పరిచిత అపరిచితుడు

 

-పూడూరి రాజిరెడ్డి

~

rajireddi-1అతడిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. నిజానికి, ‘మొదటిసారి’ అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆ పరిచయం ఎంతో కొంత సాన్నిహిత్యానికి దారి తీసినప్పుడు కదా! కానీ ఇక్కడ సాన్నిహిత్యం అటుండనీ, కనీస పరిచయం కూడా లేదు. కాకపోతే ఎక్కువసార్లు తటస్థపడుతున్న వ్యక్తిగా ఇతడు నాకు ‘పరిచయం’. అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసేవుంటాను! కానీ, ఏదో ఒక ‘చూపు’లో- ‘ఈయన్ని నేను ఇంతకుముందు కూడా చూశాను,’ అని గుర్తు తెచ్చుకున్నాను.

అతడు మా కాలనీకి ఎగువవైపు ఉంటాడనుకుంటాను. నేను పొద్దున పిల్లల్ని స్కూలుకు తోలుకు పోయే సమయంలో, అతడు మెయిన్ రోడ్డు ఎక్కడానికి అడ్డరోడ్డు దాటాలి గనక, అలా దాటుతూ ఎదురుపడతాడు. ఒక్కోసారి నేను పిల్లల్ని స్కూల్లో ‘పడగొట్టాక’- తిరిగి మూలమలుపు తిరుగుతున్నప్పుడు, అతడు ఏటవాలు రోడ్డు మీద నడుస్తూ వస్తూంటాడు. ఆ జారుడు మీద కాలిని అదిమిపట్టడానికి వీలుగా మోకాళ్లను కాస్త వంచి నడవడం నాకు తెలుస్తూవుంటుంది.

అతడిది అటూయిటూగా నా వయసే అని సులభంగానే అర్థమవుతుంది. టక్ చేసుకుంటాడు. షూ వేసుకుంటాడు. ఇవి రెండూ నేను కొన్ని ‘సిద్ధాంత కారణాల’ వల్ల వదులుకున్నవి! సిద్ధాంత కారణాలు అంటే, మరీ గంభీరమైనవేం కావు. టక్ చేసుకున్నప్పుడు నా పృష్టభాగపు ఉనికి వెనకవారికి ఇట్టే తెలిసిపోతుందని నాకు తెలియడం; కాలికి రిలీఫ్ ఇవ్వగలిగే పనిలో ఉన్నవాడికి- షూ అనవసరపు ఉక్క అని అర్థం కావడం!

అతడు కూడా నాలాగే వేగంగా నడుస్తాడు. దాదాపుగా ప్రతిసారీ చేతిలో లంచ్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి, అతడు ఏ ఆఫీసుకో వెళ్తూవుండాలి!

ఈ ఆఫీసు ఆహార్యంలో కాకుండా, కొంత ‘స్పోర్టీ’గా అతడు ఒకట్రెండు సార్లు కాలనీలో ఉన్న చిన్న పార్కులో దాదాపుగా చీకటి పడే వేళలో ఎదురుపడ్డాడు. అప్పుడు అర్థమయ్యిందేమిటంటే, అతడికి పెళ్లయిందీ, నాలాగే ఇద్దరు పిల్లలూ! కాకపోతే ఇద్దరూ అబ్బాయిలే కాదు; ఒక పాప, ఒక బాబు.

ఇంకొకసారి, వచ్చిన అతిథిని కావొచ్చు, సాగనంపుతూ ఎదురయ్యాడు.

ఇన్నిసార్లలో ఏ కొన్నిసార్లయినా అతడి గమనింపులోకి నేను వెళ్లివుంటానని నాకు అర్థమవుతోంది. అయినా మేము పరిచయం కాబడటానికి ఇంకా ఏదో కావాలి. లేదా, మాకు పూర్తి భిన్నమైన స్థలంలో ఎదురుపడటమో జరగాలి. విచిత్రంగా, రెండు తెల్ల బొచ్చు కుక్కపిల్లలతో ఇలానే తరచూ ఎదురుపడే తెల్లజుట్టు పెద్దమనిషితో కూడా నాకు ఏ పరిచయమూ లేదు; కానీ కొన్నిసార్ల తటస్థత తర్వాత ఒక పలకరింపు నవ్వు అలవాటైపోయింది. బహుశా, పిల్లలు నా పక్కనుండటం ‘తాత’ వయసు ఆయనకు ఆ నవ్వును సలభతరం చేసివుంటుంది.  కానీ ‘అతడు’ దీనికి భిన్నం. అతడు నా ఈడువాడు. ఇంకా చెప్పాలంటే, దేనికోసమో తెలియని పోటీదారు!

కొంతకాలానికి అతడు నడకలో ఎదురుపడటం పోయి, బండిమీద కనబడటం మొదలైంది. బ్లాక్ రోడియో తీసుకున్నట్టు అర్థమైంది. దుమ్ము నుంచి రక్షణగా కావొచ్చు, నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇక్కడొక అపనమ్మకంగా కనబడే విషయం చెప్పాలి. ‘చూశావా, నేను బండి తీసుకున్నాను,’ అని చెప్పీ చెప్పనిదేదో, ఇంకా చెప్పాలంటే, నాపైన అతణ్ని ఒక పెమైట్టు మీద ఉంచుతున్న చిరుస్పర్థ లాంటిదేదో అతడు అనుభవిస్తున్నాడేమోనని నేను నిజంగా ఫీలయ్యాను. అదే అతణ్ని ‘పరిచిత’ అపరిచితుడిగా నిలబెడుతోంది.

దీనికి ముగింపేమిటో నాకు తెలియదు. ఈ పరిచయం ఎటో దారి తీయాలని నేనేమీ ప్రత్యేకంగా కోరుకోవడం లేదు. కానీ ఎటు దారితీస్తుందో చూడాలన్న కుతూహలం మాత్రం ఉంది.

* * *

నిజానికి మొదలుపెట్టిన అంశం పైనే ముగిసిపోయింది. కానీ ఇది ఊరికే అపరిచిత్వం భావనకు కొంచెం కొనసాగింపు. అది ఇంకా ఎన్ని రకాలుగా ఉండగలదు! మా ఎదురుగా ఉండే ఇంటిని కూల్చి, అపార్ట్‌మెంట్ కట్టారు. ముందుగా కనబడే వాచ్‌మన్ తప్ప, లోపల ఎవరుంటారో నాకు తెలియదు.

అంతెందుకు, మా ఆఫీసులో పనిచేసేవాళ్లు అనేది చాలా పెద్ద మాట, మా ఫ్లోర్లోనే ఉత్తరం వైపు పని చేసేవాళ్లలో చాలామంది నాకు తెలియదు. అంటే, ముఖాలుగా తెలుస్తారు; కానీ, ఆలోచనలుగా తెలియరు.

చూడండి గమ్మత్తు! ఎక్కడో ప్రారంభమై, ఎక్కడో చదివి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు మారి, తీరా ఒకే సంస్థలో ఒకే లిఫ్టు బటన్ నొక్కడమనే ఉమ్మడితనంలోకి ప్రవేశిస్తాం. అయినా అపరిచితులుగానే ఉండిపోతాం. బహుశా పండగల పరంగానో, సినిమాల పరంగానో, పుస్తకాల పరంగానో, రాజకీయాల పరంగానో, భావజాలాల పరంగానో ఏదో ఉమ్మడితనం అనుభవిస్తూనే ఉంటాం కావొచ్చు; అయినా అనుభవిస్తున్నట్టుగా తెలియకుండానే ఉండిపోతాం. అదే కదా పరిచయం కావడానికీ కాకపోవడానికీ మధ్య తేడా!

*

రెండు దమ్ములు

పూడూరి రాజిరెడ్డి

 

rajireddi-1నా కుతూహలానికి ఫలితం ఇవ్వాళ అనుభవించబోతున్నాను.

‘అన్నా, నైట్ ప్లాన్ ఏంటి? అక్కాపిల్లలు ఊళ్లో ఉన్నరా?’ అప్పుడెప్పుడో అనుకున్నది…’ పొద్దున్నే వంశీ నుంచి మెసేజ్.

ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. వేసవి సెలవులు కదా ఊరెళ్లారు. ఏ అజ్ఞాతస్థలంలోనో చేయాల్సివచ్చేది ఇంట్లోనే పెట్టుకోవచ్చు! ‘పక్కోళ్లు గుర్తుపట్టరు కదా!’

ఆఫీసు పనిలో మునిగిపోయినా, ఒకట్రెండు సార్లు రాత్రి జరగబోయేది చప్పున గుర్తొచ్చింది. ‘ఇవ్వాళ చారిత్రక దినం అవుతుంది నా ఆత్మకథలో’.

వంశీ పడుకోవడానికి సిద్ధపడి వస్తానన్నాడు కాబట్టి, సాయంత్రం వెళ్లాక అన్నం, టమోటపప్పు వండాను. గెస్టు కదా, వేడివేడిగా ఆమ్లెట్లు వేయడానికి సిద్ధంగా అరడజను గుడ్లు కూడా కొనిపెట్టాను. స్నానం చేసి వచ్చేలోగా మిస్డ్ కాల్.

“అన్నా, జీతూ ముందటున్న. బీర్లేమైన తేవాన్న?”

‘బీర్లా? అసలు విషయం ఉందా మనవాడి దగ్గర?’

“రెండు లైట్ బీర్లు తీస్కొ”

“సిగరెట్స్?”

ఇవా మనం కాల్చేది! ‘ఉత్తగనే ఊరియ్యలేదు గదా నన్ను’.

“కింగ్స్ తే”

“లైట్సేనా?”

“రెగ్యులర్”

గిన్నెలు, గ్లాసులు అన్నీ ముందరపెట్టుకుని, చాపలో కొంత చంద్రుడు కనబడేలా కూర్చున్నాక, ఎక్కువ సస్పెన్సులో ఉంచకుండానే పొట్లం బయటికి తీశాడు. దళసరి కాగితంలో చుట్టిన మరో కాగితం. ఆకుపచ్చటి ఎండు ఆకులు!

“వాసన జూడు”

నా ముక్కు బలహీనం. ఏమీ తెలియలేదు.

“ఇది రా అన్న”

“ఏడ సంపాయించినవ్?”

“ధూల్ పేట్. ఇంతకుముందు వందకు ఇంత పెట్టెటోడు. ఇప్పుడు మినిమమ్ మూడు వందలు జేసిండు.”

రెండు బీర్లు, నాలుగు సిగరెట్లు అయ్యాక, చెప్పాడు కవిసోదరుడు: “ఒక మహత్తర కార్యానికి దేహాన్ని సంసిద్ధపరచాలంటే ఇవన్నీ గావాలె. లేకపోతే ఆ మూడ్లోకి పోలేం.”

‘అసలు ఇదే ఏమైనా ఎక్కివుంటే, దాని పాలు ఎలా తెలుస్తుంది?’

“అన్నం ముందు తినేద్దామాన్నా”

“తర్వాత్తిందాం తియ్ ఏంది?”

“తర్వాత ఏ ప్లేన్లో ఉంటమో!”

‘ఇది మరీ అతిశయం’!

అంచనా ఘోరంగా తప్పడం అంటే ఇదే! ఒక విషయం వినడానికీ, అనుభవంలోకి రావడానికీ మధ్య ఊహించలేనంత అంతరం!

 

ఫస్ట్ రౌండ్:

సిగరెట్ లోని పొగాకును వేలితో సుతారంగా మీటినట్టు కిందకు రాల్చేసి, గింజల్ని పక్కకు ఏరేస్తూ ఆకుల్ని అరచేతిలో పొడిగా చేసి, ఆ పొడిని సిగరెట్లోకి బదలాయించి, కొసను దగ్గరగా ఒత్తడం ద్వారా మూతి బిగించిన తర్వాత-

“అన్నా, జాయింట్”

మామూలుగా అగ్గిపుల్ల గీకి అంటించడమే! గట్టిగా లాగాలి. ఏమీ రావట్లేదు. పొగ పీల్చినట్టు కూడా అనిపించదే!

నేను తాగుతున్నానా! ఇది నాకు తాగడం వచ్చా? ఏమీ కాదేంటి?

కటిక చేదు మాత్రం పెదాలకు తెలుస్తోంది. ‘ఛీ’!

అంతే, పెద్ద మార్పు లేదు. ఓస్ ఇంతేనా! ఇది నన్నేమీ చేయదు. మామూలుగానే ఉంది. నేను మామూలుగానే ఉన్నా. అందరినీ అన్నీ కదిలించలేవేమో! నేను సరిగానే పీల్చానా?

లేదు, నేను గట్టివాణ్ని. ఊరికే చెబుతారంతే. నన్ను ఇది పెద్దగా ఏమీ చేయలేదు. తెల్లారి చెప్పాలి, నేను మామూలుగానే ఉండగలిగానని! ఇది జస్ట్… ఉత్తదే! నేను గ్రేటే!

ఊఊఊఊఊఊఊ…. శూన్యం లాంటి గాలి. ఏదో తెలిసింది నెమ్మదిగా!

ఏదో తెలుస్తోంది… తెలుస్తోంది… రెండు మూడు నిమిషాలై ఉంటుందా?

మెదడు మొద్దుబారుతోంది. మెదడు బరువుగా అవుతోంది.

అరే దీన్ని రాయాలి, నోట్ చేయాలి, నోట్సు ఎక్కడుంది?

డైరీ… డైరీ…

“అన్నా, డైరీ నిండిపోతది. కానీ రియల్ లాంగ్ పొయెమ్ అయితది”

వేడి పొగలేవో వస్తున్నాయి, ఛాతీ తిరుగుతోంది, పెదాలు నవ్వుతున్నాయి.

మోకాళ్ల కింద పొడుస్తోంది, పొడుపు మెదడుకు పాకింది, మెదడు ఉందా అని జోక్ వేసుకుంటున్నాను.

కాలికి ఏదో పెద్ద తాడు తగులుతోంది; ఏం తాడు? ఇదెక్కడిది? ఓ దీనియమ్మ డైరీ రిబ్బన్; చక్కలిగింత పెడుతోంది.

