పెద్రో పారమొ-8

( గత వారం తరువాయి )

వేడికి కాబోలు అర్థరాత్రికి కొంచెం ముందుగా మెలకువ వచ్చింది. ఆపైన చెమట ఒకటి. ఆమె శరీరమంతా మట్టితో చేసినట్టు, పొరలు పొరలుగా పొడవుతూ, బురదగా కరిగిపోతూ. ఆమె దేహాన్నుండి కాలవలు కడుతున్న చెమటలో ఈదుతున్నట్లు అనిపించింది. చాలినంత ఊపిరి అందడం లేదు. మంచం మీదినుంచి దిగాను. ఆమె నిద్రిస్తూంది. ఆమె నోటినుంచి చావు గిలక చపుడు బుడబుడమంటూ వస్తూంది.

గాలికోసం బయటికి వెళ్ళినప్పటికీ ఎటు వెళ్ళినా వెంటాడుతున్నట్టున్న వేడినుంచి తప్పించుకోలేకపోయాను.

గాలి ఆడటం లేదు. గడ్డకట్టిన రాత్రి చిత్తకార్తె రోజుల్లో మండిపోతూ.

ఒక్క శ్వాస లేదు.వదిలిన గాలినే పీల్చాలి అది తప్పించుకునేలోగా చేతులు కప్పులాగా చేసి అడ్డం పెట్టుకుని. లోపలికీ, బయటికీ. గాలి క్రమంగా తగ్గుతూండడం తెలుస్తూంది…పల్చబడి చివరికి నావేళ్ళమధ్యనుండి పూర్తిగా తప్పించుకుని పోయింది.

ఎప్పటికీ.

నాతలపై నురగల మబ్బుల్లాంటివి సుళ్ళు తిరుగుతూన్నట్టూ, నురుగులు నన్ను కడిగాక చిక్కటి మబ్బుల్లోకి కూరుకుపోతున్నట్టూ గుర్తుంది. అదీ చివరికి కనిపించింది.

నువ్వు నీళ్లల్లో మునిగిపోయినట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నావా హువాన్ ప్రెసియాడో? పెద్ద బజారులో డోనిస్ ఇంటికి దూరంగా చూశాను నిన్ను. అతను కూడా నాతో ఉన్నాడు నువ్వు చనిపోయినట్టు నటిస్తున్నావని చెపుతూ. మేమిద్దరమూ నిన్ను ఆర్చీల నీడలోకి లాక్కెళ్ళాము. నువ్వప్పటికే భయంతో బిక్కచచ్చిన వాడిలా కట్టెలా బిర్రబిగిసి ఉన్నావు. నువ్వు చెప్తున్నట్టు ఆరాత్రి ఊపిరి పీల్చడానికి గాలి కూడా లేనట్లయితే నిన్ను పూడ్చిపెట్టడానికి కాదు, మోసుకుపోవడానికే శక్తి చాలేది కాదు మాకు. మరి చూశావుగా, పూడ్చిపెట్టామా లేదా?”

“నువ్వనేది నిజమే డొరోతియో! నీపేరు డొరోతియో అనేనా చెప్పావు?”

“తేడా ఏం పడదులే! నాపేరు డొరోతియా కానీ, తేడా ఏమీ పడదు.”

“నిజమే డొరోతియా! ఆ గొణుగుడికి చచ్చిపోయాననుకో!”

అక్కడ లోకంలో నేనన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన చోటు కనిపిస్తుంది. కలలు కనీ కనీ నేను చిక్కిపోయిన చోటు. మైదానాన్నుండి పైకి లేస్తూ నా ఊరు. జ్ఞాపకాల్తో నిండిన పిగ్గీ బేంక్ లాగా చెట్ల, ఆకుల నీడలు. అక్కడ ఒక మనిషి ఎందుకు కలకాలమూ జీవించాలనుకుంటాడో నీకే తెలుస్తుంది. ప్రత్యూషమూ, ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రీ: గాలిలో మార్పులు తప్పించి అలాగే ఉంటాయి ఎప్పుడూ. అక్కడ గాలిలో తేడా అన్నిటి రంగులూ మారుస్తుంది. జీవితం ఒక కాకలీధ్వనిలా మెత్తగా జారిపోతుందిజీవితపు స్వఛ్ఛమైన కాకలీధ్వని.

