ఒక వేసవి సాయంత్రం

Akkadi MeghamFeatured

ఉర్దు మూలం : సజ్జద్ జహీర్

తెలుగు సేత : జగద్ధాత్రి

 ఈ కథ ‘అంగారే’ అనే కథా సంకలనం లోనిది. ఇందులో ఎనిమిది కథలు ఒక నాటకం ఉన్నాయి. అరసం వ్యవస్థాపకులు డాక్టర్ రషీద్ జహాన్ , ఆమె భర్త డాక్టర్ సయ్యద్ జహీర్ కలిసి తీసుకొచ్చిన మొట్టమొదటి ఉర్దు కథా సంకలనం. ఈ పుస్తకాన్ని మతాచారాలకు వ్యతిరేకంగా ఉన్నదని అప్ప్తట్లో నిషేధించారు. రషీద్ జహాన్ పేరు ముందు అంగారే వాలీ అని ఆమె ధైర్యానికి గుర్తుగా వ్యవహరించేవారు. అభ్యుదయ రచయితల సంఘం సంస్థాపక సభ్యురాలు ఈమె. ఇటీవల ఈ కథలను అమెరికాలో ఒక ప్రొఫెసర్ స్నేహాల్ సింఘ్వీ ఆంగ్లీకరించారు. ఈ కథతో బాటుగా ఉన్న మిగిలిన కథలను కూడా అనువాదం చేస్తున్నాను. త్వరలో ఇవి ఒక పుస్తకంగా వస్తోంది. 

 

సాయంత్రం ప్రార్ధన ముగించుకుని, మున్షి బర్కత్ అలీ అలవాటు  ప్రకారం అమీనాబాద్ పార్క్ లోకి నడిచాడు. అదో వేసవి సాయంత్రం, గాలి స్తంభించిపోయింది. చల్లని షర్బత్లు  అమ్మే చిన్న దుకాణాల వద్ద నిల్చుని మనుషులు మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లు అమ్మే కుర్రాళ్ళు అరుస్తూ అమ్ముతున్నారు. మల్లెపూల దండలు అమ్మే ఒకతను కాస్త నదురుగా కనబడిన వారందరి వద్దకు పరుగున వెళుతున్నాడు. ఈ మధ్యలో గుర్రపు బగ్గీలు, బళ్ళు తోలే వాటి కలగలిసిన శబ్దం వినపడుతోంది.

“కూడలికి ! అక్కడివరకు బండి మీద ! సార్! తీసుకెళ్లమంటారా కూడలి దాకా?’

‘ హే మిస్టర్, సవారి కావాలా ?’

‘మల్లెపూల దండలోయ్! బంతి పూల మాలలూ !’

‘రుచికరమైన అయిస్క్రీం!’

మున్షి ఒక పూల దండ కొని, కాస్త షర్బత్ తాగి , పార్క్ లోకి వెళ్ళే ముందు కిల్లి వేసుకున్నాడు. కూర్చోవడానికి ఒక్క బెంచీ కూడా ఖాళీ లేనందువలన , కొంతమంది కింద గడ్డిలో చతికిలబడ్డారు. శృతి తెలియని పాటల పిచ్చాళ్లు కొందరు దగ్గరలో గోల గోల చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు మౌనంగా కూర్చుని, పంచెలు ఎగదోసి తొడలు, కాళ్ళు గోక్కోవవడం లో మునిగిపోయి ఉన్నారు. ఉండుండి దోమలను కూడా వేటాడుతున్నారు. మున్షి ఎప్పుడు పొడవాటి కాటన్ పంట్లాం వేసుకుంటాడు, కనుక ఈ మనుషుల సిగ్గులేని ప్రదర్శన అసహ్యం కలిగించింది అతనికి. తనలో తాను అనుకున్నాడు ,’ ఈ వెధవలకు సిగ్గు లేదు’, ఇంతలో ఎవరో అతన్ని ఒక బెంచీ దగ్గరనుండి పిలిచారు.

‘మున్షి బర్కత్ అలీ!’

మున్షి వెనుతిరిగి చూశాడు.

‘ఓహ్ మీరా , లాలాజీ సోదరా !బాగున్నారు కదా !’

మున్షి పని చేసే ఆఫీసులోనే  లాలాజి కూడా హెడ్ గుమాస్తా. మున్షిది అతని కింద ఉద్యోగం. లాలాజీ జోళ్లు తీసేసి హాయిగా తన శరీరమంతటితో బెంచీ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. పొడుచుకొచ్చిన బొజ్జ మీద సన్నగా నిమురుకుంటూ తనకిరువైపులా కూర్చుని శ్రద్ధగా అలకిస్తున్న వారితో ఏవేవో చెప్తున్నాడు. మున్షి ని  గమనించి పిలవాలని నిర్ణయించుకున్నాడు. మున్షి వెళ్ళి లాలా సాహిబ్ ముందర నిల్చున్నాడు.

లాలాజీ నవ్వి అన్నాడు, ‘ఏమిటిది మున్షిజి? పూల మాల కొన్నారే ? రాత్రికి బాగా గడుపుదామన్న ప్లానా? అంటూనే పెద్ద పెట్టున నవ్వుతూ తనకు ఇరు వైపులా ఉన్న ఇద్దరి వైపు తన మాటకు అంగీకరిస్తున్నారా అన్నట్టు చూశాడు. వారిద్దరూ లాలాజీ కావాలని వేసిన జోక్ కి నవ్వడం మొదలు పెట్టేరు.

మున్షి కూడా తప్పని, నీరసమైన నవ్వొకటి నవ్వాడు. ‘ హాయిగా గడపడమా, మీకు తెలుసు నేనసలేబీద వాడిని. ఈ వేదిలో ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. కొన్ని రాత్రులుగా నేను నిద్రే పోలేదు. ఈ పూల దండ కొన్నది కనీసం ఓ గంటో రెండు గంటలో నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతుందని.’

లాలాజీ తన బట్ట తల నిమురుకుంటూ మళ్ళీ నవ్వాడు. ‘ నువ్వు అనుభవించేవాడివి మున్షి జి, ఎందుకు చెయ్యవు?’ అనేసి ,మళ్ళీ తన మిత్రులతో మాటాడటంలో మునిగిపోయాడు. ఇదే అదను అని చూసి మున్షి ‘సరే మరి లాలాజీ సెలవు తీసుకుంటాను ఇక మరి ! ఖుదాహఫీజ్ !’ అని నడవడం మొదలెట్టాడు. తనలో తాను అనుకున్నాడు ‘ ఈ వెధవ కళ్ళలో పడ్డానేంట్రా బాబు ఇవాళ. రోజంతా రుబ్బిన తర్వాత అడుగుతున్నాడు ‘హాయిగా గడపాలని ప్లానా ? అంటే , ఏమనుకుంటున్నాడు నన్ను ! పెద్ద భూస్వామిని, రోజూ ముజ్రాలు వింటూ, సానుల కొంపలకి తిరిగే వాడిననా ? జేబులో పావలా కంటే ఎక్కువ లేని వాడిని. భార్య, పిల్లలు, నెలకి అరవై రూపాయల జీతం- ఇంకేముంది బల్ల కింద నుండి వచ్చే డబ్బుల పై నమ్మకమే లేదు. ఒక్క రూపాయి ఈరోజు సంపాదించడానికి ఏమి జరిగిందో ఎవరికి తెలుసు. ఈ పల్లెటూరి వెధవలు మహా తెలివి మీరీ పోతున్నారు రోజురోజుకీ. గంటలు గంటలు పనికిరాని హాస్కు కొట్టాక , అప్పుడు నిన్నేదో వాళ్ల బానిసవన్నట్టు ఇన్ని కొంచం నాణేలు జేబులోంచి తీస్తారు. కనీసం మాటలు కూడా మర్యాదిచ్చి మాట్లాడరు. ఈ పల్లెటూరి దరిద్రులు పొగరుమోతులై పోతున్నారు ఈమధ్య. ఇక అన్నిటికంటే దరిద్రం ఈ మర్యాదకోశం పది చచ్చే మాలాంటి మధ్య తరగతి మనుషుల బతుకు. ఒకవైపూ ఈ పల్లెటూరి వెధవలతోనూ కలవలేము, మరొక వైపు పై తరగతి వారు, ప్రభుత్వమూ మరీ స్ట్రిక్ట్ ఐ పోతున్నాది. ఒక్క రెండు నెలల క్రితం , బనారస్ జిల్లాలో ఇద్దరు గుమస్తాలు లంచం తీసుకున్నందుకు  పట్టుబడి సస్పెండ్ చేయబడ్డారు. ఎప్పుడూ జరిగేది అదే. పేదవాళ్లకే శిక్ష. అదే ఒక సీనియర్ ఆఫీసర్ కి మహా అయితే ఒక పదవి నుండి మరో పదవికి బదిలీ అవుతుంది అంతే’.

మున్షి సాబ్ ! ఎవరో ఒక పక్క నుండి అరిచారు. అది జూమ్మన్ గొంతు, తాను ఆర్డర్లీ ( బ్రిటిష్ పెద్ద అధికారుల ఇంట్లో పని చేయడానికి ఉండే ఉద్యోగి).

‘అరె నువ్వా జూమ్మన్? అన్నాడు మున్షి

కానీ మున్షి ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. పార్క్ నుండి బయటకి నడిచి నజీరాబాద్ దగ్గరకి వచ్చాడు, జూమ్మన్ అతన్ని అనుసరిస్తూ వచ్చాడు. అదొక వింత దృశ్యం.  ముందర సన్నగా పీలగా పొట్టిగా ఉండే , పడవ ఆకారం ముఖ్మల్ టోపీతో , చేతిలో పూల దండతో నడుస్తూ మున్షి , అతనికి రెండడుగుల దూరం లో , తల పాగాతో, చేతుల్లేని పొట్టి ఓవర్ కోట్ తో, నిలువెత్తు ఆజాను బాహువు ఆర్డర్లీ జూమ్మన్.

మున్షి అనుకున్నాడు , ‘ ఇప్పుడిలా ఈ వేళప్పుడు జూమ్మన్ నా వెంట పడటం దేనికబ్బా?’

అతని వైపుకి తిరిగి , ‘అయితే జూమ్మన్ , ఎలా ఉన్నావు? ఇప్పుడే పార్క్ లో హెడ్ క్లేర్క్ గారిని కలిశాను, ఆయన కూడా వేడి ఎక్కువగా ఉందంటున్నాడు’

‘సరే , మున్షి జి , ఏమి చెప్పమంటారు. ఒక్క వేడి మాత్రమే నన్ను చంపుకుతినడం లేదు. నాలుగు నాలుగున్నరకి పనిలోంచి బయటపడ్డాను, మేనేజర్ గారింటికి తిన్నగా ఇంటి పనికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడే అక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికి పోతున్నాను. రోజంతా ఎంత కష్టమో తెలుసా మీకు , ప్రతి రోజూ పొద్దున్న పది నుండి రాత్రి ఎనిమిది వరకు పనే. ఇంట్లో పని పూర్తి చేశానో లేదో మూడు సార్లు బజారుకి వెళ్ల వలసి వచ్చింది . ఐస్, కూరగాయలు, పళ్ళు – తీరా అన్నీ కొనుక్కుని వెళ్తానా తిరిగి అరుపులు చీవాట్లు ‘ఎందుకివాళ ఎక్కువ పెట్టి కొన్నావు? ఎందుకీ పళ్ళు కుళ్లి పోయాయి? మేనేజర్ గారి భార్యకి అసహ్యం వేసింది నేను ఈరోజు కొన్న మామిడి పళ్ళు చూసి. మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చి రమ్మంది. ‘ఈ టైమ్ లో ఎలా తిరిగి ఇవ్వగలను అమ్మగారు ?’ అన్నాను  , ‘ నాకదంతా తెలీదు , నిన్ను పంపించింది ఈ చెత్తoతా కొనుక్కొస్తావని కాదు’. చూడండి బాబు గారు, ఒక రూపాయి మామిడి పళ్లను ఏమి చెయ్యాలో తెలియక ఉన్నాను. ఆ మామిడి పళ్ల వాడి దగ్గరకు పోయి వాడితో నానా తగాదా పడితే రూపాయికి పన్నెండణాలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. నాలుగణాలు నష్టం నాకు. ఈ నెల జీతం ఖర్చు అయిపోయింది సార్ , ఒట్టు నిజంగా తినడానికి రొట్టె ముక్క కూడా మిగలలేదు. నాకేం చెయ్యాలో తెలీడం లేదు. నా భార్యకి మొహం ఎలా చూపించాలో అర్ధం కాకుండా ఉంది’.

జూమ్మన్ తనకీ కధ చెప్పడం లో ఆంతరార్ధమేమిటో మున్షి కి అర్ధం కాలేదు. ఎవరికి తెలియదు కనుక ఆకలితో మాడే పేదవాడి గురించి? అయితే ఇందులో మున్షి చేసిన తప్పేంటి? తాను మాత్రం ఏమన్నా భోగాలు అనుభవిస్తున్నాడా ఏమన్నానా ? అప్రయత్నంగా  మున్షి చెయ్యి జేబు లోకి పోయింది . పొద్దున్న సంపాదించిన రూపాయి జాగ్రత్తగానే ఉంది.

“నువ్వు చెప్పింది అక్షరాల నిజం జూమ్మన్. ఈ రోజుల్లో పేదవారు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరిని చూడు ఇవే కష్టాలు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. నిజంగా చెప్పాల్సి వస్తే ఈ సూచనలన్నీ ‘మహా తీర్పు’ వెలువడే  రోజు త్వరలో వస్తుందని తెలుపుతున్నాయి. ఈ ప్రపంచం నిండా మోసగాళ్ళున్నారు , వాళ్ళకి అన్నీ అనుభవించడానికి దొరుకుతాయి, అల్లాను నమ్ముకున్న పవిత్రమైన వారే ఇలాంటి అన్నీ బాధలూ, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది’.

జూమ్మన్ మౌనంగా మున్షి మాటలు వింటూ అతన్ని వెంబడించాడు. మున్షి బయటికి శాంతంగా మొహం పెట్టినా లోలోపల బాగా కంగారుగా ఉన్నాడు. తన మాటలు జూమ్మన్ మీద ఎలాంటి ప్రభావం  చూపాయో అర్ధం కాకుండా ఉంది అతనికి.

‘నిన్న, శుక్రవారం నమాజు తర్వాత , మౌలానా తీర్పు వచ్చే  రోజును గూర్చిన సూచనలు వివరించారు. జూమ్మన్ భాయి , నీకు నిజం చెప్తున్నా , విన్న వాళ్లందరి కళ్ళలోనూ కన్నీరే. సత్యానికి ఇవన్నీ మన పాపాల ఫలితాలే. దేవుడు ఇచ్చిన ఈ శిక్షలు చాలవు మనకు. మన ఒక్కొక్కరిలో లేని లోపాలంటూ లేవు. బెనే ఇస్రాయెల్ ను మన వాటి కంటే తక్కువైన అతని పాపాలకు దేవుడు ఎలా శిక్షించాడో తల్చుకుంటే నాకు రోమాలు నిక్క బొడుస్తున్నాయి.  అయినా ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి’.

‘నేను బీద వాడిని మున్షిజి, ఈ చదువుకున్న వారి విషయాలన్నీ నాకేలా తెలుస్తాయి.  తీర్పు రోజును గూర్చి విన్నాను  కానీ సార్, పాపమీ బన్నీ ఇజ్రీల్ ఎవరండీ?’

ఈ ప్రశ్న వినగానే మున్షికి కొంచెం హాయిగా అనిపించింది. విషయం ఆకలి , పేదరికం నుండి తీర్పు రోజు, బెన్ని ఇస్రాయెల్ వైపు మళ్లడం బాగుందని పించింది. మున్షి కి కూడా ఆ తెగల చరిత్ర అంతగా తెలీదు, కానీ దాని గురించి గంటలు గంటలు మాటాడ గలడు.’

‘ఏమంటున్నావు జూమ్మన్ ? ముసల్మాన్ వయీ ఉండీ బెనే ఇస్రాయెల్ ఎవరోతెలీదూ! అరె భాయి, ఖురాన్ మొత్తం అంతా బెనే ఇస్రాయెల్ కథలతోనే నిండి ఉంటుంది! ప్రవక్త మూసా ఖాలీం- ఉల్లా పేరైనా విన్నావా పోనీ?( ఖురాన్ లో ఉన్న మూస అనే పేరు బైబిల్ లో మోసేస్ పేరుతో  సమానమైనది. బెనే ఇస్రాయెల్ అంటే ఇస్రాయెలీయులు)

‘అదేంటి? కలీం- ఉల్లా?’

‘ ఓహ్ అలా కాదు ప్రవక్త మూసా …మూ…సా..’

‘అంటే ఆ పిడుగు పడి పోతాడు అతడిని గురించా మీరు చెప్పేది?’

మున్షి గట్టిగా నవ్వేశాడు. ఇప్పుడు పూర్తిగా హాయిగా అనిపించింది అతనికి. కాసేపట్లో ఖాసిర్ బాఘ్ దగ్గరకు చేరారు ఇద్దరూ. ఆకలి పీనుగ ఈ ఆర్డర్లీ ని వదిలించుకోవాలి ఎలాగైనా అనుకున్నాడు. ఆకలితో బీదరికంతో మగ్గుతున్న వాడిని కలుసుకోవడం ఏమీ ఆహ్లాదం కాదు అసలు, అందునా ఈ సాయంకాలం వేళ, అందులోనూ నువ్వు కడుపు నిండా ఆరగించి , నీ నమాజులు పూర్తి చేసుకున్న తర్వాత , అలా వ్యాహ్యాళికి మనసుని ఉల్లాస పరచడానికి అలా నడకకి పోయినప్పుడు. కానీ మున్షి ఏమి చెయ్యగలడు! కుక్కలాగా జుమ్మన్ నివిదిలించి పారేయడానికి అస్సలు కుదిరే పని కాదు, ఎందుకంటే రోజూ కచేరీలో అతనికి ఎదురు పడాల్సిందే, అదీగాక పేద వర్గానికి చెందినవాడవటం వలన కూడా. తాను గనుక అందరి ముందు మున్షిని అవమాన పరిచాడంటే ఇన్నాళ్లూ నిలబెట్టుకున్న పరువు కాస్తా పోతుంది. బహుశా ,ఈ మలుపులో ఇక దారులు మళ్లి విడిపోవడం మంచిది.

‘సరే అయితే ! నీకు బెనే ఇస్రాయెల్ గురించి మూసా గురించి మరోసారెప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పుడు నాకు కొంచం అవసరమైన పని ఉంది…ఇక్కడ.. సలాం , జూమ్మన్.’ మాటలు పూర్తి చేసి ఖాసీ బాఘ్ సినిమా హాల్ వైపు తిరిగి పోయాడు మున్షి. మున్షి అంతా వేగంగా వెళ్లిపోవడం చూసి జూమ్మన్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు అతనికి. అతని నుదుటి మీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి.అతని కళ్ళు దిగాలుగా యిటు అటు చూశాయి. పెద్ద వెలుగుతో ఎలెక్ట్రిక్ దీపాలు, నీళ్ళు చిమ్మే ఫౌంటెన్, సినిమా పోస్టర్లు, హోటళ్లు, దుకాణాలు, కార్లూ, బళ్లూ, బగ్గీలూ, అన్నిటికి మించి చిమ్మ చీకటి ఆకాశం , మెరిసే నక్షత్రాలూ. తక్కువలో చెప్పాలంటే దేవుడి సృష్టి అంతా.

అయితే వెనువెంటనే తెప్పరిల్లి జూమ్మన్ మున్షి వెనుక పరుగెట్టాడు, జూమ్మన్ వదిలించుకున్నాననే  ఆనందం లో సినిమా పోస్టరును పరికిస్తున్న మున్షి వద్దకి.

అతని దగ్గరికి వెళ్ళి “ మున్షిజీ !’ అని పిలిచాడు

మున్షి గుండె గుభెలుమంది.  మతపరమైన ఆ చర్చ అంతా , అంతిమ తీర్పు రోజును గురించిన మాటలన్నీ అంతా వృధా పోయింది. మున్షి జూమ్మన్ కి జవాబు చెప్పలేదు.

‘మున్షి జీ , ఈరోజు ఒక్క రూపాయి అప్పు ఇస్తే , మీకు జీవితాంతం…’

మున్షి ఇటు తిరిగేడు. ‘ భాయ్ జూమ్మన్ , నాకు తెలుసు నీవెంతో  ఇబ్బందికర పరిస్థితి  లో ఉన్నవాని, కానీ నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు. ఒక్క రూపాయి గురించి వదిలేయ్, కనీసం ఒక్క పైసా కూడానేను నీకు అప్పివ్వలేను. నా దగ్గరుంటే దాచుకునేవాడినా చెప్పు? నువ్వు అడగల్సిన  పనే లేదు. మొదట్లోనే నా దగ్గరేముంటే అది నీకు ఇచ్చి ఉండేవాడిని”

ఐనా సరే , జూమ్మన్ బతిమిలాడ సాగేడు. ‘మున్షి జీ, ఒట్టు నా కూలిరాగానే మీకు వెంటనే తిరిగి తీర్చేస్తాను. నిజం చెప్తున్నాను అయ్యగారు. నాకు సహాయం చేయడానికి ఇంకేవ్వరూ లేరు….’

ఇలాంటి సంభాషణలేప్పుడు మున్షి ని ఇబ్బంది పెడతాయి. ఏదన్నా సరి అయిన కారణం ఉంటే ఎవరినైనా కాదనేయవచ్చును , కానీ అది బాగోదు మరి. అందుకే ముందు నుండి విషయం ఇంత వరకు రాకుండా చూస్తున్నాడు.

అదే సమయానికి సినిమా పూర్తయి జనం వీధుల్లోకి వచ్చారు ఒక్కసారిగా.

“ బర్కత్ భాయ్ ! ఇక్కడేం చేస్తున్నావు? ‘ ఎవరో దగ్గరనుండి అన్నారు. మున్షి జూమ్మన్ వైపు నుండి అన్నది ఎవరా అని అటు  వైపు తిరిగాడు. ఒక సంపన్నుడు , లావుగా గుండ్రంగా , బహుశా ముప్ఫయ్యో ముప్ఫయ్ ఐదో ఉండొచ్చు వయసు, పొడుగు కోటు  వేసుకున్నాడు,బొచ్చు టోపీ పెట్టుకుని కిల్లీ నములుతూ, సిగరెట్టు తాగుతున్నాడు. ‘ఓహ్ మీరా చాలా ఏళ్లైంది మిమ్మల్ని చూసి. లక్నో పూర్తిగా వదిలేశారే మీరు. అయినా  భాయ్ , సిటీ లోకి వచ్చినా మీకు మాలాంటి పేద వాళ్ళని చూడటానికి టైమ్ ఎక్కడిది లెండి.’. అతను మున్షి కాలేజ్ స్నేహితుడు , మంచి సంపన్నుడు.  ‘అదంతా సరేలే వదిలెయ్. కాస్త సరదాగా హాయిగా గడుపుదామని లక్నో లో కొన్ని రోజులు వచ్చాను. రేపు నాతో రా , నువ్వు  జన్మలో మరిచిపోలేనంత గొప్ప నాట్యకత్తే ఇంటికి  తీసుకెళతాను. నా కార్ ఇక్కడే ఉంది. ఎక్కువ ఆలోచించకూ దాన్ని గురించి , వచ్చేయ్ అంతే. నువ్వేప్పుడైనా నూర్జెహాన్ పాట విన్నావా ? ఓహ్ అద్భుతంగా పాడుతుంది, అందంగా సొగసైన భంగిమలతో నాట్యం చేస్తుంది. ఆ కొంటె చూపులు , ఆ వయారి వొంపులు తిరగడం , ఆ పెదవులు కదిలించే విధానం, ఆమె గజ్జెల శబ్దం. మా ఇంట్లోనే ఆరుబయట , తారల నీడ కింద , గానా బజానా ఉంది. పొద్దున్న మేల్కొలుపు రాగం వినే వరకు అదలా కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా రా. రేపేలాగూ ఆదివారమేగా … మీ ఆవిడ చెప్పు తీస్తుందని భయమా ఏం? ఆడాళ్లకి బానిసలుగా పడి ఉండాలంటే , నీకు తెలుసు పెళ్లే చేసుకోనక్కర్లేదు , అవునా ? రా భాయ్ మరి తప్పకుండా , భలే మజాగా ఉంటుంది.అలిగిన భార్యని బుజ్జగించడం లో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుందిలే …….’

పాట మిత్రుడు, కార్ ప్రయాణం, ఆట పాట,కైపెక్కించే  కను చూపుల వాగ్దానం , స్వర్గం లాంటి ప్రదేశం- మున్షి ఒక్క ఉదుటున కార్ లోకి దుమికి కూర్చున్నాడు కార్ లో .జూమ్మన్ గురించి మరో మాట ఆలోచించలేదు. కార్ సాగిపోతుంటే  జూమ్మన్ అక్కడే మౌనంగా నిలబడి ఉండటం కనిపించింది.

 

 

*

 

 

నీలి సుమ౦ లాలస

khalil1

 

మూలం: ఖలీల్ జిబ్రాన్ 

అనువాదం: స్వాతీ శ్రీపాద 

 

అందమైన సువాసనగల నీలి పుష్పం ఒకటి తన మిత్రులతో ప్రశాంతంగా, మిగతా పూల మధ్య ఆనందంగా ఊగుతూ, ఒక ఒంటరి తోటలో ఉ౦డేది. ఒక ఉదయం మంచు ముత్యాలతో అల౦కరి౦పబడిన ఆమె కిరీటం గల తలెత్తి చుట్టూ చూసి౦ది. ఒక పొడవైన అందమైన గులాబీ ఆకాశాన్ని తాకుతున్నట్టు పచ్చని దీపంపై వెలుగుతున్న కాగాడాలా గర్వంగా నిలబడి ఉండటం ఆమె చూసి౦ది.

ఆ నీలం తన నీలి పెదవులను తెరిచి ఇలా అంది, “ ఈ పూలన్ని౦టిలో నేను ఎంత దురదృష్ట వంతురాలిని.వారి సమక్షంలో నా కున్న స్థానం ఎంత సాధారణం. ప్రకృతి నన్ను ఇలా పొట్టిగా, బీదగా సృష్టి౦చి౦ది. నేను నేలకు అతి సమీపాన నివసిస్తాను, నీలి ఆకాశంవైపు తలెత్తలేను కూడా, లేదూ, గులాబీల మాదిరి నా వదనం సూర్యుడి వైపు తిప్పనూ లేను.

గులాబీ తనపక్కనున్న నీలం మాటలు వి౦ది. అది ఒక నవ్వు నవ్వి ఇలా వ్యాఖ్యాని౦చి౦ది,

“  నీ మాటలు ఎంత చిత్రంగా ఉన్నాయి, నువ్వు అదృష్టవంతురాలవు. అయినా నీ అదృష్టం ఏమిటో నీకు అర్ధంకాడం లేదు. ఎవరికీ అనుగ్రహి౦చని అందం, సువాసన నీకు వరంగా ఇచ్చి౦ది ప్రకృతి. నీ ఆలోచనలు పక్కకు తోసి సంతృప్తిగా ఉండు. పైగా గుర్తుంచుకోవలసినది ఏమిట౦టే ఎవరైతే ఒదిగి ఉ౦టారో వారు ఉన్నత స్థితికి వస్తారు. ఎవరిని వారు పైకి ఎత్తుకు౦టే నలిపెయ్యబడతారు”

ప్రకృతి గులాబీ , నీలి పుష్పం సంభాషణ వింది. ఆమె వారిని చేరుకొని , “బిడ్డా , నీలం ఏమైంది నీకు?నీ మాటలు చేతల్లో ఎంతో హుందాగా, వినయంగా ఉ౦టావు. దురాశ నీ హృదయం లో చేరి నీ చేతనత్వాన్ని మొద్దుబారేలా చేసి౦దా?” అని అడిగి౦ది

వేడుకు౦టున్న స్వరం తొ నీలం జవాబిచ్చి౦ది.

violet2

“ ఓహ్ ఉన్నతురాలు, కరుణామూర్తివై, అణువణువునా పూర్తీ ప్రేమా, సానుభూతి గల తల్లీ, నేను మనసా వాచా హృదయంతో  నిన్ను వేడుకు౦టున్నాను. నా కోరిక మన్ని౦చి నన్నుఒక్కరోజు గులాబీగా ఉ౦డనివ్వు”

దానికి ప్రకృతి స్పందించి, “నువ్వేం అడుగుతున్నావో  నీకు తెలియడం లేదు. నీ గుడ్డి ఆశ ము౦దు నీకు దాని వెనకాల దాగిన విపత్తులు అసలు తెలియడం లేదు. నువ్వు గులాబీవయితే నువ్వు బాధపడతావు, ఆ తరువాత  ఎంత పశ్చాత్తాపపడ్డా ఏమీ లాభం ఉ౦డదు”

కాని నీలి పుష్పం బలవ౦త౦  చెసి౦ది. “ నన్ను పొడవైన గులాబీ గా మార్చు, గర్వంగా తలెత్తుకుని ఉండాలని నా కోరిక , నా భవిష్యత్తు ఎలాగైనా ఉ౦డనీ అది నా స్వయ౦ కృతం”

ప్రకృతి దానికి లొ౦గిపోతూ  అంది, “ ఓ అజ్ఞానురాలా, అవిధేయురాలైన నీలమా, నీ కోరిక మన్నిస్తాను. కాని ఏదైనా విపత్తు సంభవిస్తే నిన్ను నువ్వే ని౦ది౦చుకోవాలి”

అప్పుడు ప్రకృతి తన నిగూఢమైన , మాయాపూరిత వేళ్ళను ము౦దుకు చాపి నీలం మొక్క వేళ్ళను తాకి౦ది. వెంటనే అది ఆ తోటలో ఉన్న అన్ని పూలకన్నా పొడవైన గులాబీ గా మారి౦ది.

అదే సమయంలో ఆకాశం నల్ల మబ్బులతో మందంగా మారి , తీవ్రమవుతున్న పరిసరాలు, నిశ్శబ్దపు ఉనికిని అల్లకల్లోలం చేస్తూ ఉరుములతో ఆ తోటను ముట్టడి చెయ్యడం, బలమైన గాలులతో పెద్ద వాన మొదలై౦ది. ఆ తుఫాను కొమ్మలను విరిచేసి, చెట్లను పెళ్ళగి౦చి, పెద్దపెద్ద పూల కాండాలు విరిచేసి౦ది, కేవలం భూమికి దగ్గరగా మొలిచిన చిన్న వాటిని వదిలేసి౦ది. ఆకాశ౦ చేసే యుద్ధ తాకిడికి ఆ ఒంటరి తోట చాల ఎక్కువగా  గురైంది, తుఫాను తగ్గుముఖం పట్టి, ఆకాశం తేటగా మారేసరికి పూలన్నీ వ్యర్ధంగా నేలన వాలి ఉన్నాయి.  ఒక్కటి కూడా ప్రకృతి వైపరీత్యానికి, కోపానికి గురి కాకుండా మిగలలేదు. కేవల౦ తోట గోడ పక్కన దాక్కున్న నీలం పుష్పాలు తప్ప.

ఆ నీలం పూలలో ఒకటి తలపైకెత్తి ఆ చెట్ల, పూవుల విషాదాన్ని గమని౦చి సంతోషంగా చిరునవ్వుతో తన చెలికత్తెలలో ఒకరిని పిలిచి అంది, “ చూడండి ఆ తుఫాను ఆ అహంకారపు పూలను ఏ౦చేసి౦దో” మరో నీలి పువ్వు అన్నది, “ మనం చాలా చిన్న వాళ్ళం, నేలకు చేరువగా ఉ౦టా౦. కాని మన౦ ఆకాశపు కోపానికి దూర౦ గా ఉ౦టా౦.” మూడో పువ్వు దానికి మరి౦త జోడిస్తూ, “ మనం పెద్ద ఎత్తుగా లే౦ కదా, అందుకే తుఫాను మనను అణగ దొక్కలేదు”

ఆ సమయంలో నీలం పూల రాణి తనపక్కన ఆకారం మార్చుకుని  యుద్ధభూమిలో కు౦టి సైనికుడిలా తుఫాను వల్ల తడి గడ్డిలో ఒరిగి, రూపం చెదిరి నేలకు వాలిన నీలం పూవును చూసి౦ది. నీలం పూల రాణి దాని తల పైకెత్తి ఆమె కుటు౦బాన్ని పిలిచి ఇలా అంది, “ నా పిల్లల్లారా, చూడ౦డి. ఒక గంట కోసం అహంకారపు గులాబిగా మారిన ఈ నీలం ఏమైందో చూడండి. ఈ దృశ్యం మీ అదృష్టాన్ని మీకు గుర్తు చేసేదిగా పదిలంగా దాచుకో౦డి”

ఆ మరణిస్తున్న గులాబీ కదిలి, మిగిలిన తన శక్తిని కూడగట్టుకుని శాంతంగా అన్నది, “ మీరు సంతృప్తిపడిన పిరికి సన్నాసులు. నేనెప్పుడూ తుఫానుకు భయపడలేదు. నిన్నటి వరకూ  నేనూ జీవితం తో తృప్తిపడి సంతృప్తిగా ఉన్నాను, కానీ సంతృప్తి అనేది నా ఉనికికీ జీవితపు తుఫానుకూ  మధ్య అడ్డుగోడలా, నన్ను ఒక బంకలా అంటుకున్ననిదానంతో ప్రశాంతత ,మానసిక సంయమనానికి  బందీని చేస్తూ నిలిచి౦ది. నేనూ మీలాగే భయంతో నేలకు అ౦టుకుపోయి వేళ్ళాడుతూ అదే జీవితం గడిపి ఉండే దానను. నేనూ శిశిరానికి ఎదురుచూస్తూ, అది నాపై మంచు తెల్ల గుడ్డ కప్పి, తప్పకు౦డా నీలం పూలన్నీసొ౦త౦ చేసుకునే  మృత్యువు వద్దకు ప౦పే వరకూ ఎదురు చూసి ఉ౦డేదాన్ని. నేనిప్పుడు ఆనందం గానే ఉన్నాను, నాచిన్ని ప్రపంచానికి ఆవల ఈ ప్రపంచ౦లో  అర్ధం కానిది  ఏము౦దో తెలుసుకున్నాను, అదేదో మీరెవరూ ఇంత వరకూ చెయ్యనిది. నేను నా దురాశను నిర్లక్ష్యం చేసి ఉ౦డవచ్చు, దాని స్వభావం నాకన్నా ఉన్నతమైనదే. కాని రాత్రి చీకటి నిశ్శబ్దాన్ని నేను విన్నప్పుడు రాత్రి ఒక స్వర్గ ప్రపంచం ఈ భూప్రపంచంతో మాట్లాడటం విన్నాను. అది అన్నది కదా, “ మన ఉనికి కి ఆవల లాలస అనేది మన గమ్యం”

ఆ సమయాన నా ఆత్మ ఎదురు తిరిగి, నా హృదయం నా పరిమిత జీవనాని కన్న ఉన్నతమైన స్థితిని కోరుకు౦ది. పాతాళం అనేది నక్షత్రాల గానం వినలేదని  నేను గ్రహి౦చగలిగాను , ఆ క్షణమే నేను నా అల్పత్వంపై  పోరాటం మొదలుపెట్టి, నాది కాని దాని కోస౦ వా౦ఛి౦చడం, నా తిరుగుబాటుతనం గొప్ప శక్తిగా నా కోరిక మనో బలంగా మారే వరకూ కొనసాగించాను. మన లోలోపలి కలలకు సాకారమైన ప్రకృతి , నా కోరిక మన్ని౦చి ఆమె మాంత్రిక వేళ్ళతో నన్ను ఒక గులాబిగా మార్చి౦ది”

 

ఆ గులాబీ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉ౦డి , బలహీనమవుతున్న స్వరంతో సాధించిన గర్వం కలగలిపి అన్నది, “ ఒక గంట గర్వంగా గులాబీగా బ్రతికాను. కాస్సేపు నేను ఒక మహారాణిలా నివసి౦చాను. గులాబీ కళ్ళ వెనకను౦డి  ఈ విశ్వాన్ని వీక్షి౦చాను. గులాబీ పూల చెవులతో ఆ ఆకాశపు గుసగుసలు విన్నాను, వెలుగు వస్త్ర౦ మడతలను గులాబీ రెక్కలతో స్పర్శి౦చాను. ఇలాటి గౌరవం ఇక్కడ ఎవరికైనా దక్కి౦దని చెప్పగలరా?”

 

ఆ మాటలు చెప్పి తల వాల్చి ఉక్కిరిబిక్కిరయే స్వరంతో అంది, “ నేనిప్పుడు మరణిస్తాను. నా ఆత్మ దాని గమ్యాన్ని చేరుకు౦దిగా,  చివరిగా నేను నా విజ్ఞానాన్ని, నేను జన్మి౦చిన ఒక ఇరుకైన గుహ బయటి ప్రపంచానికి విస్తరి౦చగలిగాను. ఇది జీవన విధానపు పధ్ధతి. ఇదే మన ఉనికి రహస్యం”

ఆ తరువాత ఆ గులాబీ వణికి, నెమ్మదిగా రెక్కలు ముడుచుకుని చివరి శ్వాస ఆమె పెదవులపై  ఒక స్వర్గపు చిరునవ్వుతో పీల్చుకుని, జీవితాన ఒక ఆశ, ఉద్దేశ్యం నెరవేరిన సంతృప్తి, ఒక విజయ సాధన చిరునవ్వుతో, భగవంతుడి నవ్వు నవ్వి౦ది.

*

 

ఒక్క శ్వాస

 

 

 

– ధనుష్ లక్కరాజు                                                తెలుగు: కొల్లూరి సోమ శంకర్

~

కిటికీలోంచి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చిన చల్లటిగాలి నన్ను తాకి, మేల్కొలిపింది. చల్లటి వాతావరణంలో తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో వీచే చలిగాలులు ఏమంత ఆహ్లాదంగా ఉండవు. ఓ శీతల పవనం నన్ను నిలువెల్లా వణికించడంతో లేచి కూర్చున్నాను. ఓడ కుదుపులు తెలుస్తున్నాయి. ఈ కుదుపులు చాలామందిలో వాంతులకు కారణమవుతాయి, కానీ చిరపరిచితమైన కారణంగా నాకు మాత్రం ఆ భావన కలగడం లేదు. ఏదో చైతన్యం నన్ను నిలువెల్లా ఆవరించింది, కానీ నా మనసు మాత్రం అంతఃశ్చేతన కల్పించిన ఓ భ్రమలో ఉండి ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా లేచి నిలుచున్నాను. గచ్చంతా చల్లగా ఉంది; మంచుకొండ మీద నిలుచున్నట్లుంది. నెమ్మదిగా కిటికి వైపు కదిలాను, పై నుంచి కురుస్తున్న మంచు బిందువులను చూడసాగాను. అదో అద్భుతమైన దృశ్యం, వణికించే అనుభవం.

కిటికి మూసేసాను, అయినా ఆ దృశ్యంపైనే కొన్ని క్షణాలపాటు దృష్టి నిలిపాను. నా శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. కాస్తంత తాజా గాలి వస్తుందని నేనే తెరిచానా కిటికిని నిన్న రాత్రి. అయితే ఈ అనుకోని అతిథి నన్ను పలకరిస్తాడని ఊహించలేదు. అక్కడ్నించి కదిలి వెళ్ళి నా మంచం మీద కూర్చున్నాను. బద్దకాన్ని వదిలించుకునేందుకు కాళ్ళు చేతులు సాగదీసి, గట్టిగా ఆవులించాను. ఇవాళ నాకెంతో విశేషమైన రోజు. గడ్డకట్టిన శరీరావయవాలతో, పడుతూ లేస్తూ పక్కగదిలోకి నడిచాను. అక్కడున్న సోఫావైపు అడుగులేసి, నేను ధరించిన దుస్తులని బిగుతు చేసుకుంటూ సౌకర్యంగా సోఫాలో కూలబడ్డాను.

నా మేనేజర్, నా చిరకాల మిత్రుడు, ఎప్పుడో నిద్ర లేచి కాఫీ తాగుతున్నాడక్కడ. నా పక్కకొచ్చి కూర్చున్నాడు.

“గుడ్ మార్నింగ్ స్టీవ్” అని గొణిగాను. ఆ నిరుత్సాహపూరితమైన వాతావరణంలో ఏదో ఉత్తేజం కలిగించాలని విశాలంగా నవ్వాను.

స్టీవ్ నాకేసి చూస్తూ మొక్కుబడిగా నవ్వాడు, ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తూ, “ఈ ఉదయం నీకెలా ఉంది?” అని అడిగాడు.

కాని నాకర్థమైంది. అతను చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. కాబిన్‌లో అందరిలానే మృత్యువంటే భయపడుతున్నాడు. నేను నీట మునిగిపోతాననే భయం, నేనెన్నటికి పైకి రాలేనేమోనన్న భయం కాబిన్ అంతా వ్యాపించింది.

నేనొక ప్రొఫెషనల్ స్క్యూబా డైవర్‌ని, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్‌ని. భూమి మీద అతి పెద్ద మానవ వైజ్ఞానిక సాహసయాత్రకి సంబంధించిన ఒప్పందంపై ఇటీవలే సంతకం చేశాను. దానిలో భాగంగా భూమిపై అత్యంత లోతైన అగడ్త అయిన “మరియానా ట్రెంచ్”లోకి నేను దూకాలి. అక్కడ ఒత్తిడి ఎంతో తీవ్రంగా ఉంటుంది. పూర్తిగా అనావిష్కృతమైన వాతావరణం! వెళ్ళగలిగినంత దూరం నేను వెళ్ళాలని; అడుగుపొర వరకూ (కనీసం మధ్య వరకూనైనా) చేరాలని నిర్ణయమైంది. నా శరీరానికి అమర్చే సెన్సార్ల ద్వారా శరీరంలోపలా, బయటా ఏం జరుగుతున్నా – మధ్య పసిఫిక్ ప్రాంతానికి నేను ప్రయాణిస్తున్న ‘అడిలైడ్’ అనే ఓడ డెక్ పైన ఉండే మానిటర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఎక్కడ తప్పు జరగవచ్చో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కానీ చాలా మందికి తెలుసు – ఇది ఒక వైపు ప్రయాణమేనని! ఓ స్నేహితుడిని, కొడుకుని, పరిచయస్తుడిని, బంధువుని పోగొట్టుకుంటామేమోనని అందరూ భయపడుతున్నారు. నా గురించి నాకన్నా ఎక్కువగా భయపడుతున్నారు. నేనెలా ఉండాలని ప్రపంచం అనుకుందో, అలాగే ఉన్నాను. వాళ్ళకి నేను “అందమైన, యువ సాహసిని, లోతైన సముద్రాల అన్వేషిని, సముద్ర శాస్త్రవేత్తలకు కొత్త ఆప్తమిత్రుడిని” అని ఓ పత్రిక రాస్తే, మరో పత్రిక ఇంకో అడుగు ముందుకేసి, “విజ్ఞానశాస్త్రం కోసం జీవితాన్ని ధారపోస్తున్న సముద్రాన్వేషి” అని పేర్కొంది. నిజానికి సైన్స్ కోసమంటే, నేను ఏ ప్రాజెక్ట్‌నయినా ఒప్పేసుకుంటాను. నిజానికి – సముద్రపు లోతుల్లో నన్ను నేను తెలుసుకోడానికే ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నాను. ఆలోచనల్లోంచి బయటపడి ఒళ్ళు విరుచుకున్నాను. బాహ్యపరిసరాలకు తగ్గట్టుగా నా హైపోథలమస్ నా శరీర ఉష్ణోగ్రతని సవరించింది.

“మనం ఇంకా చేరలేదా?” అడిగాను మేనేజర్‌ని, బార్ కౌంటర్ వద్ద కొత్తగా అమర్చిన కాఫీమెషిన్ వైపు నడుస్తూ

“లేదు… లెఫ్టినెంట్ ఉర్కెల్ ప్రకారం మనం అక్కడికి చేరడానికి కనీసం ఇంకో రెండు గంటలు పట్టచ్చు. నువ్వు విని ఉండకపోతే, మళ్ళీ అడుగుదాం..” అంటూ అతనేదో చెప్పబోతుంటే – మధ్యలో జోక్యం చేసుకుంటూ – “మా ఇంటికి ఫోన్ చేసి కనెక్షన్ ఇస్తావా? ఒకసారి…. బహుశా ఆఖరిసారి వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తోంది!” అన్నాను. నాలో ఏదో నిరాశాభావం!

అపరాధభావంతో చూస్తూ, “అలాగే…” అన్నాడు.

తన శాటిలైట్ ఫోన్ నుంచి మా ఇంటికి ఫోన్ చేశాడు. అక్కడ చాలాసార్లు మ్రోగుతోంది కాని ఎవరూ ఫోన్ తీయడం లేదు. ఎంత అత్యాధునికమైన పరికరాలు ఉన్నా, టైమ్ జోన్స్ ఎప్పటికీ సమస్యే.

అతను ఏదైనా మాట్లాడడానికి ముందే, “సరే అయితే, నేను వెళ్ళి సిద్ధమవుతాను..” అన్నాను

ఓ చిరునవ్వు నవ్వి, నా గది వైపు కదిలాను. గదిలోకి వెళ్ళి తలుపు మూసాను. తలుపుని ఆనుకుని నిలుచున్నాను. సముద్రపు నీటికన్నా ఉప్పనైన ఓ కన్నీటి చుక్క నా బుగ్గలమీదకి జారింది. హాస్యాస్పదం కదూ! కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు. మృత్యుభయం నన్ను ఆవహించే లోపే ప్రత్యేకంగా రూపొందించిన డైవింగ్ సూట్ బయటకి తీసి, మంచం మీద ఉంచాను. ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకునేలా సుప్రసిద్ధ కంపెనీ ‘టీమ్ స్పిరిట్’ తయారు చేసిందా సూట్‌ని. నేను ధరించిన బట్టలు విడిచి, శరీరానికి సెన్సార్లు, వైర్లు తగిలించుకున్నాను. తరువాత ఆ బరువైన డైవింగ్ సూట్‌ని ధరించాను.

ఇరవై లీటర్ల ఆక్సీజన్ సిలిండర్లు నాలుగు, పీడన వాయువుల సిలిండర్లు చిన్నవి రెండు నా వీపుకి తగిలించుకోవాలి. ఇవి నా దిశలను మార్చుకోడానికి, తేలే శక్తిని కాపాడుకోడానికి అవసరం. సూట్ ధరించాకా, నౌకా సిబ్బందిలో ఒకడైన గ్యారీని పిలిచి, సిలిండర్లను తగిలించుకోడంలో సాయం చేయమన్నాను. ఓడ కదలడం ఆగిపోయిందని తెలుస్తోంది. నేను సన్నద్ధమయ్యాను. బ్రహ్మాండమైన ఆ ఓడ డెక్ మీదకు నడిచాను. అక్కడ నా కోసం కెప్టెన్, మానేజర్‌తో సహా సిబ్బంది అందరూ ఎదురుచూస్తున్నారు.

“వచ్చేసామన్న మాట” అన్నాను గట్టిగా.

కానీ నా మాటలు అక్కడ ఎవరికీ వినిపించలేదు. హోరున వీస్తున్న పసిఫిక్ గాలులు – గత పదిహేను సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్న వ్యక్తులకు నా చివరి మాటలు వినబడకుండా చేశాయి. బరువైన దుస్తులు, చేతిలో హెల్మెట్‌తో వాళ్ళవైపు నడిచాను. కెప్టెన్ ఉద్వేగంతో నన్ను గట్టిగా హత్తుకున్నాడు.

“మిత్రమా, నీకు ఇరవై గంటల పాటు సరిపోయే ఆక్సీజన్ అందుబాటులో ఉంది.. ఒక వేళ నువ్వు వెనక్కి వచ్చేయదలచుకుంటే ఎనిమిది గంటల ముందు ఆగిపోయి, అక్కడే.. సముద్రతలంలోని ఓ గుట్ట మీదో లేదంటే ఏ కొండచరియ మీదో నిల్చో. సముద్రంలో ఈ భాగం… చాలా వరకు అనావిష్కృతంగానే ఉంది.. అందుకని ఈ ఆయుధం ఉంచుకో..” అంటూ ఓ తుపాకీ లాంటి యంత్రాన్ని నా చేతిలో ఉంచాడు. దానితో పాటు పది మిల్లీ లీటర్ల ట్రాంక్విలైజర్ సీసాలు నాలుగు ఉన్నాయి.

“ఒక్కో సీసా – నీకు ప్రమాదం కలిగించే జీవిని అరగంట నుంచి గంట వరకు మత్తులో ఉంచుతుంది. వీటిని తక్కువ మోతాదులో ఎందుకు ఇస్తున్నామంటే – సొరచేపలు గానీ, ఇతర సముద్రజీవులు గానీ ఈదడం మానేస్తే మునిగిపోతాయి. ఈ సాహసయాత్రలో ప్రాణనష్టం జరగడం మంచిది కాదు…”

నేను అతని కళ్ళలోకి చూసాను. కనుబొమలు ముడిచాను. ఇలా మాట్లాడినందుకు ఆయన బహుశా తనని తానే కొద్దిగా అసహ్యించుకుంటున్నాడేమో. నా జీవితం ఎలాగూ ప్రమాదంలో ఉంది, అందువల్ల ఆ మాటలు కొద్దిగా వ్యంగ్యంగా అనిపించాయి. ఆ సీసాల్ని జేబులో పెట్టుకుని జిప్ వేసేశాను. స్టీవ్ వైపు నడిచి, అతడిని హత్తుకున్నాను. “నేను తిరిగొస్తానని వాళ్ళకి చెప్పు” అని అతని చెవిలో గొణిగాను. అతను నాకేసి మౌనంగా చూస్తూండిపోతే, కన్ను గీటాను.

హెల్మెట్ బిగించుకున్నాను, బెల్ట్‌ బిగుతు చేసుకున్నాను. మరి ఇక ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకేశాను.

అప్పుడు సమయం ఉదయం 5 గంటల 45 నిమిషాలు.

ఉత్తరపుగాలుల ప్రకోపం వలె నీళ్ళు మరీ చల్లగా ఉన్నాయి. ఏదో తెలియని అనిశ్చితి, భయం, సాహసకృత్యం చేయబోతున్నాననే ఉత్సాహం నాలో కలిగాయి. కొన్ని క్షణాల పాటు చూపు మసకగా ఉన్నా, సముద్రాంతర భాగాలపైకి దృష్టి సారించాను. దిగువన సముద్రంలోని విశాలమైన, అందమైన దృశ్యాలను చూస్తుంటే… సముద్రానికి ఎగువన ఉన్న జీవితం సూక్ష్మమైనదిగా అనిపిస్తుంది.

నీలం! నీళ్ళలోకి దూకిన కాసేపటి వరకూ నా కళ్ళు గ్రహించినది ఇదే! ఆక్వా బ్లూ! ఇంతలో హఠాత్తుగా నా కర్తవ్యం గుర్తొచ్చింది.

అన్ని అవయవాలను సవరించుకుని, అంతులేని అంధకారపు అగాధంలోకి జారసాగాను. కాళ్ళను వేగంగా కదిపాను. జలదృశ్యం వైపు ఈదసాగాను.

క్రమక్రమంగా… ఉదయించే సూర్యుడి కిరణాల గుండా సాగరం నాకు తనలోని జీవరాశులను చూపించసాగింది. నేను వెంటనే నా హై రెజల్యూషన్ వాటర్ రెసిస్టెంట్ కెమెరాని ఆన్ చేశాను. పసుపుపచ్చ రంగులో మెరిసిపోతున్న జల్లిచేపలు పైపైకి చేరాలని ప్రయత్నించడం కనిపించింది. వాటి మీసాలు మెడుసా కేశాల్లా పొడవుగా ఉన్నాయి, చేపలు పైకి ఈదాలని ప్రయత్నిస్తున్నడప్పుడల్లా అవి మెలి తిరుగుతున్నాయి. అయితే వాటి స్థితిలో మాత్రం మార్పు లేదు. బలిష్ఠమైన చేపలెన్నో నా పక్కనుంచి ఈదుతున్నాయి. కొన్ని నన్ను ఢీకొట్టాయి, మరికొన్ని – జలాంతర్గత నగరంలో తీరికలేని పాదచారుల్లా – నన్ను పట్టించుకోలేదు. తమ పనులలో నిమగ్నమైపోయి, తమలోకంలోకి వచ్చిన ఈ అన్యజీవిని అవి గుర్తించలేదు. దాదాపు 100 అడుగుల మందాన పేరుకుపోయిన సముద్రపు పాచిని చూసాను. నీటి ప్రవాహంతో పాటు అదే దిశలో కదులుతోంది అది. పాచి ఉందంటే, అడుగున ఎక్కడో రాతి గుట్ట ఉంటుంది. ఈ అనంతమైన నీలి జలరాశి మధ్య నేనెంత అల్పుడనో అర్థమైంది, ఎంత అణఁకువగా ఉండాలో తెలిసింది.

పసిఫిక్ మహాసముద్రంలో అంతగా లోతు లేని ఈ ప్రాంతంలో తీరికగా రెండు గంటలపాటు సముద్రపు అందాలని ఆస్వాదిస్తూ గడిపాను. ఇంక లోతులకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఏం జరిగినా సరే, సంయమనం కోల్పోకూడదు, కంగారు పడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆక్సీజన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గబగబా లెక్కలు కట్టాను. ఇప్పటికే ఒక సిలిండర్‌లో ఐదో వంతు ఉపయోగించేశాని అర్థమైంది. గట్టిగా తల విదిల్చి, నా విధిని అనుసరించాను. లోపల మరింత చీకటిగా మారుతుంది. మల్టీపర్పస్ డివైజ్‌ని చెక్ చేశాను. సముద్ర ఉపరితలానికి 300 మీటర్ల దిగువన ఉన్నాను. మరియానా ట్రెంచ్ సముద్రమట్టానికి 10,810 మీటర్ల అడుగున ఉంది. నేను అంత దూరానికి – మరియానా ట్రెంచ్ అట్టడుగు ప్రాంతానికి వెళ్ళకపోయినా (అది అసాధ్యం, సాధ్యమైతే మాత్రం అద్భుతమే) – 2000 నుంచి 2500 మీటర్ల లోతుకి వెళ్ళగలను. అసలైన మరియానా ట్రెంచ్ ప్రస్తుతం నేనున్న చోటుకి ఇంకో 2 కిలోమీటర్ల అడుగున ఉంటుంది.

ఏదో తేడాగా అనిపిస్తుంది. సముద్రం అసాధరణంగా చాలా ప్రశాంతంగా ఉంది. అండర్‌వాటర్ డైవింగ్‌లో నాకున్న విశేష అనుభవం దృష్ట్యా… అది ప్రమాదానికి సూచన అని గ్రహించాను. ఉత్పాతానికి ముందుండే ప్రశాంతత అది అని నాకు తెలుసు.

కొద్ది దూరంలో ఓ చిన్న ప్రాణి యొక్క నీడ కనబడింది. దాని ముందు భాగం నల్లగానూ, వెనుక భాగం వెండి రంగులో ఉంది. తూరమీను? బహుశా కాదేమో! అదేంటే నాకు అర్థమయ్యేసరికి ఓ భారీ జీవి నా వెనుక నిలిచింది. సుగ సుర జాతికి (Carcharhinus falciformis) చెందిన సొరచేప. పసిఫిక్ సముద్రం వీటి సహజావాసం. అది బాగా అనుకరిస్తుంది, పైగా దాని భారీ పరిమాణం మానవులకి ప్రమాదకరం.

మానవులకి ప్రమాదకరమైనది అదొకటే కాదు. రెండో ఆలోచన లేకుండా మరింత లోతుకి ఈదసాగాను. ఈదుతూనే నా జేబు తెరిచి, ట్రాంక్విలై‌జర్లు బయటకి తీసాను. నీటిలో మరింత లోతుకు దూసుకుపోతు, జేబు జిప్ మూసేశాను. ఈతలో కొద్దిగా పట్టు జారేసరికి, ట్రాంక్విలైజర్లు జారిపోయాయి. ఎలాగొలా రెండు సీసాల్ని చేజిక్కించుకోగలిగాను. మిగతా రెండు సీసాల కోసం ప్రయత్నించే అంత బలం, వెనక్కి తిరిగి చూసేంత ధైర్యం నాకు లేకపోయాయి. నాకు తెలిసిందల్లా నా వెనుకగా సోకుతున్న సొరచేప ప్రకంపనాలే! వాసనని అనుసరిస్తూ అది నా వెనుకే వస్తోంది. సాగరం దానికి అనుకూలం కావడంతో నేను దాని నుంచి తప్పించుకుని ఎక్కువ దూరం పోలేను. దానికి మత్తు ఇవ్వడమే ఉత్తమం. తుపాకీలో ఇంజక్షన్ లోడ్ చేసి వెనక్కి తిరిగాను. అంతే! 346 కిలోల భారీ ప్రాణి నా ఎదురుగా ఉంది. నేను ఊపిరి పీల్చుకునేలోపు, అది నా చేతిని పట్టుకుంది.

నేను భయంలో బిగుసుకుపోయాను, నిస్సహాయుడనయ్యాను. నా చెయ్యి తెగిపోతోంది. దాని పదునైన దంతాలు నా చేతిలోకి గుచ్చుకుపోతున్నాయి. చేతిని విదిలించుకోడానికి గట్టిగా ప్రయత్నించాను. చిక్కటి రక్తం బయటకొచ్చింది. నేనున్న ప్రాంతంలో నీలి రంగు కాస్తా మాజెంటా రంగులోకి మారింది. భరించలేని నొప్పి నా వెన్నంతా పాకింది. అసంకల్పిత ప్రతీకారచర్యగా నేను నా చేతిలో ఉన్న ఇంజెక్షన్‌ని దాని వెనుక భాగంలో గుచ్చాను. అఘాతపు ప్రభావాన్ని తగ్గించుకునేందుకు మరింత క్రిందకి జారడానికి ప్రయత్నించాను. అది అక్కడితో ఆగలేదు, నా వెనుకే నీటిని చీల్చుకుంటూ వేగంగా వస్తోంది. నా వీపు పై ఉన్న సిలిండర్లను లక్ష్యంగా చేసుకుంది. నేను వెనక్కి తిరిగి తాను పొట్ట మీద వీలైనంత గట్టిగా తన్నాను. ఈ క్రమంలో నా సిలిండర్ స్టాండ్ విడిపోయింది, నా సూట్ చిరిగిపోయింది. సిలిండర్లు స్టాండ్ నుంచి ఊడిపోయి పైకి తేలసాగాయి.

ఉన్నట్లుండి అధిక పీడనం వల్ల నా వీపు మీద భారం పెరిగిపోయింది. వెనక్కి తిరిగి సొరచేప వైపు చూసాను. ట్రాంక్విలై‌జర్ ప్రభావం చూపుతోంది. గురుత్వాకర్షణకి దారిచ్చాను. ఈ సంఘటనని పైన మా వాళ్ళు చూసి ఉంటారు, లేదా చూసుంటారని ఆశించాను. నా ఈ దుస్థితికి కారణమైన ప్రదేశానికి చేరాలని ప్రయత్నిస్తుంటే ఊపిరి అందడం లేదు. ఊపిరితిత్తులు నిండిపోయానని, గట్టిగా దగ్గి నీళ్ళని బయటకి తెద్దామని చూసాను. అధిక పీడనం వల్ల నా రక్తనాళాలు చిట్లిపోతాయని అనిపించింది. తెగిన చేతి నుంచి రక్తం ధారపాతంగా కారుతూనే ఉంది. రక్తం వాసన గ్రహిస్తే, మరికొన్ని సొరచేపలు నా మీద దాడి చేయడం ఖాయం.

నాకున్న అతి కొద్ది సమయంలోనే, నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇక నాకు చావు తప్పదా? నేను దేని కోసం జీవించాను? ఏం సాధించాను? అసలు నేనెందుకు చావాలి? నా జీవితంలో నేను ఎక్కవగా ఏం కోరుకున్నాను? ఇవన్నీ అలా ఉంచితే, ప్రస్తుతం నాకు కావల్సింది ఒక్క శ్వాస! ఒక్క శ్వాస నాక్కావాలి. పైకి చేరేందుకు, కుటుంబాన్ని కలిసేందుకు, మరణాన్ని తప్పించుకునేందుకు – ఒక్క బలమైన శ్వాస కావాలి. గాయపడిన నా శరీరం ఏదో గట్టి రాయికి కొట్టుకుంది, దాంతో వీపు నొప్పి మరింత అధికమైంది. ఇంతలో నాకేదో ఆలోచన స్ఫురించింది. మంగోలియన్ గడ్డి మైదానాలలో నేను నల్ల గుర్రమెక్కి తిరుగుతున్న భావన నన్ను వణికించింది. ఈ వైజ్ఞానిక సాహసయాత్ర ద్వారా పొందే మిలియన్ డాలర్లు నాకు అక్కర్లేదు, పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, నా కుటుంబాన్ని ఆఖరిసారి మాత్రమే చూడాలనుకోవడం లేదు. గడ్డి మైదానాలలో గుర్రమెక్కి తిరగాలనుకోవడం లేదు. నా అవయవాలన్నీ తెగిపోయినా పర్వాలేదు, సొరచేప నన్ను తినేసినా పర్వాలేదు, నేను బ్రతకకపోయినా పర్వాలేదు…. కానీ ప్రస్తుతం నాక్కావలసింది మాత్రం ఒకే ఒక్క శ్వాస! ఓ జంతువు ఎలా ఊపిరి తీసుకుంటుందో, నేనూ అలాగే శ్వాస తీసుకోవాలనుకుంటున్నాను. మనిషి కూడా జంతువే కదా! నన్ను మగత కమ్మేస్తోంది. నీలి రంగు నీళ్ళు నల్లగా మారుతున్నాయి. పైకి లేవాలనుకున్నాను, కాని లేవలేకపోయాను. కాసేపటికే… నా ఆలోచనల్ని శుభ్రం చేసిందుకో, నా పాపాల్ని తొలగించేందుకో… నన్ను చీకటి కమ్మేసింది. నేనిప్పుడు ‘అందమైన, యువ సాహసిని, లోతైన సముద్రాల అన్వేషిని, సముద్ర శాస్త్రవేత్తలకు కొత్త ఆప్తమిత్రుడిని’ కాను, ‘విజ్ఞానశాస్త్రం కోసం జీవితాన్ని ధారపోస్తున్న సముద్రాన్వేషిని’ అసలే కాను; శ్వాస కోసం పరితపిస్తున్న ఓ సాధారణ మానవుడిని. మృత్యుదేవతకి ఎవరైనా ఒకటే!

కాసేపటికే నాకు స్పృహ తప్పింది. మళ్ళీ నాకు స్పృహ వచ్చాకా తెలిసింది – నేను మా ఓడ అడిలైడ్ డెక్ మీద ఉన్నాననీ; మా లెఫ్టినెంట్ నా చాతీఎముకని ఒత్తుతున్నాడనీ. నా చేతి గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేసి ఉంది, నాకు ఇన్సులిన్ ఎక్కిస్తున్నారు. నేను గట్టిగా దగ్గి, నీళ్ళని కక్కాను. దీర్ఘ శ్వాస తీసుకున్నాను. “అమ్మయ్య! నువ్వు ఊపిరి తీసుకోగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అంటూ కెప్టెన్ అరిచాడు.

నేను చిన్నగా నవ్వి, “నాక్కూడా” అని గొణిగాను.

సముద్రంలోని నీటిని చూస్తూ, “నేను మత్తు మందు ఇచ్చిన ఆ సొరచేప క్షేమంగానే ఉండి ఉంటుంది కదా…” అన్నాను.

కళ్ళ నుండి నీళ్ళు జారుతుంటే… కెప్టెన్ ముసిముసిగా నవ్వాడు.

(సమాప్తం)

 

 

మూలకథ “Breath” అనే పేరుతో మ్యూస్ ఇండియా డాట్ కామ్ అనే వెబ్‌సైట్ లో(మే – జూన్ 2016 సంచిక) ప్రచురితమయ్యింది.

మూలకథని ఈ లింక్‌లో చదవవచ్చు.

http://museindia.com/regularcontent.asp?issid=67&id=6555

   కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్

 

 

 మూలం: పంకజ్ సుబీర్                         అనువాదం : శాంత సుందరి రామవరపు

~

pankaj

 

పంకజ్ సుబీర్ – 2 కథా సంపుటులూ , 2 నవలలూ  ప్రచురించారు . ‘ యే వో సహర్ తో నహీం ‘ అనే నవలకి 2009 లో జ్ఞాన్ పీఠ్ వారి ‘యువపురస్కారం ‘ లభించింది. ఇవి కాక ఎన్నో కథా సంకలనాలకి సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు .ఇండియా నుంచీ కెనడా నుంచీ వచ్చే హిందీ  పత్రికలకి  సంపాదక సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరి కథలను ఆడియో ,వీడియోలుగా విడుదల చేశారు . ఒక కథ సినిమాగా విడుదలకి సిద్ధంగా ఉంది. 

peepal-leaves-2013

 

గాలి బరువెక్కింది. ఈ గోడలకి అలా గాలి బరువెక్కడం అలవాటే. అలవాటు ఎందుకంటే ఈ గోడల్లో తరచు ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఇవాళ కూడా ఒత్తిడి ఉంది. దానికి కారణం సీ-7096. అది నవంబర్ నెలలో ఒక రాత్రి. సరిగ్గా ఒక వారం రోజుల క్రితం దేశం నలుమూలలా ఎక్కడ చూసినా విస్ఫోటనాలే, అవి దీపావళి టపాకాయల పేలుళ్ళు.

ఇవాళ మళ్ళీ మంగళవారం. మళ్ళీ పేలుళ్ళకి సిద్ధం అవుతున్నారు. పేల్చేందుకే సీ-7096 ని ఇక్కడికి తీసుకొచ్చారు. పాతికేళ్ళ సీ-7096 వల్లే ఇక్కడ గాలి ఇంత బరువుగా ఉంది.

సీ-7096 మౌనంగా ఉన్నాడు. ఇక అతనికి మౌనం తప్ప ఇంకేమీ మిగల్లేదు. బుర్రలో ఆలోచనలు మాత్రం సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ వాటిని పంచుకునేందుకు అక్కడెవరూ లేరు.రాత్రి చిక్కబడుతోంది. మెలకువగా ఉన్న సీ-7096 వేకువ శబ్దాలని వినేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ వేకువ అతనికోసం అనంతమైన రాత్రిని మోసుకు రాబోతోంది.

ఇక్కడికి వచ్చే ముందు సీ-7096 సత్యం అనే విషయాన్ని తీసుకుని  ఒక వ్యక్తి చేసిన ప్రయోగాల గురించి చదివాడు. ఆ ప్రయోగాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. అతనికి వాళ్ళు చెప్పిన సత్యానికీ దానికీ ఎక్కడా పోలికే లేదు. ఆ సత్యం పూర్తిగా కొత్త రూపంలో అతనికి సాక్షాత్కరించింది. ఇప్పుడు అంతిమ సత్యాన్ని ఎదుర్కోబోతున్నాడతను. అతనికి తెలిసిన సత్యాలు గుర్తుకు రాసాగాయి. భయకంపితులై, హడిలిపోయి పరిగెత్తే జనం. వాళ్ళలో స్త్రీలూ, పిల్లలూ, వృద్ధులూ కూడా ఉన్నారు. కలాష్నికోవ్ లోంచి పేలిన మందుగుండు దెబ్బకి నేల మీద గుట్టలు గుట్టలుగా ఒరిగిపోయారు. ఇంకో రోజు బతికేందుకు బైటికి వచ్చిన జనం…వాళ్ళతో తను కూడా చనిపోదామనుకునే వచ్చాడు, కానీ అలా ఎక్కడ జరిగింది? బతికిపోయాడు. ఈ నాలుగేళ్ళు గడపడం కోసమే ప్రాణాలతో బైటపడ్డాడు.

ఈరోజు తనని తెచ్చి ఉంచిన చోట ఎనభైయేళ్ళ క్రితం సత్యంతో ప్రయోగం చేసిన ఆ వ్యక్తి కూడా ఉండేవాడని అతనికి తెలుసు. ఈ గోడలు అందర్నీ చూశాయి. సత్యం తో ప్రయోగాలు చేసే వాళ్ళనే కాక అసత్యంతో ప్రయోగాలు చేసేవాళ్ళని కూడా చూశాయి. అర్ధరాత్రి కావచ్చింది. సీ-7096 గోడలని తాకి వాళ్ళ స్పర్శని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. వీటిలో ఒకటి ఆ స్పర్శ కూడా ఉండచ్చు!

గోడ మీద ఒక నీడ కనిపించింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆ నీడ నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకి వచ్చింది. అతనికి ఇంకా భయం వేసింది. నీడ సరిగ్గా అతని ముందు వచ్చి నిలబడింది. ఈ నీడని అతను ఫొటోల్లో చూశాడు. దీనికి కొన్ని గుర్తులున్నాయి, వాటిని బట్టి ఎవరైనా ఆ నీడని గుర్తుపట్టగలరు. సీ-7096 కూడా వాటిని బట్టే ఆ నీడని గుర్తించాడు. కానీ ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు. ఆ నీడ మొహం ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. దాన్నిప్పుడు నీడ అని కూడా అనలేడు. గుండ్రటి ఫ్రేమున్న కళ్ళద్దాల్లోంచి వయసుమళ్ళిన ఆ నీడ కళ్ళు తననే చూస్తున్నాయి. ఈరోజు ఆ నీడ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. కింద అదే అందరికీ చిరపరిచితమైన పంచెకట్టు, కానీ పైన ముతక ఖద్దరుతో నేసిన ఖైదీలు వేసుకునే మురికి చొక్కా. దానిమీద తోలుతో చేసిన చిన్న బిళ్ల వేలాడుతోంది. ఆ బిళ్ళమీద 189 అనే అంకె ఉంది. మొహాన అదే చిరునవ్వు…అది ఆయన ట్రేడ్ మార్కు! సీ-7096 కళ్ళూ కళ్ళజోడులోంచి చూస్తున్న ఆయన కళ్ళూ కలుసుకున్నాయి. సీ-7096 కి చాలా ఇబ్బందిగా అనిపించింది.

“ఎలా ఉన్నావు?”అంటూ నవ్వే పెదవుల్లోంచి ఒక ప్రశ్న వినిపించింది. సీ 7096 అయోమయంలో పడ్డాడు.

“మీరు నన్నేనా అడుగుతున్నది?”అని ప్రశ్నకి ప్రశ్న బదులిచ్చాడతను.

“ఇక్కడున్నది మనమిద్దరమే కదా? మరి నిన్ను తప్ప ఇంకెవర్ని అడుగుతాను?” 189 శాంతంగా నవ్వుతూ అన్నాడు.

“అదికాదు, ఈ రాత్రివేళ ఇక్కడ  నన్నా ప్రశ్న అడగడం గురించి అంటున్నాను.ఏం జరిగిందో మీకు తెలీదా?”అన్నాడు సీ 7096 పొడిగా. అది వినగానే 189 మొహం మీది నవ్వు వెలిసినట్టయింది. నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్ళు కూడా మెరుపు తగ్గాయి. 189 బోసి నోటితో గాలి నెమరేస్తూ, చేతిలోని కర్రని గోడకి ఆనించి కింద కూర్చునేందుకు సిద్ధమయాడు. అది చూసి సీ 7096 సాయం చేసేందుకు ముందుకెళ్ళాడు.

“అక్కర్లేదు,నేను కూర్చోగలను, ఇంకా అంత ముసలితనం రాలేదులే,”అని నేలమీద కాళ్ళు ఒక పక్కకి ముడుచుకుని అందరికీ బాగా పరిచయమున్న పోజులో కూర్చున్నాడు 189. మోకాళ్ళకి పైకి ఉన్న ధోవతిలోంచి అస్థిపంజరాల్లా ఉన్న రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి. 189 సూటిగా సీ 7096 కళ్ళలోకి చూసి నవ్వాడు. అంతవరకూ ఆయన్నే చూస్తున్న అతను ఆయన అలా చూసేసరికి తడబడ్డాడు. అతని తడబాటుకి ఆయనకి ఇంకా నవ్వొచ్చింది.

“ఎలా ఉన్నావని ఇవాళే అడగాలి,”అన్నాడు 189, ఇవాళే అనే మాటని ఒత్తి పలుకుతూ. సీ 7096 జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. 189 మొలలో ఉన్న గడియారాన్ని తీసి టైమ్ చూశాడు. టైమ్ చూడగానే ఆయన కళ్ళలో కలవరపాటు కనిపించింది. తనలో తాను ఏదో గొణుక్కున్నాడు. అది సీ 7096కి వినిపించలేదు.

“ఎలా ఉన్నావో చెప్పనేలేదు నువ్వు?” అన్నాడు. బోసినోట్లోంచి మాటలు స్పష్టంగా రావడం లేదు.

“బాగానే ఉన్నాను,” అన్నాడతను నిర్లిప్తంగా “బాగున్నావా? నిజంగానా?” అన్నాడాయన. అతన్ని ఎగతాళి చేసే ఉద్దేశం 189 కి లేకపోయినప్పటికీ అతనికి అలాగే అనిపించింది.

“ఏం…ఎందుకు బాగుండకూడదు? ఏం జరుగుతోందని నేను ఆనందంగా ఉండకూడదు?” అన్నాడు అతను కొంచెం కోపంగా.

“అబ్బే,నా ఉద్దేశం అది కాదు, నేను అన్నది…”అని 189 ఏదో సంజాయిషీ ఇవ్వబోయే లోపల అతను అడ్డొచ్చి,”ఏమిటి? ఏమనాలనుకున్నారసలు? నేను భయపడాలా? బెదిరిపోయి ప్రాణభిక్ష పెట్టమని బతిమాలాలా? నా మొహంలో చావు భయం కనిపించడం లేదనా? చూడండీ, ఇదంతా ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాను. అసలు నేను  నాలుగేళ్ళు ఆలస్యంగా వచ్చాను. నా మిత్రులు నాలుగేళ్ళ క్రితమే స్వర్గం చేరుకున్నారు!” అన్నాడు అతను అరుస్తున్నట్టుగా. గొంతులో ఉక్రోషం తొంగిచూసింది.

ఇలాంటి మాటలు వినడం 189కి అలవాటే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఉక్రోషం వెళ్ళగక్కే మాటలు విన్న అనుభవం ఉంది. వాటిని మౌనం అనే ఆయుధంతోనే ఎదుర్కొన్నాడు. ఆ తరవాత ఎవరూ మాట్లాడలేదు. సీ 7096 ఆయన జవాబు కోసం ఎదురుచూడసాగాడు.

పది నిమిషాలు,పదిహేను నిమిషాలు గడిచాయి…గడియారం ముళ్ళు ముందుకి కదుల్తున్నాయి,కానీ 189 నోరు విప్పలేదు. సీ 7096 కి ఆయన మౌనం భయం పుట్టించడం మొదలెట్టింది. గోడలమీదా, నేలమీదా కేవలం మౌనం! మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మౌనం అతనికి హాయినిస్తుంది, కానీ ఇద్దరు మనుషులున్నప్పుడు వాళ్ళ మధ్య మౌనం భయపెడుతుంది. ఎంత త్వరగా ఈ మౌనం వీడితే అంత బావుంటుందని అనిపిస్తుంది. 189 కావాలనే మౌనంగా ఉన్నాడు. ఆయనకి ఇంకోళ్ళని భయపెట్టడమంటే మహా ఇష్టం. అలా భయపెట్టేందుకు ఆయన ఎన్నో మార్గాలు అనుసరిస్తాడు, మౌనవ్రతం చేపట్టడం, నిరాహారదీక్ష చెయ్యడం లాంటివి. ఒక్కోసారి ఆయన చిరునవ్వు కూడా అవతలివారిని భయపెడుతుంది.

సీ 7096 అలజడికి గురవుతున్నాడు. లోలోపల ఆ అలజడి క్షణం క్షణం పెరిగిపోతోంది.

దాన్నించి తప్పించుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడాలనిపించి,” మీరు వేసుకున్న జైలు దుస్తులు ఇక్కడివి కానట్టుందే?” అన్నాడు.

“ఇదా?”అంటూ 189 తన చొక్కాని చేత్తో తడుముతూ దానికున్న నంబరు బిళ్ళని వేళ్ళతో పట్టుకుని, “ఇది ఇక్కడిది కాదు, సౌత్ ఆఫ్రికాది. నేను మొదటిసారి జైలుకెళ్ళినప్పుడు ఇచ్చారు దీన్ని”అన్నాడు.

“మరి ఇక్కడ ఈ దుస్తులు…?”అన్నాడు సీ 7096.

“జైళ్ళు మారతాయి కానీ దుస్తులు ఎక్కడైనా అవే, జైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. మొదటిసారి ఈ దుస్తులు వేసుకున్నామంటే ఇక జీవితాంతం ఒంటికి అతుక్కుపోయి వదలవు. జైల్లో ఉండడం నీకు అవస్థగా ఉందేమో కాని నిజం చెప్పాలంటే ఇదొక వ్యవస్థ. ఈ అవస్థనీ, వ్యవస్థనీ అర్థం చేసుకున్నావనుకో, ఇక నా సౌత్ ఆఫ్రికా దుస్తులు కూడా నీకు అర్థమవుతాయి”అన్నాడు 189 ఇంకా గూఢంగా నవ్వుతూ.

ఆ నవ్వు చూస్తే సీ 7096 కి చెప్పలేనంత ఇబ్బందిగా ఉంది. అతనికి ఇలాంటి నవ్వు చూడడం అలవాటు లేదు.

“అసలు మీరిక్కడికి ఎలా…నా ఉద్దేశం, మీరిక్కడే ఉంటున్నారా? రాజధానిలో ఉంటారని విన్నానే?” 189 మళ్ళీ మౌనం దాలుస్తాడేమో అనే భయంతో సీ 7096 ఏదో ఒకటి మాట్లాడాలని తడబాటుకి గురవసాగాడు. ఆయనతో వ్యక్తిగత విషయాలు చనువుగా మాట్లాడాలని ప్రయత్నించడం మొదలెట్టాడు. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకపోతే తనకి మతిపోయేట్టుంది.

అదే భంగిమలో కూర్చుని 189 తలెత్తి సీ 7096 వైపు చూశాడు. ఎన్నో ఏళ్ళ అనుభవంతో ఇక మౌనం వహించాల్సిన అవసరం తీరిపోయిందని గ్రహించాడు.

“ఎంతసేపని నిలబడే ఉంటావు,కూర్చో,” అంటూ కుడిచేత్తో కూర్చోమని సైగ చేశాడు. ఎవరో కీ ఇచ్చినట్టు సీ 7096 ఎదురుగా ఉన్న గోడకి ఆనుకుని కూర్చున్నాడు. మౌనం అనే మంత్రం ఫలించింది. 189 ఎప్పుడూ అవతలివాళ్ళు తన మాట వినేట్టు చేసేందుకూ, అన్నీ తన పక్షం ఉండేట్టు చూసేందుకూ ఈ మంత్రాన్నే ఉపయోగించేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అది ఎప్పుడూ తన ప్రభావాన్ని చూపించకుండా ఉండలేదు. కర్ణుడి శాపంలా విచిత్రంగా అన్నిటికన్నా ఎక్కువ అవసరం ఉన్నప్పుడే ఈ మంత్రం పనిచెయ్యకుండా పోయింది!

ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఎదురు బొదురుగా కూర్చున్నారు. 189 మౌనాన్ని వీడాడు, కానీ ఆ సంగతి సీ 7096 కి తెలియకూడదనీ, అతన్ని ఇంకా తన మౌనంతో భయపెట్టాలనీ ఆయన అనుకున్నాడు. ఎప్పుడైనా ఆ మౌనాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుందని అతనికి తెలియాలన్నది ఆయన ప్రయత్నం.

“నేనిక్కడే ఉన్నానే…అప్పట్నించీ ఇక్కడే ఉన్నాను, రాజధానిలో నాకు ఇంకేం మిగిలిందని? నీలాగే నేను కూడా నాలుగేళ్ళనుంచీ ఇక్కడికి రావాలనుకుంటున్నాను. వాళ్ళిద్దర్నీ పోగొట్టుకుని వెనక్కి వచ్చి నాలుగేళ్ళయింది. అప్పట్నించీ ఇక్కడికి రావాలనే అనుకుంటూ ఉన్నాను. వాళ్ళిద్దరూ ఇక్కడే నిద్రపోతున్నారు, వాళ్ళని వదిలి ఎలా వెళ్ళగలను? కానీ పని పూర్తి కాలేదు. ఇక అయిపోతుందనుకునే సమయానికి మరెవరికో నా అవసరం పడింది. అయినా ఇప్పుడు కాకపోతే తరవాతైనా నేనిక్కడికి రావలసినవాణ్ణే” అన్నాడు 189. ఆ మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నట్టు అనిపించింది సీ 7096 కి.

“జైల్లో ఉన్నాను, కానీ రెండోసారి నన్ను మహల్ లో ఉంచారు…ఆగాఖాన్ మహల్ లో. రెండూ ఇక్కడే యారవాడ లోనే ఉన్నాయి. ఇక్కడికి దగ్గర్లోనే ఉంది ఆ మహల్. అందుకే ఇక్కడికీ అక్కడికీ తిరుగుతూ ఉంటాను”

“నేనేమో 2012 లో వచ్చాను, విచిత్రంగా ఉంది కదూ…32,42,12…” అన్నాడు సీ 7096 ఏదో కొత్తవిషయం కనిపెట్టినట్టు.

“అవును విచిత్రమే, కానీ నేను రావడం, నువ్వు రావడం ఒకటి కాదు. ఒకటే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ తేడా ఉంది…చాలా పెద్ద తేడా. నువ్వింకా చిన్నవాడివి. పాతికేళ్ళు నీకు. అందుకే ఆ తేడా ఎలాటిదో అప్పుడే నీకు అర్థం కాదు,” అన్నాడు 189 తనమాటకి తిరుగులేదన్నట్టు. సీ 7096 జవాబు చెప్పలేదు.

“నలభైరెండులో వచ్చినప్పుడు బా, మహాదేవ్ ఇద్దరూ నావెంట ఉన్నారు. మహాదేవ్ ఆరు రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడు”అంటూ ఉంటే 189 గొంతు గద్గదమైంది. నలభైరెండు,ఆగస్టు పదిహేనో తేదీన వెళ్ళిపోయాడు మహాదేవ్. నేను అతన్ని ఎన్నిసార్లు పిలిచినా లాభం లేకపోయింది. మామూలుగా అతను నామాట జవదాటడు…కానీ ఆరోజు అతన్ని ఆగాఖాన్ మహల్ లోనే పడుకోబెట్టేశారు” తనగొంతులో ఎలాంటి భావోద్రేకమూ పలకకుండా 189 జాగ్రత్త పడ్డాడు.

“ఆ తరవాత రెండేళ్ళకి ఫిబ్రవరి ౨౨ న బా కూడా…ఇద్దరూ ఒకరి తరవాత ఒకరు వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. బా కూడా ఆ మహల్లోనే శాశ్వతంగా నిద్రపోయింది. నా రెండు చేతులూ అక్కడ నిద్రపోతున్నాయి. ఇద్దరి జ్ఞాపకంగా అక్కడ ఒక ఆలయం లాంటిది కట్టించారు. నేను జైల్లోంచి విడుదలైనప్పుడు నాకు చేతుల్లేవు! ఆసరికి బైటి ప్రపంచం కూడా చాలా మారిపోయింది. నలభై నాలుగులో ఇక్కణ్ణించి విడుదల పొంది రాజధానికి వెళ్ళాను, నలభై ఎనిమిదిలో అక్కణ్ణించి బైటపడి మళ్ళీ ఇక్కడికే వచ్చేశాను. రాజధానిలో ఇక చెయ్యవలసిన పనులేవీ లేవనిపించింది. పైగా నావల్ల రాజధానికి కూడా ఎటువంటి ప్రయోజనమూ లేదని అనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను. వీళ్ళిద్దరికోసమే నేనిక్కడ ఉంటున్నాను. ఇంకెక్కడికీ వెళ్ళేది లేదు!” 189 చివరి వాక్యం గొణిగినట్టు అన్నాడు.

“ఆవిడ పోయాకే మీకు ఆవిడ విలువ తెలిసొచ్చిందా?” చాలాసేపటికి సీ 7096 నోటినుంచి ఈ చిన్న వాక్యం వచ్చింది. ముసలి కళ్ళజోడుకి ఆ ప్రశ్నలోని సెగ తగిలి కళ్ళు పైకి లేచాయి. ఆ కళ్ళు సూటిగా సీ 7096 కళ్ళలోకి చూశాయి. ఈసారి సీ 7096 మొహం మామూలుగా ఉంది. 189 వ్యక్తిత్వం ప్రస్తుతం అతన్ని ప్రభావితం చెయ్యడం మానేసింది. 189 కి సీ 7096 కళ్ళలో నిప్పు సెగ కనిపించింది. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక కంటికి మాత్రమే లెన్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి కళ్ళలో ఇదే సెగ చూశాడు 189. కానీ ఆయనకి ఇలాంటివి అలవాటే.

“అదేం లేదు, నాకు బా విలువ ఎప్పట్నుంచో తెలుసు. అందుకే నేను కూడా ఆవిణ్ణి బా అనే పిలిచేవాణ్ణి”189 గొంతు విచిత్రంగా వణికింది. అది మరీ వినీ వినిపించనట్టుండి సీ 7096 కి తెలియలేదు.

“అందుకేలాగుంది జీవితాంతం ఆవిణ్ణి పట్టించుకోలేదు మీరు!”వాక్యం చిన్నదే అయినా సీ 7096 అన్న మాటల్లో లోతైన అర్థమే ఉంది.

“అదేం కాదు.ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎంతో చదావాలి. గొప్ప పనులు చెయ్యాలని నడుం కట్టుకున్నప్పుడు కుటుంబాన్ని కొంత వదులుకోవలసి వస్తుంది. తమ కుటుంబం ఇక విస్తృతమైపోయిందనీ, ఇతరులకి కూడా సమయం కేటాయించవలసిన అవసరం ఉందనీ వాళ్ళు తెలుసుకోవాలి. బుద్ధుడైనా,రాముడైనా,కృష్ణుడైనా, ఏసుక్రీస్తయినా, చివరికి మహమ్మద్ ప్రవక్తైనా సరే కుటుంబం మీద వ్యామోహం వదులుకోవలసిందే!”189 తన వాదనని సమర్థించుకునేందుకు జవాబు చెప్పాడు.

గోడలకవతల రాత్రయింది కానీ నిశ్శబ్దంగా లేదు. ఇక్కడ రాత్రి నిశ్శబ్దంగా ఉండదు. ఈ రోజూ అంతే. అసలు అదంతా జరగబోయే ముందటి రాత్రి నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది?

“కుటుంబ సభ్యులు కూడా మనమీద మమకారం చంపుకోవలసిందే. లేకపోతే అర్ధరాత్రి, నిద్రపోతున్న భార్యని వదిలి సత్యాన్ని తెలుసుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళేవాడిని ఎవరు సమర్థిస్తారు …?” 189 గొంతు బాగా తగ్గించి ఈ మాటలు అన్నాడు. ఆ తరవాత ఇద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది. సీ 7096 తదేకంగా 189 చేతుల వైపే చూడసాగాడు… ’ఆజానుబాహువు!’ అనుకున్నాడు.

“నేను కూడా నా కుటుంబాన్ని వదిలి ఈ అడవిలోకి వచ్చేశాను…!”అన్నాడు సీ 7096 తలెత్తకుండా. మళ్ళీ “అమ్మనీ, నాన్ననీ, చెల్లినీ, ఇద్దరు తమ్ముళ్ళనీ వదిలి… శాశ్వతంగా…నేనిక్కడ ఉన్నానని మా అమ్మకి తెలియనుకూడా…” అతను వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు.

“తేడా ఉంది. నువ్వు నీ కుటుంబానికి ఏదో చెయ్యాలని వాళ్ళని వదిలి వచ్చావు. దేశం కోసమో సమాజం కోసమో కాదు. అలాటిదేదైనా చేసి ఉంటే విషయం వేరుగా ఉండేది” అన్నాడు 189 కొంచెం కోపంగా.

“మీరు పేదరికాన్ని చూడలేదు, అనుభవించలేదు. అందుకే ఇలాటి మాటలు మీరు సులభంగా అనేస్తున్నారు. ఇంట్లో మీ తోడబుట్టినవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటే, మీ తలిదండ్రులు పేదరికం కోరల్లో చిక్కి క్రమంగా మృత్యువుకి చేరువవుతూ ఉండడం చూస్తూ ఉంటే, అప్పుడిక దేశం, సమాజం లాటివి గుర్తుండవు. అప్పుడు గుర్తుండేది ఒక్కటే…ఆకలి…ఆకలి…ఆకలి”అన్నాడు సీ 7096 ఆవేశంగా.

“మా కుటుంబంలో మొత్తం ఆరుగురం. సంపాదించేది మాత్రం ఒక్కరే.అది కూడా నికరంగా చేతికి వచ్చే నెలజీతం కాదు. చేతికి డబ్బులు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావో తెలీని పరిస్థితి. నాలుగో తరగతి దాకా చదివాక చదువు మానెయ్యాల్సి వచ్చింది. ఆ తరవాత చేసేందుకేమీ లేకుండా పోయింది. ఏం చేస్తాను?ఇలాటి పని చెయ్యకపోతే…?”189  అతని బాధని అర్థం చేసుకుని మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. సీ 7096 పిడికిళ్ళు బిగిశాయి. బహుశా ఏడుస్తున్నట్టున్నాడు. కానీ 189 కి అతని ఏడుపు వినపడడం లేదు.

“మీరు చెప్పిన మహనీయులందరూ మహళ్లలో ఉండేవారు. వాళ్ళలో ఎవరూ పేద కుటుంబానికి చెందినవాళ్ళు కారు. పేద ఇంట్లో పుట్టి ఉంటే సత్యాన్ని వెతుకుతూ అడవుల్లోకి వెళ్ళవలసిన అగత్యం ఉండేది కాదు, ఇంట్లోనే సత్యం సాక్షాత్కరించి ఉండేది” సీ 7096 ఏడవడం లేదు. అతని గొంతు స్పష్టంగా ఉంది.

“మా నాన్నే స్వయంగా నన్ను ఈ మనుషులకి అప్పగించాడు. ఏ తండ్రైనా తన పిల్లల్ని మృత్యువు ఒడిలోకి పంపుతాడా? పంపడు కదా? కానీ అలాటిది నాకే జరిగింది. మా నాన్నే ’వీళ్ళ వెంట వెళ్ళు, మంచి బట్టలూ, మంచి తిండీ ఇస్తారు. నువ్వు వీళ్ళతో వెళ్తే మాకు కూడా డబ్బులు దొరుకుతాయి. డబ్బుంటే నీ తోడబుట్టినవాళ్ళు సుఖంగా బతకగలుగుతారు. పెళ్ళిళ్ళు కూడా సవ్యంగా జరుగుతాయి’ అని నచ్చజెప్పి పంపించాడు.”

189 తన పొడవాటి చేతిని జాపి సీ 7096 భుజం మీద ఉంచాడు. ఆ స్పర్శ ఏదో వింత ఓదార్పునీ, ఉపశమనాన్నీ ఇచ్చినట్టు అనిపించిందతనికి. తలెత్తి 189 వైపు చూశాడు. అలవాటు ప్రకారం బోసినోటితో గాలి నములుతున్నట్టు దవడలాడిస్తూ 189 చిన్నగా నవ్వాడు.

“నాలుగో తరగతి దాకా చదివి,వెంటనే నువ్వు వీళ్ళతో చేరిపోయావా?” 189 మెత్తగా అడిగాడు.

“లేదు, కొన్నాళ్ళు ఊళ్ళోనే కూలి పని చేశాను. కానీ సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది.తరవాత పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళాను. కానీ అక్కడా పని దొరక్క మళ్ళీ ఉన్న ఊరికే రావలసివచ్చింది”అన్నాడు 7096. 189 చేత్తో అతని భుజాన్ని రెండు సార్లు చరిచి మళ్ళీ తన ఒళ్ళో పెట్టేసుకున్నాడు.

“అందుకే నేను ఎప్పుడూ అనేవాణ్ణి, పల్లెల్లో అభివృద్ధి వెలుగులు ప్రసరించనంత కాలం పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్టు కాదని.ఒకరి అధీనంలో ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా నగరాల్లో పెద్ద తేడా ఏమీ రాదు. నిజమైన బానిసత్వం ఉండేది పల్లెటూళ్ళలోనే. ఆ బానిసత్వం ఈనాటికీ అలాగే ఉంది. స్వాతంత్ర్యం వస్తే అసమానతల అగాధం పూడుకుంటుందని అనుకున్నాను”అన్నాడు 189. బోసినోటితో మాట్లాడుతూంటే ఉచ్చారణ తమాషాగా ఉందనిపించింది సీ 7096కి.

“ఏ స్వాతంత్ర్యం గురించి చెపుతున్నారండీ మీరు? స్వాతంత్ర్యం ఎక్కడొచ్చింది? మీ దేశంలో స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. మీ దేశంలోనే ఒక ధనవంతుడు ఐదువేల కోట్ల ఖర్చుతో ఒక భవనం కట్టించి తన భార్యకి కానుకగా ఇస్తున్నాడు. ఐదువేల కోట్లు!!! ఐదువేల కోట్లంటే ఎంతో తెలుసుకదా మీకు? అయినా మీకెందుకు తెలీదు, అన్ని నోట్లమీదా మీ ఫొటోనే కదా అచ్చు వేస్తారు? ప్రస్తుతం కరెన్సీ అంటే మీరే. ఐదువేల కోట్లతో ఎన్ని కుంపట్లు, ఎన్ని రోజులపాటు వెలుగుతాయో కాస్త లెక్క కట్టండి. అగాధం గురించి మాట్లాడుతున్నారు మహానుభావా! ప్రస్తుతం అగాధం లేదూ ఏమీ లేదు, ఆకాశానికీ నేలకీ ఉన్నంత తేడా ఉంది. అగాధమైతే పూడ్చడం సాధ్యమౌతుంది. ఆకాశానికీ నేలకీ ఉన్న దూరాన్ని దేంతో పూడుస్తారు?” సీ 7096 కి ఆవేశం ఎక్కువై 189 మీది మీదికి రాసాగాడు.

189 ని కరెన్సీ అని అవమానించాలనుకున్నాడు. కానీ 189 ఏమీ జవాబు చెప్పకుండా అతని కళ్ళలోకి లోతుగా చూసి ఊరుకున్నాడు. మళ్ళీ ఒకసారి తన జేబు గడియారాన్ని తీసి టైమ్ చూశాడు.

“మానాన్న నన్ను వాళ్ళతో పంపించేప్పుడు నా వైపు చూడకుండా, ‘బాబూ,నువ్వు వీళ్ళ వెంట వెళ్తే మాకు తిండీ బట్టా దొరుకుతాయి’ అన్నాడు,” 189 మౌనంగా ఉండడం చూసి సీ 7096 అన్నాడు.

“మరి మీ అమ్మ? ఆవిడ ఏమంది?” 189 అడిగాడు.

“నిరుపేదల ఇళ్ళలో అమ్మలు ఏమీ అనరు, ఊరికే ఏడుస్తారంతే. విషయం ఏదైనా వాళ్ళకి తెలిసింది ఏడవడం ఒక్కటే. మా అమ్మ కూడా ఏడ్చి ఊరుకుంది”అన్నాడు సీ 7096 వణికే గొంతుతో. మళ్ళీ 189 అతని భుజం తట్టి ఓదార్చాడు. గోడలు మౌనంగా అంతా చూస్తున్నాయి.

“నన్ను చంపేస్తే ఇదంతా ముగిసిపోతుందా? నాలాంటి వాళ్ళందరూ ఇక లేకుండా పోతారా? అక్కడ చాలా పేదరికం ఉంది. నిరుపేద తండ్రులు ఒక ముద్ద అన్నం కోసం ,జానెడు గుడ్డముక్క కోసం నాలాంటివాళ్ళని వీళ్ళకి అప్పగిస్తూనే ఉంటారు. అలాంటి తండ్రులు చాలా మందే ఉన్నారక్కడ. నన్ను చంపినంత మాత్రాన కథ ముగుసిపోదు. నేను ఒక చిన్న పావుని మాత్రమే. నా చావు పెద్ద లెక్కలోకి రాదు. ఒక్క పిసరు కూడా మార్పు రాదు,”అన్నాడు కసిగా సీ 7096. అతని గొంతులోని కసి 189 కి తెలిసింది.

“అందుకే విభజన వద్దని మొత్తుకున్నాను. నా శవం లేచాకే విభజన జరగాలని కూడా అన్నాను. నేను శవంగా మారినా పరవాలేదు , విభజన మాత్రం జరిగి తీరవలసిందే అన్నారు వాళ్ళు. చిరకాల స్నేహితుడే అందరికన్నా పెద్ద శత్రువుగా మారతాడని నాకు తెలుసు. విభజన జరిగాక కూడా ఇంటి గోడలు కలిసే ఉంటే అన్నదమ్ముల మధ్య అయినా ఒక్కొక్క అంగుళం కోసమూ గొడవలు రాక మానవు. ఈనాడు రెండు ముక్కలైన ఈ భాగాలు రేపు అతి పెద్ద శత్రువులై ఇద్దరి ముందూ నిలబడతాయని నాకు అప్పుడే తెలుసు. చూడు, ఇప్పుడు జరిగింది అదే కదా? నువ్వే దానికి అన్నిటికన్నా పెద్ద నిదర్శనం!” అన్నాడు 189 గొంతు తగ్గించి.

“విభజన జరగకుండా ఆపాలని చూశారా మీరు?” అని అడిగాడు సీ 7096

“శతవిధాల ప్రయత్నించాను,కానీ నామాట ఎప్పుడూ,ఎవరూ వినలేదు” అన్నాడు 189.

“ధృతరాష్ట్రుడు కూడా మహాభారత యుద్ధం జరగకుండా ఆపాలనే చూశానన్నాడు. కానీ ఆయన మాటా ఎవరూ వినిపించుకోలేదు కదా? దుర్యోధనుణ్ణి హస్తినాపురానికి రాజు చెయ్యాలనుకున్నాడనుకోండి, అది వేరే విషయం. ఆ విషయంలో మొండిపట్టు సడలించలేదు కానీ యుద్ధం మాత్రం కూడదన్నాడు. మీరు ఇంతకు ముందన్నారు, మమకారం వదులుకోవాలని, కానీ మీ కొడుకు మీద మమకారం వదులుకోలేకపోయారేం?”అన్నాడు సీ 7096.

“నాకు కొడుకు మీద మమకారమా? అసలు నన్ను బోనులో నిలబెట్టిందే నా సంతానాన్ని సరిగ్గా పెంచలేదని కదా?”అన్నాడు 189.

గోడలకి అవతల ఏదో హడావిడి వినిపిస్తోంది. ఏవో ఏర్పాట్లు చేస్తున్న చప్పుళ్ళు,గొంతు తగ్గించి ఎవరో మాట్లాడుతున్నారు. జనం హడావిడిగా అటూ ఇటూ తిరగడం వినిపిస్తోంది. ఆ చప్పుళ్ళకి సీ 7096 గాభరా పడుతున్నాడు. అతని కళ్ళు మాటిమాటికీ ఆ చప్పుళ్ళు వినవస్తున్నవైపు భయంగా చూస్తున్నాయి.

“నేను చెప్పేది మీ కన్నకొడుకు గురించి కాదు, మీరు మమకారం వదులుకోలేని కొడుకు ఒక్కడే, అతని గురించి అంటున్నాను. అధికార పీఠం మీద అతనే కూర్చోవాలని కోరుకున్నారు. ఇంకెవరూ ఆ పదవి చేపట్టడం మీకిష్టం లేకపోయింది. అలా కాకుండా మీరు మీ పట్టు విడిచిపెట్టి ఉంటే విభజన జరిగేదే కాదు. మీరు కూడా మహాభారతం జరగకూడదనీ అయినా మీ కొడుకే పదవిని అలంకరించాలనీ కోరుకున్నారు” బైటివైపు చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు సీ 7096

” నేనా…? విభజన జరగకూడదని, దాన్ని ఆపాలని నేను ప్రయత్నించలేదా? నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఒక ఉత్తరం కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. ‘అధికారం కావలసినవాళ్ళకి ఇచ్చెయ్యండి, కానీ విభజన మాత్రం జరగనీయద్దు’ అని రాసి మరీ ఇచ్చాను. నా మాట ఎవరైనా వింటే కదా? ఓడిపోయి ఆ ఉత్తరం పట్టుకుని వెనక్కి వచ్చేశాను. విషయం నా చెయ్యిదాటిపోయింది. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం ఎటువంటి మూల్యం చెల్లించటానికైనా సిద్ధపడ్డారు. విభజన కూడా ఆ మూల్యంలో ఒక భాగమే” అన్నాడు 189 అలసిన గొంతుతో.

7096 కళ్ళార్పకుండా ఆయన్నే చూస్తున్నాడు. అతనికి 189 మొహంలో ఒక విచిత్రమైన దిగులుతో నిండిన భావం కనిపించింది. ఈనాటివరకూ అతను చూసిన ఆయన ఫొటోలు వేటిలోనూ అలాంటి దిగులు కనబడలేదు. ఎప్పుడూ ఆ బోసి నవ్వే చూశాడు.పేరు తెచ్చుకుని గొప్పవారైపోతే ఇదొక ప్రమాదం, ఎప్పుడూ అందరికీ మీరు నవ్వుతూ కనిపించాలి! దిగులు ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవాల్సిందే.

మహాత్ములు, అవతార పురుషులు ఎక్కడైనా దిగులుగా ఉంటారా? వాళ్ళే దిగులు పడితే మామూలు మనుషులకి వాళ్ళమీదున్న భ్రమ తొలగిపోతుంది కదా! మామూలు మనుషులు తమ దిగులుకి పరిష్కారాలని వీళ్ళ దగ్గరే వెతుక్కుంటారు. వీళ్ళే దిగులు పడితే వీళ్ళని ఎవరు పట్టింగహుకుంటారు? సీ 7096 ఆయన అన్న మాటలకి ఘాటైన సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అతని దగ్గర అలాంటి సమాధానం ఉంది. కానీ 189 మొహంలో దిగులు అతన్ని ఇబ్బంది పెట్టింది. ఎందుకో గాని ఆయన్ని మరింత బాధ పెట్టేందుకు అతని మనసు ఒప్పుకోలేదు.

” కానీ…కానీ మీరు తల్చుకుంటే అది సాధించటం సాధ్యమయేదే. మొత్తం మీ చెయ్యి దాటిపోయిందనటం సరికాదు. జనం మీ వెంటే ఉన్నారు. మీ మాటలు విన్నారు, మీ మాటకి విలువిచ్చారు. ఆ ఉత్తరం పట్టుకుని రోడ్డుమీదికొచ్చి, జనానికి నచ్చజెప్పి ఉంటే, వాళ్ళు మీ మాట వినేవాళ్ళు కారూ? తప్పకుండా వినేవాళ్ళే. కానీ మీరు పుత్ర వాత్సల్యంలో…మీ మానస పుత్రుడి మీది మమకారంలో పడి అన్నీ వదిలేశారు. మీ శవం మీదే విభజన జరగాలి అన్నప్పుడు విభజనకి ముందు మీరు శవంగా మారలేదేం? లేదు, మీరు నిజంగా అడ్డుకోవాలనుకుంటే విభజన జరక్కుండా చూసేవారే. మీ పుత్త్ర ప్రేమ అడ్డొచ్చింది. అప్పుడు మొదలైన ఆ మహాభారతం ఈనాటివరకూ కొనసాగుతూనే ఉంది” కటువైన మాటలు అనకూడదని సీ 7096 చాలా ప్రయత్నించాడు, కానీ వేగంగా గడిచిపోతున్న సమయం ఇక కాలం తన చేతిలోంచి ఇసుకలా జారిపోతోందని చెపుతున్నట్టు అనిపించింది. ప్రవహించే కాలం అతనికి మిగిలిఉన్న క్షణాలని దోచుకుంటున్నట్టు అనిపించింది. ఇంక ఎక్కువ సమయం లేదేమో! అందుకే మనసులో ఉన్నదంతా కక్కేస్తున్నాడు. ఈ సారి 189 అతని మాటలకి జవాబు చెప్పలేదు.

“మీరు దాన్ని ఆపి ఉండచ్చు. జనం మీ మాట వినేవారు,”అంటూ మళ్ళీ గొణిగాడు సీ 7096.

“ఆ ఉత్తరంలో నేను రాసినదానికి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే నేను దేశమంతటా తిరిగి జనాలని ఒప్పిస్తానని చెప్పాను. కానీ ముందు నావాళ్ళు అందులోని విషయాలని ఒప్పుకోవాలి. వాళ్ళే కాదన్నాక నాకింక వేరే దారి లేకపోయింది. ఇక దాన్ని తీసుకెళ్ళి లూయిస్ కి ఇచ్చెయ్యాల్సి వచ్చింది. నేను అనుకున్నది సాధించలేక పోయానని ఓటమిని అంగీకరించటం తప్ప చేసేదేమీ లేకపోయింది. నా చేతిలో ఏమీ లేదనీ, మీరు ఎలా కావలిస్తే అలా చెయ్యండనీ అన్నాను. అసలు నా నా చేతిలో ఏమైనా ఎలా ఉంటుంది? వాళ్ళ పార్టీని నేను వదిలిపెట్టి ముప్ఫైనాలుగేళ్ళయింది. వాళ్ళ ధోరణి బొత్తిగా నచ్చక వదిలేశాను,” అన్నాడు 189. ఆయన తనలో తనే మాట్లాడుకుంటున్నంత నెమ్మదిగా మాట్లాడాడు.

“మాకు మావాళ్ళు ఏం చెపుతారో తెలుసా? విభజన జరిగినప్పుడు అటువైపువాళ్ళు మా హక్కులన్నిటినీ కాజేశారని అంటారు. అందుకే మా దేశంలో అంత పేదరికం ఉందని చెపుతారు. మమ్మల్ని వెళ్ళి మా హక్కుల్ని సాధించుకు రమ్మని పంపిస్తారు. నాకూ అదే చెప్పారు”అన్నాడు సీ 7096.

“ఈనాటి వరకూ ఎప్పుడు ఏ విభజన జరిగినా పెద్దవాడే నిందని భరిస్తున్నాడు. తమ్ముడి వాటాని దోచుకున్నాడని అన్ననే దోషిగా నిలబెడతారు. తమ్ముడు అన్నకి అన్యాయం చేశాడని ఎప్పుడూ అనరు. అన్న అవడంలో ఇది కూడా ఒక సమస్యే. సాఫల్యం సాధించలేని ప్రతి సమాజమూ తన ఓటమికి కారణాలని బైటే వెతుక్కుంటుంది. మనం తయారుచేసిన ఈ సమాజం అసమానతలమీద నిలబడి ఉంది. ధనవంతుడు రోజు రోజుకీ మరింత ధనవంతుడైపోతూ ఉంటాడు, పేదవాడు మరింత అధోగతికి దిగజారిపోతూ ఉంటాడు.

“నువ్వు చెప్పే పేదరికం ఇక్కడా ఉంది. అంతే ఉందో ఇంకా ఎక్కువే ఉందో! నీకు ఆట్టే సమయం లేదు లేకపోతే తీసుకెళ్ళి చూపించేవాణ్ణి. నేను దేశమంతా తిరిగి చూసిన పేదరికాన్ని నీకూ చూపించేవాణ్ణి. బైటికి ప్రదర్శించేట్టు అంత గొప్పగా ఏం లేదు ఈ దేశం. నగరాల్లోని వెలుగులు చిమ్మే రహదారులనే చూపిస్తారు, చీకటి సందులూ, గొందులూ, ఆకలితో అలమటించే పల్లెల్లోని మట్టి కాలిబాటలూ ఎవరు చూపిస్తున్నారు? స్వాతంత్ర్యం మొత్తంగా పెద్ద పెద్ద ఇనప్పెట్టెలు నింపుకోవడానికే పనికివచ్చింది. అంత పెద్ద పోరాటమూ వ్యర్థమైపోయింది…ఏమీ సాధించలేదు…ఇప్పుడనిపిస్తుంది…అనవసరంగా అంత శ్రమపడ్డామేమోనని…అంతా వృథా…వృథా అయింది…” అని 189 తన చేతితో సీ 7096 వేళ్ళని తాకాడు.

“కావాలంటే నన్ను మీవెంట తీసుకెళ్ళి మీ దేశం చూపించండి. మీమాట ఎవరు కాదంటారు? రేపు జరగవలసినది కొన్ని రోజులకివాయిదా వేస్తారు, అంతే. మీతో వచ్చి మీ దేశం చూశాక మళ్ళీఇక్కడికే వచ్చేస్తాను. నాకు జరగబోయేదాన్ని గురించి నేనుభయపడటం లేదు.కానీ ఈ లోపల నేను చూసి, అనుభవించివచ్చిన పేదరికం లాంటిదే ఇక్కడ కూడా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు మనిద్దరం ఇక్కడి పేదరికాన్ని చూద్దాం. తరవాత మీరు నావెంట వచ్చి అక్కడ ఉన్నపేదరికాన్నీ, ఆకలినీ చూద్దురుగాని. స్వాతంత్ర్యం రాకముందు అక్కడిపరిస్థితి మీరు చూసే ఉంటారు, కానీ తరవాత ఎలా ఉందోచూడాలిగా!” ఇంకా ఆయన వేళ్ళమీద తన వేళ్ళు అలాగే ఉంచిఅన్నాడు సీ 7096.

“నా మాట ఎవరు వింటారు? ఎప్పుడో మానేశారు. అప్పుడే వినకపోతే ఇప్పుడిక ఎవరు వింటారు?ఒక విషయం చెప్తాను విను, ఈ లోకం ఒకవ్యక్తి పటాన్ని పూజించినప్పటికీ అతని మాట వింటుందనేమీగ్యారంటీ లేదు. పటం ఫ్యాషన్ కోసం కూడాపెట్టుకుంటారు!” అన్నాడు 189.

“అయినా మీరెందుకు మాట్లాడతారు? నేను మర్చిపోవడం నాదేతప్పు. ౨౩ మార్చి ౧౯౩౧ రోజున కూడా లాహోర్ సెంట్రల్ జైల్లోఉదయం ఏడు గంటలకి ఆ ఉరితాడు వేస్తూంటే దాన్ని ఆపగలిగి కూడా మీరేమీ అనలేదు. మీరు సైగ చేసినా ఆ ఉరి ఆగిపోయేదే. కానీమీరు దాన్ని ఆమోదిస్తున్నట్టు తలవంచుకుని ఊరుకున్నారు. ఆ ఘోరాన్ని జరగనిచ్చారు!” మొదటిసారి సీ7096 గొంతులో వెటకారం ధ్వనించింది.

“వాళ్ళు హింసకి పాల్పడ్డారు. వాళ్ళని కాపాడి ఉంటే  దేశమంతటాహింస విజృంభించి ఉండేది.ఏ రకమైన హింసనీ నేను సమర్థించను. హింసవల్ల దేన్నీ సాధించలేం. ఒకవేళ సాధించినాదాన్ని నేను ఆమోదించను. నేను నా అహింసామార్గాన్ని వదులుకోదలచలేదు. 189 గొంతు మళ్ళీ దృఢంగా మారింది.

“అహింసా? అదెక్కడుంది? అన్నివైపులా హింసే రాజ్యమేలుతోంది. అడవిలో సింహం జింకలని చంపుతోంది, ఆకాశంలోడేగ పిచుకలని చంపుతోంది, సముద్రంలో పెద్దచేప చిన్నచేపలనిమింగుతోంది, అంతటా హింసే ఉంది. అడవిలో అమలయే న్యాయమే అంతటా చెల్లుతోంది మహాశయా! మీరు చంపేవాళ్ళలో కాకపోతేచనిపోయేవాళ్లలో ఉంటారు. ఏవైపు ఉండడానికి ఇష్టపడతారో మీరే నిర్ణయించుకోవాలి. ఈ లోకాన్ని కూడా అడవిని నిర్మించినట్టే నిర్మించారు. ఇక్కడ ప్రాణాలతో ఉండాలంటే హింస చెయ్యకతప్పదు” ఇంకా సీ 7096 గొంతులో వెటకారం అలాగే ఉంది.

“సరే, కానీ నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. నేను హింసని ఎంతమాత్రం సమర్థించలేదు, సమర్థించను. వాళ్ళు చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే కదా? నేనెందుకు జోక్యం చేసుకుంటాను? అయినా నేను అడ్డుపడితే వాళ్ళు చావు తప్పించుకునేవాళ్ళా?” సీ 7096 తనని వెటకారం చేస్తున్నాడని గ్రహించి 189 మరింత దృఢంగా అన్నాడు.

