రాజ్యమా ఉలికిపడకు

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

యే దిక్కునుండో
నోట్లు రాలుతున్న శబ్దం

కన్నీళ్లు
కరెన్సీనోట్ల ముందు
మంచుగడ్డలై మౌనం వహిస్తుతుంటే
కుబుసం విడిచిన రాజ్యం
కొత్త నవ్వులు నవ్వుతుంది

గుండెల్లో
లాండ్మైనింగ్ జరుగుతున్నట్టు
కరెన్సీ నోట్ల బాంబులు

అక్కడో సగటు మనిషి
తలగడ కింద నోట్లతో
శూన్యంలోకి చూస్తూ
తిరగబడ్డ ఆకాశానికి
శాపనార్థాల రాళ్లు విసురుతున్నాడు

ఆశలని మోసిన భుజాలు
ATM ల ముందు
కనబడని శిలువతో కూలబడుతుంటే
అచ్చేదిన్ స్టాంపును వీపులపై ముద్రిస్తూ
కాషాయపు చువ్వలు

రాజ్యమా ఉలికిపడకు
నీ వోటే అది కళ్లు పెద్దవి చేసిచూడు

యే దిక్కునుండో
నోట్లు రాలుతున్న శబ్దం
కాళ్లు భూమిలో దిగబడుతుంటే
వినిపిస్తున్న దేశభక్తిగీతం.

*

చీకటిదే మతం?

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

ఉదయమే ఇంటర్వ్యూ  కి వెళ్ళాలి. వెళ్ళగలనా ? ఈ  చీకటి , ఈ నిద్రలేని  రాత్రులు ఇలా  అలవాటైపోయాక అనుకున్న సమయానికి  నిద్రలేవగలనా ? మళ్ళీ నన్ను వెతుక్కునే పనిలో పడాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అహ అస్సలు చూడకూడదు.

ఎంత  బాగుంటుంది  చీకటి. ప్రశాంతంగా. పొగలూదుతూ కాఫీ తాగే చంద్రున్ని వేల ప్రశ్నలు అడుగుతూ నేను ఓ కాఫీ కలుపుని నాలుగో అంతస్తులో ఉంటున్న మా  ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఆకాశంకేసి చూస్తూ తాగడం. ఇవన్నీ ఇవన్నీ నేను బ్రతికున్నాను, బ్రతుకుతున్నాను అన్న సూచనలే.

ఏదో  ఆలోచిస్తుంటాను. ఏదో రాద్దాం అనుకుంటాను. ఎవరెవరి జీవితాలో కళ్ళముందుకి వచ్చి అసంపూర్ణ కథలు చెప్పి వెళుతుంటే వాళ్ళ వంక దీనంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాను. ఎవరు వీళ్ళంతా . వీళ్ళ మానసిక వేదనలేంటి.

ఏమో ఇవ్వాలెందుకో ఆ పిల్ల బాగా గుర్తొస్తుంది. అందరికన్నా ముందే బైబిల్ పట్టుకుని చక చక చర్చికి వచ్చే పిల్ల. అందరికన్నా ముందే నన్ను సండేస్కూల్ లో పలకరించడానికి వచ్చే పిల్ల. కంఠతా పట్టేసిన ఆ రోజుటి వాక్యాన్ని గబగబా అప్పగించే పిల్ల. బాగా గుర్తొస్తుంది.

పోయినేడే కదూ ఆ అమ్మాయి క్రిస్మస్ కి చర్చ లో స్పెషల్ సాంగ్ పాడింది. అందరూ మెచ్చుకున్నారు. వాళ్ళమ్మ నాన్నలకైతే ఎంత సంతోషమేసేదో ఆ రమ్య  పాడుతూ , బైబుల్ వాక్యం చదువుతుంటే.

చిన్నప్పుడు వాళ్ళను చూస్తే నాకు సందేహం కలిగేది. తెలిసో తెలియకో మా నాన్నను ఒక రోజు అడిగేసా. మన ముక్కుల్లా వాళ్ళ ముక్కులెందుకు లేవు అని. ఏం చెప్పాలి ఈ పిల్లకి అనుకున్నాడో ఏమో  మా నాన్న కొంచెం సేపు తటపటాయించి చెప్పాడు. ఆ అంకుల్ వాళ్ళది ఇక్కడ కాదు వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు. అని అప్పటి వరకు నాకు అందరి ముక్కులూ ఒక్కలా వుండవు అన్న విషయమే తెలియదు. కాని రమ్యకి ఆ ముక్కుతో ఏ సంభంధం లేదు. ఎంత చక్కగా వుండేది. తెల్లగా , బుగ్గలేసుకొని. “స “ మామూలుగా పలకడానికి రాక. పై పల్లకి నాలుక ఆనించి స అన్నప్పుడు సండేస్కూల్ లో పిల్లలు కుళ్ళుతో ఏడ్పించే వాళ్ళు కాని అందరికీ  తెలుసు. బైబుల్ మెమరీ వర్సస్ చెప్పాలంటే అందరూ రమ్య తరవాతే అని . చదువులో కూడా అంతే ఫస్ట్ కదా. అందుకే బాసర ట్రిపుల్ ఐటీ  లో సీట్ సంపాదించింది.

