప్పుడైనా త్రిపీటిక విధించే నియమాలను  అతిక్రమించినా, తోటిభిక్షువులపట్ల దురుసుగా, కరకుగా ప్రవర్తించినా బహిరంగంగా క్షమాపణ చెప్పుకొనే రోజు. ఆ కార్యక్రమం ముగిసిన మర్నాడే సమీపగ్రామాల ప్రజలు ఇక త్వరలోనే ప్రయాణం కట్టబోయే భిక్షువులకు వీడ్కోలుచెప్పడానికి విహారానికివస్తారు. చీవారాలను బహూకరిస్తారు; ఆశీర్వాదాలను కోరుకుంటారు.

ఆనాటి ప్రతిమోక్షాసమావేశానికి ఉదయాన్నే భిక్షువులందరూ ముందుగానేవచ్చి మహాస్తూపానికెదురుగా కూర్చున్నారు. భద్రపాలుడు లోనికివచ్చి అందర్నీ పరిశీలనగా చూశాడు. పట్టుమని పాతికమందికూడా లేరు. వర్షావాస ప్రతిమోక్షాదినాన ఇంతచిన్న భిక్షువులగుంపుని చూడడం అతనికిదే ప్రధమం. చివరివరుసలో దీపాంకరుడు కూర్చొని ఉన్నాడు. భిక్షువులందరిలాగే శిరోముండనం చేయించుకొని, కాషాయిరంగు చీవారాలను ధరించిఉన్నాడు. ముందువరసలోకి వచ్చికూర్చోమని భద్రపాలుడు అతనికి సైగచేశాడు. దీపాంకరుడి వద్దనుండి ఎలాంటి స్పందనా లేదు.  అతని వెర్రిచూపు పోయింది గాని, మౌనం అలాగే ఉంది.

భద్రపాలుడు పాళీ భాషలో త్రిపీటికానియమాలను పైకి బిగ్గరగా చదువుతున్నాడు. ఒక్కో నిత్తనీ (నిష్ఠనీ లేదా నియమాన్ని) పూర్తిగా వినిపింపజేశాక  –

“మీలో ఎవరైనా దీన్ని అతిక్రమించారా?” అని అడుగుతున్నాడు. ఎవరూ స్పందించకపోతే,

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఈ నిష్టని అతిక్రమించలేదని భావిస్తున్నాను” అని ప్రకటించి ముందుకి సాగుతున్నాడు.

నిష్టా నియమాల ప్రకటన పూర్తయింది. చివరి ప్రశ్నను సమావేశం ముందుంచాడు భద్రపాలుడు.

“ఎవరైనా, ఏ విషయంలోనైనా పశ్చాతాపం ప్రకటించదలుచుకున్నారా?”

భిక్షువుల నుండి మళ్ళీ నిశ్శబ్దం.

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఏ నియమాన్నీ అతిక్రమించలేదనీ, ఈ వర్షావాసంలో ఒకరిపట్ల ఒకరు దురుసుగాగాని,  కఠినంగాగాని వ్యవరించలేదని భావిస్తూ ఈ ప్రతిమోక్షాసమావేశాన్ని ముగిస్తున్నాను” అన్నాడు భద్రపాలుడు.

సరిగ్గా అప్పుడే దీపాంకరుడు ఏదో అన్నాడు. భద్రపాలుడికి వినిపించలేదు.

“ఏమంటున్నాడు?” అని దీపాంకరుడికి సమీపంగా కూర్చున్న భిక్షువులను అడిగాడు.

అంతటా కలవరం. భద్రపాలుడు చెయ్యపైకెత్తి సభికులను నిశ్శబ్దంగాఉండమని సౌంజ్ఞచేశాడు; సద్దుమణిగింది. దీపాంకరుని పక్కనే కూర్చున్న యువభిక్షువు అన్నాడు:

“నాలందాలో ఉండగా – పాళీభాషని బోధించే ఆచార్యుని మరణానికి తానే కారకుడినని అంటున్నాడు”

“ఎందుకని అలా అనుకుంటున్నావు? వివరంగా చెప్పు” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడు మాట్లాడ్డం మర్చిపోయిన వాడిలా నెమ్మదిగా, కూడబలుక్కుంటూ జవాబిచ్చాడు:

“ఆ సాయింత్రం……తురుష్కుల బృందం ఒకటి వెంటాడుతూంటే…..నడవలేకపోతున్న ఆచార్యులవారిని ఇక మొయ్యలేక…..ఒక చెట్టుకింద వదిలేశాం…..ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని ఏదోవిధంగాదాటి అవతలిఒడ్డున ఉన్నగ్రామంలో తలదాచుకున్నాం ఆ రాత్రికి…..  మర్నాడు ఉదయం, ధైర్యంచేసుకొని, గ్రామస్థులను వెంటబెట్టుకొని వెళ్లి చూస్తే ఆయన తలనరికేసి ఉంది…. ఏదోలా మాతోబాటు నదిదాటించి ఉంటే  బతికేవారు…..”

“మీలో ఎవరో కొందరు ఆయనకి తోడుగా ఉండవలసింది కదా?” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడి మాటల్లో వేగంపుంజుకుంది. “మేంకూడా అదేఅన్నాం, భాదంతా. ఆచార్యులవారు అంగీకరించలేదు.

‘మీరెంతమంది తోడున్నా వాళ్ళను నిలువరించలేరు. మనం సైనికులంకాము. మనవద్ద ఆయుధాలులేవు. నాఒక్కడికోసం మీరందరూ ప్రాణాలు వదులుకోవడంలో  అర్థంలేదు. మీరు ముందుకి వెళ్ళండి. నాకోసం ఆగవద్దు. ఇప్పటికే నా మూలంగా తొందరగా ముందుకి సాగలేకపోతున్నారు. మీరంతా చిన్నవాళ్ళు; మీరే రేప్పొద్దున్న బౌద్ధాన్ని కాపాడాలి. నాబోటి ముసలాడు పోయినా సంఘానికి జరిగే నష్టం ఏమీ లేదు. అంతా బాగుంటే మళ్ళీ కలుసుకుందాం… మీరు నాకోసం ఆగవద్దు. ఇది నా ఆదేశం’ అన్నారు”.

చాలాసేపు సభలో నిశ్శబ్దం. చివరికి భద్రపాలుడు ఇలా అన్నాడు:

“ఆచార్యులవారు అన్నదే సహేతుకంగా ఉన్నది. అటువంటి విపత్కర పరిస్థితుల్లోకూడా ఆయన తన తార్కికదృష్టిని మరలించక, తనప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం మానుకొని మిమ్మల్ని బతికించాడు. బౌద్ధానికి సేవచెయ్యమని కోరుకున్నాడు. ఈ విధంగా అతను బౌద్ధధర్మాన్ని నిలబెట్టాడు. తథాగతుని మార్గాన్ని అనుసరించాడు”.

“అదే….అదే మోయలేని భారం. ఏం చెయ్యాలి? ఏమీ తోచడం లేదు భాదంతా”.

“అంటే?”

“అటువంటి ఉత్తముడైన ఆచార్యుడి త్యాగానికి అర్హునిగా నిలవాలంటే నేనేం చెయ్యాలి? ఆయన దయవల్లనే ఈరోజున జీవించి ఉన్నాను. ఇకమీదట నా జీవితపరమార్థం ఏమిటి? అదే తెలియడంలేదు”

మొదటిసారిగా దీపాంకరుడి వ్యధ భద్రపాలుడికి పూర్తిగా అవగతమైంది.

“రేపటి ప్రత్యేక సమావేశంలో ఈ విషయం చర్చిద్దాం. ప్రస్తుతానికి ఈ సమావేశాన్ని ముగిద్దాం” అన్నాడు. దీపాంకరుడు నాలందా విషయమై నోరువిప్పినందుకు భద్రపాలుడి మనసు రవ్వంత తేలికపడింది.

***

బౌద్ధానికి పెద్దపీటవేసిన మహానుభావులు దేవానాంప్రియఅశోకుడూ లేడు; కనిష్కచక్రవర్తీ లేడు; హర్షవర్ధనుడూ లేడు. ముందుముందు అటువంటి అనుకూలురైన సామ్రాజ్యాధిపతులు అధికారంలోకివచ్చే సూచనలూ లేవు. ప్రజల్లోకూడా బౌద్ధానికి ఆదరణ అంతంతమాత్రంగానే ఉన్నది. పాలకులు, పండితుల దగ్గరనుండి సామాన్యప్రజలదాకా ప్రతి ఒక్కరూ శైవ, వైష్ణవ శత్రుశిబిరాలుగా చీలిపోయి, వీధినపడి కొట్లాడుకుంటున్నారు. ఆపైన కొత్తగా ఈ తురుష్కుల దాడి; నాలందా విధ్వంసం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుకోవడమెలా? ఇదీ ప్రత్యేకసమావేశపు ప్రధానచర్చాంశం. భద్రపాలుడితోబాటు మరో ఆరుగురు అనుభవజ్ఞులైన భిక్షువులతోకూడిన సమావేశం. వాళ్ళల్లో దీపాంకరుడు కూడా ఉన్నాడు.

నిజానికి ఇప్పుడంటే నాలందా ఒక అంశంగా చర్చలో చోటుచేసుకున్నదిగాని, ధర్మాన్ని ఎలాకాపాడుకోవాలి? ఎలా విస్తరింపజెయ్యాలి? అనేప్రశ్నలు ప్రతీసారీ ప్రత్యేకసమావేశాల్లో చర్చకువచ్చేవే. అయితే ఇంతకుముందెన్నడూలేని విధంగా – నిస్పృహతోకూడిన ఆందోళన, ఏదోఒకటి తొందరగా అమలుచెయ్యాలనే ఆదుర్దా, ఏం చెయ్యాలో తెలీని సందిగ్ధత – ఇవన్నీ ఆనాటి సమావేశంలో వ్యక్తమయ్యాయి.

రాజులూ, మహారాజులూ బౌద్ధానికి అనుకూలురుగా మారితేతప్ప గతవైభవాన్ని పునరుద్ధరించడం అసాధ్యం అనే వాదనే నేడుకూడా ప్రధానంగా వినిపించింది. అది ఎలాసాధ్యం అనేప్రశ్నకు మాత్రం అందరికీ అంగీకారమైన సమాధానం లభించలేదు. కాకతీయరాజైన ప్రతాపరుద్రుడు జైనమతాన్ని పాటించి, పోషిస్తున్నాడు. అటు కన్నడదేశంలోకూడా ఒకమేరకు జైనానికి ప్రజల్లోనూ, పాలకుల్లోనూకూడా ఆదరణఉన్నది. మరి బౌద్ధం విషయానికి వస్తే ఆమాత్రపు ఆదరణకూడా దుర్లభంగా ఉన్నది…..ఇలా నడిచింది చర్చ. చాలాసేపు మౌనంగా వింటూవచ్చిన దీపాంకరుడు గొంతుసవరించుకున్నాడు. అందరూ అతనికేసితిరిగారు – ఏం చెప్పబోతున్నాడా అని.

