ఫిబ్రవరి: హాస్య కథల హవా!

 2 (1)

 

 

[ఫిబ్రవరి కథలలోకి వెళ్ళే ముందు ఓ చిన్నమాట. జనవరి నెల కథల పరిశీలనలో రెండు మంచి కథలు మా దృష్టిని దాటిపోయాయి. అవి – హిట్లర్ జ్ఞాపకాలు (డా. వి. చంద్రశేఖరరావు, పాలపిట్ట), చావుదేవర (రమాసుందరి, పాలపిట్ట). “హిట్లర్ జ్ఞాపకాలు” లేయర్డ్ గా సాగే కథనంతో కాలేజీ కేంపస్ లోని రాజకీయాలను పరిచయం చేస్తే, “చావుదేవర” సొగసైన ఒంగోలు మాండలికంలో సాగిన ఇద్దరాడవాళ్ళ కథ. రెండింటిలోనూ ప్రతీకాత్మకంగా రెండు జంతువులుండటం, రెండింటిలోనూ మిస్టిక్ లక్షణం వుండటం ఓ చిత్రమైన సామీప్యం. గత మాసంలో ప్రకటించిన జనవరి మంచి కథల జాబితాలో ఈ రెండు కథలూ తప్పకుండా చేర్చతగినవి. జరిగిన పొరపాటు సహృదయంతో అర్థం చేసుకోని క్షమించగలరని ఈ ఇద్దరు రచయితలను, పాఠకులను కోరుతున్నాము. మేము వీలైనంత సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకున్న పరిమితుల వల్ల ఏవైనా కథలు/పత్రికలు మా దృష్టిని దాటిపోతే పాఠకులు సూచించడం ద్వారా ఈ కృషిని సమిష్టిగా, సమగ్రంగా చేయగలరని మళ్ళీ కోరుతున్నాము.]

 

ఇక ఫిబ్రవరి కథలలోకి వద్దాం –

ఫిబ్రవరి కథలలో రెండు ప్రత్యేకతలు వున్నాయి. మంచి కథల జాబితాలో చేర్చతగిన కథలలో చాలా వరకు హాస్యకథలు వున్నాయి. ఇది చాలా “ఆనందకరమైన” పరిణామం. రెండవది – చాలావరకు మంచి కథలు వెబ్ పత్రికలలో రావటం. సంఖ్యాపరంగా వెబ్ పత్రికలన్నీ కలిపితే కొన్ని కథలే వస్తున్నప్పటికీ వాటిలో మంచి కథల శాతం, ప్రింటు పత్రికలలో వస్తున్న మంచి కథల శాతం కన్నా ఎక్కువ వుండటం మరో పరిణామం. ఇది విస్తరిస్తున్న వెబ్ సాహిత్యానికి నిదర్శనమా లేక ప్రింటు పత్రికలలో క్షీణిస్తున్న ప్రమాణాలకు చిహ్నమా అన్నది మరింత లోతుగా పరిశీలించవలసి వున్నది. మరి కొన్ని నెలల పరిశీలన తరువాత ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుకుందాం.

ఇందాక చెప్పినట్లు ఈ నెల హాస్య కథల హవా నడిచింది. ఓ అంతర్జాల పత్రిక హాస్య కథల పోటీ నిర్వహించి అందులో బహుమతి పొందిన కథలను ప్రకటించడం అందుకు ముఖ్యకారణం కావచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో హాస్య కథల విషయంలో ఓ చిన్న చూపు వుంది. ప్రముఖ వార్షిక సంకలనాలలో హాస్యకథలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఎక్కడో సెటైర్ కథలలో తప్ప కథాంశంలో బలం వుండదనీ, పాఠకులను నవ్వించడమే తప్ప ఇలాంటి కథలతో సామాజిక ప్రయోజనం పెద్దగా వుండదనీ కారణం చెప్తారు. పాఠకులను నవ్వించడమే ఓ సామాజిక ప్రయోజనమనే వాదన కూడా వుంది. ఏది ఏమైనా హాస్య కథ రాయడం కష్టమైన పని. మంచి పరిశీలన (వస్తువు కోసం), మంచి వాక్య నిర్మాణం (శైలి) వుంటే తప్ప హాస్యకథలు పండవు. అందుచేత ఈ నెల హాస్య కథలను ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాము. ఇవేవీ కాకపోయినా మిగిలిన (సో కాల్డ్ సీరియస్) కథలు ఇచ్చే నిరుత్సాహం నుంచి కాస్త తెరిపిగానైనా వీటిని చదువుకోవచ్చు.

