కవిత్వంలో “మెటానమీ” !

 

metonymy_cover

-పెన్నా శివరామకృష్ణ

~

 

–“Chess is a play – activity,  yet it is play only because the players deliberately make the game difficult in order to overcome the difficulties. The equation is simple: no difficulty no fun. No Chess player finds

any real pleasure in playing an obviously inferior opponent. Every game ever invented by mankind is

a way of making things hard look easy…….Learning to experience poetry is not a radically different

process from that of learning any other kind of play.”

–John Ciardi   (How Does a Poem Mean, pg. 669)

 

క్లుప్తతనూ, గుప్తతనూ సాధించడం కోసం కవిత్వంలో ఉపయోగింపబడే అనేక పద్ధతులలో మెటానమీ (Metonymy), సినెక్^డకీ (Synecdoche) కూడ ప్రధానమైనవి. ఇవి నిశ్చయంగా అలంకారాలు కాకపోయినా అలంకారాల వంటివే. మెటఫర్ (రూపకానికీ)కు దగ్గరి సంబంధం కలిగినవి మెటానమీ, సినెక్^డకీ.  మెటానమీకి దగ్గరి పోలిక కలిగినది సినెక్^డకీ.

–“In metonymy (Greek for “a change of name) the literal term for one thing is applied to another with

Which it has become closely associated because of a recurrent relation in common experience.

Thus “the crown” or “the scepter” can be used to stand for a king and “Hollywood” for the film

Industry. ……….In synecdoche (Greek for “taking together), a part of something is used to signify

the whole, or (more rarely) the whole is used to signify a part. We use “ten hands” for

“ten workers”, in current slang “wheels” to stand for an automobile

–M.H. Abrams (A Glossary of Literary Terms, pg. 103)

ఒక వస్తువుకు లేదా అంశానికి విడదీయరాని సంబంధం కలిగిన లేదా సన్నిహిత సంబంధం కలిగిన అంశాన్ని మాత్రమే పేర్కొనడం ద్వారా, ఆ వస్తువును (లేదా ఆ అంశాన్ని) అంతటినీ సూచించడాన్ని మెటానమీ అంటారు. ఒక వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే పేర్కొని, ఆ వస్తువునంతటినీ సూచించడాన్ని సినెక్ డకీ అంటారు. ‘శకలం’ ద్వారా ‘సకలం’ స్ఫురింపజేయడం వీటిలో ప్రత్యేకత.

మెటానమీ, సినెక్^డకీ అనేవి ఆంగ్ల అలంకార శాస్త్ర పారిభాషిక పదాలే అయినప్పటికీ, తెలుగు నుడికారాలలో, జాతీయాలలో, సామెతలలో గుప్తంగా ఒదిగి ఉన్నవే. “పొయ్యిలో పిల్లి లేవలేదు” అనే జాతీయంలోని  ‘పొయ్యి’ అనే ప్రధాన సాధనం ద్వారా ‘వంట’ సూచింపబడింది. “కత్తి కంటే కలం గొప్పది” అనే వాక్యం కూడ ఇలాంటిదే. ఇక్కడ ‘కత్తి’ యుధ్ధానికీ, ‘కలం’ ప్రబోధాత్మకమైన రచనలకూ ప్రతినిధులు. ఇలాంటివన్నీ మెటానమీకి ఉదాహరణలే. “నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది” అనే వాక్యంలో,వ్యక్తి యొక్క మాటతీరు, నడవడిక, వ్యవహార జ్ఞానం మొదలైన వాటికన్నిటికీ నోరు సంకేతం. “తలా ఒకటి ఇవ్వడం..” అనే వాక్యంలోని ‘తల’ వ్యక్తి సూచకం. ఇలాంటివి సినెక్^డకీ కి నిదర్శనాలు.

లక్ష్యార్థంతోపాటు ముఖ్యార్థం కూడ అన్వయిస్తున్నప్పుడు, దానిని భారతీయ అలంకారశాస్త్ర పరిభాషలో ‘ఉపాదాన లక్షణ’ అంటారు. దీనికే ‘అర్థాంతర సంక్రమిత వాచ్యం’, ‘అజహల్లక్షణ’, ‘అజహదభిదేయ’ అనే నామాంతరాలున్నాయి. ఒకరకంగా మెటానమీ, సినెక్ డకీలు ‘ఉపాదాన లక్షణ’లో అంతర్భాగాలే. ఒక వాక్యంలో వాచ్యార్థం పోసగనప్పుడు, రూఢిని బట్టి కానీ, ప్రయోజనాన్ని బట్టి కానీ, మరొక అర్థాన్ని స్ఫురింపజేసే శబ్దశక్తిని “లక్షణ” అన్నారు. ‘ప్రాణి లక్షణారోపణ’, ‘మానవ లక్షణారోపణ’, ‘ప్రతీక’, మెటానమీ, సినెక్^డకీ లాంటి విభజనలనూ, అంతర్విభజనలనూ చెప్పకపోయినా, ఇలాంటివన్నీ వివిధ ధ్వని భేదాలలో అంతర్భాగాలే.

