పేచీలున్నాయి…మీతో నాకు…నాతో నాకు కూడా!

Chandra2

 

దాదాపు ఏడాది క్రితం వేసంకాలంలో ప్రభవ బళ్ళో గుడిసె వేసే  పన్లో ఉన్నామా,

జూలియా గుంటర్ గారు  వచ్చారు మా ఇంటికి.

అప్పుడే కట్టిన గట్టు మీద కూర్చుని, కొత్త తాటాకుల కమ్మదనంలో మునిగితేలుతూ.. ఆ కబుర్లు ఈ కబుర్లు చెపుతూ , అవీ ఇవీ అడుగుతూ .. వారు ఒక గట్టి ప్రశ్నను యధాలాపంగానే అడిగారు.  ఊరక అడగరు కదా మహానుభావులు !

నేనూ ఆ మాటల వరస లోనే చటుక్కున  చెప్పేసాను. నా మనసులో మాట . తేలిక గానే.

“ What is resistance for you?” అడిగారామె.

“ Being myself ! It’s my resistance and my existence as well!” తడుముకోకుండా చెప్పా.

అక్కడి వరకు బాగానే ఉంది !

ఒక్క సారి తీరికగా మా సంభాషణను నెమరు వేసుకొంటే , నేనంత సులువుగా ఇచ్చేయదగ్గ సమధానం కాదని నాకు తెలియవచ్చింది.

నేనింకా ఆ ప్రశ్నకు సమాధానాలు అన్వేషిస్తూనే. ఉన్నాను కదా…. ఆ జవాబును జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా…  .ప్రతిక్షణం.

సరిగ్గా అప్పటికి రెండు దశాబ్దాల క్రితం నేను రాసిన మాట పదిమంది కళ్ళల్లో పడింది. ఇది ప్రయత్న పూర్వకంగా చేసింది కాదు. బోలెడంత ఆవేశం తో చేసిన పని!

నేను ప్రధానం గా పాఠకురాలిని.

నెల్లూరు చిన్న పత్రికలకు పెట్టింది పేరు. తుంగా రాజగోపాల రెడ్డి గారు “లాయర్” పేరిట ఒక పత్రిక నిర్వహించేవారు. అందులో తిరుమూరు నరసింహా రెడ్డి గారు “లోకాలోకనం”  అని శీర్షిక రాసే వారు. ఆ ఏడాది బడ్జెట్ ను వ్యాఖ్యానిస్తూ , జాషువా గారి పద్యం ” భాగ్య విహీనుల క్షుత్తులారునే ! ” ని mis interpret చేసారు. .పై నుంచి జాషువా గారిపై అనవసరపు అసంగత వ్యాఖ్యానాలు చేశారు. నాకు బోలేడంత కోపం వచ్చింది. వెంటనే తెగ బారెడు ఉత్తరం రాసేసా! రాజగోపాల్ రెడ్డి గారు ఆ ఉత్తారాన్ని యధాతథం గా ప్రకటించారు. తలా తోకా తీసేసి.

అది ఆ టాబ్లాయిడ్ సైజు  పత్రిక లో  ఒక పేజీ నిండుగా అచ్చయిన మొదటి వ్యాస రచన .

అచ్చులో చూసుకోగానే నా దిమ్మ తిరిగి పోయింది. .నేను సహజంగా బిడియస్తురాలిని. పల్లెత్తి మాట్లాడే దానిని కాదు. అలాంటిది నాకెందుకంత కోపం వచ్చిందో ఇలా అక్ష్రాగ్రహం వెలికక్కానో నాకే తెలియదు! బహుశా ఆ పద్యం పట్ల నాకున్న అభిమానం , జాషువా గారి పట్ల ఉన్న అంతులేని గౌరవం కారణాలు కావచ్చు.

అప్పుడు తెలిసింది. తిరుమూరు వారు నెల్లూరి సాహితీప్రముఖుల్లో ఒకరని. వారి అబ్బాయి తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు స్థానిక కళా శాలలో తెలుగు ఉపన్యాసకులనీ, స్వయంగా కవీ విమర్షకులనీ.

