ప్రజల కష్టాలే కొలబద్ద: పి. చంద్

chandగత ముప్పై ఏండ్ల నుంచి సింగరేణి కార్మికుల కష్టాలను, ఆశలను, ఆకాంక్షలను అక్షరీకరిస్తున్న, తెలుగులో మొట్ట మొదటి ఏకైక కార్మిక వర్గ రచయిత పి.చంద్ గారు… శేషగిరి, అంతర్జాతీయ శ్రామిక యోధుడు కే.ఎల్ మహేంద్ర, శ్రామిక యోధుడు, ఒక కన్నీరు, నెత్తుటి ధార, విప్లవాగ్ని, హక్కుల యోధుడు బాల గోపాల్, తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు బండ్రు నర్సింహులు, తెలంగాణ, నల్లమల, మేరా సఫర్(జి.వెంకట స్వామి జీవిత చరిత్ర) వంటి నవలలు మరియు భూనిర్వాసితులు, సమ్మె, జులుం, గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు వంటి కథా సంపుటాలు ప్రచురించి ప్రచారార్భాటాలకు దూరంగా ఉండి పోయారు. సింగరేణి ఉద్యోగానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి, గోదావరిఖని యైట్ ఇంక్లైన్ కాలనీలో తన క్వాటర్ లో ఉండి, సైకిల్ తొక్కుతూ సింగరేణి జీవితాల్ని నిశ్శబ్దంగా గమనించి రచనా ప్రస్థానం కొనసాగిస్తున్న పి.చంద్ ఉరఫ్ యాదగిరి ఈ మధ్య తన జన్మస్థలం వరంగల్ కు మారినారు. వారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ఇంటర్వ్యూ….

ప్ర…చంద్ సార్ మీ సాహిత్యానికి ప్రేరణ ఎక్కడ మొదలైంది?

జ…సాహిత్యానికి గాని దేనికి గాని మనిషి జీవితమే పునాది. మనం బతికిన జీవితం మనం చూసిన రచనలకు ప్రేరణ కలిగిస్తది, ముఖ్యంగ ఏందంటే, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గాబట్టి, మా నాయిన ఆజంజాహి మిల్లు లోపట పనిజేసిండు గాబట్టి, చిన్నప్పట్నుంచి గూడ కార్మిక కుటుంబాల్లో ఉండే సాధక బాధకాలు ఏందో తెలుసు, రెండోది ఏందంటే ఒక చారిత్రిక దశలోపట మనం బతికినం, డెబ్బై ఎనబై దశకం లోపట సమాజంలో ఒక చలనం మొదలైంది. ఎక్కడో ఒక సామాన్యునికి ఏదో జరిగితే వీథులల్లోకి వచ్చి కొట్లాడే రోజులు. ఇయ్యాల్ల పక్కింటోడు చచ్చిపోతాండంటే గూడ పట్టిచ్చుకొని పరిస్థితి. సమాజం ఒక అలజడికి గురవుతున్న తరంలో పుట్టినం, ఈ సమాజాన్ని అధ్యయనం చేయడమనేది జీవితంలో భాగమైంది. అదిగాకుంట ఆ రోజులల్లోనే ఈ సమాజం మార్పు కోసం ఎంతో మంది యువకులు వచ్చినట్టు మేం గూడ వచ్చినం, ఎమర్జన్సీలో ఎంతోమంది లాకప్ లకు, జైళ్ళకు పోయి వచ్చిన సంఘటనలు గూడ ఉన్నయ్.

ఈ నేపథ్యమేదైతే ఉన్నదో, అంటే కార్మిక వర్గ జీవితం, మనం బతికిన కాలం, దానికి తోడు నిరంతర అధ్యయనం ఇవన్నీ ప్రేరణే. వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి సైకిలేసుకొని పొయ్యేది. ఇప్పటిగ్గూడ సైకిలే తొక్కుతున్న, బండి జీవితంల వాడలే!. అప్పుడున్న అన్ని లైబ్రరీలల్ల నాకు మెంబర్ షిప్ ఉండేది. మన అభిరుచికి అనుగుణంగ తత్త్వ శాస్త్రం, ఆ తర్వాత జీవితానికి సంబంధించిన సాహిత్యాన్ని, ప్రామాణికంగా వచ్చిన ‘గోర్కీ’ కావచ్చు , రష్యన్ నవలలు, చైనీస్ నవలలు గూడ వచ్చినయ్. ఇట్లా అనేక పుస్తకాలు చదివే వాణ్ణి.

తర్వాతేమయిందంటే, పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి. నేనచ్చి మల్ల సింగరేణి ప్రాంతంల ఉన్న, అప్పుడే సింగరేణిల ఎమర్జెన్సీ ఎత్తేసిండ్లు అయితే ఆ అణచివేత నుంచి, తిరుగుబాటు ఉద్యమ రూపం సంతరించుకున్న క్రమంల నేనిక్కడ ఉన్న, అందువల్ల సింగరేణిల విప్లవోద్యమానికి ఒక ప్రత్యక్ష సాక్షిని, ఐ విట్నెస్ అన్నట్టు. దానితోనేమయిందంటే మనం మరింత పదునుదేరడానికి మన ఆలోచన పదునుదేరడానికి సాధ్యమైంది. ఒక విప్లవకారుని గురించి రాయాల్నంటే ఎప్పుడు గూడ ఊహల్లో రాయలేం!, ఒక రిక్షా కార్మికుని గురించి రాయాలంటే వాని సాధక బాధకాలు, వాని కష్టం సుఖం అన్ని గూడ ప్రత్యక్షంగ చూసన్న ఉండాలె, పరిశీలించన్న ఉండాలె, అనుభవించన్న ఉండాలె. అట్ల ఉంటే మాత్రమే లైవ్లీగ వస్తది. లేకుంటే వాళ్ళ జీవితం వేరుంటది, మన బుర్రలో పుట్టినట్టత్తది, ప్రామాణికంగా నిలబడలేదు. యాబై ఏండ్ల కింద నేను పుట్టక ముందు సమయంలోపట ఉన్న శేషగిరిరావు అనే ఒక విప్లవకారుని గురించి నేను లైవ్ లీ గ రాయగలిగిన అంటే, విప్లవకారుల స్వభావం ఏం ఉంటది, వాళ్ళ త్యాగ నిరతి ఎట్ల ఉంటది, ప్రజలకోసం ఎంత అంకిత భావంతో పనిజేస్తరు, ఎటువంటి కష్టాల్నేదురుకుంటరు. అనే దృశ్యాల్ని నేను చూసిన, కాబట్టి నాకు తేలికైపోయింది, శేషగిరిరావు ప్లేస్ లోపట నేను చూసిన ఏదో ఒక విప్లవకారున్ని పెట్టిన కాబట్టి లైవ్లీ గ రాయగలిగిన.

ప్రశ్న… చంద్ సార్! మీరు కార్మికుల  హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి శేషగిరి రావు, కే.ఎల్.మహేంద్ర, బాలగోపాల్, బండ్రు నర్సింహులు మొదలైన వారి జీవితాలను నవలలుగా రాసిండ్రు గద, మీ ఈ కృషి వెనుక నేపథ్యం  గురించి చెప్పుతరా?

జవాబు….. తెలంగాణ సాయుధ పోరాటం మీద చాలా మంది గొప్ప రచయితలు సుమారు ఇరువై రెండు నవలల దాకా రాస్తే, అందులోపట మొట్ట మొదటి సారిగా తె.సా.పోరాటం నేపథ్యం లోపట కార్మిక వర్గ లిటరేచరచ్చింది. అది పందొమ్మిది వందల నలబై లోపట స్టార్టయ్యింది. వాస్తవానికి ఏమైందంటే, పద్దెనిమిది వందల ఎనబై లోపట సింగరేణి స్టార్టయినప్పటికి గూడ పందొమ్మిది వందల నలుబై వరకు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. అంటే, ఒక యాబై సంవత్సరాలు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. ఎందుకంటే, ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ, బ్రిటీష్ యాజమాన్యం, ఒకటి వలసవాద పాలన రెండోది ఫ్యూడల్ దోపిడీ, ఇవి రెండు ఎటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ లేకుండా అణచివేసినయ్.

అటువంటి నేపథ్యం లోపట, ఎప్పుడైతే ఆంద్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో వాళ్లు కార్మిక రంగం మీద కాన్ సన్ ట్రేట్ చేసి పని చెయ్యడం మొదలైంది. ఆ నేపథ్యంలోపట మగ్దూమ్ మొహియుద్దీనేమో హైద్రాబాదులోపట పరిశ్రమించిండ్రు. వరంగల్ జిల్లా ఆజం జాహిమిల్ ప్రాంతం లోపట సర్వదేవ భట్ట రామనాథం,  శేషగిరిరావు అనేటాయినేమో సింగరేణి లోపట మొట్ట మొదటి సారి యూనియన్ స్థాపకుడైండు. అయితే అప్పుడు నలబై ఆ ప్రాంతం లోపట  చరిత్రలో దాదాపు ఒక వందమంది ఆనాటి సాయుధ పోరాటం లోపల కార్మికులు పార్టిసిపేషన్ చేసి చనిపోయిండ్రు. కని, వాళ్లకు సంబంధించి రికార్డు ఎక్కడా చరిత్రలో నమోదుగాలే. ఒక సుందరయ్య రాసిన తెలంగాణా సాయుధ పోరాటం గుణపాఠాలు లో మాత్రం శేషగిరిరావు గురించి ఒక పేజీ, పేజీన్నర మ్యాటరున్నది. అంతకుమించి సమాచారం ఎక్కడా చరిత్రలో రికార్డు కాలేదు. ఆ తరం వాళ్ళలోపట శేషగిరిరావు సార్ కు కార్మిక వర్గం లోపట పెద్ద పేరున్నది. ఇప్పటికీ, ఆయన అట్ల చేసిండు, ఇట్ల చేసిండు అని చెప్పుకుంటరు. చనిపోయే నాటికి ఆయన వయసు  ముప్పై ఏండ్ల లోపట్నే. ఆ నేపథ్యం లోపట విప్లవోద్యమం ఏం చేసిందంటే పాత చరిత్రను తవ్వి తీసే క్రమం లోపట కొమురం భీం చరిత్రను తీసుకచ్చింది. అట్లాగే ఇక్కడ గూడ సింగరేణిలో విప్లవోద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో పాత చరిత్రను తవ్వి తీసుకునే క్రమం లోపట శేషగిరిరావు గురించి ఈ కార్మికుల్లో ఉన్న బహుళ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అన్వేషణ చెయ్యడం జరిగింది. దాదాపు ఒక నూరు నూట యాబై మంది ఆ తరం వాళ్ళను ఇంటర్వ్యూ చేసిన. అసలు ఏంజేశిండు ఆయన, ఎట్ల జేశిండు, ఏ సమస్య మీద ఎట్ల కొట్లాడిండు, అప్పటి పరిస్థితులు ఎట్ల ఉండేది అని సమగ్రంగ, ఒక ఐదారు సంవత్సరాలు ఇదే పనైపోయింది. అంటే, ఒక రిసెర్చ్ వర్క్ లాగ ఐపోయింది. ఆ తర్వాత దాన్ని తీసుకొన్న, అది రిపోర్ట్ గ రాస్తే దానికి విలువ ఉండది.

