ముగింపు లేని వ్యధ-రైతు కథ

 

-వై. కరుణాకర్

~

ఇటీవల ఓ రెండు కథలొచ్చాయి. ఒకటి పింగళీ చైతన్య రాసిన ’గౌరవం’, రెండు చందుతులసి రాసిన ’ఊరవతల ఊడలమర్రి’.  రాసిన వాళ్ళిద్దరూ కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు. ఒకరికైతే ఇదే తొలి కథ. రెండింటికీ రైతు ఆత్మహత్యలే నేపధ్యం. ఈ నేపధ్యంలో ఎన్నో కథలొచ్చినా ఈ రెండు కధలు తీసుకున్న ముగింపు వల్ల  ప్రత్యేకత సంతరించుకున్నాయి. చైతన్య ’గౌరవం’ కథలో ఆత్మహత్య చేసుకున్న రైతుభార్య పార్వతమ్మ వ్యవసాయాన్ని వదిలి, పొలం అమ్మి, రాగల అగౌరవ భయాన్ని అధిగమించి .. బ్రతకటానికి మద్యం లైసెన్సు కోసం టెండర్ వేసి దక్కించుకుంటుంది. చందుతులసి ’ఊరవతల ఊడలమర్రి’ కథలో రైతు ’నారయ్య’ అప్పులవాళ్ళ ముందు అవమానం పొంది ఆత్మహత్య తలపును జయించడానికి ఎంతో మంది ఉరిపోసుకున్న ఊడలమర్రిని నరికేస్తాడు. రెండు కథలలో ప్రధాన పాత్రలు వ్యవసాయాన్ని వదిలి వేస్తాయి. అందులో బ్రతకలేక చావడం కంటే ఏ పని చేసికొనయినా బ్రతకడం ముఖ్యమనీ, అది అగౌరవం కాదనీ చెప్తారు. నిజానికి ఈ ముగింపుల గురించి మాట్లాడుకునే ముందు వాటి ప్రారంభం దగ్గరకు వెళ్ళాలి.

ఇప్పటి రైతు ఉసురు తీస్తున్న సంక్షోభ మూలాలు వలస పాలనలోనే ఉన్నాయి. సహజ వినియోగం నుండి మార్కెట్ అవసరాలకోసం భూమిని వినియోగించడం కొంత తెల్లవాడి బలవంతగానే మొదలైనా ఆ తరువాత దేశీయ పాలకుల హరిత విప్లవ నినాదం కలిగించిన మైమరపులో రైతాంగం ఆమోదంతోనే ఈ బదలాయింపు పూర్తయింది. ఫలితంగా ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. దానికంటే పురుగుమందులు, ఎరువులు, యంత్ర పరికరాల వినిమయం పెరిగింది. ఇవి ఎంతగా పెరిగాయో అంతగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఎనభైలలో వందలాదిగా సాగిన పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈ వైరుధ్యం బట్టబయలైంది.