“నేను సాధువులతో బాటుగా తిరుగుప్రయాణంచేస్తూ గమనించాను. మొదట గాంగుల రాజైన అనంతవర్మ చోడగాంగు, ఆతరువాత ఓడ్ర రాజైన అనంగ భీమదేవుడు పూరీలో జగన్నాథస్వామి దేవాలయాన్ని నిర్మించి దానికొక ప్రాధాన్యతని కల్పించారు. అయితే జగన్నాథుడిమూలరూపం, మారుమూల ప్రాంతంలో కొండవాళ్ళు కొలుచుకొనే దేవతది. అలాగే మిగతాచోట్లకూడా కొత్తగా సామ్రాజ్యాలను స్థాపిస్తూన్న రాజులు స్థానికదేవుళ్లకు, కులదేవతలకు పెద్దపెద్ద దేవాలయాలు నిర్మించి ప్రాముఖ్యత ఏర్పరుస్తున్నారు. ఆయా దేవుళ్ళని స్వంతం చేసుకుంటున్నారు. వాళ్ళే తమ రాజవంశాలని కాపాడుతారని  నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. అంతేగాని బౌద్ధం వైపు దృష్టిసారించడం లేదు”.

దీపాంకరుడు చర్చలో పాల్గొంటున్నందుకు సంతోషిస్తూ భద్రపాలుడు అడిగాడు:

“అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి?”

“రాజులూ, రాజ్యాలూ శాశ్వతంగా ఉండిపోవు. మన దృష్టిని రాజ్యాధిపతులపైన కాకుండా సామాన్యప్రజలపైనే పెట్టాలి. సమాజపుకిందిపొరలను బౌద్ధధర్మంవైపు ఆకర్షితులను చెయ్యాలి. పైగా బౌద్ధంఅనేది, జ్ఞానమార్గంలో పయనించే తార్కికులకు, మేధావులకు, పండితులకు పరిమితమైన ధర్మమేగాని, సామాన్యులకు అందుబాటులో ఉండదనే భావన ఒకటి ప్రచారంలో ఉన్నది. ఒకవైపు తాత్విక అన్వేషణలను కొనసాగిస్తూనే మరోవైపు సామాన్యప్రజానీకాన్ని హేతుబద్ధమైన ధర్మపథంవైపు నడిపించాలి. ఇదే మనం చెయ్యవలసిన, చెయ్యగలిగిన ప్రయత్నం. ఫలితాలు మనకు ఇవాళ కనిపించకపోవచ్చు. ఎప్పుడో ఒకరోజున పామరులనుకొనేవాళ్ళే పెద్దసంఖ్యలో బౌద్ధధర్మపు విశిష్టతని గుర్తిస్తారు. అప్పుడే బౌద్ధం నిలబడుతుంది. అది ఎప్పుడు, ఎలా జరుగుతుందని అడిగితే నా వద్ద సమాధానంలేదు”.

“బాగాచెప్పావు. అజ్ఞానపుటంధకారాన్ని శాశ్వతంగా దూరంచేసేది బౌద్ధధర్మమే. ఇవాళ్టి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండవచ్చు. రాజపోషకుల ప్రాపకంకోసం దేబిరించడం మానుకొని ప్రజానీకాన్ని ధర్మపథంవైపు నడిపించే ప్రయత్నాలు కొనసాగించాలి. నాలందాలో పోగొట్టుకున్నగ్రంధాలని తిరిగిసేకరించాలి. ఇవేమనపై కాలం విధించిన కర్తవ్యాలు. దీపాంకరుడి ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నాను”. అన్నాడు భద్రపాలుడు. పెద్దలందరూకూడా తమ ఆమోదం తెలియజేసారు. ఆనాటి ప్రత్యేక సమావేశం ముగిసింది.

ఒక చర్చాంశంమాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. అరబ్బులూ, పారశీకుల్లాగే తురుష్కులు ఆచరించే ధర్మంకూడా మహమ్మదీయమేఅని అందరికీ తెలుసు. అరబ్బు, పారశీకదేశాల ఓడవర్తకుల రాకపోకలు, వారితో లావాదేవీలు అప్రాంతాల్లో అనాదిగా జరుగుతూనేవస్తూన్నవి. వాళ్లెప్పుడూకూడా ఈ తురుష్కుల్లా ప్రవర్తించిందిలేదు.  “ఎవరీ క్రూర మహమ్మదీయులు? నాలందాపైన ఎందుకు దాడిచేశారు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి చంపారు?” అన్న ప్రశ్నలకు మాత్రం ఆనాడు సమాధానం లభించలేదు.

***

కొండల్లో చిన్నగా చలి మొదలైంది; ఉదయాన్నా, సాయింత్రంపూటా విహారాన్ని పొగమంచు ఆవహిస్తున్నది; ఇండ్ల పైకప్పులనుండి నీలిరంగు పొగ కానవస్తున్నది. భద్రపాలుడూ, మరోఇద్దరు వృద్ధభిక్షువులూ, ఇద్దరు అంతేవాసులూ విహారంలో మిగిలారు. మిగతావాళ్ళంతా దేశాటనకు వెళ్ళిపోయారు. విహారనిర్వహణాబాధ్యత పూర్తిగా దీపాంకరుడిపైనే పడింది.  చీకటితోనేలేచి పంపానదీ తీరానికిపోయి స్నానంచేసి, నీళ్ళు పైకిమోసుకురావడం, విహారాన్నిఊడ్చి శుభ్రంచెయ్యడం,  భిక్షాటనకు పోయిరావడం వీటితో మొదలుపెట్టి అధ్యయనం, చర్చలు నిర్వహించడం, స్థానికులకు ఉపదేశాలు ఏర్పాటుచెయ్యడం వరకూ అన్నీ అతడే చేస్తున్నాడు.

రోజులు గడిచిపోతున్నాయి. అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ముఖ్యంగా నాలందాలో రెండేళ్ళపాటు అత్యుత్సాహంగా గడిపినదినాలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.  ఆ రెండేళ్ళలోనే ఎంతమందితో సావాసం చేశాడు? ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నాడు? అతనిప్పుడు ద్వైత, అద్వైత సిద్ధాంతాల గురించి, వాటి మధ్యగల తేడాలగురించి వివరణ ఇవ్వగలడు; నాగార్జునిబోధనలకు, ఆదిశంకరాచార్యుని ప్రవచనాలకు మధ్యగల సారూప్యాల్ని, అంతరాన్ని విశ్లేషించి చర్చించగలడు. పాళీగ్రంధాలను సునాయాసంగా పఠించి భాష్యం చెప్పగలడు. అయితే కొత్తగా ప్రోదిపడిన ఈ జ్ఞానభండారం విహారానికి తిరిగివచ్చాక అతనికి అక్కరకు రాలేదు – భద్రపాలునితో జరిపిన ఒకటీఅరా సంభాషణలను మినహాయిస్తే. అతనికి జ్ఞానాన్వేషణకు నూతనద్వారాలను తెరిచి, అనేక విషయాలపట్ల కనువిప్పు కలిగించిన ఆ మహత్తరమైనకాలం ఆకస్మికంగా అంతంకావడం, మళ్ళీ ఇక్కడికి చేరుకోవడం అతనికి ఒక వైఫల్యంలాగా, ఎదురుదెబ్బలాగా  అనిపించసాగాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అతని అసంతృప్తి మరింత తీవ్రం అవుతోందితప్ప మారినపరిస్థితుల్ని ఆమోదించగల సంయమనం ఏర్పడడం లేదు.

అసంతృప్తితో అల్లాడడం బౌద్ధభిక్షువైన తనకుతగదని దీపాంకరుడికి తెలుసు. గురువుగారైన భద్రపాలుడితో చర్చిద్దామనుకుంటూనే అలక్ష్యం చేస్తూవస్తున్నాడు. అందుకు కారణం ఒకటే. తన సమస్యని వివరించగలడుగానీ పరిష్కారం చర్చించేందుకు అతనివద్ద ఏ ఆలోచనాలేదు. అటువంటప్పుడు వయోభారంతోబాటుగా నాలందా విధ్వంసంకారణంగా కుంగిపోతున్న భద్రపాలుడిని వేధించడం ఇష్టంలేక ఊరుకున్నాడు.

చలికాలం కూడా అలాగే గడిచిపోయింది. వసంతఋతువు సమీపించింది. మామిడిపువ్వు వాసన, కోయిలల పలకరింపులు లోయల్ని ఆవరించాయి. అదేకాలంలో దీపాంకరుడికి ఊహించనివిధంగా ఒకఆధారం దొరికింది; అంధకారంలో ఆశాకిరణం వికసించింది. నాలందాలో బయల్దేరి ఉజ్జయని, ధాన్యకటకం (అమరావతి) మీదుగా ప్రయాణించి కళింగపట్నంరేవుకి వెళ్తూన్న ఇద్దరు సింహళభిక్షువుల ఆగమనంతో అతనిలో ఉత్సాహం పెల్లుబికింది. వారిలో పెద్దవాడు ఆచార్య శాంతిదేవుడు రెండోది అతని శిష్యుడైన గుణసేనుడు. వాళ్ళిద్దరూ సింహళద్వీపంలోని పొలోన్నరువ నగరమందున్న ఉత్తరారామం (గల్ విహార) నుండి వచ్చారు. ఇంకో విశేషమేమంటే వాళ్ళిద్దరూకూడా నాలందాలో దీపాంకరుడి సహాధ్యాయులే; బాగా పరిచయస్థులుకూడా. కళింగపట్నం మీదుగా తిరిగి తమదేశానికి పోదల్చుకున్న  ఆ భిక్షువులిద్దరినీ కొన్నాళ్లపాటు విహారంలో గడపమని దీపాంకరుడేకాక భద్రపాలుడుకూడా అభ్యర్ధించాడు. వారిసాంగత్యంమూలంగా దీపాంకరుడిలో వెల్లివిరుస్తున్న ఉత్సాహాన్ని గమనించిన భద్రపాలుడు వారిమజిలీ మరికొన్నాళ్ళు కొనసాగాలని కోరుకున్నాడు. అందుకు ఆ భిక్షువులు సంతోషంగా అంగీకరించారు.

వారితో పాళీ, సంస్కృత భాషల్లో జరిపిన సంభాషణల్లో నాలందావిధ్వంసం గురించి మరికొన్నివివరాలు తెలిసాయి. మూడు ప్రధాన గ్రంధాలయాలు తగులబెట్టబడినమాట వాస్తవమే. వందలకొద్దీ భిక్షువులను వధించడంకూడా నిజమే.  మరో దారుణం ఏమిటంటే – ఉద్దానపుర, విక్రమశిల, జగద్దల, సోమపుర మహావిహారాలపైనకూడా తురుష్కులు దాడులుచేసి సర్వనాశనం చేశారనే దుర్వార్త తెలియవచ్చింది.  ఇద్దరుసింహళ భిక్షువులలోనూ పెద్దవాడూ, ఎల్లప్పుడూ గంభీరంగాఉండే ఆచార్యుడూ అయిన శాంతిదేవుడు ఇలా అన్నాడు:

“విహారాలపైనా, దేవాలయాలపైనా దాడులుచేసి, అందినదంతా దోచుకోడంతో సరిపుచ్చుకొనే వారుకాదు ఈ తురుష్కులు. వీళ్ళకు ప్రభువైన మహమ్మద్ గోరీ అనే తురుష్కుడు తనకు సంతానంలేకపోవడంతో అతడు జయించిన రాజ్యాలను తన బానిసలకు అప్పగించాడు. ఉత్తరదేశం యావత్తూ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. నాలందా, తదితర విహారాలనూ, దేవాలయాలనూ ధ్వంసం చేసిందీ, కొల్లగొట్టిందీ అటువంటి బానిస సుల్తాన్లలో ఒకడైన బఖ్తియార్ ఖిల్జీ అనేవాడు. అందుచేత ఈ తురుష్కులు అక్రమించుకోవడానికీ, శాశ్వతంగా ఇక్కడేఉండి పరిపాలించడానికీ వచ్చారు తప్ప పూర్వం రోజుల్లోలా దాడులుచేసి, దోచుకొని పారిపోవడానికి కాదు. ఉత్తరభారతంలో వీరి ఆధిపత్యం స్థిరపడ్డాక దాడులు, ఆక్రమణలు దక్షిణదేశానికి కూడా విస్తరించకపోవు”.