“అందుకే ఆ శిక్ష పడడానికి సరిగ్గా 18 రోజుల ముందు, మార్చి 5 న మీరు ఆ ఒడంబడిక చేసుకున్నారు. సరిగ్గా 18 రోజుల ముందు! అది మీరు వేసిన ఎత్తు కాదా? ఆ ఒడంబడికలో రాజకీయ ఖైదీలందరినీ విడుదల చెయ్యాలన్న అంశం ఉన్నప్పుడు దాన్ని అలాగే ఉండనివ్వాల్సింది! అందులో ‘హింసాయుతమైన పనులు చేసినవారిని తప్ప’ అనే వాక్యాన్ని ఎందుకు జోడించాల్సి వచ్చింది? హింస చేసేవాళ్ళెవరు? ఆ దోషులు మీ అభిప్రాయాలని అంగీకరించని వారే కదా? మిమ్మల్ని సమర్థించినవారందరూ అహింసావాదులేనాయె. ఈ ఒడంబడిక చేసుకుని మిమ్మల్ని సమర్థించేవారందరినీ రక్షించారు, కానీ మిమ్మల్ని ఎదిరించి, మీ అభిప్రాయాలతో ఏకీభవించని వారందరినీ ఉరికంబానికి వేలాడదీయించారు. ఆ ఒడంబడికవల్ల లాభం చేకూరింది మీకే. మీ పార్టీ మీద నిషేధాన్ని ఎత్తేశారు. మీవాళ్ళ ఆస్తులన్నీ వెనక్కిచ్చేశారు. మీరు చాలా యుక్తిపరులని జనం ఊరికే అనలేదు,” సీ 7096 పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు.

బైటి గోల ఎక్కువైంది. జనం పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఇటూఅటూ హడావిడిగా నడిచే కాళ్ళ బూట్ల చప్పుడు కూడా ఉండుండివినిపిస్తోంది.

” అహింస నా సిద్ధాంతమనీ, ఎపుటికీ దాన్నే నమ్ముతాననీ, హింసని సమర్థించే పనులేవీ అన్నటికీ చెయ్యననీ చెప్పా కదా?ఎవరైనా, ఎప్పుడైనా, ఎటువంటి హింసకి పాల్పడినా దాని పరిణామాలని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే!” 7096 ఇచ్చిన అంతదీర్ఘోపన్యాసమూ 189 మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఆయన అదే ధోరణి ప్రదర్శించాడు.

“ఎప్పుడూ మీ నోట వినిపించే రామనామం, చనిపోయేప్పుడు కూడా చివరిగా మీ నోటి వెంట వినిపించినది అదే, ఆ రాముడు కూడా హింసనే సమర్థించాడే? ఆయన అహింసని నమ్మనే లేదు. మీ రాముడుఎంత భీకరమైన యుద్ధం చేశాడు! అలాంటప్పుడు అహింసామంత్రాన్ని జపించే మీ నోట ఎప్పుడూ ఆయన పేరే వినిపిస్తుందేమిటి? ఆయన చేసిన హింస మీకు హింసలా కనిపించదా? ఇక ఎప్పుడూ మీవెంటే ఉండే భగవద్గీతలో ఏముంది?అతి పెద్ద హింస జరిగే ముందు ఇచ్చిన ఉపన్యాసం అది. ఒక యోధుడు అహింసా మార్గాన్ని అనుసరించాలనుకుని తన ఆయుధాలని పారేస్తూఉంటే, అతన్ని మళ్ళీ హింసవైపు ఉసికొల్పడానికి అన్న మాటలే కదా భగవద్గీత?మానవ చరిత్రలో అన్నిటి కన్నాఅతి ఘోరమైన హింస జరిగినది ఆ యుద్ధంలోనే అనేది మీకూ తెలుసు. ఆ హింస జరగడానికి సరిగ్గా ముందు, దాన్ని ప్రారంభించేందుకు చెప్పిన మాటలన్నిటినీ మీరు ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు, కానీ అహింస గురించి మాట్లాడతారు!” అన్నాడు సీ 7096 మరింత ఉద్రేకంగా. 189 జవాబేమీ చెప్పలేదు.ఒకసారి గాలిని నమిలాడు. ఇబ్బందికరమైన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఉండేందుకు అదే ఆయన వాడే ఉపాయం.

“విభజన కారణంగా రెండు దేశాలలోనూ పది లక్షలకి పైగా ప్రాణాలు కోల్పోయినప్పుడు మీరు మాత్రం ఎక్కడ ఆపగలిగారు? ఇంకాఎంతమంది ఇళ్ళూ వాకిళ్ళూ కోల్పోయారో, ఎంతమంది ఆచూకీ తెలీకుండా మాయమయారో వాళ్ళ లెక్కే తేలలేదు.అంత హింస తరవాత లభించిన స్వాతంత్ర్యాన్ని మీరందరూ స్వీకరించారు కదా? టపాకాయలు కాల్చారు, డప్పులు వాయించి ఆ స్వాతంత్ర్యానికి స్వాగతం పలికారు!” 189 గాలి నమలడం చూసి సీ 7096 కిఆవేశం హెచ్చింది. గొంతులో కోపాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ అతనికి మౌనమే సమాధానమయింది. వంచిన మోకాలి మీది చెయ్యి కొద్దిగా కదిలిందంతే.

మళ్ళీ సీ 7096 మౌనాన్ని ఛేదిస్తూ,” ఆ… కొన్ని వేలమంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఆ హంతకుడు, ఆయుధాల దళారి, వాడు చేసిన హింస మీకు కనబడలేదు. ఆ రక్తం రుచి మరిగిన తోడేలు ఆరేళ్ళ క్రితం మీ దేశానికి వచ్చినప్పుడు, రక్తసిక్తమైన తన పంజాలతో, మాంసం ముక్కలు అతుక్కున్న పళ్లతో మీ సమాధి దగ్గరకి కూడా వచ్చాడు. వాడిప్పుడు ఈ ప్రపంచానికే రాజు కాబట్టి వాడు చేసిన హింస న్యాయమేనా? వాడి రక్తంతో నిండిన పంజాలకి స్వాగతం పలికేందుకు మీ దేశమే రెడ్ కార్పెట్ అవుతుందా? మీరు ఆ సమాధిలో నిద్రపోతూ వాడు సమర్పించిన రక్తం అంటిన పువ్వులని స్వీకరించి, చూస్తూ ఊరుకున్నారు కదూ? వాడు ఈ కాలపు అతి పెద్ద యుద్ధ నేరస్థుడు. వాణ్ణి మీ సమాధి దగ్గరకి మీదేశమే ఆహ్వానించింది. మార్చి ౨,౨౦౦౬ నాటి ఆ బ్లాక్ థర్స్ డే న మీ సమాధీ, మీ అహింసా, మీ సిద్ధాంతాలూ అన్నీ, ఆ నేరస్థుడిచ్చిన పువ్వులు స్వీకరించగానే, అపవిత్రమైపోయాయి. మీరు గర్వించేందుకు ఇంకేమీ మిగల్లేదు…” సీ 7096 కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు, 189 అతని మాటలన్నీ మౌనంగా విన్నాడు. కోపంగా అనే మాటలు వినడం ఆయనకి బాగా అలవాటే.

“కనీసం వాణ్ణి రాకుండా చెయ్యాల్సింది. వాడు హత్య చేసి నెత్తుటిధారలు ప్రవహింపజేసింది ఆ పెద్ద భూభాగానికి చెందినవాళ్ళనే కదా! అదంతా ఒకే జాతికి చెందినవాళ్ళ రక్తం…వాళ్లని మీరు ఆర్యులంటారు. ఇక్కణ్ణించి అక్కడిదాకా పరుచుకున్నది ఆరక్తమే. వాడి రక్తం వేరు, కనీసం మీరైనా మీవాళ్ళ పక్షం మాట్లాడి ఉండవలసింది. అప్పుడు మీ అహింసా సిద్ధాంతాన్ని వాడి చెవులు చిల్లులు పడేట్టు గొంతు చించుకుని మరీ అరవాల్సింది. కానీ ఎవరూ మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. మౌనం అంగీకారమనే మాట మీకే బాగ తెలిసుండాలి. మౌనంగా ఉండి మీరు కూడా వాడి హింసని సమర్థించారు. అందుచేత అహింస గురించి ఇప్పుడు మాట్లాడే హక్కు మీకు గాని ఇంకొకరికి గాని లేదు. వాడు ప్రపంచంలో ఏ మూలకి కావాలంటే ఆ మూలకి సైన్యాన్ని పంపించగలడు. ఎవరికైనా మరణదండన విధించెయ్యగలడు. వాడి నాన్న ఒక తోడేలైతే వీడూ తోడేలే. చాలాకాలం క్రితం వాడి నాన్న సైన్యంతో వచ్చాడు. లక్షమందిని హతమార్చి మరీ వెళ్ళాడు. పాలస్తీనా నుంచి ఇరాక్ దాకా ఈ తోడేళ్ళ గోళ్ళ, వాడైన కోరల గుర్తులే. కానీ మీకవి కనిపించవు!” సీ 7096 గొంతు కాస్త తగ్గించి అన్నాడు. ఆ తరవాత కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. 189 తను ఏమీ మాట్లాడకుండా అతనికి తన ధోరణిలో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఇక సీ 7096 చెప్పేందుకేమీ లేదని ఆయన గ్రహించాడు. తను కూర్చున్న భంగిమ మార్చుకుని మోకాళ్ళు మరోవైపుకి మడుచుకున్నాడు. బైట చప్పుళ్ళు ఎక్కువయాయి.

“కొంచెం నీళ్ళు…”అన్నాడు 189 నెమ్మదిగా. వెంటనే సీ 7096 గ్లాసులో నీళ్ళు నింపి ఆయనకి అందించాడు. 189 నెమ్మదిగా ఒక్కొక్క గుక్కే తాగి గ్లాసు అతనికి అందించి, “రాత్రిపూట సామాన్యంగా గోరువెచ్చని నీళ్ళే తాగుతాను. కానీ ఇప్పుడు ఎలాంటినీళ్ళైనా ఏమీ తేడా తెలీదు” అని 189 ధోవతి కింది అంచుని సాఫీచేశాడు.

మళ్ళీ”అప్పటి సంగతి వేరు. అంతా పద్ధతి ప్రకారం చేసే అలావాటుండేది. కానీ మంచి అలవాట్లని జీవితాంతం పాటించడం అంత సులభం కాదు” అని బోసి నోటితో నవ్వాడు. ఆ నవ్వు పేలవంగా ఉంది.

“నీ తమ్ముళ్ళు ఏం చేస్తూంటారు?” బైటి చప్పుళ్ళు ఎక్కువవడం గమనించి 189 మాట మార్చాడు.

“ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలీదు, ఐదేళ్ళ క్రితం, నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు పెద్ద తమ్ముడు పొలంలో కూలీ పని చేసేవాడు, చిన్నవాడు స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు” అన్నాడు సీ 7096. అతని గొంతు గద్గదమైంది. తల వంచుకుని “నేను చేసిన ఈ పనికి ఫలితంగా వాళ్ళకి ఏమైనా దక్కిందో లేదో కూడా తెలీదు” అన్నాడు.

“మీ నాన్న ఏం చేసేవాడు?” సీ 7096 మెత్తబడడం చూసి 189 మరో ప్రశ్న వేశాడు.

“పెరుగ్గారెలు అమ్మేవాడు. ఇంటింటికీ తిరిగేవాడు. కొన్నిసార్లు ఊళ్ళోనే అమ్మితే కొన్నిసార్లు బైటికి వెళ్ళి అమ్మేవాడు. కానీ పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు, గడిచిపోయేది అంతే”ఇంకా తలవంచుకునే సమాధానం చెప్పాడతను.

“ఇల్లు విడిచి నువ్వు వచ్చిందెప్పుడు?” అంటూ 189 తన చెతిని మళ్ళీ అతని భుజం మీద ఉంచాడు.

“ఐదేళ్ళయిపోయింది అప్పుడే. నేను ఇల్లు వదిలినప్పుడే మా ఊళ్ళో పూరబ్ అనే అమ్మాయి హత్యకి గురైంది. అది చలికాలం, డిసెంబర్ అనుకుంటా,” అంటూ సీ 7096 తన భుజం మీదున్న 189 చేతిమీద తన చేతిని ఉంచాడు. కానీ తల మాత్రం ఎత్తలేదు.

“ఎవరి వెంట వెళ్ళావు?”అన్నాడు 189.

“మా చిన్నాన్న వెంట. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళమనీ, ఆయన వెంటే ఉండమనీ చెప్పాడు మా నాన్న. ఏమీ అడక్కుండా ఆయనవెంట వెళ్ళిపోయాను”అన్నాడు సీ7096 కాస్త దిగులుగా. 189 చేతిమీదున్న తన చేతిని తీసి నేలమీద ఆనించాడు. ఆ తరవాత 189 ఇంకేమీ అడగలేదు. ఇద్దరూ అలా మౌనంగా కూర్చుని ఉండిపోయారు.

“నాకు మా అమ్మంటే…చాలా…చాలా ఇష్టం…ప్రేమ. అమ్మ నాతో చాలా సన్నిహితంగా ఉండేది. అమ్మ నా కోసం…” ఆతరవాత సీ 7096 గొంతు పెగల్లేదు. 189 అతని భుజాన్ని చేత్తో గట్టిగా నొక్కాడు.

“అందరూ అమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, అందరూ. ఈ ప్రపంచం మొత్తాన్ని అమ్మల చేతుల్లో పెడితే, ఈ రక్తపాతం, హింసా మొత్తం ఆగిపోతుంది. కానీ మనం అలా ఎన్నటికీ జరగనివ్వం. ఎందుకంటే అమ్మలు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తారు. ప్రపంచపటం మీదున్న గీతల్ని ఊడ్చి చెరిపేస్తారు. ఈ చివర్నించి ఆ చివరి దాకా అంతా ఒకేలా ఉండేట్టు చేసేస్తారు. చీపురుతో మందుగుండు సామాన్లని చిమ్మి చెత్తబుట్టలో పారేసి వస్తారు. మందుగుండు ఎప్పుడూ తల్లుల గర్భాలనే కాల్చివేస్తుందని వాళ్లకి తెలుసు. ఈ లోకాన్ని వాళ్లకి గనక అప్పజెపితే దీన్ని హాయిగా బతికేందుకు వీలుగా మార్చేస్తారు వాళ్ళు. మనం లోకాన్ని ప్రియురాళ్లకి అప్పజెప్పాం, భార్యలకి అప్పజెప్పాం, ఉంపుడుగత్తెలకి అప్పజెప్పాం, కానీ ఎప్పుడూ ఏ తల్లికీ అప్పజెప్పలేదు. మనకి భయం…ఒకవేళ తల్లులు ప్రపంచమంతటా ప్రేమ నింపేస్తే మనం ఎక్కడికి పోతాం, ప్రేమ నిండిన ఆ ప్రపంచంలో ఎలా బతుకుతాం, అనే భయం! మనకి అలా బతకడం అలవాటే లేదే!” అన్నాడు 189 ప్రేమ నిండిన గొంతుతో. సీ 7096 అలాగే తలవంచుకుని కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయారు.

“మందుగుండు పేలినప్పుడు మొట్టమొదటి కేక ఎవరో ఒక తల్లి గొంతులోంచే వస్తుంది.అది ఎక్కడైనా కావచ్చు, ఆ తల్లి ఎవరైనా కావచ్చు. ప్రపంచంలోని తల్లులందరూ మందుగుండుని ఎంత అసహ్యించుకుంటారో నువ్వు ఊహించలేవు” 189 గొంతు ఖంగుమని పలికింది.

“తెలుసు, నాకు బాగా తెలుసు. మా అమ్మకి కూడా మందుగుండంటే పరమ అసహ్యం. కానీ అసహ్యించుకున్నంత మాత్రాన ఏదీ ముగిసిపోదు కదా! అది అక్కడే అలాగే ఉంటుంది. మీరు ఎంత అసహ్యించుకున్నప్పటికీ” సీ 7096 గొంతులో దిగులు పెరిగిపోయింది.

“నిన్ను అక్కడికి పంపినప్పుడు నువ్వెందుకు ఎదురుతిరగలేదు? అప్పటికి నీకు ఇరవైయేళ్ళు. మంచీ చెడూ తెలుసుకునే జ్ఞానం ఉంది. నాకు వెళ్ళాలని లేదని అనుండచ్చే?” 189 సరైన అదను చూసి అడిగాడు.

“నేను పదమూడేళ్ళకే స్కూలు మానేశానని మీకు తెలుసు కదా? ఆ తరవాత ఏమీ చెయ్యకుండా ఉండిపోయాను. చేసేందుకు ఏమీ లేకపోయింది. ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు కూలీ పనికి పోయేవాణ్ణి. అలాంటి సమయంలో ఎవరైనా వెళ్లనని ఎలా అనగలరో మీరే చెప్పండి?” ప్రశ్నకి ప్రశ్నే బదులు చెప్పాడు సీ 7096.

అక్కడికెళ్ళకైనా ఈ పని చెయ్యకూడదు, వెనక్కి వెళ్ళిపోవాలని నీకు అనిపించలేదా?” 189 గొంతులో ఇప్పుడు మృదుత్వం లేదు.

“అనిపించింది, ఇలాంటి పనులు నేను చెయ్యలేనని కూడా చెప్పాను. కానీ నా మాట వినిపించుకున్నదెవరు? చెప్పడం, వినడం లాంటివి అక్కడ ఉండవు. వెనక్కి వచ్చే మార్గం లేకపోయింది. వాళ్ళు చెప్పే మార్గం ,స్వర్గానికి తీసుకెళ్ళే మార్గం ఒక్కటే మిగిలింది నాకు. అక్కడ ఆ కొండ ప్రాంతాల్లో నేను కాక నాలాంటివాళ్ళు మరో పాతికమంది దాకా కుర్రవాళ్ళు ఉండేవారు. అందరూ తిండికి కూడా గతిలేని నిరుపేదలే. నా లాగే వాళ్ళు కూడా నరకంలాంటి జీవితాన్ని స్వర్గం చేసుకునేందుకు అక్కడికి వచ్చారు. దాన్ని సాధించాలంటే మేమే స్వయంగా స్వర్గానికెళ్ళాలని మాకందరికీ తెలుసు. ఆ కొండల్లోనే మాకు మందుగుండు సామానుతో ఆడుకోడం నేర్పారు. మందుగుండు సామాన్లలోఅన్ని రకాలూ, రంగులూ అక్కడే చూశాం. దాన్ని ఎలా అదుపు చెయ్యాలో, అదుపులో ఉంచుకుని మా లక్ష్యం కోసం దాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకున్నాం,” సీ 7096 గొంతు మామూలు స్థితికి రావడం మొదలెట్టింది. ఒక్క క్షణం ఆగి గొణుగుతున్నట్టు ” నేనా పని చెయ్యలేను, నా వల్లకాదని చెప్పాను, నిజంగా చెప్పాను!” అన్నాడతను.

“ఊ…ఇక నిన్నిక్కడికి పంపించినప్పుడు ఎందుకు పంపించారో నీకు తెలిసే వచ్చావా?” 189 కొంచెం మెత్తబడినట్టు అడిగాడు.

“తెలుసు,మాకందరికీ తెలుసు. ఇక్కడ మనుషులని చంపేందుకు పంపారు… ఇంకా…ఇంకా…మేం చనిపోయేందుకు కూడా…మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో మాకందరికీ బాగా తెలుసు. అసలు మాకు శిక్షణ ఇచ్చిందే అందుకు. మా కుటుంబాలకి డబ్బులిచ్చింది కూడా అందుకే. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి హత్యలు చెయ్యడమే మా పని,” అన్నాడు సీ 7096.

“ఎవర్ని చంపడానికి?”189 అడిగాడు.

“ఎవర్నైనా సరే,కనబడిన వాళ్లందర్నీ…” సీ 7096 గొంతు అణగారిపోతోంది.

“ఎందర్ని చంపావు…ఆ స్టేషన్ లో?” అతని గొంతుని మరింత అణిచేందుకు 189 ఆ ప్రశ్న వేశాడు.

“తెలీదు…కానీ…రెండున్నర మేగజైన్లు ఖాళీ చేసేశాను. నేను…అలా కాలుస్తూ పోయానంతే. వాళ్లని చంపు, అప్పుడే మనం బతికి ఉండగలం అని చెప్పారు నాకు…అందుకే చంపుతూ పోయాను…ఎందర్ని చంపానో నాకే తెలీదు…” సీ 7096 ఆగి ఆగి మాట్లాడసాగాడు, అతని గొంతు చాలా నీరసంగా ఉంది.

“నువ్వు చేసిన ఈ పనికి అసలు అర్థమేమిటో తెలుసా నీకు? మీ చేత ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తున్నారో ఏమైనా అవగాహన ఉందా?”189 నెమ్మదిగా అడిగాడు.

“తెలీదు,” అని క్లుప్తంగా జవాబు చెప్పాడు సీ 7096.

“మరి?” అన్నాడు 189.

డబ్బున్న కుటుంబాల్లోని వాళ్ళెవరైనా ఇలాంటి పనులెందుకు చేస్తారు? నాలాంటివాళ్ళే డబ్బులకాశపడి చేస్తారు కానీ!”ఈసారి సీ 7096 తలెత్తి సమాధానం చెప్పాడు. సూటిగా 189 కళ్ళలోకి చూస్తూ ఈ మాటన్నాక అలా చూస్తూనే ఉండిపోయాడు. 189 కూడా చూపులు మరల్చుకోలేదు. ఇద్దరూ కొంతసేపలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. కొంతసేపేమిటి, చాలాసేపు అలాగే కళ్ళతో మాట్లాడుకున్నారు. చాలా సేపటితరవాత 189 తన చేతిని సీ 7096 భుజం మీంచి తొలగించి,అతని ఒక చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకుని నొక్కాడు. సీ 7096 కి ఆ చేతుల్లో వెచ్చదనం ఉన్నట్టు తోచింది. ఆ వెచ్చదనాన్ని ఒకప్పుడు ప్రపంచం మొత్తం అనుభవించింది!

“మీకు…మీకు నన్ను చూస్తే అసహ్యం వెయ్యడం లేదా?”అన్నాడు సీ 7096 చాలాసేపటికి నోరు విప్పి.

“లేదు…అసలు నేను ఎప్పుడూ  పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు, అనేవాణ్ణి. నేరాన్ని అసహ్యించుకోవాలి గాని నేరస్థుణ్ణి కాదు! అపరాధాన్ని అంతమొందించమనే ఎప్పుడూ చెప్పాను, అపరాధిని మట్టుపెట్టమని ఎప్పుడూ అనలేదు. నువ్వనే కాదు, ఆ అపరాధి ఎవరైనా నేనలాగే చేస్తాను. హింసకి సమాధానం హింస కాకూడదు. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోకూడదు. ఒకవేళ తను చేసిన నేరాన్ని ఆ నేరస్థుడే అసహ్యించుకుంటే నేనతన్ని ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా?అలాంటి సమయంలో అతనికి ఎక్కువ అవసరమైనది ప్రేమే” 189 చాలా తియ్యగా, సీ 7096 చేతిని తన చేత్తో మృదువుగా తడుతూ అన్నాడు. సీ 7096 ఏమీ జవాబు చెప్పకుండా ఆ కళ్ళ్జజోడులోంచి తనవైపు చూస్తున్న కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు.

“ఇందాక హింసని సమర్థిస్తూ నువ్వేమేమో అన్నావు. నేను మాట్లాడకుండా నువ్వు చెప్పింది విన్నాను. నువ్వు చెప్పిన దానితో ఏకీభవించకపోయినా నిన్ను ఆపలేదు. ఎందుకో తెలుసా? నా ఉద్దేశం ఈ లోకంలో ఉన్న ఎటువంటి అభిప్రాయమైనా సరే, దానితోపాటే దాన్ని ఏకీభవించకపోవడమనే అంశం కూడా దాని వెంటే ఉంటుంది. ఎటువంటి అభిప్రాయమూ కూడా సర్వసమ్మతమై ఉండదు. అలా ఉంటే అది అసలు అభిప్రాయమే కాదనాలి. నువ్వు వెలిబుచ్చిన అభిప్రాయాలలో కొన్నిటిని తప్ప మిగతా వేటినీ నేను ఒప్పుకోను. అయినా అలాగని నీతో అనలేదు. అవతలి వ్యక్తి భిన్నాభిప్రాయాన్ని తీసిపారెయ్యడం కూడా ఒక రకంగా హింసే అంటాను. అసలు ఆరోగ్యకరమైన ఏ సమాజానికైనా ఇదే, అన్నిటికన్నా పెద్ద హింస అంటాను” అని 189 ఒక్క క్షణం ఆగి తొడమీద ఉన్న జేబు గడియారంలో టైమ్ చూశాడు.

“ఇంక నేను అడగదల్చుకున్న ఆ ఒక్క ప్రశ్నా అడిగే సమయం వచ్చిందనుకుంటా. అక్కడిదాకా వచ్చేందుకే ఇంతసేపూ ఏవేవో ప్రశ్నలు వేస్తూ వచ్చాను,” అని ఆయన మళ్ళీ కాసేపు మౌనం వహించాడు. ఆ నిశ్శబ్దంలో బైటి చప్పుళ్ళు మరీ గట్టిగా వినిపించసాగాయి.

“ఇప్పుడు నా ఈ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పు. హింసని సమర్థిస్తూ నువ్వు చాలానే మాట్లాడావు. ఎన్నో ఉదాహరణలు ఇచ్చావు. కానీ ఇంకెవరి ఉదాహరణో కాకుండా నీ ఉదాహరణ ఆధారంగా నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన హింస నీకు సమ్మతమేనా? అప్పుడు అక్కడ జరిపిన హింసాకాండని ఈరోజు, ఇక్కడ నువ్వు సమర్థిస్తావా? ఇప్పుడు దాన్ని ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడమే అన్నిటికన్నా ముఖ్యం, ఎందుకంటే ఇదే అంతిమ సత్యం. ఇంతకు ముందుగాని,తరవాత గాని జరిగేదేదీ సత్యం కాదు!” 189 గొంతు స్పష్టంగా, గట్టిగా పలికింది. ఒక్కొక్క మాటా ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నట్టు మారుమోగింది. దాని ప్రభావం సీ 7096 ని కొంతసేపు కమ్మేసింది. అతను 189 కళ్లలోకి ఒక్క క్షణం చూసి తల దించుకున్నాడు.

“నేనొప్పుకోను…లేదు, మీ మాటలు అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోను” అన్నాడు 7096 తలవంచుకునే.

“ఇదే శాశ్వత సత్యం. దీన్ని గుర్తుంచుకో. నువ్వు చేసిన పని హింస అనీ, దాన్ని వ్యతిరేకిస్తున్నాననీ నువ్వు  ఒప్పుకుంటే, ఇక రేపు జరగబోయేదాన్ని నువ్వు ప్రశాంతమైన మనసుతో అంగీకరించగలుగుతావు. పరిపూర్ణమైన శాంతి అనుభవిస్తావు”అన్నాడు 189 ఎంతో తియ్యగా, ప్రేమగా. సీ 7096 ఆయన మాట అంగీకరించినట్టు మౌనంగా తల పంకించాడు.

“ఇంకొక మాట, ఈ ఆకలీ, పేదరికం ఎక్కువకాలం ఉండవు. ఒకరోజు జనం మళ్ళీ వెనక్కి వస్తారు…ఆ రోజు, ఇదే చేతికర్రతో ఆ ఐదువేల కోట్లు ఖరీదు చేసే భవనాన్ని ధ్వంసం చేస్తాను. అలాంటి భవనాలన్నిటినీ కూల్చేస్తాను. ఆ విరిగిన ముక్కలన్నిటినీ ఈ దేశమంతటా వెదజల్లుతాను. మీ ఇల్లు ఉన్నంత దూరం, మరీ మాట్లాడితే ఇంకా దూరం వాటిని విసురుతాను. ఈ నరభక్షక భవనాలు కూలిపోవాలి. కొన్ని లక్షలమందికి అందవలసిన వాటాలని పీల్చి పీల్చి తమలో నింపుకుంటున్నాయివి. నీ లాంటి ఇంకా ఎంతోమందిని సృష్టిస్తున్నవి ఇవే. ఇవి నేలమట్టమైన రోజున అన్నీ సర్దుకుంటాయి. నా మాట నమ్ము, అలాంటి రోజు తప్పక వస్తుంది, ఈ నా చేతికర్రతోనే ఒక్కొక్క భవనాన్నీ ముక్కలు ముక్కలుగా కూల్చేస్తాను”అంటూ తన పక్కనున్న కర్రని ఎత్తి గాల్లో గిరగిరా తిప్పాడు 189. మాట్లాదేకొద్దీ ఆయన గొంతు మరింత దృఢంగా అయింది. బైటి మాటలు ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి .తెల్లవారిపోయినట్టుంది. 189 తనని తాను సంబాళించుకుంటూ లేవడానికి ఉద్యుక్తుడయాడు. సీ 7096 గబగబా వెళ్ళి ఆయన్ని పట్టుకుని లేవదీశాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు.

“ఇప్పుడు నీకింక భయం వెయ్యడంలేదు కదా?” అన్నాడు 189 అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.

“లేదు, కానీ…అమ్మ గురించే భయం!” అన్నాడు సీ 7096 ఆయన వైపే చూస్తూ.

“అమ్మ గురించా, ఎందుకు?”

“నామీద అమ్మకి కోపం వస్తుంది”అన్నాడతను దిగులుగా.

“ఊ…అయితే ఈ భయం మంచిదే…చాలా మంచిది,”అన్నాడు 189, సీ 7096 భుజం తట్టి చిరునవ్వు నవ్వుతూ. సీ 7096 సమాధానమేమీ చెప్పలేదు కానీ మొదటిసారి అతని మొహంలో పల్చని చిరునవ్వు కనిపించింది.

“నీ మరణం గురించి నాకూ ఒక భయం ఉంది. నువ్వు చనిపోయాక అక్కడ జనం నిన్నొక హీరోని చేసేస్తారు. నీ గురించి కథలు కథలుగా చెప్పి, నీలాంటి అమాయకులని భావోద్రేకంతో నింపి అదే మార్గాన నడిపిస్తారు. నీ మరణాన్ని బలిదానం, వీర మరణం అంటారు. చనిపోయాక కూడా నువ్వు వాళ్లకి ఉపయోగపడుతూ ఉంటావు. ఇది అన్నిటికన్నా పెద్ద నష్టం అనిపించుకుంటుంది. అదే నా భయం. హింసని బలిదానం అనడం అన్ని ప్రమాణాలనీ మార్చేస్తుంది. సమాజానికి దానివల్లే అన్నిటికన్నా ఎక్కువ చెరుపు. హింస తాలూకు ఈ దుష్పరిణామాన్ని చూస్తేనే అన్నిటికన్నా నాకెక్కువ భయం. హింసా మార్గాన్ని అనుసరించేవాళ్ళని వీరులని ఆకాశానికెత్తితే, ఇక సమాజం మొత్తం అదే దారిన నడుస్తుంది,” 189 గొంతులో అలసట ధ్వనించింది.

“రేపు నువ్వు చనిపోయాక దేశమంతటా టపాకాయలు పేల్తాయి. కూడళ్ళలో మిఠాయిలు పంచుతారు, ఆనందంతో డప్పులూ,డోళ్ళూ వాయిస్తారు. నీ దిష్టి బొమ్మల్ని తగలబెడతారు” అన్నాడు 189 అతని కళ్లలోకి లోతుగా చూస్తూ.

“తెలుసు, కానీ మీరు చనిపోయినప్పుడు కూడా ఇవన్నీ చేశారు కదూ? తక్కువమందే కావచ్చు, కానీ కొందరైనా చేశారు” చూపు మరల్చుకోకుండా అన్నాడు సీ 7096.

” ఊ…నిజం చెప్పావు. నేను చనిపోయినప్పుడు కూడా కొందరు మిఠాయిలు పంచారు” 189 గొంతులో అపహాస్యం కనిపించింది, ఆ వెటకారం తనపట్లే . సీ 7096 ఆయన బోసినోటి నవ్వు చూస్తూ ఉండిపోయాడు.

“సరే , నేనిక వెళ్తాను ప్రార్థనకి వేళయింది. బా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక నీకు కూడా సమయం ఆసన్నమైందనుకుంటా, బైట హడావిడి ఎక్కువైంది” అంటూ 189 చేతులు జోడించి నమస్కారం చేశాడు. సీ 7096 అవాక్కయి అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు.

“ఇక వెళ్తాను”అంటూ 189 అడుగు ముందుకేశాడు.

“ఒక్క మాట…!” ఆయన వెళ్ళిపోతూంటే వెనకనించి సీ 7096 పిలిచాడు. అప్పటికి ఆయన గది ఆ కొసకి చేరుకున్నాడు. అతను పిలవగానే ఆయన ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

“మా అమ్మకి చెప్పండి…” అన్నాడు సీ 7096 బొంగురుపోయిన గొంతుతో.

ఇద్దరూ గదికి చెరో కొసనా నిలబడిపోయారు. ఇద్దరిమధ్యా చిమ్మచీకటి పరుచుకుంది. బైటినుంచి ఎందరో నడిచివస్తున్న చప్పుడు…వాళ్ళ కాళ్ళకున్న జోళ్ళ చప్పుడు…జోళ్ళకి కొట్టిన మేకులు నేలకి తగుల్తున్న టకటకమనే చప్పుడు. అవి నెమ్మది నెమ్మదిగా దగ్గరవసాగాయి. అతనున్న గదివైపుకే రాసాగాయి. నడుస్తూ ఇంకా ఇంకా దగ్గరకి రాసాగాయి.

***

 

 

 

 

జలపిత

 

ఉక్రేనియన్ రచన: ఎమ్మా అందిజెవ్ స్కా

అనువాదం: అనంతు 

~

 

emma“మన’’( జీవిత) కాలంలో్ అసాధ్యమనిపించే కార్యకలాపాల, ఘటనల విలీనతనూ, లేదా కదంబాన్నీ ప్రతిపాదించి ‘వలయకాలం’ అనే నవీన కోణాన్నీ, శైలినీ ఆవిష్కరించిన ఎమ్మా అందిజెవ్ స్కా ఉక్రేనియన్ సర్రియలిస్ట్ రచయిత్రి.

1931, మార్చి 19 న తూర్పు ఉక్రేనియాలో పుట్టి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీకి వెళ్ళి, 1950లో న్యూయార్క్ నగరానికి తరలీ, ప్రస్తుతం మ్యూనిచ్ (జర్మనీ) లో నివాసముంటున్న ఎమ్మా అందిజెవ్ స్కా  అస్తిత్వం గూగుల్ లో అమెరికన్ జాతీయత, స్వంత గడ్డ (ఉక్రేనియా) లో విదేశీ రచయిత.

ఈ మెను తన పిత్రు దేశం ఆమోదించిందీ, అక్కున చేర్చుకున్నదీ, అర్థం చేసుకున్నదీ, గౌరవించిందీ ఎనిమిది దశాబ్దాల తర్వాతే. ఎమ్మా అందిజెవ్ స్కా 80 వ పుట్టిన రోజు పర్వదినాన ఉక్రేనియా 10 సంకలనాల్లో ఆమె సంపూర్ణ రచనలను ప్రచురించి తన చారిత్రక పొరబాటుకు దిద్దుబాటు చేసుకుంది.

ప్రస్తుత రచన ‘జలపిత’ (Djalapita) 1962 లో ప్రచురితం.

ఈ రచనలో వాస్తవికత, అధివాస్తవికత, మంత్రవాస్తవికత, జానపద కథనం, వ్యంగ్య ప్రకటన, నిరసన గొంతు, ధిక్కార స్వరం చెట్టపట్టాలేసుకుని కని, వినిపిస్తాయి.

ఇందులో స్రజనాత్మకత, ఆవిష్కరణాత్మక శైలికి కవలగా హేతుబద్ధ, తర్కబద్ద రుజు వర్తన కాల గమనాన్ని నడ్డి విరిచే తత్వ విచారం పాటించింది.

కాలం రుజు వర్తని అనే ‘మన’ హేతు బద్ధతనీ, తర్క విధేయతనీ అదే పనిగా తుత్తునియలు చేసి భూత, భవిష్యద్ వర్తమానాలను తోబుట్టువులను చేస్తుంది.

దీన్నే తను వలయకాలం(round time)గా ప్రతిపాదించింది.

ఎమ్మా అందిజెవ్ స్కా బౌద్ధాన్నీ, సంస్కృత  వాంగ్మయాన్నీ చదువుకుంది.

ఈ జలపిత పదబంధం, పదచిత్రం (తాత్విక ప్రతిపాదన) ఆ ఎరుకలోంచి జనించి ప్రవహించినదే.

ఇంతకీ ఇది కథా, కవితా, విడి విడి అంకాల మాలికా?

 లేక ఉట్టి పిచ్చి ప్రేలాపనా?

 లేక మన గిరి గీతల ఆవల పారే కొత్త నీటి పాయా?

తేల్చుకునేది ఎప్పుడూ  పాఠకుల, విమర్శకుల రసగ్న విగ్నతే.

రచనలదీ, వాటి రచయితలదీ కాదు.

 

Akkadi-MeghamFeatured-300x146

జలపిత

 

 

 

రచయితఎమ్మా అందిజెవ్ స్కా, ఉక్రేనియా

1962  లో ముద్రితం

ఆంగ్ల అనువాదంరోమన్ ఇవాష్కివ్

తెలుగుఅనంతు చింతలపల్లి

 

*

 

“నన్ను చంపేందుకు కత్తి నీడ చాలు’’ జలపిత అన్నాడు.

“అయినా సరే నా పైకి కత్తినే దూయాలనకుంటున్నావా?’’

*

మేఘాలే జలపిత ఆహారం.

అతని అరికాళ్ళు మేఘాలు. అతని చేతులు కూడా.

అందుకే ప్రతిసారీ జలపిత పేరు మారిపోతూ వుంటుంది.

*

 

జలపిత సర్వత్రం.

ప్రతి జీవీ, ప్రతి వ్యక్తీ అతనే. కానీ అతను ఎవ్వరూ కాదు.

అతనే జలపిత.

*

రెండు వేల సంవత్సరాల క్రితం జలపిత ఆత్మకథ రాసే ప్రయత్నం జరిగింది.

కానీ పదాల్లో జలపిత ఇమడకపోయేసరికి ఆ ప్రయత్నం మానుకున్నారు.

అతను పదం నుంచి పిండి రాలినట్టు రాలాడు. ప్రజలంతా అటు ఇటూ పరుగులు తీసారు.

అతని కోసం ఆకాశం కేసి, నేలకేసీ చూసారు.

 

జలపితను వర్ణించడం అసాధ్యం.

*

ఉద్వేగం బట్టి జలపిత పేరు మారుతుంటుంది. వాతావరణ మార్పుల వల్ల కూడా.

నీటికి అతను ఎంత చేరువలో వున్నాడన్న సంగతి మీద ఆధారపడీ అతని పేరు మారుతూపోతుంటుంది.

*

జలపిత బేబెల్ స్తంభం కొసకు లిఫ్ట్ లో వెళ్ళి ఒకసారి కిందకు తేరిపార చూసాడు.

ఆ పట్నం వీధుల్లో దుమ్మలో ఒక బూరబుగ్గల పిల్లవాడు తన ముక్కు లాక్కుంటూ కనిపించాడు.

“ఈ పిల్లవాడు నా శిష్యుడు అయ్యే అవకాశం వుంది’’ అనుకున్నాడు జలపిత.

“ఎందుకంటే అతనికి జీవన రహస్యం విచ్చుకున్నస్వాతి ముత్యపు చిప్ప.’’

జలపిత తన అదనపు పాదాన్ని ఆ స్తంభం కొనపై నుంచి సరిగ్గా ఆ వీధిలోకి మోపి ఆ పిల్ల వాడి పక్కన కూర్చున్నాడు.

“మీ శిష్యుడినేనా?’’ ముక్కు లాక్కోవడం ఆపి అడిగాడు ఆ పిల్లవాడు.

“కాదు’’, జలపిత ఆలోచించాడు.

ఈ పిల్ల వాడికి స్థిమితం లేదు.

ఇతను నా శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేడు.

*

జలపితను ఆరగించవచ్చు. జలపితపైన నడవచ్చు.

అతనొక మైదానం.

*

జలపిత గుర్రపు పందేలకు వెళ్ళి మొదటి వరసలో కూర్చున్నాడు.

పక్కనే ఒక ముసలి మహిళ. వయసు పైబడి చూపు దూరమవుతోంది.

ఆమె జలపితను గుర్రం అనుకుని భ్రమించి భయంతో అరిచేసింది. ఆమె జలపిత దృష్టిలో పడింది.

ఎందుకంటే ఆమె తన కళ్ళద్దాలు ఇంట్లో మరచి వచ్చింది. అందుకే గుర్రపు పందేలను చూడలేకపోయింది.

ఆమె చూడగలిగిందల్లా ఒక్క జలపితనే.

ఆమె అరుపును కూడా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థిలో లేరు. అంతా పందేల్లో తలమునకలైపోయారు.

ఇంతలో ఆమె చూపునుంచి తప్పించుకుని తన ఎడమ చేతి వెనక్కి వెళ్ళిపోయి నక్కి దీర్ఘ ఆలోచనల్లోపడ్డాడు జలపిత.

గుర్రాలు వేరుగా, వేగం వేరుగా పరిగెత్తుతాయన్నది అతని ఆ ఆలోచనల సారం.

*

రాత్రంతా ఎటు పడితే అటు తిరిగి మెల్లిగా ఒక బాయిలర్ గదిలో నిద్రపోయాడు.

నిప్పురాజేసేవాడు భలే సోమరి. వాడికి బొగ్గులు, మొద్దులు వెతికి తెచ్చి వేసే ఓపిక లేక అక్కడే కనిపించిన జలపితను ఆ మండుతున్న భట్టీలోకి వేసి అగ్గి రాజేసాడు.

ఆ ఆకాశ హర్మ్యానికి వెచ్చదనాన్నిచ్చే ఆ భట్టీ గొట్టంలో తన దేహం పయనించడం గమనించిన జలపిత ఆశ్చర్యపోయాడు.

మొదట్లో ఆవిరితో కలిసి పయనించడం ఆహ్లాదంగా తోచింది అతనికి.

కానీ కొద్దిసేపటికే బేజారనిపించి ఆ భట్టీ గొట్టాన్ని పగులగొట్టి బయటపడ్డాడు.

అగ్నిమాపక దళం, భద్రతా సిబ్బందీ ఆ భవనం చుట్టుముట్టి నిచ్చెనలు వేస్తున్నారు హడావిడిగా.

ఈ లోగా భట్టీ గొట్టాలనుంచి తన దేహాన్ని కూడబలుక్కుని జలపిత వాళ్ళతో ఇలా అన్నాడు.

“జలపితతో భవనాలను వెచ్చబరచడం ప్రమాదకరం.’’

*

పదాన్ని విశ్వసించాడు జలపిత. అయితే ఆ పదం అతని ఎముకలన్నిటినీ విరిచి, అతని ఆత్మనంతా నుజ్జునుజ్జు చేసేసింది. అదే పదం జలపితను గానుగలో వేసి సిమెంట్, కంకర, చెదారంతో కలిపేసింది.

పాపం జలపిత ముక్కలుముక్కలై పడి వున్నాడు.

గానుగ చుట్టూ తిరుగుతున్న ఆ అవిశ్వాస పదం ఇలా పాడుతోంది తనలో తానుః

“వెర్రిబాగులోడులే జలపిత.

నమ్మతాడా ఎవడైనా పదాలను.

నమ్ముకుంటాడా ఎపుడైనా పదాలను.’’

*

జలపితతో వాళ్ళు బలవంతంగా నీళ్ళు మోయించారు.

నీటిని ఛిద్రం చేయడం ఇష్టం లేక అతను మొత్తం నదినంతా తన దోసిలిలో పట్టి తెచ్చి బల్ల మీద పెట్టాడు.

నదిని తిరిగి మళ్ళీ తీసుకుపొమ్మని అతణ్ణి ఆదేశించారు.

అత్యంత విధేయతతో జలపిత తీరం పక్కకు నదిని చేర్చాడు.

అతను చాలా సేపు అలా నిశ్చలంగా నిలబడిపోయాడు.

తనతో పాటు ఇతరులూ విస్థాపన చెందినందుకు బాధపడ్డాడు.

జలపిత చాలా మంచోడు.

*

జలపిత ఉద్యానవనానికి వెళ్ళి మొదటి వరుసలోని బల్ల పైన కూర్చున్నాడు.

దాహంలో వున్న జనాలు ఒకే ఒక్క నీటి చుక్క కోసం ఎంత తహతహలాడతారో అచ్చం అదే శైలిలో ఎంతగానో ఏడవాలనుకున్నాడు.

కానీ అలా చేయడం అతనికి చేతకాదు; తెలియదు.

 

తన బాహువులు, అరి పాదాలూ నేలకు ఆనించి చాలా బాధగా, గజిబిజిగా కూర్చున్నాడు.

దాంతో అతని చుట్టూ పిల్లలు మూగారు. ఆ పిల్లలు అతనిపైన ఇసుక చల్లుతున్నారు.

తన పెదాలపైన క్రమంగా మీసాలు ఏర్పడుతుండగా జలపిత ఇలా అనుకున్నాడుః

“కనీసం ఒక్క రోజన్నా చనిపోవడం ఎంతబాగుండునో.’’

అతని పైనంతా పిల్లలు దోగాడుతున్నారు.

పిల్లలు తడి ఇసుక అంటిన తమ చేతుల్తో జలపిత ఆకుపచ్చ కనురెప్పల వెంట్రుకలను పీకారు.

అవి బల్లుల్లా విడివడి గడ్డిలోకి కనుమరుగయ్యాయి.

 

జలపిత తరచూ ఉద్యానవనానికి వెళ్ళేవాడు. అప్పుడల్లా తనే గాలి లోని జాగాలనంతా ఆవరించాలని అనుకునే వాడు. అప్పుడు ఆ జాగాలంతా భారీ పుట్టగొడుగుల్లా ఉద్యానవనమంతా వెలిసేవి.

అటుగా వెళ్ళేవాళ్ళు ఓ గుప్పెడు జలపిత ఆలోచనలను కోసుకుని వెళ్ళే వాళ్ళు.

*

Art: Ananthu

జలపిత ఒక నీటి టెలిగ్రాఫ్ యంత్రాన్ని ఆవిష్కరించాడు.

మనం చేయవలసిందల్లా మన ముఖాన్ని నీటిలో పెట్టి ఆలోచనల్ని విరజిమ్మడమే.

అవి అలా భూగోళం వేరే అంచుకు ప్రసారం అయిపోతాయి.

మీకు టెలిగ్రాం అందాలంటే మీ దగ్గర ఆ నీటిని ఆపే కుళాయి మీట వుండాలంతే.

*

ఆవిరి స్నానం చేసే గదిలోకి వెళ్ళాడు జలపిత. గదిలో వున్న పై అంచు బల్లను చేరుకుననేందుకు దోగాడాడు. జలపితను అమితంగా సంతోషపరచాలన్న తపనతో ఆ ఆవిరి గది మాలి జలపిత కాలికి ఆవిరి పట్టాడు.

దాంతో జలపిత కాలు ఊడి కిం…ద…ప..డిం..ది.

అది అమాంతం ఆవిరి గదిలో తలంటుకుంటున్న ఒక మెథడిస్ట్ పైన పడి హతమార్చింది.

తన నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణి కన్నుమూసిందని చాలా సేపు వేదన చెందాడు జలపిత.

*

emma-1

విషయాల ద్రవ్య స్థితి గురించి ఆలోచిస్తూ తీరం వెంట నడుస్తున్నాడు జలపిత.

అప్పుడే అక్కడికి చేరిన ఒక అమ్మాయి ఒక పదంతో అల్లిన ఒక కళ్ళెం జలపితపై వేసింది.

ఆ పదం జలపిత తలలోని అన్ని ఆలోచనలనూ చెదారంలా మార్చేసేసరికి అతను ఓ కుప్పలా మారిపోతున్నాడు.

తనెంత పని చేసిందో ఆ అమ్మాయికి అస్సలు తెలియదు.

జలపిత తీరంలో పడి వున్నాడు. అలలు అతనిపై కదలాడుతున్నాయి.

“హమ్మా… చాలా కష్టంగా వుంది.’’ జలపిత ఫిర్యాదు చేసాడు.

ఆ ఫిర్యాదు పట్టించుకోని అలలు అటూ ఇటూ తిరుగుతూ అలవోకగా జలపిత దేహంలోని ఒక్కో అంగాన్ని, భాగాన్ని, అవయవాన్ని, చివరకు అతని ఆత్మనూ తుడిచిపెట్టేసాయి.

ఇసుక గతుకుతూ చాలా ఇబ్బంది పడ్డాడు జలపిత.

 

“జలపిత జలపితే ఎందుకు?’’, తనని తాను ప్రశ్నించుకున్నాడు.

జలపిత మరణానికి ఒక నిర్లక్ష్య ఆలోచన చాలు.

*

బాగా అలసిపోయాక నేలపై చేరగిలపడి తన చుట్టూ వున్న మైదానాలను కలగాపులగం చేసాడు జలపిత.

అప్పుడు దృశ్యాలతో సాలిటైర్ అడాడు.

అప్పటికి గాని అతని మనసు కుదుటపడలేదు.

*

జలపిత ఎప్పుడు యాత్రలకు వెళ్ళినా తన జేబులో ఒక మైదానాన్ని అదనంగా ఉంచుకునేవాడు.

*

జలపిత ఒక బంక కనుగొన్నాడు.

అది మధుర క్షణాలను ఏకంగా ఏడాదులుగానూ చేయగలదు.

దుఃఖ గడియలను కుదించనూ గలదు.

శతాబ్దాలను, యుగాలను కూడా చీమకాలంత చిన్నగా, చిటికె అంత సన్నగా, మెరుపంత లిప్తంగా చేసేయగలదు.

*

అలా వీధుల్లో నడుస్తుండగా ఒక ముసలి మహిళ బాగా బరువున్న సూట్ కేస్ మోసుకుంటూ వెళ్ళడం గమనించాడు జలపిత. తను సాయం చేస్తానని అడిగాడు. అంతే అలా అనీ అనగానే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె నీడకూడా ఎక్కడా కనిపంచలేదు. ఆశ్చర్యం వేసింది జలపితకి. ఉత్తర క్షణంలో తనకే తోచింది. మనుషులు తను నడిచినట్లు నడవలేరని. అలా ఆ మహిళ ఒక అడుగు వేసిందో లేదో జలపిత నగర శివారుకు చేరుకున్నాడు.  చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళి తన నుంచి తప్పి పోయిన మహిళను వెతికాడు.  తన లగేజీతో జలపిత ఉడాయించాడని ఆమె గ్రహించేలోపే ఆమెను చేరుకున్నాడు.

*

జలపిత ఒక కచేరీకి వెళ్ళాడు. ఆ సంగీతం అతడి దేహాన్ని చిన్ని ధూళి రజనులుగా మార్చి వేసింది.

ఆ రజను కణకణంగా తిరిగి కూర్చుకునేందుకు అతనికి సుమారు ఏడాది పట్టింది.

*

రెడు ప్రేమ పక్షులు జలపిత సాయం అర్థించాయి.

“మాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసినా కార్లు, ఇళ్ళు, వీధులే.’’

ఆ దంపతుల అభ్యర్థన తిరస్కరించలేకపోయాడు జలపిత. వీధులను కట్టేందుకు వాడే బింగరాళ్ళపై వాలాడు.

అతని శరీరం వ్యాకోచించింది. అది క్రమంగా చెట్లుగా, పొదలుగా అవతరించింది.

ఆ పరిసరాల్లో వున్న కార్లన్నీ కొత్తగా నెలకొన్నఆ ఉద్యానవనం చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చింది.

*

జనాలకు మరీ దగ్గరవడం వల్ల తనలో కలిగిన క్షోభ నుంచి, ప్రేమ నుంచీ స్వాంతన పొందేందుకు వర్షాన్ని అవిష్కరించాడు జలపిత ఒకానొక నిద్ర లేని రాత్రిలో.

*

జనాలు జలపితని వేధించారు.

కానీ తనను తాను రక్షించుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు జలపిత.

అంతటి మంచితనం అతనిది మరి.

*

జలపిత వీధిలో నడుస్తున్నప్పుడు, “ఎందుకు జనాలు చేతులూపుకుంటూ నడుస్తారు’’ అని ఆలోచించాడు.

అతనికి ఈ సమాధానం దొరికిందిః స్థలాన్ని కొలిచేందుకూ, స్థిమితాన్ని కొనసాగించేదుకూ, విశ్వాంతరాళ వాయువులు తమలో ప్రసరింపచేసుకునేందుకూ మనుషులు చేతులూపుతూ నడుస్తారు.

*

మితి మీరిన డొల్లతనం తనను ఆవరించినపుడు జలపిత ఒక వ్యాపారం మొదలు పెట్టాడు.

స్వర్గ తుల్యమైన లోయలనూ, మేఘాల బావులనూ, మడతపెట్టిన ఉరిమే మేఘాలను, ఉరమని వాటినీ అద్దెకివ్వడమే అతని కొత్త వ్యాపారం.

నిరుద్యోగులకు ఎలాంటి అద్దె లేదు.

ఇక ఉన్నవాళ్ళకు వాళ్ళ వాళ్ళ జీతాలను బట్టి అద్దె ఐదుసెంట్ల నుంచి వెయ్యి డాలర్ల వరకూ నిర్ణయించాడు.

జలపిత తన వ్యాపారంలో భాగంగా గ్నాపకాలతో కట్టిన మైదానాలనూ విక్రయించాడు.

*

Art: Ananthu

జలపిత మహాసముద్రం పైన ఒక వంతెన నిర్మించాడు. దానిపైన జనాలు నడుస్తున్నప్పుడు ఆ ఎత్తుకు భయపడి కిందపడిపోకుండా వంతెనకు అటు ఇటూ చెట్లను నాటాడు.

ఆ వంతెన చిత్తడిగా వుండింది.

ఎందుకంటే దాన్ని మహాసముద్రపు నీటితోనే జలపిత నిర్మించాడు.

దాన్ని ముగ్గురు తాగుబోతులు దాటే దుస్సాహసం చేసారు.

వారికివేమీ లెక్కేలేదుగా మరి.

*

కోర్టు అధికారులు జలపిత దగ్గరికి వచ్చి తమతో విబేధించమని ఆహ్వానించారు.

అప్పుడు జలపిత సూర్యుడివైపు చూస్తూ నీటిలో వున్నాడు.

చుట్టుపక్కల చుక్క నీరూ పడకుండా జాగ్రత్తగా తన తడి దేహాన్ని పిండుకుంటుండగా న్యాయాధిపతులు జలపితని ఇలా ప్రశ్నించారుః

“న్యాయం అంటే ఏమిటి?’’

“మిల్లీ మీటర్లలో కొలిచే మంచితనమే న్యాయం.’’

ఇలా జలపిత తన జవాబు చెప్పిచూసేసరికి విచారణ గదిలో ఎవరూ కనిపించకపోవడం గమనించాడు.

తన తడి దేహం పిండగా రాలిన నీటిలో న్యాయాధిపతులు కొట్టుకుపోవడాన్ని జలపిత గమనించనేలేదు.

వాళ్ళంతా ఒక నదిలో తేలారు.

చావు బతుకుల మద్య వున్న వాళ్ళను గట్టుకు తెచ్చింది ఇంగ్లీషు పర్యాటకులున్న ఒక పెద్ద పర్యాటక నౌక.

 

*

అవపాతాన్నీ, తాపమానాన్నీ కొలిచే పరికరంగా కూడా జలపితని వాడడచ్చు.

*

ఒక వ్యక్తి బొద్దింక మెడకు తాడుకట్టుకుని జలపిత దగ్గరకు వచ్చి తమ తగవు తీర్చమని కోరాడు.

“ఇతను నా జీవితం దుర్భరం చేస్తున్నాడు.’’ బొద్దింకని చూపుతూ ఫిర్యాదు చేసాడు ఆ వ్యక్తి.

“మంచిది.’’ అని మనిషి, బొద్దింకల దేహాలను తారుమారు చేసాడు జలపిత.

కొద్ది రోజుల తర్వాత వ్యక్తి మెడకు తాడు కట్టుకుని బొద్దింక వచ్చింది.

అట్లాంటి దయలేని వ్యక్తితో జీవించడం దుర్లభంగా వుందని జలపితతో వాపోయింది బొద్దింక.

అప్పుడు ఎవరి దేహం వారికి తిరిగి ఇప్పించాడు జలపిత.

ఇద్దరూ చెరో దారిలో వెళ్ళిపోయారు.

అయితే చాలా దూరం ఒకరినొకరు వెనక్కి తిరిగి చూసుకుంటూనే నడిచారు.

 

*

లౌకిక వ్యవహారాల నుంచి కాసేపు దూరంగా వుండాలని నిశ్చయించుకున్నాడు జలపిత.

విశ్వపు అట్టడుగు పొరల్లోకి వెల్ళిపోయాడు.

తన కాళ్ళను శూన్యంలో వేలాడేసి, తన తల ఆకాశమంతా వ్యాపించడాన్ని వినడం మొదలుపెట్టాడు.

సరిగ్గా అప్పుడే ఎవరో తన బొజ్జ దగ్గర గిలిగిలి పెట్టారు.

జలపిత కిందకు చూసి నిట్టూర్చాడు.

ఒక వ్యక్తి కుమారుడికి తనే మార్గదర్శిగా వ్యవహరిస్తానని ఎప్పుడో ఇచ్చిన తన మాట గుర్తుకు వచ్చింది జలపితకి. భూమి మీద నిలబడి ఒక పూల రెమ్మతో జలపితకు గిలిగిలిపెట్టింది ఆ తండ్రే.

అతను నామకరణ ఉత్సవాన్ని గుర్తుచేసాడు జలపితకి. ఆ పూలరెమ్మను విరిచిపారేయాలనుకున్నాడు జలపిత.

ఆ వ్యక్తికి ఉన్నదల్లా ఆ పూలరెమ్మ ఒక్కటేనన్న విషయం జలపితకు గర్తుకు వచ్చి జాలిపడి విరమించుకున్నాడు.

 

జలపిత మంచితనం అనంతం.

*

తన తల శకలాల కోసం తడుముకున్నాడు జలపిత.

వాటిని అంతరాళం అంతటా చల్లాడు.

అదంతా తన మామూలు రూపం తీసుకునేంతవరకు నిరీక్షించే వ్యవధిలేకపోవడంతో వాటినంతా గాలితో మిళితం చేసేసాడు.

తన అరికాళ్ళతో తాడించి సతత హరితంగా మార్చేందుకు ప్రయత్నించాడు.

అవి వాటి మార్గంలో పేలిపోయి విచ్చలవిడిగా పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు.

ఆ సాయంత్రం సదరు మార్గదర్శి జలపిత ప్రవర్తన చాలా నిర్లక్ష్యంగా వుందన్న వదంతులు వ్యాపించాయి.

అతను మందు కొట్టాడు. చిందేసాడు. అసభ్యకరమైన జోకులు వేసాడు.

తర్వాతి కాలంలో అవన్నీ కొన్ని ఆఫ్రికా మతాల జడ సిద్ధాంతాలుగా ప్రాచుర్యం పొందాయి.

*

జలపితను బానిసగా అమ్మేసారు. చలువరాతి నేలను శుభ్రం చేయడం అతని రోజువారీ పని.

అతను నేలను ఎంతగా శుభ్రం చేసాడంటే, వచ్చిన అతిధులు కాలుమోపగానే సర్రున కిటికీల్లోంచి, తలుపుల్లోంచీ జారి పడిపోయారు.

 

*

ఎండ విపరీతంగా వెన్న ఒక రోజు తాపం చల్లార్చుకునేందుకు జలపిత ఒక పుచ్చకాయలోకి వెళ్ళిపోయాడు.

ఆ పుచ్చకాయను తీగ నుంచి తెంపి సంతకు తీసుకు వెల్తున్నారన్న విషయం గమనించనేలేదు జలపిత.

తీరా పుచ్చకాయను ఒప్పలు కోస్తుండగా అందులోంచి బయటపడ్డాడు జలపిత.

అప్పటికే అతని అరికాళ్ళు చెక్కివేయబడ్డాయి.

పుచ్చకాయ రసంలోంచి తన బాహువులను కూడబలుక్కుని ఒక్కసారి విదిలించుకున్నాడు.

భయ భ్రాంతులైన అతిథులు తమ కంచాలను గిరాటేసి కుర్చీల్లోంచి తూలిపడ్డారు.

ఎటుపోవాలో తోచక తొక్కిసలాట జరిగింది.

పుచ్చకాలయలు కోసుకునే చాకులతో ఒకరినొకరు పొడిచేసుకున్నారు.

ఆ విపత్తను చూసిన జలపిత అతిథుల దేహహాలలో దిగబడిన చాకులను తీసివేసి వాళ్ళందరినీ యధావిధిగా విందు బల్ల ముందు ఆశీనులను చేసాడు. వారి గాయాలను తడిమి స్వస్థత చేకూర్చి దగ్గరలో వున్న కొలను నుంచి కొంత నీటిని తెచ్చేందుకు వెళ్ళాడు.

ఆ కొలను దగ్గరే పిట్టలు నివాసం వుండేది.

ఆ కొలను దగ్గర ఏవేవో మాటలు ఉచ్చరించాడు.

దాంతో పరిశ్రమల్లో, జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది.

అతను ఉచ్చరించిన మాటల్లో మచ్చుకు ఒకటిః  చాకు లేకుండా కూడా పుచ్చకాయ తినవచ్చు.

*

“నువ్వు లేకుండా నేను బతకలేను.’’ జలపితతో అంది ఓ నీటి చుక్క.

“నువ్వు చాలా గొప్పవాడివని నాకు తెలుసు. నువ్వు జలపితవి. నేను మామూలు నీటి చుక్కని.

అయినా అదంతా నాకు పట్టదు. ఎందుకంటే నేను నువ్వు లేకుండా బతకలేను.’’

జలపిత నిశ్చేష్టుడయ్యాడు.

అంతటి ఆశ్చర్యంలో నిలుచున్న చోటే మూడు రోజులు స్థాణువై వుండిపోయాడు.

నాలుగో రోజు జలపిత ఇలా పలికాడుః

“నేను లేకుండా బతకలేక పోతే, నాతోనే బతుకు.’’

ఇలా అనగానే అతని చెవి వెనుకకు చేరింది నీటిచుక్క.

లోకమంతా పగలబడి నవ్వింది.

నీటి చుక్కతో ఏదో లోపాయకారి ఒప్పదం చేసుకుని దాన్ని జలపిత పటాయించాడని అనుకున్నారంతా.

“నువ్వు ఊహించగలవా ఇది?’’ కిందపడి దొర్లుతూ పగలబడి నవ్వుతూ ఒక కొండముచ్చు ఇంకో ముచ్చుతో పిచ్చాపాటి మాట్లాడుతోందిలా.

“వాళ్ళు పక్కపక్కన నడుస్తుంటే, వాళ్ళంత ఎత్తు వుంది అది. వాళ్ళిద్దరినీ చూసిన ఓ గోమాత నవ్వాపుకోలేక పొరబోయి చనిపోయిందికూడా,’’ అంది నవ్వుతూ ఇంకో కొండ ముచ్చు.

అప్పుడు మనుషులనూ, జంతువులనూ కలిపి జలపిత అడిగాడు.

“ఇందులో అంత పగలబడి నవ్వే సంగతి ఏముంది?’’

“అది చిన్నది. నీకన్నా సిగ్గు వుండొద్దా జలపితా!” అని అడిగారంతా.

 

తన అరచేతిలో వున్న నీటి చుక్కను వారికి చూపుతూ జలపిత అన్నాడు.

“చిన్నదీ, పనికి మాలినదీ అంటూ ఏదీ లేదు.’’

 

ఆ నీటి చుక్కలో తమ ఛిద్రమైన ముఖ బింబాలను చూసుకున్న వాళ్ళంతా భయంతో తలో దిక్కు పారిపోయారు.

ఆ నీటి చుక్క అంతకంతకూ పెరిగి వాళ్ళ ముందు సూర్యుడంత పరిణామంలో వ్యాకోచించింది.

అందరూ దాని ముందు ఇసుక రేణువుల్లా వున్నారు.

ఇదే జలపిత సంకల్పం.

*

Art: Ananthu

వీధిలో నడుస్తున్న రెండు దీపాలు జలపితని నిలదీసాయి.

“నువ్వు ప్రకాశమా?’’

“నేను మిణుకు’’ బదులిచ్చాడు జలపిత.

దాని తర్వాత అందరూ కలసి పబ్ కి వెళ్ళి మందుకొట్టారు.

 

“నీటి నుంచి దుఃఖం జనించింది.’’ అన్నాడు జలపిత

*

ఇసుకలో కూర్చుని తన పిడికిళ్ళతో కళ్ళు నులుముకుంటున్న ఒక పిల్లవాడు జలపితను “పవనం అంటే ఏమిటి?’’ అని అడిగాడు.

“పవనం నైరూప్య జలం.’’ జలపిత జవాబు.

*

“జనాలు ఎందుకు పొగతాగుతారు?’’ అని గందరగోళ పడి, మళ్ళీ తనే చటుక్కున తమాయించుకేని “తమ గౌరవార్ధం ఇంకెవ్వరూ అగరబత్తీలు వెలిగించరు కాబట్టి తమను తామే గౌరవించుకోవాలన్న దిగులుతో జనాలు పొగతాగుతారు.’’ అని నిర్ధారించుకున్నాడు జలపిత.

*

సాంకేతికత పరమావధిపైన తన అభిప్రాయం వెలుబుచ్చాలని జలపితను కోరారు.

“జనాలు తమ వెంట్రుకలతో తమనే పైకి లేపుకునే సత్తా ఇస్తుంది అది.’’ ఇదీ జలపిత సమాధానం.

అయితే అదేదో మెట్ట వేదాంతంలా వుందనిపించి పత్రికా విలేకరులు అతని సమాధానాన్ని నమోదే చేసుకోలేదు.

*

జలపిత నది పక్కన బల్ల మీద నిద్రపోతున్నప్పుడు ఇద్దరు ఆకతాయిలు అతని గుండెలోకి గాలం వేసి చేపల వేట మొదలుపెట్టారు.

ఒక ఆకతాయి జలపిత గుండెలోంచి జల్ల చేపని లాగేసినప్పుడు మెలకువ వచ్చింది.

కానీ నిద్రలేవాలని లేదు జలపితకి.

ఆకతాయిల వైపు చూసి తన మనికాలితో మెల్లగా బల్లను తాకాడు.

ఆ కుదుపుకి ఆకతాయిలు బోర్లాపడి ముక్కులు పచ్చడి చేసుకోకుండా జాగ్రత్తగానే బల్లను తాకాడు జలపిత.

వారి కాలి కింది బల్ల రెండు గా చీలిపోయింది.

ఒక ముక్క జలపితని నేరుగా మహాసముద్రం లోకి తీసుకువెళ్ళింది.

*

ఈతగాళ్ళు జలపిత దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసారు.

“లావుగా వున్న వాళ్ళు మమ్మల్ని ఈత కొట్టనివ్వడం లేదు. వాళ్ళు దిగగానే నదిలోని నీళ్ళన్నీ చెల్లా చెదరై బయటపడిపోతున్నాయి.’’ అన్నారు బక్క ఈతగాళ్ళు.

“బక్కవాళ్ళు మమ్మల్ని ఈత కొట్టకుండా ఆపుతున్నారు. వాళ్ళు ఈతకు దిగితే నీళ్ళు జ్యామితిగా, డొల్లగా తయారవుతున్నాయి. అట్లాంటి నీటిలో ఎవరైనా ఎట్లా ఈత కొడతారు?’’ అని వాదించారు లావున్న ఈతగాళ్ళు.

జలపిత వాళ్ళిద్దరి వంకా చూసాడు. ఇసుక వైపు చూపు సారించాడు.

అక్కడే ఈతగాళ్ళంతా నిలబడేది.

అప్పుడు వాళ్ళ కోసం రెండంస్తుల నీటిని సృష్టించాడు జలపిత.

ఒక అంతస్తులో బక్కవాళ్ళు, మరో అంతస్తులో లావు వాళ్ళు ఈతకొట్ట వచ్చు.

 

*

“లోకాన్ని వగతుగా చేస్తున్నాడు జలపిత.’’ అని అభిప్రాయపడిన బుధ వర్గం జలపితపైన వ్యాకరణం విధించాలని నిశ్చయించుకున్నారు.

జలపిత అసలు జలపితే కాదనేసారు.

అతని మూలాలు అనుమానాస్పదమైనవి అన్నారు.

బహుశా సంస్కృతంలో వున్న “జలి – పితర్ ‘’ అన్న రెండు పదాల అపభ్రంశమే అతను అని తేల్చారు.

జలపితర్ అంటే నీటి తండ్రి. జల చర అంటే నీటి జీవి.

జలపితను తోసిరాజంటే తప్ప లోకంలో ఎక్కడుండాల్సింది అక్కడ వుండదు అని బుధ వర్గం అభిప్రాయపడింది.

పైగా సంస్కృతం ఒక మృత భాష; జలపిత కూడా అంతే – అని తేల్చేసిన బుధవర్గం తమ గ్రంధాలను తెరిచింది.

అయితే బుధవర్గం ఇలా జలపితను తూష్ణీకరించి అతని పేరు మూలాలగురించి మల్లగుల్లాలు పడుతుండగా వ్యాకరణ గ్రంథంలో సరిగ్గా అప్పుడే చేరిన జలపిత పేరు తాజా దవన దళంలా పరిమళించింది.

తమ అసలు సంగతి మరచి పోయి బుధ వర్గం తమ సులోచనాలను తొలగించి నీటి శబ్దానికి నిశ్చేష్టులయ్యారు. జలపితలోపల పాడుతున్న పక్షులతో జత కలిపి చిందేసింది బుధవర్గం.

*

ఇనుముకు తనే సూర్యుడినని వాన ఎలా భరోసా ఇచ్చిందో నీటి గొట్టంలో ఉన్నప్పుడు విన్నాడు జలపిత.

వాన భాషలో అన్నన్నేసి అచ్చులు లేకపోయి వుంటే ఈ విషయం ఇనుముకు చటుక్కున అవగతం అయ్యి వుండేది కదా అనీ అనుకున్నాడు జలపిత.

*

“కొంచెం తప్పుకో’’ చెట్టు కొమ్మల మద్యలో నిద్రిస్తున్న జలపితను ఓ చిట్టి గువ్వ అడిగింది.

జలపిత జరిగాడు.

సగం విశ్వం ధ్వంసం అయ్యింది.

గువ్వ కిచకిచమంది.

అప్పుడు జలపిత అన్నాడుః “స్థూలాన్ని ధ్వంసం చేయగలదు సూక్ష్మం.’’

*

ఒక రోజు ఉదయం తప్పనిసరిగా ఆసనాలు వేయాల్సి వచ్చింది.

నిరాకరించడానికి తటపటాయించాడు జలపిత.

అందుకే సూర్యగ్రహణం తెప్పించాడు.

తమ చాకచక్య లేమికి వేరెవ్వరూ చంకలు గుద్దుకోకుండా అలా చేసాడు.

*

గాలికి అభిముఖంగా తన పాదాన్ని గీకాడు జలపిత.

అలా గాలితో చదరంగం ఆట మొదలైంది.

“ఆటకట్టు, అబ్బాయి.’’ అంది గాలి.

తన తర్వాతి అడుగు గురించి జలపిత తీవ్రంగా ఆలోచిస్తూ వున్నాడు చాలాసేపు.

చివరికి స్పందించి “కట్టుకు పై కట్టు’’ అని చెప్పి ఆట గెలిచాడు.

*

‘జనాలు ఎందుకు నీట మునిగిపోతున్నారు?’ అని ఒక సారి జలపిత సుదీర్ఘంగా ఆలోచించాడు.

ఎందుకంటే అతనికి నీటి గురించి బాగా తెలుసు.

పైగా నీరు సుదీర్ఘమనీ, అందులో మునిగే వీలే లేదనీ అతనికి బాగా తెలుసు.

ఖచ్చితంగా నీటిలో రంధ్రాలేవో వుండి వుండాలి.

వాటిల్లో పడే జనాలు అలితిగా చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చాడు జలపిత.

ఈ రంధ్రాలను దిండ్లతో కనుక పూడ్చ గలిగినట్టయితే జనాలు నీట మునగడాన్ని నివారించవచ్చు.

*

ఒక వేసవి కాలంలో గ్రంధాలయం ముందు జలపిత నడుస్తున్నప్పుడు దాని నిశ్శబ్దానికీ, నిర్మలతకీ ముగ్ధుడయ్యాడు.  కిటికీలకున్న దోమ తెరల్లోంచి తన దేహాన్ని లోనికి అనుమతించాడు.

పుస్తకాల అరల మధ్య నిద్ర పోయాడు.

ఎంత ఘాడంగా నిద్రించాడంటే అతని చేతిలో కొంత భాగం, భుజంలో కొంత భాగం పుస్తకాల్లో కూరుకుపోయేంతగా.

లోహ ముఖపత్రాలతో రూపొందించిన ఒక అతి భారీ, అతి పురాతన పుస్తకాన్ని గ్రంధమాలి తన పొత్తిలి లోకి చొప్పిస్తున్నప్పుడు జలపితకు మెలకువ అయ్యింది.

అది జలపిత ఉరఃపంజరానికీ, పొత్తి కడుపుకూ మధ్య ఇమడటం లేదు.

తన ఖాళీ కడుపుపైన ఇలాంటి అనుకోని దాడి ఇబ్బందిగా అనిపించింది జలపితకి.

అయితే ఆ వృద్ధ గ్రంధమాలికి తను తక్షణం కనిపిస్తే గుండె ఆగి చస్తాడని జలపితకి తెలుసు.

పైగా అతను జలపితకు సుపరిచితుడు.

పైగా అతనికి మూఢనమ్మకాలెక్కువ.

పైగా అతని భార్య గయ్యాళి.

అందుకే అయ్యో పాపం అనుకుని జలపిత అతనికి కనిపించడం మానివేసాడు.

ఆ పాత గ్రంధాన్ని తన దేహంలో సర్దుకునేందుకు తన పొత్తి కడుపును మెడవరకు జుర్రుకున్నాడు జలపిత.

ఆ తర్వాత తన పేగుల్లో పడిన ముద్రలను తొలగించుకునేందుకు దాదాపు కొన్ని వారాలు తన పేగులను ఇస్త్రీ చేసుకోవడంలోనే తలమునకలైపోయాడు.

“నా ముఖం చూసిన వారంతా నీటి వంక చూస్తారు.’’ ప్రకటించాడు జలపిత.

*

గణిత శాస్త్ర వేత్తల సమావేశానికి జలపితని ఆహ్వానించారు.

అంతరాళ వంపుల నియమాలను లెక్కించే క్రమంలో పాల్గొనేందుకే అందింది ఆహ్వానం.

ప్రతిపాదిత సిద్ధాంతాలన్నింటినీ ఆలకించాడు జలపిత.

అప్పుడు తన అతి పిన్న వయసు చిటికెన వేలు మూత తీసాడు.

దాని లోపలినుంచి ఒక పుష్ఫాన్ని బయటికి లాగాడు.

ఫలితాన్నిగణిత శాస్త్ర వేత్తలకు వివరించాడు.

ఈ ఆవిష్కరణకు ముగ్ధులైన వాళ్ళందరూ తమ కుర్చీలను గిరాటేసేసి పరిగెత్తారు.

దారిలో వాళ్ళ కళ్ళద్దాలు వదులుకున్నారు.

నేరుగా పచ్చిక మైదానాల్లోకి వెళ్ళి సీతాకోకచిలుకలను వడిసి పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.

 

*

జలపిత మొక్కల్లోపలికి వెళ్ళిపోయాడు.

వాటిల్లోనే రెండు వందల సంవత్సరాలు యానించాడు.

జలపితలో వున్న ఏకైక శాశ్వత గుణంః  మంచితనం.

ఇక తక్కినదంతా మిణుకే.

*

జలపిత రాయబారిగా నియోగించబడినప్పుడు అతనికి ఒక భారీ ఉక్కు కవచాన్నిచ్చారు.

కనీసం అలాగైనా తన నిర్లక్ష్యపు అరికాలితో దాన్ని నిమరడని.

కనీసం దాన్ని ధరించినప్పుడు అలా చేయడనీ.

అయితే జలపిత భావాల భట్వాడాధారుడన్న విషయమే మరచిపోయారు.

అతను ఇంత వరకెన్నడూ భావాలలోని లీలా మాత్ర లేశాన్నీ కనీసం నలపలేదు; కనీసం ఏమార్చనూలేదు.

 

జలపిత లాలిత్యం చెక్కు చెదరనిది.

 

*

జలపిత ఒక చిత్ర కళా ప్రదర్శనకు వెళ్ళాడు.

కళాఖండాలన్నీ సిగ్గుతో తమ చట్రసమేతంగా చడీ చప్పుడూ చెయ్యకుండా గది నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాయి.

 

*

“జనాలు ఎందుకు నీడలు చేస్తారు?’’ అని అడిగారెవరో జలపితని.

“ఎందుకంటే లోపలి కాంతి జనాల్లో పెద్దగా పనిచెయ్యదు కాబట్టి.’’ అని బదులిచ్చాడు.

జలపిత ఎప్పుడైనా ఆటోరిక్షాలోనో లేదా మరో డొంకదారి రవాణా వాహనమో ఎక్కినప్పుడు తన అదనపు అరికాళ్ళను, కాళ్ళనూ లగేజీ భద్రపరిచే గదుల్లోనే పెట్టేసుకునేవాడు.

 

*

Art: Ananthu

జలపిత బంగారం.

నిజానికి కంసాలులు అతడిని తరచూ వాడుకునేవారు.

ఇంకా చెప్పాలంటే జాతరలకు వెల్ళినప్పుడు నగ లాగా అతడిని ధరించేవారు జనం.

 

*

“వస్త్రాలు దేహానికీ, ఆత్మకీ గిరిగీస్తాయి.’’ అనుకున్నారు జనం.

అందుకే చివరికి జలపితని తొడుక్కున్నారు.

అలాగైనా అతడిని వర్గీకరించి, నిర్వచించాలని అనుకున్నారు.

కనీసం అతని అభిమానులు అలా అభిప్రాయపడ్డారు.

తీరా ఇది ఆచరించబోతే మరో మీమాంస ఎదురైంది.

ధరించిన వస్త్రాలకి ఆవలా జలపిత ఎంతగా వున్నాడంటే, పెద్ద పెద్ద నిపుణలు కూడా ఈ సంశయాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారు.

ఇంతకీ జలపితకి వస్త్రాలున్నాయా?

లేక వస్త్రాల చుట్టూ ఆవరించిన ఆచ్ఛాదనే జలపితా?

ఎందుకంటే అవి రెండూ కూడా జలపితే కదా!

 

 

*

ఒక దంపతులు సినిమాకి వెళ్దామనుకున్నారు.

అయితే అంత తక్కువ వ్యవధిలో తమ మూడు మాసాల పాపను చూసుకునేందుకు ఒక ఆయాను వెతికి పట్టుకోవడంలో విఫలమయ్యారు.

ఆ కారణంగా పాపను చూసుకోమని జలపితని కోరారు.

తన విధిని జలపిత తూచ తప్పకుండా నిర్వహించాడు.

ఎంతగా అంటే, కొన్ని గంటల్లో కన్నవారు సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు 20 ఏళ్ళ వాడయ్యడు.

ఆ యవ్వనుడు తనకు వెంటనే పెళ్ళి చేయమనీ, లేకపోతే సన్యాసం తీసుకుని లోక కల్యాణం కోసం పాటు పడతానని బెదిరించాడు.

ఈ యువకుడి కన్న వారి ప్రతిస్పందన చరిత్రలో నమోదు కాలేదు.

*

జలపిత ఒక జల్లెడ కనుగొన్నాడు.

అందులోంచి చెడ్డవాడిని జల్లిస్తే మంచివాడయిపోతాడు.

 

రాజకీయ కారణాల వల్ల ఈ జల్లెడని నిషేధించారు.

*

ఒక పేరు ప్రతిష్టలున్న రాజకీయ వేత్త వివాహ మహోత్సవంలో జలపితని ప్రసంగిచమని కోరారు.

జలపిత తన మాటలు మొదలు పెట్టగానే అందరూ పరారయ్యారు.

కారణంః  అతను ఉపన్యాసం ఇవ్వడానికి బదులు ఒక పిట్టల గుంపును ఆకాశంలోకి వదిలాడు.

పైగా జలపిత తన మాట నిలబెట్టుకోలేదని అతిథులంతా ఫిర్యాదు చేసారు.

ఈ సారి ఆశ్యర్యపోవడం జలపిత వంతయ్యింది.

ఎందుకంటే ఇప్పటివరకు అతను చేసిన ఉపన్యాసాలన్నింటిలోకీ అదే అత్యంత గొప్పదని అతని నమ్మకం.

అందుకే అసలు తననుంచి జనం ఏమి కోరుకుంటున్నారో జలపితకి కొంచెం కూడా బోధపడలేదు.

 

*

జలపితను పుట్టినరోజు వేడుకలకు పిలిచారు.

తొందదరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యంది.

జలపిత సత్కార్యాలు చేయడంలో పుణ్యకాలం గడచిపోవడమే ఈ ఆలస్యానికి అసలు కారణం.

అందుకే చాలా హడావిడిగా వెళ్తున్నాడు.

హఠాత్తుగా అతనికి ఒక చిన్న నీటి పాయ తన కాళ్ళ ముందే తగిలింది.

తన దారిని అడ్డుకుంటోంది ఆ పాయ.

తన హడావిడిలో జలపిత ఆ పాయను దాటేందుకు అంజె వేయబోతున్నాడు.

అప్పుడే తట్టింది.

కాళ్ళ ముందు పడివున్న వాటిని దాటడం అరిష్టం అని.

అందుకే ఇబ్బందికి లోనయ్యాడు జలపిత.

అందుకే ఆ నీటి పాయ వెంట వెళ్ళి, దాని చుట్టూ తిరిగి వేడుకలకు ఆలస్యం కాకుండా చకచకా వెళ్ళిపోయాడు.

అలా వెళ్తున్నప్పుడు ‘చిన్నా, పెద్దా’ విషయాల గురించి దీర్ఘంగా ఆలోచించాడు.

 

*

ఒక కోళ్ళ ఫారంలో గుడ్లు పొదగవలసి వచ్చింది.

చాలా శ్రద్ధగా గుడ్లను పొదిగాడు జలపిత.

ఎంత శ్రద్ధగా అంటే ఒక విమానయాన కంపెనీ తన కోళ్ళ ఫారంకు వ్యతిరేకంగా కోర్టులో దావా వేసేంత.

దావా సారాంశంః జలపిత సద్దుమణగకపోతే ఇక మా విమాన యాన కంపెనీ మూసుకోవాల్సిందే.

జలపిత కోళ్ళఫారంలో పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి దూర విమాన ప్రయాణాలు చేసే వారంతా విమానాలు ఎక్కడం మానేసి కోళ్ళపైనే ప్రయాణించడానికి మొగ్గుచూపుతున్నారు.

ఆ కోళ్ళు ప్రయాణికులను అంత వేగంగా, అంతే భద్రంగా తీసుకువెళ్తున్నాయి మరి.

 

*

జలపిత ఆవిష్కరణలన్నింటిలోకీ తూర్పు దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కొన్ని ఇలా వున్నాయిః

తీరిక లేని పొగతాగే కుక్క పిల్లల యజమానుల కోసం జలపిత రూపొందించిన కొత్త కుక్క పిల్లలు.

ఈ కుక్క పిల్లలు తమ యజమానులు వదిలిన సిగరెట్ పొగ రింగులపైన నడిచివెళ్ళగలవు.

దీని వల్ల కుక్కలకు ఎలాంటి అనారోగ్యం కానీ, ఇతర హానీ కానీ వుండదు.

ఇక పొగ తాగని యజమానలకూ ఈ కొత్త కుక్కపిల్లలు మరో వెసులుబాటును కల్పిస్తాయి.

పొగతాగని యజమానుల ఊపిరి వెంట ఈ కుక్క పిల్లలు నడవగలవు.

 

మరో ఆవిష్కరణః ఇది మరో అద్భుతం.

శుభ్రత పట్ల విపరీతమైన శ్రద్ధ వున్న సంపన్నమహిళల సౌలభ్యం కోసం జలపిత చేసిన ఆవిష్కరణ ఇది.

స్వచ్చంధ శౌచ్య రబ్బరు బూట్లు.

ఈ బూట్లు దుమ్మును తమంతట తామే తుడిచిపెట్టుకుంటాయి.

*

“లోకంలో ఆత్మమితి ఆవిష్కరించబడిన తర్వాతే తమకంటూ ఆత్మ ఒకటి వుందన్న విషయం మానవాళికి బోధపడింది.’’ నిర్ధారించాడు జలపిత.

 

సకాలంలో అవతరించడంలో విఫలమైన ఓజోను పొరే జలపిత.

కానీ జలపిత గురించి ఆలోచించిన ఉత్తరక్షణం అతను అప్పటికే తన బాహువులనూ, కాళ్ళనూ గాలి నుంచి లాగేసుకుంటూ వుంటాడు.

*

 

 

 

అనువాదకుడి మాట

 

anantజలపిత కథ(?) నా చేతికి అందినప్పుడు… ఇది తెలుగులో ఇప్పుడు ఎందుకు?

తెలుగుకి ఎందుకు? అని తోచింది.

మొదలు, మధ్య, ఘర్షణ, అవరోధం, సమస్య, ముగింపు, తెగింపు, పరిష్కారం, ఆశావాదం అనే లెక్కల తక్కెడల జల్లెడలో ఎల్లెడలా కొట్టుమిట్టాడే లేదా కొడిగడుతున్న మన కథా templates కి ఆవల కూడా కథాకథన నిర్గమనాలూ, నిమజ్జనాలూ జరిగాయనీ, జరుగుతాయనీ, జరుగుతన్నాయనీ, జరగాలనీ మరోసారి ఆశించేందుకే (నా మటుకు నేను) ఈ జలపితనీ, ఈ ఎమ్మా అందిజెవ్ స్కా నీ అనువదించాలని అనుకున్నాను.

ఎమ్మాని విస్మరించి, తూష్ణీకరించిన ‘ఆధునిక వాస్తవికతా వాద’ సరళినీ, తర్క హేతు రుజు మార్గాన్నీ, దాని కాలిక గమనాన్నీ ఏక కాలంలో, ఏకైక సమయంలో ప్రోది చేసుకుని పొందు పరచి పొదిగి… ఎవరైనా ఆ గుడ్డును పగలేసే ఆ తంతును కనులారా చూడాలని, ఆ పగిలి వచ్చే బిడ్డల రెక్కలను కౌగిలించుకోవాలనీ ఆమెకు ఇప్పుడు పాల్పడ్డాను.

ఇందులోని ‘పదాలు కట్టేయలేని’ ఆలోచనలు తెలుగు కథా, నిర్మాణ, శైలీ, నిపుణత, పాండిత్య ప్రకర్షలకీ ఏ రెండు గింజలయినా సాదరంగా చల్లకపోతాయా అనే బలమైన, బలహీనమైన మూఢనమ్మకంతోనే ఇది అనువదించాను.

ఎమ్మా అందిజెవస్కా పదాన్ని శంకించింది.

భాషేతర వాస్తవికతలో పదం తల వొంచుకుని చేతులు కట్టుకుని చిత్తగించవలసి వుంది ఇంకనూ…

గిరిలోపలి మన పదాలు వినోదమే.

అది మనుగడ కాదు.

గిరిబయట మనకింకా అందని పదాలు నవ్య నిర్వచనాలు.

లేదా నూతన కరచాలనాలు.

ఇటు మన గిరులకీ.

మన నలిగిన/రొడ్డుకొట్టుడు పదాలకీ.

*

మగవాడు – ఆడది

 

ఉర్దు మూలం: ‘మర్ద్ ఔర్ ఔరత్’  డాక్టర్ రషీద్ జహాన్ (1905-52)

ఆంగ్ల సేత : రక్షందా జలీల్

తెలుగు సేత : జగద్ధాత్రి

~

ఆడది: అరె నువ్వు మళ్ళీ వచ్చావా?

మగవాడు : అవును

ఆ: కానీ నిన్న నీ పెళ్లి కదా?

మ: అవును

ఆ: అయితే?

మ: అయితే ఏంటి ?

ఆ: అంటే పెళ్లికూతురు ఏదీ అని?

మ: నా జీవితం నాశనమవ్వాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా.

ఆ: నేనలాంటి మాట ఎప్పుడు అన్నాను?

మ: అయితే నన్ను ఇంత కష్టపెట్టడం లో నీ ఉద్దేశం ఏమిటి?

ఆ: అంటే అర్ధం ?

మ: ఎందుకలా నటిస్తావు? నేనంటున్నదాని అర్ధం నీకు ఖచ్చితంగా తెలుసు

ఆ: అలాగా. కానీ నేను ఏడాది క్రితం నుండే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాదంటున్నది నువ్వే.

మ: ఓహ్! అంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నవన్నమాట? అయితే మరి నీ ఉద్యోగం సంగతి?

ఆ: అదీ ఉంటుంది

మ: కానీ నా భార్య మరొకరి దగ్గర పని చేయడం నేను సహించలేను. ఇల్లు , పిల్లలు చూసుకోకుండా పొద్దున్నే ఇల్లొదిలి వెళ్ళడం నాకు నచ్చదు.

ఆ: నువ్వు మాత్రం పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లవా? నేను మాత్రం ఇంట్లో కూర్చుని ఈగలు తోలాలా?

మ: ఇంట్లో చేయడానికి చాలా పనులుంటాయి, ఇల్లు చక్కపెట్టుకోవడం లాంటివి ఇంకా కూడా.

ఆ: సరే …. అయితే నువ్వు ఆఫీసుకి వెళ్ళిన సమయమంతా నేను ఇంటి మూలలన్నీ చూస్తూ ఉండాలన్నమాట.

మ: నేను అలా అనలేదు. కానీ ఇంట్లో చేయడానికి చాలా పని ఉంటుంది అన్నాను.

ఆ: అంటే ఎలాంటిది?

మ: ఇదిగో చూడు , ఇల్లు చక్కపెట్టుకోవడం … ఐనా మన అమ్మలందరూ చేసిందే కదా , ఏం చేయలేదా చెప్పు?

ఆ: ఓ అంటే నువ్వానేదాని అర్ధం ఇంట్లో పొయ్యి అరకూడదని అంతేనా?

మ: నేను ఆ మాట అనలేదు.

ఆ: అయితే మరి ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అర్ధం ఏమిటి ?

మ:ఇదిగో చూడు , నాకు తెలీదు. నిన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి  నా మీద విసురువెయ్యడం నీకు బాగా అలవాటైపోయింది.

ఆ: సరే , నీకు నా గొంతు వినడం ఇష్టం లేకపోతే , నేను మౌనంగానే ఉంటాను… చెప్పు ఇంతకీ , నువ్వు నిజoగానే పెళ్లి చేసుకుంటున్నావా లేక నన్ను మెప్పించడానికి అంటున్నావా ?

మ: ఏదో ఒక రోజు పెళ్లి తప్పక చేసుకుని తీరతాను; అక్కడికి నువ్వొక్కర్తెవే ఈ ప్రపంచం లో ఆడదానివి కావు. ఐనా చెప్పు , నా గురించి నీకెందుకంత బాధ?

ఆ: ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను గనుక.

మ: భలే బాగా చెప్పావ్! నువ్వేగనుక నన్ను నిజంగా ప్రేమించి ఉంటే ఇంత మొండి పట్టుదలతో వాదించి ఉండేదానివా? …’నేను ఉద్యోగం వదలను’…. ఆఫ్టర్ ఆల్ ఏముంది ఆ ఉద్యోగం లో గొప్పతనం? అదేదో వెయ్యి రూపాయలు సంపాదిస్తోన్నట్టు .. ఇంతా జేసి సంపాయించేది వంద రూపాయలు అంతకంటే లేదు.

ఆ: అయితే అవ్వచ్చు , కానీ ఆ కొద్ది సంపాదనే నా స్వేచ్చకి తాళం చెవి లాంటివి.

మ: అంటే నీ అర్ధం నీ స్వేచ్చ అంతా ఒక వంద రూపాయల్లో ఉందనా ?

ఆ: వందా, రెండొందలా… అది కాదు ఇక్కడ విషయం. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగల శక్తి కలిగి ఉండటమే నీ స్వాతంత్ర్యానికి నిదర్శనం.

మ: నీకస్సలు నా మీద ఏమాత్రం నమ్మకం లేనట్టుందే. నీకు నేను డబ్బులు ఇవ్వనని అనుకుంటున్నావా?

ఆ: అది కానే కాదు , కానీ అది నా కష్టార్జితం అవ్వదుగా.

మ: ఎవరు సంపాదిస్తే ఏముంది… మగవాడో ఆడదో

ఆ: ఓహ్! అందులో  తప్పకుండా చాలా పెద్ద తేడా ఉంది. నువ్వు ఆ పాత పల్లెపదం వినే వుంటావుగా : మగపిచ్చుక ఒక బియ్యం గింజ తెచ్చింది, ఆడ పిచ్చుక ఒక పప్పు గింజ తెచ్చింది , రెండు కలిపి ఖిచిడి (పులగం) వండుకున్నారు అని.

Akkadi-MeghamFeatured-300x146

మ: నాకు నీ పప్పు బద్ద అక్కర్లేదు.

ఆ: నేను ఒట్టి అన్నం తినలేను.

మ: నిజమే నీకు పచ్చడి, అప్పడం, ఊరగాయాలూ కావాలి.

ఆ: నిజమే నాకు కావాలి

మ : ఎప్పుడు నిన్ను చూసినా నీ చుట్టూ నీ ఆరాధకులు మందలా చుట్టి ముట్టి ఉంటారు – దీపం చుట్టూ రెక్క పురుగుల్లాగా.

ఆ: నిజమే మరి , నువ్వు వాళ్ళని ఇంట్లోకి రానివ్వవుగా

మ: అస్సలు రానివ్వను

మ: కానీ వాళ్ళంతా నా స్నేహితులని నీకు తెలుసు

మ: అవును , మరే , చాలా దగ్గర స్నేహితులు

ఆ: అంటే దానర్ధం , వాళ్ళు వచ్చి నన్ను కలుసుకోవడానికి వీలు లేదనేగా?

మ: నాకు వాళ్ళంటే అసహ్యం

ఆ: ఎందుకో అడగవచ్చా?

మ: ప్రతి వారికి ఎవరి స్వభావం వారికి ఉంటుంది

ఆ: అయితే మరి నన్ను పర్దాలో కూర్చునేలా ఎందుకు చెయ్యవు?

మ: అలా చేయాలనే ఉంది నాకు , కానీ నువ్వు ఒప్పుకుంటావా?

ఆ: అంతేకాదు ఇంకా చాలా విషయాలున్నాయ్ నేను నీతో అంగీకరించనివి.

మ: ఏమైనా .. మిగిలినవి నువ్వు అంగీకరించినా అంగీకరించక పోయినా సరే , కానీ నీ మిత్ర మందని మాత్రం నేను భరించలేను.

ఆ: అయితే మరెవరు మన  ఇంటికి రావడానికి ఒప్పుకుంటావు?

మ: కేవలం మనిద్దరికి చెందిన మిత్రులు మాత్రమే.

ఆ: హ్మ్మ. మిస్టర్ అండ్ మిసెస్ సేథీ, మిస్టర్ సఫ్దర్.

మ: ఎందుకు? వాళ్లెందుకు రాకూడదు?

ఆ: కానీ నేను వాళ్ళని భరించలేనే

మ: కానీ ఎందుకని? ఎందుకు నీకు వాళ్ళంటే అయిష్టం?

ఆ: అదంతే.

మ: ఏదో కారణం ఉండాలి కదా

ఆ: ప్రతి ఒక్కరికీ వారివారి ఇష్టాలుంటాయి మరి

మ: మరీ చిన్న పిల్లలా మాటాడుతున్నావ్

ఆ: మరి నువ్వో?

మ: నేనెప్పుడూ సరయిన పద్ధతిలోనే సహేతుకంగానే మాటాడుతాను.

ఆ: అవును , నిజమే నువ్వాలాగే చేస్తావు. నీ వాదన ప్రకారం , నీకు నా స్నేహితులంటే ద్వేషం కాబట్టి వాళ్ళు మనింటికి రాకూడదు, కానీ నేను నీ స్నేహితుల్ని అసహ్యించుకుంటే …. ఏమి బాలేదిది! వాళ్ళు నిరభ్యంతరంగా వస్తో వెళ్తుండవచ్చును.

మ: సరే సరే బీబీ సహేబా, ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి అలసి పోయి నేను ఇంటికి వస్తే , ఏదో ఒక క్షణం భార్య తో  ఆనందంగా గడపాలనుకుంటే , ఆవిడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వస్తుంది. అయితే ఇదన్న మాట నీ మనసులో ఉన్న ఆలోచన  వైవాహిక జీవితమంటే?

ఆ: నీ మనసులో పెళ్ళైన తర్వాత జీవితం గురించి ఏమి ఆలోచన ఉందో నేను తెలుసుకోవచ్చా ? ఉదయాన్నే నువ్వు ఉద్యోగానికి వెళుతుంటే , భార్య మిమ్మల్ని చక్కగా ముస్తాబు చేసి పంపాలి …బొమ్మలా! ఆ తర్వాత తమరు వెళ్ళిన తర్వాత , ఇంట్లోనే ఉండి జపమాల తిప్పుకుంటూ తమరి జపమే చేస్తూ ఇంటి పనంతా చేసుకోవాలి. ఈ రకమైన బలవంతపు ఖైదుని ‘ఇల్లు చక్కదిద్దుకోవడం’ అంటారు. మీరు ఆఫీసునుండి అలసి సొలసి , చిరాకుతో రాగానే , మీ భార్య మిమ్మల్ని అలరించాలి , ఆ తర్వాత సఫ్దర్ సాహిబ్ కి , మిసెస్ సేథీకి కూడా మర్యాద చేయాలి.

మ: నేనలా ఏమీ అనలేదు

ఆ: అయితే ఏమిటి నువ్వన్నది?

మ: నేనన్నది అందరి ఆడవారి లాగే నువ్వు ఇంట్లో ఉంది ఇల్లు చూసుకోవాలి ……

ఆ: మళ్ళీ అదే మాట ‘ఇల్లు చూసుకోవడం’?

మ: అవును ఇల్లు కనిపెట్టుకుని ఉండటం

ఆ: నా ఉద్యోగాన్ని వదిలి నా స్వాతంత్ర్యాన్ని నేను అమ్ముకోలేను.

మ: నీ స్వాతంత్ర్యమా ?

ఆ: అవును , నా స్వేచ్ఛే

మ: అలా అయితే ! నువ్వు నీ స్వేచ్చని హాయిగా పెద్ద గుటకలు వేస్తూ అనుభవిస్తోంటే , నీ పిల్లల బాధ పడతారు.

ఆ: పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టెయ్యరు కదా

మ: ఏదో  ఒక రోజు పుడతారు కదా , దానికీ నీ అభ్యంతరం లేకపోతేనేగా

ఆ: లేదు నాకే అభ్యంతరం లేదు

మ: పోనీ పిల్లలు పుట్టాక ఐనా నీ ఉద్యోగాన్ని వదులుతావా?

ఆ: లేదు, అప్పుడు కూడా వదలను

మ: అయితే మరి ఒక్క విషయం అడగనా , పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?

ఆ: నువ్వు , నేను కలిసి

మ: ఒక ఆడదాని మొదటి బాధ్యత పిల్లల్ని పెంచడం

ఆ: ఒక మగాడి మొదటి బాధ్యత పిల్లల్ని కనడానికి అర్హత కలిగి ఉండడం

మ: ఏమంటున్నావ్ నువ్వు ?

ఆ: నేననేది ఎప్పుడు ఆడదే పిల్లల్ని ఎందుకు పెంచాలని ఆజ్ఞాపిస్తారు , ఇంతకీ పిల్లలు ఎవరికి చెందుతారు ?

మ: తండ్రికి

ఆ: అయితే మరి నేను ఎందుకు పెంచాలి? ఎవరికి వాళ్ళు స్వంతమో వాళ్ళే పెంచాలి

మ: మరీ విడ్డూరమైన మాటలు చెప్తావు నువ్వు !

ఆ: ఇందులో విడ్డూరం ఏముంది ?

మ: ఇందులో వింత ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు పిల్లల్ని కూడా పెంచడానికి ఒప్పుకోవడం లేదు కదా

ఆ: నేను ఒప్పుకుంటానో ఒప్పుకోనో , కానీ నువ్వు మాత్రం ఒప్పుకోలేదుకదా

మ: నా పని పిల్లల్ని పెంచడం కాదు , డబ్బు సంపాదించడం

ఆ: నేనూ డబ్బు గడిస్తాను

మ: హ్మ్మ… ఒక్క వంద రూపాయలకేనా ఇంత మిడిసిపాటు! ఇంకొంచం ఎక్కువ సంపాదిస్తే ఇక ఎంత గోల చేసి ఉందువో  ఆ భగవంతుడికే తెలియాలి

ఆ: ఆల్రైట్ , పోనీ వాదన కోసమైనా ఒక సారి ఊహించు , నీ జీతం వంద రూపాయలయి, నా జీతం ఎనిమిది వందలుంటే, ఎవరు ఉద్యోగం వదిలేయలి, నువ్వా నేనా?

మ: నువ్వు

ఆ: ఎందుకని?

మ: ఎందుకంటే నేను మగాడిని కనుక

ఆ: అంటే ఏ సందర్భం లోనైనా నిన్ను నువ్వే అధికుడిని అనుకుంటావన్న మాట ?

మ: నేనొక్కడినే అలా అనుకోవడం లేదు ; ఈ విశ్వమే నన్ను అధికుడిగా సృష్టించింది

ఆ: నువ్వు నాకంటే ఏమీ గొప్ప అని నేను అనుకోవడం లేదు. నిన్ను రేయింబవళ్లూ పూజించే ఆడదాన్ని కట్టుకోవాలి నువ్వు

మ: అవును అలాగే చేసుకుంటాను. ప్రపంచం లోఉన్న ఆడదానివి నువ్వొక్కత్తెవే కాదు కదా

ఆ: అయితే వెళ్ళు , నీ దారిన నీవెళ్లు. రోజూ నా దగ్గరికి వచ్చి నన్నెందుకు విసిగిస్తావు?

మ: ( ఒక క్షణం మౌనం తర్వాత) ప్రేమంటే నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట

ఆ: నువ్వూ అంతేగా

మ: (మరొక్క క్షణం మౌనం తర్వాత) అయితే చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను?

ఆ: నువ్వెప్పుడంటే అప్పుడే , కానీ నా ఉద్యోగం మాత్రం వదులుకోను.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పావురం

 

ఇంగ్లీష్ మూలం: రస్కిన్ బాండ్ 

అనువాదం: శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

~

         రస్కిన్ బాండ్  బ్ర్రిటీష్  సంతతికి  చెందిన భారతీయ రచయిత. 19 మే 1934 లో పంజాబ్ లోని  కౌశాలి లో  జన్మించాడు . ఇతను  ఏడు సంవత్సరాల  వయసున్నపుడు తల్లి  , తండ్ర్రి  నుంచి  విడిపోయి పంజాబ్ కు  చెందిన హరి  అనే అతన్నిపెళ్లి చేసుకుంది. చెప్పాలంటే  రస్కిన్  బాల్యంలోని   ఒంటరితనాన్ని  పోగొట్టుకోవడానికి కథలు  వ్రాయడం మొదలుపెట్టాడా   అనిపిస్తుంది. భారత  దేశం  మీద  ఉన్న మక్కువతో ముస్సోరీలో  ఉంటున్నాడు . అతని రచనల్లో బాల్యము, ఇంకా ఇతర దశలు , ముస్సోరిలో  గడిపిన  జీవితము  ప్రతిఫలిస్తాయి.”Our Trees still grow in Dehra” అనే  రచనకు 1992 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పద్మ శ్రీ ,పద్మ భూషణ్ అవార్డు లు కూడా ఇతన్ని వరించాయి . రస్కిన్  రాసిన కొన్ని  రచనలు చిన్న/పెద్ద తెర  మీద సీరియల్స్ ,సినిమాలుగా  వచ్చాయి .

“The Blue Umbrella”  అనే పిల్లల నవల  ని విశాల్ భరద్వాజ్ చిత్రంగా  తీసి , National Award for Best Children’s film ,దక్కించుకున్నారు . Alice in Wonderland లాంటి క్లాసిక్స్ అంటే తగని ప్ర్రీతి. పిల్లల కోసం 50 కంటే ఎక్కువ  రచనలే చేసాడు.దాంట్లో ప్రముఖంగా పెర్కొనాల్సింది చారిత్ర్రక నవల అయిన   “A Flight of Pigeons”. దీన్నితెలుగు వారైన, శ్యాం బెనెగల్   సినిమాకు  దర్శకత్వం వహిస్తే ,శశి కపూర్ నిర్మాత. ఇలా చెప్పుకుంటూ  పోతే  బావి  లోంచి నీరు తోడినట్టు వస్తూనే  ఉంటాయి. ఈ కథ ఆంగ్ల శీర్షిక “A Job Well Done”

~

ruskin

తోటమాలి దుకీపాడుబడిన బావి చుట్టూ దట్టంగా పెరిగిన కలుపును ఏరి పారేస్తున్నాడు. శరీరం బక్క చిక్కి , నడుం వంగి, పొడవైన, బలహీనమైన కాళ్ళతో  ఉన్న  వృద్దుడు దుకీ. ముందు  నుంచి  ఇలాగే ఉండేవాడు. కాని బలమంతా అతని చేతి మణికట్టు, పొడవైన తీగ లాగున్న వేళ్ళల్లో నిక్షిప్తమై ఉంది. పెటునియా మొక్కలా బలహీనంగా ఉన్నా,  సారాయి లోని పట్టు  ఉంది తనలో.

” బావిని మూసేస్తున్నావా ” దుకీని అడిగాను. అపుడు ఎనిమిదేళ్ళు నాకు. దుకీ  అంటే  ఇష్టం నాకు. నేను పుట్టక మునుపే  తోటమాలిగా చేరాడు. మా నాన్న చనిపోయేవరకు అతని కోసం పని చేసాడు. ఇప్పుడు మా అమ్మ కోసం,నా సవతి తండ్రి కోసం చేస్తున్నాడు.

“మూసేయ్యాలి…ఆనుకుంటా ” దుకీ సమాధానం. “బావిని మూసేయ్యడమే కదా మేజర్ సాహిబ్ కి కావాల్సింది. ఎప్పుడైనా తిరిగి రావచ్చు. వచ్చిన తర్వాత బావి మూసేయ్యలేదు  అని కనిపెట్టాడో, కల్లు తాగిన కోతే  అవుతాడు. నేను ఇంకో పని వెతుక్కోవాలి అప్పుడు ”

మేజర్ సాహిబ్  నా  సవతి తండ్రి.  పేరు మేజర్ సమ్మర్ స్కిల్ . పొడుగ్గా, ధృడంగా, డాంభికంతో ఉంటాడు. తనకి పోలో అన్నా, గుర్రం పై కూర్చొని చేతిలో ఈటె తో అడవి పందుల్ని వేటాడ్డం అన్నా తెగ పిచ్చి. పూర్తిగా మా నాన్న కు భిన్నం. మా నాన్న నాకెప్పుడు పుస్తకాలు ఇచ్చేవాడు చదవమని.

కాని ఎక్కువ చదివితే  నేనొక స్వాప్నికుడిని అవుతానని, నా పుస్తకాలు లాగేసుకున్నాడు మేజర్. ఇతనంటే నాకు  గిట్టదు, ఇతన్ని చేసుకున్న మా అమ్మ గురించి కూడా నేను పెద్దగా తలవను. మా అమ్మతో అనడం నేను చాల మెత్తన అని, నాకు గుర్రపు స్వారి నేర్పించే ఏర్పాటు చెయ్యాలని.

కాని నాకు ఆ ఏర్పాటు చేయ్యకమునుపే తనకి తన పై అధికారి నుంచి పిలుపు వచ్చింది. సరిహద్దు దగ్గర ఉన్న గిరిజనుల నుంచి ప్రమాదం ఏదో ఉందని పెషావర్ కు వెళ్ళమని. సుమారు రెండు నెలలు ఇంట్లో లేడు. పెషావర్ కు  వెళ్లేముందు దుకీని గట్టిగా హెచ్చరించాడు తను వచ్చేలోపు బావి మూసేసి ఉండాలని.

“తోట మధ్యలో ఇలా నుయ్యి  తెరిచి ఉండడం ఎప్పటికైనా  ప్రమాదమే. నేనోచ్చేలోపు బావిని పుడ్చెయ్యి ” దుకీ తో చెప్పడం విన్నాను.

కాని దుకీకి ఇష్టం లేదు బావిని పుడ్చేయ్యడం- ఈ ఇల్లు కట్టక ముందు నుంచి, అంటే యాభై సంవత్సరాల కంటే ముందు నుంచి ఉంది. ఎప్పటినుంచో ఆ  బావి గోడల మీద పావురాళ్ళు నివాసం ఉంటున్నాయి. వాటి  మృదు మధురమైన కలరవం  తోటంతా వ్యాపించేది. వేసవిలో ఎండలు మండిపోయేవి. కుళాయిలో నీళ్ళు వచ్చేవి కాదు. అప్పుడు ఈ బావే నీటికి ఆధారం.

అప్పుడు “భిస్తి” జన సమూహం మేకతోలు తో తయారు చేసిన సంచీలో చల్లటి నీరు నింపుకొని అందరికి సరఫరా చేసేవాళ్ళు. అదే  కదా వారి పని. ఇంటి చుట్టూ దుమ్ము లేవకుండ బావి నీటితో  చిలకరించేవారు.

పాపం దుకీ మా అమ్మను ఎంత బ్రతిమాలాడో బావిని పూడ్చనని, అలాగే వుండనివ్వని-

“పాపం పావురాళ్ళు ఎటు పోతాయి? ” అన్న దుకీ మాటలకు మా అమ్మ “అవి  ఇంకో నుయ్యిని చూసుకుంటాయిలే. ఎట్టి పరిస్థితిలో నువ్వు బావి  తెరచి ఉంచద్దు” అంది.  మా అమ్మను చూస్తేనే తెలుస్తుంది, మేజర్ అంటే  తనకి భయమని.

” ప్రేమించేవాళ్ళకు  భయపడ్డం ఏమిటి? ఆ ప్రశ్న నన్ను అప్పుడు తికమక  పెట్టింది. ఇప్పటికి పెడుతుంది. మేజర్ ఇంట్లో లేకపోవడంతో జీవితం మళ్ళీ ఆహ్లాదకరంగా మారింది. పుస్తకాలు మళ్ళీ నా చేతుల్లోకి వచ్చాయి. గంటలు గంటలు నాకిష్టమైన మర్రిచెట్టు నీడలో గడిపాను. బక్కెట్ల కొద్దీ మామిడి పళ్ళు తిన్నాను. దుకీతో కబుర్లు చెప్తూ  తోటలో కాలక్షేపం  చేసేవాడిని.

నేను, దుకీ మేజర్ కోసం  ఎదురు చూడ్డం లేదు.

మా అమ్మ రెండో పెళ్లి తర్వాత దుకీ ఇక్కడ నివాసం  మా అమ్మ మీద ఉన్న గౌరవంతో, నా మీదున్న ప్రేమతో.

నిజం చెప్పాలంటే అతను మా నాన్న మనిషి. కాని మా అమ్మ నటన ఎలా ఉండేదంటే  తను నిస్సహాయురాలినని ఎలాంటి సహాయం చేయలేని దానినని. మేజర్  సమ్మర్  స్కిల్ మనుషులు తనకు రక్షణగా ఉంటున్నారని అనుకుంటుంది. తన కోసం పని చేసేవారంటే  తనకు చాలా ఇష్టం.

” మీ నాన్న కు  ఈ బావి అంటే  చాలా  ఇష్టం.  సాయంత్రాలు ఇక్కడే కూర్చొని, పుస్తకంలో  పిట్టల్ని, పువ్వుల్ని, కీటకాలను  బొమ్మలుగా   వేసేవారు.” దుకీ అన్నాడు.

మా నాన్న గీసిన బొమ్మలు నాకింకా గుర్తున్నాయి. అలాగే ఈ మేజర్ సాహిబ్ ఈ ఇంట్లోకి వచ్చాక ఆ పేపర్లను గిరవాటు వెయ్యడం కూడా గుర్తుంది. దుకీకి కూడా అన్నీ తెలుసు. నేను ఏది దాచను.

“విచారంగా ఉంది ముయ్యాలంటే. ఎవరు  పడతారు దీంట్లో తెలివిలేనోళ్ళు, తాగుబోతులు తప్పితే.”

ఇష్టం లేకున్నా మూసేయ్యడానికి సిద్దమయ్యాడు . మద్ది చెట్ల దుంగలు ,ఇటుకలు ,సిమెంట్ అన్నిటిని పోగు చేసి పెట్టాడు నూతి  చుట్టూ.

“రేపు” అన్నాడు దుకీ “రేపు బావి మూసేస్తాను , ఈ  రోజు కాదు,  ఇంకో రోజు ఉండనీ పావురాలు .”