నేను రాసింది చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అక్షరాలు పెద్దగా కనబడుతున్నాయి. పెద్దగా… పెద్దగా… బ్లో అప్!

గాలి కంట్లోకి వచ్చింది. ఫ్యానుదేనా? పెద్ద అలలాంటి గాలి కంటి కొసన. చిన్న శబ్దం కూడా పెద్దగా. పేజీ తిప్పుతుంటే పుస్తకం అంత బరువుగా అనిపిస్తోంది. అరే ఈ వాక్యాలకు నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదా? పెట్టాను.

నెమ్మదిగా అక్షరాలు జూమ్ ఇన్ అవుతున్నాయి. నేను నార్మల్సీ… ఇంతే! స్పీడ్ తగ్గుతోంది… దేని స్పీడ్, ఫ్యాన్ స్పీడా?

తగ్గలేదు. తిరుగుతోంది. తల. తల తిరుగుతోంది. గుండ్రంగా తిరుగుతోంది. గుండ్రంగా… గుండ్రం… అరే ఇప్పుడేమో కర్ణంలాగా. ఆఆఆఆఆఆఆ ఇప్పుడు స్లోప్… జారినట్టుగా… జారిపోతున్నట్టు…

ఇప్పుడు పూర్తిగా బోర్లించినట్టు. తల బోర్లా పడుతోంది… బోర్లా…

‘అయినా నువ్వు భలే రాయగలుగుతున్నావురా’

నిజమే, నేను రాస్తున్నా…

తల తలకిందులవుతోంది, తలకిందులు కిందులు…

ఇప్పుడేమో ఏవో కంపనాలు, థిల్లానా థిల్లానా…

చంకల్లో పొడుస్తోంది, వంశీ శ్వాస తెలుస్తోంది, పొడుపు ఎక్కువైంది… పొడుపు… పొడుపు కథ? పొడుపు మరీ ఎక్కువైంది. దీనియమ్మ పొడుపు… పొడుపు…

కళ్లు గట్టిగా తెరిచి, రాయడం చాలించి, నడుమెత్తి వంశీని చూశాను.

“ఏం జేస్తున్నవ్?”

వంశీ రెండో రౌండుకు సిద్ధం చేస్తున్నాడు. ఎన్ని రౌండ్లు తిరగాలని ఇతడు!

నా తలలో మామూలుగానే ఉంది. ఊఊఊఊఊఊఊ…

నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను దీన్ని? ఎగ్జాగ్ట్. లాస్ట్ టైమ్ వాచీ చూసినప్పుడు 11:36. ఛా 11:09. ఇప్పుడు 11:36.

వంశీ ఏదో బ్యాగ్ సర్దుతున్నాడు, జిప్ ఏదో లాగుతున్నాడు, జీప్ అని రాయబోయి జిప్ చేశాను.

ప్లేట్ చప్పుడు… ఎక్కడో కుక్క మొరుగుతోంది, అవ్ వ్ వ్ వ్ వ్ వ్ వ్… బయటా?

“రండి, వచ్చాక రాసుకుందాం; అన్నా, దా”

 

సెకండ్ రౌండ్:

మళ్లీ ఇందాకటిలాగానే- రూమ్ లోంచి బయటి వాకిలి సందులోకి వచ్చి, చీకట్లో గోడకు వీపును ఆన్చి కూర్చుని-

 

(ఈ తర్వాతిదంతా నేను అప్పుడే రాయలేకపోయాను. ఆ మాటకొస్తే తెల్లారి సాయంత్రం కూడా రాయాలనిపించలేదు. 36 గంటల తర్వాత, మళ్లీ జరిగింది గుర్తుచేసుకుని రికార్డు చేశాను. దీన్ని రాయడంలో నా ప్రధాన ఉద్దేశం ఒక స్థితికి సంబంధించిన గ్రహింపును నమోదు చేయడమే! అదైనా 100 స్కేలులో 5,10 కౌంటు మాత్రమే- కేవలం ఒక నీడనీ జాడనీ పట్టుకోగలిగానంతే!)

 

మొదటి పప్ఫు. గట్టిగా, లోపలికి…

రెండోది పీల్చేసరికి శరీరం స్థాణువైంది. చేయి కదిలేట్టు లేదు. వంశీకి దీన్ని పాస్ చేయాలంటే చేయి కదిలించాలని అనిపించట్లేదు. నా చేతు ఇలాగే కాలిపోతుందేమో!

బరువుగా… శక్తిని కూడదీసుకుని… చేయిని కదిపి…

ఇక నేను పీల్చలేను.

నె..మ్మ..ది..గా లేచి మళ్లీ రూమ్ లోకి వచ్చాను.

ముందు తిందాం అనుకున్నా. కానీ కదిలేలా లేను. వెనక్కి చేతులు పెట్టి, నడుం చాపుకుని అలా కాసేపు కూర్చున్నా. బ్యాలన్స్ అవట్లేదు.

శరీరాన్ని మోయలేను. లేను. పడుకోవాల్సిందే… వెల్లకిలా… చేతులు, కాళ్లు బార్లా జాపి…

ఏదో వేడి…  సన్నని మంట ఒళ్లంతా పాకినట్టు, పాదాల నుంచి పైదాకా వచ్చినట్టు… ఎర్రగా…

నోరు పిడచగట్టినట్టు, పెదాలు తెరవలేనట్లు, శాశ్వతంగా మూసుకుపోయినట్లు…

అరే, శక్తి కూడదీసుకుని లేస్తే స్ప్రింగు లాగా లేచిన ఫీలింగ్…

కొన్ని నీళ్లు ఫిల్టర్ లోంచి…

తినేటట్టు లేదు. ఇప్పుడు అన్నం గిన్నె వెతకడం నా వల్లకాదు.

వంశీ తింటున్నట్టున్నాడు. ప్లేట్ కడుగుతాడా? రేప్పొద్దున ఎంగిలిపళ్లెం నాతో కడిగిస్తాడా?

అలాగే రూములోంచి హాల్లోకి వచ్చిపడ్డాను. పడలే, పడ్డంత పనై పడుకున్నా.

నేను శ్వాసిస్తున్నానా?

ఊమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్…

ఏదో కదులుతోంది. ఒంట్లోకి ఏదో ప్రవహిస్తోంది. ఏదో కొత్తది, లేదూ తెలిసినట్టే ఉన్నది… మొత్తం శరీరంలోకి ఆనందం జొరబడుతోంది, పెదాల మీద తెలియకుండానే నవ్వు చేరింది, నా ముఖంలో కొత్త వెలుగేదో తెలుస్తోంది.  దివ్యమైన కాంతి. రంగులరాట్నం ఎక్కినట్టు ఒకటే ఏదో హేహేహేహేహేహేహే…

భావప్రాప్తి. భావప్రాప్తి. భావం ప్రాప్తించింది. ఇదే ఇదే ఇదే, ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నా కలగని సుఖం… అట్లాగే నిలకడగా, నిలిచిపోయినట్టుగా… ఈ ఆనందం నేను ఓపలేను, ఈ ఆనందం తట్టుకోలేను… ఇలా స్త్రీ కదా అనాలి!

మర్మాంగాలు మాత్రమే ఉనికిలో ఉన్నట్టుగా… అవి మాత్రమే నిజం… అంతా అబద్ధం… ఆనందం… బ్లిస్… అద్భుతం… ఇదే ఇదే పరమానందం… వదులుకోలేని ఆనందం… ఓఓఓఓఓఓఓ…

దేవుడా దేవుడా దేవుడా ఆనందం ఆనందం ఆనందతాండవం, ఎక్కడ కదలకుండానే తాండవం, లోలోపలి నర్తనం… ఓహోహోహోహోహోహోహో…

దివ్యానందం… సుఖమజిలీ… సుఖం సుఖం… ప్రాణానికి సుఖం… హాయి హాయి హాయి మహాగొప్పగా నవ్వుగా, ఇక చాలన్నట్టుగా…

ఆఆఆఆఆఆఆ…

కదిలేట్టు లేదు. బరువు అలాగే ఉంది.

స్టేట్ మారుతోంది.

శరీరంలో ఏదో మారుతోంది, మార్పు తెలుస్తోంది, వైబ్రేషన్ మోడ్…

ప్లగ్గులో బాడీని పెట్టినట్టుగా సన్నటి కంపనాలు… క్ క్ క్ క్ క్ క్ క్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్… వైబ్రేషన్ వైబ్రేషన్… శబ్దం తెలుస్తోంది…

శరీరంలో అలలు… ప్రకంపనలు…

అయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యో… జూజూజూజూజూజూజూ…

శరీరాన్ని విరిచినట్టుగా…  బట్టలాగా పిండినట్టుగా… మెడ తిరిగిపోయిందేమో… తిరిగిపోతోందా? పోతోందా? పోతోం…

చచ్చిపోతానేమో! చావడం అంటే ఇదేనేమో! నేను బతకడం కష్టం… నేనిక బతకను…

దాహం దాహం… నీళ్లు నీళ్లు మంచినీళ్లు…

కదిలేలా లేను… నేను కదలలేను… అయ్యో … అయ్యో…

లేదు, తాగకుండా ఉండాల్సింది… ‘వంశీ నువ్వు నన్ను వార్న్ చేయాల్సింది. సరిగ్గా వారించాల్సింది. ఇది నాకు నువ్వు కరెక్టుగా వివరించి చెప్పాల్సింది. ఈ స్థితి గురించి’… దేవుడా దేవుడా చచ్చిపోయానా…

రేపు అందరికీ తెలిసిపోతుంది, ఇట్లా చచ్చిపోయారని తెలిసిపోతుంది… ఈ కారణంగా మరీ ఇలాగా…

చచ్చినట్టే… బతికే చాన్స్ లేదు… డీ హైడ్రేషన్… నీళ్లు ఇంకిపోతున్నాయ్… ఇంట్లో నీళ్లు లేవు, ఒంట్లో ఒంట్లో లేవు, చుక్క కూడా లేదు… చుక్క కూడా చుక్క కూడా…

నీళ్లు తాగాలి, రేపు అందరికీ తెలిసిపోతుంది… నీళ్లు తాగాలి నేను బతకాలి…

తాగాలి నేను బతకాలి నీళ్లు తాగాలి అది తాగకూడదు నీళ్లు తాగాలి తాగకూడదు తాగాలి తాగకూడదు తాగా…

చేయి కదిలింది… అమ్మయ్య… ఈజీ ఈజీ కదిలింది… ఈజీ… లేచాను…

గ్లాసు ఎక్కడ? నీళ్లు… కిచెన్ లోకి…

వంశీ అప్పటికే నీళ్లు తాగుతున్నాడు… నీళ్లు అమ్మా… నీళ్లు… ప్రాణం ప్రాణం…

గుక్క గుక్క గుక్క…. ఊఊఊఊఊఊఊ… ఏమైంది నాకు?

హొహ్హొహ్హొ… ఒక్కసారి స్విచాఫ్ అయినట్టుగా… వైబ్రేషన్ మోడ్ పోయింది. ఇది మ్యాజిక్. మ్యాజిక్ జరిగింది. కంపనం ఆగిపోయింది. లోపలి రొద సద్దుమణిగింది.

“ఏం వంశీ ఇట్లా స్విచాఫ్ అయింది”

నోట్లోంచి మాట వస్తుందని కూడా ఊహించలేదే!

“అంతే అన్నా, త్రీ ఫోర్ అవర్స్ ఉంటుందంతే”

హేహేహేహేహేహేహే… నేను బతికాను నేను బతుకుతాను. నేను చావను నేను చావను బతుకుతున్నా…

అయిపోతుంది ఏం ఫర్లేదు…

ఇప్పుడు టైమెంత? ‘మూడు గంటలు’. సరిగ్గా మూడు.

అమ్మా అమ్మా… మళ్లీ వచ్చి పడక… ఇప్పుడు బెడ్రూములో, ఇప్పటికైనా బెడ్రూములోకి సరిగ్గా…

“వంశీ నువ్వు గూడ బెడ్లోనే పండుకో…  చెద్దరేమన్న గావన్నా?”

“ఏమొద్దన్నా”

“బయటి గొళ్లెం బెట్నవా?”

“అప్పుడే పెట్నన్నా”

ఆఆఆఆఆఆఆ… కొంచెం రిలీఫ్…

నిద్రపోదాం కాసేపైనా…

నిద్ర పోదాం. నిద్ర. నిద్ర.

దోమలు చెమట గాలిలేనితనం… కరెంటు పోయినట్టుంది…

మళ్లీ ఏమవుతోంది? వూవూవూవూవూవూవూ…  కోకోకోలా బుడగలు పేలినట్టుగా… లోపల ఏదో చర్య… ఇది పూర్తిగా రసాయనిక చర్య… బాడీ డీకంపోజ్ అవుతోంది… ఓహో ఇలా చంపేస్తుందేమో… మళ్లీ చావు… చావు తప్పదా?

సూసూసూసూసూసూసూ… మోకాళ్ల కింద నొప్పి. సులుక్ సులుక్ సులుక్…

కిటికీలు బంధించి వుండి గాలి రాకపోతే ఇది కచ్చితంగా సూసైడ్ అవుతుంది. అయిపోతుంది. చచ్చి ఊరుకుంటాం. గాలి కావాలి గాలి…

కిటికీ తీసి కదలకుండా బోల్ట్… లొకేషన్ కుదరట్లేదు… కాన్సంట్రేట్… ధ్యాస ధ్యాస పెట్టగలిగాను.

రేపటి డెడ్ లైన్… ఆఫీసు వర్కు… చెమట వెళ్లిపోతున్నట్టుగా…

ఏదోలా అవుతోంది. తినివుంటే వాంతి అయ్యేదా? తినకపోవడమే మంచిదయ్యిందా?

ఇందాక మిక్చర్ ప్యాకెట్లు కత్తిరించడానికి తెచ్చిన కత్తెరను సర్దానా? ఆ కత్తితో వంశీని పొడుస్తానా… ఆ కత్తెరతో…

అట్లా ఎవరికైనా పొడవాలనిపిస్తుందా? మనం ఏం చేసేదీ మనకు తెలియకుండా పోతుందా? నిజంగా తెలియదా?