శ్రద్ధగా వింటూన్న భద్రపాలుడు, దీపాంకరుడు హుతాశులైయ్యారు. భద్రపాలుడు నెమ్మదిగా అన్నాడు: “అయితే తథాగతుని గడ్డమీద బౌద్ధం నిలదొక్కుకొనే ఆశ ఇప్పట్లో ఇకలేనట్టే”.

శాంతిదేవుడు మౌనంగా ఉండిపోయాడు. దీపాంకరుడికి ఒకఆలోచన తోచింది.

“పోనీ ఈ తురుష్కుల్నే బౌద్ధానికి సానుభూతిపరులుగా మార్చగలిగితే…..?” అన్నాడు.

విషాదవదనుడైన శాంతిదేవుడు అన్నాడు, “అది అసాధ్యం. వాళ్లకు అర్థమయ్యేభాష సంగ్రామఘోష మాత్రమే; వాళ్ళకు తెలిసిందల్లా ఆయుధాలు, రణరంగం, దోపిడీ, ఊచకోత. అంతటి తథాగతుడుకూడా ఒకేఒక్క అంగుళీమాలుడిని సంస్కరించగలిగాడు. తురుష్కులదాకా ఎందుకు? కోసలరాజైన విరూధకుడు శాక్య గణరాజ్యాన్ని నాశనంచేసి, మొత్తం తథాగతుడి వంశీకులందర్నీ ఏనుగులతో కుమ్మించి మట్టుపెట్టినప్పుడు అతడు ఆ దుర్వార్తవిని మౌనంగా ఉండిపోయాడుతప్ప ఏమీ చెయ్యలేకపోయాడని మనకు తెలుసు”.

దీపాంకరుడు ఉండబట్టలేక, “తథాగతునికి తెలుసు; ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది” అనేశాడు, అస్వభావికమైన ఆవేశంతో.

శాంతిదేవుడు పరమశాంతంగా – “అవును. ఎప్పటికైనా….. ఇప్పుడు మాత్రం కాదు” అన్నాడు.

భద్రపాలుడు జోక్యంచేసుకున్నాడు. “ఇప్పుడు మనబోటి వాళ్ళం ఏంచేయాలి? దీనిమీద మొన్నటి ప్రతిమోక్షాసమావేశంలో పెద్దచర్చే జరిగింది. కాలచక్రదీక్ష పాటించి బౌద్ధులందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సరైన సమయంకోసం ఎదురుచూడాలా? ఎన్ని తరాలని ఎదురుచూస్తాం? అంతవరకూ మన ధర్మాన్ని, సంఘాన్ని, గ్రంధాలని, విహారాలనీ ఎవరు కాపాడుతారు? బోధనలని ఎవరు కొనసాగిస్తారు? దీపాంకరుడు మొన్న ఒక ప్రతిపాదన చేశాడు – రాజుల్నీ, చక్రవర్తుల్నీ సంస్కరించే ప్రయత్నం మానుకొని సామాన్యప్రజలమీదే దృష్టిపెట్టాలనీ, వాళ్ళే రేప్పొద్దున్న బౌద్ధాన్నినిలబెట్టగలరనన్నీ. ఇవాళ్టిచర్చ తరవాత దీపాంకరుడు చెప్పింది చాలా సబబుగా ఉందని మరీమరీ అనిపిస్తోంది. కానీ అది ఎలా సాధ్యం అనేదే ప్రశ్న”.

“నేనొక సూచన చేయదలచాను, భాదంతే” అన్నాడు శాంతిదేవుడు భద్రపాలుడిని ఉద్దేశించి.

“చెప్పండి, ఆచార్యా”

“దీపాంకరుడు మంచి ఆలోచన చేశాడు. అతని శ్రద్ధాసక్తుల్ని, నియమనిష్టల్ని నాలందాలో ఉండగానే – నేనేకాదు – చాలామంది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్నికాపాడి నిలబెట్టగలిగినవాళ్ళల్లో దీపాంకరుడు ఒకడు. అతను కోరుకుంటూన్నట్టుగా సామాన్యప్రజానీకపు నిత్యజీవనంలో బౌద్ధంఅనేది మీప్రాంతాల్లో ఎప్పుడూ ఒక భాగంగా లేదు. అదే మాదేశంలో అయితే బౌద్ధధర్మమే సర్వవ్యాపితంగా ప్రకాశిస్తున్నది; తరతరాలుగా మా ప్రజల దైనందిన జీవనంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. దీపాంకరుడుగనక మాదేశం వస్తే అతను కలలుకంటూన్న భవిష్యత్తుని కళ్ళారాచూడగలడు. అంతేకాదు, మీరిక్కడ అనుసరిస్తూన్న థేరవాదబౌద్ధానికి మాదేశంలో రాజవంశపోషణ, సమర్థన ఉన్నాయి. అందుచేత నేను కోరేదేమంటే దీపాంకరుడిని మాతోబాటు పొలోన్నరువలోని ఉత్తరారామానికి పంపించండి. అక్కడ రెండు, మూడేళ్ళు ఉన్నట్టయితే అక్కడి పద్ధతులను, ఆచరణను స్వయంగా పరిశీలిస్తాడు; తెలుసుకుంటాడు. అంతేకాదు, నాలందాలో మధ్యలో ఆగిపోయిన అధ్యయనాన్ని కొనసాగిస్తూనే మావిహారంలో అధ్యాపకునిగా పనిచేస్తాడు. నాలందాస్థాయిలో సింహళదేశంలోకూడా ఒక బోధనాకేంద్రాన్ని నిర్మించాలనేది మా ప్రభువుల ఆశయం. నన్ను నాలందా పంపిందికూడా అక్కడి పద్ధతులను అధ్యయనం చేయడానికే. ఇప్పుడది ధ్వంసం అయిపోయింది గనక మరింత శ్రద్ధగా, పట్టుదలగా, త్వరితగతిన అటువంటి కేంద్రాల్ని నిర్మించుకోవాలి”.

ఆచార్యశాంతిదేవుని సూచనపై చాలాసేపే చర్చజరిగింది. భద్రపాలుడు కొంత అయిష్టంగానూ, దీపాంకరుడు చాలా ఉత్సాహంగానూ ఆసూచనకు అంగీకరించారు. దీపాంకరుడిని వెంటబెట్టుకొని ఇద్దరుసింహళభిక్షువులూ కళింగపట్నం సమీపంలోని శాలివాటిక విహారంలో కొన్నాళ్లపాటు బసచెయ్యడానికీ, సింహళదేశానికి బయలుదేరే మొట్టమొదటి ఓడనుఎక్కి సముద్రప్రయాణం చెయ్యడానికీ నిర్ణయం తీసుకున్నారు.

 

(రెండో భాగం -వచ్చే వారం )

—ఉణుదుర్తి సుధాకర్

 

మాటల్లో నిశ్శబ్దం

 

painting: Rafi Haque

painting: Rafi Haque

 

 

బరువుగా ఘనీభవించిన బండనిశ్శబ్దం ఒకటి

చాటుగా పేరుకున్న రహస్యం –

అది దూదిపింజల్లా గాలికెగిరినవాళ్ళకే తెలిసొస్తుంది

తేలికపాటి జల్లులు సుతారంగా కురిసినప్పుడల్లా.

 

పోనీ, అలాగని –

దాన్ని పెళ్ళగించి బహిరంగంగా దొర్లించడం అంటే

రక్తసిక్త రాకాసి చీకటిని ముందుగా మొహమ్మీదకి తెచ్చుకోవడమే కదా!

అయినా ఇప్పుడేం తొందర?

 

తీరం వెంబడే మెరిసిన

స్ఫటిక రాత్రుళ్ళ నక్షత్రాలు మిలమిలా తొడుక్కున్న గొడుగుకింద

వొట్టి పాదాలను తాకే ఇసుకవేడి గరగరని

ఆస్వాదిస్తూ ఇంకాసేపు కలిసినడుద్దాం నాలుగడుగులు – ఊరికే.

 

మూకం కరోతి వాచాలం,

మాటల్లో దొర్లేను నిశ్శబ్దం.

 

*

 

 

కొంచెం గెడ్దపునురగ, ఒక కత్తి గాటు..

 

 

-ఉణుదుర్తి సుధాకర్

~

 

Sudhakar_Marine Linkసుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. అప్పట్లో వాటిని మంగలి షాపులనే అనేవాళ్ళు. అలా అనడం సరైన రాజకీయ పరిభాషాప్రయోగం కాదనే అవగాహన ఇంకా ఏర్పడలేదు. బార్బర్, హెయిర్ డ్రేసర్, సెలూన్, బుటీక్, పార్లర్  – ఈ మాటలు లేవు. క్షౌరశాల అని బోర్డుమీద రాయడమే గానీ పలికిన వాడు లేడు. మంగలి భూలోకం పెద్దకొడుకు వైకుంఠానికి చదువు అబ్బలేదు. స్కూలు తెరిచే కాలంలో కాసే నేరేడుపళ్ళతో మొదలుపెట్టి, రేగుపళ్ళూ, ఉసిరికాయలూ, సీతాఫలాలూ, చెరుకుగడలూ,  ఫైనల్ పరీక్షలనాటికి మామిడికాయలూ – ఇవికాక  ఏడుపెంకులాట, జురాబాలు, గోలీలాట, జీడిపిక్కలాట వీటన్నిటి మధ్య ఏర్పడ్డ దొమ్మీలో పదోతరగతి పరీక్ష చెట్టెక్కిపోయింది. చదివింది చాల్లే అని వాళ్ళ నాన్న తనకి సాయంగా దుకాణానికి రమ్మన్నాడు.

మొదట ఓ ఆరునెలలు – కత్తిరించగా కిందపడిన వెంట్రుకలు ఊడవడం, గెడ్డం చేయడానికి సరంజామా సిద్ధంచేసి ఉంచడం, మంచినీళ్ళ కూజా మోసుకురావడం, మొహాలమీద నీళ్ళు చిలకరించే సీసాలు నింపిపెడుతూండడం, తోలుపట్టీ మీద కత్తుల్ని సానపట్టడం, మధ్యమధ్య  శిల్లావెంకన్న హోటల్ కి పరుగెత్తి ఫ్లాస్కులో టీలు, విస్తరాకుల్లో కట్టిన కరకర పూరీలు, వాటికి తోడుగా బొంబాయికూర తెచ్చిపెట్టడం (ఎవరూ చూడనప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మిల కేలెండర్ల వైపు దృష్టిసారించడం, షాపు అంతటాఉన్న అద్దాలముందు జుత్తు పరపరా దువ్వి ‘సైడుపోజులో హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం), ఇవన్నీచేసి తండ్రి దగ్గర మన్ననలు, ఇతర బర్బరులనుండి గుర్తింపు పొందాడు.

