నూరేళ్ళ రజని: పాట ఆయన ఎగరేసిన పావురం!

2001_photo

” లలిత సంగీతం అనే పేరు ఎలా వచ్చింది ? ” అన్న నా ప్రశ్నని కొంత మార్చి ” లలిత సంగీతం ఎలా వచ్చింది ? ” అని నవ్వుతూ అడిగారు ఆయన కుమారులు బాలాంత్రపు హేమచంద్ర గారు.

” నా లోంచి ” – వంద గండుతుమ్మెదలు పలికాయి గొంతులో. ఆ చెప్పుకోవటం లోనూ పాటే ఉంది … విడిగా ఆయన ఉనికి లేదు ఇప్పుడు. బహుశా ఎప్పుడూ ఉండి ఉండదేమో కాని, ఈ శైశవ మౌగ్ధ్యం లో అసలు తెలియటం లేదు. కళా దేవి తన ప్రేమికులను యౌవనం నుంచి, ప్రౌఢత్వం నుంచి వృద్ధులను చేయక ఇలాగ పసివారిని చేస్తుందేమో.

అలా అని వారికి ఏవీ పట్టటం లేదనేమీ కాదు, మాకు అతిథిమర్యాదలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారొక కంట.
‘’ Her whole life became a poem and a song ‘’ అని సరోజినీ నాయుడు గారి గురించి అన్నారని తెలుసు, ఇక్కడ దాన్ని దర్శించే వీలు కలిగింది. ఆ పాట కేవలం కలల్లో మ్రోగి ఊరుకునేది కాదు, పరిసరాలనూ పరిచయస్తులనూ ఆప్తులనూ సేవకులనూ తడిపి స్వచ్ఛం చేయగలిగినది.

ఈ 31 వ తేదీకి అధికమాసాలతో కలిపి వారికి నూరు సంవత్సరాలు పూర్తవుతాయట. ఆంగ్లమానం ప్రకారం తొంభై ఆరు. కొద్దిపాటి శారీరక అశక్తత లకు సాయం చేసేందుకు ఒక యువకుడు ఉన్నారు వారితో. అతను ప్రేమగా అడుగుతున్నాడు ” అది పాడండి, ఇది పాడండి ” అని.
ఇంటికివచ్చినవారి దగ్గర బిడ్డను పద్యాలు చెప్పమన్నట్లు ఉంది ఆ అడగటం. అతని మనసులో అంత మెత్తదనాన్ని మేల్కొలిపిన ఈయన ఆర్ద్రత ఎంతదో కదా..హాయిగా అనిపించింది చూస్తుంటే.
తెలుగు సాహిత్యపు సుకృతాలలో ఒకటి వేంకటపార్వతీశ్వర కవుల సాహిత్యం. ఆ జంట లో ఒకరి, బాలాంత్రపు వేంకటరావు గారి – పుత్రులు రజనీకాంతరావు గారు. వేంకటరావు గారి సేవకు సంతుష్ట అయిన సరస్వతి , తన మరొక కారుణ్యాన్ని, సంగీతాన్ని – వారి బిడ్డ పైన వరంగా కురిపించింది. ఆ గులాబీ నీటి జడి ఇంచుమించు అరవై ఏళ్ళ పాటు ఆంధ్రదేశాన్ని ముంచెత్తింది, ఇప్పటి శాంతపు విశ్రాంతి లోనూ ఆ సౌరభం స్ఫురిస్తూనే ఉంది.

రజని అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సవం, ఒక జీవన సందేశం. ముదిమి లేని కౌముది.. (ఫోటో: దాసరి అమరేంద్ర)

రజని అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సవం, ఒక జీవన సందేశం. ముదిమి లేని కౌముది.. (ఫోటో: దాసరి అమరేంద్ర)

” ఆయన వినికిడి అంత బాగాలేదు, ముఖాముఖీ వంటిదేమీ సాధ్యం కాదేమో ” నని వారి అబ్బాయి ముందే హెచ్చరించి ఉన్నారు. ఊరికే చూసేందుకు వస్తామని చెప్పాను. నా జీవన కాలం రజనీకాంతరావు గారి కాలాన్ని స్పర్శించగలగటమే గొప్ప సంగతి, మరింకేదైనా అదనమే. మేము వెళ్ళేసరికి చక్కగా, ఒక కేంద్రప్రభుత్వపు ఉన్నతోద్యోగి ఎలా ఉండాలో అలా, తయారై హాల్ లో కూర్చుని ఉన్నారు.

”ఏమైనా పాడతారా, వీళ్ళకోసం ? ” -వారి అబ్బాయి అడిగారు.
నేను ధైర్యం చేసి ” స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా ” కోరుకున్నాను. లత గారి మోహనవంశీ మొదటి పుటలో ‘ theme song ‘ గా నాకు పరిచయమై, వెంటాడిన పాట అది. ఆయన ముఖం వెలిగింది, ” మీకు మంచి పాటలు తెలుసూ ” అని కితాబు ఇచ్చారు. పాడారు. ఇంతలో వారి కోడలు ప్రసూన వచ్చేశారు. ” ఆవిడ అడిగితే బోలెడు విషయాలు చెబుతారు, పాడతారు ”-అట. ఎదురుగా కూర్చుని లాలనగా వారి మోకాలి పైన అరచేయివాల్చి మృదువుగా ఆజ్ఞాపిస్తున్నారు ఆమె.