నాకు తెలుస్తోంది. మరీ శూన్యమైపోవడం ఏమీలేదు. బాహ్య ప్రపంచం తెలుస్తోంది. ఇది ఇల్లు ఇది మంచం ఇది నేను ఇది వంశీ… అది కిచెన్… నీళ్లు నీళ్లు… ఎలా లేవను? మళ్లీ లేవాలా? మళ్లీ మళ్లీ లేవాలా ఇలాగా! ఆకలి ఆకలి…

తిని పడుకోవాల్సింది… ఇప్పుడు ఈ టైములో తింటే జీర్ణమవుతుందా? తప్పు చేశాను, తిని పడుకోవాల్సింది…

ఆకలి… ప..క్క..కు తిరిగి… అ..మ్మ..య్య ఎంతసేపటికి తిరిగాను!

కరెంటు వచ్చినట్టుంది… హా గాలి… చల్లగా గాలి… గాలి…

ఒకట్రెండు పఫ్పులైతే ఆర్గాజం స్టేట్ వచ్చి ఆగిపోయేదేమో! తర్వాత ఈ పెయిన్ ఎందుకు? అసలు ఎంతయితే కరెక్టు? ఫూలిష్… తెలియక చేశా.. రెండో రౌండులోకి వెళ్లకుండా ఉండాల్సింది…

శ్వాస పీల్చుకుంటున్నానా… కళ్లు బరువుగా రెప్పలు తెరవలేనట్టుగా… కూలిపోయేట్టుగా… ‘వంశీ, దీన్ని మళ్లీ మళ్లీ తాగకు… చచ్చిపోతాం… తెలుస్తోంది. నాకు అర్థమవుతోంది. ఇది చావే ఇది చావే చావు తెచ్చుకోవడమే’…

అయ్యో పొద్దున చెప్పాలి… ఇప్పుడు మాట్లాడబుద్ధి కావట్లేదు… దాహం దాహం… వంశీ ఇందాక ఎక్కడో పెట్టాడు. అద్దం దగ్గర… సగం తాగిన నీళ్లగ్లాసు…

“రెడ్డిగారూ”

……………………

ఓనర్ అంకుల్ పిలుస్తున్నాడు. పడుకోబుద్ధవుతోంది… ఇలాగే ఇలాగే… ఇంకో అరగంట… ఇంకో గంట… ఇంకో రెండు గంటలు…

“రెడ్డిగారూ, రెడ్డిగారూ”

శరీరానికీ మెదడుకూ పోలిక లేదు. అది బరువుగా ఇది రకరకాలుగా… ఎలా మొదలైంది ఇదంతా? ఎలా ఇప్పటి స్థితికి వచ్చాను!

కళ్లు తెరిచి… ఏడు అవుతున్నట్టుంది. “ఆ… అంకు… అంకుల్ వస్తున్నా”

తలుపు తెరిచి- ‘తేడా ఏమన్న గుర్తువడుతడా? నడకలో మార్పుందా?’

ఇంటి రెంటు ప్లస్ కరెంటు బిల్లుకు కలిపి ఇచ్చిన డబ్బుల్లోంచి- “మీకు వన్ సిక్స్టీ నైన్ ఇవ్వాలండీ”

రెండు వంద నోట్లు ఇచ్చాడు.

నేను ఇంట్లోకి వచ్చి… మూడు పది నోట్లు, ఒక రూపాయి బిళ్ల వెతికి…

మళ్లీ కాసేపు పడుకుని, ఇంకాసేపు పడుకుని, లేచి, వంశీని సాగనంపి, “జాగ్రత్త” “ఏం ఫర్లేదన్న”- ‘ఆఫీసుకెళ్లే ధైర్యం చేయొచ్చు’.

ఒకటేదో జరక్కూడనిది జరిగిందన్న ఫీలింగులోనే సాయంత్రం దాకా గడిపి-

దీన్నో ఘనకార్యంగా చెప్పుకోవాలన్న ఉబలాటాన్ని లోలోపలే దాచి-

రాత్రి- స్నానం చేశాక- నిన్నటి గోడ అంచునే కాసేపు విరామంగా, నిశ్శబ్దంగా కూర్చుని- పక్కనే ఉన్న మల్లెచెట్టును చూస్తూ- వేసవి వరంగా విచ్చుకుంటున్న దాని పూల పరిమళాన్ని అనుభవిస్తూ- మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్-

‘ఒక చెట్టుకూ మరో చెట్టుకూ మధ్య ఎంత తేడా ప్రకృతిలో!’

*

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.

కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. మాట్లాడటానికి ఉపక్రమించగానే నా చేతులు వణుకుతాయి, లోపలి నరాలు ఊగుతాయి. దీన్నే చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఎక్కడైనా నాకు ఆవేశం తన్నుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి జంకుతాను. అలా మాట్లాడాలనిపించీ, ఎందుకొచ్చిందిలే అని వదిలేసిందాన్ని ఇక్కడ రాయడం కోసమే ఇదంతా చెప్పడం!

మొన్న మే 31, జూన్ 1 (2014) తేదీల్లో కర్నూలు ‘కథాసమయం’ మిత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అందులో విడతలుగా చర్చకు పెట్టిన కొన్ని అంశాలు ఉన్నాయిగానీ దానికంటే ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు జరిగిన చివరి సమావేశం కావడం దాని ప్రత్యేకత! దానికి అన్ని ప్రాంతాలవాళ్లూ వచ్చారు. కొందరు కొత్తగా పరిచయమయ్యారు; మరికొందరు పేర్లుగా మాత్రమే తెలిసినవాళ్లు ముఖాలుగా పరిచయమయ్యారు. ఈ పర్యటనలో నావరకూ ముఖ్యాంశం: కర్నూలు నగరాన్ని మొదటిసారి చూడటం! కొండారెడ్డి బురుజును ఎక్కకుండా తిరిగిరాకూడదనుకున్నాను, ఎక్కాను. టీజీ వెంకటేశ్ కోటలాంటి ఇంటిగోడలు చూడకుండా సంపద స్వరూపం అర్థం కాదన్నారు, కాబట్టి వెళ్లాను. మద్రాసు నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని కర్నూలు కాబట్టి, అప్పుడు తాత్కాలికంగా గుడారాలు వేసి పనులు నడిపించిన స్థలాన్ని చూసుకుంటూ వెళ్లాను. పూర్వస్థితిలోలాగా కర్నూలును రాజధాని చేయమని పట్టుబట్టడానికి కావాల్సినంత చారిత్రక హేతువుండగా, సీమవాళ్లు ఎవరూ దాని ఊసు ఎందుకు ఎత్తడంలేదన్న ప్రశ్న సమావేశాల్లోనే వచ్చింది. ‘కానీ ప్రశ్నించగలిగేవాళ్లేరి?’ అన్న నిరాశే జవాబుగా ఎదురైంది. చివరగా, సాయంత్రం పూట- నక్షత్రాకార సాయిబాబాలయం పక్కన పారుతున్న తుంగభద్ర నీటిపాయలో కరిగిపోయిన సూర్యుడినీ చూశాను. థాంక్స్ టు విజయసారథి! బహుశా, ఇకముందునుంచీ కర్నూలు అంటే నాకు గుర్తుండబోయే ఇమేజ్ ఇదే!

*

నిజానికి భావనలు చాలా బలహీనమైనవి. అయినాకూడా ఒక నిర్దేశిత సమయంలో అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మళ్లీ బలమైనవి కూడా! రెండు వేడి వేడి దోసెలు తిని, ఉడుకుడుకు చాయ్ తాగాక- మా పొద్దుటి సమావేశంలో ఒక విడత మొదలైంది. ‘రాయలసీమ కథ అస్తిత్వం: వైవిధ్యాలు, వైరుధ్యాలు’ మీద వెంకటకృష్ణ మాట్లాడారు. అక్కడి కథ అందుకోవలసిందీ చెప్పారు; సీమ కథ అనగానే కరువు తప్ప మరొకటి గుర్తుకురానివ్వకుండా చేసిన ‘తామందరినీ’ నిందించుకున్నారు. అలాగే సాఫల్యతను ప్రస్తుతించారు. చాలా ఉటంకింపులతో ఆవేశంగా సాగిన ఆ మాటలు ఎక్కడ ఆగాయంటే… సీమరచయితలకు తగిన గుర్తింపు లేదని!

వెంకటకృష్ణ మాటలకు స్పందనగా నేను కొన్ని పాయింట్స్ ఏవో చెబుదామనుకున్నాను. ‘ఎందుకొచ్చిందిలే’ అని వదిలేశాను. సభాభయం ఒకటి ఉందిగా! పైగా నేనేమీ అకడెమిక్ కోణంలో చెప్పలేను. దీనికి అంత ప్రాధాన్యత ఉండదులే, అని కూడా నేను ఆగిపోవడానికి మరో కారణం. అయితే, తర్వాతి విడత చర్చలో, (ఈసారి కోడికూర, గోంగూర భోజనం తర్వాత- మనుషులు మాంసాహారులుగా, శాకాహారులుగా వేరుపడటం ఏంటబ్బా అనుకున్నాం… నేనూ, నా పక్కనే కూర్చున్న దగ్గుమాటి పద్మాకరూ!) సుభాషిణి మాటల్లో కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. తమ సీమకథకూ, సీమభాషకూ మన్నన లేదని!

 

వాళ్లు లేవనెత్తినట్టుగా ఈ రాయలసీమ కథకుల్ని ఎవరు గుర్తించాలి? బహుశా, తెలంగాణవాళ్లు సీమవాళ్లను కలుపుకొనే పోతారనుకుంటాను. మరి వీళ్లను గుర్తించ నిరాకరిస్తున్నది ఎవరు?

అలాగే, తెలంగాణవాళ్లు కూడా ఇన్నేళ్లుగా మాట్లాడుతున్నది తమను ప్రధాన స్రవంతి సాహిత్యంలో చేర్చుకోరనే. రాయలసీమ వాళ్లు చెబుతున్న భాష సమస్యే తెలంగాణకూ ఉంది. రెండు ప్రాంతాలూ ఒకే బాధను ఎదుర్కొంటున్నాయి. మరి వీళ్లను గుర్తించాల్సింది ఎవరు? అది ఒక ప్రత్యేక సమూహమా?

(ఉత్తరాంధ్ర తరఫున ఎవరూ ఆ సమావేశంలో మాట్లాడలేదుగానీ వాళ్లకూ ఈ బాధే ఉందేమో! )

ఇక విషయాన్ని నేననుకున్నట్టుగా కోస్తావారివైపే డ్రైవ్ చేస్తున్నాను. ఇండ్లదిండ్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారికి కొన్ని మినహాయింపులున్నాయి. సీమతో వారికున్న సరిహద్దులవల్ల కావొచ్చు.

వీటిని తీసేస్తే మిగిలినవి ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణా. అంటే, ఈ నాలుగు జిల్లాల గుర్తింపే అందరికీ కావాలా? సమావేశానంతరం, నలుగురం- అజయ్‌ప్రసాద్, జీఎస్ రామ్మోహన్…- సేదతీరుతున్నప్పుడు, గోదావరి వాడైన ఒమ్మి రమేశ్‌బాబుతో ఇదే విషయం నవ్వుతూ అన్నాను: ‘మాకందరికీ దండలు వేయాల్సిన చాలా పెద్ద బాధ్యత మీమీద ఉంది’.

మొదటే చెప్పాల్సిన డిస్‌క్లెయిమర్ ఇప్పుడు చెబుతున్నాను. నాది చాలా పరిమితమైన భాష, ప్రాంత జ్ఞానం. పైగా ఇదేమీ థియరీ కాదు. నా మానసిక అలజడిని తగ్గించుకోవడానికి నేను పూసుకుంటున్న లేపనం మాత్రమే.

10409245_10103692712795837_3125675474451956223_n

ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! అయితే, ఇదంతా చెప్పుకున్నంత కాంక్రీటుగా ఉండే విషయమేనా!

సమావేశాల్లోనే ఒక రాత్రి- విశాలమైన గార్డెన్‌లో అందరమూ గుండ్రంగా కూర్చునివున్నాం… ఇనాయతుల్లా మంచి నటుడు! ఏకపాత్రాభినయాలతో నవ్వించారు. దుర్యోధనుడికైతే చప్పట్లే చప్పట్లు!! ఆయన అనుకరించిన పల్లీయుల గొంతుల్లో ‘వచ్చాండా’, ‘పోతాండా’ లాంటి ఎన్నో మాటలు దొర్లిపోయాయి. అలాగే, కర్నూలు జిల్లాలోనివే అయిన నంద్యాల, ఆదోని యాసలు ఎలా వేరుగా ఉంటాయో మాట్లాడి వినిపించారు. అయితే, ‘రాయలసీమ యాస’ అని దేన్నయితే అనుకుంటామో, అక్కడి రచయితలెవరూ మాట్లాడలేదు. అందరూ ప్రామాణికభాష అని నిందిస్తున్నదాన్నే మాట్లాడారు. అంటే ఏ యాస అయితే ఇనాయతుల్లా నోట్లోంచి రావడం వల్ల నవ్వు పుట్టిందో, ఆ దశను వీళ్లందరూ దాటేశారు. అందులో అసహజం ఏమీ లేదనే అనుకుంటాను.

*

నేను ఆరో తరగతి చదవడానికి మా ఊరినుంచి మేడ్చల్‌కు వచ్చాను. బడి ప్రారంభం కావడానికి ముందే, మామయ్య వాళ్లు వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు నన్ను తోలుకొచ్చారు. మళ్లీ నేను మా ఊరెళ్లింది దసరా సెలవులకే. ఆ ఆరేడు నెలల కొత్త వాతావరణం నన్నెలా మార్చిందంటే, ‘రాజిరెడ్డి బాగ శానికచ్చిండు; మన మాటే మాట్లాడుతలేడు,’ అన్నారు మా వదినలు. ‘అత్తన్నా’కు బదులుగా ‘వస్తున్నా’ అని బదులిచ్చివుంటాను. అదే వాళ్లు ప్రేమగా నిందించిన నా శానితనం!