“అవును డొరోతియా, ఆ గొణుగుడుకి చచ్చిపోయాననుకో! నాభయాన్ని అదుపులో పెట్టుకోవాలనే చూశాను. కానీ లోపల్లోపల అది పెరిగిపోతూనే ఉంది. ఇక బిగపట్టుకోలేకపోయాను. ఆ గొణుగుడికి ఎదురు నిలిచేసరికి ఇక ఆనకట్ట బద్దలయింది.”

“నేను పెద్ద బజారుకు పోయాను. నువ్వు చెప్పింది నిజమే. జనాల సద్దు విని పోయాను. అక్కడ నిజంగానే జనాలు ఉన్నారనుకున్నాను. అప్పటికి నా బుద్ధి సరిగా పని చేయనట్లుంది. గోడల్ని తడుముకుంటూ చేతులతో నడుస్తున్నట్టు అక్కడికి చేరుకోవడం గుర్తుంది. ఆ గోడలు పగుళ్ళలోంచీ,చితికిపోతున్న సిమెంట్ లోంచీ గొంతుల్ని పీల్చుకున్నట్టు ఉన్నాయి. నేను విన్నాను. మనుషుల గొంతులు. చెవుల్లో రొద పెడుతున్నట్టు రహస్యపు గొంతులు ఏవో గుసగుసలాడుతున్నట్టు. గోడలనించి దూరంగా జరిగి వీధి మధ్యలో నడవసాగాను. అయినా ఇంకా వినిపించాయి. అవి నాతోటే వస్తున్నట్టు, నాముందో, కొద్దిగా వెనకో. నీకు చెప్పినట్టు అప్పుడింక వేడిగా లేదు. చల్లగా ఉంది. తన మంచం వాడుకోనిచ్చిన ఆమె ఇంటి దగ్గరనుంచి – నీకు చెప్పానే, ఆమె చెమటలో కరిగిపోయినట్టు – అప్పటినుంచీ నేను చల్లగా అయిపోయాను. దూరం వెళుతున్న కొద్దీ చలి పెరిగసాగింది. వొళ్ళంతా పులకలు. నాకు తిరిగి వెళ్ళాలనిపించింది. వెళితే నేను వదిలేసిన వేడి దొరుకుతుందనిపించింది. కానీ కొద్దిదూరం వెళ్ళాక అర్థమయిందేమిటంటే ఆ చలి నా వొంట్లోంచి, నా రక్తంలోంచే వస్తుందని. అప్పుడు తెలిసింది నేను భయపడుతున్నానని. పెద్దబజార్లో జనాల సవ్వడి విని అక్కడ జనమున్నారనీ భయాన్నుంచి తప్పించుకోవచ్చనీ అనుకున్నాను. అట్లా నీకు నేను పెద్దబజారులో కనిపించాను, అయితే డోనిస్ తిరిగి వచ్చాడా? అతను తిరిగి రాడని ఆమెకి గట్టి నమ్మకం.”

“నువ్వు కనపడేసరికి తెల్లవారింది. అతను ఎక్కడినుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను అడగలేదు.”