ఫిక్షన్ మనిషి హృదయానికి సంబంధించిన విషయం మనిషి హృదయం లోపట ఒక ముద్ర వేస్తదన్నమాట. అంటే, అది డాక్యుమెంటేషన్ కు పరిమితం చెయ్యలేదన్న మాట. అట్లగాకుంట ఏం జేసిన్నంటే దీన్ని విశ్లేషణ జెయ్యాల్నని జెప్పి వందలాది పాత్రల తోటి అప్పటి పరిస్థితులు, అప్పటి బొగ్గుబాయి పరిస్థితులు, అప్పటి భౌతిక పరిస్థితులు, అప్పటి కార్మికుల కష్టాలు, వాళ్ళ ఆరాటాలు, వాళ్ళ పోరాటాలు, ఆ నిర్బంధాలు ఇవన్నీ మొత్తం గలిపి శేషగిరి నవల రాసిన. అందుకోసం ఏందంటే తెలుగు సాహిత్యం లోపట వచ్చిన సాహిత్యం లోపల “శేషగిరి” నవల అంత విస్తృత క్యాన్వాస్ తోని, ఒక ఉద్యమం ఎట్ల నిర్మించబడుతుంది, ఉద్యమ కారులు ఎట్లా ఉద్యమాల్ని నిర్మిస్తరనిజెప్పి ఇంత బ్రాడ్ కాన్షియస్ తోని వేరే నవల లేదని చెప్పి విమర్శకులు అంటరు.

ప్ర… “హక్కుల యోధుడు బాల గోపాల్”  ఏ నేపథ్యంతోని రాసిండ్రు?

జ… బాల గోపాల్ ను ఒక ఆలంబనగ చేసుకొని సింగరేణి ప్రాంతంలో స్టేట్ చేసిన రిప్రెషన్ ను రాసిన, రాజ్యం కార్మిక వర్గం మీద చేసిన దాడిని రాసిన, ఆయనను ధారలాగ పెట్టుకొని రాసిన. ఆయనతో వ్యక్తిగతంగా తిరిగిన కాబట్టి ఆయన ఎట్లా విషయాల్లో అప్రోచవుతడనడానికి లైవ్లీనెస్ రావడానికి అది దోహదపడ్డది. ప్రమాదాలు, ఎన్ కౌంటర్లు, ప్రభుత్వ నెగ్లిజెన్స్ ఆధారంగా చేసుకొని రాసిన. ప్రతి విషయాన్ని గూడ ప్రజల పక్షాన తీసుకొని రాసిన.

ఇయ్యాలటి రోజుల్ల సాహిత్యంలో ఉన్న ఈ గ్యాప్ ను పూర్తి చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగ లేరు. బాలగోపాల్ పై స్టేట్ రిప్రెషన్ గురించి రాయాలనుకో అసలు స్టేట్ రిప్రెషన్ ఏం జేసిందో తెల్సి ఉండాలె గద!, తెలిసినా దాన్ని ఆ ఫామ్ లో పెట్టాలె! పాఠకునికి హృదయానికి నాటుకునేలాగ, చొచ్చుకుపొయేలాగ, అయ్యో! గింత ఘోరం జరిగిందా! అని అనిపించేలాగ రాసిన. నేనేదైతే ఫీలయ్యిన్నో , అది పాఠకులకు కన్వేజెయ్యటం కోసం ఈ మాధ్యమాన్ని ఎన్నుకొన్న. స్టేట్ లో ఫలానప్పుడు ఎన్ కౌంటర్ జరిగింది, బాలగోపాల్ సార్ అచ్చి మాట్లాడిండు అన్న విషయం కంటె గూడ, ఆ ఎన్ కౌంటర్, ఆ భీభత్సం, ఆ దుక్కాన్ని పాఠకునికి అందియ్యదల్సుకున్న, అందుకోసం ఈ ఫిక్షన్ ఫామ్ అనేది ఆలంబన చేసుకొని రాయడం జరిగింది.

ప్ర…మీరు కార్మిక వర్గ చరిత్ర నిర్మాణం కోసం కథ, నవల ప్రక్రియలను తీసుకున్నరు, కానీ కార్మికులంటే సామాన్య ప్రజలు వాళ్ళెప్పుడు పనిలోనే నిమగ్నమై ఉంటరు. చదివే అంత తీరిక ఉండదు కదా! పాట దిక్కు మొగ్గు చూపుతరు అనుకుంట – మీరు ఎన్నుకున్న ప్రక్రియ ఎటువంటి ప్రయోజనాల్ని నెరవేర్చింది?

జ…పాటకుండే పరిమితి పాటకుంటది. పాట ఇమిడియేట్ గా మనిషి హృదయంలోకి చొచ్చుక పోతది. కానీ, దాని ప్రయోజనం తాత్కాలికం. నేను కేవలం ఫిక్షనే రాయలే, చరిత్రను కూడ రికార్డు చేసిన. దాదాపు పదిహేను ఇరువై పుస్తకాలు నేను సింగరేణి కార్మికుల జీవితాల మీద రాసిన, ఉదాహరణకు తరతరాల పోరు, సంస్కరణలు ఒక పరిశీలన, వేజ్ బోర్డులు మొ.. వాటిమీద రాసిన. వనరుల తరలింపు క్రమంలోపట, సింగరేణి ప్రాంతంలోపట  ఆంధ్రా వలసవాద దోపిడీ ఏవిధంగా జరుగుతంది, ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి, ఓపెన్ కాస్ట్ వల్ల జరిగే బీభత్సమేమిటి ఇట్లా చాలా పుస్తకాలు రాసిన. అయితే గమ్మతైన విషయమేందంటే సింగరేణి ఎంప్లాయ్ గ ఉండటం వలన వాటిని నాపేరు మీద వేసుకునుటానికి అవకాశం లేకుంట పోయింది. మారుపేర్లతో వచ్చినయ్. ఇంకో గమ్మతేందంటే సంస్కరణలనేవి భారతదేశం మొత్తం మీద పందొమ్మిది వందల తొంబై ఒకటి తర్వాత జరిగినయ్. వీటిని ఒక కేస్ స్టడీ లాగ సింగరేణిలో ఎలాంటి పరిణామాలు వచ్చినాయని ఎవరూ రాయలేదు. సంస్కరణలు ఒక పరిశీలన అని పుస్తకంగ రాసిన. దాన్ని పిట్టల రవీందర్ పేరు మీద ఒక పుస్తకంగ వేస్తె దానిమీద కంపెని బాగ షేకయ్యింది. భావజాల పరంగా ఒక ఆందోళన మనిషికి రావాల్నంటే ముందు మానసికంగా ఆందోళనకు సిద్దం కావాలె . అందుకే జయ శంకర్ సార్ “భావజాల ప్రచారం”, “ఆచరణ” అన్నడు. ముందు మనం చేస్తున్నది న్యాయమైంది, చెయ్యాలనుకునే ఒక ఆకాంక్ష పుట్టినప్పుడు, నువ్వు చేయడానికి సిద్ధపడితే మార్గం అదే దొరుకుతుంది. భావజాల పరమైన మార్పు రాకుంట ఆచరణకు పొయ్యే అవకాశం ఉండదు.

మళ్ళీ మొదటికి వస్తే రచయితకు ఉన్న అభిరుచిని బట్టి కావచ్చు, కాపెబులిటీ కావచ్చు, పాట రాయాల్నంటే పాటగాడై ఉండాలె. పాటగాడై ఉంటే ఆ పాటకు ట్యూన్ దొరుకుతది. చాలా వరకు పాటగాళ్ళు మాత్రమే పాటలు బాగా రాయగలిగిండ్రు. ఎవలన్న ఒకలిద్దరు రాసినప్పటికి గూడ వాళ్ళంత బలంగ రాయలేకపోయిండ్రు. తెచ్చిపెట్టుకున్నట్టై పోయింది. కాబట్టి కథా, నవలా రచన మేధోపరమైనది. ఉద్యమాలు ఆకాశం నుండి ఊడిపడయి, ఉద్యమాలు ఎందుకు పుట్టినయ్, దాని భౌతిక పరిస్థితులేమిటి, సమస్యకు దారితీసిన పరిస్థితులేమిటి దాని నేపథ్యమేమిటి, దాన్ని మార్చుకోవడం కోసం వాళ్ళెటువంటి పోరాటం చేసిండ్రు, వాళ్ళ వైఫల్యాలేమిటి, సక్సెస్ లేమిటి, అంతిమంగ ఏం జరిగింది. ఇట్లాంటి విషయాలను ఎంత లోతుగా అధ్యయనం జేస్తే అంత బాగ చెప్పగలం. ఇలా ప్రతి పుస్తకం వెనుక ఇటువంటి మేధోపరమైన శ్రమ ఉన్నది.

ప్ర… సార్!  ఊరుగొండ యాదగిరి గా ఉండే మీరు పి.చంద్ గా మారడానికి, కార్మిక, వీరమల్లు, కే.రమాదేవి, ఉదయగిరి, ఏ.చంద్ర శేఖర్, వి.హరి, గోపి, వినీల్ చైతన్య మొ..ఇరవై దాకా కలం పెర్లతోని రాయడానికి కారణమేంది?

జ…ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగ లేకుంటే దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగ ఉన్నటువంటి భావజాలాన్ని గూడ వాళ్ళు సహించలేని పరిస్థితి, తీవ్రంగ అణచివేసే పరిస్థితి, చిన్న కాయిదం ముక్క దొరుకుతే గూడ చంపేసిన సంఘటనలున్నయ్ సింగరేణి ప్రాంతంలోపట, దేశ వ్యాప్తంగ గూడ… అటువంటి పరిస్థితిలోపట మనం చూస్తున్న జీవితం, మనం అనుభవిస్తున్న జీవితం, మన చుట్టూ జరుగుతున్న వాతావరణం ఒక రచయితగా నన్ను ఖాళీగా ఉంచలేకపోయింది.