ప్రపంచంలో ఎక్కడైనా అలంకారశాస్త్ర పరమ లక్ష్యం కావ్యసౌందర్య అన్వేషణమే. కావ్యసౌందర్య సాధనాలను రకరకాలుగా సూత్రీకరించి, విభజించి, రకరకాల పేర్లు పెట్టారు. ఈ విభజనలలో, నామకరణాలలో కొన్ని భేదాలున్నప్పటికీ, సంఖ్యాధికమైన సామ్యాలూ ఉన్నాయి.

—“వర్తమాన తెలుగు కవిత్వాభివ్యక్తికి వైవిధ్యం ప్రధానంగా నాలుగు అభివ్యక్తి విధానాల ద్వారా వస్తున్నది. అవి వరుసగా 1. Metaphor, 2. Metonymy, 3. Synecdoche, 4. Paradox. వీటిని  వీటిని ‘tropes’గా వ్యవహరిస్తున్నారు విమర్శకులు. అంటే, భాషను సాధారణ అర్థాల నుంచి   విశేష అర్థాలకు మార్చే సాధనాలు. ఒక కోణంలో అలంకారాలే కానీ ఖచ్చితంగా అలంకారాలు కావు.   భాషలోని పదాలకుండే అర్థాలను సందర్భానుగుణంగా మార్చి నూతనార్థాలను సృష్టించే పనిని ఇవి   నిర్వహిస్తాయి. ఈ సాధనాలు లేకుండా కవిత్వం ఉండే వీలు లేదు.” (“అదే పుట” సాహిత్య వ్యాసాలు  పు. 17)

పై సీతారాంగారి పరిశీలన సమంజసమైనదే. కాని, వర్తమాన వచనకవిత్వంలో, పర్సానిఫికేషన్, ఐరనీ, సానుకూల లేదా ప్రతికూల సమాధానాలను ఆశించే ప్రశ్నలతో కూడిన (రిటారిక్) సంభాషణాత్మకత లాంటి వ్యక్తీకరణ పద్ధతులు కూడ ప్రముఖ భూమిక పోషిస్తున్నాయి.

***

—“ఓల్గా ఘనీభవించెను / యంగ్సీ నది పొంగెను / రుతుగీతికి పరవశించి/గంగ కూడ పొంగెను”

“రుతుసంగీతం” అనే శివసాగర్ గేయంలోని పై వాక్యాలు ప్రసిద్ధమైనవే. ఇక్కడ ‘ఓల్గా’, ‘యంగ్సీ’, ‘గంగ’లు క్రమంగా సోవియట్ రష్యా, చైనా, భారత దేశాలను గుర్తు చేస్తాయి. సోషలిజం సాధనలో రష్యామార్గం గడ్డకట్టుకుపోయింది, మార్క్సిస్టు లెనినిస్టు పంథాను మావో ఆలోచనావిధానం ద్వారా చైనా కాపాడుకుంటున్నది, చైనా స్ఫూర్తితో భారతదేశంలో విప్లవోద్యమం విస్తరిస్తున్నది అనేది లక్ష్యార్థం. నదుల పేర్ల ద్వారా దేశాలూ, దేశాల పేర్ల ద్వారా విప్లవోద్యమాలూ స్ఫురింపజేయబడినాయి. ముఖ్యార్థ సంబంధం సాక్షాత్ సంబంధంగా కాక పరంపరా సంబంధంగా అభివ్యక్తమైతే కనుక, దానిని భారతీయ ఆలంకారిక పరిభాషలో ‘లక్షితలక్షణ’గా చెప్పవచ్చు.

—“నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు

                                      పిడికిళ్ళలో బాంబుల్ని బిగించుకుని వచ్చాను”  (ఆధునిక మహాభారతం, పు. 332)

 

ఇవి శేషేంద్ర వాక్యాలు. ఇవి వాచ్యార్థాలు పొసగని వాక్యాలని తెలుస్తూనే ఉంది. ఇక్కడ ‘కోకిలలు’ వసంత రుతు సూచకాలు. ‘బాంబులు’ ఆధునిక ఉపకరణాలలో ప్రధానమైనవి. వసంత రుతువు, ఆనందదాయక జీవనస్థితినీ, భోగప్రవృత్తినీ (శృంగారాన్నీ) తెలుపుతుంది. యధాతథ స్థితిని కాంక్షించే వారికీ, సంతుష్ఠ భద్రలోక జీవులకూ తన కవిత్వం ఆనందం కలిగించేది కాదనేదీ, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ పీడితులను పోరాటాలకు ఉసిగొల్పుతుందనేదీ పై వాక్యాల భావం.