ఇప్పుడు తెలంగాణ రచయితలు కూడా నిజజీవిత వ్యవహారంలో ‘అచ్చిన’ అనరు; ‘వచ్చిన’ అనే అంటారు. ఇందులో ఏది మరింత తెలంగాణ? పాతకాలపువాళ్లు, ఇప్పటి యువకులు; చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు; ఆ కులంవాళ్లు, ఈ కులంవాళ్లు; ఆ జిల్లావాళ్లు, ఈ జిల్లావాళ్లు; హైదరాబాద్‌తో సంపర్కం ఉన్నవాళ్లు, లేనివాళ్లు; ఇలా తెలంగాణ భాష ఎన్నో రకాలుగా విభజించబడివుంది. అన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి ఉంటూనే, మళ్లీ వేరుగా ఉండటం! ఇదే భాషలోని వైవిధ్యం.

నా వరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడుతాను. అంటే మా ఊరికి వెళ్లినప్పుడు మా తాత, పెద్దనాన్న వరస వారితో ఒకలాగా మాట్లాడతా. కొంచెం చదువుకున్న వాళ్లతో ఒకలాగా, నాకు పరిచయమున్న తోటి తెలంగాణ ఉద్యోగులతో ఒకలాగా, ఇతర మిత్రులతో ఒకలాగా. కార్టూనిస్టు శంకర్‌తో ‘ఏమన్నా ఏడున్నవే,’ అంటాను. జూకంటి జగన్నాథంతోనూ, దేశపతి శ్రీనివాస్‌తోనూ మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా నేను సార్ అనలేదు; ‘నమస్తేనే’ అని పలకరించాను. అదే, వాళ్లిద్దరికంటే ఎంతో ఎక్కువ పరిచయమున్న సురేంద్రరాజును ఇన్నేళ్లయినా ‘ఏమే, ఏందే’ అనలేదు. ఏ కొంత చనువు తీసుకోదలిచినా నేను ఏత్వం ఉపయోగిస్తాను. ఏత్వం ఉపయోగించడం, నా దృష్టిలో దగ్గరితనమూ, అదేసమయంలో కొంతమేరకైనా తెలంగాణీయత!

అయితే, తుమ్మేటి రఘోత్తమ్ సార్‌ను ఏకవచనంలో సంబోధించలేను. ఆయన కూడా ‘రాజిరెడ్డి గారు’ అనే పిలుస్తారు, రాజిరెడ్డి అంటే సరిపోతుందని చెప్పినా! అలాగే, తెలంగాణలో జన్మించని అన్వర్‌ను వయసుతో నిమిత్తం లేకుండా ‘ఏం సార్, ఎక్కడున్నారు?’ అని పలకరిస్తాను. వయసులో పెద్దవాళ్లయినప్పటికీ తెలంగాణలో పుట్టని మాధవ్ శింగరాజుతోగానీ, నరేష్ నున్నాతోగానీ, అనంతుతోగానీ వాళ్లు నాకు పరిచయమైన తొలిరోజునుంచీ ఏకవచనంలోనే మాట్లాడుతున్నాను. వాళ్లతో ఈ చనువు తీసుకోవడానికి కారణమైందేమిటో నాకు అంతుపట్టదు. అదే చినవీరభద్రుడితోనో, వి.చంద్రశేఖరరావుతోనో మాట్లాడినప్పుడు, నా గొంతు మరింత మర్యాదను అరువు తెచ్చుకుంటుందనుకుంటాను!

అవతలివారిని బట్టి, నా నాలుక ‘వచ్చిండ్రా’ అనేది ‘వచ్చారా’ అనేస్తుంది. ఈమాత్రమేనా యాసల గొడవ అనిపిస్తుంది. గొడవ స్థానంలో లొల్లి రాయలేకపోవడం కూడా ఒక గొడవ! అంతోటి కాళోజీ కూడా ‘నా గొడ’వే అన్నాడుగానీ ‘నా లొల్లి’ అనలేదు.

నా భార్య మొన్నోసారి మావాణ్ని ‘పోయిండు’ బదులుగా ‘వెళ్లాను’ అనిపిస్తోంది. ‘ఏందే?’ అంటే, పార్కులో ఒకామెకు అలా అంటే అర్థం కాలేదట! ఆమెకు అర్థంకాకపోతే రెండ్రోజుల్లో అలవాటవుతుందిలేగానీ అంత నాలుకను మలుచుకోవాల్సిన పనిలేదని చెప్పాను. మరి ఈ తెలంగాణ-ఆంధ్ర స్పృహ లేనప్పుడు, నాకున్న ఆంధ్ర రూమ్మేట్స్ సాయితోగానీ, సుధాకర్‌తోగానీ నేనెలా మాట్లాడానో, అసలు వాళ్లు నాతో ఎలా సంభాషించారో నాకు గుర్తులేదు. ఈ స్పృహ జొరబడ్డాక, నా నాలుకను ఎక్కడ స్థిరం చేసుకోవాలో తెలియక కొంత తికమకపడ్డాను. అందుకే ఒక్కోసారి నా నాలుక మాటల్ని కాక్‌టెయిల్ చేస్తుంది. డబుల్ యాక్షన్ చేస్తుంది.

నిజానికి ఒక మనిషికి నాలుగు నాలుకలు ఉండటం… తన భాష తాను మాట్లాడలేకపోవడం కూడా న్యూనతే! కానీ ఏది నా ఒరిజినల్ భాష? అది ఎక్కడుంది? ఇప్పుడు నేను రాస్తున్నది కూడా ఏ భాష? మాట్లాడినట్టుగా రాయాల్సివచ్చిన ‘పాత్రోచిత సందర్భం’ అయితే తప్ప… లేదంటే ఈ ఆర్టికల్‌లో మీరు చదువుతున్నట్టుగానే రాస్తున్నాను. ఆ పాత్రోచితం అనుకునేదాన్ని కూడా నేను తెలంగాణ యాస అనడానికి సాహసించను. అది మా నర్సింగాపురం యాస మాత్రమే!

*

మావాణ్ని స్కూల్లో వేస్తున్నప్పుడు, పర్మనెంట్ అడ్రస్ రాయాల్సివచ్చింది. డిస్ట్రిక్ట్: కరీంనగర్ అని రాసింతర్వాత, స్టేట్: ‘ఎ’ అని రాయబోయి, ‘టి’తో ప్రారంభించాను. కొత్త సంవత్సరపు తొలివారంలో అలవాటుగా పాత ఏడాదే వేస్తుంటాంకదా, అలాగ!

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ‘అండి’, ‘గారు’ పోవాలని నేను కోరుకోవడం లేదు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్. నా వయసువాళ్లు ఎవరైనా మా బాపును ‘రాంరెడ్డీ’ అని పిలిస్తే నా ప్రాణం చివుక్కుమంటుంది. ఏకవచనాన్ని ఏకవచనంలా కాకుండా పలికించడం చాలామందికి తెలియదు. ‘ఓ పెద్దబాపు ఎటువోయినవే?’, ‘ఓ బావా కనవడుతలేవేంది?’, ‘మామా ఎట్లున్నవే’… అన్నీ ఏకవచనమే. కానీ పిలుపులో ఆత్మీయత ఉంది. అయితే, మనకు వరుస తెలియనివారితో కూడా వ్యవహారం చేసే జీవనశైలిలోకి ప్రవేశించాం కాబట్టి, మర్యాదను ప్రకటించడానికి నిర్దిష్టమైన రూపం కావాలి. ఆహారమూ, వ్యవహారమే కదా మన నాగరికతను తెలియజేసేవి!

ఆహారం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. మా ఇంట్లో(ఊళ్లో) పప్పుచారు తప్ప నాకు సాంబారు తెలీదు. హైదరాబాద్ వచ్చేదాకా నేను ఇడ్లీ, దోశ చూడలేదు. ఇప్పటికైనా ఈ రెండూ నా పిల్లలమ్మ చేస్తుందేగానీ మా అమ్మ చేయదు. అమ్మ చేసేవల్లా సర్వపిండి, ఉప్పుడువిండి, వరిరొట్టె, అట్లు. ఇవన్నీ నాకిష్టమే. అయినంతమాత్రాన ఇడ్లీ తినడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి?

నేను చిన్నప్పుడు అంగూర్లు తినేవాణ్ని. మా అత్తమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు కేలాపళ్లు తెచ్చేది. ఇక నాకు డబల్‌రొట్టె అయితే దానికోసం జ్వరాన్ని కోరుకునేంత ఇష్టం. ఇప్పుడా పదాలు వాడే మా అత్తమ్మల తరం పోతోంది. అందుకే, నేను నా పిల్లలకు అంగూర్లకు బదులుగా ద్రాక్షల్ని తినిపిద్దామనుకునేలోపే, వాళ్లు గ్రేప్స్ కోసం మారాం చేస్తున్నారు. హిందూ పేపర్ మాస్టర్‌హెడ్ మీది బొమ్మను చూసి బడికి వేయని చిన్నోడు ఏనుగనీ, స్కూలుకు వెళ్తున్న పెద్దోడు ఎలిఫెంటనీ కొట్లాడుతున్నారు. తెలుగు భాషే మునిగిపోతున్న స్థితిలోవుంటే, ఏ నిర్దిష్ట రూపమూ లేని తెలంగాణ భాష ఇంకెలా మనగలుగుతుంది?

నాకు కొంతకాలం ‘ఆనిగెపుకా’యే అనాలన్న పట్టింపుండేది. సొరకాయ అనకుండా ఉండటానికి ప్రయత్నించేవాణ్ని. కానీ ఇప్పుడది చాలా మామూలుగా నోట్లోకి వచ్చేస్తోంది. ఇది రుద్దడమే అనుకుందాం. అసలు ప్రతిదీ రుద్దడమే. మన భాష, మన మతం, మన ఆహారపుటలవాట్లు, ప్రాంతపు స్పృహ, సంప్రదాయాలు, దేశభక్తి, అంతెందుకు, చివరికి మన పేరు కూడా! అలవాటయ్యేకొద్దీ ఏదైనా మనదవుతుంది. కనీసం ఒక తరంలో రుద్దింది, తర్వాత తరానికి ‘వాళ్ల’దయిపోతుంది.

ఉర్దూ రాజ్యమేలితే చచ్చినట్టు ఉర్దూ నేర్చుకుంటాం. ఇంగ్లీషు ఏలుతోంది కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కృష్ణా జిల్లా అమ్మాయి, రాయలసీమకు చెందిన మా భారతి మేడమ్ మాటల్ని అనుకరించడం నేను విన్నాను. అందుకే కోస్తాధిపత్యాన్ని అబద్ధం అనాలనే ఉంది నాకు. ఎందుకంటే కోస్తావారిలో కూడా అందరి భాషా ఒకటే అయే అవకాశమే లేదుకదా! అది కూడా పేదలుగా, ధనికులుగా, పల్లీయులుగా, నగరవాసులుగా, కులాలుగా, జిల్లాలుగా విభజించబడే ఉంటుంది కదా! అసలు ప్రమాణం అనుకునేదే ఒక ప్రమాణంలోకి ఒదిగేది కాదు. దీన్ని ఇలాగే అంగీకరిస్తే, ఇక ఈ ఐటెమ్ చెప్పవలసిందేదో చెప్పకుండానే ముగిసిపోతుంది.

 

మరి వెంకటకృష్ణ పెయిన్ అబద్ధమా? తెలంగాణ మిత్రుల వాదన నిజం కాదా? అంతెందుకు, నాకు నేను నాలుగు నాలుకలుగా చీలిపోయిందంతా ఊరికే జరిగిపోయిందా?

నేననుకోవడం- ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ వాల్యూతో ముడిపడివుంటుంది. ఆ విలువే మన జీవితాన్నీ, ప్రపంచాన్నీ నడుపుతుంది. మాకు ఆతిథ్యమిచ్చిన ‘ఇండస్ పబ్లిక్ స్కూల్’ ముందుభాగంలో ‘జీపీఏ 10/10’ సాధించిన పదో తరగతి విద్యార్థిని ముకుంద ప్రియ పేరు, ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వేలాడదీసివుంది. బహుముఖీనంగా ఉండే ప్రాక్టికల్ వాల్యూకు ఇదొక రూపం. ఏ తల్లో ఆ పాపలాగే తన కూతురినీ చదివించాలనుకుంటుంది. ‘సమాజం’ ఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ఆ ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే ఆ వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. ఆ విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర!

(జూన్ 2014లో రాసిన ఆర్టికల్)

-పూడూరి రాజిరెడ్డి

rajireddi-1

పలక మీద పెన్సిల్‌తో రాసిందేమిటి?

rajireddi-1

 రాజిరెడ్డి అంటే ఫలానా అని ప్రత్యేకంగా ఇవాళ పరిచయం చేయనక్కర లేదు.  తెలుగు లో ఇప్పుడున్న మంచి వచన రచయితల్లొ రాజిరెడ్ది ది ఒక ప్రత్యేక శైలి. రాజిరెడ్ది కొత్త పుస్తకం ” పలక-పెన్సిల్” ని సారంగ పబ్లికేషన్స్  తెలుగు సాహిత్యభిమానులకు సగర్వంగా అందిస్తోంది . ఈ పుస్తకం  ఆగస్ట్ 30 వ తేదీ నుంచి  హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. ఈ పుస్తకానికి రాజిరెడ్డి రాసుకున్న ముందుమాట ఇది.  