‘ ఓంకార పరివృత్తం విశ్వం ‘ పాడండి
పాడారు.
‘ ఓ విభావరీ ‘ పాడండి..
పాడారు.
‘కొండవాలులో ‘ పాడండి..
పాడారు.
‘ ప్రతిశ్రుతి ‘ … ఆ పాట ఎలా రాశారు ?
” మా పిఠాపురం లో బడికి వెళ్ళేప్పుడు ఒక వీధిలో అలా ప్రతిధ్వనులు వినిపించేవి , దాని గురించి రాశాను ”
‘’ మధువనస్వప్నం లోవి పాడండి. పాడారు.
” Puck,అదే, Robin good felow గుర్తున్నాడా ? ” నన్ను ప్రశ్నించారు.
” గుర్తున్నాడండీ ”
” అతను పాడతాడు ఇది ” – వివరించారు.

మనుమడు బాలాంత్రపు తేజతో ....

మనుమడు బాలాంత్రపు తేజతో ….

Shakespeare నాటకం ‘ Midsummer night’s dream ‘ ని సంగీతరూపకంగా మలచి పాటలు రాసి, స్వరపరచారు. అదొకటే కాదు, ‘ ఉమర్ ఖయాం ‘ , ‘ అవంతిసుందరి ‘[దశకుమార చరిత్ర నుంచి ] , ‘ దేవదాస్ ‘ , ‘ సిద్ధేంద్రయోగి ‘ , రవీంద్రుల ‘ చిత్ర ‘ , ‘ లైలా మజ్ఞు ‘, ‘ చండీదాస్ ‘ , ‘ శిలప్పదిగారం’ , ‘ కులీకుతుబ్ షా’ …లెక్కలేనన్ని రూపకాలు . వసంత , గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత , శిశిరాలా పత్రాలుగా అలవోకగా రాలిన పాటలు. సాహిత్యం పట్ల గాఢమైన అభినివేశం ఉన్నవారు సంగీతరసజ్ఞులైతేఎటువంటి కళాకృతులు రాగలవన్నదానికి తార్కాణాలు అవన్నీ . వారి లోని కవిని సంగీతకారుడు కొన్ని సార్లు అధిగమించారనిపించినా, మెట్లవరుసలు వంటి గేయాలలో ఏ ఉత్తమ ఆధునిక కవికీ తీసిపోని ప్రతిభ కనిపిస్తుంది.

”గగనసీమలు కాలపరిధులు
గడచిపోయే మెట్లవరుసలు
జీవితమునకు మరణమునకూ
ఈవలావల కదలు వరుసలు
కుడిఎడమలే కానరాని
తుదిమొదళ్ళే తోచబోని –మెట్లవరుసలు
స్వప్నమధువుల జడులలోపల
స్వాంతమున జ్ఞాపకపు పొరలు
పొరలలోపల తెరలు తెరలుగ
పూర్వజన్మల ప్రేమకథలు- మెట్లవరుసలు..

పిఠాపురం రాజా వారి కళాశాలలో చదువు అయాక ఎం.ఏ కి ఆంధ్ర విశ్వవిద్యాలయం తోబాటు శాంతినికేతన్ కి కూడా దరఖాస్తు చేశారట. రెండు చోట్లా సీట్ వచ్చింది.

” వెళ్ళలేదేం మరి ? ” హేమచంద్ర గారు అడిగారు.
” అంధ్రా లో వచ్చిందిగా, దగ్గర గా ” – ఆరాటం లేదన్నమాట, హెచ్చేమో అనిపించే సౌందర్యం కోసం కూడా. అనవసర తాపత్రయాలు లేని జీవనం, అలాగని క్రియాశూన్యమైనది కాదు. అటువంటి తూకం ఉండటం అంత మేధావినీ pervert కాకుండా ఆపిందనిపించింది. సాటిలేని ప్రతిభ కారణంగా తోటివారు ఈర్ష్యాసూయలు చూపెట్టినా అవి వారిని తాకలేదు ఏనాడూ. చిన్నప్పుడు అన్నగారు నళినీ మోహన రావు గారు మంచి స్పోర్ట్స్ పర్సన్ గా ఉండేవారట. వీరూ ఆ పనేదో మొదలెడదామని ఒకనాడు పరుగుపందెం లో పాల్గొనబోయారట. మాస్టర్ విజిల్ వేసినా పరిగెత్తాలని తోస్తే కద, అక్కడే ఉండిపోయారు. తమకు అది సరిపడదని తెలుసుకున్నారట… ఆ తర్వాతెప్పుడూ ఏ పరుగు మీదా ప్రీతి లేదు , దారిప్రక్కన గులాబీలను ఆఘ్రాణిస్తూ హాయిగా నడిచారు, గమ్యం కోసం కాదు. ఆ నిశ్చింత వారికి ఆయుష్షునూ ఆరోగ్యాన్నీ ప్రసాదించింది.