గుండె పగిలిన తమసా తీరం, ఘూర్ణిల్లింది శోకచ్చందంగా” (విశ్వంభర, పు. 27),  తమసా నదీ తీరంలోనే వాల్మీకి ఆశ్రమం ఉండేదట. ‘శోకచ్చందం’ అనే కొత్త పదబంధం, ‘శ్లోకం శోకత్వమాగచ్చతి’ అనే సాంప్రదాయిక భావనకు సూచకం. ‘గుండె పగలడానికి’ కారణం పక్షుల జంటలో ఒక పక్షిని ఒక బోయవాడు చంపడం. దానిని చూసిన వాల్మీకి నోట అప్రయత్నంగా “మానిషాద ప్రతిష్ఠాంత్వమ్…” ఇత్యాది శ్లోకం వెలువడడం…అదే రామాయణ రచనకు నాందీవాచకం కావడం అనే అంశాలన్నిటినీ అతి తక్కువ మాటలలో కవి ధ్వనించాడు. మానవ లక్షణారోపణతో కూడిన, ‘తమసాతీరం” అనే మెటానమీ ఈ క్లుప్తతకు ప్రధాన కారణం.  –“ప్రతి మకుటం తన కాలిగోటిలో ప్రతిఫలించాలని…” (విశ్వంభర, పు. 50) ఇక్కడ మకుటం అంటే మకుటధారులని లక్ష్యార్థం. లక్ష్యార్థంలో ముఖ్యార్థం కూడ ఇమిడి ఉన్నది. ప్రయోజనం దృష్ట్యా అర్థాంతరాన్ని చెప్పుకుంటున్నాం. లక్ష్యార్థం తోపాటు ముఖ్యార్థం కూడ వాక్యార్థంలో అన్వయిస్తూ ఉంటే దానిని ’ఉపాదాన లక్షణ’ అంటారు. ఇది సినెక్^డకీకి ఒక ఉదాహరణ.

–“నా గూడు బాణసంచా అవుతుంది

                             నా గూడు భోగిమంటవుతుంది

                             నా గూడు నరకాసురుని చితాభస్మమవుతుంది”

 

ఖాదర్ మొహియుద్దీన్ గారి “పుట్టుమచ్చ” (దీర్ఘ కవిత”)లోనివి ఈ వాక్యాలు. ఇక్కడ దీపావళికీ, సంక్రాంతికీ, దసరాకీ అవినాభావాలైన ‘బాణసంచా’, ‘భోగిమంట’, ‘నరకాసురుని చితాభస్మం’ అనే ప్రయోగాలు గమనించండి. ఈ మూడు పండుగలనూ ప్రస్తావించి, హిందూ ఆధిక్యతాభావాగ్నికి ముస్లింల ఆత్మగౌరవం భస్మమవుతున్నదన్న భావాన్ని వ్యంగ్యం చేశారు. ఇదే కవితలో “త్రిశూలాల మొనల మీదా / పి. ఏ. సి. తుపాకుల కోనల మీదా / బాలెట్ బాక్స్ ల కొనల మీదా/ నెత్తురోడుతున్న నా పుట్టుమచ్చను గురించి ప్రశ్నించలేను” అన్నారు. హిందూ మతోన్మాదమూ, సైనిక (పోలీసు)వ్యవస్థా, ‘ప్రజాస్వామ్యమూ’ ముస్లిం సమాజాన్ని వంచిస్తున్న తీరును ధ్వనించడానికి,  ‘త్రిశూలాలు’, ‘తుపాకులు’, బాలెట్ బాక్స్’ అనే మాటలను కవి ఎంతో సమర్థంగా ఉపయోగించుకున్నాడు.

జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి కష్టనష్టాలను చెబుతూ “బతకవోయిన చోట / ఇంటి తుఫాన్లు ఇసుక తుఫాన్లు తట్టుకోవలసిందే / ఎన్నాళ్ళయినా కట్టెను మోసుకుంటూ బతక వలసిందే” (ఇక్కడి చెట్ల గాలి, పు. 12) అన్నారు నందిని సిధారెడ్డి. ‘ఇంటితుఫాన్ల’ ద్వారా, స్వగ్రామంలోనే ఉన్న కుటుంబ సభ్యుల కష్టనష్టాలనూ, ‘ఇసుకతుఫాన్ల’ ద్వారా అక్కడి వృత్తిపరమైన, వ్యక్తిపరమైన ఒత్తిడులనూ దుఃఖాలనూ స్ఫురింపజేశారు. “నడి ఎండలో పడి పడి పాదయాత్ర చేస్తే / మనిషిని నమ్మాలె గద / నమ్మిన / పాదాలకు కండ్లుంటయంటరు / పాదయాత్ర చూపంతా / భూముల ఆక్రమణ వ్యూహమని గుర్తించలేదు” (ఇక్కడి చెట్ల గాలి”, పు. 43) అంటూ, ‘పాదయాత్ర’ అనే మాట ద్వారా, ఆనాడు పాదయాత్ర చేసే గద్దెనెక్కిన ఒకానొక ముఖ్యమంత్రి నిర్వాకాలను గుర్తు చేశారు. “సింహాసనాలూ, సినిమా హోర్డింగులూ వియ్యమందుకుంటాయి” అనే చోట, ‘సింహాసనాలు’, అధికారం అనుభవిస్తున్న ‘పెద్దల’కూ, ‘సినిమా హోర్డింగులు’ సినిమా రంగంలోని ‘పెద్దల’కూ సంకేతాలు.

“నల్లతల్లి” అనే కవితలో “బొట్టులేని నీ కాటుకరంగు నుదురు చూస్తే / కుంకుమ భరిణెలు నెత్తురు కక్కుకుంటాయి” అన్నారు ఎండ్లూరి సుధాకర్. హిందూ (ఐదువ) స్త్రీలకు సంబంధమున్నవి ‘కుంకుమ భరిణెలు’. తద్ద్వారా హిందూభావజాల ప్రతినిధులు. దళితులనూ, అందులోనూ దళితక్రైస్తవులనూ కొందరు హిందువులు న్యూనంగా చూసే ధోరణిని ధ్వనించడానికి, కవి మెటానమీని చక్కగా వాడుకున్నారు.

సానుకూల (లేదా ధనాత్మక) ఫలితానికి దారి తీసే “అనూహ్యత” (“అపూర్వత” కూడ) జీవితంలో అయినా, కవిత్వంలో అయినా అమిత ఆనందదాయకమే. ఉపమానం, ఉత్ప్రేక్ష, ప్రతీక లాంటి ఆలంకారిక రీతులలో కానీ, సంపూర్ణంగా అభివ్యక్తి రూపంలో కానీ పాఠకుడు ఊహించని ప్రయోగాలు ఎదురైనప్పుడు, ఆ ప్రయోగాలు వక్తవ్యాంశాన్ని గుప్తంగా వెల్లడించి నప్పుడు, ఆ రచన పాఠకుడిని గొప్పగా ఆహ్లాదపరుస్తుంది. ( ‘పారదర్శకం’ కాని ‘గుప్తత’, ‘నిగూఢత’గా పరిణమిస్తుంది. ఎవరు అన్ని సిద్ధాంతాలను అడ్డుపెట్టుకొని సమర్థించుకున్నా, అలాంటి రచనలు ‘భావాలను బట్వాడా చేయలేక’ అర్థరహితమైనవిగానే మిగిలిపోతాయి, క్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయి. గత మూడు, నాలుగు దశాబ్దుల తెలుగు కవిత్వంలోనే ఇందుకు ఉదాహరణ ప్రాయమైన ‘రచన’లు ఎన్నో ఉన్నాయి.)  అలాంటి రచనలలోని వస్తువుకు వన్నె సమకూరుతుంది; కవి దృష్టికోణాన్ని పాఠకుడు తేలికగా అందుకొన గలుగుతాడు. అదను ఎరిగి ప్రయోగింపబడే పదునైన మెటానమీలూ, సినెక్^డకీలూ చదువరికి అనూహ్య ఉదాత్త ఆనంద ప్రదాయకాలై, కవి లక్ష్యసిద్ధికి తోడ్పడుతాయి.

కవిత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఆలంకారికంగా నయితే. ఒకటి synecdoche, మరొకటి metonymy . ముఖ్యంగా ఆధునిక కవిత్వం మెటనామిక్ గా, మిథో పోయిక్ (mytho – poeic) గా ప్రవర్తిల్లుతోంది.” అన్నారు వేగుంట మోహన్ ప్రసాద్. (రహస్తంత్రి, పు. ii)

 

***