“సరే, పెద్దబజారు చేరుకున్నాను. ఆర్కేడ్ స్తంభానికి ఆనుకుని నిలుచున్నాను. అక్కడ ఎవరూ కనపడలేదు కానీ సంతనాడు జనాలు చేరితే వినిపించే రణగొణధ్వని వినిపిస్తూంది. ఆగకుండా మాటల్లేని చప్పుళ్ళు, చెట్టు కొమ్మల్లోంచి రాత్రిపూట గాలి వీచినట్టు. చెట్టూ కనపడదు, కొమ్మలూ కనపడవు కానీ గుసగుసలు వినిపిస్తాయే అట్లా. ఇంకో అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఆ గుసగుసలు దగ్గరికి వచ్చినట్టూ, తేనెటీగల రొద మల్లే నా చుట్టూ తిరుగుతున్నట్టూ అనిపించింది. చివరికి నాకు చప్పుడు లేని మాటలు వినిపించాయి “మా కోసం ప్రార్థించు!” అవే మాటలు నాకు వాళ్ళు చెపుతున్నవీ, నేను విన్నవీ. ఆక్షణంలో నా ఆత్మ గడ్డకట్టుకుపోయింది.అందుకే నీకు కనిపించినపుడు నేను చనిపోయి ఉన్నది.”

“ఇంటి దగ్గరే ఉంటే బాగుండేది కదా! ఇక్కడికెందుకు వచ్చావు?”

“నేను మొట్టమొదటే చెప్పాను. అందరూ మా నాన్న అని చెప్పే పేద్రో పారమొ ని వెతకడానికి వచ్చాను.ఆశే నన్ను లాక్కొచ్చింది ఇక్కడికి.”

“ఆశా? దానికి చాలా మూల్యం చెల్లించాలి నువ్వు. నా భ్రమలు నేను బతకవలసిన దానికంటే ఎక్కువకాలం బతికించాయి. నా కొడుకు కోసం నేను చెల్లించిన మూల్యం అదీ.అసలు ఒకరకంగా వాడు కూడా ఇంకో భ్రమ. ఎందుకంటే నాకు కొడుకనేవాడే లేడు. ఇప్పుడు చనిపోయాను కనక ఆలోచించడానికీ, అర్థం చేసుకోవడానికీ సమయం చిక్కింది. ఆ దేవుడు నాకు చిన్నగూడు కూడా ఇవ్వలేదు నా బిడ్డకి నీడనివ్వడానికి. కాళ్ళు ఈడ్చుకుంటూ దిక్కు తోచకుండా గడప గడపకీ తిరిగే అంతులేని జీవితమిచ్చాడు. వాళ్ళు దాచారా, వీళ్ళో.. వీళ్లు దాచారా నాబిడ్డను నాకు కాకుండా అని అనుమానంగా, ఏడుపు కళ్ళతో పక్క చూపులతో, ఎప్పుడూ మనుషుల్ని దాటి చూసుకుంటూ బతికాను. అసలిదంతా ఒక పాడు కల. తప్పు. రెండున్నాయి నాకు: అందులో ఒకదాన్ని మంచి కల అనీ రెండోది పాడు కల అనీ చెప్పుకుంటాను. మొదటిది నాకసలు కొడుకు ఉన్నట్టు కల కనేట్టు చేసింది. ఇక బతికి ఉన్నన్నాళ్ళూ అదే నిజమని నమ్ముతూ గడిపాను. నా వరాల తండ్రి బుల్లి నోటితో, కళ్లతో,చిట్టి చిట్టి చేతులతో నా చేతుల్లో ఉన్నట్టే అనిపించేది. చాలా చాలా కాలం దాకా వాడి కనురెప్పలూ, కొట్టుకునే గుండెకాయా నా చేతి వేళ్ళ చివరే ఉన్నట్టు అనిపించేది. అది నిజమని నేనెందుకనుకోను? నా పైశాలువాలోనే చుట్టుకుని నేనెక్కడికి వెళ్ళినా తీసుకు వెళ్ళేదాన్ని. ఒకరోజు వాణ్ణి పోగొట్టుకున్నాను. స్వర్గంలో వాళ్ళు పొరపాటు వాళ్ల వల్లే జరిగిందని చెప్పారు. నాకు గుండె తల్లిది ఇచ్చి కడుపు లంజది ఇచ్చారట. అది నా ఇంకో కల. నేను స్వర్గానికి వెళ్ళి అక్కడ దేవదూతల్లో నాకొడుకెవడో గుర్తుపట్టగలనేమోనని తొంగి చూశాను. లేదు. ఆ మొహాలన్నీ ఒకే మచ్చు లోంచి తీసినట్టు ఒకలాగే ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను. ఆ సాధువుల్లో ఒకరు నావద్దకు వచ్చి మైనపు ముద్దలో దూర్చినట్టు నా కడుపులోకి చేయి పెట్టాడు. చేయి బయటికి తీసినప్పుడు కాయపై పెంకు లాంటిదేదో నాకు చూపించాడు. ‘నేను నీకు ప్రదర్శిస్తున్నదానికి ఇదే ఋజువు.’