ఉదాహరణకు మన రోడ్డు మీద ఎవరో పిల్ల అడుక్కుంటున్నదనుకో చూసే వరకు జాలి అనిపిస్తది. అయ్యో! చిన్నపిల్ల ఆకలితోటి ఉన్నట్టున్నదని రూపాయో రెండో ఇయ్యాలనిపిస్తది ఎందుకు? మానవత్వంతోనే కదా!, అట్లనే మన చుట్టూ జరుగుతున్న జీవితాల్ని చిత్రించే క్రమంలోపట మనం రచనలు చేస్తం. ఉదాహరణకు ఒక వేశ్య గురించి ఒక రచయిత రాసిండు. రాసినంత మాత్రాన ఆ రచయిత వేశ్య కాలేడు గద, ఆమె జీవితం దుర్భరంగ ఉందని ఏదో జాలిపడిపోయి, అరె ఒక ఆడామె ఇంత అధ్వాన్నంగ బతుకుతంది అని, ఆ బాధను తనకు తెలిసిన ఫాం లోపట వ్యక్తీకరిస్తడు… అట్ల వేశ్య గురించి రాస్తే నిన్నెవరు పట్టించుకోరు. కని మార్పు కోసం కొట్లాడుతున్న ఒక కార్మికుని గురించో, ఉద్యమ కారుని గురించో రాస్తే ప్రభుత్వం పట్టించుకుంటది. దీన్ని ఏవిధంగ అర్థం జేసుకోవాలె? అటువంటి పరిస్థితిలోపట ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఈ స్టేట్ కు వ్యతిరేకంగ రాస్తున్న క్రమంలోపట, మన ఒళ్ళు మనం కాపాడుకోవడానికి ఈ మారుపేర్లు వాడుకోవాల్సి వచ్చింది. కొన్ని త్యాగాలు చెయ్యాల్సి వచ్చింది. ఎవ్వరూ రాయనంతగా విప్లవోద్యమం మీద రాసి గూడ, ఎవరికీ తెలియకుంట ఉన్న పరిస్థితి కొన్నేండ్ల వరకు ఉండిపోయింది. ఈ మధ్య “గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు” కథా సంపుటి వచ్చిన తర్వాతనే ఓహో ఈయనే ఇవన్నీ రాసిండని తెలిసి వచ్చింది.

ప్ర…సరే! అప్పటి అలజడి నుండి, కార్మికోద్యమాల నుండి, అనుభవించిన జీవితం నుండి ఇన్ని రచనలు వచ్చినయ్ గదా! ఇప్పుడు గూడ విధ్వంసం కొనసాగుతనే ఉన్నది? ఓపెన్ కాస్ట్ ల రూపంలో మరింత జీవన విధ్వంసం జరుగుతున్నది. దీనిమీద ఏమన్నా రాసిండ్ర మీరు?

జ…. అసలు ఓపెన్ కాస్ట్ ల మీద జరుగుతున్న విధ్వంసం గురించి మొట్ట మొదట రాసింది నేను. ఇయ్యాల్ల ఓపెన్ కాస్ట్ ల గురించి ఎవరు మాట్లాడుతున్నా, అది చంద్ రాసిన విషయాలను తప్ప అదనంగా ఏం మాట్లాడుతలేరు, ఓపెన్ కాస్ట్ ల విషయంలోపట నేను రాసిన పుస్తకాలే, అంటే రూట్ లెవల్లోపట అధ్యయనం జేసిన చెప్పిన విషయాలే…. “భూ నిర్వాసితులు” అనే కథల సంపుటి నా మొట్టమొదటి కథల సంపుటి. అది మొత్తంగ గూడ ఓపెన్ కాస్ట్ ల వల్ల నిర్వాసితులైన ప్రజల యొక్క జీవితాలను చిత్రించింది. అక్కణ్ణుంచి మొదలుకొని “భూదేవి” అనే నవల (ఇంకా ప్రింట్ కాలేదు) ఏందంటే ఓపెన్ కాస్ట్ వల్ల నిర్వాసితురాలైన ఒక గ్రామాన్ని కేంద్రంగా తీస్కొని, ఒక మధ్య వయస్కురాలైన భూదేవిని పాత్రగా పెట్టుకొని, ఆ మొత్తం భూమికి ఈమెను ఒక రిప్రజెంటేటివ్ గ పెట్టుకొని, ఆమె జీవితాన్ని తీసుకొని రాసిన… అంటే సామాన్యుల జీవితాలు ఎట్లుంటయ్… కొడుకు పిల్లలు మంచిగా బతుకాలనుకుంటరు… కానీ అవన్నీ వీళ్ళ ప్రమేయం లేకుంట, ఉన్న భూములు కోల్పోయి, కూలీ నాలీ జేసుకొని బ్రతికే పరిస్థితులు.. యిట్లైతే మాజీవితం అన్యాయమైపోతది గదా అని, దానికి వ్యతిరేకంగ వాళ్ళు జేసే పోరాటాలు, అవి ఎట్లా నిష్ప్రయోజనమైతున్నయ్, ఎట్లా నిర్బంధాలకు గురైతుండ్రు, ఎట్లా నలిగి పోయిండ్రు అనే విషయాన్ని… అంటే సామాన్యులు భూములు కోల్పోవడం వలన, ఓపెన్ కాస్ట్ ల వల్ల బతుకు కోల్పోవడం వలన ప్రజలు పడే బాధల్ని “భూదేవి” నవలగ రాసిన…

అట్లనే “దేవుని గుట్ట” అనే నవల కరీంనగర్ జిల్లలోని గ్రానైట్ క్వారీస్ గురించి రాసిన. ఇవన్నిట్ల ఉద్యమంల పనిచేసిన వాళ్ళ ప్రత్యక్ష అనుభవాల్నే రాసిన. అందుకే ఇవన్నీ ఎక్కడో ఒకచోట విన్నట్టు, చూసినట్టు  అనిపిస్తయ్. ఇవన్నీ శకలాలు శకలాలుగ ఉన్నయ్… నేను వాటన్నిటినిదీసుకచ్చి ఒక కుర్చీగానో, బెంచీగానో తయారు చేసిన, ఒక కర్ర అక్కడ పడి ఉందంటే, అరె! ఇది వంక కర్ర చెయ్యికి బాగ పనిజేస్తదని తీసుకచ్చుకొని వాడుకున్న… నాకు ఇటువంటి రచనలు చేయడమంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తది… నా మనుసుకు  సంతృప్తి అనిపిస్తది…

ప్ర… అభివృద్దిలో భాగంగా గ్రానైట్ క్వారీస్, సింగరేణి కాలరీస్ ఇట్లా సహజ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేస్తున్నమని ప్రభుత్వాలు చెప్తున్నయ్! సింగరేణి ఎట్లనో గ్రానైట్ ను గూడ అట్లనే చూడవలసి వస్తే అది ఎంత వరకు సబబు? అభివృద్ధికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

జ… ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరు అభివృద్ధి గావాలె అభివృద్ధి గావాలె అంటున్నరు. బొగ్గు కావాల్నంటే ఓపెన్ కాస్ట్ లు జేస్తే అభివృద్ధి ఐతది.. అవసరాలు తీరుతయ్ అంటున్నరు. కానీ, ఒక విషయం ఫండమెంటల్ గ గుర్తుంచుకోవల్సిందేందంటే రెండు అంశాలున్నయ్. ఇండ్ల ఒకటేమో అభివృద్ధి గురించి… ఎవరికి అభివృద్ధి? కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు కొద్దిమంది అభివృద్ధి ఒక పక్కకు… ఏదైన అభివృద్దే గాబట్టి, తలసరి ఆదాయం విషయంలో వానికొక లక్షరూపాయలస్తే నీకు పది రూపాయలచ్చినగానీ  ఇద్దరికీ యాభైవేలైతయనేది ఒక అభివృద్ధి సూత్రం.. అదొక అంశం… రెండోది ఏందంటే అభివృద్దంటే ఏంటి… అసలీ ప్రాంతంలోపట వేల సంవత్సరాలుగా మనుషులు బతికిన ప్రాంతాన్ని భవిష్యత్తులోపట మనుషులు బతుకకుండా ఒక ఎడారిగా మార్చేది ఎట్లా అభివృద్ది ఐతది?.. ఒక విధ్వంసాన్ని సృష్టించి, తాత్కాలిక లాభాలకు, గోరంత లాభం కోసం కొండంత నష్టం జేసేది అభివృద్ధి ఐతదా?.. నిజంగా… మనిషి బతుకాల్నంటే వనరులు గావాలె, భూమి ఉండాలె, భూమ్మీద ఫార్మేషన్ ఏర్పడుతా ఉంటది, మానవులు గాని, జంతుజాలం జీవించడానిగ్గాని, వృక్షాలు పెరగటానిగ్గాని, కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంల ఆవిర్భవించింది భూమి… అటువంటి భూమిని తలకిందులు జేసి, మనుషులు, జంతువులు,వృక్షాలు బతుకకుండజేసేదాన్ని ఎట్లా అభివృద్ధి అంటం?..తల్లకిందుల అభివృద్ధి అభివృద్ధి గాదు…

ప్ర…మీరు సింగరేణి కార్మికుల గురించి, సంఘాల గురించి ఎన్నో కథలు రాసిండ్రు గద, ఒకప్పుడు చాలా బలంగా ఉండి ఉమ్మడిగా పోరాటాలు చేసిన కార్మిక సంఘాలు  ఇప్పుడు ఎట్ల పనిజేస్తున్నయ్?

