అన్నం పెడితే చాలు… ఎంతసేపైనా!

 

 

 

చిత్రం: రాజశేఖర్ చంద్రం

చిత్రం: రాజశేఖర్ చంద్రం

*

 

వలసరవాక్కం మెయిన్ రోడ్డు నుంచి శ్రీదేవి కుప్పానికి దారి వుంది. ఆ శ్రీదేవి కుప్పం చాలా ఫేమస్. ఒకటి సినీ జనాల వల్ల, రెండు వేంకటేశ్వర స్వామి ఆలయం వల్ల. ప్రసిద్ధ గాయకుడు మనో ( మన నాగూరు బాబే) , విలక్షణ రచయిత బహుభాషా కోవిదుడు సాహితి, ఏ తెలుగు ఫన్షన్ జరిగినా నోరారా అందరినీ పలుకరిస్తూ తలలో నాలుకగా మెలిగే డా! శివకుమారీ, అంతే కాదు .. ఆ శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డుని ఆనుకొని వున్న కనకతారానగర్ లో ఒకప్పుడుండే వేలుగారు, ముత్యాల సుబ్బయ్యగారు ( మా మంచి మనిషి.. దర్శకులు) , శ్రీలక్ష్మి, పి.జె. శర్మగారు, ఆంజనేయులుగారు, భీమనేని శ్రీనివాసరావుగారు, ఇప్పుడు వుంటున్న నిర్మాతలు శివరాజుగారు, వెంకటరాజుగారు, వందేమాతరం శ్రీనివాస్ గారు ( ఇప్పటికీ ఇల్లు అలానే వుంది.. ఆయనదే) వీరందరితోనూ కళకళాడుతూ వుండేది. ఇక హాస్య నటులు కారెక్టర్ ఆర్టిస్టులూ, మ్యుజీషియన్లు లెక్కకి మించి వుండేవారు.

గతాన్నంతా స్మరించుకుంటూ అటువైపే వాకింగ్ కి వెళ్ళాను. ఇప్పటికీ  ప్రొడక్షన్ మేనేజర్   సర్వేపల్లి బ్రహ్మయ్య , ప్రొడక్షన్ మేనేజర్ రాజు అక్కడే వున్నారు.

ఆ మెయిన్ రోడ్డు మీదే ‘సినిమా నాగే౦ద్రుడి “గుడి వుంది. అదీ కె.ఆర్.విజయ గార్డెన్స్ కి ఎదురుగా.  సినిమా నాగేంద్రుడని ఎందుకన్నారంటే పుట్ట బ్రహాండంగా ఆరేడు అడుగులకి పైగా వుంటుంది. లోపల నాగుపామే వుండదు. ( అని అందరికీ తెలుసు). గుడి మాత్రం కట్టుదిట్టంగా వుండి చాలా డీప్ ఎఫెక్ట్ ని కలిగిస్తుంది. ఇంతా చూస్తే ఆ ‘ప్రాపర్టీ “ప్రైవేట్ వారిది. షూటింగు చెయ్యాలంటే వాళ్లకి డబ్బులు చెల్లించాల్సిందే.

సరిగ్గా ఆ గుడి దాటాక వచ్చే రోడ్డే కనకతారానగర్ కి వెళ్ళే రోడ్డు. అక్కడే కలిశాడు నటరాజన్.

తెలుగులో ‘శీనులు “’రాజులు “ఎట్టాగో తమిళ్ లో “నటరాజన్ “లు ‘వాసు”లు అట్లాగ. నటరాజన్ కూడా ఒకప్పుడు పెద్దపెద్ద తమిళ్ సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా చెయ్యడమే కాకుండా , తమిళ్ టూ తెలుగు డబ్బింగ్ రైట్స్ బ్రోకర్ గా పని చేసి చాలా సంపాదించాడు. ఎంతా అంటే శ్రీదేవి కుప్పంలోనూ , చుట్టుపక్కల ఏరియాల్లోనూ మూడు షూటింగ్ లకి పనికొచ్చే బంగళాలు, తోటలు కట్టేంత.

“ఏమీ సార్ మీ వీధి వదిలి మా ఏరియాకి వచ్చుండారు? లాంగ్ వాకా? ఏమైనా రొంబ హాపీ!”ఆగి మర్యాదగా పలుకరించాడు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వుండటం తమిళ్ వాడి లక్షణం. ఎ.వి.యం శరవణన్ గారి లాంటి గ్రేట్  ప్రొడ్యూసర్లు కూడా ఎవరు ఆఫీసులోకి అడుగు పెట్టినా లేచి, చేతులు జోడించి నమస్కరించి ఆహ్వానిస్తారు.  మన వాళ్ళ సంగతి అడక్కండి. అలా అని మనవాళ్ళని తక్కువ చేయడం లేదు. హీరో నుంచి బాయ్ దాకా అద్భుతమైన భోజనాలు పెట్టడం ఒక్క తెలుగు నిర్మాతకే సాధ్యం. తమిళ్ వాళ్ళు సాంబారు సాదం పొట్లం , తైరు సాదం పొట్లంతో సరిపెడితే , మనవాళ్ళు మాత్రం విందు భోజనాలే పెడతారు.

సరే…..’’హాపీ…నటరాజన్ సారు.. ఏమిటి విశేషాలు? “గుడి పక్కనే ఆగి అన్నాను. “ఏమైనా మీ లకలక సాంగ్  మాత్రం అదిరిపోయింది… అన్నట్టు ఫ్రీ గా వుంటే ఒక చోటకి పోద్దాం”అన్నాడు.

నేను దాదాపు 200 సినిమాల్లో ( డబ్బింగ్) పాటలు వ్రాయడం వల్ల తమిళ్ ఫీల్డ్ లో వారు చాలామంది తెలుసు. మ్యూజిక్ సిట్టింగ్స్ గట్రా  ఏర్పాటు చేసేది ప్రొడక్షన్ మేనేజర్లేగా, అందుకే నటరాజన్ బాగా తెలుసు.

“ఎక్కడకీ? “అన్నాను. టైం చూసుకొని ఏడున్నర అయ్యింది. నేను బ్రేక్ ఫాస్ట్ చేసేది పదింటికి గనక తొమ్మిదింటికి ఇల్లు చేరితే చాలు. స్నానం, పూజా పూర్తవ్వడానికి.

“దగ్గరలోనే… పది నిమిషాల నడక “బుగ్గ గోక్కుంటూ అన్నాడు.

“సరే పదండి..”అన్నాను నడుస్తూ..

“న్యాయంగా మిమల్ని తీసుకెళ్ళకూడదు , మీ ‘కవింజర్లు (కవులు ) రొంబ సెన్సిటివ్. కానీ, ఆమె మీకు నిండా తెలిసిన మనిషి “మనో ఇంటి వైపు వున్న రోడ్డులో ఎంటర్ అయ్యి అన్నాడు.

“ఎవరూ? “అని అడిగాను

“కోడంబాకంలో మీ తెలుగు ప్రొడ్యూసర్ వుంచుకున్నాడే , కుముదం .. ఆమె దగ్గరకి “చిన్నగా నవ్వి అన్నాడు.

ఇండస్ట్రీ హైద్రాబాద్ కి మారాక కోడంబాకంలో తెలుగు సినిమా వాళ్ళు ఎవరు మిగిలారూ? శ్రీ చంద్రమోహన్ గారు, జలంధర్ గారూ, మరి కొంతమంది, విశ్వనాథ్ గారు కూడా హైద్రాబాద్ కి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్లని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు.

“గుర్తురావడం లేదు “అన్నాను.

“ఆయన రెండు తమిళ్  సినిమాలు కూడా తీసి వుండాడు. బాగా వున్నోడు “అన్నాడు. అయినా పేరు గుర్తురావడం లేదు. అసలు కోడంబాకం సినిమా పని మీద వెళ్ళే దశాబ్దం దాటింది.

“సరే ఆ యమ్మని చూస్తే గుర్తుపడతారేమో చూద్దం “అన్నాడు.

సినిమా జనాలకి ఓ తెగులుంది. ఉన్నదిఉన్నట్టు చెప్పరు. బోలెడంత సస్పెన్సు మెయిన్ టైన్ చేస్తారు.  నటరాజన్ ఆ సిస్టంకి విరుద్ధమేమీ కాదు.  ప్రొడ్యూసర్ పేరు తెలిసినా ప్రస్తుతానికి చెప్పడని నాకు అర్ధమయ్యింది.

“ఇంతకీ ఆవిడని నేనెందుకు చూడాలి? “ఆగి అన్నాను.

“మీరు మంచివాండు గనక. కళ్ళలో నీళ్ళు తిరిగితే జేబులో నోటు తీసిస్తురు గనకా. అన్నిటికీ మించి ‘కుముదం “అని తమిళ్ నాట పెరిగినా ఆయమ్మ తెలుగే గనక “అన్నాడు

తమిళ్ వాళ్లని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు చేసే సహాయం చేసి వూరుకోరు. వీలున్నంతగా ఎదుటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అయితే ఎదటి వాళ్ళు చేసి౦దంతా కూడా ‘తామే “చేశామని అనుకోవడమే కాదు , పబ్లిసిటీ కూడా ఇచ్చుకుంటారు. ఇవ్వాళ నేనేదో తమిళ్ సోదర్లని ‘ఏకి “పెడుతున్నానని అనుకోకండి స్నేహితులారా! ఎందరో మహానుభావులున్నారు. వారందరికీ వందనాలు. కొందరున్నారు , వాళ్ళని గౌరవించడం ఏ తెలుగువాడి వల్లా కాదు. తమిళ్ భాషకి ప్రాచీన హోదా దక్కిందని ఏ తెలుగు వాడు బాధపడలేదు. నిజం చెబితే సంతోషించాము కూడా.

అదే హోదాని కేంద్రప్రభుత్వం తెలుగు భాషకిచ్చినప్పుడు ‘ఎందుకివ్వాలి? ఏ బేసిస్ మీద ఇచ్చారు? “అంటూ కోర్టుకెళ్ళారు. తెలుగుభాషకి ప్రాచీన హోదా దక్కితే వాడికి పోయిందేమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అది రావణ కాష్టంలా రగిలీరగిలీ ఇవ్వాళ మళ్ళీ తెలుగు వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందనుకోండి.

సరే నడిచీ నడిచీ 20 నిమిషాలు నడిచాక ఓ చిన్న సందు వచ్చింది. లోపలికెళ్ళాం. సందు చివర్న కొబ్బరాకుల్తో కుట్టిన చిన్న చిన్న పాకలు, గుడెసెలు. ఓ పాక ముందు ఆగాడు, నేనూ ఆగాను. ‘పొన్నాంబళం “అంటూ అరిచాడు నటరాజన్. నాకూ మీకూ తెలిసిన ‘పొన్నాంబళం “భారీ వ్యక్తి, విలన్. (ముత్తు సినిమాలో చూడండి). అతనిక్కడ వుండటం ఇంపాజిబుల్.

సన్నగా, రివట్లా వుండే ‘పొన్నాంబళం “బయటకు వచ్చాడు. “వాంగ…వాంగ “అతి వినయంతో లోపలకి ఆహ్వానించాడు. నటరాజన్ కదలకుండా , “అందమ్మా ఏమిసేస్తా వుండాది “అని చెన్నై తెలుగులో అడిగాడు.

“పడుకోని వుండాది”గుసగుసగా అన్నాడు. “సరే “వెనక్కి తిరిగాడు నటరాజన్.

“చూడాలన్నారుగా”అడిగాను నేను. ఇంతదూరం నడిపించి ఇప్పుడు వెనక్కి తిరిగితే అసలు తీసుకురావడం ఎందుకట?

“లేపితే బేజారు”అన్నాడు పొన్నాంబళం. అతనా మాట పూర్తి చేసేలోగానే ఓ నడివయసావిడ “హా.. ళ్ “అనే ఒక వికృతమైన అరుపుతో పాకలోనుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. పొన్నాంబళం ఠక్కున ఆమెని పట్టుకున్నాడు.

“వాంగ సారు… వాంగ… అన్నం పెడితే చాలు ఎంతసేపైనా.. ఎలాగైనా… రా.. ఇదిగో రా.. “అంటూ జాకెట్టు చింపుకొని రొమ్ము చూపిస్తూ అరచింది. ఒళ్ళంతా మట్టిగొట్టుకుపోయి వున్నా, చీర చిరుగులు పట్టి వున్నా, వదనం  మాత్రం మారలేదు. ఆమె.. అవును.. ఆమెని ప్రొడ్యూసర్ (so and so) ఇంట్లోనే చూశా.

“వాంగ సారు.. వా.. అన్నం పెడితే చాలు ఎంతసేపైనా .. వూ? రావూ? రారా నా కొడకా “అంటూ నటరాజన్ మీదకి వురికింది. ఒక్క గంతులో తప్పుకున్నాడు. యీలోగా పొన్నాంబళం లాగి ఆమె చెంప మీద కొట్టి, గట్టిగా పట్టుకొని పాకలోకి తీసుకెళ్ళి పాక తలుపుకి తాళం వేశాడు. లోపల నుంచి అదే అరుపు “అన్నం పెడితే చాలు రా “అంటూ

“మీరుండండి.. నేనొచ్చేదాక.. డాక్టర్ని తీసుకొస్తా “అని గబగబా అన్నాడు పొన్నాంబలం.

“ఏమయ్యిందండి? “బాధగా అడిగాను.

ఆ ప్రొడ్యూసర్ ది రాయలసీమ. భార్యబిడ్డలు అనంతపురంలోనో ధర్మవరంలోనో మరో ఊళ్లోనో వుంటారని జనాలు చెప్పుకునేవాళ్ళు. మనిషి మాత్రం ‘జమ్ .”చెప్పిన అమౌంట్ ని ఠంచన్ గా ఇచ్చేవాడు. ఆయన తీసిన ఓ డబ్బింగ్ సినిమాకి నేను రెండు పాటలు వ్రాశాను. అప్పుడు చూశాను యీవిడని. ఖరీదైన పట్టుచీరా, ఒంటి నిండా నగలూ, ఓ..హ్… మహా రాజసంగా ఆజ్ఞ ఇవ్వడం.   మహా గయ్యాళి అనేవాళ్ళు డ్రైవర్లు, నౌకర్లు.

అందంతా నీకెలా తెలుసంటే , వాళ్ళింట్లో పని చేసే ‘తిలగమే “తరవాత మా ఇంట్లోకి పనిమనిషిగా చేరింది.

“ఏవన్నా చెప్పండి అప్పా, ఆయమ్మకి నిండా తిమురు”అనేది… యీవిడ ప్రసక్తి వచ్చినప్పుడల్లా. అయితే మాకు తెలిసిన యీవిడ పేరు మహేశ్వరి.  పాండీబజార్లో నేను       ‘మలర్ కోడి మేన్షన్”లో వుండేటప్పుడు యీవిడ బ్రిలియంట్ టుటోరియల్స్ కి అవతల  వున్న వీధిలో వుండేది. మహాచలాకీ మనిషి. క్షణంలో మాటలు కలిపేది. “సినిమాని నమ్ముకొని వచ్చానండి, చిన్న వేషం ఇప్పించినా మీకు కృతజ్ఞురాలిగా వుంటా !”అని అనేది. నేనూ కొత్తే. ఆ మాట అడిగితే చెప్పాను “అమ్మా.. నేనూ కొత్తవాడ్నే “అని “మగాళ్ళకేం సార్ క్షణాలలో ఎదిగిపోతారు “అన్నది. ఆ మాట నాకూ ఇప్పటికీ గుర్తే.

సడన్ గా ఆవిడని ‘ఇలా “చూడటం నాకు డైజెస్ట్ కాలేదు. “నటరాజ్ గారు.. అసలు జరిగింది ఏమిటి? “అడిగాను. లోపలి నుంచి అవే అరుపులు వినిపిస్తుంటే మనసుకి దుర్భరం అనిపించింది.

“ఈ ‘కుముదం “తెలుగు పిల్ల. ఎట్టా చేరిందో మద్రాసుకి చేరింది. సెంట్రల్ బాచ్ వాళ్ళ గురించి విన్నారుగా ! పాపం వాళ్ళ చేతులో పడింది. “ఓ క్షణం ఆగాడు నటరాజన్.

సెంట్రల్ బాచ్ అంటే సినిమా మోజులో అనేక రాష్ట్రాల నుంచీ , పల్లెటూర్ల నుంచీ మద్రాసు కొచ్చే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి , వాళ్ళకి బోలెడు ఆశలు కల్పించి ‘వృత్తి “లోకి దించుతారు. లొంగని వాళ్ళని ఏ బాంబే కో, కలకత్తాకో, ఎగుమతి చేస్తారు. అదో పెద్ద సాలెగూడులాంటిది.

“మరి “షాక్ తో అన్నాను…

“యీ పొన్నాంబళం గాడు కూడా ఆ బాచ్ వాడే. అయితే సినిమా వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పని చేస్తూ వుండేవాడు. ఆ పిల్లని చూడగానే వీడికి బ్రహ్మాడంగా  ప్రేమ పుట్టుకొచ్చి, విడిగా తన దగ్గర పెట్టుకున్నాడు. సినిమా ఛాన్సులు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని సినిమాలలో ‘గుంపులో గోవిందం”లా కూడా కనిపించింది. ఆ తరవాత యీ పిల్ల ‘లక్ “ తిరిగింది. అలాంటి ఓ గుంపులో యీమెని చూసి మా బండరాక్షసుడిలాంటి కమేడియన్ … అదేనండీ… తెలీదా… నల్లగా.. లావుగా.. ఆ.. ఆయనే యీవిడకో చిన్న యిల్లు ఏర్పాటు చేశాడు. ఆ కమేడియన్ భార్య ఓ కొరకంచు. ఎట్టా తెలుసుకుందో ఏమో ఆర్నెల్లు

గడవకుండానే ఓ పొలిటికల్ గ్యాంగ్ కి చెప్పి యీవిడ్ని ఇల్లు ఖాళీ చేయించడమే కాక వార్నింగ్ కూడా ఇప్పించింది. ఆ గొడవతోనే సదరు కమేడియన్, భార్య విడిపోయేంతవరకు వస్తే ‘పెద్దాయన’  సంధి కుదిర్చి ఫామిలీ సేవ్ చేశాడు.“ఆగాడు నటరాజన్.

ఆ విషయం నాకూ గుర్తుంది. తమిళ్ నాడులో సినిమాకి, రాజకీయానికి అవినాభావ సంబంధం ఏదో వుంది.   అంతేకాదూ, రాజకీయనాయకుల్లో 90 మంది తెలుగు జాతి ‘వేర్లు  “ వున్నవారైనా , తెలుగుని విమర్శించడం, విస్మరించడం నిజంగా మనకు విస్మయం కలిగిస్తుంది.

“తరవాత “అడిగాను

“నేను చెబుతాను సామీ “అన్నాడు డాక్టర్ని తీసుకొచ్చిన పొన్నాంబళం. ఆ డాక్టర్ గారు నాకూ తెలుసు. శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డు లో వుండే ఎం.బి.బి.ఎస్. డాక్టర్. హస్తవాసి చాలా మంచిది. కానీ ఆయన ఇలా హోం విజిట్ చేయరు. మరి ఇక్కడికెలా వచ్చారో? అదే ఆయనతో అంటే “యీ పేషంటు నాకు కొత్త కాదు సార్, ఈవిడ అక్కడికి వచ్చేకంటే, నేను ఇక్కడకి రావడమే ఉత్తమం. అదీగాక అప్పుడప్పుడైనా వృత్తికి సంబంధించిన తృప్తి వుండాలి కదా సార్! “అని చిన్నగా నవ్వారు.

డాక్టర్ వెళ్ళిపోయాక మాతో పాటు పొన్నాంబళం కూడా నడుస్తూ వచ్చాడు.. ఇంటి తాళం వేసి. “మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, కొన్ని గంటల పాటు పర్లేదు. “ముక్తసరిగా అని “కథ నేను చెబుతానన్నాను కద సార్, తమిళ్ కమేడియన్ భార్య ఈవిడ్ని వెళ్ళకొట్టాక యీమెకి మళ్ళీ నేనే దిక్కయ్యాను. మనిషి చాలా మంచిది. అయినా ‘పాదరసం “లాంటిది. రెండు నెలలలోనే దుఖం నుంచి పుంజుకుంది.

మళ్ళీ ఓ నాడు షూటింగ్ దగ్గరే మీ తెలుగు ప్రొడ్యుసర్ గారి కంట పడింది. ఆయన పోయేంతవరకు అధారిటీ ఈవిడదే. అంత బలంగా ఆయన్ని అల్లుకుపోయింది. నేనూ అక్కడే ఆయన దగ్గరే డ్రైవర్ గా చేరాను. ఎంతలా ఈవిడ వుండేదంటే , నా మొహమే తెలీనట్టు ప్రవర్తించేది. డ్రైవర్ గానే చూసేది. కానీ సార్, నాకెందుకో యీమంటే ప్రాణం. కారణం నేను నిజంగా ప్రేమించిన అమ్మాయిలా వుండటమే. “ఓ క్షణం ఆగి, “నవ్వకండి సార్.. ఆఫ్ట్రాల్ డ్రైవర్ గాడికి ప్రేమేమిటి అనుకోకండి. లోకంలో అందరికీ ఎవరో ఒకరి మీద ప్రేమ వుంటుంది. ఎవరో ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ వుంటుంది. నేనూ ఆర్టిస్టు కాదలచుకునే మద్రాసొచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువు ఆగిపోయింది. నేను ప్రేమించిన పిల్ల నాకు షాక్ ఇస్తే, ఆ షాకులో స్త్రీలనే అసహించుకుంటూ చేయరాని పనులు చేశా. సినిమాల్లో అవకాశాలు రాలేదనే ఫ్రస్ట్రేషన్ మరో వైపు పీడిస్తుంటే , దయా ధర్మం జాలీ కృపా లేని సెంట్రల్ బాచ్ లో చేరాను. మళ్ళీ యీ మనిషిని చూశాక ఎందుకో ‘మనిషి “ నయ్యా. మీ తెలుగు ప్రొడ్యూసర్ అర్ధాంతరంగా పోయాక, యీవిడ చేతులు మారింది , పొట్ట గడవడం కోసం చివరికి ‘ఫలాన “వాళ్ళ చేతుల్లో పడింది. మొదటి నుంచీ నేను ఆమెని ఎంత ప్రేమించినా , నా ప్రేమ విషయం ఎన్ని సార్లు చెప్పినా తను మాత్రం లెక్క చేసేది కాదు. సెంట్రల్ బాచ్ నుంచి తప్పించాను కానీ “ఫలాన “బాచ్ నుంచి మాత్రం తప్పించలేకపోయాను. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఫుల్ గా వుంటుంది. ఎంత క్రూరత్వానికైనా పాల్పడుతారు. నాకు తెలిసిన యీవిడ ఏ పనైనా ఇష్టపడితేనే చేస్తుంది గానీ, బలవంతపెడితే లొంగదు. మరి లొంగదీసుకోడానికి వాళ్ళు ఏమేం చేశారో మన వూహలకి అందదు. ఆరునెలల పాటు పిచ్చిగా వెతికినా ఆవిడ నా కంట పడలేదు. చివరికి ఓ నాడు అంటే మూడు నెలల క్రితం “ఇప్పటిలాగానే , “అన్నం పెడితే చాలు.. ఆ తరవాత నీ ఇష్టం “ అని అరుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దగ్గర కనిపించింది. బట్టలన్నీ చీలికపీలికగా వున్నాయి.

నా గుండె ఒక్కసారి ఘొల్లుమంది. నా కారు… అదే, నేను నడిపే టాక్సీ లో తీసుకొచ్చి యీ పాకలో పెట్టాను. అప్పుడే యీ నటరాజన్ గారు చూసి మంచి మనసుతో కొంత డబ్బిచ్చారు. ఆమెకి ట్రీట్ మెంట్ చేయించాలంటే ఎంతవుతుందో తెలీదు. అదీగాక  ఎలా బయటపడాలో కూడా తెలీదు. పాపం ఆ డాక్టర్ గారికే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఆయనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఇప్పుడు పరవాలేదు. పదిహేనురోజులకో ఇరవైరోజులకో యీ మాదిరిగా అరుస్తూ వుంటుంది. ఓ రెండుమూడు ఇంజక్షన్ల తరవాత మౌనంగా పడుకొని వుంటుంది.  ”సైలెంటయ్యాడు పొన్నాంబళం.

ఎందుకో అతని చెయ్యి అందుకోవాలని అందుకున్నాను. మనం మనిషిని చూడగానే ఏవేవో అంచనాలు వేస్తాం. కానీ మనిషిలోని ‘అసలు మనిషిని “అర్ధం చేసుకోవాలంటే యీ బతుకు చాలదు.

“కనీసం నిన్నైనా గుర్తుపడుతుందా? “అడిగాను.

మెల్లగా నవ్వాడు “పడుతోందని నాకు తెలుసు సార్… కానీ గుర్తుపట్టనట్టే వుంటుంది. ఏమో గుర్తు కూడా లేనేమో. కానీ, అందరిలో వైల్డ్ గా ప్రవర్తించే ఆమె, నాతో మాత్రం వైల్డ్ గా ప్రవర్తించదు. పైపెచ్చు తలవొంచుకుంటుంది. ఆ తల వొంచుకుని కూర్చున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది సార్! మీ తెలుగు ప్రొడ్యూసరింట్లో రాణివాసం నెరిపింది. కానీ ఇప్పుడు , ఇంత దయనీయంగా .. “సైలెంటు అయిపోయాడు.

“ఆమెని నువ్వు.. “ఆగాను. “ప్రేమిస్తానా లేదా అనా? లేక ఆమెని నేను వాడుకున్నా లేనా అనా? ప్రేమిస్తాననే చెబుతా. నిజం చెబితే నేను ప్రేమించేది యీమెని కాదు, యీమె పోలికలున్న నా ‘కుముదా “న్ని. యీమెకి ఆ పేరు పెట్టింది నేనే. ఈవిడ అసలు పేరు ఏమిటో కూడా నాకు గుర్తులేదు. ఇహ వాడుకోవడం గురించా? లేదు సార్. ఒకప్పుడు నేను పచ్చి రౌడీని, తిరుగుబోతుని. ఇప్పుడు ఆ ఆలోచన వస్తేనే పొడుచుకొని చచ్చిపోవాలనిపిస్తుంది.

ఎందుకంటే, ఆవిడ అరుపులు విన్నారు కదా సార్… “అన్నం పెడితే చాలు … రారా “అని. నాలాంటి పాషాణంగాడే యీవిడ్ని అంత నీచానికి దిగజార్చి వుండాలి. ఏముండాది సార్? ఎముకలు చర్మం.. అక్కడక్కడా కొండలూ లోయలూ.. ఏముండాది సార్ యీ శరీరంలో. నేనిప్పుడు దీని గురించే ఆలోచించట్లేదు సార్. ఈమె బాగుపడాల. అంతే నేను చేసిన పాపంలో కొంతైనా యీమె బాగుపడితే , కరిగిపోయిందనుకుంటాను.

