ఆత్మని పలికించే గానం

 

 

రేఖా జ్యోతి  – సరస్వతీ ప్రసాద్ 

~

 

“అతని పాడెదను అది వ్రతము” అంటూ అన్నమయ్య సంకీర్తనలను” అన్ని మంత్రములు” గా జపిస్తూ ఆ “షోడశ కళానిధికి షోడశోపచారములు” చేస్తూ “వినరో భాగ్యము విష్ణు కధ” అని మధురానుభూతిని మధురంగా ఆలపిస్తూ, సంగీతాన్ని సాధనంగా మలచి ఎందరినో భక్తి మార్గంలోకి మళ్ళించిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ధన్యజీవులు. అన్నమయ్య పాట  అనగానే మొట్టమొదటగా మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి  శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఎన్నో అన్నమయ్య పదకవితలకు చక్కని బాణీలను కూర్చి అతిసులభంగా శ్రోత యొక్క మనసును, బుద్ధినీ స్వామీ వైపు నడిపించినవారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య కీర్తనలపై గల మక్కువతోనే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారిని తిరుపతి రప్పించుకొని తన ఆస్థానంలో కొలువిచ్చి తన సేవ చేయించుకుంటున్నారు.

అన్నమయ్య దివ్యాశీస్సులతో ప్రసాద్ గారు ఆణిముత్యాల వంటి పదకవితలకు ప్రాణం పోసి మనకు అందిస్తున్నారు. ఇది ప్రసాద్ గారి పూర్వజన్మ పుణ్యఫలం. మనందరి భాగ్యం.  నిరంతరం అన్నమయ్య సాహిత్యాన్ని చదువుతూ ఆస్వాదిస్తూ అందులోని అతి సూక్ష్మమైన లలితమైన బిందువు నుండి అనంతమైన భక్తి తీరాలకు తీసుకెళ్ళే బాణీలను అందిస్తున్న శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీత సాహిత్య రంగాలతో తన అనుభవాలను అనుభూతులను అభిప్రాయాలనూ ‘సారంగ’ తో ఇలా పంచుకున్నారు.

 

మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మాధుర్యం మీ బాణీదా, గొంతుదా

నా పాటలో ఏముందో ఇంకా నాకే తెలీదు, కానీ ఈ ఆదరాభిమానాలు చూసినప్పుడు మాత్రం ఏదో ఉందేమో అనిపించి ‘పాట’ విషయంలో నా బాధ్యతను మరింత బలపరుచుకుంటూ ఉంటాను. ఈ పాట ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది, ఆయనే శ్రద్ధగా కూర్చొని .. కూర్చిన బాణీలు ఇవి. కానీ వ్యక్తిగా ఒక మాధ్యమంగా నేను కనిపిస్తున్నాను కనుక అందరి మెప్పు నాకు చేరుతోంది.  పదాన్ని పలికే విధానమే శ్రోతకు గాయకుడి యొక్క సందేశం. అన్నమయ్య పాటలోని వెన్నెల ద్వారా సదా ఆ శ్రీనివాసుడనే చందమామ వైపు అందరి చూపు మరల్చే ప్రయత్నం నాది!  ఇరవై యేళ్ళ క్రితం ‘ఇక మీరు మాట్లాడనే కూడదు, మెడలో పలక తగిలించుకోండి’ అని అన్న డాక్టర్లు గెలవలేదు, నాతో ఇంకా పాడించుకుంటున్న ‘స్వామి’ గెలిచారు. ఈ శక్తి  నాది కాదు అని నాకు అనిపించినప్పుడు అది భగవంతుడిదే కదా… నా జీవితం ఈ ‘మిరాకిల్’ కి అంకితం  !!