జ.. ప్రధానంగ ఏందంటే… మనకు ఒక వంద సంవత్సరాల పైచిలుకు కార్మికోద్యమ చరిత్ర ఉంది. ఒకప్పుడు ప్రభుత్వరంగ పరిశ్రమల్నే గాని, ఇతర పరిశ్రమల్నే గాని కార్మిక వర్గం డిమాండ్ జేసే పరిస్థితి ఉండే.. ఇయ్యాల్ల శాసించే పరిస్థితి నుంచి యాచించే పరిస్థితికచ్చింది.. ఎందుకచ్చిందంటే కార్మిక వర్గ సంఘాలు బలంగా పనిజేయ్యలేకపోవటం వల్ల, ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టడంలో నాయకత్వం వైఫల్యంజెందటం వల్ల ఇది జరిగింది.. వాస్తవానికి ఇట్లా జరగడానికి ప్రధాన కారణం ఏందంటే గ్లోబలైజేషన్… ఈ గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే లాభాలకోసం పరిశ్రమల స్థాపన దోపిడీ ఒకటేగాక మానసికమైన దాడి గూడ మొదలువెట్టింది. కార్మిక సంఘాలను వీక్ జెయ్యడమనేదాన్ని గూడ ఒక ప్రణాళిక ప్రకారం చొప్పించింది. ఒక ఉదాహరణ చెప్తే.. మా తరం లోపట సామాజిక సమస్యలస్తే మేమంతగూడ వాటికి రెస్పాన్డైనం యువకులంతా సమాజం లోని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినం.. ఆ తరం వాళ్ళే ఇవ్వాళ భారతదేశం మొత్తం మీద విప్లవోద్యమాలు నడిపించే పరిస్థితచ్చింది. కాబట్టి దీన్నుంచి గుణపాఠం నేర్చుకొని, సామాజికాంశాల నుంచి విద్యార్థులను దూరం చెయ్యాలె కాబట్టి, ఒక ప్లాన్ ప్రకారం ఎజుకేషన్ అంత గూడ సెల్ఫ్ సెంటర్డ్ విధానంజేసిండ్రు.. నువ్వు చదువుకో నువ్వు బాగుపడు.. చదువుకున్నా బాగుపడుతడా అంటే బాగుపడడు.. అది అర్థం అయ్యే వరకు జీవితం వృథా ఐపోతది… అంటే సమాజం నుంచి ఐసోలేట్ జేసేసి విద్యనేంజేసిండ్రంటే…సెల్ఫ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చేసిండ్రు… ఎవడెట్లనన్న సావనియ్ మనం బాగుపడాలే… ఇది ఎందుకు జెప్పిండ్రంటే, హార్డ్ కోర్ గా ఉన్న విద్యార్థి రంగాన్ని కరప్ట్ జెయ్యడం కోసం, డైవర్ట్ జెయ్యడం కోసం… గ్లోబలైజేషన్, చేతిలో ఉన్న సాధనాలైన విద్యా విధానం లోపట మార్పుజేసుకున్నది.. ఏ వ్యవస్తైతే అధికారంలో ఉందొ ఆ వ్యవస్థకు అనుకూలమైన భావజాలాన్ని సమాజంలోపట చొప్పిస్తున్నరు.. ఉదాహరణకు క్రికెట్… క్రికెట్ లేకుంటే ఖాళీ సమయం దొరుకుతది.. ఎండాకాలం ఏదో నాలుగు బ్యాట్లిస్తరు… వాడు వీణ్ణి, వీడు వాణ్ణి ఓడిస్తడు.. వీడు ఖాలిగ ఉంటే ఎంజేస్తడు….ఇంకో దిక్కు ఆలోచన పోతది.. అంటే ఒక వ్యవస్థ అధికారంలో ఉన్నప్పుడు, రాజు అధికారంలో ఉన్నప్పుడు రాజే గొప్ప వ్యక్తి, రాజే బాగ చేస్తడు అన్న భావజాలమే ప్రచారంల ఉండాలె… అట్లైతేనే వాళ్ళు నిలబడగలుగుతరు…

అట్లాగే గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే ప్రపంచ వ్యాప్తంగ వచ్చిన పరిణామాల్లోపట… కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్యూనిస్టుల చేతుల్లోపట ఉన్న తర్వాత ఏర్పడ్డ అంతర్గత పోరులోపట పెట్టుబడి ఆధిపత్యం సంపాయించింది.. పెట్టుబడి ఏంజేసిందంటే అది తన అస్తిత్వం  కొనసాగించడం కోసం.. ఒక వ్యాపారం మీదనే కాదు, మనుషుల మీద, వాళ్ళ ఆలోచనలను గూడ నియంత్రించే ఒక పరిస్థితిని తీసుకచ్చింది… ఆ నేపథ్యంలోపట కార్మిక సంఘాలను గూడ నిర్వీర్యం జేసింది. వ్యాపార దృక్పథంలో ఉండు, నువ్వు సంపాయించుకో అన్నది. సింగరేణి ల సికాస ఏంజేసింది… నువ్వు ఒప్పుకున్న అంశాలు అమలుజేయి అన్నది. పర్మనెంట్ జేస్తా అంటే నూటాటొంబై మస్టర్ల తర్వాత పర్మనెంట్ జెయ్యమన్నది.. నాలుగేండ్లకొకసారి  వేజ్ బోర్డు పరిష్కరిస్త అంటే… నాలుగేండ్లు పోయి రెండేండ్లు గడిచింది నువ్వు ఎందుకు చెయ్యలేదు అన్నది… అట్ల అంటే రాజీలేని పోరాట శక్తులను నిర్దాక్షిణ్యంగ చంపేసింది… రాజీపడ్డ వాళ్ళను మాత్రమే అస్తిత్వంల కొనసాగించింది… ఆవిధంగ నాయకత్వ లేమితోని అవి నిర్వీర్యమైపోయినయ్.. మరి ఏం జేస్తరు ప్రజలు.. ఎన్నిరోజులు ఇట్ల సర్దుకొని బతుకుతరు… సర్దుకొని బతుకలేరుగాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి నేపథ్యమున్నది.  గ్లోబలైజేషన్ సృష్టించిన ఈ విధ్వంసకర జీవన విధానమే రేపు ఉద్యమాలకు వనరుగ పనిజేస్తది. తాత్కాలికంగ నువ్వు అణిచిపెట్టవచ్చు, నాయకత్వం లేకుంట జేయ్యవచ్చు . ఇయ్యాల్ల ఎందుకు విప్లవోద్యమ నాయకుల మీద టార్గెట్ జేస్తుండ్రు. ఎందుకంటే ఇయ్యాల్ల యాబై రెండు శాతం బీసీలున్నరు. వాళ్లకు సమాజంల ఒక న్యాయం రాలేదు. కని పన్నెండు శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ లకు ఎంతో కొంత న్యాయం జరగడానికి వాళ్ళ తరపున అంబేద్కర్ అనే ఒక నాయకుడున్నడు. అంబేద్కర్ ఏమన్నడు. రాజ్యాధికారం లోపట మా పాత్ర లేకుంట మాకు న్యాయం జరగదు, ప్రభుత్వం లోపట మా వాటా మాకుంటే న్యాయం జరుగుతదని చెప్పిండు. బీసీ కులాలకు నాయకత్వం లేక ఉత్పత్తి కులాలు బతకలేని పరిస్థితి వచ్చింది. అట్లాగే నాయకత్వాన్ని నిర్వీర్యం జేస్తే మొత్తం వ్యవస్థంత కుప్పకూలిపోతుంది. ఇవాళ కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడుండడం వల్లగదా కల సాకారమైంది…

ప్ర… కేసీఆర్ ప్రస్తావన వచ్చింది గదా! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి, భవిష్యత్తు గురించి మీ అభిప్రాయం ఏంది?

జ… తెలంగాణ కోసం వేలాదిమంది, కోట్లాది మంది సామాన్యులు గూడ ఉద్యమంల పార్టిసిపేట్ జేసిండ్రు. కేసీఆర్ తో పాటు సామాన్యులు గూడ ఇదే ఆకాంక్షను కలిగి ఉన్నరు. తెలంగాణ వస్తే మన బతుకు బాగుపడుతుందనుకున్నరు. వాళ్ళ కనీస జీవితం… కొంత తిండి, కొన్ని మందులో, ఉండుటానికి ఇల్లో, కనీస వసతులు, అవసరాలు తీరేలాగ ఉండాలనుకున్నరు. ఐతే దాన్ని ఎట్లా ఫుల్ ఫిల్ జేస్తరనే విషయం ఒకటి ముందున్నది. ఎందుకున్నదంటే… ఆంధ్రా వాళ్ళచ్చేసి మన వనరులనుగాని, మన భూములను గాని, నీళ్ళను గాని దోసుకున్నరు. ఈ దోసుకునుడనేది ఒకటి ఉండటం వల్లనే ఈ ఆందోళన మొదలైంది. రేపు ఈ సమాజంలో దోపిడీ స్వరూపం మారి ఇంకో రూపంల కొనసాగుతే ప్రజలకు న్యాయం జరుగది. దోపిడీ స్వభావం లేని సమాజం గావాలె తప్పితే బాగుపడే అవకాశం లేదు. అటువంటి పనేమన్న కేసీఆర్ జేసేదుంటే ప్రజల ఆకాంక్షలు తీరుతయ్. ప్రజలకు ఉపయోగపడే విషయం లోపట ఒక నిర్దిష్టమైన విధానం ఉండాలె. దాన్నే పాలసీ అంటరు. ఏం పాలసీ అనుసరిస్తున్నరు అన్నదాన్ని బట్టి ఉంటది. బూమికి నీళ్ళిత్త అంటున్నడు. కాని బూమిలేని వాళ్లకు నీళ్ళెం పనిజేస్తయ్. ముందు సమస్య బూమి ఉండాలె, బూమికి నీళ్ళు గావాలె. బూమంత ఎవని చేతుల్నో ఉంటే ఈ నీళ్ళిచ్చి ఎవన్ని పెంచి పోషిస్తవు.

తర్వాత ఉద్యమంలోపట ఇయ్యాళ్ళ పదేండ్ల కాన్నుంచి దెబ్బలుదిని అన్నిట్ల పార్టిసిపేట్ జేసినోల్లంత వెనుకకుబోయి, నాలుగు పైసలున్నోళ్ళు, పైసలు కర్చు పెట్టేవాళ్ళు, ఎన్నికల రాజకీయాల్ల్లో ముందుకచ్చిన వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం జేసిన వాళ్ళు గూడ ఇవాళ్ళ ప్రజా ప్రతినిధులుగ న్యాయం జేస్తరా, రాత్రికి రాత్రి ఉద్యమకారులైనోళ్ళు ఏ మేరకు న్యాయంజేస్తరన్న దాన్ని బట్టి కేసీఆర్ గారు సక్సెసైతరు…

ప్ర… మీ దృష్టిలో బంగారు తెలంగాణ ఎట్లుండాలె?