chaitanya

చైతన్య పింగళి

ఈ పరిణామాల సాహిత్య ప్రతిఫలనాలను అటు ఉత్తరాంధ్రలో కారా ‘యజ్ఞం’ కథలో  సీతారాముడు కన్నబిడ్డను చంపుకోవడంగానూ, ఇటు రాయలసీమలో సింగమనేని నారాయణ ‘అడుసు’ కథలో రైతు నారాయణప్ప  రెక్కలుముక్కలు చేసి పెంచిన తోటను నరికివేయడంతోనూ ముగిసాయి. యజ్ఞం కథ ముగింపు ఆప్పుడే మొదలవుతున్న ప్రతిఘటన పోరాటాలకు సూచనప్రాయం చేస్తే, అడుసు కథ రాయలసీమలో ప్రతిఘటన రాజకీయాలు లోపించడం వల్ల వట్టి నైరాశ్యాన్ని ధ్వనించింది. ఈ రెంటికీ మధ్య కాస్త ఎడంగా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున లేచిన రైతుకూలీ పోరాటాల స్ఫూర్తి అటు కార్మికుల్నే కాదు ఇటు రైతాంగాన్ని కూడా కొంతవరకు సంఘటితం చేయగలిగింది. రఘోత్తమరెడ్డి ’పగలు రేయి శ్రమ పడుతున్నా..’ కథలో రైతుకూలీ మల్లేశం రైతు రాంరెడ్డికి ‘మీ కాపుదనపోళ్ళంతా తగిన ధరల్రావాల్నాని బయటకి రాండ్రి. … ఒక్కనెల రోజులు దినుసు మార్కెటుకు కొట్టకుంట ఆపుండ్రి. – మీతోని మేం రాకపోతే అప్పుడనుండ్రి.  సర్కారోన్తోని కొట్లాడితే మీరు మీరు మేం కలిసే కొట్లాడదాం’ అంటూ ధైర్యమిస్తాడు. ’ఒక్కటైతే’ కథలో హమాలీల పొరాటం రామిరెడ్డిలాంటి రైతుకు ఒక్కటవ్వాలన్న ఆలోచన కలిస్తుంది. ఈ ఆలోచనల వల్లనే టంగుటూరులో, కాల్దారిలో రైతులు తూటాలకెదురు నడిచారు. ఉద్యమాలు ఉధృతంగా నడచిన కాలంలో ఆయా  ఉద్యమ ప్రభావిత ప్రాంతాలనుండి రైతుల ఆత్మహత్యల వార్తలు అరుదుగానే వినిపించాయి.

సమాజంలోని అన్నివర్గాలకు ప్రేరణ నిచ్చిన మౌలిక పోరాటాలు ఒకవైపు నెమ్మదించగా మరోవైపు తొంభైలనాటికి ప్రంపంచ మార్కెట్లకు తలుపులు బార్లా తెరవడంతో ఉధృతమైన వ్యవసాయిక  సంక్షోభం నేడు పరంపరగా సాగుతున్న రైతు బలిదానాలతో పరాకాష్టకు చేరింది. రైతుకు భూమితో అనుబంధాన్ని ముగింపుకు తెచ్చింది. ఎనభైలలో, తొంభైలలోనే వ్యవసాయాన్ని వీడి వ్యాపారాలలోకి అటునుంచి రాజకీయాలలోకి వెళ్ళిన వాళ్ళు ఆర్ధిక సంస్కరణల తొలి ప్రయోజనాన్ని పొందగలిగారు. ‘గౌరవం’ కధలో పార్వతమ్మతో పాటు టెండరు వేయడానికి వచ్చిన తెల్లబట్టలవాళ్ళలో వీళ్ళని పోల్చుకోవచ్చు. మరి కొంతమంది పెద్ద పెట్టుబడులతో తిరిగి వ్యవసాయంలోకి ప్రవేశించారు. ట్రాక్టర్లు, పెద్దపెద్ద యంత్రాలు, నెలల తరబడి కోల్డ్ స్టోరేజీలలో పంటని నిలవ ఉంచుకోగల పెట్టుబడి సామర్ధ్యంతో గట్టు మీద నుండి దిగనవసరంలేని కొత్త తరం రైతులు తయారయ్యారు. వీళ్ళు ఒకవైపు ఆశపెట్టగా మరోవైపు పెరిగిన ఖర్చులు, పిల్లల చదువులూ, మారిన అవసరాలూ పెద్దసంఖ్యలో రైతులు ఆ భూమిలోనే పెనుగులాడేట్టు చేశాయి. ‘ఊరవతల ఊడల మర్రి’  కథలో నారాయణలాంటి ఎకరం రెండెకరాల రైతులు మరింత భూమిని కౌలు చేసేలా చేసాయి. బీటీ పత్తి తప్ప మరో పంట వైపు కన్నెత్తి చూడకుండా చేసాయి. ఫలితంగా భూమికి డిమాండ్ పెరిగింది. కౌళ్ళు పెరిగాయి. విత్తనంలోనే చేరిన విదేశీ పెట్టుబడి, ఆపైన పురుగుమందులూ, ఎరువులూ ఆపైన మార్కెట్ ధరల జూదంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీర్చలేని అప్పులతో నష్టదాయకమైన వ్యవసాయాన్ని వదిలేయాల్సిన ఆర్ధిక అవసరాలకూ, దానిని వదిలి మరో వృత్తిలోకి వెళ్ళలేని సామాజిక అవరోధాలకూ మధ్య రైతు ఉరితాడుకు వేళ్ళాడుతున్నాడు.