“అక్కడ వాళ్ళెంత వింతగా మాట్లాడతారో తెలుసా? కానీ వాళ్ళు చెప్పేది నీకు అర్థమవుతుంది. అది నా కడుపేననీ, తినడానికి ఏమీ లేక ఆకలికి ఎండిపోయిందనీ వాళ్ళకు చెప్దామనుకున్నాను కానీ ఇంకో సాధువు వచ్చి నా భుజాలు పట్టుకుని వాకిలి వైపు నెట్టాడు. ‘వెళ్ళి భూమ్మీద కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో బిడ్డా! సన్మార్గంలో బతికితే ప్రాయశ్చిత్త స్థలంలో గడిపే సమయం తగ్గుతుంది.’

“అది నా ‘పీడ కల ’. నాకసలు కొడుకే లేడని తెలిసిన కల. అది నాకు బాగా ఆలస్యంగా తెలిసింది, నా వొళ్ళంతా ముడుచుకు పోయి నా వెన్నెముక పైకి పొడుచుకు వచ్చి నేనిక నడవలేనప్పుడు. ఆపైన అందరూ ఊరు వదిలి వేరే ఎక్కడికో వెళుతున్నారు. చావు కోసం ఎదురు చూస్తూ నేను కూచున్నాను. నువు కనిపించాక ఇక నా అస్థులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాయి. ‘నన్నెవరూ పట్టించుకోరు,’ అనుకున్నాను. ‘నేనెవర్నీ ఇబ్బంది పెట్టను.’ చూడూ, నేను ఈ నేల మీద ఇంత చోటు కూడా దొంగిలించలేదు. నన్ను నీతో పాటు సమాధి చేశారు, నేను నీ చేతుల మధ్య ఖాళీలో ఇమిడిపోయాను. ఇప్పుడు నేను ఈ కొద్ది చోటులో ఉన్నాను. ఒకటే విషయం ఏమిటంటే నా చేతులు నీ చుట్టూ వేసి ఉండవలసింది. వింటున్నావా? పైన వాన పడుతూంది. వాన దరువు వినపడటం లేదా?”

“ఎవరో నడుస్తున్నట్టుగావినిపిస్తుంది నాకు.”

“నువు బెదిరిపోవలసిన పని లేదు. ఇప్పుడు నిన్నెవరూ భయపెట్టలేరు. మంచి ఆలోచనలు రానివ్వు, మనం ఈ నేలలో చాలా కాలం ఉండబోతున్నాం.”

pedro_paramo1

తెల్లవారేసరికి భారీ వర్షం పడుతోంది నేల మీద. చాలులో మెత్తటి మట్టి పైన పడి మందంగా చప్పుడవుతూంది. వనభూషణ పక్షి పొలం మీద కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పిల్లవాడి మొరననుకరిస్తూ ఏడ్చింది, కొంత దూరం పోయాక అలుపుతో వెక్కి వెక్కి ఏడ్చినట్టు పాడింది, ఇంకా దూరంగా తెరిపి పడుతున్న దిగంతాలలో వెక్కిళ్ళు పెట్టి, మళ్ళీ నవ్వి, ఇంకోసారి ఏడ్చింది.