జ…  ప్రజలకు ఉపయోగపడే విధంగ ఉండాలె. ప్రజల్ని మెరుగు పరిచే విధంగ ఉండాలె. బ్రాడ్ సెన్స్ ల జెప్పాల్నంటే…. పాలసీల పరంగా వీళ్ళేం భిన్నంగ పోయే పరిస్థితి అగుపిస్తలేదు. కాకుంటే ఏందంటే గతంలో కంటె మరింత మెరుగైన సంస్కరణలు చేపట్టాలె. ఇప్పుడీ వనరుల దోపిడీ, సింగరేణి సంపద మన దగ్గర నుండి అక్కడికి పోకుంట ఇక్కడ మన వనరులు మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తే కొంత అభివృద్ధి జరుగుతది. కాని మౌలికమైన మార్పు సమాజంలో వస్తదని నేననుకోను. కేసీఆర్ ఏమన్నజేసేదుంటే సంతోషం. ఎంతవరకైతే ప్రజలకు న్యాయం జరగదో అంతవరదాక వాళ్ళు ఈ రూపంలో కాకపొతే ఇంకో రూపంలో కొట్లాడుతనే ఉంటరు. ఎందుకంటే వాళ్ళు బతుకాలె. వాళ్ళు బతుకాల్నంటే తప్పనిసరిగ ఐతేనేమో ఆకలికి సావడం, లేకుంటే బతుకడం కోసం పోరాటం జెయ్యడమో మిగిలిపోతుంది. అసమానతలు ఉన్నంత సేపు ఉద్యమాలు పుడుతనే ఉంటయ్. ఉద్యమకారులు పుడుతనే ఉంటరు.

ప్ర… తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పునర్నిర్మాణం జరుగాలంటున్నరు గదా! ఇది ఎట్లుండాలే?

జ.. సాహిత్యకారులు గాని, సామాజిక వేత్తలుగాని, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవారు గాని, ముందుగా చేయాల్సిందేందంటే, అసలు రోగమేందో తెలుసుకొవాలె, ప్రజల సమస్యలేందో తెలుసుకొవాలె, లోతుగా అధ్యయనం చేయాలె, చేసి, అవి వెలుగులోకి తీసుకస్తే అది ఒక ఎజెండాగా మారుతె దాన్ని పరిష్కరించే మార్గం దొరుకుతది. దాన్ల గూడ రెండు రకాలు! ఒకటి మౌలికంగ మొత్తంగ మార్చడమనేది ఈ వ్యవస్థల సాధ్యం గాదు. వితిన్ ద ఫోల్డ్ లోపటనే చేయగల అంశాలు చాల ఉన్నాయ్. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా లోపట మలేరియా వచ్చి వేలాది మంది చచ్చిపోతండ్రు. మలేరియా క్యూరేబుల్, చాలా ప్రైమరీగ చెయ్యచ్చు. అటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీస్కపోతే ఇంకొన్ని పి.హెచ్.సి లు పెంచడం వల్లనో ఆ చావులను ఆపగలుగుతం… వేలకోట్ల రూపాయలు పెట్టి రోడ్లేస్తండ్రు కని, రైతు పంట పండిచ్చుకొని వస్తే మార్కెట్ల పెట్టుకుందామంటే షెడ్లు లెవ్వు. అట్లాంటి వాళ్లకు మేలు చెయ్యాలె. ప్రజలకోసం ఆలోచించే వాళ్ళు ప్రజలు బతికే మార్గం ఆలోచించాలే. ప్రజల కష్టాలే కొలబద్ద కావాలె..

ప్ర… మీరు ఒక సామాజిక మార్పును ఆశించి చేసిన రచనలు మీరు అనుకున్న పాఠకులకు చేరినయా? మీ పాఠకులు ఎవరు?

జ… సమాజం గురించి ఆలోచించే వారు, సమాజంలో మార్పుకోసం తాపత్రయపడే వాళ్ళే నా రచనలు ఎక్కువగా చదువుతరు. సమాజాన్ని అర్థం చేసుకోవడం, అందులో ఉండే లోటుపాట్లు, కష్టాలు, నష్టాలు తెలుసుకోవాలనుకునే వాళ్లు, నా రచనలు వెతుక్కొని చదువుకుంటండ్రు. ఫలానా పుస్తకం వచ్చిందట చంద్ గారిది, ఏడ దొరుకుతదని తెప్పిచ్చుకొని చదివిండ్రు. నేను ఎంత మంచిగ రాసినప్పటికి గూడ, ఒక వ్యాపార పత్రికో, ఒక సినిమా స్టైల్ సాహిత్యాన్ని చదివే వాళ్ళను ఆకర్షించలేను. నా పాఠకులు నాకున్నరు.

ప్ర… ఏ అవార్డులను ఆశించి మీరు రాయకపోయినప్పటికీ… మీకు సరియైన గుర్తింపు రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

జ… ఆర్నెల్లు కష్టపడి పంట పండిచ్చిన వాడు పంట రాకుంటే ఏం జేస్తడు… జీవితమంత బొగ్గు బాయిల పనిజేసి ముసలితనానికి వచ్చినంక అడుక్కుంటున్నోని సంగతేంది? ముప్పై ఏండ్లు బొగ్గుబాయిల కాలం తోటి పోటీ పడి అననుకూలమైన  పరిస్థితిలో సచ్చి పుట్టినోని సంగతేగట్లుంటే నాకు గుర్తింపు గావాల్నని నేననుకోను.. నాకు గుర్తింపునియ్యడానికి వాళ్ళ ప్రమాణాలు వేరు. అట్ల ఆశించడం అర్థం లేని విషయం. ఏ సాహిత్యమైనా మంచిగుంటే నిలబడుతది. లేకుంటే కొట్టుకపోతది. ప్రజల హృదయాల్లో ఉండుడే అసలైన గుర్తింపు…

*

కులవృత్తుల వేదన బయటికి రావాలి

 

devendar

అన్నవరం దేవేందర్ ప్రముఖ తెలుగు కవి. 2001లో “తొవ్వ” కవితా సంకలనంతో మొదలై, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, బుడ్డుపర్కలు, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత కవితా సంపుటాలు ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ ఇప్పటికి పది పుస్తకాలు ప్రచురించారు. ఇటీవల “బువ్వకుండ” దీర్ఘ కవితను వెలువరించారు. ప్రధానంగా తెలంగాణ జీవన దృశ్యాన్ని, బహుజన దృక్పథాన్ని, ప్రపంచీకరణ పర్యవసానాలను కవిత్వీకరించారు. తెలంగాణ ప్రజల భాషను కవిత్వ భాషగా తనదైన శైలిలో ప్రయోగిస్తున్న వారిలో ముఖ్యులు అన్నవరం దేవేందర్.

ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్ధిక విధానాలు, సాంకేతిక పురోగతి కుల వృత్తులను కనుమరుగు చేస్తున్నది. ఈ క్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువును తీసుకుని దీర్ఘ కవితగా వెలువరించిన అన్నవరం దేవేందర్ గారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ముఖాముఖి.

 

  • దేవేందర్ గారూ! కుల వృత్తి మీద దీర్ఘ కవిత వేశారు కదా! ప్రస్తుతం కుల వృత్తుల పరిస్థితి ఏమిటి? కుల వృత్తుల కొనసాగింపు పై మీ అభిప్రాయమేమిటి?

 

  • కుల వృత్తులు కూలిపోవడమనేది ఒక విషాదకర దృశ్యమే ఐనా కులవృత్తులు నిలపాలని ఎవరూ కోరుకోరు కోరుకోవలసిన అవసరం కూడా లేదు. వీటిని అధిగమించి బహుజనులు ఎదిగి రావాలె. ఇవి ప్రాచీన కళా శాస్త్ర సాంకేతిక నైపుణ్య రూపాలు. బహుజన కులాల శ్రమ జీవులంతా సామాజిక శాస్త్రవేత్తలు. కుండను కనిపెట్టడమనేది మెసపుటేమియా నాగరికత నాడే కనిపించింది. నూలు వడకడం, వంట వండడం మొదలైన మానవ నాగరికత పరిణామానికి మూల బీజాలు. ఈ టెక్నాలజీ కి, కళకు వాళ్ళు పేటెంట్ దారులే. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లైనా ఈ వృత్తులు కలవాళ్ళు తొలి నాగరికతకు బీజాలు వేసిన వాళ్ళే. ఈ వృత్తులల్లో కళతో పాటు సమాజోపయోగం కూడా ఉంటది. ఇది పర్యావరణానికి కూడా హాని చేయనిది. ఒక్క మిషన్ వందల చేతులను ఇరగ్గొట్టింది, ఒక కంప్యూటర్ రెండు వందల  టైపు మిషన్ లను లేకుండ చేసింది. ప్రపంచంలో ఏది కొత్తగ కనిపెట్టినా అది అంతకుముందున్న  వ్యవస్థకు విఘాతం కలిగిస్తది. అది అనివార్యమే, దాన్ని ఆపలేం. కాబట్టి దాన్ని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటది. వ్యవసాయ రంగంలో నాగళ్ల స్థానంలో, ఎడ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినయ్, పొలం కోతలకు హార్వేస్టర్ లు వచ్చినయ్. ఇంకా అన్ని రంగాల్లోకి వస్తయ్. వీళ్ళు కూడా ఇతర ఆధునిక వృత్తులలోకి అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉన్నది.

 

  • బువ్వకుండ దీర్ఘ కవిత రచనకు ప్రేరణ ఏమిటి? గతంలో ఏవైనా దీర్ఘ కవితలు రాశారా?

 

  • మల్ల ప్రపంచీకరణ నుంచే మొదలు పెడితే, ఈ ప్రపంచీకరణతో చాలా వృత్తులు పూర్తిగ అంతరించి పోతయ్. ముందు తరాలకు ఈ వృత్తుల గురించి తెలిసే అవకాశం కూడ లేదు. నేను కుమ్మరి కుల వృత్తి నుంచి రావడం వల్ల దీనిలోని కళాత్మకతను, నైపుణ్యాన్ని, మూలాల్ని సాహిత్యంలో రికార్డు చెయ్యాలను కున్నా. ఐతే, ముఖ్యంగా మిత్రుడు జూలూరు గౌరీ శంకర్ వెంటాడే కలాలు పేరుతో పదిహేనేండ్ల కిందనే చాలా కుల వృత్తుల కవిత్వాన్ని తీసుకచ్చిండు. దాన్ని రివైజ్ చేసే క్రమంలో మళ్ళీ రాయాలనే ప్రేరణ దొరికింది. గతంలో కూడ తెలంగాణ మీద నేలపాట, గుండె పాట అనే పేరుతోని రాసిన, నా బాల్యం గురించి కూడా పెద్ద కవితలు రాసిన కానీ, దీర్ఘ కవితలుగా రాయలేక పోయిన. ఆఖరి ముచ్చట అనే పేరుతోని రైతు చనిపోతూ చెప్పే స్వగతం గురించి దీర్ఘ కవిత రాయాలని తపన ఉండే. ఇవన్నీ ప్రేరణగా ఇప్పుడు “బువ్వకుండ” వచ్చింది.