సంగీత దర్శకుడే గాయకుడు అయినప్పుడు …

సంగీత దర్శకుడి ఒక ఊహకు తన గాన కళతో, సంగీత ప్రజ్ఞతో, మధురమైన కంఠంతో ప్రాణం పోస్తాడు గాయకుడు. సంగీత దర్శకుడి భావాన్ని తానూ అనుభూతి చెంది పూర్తిగా తన performance తో పలికించిన పాటలే ప్రాచుర్యంలోకి నేరుగా వెళ్ళగలుగుతాయి.  లలిత సంగీతం విషయంలో సంగీత దర్శకుడే గాయకుడు అయినప్పుడు ఆ మాధుర్యంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఊహ, కృషి రెండూ ఆ భావం పలికించడంలో సమాన పాత్ర పోషిస్తాయి కనుక. విలువ బాణీకి … ప్రశంసలు గాయకుడికి లభిస్తాయి. పాడేటప్పుడు గాయకుని యొక్క మనసు ఒక ఆనందాన్ని మించి మరొక ఉపశాంతికి చేరుతుంది … అది అతని పాటలో స్పష్టమైపోతుంది. ఈ లక్షణం గాయకుడి దగ్గరున్నప్పుడు శ్రోత అక్కడే కట్టుబడి పోతాడు.

GBK3

ఎలాంటి పాటలు  చిరకాలం నిలిచిపోతాయి ?

కొన్ని  కీర్తనలు సాహిత్యానికి రూపం ఇచ్చే క్రమంలో నిర్మితమైన బాణీలు, కొన్ని స్వరాలని ( Notes) పలికించడానికి నిర్మితమైన బాణీలు,మరికొన్ని భావ నిర్మితమైన బాణీలు.ఒక కీర్తనని స్వరస్థానాల మీద, కట్టుదిట్టమైన నోట్స్ మీద శాస్త్రీయంగా ట్యూన్ చేసినప్పుడు ఎవరు పాడినా అదే నోట్స్ అనుసరిస్తారు కనుక అలాంటి బాణీలు చొరవగా రక్తికట్టే అవకాశం ఉంది. కానీ లలిత సంగీతం అలా కాదు … భావమే మేటిగా పలుకుతూ ఉంటుంది, పెర్ఫార్మన్స్ మీద ఆధారపడుతుంది. పాడేటప్పుడు శ్రుతి, లయ, భావం, స్పష్టత కలిసిన ఒక పూర్ణత్వం ఉంటే ఆ పాట పది కాలాలు నిలిచిపోతుంది ఖచ్చితంగా !

ఘంటసాల పాడిన ఆ ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో – రావణాసురుడు కైలాసాన్ని లేపుతున్నప్పుడు ఆ స్తోత్రం ఎట్లాంటి శక్తితో ఉంటుంది..!  అర్కెష్ట్రా కూడా అంతగా ఉండదు .. కానీ భావం మొత్తం ఆ గొంతులోనే పలుకుతుంది. విన్న ప్రతీసారీ నన్ను రోమాంచితుడిని చేస్తుంది. “శివ శంకరీ …”, “మాణిక్య వీణా ..” లాంటివి వింటుంటే ఆశ్చర్యం. అది ఘంటసాల పాటకు చేసిన అత్యుత్తమ న్యాయం. ట్యూన్ ని మాత్రం ప్రెజెంట్ చేయడం కాకుండా పాడేటప్పుడు ఒక fullness … పరిపూర్ణతను భావంతో జొడించగలిగితేనే ఆ పాట రాణిస్తుంది. అంటే ఆ గొంతులో  రాణించిన అన్ని పాటల్లోనూ ఈ టచ్ ఉందని అర్ధం ! ఈ స్పర్శ లేని పాటలు బాహుళ్యం కాలేదు. గొంతు ఆ గాయకుడిదే .. కానీ ఆత్మ నిండుగా ఉన్న పాటలు రాణించాయి. మనసు – భావం లగ్నం చేసిన బాణీలు స్థిరంగా నిలిచిపోతున్నాయి అని !

గాయకుడికి సంగీత జ్ఞానం అవసరమంటారా?