IMG_20150628_105027_1447180109835

చందు తులసి

ఇది సాహిత్యంలోకి ఎట్లా ప్రతిఫలిస్తోంది? బుధ్ధిజీవులైన రచయితలు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఈ ఆత్మహత్యల పరంపరకు ఏ ముగింపు పలుకుతున్నారు? చైతన్య, చందుతులసిల కథలు జవాబు చెప్ప ప్రయత్నించాయి. రెండు కథలూ ఆరుగాలం కష్టపడే రైతు ఆత్మహత్యల నేపధ్యాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రించాయి. ఒక పరిష్కారాన్నీ చెప్ప ప్రయత్నించాయి. జీవితం విలువైనది కనుక ఆత్మహత్యం పరిష్కారం కాదు. ఇక మిగిలింది వ్యవసాయాన్ని వదిలివేయడమే. రెండు కథలూ దాన్నే సూచించాయి. రైతు భూమిని వదిలి ఏ పని చేసినా తప్పుపట్టే నైతికార్హత  సమాజానికి లేదని  ‘గౌరవం’ కథ కాస్త ఆగ్రహంగా చెబితే, ‘ఊరవతల ఊడల మర్రి’ కథ ఇదే విషయాన్ని రైతుకు సానునయంగా నచ్చజెప్పింది. ఆ విధంగా అవి అనవసర ప్రాణనష్టాన్ని నివారించ ప్రయత్నించాయి. అందుకే ఇవి మంచి కథలయ్యాయి.

అదే సమయంలో భూమినుండి రైతును బయటికి తరమివేసే రాజకీయార్ధిక క్రమానికి లోబడే ఈ రెండు కథలూ వాటి  ముగింపులూ ఉన్నాయి. కాకపోతే ఆ క్రమం వీలైనంత సులువుగా సాగేందుకు వీలుగా – అయిష్టంగానే, వేరే దారిలేకే – రైతునూ, సమాజాన్ని  సిధ్ధం చేశాయి. దీనికి ఆయా రచయితలను కూడా తప్పు పట్టలేం. మొత్తం సమాజం యొక్క చైతన్య స్థాయిని, సామూహిక కార్యాచరణనూ పెంచే .. స్థిరమైన, బలమైన పోరాట కేంద్రాలు లేని సామాజిక వాస్తవికత -పరిష్కారాలు సూచించడలో వాళ్ళ సృజనకు పరిమితులు విధించి వుండొచ్చు.

అయితే సమాజం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. రైతులే కాదు కష్టజీవులందరూ వారివారి వనరులనుండి దూరంచేసే ప్రయత్నాలను తప్పక ప్రతిఘటిస్తారు. ఆలోచనపరులుగా రచయితల బాధ్యతేమంటే – ఆ ప్రతిఘటన ఎంత సూక్ష్మరూపంలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నాగుర్తించడం. తమ తమ సృజనతో దానిని బలపరచి స్పష్టమైన రూపమిచ్చి తిరిగి ఆయా వర్గాలకు ఆయుధంగా అందించడం.  చైతన్య, చందు తులసి కథల వెనుక వారి సంవేదన, నిజాయితీలను చూస్తే భవిష్యత్తులో ఆ బాధ్యత నెరవేరుస్తారనే ఆశ కలుగుతున్నది.