కొడుకు హేమచంద్ర , కోడలు ప్రసూనతో

కొడుకు హేమచంద్ర , కోడలు ప్రసూనతో

సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు మండా కృష్ణమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.బాల్యంలో పాటలు కట్టుకుంటున్నప్పుడే స్వరాలు వచ్చేసేవి, ఒక రాగపు ఛాయలో ఒదిగేవి. ఇరవై ఏళ్ళు దాటుతుండగా, 1937-40 మధ్యలో పూర్తి స్థాయి వాగ్గేయకారుడైనారు. తమ అభిరుచికి తగిన ఉద్యోగం లో ప్రవేశించారు. అలాగ కుదరటం ఎవరికోగాని పట్టని అదృష్టం. ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు వంటి భావుకులూ ఉద్దండులూ అయినవారి దగ్గర రేడియో మాధ్యమాన్ని అవగాహన చేసుకున్నారు. గొప్ప సాహిత్యాన్నంతటినీ రేడియో ద్వారా వినిపించే పనిని ఆయన తానుగా మీద వేసుకున్నారు, ఆ క్రమం లో రెండు తరాల అభిరుచిని ఉన్నతం చేశారు. ఆ ఘనతేదో తామొక్కరికే దక్కాలని అనుకోనూలేదు. ఫలితంగా రేడియో కి ఒక సామూహిక నిత్యోత్సవంగా పేరు వచ్చింది.

తెలుగు లో శాస్త్రీయానికి మార్దవాన్ని జోడిస్తూ సుగమమైన సంగీతం మొదలైన కాలం అది-రజనీకాంతరావు గారు , ఎస్.రాజేశ్వర రావు గారు, రావు బాలసరస్వతి గారు, సీతా అనసూయ గార్లు- వీరంతా ఆ వైతాళికులు. ఇందరిలో వాగ్గేయకారులు రజని గారొక్కరే. ఆ తర్వాతి కాలం లో కొన్ని సినిమాలకు పనిచేస్తూ, ప్రభుత్వోద్యోగపు నిబంధనల వల్ల అన్నగారి పేరనా, బావ మరిది బుద్ధవరపు నాగరాజు గారి పేరనా పాటలు చేస్తూ పోయారు. బహిరంగరహస్యం ఒకటి – కృష్ణశాస్త్రి గారి ‘ జమీందారీ బద్ధకం ‘ కారణం గా పాటలు అందించలేకపోతే రజనిగారు రాసేసేవారు.

అలా కృష్ణశాస్త్రి గారి పేర చలామణీ అయిన పాటలలో ముఖ్యమైనది ‘ కొలువైతివా రంగశాయి ‘. పాట వారిది అంటే నూటికి తొంభైతొమ్మిది సార్లు రచన, వరస రెండూ అనే అర్థం. బి.ఎన్.రెడ్డి గారు, గోపీచంద్ గారు – వీరి సినిమాలలో రజని గారు తప్పకపనిచేయవలసిందే. రాజమకుటం లో ‘ ఊరేది పేరేది ‘ రజని గారి అద్భుతాలలో ఒకటి. గోపీచంద్ గారి ‘ మానవతి ‘ లో ‘ తన పంతమే ‘ , అరుదైనరాగం రసాళి లో చేశారు. బాలసరస్వతి పాడారు. అది వి.ఎ.కె. గారికి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెప్పారు. ఆ పాటను రజని గారి పేరన ప్రస్తావించనందుకు బాలసరస్వతి గారి పైన వి.ఎ.కె. గారికి కొంచెం కోపం కూడానట.

1950 తర్వాతి కాలం లో మీర్జాపురం రాజావారి సినిమా కి పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బంది వల్ల ఆయన సినిమాల్లోంచి తప్పుకున్నారు. అక్కడా వారి ‘ మట్టసం ‘ కనిపిస్తుంది, తమకు తగనిదేదో తెలుసుకొనే స్పష్టత. రేడియో లో ఉండిపోవటం ఎంతో స్థిమితాన్ని ఇచ్చింది, కీర్తితోబాటు. ఇక్కడ తమ పేరు ని దాచుకొనే అవసరం లేకపోయింది. తమ పాటలు మరొకరి పేర ఉంటే వారికి పట్టదు కాని, తమది కానిది తమది అనటాన్ని వెంటనే ఖండిస్తారు. చలం గారి మ్యూజింగ్స్ లో ‘ ఆ తోట లోనొకటి ఆరాధనాలయము ‘ పాట ను మెచ్చుకుంటూ అది రాశారు కనుక రజని అప్పటిదాకా రాసిన దేశభక్తి గేయాలన్నిటినీ క్షమించవచ్చు అంటారు. ఆ మాటలు అంతా చెప్పుకుంటారు. ఇంతకూ అది రాసినవారు ఎస్.రాజేశ్వర రావు గారి తండ్రి సన్యాసి రాజు గారు. మేము ఉండగా హేమచంద్ర గారు రజని గారిని సరదాగా మళ్ళీ అడిగారు ” ఆ తోటలోనొకటి పాట ఎవరు రాశారు ? ” అని.
” నేను కాదు ” ఖచ్చితంగా, చిన్న ఉక్రోషం తో బదులిచ్చారు రజని గారు.