ముగ్గురం మౌనంగా నడుస్తూ నడుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దాకా వచ్చాం. మౌనంగానే సెలవు తీసుకొని కనకతారా నగర్ వైపెళ్లాడు నటరాజన్. నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు పొన్నాంబళం. నేను నడుస్తూనే వున్నాను. ఆలోచిస్తూనే వున్నాను. సినిమా వ్యామోహంలో ఎందరు బంగారు తల్లులు ఇలా పరమనీచుల చేతుల్లో చిక్కారో! ఎందరి మానాలు టైర్ల కింద పువ్వుల్లా నలిగిపొయాయో! ఎందరు ఆకలి కోరలకి బలై ఇలా ఆక్రోశిస్తున్నారో!

మెరిసే తారల్నే కాదు… రాలిపోయిన, రాలిపోతున్న నక్షత్రాలని మాత్రం ఎవరు లెక్కించగలరూ?

PS  : నటరాజన్ చెప్పిన కథనే (కొంత) పొన్నాంబళం చెప్పినా, రిపీట్ చెయ్యడం ఎందుకని పొన్నాంబళంతో కథని కంటిన్యూ చేశా. కథనం సాఫీగా వుండటం కోసం. వాళ్ళు మాట్లాడింది మూడు వంతులు తమిళం ఒక వంతు చెన్నై తెలుగు , అయినా నేను వీలున్నంత వరకు తెలుగులోనే చెప్పాను.

*

ముసుగు

 

 

-భువన చంద్ర

~

bhuvanachandra (5)‘సుమీ ‘ అంటే చలనచిత్ర పరిశ్రమలో ఎవరికీ తెలియదు. ‘సుమీ ‘ అసలు పేరు ‘సుమిత్ర ‘.

‘నల్లమణి’ అంటే ‘ ఆవిడా ‘ అని అందరూ అంటారు. తెలుగులో ‘నల్ల ‘ అంటే నలుపు. తమిళంలో ‘ నల్ల ‘ అంటే ‘మంచి’ అని అర్ధం. సుమీని ‘నల్ల మణి ‘ అనడం కేవలం ఆమె మంచితనాన్ని గుర్తించడానికే. అలాగని సుమీ అరవ పిల్ల కాదు. పదహారణాల తెలుగు పిల్ల.  పిల్ల అనడం తప్పే. ఆవిడ వయసు ఎట్టా చూసినా ముప్పై అయిదుకి తగ్గదు … ముప్పై ఆరుకి మించదు.

ఆమె ఉత్సాహం చూస్తే మాత్రం పదహారేళ్ళ పడుచుపిల్లలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

‘తలలో నాలుక ‘ అంటారే  అలా వుంటుంది అందరికీ. కార్తవరాయన్ పెళ్ళానికి పురుడొచ్చినప్పుడు వాడు వూర్లో లేకపోతే తనే హాస్పటల్ లో జేర్పించి, డిశ్చార్జ్ అయ్యే వరకు తోడుండి మరీ ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టింది.

“గాజులేమయ్యాయి?” అనడిగిన  ‘తాలాట్టు  సరళ ‘ కి “హాస్పటల్ బిల్లు కింద మారినై ” అని సమాధానం చెప్పిందిట.

“ఆ తాగుబోతు చచ్చినాడు నీకు గాజులు కొనిచ్చినట్టే! ” అని తాలాట్టు సరళ దెప్పిపొడిస్తే “వాడో సిగ్గోసిరి .. వాడివ్వడని నిండుచూలాల్ని రోడ్డు మీద వదుల్తామా? ” అని నవ్విందిట.

కోడంబాకం మొత్తంలో ఏనాడూ తలుపు మూయని ఇల్లు ఏదైనా వుంటే అది సుమీదే. అదేమీ ఆవిడ సొంతిల్లు కాదు. నెలకి ఏడొందలకి తీసుకున్న మేడ మీద పాకలో ఓ గది. ఆ పాకలో మొత్తం ఐదు పోర్షన్లు . అవన్నీ కొబ్బరాకుల తడికల్తో  సెపరేటు చేసినవే కానీ, గోడలతో కాదు. స్నానానికీ, టాయిలెట్టుకీ కింద వుండే రెండు బాత్ రూమ్ లు , టాయిలెట్లే గతి. అవి కామన్వి కనుక ఎవరూ కడగరు. రోజుకి రెండుసార్లైనా వాటి అతీగతీ  చూసేది సుమీనే.

“నీకెందుకే? ” అని పక్క పోర్షన్ లో వుండే కాటరింగ్ సావిత్రి అడిగితే ” ఆ.. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అందరం చస్తాము. సౌతాఫ్రికాలో గాంధి గారు అనుసరించిన మార్గాన్నే నేనూ అనుసరిస్తున్నాను. ” అన్నదట. అదీ ‘సుమీ ‘ అనబడే సుమిత్ర వ్యక్తిత్వం.

ఈ ‘ట ‘ లు ఎందుకంటే సుమిత్ర మొదట్లో నాకూ తెలియదు. ఆరుద్ర గారి ఇంటి ఎదుట వున్న ‘భగవతీ ‘ విలాస్  దగ్గర కనబడేది. అక్కడ ‘ప్రొడక్షన్ ‘ డిపార్టుమెంటు’ వాళ్ళుండే వాళ్ళు. పొద్దున్నే సినిమా కంపెనీలకి టిఫిన్లు ‘భగవతి ‘ విలాస్ నుంచే ఎక్కువగా సప్లై అయ్యేవి. గిన్నెలు అవీ కడగడానికి ‘కార్డు’ వున్న ఆడవాళ్లని ప్రొడక్షన్ వేన్ లలో ఎక్కించుకొని పోతూ వుండేవాళ్ళు. మొదట్లో సుమిత్ర కూడా అదే బాపతు అనుకున్నాను. కానీ కాదు.

ఆవిడ ఓ హీరోయిన్ కి “టచప్  విమెన్ “. సదరు హీరోయిన్ గారు సుమిత్ర ని పాండీబజార్ కారు ఎక్కించుకునేది. ఆ కారు వచ్చే వరకు సుమిత్ర ప్రొడక్షన్ వాళ్ళతో కబుర్లాడుతూ మంచీచెడ్డ తెలుసుకుంటూ వుండేదిట. అక్కడా సాయం చేయడమే లక్ష్యం.

మామూలుగా అయితే పరిచయం అయ్యే అవకాశం లేదు. ఎవరు ఎవరికి ఎప్పుడు తారస పడతారో అప్పుడే వారు తారసపడతారని మా అమ్మగారనేది. “ఇంతమంది అన్నల్ని, అక్కల్ని వదిలి నువ్వు ఇంత దూరంగా ఢిల్లీలో   ఎందుకున్నావో తెలుసా? ఏ జన్మలోనో అక్కడి నేలా, నీరు, గాలీ నీకు ఋణమున్నాయి. ఎప్పుడో నువ్వక్కడ పుట్టి వుండకపోతే అక్కడకి ఎన్నడూ పోలేవు. ” అన్నది ఢిల్లీ నుండి వచ్చిన రోజున. ఎడార్లో వున్నప్పుడు అదే మాట అనేది.

సుమిత్ర నాకు తారస పడటం ” —–  గెస్టు హౌస్ ‘ లో నేను పాట రాయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, నన్నా గెస్టుహౌజ్  లో పెట్టారు. రూంస్ చాలా కాస్ట్లీ. కానీ బ్రహ్మాండంగా  వుండేది. భోజనం రుచిగానూ, శుచిగానూ వుండేది.  హీరోయిన్ కూడా అక్కడే దిగేది. విశాలమైన గదులు, చక్కని గార్డెన్.

రెండో రోజు మెట్లెక్కుతూ జారిపడ్డాను. కాలికి మెట్టు కొట్టుకొని విపరీతమైన బాధ. ఆ శబ్ధానికి ఎదుటి గదిలో నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. చెయ్యి ఆసరా ఇచ్చి పై అంతస్తులో వున్న నా గది దాకా నడిపించింది. భుజం కూడా ఆసరా అయ్యింది.

గంటలో మా వాళ్ళు వచ్చి  ఏక్స్ రే అవీ తీయించారు. ఏదీ విరగలేదు కానీ మజిల్ రప్చర్ అయ్యిందన్నారు. మళ్ళీ నా గదిలో ‘బెడ్ రెస్ట్ ‘ అంటూ దిగబెట్టారు. న్యాయంగా నాకు సేవ చేయాల్సిన అవసరమో , నన్ను చూసుకోవాల్సిన బాధ్యతో ఆమెకి లేదు.

కానీ తనంతట తానే వచ్చి కాలుకి కాస్త కాపడం పెట్టడం , డాక్టర్ ఇచ్చిన లిక్విడ్స్ పూయడం , నేను వీలుగా పడుకుంటే టిఫిన్ ప్లేట్లో, భోజనం ప్లేట్లో చేతికివ్వడం, మంచి నీళ్ళు తాగాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేట్లు తను పట్టుకొని నాకు మంచినీళ్ళు తాగే వీలు కల్పించడం లాంటి సేవలు చేసేది.  నేను మొహమాట పడితే ” ఇందులో ఏముందండీ? అయినా మీ పాటలంటే నాకు ఇష్టం… పోనీ ఏ పాటలోనైనా నా పేరు ఇరికించండి. ” అనేది నవ్వుతూ.

ఆ ‘హీరోయిన్ ‘ కూడా వచ్చి పలకరించేది. వస్తూ పళ్ళు అవీ తీసుకొచ్చేది. “ఎందుకివన్నీ ” అని నేను మొహమాట పడితే “, “నాకో సూపర్ హిట్ సాంగ్ ఇస్తారని కాకాపడుతున్నా ” అనేది.

వారంలోగా రెండు పాటలు పూర్తి చేశాను. కాలూ బాగుపడింది. సాయంత్రాలు ముగ్గురం కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. పాటలు రాశాను కనక వెళ్ళిపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ మరో నాలుగు రోజులు వుండమన్నారు. కారణం ఇంకో రెండు ట్యూన్లు రెడీ అవుతున్నాయిట.

“మీదేవూరండీ?” అడిగింది సుమిత్ర ఓ ఉదయమే. “ఫలానా ” వూరని చెప్పాను. పకపకా నవ్వి “చూశారా! నేను అనుకున్నదే నిజమయ్యింది. నిన్న మీరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సరదాగా “చేద్దాం.. చూద్దాం ” అంటూ యాసలో మాట్లాడారు. ఆ యాస మా పక్కదే.”

“అంటే?” నవ్వాను

“మీ వూరి దగ్గరే మా వూరూనూ! అయినా పొట్ట చేత పట్టుకున్నవాళ్ళకి ఏ వూరైతేనేం. కానీ, ఏదో పాశం పుట్టిన గడ్డకి లాగుతూనే వుంటుంది. ” మామూలుగా అన్నా ఓ చిన్న బాధ ధ్వనించింది.

“సుమిత్ర గారు! నేను చాలా కాలం నుండి  మిమ్మల్ని చూస్తున్నాను… భగవతీ హోటల్ దగ్గర. మా వూరి దగ్గరే మీ వూరు అన్నారు కనక అసలు మద్రాస్ ఎలా వచ్చారో  చెప్తారా? కేవలం కుతూహలంతో అడుగుతున్నా! ” అన్నాను.

“అందరూ నన్ను ‘మణి ‘ అనో, ‘నల్లమణి ” అనో, పిలుస్తారు. తెలిసిన వాళ్ళు సుమీ అనో, సుమిత్ర అనో లేకపోతే ఒసేయ్ సుమిత్ర అనో పిలుస్తారు. మీరు మాత్రం ‘గారూ ‘ అన్న గౌరవవాచకం తగిలించి నా నెత్తిన కిరీటం పెట్టారు. మొదట మనిషిగా చూసినందుకు థాంక్స్. ఇక నా కథ అంటారా… కోడంబాకంలో వున్న నాలాంటి వాళ్లందరిదీ ఒకటే కథ. మరీ ప్రత్యేకమైనది ఎమీ లేదులెండి. ” తేలిగ్గా నవ్వేసింది.

“చూడటానికి, వినడానికి అన్నీ ఒకేలా వున్నా , ఎవరి కథ వారిదేనండీ. ఎవరి కథ ఎవరిని ఎలా మార్చగలదో ఎవరికి తెలుసు? నేనూ ఒకరి జీవితాన్నించి స్ఫూర్తి పొంది మద్రాసుకి వచ్చాను. కుతూహలంతోనే అడిగాను సుమిత్ర గారు. ఇందులో బలవంతం ఏమీ లేదు ” అనూనయంగా అన్నాను.

“చెప్పకూడదని ఏమీ లేదండి. చెప్పినా నష్టం లేదు. నిజం చెబితే చెప్పాలనే వుంది. అన్నట్లు మీరు “చినరాయుడు’ లో “చెప్పాలనుంది సుందరి … కథ విప్పి చెబుతాను సుందరీ ” అని పాట కూడా రాశారుగా. నేనూ చెబుతా. .. అయితే నాకు  కొంచం టైం ఇవ్వాలి. ” చిన్నగా నవ్వి అన్నది.

“ఓ పదేళ్ళు తీసుకోండి ” నవ్వి దిండు మీదకు వాలాను.

“హి.. హి.. మరీ అంత తక్కువ టైమా? సరే! చిన్నప్పటి నుంచీ ‘ప్రేమ ‘ అంటే నాకు అసహ్యం. నా ఫ్రెండ్స్  లో ‘ప్రేమ ‘ పేరుతో చాలా మంది కన్యత్వాన్ని సమర్పించుకున్నారు. కొంతమందైతే రహస్యంగా డాక్టర్లని కూడా బ్రతిమాలుకొని ‘బుద్ధి ‘ తెచ్చుకున్నారు ” ఆగింది. నేను పడుకున్నవాడిని కాస్తా మళ్ళీ వీలుగా కూర్చున్నాను. మరింత అటెంటివ్ గా.

“నాకు తెలియని విషయం ఏమిటంటే ‘ప్రేమ’ ని కంట్రోల్ చేసుకోవడం తేలికేగానీ ‘పెళ్ళి’ ని కంట్రోల్ చేయడం కష్టం అని. మగాళ్ళలో ఓ మాదిరి తెలివిగలవాళ్ళు ‘మూర్ఖులు ‘ , ‘ప్రేమ ‘ పేరుతో ఆడదాన్ని ప్రలోభ పెట్టే పద్ధతి ఎన్నుకుంటే, మహా  తెలివైనవాళ్ళూ , ప్రేమకు ‘సొడ్డు ‘ కొట్టడం తెలిసినవాళ్ళు ‘పెళ్ళి ‘ పేరుతో వలవేస్తారు. నా విషయంలో జరిగింది వేరు. ” ఓ క్షణం ఆగి కళ్ళు మూసుకుంది. బహుశా గతపు నీడల్లోకి పయనించి వుండొచ్చు.

“అతని పేరు సుధాకర్. నేను డిగ్రీ రెండో సంవత్సరం , అతను అప్పటికే బ్యాంక్ ఉద్యోగి . నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఎదురుపడ్డాడు కానీ , ఎప్పుడూ వెకిలిగా బిహేవ్ చేయ్యలా! అలాగే నేను చామనఛాయ కంటే కొంచం తక్కువ. అతనేమో ‘ఫారన్ ‘ కలర్. అంటే గోల్డన్ బ్రౌనన్న మాట. ఓ రోజు సడన్ గా “సుమిత్ర గారు… మిమల్ని చాలా రోజుల నుంచీ గమనిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నేనంటే మంచి అభిప్రాయం వుంటే ‘పెళ్ళి ‘ చేసుకుందాం.. మీరెప్పుడు ఓ.కే అంటే ఆ క్షణాన్నే మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో మాట్లాడుతా. పెళ్ళైంది కదా అని మీరు చదువు మానక్కర్లేదు. డిగ్రీనే కాదు.. పోస్ట్ గ్రాడ్యేషన్ కూడా నేనే చేయిస్తా… నో కట్నం. ఆలోచించుకొని చెప్పండి. ” అని వెళ్ళిపోయాడు. నాకు షాకు. అసలు నా పేరు అతనికి ఎవరు చెప్పారో కూడా నాకు తెలియదు. ” మళ్ళీ ఆగింది సుమిత్ర. కొన్ని క్షణాలు మౌనం పాటించాము.

“తరవాత” కుతూహలంగా అడిగాను.

“అతను డైరెక్ట్ గా అడిగిన విధానం నచ్చి నేను ఓ.కే. చెప్పాను. అతనూ మాట తప్పకుండా మా ఇంటికి వచ్చాడు. అయితే అతను వచ్చిన రోజు ఇంట్లో నేను వదినా తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కారణం మా నాయినమ్మ చనిపోవడం. అతను చెప్పదలచుకున్నది మా వదినతోటే సూటిగా స్పష్టంగా చెప్పాడు. ” మళ్ళీ ఓ బ్రేక్.

“మీ కులం ఏమిటి? ” ఒకే ఒక ప్రశ్న అడిగింది మా వదిన. మా ఒదిన అంటే చాలా పెద్దదని అనుకునేరు. ఆవిడ నాకంటే కేవలం ఐదేళ్ళే పెద్దది. ” సుమిత్ర పెదవుల మీద చిరునవ్వు.

“ఊ.. ” అన్నాను.

“అవసరమా? సరే.. నా కులం ఏమిటో నాకే తెలియదు. ‘ఫలానా ‘ కులం వాళ్ళు నన్ను పెంచుకున్నారు గనక నా కులం ‘ఫలానా ‘ దే అనుకోవచ్చు” అన్నాడతను.

“అయితే.. ఈ జన్మకి మావాళ్ళు ఒప్పుకోరు. మీ కులానికి మా కులానికి పురాణ వైరం వుంది. మా వాళ్ళు

ప్రాణాలన్నా  వదులుకుంటారు కానీ కులాన్ని వదులుకోరు ” స్పష్టంగా చెప్పింది మా వదిన. ఆవిడ అన్న మాట తప్పు కాదు. మా వాళ్లకి ‘కులం ‘ అంటే చెప్పలేనంత అభిమానం ” నిట్టూర్చింది సుమిత్ర.

“అదీ నిజమేలెండి. ఇవాళ మనిషిని సంస్కారాన్ని బట్టి ఎవరూ గుర్తించడం లేదు. గుర్తించేది కేవలం కులంతోటే ” నవ్వాను నేను.

“అంతేగా! ఆ తరవాత మా వదిన ఒక సలహా ఇచ్చింది! ” నవ్వింది

“ఏమని? ”

“లేచిపొమ్మని!” నవ్వింది

“లేచిపోతే మా ప్రేమని దక్కించుకున్నట్టు అనడమే కాక, ఎప్పుడో ఒకప్పుడు మావాళ్ళు ఒప్పుకోవచ్చు . ఒప్పుకుంటే వేరీ గుడ్, ఒప్పుకోకపోతే ప్రేమైనా దక్కుతుంది గదా.. అదీ ఆవిడ రీజనింగు ” మళ్ళీ నవ్వింది సుమిత్ర.

“నవ్వుతారెందుకూ? మంచి సలహానేగా? “అన్నాను.

“మంచి సలహానే. రెండు నెలల క్రితం వాళ్ళ చెల్లెలు ఇదే సమస్య తో మా వదినని సలహా అడిగితే “పెద్దవాళ్ళని క్షోభపెట్టి మీరేమి బావుకుంటారు, నోరు మూసుకొని అమ్మానాన్న కుదిర్చిన సంబంధం చేసుకో. ప్రేమా గీమా అంటూ పిచ్చివాగుడు వాగకు ” అని నానా తిట్లు తిట్టింది ” ఈ సారి పగలబడి నవ్వింది  సుమిత్ర.

“ఇంత నవ్వెందుకంటారా? నేను ప్రేమ పేరుతో లవ్ మారేజ్ చేసుకుంటే నా పెళ్ళి ఖర్చు తప్పుతుంది. ఆస్తిలో కూడా చిల్లిగవ్వ ఇవ్వక్కర్లేదు. మొత్తం మా అన్నవదినలకే దక్కుతుంది. ఇంత దూ(దు) రాలోచన వుంది…. ఆ సలహా వెనుక.

“మరేం చేశారు? ” కుతూహలంగా అడిగాను

“సుధాకర్ కి సారీ చెప్పాను. కానీ..” నిట్టూర్చింది…

“ఊ…”

“నెలరోజుల పాటు ఆలోచించి ఆలోచించి అతని దగ్గరకే వెళ్ళి “మీకు ఓ.కే అయితే నాకూ ఓ.కే ” అని చెప్పాను.

దానికతను నవ్వి ” సారీ సుమిత్ర గారు! మీరెప్పుడైతే నో అన్నారో అప్పుడే నేను మావాళ్ళు చెప్పిన సంబంధం ఓ.కే అని చెప్పాను, ప్రేమ గొప్పదా?.. కాలం గొప్పదా? అనడిగితే నా దృష్టిలో కాలమే గొప్పది . ప్రేమించినవాళ్ళు ప్రేమించిన వారి కోసం కొన్నాళ్ళు ఆగొచ్చు. కానీ కాలం క్షణం సేపు కూడా ఆగదు అన్నాడు ” ఈ సారీ సుధీర్ఘంగా  నిట్టూర్చింది సుమిత్ర.

“తరవాత?”

“మా వదిన చెడ్డది కాదు, అలాగనీ మంచిదీ అనలేను. సుధాకర్ విషయం మా వాళ్ళతో చెప్పింది. అప్పటినుంచి నా బ్రతుకు ఘోరమైంది.

“ఎందుకు చెప్పావు? ఆల్రెడీ అతనికి పెళ్ళి కుదిరింది కదా ‘ అని అడిగితే ” ఏమో మీవాళ్ళూ సరే అంటే నీ ప్రేమ సఫలం అవుతుందని ఊహించాను.   అందుకే మీ అన్నయ్యకి చెబితే, మీ అన్నయ్య మీ అమ్మానాన్నకు చెప్పారు. ఇలా అవుతుందనీ నాకేం తెలుసు ” అని దీర్ఘం తీసింది.

నేను ఎవరితో లేచిపోతానో అనే భయంతో నా కాలేజి చదువు మానిపించారు. అంతే కాదు రోజంతా ‘నడవడిక ‘ గురించీ పరువూ- ప్రతిష్టల గురించీ క్లాసులు! ” మొహంలో నైరాశ్యంతో కూడిన నవ్వు కానీ నవ్వు.

“ఊ…” అన్నాను. ఓ ఎమోషన్ లో వున్నవారిని మాటల్తో విసిగించేకంటే ‘ఊ..ఊ… ‘ల భాష ఉపయోగించడమే మంచిది.

“సార్… పెద్దవాళ్ళు ఒకరకంగా మూర్ఖులు.. పిల్లలకేదో ‘బుద్ధి ‘ చెబుతున్నామనకుంటూ ‘పిచ్చి ‘ పుట్టిస్తారు. చెప్పిందే వందసార్లు చెప్పి విసిగిస్తే ఏమౌతుందీ? మెదడూ, మనసూ కూడా మొద్దుబారతాయి. నాకు జరిగిందీ అదే! ‘తిక్క ‘ పుట్టుకొచ్చింది. చదువు మాన్పించడంతో ‘కచ్చ ‘ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో పరిచయమయ్యాడు బదిరీ… అంటే బదిరీనారాయణ ” మళ్ళీ మౌనంలోకి జారిపోయింది.

రాలిపోయిన క్షణాల్ని ఏరుకోవాలంటే మౌనం ఒక్కటే ఆయుధం “అతను అందగాడు కాదు. అనాకారి. కానీ గొప్ప మనిషి. ఒకసారి  మా అమ్మతో పాటు గుడికెళ్తే అక్కడ పరిచయమయ్యాడు. మా అమ్మని “మీరు ఫలానా కదూ ” అనడిగి పరిచయం చేసుకున్నాడు. అతనిదీ అమ్మ వాళ్ళ వూరే. నాకంటే పదిహేనేళ్ళు పెద్దవాడు. ఓ రోజు నా బాధలు అడిగి తెలుసుకున్నాడు. మావాళ్ళు అతన్ని మాయింటికి రానివ్వడానికి కారణం అతను మా కులం వాడే. మెల్లగా మా వదిన రాజకీయం నడిపింది , నాకు అతన్ని ‘పెళ్ళికొడుకుగ్గా ‘ మాట్లాడేట్లు మా వాళ్ళని వొప్పింది.

ఇదో కొత్త ట్విస్ట్ .. అయితే అసహజమైనది కాదూ. ఘనత వహించిన భారతీయ సగటు తల్లిదండ్రులకి ‘పిల్లలకంటే, వాళ్ళ భవిష్యత్తు కంటే, ‘పరువు-ప్రతీష్టలే ‘ ముఖ్యం అని పురాణకాలం నుంచీ స్పష్టమైన ఆధారాలు మనకున్నాయి.

‘చచ్చినా సరే.. పెళ్ళి చేసుకొని చావు ‘ అనేది ఇంగ్లీషు రాజ్యంలా , అన్ రిటెన్ కాన్స్టిట్యూషన్.

“నా వాళ్ళ దగ్గర వుండే కంటే నరకంలో వున్నా గొప్పగానే వుంటుందని నేను పెళ్ళికి ఒప్పుకున్నా.

“సుమిత్రా.. కాలం మనకోసం ఆగదు. ఆగని దాన్ని మనమెందుకు గుర్తించాలి? ప్రేమ ఆగుతుంది… ఎన్నాళ్ళయినా.. ఎన్నేళ్ళయినా .. అందుకే నువ్వు నీ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవరకూ నేను ముట్టుకోను. రేపే కాలేజీలో చేరు… ట్యూషన్ తీసుకో. డిగ్రీ తెచ్చుకొని తీరాలి! ” అన్నాడాయన శోభనం రోజు ! ”

సుమీ దీర్ఘంగా నిట్టూర్చింది. ప్రతి నిట్టూర్పు వెనకాల కొన్ని వేల ఆలోచనలు సమాధుల్ని చీల్చుకొని బయటకొస్తున్నాయని నాకు అర్ధమయింది.

“టైమ్‌కి విలువిచ్చి సుధాకర్ వేరేదాన్ని పెళ్ళిచేసుకుంటే, ప్రేమకి విలువిచ్చి బదరీ నాకు స్వేచ్చనీ, చదువునీ ప్రసాదించాడు. అందం ‘వయసు ‘ తోనూ ‘తనువు ‘ తోనూ వుండదనీ , అందుండేదీ ‘ మనసు ‘ లోనేననీ నాకు అర్ధమవడానికి సంవత్సరం పట్టింది.

పట్టుపట్టి పరీక్షలు పాస్ అయ్యాను. డిగ్రీ చేతికొచ్చిన రెండో సంవత్సరానికల్లా  ఓ బిడ్డకి తల్లినయ్యాను ” ఓ చిన్న నిట్టూర్పు..

“ప్రతి కష్టం ఓ సుఖానికి పునాదే అని ఎవరూ చెప్పరు. కానీ అది నిజం. ఉద్యోగం చేస్తున్న బదిరి, సడన్ గా పోవడంతో భయంకరమైన శూన్యం నన్ను ఆవహించింది.అదృష్టం ఏమిటంటే, అతను చేస్తున్న ఉద్యోగమే ఆ కంపెనీ వారు నాకు యిచ్చి నన్ను ఆదుకున్నారు ” మళ్ళీ మౌనం.