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
అటు వెతికీ ఇటు వెతికీ… అబ్బే ఇది ఉండకూడదనుకొని, ఇది ఉంటే బానే  ఉంటుందనుకొని, ఇందులో ఏముందనుకొని, ఏదో కొంత ఉన్నట్టే ఉందనుకొని…
జర్నలిజంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో సందర్భాన్ని బట్టి రకరకాల ‘వ్యాసాలు’ రాశాను. ఎన్ని రాసినా అన్నీ పుస్తకంగా వేయాల్సిన అవసరం లేదు. కొన్నింటికి ‘టైమ్‌బౌండ్‌్‌’ ఉంటుంది. కొన్నింటికి పుస్తకంలో రావాల్సినంత ‘అర్హత’ ఉండదు. కొన్ని బాగున్నా మ్యాగజైన్‌ ప్రెజెంటేషన్‌లో ఉన్న వీలు ఇందులో ఉండదు. అలా నాకు నేనే వడగట్టుకుని ఈ ఐటెంస్ ను షార్ట్‌ లిస్ట్‌ చేశాను.
ఇంకోలా చెప్పాలంటే, ఏ ఆదివారపు మధ్యాహ్నమో సోమరిగా కూర్చుని, ఫొటో ఆల్బమ్‌ తిరగేస్తుంటే, నిజంగా అప్పుడు మనం బాగుండేవాళ్లం అనిపిస్తుంటుంది చూడండి… అలా నా ‘రాతప్రతులను’ తిరగేస్తుంటే, నిజంగానే నేను అప్పుడు బాగా రాసేవాడిని అనిపించి ముచ్చట గొలిపినవే ఇందులోకి వచ్చాయి.
రాయడం అంటే నాకు వణుకు పుడుతుంది. ఐటెమ్‌ ఎలా వస్తుందోనన్న టెన్షన్‌! బాహ్య ఒత్తిడిలో రాసినవి కొన్ని. అంతర్గత ఒత్తిడి నుంచి రాసినవి కొన్ని. మొదటిది బాధ్యత. రెండోది సహజం.
అయితే ఎంత సహజమైన ప్రక్రియకైెనా కొంత కృత్రిమత్వపు సహకారం అవసరం. అలాగే, ఎంత కృత్రిమంగా మొదలుపెట్టినదానిలోనైనా రాస్తూవుంటే మనకు తెలియకుండానే వచ్చిచేరేది ఉంటుంది, ఇలా రాయబోతున్నామని మనక్కూడా తెలియనిది. అదే అందులోని సహజత్వం.
ఈ ఆర్టికల్స్‌ను నాకు నేనే ముచ్చట పడటానికి ఇవి రెండూ కారణాలు.

…తుపాల్‌…

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
కానీ సమస్యేమిటంటే, ఇవన్నీ ఏమిటి?
మనం ఒకటి రాస్తాం. అది ఏదైనా కావొచ్చు. అది ఒకటి. అంతే. రాశాక, అది కవిత్వం అవుతుందా? కథ అవుతుందా? వ్యాసం అనొచ్చా? లేకపోతే ఇంకేం అనొచ్చు? ఇలా ఉంటుంది మన ఆలోచన. అసలు దాన్ని ఏదో ఒక పరిధిలోకి ఎందుకు ఇమడ్చాలి? అది దానికదే స్వతంత్రం ఎందుకవదు? మన వేళ్లు పట్టుకుని ఇంతదూరం నడిపించిన  పాత ప్రక్రియలను నిరసించడానికి నేను ఇది చెప్పట్లేదు. అంత సాహసం కూడా చేయను. నేను రాసిందానికోసం ఈ మాట అనవలసి వస్తోంది.

…తుపాల్‌…

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
కానీ సమస్యేమిటంటే,
నాకు ఒక పుస్తకం చదువుతుండగానే రివ్యూ ఫామ్‌ అవుతూ ఉంటుంది, అది నేను అదే ఉద్దేశంతో చదువుతుంటే గనక. ఎలా ఎత్తుకోవాలి, ఎలా ముగించాలి, ఏమేం రావాలి… అనేది నాకు ఐడియా వచ్చేస్తూనే ఉంటుంది. అలాగే ఈ పుస్తకం వేద్దామనుకున్నప్పట్నుంచీ ముందుమాట ఇలా రాయాలి, ఇది మెన్షన్‌ చేయాలి, అని రకరకాలుగా ఆలోచించాను. కానీ పుస్తకంలో ఏమేం రావాలి, అన్నది తేల్చుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ముందు అనుకున్న వెర్షన్స్‌ మారిపోయాయి. దీంతో నోట్స్‌ ఏమో ఉంది. ముందుమాటేమో లేదు. అందుకే ఈ తిప్పలు.
రాయకుండా కూడా వదిలేయొచ్చు. కానీ రచయిత నోటితో అదెందుకు రాశాడో, ఏం ఆలోచించాడో తెలుసుకోవడం నాకు బాగుంటుంది. ఏ పుస్తకాన్నయినా నేను ఈ ముందుమాటలు పూర్తిచేశాకే మొదలుపెడతాను. దీనివల్ల కూడా రచయిత రుచి ఏమిటో నాకు తెలుస్తుంది.
కానీ నాకు నిజంగానే రాయడం అంటే వణుకు పుడుతుంది. రాయకుండా  ఉండగలిగే శక్తి  ఉంటే నేను ఇంకా ప్రశాంతంగా బతకగలను. కానీ ఉండలేను. కాబట్టి ప్రశాంతంగా బతకగలిగే అదృష్టం నాకీ జన్మకు లేదు.
జిడ్డు కృష్ణమూర్తి మీదా, జలాలుద్దీన్‌ రూమీ మీదా, స్వామి వివేకానంద గురించీ, రాహుల్‌ సాంకృత్యాయన్‌ గురించీ, ఇంకా, బి అంటే బ్లాగు, భూటాన్‌ జీవనశైలి (చిన్నదేశం పెద్ద సందేశం)… ఇలా కొన్ని ‘నేను’లు, కొన్ని కవర్‌ స్టోరీలు, మరికొన్ని ఇంకేవో రాశాను. మొదట్లో చెప్పి నట్టు నాకు నేనే ముచ్చటపడగలిగే అర్హత ఉంది వీటికి. కానీ ఇవన్నీ నేను పుస్తకంగా వేయాల్సిన అవసరం ఉందా? నా ఉద్దేశం అవి నేను మాత్రమే చెప్పగలిగినవా? ఇదింకా పొగరు వాక్యంలాగా కనబడుతున్నట్టుంది. మరోసారి ‘తుపాల్‌’ను ఆశ్రయించాల్సి వచ్చేట్టే ఉంది.
తుపాల్‌ అనేది మావైపు పిల్లల ఆటల్లో వినిపించే పదం. ఆటలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ మాటంటే ఆ తప్పు తప్పు కాకుండా పోతుంది. చూడండి చిత్రం! ఎంతో గంభీరంగా మొదలుపెడదామనుకున్న ముందుమాట… పుస్తకం టైటిల్‌కు తగ్గట్టే పిల్లవాడు రాసి కొట్టేసినట్టే అయింది.

Palaka-Pencil Cover (2)

 

*

ఓం నమ:శివాయ.
అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
అయితే, ఈ పుస్తకం వేయాలనుకున్నప్పటినుంచి నా మానసిక స్థితి రకరకాలుగా మారుతూ వచ్చింది. చివరకు ‘నా’, ‘నేను’ ఈ కోవలోకి వచ్చేవే పుస్తకంలోకి రావాలనుకున్నాను.
ఇందులో దాదాపు అన్నీ సాక్షి ‘ఫన్‌డే’, ‘ఫ్యామిలీ’ల్లో అచ్చయినాయి. ఒకటి ఈనాడు ‘ఆదివారం అనుబంధం’లోది. ఎటూ డైరీ మాట వచ్చింది కాబట్టి, అది ఇందులో చేర్చితే బాగుంటుందనిపించింది. ఒకట్రెండు నేరుగా పుస్తకం కోసమే రాశాను. వీటన్నింటి రచనాకాలం 2007 నుంచి 2011.
అం­తే, నా మొదటి పుస్తకం ‘మధుపం’లాగా వీటన్నింటినీ జనరలెైజ్‌ చేయగలిగే అంతఃసూత్రం ఒకటి లేదు. కొన్ని నాస్టాల్జియా, కొన్ని స్వీయ ఘర్షణకు సంబంధించినవి, కొన్ని సహజంగానే స్త్రీ సంబంధిత ఫీలింగ్స్‌. అలాగే వీటి పొడవు కూడా ఒకటి అరపేజీకి సరిపోతే, ఇంకోటి నాలుగు పేజీలుంటుంది. ఈ వైరుధ్యాన్నీ, వైవిధ్యాన్నీ ప్రతిఫలించేట్టుగా పుస్తకం పేరు, క్యాప్షన్‌ ఉండాలనుకున్నాను.
పుస్తకం ఆలోచన వచ్చినప్పట్నుంచీ ఎందుకో ‘పలక’ నా మనసులోకి జొర బడిరది, టైటిల్‌ తన మీద ఉండేట్టు చూడమని. బాల్యపు రాతలు ఉండటం వల్ల కాబోలు!
అందుకే, పలక బలపం అనుకున్నా.
కానీ ఇందులో పూర్తిగా బాల్యమే లేదు.
తర్వాత, పలక కలం, పలక పెన్ను… ఇలా కూడా ఆలోచించాను. ఎక్కడో తంతోందని తెలుస్తోందిగానీ ఒకటి ఎందుకో గుర్తేరాలేదు. ఆ మాట తట్టగానే, ఇదే కరెక్ట్‌ టైటిల్‌ అనిపించింది.
పలక పెన్సిల్‌…
దానికీ దీనికీ ఏ సంబంధవూ లేదు, ఒక విధంగా.
ఇంకో విధంగా చూస్తే రెండూ పిల్లవాడికి అపురూపమైన విషయాలు.
ఇంకా పిల్లాడే(పలక), కానీ ఆ పిల్లతనాన్ని దాటి(పెన్సిల్‌) కూడా కొన్ని మాట్లాడు తున్నాడు, అనేది కూడా ఈ టైటిల్‌ ఎన్నుకోవడంలో మరో ఉద్దేశం.
ఇంకా ముఖ్యంగా, సమీర అన్నట్టు, ‘పలక పెన్సిల్‌ అంటే బలపం కదా!’
ఎగ్జామ్‌లో ఆన్సర్‌ తప్పు రాశానని తెలిసినా, దిద్దుకోవడానికి ఇష్టపడనంత విచిత్రమైన అలవాటు నాది. దిద్దితే పేజీ ఖరాబు అవుతుందనిపిస్తుంది. మొట్టమొదటగా  అప్రయత్నంగా ఏది వచ్చిందో, అదే ఫైనల్‌. ఇదీ అంతే. సూట్‌ అయ్యిందో లేదో నాకు తెలియదు.
ఇంకా, మగవాడి డైరీ!
ఒక విధంగా ‘డైరీ’ అనడం కరెక్టు కాదు.
కానీ డైరీ రాతల్లో ఒక క్రమం ఉండదు. ఏదైనా రాసుకోవచ్చు. ఈ ఆర్టికల్స్‌ కూడా ఏదైనా మాట్లాడుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యక్తిగత కోణం ఉండటంవల్లే దీన్ని డైరీ అనగలిగాను. ఇది అంత అర్థవంతమైన పనేమీ కాకపోవచ్చు, అలాగని పూర్తి అర్థరహితం కూడా కాకపోవచ్చు.
మూడో భాగంలోవి మినహా, ఈ ఐటెమ్స్‌ దేనికదే విడిగా రాసిందే అయినా, పుస్తకంలో వాటి క్రమం కోసం ఒక ‘థీమ్‌’ పాటించాను. తొలి అడుగు వేసి, ‘అంమ’ అంటూ మొదటి మాట పలికి, మా ఊరి ముచ్చట్లు చెప్పి,  ప్రేమ గురించి మాట్లాడి, ప్రేమలో పడి, సంసారం, పిల్లల గురించి ఒకట్రెండు మాటలు చెప్పి, ఆ అనుభవంతో కొంత జ్ఞానం సంపాదించి, అటుపై మరణంతో ముగిసేట్టుగా.
ఆర్టికల్‌ చివర్లో మధుపంలో లాగే, నేను వేరే సందర్భాల్లో రాసిన, రాసుకున్న వాక్యాలను ఫుట్‌కోట్‌గా ఇస్తున్నాను. దీనివల్ల ఆ ముచ్చటపడ్డానని చెప్పిన వాటిల్లోని ఒకట్రెండు మాటలైనా పుస్తకంగా రికార్డు చేయగలిగానన్న తృప్తి ఉంటుంది నాకు. అయితే, ఎందులోంచి ఏది తీసుకున్నానో వివరాలు ఇవ్వట్లేదు. బోర్‌. నాకూ మీకూ.
అలాగే, ఇలా ఫుట్‌ కోట్‌ ఇవ్వడం వల్ల ప్రధాన ఐటెమ్‌ ఇచ్చిన భావనను కాసేపు అట్టే నిలుపుకోగలిగే అవకాశం పోతుందని తెలుసు. కానీ రీ`రీడిరగ్‌ (ఆ అర్హత   ఉంటే) లో అది మీరు పొందగలిగే అదనపు వాక్యం అవుతుంది.
త్వరగా మొదలై, ఆలస్యంగా ముగిసిపోయే వేసవికాలపు పగలులాగా (నిజానికి ముందు రాసుకున్న వాక్యం… ఆలస్యంగా మొదలై, , త్వరగా వ­గిసిపోయే శీతాకాలపు రోజులాగా) ఈ పుస్తకం వేయాలన్న ఆలోచన త్వరగా వచ్చింది. పని మాత్రం ఆలస్యంగా పూర్తయ్యింది. ఇదీ మంచిదే అయ్యింది. ‘పదాలు పెదాలు’ ఇందులోకి రాగలిగాయి. నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఒక్కోసారి మంచే చేస్తుందన్నమాట. పదాలు`పెదాలు గురించి ప్రత్యేకంగా రెండు మాటలు. పత్రికలో పనిచేసేవాడిగా అవసరం నిమిత్తం ఏమైనా రాయవలసి రావచ్చు. ఇందులో ఉన్న ప్రతిదీ, నేను ఎంతో ఇష్టంగా రాసినప్పటికీ, అది రాయడానికి ఒక కారణమో, ఏదైనా సందర్భమో ఉంది. అలా కాకుండా ఏ అవసరంతోనూ, ఏ కారణంతోనూ పని లేకుండా, కేవలం రాయడం కోసమే రాసిన ఖండికలు ఈ పదాలు`పెదాలు.
ఏదేమైనా, ఈ పుస్తకానికి సంబంధించి ఈ ‘సాక్షి’ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పడం, నా ఫ్యామిలీని తలుచుకోవడం నా కనీస ధర్మం.
వై.ఎస్.భారతి గారు
సజ్జల రామకృష్ణారెడ్డి గారు
వర్ధెల్లి వ­రళి గారు
ప్రియదర్శిని రావ్‌ు గారు
ఖదీర్‌ గారు
ఇంకా, అన్వర్‌ గారు
నేను నూటారెండు సార్లు రివైజ్డ్‌ అంటూ కాపీ పంపినా విసుక్కోకుండా ముందుమాట రాసిన అఫ్సర్‌ గారు
ఆప్తవాక్య మిత్రుడు భగవంతం
మల్లేష్‌
అనూష
ఇప్పుడు నాతో టీ, లంచ్‌ పంచుకుంటున్న సహచరులు
నా అక్షరం కనబడగానే బైలైన్‌ వెైపు చూడగలిగే ఆత్మీయులు
కనీసం మెయిల్‌ పరిచయమైనా లేకుండానే పుస్తకం రావడానికి కారకులవుతున్న ‘సారంగ’ రాజ్‌ గారు
కేవలం తన చొరవతో ఈ పుస్తకాన్ని సాధ్యం చేస్తున్న కల్పనా రెంటాల గారు
కనీసం పదిసార్లయినా ఫైనల్‌ కరెక్షన్స్‌ చేసిన అక్షర సీత గారు
నాతో కలిసి ‘తా’, ‘దు’ పెరుగుదల చూస్తున్న నర్మద
నా పెరుగుదల కూడా అలాగే చూసివుండిన అమ్మ, బాపు.
చిట్టచివరిగా…
బాధకు స్థాయీ భేదం ఉండదనుకుంటే… ఒక అక్షరదోషం గురించి శ్రీశ్రీ ‘అనంతం’లో పదేపదే బాధపడతాడు. దాని తీవ్రత తొలి పుస్తకం అచ్చువేశాకగానీ అనుభవంలోకి రాలేదు.
సమయం దొరికినప్పుడల్లా మధుపాన్నిమురిపెంగా తిప్పితే ఎన్నిసార్లు తిప్పినా  బాగుందనిపించేది. మన పుస్తకం మనకు బాగుందనిపించడంలో వింతేముంది! రీ ప్రింట్‌ చేసినప్పుడు ఎక్కడైనా మార్చవచ్చు అనుకుంటే పక్కన రాసిపెడుతున్నాను. శ్రీశ్రీలా నాకు అక్షరదోషాలకు బాధపడాల్సిన బాధ తప్పిందనుకున్నా. కానీ ఎలా మిస్‌ అయ్యిందో ఇండెక్సులోనే తప్పు వచ్చింది. బ్యాచిలర్‌కు బదులు బ్యాచిలచ్‌. నేను గమనించినంత వరకూ ఇంకోటి ఫుట్‌కోట్‌లో ఉంది. కెమిస్ట్రీ బదులుగా కెమిస్త్రీ. అలాగే ‘పేర్లుండవు’లో డ, ‘దొరకలేదు’లో ర అక్షరాలు ఎగిరిపోయాయి. దీనివల్ల మరింత జాగ్రత్తగా పుస్తకం ప్రూఫ్‌ చూడాలనే జ్ఞానం రాలేదుగానీ, ఎవరి పుస్తకంలోనైనా ఒకటీ అరా అక్షర దోషాలుంటే క్షమించేసే ధోరణి అలవడింది.
ఇంకొక్క మాట చెప్పి ముగించేస్తాను. మేము ­ సాక్షి ఆఫీసులో వాడే పత్రిక అనే ఓ సాఫ్ట్‌వేర్‌లో 16 సైజులో పెడితే ఏర్పడే అక్షర స్వరూపం నాకు కంటికి ఇంపుగా  ఉండదు. 14 పెట్టినా నాకు నచ్చదు. 15లోనే నాకు హాయి­. ఏమిటి దానికే ఆ పర్టిక్యు లారిటీ? మిగతావారికి ఇలా ఉండకపోవచ్చు. అది నా వ్యక్తిగత సమస్యే అనుకుంటాను.
ఇప్పుడు ఈ పాత ఐటెమ్స్‌ అన్నింటినీ అచ్చు వేయకపోతేనేం? అంటే, ఏమో!   నాకు ‘15’లో కనబడేదేదో మీకు కనిపించొచ్చు, అన్న సంశయలాభంతోనే వీటిని మీ ముందుకు తెస్తున్నాను.
మరీ చిన్న పిల్లాడి మారాం అనుకోనంటే ఇక ఇది చివరివాక్యం.
అసలు ఏ మనిషైనా ఎదుటివాళ్లతో తానేమిటో ఎందుకు వ్యక్తపరుచుకోవాలి?  ఈ ప్రశ్న ఎన్నాళ్లుగానో నన్ను వేధిస్తోంది. నేను సమాధానపడగలిగే జవాబు ఇప్పటికీ దొరకలేదు.
తద్విరుద్ధంగా, ఒక రసాత్మక వాక్యాన్ని నాకోసం ఏ పుస్తకంలోనో అట్టిపెట్టి, నేను వెతుక్కోగలనా లేదా అని తమాషా చూసే రచయితతో, దొరికింది చూసుకో అని నేను చిలిపిగా నవ్విన క్షణం… నా జీవితంలో అత్యంత విలువైన క్షణం.
అలాంటి ఏ ఒక్క క్షణాన్నయినా మీకివ్వగలిగితే ఈ పిల్లాడి మారానికి ఏమైనా అర్థముంటుంది. పుస్తకం వేయాలన్న నిర్ణయం సరైనదైపోతుంది.