“బాబా , రేపు ప్రొద్దున  బావిలోంచి పక్షులను  తోలేప్పుడు నువ్వు నాకు సాయపడాలి ”

నా సవతి తండ్రి వచ్చే రోజు మా అమ్మ ఒక టాంగాను బాడుగకు మాట్లాడుకొని యేవో  కొనడానికి బజారుకు వెళ్ళింది. కొద్దిమందికే  ఉండేవి  కార్లు  ఆ రోజుల్లో. ‘కల్నల్ ” లు  కూడా  టాంగాలోనే వెళ్ళేవాళ్ళు. మరిప్పుడేమో  క్లర్క్ లు కూడా వాళ్ళ గౌరవానికి తక్కువని టాంగా లో  కూర్చోడానికి  వెనకాడుతున్నారు. మేజర్  ఎలాగూ సాయంత్రానికి ముందు రాడు కాబట్టి, ఈ  ఆఖరి ఉదయాన్ని సావకాశంగా వాడుకుంటాను.

నాకిష్టమైన  పుస్తకాలన్నీ అవుట్ హౌస్ లో దాచి ఉంచాను, ఎప్పటికప్పుడు తీసుకోవచ్చని.

జేబులు   మామిడిపండ్లతో నింపుకొని, మర్రి చెట్టెక్కాను. జూన్ నెల లో  ఉన్న పగటి ఎండ తాపాన్నుంచి  తప్పించుకోడానికి ఇంత కంటే ప్రశాంతమైన, చల్లనైన  స్థలం ఇంకోటి లేదు. నేను బయటకు కనపడకుండా తెరలా అడ్డున్న ఆకుల మాటు  నుంచి చూస్తుంటే, దుకీ బావి  దగ్గర తిరుగుతున్నాడు. బావిని మూసే పని అతనికి అస్సలు ఇష్టం లేదులా ఉంది.

“బాబా ” అంటూ చాలా సార్లు పిలిచాడు. కాని నాకు మర్రి  చెట్టు నుంచి కదిలే ఉద్దేశ్యం అస్సలు లేదు. దుకీ, పెద్ద చెక్క పలకతో   బావి ఒక చివర అంతా మూసేసాడు.  సుత్తి తో మేకులు బిగించే పని మొదలు పెట్టాడు. మర్రిచెట్టు పై నుంచి చూస్తుంటే, దుకీ  వంగిపోయి  మరీ ముదుసలిలా  అనిపిస్తున్నాడు.

గణ గణ గంటతో, చక్రాలు సమరు లేక  కీచుకీచుమనగా ఒక  టాంగా గేటు లోపలకు వచ్చింది.

బజారుకు వెళ్ళిన  అమ్మ అయితే ఇంత త్వరగా రాదు. జిగురుగా, మందంగా ఉన్న ఆకుల సందు నుంచి తొంగి చూస్తును కదా,  ఆశ్చర్యం! ,కొమ్మ మీంచి కింద పడ్డంత పనైంది.వచ్చింది మేజర్,  నా సవతి తండ్రి!.

రావాల్సిన టైం  కంటే ముందే వచ్చాడు. నేను చెట్టు దిగి కిందకు రాలేదు .మా అమ్మ వచ్చేవరకు ఆయనకు ఎదురుపడే ఉద్దేశ్యం నాకు లేదు. మేజర్ కిందకు  దిగి, టాంగావాడు  సామాను వరండా లోకి చేర వేస్తుంటే చూస్తున్నాడు .

మనిషిని  చూస్తుంటే చిరాగ్గా కనిపిస్తున్నాడు. అతని రొయ్య  మీసాలు Brilliantine రాయడం తో దళసరిగా ఉన్నాయి. దుకీ  అయిష్టంగానే దగ్గరికి వెళ్ళి సలాం  కొట్టాడు.

“ఓహ్! ఇక్కడున్నావా ముసలి నక్కా !” అదేదో జోక్ అయినట్టు, స్నేహితుడ్ని  అన్నట్టు  అన్నాడు.

“ఏంటో  ఇది  గార్డెన్  తక్కువ, అడవి ఎక్కువలా ఉంది .నీకు వయసయిపోయింది. పని నుంచి తప్పుకోవాలి. సరే  కాని మేమ్ సాబ్  ఎక్కడ?”

“బజారుకి వెళ్ళింది ” దుకీ  సమాధానం

“మరి పిల్లోడు?”

దుకీ  భుజాలెగరేస్తూ , “పిల్లోడా! కనిపించలేదు”

“డామిట్! ఇంటికొస్తే ఇలాగా  స్వాగతం చెప్పడం  నాకు- సరే వెళ్లి వంట చేసే పిల్లోడ్ని లేపి సోడాలు తెప్పించు”

“వాడు వెళ్లి పోయాడు సాహిబ్ ”

“డబల్ డామిట్ “అన్నాడు  మేజర్

టాంగా వెళ్ళిపోయింది .  మేజర్ గార్డెన్ ని ఆసాంతం పరిశీలించడం మొదలుపెట్టాడు. పూర్తికాని బావి పని మేజర్ కంట్లో పడనే పడింది. మేజర్  మొహం  నల్లబడింది. పెద్ద  పెద్ద  అంగలతో   బావి దగ్గరికి చేరుకున్నాడు.ఇంక మొదలుపెట్టాడు ముసలి  తోటమాలి మీద  తిట్ల  దండకం.

దుకీ  సాకులు చెప్పసాగేడు . ఇటుకలు సరిపోలేదని, మేనకోడలికి  ఆరోగ్యం బాలేదని, సిమెంట్  నాణ్యత  బాగాలేదని,  వాతావరణం అనుకూలంగా  లేదని, అనుకోని పనులు ఎదురయ్యాయని. పై సాకులేవి  పనిచెయ్యలేదు మేజర్  మీద. ఇక  చేసేదేమిలేక దుకీ  సణుగుతూ  “నీటి  అడుగు భాగం  నుంచి  ఏదో   బుడగల శబ్దం వినిపిస్తుంది” అంటూ బావి  లోపలికి  వేలు  సారించాడు. మేజర్  బావిని ఆనుకొని  కట్టిన  చిన్నగోడ  మీద  కాలు పెట్టి  బావి  లోపలికి  తొంగిచుస్తున్నాడు.

దుకీ  కిందకి చూపిస్తూనే ఉన్నాడు. మరి  కాస్త  వంగాడు మేజర్. అంతే దుకీ చేతులు వేగంగా  కదిలాయి, ఎలా అంటే ఇంద్ర్రజాలికుడు కదిల్చినట్టు.

నిజానికి దుకీ  తొయ్యలేదు మేజర్ని. ఊరికే అలా చేతితో తట్టాడు అంతే. నా కంటికి మేజర్ బూట్లు మట్టుకే కనిపించాయి  బావిలో పడుతూ.

Alice In wonderland ని  తలచుకోకుండా ఉండలేకపోయాను. అదే Alice కుందేలు కలుగులోకి  మాయమవడం. ఒక్కసారిగా  విపరీతమైన శబ్దం నీళ్ళు చెల్లాచెదురు అవడంతో. దానితో పావురాలన్నీ పైకి లేచాయి . బావి చుట్టూ మూడుసార్లు తిరిగి ఇంటి పైకప్పు మీద స్థిరపడ్డాయి.

భోజనం టైం కల్లా దుకీ  బావిని చెక్క పలకలతో కప్పేసాడు.

“మేజర్ చూసాడంటే చాలా సంతోషపడతాడు ” అంది మా  అమ్మ బజారు  నుంచి వస్తూనే.

“సాయంత్రం కల్లా మొత్తం పని అయిపోతుంది కదా దుకీ “?

మా అమ్మ అన్నట్టే  సాయంత్రం కల్లా ఇటుకలతో బావి మొత్తం కప్పేసాడు.

దుకీ ఇప్పటివరకు  అతి శీఘ్రముగా చేసిన  పని ఏది అంటే ఇదే .

కొద్ది వారాల్లో మా అమ్మ మేజర్ కోసం పడ్డ ఆదుర్దా …ఆందోళనగా,ఆందోళన కాస్తా విచారమై, విచారం కాస్త విడుపు లోకి వచ్చేసింది. నాకు కలిగిన సంతోష, ఉత్సాహాలతో  అమ్మను ఉల్లాసంగా ఉండేలా చూసాను.

అమ్మ రెజిమెంట్ కల్నల్ కి  ఉత్తరం రాసింది . కాని మేజర్ సెలవు మీద   పదిహేనురోజుల ముందే ఇంటికి బయలుదేరినట్టు తిరుగు టపాలో వార్త వచ్చింది.

ఈ విశాలమైన భారతదేశంలో పాపం మేజర్  ఎక్కడో అదృశ్యమయ్యాడు.

తప్పిపోయి తిరిగి ఎప్పటికి దొరక్కపోవడం సర్వ సాదారణమే  కదా!

నెలలు గడిచి పోయాయి మేజర్  లేకుండానే .

రెండు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి  మేజర్ అదృశ్యం వెనక..

ఒకటి రైలులో వస్తుంటే ఎవరైనా హత్య చేసి నదిలోకి విసిరేసి ఉండొచ్చు లేదా గిరిజనుల  పిల్లతో దేశం మారుమూల ప్రదేశానికి  పోయి బ్రతుకుతున్నాడో …

జీవితం కొన సాగింది మిగిలిన వాళ్లకు. వర్షాలు నిలిచి, జామకాయలు వచ్చే కాలం మొదలయ్యింది.

32 రెజిమెంట్ ఫూట్ నుంచి ఒక ఒక కల్నల్ రాకలు మొదలయ్యాయి మా ఇంటికి.

కొంచం వయసైపోయి, అందరితో కలివిడిగా ఉంటూ , ఇంకా  చెప్పాలంటే  పరధ్యానంగా, ఎవరి పనులకు అడ్డురాకుండా ఉన్నాడు. పలకలు పలకలు చాక్లేట్లు  ఇంట్లోవదిలేసేవాడు.

“మంచి సాహిబ్ “కితాబిచ్చాడు దుకీ.

కల్నల్ ఒక్కొక్క వరండా మెట్లు ఎక్కుతున్నపుడు  నేను , దుకీ బోగన్ విల్లా వెనక నిలబడి ఉండగా అన్నాడు

“చూడు…  ఎంత చక్కగా సోలా టోపి పెట్టుకున్నాడు ” అన్నాడు  దుకీ

“లోపలంతా బట్టతల” అన్నాన్నేను

“పర్లేదు , ఇతను సరైన వాడేమో అనుకుంటున్నాను ”

“ఒకవేళ కాకపోతే”? నా  సందేహం

” ఏముంది మళ్ళీ బావి తెరుద్దాం”

దుకీ గొట్టం పైప్ నాజిల్ తీసేయడం తో  నీళ్ళు ఒక్కసారిగా మా  కాళ్ళను తడిపాయి. వెంటనే సరిచేసి  దుకీ నా చెయ్యి పట్టుకొని పాత బావి దగ్గరికి తీసుకెళ్ళాడు.

బావి మీద సిమెంట్ తో  మూడంచెల  తిన్నె తయారు చేసాడు. అది చూడ్డానికి అచ్చు వెడ్డింగ్ కేక్ లా ఉంది .

“బాబా ,మనం ఈ పాత బావిని మర్చిపోవద్దు .దీన్ని పూలకుండిలతో అందంగా అలంకరిద్దాము”

ఇద్దరము కలిసి కుండీలు, వాటిలోకి సువాసన భరితమైన గెరానియం, అడవి మొక్కలతో బావి పై భాగం  అలంకరించాము..

పని చక్కగా చేసినందుకు అందరు అభినందించారు దుకీని .

పావురాలు  లేవనే బాధ తప్పిస్తే ఇంకే  విచారం లేదు నాకు.

sp dattamala

దత్తమాల

*

 

ఆమె ముందడుగు!

 

రచన: శివి సింగ్
అనువాదం: ఇంద్రప్రసాద్
 

నేను ఇవాళా , రేపూ కూడా సంతోషంగానే ఉంటాను ‘ సింక్ మీద వేళ్లతో చప్పుడు చేస్తూ నెమ్మదిగా అనుకొంది.

‘ఇదంతా యీ ప్రక్రియలో  భాగమే. నీ మనసుకెక్కేటట్లు ధైర్యం చెప్పుకోవాలి. గతాన్ని మర్చిపోతూ వర్తమానంలోకి రావడానికి వేసేచిన్న అడుగిది.’ ఎన్నిసార్లు వినలేదు? ప్రతీ అరకొర డాక్టరూ ఇదే మాట చెప్పేవారు. రంగులేని ఆస్పత్రులలో  ఎన్నిసార్లువిన్నట్లు నటించలేదు?

కాటన్ చొక్కా వేసుకొని, బాగ్ నిండా కాఫీ పొట్లాలతో కూర్చున్నావిడ ముందర ఎన్ని శనివారం మధ్యాహ్నాలు గడపలేదు? ఆవిడేమిటి అందరూ అంతే.  మానవమస్తిష్కంలో చెలరేగే శబ్దంలేని అలజడులన్నీ ఫైనలియర్ మెడిసిన్ పుస్తకాల్లో చదివేసేంఅని ఎంత ప్రదర్శన?

వాళ్లు చెప్పిందంతా నమ్మినట్లు నటించాలనీ, ఆకుపచ్చని చీటీలన్నీ ఎగిరిపోతూంటే చూడాలనీ….

 బట్టలు సవరించుకొని ముఖానికి నవ్వు పులుముకొని ఆలోచనల్నించి బయటకొచ్చి అద్దంలో చూసికొంది .  ఆద్దం తననిజాన్నెప్పుడూ బయటపెట్టదు. చుట్టూరా ఒక్కసారి దృష్టి సారించింది. లేడీస్ రూము నించి వరండా కొసదాకా నడిచింది.

‘గతం అందరికీ ఉండేదే. తలుచుకొన్నప్పుడు తెలుస్తుంది దాని అందమేమిటో. గతంలో జీవిద్దామనుకొంటున్నమా, తొంగిచూసి వస్తున్నామా అన్నదాన్నిబట్టి ఉంటుంది దాని అందం.’

1997 వేసవిలో అంతర్రాష్ట్ర పోటీల్లో మా జట్టు (ఈగిల్స్) గెలుపు అందరూ చెప్పుకున్నదే. మెచ్చుకున్నదే. ఒక చిన్న పట్టణంనించి వచ్చిన జట్టు గెలుపొందడం నిజంగా గొప్ప విశేషమే.

17 ఏళ్ల వయసులో పల్లెటూరి అమాయకత్వంతో ఎంత మెరుస్తూ ఉండేది? జుట్టు ముడి వేసుకొని సరదాగా అమ్మ చీర కట్టుకొన్న రోజు ఎంత అందంగా కనిపించేది . అందరి కాలేజి పిల్లల్లా జీను పాంటు వేసుకొని పాటలు వినే పిల్లని హుషారుగా తుళ్ళింత లాడే  చిన్న పిల్లలా అనిపించేది కాదు ఆ సౌందర్యమే వేరు.

Akkadi MeghamFeatured

ఆ వేసవి లోనే, అంత ఉల్లాసంగా ఉన్న రొజుల్లోనే జరిగింది.  ట్రాక్టర్  వెనుకభాగంలొ నిశ్చేతనంగా కాళ్లు రెండు తెరుచుకొనికనిపించింది , ఎవరికీ ఎలా జరిగిందో తెలియలేదు , ఎవరికీ తెలుసుకోవాలని శ్రద్ధ కూడా లేకపొయింది ,  ఆట జరిగిన రోజురాత్రి. ఎప్పుడు దూరమయ్యిందో, ఎలా అందరి నించీ విడిపోయిందో ఎవరు ఏం చేసేరో … తనని తానే కోల్పోయింది.

నగరంలో అందరినోటా తన కథే, తన గుణగణాల గురించే. వేరే ఎవరు దోషులు? ఎవరికీ తెలియదే.. ఎవర్ని తప్పు పడతారు.

ఎవరో వస్తున్నారు. బాగా డబ్బున్న మనిషిలా ఉంది

నెమ్మదిగా వచ్చి కూర్చొంది ముందు కుర్చీలో కాగితాలు సర్దుకొంటూ సంశయంగా చూస్తూ.

“గుడ్ మార్నింగ్. నేనే డాక్టర్ని. చెప్పండి.”

(19ఏళ్ల శివి సింగ్  ప్రస్తుతం  పూనె ఫెర్గుసన్ కాలేజి లో సొషియాలజి మేజర్తొ రెండొ సంవత్సరం డిగ్రీ  చదువుతున్నారు. 8 ఏళ్లవయసునించీ రచనలు చేస్తున్నా రు. కథ 2002లో viewspaper.netలో ప్రచురితం.)

మాలిష్…మాలిష్!

 

రచన – ఇస్మత్ చుగ్తాయీ

అనువాదం – కె. బి. గోపాలం

~

 

బహుశ ముఠ్ఠీ మాలిష్ అనే ఈ కథ 1956 ప్రాంతంలో ప్రచురితమయింది. బొంబాయిలోని బడుగు వర్గాల స్త్రీల పరిస్థితి ఈ కథలో చిత్రింపబడింది. కథ చెపుతున్న ఆడమనిషితోబాటు రత్తిబాయి. గంగబాయి అని రెండు పాత్రలు ఇందులో కనబడతాయి. తరువాత ఈ కథను ముగ్నీ తబస్సుం, వహీద్ అన్వర్ గారల సంపాదకత్వంలో వచ్చిన కహానియా సంపుటి 1 లో ప్రచురించారు. అయితే అక్కడ తేదీ ప్రసక్తి కనబడదు. ఆ సంపుటి బహుశ 1975 ప్రాంతంలో వచ్చి ఉంటుంది. వహీద్ అన్వర్ గతించారు. ముగ్నీ తబస్సుం గారికి కథ వచ్చిన తేదీగానీ సంచికగానీ గుర్తు లేవు. అదే ప్రచురణకర్తలు,  ఉర్దూ క్లాసిక్స్ వారు 1985లో కహానియా రెండవ సంపుటాన్ని ప్రచురించారు. పోలింగ్‌ స్టేషన్‌ దగ్గర తొక్కిడిగా జనం ఉన్నారు. అక్కడికేదో సినిమా మొదటి దినం లాగ! లైను కొన కనిపించకుండా ఉంది. అయిదేండ్ల కింద కూడా అచ్చం ఇట్లాగే లైను ఉంది. అక్కడ తిండిగింజలు చవకగా పంచిపెడుతున్నట్టు! ఓట్లేయడానికి  వచ్చినట్టు మాత్రం కాదు. అందరి ముఖాల్లోనూ ఆశాభావం కనపడుతున్నది. లైను ఎంత పొడుగు ఉంటేనేమి, ఎప్పుడో ఒకసారి మన అవకాశం రానే వస్తుంది. ఇక చూచుకోండి, ఆ తరువాత కట్టలు కట్టలుగా పైసలు! అతను మాకు బాగా నమ్మకం ఉన్న మనిషి. మొత్తానికి మనవాడు ఎన్నికవుతాడు. కష్టాలన్నీ తీరిపోతయి.

*

Spring Explosive‘బాయీ, ఓ బాయీ! ఎట్లున్నవు?’ మాసిపోయిన చీర చుట్టుకున్న ఒక ఆడమనిషి తన పసుపు గారపళ్లను బయటపెట్టి  ఇకిలిస్తూ, నా చేయి పట్టుకున్నది.

‘ఓ నీవా? గంగాబాయి….’

‘కాదమ్మా, రత్తిబాయిని! గంగబాయి వేరె. సచ్చిపాయెగద, పాపం’

‘అయ్యో, అట్లనా….’

ఒక్కసారి నా మెదడు అయిదు సంవత్సరాలు వెనుకకు వెళిపోయింది. ‘రుద్దుడా? గుద్దుడా?’ అడిగాను.

‘రుద్దుడే’ రత్తిబాయి కన్ను గీటింది. ‘ఒద్దే అని చెప్తనే ఉన్న. అది ఇంటదా? బలుపు ఆడిది. బాయి, ఓటు ఎవర్కి  ఏస్తున్నవ్‌?’

‘మరి నీవు? ఎవరికేస్తవ్‌?’ ఒకరినొకరు అడుక్కున్నాము.

‘మా కులపాయన ఉన్నడు. మాతాననే ఉంటడు.’

‘అయిదేండ్లకింద గూడ మీరంత కులపాయనకే ఓటేస్తిరి. కాదు?’

‘అవును బాయి. కానీ, ఆడు దొంగముండకొడుకు. ఏం పనిజెయ్యలే’ ముఖం వేలవేసి అన్నదామె.

‘ఇగ ఇప్పుడు ఈయనగూడ మీ కులపాయననేగద?’

‘ఈయన శాన మంచోడు. అవును బాయి, సూస్తవ్‌గద. మాకంత పొలాలిప్పిస్తడు.’

‘అంటే, నీవింక ఊరికివొయ్యి వొడ్లు దంచుతవు.’

‘ఔ, బాయి’ ఆమె కళ్లు మెరిశాయి.

అయిదు సంవత్సరాల క్రితం ఆసుపత్రిలో ఉన్నాను. మా మున్నీ పుట్టిన కాన్పు కొరకు. రత్తిబాయి తమ కులపాయనకు ఓటేసేందుకు పోతున్నట్లు చెప్పడం గుర్తుంది. వేలమంది ముందు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం గొప్ప మార్పు చేస్తానన్నాడు. పాలు నదుగా పారుతాయని, బతుకంతా తేనె అవుతుందని అన్నాడు. అయిదేండ్ల తరువాత, ఇవాళ రత్తిబాయి చీర మరింత మురికిగ ఉంది. తల మరింత పండింది. కళ్లలో మెరుపు తగ్గింది. ఈసారి వినిపించిన వాగ్దానాలను ఊతం కర్రగా పట్టుకుని నడుస్తూ, ఆమె మళ్లీ ఓటెయ్యడానికి వచ్చింది.

……..

Akkadi-MeghamFeatured-300x146

‘బాయి, ఆ లంజెముండతోటి అంతగనము ఎందుకు మాట్లాడ్తవ్‌?’ రత్తిబాయి తన సలహాల మూట విప్పుతూ,  బెడ్‌పాన్‌ను నా మంచం కింద నెట్టింది.

‘ఏమి? ఏం సంగతి?’ ఏమీ తెలియనట్టు నేను అడిగాను.

‘చెప్తిగద. అది మంచి ఆడిదిగాదు. పాడు మనిషి. లంజె.’

రత్తిబాయి రావడానికి కొంచెం ముందే, గంగాబాయి సరిగ్గా ఇదే మాటలతో ఈమె గురించి తన అభిప్రాయం చెప్పింది. ‘రత్తిబాయి అస్సలు దొంగది’ అన్నదామె. ఆస్పత్రిలో ఉన్న ఈ పనివాళ్లు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. అప్పుడప్పుడు గుద్దులాట దాకా వస్తారు. నాకు వాళ్లతో మాట్లాడడం సరదాగా ఉండేది.

‘ఆ శంకర్‌గాడు ఉన్నడుగదా, దాని అన్న కానేకాడు. దానికి మిండగాడు! వాని దగ్గర అది పండుతది’ గంగాబాయి చెప్పింది.

రత్తిబాయి మొగుడు దూరంగా ఒక పల్లెలో ఉంటాడు. ఉన్న కొంచెం పొలానికి అంటుకుని ఉంటాడు. పండినదంతా  అప్పు తీర్చడానికే సరిపోతుంది. కొంచెమేదో మిగిలితే, తొందరలోనే తీరుతుంది. అప్పుడు ఆమె పోయి ఆనందంగా పిల్లలతో ఉంటుంది. ఒడ్లు దంచి, ఉనుక వేరు చేస్తుంది. ఆ ఇద్దరు ఆడంగులు, ఆనందమయిన బతుకు గురించి, వడ్లు దంచడం గురించి కలలుగంటారు. మరెవరో పారిస్‌ గురించి కన్నట్టు!

‘కానీ రత్తిబాయి, పైసలు సంపాయించేందుకు నీవు పట్నం ఎందుకు వచ్చినవు? నీవుగాక మీ ఆయన వచ్చి ఉంటే, బాగుండునేమో?’

‘ఓ బాయి! ఆయనెట్లొస్తడు? పొలము పనిజేయాలి గద? ఎగుసము నా నుంచి అయితదా?’

‘మరి మీ పిల్లలను ఎవ్వరు చూస్తరు?’

‘ఒక లంజె ఉన్నది.’ ఆమె తిట్ల దండకం మొదలు పెట్టింది.

‘నీ మొగడు పెండ్లిజేసుకున్నడా ఎట్ల?’

‘దొంగ కొడుకు, గంత దైర్యమున్నాది? ఉంచుకున్నడు.’

‘నీవు లేనిదిజూచి ఇంటిపెత్తనము అది అందుకుంటె?’

‘అదెట్ల? తిత్తిదీసి గడ్డినింపుతా. అప్పుదీరెనా అంటె, నేను మళ్లవోతగద!’

 

రత్తిబాయి తన మొగడు,పిల్లలకు చాకిరిచేసేటందుకు ఆడ మనిషిని తానే ఎంపిక చేసిందని తరువాత అర్థమయింది. పొలం మీద అప్పు తీరితే, ఆమె ఇంటికి  వెళ్లిపోతుంది. ఇల్లాలుగా మారి వడ్లు దంచుతుంది. ఇక మరి ఆ ఉంపుడుగత్తె ఏమవుతుంది? ఆమెకు, పెండ్లాము పట్నం పోయిన మరొక మనిషి దొరుకుతడు. ఆ యింట్లో పిల్లలను సాకే పని దొరుకుతుంది.

‘ఆమెకు మొగడు లేడా?’ అడిగాను.

‘ఉన్నడు.’

‘మరి, ఆయన దగ్గర ఉండదా?’

‘వాని పొలము మందికి పొయ్యింది. వాడు జీతం చేస్తడు. యాడాదిలో ఎనిమిది నెలలు దొంగతనాలు చేస్తడు. పట్నముల తిరుగుతడు. దొంగపనులు చేసుకుంటు బతుకుతడు.’

‘ఆమెకు పిల్లలున్నరా?’

‘ఉండకేమి? నలుగురున్నరు. ఒగడు ఈ పట్నములనె పోగొట్కపోయిండు. దొర్కనే లేదు. ఇద్దరాడి పిల్లలు పారి పోయిన్రు. చిన్న పిలగాడు మాత్రము తండ్రితాన ఉన్నడు.’

‘నీవు ఊరికి ఎన్ని పైసలు పంపుతవు?’

‘మొత్తం నలబై ఒకటి.’

‘మరి నీ సంగతి?’

‘మా యన్న ఉన్నడుగద’ గంగాబాయి చెప్పిన అన్న ఆయనే!

‘మీయన్నకు పెండ్లాం పిల్లలు లేరా?’

‘ఉండకేమి?’

‘ఎక్కడున్నరు? ఊర్లనా?’

‘ఔ. శాన దూరం ఊరు. వాండ్లన్న ఎగుసము జేస్తడు.’

‘ఎవరు? మీ పెద్దన్ననా?’ ఆటపట్టించడానికి అడిగాను.

‘అగజూడు. ఇగ ఉండని. వాడు నాకెట్ల అన్న అవుతడు? ఓ బాయి, నన్నేమి గటువంటి ఆడిది అనుకున్నవా ఎట్ల?  నేను గంగబాయి అసువంటి దాన్నిగాను. తెలుసునా బాయి, నీ తాన ఉన్న పాత శీరలుగట్ల ఆ పాడుముండకు మాత్రం ఇయ్యకు. నాకే ఇయ్యి. సరేనా?’

‘రత్తిబాయి’

‘ఔ బాయి.’

‘మీయన్న నిన్ను కొడ్తడా?’

‘ఆ దుడుక గంగబాయి, అదే చెప్పుంటది. లేదు బాయి, అంతగనం ఏమి కొట్టడు. జర తాగుడు ఎక్కువయితె మాత్రమె. మళ్ల ఎన్కనె మారిపోతడు.’

‘ప్రేమ జూపుతడా?’

‘ఎందుకు జూపడు?’

‘కాని, రత్తిబాయి?, ఆ గాడిదిని అన్న అని ఎందుకంటవు?’

ఆమె నవ్వడం మొదుపెట్టింది. ‘బాయి, మా మాటలే అంత’

‘కానీ రత్తిబాయి? నలభయి ఒక్క రూపాయు వస్తయిగదా? మళ్ల ఈ లంజె తనమెందుకే?’

‘ఇగ మరి ఎట్ల గడవాలె? ఇంటికి పైసలు గావాలె. అది ఇల్లా? ఎలుకలగూడు. మీనికెల్లి దల్లాలుకు అయిదు రూపాయిలియ్యాలె.’

‘ఎందుకంటని?’

‘గాడ ఉన్న ఆడోండ్లు అందరు ఇయ్యాలె. లేకుంటె ఎలగొడ్తడు.’

‘అక్కడ ధంద చేస్తున్నందుకా?’

‘ఔ బాయి.’  ఆమె కొంచెం విస్తు పోయింది.

‘ఇగ మీయన్న. ఆయనేం జేస్తడు?’

‘బాయి, చెప్పగూడదు. ఆడు జేసేడిది లంగదందా. పోలీసోండ్లకు పైసలియ్యకుంటె ఎలగొడ్తరు.’

‘అంటె, పట్నము నుంచా?’

‘ఔ బాయి.’

ఈలోగా గదిలోకి ఒక నర్సు దూసుకువచ్చింది. తిట్లు మొదలుపెట్టింది. ‘ఇక్కడేమి ముచ్చట్లు పెట్టినవు? రూము నంబరు పదిలో బెడ్‌పాన్‌ మార్చాలె. పో’ అన్నది నర్స్‌. ఆమె నా పాపను ఊయల నుంచి ఎత్తుకుని వెళ్లిపోయింది.

………

 

ఆ సాయంత్రం గంగాబాయి డ్యూటీలో ఉంది. కనీసం బెల్‌ కూడ మోగించకుండ నా గదిలోకి వచ్చేసింది.

‘బాయి, బెడ్‌పాన్‌ కొరకు వచ్చిన.’

‘అదేమి గంగబాయి, కూచో.’

‘సిస్టరు తిడతది. దొంగముండ! నీకేంజెప్పింది?’

‘సిస్టరా? నన్ను రెస్టు దీసుకోమన్నది.’

‘కాదు, గా సిస్టరుగాదు. రత్తిబాయి సంగతి.’

‘గంగబాయిని వాండ్లన్న బాగ గొడ్తడని చెప్పింది.’ ఆటపట్టించాను.

‘దొంగముండ, తియ్యి. వానికంత దైర్యమా?’ గంగాబాయి నెమ్మదిగా నా కాళ్లమీద పిడికిళ్లతో కొట్టడం మొదలు పెట్టింది.

‘బాయి, నీ పాత చెప్పులు ఇస్తనంటివి.’

‘సరే. అట్లనెదీస్కో. కానీ నీ మొగనిదగ్గరి నించి ఉత్తరం వచ్చిందా? చెప్పు.’

‘ఔను. గా సిస్టర్‌ లంజె సూసిందంటె, పెద్ద లొల్లి లేప్తది. ప్రతిదాన్కీ లొల్లె’ అంటూనే గంగాబాయి నా చెప్పు మీదికి దాడి చేసింది.

‘గంగాబాయి.’

‘ఔ బాయి.’

‘నీవు మళ్ల ఊరికి ఎప్పుడు ఓతవు?’

నల్లగా మెరిసే గంగ కళ్లు దూరాన ఉన్న పచ్చని పొలాల మీదకు మళ్లాయి. ఒక్కసారి ఊపిరిపీల్చి మెత్తగా మాట్లాడసాగింది. ‘దేవుని దయతోని ఈసారన్నా పంటలు బాగ పండాలె. ఇగ బాయి, నేను ఎల్లిపోత. పోయినసారి ఒడ్లన్ని  వానలల్లనే పాడయిపోయినయి.’

‘గంగబాయి,  నీ మొగనికి నీ దోస్తు సంగతి తెలుసునా?’ తరిచి అడిగాను.

‘ఏమంటున్నవు బాయి?’ ఆమె ఒక్కసారి మూగబోయింది. కొంచెం విస్తుపడినట్టు కనిపించింది. విషయం మార్చాని ప్రయత్నించింది. ‘బాయి, ఇద్దరు ఆడిపిల్లలె పుట్టిరి. సేటుకు కోపమొచ్చుండాలె. ఒచ్చిందే?’

‘సేటెవరు?’ తికమకపడి అడిగాను.

‘నీ మొగడు. కోపమొచ్చి ఇంకొగ పెండ్లి చేస్కుంటె!’

‘చేస్కుంటె, నేనొక మొగణ్ణి ఎతుక్కుంట.’

‘మీరు గూడ అట్లజేస్తరా బాయి. పెద్ద కులపోళ్లయితిరి?’ ఆమె పెద్ద కులాలను ఎద్దేవా చేస్తున్నదని నాకు అర్థమయినట్టే ఉంది. నేను అర్థం చేయించడానికి ప్రయత్నించాను. అయినా సరే, రెండవసారి కూడా ఆడపిల్లను కని నేను తన్నులు తిన్న వలసినంత తప్పు చేశానని, ఆమె గట్టిగ నమ్ముతున్నది. మా సేటు నన్ను చావగొట్టకపోతే, అతను మంచి సేటే కాదు!

…….

 

ఆసుపత్రిలో ఉండడమంటే ఒంటరిగా జైల్లో ఉండడానికి తక్కువేమీకాదు. మిత్రులు, పరిచయస్తులు సాయంత్రం పూట రెండు గంటలపాటు చూడవస్తారు. మిగతా సమయమంతా, నేను గంగాబాయి, రత్తిబాయితో మాట్లాడుతూ గప్పాలు కొడుతూ కాలం గడపాలి. వాళ్లు లేకుంటే, నేను ఎప్పుడో పిచ్చెత్తి చచ్చి ఉండేదాన్ని. కొంచెమేదో లంచం ఇస్తే చాలు, ఒకరి గురించి ఒకరు బోలెడు సంగతులు చెప్తారు. అవి నిజాలా, అబద్ధాలా అన్నది వేరే సంగతి. ఒకనాడు నేను  రత్తిబాయిని ఒక ప్రశ్న అడిగాను. ‘నీవు మిల్లులో పనిజేస్తుంటవి గద. ఎందుకు ఇడిసిపెట్టినవ్‌?’

‘ఓ బాయి, ఆ మిల్లు పెద్ద గడుబడ!’

‘ఏమట్లా?’

‘ఓ బాయి. ఒక్కటేందంటే, పని శాన కష్టం. అయినా మానె. చెయ్యొచ్చు. కానీ, ఆ కొడుకు రొండు నెలలు గాంగనె ఎలగొడ్తడు.’

‘ఎందుకని?’

‘వేరెటోండ్లను పెట్కుంటరు.’

‘ఎందుకట్ల జేస్తరు?’

‘ఎందుకేంది? ఆరు నెలలు నౌకరి జేస్తే, మరి గట్టి చెయ్యాలెగద?’

‘ఓ, అర్తమయింది.’

మరో మాటలో చెప్పాలంటే, అప్పుడప్పుడు మొత్తం సిబ్బందిని మార్చేస్తారు. ఒకే మనిషి ఎక్కువ కాలం పనిలో ఉంటే, సిక్‌ లీవ్‌, మెటర్నిటీ లీవ్‌ అన్నీ చట్టం ప్రకారం ఇవ్వాలి. అందుకే, రెండు నెలలకొకసారి సిబ్బందిని మారుస్తారు.  ఆ పద్ధతిని ఒక మనిషికి ఏటా నాలుగు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. ఆ మధ్యకాలంలో ఆడవాళ్లు పల్లెకు వెళిపోతారు. అది కుదరనివాళ్లు మిగతా కార్ఖానా చుట్టూ పని కోసం తిరుగుతారు. లేదంటే, రోడ్డు పక్కన కూరలు అమ్ముతూ బతుకుతారు. అక్కడ తిట్ల పోటీలు, సిగపట్ల పోటీలు ఉంటాయి. లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు పోలీసువాళ్లకు మామూళ్లు ఇవ్వాలి. ఇచ్చినా సరే, మళ్లీ ఒక కొత్త ఆఫీసరు వస్తే, గోల మొదవుతుంది. మూట సర్దుకుని కొంతమంది పక్క సందులోకి జారుకుంటారు. కొంతమంది పట్టుబడి గొంతు చించుకుని ఏడుస్తారు. పోలీసు వాళ్లను స్టేషన్‌కు లాక్కుపోతారు. చూస్తూండగానే మళ్లీ తిరిగి వస్తారు. చింపు బొంత పరిచి మళ్లీ సంతపెడతారు. తెలివిగలవారు  నాుగు నిమ్మకాయలు లేదా మక్క బుట్టలు మూటగట్టుకుని తాము కొనవచ్చినవాళ్లలాగ, తచ్చాడతారు. పక్కనుండే వారితో గుసగుసగా ‘అన్నా, మక్కబుట్టలు. ఏకానకు ఒకటి.’ అంటూ గుసగుసపోతారు. వాళ్ల దగ్గర వస్తువు కొనడం అంటే కలరాను ఇంటికి తెచ్చుకున్నట్టే లెక్క.

మరీ అన్యాయమయినవాళ్లు బిచ్చమెత్తుతారు. వీలయినచోట చేతివాటం చూపించడానికి కూడా వెనకాడరు. నోట్లో ఉన్న పొగాకును నములుతూ, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోని చీకటి సందుల్లో తిరుగుతూ ఉంటారు. కస్టమర్‌ నడిచి వస్తాడు. కళ్లచూపుతోనే మాట్లాడుకుని బేరాలు కుదుర్చుకుంటారు. పై ఊరు నుంచి వచ్చిన పాలవాళ్లు, పెళ్లాం  ఊళ్లలో ఇళ్లలో ఉన్న కూలీవాళ్లు, నిరంతర బ్రహ్మచారులు వీళ్లకు కస్టమర్లు. ఆ మురికి గొందులే వాళ్లకు ఇళ్లు.

…….

ఒకనాడు ఉదయాన వరండాలో ఇద్దరు బాయీలు యుద్ధానికి దిగారు. రత్తిబాయి, గంగాబాయి కొప్పును ఒడిసి పట్టుకున్నది. గంగాబాయి, రత్తిబాయి మంగళసూత్రాన్ని తెంపింది. అక్కడితో తనకు వైధవ్యం వచ్చినట్టు, ఆ ఆడమనిషి ఆగకుండ ఏడుపు లంకించుకున్నది. వాళ్ల కొట్లాటకు కారణం వెతికితే, కడుపుతో ఉన్న ఆడవాళ్లు వాడిపడేసిన లేదా గాయాలు తుడిచి పడేసిన కాటన్‌ పాడ్స్‌ దాకా కథ వెళ్లింది. చట్టం ప్రకారం ఆ దూదిని కాల్చేయాలి. కానీ, ఈ బాయీలు ఇద్దరూ, ఆ కాటన్‌ను తీసికెళ్లి శుభ్రం చేసి ఇంటికి ఎత్తుకుపోతున్నారట! ఈ మధ్యన ఇద్దరికీ తగాదాలెక్కువయి సంగతిని  గంగాబాయి సూపర్‌వైజర్‌ చెవిన వేసింది. రత్తిబాయి తిట్లు మొదుపెట్టింది. త్వరలోనే ముష్టియుద్ధం మొదలయింది.  ఇద్దరి ఉద్యోగాలు ఊడవసిందే. కానీ, కాళ్లు గడ్డం పట్టుకున్న తరువాత సూపర్‌వైజర్‌ వ్యవహారాన్ని కప్పి ఉంచాడు.

రత్తిబాయి కాస్త బొద్దుగా ఉంటుంది. కనుక చెయ్యివాటం బాగా చూపగలిగింది. గంగాబాయి ఆ తరువాత బెడ్‌ పాన్‌ మార్చడానికి వచ్చినప్పుడు ముక్కు వాచి కనిపించింది. ‘ఆ దూదితో ఏం చేస్తారు, రత్తిబాయి?’ నేను అడిగాను.

‘కడిగి ఎండబెడితే, మళ్ల పనికొస్తది.’

‘ఎట్ల?’

‘దూది కొనెటోండ్లు ఉంటరు.’

‘గంత మురికి దూదిని ఎవరు గొంటరు?’

‘పరుపు కుట్టెటోండ్లు. సోఫలు బాగజేసేటోండ్లు.’

‘ఓయమ్మో!’ నా వొళ్లు జదరించింది.  ఇంట్లో పేము సోఫాలోని దిండ్లను మళ్లా కుట్టించాలని తీసినప్పుడు వాటిలోని దూది నల్లని నలుపుగా ఉండడం గుర్తుకువచ్చింది. అంటే, ఆసుపత్రుల్లో వాడి పడేసిన దూది అక్కడికి వచ్చిందా ఏమిటి? నా బిడ్డ పడుకున్న పరుపులో దూది ఎక్కడిది? పువ్వులాంటి నా కూతురు క్రిముల మీద పడుకున్నదా? ఈ గంగాబాయి పాడుబడ! రత్తిబాయిని దేవుడు ఎత్తుకుపోను!

ఇద్దరూ చెప్పుతోటి కొట్టుకునే వరకు వచ్చారు గనుక రత్తిబాయి కడుపులో రగిలిపోతున్నది. గంగాబాయి వయసులో చిన్నది. కనుక అది మరింత ఎక్కువ పాపం చేస్తున్నదని రత్తిబాయి అభిప్రాయం. అగ్గిలో నెయ్యిపోసినట్టు, ఆ మనిషి గంగబాయి కస్టమర్లను మరల్చుకున్నది. గంగాబాయికి ఎన్ని అబార్షన్స్‌ జరిగినయో. ఒకసారి బతికి ఉన్న బిడ్డను చెత్త కుప్ప మీద పడేసిందట! నోట్లో ఏవో కుక్కినా, ఆ బిడ్డ కదులుతూనే ఉన్నదట. జనమంతా అక్కడ పోగయ్యారు. రత్తిబాయి తలుచుకుంటే, సంగతి బయటపెట్టి ఉండేదే. కానీ, రహస్యాన్ని ఎదలో దాచుకున్నది. మరిప్పుడేమో ఆ పాపి మనిషి ఏ పాపమూ ఎరగనట్టు దారి పక్కన కూచుని పచ్చి రేగుకాయలు, జామకాయలు అమ్ముతున్నది.

‘దోస్తీ సంగతి సరేగాని రత్తిబాయి, ఏమన్న అయితే ఏంజేస్తరు? దవఖానకు పోవొచ్చుగద?’

‘ఎందుకు పోవాలె? మా బాయిలల్ల డాక్టర్లకంటె తెల్విగలోండ్లు ఉన్నరు.’

‘కడుపు పడేందుకు మందులిస్తరా?’

‘ఔ ఇస్తరు. ఏమనుకున్నవు? ఇగ పిడికిళ్లు ఉండనే ఉండె. మాలిషు మరింత బాగ పనిచేస్తది.’

‘పిడికిళ్లేంది? మాలిషేంది?’

‘బాయి, నీకు దెల్వది.’  రత్తిబాయి ముఖం కొంచెం ఎర్రనయింది. ఆమె నవ్వు మొదలు పెట్టింది. కొంతకాలంగా ఆమె నా పౌడరు డబ్బా మీద కన్ను వేసింది. దాన్ని ముట్టుకున్నప్పుడల్లా, ఒక చిటికెడు తీసి అరచేతిలో వేసుకుని బుగ్గకు రుద్దుకుంటుంది. ఆ డబ్బా ఇస్తే సంగతి మొత్తం తెలుసుకోవచ్చునని నాకు తోచింది. నేను ఇవ్వజూపే సరికి, ఆమె భయపడింది.

‘ఒద్దు బాయి, సిస్టర్‌ జంపుతది.’

‘ఏం గాదు. వాసన నచ్చక నేనే ఇచ్చిననని చెప్త.’

‘అగో, వాసన ఎంత బాగున్నది? ఓ బాయి, తిక్కగాని లేచిందా ఏమి?’

చాలాసేపు పోరాడిన తరువాత ఆమె రుద్దుడు, గుద్దుడు గురించి వర్ణించి వివరం చెప్పింది.

‘రుద్దుడు’ పద్ధతి కడుపు వచ్చిన మొదటి దశలో పనిచేస్తుంది. డాక్టర్‌ పద్ధతిలో అది ఫస్ట్‌ క్లాస్‌ అట! కడుపొచ్చిన మనిషిని పడుకోబెడతారు. పై కప్పులోని దూలం నుంచి కట్టిన ఒక తాడు పట్టుకుని ఆమె కడుపు మీదకు బాయి ఎక్కు తుంది. ‘ఆపరేషన్‌’ ముగిసేదాకా కాళ్లతో రుద్దుతుంది. లేదంటే మరొక పద్ధతి ఉంది. బాయి తన జుట్టును తడి నెత్తిన కొప్పుగా కట్టుకుంటుంది. ఆడమనిషిని గోడకు నిలబెడుతుంది. తన జుట్టుమీద ఆవనూనె పోసుకుంటుంది. దాంతో ఆడమనిషి కాళ్లను కుమ్ముతుంది. కొంతమంది ఆడవాళ్లకు ఈ పద్ధతితో పని జరగదు. అప్పుడు గుద్దుడు మొదవుతుంది.  చేతులను నూనెలో ముంచి కడుపు రుద్ది పనికానిస్తారు.

మొదటి దాకిడితోనే, చాలా సందర్భాలో ఆపరేషన్‌ అంతమవుతుందట! పనిలోకి దిగింది అనుభవంలేని మనిషి అయితే, కాలు చెయ్యి విరిగే అవకాశం ఉందట. అయితే, మాలిష్‌ అనే రుద్దుడు పద్ధతితో ఎక్కువమంది చావరు. కాకుంటే, వాళ్లకు రకరకాల రోగాలు పట్టుకుంటాయి. ఒంట్లో భాగాలు వాపు చూపుతాయి. ఆ తరువాత చచ్చినా చావచ్చు.  గుద్దుడు పద్ధతిని ఎప్పుడో మాత్రం వాడరట! మిగతా పద్ధతులు పనిచేయకుంటేనే వాడతారు. బతికి బయటపడ్డవాళ్లు నడక చేతగాక కష్టపడతారు. నాలుగేళ్లు బతికి ఆ తరువాత పోతారు.

 

నాకు కడుపులో తిప్పి వాంతి వచ్చింది. వివరం వర్ణిస్తున్న రత్తిబాయి భయపడి పారిపోయింది. ఆసుపత్రి ప్రశాంతత నన్ను మరింత కుదిపింది. మరొక జీవాన్ని ఈ ప్రపంచంలోకి తెచ్చినందుకు ఇంతటి భయంకరమయిన శిక్షలా? నేను శూన్యంలోకి కదిలిపోతూ, ఆలోచించాను.

నా వొళ్లంతా భయంతో వణికిపోయింది. రత్తిబాయి జీవం నింపుతూ, చిత్రించిన రంగు బొమ్మలు నా కళ్ల ముందు మెదిలాయి. కిటికీ కర్టెన్‌ నీడలు గోడమీద కదులుతున్నయి. అది త్వరలోనే నాకు రక్తం నిండిన శవంలా కనిపించ సాగింది. గంగాబాయి రుద్దుడు పద్ధతికి గురయిన శవం అది. గోళ్లలో మురికి నిండిన ఒక పిడికిలి నా మెదడులో దిగబడింది.  చిన్ని వేళ్లు, వేలాడుతున్న మెడ రక్తం మడుగులో, జరిగిన పద్ధతికి బహుమతి అన్నట్టు కళ్లముందు కదలాడింది. నా గుండె దిగజారిపోయింది. మెదడు మొద్దుబారింది. గొంతెత్తి ఎవర్నయిన అరిచి పిలవాలని ఉంది. కానీ, నా నోట మాట రావడం లేదు. బెల్‌ మోగించాలి అనుకున్నాను. చెయ్యి కదడంలేదు. నా యెదలో మూగ అరుపులు గజిబిజిగా వినపడుతున్నాయి.

ఆసుపత్రి నిశ్శబ్దంలో ఒక్కసారిగా హత్యకు గురయిన ఎవరో అరిచినట్టు ఉంది. ఆ ఎవరో నా గదిలోనే ఉన్నట్టు ఉంది. కానీ నాకు వినిపించడం లేదు. ఆ అరుపు నా గొంతులోనే వస్తున్నట్టున్నాయి. కానీ వినిపించడం లేదు.

‘ఏమిటమ్మా, కల వచ్చిందా?’ ఇంజక్షన్‌ గుచ్చుతూ నర్స్‌ అడిగింది.

‘సిస్టర్‌, వద్దు. అటుచూడు, గంగాబాయి రుద్దిన శరీరం శవమై శిలువమీద నిలబడి ఉంది. దాని అరుపులు నా గుండెను బల్లాలతో పొడుస్తున్నాయి. ఎక్కడో కాలువలోపడ్డ చిన్న ప్రాణం ఏడుపు నా మెదడు మీద సుత్తెతో బాదుతున్నాయి.  మార్ఫీన్‌ ఇచ్చి నా మెదడును నిద్రపుచ్చకు. రత్తిబాయి పోలింగ్‌ బూతుకు పోతుంది. కొత్తగా ఎన్నికయిన మంత్రి వాళ్ల కులం వాడే. ఆమె అప్పు వడ్డీతో సహా తీరుతుంది. గంగాబాయి ఆనందంగా వొడ్లు దంచుతుంది. నా మెదడుమీద నుంచి ఈ నిద్ర తెరను ఎత్తేసెయ్‌. నన్ను మెలుకువగా ఉండనీ. తెల్లని దుప్పటి మీద గంగాబాయి రక్తం మరకలు వెడల్పు అవుతున్నాయి.  నన్ను మెలుకువగా ఉండనీ’.

…….

బల్ల వెనుక కూచున్న మనిషి నా ఎడమచేతి వేలి మీద ఇంకు చుక్కతో గుర్తు పెడుతూ ఉంటే, నాకు మళ్లీ ప్రపంచం తెలిసింది.

‘నీ ఓటు మా కులపాయనకు ఎయ్యి, అట్లనేనా?’ రత్తిబాయి గట్టిగా చెప్పింది.

రత్తిబాయి కులపాయన బ్యాలెట్‌ పెట్టె ఒక పెద్ద పిడికిలిలా పైకి లేచి మొత్తం బలంతో నా గుండె, మెదడు మీద దాడి చేసింది. నేను నా ఓటు అందులో వేయలేదు.

……………

 

 

అనువాదకుని గురించి –

డాక్టర్ కె. బి. గోపాలం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి. ఎచ్ డి పట్టం పొందారు. కొంతకాలం ఉపాధ్యాయుడుగా పని చేసిన తరువాత ఆకాశవాణిలో హైదరాబాద్ లో సైన్స్ కార్యక్రమాల అధికారిగా చేరారు.

గోపాలం నిర్వహించిన కార్యక్రమాలకు మంచి గుర్తింపు, బహుమతులు వచ్చాయి.

స్టేషన్ డైరెక్టర్ స్థాయిలో ఉండగా ఉద్యోగం వదిలేసి సంగీత సాహిత్య సేవలో కొనసాగుతున్నారు.

 

వైవిధ్యాన్ని ఇష్టపడే వ్యక్తిగా గోపాలం ఎన్నో రకాల పనులను తలకెత్తుకుని విజయాలు సాధించారు.

 

పుస్తకాలు చదవడం తనకు ఇంచుమించు వ్యసనం అంటారాయన. సమీక్షించడమూ అంతే ఇష్టమంటారు.

ఎన్నో విషయాలను గురించి పత్రికలలో, పుస్తకాలుగానూ రాశారు, రాస్తున్నారు.

ఉత్తమ పాపులర్ సైన్స్ రచయితగా గుర్తింపు, అవార్డులూ అందుకున్నారు.

ఎన్నో అనువాదాలు కూడా చేశారు.

ఇంటర్నెట్ లో వీరి బ్లాగులు చాలా పేరు పొందాయి.

దూరదర్శన్ లో గోపాలం నిర్వహించిన క్విజ్ కార్యక్రమం శాస్త్ర ఎంతో పేరు పొందింది. ఈ కార్యక్రమానికి గాను గోపాలం నంది అవార్డు అందుకున్నారు.

 

కర్ణాటక సంగీత రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కూడా అవార్డులు అందుకున్నారాయన. సంగీతం సేకరించడం ఆయన పెట్టుకున్న పనులలో ముఖ్యమయినది.

 

సైన్స్ ఇంకా సంగీతం అంటే ప్రాణం పెట్టే రచయిత, పాఠకుడు, పరిశీలకుడు అయిన గోపాలం చేయవలసింది మరెంతో మిగిలి ఉంది అంటుంటారు.

సమాజాన్ని ఇరుకున పెట్టిన ఇస్మత్‌ చుగ్తాయి

 

-కె.బి.గోపాలం 

~

GopalamKB 1మహానటుడు శశికపూర్‌ సొంత ఖర్చుతో, సొంత ఆలోచనతో తీసిన సినిమా ఒకటి ఉంది. అది అర్థంలేని ప్రేమ గురించిన సినిమా. అందులో నాయకుడు ఒక బ్రిటిష్‌ ఆఫీసర్‌ కూతురిని మరీ మరీ ప్రేమించేస్తాడు. మనకికక్కడ ఆ సినిమా ముఖ్యం కాదు. హీరోయిన్‌ తల్లి పాత్రలో శశికపూర్‌ భార్య జెనిఫర్‌ కనిపిస్తుంది. ఆమెకు తల్లిగా ముగ్గుబుట్టలాంటి తల ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె సినిమా మొత్తంలోనూ మాట్లాడదు. కానీ, కథలో బలమయిన భాగంగా మిగులుతుంది. నిజానికి ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి సినీ నటి కాదు! ఆమె ప్రసిద్ధ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయి!  సాహిత్య రంగంలో అందరూ ఆమెను ఇస్మత్‌ ఆపా అంటారు. ఉర్దూలో ఆపా అంటే అక్కయ్య. సినిమాలో చూచినవాళ్లకు ఆ వ్యక్తి గురించి అభిప్రాయాలు ఏర్పడే వీలే లేదు. మహా కలిగితే, జాలి కలుగుతుంది. కానీ, ఇస్మత్‌ ఫయర్‌ బ్రాండ్‌ రచయిత్రి. ఆమె క్రూరులకే క్రూరుడయిన చంగేజ్‌ ఖాన్‌ వంశంలో పుట్టిందని ఎక్కడో చదివినట్టు గుర్తు.

ఇస్మత్‌ చుగ్తాయి పుట్టుకతోనే తిరుగుబాటు స్వభావం గల మనిషి. మగరాయుడులాగ బతికింది. తన యిష్టం వచ్చినట్టు బతికింది. ఆవిడ కథలు, నవలలు, వ్యాసాల్లో కూడా అదే పద్ధతి బలంగా కనిపించింది. సమకాలీనుడు సాదత్‌ హసన్‌ మంటో కూడా ఈ రకం మనిషే. అతను బతుకంతా కష్టపడ్డాడు. ఇస్మత్‌ మాత్రం బతుకంతా పోరాడుతూనే ఉన్నది.

ఇస్మత్‌ చుగ్తాయి 1915లో పుట్టిందన్నారు. ఈ మధ్యన మాత్రం 1911లో అంటున్నారు. ముస్లిం కుటుంబాలో ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరం లేదని గట్టి కట్టుబాట్లు ఉన్న ఆ కాలంలోనే, ఇస్మత్‌ ఎదురుతిరిగింది. బడికి వెళ్లింది. అక్కడితో ఆపకుండా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. సుమారు మూడు సంవత్సరాల పాటు వేరు వేరు చోట్ల పంతులమ్మగా పనిచేసింది. ఇంకా పైకి చదువుకున్నది. ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ స్కూల్స్‌ ఉద్యోగానికి ఎక్కింది. ఆ కారణంగా ఆమె బొంబాయి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఇస్మత్‌ పెళ్లి కూడా చేసుకున్నది. ఇద్దరు అమ్మాయిలను కన్నది.  ఉద్యోగం మానేసి రచనతోనే కాలం గడుపుతూ, చివరి దాకా అక్కడే బతికింది.

ఇస్మత్‌ చుగ్తాయి రచనారంగంలోకి రావడానికి బొంబాయిలోని వామపక్ష అభ్యుదయ రచయితల బృందం కారణం అంటారు. నిజానికి ఆ బృందంలో సభ్యురాలయిన రషీద్‌ జహా అనే గైనకాలజిస్ట్‌ ఇస్మత్‌ మీద నిజమయిన ప్రభావం కనబరచిన వ్యక్తి. ఆ డాక్టరమ్మ ఆదర్శభావాన్నింటినీ పొందుపరుస్తూ కథలు రాసేది. ఆ ప్రభావంతోనే ఇస్మత్‌ కూడా నాటకాలు, కథలు, వ్యాసాలు రాయడం మొదుపెట్టింది. 1945లో ఆమె రాసిన నవల ఉర్దూ సాహిత్యంలోనే గొప్ప రచనల్లో ఒకటిగా పేరు పొందింది. నవల పేరును తెలుగులో ‘వంకర గీత’ అని చెప్పుకోవచ్చు. ఆ నవల నిజానికి రాసిన తరువాత యాభయి సంవత్సరాలకు అచ్చయింది. అందులో ఆమె ఆడవారి లైంగికతను, ఆ విషయంగా వచ్చే సమస్యలను జంకు లేకుండా చర్చించింది. అయితే, అది అసలు సిసయిలన నవల. వ్యాసాల పోగు కాదు. చెప్పదలచుకున్న విషయాన్నీ బలంగా చిత్రించిన ఒక పాత్రలోనుంచే వస్తాయి. ఆ పాత్ర బహుశా స్వయంగా ఇస్మత్‌ అన్నారు పరిశీలకలు.  పాత్రలో ఇస్మత్‌ వ్యక్తిత్వంలోని మిగతా అంశాలు లేకపోవచ్చు. ఈమె రచయిత్రి. నవలలోని కథా నాయిక మాత్రం పుస్తకాలు పట్టని మనిషి. అసలు కళంటేనే ఆసక్తి లేని మామూలు అమ్మాయి. కనుకనే ఆ పాత్ర, ఆమె చుట్టూ అల్లిన కథ, చివరికి నవల, చాలా సహజంగానే కనిపిస్తాయి. చర్చకు అసలు ఆధారం కథానాయిక షంషాద్‌ పెళ్లి. ఆమెకు దొరికిన మొగుడు ఇంగ్లీషు మనిషి. అప్పట్లో అదొక పద్ధతి. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఆ మొగుడు షంషాద్‌ను వదిలి వెళిపోతాడు. ఆమెకు మొత్తం కంపెనీ మీద బ్రిటీష్‌వారి మీదా కోపం వస్తుంది. మొగుణ్ణి ఆమె చీదరించుకుంటుంది. వదిలేస్తుంది కూడా!

Akkadi MeghamFeatured

ఈ నవల రాసేనాటికి చుగ్తాయికి పెళ్లయింది. భర్త షాహిద్‌ కూడా కలంబలం మనిషి. ‘నేను మామూలు ఆడమనిషిని కాదు. నా వల్ల కష్టాలు కలగవచ్చు. నేను బతుకులో బంధనాన్నీ తెంపుకున్నాను. మళ్లీ ఒకసారి కట్టుబాట్లకు లొంగేది లేదు. బుద్ధిగా భార్యగా, జీవించడం, నటించడం నావల్ల కాదు’ అని ఆమె భర్తతో చెప్పిందట. చుగ్తాయి పెళ్లి తరువాత కూడా రచనలు కొనసాగించింది. దుప్పటి అనే కథలో అప్పటికి ఎవరూ నోరు విప్పి మాట్లాడని లైంగిక సమస్యను గురించి రాసింది. ఆడమనిషి మరో ఆడమనిషితో సెక్స్‌ అనుభవించడాన్ని చర్చించింది. కనుక ఇస్మత్‌ కోర్టు పాలయింది.  కన్నబిడ్డను చంకనెత్తుకుని ఆమె కోర్టు చుట్టూ తిరగవసి వచ్చింది. ఆ తరువాత జీవితంలో ఇటువంటి అపభ్రంశపు సంఘటనలు ఎదురు కాలేదుగానీ, కుటుంబ జీవితం సాఫీగా సాగింది లేదు. రచన కారణంగా ఆమెకు గొప్ప పేరు వచ్చింది. ఆమె తీరు అలాగే కొనసాగింది. భయం లేకుండా ఆమె కలం ముందుకు సాగింది. బతుకు కూడా భయం లేకుండానే ముందుకు సాగింది. అయినా, గొప్ప ఒడిదుడుకులు మాత్రం ఎదురు కాలేదు.

కుటుంబ జీవితం గుంభనంగా సాగింది. అయినా, ఏ భర్తకు భార్య ఖ్యాతి నచ్చదు. ఇస్మత్‌ పేరు పెరుగుతున్నకొద్దీ, భర్త ఆమె నుంచి దూరం కాసాగాడు. ఈమె మాత్రం ఎక్కడా భర్త గురించి ఒక్క ముక్క రాయలేదు. అవసరం వచ్చిన చోట  ఆయన తన నేస్తము, సహచరుడు, సముడు, అని మాత్రమే అంటూ వచ్చింది. మామూలుగా రచనల్లో కల్పన పేరుతో నిజాలు కనపడతాయి. అనుభవాలు కనపడతాయి. ఆలోచనకన్నా, ఈ అనుభవాలే బలంగా కనపడతాయి. అయినా, ఇస్మత్‌ చుగ్తాయి తన రచనల్లో ఎక్కడా తన వైవాహిక జీవితం గురించి, భర్త గురించి లోతుగా రాసిన సందర్భాలు కనిపించలేదు.

ఈ దేశంలో నాటికీ నేటికీ ముస్లిం స్త్రీ జీవితాలు తెర వెనుక వరకే పరిమితమయి ఉన్నాయి. ఇస్మత్‌ మాత్రం ఆ తెరలను చింపేసింది. అది తొలగించడం కాదు. కథన్నింటిలోనూ ఆడవాళ్ల కష్టాలను గురించి అలవిమాలిన ధైర్యంతో  గొప్ప సత్యాలను చెప్పింది. ముఖ్యంగా సినీపరిశ్రమలోని అమ్మాయిల కష్టాలను వర్ణించిన తీరు దేశాన్ని కుదిపింది. చెప్పకుండా జరిగే వ్యభిచారం ఆమె కథల్లో చాలా చోట్ల వస్తువుగా మారింది. అయినాసరే, ఆ కథలేవీ సంచనాత్మకంగా మాత్రం లేవు. లైంగిక పరంగా మనుషులను కిత కితలు పెట్టేవి కూడా కావు. భయంకర సత్యాలను అంత భయంకరంగానూ  బయటపెట్టి భయపెట్టే రచనలవి!

ఇస్మత్‌ పేరు చెప్పగానే ‘లిహాఫ్‌’ అనే పేరుగల ఆమె కథ అందరికి గుర్తు వస్తుంది. తెలుగులో చెప్పాలంటే శీర్షిక ‘దుప్పటి’. ‘ద క్విల్ట్’  అనే పేరును వెదికితే నెట్‌లో ఈ కథ దొరకవచ్చు. కథ తనకు తెలిసిన ముస్లిం జనానా పరిస్థితుల్లో నడుస్తుంది. అక్కడ సెక్స్‌ కోరికను తీర్చుకోవడానికి ఆడవాళ్లు ఆడవాళ్లనే వాడుకోవడం గురించి ఇస్మత్‌ ఆ కాలంలోనే రాసిందంటే, అది ఆశ్చర్యం మాత్రమే కాదు, అద్భుతం అనవచ్చు. కథ గొప్ప దుమారాన్ని రేపింది. కానీ సరదాగా సాగుతుంది. చాలాకాలంగా చర్చకు, కోర్టు కేసుకు ఆధారమయిన ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది.

ఇస్మత్‌ రాసిన కథలో ‘పవిత్ర ధర్మం’ అనే అర్థం వచ్చే పేరుగల మరో కథ గొప్పది. ఈ కథ అంతగా చర్చకు గురి కాలేదేమో! దిల్లీలోని ఒక ముస్లిం కుటుంబం, గౌరవం కలది. ఇంటి ఆడకూతురు సమీనాకు తగిన సంబంధం చూచి పెళ్లి చేయాలనుకుంటారు. సరిగ్గా లగ్నానికి ముందు రోజు అమ్మాయి అలహాబాద్‌కు చెందిన ఒక త్రివేదీ, బ్రాహ్మణ కుర్రవాడితో  లేచిపోతుంది. అనుకున్నట్టుగానే వాళ్లు అలహాబాద్‌ చేరుకుంటారు. అబ్బాయి కుటుంబంవాళ్లు సమీనాను హిందువుగా మారుస్తారు. కొంతకాలానికి అమ్మాయి ధైర్యం చేసి అమ్మానాన్నలకు ఉత్తరం రాస్తుంది. వెంటనే తల్లి తన భర్తతో అన్నట్టు రాసిన మాట ఏమిటో తెలుసా? ‘పదండి, అలహాబాద్‌ వెళ్లి ఇద్దరినీ షూట్‌ చేద్దాం’ అని! కథ తల్లిదండ్రుల దృష్టి నుంచి నడుస్తుంది.

కొంతకాలం గడుస్తుంది. కోపతాపాలు కొంత తగ్గుతాయి. సమీనా తండ్రి అలహాబాద్‌ పోతాడు. కూతురు అల్లుళ్లను  దిల్లీకి పిలవాలని, ఒక రకంగా సంధి చేసుకోవాలని అక్కడ ఉద్దేశం. అతని తీరు చూచిన త్రివేదీలు అభ్యంతరం చెప్పరు.  ఇక్కడ దిల్లీలో మాత్రం ముస్లిం పద్దతిలో ఆ జంటకు మరోసారి పెళ్లి చేయాలని ఏర్పాట్లు జరుగుతాయి. అంటే, అబ్బాయి  మతం పుచ్చుకోవాలి. సమీనా కూడా తిరిగి మతంలోకి రావాలి. చిత్రంగా సమీనా భర్త ఒప్పుకుంటాడు. అమ్మాయి మాత్రం ఎదురు తిరుగుతుంది. ఇక అక్కడ గొప్ప చర్చ జరుగుతూ కథ ముందుకు సాగుతుంది. సమీనా, భర్త తాషార్‌ ఇద్దరూ ఎక్కడికో పారిపోతారు. రెండు వేపులా కుటుంబాలు వేసిన పథకాలు అర్థంతరంగా ఆగిపోతాయి. పారిపోయిన తరువాత  సమీనా తన తల్లిదండ్రుకు ఒక ఉత్తరం రాస్తుంది. అది కథకు ప్రాణం.

‘అయితే, నాన్నా, అంతలో నీవు రంగం మీదికి దిగావు. నువ్వు చాలా గొప్ప నటుడివి. మామగారిని మెప్పించి నీవు ఒప్పించిన తీరుతో నేను కదిలిపోయాను. మా మామగారు గొప్ప మనసున్న మనిషని నాకు నేను నచ్చచెప్పుకున్నాను.  ఆయన నిజానికి తన మనుషులను వాడి మమ్మల్నిద్దరినీ బనారస్‌ చేర్చాడు. మా మీద మొట్టమొదట మంత్రదండం ప్రయోగించింది ఆయనే! ఇక నీవు వచ్చి క్షమిస్తున్నానంటూ చల్లగా చెప్పి మమ్మల్ని దిల్లీ చేర్చావు. అయితే ఆ తరువాత నీ అసలు రూపం బయటపడింది. బజారులో బిచ్చగాడు కోతులను ఆడిరచినట్టు నీవు నన్ను, నా భర్తను ఆడింపజూచావు. మేమిదంతా సరదాగా ఉందనుకుని చూస్తూ ఉండిపోయాము. అయితే భయపడకు, నీ రహస్యాన్ని మేము అంత సులభంగా బయటపెట్టము. రేపు పొద్దున పత్రికలో విషయం చూస్తే, మా మామగారి మనసులో బాంబు పేలుతుంది, తప్పదు. ముస్లిం పెళ్లి సంగతి వాళ్లకు తెలిసిపోతుంది. మేము వాళ్లను వదిలి వచ్చేశాము. ఇక మీకు కూడా సెలవు. మేము ఎక్కడికి పోతున్నది నీకు పట్టకూడదు. మా వల్ల బాధ కలిగితే, క్షమించండి. కాదు, మేము మిమ్మల్ని బాధపెట్టింది లేదు. మీరే మమ్మల్ని కష్టపెట్టారు. నిజానికి క్షమాపణ చెప్పవలసింది మీరే! మమ్మల్ని మీరు నవ్వుపాలు చేశారు. మీకు నచ్చిన విధంగా మీ పాటకు మమ్మల్ని కోతుల్లాగ ఆడించదలిచారు. మీరు అమ్మానాన్నలేనా? ’

చెప్పా పెట్టకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నది తాను. కానీ, ఎదురుతిరిగి తప్పంతా తలిదండ్రుల మీద రుద్దే చోటికి వచ్చిందంటే రచయిత్రి ఇస్మత్‌ ఆపాను మెచ్చుకోకుండా ఉండలేము. మతాలు రుద్దాలని రెండు వేపులా తల్లిదండ్రులు చేసిన  తప్పుడు ప్రయత్నాలను ఆధారంగా తీసుకుని అక్కయ్య ఈ పని చేయగలిగింది. కుటుంబ గౌరవం, అన్ని రకాల గౌరవం  నిలిస్తే చాలు, మిగతా ఎన్ని తప్పులు చేసినా ఫరవాలేదనుకున్న పెద్దల తప్పులను ఈ కథలో ఆమె ఎత్తి చూపింది. ఉత్తర భారతదేశంలో ఈమధ్యన జరుగుతున్న ‘గౌరవ హత్యలు’ ఈ సందర్భంగా మనసులో మెదిలితే తప్పు కాదు. ఇన్నేళ్లయినా,  పరిస్థితి మారలేదు. ఇస్మత్‌ చుగ్తాయి లాంటి రచయిత్రులు ఇంకా రావాలన్న భావం మనసుల్లో బలపడుతుంది. పెళ్లి అనే వ్యవస్థ మీద రచయిత్రి ఫెడీలుమని కొట్టిన చెంపదెబ్బ ఈ ‘పవిత్ర ధర్మం’.

ఈ రచయిత్రి కథలు ఇంచుమించుగా అన్నీ ఇదే పద్ధతిలో సాగుతాయి. సమాజంలోని సమస్యల మీద చక్కని చెణుకులను విసురుతాయి. ఈమె కలంలాగే మాటలు కూడా చాలా పదునుగలవి.

కథను ఎత్తుకుంటే చాలు వెతకనవసరం లేకుండా, ఆలోచలను ముప్పిరిగొంటాయి. వాటికి తగినట్టే వెల్లువల్లాగ మాటలు కూడా ప్రవహిస్తాయి. ఎక్కడా ప్రయత్నించి, తడుముకుని రాసిన తీరు కనిపించదు. ఆమె మాట్లాడుతూ ఉంటే కూడా అంతే వేగంగా ఉండేదట! నిజానికి మాటు దొర్లేవట. వంట గదిలోకి వచ్చిందంటే, గోల చేసేసేదట. అంటే, కొంచెం తొందరపాటు మనిషి అని అర్థంచేసుకోవచ్చు. పిండి పిసకకముందే పెనం మీద రొట్టె కాల్చ గలిగిన మనిషి ఇస్మత్‌!   ఆలోచనల్లోనే వంటంతా ముగించే ఈ రచయిత్రి రచనల్లో దూకుడు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అది అప్పటి పాఠకును, విమర్శకులను అందరినీ అదరగొట్టిన తీరు. ఒక తోటి రచయిత్రి ఈమె స్వభావాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ,  చక్కని మాట చెప్పింది. ఇస్మత్‌ వంట ఇంట్లోకి వెళుతుంది, తన ఆలోచనలతోనే కడుపు నింపుకుని బయటకు వచ్చేస్తుంది, అన్నారావిడ.

ఇస్మత్‌ చుగ్తాయి తన స్వంత కథను కూడా రాసింది. అందులో మొగమాటం లేకుండా తన తీరు గురించి, తిరుగుబాటు మనస్తత్వం గురించి వివరించింది. చిన్నప్పటి తీరు, పెళ్లినాటిదాకా సాగిందని చెప్పేసుకున్నది. ఆ సంఘటను చదివేవారికి ఆమె మాటలోని చమత్కార ధోరణి, మనసులోని విషయం చెప్పడానికి హాస్యాన్ని వాడుకున్న తీరు చక్కగా ఎదురవుతాయి. చకితులను చేస్తాయి. మొత్తానికి మంచి మాటలతోనే ఇస్మత్‌ తాను చెప్పదలచుకున్న సంగతులు చెప్పేస్తుంది.  అమ్మాయి పెద్దదవుతున్నదని వాళ్ల నాన్న వంట నేర్చుకోమన్నాడట. బడికి వెళ్లడం అవసరం లేదేమో అని కూడా అన్నాడట.

‘ఇస్మత్‌! అమ్మాయిలు వంట చేస్తారమ్మా. అత్తవారింటికి వెళ్లిన తరువాత అక్కడ వాళ్లకు ఏం పెడతావు?’ అని నచ్చజెబుతూ, మెత్తగా చెప్పాడట వాళ్ల నాన్న! ఆమె మాత్రం ‘నా మొగుడు లేనివాడయితే, కిచిడీ మాత్రం వండుకుని తింటాం. ఇక కలిగినవాడయితే, వంట వాడిని పెట్టుకుంటాం’ అన్నది. ఆ దెబ్బతో ఆ తండ్రికి సంగతి అర్థమైపోయి ఉండాలి. అయినా, పట్టలేక ‘అయితే నీవేం చేస్తావు?’ అని అడిగాడు. ‘నా అన్నదమ్ముల్లాగ నేను కూడా చదువుకుంటాను’ అన్నది ఆ గడుగ్గాయి అమ్మాయి మొండిగా.

తండ్రికి ఇక తప్పలేదు. ఒక బంధువును అమ్మాయికి చదువు చెప్పమని నియమించాడు. నాలుగయిదు నెలలు పగలు, రాత్రీ ట్యూషన్‌ సాగింది. ఆ తరువాత బడికి పోతే, పరీక్ష పెట్టి ఏకంగా ఆమెను నాలుగవ తరగతిలో చేర్చుకున్నారు.  అక్కడ డబుల్‌ ప్రమోషన్‌ దొరికింది. అంటే, అయిదు అవసరం లేకుండానే ఆరవ క్లాసుకు చేరింది. ఆమె తెలివి గురించి  చెప్పడానికి ఈ రెండు మాటలు చాలు. ఆమె నాకు స్వతంత్రం కావాలి. చదువు లేకుండా ఆడదానికి స్వతంత్రం అందదు,  చదువుకోని అమ్మాయికి పెళ్లయితే, వాళ్ళాయన ఆమెను ‘చదువురాని దానివి’ ‘మొద్దువు’ అంటాడు! మగమహారాజు పనిలోకి వెళితే, ఆయన మళ్లీ వచ్చేదాకా ఆ మొద్దు వేచి ఉండక తప్పదు. నేను మాత్రం అట్లా ఉండదచుకోలేదు. కనుకనే చేతనయినంత వేగంగా చదువుకుంటాను, అన్నది ఇస్మత్‌.

ఇస్మత్‌ కుటుంబంవాళ్లు అభ్యుదయ భావాలుగల వాళ్లేమీ కాదు. అయినా, ఆమె పట్టు వదలలేదు. చదువుకుని తీరాలన్నది. గడపదాటి బయటకు రాగలిగింది. చివరకు పెళ్లి కూడా తన ఇష్టం వచ్చిన మనిషినే చేసుకున్నది.

ఇస్మత్‌ గురించి, ఆమె స్వభావం గురించి మరింత తెలుసుకోవడానికి ఆమె కోర్టు కేస్‌ వివరాలను చదివితే అర్థమవుతుంది. ఆ వివరాలను ఆమే రాసి అందించింది. చాలా గొప్ప రచనలు చేసినవాళ్లు కూడా, పొందని కీర్తి కోర్టు కేసులో చిక్కుకున్న రచయితలు పొందుతారు! సల్మాన్‌ రుష్దీ అందుకు ఒక ఉదాహరణ. లిహాఫ్‌ అంటే, దుప్పటి అన్న ఆడవాళ్ల మరుగు వ్యవహారాలను గురించిన కథలో బూతు ఎక్కువయిందని ఆమె మీద కేసు వేశారు. ఇస్మత్‌ మాత్రం పరిస్థితికి కదిలిపోయిన దాఖలాలు కనిపించవు. ఆ సమయంలో ఆమె లాహోర్‌లో  సాదత్‌ హసన్‌ మంటో ఇంట్లో భర్తతో సహా విడిది చేసింది. అక్కడ జరిగిన సరదా సంగతులు, అంత సరదాగానూ కోర్టు వ్యవహారం గురించి కూడా చెప్పింది.  అసలు కథలో బూతు ఉందా? అన్న చర్చ కూడా ఇంట్లోనే బాగా జరిగింది, అంటుంది ఇస్మత్‌. వాళ్లకు అక్కడ సాదత్‌ హసన్‌ మంటో ఆతిథ్యం ఇచ్చాడు. అతను ఈమె కన్నా ధైర్యం గల రచయిత. కనీసం ఈమెతో సమానంగా ధైర్యం గల రచయిత. రచనలు, కోర్టు కేసు, బెదిరింపు కారణంగానే అతను లాహోర్‌ చేరాడు.

కథ గురించి కోర్టులో జరిగిన వాటికన్నా, సభ్య సమాజంలోనే ఎక్కువ చర్చలు జరిగాయి. భర్త మిత్రుడు అస్లమ్‌ ఈమె కథను తీవ్రంగా విమర్శించాడు. ఇస్మత్‌ మాత్రం గౌరవంగా ఎదురుతిరిగి ‘ఈ కథ రాయడం పాపంగా పరిగణింప బడుతుందని నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఈ దుర్మార్గపద్ధతి గురించి రాయకూడదని ఎక్కడా చదివిన గుర్తూ లేదు. నేనేమో బొమ్మగీయగల కళాకారిణిని కాదు. నా మెదడు కేవలం మామూలు కెమెరా వంటిది. దానికేదయినా కనిపిస్తే, చెప్పకుండానే పనిలోకి దిగుతుంది. నా చేతులు అప్రయత్నంగా పనిలోకి దిగుతాయి. కలానికి పని చెపుతాయి. నా కలానికి పని చెప్పేది నా మెదడు. ఆ రెంటి మధ్యకు వచ్చే ధైర్యం నాకు ఉండదు’ అంటూ జవాబిచ్చింది. అది ఎదురులేని జవాబు. గౌరవం గల కుటుంబాలు అనుకొనే చోట్ల కూడా తెరమరుగున జరుగుతున్న తప్పులు నిజానికి పాపాలు అని ఇస్మత్‌ గట్టిగా నమ్మింది.  కథ చదివితే, పాఠకులకు కలిగే భావాలు వేరు. రచయిత్రి అనుకున్నది అంతకన్నా బలంగా ఉందేమో! కొన్ని సంగతులు మన దృష్టిలోకి వస్తే, పట్టనట్టు ఉండడం మంచిది కాదు, అంటుంది ఈ రచయిత్రి. అంటే, కథకు ఆధారమయిన సంగతి ఈమె కళ్ల ముందుకు వాస్తవంగానే వచ్చిందని, అది క్పన కాదని, అర్థమవుతుంది. కనుకనే, ఆమె కదిలిపోయి తన ప్రతిక్రియను కథ రూపంలో చెప్పింది.

కోర్టులో జరిగిన నాటకాన్ని కూడా ఇస్మత్‌ చుగ్తాయి చక్కగా వివరించి చెప్పింది. చాలామంది ఆ దంపతులకు క్షమాపణలతో లేదా అపరాధ రుసుముతో తప్పించుకుంటే మంచిదని సలహా ఇచ్చారట. కానీ, వీళ్లు ఒప్పుకోలేదు. కేసు సాగింది. ఒకరి తర్వాత ఒకరుగా సాక్షులు వచ్చి కథను బూతుగా నిలబెట్టేందుకు ఏవో చెపుతున్నారు. రచయిత్రి పక్షం లాయరు వేసిన ఎదురుప్రశ్నతో వాళ్లంతా వెనుదిరగవలసి వచ్చింది. ఒక పెద్ద మనిషి ఒక వాక్యాన్ని ఎత్తుకుని, ‘ప్రేమికులను  ఎంచుకుంటున్నది’ అన్న మాట బూతు అన్నాడు. లాయర్‌ ఎదురుతిరిగి, ‘అందులో ఏమిటి బూతు? ప్రేమికులా? ఎంచుకోవడమా?’ అని అడిగాడు. ఆ దెబ్బతో ఆ సాక్షి, అట్లాగే కేసు వీగిపోవడం మొదలయింది.

లిహాఫ్‌ గురించి కేసు జరుగుతున్నది. అప్పట్లో ఆ వివరాలను వార్తాపత్రికల వారందరూ ఎప్పటికప్పుడు అచ్చు వేశారు. ఇస్మత్‌ మామగారు అప్పుడొక ఉత్తరం రాశారు. ‘కోడలికి కొంత సలహా ఇవ్వండి. ఆమె అల్లా గురించి, ప్రవక్త గురించి రాస్తే బాగుంటుందని చెప్పండి. అప్పుడయినా, ఆమెకు ఆశీర్వచనాలు అందుతాయేమో! కోర్టు కేసు, అందునా,  బూతు గురించి` ఇదంతా మాకు బాధగా ఉంది. దేవుడు అందరినీ కాపాడుగాక!’ అని ఆయన అందులో రాశారు.

లాహోర్‌లో వీళ్లు సాదత్‌ హసన్‌ మంటోతో ఉన్నారు. ఆ సమయంలోనే మంటో మీద కూడా అదే అభియోగంతో  కేసు మొదయింది. అదే రోజున, అదే సమయానికి అతనికి కేసు కూడా చర్చకు వస్తుంది. ఇంటికి వచ్చిన మంటో అదేదో  విక్టోరియా క్రాస్‌ అంటే, ఇప్పటి పద్మ అవార్డు లాంటిది అందినంత ఆనందంగా ఉన్నాడట! ఇస్మత్‌కు మాత్రం ఆయన గురించి బాధగా ఉంది. అయినా బయటకు కనపరచలేదు.

కోర్టు కేస్‌ కన్నా, విమర్శిస్తూ వచ్చిన ఉత్తరాలు ఇస్మత్‌ను ఎక్కువగా కష్టపెట్టాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె రాసిన తీరు ఒక్క ఇస్మత్‌కే తగును. ‘నాకు బురద, బల్లి, ఊసరవెల్లులంటే చచ్చే భయం. కొంతమంది మహా ధైర్య వంతులమంటూ, బోర విరుచుకుని తిరుగుతారు. చచ్చిన ఎలుక కనిపిస్తే మాత్రం వాళ్ల అసలు సంగతి బయటపడుతుంది.  నాకు ఉత్తరాలను చూస్తే అంత భయమూ అయ్యేది. వాటిలో పాములు, తేళ్లు, పైథాన్‌లు ఉన్నాయన్నంత భయం! అనుమానంగా విప్పిన ఉత్తరంలో ఆ పాములు, తేళ్లు కనిపించినా, తప్పకుండా చదివేదాన్ని. అప్పుడు వెంటనే వాటికి అగ్గి పెట్టేదాన్ని. ఉత్తరాలు షాహిద్‌, అంటే, మా ఆయన కంటపడితే మరోసారి విడాకుల వ్యవహారం చర్చకు వస్తుంది.

సంచలనం పుట్టించిన ఆ కథను రాసినప్పుడు ఇస్మత్‌ తన అన్నగారి ఇంట్లోఉండేది. కథను ఆమె రాత్రిపూట రాసింది. మరుసటినాడు వదినగారికి చదివి వినిపించింది. ఆమె కథ గురించి వ్యాఖ్యానించలేదు. కానీ, అది ఎవరి గురించి రాసిందో అర్థం చేసుకుంది. ఆ తరువాత కథను ఇస్మత్‌ మరొక బంధువు అమ్మాయికి చదివి వినిపించింది. ఆమె ‘ఏం రాశావు? నాకేమీ అర్థం కాలేదు’ అన్నది. కథను అందుకున్న పత్రిక సంపాదకుడు ఏమాటా అనకుండా, వెంటనే దాన్ని అచ్చువేశాడు. అప్పటికి ఇస్మత్‌కు పెళ్లి కాలేదు. కాబోయే భర్త షాహీద్‌ కథను చదివాడు. అది తనకు నచ్చలేదన్నాడు.  ఆ తరువాత కొంత చర్చ కూడా జరిగింది. అయినా పెళ్లి జరిగింది.

అసలు బూతు అన్నది నిర్వఛనానికి అందని సంగతి. ఇవాళ సినిమా, అందునా, తెలుగు సినిమా చూస్తున్నవాళ్లకు  బూతు, పచ్చిబూతు కూడా అవాటయిపోయినయి. ఆడ, మగ పిల్లలతో కలిసి ఆ రకం సినిమాను చూస్తున్నారు. పిల్లలు  కళ్లార్పకుండా బూతు మాట్లాడుతున్నారు. ఇక రచనలో రతి గురించి చెప్పినా, అది వివరంగా లేకుంటే బూతు కాదు.  ఈమధ్యన కూడా ఎన్నో పుస్తకాల గురించి చర్చలు జరిగాయి. ఆడ, మగ సంబంధాలను పచ్చిగా వివరించడం వేరు. వెచ్చగా సూచించడం వేరు అంటున్నారు. మతకల్లోలాలను గురించి కూడా ఇంచుమించు ఈ రకం వాదనలే వినిపించాయి.   ఒక మతాన్ని గొప్ప చేసి చూపితే తప్పు, ఒక మతం అంటూ ఎంత రాసినా తప్పులేదు అన్నది ఇప్పటి పంథా.

ఇస్మత్‌ చుగ్తాయి ఆ కాలంలోనే మతం సమస్యను కూడా మర్మంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిన సత్యాలు కొన్ని ఉంటాయి. కానీ కొందరు మాత్రమే వాటిని గురించి బాహాటంగా చెప్పగలుగుతారు. కొందరు రచయితలు మాత్రమే ఈ రకం సంగతును గురించి రాయగలుగుతారు. ఇస్మత్‌ చుగ్తాయి  ఈ రకం మనుషులో అందరికన్నా ముందుంటారు. ఆమె రాసిన కథలో ఒక ‘స్ట్రాంగ్‌ వాయిస్‌’ వినిపిస్తుంది. ఒక బేగం అఖ్తర్‌, ఒక నూర్జహాన్‌, ఒక మల్లికా ఫుఖ్‌రాజ్‌ గళంలోని బలం ఇస్మత్‌ కథల్లో కూడా కనిపిస్తుంది.

ఇస్మత్‌ రాసిన కథల్లో మొదట్లో ఉన్న గట్టి గొంతుక, తరువాత కొంచెం మెత్తబడిందని పరిశీకులు అన్నారు. అయినా, ఆమె ఆడవారి కష్టాలను గురించి, వర్గ విభేదాలను గురించి, మిగతా అందరికన్నా చాలా బాగా రాశారు. కొన్ని కథలో కూలీవాళ్లను గురించి రాసిన తీరు గొప్పగా ఉంటుంది. ‘ఈ చేతులకు చట్టాలు తెలియవు. ఇవి కేవలం చేతులు.  మురికిని కడిగే చేతులు, ముసలితనాన్ని మోసే చేతులు, మకిలిబారిన ఈ చేతులు భూమి ముఖానికి మెరుగులు అద్దుతున్నాయి’ అంటూ కవితాధోరణిలో ఆమె చెప్పిన మాటలు బీదతనానికి పాడిన హారతిగా వినిపిస్తాయి. అరవయ్యేళ్లనాడే అంత ధైర్యంగా కడగండ్ల బతుకును కథలుగా చెప్పి సమాజం మకిలిని కడగబూనిన ఇస్మత్‌ గురించి ఎంత చెప్పినా చాలదు.

నా సృజన, నా బంధనాలు నేను కోరి తెచ్చుకున్నవి. అవి నా అదుపులోనే ఉన్నాయి. నేను వేసిన పెయింటింగ్‌లు  నా గదిలో వేలాడుతూనే ఉన్నాయి. పచ్చని చేలు, ఆడుకుంటున్న పిల్లలు, ఎగిరే పక్షులు, నిట్టూర్పు,నవ్వు, దూరాన మొగుళ్లు మరెన్నింటినో నేను పట్టేసుకున్నాను అంటుంది ఆవిడ ఒకచోట. వర్గ విభేదాలు, వాటి హద్దులు ఈమె కథలో  కనిపించే వస్తువు. వాటి గురించి చెప్పడానికి ‘ధనిక గౌరవ కుటుంబాలు’ ఎంతగా పనికివచ్చాయో, అంతగానూ బీద బతుకులు కూడా ఆమె కథకు ఆసరా అయ్యాయి.

చుగ్తాయి వర్ణించిన ప్రపంచం ఇప్పుడు లేకపోవచ్చు. అది లేకుండా కావాలన్నదే, ఆమె కోరిక. కథలో ఆమె వంటి వారు అప్పటి పరిస్థితును కంటికి కట్టి చూపకపోతే, అవి కలకాలం నిలిచేవేమో! నిలవకూడదు అనుకున్న ఇస్మత్‌ వంటి రచయిత కోరిక ఫలించింది. కనుకనే, ఆమె హాయిగా వెళ్లి పోయింది. చివరి రోజుల్లో, తనను తిరిగి తన చోటికి చేర్చమని కోరుకున్నది ఆమె. అంటే, ఆమె మనసునిండా గతం నిండి ఉన్నదన్నమాట!  ఆమె కథల్లో చదివి మనం ఇప్పుడు అప్పటి సమాజాన్ని మనసులోనే చిత్రించుకోవాలి. అప్పుడు సమాజంలో వచ్చిన మార్పు మనకు అర్థమవుతాయి. మిగిలి ఉన్న కొన్ని సమస్యలు కూడా మనకు మరింత బాగా మనసుకు ఎక్కుతాయి.

ఉర్దూతో పరిచయం ఉన్నవాళ్లకు ఆమె శైలిలోని ప్రత్యేకత బాగా అర్థమవుతుంది. కానీ, ఆమె కథను అనువాదాల ద్వారానే ఎక్కువగా చదివారు. అనువాదాలు ఎంత బాగా వచ్చిందీ చెప్పగలగడం మరో కష్టం. కవితలాగ గల గలా పారే ఆమె మాటలు అవసరమయిన చోట చటుక్కున ఆగిపోతాయి. చిన్న వాక్యం ఒకటి పడుతుంది,  చదువరిని  ఆశ్చర్యంలో ముంచుతుంది.

ఇస్మత్‌ మరణం తరువాత నివాళి రాస్తూ, మరొక మంచి రచయిత్రి ఖుర్రతులైన్‌ హైదర్‌ అన్న మాటలు వినదగ్గవి.  ‘ఇస్మత్‌ పుట్టిన వంశానికి పూర్వజులలో చంగేజ్‌ఖాన్‌ ఒకరు. అతను ఒక గుడారంలో బతికాడు. ఆ గుడారానికి బంగారం శిఖరం ఉండేది. ఖాన్‌ సైన్యం గుర్రాలమీద కదులుతూ ఉండేది. వాళ్ల గుడారాలన్నింటిమీదా బంగారు పై కప్పులు ఉండేవి. ఆ సైన్యానికి ‘బంగారు సైన్యం’ అని పేరు. ఉర్దూలో దాన్ని ‘ఉర్దూ`ఎ`ముతల్లా’ అనేవారు. సైన్యంలో పుట్టిన భాష కనుక అది ఉర్దూ అయింది. ఇస్మత్‌కు సైన్యం భాష ఉర్దూ అసలయిన ఆడపడుచు పద్ధతిలో అందింది. కత్తిలాంటి వాడి, మెత్తనయిన హాస్యం కలగలిసి అది ఆమె చేత భావచిత్రాలు గీయించింది. ఆమె కథలన్నీ అనుకోకుండా అటువంటి చిత్రాలుగా పాఠకులకు అందాయి. మరొకరికి వీలుగాని శైలి, ఇస్మత్‌కు సొంతమయింది. ఆమెను ఇస్మత్‌ ఖానమ్‌ అంటాను నేను. అంటే, ఆమె ‘ఆడ చంగేజ్‌ఖాన్‌’!

ఇద్దరి మీదా కేసు నడుస్తున్న సమయంలోనే, ఇస్మత్‌, మంటోతో ఒక మాట అన్నది ‘మంటో సాహిబ్‌, క్షమాపణ చెప్పేస్తే పోతుందా? వచ్చిన పైసలతో హాయిగా షాపింగ్‌ చేయవచ్చు’ అన్నది. మంటో మాత్రం కళ్లు పెద్దవిగా తెరిచి, ‘చెత్త’ అన్నాడట! మంటో ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. ‘నీవు ఒక్కర్తివి క్షమాపణ చెప్పవచ్చుకదా?’ అన్నారు చుట్టూ ఉన్నవారు. ‘మీకు మంటో గురించి తెలియదు. నన్ను ఇక బతకనివ్వడు. అతని కోపం ముందు వీళ్లు వేసే శిక్షను భరించడం సులభమని పిస్తుంది’ అన్నది ఇస్మత్‌.

ఆశ్చర్యంగా చివరకు వీళ్లకు శిక్ష లేకుండానే కేసు ముగిసింది. జడ్జ్‌ ఇస్మత్‌ను తన ఛాంబర్‌లోకి పిలిపించి, గౌరవంగా మాట్లాడాడు. ‘నేను మీ కథలన్నీ చదివాను. వాటిలో ఎక్కడా బూతు లేదు. లిహాఫ్‌లో అసలే లేదు. మంటో కథలు మాత్రం కంగాళీగా ఉంటాయి’ అన్నాడు. ‘ఈ ప్రపంచమంతా కంగాళీయే కదా?’ అన్నది ఇస్మత్‌. ఆ పెంటనంతా  ఎత్తి వెదజ్లడం అవసరమా అని జడ్జ్‌ అడిగాడు. ఆ పనిచేస్తే, అది అందరికీ కనపడుతుంది. కనుక ఏదో చేయాలన్న భావం కలుగుతుంది అన్నది ఇస్మత్‌. జడ్జ్‌ నవ్వి ఊరుకున్నాడు. కేస్‌ గెలిచినందుకు ప్రత్యేకించి సంతోషపడింది లేదు అంటుంది ఇస్మత్‌. తనదయిన పద్ధతిలో, మళ్లీ లాహోర్‌కి రావడానికి అవకాశం ఉండదేమోనని బాధ కలిగింది అని మాత్రం అంటుంది.

 

(ఇస్మత్ చుగ్తాయి కథ తెలుగు తర్జుమా వచ్చే గురువారం)

అమ్మ … 

 

 మాగ్జిమ్  గోర్కీ

అనువాదం: నౌడూరి మూర్తి 

 

“ప్రతి తల్లీ మృత్యువుకి వ్యతిరేకమే. అంతే కాదు, ప్రజల ఇళ్ళల్లోకి మృత్యువును జొప్పించే హస్తాలన్నా, తల్లులందరికీ ద్వేషమూ, కోపమే.”

 

అప్పటికి చాలా వారాలబట్టి సైనికులతో ఆ నగరం చుట్టుముట్టబడి ఉంది. రాత్రిపూట నెగళ్ళు లేస్తున్నాయి, చీకటిలో గోడలవైపు కొన్ని వేల జతల ఎర్రబడిన తీక్షణమైన కళ్ళు చూస్తున్నాయి. ఆ చలినెగళ్ళతీరు అశుభాన్నిసూచిస్తూ, ఆ నగరప్రజలని హెచ్చరిస్తున్నట్టుంది. అవి రేకెత్తించే ఆలోచనలూ భయంకరంగా ఉన్నాయి.

నగరప్రాకారపు గోడలనుండి పరికిస్తే, శత్రువు నగరం మీద తన ఉచ్చును రోజు రోజుకీ గట్టిగా బిగిస్తున్నాడని అర్థమైపోతుంది.  ఆ మంటల చుట్టూ నల్లని నీడలు అటూ ఇటూ కదలాడడం తెలుస్తుంది; బాగా మేపిన అశ్వాల శకిలింపులతో పాటు, ఆయుధాల మోతలూ, గెలుపుమీద ధీమా ఉన్న సైనికుల వికటాట్టహాసాలూ, ఆనందంతో పాడేపాటలూ వినిపిస్తాయి.  శత్రువుల పాటలూ, నవ్వులూ వినడం కంటే బాధాకరమైనది ఏముంటుంది?

నగరానికి నీరు సరఫరా చేసే ఏటిని శత్రువు శవాలతో నింపేసేడు; నగరానికి చుట్టూ ఉన్న ద్రాక్షతోటలని తగలబెట్టేడు; పంటలని ధ్వంసం చేసేసేడు; చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నరికేయడంతో నగరం నాలుగువైపులనుండీ బోసిపోయి దాడిచెయ్యడానికి అనువుగా మారిపోయింది; దానితో ప్రతిరోజూ నగరంపై శత్రువు ఫిరంగులతో తుపాకులతో గుళ్ళు కురిపిస్తూనే ఉన్నాడు.

యుద్ధంలో అలిసి, అర్థాకలితో మాడుతున్న సైనికులు ఇరుకైన నగరపు వీధుల్లోంచి వెళుతున్నారు.  ఇంటి కిటికీలలోంచి గాయపడ్డవారి మూలుగులూ, అపస్మారకంలో ఉన్న వ్యక్తుల సంధిప్రేలాపనలు, స్త్రీల ప్రార్థనలూ, పిల్లల ఏడుపులూ వినవస్తున్నాయి. ప్రతివారూ లోగొంతులో, నెమ్మదిగా మాటాడుకుంటున్నారు… మధ్యమధ్యలో, శత్రువు మళ్ళీ నగరం మీద గుళ్ళ వర్షం కురించడం లేదుగదా అని చెవులు రిక్కించి వినడానికి, మాట్లాడుతున్న వారిని ఆపమని సంజ్ఞచేస్తూ.

వాళ్లు ఇళ్ళల్లో దీపాలు వెలిగించడానికి భయపడుతున్నారు; నగరాన్ని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఆ పొగమంచులో, నదికి అడుగున అటూ ఇటూ తిరిగే చేపలా ఒక స్త్రీ ఊరల్లా కలయతిరుగుతోంది… ఆపాదమస్తకం ఒక నల్లని  ముసుగు కప్పుకుని.

ఆమెను గుర్తించిన కొందరు ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు

“ఆమేనా?”

“అవును. ఆమే.”

అంటూ తమ తలలు పక్కకి తిప్పుకుని, ఆమెదారిలో తప్పుకుందికి అయితే దొరికిన దగ్గరగుమ్మం ఎక్కిపోవడమో, లేకుంటే మౌనంగా ఆమెని దాటుకుంటూ వడివడిగా  వెళ్ళిపోవడమో చేస్తున్నారు. రాత్రి పహారాకాస్తున్న దళం నాయకుడు ఆమెని తీవ్రంగా మందలించేడు: “చూడు మరియమ్మా! కొంచెం జాగ్రత్తగా తిరుగు! వాళ్లు నిన్ను కాల్చిపారెయ్యగలరు. అప్పుడు ఎవడాపని చేసేడో పట్టించుకునే నాథుడుకూడా  ఉండడు.”

ఆమె నిటారుగా నిలబడి చూస్తోంది. పహరాకాసే వాళ్లు ఆమెకు కష్టం కలిగించడం ఇష్టలేకో, లేక సందేహిస్తూనో పక్కనుండి తప్పుకున్నారు. ఆమె చుట్టూ సాయుధులు నడుచుకుంటూ వెళ్ళేరు, ఆమె ఒక శవమైనట్టూ, వాళ్ళు ఆ శవాన్ని మోసుకెళుతున్నట్టూ. అయినా ఆమె చీకటిలో తచ్చాడడం మానలేదు. ఆ నగరానికి పట్టిన దురదృష్టంలా … ఒంటరిగా, మౌనంగా, నెమ్మదిగా, నల్లని ముసుగు కప్పుకుని ఒక్కొక్క వీధీ తిరుగుతోంది. ఆమెను అనుసరిస్తున్న శోకంలా… మూలుగులూ, ఎక్కిళ్ళూ, ప్రార్థనలూ, ఇక గెలవలేమని నిరాశచేసుకున్న సైనికుల సంభాషణలూ… ఆమెను వదలలేదు.

Akkadi-MeghamFeatured-300x146

ఆమె ఒక తల్లీ, ఆ నగర పౌరురాలు కూడా . ఆమె ఆలోచనలన్నీ ఆమె కొడుకు చుట్టూ, ఆమె పుట్టిన ఆ నగరం చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె కొడుకు చాలా అందమైన హుషారైన కుర్రాడే గాని, హృదయంలేని వాడు. ఆ నగరాన్ని నాశనం చేస్తున్న సైన్యానికి నాయకుడుగా ఉన్నాడు. మొన్నమొన్నటిదాకా తనకొడుకుని తలుచుకుని తన జన్మభూమికి ఆమె అందించిన కానుకగా; తను పెరగడమేగాక, తనకొడుకుని కనిపెంచిన ఆ నగరసంక్షేమానికి ఆమె సృష్టించిన ఒక ప్రయోజనకర వస్తువుగా చాలా గర్వంగా భావించేది. ఆ ప్రాచీన నగరపు ప్రతి రాయితోనూ ఆమెకు విడరాని అనుబంధం ఉంది; ఎందుకంటే ఆ నగరపు గోడలూ, ప్రతి ఇల్లూ ఆ రాళ్లతో ఆమె పూర్వీకులు కట్టినవే. ఆ మట్టిలో ఆమె వంశీకుల అస్థికలు నిక్షిప్తమై ఉన్నాయి; అక్కడి కథలతో, చరిత్రతో ఆశలతో, గీతాలతో ఆమె అనుబంధం విదదీయరానిది. అటువంటి హృదయం ఇప్పుడు అంత అమితంగా ప్రేమించిన ఆ కొడుకుని పోగొట్టుకుని రెండు ముక్కలైపోయింది. నగరం పట్ల ఆమెకున్న ప్రేమా, కొడుకుపట్ల ఆమెకున్న ప్రేమా త్రాసులో వేసి ఎవరో తూచుతున్నట్టు ఉంది ఆమె స్థితి. ఇప్పుడు ఆమె మనసు ఎటుమొగ్గుతోందో చెప్పడం కష్టం.

ఈ మానసిక స్థితిలో ఆమె రాత్రిపూట వీధులు తిరిగేది; గుర్తుపట్టలేని చాలా మంది ఆమెను చూసి వాళ్ళకి అతి సమీపంగా సంచరిస్తున్న మృత్యుదేవత ఆకారమేమోనని జడుసుకుంటే, ఆమెను గుర్తుపట్టగలిగినవాళ్ళు ఆ దేశద్రోహి తల్లిని తప్పించుకుందికి ఆమె మార్గంనుండి తప్పుకునే వాళ్ళు.

ఒక సారి, ఆ నగరపు సరిహద్దు గోడకి సమీపంగా జనసంచారం లేని ఒక మారుమూలన ఆమెకు మరొక స్త్రీ తారసపడింది.  ఆమె తన ముందున్న శవం దగ్గర మోకాళ్ళపై కూచుని ఆకాశంకేసిచూస్తూ ప్రార్థిస్తోంది. ప్రాకారపు గోడమీద పహారా కాస్తున్న సైనికులు మంద్రస్వరంలో మాటాడుకుంటున్నారు. వాళ్ళ చేతిలోని తుపాకులు ముందుకి చొచ్చుకువచ్చిన రాళ్ళు తగలగానే, చప్పుడు చేస్తున్నాయి.

ఆ దేశద్రోహి తల్లి ఆ స్త్రీని అడిగింది:

“నీ భర్తా?”

“కాదు.”

“అన్నదమ్ముడా?”

“కొడుకు. నా భర్త పదమూడురోజులక్రిందటే చంపబడ్డాడు. ఇవాళ వీడు.”

మృతుని తల్లి చేతులు పైకెత్తి వినయంగా ఇలా అంది:

“మేరీ అన్నీ చూస్తుంటుంది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమెకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.”

“ఎందుకు?” అని అడిగింది మరియమ్మ. దానికి ఆమె,

“ఇప్పుడు వీడు గౌరవప్రదంగా, దేశంకోసం పోరాడుతూ మరణించేడు కాబట్టి నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పగలను: వీడు నన్ను కొన్నిసార్లు చాలా ఆందోళనకు గురిచేసేవాడు; నిర్లక్ష్యంగా తిరుగుతూ, సుఖాలవేటలో ఉండేవాడు; ఆ కారణంగానే, శత్రువులకు నాయకత్వం వహిస్తూ, దేశానికీ, ప్రజలకీ ద్రోహం చేసిన మరియమ్మ కొడుకులా, వీడుకూడా ఎక్కడ ద్రోహం చేస్తాడోనని భయపడే దాన్ని. వాడూ, వాడిని కన్న ఆ తల్లీ నాశనం అయిపోవాలి!”

gorky

చేతుల్లో ముఖం దాచుకుని మరియమ్మ అక్కడనుండి పరిగెత్తింది.

మరుచటిరోజు నగర రక్షకులదగ్గరకి వెళ్లి ఇలా అంది:

“నా కొడుకు మీ శత్రువుగనుక నన్ను చంపనన్నా చంపండి లేదా నగరద్వారమైనా తెరవండి నేను వాడి దగ్గరకిపోడానికి వీలుగా.”

వాళ్ళు సమాధానంగా,

“మీరు ఈ నగర పౌరులు. మీకు ఈ నగరమే ప్రాణప్రదమైనది.  మీ కొడుకు మాకు ఎంత శత్రువో మీకూ అంతే,” అన్నారు.

“నేను అతని తల్లిని. అతనంటే నాకు ప్రేమ. అతను ఇలా తయారవడానికి నేనే బాధ్యురాలిని అని అనుకుంటున్నాను.”

అపుడు వాళ్లందరూ ఈ విషయమై ఏమి చెయ్యాలో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చేరు .

“మీ కొడుకు చేసిన పొరపాటుకి మిమ్మల్ని చంపడం భావ్యం కాదు.  మీరూ ఇటువంటి పాపాన్ని చెయ్యమని మీ కుమారుడికి సలహా ఇస్తారని మేము భావించలేము. అది మీకు ఎంత బాధాకరమో మేము గ్రహించగలము. ఆ రాక్షసుడు మిమ్మల్ని మరిచిపోయేడని మేము భావిస్తున్నాము.  అదే మీకు పెద్ద శిక్ష, మీరు దానికి అర్హులనుకుంటే.  మా దృష్టిలో అది చావుకన్నా భయంకరమైనది. ”

“అవును, అది చాలా బాధాకరం. ”

వాళ్ళు నగర వాకిలి తెరిచి ఆమెని బయటకి పోనిచ్చారు.

ఆమె కుమారుడివల్ల రక్తసిక్తమైన ఆమె జన్మభూమిని విడిచిపెడుతూ … విడిచిపెడుతూ … ఆమె వెళ్లడాన్ని వాళ్లు చాలసేపు గోడని ఆనుకుని గమనించేరు. ఆ బురదలో ఆమె మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ, నగరరక్షణలో ప్రాణాలర్పించిన వారి దేహాలదగ్గర వినమ్రంగా తలవాల్చుతూ, త్రోవలో పడి ఉన్న మారణాయుధాలని కోపంగా కాలితో విసరికొడుతూ వెళ్లడం గమనించేరు. ఎందుకంటే, తల్లులెప్పుడూ వినాశకరమైన వస్తువుల్ని ద్వేషిస్తారు; ప్రాణాల్ని నిలిపే వస్తువులపట్లే వారికి మక్కువ.

తన ముసుగుక్రింద ఏదో ద్రవాన్నీ తీసుకెళుతున్నట్టూ, అదెక్కడ ఒలికిపోతుందో అని భయపడుతున్నట్టూ ఉన్నాయి ఆమె అడుగులు.  అలా  అలా వెళుతున్న కొద్దీ… ఆమె రూపం చిన్నదయిపోతున్న కొద్దీ… నగర వాకిలినుండి గమనిస్తున్న వాళ్లకి ఆమె పట్ల అంతకు ముందున్న నిర్వేదము, విచారమూ తగ్గినట్టనిపించింది.

ఆమె సగందూరం గడిచిన తర్వాత ఆగి, తన పైనున్న ముసుగు వెనక్కి తొలగించి, నగరాన్ని ఒక సారి వెనక్కితిరిగి చూడడం వాళ్ళు గమనించారు. దూరంగా శత్రుశిబిరాలలోని వాళ్ళుకూడా మరుభూమినుండి ఆమె ఒంటరిగా రావడం గమనించారు. ఆమెలా నల్లని ముసుగులు ధరించిన ఆకారాలు ఆమెని సమీపించాయి.  ఆమె ఎవరో, ఎక్కడికి వెళుతోందో కనుక్కున్నాయి.

 

“మీ నాయకుడు నా కుమారుడు,” అందామె. ముసుగులలోని వ్యక్తులెవ్వరూ ఆమె మాటలని సందేహించలేదు. వారి నాయకుడి తెలివితేటలూ, ధైర్యసాహసాలు కొనియాడుతూ ఆమె ప్రక్కగా నడిచేరు. ఆమె ముఖంలో ఎక్కడా ఆశ్చర్యం పొడచూపకుండా గర్వంగా తలెత్తుకుని నడిచింది. ఆమె కొడుకంటే అలాగే ఉండాలి మరి!

పుట్టకముందు తొమ్మిది నెలల ముందునుండే పరిచయమున్న వ్యక్తి ఎదురుగా నిలబడింది. మునుపెన్నడూ ఆమె తన మనసులోని భావాలని అతనికి వ్యక్తపరచి ఉండలేదు. ఆమె ఎదురుగా అతను మెత్తని పట్టు వస్త్రాలు కట్టుకుని, రత్నాలు పొదిగిన కత్తి ధరించి నిలబడ్డాడు. ఆమె తన కలల్లో అతన్ని ఎలా రూపు కట్టుకుందో, ఏది ఎలా ఉండాలో అది అలా ఉంటూ… పేరూ, ప్రఖ్యాతీ, సంపదతో సాక్షాత్కరించాడు ఆమె కళ్ళకి.

“అమ్మా!” అంటూ ఆమె చేతులు ముద్దాడాడతను. ” నువ్వు నా దగ్గరకి వచ్చేవు అంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావన్న మాట. రేపే ఆ పాపిష్టి నగరాన్ని వశపరచుకుంటాను.”

“నువ్వు అక్కడే పుట్టావు.”

అతని విజయాలు తలకెత్తిన మత్తులో, మరింత కీర్తి సంపాదించాలన్న కాంక్షతో, యవ్వనసిద్ధమైన అహంకారంతో మాటాడేడు.

“నేను ఈ ప్రపంచంలో పుట్టేను… ఈ ప్రపంచం కోసం, దాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి పుట్టేను. నీ కారణంగా ఈ నగరాన్ని ఇన్నాళ్ళూ ఉపేక్షించేను. నేను అనుకున్నంత తొందరగా యశస్సు సంపాదించడానికి అడ్డంగా కాలిలో ముల్లులా ఉంది ఇన్నాళ్ళూ. నేడో రేపో నా దారికి అడ్డంగా మొండిగా ఎదిరిస్తూ నిలబడిన వారిని హతమారుస్తాను.”

“అక్కడి ప్రతి రాయీకీ నువ్వూ, నీ బాల్యమూ గుర్తే.”

‘రాళ్లకేముంది, అవి మూగవి. అవి నాగురించి మాటాడలేకపోతే పర్వతాలనే నాగురించి మాటాడేలా చేస్తాను. నాకు కావలసింది అదే.”

“మరి మనుషుల సంగతో?” ఆమె అడిగింది.

“ఆహా! అమ్మా వాళ్ల నెందుకు మరిచిపోతాను. వాళ్ళు నాకు అవసరం కూడా. ప్రజల జ్ఞాపకాలలోనే గదా వీరులు చిరంజీవులుగా మిగిలేది.”

దానికి సమాధానంగా, ఆమె

“ఎవడు ప్రాణాన్ని సృజిస్తాడో, మృత్యువుని ద్వేషించి దాన్ని జయించగలడో వాడూ నిజమైన వీరుడంటే!”

“కాదు,” అన్నాడతను ఆమె మాటలని ఖండిస్తూ, “నగరాల్ని నిర్మించినవాడికి ఎంత కీర్తి ఉంటుందో, వాటిని నిర్మూలించినవాడికికూడా అంత కీర్తి దక్కుతుంది. ఉదాహరణకి  ‘ఈనియస్’, ‘రోమ్యులస్’ రోము నగరాన్ని నిర్మించోరో లేదో నాకు తెలియదు గాని, దానిని నాశనం చేసినది ‘అలారిక్’ అని మాత్రం తెలుసును.”

“ఆ పేరు అన్ని పేరులకన్నా చిరంజీవిగా మిగిలిపోయింది.”

ఈ రీతిగా వాళ్ళ సంభాషణ సూర్యాస్తమయం దాకా కొనసాగింది.  రానురాను అతని వ్యర్థ ప్రలాపాలని ఆమె అడ్దుకోవడం తగ్గడంతో పాటు, అంతవరకు గర్వంతో విరుచుకున్న ఆమె గుండె రానురాను కుదించుకుపో సాగింది.