“అయ్యా జరిగింది జరిగినట్టుగా, వరుస క్రమంలో చెప్పాలంటే , ఓ నవల తయారవుతుంది. ఒకటి మాత్రం నిజం ఆడకానీ మగ కానీ ఒంటరిగా వుండటం చాలా కష్టం. యవ్వనం ఎటువంటిదంటే ఎంతకైనా తెగింపచేస్తుంది. బదరీ వాళ్ళ అమ్మ వచ్చి ఓ రోజున నాతో దెబ్బలాట పెట్టుకుంది… మాకు పుట్టిన పిల్లాడిని తనకు ఒప్పజెప్పాలని. మొదటి నుంచీ నా విషయంలో ఆమె దురుసుగానే వుంది. కారణం నేను అంతకు ముందే ‘ప్రేమ ‘ లో పడ్డానని ఆమెకు ఎవరో ‘ఉప్పు ‘ అందించడమే. ఓ పక్కన భర్త పోయిన బాధ, రెండో పక్క అత్తగారితో దెబ్బలాటలు నా మనశ్శాంతిని  వంచించాయి. అప్పటికే ‘ఓదార్పు ‘ పేరుతో నాతో కొంచం సన్నిహితంగా వచ్చిన  ‘వినోద్ ‘ నాకు ధైర్యం చెప్పాడు. వినోద్ నిరుద్యోగి.. కానీ గొప్ప నటుడు. అతని డ్రామాలు నాలుగైదు అంతకు ముందే మా వారితో  కలిసి చూశాను. ఓ విధంగా అతను మా వారికి ఓ మాదిరి స్నేహితుడే! ” గుక్క తిప్పుకోవడం కోసం ఆగింది.

“ఎందుకు .. ఎలా అనేదాని కంటే , బిడ్డను అత్తగారికిచ్చేసి వినోద్ తో నేను మద్రాస్ వచ్చేశాను. నాలుగేళ్ళపాటు పాండీబజారులో ‘ఫలానా ‘ షాప్ లో సేల్స్ గార్ల్ గానూ, ఆ తరవాత ఎకౌంటెంట్ గా, ఆ తరవాత ‘ఫలానా ‘ హోటల్లో హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ గా , బోలెడు అవతారాలెత్తాను. నిజం చెపితే వినోద్ అవకాశాలు వెతుక్కోడానికి అవకాశం కల్పించాను. ”

“వినోద్ అంటే? ”

“తొందరెందుకు సార్ , మామూలు ఎగస్ట్రా వేషాల్నించి ‘హీరో ‘ గా ఎదిగిన ‘ఫలానా ‘ వ్యక్తి గురించే నేను చెప్పేది ” నవ్వింది.

“మై గాడ్ కోట్ల మీదేగా అతని సంపాదన? ” షాక్ తిన్నాను.

“అవును నిచ్చెన ఉపయోగపడేది మేడ ఎక్కడానికే. ఎక్కాక నిచ్చెనతో పనేముంది? ” నిట్టూర్చింది.

“మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ తరవాత అర్ధమయింది. ‘వినోద్ ‘ అనే రాయిని ‘శిల్పం’ గా మార్చాలనేది నా కోరిక. నిచ్చెనగా ఉపయోగపడమని అతను నన్ను అడగలేదు.  శిల శిలగా ఉన్నప్పటి కథ వేరు. శిల శిల్పమైతే? దాని అసలైన స్థానం ఏమిటో అక్కడకి అది చేరి తీరుతుంది. వినోద్ కూడా అతని చేరాల్సిన స్థానానికి చేరాడు. అతని తప్పేముంది? “మళ్ళీ ఓ సుదీర్ఘ నిట్టుర్పు. నిజంగా నాకు షాక్. వినోద్ (అసలు పేరు వాడలేదు) అంత ఎత్తుకి ఎదుగుతాడని మేము ఎన్నడూ వూహించలేదు. అతని టాలెంట్ కాక అదృష్టమూ అతని తలుపు తట్టింది. అదే, సుమిత్ర తలుపు మూసేసింది.

“తరవాత?” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను.

“ఏ ‘మగవాడి ‘ దగ్గర పనిచేసినా వాడి చూపులు “శరీరం” మీదే వుండేవి. కోరికకీ – అందానికి సంబంధం పెద్దగా వుండదేమో. ఒకరు నన్ను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ఇంకొకరు నన్ను పెళ్ళి చేసుకొని ప్రేమించారు. మరొకరు నన్ను ఓదార్చే ప్రయత్నంలో దగ్గరై మరో స్థాయికి చేరారు. నేనూ మాత్రం ఏం చెయ్యనూ? నా అత్తమామలకి వారసులు లేరు గనక , నా బిడ్డని వాళ్ళ వారసుడిగా వారికే వప్పచెప్పాను. ప్రేమ మీద నమ్మకం లేని నాకు ప్రేమే కరువయ్యింది. కానీ , ఆ ప్రేమ కోసం శరీరాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ హీరోయిన్ నాకు చాలాకాలం నుండి పరిచయం వున్న వ్యక్తే. అందుకే ఆమె దగ్గర “టచప్ వుమెన్ ” గా చేరాను. నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తోంది. ఇక కంఫర్ట్ అంటారా? అంతెక్కడా? ” మళ్ళీ ఆగింది.

“మరి.. ” ఓ ప్రశ్న వెయ్యబోయి ఆగాను.

“ఇప్పటి జీవితం గురించా? నిజం చెబితే చాలా ఆనందంగా వున్నాను. గురూజీ.. ‘ఫలానా ‘ది కావాలని అని కోరుకున్నంత కాలం నేను అనుభవించింది క్షోభే. కానీ ఇప్పుడు ‘నాకేదీ వద్దు ‘ అనుకున్నాను కనక హాయిగా వుంది. అసలేం కావాలి డబ్బా? పదవులా? పెద్ద ఉద్యోగమూ, జీతమూ పరపతి అవా? అవన్నీ వుంటే సౌకర్యం వుంటుందే కానీ ‘సుఖం ‘ దక్కుతుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు నన్ను చాలా కాలం వెంటాడాయి. ఇవన్నీ వున్నవాళ్ళు సుఖపడుతున్న దాఖలాలేవీ నాకు కనిపించలేదు.

డబ్బు సంపాదన పెరిగే కొద్ది అనవసరమైన వస్తువులు  కొనడం, అర్ధం లేని ఆడంబరాలకు పోవడం, తప్ప ‘నిజమైన సుఖం ‘ నాకు అవగతం కాలేదు. ‘రేపటి మీద ‘ ఆశలతో మనిషి ‘ఈనాడు’ ని నిర్వీర్యం చేసుకున్నాడని అనిపించింది. అందుకే, అన్నీ వదిలేసి అతిసామాన్యులు వుండే పాకలో వుంటున్నా. నాకు తోచినంతగా పదిమందికీ వుపయోగపడే ప్రయత్నం చేస్తున్నాను ” ఆగింది.

“సరే.. పాకలో వుంటే ఏమి తెలిసిందీ? ” కుతూహలంగా అడిగాను

పకపకా నవ్వింది సుమిత్ర “కవిగారూ.. మీలో ఇంకా ఆ ‘సైనికుడి ‘ మనస్తత్వమే వుంది కానీ, సినిమా మనస్తత్వం రాలేదు. అయ్యా, తాజ్ మహల్లో వున్నా, పూరి గుడిసెలో వున్నా మనుషుల ‘ నిజమైన ‘ మొహాల్ని ఎప్పటికీ చూడలేమని అర్ధమయ్యింది. గొప్పవాళ్ళు ఒక రకం ‘ముసుగులు ‘వేసుకొని కృత్రిమంగా జీవితం గడుపుతుంటే , పేదవాళ్ళు మరోరకం ముసుగులు తగిలించుకొని కృత్రిమమైన జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. నాకు నిజంగా అర్ధమైనదేమిటంటే , పేదా గొప్ప తేడాలు ‘ఆస్తిపాస్తుల్లో ‘ లేవని కేవలం ‘మనసుల్లో ‘ మాత్రమే వున్నాయని అర్ధమైంది! ” అన్నది.

బహుశా పేద గొప్పలకి ఇంత పెద్ద నిర్వచనం ఇచ్చింది సుమిత్ర ఒకతేనేమో! మనిషి యొక్క గొప్పతనము, పేదతనమూ నిజంగా డబ్బుతో కాదు , మనసు బట్టి ఆధారపడి వుంటుందన్న మాట ఆ తరవాత 72 గంటల్లో ఋజువైంది.

ఈ సంభాషణ జరిగిన రోజే నేను చెన్నై వచ్చేశా యీవినింగ్ ఫ్లైట్ లో. కారణం ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజింగ్ రికార్డింగ్ చెన్నై లో చేద్దామనుకోవడం వల్ల.

రెండు రోజుల తరవాత పాండీబజారు లో ‘సుమీ ‘ కనిపించింది.

“అదేంటీ? ఈ నెలాఖరు వరకు మీ షెడ్యూల్ వుందన్నారుగా? క్యాన్సిల్ అయ్యిందా? “ఆశ్చర్యంగా అడిగాను.

సన్నగా నవ్వింది సుమిత్ర.

“షెడ్యూల్ మామూలుగానే వుందండీ.. నాకే పని “ఊడిపోయింది! ” అన్నది.

“అదేంటీ? మీకూ హీరోయిన్ కి …. ” ఆగాను..

“ఊహూ.  సినిమాహిరో గారితో ప్రాబ్లం వచ్చింది. మొన్నటి వరకు అన్నీ హీరోయిన్ ఓరియంటెడెడ్ సీన్లు , మిగతా సీన్లు షూటింగ్ జరిగాయి.  మొన్న హీరో గారు ఎంటర్ అయ్యారు. వారు నన్ను చూసి ఇబ్బంది పడ్డరనుకుంటాను. ‘సెట్ ‘ నుంచి నన్ను తప్పించమని వారు డైరెక్టర్ కి చెబితే , డైరెక్టర్ ప్రొడ్యుసర్ కి, ప్రొడ్యుసర్ హీరోయిన్ గారికి చెప్పారుట. చివరికి హీరోయిన్ గారు నన్ను పిలిచి “సారీ సుమీ.. నిన్ను చూసి బహుశా హీరోగారికి మొహం చెల్లలేదనుకుంటా… ఏమైనా, అతనా టాప్ హీరోలలో ఒకడు. నేనింకా అంతగా నిలబడిపోలేదు. నువ్వే అర్ధం చెసుకొని.. ” అంటూ చెక్కుబుక్కు తీసింది. ఇంకేం చెస్తా, నాకు రావల్సిన మొత్తం మాత్రం తీసుకొని ట్రైనెక్కాను ” నిట్టూర్చింది సుమిత్ర.

“మరి.. ఇప్పుడు… “ఆగిపోయాను “అంటే ఆ హీరో వినోదేనా?” ఆత్రంగా అడిగాను.

“అవును.. ఒకప్పుడు నా మీద ఆధారపడ్డవాడు నన్ను ఆఫ్ట్రాల్ ఓ టచప్ విమెన్ గా ఎలా చూడగలడూ? అందుకే… ” పకపకా నవ్వింది.

“మరి.. ఇప్పుడు ” ఇందాకటి ప్రశ్నే మళ్ళీ అడిగాను.

“జీవితం చాలా విశాలమైనది సార్.. ఎన్ని తలుపులు మూసుకుపోయినా ఏదో ఒకటి మళ్ళీ తెరుచుకుంటుంది. అయినా యీ మాత్రం సస్పెన్సు లేకపోతే జీవితం నిస్సారంగా నడుస్తుంది కదూ! ” నవ్వీ నడక సాగించింది సుమీ అనబడే సుమిత్ర ఉరఫ్ నల్లమణి. నేను అక్కడే నిలబడ్డా.. చాలా సేపు.. నడిచే సినిమా చూస్తూ…

బొరుసు

 

 

-భువన చంద్ర

~

చిత్రం: సృజన్ రాజ్ 

bhuvanachandra (5)“ఈ అమ్మాయి పేరు శ్రావణి. వాళ్ల కాలేజీ నాటకంలో చూసా. అద్భుతం అనుకో..” ప్రసాద్‌తో అన్నాడు మాజేటి.  మాజేటి చాలా సీనియర్ నటుడే కాక చాలా మంది సీనియర్ దర్శకుల దగ్గర అసోసియేట్‌గా కూడా పని చేశాడు. ఎన్ని సినిమాల్లో నటించినా నాటకాల పిచ్చి పోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కడ నాటకం జరుగుతుంటే అక్కడికి వెళ్లిపోతాడు. నటీనటుల్లో ‘స్టఫ్’ వుంటే తెలిసిన దర్శకులకి పరిచయం  చేస్తాడు. ఇహ ఆపైన వాళ్ల అదృష్టం.

“అన్ని పాత్రలకీ, నటులకి అడ్వాన్సులిచ్చేశా బాబాయ్.. అడ్రస్ తీసుకుని నీ దగ్గరుంచుకో.. నెక్స్ట్ ఫిలింకి అవకాశం ఏదన్నా వుంటే చూద్దాం.” శ్రావణి వంక ఓ క్షణం చూసి మాజేటితో అన్నాడు ప్రసాద్..

ప్రసాద్ ఓ ట్రెండ్ సెట్టర్. ఓ పర్పస్ కోసం సినిమా తీసేవాళ్ల లిస్టు గనక తయారు చేస్తే అతని పేరు మొదటి మూడు స్థానాల్లో వుంటుంది. అంతేకాదు ఒక్కసారి అతను గనక ‘బడ్జెట్’ చెబితే  ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పైసా కూడా బడ్జెట్ గీతని దాటనివ్వడు. అలాగే ఇన్ని రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి అంతకంటే తక్కువ రోజుల్లోనే సినిమా పూర్తి చేసిన సంఘటనలు ఎన్నో వున్నాయి.

అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమే. భార్య అదో టైపు. అతనికి ఎంత పేరొచ్చినా ఆవిడకేం పట్టదు. ” ఏమిటో పిచ్చి జనాలు.. సినిమా అంటేనే కల్పన. జనాలు సినిమాలంటూ ఎందుకు పడి చస్తారో నాకు అర్ధం కాదు. అయినా మీరు తీసిన ఆ ‘తిరుగుబాటు’ సినిమా నేనూ చూశాగా! ఏవుంది అందులో? ఓ ఆడది మొగుడు చస్తే ముండమొయ్యనని భీష్మించుకుని కూర్చుంటుంది. బొట్టూ, గాజులూ తియ్యనంటుంది. కావాలంటే తాళి తీసిపారేస్తానని తీసి పారేస్తుంది. ఇంటి పేరు కూడా మార్చుకుంటానంటుంది. ఆ పిచ్చి మాటలు విన్న సినిమాలోని కుర్ర పాత్రధారులందరూ వెర్రెత్తినట్లు చప్పట్లు చరుస్తారు. ఏవుందీ నా బొంద.. అంత వెర్రెత్తడానికీ?” ప్రసాద్‌తోనే అన్నది ఆవిడ. కాఫీ తాగుతూ భార్య ‘సినీ సమీక్ష’ విన్న ప్రసాదుకి పొలమారింది. ఏం చెబుతాడూ? ఆకాశంలోకి చూసి పైవాడికో దండం పెట్టి బయటపడ్డాడు. చిత్రమేమింటంటే ఆ సినిమాకి మూడు ‘నందులూ’, రెండూ ఫిలింఫేర్ అవార్డులూ వచ్చాయి.

ఒక విధంగా ప్రసాదు అదృష్టవంతుడే. తన పనీ, పిల్లల పనీ తప్ప ఆవిడకేమీ పట్టదు. టైంకి తినేసి నిద్రపోతుంది. ఎందుకూ, ఏది అని ఎప్పుడూ అడగదు. అందువల్ల ప్రసాద్ తెల్లవార్లూ పని చేసుకోవడానికి వీలవుతుంది. ప్రసాదూ యీ పద్ధతికి అలవాటు పడిపోయాడు. అతనికి ఆ ‘యావ’ పుట్టినా, ” ఛా..ఛా…. పిల్లలు పుట్టాక యీ వెధవ పనులెందుకూ?” అని అవతలికి తిరిగి పడుకోవడం వల్ల అదేదో పిక్చర్లో అన్నట్టు అతనిలో ‘రసస్పందన’ కూడా ఇంకిపోయింది. ప్రస్తుతం ప్రసాద్ జీవితంలో ‘పని’కి తప్ప మరి దేనికీ స్థానం లేదు.

శ్రావణితో బయటికొచ్చాక అన్నాడు మాజేటి..”అమ్మాయ్ .. సారీ.. ప్రసాద్ అబద్ధం చెప్పడు. అన్ని కేరక్టర్లూ ఫిల్ అయిపోయి వుంటై. అతను తరవాత పిక్చర్‌కి తప్పకుండా కబురు చేస్తాడు. నేనంటే అతనికి అంత గౌరవం. అప్పటిదాకా నువ్వు మీ వూరికి వెళ్లి రావచ్చు” అన్నాడు.

“అలాగే సార్. సాయంత్రమే వెళ్ళిపోతా” అని చెప్పటమే కాదు సాయంత్రమే ‘మెయిల్’ ఎక్కింది శ్రావణి. రావడం అయితే చెన్నై వచ్చింది గానీ ఓ పక్క ఫైనలియర్ ఎగ్జామ్స్ గురించిన టెన్షన్ ఆవిడ బుర్రలో వుండనే వుంది. అదీ మంచిదే. డిగ్రీ చేతికొస్తే ఇంకా బాగుంటుంది. శ్రావణి . BA సినీ నటి అని కార్డ్స్ మీద వేసుకోవచ్చు” అని నవ్వుకుంది. సినిమా క్రేజంటే దాన్నే అంటారు.

కొందరు మొదట్లో చాలా సామాన్యంగా వుంటారు. పర్సనాలిటీలూ అంతే. వాళ్లకు మేకప్ వేసి, కాస్ట్యూమ్స్ తగిలిస్తే మొత్తం మారిపోతుంది. పిచ్చ గ్లామరొస్తుంది.

ఇంకొందరుంటారు. చూడటానికి పిచ్చెక్కించే పర్సనాలిటీ . నిలబెట్టే సౌందర్యమూ కొట్టవచ్చినట్టుంటారు. అంత అందగత్తెలూ కెమెరా ముందు నిలబెడితే ఎంత మేకప్ వేసినా వెలవెలాబోతూనే వుంటారు. సినిమాకి కావలసింది బ్యూటీఫుల్ ఫేస్ కాదు ‘ఫోటోజెనిక్’ ఫేస్.

నాటకం సంగతి వేరు. మనిషికంటే కెమెరా కన్ను చాలా సూక్ష్మమయింది. అందుకే అన్ని లోపాల్నీ ఠక్కున పట్టేస్తుంది. కెమెరా కన్ను ఎంత తీక్షణమైనదంటే దాని కంటికి చిక్కని అంశమే లేదు.. అందమూ లేదు!!

*****

A21‘స్టార్ట్ ఇమ్మీడియట్లీ’ టెలిగ్రాం అందింది. శ్రావణికి పరీక్షలు అయిన మరుసటి రోజునే. ఇచ్చింది మాజేటి. వెంటనే బయలుదేరింది శ్రావణి. శ్రావణి తల్లిదండ్రులు శ్రావణి ఆశయాలకీ, ఆశలకీ ఏనాడూ అడ్డు రారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అది. శ్రావణి చిన్నప్పుడే ఆస్తులన్నీ కరిగి అంతంతమాత్రంగా మిగిలారు. పెంకుటింటి మీద వచ్చే అద్దె ఏపాటిది?? వాళింట్లో వున్నది నారాయణగారనే  హార్మోనిస్టు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హార్మోనిస్టు. నాటకాల్లో ‘కీ’బోర్డు ప్రవేశించని కాలంలో. ఇప్పుడు అతని డిమాండ్ తగ్గలేదు. నాటకాలే తగ్గాయి. నాటకాలాడే నటీనటులే కరువయ్యారు. పెళ్లికాని ఆడపిల్లలకి హార్మోనియం నేర్పుతూ రోజులు నెట్టుకొస్తున్న నారాయణ కొన్ని నాటకాలకై చిన్న పిల్ల కావాల్సి వచ్చి ‘శ్రావణి’ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆ పిల్లని స్టేజీ ఎక్కించాడు. అద్భుతంగా చేసింది. దాంతో పదో, పరకో ఇచ్చి పంపేవాళ్లు. అది పులుసు ముక్కలకి సరిపోయినా సరిపోయినట్టేనని శ్రావణి తల్లిదండ్రులు అనుకునేవాళ్లు. అదే కంటిన్యూ అయి, కాలేజీలో కూడా ‘మహా నటి’ అనిపించుకుని శ్రావణి.

“అమ్మాయ్… అదృష్టం తలుపు తట్టడం అంటే దీన్నే అంటారు. ప్రసాద్ సినిమాలొ సెకండ్  హీరోయిన్ వేసే అమ్మాయి కాలు విరిగింది. షూటింగ్ ఎల్లుండినించే ప్రారంభం. స్క్రిప్టు పక్కా రెడీ. అతను నన్ను సలహా అడిగితే నీ పేరు సజెస్ట్ చేశాను. ఆల్ ద బెస్ట్” అన్నాడు మాజేటి  శ్రావణితో. చెన్నై సెంట్రల్‌లో రిసీవ్ చేసుకుంటూ (అప్పుడది మద్రాస్ సెంట్రల్)

శ్రావణిని చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు ప్రసాద్. సినిమా ప్రేక్షకులు సినిమాల్ని ఎంతైనా ఎంజాయ్ చెయ్యగలరుగానీ, షూటింగ్ చూడ్డాన్ని మాత్రం ఎంతో సేపు భరించలేరు. కారణం ‘షూటింగ్’ అనేది మరో లోకం. అందులో ఇన్వాల్వ్ అయినవాళ్లకి తప్ప దానిలో వున్న మజా ఏమిటో ఇతరులకు అర్ధం కాదు. మొదటిమూడు రోజులూ ‘షూటింగ్’ ఎలా జరుగుతుందో, పాత్రధారులు కెమెరాముందు ఎలా పాత్రలోకి ఒదిగిపోతారో బాగా గమనించమని ప్రసాద్ శ్రావణికి చెప్పాడు. అంతేగాదు. మిగతా పాత్రధారులందరికీ శ్రావణిని పరిచయం చేసి, ఆమెకి అవసరమైన సలహానివ్వమని కూడా చెప్పాడు. చాలా చిత్రంగా శ్రావణి ఫస్ట్ సీన్ మొదటి టేక్‌లోనే ఓ.కె అయిపోయింది. ఎంత అద్భుతంగా చేసిందంటే ‘కొత్త’ అంటే ఎవరూ నమ్మలేనంతగా.. అప్పుడు చూశాడు ప్రసాద్ శ్రావణిని బాగా పరికించి. షాక్‌తో సైలెంటైపోయాడు.

“శ్రావణి’ని చూస్తున్నకొద్దీ అతనికి ‘ప్రవీణ’ గుర్తొస్తుంది. ప్రవీణని పిచ్చిగా ఆరాధించిన వాళ్లలో ప్రసాద్ ఒకడు. ప్రసాద్ చదివిన కాలేజీలో ప్రవీణ కాలేజ్ బ్యూటీ. కొన్ని నెలలపాటు ప్రవీణ ప్రసాదు నిద్రని కనురెప్పల నించి దొంగిలించింది.

‘అప్పటి’ మధురోహాలు ఇప్పుడు మళ్లీ రెక్కలు విప్పుకున్నాయి శ్రావణిని చూస్తుంటే. నేల మీద పడ్డ విత్తనం వర్ష రుతువులో భూమిని చీల్చుకుని మొలకలా అవతరించినట్టు అప్పుడెప్పుడో మనసు పొరల్లో దాగిపోయిన ప్రేమ ఇపుడు చివురు తొడిగినట్లనిపించింది  ప్రసాద్‌కి.

అయితే శ్రావణికి ఇవేం తెలీదు. రోజురోజుకీ ఆమెకి ప్రసాద్ అంటే గౌరవం పెరుగుతోంది. కారణం అతను చూపే అటెన్షన్. హీరోయిన్ ‘శ్రమా విశ్వాస్’ బెంగాలీది. అయినా ప్రసాద్‌లోని అలజడిని అవలీలగా పసిగట్టింది. అయితే ప్రసాద్ మీద ‘శ్రమ’కి అపారమైన నమ్మకముంది. అతను సున్నితమనస్కుడనీ, చాలా సంస్కారవంతుడనీ సినిమా స్టార్ట్ కాకముందే ఎంక్వయిరీ చేసి తెలుసుకుంది.

శ్రావణిది చిత్రమైన అందం. చూసే కొద్దీ ఆమె అందం చూసేవాళ్ల కళ్లల్లో విరబూస్తూ ఉంటుంది.  ప్రేమలో పడ్డ ప్రతి ప్రేమికుడిలాగే ప్రసాద్ శ్రావణితో ఎక్కువసేపు గడపటం కోసం ఆమె ‘రోల్’ కొద్ది కొద్దిగా పెంచసాగాడు.

ఒక్కోసారి అనుకోనివి జరుగుతుంటాయి. అవి ఇతర్లకి ఎలా వున్నా కొందరికి అపరిమితానందాన్నిస్తాయి. ‘శ్రమా విశ్వాస్’ని పెంచిన అమ్మమ్మ అకస్మాత్తుగా కన్ను మూసింది. శ్రమని కలకత్తా పంపక తప్పలేదు. ఒక్క రోజు ఆమెకి ‘హాలిడే’ ఇవ్వగలిగాడు ప్రసాద్. కలకత్తా వెళ్లాక ఆమెకి జ్వరం వచ్చిందని ఫోన్ వచ్చింది. మూడోరోజున ఆమెకి ‘చికెన్ గున్యా’ అని డాక్టర్లు తేల్చారని వాళ్ల నాన్నగారు ఫోన్ చేసారు. ప్రసాద్ పన్నెండు గంటలు కూర్చుని కథలో ఆమె పాత్రని ‘అర్ధాంతరంగా’ ముగించేలా ప్లాన్ చేసి , మిగతా కథలో శ్రావణి మెయిన్ హీరోయిన్ అయ్యేట్టు మార్చాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చెప్పిన డేట్‌కల్లా పిక్చరు పూర్తి చేసే కమిట్‌మెంట్ కలవాడు గాబట్టి.

శ్రావణి తెలివైంది. నవలలూ అవీ తెగ చదివింది. జ్ఞాపకశక్తీ ఎక్కువే. దానితో ప్రసాద్‌కి చిన్న చిన్న సలహాలు ఇచ్చేది. స్క్రిప్టులో ఎవరి జోక్యాన్నీ అతడు అంతకు ముందు ఏనాడూ సహించలేదు. కానీ ఇప్పుడు ఆమె సజెషన్స్‌ని పాజిటివ్‌గానే తీసుకుంటున్నాడు. ఇదీ ఓ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. చిత్రం ఏమంటే యీ విషయాలు అటు ప్రసాద్‌కి, ఇటు శ్రావణికీ తెలీవు.

