తెలంగాణా చెలిమె కూకట్ల కవిత్వం

 

–     విలాసాగరం రవీందర్

~

 

మనిషి సంఘజీవి.   సంఘం చరణం గచ్ఛామి అంటూ బుద్ధునిలా త్యాగం చేసే వారు కొందరయితే, సమాజాన్ని చీడ పురుగులా కొరుక్కుతినే వారు మరికొందరు. సమాజ హితాన్ని కోరుతూ, సమ సమాజం కొరకు పరితపించే వారు బుద్ధి జీవులు. వారిలో కవులు, కళాకారులు అగ్ర భాగాన వుంటరు. కత్తి కన్నా కలం గొప్పదని నిరూపిస్తూ సమాజంలోని అసమానతల చెదను దులిపే అక్షరాలెన్నో ! కవిత్వం మనిషిలోని మనసును మేలుకొల్పుతది. మనిషిని మనీషిగ జేస్తది.

          కూకట్ల తిరుపతి 2000 నుంచి కవిత్వం రాస్తున్నడు. మూడు పదుల వయసులోనే “మేలుకొలుపు(2005)” కవితా సంపుటిని వేసి, ఒక శతకం, ఒక నానీల సంకలనాలను ప్రచురించి కవిత్వ ప్రపంచంలో సుపరిచితమయిన పేరు. ఇతడు “ఆరుద్ర పురుగు” పుస్తకంలో రాసిన ప్రతి పదంలో పల్లెదనం పరిమళిస్తది. మండుతున్న పల్లెల గుండెలను చూసి ఈ కవి కలం నుంచి వచ్చిన మరో కన్నీటి కావ్యమే “ఎర్ర గాలు”.

ప్రపంచీకరణ ప్రభావంతో పల్లెల ఉనికి ప్రశ్నార్ధకమయింది.  చేతి వృత్తుల మెడకు కత్తి వేలాడుతంది. ఈ దుస్థితిని ‘వలస వోయిన పల్లె’ కవితలో చిత్రిక కట్టిండు.

“ఎర్రమట్టి అలుకు పూతలు

ముంగిళ్ళ జాజు తీనెలు

ఎలిసిన సున్నం బొట్లు

కూలిన కుమ్మరి గూనపెంకుటిళ్ళు…

కూలవడ్డ మట్టి గోడలు

చితికిన బతుకుల ఆనవాళ్ళు …”

అంటూ వలస వోయిన పల్లె ధీన దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెస్తడు. మనుషులు వలస బోతరు. బతుకు దెరువు వెతుక్కుంట వేరే చోటికి మారుతరు. కాని కవి పల్లెనే వలస బోయిందని చెబుతున్నడు. అంటే పల్లె తన అస్తిత్వాన్ని కోల్పోవటం. పల్లె ఖాళీ కావడం.

మరో కవిత ‘దీన దృశ్యం’లో పల్లెలు బొందల గడ్డలయినవంటడు. ఓట్ల కోసం తెచ్చే పథకాలతో ప్రభుత్వాలు కనికట్టు చేస్తున్నయని బాధ పడుతడు.

“ఎండిన చెరువు

బోర్లేసిన బాయి

నడుమిరిగిన నాగలి

కొండెక్కిన కోరిక

వట్టిపోయిన ముల్లెలు

బొందల గద్దయిన పల్లెలు “

మనిషి చివరి ప్రయాణం బొందలగడ్డకు పోవుడే గదా ! బతికినాన్ని నాళ్లు ఆసరా వుండే పల్లెనే నేడు బొందల గడ్డ అయ్యిందట. అన్ని వృత్తులు నశించి పల్లె మాయమయింది అంటున్నడు కూకట్ల తిరుపతి. చాలామంది ప్రపంచీకరణ వల్ల ఏమి నష్టం వచ్చింది అని అడుగుతరు. ఈ కవితను వినిపిస్తే చాలు వారికి నష్టం కళ్ళకు కడుతది.

ప్రభుత్వాలు ప్రజల కోసం చట్టాలు చేస్తయి. కాని వాటి అమలులో నిర్లక్షం వహిస్తయి. మనిషి జీవనాధారం నీరు.  ఈ నీటి వనరుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయబడింది వాల్టా చట్టం.  ఈ చట్టం ఏ విధంగా నిర్వీర్యం చేయబడిందో ‘పచ్చ దనాల బాట’ పేరుతో కవిత్వం చేస్తడు.

“ఉల్టా పల్టాగా వాల్టా

పచ్చల హారాలు  ఏలిక మేడల్ల

భరించడం ఇంకెన్నాళ్ళు ?” అంటూ ప్రశ్నిస్తడు.