ఇన్నాళ్ళూ అనవసరంగా స్కూలికి వెళ్ళి ఎందుకు దెబ్బలు తిన్నానా అని బాధ పడుతూనే ఆ దుర్దినాలకు శాశ్వతంగా స్వస్తి పలికినందుకు మురిసిపోయాడు. తండ్రి పర్యవేక్షణలో పదహారేళ్ళకే కత్తి చేతపట్టి  రంగంలోకి దూకాడు. ప్రయోగాత్మకంగా పేద గిరాకీల గెడ్డాలు ఎడాపెడా గీయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత రక్తపాతం జరిగింది. స్ఫటిక వాడకం పెరిగిపోయింది. డెట్టాలు, పలాస్త్రీల అవసరం కలిగింది. షాపులో ఊదొత్తుల సువాసనలకు బదులు ఆస్పత్రివాసన పెరగడంతో తండ్రి భూలోకం ఉద్రిక్తతకు లోనయ్యాడు. అయితే మరికొద్ది వారాల్లోనే వైకుంఠానికి అహింసామార్గం దొరికిపోయింది. కాస్త పొడుగూపొట్టీ అయినా జుత్తు కత్తిరించడం కూడా పట్టుబడింది. కొడుకు ప్రయోజకుడై అందివచ్చినందుకు తండ్రి ఆనందానికి అవధులు లేవు.

అన్నయ్య వైకుంఠం తమ వృత్తిరంగంలో రోజురోజుకీ ఎదిగిపోతూ తన అనుభవాల్నీ, విజయాల్నీ వివరించినప్పుడల్లా కైలసానికి దిగులు కలగసాగింది. చదువులో ఉంచి తండ్రి తనకి తీరని అన్యాయం చేసాడని మరీమరీ అనిపించసాగింది. చిక్కల్లా ఒక్కటే. కైలాసానికి చదువు బ్రహ్మాండంగా వస్తోంది. పెద్ద ప్రయత్నం లేకుండానే మంచి మార్కులు వస్తున్నాయి. చిన్నకొడుకు గవర్నమెంటు ఆఫీసరు అవుతాడనే భూలోకం నమ్మకం ప్రతీ ఏడూ మరింత బలపడుతోంది. క్షవరం చేయించుకోవడానికి వచ్చే మాస్టార్లందరూ కైలాసాన్ని పెద్ద చదువులు చదివించమనే అంటారు. కైలాసం ఇంగ్లీషులో కాస్త వెనకబడ్డా, తెలుగు పద్యాలు చదివేడంటే మాత్రం పెద్దపంతులుగారు కూడా డంగైపోతారు. కొత్తగా వచ్చిన లెక్కలమాస్టారు మధుసూదనంగారైతే జీతం తీసుకోకుండా ప్రైవేటు చెప్పి తన సబ్జెక్టులో ఫస్టుమార్కు వచ్చేలా చేసాడు. అంతేకాక రెన్ అండ్ మార్టిన్ లోంచి ఎక్సెర్సైజులు చేయించి ఇంగ్లీషంటే భయం లేకుండాచేసాడు. ‘ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ’ అంటే గనక అది ముమ్మాటికీ  తప్పే అనిన్నీ, ‘ఐ ప్రిఫర్ కాఫీ టు టీ’ అన్నదే కరెక్ట్ అనీ కైలాసం ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆక్టివ్ వాయిస్ లో ‘రామా కిల్డ్ రావణా’ అని ఉంటే అది పాసివ్ లో ‘రావణా వాస్ కిల్డ్ బై రామా’ అవుతుందని తెలుసుకున్నాడు. మొదటే తెలుగు బాగా వచ్చి ఉండడంవల్ల ఇంగ్లీషు తొందరగా పట్టుబడింది.  ఇప్పుడు సెలవుచీటీ ఇంగ్లీషులో రాయగలడు. నిజానికి వీపీపీ ద్వారా పుస్తకాలు పంపిచమని కొంతమంది విజయవాడ పబ్లిషర్స్ కి కూడా ఇంగ్లీషులోనే రాశాడు. ఆయా పుస్తకాలు టంచన్ గా వచ్చేశాయి కూడా.

మధుసూదనం మాస్టారింటికి ట్యూషన్ కి వెళ్ళినప్పుడు ఆయన వద్దనున్న తెలుగు, ఇంగ్లీషు పుస్తకభండారాన్ని చూసి కైలాసం అదిరిపోయాడు. చాలా తెలుగు పుస్తకాలు, కొద్దిపాటి ఇంగ్లీషు పుస్తకాలు తెచ్చుకొని చదివేశాడు. కొన్ని బోధపడ్డాయి; కొన్ని పడలేదు. కాని అవి అతనికి ఒక కొత్త ప్రపంచానికి దారి చూపించాయి.  ఆగష్టు పదిహేను నాడు జరిగిన తెలుగు వ్యాసరచన పోటీలో స్కూలు మొత్తానికి మొదటి బహుమతిగా గాంధీగారి ఆత్మకథ చేతికి రావడంతో కైలాసంలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇన్ని సాధిస్తున్నప్పటికీ అసలు మజా అంతా అన్నకే దక్కుతున్నదని అతని ఆక్రోశం మాత్రం అలాగే మిగిలిపోయింది. పోరగాపోరగా పదకొండో తరగతి సెలవరోజుల్లో దుకాణానికి వచ్చి పని నేర్చుకోవడానికి తండ్రి అయిష్టంగా అంగీకరించాడు. అయితే మరుసటేడు – అంటే పన్నెండో తరగతిలో మాత్రం చదువు తప్ప మరో వ్యాపకం ఉండరాదని షరతు పెట్టాడు. కైలాసం ఉత్సాహంగా దుకాణంలో అడుగుపెట్టాడు.

 

మొదట్లో తమ్ముడి మీద పెత్తనం చెయ్యాలని వైకుంఠం చాలా ప్రయత్నించాడుగాని అది అట్టేకాలం సాగలేదు. గెడ్డాలు చేయడంలో ఇద్దరికిద్దరూ సరిసమానం అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. షాపు తమదే అన్న ధీమా తలకెక్కింది. ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. వాళ్ళు మోసుకొచ్చే వార్తల్లో వాళ్లకి ఆసక్తి పెరిగిపోయింది.  క్షౌరశాల అంటే నేటి భాషలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫాం, పేస్ బుక్, ట్విట్టర్.  వినగావినగా అన్నదమ్ములిద్దరికీ ఒక కొత్త సంగతి బోధపడింది. చుట్టుపక్క ప్రాంతాల్లో నక్సలైట్లు అనబడే వాళ్ళు సంచరిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారుగాని వాళ్ళు పట్టుబడడం లేదు. వాళ్ళు పరమ కిరాతకులని కొందరూ డబ్బున్న వాళ్ళని దోచుకొని పేదలకి పంచిపెడతారని కొందరూ అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఈ నక్సలైట్లంటే ఊళ్ళోఉన్న వ్యాపారులంతా హడిలిచస్తున్నారు. వీళ్ళకీ సంగతులు తెలుస్తున్న రోజుల్లోనే పాటలు పాడుకుంటూ ఒక ఎర్రజెండా బృందం షాపు ముందుకొచ్చి నిలబడింది. వాళ్ళేవో కేకలు వేశారు, కరపత్రాలు పంచారు, చందాలు అడిగారు. భూలోకం ఐదురూపాయిలిచ్చి పంపించేశాడు. ‘అదుగో, వాళ్ళే నక్సలైట్లు’ అన్నారెవరో. అన్నదమ్ములిద్దరూ కరపత్రం శ్రద్ధగా చదివారు.

సరిగ్గా అప్పుడే వైకుంఠం బుర్రలో ఆ ఆలోచన పుట్టింది. సెలవురోజున అంటే మంగళవారంనాడు షాపులో ఒక్కడూ కూర్చొని  కరపత్రంలోని భాషని వాడుకుంటూ, వాక్యాల్ని అటూఇటూ తిప్పి ఊరికల్లా పెద్ద కిరాణా వ్యాపారి సుంకాల కాశీనాథాన్ని సంబోధిస్తూ ఒక బెదిరింపు లేఖ తయారుచేశాడు. “ఖబడ్దార్! ప్రజా శత్రువులారా! ఎర్రసేన కదిలింది! మీ అంతు చూస్తుంది!” కరపత్రంలోని ఈ వాక్యంతో తన లేఖలోని ఆఖరి పేరాని ముగించి చివరిగా తన సొంత కవిత్వం చేర్చాడు: “మంగళవారం నాడు సాయింత్రం ఆరో గంటకల్లా జగద్ధాత్రి గుడి ఎదురుగా ఉన్న బంద పక్కన మర్రిచెట్టు మొదట్లో పదివేల రూపాయిలు ఒక బాగ్ లో పెట్టి వెళ్ళాలి”. ఎందుకేనా మంచిదని మరో వాక్యం చేర్చాడు “లేకపోతే ఎర్రసేన నిన్నూ నీ కుటుంబాన్నీ సర్వనాశనం చేస్తుంది ”. “ఇట్లు, కామ్రేడ్ జిల్లా నాయకుడు” అని ముగించాడు. పదివేలు చేతిలోపడితే మద్రాసువెళ్లి సినీమాల్లో హీరో అవ్వాలని వైకుంఠానికి మహా దురదగా ఉంది.

సుంకాల కాశీనాథం లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ కి పరుగెత్తాడు. ఉత్తరం చదవగానే అది నకిలీదని పోలీసులకి అర్థం అయిపోయింది. వలవేసి వైకుంఠాన్ని పట్టుకొని నాలుగు తగల్నిచ్చి వెనకాతల ఇంకెవరూలేరని తేల్చుకున్నారు. కొడుకుని విడిపించడానికి భూలోకం కులపెద్దల సహాయం కోరితే వాళ్ళు చేతులెత్తేశారు; ఇది మామూలు తగువు కాదన్నారు. మరో మార్గంలేక సబ్ ఇన్స్పెక్టర్ సూర్యారావు కాళ్ళమీద పడ్డాడు. ‘ఊరికే వదిలేస్తామా?’ అన్నాడు సూర్యారావు. ఏమీ  ఇచ్చుకోలేనని భూలోకం మొర. ఇప్పుడంటే నక్సలైట్లని పట్టుకోలేక నానా పాట్లూ పడుతున్నాడుగాని, బుల్లెట్ మోటార్ సైకిల్ మీద బడబడమని తన రాజ్యమంతటా యదేచ్ఛగా పర్యటించే సూర్యారావంటే ఊళ్ళో అందరికీ భయమే. ‘పోలీసాఫీసరంటే అలా ఉండాలి’ అన్న వాళ్ళూ ఉన్నారు. అతని ఠీవిని చూసి మురిసిపోయే వాళ్ళల్లో ముఖ్యుడు సుంకాల కాశీనాథం. కానీ వైకుంఠంకేసులో ఇద్దరికీ కొంచెం తేడావచ్చింది. తగిన శిక్ష వెయ్యకుండా నేరస్తుడిని విడిచిపెట్టడం ధర్మవిరుద్ధం, ఇలాంటి అల్లరచిల్లరగాళ్ళే రేప్పొద్దున్న నిజం నక్సలైట్లు అవుతారు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని కాశీనాధం పట్టుబట్టాడు. ‘మీకెందుకు సార్? నేను చూసుకుంటాను, నాకొదిలెయ్యండి. పోలీసుడిపార్టుమెంటు ఉన్నదెందుకు?’ అన్నాడు ఇన్స్పెక్టర్.