             ప్రతీ గాయకుడికి కనీస సంగీత జ్ఞానం ఉండి తీరాలి. లేదంటే గాయకుడి యొక్క బాధ్యత పెరుగుతుంది,  పాడగలిగే ఆ వైశాల్యం పరిమితంగా ఉంటుంది. అంటే అన్ని రకాల పాటలు పాడలేడని అర్ధం. సంగీతజ్ఞానం లేకుండా పాడేటప్పుడు ప్రతీ వాక్యంలో, పదంలో, స్వరంలో భావాన్ని పెట్టాల్సి వస్తుంది. అది బాధ్యతతో కూడుకున్న పని కదా? అదే సంగీత జ్ఞానం తోడై ఉంటే 50% భావం చూపించి మిగతా 50% బాణీని నోట్స్ మీద నిలబెడితే చాలు… అది పాటని నడిపిస్తుంది. మూడవ అంశం మాధుర్యం. ఇది ఏమిటంటే సంగీత జ్ఞానం, భావం రెండూ అమరినప్పుడు శ్రోతని ఇక కదలనివ్వని అంశం. ‘గొంతు బాగుండడం’ అనే విషయం ఈ చివార్న సహాయ పడుతుంది అని నా అభిప్రాయం!
మహా మంత్రి తిమ్మరుసు – సినిమాలో యస్. వరలక్ష్మి భావం కంటే కూడా ఒక talented expression తో పాడిన పాట ‘తిరుమల తిరుపతి వెంకటేశ్వరా …. ‘ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆమె సంగీత జ్ఞానం ఒక ఆణిముత్యాన్ని ఆమె ఖాతాలో అలవోకగా వేసినట్టయ్యింది కదా !

GBK-SP-RJ2

అన్నమయ్య సాహిత్యానికి సంగీత బాణీలు కూర్చేటప్పుడు కలిగిన మీ అనుభవాలు… !!

             అన్నమయ్య తన సాహిత్యాన్ని – సంగీతంతో కంటే కూడా ఆత్మతో పలికించే ప్రయత్నం చేశారు. ఆ రచించిన కీర్తనల సంఖ్య ముప్పై రెండు వేలు అంటే సామాన్యం కాదు! ఆయన ఎన్నుకున్న కొన్ని రాగాలు,  సాహిత్యాన్ని తాళానికి వదిలే పధ్ధతి చూసినప్పుడు అన్నమయ్య ఎంత ప్రత్యేకమైన పోకడకి ప్రయత్నించారో తెలుస్తుంది. ఆయన సుసంపన్నమైన జీవితకాలం 95 సంవత్సరాలలో ఆయన సంకీర్తనలే కాక ఎన్నో రచనలు చేశారు, ద్విపదలు, శతకాలు, సంకీర్తనా లక్షణ గ్రంథం మొదలైనవి  రాశారు. నాకు వీలైనంత వరకూ అన్నమయ్య  తన సాహిత్యం వద్ద ప్రస్తావించిన రాగంతోనే బాణీ కట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. బాణీ పూర్తయ్యేటప్పుడు లోపల అనిపిస్తుంది ‘బహుశా అన్నమయ్య ఊహ ఇదేనేమో ‘ అని!

కొన్ని బాణీలు పూర్తి కావడానికి నిమిషాలు తీసుకుంటే, మరికొన్ని బాణీలు పూర్తి అయ్యేందుకు కొన్ని సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.

త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్ వంటి వాగ్గేయకారుల కృతులకు ఒక పటిష్ఠమైన structure ఉంది. అందుకే అది ఒకరు పాడుచెయ్యగలిగేది కాదు.. వాటి వైభవం వాటి కూర్పే! ఆ కీర్తనల్లోని ఎత్తుగడ, పోకడ, సాహిత్యం, భావం .. దేనికదే!! ఆ సాహిత్యం చదువుతున్నా కూడా బాణీ మన లోపల పలుకుతూనే ఉంటుంది ఒక నీడలాగా …, ఆ involvement వల్ల కలిగేదే  మోక్షము.

