నయాగరాకి రంగులు అద్దితే…మన మోహన్!

 

(ప్రసిద్ధ చిత్రకారుడు మోహన్ కి పుట్టిన రోజు  శుభాకాంక్షలతో..)

-ప్రకాష్

~

 

prakashహృదయంలో ప్యూరిటీ- ఆలోచనలో క్లారిటీ- ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుంది గానీ, దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుకున్నా, చికాకు పడినా… రచయితలు… అర్టిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదే పదే చెబుతుంటాడు. మోహన్ అలాగే ఉండాడు.

మోహన్‌ కిప్పుడు అరవై ఐదేళ్లు. 1950 డిసెంబర్‌ 24న ఏలూరులో పుట్టాడు. తండ్రి తాడి అప్పల స్వామి అనే కమ్యూనిస్ట్ నాయకుడికీ తల్లి సూర్యావతికీ పుట్టిన మోహన్‌ని కమ్యూనిస్టు ఉద్యమమే ఎత్తుకుని పెంచి పోషించింది. అప్పల స్వామి ఆనాటికే బాగా చదువుకున్నాయన. ఇంగ్లీషు, హిందీ, సంస్కతం బాగా తెలిసినవాడు. చదువుకోవడమే, విద్యతో వెలిగిపోవడమే , జ్ఞానంతో రాణించడమే , పేద వాడి కోసం పోరాడడమే మానవుని విధి అని నమ్మేవాడాయన. అదే మోహన్‌కి అబ్బింది. మొదటి నుంచీ మోహన్‌ చదువరి. కథో, నవలో, పద్యమో, మార్క్సిస్టు సాహిత్యమో చదవడమే పని. ఆ చదువే ఆనందం. పధ్నాలుగు, పదిహేనేళ్ళకే బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు. రెండే వ్యాపకాలు చదవడం, బొమ్మలు వేయడం. మరొక్కటుంది, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చుట్టూ స్నేహితులే. మోహన్‌ చుట్టూ సంపాదకులు, జర్నలిస్టులు, రచయితలూ, ఆర్టిస్టులు, కవులు, ఉద్యమకారులు… ఎందరెందరో… కళాకారుడి కార్యాలయం పార్టీ ఆఫీసులాగే… టీలు… సిగరెట్లు… చర్చలు… ఎన్ని మాటలున్నా, జోకులున్నా, అందరి మధ్యలో మోహన్‌ బొమ్మలు వేస్తూనే వుంటాడు. నాజూకైన గీతలు. ఆడపిల్ల నడుం నుంచి అరచేయి దాకా వయ్యారపు ఒకే గీత. గీతాదత్‌ పాటలాగ. సర్రున మొగవాడి మోకాలి నుంచి చెయ్యెత్తి తుపాకీ పట్టే దాకా కత్తితో గీశాడేమో అనిపించే ఉద్యమగీత. పాబ్లోనెరూడా పోయిట్రీలా.

06

మోహన్‌ ఒక స్వచ్ఛమైన జలపాతం. అన్ని రంగులూ కలిస్తే తెలుపు అయినట్టుగా – అతను ఆర్టిస్టు, కమ్యూనిస్టు, కార్టూనిస్టు, జర్నలిస్టు, కవి, విమర్శకుడు, రచయిత, యానిమేటర్‌, మిత్రుడు, గురువు, డ్రీమర్‌, తండ్రి, నీ సగం సిగరెట్టు తీసుకొని తాగే సాదా సీదా సగటు ఒన్‌బైటూ చాయ్‌ గాడు. నీకెప్పుడూ అందుబాటులో వుండేవాడు. నీకెప్పటికీ అందనివాడు. కవిబాల గంగాధర తిలక్‌లాగా అందమైనవాడు. మనోహరమైన చిరునవ్వును ఆయుధంగా ధరించినవాడు. అడిగిన వాడికి లేదనకుండా బొమ్మగీసిచ్చేవాడు. వాడు ఐయ్యా, ఎమ్మా, ఎమ్మెల్లా, లిన్‌పియావో, పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జనశక్తి, ప్రతిఘటన, అతి నటన, మహిళ, బడుగు, బలహీన, ముస్లిం మైనార్టీ, దళిత, మాదిగ, డక్కిలి, లంబాడా, నంగరా, అస్తిత్వ, సుత్తిత్వ, పరమబోరిత్వ… ఎవరైనా మోహన్‌కి ఒక్కటే. బొమ్మవేసిస్తాడంతే. నచ్చడం నచ్చకపోవడం జాన్తానై. ఒక్కోడిదీ ఒక్కోరకం కమ్యూనిజం. ఒకడిది వర్గకసి. ఒకరిది ప్రేమదాహం. మరొకరిది విప్లవద్రోహం. మరొకామెది మగదురహంకార పదఘట్టన కింద నలిగిపోయే భూమిక. ఇంకొకడు మానవ హక్కుల్ని ప్రేమిస్తాడు. మరొకడు తెలంగాణా కోసం ఉద్యమిస్తాడు. మోహన్‌కి ఫిర్యాదుల్లేవు. గొడవలూ పెట్టుకోడు. నువ్వేం చెప్పు, శ్రద్ధగా వింటాడు. నీక్కావాల్సిన బొమ్మ, నువ్వు కోరుకున్న బొమ్మ బాగా వేసిస్తాడు. నీ అజ్ఞానం వల్ల, ఉపన్యాసాలిచ్చే దురలవాటువల్ల మంచి బొమ్మని మార్చి పిచ్చిబొమ్మ వేయమని మర్యాదగానే అడుగుతావు. నో కంప్లయింట్స్. నువ్వు కోరుకున్న మీడియోకర్‌ బొమ్మే నీకు దక్కుతుంది. ‘అదేంటి?’ అని ఎవరన్నా అడిగితే ‘‘ వాళ్ళకదే నచ్చుతుంది’’ అంటాడు. మారేజి బ్యూరో క్లయింట్‌ సర్వీసా? పవిత్రమైన ఆర్టా? అని ఎవరైనా కోప్పడితే ‘‘నువ్వు ప్రపంచాన్ని మారుస్తావా? నేనైతే అలాచేయలేను’’ అంటాడు మోహన్‌.