అన్నట్టుగానే రేపు విదిచిపెడతారనగా ముందురోజురాత్రి రైఫిల్ బట్ తో బలంగా మోది వైకుంఠం కుడిచెయ్యి విరగ్గొట్టాడు – ‘రేప్పొద్దున్న తుపాకీ పట్టుకోవాలనుకున్నా నీవల్ల కాదురా’ అంటూ. ‘మీవాడు బాత్రూంలో జారిపడి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు’ అని భూలోకానికి అప్పజేప్పేడు.  విరిగిన చెయ్యి అతుక్కుందిగాని వంకర ఉండిపోయింది. ఇప్పుడు వైకుంఠం ఫుల్ హ్యాండ్ చొక్కాలే వేసుకుంటాడు. అవిటి చేత్తో కటింగ్ చేస్తాడు గాని మునపటి జోరు లేదు. ‘హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం మానేశాడు.

***

కొడుకులిద్దర్నీ షాపులో ఉంచి భూలోకం భోజనానికి వెళ్ళాడు. షాపంతా ఖాళీ. బయట ఎండ మండిపోతోంది. ఎదురుగుండా మెడికల్ షాపులో కూడా ఓనరుతప్ప ఎవరూ లేరు. రోడ్డుమీద అలికిడి తగ్గిపోయింది. మధుసూదనం మాస్టారి దగ్గర తీసుకొచ్చి అద్దం వెనకాతల దాచిన పుస్తకం తీసి చదవుతున్నాడు కైలాసం. కూజాలోని చల్లటి నీటిని చేతిలోకి తీసుకొని మొహమ్మీద కొట్టుకున్నాడు వైకుంఠం. సరిగ్గా అప్పుడే బుల్లెట్ బడబడ వినబడింది. శబ్దం దగ్గరవుతోంది. పుస్తకంలోంచి చటుక్కున తలెత్తి అన్నకేసి చూశాడు కైలాసం. ‘ఇక్కడికే వస్తున్నాడా?’ అన్నట్టు చూశాడు వైకుంఠం. శబ్దం బాగా దగ్గర్నించి వినిపిస్తోంది; గుమ్మం ముందుకొచ్చి ఆగిపోయింది. పెరటి గుమ్మంలోంచి వైకుంఠం జారుకున్నాడు. చదువుతున్న పుస్తకాన్ని గభాలున అద్దం వెనక పడేశాడు కైలాసం.

లోపలి వస్తూనే, “ఏరా, ఎవరూ లేరా?” అన్నాడు ఇన్స్పెక్టర్ సూర్యా రావు.

“నాన్న, అన్న భోజనానికి వెళ్ళారు”

పిస్తోలుతో ఉన్న తోలు పటకా, బులెట్ లతో ఉన్న క్రాస్ బెల్టునీ విప్పేసి ఒక ఖాళీ కుర్చీ మీద పడేశాడు.

“ఎప్పుడొచ్చినా మీ అన్న కనబడ్డు. ఏంటి సంగతి? మళ్ళా ఏమైనా వేషాలేస్తున్నాడా?”

georgia

“అలాటిది ఏమీ లేదు సార్”

“గెడ్డం చెయ్యడం చేతనవునా?” కుర్చీలో కూర్చుంటూ.

“కిందటిసారి నేనే కద సార్ చేసింది?” అని టేబిల్ ఫ్యాన్ ఆన్ చేశాడు.

నాలుగు రోజుల గెడ్డం. నక్సలైట్ల వేటలో నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడని సోషల్ మీడియా ద్వారా కైలాసానికి తెలుసు.

“నీకు తెలిసిందా? రాత్రి ముగ్గుర్ని లేపేశాం”

ముగ్గురు నక్సలైట్లని మొన్న పట్టుకొని నిన్న రాత్రే చంపారని, వాళ్ళల్లో ఇద్దరు నాయకులున్నారనీ అరవ వైర్లెస్ ఆపరేటర్ పొద్దున్న గెడ్డం చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాడు. తెలుగు రాకపోవడం వలన అంతకు మించి చెప్పలేకపోయాడు.

పరుగెత్తుకెళ్ళి మధుసూదనం మేష్టారికి ఈ సంగతి తెలియజేస్తే ఆయన వెంటనే మార్చురీకి బయిల్దేరాడు.

“తెలీదు సార్” అంటూ గుడ్డ కప్పి బొందులు ముడేశాడు.

నీళ్ళు చిలకరించే సీసా తీసి ఇన్స్పెక్టర్ మొహంమీద నీళ్ళు కొట్టాడు. తుడిచి మళ్ళీ కొట్టాడు. సూర్యారావు రిలాక్సైపోయాడు.

బ్రష్ తో సబ్బు బాగా కలిపాడు. బాగా నురగ వచ్చాక గెడ్డానికి అద్దాడు. గెడ్డం మీద బ్రష్ ఆడుతోంది. నురగ గెడ్డం అంతటా వ్యాపిస్తోంది. సబ్బు వాసన షాపులో అలముకుంది.

“మీసం ముట్టుకోకు…. మీసం సంగతి నేను చూసుకుంటాను”. కిందటి సారీ ఇదే మాటన్నాడు.

“అలాగే సార్”

బేరాల్లేక అన్నదమ్ములిద్దరూ పొద్దుట్నించీ అదేపనిగా కత్తులకు సానపెట్టారు. అవన్నీ ఇప్పుడు మహావాడిగా మెరిసిపోతున్నాయి. అన్నిట్లోకీ వాడిగా ఉన్న కత్తిని ఎంచుకున్నాడు కైలాసం. బొటనవేలు మీద నెమ్మదిగా నొక్కి చూశాడు.

‘నా సామి రంగా, ధారు అదిరిపోయింది’ అనుకున్నాడు.

“వచ్చే నెల నుంచీ మన ఊళ్ళో కూడా స్పెషల్ పోలీస్ కేంపు పెడుతున్నారు. వీళ్ళ ఆటలు ఇంక సాగవు”.

కొత్తవిషయం తెలిసింది. ఈ సంగతిని నమోదు చేసుకున్నాడు. మేష్టారికి చెప్పాలి.

తోలు పట్టీ మీద కత్తిని ఇంకా సాన పడుతూ కొత్తలో తండ్రి భూలోకం నేర్పిన పాఠాలు గుర్తు చేసుకున్నాడు.

“ఒరేయ్, కత్తి ధారుగా ఉంటేనే అది మన మాట వింటుంది. ఎంత మొండి గెడ్డమైనా లొంగిపోతుంది. కాని గెడ్డం చేసేవాడు మూడే మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. చర్మాన్ని సాగదీసి కత్తికి దారి చూపించాలి. కత్తిని కిందకి లాగాలి. ఎగ్గొరగ కూడదు. అందుకే ‘మంగలాడెంత మంచోడైనా ఎగ్గొరిగితే మంటే’ అన్నారు. తేలిగ్గా లాగి చివర్లో తేల్చాలి. లోపలికి  నొక్క కూడదు. తేల్చు. అద్గదీ, అలా తేల్చు”.

ఎడమ బొటన వేలుతో చర్మాన్ని లాగి పట్టి, దారిచేసి, కుడి చేత్తో కత్తిని నడిపిస్తున్నాడు. తండ్రి చెప్పినట్టే కత్తి మహాసున్నితంగా తన పని చేసుకుంటూ పోతోంది.‘ఇప్పుడు గాని కత్తి కిందకి దించి గొంతుకమీద ఒక్క నొక్కు నొక్కేనంటేనా! వీడి పని అయిపోతుంది. ఇవాళ నా చేతిలో చస్తాడు’ అనుకున్నాడు.

షట్టర్ మూసిన శబ్దం. ఎదురుగుండా మెడికల్ షాపు కోమటాయన ఇం’టికి వెళ్ళిపోతున్నాడు. సాయింత్రం అయిదైతేగాని రాడు. గడియారంలో రెండవుతోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కైలాసానికి చెమటలు పడుతున్నాయి. గుండె కొట్టుకోవడం వినిపిస్తోంది.

పెదవికింద కత్తి లాగుతున్నాడు. మీసానికి అటూ, ఇటూ. పైన కూడా.

“మీ నాన్న కన్నా నువ్వే బాగా చేస్తున్నావు రా”

“అదేం లేదు సార్”

ఫైనల్ గా ఎక్కడా గరుకు మిగలకుండా మొత్తంగా కత్తి లాగుతున్నాడు. గొంతుక దగ్గర ఒక్క క్షణం కత్తి నిలిచి పోయింది, దానంతట అదే. మళ్ళీ కదిలింది.

ఆలోచనలు ముందుకి పరుగెడుతున్నాయి. వీడ్ని చంపితే మాత్రం ఏమొస్తుంది? ఊరంతా ఈ వార్త గుప్పుమంటుంది. నెలయ్యాక అంతా మర్చిపోతారు. మరో ఇన్స్పెక్టర్ వస్తాడు. నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.  పదేళ్లో, ఇరవై ఏళ్లో శిక్ష పడుతుంది. ఒట్టి పిరికిపంద, గెడ్డంచేస్తూ చంపేసాడు అంటారు కొందరు. విప్లవకారుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడని కొందరనవచ్చు. మధుసూదనం మేష్టారు ఏమంటారో?

“తొందరగా కానీ, స్టేషన్ కి వెళ్ళాలి” అని ఇన్స్పెక్టర్ అనడంతో ఉలిక్కి పడి నిలుపుచేసాడు. నున్నగా మెరిసిపోతోంది గెడ్డం. ఎక్కడా ఒక్క గాటు గాని రక్తపు ఛాయలు గాని లేవు. ఈ పనితనం తండ్రి చూస్తే సంతోషించే వాడు. ఇన్స్పెక్టర్ మొహాన్ని తడిచేసి,  తువ్వాలుతో తుడిచి, పైన వేసిన గుడ్డ విప్పి తీసేసాడు. ఇప్పుడింక సబ్బు మరకలు కూడా లేవు.

పిస్తోలుబెల్టు, తూటాలపటకా తగిలించుకుంటూ, ఇన్స్పెక్టర్ అన్నాడు: “మనుషుల్ని చంపడం అంత తేలికేమీ కాదు. కసి ఒక్కటే సరిపోదు. నిర్దాక్షిణ్యంగా ఉండాలి. మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మాదగ్గర నేర్చుకుంటున్నారు. ఇంకా చాలా కాలం పడుతుంది”.

కైలాసం నిర్ఘాంతపోయాడు. గొంతుక ఆర్చుకు పోయింది. నోరు పెగల్లేదు. చెవుల్లోంచి ఆవిర్లు. పది రూపాయిలు చేతిలో పెట్టి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్.