ఇక మిగిలిన కథల గురించి –

గత మాసం చెప్పినట్లుగానే తెలుగు కథకులలో వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమకాలీన అంశాలకు కథా రూపం ఇచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రైతు కష్టాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వంటి నిలవ కథాంశాలు అడపాదడపా కనపడుతున్నా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వర్తమాన వస్తువులతో కథలు వస్తున్నా ఆ వస్తువు లోతుల్లోకి వెళ్ళే విషయంలో కొంత అలసత్వం కనిపిస్తోంది. వస్తు వైవిధ్యం ప్రోత్సహించవలసినదే కానీ, వస్తువు పట్ల మరికొంత గాఢమైన పరిశీలన లేకపోవడం లేదా అది కథలో ప్రతిఫలించలేకపోవడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఓ గంభీరమైన విషయాన్ని కథలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది గంభీరమైన కథ అయిపోదు. ఆ విషయం తాలూకు విభిన్న కోణాలు కథలో సూత్రామాత్రంగానైనా స్పృశించబడాలి.

ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ కథలను చూద్దాం –

“సుపుత్రుడు” (బి. గీతిక, స్వాతి మాసపత్రిక) కథ రొటీన్ అనాధ వృద్ధుల కథ అయినప్పటికీ ఓ అనాథను తెచ్చి పెంచుకోవడంతో ముగిసే విభిన్నమైన ముగింపు ఉన్న కథ. “శివుడి పెళ్ళి” (జయంతి వెంకటరమణ, నవ్య వారపత్రిక) కథకు (పెళ్ళికి) ఆడపిల్లలు దొరకకపోవటం అన్న అంశం మీద ఆధారపడింది. ఇది సమకాలీనమే అయినా ఆ అంశం గురించి తక్కువ మాట్లాడటం వలనా, ఒక వ్యక్తి అనుభవంలా మాత్రమే మిగిలిపోవటం వలన చిక్కదనం కొరవడింది. “వెలుగు రేఖలు” (రాజేష్ యాళ్ళ, ఈనాడు ఆదివారం), “ఓటమి” (సనిహిత్, కౌముది) కథలు కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల గురింఛిన కథలు. రెండింటిలోనూ నాటకీయత ఎక్కువైనప్పటికి ఇప్పటి సందర్భానికి చెప్పవలసిన కథలు. “ఇదో రకం పోరాటం – ఈ నాటి పోరాటం” (గంటి భానుమతి, భూమిక) కథలో కూడా కార్పొరేట్ ప్రపంచం నేపధ్యం. అయితే అందులో స్త్రీ ప్రత్యేకమైన సమస్యలను ప్రతిపాదించారు. అలాగే “గడువు” (ప్రతాప వెంకట సుబ్బారాయుడు, స్వాతి వారపత్రిక) అదే ప్రపంచంలో నుంచి ఓ personality development కథను రాయగలిగారు. దొరికినదల్లా ’వాడుకునే’ లక్షణం గురించి “కొత్త పరుగు” (సి.యస్. రాంబాబు, సారంగ), అందినంతవరకు దోచుకునే లక్షణం గురించి “గుడి” (భువనచంద్ర, స్వాతి వారపత్రిక) ప్రస్తావించాయి. మనిషి యొక్క మౌలికమైన స్పందనలు – దయ, ఆశ, మోసం, మోహం వంటి గుణాలను విశ్లేషిస్తూ “వజ్రం” (జి. వెంకటకృష్ణ, ఆదివారం ఆంధ్రజ్యోతి), “కురిసిన మనసు” (జి. వెంకటకృష్ణ, నవ్య) కథలు కనిపిస్తాయి. చాలా పాత (సినిమా) కథాంశాన్ని కొత్తగా చెప్పిన “ముళ్ళగులాబి” (పులిగడ్డ విశ్వనాథరావు, తెలుగువెలుగు), కొంత అసహజంగా వున్నా ఆశావహంగా వున్న కథ “జనాగ్రహం” (డా. జి.వి. కృష్ణయ్య, స్వాతి వీక్లి) చెప్పుకోదగ్గవి.

