గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -19

 

[ Anne Of Green Gables By L M Montgomery ]

 

పెద్ద పెద్ద విషయాలతో చిన్నవీ కలిసి వస్తుంటాయి. ఘనత వహించిన కెనడా ప్రధానమంత్రి తన పర్యటన లో ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవిని సందర్శించాలని మొదట అనుకోలేదు ..ఆ రాజకీయ పర్యటన కీ ఆన్ అదృష్టానికీ సంబంధం ఉండనక్కర్లేదు , కాని ఉండటం సంభవించింది.

ఆయన జనవరిలో వచ్చారు…చార్లెట్ టౌన్ లో గొప్ప బహిరంగసభ జరిగింది.  సమర్థించేవారితోబాటు కొందరు వ్యతిరేకించేవారు కూడా  గుమిగూడారు అక్కడ.  అవొన్లియా జనం లో చాలా భాగం ఆయన పక్షం వారే – అందరు మగవాళ్ళూ చాలా మంది ఆడవాళ్ళూ బయల్దేరి    ఆ ముప్ఫై మైళ్ళూ పడి వెళ్ళారు. మిసెస్ రాచెల్ లిండ్ కూడా ప్రయాణం కట్టింది – అసలైతే ఆవిడ అవతలి పక్షం మనిషే గాని, తను లేకపోతే అంత పెద్ద సభా బోసిపోతుందని ఆవిడ అభిప్రాయం. వాళ్ళాయన థామస్ నీ బయల్దేరదీసింది – లేకపోతే గుర్రాన్ని కనిపెట్టి ఉండేదెవరు మరి ! మెరిల్లానీ తనతో రమ్మంది . పైకి తేలదు గానీ , రాజకీయాల మీద మెరిల్లాకి కాస్త ఆసక్తే. ఒక ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా చూసే అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందిలే అనుకుని , ఆన్ కీ మాథ్యూకీ మర్నాటివరకూ ఇల్లప్పగించే సాహసం చేసింది మొత్తానికి.

అలాగ- మిసెస్ రాచెల్ , మెరిల్లాలు తమ రాజకీయోత్సవం లో ఉండగా ఇక్కడ ఆన్ , మాథ్యూ లు తమ స్వాతంత్రోత్సాహం లో  తలమునకలవుతున్నారు-  ఇల్లంతా వాళ్ళదేనాయె ! చక్కగా భగభగమంటూ పొయ్యి మండుతోంది. వంటింట్లో పాతకాలపు వాటర్ లూ స్టవ్వూ  , గోడలకి వేసిన తెలుపూ నీలం పింగాణీ  పలకలూ తళతళలాడుతున్నాయి. మాథ్యూ తీరుబడిగా సోఫాలో జేరబడి ‘ రైతు వాది ‘ పత్రిక తిరగేస్తున్నాడు. ఆన్ మహా బుద్ధి గా చదువుకునే ప్రయత్నం లో ఉంది , మధ్య మధ్యన కాస్త అవతలగా పెట్టుకున్న నవల కేసి చూసుకుంటోంది.  జేన్ ఆండ్రూస్ దగ్గర్నుంచి కిందటిరోజు తెచ్చుకుంది దాన్ని- బోలెడంత ‘ ఉత్కంఠ ‘ గా  ఉంటుందట అది  , జేన్ చెప్పింది.  దాన్ని అందుకుని తెరవాలని ఆన్ చెయ్యి లాగేస్తోంది…కాని రేపు పరీక్ష  యుద్ధం లో గిల్బర్ట్ ముందు ఓడిపోతే ఎలాగ ? అది అక్కడ లేదని ఊహించుకునే ప్రయత్నం చేస్తోంది.

” మాథ్యూ ! నువ్వు స్కూల్ కి వెళ్ళేప్పుడు జామెట్రీ చదువుకున్నావా ఎప్పుడన్నా ? ”

జోగుతూన్న మాథ్యూ ఉలిక్కిపడి లేచి – ” అబ్బే- లేదు- ఎప్పుడూ లేదు ”

” హు. నువ్వు చదువుకుని ఉంటే బావుండేది , నా కష్టం నీకు పూర్తిగా అర్థమయేది …ఏం జామెట్రీ ఇది మాథ్యూ ! నా జీవితాన్ని అంధకారబంధురం చేసేస్తోంది – నేనొట్టి మొద్దుని తెలుసా ఇందులో ? ”