మోహన్‌ ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కాలేజీలో బి.ఎస్‌.సి. చదివి, 19 ఏళ్ళ వయసులో విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా చేరాడు. విశాలాంధ్ర లైబ్రరీ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ పుస్తకాలూ, అప్పటి సోవియెట్‌ సాహిత్యం మోహన్‌కి ఎప్పటికీ మరిచిపోలేని మంచి మిత్రులు. ఏటుకూరి బలరామ్మూర్తీ, రాఘవాచారీ, కంభపాటి సీనియర్లు తనని బాగా ప్రభావితం చేశారు. ఇంత రియలెస్టేటూ, స్టాక్‌మార్కెట్టూ, ఐటీ బూమూ, సెల్‌ఫోన్లు లేని బంగారం లాంటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజులవి. పుస్తకాలూ, పేపర్లూ, చదువూ, కవిత్వమూ చర్చలూ. అటు సొదుం రామ్మోహన్‌, ఇటు పెద్దిభొట్ల సుబ్బరామయ్య – సాయంత్రం అయితే కె.రాజేశ్వరరావు, గాంధీ, టీలు, సిగరెట్లు, అదృష్ట దీపక్‌, కవిరవి ఇతర స్నేహితులు. రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి లతో మాటకచేరీలు. సబెడిటర్‌ పని అంటే ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి అనువదించడం. అయ్యాక, ఓ రాజకీయ కార్టూన్‌ లాగించేవాడు. పబ్లిషింగ్‌ హౌస్‌కో కవర్‌ పేజీ వేసేవాడు. ఎవరి కవిత్వానికో ఓ బొమ్మ తగిలించేవాడు. జీవితంలో పెద్ద కోర్కెలేమీ లేనట్టుగానే బతికాడు. జెనీలియాలాగా కుదిరితే కప్పుకాఫీ, ఓ సిగరెట్టు. పుస్తకం ఎలాగో చేతిలో వుండేది. సింప్లీ, హి కెన్‌ కాల్‌ యిట్‌ ఎ డే.
చిన్న ఆనందాలు, గొప్ప అనుభవాలు (పైగా ఆ గురజాడ ఒకడు, జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును అని ఎగిరెగిరిపడుతూ)

ఎంటర్‌ హైదరాబాద్‌:

ఆంధప్రభలో అదే గొప్ప దిక్కుమాలిన కార్టూనిస్టు ఉద్యోగం కోసం మోహన్‌ 1980లో హైద్రాబాద్‌ వచ్చాడు, క్రోక్విల్‌ చెవిలో పెట్టుకొని. కార్టూన్లు పేలాయి. ఎబికె, వాకాటి పాండురంగారావు, దేవీప్రియ ఇంకా అనేకుల్‌, ‘‘ ఇరగదీస్తున్నావోయ్‌, రా చాయ్‌ తాగుదాం’’ అన్నారు లిబర్టీ సెంటర్లో. వో ఫర్లాంగు నడిస్తే, హిమాయత్‌ నగర్‌, అనగా మఖ్దూంభవన్‌ ఉండే చోటు. సి.పి.ఐ. నాయకులూ, స్నేహితులూ, అరివీర కామ్రేడరీ. ఆనక 1983లో ‘ఉదయం’ హడావిడి మొదలైంది. 1984 డిసెంబర్‌ 29 ‘ఉదయం’ దినపత్రిక మోహన్‌ కార్టూన్‌తో రిలీజైంది. మొదటిరోజు నుంచి ప్రతి ఉదయం కార్టూన్లు పేలాయి. బొమ్మల్ని జనం ప్రేమించారు. ఉదయంలో మోహన్‌ రోజుకి పది, యిరవై, పాతిక బొమ్మలు వేసిన రోజులున్నాయి. జనం మెచ్చినది మనం శాయడమే అనుకున్నాడో ఏమో! దారినపోయే దానయ్య నుంచి దాసరి నారాయణరావు దాకా ‘శెబ్బాష్‌ మోహన్‌’ అన్నారు. అండ్‌ ది రెస్ట్ ఈస్‌ కార్టూన్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధప్రదేశ్‌.

SHEET-1

మోహన్‌ చుట్టూ ఎప్పుడూ ప్రసిద్ధ కవులూ, కళాకారులూ, రచయితలూ, జర్నలిస్టులూ, మేధావులే. పురాణం సుబ్రమణ్య శర్మ నుంచి నామిని సుబ్రమణ్యం నాయుడు దాకా. గుడిహాళం రఘునాథం నుంచి గోరటి వెంకన్న దాకా. కేశవరెడ్డి నుంచి కె.ఎన్‌.వై.పతంజలి దాకా… సురవరం సుధాకరరెడ్డి, డాక్టర్‌ కె.నారాయణ మోహన్ని ఎంతగా అభిమానిస్తారో బాలగోపాల్‌, వరవరరావు అంతగా ప్రేమిస్తారు. ఎబికె ప్రసాద్‌, చేకూరి రామారావు ఎంత యిష్టపడతారో, వోల్గా నుంచి గద్దరు దాకా అంతే గౌరవిస్తారు. మన రాష్ట్రంలో అన్ని రకాల ప్రజా ఉద్యమాలలో అంతగా కలిసిపోయిన ఆర్టిస్టు మరొకరు కనిపించరు. మోహన్‌ యిదేమీ పట్టదన్నంత మౌనంగా, మయకోవస్కీ పుస్తకమో పట్టుకొని ‘‘అగ్గిపెట్టుందా?’’ అని అడిగి ప్రశాంతంగా చదువుకుంటూ నిద్రపోతాడు.

1990 తోసుకొచ్చింది. రాయటమూ, కార్టూన్లూ, కథలకి ఇలస్ట్రేషన్లూ, కవిత్వాలకు బొమ్మలూ, (ప్రపంచ పదులకి మోహన్‌ వేసిన బొమ్మలంటే సినారెకి ఎంత యిష్టమో) పోస్టర్లూ, కవర్‌ పేజీలూ చాలవన్నట్టు యానిమేషన్‌ మొదలుపెట్టాడు. యానిమేషన్‌ అంటే బొమ్మల్ని కదిలించడం కాదు, హృదయాల్ని కరిగించడం అన్నాడు. ఏళ్ళూ వూళ్ళూ గడిచిపోయాయి. ఇంకా హైద్రాబాద్‌కి మంచి కంప్యూటర్లు, స్కానర్లూ, హెచ్‌డి కేమెరాలు రాని కాలం అది. కాలం కంటే ముందు పరిగెత్తి అలసిపోయాడు. 17 సంవత్సరాలు గడిచి పోయాక ‘సాక్షి’ పేపర్‌ వచ్చింది. తర్వాత వాళ్ళు టీవీ ఛానల్‌ పెట్టారు. సజ్జెల రామకృష్ణా రెడ్డి, సువర్ణకుమార్‌ల పుణ్యాన అందులో మోహన్‌ యానిమేషన్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యాడు, వో పాతిక మంది టీమ్‌తో. తెలుగు ఛానళ్ళలో, ఆమాటకొస్తే ఏ జాతీయ ఛానల్లోనూ రాని అందమైన అపురూపమైన యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్లు చేసి చూపించాడు. జనం వెర్రెత్తిపోయారు. ఇన్‌స్టెంట్‌ హిట్‌.