 

  • తెలంగాణ ఉద్యమ సాహిత్యం  గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితి గురించి వివరిస్తారా?

 

  • గడిచిన దశాబ్దం అంటే 2014 కు ముందు దశాబ్ద కాలం దాకా తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యమే ఏలింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం అణచి వేయబడ్డ తెలంగాణ భాష, సామెతలు, పాత్రలను సాహిత్యంలో ప్రతిష్టించింది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కలాలు ఆగిపోయినయ్. తెలంగాణ ఆకాంక్ష కవిత్వం దాదాపుగా నిలిచిపోయింది. కానీ, తెలంగాణ విశిష్టతను తెలిపే తొలిపొద్దు, తంగేడు వనం లాంటి కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఐతే, తెలంగాణ ఏర్పడంగనే సమసమాజం ఏర్పడ్డట్టు భావించవల్సిన పనిలేదు. కోస్తా ఆంధ్రా కమ్మ పాలన నుండి చేతులు మారి తెలంగాణ పాలన ఆరంభమైంది. రూపం మారినా పాలక వర్గ స్వభావ సారాంశంలో పెద్దగా ఆశించాల్సిందేమీ ఉండదు. సంస్కృతి, చరిత్ర నిర్మాణంలో పాలనాపరమైన తెలంగాణతనం మాత్రం కనిపిస్తున్నది. కవి తన గొంతును సవరించుకోవల్సిన అవసరం ఉంటది ఎపుడైనా.

 

  • మీరు తెలంగాణ భాషలో గత రెండు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు కదా! తెలంగాణ భాష గురించి ఏమంటారు?

 

  • తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాష అద్భుతంగా ఇమిడి పోయింది. తెలంగాణ భాష స్వభావరీత్యా నాదాత్మకమైన భాష. తెలంగాణ భాషలో ప్రాస, లయాత్మకత సహజంగ ఉండి వినసొంపుగ ఉంటది. ఇది సాహిత్య ప్రామాణికతను సాధించుకున్నది. నిజానికి తెలంగాణ వ్యవహార భాషను సాహిత్యంలోకి రానీయకపోవడం వల్ల దూరమైంది కానీ, దీనిలో ఏ భావాన్నైనా వ్యక్తీకరించే సత్తా ఉన్నది. సోమన , పోతన, సురవరం, వానమామలై, కాళోజీలాంటి వాళ్ళు వాళ్ళ సాహిత్యంలో వాడిండ్రు. 1956 తర్వాత రెండున్నర జిల్లాల భాష ప్రమాణ భాష చేసి, అదే ప్రసార మాధ్యమ భాష చెయ్యడం వల్ల తెలంగాణ భాష నిరాదరణకు గురైంది. నా దృష్టిలో భాషకు ప్రామాణికత ఉండడమే ఆధిపత్య భావజాలం.

 

  • ప్రస్తుత తెలుగు సాహిత్య స్థితి ఎట్లా ఉన్నది? నేటి తరం సాహిత్య స్పృహ ఎట్లా ఉన్నది?

 

  • ఒక పదేండ్ల కిందట తెలుగు సాహిత్యమంటే దిన వార మాస పత్రికలే అనుకున్నం. కానీ, వాటికి పదింతల సాహిత్యం  ఇప్పుడు అంతర్జాలంలో వస్తున్నది. ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్ లాంటి గ్రూప్ లతో పాటు  అంతర్జాల పత్రికల్లో అద్భుతమైన కవిత్వం, సాహిత్యం వెలువడుతున్నది. ఈ పత్రికలు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా వేలువడుతున్నయ్. యువతరం దీన్ని పట్టుకున్నది. ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడ కథలు కవిత్వం రాస్తున్నరు. ఫేస్బుక్ లో కవి సంగమం, సాహితీ సేవ, సాహితీ సవ్వడి, ఇట్లా ఎన్నో గ్రూప్ లు వేల మంది సాహిత్యాన్ని దినదినం పోస్ట్ చేస్తున్నయ్. కరీంనగర్ జిల్లాలో కూడా ఎన్నీల ముచ్చట్ల పేరుతో మూడు సంవత్సరాలుగ వెలువడుతున్న కవిత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలుగు సాహిత్యానికి ఇప్పుడు పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు. రాశితో పాటు వాసిని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది.

 

  • చివరగా…. కుండ మీద కుండ పేర్చినట్లుండే మీ కవిత్వ దొంతరలో బువ్వకుండలోని కొన్ని కవిత్వ పాదాల్ని ఉదహరిస్తారా?
  •  “మట్టిని లోహం పురాగ మింగింది/అయినా మన్ను పరిమళం మిగిలే ఉంది/కళాత్మకతలో ఉత్పాదకత దాగి ఉన్న కుల కశ్పి/ చేతి వేళ్ళ నుంచే ఆణి ముత్యాల్లాంటి కుండలు గురుగులు గూనలు రాలిపడుతయి”.

“ చేతి పనులన్నీ కవిత్వం అల్లినట్లే/ అందంగా నులక మంచం నేసుడు/ నూలు పోగుల అల్లికలతో రంగు రంగుల చీర/ పసురం తోలుతో కిర్రు చెప్పులు ముడుసుడు/ తాళ్ళు పగ్గాలు దందెడ్లు వడివడిగా పేనినట్టుగ/ బాడిశతో నాగండ్లు అమిరిచ్చుడు/ కర్రు గడ్డ పారకు మొన పెట్టినట్లుగనే/ వ్యవసాయ దారులు తినే దినుసులు పండిచ్చినట్లుగ/ సకల కుల వృత్తులు ఊరూరి సూర్యులు/ ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి/ ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశం/ సమాజానికి బహుజనులు అందించిన బహుమానం/ తరతరాలుగ కొనసాగుతున్న వారసత్వం”.

“మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం/ మట్టే వస్తుసేవలకు మూల్యాంకనం/ మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం/మట్టి కుండతోనే అగ్గిల మాయం”.

 

సృజన, అనువాదం బొమ్మా బొరుసూ: నలిమెల

 

బహుభాషా వేత్త, ఆదర్శ అధ్యాపకుడు, కవి, రచయిత, అనువాదకుడు, తెలంగాణ పదకోశ రూపకర్త  నలిమెల భాస్కర్ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాకు చెందిన వారు.     పద్నాలుగు భారతీయ భాషల నుండి తెలుగులోకి, తెలుగు నుండి ద్రావిడ భాషల్లోకి అనువాదాలు చేసిన వారు. మలయాళంలో పునత్తిల్ కుంజ్ అబ్దుల్లా రాసిన ‘స్మారక   శిలగల్’ నవల తెలుగులోనికి అనువాదం చేసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ       అవార్డును అందుకున్నారు.  బహుముఖీన మైన వారి ప్రతిభను కృషిని తెలుసుకోవడంలో       భాగంగా భాషారంగానికి పరిమితమవుతూ ఈ ముఖాముఖి బూర్ల వేంకటేశ్వర్లు మన        ముందుంచారు.

 

@  నమస్తే! ఉద్యోగమూ, సృజనా, వ్యక్తిగత జీవితమూ చక్కబెట్టుకుంటూ ఇన్ని  భాషలు నేర్వడంలో ఎట్లా సఫలీకృతులైనారు?

  • ఉద్యోగము చేయక తప్పని సరి పరిస్థితి, చేస్తే తప్ప వెళ్ళని స్థితి, కాకుంటే నిబద్ధతతో, నిజాయితీగా చేయడానికి మా తండ్రి రామచంద్రం స్ఫూర్తి. ఇక సృజన అంటారా! అది శ్వాసతో సమానం. ఐతే, అనువాదాలు ఆరంభమయ్యాక సృజన తగ్గింది. మా తరం అంతా ఆదర్శాల తరం. ఎటు చూసినా ఉద్యమాలు, పోరాటాలు. పొతే… భాషల అధ్యయనం గురించి నేను టీచర్ గా పనిచేసిన ఊరికి కనీసం పేపర్ రాదు. ఆ ఊళ్ళో గ్రంథాలయమూ లేదు. అక్కడ ఐదేండ్లు పని చేయాల్సి వచ్చింది. నాకు తొమ్మిదవ తరగతి నుండి పుస్తక పఠనం తప్ప మరే అలవాటు లేదు. ఏం చేయను. ముప్పై రోజుల్లో కన్నడ భాష పుస్తకం కంట బడింది. నేను దాని వెంట పడ్డాను. తర్వాత తమిళం వంతు అయ్యింది. ఐతే, భాషలు నేర్చుకోవడం అనేది ఒక అధ్బుతమైన క్రీడలాంటిది. గణితంలో కఠిన మైన లెక్కలు చేయడం లాంటిది. పైగా, అనేక భాషలను ఏక కాలంలో తులనాత్మకంగా నేర్చుకోవడం ద్వారా సులభమైంది. కొంత విలక్షణంగా పని చేయడం అనేది మొదటి నుండి నా స్వభావంలో ఉంది.

@ జాతీయ భాష, త్రిభాషా సూత్రం ఏమేరకు సాధించినై , భాష వలన ఇది సాధ్యమౌతుందా?

  • ఇది అకాడెమిక్ ప్రశ్న! జాతీయ భాష హిందీ ద్వారా దేశ సమైక్యతను కాపాడాలన్న సంకల్పం మంచిదే! కానీ, ఇది వికటించింది. హిందీ ఆధిపత్య భావజాలం దక్షిణాది మీద ముఖ్యంగా తమిళం మీద రుద్దబడింది అన్న అభిప్రాయలు ప్రచలితం అయినవి. ఇక, త్రిభాషా సూత్రం కూడా దాదాపు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైంది. జాతీయ సమైక్యత బలపడాలంటే ఉత్తరాది వాళ్ళు సైతం దక్షిణ దేశ భాషలలోని ఏ ఒక్కటైనా చదవాలి కదా! కానీ, అలా జరగడం లేదు. జాతీయ భాష హిందీతో పాటు ఆంగ్లాన్ని చదువుకొని ఉత్తరాది వారు ద్విభాషా సూత్రానికే పరిమితమవుతున్నారు.

భాష వల్ల జాతీయ సమైక్యత అనేది కొంత మేరకే సాధించ గలమనేది నా వ్యక్తిగత    అభిప్రాయం. అపారమైన దేశభక్తే ఈ దేశ సమైక్యతను, సమగ్రతను నిలబెట్టగలదు.