బుక్ టైటిల్ పోయెం “ఎర్రగాలు” పుస్తకానికే హైలైట్ . ఎర్రగాలు అనేది ఎర్ర కాలం. యాసంగి(రభి)కి వానా కాలం(ఖరిఫ్) కు మధ్యన వచ్చే పంట కాలం. స్వచ్ఛమైన తెలంగాణా భాషలో రైతు ఎతను, ఎవుసం చేసే విధానాన్ని వర్ణిస్తది. ఈ కవిత మనం కన్న పిల్లలను ఎట్లా అరుసుకుంటమో అట్లా పోషణ చేస్తరట

“కంటి పాపల కడుపుల వెట్టుక

అరొక్క తీర్ల అరుసుకున్నట్టు

ఆవురావురుగా ఆరుకాలం

యాళ్లకనంగ సేన్ల పొదన…”

ఇంత కష్టం జేసినా పూర్తిగా కరువుతీరుతుందా అంటే అదీ లేదు. మండే ఎండల్ల ఎండుక పోవుడే తప్ప రైతుకు మిగిలేది ఏమి వుండదంటున్నడు కూకట్ల తిరుపతి.

“ఎర్రగా బుర్రగ ఎర్ర తేలోలె వున్నా !

ఎండి ఎర్రగప్పవుడే

ఎర్రగాలు దెబ్బకు.

రైతుల కాయ కష్టాన్ని, వారి దయనీయ జీవన దృశ్యాన్ని ఆవిష్కరించేది ‘అకాలం’ కవిత. మూడు కాలాలు కలసి రైతును విగత జీవిగా చేస్తున్నయంటడు కవి.

నాటి నుంచి నేటి వరకు కుల, మతాలు సమాజాన్ని ఎట్లా అతలా కుతలం చేస్తున్నాయో చూస్తున్నం. అట్లనే ఆడా, మగ తేడాలు కూడ ముల్లులా గుచ్చుకోవడం అనుభవంలోదే కదా !  అందరూ సమానమే నంటూ ‘సర్దుబాటు’ కవితలో ఎవుసానికి ఎనగర్ర అయిన నాగలిలోని భాగాలను ప్రతీకలుగా తీసుకొని అద్భుతంగా కవిత్వం చేస్తడు. నాగలిలో పొడుగు కర్రను ‘కోలా’, అని నిలివు భాగాన్ని ‘పాలే’ అని, పట్టుకొనే కర్రను ‘పడుసోగ’ అని అంటరు. ఇవన్ని కలిసి పని చేస్తేనే దుక్కి దున్నబడి పంట వేయడానికి పనికివస్తుంది. అలాగే సమాజంలో కుల, మత, ఆడ, మగ తేడాలు లేకుండా ఉండాలంటడు ఈ కవి. ఈ కైత ను సంపుటి చివరికి పెట్టడంలో కూడా తన అంతిమ లక్ష్యం అదే అని చెప్పకనే చెబుతడు.

 

కవిది మెత్తటి మనసు. సున్నిత మనస్కులే కవిత్వం రాస్తరని ఎక్కడో చదివిన గుర్తు.  ఏది కవిత్వమో ‘కవిత్వం’ శీర్షికన మొదటి కవితలో  చెబుతడు. ‘నిప్పుల ఉప్పెన వలె ఉప్పొంగి \ వెట్టి చాకిరిని మట్టీడేది , భూస్వామ్య నియంతృత్వం పై \ అగ్ని పూలు పుయించేది’ కవిత్వం అంటదు. కవిత్వం ‘సామాన్యుని తలలో నాలుకలా, గాయపడిన ఉవిదకు ఓదార్పునివ్వాలనీ, అణచబడినోడి కరాయుధం కావాలనీ, జన చైతన్యం పరమార్ధంగా ఉండాలంటడు. బడుగు జీవుల బానిసత్వ విముక్తి కోసం సమరం సాగించాలని పిలుపునిస్తడు.

ఈ కవి చెప్పిందే రాస్తడని “అక్షర నిరసన”, “ఖబర్దార్ ఖబర్దార్”  కవితలు చదివితే అర్ధం అవుతది. లక్ష్మిదేవిపల్లి గ్రామంలో దళితుల ఊచకొతను ఖండిస్తూ ‘అక్షర నిరసన’ ప్రకటిస్తడు. ప్రభుత్వ భూ పంపిణీ ప్రచార పటాటోపాన్ని దునుమాడుతడు.  ఫాసిస్టు పాలకుల పక్ష పాతాన్ని తెగడుతడు. భూ విముక్తి పోరాట యోధులను గుర్తుచేస్తడు. అణగారిన జనం అగ్గిరవ్వలై తిరగబడాలంటడు. అణచబడ్దోడు లేచి నిలబడి, తెగిపడిన చోట తెగబడటమే అంతిమ పరిష్కారమని నినదిస్తడు.

