బిలియర్డ్స్ ఆట…

220px-Alphonse_Daudet_2

ఆల్ఫోన్స్ డాడెట్

(13 May 1840 – 16 December 1897)

ఫ్రెంచి నవలాకారుడు, కథా రచయిత, కవీ.

*

రెండురోజులబట్టీ పోరాడుతున్నారేమో, సైనికులు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. వర్షం పడుతూ, క్రిందనుండి నీళ్ళు ప్రవహిస్తున్నా లెక్కచెయ్యకుండా వాళ్ళు వీపులకి తగిలించిఉన్న సంచీలతోనే నిద్రపోతున్నారు. ఆయుధాలు పక్కనబెట్టి, చెరువులయిపోతున్న రాజమార్గం మీదా, నీరు ఊరుతున్న బురద పొలాలల్లోనూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే మూడు గంటలపాటు అలా నిరీక్షించవలసి వచ్చింది.

అలసటవల్ల, నిద్రలేమివల్ల, యూనిఫారంలతో నిలువునా తడిసిముద్దయిపోవడం వల్లా శరీరం కొంకర్లుపోయి వెచ్చగా ఉండడానికి ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకున్నారు;  కొందరయితే ఒకరి భుజానికున్న సంచికి మరొకరు చేరబడి నిలబడే నిద్రపోతున్నారు; ఆ నిద్రలో ప్రశాంతంగా వాళ్ల ముఖాలు కనిపిస్తున్నా, వాళ్ళల్లో అలసటా, ఆకలీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

తెరిపిలేకుండా కురుస్తున్న వర్షం… ఎక్కడచూసినా బురద, తినడానికి ఏమీ లేకపోవడం, కొండదిగిన నల్లని మబ్బులు, ఎప్పుడు వచ్చి మీదపడతాడో తెలియని శత్రుభయంతో… చుట్టూ మృత్యువాతావరణం అలముకుని ఉంది.

వాళ్ళక్కడ ఏం చేస్తున్నట్టు? అక్కడ ఏం జరుగుతోంది? ఫిరంగులు వాటి మూతులు అడవిపక్క గురిపెట్టి చూస్తూ, అక్కడ వేటినో పరీక్షగా చూస్తున్నట్టు కనిపిస్తున్నై. ఆకస్మికంగా దాడి చెయ్యడానికి పొదల్లో మెషిన్ గన్ లు ఆకాశంవంక నిరీక్షిస్తూ సన్నద్ధంగా ఉన్నాయి. అన్నీ దాడి చెయ్యడానికి ఆయత్తమయి ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎందుకు దాడి చెయ్యడం లేదు? దేనికోసం నిరీక్షిస్తున్నట్టు?

వాళ్ళు ఉత్తరువులకోసం ఎదురుచూస్తున్నారు… కేంద్ర కార్యాలయం ఏ ఉత్తర్వులు పంపదు. పోనీ అదేమన్నా చాలా దూరంలో ఉందా అంటే అదేం లేదు. లూయీ XIII  కోట కనుచూపు మేరలో కొండ మధ్యలో ఉంది… వానకడిగిన ఎర్రని కోట ఇటుకలు చెట్లమధ్యనుండి మెరుస్తున్నాయి. అది నిజంగా రాజభవనమే… సేనాధిపతి నివాసం అన్న ముద్ర ధరించడానికి తగిన యోగ్యత కలిగి ఉంది. రోడ్డుకి దూరంగా, ముందున్న వెడల్పైన కందకాన్నీ వెనకున్న రాతిగోడనీ వేరుచేస్తూ మెత్తని తివాచీలాంటి పచ్చిక … తలవాకిలి వరకూ వరసగా పువ్వులతో అలంకరించినట్టు వ్యాపించి ఉంది.