—పూడూరి రాజిరెడ్డి

నేనేమిటి?

rajireddi-1

రాజిరెడ్డి అనే పేరు కేవలం వొకానొక పేరు కాదని ఇప్పుడు మనకు తెలుసు. ఆ సంతకం పైన కనిపించే వాక్యాలు కూడా సాదాసీదా వాక్యాలు కాదనీ తెలుసు. రాజిరెడ్డి చిరు వచన దరహాసాన్ని “పలక-పెన్సిల్” పుస్తక రూపంలో సారంగ బుక్స్ ద్వారా త్వరలో మీకు అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ఏడాది సారంగబుక్స్ ద్వారా వెలువడుతున్న తొలి పుస్తకం “పలక-పెన్సిల్”. ఆ పుస్తకం నించి వొక మెచ్చుతునక మీ కోసం!

 *

ఇది రాయడానికి నాగ్‌ పంపిన ఒక మెయి­ల్‌ ఆధారం (నవంబర్ 2010). అది చదవగానే నాకు చిన్నగా వణుకు మొదలైంది. ఈ వణుకు భౌతికమైంది కాదు, మానసికమైంది. అందులోని సారాంశం ఏమిటంటే: కోరికలను అణిచి ఉంచడం, దాచిపెట్టడం, మనం లోపల ఒకలా ఉండి బయటకు ఇంకోలా కనబడే ప్రయత్నం చేయడం, వ్యాకులత, నిర్ణయం తీసుకోలేనితనం, తేల్చుకోలేకపోవడం… ఇత్యాదివన్నీ గ్యాస్ట్రిక్‌, అల్సర్… ఇంకా ము­దిరితే క్యాన్సర్స్‌గా పరిణామం చెందుతాయి.

ఇప్పటికిప్పుడు నాలో ఏం తప్పులున్నాయి­? ఏం తప్పులుచేసి దాచిపెట్టాను? ఏం తప్పులు చేయాలనుకున్నాను?

బయటికి చెప్పినవీ చెప్పలేకపోయి­నవీ లోపల ఉన్నవీ లోలోపల దాక్కున్నవీ అంతరాంతరాళాల్లో రక్తంలో ఉన్నవాటిని వేరుచేయడానికి శ్రమపడాల్సినవీ….   తప్పులు ఒప్పులు కన్ఫెషన్లు కోరికలు ఇబ్బందులు హిడెన్‌ ఎజెండాలు ఓపెన్‌ ఆదర్శాలు అన్నింటినీ కలిపి ఒక్కసారి సంచీని దులిపేసినట్టుగా దులపడానికి ప్రయత్నించాను. ఇంకో విధంగా చెప్పాలంటే, నాకు నన్నే ఓసారి తిరిగి పరిచయం చేసుకున్నాను.

* ఎవరినీ నేను పట్టించుకోనట్టు నటిస్తాను కానీ అందరూ నన్ను గుర్తించాలనుకుంటాను.

* టీవీ పాడైతే మెకానిక్‌ను పిలవడం, గిర్నీ ఎక్కడ పట్టించాలో వెతకడం… ఇలాంటివన్నీ నాకు జన్మలో సాధ్యం కాదు.

* నాకు ఫోనోఫోబియా ఉంది.

* ఈ ప్రపంచంలో నా ఒక్కడికే నూటా ఇద్దరు ప్రియు­రాళ్లుండే మినహాయింపు ఉండకూడదా?

*విలాస వస్తువుల మీద నాకు సరైన స్పష్టత లేదు. ఒక్క కెమెరా కొనడానికి కొన్నేళ్లు ఆలోచించాను, అది లగ్జరీ వస్తువే అన్న కారణంగా, నాకు ఆర్థిక ఇబ్బంది లేనప్పటికీ. అది కొంటే ఎలా? కొనకపోతే ఎలా? ఎన్నోసార్లు ఎన్నోవిధాలుగా మథనపడి కొన్నాను. తీరా కొన్నాక కొనకపోతే బాగుండుననిపిస్తోంది. ఒకవేళ కొనకపోయి­వుంటే మళ్లీ నేను కొనలేకపోతున్నానని బాధపడుతుండేవాడిని.

* ప్రభుత్వాఫీసులన్నా, ప్రొసీజర్లన్నా వణుకు. ఆ కారణంగానే కొన్నింటికి నేను అప్లై చెయ్యను. ఇంతవరకు బానే ఉంటుంది. కానీ ఏ ఎక్సో పాపం నా మంచి గురించే, అది ఉంటే మంచిదంటాడు. మళ్లీ నేను డైలమా. అలోచించీ చించీ చించీ నా మనసును మేకప్‌ చేసుకునే సరికి నాకు కొద్దిగానైనా రక్తం ఖర్చయి­పోతుంది కదా!

* కొత్త బట్టలు వేసుకోవడం నాకు చాలా ఆడ్‌-గా ఉంటుంది. వాటి కొత్తదనం చూసేవాళ్లకు ఇట్టే తెలుస్తూనే ఉంటుంది. నెలరోజులు పాతవి అయి­పోతేగానీ నాకు మామూలుగా ఉండదు. పైగా, ఏ విధంగానూ అంతకుముందు పరిచయంలేని ప్యాంటునో, చొక్కానో నా ఒంటిమీదకు ఎలా తెచ్చుకోవడం? ఆ కొత్త చొక్కాతో నా శరీరానికి కొంత పరిచయం జరిగేదాకా నేను దాన్ని ఓన్‌ చేసుకోను.

* నేననుకోవడం నేను పిసినారిని ఏమీ కాను. చాలాసార్లు నేను అనుకున్నవాటికి ఇట్టే ఖర్చుపెట్టేస్తాను. దానికీ నాకూ మధ్య ఏదో ఒక గురి కుదరాలి. అలా లేనప్పుడు మళ్లీ సంశయంలో పడిపోతాను. ఇది ఎంతదాకా వెళ్తుందంటే, ఒక కొబ్బరిబొండాం తాగడానికి నాకు పదకొండేళ్లు పట్టింది. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు మొ­దటిసారి కొబ్బరిబొండాం గురించి విన్నా. కొబ్బరికాయ తెలుసుగానీ బోండాం తెలియదు. అదేంటో కుతూహలం. కానీ అలా దాగుండిపోయింది తప్ప, అది తీర్చుకునే అవకాశం రాలేదు. ఇంటర్లోకొచ్చినప్పుడు మొదటిసారి చూశాను, హైదరాబాద్‌లో. దగ్గరికి వెళ్లి అడుగుదును కదా, ఏడు రూపాయలని చెప్పాడు. అంత ఖరీదైన వస్తువని నేను ఊహించలేదు. అక్కడ్నించి వచ్చేశాను. మళ్లీ మళ్లీ మళ్లీ ఎన్నోమార్లు ఆ ఒక్క కోరిక  తీర్చేసుకుంటే అయి­పోతుందని అనుకున్నాను. కానీ తీర్చుకోలేదు. అది ఎప్పటికి తీరిందంటే, నా డిగ్రీ అయి­పోయి­, పటాన్‌చెరులో జాబ్‌లో చేరాక.  ఇది మూర్ఖత్వమేనా? అప్పటి నా స్థాయికి బోండాం ఖరీదే. కానీ కచ్చితంగా నేను కొనలేనంత ఖరీదైనదేమీ కాదు. అయి­నా నేను కొనలేదు. అలా అని దాని గురించి ఆలోచించకుండా ఉండనూలేదు. ఎందుకంటే దానికి అంత పెట్టి తాగడం అనవసరం అన్న ఒక పాయింట్‌ నుంచి నేను బయటపడటానికి చాలా సమయం పట్టింది. అలాగని నేనేమీ సినిమాలు చూల్లేదా? సిగరెట్లు కాల్చలేదా? ఒకట్రెండు సార్లయినా మద్యం తాగలేదా? అన్ని వెధవ పనులు చేశానుగానీ దీనికి మాత్రం ఖర్చు పెట్టలేదు. ఇలాంటిది నాకు మాత్రమేనా? ఇంకెవరికైనా ఇలాగే ఉంటుందా?

* ఏ బస్టాండులోనో కనబడిన టాయ్‌లెట్‌ దృశ్యాలు నన్ను తినేటప్పుడు హాంట్‌ చేస్తూనే ఉంటాయి.