వస్తుపరంగా చెప్పుకోదగ్గ ముఖ్యమైన కథ “టైలర్ శీను” (ప్రసాదమూర్తి, సారంగ). తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాసిన ఈ కథ వర్తమానంలోనే వుంది. అయితే వివిధ వృత్తుల గురించి వాటిని కోల్పోవడం గురించి మొదలైన ఈ కథ, క్రమంగా చెప్పదల్చుకున్న సమస్యలోకి వెళుతుంది. అందువల్ల చెప్పదల్చుకున్న సమస్య కొత్తగా వచ్చి చేరినట్లు, కథ దిశ మారినట్లు అనిపించే ప్రమాదం వుంది.

ఇక భాష, కథనపరంగా చెప్పుకోవాల్సిన కథలు కొన్ని వున్నాయి. పైన ప్రస్తావించిన “టైలర్ శీను” కథే కాకుండా, “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” (వై. విశారద, కినిగె పత్రిక), “ఓ చిత్ర కథ” (పూర్ణిమ తమ్మిరెడ్డి, కినిగె పత్రిక) కథలు విశేషంగా చెప్పుకోదగినవి. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు “టైలర్ శీను” కథకు కొత్త అందాన్ని ఇచ్చాయి. “తరళ మేఘచ్చాయ..” చాలా పెద్ద కథ అయినప్పటికీ శైలి పరంగా చాలా మంచి అనుభూతి మిగిల్చింది. “ఓ చిత్ర కథ” ఓ చక్కని ఫోక్ లోర్ కథని అన్వయిస్తూ సాగింఛిన కథనం బాగుంది. అయితే “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” కథలో వస్తు బలం లేకపోవటం; “టైలర్ శీను”, “ఓ చిత్ర కథ” కథలలో ఫోకస్ మారిపోవడం వంటి సమస్యలవల్ల కథ ప్రారంభంలో ఒక మంచి కథ చదవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించినా, కథ గడిచే కొద్దీ ఆ నమ్మకం పల్చబడినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే కథలన్నింటిలోనూ నాటకీయత ఎక్కువగా కనపడుతోంది. కథల్లో కనిపించే పాత్రలూ, జరిగే సంఘటనలూ మన చుట్టుపక్కల సాధారణంగా కనిపించేవీ, జరిగేవీ అయినప్పుడు మాత్రమే పాఠకులకి ఆ కథ నమ్మశక్యంగానూ, ఆలోచించదగినదిగానూ అనిపిస్తుంది తప్ప, కేవలం కథని నడపడం కోసమే పాత్రలనీ, సన్నివేశాలనీ సృష్టిస్తే అవి అసహజంగానూ, నాటకీయంగానూ కనిపిస్తాయి. పాఠకుడు అలాంటి కథని చదివిన వెంటనే మర్చిపోతాడు.

“శివుడి పెళ్ళి”, “సుపుత్రుడు”, “కురిసిన మనసు”, “గుడి” వంటికి కథలల్లో నాటకీయత పాళ్ళు కాస్త తూకం తప్పితే, “జనాగ్రహం”, “వెలుగురేఖలు”, “ఓటమి” వంటి కథల్లో దాదాపు అసహజత్వానికి దగ్గరగా వెళ్ళిపోయాయి. ఇది తెలుగు రచయితలు సమీక్షించుకోవాల్సిన అంశం. ఈ అసహజత్వానికి మరింత దోహదపడుతున్నవి సంభాషణలు. మామూలుగా మనం మాట్లాడుకునే విధానం కథలలో అరుదుగా కనపడుతోంది. చివర్లో ప్రసంగంలాంటి సంభాషణలు (ఇదో రకం పోరాటం…, వెలుగు రేఖలు మొదలైనవి), ఈ ప్రసంగం వల్ల ప్రధాన పాత్రలో తక్షణం మార్పు రావటం జరుగుతోంది. పాఠకుడికి కథా నేపథ్యం చెప్పడం కోసం పాత్రలు తమకు తెలిసిన విషయాలను vocalగా సంభాషించడం చాలా కథల్లో జరుగుతోంది. ఈ విషయం గురించి కూడా మరింతగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.