” నువ్వు మొద్దువేమిటి ఆన్ ? కిందటివారం కార్మొడీ వెళ్ళానా – అక్కడ బ్లెయిర్ వాళ్ళ స్టోర్ దగ్గర మిస్టర్ ఫిలిప్స్ కనిపించి మాట్లాడాడు. నువ్వు బళ్ళోకంతా తెలివైనదానివట, అన్నీ ‘ గబా గబా ‘ నేర్చేసుకుంటున్నావట . ఆ టెడ్డీ ఫిలిప్స్ అంత మంచి మేష్టరేం కాదనేవాళ్ళున్నారులే గాని , నాకైతే అతను బుర్ర ఉన్నవాడేననిపించింది ”

ఆన్ ని మెచ్చుకున్నవాళ్ళెవరైనా తెలివిగలవాళ్ళే మాథ్యూ ప్రాణానికి.

” ఏమో. మిస్టర్ ఫిలిప్స్ జామెట్రీ లో అక్షరాలు మార్చెయ్యకుండా ఉంటే ఇదీ బాగానే నేర్చుకోగలనేమో. అంటే – గీతలతో బొమ్మలు వేసేప్పుడు గుర్తుకి ఎ, బి , సి అని అక్షరాలు పెట్టుకుంటామన్నమాట. ఎలాగో కుస్తీ పట్టి అన్నీ గుర్తు పెట్టుకుంటానా..మిస్టర్ ఫిలిప్స్ బోర్డ్ మీద రాసేప్పుడు అన్నీ కలగాపులగం చేసేస్తారు..నాకేమో బొత్తిగా తికమక అయిపోతుంటుంది. ఎంత మేష్టారైతే మాత్రం..అలా చెయ్యచ్చా చెప్పు ?

మెరిల్లా, మిసెస్ రాచెల్ ఏం చేస్తూ ఉండిఉంటారో ? అటావా లో పరిస్థితి ఏమీ బాగోవట్లేదనీ ఇదే గనక కొనసాగితే ప్రధాన మంత్రికి వచ్చే ఎన్నికల్లో కష్టమేననీ మిసెస్ రాచెల్ అంటున్నారు…అసలు ఆడవాళ్ళకి  కూడా ఓటు హక్కు ఉంటే మొత్తం మారిపోతుందట..ఆవిడే చెప్పారు. అవునూ నువ్వే పార్టీ కి ఓట్ వేస్తావు మాథ్యూ ? ”

” కన్ జర్వేటివ్ పార్టీ కి ” అనుమానం లేకుండా చెప్పాడు – ఆ పార్టీ మాథ్యూ జీవితం లో భాగం- చర్చికి వెళ్ళటం లాగా.

” అయితే నేనూ అదే ” ఆన్ నిర్ణయించేసుకుంది. ” నీది ఆ పార్టీ అవటం నాకు సంతోషమే ..ఎందుకంటే గిల్ – అదే , స్కూల్లో కొంతమందిది గ్రిట్స్ [  లిబరల్ ] పార్టీ. మిస్టర్ ఫిలిప్ కూడా ‘ గ్రిట్ ‘ నే అనుకుంటా, ఎందుకంటే ప్రిస్సీ ఆండ్రూస్ వాళ్ళ నాన్న ఆ పార్టీ యే కదా. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తుంటే వాళ్ళమ్మ వెళ్ళే చర్చి కే  వెళ్ళాలట , వాళ్ళ నాన్న పార్టీ కే ఓట్ వెయ్యాలట- రూబీ గిల్లిస్ చెప్పింది. నిజమేనా మాథ్యూ ? ”

” ఏమో. తెలీదు ”

anne19-2

” నువ్వెవరైనా అమ్మాయిని ప్రేమించావా మాథ్యూ ? ”

” లేదు. ఎప్పుడూ లేదు ” – జన్మలో అలాంటి బుద్ధి పుట్టలేదు మాథ్యూకి.

ఆన్ అరచేతుల్లో గడ్డం ఆనించుకుని తలపోసింది –

” అదంతా  సరదాగానే ఉంటుందేమో కదా. రూబీ చెప్పిందీ – తను పెద్దయాక తన కి బోలెడంతమంది అబ్బాయిలు ఆరాధకులు గా అయిపోతారట, అందరూ పెళ్ళి చేసుకోమని అడుగుతారట ..తనకైతే పిచ్చెక్కి పోతుందిట..అంత మంది ఎందుకులే గాని, సరైనవాడు ఒకడుంటే బావుంటుంది. రూబీ కి ఇలాంటి విషయాలు బాగా తెలుసు , ఎందుకంటే తనకి చాలా మంది అక్కలు ఉన్నారు గదా. గిల్లిస్ వాళ్ళ అమ్మాయిలు హాట్ కేకుల్లాగా చలామణీ అవుతారుట –  మిసెస్ రాచెల్ అన్నారు. మిస్టర్ ఫిలిప్స్ రోజూ ప్రిస్సీ ఆండ్రూస్ వాళ్ళింటికి వెళ్తారు – పాఠాల్లో సాయం చేసేందుకని. మరైతే మిరండా స్లోన్ కూడా ఆ పరీక్షకే కదా చదువుతోంది..ప్రిస్సీ అంత బాగా కూడా చదవదు తను- వాళ్ళింటికీ  వెళ్ళి సాయం చెయ్యచ్చుగా..ఏమిటో ! అర్థం కాదు ..”