మాజేటికి తెలిసి, ప్రసాద్‌ని హెచ్చరిద్దామనుకున్నాడుగానీ, ప్రసాద్‌లోగానీ, శ్రావణిలోగానీ ‘మోహం’ కనపడలేదు. అదీగాక అతనికి ప్రసాద్ మీద అపార నమ్మకం. ప్రసాద్ ‘కేరక్టర్’కి విలువిస్తాడని తెలుసు. ఓ పక్క డబ్బింగ్ ఎప్పటికప్పుడు జరుగుతోంది. నైట్ 9 నించి 11 వరకూ ప్రసాదే పర్యవేక్షిస్తున్నాడు. ఆ రోజు శ్రావణి చెప్పాలి. ఆ ప్రక్రియ ఆమెకు కొత్త. ఫస్ట్ డైలాగ్ ఓకే చెయ్యడానికే 20 నిమిషాలు పట్టింది. మనసు మనసే.. వర్కు వర్కే.. ప్రసాద్ చాలా అసహనంగా వున్నాడు. “పోనీ వేరేవాళ్లు చెప్పేటప్పుడు యీ అమ్మాయిని అబ్జర్వు చెయ్యమని చెబుదాం సార్..” మెల్లిగా అన్నాడు సౌండ్ ఇంజనీర్.

“ఇప్పటికే నేను బిహైండ్ ద షెడ్యూల్. ఇలా జరుగుతుందని తెలిస్తే…” బలవంతంగా మాట ఆపేశాడు ప్రసాద్..

‘టాక్‌బాక్’లో వింటున్న శ్రావణికి ‘మిగతా మాట’ అర్ధమైంది. ‘ప్లీజ్ ఒక్క అవకాశం’ అన్నది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.

సరే అన్నట్టుగా సౌండ్ ఇంజనీర్ వైపు చూశాడు ప్రసాద్.

ఓడినప్పుడే మనిషికి పట్టుదల పెరిగేది. అవమానంలోంచే మనిషి ఎదుగుతాడు ‘సన్మానం’ దాకా. నేలకి కొట్టిన బంతే ఎత్తుకి ఎగురుతుంది. ‘ఒక్క అవకాశం’ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆమె కొత్తది గనక రెండు రోజులు కాల్‌షీట్ (డబ్బింగ్‌కి) వేసుకున్నాడు ప్రసాద్. ఏకబిగిన మూడు గంటల్లోనే ఫస్టాఫ్ మొత్తం పూర్తి చేసింది శ్రావణి. అదీ మామూలు డైలాగులు కాదు. వేరు వేరు సన్నివేశాల్లో వేరు వేరు ఎమోషన్స్‌లో వచ్చే సంభాషణలు. వాయిస్ మాడ్యులేషన్ పర్ఫెక్టుగా వుంటేగానీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌కి అతకదు. అలాంటివి అవలీలగా శ్రావణి పూర్తి చెయ్యడం ప్రసాద్‌కి షాక్ అనిపించింది.

ఎందరో హీరోయిన్లని చూసాడు. ఎంతో సీనియర్ నతీమణి అయినా ఇంత ఫాస్ట్‌గా కావల్సిన మాడ్యులేషన్‌తో చెప్పలేదు.

కొన్ని విషయాలు జస్ట్ జరుగుతాయి. (విషయం అనడం కన్నా సంఘటనలు అనడం కరెక్టు). ఫస్ట్ హాఫ్ లాస్ట్ డైలాగ్ అవగానే ప్రసాద్ ఓ ఉద్వేగంతో శ్రావణి ఉన్న కేబిన్‌లోకి వెళ్లి గట్టిగా హగ్ చేస్కుని “ఐయాం రియల్లీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ యూ శ్రావణి” అని చాలా ఎమోషనల్‌గా అన్నాడు. అలాగే ఆ కౌగిట్లో ఒదిగిపోయింది శ్రావణి. గడిచింది కొద్ది నిమిషాలైనా కొన్ని గంటలు గడిచినట్లు అనిపించింది. నిద్రకళ్లతో ‘వెయిట్’ చేస్తున్న సౌండ్ ఇంజనీరుకి.

“ప్రేమలో ఏ క్షణాన ఏది చూసి పడ్డావూ?” అని ఏ ప్రేమికుడిని అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేరు. అలాగే శారీరకమైన సంబంధం ఏర్పడటానికి కారణం ఎవరూ   స్పష్టంగా చెప్పలేం. ఒక్కోసారి స్త్రీ కావొచ్చు. ఎక్కువసార్లు పురుషుడు కావొచ్చు. చాలా రేర్‌గా ‘ఇద్దరూ’ కావొచ్చు. ఆనాడు ‘పార్క్ షెరటన్’లో వారిద్దరి కలయికా అంత అరుదైనదే.

ఆమెకి చక్కని భోజనం ఇప్పిద్దామని తీసికెళ్లాడు. టైము ఒంటిగంట దాటింది. అతనికి హోటళ్లో పెద్దగా అలవాటు లేదు. తీరా వెడితే భోజనాలు లేవు. మిడ్‌నైట్ ‘స్నాక్స్’ మాత్రం వున్నాయి. అవి తింటూ “ఇప్పటికిప్పుడు నేలమీదైనా హాయిగా పడుకొవాలని వుంది” అన్నది శ్రావణి.

ఆ తరవాత రూం బుక్ చెయ్యడం, అతనూ ఆ గదిలోనే మంచానికి అవతలి వైపున పడుకోవడం .. ఎవరు ముందు ఇటువైపు తిరిగారో తెలీదుగానీ … ద్వితీయ విఘ్నం లేకుండా రెండో కౌగిలి నిర్విఘ్నంగా అమరింది. ఆ తరవాత కొన్నేళ్లుగా అతనిలో పేరుకుపోయిన ‘జడత్వం’ ఒక్క క్షణంలో పగిలి ముక్కలై ఆమెని సంపూర్తిగా ఆక్రమించింది.

ఆమెకది మొదటి అనుభవం.

అతనికది ‘నిజమైన’ శోభనం.

ఆహార, భయ, నిద్రా, మైధునాలు సర్వజీవ లక్షణాలంటారు. ఇక్కడ ‘భయ’ అంటే భయం కాదు. ‘రక్షణ, స్వీయరక్షణ’ అని అర్ధం. ఈ నాలుగు లక్షణాలు చీమనించి ఏనుగు దాకా,  మనుషులకీ, మృగాలకీ కూడా సమానంగానే వున్నాయి. ఎటొచ్చీ జంతువులకి ‘సీజన్’ అనేది వుంటుంది. మనిషి దాన్ని పట్టించుకోడు. ఏనాడైతే పార్క్ షెరటన్‌లో శారీరకంగా కలిశారో ఆ క్షణం నించే వాళ్లు ఒక్కటైపోయారు.

ప్రేమకీ, శృంగారానికీ వయసు లేదు. వయసులు అడ్డం రావు. ప్రేమలో పడినా, శృంగారపు రుచి తెలిసినా, ‘సిగ్గూ ఎగ్గు’లలోనూ ‘పరువూ ప్రతిష్ట’లతోనూ సంబంధం వుండదు. ప్రేమా, శృంగారం.. యీ రెండూ ఎంత గొప్పవంటే అతి బలహీనుడ్ని కూడా సాహసవంతుడిగా మార్చేస్తాయి. అత్యున్నతుడ్ని కూడా ‘సర్వ సామాన్యుడి’గా మార్చగలవు.

‘చర్చ’ జరిగితే ఎవరెలా స్పందిస్తారో తెలీదు గానీ, మాజేటి మత్రం ఒకే ఒక్క మాటన్నాడు. “నిన్నటిదాకా ప్రసాదు కేవలం బతికాడు. కానీ ఇవాళ నిజంగా జీవిస్తున్నాడు.!! ‘టు హెల్ విత్ ప్రెస్టీజ్” అని.

ఒకటి  నిజం. శరీరాలు దగ్గర కానంతవరకే మర్యాద మర్యాద. గౌరవం గౌరవం అనేవి. ఒక్కటయ్యాక ‘ఫలానా’ అని స్పష్టంగా చెప్పలేని ఓ చనువూ. ఓ ప్రేమతోనో, చనువుతోనో కూడుకున్న అధికారమూ గౌరవం మర్యాద ఉండే చోటుని ఆక్రమిస్తాయి. ఆ చనువు మొదట్లో ఎంత అద్భుతంగానూ, అబ్బురంగానూ వుంటుందంటే, జన్మలో దాన్ని వదులుకోలేనంత.

ఇప్పుడు జరుగుతున్నదదీ అదే. తనకి  తెలీకుండానే శ్రావణి ప్రసాదు హృదయాన్నీ, ఆఖరికి వృత్తిని కూడా ఆక్రమించేసింది.

రీరికార్డింగ్ జరిగే సమయంలో ప్రతి బిట్టూ మ్యూజిక్ డైరెక్టర్ రిహార్సల్‌లో చూపడం, అది చూసిన వెంటనే ప్రసాద్ శ్రావణి వంక చూడటం, శ్రావణి తలాడించగానే ప్రసాద్ ఓకె అనడం మ్యూజీషియన్స్ అందరూ గమనించారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ ఫ్రెండు. శ్రేయోభిలాషి కూడా.

“భయ్యా.. ఏ రిలేషన్ అయినా పెట్టుకో. తప్పు లేదు. అందరూ అన్నీ తెలుసుకునే ఇక్కడికి వస్తారు. లేకపోతే తెలుసుకుంటారు. కానీ ఒక్కటి. నీ వృత్తిని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఇందాకటి టేక్ నువ్వు ఓకే అన్నావు. కానీ జాగ్రత్తగా చూస్తే అది చాలా ‘odd’గా వచ్చింది. కళ్లు ఎప్పుడూ తెరుచుకునే వుండాలి యీ పరిశ్రమలో నిలబడాలంటే” అని హెచ్చరించాడు. అనడమే కాదు ఓకే చేసిన బిట్‌ని మళ్లీ స్క్రీన్ మీద చూపించాడు. అప్పుడు అర్ధమైంది ప్రసాదుకి. తన కాన్సంట్రేషన్ తగ్గిందనీ, శ్రావణి మీదే ఆధారపడుతున్నాననీ.

శ్రావణిని ఇంటికి పంపుతూ అన్నాడు. “శ్రావణి ఈ సినిమా కానీ, నెక్స్ట్ సినిమాకి నిన్ను అన్ని శాఖల్లోనూ ఎక్స్‌పర్ట్‌ని చేస్తాను”.

చిత్ర పరిశ్రమలో జరిగినన్ని విచిత్రాలు ఎక్కడా జరగవు. అఫ్‌కోర్స్.. ఈమధ్య రాజకీయాల్లో కూడా జరుగుతున్నాయనుకోండి.

ప్రసాద్, శ్రావణిల రొమాన్స్ గురించి రూమర్లు(నిజాలే) వ్యాపించిన కొద్దీ సినిమామీద క్రేజ్ పెరగటం మొదలెట్టింది.

“టేబుల్ ప్రాఫిట్ మామూలుగా కాదు. బంపర్‌గా రావడం ఖాయం” అన్నాడు ప్రొడ్యూసర్ మందేస్తూ మాజేటితో. ఆ రొమాన్స్ గురించి అందరికీ ‘లీక్’ చేయించింది కూడా ఆ నిర్మాతగారే.

“అఫ్‌కోర్స్. క్రేజ్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుందనుకోండీ కానీ, ప్రసాద్ లైఫ్ ఏ చిక్కులో పడుతుందా అని భయంగా వుంది!” అన్నాడు మాజేటి.

“ఇదిగో మాజేటి… ఎవడేమయితే మనకెందుకయ్యా? ముందర మనం బాగుండాల. అయినా.. ఎవడి బాగు వాడు చూసుకోవాలి గానీ, మంది బాగు మనకెండుకూ? హాయిగా మందేసుకో.. ముక్కు దాకా తిను. ఆ తరవాత కళ్లారా తొంగో…! ” మాజేటి భుజం తట్టి అన్నాడు నిర్మాత.

నిర్లిప్తంగా నవ్వుకున్నాడు మాజేటి. ప్రసాద్ భార్య సౌజన్య ఎంత నిర్లిప్తురాలో అంత గయ్యాళిదని ఆయనకి తెలుసు.

“ఏంటిటా? ఎవత్తో సెకండ్ హీరోయిన్‌తో శృంగారం వెలగబెడుతున్నావుటా? నువ్వెటు పోయినా, ఎలా పోయినా నీ చావు నీది. కానీ గుర్తుంచుకో.. ఒక్క పైసా దానికి పెట్టావని తెలిస్తే మాత్రం పిల్లల్ని నూతిలోకి తోసేసి నేనూ దూకి చస్తా. చచ్చేముందు నా చావుకి నువ్వేకాక ఆ దగుల్బాజీదీ కూడా కారణమేనని ఇద్దరినీ ఇరికిస్తా” అని ఆల్‌రెడీ సౌజన్య ప్రసాద్‌కి వార్నింగిచ్చిందని మాత్రం మాజేటికి తెలీదు.

ప్రసాద్ కూడా మౌనంతోనే ‘అంగీకారం’ అన్నట్టుగా తలాడించాడు. గుడ్డికంటే మెల్ల బెటర్ కదా. మామూలుగా సెకెండ్ హీరోయిన్‌కిచ్చే రెమ్యూనరేషన్, అదీ ఫస్ట్ సినిమాలో  అంతగా వుండదుగానీ, మెయిన్ హీరోయిన్ ప్లేస్‌లో ఇప్పుడు శ్రావణి వొదిగింది గనక లక్షా వెయ్యి నూట పదహార్లు ఇప్పించాడు ప్రసాద్. శ్రావణి వూహించని అమౌంట్ అది.

చెక్కు అందుకున్న వెంటనే తల్లినీ, తండ్రినీ పిలిపించుకుంది.

“అదేమిటి అమ్మాయీ..ఆ ప్రసాద్‌తోనే పగలంతా షూటింగులో వుంటావు గదా.. మళ్లీ సాయంత్రాలు కూడా ఎందుకొస్తున్నాడు?” ఆరా తెసింది శ్రావణి తల్లి. ఏం చెబుతుందీ..

“అమ్మా.. తియ్యబోయే కొత్త పిక్చరు గురించి డిస్కస్ చేస్తున్నాం. డిస్త్రబెన్శ్ ఉండకూడదని మేడ మీది నా గదిలొ కూర్చుంటున్నాం. అంతే. నువ్వేమీ ఊహాగానాలు చెయ్యమాకు..” మెత్తగా అన్నా స్ట్రిక్టుగా అన్నది శ్రావణి.

కూతురికి సినిమా ‘పాత్ర’ బాగా వంటబట్టిందని తల్లికీ తండ్రికీ అర్ధమైంది. అయినా చేసేదేముందీ? గమనించనట్టుగా కూర్చోవడానికీ లేదు. పోనీ వూరెళ్లి పోదామన్నా అక్కడ వున్న ఇల్లు అద్దెకిచ్చి వచ్చారు. ఒక రోజున పెద్దావిడ మేడ మీదకు వెడుతున్న ప్రసాద్‌ని ఆపి “బాబూ.. ఏమనుకోవద్దు. మేమూ బతికి చెడ్డవాళ్లమే. నా కూతురు ఎంత బుకాయించినా మీ మధ్య వున్న బంధం ఏమిటో మాకు అర్ధమవుతూనే వుంది. ఒక్క చిన్న సహాయం చెయ్యి. చాలు.. నీకు ఆల్రెడీ పెళ్ళయిందనీ, పిల్లలున్నారని తెలిసింది. అందువల్ల నీ భార్యకి విడాకులిచ్చింతరవాతే మా గుమ్మం తొక్కమని అనను. ఏదో, కొద్దో గొప్పో సాంప్రదాయం కలిగినవాళ్లం గనక, గుళ్ళో అయినా నా కూతురి మెడలో మూడు ముళ్ళు వెయ్యి. అదీ కుదరదంటే కనీసం మా కళ్లముందరే దానికో పసుపు తాడు కట్టు. ఇవి చేతులు కావు కాళ్ళు..” అన్నది. అనటమే కాదు సిద్ధంగా పెట్టిన పసుపు తాడు కూడా చేతికిచ్చింది.

పెళ్లికి ప్రేమ పునాది అయితే పెళ్ళి ప్రేమకి సమాధి. ఇది మాత్రం నిజం. నిన్నటిదాకా సినీ నటిగా ప్రసాదు దగ్గర మెలిగిన శ్రావణికిప్పుడు భార్య హోదా రాగానే (ఉత్తుత్తి హోదా అయినా) ఓ రకమైన ‘అధికారం’ ఆమె మనసులో (హక్కు రూపంలో) స్థిరపడింది. అలా అని ప్రసాద్‌ని ప్రేమించడం లేదన్నది కాదు. అప్పటి  ప్రేమ గుండెల్లో పుట్టిన ‘తొలి ప్రేమ’ ఇప్పటి ప్రేమ ‘పొజెసివ్‌నెస్’ తో కూడిన విపరీత ప్రేమ.

శ్రావణి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రసాద్‌ని స్వంత అల్లుడిలాగా సగౌరవంగా చూసుకుంటున్నారు. అతనూ అత్తయ్యా, మామగారూ అంటూ చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు.

‘పిక్చర్’ సూపర్ హిట్టయింది. ఎంత పెద్ద హిట్ అంటే ఇండస్ట్రీ మొత్తం ప్రసాద్ వెంటా, శ్రావణి వెంటా పడేంత. తనకి వచ్చిన ఆఫర్స్‌కి శ్రావణి ఓ కండీషన్ పెట్టింది. ప్రసాద్ డైరెక్షన్లో అయితేనే హీరోయిన్‌గా చేస్తానని. ఇంకేం కావాలీ..

A21

అర్జంటుగా ఓ పది సినిమాలకి ఇద్దరూ ‘సైన్’ చేశారు. పెద్ద హీరోలతో 3 సినిమాలు నెలరోజుల గ్యాప్‌తో మొదలయ్యాయి. ఒక్కొక్కరికీ నెలకి 10 రోజుల కాల్‌షీట్లు.

కారొచ్చింది.. బంగళా వచ్చింది. నగలొచ్చాయి. అన్నిటికీ మించి పేరొచ్చింది. శ్రావణి ఇప్పుడు టాప్ 5 లో ఒక హీరోయిన్.

మరో రెండు వరస హిట్లు. హేట్రిక్ హీరోయిన్ అని బిరుదిచ్చాడు ఓ సీనియర్ జర్నలిస్టు. ఆయన ఆసలు పేరు పాపారావయితే  మిగతా పాత్రికేయులు కాకారావంటారు.  ఊరందరికంటే మొదట పొయ్యి వెలిగించే కాకా హోటల్లాగా, కాకారావు కూడా రేపటి న్యూస్ ఇవ్వాళే గాలం వేసి పట్టగలడు.

“కాకా.. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ప్రసాద్‌వీ, శ్రావణివీ కాల్‌షీట్లు కావాలి..” ఫుల్‌బాటిల్ ఎదురుగా పెట్టి అన్నాడు సీనియర్ మోస్టు ప్రొడ్యూసర్ దశరధనాయుడు.

“ఓ పనిజెయ్యండి. ప్రసాద్ సొంతింట్లో వుండేటప్పుడు మీ స్టోరీ రైటర్ని పంపండి. ఆ తరవాత కథ తెర మీద చూడండి” ఆత్రంగా సీలు తీసి అన్నాడు కాకారావు.

“సీసాకి సీలూ పిల్లకి శీలం ఎప్పుడో అప్పుడు ఊడక  తప్పదు!” ఒకే గుక్కతో గ్లాసు ఖాళీ చేసి కుళ్ళు జోకు వేశాడు కాకారావు. “అదీ..! డ్రింకు చెయ్యడం అంటే…” మరో పెగ్గు పోశాడు నాయుడు.

రెండు లక్షల డబ్బు చెయ్యలేని పనిని అక్షరాలా ఓ ఫుల్ బాటిల్ క్షణాల్లో చేయించగలుగుతుంది. ప్రసాద్‌కీ, శ్రావణికీ మధ్య రిలేషనేగాక శ్రావణి మొత్తం వివరాల్ని రాబట్టాడు కాకారావు.

శ్రావణి తండ్రితో మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు. మెల్లిగా ‘మందు’లోకి దింపాడు. యధాలాపంగా అన్నట్టు “అయ్యా!! మీరేమో గొప్పగా బతికినవాళ్లు. మధ్యలో కాస్త డౌన్ అయినా ఇప్పుడు డబ్బుకీ, గౌరవానికీ, ఆస్థిపాస్తులకీ కొదవలేదు గదా… మీ అమ్మాయేమో ఆ ప్రసాదుగార్ని పట్టుకుని కూర్చున్నారు. ఎంత గొప్ప హీరోయినైనా యీ రోజుల్లో పదేళ్లకి మించి చెయ్యలేదు. ఆ తరవాత  దొరికేవి అమ్మ వేషాలూ, అక్క వేషాలూ. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ, ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలనీ పెద్దలు ఊరికే అన్నారా? డిమాండున్నప్పుడే నాలుగు కాసులు కూడబెట్టుకోవాలి. పెద్ద హీరోలూ, పెద్ద బేనర్లూ వచ్చినప్పుడు గిరి గీసుకుని కూర్చోకూడదు. ఆపైన మీ ఇష్టం!!” అన్నాడు కాకారావు. లోఫల్నించి అటు శ్రావణి వాళ్ల అమ్మా, శ్రావణీ కూడా వింటున్నారని తెలిసే!!

“ఇలాంటి చెత్త కథని డైరెక్టు చెయ్యను పొమ్మన్నాడటయ్యా ఆ ప్రసాదు. వాడికి అన్నీ లాజిక్కులూ, రియాలిటీలూ కావాల్ట. టాప్ హీరో సినిమాకి లాజిక్కెందుకూ? అయినా నా బేనర్‌లో చెయ్యాలంటే పెట్టి పుట్టుండాలి. చా.. రైటర్ని ఆ వెధవ దగ్గరికి పంపి ఇడియట్‌నయ్యాను..” కోపంగా అన్నాడు దశరధ నాయుడూ.

“అయ్యా.. మీ రైటర్ కోటేశ్వరరావుకి కథలు బాగా వండటం తప్ప చెప్పడం సరిగ్గా రాదని నాకు తెలియబట్టే ప్రసాదు దగ్గరికి పంపమన్నాను. ఇప్పుడు, అంటే.. ఇప్పటికిప్పుడు మీరూ, కోటేషూ, మీ అసిస్టెంటు డైరెక్టరు సంజీవీ హీరోయిన్ శ్రావణిగారి దగ్గరికి వెళ్లండి. సంజీవి చేత కథ చెప్పించండి. ఆ తరవాత ఏం జరుగుతుందో మీరే చెబ్దురు గాని..” అన్నాడు కాకారావు.

******

“పది లక్షలమ్మా.. నా బేనర్‌లో ఇంత డబ్బివ్వడం ఇదే ఫస్ట్ టైం. ఏ హీరోయినైనా నా పిక్చర్‌లో యాక్ట్ చేస్తే చాలనుకుంటూంది. ఎనీవే..  యూ ఆర్ ద ఫస్ట్ హీరోయిన్ టు టేక్ అవే టెన్ లాక్స్!” అంటూ చెక్కు చేతికిచ్చాడు దశరథనాయుడు.

“థాంక్యూ సార్! ఆనందంగా పాదాలు టచ్ చేసి అన్నది శ్రావణి. ఆవిడా విన్నది. దశరధనాయుడు గొప్ప ప్రొడ్యూసర్, ఇచ్చేది కొద్ది మొత్తమే అయినా ఠంచనుగా ఇస్తాడనీ, హీరోయిన్‌కి ఎక్స్‌పోజర్ అద్భుతంగా ఇస్తాడనీ.

*****

“నేను వద్దన్న సినిమాని నువ్వెలా వొప్పుకున్నావ్ శ్రావణీ…!”చిరాగ్గా అన్నాడు ప్ర సాద్.

“అది కాదు ప్రసాద్ … డైరెక్టర్‌కి ఏజ్ పెరిగేకొద్దీ క్రేజ్ పెరుగుతుంది. హీరోయిన్‌గా నా విషయం అలా కాదే! అయినా డైరెక్టరుగా నువ్వే  వుండాలనే షరతు మీదే అంగీకరించాగా…!: ఓ మాదిరిగా నచ్చచెబుతున్నట్టంది శ్రావణి..

*****

“ఏమిటమ్మా.. యీ ఇంట్లో.. ‘చెయ్యనుపో’ అన్నవాడు ఆ యింట్లో ‘OK.. చేస్తా’  అని ఎలా అన్నాడూ? అంటే ఆవిడ కథ విని OK అంటేగానీ మీ ఆయన సినిమా తియ్యడా?” కోపంగా అన్నాడు కోటేశ్వరరావు. తన కథని అసిస్టెంటుగాడితో చెప్పించడం అతనికి అవమానంగా తోచింది. అంతే కాదు. ప్రసాదు కూడా సంజీవితోనే ఎక్కువగా ‘డిస్కస్’ చేస్తున్నాడుగానీ తనతో కాదని బాధ.

“నిజమా?? అక్కడిదాకా వచ్చిందీ? దాన్ని చెప్పుచ్చుకు కొట్టకపొతే నా పేరు సౌజన్య కాదు.” రౌద్రంగా  లేచింది సౌజన్య. భయపడ్డాడు కోటేష్. “అమ్మా… నా పేరు మాత్రం బైటికి రానీకు. ఏదో కథలు చెపుకు బతికేవాడ్ని..!” అంటూ బతిమాలాడాడు. “రానీను లేవయ్యా. ముందు వాళ్లెక్కడున్నారో చెప్పు…” ఇంటికి తాళమేస్తూ అడిగింది సౌజన్య.

 

*****

“లాబ్‌లో హీరోయిన్ని చెప్పుతో కొట్టిన దర్శకుని భార్య… ఏడుస్తూ హీరోయిన్ నిష్క్రమణ” అదీ సాయంత్రపు పేపర్లోని హెడ్‌లైన్స్. (చెన్నైలో ఇప్పటికీ యీవెనింగ్ ఎడిషన్లు వున్నాయి). ఏ స్టూడియోలో విన్నా ఇదే కబురు. అడ్డొచ్చిన ప్రసాద్‌కి కూడా చెప్పు దెబ్బలు బాగా తగిలాయనే మరో వార్త కూడా గుప్పుమంది.

ప్రసాద్ విడాకుల కోసం అప్లై చేశాడని మరుసటి రోజున ప్రచారం జరిగింది.

*****

 

‘హిట్’ అవగానే అడ్వాన్సులు ఇచ్చేవాళ్లందరూ చివరిదాకా నిలబడరు. దశరధనాయుడుగారి సినిమా పెద్ద హిట్టు. కారణం హీరోయిన్ కేరక్టర్‌ని,  హీరోని ప్రేమించిన మరో ఫీమేల్ కేరక్టర్ చెప్పుతో కొడుతుంది. దాన్ని జనాలు ‘రియల్’ సీన్‌గా పరిగణించి అత్యుత్సాహంగా చూశారు. ప్రసాద్‌కి జ్వరం వచ్చి ఓ రోజు షూటింగ్‌కి రాకపోతే, శ్రావణి డూప్‌ని సైడ్‌నించి చూపిస్తూ అసిస్టెంట్ (సినిమా అసోసియేట్) డైరెక్టర్ సంజీవి ఆ షాట్ తీశాడు. ఇది సెన్సార్ కాపీ చూపినప్పుడు మాత్రమే ఆడ్ చెయ్యబడిందని ప్రసాదుకీ, శ్రావణికి కూడా తెలీదు. రిలీజయ్యాక చేసేదేం లేదని వాళ్లకీ తెలుసు.

