సంకలనాలే ప్రమాణం కాదు : మధురాంతకం నరేంద్ర

 

1) 2016 లో వచ్చిన కథలు:-

పన్నెండేళ్ళపాటూ వార్షిక కథల్ని చదివిన అనుభవంతో చాలాకాలంగా సీరియస్‌గా చదువుతున్న పత్రికలు కొన్నే! మిగిలిన పత్రికలని చదవకపోయినా మంచి కథల్ని చదవకుండాపోయే ప్రమాదముండదని అనుభవంద్వారా నేర్చుకున్న పాఠం.

చదువుతున్న పత్రికలు:-

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం

పాలపిట్ట

చినుకు

యివిగాకుండా గతంలో మంచి కథల్ని జారిపోకుండా జాగ్రత్తపడటం కోసం మరికొన్ని పత్రికల్ని కూడ చదివేవాణ్ణి. యిప్పుడా అవసరం లేదు. “సాక్షి” ఆదివారం అనుబంధాల్లో కథలకిచ్చే ప్రాముఖ్యత బాగా తగ్గిపోవడంతో దాన్నీ చూడాల్సిన అవసరం తప్పిపోయింది. పైగా వాళ్ళు గొప్ప తెలుగు కథల్ని సంక్షిప్తీకరించి ప్రచురించే నేరాన్ని గూడా చేశారు. యిప్పుడు మామూలు పాఠకుడిగా చదివే అవకాశం దొరికింది. అందువల్ల గుర్తున్న కథల్ని గురించి మాత్రమే చెప్పగలను. వస్తుపరంగా చూసినప్పుడు పర్వాలేదనే చెప్పొచ్చు. కానీ శిల్పపరంగా అంటే యేం చెప్పాలి? “వస్తువే శిల్పాన్ని ఎన్నుకుంటుంది” అనేది పాతబడిన మాటే అయినా గుర్తుంచుకోవల్సింది గూడా! అయితే జీవితపు సంక్లిష్టతల్ని వివరించే వస్తువుల్ని యెన్నుకోవడానికీ, వాటిని అవసరమైన శిల్పరీతుల్లో ఆవిష్కరించడానికీ అనుకూలమైన పరిస్థితులు లేవు.

2015లో O’Henry Prize Storiesలో దాదాపు 80పేజీల కథ వచ్చింది. తెలుగులో యిప్పుడు 10పేజీల కథను పత్రిక లేనేలేదు (పాలపిట్ట, చినుకు మినహా). యీ ప్రమాదం నుంచీ రచయితల్ని కాపాడింది మాత్రం వెబ్ పత్రికలే! రెండు మూడు సంవత్సరాలుగా వెబ్ పత్రికలు (సారంగ, వాకిలి, విహంగ వంటివి) రావడంతో పరిస్థితి మెరుగుపడింది. అయితే యీ పత్రికలు మామూలు పత్రికల్లాగా సమయానికి తప్పకుండా వస్తున్నాయో లేదో తెలియదు. యీ పత్రికలన్నింటికి కలిపి వొక Web Index లాంటిది తయారై, అది facebookలాంటి చోట ప్రకటించబడుతూ వుంటే నాలాంటి పాఠకుడికి సౌలభ్యంగా వుంటుంది.

2) 2016లో నేను విడవకుండా చదివింది, లేక చదవడానికి ప్రయత్నించిందీ “ఆంధ్రప్రదేశ్” పత్రికనే! నాకు గుర్తున్న కథలన్నీ దాన్లోంచే వచ్చాయి. ఫిభ్రవరినెలలో రాణి శివశంకర శర్మ “ప్రొఫెసర్ అంతరంగం” అనే కథ రాశాడు. అలీగరీగా చెప్పదలచుకున్న అంశాన్ని బాగా చెప్పాడు. అయితే Browning ప్రసిద్ద కవిత, డ్రమటిక్ మొనలాగ్ “My Last Duchess” ప్రతిధ్వనులు వినిపించాయి. యేప్రెల్‌లో శ్రీవల్లీ రాధిక రాసిన “నాన్న దగ్గరికి” Mythను సమకాలీనంగా మలిచిన కథ.రచయిత్రికి సంప్రదాయంపైన వున్న ప్రగాడమైన విశ్వాసం, ఆస్తిక ధోరణీ కథ సగానికి చేరేసరికి ముందేం జరుగుతుందో, పాత్రలెవరో తేల్చేశాయి. ఆ suspenseను చివరివరకూ సాగనివ్వలేదామె. రచయిత్రి విశ్వాసాలతో పాఠకుడికి పని లేనప్పుడు కథ తేలిపోతుంది. విశ్వాసం వున్నప్పుడు పాఠకుడికి పరవశం కలుగుతుంది. రెండు విధాలా కథకు దెబ్బే తగులుతుంది.