” నాకూ అలాంటివి అర్థం కావు ” మాథ్యూ ఒప్పుకున్నాడు.

” సరేలే. చదువుకోవాలి నేను..చాలా ఉన్నాయి పాఠాలు. ఆ జేన్ ఇచ్చిన నవల  తీసుకు చదవాలని ఎంత అనిపిస్తోందో..వీపు అటువైపు తిప్పి కూర్చున్నా అది నాకు కనిపిస్తూనే ఉంది. జేన్ అది  చదువుతూ ఏడ్చేసిందట తెలుసా..అలా కన్నీళ్ళు తెప్పించే పుస్తకాలు నాకు బాగా నచ్చుతాయి. హ్మ్..లాభం లేదు , దాన్ని పట్టుకుపోయి జామ్ అల్మైరా లో పెట్టి తాళం వేసి తాళం చెవి నీకు ఇచ్చేస్తానూ..నా చదువు పూర్తయేదాకా తాళం చెవి నాకు ఇవ్వకేం ! నేనెంత అడిగినా.. ప్రాధేయపడినా కూడా ! ఆకర్షణ  లని నిగ్రహించుకోమంటారు కదా , తాళం చెవి దగ్గర లేకపోతే ఆ పని చెయ్యటం కొంచెం తేలిక. నేలమాళిగ లోకి వెళ్తున్నా- రస్సెట్స్ [ తొక్క ముదురు రంగులోకి తిరిగిన ఆపిల్స్ ] కావాలా నీకు అక్కడినుంచి ?”

” నాకొద్దులే. నువ్వు తెచ్చుకో కావాలంటే ” ఆన్ కి అవి ఇష్టమని మాథ్యూ కి తెలుసు.

ఒకచేత్తో కొవ్వొత్తీ ఇంకో చేత్తో పళ్ళెం నిండుగా రస్సెట్స్ పట్టుకుని నేల మాళిగ నిచ్చెన మెట్లెక్కుతూ పైకి వస్తోంది ఆన్. బయట మంచు కట్టిన బాట మీద చక చకా నడిచే అడుగుల చప్పుళ్ళు . వంటింటి తలుపు చటుక్కున తెరుచుకుంది. చలిగాలికి పాలిపోయిన మొహం తో , రొప్పుకుంటూ- ఆదరాబాదరా తలమీంచి చుట్టుకున్న శాలువా తో – అక్కడ – డయానా బారీ !! ఆన్ చేతుల్లో ఉన్నవన్నీ రెప్పపాటులో కిందపడిపోయాయి…..[ నేలమాళిగ నేల మీద గ్రీజ్ పేరుకుని ఉంది- మరసటిరోజు మెరిల్లా అన్నీ శుభ్రం చేస్తూ మొత్తమంతా తగలబడిపోనందుకు హర్షం వ్యక్తం చేసింది ].

” ఏమైటి- ఏమైంది డయానా ?? మీ అమ్మగారు ఒప్పుకున్నారా ?? ”

 

” లేదు- అది కాదు. నువ్వు తొందరగా రా..మిన్నీ మే కి అస్సలు ఒంట్లో బాలేదు. అమ్మా నాన్నా ఊరెళ్ళారు..తనకి డిఫ్తీరియా అంటోంది మేరీ జో  – ఎక్కువగా వచ్చేసిందట..ఏం చెయ్యాలో తెలీట్లేదు ”  మిన్నీ మే డయానా చెల్లెలు- మూడేళ్ళుంటాయి. మేరీ జో పిల్లల్ని చూసుకుందుకూ ఇంట్లో సాయం చేసేందుకూ ఉంటుంది.  ఆమెకి పదహారేళ్ళు , ఫ్రెంచ్ అమ్మాయి.

మాథ్యూ తన టోపీ కోటూ తీసుకుని ఒక్క మాట మాట్లాడకుండా చీకట్లో పడి బయటికి వెళ్ళాడు.