తాజా నేల పరిమళాన్ని పీల్చుకుని ఫుల్గర్ సెడనొ బయటికి చూశాడు వాన చాళ్ళను ఎంతవరకు తడుపుతుందోనని. అతని కళ్ళు సంతోషంగా మెరిశాయి. అతను మూడు గుక్కలు లోతుగా పీల్చాడు ఆ వాసనను ఆస్వాదిస్తూ. పళ్ళు బయటికి కనపడేట్టు నవ్వాడు.

“ఓహో! ఈ ఏడూ బాగా పండేట్టు ఉంది.” ఆగి మళ్ళీ అన్నాడు “పడవే వానా బాగా పడు. ఇంక కురవలేనంతగా కురువు. అప్పుడు వెళ్ళిపో. గుర్తు పెట్టుకో, ఈ నేలంతా నీ ఆనందం కోసమే దున్ని ఉంచాం.”

 

పైకే పెద్దగా నవ్వాడు.

పొలాలన్నీ సర్వే చేసి వచ్చిన వనభూషణ పక్షి అతని మీదుగా ఎగిరిపోయింది గుండెలవిసిపోయేలా రోదిస్తూ.

వాన ఎక్కువయింది. దూరంగా వెలుతురు వచ్చిన చోట తిరిగి మబ్బులు కమ్ముకున్నాయి. పోతున్నదనుకున్న చీకటి తిరిగి వస్తున్నట్టుంది.

మెదియా లూనా పెద్ద తలుపు కీచుమంటూ తెరుచుకుంది తేమ గాలికి తడిసి. ముందు ఇద్దరు, తర్వాత ఇద్దరు, ఆ వెనక మరో ఇద్దరు, అట్లా రెండువందలమంది గుర్రాల మీద స్వారీ చేస్తూ వానకి తడిసిన పొలాల మీద చెల్లాచెదరయ్యారు.

“మనం ఎన్మెడియో మందని ఎస్తగువా ఉండే చోటు దాటి తోలాలి. ఎస్తగువా పశువుల్నేమో విల్మయో కొండల్లోకి తరమాలి.” ఫుల్గోర్ సెడానో ఆజ్ఞాపించాడు ఒక్కొక్కళ్ళూ దాటి పోతూ ఉంటే. “కదలండి, వాన దంచి కొట్టేటట్టుంది.”

అతను ఎన్నిసార్లు చెప్పాడంటే చివర వెళ్ళే వాళ్ళకు “ఇక్కడినుండి అక్కడికి, అక్కడి నుండి ఇంకా పైకి,” అని మాత్రమే వినిపించింది.

వాళ్లలో ప్రతి ఒకడూ తనటోపీ అంచు తాకాడు అర్థమయిందని సూచిస్తూ.

చివరివాడు వెళ్ళాడో లేదో మిగెల్ పారమొ గుర్రం మీద వేగంగా వచ్చి కళ్ళెం బిగించి నిలపకుండానే దాదాపు ఫుల్గోర్ మొహమ్మీదికి దూకేశాడు. గుర్రం జీనుతో సహా కొట్టానికి పోయింది.

“ఈ వేళప్పుడు ఎక్కడికి పోయావబ్బాయ్!”

“కొంచెం పాలు పితుకుతున్నా.”

“ఎవరివి?”

“నీకు తెలియదా?”

“ఆ డొరోతియా క్వర్రకా అయి ఉండాలి. పిల్లలంటే ఆమెకే అంత ఇష్టం ఈ చుట్టుపక్కల.”

“నువ్వు వెధవ్వి ఫుల్గోర్. అయినా అది నీ తప్పు కాదులే!”

గుర్రపుసవారీ చేస్తున్నప్పుడు కాళ్లకు కట్టుకునే ముళ్ళచక్రాల్ని తీయకుండానే మిగెల్ తనకు నాస్తా పెట్టడానికి ఎవరయినా కనపడతారేమోనని చూస్తూ పోయాడు.