జనరల్‌గా మోహన్ని ఆర్టిస్టుగానే చూస్తారు. అతనో మంచి రచయిత అని కొద్దిమందికే తెలుసు. మోహన్‌ ముందు జర్నలిస్టు. అనేక పుస్తకాలు తెలుగులోకి అనువదించాడు. కళమీదా, కార్టూన్లమీదా ఎన్నో వ్యాసాలు రాశాడు. ‘‘ఇతను ఎంత మంచి వచనం రాస్తున్నాడు’’ అని రచయితలూ, కవులే ముచ్చట పడ్డారు. ‘‘కార్టూన్‌ కబుర్లు’’ అనే మోహన్‌ వ్యాసాల పుస్తకం చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. ‘‘బాపూగారూ అందరూ మీరు అభిమానులు కదా, మీరు అభిమానించేదెవరిని?’’ అని ఒక సందర్భంలో ఆయన్ని అడిగినప్పుడు ‘‘ఇంకెవరు? మోహనే’’ అని బాపూ సమాధానం.

నవ్వులూ పూలూ చురకలూ మెరుపులూ అన్నీ కలిసి...

నవ్వులూ పూలూ చురకలూ మెరుపులూ “మేల్” కొల్పులు  అన్నీ కలిసి…

కార్టూన్లలో పొలిటికల్‌ కార్టూన్లు అనేవి మేలు జాతి పొట్టేళ్ళు లాంటివి. అవి వేయడంలో కొమ్ములు తిరిగిన వాడు మోహన్‌. ఎంకి ఏదంటే వెలుగునీడల వైపు వేలు చూపించినట్టుగా ఆంధప్రదేశ్‌లో పొలిటికల్‌ కార్టూన్‌ అంటే మోహన్‌ వైపే చూస్తారెవరైనా. మరో ఇంటరెస్టింగ్‌ సంగతి- మోహన్‌కి సంగీతం అంటే చాలా యిష్టం. పాత హిందీ సినిమా పాటలూ, తెలుగు పాటలూ, జానపదాలూ బాగా తెలిసినవాడు.

హేమంతకుమార్‌, సైగల్‌, సురయా, గీతాదత్‌, నూర్జహాన్‌ల పాటలంటే మరీ యిష్టం. సెర్జీ ఐజెన్‌ స్టీన్‌- ‘బేటిల్‌ షిప్‌ పొటెంకిన్‌’, కురొసొవా ‘సెవెన్‌ సమురాయ్‌’, ఇస్త్వాన్‌ జాబో ’కాన్ఫిడెన్స్’, పోలిష్‌ కీస్లెవయస్కీ, ‘త్రీకలర్స్ బ్లూ’ దాకా అన్నీ శ్రద్ధగా చూశాడు. ఎం.ఎస్‌.సత్యు, శాంతారాం, సత్యజిత్‌ రే నుంచి పట్టాభి సంస్కార మీదుగా శ్యాంబెనగల్‌ భూమిక దాకా భారతీయ సినిమాల గురించి సాధికారికంగా చర్చించగలడు. గురుదత్‌ సినిమాలన్నా, ప్యాసాలో వహీదా రెహమానన్నా చాలా చాలా మురిపెం మోహన్‌కి. టాల్‌స్టాయ్‌ వార్‌ అండ్‌ పీస్‌, అనాకెరినినా, షోలహోవ్‌ ‘అండ్‌ క్వయిట్‌ ఫ్లోస్‌ దిడాన్‌’ అన్నా అంతే ప్రేమ. రష్యా, చైనా, క్యూబా, వియత్నాం, లాటిన్‌ అమెరికా విప్లవోద్యమ చరిత్ర గురించి ఎన్ని గంటలైనా అలుపు లేకుండా మాట్లాడతాడు. చేగువేరా త్యాగమూ, హోచిమిన్‌ ఆదర్శమూ, నిరుపేదవాడి పోరాటమూ మోహన్ని కదిలిస్తాయి. గోబీ ఎడారిలో తూనీగల్లా పరిగెత్తే చంఘిజ్‌ ఖాన్‌ సేనల గుర్రాల నుంచి గుడిపాటి వెంకట చెలం మైదానం దాకా ఎన్ని కబుర్లయినా చెబుతాడు. నెరూడా జ్ఞాపకాల నుంచి మావ్‌సేటుంగ్‌ వ్యాపకాల దాకా ఎన్ని ముచ్చట్లో చెప్పలేం. విజయవాడ మారుతీనగర్‌లో మాయింటి పక్కయిల్లే విశ్వనాథ సత్యనారాయణ గారిదనీ, ‘విశాలాంధ్ర’కి వచ్చిన పుట్టపర్తి నారాయణా చార్యుల వారికి అరిటిపళ్ళు, టీ పట్టుకెళ్ళి యిచ్చేవాడిననీ, ఢిల్లీ పొలిటికల్‌ క్లాసుల్లో దేవీ ప్రసాద్‌ చటోపాధ్యాయ, గంగాధర అధికారి, డాంగే, నీలం రాజశేఖరరెడ్డి, మొహిత్‌ సేన్‌, సర్దేశాయ్‌ లాంటి మహామహుల దగ్గర మూడు నెలలు చదువుకున్నానని మహదానందంగా చెబుతాడు.