” కార్మొడీ వెళ్ళేందుకు గుర్రబ్బండి సిద్ధం చేసుకుంటున్నాడు , డాక్టర్ కోసం – నాకు తెలుసు ” – ఆన్ తన కోటూ టోపీ వెతుక్కు తీసుకుంటూ అంది. ” వేరే చెప్పక్కర్లేదు,  తెలుసు ”

” కార్మొడీ లో ఎవరూ ఉండరు ” డయానా వెక్కిళ్ళు పెట్టింది ” డాక్టర్ బ్లెయిర్ మీటింగ్ కి వెళ్ళారట… డాక్టర్ స్పెన్సర్ కూడా వెళ్ళే ఉంటారు.. మిసెస్ రాచెల్ కూడా లేరు. మేరీ జో ఎప్పుడూ చూళ్ళేదట డిప్తీరియా వచ్చిన వాళ్ళని –

అయ్యో ! ఆన్ – ఏం చెయ్యాలి !!! ”

” వద్దు. ఏడవకు డయానా . మిసెస్ హమ్మండ్ కి మూడు జతల కవల పిల్లలు , నేను వాళ్ళింట్లో ఉండేదాన్ని – గుర్తు లేదూ ? ఎవరో ఒకరికి డిప్తీరియా వస్తూనే ఉండేది , నాకు తెలుసు ఏం చెయ్యాలో. ఇపికాక్ అని మందు ఉంటుంది , తీసుకొస్తా ఉండు – మీ ఇంట్లో ఉండి ఉండదేమో ” –  ఆన్  ధైర్యమిచ్చింది.

ఇద్దరు పిల్లలూ చేతులు పట్టుకుని చుట్టుదారిలో గబ గబా నడుస్తూ డయానా ఇంటికి బయల్దేరారు. దగ్గరిదారినిండా మోకాళ్ళ లోతున మంచు పేరుకుపోయిఉంది, అటు వెళ్ళేందుకు లేదు. మిన్నీ మే కి జబ్బు చేసినందుకు ఆన్ కి బాధ లేదని కాదుగానీ మళ్ళీ డయానా తో కలిసి ఉన్నందుకూ ఎంతో కొంత సాయపడబోతున్నందుకూ ఆనందంగా కూడా ఉంది .

రాత్రి శీతలనిర్మలంగా ఉంది. నల్లటి నున్నటి నీడలు, వెండిలాగా మెరుస్తూన్న కొండలు. నక్షత్రాల వెలుతురు. అక్కడా అక్కడా పొడుగ్గా కొమ్మలు చాచుకున్న ఫర్ చెట్లు , వాటి ఆకుల్లోంచి పొడి పొడి గా రాలే మంచు , వాటిలోంచి వినబడే గాలి ఈలలు. ఆన్ హృదయం ఆ మార్మిక సౌందర్యానికి మేలుకునే ఉంది .

మిన్నీ మే కి పాపం నిజంగా బాలేదు. జ్వరం మండిపోతోంది . సోఫా మీద పడుకోబెట్టారు గానీ నిమ్మళంగా ఉండ పోలేకుండా ఉంది. ఊపిరి పీల్చి వదుల్తుంటే గరా గరా శబ్దం- ఇల్లంతా వినిపిస్తోంది. మేరీ జో కి ఏమీ పాలుపోవటం లేదు – అటూ ఇటూ ఊరికే తిరుగుతోంది .

ఆన్ చురుగ్గా పనిలోకి దిగింది.

” మిన్నీ కి డిప్తీరియానే , ఎక్కువగానే వచ్చింది – కాని ఇంకా ఎక్కువ వచ్చినవాళ్ళని చూశాను నేను. మనకి ముందు బాగా కాగిన వేణ్ణీళ్ళు కావాలి- డయానా, చూడు – ఆ కెటిల్ లో ఉన్నట్టున్నాయి ? ఆ. ఇప్పటికి సరిపోతాయిలేగాని , మేరీ జో ! పొయ్యి లో ఇంకాసిని పుల్లలు వెయ్యి , మండటం లేదు అది. ఏమీ అనుకోకుగాని నువ్వు ఈ పాటికే ఆ పని చేసి ఉండాల్సింది. ఫ్లానల్ దుప్పట్లు ఉన్నాయా డయానా ? నాలుగైదు పట్టుకు రా. మిన్నీ బట్టలు వెచ్చగా లేవు, అవి విప్పేసి పక్కమీద పడుకోబెట్టి దుప్పట్లన్నీ కప్పాలి. ముందు ఇపికాక్ తాగించాలి , ఉండు ”