వస్తుపరంగా బాగున్న కథలు కథనంలో వెనుకబడటం, కొన్ని కథలలో కథనం బాగున్నా వస్తు బలం లేకపోవటం, కథ తాలూకు లక్ష్యం స్థిరంగా లేకపోవటం, సహజత్వాన్ని దూరం చేసే నాటకీయత – ఈ నెల కథలలో ప్రధాన సమస్య. ఈ కారణంగా మొత్తం కథలలో ఉత్తమ కథ అంటూ ఏ ఒక్క కథ ఉండేందుకు ఆస్కారం లేదని మేము భావిస్తున్నాము.

 

ఫిబ్రవరి నెల హాస్యకథలు

వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్టు, ఈ నెలలో కొన్ని మంచి హాస్యకథలు రావడం కొంత రిలీఫ్ కలగజేసింది. ఆ కారణం గానూ, రచయితల ప్రయత్నాన్ని అభినందించడానికి గానూ, ఒక్కో కథనీ పరిచయం చేస్తున్నాం!

ఆనందబాష్పాలు (గోతెలుగు, ఫిబ్రవరి) :: పి వి సాయిసోమయాజులు

మండుతున్న ఉల్లిపాయల ధరల గురించి. హాస్యకథ గా పర్వాలేదనిపించింది.

 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (గోతెలుగు, ఫిబ్రవరి) :: అశోక్ పొడపాటి

సాఫ్ట్ వేర్ ఇంజనీరే తన అల్లుడు కావాలని పట్టుబట్టిన మామ కథ. కథనంలో మంచి హాస్యాన్ని అందించగలిగారు.

 

సుబ్బారావూ, బ్యాంకు అకౌంటూ (గోతెలుగు, ఫిబ్రవరి) :: రాజేష్ యాళ్ళ

ఇంటింటికీ తిరిగి ఎకౌంట్లు ఓపెన్ చేసే ఓ బాంకు పెట్టిన కష్టాల కథ. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న మంచి హాస్యకథ.

 

 

ఫిబ్రవరి నెల కథలు

పైన వ్యాసంలో ప్రస్తావించిన ఫిబ్రవరి నెల కథలు ఇవి. చదివి, మీరూ వాటి మంచిచెడ్డల గురించి ఆలోచించదగ్గ కథలు.

కథ

రచయిత

పత్రిక

సంచిక

ఇదోరకం పోరాటం – ఈనాటి పోరాటం గంటి భానుమతి భూమిక ఫిబ్రవరి
ఓ చిత్ర కథ పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగె పత్రిక ఫిబ్రవరి
ఓటమి సన్నిహిత్ కౌముది ఫిబ్రవరి
కురిసిన మనసు జి. వెంకటకృష్ణ నవ్య 19 ఫిబ్రవరి
కొత్తపరుగు సి. యస్. రాంబాబు సారంగ ఫిబ్రవరి
గడువు ప్రతాప వెంకట సుబ్బారాయుడు స్వాతి వారపత్రిక 7 ఫిబ్రవరి
గుడి భువనచంద్ర నది మాసపత్రిక ఫిబ్రవరి
జనాగ్రహం డా. జి.వి. కృష్ణయ్య స్వాతి వీక్లీ 14 ఫిబ్రవరి
టైలర్ శీను ప్రసాదమూర్తి సారంగ ఫిబ్రవరి
తరళ మేఘచ్చాయ, తరువాతి ఎడారి వై. విశారద కినిగె పత్రిక ఫిబ్రవరి
ముళ్ల గులాబి పులిగడ్డ విశ్వనాథరావు తెలుగు వెలుగు ఫిబ్రవరి
వజ్రం జి. వెంకటకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి 16 ఫిబ్రవరి
వెలుగు రేఖలు రాజేష్ యాళ్ళ ఈనాడు ఆదివారం 16 ఫిబ్రవరి
శివుడు పెళ్ళి జయంతి వెంకటరమణ నవ్య 26 ఫిబ్రవరి
సుపుత్రుడు బి. గీతిక స్వాతి  మాసపత్రిక ఫిబ్రవరి

(అకారాది క్రమంలో..)

—అరిపిరాల సత్యప్రసాద్, ఏ. వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర్ రెడ్డి

02. T Chandra Sekhara Reddy

 01. Ramana Murthy03. Aripirala