‘మీ వాళ్ళు అన్నాడు….అంటే?… తెలిసిపోయిందా?’ కైలాసం బుర్ర పనిచెయ్యడం లేదు. మోటార్ సైకిల్ బయిల్దేరింది. పెద్ద బజారు మీదుగా చర్చి పక్కన పోలీస్ స్టేషన్ దారిలోకి మళ్లే వరకూ బడబడ వినిపిస్తూనే ఉంది.

[కొలంబియన్ రచయత హెర్నాండో తెల్లెజ్ (1908-1966) రాసిన సుప్రసిద్ధ కథ ‘Just Lather, That’s All’ అందిచ్చిన ప్రేరణతో, కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా – రచయత].

 

 

ఒక వీడ్కోలు సాయింత్రం

Art: Srujan Raj

Art: Srujan Raj

ఉణుదుర్తి సుధాకర్

~

Sudhakar_Marine Linkజాన్ ఇంకా రాలేదు; చెన్నపట్నం మీదుగా స్టీమర్ లో ఇంగ్లండు తిరుగుప్రయాణానికి సర్దుకోవలసిన సామాన్లూ, చేయ్యాల్సిన ఏర్పాట్లూ ఇంకా చాలా ఉన్నాయనీ, అందుచేత ఆ రోజు సాయింత్రం ఏడుగంటలకిగానీ క్లబ్బుకి చేరుకోలేననీ ముందుగానే చెప్పాడు. ఎర్రమట్టి దిబ్బల మీద పరుచుకున్న కోరమాండల్ క్లబ్బు దొరలందరికీ స్థానిక జలాశయం. కేవలం దొరలకీ,  రాజాలకీ, జమీందార్లకే కాకుండా తగినస్థాయి కలిగిన ఇతర స్థానికులకు కూడా ప్రవేశం కల్పించవచ్చని క్లబ్బుయాజమాన్యం – తీవ్రమైన అభ్యంతరాల్ని తోసిపుచ్చి – ఇటీవలే తీర్మానించింది.

క్లబ్బులాన్స్ లో కూర్చుంటే సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది; మంద్రంగా వినిపిస్తుంది. కెన్ క్లబ్బుకి చేరేటప్పటికి పడమటి ఆకాశం బాగా ఎర్రబడింది. తూర్పువైపు నుండి సముద్రపుగాలి బలంగా వీస్తోంది – చల్లగా, కాస్తంత ఉప్పగా – మధ్యాహ్నం పూట వేధించిన వేడినీ, ఉక్కనీ మృదువుగా  మరపింపజేస్తూ. క్లబ్బు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్ల మీద బంగారు ఎండ తేనెరంగులోకి మారుతోంది. దూరంగా తీరంవెంట సరుగుడుతోటల వెనక ఇసుకతిన్నెలు ఎర్రగా మెరుస్తున్నాయి. వాటికి నేపధ్యంగా గాఢనీలంలోంచి ఊదారంగుకి మారిన సముద్రం.

‘ఇప్పుడు బాగానే ఉందిగాని చీకటి పడ్డాక దోమలబాధ తప్పదు’ అనుకుంటూ లాన్స్ లోకి నడిచాడు కెన్. తెల్లటి గుడ్డలు పరచిన గుండ్రటి టేకు మేజాలు; వాటిచుట్టూ నాలుగేసి లేతాకుపచ్చ రంగువేసిన పేము కుర్చీలు.  కుర్చీలన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయి.  కాసేపట్లో సందడి మొదలౌతుంది. పేకాటరాయుళ్ళు, పీకలదాకా తాగేవాళ్ళు భవనంలోపలే కూర్చుంటారుగనక లాన్స్ లో కాస్త ప్రశాంతంగానే ఉంటుంది.  కుర్చీలన్నీ దాటుకుంటూ వెళ్లి ఒక మూల కూర్చున్నాడు కెన్  – ‘ఇక్కడైతే చీకట్లో ఎక్కువమందికి కనిపించం’ అనుకుంటూ. ఇది జాన్ కి తను వ్యక్తిగతంగా ఇస్తూన్న వీడ్కోలువిందు. ఇంకెవర్నీ పిలవలేదు. పదింటికల్లా ముగించి బంగళాలకు బయిల్దేరాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాగా, ఎర్రకోటూ, నీలం కమర్బంద్ ధరించిన బేరర్ పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి సాయిబుల పద్ధతిలో సలాం చేసాడు.

“సింహాచలం! కైసా హై?” ఎన్నాళ్ళయినా కెన్ కి తెలుగు పట్టుబడలేదుగాని హిందుస్తానీతో నెట్టుకుపోగలడు. నేటివ్స్ తో కాస్త సఖ్యంగా ఉంటే వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారని ముప్ఫై ఏళ్ల ఇండియన్ సర్వీసు చివరి దశలో అతను గ్రహించాడు. ఈ గ్రహింపు వెనుక జాన్ ప్రభావం చాలానే ఉంది. అలాగని వాళ్ళని నెత్తికెక్కించుకోకూడదు – ఇది మాత్రం ముందే తెలుసు.

కెన్ దొరంతటి వాడు తనని పేరుపెట్టి పిలిచినందుకు సంతోషం పట్టలేక పోయాడు సింహాచలం.  “అచ్ఛా హూ, సార్. క్యా లేంగే సార్” అన్నాడు.

అందాకా తనకో బీరు, జాన్ రాగానే షాంపేన్, ఆవెంటనే విస్కీ ఆర్డరు చేసాడు. దోమలురాకుండా ధూపం వెలిగించమన్నాడు. సింహాచలం పరుగుతీసాడు.  జాన్ దొర వొస్తున్నాడంటే అతనిలో ఉత్సాహం ఉప్పొంగింది. ఎప్పుడో గాని రాడు; వొచ్చినప్పుడల్లా అర్థరూపాయికి తక్కువ కాకుండా బక్షీష్ ఇస్తాడు మరి. తెలుగు ఒక మాదిరిగానైనా మాట్లాడే దొర జాన్ ఒక్కడే.

Kadha-Saranga-2-300x268

పొగాకు దాచి మడత పెట్టిన తోలు సంచీ, పైపూ కోటుజేబులోంచి తీసి టేబుల్ మీద పరిచి పైపులో పొగాకు కూరడం మొదలు పెట్టాడు కెన్. ఇండియాలో ఉన్న ముప్ఫై ఏళ్లల్లో చాలామందికి స్వాగతాలు పలికాడు;  వీడ్కోళ్ళు చెప్పాడు. వచ్చేవాళ్ళు సవాలక్ష సందేహాలతో జంకుతూ వస్తారు. వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పొంగిన చాతీలతో, బరువైన డబ్బు సంచులతో వెళతారు. ఇంగ్లాండు తిరిగివెళ్ళి పోతున్నామనే ఉత్సాహం, ఇండియాను వీడిపోతున్న దిగులుని అధిగమిస్తుంది. భార్యలైతే మరీను. ఎగిరి గంతేసి వెళ్ళిపోతారు. ఇంగ్లండులో  నౌకర్లు ఉండరనేదొక్కటే వాళ్ళకు దిగులు కలిగించే విషయం.  జాన్ భార్యా, పిల్లలూ ఆరు నెలల క్రిందటే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రయాణం కడుతున్నప్పుడు –

“ఏ విషయంలో ఇండియాని మీరు మిస్ అవుతారు?” అని కెన్ అడిగితే, జాన్ పిల్లలిద్దరూ తడుముకోకుండా – “మామిడిపళ్ళు” అని టపీమని జవాబు చెప్పారు. అప్పుడు వాళ్ళని చూస్తే కెన్ కి ముచ్చటేసింది. ఇప్పుడు తలుచుకుంటూంటే – తనకి భార్యా, పిల్లలూ లేకపోవడం గుర్తుకొచ్చి బాధ కలిగిస్తోంది. అసలు తను ఇండియా వచ్చినప్పుడే ఐదు, పదేళ్లకన్నా ఎక్కువ ఉండననుకున్నాడు. అలాటిది తనకన్నా తరవాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు; వెళ్ళిపోతున్నారు.

పాతికేళ్ళ సర్వీసు దాటాక ‘ఇక్కడేం తక్కువ? చిన్నజమీందారు లాగా బతుకుతున్నాను. ఇప్పుడు ఇంగ్లాండు వెళ్లి మాత్రం ఏం ఊడపొడవాలి?’  అన్న ఆలోచన బలపడింది. బంగాళా చుట్టూ పెంచిన తోటన్నా, తనని విడిచి ఉండలేని కుక్కలన్నా అమితమైన ప్రేమ ఏర్పరచుకున్నాడు. ఒక ఆంగ్లో-ఇండియన్ టీచర్ దగ్గరైంది. ఇంకేం కావాలి? కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి.  ఎంతమంది వెళ్ళిపోయినా ఏమంత అనిపించలేదు గానీ  జాన్ వెళ్ళిపోతాడంటే మనసుకి కష్టంగా ఉంది.

సింహాచలం గ్లాసులో పోసిన బీరు గుక్కెడు తాగి, గ్లాసు కిందపెట్టి  పైపు వెలిగించాడు. చీకటవుతోంది. గాస్ దీపాలు వెలిగించారు. దోమలింకా రాలేదు. ధూపం పనిచేస్తున్నట్టుంది. పాతికేళ్ళు ఇంగ్లండులోనూ, ముప్ఫైఏళ్ళు ఇండియాలోనూ గడిపాడు. ఏది తన దేశం? ఇక్కడే పోతే ఏ వాల్తేరు సెమెట్రీ లోనో పాతిపెడతారు. ఎక్కడయితేనేం? చివరికి మట్టిలో కలిసిపోవడమే కదా?…ఛ ఛ…ఎందుకిలా ఆలోచిస్తున్నాడు?

Art: Srujan Raj

తను ఇలా దిగాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు  తన అంతులేని ఉత్సాహంతో, సునిశితమైన హాస్యంతో జాన్ తనని పైకిలాగాడు? జాన్ కి ఆసక్తిలేని విషయమేదీ లేదనిపిస్తుంది. ఎన్నో విషయాల గురించి మాట్లాడతాడు. తెగ చదువుతాడు. ఏవేవో కొత్త వార్తలు, సంగతులు చెబుతూనే ఉంటాడు. అలాగని ఎవరిగురించీ చెడ్డగా చెప్పడు.   టెన్నిస్, క్రికెట్ ఆడతాడు. మంచి కార్యదక్షుడిగా పేరుపొందాడు. అతనికింకా పదేళ్ళు సర్వీసుంది. అనుకోకుండా లండన్ లోని  ఇండియా ఆఫీసులో ఉపకార్యదర్శిగా చేరమని ఉత్తర్వు వచ్చింది. అంటే రిటైరయ్యే నాటికి చాలా పెద్ద పొజిషన్ లోకి వస్తాడు. అలాంటి అరుదైన స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు.