రెండోపక్క, ఆ భవనానికి వెనకభాగంలో, ఏకాంతంగా ఉండే స్థలంలో చుట్టూ కంచెలా నిలబడ్డ చెట్ల మధ్య ఖాళీలు కనిపిస్తున్నాయి; అక్కడ హంసలు ఈదుతున్న చిన్న కొలను అద్దంలా మెరుస్తోంది; గోపురంలా ఉన్న అసంఖ్యాకమైన పక్షులు వసించే చూరు క్రింద, చెట్టుకొమ్మల మధ్య, నెమళ్ళూ,అడవి కోళ్ళూ తమ పురులు విప్పి సోయగాలు ప్రదర్శన చేస్తూ, సన్నగా క్రేంకారాలు చేస్తున్నాయి. యుద్ధం వల్ల యజమానులు ఇల్లువీడి వెళ్ళిపోయినా, అక్కడ మనుషులెవ్వరూ లేనట్టూ, ఆలనాపాలనా చూసేవాళ్ళెవరూ లేనట్టూ కనిపించడం లేదు. దేశపతాకం చలవ వల్ల పచ్చికబయళ్ళలో అతిచిన్న పువ్వు కూడా చెక్కుచెదరకుండా పరిరక్షింపబడి ఉంది. యుద్ధభూమికి సమీపంలో చక్కగా తీర్చినట్టున్న పొదలతో, గంభీరమైన నిశ్శబ్దం అలముకున్న రాచబాటలతో  అంత మనోహరమైన  ప్రశాంతత లభించడం అరుదే.

దూరంగా కనిపిస్తున్న రోడ్లని చికాకుకలిగించేలా బురదతో ముంచెత్తుతూ, లోతుగా గోటులుతవ్వుతున్నట్టు కురుస్తున్న ఆ వర్షమే, ఇక్కడకొచ్చేసరికి రాజసంగా సన్నని చిరుజల్లులా కురుస్తూ, పచ్చికకి పచ్చదనాన్నీ, ఇటుకలకి పూర్వపు ఎర్రదనాన్ని తెస్తూ, హంసల రెక్కలనీ, నారింజ బత్తాయిచెట్ల ఆకుల్ని మెరుగుపెడుతోంది. ప్రతీదీ తళతళలాడుతూ, అంతా ప్రశాంతంగా ఉంది. నిజానికి ఇంటికప్పుమీద ఎగురుతున్న జండా, గేటుకి ముందు పహారా కాస్తున్న ఇద్దరు జవానులేగనక లేకపోతే అది సైనికాధికారి కేంద్రకార్యాలయమని ఎవరూ తెలుసుకోలేరు. గుర్రాలు అశ్వశాలలో విశ్రాంతి  తీసుకుంటున్నాయి. అక్కడక్కడ ఉండీ ఉడిగీ  మనకి  ఒక అశ్వ రక్షకుడో, వంటగది దగ్గర పచార్లూ చేస్తూ యూనిఫారంలో లేని ఆర్డర్లీనో, విశాలమైన ఆవరణలో ఎర్రని ఫేంటు తొడుక్కుని నిర్లిప్తంగా అరగొర్రు లాగుతూ తోటమాలీవో కనిపిస్తున్నారు.

ముఖద్వారంవైపు కిటికీలు తెరుచుకున్న భోజనాలగదిలో, సగం శుభ్రంచేసి ఉన్న ఒక టేబిలు కనిపిస్తోంది; దానిమీద నలిగిపోయిన గుడ్డా, ఇంకా మూతతియ్యని సీసాలూ, ఖాళీవీ, మరకలుపడిన సగం తాగి వదిలేసినవీ గ్లాసులు ఉన్నాయి; అక్కడనుండి అతిథులందరూ  నిష్క్రమించడంతో విందు ముగిసినట్టు తెలుస్తోంది. దాన్ని ఆనుకుని ఉన్న గదిలోంచి పెద్దగా మాటలూ, నవ్వులూ, గ్లాసులు ఒకదాన్ని ఒకటి సున్నితంగా తాకినపుడు చేసే ఘల్లుమన్న చప్పుడుతోపాటు, బంతులు ఒకదాన్ని ఒకటి ఢీకొడుతున్న చప్పుడుకూడ వినవస్తోంది. సైన్యాధ్యక్షుడు(మార్షల్) ఇక్కడ బిలియర్డ్స్ ఆడుతున్నాడు… అందుకనే అక్కడ సేన అతని ఉత్తర్వులకోసం ఎదురుచూస్తోంది. అతను ఒకసారి ఆట ప్రారంభించేక, మిన్ను విరిగి మీద పడ్డా, అది పూర్తిచెయ్యకుండా ప్రపంచంలో ఏదీ ఆపలేదు.