* మా ఊరు వెళ్లినా ఊరి నడిబొడ్డునుంచి నేను ఆత్మన్యూనత లేకుండా, లేదా ఏ ఫీలింగ్‌ లేకుండా, లేదా అతి మామూలుగా నడుచుకుంటూ వెళ్లలేను. ఎందుకు వెళ్లలేనో నాకిప్పటికీ మిస్టరీ. ఎవరూ పరిచయం లేదు. అలాగని మొ­త్తానికి పరిచయం లేనట్టూ కాదు. వాళ్లతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. మా ఇల్లు, పొలం మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా, నా ప్రేమ అక్కడికే పరిమితం. అసలు ‘స్వేచ్ఛగా సంచరించాను,’ అంటుంటారే… అలాంటిది నా జన్మలో ఎప్పుడూ జరిగినట్టు గుర్తులేదు.

* తెల్ల లుంగీ కట్టుకుని, చేతుల బనీన్‌ వేసుకుని ఆఫీసుకు వెళ్లగలిగే స్వేచ్ఛ కోసం చాలారోజులు ఆలోచించాను.

* నేను పెళ్లికిముందు ఒక ఏడాది మొత్తం తెల్లచొక్కా, యాష్‌ కలర్‌ ప్యాంటు కాంబినేషనే వేసుకున్నాను. ఎంపిక సమస్యను అధిగమించడానికి. దానికో సిద్ధాంతం కూడా ఉండేది. తెలుపు కల్మషానికీ, ఆ కల్మషాన్ని కాల్చాలనేదానికి బూడిదా… సంకేతాలు. అన్ని రంగులనూ తనలో ఇముడ్చుకుని పైకి మాత్రం అమాయకంగా కనబడుతుంది కదా తెలుపు… అందుకని అది కల్మషానికి గుర్తు. మనిషి కూడా అలాంటివాడేనేమో!

* అరటిపండు తినడంకంటే, తిన్న తర్వాత తొక్క ఎక్కడ వెయ్యాలన్నది నాకు  పెద్ద సమస్య.

* బాలకృష్ణకి, బాలకృష్ణకు… ఇందులో ఏది కరెక్టు?  చిరంజీవికి కి ఓకేగానీ బాలకృష్ణకు కు యే నాకు వినడానికి బాగుంటుంది.

* లవంగం అని మనం పిలుస్తున్నదాన్ని యాలక్కాయకు పెట్టాల్సింది. రూపపరమైన ధ్వని కుదరలేదు.

* ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు, వాళ్ల బాత్రూమ్ వాడుకోవడం నాకు అసౌకర్యంగా ఉంటుంది.

* పేలు చూపించుకునే సుఖం కోసమైనా నేను అమ్మాయి­గా పుడితే బాగుండనిపిస్తుంది నాకు.

* ఓరోరి యోగి నన్ను కొరికెయ్‌రో… పాట నేను ఎంజాయ్‌ చేశాను.

* నిన్న మొ­న్నటిదాకా నాకు వైయక్తికం వైయు­క్తికమే. జానమద్ది జానుమద్దే. యద్దనపూడి యు­ద్దనపూడే. ఈ కొమ్ములు ఎక్కడొచ్చి తగులుకున్నాయో తగులుకున్నాయి. అసలు కొన్నింటిని పూర్తిగా చూడకుండా, నేను ఎలా ఉంటుందని నిర్దేశించుకుంటానో అలాగే చదివేస్తుంటాను. ఎవరో దాన్ని ఇంకోలా పలికితే, ఇలా పలికాడేమిటా అనుకునేదాకా!

* పై సమస్యే నాకు ఎంత తీవ్రంగా ఉంటుందంటే,  నేను రోజూ దాన్ని దాటుకుంటూ నడిచే మా పక్కింట్లో ఉండే పెద్ద మామిడిచెట్టును కూడా నేను చూడకపోవచ్చు. సంభాషణలో ఎవరైనా దాని ప్రసక్తి తెచ్చినప్పుడు, అక్కడ చెట్టుందా? అని నేను ఆశ్చర్యపోతే, నేను నవ్వులాటకు అలా అంటున్నానని వాళ్లు అనుకుంటారు.

* ఆరోగ్యకరమైన జడ నాకు సెక్సీగా అనిపిస్తుంది.

* ఇవి చదువుతున్నప్పుడు, చదివేవాళ్ల ము­ఖకవళికలు ఎలా ఉంటాయో చూడాలన్న కోరిక నాకుంది.

*ఓ వందమంది ఒక చోట గుమిగూడుతున్నారంటే నాకొచ్చే మొ­దటి సందేహం: వీళ్లు టాయ్‌లెట్‌ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారు?

* అవసరానికి డబ్బులు తీసుకుని ఇప్పటికీ ఇవ్వనివాళ్లు ఎదురుపడినా, డబ్బులిమ్మని అడగలేను. కాని నాకా విషయం గుర్తుంటుంది.

* చిల్లర కరెక్టుగా లేకపోతే బస్సులో వెళ్లేప్పుడు కండక్టర్‌ను ఎదుర్కోవడం నాకు  ఇబ్బంది.

* ఇందులో చాలా చోట్ల వచ్చిన ఇబ్బంది, భయం అనే మాటలకు నిజమైన ఇబ్బంది, భయం అని అర్థం కాదు. మనిషి లోపలి భావసంచలనానికి తగిన పేర్లు అన్నింటికీ  ఉన్నాయా?

* నాకెందుకో వేడి వేడి సాంబారు గిన్నె నా మీద పడే దృశ్యం చాలాసార్లు గుర్తొస్తుంది, ము­ఖ్యంగా హోటల్లోగానీ, పెళ్లిళ్లలోగానీ భోంచేస్తున్నప్పుడు. బహుశా, మా కీసరగుట్ట స్కూల్‌ దీనికి కారణం. గురుకులం కాబట్టి, మనమే సర్వ్‌ చేసుకోవాలి. రోజుకు కొందరు. నేను సాంబార్‌ బకెట్‌ మోయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడో ఈ భయం నాలో జొరబడింది; గిన్నెను నేను కచ్చితంగా ఎత్తేస్తానని. అది ఇలా రూపాంతరం చెంది ఉంటుందా?

* దర్శకుడు అడ్రియన్‌ లైన్ నాకు నచ్చడానికి కారణం అంతకంటే శృంగారాన్ని బాగా చూపించగలిగేవాళ్లు నాకు తెలియకపోవడం.

* ప్యాంటు కుడిజేబులో దస్తీ పెట్టుకోవడం నాకు మొ­దట్నుంచీ అలవాటు. అంటే, ప్యాంటులో కర్చీఫ్‌ అనే వస్తువు ఒకటి ఉండటం అలవాటైనప్పట్నుంచీ. సాధారణంగా దీన్ని భోంచేసి, చేయి­ కడుక్కున్నాక, మూతినీ చేతినీ తుడుచుకోవడానికి తప్ప వాడను. కుడివైపు జేబులో ఉంటే, కుడి చేత్తో తీసినప్పుడు జేబు తడి అయి­పోతుంది. అందుకని నాకోసారి ఎడమవైపు ఎందుకు పెట్టుకోకూడదనిపించింది. అంతే! అప్పట్నుంచీ ఎడమజేబులోనే పెడుతున్నా.

* చక్రగోల్డ్‌ యాడ్‌లో సోనాలి బెండ్రే వచ్చేది. ఎర్రచీర. నవ్వుము­ఖం. నాకు అలాంటి భార్య వస్తే బాగుండేదని కలలు కనేవాణ్ని.

* మగవాళ్లు హాఫ్‌ బనీన్లు ఎలా వేసుకుంటారో నాకు అర్థం కాదు. బనీన్‌ వేసుకోవడంలోని పరమోద్దేశం నెరవేరదు కదా! నిజమే, చేతుల బనీన్‌ చూడ్డానికి కాస్త పల్లెటూరితనంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఎత్తిచూపి నా డిగ్రీ ఫ్రెండ్స్‌ నన్ను వెక్కిరించేవాళ్లు. నేను కూడా ఒకట్రెండుసార్లు నా పల్లెటూరితనాన్ని వదిలిపెట్టి, నగరాన్ని ఆశ్రయించాను. అదే, హాఫ్‌ బనీన్‌ ధరించాను. నా వల్ల కాలేదు. అప్పట్నుంచీ, నా ఓటు చేతు గుర్తుకే.

* సౌండ్‌ ఫ్రూఫ్‌ టాయ్‌లెట్లు ఉంటే బాగుంటుంది కదా!

* పుస్తకం చదవడానికి అవసరమైన బలమైన ప్రేరణ ఏదో అందులో ఉండాలి. అది సినిమా అయి­నా అంతే. లేదంటే నేను చూసినదాన్నే మళ్లీ చూడటానికీ, చదివినదాన్నే మళ్లీ చదవడానికీ ఉత్సాహం చూపిస్తాను తప్ప కొత్తదాన్ని చదవను.

* నాకు చాలామందిని సర్‌/మేడమ్ అని పిలవడానికి అభ్యంతరం ఉండదు. కానీ వీళ్లను కచ్చితంగా సర్‌/మేడమ్ అనాల్సివుంటుందంటే మాత్రం నోరు రాదు.

* ఫొటో ఎందుకు అచ్చువేయాలి?

ఏదో ఒకటి, అది ఏదైనా సరే, నేను అంటూ మొదలుపెట్టి రాసేదాన్లో పాఠకుడు అది రాసిన మనిషిని ఊహిస్తాడు. అది చదువుతున్నప్పుడే రచయిత బొమ్మ పాఠకుడి మనసులో రూపుదిద్దుకుంటూ ఉంటుంది. తర్వాతెప్పుడో, ఆ రచయిత వాస్తవ ముఖాన్ని చూసినప్పుడు, తన ఊహకూ దానికీ మిస్‌మ్యాచ్‌ అయ్యిందంటే (సహజంగానే అవుతుంది) అతడు తీవ్రమైన నిరాశకు లోనవుతాడు.

అలా కాకుండా…

ఫొటోతో సహా ఐటెమ్‌ చదివినప్పుడు, పాఠకుడి ప్రమాణాన్ని ఆ ఫొటో నిర్దేశిస్తుంది. దానికి లోబడే అతడి ఊహ సాగుతుంది. ఇదిగో ఈ ముఖమే ఇది రాసింది, అన్న గమనింపు అతడికి ఉంటుంది. ఆ అక్షరాలు నచ్చకపోతే గనక, ఆ రచయిత ముఖానికి ఏ విలువా ఉండదు. అసలు ముఖం గుర్తింపునకే నోచుకోదు. అలా కాకుండా ఆ అక్షరాలు నచ్చితే గనక, క్రమంగా ఆ ముఖానికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. (నా ఫొటోకు ఇది ఒక వివరణలా కూడా భావించవచ్చు.)

* నేను క్లారిఫై చేసివుంటే, నా మీద ఉన్న బ్యాడ్‌ ఇమేజ్‌ తొలగిపోతుందని అనుకున్నప్పుడు కూడా నేను నూటికి తొంభై తొమ్మిదిసార్లు మౌనంగానే ఉంటాను.

* నాకుగా మొ­దట సంభాషణ ప్రారంభించడం నాకు చాలాసార్లు సాధ్యం కాదు. ఒకవేళ మాట్లాడాలనిపించినా, వందసార్లు రీహార్సల్‌ చేసుకుంటాను.

* ఇదింకో విచిత్రమైన సమస్య. మనం ఒక వాక్యం రాసేస్తాం. అంటే అది చదివేవాళ్లకు శిలాక్షరమై కూర్చుంటుంది. ఒకవేళ నేను వేరేవాళ్లను చదివినా ఇలాగే చదివేస్తానేమో. కానీ అది అలా ఉండదు. ఆ వాక్యంలో నూటికి నూరు శాతం నిజం ఉండదు. అలాగని అది అబద్ధమని కాదు.

ఉదాహరణకు పైన చెప్పిందే తీసుకుంటే, నేను ఎవరితోనూ ఎప్పుడూ చొరవ  తీసుకుని మాట్లాడివుండలేదా?, అంటే ఉన్నాను. మరి అలా అయి­నప్పుడు తీసుకోలేదని ఎందుకు అనాలి?, అంటే జవాబివ్వలేను. వాక్యం వంద శాతం నిజం కావడానికీ, వంద శాతాన్ని తగ్గించేలా చేసే అంశాలకూ మధ్య ఉన్న ఆ చెప్పలేనితనాన్ని ఎవరికి వారే అర్థం చేసుకోవాలని నా సలహా.  లేదంటే, ఇక్కడ రాసినవి చాలా వరకు అబద్ధాలై కూర్చుంటాయి.

* చాలావరకు ఈ ఆలోచన రాగానే వచ్చినవి వచ్చినట్టు రాయడానికే ప్రయత్నించాను. చాలా కొన్నింటినే వాటి స్థానాలను మార్చాను, ము­ఖ్యంగా కింద వచ్చేవి. దానివల్ల కొంత కరెక్టు ఎండ్‌ ఉంటుందని నా ఉద్దేశం.

* కొన్ని చెప్పడం వల్ల చదివేవారికి కొన్ని ఇమేజెస్‌ ఏర్పడతాయన్న ఉద్దేశంతో, కొన్నింటిని రాసి తొలగించాను. అంటే నేను పూర్తి స్వచ్ఛంగా ఉండలేకపోయాను.

* అనుకుంటాంగానీ, నిజంగా మనిషి మనసులో ఉన్నవన్నీ రాయలేం. ఇలాంటి నా లోపలి విషయాలు ఇంకా వెయ్యి ఉన్నాయేమో, అనిపిస్తోంది. ఇంకొకటి చెప్పాలి. నిజంగా రాయలేమా అంటే, ఒక క్షణంలో మనకు కలిగిన భావాన్ని వాక్యంలోకి తర్జుమా చేస్తే అది సంపూర్ణ సత్యం కావాలని లేదు. అది ఆ క్షణానికి సత్యమే. కానీ ఎప్పటికీ నిలిచే సత్యం కాకపోవచ్చు.

* కొన్ని చీకటి విషయాలను కావాలనే రాయలేదు. వీటిని చెప్పకుండా ఉంటే, పై అధ్యయనం ప్రకారం క్యాన్సర్‌తో పోతాననేది నిజమే కావొచ్చుగానీ, మరీ రాళ్లతో కొట్టించుకుని అంతకంటే ముందే చచ్చిపోవడానికి నేను సిద్ధంగా లేను.