@ జ్ఞానార్జనలో, సృజనలో, భావ వ్యక్తీకరణలో మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం  కాగలుగుతుందా, అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద ఎలాంటి ప్రభావాన్ని    చూపుతున్నది?

  • దేనిలోనూ మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం కాదు. అది తల్లి వంటిది. మాతృమూర్తికి బదులుగా మరొకరు ఆ స్థానాన్ని పొందగలరా, లేదు. తల్లిభాష సహజమైనది, సులభమైనది, శాస్త్రీయమైనది. అతి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించే సాధనం తల్లి భాష. వ్యక్తి సమగ్ర వికాసానికి, మూర్తిమత్వ వృద్ధికి మూలకారణం భాష. అది, మాతృభాష ద్వారా జరిగినప్పుడు అనేక సత్పలితాలు చూడగలం.

అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద బాగా పనిచేస్తున్నది. ఎంత  కాదన్నా… శాస్త్ర సాంకేతిక సమాచారమంతా ఆంగ్లంలో ఉండిపోయింది. జ్ఞాన     సముపార్జనకు ఆంగ్లాన్ని వాడుకోవాల్సిందే. ఐతే, ఆ క్రమంలోనే మాతృభాషను మరింత సుసంపన్నం చేసుకోవాలి. విరివిగా అనువాదాలు జరగాలి. ఆంగ్లంలో ఉన్నఅపారమైన ఆయా శాస్త్రాల జ్ఞానాన్ని ఇతర         భాషల్లోకి తెచ్చుకోవాలి. అట్లు జరగక      పోగా రాను రాను ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇతర భాషలు కనుమరుగయ్యే ప్రమాదం   ఏర్పడుతున్నది. మాతృభాష తన మూలాలు కాపాడుకుంటూనే అంతర్జాతీయ భాష వల్ల  ప్రభావితమైతే ఏ రకమైన ఇబ్బంది రాదు.

@ బహుభాషలు నేర్చుకున్న మీరు తెలంగాణ పదకోశం గల కారణాలు ఏమున్నాయి?

  • సాహిత్యంలో నిర్దిష్టత ప్రవేశించాక స్థానికత ప్రబలమయ్యాక, అస్తిత్వ ఉద్యమాలు బాగా ప్రచలితం అయ్యాక మన చరిత్ర, భాష, సంస్కృతి పట్ల సోయి పెరిగింది. తెలంగాణ మలిదశ పోరాట సందర్భంలో తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం జరిగింది. ఆ వేదిక నన్ను నేను తవ్వి పోసుకోవడానికి కారణమైంది. ఆంధ్రా ఆధిపత్య వాదులు తెలంగాణ తెలుగుకు వెక్కిరించడం వల్ల అది తెలంగాణ ఆత్మకు శరాఘాతమైంది. తెలంగాణ ఆత్మ మేల్కొంది. కొందరు ఆ భాషలో కైతలు రాశారు. మరికొందరు కథల్ని పండించారు. నేనేమో పదకోశం వేశాను.

@ తెలంగాణ రాష్ట్రంలో భాషకు ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉన్నది?

  • మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ శిష్ట వ్యావహారిక భాషనే వాడడం ఒకింత విచారాన్ని కలిగిస్తున్నది. పాఠశాల స్థాయిలో ఒకటి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాలు మారాయి. వీటిల్లో ఎనభై శాతం తెలంగాణ వాళ్ళవే ఉండడం ఆనందాన్ని కల్గించే  అంశం. అయితే, ప్ప్ర్వపు భాషే ఉన్నది. తెలంగాణ తెలుగులో వాచకాలు లేవు. ఒక ప్రామాణిక భాష ఏర్పడ లేదు. ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత మేరకైనా తెలంగాణ తెలుగును బోధనా భాషగా చేసుకోకపోతే బోలెడు నష్టం జరిగిపోతుంది. కేవలం బోధనా భాషగానే కాక, అధికార భాషగానూ, పత్రికా భాష గానూ, సినిమా భాషగానూ తెలంగాణ తెలుగు నిలదొక్కుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. ఒక సమగ్ర నిఘంటు నిర్మాణం జరగాలి. తెలంగాణ తెలుగులో రాస్తున్న రచయితల్ని ప్రోత్సహించాలి. పాల్కురికి, పోతన వంటి కవుల పద ప్రయోగ సూచికలు రావాలి. భాషకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి.

@ సృజనలో భాష నిర్వహించే పాత్ర గురించి చెబుతారా?

  • సృజనలో భాష ఒక అంగం. పైగా ముఖ్యమైన అనుఘటకం. రచనకు అది ఒక కవితైనా, కథైనా, నవలైనా మరేదైనా వస్తువు చాలా ముఖ్యమైన అంశం. ఐతే, ఆ వస్తువు ఎంత ఉదాత్తమైనది ఐనా, ఎంత ఉన్నతమైనది అయినా ఏ భాషలో చెబుతున్నామనేది ఎంతో ముఖ్యమైన విషయం. నన్నయ తన భారతాన్ని తెలుగులో కాక సంస్కృతంలోనే అతనికి అంత ప్రశస్తి వచ్చి ఉండేది కాదేమో! పాల్కురికి సోమన దేశీ కవితా మార్గంలో బసవ పురాణాన్ని తీర్చిదిద్దడం వల్లే దేశి కవితా మార్గానికి ఆది పురాణమైంది. వేమన అలతి అలతి పదాలతో ఆటవెలదులు రాసినందువల్లనే అతని పద్యాలు ఈనాటికీ అందరి నోళ్ళలో నానుతున్నాయి. సృజనలో ఉన్న అంతస్సత్త అంతా భాష అనే మాధ్యమం ద్వారానే పాఠకుణ్ణి చేరుతుంది. అది మాతృభాష కాకున్నా, ప్రజల భాష కాకున్నా రచనలకు అంత ప్రాధాన్యత ఉండదు.

@ ప్రాచీన భాష తెలుగు అభిమాన భాషగా ఎదగక పోవడానికి ఆటంకాలు ఏమున్నాయంటారు?

  • మాతృభాష పట్ల మన ప్రభుత్వాలకు ఉన్న అభిమాన రాహిత్యమే ప్రధాన ఆటంకం. తమిళనాడులో ప్రజల కన్న మిన్నగా పాలకులకే భాషాభిమానం ఉంటుంది. కర్ణాటకలో సైతం కన్నడ భాషాభిమానం మెండు. తెలుగు వాళ్లకి తెలుగు పట్ల ఒక తేలిక భావం. పొరుగింటి పుల్లకూర రుచి వీళ్ళకి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వాల్లో కదలిక రావాలి, చిత్తశుద్ధి కావాలి. మొక్కుబడి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వవు.

@ అనువాదాల గురించి మీ అభిప్రాయమేమిటి?

* అనువాదం అనేది పొరుగు వాడి గురించి తెలుసుకోవడం వంటిది. ఇతరులగురించి అవగాహన ఉన్నప్పుడే వాళ్ళకన్నా మనం ఎంత ముందున్నాం లేదా వెనుకబడినాం అనేది తెలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు ఇతరులను పోల్చుకుని పోటీపడే స్వభావం పెరుగుతుంది. సృజన, అనువాదం ఇవి రెండు పరస్పర పరిపూరకాలు. ఇందులో ఏది లోపించినా మన జ్ఞానం అసంపూర్ణం. అనువాదాలు లేకపోతే ఇతర భాషల సాహిత్యం లేదు. ప్రపంచ సాహిత్యం లేదు. శాస్త్ర సాంకేతిక జ్ఞానం శూన్యం. హృదయ వైశాల్యానికి, దృష్టి నైశిత్యానికి, వ్యక్తి వికాసానికి అనువాదం ఒక ముఖ్యమైన మెట్టు.

*

కవిత్వం కాకి బంగారం కాదు: అనిశెట్టి రజిత

 

boorlaకవయిత్రి సామాజిక ఉద్యమ కారిణి అనిశెట్టి రజిత తన చిన్ననాటి నుండే ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారు. కాళోజీ అడుగుజాడల్లో నడిచినవారు. ఇప్పటి వరకు ఐదు కవితా సంపుటాలు, తన సంపాదకత్వంలో అనేక కవితా సంపుటాలు ప్రకటించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల తెలంగాణ రచయితల వేదిక అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా అన్నవరం దేవేందర్, బూర్ల వేంకటేశ్వర్లు వారితో జరిపిన ముఖాముఖి.

  • అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం స్వీకరిస్తున్నారు కదా! ఎలా అనుభూతి చెందుతున్నారు. అలిశెట్టి ప్రభావం మీ కవిత్వం మీద ఉన్నదా? ఆయన కవిత్వం పై మీ వ్యాఖ్య?

#  అలిశెట్టి ప్రభాకర్ స్మృతిలో ఒక పురస్కారం ఒకటి కరీంనగర్ తెలంగాణ రచయితల వేదిక నెలకొల్పడం, ప్రతి సంవత్సరం 12జనవరిని చరిత్రాత్మకం చేస్తుంది.  ఈ పురస్కారానికి ఈ సంవత్సరం నన్ను ఎంచుకోవడం ఆనందం కలిగినా చాలా ఆలోచిస్తున్నాను.

39 ఏళ్ల వయసు నాటికి ఒక అరాచకత్వంతో, క్రమ శిక్షణా రాహిత్యంతో, దారిద్ర్యం పడగ నీడలో బతికిన మంచి కవి సాహితీలోకం నుండి నిష్క్రమించడం తలుచుకుంటే విషాదం కమ్ముకుంటున్నది.

అలిశెట్టి కవిత్వంతో నాకు ఉన్న పరిచయం అప్పట్లో ఎక్కువేమీ కాదు. గత మూడు సంవత్సరాలుగా చాలా లోతైన అనుబంధం ఏర్పడింది. ఎంత పదునైన కవిత్వం అది. అంత చిన్న పదాల్లో అత్యంత పెద్ద భావన, చురుక్కుమనిపించే మినీ కవితలో లోకం తీరును అనితరసాధ్యంగా ప్రతిబింబిస్తుంది ఆ కవిత్వం. simply he is a great poet. పరోక్షంగా ఆయన కవిత్వ ప్రభావం నాపైన ఉన్నదనే అనుకుంటాను.

  • నలభై ఏళ్లకు పైగా సాహత్య రంగంలో ఉన్నారు. ఇప్పటికి ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, నానీలు, హైకూలు, కథా సంపుటి, ఎనిమిది సంకలనాలకు సంపాదకత్వాలు వెలువరించారు. ఒకరకంగా చెప్పాల్సివస్తే తక్కువగా రాసినట్టే…క్రియాశీల ఉద్యమాల్లో పాల్గొన్నందున ఇలా జరిగిందా!