మన్నం సింధుమాధురి డిసెంబరులో “తూరుపు కొండ” అనే చాలా మంచి కథ రాశారు. ఆవిడదైన శైలి యీ కథకు బాగా నప్పడంతోనూ, నిపుణతతో వాడిన శిల్పంతోనూ యీ కథ చాలా బాగా వచ్చింది. యీ కథలన్నింటినీ ప్రచురించడానికి దాని సంపాదకుడైన “నరేష్ నున్నా”ను అభినందించాలి. మంచి సంపాదకుల కొరత వల్లే మంచి కథలు రావడంలేదని గూడా గుర్తించాలి. పట్టుదలతోనూ, అభిరుచితోనూ కృషి చేస్తే మంచి కథానికల్ని రాయించి, ప్రచురించవచ్చునని ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులు నిరూపించి చూపెట్టారు. అలాగే “సారంగ” పత్రిక గూడా. సారంగలో వచ్చినవన్నీ సీరియస్ కథలే! అయితే కొన్ని మాత్రమే గుర్తున్నాయి.

యివిగాకుండా యీ యేడాదిలో చదివిన కథల్లో నాకు గుర్తున్న కథ, ఖదీర్ బాబు రాసిన “తేగలు”. మెట్రోకథల చట్రంలోకి యీ కథను దూర్చకపోవడంతోనే యిది మంచి కథయ్యింది. అయితే కథను చెబుతున్న వ్యక్తి భార్యపాత్ర చిత్రణలో కొంత వైరుధ్యం కనపడింది.

కథాసారంగలో వచ్చిన సింధుమాధురి గారి కథ “డేవిడ్” పెద్ద Romantic artificial కథగా తయారయ్యింది.

యిటీవలికాలంలో యువ రచయితలూ, రచయిత్రులూ ధైర్యంగా స్త్రీపురుష సంబంధాలను చిత్రిస్తున్నారుగానీ, యిందులో అనవసరపు అనౌచిత్యపు ధోరణులుండడం మంచి ధోరణి గాదు. సత్యం చెప్పడానికీ, extremities చెప్పడానికీ మధ్యనున్న తేడాను గుర్తించాలి.

బూతులు వాడటమే మాండలికమన్న అభిప్రాయమొకటి బలపడింది. నిజజీవితంలో వాడని బూతుల్నిగూడా కథలోకి జొప్పించి, cheap popularityకి పాకులాడడం గూడా జరుగుతోంది. కథకెంత అవసరమో అంత మోతాదులోనే యేదైనా వాడచ్చు. కానీ ఆ మోతాదు శృతిమించడం సంస్కారం గాదు. సాహిత్యం మానవుడి సంస్కారాన్ని పెంచేదిగానే వుండాలి.

3) యీ ప్రశ్నకు జవాబివ్వతగ్గంతగా నేను కథలన్నింటినీ చదవలేదు.

4) వొక ప్రక్రియగా తెలుగు కథ అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకుందా లేదా తెలుసుకోవాలంటే సమకాలీన విదేశీ సాహిత్యాన్ని గూడా చదవాలి. అందుబాటులో వున్న విదేశీకథల సంకలనాలు కొన్నే! వాటితో పోల్చి చూసినప్పుడు మనకథకు యెదగడానికి వీలయిన పరిస్థితులు లేవు.

యిన్ని మార్పులు వచ్చినా తమిళంలోనూ, కన్నడంలోనూ, మళయాళంలోనూ, ఒడిస్సాలోనూ సాహిత్య పత్రికలు కొన్ని వుండనే వున్నాయి. పాఠకులూ వున్నారు. కానీ తెలుగులో పత్రికలూ లేవు. మంచి పాథకుల సంఖ్యా క్రమంగా తగ్గిపోతోంది.

మిగిలిన భారతీయ భాషలతో పోలిస్తే కమర్షియల్ సినిమా వ్యాపారం పెచ్చుపెరిగి పోవడమూ, సాహిత్యం పట్ల అనురక్తి తగ్గడమూ గమనించాల్సిన విషయం.

5) —-

6/7) కథావార్షికను 12సంవత్సరాల పాటూ ప్రచురించిన తర్వాత ఆపేశాను. యిందుకున్న కారణాల్ని గురించి సావధానంగా చెప్పాలి. దానిక్కాస్తా సమయం కావాలి. తరువాతెప్పుడైనా…

2016లో వచ్చిన కథ, ప్రాతినిథ్య సంకలనాలు సగం సగం చదివాను. కొన్ని కథలు బావున్నాయి. కొన్ని నచ్చలేదు.