యానాం పరిసర ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సంఘటనను తీవ్ర స్వరంతో ఖండిస్తడు. అగ్రవర్ణ దురహంకారాన్ని నిరసిస్తడు.  కారంచేడు, నీరుకొండ, చుండూరులలో పారిన నెత్తుటిదారలకు దుక్కపడుతడు.  ‘ఒక్కో బక్క జీవి…. మండే సూర్యుల్లయి  మసి చేస్తరు… ఖబర్దార్ ఖబర్దార్’ అంటూ హెచ్చరిస్తడు.

కూకట్ల తిరుపతికి అమ్మంటే అలవిమాలిన ప్రేమ.   ‘కమ్మని అమ్మ మనసు, పూల జల్లైయి కురిసి, మంచు పర్వతంలా మారి, శాంతి కపోతమై సమతను పంచుతుందని’ చెబుతడు. చివరకు ‘అమ్మ ఋణం జన్మ జన్మలకు సశేషం’ అంటడు.

పేగు సంబంధం తల్లి అయితే జీవిత బంధం ఇల్లాలు. ఈ కవి తన భార్యను ‘ఇంటికి దీపం’గా భావిస్తున్నడు. దీపం లేని ఇల్లు చీకటి చిరునామే కదా ! అలాగే తన ఇంటికి దీపం ఆవిడే అంటున్నడు. ఆమె

“చేనుకు చెమట చుక్కలను జల్లుతూ

పంట పరిమళాలను పరివారానికి పంచుతూ

వ్యవసాయాన వెన్నుదన్నుగా నిలిస్తుంది” అంటడు.

మహా కవి జాషువా కష్ట జీవి కవితలో ‘వీని రెక్కల కష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకరించ సంశయించు… అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్’ అన్నట్టు ఈ కవి “నా అక్షరాల సాక్షిగా / ఆమె సేవకు / నా జీవితం ఋనపడ్డది” అని నొక్కి చెబుతడు.

ఈ కవి మూలాలు మరువని కవి. తన ముందు మాటలో చెప్పినట్టు తాను బాల కార్మికుడి నుండి బడి పంతులు దాకా కష్టపడి ఎదిగాడు. తన స్వానుభవాన్ని, తాను సమాజంలో గమనించిన పసి చేతుల కష్టాన్ని, దీనత్వాన్ని కళ్ళకు కట్టే విధంగా ‘బాల కార్మికులం’ పేరున అక్షరీకరిస్తడు.

సునామీ వచ్చినప్పడు చాలా మంది కవులు సునామీని తిడుతూ కవిత్వం చేసారు. దానికి భిన్నంగా కూకట్ల తిరుపతి సముద్రాన్ని విచ్చలవిడిగా మనిషి తన స్వార్ధానికి ఉపయోగించుకోవడం వల్లలే ఈ ఆపద వచ్చిందని ‘సాగర ఘోష’లో అంటడు. ‘అంతులేని సముద్ర తీరాన పిల్లల గొప్ప సమావేశం జరుగుతూంది’ అని గీతాంజలిలో రవీంద్రనాథ టాగూరు అంటే ఈ కవి మానవుడి దురాశనే ‘మృత్యువు విచ్చలవిడిగా సంచరించెట్లు ‘ చేస్తుందని చెబుతడు.

ఈ కవికి స్నేహమంటే వల్లమాలిన ప్రేమ. అందుకే “ఆపదలో … ఆనందంలో … / నా చెలిమి చెలిమయి / అలుపెరుగక పారునది” అని ‘చెలిమి’ కవితలో నెయ్యాన్నిపారే నదితో పోలుస్తడు. పారే నది ఎప్పుడు ఎండి పోనట్టే తన మిత్రత్వం కూడా అజరామరం అంటున్నడు.

కవిత్వంలో రూపం, సారంతో పాటూ అలంకారాలు ఉన్నప్పుడే వినసొంపుగా వుంటది. “ఎర్ర గాలు”లో ‘ఊర చెరువు’ అద్భుతమైన నాద సౌందర్యం వున్న కవిత. ప్రతి పాదం చివర సున్నాతో కూడిన గకారాలను వాడినరు. దీనివల్ల ఆ కవిత చదువుతుంటే నీటి ప్రవాహ వేగం కనబడుతది. అంత్య ప్రాసలతో పాటు రూపకాలను, ఉపమాలను సందర్భానుసారంగా ఉపయోగించే నేర్పు కూకట్ల తిరుపతి కవిత్వంలో మరో ప్రత్యేకత.