తల్లి ప్రాణాన్నివ్వడమే కాదు, ప్రాణాన్ని నిలబెడుతుంది; ఆమె సన్నిధిలో వినాశము గురించి మాటాడడమంటే, ఆమెకు ప్రాణం గురించి ఉన్న అవగాహనని త్రోసిపుచ్చడమే. అది తెలియక, ఆమె కొడుకు  ప్రాణం గురించి ఆమె చెబుతున్న అన్ని విషయాలనీ పక్కన బెడుతున్నాడు.

painting: Satya Srinivas

painting: Satya Srinivas

ప్రతి తల్లీ మృత్యువుకి వ్యతిరేకమే. అంతే కాదు, ప్రజల ఇళ్ళల్లోకి మృత్యువును జొప్పించే హస్తాలన్నా, తల్లులందరికీ ద్వేషమూ, కోపమే. కానీ, నిర్దాక్షిణ్యమైన కీర్తికాంక్ష మెరుపులకు కళ్లు గప్పుకుపోయి, మనసు చచ్చిపోవడంతో కొడుకు ఆ విషయాన్ని గ్రహించలేకున్నాడు.

ఏ తల్లి ‘ప్రాణానికి’ ప్రాణంపోసి పెంచుతుందో, ఆ తల్లే ఆ ప్రాణాన్ని పరిరక్షించే విషయం వచ్చేసరికి జంతువులా ఎంత నిర్దాక్షిణ్యంగా, ఉపాయశీలిగా ఉండగలదో అతను ఎరుగడు.

వినివిని, శక్తి సన్నగిల్లి, తల వంచుకుని ఆమె అలా కూలబడిపోయింది. సుసంపన్నమై, తెరచి ఉన్న నాయకుడి గుడారం ముఖద్వారంనుండి… తన నగరాన్నిచూస్తోంది… తన తొలిసంతానం … కొడుకు … కడుపులోపడినపుడు తను అనుభవించిన పులకింతలూ, పురిట్లో తను పడ్డ బాధలూ అన్నీ గుర్తుచేసుకుంది; ఇపుడు వాడికి ఆ ఊరిని నాశనం చేయడమే ఏకైక ధ్యేయం.

సూర్యుడు తన రక్తారుణిమ కిరణాలతో నగరాన్నీ, అక్కడి గోడల్నీ ముంచెత్తుతున్నాడు. కిటికీలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయా అన్నట్టు మెరుస్తున్నాయి. నగరం నగరమంతా గాయపడ్దట్టూ, దాని వందల గాయాల్లోంచి రక్తం స్రవిస్తున్నట్టూ అనిపిస్తోంది. కాలం కరిగిపోయింది. నగరం శవంలా నల్లబారింది.  శోకచిహ్నంగా వెలిగించే కొవ్వొత్తులా నక్షత్రాలు ఆకసంలో వెలిగాయి.

శత్రువు దృష్టిని ఎక్కడ ఆకర్షిస్తాయోనన్న భయంతో నగరంలోని ప్రజలు దీపాలు వెలిగించకుండా చీకటిలో ఉండడం తన మనోనేత్రంతో దర్శించింది. నగరంలోని వీధులన్నీ శవాలనుండి వెలువడే దుర్గంధంతోనూ, మృత్యువుకి ఎదురుచూస్తున్న ప్రజల గుసగుసలతోనూ నిండిపోయాయి. అన్నిట్లోనూ ఆమెకి తనే కనిపించింది. ఆమెకు అక్కడపుట్టిన ప్రతివస్తువూ, పరిచయమున్న ప్రతివస్తువూ ఎదురుగా నిలబడి ఆమె నిర్ణయానికై ఎదురుచూస్తున్నట్టు అనిపించింది; తన కొడుకు ఒక్కడికేగాక, ఆమె తను పుట్టిన నగరంలోని ప్రజలందరికీ తల్లిని అని అనిపించింది.

ఎత్తైన కొండశిఖరాలనుండి  మేఘాలు లోయలోకి దిగిపోయాయి, రెక్కలున్న వార్తాహరుల్లా  నగరమంతా కమ్ముకున్నాయి.

“బహుశా ఈ రాత్రికి దాడి చెయ్యవచ్చు,” అన్నాడు ఆమె కొడుకు. “రాత్రి అంతా చీకటిగా అనుకూలంగా ఉంటే. కళ్ళల్లో సూర్యుడు పడినా, ఆయుధాల మిలమిలలు కంట్లోపడినా శత్రువుని చంపడం కష్టం. చాలా దెబ్బలు వృధా అయిపోతాయి,” అన్నాడు తన కత్తిని మరొకసారి  పరీక్షగా చూసుకుంటూ.

“నాన్నా ఇలా రా,” అంది తల్లి: “రా, నా గుండెమీద కాస్త విశ్రాంతి తీసుకో. నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా, దయాళువుగా ఉండేవాడివో, అందరూ నిన్నెంత ప్రేమించేవారో  ఒక్కసారి గుర్తుచేసుకో.”

ఆతను ఆమె మాటని మన్నించాడు. ఆమెపై వాలి, కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు:

“నాకు నవ్వన్నా, కీర్తిప్రతిష్టలన్నా ఇష్టం, ఎందుకంటే నువ్వు నన్ను కనిపెంచేవు కాబట్టి.

“మరి స్త్రీలో?”, అతని మొహం మీద  మొహం వాల్చి అడిగింది.

“చాలా మంది ఉన్నారు జీవితంలో.  కాని త్వరలోనే వాళ్ల పట్ల విముఖత వచ్చేస్తుంది, తియ్యనివన్నీ త్వరలో వెగటుపుట్టించినట్లు.”

“నీకు నీ వంశాన్ని ఉద్ధరించాలని లేదా?”

“ఎందుకూ? ఎవడో ఒకడు వాళ్ళని చంపడానికా?  నాలాంటి వాడెవడో వాళ్ళని హతమారుస్తాడు.  అది నన్ను దుఃఖంలో ముంచుతుంది. అప్పటికి తప్పకుండా నేను ముసలివాణ్ణై, శక్తి సన్నగిలి ప్రతీకారం తీర్చుకోలేని స్థితిలో ఉంటాను.”

ఆమె నిట్టూరుస్తూ, “నువ్వు చాలా అందగాడివి. కానీ, మెరుపులా అనపత్యుడివి.”

అతను నవ్వుతూ అన్నాడు: “నిజం. నేను మెరుపులాంటి వాడిని.”

అతను చిన్నపిల్లవాడిలాగే ఆమె గుండెమీద నిద్రపోయాడు.

ఆమె అతని ముఖంపై తనపైనున్న నల్లని వస్త్రాన్ని కప్పి గుండెలో కత్తితోపొడిచింది.  ఒక్క సారి అతను వణికి, వెంటనే ప్రాణాలు విడిచాడు, ఎందుకంటే తల్లిగా ఆమెకు తన కొడుకు గుండె ఎక్కడ చప్పుడు చేస్తోందో బాగా తెలుసు.  శవాన్ని తన కాళ్ళమీదనుండి ఆశ్చర్యంలో మునిగిన కాపలాదారుల కాళ్లమీదకి త్రోసి, తన నగరం వైపు వేలు చూపిస్తూ ఆమె ఇలా అంది:

“ఒక పౌరురాలిగా నా జన్మభూమికి నేను చెయ్యగలిగినదంతా చేశాను; కాని తల్లిగా నేను నా కొడుకుతోపాటే ఉంటాను. నాదిపుడు పిల్లలని కనే వయసు కాదు. నా జీవితం ఎవరికీ పనికిరాదు కూడా,” అని అంటూ, తనకొడుకు రక్తం … తనరక్తం.. వేడి ఇంకా చల్లారని అదే కత్తిని తన గుండెల్లోకి దించుకుంది. నిస్సందేహంగా అది గుండెలోనుండి దూసుకుపోయి ఉండాలి.  హృదయం వేదనకు గురయినప్పుడు దాన్ని తప్పిపోకుండా గురిచూడడం సులభం!

.(Courtesy: Phoenix, Vol 3 July-Aug 1915 No 2-3  pp 45 – 51)

  మూతపడ్డ వ్యాపారం

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్
అనువాదం:     ఎలనాగ

 

సోమర్సెట్ మామ్ పరిచయం

 

సోమర్సెట్ మామ్ (1874 – 1965) ఇంగ్లండ్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధ నాటక, నవలా, కథా రచయిత. అతనికి పది సంవత్సరాల వయసు వచ్చేసరికే తలిదండ్రులిద్దరూ చనిపోవడంతో, పెదనాన్న దగ్గర పెరిగాడు. మామ్ మెడికల్ డాక్టరు. 1897 లో మామ్ రాసిన మొదటి రచన – లిజా ఆఫ్ లాంబెత్ అనే నవల – ఎంత విపరీతంగా అమ్ముడు పోయిందంటే, దాంతో ఆయన తన వైద్యవృత్తిని వదిలి పూర్తిస్థాయి రచయితగా స్థిరపడిపోయాడు.

మామ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రెడ్ క్రాస్ సంస్థలో పని చేసి, తర్వాత బ్రిటిష్ గూఢచారి విభాగంలో చేరాడు. అప్పుడతడు స్విట్జర్లాండ్, రష్యాలలో పని చేశాడు. ఇండియాలోనే కాక, మలయా (మలేషియా) వంటి దక్షిణప్రాచ్య దేశాలలో పర్యటించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను కథలుగా, నవలలుగా మలిచాడు. భారత దేశానికి వచ్చినప్పుడు అక్కడి తత్వవేత్తలు చెప్పిందాని గురించీ, తాను విన్న వీణావాద్య కచేరీ గురించీ, చూసిన ఫకీర్ల విన్యాసాల గురించీ ద సమింగ్ అప్ అన్న పుస్తకంలో మనం చదవవచ్చు.

తనపట్ల నిర్లక్ష్యాన్ని చూపిన పెదనాన్న కారణంగా, ఇంకా స్కూలు అనుభవాల మూలంగా మామ్ జీవితపు మొదటి భాగంలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి. అతనికి నత్తి వచ్చింది.

మామ్ రాసిన నవలల్లో ఆఫ్ హ్యూమన్ బాండేజ్ (1915) అత్యంత పేరెన్నిక గన్నది. Theodore Dreiser అనే ప్రసిద్ధ అమెరికన్ విమర్శకుడు ఆ నవలను బేథోవెన్ సింఫనీతో పోల్చాడు. 1907 లో మామ్ వి నాలుగు నాటకాలు ఒకే సమయంలో లండన్ లోని నాటక ప్రదర్శనశాలల్లో ఆడినప్పుడు Punch పత్రిక ఒక కార్టూన్ ను ప్రచురించింది. అందులో మామ్ నాటకపు పోస్టర్ను చూసి షేక్స్పియర్ ఆందోళనతో గోళ్లు కొరుక్కుంటున్నట్టుగా చిత్రించబడిందట!

మామ్ దాదాపు 30 నవలలు, 25 నాటకాలు రాయడమే కాక ఎన్నో కథాసంకలనాలు, ఇతర రకాల రచనలు చేశాడు. నవలల్లో ఆఫ్ హ్యూమన్ బాండేజ్ కాక, ద మూన్ అండ్ సిక్స్ పెన్స్, ద పెయింటెడ్ వేల్, ద రేజర్స్ ఎడ్జ్, కేక్స్ అండ్ ఏల్, క్రిస్మస్ హాలిడే మొదలైనవి చెప్పుకోతగినవి. ఆయన రాసిన కథల్లో రెయిన్, ద ఏలియెన్ కార్న్, ద వెసెల్ ఆఫ్ ర్యాత్, మిస్టర్ నో ఆల్, ఫూట్ ప్రింట్స్ ఇన్ ద జంగిల్, లార్డ్ మౌండ్రాగో, గిగోలో అండ్ గిగోలెట్ మొదలైనవి ప్రసిద్ధమైనవి.

***

 

 

నేను వివరించకుండా ఉండలేని ఈ సంఘటనలు ఏ ఆనందమయ దేశంలో జరిగాయో ఆ దేశం పేరును చెప్పేలా నన్ను ఏదీ చెయ్యజాలదు. కాని అది అమెరికా ఖండంలోని ఒక స్వతంత్ర దేశం అన్న విషయాన్ని చెబితే ఏ హానీ ఉండదని తెలుసు నాకు. ఈ రకంగా చెప్పడంలో సరిపోయినంత అస్పష్టత వుంది కనుక, దీంతో ఏ విధమైన రాజకీయ సమస్యా తలెత్తే ఇబ్బంది వుండదు. ఆ దేశ అధ్యక్షుడు ఒక అందమైన స్త్రీ మీద కన్నేశాడు.

ఆ అధ్యక్షులవారి రాజధాని సూర్యకాంతి పుష్కలంగా ప్రసరించే ఒక విశాలమైన నగరం. అక్కడ ఒక దుకాణాల సముదాయం వుంది. ఒక చక్కని చర్చి భవనమూ కొన్ని పురాతన స్పానిష్ గృహాలూ కూడా ఉన్నాయి. మనసుల్ని రంజింపజేసే గుణం ఉన్న ఒక యువకుడు మిషిగన్ నుంచి ఆ నగరానికి వచ్చి అదే స్త్రీ మీద మనసు పారేసుకున్నాడు. ఆ అధ్యక్షుడు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రేమను ఆమెకు వెల్లడించాడు. ఆమె కూడా అతని పట్ల తన ప్రేమను వ్యక్తపరచటంతో సంతుష్టుడయ్యాడు. కాని ఆ యువకునికి ఒక భార్య, ఆ స్త్రీకి ఒక భర్త అవసరం కావటమన్నది తాను ఆమెను పొందటానికి అడ్డంకిగా మారిందని తెలుసుకుని మానసిక క్షోభకు గురయ్యాడు. పెళ్లి చేసుకోవాలనే స్త్రీసహజమైన కోర్కె ఉన్నదామెకు.

అది అతనికి అసమంజసం అనిపించినా ఒక అందమైన స్త్రీ తనను కోరుకున్నప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయే అమాయకుడు కాదతడు. ఆమెకు పెళ్లి అయ్యేందుకు అనువైన పరిస్థితులు నెలకొనేలా చేస్తానని ఆ అధ్యక్షుడు వాగ్దానం చేశాడు. అతడు తన ఆస్థానంలోని న్యాయకోవిదులను పిలిపించి విషయాన్ని వాళ్ల ముందుంచాడు. తన దేశంలోని వివాహచట్టాలు చాలా పాతబడిపోవటం వల్ల అవి ఎంతమాత్రం సవ్యంగా లేవని తాను యెప్పట్నుంచో అనుకుంటున్నట్టూ, దేశం అభివృద్ధిపథంలో పయనించాలంటే  ఆ చట్టాలలో సమూలమైన మార్పుల్ని తేవాలని తాను భావిస్తున్నట్టూ తెలిపాడు వాళ్లకు. ఆ న్యాయకోవిదులు అధ్యక్షులవారి నుండి సెలవు తీసుకుని పోయి, ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని రోజులకే ఒక విడాకుల చట్టాన్ని తయారు చేసుకుని తెచ్చారు. దాన్ని రూపొందించేటప్పుడు అది అధ్యక్షునికి నచ్చేట్టు ఉండేలా జాగ్రత్త పడ్డారు వాళ్లు. కాని నేను చెబుతున్న దేశం ఎంతో నాగరికత, ప్రజాస్వామ్యం ఉన్నది కావడమే కాక గొప్ప ప్రతిష్ఠ ఉన్నది కావటంవల్ల, అక్కడ ఏం చెయ్యాలన్నా చాలా జాగ్రత్తగా, చట్టబద్ధంగా చేయాలి. అక్కడ దేశాధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తికి ఎంత గొప్ప గౌరవం ఉన్నా కొన్ని సూత్రాలను పాటించకుండా అతడు ఏ చట్టాన్నీ ప్రవేశపెట్టలేడు – ఆ చట్టం తనకోసం చేసుకున్నదైనా! కాబట్టి ఆ పనికి కొంత కాలం పట్టింది.

కొత్త విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది కాలంలోనే ఆ దేశంలో విప్లవం మొదలైంది. దురదృష్టవశాత్తు ఆ దేశాధ్యక్షుణ్ని రాజధానిలోని ప్రధాన కూడలిలో చర్చి ముందర ఒక స్తంభానికి ఉరి తీశారు. హృదయాలను రంజింపజేసే యువకుడు ఆదరాబాదరాగా ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు. కాని ఆ చట్టం అట్లాగే ఉండిపోయింది. దాని నిబంధనలు సరళంగా ఉన్నాయి. ముప్ఫై రోజులపాటు భార్యాభర్తలిద్దరు కలిసి బతికింతర్వాత వంద డాలర్లకు సమానమైన బంగారాన్ని ఇస్తే భర్త కాని భార్య కాని తన జీవిత భాగస్వామికి విడాకులివ్వవచ్చు – అదీ ఏ రకమైన సమాచారాన్నీ ముందుగా ఇవ్వకుండానే. ఉదాహరణకు ఒక భార్య తాను తన ముసలి తల్లితో ఓ నెల రోజులపాటు ఉండబోతున్నట్టు భర్తతో చెప్పి వెళ్లిపోవచ్చు. తర్వాత ఒకరోజు ఉదయాన అల్పాహారం తర్వాత భర్త తనకు వచ్చి ఉత్తరాలను చూసుకుంటున్నప్పుడు తాను విడాకులిచ్చి వేరే పురుషుణ్ని పెళ్లి చేసుకున్నట్టు భార్య రాసిన ఉత్తరం అతనికి కనపడవచ్చు.

ఈ సంతోషకర వార్త స్వల్పకాలం లోనే అంతటా వ్యాపించింది. న్యూయార్క్ నుండి మరీ ఎక్కువ దూరంలో లేనటువంటి ఒక దేశ రాజధానిలో సమశీతోష్ణ వాతావరణంతో పాటు మరీ అంత ఇబ్బందికరం కాని వసతి సౌకర్యం ఉన్నదనీ, అక్కడ స్త్రీలు తమకు చిరాకును కలిగించే వివాహబంధం నుండి తక్కువ సమయంలో తక్కువ డబ్బు ఖర్చుతో విముక్తిని పొందవచ్చుననీ తెలిసిపోయింది ప్రజలకు. భర్తకు తెలియకుండానే అటువంటి తతంగాన్ని నడుపుకోగలగడం అన్నది కేసు నడుస్తున్నప్పుడు మనసుకు క్షోభను కలిగించే వాదప్రతివాదాల నుండి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఒక ప్రతిపాదనకు వ్యతిరేకంగా పురుషుడు ఎంతగానైనా వాదించవచ్చును కాని, చివరకు ఆ వాదాన్ని వదిలి తోకాడిస్తాడని ప్రతి స్త్రీకీ తెలుసు. తనకొక రోల్స్ రాయిస్ కారు కావాలని భార్య అడిగితే భర్త తనదగ్గర అంత డబ్బు లేదనవచ్చు. కాని ముందు చెప్పకుండా ఆమె ఆ కారును కొన్నదనుకోండి. అప్పుడతడు పిల్లిలాగా చెక్కుమీద సంతకం పెట్టి ఇస్తాడు. అందువల్ల కొద్ది కాలంలోనే  అందమైన స్త్రీలు పెద్ద సంఖ్యలో ఆ నగరానికి తరలి వచ్చారు.

వ్యాపార వ్యవహారాలతో అలసిపోయిన స్త్రీలు, ఫ్యాషన్ ప్రపంచంలో వెలిగిపోయిన స్త్రీలు, ఖుషీయే జీవన విధానం అయిన స్త్రీలు, ఏ పనీపాటా లేక రికామీగా ఉండే స్త్రీలు – ఇటువంటి వాళ్లంతా న్యూయార్క్, షికాగో, సాన్ ఫ్రాన్సిస్కో, జార్జియా, డకోటా మొదలైన అన్ని రాష్ట్రాలనుండి వచ్చారు. దాంతో ఆ నగరానికి వచ్చే ఓడల్లో వసతి బొటాబొటిగా మాత్రమే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఓడలో ప్రత్యేకమైన గది కావాలంటే ఆరు నెలలు ముందుగానే రిజర్వు చేసుకోవాలి. ఆ నగరం అలా సంపదతో వర్ధిల్లిపోయింది. కొద్ది కాలంలోనే అక్కడి న్యాయవాదులకు గిరాకీ బాగా పెరిగి, ప్రతి లాయరూ ఫోర్డ్ కారును కొనుక్కోగలిగే స్థాయికి చేరుకున్నాడు. గ్రాండ్ హోటలుకు యజమాని అయిన డాన్ ఆగస్టో ఎంతో ఖర్చు పెట్టి అదనంగా చాలా బాత్ రూములను కట్టించాడు. అయితే అలా చేసినందుకు అతడు విచారించలేదు. ఎందుకంటే ఎంతో లాభం వచ్చిందతనికి. పూర్వ దేశాధ్యక్షుణ్ని ఉరి తీసిన స్తంభం ముందునుండి పోయిన ప్రతిసారీ అతడు హుషారుగా దానికి వందనం చేశాడు.

ఒకసారి “అతడు మహానుభావుడు. ఏదో ఒకరోజు అతనికోసం శిలావిగ్రహాన్ని కట్టించి నిలబెడతారు” అన్నాడు డాన్ ఆగస్టో.

సౌకర్యవంతమైన, సమంజసమైన ఆ చట్టం ద్వారా కేవలం స్త్రీలే  లాభపడ్డారని చెప్పాను నేను. కాని అమెరికాలో పవిత్ర వివాహబంధం అనే జంజాటం నుండి విముక్తిని కోరుకునేవారు స్త్రీలు మాత్రమేననీ, పురుషులు కాదనీ సూచిస్తాయి నా మాటలు. అయితే నా ఉద్దేశం అది కాదని నా నమ్మకం. ఆ దేశానికి ఎక్కువగా స్త్రీలే ప్రయాణించినప్పటికీ అట్లా ఆరు వారాల పాటు సొంత ఊరు వదిలి వెళ్లటం (పోవడానికీ రావడానికీ ప్రయాణం కోసం ఒక్కొక్క వారం, ఆ దేశవాసిగా గుర్తింపు కోసం నాలుగు వారాలు) ఆడవాళ్లకే సులభం కావటమే అందుకు కారణం అంటాను నేను. మగవాళ్లకైతే అంత కాలం పాటు తమ వ్యవహారాలన్నిటినీ వదిలేసి పోవటం కష్టం కదా. వేసవి సెలవుల్లో అక్కడికి పోవచ్చునన్నది నిజమే కాని, ఆ వేడిమి కలిగించే బాధను అనుభవించాల్సి వస్తుంది. పైగా అక్కడ గోల్ఫ్ మైదానాలు లేవు. ఒక నెల పాటు గోల్ఫ్ ఆడే అవకాశాన్ని వదులుకునే బదులు, భార్యకు విడాకులివ్వకపోవటం వైపే ఎక్కువ మంది పురుషులు మొగ్గు చూపుతారని మనం అనుకోవచ్చు. గ్రాండ్ హోటల్లో ఇద్దరుముగ్గురు మగవాళ్లు నెలరోజుల పాటు మకాం వేశారన్నది నిజమే. కాని వాళ్లు వ్యాపార పరమైన పని మీద వచ్చారట. అసలు కారణం అంత స్పష్టంగా బోధపడటం లేదు. వాళ్ల వ్యాపకాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నా ఊహ ప్రకారం వాళ్లు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఏకకాలంలో అటు మజా చేసే స్వాతంత్ర్యాన్నీ, ఇటు వ్యాపారంలో లాభాన్నీ పొందారనిపిస్తుంది.

ఈ గొడవనట్లా వుంచుదాం. అసలు వాస్తవమేమంటే, గ్రాండ్ హోటల్లో చాలా వరకు ఆడవాళ్లే బస చేశారు. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత వాళ్లు వరండాలో కమాను ఆకారంలో ఉన్న పైకప్పుల కింద చిన్న చతురస్రాకారపు బల్లల చుట్టూ కూచుని షాంపేన్ తాగుతూ తమ వైవాహిక ఇబ్బందుల గురించి చర్చించుకుంటూ సమయాన్ని ఆనందంగా గడిపారు. డాన్ ఆగస్టోకు మిలిటరీ అధికారులు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, వర్తకులు, స్థానిక యువకులు – వీళ్లందరి ద్వారా బోలెడంత వ్యాపారం జరిగి, పిచ్చిగా లాభాలు వచ్చాయి. ఎందుకంటే, తన హోటల్లో బస చేసిన అందమైన స్త్రీలను చూడటం కోసం వీళ్ళందరూ వచ్చేవారు. కాని పూర్తిగా సవ్యమైనది ఈ ప్రపంచంలో ఎప్పుడూ దొరకదు కదా! ప్రతిదాంట్లో ఏదో ఒక అపసవ్యత వుంటుంది. భర్తలను వదిలించుకోవాలనుకునే ఆ స్త్రీలు చాలా మట్టుకు ఆందోళనగా ఉండేవారు. వాళ్ల వైపునుండి ఆలోచించినప్పుడు మరి అది సమంజసమే.

వాళ్లను సంతోషపెట్టడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ఆ చిన్న నగరంలో ఎన్నో మంచి అంశాలున్నా వినోదకర ప్రదేశాలు మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ వున్న ఒకేఒక్క సినిమా టాకీసులో ఆడే చిత్రాలు చాలా కాలం క్రితం హాలీవుడ్ లో వెలువడినవై ఉంటాయి. పగటి వేళల్లో ఆ స్త్రీలు తమ లాయర్లతో మంతనాలు జరుపవచ్చు, గోళ్ళకు పాలిష్ వేసుకోవచ్చు, కొంచెం షాపింగు కూడా చేసుకోవచ్చు. కాని సాయంత్రాలను గడపటం దుర్భరంగా ఉంటుంది. నిబంధనలో వున్న నెల రోజుల బస అన్నది ఎక్కువ అని చాలా మంది ఫిర్యాదు చేశారు. సహనం కొరవడిన ఒకరిద్దరైతే ఆ వ్యవధిని నలభై ఎనిమిది గంటలకు కుదించి చట్టంలో బలాన్నీ ఉత్సాహాన్నీ కొంచెం పెంచవచ్చును కదా అని తమ లాయర్లను అడిగారు. డాన్ ఆగస్టో శక్తియుక్తులున్న మనిషి. ఆయన ఈ విషయంలో స్ఫూర్తిని పొంది, మారింబా అనే వాద్యాన్ని వాయించే గ్వాటెమాలా దేశపు కళాకారుల బృందాన్ని తన హోటల్లో నియమించాడు. ఆ సంగీతం ఎట్లా ఉంటుందంటే, దానికన్న ఎక్కువగా కాళ్లలో చలనాన్నీ ఆపుకోలేనంత ఉత్సాహాన్నీ కలింగించేది ప్రపంచంలో మరొకటి వుండదు.

హాల్లో ఉన్న ప్రతి ఒక్కడూ దాన్ని వినగానే వెంటనే నిలబడి డాన్సు చేయడం మొదలెట్టాడు. ఆ ఇరవై ఐదుగురు స్త్రీలు డాన్సు చేయాలనుకున్నప్పుడు, తమతో పాటు ఆ హోటల్లో బస చేసిన కేవలం ముగ్గురు పురుషులు మాత్రమే సరిపోరన్నది స్పష్టం కాబట్టి, సైనికాధికారులూ స్థానిక యువకులూ వచ్చి ఆ డాన్సులో చేరుతారు. అప్పుడు వాళ్ల నల్లని కళ్లు ఆనందంతో మెరుస్తాయి. గంటలూ రోజులూ ఎంత వేగంగా గడిచాయంటే, అప్పుడే నెల రోజుల వ్యవధి ముగిసిందా అని ఆశ్చర్యం కలిగింది వాళ్లకు. ఒకావిడైతే వెళ్లిపోయేటప్పుడు తనకు మరికొన్ని రోజులపాటు ఆ హోటల్లో ఉండాలనిపించిందని చెప్పింది. డాన్ ఆగస్టో ముఖం ఆనందంతో, విజయగర్వంతో వెలిగిపోయింది. తన కస్టమర్లు సంతోషంగా ఉండటం అతనికి ఇష్టం. తాను చెల్లించిన డబ్బుకన్న రెండు రెట్లు ఎక్కువ విలువ చేసింది మారింబా బ్యాండు – అనుకున్నాడతడు. డాన్ ఆగస్టో పొదుపరి కనుక, రాత్రి పది కాగానే తన హోటల్లోని మెట్లమీదా, వరండాల్లో లైట్లను కట్టేయించాడు. దాంతో సైనికాధికారులూ, స్థానిక యువకులూ మాట్లాడే ఆంగ్లభాష అద్భుతంగా మెరుగైపోయింది.

పెళ్లివారి బ్యాండు మేళంలాగా అంతా సజావుగా సంతోషంగా గడిచిపోయింది. ఈ వాక్యంలోని మొదటి పదాలు ఎంత అరిగిపోయినవైనా వాటిని ఉపయోగించాలనే కోరికను ఆపుకోవటం కష్టం కనుక, వాటిని వాడుతాను నేను. అంతా బాగా జరుగుతోందనుకుంటున్న సమయంలో ఒకరోజు మేడం కొరాలీ అనే ఆవిడ తాను భరించిన దుర్భర పరిస్థితి ఇక చాలు అనే నిర్ణయానికి వచ్చింది. ఆమె డ్రెస్ తొడుక్కుని, తన స్నేహితురాలైన కార్మెన్సిటాను కలవటం కోసం వెళ్లింది. తాను యెందుకు వచ్చిందో మేడం కొరాలీ కొన్ని పదాల్లో బిగ్గరగా చెప్పగానే కార్మెన్సిటా ఒక పనిమనిషిని పిలిచి, లా గోర్డా అనే మరో ఆవిడను ఉన్నపళంగా తీసుకురమ్మని పురమాయించింది. ఒక ముఖ్యమైన విషయాన్ని లా గోర్డాతో చర్చించాలని అనుకున్నారు వాళ్లిద్దరు.

భారీ శరీరంతో పాటు పుష్కలంగా మీసాలను కలిగివున్న లా గోర్డా వచ్చి వాళ్లతో చేరింది. ఆ ముగ్గురు మలాగా అనే మద్యాన్ని తాగుతూ గంభీరమైన చర్చలను జరిపారు. తద్వారా ఏర్పడ్డ పరిణామమేమంటే, తాము మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ వాళ్లు దేశాధ్యక్షునికి ఒక ఉత్తరం రాశారు. భారీ శరీరం కలిగిన కొత్త అధ్యక్షుని వయస్సు ముప్ఫై ఏళ్లకన్న కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అతడు ఒక అమెరికన్ షిప్పింగ్ కంపెనీలో సామాన్లను మోసేవాడిగా పని చేశాడు. తన మనసులోని ఉద్దేశాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడల్లా అతడు తన వాగ్ధాటినీ, తుపాకీనీ ప్రభావవంతంగా ఉపయోగిస్తూ ప్రస్తుత ఉన్నత హోదాకు చేరుకున్నాడు. తన కింది అధికారి ఒకతను ఆ ఉత్తరాన్ని తన ముందుంచినప్పుడు అతడు నవ్వి, “ఈ ముగ్గురు వృద్ధ స్త్రీలకు నా నుండి ఏం కావాలట?” అన్నాడు.

కాని అతడు మంచీ మర్యాదా ఉన్న మనిషే కాక, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తను కూడా ప్రజల్లో ఒకడు అనీ, ప్రజలను సంరక్షించడం కోసమే తను ప్రజల చేత ఎన్నుకోబడ్డాడనీ అతడు మరచిపోలేదు. పైగా అతడు తన యవ్వనదశలో మేడం కొరాలీ దగ్గర చిన్నచిన్న పనులమీద బయట తిరిగే ఉద్యోగం చేశాడు. ఆ ముగ్గురు స్త్రీలను తాను మరుసటి రోజు ఉదయం పది గంటలకు కలుస్తానని తన సెక్రెటరీకి చెప్పాడు దేశాధ్యక్షుడు. వాళ్లు సరైన సమయానికి అధ్యక్ష భవనాన్ని చేరుకున్నారు. అక్కడి ఉద్యోగి ఒకతను వాళ్లను వెంట తీసుకుని దివ్యమైన మెట్లదారి మీదుగా సందర్శకుల హాలు వైపు నడిచి, అక్కడికి చేరుకోగానే తలుపును చిన్నగా తట్టాడు.

ఇనుప కమ్మీలున్న లావుపాటి లోహపు ద్వారం తెరుచుకుని, అనుమానపు చూపులున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ అధ్యక్షుడు మునుపటి అధ్యక్షునిలాగా ప్రాణాంతక దుష్ట పరిస్థితిని ఎదుర్కోదల్చుకో లేదు కనుక, వచ్చిన సందర్శకులు ఎంతటి వారైనా సరే జాగ్రత్త పడకుండా వాళ్ల ముందుకు రాకూడదనే నియమం పెట్టుకున్నాడు. వాళ్లను తీసుకువచ్చిన ఉద్యోగి ఆ ముగ్గురు స్త్రీల పేర్లను చెప్పగానే అసలైన లోపలి తలుపు తెరుచుకుంది. కాని లోపలికి వెళ్లే తోవ కొంచెం ఇరుకుగా వుంది. వాళ్లు లోపలికి పోయారు. ఆ హాలులో హుందాతనం, దర్జా కనిపించాయి. అక్కడ చిన్నచిన్న టేబుళ్ల దగ్గర పొట్టిచేతుల చొక్కాలనూ, ప్యాంటు వెనుక జేబులో పిస్తోళ్లనూ కలిగిన సెక్రెటరీలు తీరిక లేకుండా టైపింగ్ చేస్తున్నారు. భారీ తుపాకులతో, బులెట్లతో ఒకరిద్దరు యువకులు సోఫా మీద కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు. అధ్యక్షుడు కూడా పొట్టి చేతుల కోటు తొడుక్కున్నాడు. బెల్టులో ఒక పిస్తోలు వుంది. తన రెండు బొటనవేళ్లను కోటు జేబుల్లోకి దూర్చి నిలుచున్నాడు. అతడు పొడుగ్గా బలిష్ఠంగానే కాక, హుందాగా కూడా కనిపించాడు.

“ఏం కావాలి? దేనికోసం వచ్చారు మీరు?” అని అడిగాడతడు. అతని తెల్లని దంతాలు తళతళ మెరుస్తుంటే, “ఎంత దివ్యంగా కనిపిస్తున్నారు డాన్ మాన్యుయెల్ గారూ! చక్కని దేహపుష్ఠి వున్న పురుషుని లాగా ఉన్నారు మీరు” అన్నది లా గోర్డా.

అతడు వాళ్లకు హాండ్ షేక్ ఇచ్చాడు. అతని సిబ్బంది తాము చేస్తున్న శ్రమపూరితమైన పనిని ఆపి వెనక్కి ఒరిగి, ఆ ముగ్గురు స్త్రీల వైపు స్నేహపూర్వకంగా చేతులు ఊపారు. నిజానికి వాళ్లందరు ఒకరికొకరు పాత మిత్రులే. అందుకే వాళ్ల స్వాగతం పైకి కొంచెం మామూలుగా కనిపించినా అందులో సుహృద్భావం ఉంది. ఆ ముగ్గురు స్త్రీలు ఆ నగరంలోని ముఖ్యమైన వేశ్యాగృహాలకు యజమానురాళ్లు అని నేనిక్కడ చెప్పాల్సి వుంది. వినేవాళ్లు నిస్సందేహంగా నన్ను అపార్థం చేసుకోని విధంగా జాగరూకత నిండిన వివేకంతో ఈ విషయాన్ని చెప్పగలను నేను. అయినా మీరేమైనా అనదల్చుకుంటే నిస్సంకోచంగా అనవచ్చు. లా గోర్డా, కార్మెన్సిటా స్పెయిన్ దేశపు మూలాలున్న స్త్రీలు. వాళ్లు తమ తలలమీద నల్లని శాలువాలను కప్పుకుని, అందమైన నల్లని దుస్తుల్లో వున్నారు. కాని మేడమ్ కొరాలి ప్రెంచ్ స్త్రీ. ఆమె తన తలమీద ఒక హ్యాట్ ను పెట్టుకుంది. వాళ్లు ముగ్గురూ నడి వయస్సులో ఉన్నారు. వాళ్ల ప్రవర్తనలో వినయం కనపడుతోంది.

అధ్యక్షుడు వాళ్లను కూచోమన్నాడు. ఆ తర్వాత వాళ్లకు మదీరా అనే మద్యాన్నీ, సిగరెట్లనూ ఇవ్వబోయాడు. కాని ఆ వాళ్లు వాటిని తీసుకోలేదు.

“మీ ఔదార్యానికి కృతజ్ఞతలు మాన్యుయెల్ గారూ! కాని మేము సొంత వ్యాపారపు పని మీద వచ్చాము కనుక వాటిని స్వీకరించలేము” అన్నది మేడమ్ కొరాలీ.

“సరే. అయితే నేను మీకెలాంటి సహాయం చెయ్యగలను?”

లా గోర్డా, కార్మెన్సిటా మేడమ్ కొరాలీ వైపు చూశారు. మేడమ్ కొరాలీ వాళ్లిద్దరి వైపు చూసింది. ఆ యిద్దరు స్త్రీలు అంగీకారాన్ని సూచిస్తూ తలలు ఊపడంతో, తనే మాట్లాడాలని వాళ్లు ఆశిస్తున్నారని గ్రహించి ఇలా అన్నది మేడమ్ కొరాలీ.

“డాన్ మాన్యుయెల్ గారూ! అసలు సంగతేమిటంటే, మేం ముగ్గురం ఎన్నో సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాము. ఈ దీర్ఘకాల వ్యవధిలో మా పరువుకు మచ్చ తెచ్చే పని ఒక్కటి కూడా చెయ్యలేదు మేము. మేము నడుపుతున్న వేశ్యాగృహాలంత పేరెన్నిక గన్న గృహాలు మొత్తం అమెరికా ఖండంలో మరెక్కడా లేవు. అవి ఈ అందమైన నగరానికి గర్వకారణాలుగా నిలుస్తాయి. అంతెందుకు? నేను నిర్వహిస్తున్న వేశ్యాగృహానికి హంగుల్ని సమకూర్చడం కోసం గత సంవత్సరమే ఐదు వందల డాలర్లను ఖర్చు పెట్టి అధునాతనమైన అద్దాలను అమర్చాను. మేమెప్పుడూ మర్యాదగానే, గౌరవప్రదంగానే ఉన్నాము. ప్రతి సంవత్సరం పన్నులను సకాలంలో కట్టాము. ఇన్నేళ్లు మేమెంతో శ్రమ పడ్డాక దాని ఫలాలను మా నుండి లాక్కోవడం బాధాకరంగా వుంది. ఇంత కాలంగా మేము నిజాయితీతో, వ్యాపారం పట్ల విచక్షణాత్మకమైన ధ్యాసతో కృషి చేశాక మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అన్యాయమని చెప్పడానికి నేను సందేహించను”

అధ్యక్షుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు.

“కాని నా ప్రియమైన కొరాలీ! నువ్వు దేనిగురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు నాకు. చట్టానికి వ్యతిరేకంగా కాని లేక నా కన్నుగప్పి కాని మీ డబ్బును ఎవరైనా గుంజుకున్నారా?”

అతడు ఒక అనుమానం నిండిన చూపును తన సెక్రెటరీల వైపు విసిరాడు. వాళ్లు తమకేమీ తెలియదన్నట్టు అమాయకంగా కనిపించే ప్రయత్నం చేశారు. వాస్తవంలో వాళ్లు అమాయకులే అయినా తమ ముఖాల్లోని ఇబ్బందిని దాచలేకపోయారు.

“మేము కొత్త చట్టం గురించి మాట్లాడుతున్నాము. మేము సర్వనాశనం కాబోతున్నాము”

“ఏంటీ? సర్వనాశనమా?”

“కొత్త విడాకుల చట్టం అమలులో ఉన్నంత వరకు మేము మా వ్యాపారాలను చేసుకోలేం. మేము నిర్వహిస్తున్న అద్భుతమైన వేశ్యాగృహాలను మూసుకోవాల్సి వస్తుంది”

తర్వాత మేడమ్ కొరాలీ తమ ఇబ్బందిని ఎంత నిర్మొహమాటంగా వివరించిందంటే, ఆమె అన్న మాటలను నేను కొద్దిగా మార్చి చెబుతున్నాను. ఆమె వెళ్లబోసుకున్న గోడు సారాంశమేమంటే, పరాయి ప్రాంతాల నుండి అందమైన స్త్రీలు ఆ నగరానికి రావటంతో, హుందాతనం నిండిన తమ మూడు బంగళాలు పూర్తిగా దిక్కుమాలినవి ఐపోయాయి. వాటిమీద తాము ముగ్గురూ అన్ని పన్నుల్ని సక్రమంగా కడుతున్నా కూడా, నాగరికతను అవలంబించే యువకులు తమ సాయంత్రాలను గ్రాండ్ హోటల్లో గడపటం వైపే మొగ్గు చూపుతున్నారు. డబ్బు చెల్లిస్తే మాత్రమే వేశ్యాగృహాల్లో లభించే సరసమైన వినోదం ఆ హోటల్లో ఉచితంగా దొరుకుతోంది.

“హోటలువాళ్లను మనం నిందించలేం” అన్నాడు అధ్యక్షుడు.

“నేనేం వాళ్లను నిందించటం లేదు. కాని ఆ స్త్రీలను తప్పు పడుతున్నాను. ఇక్కడికి వచ్చి మా పొట్టలమీద కొట్టే హక్కు వాళ్లకు లేదు. డాన్ మాన్యుయెల్ గారూ, మీరు ప్రజల్లోని ఒక మనిషే తప్ప రాచరికంలో ఉన్నవారు కారు. ఈ దుష్ట వ్యాపారస్థుల చేత మేం తరిమి కొట్టబడితే మీ దేశం దాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తుంది? వాళ్లు చేస్తున్నదాంట్లో న్యాయం ఉందా? నిజాయితీ వుందా?”

“కాని నేనేం చేయగలను? హోటల్లో బస చేసిన ఆ అందమైన స్త్రీలను ముప్ఫై రోజుల పాటు గదుల్లో బంధించి వుంచలేను కదా. ఈ విదేశీ స్త్రీలకు మర్యాద లేకుంటే దానికి నేనెలా బాధ్యుడినవుతాను?”

“బీద స్త్రీలు ఆ విధంగా చేయటం వేరు. ఎందుకంటే పాపం వాళ్లకు వేరే మార్గం వుండదు. కాని వీళ్లు అట్లా చేయటమన్నది సమంజసమెలా అవుతుందో నాకర్థం కాదు”

“ఈ చట్టం చెడ్డది, క్రూరమైనది” అన్నది కార్మెన్సిటా. అధ్యక్షడు ఒక్కసారిగా లేచినిలబడి తన రెండు చేతులను పక్కలకు చాపి, ఇలా అన్నాడు. “ఈ దేశానికి సంపదనూ శాంతినీ తెచ్చిన ఆ చట్టాన్ని నిషేధించాలని అడగకండి. ప్రజలచేత ఎన్నుకోబడ్డ నేను ప్రజల్లో ఒకణ్ని. నా మాతృదేశపు ఐశ్వర్యం నా హృదయానికి చాలా దగ్గరగా వుండే విషయం. విడాకుల చట్టం మన దేశపు ముఖ్య పరిశ్రమ. చచ్చినా దాన్ని నేను నిషేధించను”

“ఓరి దేవుడా! ఆఖరుకు ఇట్లాంటి గతి దాపురించింది. నా ఇద్దరు కూతుళ్లు న్యూ ఆర్లియెన్స్ లోని కాన్వెంటులో చదువుతున్నారు. అయ్యో భగవంతుడా! ఈ వ్యాపారం చాలావరకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేదే. అయినా నా ఇద్దరు కూతుళ్లు చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటారనీ, నేను ఈ పనిని మానుకునే సమయం వచ్చినప్పుడు వాళ్లు దీన్ని నడిపే బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకుంటారనీ ఆశ పడుతూ ఎప్పుడూ నన్ను నేను సముదాయించుకున్నాను. ఈ వ్యాపారమే లేకపోతే న్యూ ఆర్లియెన్స్ వంటి మహానగరంలోని కాన్వెంటులో వాళ్లను అంత సులభంగా ఉంచగలనా?” అన్నది కార్మెన్సిటా.

“మరి నా సంగతి? నా బంగళాను మూసేసుకుంటే నా కొడుకును హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎవరు చదివిస్తారు?” అని అడిగింది లా గోర్డా.

“నేను మాత్రం దీన్ని ఖాతరు చేయను. ఫ్రాన్స్ కు వెళ్లిపోతాను. నా తల్లికి ఇప్పుడు ఎనభై ఏడు సంవత్సరాల వయసుంది. ఆమె ఇంకా ఎంతో కాలం బతకదు. తన అవసానదశలో నేనామె పక్కన వుంటే ఆమెకు ఊరటా మనశ్శాంతీ దొరుకుతాయి. కాని ఈ అన్యాయం నన్నెంతగానో బాధ పెడుతోంది. అయ్యా, మాన్యుయెల్ గారూ! తమరు కూడా ఎన్నో సాయంత్రాలను నా బంగళాలో ఆనందంగా గడిపారు. మీరు మాతో ఇలా వ్యవహరిస్తుంటే మా మనసులు గాయపడుతున్నాయి. ఒకప్పుడు నా దగ్గర చిన్నచిన్న పనులను నిర్వహించే ఉద్యోగం చేసి, నా బంగళాలోకి దేశాధ్యక్షుని హోదాలో గౌరవ అతిథిగా వచ్చినప్పుడు అది మీ జీవితంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సందర్భం అని మీరు స్వయంగా నాతో అనలేదా?” అన్నది మేడమ్ కొరాలీ

“అది వాస్తవం కాదని అనటం లేదు. నేనెప్పుడూ నిజాయితీగానే వ్యవహరిస్తాను” అని డాన్ మాన్యుయెల్ ఆ హాలులో అటూయిటూ నడుస్తూ, అలవాటుగా మధ్యమధ్య తన బుజాలను పైకి లేపాడు. దీర్ఘాలోచనలో మునిగిన అతడు “నేను ప్రజల మనిషిని. ప్రజలచేత ఎన్నుకోబడినవాడిని. ఇక్కడ వాస్తవమేమిటంటే, ఈ స్త్రీలు విశ్రాంతి తీసుకోకుండా పని చేశారు” అని తన సెక్రెటరీలతో నాటక ఫక్కీలో మళ్లీ ఇలా అన్నాడు. “నా పరిపాలన మీద ఇదొక మచ్చ. నైపుణ్యం లేని విదేశీయులు నిరంతరం నిజాయితీతో కృషి చేసే ఇక్కడి మనుషుల పొట్టలను కొట్టడం నా సిద్ధాంతానికి విరుద్ధం. ఈ స్త్రీలు నన్ను ఆశ్రయించి నానుండి రక్షణను కోరటం సరైనదే. ఈ వ్యవహారం ఇంకా ఇలా కొనసాగటాన్ని నేను అనుమతించను”

అతని మాటలు నిశితంగా ప్రభావవంతంగా ఉన్నాయి కాని, వాటిని విన్నవాళ్లందరికి కేవలం ఆ మాటల వల్ల ఏం లాభం చేకూరదని తెలుసు. మేడమ్ కొరాలీ కొట్టొచ్చినట్టుగా పెద్దగా వుండే తన ముక్కు మీద పౌడరును అద్దుకుని, తన పర్స్ లోని చిన్న అద్దంలో ఒకసారి చూసుకుంది.

“మానవ నైజం ఎట్లా వుంటుందో తెలుసు నాకు. ఆ అందమైన విదేశీ స్త్రీల పని ఐపోయే రోజు వస్తుంది” అన్నదామె.

“మనం ఒక గోల్ఫ్ మైదానాన్ని తయారు చేయవచ్చు. కాని అది కేవలం పగటి వేళల్లో మాత్రమే జనాన్ని ఆకర్షిస్తుందనేది వాస్తవం” అన్నాడొక సెక్రెటరీ.

“కులకడానికి వాళ్లకు మగాళ్లు అవసరమైతే వాళ్లే తమతో పాటు తెచ్చుకోవచ్చు కదా?” అన్నది లా గోర్డా.

“భగవంతుడా” అని అరిచి, కొంత సేపు కదలక మెదలక నిల్చున్నాడు అధ్యక్షుడు. తర్వాత “దీనికో పరిష్కారం వుంది” అన్నాడు. అంతర్వివేచనా, వివేకమూ లేకుండానే అతడు అంతటి ఉన్నత స్థానాన్ని చేరుకోలేదు. ఆయన ఉల్లాసంతో నవ్వి ఇలా అన్నాడు. “చట్టాన్ని మార్చేద్దాం. ఇకముందు పురుషులు మునుపటి లాగానే ఏ ఆటంకం లేకుండా వస్తారు. కాని, స్త్రీలు మాత్రం భర్తలతోనే రావాలి, లేదా హామీ పత్రాన్ని ఇవ్వాలి”. వెంటనే తన సెక్రెటటరీల చూపుల్లో నిరాశను గమనించి, “అయితే భర్త అనే పదాన్ని అత్యంత విస్తృతార్థంలో చూడాలని ఇమిగ్రేషన్ అధికారులకు మనం ఆదేశాలను ఇస్తాము” అని వాళ్ల వైపు చేయి ఊపాడు అధ్యక్షుడు.

“భలేగా వుంది. ఆ విధంగా ఆ స్త్రీలతో పాటు మగవాళ్లెవరైనా వస్తే ఇతర పురుషులెవరూ మధ్యలో జోక్యం చేసుకునే అవకాశముండదు కనుక, మా కస్టమర్లు మేము నడుపుతున్న వేశ్యాగృహాలకే తిరిగి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. డాన్ మాన్యుయెల్ గారూ, మీరొక అద్భుతమైన వ్యక్తి అంటాన్నేను. ఏదో వొక రోజున ప్రజలు మీ శిలావిగ్రహాన్ని తప్పక ప్రతిష్ఠిస్తారు” అన్నది మేడమ్ కొరాలీ.

చాలా సార్లు చిన్నచిన్న ఉపాయాలే పెద్దపెద్ద కష్టాలనుండి మనను గట్టెక్కిస్తాయి. డాన్ మాన్యుయెల్ సూచించిన విధంగా చట్టం మార్చబడింది. పుష్కలమైన సూర్యరశ్మినీ, వైశాల్యాన్నీ కలిగిన ఆ స్వతంత్ర దేశం సంపదతో తులతూగటం వల్ల, మేడమ్ కొరాలీ తను ఆశించినట్టుగా తన వ్యాపారాన్ని కొనసాగించి బాగా లాభాలను గడించింది. కార్మెన్సిటా కూతుళ్ళిద్దరూ న్యూ ఆర్లియన్స్ నగరంలో ఖరీదైన విద్యను పూర్తి చేశారు. లా గోర్డా కొడుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి మార్కులతో పట్టభద్రుడయ్యాడు.

 

 

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ కథల మేజిక్ అనుభవించి పలవరించాల్సిందే…

                                                                              కృష్ణమోహన్ బాబు

 

krishna mohan babu“బాబూ గిఖోర్ , నీకు కొన్ని విష యాలు చెప్పవలసివుంది.  ఇక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా వున్నాయి.  పన్నుల కోసం మమ్మల్ని వత్తిడి చేస్తున్నారు.  మా దగ్గర డబ్బు లేదు.  మీ అమ్మకి , జాన్నీకి వేసుకోవడానికి బట్టలు లేవు.  నిజానికి బనీను గుడ్డల్లాంటివి వేసుకుని బతుకుతున్నాం.  మాకు కొంచెం డబ్బు పంపించు బాబూ.  నీ క్షేమం గురించి ఒక వుత్తరం కూడా రాయి.  ఆవు చచ్చిపోయింది.  మీ అమ్మకి, జాన్నీకి ఒళ్ళు కప్పుకోవడానికి ఏమీ లేదు.”

గిఖోర్ అనే కుర్రవాడికి  వూరి వాళ్ళ ద్వారా వాళ్ళ నాన్న పంపిన వుత్తరం యిది.  హువనేస్ తుమన్యాన్ “కథలు – గాథలు” అనే పుస్తకం లో ‘గిఖోర్ ‘ అనే కథ లోది. ఆర్మేనియన్ సాహితీ చరిత్రలో పెద్ద దిక్కుగా పేరు తెచ్చుకొన్న తుమన్యాన్.

ఫిబ్రవరి 19, 1869లో పుట్టాడు .  అప్పుడు  ఆర్మేనీయా రష్యన్ రాజారికం లో భాగం .  తుమన్యాన్ ని ఆర్మేనీయన్ జాతి సంపదగా కొల్చుకుంటారు.  ప్రతి యేడు ఏప్రిల్ లో అతనిని   గుర్తు చేసుకుంటారు .  ఇతను  తల్లి నుంచి కథలు చెప్పడం నేర్చు కున్నాడు.  12 యేళ్ళ కి మొదటి  కవిత్వం రాశాడు .  కవిత్వం, కథలు, జానపద కథలు, గాథలు అలా అన్ని రకాల ప్రక్రియల్లో పేరు సంపాదించాడు .  1923, మార్చ్ 23 న చనిపోయాడు.  ఈ పుస్తకం లో 6 కథలు, 9 జానపద గాథలు వున్నాయి.  ఈ పుస్తకం 40 యేళ్ళ క్రితం ఒకసారి సోవియట్ అనుబంధ సంస్థ  ‘ప్రగతి ప్రచురణాలయం’  వారు వేశారు.  దీనిని పి. చిరంజీవినీ కుమారి గారు తెలుగు లోనికి తీసుకు వచ్చారు. నవచేతన్ పబ్లిషింగ్ హౌస్, హైదారాబాద్ వారు ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని మళ్ళీ అచ్చువేశారు.

ఇందు లో మొదటి కథ ‘గిఖోర్ ‘.  ఒక బీద రైతు, తన 12 యేళ్ళ కుర్రాణ్ని, బతుకు తెరువు తెలుస్తుంది, పని నేర్చు కుంటాడనుకొని, పట్నం లో షావుకారు దగ్గర జీతభత్యాలు లేని పనివాడుగా పెడతాడు.  ‘ముక్కుపచ్చలారని బిడ్డని నీతి, న్యాయం లేని ఈ ప్రపంచం లోనికి తోసేయడానికి వీలులేదని’ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది.  తన పరిస్థితి ఎలాగూ దుర్భరంగా వుంది.  కనీసం కొడుకైనా ఏదో

ఒక పని నేర్చుకుని కుటుంబాన్ని ఆదుకోపోతాడా అన్నది రైతు ఆశ.    ఈసడింపులు, తిట్లు, చివాట్లు మధ్య అతి హీనమైన పరిస్థితులలో ఆ కుర్రాడు షావుకారు దగ్గర వుంటాడు.  వెనక్కి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు.   తన వాళ్ళెవరినీ తిరిగి చూడకుండానే కొద్ది కాలంలోనే  ఆ కుర్రాడి జీవితం కడతేరిపోతుంది.  చెల్లెలి కోసం పోగు చేసిన మెరుస్తున్న బొత్తాలు, రంగురంగు కాగితం ముక్కలు, పిన్ను సూదులు, బట్టల తాన్ల పీలికలు మిగులుతాయి.  1894 లో వచ్చిన ఈ కథ తర్వాత రష్యన్ సినిమాగా కూడా వచ్చింది.  ఇది ‘యూ ట్యూబ్ ‘ లో కూడా వుంది.   ఇది ఈ రోజుకీ నడుస్తున్న కథే.   ఇప్పటికీ ఒక్కసారి బయటికి తొంగి చూడండి.  పిల్లల్ల్ని మోస్తూనో, నౌకర్లు గానో, కాఫీ హోటళ్ళలో బల్లలు తుడుస్తూనో, నాశనమవుతున్న పల్లె జీవితాల నుంచి పట్టణకీకారణ్యంలో  పడ్డ గిఖోర్లు అన్ని చోట్లా  కనబడుతూనే వుంటారు.

రెండో కథ ‘నా నేస్తం  – నెస్సో.’   చిన్నతనంలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడుకోవడమే జీవిత లక్ష్యంగా ప్రాణానికి ప్రాణంగా పల్లెటూరిలో పెరిగిన ఒక కుర్రాళ్ళ గుంపు.  ఆ గుంపులో నెస్సో ఒకడు.  వేసవి వెన్నెలలో నెస్సో మిగతా

కుర్రాళ్ళకి ఎన్నెన్నో కథలు చెప్పేవాడు.  అప్సరసల గురించి , రత్నాల పక్షి గురించి, గుడ్డి రాజు గురించి. మిగతా కుర్రాళ్ళంతా వాడి కథల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు.  కాలప్రవాహంలో డబ్బులున్న పిల్లలు చదువులతో ముందుకెళ్ళి నాగరికంగా తయారయితే, దారిద్రంలో జీవిస్తున్న నెస్సో సామాజిక పరిస్థితుల వల్ల దొంగగా మారతాడు.  ఎంత నాగరికంగా మారినా, వెన్నెల రాత్రి నెస్సో చెప్పిన కథలు తీయని జ్ఞ్యాపకాలుగా వెంటాడుతూనే వుంటాయి.

“నెస్సో దరిద్రుడు, నెస్సో అజ్ఞ్యాని.  దౌర్భాగ్యం బీదరైతులకి ప్రసాదించే కష్టాలలో నెస్సో నలిగిపోయాడు.  వాడికే చదువుంటే, వాడికే భవిష్యత్తు మీద భరోసా వుంటే, వాడూ మంచి వాడయ్యే వాడే.  నా కంటే కూడా గుణవంతుడు అయ్యేవాడు—-” నెస్సో మిత్రుడు నెస్సోని తలచుకుని అనుకున్న మాటలు.  వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో చాలా మందికి యిలాంటి తడి జ్ఞ్యాపకాలు వుండే వుంటాయి.

పారిశ్రామిక ప్రగతి జీవితాలలో ప్రవేశించినపుడు మనుషుల విలువల్లో వచ్చే మార్పుని సూచిస్తుంది ‘రైల్వే లైను నిర్మాణం’ కథ.

మూడో కథ ‘పందెం’.  ఆర్మేనియన్లని టర్కీ దేశస్తుల్ని విడదీశే కొండల మధ్య వున్న ‘మూతు  జోర’  అనే లోయలో జరిగిన కథ.  ఒక టర్కిష్ బందిపోటు, ఛాతి అనే ఆర్మేనియన్ పశువుల కాపర్ని చంపుతానని పందెం కాసి ఆ కుర్రాడి చేతిలో తనే ప్రాణాలు పోగొట్టు కున్న కథ.  అయితే ఆ బందిపోటు తండ్రి తన కొడుకు చేసిన దుర్మార్గాన్ని ఖండించి వాడి తలపాగా, కత్తి, డాలు  ఇచ్చేయమని అర్థించి యిలా అంటాడు “వాడి తల్లి మాత్రం ఏం చేయగలదు.  ఎంతయినా తల్లి కదా!  గుండె చెరువయ్యేలా ఏడుస్తోంది.   వాడి బట్టలు యిచ్చేస్తే, ఆమె దగ్గరికి తీసుకుపోతాను.  కరువుతీరా ఏడుస్తుంది.  అప్పటికైనా ఆమె దుఖ్ఖమ్ తీరి మనసు కొంచం కుదుట పడుతుంది.”

తాము అనుకున్న పని జరుగకపోతే ఎంత దగ్గిర వాళ్ళయినా నీచంగా చిత్రించే మనిషి నైజాన్ని చెప్పే కథ, ‘ఖేచన్ మామయ్య.’

యిక చివరి కథ ‘లేడి,’  మనిషి కంటే క్రూర జంతువు మరొకటి లేదనిపించే కథ.  తుపాకి పట్టి ఒక మృగాన్ని చంపిన తర్వాత దాని తల్లి దీనంగా దిక్కులు చూస్తూ ఆ పిల్ల కోసం, అది పడే తపన, మన యిళ్ళల్లో పి‌ల్లో పిల్లవాడో చావుబతుకుల్లో వున్నప్పుడు ఆ తల్లి పడే బాధ లాంటిదే.  అందుకే తోటమాలి ‘ఓవంకి ‘ అంటాడు “ మనకీ, ఈ కొండల్లో లేళ్ళకి తేడా ఏంటి?  ఏమీ లేదు.  మనసు మనసే.  బాధ బాధే.”

యింకా గాథలలో  వున్న 9 కథలు చాలా చమత్కారంగా, నవ్విస్తూ కొన్ని సందేశాలను కూడా చెబుతాయి.  ‘తోక తెగిన నక్క’  అనే కథ  రాజుగారు – ఏడు చేపల కథను గుర్తు చేస్తుంది.  మనం ఎవరికైనా ‘ మేలు చేస్తే దాన్ని సముద్రంలో పారేసినా మళ్ళీ నీ వద్దకు ఒకనాడు తిరిగి వస్తుంది’  అన్న ఆర్మేనియన్ సామెతని పిల్లలకి ‘మాట్లాడే చేప’  కథ ద్వారా చెబుతారు.  మన ‘శ్రావణ, భాద్రపద’  కథ లాంటిదే ‘తీర్ధం’  కథ.  తెలివి తేటలతో కష్టాల్నించి ఎలా గట్టెక్కచ్చో చెబుతుంది ‘యజమాని – పనివాడు’  కథ.  వీటన్నిటినీ మించిన తమాషా కథ, ‘వేటగాడి కోతలు .’  ఇది ఒక మ్యాజిక్ రియలిజం లాంటి కథ.

ఈ కథ చదువుతూ వుంటే దక్షిణ అమెరికా కథను దేన్నో చదువు తున్నట్లు వుంటుంది.    ఇవి ముఖ్యంగా పిల్లల్ని వుద్దేశించి, వాళ్ళకి లోకరీతిని నేర్పించేవి.  అందుకనే ఆ కథలు చెప్పే తీరు చదివి అనుభవించాల్సినదే గాని, మాటల్లో చెప్పేవి కాదు.

 వందేళ్ళ నుంచి ఈ కథలు జనం చదువుతూనే వున్నారు.  మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూనే వున్నారు.  తెలిసిన విషయాలే అయినా ఇంత కాలం మన మధ్య ఈ కథలు బతికి వుండడం కథకుడిగా తుమన్యాన్ మ్యాజిక్.  రచయితలు అనుకుంటున్న వాళ్ళు,  తమ రచనలు జనాల మధ్య పది కాలాలపాటు వుండాలనుకునే వాళ్ళు ఈ కథల్లోకి తొంగి చూడండి.  ఆ మ్యాజిక్ ని పట్టుకోండి.  మిమ్మల్ని మీరు బతికించుకోండి.

*

 

 

 

 

అనామకుల ఆయుధం!

నారాయణస్వామి వెంకటయోగి 

swamy1“కళ అబద్దం . అది నిజాన్ని చెప్తుంది” – పికాసో

“ఎడ్యుయార్డోను ప్రచురించడం అంటే శత్రువుని ప్రచురించడమే ! అబద్దాలకూ, ఉదాసీనతకూ, అలక్ష్యతకూ అన్నింటికంటే మించి మతిమరపుకు శత్రువు! మన నేరాలు గుర్తు పెట్టుకోబడతాయి. అతని సౌకుమార్యం విధ్వంసకారకం, అతని నిజాయితీ ప్రచండమైనది” – జాన్ బెర్గర్

~

 ప్రపంచ ప్రఖ్యాత లాటిన్ అమెరికా రచయిత, ఉరుగ్వే దేశానికి చెందిన జర్నలిస్టు, నవలా రచయితా కవీ ఎడ్యుయార్డొ గాలియానో,  74 యేండ్ల వయసులో కాన్సర్ తో పోరాడుతూ ఏప్రిల్ 13, 2015  న మరణించారు. గాలియానో ప్రముఖ రచన ‘ఓపెన్ వేన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా – ఫైవ్ సెంచరీస్ ఆఫ్ ద పిలేజ్ ఆఫ్ ఎ కాంటినెంట్’ (చిట్లిన రక్తనాళాల లాటిన్ అమెరికా – ఐదు శతాబ్దాలుగా కొల్లగొట్టబడిన ఒక ఖండపు గాథ) ను వెనీజువెలా అధ్యక్షుడు హుగో షావేజ్ అమెరికా అధ్యక్షుడు ఒబామా కు బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

ఆ పుస్తకం 1971 లో మొదటిసారిగా ప్రచురించబడినప్పటినుండీ కొన్ని లక్షల కాపీల్లో అమ్ముడై రికార్డు సృష్టించింది. చీలీ, ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో మిలిటరీ నియంతృత్వ ప్రభుత్వాలు ఆ పుస్తకాన్నినిషేధించాయి. తన స్వదేశమైన ఉరుగ్వే లో 1973 లో మిలిటరీ హుంటా అధికారాన్ని చేజికించుకున్నాక, ప్రవాసానికి వెళ్ళిపోయిన గాలియానో ‘’మెమరీ ఆఫ్ ఫైర్” (అగ్నిస్మృతి) అనే ప్రముఖ రచన చేసారు. దానిలో గాలియానో ఐదు శతాబ్దాలా అమెరికా ఖండాల చరిత్ర తిరిగి రాసారు. “సాకర్ ఇన్ సన్ అండ్ షాడో” (ఎండా నీడలలో సాకర్ ), “అప్ సైడ్ డౌన్” (తలకిందులుగా ),” వాయిసెస్ ఆఫ్ టైమ్  “ (కాల స్వరాలు), “మిర్రర్స్ “ (అద్దాలు), “వి సే నో” (మేము కాదంటున్నాము) – అతని ప్రముఖ రచనలల్లో మరికొన్ని. గాలియానో కు సాంస్కృతిక స్వేఛ్చ కిచ్చే లన్నాన్ అవార్డు,ఇంకా తదితర అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చినయి.

గాలియానో మరణం, కేవలం లాటిన్ అమెరికా లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం, సత్యానికి జయం కోసం పోరాడుతున్న కోట్లాది ప్రజానీకానికి తీరని లోటు. అందరినీ కలుపుకుని పోయే, న్యాయమైన, సమైక్య లాటిన్ అమెరికా కోసం పోరాడే వారందరికీ గాలియానో మరణం తీవ్రమైన నష్టం. లాటిన్ అమెరికా లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నోరులేని నిరుపేద అనామక ప్రజానీకానికి గొంతునిచ్చి వారి దైన్యాన్ని,  ఆగ్రహాన్ని తన రచనల్లో అత్యంత శక్తివంతంగా పలికిన గాలియానో అమరులు. చిరస్మరణీయులు, ఆయన రచనలు అనామకుల చేతుల్లో ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధాలు.

“సామ్రాజ్యవాదులు, దోపిడీ శక్తులు అనుక్షణం మనందరిలో మతిమరపును కలిగిస్తూ ఉంటాయి – వారి దుర్మార్గాలను మైమరపింపజేసే మతిమరపు. మన రచనలు సాహిత్యం ప్రజల్లో గ్నాపక శక్తిని పెంపొందించాలె” అంటారు గాలియానో. సాంప్రదాయిక విద్యనేదీ పాఠశాలకు పోయి నేర్చుకోని గాలియానో, ఉరుగ్వే రాజధాని మాంటేవీడియో లోని కాఫీ హోటళ్ళలో చదువు నేర్చుకున్నాడు. కథలు చెప్పే కళలు నేర్చుకున్నాడు. అక్కడ్నుండే,  గడచిన ఐదు శతాబ్దాల కథలన్నీ యిప్పుడే జరుగుతున్నట్టుగా భమింప జేసే అద్భుత మాయాజాలాన్ని సృష్టిస్తూ రచనలు చేసాడు. మరచిపోయిన గతాన్ని వర్తమానం లో యిప్పుడే జరుగుతున్నట్టుగా  ఆవిష్కరించి, సామ్రాజ్యవాదులు తన అందమైన లాటిన్ అమెరికా ఖండాన్నెలా దోపిడీ చేసి కొల్లగొట్టారో కళ్లకు గట్టేలా చిత్రించారు గాలియానో.

“మన గ్నాపకాలను ముక్కల కింద కోసేసారు. నేను చేసిందల్లా మన నిజమైన గ్నాపకాలను పునర్నిర్మించడమే. మానవజాతి గ్నాపకాలు మానవ ఇంద్ర ధనుస్సు లాంటిది . అది నిజమైన ఇంద్ర ధనుస్సుకన్న అందమైనది. కానీ మానవ ఇంద్రధనుస్సు పురుషాహంకారం, జాత్యహంకారం, మిలిటరీ నియంతృత్వం లాంటి అనేక దుర్మార్గాల చేత చిన్నాభిన్నమైంది. ధ్వంసం చేయబడ్డది. అనేక దుర్మార్గాలు మానవ జాతి గొప్పతనాన్ని, మనకు మాత్రమే సాధ్యమయ్యే ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నయి. ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి వాటిచేత అణచివేయబడుతున్న అనామకులకు గొంతునివ్వడమే రచయితల నిజమైన కర్తవ్యం. అట్లాంటి రచనే నిజమైన గొప్ప రచన”  అన్నారు గాలియానో. తాను నమ్మిన దాని కోసం  జీవితం లో చివరి క్షణం దాకా  నిలబడ్డ మహోన్నత వ్యక్తిత్వం గల రచయిత గాలియానో.

“We shall miss him dearly”.

అనామకులు

ఈగలు తమకోసం ఒక కుక్కపిల్లను కొనుక్కోవాలని కలగంటాయి. అనామకులు దరిద్రం నుండి బయటపడాలని కలగంటారు. యేదో ఒక అద్భుత దినాన హఠాత్తుగా బకెట్ల కొద్దీ అదృష్టం తమ మీద వర్షిస్తుందని – కానీ అదెప్పుడూ జరగదు, నిన్న, యివాళ్ళ,  రేపు యెప్పటికీ జరగదు – అదృష్టం కనీసం తుంపరలెక్కన్న కూడా రాదు అనామకులు  దాన్నెంత గట్టిగా పిలిచినా సరే  – వాళ్ళ కుడి కన్ను యెంత అదిరినా సరే, ప్రతి రోజూ ఠంచను గా కుడికాలు ముందుపెట్టి పనులు మొదలుపెట్టినా సరే, ప్రతీ కొత్త సంవత్సరం ఒక కొత్త చీపురుతో మొదలు పెట్టినా సరే …

అనామకులు: అనామకుల పిల్లలు, దేనికీ యజమానులు కారు. అనామకులు, యెవరూ కాని వారు,  యెవరికీ కాని వారు, ప్రతి క్షణం ప్రాణభయంతో ఉరుకుతూ, ప్రతి క్షణం చచ్చిపోతూ, అన్ని రకాలుగా వోడిపోతూ, వోడించబడుతూ …

యెవరైతే లేరో,  కానీ వుండవచ్చో
యెవరికైతే  భాషలు రావు, కానీ మాండలికాలు మాట్లాడతారో
యెవరికైతే మతాలుండవు,  కానీ మూఢనమ్మకాలుంటయో
యెవరికైతే కళలు కాదు,  కానీ హస్తకళలు తెలుసో

యెవరికైతే సంస్కృతుండదు, కానీ జానపదముంటుందో
యెవరైతే మనుషులు కాదు,  కానీ మానవ వనరులో
యెవరికైతే ముఖాలుండవు  కానీ చేతులున్నాయో

యెవరికైతే పేర్లుండవు,  కానీ అంకెలు గా మాత్రమే తెలుసో
యెవరైతే స్థానిక వార్తా పత్రికల పోలీసు వార్తల్లోనే  కానీ,
ప్రపంచ చరిత్రలో యెక్కడా కనబడరో…
అనామకులు –
వాళ్లని కాల్చిపారేసిన బులెట్ విలువ కూడా లేని వాళ్ళు.

 

*

ప్రేమ కధకొక కొ త్త పేజీ…!

శారద శివపురపు

అమృతా ప్రీతం కౌర్ (1919-2005) గుజ్రన్ వాలా పంజాబ్ ఇవ్వాల్టి పాకిస్తాన్ లో పుట్టారు. తండ్రి కర్తార్ సింగ్ బ్రజ్ భాషా పండితుడు, ఉపాధ్యాయుడూ.  తల్లి అమృతకు 11 ఏళ్ళ వయసులోనే మరణించింది.  తర్వాత ఆమె మకాం లాహోరుకి మారింది. ఇండియా పాకిస్తాన్ విభజన అనంతరం ఆమె తిరిగి  ఢిల్లీలో  స్థిరపడేవరకూ అక్కడే ఉంది.  ఇంటి బాధ్యతలు, ఒంటరితనం ఆమెను చిన్నవయసులోనే కవయిత్రిని చేసాయి.  పదహారేళ్ళ వయసులో ఆమె మొదటి కవితా సంకలనం అచ్చయింది.   అదే ఏడాది ఆమె వివాహం ప్రీతం సింగ్ తో జరిగింది. ప్రేమ కవిత్వంతో మొదలు పెట్టి, బెంగాల్ కరువు (1943) ఇంకా రెండవ ప్రపంచ యుద్ధంతో చిన్నా భిన్నమయిన ఆర్ధిక వ్యవస్త చూసాకా, అభ్యుదయ కవిత్వం, చివరగా 1960 లో భర్తతో తన విడాకుల తరవాత స్త్రీవాద కవిత్వం రాసారు.

ఆమెకు వచ్చిన ఎవార్డ్స్ అన్నీ చెప్తే ఒక పెద్ద లిస్టే అవుతుంది. పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతీయ జ్ఞానపీఠ్ ఎవార్డ్, (కాగజ్ కేద్ కాన్వాస్ అనే రచనకు) సాహిత్య అకాడమీ ఫెల్లోషిప్ మచ్చుకి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే. ఆమె 28 నవలలు, 18 కవితా సంకలనాలు, 16 వివిధ వచన రచనలు, 5 చిన్న కధలూ రాసారు.  అమృత బహుముఖ ప్రజ్ఞాశాలి.  ఆమె సంగీతం, నృత్యం కూడా నేర్చుకున్నారు. కాని తండ్రి ఆమె నృత్య ప్రదర్శనలివ్వడానికి ఒప్పుకోలేదు.  లాహోరు, పంజాబ్ AIR లోనూ ఆమె గాయనిగా పనిచేశారు.

సాహిర్ లూధియాన్వీ గురించి చెప్పకపోతే అమృత జీవితంలో ఒక ముఖ్య అధ్యాయం విస్మరించినట్టే. ఒక ముషాయిరాలో అమృతని కలిసి ప్రేమలో పడిన సాహిర్ లూధియాన్వీ (సినీ గేయ రచయిత) కొన్ని అద్భుతమైన పాటలు రాసాడు.  తన ప్రేమని అమృత ఎంత కోరుకున్నా బంధంగా మార్చుకోలేకపోయాడు, కొన్ని వ్యకిగత కారణాలో, మరి బలహీనతలో వల్ల.  ఆయన రాసిన పాటలు యూట్యూబ్ లో వింటే అన్నిటి వెనకా ఆయన మదిలో అమృతనే ఉందా అని అనిపిస్తుంది.  అభీ న జావో చోడ్కర్ ఏ దిల్ అభీ భరా నహి, జాయెతో జాయే కహా,  ఆజా తుజ్కో పుకారే మేరె ప్యార్ లాంటి గీతాలు కొన్ని మచ్చుకి.  సాహిర్తో పొసగక ఆమె చివరకు తన చిరకాల మిత్రుడు, నాగమణి పత్రిక నడపటంలో సమ పాత్ర పోషించిన ఇమ్రోజ్ తోనే తన చివరి నలభై ఏళ్ళ జీవితం గడిపారు.

దేశ విభజన సమయంలో జరిగిన అమానవీయ హింసాకాండకి చలించి రాసిన “I ask Waris Shah today” అనే పోయెం ఆమెను చిరస్మరణీయం చేసింది. పంజాబీ నుంచి, ఇంగ్లీష్ లోకి అనువదించబడిన ఈ పొయెంని మళ్ళీ తెలుగులోకి అనువదించినపుడు,  మూల కవిత భావం దెబ్బ తింటుందేమోనని భయపడ్డా సాహసించాను. ఈ పోయెంని అనువదించే ముందు అసలు వారిస్ షా ఎవరో చెప్తాను.  వారిష్ షా 1766 లో హీర్ రాంఝా  అనే ప్రేమ కధని రాసాడు.  అసలు ఇది కధ కాదు నిజంగా జరిగిన విషయం అని ప్రజలు నమ్మేవారట. అది ఒక జానపద కధగా పాపులర్ అయ్యింది.  రాంఝా తన తండ్రికి ఇష్టమైన నాల్గో కొడుకు అయిన కారణంగా పనీ పాటా లేకుండా ఫ్లూట్ వాయించుకుంటూ ఆనందంగా తిరిగేవాడట. అయితే ఇతని వ్యవహారం ఇతని వదినలకి నచ్చక తిండి పెట్టం పొమ్మన్నారట.

20-copy

అప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసిన రాంఝా హీర్ అనే అందమైన అమ్మాయి ఉండే ఊరికి వస్తాడు.  హీర్ తండ్రి దగ్గర పశువులు కాసే పనికి కుదురుతాడు.  అతని ఫ్లూట్ వాయిద్యానికి మైమరిచిపోయి హీర్ అతన్ని ప్రేమిస్తుంది.  వీరిద్దరి ప్రేమా హీర్ మామ కైడో కంట్లో పడే వరకు కొన్ని ఏళ్ళు సాగుతుంది. హీర్కి బలవంతంగా పెళ్ళి చేసి పంపించేస్తారు.  విరక్తితో రాంఝా సన్యాసం పుచ్చుకుని ఊళ్ళమ్మట తిరుగుతూ హీర్ ఉంటున్న ఊరికి వెళ్తాడు.  మళ్ళీ ప్రేమికులిద్దరూ హీర్ తల్లితండ్రుల ఊరికి వస్తారు. ఈసారి వీళ్ళ పెళ్ళికి అందరూ ఒప్పుకుంటారు కానీ పెళ్ళికి ముందు హీర్ మామయ్య ఆమెకు విషం కలిపిన లడ్డూ ఇచ్చి చంపేస్తాడు.  ఇది తెలిసి రాంఝా కూడా ఆ లడ్డూ తిని మరణి స్తాడు. అసలు జానపద కధలో ఇది సుఖాంతమే అయినా వారిస్ షా ఈ కధని దుఖాంతం చేసాడంటారు.  ఆ కారణంగానే ఈ కధ అంత పాపులర్ అయ్యిందట. అసలు కధలో ఇంకో పిట్టకధ అయింది కదూ. అమృతా ప్రీతం వారిస్ షాని ఎందుకు అడుగుతానంటుంది, అసలు ఈయన ఎవరు అన్న సందేహం తీర్చడానికి ఇదంతా చెప్పాను.

 

I Ask Waris Shah Today

 

I say to Waris Shah today, speak from your grave

And add a new page to your book of love
Once one daughter of Punjab wept, and you wrote your long saga;

Today thousands weep, calling to you Waris Shah:
Arise, o friend of the afflicted; arise and see the state of Punjab,

Corpses strewn on fields, and the Chenaab flowing with much blood.
Someone filled the five rivers with poison,

And this same water now irrigates our soil.
Where was lost the flute, where the songs of love sounded?

And all Ranjha’s brothers forgotten to play the flute.
Blood has rained on the soil, graves are oozing with blood,

The princesses of love cry their hearts out in the graveyards.
Today all the Quaido’ns have become the thieves of love and beauty,

Where can we find another one like Waris Shah?
Waris Shah! I say to you, speak from your grave

And add a new page to your book of love.

 

ఈ రోజు వారిస్ షాని అడుగుతాను, నీ సమాధి నుంచి మాట్లాడు,

నీ ప్రేమ కధకొక కొ త్త పేజీ చేర్చు అని,

ఒక పంజాబు కూతురు ఒకసారి ఏడిస్తే, నువ్వొక ప్రేమకధ రాసావు;

 

ఈరోజు వేలమంది కూతుళ్ళు విలపిస్తూ నిన్ను పిలుస్తున్నారు వారిస్ షా!

లేవయ్యా ఓ దీనభంధూ, లేచి చూడు పంజాబును, పొలాల్లో శవాలు చల్లినట్లున్నాయి,

చేనాబ్ నదిలో ఎక్కువగా ర క్తం ప్రవహిస్తోంది

 

ఎవరో అయిదు నదుల్లో విషం కలిపారు; మన మట్టిని తడిపేదీ నీరే

ఇప్పుడా వేణువు ఎక్కడ పోయింది? ఎక్కడ ఆ వేణువులో నినదించిన ప్రేమ గీతాలు?

 

రాంఝా తమ్ముళ్ళంతా వేణువు వాయించడమే మరిచారు

రుధిర వర్షం కురిసింది మట్టి పైన, సమాధుల్లోంచి రక్తం ఉబుకుతోంది.

 

ప్రేమ యువరాణులంతా సమాధుల వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్నారు

ఈ రోజు కైడోస్ అందరూ అందాన్నీ,  ప్రేమనీ హరించే దొంగలయ్యారు

 

ఇంకొక వారిస్ షాను ఇప్పుడు ఎక్కడ వెతకాలి?

వారిస్ షా! నీకే చెప్తున్నా, నీ సమాధి నుంచైనా మాట్లాడు,

 

ఒక కొత్త అధ్యాయాన్ని జోడించు నీ ప్రేమ పుస్తకానికి.

 

I will meet you yet again అని అమృత రాసిన ఈ చివరి పోయెం ఆమె డెత్ బెడ్ మీంచి రాసింది. ఇందులో ఇమ్రోజ్ అంటే ఆమెకున్న ప్రేమ వ్యక్తం చేస్తుంది.  అనువాదంతో సహా మీకిక్కడ ఇస్తున్నాను.

 

I Will Meet You Yet Again.

 

I will meet you yet again
How and where
I know not
Perhaps I will become a
figment of your imagination
and maybe spreading myself
in a mysterious line
on your canvas
I will keep gazing at you.

Perhaps I will become a ray
of sunshine to be
embraced by your colours
I will paint myself on your canvas
I know not how and where —
but I will meet you for sure.

Maybe I will turn into a spring
and rub foaming
drops of water on your body
and rest my coolness on
your burning chest
I know nothing
but that this life
will walk along with me.

When the body perishes
all perishes
but the threads of memory
are woven of enduring atoms
I will pick these particles
weave the threads
and I will meet you yet again.

 

 నేను నిన్ను ఇంకొకసారి కలుస్తాను

 

నేను నిన్ను ఇంకొకసారి కలుస్తాను

ఎక్కడ ఎప్పుడు

నాకు తెలియదు

నీ ఊహా చిత్రంలోని

ఒక అద్భుత భావమవుతానేమో

ఇంకా నన్ను నేను పరుచుకున్న

ఒక ఊహకందని గీతనై

నీ కాన్వాసు మీద,

నిన్ను తదేకంగా చూస్తుంటానేమో.

 

ఏమో, సూర్యరశ్మిలోని

ఒక కిరణమై

నీ రంగుల్లో మమేకమై,

నీ కాన్వాసు పై నన్ను నేను  ఆవిష్కరించుకుంటానేమో

ఎప్పుడు ఎక్కడ అంటే ఖచ్చితంగా నాకు తెలియదు

కానీ తప్పక నిన్ను కలుస్తాను.

 

ఒక జలపాతమై

ఆ నీటి చుక్కల నురగనై

నీ శరీరం తాకుతూ

నీ మండే గుండెపై

నా చల్లదనంతో విశ్రమిస్తానేమో

నాకసలేం తెలియదు

ఈ బ్రతుకు

నాతో పాటే నడిచివస్తుందని తప్ప.

 

శరీరం నశించినప్పుడు

అంతా నశిస్తుంది

కానీ జ్ఞాపకాల దారాలు ఎన్నో,

ఎంతోదుఖపు ముక్కలతో అల్లుకునున్నాయి.

ఈ ముక్కలన్నిటినీ నేను ఏరి

దారంగా పేనుతాను

నేను నిన్ను మళ్ళీ కలుస్తాను.

 

వైల్డ్ ఫ్లవర్ అనే ఒక కథానిక గురించి చెప్పకుండా ఉండలేక పోతున్నాను.  ఒక పల్లెటూరి పిల్ల అంగూరి అమాయకత్వాన్ని అద్భుతంగా చిత్రించిన చిన్న కధ.  ఇంత అమాయకంగా ఉన్న ఆడవారిని చిన్నప్పటినుంచే తన మాయ, మోసం, దగాతో మగాడు ఎలా తొక్కేస్తున్నాడో చూపెడుతుందీ కధ.  అతి సున్నితంగా, అదే సమయంలో అత్యంత శక్తివంతంగా తన సందేశాన్ని పాఠకులకి పంపించి వారి చేత ఒప్పించి, మెప్పించే కధ.

ఈ కథలో  పర్భటి అనే పక్కంటి పక్కింటివాళ్ళ  పనివాడి భార్య చనిపోతుంది. పర్భటి భార్య కర్మ చేసినప్పుడు అంగూరి తండ్రి వచ్చి పర్భటి పైగుడ్డ పిండుతాడు. దీనర్ధం పంజాబు లోని సాంప్రదాయం ప్రకారం భార్య చనిపోయిన దుఖంలో ( తడిసిన పైగుడ్డ  కర్మకాండ వల్ల కానీ భార్య చనిపోయిన దుఖంతో కార్చిన కన్నీటి వల్ల కానే కాదు అని అంటుంది)  ఉన్న నీ దుఖం తగ్గించడానికి, నీ జీవితంలో ఆ లోటు పూడ్చటానికీ నేను నా కుతుర్ని ఇచ్చి నీకు పెళ్ళి చేస్తాను, ఇంక నువు ఏడవకు అనిట. ఆ రకంగా తమకు భారంగా ఉన్న తమ కూతుళ్ళను రెండో పెళ్ళి వాడికైనా సరే ఇచ్చి వదిలించుకునేవారట.  అయితే ఈ ఒప్పందం ప్రకారం అంగూరి ని అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్య కోలుకున్నాక, ఇంకా కొంచం పెద్దదయ్యే వరకూ ఆగి ఒక అయిదేళ్ళ తరవాత పర్భటి కిచ్చి పెళ్ళి చేస్తాడు.  అయితే పర్భటి యజమానికి ఇద్దరికి భోజనం పెట్టడం ఇష్టం ఉండదు.  అప్పుడు పర్భటి, లేదు లెండి అంగూరి servant quarter లోనే ఒక చిన్న kitchen ఏర్పాటు చేసుకుని తన  తిండి తను తింటుంది అని ఒప్పిస్తాడు.  కాపరానికి వచ్చిన అంగూరి మొదట్లో తల పైనుంచి ముసుగు తియ్యక పోయినా మెల్లిగా  అలవాటుపడి తీస్తుంది.  ఆమె నీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ తన వెండి నగలు చూపిస్తూ మహా ఆనందంగా  నవ్వుతూ, తుళ్ళుతూ, తన గజ్జెల సవ్వడితో పొటీ పడుతూ ఉండేది.  ఒక రోజు ఎండాకాలం చల్లదనం కోసం బయటికి వచ్చి బావి దగ్గర చెట్టుకింద కూర్చుని చదువుకుంటున్న అమృతని  కలిసినప్పుడు వాళ్ళ సంభాషణ ఇలా ఉంటుంది.

 

అంగూరి: ఏం చదువుతున్నారు బీబీజీ?

అమృత: నీకు  చదవటం ఇష్టమా?

అంగూరి: నాకు చదవటం రాదుగా!

అమృత:  నేర్చుకోవచ్చుగా!

అంగూరి:  ఊహూ…

అమృత: ఎందుకూ?

అంగూరి: ఆడవాళ్ళు చదువుకోవటం పాపం

అమృత: మగవాళ్ళు చదువుకోవటం పాపం కాదా

అంగూరి:  కాదు

అమృత :  ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ

అంగూరి: నాకు తెలుసు

అమృత:  మరైతే నేను చదివి పాపం చేస్తున్నానా?

అంగూరి:  లేదు, మీరు సిటీ వాళ్ళు, మీరు చదువుకోవచ్చు, మేము ఊరి వాళ్ళం

మేము చదువుకుంటే పాపం.

*

ఈ రచన ద్వారా అమృతా ప్రీతంని సరైన కోణంలో మీముందుంచే ప్రయత్నంలో నేనెంతవరకూ  సఫలీకృతమయ్యానో మీరే చెప్పాలి.  ప్రపంచవ్యా ప్తంగా స్త్రీ స్వేచ్చ కోసం గొంతెత్తిన ఏకైక స్త్రీ గళం మన పంజాబు నుంచి ఇంత గట్టిగా ఇప్పటికీ నినదిస్తోందంటే అది ఆమె కోరిన స్వేచ్చని తన వ్యక్తిగత జీవితంలో ఆచరణలో పెట్టడం వల్లే సాధ్యమైంది.

*sarada shivapurapu 

 

 

పరాయి దేవుడు

Parayi

చిత్రం: మహీ బెజవాడ

మిస్టర్ బ్లూమ్ ఆ వినాయకుడిని చూసేదాకా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం గడిపాడు. బ్లూమ్ లాంటి వాళ్ళంతా ఇంతే. మనసులో సుదూర దేశాలకు ప్రయాణం చెయ్యాలన్న కోరిక బలంగా వున్నా అమ్మ చెప్పిన మాట విని ఆప్థమాలజీ (కంటి వైద్యం) కాలేజీలో చేరతారు. ఇదిగో ఇలాంటివాళ్ళే స్పైస్ ద్వీపాలకో, అందమైన మైదానాలకో వెళ్ళాలని కలలు కంటూనే టెల్మా లాంటి మందుల గుట్టలో పడి బతికేస్తుంటారు.

ఇలాంటివాళ్ళే – చివరికి రిటైరైన కంటి డాక్టర్ లెఫ్కోవిజ్ కూతురు ఎంత లావుగా వున్నా సర్దుకుపోయి పెళ్ళి చేసుకుంటారు. బ్లూమ్ లాంటి వాళ్ళే నీరు కారే కళ్ళని పరీక్షించడం అనే పనిని రోజూ చేస్తూనే సంసారాన్ని ఈదేస్తుంటారు. కుటుంబంతో కలిసి బంగారం రంగు ఇసుక వున్న బీచ్‌కి వెళ్ళాలని, అక్కడ చొక్కా లేకుండా నిలబడి సముద్రపు గాలిని పీల్చాలనీ, మనిషి నడవని చోట నడవాలని, ఏ మనిషీ ప్రేమించనంతగా మరొకరిని ప్రేమించాలనీ  అనుకుంటూ, అవేమీ చెయ్యకుండానే సంవత్సరాలు గడిపేస్తుంటారు.

అలా గడపటం కొంత మందికి అసంతృప్తి ఇవచ్చుగాక, కానీ కొంతమందికి అలా బ్రతకడంలోనే తృప్తి వుంటుంది. సరిగ్గా అలాంటి తృప్తి కలిగివున్న జీవితం గడుపుతున్న బ్లూమ్‌కి ఆ వినాయకుడి ప్రతిమ దొరకటమే ఆశ్చర్యం.

ఆ రోజు అతను గాజులు, చీరలు, అగరుబత్తీలు అమ్ముతున్న ఒక దుకాణం దగ్గర నిలబడ్డాడు. వాటన్నింటి మధ్యలో అనుకోకుండా కనపడిందా విగ్రహం. నాలుగు చేతుల మనిషి శరీరానికి ఏనుగు తల వుందా? లేక ఏనుగుకి మనిషి శరీరం అతికించారా? అని పరిశీలనగా చూశాడు. మెరిసిపోయే గులాబి రంగు శరీఅం, కరుణ కురిపించే కళ్ళు, బంగారు కిరీటం. ఒక చేయ్యి చూపుడు వేలుతో ఏదో సైగ చేస్తున్నట్లు వుంటే, రెండొవది దగ్గరకు రావద్దని వారిస్తున్నట్లు కనపడింది. చూడగానే అది దేవుడి బొమ్మ అయ్యివుంటుందని వూహించాడు బ్లూమ్.

“కాకపోతే మరేమిటి? ఒకేసారి భయం భక్తి రెండూ కలుగుతున్నాయంటే ఆయన ఖచ్చితంగా దేవుడే అయ్యుంటాడు” అనుకుంటూ ఆ నునుపైన విగ్రహాన్ని వేళ్ళ చివర్లతో సుతారంగా అందుకున్నాడు. అది చూసి ఆ పక్కనే నిలబడి స్టాల్ చూసుకుంటున్న కుర్రవాడు ముందుకొచ్చాడు.

“ఏంటి తాతగారూ? జాగ్రత్తగా పట్టుకోండి… బొమ్మ పగలకొట్టినా డబ్బులు కట్టాలి.. అర్థం అయ్యిందా?” అన్నాడతను.

పూర్వం విగ్రహారాధన చేసే తండ్రిని ఎదిరించిన అబ్రహాం కథ గుర్తుకొచ్చింది బ్లూమ్‌కి. చిన్నతనంలోనే దేవుడు సర్వవ్యాప్తమై వున్నాడన్న సత్యం తెలుసుకున్న అబ్రహాం తన తండ్రి పూజించే విగ్రహాలని అన్నింటినీ పగలగొట్టాడు.

“నేను కాదు నాన్నా పగలకొట్టింది.. ఇదంతా ఆ పెద్ద విగ్రహం చేసిన పని. ఆ బొమ్మే కర్ర తీసుకోని మిగిలిన అన్నింటినీ పగలగొట్టింది..” అన్నాడు.

“విగ్రహాలు ఎక్కడైనా కదులుతాయట్రా?” అన్నాడు తండ్రి మరింత కోప్పడి.

“మరి కదలలేని విగ్రహాలకు పూజలెందుకు నాన్నా” అంటూ సమాధానం చెప్పాడు అబ్రహాం.

ఆ కథ అంతటితో అయిపోయింది. ఆ ప్రశ్నతో ఆ తండ్రికి జ్ఞానోదయమైందో లేక తన నమ్మకాల్నే ప్రశ్నించిన కొడుకుని మరింతగా కొట్టాడో తెలియదు. అందులోనూ, ఆ కాలంలో నమ్మకాలు ఇప్పటికన్నా పవిత్రంగానూ బలంగానూ వుండేవి కదా.

వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టుకోనే ఇదంతా ఆలొచించాడు బ్లూమ్. ఆ ప్రతిమ అర్థ మిళిత నేత్రాలతో ప్రేమని కురిపించేలా వున్నాయి. ఆయన శరీరం ఎంత దృఢంగా  వుందంటే, ఆ బొమ్మే మన పక్కన వుంటే విజయం తధ్యమని అనిపిస్తోంది. నిజానికి  బ్లూమ్ ఇలాంటి ప్రతిమల్ని ఏనాడూ ముట్టుకోను కూడా లేదు. మతపరంగా నిషేదించిన విగ్రహారాధన చేస్తే ఏ పాపం చుట్టుకుంటుందో అని అతని భయం. ఇప్పుడు చేతిలో వున్న వినాయకుడి వైపు మళ్ళీ చూశాడు. గుండ్రంగా తిరుగుతూ బలంగా వున్న తొండం వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు.

“నాకు ఇది కావాలి” అన్నాడు స్థిరంగా.

***

ఆ విగ్రహాన్ని తీసుకోని ఇంటికి వెళ్ళిన తరువాత ఎక్కడైనా దాచేయ్యాలని అనుకున్నాడు. ఆ బొమ్మని కళ్ళద్దాలు తుడుచుకునే మెత్తటి గుడ్డలలో చుట్టి, ప్లాస్టిక్ సంచిలో పెట్టి స్టోర్ రూమ్‌లో ఒక అరమర కింద భాగంలో, పగిలిపోయిన పాత్రల వెనక దాచిపెట్టాడు. కాని ఫలితం లేకపోయింది. అతని భార్య నిముషానికి ఒకసారి అదే అరమర తెరిచి ఏదో ఒక వస్తువు తీసుకోవడమో, లేకపోతే పిల్లలు ఆడుకుంటూ ఆ తలుపులు తీసి వదిలేయడం చేస్తుండటంతో దాన్ని అక్కడి నుంచి తీసేయ్యాలనుకున్నాడు. ఆ గది దగ్గరకు వెళ్ళినప్పుడల్లా చుట్టిపెట్టిన సంచీ చిరుగులలోంచి వినాయకుడి తొండం బయటికి వచ్చి, తననే పిలుస్తున్నట్లుగా అనిపించేది.

“ఆయన పూజలు కావాలని అడుగుతున్నట్లున్నాడు” అనుకున్నాడు బ్లూమ్. “దేవుడు కదా… అలాంటి కోరిక వుండటం సహజమే” అని సర్ది చెప్పుకున్నాడు.

“అయితే ఆయన్ను ఎలా పూజించాలి?” బ్లూమ్ కి ఏం తోచలేదు. ఇంతకు ముందెపుడూ విగ్రహాన్ని పూజించనే లేదు కదా. అసలు ఎలా చెయ్యాలో కూడా తెలియదైపోయే. బైబిల్ తీసి ఒకసారి తిరగేశాడు. “దేని రూపమునైననూ విగ్రహమైనైననూ నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు” అని వుంది. ఇంకొక చోట “మంటి (మట్టి) బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను నీ గొర్రలను నీ ఎద్దులను అర్పింపవలెను” అని కూడ వుంది.  బ్లూమ్ దగ్గర గొర్రలూ లేవు, ఎద్దులూ లేవు. అలాగని వృత్తిపరంగా వాటికి సమానమైనవి బలిగా తగలపెట్టడం భావ్యం కాదనిపించింది. ఒకసారి పొరపాటున ఒక జత కళ్ళద్దాలు తగలబడితేనే వాటి వాసననే భరించలేకపోయాడు. అంతకన్నా శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించడమే తేలిక అని అనిపించింది.

బ్లూమ్ ఆ స్టోర్ రూమ్‌ లోకి ఎవరూ రాకుండా తలుపులు వేశాడు. ఆ వినాయకుణ్ణి తీసి అక్కడే వున్న ఒక వెదురు స్టూల్ మీద వుంచాడు. అప్పుడే వినాయకుడి కళ్ళలో సంతోషం, తను చెయ్యబోతున్న పనికి ఆమోదం కనిపించాయి ఆతనికి. జాగ్రత్తగా మోకాళ్ళ నొప్పులు బాధించకుండా మోకరిల్లి, ముందుకు వంగి నుదిటిని నేలకి ఆనించి తన ప్రార్థన మొదలుపెట్టాడు.

“ఓ గణేశా… నీ రాకతో మా ఇంటిని పావనం చేసిన నీకు నా కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. ఈ ఇంటిలో వున్నవారందరినీ నీవు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మా అమ్మాయి జూడీ లా పరీక్షలలో నీవు సహాయము చెయ్యాలి. ఆ పిల్లకి ఆ లా పుస్తకాలు, సెక్షన్లు అవీ కష్టం అనిపిస్తున్నాయట… ఓ వినాయకా..” అంటూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూనే మళ్ళీ మోకాళ్ళ మీదకు లేవబోయాడు. అతని నడుము మాత్రం అతని ప్రార్థనకి సహకరించలేదు. ఎడమ వైపు నడుముకి కొంచెం కింద నరం పట్టేసినట్లై కలుక్కుమనడంతో మళ్ళీ ముందుకే వంగాడు. ఇక లేవనూ లేడు, అలా వుండనూ లేడు. ఓ ఇరవై నిముషాల తరువాత అతని భార్య వచ్చి చూసేదాకా అలాగే, అదే భంగిమలో వున్నాడు  బ్లూమ్.

“బ్లూమ్…!! ఏం చేస్తున్నావక్కడ?” అంటూ అరిచింది ఆమె.

“శాండ్రా… సమయానికి వచ్చావు… నా నడుము మళ్ళీ పట్టేసింది. ఆ అమృతాంజనం తెచ్చిస్తావా” అన్నాడతను. ఆమె అటు వెళ్ళగానే పాక్కుంటూనైనా సరే ఆ వినాయకుణ్ణి మళ్ళీ అలమరలో దాచేయ్యాలని అతని ఆలోచన. కానీ శాండ్రా అతనికంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లుంది.

Akkadi MeghamFeatured

“బ్లూమ్… అది విగ్రహమే కదూ. నువ్వు మన ఇంట్లో విగ్రహారాధన చేస్తున్నావా? ఒక పక్క నేను అంట్లు తోముకుంటూ, అతిధులు వస్తారని పరుగులు తీస్తుంటే నువ్వు ఇక్కడ..” అంటుండగానే అందుకున్నాడు బ్లూమ్.

“శాండ్రా… ఎందుకు ఎలా అనుకుంటున్నావు? నేను విగ్రహానికి ఎందుకు మొక్కుతాను? ఈ విగ్రహం బజార్లో అమ్ముతుంటే చూశాను. ఇదిగో ఈ గది గోడలకి వేసిన రంగులకి మంచి మాచింగ్ అవుతుందని కొన్నాను…” అన్నాడు. ఇరవై ఏళ్ళ సంసారంలో  బ్లూమ్ ఇలాంటి ఇంటి విషయాలు పట్టించుకున్నదే లేదు. అలాంటప్పుడు మిసెస్ బ్లూమ్ అతని మాటల్ని ఎలా నమ్ముతుంది? అయినా అతను వదల్లేదు. “ఇది ఎక్కడపెడదామా అని చూస్తూ వున్నాను.. ఇంతలో తూలి ముందుకు పడ్డాను… నడుం పట్టేసింది..” అన్నాడు.

శాండ్రా నమ్మీ నమ్మనట్లు తలాడించింది.

” ప్లీజ్ శాండ్రా… అమృతాంజనం…” అన్నాడతను మాట మారుస్తూ. శాండ్రా మాట కరుకేకానీ మనసు వెన్న. అందుకే అమృతాంజనం తీసుకురావాలని బాత్రూమ్ వైపు పరుగెత్తింది.

ఇదే అవకాశం అని వినాయకుడి బొమ్మని తీసి ఇంతకు ముందున్న సంచిలో పెట్టాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు బ్లూమ్. అప్పటికే చిరిగిపోయిన ఆ సంచిలో నున్నగా జారిపోతున్న బొమ్మ పట్టలేదు. శాండ్రా తిరిగి వచ్చేసరికి వినాయకుడి బొమ్మ ఇంకా అక్కడే నేలమీదే వుంది. పాపం ఆమె బ్లూమ్ నడుము మీద అమృతాంజనం పూసి నెమ్మదిగా మర్దనా చేస్తూ వినాయకుడి బొమ్మ వైపే చూస్తూ వుండిపోయింది. చివరికి ఘాటైన అమృతాంజనం వాసన వస్తున్న చేతులతోనే వినాయకుడి బొమ్మను తీసుకోని పరీక్షగా చూసింది.

“నాకు తెలిసి ఈ బొమ్మ హాల్లో పెడితేనే బాగుంటుందనుకుంటా… చాలా ప్రాచీనంగా కనిపిస్తోంది కదా, అక్కడ బాగుంటుంది…” అంది.

అలా ఆ వినాయకుడి స్థానం ఆ ఇంటి నట్టింట్లోకి మారింది.

***

అందరి పిల్లల్లాగే వాళ్ళ పిల్లలు కూడా అభ్యంతరం చెప్పారు.

“ఆ బొమ్మ నన్నే చూస్తున్నట్లు అనిపిస్తోంది…” అంది జూడీ మర్నాడు బ్రెడ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు.

డెవిడ్ స్కూల్ బాగ్ అందుకుంటూ వేలితో బొమ్మని తాకి – “దీని నిండా మురికి వున్నట్టుంది..” అన్నాడు.

“ఆ విగ్రహం లోపలంతా ఖాళీ… ఏం వుండదు… ఆయన పేరు గణేశ” చెప్పాడు బ్లూమ్. అందమైన పసిపిల్లల్ని ఇలాంటి మాటలనే టీనేజర్లుగా ఎందుకు మారుస్తావు భగవంతుడా అనుకున్నాడు మనసులో.

డేవిడ్ చిత్రంగా కళ్ళు తిప్పాడు. జూడీ నిట్టూర్చింది. ఇద్దరూ స్కూల్‌కి బయల్దేరారు. బ్లూమ్ బ్రేక్‌ఫాస్ట్ గిన్నెలు వంటింటిలోకి తీసుకెళ్తూ ఒక్క క్షణం వినాయకుడి బొమ్మ దగ్గర ఆగాడు. ఒక చిన్న బ్రెడ్ ముక్కను తుంచి ఆ ప్రతిమ దగ్గర సాసర్‌లో వుంచి, తల వంచి నమస్కరించాడు.

ఆ వినాయకుడి బొమ్మ వచ్చిన తరువాత అతని జీవితం బాగున్నట్టు గుర్తించాడు. మిసెస్ రోసెన్‌బ్లట్ అని పెద్ద డ్రై ఫ్రూట్ కంపెనీ అధిపతి భార్య, నాలుగుదఫాలుగా వస్తానని రాకుండా ఎగ్గొడుతోంది. బ్లూమ్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు కోపంతో అరిచి బెదిరించలేదు. మనసులో ఒక ప్రశాంతత, స్థిరత్వం ధ్వనిస్తుండగా ఏ మాత్రం జంకకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“మిసెస్ రోసెన్‌బ్లట్, మీ అపాయింట్‌మెంట్ సాయంత్రం నాలుగున్నరకి మార్చబడింది. సరిగ్గా నాలుగున్నరకి నా షాప్ ముందు మీరు లేకపోతే బ్లూమ్ ఆప్టిసియన్ మీకు ఎలాంటి సహాయము…”

“అది కాదండీ…” మధ్యలో మాట్లాడబోయింది ఆమె.

“మీరేం చెప్పాల్సిన పనిలేదు…”

“లేదండీ… హలో…”

“థ్యాంక్ యూ, గుడ్ డే…” పెట్టాశాడు బ్లూమ్. సరిగ్గా నాలుగున్నరకి ఠంచనుగా, బిక్కు బిక్కు మంటూ వచ్చింది మిసెస్ రోసెన్‌బ్లట్. ఆమెను కళ్ళు పరీక్షించే టెస్టింగ్ రూమ్‌కి పంపిస్తూనే, నిశబ్దంగా వినాయకుడికి మొక్కాడు.

క్రమంగా ఆ కుటుంబం మొత్తం ఆ దేవుడి మీద ఇష్టం పెంచుకోవడం మొదలైంది. ఆ గణేషుడి చల్లని చూపులు ఆ ఇల్లు మొత్తం ప్రసరిస్తూ వుండేవి. ఇప్పుడు శాండ్రా తో పాటు పిల్లలు కూడా ఎక్కువ సమయం ఆ గదిలోనే గడుపుతున్నారని బ్లూమ్ గ్రహించాడు. జూడీ ఇప్పటికీ నమ్మనట్టే వుంటోంది కానీ మాడ్యూల్ పరీక్షలు రాయటానికి వెళ్ళే రోజు వుదయం మాత్రం తన కోటుపైన బాడ్జి తీసి వినాయకుడి ముందు వుంచింది. ఆ విషయాన్ని బ్లూమ్ గమనిస్తే, ఏమీ ఎరగనట్టు భుజాలు ఎగరేసి – “లక్ కోసం నాన్న” అంది. అయితే ఆ పరీక్షలలో జూడీ ఆమె టీచర్లు అనుకున్నదానికన్నా బాగా రాయటంతో ఆ నమ్మకం ఇంకా బలంగా తయారైంది. ఆమే కాదు, కుటుంబం మొత్తం ఆ వినాయకుడి ప్రతిమని భక్తిగా చూడటం మొదలుపెట్టారు.

మొదట్లో బ్లూమ్ కుటుంబ సభ్యులెవరూ వినాయకుడి గురించి బయట ఎక్కడా అనలేదు. కానీ వాళ్ళుండే హెండన్ ప్రదేశంలో రహస్యాలకు చోటే లేదు. బహుశా జూడీ స్నేహితురాలు మికైలా ఇంటికి వచ్చినప్పుడు, జూడీ హోంవర్క్ చెయ్యడానికి ముందు ప్రతిసారీ ఆ దేవుడి ముందు గుప్పెడు బ్రెడ్ ముక్కలు నైవేద్యం పెట్టడం చూసినట్లుంది. డేవిడ్ స్నేహితుడు బెంజీ కూడా, కప్యూటర్ టెన్నిస్ గేం ఆడుతూ ఫైనల్ రౌండ్‌కి వచ్చిన ప్రతిసారీ డేవిడ్ ఆ విగ్రహాన్ని తాకుతున్న సంగతి గమనించాడు. ఇంకేముంది.. ఒకరి నుంచి ఒకరికి అక్కడి నుంచి ముగ్గురికి అలా అలా హెండన్ మొత్తానికి తెలిసిపోయింది. “ఆ బ్లూమ్స్ లేరూ – అదే కళ్ళజోళ్ళు అమ్మే బ్లూమ్ కుటుంబం… అవును శాండ్రా బ్లూమ్ అనే ఆవిడ, అదే వాళ్ళాబ్బాయి డేవిడ్ బ్లూమ్ అనే పిల్లాడు… వాళ్ళేనండీ – వాళ్ళింట్లో ఒక విగ్రహముందట.”

ఒక సాంప్రదాయకుడైన యూదుని ఇంట్లోకి విగ్రహాన్ని తీసుకురావటాన్ని క్షమించిన దాఖలాలు బైబిల్‌లో లేవు. అందుకే కదా బంగారు ఆవుదూడ విగ్రహానికి పూజ చేశారని 3000 మందిని పొట్టనపెట్టుకున్నారు? జెస్‌బెల్ ఇలాంటి తప్పు చేసినందునే కదా కిటికీ గుండా గిరాటు వేసి కుక్కలకు బలి చేశారు. ఇక్కడ వున్న కౌన్సిల్ కూడా ఈ విషయంలో రాజీ పడే అవకాశమేలేదు.  బ్లూమ్ ఇలా అనుకున్నాడో లేదో ఆ రాత్రే అతనికి ఫోన్ వచ్చింది. చర్చిలో వుండే రబ్బీ (మతపెద్ద)ని వీలైంనంత త్వరగా వచ్చి కలవాలన్నది ఆ ఫోన్ సారాంశం.

***

ఆ వూరి రబ్బి చాలా చిన్నవాడు. ఈ మధ్యనే అతని మతపరమైన విద్యాభ్యాసం పూర్తైంది. అయినప్పటికీ అతను కుదురుగా పెంచిన గడ్డంతో, హుందాగా ఎంతో మర్యాదస్తుడిలా కనిపించాడు బ్లూమ్‌కి.

పిలిపించాడేకానీ మాట్లాడటానికి చాలా సేపు తటపటాయించాడు రబ్బీ. – “అదే.. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించాను… అదే ఆ విగ్రహం గురించి..” అన్నాడు

“సరే మాట్లాడండి” అన్నాడు బ్లూమ్. అతను ఏ మాత్రం ఖంగారు పడలేదు. వినాయకుడి విగ్రహం అతని జీవితంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇలాంటి విపర్యాలకి అతను ఏ మాత్రం చెలించడంలేదు.

“అవును అదే… విషయం ఏమిటంటే బ్లూమ్‌గారూ… బయట చాలామంది అనుకుంటున్నారు, మీకు తెలిసే వుంటుంది లెండి… అంటే నేను అవన్నీ పట్టించుకుంటున్నానని కాదు కానీ మీలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు… పైగా మీరు మన ఆరాధనా సమాజానికి ట్రస్టీ కూడా కదా…” అన్నాడు రబ్బి తడబడుతూ.

“మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి” అన్నాడు బ్లూమ్ మరింత స్థిరంగా.

బ్లూమ్ తీరు మరింత ఖంగారు పెట్టడంతో రబ్బీ గబగబా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“అదే అదే.. ఆ విగ్రహం గురించి.. మిస్టర్ బ్లూమ్ మీలాంటి ఆరాధనా సమాజం సభ్యుల వద్ద అలాంటిది వుండకూడదు..”

“ఏది?”

“అదే”

“వినాయకుడా?” రెట్టించాడు బ్లూమ్.

“కాదు విగ్రహం… మీలాంటి పెద్దమనుషులు అలాంటివి ఇంట్లో వుంచుకోకూడదు… దాన్నీ తీసిపారేయండి” చెప్పడాయన.

బ్లూమ్ క్షణ కాలం వినాయకుడు తన ఇంటికి వచ్చిన తరువాత వచ్చిన మార్పులను గుర్తుచేసుకున్నాడు. అక్కడికేదో అద్భుతాలు జరిగాయని కాదు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటారు, అరుచుకుంటారు, అప్పుడప్పుడూ అపశృతులు వుంటూనే వుంటాయి. కానీ ఆ గజముఖుడు ఉండటం వల్ల కుటుంబం మొత్తంలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తోంది. అది అతని వూహే అయ్యివుండచ్చుగాక అయినా సరే ఆ దేవుణ్ణి వదులుకోవడం ఇష్టం లేదు అతనికి.

“నేను ఆ విగ్రహాన్ని తీసెయ్యలేను” స్థిరంగా చెప్పాడు రబ్బీతో.

రబ్బీ ఆ మాట వింటూనే కళ్ళు చిట్లించి అపనమ్మకంగా ముందుకు వంగాడు.

“అలాకాదు మిస్టర్ బ్లూమ్ మనం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం… అయినా నాకూ తెలుసు మీకూ తెలుసు… విగ్రహం ఇంట్లో వున్నంత మత్రాన మీరు దానికేం పూజలు చెయ్యరనుకోండి, అయినా చూసేవారికి ఇదంతా పెద్ద తప్పులా అనిపించకుండా ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా..” అనూనయించబోయాడు.

“నేను చేస్తున్నానుగా” చెప్పాడు బ్లూమ్

“ఏమిటి? అలాంటి ప్రయత్నం చేస్తున్నారా?” అన్నాడు రబ్బీ తృప్తిగా.

“నేను చెప్పేది ప్రయత్నం చేస్తున్నానని కాదు… పూజ చేస్తున్నానని చెప్తున్నాను” సరి చేశాడు  బ్లూమ్.