anne19-1

మిన్నీ ఆ చేదు మందు మింగేందుకు బాగానే మొరాయించిందిగానీ ఆన్ కి మూడు జతల కవలపిల్లల్ని చూసుకున్న అనుభవం- ఊరికే పోతుందా ? మందు దిగింది గొంతులోకి – అప్పుడే కాదు , ఆ రాత్రంతా చాలా సార్లు. ఆన్, డయానా ఓర్పుగా , శ్రద్ధగా మిన్నీ ని  కాచుకున్నారు. మేరీ జో కూడా చెప్పింది చెప్పినట్లు చేసుకుపోయింది. పొయ్యి బ్రహ్మాండంగా మండింది , ఒక హాస్పిటల్ నిండుగా ఉన్న డిప్తీరియా పిల్లలకి సరిపోయేంత వేణ్ణీళ్ళు సిద్ధమయాయి.

డాక్టర్ కి నచ్చజెప్పి అంత దూరమూ చలిలో తీసుకొచ్చేసరికి తెల్లారగట్ల మూడైంది.  కాని ఆ పాటికి గండం గడిచినట్లే ఉంది – మిన్నీ మే ప్రశాంతంగా నిద్రపోతోంది .

” ఇంచుమించు ఆశ వదిలేసుకున్నాను డాక్టర్ గారూ ” ఆన్ వివరించింది ” అంతకంతకీ పరిస్థితి క్షీణించింది –  మిసెస్ హమ్మండ్ పిల్లల కి వచ్చిందానికనా బాగా ఎక్కువ గా వచ్చినట్లుంది. ఇక తనకి ఊపిరి అందదేమోననిపించింది. సీసాలో ఉన్న ఇపికాక్ మొత్తం విడతలు విడతలు గా ఇచ్చేశాను. ఆఖరి మోతాదు  పోస్తూ అనుకున్నాను – అంటే డయానా కీ మేరీ జోకీ చెప్పలేదనుకోండీ , నాకు నేను చెప్పుకున్నానంతే – ‘ ఐపోయింది , ఇది గనక పని చెయ్యకపోతే నేను చేయగలిగిందింకేమీ లేదు ‘ అని . కాని మూడు నిమిషాలలో పెద్ద దగ్గు తెర వచ్చి చాలా కఫం బయటపడింది , అప్పట్నుంచీ ఊపిరి ఆడటం మెరుగుపడిందండీ. నాకు ఎంత ఊరట కలిగిందో చెప్పలేను, కొన్నిటిని మాటల్లో పెట్టలేం , కదండీ  ? ”

” అవును, నాకు తెలుసు ” డాక్టర్ తల ఊపాడు. ఆన్ వైపు చూస్తుంటే ఆయనకీ కొన్నిటిని మాటల్లో పెట్టలేమనిపించింది. అయితే ఆ తర్వాత మిసెస్ బారీ కీ వాళ్ళాయనకీ చెప్పకుండా ఉండలేకపోయాడు .

”  కుత్ బర్ట్ వాళ్ళింట్లో ఉండే ఆ ఎర్రజుట్టు అమ్మాయి – అక్షరాలా మీ పాపని బతికించింది. లేదంటే నేను వచ్చేవేళకి పరిస్థితి చెయ్యిదాటిపోయిఉండేది. అంత చిన్న వయసులో ఆ పిల్లకి ఎంత వివేకం, ఎంత సమయస్ఫూర్తి ! తనేమేం చేసిందో ఎలా చేసిందో ఎంత బాగా చెప్పింది నాకు ! ”

ఆ అద్బుతమైన ఉదయం లో ఆన్ మాథ్యూ తో కలిసి ఇంటికి బయల్దేరింది. నిద్రలేమితో కళ్ళు మూతలు పడుతున్నాయి గానీ ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. మంచు కప్పిన తెల్లటి పొలాల మీదుగా , మెరిసిపోయే మేపుల్ చెట్ల కిరీటాల కిందుగా – ఇద్దరూ నడుస్తున్నారు.