వంటగదిలో డామియానా సిస్నెరోస్ అదే ప్రశ్న అడిగింది అతనిని.

“ఎక్కడికెళ్ళావు మిగెల్?”

“ఆఁ ఇక్కడనే. చుట్టుపక్కల తల్లుల్ని పలకరించి..”

“నీకు చిరాకు పుట్టించాలని కాదు మిగెల్! గుడ్లు ఎట్లా కావాలి?”

“పక్కన ఏదన్నా స్పెషల్ తో వడ్డిస్తావా?”

“నేను సీరియస్ గా చెపుతున్నాను మిగెల్!”

” నాకు తెలుసు డామియనా. కంగారు పడకు. అది సరే కానీ నీకు డొరోతియా అనే ఆమె తెలుసా? అందరూ క్వర్రకా అని పిలుస్తారు.”

“తెలుసు. నీకు ఆమెని చూడాలనిపిస్తే ఇక్కడే ఆ బయటే కనపడుతుంది. రోజూ పొద్దున్నే లేచి నాస్తా కోసం ఇక్కడికే వస్తుంది. ఒక మూటని శాలువాలో కప్పుకుని పిల్లాడని చెప్పుకుంటూ పాటలు పాడేది ఆమే. ఏదో ఘోరం జరిగి ఉండాలి ఎప్పుడో. ఆమె ఎప్పుడూ మాట్లాడదు కనక ఎవరికీ తెలియదు అదేమిటో. ఎవరన్నా దయదల్చి ఇచ్చిన వాటి మీద బతుకుతుంది.”

“ఆ ఫుల్గోర్ గాడు.. దిమ్మతిరిగేట్టు బాదుతా!”

అతను కూర్చుని కాసేపు ఆలోచించాడు ఆమె తనకెలా ఉపయోగపడుతుందో. తర్వాత అణుమాత్రమైనా సంశయించకుండా వంటగది వెనక తలుపు దగ్గరకు వెళ్ళి డొరోతియాని పిలిచాడు.

“ఒకసారి ఇటురా. నీతో ఒక మాట చెప్పాలి.”

ఆమెకేం చెప్పి ఏం బేరం కుదుర్చుకున్నాడో ఎవరికీ తెలియదు. అతను లోపలికి వచ్చినప్పుడు మాత్రం చేతులు రుద్దుకుంటూ ఉన్నాడు.

“ఆ గుడ్లు తీసుకురా!” డామియానాకి కేకేసి చెప్పాడు. “ఇకనుంచీ ఆమెకి నాకు పెట్టే తిండే పెట్టు. నీకు పని ఎక్కువయితే అయింది. అది నాకనవసరం.”

ఈలోగా ఫుల్గోర్ సెడానో గాదెల్లో ఇంకా ఎంత ధాన్యం మిగిలిందో చూడటానికి పోయాడు. కోతలకింకా చాలా కాలం ఉంది కాబట్టి తగ్గిపోతున్న నిలవల గురించి ఆందోళన చెందాడు. అసలు పంటలు పూర్తిగా వేయనే లేదింకా. “ఎట్లా సర్దుకు పోవాలో చూడాలి.” మళ్ళీ పైకే అన్నాడు. “ఏం పిల్లాడు? అచ్చం వాళ్ళ నాన్నే. కానీ అప్పుడే మొదలుపెడుతున్నాడు. ఈ లెక్కన చూస్తే ఎన్నాళ్ళో నిలిచేట్టు లేడు. ఈయనికి చెప్పడం మరిచేపోయాను నిన్నొకడు వచ్చి ఇతనెవరినో చంపాడన్న విషయం చెప్పినట్టు. ఈ లెక్కన ..”