*****

“ఇంతకీ తప్పెవరిది?” అడిగాడు సూర్యంగారు ఆంధ్ర క్లబ్‌లో. నేనూ కుతూహలంగా వింటున్నా. మాజేటి ఏం చెపుతాడో అని. “అయ్యా ప్రొఫెషనల్‌కీ, పర్సనల్‌కీ లింకు పెట్టకూడదు. శ్రావణి తెలివైందే. కాదనను. కానీ, కథ వినడం దగ్గర్నించీ, కేస్టింగ్ విషయం వరకూ ఆవిడే నిర్ణయించడం ఎంత సబబూ? ఆవిడ మీద ప్రేమతో వచ్చిన పేరునంతా పోగొట్టుకోవడం ప్రసాదు తప్పు.

ఒక్క మాట చెప్పనా? సక్సెస్‌ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎంత గొప్పవాడైనా సక్సెస్‌ని హేండిల్ చెయ్యాలంటే చాలా కష్టపడక తప్పదు. ఓడలు బళ్లూ – బళ్లు ఓడల్లా మారడం ఎలానో ఇక్కడ బొమ్మలు బొరుసులుగా, బొరుసులు బొమ్మలుగా మారడమూ అంతే సహజం.

ద లాస్ ఆఫ్ ప్రసాద్ యీజ్ ద గెయిన్ ఆఫ్ సంజీవి..” అంటూ గ్లాసు పూర్తి చేశాడు మాజేటి.

ప్రసాద్ ఇప్పుడు లేడు. హార్ట్ ఎటాక్‌తో పోయాడు. అయినా చివరి రోజుల్లో సంపాదన బాగానే ఉంది గనక భార్యా,పిల్లలు బాగానే వున్నారు.

శ్రావణి కొంత కాలం అక్క వేషాలూ, ప్రత్యేక వేషాలు వేసింది. ఒంటరిగా  ఉన్నా తల్లిదండ్రుల్ని పెద్దగా పట్టించుకోలేదని జనం అంటారు. నిజం ‘ఆవిడకీ, దేవుడికే’ తెలియాలి.

 

*

 

 

‘బొమ్మ’ ఏ సక్సెస్ స్టోరీ  (part – 1)

 

భువన చంద్ర

 

bhuvanachandra (5)నంబర్ వన్ సినిమా.. టేబుల్ ప్రాఫిట్. బయ్యర్లకి అద్భుతంగా నచ్చింది. నిర్మాతకి రిలీజుకి ముందే లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇంకేం కావాలి? ప్రివ్యూ షోలు వేశారు. చూసినవాళ్లకి మతిపోయింది. ఓ కొత్త డైరెక్టర్. ఓ సీనియర్ డైరెక్టర్ దగ్గర ఎన్నాళ్లో పని చేశాడు. అంతే!! కానీ అతని ఫస్ట్ పిక్చర్ టేకింగ్ చూసి అవాక్కయ్యారు సినీ జనాలు.

థియేటర్లో మాత్రం ‘క్లాస్’ టాక్ వచ్చింది అంటే కమర్షియల్‌గా ఫ్లాప్ అన్నమాట. చూసిన ప్రతీ ప్రేక్షకుడు”ఓహో!” అన్నాడు. కాని జనాలు ఎగబడలేదు. వాళ్లకి కావల్సినది అందులో వున్నా, తక్కువ మోతాదులో వుంది. మానవత్వం పాలు మాత్రం చాలా ఎక్కువగా ఆలోచింపచేసేంత వుంది.

“మాకు కావల్సింది  ఎంటర్‌టైన్‌మెంట్. మానవత్వమూ, మట్టిగడ్డలూ కాదు” ఓ సమీక్షకుడు  ఓపెన్‌గా చెప్పిన మాట ఇది. కమర్షియల్ సినిమాని ద్వేషించేది ఇతనే.

” ఈ కుర్రాళ్లంతా ఇంతే. సినిమా అంటే వినోదాన్ని ఇవ్వాలి గానీ, నీతిబోధలెందుకూ?”అన్నాడో సీనియర్ పాత్రికేయుడు. ఆ సినిమానీ, దర్శకుడ్నీ ఆకాశానికెత్తింది అతనే.

నవ్వుకున్నాడు ‘సారధి’. అతనే ఆ సినిమా డైరెక్టరు. ఓడలు బళ్ళూ, బళ్లు ఓడలూ అవుతాయన్న సామెత వినడమే కానీ ఇంత క్విక్‌గా క్షణాల మీద మారిపోతాయని అతను కలలో కూడా వూహించలేదు.

‘సినిమా అద్భుతం  కానీ ప్రేక్షకులు కరువయ్యారు.’ ఇదేమి కామెంటూ? ఈ కామెంటు ఈనాడు  ఉంది… “సినిమా సూపరు.. కలెక్షన్లే నిల్లు’ అని.

ఫస్ట్ ఎటెంప్ట్‌తోనే అన్ని ఏరియాలూ అమ్ముడుపోయాయని తెలిసిన రోజున కనీసం పదిమంది పెద్దా చిన్నా ప్రొడ్యూసర్లు సారధి వెంటపడ్డారు. ఓ పెద్ద నిర్మాత అయితే ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సారధి ఏమాత్రం తొందరపడలేదు.

‘సినిమా రిలీజయ్యాక చూద్దాం. అంతే కాదు. కథ రెడీ చేసుకోకుండా బ్లాంక్ చెక్ ఎలా తీసుకోనూ’ అని సున్నితంగా తిరస్కరించాడు. సిన్సియర్‌గా ఉండటం గొప్ప విషయమే. కానీ సారధిని అదే ముంచింది.

సినిమా ‘టాక్’ బాయటికి రాగానే తుపాకీగుండు శబ్దం విని ఎగిరిపోయే కాకుల్లాగా ప్రొడ్యూసర్లు ఎగిరిపోయారు. “నా రెండో సినిమాకి నువ్వే డైరెక్టరువి” అన్న మొదటి సినిమా నిర్మాత కూడా మొహం చాటేశాడు. రాజ్ కపూర్ పాటలో ఓ లైనుంది. “హీరోసే జోకర్ బన్‌జానా పడ్‌తా హై” అన్నట్టు నిన్నటిదాకా పరిచయం కోసం ఎగబడ్డ క్షణమాత్ర అభిమానులంతా ఇవాళ మొహం మీదే “ఏంటి గురూగారు  పిక్చర్ పోయిందంటగా..!” అని ఎగతాళిగా అడుగుతుంటే సారధి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు.

*****

“ఎన్నాళ్లిలా ఇంట్లోనే కూర్చుంటారూ..” అనునయంగా అన్నది భార్య. “నా మీద నాకు నమ్మకం కుదిరి జనాన్ని పిచ్చెక్కించే  స్క్రిప్టు తయారయ్యేవరకు…! “నవ్వుతూనే అన్నాడు సారధి. ఆ నవ్వులో ‘కసి’ వుంది. “అంటే?” అయోమయంగా అన్నది భార్య. నేనో గొప్ప సినిమా తియ్యాలనుకుంటున్నాను. తీశాను. రిలీజ్‌కి ముందే నిర్మాతకి లాభం తెచ్చి పెట్టిన సినిమా అది. ప్రేక్షకులకి నచ్చలేదు. కారణాలు లక్ష వుండొచ్చు. కానీ నేను తీసిన సినిమా మాత్రం నిజంగా మానవత్వంతో కూడిన గొప్ప సినిమా. ఆ సినిమా గురించి ఎవరేమన్నా, అనుకున్నా నిజం నిజమే. అదీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది గొప్ప సినిమా గురించి కాదు. ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్‌కి రప్పించే సినిమా గురించి” వివరించాడు సారధి. చాలా కాలం తరవాత వీడిన మౌనం అది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. జనలు సారధిని మరిచిపోయారు. జనాలు అంటే ఇక్కడ ప్రేక్షకులని అర్ధం కాదు. సినీజనాలు. ఆదాయం పొలం మీద వచ్చేది కొంచెమే అయినా సునీతి అంటే సారధి భార్య గుంభనంగా సంసారాన్ని నెట్టుకొచ్చింది. మూడేళ్లు దాటాక అవకాశం వచ్చింది సారధికి, వెతుక్కుంటూ… ఓ NRI సారధి తీసిన సినిమాని చూసి ఇంప్రెస్ అయి వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు.

“సార్, మీ సినిమా చూశాను. అది ఓ మేధావి మాత్రమే తీయగల సినిమా. నాకెందుకో సినిమాలంటే చిన్నప్పటినించి పిచ్చి. నన్ను నేను నిర్మాతగా చూసుకోవాలన్న ఆత్రంతోటే అమెరికా వెళ్లాను. కడుపు కట్టుకొని సంపాయించాను. ఇప్పుడు రెండు కోట్లు పోయినా నాకొచ్చే నష్టం లేదు. కనుక మీరు నాకో సినిమా తీసిపెట్టండి. కథ గురించి నేను అడగను. రెమ్యూనరేషన్లూ అవీ ఎవరికి ఎంతో నాకు తెలీదు. ఇదిగో రెండు కోట్లకి విలువైన చెక్ బుక్. ఒక్కో చెక్ మీద పదిలక్షల చొప్పున ఇరవై చెక్కులు వున్నై. సినిమా తీసేటప్పుడు మాత్రం నేను మీ పక్కనుండాలి. అంతే. నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను. సినిమా నిర్మాణం గురించిన అవగాహన కోసం నేను మీ పక్కన వుండాలనుకుంటున్నాను. అదీ మీకు ఇష్టం అయితేనే..” అంటూ చెక్ బుక్ సారథి చేతిలో పెట్టాడు.

చిన్నగా నవ్వాడు సారధి. “నేను ఫ్లాప్ సినిమా డైరెక్టర్ని. జనాలు నన్ను మర్చిపోయారు. కానీ, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. థాంక్యూ. సరిగ్గా రెండు నెలల తరవాత ఇదే చెక్‌బుక్‌తో రండి. కథ సిద్ధంగా వుంటుంది. “షేక్‌హాండ్ ఇచ్చి అన్నాడు. అతను ఆనందంగా “ముందుగా ధన్యవాదాలు అందుకోండి. 2 నెలల తరవాత కలుస్తా” అని వెళ్లిపోయాడు.

painting: Rafi Haque

painting: Rafi Haque

“అదేంటండి.. ఆయన పేరు కూడా అడగలేదు?” ఆశ్చర్యంగా అన్నది సునీతి.

“కథ సిద్ధంగానే వుంది. డైలాగ్స్‌తో సహా సిద్ధం చేయడానికి టైం అడిగాను. అతను వచ్చి నా మీద నాకున్న నమ్మకాన్ని వందరెట్లు పెంచాడు. అతని అసలు పేరు ఏదైనా నేను మాత్రం అతన్ని ‘విశ్వాసం’ షార్ట్‌కట్ విశ్వం అంటాను..” గలగలా నవ్వాడు సారధి మూడేళ్ళ తరవాత. సునీతి పొంగిపోయింది. గబగబా చేతి గాజులు తాకట్టు పెట్టి రెండు మంచి డ్రెస్సులూ, ఓ పది బాల్ పెన్నులూ, స్క్రిప్టు వ్రాయడానికి A4 కాయితాల కట్టలూ, ఓ టేబుల్ లైటూ మొదలైన సరంజామాతో పాటు అతనికి ఇష్టమైన పిండి వంటలు చేసింది. సారధి కళ్ళల్లో చెమ్మ.

 

*****

“ఇదిగో అయిదువేలు ఎడ్వాన్సూ. డైలాగ్స్ నువ్వే రాస్తున్నావు!” రమణ చేతికి కాష్ ఇచ్చి అన్నాడు సారధి. ఆ అయిదువేలూ భార్యవి. గాజులు తాకట్టు పెట్టిన బాపతువి.

కన్నీళ్లతో రమణ సారధిని కౌగిలించుకుని “థాంక్యూ సారధీ.. స్నేహానికి విలువిచ్చే నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ప్రాణం పెట్టి డైలాగులు రాస్తా..” అన్నాడు.

సారధి , రమణ, గుప్త, శీనూ వీళ్లంతా ఒకప్పుడు రూంమేట్స్. ఒక్కోసారి డబ్బుల్లేక ఒకే దోశని నలుగుతూ పంచుకు రోజులున్నాయి. భగవతి మెస్ వాడు దయామయుడు. హార్లిక్స్ బాటిల్ నిండా సాంబారు ఇచ్చేవాడు.

ఇక్కడ ఓ విషయం చెప్పక తప్పదు. T.Nagar  కోడంబాకం సినిమావాళ్లకి నిలయాలు. గీతా కేఫ్, బాలాజీ కేఫ్, డబ్బులున్న సమయాల్లో స్వాగతిస్తే  టి.నగర్ పోస్టాఫీస్ దగ్గరుండే తోపుడుబండి హోటల్సు (వాటినే ‘కయ్యేంది’ భవన్లంటారు సరదాగా) సామాన్య సినీనటులకి రాజప్రాసాదాలు. రూపాయికి నాలుగిడ్లీలు ఆ రోజుల్లో. భగవతి హోటల్ సంగతి చెప్పక్కర్లా. హోటల్ చాలా చిన్నది. బిజినెస్ మాత్రం లెక్కలేనిది. నూటికి అరవై సినిమాలకి టిఫిన్ సప్లైలు అక్కడినించే. ఆ హోటల్ ఎదురు సందులోనే ‘మలర్‌కొడి’ మాన్షన్ వుండేది. 30 గదులు, 3 అంతస్థులు. అన్ని గదుల్లో 8/8. అద్దె నెలకి 400. సందు మొదట్లో మహా రచయిత ఆరుద్రగారి ఇల్లు, ఆయన అపురూపమైన లైబ్రరీ.

ఇహ తెలుగువాళ్లు. ఇంక్లూడింగ్ సినీ నటీనటుల అడ్డాలు రెండు. ఒకటి రాణీ బుక్ సెంటర్. రాణీగారు ఎంత కలివిడి మనిషి అంటే ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది ఆవిడే. ఎడంచేతికి తెలీకుండా కుడిచేత్తో ఎంతమందిని ఆదుకున్నారో నాకూ తెలుసు. పుస్తకాలు దొరకాలంటే అక్కడే. ఫలానా పుస్తకం అని అడిగితే చాలు ఎక్కడినుంచైనా సరే తెప్పించి మరీ ఇస్తారు. అట్లూరి అనిల్ వారబ్బాయే.

రెండో అడ్డా పానగల్ పార్కు దగ్గర స్టాండర్డ్ ఎలక్ట్రికల్స్ ముందరున్న ప్లాట్‌ఫాం. అక్కడే డాక్టర్ గోపాలకృష్ణగారు ఉండేవారు. టీకి డబ్బులు లేవని బాధపడక్కర్లా. ఎవరొచ్చినా ఆయన స్వయంగా పక్కనున్న టీ కొట్లోంచి టీ పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే వీళ్లు నలుగుతూ మలర్‌కొడి మేన్షన్‌లో ఓ గదిలో వుండేవారు. నేనూ అక్కడే (కొన్నాళ్ల తరవాతే అనుకోండి) వుండేవాడ్ని రూం నంబర్ 34.

“ప్రాణం కాదు రమణా. అడుగడుగునా హాస్యం వుండాలి. ఆలోచించు. ప్రతీ డైలాగు ఓ శ్వాసలాంటిది మనకి” భుజం తట్టి అన్నాడు సారధి. రమణలో పిచ్చి స్పార్క్ వుందని సారధికి తెలుసు. ఫుడ్‌కి లాటరీ కొట్టేటప్పుడు వాళ్ల పొట్టలకి అతని ‘మాట’లే ఆహారంగా  మారేవి. అతి సున్నితమైన హాస్యం అతని ప్రతి మాటలోనూ తొణికిసలాడేది. మొదటి సినిమా సమయంలో రమణ తండ్రి పోవడంతో వేరేవాళ్లచేత డైలాగ్స్ రాయించాడు. ఇప్పుడు యీ కథకి సరైన సంభాషణలు రమణ మాత్రమే రాయగలడని సారధికి ఖచ్చితంగా తెలుసు. శీనూ, గుప్తా అసిస్టెంటు డైరెక్టర్లు.  “ఫ్రెండ్స్ మీ ఎడ్వాన్సులు నిర్మాత వచ్చిన రోజే ఇస్తాను. అప్పటివరకూ చెరో వెయ్యి.” అని తలో వెయ్యి రూపాయలు ఇచ్చాడు. అదీ గాజుల పుణ్యమే.

యజ్ఞం  మొదలైంది. పొద్దున ఆరింటికి మొదలైతే అర్ధరాత్రి వరకు స్క్రిప్ట్ మీదే. హోటల్‌నించి తెప్పించేంత డబ్బులేదు. సునీతి వంటమనిషి అవతారం ఎత్తింది.

చిత్రంగా రెండు నెలల  తరవాత వస్తానన్న నిర్మాత పదిహేను రోజుల ముందే వచ్చాడు.  మిరకిల్స్ జరుగుతాయి. స్క్రిప్టు వర్క్‌లో అతనూ పాలు పంచుకున్నాడు. కురుక్షేత్రాన్ని ఏం వర్ణిస్తాం? యుద్ధాన్ని చూసినా అర్ధం కాదు. పాలుపంచుకుంటేనే అంటే సైనికుడిలా యుద్ధం చేస్తేనే అసలు విషయం అర్ధమవుతుంది. ఆ నిర్మాత పేరు రాఘవ చెరుకూరి. వచ్చిన రెండో రోజునే యజ్ఞవాటిక “బృందావన్” హోటల్‌లోకి మారింది. అది మధ్యతరగతివాళ్లకి ప్రియమైన హోటల్. రూములు కొంచెం పెద్దవే. అద్దె రోజుకి ఎనభై రూపాయలు. రాఘవ ‘సవేరా’ హోటల్ని ప్రిఫర్ చేశాడుగానీ సారధి ఒప్పుకోలేదు. “రాఘవగారూ మాకు ఇది చాలు. ఆలోచించడానికి ఇది సరిపోతుంది. ఆలోచించి, ఆలోచించి బుర్ర వేడెక్కితే తిరగడానికి పాండీబజారుంది. సరికొత్త ఆలోచనలు పుట్టుకొచ్చేది  ఈ రోడ్డు మీదే. ఎందరు మహారచయితలూ, దర్శకులూ, నటీనటులూ అక్కడ తిరిగారు. అదో ఆ గీతా కేఫ్‌లోనే రోజు ఘంటసాలగారు ఇడ్లీ తిని కాఫీ తాగేవారు. అదిగో ఆ చెట్టు కిందే సి.యస్.ఆర్‌గారూ కారు పార్కు చేసి దాన్ని ఆనుకుని నిలబడి స్టైలుగా సిగరెట్లు కాల్చేది. అదిగో ఆ  పానగల్ పార్కులో మల్లాది వారి సిమెంటు బెంచీ. ఓహ్.. యీ ఇన్స్పిరేషన్ స్టార్ హోటల్లో ఎలా దొరుకుతుందీ?” అని నవ్వాడు.

అదో అద్భుతమైన పాఠం అనిపించింది రాఘవ చెరుకూరికి. ఆ క్షణం నించే సారధిని ‘గురువుగారూ’ అని పిలవటం మొదలెట్టాడు. చిన్న చిన్న వేషాలు వేసే  ఓ నటుడ్ని హీరోగా బుక్ చేశాడు సారధి. అతనికి తగ్గట్టు సంభాషణల్ని కూడా మార్చారు. యజ్ఞంలో ఆ  యువకుడూ పాల్గొనడం మొదలైంది. కారణం ‘హీరో’ అవకాశం వస్తుందని జీవితంలో ఏనాడూ ఆతను అనుకోలేకపోవడంచేత. హీరోయిన్ కొత్త. కేరక్టర్ ఆర్టిస్టులు మాత్రం పాతవాళ్లూ, సారధి మీద నమ్మకం వున్నవాళ్ళూ. స్క్రిప్టు ‘బౌండ్ బుక్’గా మారింది. విజయా గార్డెన్స్‌లో విఘ్నేశ్వరుడి ముందు షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభం అయింది. ప్రతీ డైలాగూ ఓ పంచ్ డైలాగే. రమణ మాడ్యులేషన్‌తో సహా నటీనటులకి తర్ఫీదిస్తే సారధి నటించి చూపించేవాడు. ముప్పై అయిదు రోజుల్లో గుమ్మడికాయ కొట్టేశారు (అంటే షూటింగ్ పూర్తయిపోయిందన్నమాట.) పగలూ, రాత్రీ లేకుండా ఎడిటింగ్, రీరికార్డింగ్ నెలరోజుల్లో పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ ‘గుడ్‌లక్ థియేటర్’లో చూశారు. ( ఈ గుడ్‌లక్ థియేటర్ జి.వి గారిది. అంటే ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం అన్నగారిది. ఇప్పటికీ వుంది. అక్కడ ప్రివ్యూ వేస్తే లక్ అని చాలా మందికి నమ్మకం. నిజం కూడా). ప్రస్తుతం దాని పేరు 4 ఫ్రేమ్స్)

యూనిట్ వాళ్లు మాత్రమే చూశారు కుటుంబాలతో. హిలేరియస్. సాధారణంగా సిగ్గరి అయిన సునీతి  సినిమా పూర్తయ్యి లైట్లు వెలగగానే ఆనందంగా సారధిని కౌగిలించుకుంది. ఆ అపూర్వదృశ్యానికి అందరూ చప్పట్లు కొడితే మైమరపులోంచి ఇవతలపడ్డ సునీతి సిగ్గుల మొగ్గ అయింది.

“గురువుగారూ! ఇది హిట్ కాదు. సూపర్ డూపర్ హిట్” సారధి కాళ్లకి నమస్కారం చేసి అన్నాడు రాఘవ చెరుకూరి. డబ్బు అతని చేతిమీదుగానే ఇప్పిస్తూ ఉండటంతో అతనికి తెలుసు సారధి ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్‌గా తీసుకోలేదని. అంతే కాదు సునీతి రాళ్ల నెక్లేసూ, మూడు గొలుసులూ, చెవి దిద్దులూ ఆఖరికి నాంతాడు మాయమై మెడలో పసుపు కొమ్మ కట్టిన నల్లపూసల తాడు మాత్రమే వునందాన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించాడు. ఒక కోటి ఎనభై లక్షల్లో పిక్చర్ పూర్తయింది. మిగిలిన ఇరవై వేలూ రాఘవ దగ్గరే వున్నాయి. ప్రతీదానికి రసీదులు వున్నాయి. ఫైనాన్సు వ్యవహారాలన్నీ అతని చేతిమీదుగానే నడిచాయి.

సినిమా వాళ్లంత భోళా మనుషులు ఎక్కడా కనిపించరు. ముఖ్యంగా ‘టెక్నీషియన్లు’. వాళ్ల పని వాళ్లదే తప్ప మిగతా విషయాలు వాళ్లకి పట్టదు. ‘టెక్నీషియన్స్’ రాజకీయాలు నడపరు. ‘టాక్’ బయటపడింది.

రీరికార్డింగ్‌లో పాల్గొన్న ప్రతీ మ్యూజీషియనూ సారధి సరికొత్త సినిమా “వసంతమా.. నువ్వే నా ప్రాణం” సినిమా సూపర్‌గా వుందనీ, ప్రతీ పాటా, ప్రతీ మాటా ఆణిముత్యమనీ ఫ్రెండ్స్‌లో చెప్పడంతో మౌత్ పబ్లిసిటీ వచ్చింది. సినిమా చూసిన టెక్నీషియన్ల కుటుంబాలు చేసిన మౌత్ పబ్లిసిటీ పాండీబజార్లో మోగిపోయింది. సినిమా రాత్రి 9 గంటలకి పూర్తయితే రాత్రి 10.30 నించే బయ్యర్ల నించి ఫోన్లు .. పిక్చర్‌ని కొనడానికి సిద్ధంగా వున్నామనీ,కలవడానికి టైం చెప్పమనీ. ఉక్కిరిబిక్కిరైన రాఘవ సారధి ఇంటికొచ్చి విషయాన్ని చెబితే సారధి ఒకటే మాట అన్నాదు. “వెయిట్ చేద్దాం రాఘవగారూ. ఒక్కరోజు ఆగుదాం. అన్నట్టు రేపొద్దున్నే మీరొస్తే ఇద్దరం ‘ముప్పత్తమ్మ’గుదికి వెళ్ళొద్దాం. కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను” అని.

‘ముప్పత్తం’ గుడిలో మొక్కుకుంటే, ఫలితం వెంటనే వస్తుందనీ, కోరుకున్నది జరిగి తీరుతుందనీ నమ్మకం. ఇప్పటికీ ఆ గుడికి రష్ ఎక్కువే. ఇంకో గుడి మా వలసరవాకంలో వున్న ఆంజనేయర్ కోవిల్.

మొక్కు తీర్చుకున్నాక రమణ, శీను, గుప్త, రాఘవ, సారధి అందరూ సారధి ఇంట్లోనే టిఫిన్ చేశారు. సునీతి కొసరి కొసరి తినిపించింది. తగ మూడేళ్లుగా భర్త మౌనంతో భారమైన ఆమె హృదయం నిన్న రాత్రి సినిమా చూశాక ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని , ఆకాశంలో ఎగురుతున్న రాజహంసలా మారింది. ఉప్మా, ఇడ్లీ, గారెలు, ఆవడ సమస్తం ఆమె స్వయంగా చేసినవే.

రాఘవ ఆమెని గమనిస్తూనే వున్నాడు మూడున్నర నెలలుగా. రోజురోజుకీ ఆమె అంటే అతనికి గౌరవం పెరుగుతూనే వుంది. ప్రశాంతమైన మొహం అన్నం పెట్టినా, ఆఖరికి మంచినీళ్లు ఇచ్చినా అందులోని ఆప్యాయతా, ఆదరణా అతని మనసుని కట్టి పడేసేవి. అందర్నీ ఒకేలా చూసేది. టిఫిన్ అయ్యాక అప్రయత్నంగానే ఆమె పాదాలకి నమస్కరించాడు రాఘవ.

ఆడాళ్లు  పిల్లల్ని కనడంతో ‘తల్లు’లవుతారు . అంతే ‘మాతృత్వపు’ పరిధి వేరు. అది ‘అమ్మ’దనం. అందర్నీ బిడ్డలుగా చూడగలగడం. ఆ అమ్మదనం (మాతృత్వం) నిండుగా ఉన్నది గనకే థెరెసాని ‘మదర థెరెసా’ అని ప్రేమతో పిలుచుకున్నాం. ఆ మాతృత్వం ఆమె అణువణువునా వున్నది గనకే జిల్లేళ్ళమూడి అమ్మనీ ‘అమ్మ’ అని నోరారా పిలిచాం. అంతెందుకూ, పుట్టిన క్షణం నించి మరణించేవరకూ యీ నేల తల్లిని ‘మదర్ ఎర్త్’ గానే పిలుచుకుంటున్నాం. చివరికి ఆమె ఒడిలోనే ఒరిగిపోతున్నాం. అలిసిన శరీరాలకి ఆమె ఒడిలోనే విశ్రాంతినిస్తున్నాం. సునీతి టిఫిన్ పెట్టాక అలాటి భావనే కలిగింది రాఘవకి. “అయ్యయ్యో… అదేమిటి రాఘవగారూ” అని ఖంగారూ, బిడియంతో అన్నది సునీతి.