” మాథ్యూ , ఎంత బావుందో కదా ? దేవుడే ఊహించుకుని సృష్టించినట్లుంది ఇవాళంతా. ఆ  మంచు ధూళి చూడు – ఉప్ఫ్ అని ఊదితే దాంతోబాటు చెట్లే ఎగిరిపోయేట్లున్నాయి కదూ ? మిసెస్ హమ్మండ్ కవల పిల్లల్ని పెంచి ఉండటం ఎంత మంచిదైందో – అప్పుడప్పుడూ తిట్టుకుంటుండేదాన్ని గాని ! నిద్రొచ్చేస్తోంది మాథ్యూ – స్కూల్ కి వెళ్ళలేనేమో , వెళ్ళి నిద్రపోతే  బుర్ర తక్కువ గా ఉంటుంది. కానీ వెళ్ళకపోతే ఎలా – గిల్ – అదే వేరేవాళ్ళు నా కంటే చదువులో ముందుకి వెళ్ళిపోతారు. మళ్ళీ అందుకోవటం కష్టం , కాని ఏ పనైనా ఎంత కష్టమైతే అంత తృప్తి , కదా ? ”

” ఏం పర్వాలేదులే , తేలిగ్గానే అందుకుంటావు నువ్వు ” ఆన్ చిట్టి మొహాన్నీ కళ్ళ కింద నీలి వలయాలనీ చూస్తూ ఆదుర్దా గా అన్నాడు మాథ్యూ – ” ఇంటికి వెళ్ళగానే పడుకుని హాయిగా నిద్రపో. పనులన్నీ నేను చూసుకుంటాను ”

ఆన్ అలాగే వెళ్ళి మంచి నిద్ర తీసింది. లేచేప్పటికి మధ్యాహ్నం దాటిపోతోంది. మెట్లు దిగి వస్తూంటే మెరిల్లా వచ్చేసి ఉంది , కూర్చుని ఊలు అల్లుకుంటోంది.

” వచ్చేశావా మెరిల్లా ! ప్రధానమంత్రి ని చూశావా – ఎలా ఉన్నారు ఆయన ? ”

” ఆయన అందం బట్టి  కాదు గా ప్రధానమంత్రి అయింది….ఆ బుర్ర ముక్కూ ఆయనానూ. కాని బాగా మాట్లాడారు , నేను కన్ జర్వేటివ్ అయినందుకు గర్వమనిపించింది. రాచెల్ లిండ్ లిబరల్ కదా , తనకి పెద్ద ఎక్కలేదులే ఆయన ఉపన్యాసం ! నీ భోజనం ఓవెన్ లో పెట్టాను చూడు , బ్లూ బెర్రీ ప్రిజర్వ్  తెచ్చుకో లోపల్నుంచీ. బాగా ఆకలేస్తుండి ఉంటుంది నీకు. మాథ్యూ అంతా చెప్పాడు – నీకు డిప్తీరియా గురించి తెలిసి ఉండటం ఎంత అదృష్టమో , నేనైతే ఏమీ చెయ్యగలిగిఉండేదాన్ని కాదు. అదిగో , మాటలు తర్వాత , ముందు తిను – తర్వాత ఎంతసేపైనా చెప్పచ్చు ”

మెరిల్లా ఏదో చెప్పదల్చుకుంది గానీ ముందే చెప్పేస్తే ఆన్ ఉద్రేకపడి భోజనం వంటి సాధారణ విషయాలని పట్టించుకోదని భయపడి ఊరుకుంది . ఆఖరి బ్లూ బెర్రీ ఆన్ పొట్టలోకి వెళ్ళిపోయాక అప్పుడు చెప్పింది –

” ఇందాక మిసెస్ బారీ వచ్చింది . నువ్వు నిద్రపోతున్నావు , లేపలేదు నేను. నువ్వు వాళ్ళ పాప ప్రాణాన్ని రక్షించావనీ నీకు చాలా చాలా కృతజ్ఞతలనీ చెప్పింది. నీ మీద కోపం పెట్టుకున్నందుకు బాగా నొచ్చుకుంది. ఆ వైన్ విషయం లో నువ్వు కావాలని చెయ్యలేదనీ డయానా తాగేసి వెళ్ళటానికి నువ్వు కారణం కాదనీ తెలుసుకుందట. ఎప్పట్లాగా డయానా తో స్నేహంగా ఉండమని నీకు చెప్పమంది. డయానా కి రాత్రి నుంచీ జలుబు చేసి ఉందట, ఈ చలిలో బయటికి పంపలేననీ నిన్నే వాళ్ళింటికి రమ్మనీ చెప్పి వెళ్ళింది. అరే – ఆగు – ఆన్- అలా గెంతకూ ..”

ఆన్ గాల్లో తేలుతూ లేచింది – మొహం ఆనందం తో వెలిగిపోతోంది.