ఆ మాటలు ముఖానికి కొట్టినట్లు అనిపించండంతో ఏం పాలుపోక వెనక్కి జారిగిలపడ్డాడు రబ్బీ. చాలా సేపు ఏం మాట్లాడకుండా వుండి తరువాత – “ఈ విషయం గురించి మనం మళ్ళీ చర్చించాలి. రేపు ఒకసారి రాగలరా?” అన్నాడు నీళ్ళు నములుతూ.

ఆ మర్నాడు రబ్బీ  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ చేసి మధ్యాహ్నంగా ఆరాధనా మందిరానికి పిలిపించాడు.

“మిస్టర్ బ్లూమ్ మీతో దేవుడి గురించి చర్చించాలి” అన్నాడు ఖంగారుగా. బ్లూమ్ చిన్నగా నవ్వి –

“అది మీకు బాగా తెలిసిన సబ్జక్ట్ రబ్బీగారూ, నాకేం తెలుసు” అన్నాడు. దానికి రబ్బీ కూడా చిన్నగా నవ్వాడు.

“సరే సరే.. కాకపోతే మిస్టర్ బ్లూమ్…  ప్రభువు విగ్రహారాధన గురించి ప్రత్యేకంగా చెప్పియున్నాడు. రెండొవ ఆజ్ఞ గుర్తులేదా? ‘మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు’, ‘దేని రూపమునయనను విగ్రహమైనయినను నీవు చేసికొనకూడదు’ అని చాలా స్పష్టంగా చెప్పబడివుంది.”

బ్లూమ్ సన్నగా తలవూపాడు.

“అలాంటిది మీరు ఆ విగ్రహానికి పూజలు చేస్తానని చెప్తూ ఈ సమాజం బోర్డులో ఎలా వుంటున్నారో నాకర్థం కావటంలేదు… ఇలాగైతే మిమ్మల్ని ఈ ఆరాధనా సమాజంలోనికి రానివ్వడం కూడా కుదరకపోవచ్చు..”

“అదేమిటండీ… నేను అన్ని నియమాలు పాటిస్తున్నాను. ప్రభువునీ ఆరాధిస్తున్నాను. నా మతం ఇప్పటికీ యూదు మతమే కదా” అన్నాడు  బ్లూమ్ కొంచెం ఆవేశంగా.

రబ్బి అందుకు సమాధానంగా నవ్వి చేతులు వెడల్పుగా చాస్తూ బైబిల్‌లోని మరో వాక్యాన్ని చదివాడు. “మీ దేవుడను యావేను అయిన నేను అసూయగలవాడను”

బ్లూమ్ ఒకసారి వినాయకుణ్ణి, అతని కరుణ పూరితమైన కళ్ళను గుర్తుచేసుకున్నాదు.

“దేవుడు నిజంగా గొప్పవాడైతే… ఆయనకు అసూయ ఎందుకు వుంటుంది? ఇలాంటి రాగద్వేషాలకు అతను అతీతుడు కదా?” సూటిగా అడిగాడు.

రబ్బీ ముఖం పాలిపోయింది. “ఈ విషయం గురించి మనం ఇంకా మాట్లాడాలి మిస్టర్ బ్లూమ్.. రేపు మళ్ళీ కలుద్దాం” అన్నాడు.

మూడోరోజు  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ వచ్చింది. అదీ తెల్లవారుఝామునే. అంత పొద్దున్నే ఫోన్ చేసినందుకు రబ్బీ క్షమాపణ అడిగి చెప్పాడు –

“మిస్టర్ బ్లూమ్.. మీరు చెప్పిన విషయం గురించి రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను. నేను ఒకసారి ఆ విగ్రహాన్ని చూడాలి. మీరు ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకోని మన ఆరాధనా మందిరానికి రాగలరా? అలా చేస్తే అన్ని సమస్యలను అక్కడే పరిష్కరించుకుందాం..”

బ్లూమ్ అందుకు అంగీకరించాడు. ఎన్ని వివాదాలైన తను ఒక యూదుడే కదా, ఆ ప్రార్థనా మందిరం వల్ల, రబ్బీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన మాటకూడా నిజమే. ఆ విగ్రహం విషయంలో రబ్బీ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా అతనికి గౌరవభంగం కలిగించే పని చెయ్యకూడదని అనుకున్నాడు.

ఆ వినాయకుడి విగ్రహాన్ని మెత్తటి దుప్పటిలో చుట్టి, చిన్న చేతి సంచిలో పెట్టాడు బ్లూమ్. అలా చుడుతున్నప్పుడు కూడా వినాయకుడి నున్నని తోండాన్ని ఒక్కసారి ప్రేమగా నెమిరాడు. బైబిల్ కథల్లో ఎలీజా అనే మేధావిలా రబ్బీ కూడా దేవుడితో వాదప్రతివాదాలు చేస్తాడా అని అనుమానం వచ్చింది. అలా నిజంగా జరిగితే దేముడు ఏం సమాధానాలు చెప్తాడో అని ఆసక్తి కలిగింది.

బ్లూమ్ ప్రార్థనామందిరానికి చేరేసరికే రబ్బీ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఎళ్ళుగా ప్రార్థనలు, గీతాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ పురాతన మందిరంలోనికి  బూమ్‌ను తీసుకెళ్ళాడు. మామూలుగా వసారాగుండా ప్రధాన మందిరంలోకి వెళ్లే దారిలో కాకుండా, దేవదారు మెట్లద్వారా పై అంతస్తులోని పాటకులు కూర్చుండే గదిలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా పవిత్రమైన గదికి పైన వున్న ఆ గదిలోనే పాతనిబంధనము తాలూకు వ్రాతప్రతులు వుంచబడ్డాయి. అక్కడి నుంచి చూస్తే చర్చిలోని ప్రార్థనా మందిరం మొత్తం, అక్కడ వేయబడిన కుర్చీలతో సహా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలలో ఆ కుర్చీలు మొత్తం భక్తితో వచ్చే వందలాది యూదులతో నిండిపోయి వుంటాయి.

రబ్బీ ఆ పాటకులగది కిటికీ తలుపులు బయటకు తెరిచి గట్టిగా రెండు మూడుసార్లు శ్వాస తీసుకోని ఆ తరువాత బ్లూమ్ వైపు తిరిగాడు. “ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారా?” అడిగాడు. బ్లూమ్ అవునన్నట్లు తలాడించాడు. రబ్బీ మనసులో కూడా అలజడి తగ్గి స్థిరంగా వున్నట్టు బ్లూమ్ గుర్తించాడు.

“ఏది నన్ను చూడనివ్వండి” అన్నాడు రబ్బీ.

బ్లూమ్ తన చేతిసంచిలో వున్న దేవుణ్ణి బయటకు తీసి, చుట్టివున్న మెత్తటి గుడ్డని తొలగించి, వినాయకుణ్ణి సుతారంగా పట్టుకున్నాడు. కొన్న రోజుకన్నా ఈ రోజు విగ్రహం బరువు పెరిగినట్లుగా అతనికి అనిపించింది.

రబ్బి భృకుటి ముడిపడింది.

“ఇది కేవలం ఒక మనిషి తయారు చేసిన బొమ్మ. ఆ విషయం మీకు అర్థం అవుతోందా మిస్టర్ బ్లూమ్? ఇందులో చైనా మట్టి, పెయింటు తప్ప ఇంకేమి లేదు. మనకి మనమే తయారు చేసుకున్న ఇలాంటి వస్తువుకి మనం ఎలా మొక్కగలం చెప్పండి?” అన్నాడు.

రబ్బీకి అర్థం అయ్యేలా సమాధానం చెప్పడం అసాధ్యమనిపించి బ్లూమ్ భుజాలు ఎగరేశాడు. చివరికి ఎదో ఒక సమాధానం చెప్పాలని – “నా కళ్ళను, మనసును నమ్మి పని చేస్తున్నాను అంతే..” అన్నాడు. అనడానికైతే అన్నాడు కానీ, తను చెప్పాలకున్నదాంట్లో కనీసం పదోవంతు కూడా చెప్పలేకపోయాడని అతనికి అర్థం అయ్యింది.

చాలా సేపు రబ్బీ బ్లూమ్ వంకే చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత చిన్న చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి అతని భుజాలమీద చెయ్యివేసి నడిపించుకుంటూ కిటికీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ ప్రార్థనామందిరం ఎత్తైన ప్రదేశంలో కట్టబడటం వల్ల ఆ మరకలు పడ్డ కిటికీ అద్దాలలోంచి చూడగలిగితే హెండన్ నగరం మొత్తం కనపడుతుంది.

“ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసుకదా?” అడిగాడు రబ్బీ.

బ్లూమ్ నిశబ్దంగా తలాడించి ప్రశాంతమైన వినాయకుడి ముఖం వైపు చూశాడు.

“ఇలాంటి సమస్య నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు… అందుకే నిర్ణయం తీసుకునే ముందు నా కన్న పెద్దవాళ్ళను కూడా సంప్రదించాల్సి వచ్చింది..” చెప్పుకుపోతున్నాడు రబ్బి. బ్లూమ్ తలాడిస్తూనే వున్నాడు.

“పెద్దలంతా ఒకే అభిప్రాయం తెలిపారు. మీరు అర్థం చేసుకోవాలి మిస్టర్ బ్లూమ్.. మేం తీసుకున్న నిర్ణయం మీకు మంచే చేస్తుంది..” అన్నాడతను. అంతే… అప్పటిదాకా నెమ్మదిగా మట్లాడుతున్నవాడల్లా ఒక్క ఉదుటున, బ్లూమ్‌కి ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా చప్పున ఆ విగ్రహాన్ని లాగేసుకున్నాడు. ఆ విగ్రహాన్ని ఒక్క క్షణంపాటు తన శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ తరువాత కిటికీకి వున్న చిన్న ఖాళీలోనుంచి ఆ విగ్రహాన్ని కిందకి జారవిడిచాడు. భళ్ళున పగిలిన శబ్దం. ఆ కిటికీ కింద వున్న ప్రాంతంలో వినాయకుడి విగ్రహం వెయ్యి ముక్కలై పరుచుకుంది.

“మిస్టర్ బ్లూమ్ ఇప్పుడు ఆ తిరుగుబాటు చిహ్నం బద్దలైపోయింది… మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తోందా?” అడిగాడు రబ్బీ దగ్గరగా వచ్చి.

బ్లూమ్ సమాధానం చెప్పలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళి కిందకి తొంగి చూశాడు. వినాయకుడు కింద పడిన చోటు చుట్టూ గులాబి రంగు శకలాలు పరుచుకోని మెరుస్తూ కనిపించాయి. రబ్బీని తప్పించుకుంటూ ఆ కిటికీ నుంచి దూరంగా జరిగి ఇంటి వైపు అడుగులేశాడు బ్లూమ్.

***

గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రార్థనా మందిరానికి కోశాధికారిగా వ్యవహరించిన బ్లూమ్ అప్పటికి ఏం మాట్లాడకుండా వున్నా ఆ తరువాత, బాగా చీకటిపడిన తరువాత మందిరం వెనుక వున్న ఇనుప గేటు తీసుకోని నిశబ్దంగా అడుగుపెట్టాడు. వచ్చేటప్పుడు ఇంటినుంచి తనతోపాటు గుడ్డ బ్రష్, నగిషీలు చెక్కిన చిన్న చెక్క పెట్ట, ఇంకా సంచిలో ఏవో బరువైన వస్తువులు తెచ్చుకున్నాడు. వినాయకుడు పడి పగిలిపోయిన చోట చుట్టూ తిరుగుతూ బ్రషతో ముక్కలను చెక్కపెట్టలోకి చేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ పక్కనే వున్న పూలమొక్కల మధ్యలో ఒక చిన్న గుంత తొవ్వి అందులో ఆ పెట్టను వుంచి మట్టితో కప్పేశాడు. అక్కడే నిలబడి వినాయకుడితో ఏదన్నా చెప్పాలా అని ఆలోచింఛాడు కానీ, ఏం చెప్పాలో తెలియక మిన్నకున్నాడు.

ఆ తరువాత అలాగే చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా నడుస్తూ ప్రధాన ద్వారం తెరిచి ప్రార్థనా మందిరంలోకి జారుకున్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా అదీ ఎలాంటి స్పష్టమైన అవసరం లేకుండా ఈ మందిరంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. ఒక్క క్షణం అక్కడే ఆగి ఆ ప్రాంతం అతనికి ఎన్ని గంటల ప్రశాంతతనిచ్చిందో గుర్తుచేసుకున్నాడు. తన సంతోషంలో, బాధలో ఇదే ప్రదేశంలో విన్న ప్రార్థనలు, ప్రత్యేక స్వరంలో పాడిన గీతాలు అన్నీ జ్ఞప్తికి వచ్చాయి.

మర్నాడు ఉదయం ఆ మత పెద్దలు అక్కడికి వచ్చేసరికి తలుపులు తాళాలు వేసి వుండటం, ఆ తాళాలకు మైనం కూరి వుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఏదో అనర్థం జరిగి వుంటుందని వూహిస్తూనే తాళాలు బాగుచేసేవారిని పిలిపించి ఆ తాళాలను పగులకొట్టించారు. అప్పటికే అక్కడ జరిగే వింత చూడటానికి గుమికూడిన జనంతో సహా ఆ పెద్దలంతా లోపలికి అడుగుపెట్టి, లోపల జరిగింది చూసి నిశ్చేష్టులైయ్యారు.

లోపల అంతా విధ్వంసం జరిగినట్టు వుంది. అక్కడ బల్లలు విరిగిపోయి, కర్టన్లు చినిగిపోయి, దీపపుసెమ్మలు వంగిపోయి, అద్దాలు పగిలిపోయి వున్నాయి. వాటన్నింటి మధ్యలో చేతిలో గొడ్డలితో అలసిపోయి ఆయాసపడుతూ వున్నాడు – బ్లూమ్. చమటతో అతని బట్టలు తడిసిపోయి వున్నాయి.

“ఇదంతా నువ్వే చేశావా?” ఆడిగారు వాళ్ళు.

“నేనా? నేను కాదు.. ఇదంతా ఆ భగవంతుడు చేశాడు..” చెప్పాడతను.

వాళ్ళు మళ్ళీ చుట్టూ కలియచూశారు. విరిగిన బల్లలన్నింటి మీద గొడ్డలి గుర్తులు కనిపిస్తున్నాయి. పరదాలన్నింటి పైనా ఒక మనిషి అరచేత్తో చించినట్లు గుర్తులున్నాయి.

“దేవుడు చేశాడా? దేవుడు ఇలాంటివి ఎలా చెయ్యగలడు?” అడిగారు వాళ్ళు.

“ఇది కూడా చెయ్యలేని దేవుణ్ణి కొలవాల్సిన పనేముంది?” ప్రశ్నించాడు అతను.

ఇంతవరకే తెలుసు. అతను అడిగిన ఈ ప్రశ్నవల్ల అక్కడున్న మనుషులకు జ్ఞానోదయం అయ్యిందా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.

 మూలం: నయోమి ఆల్డర్మెన్

అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

  64_1naomi_aldermanలండన్ లో పుట్టిన నయోమి ఆల్డర్మెన్  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తరువాత సాహిత్యంలో పట్టభద్రులై ప్రస్తుతం బాత్ స్పా యూనివర్సిటీలో కాల్పనిక సాహిత్యం బోధిస్తున్నారు. 2007లో ఈమె సండే టైమ్స్ పత్రిక “యంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్” అవార్డును సాధించి, ఆ తరువాత వాటర్ స్టోన్స్ సంస్థ ప్రకటించిన “25 రైటర్స్ ఫర్ ది ఫ్యూచర్” జాబితాలో స్థానం సంపాదించారు. ఈమె రాసిన నవలలో “డిస్ ఒబీడియన్స్”, “ది లయర్స్ గాస్పెల్” వంటివి ఈమెకు పేరుతో పాటు ఎన్నో వివాదాలను కూడా అందించాయి. ప్రస్తుతం మీరు చదవబోయే “పరాయిదేవుడు” కూడా అలాంటిదే. 2009 రాసిన ఈ కథ ఆ సంవత్సరం బీబీసి నేషనల్ స్టోరీ అవార్డ్ గెలుచుకుంది.

దారిలో కాఫీ

                   అలెక్స్ లా గ్యూమా పరిచయం

    అలెక్స్ లా గ్యూమా (1925 – 1985)సౌతాఫ్రికా దేశపు నవలాకారుడే కాక, South African Coloured People’s Organisation (SACPO)కు నాయకుడు. ప్రభుత్వం పట్ల ద్రోహం కేసులో నిందితుడైన యితడు చేసిన రచనలు వర్ణ / జాతి వివక్ష (Aparthied) కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని బాగా ప్రభావితం చేశాయి. స్పష్టమైన శైలి, ప్రత్యేకమైన సంభాషణలు, పీడిత వర్గాల పట్ల నిజమైన సానుభూతిపూర్వక దృక్పథం ఇతణ్ని సౌతాఫ్రికా దేశంలోని ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ రచయితల్లో ఒకనిగా నిలబెట్టాయి. 1957 లో మొట్టమొదటిసారిగా Nocturn అనే కథను రాశాడు. 1966 లో స్వంత దేశాన్ని వదిలి శేషజీవితాన్ని ప్రవాసంలో గడిపాడు.

ఇతని రచనలు:

  1. A Walk in the Night and Other Stories (1962)
  2. And a Threefold Cord (1964)
  3. The Stone-Country (1967)
  4. In the Fog of the Season’s End (1972)
  5. A Soviet Journey (1978)
  6. Time of the Butcherbird (1979)

      1969లో ఈయనకు Lotus Prize for Literature వచ్చింది.

 

                                               అనువాదం: ఎలనాగ

 

         వాళ్లు మొక్కజొన్న తోటల్ని దాటి, చదునైన ప్రదేశాలూ ఏటవాలు భూములూ వున్న సగం ఎడారి లాంటి ప్రాంతాన్ని చీలుస్తూ పోయే రోడ్డుమీదుగా కార్లో ప్రయాణం చేస్తున్నారు. దక్షిణం వైపు పరచుకుని వున్న ఆ భూమి,ముళ్లపొదలు నిండిన చిన్నపాటి అడవి లాగా, ఊడ్వని అతిపెద్ద తివాచీలా ఉంది. కుడివైపున చాలా దూరంలో గాలిమరల లోహపు రెక్కలు ఉదయపు గాలుల తాకిడికి బడలికతో పిసినారి భూమిలోంచి నీళ్లను తోడే డ్యూటీని చేయటంకోసం అయిష్టంగా మేల్కొన్నాయా అనిపించే విధంగా తిరుగుతున్నాయి. తారురోడ్డు మీద గర్జిస్తూ కారు వేగంగా సాగిపోతోంది.

“నాకు యింకో సాండ్విచ్ కావాలి ప్లీజ్” అన్నది జైదా. వెనుకసీట్లో సూట్ కేసుల మధ్య, బ్యాగుల మధ్య ఒదిగి కూచున్నది ఆమె. ఆరేళ్ల వయసున్న ఆ అమ్మాయి కారులో ఆ దూరప్రయాణం చేస్తుంటే అలసిపోయింది. బయటి దృశ్యాల పట్ల ఆమెకు మొదట వున్న ఆసక్తి మాయమైంది.వెనక్కి పరుగెత్తుతున్న ఎండిపోయిన వాగులనూ గిడచబారిన చెట్లనూ చూడకుండా, తలగడలవంటి బ్యాగుల మధ్య అలసటతో ముందుకు వంగి కూర్చుంది ఆ అమ్మాయి.

స్టీరింగు వెనకాల వున్న స్త్రీ తన దృష్టిని రోడ్డు మీంచి మరల్చకుండా “టిన్నులో కొంచెం సాండ్విచ్ వుంది. నీ అంతట నువ్వే తీసుకోగలవు కదా” అని,“నువ్వు కూడా ఇంకొంచెం తింటావా, రే” అని అడిగింది.

“నాకు ఆకలిగా లేదు” అన్నాడు ముందర పక్కసీట్లో కూచున్న అబ్బాయి. అతడు వెనక్కి పరుగెడుతున్న ఇనుపతీగ కంచెను తెరిచివున్న కిటికీలోంచి చూస్తున్నాడు.

సాండ్విచ్ నములుతూ “కేప్ టౌన్ పట్టణం ఇంకా యెంత దూరంలో వుంది అమ్మా?” అని అడిగింది జైదా.

“రేపు మధ్యాహ్నం మనమక్కడ చేరుతాము” అన్నది ఆ స్త్రీ.

“నాన్న మనకోసం యింట్లో వేచివుంటాడా?”

“ఔను”

“అదుగో, కొన్ని మేకలు కనపడుతున్నాయక్కడ” అన్నాడు రే. గోధుమరంగున్న ఏటవాలు మైదానంలో అక్కడక్కడా చదరాల ఆకారాల్లోవున్న సాదా ఫామ్ హౌజ్ లు కనిపించాయి.

రాత్రంతా కారు నడపటంవల్ల ఆ యిద్దరు పిల్లల తల్లి బాగా అలసోయింది. కనురెప్పల కింద ఇసుకరేణువులున్నాయా అన్నట్టు ఆమె కళ్లు గరగరమంటున్నాయి. గతరాత్రి రోడ్డు పక్కన కొంచెంసేపు ఆగారు వాళ్లు. ఒక చిన్న ఊరవతల ఖాళీ ప్రదేశంలో కారును నిలుపుకున్నారు. రాత్రంతా ఆగుదామంటే అందుకు సరిపడే ఊరే కనిపించలేదు. ఒకటిరెండు వూళ్లలో హోటళ్లు కనిపించాయి కాని, అవి కేవలం తెల్లవాళ్ల కోసమే. నిజానికి ఆ వూళ్లలో తెల్లవాళ్లే నివసిస్తున్నారు. పనిమనుషులు తప్ప మిగిలిన నల్లవాళ్లందరూ శిథిలమౌతున్న ఇండ్లలో, ఊరికి దూరంగా బతుకుతున్నారు. పైగా ఆ ప్రాంతంలో ఆమెకు తెలిసినవాళ్లెవరూ లేరు.

తెల్లవారగానే ఆందోళన, నైరాశ్యం, చిరాకు కలిగినాయి ఆమెకు.పిల్లలున్నారు కనుక వాటిని ఆపుకుంది ఆమె. మధ్యరాత్రి ఆ ఖాళీ ప్రదేశంలో కొంతసేపు ఆగింతర్వాత, ఆమె మళ్లీ కారు నడపటం ప్రారంభించింది. ఇంకా రాత్రిగానే వుండటం వల్ల పిల్లలు కార్లోనే నిద్రపోయారు.

ఆమెకు తలనొప్పి కూడా మొదలైంది.“నాకొక మీట్ బాల్ కావాలి మమ్మీ” అని జైదా అడగ్గానే “అబ్బా యేం విసిగిస్తావే పిల్లా. అక్కడే వుంది తీసుకుని తిన్లేవా?” అన్నదామె చిరాకుగా, అసహనంగా.

బయటి దృశ్యం సినిమా రీలు లాగా వెనక్కి పరుగెత్తింది. ఆ దృశ్యం వివిధ రంగుల్లో వున్న పల్చని పొదలతో, బండరాళ్లతో అలంకృతమై వుంది. తూర్పువైపున చాలా పెద్ద సైజులో వున్న కొండరాళ్ల వరుస ఇసుకనేల మీద అకస్మాత్తుగా పైకి లేచింది. ఊదా, నీలం రంగుల వరుసల్లో వున్న కేకు మీద చాక్లెట్ రంగున్న పైపొర లాగా కనిపిస్తున్నాయి ఆ రాళ్లు. కారు కంకరరాళ్ల పట్టీ మీంచి దూసుకుపోయింది. మంటల్లోంచి పైకెగసే రంగుపొగలా కారు వెనకాల ఎర్రని దుమ్ము లేచింది. రిబ్బనులాంటి పొడవైన తోక వున్న పక్షి వొకటి రోడ్డు అంచు వెనకాల కారంత వేగంతో పరుగెత్తుతూ మాయమైంది.

“ఆ వింతైన పక్షిని చూడు మమ్మీ” అని సంతోషంతో అరిచి, మూసివున్న గాజు తలుపుకు ముఖం ఆనించాడు రే.

ఆమె పట్టించుకోకుండా స్టీరింగు వెనకాల కొంచెం రిలాక్స్ అవటానికి ప్రయత్నించింది. ఆమె అనాలోచితంగా వున్నా, డాష్ బోర్డు కిందున్న పెడళ్ల మీద ఆమె పాదాలు నైపుణ్యంతో కదులుతున్నాయి. రైల్లో వచ్చివుంటే బాగుండేదనుకున్నది ఆమె. కాని తన భర్త ఐన బిల్లీ తాను చాలా మందిని కలవాల్సి వుందనీ,అందువల్ల తనకు కారు అవసరం అనీ ఉత్తరం రాశాడు. కేప్ టౌన్లో తమ వ్యాపారం బాగా ఉండి వుంటుందని ఆశించిందామె. ఆమెకు తలనొప్పి వస్తోంది. ఆమె అనాలోచితంగా కారు నడుపుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణాన్ని ముగించాలని నిశ్చయించుకుంది ఆమె.

“నాకు కాఫీ కావాలి” అన్నాడు రే. డాష్ బోర్డు కింద వున్న ఫ్లాస్కు కోసం చేయి చాచాడు అతడు. రే తన సంగతి తానే చూసుకుంటాడు. చిన్నచిన్న పనుల్ని అతనికోసం ఇతరులు చేయాల్సిన అవసరం లేదు.

“నాక్కూడా యివ్వు కొంచెం కాఫీ” వెనకాల బ్యాగుల మధ్య కూచునివున్న జైదా అన్నది.

“అంత దురాశ పనికిరాదు. ఎప్పుడూ తినడం తినడం తినడమే నీకు” అన్నాడు రే.

“నాది దురాశ కాదు. నాక్కొంచెం కాఫీ కావాలి అంతే”

“పొద్దున్నే తాగావు కదా కాఫీ”

“ఇంకొంచెం కావాలి నాకు”

“దురాశ”

“పిల్లలూ అల్లరి ఆపండి”అన్నది తల్లి నీరసంగా.

“వాడే మొదలుపెట్టాడు” అన్నది జైదా.

“ఇంక చాలు, నోర్మూసుకో” అన్నది తల్లి.

రే ఫ్లాస్కు మూతను తెరిచాడు. లోపలికి చూసి,“అమ్మా ఇందులో కాఫీ లేదు” అన్నాడు.

తల్లి “అయ్యో, మన ఖర్మ” అన్నది.

“నాకు దాహంగా వుంది. నాక్కొంచెం కాఫీ కావాలి” అని అరిచినట్టుగా అన్నది జైదా.

తల్లి నీరసంగా “ఓ… సరే, కానీ కొంచెం ఆగాలి నువ్వు. ముందుకు పోయింతర్వాత రోడ్డు పక్కన కాఫీ దొరుకుతుంది మనకు. అంతవరకూ ఆగాలి. సరేనా” అన్నది.

నీలి ఆకాశం మీద ఎర్రని రాగిపూతలా ఉన్నాడు సూర్యుడు.ఆ పల్లెప్రాంతం కాలిన పెద్ద టోస్టు బ్రెడ్ లా పొగమంచులో కదులుతూ, పసుపు కలిసిన గోధుమరంగులో వుంది. ఎండిన కాయలోపల గింజ కదిలినట్టు తలలోపల మెదడు కదుల్తున్నట్టనిపిస్తుంటే, ఆమె అలసటగా కారు నడుపుతోంది. ఆమె పెట్టుకున్న కళ్లద్దాల వెనక కళ్లు ఎర్రబడి, నల్లని విశాలమైన, అందమైన రెడిండియన్ ముఖం వుంది. తన శరీరం మొత్తం వీణమీద బిగుసుకున్న తీగల్లా బిగువుగా ఉన్నట్టూ, చేయి తాకితే వాటిలోంచి ఒక తీగ తెగిపోతుందా అన్నట్టూ అనింపించింది ఆమెకు.

మైళ్లు సర్రుమంటూ కూనిరాగం తీస్తూ, మధ్యమధ్య గర్ర్ మంటూ వెనక్కి పోతున్నాయి. మట్టిరంగులో వున్న గుట్టలూ, రెండువైపులా రేగడి మట్టితో సెలయేర్లూ, రాతి అంచులతో వున్న చిన్నచిన్న కొండలూ కనపడ్డాయి. ఒక చిన్న కొండ అంచున పశువులకాపరి గుడిసె, వొక ఒంటరిజీవిలా కనిపించింది. అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న కార్లు దూసుకుపోతుంటే, జిప్ జిప్ మని వాటి శబ్దం వినపడుతోంది. గాలి మరుగుతోందా అన్నట్టు తీక్ష్ణమైనఎండపొడ కదులుతోంది.

“నాక్కొంచెం కాఫీ కావాలి.మనకు కాఫీయే లేదు” అన్నది జైదా చిరచిరలాడుతూ.

ఆమె తల్లి “కొంత దూరం పోయాక కొందాం. ఇక నీ యేడుపు ఆపు. ఇంకో సాండ్విచ్ తిను” అన్నది

“నాకు సాండ్విచ్ వద్దు. కాఫీయే కావాలి”

పగిలిన డబ్బాల్లాగా శిథిలావస్థలో చెల్లాచెదరుగా వున్న కొన్ని గుడిసెలు రోడ్డు పక్కన గోతిలో కనిపించాయి. మట్టికొట్టుకుపోయి నగ్నంగా వున్న పిల్లలగుంపు వొకటి మేకలదొడ్లోంచి పోలోమంటూ బయటికి వచ్చి, రోడ్డుపక్కలకు చేరి, కారును చూస్తూ కేరింతలతో చేతులు వూపింది. రే కూడా చేతులు వూపుతూ నవ్వాడు. క్షణంలోనే వాళ్లు కనుమరుగయ్యారు. నీళ్లను పైకి లాగే ఒక గాలిమర కూడా కనిపించి వెంటనే మాయమైంది. ముగ్గురు నల్లవాళ్లు రోడ్డుపక్కన ఒకే వరుసలో నడుస్తున్నారు.వాళ్లు చిరిగిపోయి దుమ్ముపట్టిన కంబళ్లు కప్పుకుని, వాతావరణాన్ని లెక్కచేయకుండా అగోచరమైనభవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నడుస్తున్నారు.తలలమీది నలిగిపోయిన టోపీలే వాళ్లకు నీడనిస్తున్నాయి. వాళ్లు కారు వైపు చూడలేదు. చేతులు ఊపలేదు. తదేక దృష్టితో ముందుకు చూస్తూ నడుస్తున్నారు.

ఇనుప వంతెన మీదికి రాగానే కారువేగం తగ్గింది. రాళ్లుతేలిన వాగుమీంచి కారు పోతుంటే గడగడమనే శబ్దం వచ్చింది. మట్టికొట్టుకుపోయిన నల్లని బొచ్చున్న గొర్రెలు కొన్ని పెద్ద రాళ్ల మధ్య తుమ్ముతుంటే, వాటి కాపరి దిష్టిబొమ్మలా నిశ్చలంగా వాటినే చూస్తున్నాడు.

కొంచెం దూరం పోయాక వాళ్లు యూరోపియన్ల కాలనీని దాటారు. తర్వాత నల్లవాళ్ల యిళ్లు వచ్చాయి. ఆ మట్టిగోడల యిళ్లకు చెక్కపలకల చూర్లున్నాయి. ఏటవాలుగా వున్న గోధుమరంగు మైదానంలో ఆ యిళ్లు రంగు వెలిసిన పాచికల్లా వున్నాయి. చిన్నచిన్న మనుషులతో పాటు చీమల్లాంటి కుక్కలు కదుల్తూ కనిపించాయి వాళ్లకు. మరో ఏటవాలు స్థలంలో వెల్లవేసిన పెద్ద రాయి మీద ఒక ఊరిపేరు రాసివుంది.

రైలుమార్గం పక్కన వున్న దొడ్లలో గొర్రెలు ఒకదానిమీద ఒకటి పడుతున్నాయి. వాటిని దాటుకుని, కారు రైల్వే క్రాసింగు మీదుగా మళ్లీ రహదారి మీదికి చేరింది. ఒక యూరోపియన్ సైకిలు మీద పోతున్నాడు. వేగం తగ్గిన కారుతమాషాగా వున్న ఒక రైల్వే హోటలు ముందుభాగాన్నీ, దుకాణాల వరుసనూ దాటుకుంటూ పోయింది. తర్వాత ఒక చోట డచ్ కొలోనియల్ హోటల్ లాగా కంచెగల ప్రాంగణంలో ఎండ సోకి ఎర్రబడిన ముఖాలతో కొందరు యూరోపియన్లు టేబుళ్ల ముందు కూర్చుని తాగుతున్నారు. కంకరా, దుమ్మూ నిండిన మరో వీధిలో ధూళిపేరుకుపోయిన కార్లూ,దెబ్బతిన్న పికప్ ట్రక్కులూ, వ్యాన్లూ నిలబడి వున్నాయి. ఒక యూరోపియన్ వృద్ధుడు దుకాణం ముందు ఊడుస్తున్నాడు. పుల్లల చీపురుతో అతడు ఊడుస్తుంటే బుస్ బుస్ మంటూ గ్యాసు బయటికి వస్తున్నట్టు శబ్దం వస్తోంది.

గులాబీవర్ణం ముఖంతో, బంగారురంగు వెంట్రుకల్తో, ఖాకీ చొక్కాలు, లాగులు తొడుక్కున్న ఇద్దరు యూరోపియన్ యువకులు కారు వైపు చూశారు. ఫ్యాక్టరీనుండి అప్పుడే బయటికి వచ్చినట్టు తళతళ మెరుస్తున్న ఆ కారునూ, దాంట్లో స్టీరింగు వెనకాల ఉన్న నల్ల స్త్రీనీ చూడగానే అకస్మాత్తుగా వాళ్ల కళ్లలో ప్రతికూల భావం చోటు చేసుకుంది. వెనకాల ఒక చిన్న ధూళిమేఘం లేచింది.

“ఈ వూరి పేరేమిటి మమ్మీ?” అని అడిగాడు రే.

“నాకు తెలియదు. కర్రూ ప్రాంతంలోని ఏదో వొక వూరు” అన్నదామె. కారు వేగాన్ని తగ్గించగలిగినందుకు సంతోషపడింది.

కారు కిటికీ గుండా బయటకు చూస్తూ “ఆ మనిషేం చేస్తున్నాడు?” అని అడిగింది జైదా.

“ఎక్కడ? ఏ మనిషి?” బయటికి చూస్తూ అడిగాడు రే.

“అతడు వెనక్కి మాయమయ్యాడు. నేనన్న వెంటనే చూళ్లేదు నువ్వు” అన్నది ఆపిల్ల. తర్వాత,“మనకు కాఫీ దొరుకుతుందా యిక్కడ?” అని అడిగింది.

“దొరకొచ్చు. మీరిద్దరూ అల్లరి చెయ్యకుండా బుద్ధిగా వుంటే కాఫీ దొరుకుతుంది. కూల్ డ్రింక్ తాగుతావా?”

“అది తాగితే తర్వాత వెంటనే దాహమేస్తుంది” అన్నాడు రే.

“సరే, ఎక్కువగా మాట్లాడకుండా ఓపికతో వుండండి” అన్నది తల్లి.

కొంచెం ముందర ఖాళీ ప్రదేశంలో ఒక రెస్టారెంటు కనిపించింది. దాని ముందరి నీడలో, కిటికీల దగ్గర పేవ్ మెంటుకు ఎదురుగా, స్టీలు కుర్చీలూ టేబుళ్లూ వేసి వున్నాయి. దాని ముఖభాగం కోకాకోలా తాలూకు బొమ్మలతో అలంకరించబడి వుంది. తినుబండారాల ధరలను సూచించే ఒక పట్టిక వుంది. చారలున్న డేరా ఒకటి టేబుళ్ల మీద నీడను పరుస్తోంది. ఖాళీ ప్రదేశానికి ఎదురుగా వున్న గోడలో ఒక చదరపు అడుగంత కిటికీ వుంది. అది నల్లవాళ్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్. మురికిగా వున్న నల్లవాళ్లు కొందరు మట్టిలో నిలబడి, ఒకరి తలలు మరొకరికి తగుల్తుంటే, ఆర్డరిచ్చినవాటి కోసం ఓపికతో వేచి వున్నారు ఆ కిటికీ దగ్గర.

ఆమె కారును రెస్టారెంటు ముందుకు తీసుకుపోయి ఆపింది. లోపల ఒక రేడియో మోగుతోంది. కిటికీలకు వేలాడుతున్న వెనేషియన్ బ్లైండ్స్ దుమ్ము లేకుండా శుభ్రంగా వున్నాయి.

“ఫ్లాస్కు ఇటివ్వు” అని పిల్లవాని దగ్గర నుండి దాన్ని తీసుకుంది ఆమె. కారుతలుపును తెరిచి,“మీరు కదలకుండా కూర్చోండి. నేనిప్పుడే వస్తాను” అన్నది.

కారు తలుపును తెరిచి, ఒక్క క్షణం పేవ్ మెంటు మీద నిలబడింది. దాంతో కండరాలు వదులై చెప్పలేని హాయిని అనుభవించింది.నిటారుగా నిలబడి, దాదాపు ఇంద్రియభోగం లాంటి సుఖాన్ని పొందింది. కాని తలనొప్పి ఇంకా బాగా వుండటంతో క్షణికమైన ఆ సుఖం చెడిపోయిన అనుభూతిని పొందింది. ఆమె మెదడు మళ్లీ అలసటకు లోనై, శరీరం మళ్లీ బిగుసుకుపోయిన స్ప్రింగులా మారింది. నలగటం వల్ల కోటుమీద ఏర్పడ్డ గీతల్ని ఆమె సాఫుచేసింది. కానీ లోపలి జాకెట్ కు వున్న పైగుండీలను పెట్టుకోకుండా అలానే వుంచింది. తర్వాత ఫ్లాస్కును పట్టుకుని పేవ్ మెంటు మీదుగా లోపలికి ప్రవేశించి, ప్లాస్టిక్, స్టీలు కుర్చీల మధ్యలోంచి రెస్టారెంట్ లోపలికి చేరుకుంది.

లోపల చల్లగా వుంది. గ్లాసుకేసుల్లో సీసాలు, టిన్నులు, ప్యాకెట్లు చక్కగా అమర్చబడి, మ్యూజియంలా అనిపించింది. రెస్టారెంటు వెనకాల నుండి బంగాళాదుంపలు వేపుతున్న వాసన, చప్పుడు వస్తున్నాయి. ఒక గాజు అరలో పెట్టిన ఎలెక్ట్రిక్ ఫ్యాను తిరుగుతోంది. గోడకు ఆనుకుని టీతో, కాఫీతో నిండివున్న రెండు పాత్రలు మెరుస్తున్నాయి.

అక్కడ వున్న ఒకేఒక్క మరో మనిషి చిన్న యూరోపియన్ పిల్లవాడు. అతని ముఖం ఆపిలుపండు లాగా, వెంట్రుకలు గోధుమరంగులో వున్నాయి. అతని ముక్కు కారుతోంది. అతడు వెలిసిపోయిన డిజైనున్న చొక్కా, ఖాకీ లాగూ తొడుక్కున్నాడు. మట్టికొట్టుకుపోయిన అతని నగ్న పాదాలు లేత పసుపు వర్ణంలో, పగిలిన ఆనెకాయలతో నిండి వున్నాయి. అతని గులాబీరంగు నోరు ఒక లాలీపాప్ ను చప్పరిస్తోంది.వైరుబుట్టలో పెట్టివున్న పాత పత్రికల్ని చూస్తున్నాడు ఆ అబ్బాయి.

గ్లాసు కౌంటరు వెనకాల ఆకుపచ్చని జుబ్బా తొడుక్కున్న ఒకావిడ, పక్కగోడ లోని చతురస్రాకారపు కిటికీ గుండా అడుగుతున్న నల్లని ముఖాల్ని పట్టించుకోకుండా రెస్టారెంటు లోపల వున్నవాళ్లకు సమాధానమిస్తోంది. ఆమె బుజాలు గుండ్రంగా, ముఖం ఎర్రగా వున్నాయి. ముఖంలోని అవయవాలు విడిపోయి దూరందూరంగా ఉన్నట్టున్నాయి. చెక్కిళ్లు గుండ్లలాగాఉండి,ముక్కు తాలూకు ఎముక రెండు బూడిదరంగు చెంపల్ని వేరు చేస్తోంది. ఆమె నోరు ఒక ద్వేషపూరితమైన బల్లినోరు లాగా తెరుచుకుని వుంది. నోట్లో గులాబీరంగు చిగుళ్ల నుండి బయటకు వచ్చిన పలువరుస రంపపు అంచులా తోచింది.

అమె తలెత్తి పైకి చూసి ఏదో అనబోయింది. ఎదురుగా వున్న నల్లజాతి స్త్రీని చూడగానే ఒక్క క్షణం సేపు ఆమె కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చాయి. బక్కపలుచని యూరోపియన్ పిల్లవాడు పురుగులాగా కదిలాడు.

“ఈ ఫ్లాస్కునిండా కాఫీ పోసిస్తారా ప్లీజ్” అన్నది ఆ నల్ల యువతి.

ఆ యూరోపియన్ స్త్రీ నోరు తెరుచుకుని, ఒక రాయికి లోహపు వస్తువు గీరుకుంటున్నట్టుగా గరుకైన, కటువైన శబ్దం చేస్తూ,“కాఫీయా? లార్డ్, జీసస్, దేవుడా.ఒక పాపిష్ఠి కూలీ అమ్మాయి ఇక్కడికెలా వచ్చింది?” అన్నది. ఖరీదైన షోకైన కళ్లద్దాలు పెట్టుకున్న ఆ అందమైన ముఖాన్ని చూసి తర్వాత,“కూలీలు, కాఫిర్లు, మోటు మనుషులు బయట వుండాలని తెలియదా? ఇంకా ఇంగ్లీషు కూడా మాట్లాడుతున్నావా నువ్వు?” అని అరిచింది. నల్ల స్త్రీ ఆమె వైపు చూసి ఉక్రోశానికి వచ్చింది. ఆమెకు మనసులోపల యెక్కడో మండినట్టవడంతో అకస్మాత్తుగా స్ప్రింగులాగా ఎగిరి కోపంతో కేకలు వేస్తూ ఫ్లాస్కును ఆ యూరోపియన్ స్త్రీ ముఖం మీదికి విసిరింది.

“తెల్ల ముండా, నువ్వే కూలీవి” అని అరిచింది.

ఆ యూరోపియన్ స్త్రీ ఫ్లాస్కును చేత్తో వేరే దిక్కుకు కొట్టిపారేసే లోపలే,అది ఆమె కనుబొమ్మకు తాకి పడిపోయింది. ఫ్లాస్కులోపలి గాజుసీసా పగిలిన శబ్దం వినిపించింది. ఆ తెల్ల స్త్రీ అరుస్తూ,రక్తం కారుతున్న నుదుటికి చేయి పెట్టుకుని, వెనక్కి తూలింది. ఆ చిన్న పిల్లవాడు లాలీపాప్ ను కింద పడేసి, బయటికి పరుగెత్తాడు. పక్కగోడ లోని కిటికీ దగ్గరున్న మనుషులు నోరు తెరిచి, రెస్టారెంట్ లోపలి వైపు చూశారు. ఆ నల్ల స్త్రీ వెనుతిరిగి కోపంతో బయటకు నడిచింది.

ఎర్రబడి బిగుసుకుపోయిన ముఖంతో ఆమె కారు వైపు నడిచి, కోపంగా కారుతలుపును తెరిచింది. తలుపును మళ్లీ గట్టిగా మూసి కారును స్టార్టు చేస్తుంటే, కిటికీ దగ్గరున్న నల్లవాళ్ల గుంపు అక్కడికి వచ్చి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది.

స్టీరింగును గట్టిగా పట్టుకుని ఆమె పిచ్చిఆవేశంతో కారును వేగంగా నడుపుతుంటే,చేతులు పచ్చరంగును పులుముకున్నాయి. తర్వాత తేరుకుని జాగ్రత్తగా కారు వేగాన్ని తగ్గిస్తూ కొంచెం రిలాక్సయింది. మళ్లీ అలసట, చిరాకు. ఊరిబయటికి చేరటానికి ఆమె త్వరపడక, కొంత సమయం తీసుకుంది. పిల్లలు నోళ్లు వెళ్లబెట్టారు. ఏదో జరగరానిది జరిగిందని అర్థమైంది వాళ్లకు.

“కాఫీ దొరికిందా మమ్మీ? ఫ్లాస్కేదీ? అని అడిగాడు రే.

“కాఫీ దొరకలేదు. అది దొరకకున్నా మనం సరిపెట్టుకోవాలి” అన్నది ఆమె.

“కాఫీ అడిగాన్నేను” ఫిర్యాదు చేస్తున్నట్టుగా అన్నది జైదా.

“నువ్వు బుద్ధిగా వుండాలి. అమ్మ అలసిపోయింది. ఏమీ వదరకు” అన్నదామె.

“ఫ్లాస్కు పోయిందా?” అడిగాడు రే.

“ఏమీ మాట్లాడకు. నిశ్శబ్దంగా వుండు” అన్నది తల్లి. పిల్లలిద్దరూ మౌనంగా వుండిపోయారు.

వాళ్లు ఊరి పొలిమేరల్ని దాటారు. సెంట్రీ గార్డుల్లా నిలుచున్న ఎర్రని పంపులున్న పెట్రోలు బంకును దాటారు. తల మీద పెద్ద ఎండుకట్టెల మోపును పెట్టుకుని నడుస్తున్న మనిషిని దాటారు. ఊరి చివర్న వున్న యిళ్లను దాటారు. ఆ యిళ్లు వెల్లవేయబడి తెల్లగా వున్నాయి. ముంగిళ్లలో కోడిపిల్లలు మట్టిని కెలుకుతున్నాయి. గొర్రెల బొచ్చు గుట్టలుగా పడివున్న కొట్టాలు అపరిశుభ్రంగా కనపడ్డాయి. ప్రహరీగోడ మీద కూర్చున్న ఒకతను ఆ కారు మీద దృష్టి నిలిపి పరీక్షగా చూశాడు.

రోడ్డు మళ్లీ పల్లెప్రాంతం లోకి ప్రవేశించింది.దారిలోని ఆకుపచ్చని చెట్లు మాయమయ్యాయి. ఏ భావమూ లేక బోసిపోయిన నేల మీద సూర్యకాంతి నర్తించింది. నల్లని తారు మీద టైర్లు మంద్రస్వరంలో సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ముందర కొంత రద్దీ కనపడింది. కాని ఆమె నిర్లక్ష్యంగా రద్దీని దాటిపోయింది.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ రే,“నాన్న మనను కార్లో డ్రైవ్ కు తీసుకుపోతాడా?” అని అడిగాడు.

“తప్పక తీసుకుపోతాడు. నాకు తెలుసు. ఇకె మామయ్య కారుకన్నా నాకు మన కారే ఎక్కవిష్టం ”అన్నది జైదా.

“నిజానికి నాన్న యెన్నోసార్లు మనను కార్లో తీసుకుపోయాడు”అని,“అదుగో అప్పుడు చూసిన గమ్మత్తైన పక్షి మరొకటి పోతోంది” అన్నాడు రే.

“అమ్మా, తర్వాతైనా మనకు కొంచెం కాఫీ దొరుకుతుందా?” అని అడిగింది జైదా.

“ఏమో, చూద్దాం”

ఎండిపోయి దుమ్ము నిండిన భూమి వెనక్కి పరుగెడుతోంది. ముందర పలుచగా వున్న వాహనాల వేగం తగ్గటంతో, ఆక్సెలరేటర్ మీంచి ఆమె తన పాదాన్ని మెల్లగా పైకి లేపింది.

“ఆ కొండను చూడు. అది మనిషి తల ఆకారంలో వుంది కదా” అన్నాడు రే.

“అది నిజమైన మనిషి ముఖమా?” అని అడిగింది జైదా బయటకు చూస్తూ.

“పిచ్చిదాన్లా మాట్లాడకు. నిజమైన ముఖమెలా అవుతుంది? కేవలం ముఖంలాగా వున్నదంతే”

కారు మెల్లగా పోతోంది. కిటికీలోంచి తలను బయటపెట్టి ఆమె ముందుకు చూసింది. ముందర రోడ్డు బ్లాకు అయివుంది.

African Kadhalu_title

అక్కడ ఒక చిన్న పోలీసు వ్యాను ఆగివుంది. దాని కిటికీలకూ, హెడ్ లైట్లకూ తీగలతో చేసిన కన్నాల ప్లేట్లు వున్నాయి. ఆ వ్యానుకు పక్కనే మరో వాహనాన్ని నిలిపారు. దాంతో ముందుకు పోవటానికి కేవలం ఒక కారు పట్టేంత స్థలం మాత్రమే మిగిలింది. ఖాకీ చొక్కా, ప్యాంటు, టోపీ తొడుక్కుని తొడలకు అడ్డంగా ఒక స్టెన్ గన్ తో ఒక పోలీసు ఆ వాహనానికి ఆనుకుని వున్నాడు.మరొక పోలీసు కారు స్టీరింగు దగ్గర కూచుని వున్నాడు. మూడవ పోలీసొకాయన ఆ వాహనం పక్కన నిల్చుని,డ్రైవర్లను పరీక్షిస్తూ ముందుకు పంపుతున్నాడు.

వాళ్ల ముందున్న కారు అక్కడికి పోగానే ఆగింది. పోలీసు ఆ డ్రైవరు ముఖాన్ని పరీక్షగా చూసి, ముందుకు పొమ్మన్నట్టుగా చేయి ఊపి వెనక్కి జరిగాడు. ఆ కారు రయ్యిమని దూసుకుపోయింది.

తర్వాత పోలీసు, వీళ్ల కారు దిక్కు తిరిగి ఆగమన్నట్టుగా సంజ్ఞ చేశాడు. ఆమెకు అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె బ్రేకు వేసింది. ఖాకీ గుడ్డలు తొడుక్కున్న పోలీసు ఆమెవైపు అడుగులు వేశాడు.

అతని ముఖం యువకుని ముఖంలా ఉంది.తలమీద తోలుటోపీ పెట్టుకున్నాడు. అతడు చిరునవ్వు నవ్వాడు కాని, అతని కళ్లు గ్రనైటు రాయిలా కర్కశంగా వుండటంచేత, వాటిలో ఆ నవ్వు ప్రతిఫలించలేదు. అతని నడుము దగ్గర ఒక తోలుసంచీలో పిస్టల్ వుంది. వేరే పోలీసులవైపు తిరిగి,“ఇదే ఆ కారనుకుంటా” అన్నాడతడు.

స్టెన్ గన్ పట్టుకున్న పోలీసు నిటారుగా నిలబడ్డాడు. కానీ ముందుకు రాలేదు. కార్లో కూచున్న మరో పోలీసు ఆమెనే చూస్తున్నాడు.

రోడ్డు మీదున్న పోలీసు నవ్వుతూ,“మేం నీకోసమే చూస్తున్నాం. ఆ వూర్లోని పోలీసులు మాకు ఫోన్ చేస్తారని తెలియదా?” అన్నాడు.

కార్లో వున్న పిల్లలు నిశ్చలంగా కూచుని గుడ్లప్పగించి చూస్తున్నారు. ఆమె పోలీసుల్తో “ఏమిటిదంతా?” అన్నది.

“ఏమిటో అంతా తెలుసు నీకు” అన్నాడు పోలీసు. ఆమెను మళ్లీ పరీక్షగా చూసి,“గోధుమరంగు కోటు తొడుక్కుని… నల్లకళ్లద్దాలు పెట్టుకున్న నల్లమ్మాయి….. నిన్ను అరెస్టు చేస్తున్నాం” అన్నాడు.

“మీరు చేస్తున్నదేమిటి?” అని మళ్లీ అడిగిందామె. ఆమె గొంతులో ఆందోళన లేదు. కాని పిల్లల గురించి విచారం కలిగిందామెకు.

“నీకే తెలుస్తుంది. ఇక్కడ ఒక గుంపు గొడవ చేస్తోంది విను” అని ఎర్రబడ్డ కళ్లతో ఆమెను చూశాడతడు.“కారును పక్కకు తీసుకో. వెధవ వేషాలెయ్యకు. ముందర మా కారూ, దానివెనక వ్యానూ పోతుంటుంది. బాగా గమనించు” అన్నాడు మెల్లగా. కాని అతని గొంతు బెదిరిస్తున్నట్టుగా వుంది.

“మమ్మల్నెక్కడికి తీసుకుపోతున్నారు? నా పిల్లల్ని కేప్ టౌనుకు తీసుకుపోవాలి నేను” అన్నదామె.

“అదంతా నాకనవసరం. ఈ ప్రాంతంలో నువ్వు సమస్య తెచ్చావు కనుక, ఇక్కడే పర్యవసానాన్ని అనుభవించాలి నువ్వు” అని వెనక వున్న పోలీసుకారు లోని వాళ్లకు చేయి ఊపాడు. దాని డ్రైవరు స్టార్టు చేసి, కారును రోడ్డు మీదికి పోనిచ్చాడు.

“డ్రైవ్ చేస్తూ ఆ కారు వెనకాల పోవాలి నువ్వు. మనం వెనక్కి పోతున్నాం” అన్నాడు.

ఆమె ఏమీ మాట్లాడకుండా తన కారును స్టార్ట్ చేసి, పోలీసుకారు వెనకాల పోవటానికి సిద్ధమైంది.

“ఏ విధమైన పిచ్చి వేషాలు వెయ్యకు” అన్నాడు ఆ పోలీసు. మళ్లీ అతణ్ని చూసిందామె. ఆమె చూపులు కూడా యిప్పుడు ప్రశాంతంగా వున్నాయి. అతడు పోయి, పోలీసు వ్యానులో ఎక్కి కూచున్నాడు. ముందరి కారు వేగాన్నందుకోవటంతో ఆమె కూడా వేగంగా నడుపుతూ వెనకాల వెళ్లింది.

“మనం ఎక్కడికి పోతున్నాం అమ్మా?” అని అడిగింది జైదా.

“నువ్వు నోర్మూసుకుని బుద్ధిగా వుండు” అన్నది తల్లి కారు నడుపుతూ.

మట్టిరంగున్న పల్లెప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్లింది కారు. అంతకుముందు తాము చూసిన దృశ్యాలు మళ్లీ కనపడ్డాయి వాళ్లకు. చిక్కని నల్లని ఆకాశం నాట్యం చేస్తూ ఊగింది.సూర్యుని పసుపుపచ్చ కాంతిలో పొదల్తో నిండిన ఇసుకప్రదేశం వాళ్ల ముందు పరుచుకుని వుంది.

“కొంచెం కాఫీ దొరికితే బాగుండేది” అన్నది జైదా.

 

***

 

 

 

మిస్టా కోరిఫర్

అడెలేడ్ కేస్లీ హేఫోర్డ్ పరిచయం

    hayford_adelaide

అడెలేడ్ కేస్లీ హేఫోర్డ్ 1868లో సియెరా లియోన్ లోని ఫ్రీటౌన్ లో జన్మించింది. ఈమె వొక న్యాయవాది,‘సాంస్కృతిక జాతీయత’ కోసం పని చేసిన కార్యకర్త మాత్రమే కాక విద్యావేత్త, కథా రచయిత, స్త్రీవాది కూడా. తన దేశం ఆంగ్లేయుల పాలనలో వున్నప్పుడు, పాఠశాల విద్యార్థినుల్లో సంస్కృతిపరమైన, జాతిపరమైన స్వాభిమానాన్ని పెంపొందించే లక్ష్యంతో1923 లో ఒక స్కూలును నెలకొల్పింది. 1925 లో వేల్స్ రాకుమారుని సన్మానసభకు ఆఫ్రికన్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై సంచలనాన్ని సృష్టించింది. పదిహేడేళ్ల వయసులో జర్మనీకి పోయి, అక్కడ సంగీతాన్ని అభ్యసించింది. కొన్నేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించి, అక్కడి ప్రజల్లో ఆఫ్రికా గురించిన తప్పుడు అభిప్రాయాలను రూపుమాపేలా ఉపన్యాసాలిచ్చింది.

     మిస్టా కోరిఫర్ అనే యీ కథ లాంగ్స్టన్ హ్యూస్ సంకలించిన African Treasury: Articles, Essays, Stories, Poems (1960) లో చోటు చేసుకుంది.

     ఈమెను 1935లో King’s Silver Jubilee Medal, 1950లో MBE (Most Excellent Order of the British Empire) వరించాయి.

~

 

శవాలనుంచే పెట్టెల్ని తయారు చేసే ఆ వర్క్ షాపులోంచి ఒక్క మాట కూడా వినపడ లేదు. అంటే మనుషుల శబ్దం రాలేదని అనటం. సియెరా లియోన్ దేశానికి చెందిన సంపూర్ణ పౌరుడైన మిస్టా కోరిఫర్ కు మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది. అతని దగ్గర శిక్షణ పొందుతున్నవాళ్లు ఆ విషయాన్ని గ్రహించి, మొదట కోరిఫర్ మాట్లాడే దాక ఏమీ మాట్లాడే ధైర్యం చేయలేక పోయారు. తర్వాత వాళ్లు గుసగుసగా మాట్లాడుకున్నారు. మిస్టా కోరిఫర్ మౌనంగా వున్నది అతనికి తన నాలుకనెట్లా ఉపయోగించాలో తెలియక కాదు. అతడు సుత్తితో దెబ్బ వేసినప్పుడల్లా అతని నాలుక ముందుకూ వెనుకకూ కదుల్తూనే వుంది. ఫ్రీ టౌన్ నగరంలో మధ్యన వున్న అతని షాపు నిజానికి సొంత యింట్లోని ఒక భాగం. తన స్నేహితునితో ఒకసారి అతడు చెప్పినదాని ప్రకారం, తన సొంత యింట్లో అతనిది మౌనపాత్ర. అవసరం కొద్దీ అతడట్లా వుండాల్సి వస్తోంది. ఎప్పుడూ లొడలొడ మాట్లాడే అతని భార్య అతణ్ని మాటల్లో ఓడించగలదు.
“ఆడవాళ్లకు వడ్రంగి పని నేర్పటంలో ఎట్లా ప్రయోజనం లేదో వారితో మాట్లాడి కూడా అలానే ఉపయోగం లేదు. ఆడది యెప్పుడూ మేకు తల మీద సుత్తితో సరిగ్గా కొట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ఒక్క మేకు మీద తప్ప మిగతా అన్నింటిమీదా సుత్తితో కొడుతుంది. ఆమె మాట్లాడితే కూడా అంతే” అంటాడు కోరిఫర్.
కాబట్టి పక్కన తన భార్య వున్నప్పుడు కోరిఫర్ నాలుక గడియారపు పెండ్యులమ్ లా నిరంతరంగా ఊగుతుందే తప్ప, అతని ‘నోరు’ మాత్రం దాదాపు మూసుకుని వుంటుంది. కాని యింటి దగ్గర అతడు పాటించే సంయమనం చర్చిలో అధికారిక మతబోధకుని హోదాలో వున్నప్పుడు మాత్రం గాలికి ఎగిరిపోతుంది. ఎందుకంటే మిస్టా కోరిఫర్ ఆ చర్చికి ఒక మూలస్తంభం వంటి వాడు. అతడు ప్రార్థనను జరిపించటం, ఆదివారాలప్పుడు జరిగే ప్రసంగ కార్యక్రమాలను పర్యవేక్షించటం, వేదిక మీద గురుపీఠంలో ఆసీనుడై వుండటం – మొదలైన అన్ని సందర్భాల్లోనూ సమానంగా మంచి సమర్థతను కనబరుస్తాడు.
అతని కంఠస్వరం అద్భుతమైన హెచ్చుతగ్గులతో విశిష్టంగా, ప్రత్యేకంగా వుంటుంది. భక్తిపాటల బాణీల పట్ల అతడు పట్టుదలగా వుంటాడు. ఫలితంగా ఆ పాటలు దాదాపు ప్రతిసారీ ఒంటరి గాయకుని పాటలుగా మిగులుతాయి. అతడు మంద్రస్వరంలో పాడినప్పుడు ఎంత దిగువకు వెళ్తాడంటే, ప్రార్థన కోసం వచ్చినవాళ్లు అతణ్ని అందుకోలేక కొంచెం హెచ్చు స్థాయిలో కొట్టు మిట్టాడుతారు. అతడు హెచ్చు స్థాయిలో పాడటం ప్రారంభించినప్పుడు ఎంత పైకి పోతాడంటే, పిల్లలు గుడ్లప్పగించి నోరు తెరుస్తారు. పెద్దవాళ్లేమో ఆశ్చర్యానందాల్లో మునిగిపోతారు. అతని ప్రార్థనలను గమనిస్తే అతడు ఉరుముతున్నట్టుగా, ఎంత బిగ్గరగా పాడుతాడంటే, వాటిని వినే చిన్న పిల్లలకు తొందరగానే శోష వచ్చినట్టై భయంతో ఏడుస్తారు.
కాని గురుపీఠం మీద కూర్చున్నప్పుడు అతనికి చాలా నిమ్మళంగా వుంటుంది. అతని సేవలు గ్లౌసెస్టర్, లీసెస్టర్ అనే రెండు జిల్లాల్లోని గ్రామాలకే పరిమితమనేది నిజం. ఈ విషయం అతనికి ఎంత మాత్రం సంతృప్తినివ్వలేదు. అయినా గ్రామ చర్చి లోని సమావేశాలు ఏమీ లేనిదానికన్న నయం.
అతనికి ఇష్టమైన పురాణ పాత్రలు జోనా, నోవా. ఆ రెండు పాత్రల మధ్య వున్న సామ్యాన్ని అతనెప్పుడూ చెప్తూ తన ప్రసంగాన్ని సాధారణంగా యిలా ముగిస్తాడు: “నా ప్రియమైన సోదరులారా! ఆ రెండు పాత్రలూ చాలా వరకు ఒకే విధముగా నుండును. వారిద్దరూ పాపభూయిష్ఠమైన, అనైతికత నిండిన తరాలలో బ్రతికిరి. ఒకరు పెద్ద పడవలోనికి పోగా మరొకరు వేల్ అనే పెద్ద చేప నోటిలోనికి పోవటం మీకు తెలిసినదే. వారిద్దరూ విజృంభిస్తున్న అలల నుండి రక్షణ కోరిరి. కావున ఓ నా ప్రియమైన సోదరులారా! మనం పడవలోనికి పోయినా ఫరవా లేదు, వేల్ చేప నోటిలోనికి పోయినా ఫరవా లేదు. దుష్టత్వముల నుండి, దెయ్యముల నుండి మనను మనం రక్షించుకొనటానికి ఏదో వొక సురక్షిత ప్రదేశం, ఒక ఆశ్రయం, ఒక దాక్కునే చోటు కావాలి మనకు”
కాని ప్రార్థన కోసం వచ్చినవాళ్లకు మనసు పూర్తిగా నిండదు.
మిస్టర్ కోరిఫర్ ఎప్పుడూ నల్లని దుస్తుల్నే తొడుక్కుంటాడు. అతడు యూరోపియన్ల ప్రతి వ్యవహారం సవ్యంగా వుండటమే కాక ఆఫ్రికాకు సరిపోయే విధంగా వుంటుందని నమ్మే సియెరా లియోన్ పౌరుల్లో ఒకడు. ఆంగ్లేయ మతబోధకులు సాధారణంగా ముదురు రంగు బట్టల్ని తొడుక్కుంటారని ఎక్కడో చదివిన కోరిఫర్, తను కూడా అటువంటి దుస్తుల్నే వేసుకోవటం ప్రారంభించాడు.
అతడు తన యిల్లును కూడా యూరపులోని ఇళ్లలాగా కట్టుకున్నాడు. తాను లండన్లో కొంతకాలం వున్నప్పుడు అక్కడ యిళ్లను ఎట్లా కడతారో, ఎట్లాంటి ఫర్నిచర్ను వాడుతారో గమనించాడు. ఆ సూత్రాలను పాటిస్తూ తనే స్వయంగా ఇల్లు కట్టుకున్నాడు. గదుల మధ్య అంత విశాలం కాని స్థలాలతో, సన్నని మెట్ల దారులతో, చిన్నచిన్న గదులతో, మందమైన కార్పెట్లతో వున్న ఆ యింటి నిండా సంచులు వుంటాయి. ఆ యిల్లు చాలా ఇరుకుగా, గాలి ఆడనట్టుగా, అపరిశుభ్రంగా, అసౌకర్యంగా వుంటుంది కనుక అతని భార్య ఎప్పుడూ సణగటంలో ఆశ్చర్యం లేదు.
African Kadhalu_title
ముందే చెప్పినట్టు, మిస్టర్ కోరిఫర్ నల్లబట్టలే తొడుక్కుంటాడు. ఎర్రదుస్తులు సవ్యంగా, నప్పేట్టుగా, చాలా చవకగా, ఎంతో జాతీయతను ప్రతిబింబించే విధంగా ఉంటాయని అతనికి ఒక్క క్షణం సేపు కూడా అనిపించదు. లేదు, నలుపే బాగుంటుందని అంటాడతడు. నీలం రంగు కలిసిన నలుపు కూడా అతనికి ఇష్టమే. కాని దానికి ఖర్చు ఎక్కువౌతుందని, మెరుపు లేని నల్లని దుస్తులే వేసుకుంటాడు.
మిస్టర్ కోరిఫర్ చాలా ఒడుపుతో, హాయిగా మాట్లాడగల మరొక విషయం, ఇంతకు ముందు చెప్పుకోనిది వుంది. అది తన కొడుకైన టోమాస్ గురించి యెన్నో ఆశలు పెట్టుకోవటం. టోమాస్ ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నాడు కనుక అతణ్ని ఒక ఉన్నతాధికారిగా చూడాలనే ఆశను తన మనసులో దాచుకున్నాడు కోరిఫర్. మరీ ఉన్నత స్థానంలో అని కాదు గాని, ఓ మోస్తరుగానైనా కొడుకు పై స్థాయికి చేరాలనుకున్నాడు. అది చాలా పెద్ద గౌరవమని భావిస్తాడు కోరిఫర్. కాని దురదృష్టం కొద్దీ టోమాస్ ఆ రకంగా ఆలోచించినట్టనిపించదు. కాని తన తండ్రి ముందర అతడు పూర్తి తటస్థమైన అభిప్రాయాన్నే వెలిబుచ్చుతాడు. టోమాస్ తొడుక్కున్న బట్టల్ని చూస్తే అతడు కొంచెం ఆడదానిలా కనిపిస్తాడు గాని, అతని గొంతులో పురుషత్వం స్పష్టంగా కనిపిస్తుంది. తటస్థంగా వుండటం అతనెన్నుకున్నది కాదు. బలమైన పితృస్వామ్య భావనలున్న కోరిఫర్ కుటుంబంలో ఎవ్వరికీ దేన్నీ స్వంతంగా ఎన్నుకునే స్వాతంత్ర్యం ఉండదు. అదీ అసలు కారణం.
మొదట్నుండి చివరిదాకా టోమాస్ జీవితం ముందే నిర్దేశింపబడి వుంది. అతని చర్మం నల్లగా వున్నా, అతనిది అచ్చమైన ఆఫ్రికన్ స్వభావమైనా, అతడు ఆంగ్లేయునిగా పెరగాలని నిశ్చయింప బడింది. రూపంలో కూడా అతడు ఆంగ్లేయునిలా వుండాలని తండ్రి కోరిక.
తత్ఫలితంగా పోస్టు ద్వారా పెద్దపెద్ద పార్శిళ్లు వచ్చేవి. వాటిని విప్పిచూస్తే లోపల చారలున్న, గళ్లున్న , అద్భుతమైన స్వెటర్లు, జెర్కిన్లు, కోట్లు ఆకుపచ్చ రంగువి, నీలం రంగువి ఉండేవి. వాటిమీద ఇంద్రధనుస్సుల్లా మెరిసే ఆకర్షణీయమైన డిజైన్లు, ఇత్తడి గుండీలు కనిపించేవి. చాలా నాజూకైన బూట్లూ, మేజోళ్లూ కూడా ఆ పార్శిళ్లలో వచ్చేవి. అవన్నీ ఇంగ్లండులోని ఫ్యాషన్ కు తగినట్టుగా ఉండేవి.
టోమాస్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు కనుక మొదటిసారి బడికి వెళ్లే చిన్నపిల్లవాడి కోసం కొన్నట్టుగా తన దుస్తుల్ని వేరే వాళ్లు ఎంపిక చేయటాన్ని గట్టిగా తిరస్కరించాడు. ఒకసారైతే తన తండ్రి కొన్న గుడ్డలన్నింటినీ మంటలోకి విసిరేసేవాడే కాని, అతని చెల్లి సరైన సమయానికి అతణ్ని వారించింది. తనకన్న ఎనిమిది సంవత్సరాలు చిన్నదైన ఆ పిల్ల పేరు కెరెన్ హాపుచ్. గిడచబారినట్టు చిన్న ఆకారంలో వుండే ఆమె, ఎంత మాత్రం ఆకర్షణీయంగా వుండదు కాని, ఆమె హృదయం చాలా విశాలమైనది. అదెంత పెద్ద తప్పు! మనుషుల హృదయాలు ఎప్పుడూ వారి శరీరపు సైజుకు తగ్గట్టుగానే వుండాలి. లేకపోతే పరిమాణాలన్నీ సమతౌల్యం చెడి, మొత్తం శరీరరూపం అస్తవ్యస్తమౌతుంది. టోమాస్ ఆలోచనలు ఇట్లా సాగుతాయి.
కెరెన్ యెవరూ ఆరాధించని మామూలు పిల్ల. దాంతో ఆమె ఇతరులను అమితంగా ఆరాధించే కళను అర్థం చేసుకుని దాన్ని పాటించింది. టోమాస్ ను ఆమె ఆరాధిస్తుంది. అతనికోసం ఆమె తన వంతు ధనాన్ని పుష్కలంగా వెచ్చించింది. టోమాస్ ను బాధించే ఏ విషయమైనా ఆమెకు మానసిక హింసను కలుగజేస్తుంది.
మంటల్లోకి విసిరేయడానికి గుట్టలా పేర్చివున్న బట్టల్ని చూసిన కెరెన్ అతణ్ని ఎలుగు బంటిలా గట్టిగా పట్టుకుని, “టోమాస్, వాటిని కాల్చొద్దు. ముసలోడు నిన్ను కొరడాతో బాదుతాడు. నేను మగవాణ్నై వుంటే అవి నాకైనా పనికొచ్చేవి” అన్నది.
అది విన్న టోమాస్ మొదటిసారిగా ఆ విషయమై ఆలోచనలో పడ్డాడు. కెరెన్ హాపుచ్ కు తన జీవితంలో యెప్పుడూ ఇంగ్లీషువాళ్ల దుస్తుల పార్శిళ్లు రాలేదు. అందుకే వాటిని అంతగా ఇష్టపడుతున్నదామె అనుకున్నాడు.
మొదట టోమాస్ కేవలం నవ్వాడు. అది సాహసంతో కూడిన మొండితనపు నవ్వు. తర్వాత ఏమైనా కానీ అనే నిర్లక్ష్యమున్న నవ్వు. కాని చెల్లి అన్న వాక్యాల్ని విన్నతర్వాత అతడు తన పాత కోపాన్నంతా మరచిపోయి, ఒక అన్న నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుని, తదనుగుణంగా ఆ పనిని మానుకున్నాడు.
కొన్ని ఆదివారాల తర్వాత టోమాస్ కోరిఫర్ తన చెల్లి ఐన కెరెన్ హాపుచ్ తో కలిసి వెస్లీ చాపెల్ చర్చి అరుగు మీదికి నడిచాడు. లివర్ పూల్ నుండి తెప్పించిన అతని దుస్తుల వైభవం ముందు కుచ్చులతో, పేటంచుతో ఎర్ర రంగులో వున్న కెరెన్ డ్రెస్సు ఆమె రూపపు ఆకర్షణ లేమిని మరింత ఎక్కువ చేసింది. కాని ఆమె ముఖం మీద మెరిసిన నవ్వు ఆ వేషాన్ని మరచిపోయేట్టు చేసి, చూపరులకు హాయిని గొలిపింది. జోనా బాధల వర్ణనవల్ల ఆవరిచబోయే దిగులును ముందే పరిహరించే విధంగా ఆమె నవ్వు చర్చినంతా వెలిగించినట్టనిపించింది.
దురదృష్టం కొద్దీ టోమాస్ కు ప్రభుత్వ ఉద్యోగం పట్ల చాలా చులకన భావం వుంది. మితి మీరిన ఆత్మవిశ్వాసంతో అతడు ఆ వుద్యోగాన్ని వదులుకుంటానని మొదట్లోనే తన చెల్లితో అన్నాడు. ఆమె ఆ వుద్యోగంలోని గౌరవాన్నీ, పెన్షను వంటి లాభాల్నీ, ఉద్యోగం లేకపోతే కుటుంబపెద్ద కనబరిచే కోపం తాలూకు శిక్షనూ, అపజయాన్నీ వివరించింది.
“ఉద్యోగాన్ని ఎందుకు వదులుతావు టోమాస్?” అని అడిగింది నిరాశతో.
“ఎందుకంటే అక్కడ నాకు సరైన సెలవు దొరకదు. నేను నాలుగు సంవత్సరాలనుండి పని చేస్తున్నా ఒక వారం రోజుల సెలవు కూడా దొరకలేదు నాకు. పైగా ఈ పాశ్చాత్య దేశాల బాసులు వస్తారు, పోతారు. కొత్తగా వచ్చినవాళ్లు పాతవాళ్లు చేసిందాన్ని నాశనం చేస్తారు. మళ్లీ కొత్తగా వచ్చినవాడు మరింతగా పాడు చేస్తాడు. వాళ్లు కేవలం ఒక యేడాదిన్నర మాత్రమే పనిచేసి, నాలుగు నెలల సెలవు మీద పోతారు. భారీ జీతాలను తీసుకుంటూ ప్రభుత్వ ఖర్చులమీద విలాసవంతమైన ప్రయాణాలు చేస్తారు. ఇక నావంటి ఆఫ్రికన్లేమో పాపం మంచి సెలవే లేకుండా సంవత్సరాల పాటు పని చేస్తారు” అన్నాడు టోమాస్ ఆవేశంగా. “కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కెరెన్. నేను రాజీనామా చేయను. వాళ్లంతట వాళ్లే నన్ను ఉద్యోగంలోంచి తొలగించే విధంగా ప్రవర్తిస్తాను. అప్పుడు ముసలోడికి నన్ను అంతగా తిట్టే అవకాశం ఉండదు” అన్నాడు మళ్లీ.
ముందు అనుకున్నట్టుగా టోమాస్ ఎనిమిది గంటలకు బదులు తొమ్మిది గంటలప్పుడు సిగరెట్ తాగుతూ మెల్లగా ఆఫీసులోకి ప్రవేశించాడు. అతని పై అధికారి అయిన మిస్టర్ బక్ మాస్టర్ కళ్లు పెద్దవి చేసి, గట్టిగా మందలించాడు. సాధారణంగా అతడు మౌనాన్ని పాటించడమే కాక, కళ్లు మూసుకుని వుంటాడు. టోమాస్ కు ఆహం బాగా దెబ్బ తిన్నది. నిజానికి తెల్లవాడైన మిస్టర్ బక్ మాస్టర్ పట్ల టోమాస్ కు తన మనసు లోతుల్లో రహస్యమైన ఆరాధనభావం ఉంది. అతడి మనసును గాయపరుస్తానేమోననే భయం వల్లనే ఇంతకాలం అతడు ఆ వుద్యోగానికి అతుక్కుని వున్నాడు.
కొద్ది రోజుల్లోనే బక్ మాస్టర్ సెలవు మీద వెళ్లిపోతాడని ఈ మధ్యనే విన్నాడు టోమాస్. కనుక తనకు చాలా అసంతృప్తిని కలిగించిన ఆ వుద్యోగాన్ని ఉన్నపళంగా వదిలెయ్యాలని నిశ్చయించుకున్నాడు. టోమాస్ చిన్నచిన్న వార్తాపత్రికల్ని విరివిగా చదువుతాడు. ఇంగ్లండులోని షాపుల్లో పని చేసే అతి చిన్న ఉద్యోగులకు కూడా సంవత్సరానికి పదిహేను రోజుల సెలవు దొరుకుతుందని ఆ పత్రికల్లో చదివాడతడు. నేను ఆఫ్రికాలో పనిచేస్తున్న ఆఫ్రికన్ ను కనుక సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదనటం విడ్డూరం – అనుకున్నాడతడు. సెలవు కోసం అతడు పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ చెత్తబుట్టలో పడేశారు పై అధికారులు. తర్వాత ఆఫీసులో పని తక్కువగా ఉన్నప్పుడు సెలవును మంజూరు చేస్తారట.
“కోరిఫర్! నా ఆఫీసురూం లోకి వచ్చి కనపడు” అన్నాడు మిస్టర్ బక్ మాస్టర్ గంభీరంగా. ఉద్యోగం ఊడటానికి ఇది ప్రారంభం అనుకున్నాడు టోమాస్.
“మన ఆఫీసులోని పనివేళలు ఉదయం ఎనిమిది గంటలనుండి తొమ్మిది గంటల వరకు అని నీకు తెలుసనుకుంటా” అన్నాడు మెల్లగా.
“స…స… సార్, తెలుసు” అన్నాడు టోమాస్. గుండె దడదడ కొట్టుకుంటుంటే అతని మూతి వంకర తిరిగింది.
“ఆఫీసులో పొగ తాగటం పట్ల నిషేధముందని కూడా నీకు తెలుసనుకుంటాను”
“తె…తె… తెలుసు సర్” తడబాటు వల్ల నత్తిగా మాట్లాడాడు.
“నిన్నెప్పుడూ నేనొక మంచి క్లర్కుగానే భావించాను. చాలా వినయంగా వుంటావు. సమయ నిబంధనల్ని చక్కగా పాటిస్తావు. నిజాయితీగా ఉంటావు. పనిలో కచ్చితత్వాన్ని పాటిస్తావు. కాని రెండు మూడు వారాలనుండి నీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. నా అంచనా ప్రకారం నీ ప్రవర్తన బాగా లేదు”
మిస్టర్ బక్ మాస్టర్ లేచి నిలబడి మాట్లాడాడు. జేబులోంచి తాళంచెవుల గుత్తిని బయటకు తీసి డ్రాయర్ను తెరిచి, అందులోంచి కొన్ని కాయితాల్ని లాగాడు. “ఇదేనా నువ్వు చేసిన ఆఫీసు పని?” అని అడిగాడు.
టోమాస్ తను ఘోరంగా టైపు చేసిన, సిరామరకల్తో నిండిపోయిన కాయితాల్ని చూసి, సిగ్గు పడుతున్నవాడిలా “అవును… స్సర్” అన్నాడు తడబడుతూ.
“అయితే నువ్వింత ఘోరంగా పని చేయటానికి కారణమేంటి?”
టోమాస్ ఒకటి రెండు క్షణాలసేపు మౌనంగా వున్నాడు. గంభీరంగా వున్న బాసు ముఖంలోకి నేరుగా చూడటానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. అట్లా చూస్తుంటే బాసు ముఖంలోని గాంభీర్యం కరిగిపోయి, పని పట్ల అతనికున్న నిజమైన పట్టింపు కనిపించింది.
“ప్లీజ్ సర్. అసలు విషయమంతా చెప్పమంటారా?”
అరగంట తర్వాత ఓడిపోయిన, పశ్చాత్తాపపడుతున్న, చాలా మౌనంగా వున్న టోమాస్ కోరిఫర్ పక్క తలుపు గుండా మెల్లగా బయటికి వచ్చాడు. తర్వాత ఆ పశ్చిమాఫ్రికా యువకుని సహనశక్తిని గౌరవిస్తూ మిస్టర్ బక్ మాస్టర్ కూడా వచ్చాడు బయటికి.
ఆరు వారాల తర్వాత ఒక యూరోపియన్ తన వర్క్ షాపుకు వచ్చి, తలుపు దగ్గర నిల్చున్నప్పుడు మిస్టర్ కోరిఫర్ తన నాలుకను బిజీగా కదలాడిస్తున్నవాడల్లా పనిని ఆపి, ఆ వచ్చినతని వైపు చూశాడు.
మిస్టా కోరిఫర్ కుర్చీని లాగుతూనే మాట్లాట్టం మొదలెట్టాడు. ఆ కుర్చీ మీది దుమ్మును దులపకముందే “నమస్కారం సార్” అన్నాడు. తర్వాత కుర్చీని వేస్తూ , “దేవుని దయవల్ల మీకు శవాల పెట్టె అవసరం లేదనుకుంటాను” అన్నాడు. నిజానికి అది మహా పర్వతమంత పెద్ద అబద్ధం. ఎందుకంటే ఒక యూరోపియన్ కోసం శవాల పెట్టెను తయారు చేయాల్సిన అవసరం రావటంకన్న ఎక్కువ ఆనందకరమైనదేదీ లేదతనికి. వాళ్లైతే తప్పక పుష్కలంగా డబ్బు యిస్తారు. అది కూడా ఎటువంటి కోత, ఎలాంటి ఆలస్యం లేకుండా. తన దేశస్థులు అట్లా కాదు. వాళ్లు బేరమాడుతారు, సంకోచిస్తారు, డబ్బుకు బదులుగా వస్తువులిస్తారు. తమకున్న ఆర్థిక యిబ్బందుల్ని ఏకరువు పెడతారు. అంతేకాక, కొన్ని వారాల పాటు తిప్పించి సగం డబ్బే యిచ్చి, దానికే సంతోషపడాలంటారు.
మిస్టర్ బక్ మాస్టర్ కుర్చీ మీద కూర్చుని “కృతజ్ఞతలు. నాకిప్పుడే చావాలని లేదు. ఈ దుకాణం ముందు నుండి పోతున్నాను కనుక ఇక్కడ ఆగి, నీ కొడుకు గురించి ఒక మాట చెప్పి పోవాలనుకుంటున్నాను” అన్నాడు.
మిస్టర్ కోరిఫర్ ఏదో శుభవార్త వుందనుకున్నాడు. విజయగర్వంతో, సంతోషంతో అతని శరీరం పులకరించింది. బహుశా తన కొడుకును వాళ్లు పెద్ద రాష్ట్రాధికారిగా నియమిస్తున్నారేమో అనుకున్నాడు. కోరిఫర్ కుటుంబానికి అదెంత గొప్ప గౌరవం! దాంతో సమాజంలో తమ స్థాయి ఎంతగా పెరుగుతుంది? భగవంతుడెంత మంచివాడు? అనుకున్నాడతడు.
“నీ కొడుకు నా ఆఫీసులో పని చేస్తున్నాడని నీకు తెలుసు కదా?”
“ఔను సార్. వాడెప్పుడూ మీ గురించే చెప్తుంటాడు”
“నేను సెలవు మీద స్వదేశానికి వెళ్తున్నాను. మళ్లీ సియెరా లియోన్ కు రాకపోవచ్చు కనుక, అతని పని గురించి ఒక సర్టిఫికెట్ యివ్వటానికి నేనెంతగా సంతోషిస్తానో చెప్పలేను”
“ఔనా సార్” అన్నాడు మిస్టర్ కోరిఫర్ అనుమానంగా.
“అతని ముఖం వాలిపోయింది. ఒకవేళ శుభవార్తకు విరుద్ధమైనదైతే ఎంత అప్రతిష్ఠ? అనుకున్నాడు.
“నీ కొడుకు ఒక నెమ్మదస్థుడనీ, పట్టుదల గలవాడనీ, నమ్మకస్థుడనీ అంటూ ఒక సర్టిఫికెట్ ఇవ్వగలను నేను. అట్లాంటిది కావాలనుకుంటే మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు”
అంతేనా? ఎంత ఆశాభంగం! అయినా అట్లాంటిదైనా తీసుకోతగిందే. మిస్టర్ బక్ మాస్టర్ ఒక ఆంగ్లేయుడు కనుక అతడిచ్చే సర్టిఫికెట్ కు చాలా విలువ ఉంటుంది అనుకుని, కోరిఫర్ తన రెండు చేతుల్తో కళ్లు నులుముకుని, “సార్, కృతజ్ఞుణ్ని, చాలా కృతజ్ఞుణ్ని. ఎక్కువ సమయం లేదు కనుక అదేదో యిప్పుడే రాసిస్తారా?” అన్నాడు.
“తప్పకుండా. ఒక కాయితం ఇస్తే ఇప్పుడే రాసిస్తాను” అన్నాడు బక్ మాస్టర్.
టోమాస్ సాయంత్రం ఆఫీసునుండి రాకముందే మిస్టా కోరిఫర్ దానికి ఫ్రేము కట్టి, పురుగులు తిన్న మఖ్మల్ సోఫాల పైన గోడకు వేలాడదీశాడు.
మరుసటి సోమవారంనాటి ఉదయాన టోమాస్, తన తండ్రిగారి వర్క్ షాపులోకి దభీమని దూకటంతో అక్కడున్న బెంచీ సమతుల్యతతో పాటు, దీక్షతో పని చేసుకుంటున్న మిగతా పనివాళ్ల సమతుల్యత కూడా చెడిపోయింది.
“సార్, తమరు చాలా ఆలస్యంగా వచ్చారు. ఇవ్వాళ మీరు ఆఫీసుకెందుకు పోలేదు?” అని అడిగాడు మిస్టా కోరిఫర్.
“ఎందుకంటే నాకు రెండు పూర్తి నెలల సెలవు దొరికింది నాన్నా . కొంచెం ఆలోచించండి మీరు. రెండు పూర్తి నెలల సెలవు. హాయిగా గడపటమే తప్ప మరే పనీ చెయ్యాల్సిన అవసరం లేదు”
“టోమాస్, శవాల పెట్టెల్ని తయారు చేయటం నేర్చుకోవాలి నువ్వు. ఇదే మంచి అవకాశం నీకు”
‘అమ్మో నా బతుకు చంక నాకిపోతుంది’ అనుకున్నాడు టోమాస్ మనసులోనే. పైకి మాత్రం “ధన్యవాదాలు నాన్నా. ఎట్లా ప్రేమించాలో నేర్చుకోబోతున్నాను నేను. దాంతర్వాత ఒక మంచి మట్టిగోడల గుడిసెను ఎలా కట్టాలో నేర్చుకుంటాను”
“అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఎవరు?” అని గర్జించాడు తండ్రి , తర్వాత అనవలసిన వాక్యాన్ని పూర్తిగా మరచిపోయి.
టోమాస్ ముఖం మీద పెద్ద నవ్వు వెలిగింది. “అయ్యా, ఆమె చాలా మంచి అమ్మాయి. ఎంతో మౌనంగా, మెత్తని మనసుతో, ప్రసన్న వదనంతో వుంటుంది. ఆమె ఎక్కువగా మాట్లాడదు”
“ఓహో, అలాగా? అంతేనా?”
“కాదు కాదు. ఆమెకు డ్రెస్సులు కుట్టటం, ఇల్లును పరిశుభ్రంగా వుంచటం, ఇల్లును చక్కగా నడపటం వచ్చు. ఆమెకు చాలా తెలివి ఉంది. ఆమె ఒక మంచి తల్లి కాగలదు”
“సరే. అంతకన్న ఎక్కువ చెప్పేది ఏమీ లేదా?”
“ఆమె చాలా సంవత్సరాల పాటు బడికి వెళ్లింది. పుస్తకాలు బాగా చదువుతుంది. బాగా రాస్తుంది కూడా. ఓహ్, ఎంత మంచి ఉత్తరాలవి?” అన్నాడు టోమాస్ షర్టుజేబు మీద ఆప్యాయంగా కొట్టుకుంటూ.
“అలాగా? ఆమె వంట కూడా బాగా చేస్తుందనుకుంటాను”
“ఆ విషయం నాకు తెలియదు. బహుశా తమరు చెప్పింది నిజం కాదేమో. అయినా దాంతో పెద్ద యిబ్బందేమీ వుండదు”
“ఏంటీ? వంట చేయటం రాని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటున్నావా నువ్వు?” అని గర్జించాడు ముసలాయన.
“నేనామెను ప్రేమిస్తున్నాను కనుక ఆమెనే పెళ్లి చేసుకుంటానయ్యా”
“అది సరే కాని, మన ఆఫ్రికన్లకు హృదయమన్నా కడుపన్నా ఒకటే. మనదేశంలో ఏ మగవాడూ వంట రాని అమ్మాయిని పెళ్లి చేసుకోడు. అది అన్నిటికన్న ముఖ్యమైన విషయం. నీ సొంత తల్లి వంట చేస్తుంది కదా”
‘అందుకే ఆమెకు ఎప్పుడూ దుర్భరమైన చాకిరీ చేయటం తప్ప వేరే ఏ ఆనందమూ వుండదు’ అనుకున్నాడు టోమాస్ మనసులోనే. తన మాటల్ని ఇలా కొనసాగిస్తుంటే అతని ముఖం గంభీరమైపోయింది: “మన దేశంలోని విధానం సరైనది కాదు నాన్నా. తన భర్త కోసం ఒక యిల్లాలు మంచి భోజనాన్ని తయారు చేస్తే అతడు భార్యాపిల్లల కోసం ఏమీ మిగల్చకుండా అంతా మింగేయటం నాకు నచ్చదు నాన్నా . ఉహుఁ , అట్లాంటిది వద్దు. ఇక పోతే , నేనొక ఆంగ్లేయునిగా తయారవ్వాలని ఎప్పుడూ అంటుంటావు నువ్వు. అందుకే ఎప్పుడూ నీతో మంచి ఇంగ్లీషు మాట్లాట్టానికి ప్రయత్నిస్తాను నేను”
“అది సరే. అది చాలా మంచి విషయం. కాని నువ్వొక ఇంగ్లీషువాడిలా ‘కనిపించాలి’. వాళ్లను పూర్తిగా అనుకరించాలని అనటం లేదు నేను”
“కాని చచ్చేదాకా ప్రయత్నించినా నేనొక ఆంగ్లేయునిలా కనిపించలేను. అలా కనిపించాలని నాకు వుండదు కూడా. కాని ఇంగ్లీషువాళ్ల కొన్ని ఆచారాలు నాకు నిజంగా బాగా నచ్చుతాయి. వాళ్లు భార్యలను ఎట్లా చూస్తారో నాకు నచ్చుతుంది. వాళ్ల కుటుంబ జీవన రీతి నాకు నచ్చుతుంది. తల్లీ, తండ్రీ , పిల్లలూ, కుటుంబమంతా కలిసి భోజనం చేయటం నాకిష్టం”
“ఓహో అలాగా?” వెటకారంగా తిప్పికొడుతున్నట్టుగా అన్నాడు తండ్రి. మళ్లీ “మరి వంటెవరు చేస్తారు? నీ నాలుగు పౌండ్ల జీతంతో ఒక మంచి వంటమనిషిని పెట్టుకోవచ్చు నుకుంటున్నావా?” అన్నాడు.
“కాదు. నేనట్లా అనటం లేదు నాన్నా . పెళ్లికన్న ముందరే అక్కాస్టసువా వంట నేర్చుకుంటుందని నా నమ్మకం. కాని నువ్వేం అర్థం చేసుకోవాలంటే, ఆమెకు వంట వచ్చినా రాకున్నా అదేమంత పెద్ద విషయం కాదు కనుక నేనామెను పెళ్లి చేసుకోబోతున్నాను”
“అయితే చాలా మంచిది. కాని నువ్వొక మట్టిగుడిసెకు బదులు వెర్రిగృహానికి సొంతదారు కాబోతున్నావు”
“ధన్యవాదాలు నాన్నా. కాని నేనేమిటో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి మట్టిగుడిసే మాకు బాగా సరిపోతుంది”
“మట్టిగుడిసె సరిపోతుందా?” అని భయంగా అన్నాడు మిస్టర్ కోరిఫర్. తర్వాత “నువ్వొక మంచి విదేశీ గృహం లాంటి యింట్లో వున్నావు. దాంట్లో మంచి మెట్లదారి, అందమైన పిట్టగోడ, దళసరి తివాచీ, ముచ్చటగొలిపే ఫర్నిచర్ వున్నాయి. నువ్వు మట్టిగుడిసెలో వుంటావా? కృతఘ్నుడా. సిగ్గు పడాలి” అన్నాడు.
“ప్రియమైన నాన్నా. నువ్వు సిగ్గుపడేలా చేయను నేను. ఆ మట్టిగుడిసె చాలా విశాలంగా, శుభ్రంగా వుంటుంది. అదొక సంతోషం నిండిన చిన్న యిల్లులా ఉంటుంది. కేవలం ఇద్దరికి సరిపోయేటంత. అంతకన్న యేం కావాలి? గోడలమీద మంచి ఆకుపచ్చని పెయింటును వేయిస్తాను. కెరెన్ చదివే బడిలో హెడ్ మాస్టరుగారి గదిలో లాగా”
“మరి నీ భార్య గది ఎలా వుండబోతుంది?”
“కెరెన్ కోసం ఫీజు కట్టటానికి నన్ను రెండుమూడు సార్లు స్కూలుకు పంపావు నువ్వు. అప్పుడు ఆ గోడల్ని చూశాను నేను. అవి నాకు చాలా నచ్చాయి”
“అలాగా. ఇంకా యేం చేయాలనుకుంటున్నావు నువ్వు?” అని అడిగాడు తండ్రి వ్యంగ్యంగా.
“కొన్ని కేన్ కుర్చీలను కొంటాను. కింద నేల మీద పరచటంకోసం మంచి మెరిసే ప్లాస్టిక్ షీట్లను కొంటాను. ఇంకా……”
“ఆఁ , యింకా?”
“నా భార్యను ఇంటికి తీసుకొస్తాను”
ఒక్కొక్క క్షణం గడుస్తున్నకొద్దీ మిస్టర్ కోరిఫర్ లో నిస్పృహ పెరిగిపోతోంది. ఒక మట్టిగుడిసె! ఈ నా …. కొడుకు. నా జీవితానికి వెలుగనుకున్నవాడు. ఒక ప్రభుత్వాధికారి కాబోయే ఆంగ్లేయుడు. మట్టి గుడిసెలో నివసించటం! అతని నైరాశ్యం విపరీతంగా పెరిగింది. కృతజ్ఞత లేని దరిద్రుడా! నువ్వు నన్ను అప్రతిష్ఠ పాలు చేస్తున్నావు. నీ పేదతండ్రిని పాతాళంలోకి పడతోస్తున్నావు. నీ ఆపీసు హోదాను తక్కువ చేస్తున్నావు.
“క్షమించు నాన్నా. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నాకోసం నువ్వు చేసిందానికి నేనెంతో కృతజ్ఞుడిని. కాని నా జీతం పెరిగింది కనుక నేను సొంత యింటిని కట్టుకోవాలనుకోవటం సహజమే” అని ఆగి , నేరుగా తండ్రిముఖం లోకి చూస్తూ మళ్లీ “ఇప్పడే చెప్పటం మంచిది. ఇకమీదట నాకోసం నువ్వు ఏ లివర్ పూల్ సూట్లకోసం ఆర్డరివ్వాల్సిన అవసరం లేదు”
“ఎందుకవసరం లేదు?” అని ఉరిమినట్టుగా కోపంగా అన్నాడు తండ్రి , కళ్లద్దాలు కింద పడిపోకుండా వాటిని ముఖం మీంచి తీస్తూ.
“నీ మనసును నొప్పిస్తున్నందుకు నాకు విచారంగా వుంది నాన్నా . కాని నువ్వు కోరుకున్న యూరోపియన్ ప్రమాణాలకు తగ్గట్టుగా బతకటం కోసం ఇన్నాళ్లూ నేనెంతో ప్రయత్నించాను. అదంతా శాశ్వతంగా విసిరిపారేయబోతున్నాను. అమ్మ తరఫువాళ్లు తొడుక్కునే సంప్రదాయ దుస్తుల్నే తొడుక్కోబోతున్నాను. మళ్లీ చర్చికి పోయినప్పుడు నేనొక సంప్రదాయ ఆఫ్రికన్ గా కనపడుతాను”
తర్వాత వచ్చిన ఆదివారం నాడు తన కొడుకు ఒక పొడవైన లాగునూ, గాంబియా దేశస్థులు ధరించే వదులైన, ముదురు రంగున్న ఎర్రని చొక్కానూ తొడుక్కుని చాకొలేట్ రంగులో వున్న ఒక యౌవనవతి ఐన అందమైన పిల్లను (ఆమె కూడా సంప్రదాయ దుస్తుల్ని వేసుకుంది) వెంటబెట్టుకుని చర్చి అరుగు మీదికి నడుస్తుంటే మిస్టా కోరిఫా ఎంత నిరాశ చెందాడంటే, అకస్మాత్తుగా అతని మెదడులో శూన్యం ఆవరించింది. అతడు జోనానుగానీ, వేల్ చేపనుగానీ జ్ఞాపకముంచుకోలేక పోయాడు. అతని నోట్లోంచి ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేకపోయింది. ఆనాటి కార్యక్రమాన్ని కేవలం మామూలు ప్రార్థనగా మార్చాల్సి వచ్చింది.
ఇప్పుడు మిస్టా కోరిఫర్ మతబోధకుడెంత మాత్రం కాడు. అతడు కేవలం శవాల పెట్టెల్ని తయారు చేసే ఒక వడ్రంగి మాత్రమే.

-అడెలేడ్ కేస్లీ హేఫోర్డ్
అనువాదం: ఎలనాగ

ఇంగ్లీష్ సూరన కు నాలుగున్నర శతాబ్దాలు!

కాళిదాసు ను భారతీయ షేక్స్పియర్  అని మురిసిపోయిన పాశ్చాత్య సాహిత్య సమాజానికి మనం కూడా షేక్స్పియర్ను ఇంగ్లిష్ సూరన అని పిలిచి ప్రచారం లోకి తీసుకు రావచ్చును.  కాళిదాసు కు, షేక్స్పియర్ కు దాదాపు పదిహేను వందల ఏళ్ల అంతరం వున్నదేమో కానీ పింగళి సూరన కు, షేక్స్పియర్ కు దాదాపు సమకాలీనత వున్నది. 1564 లో పుట్టిన షేక్స్పియర్ కు ఈ ఏడాది నాలుగున్నర శతాబ్దాల  ముచ్చట ఈ ఏప్రిల్ 23న  మరియు 26/27 వారాంతంలోనూ ఘనం గా జరుగుతున్నది. బ్రిటన్ దేశమంతటా, ముఖ్యం  స్ట్రాట్ ఫర్డ్ ఏవన్ లో విశేషించి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఆంగ్ల దేశపు విఖ్యాత నాటక కర్త , కవి  అయిన షేక్స్పియర్ జ్ఞాపకాలలో ఈ ఎలిజబెతియన్ పట్నంలో ప్రజలు  ఈ ఉత్సవ దినాలలో రెండువైపులా బారులు తీరి  తమ దేశానికి ఈ సందర్భం గా  వొచ్చిన అనేక మంది నటులు, సాహితీ సాంస్కృతిక ప్రముఖులు  దాదాపు వెయ్యి మంది ఈ పాదయాత్రలో  26 ఏప్రిల్, శనివారం నాడు పాల్గొంటున్నారు. వారి వెనుకే పలు రకాల వేషాలలో  మేళాలు, తాళాలు, వాద్యాలూ సంరంభం గా కళాకారులు పాల్గొంటున్నారు.  వీరంతా హోలీ ట్రినిటీ చర్చ్ ప్రాంగణంలో షేక్స్పియర్ సమాధి వద్దకు వెళ్ళి పుష్పాంజలి ఘటిస్తారు.

index

వీటికి మించి అక్కడ ఆరోజంతా  షేక్స్పియర్ జన్మస్థల కమిటీ , మరియు  రాయల్ షేక్స్పియర్ కంపెనీ వచ్చిన వారిలోని  అన్నివయసుల సందర్శకులకూ, తగు వినోద కార్యక్రమాలు, షేక్స్పియర్ రచనల నుంచి ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు.  వీటిలో భాగం గా, సంగీత కార్యక్రమాలు,  వీధి ప్రదర్శనలూ, కథలు చెప్పే ప్రక్రియలూ,  రంగస్థల పోరాటాలూ,  రకరకాల మేకప్ లలో ఊరంతా కలయ దిరగడాలూ వంటివి చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా షేక్స్పియర్ స్మారక భవనాలకు యాత్రలూ, చేయవచ్చు. అవకాశం కలిసొస్తే, ఏ ప్రముఖ నటుడిని అయినా ఒక షేక్స్పియర్ పాత్రలో మనకు సమీపంలోనే కూడా చూడవచ్చు.

2014 లో షేక్స్పియర్ 450వ జన్మదినం కాగా 2016 లో ఆయన నాలుగువందలవ వర్ధంతి వరకూ ఈ ఉత్సవాలను సాంకేతికత సహకారం తో  లైవ్ స్ట్రీమింగ్ సినిమా  గా ప్రదర్శించనున్నారు, ఇది నాటక ప్రదర్శనలు, ఒక స్థలానికి, ఒక కాలానికి, మాత్రమే పరిమితమై ఉంటాయి అనే పడికట్టు ఆలోచనను విప్లవాత్మకం గా మార్చివేయననున్నది. దీని వల్ల, ఒక వూరిలో  ఒక వేదిక పై ప్రదర్శితమవుతున్న నాటకం అదే సమయంలో, ఎన్నో నగరాలలో,   థియేటర్లలో ప్రదర్శన సాధ్యమవుతుంది. ఇలా ఇంగ్లాండ్ లో ఒక చోట ప్రదర్శితమవుతున్న నాటకం, అమెరికా లోని 42 పలు ప్రాంతాలలోని థియేటర్లలో చూడవచ్చు. ఇంకా అదే సమయానికి, , తమ సమయాన్ని సమన్వయం చేసుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, మాల్టా, స్వీడన్, రష్యా , జర్మని, ఐర్లెండ్ వంటి  దేశ దేశాల థియేటర్లలో  పలు దేశాల ప్రేక్షకులు చూడ సాధ్యమవున్నది. బహుశా  సినిమా రంగానికి ఇటువంటి లైవ్ డ్రామా ( థియేటర్ లో మంచి తెర, మంచి సౌండ్ తో) చూడగలిగే సాంకేతిక సౌలభ్యం, సాంస్కృతిక రంగానికి అందుబాటులోనికి రావడం కొత్త మార్పులకు దారి తీయవచ్చు. దీనివల్ల మన తెలుగు నాటక రంగానికి, మంచి రోజులు రావచ్చు అనే ఆశ కలుగుతున్నది. సినిమాలు లేక మూలన పడిపోతున్న ఎన్నో థియేటర్లు ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం, వాస్తవం గా పరిణమించే రోజులను మనం చూడబోతున్నాము అనిపిస్తున్నది. ఇందుకు, షేక్స్పియర్ నాలుగున్నర శతాబ్దాల  ముచ్చట్లు ఒక ఆరంభ బిందువు కావడం ఒక సబబైన సందర్భం.

గెలిలియో పుట్టిన ఏడాదిలోనే పుట్టి , ఈ శాస్త్రవేత్త అంతరిక్ష లోకాలలోకి  చూస్తే, మనిషి మనోలోకాలలోకి  చూసిన  అక్షర దార్శనికుడు షేక్స్పియర్. తన 52 ఏళ్ల జీవితంలో ఎన్నో నాటకాలూ , కవితలూ రాసిన షేక్స్పియర్, ఆంగ్ల భాషా వికాసంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ కవి రాసిన ఎన్నో మాటలు, పద బంధాలు, ప్రజా జీవనం లో , పత్రికా  రచనలలో, ఆంగ్ల సంస్కృతిలో  ఆంగ్లేయులు రోజూ వాడే ఈ ఇంగ్లిష్ మాటలు ఇలా  కాయిన్ చేసి రాసినది ఈ రచయితే. (dead as a doornail, a laughing stock, fair play, neither here nor there, in stitches వంటివి) ఆల్  ద వర్ల్ద్ ఈజ్ ఎ స్టేజ్, యు టూ బ్రూటస్, ద మోస్ట్ ఆన్ కైన్డెస్ట్ కట్ ఇంకా ఎన్నో షేక్స్పియర్ ఆంగ్ల పలుబదులు, ఆ భాషా సంస్కృతీ సాహిత్యాలలో,  చెరగని   ముద్రలు గా నిలిచిపోయాయి. తన రచనలలో మౌలికమైన ఇతివృత్తాలు తక్కువే అయినా, అనేక నాటకాలు  గ్రీక్, రోమన్ రాజుల కుటుంబాల కథలు అయినా వాటిని ఆంగ్లంలో అందుకున్న ఘనత షేక్స్పియర్ దే. పన్నెండు విషాదాంత   నాటకలూ, పది చారిత్రక నాటకాలూ, పదహారు సుఖాంత నాటకాలు  రాసినా, విషాద, చారిత్రక నాటకాలు వాటి ఇతివృత్త పరిమితులలో గొప్ప ఎత్తులకు ఎదగగా, సుఖాంత నాటకాలైన  వాటిలో సాంఘిక జీవనం ప్రతిబింబించగా, కల్పన, కొత్త యెత్తులకు ఎదిగిన దాఖలాలు, పింగళి సూరన కళాపూర్ణోదయం తో ( ఇదొక పద్య కావ్యమైనా) సాటి గా  షేక్స్పియర్  రచనలో కనిపించవు.

పింగళి సూరన కూడా 1550 ప్రాంతాలకు తన ఉత్తమ కావ్య  రచన  చేస్తున్నాడు, ఆయన కళాపూర్ణోదయం వంటి కల్పన ఆనాటి ప్రపంచ సాహిత్యంలో మరొకటి కనిపించదు. కథా కథన  వైచిత్రి, నవీన కల్పనా గల ఈ రచన,  షేక్స్పియర్ కి కొంచెం ముందే జరిగినా, మనం ప్రపంచ సాహిత్యానికి, పింగళి సూరన స్వకపోల కల్పనా ధురీణత  గురించి తెలియ చేసే ప్రయత్నాలు తగినంతగా చెయ్య లేదు. ఇటీవల వచ్చిన అనువాదాలు ఈ దిశలో కొంత ప్రయత్నం చేశాయి. ఇవి ఇంగ్లిష్ తోనే ఆగక స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి యూరోపియన్ భాషలలోకి కూడా వెళ్లాల్సిన అవసరం వుంది.

కల్పనా వైచిత్రి  విషయంలో పింగళి సూరన తో పోలిక, షేక్స్పియర్ సృజన వైశాల్యత ను తగ్గించడానికి కాదు, కానీ ఒక  పెద్ద  గీత  కింద  మరొక గమనించ దగ్గ వాస్తవ రేఖ ను పొందు పరచడానికే.   పదిహేనో శతాబ్దపు తెలుగు సాహిత్యం, షేక్స్పియర్ పుట్టుకకు ముందే, ప్రబంధ యాత్ర మొదలు పెట్టింది, అనేది, ప్రపంచ సాహిత్యం లో మన స్థానం ఏమిటో, మనం గ్రహించి, ప్రపంచానికి తెలియ పరుస్తూ, ఇందుకు బాధ్యులైన ప్రతిభా మూర్తులైన  రచయితలను వారు ప్రాచ్యులైనా, పాశ్చాత్యులైనా  సమున్నతం గా గౌరవించి అనుసరించటానికే. ఎటొచ్చీ షేక్స్పియర్  అక్షరాలకు కు నివాళి గా  జరుగుతున్న ఈ జాతీయ  సందడి, మన భారతీయ, తెలుగు కవులకు కూడా జరిగేలా, ఆధునిక చేతన, సాంకేతిక సన్నాహాలూ, చేసుకుంటూ  మనం కూడ అడుగులు వేయాలని ఆశించడం సహజమూ, ఆచరణ సాధ్యమూ  అన్న నా విశ్వాసాన్ని జాతి జనులందరూ పంచుకుంటారని విశ్వసిస్తున్నాను.

    -రామతీర్థ

ram

వర్షం

సౌత్ ఆఫ్రికా కథ

                                  ఆంగ్ల మూలం:రిచర్డ్ రైవ్

                                                                    అనువాదం:     ఎలనాగ

    676x380      అప్పటిదాకా వున్న కలకలాన్ని పీల్చేస్తూ మిలిటరీ బ్యాండులా గట్టిగా ప్రతిధ్వనించే శబ్దంతో కురవసాగింది వర్షం. తడిసిన అద్దాల్లా వున్న వీధుల్లోని ఎరుపు, పసుపుపచ్చ రంగుల ప్రకాశవంతమైన నియాన్ లైట్ల కాంతిని ముంచేసింది వాన. సైడుకాలువలు పొంగినయ్. రోడ్ల మీద పొంగిన నీరు శబ్దం చేస్తూ పేవ్ మెంట్ల మీదికి చేరింది. నీటి ప్రవాహం గురగుర శబ్దం చేస్తూ డ్రెయినేజీల మూతల్ని పీల్చేసింది. బూడిదరంగులో వున్న వర్షధారలూ, పొగమంచూ కలిసి నగరం మధ్యలో వున్న కొండని కనపడకుండా చేసినయ్. ఉదాసీనంగా వున్న కేప్ టౌన్ నగరంలోని సిటీహాల్ క్లాక్ టవర్ ధీరత్వంతో తొమ్మది గంటలు కొట్టడానికి ప్రయత్నించింది. విధ్వంసకర శబ్దాల్ని చేస్తూ విసురుగా ఉధృతంగా కురిసింది వర్షం.

సోలీస్ గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ బిల్డింగు లోపలి నుండి పసుపుపచ్చని కాంతి బయటికి వస్తోంది. బయటి వాతావరణం నుండి రక్షణ కోసం దాని తలుపు గట్టిగా మూయబడి వుంది. లోపల  శరీరాల వేడిమి, గుడ్డల వేడిమి, మళ్లీ మళ్లీ వేడి చేసిన చేపనూనె వాసన – అన్నీ కలిసి ఊపిరాడనివ్వ కుండా వాంతి తెప్పించే విధంగా వున్నయ్. కిటికీల గాజుతలుపుల మీద పొగమంచు తాలూకు మసక చిత్రాలు. తలుపు కింది నుండి లోపలికి తన్నుకొచ్చిన నీళ్లు రంపపు పొట్టుతో కలిసిపోయి అక్కడ చిన్న మడుగులా తయారైంది.

చేతుల చొక్కా తొడుక్కున్న సోలీ చెమటతో తడిసిపోయాడు. అతనికి బూతులు మాట్లాడాలనిపిచేటంత చిరాకుగా వుంది. నీళ్లోడుతూ అప్పుడే లోపలికి వచ్చిన స్త్రీని చూసి “తలుపును గట్టిగా ముయ్. ఇది టెంటనుకున్నావా” అని బిగ్గరగా అరిచాడు.

“అరవకు సోలీ”

“కోపం తెప్పించొద్దు. మీ నల్లోల్లు ఎప్పుడూ తలుపుల్ని సరిగ్గా మూయరు”

“తెల్లోడా, అరవకు”

“నేను నీ మీద అరుస్తున్నాను కదా. ఔను మరి”

“ఇక పోనియ్. నాకు రెండు చేప ముక్కలు, తోక నరికినవి”

“రెండు చేప ముక్కలా? ఓకే”

“బయట కుండపోతగా వర్షం” అన్నదామె ఎవరినీ ఉద్దేశించకుండానే.

“అవును. వర్షం ఉధృతంగా వుంది” అంటూ లోపలికి వచ్చాడొక బక్కపలుచని మలేషియన్ యువకుడు. అతడు తల మీద హ్యాట్ పెట్టుకున్నాడు.

“ఒకటిన్నర పౌండ్ల ఫిష్షూ చిప్సూ కావాలి”

“ఒకటిన్నర పౌండ్లు. థాంక్యూ. కాని ఆ తలుపును మూసెయ్”

“సరే కాని ఈ హానోవర్ స్ట్రీట్లో ఒక్క నీ షాపుకే తలుపుందనుకుంటున్నావా?

“అయితే చావు” అంటూ మాటలు ఆపి, మరో కస్టమర్ వైపు తిరిగాడు సోలీ.

ఉత్తరం వైపు నుండి బలమైన వర్షపు ఈదురుగాలులు కిటికీల అద్దాల్ని బాదుతున్నాయి. హానోవర్ స్ట్రీట్ బస్టాపులో ఒక బస్సు జారుడు శబ్దం చేస్తూ ఆగింది. అందులోంచి దిగిన ప్యాసెంజర్లు వాన నుండి తప్పించుకోవడానికి ఎదురుగా వున్న సినిమా హాలు గేట్లోకి పరుగెత్తారు. వీధిదీపాలు మసకగా వెలుగుతున్నాయి.

చేపముక్కల్నీ చిప్సునూ పాత వార్తాపత్రికల్లో కస్టమర్లకు కట్టి యిస్తుంటే సోలీ చెమటలు కక్కుతున్నాడు. ఫిష్షూ, చిప్సూ. వినెగర్ వేసియ్యాలా? పేపర్లో కట్టి ఇవ్వాలా? ఇక్కడే తింటావా? “ఒకటిన్నర పౌండ్లవి ప్లీజ్.” థాంక్యూ. నెక్స్ట్. ఫిష్షూ చిప్సూ. వద్దా? రెండు ఫిష్ ముక్కలు, చిప్సు. వద్దా? ఉప్పూ, వినెగర్ చల్లనా? “ఒకటిన్నర పౌండ్లవి ఇవ్వండి.” థాంక్యూ. నెక్స్ట్. ఫిష్షూ, చిప్సూ.

