రహస్య

 

నేను రాత్రినై నక్షత్రాలతో చూస్తున్నప్పుడు

నీవు నదివై చీకటిని చుట్టుకుంటూ పోతావ్-

 

నేను చెట్టునై ఆకులన్నీ చెవులు చేసుకుని నిశ్చలంగా నిలిచినప్పుడు

నీవు గాలిలో లీనమై గలగలల సంగీతంలో ముంచేస్తావ్-

శ్వాసించడం అంటే ప్రతిక్షణం కొత్త ప్రాణాన్ని పొందడమేనని

మరణానికీ మరణానికీ మధ్య చిగురు తొడగడమేనని చెప్పేస్తావ్-

 

నువ్వెవరని వీళ్ళడుగుతారు

‘నువ్వు’కు అర్థం తెలిస్తే

‘నేను’ రహస్యం తెలిసిపోతుందని ఎలా చెప్పడం?

 

నేను వెంటే నువ్వున్నావ్

నువ్వున్న చోట నేను దారి తప్పుతుంటాను

ఏ దారిలోనైనా నువ్వుంటావ్-

 

నువ్వంటే ప్రేమంటారు వీళ్ళంతా

ప్రేమ ఎంత పరిమిత ప్రపంచం?

అది నా స్వార్థమంత అల్పం

అది నా లాలసంత తేలిక

అది నా సుఖమంత క్షణికం-

 

అదే నువ్వు…

నా ఏకాంతమంత అనంతం

నా దేహమంత కారాగారం

నా స్వప్నమంత సందేహం-

నేను నాలోనే తిరుగుతున్నప్పుడు

ఏ చెరువు గట్టు మీదో నిల్చుని చేయందించే దేవరూపం

నేను నీలోనే తేలిపోతున్నప్పుడు

తెరచాపలా రెపరెపలాడే తరంగ నాదం-

 

నేను ధ్యానం

నీవు యోగం

నేను మెలకువనై కలల్ని బహిష్కరించినప్పుడు

నీవు వేకువవై నిజాల్ని ఆవిష్కరించినప్పుడు

వెలుగు లేని పగళ్ళు

చీకటి లేని రాత్రుల మధ్య

రెక్కలొచ్చిన కన్రెప్పలా నేను

కన్రెమ్మలకు వేలాడే జ్వలిత జలపాతంలా నీవు-

 

వెలిగిపోవడానికీ

కాలిపోవడానికీ మధ్య దాగిన రహస్యమేదో

ఇప్పుడిప్పుడే తెలిసిపోతోంది-

  • -పసునూరు శ్రీధర్ బాబు
  • శ్రీధర్ బాబు

     

 

నువ్వొంటరివే!

861_10203100224966079_1515021072_n

ఒక ఆశ్చర్యాన్ని వేటాడుతున్నప్పుడు

ఒళ్ళు మరిచిన పరవశంలో

నువ్వు ఒంటరివే-

ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు

అలల వలల్లో తుళ్ళిపడే

ఒంటరి చేపవు నువ్వే-

ఒక పాట వెంట కాందిశీకుడిలా పరుగు తీసినప్పుడు

నిశ్శబ్ద అగాధంలోకి జారిపడ్డ

ఒంటరి అక్షరానివి నువ్వే-

చీకటిని తెరిచినప్పుడు

వెలుతురును మూసినప్పుడు

కాంతిరేఖల రహస్యం తెలుసుకుని మాడి మసైపోయిన

ఒంటరి మిణుగురు నువ్వే-

ఎవరినో కోరుకున్నప్పుడు

ఎవరూ కోరుకోనప్పుడు

నీ పగిలిన గాజుకన్నుకు గుచ్చుకుని వేలాడే

ఒంటరి కల… నువ్వే!

ఒక భయానికి ముక్కలుగా తెగిపోతున్నప్పుడు

వికల శకల సకలమైన ఒంటరివే నువ్వు!

ఒక విజయానికి రెక్కలతో ఎగిరిపోతున్నప్పుడు

శూన్యంలో పక్షిలానూ

నువ్వొక్కడివే-

20140715_190028-1

ఒక దిగులు… నల్లని మల్లెల తీగలా పెనవేసుకున్నప్పుడు

నెత్తుటిని బిగపట్టిన గాయాల చెట్టులా

నువ్వొంటరివే…

ఒక స్వప్నం ఇసక తుపానులా

నిన్ను చీకట్లోకి విసిరిపారేసినప్పుడు

వెన్నెల ఒయాసిస్సు కోసం అర్రులు చాస్తూ

ఒక్కడివే… ఒంటరివే!

పుటకలోంచి బతుకులోకి

బతుకులోంచి చితిలోకి

చితిలోంచి చింతనలోకి

దేహంలానో

ధూపంలానో

ధూళిగానో

వెళ్తున్నప్పుడు

వెళ్ళి వస్తున్నప్పుడు

వస్తూ పోతున్నప్పుడు

ఒంటరివే…

నువ్వొంటరివే-

***

(సాయంత్రం 5.30 గం.లు, 30 జూన్, 2014)

 

-పసునూరు శ్రీధర్ బాబు

చీకట్లోంచి రాత్రిలోకి…

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు

ఎంతసేపని

ఇలా

పడిపోతూనే ఉండడం?

పాదాలు తెగిపడి

పరవశంగా

ఎంతసేపని ఇలా

జలపాత శకలంలా

లేనితనంలోకి

దిగబడిపోతూనే ఉండడం?

రాలిన

కనుగుడ్ల నడుమ

కాలిన దృశ్యంలా

ఎంతసేపని

ఇలా నుసిలా

రాలిపోతూ ఉండడం?

గాలి

ఎదురుతన్నుతున్న

స్పర్శ లేదు-

జాలి

నిమిరి నములుతున్న

జాడ లేదు-

ఎవరో.. పైనుంచి

దిగాలుగా చూస్తున్నారన్న

మిగులు లేదు-

లోలోతుల్లో ఎవరో

చేతులు చాచి

నిల్చున్నారన్న

మిణుగురులూ లేవు-

ఎంతసేపని

ఇలా

అడ్డంగా

తలకిందులుగా

చీకట్లోంచి రాత్రిలోకి?

రాత్రిలోంచి చీకట్లోకి?

పొగల

వెలుగు సెగలకు

ఒరుసుకుపోతూ

తరుక్కుపోతూ

ఎంతసేపిలా

లోతుల్లోంచి లోతుల్లోకి..?

Pablo_Picasso_PIP025

వేళాపాళా లేని

ఖాళీలోకి

ఎండుటాకుల గరగరలతో

కూలే చెట్టులా

ఇలా

ఎందుకని

బోర్లపడ్డ ఆకాశంలోకి?

జ్ఞాపకమూ

దుఖ్కమూ

ఆనందమూ

నేనూ

ఎవరికెవరం కానివారమై

రేణువుల్లా చెదిరిపోతూ

పట్టుజారుతున్న

చీకటి వూడల నడుమ

నిద్ర స్రవించిన మెలకువలతో

గాట్ల మీద కట్లు కట్టుకుని

ఇలా ఎంతసేపని

కలల్లోకి

కల్లల్లోకి

కల్లోలంలోకి?

(12 గంటలు, 11 సెప్టెంబర్, 2013)

-పసునూరు శ్రీధర్ బాబు