సప్త స్వరాల చివరి మజిలీ- ని!

 

 

మమత వేగుంట

 

సప్తస్వరాల శిఖర బిందువు- నిషాదం!

స్వరం సరిహద్దులకి చివరి పరీక్ష- ని.

నీ వ్యక్తీకరణ పరిధుల తుదీ మొదలూ  తేల్చుకునే సమయంలో వినాలి- ని.

 

తెగని సంఘర్షణ తరవాతే గెలుపు

కాన్వాస్ చీకట్లోంచి మెరుస్తుంది కళాఖండం

ఆ ఉత్సాహపు ఉరకల్లో మేధో విజయంలో వినాలి- ని.

 

ఏనుగు ఘీంకారంలోంచి కదిలాయి నిషాద స్వరమూలాలు.

ఆ ఘీంకారం నిన్నూ నన్నూ ఆదిమ యుగాల్లోకీ తీసుకెళ్తుంది

ఈ క్షణంలోకీ ఇక్కడికీ మేల్కొల్పుతుంది.

సాధ్యమయ్యే కలలోకి మెలకువ- ని

ఒక అద్భుతంలోకి విజయ సోపానం- ని

సాధ్య స్వప్న కళకి చేరువగా విను- ని!

Mamata 1

వినిపిస్తోందా ఆ సూర్యుడి శ్వాస…అశ్వ ఘోష!

 

మమత వేగుంట 

 

దూరాన్నుంచి

గుర్రం అడుగుల  చప్పుడు విను,

గాఢమయ్యే లయలో

కొట్టుకునే నాడితో-

 

అదిగో చూడు

కాలు దూసే ఆశ్వ సోయగం   

ఆ  శక్తీ

ఆ తీవ్రతా.

suswaram

 

 

 

 

 

వింటూ వుండు

భైరవ రాగంలో పల్లవించే సౌందర్యం

ఎగసి పడే అశ్వ ఘోషలో 

వాది స్వర నాదం – ద!

ఆ నాదంలో  ఆ స్వరంలో

సూర్యకాంతిని తాకి చూడు.

నేలంతా  అల్లుకున్న వెల్తురు చూడు.

గుర్రం అడుగుల కింద మెరిసే శక్తినీ చూడు.

 

ఇక అప్పుడు కదా,

తపన జ్వాలగా ఎగసి పడుతుందీ!

*

Mamata 1

 

కోకిల పాడే దీపం పాట!

మమత వేగుంట 

 

పొడుగాటి నీడలు చీకట్లోకి కరిగిపోయాయి.

గాఢమవుతున్న ఆకాశంలో దిగంతానికి ఒక చట్రం గీస్తున్నాయి సాయంత్రపు రేఖలు.

దీపాలు ముట్టించే వేళ

వేసవి పాట కోసం కోకిలకి దాహం- నాలాగే.

ప.

ఆ కోకిల పిలుపు

సప్తస్వరాల్లో అయిదో పలుకు.

suswaram

స్థిరమైన ప్రకృతి దృశ్యం లాగానే ఎంతో నిబ్బరం ఆ స్వరంలో-

వేసవిలోని గాంభీర్యం ఆ పలుకులో.

దీపాలు వెలిగించే దీప రాగం – దీపకం- “ప” ఆ రాగానికి వాది స్వరం.

ఆ దీప గీతికని పాడే కోకిల గొంతు విను

నట్టింట్లోనూ గుండె లోతుల్లోనూ జీవించే  దీపాన్ని చూడు.

ఎదురుచూస్తున్న కలల పాట పాడే కోకిలని విను

అది జీవితాన్ని వెలిగించే కల.  

Mamata 1

పద పదవే పావురమా!

మమత వేగుంట 

 

సప్తస్వరాల్లో –

అటు స రి గ లోతుల్లో, ఇటు ప ద ని శిఖరాల్లో- మధ్యన – మ!

ఈ స్వరం  బరువూ, గంభీరమూ కూడా – హృదయాన్ని యిట్టే పట్టేస్తుంది.

 

నేలని ముద్దాడినట్టుండే ముత్యాల ముగ్గులు చూడు.

చుట్టూ వున్న భూమికి అదొక అందమైన కేంద్రమే కదా!

అలాగే, “మ” స్వరం కూడా మధురమైన నాదానికి భూమిక.

 

అది  పావురం పలికే పాట! నింగికి ఎగిరే సన్నాహంలో వున్న పావురం.  

మిల మిల మెరిసే విశాలమైన దాని రెక్కలు చూడు.

ఆ మెరుపు రెక్కల అందం మాల్కోస్ రాగ సౌందర్యానికే చిక్కుతుంది.

 

“మ” వాది స్వరమైన పురాగానమే మాల్కోస్!