mohan2

ఇలా ఎన్ని చర్చలయినా, కబుర్లయినా, బొమ్మలు వేసివ్వడం అయినా బ్లాక్‌టీ తాగినంత హాయిగా, ఈజీగానే. భేషజానికో, పోజుకో తావేలేదు. ఇలా గత 40 సంవత్సరాలుగా నాన్‌ స్టాప్‌గా బొమ్మలు వేస్తూనే వున్నాడు. సాటి ఆర్టిస్టుల్ని ఎంతగా ఆదరించాడో అంతగానూ ప్రభావితం చేశాడు. విన్సెంట్‌వాంగో, పాల్‌గాగిన్‌, పికాసో బొమ్మలూ, బతుకులూ, ఎం.ఎఫ్‌,హుస్సేన్‌, సమీర్‌మండల్‌, సచిన్‌ జల్తారే, లక్ష్మాగౌడ్‌, వైకుంఠం బొమ్మల్లోని సౌందర్యమూ, తత్వాల గురించి మోహన్‌ చెబుతున్నప్పుడు వినితీరాలి. విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అలవోకగా, హాస్యానికి అణుమాత్రమూ కొదవలేకుండా చెప్పడంలో మోహన్‌ స్పెషలిస్టు. తెలుగు, భారతీయ ప్రాచీన చిత్రకళ మీద గట్టి అవగాహన వున్నవాడు. ‘శంకర్స్ వీక్లీ’ శంకర్‌ నుంచి డేవిడ్‌లో దాకా, అబూ అబ్రహాం నుంచి అమెరికన్‌ సూపర్‌స్టార్‌ సెర్గీ అరగాన్స్ దాకా జాతీయ అంతర్జాతీయ కార్టూన్‌ కళని బాగా అధ్యయనం చేసినవాడు. రాసినా, మాట్లాడినా, బొమ్మేసినా అతనికే చెల్లిందని అనిపించుకున్న అరుదైన గౌరవాన్ని పొందినవాడు మోహన్‌.

ఆర్టిస్టు మోహన్ని ‘జీనియస్‌’ అన్నాడు మణిశంకర్‌ అయ్యర్‌. ‘‘నీ గీతలో మేజిక్‌ వుంది మోహన్‌’’ అన్నాడు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మన గోవా ఆర్టిస్టు మారియో మిరాండా. ‘‘నీ గీతలు నాకిష్టం. నువ్వు రాసే అక్షరాల్లో మనోహరమైన చైనీయమైన కళవున్నది’’ అన్నారు లెజెండరీ ఆర్టిస్టు కొండపల్లి శేషగిరిరావు గారు.

చదువుకోవడమూ, బొమ్మలు వేయడం తప్ప తనకీ లోకంతో పనిలేనట్టుగానే వుంటాడు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి యానిమేషన్‌లో దృశ్య రూపం యివ్వాలని తపనపడుతున్నాడు. అన్నమయ్య పదాలనూ, గోరటి వెంకన్న పాటలనూ యానిమేట్‌ చేయాలని కలవరిస్తున్నాడు. కొన్ని అరుదైన, తన హృదయానికి దగ్గరైన యానిమేటెడ్‌ షార్ట్ ఫిలిమ్స్ తీసి దుమ్మురేపాలని ఆత్రంగా వున్నాడు. ఇప్పటివరకూ ఏమీ చేయనట్టు, ఇప్పుడు అపూర్వమైన మేజిక్‌ చేయడానికి చిన్న యానిమేషన్‌ స్టుడియో పెట్టి గుండెనూయిల నూగించే బొమ్మలెన్నో మనకి చూపెట్టాలని మోహన్‌ సరదాపడుతున్నాడు. ఒక చేత్తో పెన్సిలూ, మరో చేత్తో బ్రష్షూ పట్టుకుని, ఇంకో డజను చేతుల్తో స్నేహాన్నీ, ప్రేమనీ పంచి యిచ్చే మాంత్రికుణ్ణి మీరెప్పుడూ చూడలేదా?
అయితే మోహన్ని మీరింకా కలుసుకోనట్టే.

*