కీ. శే. శ్రీ నేదునూరిగారితో మీ అనుబంధం, అన్నమయ్య సంకీర్తనల కూర్పులో ఆయన ప్రభావం 

మా గురువులు కీ.శే. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. ఆయన స్వరపరచిన అన్నమయ్య సంకీర్తనలకు లోతైన శాస్త్రీయ శోభను అద్దారు, అవి వినినంత మాత్రమునే సంగీతం చాలా వరకూ నేర్చుకోవచ్చు. సంగీత జ్ఞానం పెంచుకోవచ్చు. అంటే మిగతా వారి బాణీల్లో సంగీతం లేదని కాదు కానీ, ఇక్కడ ఒక తేలికపాటి అందమైన సంగీతపు పలుకు మా గురువుగారి బాణీల్లో ఉందని నా నమ్మకం. Notation చూస్తే వచ్చే పలుకు కాదు అది. ఆ గొంతులో ఒక్కమారు విని ఉంటే తెలిసే మాధుర్యపు కణిక. ఆయన పోకడ నా కంపోజింగ్ లో కనపడదు కానీ, నా లోపల దీపం వెలిగించింది మాత్రం ఆయనే! ఆయన ఒక టార్చ్ లైట్ వేశారు .. ఆ వెలుగులో నేను నడుస్తున్నందుకే నా సంగీతం ప్రపంచానికి కనబడుతోంది! నా గొంతు కంటే ఎంతోమంది గొంతులో ‘మాధుర్యం’ పాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ  .. రేంజ్ ఎక్కువ ఉన్నప్పటికీ నా పాటలో హృదయానికి, ఆత్మకీ తగిలేది ఏదో ఉందేమో! అందుకే చాలా మంది చాలా సార్లు నా కచేరీ అయిపోయాక ‘మా ఆయుష్షు కూడా పోసుకొని హాయిగా కలకాలం పాడండి’ అని దీవిస్తూ ఉంటారు. నిజానికి పాడగలిగే వయసులో ఇన్ని అవకాశాలు రాలేదు. ఇప్పుడు కంపోజింగ్ తోనూ .. పాడుకోవడం తోనూ … ప్రతి నిమిషాన్ని అపురూపంగా వినియోగించుకోవలసి వస్తోంది. మధ్యలో ఏడెనిమిది సంవత్సరాలు కంఠంలో అసౌకర్యం ఏర్పడింది. నా బాధ చూడలేక తిరిగి ఆ స్వామి ఇచ్చినదే ఇవాళ నా సౌకర్యమైన గొంతు. స్వామి దయ వలనే ఇవాళ ఇంత మందికి చేరువ కాగలిగి అందరి అభిమానం సంపాదించుకోగాలిగాను.

గాయకులుగా ఎదగాలనుకొనే వారికి మీ సూచనలు 

కొత్తగా సంగీతరంగంలోకి గాయకులుగా అడుగు పెట్టలనుకొనే వారికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఒక్కటే .. సరైన వెర్షన్ విని మన శక్తి వంచన లేకుండా, ఒరిజినల్ పాట స్థాయి తగ్గకుండా ‘బాగుంది’ అనుకొనేటట్టుగా పాడగలగాలి. సాహిత్యాన్ని అర్ధం చేసుకొని వినేవారికి కూడా అర్ధమయ్యేలా పాడగలగాలి.  స్వతహాగా సంగీతం మీద గాయకుడికి ఉన్న పట్టు, గొంతులోని లాలిత్యం, కమిట్ మెంట్ శ్రోతల్ని అలా పట్టేసుకుంటాయి. వైవిధ్యభరితమైన పాటలు పాడగలగాలి…. చాలు , ఇక వారి కృషే వారిని నడిపిస్తుంది.

‘అన్నమయ్య వరప్రసాద్’ అనే పుస్తకంలో నా ఈ సుదీర్ఘ సంగీత ప్రయాణాన్ని సవివరంగా పొందుపరచిన సోదరి యన్.సి. శ్రీదేవి కి ఇవాళ మరోసారి కృతజ్ఞతలు.  ఎక్కడో ఖండాంతరాలలో కూడా తెలుగు భాషకు ప్రాణం పోస్తూ, తెలుగు భాష మీద ఎంతో మందికి ఆసక్తిని కలిగిస్తూ, తెలుగు సాహిత్య వృద్ధికి సేవలు అందిస్తున్న ‘సారంగ పత్రిక’ సారధులకు నా అభినందనలు..  ఆశీస్సులు !!

*