బిలియర్డ్స్! ఆ యోధుడికున్న ఒక పెద్ద బలహీనత. అతను ఆటకు వచ్చేడంటే, పూర్తి యూనిఫారంలో, గుండేమీద పతకాలు వేలాడుతూ, యుద్ధానికి వచ్చినంత గంభీరంగా ఉంటుంది అతని ముఖం;  విందు భోజనమూ, త్రాగుడూ, ఆటా ఇచ్చిన ఉద్రేకంతో కళ్ళు నిప్పుల్లా వెలుగుతూ, బుగ్గలు ఎర్రబారి ఉంటాయి. అతని అంగరక్షకులు వెన్నంటే ఉంటారు… భక్తీ, వినయమూ చూపిస్తూ అతను “క్యూ”తో కొట్టే ప్రతి దెబ్బకీ మెచ్చుకోలుగా చప్పట్లు చరుస్తూ. మార్షల్ ఒక పాయింటు సాధించేడంటే అది ప్రత్యేకంగా చెప్పుకుంటారు; అతనికి దాహం వేస్తే అతనికి మదిర అందించడానికి సిద్ధపడతారు. ఇక్కడ భుజకీర్తుల రాపిడులూ, తురాయిల కదలికలూ, ఒంటిమీద పతకాలపట్టీలు చేసే గలగలలూ నిరంతరాయంగా సాగుతూ ఉంటాయి. ఉద్యానవనాలకీ ఉన్నతమైన దర్బారులకీ ఎదురుగా ఉంటూ, గోడలకు ఓకు పలకలు తాపడంచేసి ఉన్న విలువైన ఆ మందిరంలో అందమైన చిరునవ్వులూ, సభాసదులు చేసే వినయపూర్వక వందనాలూ, సరికొత్త యూనిఫారాలూ, వాటిమీది బుటాలనగిషీలూ చూస్తుంటే, కాంప్య్ర్న్యూ (Compiègne)లోని రోజులు గుర్తొస్తూ, అదిగో అక్కడ దూరంగా రోడ్లమీద, వర్షంలో తడిసి వణుకుతూ, బట్టలు మట్టికొట్టుకుపోయిన బాధాకరమైన దృశ్యం నుండి కళ్ళకి కాస్త  ప్రశాంతత లభిస్తుంది.

మార్షల్ ప్రత్యర్థి ఒక యువ కేప్టెన్… ఉంగరాలజుట్టుతో, తేలికైన చేజోళ్ళు ధరించి బిలియర్డ్స్ ఆటలో ప్రపంచంలోని అందరు మార్షల్స్ నీ ఓడించగల సత్తా ఉన్న అగ్రశ్రేణి బిలియర్డ్స్ ఆటగాడు. అయితే అతనికి మన మార్షల్ నుండి ఎంత గౌరవప్రదమైన దూరంలో ఉండాలో ఆ మెలకువ బాగా తెలుసు. తన శక్తినంతా ఆట ఎలా గెలవకూడదో దానికి వినియోగిస్తున్నాడు. అలాగని సులువుగా ఓడిపోవడమూ లేదు. సరిగ్గా చెప్పాలంటే, మంచి భవిష్యత్తు ఉన్న అధికారి అతను.

ఓ యువకుడా, బహుపరాక్! అప్రమత్తంగా ఉండు. మార్షల్ వి పాయింట్లు పదిహేనూ, నీవి పదీను. అసలు విషయం ఏమిటంటే, చివరిదాకా ఈ ఆటని అలాగే కొనసాగనివ్వాలి. అలా చేస్తే నీ పదోన్నతికి, అదిగో బయట మిగతా వాళ్లతోపాటే దిక్కుల్ని ముంచెత్తుతున్న వర్షంలో తడుస్తూ, నీ యూనిఫారాన్నీ దానిమీది ఉపకరణాల్నీకుళ్ళు చేసుకుంటూ, రాని ఉత్తర్వులకోసం ఎదురుచూస్తూ చేసినదానికంటే …. ఎక్కువ చేసినట్టే.