నిట్టూర్చి, ఈ పాటికి జీతగాళ్ళు ఎక్కడి దాకా పోయుంటారో ఊహించడానికి ప్రయత్నించాడు. కానీ చిక్కంతో దడిని రాస్తూ ఉన్న మిగెల్ గుర్రం అతని ఆలోచనల్ని భగ్నం చేసింది. “దాని జీనుని కూడా తీయలేదు.” అనుకున్నాడు. “తీయాలన్న ధ్యాసే లేదు. డాన్ పేద్రో ఇంకా నయం. ఆయన కాస్త స్థిమితంగా ఉండే సమయాలన్నా ఉంటాయి. కానీ మిగెల్ ఆటలన్నీ సాగనిస్తాడు. కొడుకేం చేశాడో నిన్న చెప్పినప్పుడు అతను ” అది నేను చేసినట్టే అనుకో ఫుల్గోర్! వాడు అట్లాంటి పని చేసి ఉండడు. ఒక మనిషిని చంపేంత దమ్ము లేదు వాడికి. దానికి ఇంత గుండె కావాలి.” అని ఒక పెద్ద గుమ్మడికాయను చూపిస్తున్నట్టు చేతులు ఎడంగా సాచాడు. “వాడేం చేసినా నాదీ పూచీ.”

“మిగెల్ నీకు తలనెప్పులు తెచ్చిపెడతాడు డాన్ పేద్రో. గొడవలకు ఎప్పుడూ ముందుంటాడు”

“కాస్త వదిలెయ్! ఇంకా పిల్లాడు. ఎన్నేళ్ళున్నాయి వాడికి. పదిహేడేగా వచ్చింది ఫుల్గోర్?”

“అంతే! నిన్న కాక మొన్నే తనని తీసుకు వచ్చినట్టుంది. నాకు గుర్తే. కానీ పట్టపగ్గాలు లేకుండా తిరుగుతున్నాడు. కాలంతో పందెం పెట్టుకున్నంత దూకుడుగా బతుకుతున్నాడు. ఎప్పుడో ఓడిపోక తప్పదు. చూస్తావుగా!”

“ఇంకా పసివాడే ఫుల్గోర్!”

“నువ్వు చెప్తే సరే డాన్ పేద్రో! కానీ తన భర్తని నీ కొడుకే చంపాడని నిన్న ఏడుస్తూ వచ్చిన ఆమెని ఆపలేకపోయాము. బాధను అంచనా వేయడం నాకు తెలుసు డాన్ పేద్రో, ఆమెది మామూలు దుఃఖం కాదు. ఈ విషయాన్ని వదిలెయ్యమని నూటా యాభై బస్తాల మొక్కజొన్నలు ఇస్తానని చెప్పినా ఒప్పుకోలేదు. ఎలాగో ఒకలా విషయాన్ని సరి చేస్తానని మాట ఇచ్చాను. అయినా తృప్తి చెందలేదు.”

“ఏమిటంట సంగతి?”

“ఏమో, అందులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు.”

“అంత ఆందోళన చెందవలసిందేమీ లేదు ఫుల్గోర్! వీళ్లని లెక్క చేయాల్సిన పని లేదు.”

ఫుల్గోర్ గాదెల దగ్గరకు వెళ్ళాడు. మొక్కజొన్నల వేడి తెలుస్తూంది. గుప్పిట నిండా తీసుకుని పురుగేమన్నా పట్టిందేమోనని పరీక్షగా చూశాడు. ఎంత ఎత్తువరకు గింజలున్నాయో కొలిచాడు. “సరిపోతాయిలే. కొంచెం గడ్డి మొలకలేస్తే పశువులకి గింజలు తినిపించక్కర్లేదు. కాస్త ఎక్కువగానే ఉన్నట్టు లెక్క.”

వెనక్కి వెళుతున్నప్పుడు పైన మబ్బులు పట్టిన ఆకాశం వంక చూశాడు. “వాన చాలాసేపే పడేట్టుంది.” ఇక మిగతావన్నీ మరిచి పోయాడు.