పైపు ఆరిపోయింది. కోటు లోపలి జేబులోంచి గొలుసు గడియారం తీసి చూసాడు. ఏడు దాటింది. కొన్ని టేబుళ్ల చుట్టూ జనం చేరారు. పకపకా నవ్వులు వినిపిస్తున్నాయి. దోమలు కుడుతున్నాయి. కెన్ కి చిరాగ్గా ఉంది. ఆరిన పైపుని టేబిల్ మీద విదిలించి కొట్టాడు. బూడిద బయటకొచ్చి తెల్లటి టేబిల్ క్లాత్ ని పాడుచేసింది. అతని చిరాకు ఇంకా ఎక్కువైంది. అటుగా వెళ్తున్న ఒక బేరర్ ని కసిరినట్టుగా పిలిచి మరో బీరు తీసుకురమ్మన్నాడు. సేవకుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జాన్ నేర్పిన పాఠాలు రెండుగ్లాసుల బీరుతో ఎటో ఎగిరిపోయాయి.

ఈరోజు అతనికెందుకో జెన్నిఫర్ జ్ఞాపకం వస్తోంది. ఇరవై ఏళ్ల కిందటి మాట. లేక ఇంకా ఎక్కువే అయిందా? ఇప్పుడు తగ్గిపోయిందిగాని అప్పట్లో ప్రతీ ఏడూ చలికాలపు రోజుల్లో, అంటే క్రిస్టమస్ సెలవుల్లో పెళ్లికొడుకుల్ని వెతుక్కుంటూ ఇంగ్లండు నుండి యువతుల బృందాలు  తరలివచ్చేవి. వాళ్ళని ‘గేలం యువతులు’ అనే వాళ్ళు.  కలకత్తా, బొంబాయి, డిల్లీ, సిమ్లా – ఈ ప్రదేశాలన్నీ చుట్టబెట్టే వాళ్ళు. కొన్ని గేలాలకి చేపలు పడేవి; లేదంటే సరదాగా సెలవులు గడిపేసి ఎండలు ముదిరేలోగా తిరిగివెళ్ళిపోయేవారు. జెన్నిఫర్ కూడా అలాగే వచ్చింది. ఇక్కడే, ఈ క్లబ్బులోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్థరాత్రి వరకూ సంగీతం, డాన్సులు, నవ్వులు, కేరింతలు – అదంతా ఓ కలలా అనిపిస్తోంది. అదే రోజున ప్రపోజ్ చేద్దామనుకుంటూ ఎందుకో జంకాడు. చేసి ఉంటే ఎలా ఉండేదో? వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఉందని అందరూ అనుకున్నారు.

ఆమె  జాన్ కి కజిన్. వాళ్ళింట్లోనే దిగింది. వేసవిలో తనని లండన్ రమ్మంది, ఉత్తరాలు రాస్తానంది. ఎందుకోగాని మనసు మార్చుకుంది. తను రాసిన ఉత్తరాలకి జవాబివ్వలేదు. ముడిపడుతున్న బంధాన్ని చేతులారా ఎందుకు తెంచింది? జాన్ ని అడుగుదామని చాలా సార్లు అనుకున్నాడు గాని, తీరా అడిగితే ఏ చేదునిజం చెబుతాడో అని ఊరుకున్నాడు. ఆమె నవ్వినప్పుడు బుగ్గమీద పడే సొట్ట, న్యూ ఇయర్ పార్టీ నాడు ఆమె వేసుకున్న ఎర్ర ముఖమల్ గౌను, అదే ఎరుపు లిప్ స్టిక్,  మెడలో మెరిసే ముత్యాల పేట – కళ్ళకి కట్టినట్టుగా గుర్తొస్తున్నాయి. మర్చిపోయినవి అనుకున్న సంగతులు మస్తిష్కపు మారు మూలల్లో దాగి ఉంటాయి కాబోలు; ఎప్పుడెప్పుడో ఉబికి వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా కొత్తకొత్త రంగులు పులుముకొని మరీ వస్తాయి. గతానికి వర్తమానం  చేసే అలంకరణ అది. జెన్నిఫర్ ఇప్పుడెలా ఉందో? ఒకేఒక సారి మాటల సందర్భంలో జాన్  ఆమె ప్రసక్తి  తీసుకొచ్చాడు – పెళ్లి చేసుకొని గ్లాస్గోలో స్థిరపడిందని చెప్పాడు.

చీకట్లో ఎట్నుంచి ఊడిపడ్డాడోగాని, “సారీ, ఆలస్యం అయింది” అంటూ చటుక్కునవచ్చి కూర్చున్నాడు జాన్, తన ఉత్సాహభరితమైన చిరునవ్వుతో.

“ఏడుకే క్లబ్బుకి చేరాను గాని రిసెప్షన్ దగ్గర ఎప్పట్నించో కలవాలనుకుంటున్న ఒక ప్రముఖ వ్యక్తిని ఒకాయన పరిచయం చేశాడు. నాలుగు ముక్కలు మాట్లాడే సరికి ఆలస్యం అయింది”

“ఎవరా వ్యక్తి?”

“మనం ఎప్పటినుంచో వింటూన్న పేరే. సర్ ఆర్థర్”

“ఆ!? సర్ ఆర్థర్ కాటనే?!”

“ఆహా, ఆయనే!”

“ఏమంటాడు?”

“టూకీగా చెబుతాను. బ్రిటీష్ పాలనకు గుర్తుగా చిరకాలం మిగిలిపోయే ఉత్తమచిహ్నాల గురించి సంభాషణ సాగుతోంది. సీనియర్ రైల్వే అధికారి ఒకాయన – శాశ్వతంగా ఈ దేశంలో నిలిచిపోయేది భారతీయ రైల్వేవ్యవస్థ మాత్రమే అన్నాడు”.

Calcutta Club_Bearer

“అలా అంటే కాటన్ మహాశయుడు ఒప్పుకోడే?”

“అవును మరి. జవాబుగా సర్ ఆర్థర్ – రైల్వేల మీద పెడుతున్న ఖర్చులో పదోవంతు నీటి పారుదల, జలరవాణాల మీద పెడితే ఇంకా గొప్ప ప్రయోజనాలను ఈదేశస్తులు పొందిఉండేవారన్నాడు. ఈ దేశపు అపార జలసంపదని సద్వినియోగంచేసి లక్షలమందిని కరువులనుండి ఎలా శాశ్వతంగా విముక్తులను చెయ్యవచ్చో చెప్పాడు. రైల్వేలు అవసరమేగాని పంటభూములకు నీరు అందించడం పాలకుల మొదటి కర్తవ్యం అన్నాడు. భారతదేశపాలకులు ప్రాచీనకాలం నుండీ  ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూవస్తున్నారన్నాడు”.

“ఇదే అతని వాదన, ఎప్పట్నించో” అన్నాడు కెన్.

“ఈరోజున తన వాదనని హేతుబద్ధంగానే కాకుండా భావోద్వేగంతో కూడా వినిపింప జేశాడు. తక్షణ లాభనష్టాల బేరీజు కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రాణాల్ని కాపాడడం ముఖ్యం అన్నాడు. ఈ దృష్టి లేకపోతే భగవంతుడు పాలకులను క్షమించడన్నాడు. అతనికి హృదయానికి చాలా దగ్గరగా ఉండే ప్రతిపాదన – ఈ దేశపు నదుల్ని అనుసంధించే పథకం గురించి చెప్పాడు. ముసలాడి ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది”.

“పదవీ విరమణ చేసి ఇంగ్లండు వెళ్లిపోయాడని విన్నాను?”

“నిజమే. ప్రభుత్వంవారి పిలుపుమీద సలహాదారుడిగా ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. కుంఫిణీ పాలన ముగిసి ప్రత్యక్ష బ్రిటీష్ ప్రభుత్వ పాలన ఏర్పడింది గనక, ఇటువంటి నిపుణుల సలహాలతో ఇకమీదట పెద్దపెద్ద పథకాలు అమలు కాబోతున్నాయనే ఆశాభావం పెరుగుతోంది”.

“ఈరోజున సర్ ఆర్థర్ వస్తున్నట్టు క్లబ్బువాళ్ళు ముందుగా చెప్పలేదే? ఒట్టి పనికిమాలిన సజ్జు” అన్నాడు కెన్ చిరాగ్గా.

“టౌన్ హాల్లో ఆయనకి సన్మానం జరిగింది. ఆ విషయం నాకూ తెలుసుగాని వెళ్ళడం కుదరలేదు. నీక్కూడా ఆహ్వానం వచ్చి ఉండాలే? డిన్నర్ కని ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. నేను కలిసినప్పటికే  భోజనాలు ముగించి బయిల్దేరిపోతున్నారు”.

సర్ ఆర్థర్లాంటి మహానుభావుడిని కలుసుకొనే అవకాశం చేజారిపోయినందుకు కెన్ మనసు అసంతృప్తి తో నిండి పోయింది. అది గ్రహించిన జాన్ –

“ఇంకా కొన్నాళ్ళు ఉంటాడులే. విశాఖపట్నం పోర్టు పథకం ముందుకెళ్ళేటట్టుగా ఉంది. దానికి మరి ఈయనే ఆద్యుడు కదా. ఇరవై ఏళ్ల కిందట సర్ ఆర్థర్ ఇక్కడే యారాడ కొండమీద కుటుంబంతో సహా రెండేళ్లున్నాడు – నువ్వు వినే ఉంటావు. అప్పుడే పోర్టు నిర్మాణానికి ప్రతిపాదన చేసాడుగాని నిదులులేక కుంఫిణీ అధికారులు దాన్ని పక్కన పెట్టారు”.

“బ్రిటిష్ పాలనకు గుర్తులు అన్నావు. అంటే మనం ఇక్కడినుంచి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చునంటావా?” ఈ ఊహకందని పరిణామం కెన్ ని కంగారుపెట్టింది. తన కుక్కలూ, బంగళా, తోటా, సహచరీ గ్యాపకం వచ్చాయి – అదే క్రమంలో .

“ఇప్పట్లో కాదులే. నువ్వూనేనూ ఆ రోజు చూడం గాని ఎప్పుడో వస్తుంది. తప్పదు”.

కెన్ కాస్త ఊపిరి పీల్చుకుని, “ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం! ఊహకే అందడం లేదు” అన్నాడు.

సింహాచలం వచ్చి షాంపేన్ సీసాని కెన్ కి అందజేశాడు. పొగాకు బూడిదని తుడిచి, వైన్ గ్లాసుల్ని, వేయించిన చేప ముక్కల్నీ  టేబిల్ మీద సర్దివెళ్ళిపోయాడు. కెన్ స్వయంగా బిరడా తీసి, ఇద్దరి గ్లాసుల్లోనూ పోసాడు.

“ఛీర్స్! భారతదేశంలో నీ అద్భుత అనుభవాల్ని  గుర్తుచేసుకుంటూ, ఇంగ్లండులో మరిన్ని విజయాల్ని సాధించాలని కోరుకుంటూ –“

ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. బీరు, షాంపేన్, విస్కీ కలగలిసిపోయి కెన్ లోలోపల గందరగోళం సృష్టిస్తున్నాయి. దూరంగా సముద్రపు హోరు. ‘మనం ఇక్కడ లేకపోవడం’ అన్న ఆలోచనే అతనికి ఇబ్బందికరంగా, చిరాగ్గా ఉంది.

“మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఎందుకనుకుంటున్నావు, జాన్?”