1947 ఆగస్ట్ పదిహేను న ఉమ్మడి[14 వ తేదీ అర్థరాత్రి ] మద్రాస్ రాష్ట్రపు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన పాటలలో మొదటిది పట్టమ్మాళ్ గారు పాడినది. రెండవది టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన రజని గారి పాట – ‘ మ్రోయింపుము జయభేరి ‘ . పెద్ద సంతోషం ,ఆ విషయం వింటూంటే అంతకన్న ప్రసిద్ధమైనది- ” మాదీ స్వతంత్ర దేశం , మాది స్వతంత్ర జాతి ‘ ఇవాళ విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. ముఖ్యంగా ప్రారంభం లో వచ్చే trumpet ధ్వనులు. ఆ పాట 1948 ఆగస్ట్ పదిహేనున ప్రసారమైందట.

చిన్నపిల్లల కోసం ‘ జేజిమామయ్య పాటలు ‘ బోలెడన్ని కూర్చారు. .. ‘ దిబ్బరొట్టె అబ్బాయి ‘ వంటివి. 1961 లో రవీంద్రుల శతజయంతి. మొత్తం రవీంద్రసంగీతాన్నంతా తెలుగులోకి తెచ్చేశారు రజని. బెంగాలీ లో ఇంతకన్న బావుంటాయనిపించదు నాకు. అదొక ఆనంద సం రంభం ఆకాశవాణిలో. అపురూపమైన పాటలు అవి..కృష్ణనీ గోదావరినీ దాటించి సరాసరి పద్మానది తీరానికి ప్రయాణం చేయిస్తాయి. [వేంకటపార్వతీశ్వర కవులు చాలా బెంగాలీ నవలలని తెలుగులోకి అనువదించారు. వేంకటరావు గారి తమ్ముడు కలకత్తా విశ్వవిద్యాలయం లో చదువుకుంటూ బెంగాలీ పుస్తకాలు ఇంటికి తెచ్చేవారు. వీరు భాష నేర్చేసుకున్నారు. వారి ద్వారా రజని గారికి బెంగాలీ వచ్చిఉండటం గొప్ప మేలు చేసింది శ్రోతలకి]

ఆయన దిద్దినవారూ అంతేవాసులూ అనంతరకాలం లో ప్రసిద్ధులైనారు . బాలమురళీకృష్ణ గారు రజని గారిని గురుసమానులుగా చూసేవారిలో ఒకరు అంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు, కాని అది నిజం. శ్రీరంగం గోపాలరత్నం గారితో కలిసి బాలమురళి గారు పాడిన రజని గేయం ‘ మనప్రేమ ‘ ఈ మధ్య , తిరిగి ఫేస్ బుక్ లోఆహ్లాద విహారం చేసింది. రజని గారి గేయాల సంపుటి ‘ శతపత్రసుందరి ‘ కి బాలమురళి గారు వినయంగా రాసిన ముందుమాట ఉంది .ఘంటసాల గారు ఎదుగుతూన్న దశ లో రజని గారి ఊత ను అందుకున్నారు.
1972 లో చలం గారిని చేసిన ఇంటర్ వ్యూ రజని గారి గొప్ప achievements లో ఒకటి. చలం గారి పరంగా రజని ఆప్తత, అధ్యయనం, గౌరవం కనిపిస్తాయి అందులో. వీటితోబాటు [అభిమానులని మినహాయిస్తే ] లోకం చలం గారిని చూసే చూపు రజని గారికి తెలుసు, చూడవలసిన చూపు ఎలా ఉండాలో కూడా.

కృష్ణశాస్త్రి గారితో రజని గారి అనుబంధం అతి ప్రత్యేకమైనది. అది ఇరుగుపొరుగుల ఆత్మీయతగా మొదలై ఇద్దరూ కలిసి కూర్చుని పాటలు చేసేవరకూ విస్తరించింది. ‘కృష్ణ రజని ‘ అని తమ గేయాల సంపుటికి పేరు ఉంచారు కృష్ణశాస్త్రి గారు.

ఆకాశవాణిలో సీనియర్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కు బయట కూడా పనిచేశారట. ఆ ఇతర రాష్ట్రాలలో ఏమి చేసి ఉంటారు ? బెంగళూరు కేంద్రం లో పనిచేస్తూ కన్నడం నేర్చేసుకున్నారు, కన్నడం లో పాటలు రాసేటంతగా. వాణీ జయరాం గారు పాడిన ఒక పాట ఆవిడకి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెబుతూండగానే ఆ పాట అందుకుని పాడేశారు రజని. డార్జిలింగ్ దగ్గరి కేంద్రం లో పనిచేస్తూ జయదేవుడి అష్టపదులను కొత్తగా పాడి, పాడించి రికార్డ్ చేశారట. ‘ శతపత్రసుందరి ‘ సంపుటం లో డార్జిలింగ్ చుట్టు పక్కల ప్రకృతి గురించి రాసిన రమ్యమైన గేయం ఉంది.