అప్పుడే లోపలికి వచ్చిన ఒక స్త్రీతో “తలుపు మూసెయ్” అని బిగ్గరగా అరిచాడు సోలీ. సారీ అన్నట్టుగా ఆమె చిన్నగా నవ్వింది.

“మీ నల్లోల్లు నాస్తికులకన్నా ఘోరం” అన్నాడు సోలీ.

ఆమె తలుపు మూయటానికి యాతనపడి, రంపపు పొట్టూ నీళ్లూ కలిసిన మడుగులో నిలబడింది. ఆమె శరీరం  మీది నుండి  నీళ్లు కారుతున్నాయి. సోలీ రెండు వంటచెరుకు కట్టెల్ని పొయ్యిలో వేయటానికి కౌంటరు దగ్గర్నుంచి కదలగానే ఆమె పక్కకు జరిగి తోవనిచ్చింది. అంతకు ముందు సోలీ అన్న వాక్యానికి మరో కస్టమరు కోపం తెచ్చుకుని, “మీ యూదులు మా నల్లోల్లను ఎప్పుడూ బయటికి తోయటానికే వున్నారు” అన్నాడు.

తన జాతి మీద వచ్చిన వ్యాఖ్యను తిప్పికొట్టటం కోసం “అయితే చావు” అన్నాడు సోలీ. ఫిష్షూ, చిప్సూ. వినెగర్ తోనా? ఉప్పు వెయ్యనా? ఒకటిన్నర పౌండ్లవా? థాంక్యూ.

“ఏం కావాలి చెప్పండి మేడమ్”

“సినిమా యెప్పుడు వొదుల్తారో కొంచెం చెప్తారా?”

“నేనేం సినిమా టాకీసు మేనేజర్ననుకున్నావా?”

“ప్లీజ్”

“పదిన్నరకు” అని చెప్పాడు మలేషియన్ యువకుడు.

“థాంక్యూ. అంత వరకు నేనిక్కడ నిలబడొచ్చా? బయట వర్షం బాగా వుంది” అన్నదామె సోలీతో.

“బయట బాగా వర్షం కురుస్తుందని తెలుసు నాకు. కాని ఇది ధర్మసత్రం కాదు” అన్నాడు సోలీ.

“ప్లీజ్ బాస్”

ఈ వాక్యంతో సోలీకి హృదయం లోపల తెలియకుండానే గిల్లినట్టైంది. ఆరో జోన్ లోని ఆ మూలలో అతని దుకాణం చాలా సంవత్సరాలుగా వుంది. ఇంతకు ముందు యెన్నోసార్లు యెందరో తనకు బాధ కలిగించే మాటలనటం అతనికింకా జ్ఞాపకమే. అతనెప్పుడూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడామె అన్న వాక్యం అతడు ఊహించనిది. ప్లీజ్ బాస్…ఈ వాక్యం అతనికి నచ్చింది. తను వేసుకున్న కోటుకూ, టైకీ ఆ వాక్యం సరిపోయేట్టుగా వుందనుకున్నాడు. ప్లీజ్ బాస్…ఆహా ఎంత బాగుందీ వాక్యం!

“సరే సరే. కొంత సేపటిదాకా వుండు. కానీ వర్షం ఆగగానే వెళ్లిపోవాలి”

ఆమె తలూపి ముసురు వెనకాల మసకగా కనపడుతున్న టాకీసు పేరును చదవటానికి ప్రయత్నించింది.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా?” అడిగాడు సోలీ.

ఆమె యేమీ మాట్లాడలేదు.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడుగుతున్నాను”

అప్పటికీ ఆమె నుండి ఏ సమాధానమూ లేదు.

“చావు” అన్నాడు సోలీ మరో కస్టమరు వైపు తిరిగి.

 

వర్షపు మసకలోంచి సియెనా చూస్తోంది కానీ ఆమె చూపులు దేనిమీదా లేవు. తడిసిన రోడ్ల మీద జారుతూ పోతున్న కార్లు. వర్షంలో రకరకాల హారన్ల చప్పుళ్లు. టైర్ల కిందికి వచ్చిన నీళ్లను చిమ్ముతూ బస్సులు. గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ ప్యాలెస్ లో బిగ్గరగా మనుషుల మాటలు. ఆమె చూపులు ఎదురుగా వున్న కొండ మీది నీటి పాయలను దాటి, చలికాలపు కేప్ టౌన్ ను దాటి, బోలండ్ అనే వూరి వేసవిలోకి ప్రవేశించాయి. స్టెలెన్ బాష్ పార్ల్ ల ఆకుపచ్చని ద్రాక్షతోటల్ని దాటి, మాల్మెస్ బరీలోని ఉక్కపోత నిండిన గోధుమపొలాల్ని దాటి, తెస్లర్స్ డాల్ గ్రామంలోని కేరింతల్నీ , బద్ధకంగా ఆవులించే సూర్యుణ్నీ చేరుకున్నాయి. అక్కడ సూర్యుడు ఉదయించటం కోసం, వెలుగునివ్వటం కోసం, అస్తమించటం కోసం శ్రమ పడుతూ అలసిపోయినట్టుగా వుంటాడు.

పంతొమ్మిదవ శతాబ్దపు ఎత్తుగోడల మిషన్ చర్చిలో ఆమె మొదటిసారిగా జోసెఫ్ ను కలిసింది. ఆ చర్చి ఇప్పటికీ వుందక్కడ. ఎంతో అందంగా పైకి పాకే ఐవీ తీగ ఆ చర్చి అందాన్ని మరింతగా పెంచుతుంది. బాగా పాలిష్ చేయబడి తళతళ మెరిసే పెద్దపెద్ద చమురు దీపాలు పైకప్పు నుండి వేలాడబడి వుంటాయి. ఆ చర్చిలో ఆ దీపాల రెపరెపల్లోనే ఆమె మొదటిసారిగా అతణ్ని చూసింది. అతడు ఆ చర్చిని చూడటానికి కేప్ టౌన్ నుండి వచ్చాడు. ఆ రాత్రి ఆమె చర్చిలో అంతకు ముందెప్పుడూ పాడనంత బాగా ఒక భక్తిగీతాన్ని పాడింది. “మృత్యుచ్ఛాయలు నిండిన లోయలో నడుస్తున్నా, ఓ నా ప్రియతమా” అంటూ సాగుతుంది ఆ గీతం.

అప్పుడతడు ఆమెను చూశాడు. అందరూ ఆమెనే చూశారు. ఎందుకంటే సోలోలను ఆమె అద్భుతంగా పాడుతుంది.

“ఏ దుష్టశక్తికీ వెరవను నేను” అంటూ చరణం.

నిజంగా ఆమె భయం లేకుండా అతణ్ని ప్రేమించింది. అతనికోసమే పాడింది. అతని విశాలమైన కళ్లకోసం, పసిమి నిండిన అతని చర్మం కోసం, అందమైన అతని చెక్కిలి కోసం పాడింది. జోసెఫ్ అనే మనిషిని సృష్టించిన సృష్టికర్త కోసం పాడింది. చుక్కలు పొదిగిన పాలపుంతలో వీణతీగల్ని బిగించిన ఆకాశం మీద చంద్రుడు బొమ్మలా అడుగులు కదిపిన రాత్రులవి. తన చెవిలో అతడు గుసగుసగా పలికిన వలపు వాక్యలు నిండిన రాత్రులవి. అతని కొంటె మాటలకు ఆమె సిగ్గుపడి కిసుక్కున నవ్వింది. అట్లా నవ్వటం సభ్యతే అనుకున్నదామె.  తాను కేప్ టౌన్లోని ఆరో జోన్ లో ఒక వీధిలో ఉంటున్నాననీ, ఆడపిల్లలు తనంటే పడిచస్తారనీ చెప్పాడతడు. మోలీ, మియెనా, సోఫియాల గురించీ, స్కూలుటీచరుగా పని చేస్తూ ఎప్పుడూ ఇంగ్లిష్ లోనే మాట్లాడే చార్మేన్ అనే ఆవిడ గురించీ అతని ద్వారానే తెలిసిందామెకు. కానీ తనకు మాత్రం తెస్లర్స్ డాల్ మీదనే ప్రేమ కలిగిందని అన్నాడు జోసెఫ్. అతణ్ని నమ్మాలా వద్దా అన్నది ఆమె నిశ్చయించుకోలేక పోయింది. మబ్బు వెనకాల చంద్రుని నడకతో పాటు యవ్వన సంపదను కనుగొన్నాడతడు.

ఆ తర్వాత కేప్ టౌన్ కు వెళ్లే రైలు తాలూకు కీచుశబ్దం. ఎంత పెద్ద శబ్దమంటే అది తన కుటుంబం తెలిపిన నిరసనను ముంచేసింది. తన తండ్రి ఉగ్రరూపం దాల్చడం, తెస్లర్ డాల్ చర్చిలోని అవివాహితులైన నన్స్ విసిరే మర్మపూరిత వీక్షణాలు. తన పారవశ్యాన్నీ, వెర్రి ఆవేశాన్నీ ముంచేసేటంత శబ్దం చేస్తూ రైలు. లక్షలకొద్దీ విద్యుద్దీపాల వెల్తురులో వేలకొద్దీ కార్లు తిరుగుతూ చేసే శబ్దంలో మునిగిపోయి తబ్బిబ్బవటం. కేప్ టౌన్ కు ప్రత్యేకం అయిన ఉత్సవ సాయంత్రాలు నిండిన వేసవి కాలం. ఆరో జోన్ లోని చిన్న గదిలో తనివి తీరని వ్యామోహం నిండిన ప్రేమ. నాలుగు తెల్లని గోడలూ, కిర్రుమనే ఒక పాత కుర్చీ, “ఈ యింటికి మా దీవెనలు” అంటూ గొణుగుతున్నట్టున్న గోడల అంచుల్లోని కార్డ్ బోర్డ్ పట్టీ.

ఆ తర్వాత అతడు ఆలస్యంగా ఇంటికి రావటం. అప్పుడప్పడు మరీ ఆలస్యంగా రావటం. కొన్నిసార్లు అసలే రాకపోవటం. రోజురోజుకూ అతని మోహం తగ్గుతూ ఇతర అమ్మాయిల పేర్లను గొణుక్కోవటం. మోలీ, మియెనా, సోఫియా, చార్మేన్. అతడు తననుండి జారిపోతున్నాడనే ఎరుక అసహాయతలోకి తోస్తూ , మరింత వడివడిగా వేగాన్ని బాగా పెంచుతూ…

“నేను నింద మోపటం లేదు. కేవలం విన్నానని అంటున్నానంతే”

“అప్పుడప్పుడు రాత్రుళ్లు నువ్వెందుకు సినిమాకు పోవు?”

మరియా ప్రియుడు జోసెఫ్ కోసం వెతుకుతున్నాడు.

జోసెఫ్ కోసం నిఘా. జోసెఫ్ కోసం వెతుకులాట. జోసెఫ్ ను పొడవటం కోసం ప్రయత్నాలు. జోసెఫ్. జోసెఫ్. జోసెఫ్. మోలీ. మియెనా. సోఫియా. పేర్లు, పేర్లు, పేర్లు. పుకార్ల మీద పుకార్లు. ఏకపక్ష వాంఛ. సినిమాకు వెళ్లరాదూ. సినిమాకు పోయి ఏం చూడాలి? ఎందుకు చూడాలి? ఎప్పుడు చూడాలి? ఎక్కడ చూడాలి?

వరుసగా వారం రోజుల పాటు అతడు రాకపోయే సరికి అతణ్ని వెతకాలని గట్టి నిర్ణయం చేసుకుంది. వర్షంలో నడిచివెళ్లి, ఆ మర్యాద లేని సోలీ గాడి ఫిష్ అండ్ చిప్స్ దుకాణంలో నిలబడాలని నిశ్చయించుకుంది. షో అయిపోయే దాకా వేచి చూడాలి.

కిటికీ అద్దాల మీద అప్పటి దాకా విసురుగా కొట్టిన వాన ఆగిపోయింది. కేవలం చర్మాన్ని మాత్రమే కొద్దిగా తడిపే ముసురు మొదలైంది. ఎడతెరిపి లేకుండా. అంతం లేకుండా. ప్రతి రూపాన్నీ, దృశ్యాన్నీ ముసురు తాలూకు సన్నని పొరతో నల్లని దిగులుతో కప్పేస్తూ. ఒక నియాన్ లైటు వణుకుతూ, రోదిస్తూ మూర్ఛరోగి లాగా వెలుగుతూ ఆరిపోతోంది. అలసిపోయిన సోలీ కౌంటరు మీదున్న చవకబారు గడియారం వైపు క్షణం పాటు చూపును విసిరాడు.

“పదిన్నర అయింది. సినిమా షో నుండి జనం బయటికి వస్తారిక”

ముసురు తాలూకు మసకపొర లోంచి సియెనా తదేక దృష్టితో చూసింది. సినిమా హాలు ప్రాంగణంలో ఏ మాత్రం మనుషుల అలికిడి లేదు.

“జనం బయటికి వచ్చే సమయమైంది” అంటూ షో తర్వాత తన దుకాణాన్ని ముంచెత్తే కస్టమర్ల తాకిడిని తట్టుకోవటానికి సన్నద్ధుడయ్యాడు సోలీ.

“ఇవ్వాళ్ల జనం బయటకు రావటం లేటయింది” అన్నాడు సోలీ.

“అవుననుకుంటా” అన్నది సియెనా.

సోలీ తన కళ్లచుట్టూ కారుతున్న చెమటను తుడుచుకుని, శుభ్రంగా నిరాడంబరంగా వున్న ఆమె శరీరాన్ని పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం అలిసినట్టుంది కాని కాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సినిమా హాలు నుండి చాలా జనం ఆవరణలోకి వచ్చాక, ఆఖర్న ఒకరిద్దరు చలిలో వణుకుతూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. బయట ఈదురు గాలులు వీస్తూ అంతా తడితడిగా వుంది.

“మీ ఆయననున్నాడా సినిమా థియేటర్లో?”

ఖాకీ యూనిఫాంలో వున్న ఒక వ్యక్తి థియేటర్ గేటును తెరవడానికి అవస్థ పడుతుంటే ఆమె అతణ్నే పరీక్షగా చూస్తోంది.

“మేడం, మీ ఆయనున్నాడా లోపల?”

లోపలి జనమంతా టాకీసు కాంపౌండులోకి వచ్చారు. గేటు తెరిచి జనాన్ని బయటికి  వదలటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ యూనిఫాంలోని మనిషి .  తుపుక్కున ఊసినట్టు, వాంతి చేసుకున్నట్టు జనం బయటికి రాబోతున్నారు.

“థియేటర్లో మీ ఆయనున్నాడా?”

జవాబు లేదు.

“చావు” అన్నాడు సోలీ.

వాళ్లంతా ఇప్పుడు బయటికొస్తారు. జోసెఫ్ కూడా వస్తాడు. ఆదరబాదరాగా సోలీకి కృతజ్ఞతలు చెప్తూ ఆమె తలుపు వైపు పరుగెత్తింది.

“తలుపును మూసెయ్”

ఆమె దేన్నీ వినే స్థితిలో లేదు. ముసురు ఆగిపోయింది. నిర్జనమైన వీధిలో, టాకీసులోని ఖాళీ ఆవరణలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. తన ఖాళీ హృదయంలో కూడా అదే నిశ్శబ్దం. థియేటర్ ఎక్సిట్ తలుపు ముందున్న మెట్లలో చివరిమెట్టు మీద ఆశాభావంతో నిల్చుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూండగా.

అప్పుడు నవ్వుకుంటూ, తోసుకుంటూ ఒకరి వెంట ఒకరు వచ్చారు. ఆమె వాళ్ల ముఖాలను అత్యంత తీక్షణంగా పరిశీలించింది కానీ ఆ ముఖాలు చాలా వేగంగా కదిలిపోయాయి. నవ్వుతూ, తుళ్లుతూ, బిగ్గరగా అరుస్తూ…వెడల్పైన కన్నులతో, పసిమి వన్నె వాళ్లు, నల్లని కన్నులవాళ్లు, బలమైన చెక్కిలి ఎముకల్తో నల్లనివాళ్లు, గోధుమరంగువాళ్లు, తెల్లనివాళ్లు, పసుపుపచ్చని వన్నె వాళ్లు, నల్లని కన్నులవాళ్లు, నవ్వే కళ్లతో, ఎంతో ఆహ్లాదంగా, ఎగిరెగిరి పడుతూ. కానీ వాళ్లలో జోసెఫ్ లేడు. వేగంగా కొట్టుకుంటున్న తన గుండె వెయ్యి ముక్కలవుతుందా అనిపించిందామెకు. జోసెఫ్ అసలే కనపడకపోతే? ఎవరెవరి ముఖాలో కనిపిస్తున్నాయి ఆమెకు. వాటిలో సోలీ ముఖం కూడా వుంది. నల్లని ముఖాల, గోధుమరంగు ముఖాల సముద్రంలో చిక్కని నీలికళ్లూ, చక్కని తెల్ల గెడ్డమూ ఉన్న ముఖం కోసం పిచ్చిగా వెతుకుతూ…మళ్లీ సోలీ ముఖం కనపడుతోందేమిటి! యాభై ముఖాల్ని చూసినా అందులో జోసెఫ్ లేడు. తనకు తెలిసిన పెద్ద చెక్కిలివాడి కోసం వెతుకుతూ ఆమె. సోలీ, మోలీ, మియెనా, చార్మేన్, ఎన్నెన్నో ముఖాలు కదులుతున్నయ్.

ముసురు మళ్లీ మొదలైంది. అప్పుడు ముఖాల్ని కాకుండా షర్ట్లనూ, ఓవర్ కోట్లనూ చూస్తోంది ఆమె. సోలిటేర్ షాపులో బేరం చేసి ఒకటిన్నర పౌండ్లకు తాను కొన్న లేత నీలంరంగు షర్ట్ కోసం, దాని మీది కోటు కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి ఆమె కళ్లు. ఒకటిన్నర పౌండ్లకు వాటిని చేజిక్కించుకోవటం కోసం ఆమె ఎంతో గింజుకుంది. షాపువానితో ప్రాధేయపడింది. తన ఒక వారం రాబడి అది. ఊహల్లో మునుగుతూ జోసెఫ్ ముఖం కోసం వెతుకుతోంది. గుంపు పల్చబడి ఆఖర్న ఒకరిద్దరు మెల్లగా బయటకు వస్తున్నారు. వాచ్ మన్ ఇనుప గేటును మూసేస్తున్నాడు. జోసెఫ్ ను లోపల వేసి మూశారేమో. తనొక్కతే బయట. వాచ్ మన్ లే మిగిలిపోయారు. ఇంకా బలమైన ఇనుప గేట్లు.

“జోసెఫ్ వున్నాడా లోపల? ప్లీజ్ చెప్పండి”

“జోసెఫ్ ఎవరు?”

“జోసెఫ్ ఇంకా లోపలే ఉన్నాడా?”

“జోసెఫా? అతనెవరు?”

వాళ్లు ఆమెను ఆటపట్టిస్తున్నారు. వెనకాల నవ్వుతున్నారు. జోసెఫ్ ను వెతకటంలో ఆమెకు ఆటంకం కలిగిస్తున్నారు.

“జోసెఫ్ లోపలున్నాడు” పిచ్చిదానిలా గట్టిగా కేక వేసిందామె.

“చూడండి మేడమ్, కుంభవర్షం కురుస్తోంది. ఇంటికి వెళ్లండి మీరు”

ఇంటికెళ్లాలా? ఎవరి దగ్గరికి? దేని దగ్గరికి? ఖాళీ గదిలో ఖాళీ పడక మీదికా? “ఈ యింటిని దీవించండి” అని అబద్ధం పలుకుతున్న రోడ్డుమీదికా?

మూల మీద గుంపును చూసిందామె. జోసెఫ్ అక్కడున్నాడేమో అనుకుంది. పరుగెత్తుతూ ప్రతి ముఖంలోకి పరీక్షగా చూస్తోంది. ఓ నా జోసెఫ్. గుంపు వర్షంలో తడుస్తోంది. నడుమ ఇద్దరు భీకరంగా పోట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఒకడు జోసెఫ్. మురికి కాలువలోని బురదలో ఒకరి మీద మరొకరు కలియబడుతూ, జారుతూ. తొడుక్కున్న బట్టల్లోంచి బురద కారుతూ, ఆ రెండు శరీరాలు రేఖామాత్రంగా. నీలిరంగు షర్టును తొడుక్కున్న జోసెఫ్ ను గుర్తించిందామె. కళ్లమీంచి కారుతున్న వర్షపు నీటిని తుడుచుకుంటూ జోసెఫ్ ను చూసిందామె. ప్రాణరక్షణ కోసం పోట్లాడుతున్న జోసెఫ్ ను చూసింది. సైడు కాలువలో నిస్సహాయంగా మరొకడిని తన్నుతున్నాడు జోసెఫ్. అంతలోనే పోలీసుల విజిల్. పోలీస్ వ్యాను వచ్చి కీచుమంటూ ఆగిందక్కడ.

“ప్లీజ్ సర్. ఇతనిదేం తప్పు లేదు. మిగతా వాళ్లందరూ పారిపోయారు. ప్లీజ్ సర్. ఇతను జోసెఫ్. ఇతనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదు. బాస్. ప్లీజ్ సర్. ఇతడు నా జోసెఫ్. ప్లీజ్ బాస్.

“పక్కకు తప్పుకో”

“ప్లీజ్ సర్. అసలుదోషి ఇతడు కాదు. వాళ్లంతా పారిపోయారు. నిజం బాస్”

images

ఒంటరిగా మిగిలిందామె. ఒంటరి పడక. ఒంటరి గది.

సోలీస్ గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ ప్యాలెస్ గుంపుతో నిండిపోయింది. లోపల మనుషుల తొక్కిసలాట. ఈదురు గాలితో కలిసిన వాన మళ్లీ తలుపునూ, కిటికీల్నీ బాదుతోంది. పొంగిన సైడుకాలువలు తమ మీదికి వస్తున్న మరింత మట్టినీటిని ఇముడ్చుకోలేకపోతున్నాయి. సినిమా తర్వాతి రష్ ను తట్టుకోలేక సోలీ చెమటలు కక్కుతున్నాడు.

ఫిష్షూ చిప్సా? వినెగర్ కలపాలా? ఉప్పు వెయ్యాలా? ఒకటిన్నర పౌండ్లదా? థాంక్యూ. సారీ. ఫిష్ అయిపోయింది. ఐదు నిమిషాలాగాలి. కేవలం చిప్సా? వినెగర్? తొమ్మిది పెన్నీలు. చిన్న చిల్లర.  థాంక్యూ. సారీ. ఫిష్ లేదు. ఐదు నిమిషాలాగండి. చిప్సా? తొమ్మిది పెన్నీలదా? థాంక్యూ. సోలీ ఊపిరి పీల్చుకోవడం కోసం ఆగి, చేపముక్కల్ని పైవి కిందకూ కిందవి పైకీ తారుమారు చేశాడు.

“బయట ఏం గొడవ?”

“సినిమా కోసం వచ్చాను సోలీ”

“జాగా లేదు. బయటికి వెళ్లాలి”

“సినిమా కోసమని చెప్పానుగా”

“పోలీసోళ్లేం చేశారు? సారీ, ఫిష్ లేదు సార్. ఐదు నిమిషాలాగండి. పోలీసోళ్లేం చేశారు?”

“భోరున కురిసే వానలో భయంకరమైన పోట్లాట”

“జీసస్! వర్షంలోనా?”

“ఔను”

“పోట్లాడుకున్నదెవరు?”

“జోసెఫూ ఇంకొకడూ”

“జోసెఫా?”

“ఔను. అరుండేల్ వీధిలోని వాడు”

“అతడా. ఆ జోసెఫ్ నాకు తెలుసు. ఎప్పుడూ ఎవరితోనో తంటా పడతాడు. వాడి బతుకెప్పుడో రోడ్డు పాలైంది”

“అవును వాడే”

“ఇంకొకడెవడు?”

“తెలీదు”

“పోలీసులు పట్టుకున్నారా?”

“జోసెఫ్ ను పట్టుకున్నారు”

“ఎందుకు పోట్లాడుకున్నారు? ఫిష్షా? ఒక్క నిమిషంలో ఇస్తాను సార్”

“ఎవరో అమ్మాయి గురించి”

“ఎవరామె”

“పటేల్ కంపెనీలో పన్చేసే మియెనా తెలుసు కదా. ఇప్పుడామెతో వ్యవహారం నడుస్తోంది. ఆమె ప్రియుడు పట్టుకున్నాడు వీళ్లను”

“సినిమాలోనా?”

“ఔను”

సోలీ బిగ్గరగా, గుంభనంగా నవ్వాడు.

“పోలీసుల ముందు ఏడ్చిన ఆమెను చూశావా?”

“ఎవరామె?”

“పోలీసుల దగ్గర ఏడ్చింది చూడు, ఆమె”

“ఆమె జోసెఫ్ ప్రియురాలంటున్నారు”

“జోసెఫ్ కు ఎప్పుడూ బోలెడు మంది ప్రియురాళ్లుంటారు” ఫి-ష్ త-య్యా-ర్. మీకు రెండు ముక్కలా సార్. ఒకటిన్నర పౌండ్లదా. చిల్లర ప్రాబ్లెం. ఫిష్షూ చిప్సా? ఒకటిన్నర పౌండ్లవా? థాంక్యూ. కేవలం ఫిష్షేనా? వినెగర్ వద్దా? ఉప్పు? తొమ్మిది పెన్నీలదా? చిల్లర ప్రాబ్లెం. థాంక్యూ.

“ఆ స్త్రీ గురించి చెప్పు”

“ఆమె పోలీసుల ముందు ఏడ్చిందంటున్నారు”

“ఓహ్, జోసెఫ్ కు బోలెడు మంది ప్రియురాళ్లు”

“ఈమె అతనితో కలిసి బతుకుతోంది”

“ఎట్లా వుంటుందావిడ? ఫిష్ కావాలా సర్?”

“ఔను, ఆమె కాళ్లు చాలా బాగుంటాయి”

“ఓహో” అన్నాడు సోలీ. “ఎవరది? తలుపు మూయండి వెంటనే” అన్నాడు మళ్లీ.

సియెనా లోపలికి వచ్చింది. క్షణం పాటు నిశ్శబ్దం. తర్వాత గుసగుసలు, గోల.

ఎవరో చెవిలో గుసగుసగా అడిగితే ఔనన్నట్టు తల వూపాడు సోలీ. “ఈవిడ ఇప్పటిదాకా ఇక్కడే నిల్చుని ఎదురు చూసింది. అతనికోసం కాదనుకుంటా” అన్నాడు మళ్లీ.

జీన్స్ లో వున్న ఒక అమ్మాయి కిసుక్కున నవ్వింది.

“ఫిష్షూ చిప్సుకు ఒకటిన్నర పౌండ్లు మేడం”

“ఒకప్పుడు ఒకటింపావు పౌండ్లే కాదా”

“అది బోర్ యుద్ధంకన్న ముందు మేడం. ఇప్పుడు చేపల ధర పెరిగింది. బంగాళా దుంపల ధర పెరిగింది. అయినా ధర పెంచొద్దంటారా?”

“అవును, ఎందుకు పెంచాలి?”

“ఓహ్, చావు. నెక్స్ట్ ప్లీజ్”

“ఔను. మాకు చావే గతి సోలీ”

“క్షమించండి మేడం”. సియెనా వైపు తిరిగి “ఫిష్షూ చిప్సూ కావాలా? డబ్బు లేకపోయినా

ఫరవా లేదు. ఉచితంగా యిస్తాను”

“థాంక్యూ బాస్”

జనం బయటికి పోతుంటే వర్షం భోరున కురవసాగింది. సోలీ డ్రాయరు లాగి డబ్బును లెక్క పెట్టుకున్నాడు. వీధిలో నీటి పాయలు జలాశ్వాల్లా దౌడు తీస్తున్నాయి. పేవ్మెంటు మీదికీ డ్రెయినేజీ రంధ్రాల్లోకీ వాననీరు ఉధృతంగా పోతోంది. భవనాల పైనుండి చిన్నచిన్న జలపాతాలు దూకుతున్నయ్. ఎడతెగని ప్రవాహాలు. మసకబారిన వీధిదీపాలు. ఫిష్షూ చిప్సూ కట్టివున్న న్యూస్ పేపర్ను నీరసంగా పట్టుకుంది సియెనా.

“వర్షం ఆగేదాకా నువ్విక్కడ ఉండొచ్చు” అన్నాడు సోలీ.

కన్నీరు నిండిన కళ్లతో పైకి చూసింది సియెనా. తన పచ్చని పళ్లు బయటపడేలా నవ్వాడు సోలీ. “ఏం ఫరవా లేదు”

ఒక్క క్షణం పాటు ఆమె ముఖం మీద చిన్న నవ్వు మెరిసింది.

“ఏం ఫరవా లేదు నాక్కూడా” ఆమె కిందికి చూసి ఒక్క క్షణం సందేహించింది. తర్వాత తలుపు తీయటానికి అవస్థ పడింది. పెద్ద శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. ఊళ వేస్తూ ఉత్తరదిక్కు నుండి కొడుతున్న వాన సోలీస్ ప్యాలెస్ లోకి వచ్చింది.

“తలుపు మూయ్” అన్నాడు సోలీ నవ్వుతూ.

“థాంక్యూ బాస్” అని వణుక్కుంటూ వర్షంలోకి నడిచిందామె.

***

 

 

 

 

 

 

కూరలబ్బాయి

sanjay_kumar
మూల రచయిత శ్రీ సంజయ్ కుమార్  9 ఆగస్టు 1987 నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‍లో జన్మించారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.  వృత్తి ప్రైవేటు సంస్థలో ఐటి మానేజర్ మరియు సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌. ప్రవృత్తి రచనలు.  ప్రింట్ పత్రికలలోనూ, వెబ్ పత్రికలలోనూ అనేక రచనలు ప్రచురించారు.
# #
సాయంకాలం. పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు. కొందరు టైర్లు దొర్లిస్తుంటే, మరికొందరు సైకిల్ళు తొక్కుతున్నారు. ఇంకొందరు గిల్లీదండా ఆడుతున్నారు. కొందరేమో గాలిపటాలు ఎగరేస్తున్నారు. నేను ఇంట్లో కూర్చుని, ఈమధ్యే కొన్న కథా సంకలనం చదువుతున్నాను. “కూరలమ్మా…. కూరలు…” అనే పిలువు నా చెవుల్లో ప్రతిధ్వనించింది.
కూరలమ్మేవాళ్ళ మాములు కేకల్లా లేదది, ఆ గొంతులో ఏదో తేడా ఉంది. నేను పుస్తకాన్ని పక్కనబెట్టి కిందకి దిగివచ్చాను. ఆ గొంతు ఎవరిదా అని చూస్తున్నాను. నా దృష్టి ముందుకు సాగింది. ఓ చిన్న పిల్లాడు కూరల బండిని తోస్తూ నా వైపు వస్తున్నాడు. “కూరలమ్మా…. కూరలు…” అని మధ్యమధ్యలో అరుస్తున్నాడు. అతడి వయసు పన్నెండు లేదా పదమూడు సంవత్సరాలకు మించి ఉండదు. చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు, ముఖంలో అమాయకత్వం గోచరిస్తోంది. అతన్ని చూస్తుంటే నా మనసులో లెక్కలేనన్ని పశ్నలు… పడగ విప్పిన పాములా తలెత్తున్నాయి. ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి, బండిని పూర్తిగా లాగలేకపోతున్నాడు. బండిని లాగడానికి వాడి శక్తి సరిపోవడం లేదు. తోపుడుబండిని ఓ వైపు తిప్పాలంటే, దాన్ని ఎత్తడానికి పూర్తిగా వంగిపోయి, అతి కష్టం మీద ఎత్తి తిప్పుతున్నాడు.
ఆ కుర్రాడు నా సమీపంలోకి వచ్చి, కూరలు తీసుకోమంటూ గట్టిగా అరుస్తున్నాడు. అతడి వంటి మీద అతి పల్చటి చొక్కా ఉంది, దానికెన్నో చిల్లులు! గుండీల స్థానంలో మచ్చలు. అతని ప్యాంటు బాగా మాసిపోయిన, మురికిగా ఉంది. వెనుకవైపు చిరిగి ఉంది. బండిని తోస్తున్నప్పుడు, ప్యాంటు వెనుక చిరుగులోంచి పిరుదు బయటకి కనబడుతోంది. నేను అతని కాళ్ళవైపు చూసాను. అతను ధరించిన చెప్పులు బాగా చిన్నవి. పాదాలు బయటకి వచ్చేస్తున్నాయి. చెప్పులు కూడా అరిగిపోయి, చిల్లులు పడి ఉన్నాయి. ఆ చిల్లుల్లోంచి దుమ్ము, మట్టి, నీళ్ళు బయటకు పోతాయేమో. బండి తోసుకుంటూ ఆ కుర్రాడు నా ముందు నుంచే వెళ్ళిపోయాడు. నిజానికి ఆ కుర్రాడిని చూస్తే నాకు నా బాల్యం గుర్తొచ్చింది. నేను కూడా ఆ వయసులో బండి తోసాను. ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. మర్నాడు నేను ఆ కుర్రాడి కోసం ఎదురుచూసాను. కొద్ది సేపయ్యాక, వస్తూ కనపడ్డాడు. వచ్చి నా ముందు ఆగాడు.
నాకేసి చూస్తూ, అమాయకత్వం నిండిన స్వరంతో, “కూరలేమయినా కావాలా సార్…” అని అడిగాడు.
నాకు కూరలు అక్కర్లేదు, కానీ ఆ కుర్రాడితో మాటలు కలపడానికి అదో అవకాశంగా భావించాను.
“ఇంత చిన్న వయసులో ఈ పనెందుకు చేస్తున్నావు?” అడిగాను.
“మా నాన్న చనిపోయాడు…” డొంకతిరుగుడు లేకుండా సూటిగా జవాబిచ్చాడా కుర్రాడు.
“అయ్యో… మరి మీ అమ్మ ఎక్కడుంది”
“అమ్మకి ఒంట్లో బాలేదు. ఏ పని చేయలేదు. అందుకే నేను పని చేస్తున్నా…”
“సరే, సార్, నేను వెళ్ళొస్తా. లేకపోతే ఆలస్యం అయిపోతుంది…”
బేరం ఏమీ చేయకుండానే, కూరలు తీసుకున్నాను. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
ఆడేపాడే వయసులోని ఈ కుర్రాడు ఎదిగిన మగాడిలా మారాడు, మంచీ చెడూ తెలుసుకున్నాడు. ఈ వయసులో మాములు పిల్లలు అయిదు కిలోల బరువు కూడా ఎత్తలేరు, ఈ అబ్బాయి మాత్రం యాభై కిలోల బండి లాగుతాడు. అవసరం ఆ కుర్రాణ్ణి ఎంత దృఢంగానూ, తెలివిగానూ తయారు చేసిందో… నా మనసులో ఆ పిల్లాడి పట్ల సానుభూతి కలిగింది. ఆ పిల్లాడిని నా స్నేహితుడిగా భావించసాగాను. ప్రతీరోజూ, బేరం చేయకుండానే కూరలు కొంటున్నాను. నేను ఏదో పనిబడి బజారుకి వెళ్ళడంవల్ల  ఓ రోజు సాయంత్రం ఆ కుర్రాడిని కలవలేకపోయాను. రాత్రి ఇంటికి తిరిగొస్తుంటే, నా దృష్టి ఆ కుర్రాడిపై పడింది. రోడ్డు వారగా, ఓ మూల కూర్చుని ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తున్నాడు.
Akkadi-MeghamFeatured-300x146
“ఏమైంది?”
“అయ్యగారు, ఇవాళ కూరగాయలు అమ్ముడుపోలేదు…”
“దానికి ఏడవడం ఎందుకు, రేపు అమ్ముడుపోతాయిగా….”
“ఈరోజు నాకు డబ్బు దొరక్కపోతే, అమ్మ మందులు కొనలేను…”
ఈ మాట వినగానే, జేబులోంచి వందరూపాయల నోట్లు రెండు తీసి ఇచ్చాను.
“నేను బిచ్చం అడుక్కోడం లేదు బాబుగారు…” అన్నాడు స్వాభిమానంతో.
వెంటనే నా తప్పు నాకు తెలిసింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. సంచి పట్టుకుని మళ్ళీ ఆ కుర్రాడి దగ్గరికి వచ్చాను. నన్ను చూస్తూనే ఆ కుర్రాడు లేచి నిలుచున్నాడు.
“ఇంట్లో కూరలు లేవు.. ఏమైనా ఇవ్వు…” అన్నాను. నా మాటలు వినగానే అతని ముఖంపై నవ్వు కదలాడింది.  నేను నా పెద్ద సంచీ తీసుకుని కూరలు అందులో వేసుకోసాగాను. సంచీ పూర్తిగా నిండిపోయింది.
“ఎంతయ్యింది?” అని అడిగాను.
ఆ కుర్రాడేమీ జవాబు చెప్పలేదు. అతని కళ్ళు చెమర్చాయి. నా ఎత్తుగడ అతనికి అర్థమైంది. అతన్నిఊరడించి, కూరలకి ఎంతైందో చెప్పమన్నాను.
“మూడు వందల నలభై రూపాయలు సార్…” అన్నాడు.
అతనికి డబ్బులిచ్చేసాను. “కూరలు కొన్నే ఉన్నాయిగా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో…” అన్నాను. ఆ పిల్లాడు నాకు ధన్యవాదాలు చెప్పి, ఇంటికి వెళ్ళిపోయాడు. నేను కూడా సంతోషంతో ఇంటిముఖం పట్టాను.
***
రోజులు గడిచేకొద్దీ మా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నేనా కుర్రాడి దగ్గర కూరలు తీసుకుంటూనే ఉన్నాను. “ఏంటి, కూరల కొట్టు ఏమైనా పెడుతున్నావా? రోజూ సంచి నిండా కూరలు తెస్తున్నావు…..”అని మా అమ్మ నామీద అరుస్తోంది.
ఓ రోజు సాయంత్రం నేనా కుర్రాడి కోసం ఎదురు చూస్తున్నాను. రాత్రి అయిపోతోంది, కానీ ఆ అబ్బాయి రాలేదు. రెండో రోజు కూడా ఆ కుర్రాడు రాలేదు. మరో నాలుగు రోజులు గడిచిపోయాయి. నా మనసులో లెక్కలేనన్ని అపశకునాలు. ఆ కుర్రాడిని వెదకాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? ఈ రోజు వరకూ ఆ కుర్రాడి పేరే అడగలేదు. ఎక్కడుంటాడో అడగలేదు. ఇవన్నీ అడగడం పెద్ద కష్టం కాదు కానీ, ఎందుకో…. వీటి ప్రస్తావనే రాలేదు మా మధ్య. వెదకడానికి బయల్దేరాను. మొదటగా రాత్రిళ్ళు ఆ అబ్బాయి నిల్చునే వీధి చివరకి వెళ్ళాను. కనపడలేదు. అక్కడున్న మిగతా కూరలమ్మే వాళ్ళని భోగట్టా చేసాను. మూడు నాలుగు రోజులుగా అసలా కుర్రాడు బజారులోకే రావడం లేదట! ఆ కుర్రాడు ఎక్కడుంటాడో, ఇల్లెక్కడో తెలుసా అని ఒకతన్ని అడిగాను. బదులుగా తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడతను. నిరాశగా ఇల్లు చేరాను. ఇంటికొచ్చి ఆలోచనల్లో లోనమైపోయాను.
“ఏమైంది?” అడిగింది అమ్మ.
“ఏం లేదు…”
రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత, “ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు…” అంది అమ్మ.
ఈ మాటలు వినగానే నేను లేచి నిలుచున్నాను. కానీ నేనా కుర్రాడి గురించి బెంగ పడుతున్నట్లు అమ్మకి ఎలా తెలుసు? అమ్మ దైవంతో సమానమని మహాత్ములు నిజమే చెప్పారు. దైవానికి తెలియని విషయం ఉంటుందా?  వెంటనే అమ్మ దగ్గర ఆ కుర్రాడి ఇంటి జాడ తెలుసుకుని, అక్కడికి బయల్దేరాను. కాస్త వెతుకులాట అయ్యాక, ఆ కుర్రాడి ఇల్లు పట్టుకోగలిగాను. పేరుకే ఇల్లుగానీ, నిజానికది పూరిగుడిసె. పైన వేసిన గడ్డిని చూస్తుంటే, ఏదో పల్లెటూరి ఇల్లు ఉన్నట్లే ఉంది. ఆ కుర్రాడు ఇంటి బయటే కనపడ్డాడు, నన్ను చూసి ఉలిక్కిపడ్డాడు.
“మీరేంటి సార్ ఇక్కడ…”అన్నాడు ఆశ్చర్యంగా.
“నిన్ను కలవాలనే వచ్చాను…”
“కొన్ని రోజులు నుంచి ఎందుకు రావడం లేదు?”
“అమ్మకి అస్సలు బాగాలేదు….”
“ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది?”
ఆ కుర్రాడు నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు. లోపల మురికి చీరలో నేల మీద పడుకుని ఉంది. ఆ చీర కూడా అక్కడక్కడా చిరుగులు పట్టి ఉంది. బట్టల పేరుతో, ఆవిడ చిరుగులని కట్టుకున్నట్లుంది. ఏదో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లుంది. ఏమీ మాట్లాడలేకపోతోంది. బయటకి వచ్చేసాను. కుర్రాడు కూడా నాతో పాటు బయటకు వచ్చాడు.
“నీ దగ్గర డబ్బులేమయినా ఉన్నాయా..?”
ఉన్నాయంటూ తలూపాడు. నేను ఇంటికి వచ్చేసాను. అతని దుర్భర పరిస్థితులను తలచుకుంటూ, అతడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. అర్థరాత్రి వరకూ అతని ఆలోచనల్లోనే లీనమయ్యాయి. ఆ కుర్రాడు చదువు, ఆటలు మానేసి కూరల బండి ఎందుకు తోస్తున్నాడో నాకిప్పుడు అర్థం అయ్యింది.
***
ఆ పిల్లాడు మరికొన్ని రోజులు రాలేదు.  ఆదివారం మధ్యాహ్న సమయం. బయట ఎంత ఎండగా ఉందంటే… గోధుమ పిండిని ఎండలో ఉంచితే, క్షణాల్లో అది రొట్టెలా మారిపోయేంత! ఇంతలో ఆ కుర్రాడి గొంతు వినిపించింది.  బయటకి వచ్చాను. ఎండ మండిపోతోంది. వాళ్లమ్మకి ఇప్పుడు ఎలా ఉందని అడిగాను. అంతా సర్దుకుందని చెప్పాడు. నాకు సంతోషం కలిగింది.
ఏవో మాట్లాడుతూ, ఆ కుర్రాడి పాదాల కేసి చూసాను. అతనికి చెప్పులు లేవు.
“నీ చెప్పులేమయ్యాయి…?” కాస్త కోపంగా అడిగాను.
“విరిగిపోయాయి బాబుగారు….” అన్నాడు కాస్త భయంగా.
“అయితే ఇలాగే వీధుల్లోకి వచ్చేస్తావా…?”
“మరి ఏం చేయను సార్, ఇంట్లో డబ్బులు లేవు…”
నేనేమీ మాట్లాడలేకపోయాను.
కుర్రాడు కదిలాడు. ఒట్టి కాళ్ళతోనే కూరలు అమ్ముకుంటున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ నేను ఆ ఒట్టి కాళ్ళను మర్చిపోలేకపోతున్నాను. మండుటెండలో, ఒట్టికాళ్ళతో కూరలమ్ముతున్న ఆ కుర్రాడిపై నాకు జాలి కలిగింది. ఓ జత చెప్పులు కొనిద్దామని అనుకున్నను. కానీ, గతంలో ఒకసారి డబ్బులిస్తే ఆ అబ్బాయి తిరస్కరించిన సంగతి గుర్తొచ్చింది. మరి చెప్పులు కూడా తీసుకోనంటే?
బాగా ఆలోచించిన మీదట ఆ అబ్బాయికి చెప్పులు కొనివ్వాలనే నిర్ణయించుకున్నాను. గబగబా తయారై బజారుకి వెళ్ళాను. రెండు లేక మూడు వందల రూపాయలలో ఆ కుర్రాడికి చెప్పులు కొనాలనున్నాను. అయితే ఆ అబ్బాయి తిరుగుడికి ఆ చెప్పులు రెండు మూడు నెలలకన్నా ఎక్కువ రోజులు రావని గ్రహించాను.  దగ్గర్లోనే ఉన్న ఓ పెద్ద చెప్పుల కొట్టుకి వెళ్ళాను. కొండలెక్కేందుకు ఉపయోగపడే చెప్పులు ఉంటే చూపించమని సేల్స్‌మాన్‌ని అడిగాను. చెప్పులు నాకేనా అని అడిగాడు. కాదు, ఓ పన్నెండేళ్ళ కుర్రాడికి అన్నాను. అతను వెంటనే, మెరుస్తున్న ఓ చెప్పుల జతని బయటకు తీసాడు. అవి చాలా దృఢంగా ఉన్నాయి. ఆ కుర్రాడి సరిగ్గా సరిపోతాయి, బాగా మన్నుతాయి కూడా. డబ్బులిచ్చి, ఆ చెప్పులు తీసుకుని ఇంటికి వచ్చాను.
సాయంకాలమైంది. నేను ఆ కుర్రాడి రాక కోసం ఎదురుచూస్తున్నాను. కానీ రాత్రయినా ఆ కుర్రాడు రాలేదు. ఒకవేళ ఈరోజు ముందే వచ్చి వెళ్ళిపోలేదు కదా?  వెంటనే వీధి చివరకు వెళ్ళి చూసాను. ఆ కుర్రాడు అక్కడే కూర్చుని ఉన్నాడు. నన్ను చూస్తూనే లేచి నిలబడ్డాడు. ఆ అబ్బాయి పాదాలకి ఇప్పుడు కూడా చెప్పుల్లేవు. చెప్పుల కవర్ నా చేతికి వేలాడుతోంది. ఆ కుర్రాడు సూటిగా దానినే చూస్తున్నాడు. ఆ అబ్బాయి ఈ కవర్ ఏంటని అడుగుతాడేమోనని అనిపించింది. కానీ ఆ అబ్బాయి కనీసం ఒక్కసారైనా దాని గురించి అడగలేదు. నేనే ఉండబట్టలేక, “నో కోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం… ” అని అంటూనే, “చెప్పులు…” అని చెప్పేశాను. నాకేసి తిరస్కారంగా చూసాడు.
“మన్నించండి బాబుగారు. నాకు వద్దు…” అన్నాడు.
ఎంతగానో నచ్చజెబితే గానీ తీసుకోడానికి అంగీకరించలేదు. వెంటనే నేను కవర్ తెరిచి చెప్పులు బయటకు తీసాను. అతడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కానీ అంతలోనే కళ్ళల్లో నీళ్ళు! చాలా సేపు ఓదారిస్తే గానీ అతడి ఏడుపు ఆగలేదు. నాకు ధన్యవాదాలు చెబుతునే ఉన్నాడు. కనీసం పదిసార్లకు పైగా చెప్పి ఉంటాడు. ఆ పిల్లాడు చెప్పులు తీసుకున్నాడు. నేను ఇంటికి వచ్చేసాను.  ఇక మీదట ఆ అబ్బాయి ఒట్టి కాళ్ళతో తిరగాల్సిన బాధ తప్పినందుకు నేను ఆనందించాను. ఈ సంఘటన జరిగాకా, ఏవో కారణాల వల్ల నేను మూడు రోజులపాటు ఆ అబ్బాయిని కలవలేకపోయాను. నాల్గవ రోజు మిట్టమధ్యాహ్నం పూట కూరలమ్మా… కూరలు అని అరుస్తూ వచ్చాడు. అతడిని చూడడానికి బయటకి రాగానే, నేను చేసిన మొదటిపని అతని పాదలకేసి దృష్టి సారించడం. అతని పాదాలకి చెప్పుల్లేవు.
“చెప్పులేవి?”
ఆ అబ్బాయి మౌనంగా ఉండిపోయాడు.  కోపంతో నేను నా ప్రశ్నని మళ్ళీ రెట్టించాను.
పిల్లాడు భయంతో వెనక్కి జరిగాడు, తల దించుకున్నాడు.
“అమ్మేసానయ్యా…” అన్నాడు.
ఇది వింటూనే నేను కోపం పట్టలేకపోయాను. నానామాటలూ అన్నాను.
“అసలు చెప్పులు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?” అడిగాను.
“అయ్యగారూ, మా అమ్మ చీర పూర్తిగా చిరిగిపోయింది. అందుకే, చెప్పులమ్మేసి అమ్మకి చీర కొన్నాను. నేను ఒట్టి కాళ్ళతో తిరగగలను, కానీ అమ్మని చిరిగిన చీరలో చూడాలంటే కష్టంగా ఉంది. పైగా అమ్మ చీరతో పోలిస్తే, నాకు చెప్పులు పెద్ద అవసరం కాదు…”
అతని జవాబు వినగానే, నా కోపం మీద చన్నీళ్ళు గుమ్మరించినట్లయింది. ఆ అబ్బాయి ముందు నేనెంతో చిన్నవాడిలా అనిపించింది. అంత చిన్న పిల్లాడి నోట్లోంచి అటువంటి పెద్ద పెద్ద మాటలు వింటూ నేను విస్మయానికి గురయ్యాను. ఆ అబ్బాయిని చూస్తుంటే గర్వంగా అనిపించింది. ఆ కుర్రాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతని ముఖంలో నేను మునుపెన్నడూ చూడని ఓ చిరునవ్వు ఉంది. ఒట్టి కాళ్ళతోనే అతను బండిని తోసుకుంటూ కదిలాడు. నేను ఇంటి వైపు తిరిగాను, రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి మళ్ళాను…
“ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు…”
ఆ అబ్బాయి నవ్వుతూ తన పేరు చెప్పాడు. నాదీ అదే పేరు.
హిందీ మూలం: సంజయ్ కుమార్

కొల్లూరి సోమశంకర్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

 

 

కిటికీ

సుమారు పది పదిహేను సంవత్సరాల క్రిందట అనుకుంటాను, “Readers Digest” ప్రత్యేక కథల సంపుటిలో ఈ Open Window కథ మొదటి సారి చదివాను.  మనసుమీద చెరగని ముద్ర వేసింది. ఈ కథకి ఆయువుపట్టు చివరి వాక్యమే. ఎక్కడా అసంబద్ధత లేకుండా, ఏ చిన్న విషయాన్నీ వదిలిపెట్టకుండా, ఎంత నిశితంగా పరీక్షించినా (నా మట్టుకు) తప్పుదొరక్కుండా పకడ్బందీగా కనిపించింది దీని అల్లిక.  Short Story(చిన్న కథ) అన్నపదానికి అక్షరాలా నిర్వచనంగా చూపించొచ్చు దీన్ని. ఇంగ్లీషు అచ్చులో 2, 3  బొమ్మలతో కలిపి 3 పేజీలు మించకుండా వచ్చినట్టు జ్ఞాపకం. కిటికీ వంటి చిన్న కేన్వాసుమీద కథ అల్లటం నిజంగా రచయితకి సవాలే. రావి శాస్త్రిగారు ఇలా “కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా…” అన్న శ్రీశ్రీ కవితలోని వస్తువులు తీసుకుని రసవత్తరమైన కథలు అల్లేరు. ఇంతకంటే ఎక్కువ చెబితే, పొరపాటునైనా కథగురించి క్లూ ఇచ్చేస్తానేమోనన్న భయంతో విషయం చెప్పకుండ కప్పదాట్లేస్తున్నాను. ఎవరికివారు చదివి ఆనందించవలసిన కథ ఇది.

452px-Hector_Hugh_Munro_aka_Saki,_by_E_O_Hoppe,_1913

* *

 

 

“మిస్టర్ నటెల్, మా అత్త ఇప్పుడే వచ్చేస్తుంది,” తన మనోభావాల్ని ఏమాత్రం పైకి కనపడనీయని నేర్పుగల పదిహేనేళ్ళ ఆ అమ్మాయి అంది; “అప్పటిదాకా మీరు నన్ను భరించక తప్పదు.”

ఫ్రాంటన్ నటెల్ ఆ క్షణానికి తగినట్టుగా మేనగోడల్ని పొగుడుతూ ఏదో తోచింది చెప్పేడు ఎదురుచూస్తున్న మేనత్తని ఏమాత్రం పలుచన చెయ్యకుండా. మనసులో మాత్రం ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ఇళ్ళకి ఇలా తన ఆత్మవిశ్వాసం పునరుద్ధరించుకుందికి వెళ్ళడంవల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని మునుపటికంటే ఎక్కువగా ఇప్పుడు పునరాలోచించసాగేడు.

“నేను ఊహించుకో గలను,” అంది అతని సోదరి తను పల్లెవాతావరణంలో విశ్రాంతి తీసుకుందికి మకాం మార్చడానికి సిద్ధపడుతున్నప్పుడు; “ఏ ఒక్క ప్రాణితోనూ మాటాడకుండా నిన్ను నువ్వు అక్కడ సమాధి చేసేసుకుంటావు. దానితో నువ్వు ఇంకా అంతర్ముఖుడివైపోతావు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళందరికీ పరిచయపత్రాలిస్తాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ మంచి వాళ్ళే.”

ఆ మంచి వాళ్ళ జాబితాలోకి తను పరిచయపత్రం ఇవ్వబోతున్న సాపిల్టన్ వస్తుందో రాదో అన్న సందేహం కలిగింది ఫ్రాంటన్ కి.

“మీకు ఇక్కడ తెలిసినవాళ్ళెవరైనా ఉన్నారా?” అని ఉండబట్టలేక అడిగింది ఆ మేనగోడలు… తమ మధ్య అప్పటికే తగినంత మౌనసంభాషణ జరిగిందని నిశ్చయించుకున్నాక.

“ఒక్కరు తెలిస్తే ఒట్టు,” అన్నాడు ఫ్రాంటన్. “సుమారు నాలుగేళ్ళక్రిందట మా సోదరి ఇక్కడ ఫాదిరీ గారింట్లో ఉండేది. ఆమే ఇక్కడ తనకి తెలిసిన కొద్ది మందికి పరిచయపత్రాలు ఇచ్చింది.”

ఆ చివరి మాట అంటున్నప్పుడు అతని గొంతులో పరిచయపత్రాలు ఎందుకు తీసుకున్నానా అన్న పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది.

“అయితే మీకు మా మేనత్త గురించి అస్సలు ఏమీ తెలీదా?” అని రెట్టించి అడిగింది ఆ అమ్మాయి.

“ఆమె పేరూ, చిరునామా. అంతవరకే,” అంగీకరించాడు సందర్శకుడు. అసలు ఈ సాపిల్టన్ వివాహితో, భర్తృవిహీనో అర్థం కాలేదు అతనికి. ఎందుకంటే, ఆ గదిలోని వాతావరణం అతనికి కారణం చెప్పలేని అనుమానం కలిగిస్తోంది అక్కడ మగవాళ్ళే ఉంటున్నారేమోనని.

“ఆమె జీవితంలో అతి విషాదకరమైన సంఘటన జరిగి సుమారు మూడేళ్ళయి ఉంటుంది,” అంది ఆ పిల్ల; “బహుశా మీ సోదరి ఇక్కడనుండి వెళ్లిన తర్వాత అయి ఉండొచ్చు,” అని ప్రారంభిస్తూ.

“విషాద సంఘటనా?” అడిగేడు ఫ్రాంటన్; ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో అకస్మాత్తుగా ఏ విషాద సంఘటనలు జరగడానికి అవకాశం లేదనిపించి.

“మీకు ఈపాటికి సందేహం వచ్చి ఉండాలి, అక్టోబరు నెలవచ్చినా ఇంకా ఆ కిటికీ ఇంకా ఎందుకు తెరిచే ఉంచేరని,” అంది ఆ మేనగోడలు, లాన్ లోకి తెరుచుకున్న పెద్ద ఫ్రెంచి కిటికీని చూపిస్తూ.

అసాధారణంగా ఈ నెలలో ఇక్కడ ఇంకా ఉక్కగానే ఉంది,” అన్నాడు ఫ్రాంటన్; “అయితే ఆ కిటికీకి, విషాదానికీ ఏమైనా లంకె ఉందా?” అని అడిగేడు.

“సరిగ్గా ఇవాళ్టికి మూడేళ్ళ క్రితం, ఆమె భర్తా, ఆమె సోదరులిద్దరూ వేటకని బయటకి వెళ్ళేరు. మరి తిరిగి రాలేదు. వాళ్ళకి ఇష్టమైన పక్షుల్ని వేటాడడానికి అనువైన చోటికి వెళుతూ దారిలో ఒక చిత్తడినేలదాటబోయి అక్కడి ప్రమాదకరమైన అడుసులో కూరుకుపోయారు. ఆ ఏడు ఎంత భయంకరంగా వర్షాలు కురిసేయంటే, అంతవరకూ నిరపాయమైన స్థలాలుకూడా తెలియకుండానే ప్రమాదకరంగా మారిపోయాయి. అన్నిటిలోకీ విషాదకరమైన విషయం వాళ్ళ శరీరాలు ఇంతవరకు దొరకలేదు.” ఇలా అంటున్నప్పుడు మాత్రం ఆ అమ్మాయి గొంతులో అంతవరకూ ఉన్న సంయమనం పోయి ఒక్క సారి గద్గదమైపోయింది. “పాపం, మా పిచ్చి అత్త, ఇంకా కలగంటూనే ఉంటుంది, ఏదో ఒక రోజు వాళ్ళూ, వాళ్ళతో పాటే తప్పిపోయిన వేటకుక్కా వాళ్ళు వెళ్ళిన ఆ కిటికీలోంచే ఇంట్లోకి తిరిగి వస్తారని. అందుకే ప్రతిరోజూ చీకటిపడే దాకా ఆ తలుపు తెరిచే ఉంచుతుంది. పాపం, ఆమె ఎప్పుడూ నాకు చెబుతూనే ఉంటుంది వాళ్లు బయటికి ఎలా వెళ్ళేరో… ఆమె భర్త మోచేతిమీద వాటర్ ప్రూఫ్ కోటు వేసుకునీ, ఆమె చిన్న తమ్ముడు రోనీ ఆమెని ఎప్పుడూ ఏడిపించడానికి పాడే “ఎక్కడికిపోతావె చిన్న దాన,” అన్న పాట పాడుకుంటూను. ఆ పాట వింటున్నప్పుడల్లా ఆమెకి గొప్పచిరాకేసేదట. ఎందుకో తెలీదుగాని, ఇలాంటి, స్తబ్ద నిశ్శబ్ద వాతావరణంలో, నాకు ఒళ్ళు గగుర్పొడిచే ఊహ కలుగుతూంటుంది… ఆ కిటికీ లోంచి వాళ్ళు నిజంగా లోపలికి వస్తారేమో నని….”

గగుర్పాటు కలగడంతో ఆమె తన కథనం ఆపింది. ఇంతలో ఆమె మేనత్త ఇంట్లోకి తను ఆలస్యంగా వచ్చినందుకు పదేపదే క్షమాపణలు చెప్పుకుంటూ ప్రవేశించడంతో అతనికి కొంత ఊరట కలిగింది.

“వెరాతో మీకు మంచి కాలక్షేపం అవుతోందనుకుంటాను,” అందామె.

“ఆమె చాలా కుతూహలమైన విషయాలు చెబుతోంది,” అన్నాడు ఫ్రాంటన్.

“తలుపు తెరిచి ఉంచడం వల్ల మీకు అభ్యంతరం లేదు కదా,” అంది సాపిల్టన్, వెంటనే, “నా భర్తా, సోదరులిద్దరూ వేటనించి తిన్నగా ఈ తోవనే లోపలికి వస్తారు. ఇవాళ పక్షుల్ని పట్టుకుందికని బయటకి వెళ్ళేరు. వాళ్ళు నా కార్పెట్లని బురద బురద చేసెస్తారు. ఈ విషయంలో మీ మగవాళ్ళందరూ ఒక్కటే. అవునా?” అని అంది.

ఆమె అలా గలగలా మాటాడుతూనే ఉంది… వేట గురించీ, పక్షులు దొరక్కపోవడం గురించీ, ఈ శీతకాలంలో బాతులు లభ్యమవడం గురించీ. ఫ్రాంటన్ కి అదంతా భరించ శక్యంగా లేదు. అతను సంభాషణని ఎలాగైనా మరో విషయంవైపు మళ్ళిద్దామని శాయశక్తులా ప్రయత్నించాడు గాని అంతగా సఫలంకాలేకపోయాడు; పదే పదే ఆమె దృష్టి కిటికీ వైపూ, అక్కడి లాన్ వైపూ ఇంకా ముందికీ వెళుతోంది తప్ప, అతను చెబుతున్న దానిపై ఆమె ఏమాత్రం మనసు లగ్నం చెయ్యడం లేదన్న సంగతి అతను గ్రహించాడు. ఆ దురదృష్టసంఘటన జరిగిన వార్షికం నాడే తను ఆమెను కలవడానికి ప్రయత్నించడం కేవలం యాదృచ్ఛికం.

“డాక్టర్లందరూ నన్ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమనీ, దేనికీ ఉద్రేకపడొద్దనీ, ఎక్కువ శారీరకశ్రమ కలిగించే పనులు తలపెట్టవద్దనీ చెప్పారు,” చెప్పుకుపోతున్నాడు ఫ్రాంటన్ … తమకి ఏమాత్రం పరిచయంలేనివారు తమ రోగాలగురించీ తమ అశక్తతలగురించీ వాటి కారణాలూ, నివారణోపాయాలగుంచి ఏదో కుతూహలం కనబరుస్తారని చాలా మంది రోగులకి ఉండే అపోహను కనబరుస్తూ… “భోజనం విషయంలో మాత్రం ఎవరి అభిప్రాయాలూ కలవలేదు.”

“లేదూ?” అంది సాపిల్టన్, మనసులో నిర్లిప్తత గొంతులో లీలగా కదిలి చివరకి ఆవులింతగా పరిణమిస్తుంటే. ఆమె ఒక్కసారి వెంటనే అప్రమత్తమైంది … అయితే దానికి కారణం ఫాంటన్ చెబుతున్న విషయం కాదు.

“అదిగో వచ్చేశారు,” అని ఆనందతో కేరిందామె, “సరిగ్గా టీ వేళకి. వాళ్ళు ముఖంనిండా మట్టిగొట్టుకుపోయినట్టు లేరూ ?” అంది.

ఫ్రాంటన్ కి ఒకసారి ఒళ్ళుజలదరించి మేనగోడలువైపు చూశాడు కళ్ళలో జాలి కనబరుస్తూ. ఆ అమ్మాయి ఒక భయంకర దృశ్యాన్ని చూస్తున్నట్టు తెరిచిన కిటికీ వైపు కళ్ళు తేలేసి చూస్తోంది. చెప్పలేని భయమేదో ఆవహించి కొయ్య బారిపోతూ తనూ ఆమెచూస్తున్న వైపు తనదృష్టి సారించాడు.

ముసురుకుంటున్న సంజచీకట్లలో మూడు ఆకారాలు చంకలో తుపాకులు వేలేసుకుంటూ లాన్ వైపు నడుచుకుంటూ వస్తున్నాయి …. ఒక దానికి అదనంగా తెల్లని కోటు ఒకటి భుజానికి వేలాడుతోంది. బాగా అలసినట్టు కనిపిస్తున్న గోధుమరంగు వేటకుక్క ఒకటి వాళ్ళ అడుగుల్లో అడుగులేస్తూ అనుసరిస్తోంది. చప్పుడు చెయ్యకుండా వాళ్ళు ఇల్లు సమీపించిన తర్వాత, ఒక పడుచుగొంతుక, “ఎక్కడికి పోతావె చిన్న దానా?” అన్న పాట అందుకుంది.

అంతే! ఫ్రాంటన్ తన చేతికర్రనీ టోపీని ఒక్కసారి ఎలా అందుకున్నాడో అందుకున్నాడు; హాలుకి తలుపెటుందో, కంకరపరిచిన కాలిబాట ఎక్కడుందో, ముఖద్వారం ఎటో అతనికి లీలగా గుర్తున్నాయి అతని వెనుదిరిగి చూడని పరుగులో. పాపం, ఆ రోడ్డువెంట సైకిలు తొక్కుకుంటూ వస్తున్న వ్యక్తి తన సైకిలు తుప్పల్లోకి మళ్ళించవలసి వచ్చింది ఖచ్చితమైన ప్రమాదాన్ని నివారించడానికి.

“ప్రియా, ఇదిగో వచ్చేశాం” అన్నాడు తెల్లనికోటు మోసుకుని కిటికీలోంచి లోపలికి ప్రవేశించిన వ్యక్తి, “బురద కొట్టుకు పోయామనుకో, అయినా ఫర్వాలేదు చాలవరకు పొడిగానే ఉన్నాం. ఇంతకీ, ఎవరా వ్యక్తి, మేం లోపలికి వస్తుంటే, బయటకి బుల్లెట్ లా పరిగెత్తేడు?”

“ఎవరో, నటెల్ ట. చాలా చిత్రమైన వ్యక్తి,” అంది సాపిల్టన్; “అతని అనారోగ్యం గురించి తప్ప మరో మాటలేదు. మీరు రావడమే తడవు, శలవు తీసుకోకుండా, వీడ్కోలైనా చెప్పకుండా ఏదో దయ్యాల్ని చూసినట్టు పరిగెత్తాడు.”

“దానికి కారణం, ఆ వేటకుక్కే అనుకుంటున్నాను,” అంది ఆ మేనగోడలు ప్రశాంతంగా; “అతను చెప్పేడు నాకు కుక్కలంటే మహాభయమని. ఒకసారి అతన్ని గంగానది ఒడ్డునున్న ఒక గోరీలదొడ్డిలోకి కొన్ని కుక్కలు తరిమేయట. పాపం, అప్పుడే తవ్విన ఒక గోతిలో దూకి రాత్రల్లా తలదాచుకున్నాడట నెత్తి మీద అవన్నీ చొంగకారుస్తూ, మొరుగుతుంటే. అది చాలు, హడలిపోయి ఎవరికైనా ధైర్యం సన్నగిలిపోడానికి.”

ఉన్నపళంగా కథలల్లగలగడం ఆ పిల్ల ప్రత్యేకత.

.

సాకీ  (హెక్టర్ హ్యూ మన్రో.)

(18 December 1870 – 13 November 1916),

Notes:

ఇక్కడ కిటికీ అంటే  నేలకి 3 నాలుగు అడుగుల ఎత్తులో మనకు పరిచయమున్న కిటికీ కాదు; ఫ్రెంచ్ కిటికీ. మన ద్వారబంధాలలాగే నేల వరకూ ఉండి, ఒక గదిలోంచి బయట వసారాలోకో, తలవాకిట్లోకో తెరుచుకునే కిటికీ.

అనువాదం: నౌడూరి మూర్తి

 

ఆదర్శ మిలియనీర్

ఆస్కార్ వైల్డ్

ఆస్కార్ వైల్డ్

 

సంపద లేకుంటే మనిషి ఎంత ఆకర్షణీయంగాఉన్నా ఉపయోగం లేదు. కొత్తది, ఇష్టమైనది అనుభవించగలగడం డబ్బున్నవాళ్ళ ప్రత్యేకతగాని నిరుద్యోగుల నిత్యకృత్యం కాదు. డబ్బులేనివాళ్ళెప్పుడూ నిస్సారంగాజీవిస్తూ ఏది అందుబాటులోఉంటే దాన్ని అనుభవించడం నేర్చుకోవలసిందే. మనిషి మనోహరంగా కనిపించడంకంటే, స్థిరమైన ఆదాయంవచ్చే ఉద్యోగం కలిగి ఉండడం మేలు. ఈ ఆధునిక సత్యాలేవీ హ్యూయీ ఎర్స్కిన్ కి వంటబట్టలేదు. పాపం హ్యూయీ!  తెలివితేటల విషయంలో, ఏ మాటకి ఆ మాటే ఒప్పుకోవాలి, అతనంత చెప్పుకోదగ్గవాడేం కాడు.

అతని జీవితకాలంలో ఒక సరసమైన మాట, కనీసం విరసమైనదికూడా చెప్పి ఎరగడు. అయితేనేం, చూడడానికి బహుచక్కగా ఉంటాడు… గోధుమరంగు ఉంగరాలజుత్తూ, చక్కనికళ్ళూ, తీర్చినట్టున్న ముఖంతో. అతనికి మగవాళ్ళలో ఎంత పేరుందో, ఆడవాళ్లలోనూ అంత ప్రఖ్యాతి ఉంది, అతనికి అన్ని ప్రావీణ్యతలూ ఉన్నాయి… ఒక్క డబ్బు సంపాదించగల నేర్పు తప్ప. వాళ్ళ నాన్న అతనికి వారసత్వంగా మిగిల్చినవి… తను ఆశ్వికదళంలో పనిచేసినప్పటి కత్తీ, “A History of Peninsular War” 15 సంపుటాలూ. హ్యూయీ మొదటిదాన్ని తన అద్దంముందు వేలాడదీశాడు, రెండోవి పుస్తకాలబీరువాలో Ruff’s Guide కీ, Bailey’s Magazine కీ మధ్య (ఈ రెండూ గుర్రపు పందాలకు సంబంధించినవి) దాచి, అతని ముసలి మేనత్త ఏర్పాటుచేసిన సాలుకి రెండువందల పౌండ్ల జీవన భృతితో కాలక్షేపం చేస్తున్నాడు.

అతను చెయ్యని ప్రయత్నం లేదు.  ఆరునెలలపాటు స్టాక్ ఎక్స్ఛేంజిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కూడా; అయినా, బుల్స్ కీ బేర్స్ కీ మధ్య పాపం సీతాకోకచిలుకకి పనేమిటి? అంతకంటే ఎక్కువకాలమే టీ వ్యాపారంలో వేలుపెట్టేడు, కానీ ‘పెకో’ తోటీ ‘సూచాంగ్’ తోటీ విసిగెత్తిపోయాడు. తర్వాత అతను ‘డ్రై షెరీ’ అమ్మడానికి ప్రయత్నించేడు. అదీ ఫలితం లేకపోయింది; షెరీ మరీమందకొడిగా సాగింది. చివరికి అతను ఏదీ కాకుండాపోయాడు… ఎందుకూ కొరగాని, ఏ వ్యాపకమూ లేని, ఆహ్లాదకరమైన అందమైన యువకుడిగా మిగిలిపోయాడు.

ఇది చాలనట్టు, అతను ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన పిల్ల పేరు లారామెర్టన్ … ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అతని నిగ్రహాన్నీ, జీర్ణక్రియనీ పోగోట్టుకుని, అందులో ఏదీ తిరిగిపొందలేకపోయిన ఒక రిటైర్డ్ కల్నల్ కూతురు. లారాకి అతనంటే ఆరాధన, అతనామె పాదాలనుసైతం ముద్దుపెట్టుకుందికి సిద్ధం. లండనులో అత్యంత సుందరమైనజంటగా గుర్తించబడ్డారు గాని, వాళ్ళిద్దరి దగ్గరా తంతే దమ్మిడీ లేదు.  కల్నల్ కి హ్యూయీ అంటే ఇష్టమే గాని అతని దగ్గర  పెళ్ళి ఊసు మాత్రం ఎత్తకూడదు.

“కుర్రాడా, నీ దగ్గర పదివేలపౌండ్లు చేకూరినపుడు కనిపించు. అప్పుడు పెళ్ళిమాట ఆలోచిద్దాం,” అని అంటూండేవాడు ఈ విషయం వచ్చినప్పుడల్లా. ఆ రోజు హ్యూయీ ముఖం విచారంగా వేలాడేసుకుని, మళ్ళీ లారా దగ్గరకే చేరేవాడు ఉపశమనం కోసం.

ఓ రోజు, హ్యూయీ మెర్టన్స్ నివసిస్తున్న హాలండ్ పార్కుకి వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో అతని ఆప్తమిత్రుడు ఏలన్ ట్రెవర్ దగ్గరకి వెళ్ళేడు. అతనొక చిత్రకారుడు.  ఈ రోజుల్లో చిత్రకారుడు కాకుండా ఎవడూ ఉండలేడనుకొండి. అదివేరే సంగతి. అయితే అతను కళాకారుడు కూడా. కళాకారులు మాత్రం చాలా అరుదు. మనిషి చూడ్డానికి మహా చిత్రంగా, మొరటుగా, ముడతలు పడిన ముఖం, ఎర్రని చింపిరిగడ్డంతో కనిపిస్తాడు. కానీ, ఒకసారి కుంచె పట్టుకున్నాడా, అతనిలో ఒక మహాకళాకారుడు కనిపిస్తాడు. అతని బొమ్మలంటే ప్రజలు ఎగబడి కొనుక్కుంటారు. అతనికి మొదటగా హ్యూయీ అంటే ఇష్టం కలగడానికి కేవలం అతని రూపమే కారణం అని చెప్పక తప్పదు. తరచుగా అతను, “ఒక చిత్రకారుడు ఎటువంటి వాళ్లతో స్నేహం చెయ్యాలంటే సహజమైన అందంతో, జీవకళతో ఉట్టిపడే వాళ్ళూ, కళాత్మక దృష్టితో చూసినపుడు ఆహ్లాదం కలిగించే వాళ్ళూ, మేధోపరమైన చర్చలకు పనికొచ్చేవాళ్ళూ,” అని అంటుండేవాడు. అయితే హ్యూయీగురించి బాగా తెలుసుకున్నకొద్దీ, అతనిలో తొణికిసలాడే ఉత్సాహానికీ, దేన్నీ లక్ష్యపెట్టని స్వభావానికీ కూడా ఇష్టపడి, అతను ఎప్పుడు పడితే అప్పుడు అతని చిత్రశాలలోకి రావడానికి  అనుమతి ఇచ్చేడు.

2

హ్యూయీ లోపలికి వచ్చే వేళకి ట్రెవర్ ఒక నిలువెత్తు బిచ్చగాడి అద్భుతమైన చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. ఆ బిచ్చగాడే స్వయంగా చిత్రశాలకి ఒకమూల ఎత్తైన ఒక అరుగుమీద కూచున్నాడు. ఆ వ్యక్తి … బాగా చిక్కిపోయి, నలిపేసిన కాగితంలా ముఖంమీద ముడుతలతో, జాలిగొలిపే ఒక ముసలివగ్గు.  అతని భుజాలమీద బాగా మరకలుపడి చిరుగులైన ఒక ముతక గోధుమరంగు దుప్పటీ ఉంది; అతని కాలికి తొడుక్కున్న దుక్కబూట్లు అతుకులుబొతుకులుతో ఉన్నాయి; ఒక చేత్తో నాటుకర్ర పట్టుకుని దానిమీద ఆనుకుని, రెండో చేత్తో చివికిపోయిన ఒక టోపీ పట్టుకుని ఉన్నాడు అడుక్కుందికి.

“ఎంత అద్భుతమైన మోడల్!” అని గుసగుసలాడేడు హ్యూయీ మిత్రుడితో చేతులుకలిపి అభినందిస్తూ.

“అద్భుతమైన మోడలా?” అనిగట్టిగా అరిచేడు ట్రెవర్; వెంటనే సంబాళించుకుని, “అవును, అవును, ఒప్పుకోక తప్పదు. ఇలాంటి బిచ్చగాళ్ళు మనకి రోజూ తగలరు. నిజానికి ఇతనొక అద్భుతమైన ఆవిష్కరణ. మరుగుపడ్డ మాణిక్యం. ఒక జీవం ఉట్టిపడే వెలాక్జెజ్! నా అదృష్టం. ఇదే రెంబ్రాంట్ అయితే ఇతనితో ఎంత గొప్ప కళాఖండాన్ని తీర్చి దిద్దుండేవాడో!

“ఫాపం ముసలాడు!” అని నిట్టుర్చాడు హ్యూయీ, “ఎంత దయనీయంగా కనిపిస్తున్నాడు!  కానీ, మీలాంటి చిత్రకారులకి అతనొక నిధి అనుకుంటాను,” అన్నాడు మళ్ళీ.

“సందేహం లేదు,” అన్నాడు ట్రెవర్. “అయినా, నువ్వు బిచ్చగాడు ఆనందంగా కనిపించాలని అనుకోవు, అవునా?” అని అడిగేడు.

“ఇంతకీ, ఈ మోడల్ కి ఇలా కూచున్నందుకు ఎంత కిడుతుందేమిటి?” కుతూహలంగా అడిగేడు హ్యూయీ, దీవాన్ మీద అనుకూలమైన జాగా చూసుకుని కూర్చుంటూ.

“గంటకి ఒక షిల్లింగు.”

“ఏలన్, మరి నీ చిత్రానికి ఎంత దొరుకుతుంది?”

“ఓహ్! దీనికా? దీనికయితే రెండువేలు!”

‘పౌండ్లా?”

“కాదు. గినీస్1. చిత్రకారులకీ, కవులకీ, డాక్టర్లకీ ఇచ్చేది గినీలలో.”

“అలా అయితే, నా ఉద్దేశ్యంలో ఈ మోడల్ కి కూడా అందులో కొంతభాగం దక్కాలి,” అన్నాడు హ్యూయీ నవ్వుతూ; “పాపం, వాళ్ళుకూడా మీ అంత కష్టపడుతున్నారు.”

“అలాంటి పిచ్చి మాటలు మాటాడకు. చూడు! ఒక్కణ్ణీ ఈ ఈజెల్ పక్కన రోజల్లా నిలబడి ఇలా రంగుపులమడం ఎంత కష్టమో! హ్యూయీ! నీలాంటి వాళ్ళు అలా మాటాడడం బాగానే ఉంటుంది కానీ, ఒకోసారి, కళ కూడా శరీరశ్రమ అంత గౌరవాన్ని2 సంతరించుకునే సందర్భాలు ఉంటాయని నీకు చెప్పక తప్పదు. కనుక నువ్వు పిచ్చిపిచ్చిగా మాటాడకు; నేను పనిలో నిమగ్నమై ఉన్నాను. హాయిగా సిగరెట్టు తాక్కుంటూ, బుద్ధిగా మాటాడకుండా కూచో!”

wilde

3

కొంతసేపు గడిచేక, ఒక సేవకుడు ప్రవేశించి చిత్రాలకి పటంకట్టేవాడు అతనితో మాటాడడానికి వచ్చేడని ట్రెవర్ తో చెప్పేడు.

“హ్యూయీ, పారిపోకు, ఇప్పుడే క్షణంలో వచ్చేస్తా,” అని బయటకి వెళ్ళేడు ట్రెవర్.

ట్రెవర్ అలా బయటకి వెళ్ళడం గమనించి, ఆ ముసలి బిచ్చగాడు తన వెనక ఉన్న కర్రబెంచీమీద కాసేపు విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించుకున్నాడు ట్రెవర్ తిరిగి వచ్చేదాకా.  అతను ఎంత దిక్కుమాలిన, దౌర్భాగ్యస్థితిలో కనిపించేడంటే, హ్యూయీ జాలిపడకుండా ఉండలేక, అతనిజేబులో ఏమైనా కాసులున్నాయేమోనని తణుము కున్నాడు. అతనికి ఒక సావరిన్ (పౌండ్) మరికొన్ని చిల్లర పెన్నీలూ దొరికేయి.  “పాపం, నిర్భాగ్యుడు,” అని మనసులో  అనుకుని, ” నాకంటే అతనికే వీటి అవసరం ఎక్కువ, కానీ, ఇవి లేకపోవడమంటే, పదిహేను రోజులపాటు వాహనయోగం లేనట్టే,”  అని మనసులో అనుకుని, స్టూడియోలో ఆ చివరకి నడిచి బిచ్చగాడి చేతిలో ఉంచాడు.

ఆ బిచ్చగాడు ఒక్కసారి గతుక్కుమన్నాడు. కనీ కనపడని చిరునవ్వొకటి అతని వడలిన పెదాలమీద దొర్లింది. హ్యూయీకి ఎన్నో ధన్యవాదాలు చెప్పేడు.

ట్రెవర్ వచ్చినతర్వాత హ్యూయీ శలవుతీసుకున్నాడు, తను చేసిన పనికి కొంచెం సిగ్గుపడుతూనే.  ఆ రోజంతా లారాతో గడిపి, అతని ఔదార్యానికి ఆమెతో నాలుగు తిట్లుతిని, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేడు.

ఆ రోజు రాత్రి 11 గంటల వేళ ‘పేలెట్ క్లబ్’ లోకి నడుచుకుంటూ వెళ్ళేడు హ్యూయీ. అక్కడ ట్రెవర్ ఒక్కడూ సోడాకలుపుకుని వైన్ తాగుతూ, సిగరెట్టుకాల్చుకుంటూ కనిపించేడు.

హ్యూయీ సిగరెట్టు ముట్టించుకుంటూ, ” ఏలన్, మొత్తానికి నీ చిత్రం పూర్తయినట్టేనా?” అని అడిగేడు.

“పూర్తిచెయ్యడమేమిటోయ్, పటంకట్టించడం కూడా పూర్తయింది!” అన్నాడు ట్రెవర్. అని, “ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నువ్వొక ఘన విజయం సాధించేవు. ఆ ముసలి బిచ్చగాడు ఇపుడు నువ్వంటే పడి ఛస్తున్నాడు.  నువ్వెవరో, నువ్వెక్కడుంటావో,  నీ ఆదాయం ఎంతో,  నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో… అన్నీ చెప్పవలసి వచ్చింది అతనికి”.

“ఓహ్హో ఏలన్!” అని అరిచినంత పనిచేసేడు హ్యూయీ, “నేనింటికి వెళ్ళే వేళకి నాకోసం ఎదురుచూస్తుంటాడేమో! నువ్వు ఊరికే హాస్యం ఆడుతున్నావు, అవునా? పాపం ముసిలాడు.  నాకు చేతనయితే ఏదైనా సహాయం చేస్తే బాగుణ్నని అనిపిస్తోంది. ఒక మనిషి అంత దుర్భరమైనస్థితిలో ఉండడం ఊహించడానికే భయమేస్తోంది.  మా ఇంట్లో పాత బట్టలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. అతను వాటిని తీసుకుంటాడంటావా? పాపం అతని బట్టలు పీలికలు పీలికలు అయిపోయి ఉన్నాయి.”

4

“అయితేనేం? వాటిలోనే అతను చూడానికి అద్భుతంగా ఉంటాడు,” అన్నాడు ట్రెవర్.  “అదే అతను ఒక మంచి పొడవాటి కోటు వేసుకుని ఉండి ఉంటే, ఎవరెంత డబ్బుముట్టచెబుతానన్నా ఛస్తే అతని బొమ్మగీసి ఉండేవాడిని కాదు. నువ్వు పీలికలు అంటున్నవి, నా కంటికి మనోహరంగా కనిపిస్తాయి. నీకు ఏది పేదరికంగా కనిపిస్తుందో, అదినాకు చిత్రరమణీయంగా కనిపిస్తుంది. అయినప్పటికీ, నువ్వు బట్టలు ఇద్దామనుకుంటున్నావన్న విషయం అతనికి చెప్తాను.”

“ఏలన్,” హ్యూయీ ముఖం చాలా గంభీరంగా పెట్టి, ” ఎంతైనా మీ చిత్రకారులు హృదయంలేని మనుషులు,” అన్నాడు.

“ఒక కళాకారుడి హృదయం అతని మెదడులో ఉంటుంది,” అన్నాడు ట్రెవర్; అదిగాక, మాపని ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు చిత్రించడం తప్ప, మాకు తెలిసినరీతిలో దాన్ని సంస్కరించడం కాదు. ఎవడిపని వాడు చేసుకోవాలి.  అది సరేగాని, లారా ఎలా ఉంది?  ఆ ముసలి మోడల్ కి ఆమెగురించి తెలుసుకోవాలని ఉంది.”

“అంటే, ఆమె విషయాలుకూడా అతనితో చెప్పేసేవా?” అడిగేడు హ్యూయీ.

“ఆహా! అన్నీ చెప్పేసాను … అతనికి పట్టువదలని కల్నల్ గురించీ, అందమైన లారా గురించీ, పదివేల పౌండ్ల షరతుగురించీ …అన్నీ తెలుసు.”

కోపంతో జేవురించిన ముఖంతో, హ్యూయీ, “ఆ ముసిలి బిచ్చగాడికి నా వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పావు?” అని గట్టిగా కేకలేసేడు.

“ఓరి పిచ్చి కుర్రాడా,” అని చిరునవ్వు నవ్వుతూ మొదలెట్టేడు ట్రెవర్, “నువ్వు అంటున్న ఆ బిచ్చగాడు యూరోపులో అత్యంత భాగ్యవంతుల్లో ఒకడు. రేపు లండన్ ని అమ్మకానికి పెడితే అతనిఖాతాలో పెద్ద తరుగేమీలేకుండా కొనెయ్యగలడు. అతనికి ప్రతి దేశ రాజధానిలోనూ ఒక ఇల్లు ఉంది. అతను బంగారుపళ్ళెంలో తింటాడు. తలుచుకుంటే రష్యా యుద్ధానికి వెళ్ళకుండా ఆపగలడు…”

“నువ్వు చెబుతున్నదేమిటి?” ఆశ్చర్యంతో అడిగేడు హ్యూయీ.

“అవును. నే చెప్పొచ్చేదేమిటంటే,” మళ్ళీ అందుకున్నాడు ట్రెవర్, “నువ్వు ఇవాళ చిత్రశాలలో చూసింది బేరన్ హాజ్బెర్గ్ ని. అతను నాకు చాలా మంచి మిత్రుడు. నా చిత్రాలన్నిటినీ, వాటిని పోలినవాటినీ కొంటుంటాడు. నెల్లాళ్ళక్రిందట అతన్ని ఒక బిచ్చగాడిగా చిత్రించమని నాకు బయానాకూడా ఇచ్చాడు. అంతకంటే ఏమిటి కావాలి? ఆ మిలియనీర్ కి అదో వెర్రి. నిజం చెప్పొద్దూ, చిరుగుపాతల దుస్తుల్లో బిచ్చగాడుగా చాలా గొప్పగా కనిపించాడు. నిజానికి ఆ చిరుగుపాతలు అతనివి కావు, నావి. ఆ పాతసూటు నేనే స్పెయిన్ లో కొన్నాను.”

“బేరన్ హాజ్బెర్గా!” తలపట్టుకుని నిశ్చేష్టుడై పక్కనున్న చేతికుర్చీలో కూలబడుతూ, “ఎంతపని జరిగిపోయింది. బిచ్చగాడనుకుని అతని చేతిలో నేనో సావరిన్ కూడా పెట్టేను,” అన్నాడు హ్యూయీ.

5

“ఏమిటి? అతని చేతిలో ఒక సావరిన్ పెట్టేవా?” అని ఆశ్చర్యంగా అడిగి, వెంటనే పగలబడి నవ్వడం ప్రారంభించేడు. “నాయనా, మరి దాన్ని తిరిగి కానవు. ఆ డబ్బులుకి నీళ్ళధారే.”

“నువ్వు నాకు ముందే చెప్పాల్సింది, ఏలన్,” అని అతనిమీద విసుక్కుంటూ, “నన్నలా ఒక  తెలివిమాలిన వాడిగా చెయ్యకుండా ఉండవలసింది,” అన్నాడు హ్యూయీ.

“సరే, కథ ఏమిటంటే, హ్యూయీ,” అంటూ చెప్పనారంభించేడు, “నువ్విలా విచ్చలవిడిగా ఎవడికిపడితేవాడికి నిర్లక్ష్యంగా డబ్బులు దానం చేస్తావని అసలు ఊహించలేదు. నువ్వు ఒక అందమైన మోడల్ ని ముద్దుపెట్టుకుంటే అర్థం చేసుకోగలను; కానీ, నువ్విలా ఒక అందవిహీనమైన బిచ్చగాడికి ఒక సావరిన్ ఇవ్వడమేమిటి? లేదు, నేనసలు ఊహించలేదు. అదిగాక, నిజానికి ఇవేళ ఎవరొచ్చినా నేనింట్లో ఉన్నట్టు చెప్పొద్దని చెప్పాను. తీరా నువ్వొచ్చిన తర్వాత హాజ్బెర్గ్ తనని పరిచయం చేస్తే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలీదు. నువ్వు చూసేవుకదా… అతని వొంటినిండా బట్టలుకూడా లేవు.”

“నన్నెంత చవటకింద అతను జమకట్టేసి ఉంటాడో!” అన్నాడు హ్యూయీ విచారంగా.

“అదేం లేదు. నువ్వెళ్ళిన దగ్గరనుండీ పట్టలేనంత హుషారుగా ఉన్నాడు. తనలో తనే నవ్వుకుంటూ ముడుతలుపడ్డ అతని చేతులు రెండిటినీ పదేపదే రాపిడి చేసుకోడం  ప్రారంభించేడు. నీ గురించి ఎందుకు అతను అంత ఇదిగా తెలుసుకోదలుచుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం అయింది. హ్యూయీ, నువ్విచ్చిన ఆ సావరిన్ ని నీకు బదులు అతను మదుపు పెడతాడు. ప్రతి ఆరు నెల్లకీ వడ్డీ చెల్లిస్తాడు. రాత్రి డిన్నర్ తర్వాత దానిగురించి అద్భుతమైన కథ చెబుతాడు.”

“నేనో దురదృష్టవంతుణ్ణి,” అంటూ గొణుక్కున్నాడు హ్యూయీ, “ఇప్పుడు ఇంటికెళ్ళి పడుక్కోడం ఉత్తమమైన పనిలా కనిపిస్తోంది. ఏలన్, కనీసం ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు. పదిమందిలో నా ముఖం చూపించలేను.”

“అవేం పిచ్చిమాటలు హ్యూయీ! నువ్వుచేసిన పని నీలోని పరోపకారబుద్ధికి ఒక మంచి ఉదాహరణ. అలా వెళ్ళిపోకు. ఇదిగో మరో సిగరెట్టు తీసుకో. లారా గురించి నీ మనసుతీరా ఎంతసేపు చెప్పినా వింటాను.”

కానీ, హ్యూయీ మాత్రం వెనుతిరగలేదు… ట్రెవర్ ని పగలబడి నవ్వుకోమని వదిలేసి, విచారంతో ఇంటిముఖం పట్టేడు.

మర్నాడు ఉదయం ఫలహారం చేసే వేళకి అతని సేవకుడు ఒక కార్డు తీసుకువచ్చి వచ్చి ఇచ్చేడు. దాని మీద ఇలా రాసి ఉంది: గుస్తావ్ నాడిన్… బేరన్ హాజ్బెర్గ్  సేవలో.”

6

“బహుశా క్షమాపణలు చెప్పడానికి పంపించి ఉంటాడు,” అని హ్యూయీ తనలో తాను అనుకున్నాడు; సేవకుడితో వచ్చినతన్ని లోపలకి ప్రవేశపెట్టమని చెప్పేడు.

వయసు పైబడ్డ ఒక పెద్దమనిషి బంగారురంగు కళ్ళజోడూ, నెరిసినతలతో గదిలోకి ప్రవేశించాడు. “శ్రీ ఎర్స్కిన్ గారి తోనేనా నాకు మాటాడే మహద్భాగ్యం దక్కుతున్నది?” అని వినమ్రంగా అడిగేడు. ఉచ్ఛారణ స్పష్టంగా అతను  ఫ్రెంచివాడని  తెలుస్తోంది,

హ్యూయీ కూడా గౌరవసూచకంగా  తలవంచి అభివాదం చేశాడు.

“నేను బేరన్ హాజ్బెర్గ్ పంపగా వచ్చేను.  బేరన్…” అని వచ్చినవ్యక్తి చెప్పబోతుండగా మధ్యలో అందుకుని,

“సర్, మిమ్మల్ని నా తరఫున బేరన్ కి క్షమాపణలు తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను,” అని తడబడుతూ చెప్పేడు హ్యూయీ.

“బేరన్,” అని ఆ వృద్ధుడు నవ్వుతూ మళ్ళీ అందుకున్నాడు, “నన్ను మీకీ ఉత్తరం అందజేయవలసిందిగా ఆదేశించారు,” అంటూ ఒక సీలువేసిన కవరు హ్యూయీకి అందించేడు.

దాని మీద ఇలా రాసి ఉంది: “హ్యూయీ ఎర్స్కిన్ – లారా మెర్టన్ దంపతులకు పెళ్ళికానుక … ఒక ముసలి బిచ్చగాడిదగ్గరనుండి.”

అందులో పదివేల పౌండ్లకు ఒక చెక్కు ఉంది.

లారా, హ్యూయీ  దంపతులయ్యేక మరుచటిరోజు ఉదయం సుప్రభాత విందులో బేరన్ ప్రసంగించేడు కూడా.

“మిలియనీర్ మోడల్స్ చాలా అరుదు, సందేహం లేదు,” కానీ, దేవుడిమీద ఒట్టేసి చెప్పగలను… మోడల్ మిలియనీర్ లు అంతకంటే అరుదు.” అని వ్యాఖ్యానించేడు ఏలన్.

***

Notes:

  1. గినీ పౌండ్ కంటే ఒక షిల్లింగు ఎక్కువ.
  2. అంటే కూలికిట్టకపోవడం.

మూలం: ఆస్కార్ వైల్డ్

murthy gaaruఅనువాదం: నౌడూరి మూర్తి

రెండు డాలర్లంత వర్షం

 (డొమినికన్ రిపబ్లిక్ కథ)

Juan_Bosch_escritor

ఖ్వాన్ బాష్ (1909 – 2001):  ఇతడు డొమినికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన వాడు. కథారచయితే కాక రాజకీయ వేత్త, చరిత్రకారుడు, వ్యాస రచయిత, విద్యావేత్త. 1939లో Dominican Revolutionary Partyని, 1973లో Dominican Liberation Partyని స్థాపించాడు. 23 సంవత్సరాల కాలం ప్రవాసంలో గడిపి వచ్చాక 1963లో దేశాధ్యక్షుడయ్యాడు. 1969లో ప్రత్యర్థులు అతని పాలనను కూలదోయటంతో మళ్లీ పోర్టోరికోకు శరణార్థిగా వెళ్లాడు. నాలుగు కథా సంపుటాలు, రెండు నవలలు, 26వ్యాస సంపుటాలు రాశాడు.

***

ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని, తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ  “నరకం లోని ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ, ఇక వర్షం పడుతుంది ఫెలిపా” అన్నది.

ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబూ ఇవ్వలేదు. కరువు గురించిన యెన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా  చూసింది. ఆకాశం నిర్మలంగా వుంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియా  కు ఆగ్రహాన్ని తెప్పించింది.

ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు  అనుకుని మళ్లీ తన చూపును దించుకుంది.  గోధుమవర్ణపు పొలాల నేల పగుళ్లను చూపుతోంది. దూరాన కొండ మీద ఒక గుడిసె వుంది. ఆ గుడిసెలో, పక్క గుడిసెలో, దాని పక్క గుడిసెలో, ఇంకా చుట్టుపక్కల వున్న ఇతర గుడిసెల్లోని వారంతా ఆమె లాగా, ముసలి రెమిజియా లాగా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్నో నెలలుగా వర్షమే లేదు. కొండ అంచుల మీది పైన్ చెట్లను మగవాళ్లు కాల్చేశారు. ఆ మంటల వేడిమి మొక్కజొన్న కాండాలకు వేలాడే ఆకుల్ని కాల్చేసింది. అగ్నికణాలు పిట్టల్లాగా ఎగురుతూ,  కాంతిచారల్ని వదులుతూ మహా జ్వాలలై మండాయి. ఇదంతా యెందుకంటే ఆ పొగంతా పై  లోకం వైపు పోయి వర్షం కురుస్తుందని వాళ్ల ఆశ. కానీ అలా జరగ లేదు.

“మన బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా” అన్నది ఫెలిపా

“ఎన్నో సంవత్సరాలుగా మనం నేలను సాగు కోసం తయారు చేస్తూ…”     రెమిజియా ఏదో చెప్పటం ప్రారంభించింది.

పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నేల లోని తేమనంతా పీల్చేసాక అది నదుల మీద, కాలువల మీద తన ప్రభావాన్ని చూపించటం మొదలు పెట్టింది. కొంచెంకొంచెంగా నదుల అడుగు భాగాలు పైకి తేలి, పాకుడు పట్టిన బండరాళ్లు తమ తలల్ని పైకి లేపాయి. చిన్న చేపలన్నీ నది దిగువ భాగానికి తరలి పోయాయి. ఒక్కో వానా కాలం గడిచిన కొద్దీ నదులు ఎండి  పోవటమో, బురదగుంటలుగా మారటమో లేక చిత్తడినేలలుగా మారటమో జరిగింది. దాహమూ, నిరాశా నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి, తమ గుర్రాల మీద ఎక్కి , వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

కాని వృద్ధురాలైన రెమిజియా అందుకు నిరాకరించింది. ఏదో ఒక రోజు వర్షం వస్తుందనీ, ఒక మధ్యాహ్నాన ఆకాశం మీద మబ్బుల గుంపులు బారులు తీరుతాయనీ, ఏదో ఒక రాత్రి వేళ ఎండిపోయిన తన గుడిసె మీద పడే వర్షపు చినుకుల శబ్దం తనకు వినపడుతుందనీ   ఆశ పడిందామె.

తన కొడుకును స్ట్రెచర్ మీద తీసుకు వెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా వుంటూ పొదుపును అవలంబించ సాగింది. తన సొరకాయ బుర్ర  ను కొంత బూడిదతో నింపి, ఒకటొకటిగా నాణాలను అందులో వేస్తూ పోయింది. గుడిసె వెనుక వున్న నేలలో మొక్కజొన్న, చిక్కుడు వేసింది. మొక్కజొన్న గింజలు కోళ్లకూ, పందులకూ పనికొ   స్తాయి. చిక్కుడేమో తనకూ, తన మనవడికీ. ప్రతి రెండు మూడు నెల్లకో సారి ఆమె బాగా పెరిగిన కోడిని తీసుకుని, దాన్ని అమ్మటానికి పట్నం వెళ్తుంది. పందుల్లో ఒకటి బాగా బలిసి వుంటే ఆమె దాన్ని చంపి, ఆ మాంసాన్ని తనే అమ్ముతుంది. అందులోంచి ఆమె వెన్నను కూడా తయారు చేస్తుంది.  దాన్నీ, పంది తోలునూ కూడా ఆమె పట్నానికి తీసుకుపోయి అమ్ముతుంది. గుడిసె తలుపును మూసేసి, తన వస్తువుల్ని జాగ్రత్తగా చూడవలసిందిగా పొరుగింటి వాళ్లకు చెప్పి,  మనవణ్ని బుల్లి గుర్రం మీద కూచోబెట్టి, తాను వెనకాల నడుస్తూ పోతుంది. ఇంటికి తిరిగి వచ్చే సరికి రాత్రవుతుంది.

ఈ విధంగా మనవణ్ని గుండెకు వేలాడదీసుకుని, జీవితాన్ని స్వీకరించింది ఆమె.  “నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా. నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరక ముందే చనిపోవటం నాకిష్టం లేదు” అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. ఆ పిల్లవాడు ఆమె వైపు చూస్తాడు. వాడు మాట్లాడుతుండగా ఎవరూ వినలేదు.  మూడడుగుల ఎత్తు కూడా లేకున్నా వాడు సూర్యోదయంకన్న ముందే లేచి, చంకలో ఇనుప తవ్వుడు కోలను పెట్టుకుని, పొలం లోకి పోయి పని చేస్తుంటే అప్పుడు సూర్యోదయమౌతుంది.

ముసలి రెమిజియా ఆశల్ని హృదయానికి హత్తుకుంటూ బతుకుతోంది. తన మొక్కజొన్న, చిక్కుడు పెరుగుతుంటే, దొడ్లో పందులు గురగురమని శబ్దం చేస్తుంటే ఆమె మనసుకు నిమ్మళంగా వుంటుంది. రాత్రి వేళల్లో కోళ్లు ఎగిరి చెట్ల కొమ్మల మీద కూర్చున్నప్పుడు  ఆమె తన గుడిసెలో వున్న కోళ్లను లెక్క పెడుతుంది. మధ్యమధ్య సొరకాయ బుర్రను కిందికి దింపి, రాగి నాణాల్ని లెక్క పెడుతుంది. అందులో అవి బాగా జమ అయ్యాయి. కొన్నాళ్ల తర్వాత అన్ని సైజుల సిల్వర్ నాణాలు కూడా జమ అయ్యాయి.

ఆమె వణికే చేతులతో నాణాలను ప్రేమగా నిమిరి, మనససులో ఒక స్వప్నాన్ని దర్శిం చింది. ఆ కలలో యుక్తవయస్కుడైన తన మనవడు మంచి గుర్రం మీద స్వారీ చేస్తూనో  లేక కౌంటరు వెనక రమ్ సీసాలనో, గుడ్డలనో, చక్కెరనో అమ్ముతూనో కనిపించాడు. ఆమె నవ్వి , నాణాల్ని తిరిగి సొరకాయ బుర్రలో వేసి, ఆ బుర్రను కొయ్యకు తగిలించి, గాఢనిద్రలో ఉన్న పిల్ల   వాని పైకి వంగింది.

అంతా సవ్యంగా జరిగిపోతోంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఎందుకు ఎలా అని తెలియ  కుండా కరువొచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆ పైన మూడు నెలలు. ఆమె గుడిసె ముందు నుంచి పోయే మగవాళ్లు పరామర్శ చేస్తూ  “వాతావరణం  భయంకరంగా వుంది రెమిజియా” అంటారు.

ఆమె నిశ్శబ్దంగా అంగీకరిస్తుంది. ఒక్కో సారి  “నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి” అంటుంది.

Akkadi MeghamFeatured

కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలి పోయింది. వసంత రుతువులు అడుగంటి పోయాయి. పందులు దొర్లే బురద ప్రదేశం ఎండి పోయి మట్టిబిళ్లలు తయారైనాయి. అప్పుడప్పుడు ఆకాశం మీద కొన్ని మబ్బులు కమ్ముతాయి.  దూరాన ఎండిపోయిన మందమైన గట్లు కనిపిస్తున్నాయి. కొండ మీది భాగం నుండి ఒక తేమ నిండిన గాలి వీచి, ధూళిమేఘాల్ని లేపింది.

తన గుడిసె ముందు నుండి పోయే మనుషులు  “ఈ రాత్రికి వర్షం వస్తుంది రెమిజియా” అంటూ నమ్మకమిచ్చారు.

“ఇన్నాళ్లకు వాన వస్తోంది” అన్నది ఒకామె.

“ఇక యీ రోజు వర్షం కురిసినట్టే” అన్నది ఒక నీగ్రో స్త్రీ.

ముసలి రెమిజియా పడక మీదికి పోయి, దేవుణ్ని ప్రార్థించింది. నరకం లోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని వాగ్దానం చేసి, నిరీక్షించింది. ఆమెకు కొండ శిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది. ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసే సరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా వుంది.

జనాలకు ధైర్యం సడలి పోయింది. అందరి ముఖాలూ వెల్ల వేసినట్టు తెల్లబడి పోయాయి. నేలను ముట్టుకుని చూస్తే అది వేడిమితో కాలిపోతోంది. చుట్టుపక్కల ప్రదేశాల్లోని నదులు, సెలయేళ్లు అన్నీ ఎండిపోతున్నాయి. కొండ చుట్టుపక్కల ఉన్న చెట్టూ చేమా అంతా మాడిపోయింది. పందులకు వేయటానికి మేత లేదు. చెట్ల మీది ఎండిన కాయల కోసం గాడిదలు తిరుగుతున్నాయి. పశువులు చిత్తడి నేలలకు తరలి పోయి, చెట్ల వేర్లను చప్పరిస్తున్నాయి. ఒక డబ్బా అంత నీళ్ల కోసం వెతుకుతూ పిల్లలు ఒక పూటంతా గడుపుతున్నారు. గింజల్ని, పురుగుల్ని దొరికించుకోవటానికి కోళ్లు అడవుల్లోకి వెళ్లి పోయాయి.

“ఇది ప్రళయం రెమిజియా, ప్రళయకాలం” అంటూ దుఃఖించారు ముసలి స్త్రీలు.

ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క , బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానునంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ , “దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా. ఈ వూరి మీద ఏ దుష్టశక్తిదో పాడు దృష్టి పడింది”  అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి, రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది.  వాటిని రొసెండోకు యిస్తూ, “నరకం లోని ఆత్మల కోసం నా పేరు మీద యీ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు” అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తల పైకెత్తి, ఆకాశాన్ని చాలా సేపు చూశాడు.

“నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం వుంటుంది” అన్నాడు.

“నేనిక్కడే వుంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే వుండి పోదు” అన్నది రెమిజియా.

రొసెండో వెనక్కి తిరిగాడు. తన భార్యాపిల్లలు చాలా దూరం వెళ్లిపోయారు.  దూరాన వున్న కొండలు సూర్యకాంతి మంట మీద వున్నట్టు అనిపించినయ్.

రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడి పోయాడు.“నానమ్మా!  ఒక పంది చచ్చిపోయినట్టుంది” అన్నాడు వాడు. రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది.  ముట్టెలు వడలిపోయి, తీగల్లాగా తయారయి, పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒక చోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే, చచ్చి పడి వున్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి వున్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక  అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.

సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమ రంగులో వున్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చే సరికి మధ్యాహ్నమైంది. మౌనంగా, మొండిగా,  అవిశ్రాంతంగా ఇదే ప్రణాళికను పాటించించింది. ఆమె నోటి నుండి ఒక్క ఫిర్యాదు మాట కూడా బయటికి రాలేదు. సొరకాయ బుర్ర బరువు తగ్గింది. అయినా నరకం లోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బులో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడిచి వెళ్లటం ప్రారంభించింది. నదికి పోయి రావటానికి ఆమెకు చాలా సమయం పట్టసాగింది. గుర్రం డొక్కలు కత్తి అంచుల్లాగా మొనదేలాయి. దాని మెడ యెంతగా సన్నబడి పోయిందంటే, అది తల భారాన్ని మోయలేని విధంగా తయారైంది. ఒక్కో సారి దాని ఎముకలు చేసే చప్పుడు వినపడింది.

జనాలు ఆ వూరిని వదిలి వెళ్లటం ఆగలేదు. ప్రతి రోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిద రంగుకు మారి, దాని మీద పగుళ్లు కనపడ సాగినై. ఒకటి రెండు ముళ్ల  జాతి మొక్కలు మాత్రమే పచ్చగా వున్నాయి. నదికి వెళ్లిన ప్రతిసారీ నీటి మట్టం అంతకు ముందు న్న దానికంటె తక్కువైపోసాగింది.  ఒక వారం తర్వాత, నీళ్లు ఎన్ని వున్నాయో అంతే బురద వుంది.  రెండు వారాల తర్వాత, నది అడుగు భాగం మెరిసే రాళ్లతో నిండిపోయి, పాత రోడ్డు లాగా తయారయింది. తినటానికి ఏదైనా దొరికించుకోవాలని గుర్రం ఎంతగానో నిరాశతో ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. ముసిరే ఈగల్ని అది తన తోకతో పారద్రోలుతోంది.

రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి, “నరకం లోని ఆత్మలారా! మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము” అని వేడుకుంది.

కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదే రోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు.  రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో  “మనం సెయింట్ ఇసిడోరోకు రుద్రాక్షల దండ చేయిద్దాం” అన్నది.

వాళ్లు ఒక ఆది వారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ని చేతుల్లో పెట్టుకుని నడుస్తోంది. జ్వరంతో బరువెక్కిన ఆ పిల్లవాని తల నాయనమ్మ బుజం మీద గుడ్డ పేలిక లాగా వాలిపోయింది. పదిహేను ఇరవై మంది పురుషులు, స్త్రీలు, ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు.  వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని, నడుమ నడుమ ఆగి, మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలుచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతీతో, పొడవుగా పెరిగిన గడ్డంతో ఆ వూరేగింపు మొదట్లో నడుస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తూ –

 

“సెయింట్ ఇసిడోరో, ఓ కర్షకుడా

సెయింట్ ఇసిడోరో, ఓ హాలికుడా

సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు

సెయింట్ ఇసిడోరో, ఓ కృషీవలుడా” అంటూ వేడుకుంటున్నాడు.

అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్ధిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు.  ఫెలిపె, ఇతరులు, ఇంకావేరే వాళ్లు, అందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించటానికి ఆమె వాళ్లందరికీ డబ్బు యిచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకునిపోయారు.  దుఃఖభారంతో వాళ్లు కుంగిపోయారు. రెమిజియా వాళ్లకు డబ్బులిచ్చింది, కొవ్వొత్తులు వెలిగించటం కోసం. గుడిసె గుమ్మం నుండి దూరాన వున్న కొండల దాకా నేల మీద అంతా మాయమై, ఖాళీగా వుంది. ఎండిన నేల తప్ప ఏ చెట్టూ చేమా లేదు. నీళ్లు ఆవిరైపోయి, పైకి తేలిన నదుల అడుగు భాగాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లే ముందు వృద్ధులు “దేవుడు యీ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు” అనుకున్నారు. యువకులు, పిల్లలు

అక్కడేదో దుష్ట శక్తి తన పాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.

రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా అయిపోయి, అంతటా ధూళి నిండింది.  ‘మానవుడి దుష్ట చేష్టల పట్ల దేవుడి శాపం ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తోది’ అనుకుంది. కాని దేవుడి శాపం కూడా ఆమె నమ్మకాన్ని నిర్వీర్యం చేయలేకపోయింది.

నరకం లోని ఒక మూలలో నడుముల దాకా వున్న మంటల్లో కాలుతూ,  ఆత్మలు పరిశుద్ధమౌతున్నాయి. భూమ్మీద వర్షాన్ని కురిపించి, జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం  విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముదుసలి స్త్రీ ఇలా అన్నది  “కారంబా!  పాసో హోండో అనే వూళ్ళో ముసలి రెమెజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లను వెచ్చించింది.   కాబట్టి అక్కడ వర్షం కురవాలి.”

ఆమె సహచరులు అప్రతిభులయ్యారు.

“రెండు డాలర్లా?  అయ్య బాబోయ్!”

మరొక ఆత్మ అన్నది ఇలా “ఆమెకు యింకా ఎందుకు సహాయం అందలేదు? మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా?”

“ఆమె కోరికను మనం మన్నించాలి” అని గర్జించింది మరొక ఆత్మ.

“పాసో హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి”

“అవును రెండు డాలర్లంత వర్షం, పాసో హోండోకు”

“పాసో హోండోకు వర్షం, రెండు డాలర్లంతది”

ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి. ఎంతో సంతుష్టి చెందాయి. ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అందులో సగం కోసం కూడా, మూడో వంతు కోసం కూడా ఎవ్వరూ ఆర్డరివ్వలేదు. రెండు సెంట్ల కొవ్వొత్తులకు ఇంతకు ముందొక సారి ఆ ఆత్మలు ఒక రాత్రంతా వర్షం కురిపించాయి. మరొకసారి ఇరవై సెంట్ల కొవ్వొత్తులకు ఒక చిన్న వరదనే ప్రసాదించాయి.

“రెండు డాలర్లంత వర్షం, పాసో హోండోకు” అని ఆ ఆత్మలన్నీ ఏక కంఠంతో గర్జించాయి.

అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షాన్ని కురిపించాలో తలుచుకునే సరికి నరకం లోని ఆ ఆత్మలన్నీ అదిరి పడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునే దాకా, ఇలా మంటల్లో కాలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.

పాసోహోండోలో ఒక ఉదయాన ఆకాశం నిండా మబ్బులు కమ్మినయ్. రెమిజియా తూర్పుదిక్కున వున్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు ఒక పలుచనైన నల్లని మేఘం కనిపించింది. అది శోకించే వాళ్లు ధరించే నల్ల పట్టీ లాగా, సన్నని తోలు దారం లాగా పలుచగా వుంది. ఒక గంట తర్వాత పెద్ద పెద్ద మేఘాల గుంపులు జమ కూడి, ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదల సాగినయ్. రెండు గంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి, రాత్రి అయిందా అనిపించింది.

తనకు కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వాడు ఎముకల గూడులా  చాలా బక్కగా వున్నాడు.  వాడి కళ్లు రెండు గుహల్లోపల నుండి బయటకు చూస్తున్నట్టు వున్నాయి.

పెద్ద ఉరుము ఉరిమింది. రెమిజియా గుమ్మం దగ్గరకు పరుగెత్తింది. దౌడు తీస్తున్న రేసు గుర్రంలా ఒక వర్షపు జల్లు కొండ వైపు నుండి గుడిసె దిశగా వస్తోంది. ఆమె తనకు తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలం చేసింది. చాలా కాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది.

వేగంగా కదులుతూ టపటపమనే చినుకులతో పాట పడుతున్నట్టుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పైకప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసెను దాటేసి, పొలాల మీద కురవటం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి , చిన్న వరద లాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సా  హంతో బయటికి పరుగెత్తింది.

“వర్షం వస్తుందని నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు” అంటూ బిగ్గరగా అరిచింది.

వర్షపు నీరు ఆమె తల మీద శబ్దంతో పడి, కణతల మీదుగా కిందికి జారుతూ  వెంట్రుకల్ని పూర్తిగా తడిపేసింది.

