సరిగమపదనిసలే సప్త వర్ణాలుగా…!

మమత వేగుంట

 

Mamata 1ఏదైనా ఒక ధ్వనిని రంగుల భాషలో అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోగలిగితే ఆ రంగులు ఎలా వుంటాయి? అదీ సంగీత ధ్వని అయితే… మరీ ముఖ్యంగా సప్తస్వరాలను  ఈ రంగుల భాషలోకి తర్జుమా చేస్తే, ఎలా వుంటుంది? ఈ అన్వేషణ నన్ను “సుస్వరం” వైపు తీసుకు వచ్చింది. రసోద్వేగం ఏ కళనైనా బంధించే అంతః సూత్రం. ఇంతకుముందు  “మోహనం”లో నవరసాలకు రంగుల భాష ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు సప్తస్వరాలు!

సంగీతానికీ చిత్రకళకీ మధ్య ఈ అనుబంధం నేను కనిపెట్టింది కాదు; పదహారో శతాబ్దిలో పేరు పొందిన రాగమాల చిత్రాలు వివిధ రాగాలకు చిత్రరూపమే. రాగమాల ఒక సంప్రదాయం. పహడీ రాగమాల, రాజ్ పుత్ రాగమాల, దక్కన్ రాగమాల, మొఘల్ రాగమాల వీటిల్లో కొన్ని మాత్రమే. ఈ చిత్రాల్లో ఒక్కో రాగమూ ఒక రంగుగా, ఒక మనోభావంగా, ఒక కథన కవితగా రూపు తీసుకుంది. అలాగే, ఆ రాగ సమయమూ, తరుణం కూడా అందులో చిత్రితమయ్యాయి. కేవలం భైరవం, దీపిక, శ్రీ, మాల్ఖోస్, హిందోళం వంటి ఆరు రాగాలకే పరిమితం కాకుండా, ఆ రాగాల వారసత్వాన్ని – రాగిణులు, రాగపుత్రులు, పుత్రికలను- కూడా ఇవి ప్రతిబింబించాయి. అలాంటప్పుడు ఆ చిత్రాల్లో రసోద్వేగాలు, ఆలోచనాత్మక కథనం వ్యక్తం కావడం ఆశ్చర్యమేమీ కాదు మరి!

malasri

వసంత రాగిణి, 1770. రాజ్ పుత్ శైలి

మాలా శ్రీ రాగిణి ,1620. రాజస్థాన్

మాలా శ్రీ రాగిణి ,1620. రాజస్థాన్

 

1960లలో ఎమ్మెఫ్ హుస్సేన్ రాగమాల సంప్రదాయంలో గీసిన చిత్రాల గురించి కూడా చెప్పుకోవాలి. తనదైన శైలిలో ఎమ్మెఫ్ చేసిన ప్రయోగాలు  అవి. ఇదే ధోరణిలో అందరి దృష్టినీ ఆకట్టుకున్న మరో ప్రయోగం: 1988 లో ముంబై  టాటా థియేటర్లో భీమ్ సేన్ జోషి- ఎమ్మెఫ్ హుసేన్ చేసిన సంగీత-చిత్ర జుగల్ బందీ. భీమ్ సేన్ జోషి రాగ గుజరీ తోడి, మియా కి తోడీ, జౌన్ పురీ పాడుతున్నప్పుడు ఎమ్మెఫ్ ఆరడుగుల కాన్వాస్ మీద వాటికి నైరూప్య చిత్ర రూపం ఇచ్చాడు.

husain

హుసేన్, రాగమాల పెయింటింగ్, 1960

 

అలాగే, శృతి పత్రికలో సుందరం భరద్వాజ్ సంగీతమూ, పురాగాథలని కలిపి చేసిన చిత్ర రచనలు కూడా విశేషమైనవే. ముఖ్యంగా మేలకర్తల కాలెండర్, సంగీత త్రయం చిత్రాలూ చాలా పాపులర్ అయ్యాయి. ఆయన చిత్రాలు చూస్తున్నప్పుడు, నాకు ప్రాచీన ఆలయ శిల్ప రీతులూ, అజంతా కుడ్య చిత్రాల ప్రభావం కనిపిస్తుంది.