వ్యక్తిగా ఆయన గొప్పగా విజయవంతమైన వారని ఆ సాయంత్రం అర్థమైంది. కోడలు ప్రసూన గారి తల్లి దూబగుంట ఇందుమతి గారు అక్కడే ఉన్నారు. ఎంతో ఆప్యాయం గా చెబుతున్నారు వారి గురించి, తెల్లారగట్లే లేచి పాడుకుంటారని. ” మీరు ముందే బంధువులా ? ”- అడిగాను. ” లేదు, వీళ్ళ పెళ్ళి అయాకే ” ఆవిడ చెప్పారు. రజని గారి మానవసంబంధాలు అందమైనవి, అవ్యాజమైనవి.మనవలు ఇద్దరూ ఉన్నారు, తాతగారిని ముద్దుగా చూసుకుంటున్నారు. సంక్రాంతి పండగ కోసం బంధువులు వచ్చి ఉన్నారు. వారిలో ఒక అమ్మాయికి రజని గారే పేరు పెట్టారట ‘ తన్వి ‘ అని. మేఘదూతంలో నాయికను అలా సంబోధిస్తారట. అందుకని ఆ పేరు. పరమసౌందర్యవతి అయిన యువతిని వర్ణిస్తూ ‘ తన్వీ శ్యామా ‘ అని మొదలయే ఆ శ్లోకం స్పష్టంగా, పూర్తిగా ఉచ్ఛరించారు రజని. ‘’ యా తత్రస్తయత్ద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః ” అన్న చివరి పాదాన్ని తన్మయంగా నొక్కి చెబుతూ.

నా తరపున ప్రసూన గారు అడుగుతున్నారు- ” మీకు ఇష్టమైన కవి ? ”
” ఏ భాషలో ?”
” ఒక్కొక్క భాషలో చెప్పండి, తెలుగులో ? ”
” శ్రీనాథుడు ” [ వారి తండ్రి గారు బాలాంత్రపు వేంకట రావుగారికీ శ్రీనాథుడు ఇష్టమట ] ” ఇంగ్లీష్ లో ?”
” షెల్లీ, కీట్స్ ”
” సంస్కృతం లో ? ”
” కాళిదాసు .కాళిదాసును మరచిపోతే నేను పనికిరాను ” రెట్టించి చెప్పారు. శాకుంతలం లోని ప్రఖ్యాత శ్లోకం” రమ్యాణి వీక్ష్య ” ను ప్రియమారా తెనిగించి స్వరపరచారు.

” బెంగాలీ లో ?”
” టాగూర్ ”
” ఒకరి పేరే చెప్పాలంటే ?”
అనుమానం లేకుండా చెప్పేశారు – ” టాగూర్ ” అని. కాళిదాసును తనలో ఒదిగించుకున్న కవి ఏమో, టాగూర్.

రాత్రి కొంత గడిచింది, ఆయన విశ్రాంతి తీసుకునే సమయమైంది. ఆయన కోసం ఇంటి ఎదురుగా అందమైన కుటీరం వంటిది నిర్మించి ఉంది , అందులోకి నిష్క్రమించారు. ఆయన గ్రంథాలయమంతా అక్కడ ఉంది. పాడనప్పుడంతా చదువుకుంటూనే ఉంటారట. కాసేపటికి , మేము వెళ్ళేందుకని బయటికి వస్తూ ఉంటే వెన్నెట్లో పూలమొక్కల మీదినుంచి తిరిగి ఆయన కంఠం వినబడుతూ ఉంది. ఆయన నిద్రపోయేదాకా పాడుకునే పాటలు కాబోలు అవి. రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం .

-మైథిలి అబ్బరాజు

కొన్ని పాటలు 

[ఓ విభావరీ ]

 

[మన ప్రేమ – బాలమురళికృష్ణ , శ్రీరంగం గోపాలరత్నం ]

https://www.youtube.com/watch?v=GEq9MlJERvU

[ రవీంద్ర సంగీతం ]

https://www.youtube.com/watch?v=IYNUQPsRqn0

[చలం గారి తో ఇంటర్వ్యూ ]

మీ మాటలు

  1. “రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం!”
    ఈ ఒక్క మాటా చాలు!
    రజనీకాంత రావు గారికి వారి తండ్రిగారు (ప్రముఖ కవి బాలాంత్రపు వేంకటరావు గారు) పెట్టిన పేరు అక్షరాలా సాకారమైంది. సంగీత సాహితీ రంగాలకి ఆయన పూర్ణచంద్రుడిలా వెలుగుతున్నారు.
    ఆ చంద్రికలు మరొక శతవసంతాలు కూడా కాంతులు వెదజల్లుతూ ఉండాలి.
    మైథిలి గారి ఈ వ్యాసం ఆ వెన్నెలవెలుగులను మరింత దీపింప చేసేలా ఉంది.

  2. “రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం!”
    ఈ ఒక్క మాటా చాలు.
    తమ తండ్రి గారు బాలాంత్రపు వేంకటరావు గారు పెట్టిన పేరుని నూరుపాళ్ళూ సార్థకం చేసిన వారు రజనీకాన్తరావు గారు. సంగీత సాహిత్య రంగాలు రెంటిలోనూ పూర్ణచంద్రునిలా వెలుగుతున్నారు. ఈ పూర్ణ చంద్రికలు మరిన్ని వసంతాలు చల్లగా ప్రసరించాలని కోరుకుంటున్నాను.
    మైథిలి అబ్బరాజు గారు వ్రాసిన ఈ ప్రత్యేక వ్యాసం ఆవిడ వ్రాసిన వాటన్నింటిలోనూ తలమానికం గా ఉంది.