ఇప్పటి వరకూ ఇంటర్వ్యూ గురించి ఎంత ప్రిపేర్ అవ్వాలో అయ్యాను. గూగుల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఏ ప్రశ్నైనా అడుగు టపీ మని సమాధానం చెప్పేయదు. రాత్రి ఒంటిగంట అవుతుంది ఇప్పుడు . రాసుకునే అన్ని రాసుకుని, నేర్చుకునే అంత నేర్చుకుని రేపటి కోసం చూస్తున్నా .

నాకే నిద్దర ఎందుకు రాదో అర్ధం కాదు. ఈ రాత్రి పూట బయటకొచ్చి ఖాళీగా ఉన్న ఇంటి ముందు నడుస్తూ రేలింగ్ దగ్గర నిల్చుని చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతున్న ఇళ్ళ మధ్య గుండా ఎన్నో కలలు వీధుల్లో లేసర్ షో వేస్తున్నట్టు కనిపిస్తుంటాయి నాకు. నిద్దర పట్టకపోతే కీబోర్డ్ మీద వేళ్ళు ఊరుకోవు. బుర్రలో ఆలోచనలు ఊరుకోవు. ఎవరెవరో గుర్తొస్తూ ఆలోచనల్లోకి బలవంతంగా ప్రవేశిస్తారు.

ఆ రమ్య సంగతేంటి చెప్పమంటార. ఏముంది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నట్టుంది కదా ఆ పిల్ల రమ్య ఇల్లొదిలి పారిపోయి. అవును ఎనిమిదో తొమ్మిదో నెలలు అవుతుంది. ఆ పిల్ల ఇల్లొదిలి వెళ్ళినప్పుడు చర్చిలోని సంఘస్తులంతా ఒకటే చెవులు కొరుక్కున్నారు. బాగయ్యింది అని. ఎందుకో మరి వాళ్లకు ఆ సంభరం. తను  వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మా నాయన్ని ఎవరెవరు ఎలా మాట్లాడారో తెలుసో లేదో ఆ పిల్లకి . ఎలా తెలుస్తుంది. ఆ పిల్లుండే స్థలానికి వీళ్ళు వెళ్ళలేరు. వెళ్లి చూడడానికేమో వీళ్ళకు ఇష్టం కలగడం లేదు.

ఇంతకు ఎవరైనా మత విశ్వాసాలను అంత తొందరగా ఎలా మార్చుకుంటారు. ఏ నమ్మకాన్నైనా వెంటనే ఎవరం మార్చుకోలెం కదా. ఆ మార్పు వెనక ఎప్పటినుంచో వెంటాడే సమయం వుంటుంది. అది ఒక నెలో , మూడు, నాలుగు, ఆరు నెలలో, లేదా సంవత్సరమో  రెండు సంవత్సరాలో.

రమ్య తన విశ్వాసాన్ని మార్చుకోడానికి ఎన్ని రోజులు పట్టిందో. అందరూ ఆ పిల్ల అమ్మా నాన్నలను పొడవడమే. ఎవడినో ప్రేమించి వుంటుంది. లేకపోతే అలా ఎలా మతం మార్చుకుని , చెప్పా పెట్ట కుండా ఇంట్లోంచి వెళుతుంది అని. ఆ పిల్ల మతం మార్చుకోవడం కన్నా ఎవడినో ప్రేమించే మార్చుకుంది అన్న మాటలు వాళ్ళను ఇంకా బాధించి వుంటాయి.