సంగీత క్షేత్రం  నట్ట నడుమ “మధ్యమం”లో పండగే మాల్కోస్!

 

జీవితంలోని చాలా భాగం ఆ మధ్యమ క్షేత్రంలోనే నడుస్తుంది – ఎక్కువగా విలంబిత లయలో, మంద్ర సప్తకమై!

ఆ మధ్యే క్షేత్రాన్ని వోపికగా శోధించినప్పుడు,

ఆసాంతం ప్రయాణించినప్పుడే విహాయస విహారం!

 

ఈ లోపు మధ్యమ సంగీత నాదంలో తేలిపో!

 

Mamata 1

నీలో రాలే చంద్ర కాంతలు ….

మమత వేగుంట

 

వెన్నెలతో వెలిగిపోతోంది చీకటి ఆకాశం!

నక్షత్రాల మెత్తని కాంతిలో తడుస్తోంది.

 

చంద్రకాంతలన్నీ ఒక గాలి తరగలాగా నేలవైపు తరలివస్తున్నట్టే వుంది.

నేల దేహంలోకీ, నీలోకీ తీయతీయని పరిమళం ప్రవహిస్తోంది.

ఈ నడుమ మధ్యలో ఎక్కడో ఒక మేషం గొంతు విప్పుతోంది.

అదే కదా, గాంధారం! సప్తస్వరాల్లో మూడో స్వరం.

 

రాగ బిహాగ్ కి “గ” వాది స్వరం. బిహాగ్ శృంగార రస ఉత్సవం.

రాత్రి రెండో ఝాములో రాగాల పండగ.

ఒక అనిర్వచనీయమైన మాధుర్య ఆకర్షణ ఏదో ఈ రాగంలో వుంది,

అది పట్టుకోవాలని ఈ చిత్రంలో నా వెతుకులాట.

 

చంద్రకాంత పందిరి కింద నెమ్మదిగా నిద్రలోకి జారుకునే వేళ

సుదూరం నించి నీ వైపే వస్తున్న ప్రేమ గీతాన్ని విను! విను!

 

Mamata 1

ఇలాతలంలో హేమం పండగ…!

మమత వేగుంట 

 

 

suswaram

చీకట్లో మెరుస్తున్నాయి పల్లెపొలాల చాళ్ళు.
దున్నడం అయిపోయింది,
ఇక విత్తనాల కోసం వాటి ఎదురు చూపులు.

చీకటి ఎంత నల్లగా వున్నా, ఆ నేల ఎరుపుని దాచలేకపోతోంది.
అవునూ, అది నెలవంకా? లేదూ, ఎద్దు కొమ్మా?!

రి- సప్తస్వరాల్లో రెండోది.
వృషభం రంకెలోంచి పుట్టింది ఇది.
అంతే కాదు, దున్నిన నేల లోతుల్లోంచి మొలకెత్తే ప్రతిధ్వని కూడా అది.

ఈ నేల, మన దేశం.
రి- దేశ్ రాగానికి వాది స్వరం.
రాత్రి రెండో ఝాములో పాడే అందమైన, సంక్లిష్టమైన రాగం.

చాలా దేశభక్తి గీతాల్లాగే, వందే మాతరం మూల గీతం ఈ దేశ్ రాగంలో కూర్చిందే.
నా పెయింటింగ్ విషయానికి వస్తే,
వృషభం – నేలని దున్నే దేశభక్త.
సమున్నత శిఖరాలకు ఎగిసే పునాదినిస్తుంది.
ఎదగడానికి శక్తినిస్తుంది.

సస్య శ్యామలం!

Mamata 1

నెమలి పాడీ..వాన కురిసీ… హరివిల్లే విరిసీ…!

 

suswaramవర్షం-

జీవధార.

వర్షానికీ, “స” స్వరానికీ మధ్య తెగని బంధం.

మన శాస్త్రీయ సంగీతానికి ఆధార స్వరం- స.

వర్షాన్ని ఉత్సవం చేసే రాగం – మేఘ మల్హార.

మేఘ మల్హారకి జీవస్వరం- స.

 

రాగం  విచ్చుకోగానే, తెలిమబ్బుల సంచారం మొదలవుతుంది. అప్పుడు మయూరాల కలకూజితం మీరు విన్నారా?

ఆ కలకూజితం దానికదే పాటా కాదు, సంగీతమూ కాదు. కాని, “స” స్వరాన్ని నిర్వచించే ధ్వని అది. ఆ తరవాతి ఆరు స్వరాలకూ అదే ఆధారం. ఆరు స్వరాలకు జన్మనిస్తుంది కాబట్టి దాన్ని షడ్జమం అంటారు.

సరే, ఆ వాన కురిసీ, కాస్త ఎండ మెరిసే వేళలో ఏడు రంగుల హరివిల్లుని చూడండి. కచ్చితంగా అప్పుడే మయూర స్వరాన్నీ వినండి.