నాకు కాళ్ళుచేతులు ఆడ లేదు. పెద్దలను ఎదురాడరాదు అని నేర్పిన కుటుంబ నేపథ్యం కలిగిన దానిని కదా. తిరుమూరు వారు వయో వృద్ధులు. నేనా నెల్లూరు వారి కొత్త కోడలిని. ఎంత పని ఛేసాను అని అనిపించిందే కానీ , నా ఉత్తరం నాకు  తప్పుగా తోచలేదు. పత్రిక ప్రతినొక దానిని నాన్న గారికి పంపాను.

అప్పుడు నత్త ఉత్తరాల కాలం కదా. నాన్న గారికి ఒక వారానికి ఆ పత్రిక చేరాక, చదివి ఫోన్ చేసారు.

“నువ్వు సరిగ్గా ఆలోచించావ్!” అన్నారు.

అవును . నాన్న గారు అన్న మాట ఇప్పుడు తలుచుకొంటే, నేను రాయలేదు. నా ఆలోచనలకు అక్షరాలద్దాను. అంతే!

జూలియా తో ప్రభవ పిల్లలూ...చంద్రలత

జూలియా తో ప్రభవ పిల్లలూ…చంద్రలత

నాన్న గారి చిన్న మాట నాకు గొప్ప బలం ఇచ్చింది. నా ఆలోచనలు సరియైన తోవలోనే సాగుతున్నాయని చిన్నపాటి నమ్మకం కుదిరింది.

ఆ దరిమిలా నాన్న గారు ఎప్పుడు ఫోన్ చేసినా  పరామర్షలతో పాటు

“మళ్ళీ ఏం రాశావ్ ? మీ వూళ్ళో వారితో పేచీలేమీ లేవా? ” అనే వారు నవ్వుతూ.

ఎందుకు లేవు  ? బోలెడు!

మా వూళ్ళొ వాళ్ళతోనే కాదు..  నా కుటుంబంతో.. నా సంఘంతో …నాతో నాకే …  పేచీలున్నాయి!

అలా నా చుట్టూ నాలో నిరంతరం జరిగే సంఘర్షణలకు  …నాకు దక్కిన సమాధానాలే… నాలో కలిగిన సందేహాలే … నాలోని సంధిగ్ధాలే .. ఆ క్రమంలో నేను అర్ధం చేసుకొన్న పరిమితులే … …నేను గ్రహించిన  అపరిమితమైన శక్తే .. నేను ఆశించిన మార్పులే…నేను పొందిన స్వాంతనే .. .

నా గుప్పెడు అక్షరాలు !

ఆ సారాంశమే దృశ్యాదృశ్యంలో వ్యక్తపరిచేందుకు ప్రయత్నించాను. కేశవ మాటలుగా .

” ఏమి చూసుకొని నాకీ ధైర్యం?  ఏమీ లేని వాడిని.  సామాన్యుడిని.  అణుమాత్రుడిని.

అయితే ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ?”

 

NOTE:

జూలియా గుంటర్ గారు  సెంట్రల్ యూనివర్సిటీ , హైదరాబాద్  లో రీసెర్చ్ స్కాలర్. వారి స్వస్థలం ఆస్ట్రియా. నేను గుంతెర్ గ్రాస్ విద్యార్హ్తిని కావడం మూలాన వారి నేపథ్యం గురించిన బోలెడు కబుర్లు మేము ఇచ్చిపుచ్చుకున్నాం, మా ఇద్దరికీ స్నేహం ఇట్టే కుదిరింది !

నాన్న గారు, శ్రీ కోటపాటి మురహరి రావు గారు. వారు ” వావ్.. వెరీ గుడ్ ” తరహా ప్రోత్సాహాల తండ్రి కారు. తండ్రీబిడ్డల సంబంధాన్ని రచయిత పాఠకుని సంబంధాన్ని ఆయన చాలా స్పష్టంగానే  వేరుచేసి చూసే వారు.  చాలా నిక్కచ్చి విమర్షకులు. నిజాయితీగా నిజం మాట్లాడడం ఆయనకు అలవాటు.

దానా దీనా, గట్టి పేచీ నాన్నగారితోనే అన్న మాట !