ఆట నిజంగా ఆసక్తికరంగా ఉంది. కర్రబంతులు దొర్లుకుంటూ, ఒకదాన్నొకటి ఢీకొట్టుకుంటూ రంగులు కలగలుపుకుంటున్నట్టున్నాయి. అంచున ఉన్న మెత్తలు వాటిని వెనక్కి పంపుతున్నాయి. ఉండుండి ఆకాశంలో ఒక ఫిరంగి పేలిన చప్పుడు(కేనన్-షాట్)తోపాటు ఒక మెరుపు మెరుస్తుంది. దానితో పోలిస్తే కిటికీలు బహు నెమ్మదిగా కొట్టుకుంటై. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఒకరి వంక ఒకరు చూసుకుంటుంటారు ఆందోళనగా. ఒక్క మార్షల్ కే అతని ఏకాగ్రతలో ఏదీ వినిపించదు,కనిపించదు; టేబిలుమీద ఆనుకుని అతనిప్పుడు అద్భుతమైన డ్రా-షాట్ ఎలా కొట్టడమా ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు. డ్రాషాట్లు కొట్టడంలో అతను నేర్పరి.

కాని ఇంతలో ఒక దాని తర్వాత ఒకటి మెరుపులూ, వెనకనే ఫిరంగులు పేలడమూ వినిపిస్తోంది. అతని అంగరక్షకులు కిటికీలదగ్గరకి పరిగెడుతున్నరు. కొంపదీసి ప్రష్యన్లు గాని దాడి చెయ్యడం లేదుకదా!

“వాళ్లు దాడి చేస్తే చెయ్యనీయండి!” అన్నాడు మార్షల్ క్యూకి సీమసున్నం పూస్తూ. “కేప్టెన్, ఇప్పుడు మీ వంతు.”

అక్కడి ఉద్యోగులు ఆనందంతో పులకలెత్తారు. యుద్ధ భూమిలో ఉంటూ కూడా అంత ప్రశాంతంగా బిలియర్డ్స్ ఆదగలుగుతున్న తమ మార్షల్ ధైర్యం ముందు ఫిరంగులు మోసుకెళ్ళే వాహనం మీదే పడుక్కున్న టూరెన్ (1611-75 మధ్య జీవించి, 30 సంవత్సరాల యుద్ధంలో ఫ్రాన్సు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు)సాహసం ఏమీ కాదు అనుకున్నారు. ఫిరంగి గుళ్ళమోతతో మెషీన్ గన్లూ, తుపాకులమోత కలగలిసిపోయి వినిపిస్తోంది. ఈ మధ్యలో ఇక్కడ కోలాహలం కూడా రెట్టింపవుతోంది. అంచులంట నల్లగా ఉంటూ ఎర్రని కాలువల ప్రవాహం పచ్చికనానుకుని ప్రవహించడం ప్రారంభించింది. పక్షిశాలలో నెమళ్ళూ అడవికోళ్ళూ భయంతో అరుస్తున్నాయి. అరబ్బీ గుర్రాలు తుపాకుమందు వాసన పసిగట్టడంతో గుర్రాలశాలలో అసహనంగా వెనకకాళ్ళమీద లేస్తున్నాయి. కేంద్రకార్యాలయంలో ఆందోళన ఎక్కువయ్యింది. కబురు తర్వాత కబురు వస్తోంది. వార్తాహరులు ఒకటే పరుగులు. సైన్యాధ్యక్షుడు ఎక్కడ అని అడుగుతున్నారు.

కానీ మార్షలు కనిపించడే. నే చెప్పలేదూ, అతను ఆట ప్రారంభించేక ముగించేదాకా ఏదీ అడ్డదని?

“కేప్టెన్! ఇప్పుడు మీ వంతు.” అన్నాడు మార్షల్ మళ్ళీ.

కానీ కేప్టెన్ బాగా కలవరపడుతున్నాడు. కుర్రతనం అంటే అదే. లేకపోతే చూడండి. అతని మనసు మనసులో లేదు. వ్యూహాలు మరిచిపోయేడు. వరసగా రెండు పాయింట్లు సాధించి ఆట గెలిచేసేంత పని చేశాడు. దాంతో మార్షలుకి పట్టలేని కోపం వచ్చింది. ఆశ్చర్యం, ఆగ్రహం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అదేక్షణంలో ప్రాంగణంలోకి బాగా పరిగెత్తి నిట్టూరుస్తున్న గుర్రం ఆగింది. మట్టికొట్టుకుపోయిన ముఖంతో అతని సంరక్షకుడొకడు కాపలాదారులందర్నీ తప్పించుకుంటూ ఒక్క ఉదుటులో మెట్లన్నీఎక్కి వచ్చేడు. “మార్షల్! మార్షల్!”… అతను ఎలా అభివాదం చేశాడో చూసితీరవలసిందే. కోపంతో ఊగిపోతూ, కోడిపుంజులా ముఖం ఎర్రబారిపోయి మార్షల్ చేతిలో క్యూతో కిటికీ దగ్గరకు వెళ్ళేడు.