సరిగమల వర్ణాలన్నిటికీ  షడ్జమమే  శ్రీకారం!  

Mamata 1

శాంతం

 

నవరసాల

ఒడిదుడుకుల రంగుల రాట్నం

చివ్వరికొచ్చేసాం ఇక-

ఒక ప్రశాంతమైన చివరకి- శాంతంగా!

ఏ ఉద్వేగాలూ లేని ఒక శూన్య స్థితిలోకి-

నిజానికి,

శాంతం అంటే

మిగిలిన అన్ని భావాల నించీ విముక్తి కాదు,

అన్ని రసాల భావోద్వేగాలనీ పునః ప్రతిష్ట చేసేది శాంతం.

ఇక్కడి తెలతెల్లని వలయం శూన్యం-

స్థిత ప్రజ్ఞత సాధించిన సమభావం.

నలుపులోంచి తెలుపులోకి అంతర్యానం

శాంతి రాహిత్యం నించి శాంతిలోకి కూడా ప్రయాణమే.

ఇక్కడి తెలుపు కేవలం ఒక చిన్ని బిందువే కావచ్చు

ఆ చిన్ని బిందువే కొత్త ఆరంభాలన్నిటినీ మేల్కొలిపే శక్తి.

అప్పుడు మళ్ళీ జీవన వలయంలోకి మనం-

Mamata Vegunta

అద్భుతం!

Adbhutam

ఈ విశ్వమంతా ఒక అంతిమ అద్భుతం.
అసలు మనమంటూ ఎలా వచ్చాం ఇక్కడికి?
మనం మాత్రమే వున్నామా ఇక్కడ?

ఈ ఆకాశం అంతిమ ఆర్ట్ గ్యాలరీ.
నక్షత్ర సమూహాలన్నిటినీ చూస్తున్నామా లేదా?!
ఒక్కో నక్షత్ర సమూహం ఒక కళా ఖండం!

ఈ ఆకాశమే అంతిమ పెయింటింగ్.
ఇది కాన్వాస్ లో వొదగని అనంతం.
నలుపు కన్నా గాఢం.
ఏ రంగులోనూ ఇమడని రహస్యం.

అవును, ఈ అనంతమైన విశ్వంతో నా సంతోషాల యాత్రని చిత్రిస్తాను నేను:
అనేక సార్లు, ఆ నక్షత్రాల నగల పెట్టిలోంచి
కొన్ని వజ్రపు తునకల్ని ఏరుకొస్తాను,
నావైన నక్షత్ర సమూహాల్నీ రచిస్తూ వుంటాను.

నాకేమాత్రం తెలియని
అపరిచిత లోకాల అన్వేషణలో
నక్షత్ర కెరటాల మీద దూసుకు వెళ్తాను.

ఆహా! నా అద్భుతాల ఆకాశం!

Mamata Vegunta

Mamata Vegunta

బీభత్సం

Bhibahatsam

పైన అంతా గందరగోళం, పధ్ధతిలేనితనం.

కిందన ద్వేషమూ, అసహ్యమూ వాటి గరుకుదనం.

పైనేమో శకలాలైన వొక లోకం.
కిందన మానవత అంతా నిశ్శేషమైన నిస్పృహ.
 
పైన కనిపించే దృశ్యమే మనిషితనానికి కిందన వుంటే,
ఇక ఆ కిందన వున్నదేమనుకోవాలి?!
 
అట్టడుగు చిమ్మ చీకట్లోంచి వొక తీవ్రమైన విధ్వంస నీలిమ,
పాలిపోయిన  ఎర్రెర్రని నిస్సహాయత.
 
అది మన సౌందర్య కాంతిని మసక  చేస్తోందని,
మనం కళ్ళు మూసుకుంటామా?
అది మన సఖ్య శాంతికి గాయం చేస్తోందని,
 అక్కడి నించి మనం నిష్క్రమిస్తామా?
Mamata Vegunta

Mamata Vegunta

భయానకం!

Bhayanakam

ఈ నలుపు ఒక తెలియని లోతు, అనిశ్చితమైన రేపు.కాంతి రాహిత్యమే చీకటి

ప్రేమరాహిత్యమే భయం

ఇంద్రియాల చుట్టూరా చీకటి

ఆ నీడల్లోంచి తొంగి చూస్తున్నదేమిటి? దుష్టత్వమా? ప్రమాదమా?

గుండెల్లో గుబులు, నుదుటి మీంచి జాల్వారుతూ భయం.

నెత్తుటెరుపు చారల్లోంచి మాత్రమే కాంతిని చూస్తున్నప్పుడు ఆశ ఏదీ? ఎక్కడా?!