వాళ్ళు మూడు నెలల వరకు చర్చికి రావడమే మానేశారు. జనాలకు మాట్లాడుకోడానికి ఆ మసాల దొరికింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రకంగా కుదిరితే అలా కథలు అల్లుకోవడం మొదలు పెట్టారు. నా వరకూ వచ్చాయి. వినే ఓపిక లేదనిపించింది. ఎందుకో నేను సరిగ్గా నా మత విశ్వాసాన్ని ఆ అమ్మాయి వరకు చేరవేయడం లో విఫలమైయ్యానేమో. లేక ఆ అమ్మాయికి నేను అవలంభిస్తున్న మతం, సిద్ధాంతాలకన్నా తాను మారిన మతంలో ఏ విషయం గొప్పదనిపించిందో. ఆ అమ్మాయి తనకు నచ్చిన  విశ్వాసాన్ని స్వీకరించి అనుసరించే హక్కు ఆ పిల్లకి వుంటుంది కదా. వద్దు అంటే ఆ అమ్మాయి వింటుందా ? బలవంతం చేసి మతాన్ని మోయించగలమా?. ఇల్లు వదిలి వెళ్ళేంత నమ్మకం పెంచుకుంది అంటే అంత గొప్పగా తనకి ఏమనిపించిందో.

ఈ విషయం అయ్యాక కొన్ని రోజులు ఇదే ఆలోచించాను. అవును ఆయనెవరో ఫేస్ బుక్ లో మతం మారకండి అని అరిచి రాసేప్పుడు జాలి వేసేది. మా నాన్న మేనత్తలందరూ  హిందువులను పెళ్లి చేసుకుని హిందువులైయ్యారు. మా తాత RCM సిద్ధాంతాలతో ఉన్నప్పుడు మా నాన్నమ్మ ప్రొటెస్ట్ టెంట్ గా వుండి అందరిని అటువైపు తీసుకెళ్ళింది. మేము ఆ విశ్వాసంలో బలపడ్డాo. అయినా బంధుత్వాలేవి పోలేదు.

నిజమే మత విశ్వాసాల జోలికి వెళ్ళకుండా మనుషులు మనుషులుగా స్వీకరిస్తే ఏ గొడవా వుండదు కదా. ఏంటో ఓల్డ్ సిటీలో ఎదో మదరస్సాలో ఇస్లాం స్టడీస్ చేస్తుందంట ఆ పిల్ల. ప్రేమ గీమ లాంటి జోలికి కాకుండా కేవలం మతపరమైన చదువులకోసం వచ్చాను ఇప్పుడు నా పేరు అఫ్రీన్ అని వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళినప్పుడు ఆమె తరపున లాయర్ తో చెప్పించిందట. మా పాస్టర్ గారు నన్నోసారి రమ్మన్నారు.  నువ్వు మాట్లాడుదువు గాని రా అమ్మా అని. నేనేం మాట్లాడతాను. నా దేవుడు తప్పు కాదు అంటే ఆ అమ్మాయి కూడా నేను అనుసరించే దేవుడు తప్పు కాదు అంటుంది. ఆ అమ్మాయికి  ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడే ఎవరినైనా అడిగి తెలుస్కోవాల్సింది. కాని అలా జరగలేదు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను వెళ్లి మాట్లాడినా మార్పు వస్తుందా. రాదు . కాని కాలం అన్నిటికీ పరిష్కారం చూపగలదు. నేను అదే అనుకున్నా. వీలున్నపుడు ఎపుడైనా కుదిరితే ఆ మదరస్సా ఎక్కడో కనుక్కొని వెళ్ళాలని మాత్రం అనిపించింది.

సమయం ఒకటిన్నర అవుతుంది . రేపు ఉదయాన్నే ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఉద్యోగంతో తిరిగి రావాలనే అనుకుంటున్నా. వస్తా కదా.

*

వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ…

-మెర్సీ మార్గరెట్
~

mercy

 

 

 

 

 

ఈ నీలాకాశం కిందే
మూడొంతుల నీళ్ళతో  నిత్యం పరిభ్రమించే భూమి మీదే
వారు వాళ్ళ పిల్లల్ని పెంచుతారు

తమ తల్లులు తమని పెంచినట్టు
తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకునో, పక్కలో రొమ్ముపై ఆనించుకునో
నానా రహస్యాలు మాట్లాడుకున్నట్టు
చుక్కల్ని లెక్కిస్తూనే కథల్లో లౌక్యం నేర్చుకుంటూ
వారూ పెరుగుతారు
తమ తల్లిదండ్రులు నేర్పిన ఆశలతో
తమలో వారు నాటిన విలువలతో

యేమేమి నేర్పుతారో
యే తర్పీదు నిస్తారో
సద్బోధనో, వైద్యమో, ఔషదమూలికలు కనుగొనడమో
పరామర్శ చేయడమో , పరిచర్య చేయడమో
గురువులైన తలిదండ్రులే తమ ఒడిలో
యే కొత్త ఆకాశాన్నో , యే స్వచ్చమైన పావురాళ్ళనో
లాలనగా పెంచుకుంటారు
ఒకరికొకరు తోడు మనుషులని మళ్లీ మళ్ళీ వల్లెవేయించి
నేర్పుతారేమో మరీ పాఠాలు