ఆకాశం వైపు చేతులు చాస్తూ  “వాన పడుతోంది… వర్షం కురుస్తోంది…     ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు” అంటూ కేరింతలు కొట్టింది.

ఆమె యింట్లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని, గుండెలకు హత్తుకుని, వాడికి వర్షాన్ని చూపించింది.

“తాగరా, తాగు, నీళ్లు తాగు. చూడు. ఈ నీళ్లను చూడు. ఇవిగో నీళ్లు” అన్నది వేగిరిపాటు కలిసిన ఆనందంతో. మనవడిలో చల్లని నీటి శక్తిని నింపాలనుకున్నట్టు వాణ్ని వూపి  గుండెలకు హత్తుకుంది.

బయట తుఫాను చెలరేగుతుంటే గుడిసె లోపల రెమిజియా కలలోకి జారి పోయింది.  ఆమె యిలా అనుకుంది. సాగు కోసం నేల తయారవగానే బంగాళా దుంపలు, వరి,  చిక్కుడు, మొక్కజొన్న నాటుతాను. విత్తనం కొనటానికి నా దగ్గర ఇంకా కొంత డబ్బు మిగిలింది.  పిల్లవాడు బాగవుతాడు. పాపం చాలా మంది వూరొదిలి వెళ్లిపోయారు. ఈ వర్షం గురించి విన్నప్పుడు టోరిబియో ముఖం యెలా వుంటుందో చూడాలనిపిస్తోంది నాకు. అందరం యెన్నో ప్రార్థనలు చేశాం కాని నేనొక్కదాన్నే లాభం పొందబోతున్నాను. వర్షం పడిందని తెలిస్తే వాళ్లంతా తిరిగి వస్తారనుకుంటాను.

ఆమె మనవడు నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాడు. పాసో హోండో లోని ఎండిపోయిన నదుల అడుగు భాగాల మీద మట్టి కలిసిన నీళ్లు ఉరకలెత్తినయ్. వర్షం ఇంకా బాగా పుంజుకో  లేదు గాని, బండరాళ్ల చుట్టూ తిరుగుతూ నీటి ప్రవాహాలు సుళ్లు తిరిగాయి. కొండ దిగువ భాగాన రేగడి మట్టి కలిసిన చిక్కని నీళ్లు ప్రవహించాయి. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది.  వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాల్ని దర్శించింది. విరగ కాసిన తన పంట చేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది. పచ్చని మొక్కజొన్న, వరి, చిక్కుళ్లు, ఉబ్బిన బంగాళా దుంపలు ఆమె కళ్ల ముందు నాట్యమాడాయి. చివరకు ఆమె గాఢనిద్ర లోకి జారిపోయింది.

బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం.

వారం రోజులు, పది రోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, ఉప్పు అన్నీ నిండుకున్నాయి. ఆహార పదార్థాల్ని కొనటానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున్న బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది. నదులు, సెలయేళ్లు, నీరు నిండిన చిత్తడి నేలలు, రోడ్లను కప్పేస్తూ మెల్లగా పొలాల్లో నిండుతూ ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయా అనిపించింది.

ఒక మధ్యాహ్నం వేళ పెద్ద కంచర గాడిద మీద పోతున్న ఒకతణ్ని ఆపి  “స్వామీ,  ఆగండి” అన్నది.

అతడు గుమ్మం దాకా వచ్చాడు. కంచర గాడిద తలను లోపలికి దూర్చింది.

“కిందికి దిగి లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది” అన్నదామె.

కంచర గాడిద బయటే వుండిపోయింది.

అతడు  “ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాన్ని వదిలి ఆ కొండమీదికి పోయే వాణ్ని” అన్నాడు.

“నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో ఆగి పోతుంది” అన్నదామె.

“చూడమ్మా, ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటివచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది” అన్నాడతడు.

“స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను” అన్నది రెమిజియా.

“కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ” అన్నాడు ఆ ఆసామి. మళ్లీ చేతితో వెనక్కి చూపుతూ “అక్కడంతా వరదతో నిండిపోయింది. పొద్దున్నుంచి మూడు గంటల పాటు  ప్రయాణం చేసి వచ్చాన్నేను. నా కంచర గాడిద పొట్ట వరకు నీళ్లు వచ్చాయి” అన్నాడు.

చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రి వేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది.  కాని అతడు వినలేదు. “పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా. నదులు గట్లను తెంపుకుని అంతా జలమయం అవుతుంది” అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి.

రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు.

ఆ ఆసామి చెప్పిందే నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్య ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది.  మురికి నీళ్లు సుళ్లు తిరుగుతూ, గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికి వచ్చి, నేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది.  రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పాసా హోండోను వెలుతురు మయం  చేసింది. కొండ వాలు మీంచి నీళ్లే నీళ్లు…. రహదారి నదిగా మారిపోయింది.

‘ఇది వరద కావచ్చునా’ రెమిజియాకు మొదటి సారిగా అనుమానం వచ్చింది.

కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న,  రాబోయే వర్షపు తీవ్రత కన్న, బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు. గుడిసె బయట ఎంత తడిగా వుందో లోపల కూడా అంతే తడిగా వుంది. పైకప్పు లోంచి కారుతున్న నీటి ధారల్ని తప్పించుకోవ  టానికి ప్రయత్నిస్తూ పిల్లవాడు ముణగదీసికున్నాడు.

ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచం లోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.

అబ్బ , ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకు వచ్చి, లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్ట నిపించింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా, కరుణించు” అంటూ యేడ్చింది. కాని యీ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు, నరకం లోని ఆత్మలు. అవి “ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే” అంటూ అరిచాయి.

ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపటం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాన్ని వదలి, తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని, నీళ్ల లోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది. ఎలాగో ఆమె గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. నీళ్లు ఆమె నడుము దాకా వచ్చినయ్. ఆమె అతి కష్టంగా మెల్లమెల్లగా ముందుకు నడిచింది. తను ఎక్కడికి పోతోందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకా ఇంకా పెరుగుతోంది.  తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో  నిలదొక్కుకుని  “మేరీ కన్యకా, మేరీ కన్యకా” అంటూ గట్టిగా యేడ్చింది.

ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి, దాన్ని జలమయమైన ఆ ప్రదేశం మీద పరిచింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా”

ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.

“ఇదంతా ముగిసింతర్వాత బంగాళా దుంపలు నాటుతాను” అనుకున్నదామె.

తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనపడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీ లోకి గుచ్చి పట్టింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా”

గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్టు పెద్ద ఉరుము ఉరిమింది.

ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనూ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకం లోని ఆత్మలు “ఈ వర్షం సరిపోదు. రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి” అంటూ ఉధృతంగా గర్జించాయి.

– ఖ్వాన్ బాష్

                                                 (Juan Bosch)

                                                             అనువాదం: ఎలనాగ

(సెప్టెంబర్ 2వ తేదీ వెలువడనున్న  ‘ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు’ అనే నా అనువాద కథల సంపుటిలోంచి-)

 

***

elanaga invitation

 

కాఫ్కా కథ: పల్లెటూరి డాక్టరు

53544-Franz+kafka+famous+quotes+3ఫ్రాంజ్ కాఫ్కా, జర్మను రచయిత

కాఫ్కా కథ- పల్లెటూరి డాక్టర్

 నేను చాలా చిక్కులోపడ్డాను. నేను అత్యవసరంగా ఒకచోటికి వెళ్ళాల్సి ఉంది. పదిమైళ్ళదూరంలోనున్న గ్రామంలో ఒక రోగి నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతనికి నాకూ మధ్యం ఒక తీవ్రమైన మంచుతుఫాను అడ్డంగా వచ్చింది. ఈ పల్లె రోడ్లమీద వెళ్ళడానికి అనువైన పెద్ద చక్రాల తేలికపాటి బండీ ఒకటి నా దగ్గరుంది. నా పరికరాలన్నీ పెట్టుకున్న బ్యాగ్ చేత్తోపట్టుకుని, ఉన్నికోటు వేసుకుని నేను సిద్ధంగా ఉన్నాను; కానీ అసలైంది ఇప్పుడు లేదు…. అదే గుర్రం.

నా గుర్రం నిన్నరాత్రి చచ్చిపోయింది…. ఈ హేమంతపు చలికి  బాగా అలిసిపోయి ఉండడం వల్ల. నా సేవకురాలు పాపం ఊరల్లా పరిగెడుతోంది ఎక్కడైనా గుర్రాన్ని ఎరువుతెచ్చుకుందికి వీలవుతుందేమో ప్రయత్నం చేద్దామని, కానీ నాకు తెలుసు, అది వృధాప్రయత్నం, దొరకదని. అందుకే నేను ఏమీ పాలుపోక నిలుచున్నాను అచేతనంగా, మీదనుండి మంచుకురుస్తూ వేళ్లడం ఇంకా కష్టం చేస్తున్నా. సేవకురాలు గేటుదగ్గర కనిపించింది, ఒంటరిగా. ఆమె చేతిలో లాంతరు ఊగుతున్నాది. అయినా ఇటువంటి వాతావరణంలో ఎవరుమాత్రం గుర్రాన్ని ఎరువు ఇవ్వగలరు ప్రయాణానికి?

నేను మరోసారి వాకిట్లో అటూ ఇటూ పచార్లుచేస్తున్నాను. నాకు మార్గాంతరం కనిపించడం లేదు. మనసువికలమై, బాధతో చాలరోజులబట్టీ వాడకుండా వదిలేసిన పాడుబడ్డ పందులదొడ్డి తలుపుని గట్టిగా ఒక తన్ను తన్నేను చికాగ్గా. దాని మడతబందులమీద అటూ ఇటూ కొట్టుకుంటూ ఒక్కసారిగా తెరుచుకుంది తలుపు. గుర్రాలనుండి వెలువడుతున్న వేడినిట్టూర్పులా ఒక వెచ్చని వాసన గుప్పుమని వచ్చింది. లోపల సాలలో తాడుకి ఊగుతూ లాంతరు మసకమసకగా వెలుగుతోంది. పాకలో ఒదుక్కుని కూచున్న ఒక నీలికళ్ళ మనిషి ముఖం కనిపించింది.

“నేను గుర్రాన్ని బండికి కట్టేదా?” అని చేతులమీద కాళ్లమీదా పాకుకుంటూ వచ్చి అడిగేడు.

నాకు ఏంచెప్పాలో తెలియక వంగిచూసేను పాకలో ఎముందోనని. సేవకురాలు నా పక్కనే నిలుచుంది. “మనింట్లో ఏం వస్తువులు దాచేమో మనకే తెలీదు,” అంది. దానికి ఇద్దరికీ నవ్వొచ్చింది.

“తప్పుకొండి, తప్పుకొండి” అంటూ గుర్రపువాడు ఒక గావుకేక వేశాడు. రెండుగుర్రాలు, కండదేరిన పిక్కలతో, ఒకదాని వెంట ఒకటి తోసుకుంటూ బయటకి వచ్చేయి… కాళ్లు శరీరానికి దగ్గరగా ముడుచుకుని, ఒంటెల్లా తలలు దించుకుని ఆ ఇరుకైన తలుపుసందులోంచి తమ వెనకభాగాన్ని గట్టిగా విదిలించుకుని బయటపడ్డాయి. బయటకి రావడమే తడవు, నిలువుగా నిల్చున్నాయి… పొడవైన కాళ్లతో, నిగనిగ మెరుస్తున్న శరీరాలతో.

“అతనికి సాయం చెయ్యి,” అన్నాను ఆ పిల్లతో.

వెంటనే ఆ పిల్ల బండీ పగ్గాలు గుర్రంవాడికి ఇవ్వడానికి వినయంగా పరిగెత్తింది. కాని ఆ పిల్ల అతని పక్కన చేరగానే అతను ఆమెమీద చేతులువేసి తన ముఖాన్ని ఆమె ముఖానికి ఆనించ బోయాడు. దానితో ఆమె ఒక్కసారిగా కేకవేసుకుంటూ నాపక్కకి చేరింది.

“మూర్ఖుడా,” అని కోపంతో అతని మీద అరిచేను, ‘నీకు కొరడా దెబ్బలు కావాలా?” అంటూ.

కాని నాకు వెంటనే గుర్తొచ్చింది… అతను నా సేవకుడు కాదనీ, ఎవడో పరాయివాడనీ; అత నెక్కడినుంచి వచ్చేడో తెలీదు సరిగదా ఇంకెవ్వరూ సాయంచెయ్యడానికి పూనుకోకపోతే తనకుతానుగా వచ్చి నాకు సహాయం చేస్తున్నాడనీని.

నా మనసులో మాట పసిగట్టినట్టు అతను నా బెదిరింపుని తప్పుగా తీసుకోలేదు. గుర్రాలపని చూస్తూనే నా వైపు తిరిగి, “లోపలికి ఎక్కండి,” అన్నాడు. నిజానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేను మునుపెన్నడూ అంత చూడముచ్చటైన గుర్రాలతో ప్రయాణం చేసినట్టు గుర్తులేదు. అందుకని సంతోషంగా అందులో కూచున్నాను.

“నేను పగ్గాలు పట్టుకుంటాను నీకు తోవ తెలీదు,” అన్నాను.

“ఆ మాటకొస్తే నేను మీతో రావడం లేదు, నేను రోజాతో ఉంటా,” అన్నాడు.

“నో…” అంటూ ఇంట్లోకి పరిగెత్తింది రోజా రాబోయే ప్రమాదాన్ని సరిగ్గా గుర్తించి. ఆమె తలుపు సరిగ్గా గడియపెడుతుండగా లోపలి గొలుసు చప్పుడు విన్నాను. తలుపు క్లిక్ మని చప్పుడవడం కూడా విన్నాను. తన ఆనవాలు తెలీకుండా ఉండడానికి లైట్లార్పుతూ వసారాలోంచీ, అన్నిగదుల్లోంచీ పరిగెత్తడం కనిపిస్తోంది.

“నువ్వు నాతో వస్తున్నావు,” అని గట్టిగా గద్దించేను గుర్రంవాడిని, “లేకపోతే నా పని ఎంత అవసరమైనదైనా దాని పర్యవసానంతో నిమిత్తంలేకుండా వెళ్ళడం మానుకుంటాను. నా ప్రయాణానికి మూల్యంగా ఆ పిల్లని నీకు ఇవ్వడం నాకు అభిమతం కాదు.” అన్నాను.

రెండుచేతులతో చప్పట్లుకొట్టి గుర్రాలకి సంకేతం ఇచ్చేడు గుర్రంవాడు, “పరిగెత్తండి” అంటూ. ప్రవాహంలో ముక్కలైన కర్రచెక్కలా, బండి ముక్కముక్కలైపోయింది. ఆ గుర్రపువాడి తన్నులకి నా ఇంటితలుపు ఎలా ముక్కచెక్కలవుతోందో వినిపిస్తోంది. తర్వాత నా చెవులు వినిపించకుండా కళ్ళు కనిపించకుండా ఫెళఫెళమని పెద్దశబ్దం అయింది. అంతే నా ఇంద్రియాలేవీ పనిచెయ్యలేదు.

అంతా ఒక్క క్షణం పాటే. ఏదో మా వాకిలి తలుపు తీస్తే ఆ రోగి ఇల్లు ఉన్నట్టు, నేనక్కడ ప్రత్యక్షమయాను. గుర్రాలు ప్రశాంతంగా నిల్చున్నాయి. మంచుకురవడం ఆగిపోయింది. ఎటుచూసినా వెన్నెల. రోగి తల్లిదండ్రులు లోపలనుండి బయటకి పరిగెత్తుకు వచ్చేరు. అతని అప్పచెల్లెలు వాళ్ల వెనకే వచ్చింది. వాళ్ళు నన్ను బండిలోంచి అమాంత ఎత్తినంతపని చేసేరు. వాళ్ళు ఏమిటి గొణుగుతున్నారో నాకు అర్థం కాలేదు.

రోగిగదిలో గుండెనిండా ఊపిరి తీసుకోవడం ఎవరికైనా కష్టం. ఆపడం మరిచిపోయిన వంటపొయ్యి నుండి పొగలు వస్తున్నాయి. నాకు కిటికీతలుపులు తెరవాలనిపించింది, కానీ ముందు రోగి సంగతి చూద్దామనుకున్నాను. జ్వరంలేదు. అలాఅని చల్లగా కాకుండా, అలాఅని వెచ్చగా కాకుండా చిక్కిన శరీరంతో, ఒంటిమీద చొక్కా లేకుండా, కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. పరుపుమీంచి తననుతాను లేవదీసుకుని, నా మెడచుట్టూ చేతులువేసి వేలాడుతూ, నా చెవుల్లో గొణుగుతున్నాడు: “డాక్టర్! నన్ను చావనివ్వండి.”

నేను చుట్టూ చూశాను. ఎవరూ విన్నట్టులేదు. తల్లిదండ్రులు ముందుకు ఒంగుని తీర్పుకి ఎదురుచూస్తున్నట్టు మౌనంగా నిల్చున్నారు. అతని సోదరి నా బాగ్ ని ఉంచడానికి ఒక చౌకాలి(స్టూలు)బల్ల తెచ్చింది. బాగ్ తెరిచి కావలసిన పరికరాలకోసం వెదుక్కుంటున్నాను.

ఆ కుర్రాడు మాటిమాటికీ నన్ను తడుముతున్నాడు అతని అభ్యర్థనని గుర్తుచెయ్యడానికి. కొవ్వొత్తి వెలుగులో శ్రావణం తీసి పరీక్షించి మళ్ళీ లోపల పెట్టేశాను. “అవును, అందుకేగదా ఇలాంటి సందర్భాల్లో దైవం అన్నీ సానుకూలం చేసిపెడతాడు. ఉన్న ఒక గుర్రం చచ్చిపోయిందని బాధపడుతుంటే, మరొకటి పంపడమే గాక, రెండోదికూడా జతచేస్తాడు అత్యవసరం కాబట్టి; అంతేకాదు బహుమానంగా గుర్రంతోలేవాడినికూడా తోడు ఇస్తాడు,” అని అన్నాను రోగితో పరుషంగా.

ఎందుకో మొదటిసారి రోజా గుర్తుకొచ్చింది.  ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ పిల్లని ఎలా రక్షించడం? అదుపుచెయ్యలేని గుర్రాలని నా బగ్గీ ముందుంచుకుని, పదిమైళ్ళదూరంలో ఉన్న ఆ పిల్లని ఆ గుర్రపుబండీవాడినుండి ఎలా రక్షించడం?

కళ్ళేలు ఎలాగో విదుల్చుకోగలిగిన గుర్రాలు బయటనుండి కిటికీ తలుపులు తెరుస్తున్నాయి. ఇంట్లోవాళ్ళ ఏడుపులు లక్ష్యపెట్టకుండా గుర్రాలురెండూ తమ తలలు కిటికీలోంచి లోపలకి దూరుస్తూ రోగిని గమనిస్తున్నాయి. ఆ గుర్రాలేవో నన్ను వెనక్కి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నట్టు, “అలా అయితే నే వెనక్కి వెళిపోతాను,” అన్నాను. నేను ఆ గదిలో ఉన్న వేడివల్ల నేనలా మాటాడుతున్నాననుకుంది అతని సోదరి. ఆమె మర్యాదపూర్వకంగా నా ఉన్నికోటు తియ్యబోతే తియ్యనిచ్చాను.

నా కోసం ఒక గ్లాసుడు Rum సిద్ధం చేసి ఉంచారు. ఆ ముసలాయన నా భుజం తట్టేడు; అతని సర్వస్వమూ నాకివ్వడం అతనికి ఆ చనువునిచ్చింది. నేను “వద్ద”న్నట్టు తల అడ్డంగా ఊపాను.  ఆ ముసలాయన  సంకుచితమైన ఆలోచనా పరిథిలో నాకు వంట్లో బాగులేదు… కారణం, నాకు ఇవ్వజూపిన డ్రింకు తాగడానికి తిరస్కరించడమే. తల్లి రోగిమంచంపక్క నిలబడి నన్ను బతిమాలుతోంది. లోచూరుని చూస్తూ గుర్రం ఒకటి గట్టిగా శకిలించింది.

అటు వెళ్లి, రోగిగుండెమీద నా చెవిఆన్చి వినబోతుంటే, నా తడిగడ్డంకింద అతనిగుండె వణుకుతోంది. అది నాకు తెలిసిన విషయమే రూఢిచేసింది: ఆ యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కాకపోతే, అతని నాడి కొంచెం క్రమంతప్పింది, అతని తల్లి గారాబంగా ఇచ్చిన కాఫీ అస్తమానం తాగి తాగి. ఆరోగ్యంగాఉన్న అతన్ని పక్కమీంచి ఒక ఊపు ఊపి తోసెయ్యడమే మంచిది. కానీ నాకెందుకు. నేనేం ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకోలేదు… ఆ కుర్రాడు అలా పడుక్కుంటే అక్కడ పడుక్కోనీ. ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చింది దానికి పూర్తి న్యాయం చేస్తాను; ఎంతగా అంటే, అది వాళ్ళు నాకు చాదస్తం అనుకునేంతగా. జీతం అరకొరగా ఇచ్చినా సరే, నేను ఉదారంగానే ప్రవర్తించి పేదలకి చాతనైనంత సహాయం చేస్తాను. నే నింకా రోజాని సంరక్షించాల్సి ఉంది, తర్వాత కావలస్తే ఈ యువకుడి కోరిక తీర్చొచ్చు; తర్వాత నాకుకూడా చనిపోవాలనిపించవచ్చు.

అంతుపట్టని ఈ చలికాలంలో ఇక్కడ నేనేమి చేస్తున్నట్టు? నా గుర్రమా చనిపోయింది,  గ్రామంలో తమ గుర్రాన్ని నాకు ఎరువిచ్చేవారు ఒక్కరూ కనిపించలేదు. నేను ఆ జట్టుని పందులదొడ్లోంచి బయటకి లాక్కురావలసి వచ్చింది.  అవి అవి గుర్రాలయి ఉండకపోయి పందులయినా, వాటితోనైనా నేను ప్రయాణించవలసి వచ్చేదే. ఆది అంతే. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించేను. వాళ్ళకి అది చాలు. నేనెలా రాగలిగేనన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఒక వేళ తెలిసినా నమ్మరు. సందర్భం వచ్చింది కనక చెబుతున్నాను: ప్రజలతో అవగాహనకి రావడంకంటే మందుచీటీలు రాసుకోవడమే తేలిక.

ఇంతటితో వైద్యుడిగా నా రాకపోకలు ముగియాల్సిందే, కానీ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు అనవసరంగా. నాకిది అలవాటే. నా ఇంటిముందున్న గంట మోగిస్తూ ఈ ప్రాంతం అంతా నన్ను ఇలా వేధిస్తూనే ఉంటుంది. కాకపోతే, ఈ సారి నేను రోజాని విడిచి రావలసి వచ్చింది. ఎంత అందమైన పిల్ల! ఏడాది పొడవునా నా ఇంట్లో ఉంటున్నా నేనెన్నడూ గమనించనే లేదు. ఆమెనలా విడిచిపెట్టి రావడం మరీ బాధగా ఉంది.

ఎలాగోలా నాకు నేను సర్ది చెప్పుకోవాలి; ఈ కుటుంబం వాళ్ళు ఎంతగా అనుకున్నా, తిరిగి ఆమెని నాకు ఇవ్వలేరు కదా!  నేను నా బాగు మూసి ఉన్నికోటుగురించి అడుగుతుంటే, ఆ కుటుంబం అంతా ఎదురుగా నిలబడింది… చేతిలోనున్న గ్లాసుడు rum వాసన చూస్తూ తండ్రీ,… నాదగ్గరనుండి ఇంతకంటే ఏమిటి అభిలషిస్తున్నారో తెలీదు గాని… బహుశా నా సేవకి నిరుత్సాహపడుతూ తన పెదాలుకొరుక్కుంటూ తల్లీ, రక్తసిక్తమైన తువ్వాలుతో రోగికి విసురుతూ సోదరీ. ఇవన్నీ చూస్తుంటే, ఆ యువకుడు అలా ఆరోగ్యంగా  కనిపిస్తున్నప్పటికీ, బహుశా, నిజంగా  అనారోగ్యంగా ఉన్నాడని ఒప్పుకోవాలనిపిస్తోంది.

నే నతని దగ్గరకి వెళ్ళేను. అతను నన్ను చూసి నవ్వేడు… అతనికి నేనేదో జవసత్వాలందించే ఔషధాన్ని తీసుకొచ్చినట్టు… నేను ఇప్పుడు పరీక్షిస్తుంటే, ఆ యువకుడు నిజంగానే అస్వస్థతగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కుడివైపు తుంటిదగ్గర అరిచేయంత మందంలో ఒక పచ్చిగాయం కనిపిస్తోంది… ఎర్రగా, వేర్వేరు ఛాయల్లో… లోతుగా ఉన్నచోట ఎర్రగా, అంచులదగ్గర ముదురురంగులో, లేతరంగులో రక్తపుజీరలు అక్కడక్కడ కనిపిస్తూ. దానిమీద వెలుగు కేంద్రీకరించినపుడు ఒక తవ్వుతూ తవ్వుతూ ఉన్న గనిలా ఉంది. దూరంనుంచి చూస్తుంటే అలా కనిపిస్తోంది కాని దగ్గరనుండి చూస్తుంటే అందులోని ఉపద్రవం స్పష్టంగా తెలుస్తోంది… అది చూస్తూ ‘అమ్మో’ అని అనకుండా ఎవరు ఉండగలరు? అక్కడ క్రిములు… ఒక్కొక్కటీ నా చిటికినవేలంత… తెల్లగా ఉన్నవి రక్తం తాగి తాగి ఎర్రబడి, అటూ ఇటూ దొర్లుతున్నాయి. దీపం వేసినపుడు గాయంలోపల తమపట్టునుండి వేలాడుతూ కనిపిస్తున్నాయి. పాపం కుర్రాడా! నీ గాయం అయితే కనుక్కోగలిగేను గాని నీకు నేను చేయగల సాయం ఏమీ లేదు. నువ్వు ఈ కురుపుతోనే మరణించబోతున్నావు.

ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది… నేను ఏదో ఒకటి చెయ్యడం చూసి. అతని సోదరి వాళ్లమ్మతో ఆ విషయమే చెబుతుంటే, ఆమె అతని తండ్రితో చెబుతోంది, అతను తెరిచిఉన్న తలుపులోంచి, చేతులుజాచుకుని మీగాళ్ళమీదనడుస్తూ తమని తాము నిలువరించుకుంటూ వెన్నెట్లోంచి వస్తున్న అతిథులకి చెబుతున్నాడు. “నన్ను ఎలాగైనా బ్రతికించండి?” అని ఆ కుర్రాడు వెక్కివెక్కి ఏడుస్తూ అస్పష్టంగా గొణుగుతున్నాడు, గాయంలోపల క్రిములు పెట్టే సలుపు కళ్ళుమూసుకుని భరిస్తూ.

మా ప్రాంతంలో ప్రజలతీరే అంత. ఎప్పుడూ వైద్యుడుదగ్గరనుండి అసంభవమైనవి ఆశిస్తుంటారు. వాళ్ళకి పూర్వంఉన్న విశ్వాసం పోయింది. మతాధికారి ఇంటిదగ్గర కూచుని, ఒకదాని వెనక ఒకటిగా తన దుస్తుల్ని పీలికలుగా చించేస్తున్నాడు. అతనిదగ్గరనుండి విశ్వాసాన్ని ఆశించరు. కాని వైద్యుడు దగ్గరకి  వచ్చేసరికి మాత్రం, అతను తన శస్త్రచికిత్సా నైపుణ్యంతో అన్నీ సాధించాలి. సరే, అది వాళ్ళ ఆలోచనా సరళి. నేనేమీ చేస్తానని హామీ ఇవ్వలేదుగదా. వాళ్ళు మతసంబంధమైన పనులకి వినియోగించుకుంటే, నేను దానికీ ఊ కొడతాను. సేవకురాలిని పోగొట్టుకున్న ముసలి పల్లెటూరి వైద్యుడు అంతకంటే ఏమిటి చెయ్యగలడు?

అంతలో ఆ ఊరి పెద్దలూ, కుటుంబసభ్యులూ వచ్చి నా దుస్తుల్ని ఊడదీస్తున్నారు. స్కూలుపిల్లల వాద్యబృందం ఒకటి వాళ్ళ టీచరు అజమాయిషీలో వచ్చి ఇంటి గుమ్మం ముందు నిలబడి పాడుతున్నారు ఇలా:

“అతని దుస్తులు తీసేయండి అతనే రోగం నయం చేస్తాడు,

అలా రోగం నయం చెయ్యకపోతే, అతని రోగం కుదర్చండి

ఎంతైనా వైద్యుడు,  ఎంతైనా వైద్యుడు కదా!”

 

అంతే! అలా అంటూ వాళ్ళు నా దుస్తులు ఊడదీసేరు. నేను నా వేళ్ళు గడ్డంలో పెట్టుకుని, ముఖం ఒక పక్కకితిప్పి అలా మనుషులవంక చూస్తున్నాను. నేను ప్రశాంతంగా, స్పష్టమైన అవగాహనతో అలా నిలుచున్నాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేకపోయింది. వాళ్ళు నా తలా, కాళ్లూ పట్టుకుని పక్కమీదకి ఈడ్చుకెళుతున్నారు. రోగిగాయంఉన్నవైపు గోడకి నన్ను నిలబెట్టారు. తర్వాత అందరూ గదిలోంచి బయటకి వెళ్ళి తలుపుగడియపెట్టారు. పాట ఆగిపోయింది. చంద్రుణ్ణి మేఘాలు ముసురుకున్నై. పక్కమీది దుప్పట్లు వెచ్చగా నన్ను కమ్ముకున్నై. కిటికీపక్కన ఆరుబయట గుర్రాల ముఖాలు నీడల్లా కదుల్తున్నాయి.

“నీకు తెలుసా?” ఎవరో నా చెవిలో చెబుతున్నారు, “నీ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. నీ అంత నువ్వు ఇక్కడకి నడుచుకు రాలేదు. ఎక్కడినుండో నిన్నెత్తుకు వచ్చేరు. నాకు సాయంచెయ్యడానికి బదులు, నా మరణశయ్యని ఇంకా ఇరుకు చేస్తున్నావు. ఇప్పుడు నేను చెయ్యగల మంచిపని ఏదైనా ఉందంటే అది నీ కళ్ళు పీకెయ్యడమే.”

“అవమానం. నేనొక వైద్యుణ్ణి. నే నేమిటి చెయ్యాలిప్పుడు? నా మాట నమ్ము. నే నేమీ సుఖపడిపోవడం లేదు,” అన్నాను.

“ఈ సంజాయిషీకి నేను సంతృప్తి పడలా? బహుశా సంతృప్తి పడాలేమో. నే నెప్పుడూ సర్దుకుపోవలసి వస్తోంది. నే నీ లోకంలోకి రావడమే ఈ గాయంతో వచ్చేను. నాకున్న ఆభరణం అదొక్కటే”

“యువమిత్రమా!” నేను చెప్పడం ప్రారంభించేను, “నీకున్న లోపమల్లా నీకంటూ ఒక స్వంత అభిప్రాయం అంటూ లేకపోవడం. నేను దేశమల్లా తిరిగి చాలమంది రోగుల్ని చూసేను. నీ గాయం అంత ప్రమాదకరమైనదేమీ కాదు. అది తుంటికి ఒక పక్కకి రెండుసార్లు గొడ్డలి పడడం వల్ల తగిలిన గాయం. చాలా మందికి అడవిలో గొడ్డలి చప్పుడు వినిపించడం  కష్టం. అది అంతదగ్గరగా గొడ్డలి వచ్చిందంటే, ఎవరైనా ముందు వళ్లు ఇచ్చెస్తారు.”

“నిజంగానా? లేదా నేను జ్వరంగా ఉన్నానని నన్ను మభ్యపెడుతున్నావా?”

“నిజమే. నామాట నమ్మొచ్చు. ఒక వైద్యుడిగా నా వృత్తిమీద ఒట్టువేసి చెబుతున్నా.”

అతను నా మాట నమ్మి మారుమాటాడలేదు.

ఇప్పుడు నేను ఇక్కడినుంచి ఎలాబయటపడాలో ఆలోచించవలసిన సమయం వచ్చింది.  గుర్రాలు నమ్మకంగా ఉండవలసినచోట కదలకుండా ఉన్నాయి. నా దుస్తుల్నీ, ఉన్నికోటునీ, బాగునీ చకచకా ఒకచోట కట్టగట్టేను. బట్టలు వేసుకోడానికిపట్టే సమయంకూడా వృధాచెయ్యదలుచుకోలేదు. ఇంతకుముందు వచ్చిన వేగంతోనే గుర్రాలుగనక దౌడుతీస్తే నేరుగా నేను ఇక్కడనుండి నా పక్కమీదకే గెంతగలుగుతాను.

ఒక గుర్రం కిటికీ పక్కనుండి వెనక్కి తగ్గింది వినయంగా.  నేను ఈ కట్టనంతటినీ బండిలోకి విసిరేసేను. ఉన్నికోటు మరీదూరంపోయి ఒకకొక్కేనికి దాని చెయ్యితగులుకుని వేలాడుతోంది. మంచిదే. నేను గుర్రంమీదకి దూకేను. కళ్ళేలు వదులుగా వేలాడంతో గుర్రాలు రెండూ సరిగా బండికి పూన్చబడలేదు. దాంతో బగ్గీ వెనక ఊగుతోంది. అన్నిటికంటే చివర, మంచులో ఉన్నికోటు ఎగురుతోంది.

గుర్రాలని చూస్తూ “పరిగెత్తండి” చప్పట్లుకొడుతూ గుర్రంబండీవాడిలా అన్నాన్నేను. కానీ అవేమీ పరిగెత్తడం లేదు. ముసలివాళ్లలా మంచులో కాళ్ళీడ్చుకుంటూ నడక ప్రారంభించేం.  చాలసేపు ఆ పిల్లవాళ్ళు పాడిన పాటే అస్పష్టంగా నా వెనక రింగు మంటోంది.

“రోగులారా మీరు నిశ్చింతగా ఉండండి

వైద్యుడుకూడ మీతోనే పక్కమీద పడుకున్నాడు.”

ఈ వేగంతో వెళితే నే నెప్పటికీ ఇల్లుచేరుకునేట్టు కనిపించడం లేదు.  తిరుగులేని నా ప్రాక్టీసు, మందగిస్తుంది. నా వెనకే వైద్యం ప్రారంభించినవాడు నొర్లుకుంటాడు. అయినా ఏం లాభం లేదు. అతడు నన్ను అధిగమించలేడు. చిరాకు తెప్పిస్తున్న ఆ గుర్రపువాడు ఇంట్లో పెద్ద ఉపద్రవం సృష్టిస్తూ ఉండి ఉంటాడు. రోజా అతనికి బలయిపోయి ఉండి ఉంటుంది. ఇక నేను దానిగురించి ఆలోచించను. నగ్నంగా, ఈ వయసులో గడ్డమంచుకి దొరికిపోయి, చాలా సాధారణమైన బండీ, గుర్రాలతో, ముసలాణ్ణి ఒక్కణ్ణీ అలా తోలుకుంటూ పోవలసి వస్తోంది.  నా ఉన్నికోటు బండికి వేలాడుతోంది నాకు అందనంత దూరంలో. ఇంత చురుకైన రోగుల్లో ఒక్క నీచుడూ అయ్యో అనడు. అంతా మోసం! దగా! ఒకసారి రాత్రిపూట తప్పుగా మోగిన గంటకి స్పందిస్తే పరిణామాలిలాగే ఉంటాయి. వాటిని చక్కదిద్దుకోవడం జరగదు … ఎన్నటికీ .

murthy gaaruఅనుసృజన : నౌడూరి మూర్తి

ఆల్బర్ట్ కామూ కథ … అతిథి

camus

 

సెరెన్‌ కీర్కెగార్డ్‌ (1813-55) అనే డేనిష్‌ తత్త్వవేత్త రచనలు ఆధారంగా ప్రారంభమైన  ఒక తాత్త్విక సిద్ధాంతం, నేడు “అస్తిత్వవాదం”గా ప్రచారంలో ఉంది. జర్మన్‌ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!)(Friedrich Nietzsche), ఫ్రెంచి తత్త్వవేత్త జఁపాల్‌ సార్‌ట్రె (Jean Paul Sartre) ఈ వాదాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. కీర్కెగార్డ్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి తనజీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుని, అటువంటి జీవితాన్ని నిజాయితీగానూ, నిష్టగానూ జీవించడంలో సమాజానికీ, మతానికీ ఏమీ సంబంధంలేదు, అలాజీవించడంలో వ్యక్తికి పూర్తి  స్వేచ్ఛ ఉంది. “Existence Precedes essence” అంటే, అన్నిటికంటే ముందు వ్యక్తి … స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని కార్యాచరణ చెయ్యగలిగిన జీవి… ఆ తర్వాతే అతనికున్న బహురూపాలు, సిద్ధాంతాలూ, నమ్మకాలూ, విశ్వాసాలూ… అన్నది ఈ సిద్ధాంతపు మూల భావన. ఒకే సమాజంలో ఉన్నా, ఒకే మతంలో ఉన్నా, ప్రతివ్యక్తికీ తనవంటూ కొన్ని మౌలికమైన విశ్వాసాలూ, నైతికభావనలూ ఉంటాయి. అవే అతను సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు  నిర్ణయం తీసుకుందికి సహకరించి నడిపిస్తాయి.    
 
ఆ తాత్త్విక భావనకు అనుగుణంగా వ్రాసిన కథ ఆల్బర్ట్ కామూ “అతిథి” అని చాలా మంది విశ్లేషిస్తారు. మూలభాషలో వాడిన పదానికి అతిథి (ఇక్కడ అరబ్బు), అతిథేయి( దారూ) అని రెండర్థాలు ఉన్నాయి. ఒక రకంగా ఈ కథలో దారూ పాత్ర, కామూకి ప్రతిబింబమే. జీవితంలో ఎంచుకోడానికి ఎప్పుడూ అవకాశాలుంటాయి. లేనిదల్లా ఎంపిక చేసుకోనక్కరలేకుండా ఉండగలగడం. (All that is  missing is the independence not to choose anything.) ఎందుకంటే, మనిషి ఎప్పుడూ “you are damned if you do; you are damned if you don’t do” పరిస్థితులలోనే చిక్కుకుంటాడు. ఈ కథలో దారూ, అరబ్బూ అటువంటి పరిస్థితిలో వాళ్ళనిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలపై ఎలా ఆధారపడి ఉన్నాయో ఇందులో గమనించ వచ్చు. 

 
ఆల్బెర్ట్ కామూ (7 నవంబరు 1913 – 4 జనవరి 1960) ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెలు బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. అతను “The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని “వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, నిహిలిజాన్ని వ్యతిరేకించడానికే సరిపోయింది”. (నిహిలిజం తార్కికంగా  జీవితానికి ఏదో ఒక గమ్యం,లక్ష్యం ఉన్నాయన్న ప్రతిపాదనని ఖండిస్తుంది). టెక్నాలజీని ఆరాథనాభావంతో  చూడడానికి అతను పూర్తి వ్యతిరేకి. అతనికి ఏ రకమైన తాత్త్విక ముద్రలూ ఇష్టం లేదు…. ముఖ్యంగా ఎగ్జిస్టెన్షియలిస్టు అన్న పదం.  

—————————————————————————————————————————————————————————-

స్కూలు మాస్టరు వాళ్ళిద్దరూ కొండ ఎక్కుతూ తనవైపు రావడం గమనించాడు. ఒకరు గుర్రం మీద ఇంకొకరు నడిచి వస్తున్నారు. కొండవాలులో కట్టిన ఈ స్కూలుభవనం చేరడానికి అకస్మాత్తుగా ఎక్కవలసిన మిట్ట దగ్గరకి వాళ్ళింకా చేరుకోలేదు. ఎత్తుగా విశాలంగాఉన్న ఈ ఎడారివంటి మైదానంమీద మంచుతోనూ, రాళ్లతోనూ నిండిన త్రోవలో శ్రమిస్తూ నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఉండిఉండి ఆ గుర్రం అడుగులు తడబడుతోంది. చప్పుడు వినపడకపొయినప్పటికీ తను దాని ముక్కురంధ్రాలగుండా వస్తున్న బరువైన పొగలుకక్కుతున్న ఊపిరులని చూడగలుగుతున్నాడు.  ఆ ఇద్దరిలో కనీసం ఒక్కడికైనా ఈ ప్రాంతం బాగా పరిచయమే అని తెలుస్తోంది. ఎందుకంటే మురికి తేరిన   మంచుపొరల క్రింద ఎన్నో రోజుల క్రిందటే కప్పడిపోయిన త్రోవని వాళ్ళు సరిగానే గుర్తించగలుగుతున్నారు. స్కూలుమాస్టరు వాళ్లకి కొండ ఎక్కడానికి కనీసం అరగంట పడుతుందని అంచనా వేసుకున్నాడు. చాలా చలిగా ఉంది. అందుకని స్వెట్టరు తెచ్చుకుందికి వెనక్కి స్కూల్లోకి వెళ్ళేడు.

2

అతను ఖాళీగా, చల్లగా ఉన్న తరగతిగది దాటేడు. గత మూడురోజులబట్టీ, బ్లాక్ బోర్డు మీద నాలుగు రంగుసుద్దలతో గీసిన ప్రాన్సుదేశపు నాలుగునదులూ తమ సంగమస్థలాలకి పరిగెడుతూనే ఉన్నాయి. వర్షం ఎత్తిగట్టేసిన ఎనిమిదినెలల అనావృష్టితర్వాత, అక్టోబరునెల మధ్యలో వర్షాకాలం లేకుండా ఒక్కసారిగా మంచు కురవడం ప్రారంభించింది. దానితో ఈ మైదానప్రాంతంలో చెల్లాచెదరుగాఉన్న గ్రామాల్లోంచి రావలసిన ఆ ఇరవైమంది విద్యార్థులు బడికి రావడం మానేశారు. మళ్ళీ వాతావరణం మెరుగయ్యాకే వాళ్ళు స్కూలుకి వచ్చేది. అందుకని తరగతిగదిని ఆనుకుని తూర్పువైపు మైదానానికి తెరుచుకునే తను కాపురముంటున్న గదినే ‘దారూ’ వెచ్చగా ఉంచుకుంటున్నాడు. తరగతిగది కిటికీల్లాగే తన గది కిటికీ కూడా దక్షిణం వైపుకే తెరుచుకుని ఉంటుంది. అటువైపు నుండి చూస్తే స్కూలు భవనం … మైదానం దక్షిణానికి ఒరిగినట్టు కనిపించే చోటునుండి కొద్ది కిలోమీటర్ల దూరమే. నిర్మలమైన వాతావరణంలో ఊదారంగు పర్వతశ్రేణి మధ్య ఖాళీ … ఎడారి దిక్కు చూస్తూ కనిపిస్తుంది.

3

కొంచెం ఒళ్ళు వెచ్చబడనిచ్చి దారూ మొదటిసారి తను ఇద్దరినీ గమనించిన కిటికీ దగ్గరకి వచ్చి నిలుచున్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఆ మిట్ట  ఎక్కినట్టే. మంచుకురవడం రాత్రే ఆగిపోవడంతో, ఆకాశం మరీ అంత చీకటిగా లేదు. మేఘాల తెరలు తొలగడం ప్రారంభించడంతో ఉదయం చీకటిగా ప్రారంభమయినా మధ్యాహ్నం రెండుగంటలయేసరికి, రోజు అప్పుడే ప్రారంభమయిందా అన్నట్లు ఉంది. వదలని చీకటిలో తరగతిగది రెండు తలుపులూ టపటపా కొట్టుకునేట్టు గాలి వీస్తూ ఏకధాటిగా ముద్దలా మంచుకురిసిన గత మూడురోజులతో పోల్చుకుంటే, ఇది నయమే.  అప్పుడయితే తను ఎక్కువభాగం తనగదిలోనే గడపవలసి వచ్చింది … బొగ్గులు తెచ్చుకుందికో, షెడ్డులోని కోళ్లకి మేతవెయ్యడానికో వెళ్ళిరావడం మినహాయిస్తే. అదృష్టవశాత్తూ మంచుతుఫానుకి రెండురోజులు ముందరే ఉత్తరాన అతిదగ్గరగా ఉన్న తాడ్జిద్ గ్రామంనుండి సరుకురవాణా వాహనంలో తనకి కావలసిన అత్యవసర సరుకులు వచ్చేయి. ఆ వాహనం మళ్ళీ రెండురోజుల తర్వాత వస్తుంది.

4

అది రాకపోయినా, తనకి ఇలాంటి మంచుతుఫానులని తట్టుకుందికి కావలసినంత అత్యవసర సరుకు నిల్వఉంది… ప్రభుత్వం అనావృష్టిబారినపడ్డ ఇక్కడి విద్యార్థుల కుటుంబాలకి సాయంచెయ్యడంకోసం ఇచ్చిన గోధుమబస్తాలతో ఆ చిన్నగది చిందరవందరగా ఉంది. నిజానికి వాళ్ళందరూ కరువు బాధితులే, ఎందుకంటే అందరూ నిరుపేదలే. ప్రతిరోజూ దారూ వాళ్ళకి దినబత్తెం కొలిచి పంచేవాడు. పాపం, ఈ కష్టసమయంలో వాళ్ళెంతగా దాన్ని పోగొట్టుకుంటున్నారో తనకి తెలుసు.  బహుశా వాళ్ళలో ఏ పిల్లవాడి తండ్రో ఈ మధ్యాహ్నం రాకపోడు. వస్తే, వాళ్ళకి ఆ గింజలు కొలిచి ఇవ్వగలడు. మళ్ళీ పంట చేతికొచ్చేదాకా ఏదోలా నెట్టుకురాగలిగితే చాలు. అప్పుడే ఫ్రాన్సునుండి ఓడల్లో గోధుమలు వచ్చేస్తున్నాయి. కనుక గడ్డురోజులు తొలిగిపోయినట్టే. కానీ, ఆ దైన్యపురోజులు మరిచిపోవడం చాలా కష్టం… ఒక్క చినుకైనా రాలక నెలల తరబడి పచ్చని మైదానాలలో దయ్యాలు తిరుగుతూ, ఎండకి మాడి మసయిపోయి, కొంచెంకొంచెంగా నేల బీటలుబారుతూ, అక్షరాలా దహించుకుపోయినట్టయి, కాళ్ళక్రింద పడిన ప్రతిరాయీ గుండగుండయిపోవడం తనకింకా గుర్తే. గొర్రెలు వేలసంఖ్యలో మరణించాయి. అక్కడక్కడ మనుషులుకూడా… ఒక్కోసారి ఎవరికీ ఆనవాలు చిక్కకుండా చనిపోయిన సందర్భాలున్నాయి.

5

ఆ పేదరికంతో పోలిస్తే, ఈ ఒకమూలకి విసిరేసినట్టున్న స్కూలుభవనంలో బిక్షువులా గడిపిన తను, ఈ తెల్లగా సున్నం వేసిన గదిగోడలూ, ఇరుకైన మంచం, రంగువెయ్యడానికి నోచుకోని బీరువాల మధ్య, తనకి వారానికి సరిపడా ఉన్న ఆహారమూ నీటివసతితో,  ఇక్కడి జీవితం ఎంత కఠినంగా ఉన్నా, దర్జాగా మహరాజులా బ్రతుకుతున్నట్టే. కానీ, ఇదిగో … ఏ వానసూచనలూ హెచ్చరికలూ లేకుండా అకస్మాత్తుగా ఇలా మంచుతుఫానులు వచ్చేస్తుంటాయి. ఇక్కడివాతావరణం తీరే అంత… బ్రతకడం మహా కష్టం, మనిషి అన్న వాడి జాడ లేకుండా…  ఉంటేమాత్రం ఏమిటి? పరిస్థితులేమీ మెరుగుపడేది లేదు. దారూ ఇక్కడే పుట్టాడు. ఇంకెక్కడున్నా, అతనికి ప్రవాసంలో ఉన్నట్టే ఉంటుంది.

6

స్కూలు భవనం ముందున్న దిన్నె మీదకి ఎక్కేడు. ఆ ఇద్దరు వ్యక్తులూ మిట్ట సగం దూరం ఎక్కినట్టు కనిపిస్తోంది. అందులో గుర్రం మీదున్న వ్యక్తిని గుర్తుపట్టేడు తను… చాలా కాలం నుండి తనకి పరిచయమున్న పోలీసు బాల్డూక్సి. అతని చేతిలో ఉన్న తాడుకి రెండో కొసని  రెండుచేతులూ బంధింపబడి, తలదించుకుని, గుర్రానికి వెనక ఒక అరబ్బు నడుస్తున్నాడు. పోలీసు దారూని చూస్తూ అభివాదసూచకంగా చెయ్యి ఊపేడుగానీ, వెలిసిపోయిన నీలి ‘జెలాబా’ తొడుక్కుని, కాళ్ళకి ముతక ఊలు మేజోళ్ళతో, సాండల్స్ వేసుక్కుని, తలమీద బిగుతుగా పొట్టిగా ఉన్న ‘చెచే’తో నడుస్తున్న అరబ్బును గూర్చిన ఆలోచనలలో మునిగిపోయిన దారూ దాన్ని గమనించలేదు. వాళ్ళిద్దరూ సమీపిస్తున్నారు. అరబ్బుకి ఇబ్బందికలగకుండా బాల్డూక్సి తన గుర్రాన్ని నిలువరిస్తున్నాడు. ఆ గుంపు (గుర్రంతో సహా) నెమ్మదిగా సమీపిస్తోంది.

7

కూతవేటు దూరంలోకి రాగానే, బాల్డూక్సి కేక వేసాడు: “అల్ అమూర్ నుండి ఈ మూడు కిలోమీటర్ల దూరం నడవడానికీ గంట పట్టింది.” దారూ సమాధానం చెప్పలేదు. మందంగా ఉన్న స్వెట్టరు తొడుక్కుని, పొట్టిగా, చదరంలా కనిపిస్తున్న దారూ … వాళ్ళు ఆ మిట్ట ఎక్కడం గమనిస్తున్నాడు. ఒక్కసారికూడా ఆ అరబ్బు తల పైకిఎత్తి చూడలేదు. వాళ్ళు మిట్టమీదకి చేరుకోగానో, “హలో’ అంటూ దారూ పలకరించాడు. “రండి, రండి. చలి కాగుదురు గాని,” అని ఆహ్వానించేడు. తాడుని వదలకుండా, బాల్డూక్సి కష్టపడి గుర్రం మీంచి దిగేడు. నిక్కబొడుచుకున్న గుబురుమీసాలలోంచి స్కూలుమాష్టరుని చూసి నవ్వేడు. కందిపోయిన నుదిటిమీద లోపలికి పొదిగినట్టున్న నల్లని చిన్న కళ్ళూ, మూతిచుట్టూ ముడుతలు దేరిన చర్మంతో అతను చాలా జాగ్రత్తమంతుడుగా, పనిపట్ల శ్రద్ధగలవాడుగా కనిపిస్తున్నాడు. దారూ కళ్ళేలు అందుకుని గుర్రాన్ని షెడ్డులో కట్టడానికి  తీసికెళ్ళి వచ్చేసరికి ఈ ఇద్దరూ స్కూలుదగ్గర అతనికోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళని తనగదిలోకి తీసుకెళ్ళి, “నేను తరగతిగది వెచ్చగా ఉండేట్టు చేస్తాను. అక్కడయితే మనకి మరికొంత సౌకర్యంగా ఉంటుంది,” అన్నాడు. తను మళ్ళీ గదిలోకి వెళ్ళేసరికి బాల్డూక్సి మంచంమీద కూర్చున్నాడు. అరబ్బు పొయ్యికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అరబ్బు చేతులు ఇప్పటికీ బంధించబడేఉన్నాయి. బాల్డూక్సి తన చేతికున్న కట్లు విప్పుకున్నాడు.  అరబ్బు తలమీదనున్న ‘చెచే’ని కొంచెం వెనక్కితోసి, అతను కిటికీదిక్కు చూస్తున్నాడు. దారూ ముందు గమనించింది  నీగ్రోవేమో అనిపించేట్టున్న అతని బలమైన, నున్నటి, విశాలమైన పెదాలు. అరబ్బు ముక్కు మాత్రం నిటారుగా ఉంది. అతని కళ్ళు చిక్కగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. వెనక్కి తోసిన ‘చెచే’ అతని ఎత్తైన నుదిటిని సూచిస్తే, ఎండకీ వానకీ నిలదొక్కుకున్న అతని చర్మం, ఇప్పుడు చలికి పాలిపోయి కనిపిస్తోంది. అతను వెనక్కి తిరిగి సూటిగా తన కళ్ళలోకి చూడగానే, దారూకి అతని ముఖంలో అలసటా, ధిక్కారమూ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించేయి . “ఆ గదిలోకి వెళ్ళు! ఈలోగా నేను మీకు పుదీనా టీ తీసుకు వస్తాను,” అన్నాడు. బాల్డూక్సి, “థేంక్స్!” అన్నాడు. “ఎన్ని అవస్థలురా బాబూ! ఎప్పుడు రిటైరవుతానా అని అనిపిస్తోంది,” అని తనలోతాను అనుకుని, ఖైదీవంక తిరిగి అరబ్బీ భాషలో, “నిన్నే! కదులు,” అన్నాడు. ఆ అరబ్బు నెమ్మదిగా లేచి, ఇంకా బంధించి ఉన్న చేతులు ముందుకి చాచుకుంటూ మెల్లగా తరగతిగదిలోకి నడిచాడు.

8

hqdefault

టీతో పాటే, దారూ ఒక కుర్చీకూడా తీసుకు వచ్చేడు. అప్పటికే బాల్డూక్సి అతనికి దగ్గరగా ఉన్న పిల్లల రాతబల్లమీద ఎక్కి కూర్చున్నాడు; అరబ్బు కిటికీకి డెస్కుకీ మధ్యనున్న పొయ్యికి అభిముఖంగానూ, టీచరుబల్లకి ఎదురుగానూ నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. అతనికి టీ గ్లాసు అందించబోయి, అతని చేతులకి ఇంకా కట్లుండడం చూసి దారూ కాసేపు తటపటాయించేడు. “అతని చేతులకి కట్లు విప్పొచ్చేమో,” అన్నాడు. “తప్పకుండా,”అన్నాడు బాల్డూక్సి. “ఆ కట్లు ప్రయాణం కోసమే,” అని చెప్పి లేవబోయాడు. కానీ దారూ గ్లాసుని నేలమీద ఉంచి, అరబ్బుకి ప్రక్కన మోకాళ్లమీద కూర్చున్నాడు. ఏమీ మాటాడకుండా అరబ్బు తన తీక్ష్ణమైన చూపులతో దారూని గమనించసాగేడు. చేతుల కట్లువిప్పేక, వాచిపోయిన చేతులని ఒకదానితో ఒకటి రాసుకుని, టీ తీసుకుని, మరుగుతున్న టీని ఆత్రంగా చప్పరించసాగేడు… ఒక్కొక్క గుక్కా…”

9

“బాగుంది,” అని, దారూ,”ఇంతకీ ఎక్కడికి మీ ప్రయాణం?” అని అడిగేడు బాల్డూక్సిని.

టీలో మునిగిన తన మీసాన్ని బయటకి తీస్తూ, బాల్డూక్సి. “ఇక్కడికే !”

“చిత్రమైన విద్యార్థులే! అయితే ఈ రాత్రికి మీ మకాం ఇక్కడేనా?”

 

“లేదు, లేదు. నేను రాత్రికి అల్ అమూర్  వెళిపోవాలి. నువ్వు ఈ మనిషిని టింగ్విట్ లో అప్పచెప్పాలి. అతను పోలీసు హెడ్ క్వార్టర్సులో ఉండాలి.”

బాల్డూక్సి స్నేహపూర్వకంగా నవ్వేడు దారూని చూస్తూ.

“ఇదేమిటి ఈ వ్యవహారం? నాతో వేళాకోళం ఆడటం లేదు కద?” అన్నాడు స్కూలు మాష్టరు.

“లేదు, నాయనా. అవి ఉత్తర్వులు.”

“ఉత్తర్వులా? నే నేమీ…” అంటూ ఆర్థోక్తిలో ఆగేడు, ఆ కార్సికన్ పోలీసు అహాన్ని దెబ్బకొట్టడం ఇష్టం లేక.

“నా ఉద్దేశ్యం, అది నా పని కాదు అని.”

“అలా అనడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? యుద్ధ సమయంలో అందరూ అన్ని పనులు చేయాల్సిందే.”

“అలా అయితే, యుద్ధ ప్రకటనకి ఎదురు చూస్తుంటాను!”

బాల్డూక్సి తల పంకించేడు.

“సరే! ఉత్తర్వులయితే ఉన్నాయి. అవి మీకుకూడా వర్తిస్తాయి. కాకపోతే రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడో తిరుగుబాటు జరగొచ్చని అనుమానంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, మే మందరం దానికి సంసిద్ధులుగా ఉన్నాం.”

దారూ ముఖంలో ఇంకా ఆ ధిక్కార ఛాయలు తొలగిపోలేదు.

 

10

“చూడు నాయనా,” బాల్డూక్సి చెప్పబోయాడు, “నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్నర్థం చేసుకోడానికి ప్రయత్నించు.  అల్ అమూర్ లో మేం  ఓ డజనుమందిమి మాత్రమే ఉన్నాం ఆ ప్రాంతం అంతా గస్తీ తిరగడానికి. నేను త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి. నాకిచ్చిన ఉత్తర్వు ప్రకారం నేను ఇతన్ని నీకు అప్పగించి ఆలస్యం చెయ్యకుండ వెనక్కి వెళ్ళిపోవాలి. అతన్ని అక్కడ ఉంచడం కుదరదు. అతని గ్రామంలో తిరుగుబాటు జరగబోతోంది. వాళ్లు అతన్ని వెనక్కి తీసుకుపోవాలనుకుంటున్నారు. రేపుసాయంత్రానికల్లా నువ్వతన్ని టింగ్విట్ లో అప్పగించాలి.  సన్నగాఉన్న నీలాంటి వాడికి ఇరవై కిలోమీటర్లు ఒక లెఖ్ఖ కాదు.  ఆ పని పూర్తయేక, నీ బాధ్యత పూర్తవుతుంది. నువ్వు యధాప్రకారం నీ పాఠాలు చెప్పుకోడానికీ, నీ సుఖమైన జీవితానికీ మరలిపోవచ్చు.”

11

గోడ వెనక గుర్రం అసహనంగా సకిలించడం, నేలమీద గిట్టలతో రాయడం తెలుస్తోంది. దారూ కిటికీలోంచి బయటకి చూస్తున్నాడు. వాతావరణం మెరుగవడం ఖచ్చితంగా తెలుస్తోంది; మంచుతడిసిన ఆ మైదానంమీద వెలుగు క్రమంగా పెరగనారంభించింది. మంచు అంతా కరగనిచ్చి, సూర్యుడు మళ్ళీ అందుకుంటాడు… ఈ రాళ్లతో నిండిన పొలాల్ని మంటపెడుతూ. మనిషితో ఏ మాత్రం సంపర్కంలేని ఈ ఏకాంత ప్రదేశంమీద ఏ మార్పూలేని ఆకాశం రోజులతరబడి అలా ఎండవెలుగుని కుమ్మరిస్తూనే ఉంటుంది.

అతను బాల్డూక్సివైపు తిరిగి, “ఇంతకీ, అతను చేసిన అపరాథం ఏమిటి?” అని అడిగేడు.

ఆ పోలీసు నోరుతెరిచి బదులుచెప్పేలోపునే తిరిగి, “అతనికి ఫ్రెంచి మాటాడడం వచ్చునా?” అని అడిగేడు.

“లేదు. ఒక్క ముక్క కూడా రాదు. అతని కోసం మేం నెల్లాళ్ళుగా గాలిస్తున్నాం. వాళ్లతన్ని దాచిపెట్టేరు. అతను తన దగ్గర బంధువుని హత్యచేశాడు.”

“అతను ఏమైనా దేశద్రోహా?”

12

“అలా అనుకోను. కానీ, మనం ఏదీ రూఢిగా చెప్పలేం.”

“ఎందుకు చంపేడు?”

“ఏదో కుటుంబకలహం. ఒకరు ఇంకొకరికి ధాన్యం బాకీ పడ్డట్టున్నారు. అయితే ఖచ్చితంగా తెలీదు. టూకీగా చెప్పాలంటే, అతను అతని బంధువుని కొడవలిలాంటి కత్తితో చంపేడు. ఎలా అంటే గొర్రెని వేటు వేస్తారే అలా… క్రీక్…” అంటూ బాల్డూక్సి గొంతుక్కి అడ్డంగా చెయ్యి గీతలాగీస్తూ ఒక అభినయం చేశాడు. ఆ చేష్టకి అరబ్బుదృష్టి అతనిపై పడి అతని వంక ఆదుర్దాగా చూసేడు. దారూకి మనుషులమీద కోపం వచ్చింది… మనుషులందరిమీదా, వాళ్ల అర్థం పర్థం లేని వైషమ్యాలకీ, అదుపులేని వైరాలకీ, వాళ్ళ రక్తదాహానికీ. పొయ్యిమీద ఉన్న కెటిల్ కూతపెట్టడంతో గుర్తొచ్చి రెండోసారి బాల్డూక్సీకి  అరబ్బుకి కూడా టీ ఇచ్చేడు. అరబ్బు రెండు చేతులూ పైకెత్తి అంత ఆత్రంగానూ టీ తాగడంతో, ఒంటిమీద ఉన్న ‘జెల్లబా’ తెరుచుకుని, స్కూలు మాష్టరుకి అతని కండదేరిన పీనవక్షం కనిపించింది.

“సరే, అయితే. థేంక్స్. నేను వెళ్ళొస్తా.” అన్నాడు బాల్డూక్సి.

లేచి అరబ్బు వైపు నడిచేడు జేబులోంచి చిన్న తాడుని బయటకి తీస్తూ.

“ఏం చేస్తున్నారు?” అని అడిగేడు దారూ యథాలాపంగా.

కంగారుపడ్డ బాల్డూక్సి చేతిలో ఉన్న చిన్న తాడుని చూపించాడు.

“దాని అవసరం లేదు.”

ఆ ముసలి పోలీసు కాసేపు సంకోచించి, “సరే, నీ ఇష్టం. నీ దగ్గర రక్షణకి ఆయుధం ఉందికదా?” అని ప్రశ్నించేడు.

“నా దగ్గర షాట్ గన్ ఉంది.”

“ఎక్కడ?”

“పెట్లో.”

13

“అది నీ పడక పక్కనే అందుబాటులో ఉండాలి.”

“ఎందుకూ? నాకు భయపడడానికి తగిన కారణం కనపడదు.”

“నువ్వు నిజంగా పిచ్చి వాడివేనురా అబ్బాయ్. ఒకసారి తిరుగుబాటు తలెత్తిందంటే, ఎవరి క్షేమానికి హామీ ఉండదు. మనందరం ఒక నావలో ప్రయాణిస్తున్న వాళ్ళమే.”

“నన్ను నేను రక్షించుకోగలను. వాళ్లు నా వైపుకి వస్తున్నప్పుడు చూడడానికి నాకు తగిన సమయం ఉంటుంది.”

బాల్డుక్సి నవ్వ సాగేడు. అతని గుబురు మీసాలు అతని పలువరసని దాచిపెట్టేయి.

“నీకు అంత సమయం ఉంటుందా? సరే అయితే. నే చెప్పబోయేదేమిటంటే నువ్వెప్పుడూ కొంచెం తిక్కగా మాటాడుతుంటావు. అయినా, ఎందుకో నాకు అది నచ్చుతుంది.” అంటూనే అతని జేబులోంచి ఒక రివాల్వరు తీసి టేబిలుమీద ఉంచేడు.

“ఇది నీ దగ్గర ఉండనీ. ఇక్కడనుండి అల్ అమూర్ వెళ్ళేలోపు, నాకు రెండు తుపాకులవసరం లేదు.”

టేబులుకి వేసిన నల్లరంగు నేపథ్యంలో తుపాకీ మెరుస్తోంది. పోలీసు అతని వైపు తిరగగానే, స్కూలు మాష్టరుకి తోలువాసనా, గుర్రపుచర్మం వాసనా ఒకేసారి ముక్కుకి సోకింది.

అకస్మాత్తుగా దారూ, “చూడు బాల్డూక్సీ! ఇదంతా నాకు గొప్ప చికాకు తెప్పిస్తోంది… ఇక్కడ మీరూ, మీ ఖైదీను. అతన్ని నేను అప్పగించను. పోరాడవలసి వచ్చిందా, తప్పకుండ పోరాడతాను. అంతేగాని అప్పగించను.”

ఆ ముసలి పోలీసు అతనికి ఎదురుగా నిలబడి అతనివంక తీక్ష్ణంగా చూడసాగేడు.

“నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు,” అన్నాడు నెమ్మదిగా. “నాకూ అతన్ని అప్పగించడం ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనిషి చేతిని తాళ్లతో బిగించడం అలవాటవదు. అలా చెయ్యాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది. నిజం. సిగ్గు చేటు. అలాగని, వాళ్లని వాళ్ళ ఇష్టానికి వదిలీనూ లేము.”

“నే నతన్ని అప్పగించను.” అన్నాడు దారూ ఖరాఖండీగా.

“అది ఉత్తర్వురా అబ్బాయ్. మరో సారి చెబుతున్నా. అది ఉత్తరువు,”

“సరే. అయితే ఆ ఉత్తర్వు ఇచ్చిన వాళ్ళకి నేను మీతో చెప్పింది చెప్పండి: నే నతన్ని అప్పగించను.”

14

బాల్డూక్సి ఏమిటి సమాధానం చెప్పాలా అని ఒకసారి ఆలోచించాడు. దారూని, అరబ్బునీ మార్చి మార్చి చూశాడు. చివరకి ఒక నిశ్చయానికి వచ్చి,

“లేదు. వాళ్లకి నే నేమీ చెప్పదలుచుకోలేదు. మమ్మల్ని వదుల్చుకుందామనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నేను కాదనను. నాకు ఈ ఖైదీని నీకు అప్పగించమని ఉత్తర్వులు ఉన్నాయి. అందుకే నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నా కోసం ఈ కాగితం మీద సంతకం చెయ్యి.”

“ఆ అవసరం లేదు. నువ్వు అతన్ని నాకు అప్పగించలేదని అబద్ధం ఆడను.”

“నాతో అలా మరీ అన్యాయంగా ప్రవర్తించకు. నాకు తెలుసు. నువ్వు నిజమే చెబతావని. నువ్వు ఇక్కడ పుట్టిపెరిగిన వాడివి. మీదు మిక్కిలి నువ్వో మగాడివి. కానీ, నువ్వు సంతకం చెయ్యాలి. అది పాటించవలసిన నిబంధన.”

దారూ డ్రాయరు తెరిచి, గులాబిరంగు ఇంకు ఉన్న చిన్న చదరపు సీసానీ, తను చక్కని చేతివ్రాత నమూనాలు తయారుచెయ్యడానికి వినియోగించే ఎర్ర ‘సార్జంట్ మేజర్’ పెన్ను ఉంచుకునే కర్ర స్టాండునీ బయటకు తీసి, కాగితంమీద సంతకం చేశాడు. పోలీసు దాన్ని జాగ్రత్తగా మడిచి పర్సులో పెట్టుకున్నాడు. అతను నిష్క్రమించడానికి వీధి తలుపువైపు నడిచాడు.

“నేను దిగబెడతాను. పదండి,” అన్నాడు దారూ.

“వద్దు,” అని గట్టిగా అన్నాడు బాల్డూక్సి, “ఇప్పుడు మర్యాదగా ప్రవర్తించి ప్రయోజనం లేదు. నువ్వు నన్ను అవమానించావు.”

15

అతను ఉన్నచోటే కదలకుండా ఉన్న అరబ్బుని ఒకసారి చిరాగ్గా చూసి, ఒక సారి గట్టిగా నిట్టూర్చి, ద్వారం వైపు నడిచేడు.

“బిడ్డా, శలవు.” అన్నాడు.

అతని వెనకే తలుపు మూసుకుంది.  బాల్డూక్సి అకస్మాత్తుగా కిటికీ దగ్గర ప్రత్యక్షమై, మళ్ళీ మాయమయ్యాడు. అతని అడుగులచప్పుడుని నేలమీద పరుచుకున్న మంచు మింగేసింది. గోడవెనక గుర్రం కదిలిన చఫ్ఫుడుకి, కోళ్ళన్నీ భయంతో అరిచేయి.  ఒక క్షణం తర్వాత మళ్ళీ కిటికీదగ్గర ప్రత్యక్షమయ్యాడు బాల్డూక్సీ కళ్ళెంతో గుర్రాన్నిపట్టుకుని నడుపుకుంటూ. వెనక గుర్రం అనుసరిస్తుండగా, అతను వెనక్కి తిరిగైనా చూడకుండా మిట్టదాకా నడచి, తర్వాత కనుమరుగయ్యాడు. క్రిందకి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వెళ్ళడం వినిపించింది. దారూ ఖైదీవైపు నడిచాడు; అతను కూచున్నచోటునుండి ఒక్కపిసరు కదలకపోయినా, రెప్ప వాల్చకుండ దారూనే గమనిస్తున్నాడు.

“ఇక్కడే ఉండు,” అని అరబిక్ లో చెప్పి తన పడకగదివైపు వెళ్ళేడు. అతను ద్వారంలోంచి వెళుతూ మళ్ళీ పునరాలోచనలోపడి, వెనక్కి డెస్కుదగ్గరకి వచ్చి, దాని మీదనున్న పిస్తోలుని తన జేబులో దోపుకున్నాడు. మరి వెనక్కి తిరిగి చూడకుండా తన పడకగదిలోకి ప్రవేశించాడు.

16

కొంతసేపు తన పక్కమీదవాలి, నిశ్శబ్దంగా, ఆకాశంకేసి చూడసాగేడు… చీకటి దాన్ని కనుమరుగుచేసేదాకా. ఇక్కడకి వచ్చిన కొత్తలో, ఈ నిశ్శబ్దమే అతనికి బాధాకరంగా ఉండేది. ఎగువనున్న మైదానాలనీ, ఎదురుగాఉన్న ఎడారినీ వేరుచేసే పర్వతపాదాల చెంతనున్న చిన్న ఊరికి తనని బదిలీ చెయ్యమని అర్జీ పెట్టుకున్నాడు. అక్కడ పచ్చగా, నల్లగా ఉత్తరానికీ… గులాబీ, పాలిపోయిన ఊదారంగులో దక్షిణానికీ… ఉన్న గోడలు సతతగ్రీష్మాన్ని సూచిస్తుంటాయి. ముందు అతనికి ఈ మైదానంలో ఇంకా ఉత్తరానికిఉన్న ఒకచోట నియామకానికి ప్రతిపాదన జరిగింది. ఎటుచూసినా రాళ్ళూరప్పలతో నిండిఉన్న ఈ నిర్జనప్రదేశంలో ఒంటరితనమూ, నిశ్శబ్దమూ భరించడం కష్టంగా ఉండేది. అక్కడక్కడ పొడవాటి చాళ్ళలా కనిపిస్తే వ్యవసాయం జరుగుతోందేమో ననుకునేవాడు తను. తీరా చూస్తే అవి భవననిర్మాణంలో ఉపయోగపడే ఒక రకమైన రాయిని తవ్వడానికి చేసిన చాళ్లు అవి. ఇక్కడ జరిగే ఒకే ఒక్క వ్యవసాయం రాళ్ళుతవ్వడం. అక్కడక్కడ రాళ్ళ మధ్యనున్న గతుకుల్లో చేరిన మెత్తని మట్టిని చెదురుమదురుగా ఉన్న గ్రామ ఉద్యానాల్లో వెయ్యడానికి అప్పుడప్పుడు గోకి, తవ్వి తీసుకెళుతుంటారు.

ఇక్కడి నైసర్గిక స్వరూపమే అంత. నాలుగింట మూడొంతులు భూబాగమంతా రాళ్లతో, గుట్టలతో నిండి ఉంటుంది. పట్నాలువెలిసి, అభివృద్ధిచెంది, అంతరించిపోయాయి. మనుషులు వచ్చేరు; ఒకర్నొకరు అభిమానించుకోడమో, తీవ్రంగా కలహించుకోడమో చేసి, చివరికి అంతా మరణించారు. ఈ ఎడారిలాంటి భూభాగంలో… తనైనా, తన అతిథి అయినా ఒక్కటే… ఎవరి ఉనికికీ విలువలేదు.  అలాగని, వాళ్ళిద్దరిలో ఎవరూ ఇంకెక్కడైనా బ్రతకగలరా అంటే, ఈ ఎడారికి బయట ఇంకెక్కడా బ్రతకలేరనీ దారూకి తెలుసు.

17

అతను లేచికూచునేటప్పటికి తరగతిగదిలోంచి ఏ చప్పుడూ వినిపించడం లేదు. అరబ్బు పారిపోయి ఉంటాడనీ, తనింక ఏ నిర్ణయమూ తీసుకోవలసిన అవసరం లేదనీ తన మనసులో ఒక క్షణకాలం మెదిలిన ఆలోచన ఇచ్చిన అచ్చమైన ఆనందానికి దారూకి ఆశ్చర్యం వేసింది. కానీ ఖైదీ పారిపోలేదు. అక్కడే ఉన్నాడు. అతను డెస్కుకీ, పొయ్యికీ మధ్య కాళ్ళు బారజాపుకుని పడుక్కున్నాడు. అంతే! కళ్ళు విశాలంగా తెరుచుకుని, లోకప్పువంక తేరిపారచూస్తున్నాడు. ఆ స్థితిలో, దళసరిగాఉన్న అతని పెదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి … బుంగమూతి పెట్టినట్టు .

“దా,” అని పిలిచేడు దారూ.

అతను లేచి దారూని అనుసరించాడు. తనగదిలో కిటికీకింద టేబిలుని ఆనుకున్న కుర్చీ చూపించాడు కూర్చోమని.

దారూ నుండి దృష్టి మరల్చకుండా అందులో కూచున్నాడు అరబ్బు.

“ఆకలిగా ఉందా?”

“అవును,” అన్నాడు ఖైదీ.

n127099

18

దారూ ఇద్దరికి భోజనం ఏర్పాటు చేశాడు. పిండీ, నూనె తీసుకుని పెనంమీద రొట్టెలా వేసి సిలిండరుగాసుతో పనిచేసే చిన్న స్టౌ వెలిగించాడు. రొట్టె అలా కాలుతుంటే, జున్నూ, కోడిగుడ్లూ, ఖర్జూరం, గడ్డపాలూ తీసుకురావడానికి బయట షెడ్డులోకి వెళ్ళేడు. రొట్టె తయారయేక అది చల్లారడానికి కిటికీలో ఉంచేడు. గడ్డపాలు పొయ్యిమీదపెట్టి కొంచెం నీళ్ళు కలిపాడు పలచన చెయ్యడానికి. గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్టు వేశాడు. అలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు అతని కుడి జేబులో ఉన్న రివాల్వరుకి చెయ్యి తగిలింది. గిన్ని కిందపెట్టి, తరగతిగదిలోఉన్న డెస్కుడ్రాయరులో దాన్ని పెట్టేడు. మళ్ళీ తనగదిలోకి వచ్చేసరికి అప్పుడే బాగా చీకటిపడిపోతోంది. దీపంవెలిగించి అరబ్బుకి భోజనం వడ్డించేడు.

“తిను,” అన్నాడు.

అరబ్బు ఒక చిన్న ముక్క తీసుకుని ఆత్రంగా నోటిదాకా తీసుకెళ్ళి, ఒక్క సారి ఆగి,  “మరి నీ సంగతి?” అని అడిగేడు.

“నువ్వు తిన్నాక తింటానులే.”

ఆ దళసరి పెదాలు కొంచం విచ్చుకున్నాయి. కొంచెంసేపు వెనకాడి, తర్వాత తినడానికి నిశ్చయించుకున్నాడు.

భోజనం అయిన తర్వాత, అరబ్బు స్కూలుమాష్టరువైపు చూస్తూ, “నువ్వేనా, న్యాయాధికారివి?” అని అడిగేడు.

“కాదు. రేపటిదాకా నేను నిన్ను నాతో ఉంచుకుంటున్నాను. అంతే.”

“మరి నాతో ఎందుకు భోజనం చేస్తున్నావు?”

“నాకూ ఆకలేస్తోంది.”

19

అరబ్బు మౌనంగా ఉండిపోయాడు.

దారూ లేచి బయటకి వెళ్ళేడు. వస్తున్నప్పుడు షెడ్డులోంచి ఒక మడతమంచం తీసుకువచ్చి, టేబిలుకీ, స్టౌకీ మధ్యగానూ, తన పక్కకి లంబంగానూ ఉండేట్టు వేశాడు. ఒక మూలగా నిలబెట్టబడి తను తనకాగితాలకి అలమరలా ఉపయోగించే పెద్ద సూట్ కేసులోంచి రెండు కంబళీలు తీసి, మడతమంచంమీద పరిచేడు. వాటివల్ల ఉపయోగంలేదని గ్రహించి, ఆగి, తన మంచంమీద కూలబడ్డాడు. అంతకంటే తనింక చెయ్యడానికిగాని, సిద్ధంచెయ్యడానికిగాని ఏమీ లేదు. ఈ మనిషినిచూస్తూ కూచోవలసిందే. అతనిముఖం కోపంతో రగిలిపోతోందేమోనని ఊహించుకుంటూ అతనిపక్క చూసేడు.

నల్లగా మెరుస్తున్న కళ్ళూ, జంతువు పెదాల్లాంటి పెదాలూ తప్ప మరేం కనిపించలేదు.

“అతన్ని ఎందుకు చంపేవు?” అని అడిగాడు. అతని గొంతులో వినిపించిన కాఠిన్యానికి అరబ్బుకి ఆశ్చర్యం వేసింది.

అతను ముఖం అటుతిప్పుకున్నాడు.

“వాడు పారిపోయాడు. నేను అతన్ని వెంబడించాను.”

అతను మళ్ళీ దారూతో చూపు కలిపాడు. అందులో నిశితమైన ప్రశ్నలు ఉన్నాయి.

“వాళ్ళిప్పుడు నన్నేం చేస్తారు?”

“నువ్వు భయపడుతున్నావా?”

అరబ్బు ఒక్క సారి బిర్రబిగుసుకుపోయాడు… ఎటో దిక్కులు చూస్తూ.

“నువ్వు చేసినపనికి పశ్చాత్తాపపడుతున్నావా?”

అరబ్బు అతనివంక నోరువెళ్ళబెట్టుకుని కన్నార్పకుండా చూశాడు. ఆ మాట అతనికి అర్థం కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. దారూకి అసహనం పెరిగిపోతోంది. అదే సమయంలో, రెండు పక్కలమధ్యా చిక్కుకున్న అతని భారీ కాయాన్ని చూసి, కొంచెం ఇబ్బందీ, తన ఉనికి గురించిన స్పృహా కలిగేయి.

అసహనంగా, “అదే నీ పక్క. అక్కడ పడుక్కో,” అన్నాడు.

20

అరబ్బు కదలలేదు.

దారూ తో, “ఒక విషయం చెప్పండి!”

స్కూలు మాష్టరు అతనివంక చూశాడు.

“రేపు ఆ పోలీసు మళ్ళీ వస్తున్నాడా?”

“నాకు తెలీదు.”

“మీరు మాతో వస్తున్నారా?”

“లేదు. అయినా, ఆ విషయం నీకెందుకు?”

ఖైదీ లేచివెళ్ళి కిటికీవైపు కాళ్ళుజాపుకుని, కంబళీమీద వెల్లకిలాపడుకున్నాడు. ఎలక్ట్రిక్ బల్బునుండి కాంతి సూటిగా అతని కళ్లలోకి పడటంతో కళ్ళు ఒక్కసారి మూసుకున్నాడు.

అతని పక్కనే నిలబడి, దారూ మళ్ళీ అడిగాడు, “ఎందుకు?” అని.

కళ్ళు తెరవలేకుండాచేస్తూ పడుతున్న వెలుగులో దారూవైపు కళ్ళు మిటకరించి చూస్తూ, అన్నాడు,  “మాతో రండి.”

21

అర్థరాత్రి అయింది కాని దారూకి నిద్రపట్టలేదు. నగ్నంగా పడుకోడం అతనికి అలవాటు. అందుకని పూర్తిగా దిగంబరంగా పక్కమీద వాలేడు. కానీ అకస్మాత్తుగా అతనికి గుర్తొచ్చింది, ఒంటిమీద ఏమీలేకపోవడమూ, దానివల్ల అతనికి హానికలగబోయే అవకాశమూ. వెంటనే లేచి బట్టలువేసుకుందామా అన్న ఆలోచన వచ్చింది కానీ, మళ్ళీతనే అనుకున్నాడు, తనేమీ చిన్నపిల్లాడు కాదు. అంతవరకూ వస్తే, తను శత్రువుని రెండుముక్కలుగా విరగ్గొట్టగలడు; ఒత్తుగా పడుతున్న వెలుగుకి నిశ్చలంగా కళ్ళుమూసుకుని తన పక్కమీద వెల్లకిలా పడుక్కున్నా, అక్కడనుండి అతన్ని పరికించగలడు. దారూ లైటు ఆర్పేయగానే, చీకటి ఒక్కసారి ఘనీభవించినట్టు అనిపించింది. కిటికీలోంచి కనిపిస్తున్న నక్షత్రాలులేని ఆకాసం నెమ్మదిగా కదులుతుండడంతో క్రమక్రమంగా చీకటి మళ్ళీ చైతన్యంలోకి వచ్చింది. అతని కాళ్ళదగ్గర పడున్న శరీరాన్ని స్కూలుమాష్టరు పోల్చుకోగలిగేడు. అరబ్బు కదలడం అయితే కదలడంలేదు గాని, అతని కళ్ళుమాత్రం ఇంకా తెరుచుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఒక సన్నటిగాలి స్కూలుచుట్టూ ఈలవేసుకుంటూ సాగుతోంది. అది మేఘాల్ని తరిమేస్తే, బహుశా సూర్యుడు రేపు మళ్ళీ కనిపించవచ్చు.

22

రాత్రి గాలిజోరు ఉధృతమైంది. కోళ్ళు ఒకసారి రెక్కలు టపటపలాడించి ఊరుకున్నాయి. అరబ్బు నిద్రలో ఒత్తిగిల్లాడు దారూకి వీపు కనిపించేలా. దారూకి అతని మూలుగు విన్నట్టు అనిపించింది. తర్వాత అతను తన అతిథి … శ్వాస బరువుగా, ఒక క్రమంలో ఇంకా బరువుగా తీసుకోవడం గమనించేడు. నిద్రపోకుండానే, ఆ బరువైనఊపిరి తనకి సమీపంగా ఊహించుకున్నాడు. ఏడాదికిపైగా ఈగదిలో ఒక్కడూ నిద్రిస్తున్న తనకి, మరోవ్యక్తి ఉనికి ఇబ్బందిగా ఉంది. అది మరొకందుకుకూడా ఇబ్బంది పెడుతోంది… అది తను ప్రస్తుత పరిస్థితులలో అంగీకరించకపోయినా: అది ఒకవిధమైన సౌభ్రాతృత్వాన్ని అతనిమీద రుద్దుతోంది. ఒకే గదిని పంచుకునే వ్యక్తులు… ఖైదీలూ, సైనికులూ… చిత్రమైన అనుబంధాల్ని పెంపొందించుకుంటారు… వాళ్ల వస్త్రాలతోపాటే వాళ్ళ ఆయుధాలనికూడా విసర్జించినట్టు; వాళ్ళ విభేదాలకి అతీతంగా ప్రతి సాయంత్రమూ నిద్రా, అలసటల పాతబడిన అనుభవాలలో సౌభ్రాతృత్వాన్ని అలవరచుకుంటారు; కానీ దారూ ఒక్కసారి తల విదుల్చుకున్నాడు; అతనికి అటువంటి ఆలోచనలు నచ్చలేదు; అతనికిపుడు నిద్రపోవడం ముఖ్యం.

23

కొంచెంసేపు గడచిన తర్వాత, అరబ్బు నిద్రలో కొంచెం కదిలేడు. స్కూలుమాష్టరుకి ఇంకా నిద్ర రాలేదు.  ఖైదీ రెండోసారి కదలగానే, అతనొకసారి బిగుసుకుపోయాడు, అప్రమత్తమై. నిద్రలోనడుస్తున్నవాడిలా అరబ్బు మోచేతులమీద నెమ్మదిగా తననితాను లేవనెత్తుకుంటున్నాడు. పక్కమీద నిటారుగా కూచున్న అరబ్బు దారూవైపు తల తిప్పకుండా నిశ్శబ్దంగా నిరీక్షించేడు… ఏదో శ్రద్ధగా వింటున్నట్టు. దారూ కదలలేదు; అతనికి ఒక్కసారి తట్టింది, రివాల్వరు ఇంకా తరగతిగదిలోని సొరుగులోనే ఉందని. ఇప్పుడు తనే ముందు ఏదో ఒకటి చెయ్యాలనిపించింది.  అయినా, అతను ఖైదీని గమనించడం మానలేదు; అతనుకూడా, అంతే చురుకుగా నేలమీద కాళ్ళు మోపి, క్షణకాలం నిరీక్షించి, మెల్లగా నిలబడడానికి ప్రయత్నించసాగేడు. దారూ అతన్ని పిలవబోయేంతలో, అరబ్బు మామూలుగానే కానీ చాలా నిశ్శబ్దంగా నడవడం ప్రారంభించేడు. షెడ్డులోకి తెరుచుకున్న తలుపువైపు నడిచేడు. జాగ్రత్తగా చప్పుడుచెయ్యకుండా గడియతీసి బయటకి వెళ్ళేడు; తన వెనకే తలుపు లాగినా, అది పూర్తిగా మూసుకోలేదు. దారూ కదలలేదు. “అతను పారిపోతున్నాడు” అనుకున్నాడు. “పీడా విరగడయ్యింది.” అని మనసులో అనుకున్నా, జాగ్రత్తగా వినసాగేడు. కోళ్ళు కలవరపడటం లేదు; అంటే తన అతిథి మైదానంవైపు  వెళుతూ ఉండి ఉండాలి… లీలగా నీటి చప్పుడు వినిపించింది అతనికి.  అరబ్బు ఆకారం తిరిగి ద్వారబంధందగ్గర కనిపించేదాకా అదేమిటో అర్థం కాలేదు. అరబ్బు తలుపు జాగ్రత్తగా మూసి, చప్పుడుచెయ్యకుండావచ్చి తన పక్కమీదవాలి  పడుక్కున్నాడు. దారూ వీపు అతనివైపు తిప్పి పడుక్కున్నాడు.  అతనికి నిద్రలో, స్కూలుభవనానికి చుట్టుపక్కల సన్నని అడుగులచప్పుడు వినిపించింది. “నేను కలగంటున్నాను, కలగంటున్నాను” అని అతనికి అతను సమాధానపరచుకుని నిద్రపోసాగేడు.

24

అతనికి తెలివివచ్చేసరికి ఆకాశం నిర్మలంగా ఉంది; తెరిచిన కిటికీలోంచి గాలి చల్లగా వీస్తోంది. ఆ అరబ్బు ప్రశాంతంగా కంబళీలో దగ్గరగా ముడుచుకుపడుక్కున్నాడు, నోరు తెరుచుకుని మరీ. దారూ అతన్ని లేపడానికి కుదపబోతే, అతను భయంతో దారూవంక కళ్ళు విచ్చుకుని తేరిచూడగానే, ఆ కళ్ళలో కనిపించిన భయవిహ్వలతకి, దారూ ఒక అడుగు వెనక్కి వేశాడు. “భయపడకు. నేనే. లే”. అరబ్బు తలఊపి ఆహా అన్నాడు. అతని ముఖంలోకి మళ్ళీ ప్రశాంతత వచ్చింది గాని, ఆ చూపులు ఇంకా శూన్యంగానూ, అలసటగానూ ఉన్నాయి.

25

కాఫీ తయారైంది. రొట్టెముక్కలు నములుతూ మడతమంచంమీద ఇద్దరూ పక్కపక్కన కూచునే కాఫీ తాగేరు. దారూ అరబ్బుని షెడ్డులోకి తీసుకువెళ్ళి తను ఎక్కడ స్నానం చేస్తాడో ఆ జాగా చూపించాడు. తనగదిలోకి పోయి, కంబళ్ళూ, పక్కా మడిచి, తనపక్క జాగ్రత్తగా సర్ది, గదికి ఒక రూపు తీసుకొచ్చేడు. అక్కడనుండి తరగతి గదిలోకీ, గదిముందున్న ఎత్తైన ప్రదేశందగ్గరకి వెళ్ళేడు. నీలాకాశంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎడారిలాంటి మైదానం అంతా సూర్యుడి నులివెచ్చని లేత కిరణాలలో స్నానం చేస్తోంది. కొండశిఖరాలమీద మంచు అక్కడక్కడ కరుగుతోంది. వాటిక్రింద ఉన్న శిలలు బయటపడబోతున్నాయి. ఆ మైదానం అంచున చేతులు దగ్గరగా ముడుచుకు కూచుని నిర్మానుష్యమైన విశాల భూభాగాన్ని పరిశీలించసాగేడు. అతనికి ఎందుకో బాల్డూక్సి గుర్తొచ్చేడు. తను అతని మనసు కష్టపెట్టేడు, ఎందుకంటే అతనికి వీడ్కోలిచ్చిన తీరు అతనితో స్నేహం అక్కరలేదన్నట్టుగా ఉంది. ఆ పోలీసు వెళుతూ వెళుతూ అన్నమాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. కారణం తెలియకుండానే, చిత్రంగా అతనికి అంతా శూన్యంగా కనిపించడంతో పాటు, తను నిస్సహాయుడిగా కనిపించేడు. ఆ క్షణంలో స్కూలుభవనానికి అటువైపునుండి ఖైదీ దగ్గడం వినిపించింది. తనకి ఇష్టం లేకపోయినా అతన్ని వింటూ, చివరకి కోపంతో ఒక గులకరాయి తీసుకుని విసిరాడు. అది గాలిలో రివ్వున దూసుకెళ్ళింది, మంచులో కూరుకుపోయేలోపు. ఆ మనిషిచేసిన తెలివితక్కువ నేరానికి తనకి గొప్ప అసహ్యం వేస్తోంది. అయినా, అతన్ని అప్పగించడం తన గౌరవానికి భంగం. అసలు ఆ ఊహే అవమానంతో కుంగిపోయేలా చేస్తోంది. ఏకకాలంలో ఆ అరబ్బుని తనదగ్గరకి పంపించిన తనవాళ్లనీ, చంపడంలో చూపించిన ధైర్యం పారిపోవడంలో చూపించని అరబ్బునీ తిట్టుకున్నాడు. దారూ లేచినిలబడి, అక్కడికక్కడే గుండ్రంగా తిరుగుతూ, కాసేపు ఏదో ఆలోచిస్తూ కదలకుండ నిలబడి, చివరకి స్కూలుభవనంలోకి ప్రవేశించాడు.

26

షెడ్డులోని సిమెంటు నేలమీద ఒంగుని, ఆ అరబ్బు రెండువేళ్లతో పళ్ళు తోముకుంటున్నాడు. దారూ అతనివంక చూసి, “పద.” అన్నాడు.  ఖైదీకంటే ముందు తనగదిలోకి దారితీసేడు. స్వెట్టరుమీద హంటింగ్ జాకెట్టు తొడుక్కుని, కాళ్ళకి వాకింగ్ షూజ్ వేసుకున్నాడు. అరబ్బు తన ‘చెచే’ ధరించి, కాళ్ళకి సాండల్స్ వేసుకునేదాకా నిలబడి నిరీక్షించాడు. తరగతిగదిలోకి వెళ్ళేక దారూ బయటకిపోయే త్రోవ చూపిస్తూ, “పద. నడుస్తూ ఉండు,” అన్నాడు. అతను ఒక్క అంగుళం కూడ కదలలేదు. “నేను వస్తున్నాను” అన్నాడు దారూ.  అప్పుడు అరబ్బు బయటకి కదిలేడు. దారూ మళ్ళీ తనగదిలోకి వెళ్ళి రస్కులూ, ఖర్జూరం, పంచడార ఒక పొట్లం కట్టేడు. బయలుదేరడానికి ముందు తరగతిగదిలో తన డెస్కుదగ్గర నిలబడి ఒక్క క్షణం తటపటాయించేడు. వెంటనే గదిబయటకి వచ్చి, తాళం వేసేడు. “అదే త్రోవ.” అన్నాడు తోవ చూపిస్తూ.  అతను తూర్పు దిశగా బయలుదేరేడు ఖైదీ అతన్ని అనుసరిస్తుండగా. నాలుగడుగులు వేసేడోలేదో తనవెనక ఏదో అలికిడైనట్టు అనిపించింది. వెనక్కి వచ్చి స్కూలుభవనం నాలుగుపక్కలా వెతికేడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అర్థం చేసుకుందికి ప్రయత్నించకపోయినా, అరబ్బు అతని చర్యల్ని గమనించడం మానలేదు.  “రా,” అన్నాడు దారూ, దారి తీస్తూ.

27

వాళ్ళు ఒకగంట నడిచి, బాగా నిట్రాయిలాఉన్న సున్నపురాయికొండ దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. మంచు త్వరత్వరగా కరగడం ప్రారంభిస్తుంటే, సూర్యుడు అలా గుంటలుగా చేరుతున్న నీటిని అంత త్వరగానూ ఆవిరిచెయ్యడం ప్రారంభించేడు. మైదానం అంతా క్రమంగా పొడిగా తయారవుతూ, నీటిఆవిరి కదలికలకి మైదానమే గాలిలా కదులుతోందేమోనన్న భ్రమ కల్పిస్తోంది. వాళ్ళు తిరిగి నడక ప్రారంభించే వేళకి వాళ్ళ అడుగుల తాకిడికి నేల చప్పుడుచెయ్యనారంభించింది. ఉండిఉండి ఆనందంతో అరుచుకుంటూ ఒక పక్షి వాళ్ల ముందునుండి గాలి చీల్చుకుంటూ ఎగరసాగింది. ఉదయపు తాజా వెలుగులని దారూ కరువుతీరా అస్వాదిస్తున్నాడు. నీలాకాశం గొడుగుకింద కనుచూపుమేర అంతా బంగారపురంగులో కనిపిస్తున్న పరిచయమైన అ విశాలమైన మైదానాన్ని చూస్తూ అతనొక చెప్పలేని ఆనందానుభూతికి లోనయ్యాడు. వాళ్ళు మరో గంటసేపు నడిచేరు…దక్షిణానికి దిగుతూ. పిండిరాళ్ళతోనిండి సమతలంగాఉన్న ఒక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. మైదానం అక్కడనుండి తూర్పుకి కంపలతో నిండిన లోతైన బయలులోకీ, దక్షిణాన ఆ ప్రాంతం అస్తవ్యస్తంగా కనిపించడానికి కారణమైన చెదురుమదురు రాళ్ళ గుట్టలవైపుకీ వాలుతుంది.

28

దారూ రెండుదిక్కుల్నీ జాగ్రత్తగా పరిశీలించేడు. దిగంతాలవరకూ ఆకాశంతప్ప మరేం లేదు. మనిషి అన్న జాడ కనపడలేదు. తనవైపు శూన్యంగా చూస్తున్న అరబ్బు వైపు తిరిగాడు. అతనికి పొట్లాం చేతికందిస్తూ, “ఇది తీసుకో,” అన్నాడు. “ఇందులో ఖర్జూరం, బ్రెడ్, పంచదార ఉన్నాయి.  వీటితో రెండురోజులు గడపగలవు. ఇదిగో ఈ వెయ్యి ఫ్రాంకులు కూడా తీసుకో.” అరబ్బు ఆ పొట్లాన్నీ, డబ్బునీ అందుకున్నాడు. కానీ తనకిచ్చిన వాటితో ఏమిచెయ్యాలో తెలీదని సూచిస్తునట్టు చేతులు గుండెలకు హత్తుకుని నిలబడ్డాడు. “ఇటు చూడు,” తూర్పువైపుకి సూచిస్తూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు స్కూలుమాష్టరు, “టింగ్విట్ వెళ్ళడానికి త్రోవ అది. రెండుగంటల నడక. అక్కడ అధికారులూ పోలీసులూ ఉంటారు. వాళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నారు.” అరబ్బు తూరుపువైపు చూశాడు డబ్బునీ, పొట్లాన్నీ గుండెకు హత్తుకుంటూనే. దారూ అతని భుజాన్ని కొంచెం మోటుగా తిప్పాడు దక్షిణదిక్కుకి. వాళ్ళు నిలబడ్డ ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే, ఆ మిట్ట పాదాల దగ్గర వాళ్ళకి ఒక సన్ననిజాడలాంటి బాట కనిపిస్తోంది. “ఈ మైదానం పొడవునా సాగే బాట అది. ఒక రోజు నడిస్తే, నీకు పచ్చని చేలూ, తొలివిడత సంచారజాతులూ కనిపిస్తారు. వాళ్ళు నిన్ను తమలో కలుపుకుని వాళ్ల చట్టానికి తగ్గట్టుగా తలదాచుకుందికి అవకాశం కల్పిస్తారు.”

అరబ్బు దారూవంక చూసేడు. అతని ముఖంలో ఇప్పుడు భయందోళనలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

“నా మాట వినండి,” అన్నాడతను.

దారూ తల అడ్డంగా తిప్పి, “లేదు. మాటాడకు. నేను ఇప్పుడు నిన్నిక్కడ వదిలేసి వెళుతున్నాను.” అన్నాడు.

వీపు అతనివైపు తిప్పి, స్కూలు దిశలో రెండు పెద్ద అంగలు వేసి, కదలకుండా నిలుచున్న అరబ్బుని కాసేపు అనుమానంగా చూసి, మళ్ళీ బయలు దేరాడు.  కొన్ని నిముషాలపాటు అతనికి ఏమీ వినిపించలేదు చల్లటి నేలమీద ప్రతిధ్వనిస్తున్న తన అడుగుల చప్పుడు తప్ప. అతను వెనుదిరిగి చూడలేదు. చేతులు వేలాడేసుకుని, ఆ అరబ్బు కొండఅంచున అలాగే అక్కడే నిలుచున్నాడు స్కూలు మాష్టరుని చూస్తూ. దారూకి గొంతుకి ఏదో అడ్డం పడింది. కోపంతో తిట్టుకుంటూ, గాలిలో ఎవరికో తెలీకుండా చేతులూపి, మళ్ళీ నడక ప్రారంభించేడు. చాలాదూరం నడిచిన తర్వాత మరొకసారి ఆగి వెనక్కితిరిగి చూసేడు. ఇప్పుడు కొండఅంచున ఎవరూ కనిపించలేదు.

29

దారూ సంశయించాడు.  సూర్యుడు అప్పుడే నడినెత్తికి వచ్చి ఎండ మాడ్చడం ప్రారంభించింది. వెనక్కి అడుగులు వేశాడు … ఎటూ నిర్ణయించుకోలేక ముందు సందేహించినా, చివరకి ఒక నిర్ణయానికి వచ్చి. మరొక చిన్నకొండదగ్గరకి వచ్చేసరికి అతను చెమటతో స్నానం చేసినంత పని అయ్యింది. అతను ఎంత తొందరగా ఎక్కగలడో అంత తొందరగా ఎక్కి, ఆగేడు… ఊపిరి అందక. నీలాకాశం నేపథ్యంలో దక్షిణాన రాతిభూములు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ, తూర్పున తుప్పలూ డొంకలతో నిండిన ప్రదేశంలో నీటిఆవిరితో నిండిన వేడి మెల్లగా పైకి లేస్తోంది. ఆ మసక మసకలోనే…  అతన్ని జైలుకి తీసుకుపోయే తోవలో అరబ్బు మెల్లిగా నడవడం గమనించాడు… బరువెక్కిన గుండెతో.

30

కొంతసమయం గడిచిన తర్వాత, స్కూలుమాష్టరు తన తరగతిగది కిటికీదగ్గర నిలబడి విశాలమైదానంనిండా సూర్యకాంతి ప్రతిఫలించడం గమనిస్తున్నాడు కాని, అతనికి ఆ స్పృహలేదు. అతని వెనక, బ్లాక్ బోర్డుమీద పారుతున్న నాలుగు ఫ్రెంచి నదులమధ్యా, అతను అప్పుడే చదివిన గజిబిజిగా సుద్దతో రాసిన మాటలు మెదుల్తున్నాయి:

“నువ్వు మా సోదరుడిని అప్పగించావు. దీనికి నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు.”

దారూ ఆకాశంవంకా, మైదానంవంకా, సముద్రందాకా విస్తరించిన పొలాలవంకా చూస్తున్నాడు. ఈ విశాలమైన ప్రకృతిని అతను ఎంతో ప్రేమించాడు, కానీ ఇపుడు అతను ఒంటరి.

***

Read the Original English Translation by Justin O’Brien here:

http://www4.ncsu.edu/~dsbeckma/the%20guest%20by%20albert%20camus.pdf

http://bradleynorton.blogspot.in/2012/05/literary-analysis-guest-by-albert-camus.html

murthy gaaruఅనువాదం: నౌడూరి మూర్తి

బిలియర్డ్స్ ఆట…

220px-Alphonse_Daudet_2

ఆల్ఫోన్స్ డాడెట్

(13 May 1840 – 16 December 1897)

ఫ్రెంచి నవలాకారుడు, కథా రచయిత, కవీ.

*

రెండురోజులబట్టీ పోరాడుతున్నారేమో, సైనికులు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. వర్షం పడుతూ, క్రిందనుండి నీళ్ళు ప్రవహిస్తున్నా లెక్కచెయ్యకుండా వాళ్ళు వీపులకి తగిలించిఉన్న సంచీలతోనే నిద్రపోతున్నారు. ఆయుధాలు పక్కనబెట్టి, చెరువులయిపోతున్న రాజమార్గం మీదా, నీరు ఊరుతున్న బురద పొలాలల్లోనూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే మూడు గంటలపాటు అలా నిరీక్షించవలసి వచ్చింది.

అలసటవల్ల, నిద్రలేమివల్ల, యూనిఫారంలతో నిలువునా తడిసిముద్దయిపోవడం వల్లా శరీరం కొంకర్లుపోయి వెచ్చగా ఉండడానికి ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకున్నారు;  కొందరయితే ఒకరి భుజానికున్న సంచికి మరొకరు చేరబడి నిలబడే నిద్రపోతున్నారు; ఆ నిద్రలో ప్రశాంతంగా వాళ్ల ముఖాలు కనిపిస్తున్నా, వాళ్ళల్లో అలసటా, ఆకలీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

తెరిపిలేకుండా కురుస్తున్న వర్షం… ఎక్కడచూసినా బురద, తినడానికి ఏమీ లేకపోవడం, కొండదిగిన నల్లని మబ్బులు, ఎప్పుడు వచ్చి మీదపడతాడో తెలియని శత్రుభయంతో… చుట్టూ మృత్యువాతావరణం అలముకుని ఉంది.

వాళ్ళక్కడ ఏం చేస్తున్నట్టు? అక్కడ ఏం జరుగుతోంది? ఫిరంగులు వాటి మూతులు అడవిపక్క గురిపెట్టి చూస్తూ, అక్కడ వేటినో పరీక్షగా చూస్తున్నట్టు కనిపిస్తున్నై. ఆకస్మికంగా దాడి చెయ్యడానికి పొదల్లో మెషిన్ గన్ లు ఆకాశంవంక నిరీక్షిస్తూ సన్నద్ధంగా ఉన్నాయి. అన్నీ దాడి చెయ్యడానికి ఆయత్తమయి ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎందుకు దాడి చెయ్యడం లేదు? దేనికోసం నిరీక్షిస్తున్నట్టు?

వాళ్ళు ఉత్తరువులకోసం ఎదురుచూస్తున్నారు… కేంద్ర కార్యాలయం ఏ ఉత్తర్వులు పంపదు. పోనీ అదేమన్నా చాలా దూరంలో ఉందా అంటే అదేం లేదు. లూయీ XIII  కోట కనుచూపు మేరలో కొండ మధ్యలో ఉంది… వానకడిగిన ఎర్రని కోట ఇటుకలు చెట్లమధ్యనుండి మెరుస్తున్నాయి. అది నిజంగా రాజభవనమే… సేనాధిపతి నివాసం అన్న ముద్ర ధరించడానికి తగిన యోగ్యత కలిగి ఉంది. రోడ్డుకి దూరంగా, ముందున్న వెడల్పైన కందకాన్నీ వెనకున్న రాతిగోడనీ వేరుచేస్తూ మెత్తని తివాచీలాంటి పచ్చిక … తలవాకిలి వరకూ వరసగా పువ్వులతో అలంకరించినట్టు వ్యాపించి ఉంది.

రెండోపక్క, ఆ భవనానికి వెనకభాగంలో, ఏకాంతంగా ఉండే స్థలంలో చుట్టూ కంచెలా నిలబడ్డ చెట్ల మధ్య ఖాళీలు కనిపిస్తున్నాయి; అక్కడ హంసలు ఈదుతున్న చిన్న కొలను అద్దంలా మెరుస్తోంది; గోపురంలా ఉన్న అసంఖ్యాకమైన పక్షులు వసించే చూరు క్రింద, చెట్టుకొమ్మల మధ్య, నెమళ్ళూ,అడవి కోళ్ళూ తమ పురులు విప్పి సోయగాలు ప్రదర్శన చేస్తూ, సన్నగా క్రేంకారాలు చేస్తున్నాయి. యుద్ధం వల్ల యజమానులు ఇల్లువీడి వెళ్ళిపోయినా, అక్కడ మనుషులెవ్వరూ లేనట్టూ, ఆలనాపాలనా చూసేవాళ్ళెవరూ లేనట్టూ కనిపించడం లేదు. దేశపతాకం చలవ వల్ల పచ్చికబయళ్ళలో అతిచిన్న పువ్వు కూడా చెక్కుచెదరకుండా పరిరక్షింపబడి ఉంది. యుద్ధభూమికి సమీపంలో చక్కగా తీర్చినట్టున్న పొదలతో, గంభీరమైన నిశ్శబ్దం అలముకున్న రాచబాటలతో  అంత మనోహరమైన  ప్రశాంతత లభించడం అరుదే.

దూరంగా కనిపిస్తున్న రోడ్లని చికాకుకలిగించేలా బురదతో ముంచెత్తుతూ, లోతుగా గోటులుతవ్వుతున్నట్టు కురుస్తున్న ఆ వర్షమే, ఇక్కడకొచ్చేసరికి రాజసంగా సన్నని చిరుజల్లులా కురుస్తూ, పచ్చికకి పచ్చదనాన్నీ, ఇటుకలకి పూర్వపు ఎర్రదనాన్ని తెస్తూ, హంసల రెక్కలనీ, నారింజ బత్తాయిచెట్ల ఆకుల్ని మెరుగుపెడుతోంది. ప్రతీదీ తళతళలాడుతూ, అంతా ప్రశాంతంగా ఉంది. నిజానికి ఇంటికప్పుమీద ఎగురుతున్న జండా, గేటుకి ముందు పహారా కాస్తున్న ఇద్దరు జవానులేగనక లేకపోతే అది సైనికాధికారి కేంద్రకార్యాలయమని ఎవరూ తెలుసుకోలేరు. గుర్రాలు అశ్వశాలలో విశ్రాంతి  తీసుకుంటున్నాయి. అక్కడక్కడ ఉండీ ఉడిగీ  మనకి  ఒక అశ్వ రక్షకుడో, వంటగది దగ్గర పచార్లూ చేస్తూ యూనిఫారంలో లేని ఆర్డర్లీనో, విశాలమైన ఆవరణలో ఎర్రని ఫేంటు తొడుక్కుని నిర్లిప్తంగా అరగొర్రు లాగుతూ తోటమాలీవో కనిపిస్తున్నారు.

ముఖద్వారంవైపు కిటికీలు తెరుచుకున్న భోజనాలగదిలో, సగం శుభ్రంచేసి ఉన్న ఒక టేబిలు కనిపిస్తోంది; దానిమీద నలిగిపోయిన గుడ్డా, ఇంకా మూతతియ్యని సీసాలూ, ఖాళీవీ, మరకలుపడిన సగం తాగి వదిలేసినవీ గ్లాసులు ఉన్నాయి; అక్కడనుండి అతిథులందరూ  నిష్క్రమించడంతో విందు ముగిసినట్టు తెలుస్తోంది. దాన్ని ఆనుకుని ఉన్న గదిలోంచి పెద్దగా మాటలూ, నవ్వులూ, గ్లాసులు ఒకదాన్ని ఒకటి సున్నితంగా తాకినపుడు చేసే ఘల్లుమన్న చప్పుడుతోపాటు, బంతులు ఒకదాన్ని ఒకటి ఢీకొడుతున్న చప్పుడుకూడ వినవస్తోంది. సైన్యాధ్యక్షుడు(మార్షల్) ఇక్కడ బిలియర్డ్స్ ఆడుతున్నాడు… అందుకనే అక్కడ సేన అతని ఉత్తర్వులకోసం ఎదురుచూస్తోంది. అతను ఒకసారి ఆట ప్రారంభించేక, మిన్ను విరిగి మీద పడ్డా, అది పూర్తిచెయ్యకుండా ప్రపంచంలో ఏదీ ఆపలేదు.

బిలియర్డ్స్! ఆ యోధుడికున్న ఒక పెద్ద బలహీనత. అతను ఆటకు వచ్చేడంటే, పూర్తి యూనిఫారంలో, గుండేమీద పతకాలు వేలాడుతూ, యుద్ధానికి వచ్చినంత గంభీరంగా ఉంటుంది అతని ముఖం;  విందు భోజనమూ, త్రాగుడూ, ఆటా ఇచ్చిన ఉద్రేకంతో కళ్ళు నిప్పుల్లా వెలుగుతూ, బుగ్గలు ఎర్రబారి ఉంటాయి. అతని అంగరక్షకులు వెన్నంటే ఉంటారు… భక్తీ, వినయమూ చూపిస్తూ అతను “క్యూ”తో కొట్టే ప్రతి దెబ్బకీ మెచ్చుకోలుగా చప్పట్లు చరుస్తూ. మార్షల్ ఒక పాయింటు సాధించేడంటే అది ప్రత్యేకంగా చెప్పుకుంటారు; అతనికి దాహం వేస్తే అతనికి మదిర అందించడానికి సిద్ధపడతారు. ఇక్కడ భుజకీర్తుల రాపిడులూ, తురాయిల కదలికలూ, ఒంటిమీద పతకాలపట్టీలు చేసే గలగలలూ నిరంతరాయంగా సాగుతూ ఉంటాయి. ఉద్యానవనాలకీ ఉన్నతమైన దర్బారులకీ ఎదురుగా ఉంటూ, గోడలకు ఓకు పలకలు తాపడంచేసి ఉన్న విలువైన ఆ మందిరంలో అందమైన చిరునవ్వులూ, సభాసదులు చేసే వినయపూర్వక వందనాలూ, సరికొత్త యూనిఫారాలూ, వాటిమీది బుటాలనగిషీలూ చూస్తుంటే, కాంప్య్ర్న్యూ (Compiègne)లోని రోజులు గుర్తొస్తూ, అదిగో అక్కడ దూరంగా రోడ్లమీద, వర్షంలో తడిసి వణుకుతూ, బట్టలు మట్టికొట్టుకుపోయిన బాధాకరమైన దృశ్యం నుండి కళ్ళకి కాస్త  ప్రశాంతత లభిస్తుంది.

మార్షల్ ప్రత్యర్థి ఒక యువ కేప్టెన్… ఉంగరాలజుట్టుతో, తేలికైన చేజోళ్ళు ధరించి బిలియర్డ్స్ ఆటలో ప్రపంచంలోని అందరు మార్షల్స్ నీ ఓడించగల సత్తా ఉన్న అగ్రశ్రేణి బిలియర్డ్స్ ఆటగాడు. అయితే అతనికి మన మార్షల్ నుండి ఎంత గౌరవప్రదమైన దూరంలో ఉండాలో ఆ మెలకువ బాగా తెలుసు. తన శక్తినంతా ఆట ఎలా గెలవకూడదో దానికి వినియోగిస్తున్నాడు. అలాగని సులువుగా ఓడిపోవడమూ లేదు. సరిగ్గా చెప్పాలంటే, మంచి భవిష్యత్తు ఉన్న అధికారి అతను.

ఓ యువకుడా, బహుపరాక్! అప్రమత్తంగా ఉండు. మార్షల్ వి పాయింట్లు పదిహేనూ, నీవి పదీను. అసలు విషయం ఏమిటంటే, చివరిదాకా ఈ ఆటని అలాగే కొనసాగనివ్వాలి. అలా చేస్తే నీ పదోన్నతికి, అదిగో బయట మిగతా వాళ్లతోపాటే దిక్కుల్ని ముంచెత్తుతున్న వర్షంలో తడుస్తూ, నీ యూనిఫారాన్నీ దానిమీది ఉపకరణాల్నీకుళ్ళు చేసుకుంటూ, రాని ఉత్తర్వులకోసం ఎదురుచూస్తూ చేసినదానికంటే …. ఎక్కువ చేసినట్టే.