  3. రజనీకాంతరావు గారి గురించి ఇంత తెలుసుకుంటూ ఉంటే ఎంత బావుందో.

    “రాత్రి కొంత గడిచింది, ఆయన విశ్రాంతి తీసుకునే సమయమైంది. ఆయన కోసం ఇంటి ఎదురుగా అందమైన కుటీరం వంటిది నిర్మించి ఉంది , అందులోకి నిష్క్రమించారు. ఆయన గ్రంథాలయమంతా అక్కడ ఉంది. పాడనప్పుడంతా చదువుకుంటూనే ఉంటారట. కాసేపటికి , మేము వెళ్ళేందుకని బయటికి వస్తూ ఉంటే వెన్నెట్లో పూలమొక్కల మీదినుంచి తిరిగి ఆయన కంఠం వినబడుతూ ఉంది. ఆయన నిద్రపోయేదాకా పాడుకునే పాటలు కాబోలు అవి. రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం ”

    కళ్ళముందర ఆ దృశ్యం కనపడుతోంది. చాలా మంచి వ్యాసం మేడం. థాంక్యూ.

  4. dr. kodati sambayya says:

    కోట్లాది తెలుగు హృదయాల్లో నిండుకున్న సహస్ర చంద్రోదయ దర్శకుడు, లలిత సంగీత దార్శనికుడు రజని గారు. వారికి ప్రభుత్వం తరుఫున పద్మాలు రాలేదనే బాధ, అందమైన గులాబి కింద ముళ్ళు లాగా కుచ్చుకుంటున్నది.

  5. akbar pasha says:

    రజనీకాంత రావు గారితో విద్యార్ధి కృష్ణ సార్ చేసిన పాటలు కూడా ఎవర్గ్రీన్. విన్నకొద్దీ వినాలనిపిస్తాయి. మనల్ని ప్రశాంతంగా ఎక్కడెక్కడికో తీసుకేల్తాయి.

  6. Satapatra sumdaruDu–!

  7. రజనీ గారి గురించి ఎన్నెన్ని వివరాలూ!!! చాలా చక్కని వ్యాసం, మైధిలి గారూ.. థాంక్యూ సో మచ్!
    రేడియో పాటల్లోనూ, మాటల్లోనూ ఆ గొంతు మార్దవంగా వెంటాడిన రోజులు కోకొల్లలు..

    ” వెన్నెట్లో పూలమొక్కల మీదినుంచి తిరిగి ఆయన కంఠం వినబడుతూ ఉంది…..” ఎంత చక్కటి వీడ్కోలు దృశ్యమో కదా!

  8. ”స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా ” మళ్ళీ ఎన్నాళ్ళకు విన్నాను ? హైదరాబాద్ ఆకాశవాణి లో కాబోలు “లీల గారు ” (శారదా శ్రీనివాసన్ గారి సోదరి ) పాడగా విన్నట్టు జ్ఞాపకం , రజని గారి గురించి ఇలా రాయడం బాగుంది. రజని అనగానే ముందుగా గుర్తుకొచ్చే పాట “తన పంతమే తా విడువడూ ” (బాలమ్మ పాడింది ) . మైథిలి గారూ ధన్యవాదాలు .

  9. నిశీధి says:

    చాల మంచి వ్యాసం , ఆద్యంతం బాగుండమే కాదు లివింగ్ లెజెండ్ ని పరిచయం చేసిన ఆర్టికల్ .

  10. చాలా చాలా భద్రంగా దాచుకున్నాం , ప్రతీ పదాన్ని, స్వరాన్నీ !! ఎప్పుడు ‘లలిత సంగీతం’ సంగతి వచ్చినా మా తాతగారు ( కీ.శే . శ్రీ . కొట్రా .వి. నరసింహం ) ముందుగా ‘ శ్రీ . రజనీ కాంత రావుగారి గురించి ప్రస్తావించి అప్పటి రేడియో సంగతులన్నీ చెప్పేవారు. Remembered all the song Titles he mentioned, now from ur wonderful essay Mam. వాతావరణంలో ఒక ప్రియమైన ఆర్ద్రత నింపేస్తుంది మీ భాష ( వాక్య నిర్మాణం) . Thanks a lot మైథిలి Mam. స్పెషల్ థాంక్స్ ఫర్ షేరింగ్ ‘ చలం గారి ‘ మాటలు _/\_

  11. johnson choragudi says:

    మేడం –
    సందర్భానికి తగిన మీ వాక్యాలు, శైలి చాలా బావున్నాయి.
    విజువల్స్ లో కనిపించే ఆర్ట్, మీ లైన్స్ మధ్య వున్నాయి.
    దానికి – మన expression మీద మనకి కంట్రోల్ వుండాలి.
    ఇప్పుడు రాసే వాళ్లకు చాలా మందికి లేనిది అదే.
    రజిని గారి ఇంటి నుండి మీ నిష్క్రమణ – దృశ్యం కళ్ళకే కాదు, చెవులకు చేరింది.
    రజిని గారి శ్రోతగా మళ్ళీ విద్యార్ధి గా నన్ను 70′ ల లోకి తీసుకెళ్ళారు.
    ధన్యవాదాలు
    – జాన్సన్ చోరగుడి

  12. kandukuri ramesh babu says:

    జీవన గ్రంథాలయమ
    …………….