ఒకానొక రోజు
ఆ పిల్లల్లకూ పిల్లలు పుడతారు
వాళ్ళూ అమ్మా నాన్నలవుతారు
తమ తల్లులు తమని పెంచినట్టు
తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకుని, పక్కలో రొమ్ముపై ఆనించుకుని
తమని పెంచినట్టు వాళ్ళ పిల్లల్నీ పెంచుతారు

కానీ వీళ్లు తమ పిల్లలతో
మతోన్మాదం గురించి మాట్లాడతారు
మక్కా మసీదు, లుంబినీ వనంలో బాంబు పేలుల్ల గురించి
11/9 సంఘటన
పాలస్తీనా, ఇశ్రాయేల్ యుద్ధం గూర్చి
ఆ రాత్రి ఫారిస్ ముఖంపై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి
మాట్లాడతారు

తమ పిల్లల వీపు నిమురుతూ
వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెపుతారు కదా
మనిషికి మనిషే తోడు
మృగాల్లా మీరెప్పుడూ ఆలొచించొద్దూ అని
అంతేగా మరి
వాళ్ళూ ఎప్పుడో అమ్మానాన్నలై
గురువులుగా మారుతారు.

*

దోసిలిలో ఒక నది

mercy
బయటికి ప్రవహించేందుకు దారి వెతుకుతూ
నాలుగు గోడల మధ్య ఒక  నది
ఊరుతున్న జలతో పాటు
పెరుగుతున్న గోడల మధ్యే తను బందీ

 

ఆకాశమే  నేస్తం నదికి
మాట్లాడుకుంటూ, గోడును వెళ్లగక్కుకుంటూ
గోడల మధ్య బందీయై  ఏడుస్తున్న తనతో
ఊసులు పంచుకుంటూ

 

అప్పుడప్పుడు
నదిని ఓదారుస్తూ  వర్షంలా మారి ఆకాశం
గోడల పై నుండి జారి నదిని కావలించుకోవాలని
చేసేది ప్రయత్నం
ఉదయాన్నే కిరణాల కరచాలనంతో సూర్యుడు నదిని పలకరించి
తన స్వభావం కొద్ది ఆకాశాన్ని ఆవిరి చేసి
ఆకాశాన్ని నదిని విడదీస్తూ వేడిగా నవ్వేవాడు

 

రాత్రుళ్ళు చీకట్లో
నిశబ్ధం నాట్యం చేసేది గోడలపై
ఎలా నిన్ను బంధించానో  చూడని గోడలు
ధృడమైన నవ్వు నవ్వేవి, ఆ నవ్వు నదిని కుదిపేసేది
ప్రతిఘటించాలని ప్రయత్నిస్తే సూర్యుని సాయంతో
నది దేహాన్ని గోడలు వేడి వేడిగా కొరికి పీల్చేసేవి

 

వలస వెల్తూ పక్షొకటి  నది  పరిస్థితి చూసి
ఏమి చేయలేనని నిట్టూర్పు విడిచి
సాయపడ్డం ఎలాని? ఆలోచిస్తూ వెళ్ళింది

 

ఒక రోజు
గోడలను పెకిలిస్తూ
మర్రి చెట్టు  వేళ్ళు వ్యాపించడం నది చూసింది
ఇంకొద్ది రోజులకే గోడ  ఒక వైపు కూలింది
నదికి స్వాతంత్ర్యం వచ్చింది
పరవళ్ళు తొక్కుతూ, కొండలెక్కుతూ,
పల్లం వైపు జారుతూ భూమినంతా తడుపుతూ  ప్రవహించింది
బంజరు భూములను పచ్చగా చేసి
ప్రతి పల్లె దాహాన్ని తీర్చి తల్లిగా మారింది

 

ప్రతి విత్తనాన్ని మొలకెత్తిస్తూ స్వేచ్ఛని పండిస్తూ
మర్రి విత్తనాన్ని నాటిన పక్షి ఋణం తీర్చుకుంటూ
నింగికెగసి ఆకాశాన్ని పలకరించి
భూమి నలుదిక్కులా వ్యాప్తమై,
స్వేచ్ఛా విరోధపు గోడలను మింగేస్తూ
సహాయానికి , సహనానికి నిలువెత్తు సాక్ష్యమై
తనను తీసుకునే ప్రతి ఒక్కరి దోసిలిలో పక్షిలా మారుతూనే ఉంది