ఆట నిజంగా ఆసక్తికరంగా ఉంది. కర్రబంతులు దొర్లుకుంటూ, ఒకదాన్నొకటి ఢీకొట్టుకుంటూ రంగులు కలగలుపుకుంటున్నట్టున్నాయి. అంచున ఉన్న మెత్తలు వాటిని వెనక్కి పంపుతున్నాయి. ఉండుండి ఆకాశంలో ఒక ఫిరంగి పేలిన చప్పుడు(కేనన్-షాట్)తోపాటు ఒక మెరుపు మెరుస్తుంది. దానితో పోలిస్తే కిటికీలు బహు నెమ్మదిగా కొట్టుకుంటై. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఒకరి వంక ఒకరు చూసుకుంటుంటారు ఆందోళనగా. ఒక్క మార్షల్ కే అతని ఏకాగ్రతలో ఏదీ వినిపించదు,కనిపించదు; టేబిలుమీద ఆనుకుని అతనిప్పుడు అద్భుతమైన డ్రా-షాట్ ఎలా కొట్టడమా ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు. డ్రాషాట్లు కొట్టడంలో అతను నేర్పరి.

కాని ఇంతలో ఒక దాని తర్వాత ఒకటి మెరుపులూ, వెనకనే ఫిరంగులు పేలడమూ వినిపిస్తోంది. అతని అంగరక్షకులు కిటికీలదగ్గరకి పరిగెడుతున్నరు. కొంపదీసి ప్రష్యన్లు గాని దాడి చెయ్యడం లేదుకదా!

“వాళ్లు దాడి చేస్తే చెయ్యనీయండి!” అన్నాడు మార్షల్ క్యూకి సీమసున్నం పూస్తూ. “కేప్టెన్, ఇప్పుడు మీ వంతు.”

అక్కడి ఉద్యోగులు ఆనందంతో పులకలెత్తారు. యుద్ధ భూమిలో ఉంటూ కూడా అంత ప్రశాంతంగా బిలియర్డ్స్ ఆదగలుగుతున్న తమ మార్షల్ ధైర్యం ముందు ఫిరంగులు మోసుకెళ్ళే వాహనం మీదే పడుక్కున్న టూరెన్ (1611-75 మధ్య జీవించి, 30 సంవత్సరాల యుద్ధంలో ఫ్రాన్సు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు)సాహసం ఏమీ కాదు అనుకున్నారు. ఫిరంగి గుళ్ళమోతతో మెషీన్ గన్లూ, తుపాకులమోత కలగలిసిపోయి వినిపిస్తోంది. ఈ మధ్యలో ఇక్కడ కోలాహలం కూడా రెట్టింపవుతోంది. అంచులంట నల్లగా ఉంటూ ఎర్రని కాలువల ప్రవాహం పచ్చికనానుకుని ప్రవహించడం ప్రారంభించింది. పక్షిశాలలో నెమళ్ళూ అడవికోళ్ళూ భయంతో అరుస్తున్నాయి. అరబ్బీ గుర్రాలు తుపాకుమందు వాసన పసిగట్టడంతో గుర్రాలశాలలో అసహనంగా వెనకకాళ్ళమీద లేస్తున్నాయి. కేంద్రకార్యాలయంలో ఆందోళన ఎక్కువయ్యింది. కబురు తర్వాత కబురు వస్తోంది. వార్తాహరులు ఒకటే పరుగులు. సైన్యాధ్యక్షుడు ఎక్కడ అని అడుగుతున్నారు.

కానీ మార్షలు కనిపించడే. నే చెప్పలేదూ, అతను ఆట ప్రారంభించేక ముగించేదాకా ఏదీ అడ్డదని?

“కేప్టెన్! ఇప్పుడు మీ వంతు.” అన్నాడు మార్షల్ మళ్ళీ.

కానీ కేప్టెన్ బాగా కలవరపడుతున్నాడు. కుర్రతనం అంటే అదే. లేకపోతే చూడండి. అతని మనసు మనసులో లేదు. వ్యూహాలు మరిచిపోయేడు. వరసగా రెండు పాయింట్లు సాధించి ఆట గెలిచేసేంత పని చేశాడు. దాంతో మార్షలుకి పట్టలేని కోపం వచ్చింది. ఆశ్చర్యం, ఆగ్రహం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అదేక్షణంలో ప్రాంగణంలోకి బాగా పరిగెత్తి నిట్టూరుస్తున్న గుర్రం ఆగింది. మట్టికొట్టుకుపోయిన ముఖంతో అతని సంరక్షకుడొకడు కాపలాదారులందర్నీ తప్పించుకుంటూ ఒక్క ఉదుటులో మెట్లన్నీఎక్కి వచ్చేడు. “మార్షల్! మార్షల్!”… అతను ఎలా అభివాదం చేశాడో చూసితీరవలసిందే. కోపంతో ఊగిపోతూ, కోడిపుంజులా ముఖం ఎర్రబారిపోయి మార్షల్ చేతిలో క్యూతో కిటికీ దగ్గరకు వెళ్ళేడు.

“ఏమిటి సంగతి? ఇదంతా ఏమిటి? అక్కడ కాపలాదారులెవ్వరూ లేరా?” అని అరిచేడు.

“కానీ, మార్షల్…” అంటూ అతనేదో చెప్పబోయాడు.

“సరే, ఒక్క క్షణం; నేను ఉత్తర్వులిచ్చేదాకా నిరీక్షించు.”

కిటికీ దభాలుమని మూసుకుంది.

అతని ఉత్తర్వులకోసం నిరీక్షించాలి! పాపం, సైనికులు. ఇంత సేపూ వాళ్ళు చేస్తున్నపని అదే. గాలి వర్షాన్నీ, తుపాకీ గుళ్ళనీ వాళ్ల ముఖాలమీద కొడుతోంది. కొన్ని బెటాలియన్లకి బెటాలియన్లు అప్పుడే తుడుచుపెట్టుకు పోయేయి; కొన్ని ప్రతిచర్యకి సిద్ధంగా ఉన్నా తమ అచేతనకి కారణం తెలియక నిరర్థకంగా నిలబడి ఉత్తర్వులకోసం నిరీక్షిస్తున్నాయి.  చచ్చిపోడానికి ఏ ఉత్తర్వులూ అక్కరలేదు కనక, వందలకొద్దీ సైనికులు పొదల్లోనూ, కందకంలోనూ, ప్రశాంతంగా ఉన్న ఆ కోట ముఖద్వారందగ్గరా చచ్చి పడి ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినా, నిర్దాక్షిణ్యంగా ఫిరంగులు వాళ్ళని చీల్చి ముక్కలుచేసి పారెస్తున్నాయి; తెరిచి ఉన్న వాళ్ల గాయాల్లోంచి ఫ్రాన్సు రక్తం మౌనంగా పారుతోంది. పైన, బిలియర్డ్స్ గది మాత్రం ఆట తీవ్రతతో వేడేక్కిపోతోంది. మార్షల్ మళ్ళీ తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు; అయితే, కేప్టెన్ మాత్రం సింహంలా పోరాడుతున్నాడు.

పదిహేడు. పద్ధెనిమిది. పంథొమ్మిది.

వాళ్లకి పాయింట్లు లెక్కపెట్టడానికి సమయం లేదు. యుద్ధం చప్పుడు మరింతదగ్గరగా వచ్చేస్తోంది. మార్షల్ కి ఇంక ఒక్క పాయింటు మాత్రమే కావాలి. అప్పటికే పార్కులో గుళ్ళవర్షం కురుస్తోంది.  అకస్మాత్తుగా ఫిరంగి గుండు ఒకటి కొలనులో పేలింది. గదిలో అద్దం భళ్ళున పగిలి ముక్కలయింది. రక్తం ఓడుతున్న రెక్కలతో హంస ఒకటి ప్రాణభయంతో అరుస్తూ కొలనులో పిచ్చెక్కినట్టు ఎటుపడితే అటు ఈదుకుంటూ పొతోంది… అదే మార్షలు కొట్టిన చివరి స్ట్రోక్ కూడా.

అంతే! అంతా చెప్పలేని నిశ్శబ్దం ఆవరించింది. వినిపిస్తున్న చప్పుడల్లా కేవలం తుప్పల్లో పడుతున్న వర్షానిది. కొండ మొదలులో ఏదో గందరగోళం; బురదకొట్టుకుపోయిన రోడ్లమీద పరిగెడుతున్న సైనికుల అడుగుల చప్పుడు. సైన్యం పూర్తిగా పలాయనం చిత్తగిస్తోంది. మార్షల్ మాత్రం తన ఆట గెలిచాడు.

Read the Original in English here: http://www.bartleby.com/313/4/4.html

 

సహచరి

220px-Portrait_of_Washington_Irving_by_John_Wesley_Jarvis_in_1809

వాషింగ్టన్ ఇర్వింగ్

మూల రచయిత పరిచయం :  వాషింగ్టన్ ఇర్వింగ్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది అతని ప్రసిద్ధమైన కథలు ‘రిప్ వాన్ వింకిల్”, “ది లెజెండ్ ఆఫ్ స్లీపీ హాలో”. అవి సుమారు రెండు వందల సం వత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ వాటి కొత్తదనం, చదివించేగుణం కోల్పోక ప్రపంచం మొత్తమ్మీద పిల్లలనీ  పెద్దలనీ అలరిస్తూనే ఉన్నాయి.  ఇర్వింగ్ మంచి కథా రచయితేగాక, వ్యాసకర్తా, చరిత్రకారుడూ కూడా. అతను  ఆలివర్ గోల్డ్ స్మిత్, ముహమ్మద్, క్రిష్టఫర్ కొలంబస్, జార్జి వాషింగ్టన్ మొదలైన వాళ్ళ జీవిత చరిత్రలు రాయడంతో పాటు, 1842-46 ల మధ్య స్పెయిన్ లో అమెరికన్ రాయబారిగా పనిచేశాడు.

 అతను జర్మన్, డచ్చి జానపదకథలలోంచి కొన్ని సంఘటనలు స్వీకరించినా, కథ నేపథ్యాన్ని మాత్రం అమెరికాలోనే ఉంచుతూ, “అమెరికను కథ” కి ఒక నిర్దిష్టమైన రూపం ఇచ్చిన తొలి రచయితే గాక, కేవలం సాహిత్య సృజనవల్ల మాత్రమే జీవితాన్ని నడపగలిగిన రచయిత వాషింగ్టన్ ఇర్వింగ్.”

ఒక స్త్రీ ప్రేమబంధంలో చిక్కుకున్నవ్యక్తి అనుభవించే కనిపించని సౌఖ్యాలతో సరిపోల్చినపుడు సముద్రంలో దొరికే నిధులు ఏమంత విలువైనవి కావు. నేను ఇంటిని సమీపిస్తుంటే చాలు, నా అదృష్టపు సుగంధాలు నన్ను తాకుతుంటాయి. ఆహ్! వివాహం ఎంత కమనీయమైన శ్వాసలనందిస్తుంది! దానిముందు ఏ తోటసువాసనలైనా దిగదిడుపే…..

 

                          థామస్ మిడిల్టన్. ఆంగ్ల నాటక కర్త (1570- 1627)

 *

 జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే తీవ్రమైన కష్టనష్టాలని స్త్రీలు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరో ప్రస్తావించవలసిన సందర్భాలు నాకు చాలా ఎదురయ్యాయి. ఆ దుర్ఘటనలు మగవాడి మానసికస్థైర్యాన్ని దెబ్బతీసి వాడు వాటికి దాసోహమని నేలపై సాష్టాంగపడేలా చేస్తే, కోమలహృదయులైన స్త్రీలలో మాత్రం తమ అంతరాల్లోంచి ఎక్కడలేని శక్తుల్నీ కూడదీసుకునేలాచేసి, మొక్కవోని ధర్యంతో నిలబడగల సాహసానికి ప్రేరేపించి, వాళ్ల వ్యక్తిత్వాలకు ఎంత ఉదాత్తత కలిగిస్తుందంటే, వాళ్లకి ఏవో మహత్తులున్నాయేమోననిపిస్తుంది. జీవితంలో అన్నీ సుఖంగా సజావుగా జరిగిపోతున్నప్పుడు, అన్నిటికీ మగవాడిమీదనే ఆధారపడుతూ, బేలగా, ప్రతి చిన్న విషయానికీ విలవిలలాడే ఆ అబలే, కష్టాలపరంపర చుట్టుముట్టి ఊపిరిసలపనివ్వనపుడు, ఒక్కసారిగా ధైర్యాన్ని చిక్కబట్టుకుని, కష్టాల్లో మగవాడికి ఆశ్వాసననివ్వడమేగాక, అండగానిలబడడం గమనించినపుడు, అంతకుమించి హృదయాన్నితాకగల సందర్భం మరొకటి లేదనిపిస్తుంది.

తన అందమైన తీవెలబంధాలతో అల్లుకోనిచ్చి పైపైకి ఎగబ్రాకడానికి ఓక్ చెట్టు అవకాశమిచ్చినందుకు ప్రతిగా ఎలాగైతే ద్రాక్షతీగ పిడుగుపాటుకి ఆ చెట్టు రెండుగా చీలిపోకుండా, దానికొమ్మలు విరిగిపోకుండా తన లలితమైన నులితీగెలతో దృఢంగా, గాఢంగా బంధించి కాపాడుతుందో, అలాగే, దైవంకూడా మగవాడికి ఒక కళనిస్తూ, అతని సుఖసౌఖ్యాల్లో కేవలం అతనిమీదే అన్నిటికీ ఆధారపడే స్త్రీని, అతను అకస్మాత్తుగా కష్టాలపాలయినపుడు అతనికి బాసటగా, ఊరటగా ఉండేటట్టు నియమించింది; మొరటైన అతని వ్యక్తిత్వపులోతులలోకి చొరబడి లతలా అల్లుకుని, వాలిన అతని తల నిటారుగా ఉండేట్టు చెయ్యడమే గాక, పగిలిన అతని హృదయాన్ని అతికి ఆమె మనశ్శాంతి అందిస్తుంది.

ప్రేమాభిమానాలూ, చిక్కని అనుబంధాలతో వర్ఠిల్లుతున్న కుటుంబంగల మిత్రుని అభినందించడానికి ఒక సారి వెళ్ళాను. “నీకింతకంటే ఉత్తమమైన ఆకాంక్షలివ్వలేను,” అని ఎంతో ఆర్ద్రంగా ఇలా అన్నాడతను: “నువ్వుకూడా భార్యాపిల్లలతో సుఖంగా ఉండాలి. నువ్వు సిరి సంపదలతో  తులతూగుతున్నావనుకో, దానిలో భాగస్వాములవడానికి వాళ్ళుంటారు; దానికి భిన్నంగా ఉన్నా వనుకో, నీకు ఓదార్పునివ్వడానికి వాళ్ళుంటారు.”

నా అనుభవంలో కష్టాలొచ్చినపుడు ఒంటరిగా జీవించేవాళ్ళకంటె  ఎక్కువగా వివాహితుడు వాటినుండి బయటపడడాన్ని గమనించేను. దానికి కారణం, తనకి ప్రేమాస్పదులైన వాళ్లందరి జీవితాలూ అవసరాలకి అతనిమీదే ఆధారపడడంవల్ల వాటిని సమకూర్చడంలో కలిగే అలసటకి అతను అలవాటుపడడం ఒక ఎత్తైతే, రెండోది తనే సర్వాధికారై తనకోసం ప్రేమతో ఎదురుచూసే కుటుంబం ఉండడం వల్ల, బయట ఎన్ని అవమానాలూ, ఎంత నిరుత్సాహమూ ఎదురైనా, వాళ్ల ప్రేమపూర్వకమైన పలకరింపులు అతనికి ఊరటనిచ్చి అణగారిన అతని ఉత్సాహమూ, ఆత్మగౌరవమూ తిరిగి పుంజుకునేలా చేస్తాయి; అదే ఒంటరిగా జీవించే వ్యక్తి తనకెవరూ లేరనీ, తన్నందరూ విస్మరించేరనీ భావించి, మనుషులు నివసించని పాడుబడ్డ భవనంలా మనసు వికలమై, తన్ను తాను అశ్రద్ధచేసుకుని చెడిపోడానికే  అవకాశాలున్నాయి.

ఈ పరిశీలనలు నేను ప్రత్యక్షంగా గమనించిన ఒక ఆత్మీయమిత్రుడి కథని గుర్తుచేస్తున్నాయి.

లెస్లీ అని నాకో ప్రాణ మిత్రుడుండేవాడు. అతను చాలా అందమైనదీ, సమర్థురాలూ, నాగరీకంగా పెరిగిన ఒక అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. ఆమె పెద్ద ధనవంతురాలేమీ కాదు గాని, మా స్నేహితుడు మాత్రం బాగా ధనవంతుడే; అందుకని అందమైన స్త్రీని మగవాడు ఎన్నిరకాల సొగసులతో, అలంకారాలతో ముంచెత్తగలడో తలచుకుంటూ ఊహల్లో తేలిపోతూ మురిసిపోతుండేవాడు. “ఆమె జీవితం ఒక గాథలా సాగిపోవాలి” అని అంటుండేవాడు.

వాళ్ళిద్దరి వ్యక్తిత్వాల్లోని తేడాయే వాళ్ళిద్దర్నీ ఒక పొందికైన జంటగా చేసింది; అతనెప్పుడూ ఊహల్లో తేలుతూ, కొంచెం గంభీరంగా ఉంటాడు; ఆమె ఎప్పుడూ ఆనందంగా జీవంతో తుళ్ళిపడుతూ కనిపించేది. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ, అతనామెనే మౌనంగా ఆరాధనగా పరికిస్తూ పారవశ్యంలో మునిగిపోవడం చాలాసార్లు గమనించేను; ఉల్లాసమూ, చురుకుదనం వంటి ఆమె వశీకరణశక్తులే ఆ ఆనందానికి హేతువులు. ఎంతమంది కరతాళధ్వనులు చేస్తున్నా, ఆమె చూపులు అతనివైపే మరలేవి, అతని ఒక్కడిదగ్గరనుండే అభినందననీ, మెప్పుకోలునీ ఆశిస్తున్నట్టు. అతని భుజం మీద వాలినప్పుడు ఆమె నాజూకైన శరీరం, చూపరులకి పొడవుగా మగతనం ఉట్టిపడే అతని శరీరంతో చక్కని వ్యత్యాసాన్ని గుర్తుచేసేది. అతన్ని చూస్తున్నప్పుడు ఆమె కళ్లలో తొణికిసలాడే బులపాటమూ, విశ్వాసమూ అతనిలో ఆమెను గెలిచినందుకు గొప్ప గర్వంతో పాటు, ఆమె సౌకుమార్యం పట్ల గారాబం కలిగిస్తూ ఆ అశక్తత లోనే అతనికి మోజు ఉందేమోననిపిస్తుంది. నాకు తెలిసి ఆనందమయమైన భవిష్యత్తు నాకాంక్షిస్తూ వైవాహిక జీవితపు పూలబాటపై తరుణవయస్సులో మరే చక్కని జంటా కాలుపెట్టలేదు.

దురదృష్టవశాత్తూ నా మిత్రుడు అతని సంపదని హామీలేని ఊహాత్మక పెట్టుబడులలో పెట్టడానికి ప్రయత్నించేడు. పెళ్ళి అయి ఎక్కువ నెలలు కూడా కాలేదు, వరుసగా సంభవించిన నష్టాలపరంపరవల్ల అతను సర్వమూ కోల్పోయి దారిద్ర్యం అంచుకి చేరుకున్నాడు. చెదిరిన గుండెతో, వాడిన ముఖంతో, ఎవరికీ కొంతకాలం ఈ విషయం చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. అతని జీవితం క్రమంగా సుదీర్ఘమైన యాతనగా మారింది; అంతకుమించి అతని భార్య సమక్షంలో పెదాలకు చిరునవ్వు తగిలించుకోవలసి రావడం ఇంకా దుర్భరమైపోయింది, ఎందుకంటే ఈ విషయం ఆమెకు చెప్పే ధైర్యం అతను చెయ్యలేకపోయాడు. అయితే, అనుకంపతో కూడిన ఆమె నిశితమైన చూపులు అతనిలో కలిగిన మార్పులు గుర్తించి అంతా సవ్యంగా లేదని పసిగట్టేయి.

అతని చూపులు ఆమె చూపులని తప్పించుకుందికి చేసే ప్రయత్నాలూ, అతను బలవంతంగా అణచుకుంటున్న నిట్టూర్పులూ గుర్తించింది; ఉల్లాసంగా ఉన్నట్టు ఆమెని నమ్మించడానికి అతను చేస్తున్న వ్యర్థప్రయత్నాలు ఆమె దృష్టిని దాటిపోలేదు. అందుకని ఆమె తన సర్వ సమ్మోహ శక్తులూ అతన్ని ఉత్సాహపరచి ఆనందంగా ఉంచడానికే వినియోగించనారంభించింది. దాని వల్ల అసంకల్పితంగానే ఆమె అతని గాయాన్ని మరింత తీవ్రం చేసింది. ఆమెని అభిమానించడానికి కారణాలు పెరుగుతున్నకొద్దీ, ఆమెని దారిద్ర్యానికి గురిచేయవలసివస్తుందే అన్న ఆలోచన అతన్ని ఇంకా చిత్రహింసకి గురిచెయ్యడం ప్రారంభించింది. కొద్దికాలంలోనే ఆమె బుగ్గలమీదనుండి చిరునవ్వు మాయమవబోతోంది కదా… త్వరలోనే ఆమె పెదవులమీదనుండి పాత అంతరిస్తుంది కదా… ఆ కళ్ళలోని మెరుగులు దుఃఖంతో కప్పబడి, ఆనందంతో కొట్టుకుంటున్న ఆమె గుండె ఇకమీదట నాలాగే ఈ ప్రాపంచిక విషయాల బరువుబాధ్యతలతో  క్రుంగిపోవలసిందేగదా… అని చింతించసాగేడు.

చివరకి ఎలాగయితేనేం ఒక రోజు నా దగ్గరకు వచ్చి, విషయాన్నంతటినీ తీవ్రమైన నిస్సహాయతతో కూడిన గొంతుతో విశదీకరించేడు. అతను చెప్పడం అంతా పూర్తయిన తర్వాత అడిగేను, “నీ భార్యకి ఈ విషయాలన్నీ తెలుసా?” అని. అనడమే తడవు బాధతో ఒక్కసారి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. “దేముడిమీద ఒట్టు!” అన్నాడతను,”నా మీద నీకు ఏమాత్రం జాలీ కనికరం ఉన్నా, నా భార్యకి ఈ విషయం తెలియనీ వద్దు; అసలు ఆమె భవిష్యత్తు గురించి ఆలోచన వస్తే చాలు నాకు పిచ్చెక్కినంతపని అవుతుంది.”

“ఎందుకు చెప్పకూడదూ?”అని అడిగేను నేను. “ఇవేళ కాకపోతే రేపయినా ఆమెకు తెలియవలసిందే; ఆమెనించి ఈ విషయం నువ్వెంతకాలమో దాచలేవు; ఈ విషయం ఆమెకి పరోక్షంగా తెలిసి ఆమె ఆశ్చర్యపోయేకంటే, నువ్వు చెప్పడమే మంచిది. ఎందుకంటే, మనం అభిమానించే వాళ్ల మాటలు రాబోయే ఎంతటి కష్టాన్నయినా ధైర్యంగా ఎదుర్కొనేలా చెయ్యగలవు. అదిగాక, ఆమె చెప్పబోయే ఓదార్పువచనాలు నువ్వు కోల్పోతున్నావు. అంతకు మించి, రెండుహృదయాలను దగ్గరగా కలిపి ఉంచగల బంధం… ఇద్దరిమధ్యా ఏ అరమరికలూ లేని ఆలోచనలూ, అనుభూతులూ… దానికి విఘాతం కలిగిస్తున్నావు. ఏదో విషయం నీ మనసు దొలిచేస్తోందని ఆమె త్వరలోనే తెలుసుకోగలుగుతుంది. నిజమైన ప్రేమ రహస్యాలను దాచడాన్ని తట్టుకోలేదు. తను ప్రేమించిన వాళ్ళు తమ బాధల్ని తననుండి దాచినప్పుడు తనని కించపరిచినట్టూ, అవమానించినట్టూ బాధపడిపోతుంది.

“ఓహ్! ఏమి చెప్పను మిత్రమా! ఆమె భవిషత్తుకి నేను ఎటువంటి కోలుకోలేని దెబ్బ తీస్తున్నానో…ఆమె భర్త ఒక యాచకుడిగా మారేడని చెప్పి ఆమె ఆశల్ని ఎంతగా నేలపాలు చెయ్యాల్సి వస్తుంది! జీవితంలోని అన్ని విధాలైన సుఖాలనీ వదులుకోవలసి వస్తుందని ఎలా చెప్పను? పదిమందిలో తిరిగే అవకాశం పోతుందనీ, నాతో పాటే పేదరికంలోకి, తెరమరుగుకి వెళ్ళిపోవలసివస్తుందనీ ఎలా చెప్పేది? ప్రతికంటికీ వెలుగుగా, ప్రతి హృదయానికీ అబ్బురంగా ఉంటూ నిత్యమూ కళకళలాడుతుండవలసిన ప్రపంచంలోంచి,  ఆమెని అధోస్థితికి లాక్కొచ్చేనని ఎలా చెప్పడం? ఆమె పేదరికాన్ని ఎలా తట్టుకోగలదు? ఆమె కలిమి ఇవ్వగల అన్ని రకాల నాజూకులతో పెరిగింది. ఇప్పుడు ఆమె లేమిని ఎలా భరించగలదు? సమాజంలో ఆమె ఒక ఆదర్శ స్త్రీ. అయ్యో! ఆమె హృదయం బ్రద్దలవుతుంది! హృదయం బ్రద్దలవుతుంది!”

అతను అమితంగా దుఃఖపడడం చూసి, అతని మాటలప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నం చెయ్యలేదు; ఎందుకంటే, దుఃఖం మాటలలో తనకుతానే ఉపశమిస్తుంది. అతని ఉద్వేగం చల్లారిన తర్వాత అతనొక నిర్వేదపు మౌనంలోకి వెళ్ళిపోయాడు. అందుకని, నేను తిరిగి ఈ విషయాన్ని శాంతంగా లేవనెత్తి, అతని పరిస్థితిని భార్యకి చెప్పమని అర్థించేను. అతను ససేమిరా ఒప్పుకోలేదు బాధతో అడ్డంగా తలూపుతూనే.

“కానీ నువ్వీ విషయాన్ని ఆమెనుండి ఎలా దాచగలవు? ఆమెకి ఈ విషయం తెలియవలసిన అవసరం ఉంది, ఎందుకంటే, మారిన పరిస్థితులకి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నీ జీవన సరళి మార్చుకోవాలి, అంతే కాదు,” నేనా మాట అంటున్నప్పుడు అతని ముఖం మీద వేదన ఛాయ దొరలడం గమనించి, “ఆ ఆలోచన నిన్ను పట్టి పీడించకూడదు. నాకు తెలుసు నీ ఆనందం తెచ్చిపెట్టుకున్నది కాదు… ఇప్పటికీ నీకు మంచి స్నేహితులున్నారు, నువ్వంటే ప్రాణం ఇస్తారు. వాళ్లు నీ పరిస్థితి మారినంత మాత్రంచేత నిన్ను తక్కువగా అంచనా వెయ్యరు; నిజానికి సుఖంగా బ్రతకడానికి ఒక విలాసవంతమైన భవనమే ఉండవలసిన పని లేదు.”

“ఆమెతో నేను పూరిపాకలోనైనా సుఖంగా ఉండగలను,” వెక్కి వెక్కి ఏడుస్తూనే, మళ్ళీ, “ఆమె తోడుంటే నేను పేదరికంలోకే కాదు… చివరకి మట్టిలోకూడా హాయిగా కలిసిపోగలను… భగవంతుడు ఆమెని కనికరించాలి నావల్ల అటువంటి దుస్థితి ఆమెకి కలుగకుండా.” ఆమెమీద అతనికున్న ప్రేమవల్ల ఆ మాటలు అంటున్నప్పుడు దుఃఖం తెరలు తెరలుగా తన్నుకురావడంతో ఏడుపు కట్టలుతెంచుకుంది.

అతనికి దగ్గరగా జరిగి, తనచెయ్యి నా చేతిలోకి లాలనగా తీసుకుని, “మిత్రమా! నా మాట నమ్ము. ఆమె ఎప్పటిలాగే ఆత్మీయంగా ఉంటుంది; కాదు, ఇప్పటికంటే కూడా ఆత్మీయంగా ఉంటుంది; తన సర్వ శక్తుల్నీ కూడదీసుకుని నీ మీద తనకున్న ప్రేమ నిన్ను నిన్నుగా చూసి, అంగీకరించడంవల్లనే తప్ప నీ సంపదవల్ల కాదన్న సత్యాన్ని ఋజువు చేసుకుందికి ఇదొక అవకాశంగా భావించి గర్వపడుతుంది. నిజానికి ప్రతి స్త్రీ హృదయంలోనూ భోగభాగ్యాలలో తులతూగుతున్నప్పుడు బయటకి కనిపించని ఒక దివ్యాంశ అంతరాలలో నిద్రాణమై ఉంటుంది; కష్టాలు ఎదురైనపుడు ఆ రవ్వ మేల్కొని, దేదీప్యంగా ప్రకాశిస్తుంది. ఈ ప్రాపంచికమైన కష్టాలలో ఆమె తోడుగా నడిచేంతవరకూ ఏ భర్తకీ తన జీవిత సహచరి ఎంతటిదో, ఆమె తనని నడిపించే ఎంత గొప్ప దేవతో అవగతం కాదు.

నేను చెప్పిన తీరులోని అతనికి కనిపించిన నిజాయితీ, నేనుపయోగించిన ఉపమానాలూ బహుశా లెస్లీ వేదనాభరితమైన హృదయాన్ని ఎక్కడో తాకేయి. నేను వ్యవహరిస్తున్న శ్రోత సంగతి నాకు బాగా తెలుసును; అందుకని, నా మాటలు అతనిపై చూపించిన ప్రభావాన్ని పురస్కరించుకుని, ఇంటికి వెళ్ళిన వెంటనే ఆమెకి ఈ విషయాన్ని విపులంగా విశదీకరించి తన గుండె బరువుని తగ్గించుకోమని  సలహా ఇచ్చి ముగించేను.

అయితే, ఇక్కడ ఒక విషయం ఒప్పుకోక తప్పదు. నేను ఎంతగా చెప్పినప్పటికీ దాని ఫలితం నేననుకున్నట్టు వస్తుందో లేదోనన్న చింత అయితే లేకపోలేదు. జీవితంలో ఎప్పుడూ సుఖాలనుభవించిన స్త్రీ నైతిక ధైర్యాన్ని అంచనా వేసేదెలా? సంతోషంగా గలగలలాడే ఆమె, అకస్మాత్తుగా కళ్ళకెదురుగా కనిపించే పేదరికాన్నీ, తద్వారా కలుగబోయే దైన్యాన్నీ నిరాకరించి, ఆమె అలవాటుపడ్డ సుఖాలెక్కడదొరుకుతాయో వాటిదోవనే వెతుక్కోవచ్చు. అదిగాక, మొదటినుండీ బాగా బ్రతికినవారు చెడిన తర్వాత చాలా చేదు అనుభవాలు దిగమింగుకోవలసి వస్తుంది; మొదటినుండీ పేదరికంలో ఉన్నవాళ్ళకి అలాకాదు.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, మరునాడు ఉదయం లెస్లీని కలిసినపుడు గుండె జోరుగా కొట్టుకోవడం మానలేదు. అతనామెకి ఉన్న విషయం చెప్పేడట.

“ఆమె దాన్ని ఎలా తీసుకుంది?” అడిగేను లోపలి ఆందోళన బయటకి కనపడనీయకుండా.

“ఒక దేవత లాగే! ఆమె మనసుకి ఇది ఒక ఊరటలా అనిపించిందేమో, నా మెడచుట్టూ చేతులు వేసి ‘అయితే, ఈ మధ్య మిమ్మల్ని ఇంతగాపట్టి పీడుస్తున్న విషయం ఇదేనన్నమాట ‘ అంది.” అంటూ, “పిచ్చిపిల్ల. తనకి ఏమీ తెలీదు. ఎటువంటి మార్పులకి తను లోనుగావలసి వస్తుందో. ఆమెకి పేదరికం అంటే ఒక ఆధిభౌతికమైన భావనే తప్ప, నిజమైన అవగాహన లేదు; ప్రేమకి అనుబంధంగా ఉన్న పేదరికంగురించి ఆమె కవిత్వంలో చదువుకుంది అంతే! లేమి అన్నది అనుభవంలోని విషయం కాదు; అలవాటుపడిన సౌకర్యాలకి ఇంకా లోటు రాలేదు ఆమెకి. పేదరికంలోని దౌర్భాగ్యం, తగ్గించుకోవలసిన అవసరాలూ, దానివల్ల ఎదుర్కోవలసిన అవమానాలూ, అనుభవంలోకి వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది.” అన్నాడు.

“సరే, నీ భార్యకు తెలియపరచడమనే కఠినమైన పని ఒకటి అయింది కాబట్టి, నువ్వీ విషయాన్ని లోకానికి ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తెలియపరచడం మంచిది. అలా తెలియపరచడం చాలా అవమానకరమే; కానీ, అది ఒక్కసారితో పోతుంది; అది తెలియపరచకపోవడం వల్ల నువ్వు ప్రతి రోజూ, ప్రతి క్షణమూ ఆ బాధ అనుభవించడం తప్పుతుంది.  నిజానికి, పేదరికం కన్నా, అదిలేనట్టు భ్రమింపజెయ్యడమే … ఖాళీ జేబుకీ, అహంకారానికీ మధ్య జరిగే పోరాటమే… ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తిని కృంగదీసేది. ఉన్నదున్నట్టుగా కనిపించడానికి ప్రయత్నించి చూడు, పేదరికానికి ఉన్న బాధించగల పదును పోతుంది,” అన్నాను. ఈ విషయంలో లెస్లీ పూర్తిగా సన్నద్ధుడై ఉన్నట్టు గ్రహించేను, అతని భార్య కూడా మారిన విధివ్రాలుకి అనుగుణంగా మారడానికి ఆతురతతోనే ఉంది.

 *

 కొన్ని రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అతనే నన్ను కలవడానికి వచ్చేడు. అతను పూర్వం ఉన్న భవంతి అమ్మేసి పట్నానికి కొన్ని మైళ్ళదూరంలో పల్లెలో ఒక కుటీరం తీసుకున్నాడు. ఆ కొత్త ఇంట్లో రోజువారీ అవసరమైన అతిసామాన్యమైన గృహోపకరణాలు తప్ప పెద్దవి ఏవీ అవసరం పడలేదు; అందుకని, తన భార్య వీణ తప్ప, పాత ఇంట్లోని గొప్ప గొప్ప సామగ్రి అంతా అమ్మేసేడు. అది వాళ్ల ప్రేమకీ, వాళ్ళ ప్రేమకథకీ సంబంధించినది కనుక వదిలేసేడట; అతని ప్రేమాయణంలో మధురమైన క్షణాలు … ఆమె మృదు మధురమైన కంఠంతో పాడుతూ వీణవాయిస్తుంటే, దానిపై అతను వాలి విన్న సందర్భాలేనట. భార్యని అంత వెర్రిగా ప్రేమించే అతని ప్రేమ కథలో ఈ సరసమైన సందర్భాన్ని విని హర్షంతో చిరునవ్వు నవ్వకుండా ఉండలేకపోయాను.

తను అపుడు పల్లెలోని కుటీరానికి వెళుతున్నాడు. అక్కడ రోజల్లా ఏర్పాట్లన్నీ అతని భార్య పర్యవేక్షించిందట. ఈ కుటుంబం కథ ముందుకి ఎలా వెళుతుందా అన్న కుతూహలం చాలా ఎక్కువగా ఉండడం కారణంగానూ, అది సాయంత్రం అవడం చేతా, నేనే తనని అనుసరించడానికి సుముఖత వ్యక్తపరిచేను.

ఆ రోజు పడ్డ శ్రమకి అప్పటికే అలసిపోయి ఉన్నాడతను. మేము అలా వెళుతుంటే, విషాదం నిండిన ఆలోచనల మౌనంలోకి జారుకున్నాడతను.

“పాపం మేరీ!” ఎలాగైతేనేం అతని పెదాలనుండి ఒక గాఢమైన నిట్టూర్పుతో ఒక మాట బయటకి వెలువడింది.

“ఏమిటి సంగతి , ఆమెకేమయినా జరిగిందా?” అని అడిగేను.

“ఏమిటీ,” అన్నాడు అతను నాపక్క ఒక అసహనపు చూపు చూస్తూ, “ఇలాంటి స్థితికి దిగజారిపోవడం కంటే వేరే ఏమి జరగాలి? ఒక దిక్కుమాలిన గుడిశలో ఉండవలసి రావడం, అతి సామాన్యమైన జీవితావసరాలకోసం ప్రాకులాడవలసి రావడం చాలదూ?”

“అయితే ఆమె ఈ మార్పుకి విచారిస్తోందా?”

“విచారమా? అది ఏ కోశానా లేదు. ఆమె ఆనందంగా, ఎంతో హాయిగా నవ్వుతూనే ఉంది. నిజానికి, ఆమె ఇప్పుడున్నంత ఉల్లాసంగా ఇంతకుముందు ఎప్పుడూ ఉన్నట్టు నేను ఎరగను; ఆమె నా పాలిట ప్రేమైక మూర్తి, సుకుమారి, కొండంత ఆసరా.”

“అయితే తప్పక అభినందించవలసిన పిల్ల,” అన్నాను నేను మనఃస్ఫూర్తిగా మెచ్చుకుంటూ. “నువ్వు బీదవాడివని అంటున్నావు కాని మిత్రమా, నువ్వింతకు ముందెన్నడూ ఇంత భాగ్యవంతుడివి కావు… ఆ స్త్రీలో ఉన్న ఎన్ని అంతులేని నిధులకు యజమానివో నీకు తెలీదు,” అన్నాను.

“ఓహ్. చెప్పకు మిత్రమా. ఈ పూరిపాకలో మొదటిరోజు గడిస్తే నేను ధన్యుడినే. నిజమైన పేదరికపు అనుభవానికి ఇవాళ ఇంకా మొదటిరోజు మాత్రమే. ఆమెకి పేద గుడిశ ఎలాగ ఉంటుందో పరిచయం అయింది. రోజల్లా ఇక్కడ  ఉన్న సాదా సీదా వస్తువుల్ని సర్దడానికే సరిపోయి ఉంటుంది. మొట్ట మొదటిసారిగా ఇంటిచాకిరీ చెయ్యడంలోని శ్రమ, అలసట ఆమెకి అనుభవంలోకి వచ్చి ఉంటాయి. మొదటిసారి ఆమె తన చుట్టూ ఏ విలాసవంతమైన వస్తువూ, ఏ కనీస సౌకర్యమూ లేకపోవడాన్ని గమనించి ఉంటుంది; బహుశా అలసిపోయి, ఉత్సాహం క్షీణించి రేపు ఎలా గడపాలా అన్న చింతతో కూలబడి ఆలోచిస్తూ ఉంటుంది.”

అతను చెప్పిన దాంట్లో కొంతసంభావ్యత ఉండడంవల్ల నేను మరి వాదన పొడిగించకపోవడంతో, ఇద్దరం మౌనంగా నడుస్తున్నాము.

ప్రధాన రహదారి నుండి మళ్ళి, బాగా దట్టంగా పెరిగిన చెట్ల మధ్యనుండి పోతుండడం వల్ల ఏకాంత సంతరించుకున్న సన్నని బాటపట్టేక అల్లంత దూరంలో వాళ్ల కుటీరం కనిపించింది. ప్రకృతినారాధించే కవికి చాలా సహజంగా కనిపించగల సామాన్యమైన కుటీరం అది. అయినప్పటికీ, దానిలో కనువిందు చేయగల ఒక అందమైన గ్రామీణ ఛాయలున్నాయి. ఒక వైపు ఆకులూ కొమ్మలతో విశృంఖలంగా పెరిగిన ద్రాక్షగ కప్పితే, రెండో వంక కొన్ని చెట్లు ఏపుగా పెరిగి వాటి కొమ్మల్ని విలాసంగా ఇంటిమీదకి జాచేయి. ద్వారానికి ముందరా, ఇంటి ముందు పరుచుకున్న పచ్చికదగ్గరా కుండీలలో పూలమొక్కలు అందంగా అలంకరించినట్టు వేలాడుతుండడం గమనించేను. ముందరనున్న కర్రగేటు నుండి ప్రారంభమైన కాలిబాట కొన్ని పొదలమధ్యనుండి వంపులు తిరుగుతూ ఇంటి ద్వారందాకా సాగుతోంది. మేం ఇంటిని సమీపించేసరికి మంద్రంగా సంగీతం వినిపిస్తోంది; లెస్లీ నా భుజాన్ని ఒత్తేడు; మేం ఒక క్షణం ఆగి సంగీతం వింటున్నాం. ఆ పాట పాడుతున్నది మేరీనే, లెస్లీకి చాలా ఇష్టమైన సరళమైన రీతిలో పాడుతోంది.

లెస్లీ చెయ్యి నా భుజం మీద వణకడం నేను గ్రహించేను. అతను మరింత స్పష్టంగా విందామని ముందుకి మరొక అడుగు వేశాడు. ఆ అడుగు వెయ్యడంలో కంకర బాటమీద చప్పుడు అయింది. కిటికీలోంచి ఒక అందమైన ముఖం తొంగిచూసి అంతలోనే మాయమయ్యింది. ముందు తేలికగా వేసిన అడుగుల చప్పుడు వినిపించి, తర్వాత తడబడుతూ మమ్మల్ని కలుసుకుందికి మేరీ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. చక్కని తెల్లటి గ్రామీణ స్త్రీ ఆహార్యం ధరించి ఉందామె. ఆమె సిగలో కొన్ని కొండపూలు తురుముకుంది; ఆమె బుగ్గమీద సిగ్గు విరుస్తోంది; ఆమె ముఖమంతా చిరునవ్వులు చిందిస్తోంది. మునుపెన్నడూ ఆమె అంత అందంగా కనిపించినట్టు నాకు గుర్తు లేదు.

నౌడూరి మూర్తి

“ప్రియతమా, జార్జ్,” అని ఆనందంతో కేరి, “హమ్మయ్య. నువ్వు ఇంటికి వచ్చేసేవు. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నువ్వు ఎప్పుడు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను; వీధి చివరకి పరిగెత్తుతూ వస్తున్నావేమోనని వెతుకుతున్నాను! మన ఇంటివెనక చెట్టుక్రింద టేబిలు సర్ది ఉంచేను. నీకు ఇష్టమని ఎన్ని తియ్యని స్ట్రా బెర్రీలు కోశానో. వాటితో మంచి క్రీం కూడా తయారు చేశాను. అన్నీ ఎంత బాగున్నాయో. ఇంకా మనం ఇక్కడే ఉన్నామేమిటి?” అంటూ  అతని చేతిలో ఆమె చెయ్యివేసి, అతని ముఖంలోకి తృప్తిగా చూస్తూ, “ఓహ్! మనకింక ఏ దిగులూ ఉండదు. ఎంత హాయిగా ఉంటామో చెప్పలేను” అంది.

పాపం లెస్లీ, తట్టుకోలేకపోయాడు. ఆమెని గుండెకి గాఢంగా హత్తుకుని, ఆమె చుట్టూ చేతులు వేసి, ఆమెని మాటి మాటికీ ముద్దులలో ముంచెత్తేడు. పాపం నోట మాట రాలేదు కానీ కళ్ళంట ఆనంద భాష్పాలు ధారాపాతంగా పెల్లుబికినై.

ఆ తర్వాత అతని పరిస్థితి మెరుగైంది, అతని జీవితం ఎంతో ఆనందంగా గడిచింది. అయితే అతను నాతో తరచు చెబుతుండే వాడు, ఆ క్షణాన్ని మించిన ఆనందం తిరిగి జీవితంలో ఎన్నడూ పొందలేదని.

( ఈ కథ ను ఇంగ్లీష్ లో ఇక్కడ చదవొచ్చు. Text Courtesy:: http://classiclit.about.com/library/bl-etexts/wirving/bl-wirving-thewife.htm)

( వ్యాసం లోని వాషింగ్టన్ ఇర్వింగ్ ఫోటో వికీపీడియా సౌజన్యం తో …http://en.wikipedia.org/wiki/Washington_Irving)

 

విందు

Katherinemansfield

(కేథరీన్ మేన్స్ ఫీల్డ్ The Garden Party – తెలుగు అనువాదం శారద)

[రచయిత్రి పరిచయం  :  కేథరిన్ మేన్స్ ఫీల్డ్ (1888-1923)- న్యూ జీలాండ్ కి చెందిన రచయిత్రి. న్యూజీలాండ్  లో పుట్టి  ముఫ్ఫై అయిదేళ్ళకే  ఇంగ్లండులో మరణించారు ఆవిడ.  రచయిత్రిగానూ, వ్యక్తిగతంగానూ చాలా వివాదాస్పదమైన జీవితం ఆవిడది. ఆవిడని అమితంగా ప్రేమించిన వర్జీనియా వూల్ఫ్, ఇడా బేకర్ లాటి వాళ్ళూ వున్నారు, విపరీతంగా ద్వేషించిన డ్.హెచ్. లారెన్స్ లాటి వాళ్ళూ వున్నారు. “జీవితానికీ వృత్తికీ మధ్య విభజన రేఖ వుండనే కూడదని” నమ్మిన ఈవిడ జీవితం కూడా ఆవిడ రచనల్లానే వుంటుంది.

ధైర్యంగా, నిర్భయంగా, నిజాయితీగా, ఎవరికీ ఏ సంజాయిషీలూ ఇవ్వకుండా, కొంచెం తన తోటి వారికి భిన్నంగా, చాలా ఆసక్తికరమైన స్త్రీ, అంతకంటే ఆసక్తికరమైన రచనలు మేన్స్ ఫీల్డ్ వి.

న్యూజీలాండ్ లో వెలింగ్టన్ లో పుట్టిన కేథరిన్ పదేళ్ళకే స్కూల్ మేగజీన్ కోసం రాసే వారు. సంపన్నుల కుటుంబం వాళ్ళది. తండ్రి బేంకరు. 1903 నించి 1906 వరకు లండన్ లో చదువుకుని న్యూజీలాండ్ తిరిగ్ వెళ్ళారు. అయితే అక్కడ రెండేళ్ళకంటే ఎక్కువ వుండలేక మళ్ళీ లండన్ తిరిగ్ వెళ్ళి జీవితాంతం అక్కడే వున్నారు.  స్త్రీ-పురుషులతో ఆమె లైంగిక సంబంధాలు వివాదాస్పదం. 1918 లో జాన్ మిడిల్ టన్ మరే ని వివాహమాడారు. వాళ్ళిద్దరూ 1911  నించే సహజీవనం మొదలు పెట్టారు. అయితే ఆమె అంతకు ముందే వివాహం చేసుకున్న బౌడెన్ తో చట్ట రీత్యా విడాకులు తీసుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరూ ఆగాల్సి వచ్చింది. బ్రతుకంతా రకరకాల వ్యక్తులతో సంఘర్షణ లోనూ, గర్భ స్రావాలతోనూ, అనారోగ్యంతోనూ, ఆర్ధిక ఇబ్బందులతోనూ బాధపడింది కేథరీన్ అనిపిస్తుంది.

తను స్వయంగా చెహోవ్ ని అభిమానించినా, ఆవిడ కథనం చాలా మంది ఇతర రచయితలని ప్రభావితం చేసింది. కేథరిన్ బ్రతుకే ఒక విచిత్రమైన కథలాగుంటుంది. ఇంకా వివరాలు కావలంటే ఇక్కడ చూడండి.

ఆమె శైలిలో నాకు చాలా నచ్చేది, కొంచెం స్పష్టాస్పష్టమైన పాత్ర చిత్రీకరణ. అంటే ప్రధాన పాత్రల గురించి కథ ఏమీ చెప్పదు. వాళ్ళ వయసు కానీ, సాంఘిక హోదా కానీ, ఇతర పాత్రలతో వారికుండే సంబంధ బాంధవ్యాలు కానీ ఏ వివరాలూ కథలో వుండవు. అవి మనం అర్థం చేసుకోవాలంతే. అంతే కాదు ప్రధాన పాత్రలు తమ చుట్టూ వుండే వారికంటే కొంచెం భిన్నంగా వుంటాయి. (అందుకే చాలా సార్లు ఆవిడ ప్రధాన పాత్రలు ఆవిడలాగే వుంటాయి.]

ఆ రోజు వాతావరణం చాలా బాగుంది. తోటలో విందుకొరకు ఆ కుటుంబం సరిగ్గా అలాటి వాతావరణమే కావాలనుకొంది. పెద్ద గాలులూ అవీ లేకుండా, ఆకాశమొక్క మబ్బు తునకైనా లేకుండా, వెచ్చగా, భలే బాగుంది. నీలాకాశంలో బంగారు చెంబు బోర్లించినట్టు సూరీడు! తోటమాలి పొద్దుణ్ణించీ తోటలోనే వున్నాడు. శుభ్రం చేస్తూ, ఊడుస్తూ, గడ్డి చెక్కేస్తూ, తోటంతా మిల మిలా మెరిసేలా చేస్తూ! అసలా గులాబీలు! తోటలో విందు ఇవ్వాలంటే గులాబీలు వుండి తీరాల్సిందేనని ఎవరైనా ఒప్పుకుంటారు. గులాబీలైతే అందరికీ తెలుస్తాయి, మిగతా పువ్వులు తెలిసినా తెలియకపోయినా. ఆ రోజు వందల కొద్దీ గులాబీలు పూచినట్టుంది తోటంతా.

పొద్దున్న కాఫీలూ, టిఫిన్లూ ఇంకా అవకముందే షామియానాలూ, పందిర్లూ వేసేవాళ్ళొచ్చేసారు.

“షామియానాలవీ ఎక్కడ వేయించమంటావమ్మా?” పిల్లలు అమ్మనడిగారు.

“ఇవాళ నన్నేం అడిగినా ప్రయోజనం వుండదు. నేను మీ అమ్మననే మాట మర్చిపోయి, నన్నూ ఒక అతిథిగా భావించండి. ఈ సంవత్సరం అన్ని బాధ్యతలూ మీకే వదిలేస్తున్నాను.”

మెగ్ ఎలాగూ పనివాళ్ళతో పని చేయించటానికి బయటికి వెళ్ళదు. అంతకుముందే తను తలంటుకోని తలకు తువ్వాలు చుట్టుకోని హాయిగా కాఫీ తాగుతూ కూర్చొనుంది. జోస్ ఎప్పుడూ పట్టు లంగా, కిమోనో లాటి జాకెట్టూ వేసుకొని వుంటుంది.

“లారా, నీకే వెళ్ళక తప్పదు. అలంకరణలవీ నీకే బాగా తెలుస్తాయి.”

చేసేదేమీ లేక లారా బ్రెడ్డు ముక్కని అలా చేత్తో పట్టుకోనే బయటికి పరిగెత్తింది. నిజానికి అలాటి వాతావరణంలో ఏదో ఒక వంకన బయటికి రావటమే ఇష్టం తనకి.

నలుగురు మగవాళ్ళు నిల్చొని వున్నారు తోటలో. కర్రలూ, షామియానాలూ, సామాన్లతో ఆమె కొసం ఎదురుచూస్తున్నారు. తను చేతిలోని బ్రెడ్డు ముక్కని ఇంట్లోనే ఎక్కడైనా పెట్టి రావాల్సింది అనుకుంది లారా. ఇప్పుడు పారేయటానికీ మనసొప్పలేదు. వాళ్ళ దగ్గరకొచ్చేసరికి కొంచెం సిగ్గుతో ఎర్రబడ్ద మొహాన్ని సీరియస్ గా పెట్టింది.

“గుడ్ మార్నింగ్!”  అచ్చం వాళ్ళమ్మలా గంభీరంగా అనటానికి ప్రయత్నించింది. కానీ, తన గొంతు చిన్న పిల్లల్లాగే అనిపించేసరికి ఇంకా సిగ్గుతో తడబడింది.

“మీరంతా వొచ్చినట్టేనా? ఇదేనా షామియానా?”

“అవును అమ్మాయిగారూ!” అన్నాడు వాళ్ళల్లో అందరికన్నా పొడ్డుగ్గా వున్న అతను.

సామాన్ల సంచీ పక్కకి జరిపి, తలపై వున్న టోపీని కిందికని ఆమె వంక చూసి చిరు నవ్వు నవ్వాడు. స్నేహంగా వున్న అతని చిరునవ్వుతో లారా కొంచెం సర్దుకొంది. స్వచ్ఛంగా నీలంగా వున్న అతని కళ్ళు చూసి, మిగతా అందరివైపూ చుసింది. అందరూ  “నిన్ను మేమేం తినేయం లేమ్మా! అంత భయమెందుకు?” అన్నట్టు నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నారు. అసలు వీళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగున్నారు, తనే అనవసరంగా భయపడింది. అందులో ఎంత అందంగా వుంది ఈ వుదయం. అయినా వుదయాల గురించి మాట్లాడటం కాదు, తను చాలా హుందాగా, బాధ్యతగా వుండాలి. తనకి తనే చెప్పుకుంది లారా.

“సరే! ఎక్కడ వేస్తారు షామియానా? ఆ లీలీ పూల పక్కన లాన్ లో వేస్తారా? అక్కడైతే బాగుంటుందా?”

అందరూ అటు వైపు చూసారు. పొట్టిగా లావుగా వున్న అతను పెదవి విరిచాడు. పొడుగాటి వ్యక్తి బొమ్మలు ముడేసాడు.

“అక్కడంత బాగుండదేమో అమ్మాయిగారూ. ఒక మూలకి వున్నట్టుగా వుంటుంది. ఇప్పుడూ, షామియానా అంటే ఎలాగుండాలంటే వచ్చిన అందరి దృష్టీ ఫేడీలమని పడి పోవాలన్నమాట, ” పొడుగాటి వ్యక్తి వివరించాడు.

అతని భాష అంతగా నచ్చకపోయినా, అతను చెప్పేది సరిగ్గానే వుందనుకుంది.

“అయితే టెన్నిస్ కోర్టు లో ఒక మూలకి వేస్తారా? కానీ, అక్కడ పాటల ప్రోగ్రాం కొరకు ఆర్కెస్ట్రా వాళ్ళు వుంటారు!”

“ఓ! అయితే బ్యాండు మేళం కూడా వుంటుందన్న మాట!” అన్నాడింకొక అతను. పాలిపోయిన మొహంతో, అలసిపోయిన కళ్ళతో ఒక్కసారి టెన్నిస్ కోర్టంతా పరికించి చూశాడతను. ఏమాలోచిస్తున్నాడో మరి!

“అబ్బే! బ్యాండంటే పెద్దదేమీ కాదు. చిన్న బ్యాండు!”

అంతలో మళ్ళీ పొడుగాటి వ్యక్తి కల్పించుకున్నాడు.

“అటు చూడండి అమ్మాయిగారూ! అక్కడైతే సరిగ్గా వుంటుంది.” అతను చూపించిన  చెట్ల వైపు చూసింది. అక్కడ షామియానాలు వేస్తే ఆ చెట్లేవి కనిపించవు మరి. కానీ ఆ చెట్లెంత అందంగా వున్నాయి! మిల మిలా మెరిసే ఆకులతో, బరువుగా వేళ్ళాడుతున్న పళ్ళతో, గర్వంగా, హుందాగా నిలబడి వున్నాయి.  అవన్నీ కనిపించకుండా షామియానా వేస్తే ఏం బాగుంటుంది?

ఆమె అభిప్రాయం వినకుండానే వాళ్ళంతా పని మొదలు పెట్టేసారు. పొడుగాటి వ్యక్తి మాత్రం అక్కడే ఆగిపోయి ఒక చిన్న పూవుని తెంపి వాసన చూడసాగాడు. లారా ఆశ్చర్యపోయింది. ఎంత మందికి పని మధ్యలో పూవుల వాసన చూసేంత ఓపికా, సహృదయమూ వుంటాయి, అనుకుందామె. పని వాళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగున్నారు. కనీసం తనతో ఆదివారాలు రాత్రి భోజనానికొచ్చి డాన్సులు చేసే పెద్ద కుటుంబాల్లోని జులాయిలకంటే!  అసలు మనుషుల్లో ఎక్కువ తక్కువలేమిటి, విచిత్రం కాకపోతే!

“నాకైతే అలాటి తేడాలేవీ లేవు. హాయిగా వీళ్ళతోనైనా స్నేహం చేయగలను, ఏ మాత్రం సందేహం లేకుండా, ” అనుకుంది లారా. అంతలోకే పనివాళ్ళు పని మొదలు పెట్టిన సందడి వినబడింది. “వెయ్ రా దెబ్బా! హైసా!”  పని వాళ్ళు సరదాగా అరుపులూ, పాటలూ మొదలు పెట్టారు.

అసలు శ్రామిక జనం ఎంత స్నేహంగా, స్వచ్ఛంగా వుంటారో కదా! డబ్బున్న వాళ్ళలాగా మూతులు బిగించుకొని కుర్చోకుండా పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, సంతోషంగా వుంటారు! తనూ వాళ్ళల్లో ఒకర్తినే అన్నది నిరూపించటానికి లారా బ్రెడ్డు ముక్క తింటూనే పొడుగాటి వ్యక్తి షామియానా కొరకు వేసిన డిజైను బొమ్మ చూడసాగింది.

“లారా! లారా! నీకే, ఫోన్!” ఇంట్లోంచి పెద్దగా వినపడింది.

“ఆ! వస్తున్నా!” ఎగురుతూ, గంతులేస్తూ, లారా తోటలోంచి ఇంట్లోకి పరిగెత్తింది. హాల్లో నాన్న గారూ, అన్నయ్య లేరీ, బయటికెళ్ళటానికి సిధ్ధమవుతున్నారు.

“లారా! ఒక్కసారి నా కోటు కొంచెం ఇస్త్రీ చేసిస్తావా? మధ్యాహ్నం వేసుకోవాలి!””

“ఓ! తప్పకుండా!” లారా పరిగెత్తి లేరీని ప్రేమగా హత్తుకుంది.

“అసలు పార్టీలంటే నాకెంత సంతోషంగా వుంటుందో చెప్పలేను.’

“అవుననవును. సరేకానీ, వెళ్ళి చూడు! నీకేదో ఫోన్ వచ్చింది.”

అయ్యో ఫోను సంగతి మర్చే పోయింది.!Sharada1

“హల్లో! ఎవరు? కిట్టీ? మధ్యాహ్నమా? భోజనానికా?వచ్చెయ్యి! పెద్ద వంటేమీ చెయ్యట్లేదు. ఊరికే బ్రెడ్డు! ఇవళ ఎంత అందంగా వుంది కదా? ఏదీ? తెల్లదా? చాలా బాగుంటుంది. ఒక్క క్షణం వుండు- అమ్మ పిలుస్తోంది. ”, లారా ఫోన్ మూసి పెద్దగా అరచింది, “అమ్మా! ఏమిటి? వినపడటంలేదు.”

శ్రీమతి షెరిడన్ గొంతు మెట్లమీదినించి తేలి వచ్చింది.

“కిందటి శనివారం పెట్టుకున్న టోపీ నే పెట్టుకొమ్మను ఇవాళ కూడా.”

“కిట్టీ ! అమ్మ నిన్ను కిందటి శనివారం పెట్టుకున్న టోపీనే మళ్ళీ పెట్టుకొమ్మంటుంది. సరే ! ఒంటి గంటకి! బై.”  లారా ఫోన్ పెట్టేసింది.

రిసీవర్ పెట్టేసి లారా చేతులు మడచి తల వెనక పెట్టుకుని నిట్టూర్చింది. కిటికీలోంచి మెత్తగా సూర్య రశ్మి గదిలోకి పడుతోంది. మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండి పోయిందా అమ్మాయికి.

ఎవరో ఇంటి ముందర బెల్లు మోగించారు. సేడీ తలుపు దగ్గరకు నడుస్తున్న చప్పుడు! సేడీ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. “ఏమో, నాకు తెలియదు. అమ్మగార్ని అడిగొస్తానుండు.” నిర్లక్ష్యంగా జవాబిస్తోంది.

లారా హాల్లోకి నడిచింది. “ఏమిటి సంగతి సేడీ?”

“పూలమ్మే అతను అమ్మాయిగారూ!”

పూలతను తెచ్చిన పూలు హాలంతా పరచుకొని వున్నాయి. రంగు రంగుల్లో గది నిండా లిలీ పూలు.

“అయ్యో! సేడీ! ఏదో పొరపాటు జరిగింది. ఇన్ని లిల్లీ పూలెవరు తెమ్మన్నారు? అసలు నువ్వెళ్ళి అమ్మను పిలుచుకొని రా!”

వాళ్ళ మాటల్లోనే శ్రీమతి షెరిడన్ అక్కడికొచ్చింది.

“ పొరపాటేం లేదు. నేనే తెమ్మన్నాను. ఎంత బాగున్నాయి కదా?” లారా వైపు తిరిగింది.

“నిన్న అక్కణ్ణించొస్తుంటే షాపు కిటికీలో చూసాను. వెంటనే అనుకున్నాను, ఇవాళ పార్టీలో అంతటా లిలీ పూలే కనిపించాలని.”

“కానీ ఇవాళ పార్టీలో అన్ని ఏర్పాట్లకూ మాదే బాధ్యత అన్నావు!” లారా తల్లి మెడ చుట్టూ చేతులేసి గారాబంగా అంది. సేడీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. పూల కొట్టతను వెళ్ళి తన వాన్ దగ్గర నిలబడ్డాడు.

“బంగారు తల్లీ! అమ్మ ఎప్పుడూ మనసు మార్చుకోకూడదా?? ఇంకా పూలు తెస్తున్నాడు చూడు.” పూల కొట్టతను ఇంకొక లిల్లీ పూల ట్రేలు తీసుకొని లోపలికి తెచ్చాడు.

“అన్నీ లోపల వరండా అన్ని వైపులా పెట్టించు. ఏమంటావు లారా? అలా పెడితే బాగుండదూ?”

“అవునమ్మా. చాలా బాగుంటుంది.”

పక్కన ఇంకో పెద్ద హాల్లో మెగ్, జోస్, హేన్స్ అందరూ కలిసి పియానోని ఒక మూలకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

“ఆ సోఫాని అటు వైపు గోడ దగ్గరికి జరిపించి మిగతా అంత సామాను బయట వేయిద్దాము. సరేనా?”

“సరే!”

“హేన్స్, ఈ బల్లలన్నీ ఇంకో గదిలోకి మార్చు. పని ఆవిడని పిలిచి ఈ కార్పెట్ అంతా బాగా దులిపించాలి.”

జోస్ కి పని వాళ్ళతో పనులు చేయించటమంటే భలే సరదా. వాళ్ళకీ ఆమె చెప్పినట్టు చేయటం ఇష్టమే. అంతా ఏదో పెద్ద నాటకంలో పాత్రలు ధరిస్తున్న భావన వస్తుంది జోస్ పనులు చెప్పటం చూస్తే.

“అలాగే అమ్మనీ, చిన్న అమ్మాయిగార్నీ నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే తీసుకురా!” మళ్ళీ పురమాయించింది జోస్. మెగ్ వైపు తిరిగింది.

“మెగ్! ఒక్క సారి పియానో సరిగ్గా వుందో లేదో చూడు. ఇవాళ మధ్యాహ్నం ఎవరైనా పాడమంటారేమో నన్ను. రా, ఒకసారి ఏదైనా పాట వాయించి చూద్దాం.”

పాం- ట-ట-ట-టీ-ట, పియానో పెద్దగా నొరిప్పింది. అమ్మా లారా అప్పుడే గదిలోకి అడుగుపెట్టారు. జొస్ పాడుతూనే వుంది.

“అమ్మా, నేను బాగా పాడుతున్నానా?” ఇంతలో మళ్ళీ సేడీ వచ్చింది.

“మళ్ళీ ఏమిటి సేడీ?”

“ఏం లేదమ్మగారూ! వంట మనిషికి సాండ్ విచ్ ల దగ్గర పెట్టే పెర్లున్న కాగితాల కట్ట కనబడటంలెదు.”

“సాండ్ విచ్ ల పేర్లా? కాగితాలా? ఎక్కడ పెట్టానబ్బా?” శ్రీ మతి షెరిడన్ మొహం చూడగానే పిల్లలు ఊహించారు, అమ్మకి వాటి సంగతే గుర్తు లేదని. “సేడీ! పది నిముషాల్లో నేనా పేర్ల కాగితాలు పంపిస్తాను. వంట మనిషిని కంగారుపడొద్దని చెప్పు,” సేడీ ని పంపి వేసింది.

“లారా! నేనొక కవరు మీద ఆ పేర్లన్నీ రాసి వుంచాను. ఎక్కడ పెట్టానో మరిచిపోయాను. మళ్ళీ ఇంకొక మంచి కాగితం మీద రాద్దాం పద. మెగ్, ముందు నువ్వు తలచుట్టూ ఆ తువ్వాలు తీసి పారెయ్. జోస్, నువ్వెళ్ళి బట్టలు మార్చుకో. లేచి వెళ్తారా లేకపోతే మీ నాన్నతో చెప్పనా? అన్నట్టు జోస్, నువ్వు కొంచెం వంట మనిషి కంగారు పడుతుందేమో చూడు. మధ్యాహ్నం పార్టీ తలచుకుంటే నాకు వణుకొస్తూంది!”

భోజనాల గదిలో, గడియారం వెనక వాళ్ళకి పేర్లు రాసుకున్న కవరు దొరికింది. అది అక్కడికెలా వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు.

“ఈ కొంటె పిల్లలెవరో తీసి అక్కడ పడేసి వుంటారు. సరే అన్ని సాండ్ విచ్ ల పేర్లు వున్నాయో లేదో చూడు. ”

“సరే, పేర్లన్నీ చిన్న చిన్న కాగితాల మీద అందంగా రాద్దాం పద.”

అన్నీ రాసేసారు మెల్లగా. అ లేబుళ్ళ కట్ట పట్టుకుని లారా వంటింట్లోకి పరిగెత్తింది.

వంటింట్లో జోస్ పొగడ్తలతో వంటావిడని ఆకాశానికెత్తేస్తుంది. నిజానికి వంటావిడ సౌమ్యురాలు. ఆవిడని చూసి అంత భయపడటానికేమీ లేదు.

“ఇంత అద్భుతమైన సాండ్ విచ్ లు నేనెక్కడా చూడలేదంటే నమ్మండి! ఎన్ని రకాలు చేసారు? పదిహేనా?”

“అవును అమ్మాయి గారు, పదిహేను రకాలు చేసాను.”

“పదిహేను రకాల సాండ్ విచ్ లు. వామ్మో! ఎలా చేస్తారో ఎమో, అన్ని రకాలు.”

వంటావిడ సంతోషాన్ని దాచుకొంటూ చిన్న చిరునవ్వుతో వంటిల్లంతా ఊడ్చి శుభ్రం చేసుకుంటూంది. వున్నట్టుండి లోపలినించి సేడీ అరచింది, “గాడ్బర్ నించి మనిషి వచ్చాడు!” అంటూ. అంటే మిఠాయిలొచ్చాయన్నమాట. గాడ్బర్ చేసే మిఠాయిలు  ఊరంతా ప్రసిధ్ధి. ఎవరూ అసలు ఇంట్లో మిఠాయిలే చేయరు.

“సేడీ! మిఠాయిలు లోపలికి తెచ్చి ఆ బల్ల మీద పెట్టు,” వంటావిడ పురమాయించింది. సేడీ మిఠాయిలు లోపలికి తేవటానికెళ్ళింది. లారా, జోస్, నిజానికి తాము చాలా పెద్దయిపోయాం కాబట్టి మిఠాయిల గురించి పెద్దగా పట్టించుకోకూడదనుకొంటారు కానీ, ఆ మిఠాయిలు చూడగానే నోరూరింది వాళ్ళిద్దరికీ. వంటావిడ వాటిని అందంగా సర్ద సాగింది.

“ఇద్దరూ చెరొక మిఠాయి తీసుకుని తినండి. అమ్మకి చెప్పకపోయినా పర్వాలేదు,” వంటావిడ ఇద్దరికీ మిఠాయిలిచ్చింది.

పొద్దున్నే మిఠాయిలెలా తింటాం, అనుకుంటూనే ఇద్దరూ చెరొకటి తినేసారు.

“పద, అలా వెనకనించి తోటలోకి వెళ్ళి షామియానాలు వేయటం ఎంత వరకొచ్చిందో చూద్దాం!” లేచి నడిచింది లారా. కానీ వెళ్ళటానికి వీల్లేకుండా తలుపు దగ్గర అడ్డు నిలబడ్డారు సేడీ, మిఠాయిల అబ్బాయీ, వంట మనిషీ! ఏదో గంభీరంగా మాట్లాడుకుంటున్నారు.

వంటావిడ “అయ్యో! పాపం!” అంటోంది. సేడీ ఆశ్చర్యం, భయం కలిసిపోయినట్టు చెంపలు నొక్కుకుంటూంది. ఒక్క మిఠాయిల అబ్బాయి మాత్రం సంతృప్తిగా సంఘటన వివరిస్తున్నాడు.

“ఏం జరిగింది?” పిల్లలు అడిగారు.

“పెద్ద ప్రమాదం! ఒకతను చనిపోయాడు కూడా!” వంట మనిషి చెప్పింది.

“చనిపోయాడా? ఎక్కడ? ఎలా? ఎప్పుడు?”

“బయటికెడితే చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెల్లాటివి కనిపిస్తాయి చూడండి, అక్కడండీ అమ్మాయి గారు! మీకా గుడిసెలు తెలుసా?”

ఎందుకు తెలియదు. తెలుసు తనకి, అనుకుంది లారా.

“అక్కడ, స్కాట్ అనే గుర్రబ్బండి వాడుంటాడు. పొద్దున్న అతను ప్రమాదంలో పోయాడు.”

“పోయాడా? అయ్యో!”

“ఆ! అక్కడికక్కడే ప్రాణం పోయినట్టుంది! ఇక్కడికి నేనొస్తుంటే శవాన్ని ఇంటికి తీసికెళ్తున్నారు. పాపం, పెళ్ళాం, పిల్లలూ కూడ వున్నారతనికి.”

“జోస్, ఇలా రా!” అక్కని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది లారా. లోపలి తలుపుకానుకుని నిలబడి,

“జోస్! ఇప్పుడెలా? ఇప్పుడీ విందు ఎలా ఆపుతాం” అంది  ఆందోళనగా.

“విందు ఆపేయాలా? ఎందుకని?” ఆశ్చర్యంగా అడిగింది జోస్.

“అవును! విందు ఆపేయొద్దూ మనం?” జోస్ ఇంకా ఆశ్చర్యపోయింది.

“పిచ్చిదానివా ఏమిటి? మన విందు ఎందుకాపేయాలి? అసలు ఎవరంటారలా?”

“అది కాదు. మన ఇంటి దగ్గర ఇంట్లో ఎవరో పోయి ఏడుస్తూ వుంటే మనం విందు ఎలా చేసుకొంటాం?”

నిజానికి ఆ చిన్న చిన్న యిళ్ళు వీళ్ళ ఇంటికి అంత దగ్గరగా ఏం లేవు. వీళ్ళ వీధి చివరినించి మొదలై అలా సాగిపోతాయి. రెండు కాలనీలకీ మధ్య పెద్ద రోడ్డు కూడా వుంది. అసలా ఇళ్ళు చూస్తేనే మహా చిరాగ్గా వుంటుంది. మట్టి రంగు గోడలతో, చిన్న చిన్న యిళ్ళు! ఇంటి ముందర చిన్న చిన్న తోటల్లో ఎప్పుడు చూడూ కేబేజీ మొక్కలే వుంటాయి. గులాబీలో, అందమైన పచ్చికలో వుండనే వుండవు. ఆ కేబేజీ మొక్కల మధ్య కోళ్ళు! అసలు వాళ్ళ ఇళ్ళల్లోంచి వచ్చే పొగ కూడా నిరుపేదలా అనిపిస్తూంది. షెరిడన్ గారి ఇంటి పొగగొట్టంలోంచి వచ్చే అందమైన వెండి రంగు మబ్బుల్లాటి పొగకీ, ఆ యిళ్ళల్లోంచి వచ్చే మురికి పొగకీ పోలికే లేదసలు.

ఆ కాలనీలో, చాకలి వాళ్ళూ, చెప్పులు కుట్టే వాళ్ళూ, ఇంకా ఎవరెవరో వుంటారు. ఇళ్ళల్లో ఎక్కడ చూసినా పిల్లలు! షెరిడన్ గారి పిల్లలని చిన్నతనంలో అటు వైపు వెళ్ళనిచ్చే వారే కాదు. అయితే, కొంచెం పెద్దయ్యాక లారా, లేరీ అప్పుడప్పుడూ ఆ కాలనీలో కుతూహలంగా నడిచిచ్చే వాళ్ళు. చూడగానే అసహ్యమేసేది. కానీ జీవితం అన్నాక ఎన్నిటినో చూడాలి, ఎన్ని చోట్లకో వెళ్ళాలి మరి. అందుకే ఇద్దరూ వెళ్ళేవాళ్ళు.

“ మన బాండు వాళ్ళు పెద్దగా పాటలు పాడుతుంటే స్కాట్ భార్యకెలా వుంటుందో ఊహించు.”

జోస్ ఆశ్చర్యం కోపంలోకి దిగింది.

“లారా! ఎక్కడో ఎవరికో ప్రమాదం జరిగిన ప్రతీసారీ నువ్వు పాటలూ,ఆటలూ, సరదాలూ మానుకున్నావంటే, ఇక నీకు జీవితంలో మిగిలేదేమీ వుండదు. నాక్కూడా ఆ కుటుంబాన్ని తలచుకుంటే జాలి వేస్తుంది. కానీ దానికి మన ప్రోగ్రాం ఎందుకు మానేయాలో అర్థం కావటం లేదు. మనం పార్టీ మానుకున్నంత మాత్రాన చనిపోయిన ఆ తాగుబోతు బ్రతికొస్తాడా?”

“తాగుబోతా? ఎవరు తాగుబోతు? అతను తాగుబోతని తెలుసా నీకు? ” లారా కోపంగా లేచింది. “అసలు నేను అమ్మతో మాట్లాడతానుండు.”

“వెళ్ళు, వెళ్ళు! వెళ్ళి అమ్మేమంటుందో చూడు!”

“అమ్మా! నీతో కొంచెం మాట్లాడాలి,” తల్లి గది తలుపు దగ్గర నిలబడి అడిగింది లారా.

“రా లారా? ఏమయింది? మొహం అలా వుందెందుకు?” శ్రీమతి షెరిడన్ అద్దం మూందు కూర్చుని కొత్తగా కొన్న టోపీని పెట్టుకుని చూసుకుంటూ అంది.

“అమ్మా ! బయట ఒకతను చనిపోయాడు.”

“ఎక్కడ? మన తోటలోనా?”

“కాదు! బయట, వీధిలో.”

“హమ్మయ్య! బ్రతికించావు.” నిట్టూర్చి శ్రీమతి షెరిడన్ తల మంచి టోపీని తీసి పట్టుకుంది.

“అదికాదమ్మా! అసలేమయిందంటే,” లారా గబగబా మిఠాయిల అబ్బాయి చెప్పిందంతా వివరించింది.

“నువ్వే చెప్పు, బయట పక్క ఇంట్లో ఎవరో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే మనం ఇక్కడ తోటలో పార్టీ ఎలా చేసుకుంటాం? మన పాటలూ, నవ్వులూ విని వాళ్ళు బాధ పడతారేమో. అసలిప్పుడేం చేద్దాం?” లారా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

అచ్చం జోస్ లాగే తల్లి కూడా ఆశ్చర్యపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమెకి నవ్వు కూడా వచ్చింది.

“పిచ్చి తల్లీ! మనం వినడం వల్లే మనకా సంగతి తెలిసింది. వినకపోయి వుంటే? తెలిసేది కాదు, అవునా? అప్పుడు మామూలుగానే పార్టీ అయి వుండేది. మనలని ఎవరు తప్పుపట్టగలిగేవారు? ఇప్పుడూ అంతే. మనం వినలేదనుకుని మామూలుగానే వుందాం. అసలా యిళ్ళల్లో ఎలా బ్రతుకుతున్నారో అన్నది నాకెప్పుడూ అర్థం కాదు, నిజానికి.”

తల్లి మాటలకెలా బదులు చెప్పాలో తెలియలేదు లారాకి. అక్కడే సోఫాలో కూలబడింది.

“అమ్మా! అంత మొరటుగా ఎలా వుండగలుగుతాం?” అంది ఆవేదనగా.

“బంగారూ! ఎంత అమాయకురాలివమ్మా!” తల్లి లేచి వచ్చి కుతురి పక్కనే కూర్చుంది. తన కొత్త టోపీని లారా తల మీద పెట్టిచూసింది.

“అబ్బ, యెంత బాగుంది ఈ టోపీ నీకు! అది నీకే, వుంచేసుకో! నాకంటే నీకే అది అందంగా వుంది. కావాలంటే అద్దంలో చూసుకో,” అద్దం యెత్తి పట్టుకుంది.

“అది కాదమ్మా, ఒక్క సారి…..”

తల్లికీ జోస్ లాగే కోపం వచ్చింది.

“లారా, చిన్న పిల్లలా ప్రవర్తించకు.  అంతంత త్యాగాలేం చెయ్యక్కర్లేదు. అసలు ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళకోసం మన ఇంటికి వచ్చే అతిథుల్ని నిరాశ పరుస్తావా? నీ ఒక్క దాని పిచ్చితనం తో అందరి సరదా పాడుచేయొద్దు.”

“నాకేమి అర్థం కావడం లేదు,” బిక్క మొహంతో లారా లేచి తల్లి గదిలోంచి వెళ్ళిపోయింది. తన గదిలోకెళ్ళి కూర్చుంది. ఉన్నట్టుండి అద్దం లో చూసుకుంది. అందమైన నల్లటి హేటూ, దానికి పొడుగాటి వెల్వెట్ రిబ్బనూ, బంగారు రంగు వుంగరాల జుట్టుతో, ఎవరీ అందగత్తె అనుకుంది ఒక్క క్షణం. ఇంకెవరు, తనే!నిజంగా అమ్మ చెప్పినట్టు ఆ టోపీ తనకెంతో బాగుంది.

అమ్మ అన్నట్టు తను అతిగా ఆలోచిస్తుందా? అంతలోనే సంపాదించే భర్తను పోగొట్టుకొని, పిల్లలతో ఒంటరైపోయిన దీనమైన స్త్రీ ముఖం మనసులో మెదలింది. అంతలోకే మళ్ళీ మామూలై పోయింది. ఇహ దాని గురించి పార్టీ అయ్యాకే ఆలోచిస్తాను, అని నిశ్చయించుకుంది లారా.

భోజనాలు ముగిసేసరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. రెండున్నరకల్లా అంతా తయారయి తోటలోకెళ్ళారు. టెన్నిస్ కోర్టులో ఆకు పచ్చ రంగు యూనిఫారాలలో బేండు మేళం వాయిద్యాలను శృతి చేసుకుంటున్నారు.

“నన్నడిగితే ఆ ఆకు పచ్చ రంగు బట్టల్లో వాళ్ళంతా పెద్ద కప్పల్లాగున్నారు. అసలు వాళ్ళ స్టేజీ స్విమ్మింగ్ పూలులో పెట్టి వుంటే సరిగ్గా వుండేది,” కిట్టీ నవ్వుతూ అన్నాడు.

లేరీ బయట నించొచ్చి తన గదిలోకి వెళ్తున్నాడు, బట్టలు మార్చుకోవడానికి. అన్నని చూడగానే లారా కి చనిపోయిన స్కాట్ గుర్తొచ్చాడు. అతని వెంటే హాల్లోకి నడిచింది.

“లేరీ!”

వెనుదిరిగి చూసాడు లేరీ. చెల్లిని చూసి సన్నగా ఈల వేసి కళ్ళెగరేసాడు. “అబ్బో! యెవరబ్బా ఇంత అందగత్తె, మా ఇంట్లో?” నవ్వాడు. “లారా! నిజంగా ఇవాళ నీకా టోపీ చాలా బాగుంది.”

లారా నవ్వి అక్కణ్ణించి వెళ్ళిపోయింది.

మధ్యాహ్నానికి విందు ఊపందుకొంది. పాటలూ, ఆటలూ, మాటలూ, నవ్వులూ- అంతా సంబరంగా వుంది. షెరిడన్ గారి తోటలో వాలిన రంగు రంగుల పక్షుల్లా వున్నారందరూ. సంతోషంగా, చలాకిగా వుండే మనుష్యుల మధ్య వుండడం ఎంత సంతోషాన్నిస్తుంది! లారా ఆ రోజు పొగడ్తల్లో మునిగిపోయింది.

“లారా! ఇవాళ ఎంత అందంగా వున్నావో తెలుసా?”

“అసలా టోపీ నీకు బాగా నప్పింది.””

“స్పానిష్ అమ్మాయిలా వున్నావు. ఇంత అందంగా నిన్నెప్పుడూ చూడలేదు నేను.”

లారా మొహం ఆనందంతో వెలిగిపోయింది. అయినా అందరినీ మెత్తగా నవ్వుతూ పలకరించింది.

“కొంచెం టీ తాగుతారా?” “మీ జూస్ లో కొంచెం ఐస్ వేయనా?” “ఈ పళ్ళ ముక్కలు ఒక సారి రుచి చూడండి.”

మధ్యలో తండ్రి దగ్గరికి పరిగెత్తింది. “నాన్నా, ఒక్క సారి ఆ బేండు మేళం వాళ్ళేమైనా తింటారేమో, తాగటానికేమైనా కావాలేమో కనుక్కుంటావా?” అంటూ పురమాయించింది. మధ్యాహ్నం గడిచి సాయంత్రం అయేసరికి విరిసిన పూవు ముడుచుకున్నట్టయింది.

“భలే సరదాగా గడిపాం ఇవాళ!” , “చాలా బాగా జరిగింది పార్టీ!” అంటూ అతిథులంతా సెలవు పుచ్చుకున్నారు.

“అమ్మయ్య! అంతా సవ్యంగా జరిగిపోయింది.” నిట్టూర్చింది శ్రీమతి షెరిడన్.

“లారా! పార్టీ బాగా జరిగింది, కానీ  ఒళ్ళు హూనమైపోయింది. ఈ పిల్లలేమో పార్టీలు కావాలని ప్రాణాలు తోడుతారు. పద కొంచెం కాఫీ తాగుదాం లోపలికెళ్ళి. నువ్వెళ్ళి మిగతా అందరికీ వీడ్కోలు చెప్పి లోపలికి రా.”

అందరూ ఖాళీ అయిపోయిన షామియానా కింద కూలబడ్డారు అలసటగా.

“నాన్నా, ఒక్క సాండ్ విచ్ తింటావా? లేబుళ్ళ మీద ఈ పేర్లన్నీ నేనే రాసాను తెలుసా?”

“అబ్బో! అయితే ఇలా తే!” తండ్రి సాండ్ విచ్ అందుకొని కొరికాడు. “అన్నట్టు, ఇవాళ బయట ఒక పెద్ద ప్రమాదం జరిగింది తెలుసా?”

శ్రీమతి షెరిడన్ వెంటనే అందుకుంది. “ఆ ప్రమాదం గురంచి మాట్లాడకండి! ఇవాళ దాని వల్ల మన పార్టీ దాదాపు మానేసినంత పనయ్యింది. బయటెవరో మరణిస్తే మనం పార్టీ ఎలా చేసుకుంటామని లారా ఒకటే గోల,” నవ్వుతూ అంది.

“అబ్బ, ఏదో అన్నాను, వదిలెయ్యమ్మా!” సిగ్గుపడింది లారా.

“నిజంగానే చాలా బాధాకరమైన విషయం. పాపం అతనికి భార్యా పిల్లలూ కూడా వున్నారట.” షెరిడన్ గారు సాండ్ విచ్ కొరుకుతూ అన్నారు. ఉన్నట్టుండి అందరూ మౌనంగా వుండిపోయారు.

ఈయనకి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, చిరాకు పడ్డారు శ్రీమతి షెరిడన్. వున్నట్టుండి ఆవిడకొక ఆలోచన వొచ్చింది.

“ఒక పనిచేద్దాం. చాలా వంట మిగిలిపోయింది. ఒక బుట్టలో పెట్టి మిగిలిన తినుబండారాలన్నీ వాళ్ళకి ఇద్దాం. పిల్లలు నాలుగురోజులు తింటారు.ఇప్పుడు వాళ్ళింట్లో వచ్చీ పోయే జనం కూడా వుంటారు. అందరూ తినడానికి పనికొస్తుంది. లారా! వెళ్ళి ఆ పెద్ద బుట్ట పట్టుకురా!”

“అమ్మా! నిజంగా అదంత మంచి పని అంటావా?”

లారాకి మళ్ళీ విచిత్రంగా అనిపించింది. తను ఒక్కర్తీ వేరేగా ఎందుకాలోచిస్తుంది? ఇంట్లో విందులో మిగిలిపోయిన తిండి ఇస్తే, అసలే బాధల్లో వున్నవాళ్ళు ఏమనుకుంటారు?

“ఎందుకు బాగుండదు? ఎంత వింతగా మాట్లాడతావు లారా నువ్వు! ఇందాకేగా వాళ్ళ మీద జాలితో కరిగిపోయావు? అంతలోకే ఏమొచ్చింది?” తల్లి విసుగ్గా అంది.

లారా పరిగెత్తుకుని వెళ్ళి బుట్టతో సహా తిరిగొచ్చింది. తల్లి బుట్టంతా రకరకాల తినుబండారాలతో నింపింది.

“నువ్వే తీసుకెళ్ళు లారా! వెళ్ళేటప్పుడు ఆ లిల్లీ పూలు కూడా తీసుకెళ్ళు. పాపం, పేదవాళ్ళకి లిల్లీ పూలు బాగా నచ్చుతాయి.”

“వద్దు, ఆ పూల కాడలు నీ గౌనంతా పాడు చేస్తాయి,” జోస్ హెచ్చరించింది.

“అదీ నిజమేలే. పూలేమీ వొద్దు. వుత్తి బుట్ట మాత్రం తీసుకెళ్ళు లారా. అన్నట్టు లారా, అక్కడ-” ఆగిపోయింది అమ్మ.

“ఏమిటమ్మా?”

తటపటాయించింది  తల్లి. “ఏమీ లేదులే, వెళ్ళు. తొందరగా వొచ్చేయి.”

తోట దాటి లారా బయటికొచ్చేసరికి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొంచెం కిందికి, వీధి చివరగా వున్నాయి ఆ చిన్న ఇళ్ళు. మధ్యాహ్నం విందు హడావిడి తర్వాత అంతా నిశ్శబ్దంగా వున్నట్టనిపించింది లారాకి. వున్నట్టుండి తను ఎక్కడికి వెళ్తోందో గుర్తొచ్చిందామెకి. నిజానికి విందులో మాటలూ, హాస్యాలూ, గిన్నెలూ, పళ్ళేల చప్పుళ్ళూ, నవ్వులూ, పచ్చిక వాసనా,అన్నీ కలిపి ఆమె మనసులో ఇంక వేటికీ చోటూ లేకుండ చేసాయి. ఎంత విచిత్రం. ఆకాశం వంక చుసింది. “బలే బాగా జరిగింది పార్టీ!” అనుకుని మళ్ళీ ముందుకెళ్ళింది.

విశాలమైన రోడ్డు కొంచెం ఇరుకైంది. వాళ్ళ పెద్ద వీధి అంతమై ఒక చిన్న సందు మొదలైంది. ఆడవాళ్ళు షాల్ కప్పుకునీ, మగవాళ్ళు టోపీలు పెట్టుకునీ నడుచుకుంటూ పోతున్నారు. ఆ ఇళ్ళనించి చప్పుళ్ళూ వినొస్తున్నాయి. అక్కడక్కడా సన్నని వెల్తురు. లారాకి ఆ వీధిలో తన ఖరీదైన గౌను చూసుకొని కొంచెం సిగ్గనిపించింది. ఈ గౌను కనిపించకుండా  పైన ఒక కోటైనా తొడుక్కుని రావాల్సింది, అనుకుంది. దానికి తోడు పెద్ద సిల్కు రిబ్బను తో వున్న అందమైన తన టోపీ. అందరూ తననే వింతగా చూస్తున్నారేమో. అసలు ఇలా రావడమే తప్పేమో. పోనీ తిరిగి ఇంటికెళితే?

అంతలో ఆ ఇల్లు వచ్చేసింది. ఇక ఇప్పుడు వెనుదిరిగినా బాగుండదు. ఇదే ఇల్లు అయివుండాలి. బయట చిన్న గుంపు వుంది. లోపల చీకటిగా వుంది. గేటు పక్కనే ఒక ముసలావిడ కుర్చీలో కూర్చొనుంది. లారా దగ్గరకొచ్చేసరికి అందరూ మాటలాపేసారు. గుంపు కొంచెం పక్కకి జరిగి ఆమెకి చోటిచ్చారు.

లారాకి చాలా కంగారుగా వుంది. సిల్కు రిబ్బను ని పక్క జరుపుకుంటూ, పక్కనే వున్న ఆడమనిషితో, “స్కాట్ గారిల్లు ఇదేనా?” అని అడిగింది. ఆ మనిషి వింతగా నవ్వుతూ, “ఇదేనమ్మాయ్!” అంది.

త్వరగా ఈ బుట్ట ఇచ్చేసి ఇక్కణ్ణించి వెళ్ళిపోవాలి. భయంభయంగా దేవుణ్ణి తలచుకుంటూ లారా తలుపు దగ్గరికెళ్ళి తలుపు తట్టింది. తలుపు తెరుచుకుంది. నల్ల బట్టలతో దిగాలుగా వున్న స్త్రీ తొంగి చూసింది.

లారా తడబాటుతో అడిగింది, “స్కాట్ గారి భార్య మీరేనా?”

“లోపలికి రా అమ్మాయ్!” ఆవిడ వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

“లేదు, లేదు. నేను లోపలికి రాను. అమ్మ ఈ బుట్ట ఆవిడకివ్వమంది.”

ఆవిడ విననట్టే లోపలికి వెళ్ళి, ఇంకో తలుపు దగ్గర ఆగి, “ఇలా లోపలికి రా అమ్మాయ్,” అంది. చేసేదేమీ లేక లారా లోపలికి అడుగుపెట్టింది. లోపల తనొచ్చిన గది వంటిల్లులా వుంది. చిన్న దీపం పొగచూరి వెలుగుతూంది. పక్కనే ఇంకొకావిడ కూర్చునుంది.

“ఎమిలీ! నీకొరకెవరో ఒక అమ్మాయి వచ్చింది,” చెప్పింది తలుపు తెరిచిన ఆవిడ. లారా వైపు తిరిగింది, “ఎమిలీ చెల్లెల్నండీ నేను! తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. మీరేమీ అనుకోవద్దండీ!”

“అయ్యొయ్యో! ఆవిడని చిరాకు పెట్టకండి. నేను వెళ్తున్నాను.” లారా కంగారుగా అంది.

ఇంతలో కూర్చున్నావిడ తిరిగి లారా వైపు అయోమయంగా చూసింది. ఆమె మొహమూ, కళ్ళు ఎర్రబడి, వాచి, చాలా అసహ్యంగా వుంది. ఆమెకేమీ అర్థమవుతున్నట్టు లెదు. లారా ఎవరు? తమ ఇంటికెందుకొచ్చింది? ఆమె కేమీ బోధపడుతున్నట్టులేదు.

“పోనీలే ఎమిలీ! నువ్వేమ మాట్లాడకు. నేను చూసుకుంటాను,” ఎమిలీ చెల్లెలంది. ఆమె మొహం కూడా ఏడ్చి ఏడ్చి ఉబ్బి వుంది.

“ఆమెని క్షమించమ్మా దయ చేసి,” ఇబ్బందిగా నవ్వుతూ లారాతో అంది. లారాకి అక్కణ్ణించి బయట పడటం తప్ప వేరే ఇంకే ఆలోచనలూ లేవు. మళ్ళీ తలుపు కేసి నడిచింది. ఇంకొక తెరిచి వున్న తలుపులోంచి వెళ్ళింది. అయితే ఆ తలుపు బయటికెళ్ళలేదు, కానీ ఇంకో గదిలోకి దారితీసింది. ఆమెకి ఆ గదిలోనే మృతుడి శవం వుందన్న సంగతి తెలిసేసరికే ఆలస్యమయింది.

“ఒక్క సారి శవాన్ని చూస్తావా అమ్మాయ్?” ఎమిలి చెల్లెలడిగింది. లారా భయంతో కొయ్యబారిపోయింది. “భయపడేందుకేమీ లేదమ్మాయ్, అలా పడుకుని నిద్ర పోతున్నట్టున్నాడు. రా చూద్దువు గాని.” లారా తొంగిచూసింది.

పేటికలో పడుకుని వున్నాడొక యువకుడు. హాయిగా కష్టాలనించి, సమస్యలనించీ, దూరంగా, శాంతిగా, కలలు కంటున్నట్టు- కళ్ళు మూసుకుని వున్నాడు. కాని ఆ కళ్ళు మరిక తెరుచుకోవు. ఇంకే కలలూ కనవు. విందులూ, మిగిలిపోయిన తినుబండారాలూ, అందమైన గౌనులూ, ఖరీదైన టోపీలూ వేటితోనూ అతనికి పనిలేదు. అన్నిటినుంచీ దూరంగా వెళ్ళిపోయాడు. తామంతా తోటలో పాటలు పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతున్నప్పుడూ, అతను ఇలాగే వున్నాడు, శాంతిగా, సంతోషంగా. లారాకి ఏమనాలో అర్థం కాలేదు. “నా టోపీ చాలా అసహ్యంగా వుంది, నన్ను క్షమించండి,” అంది అసందర్భంగా. అంతే, అక్కణ్ణించి ఒక్క పరుగున ఇంటి బయటికొచ్చి పడింది. గుంపుని దాటుకుని గబగబా సందులోంచి నడిచింది. సందు చివర లేరీ ఎదురయ్యాడు.

“లారా? నువ్వేనా?”

“నేనే, లేరీ!”

“అమ్మయ్య! నీకోసం కంగారు పడి అమ్మ నన్ను పంపింది. ఏమయింది లారా? భయపడ్డావా?”

“అవును లేరీ!” అన్న చేయి గట్టిగా పట్టుకుంది లారా.

“ఏడుస్తున్నావా? ఏమయింది లారా?”

ఏమీ లేదన్నట్టు తల తిప్పింది లారా.

“ఏడవకు లారా? ఏమయింది? భయపడ్డావా?” అనునయంగా అడిగాడు అన్న.

“భయపడలేదు కానీ,” వెక్కుతూంది లారా.

“లేరీ, అసలు జీవితం……..” ఏమనాలో తోచలేదు. జీవితమంటే ఏమిటో ఆమె చెప్పలేకపోయింది. అన్నకి అర్థమైంది.

“అవును, కదా?” అన్నాడు.

  —–

ఆశ ఉందిగా…

kolluri“ఇంకో 48 గంటలకి మించి ఆవిడ బతకదు” అని చెప్పేసి, మా ప్రశ్నల కోసం ఆగకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు డాక్టర్ గులాటి.

ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద ఉన్న 70 ఏళ్ళ ముసలావిడ ఆయనకి ఓ పేషంట్ మాత్రమే. కానీ నాకు, ఆమె నా జీవితం… మా అమ్మ!

నా శరీరంలోని అణువణువు వేదనతో కేకపెట్టినయ్యింది. నలభై ఎనిమిది గంటలు. కేవలం 48 గంటలు! ఈ ప్రపంచంలో మా అమ్మ ఉండేది ఇంక 48 గంటలే. ఆ తరువాత? తరువాత ఇంకేముంటుంది? నా ప్రపంచమంతా శూన్యం, నాకో పెద్ద వెలితి.

దాదాపు పదేళ్ళపాటు నేను అమ్మతో ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడలేదు. నా కష్టనష్టాలన్నింటికీ అమ్మనే నిందించాను. నాకు ఉద్యోగం లేదు, దానికి అమ్మనే నిందించాను. చదువులో గొప్ప గొప్ప ఘనతలేం సాధించలేదు, దీనికి అమ్మనే తప్పుబట్టాను. నేను ఆత్మన్యూనతా భావంతో బాధపడ్డాను, దానికి కూడా కారణం అమ్మేననుకున్నాను. నింద…నింద…నింద. ఈ పదేళ్ళలో నేను ప్రతీ దానికీ అమ్మని నిందిస్తునే ఉన్నాను.

“ఈ భూమి మీదకి రావడం నా తప్పు కాదు” అని ఒకసారి అమ్మతో అన్నాను, నా అభిమాన నటుడిని అనుకరిస్తూ. అదే డైలాగ్‌ని అతను ఏదో సినిమాలో చెప్పినట్లు గుర్తు. కానీ వెంటనే నాలిక కరుచుకున్నాను. కానీ ఒక్కసారి నోరు జారామా, మాటల్ని వెనక్కి తీసుకోలేం.

అయినా, హృదయాంతరాళాలలో ఎక్కడో నేను అమ్మని ప్రేమించాను. అత్యంత గాఢంగా ప్రేమించాను. కానీ ఎన్నడూ వ్యక్తం చేయలేకపోయాను. పాపం, ఆ నిస్సహాయురాలు మాత్రం ఏం చేస్తుంది? నేను ఇంటర్ చదువుతూండగానే నాన్న చనిపోయాడు. తన ముద్దుల కొడుకు మానసిక వైకల్యం బారిన పడడం తట్టుకోలేక, కుమిలిపోయాడు. అవును, మా అన్నయ్య…. మేమందరం మా కుటుంబపు ఐన్‌స్టీన్ అని పిలుచుకునే అన్నయ్య….. దేశంలోని ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో బి.టెక్ చదువుతున్న అన్నయ్య… ఉన్నట్లుండి మానసిక వ్యాధికి గురయ్యాడు.

చిన్నతనంలో అమ్మ కోసం ఎర్ర కారు కొంటానని చెప్పిన అబ్బాయే, మానసిక ఆరోగ్యం సరిగా లేక ఉన్మాద స్థితిలో అమ్మపై చేయి చేసుకునేవాడు. అతను జబ్బు పడ్డాడు. తీవ్రంగా జబ్బు పడ్డాడు. నాన్న అది భరించలేకపోయారు. ఆయన హృదయం తట్టుకోలేకపోయింది. గుండె ఆగిపోయింది. వెర్రి మేధావితో సహా, అయిదుగురు పిల్లల్ని సాకాల్సిన బాధ్యత అమ్మకి వదిలి నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.

మేమంతా అప్పటికింకా చిన్నపిల్లలమే. మా కాళ్ళ మీద మేము నిలబడి, అమ్మకి ఆసరా ఇవ్వలేకపోయాం. డబ్బుకి ఎప్పుడూ కొరతే. అమ్మ ఎంతో ఓపికగా భరించింది. ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అమ్మ గుమాస్తాగా పనిచేసింది. వచ్చే కొద్దిపాటి జీతంతోనే మమ్మల్నందరిని పెంచి పెద్దచేసింది.

మరి కొత్త బట్టలు ఎక్కడ్నించి వస్తాయి? నాకు కొత్త బూట్లు ఎలా కొనివ్వగలుగుతుంది? అయితే ఈ చిన్నచిన్న విషయాలు నా బుర్రలో నాటుకుపోయాయి. నన్ను సరిగా పెంచలేదనే భావం నాలో కలిగింది. ఏ మాత్రం సణుక్కోకుండా అమ్మ ఆ నిందల్ని భరించింది.

ఇప్పుడు, ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద, సగం అపస్మారక స్థితిలో పడి ఉంది. ఇక బతికేది 48 గంటలే. నేను ఆమెని ఎంతగానో బాధపెట్టినందుకు క్షమాపణ కోరనూ లేను. “అమ్మా, ఐ లవ్ యు” అని గట్టిగా అరవాలనుకున్నాను.

“అమ్మా, నేను నిన్ను నిజంగా బాధపెట్టాలనుకోలేదు. నిన్ను ఎంతగానో ప్రేమించాను. నిజం. ఇప్పటికీ ప్రేమిస్తునే ఉన్నాను…” అని చెప్పాలనుకున్నాను. కానీ అమ్మకి వినబడుతుందా? నా నోట్లోంచి వచ్చే పదాలను అమ్మ గ్రహించగలుగుతుందా? సందేహమే! ఆలస్యం అయిపోయింది…… ఓ జీవిత కాలం ఆలస్యమై పోయింది!

నా జీవితంలో తుఫాను చెలరేగింది. ఇటువంటిది మునుపెన్నడూ నేను అనుభవించలేదు. నాలోని అణువణువు నా నుంచి వేరుపడి స్వేచ్ఛ పొందాలనుకుంటున్నాయి. నేను కూడా చచ్చిపోతే  బావుండనిపించింది. అమ్మ లేకుండా నేను బతకలేను. నా అంతర్మధనం, ఆలోచనల్లో పడి బయట ఏం జరుగుతుందో అసలు పట్టించుకోలేదు.

***

ఆసుపత్రి బయట కూడా తుఫాన్ చెలరేగింది. నగరం అల్లకల్లోలంగా ఉంది. ఒక వర్గం వారికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఎవరో అపవిత్రం చేసారటచేశారట.  ఇళ్ళు తగలబెట్టారు, బడులు దోచుకోబడ్డాయి, ఆడవాళ్ళు మానభంగాలకి గురయ్యారు, జనాలు చంపబడ్డారు. కత్తులు చేతబట్తిన ముష్కరమూకలు నగరమంతా సంచరిస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు చేతుల్లో రివాల్వర్లు ఉంచుకుంటున్నారు.

నాకు హఠాత్తుగా “మియా” గుర్తొచ్చాడు. ఎప్పటి మాట? దాదాపు నలభై ఏళ్ళ క్రితం సంగతి.

నేను స్కూలుకి వెళ్ళే రోజుల్లో అతను మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. ఓ బుట్టనిండా చేపలు తీసుకొచ్చి మా గుమ్మం ముందు పోసేవాడు. “మియా, నా దగ్గర డబ్బులు లేవు, చేపలు తీసుకు పో” అనేది అమ్మ. కాని మియా అదేమీ పట్టించుకునేవాడు కాదు. మా బెంగాలీలం రోజూ జలపుష్పాలను ఆహారంలో తీసుకోవాల్సిందే. డబ్బుదేముంది? ఉన్నప్పుడే ఇవ్వండి అన్నట్లుగా డబ్బు ఎప్పుడిస్తామో అని అడగనైనా అడగకుండా, అతను ఈల వేసుకుంటూ నడిచి వెళ్ళిపోయేవాడు.

మియా ఓ చిన్నపాటి జాలరి. అతనికి పడవా లేదు, వలా లేదు. ఉన్నదల్లా, శిధిలమైన గాలపు చువ్వ మాత్రమే. దానికే ఎరని కట్టి రోజంతా కష్టపడితేగానీ పూటగడవదతనికి. ఆ చేపలని వేరే ఎక్కడైనా అమ్ముకుంటే అతనికి చాలా డబ్బు వచ్చి ఉండేది. అయినా…..! ఆ చేపలు మా ముందే ఉండేవి, అతను మాయమైపోయేవాడు. తన పిల్లలకి ఆ పూట భోజనం పెట్టడానికి మియా దగ్గర తగినంత డబ్బు ఉందో లేదో మాకెప్పుడూ తెలియలేదు. ఎన్నో చేపలని మాకొదిలేసేవాడు, వాటిల్లోంచి ఒక్కటి కూడా తన ఇంటికి తీసుకువెళ్ళడం నేనెప్పుడూ చూడలేదు.

మర్చిపోయిన ఇంకో వ్యక్తి… రాజు. నిజానికి అతను రజాక్.. లేదా అలాంటిదే ఏదో అతని పేరు. కాని అతను రాజు ఎలా అయ్యాడో మాకెవరికీ తెలియదు. మా పిల్లలందరం రాజు అంటే ఎంతో భయపడేవాళ్ళం. ఆ మనిషంటే భయం కాదు, కానీ అతని చేతిలో కత్తెర, దువ్వెన చూస్తే మాత్రం భయం…!

అవును. రాజు మంగలి. పొడుగ్గా ఉండేవాడు, సైకిల్ తొక్కుతూ వచ్చేవాడు. అతన్ని చూడగానే మేము జారుకోడానికి ప్రయత్నించేవాళ్లం. అప్పట్లో బాలీవుడ్‍లో హీరోలంతా భుజాల దాక జుట్టు పెంచేవారు. మేము కూడా మా హెయిర్ స్టైల్ అలాగే ఉండాలని అనుకునేవాళ్లం. అయితే ఎవరో ఒకరు బలైపోయేవాళ్ళు, తమ చిన్న కాళ్ళతో ఎక్కువ దూరం పారిపోలేక పోయే వాళ్ళు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న కుర్రాడ్ని వాళ్ల నాన్న చెవులు మెలేసి తీసుకొచ్చి, బలిపీఠం లాంటి కుర్చీలో కూర్చోబెట్టేవాడు. దూరం నుండి నాన్న చూస్తుండంగా,అస్పష్టమైన ఉల్లాసంతో రాజు కుర్రాడికి అంటకత్తెర వేసేసేవాడు.

మంచి క్షురకులకు ఉండే ఓ విశిష్టమైన గుణం రాజుక్కూడా ఉంది. అదే ముచ్చట్లు చెప్పడం. అతనికి ఎన్నో కథలు తెలుసు. కుర్చీలో ఏడుస్తూ కూర్చున్న కుర్రాడు తొందర్లోనే ఏడుపు ఆపేసి, నవ్వులు చిందిస్తూ, రాజు చెప్పే కథలు వింటూ ఆనందించేవాడు. అతని సంతోషం చూసి, మేము కూడా చాలా మంది రాజుకి దగ్గరగా వెళ్ళేవాళ్లం. అంతే, మేమూ దొరికిపోయేవాళ్లం. రాజు కులాసాగా కబుర్లు చెబుతూ, తన పని కానిచ్చేసేవాడు.

ఆసుపత్రి బయట రెండు వర్గాల వాళ్ళు గొడవపడుతున్నారు.

ఐ.సి.యు.లో ఐదో నెంబరు బెడ్ ఖాళీగా ఉంది. ఎంతో సేపు కాదు. మా అమ్మ వయసే ఉండే ఓ ఆవిడని వీల్ చైర్ లో తీసుకువస్తున్నారు. పొడుగాటి గడ్డం ఉన్న ఓ బలిష్టమైన వ్యక్తి, బహుశా నా ఈడు వాడేనేమో, ఆమె వెనుకే వస్తున్నాడు.

దాడికి పాల్పడిన వాళ్ళు అతని మెడ నరకాలనే అనుకున్నారట. కానీ ఈ ముసలావిడ అడ్డం వచ్చిందట. అయితే విసిరిన కత్తి వెనక్కి రాదుగా, ఆమె చేతిని ముక్కలు చేసేసింది. దాడి చేసిన వ్యక్తి, అతని సహాయకుడు అక్కడ్నించి పారిపోయారట. తమ చర్యకు సిగ్గుపడి పారిపోయారో లేక మరేదైనా కారణమో ఎవరూ చెప్పలేకపోయారు.

ఆవిడ పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతోంది. తన కొడుకు ప్రాణాలని కాపాడుకుందావిడ. తెగిపోయిన ఆమె చెయ్యి, వేలాడుతోంది. ఆమెని వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళి సర్జరీ చేసారు. తెగిపోయిన చెయ్యిని బాగుచేయడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్య అది. దుండగులు జరిపిన దాడిలో చేతి నరాలు, స్నాయువు పూర్తిగా దెబ్బతిన్నాయట. అవి లేకుండా చెయ్యి ఉండడం అలంకార ప్రాయమే. ఎవరైనా దాత స్నాయువు, పట్టా దానం చేస్తే ఆవిడ చెయ్యి మాములుగా అవుతుందని డాక్టర్ చెప్పారు.

నేను వార్డులోకి వచ్చేసరికి అమ్మ కళ్ళు తెరిచింది. స్పృహలో ఉంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “అమ్మా” అన్నాను. దాదాపు పదేళ్ల తర్వాత “అమ్మా” అని పిలిచాను. “బాధగా ఉందా?” అడిగాను. తల అడ్డంగా ఊపింది. నా మాటలు అమ్మకి వినబడుతున్నాయి. నేనేం చెబుతున్నానో అమ్మకి అర్ధం అవుతోంది.

అమ్మ తల నిమిరి, “పడుకో అమ్మా” అన్నాను. చిన్నపిల్లలా నవ్వుతూ, నా ఆజ్ఞ పాటించింది.  అమ్మ మంచం పక్కనే ఒంగి కూర్చుని, అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. “నువ్వు అందరికంటే మంచి అమ్మవి” అన్నాను. నాకు మనశ్శాంతి లభించింది. ఇంతలో మా సోదరి రావడంతో, నేను అక్కడ్నించి బయటకి వచ్చేసాను. పేషంట్ దగ్గర ఒకరినే ఉండనిస్తారు.

సుమారుగా అరగంట తర్వాత, మా సోదరి వెక్కివెక్కి ఏడుస్తూ బయటకి వచ్చింది. “అమ్మ….” అంటూ ఇంకేం చెప్పలేకపోయింది. అమ్మ మరణాన్ని నేనే వేగవంతం చేసానేమో. తన కొడుకు తనని ఎప్పుడూ ప్రేమిస్తునే ఉన్నాడన్న గ్రహింపుతోనే ఆవిడ చనిపోయింది. ఈ గ్రహింపు ఆమెలో రక్తప్రసరణా వేగాన్ని పెంచినట్లుంది. బలహీనమైన గుండె దాన్ని తట్టుకోలేకపోయింది. ఈ ఆసుపత్రిలో చేరడానికి ఎన్నో కారణాలున్నాయి. రక్తప్రసరణహీనత వల్ల వచ్చే గుండెపోటు అందులో ఒకటి మాత్రమే.

నా ప్రపంచం స్థంభించిపోయింది. డాక్టర్‍కి నేనేం చెప్పానో నాకే అర్థం కాలేదు. నా మనసు, నా శరీరం ఒకదానికొకటి  మైళ్ల దూరంలో ఉన్నాయి. ఏవో కాగితాల మీద ఆయన నా సంతకాలు తీసుకున్నాడు. మా అమ్మ చేతి నరాలు, స్నాయువు బెడ్ నెంబరు అయిదు మీదున్న ముసలావిడకి దానం చేయమని కోరాను. లాంఛనాలు పూర్తయ్యాయి. సంప్రదాయల ప్రకారం అంతిమ సంస్కారాల కోసం అమ్మని ఇంటికి తీసుకువెళ్లాం.

***

పదేళ్ళు గడిచిపోయాయి. నేను నిత్యజీవితపు గాడిలో పడ్డాను. రోజూవారీ అవసరమయ్యే సామాన్లను ఓ పెద్ద బరువైన సంచీలో పెట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాను. ఓ రోజు ఓ ఇంటి తలుపు కొట్టాను. పొడుగాటి గడ్డం ఉన్న బలిష్టమైన వ్యక్తి తలుపు తీసాడు. గడ్డం తెల్లబడింది. “మాకేం అక్కర్లేదు, వెళ్ళిపో” అంటూ తలుపేసుకోబోయాడు. ఉన్నట్లుండి నన్ను గుర్తుపట్టినట్లున్నాడు.

లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. వాళ్లమ్మ, ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాయోమో, తన గదిలోంచి బయటకు వచ్చింది. కానీ నన్ను గుర్తు పట్టలేదు. ఆవిడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఆవిడకి మత్తుమందు ఎక్కువగా ఇచ్చారు. అప్పట్లో తనని చూడడానికి వచ్చిన వారిని గుర్తుంచుకోడం ఆమెకి కష్టం.

కొడుకు ఆమెకి వివరించాడు. ఆవిడని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె మొహంలో కనపడిన బలహీనమైన నవ్వు మళ్ళీ ఇప్పుడు ఆవిడ పెదాలపై ప్రత్యక్షమైంది. బయట ఎంతో ప్రశాంతంగా ఉంది. పదేళ్ళ క్రితం జరిగిన రక్తపాతాన్ని గుర్తు చేసే ఒక్క మూలుగు కూడా లేదు.

అయినప్పటికీ, ఆవిడని అడిగాను – “ఏమైనా ఆశ ఉందా?” అని.

ఆవిడ తన కుడి చేతిని…. మా అమ్మ చేతిని… పైకెత్తి నా తల మీద ఉంచి, “అవును నాయనా, ఆశ ఉంది” అంది.

ఆంగ్లం: ప్రణబ్ మజుందార్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్

(ప్రణబ్ మజుందార్ పూనెకి చెందిన జర్నలిస్ట్. జాతీయ వార్త సంస్థ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI)లో పదిహేడు సంవత్సరాలు పనిచేసారు. న్యూస్ ఎడిటర్‌గా యు.ఎన్.ఐ నుంచి విరమించుకున్నారు. అంతకుముందు ఫ్రీ ప్రెస్ జర్నల్ గ్రూప్ వారి పక్షపత్రిక “ఆన్‌లుకర్”లోనూ, “ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్” అహ్మదాబాద్ ఎడిషన్ లోనూ, పూనెకి చెందిన “సకల్ టైమ్స్” లోనూ పనిచేసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు.)

 Front Image: Mahy Bezawada