యిలాంటి సంకలనాలు అన్ని పత్రికలూ చదవలేని పాఠకులకు బాగా వుపయోగపడతాయి. అయితే యీ సంకలనాలలోకి రాకుండాపోయిన మంచి కథల గురించే బాధంతా! యీ సంకలనాల ఆధారంగా అటువంటి మంచి కథల గురించి శోధన, చర్చ జరగడమే లేదు. అదొక గొప్ప విషాదం. మంచి కథలు వేయడం వల్ల వార్షిక సంకలనాలకు గౌరవం చేకూరుతుంది గానీ, వాటిలో వచ్చిన అన్ని కథలూ మంచివి కాలేవు. యిదంతా పెద్ద సాపేక్షికమైన వ్యవహారం.

వార్షిక కథాసంకలనాలు కథానికా ప్రక్రియ పెరుగుదలకు దోహదం చేయడంలో అనుమానమే గానీ, పాఠకుల దృష్ట్యా మాత్రం మంచే చేస్తున్నాయి, కొంతవరకూ… యీ ప్రయాణం సాగాలి యిలాగే… పరిపూర్ణత అన్నది సాపేక్షికమూ, అసాధ్యమూ అయినా దానికోసం చేసే కృషే సాహిత్యపు భూమిక అని గుర్తుంచుకోవాలి.

*

మధురాంతకం నరేంద్ర

మీ మాటలు

  1. “యిటీవలికాలంలో యువ రచయితలూ, రచయిత్రులూ ధైర్యంగా స్త్రీపురుష సంబంధాలను చిత్రిస్తున్నారుగానీ, యిందులో అనవసరపు అనౌచిత్యపు ధోరణులుండడం మంచి ధోరణి గాదు. …..
    బూతులు వాడటమే మాండలికమన్న అభిప్రాయమొకటి బలపడింది. నిజజీవితంలో వాడని బూతుల్నిగూడా కథలోకి జొప్పించి, చేప్ పొపులరిత్య్కి పాకులాడడం గూడా జరుగుతోంది. ……సాహిత్యం మానవుడి సంస్కారాన్ని పెంచేదిగానే వుండాలి.”

    మీ పై మాటలకి చప్పట్లు!

  2. “సత్యం చెప్పడానికీ, extremities చెప్పడానికీ మధ్యనున్న తేడాను గుర్తించాలి.”

    మహాసున్నితమైన ఈ తేడా ఎందరి కళ్ళకు కనబడుతుంది? :)

  3. Sujatha Bedadakota (సుజాత ) says:

    నరేంద్ర గారూ, మహేంద్ర గారి పుస్తకమ గురించి మీకు ఫోన్ చేసినపుడు ఈ వ్యాసంలోని విషయాలు మన సంభాషణలో ప్రస్తావనకు వచ్చాయి. మీ అభిప్రాయాలూ, పరిశీలనా చాలా నిశితంగా ఉన్నాయి.

    బూతులు వాడటమే మాండలికమన్న అభిప్రాయమొకటి బలపడింది. నిజజీవితంలో వాడని బూతుల్నిగూడా కథలోకి జొప్పించి, చీప్ పాపులారిటీ కోసం పాకులాడడం గూడా జరుగుతోంది

    సత్యం చెప్పడానికీ, ఎక్సట్రీమిటిఎస్ చెప్పడానికీ మధ్యనున్న తేడాను గుర్తించాలి.

    సంకలనాల ఆధారంగా అటువంటి మంచి కథల గురించి శోధన, చర్చ జరగడమే లేదు. అదొక గొప్ప విషాదం. మంచి కథలు వేయడం వల్ల వార్షిక సంకలనాలకు గౌరవం చేకూరుతుంది గానీ, వాటిలో వచ్చిన అన్ని కథలూ మంచివి కాలేవు.

    ఈ లైన్లు మళ్ళీ మళ్ళీ చదవదగ్గవిగా, సీరియస్ గా పాటించదగ్గవి గా ఉన్నాయి

  4. I am little bit surprised to know that even a prolific writer and commentaar like you is not reading magazine like Arunatara. One of the best magazines a stage for all kinds writers though it is a revolutionary magazine. I requet you to read Arunatara.

    • madhurantakam narendra says:

      సారీ మహమూద్ గారూ,
      అరుణతార, ప్రజాశక్తి పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాను.
      లేదంటే పాపులర్ సాహిత్యం గురించి మాట్టాడుతూ వాటిని పేర్కొనడం మరచాను. బహుశా ఆ సందర్భం లో అవి గుర్తురాకపోవడానికి వాటిపైన వున్నా గౌరవమే కారణమయి ఉండాలి.

మీ మాటలు

*