మన  అశాశ్వతత్వానికి  మనమే ఎదురేగుతున్న క్షణాలివి.

నిశ్శబ్దాన్ని విను.

ఆదిమ భయాన్ని తట్టి చూడు.

భయం అనే భయాన్ని తెలుసుకో.

Mamata Vegunta

Mamata Vegunta

వీరం

Viram

తపన

ధైర్యం

ఏకాగ్రత

ఒక భావన పట్ల నమ్మకాన్ని కూడదీసుకొనే మనోవైఖరి

ఒక ఆచరణకు నడుం బిగించే భావన

ఒక సైనికుడే కావచ్చు

ఇంకో సంస్కర్తే కావచ్చు

లక్ష్యం ఈ తపనకి ఇంధనం, లక్ష్యం ఈ అగ్నికి సమిధ.

కణకణ మండే అగ్ని గోళం ఇది. వీరోచిత శక్తిని ప్రసరిస్తుంది అది.

దానికి తెలియకపోవచ్చు, అది ఏ గొప్ప మేలుని తలపెడుతుందో!

కాని, దానికి తెలిసీ తెలియకుండానే

ఒక మనుగడగా అది మారుతుంది. ఒక ఆశగా నల్దిక్కులా వెలుగుతుంది.

Mamata Vegunta

Mamata Vegunta

కారుణ్యం

 

K_Black

దుఃఖమూ కరుణా మనలోపలి ఉద్వేగభరితమైన  కవలల్లా కనిపిస్తాయి  నాకు.

దుఃఖం ఎలా అయినా రావచ్చు కదా, నిరాశలోనో  వేదనలోనో ఏదో వొక రూపంలో.

అలాగే, కరుణ కూడా సహానుభూతి రూపంలోనో, అపారమైన దయ రూపంలోనో రావచ్చు.

మనల్ని మనం పూర్తిగా నిండుగా దుఃఖంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలో, ఆనక, మనల్ని మనం పూర్తిగా క్షమించుకోగలిగే అంత  స్థైర్యమూ  వుండాలి.

నిజమైన కరుణ వొక సంపూర్ణమైన లోచూపు వల్ల వస్తుంది.

ఇక్కడ నీటి బిందువులున్నాయి కదా, అవి దుఃఖపు మనఃస్థితిని చెప్తాయి.

ఆ వెనక వున్న తెలుపు అంతా క్రమంగా ఆ దుఃఖాన్ని పీల్చుకునే కారుణ్య సీమ, ఓదార్పు లాంటి భూమిక.

ఇక ఆ తరవాత మన ముందున్న ఖాళీ పుటని రంగులతో నింపడమే!

                                                                                         -మమత వేగుంట 

Mamata Vegunta

హాసం!

Hasyam

పసుపు వన్నె-

వర్ణ వలయంలో మరింత వెలుగు.

ఇక్కడ కొన్ని దరహాసాల అలలు ఎగసిపడుతున్నాయి

కొన్ని పొరలు పొరలుగా:

మృదువైన చిర్నవ్వు, విస్మయం, చిలిపిదనం,

ఇంకొన్ని పకపకలు.

నవ్వులో మునిగి తేలుతునప్పుడు

ఎంత తేలికపడి పోతాం, మనమే నమ్మలేనంతగా. కాదా?

అన్ని ప్రాపంచిక దిగుళ్ళనీ దాటుకుంటూ

కొన్ని బుడగలుగా, కొన్ని పూల రెక్కలుగా

ప్రవహిస్తూ వెళ్ళిపోతాం కదా,

ఈ సంతోషాల అలల మీంచి-

Mamata Vegunta

Mamata Vegunta

శృంగారం

Sringaram

 

~

ఒక మెరుపు వన్నె ఆకుపచ్చ నేపధ్యం. ఆశా వాగ్దానాల నిండు సారాంశం.

ఇద్దరు కలిసినప్పుడు

మొదట వుండే ఒక అపరిపూర్ణ మనఃస్తితిని  ఎదో చెప్తోంది అది.

ఈ ఆకుపచ్చ నేల మీద తెలుపుని వొంపాను, ఒక వలయంగా.

అప్పుడు ఆ ఇద్దరు వొక్కరై విశ్వ నర్తనం చేస్తున్నారు,

వలయాలు తిరిగే దర్వీషులై-

నిండుదనాన్నీ, కలయికనీ, సత్యాన్నీ వెతుక్కుంటూ.

ఆకుపచ్చ నేపధ్యంలో నృత్య ప్రవాహం;

దాని అంచుల మీద లోతులు కనిపిస్తూనే వుంటాయి మన కళ్ళకి-

అప్పుడిక ఎగసి పడుతుంది ప్రేమ!

Mamata Vegunta

Mamata Vegunta