” నేను వెళ్తాను మెరిల్లా..వెళ్ళద్దా , ఇప్పుడే ? గిన్నెలు తర్వాతొచ్చి కడుగుతాను…వచ్చాక ఇంకేం చెయ్యమన్నా చేస్తాను  ”

” సరే, సరేలే ” ముద్దుగా అంటూన్న మెరిల్లా నోట్లో మాట నోట్లో ఉండగానే ఆన్ ఒక్క పరుగు తీసింది . మెరిల్లా గాబరా పడింది ” తలకి టోపీ లేదూ ఒంటిమీద కోటు లేదు – అలాగే వెళ్ళిపోయింది పిల్ల. దీనికీ చలిగాలికి ఏమైనా

పట్టుకుంటే …”

ఆ మునిమాపు ఊదా రంగు కాంతిలో ఆన్ నృత్యం చేసుకుంటూ ఇంటికొచ్చింది. నైఋతి దిక్కున దూరంగా మొదటి చుక్క పొడుస్తోంది – లేత బంగారపు సంధ్యాకాశం మీదికి స్వర్గం లోంచీ  జారుతూన్న ముత్యంలాగా , చీకట్ల తోటల కి అవతల  మిలమిలమిలమంటోంది. మంచు కొండల దారుల్లోంచి వెళ్ళే స్లెడ్జ్ బళ్ళ గంటల ధ్వని ఏదో కిన్నెరల సంగీతం లా ఉంది – కాని అంతకన్న ఆన్ గుండెలోపలి పాట మధురంగా ఉంది , అది ఆమె పెదవుల్లోంచి ప్రవహిస్తోంది.

” నీ  ముందు నిలబడి ఉన్న వ్యక్తి పరిపూర్ణమైన ఆనందం తో నిండి ఉంది మెరిల్లా ” – ప్రకటించింది-  ” నాకు ఎర్ర జుట్టు ఉన్నాసరే , ఏం పర్వాలేదు. నా ‘ ఆత్మానందం ‘  ఎర్ర జుట్టు స్థాయిని దాటిపైకి వెళ్ళిపోయింది ! మిసెస్ బారీ నన్ను ముద్దు పెట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. నా ఋణం ఎన్నటికీ తీర్చుకోలేననీ అపార్థం చేసుకున్నందుకు క్షమించమనీ అడిగారు. నాకేమిటో ఇబ్బందిగా అనిపించిందిగానీ – వీలైనంత గంభీరంగా జవాబు చెప్పాను – నాకు ఆవిడ మీదేమీ కోపం లేదనీ నేను  బుద్ధిపూర్వకంగా డయానా కి సారా తాగించలేదని ఆవిడ నమ్మితే చాలనీ గతాన్నంతా జరగనట్లే మర్చిపోగలననీ …

డయానా నేనూ బోలెడంత మాట్లాడుకున్నాం. కార్మొడీ లో వాళ్ళ అత్తయ్య నేర్పిన క్రాషె కుట్టు నాకు నేర్పించింది – తెలుసా , అవొన్లియా లో ఇంకెవ్వరికీ రాదు అది. ఇంకెవ్వరికీ నేర్పించకూడదని ఒట్లు పెట్టుకున్నాంలే. డయానా నాకొక అందమైన కార్డ్ ఇచ్చింది..దాని మీద చుట్టూరా  రోజా పువ్వులు . మధ్యలో ఇలా ఉంది

‘ నేను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమిస్తే మనల్ని మృత్యువు తప్ప మనల్నేదీ విడదీయలేదు ‘

మిస్టర్ ఫిలిప్స్ ని మా ఇద్దర్నీ పక్క పక్కన కూర్చోబెట్టమని అడుగుదామనుకుంటున్నాం. గెర్టీ పై పక్కన మిన్నీ ఆండ్రూస్ కూర్చోవచ్చులే కదా [ ఇప్పుడు వాళ్ళిద్దరూ మా పక్కన కూర్చుంటున్నారు ] ? మిసె బారీ వాళ్ళింట్లో కెల్లా మంచి పింగాణీ టీ సెట్ ని బయటికి తీశారు నాకోసం ..నేనేదో గొప్ప అతిథిని అన్నట్లు – ఇదివరకెవ్వరూ అలా చెయ్యలేదు నా కోసం , ఎంత సంతోషమనిపించిందో ! ఫ్రూట్ కేకూ పౌండ్ కేకూ డో నట్ లూ రెండు రకాల ప్రిజర్వ్ లూ పెట్టారు. మిస్టర్ బారీ పక్కన కూర్చున్నాను నేను , మిసెస్ బారీ ఆయనకి నాకేం కావాలో చూస్తూ ఉండమని చెప్పారు. బిస్కెట్ లు తింటానా అనీ టీ లోకి పంచదార కావాలా అనీ ..నాకెంత మర్యాద చేశారో ! నన్ను నిజంగా పెద్దదానిలాగా , మంచిదానిలాగా చూశారు ”

” నువ్వు పెద్దదానివయానంటావా , ఏమో..” – మెరిల్లా కొంచెం దిగులుగా నిట్టూర్చింది.