“ఏమిటి సంగతి? ఇదంతా ఏమిటి? అక్కడ కాపలాదారులెవ్వరూ లేరా?” అని అరిచేడు.

“కానీ, మార్షల్…” అంటూ అతనేదో చెప్పబోయాడు.

“సరే, ఒక్క క్షణం; నేను ఉత్తర్వులిచ్చేదాకా నిరీక్షించు.”

కిటికీ దభాలుమని మూసుకుంది.

అతని ఉత్తర్వులకోసం నిరీక్షించాలి! పాపం, సైనికులు. ఇంత సేపూ వాళ్ళు చేస్తున్నపని అదే. గాలి వర్షాన్నీ, తుపాకీ గుళ్ళనీ వాళ్ల ముఖాలమీద కొడుతోంది. కొన్ని బెటాలియన్లకి బెటాలియన్లు అప్పుడే తుడుచుపెట్టుకు పోయేయి; కొన్ని ప్రతిచర్యకి సిద్ధంగా ఉన్నా తమ అచేతనకి కారణం తెలియక నిరర్థకంగా నిలబడి ఉత్తర్వులకోసం నిరీక్షిస్తున్నాయి.  చచ్చిపోడానికి ఏ ఉత్తర్వులూ అక్కరలేదు కనక, వందలకొద్దీ సైనికులు పొదల్లోనూ, కందకంలోనూ, ప్రశాంతంగా ఉన్న ఆ కోట ముఖద్వారందగ్గరా చచ్చి పడి ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినా, నిర్దాక్షిణ్యంగా ఫిరంగులు వాళ్ళని చీల్చి ముక్కలుచేసి పారెస్తున్నాయి; తెరిచి ఉన్న వాళ్ల గాయాల్లోంచి ఫ్రాన్సు రక్తం మౌనంగా పారుతోంది. పైన, బిలియర్డ్స్ గది మాత్రం ఆట తీవ్రతతో వేడేక్కిపోతోంది. మార్షల్ మళ్ళీ తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు; అయితే, కేప్టెన్ మాత్రం సింహంలా పోరాడుతున్నాడు.

పదిహేడు. పద్ధెనిమిది. పంథొమ్మిది.

వాళ్లకి పాయింట్లు లెక్కపెట్టడానికి సమయం లేదు. యుద్ధం చప్పుడు మరింతదగ్గరగా వచ్చేస్తోంది. మార్షల్ కి ఇంక ఒక్క పాయింటు మాత్రమే కావాలి. అప్పటికే పార్కులో గుళ్ళవర్షం కురుస్తోంది.  అకస్మాత్తుగా ఫిరంగి గుండు ఒకటి కొలనులో పేలింది. గదిలో అద్దం భళ్ళున పగిలి ముక్కలయింది. రక్తం ఓడుతున్న రెక్కలతో హంస ఒకటి ప్రాణభయంతో అరుస్తూ కొలనులో పిచ్చెక్కినట్టు ఎటుపడితే అటు ఈదుకుంటూ పొతోంది… అదే మార్షలు కొట్టిన చివరి స్ట్రోక్ కూడా.

అంతే! అంతా చెప్పలేని నిశ్శబ్దం ఆవరించింది. వినిపిస్తున్న చప్పుడల్లా కేవలం తుప్పల్లో పడుతున్న వర్షానిది. కొండ మొదలులో ఏదో గందరగోళం; బురదకొట్టుకుపోయిన రోడ్లమీద పరిగెడుతున్న సైనికుల అడుగుల చప్పుడు. సైన్యం పూర్తిగా పలాయనం చిత్తగిస్తోంది. మార్షల్ మాత్రం తన ఆట గెలిచాడు.

Read the Original in English here: http://www.bartleby.com/313/4/4.html