“అమ్మా సారధిగారు సాగరమైతే, మీరు స్వచ్చ గోదావరి. అందుకే నా వందనం” నోరారా అన్నాడు రాఘవ.

painting: Rafi Haque

*****

 

‘అయిదు కోట్లకి’ అమ్ముడయింది సినిమా. ప్రతి టెక్నీషియన్‌కీ రిలీజ్ ముందరే మాట్లాడుకున్నంత ఎమౌంట్ + అయిదు వేలు అప్రీషియేషన్ ఎమౌంటు ఇచ్చాడు రాఘవ. రమణకి లక్ష. శీనూ, గుప్తాలకి యాభైవేలు. ఇలా అందరూ ఆనందంతో పొంగిపోయేంత పారితోషికాలు ఇచ్చాడు.

మొదటిసారి అప్రెంటీస్‌లకీ, అసిస్టెంటు డైరెక్టర్లకీ ఎవరూ పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరు. తిండి ఖర్చులూ, ట్రాన్స్‌పోర్ట్ మొదలైన ఖర్చులూ పోనూ అయిదు వేలిస్తే గొప్ప. అట్లాంటిది వాళ్లకి యాభై వేలివ్వడం అంటే కుబేరుడు స్వయంగా వరం ఇవ్వడం లాంటిదే. రమణ అడ్వాన్సుగాక మరో పదివేలు ఎక్స్‌పెక్ట్ చేశాడు. లక్ష చేతికి రావడంతో కళ్లు తిరిగిపోయాయి. సారధికి మాత్రం రాఘవ ఏమీ ఇవ్వలేదు. సారధికి ఆ ఆలోచనే రాలేదు. అతని ఆలోచనంతా సినిమా రిలీజ్ మీదే. లక్షాతొంబై ఆలోచనలు.

మొదటి సినిమాకి ఇలాగే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. కానీ థియేటర్లో బోల్తాపడింది. అచ్చం అలాగే కోటీ ఎనభై లక్షలకి తీసిన సినిమాని బయ్యర్లు షో లేయుంచుకొని చూసి అయిదున్నర కోట్లకి కొనేశారు.

పిక్చరు ఏ మాత్రం అటుఇటు అయినా తన పని జీవసమాధే. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్‌గా తయారవుతుంది. అతని టెన్షన్ సునీతికి తెలుస్తూనే వుంది. రాఘవకి కూడా. ఇద్దరూ సారధికి ధైర్యం చెబుతూనే వున్నారు. ఆగస్టు 17 రిలీజు . చిత్రం ఏమంటే ఆగస్టు 15న ఓ పెద్ద సినిమా రిలీజు కావల్సి వుంది. ఆగస్టు 22న చిరంజీవిగారి సినిమా రిలీజు. కారణం ఆ రోజు ఆయన పుట్టినరోజు.

రెండు పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న చిన్న సినిమా నిలబడగలదా? నిలబడుతుందా? బయ్యర్లు పిచ్చ ధైర్యంతో వున్నారు.

“రాఘవగారూ, నేను ఆగస్టు 17న మద్రాసులో  వుండను. 18న కలుస్తా మిమ్మల్ని. ఐ జస్ట్ వాంట్ టు బీ అలోన్” అన్నాడు సారధి పదహారో తేదీ వుదయం 10 గంటలకి.

సునీతి వాళ్లిద్దరికీ ‘పొంగరాలు’ వడ్డిస్తోంది. సారధి మాట విని షాకైంది. సారధి ఆమె వంక జూసి , “కంగారు పడకు. ఒంటరిగా ఓ రోజు గడపాలని వుంది. నా మనసుకి రెస్టు కావాలి. 18న పొద్దుటికల్లా వస్తాను. టిఫిన్ ఇక్కడే అంటే మనింట్లోనే అరేంజ్ చెయ్యి. శీనూ, గుప్తా, రమణ, రాఘవ కూడా మనతోనే టిఫిన్ చేస్తారు” అని నవ్వాడు. సన్నగా నిట్టూర్చింది సునీతి. మనసులో మాత్రం అనుకుంది. “పిచ్చివాడా నీ కష్టం,నువ్వు పడుతున్న టెన్షన్ అన్నీ నాకు తెలుసు. కానీ యీ మూడేళ్ళ పైచిలుకులో నా మనసూ, శరీరమూ ఎలా వున్నాయో, ఏమైపోయాయో, ఎంత టెన్షన్‌ని భరించాయో నీకేం తెలుసూ. నీకెలా అర్ధమౌతుందీ?” అని

17 తెల్లవారుఝామున కారు అద్దెకి తీసుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు సారధి..

 

*****

“తెలుగు సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. ‘వసంతమా’ సినిమా. రెండు భారీ సినిమాల మధ్య రిలీజైంది. కానీ పది కోట్ల కలెక్షన్స్‌ని దాటుతుంది. అద్భుతంగా యీ సినిమాని తెరకెక్కించిన ఘనత ఒక్కరికే.. దర్శకుడు సారధికే దక్కుతుంది” నిష్పక్షపాతంగా రివ్యూలు రాసే ఓ ఇంగ్లీషు పత్రిక రివ్యూ ఇది. ఇండీన్ ఎక్స్‌ప్రెస్, డక్కన్ హెరాల్డ్, ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ .. అన్ని పత్రికలదీ ఒకేమాట. ‘వసంతమా’ ఓ అద్భుతమైన సినిమా అని. జనరంజకంగా మలచబడిందనీ – ‘మాయాబజార్’లా పదికాలాల పాటు నిలుస్తుందనీ.

‘వసంతమా’ సినిమా రిలీజైన థియేటర్లో ముందు జనం క్యూలు కట్టారు.నిన్నటిదాకా చిన్న చిన్న వేషాలు వేసిన ‘మోహన్’ ఇవాళ ‘వసంతమా మోహన్’ అయ్యాడు. పది పిక్చర్లలో హీరోగా బుక్ అయ్యాడు. సరికొత్త హీరోయిన్ లక్షణ కూడ ఎనిమిది సినిమాల్లో హీరోయింగా సంతకం చేసింది.

సారధి మాత్రం ఎప్పటిలా మౌనంగా ఇంట్లోనే ఉన్నాడు. 18 ఉదయం అతను ఇంటికి వచ్చిన దగ్గర్నించి మౌనంగానే వుంటున్నాడు. రోజురోజుకీ అతనికోసం వచ్చే నిర్మాతల  సంఖ్య పెరుగుతూనే వుంది. కానీ అతను ఎవర్నీ కలవటంలా. రాఘవ అర్జంటుగా అమెరికా వెళ్లాల్సి వచ్చి వెళ్లిపోయాడు. సినిమా రిలీజై పదిరోజులైంది. యీ పదిరోజుల్లోనూ మొదట వేసిన 35 ప్రింట్స్ కాక మరో నలభై ప్రింట్స్ వేశారు. కలెక్షన్లు ఎనిమిది కోట్లు దాటినై. టిక్కెట్లు కొనుక్కుని చూసేవాళ్లకంటే టిక్కెట్లు దొరక్క నిరాశతో వెనక్కి మళ్లే వాళ్లే ఎక్కువమందున్నారు. దాంతో తెలుగు సినిమా చరిత్రలో ‘వసంతమా’ అన్ని రికార్డులనీ బ్రేక్ చేస్తుందని సినీ పండితులు ఘంటాపధంగా చెబుతున్నారు.

సునీతికి ఏమీ అర్ధం కావడంలేదు. డబ్బు చిల్లిగవ్వ లేదు. పాపం ‘మల్లికడై'(కిరాణ కొట్టు) శరవణన్ మంచివాడు. అడిగిందల్లా అప్పుగా వెంటనే ఇస్తున్నాడు. సారధి పిక్చర్ సూపర్ హిట్టని అతనికీ తెలుసు. తెలుగు కస్టమర్లు తెగ చెప్పారు సినిమా గురించి. శరవణన్‌కి ఈ విషయం తెలుసునని సునీతికి తెలీదు. అందుకే శరవణన్ మంచితనానికి పదేపదే నమస్కరిస్తోంది.

సెప్టెంబరు రెండో తారీఖున కొత్త కారు ఇంటిముందు ఆగింది. రాఘవ చెరుకూరి భార్యతో సహా దిగాడు. సునీతి సంబరంగా వాళ్లని స్వాగతించింది. సారధి గది తలుపులు తట్టింది. సారధి బైటికొచ్చాడు. పది పన్నెండు రోజుల గడ్డంతో.

“గురూగారూ” అంటూ రాఘవ సారధి కాళ్ల దగ్గర కూలబడ్డాడు. అతని భార్య కూడా కూర్చుంది.

“చ.. చ.. ఇదేంటి రాఘవగారూ..” కంగారుగా అన్నాడు సారధి. “నన్ను నిర్మాతని చేశారు. మామూలు నిర్మాతనిగాదు. స్టార్ యాక్టర్లందరూ నాకు ఫోన్ చేశారు. కాల్‌షీట్లు  ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని. అది చాలు నాకు. నా ఆశ తీరింది. మీ రుణం మాత్రం యీ జన్మకి తీరదు. ఒక్క పైసా మీకు నేనివ్వలేదు. ఒక్క పైసా మీరు తీసుకోలేదు. సీతమ్మలాంటి సునీతిగారి మెడలో నగలన్నీ తాకట్టుకి వెళ్లిపోయాయని తెలుసు. అప్పటికీ మీరు నన్ను ఏదీ అడగలేదు. నిజమైన స్నేహానికి నిర్వచనం మీరు. ఇదిగో – యీ కారు ఈ క్షణం నుంచి మీది. ఇదిగో ఇవి నేను మీకోసం కొన్న ట్రిబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తాళాలు ఇదిగో. ఈ చెక్కు మీది. నేను  సినిమా తీస్తే అది మీతోనే అవుతుంది” అంటూ కన్నీళ్లతో చెక్కుని పాదాల మీద వుంచాడు రాఘవ. సారధి అతని భుజాలు పట్టుకుని లేవదీశాడు. సునీతి కళ్లల్లో నీళ్ళు జలజలా రాలాయి. రాఘవ భార్య ఆమెని హత్తుకుని కళ్లు తుడిచింది తన పైట చెంగుతో.

‘ఇవి నీవి..’ అపార్టుమెంటు తాళాలూ, కారు తాళాలూ చెక్కూ అన్నీ సునీతికి ఇచ్చి అన్నాడు సారధి. ఆశ్చర్యంగా చూసింది సునీతి.”నేను పడ్డ కష్టంలోనూ, టెన్షన్లోనూ వున్నది నా స్వార్ధం మాత్రమే. అంటే అది ప్రొఫెషన్‌కు సంబంధించింది. మరి యీ మూడేళ్లకు పైగా నువ్వు పడ్డ టెన్షన్ సంగతి? అందులో ఏ స్వార్ధమూ లేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనూ?” సునీతి వంక చూస్తూ అన్నాడు సారధి. గొంతులో గుండె కొట్టుకుంటుంటే వచ్చిన మాటలవి.

“ఇన్ని రోజులు ఆ గదిలో మౌనంగా…” అడిగింది సునీతి.

“జస్ట్ వన్ మినిట్..” గది లోపలికెళ్లి క్షణంలో బయటికొచ్చాడు సారధి. అతని చేతిలో ఓ ఫైలుంది. ఆ ఫైల్ మీద అందంగా ‘దాహం’ అనే టైటిల్ రాసి వుంది. “ఇది నేను చెయ్యబోయే నెక్స్ట్ సినిమా. ” నవ్వాడు సారధి. సునీతికి ఆ ఫైల్ అందించి దగ్గరకి తీసుకుంటూ..

*****

‘సక్సెస్’ నా ‘బిడ్డ’ అని చెప్పుకోవడానికి లక్ష మంది రెడీగా వుంటారు. ఫెయిల్యూర్‌ని ‘నా బిడ్డ’ అని చెప్పడానికి ఎవరూ ఒప్పుకోరు.

ఈ కథ సక్సెస్ కథ.

కథలో కథ మరో కథ వుంది.

దాని పేరు “బొరుసు”

అన్నట్టు బొమ్మా బొరుసుల్లానే, సక్సెస్, ఫెయిల్యూర్లు ఒకే నాణానికి రెండు ముఖాలు.

“దేరీజ్ నో సక్సెస్ వితవుట్ ఫెయిల్యూర్’ అనేది నా అనుభవం నాకు నేర్పిన పాఠం..

అది మరో కథలో చెప్పుకుందాం

మీ

భువనచంద్ర..

 

‘పాత్రో’చితంగా…

images

నిన్న ఆహుతి ప్రసాద్
ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…!
మృత్యువు ఎంత గడుసుదీ!
అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి లాగేసుకుంటుంది.
పొద్దున్నే ఒకరు ఫోన్ చేసి, “సార్, గణేష్ పాత్రో గారూ…” అని నానిస్తే, “ఏమైందీ” అని అడిగాను.
“అహ! వారి ఫోన్ నంబరు తెలిసేమోననీ…” అన్నారు. వెంటనే ఫోన్ పెట్టేశారు.
గంట తరవాత హైదరాబాద్ నించి ఓ ఫోను. “GP…మరి లేరు!” అని.
మరో గంటకి వరసగా ఫోన్లు.
“సారీ…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని.
ఎంత విచిత్రం!

శ్వాస ఉన్ననాళ్ళూ యీ శరీరం ‘శివం’
శ్వాస ఆగిన మరుక్షణం ‘శవం’
అప్పటిదాకా మనిషికి అన్ని పేర్లూ, బిరుదులూ, లాంచనాలూ అన్నీ పోయి కేవలం “బాడీ” అనే పదం మాత్రం మిగుల్తుంది. అప్పుడెప్పుడో శోభన్ బాబు గారు పోయినప్పుడూ అంతే!
“సార్…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని ఇది సర్వ సహజం. ఈ ఒక్కదాన్నీ మించిన వేదాంతం ఎక్కడుంది? ‘బాడీ’ కేవలం body…! పేరెత్తరు! తెచ్చుకున్న పేరూ, పెట్టుకున్న పేరూ, పెట్టిన పేరూ అన్నీ శ్వాస ఆగగానే క్షణంలో మాయమవుతాయి.
సరే…

ఎక్కడో పార్వతీపురం దగ్గిర పుట్టారు. నాటకాలు రాశారు. నటించారు, స్పురద్రూపి కనుక! మధ్యతరగతీ, దిగువ మధ్య తరగతి జీవితాల్ని ఆపోశన పట్టారు. చెన్నపట్నం గమ్యం అయింది. ‘రాజీ పడడం’ అనే మాట గణేష్ పాత్రోకి తెలీదు.
మాట మనిషిని చంపుతుంది.
మాట మనసుని చంపుతుంది.
మాటే- మనిషినీ మనసునీ కూడా బతికిస్తుంది.
మాట నిన్ను గెలిపిస్తుంది. నిన్ను చిత్తుగా ఓడిస్తుంది. మాటే నిన్ను హిమాలయ శిఖరం మీద కూడా నిలబెదుతుంది. ఆ ‘మాట’ ని ఎలా వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో తెలిసిన రచయిత – మాటల రచయితా, కథా రచయితా గణేష్ పాత్రో గారు.

ఈ చలనచిత్ర పరిశ్రమలో సముద్రాల వంటి సీనియర్ల ‘యుగాన్ని’ అలాగే ఉంచితే (వారిని జడ్జ్ చేయడం సముద్రాన్ని చెంచాతో కొలవడం లాంటిది గనక) ఆ తరవాత మనకి కొందరు మాటల మాంత్రికులు కనపడతారు- పింగళి నాగేంద్ర రావు, ఆచార్య ఆత్రేయ, ముళ్ళపూడి రమణ- ఇలాంటి మహానుభావులు.
వారికంటూ వారొక ‘పంధా’ ను సృష్టించి మనకి ‘సంభాషణా రచన’ ఎలా చేయాలో పాఠాలుగా బోధించారు. గణేష్ పాత్రో కూడా నిస్సందేహంగా ఆ కోవకి చెందినవాడే.
ఓ అక్షరం ఎక్కువుండదు.
ఓ అక్షరం తక్కువుండదు.
తూచినట్టు వుంటాయి మాటలు.
తూటాల్లా వుంటాయి మాటలు.
ఏ పాత్రకి ఏ భాష వాడాలో, స్పష్టంగా తెలిసిన రచయిత గణేష్ పాత్రో. అందుకే, ఆయన మాటలు ‘పాత్రో’చితంగా – ఒక ఎక్స్పర్ట్ టైలర్ కొలతలు తీసి కుట్టిన వస్త్రాల్లా వుంటాయి.
నటుడి హావభావాల్ని బాగా అబ్సర్వ్ చేస్తారు.

ఏ పదాలు ఆ నటుడి ముఖతా వస్తే పండుతాయో పరకాయ ప్రవేశం చేసి మరీ రాస్తారు.
అందుకే- ఆయన సంభాషణలకి అలవాటు పడ్డ నటులందరూ అనేది ఒకే మాట- “ఆయన డైలాగులే ఎలా నటించాలో మాకు నేర్పుతాయని”
ఇంతకంటే గొప్ప మెప్పుదల ఏముంటుందీ?
ఆ మెప్పుని వందల సార్లు పొందారు పాత్రో.

ఆయన కెరీర్లో ఒక్క పాటే రాశారు – “హలో గురూ ప్రేమ కోసమే” అని- నేననే వాడ్ని “పాత్రో గారు ఇంకొన్ని పాటలు రాయచ్చుగా” అని- ఆయన నవ్వి, “మీరూ ఇంకొన్ని సినిమాలకి సంభాషణలు రాయొచ్చుగా? మరెందుకు రాయలేదూ? మీరు డైలాగ్స్ రాస్తే, నేను పాటలు రాస్తా!” అనే వారు. (‘అలజడి’ అనే ఏకైక సినిమాకి నేను మాటలు రాసా. దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ)

గ్రాఫ్ చూస్తే-
రుద్రవీణ, సీతరామయ్య గారి మనవరాలు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ముద్దుల కిట్టయ్య, ముద్దుల మావయ్య (భార్గవ్ ఆర్ట్స్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసారు)- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ఇలా ఎన్నెన్ని హిట్స్! మధ్యతరగతి, కింది తరగతి వాళ్ళ ప్రతి కదలికనీ గమనించారు. ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాలుగా మలిచారు. మనని మనకి కొత్తగా చూపించారు. వాడిన డైలాగ్ వాడలేదు. సన్నివేశాలు ఒక్కోసారి ఒకేలా వున్నా “డైలాగ్స్”లో వైవిధ్యాన్ని చూపించి “శభాష్” అనిపించుకున్నారు.

వ్యక్తిగా ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం.
ఆయన “సంభాషణ”లకి కూడా తనదైన “వ్యక్తిత్వం’ వుంది. ఇది స్పష్టంగా మనం చూడొచ్చు. ఇదో విచిత్రమైన లక్షణం. మరొకరి దగ్గిర కనబడదు. ఎవరినీ అడగరు, ఎవరినీ పొగడరు. ‘పని’ కోసం- వస్తే, ప్రాణం పెట్టి రాయడం, లేకపొతే హాయిగా చదువుకోవడం. ఆయనతో అనేక సాహిత్య చర్చల్లో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. మంచి వక్త.
ఏమని చెప్పనూ? నాలుగేళ్ళుగా మెల్లమెల్లగా నీరసపరుస్తున్న కేన్సర్ తో పోరాడి- ఇక దాని ‘బాధ’ నన్నేం చేయలేదంటూ, శరీరాన్ని ఇక్కడే వదిలేసి మరో నూతన ‘వస్త్రం’ ధరించడానికి ఎక్కడి నించి వచ్చారో ఆ పుట్టింటికి వెళ్లిపోయారు.

“జో జాయేగే ఉస్ పార్ కభీ లౌట్ కే …న ఆయే…” (ఆ వొడ్డుకి వెళ్ళిన వారెవరూ ఈ వొడ్డుకి తిరిగి రాలేరు)
“ఓ జానే వాలో …హో సకే తో లౌట్ కే ఆనా” (వీలుంటే మా కోసం మరో సారి తిరిగి వస్తారా?”)
బస్…

‘రాం తేరి గంగా మైలీ’ చిత్రంలో ఓ అద్భుత దృశ్యం వుంది.
ఓ పెద్ద మంచు గడ్డ పాక మీంచి కింద పడుతుంది. ఆ క్షణమే ‘కెవ్వు’ మన్న బిడ్డ ఏడుపు – అప్పుడే పుట్టింది- వినిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంత గొప్ప సింబాలిజం చూపించాడూ..
మన జీవితం అనేది పెద్ద మంచు ముద్ద.
అది క్షణక్షణం కరిగిపోతూనే వుంటుంది. (జీవితంలాగే చివరంటా)
గాలి గాలిలో, మట్టి మట్టిలో, నిప్పు నిప్పులో నీరు నీటిలో ఆత్మ ఆకాశంలో-
గణేష్ పాత్రోజీ, మీ పాత్రని ఈ భూమ్మీద అద్భుతంగా పోషించారు. మాకివాల్సింది అక్షరాల రూపంలో అద్భుతంగా ఇచ్చేసారు.

అందుకే, అల్విదా.

మీ ఆత్మ పరమాత్మలో లీనమగు గాక
అనంత శాంతి మీకు లభించు గాక.

– భువన చంద్ర

bhuvanachandra (5)

మీరే చెప్పండి

  bhuvanachandra (5)ఆ రోజుల్లో ‘పాండీబజార్’ ఎంత ఫేమస్సంటే అక్కడ నడుస్తుంటే చాలు.. బోలెడు మంది ‘ఆర్టిస్టులు’ కనపడే వాళ్ళు. టి.నగర్ సరేసరి. హార్ట్ అఫ్‌ ద సిటీ. ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ టి.నగర్. ఎన్ని జ్యుయెలరీ షాపులో లెక్కలేదు. ఇక వస్త్ర వ్యాపారానికి టి.నగర్ పెట్టింది పేరు. పట్టు చీరలు, సిల్కు చీరలు ఇలా ఎన్ని రకాలో అన్ని దొరుకుతాయి.

ఆంధ్రా నుండి పట్టుచీరల కొనుగోలుకి వచ్చే వారి సంఖ్యకి లెక్కలేదు. ఇప్పటికీ ఆ రష్ పెరిగిందే గానీ తగ్గలేదు. వ్యాపారానికి సినీ గ్లామర్ తోడవటంతో టి నగర్ ఎప్పుడూ కిట కిట లాడుతూ వుంటుంది.

‘పానగల్’ పార్క్ కూడ చాలా ఫేమస్. తెలుగు వారందరూ అక్కడికి చేరేవారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు. అక్కడ ఘంటసాల బెంచీ, మల్లాది (రామకృష్ణ శాస్త్రి) బెంచీ, పింగళి గారి బెంచీ ఇలా చాలా బెంచీలు వుండేవి. ఎందుకంటే వాళ్ళు పార్కుకి వచ్చినప్పుడు అక్కడే కూర్చునేవారట. సత్సంగాలూ, కవితాగోష్టులూ ఇవన్నీ అక్కడే సాగేవి. ఇక జరుక్ శాస్త్రి, (జల సూత్రం రుక్మిణీ శాస్త్రి)గారి పేరడీలు అక్కడే పురుడు పోసుకునేవి అంటారు.

అక్కడే ‘మనసత్యం’ (జై హింద్ స్టూడియో) చాలా శ్రమించి జనాన్ని కూడగట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి.. సినీ ప్రముఖులతో కలిసి ప్రతిష్టించిన నిలువెత్తు చిత్తూరు నాగయ్యగారి విగ్రహం యీనాటికి మనని పలకరిస్తూ, తెలుగువారి ఒకప్పటి ప్రాభవాన్ని చాటుతూ వుంటుంది. అప్పట్లో కూచిపూడి డాన్స్ అకాడమీ వెంపటి చిన సత్యం గారిది పానగల్ పార్కు పక్కనే వుండేది. స్టాండర్డ్ ఎలెక్ట్రికల్సు.. దాని ముందర ప్లాట్‌ఫాం మీద నాలుగు కుర్చీలు వేసి, బోలెడు పత్రికల్నీ, న్యూస్ పేపర్లనీ (తాజావి) ఓ గోనెపట్టామీద పడేసి, (జనాలు చదువు కోవడం కోసం) మరో కుర్చీలో డాక్టర్ గోపాలకృష్ణగారు కూర్చుని వుండేవారు.

35 సంవత్సరాలకి పైగా కొన్ని లక్షలమందికి ఉచితంగా హోమియో మందులు ఇచ్చిన మహానుబావుడు డా!!గోపాలకృష్ణగారు. సాయంకాలంలో పెద్దపెద్ద వాళ్ళంతా, అంటే, అల్లురామలింగయ్యగారూ, జగ్గయ్యగారూ, శారదగారూ, జలంధరగారూ ఇలా ఎంతమందో అక్కడి వచ్చి, కాసేపు కూర్చుని డాక్టరు గారితో ముచ్చటించి వెళ్ళేవారు. నేనూ, గౌతం కశ్యప్, డైరెక్టర్ బి.జయ అందరం అక్కడే కలిసే వాళ్ళం.

వరద వచ్చినా, ఉప్పెన వచ్చినా వన్‌ఫార్టీఫోర్ సెక్షన్ అమలు చేసినా ‘చెట్టు కింద క్లినిక్’ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేది. బీద సాదలకి ఆరోగ్యదానం చేస్తూనే ఉండేది. మండే ఎండైనా సరే, కుంభవృష్టి అయినా సరే, డాక్టరుగారు మాత్రం ఉదయం ఏడున్నర నుండి రాత్రి పదింటి దాకా అక్కడే వుండేవారు. ప్రపంచపు తలుపులు మూసుకుపొయినా డాక్టర్‌గారి హృదయ కవాటాలు మాత్రం తెరిచే వుండేవి.

ఆయన గురించి చెప్పాలంటే ఓ మహా గ్రంధమే అవుతుంది. కలెక్టర్‌కి పి.ఎ.గా, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో గొప్ప హోదాగల అధికారిగా, ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్ పోస్ట్‌గ్రాట్యుయేట్‌గా, కొంతకాలం సినిమా నటుడిగా (చాల short period) నాటకాలలో నటుడిగా, ఆ తరవాత హోమియో వైద్యాన్ని డా!! గాలిబాల సుందర రావుగారి నుంచి నేర్చుకుని హోమియో వైద్యులై. చివరివరకూ ప్రజలకు సేవ చేస్తూనే లోకం నుంచి నిష్క్రమించారు. ఆయనో మహా తత్త్వవేత్త, మహా మానవతావాది, అధ్యాత్మక వేత్త. ఆత్మ దర్శనం పొందిన మహయోగి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సినీజనాలందరూ సాయంత్రమైతే చాలు గీతాకేఫ్ దగ్గర్లో, రాణీ బుక్ సెంటర్ దగ్గరో (త్రిపురనేని రామాస్వామి కుమార్తె), డాక్టరుగారి దగ్గరో చేరేవాళ్ళు. కాసేపు కబుర్లేగాక సంగీత సాహిత్య చర్చలు జరుగుతువుండేవి. తెలుగు పుస్తకం కావాలంటే రాణీబుక్ సెంటర్‌కి వెళితే చాలు పుస్తకం లేకపోతే తెప్పించి మరీ ఇచ్చేవారు. వారి అబ్బాయి అనిల్ అట్లూరి ఇప్పటికీ సాహిత్య సేవ చేస్తునే వున్నారు. నాకు మంచి మిత్రుడు శ్రేయోభిలాషి.