ఈ సంపుటిలోని 37 కవితలలో ‘కలం యోధుడు’ కాళన్న, ‘షెహనాయి శిఖరం’ బిస్మిల్లా ఖాన్, ‘ఆదివాసి ఆణిముత్యం’ కొమురం భీమ్ కవితలు అద్భుతమైన స్మృతి కవితలు. అలాగే ‘అమ్మ ఆనవాళ్ళు’లో మనువాద ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తూ. ‘అమీనాలు’ కవిత లో అరబ్బు షేకుల అకృత్యాలను తెగనాడుతూ హైదరాబాదుపాత బస్తి పేదరికానికి బాధ పడుతున్న కవితలూ కలవు.

మొత్తంగా చూస్తే కూకట్ల తిరుపతి కవిత్వం తెలంగాణా మట్టి పదాల పరిమళం అద్ది, పాల కంకుల సాల్ల వాక్యాలతో సాగి, సమ సమాజం కొరకు ఆరాటపడే పందిరి గుంజలాంటి కవిత్వం. అసమానతల పొగరును నరికే కరవాలం ఇతని కవనం.

*

 

మా ఊరి తొవ్వ

విలాసాగరం రవీందర్

నేను పదోదిల లాగుదొడిగినప్పుడు మా ఊరికి కన్నారానికి
రెండు గంటల తొవ్వ

సుక్కదెగిపడ్డట్టు అచ్చే ఎర్రబస్సు

పోరగాండ్లు బొట్టగాండ్లు ముసలోళ్ళు వయిసోళ్ళకు అదొక  పుష్పక విమానం

యాభై మంది వట్టే దాంట్ల వందమందిమైనా
సోపతిగాళ్ళ  లెక్క సదురుకుంట  కూసునుడు

అత్తుంటే పోతుంటే
అటూ ఇటూ పక్కలకు
పిందె కాయలతోని
నవ్వుకుంట కనబడే మామిడి చెట్లు

ఎర్రపూల గుల్మర్ చెట్లు కదులుకుంట
వక్కడ వక్కడ నవ్వుడు

తీరొక్క చెట్ల
బంగరు పూల నాట్యం
మన్సు పిట్టలెక్క బస్సు చుట్టూ తిరుగుడు

ఎండకాలంల ఎండతెలిసేది గాదు
ఏసీ రూంలకేని పోతున్నట్టు
చెట్ల ఆకుల పందిరేసి నీడ

వాన కాలంల రోడ్డుపొంటి
నిండు కుండోలె వున్న కోపులల్ల
నీళ్లు జూసుకుంట పోతంటే
ఈత గొట్టబుద్దవుడు

పోంగ రొండు గంటలు
పచ్చదనంలో గడిచి పోయేది
రాంగ రొండు గంటలు
చిమ్మ చీకట్ల
తొవ్వ
సుక్కలెక్క గనబడేది

ఏ రాతిరయినా నిమ్మలముండేది
బస్సెక్కినమంటే ఇంట్ల గూసున్నట్టే…

నాలుగ్గంటలయినా
నాలుగు నిముషాల లెక్క గడిచేది
పొయినట్టుండేది గాదు !
అచ్చినట్టుండేది గాదు !!

♧♧♧

పచ్చీస్ సాల్
గిర్రున తిర్గినంక
తొవ్వ పొంటి
చెట్లు మాయమయినయి
ఇనుప కంచెలు మొలిచినయి

కోట్లాది పువ్వుల మొక్కల్ని బొండిగ పిస్కి
నాలుగు రాస్తాల నడుమ
గన్నేరు మొక్కల కింద పాతరేసిండ్రు

పచ్చదనమంతా
నాల్గు వరుసల
రాజీవ్ రహదారి కడుపుల బొందవెట్టి
పైకేని నల్లటి నాగుంబాములా తారేసిండ్రు

ఎర్రబస్సు ఎండల ఎల్సి
పాతసమానయింది

కొత్తగా
రొండు, మూడు నాల్గు పయ్యల బండ్లు
పుట్టుకచ్చినయి
గీరెలు బూమ్మీద ఆనుడేలేదు
తుఫాను గాలోలె ఉరుకుడే

రెండు దిక్కులా
ఒక్క సెయ్యి తో పట్టుకొని
గాల్లె దేలుకుంట
సర్కస్ ల జంతువుల లెక్క బోవుడు

పైకేని ఎండ
పొయ్యిల మంటలెక్క గాల్తది
కింద సీటు
జారుడుబండలెక్క జారుతది
చెయ్యి పట్టు ఇడిసినవా
నూకలు చెల్లినట్లే
రాతిరికి పొయ్యి ఎలుగది

కాళ్లకు గీరెలు కట్టుకున్నట్టు
రయ్యన పోవుడు పెరిగింది
గాని
పానాల మీద ఆశ తగ్గింది

ఇప్పుడు
మా ఊరు బెజ్జంకి కి కన్నారం కు
నలపై నిముషాల తొవ్వ !
కానీ
మనుసుకు మాత్రం
నలబయి గంటల్లెక్క…

*