    మనసున మల్లెలు మాలలూగెనే…
    అనిపించింది ఈ చంద్రుడి గురించి చదివితే…
    జేవితం పండినట్టు ఐనది.

    ఏమీ తెలియకుండా అయన గురించి చదివి, చలం ఇంటర్వ్యూ చదివి, ఎవరో గాని మైథిలి గారు. చాల మంచి పని చేసారమ్మ రాసి.

    “అనవసర తాపత్రయాలు లేని జీవనం, అలాగని క్రియాశూన్యమైనది కాదు.”

    “…ఆ తర్వాతెప్పుడూ ఏ పరుగు మీదా ప్రీతి లేదు , దారిప్రక్కన గులాబీలను ఆఘ్రాణిస్తూ హాయిగా నడిచారు, గమ్యం కోసం కాదు. ఆ నిశ్చింత వారికి ఆయుష్షునూ ఆరోగ్యాన్నీ ప్రసాదించింది.”

    “తమకు తగనిదేదో తెలుసుకొనే స్పష్టత.”

    “రవీంద్రసంగీతాన్నంతా తెలుగులోకి తెచ్చేశారు రజని. బెంగాలీ లో ఇంతకన్న బావుంటాయనిపించదు నాకు. అదొక ఆనంద సం రంభం ఆకాశవాణిలో. అపురూపమైన పాటలు అవి..కృష్ణనీ గోదావరినీ దాటించి సరాసరి పద్మానది తీరానికి ప్రయాణం చేయిస్తాయి..”

    -సంస్కారం, ఉత్తమ అబిరుచి, హృదయం ఉండటం. సామాన్యత అస్సామాన్యత తెలియడం. వల్ల ఇలాంటి మంచి రచనలు చదివే అవకాసం దొరుకుతున్నది. థాంక్సండి.

    • కల్లూరి భాస్కరం says:

      చాలా అందంగా, ఆర్ద్రంగా, ఒక ‘పాట’కుని పరిచయానికి, పలకరింపుకు తగిన మాటలు పొదుగుతూ రాశారు. అభినందనలు.

      • Mythili abbaraju says:

        ధన్యవాదాలు కల్లూరి భాస్కరం గారూ

    • Mythili abbaraju says:

      ధన్యవాదాలు రమేష్ బాబు గారూ

  13. c.v.suresh says:

    చక్కటి విషయమున్న వ్యాసము. అద్భుతమైన పరిచయ౦… పరిచయకర్త మైధిలి గారికి అభిన౦దనలు…!!

  14. Mythili abbaraju says:

    ధన్యవాదాలు సురేష్ గారూ

  15. bhuvanachandra says:

    మైధిలి గారూ, ఒక అద్భుతాన్ని దర్శింపజేసినందుకు ధన్యవాదాలండీ ……ఆనందంతో కూడా గొంతు మూగబోతుంది ……..ఇప్పుడు నేనున్నది ఆ స్తితిలోనే ………………………………………………….నమస్సులతో …………………………………….భువనచంద్ర……………… PS :”””ఓ విభావరి”” పాట మరోసారి వింటుంటే ….నా వొ ళ్ళే మేఘమైపోయి ఎన్ని స్వర శిఖరాలని తడిమిందో !

  16. Mythili abbaraju says:

    నమస్కారాలు భువనచంద్ర గారూ…

  17. vanam venkata varaprasadarao says:

    ఎప్పట్లానే మీ వ్యాసం ఎంతో చెప్పింది, ఎంతో ఊహలకు వదిలేసింది, హఠాత్తుగా వినిపించిన అందమైన పాటలా,
    అంతలోనే ఆగిపోయినా అలల్లా లేచిపడే ప్రతిధ్వనుల్లా, మీకు ;మీకే ప్రత్యేకమైన’ శైలి ఉంది! ఆయనే ఎన్నడూ వసివాడని,
    రసం వీడని దేవసౌగంధికాపద్మం! ఈ పద్మాలు ఆయనకెందుకు! శ్రీ సూక్త పురుషసూక్తాల్లో రసాయనశాస్త్ర రహస్యాలను
    రసమయంగా చెప్పిన మహానుభావుని కుమారుడు, వాగ్గేయ కారుల చరిత్రను వ్రాసిన వాగ్గేయ కారుడు, నాయనగారూ
    కీర్తిని కోరుకోలేదు, ఆయనకు తగిన కుమారుడు, ఈనా కోరుకోలేదు, అయినా దిగ్దిగంతాలకు వారి కీర్తి’చంద్రికలు’ చల్లని
    సంగీత సాహిత్య రసవ్రుష్టిని కురుస్తూనే ఉంటాయి, కీర్తికి వారి అవసరము కానీ వారికి కీర్తి కాదు! మైథిలి గారూ! ధన్యవాదాలు!
    అభినందనలు!