నా కేరాఫ్ అడ్రస్ డాక్టరుగారే. అక్కడే వుండేవాడ్ని. పని ఉంటే స్టూడియోల్లో – లేకపోతే డాక్టరుగారి దగ్గర.

హోమియో మందులేకాదు… డాక్టరుగారు ఎంతో మందికి సహాయం చేసేవారు. ‘మీటర్’ తిరగని అసిస్టెంటు డైరెక్టర్లు, సినీ కళాకారులూ డాక్టరుగారి సహాయం పొందేవారు. అదో గాధ. అప్పట్లో నెల్లూరి నించి ఓ రెడ్డిగారు మద్రాసులో ఓ చిట్‌ఫండ్ కంపెనీలో గుమాస్తాగా చేరి, సాయంత్రం ఏడు దాటాక మా దగ్గరికి వచ్చేవారు. శివవిష్ణు టెంపుల్ దగ్గరి మేడ మీది రేకుషెడ్డులో వుండేవాడు. పెళ్ళి కాలేదు గనక వచ్చే డబ్బు సరిపోయేది ఆయనకి.

దొరైస్వామి బ్రిడ్జి దాటాక ఆచారిగారి నగల కొట్టు ఒకటుండేది. మంగళసూత్రాలు, ఉంగరాలూ లాంటివి ఆయన చాలా బాగా తయారుచేసేవారు. ఆ రోజులో వ్యాపారం ‘బ్రాండ్’ మీద కంటే ‘నమ్మకం’ మీద ఎక్కువ సాగేది. అయితే ఆ కాలంలో ‘బ్రాండ్’ పిచ్చివాళ్ళు లేరా అంటే ఉన్నారని చెప్పక తప్పదు. ‘స్పెన్సర్’లో కొనడం గొప్ప.. అలాగే పట్టుచీరలకి నల్లిస్ వారూ, బంగారానికి ఉమ్మిడియార్స్… టిఫిన్లకి ఉడ్‌లాండ్స్ ఇలా చాలా ఉండేవి.

ఒకరోజున ఆచారిగారో ఖబురు తెచ్చారు. అప్పుడు నేనూ, రెడ్డిగారూ, సూరి శ్రీ విలాస్ గారూ అక్కడే వున్నాం- ఏమంటే, వెస్ట్ మాంబళం xxx వ నంబరు ఇంట్లోంచి రాత్రిళ్ళు ఏడుపులు వినిపిస్తున్నాయనీ, ఆ ఏడుపుల్ని బట్టి ఏడ్చేది ఒక తెలుగు పిల్ల అనీ!

“వెళ్ళి కనుక్కుందామంటారా?” అన్నారు డాక్టరుగారు.

R19

“ఏంక్వయిరీ చేశా. ఆ ఇంటి ఓనర్లు ఇక్కడ అంటే మద్రాస్‌లో లేరుట. ఇంటిని ఓ టాక్సిడ్రైవర్‌కి అద్దెకిచ్చారుట. అదీ పెద్ద ఇల్లేంకాదు. ఓ రెండుగదులూ, చిన్న వరండా, వంటిల్లూ, బాత్రూమూ. అంతే.. ఆ యింటి పక్కనే మా షాపులో పని చేసే రంగారావు వాళ్ళ అన్న అద్దెకుంటున్నాడు. ఆ పిల్లని లోపల ఏదన్నా హింసిస్తూ వుండి వుండొచ్చు అని అతను నాతో చెప్పాడు.. అన్నారు ఆచారిగారు.

“పోలీస్ రిపోర్టు ఇస్తే?” ఆ టాక్సీ డ్రైవర్ ఓ చిన్న పాటి రౌడీ మాత్రమే కాకుండా అక్కడి లోకల్ పొలిటికల్ లీడర్స్‌కి తొత్తుట. అందుకే కంప్లైంటు ఇచ్చినా లాభం వుండదనీ, అలా కంప్లైంటు ఇచ్చింది ‘ఫలానా’ వాళ్ళు అని తెలిస్తే ఆ టాక్సీవాడు నానా తలనెప్పులు తెస్తాడనీ రంగారావు అన్న భయపడుతూనే చెప్పాడు. అన్నారు ఆచారి.

అయితే ఒక్కపని చేద్దాం.. వాడు లేనప్పుడు మన ఆనందీ యీశ్వరన్‌ని వాళ్ళింటికి సేల్స్ ప్రమోషన్‌కి పంపిద్దాం (ఆవిడ ఆల్‌రెడీ ఉష మెషిన్లకి సేల్స్ ప్రమోటర్) ఆవిడకి బాగా తెలుగు వచ్చు కనక లోపల వున్న అమ్మాయి తెలుగులో మాట్లాడితే అర్త్ధం అవుతుంది. కనీసం లోపలి పొజిషన్ ఏమిటో తెలుస్తుంది. అన్నారు డాక్టరుగారు.

“అది చాలా మంచిపని. తమిళం ఆనందిగారి మాతృభాష గనక టాక్సీ వాడు మధ్యలో వచ్చినా అనుమానం రాదు. అదీగాక కంపెనీ IDకార్డు వుంటుందిగా…” మెచ్చుకున్నారు శ్రీ విలాస్ గారు.

“వర్కవుట్ కాలేదు సార్. ఆ పిల్లని బాత్‌రూంలో నోటికి గుడ్డకట్టి తాళం వేశారు. అలాంటి ములుగు వినిపించింది గానీ… నేను అడగలేను గదా…!” అన్నది ఆనందీయీశ్వర్ డాక్టర్ జీతో. “ఓ పని చేస్తా సర్.. నేను ఎవరో ఎవరికీ తెలీదు గదా. వాడు బయటికి వెళ్ళినప్పుడు నేను బలవంతంగా లోపలికి దూరి ఆ అమ్మాయిని పిడిపించి తీసుకొస్తాను…” కాన్‌ఫిడెంట్‌గా అన్నాడు రెడ్డిగారు.

“ఏ మాత్రం అటు ఇటూ అయినా దౌర్జన్యం కేసు కిందో, గూండా చట్టం కిందో నిన్ను మూసేస్తారు. పిచ్చి వేషాలు వద్దు.” సీరియస్‌గా వార్నింగిచ్చారు డాక్టరుగారు.

“మరి ఏలాగు ?”

“ఇంట్లోనే మూసి పెట్టి ఎన్నాళ్ళుంటారు? ఆ చుట్టు పక్కల ఎక్కడైనా కాపుగాయటానికి వీలుందా?” అడిగారు డాక్టర్.

“రంగారావు అన్నయ్య వాళ్ళు ఇల్లు ఆ యింటి పక్కనేగా..” చెప్పారు ఆచారిగారు.

“సరే.. ఓ రెండ్రోజుల పాటు పగలూ రాత్రి రెడ్డిని అక్కడ వుంచే ఏర్పాటు చేయండి. తరవాత సంగతి చూద్దాం!” అన్నారు డాక్టర్.

“వద్దు సార్.. మా రంగారావునే వాళ్ళన్నయ్య ఇంట్లో వుండి అబ్జర్వు చెయ్యమని చెబుతాను. ఎందుకంటే, కొత్త వాళ్ళు ఎవరొచ్చినా డౌట్స్ వస్తాయి.. రంగారావైతే సందేహంరాదు… అన్నారు ఆచారిగారు. “సరే.. అలా అయితే ఇంకేం కావాలీ!. అన్నారు డాక్టర్ గారు.

ఎంత ప్రయత్నించినా ఆ మరుసటి రోజున కూడ కధ ముందుకు సాగలేదు. ఏడుపులు వినిపిస్తున్నాయిట గానీ బాగా నీరసంగా వినిపిస్తున్నాయట. బయటి వాళ్ళెవరూ ఆ ఇంట్లోకి రాలేదనీ, లోపలి వాళ్ళు బయటికీ రాలేదనీ (టాక్సీవాడు తప్ప) ఇన్‌ఫర్‌మేషన్ మాత్రం ఖచ్చితంగా తెలిసింది రంగారావు ద్వారా.

ఆ మరుసటి రోజున ఆచారిగారు ఉరుకులు పరుగుల మీద పొద్దున్నే ఏడింటికే చెట్టు కిందకి వచ్చారు. బాగా కంగారుగా ఉన్నారు. నేను అప్పటికి కుర్చీలు వేసి పుస్తకాలు, పేపర్లూ పడెయ్యడానికి గోనె పట్టాలు, స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్‌కి ఇవతలి పక్కగా, అంతా, ఎవరికీ అడ్డులేకుండా వేస్తున్నాను.

“ఏమయింది ఆచారిగారూ?” అడిగాను.

“ముందు నన్ను కూర్చోనివ్వండి…!” అంటూ కూర్చుని ఆయాసంగా రొపుతున్నారు. నేను ఆ పక్కనే వున్న టీస్టాల్‌నించి ఓ గ్లాసెడు మంచినీళ్ళు ఆయన చేతికిచ్చి నా పని నేను చేసుకుంటున్నాను.

చిత్రంగా 7.20 కల్లా డాక్టరుగారు వచ్చారు. ఆయన్ని చూడగానే ఆచారిగారు ఏదో చెప్పబోతుండగా, “రాజావారూ, మీరూ రండి” అని డాక్టర్‌గారు నన్ను పిలిచారు. (ఆయన అలాగే పిచేవారు నన్ను). నేనూ కుర్చీలో కూర్చున్నాను.

“ఇప్పుడు చెప్పండి..” అన్నారు డాక్టరు గారు.

“మన రెడ్డి చాలా ఘోరమైన పని చేశాడండీ… పిల్లాపాప వున్నవాడ్నిగదా.. ఇలా నన్ను ఇరికించవొచ్చా…” అని ఏడుపు మొరపెట్టారు ఆచారిగారు.

“అసలు ఏమయిందీ?”

“నిన్న రాత్రి రంగారావుతో రెడ్డిగారు కూడా రంగారావు అన్నయ్య వాళ్ళింటికి కెళ్ళాడుట. రాత్రి పదింటికి ఆ టాక్సీ వాడు బయటికి ఎందుకో పోగానే యీ రెడ్డిగారు ఆ టాక్సీ వాడింట్లోకి చొరబడి, టాక్సీవాడి భార్యని బెదిరించి గది తాళం తీయించి ఆ పిల్లని బయటికి తీసుకొచ్చాడు. ఇంతకీ ఆ పిల్ల ఒంటి మీద బట్టలు వూడదీసి తాళం పెట్టి వుంచాడుట ఆ వెధవ టాక్సీ వాడు. యీయనేమో అర్జంటుగా ఓ దుప్పటి కప్పి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి గదికి వేసిన తాళమే ఆ యింటికి వేసి రంగారావు వాళ్ళ అన్నగారి టీవీయస్ బండి మీద ఆ పిల్లని మా యింటికి తీసుకొచ్చాడు.” ఆయాసంతో ఆగాడు ఆచారిగారు.

“ఓర్నీ.. అంత ధైర్యం చేశాడా నెల్లూరి రెడ్డి. సరే.. మరి ఆ టాక్సీవాడి పెళ్ళాం అరవలేదా? అన్నారు డాక్టరుగారు.

“నేను ఆంధ్రా పొలీస్ ఇన్‌స్పెక్టర్ని అరిచావంటే చంపేస్తాను అని ‘లియో’ పిస్తల్‌తో బెదిరించాడుట. (లియో పిస్టల్స్ అంటే బొమ్మ పిస్టల్స్.. అవి చూడటానికి నిజం పిస్టల్స్ లాగే వుంటాయి. ఖరీదు కాస్త ఎక్కువ) అయినా ఆ తరవాత ఏం జరిగిందో రెడ్డికి ఎలా తెలుస్తుందీ. ఆ పిల్లని మా యింటికి దగ్గర దింపేసి పొయాడు.” అన్నాడు ఆచారి. (ఇంతకీ ఆ బొమ్మ పిస్టల్ రంగారావు అన్న కూతురిది)

“ఆ అమ్మాయి ఎమన్నదీ?”

“ఏదీ.. చచ్చేంత నీరసంగా వుంది. మూడ్రోజులైందిట అన్నం తిని. రాత్రిళ్ళు ఎముంటై.. ఏదో కాస్త మజ్జిగ మాత్రం మా ఆవిడ ఇచ్చింది. డాక్టరుగారూ, నన్ను అనవసరంగా ఇరికించాడండీ ఆ రెడ్డి. ఇప్పుడా టాక్సీవాడికీ విషయం తెలిస్తే నా బతుకు బుగ్గిపాలు అవుతుంది. అసలే వాడికి పొలిటికల్ సపోర్టుంది…” మళ్ళి భోరుమన్నాడు ఆచారిగారు.

“మీరేమీ వర్రీ కాకండి. మీరు ఇక్కడే వుండండి. నేను ఇద్దరు ఆడపిలల్ల్ని మీ ఇంటికి పంపుతాను. వాళ్ళు పూర్తిగా సమాచారం సేకరించి వస్తారు. ఆ తరవాత ఆలోచిద్దాం ఏం చెయ్యాలో.. మీకు మాత్రం ఏ అపకారము జరగదు.” అని అభయం ఇచ్చారు డాక్టరు గారు.

“మీరు అంత మాట ఇచ్చాక సరేనండీ.. కానీ నా భయము నా పెళ్ళాం పిల్లల గురించే!” నిట్టూర్చాడు. ఆచారిగారు.

డాక్టర్‌గారు విజయకి ఫోన్ చెయ్యమని నాతో చెప్పారు. విజయ హైకోర్టు లాయరు. మాతృభాష తమిళం అయినా తెలుగు భాగా వొచ్చును. పదింటికల్ల ఆవిడ వచ్చింది. ఇంకొకరెవరంటే తెలుగు సినిమాల్లో కోరస్ పాడే సరోజ. పెద్దావిడ.. పెద్ద మనిషి తరవోగా వుంటుంది.

ఇన్‌ఫర్ మేషన్ మధ్యాహ్నాం మూడింటికికల్లా వచ్చింది. ఆ పిల్లది రాజమండ్రి దగ్గర వుండే ఓ పల్లెటూరు. పెద్ద చదువు లేదు గానీ సినిమాపిచ్చి. తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. వాళ్ళది బాగా కలిగిన కుటుంబమే.

రాజమండ్రిలోనూ, పరిసర ప్రాతంల్లోనూ షూటింగ్ జరుగుతోందని తెలిసి ఫ్రెండ్స్‌తో కలిసి చూడ్డానికి వెళ్ళిందట. అక్కడో కెమేరా అసిస్టెంటుతో పరిచయం అయిందిట. ఇంతకీ చూస్తే అతను కెమేరాకి సంబంధించిన వాడుకాదు.. లైట్ బోయ్. వాడు యీ పిల్లకి వచ్చీరాని తెలుగులో చుక్కలు చూపించాడుట. ఇంకేంవుందీ. స్టారై పోదామని తల్లికీ తండ్రికీ చెప్పకుండా నగలూ డబ్బు కొంత మూటగట్టి వాడితో పాటు మెయిల్ఎక్కిందిట.

తీరా మెయిల్ మద్రాసొచ్చాక చూస్తే వాడూ లేడు యీ పిల్ల నగలూ డబ్బు కూడా లేవు.

ఏడుస్తుంటే యీ టాక్సివాడు చూసి అయ్యో.. మా ఆవిడదీ రాజమండ్రీ. ఇవ్వాల మా ఇంట్లో వుంటే, రేపు మా ఆవిడ్నిచ్చి నిన్ను రాజమండ్రి పంపుతాను. టిక్కెట్టు డబ్బులూ అవీ మీ అమ్మానాన్నని అడిగి ఇద్దుగాని’ అని బుజ్జగించి ఇంటికి తీసుకుపోయాడంట.

ఆ తరవాత కధ ఏముటుందీ? బహుశా రెడ్డిగారు గనక యీ పిల్లని దౌర్జన్యంగా బయటికి తీసుకు రాక పొయి ఉంటే వాడు ఆ పిల్లని పడుపు వృత్తిలో దింపేవాడు.. లేకపొతే ఏ కంపెనీకో అమ్మేసి వుండేవాడు. ఇదీ కధ. ఈ విషయం వివరించి, “డాక్టరుగారూ పిల్ల మాత్రం చాలా అందంగా ఉందండీ అందం కంటే అ పిల్ల అమాయకత్వం చూసి జాలేసింది.” అన్నది లాయరు విజయ.

ఓ చీర, లంగా ఆ పిల్లకి సరిపోయే రెడీమేడ్ జాకెట్టు కొనిచ్చింది సరోజగారు (డబ్బు డాక్టరు గారే ఇచ్చారు). ఇక ఆ అమ్మాయిని పంపాలంటే ఎలాగా అని డిస్కషన్ మొదలైంది. బస్సుల్లోనూ, ట్రైన్‌లోనూ వొద్దనుకున్నాం. కారులో పంపాలంటే బొలేడంత అవుతుంది. అప్పుడే నేను పరిశ్రమకి కొత్తగ వచ్చిన రోజులు గనక నాకూ కాస్త ఇబ్బందిగానే ఉండేది. (అయితే మిలటరి పెన్షన్ వస్తుంది కనక అవసరాల వరకూ హాయిగా తీరేవి నో లగ్జరీస్).

డాక్టర్ గారితో ప్రసిద్ధ రచయిత్రి జలంధర, నేనూ

డాక్టర్ గారితో ప్రసిద్ధ రచయిత్రి జలంధర, నేనూ

దానికి ఓ సోల్యూషన్ దొరికింది. ఉమామహేశ్వరావని ఓ నటుడు శివుడి వేషాలు వేసేవాడు. వాళ్ళ అబ్బాయికి పెళ్ళి సంబంధం చూడటం కోసం గూడూరు వరకూ కార్లో వెడుతున్నారని తెలిసింది. డాక్టరు గారు అతన్ని రప్పించి మరొకర్ని కూడా కార్లో ఎక్కించుకుని గూడూర్లో దింపడానికి వీలవుతుందా అని అడిగారు. ఆయన ఓకే అన్నాక ఆసలు విషయం చెప్పారు.

“తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదుగానీ, ఆమెని గూడూర్లో ఎవరైనా ఇలాగే చీట్ చేస్తే ఎలాగ?” అని ఆయన ధర్మ సందేహం బయట పెట్టాడు.

అప్పుడు శ్రీనివాస్ గారన్నారు. “బయటకి తెచ్చింది రెడ్డిగారు గనకా, అతనిది గూడూరు దగ్గరుండే నెల్లూరే గనకా ఆ పిల్లని అతనితోనే రాజమండ్రిదాకా పంపి పిల్లని వాళ్ళ ఇంటి దగ్గర దింపితే మంచిదేమో!” అని డాక్టరుగారు నవ్వి, “నేనేమో విజయని ఆ పిల్లకి తోడుగా పంపుదామనుకున్నాను. కానీ, మీరన్నట్టు రెడ్డీ రైట్” అన్నారు.

ఇహనేం.. వాళ్ళిద్దరూ గూడూరు నించి రాజమండ్రికి బస్సులు మారుతూ పోయేటట్టూ, మళ్ళీ రెడ్డి ట్రైన్‌లో వెనక్కి వచ్చేటట్టూ నిర్ణయం జరిగింది. గబగబా డబ్బులు కూడా పొగయ్యాయి.. కావల్సిన దానికంటే తక్కువే.

స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్ దగ్గరే, ఎప్పుడూ డాక్టర్ గారికి విధేయుడిగా వుండే ‘కదిరివన్’ ఆటోలో రజని (ఓ సినీ నటికి P.A.) సరోజ వెళ్ళి బాగా చీకటి పడ్డాక ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. గభాల్న మేము ఆ పిల్లను నాయుడి సినీ టైలర్స్’ షాపులో కూర్చోపెట్టాం. నిజంగా చాలా అందగత్తె కానీ బెదిరిపొయి వుంది.

ఎనిమిదిన్నరకు ఉమగారి కారు వచ్చింది. డ్రైవరూ, ఉమామహేశ్వర్రావు, ఆయన భార్య, యీ పిల్ల, రెడ్డిగారూ మొత్తానికి ఆ ఎంబాసిడర్ కార్లో అడ్జస్టయ్యారు.

దిగ్విజయంగా ఆ పిల్లని వాళ్ళింటి వద్ద దించి మధ్యలో వాళ్ళ ఊళ్ళో దిగి ఓ పూట వుండి నాలుగో రోజున వచ్చాడు రెడ్డిగారు.

“వాళ్ళు వాళ్ళు’ చాలా ఉన్నొళ్ళండి. బోలెడంత మర్యాద చేశారండీ.. అంటూ చాలా విషయాలు వర్ణించాడు రెడ్డిగారు.

మద్రాసు వచ్చేసిందని కాకుండా రాజమండ్రి చుట్టాల ఇంట్లో వుండి వచ్చిందని చెప్పమని చెప్పానని కూడా చెప్పాడు రెడ్డిగారు.

మొతానికి ఆ పిల్ల తెచ్చిన నగలూ డబ్బు పోయినా కనీసం పిల్ల, శీలం నిలిచినందుకు అందరం సంతో షించాం.

ఆ తరవాత బాబు అనే ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిచయమై మాకు చెప్పాడు. ఇలాంటి టాక్సీ డ్రైవర్ గాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారట. వాళ్ళ పని అమ్మాయిల్ని ఎట్లాగొట్లా మాయ చేసి పడుపు వృత్తిలోకి దించడం అని. మరో విషయం విని షాక్ తిన్నాం. ఏమంటే రోజుకి కనీసం ఓ వంద మంది ఆంద్రా ఆడపిల్లలు సినీ మోజులో మద్రాసుకి వస్తుంటారనీ అందులో అధికభావం పడుపువృత్తిలోకి దింపబడతారనీ. చాలా చాలా బాధపడ్డాము. అర్జంటుగా పేరూ డబ్బు వచ్చేస్తాయనే మోజులో ఆడపిల్లలే కాదు, వందలాది మంచి యువకులు కూడ పరిశ్రమని ఓ వూపు ఊపేద్దాం అని వస్తుంటారు. ఫాల్స్ ప్రిస్టేజితో వెనక్కి వెళ్ళలేక, నికృష్టమైన బతుకులు బతుకుతూ వుంటారు. తెలిసి తెలియని తనం.. ఫీల్డు గురించి అవగాహన లేకపోవడం, ఫాల్స్‌ప్రిస్టేజ్ వీటితో బతుకు నరకమై పోతుంది. “సార్ నేను చిరంజీవి గారికి సరిపడే కధ రాశాననో, సార్ నలభై పాటలు రాశాను సార్. ఏ హీరో కయినా సరిపొతై..” అనో..సినిమా వాళ్ళకి ఫోన్లు వస్తూనే వుంటై. బోలెడు మంది గంపెడు ఆశలతో ఆఫీసుల ముందర కధల కట్టలు, పాటల కట్టలూ పట్టుకుని అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూనే వుంటారు. కొందరికి అవకాశాలు దక్కితే 90% అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వెడితే తలెత్తుకో లేమని భావిస్తూ ఎలగోలా బండి లాగిస్తూ వుంటారు.

ఇదో అంతులేని కధ. ఇంతకీ చెప్పొచ్చిందేమంటే, మూడేళ్ళ క్రితం అదే అమాయిని హైద్రాబాద్ కృష్ణానగర్లో చూశాను. బాగా లావయింది కానీ మొహం మారలేదు. అప్పటికీ ఇప్పటికీ మధ్య 20 సంవత్సరాలు గడిచాయి.

“సార్ మీరు ఫలానా కదూ!” అని సంభ్రమంగా అడిగింది. అవును అన్నాను “మీ లిటిల్ చాంప్స్ ప్రొగ్రామ్ తప్పనిసరిగా చూసేదాన్ని సార్… మీ పాటలంటే చాలా ఇష్టం..” చెప్పుకుపోయింది. దాన్ని బట్టి నాకు అర్ధమైంది ఏమంటే, ఆనాడు నన్ను సరిగ్గా యీమే చూసి వుండదని.

“మీరేం చేస్తున్నారూ? మీదే వూరు?” అని అడిగాను. మద్రాసులో జరిగిన విషయం ఆమెకి గుర్తు చేయ్యడం నాకు ఇష్టంలేదు బాధ కలిగించే గతాన్ని తవ్వకుండా ఉండటమే మంచిది.

“మేమాండీ? మాది రాజమండ్రి దగ్గరి వూరండీ.. నాకేమో సినీనటి కావాలని వుండేదండి. నా కల కలగానే వుండి పోయిందండి. ఇప్పుడు మా పాపని ‘స్టార్’ని చేసి నా కల నిజం చేసుకునే వుద్దేశంతో హైద్రాబాద్ వచ్చానండి. సార్.. మా అమ్మాయి బ్రహ్మాండంగా డాన్సు చేస్తాదండి. పాటలు కూడా బ్రహ్మాండంగా పాడతాదండి. దయచేసి మీరెవరికన్నా రికమెండ్ చేస్తే… ” అంటుండంగానే ఆవిడ కూతురొచ్చింది. పదిహేడో పద్దేనిమిదో వుండొచ్చు. అచ్చు అప్పటి ‘ఆమె’ లానే వుంది. అమాయకంగా.. అందంగా…..

 

***

మనం కన్నకలలు కలల్లానే మిగిలిపొవచ్చు. కానీ ఆ కలల్ని మన పిల్లల ద్వారా తీర్చుకొవాలనుకోవడం న్యాయమా? పోనీ ఆ ప్రయత్నం చేసే ముందు పిల్లల ఇష్టాలు ఏమిటో కనీసం తెలుసుకోవద్దా?

ఆవిడ జీవితం ఏమయిందో, ప్రస్తుత పరిస్థితి ఏమిటి తరవాత ఏమవుతుందో నాకు తెలీదు.

కానీ పాము నోట్లోనించి బయట పడ్డ మనిషి, తన బిడ్డని, తన కలని సాకారం చేసుకోవడానికి ‘పనిముట్టు’గా వుపయోగించుకోవడం ఎంతవరకూ న్యాయం?