#  పైన పేర్కొన్న ప్రక్రియలే కాకుండా మరో రెండు ప్రక్రియలు వ్యాసం, పాట కూడా నేను రాసాను… రాస్తున్నాను. ప్రచురించబడిన రచనలు ఉన్నట్లే సంకలనం కాని రచనలు వివిధ పత్రికల్లో వచ్చినవి ఎన్నో ఉన్నాయి… కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పని చేస్తూ సమయం సరిపోక ఇంకా ఎక్కువగా రాయలేక పోయాను అనేది లేదు.

నిజానికి ప్రజాతంత్ర ఉద్యమాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొనడం వల్లనే రాయగలుగుతున్నాను. ఆ క్రియాశీల భాగస్వామ్యమే లేకపోతే బహుశా నేనూ “వాలుకుర్చీ” రచయితగా మిగిలిపోయి ఉందును as a careerist and as a professional writer గా…

  • మీరు పౌర, స్త్రీ వాద, ప్రజాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు కదా! ఆయా ఉద్యమాల ప్రభావం సమాజం మీద క్రియాశీలంగా పని చేస్తుందా! ఫలితాలెలా ఉన్నాయి…

#  ఉద్యమాలు క్లిష్టమైన సామాజిక సాంస్కృతిక సమస్యల నుండే కదా పుట్టేది! వాటిలో పాల్గొనడం అంటే ప్రతి రోజూ ప్రతి క్షణం ఒక సంక్షోభం… అందుకే నేనంటాను ఉద్యమాలు ఉల్లాస క్రీడలు కావు అవి ప్రతినిత్యం జీవన్మరణ వేదనలని..

ఉద్యమాల ప్రభావం సమాజం మీద శాశ్వతంగానో సుదీర్ఘంగానో ఉండదు… అది తాత్కాలికంగానే ఉండదు… ఒక ఉద్యమం లోని కొన్ని డిమాండ్లు pass కాగానే సమూల మార్పులు జరిగిపోవు.. ఉద్యమాలకు చివరి అధ్యాయాలుండవు… ఒక తేదీన మొదలయి మరో తేదీన ముగిసిపోవదమూ ఉండదు. ఫలితాలు కూడా పాక్షికంగానే ఉంటాయి. సంపూర్ణతకు అర్థం లేదు. ఈ యథాతథ సమాజం కూలిపోయి సరికొత్త సమాజం ఏర్పడినపుడే ఉద్యమాలు మరో సృజనశీల రూపం తీసుకొని ప్రజా బాహుళ్యాన్ని  చైతన్య శీలురుగా మారుస్తాయి.. ఉద్యమాలు ఇంకెంతో పెరుగాల్సి ఉన్నది.. హేతు బద్ధత విస్తరించాల్సి ఉన్నది…

  • తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం అనుకున్న నిర్మాణానికి అడుగులు పడ్తున్నయా, ఎట్లా ఫీల్ అవుతున్నారు! ‘పునర్నిర్మాణం’ ‘బంగారు తెలంగాణ’ పట్ల మీ భావం ఏమిటి?

#  తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, భౌగోళికంగా సాధించుకున్నాం.. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తన భావజాలంతో పని చేస్తున్నది.. అంతేనా..? ప్రత్యేక రాష్ట్రం కోసం కదిలిన సకల జనుల ఉద్యమ పాత్ర అయిపోయినట్టేనా..? చేయాల్సింది చేసినం. ఇక చేయవలసిందంతా సర్కారే అనుకుంటే అతి పెద్ద ప్రమాదం… దీనివల్ల అంతా సమసిపోయిందనే అనుకోవాల్సి వస్తుంది.

ప్రజలు ఆలోచించడం.. పని చేయడం ఆగిపోయి ఎదురుచూడటం… అడుక్కోవడం మొదలయ్యిందంటే ఉద్యమ ప్రభావం అంతరించినట్టే… ఉద్యమాన్ని గతంలోకి నెట్టేస్తే ఈ నిర్మానంగానీ, పునర్నిర్మాణంగానీ, ప్రజా తెలంగాణ గానీ ఏదీ సాధ్యం కాదు.

ప్రజలు సంతోషంగా ఉన్నారా.. మెలకువతో ఉన్నారా.. సుభిక్షమైన తెలంగాణే బంగారు తెలంగాణంటే.. దాని కోసం తమ భాగస్వామ్యాన్ని గుర్తిస్తున్నారా.. తమ పని అయిపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారా.. తమ ఆకాంక్షలు ఏమిటి? అవి తీరే దారి ఏమిటి? వీటి గురించి చిత్త శుద్దితో ఆలోచిస్తేనే ఏదైనా సాధ్యం…

  • ప్రస్తుత కవితారంగం ఎటువైపు ప్రయాణిస్తున్నది? ఇంకా ఎలాంటి మార్పును తీసుకోవలసి ఉన్నది?

#  కవిత్వం మన లోపల కాలుష్యాలను ప్రక్షాళనం చేసి మంచి వైపుకే లాక్కుపోతుంది. కవితారంగం బాగా రాణిస్తున్నది…పురోగమిస్తున్నది… ఎటొచ్చీ కవులే కార్మికులు కాకుండా వైట్ కాలర్ ఉద్యోగుల్లా ప్రవర్తిస్తున్నారు. ముసుగు వీరుల్లా ముసుగు మనుషుల్లా సొంత డబ్బాలు మోగిస్తూ.. కోటరీలను తయారు చేసుకుంటూ..లొంగిపోయి బతుకుతున్నారు.

దేనికి లొంగిపోయి అంటే తమ వ్యక్తిగత అవకాశాల కోసం, కీర్తి కండూతి కోసం తమను తాము గొప్ప కవులుగా ప్రమోట్ చేసుకోవడానికీ.. సొంత దుకాణాలను బాగా అభివృద్ధి చేసుకొని ‘యాజమాన్యం’ చెలాయించడానికి దొంగ దారుల్లో.. పక్క దారుల్లో.. తప్పుడు దారుల్లో అడ్డదారులు పట్టి ఎగబడిపోతున్నారు. అందమైన తొడుగుల్నీ, ముసుగుల్నీ వేసుకొని చెలామణి అయిపోతున్నారు. సామాజిక స్పృహను కోల్పోయి దృష్టి హీనత్వం తెచ్చుకుంటున్నారు..

కవిత్వం కాకి బంగారంలా సింగారించబడి అహో ఒహోల్ల్లో సుడి చుట్టుకపోతున్నది. మనిషి కానివాడు కవెట్లయితడు? ఈ ముసుగులూ తొడుగుల్నీ చీల్చుకొని నిఖార్సైన మనుషుల్లా కవులు బయిటికి రావాల్సి ఉన్నది.. వ్యక్తిగత కాలుష్యాల నుండి కవిత్వరంగం ప్రక్షాళన కోరుకుంటున్నది.

  • తెలంగాణ ఆవిర్భావం తర్వాత కవి/రచయితల పాత్ర ఎట్లా ఉన్నది? ప్రస్తుత కర్తవ్యం ఏమిటి?

#  చాలా మంది కవులు అయోమయంలో ఉన్నారు… కిం కర్తవ్యం అనే డైలమాలో పడిపోయారు.. దారి తప్పిపోయిన వాళ్ళూ.. దారి తెలియక తచ్చాడుతున్న వాళ్ళుగా చీలిపోయారు.. ఉమ్మడి లక్ష్యం తెలంగాణ వచ్చేసింది.. ఇంకేమున్నది అన్న నిర్లిప్తతలో ఉన్నారు. నిశ్శబ్దం గుహల్లో దాక్కుంటున్నారు.. పిరికితనంతో ముడుచుకుపోయి మూగగా రోదిస్తున్నారు.

ప్రస్తుతమైనా ఎప్పుడైనా కవీ, రచయితా, మేధావీ సమాజానికి సరైన దిశా నిర్దేశకత్వం చేయాలి.. ప్రజా పక్షంలో ఉండాలి.. సమాజాన్ని కాపాడుకోవడం.. ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు చేస్తుండటం మన పని. ఏ బాధ్యతా లేదు, ఏ పనీ లేదు.. ఏ మేధావిగా ఆలోచనా రాదు అనుకుంటే కవిగా, రచయితగా, మేధావిగా, అంతా end అయినట్టే…

ఇప్పుడు కవులూ రచయితలూ చాలా మంది తమకో కర్తవ్యం బాధ్యత అస్తిత్వం ఉందనుకుంటున్నారా? అచేతనం నీడలో విశ్రమించకుండా ‘సోయి’ లోకి రావడం తక్షణ కర్తవ్యం. ఎటు గాలి వీస్తే అటు కొట్టుకపోవడం అగమ్యం.. అరాచకం.. దీన్ని గుర్తెరిగి కవులు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.

 

 

  • ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నారా?

నేనింకా చెప్పదల్చుకున్నది.. కవులు తమ బాధ్యత గుర్తెరుగక పొతే, మాట్లాడటం ఆగిపోగానే మనిషి నత్తగుల్లలోకి పలాయనం చిత్తగించినట్టవుతుంది. లాలూచీలు, రాజీ పడటాలు, పటాటోపాలు, తళుకు బెళుకులు కవులు రచయితలకు సంబంధించిన లక్షణాలు కావు.

అటు ఇటు కాకుండా ఏదో కవిత్వం కెలికి కవులమని రచయితలమని పురస్కారాలు పుచ్చుకుంటే అది ఆత్మవంచనకు పరాకాష్ట. సమాజం కోసమే కలం పట్టాలె… ప్రజల కోసమే నిలబడాలె. అదీ కవంటే.. అదీ కవిత్వమంటే.. ఇయ్యాల అలిశెట్టి ప్రభాకర్ కవిగా అందుకే చిరంజీవుడు.

ఇప్పుడున్న ఇంకొక ట్రెండ్ అకవిత్వం… అకవుల బెడద.. కవిత్వం సాధన చేయకుండా అకవులు వెల్లువెత్తుతున్నారు.. ఇక బోగస్ కవులూ పుడ్తున్నారు.. అవకాశవాదం ఎంతకైనా లోబడుతుంది. లోబడు కవులూ తేలుతున్నారు. ఈ చరిత్ర ద్రోహం నుండీ, చరిత్ర హీనత్వం నుండీ బయట పడమని నేను కవులనూ రచయితలనూ కోరుతున్నాను.