“1857లో ఏమైందో చూశాం. చావుతప్పి కన్నులొట్ట పోయింది. కేవలం లాభార్జన కోసం ఏర్పడ్డ కుంఫిణీ మాదిరిగా కాకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవరించవలసిన రోజులొచ్చాయి. లేకపోతే ఇక్కడ మనం కొనసాగడానికి జనామోదం ఉండబోదు. వాళ్ళు తిరగబడితే మనం చెయ్యగలిగేది ఏమీలేదు. ఈ మధ్య ఇంగ్లీషు చదువులు, ముఖ్యంగా ఇంగ్లండువెళ్లి చదువుకొని తిరిగిరావడం ఎక్కువైంది. వాళ్ళంతా ఎక్కువగా మధ్యతరగతి, లేదా ఉన్నతవర్గ, అగ్రవర్ణ లాయర్లు, ఉపాధ్యాయులు; ఇంగ్లీషు చక్కగా మాట్లేడే వాళ్ళు, రాసే వాళ్ళూను. మనకి అత్యంత ప్రమాదకరమైన సమూహం ఇదే”.

కొంతమంది నేటివ్ లాయర్లు, ఉపాధ్యాయులు ఒక మూల గుమిగూడి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు మంతనాలు చేస్తున్నారని ఊహించుకుంటే కెన్ కి నవ్వొచ్చింది. ఈ మాటన్నది జాన్ గనక నవ్వకుండా విన్నాడు.

“వీళ్ళ నాయకత్వంలోనే రాబోయే కాలపు తిరుగుబాట్లు పుట్టుకొస్తాయి. సిపాయిల్లోంచి కాదు. వీళ్ళని ఎదుర్కోవడానికి కొత్త ఎత్తుగడలు అవసరం. వాళ్ళకన్నా తొందరగా నేర్చుకుంటేతప్ప వాళ్ళని ఎదుర్కోలేం”.

“పాతిక ముప్ఫై ఏళ్లనుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ దేశాన్ని నియంత్రిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకొనేదేముంది?”

Art: Srujan Raj

“ఇక్కడికి వచ్చే అధికారులకు కుంఫిణీ వారు ఇస్తూవచ్చిన తర్ఫీదు ఇంకెంతమాత్రమూ సరిపోదనన్నీ, ఇండియన్ సివిల్ సర్వీస్ అనే కొత్త విభాగాన్ని ఏర్పరచాలని 1858లో తీసుకున్న నిర్ణయాన్ని హుటాహుటిన అమలు చేస్తున్నారు.  ఈ కొత్త కాడర్ ని నిర్మించేందుకూ, మరోవైపు  గూఢచార వ్యవస్థని పటిష్టం చేసేందుకూ చాలామందిని దిల్లీలోనూ, లండన్ లోనూ కొన్ని  ప్రత్యేక విభాగాల్లో నియమిస్తున్నారు. ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యతలు కూడా ఇలాంటివే”.

ఒక్క క్షణంలో కెన్ కి మొత్తం అంతా అర్థమైపోయింది. కాని ఒక సందేహం అతన్ని పీడిస్తోంది.

“మనం లేకపోతే ఈ దేశం ముప్ఫైమూడు చెక్కలవుతుంది” అన్నాడు– కొంచెం అలకతో కూడిన స్వరంతో.

“నిజమే. మన పాలనలేకపోతే  ఈ దేశపు లోలోపలి సంఘర్షణలు, వాటితోబాటు మధ్యయుగ అవలక్షణాలు బయటపడతాయి. రైల్వేలు, టేలిగ్రఫీ, విద్యా, న్యాయవ్యవస్థలు – ఇవే దీర్ఘకాలిక ప్రగతికి మనం ఏర్పరచిన మార్గాలు.  గమ్మత్తేమిటంటే ఇవే రేప్పొద్దున్న మన పీకలకు చుట్టుకుంటాయి”.

కెన్ కిక్కు కొంచెం దిగింది. ఆసక్తిగా వింటున్నాడు. సింహాచలం ఆఖరి రౌండు విస్కీ, సలాడ్, చికెన్ బిరియానీ తీసుకొచ్చి పేర్చాడు.

“ఈ మధ్య ఒక నివేదిక చదివాను. దాంట్లో ఒక పాత్రికేయుడు – పేరు గుర్తు రావడం లేదు – 1857నాటి సంఘటనల గురించి రాస్తూ ‘తిరుగుబాటు విఫలమైందిగాని బ్రిటిష్ వారు ప్రవేశపెడుతూన్న రైల్వేలే వారి కొంపముంచుతాయి. అన్ని కులాలవాళ్ళూ రైళ్లల్లో కలసికట్టుగా ప్రయాణిస్తారు. క్రమేపీ వారిమధ్య విభేదాలు తొలగిపోతాయి’ – ఈ ధోరణిలో.  విడ్డూరంగా అనిపించినా దీంట్లో కొంత నిజం ఉంది”.

కెన్ ఇక తమాయించుకోలేక పోయాడు. “రైళ్లల్లో ప్రయాణిస్తే కుల వ్యవస్థ అంతం కావడమేమిటి? ఎవడా రాసింది?”

“ఎవరో  జర్మన్ అనుకుంటా. మొదటిసారిగా మనం ఈ దేశపు ప్రజలు, ప్రాంతాలు చేరువకాగల అవకాశాల్ని సృష్టించామన్నది మాత్రం వాస్తవం”.

“ఇదంతా సరేగాని జాన్, మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తావు?” అనడిగాడు కెన్ – సంభాషణని మరో దిశలోకి మళ్లిస్తూ.

“ఏమో? ప్రభుత్వంవారు పంపితేనే”.

“ఈ దేశం వదిలి వెళ్ళాలంటే నీకేమనిపిస్తోంది?”

“నేనిక్కడికి వచ్చినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. బంగాళాఖాతం,  అరేబియన్ సముద్రం, హిందూమహాసముద్రం, హిమాలయా పర్వతాలు, గంగానది, వారణాసి, పాటలీపుత్రం, కపిలవస్తు, మలబార్, కోరమాండల్ – ఈ పేర్లలోనే గొప్ప చరిత్ర, సాహసకృత్యాలు, రొమాన్సు దాగి ఉన్నట్లు అనిపించేది. ఇప్పటికీ ఆ భావన అలాగే ఉంది. మా అబ్బాయి ఈ మధ్య రాసిన ఉత్తరంలో ఒక మంచి మాటన్నాడు. ఒక దేశం పేరున ఉన్న ఏకైక మహాసముద్రం  ఇండియన్ ఓషన్ అని. నిజమే కదా అనిపించింది”.

“ఇప్పుడేమనిపిస్తోంది?”

“ఇప్పుడా? భారతదేశంలో ఇన్నాళ్ళు పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశం అనిపిస్తోంది. ఇది నా జీవితకాలపు గొప్ప అనుభవం. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడి ప్రజలకోసం చెయ్యగలిగిన మంచిపనులేమైనా చెయ్యాలనేదే నా కోరిక. ఇవాళ అనుకోకుండా సర్ ఆర్థర్ ని కలుసుకున్నాక ఇలాగని మరీబలంగా అనిపిస్తున్నది. నేనీ క్లబ్బుకి వచ్చిన ఆఖరిరోజున ఆయన తటస్థపడడం దైవసంకల్పం కావచ్చు”.

కాసేపు మౌనంగా బిరియానీ తిన్నారు. భావోద్వేగంతో మాట్లాడడం జాన్ పద్ధతి కాదు. ఈ రోజు మాత్రం అతనిలో ఎక్కడో దాగిన ఉద్వేగ స్వరాలు వినిపించాయి కెన్ చెవులకి.

జాన్ కి కూడా అలా అనిపించిందేమో. “నేనిక బయిల్దేరాలి” అని ఏకపక్షంగా, ముక్తసరిగా ప్రకటించి లేచి నిటారుగా నిలబడ్డాడు. అర్థరాత్రి అయితేగాని కెన్ క్లబ్బు నుండి కదలడని జాన్ కి తెలుసు.  అయిష్టంగానే కెన్ కూడా లేచాడు; లేవగానే ఒకింత తూలాడు. కుర్చీని పట్టుకొని సంభాళించుకుని అడుగు ముందుకేసాడు. క్లబ్బు గేటువైపు నడుస్తున్నారు. నిండు పున్నమి వెన్నెల. పాదాలక్రింద ఎండుపుల్లలు విరుగుతున్నాయి.

సింహాచలం పరుగెత్తుకుంటూ వచ్చాడు. “దొరగారు పైపు మర్చిపోయారు” అని కెన్ కి అందజేశాడు. “గుడ్ నైట్ సార్” అన్నాడు వంగి సలాం చేస్తూ. జాన్ ఒక వెండి జడ రూపాయి – విక్టోరియా రాణి బొమ్మ ఉన్నది – సింహాచలం చేతిలో పెట్టాడు. అతను సలాంచేసి వెళ్ళిపోయాడు.

స్నేహితులిద్దరూ ముందుకి నడిచారు. కీచురాళ్ళ రొద; వాటి వెనుక తరంగ ఘోష. రెండు కెరటాల మధ్య కొద్దిక్షణాల ఉద్రిక్త నిశ్శబ్దం. ఆ తరవాత మళ్ళీ కెరటం విరిగిన సంరంభం.

“నేనొకటి అడుగుతాను, చెబుతావా?” అన్నాడు కెన్.

“అడుగు”.

“జెన్నిఫర్ ఎందుకు మనసు మార్చుకుంది? నీకేమైనా చెప్పిందా?”.

“నేనే ఆమెకు చెప్పాను. మీ ఇద్దరికీ జోడీ కుదరదని. నాకలా అనిపించింది మరి – అప్పట్లో”.

కెన్ ఇంకేమీ అనలేదు. గేటు సమీపించారు. వీళ్ళ రాకని గమనించిన జట్కాగుర్రం తలాడించి సకిలించింది. జట్కాసాయిబు ఉలిక్కిపడి నిద్రలేచాడు.

(వివరణలు: ఆర్థర్ కాటన్ 1860లో పదవీవిరమణచేసి ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం కోరికపై 1863లో తిరిగివచ్చి సుమారు ఏడాదిపాటు  ఉన్నాడు గాని ఆ వ్యవధిలో మళ్ళీ విశాఖపట్నం వచ్చిన దాఖలాలు లేవు. 1863లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరే అర్హతను సాధించిన మొదటి భారతీయుడు – రవీంద్రనాథ్ టాగోర్ అన్నగారైన సత్యేంద్రనాథ్ టాగోర్. రెండవ వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రొమేష్ చంద్ర దత్. మూడవది బ్రహ్మోసమాజ్ లో చేరిన బిహారిలాల్ గుప్తా.  నాలగవ వ్యక్తి  సురేంద్రనాథ్ బెనర్జీ. బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి భారతీయ సభ్యుడు, సెకండ్ ఇంటర్నేషనల్ సభ్యుడైన దాదాభాయి నౌరోజీ భారతదేశపు అభివృద్ది విషయమై – 1899 వరకూ ఇంగ్లండులో జీవించిన కాటన్ ని  అనేకసార్లు సంప్రదించాడు, ఆయనతో సహకరించాడు. అన్నట్టు – ఈ కథలో జాన్ మర్చిపోయిన జర్మన్ పాత్రికేయుని పేరు కారల్ మార్క్స్).

*