 

నమస్సులతో

భువనచంద్ర

 

 

 

పరమపదసోపాన పటం అను ఉత్తమ కథ

bhuvanachandra (5)

‘పెళ్ళి అయి ఆరునెలలేగా అయిందీ? అప్పుడే విడాకులా?” ఆశ్చర్యంగా అడిగారు సత్యంగారు. సత్యం గారు ‘ఆ’ కాలపు ఎడిటర్. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే మనిషి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

“విడాకులకి అప్లై చేశారండీ. ఆ కేసు చూస్తున్నది లాయరు శ్యామలగారే. మరి ఎప్పుడు సరోజగారికి తలనెప్పి తప్పుతుందో!” నిట్టుర్చి అన్నాడు లోగనాధం. కరెక్టు పేరు లోకనాధమే.. తమిళ వాళ్ళు క బదులు ‘గ’ పలుకుతారు. గుమ్మడిపూడి వాడు గనక తెలుగువాడి కిందే లెక్క.

లోకనాధం డ్రైవరు. బాగా సీనియర్. అతను మద్రాసు వచ్చిన రోజునించీ సత్యంగారితోనే వున్నాడు. ఇప్పటికీ. సత్యంగారు తన పని తను చూసుకునే మనిషి. లోకనాధానికి అన్నీ కావాలి. ఇండ్రస్ట్రీలో మనుషుల గురించీ, మనసుల గురించీ, గిల్లి కజ్జాల దగ్గర్నించి రూమర్ల దాకా ఏ ఇన్‌ఫర్ మేషన్ కావాలన్నా లోకనాధాన్ని అడిగితే చాలు. ఠక్కున చెప్పేస్తాడు.. పూర్వాపరాలతో సహా.

“అసలు తగువెందుకొచ్చిందీ?” అడిగారు సుబ్బారావుగారు. ఆయన ఒకప్పుడు నంబర్ వన్ ప్రొడక్షన్ మేనేజరు.

“ఏముందండీ.. కొందరు ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేరండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి తీర్పులిస్తారండి. వాడికి తెలిసిందే జ్ఞానం అయినట్టూ, మిగతావాళ్ళది అజ్ఞానం అన్నట్టూ మాట్లాడేవాళ్ళకి లొకంలో కొదవేముందండి. అలాంటోళ్ళల్లో నంబరువన్ ఎదవ అసిరయ్యండి!.” రసవత్తరంగా మొదలెట్టాడు లోకనాధం.

“అసిరయ్యా.. ఆ పేరు వినలేదే నేను!” ఆశ్చర్యంగా అన్నాడు కోటగిరి ప్రసాదు. ఆర్టు డైరెక్టరాయన.

“అసలు పేరు అసిరయ్యండి.. సిన్మాల్లో కొచ్చాక అవినాష్ కుమార్ సిద్దూ అని పెట్టుకున్నాడండి” నవ్వాడు లోకనాధం.

“ఏమిటీ? అవినాషా? కొన్ని సినిమాలకి.. “ఆగారు సత్యంగారు.

“అవునండీ. కొన్నిట్లో వేషాలేశాడండి. కానీ పైకి రాలేదండి. కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా ట్రై చేసినా ఆడి ఎదవ బుద్ధివల్ల మధ్యలోనే పీకేశారండి. ఆ తరవాత కొంత కాలం ప్రొడక్షన్ అసిస్టెంటుగా, ఆ మధ్య కధారచయితగా కూడా అవతారాలెత్తాడండి.” వివరించాడు లోకనాధం. అవినాష్ గురించి ఫీల్డులో తెలీని వాడు లేడు. నాస్టీ మెంటాలిటీ. భయంకరమైన అసూయే కాక తానే చాలా గొప్ప వాడిననే అహంకారం. అర్జంటుగా ఏమాత్రం శ్రమలేకుండ, పేరూ డబ్బు సంపాయించెయ్యాలన్న అశవల్ల ఎక్కడా కుదురుకోలేకపోయాడు.

“‘ఆశ'” ఉండాలి. ఎదగాలనే కాంక్ష ఉండి తీరాలి. కానీ ఎదిగే వాళ్ళని చూసి యీర్ష్యపడకూడదు. వాళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడి బురద జల్లకూడదు” నిట్టూర్చాడు కోటగిరి ప్రసాదు.

“అవినాష్‌కీ సరోజకీ ఏం సంబంధం? సరోజ పెళ్ళాడింది ‘ఉత్తమ్’ నిగదా?” అడిగారు నందకుమార్. ఆయనో గొప్ప ప్రొడ్యూసర్. నేటి పరిస్థితుల్ని భరించలేక చిత్ర నిర్మాణం మానేశారు. పిల్లలతో ఆయన కూడా వెరీ వెల్ సెటిల్డ్.

వీళ్ళందరూ కూర్చున్నది ఆంధ్రాక్లబ్ అని పిలవబడే ఆస్కాలో. మిగతా వాళ్ళందరూ నీటుగా వున్న కుర్చీలో కూర్చుంటే, లోకనాధం కొంచెం విడిగా, అయినా దగ్గరగా ఓ చిన్న స్టూల్ వేసుకుని కూర్చున్నాడు. రోజూ ఓ గంట వీళ్ళంతా అదే టేబుల్ దగ్గర గుడుపుతారు. ఎవరి పుట్టినరోజైనా వస్తే మాత్రం మరో ‘రౌండ్’ కోసం ఇంకో గంట ఎక్కువగా గడుపుతారు.

“ఉత్తంగారు మంచాయనేనండీ.. కానీ ఆయనకి వురెక్కించడానికి అసిరయ్యగాడున్నాడు గదండీ…?” నవ్వాడు లోకనాధం. సస్పెన్సు మేయింటైన్ చెయ్యడం లోకనాధానికి అలవాటు.

“ఇదిగో లోకనాధం.. సస్పెన్సులో పెట్టక అసలు జరిగిందేమిటో చెప్పు…” నందకుమార్ అన్నాడు. సస్పెన్సుని భరించడం ఆయన వల్లకాదు.

“అయ్యగారూ.. సినిమా టైటిల్సు పడేటప్పుడే క్లైమాక్సు చెప్పెస్తే ఇహ చూడటానికి ఏవుంటాదండీ? అందుకే.. కాస్త స్క్రీన్‌ప్లే నండీ…! జరిగిందేమిటీ అని చెప్పే కంటే మీకు ఇంతవరకూ తెలియనిది ఎమంటే – సరోజగారు మావూరు విజయవాడ అని చెబుతారు గానీ, ఆవిడ అసలు వూరు దమ్ముపాలెం అండి. ఓ చిన్న పల్లెటూరు ఆది. అసిరయ్యదీ ఆ వూరు పక్కనున్న చుక్క పల్లండి. సరోజగారు చదువుకుంది మాత్రం విజయవాడలోనేనండి. అసిరయ్య ఆవిడ కంటే కాలేజీలో రెండేళ్ళు సీనియరండి. ఠికానా లేనోడు అసిరయ్య అయితే సరోజగారిది కలిగిన కుటుంబమే నండి. అసిరయ్య సినిమాల్లో కొచ్చి హీరో అయిపోదామని కలలుగనే వాడటండీ. అందుకే నాటకాలు రాసీ, ఏసీ స్టూడెంట్స్‌లో కాస్త పేరు తెచ్చుకున్నాడండి. కాలేజీలో ఓసారి ఆయన రాసి డైరెక్టు చేసిన నాటకంలోనే సరోజగారు వేషం కట్టిందిటండీ…” ఆగాడు లోకనాధం.

“చెప్పవయ్యా భాబూ…” ఓ గుక్క గభాల్న బిగించి అన్నాడు నందకుమార్.

“వస్తాన్నాండీ .. మరి … మీరు సినిమాలు తీసినోళ్ళే గదండీ.. కొందరికేమో సావిత్రిగారిలా నటన పుట్టుకతోనే వస్తాదండీ.. కొందరేమో ఫిలిం ఇన్‌స్ట్రిట్యూట్లో గట్రా అంత నేర్చుకున్నా అంతంత మాత్రమేనండీ.. అదేమోగానీ సరోజగారు మొదటిసారే అందరిచేత ‘సహజనటి, సూపర్ హీరోయిన్’ అనిపించుకున్నారటండీ…!” మళ్ళీ ఆగాడు లోకనాధం.

“మధ్యలో అడ్డొస్తున్నాగానీ.. లోకనాధం నీది గుమ్మడిపూడిగదా. అంటే మద్రాసు పక్కనే గదా… నీకు ఉంటే గింటే తమిళ యాస వుండొచ్చు. కానీ కాసేపు కృష్ణా.. కాసేపు తూర్పుగోదావరీ ఇలా ఇన్ని యాసలు ఎలా పట్టావు?” ముక్కుపోడుం పీల్చి అన్నాడు సుబ్బారావు.

“మా ఆవిడది తూర్పుగోదావరండి. మా అమ్మది విజయవాడండి. ఇక్కడికి రాకముందు లారీ క్లీనరుగా ఆంధ్రా మొత్తం తిరిగానండి. మరో విషయం అంటే మీకు తెలీని విషయం ఏమంటే, అవినాషు గారి పెద్దన్నయ్యా, నేనూ చిన్నప్పుడు దోస్తులం అండీ. మా అమ్మది సరోజగారిదీ ఒకటే వూరండి. నవ్వాడు లోకనాధం. “ఓర్నీ..! ఎప్పుడూ చెప్పలేదే?” ఆశ్చర్యంగా అడిగారు సత్యంగారు.

“ఏది చెప్పాలన్నా ఏది చెయ్యాలన్న సమయం రావాలిగదండీ. అసిరయ్యకీ వాళ్ళన్నయ్యకీ పదమూడేళ్ళ తేడానండి… వయసులో సరేనండి.. సరోజగారు ఫేమస్ అయ్యాక మనోడు ఆవిడగారికే నచ్చేటట్టు నాటకాలు రాసి, కాలేజీలో వేయించే వాడండి. అప్పుడు ఇద్దరూ ఫేమస్సయ్యారండి. సీనియర్ గనక సరోజగారి కన్నా రెండేళ్ళకి ముందే అవినాషు మద్రాసొచ్చారండి. మీకోవిషయం తెలుసాండీ.. సరోజగారి నటన చూసి ‘సినిమానటిగా చాలా పేరు తెచ్చుకుంటావమ్మా’అని దీవించింది VSR స్వామిగారండీ..!”

“నిజమా…?ఓహ్..స్వామిగారంతటి వారు ఆ మాటంటే తిరుగేమి వుంటుందీ!” తలవూపి అన్నాడు కోటగిరి ప్రసాదు.

“అవునండి.. అక్కడవుండగానే సరోజగారి తండ్రి పోయారండి. ఆ తరువాత ‘మనకోసం-మనం’ సినిమా డైరెక్టరు సాయిమొహన్ గారు సరోజని ఒప్పించి సినిమాల్లో నటింపచేశారండి.. ఆ పిక్చర్ సూపర్ హిట్టు. ఇంకేముందండీ. సరోజ చకచక నిచ్చెన మెట్లెక్కితే అసిరయ్య అక్కడక్కడే చక్కర్లు కొడుతా వున్నాడండి. అసలు సరోజకి యాక్టింగ్ నేర్పింది నేనే అని చాలా మందికి పాపం నిజమే చెప్పినా, వాళ్ళు నమ్మలేదు సరిగదా ‘కోతలు ఆపరా నాన్నా’ అని ఎగతాళి చేశారటండి. ఆవిడ మెట్లు ఎక్కుతున్నకొద్దీ యీయనకి అసూయ పెరుగుతూనే వున్నాదండి…!” మళ్ళీ ఆగాడు లోకనాధం.

“సరోజ ఇండస్ట్రీకి వచ్చి అయిదేళ్ళు దాటిందిగదా… యీ అయిదేళ్ళలో ఒక్కసారి కూడా అవినాష్‌ని కల్వలేదా?” అడిగాడు నందకుమార్. “ఎందుకు కలవ లేదండీ? వచ్చిన రోజుల్లోనే కలిసి, సాయి మొహన్ గారి దగ్గర ‘రచనా సహకారం’ పొస్టు ఇప్పిస్తానన్నదాటండీ. యీయనే, ‘ఆడదాని రికమెండేషన్ నాకక్కర్లేదూ.. ఐకేన్ మేక్ ఆర్ బ్రేకు స్టార్స్’ అన్నాడటండీ” వివరించాడు లోకనాధం.

“తరువాత?” అడిగారు సత్యంగారు.

“ఉత్తంగారూ, సరోజగారూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్టు కదండీ. మెల్లగా ఆరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందండీ. పెళ్ళికి ముందర కూడా సరోజ అవినాష్‌ని సలహ అడిగితే, ఉత్తంని పెళ్ళి చేసుకుంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్టు అవుతుందీ.. మీ పెళ్ళయిన మరుక్షణమే మీ ఇద్దరికీ ‘క్రేజ్’ పోతుందీ.. ఎఫైర్ కావాలంటే నడుపుకో గానీ, పెళ్ళివద్దు అన్నాడటండి. సరోజ అవినాష్‌ని ఎగాదిగా చూసి, ‘నేనేమీ ఫిలిం ఫీల్డ్ నా జీవితం అనుకుని ఇక్కడికి రాలేదూ. ఎఫైర్ నడుపు కోడానికి నాది లూజ్ కేరక్టర్ కాదు…” అని చికాగ్గా వెళ్ళిపోయిందటండీ గాలి పీల్చుకోడానికి ఆగాడు లోకనాధం.

“అంత నమ్మకంగా ప్రేమించిన దాన్ని ఉత్తమ్ ఎందుకు వదులుకుంటున్నాడూ?” అడిగారు ప్రొ!! సుబ్బారావుగారు.

“అయ్యా.. ఇక్కడే అవినాష్ నక్క తెలివి చూపించాడండీ! ఉత్తం దగ్గరికెల్లి, “ఏదిపోయినా సంపాయించుకోవచ్చు గానీ, ఒక్కసారి జనానికి నీ మీద ‘క్రేజ్’ పోతే సంపాయించుకోవడం దుర్లభం.. అందుకే ‘పెళ్ళి’ అనే ఊబిలోంచి ‘విడాకులు’ తాడు పట్టుకుని బయటపడు” అని చెవిలో బోరీగలా ఉదరగొట్టాడటండీ.”

“అయ్యా ఇన్నేళ్ళ అనుభవం వున్న మీకు తెలీని విషయాలా? పేరూ డబ్బురాదనే జనాలు చుట్టూ చేరి, ‘భజనలు’ మొదలెట్టడం తమకి తెలీదా? మహా మహా వాళ్ళనే ‘మందు’ లోకి దింపో, రేస్ కోర్సులకి తిప్పో, దేనికీ లోబడకపోతే సినిమాల్లోకి దించో సదరు మద్దెల విద్వాంసులు పబ్బం గడుపుకుంటారు. ఎంతమంది పై కొస్తున్న హీరోలు యీ చెత్త గేంగు వల్ల నాశనం కాలేదూ? సదరు మహానుభావుల ముందు ఉత్తమ్ గారో లెక్కా!” తేల్చేశాడు లోకనాధం. అతన్ననది నూటికి నూరుపాళ్ళు కరెక్టే.

“నువ్వు చెప్పేవన్నీ నిజమేగానీ లోకం… ఉత్తమ్‌ని అవినాష్ ఎట్టా పడేశాడూ?” అడిగారు సత్యంగారు.

“సినిమా కధ చెప్పి”. నవ్వాడు లోకనాధం.

“అంటే?”

“ఏవుందండీ ఫలానా హీరో కొడుకు ‘చిట్టిబాబు’ ఏక్ట్ చేసింది సూపర్ హిట్టు… కారణం ఆ సినిమా స్వంతంగా తీయడమే. ఫలానా హీరో “శమంత్’ స్వంత బేనర్లో తీసిన సినిమా తెలుగు సినిమా రికార్డుల్ని బద్దలు గొట్టింది. ఫలానా హీరో మనవడు ‘గగన్’ యాక్టుచేసిన సినిమా 50 కోట్లు కలెక్షన్ దాటింది.. కారణం తాతగారి బేనరు. ఈ విషయాలే ఊదరగొట్టి సొంత సినిమా తియ్యాలనే కోరికని ఉత్తమ్‌లో కలిగించాడు అవినాష్. ఒకటి మాత్రం నిజం చెప్పాలండి అవినాష్‌కి అదే అసిరయ్యకి కధ చెప్పడంలో వున్న టేలంట్ లాంటిది ఇండస్ట్రీలో ఏవరికి లేదండి. అప్పుడెప్పుడో సదా శివబ్రహ్మంగారని ఉండేవారటండీ. ఆయన్ని కధా శివబ్రహ్మ అనే వాళ్ళటండీ… అవినాష్‌కీ అంత టేలంటు వున్నాదండీ ఆగాడు లోకనాధం.

“తరవాత?” మరో పెగ్గు తెప్పించుకుని అడిగాడు నందకుమర్.

“ఇక్కడే ఇంకో మడతపేచీ పెట్టాడండీ అవినాషు. తీసేది తెలుగులో మాత్రమే కాదూ… తెలుగూ, తమిళం. రెండు భాషల్లో తీస్తే మనకి ప్రిస్టేజికి ప్రిస్ట్రేజీ, డబ్బు కి డబ్బు” అని ఎక్కేశాడండి.. అంతేకాకుండా తెలుగులో ‘బ్రహ్మాండం’ స్టార్స్ కూడ తమిల్‌లోకి డబ్ చేస్తే కుదేళ్ళై పోతారు. మొన్న నువ్వు ఏక్టు చేసిన ‘ఎవరు’ సినిమాని ‘యార్’ పేరిట ‘డబ్’ చేస్తే అది నూర్రోజులాడింది. ఆ రికార్డు ఇప్పటి వరకూ నీ ఒక్కడికే సొంతం. అని ఇంకా ఫురెక్కించాడండి.” ఊ!” సిప్ చేస్తూ తల పంకించాడు నందకుమార్.

“బహ్మాండమైన ఐడియా. రైటర్‌గా రెండు భాషల్లో ఒకే సారి పేరు తెచ్చుకోవచ్చు…!” మెచ్చుకున్నాడు సుబ్బారావు.

“అసలు మడత పేచీ మూడోదండి. రెండు బాషాల్లోనూ తియ్యాలి గనక తమిళ్‌లో ఫలానా హీరో గారి కూతుర్ని హీరోయిన్‌గా పెడితే సినిమా అదిరిపోద్దన్నాడండి..”

“వార్నీ. అలాఎందుకూ?” ఆశ్చర్యపోయారు సత్యంగారు.

“అదేనండి అవినాష్ టేలంటు.. అయ్యా ఓసారి ఓ సాములారు ఉపన్యాసం ఇస్తుంటే విన్నానండి. మనుషులందరూ ఒకలానే ఉన్నా – వాళ్ళలో తేడాలుంటాయటండి. దేవతలు – రాక్షసులు, మానవులు అని. ఎవరిలో సత్య గుణం ఉంటుందో వాళ్ళు దేవతలటండీ! అంటే వాళ్ళు యీ జీవితం అశాశ్వతమని గుర్తిస్తారు గనక వీలున్నంత వరకూ అందరికీ మంచి చేస్తారటండీ. ఇతరుల్ని విమర్శించడం, బాధపెట్టడం – పగలు పెంచుకోవడం లాంటివి వారి శివారులోకి కూడ రావటండి. తిట్టినా, పొగిడినా ఏమాత్రం చలించకుండా ‘స్థిరంగా’ వుంటారండి.

ఇహ రెండో రకంవాళ్ళు మానవులంటండీ. వీళ్ళు సుఖం వస్తే పొంగిపోయి దుఃఖానికి కృంగి పోతారంటండీ. చర్యకి తక్షణ ప్రతి చర్య మాత్రమే ఉంటాదటండీ. కోపం వచ్చినా తాటాకు మంటలా గప్పున వచ్చి చప్పున పోతాడటండి. వీళ్ళ వల్ల ఎవరికీ ‘నష్టం’ గానీ ‘బాధ’ గానీ వుండవండి.

ఇహపోతే మూడో రకం వాళ్ళలోనే నంటండీ గొడవంతా.. వాళ్ళని రాక్షసులంటారటండీ!” ఆగాడు లోకనాధం.

“భలే చెప్పాడయ్యా.. ఆ సాములారెవరో! బియ్యంలో అక్కుళ్ళు, కృష్ణకటుకలు.. రాజనాల – స్వర్ణమసూరీ. I.R.8 లాగా మనుషుల్లో కూడ 3 రకాలని చక్కగా చెప్పాడు.. సరే.. రాక్షసుల మాటేమిటీ?” లోకనాధాన్ని అభినందించి అన్నాడు నందకుమార్.

“అయ్యా ఎవడిలో అయితే కామం, క్రోధం, ద్వేషం, అసూయా, అహంకారం, ప్రతీకారం నిండి వుంటాయో వాళ్ళని రాక్షసులంటారండి. ఉదాహరణకి మనం ఓ మంచి వాడికి చెడు చేసినా అతను నవ్వేసి ఊరుకుంటాడే గానీ మనకి చెడు తలపెట్టడటండీ… ఇందాకన్నట్టు వాళ్ళది సత్వగుణంటండీ. మరో రకం మనిషికి అంటే రజో గుణం ఉన్న మనుషులకి మనం చెడుచేస్తే, వాళ్ళు తక్షణమే స్పందిస్తారట గానీ నెలలపాటూ, యేళ్ళ పాటూ గుర్తుపెట్టుకుని మనని సాధించరటండి. యీ మూడో రకం వాళ్ళున్నారే – అంటే తామసగుణం ఉండే ‘రాక్షసులు’ వీళ్ళు దేన్ని మర్చిపోరంటండీ. ఎవర్నీ క్షమించలేరటండీ. ఆఖరికి కన్నవాళ్ళనీ – తాము కన్న వాళ్ళనీ కూడ. మనం తెలిసీ తెలీని వయసులో అటువంటి వాళ్ళకి బాద కలిగించినా, వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూసి చూసీ, అవకాశం దొరగ్గానే విషప్పురుగు కాటేసినట్టు కాటేస్తారటండీ. అవినాష్ గాడిది మూడో జాతండీ. ఆడి కడుపునిండా ‘సరోజ’ మీద అసూయే!” ఆగాడు లోకనాధం.

“మరీ అంత అసూయ ఎందుకోయ్..?” గ్లాసు బోర్లించి అన్నారు నందకుమార్.

“దేనికైనా కారణం వుంటుందండీ. అసూయకి కారణం ఏవుంటాదండి? అయ్యా.. ఓ నటుడున్నాడండీ ఆయనెదురుగా మరో నటుణ్ణి పొగిడి చూడండి.. ‘ఆనాకొడుకా? ఆ ఎదవకి ఏక్టింగంటే ఏంటో తెలుసా? అని అగ్గగ్గులాడతాడండీ! అలాగే ఓ మ్యూజిక్ డైరెక్టరు ముందు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్నీ, ఓ రైటరు ఎదురుగా ఇంకో రైటర్నీ, ఓ హీరోయిన్ ముందు మరో హీరోయిన్నీ మెచ్చుకుని చూడండి… వాళ్ళు నిజంగా మెచ్చుకోదగినవారైనా సదరు మహానుభావులు మెచ్చుకోరండి.. కోపంతోటీ, అసూయతోటి భగ్గుమంటారండీ. మీకు తెలీని దేముందండీ. అసిరయ్యకి అదే బాధండీ. అదే కాలేజీ నించి వచ్చిన సరోజ సూపర్ హీరోయినయింది. ఆయన మాత్రం ఎక్కే మెట్టు దిగే మెట్టూ.. అంతకంటే కారణం కావాలాండీ?” ఆగాడు లోకనాధం.

“ఓహో.. సరే.. ఇంతకీ విడాకులకి రీజనూ?” అమాయకంగ అడిగారు సుబ్బారావుగారు. సామాన్యంగా ప్రొడక్షన్ మేనేజరంటే ఆవలించకుండానే పేగులేకాదు-; నరాలు కూడ లెక్క బెట్టేవాడు. పాపం సుబ్బారావు గారు ఆ టైపు కాదు. సిన్సియర్. “ఫలానా హీరో గారి కూతుర్ని హీరోయిన్‌గా ఒప్పించి కాల్‌షీట్ తీసుకున్నాకే ‘స్వంత ప్రొడక్షన్ గురించి సరోజగారికి చెప్పొచ్చని ఉత్తమ్‌కి చెప్పి సక్సెస్ అయ్యాడు అవినాషు. అది తెలిశాక అగ్గి మీద గుగ్గిలమైంది సరోజ. కారణం ఎమంటే ఉత్తమ్‌గారిదీ, సరోజదీ జాయింట్ ఎక్కవుంటండీ.. హీరోయిన్‌కీ అవినాషుకీ, మిగతా వాళ్ళకీ అడ్వాన్సులు వెళ్ళింది ఆ ఎక్కౌంటు లోంచండీ. మొదట్నించి ఉత్తం సంపాయించేరంటూ. ‘తన’ ఎక్కువుంటులో విడిగా వుంచుకున్నాడండీ. ఈ ప్రొడక్షన్‌కి జాయింట్ ఎక్కువుంటే ఖర్చుపెటడంతో సరోజగారికి సహజంగానే కోపం వచ్చి, కడిగేసారటండీ… “నువ్వు నా పెళ్ళానివి.. నేను చెప్పినట్టువింటే ok లేకపోతే దొబ్బెయ్’ అన్నాడండీ. బస్… ఇంకా చెప్పాలాండి?” చిర్నవ్వు నవ్వాడు లోకనాధం.

సంవత్సరంన్నర తరవాత-:

 

(a)ఉత్తమ్ తన సర్వాన్ని పణంగా పెట్టి తీసిన సినిమా అట్టర్ ఫ్లాపయింది. కధలోని లోపాలవల్లా. లెక్కా జమా లేకుండా పెట్టిన ఖర్చువల్లా.

 

(b) అవినాష్ మరో హీరోని ముగ్గులోకి దించి, అదే కధని ఏ లోపం లేకుండా తీసి స్టార్ రైటరయ్యాడు ప్రస్తుతం కధకి చా. హాలు తీసుకుంటున్నాడని అనధికార వార్త.

 

(c) సరోజ మేముండే వలసర వాక్యంలోనే ఉంటోంది విడాకులప్పుడే ఆమె గర్భిణి. ఇప్పుడు పసిపాపతో, అంటే ఇప్పుడు పదినెలల పాపతో ఉంటోంది. సినిమాల్లో సంపాయించినది ‘జాయింట్ ఎకౌవుంట్’ లో హరించుకుపోయినా, పల్లె ఆస్థులు పదిలంగా వుండటం వల్ల ఆమెకి ఆర్ధిక సమస్యలు లేవు.

మీకందరికి ‘ఉత్తమ్’ పరిస్థితి ఏమిటీ, ఏమయ్యాడో అనే కుతూహలం ఉంటుందని నాకు తెలుసు హైద్రాబాద్‌లో మీరు ‘నిర్మాత’ అవతారం ఎత్తితే అతనే మీ దగ్గరికొస్తాడు. ప్రతి రోజు కారణం ఒకటే – సినిమా ఫ్లాపవడంతో ‘మందు’తో బాధని మర్చిపోవడం అలవాటు చేసుకున్నాడు. అలా పరమపద సోపాన పఠంలో పాముల నోట పడ్డవాడు ఇతనొక్కడే కాదు. ‘సూపర్ హీరోలూ గతంలో ఉన్నారు. కొంచెం ఆలోచిస్తే వారెవరో ఇట్టే మీకు అర్థమౌతుంది.

 

మళ్ళీ కలుద్దాం.. మీ

భువనచంద్ర.