పైన వాతావరణం మారుతున్నట్టుంది. వాన పడగానే కాంతీ, మొలకెత్తుతున్నవాటినుంచి పచ్చటి వాసనా అంతటా నిండుతాయని మా అమ్మ చెపుతుండేది. మబ్బులు అలలుగా ఎట్లా తేలుతూ వస్తాయో, ఎట్లా తమను తాము నేలమీదికి ఖాళీ చేసుకుని, దానికి రంగులన్నీ అద్ది మార్చేశాయో చెప్పేది. మా అమ్మ తన బాల్యమూ, యౌవన ప్రారంభకాలమూ ఈ ఊర్లోనే గడిపింది. కానీ తిరిగి చనిపోవడానికి కూడా రాలేకపోయింది. అందుకే తన స్థానంలో నన్ను పంపింది. వింతగా ఉంది డొరోతియా, నేను ఆకాశాన్నే చూడలేదు. కనీసం అది ఆమె ఎరిగిన ఆకాశం అయ్యుండేది”

“నాకు తెలియదు హువాన్ ప్రెసియాడో! తల ఎత్తకుండా ఇన్నేళ్ళు గడిపాక నేను ఆకాశం గురించే మరిచిపోయాను. పైకి చూసినా వొరిగేదేముంది? ఆకాశమేమో అంత ఎత్తున ఉంది. నాకళ్ళు మసకలు కమ్మాయి. నేల ఎక్కడుందో తెలిస్తే అదే సంతోషం. అదీ కాక ఫాదర్ రెంటెరియా నాకు దైవకృప అందదని చెప్పినప్పుడే ఆసక్తి చచ్చిపోయింది. కనీసం దూరాన్నుంచి చూడటానికయినా.. అంతా నా పాపాల వల్లనే. కానీ అది నాకు ఆయన చెప్పాలా? బతుకులో ఉన్న కష్టాలు చాలకనా? చచ్చాక ఈ కట్టె నుంచి పైకి తీసుకువెళతారన్న ఆశే ముందుకు నడవడానికి ఆధారం. కానీ వాళ్ళు నీకు ఒక తలుపు మూశాక తెరిచి ఉన్న ఒకే ఒక్క తలుపూ నరకానికే అని తెలిస్తే అసలు జన్మ ఎత్తకపోవడమే మంచిదనిపించదా? మా మటుకు మాకు ఇదే, ఇక్కడే స్వర్గం హువాన్ ప్రెసియాడో!”

“మరి నీ ఆత్మ? అదెక్కడికి పోయి ఉంటుందంటావు?”

“మిగతా వాటిలాగే తిరుగుతూ ఉందేమో తన కోసం ప్రార్థిస్తారని బతికినవాళ్ల కోసం వెతుక్కుంటూ. సరిగ్గా చూసుకోనందుకు నా మీద అసహ్యమేమో! కానీ దాని గురించి నేనిప్పిప్పుడు పట్టించుకోను. పశ్చాత్తాపం గురించి దాని రోదన నేను విననక్కరలేదు. దాని వల్ల తిన్నది కాస్తా నోట్లోనే చేదయ్యేది. పాపిష్టి వాళ్ళ పీడ తలపులతో రాత్రిళ్ళు వెంటాడేది. చద్దామని కూచుంటే లేచి ఎట్లాగో బతుకునీడ్చమని మొరపెట్టేది.అక్కడికి ఏదో మహత్యం జరిగి నా పాపాలన్నీ పరిశుభ్రమవుతాయేమోనని ఆశేమో దానికి. నేనసలు ప్రయత్నించను కూడా లేదు. ‘ఇక ముందుకు దారి లేదు,’ నేను దానికి చెప్పాను. ‘ఇంకా ముందుకు వెళ్ళేందుకు చాలినంత శక్తి నా వద్ద లేదు.’ అది పారిపోవడానికి నా నోరు తెరిచాను. అది వెళ్ళిపోయింది. దాన్ని నాగుండెకు బంధించిన నెత్తుటి పోగు నాచేతుల్లో పడ్డప్పుడే నాకు తెలిసిపోయింది.”

(సశేషం)