 అయితే, సంగీతం పెయింటింగ్స్ మరీ అంత పాపులర్ కాదు. సంగీతం కళ మాత్రమే కాదు, శాస్త్రం కూడా. అలాంటి సంగీతాన్ని పెయింటింగ్ లోకి అనువదించడం సాహసం- ఆలోచనతో నిండుకున్న సాహసం. అందుకే, “సుస్వరం” సిరీస్ వెనక చాలా ఆలోచించాల్సి వచ్చింది. నాకు కర్నాటక రాగాల కంటే, హిందుస్తానీకి సంబంధించి మౌలిక పరిచయం ఎక్కువ కాబట్టి, నేను హిందుస్తానీ రాగాలకే పరిమితమవుతున్నాను. ప్రతి స్వరాన్నీ దాని  పునాదిలోకి వెళ్లి ఆలోచిస్తూ గడపడం వల్ల ఈ సాహసయాత్ర  కొంచెం తేలిక పడింది.

సరిగమ పదని…ఈ ఒక్కో శుద్ధ స్వరం నిజానికి ఒక జంతు స్వరం. ఒక్కో రాగంలో ఒక వాది అంటే dominant note వుంటుంది. రాగంలో ఈ వాది స్వరం ఎక్కువ పునరుక్తి అవుతూ వుంటుంది. దాన్ని జీవస్వరం అనీ అంటారు. రాగ సమయం కూడా వాదిస్వరంతో ముడిపడి వుంటుంది. ఉదాహరణకు వాదిస్వరం సప్తకంలోని పూర్వాంగమైతే, అంటే సరిగమ అయితే, ఈ పూర్వాంగ వాదిస్వరాల సమయం మధ్యాన్నం పన్నెండు నించి రాత్రి పన్నెండు వరకు –యిలా నా పెయింటింగ్స్ లో ఈ ధ్వని వెనక వున్న ప్రతీకాత్మకతని – ఒక స్వరానికి నిర్దిష్టమైన రాగమూ, ఆ రాగానికి నిర్దేశించిన సమయమూ, రుతువూ – వీటిని నేను ప్రధానంగా తీసుకున్నాను.

 

sujatha

ఫోటో: కందుకూరి రమేష్ బాబు

సుస్వరం సిరీస్ మా అమ్మ సుజాత కోసం-

అమ్మ అమ్మ మాత్రమే కాదు నాకు, ఒక sweet voice of reason కాబట్టి!

 

 

రౌద్రం

ఈ “మోహనం”- నవరసాలకు ఆధునిక చిత్ర రూపం. నా దృష్టి నించి నాకు తెలిసిన రంగుల భాషలో చేస్తున్న వ్యాఖ్యానం.

మన కళల్లో కలల్లో నిజాల్లో అందంగా వొదిగిపోయిన సౌందర్యం నవరసాలు. మన చిత్రాలు, శిల్పాలు, సాహిత్యాలు అన్నీ నవరసభరితం. ముఖాల కదలికల్లో, శరీర భాషలో, శబ్ద రాగ కాంతిలో లీనమైపోయిన ఈ తొమ్మిది రసాలకు – ఉద్వేగాలకు- దృశ్యానువాదం ఈ ‘మోహనం’. ఒక్కో రసమూ ఒక భావనగా ప్రతిబింబించే ప్రయత్నం ఇది. ప్రతి రసం తనదైన ప్రతీకాత్మక వర్ణంలో, అల్లికతో, శక్తితో మీ ముందు వుంచే ప్రయోగం ఇది. ఇవి డిజిటల్ కాన్వాస్ మీద రూపు వెతుక్కున్న చిత్రాలు, కాబట్టి ఆ రకంగా కూడా ఇదొక ప్రయోగమే! ఇలా ప్రతి గురువారం ఒక రసదృశ్యం మీ ముందు…..

ఈ చిత్రాలు నాన్న – వేగుంట మోహన ప్రసాద్- స్మృతిలో, అందుకే ఇవి “మోహనం” !

Raudram

Mamata

Mamata Vegunta