  18. vanam venkata varaprasadarao says:

    ఎప్పట్లానే మీ వ్యాసం ఎంతో చెప్పింది, ఎంతో ఊహలకు వదిలేసింది, హఠాత్తుగా వినిపించిన అందమైన
    పాటలా, అంతలోనే ఆగిపోయినా అలల్లా లేచిపడే ప్రతిధ్వనుల్లా, మీకు ;మీకే ప్రత్యేకమైన’ శైలి ఉంది!
    ఆయనే ఎన్నడూ వసివాడని, రసం వీడని దేవసౌగంధికాపద్మం! ఈ పద్మాలు ఆయనకెందుకు!
    శ్రీ సూక్త పురుషసూక్తాల్లో రసాయనశాస్త్ర రహస్యాలను రసమయంగా చెప్పిన మహానుభావుని కుమారుడు,
    వాగ్గేయ కారుల చరిత్రను వ్రాసిన వాగ్గేయ కారుడు, నాయనగారూ కీర్తిని కోరుకోలేదు, ఆయనకు తగిన
    కుమారుడు, ఈనా కోరుకోలేదు, అయినా దిగ్దిగంతాలకు వారి కీర్తి’చంద్రికలు’ చల్లని సంగీత సాహిత్య
    రసవ్రుష్టిని కురుస్తూనే ఉంటాయి, కీర్తికి వారి అవసరము కానీ వారికి కీర్తి కాదు! మైథిలి గారూ!
    ధన్యవాదాలు! అభినందనలు!

  19. Mythili abbaraju says:

    ధన్యవాదాలు వనం వెంకట వరప్రసాద రావు గారూ

  20. చాలా కాలం క్రితం ఆకాశవాణి వారు బాలాంత్రపు రజనీకాంతరావుగారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ను ఒక వరసలోకి ఎడిట్ చేసి యు ట్యూబులో ఉంచాను. ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.

    https://www.youtube.com/watch?v=REqPBn2yEcs

    ఈ ఇంటర్వ్యూను కూడా మీ వ్యాసంలో ఉంచితే బాగుంటుంది.

  21. ఎంత అందమైన రోజు యిది .జన్మ సార్ధకం అయ్యింది రజని గారి విశేషాలు హృదయం తట్టి పలకరించాయి .మనసు పులకరించింది .సహజమయిన రచన సంగీతమై సాగింది ధన్యులం .

  22. ఓలేటి వెంకట సుబ్బారావు says:

    . నేను రజని గారిని ప్రేమగా – బాబాయి గారు అని పిలుస్తుంటాను – ఆయనది పసి పిల్లవాని మనస్తత్వం – నిష్కల్మషత, నిండయిన ఆప్యాయత , పలకరింపులలో ఇంపు ఆయన తో మన అనుబంధాన్ని అమరం చేస్తాయి . ఆయనను కలిసిన ప్రతీ సందర్భం ఆహ్లాదకరమయినదే -అమూల్యమైనదే- ఇది నా స్వానుభవం చెబుతూన్న మాటలు –
    ఆయనను చూసి వస్తే చాలు మనలో కూడా ఒక నూతన ఉవ్విళ్లూరుతుంది – ఈ ఆనందాన్ని – అనుభవాన్ని మనకు అందజేయడం లో రజని గారి పాత్ర ప్రముఖమైనది అయితే , అందులో భాగస్వాములు హేమచంద్ర గారు ,ప్రసూన గారు ఇంకా- రజని బాబాయి గారి ఆంతరంగికుడు -యువకుడు
    అమ్మా -మైధిలి గారు- మీ వ్యాసం రజని గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని సంపూర్ణం గా ప్రతిఫలించింది – అభినందనలు .

  23. మైథిలి గారూ!
    రజనీ గారి గురించి చాలా చక్కని వ్యాసం అందించిన మీకు ధన్యవాదాలు.! అనవసర తాపత్రయాలు లేని జీవనం – ఎంత చక్కగా సెలవిచ్చారు మన తెలుగు ఠాగోర్ గారి గురించి. రజనిగారు అల్లగే బాలాంత్రపు వెంకట రావు గార్లు తెలుగు తల్లి పుణ్య ఫలాలు. వారివారి యుగాలల్లో వారు వేసిన ముద్రలు శాశ్వత బెంచ్ మార్కులు. శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గార్లు తెలుగు లలిత సంగీతాన్ని నడిపించిన క్రిష్ణార్జునులు. తెలుగు భాషను పరిపుష్టం చేసిన పద్మ విభూషణులు . Recommendations మయమయిన ప్రబుత్వం మేలుకోదు.అది జరగనందుకు విచారం.
    భవదీయుడు
    తాళ్లూరి వెంకట రావు

  24. చాలా అందంగా వ్రాసారు! ధన్యవాదాలు!

  25. Dr G V Ratnakar says:

    మంచి సమాచారం. మా తరానికి ఇవే పాఠాలు

  26. ఒళ్ళు గగుర్పాటు చెందింది అండీ చివరన… వేవేల ధన్యవాదాలు మీకు, రజని గారి కుటుంబ సభ్యులకు కూడా

మీ మాటలు

*