” కొంచెం అయ్యాలే ” – ఆన్ చెప్పింది -” చిన్న పిల్లలతో నేనూ ఇక మీద అలాగే ఉంటాను,  వాళ్ళు పెద్దవాళ్ళన్నట్లే ! వాళ్ళు పెద్ద పెద్ద మాటలు వాడితే నవ్వెయ్యను, పాపం వాళ్ళూ నొచ్చుకుంటారు , తెలుస్తోంది. టీ తర్వాత డయానా నేనూ టాఫీ తయారు చేశాం. అంటే అంత బాగా రాలేదనుకో..పొయ్యి మీద గిన్నె లోది నన్ను గరిటె తో తిప్పుతూ ఉండమని డయానా, తను పళ్ళెం మీద వెన్న రాసి సిద్ధం చేస్తోంది. నేను మాటల్లో పడి తిప్పుతూ ఉండటం మర్చిపోయాను, అదేమో మాడిపోయింది. దాన్నే చల్లారబెట్టేందుకు పళ్ళెంలో పోసి ఉంచితే దాని మీంచి పిల్లి నడుచుకుంటూ పోయింది – పారేశాం, తప్పదు కదా ! అయినా చాలా సరదాగా ఉండింది.  వచ్చేస్తూంటే మిసెస్ బారీ  వీలైనప్పుడల్లా  నన్ను వస్తూండమన్నారు, డయానా కిటికీ లోంచి నాకు చెయ్యి ఊపుతూ గాల్లోకి ముద్దులు విసిరింది.

ఇవాళ రాత్రి ఒక కొత్త ప్రార్థన తయారు చేసి చెప్పుకుంటాను మెరిల్లా, ఈ ఆనందకరమైన సందర్భంలో ! ”

 

                                                               [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. “ఆ మునిమాపు ఊదా రంగు కాంతిలో ఆన్ నృత్యం చేసుకుంటూ ఇంటికొచ్చింది. నైఋతి దిక్కున దూరంగా మొదటి చుక్క పొడుస్తోంది – లేత బంగారపు సంధ్యాకాశం మీదికి స్వర్గం లోంచీ జారుతూన్న ముత్యంలాగా , చీకట్ల తోటల కి అవతల మిలమిలమిలమంటోంది. మంచు కొండల దారుల్లోంచి వెళ్ళే స్లెడ్జ్ బళ్ళ గంటల ధ్వని ఏదో కిన్నెరల సంగీతం లా ఉంది – కాని అంతకన్న ఆన్ గుండెలోపలి పాట మధురంగా ఉంది , అది ఆమె పెదవుల్లోంచి ప్రవహిస్తోంది.” —- poetic..
    చాలా బాగుంది మైథిలి అబ్బరాజు గారూ!

  2. ” నీ ముందు నిలబడి ఉన్న వ్యక్తి పరిపూర్ణమైన ఆనందం తో నిండి ఉంది మెరిల్లా ” :) ఎంత సాధన (ఆరాధన) కావాలి, ఇలా చెప్పాలంటే !! ఇక సాగరపు ఒడ్డున నడుస్తుంటే … బోలెడన్ని గవ్వలు దొరికినట్టు, ఇక్కడ కధ ఒడ్డున కవిత్వం ఒక వింత పరిమళంతో … “ఆ మునిమాపు ఊదా రంగు కాంతిలో ఆన్ నృత్యం చేసుకుంటూ ఇంటికొచ్చింది. నైఋతి దిక్కున దూరంగా మొదటి చుక్క పొడుస్తోంది – లేత బంగారపు సంధ్యాకాశం మీదికి స్వర్గం లోంచీ జారుతూన్న ముత్యంలాగా , చీకట్ల తోటల కి అవతల మిలమిలమిలమంటోంది. మంచు కొండల దారుల్లోంచి వెళ్ళే స్లెడ్జ్ బళ్ళ గంటల ధ్వని ఏదో కిన్నెరల సంగీతం లా ఉంది – కాని అంతకన్న ఆన్ గుండెలోపలి పాట మధురంగా ఉంది , అది ఆమె పెదవుల్లోంచి ప్రవహిస్తోంది.” Thank you Mam :)

  3. Mythili Abbaraju says:

    థాంక్ యూ రేఖా…

మీ మాటలు

*