* ఇవన్నీ నిజంగాఎందుకు రాయాలీ? జీవితంలో కొన్ని దశలు దాటింతర్వాత వీటికి ఏ విలువా ఉండదు. మరి ఇలాంటి చెత్త విషయాలను ఎందుకు పంచుకోవడం అంటే.. ఏమో, మనిషనేవాడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఆలోచించగలడు, అసలు ఎంత చిన్న విషయాల గురించి ఎంత బుర్ర పాడుచేసుకోగలడు, అని చెప్పాలని ఒక దుగ్ధ. ఇంకా ము­ఖ్యంగా ఇవన్నీ చెప్పేస్తే ఏర్పడే ఖాళీతనం నాకు ఇష్టం.

* ఇవన్నీ రాసిన తర్వాత, పుస్తకంలో అచ్చు వేయాలా లేదా అనేదాని గురించి కూడా నేను మళ్లీ మళ్లీ ఆలోచించాను. ఇక నన్ను ఎవరూ బాగుచెయ్యలేరు. నన్ను నేను కూడా చేసుకోలేను. ఇక ఇలా చెడీ చచ్చీ, కాలి, బూడిదైపోవాల్సిందే.

రచయిత గా గుర్తింపు రాకుంటే నా కథ ఇంకోలా వుండేది: ఖదీర్ బాబు

మహమ్మద్ ఖదీర్ బాబు పుట్టినరోజు ఏప్రిల్ 28 సందర్భంగా ‘సారంగ ‘ శుభాకాంక్షలు 

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బుకు వెళ్లడం నాకు ఇదే తొలిసారి. ఒక సభ్యుడు కాని వ్యక్తికి అందులో ప్రవేశం లేదు. మామూలుగానైతే నేను వెళ్లనే వెళ్లను. ఒకవేళ అనుకోకుండా పోయినా, అడ్డు చెప్పగానే మారు మాట్లాడకుండా తిరిగివచ్చేవాణ్ని. కానీ ఖదీర్ అలా కాదు. కొద్దిసేపైనా అలా గాంభీర్యం నటిస్తూనో, లేదా నిజంగానే గంభీరంగానో అలాంటి వ్యవహారాన్ని ఫైస్లా చేయగలడు. అవసరమైతే, ‘ఏంటయా బాబూ నన్నే ఆపుతున్నావు!’ అని నైసుగా అంటూనే లోపలికి వెళ్లిపోగలడు. ఆ చిన్నపాటి దబాయింపు నేను ఈ జన్మకి నేర్చుకోలేను.

నాలోని నన్నూ, పెద్ద పదం అనుకోకపోతే, ఇంకో పదం తెలియదు గనక, రచయితనూ ఏకం చేసుకోలేక నేను సతమతమవుతుంటే… ఈయన రెంటినీ ఏకకాలంలో పొట్టగీరుకున్నంత ఈజీగా దొర్లించుకుంటూ వెళ్లిపోతాడు.

ఇందులో నేపథ్యాలు పాత్ర పోషిస్తాయా? లోలోపలే ఆ బీజం ఉంటుందా? ఏమో! ఇలాంటి వ్యక్తి, “రచయితగా గుర్తింపు రాకపోయుంటే ఆ డిప్రెషన్తో సూసైడ్ చేసుకునేవాణ్ని,” అనడం ఆశ్చర్యమే! ఖదీర్ నోటినుంచి ఇది నేను కొత్తగా వినడం!

అయితే, వీటితో సంబంధం లేకుండానే ఆయనలోని వ్యక్తితో నాకు కొన్ని పేచీలున్నాయి. అంటే దానర్థం మేము ఆరోగ్యకరంగా సంభాషించుకోవడానికి అవి అడ్డంకిగా మారాయని కాదు. ముందెప్పుడో ఖదీర్ చెప్పబోతున్నట్టు, మాది లవ్ హేట్ రిలేషన్ షిప్పే అయ్యుండాలి. రోజూ కలిసి మాట్లాడేవాళ్లతో ఉన్న సమస్యేమిటంటే, వాళ్ల గురించి మనకు కొంత ఎక్కువ తెలుస్తుంది. దానివల్ల ఆయనలోని రచయితనే ఇంటర్వ్యూ చేద్దామనుకున్నా నాలోని వ్యక్తి ఆయనలోని వ్యక్తిని గిల్లబోతాడు. అది నా లోలోపల జరిగిన ముష్టియుద్ధంలోని జయాపజయాల మీదే ఆధారపడింది.

ఖదీర్ వాక్యాన్ని నేను గౌరవిస్తాను. ఆ వాక్యంలో ఒక తూకం ఉంటుంది. ఒక నెమ్మదైన వేగం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసినవాడు పద్ధతిగా వాహనం నడపడం లాంటిదది. దారిచూపించే తాతయ్యను నెట్టేసి, మనవడు ఉత్సాహంగా ముందుకు పరుగెత్తినట్టుగా… రచయితను దాటేసి పాఠకుడిగా ముందుకు వెళ్లిపోవాలనిపిస్తుంది.

దర్గామిట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు, పప్పూ జాన్ కథలు, మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాసిక్స్, నూరేళ్ల తెలుగు కథ, న్యూ బాంబే టైలర్స్; కథలు రాసినా, కథల గురించి చెప్పినా, పాటల గురించి మాట్లాడినా, సినిమాల గురించి విశ్లేషించినా, ఆ వాక్యం ప్రవహించే తీరులో ఒక సాఫీదనం ఉంటుంది. ‘సుగంధ సోడా’గదా నెమ్మదిగా పెదాలను తాకుతూ, గొంతుగోడలను మృదువుగా ఒరుసుకుంటూ జారినట్టుగా అలా లోలోపలికి వెళ్లిపోతుంది. అంతా అయ్యాక ఒక తీపిదనం ఏదో శరీరంలోని అవయవాలకు అంటుకుపోతుంది.

చిన్నప్పుడు మాస్టారు సుబ్బరాజయ్య గారు ఖదీర్ అహ్మద్ పేరును హిందూకరించి ఖదీర్ బాబుగా నామకరణం చేశాడని పోలేరమ్మ బండ కథల్లో నవ్విస్తూనే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వగలిగిన మహమ్మద్ ఖదీర్ బాబు పుట్టినరోజు (ఏప్రిల్ 28) సందర్భంగా ఈ ‘సారంగ సంభాషణ’!

నేనూ, నాతోపాటు యాకూబ్(పాషా)… అంటే దీన్నొక ఫార్మల్ వ్యవహారం చేయదలచక… అలా ఊరికే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకునేట్టుగా ప్లాన్ చేశాం.

క్లబ్బు మెట్లెక్కి, మొదటి అంతస్తులో ఖాళీ టేబుల్ కోసం చూస్తుంటే, “స్మోకింగ్ అయితే పైనుంది సార్,” అన్నాడు అటెండ్ అవుతున్న వ్యక్తి. దానికన్నా ముఖ్యంగా, పై అంతస్తు ఓపెన్ టాప్ అని తెలిసేసరికి అది మరింత వాంఛనీయ స్థలం అయింది.

పగటి పూట శ్రమ చేశామన్న సాకును, సాయంత్రపు విరామంగా మార్చుకోవడానికి చక్కటి స్థలం ఇది. అప్పటికే కొన్ని టేబుళ్లు నిండివున్నాయి. స్పష్టాస్పష్ట చీకట్లో ముఖాలు కొద్దికొద్దిగా కనబడుతున్నాయి. “ఆ సార్ మీరా?” “అయ్యో ఎలా ఉన్నారు?” “ఇమేజ్-లో మానేశారంటగా….”

మూలనున్న టేబుల్ మీద ఖదీర్ ఒకవైపూ, నేనూ యాకూబ్ ఒకవైపూ కూర్చుంటుండగా-

ఖదీర్: మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? అడగొద్దయ్యో బోర్…

రాజి: సరే సరే…

యాకూబ్: అన్నా ఇంటర్వ్యూలో నా పేరుగూడ రాస్తావే…

రాజి: నువ్వు నా పక్కనున్నంక రాయకుండ ఉంటనా!

ఈ మూలన వెలుతురు తక్కువగా ఉంది. కిందినుంచి వాహనాలు రోడ్లముఖాల్ని చూడ్డానికి టార్చిలైట్లు వెలిగించుకుంటూ వెళ్తున్నాయి. ఈ దారులన్నీ నాకు చిరపరిచితమైనవే. ఆలియా కాలేజీలో ఇంటర్ చదివినప్పుడు 7, 8ఎ బస్సుల కోసం కుస్తీలు పట్టేవాణ్ని. మా శివిగానివాళ్లమ్మ కట్టిచ్చిన పొరలపొరల చపాతీలు ఎల్బీ స్టేడియంలో ఇద్దరం కలిసితిన్నాం. ఇంటర్వ్యూ చేయబోయేవాడి ధర్మాలంటూ ప్రత్యేకంగా ఉంటే, ఈ తలపోతలన్నీ ఆ ధర్మానికి విరుద్ధం. పైకే వాటిని పాటించగలంగానీ, లోలోపల పొంగే జ్ఞాపకాలను ఎలా అడ్డుకోగలం? ఇంతాచేస్తే అంతరంగాన్ని ఆరబోసుకోవడానికేగదా ఇంటర్వ్యూలుండేది! కాకపోతే కుర్చీకి అటువైపు ఉన్నవాళ్లది:-)

వేంపల్లి షరీఫ్ యువ సాహిత్య అకాడమీ అవార్డు, చిలుమూరు ప్రోగ్రామ్; ఇట్లాంటి కొన్ని విషయాల మీద గొంతులు దొర్లాక-

“స్టార్ట్ చేద్దామా!”

Qమొన్నొక ఆన్ లైన్ వేదికలో, ‘ఇప్పటికాలంలో గురజాడలాంటి రచయిత పేరు చెప్పాల్సివస్తే’ అన్న చర్చలో, ‘ఖదీర్ బాబు’ అన్నారు; చూసుకున్నారా?

(ప్రశ్న వినగానే ఖదీరూ, యాకూబూ పగలబడి నవ్వారు. ఒక అరనిమిషం తర్వాత-) గతంలో తిరుపతిలో అన్నమయ్య భాషా ఉత్సవాలు జరిగినప్పుడు, తెలుగులో చిట్టచివరి కవి శ్రీకాంత్, చిట్టచివరి కథకుడు ఖదీర్ బాబు అని రాశారు. వాటిని సీరియస్గా పట్టించుకోకూడదు. అయితే గమనింపులో ఉన్నామనేదే ఆనందం!

Qఅసలు ఒక రచయిత బతికుండగానే వారి స్థానాలు, వారి సాహిత్యస్థాయిలు నిర్ణయమవుతాయంటారా?

దాదాపుగా. శ్రీశ్రీ బతికుండగానే తన ముద్ర వేయగలిగాడు. చలం, రావిశాస్త్రి లాంటివాళ్లు కూడా వాళ్లు వేయదగ్గ ముద్ర వాళ్లు వేసేసి వెళ్లిపోయారు. అయితే ఆ సాహిత్యం ఎంత కాలం నిలుస్తుందనేది, కాలం నిర్ణయిస్తుంది. అయితే అందరి కృషీ వాళ్లు బతికుండగానే గ్రహింపులోకి రాదు. వాళ్లకు రావాల్సినంత పేరుకూడా రాదు. ఉదాహరణకు అల్లం శేషగిరిరావు, ఆర్.వసుంధరాదేవి; ఇలాంటివాళ్లను గుర్తించడానికి సమయం పడుతుంది.

Qఈ ప్రశ్న కూడా నా దగ్గరుంది. ఎంతోమంది సీనియర్ రచయితలకు రాని పేరు మీకు రావడం వెనకున్న కారణం ఏమిటి?

నామిని చెప్పేవాడు నాకు. గాలివానలాగా కొట్టాలి. వాన ఒక గంట కొడితే లాభం లేదు. దాన్ని ఎవరూ పెద్దగా గుర్తించరు. పీపుల్ ఆర్ బిజీ విత్ మెనీ థింగ్స్. కురిసినప్పుడు కుండపోతగా రోజంతా, జనం పనులు మానుకుని చూసేట్టుగా కురవాలి. దర్గామిట్ట కథలు నాకు ఆ అవకాశం ఇచ్చింది. పదివేల కాపీలు అమ్ముడయ్యాయి. రోజూ ఒక కాపీ ఇప్పటికీ అమ్ముడవుతోంది. ప్రపంచంలో ఎవరో ఏదో మూలన ఒక్కరైనా ఆ పుస్తకాన్ని తిరగేస్తుంటారు. ఎవరో ఒకరు రోజూ మెయిల్ చేస్తూవుంటారు.

Qదర్గామిట్ట గానీ, పోలేరమ్మబండగానీ సక్సెస్ కావడానికి కారణం ఏమిటనుకుంటారు?

పతంజలిగారి రచనలు చూడండి! ఆయన నవలల్లో కనబడేదీ, మాట్లాడేదీ ఆయన కాదు; అరిచేది ఆయన కాదు; కిందపడి దొర్లి రోదించేది ఆయన. మన రచనలో మన ఆర్థిక స్థితి, మన సంస్కారం, మన క్యారెక్టర్ ఏమిటో పాఠకుడికి తెలియాలి. అప్పుడే కనెక్ట్ అవుతాడు. నా రచనల్లో కూడా అలా కనెక్ట్ అయ్యే గుణం ఉంది. మబ్బు కనిపిస్తే నవ్వే మార్దవమైన బాలుడు, ముల్లు గుచ్చుకుంటే ఏడిచే పిల్లవాడు… కథలు వాళ్ల బాల్యంతో కనెక్ట్ అయ్యాయి.

Qకావలి నుంచి వద్దాం! బాల్యంలో వంద రకాల ఉద్యోగాలుంటాయ్; పోలీసనీ, పోస్ట్ మాస్టరనీ… మీ కలల్లో రచయిత ఏ క్షణానైనా ఉన్నాడా?

నేను మొదట్నుంచీ సిక్ చైల్డుని. నెలకోసారి దగ్గు వస్తుండేది. సన్నగా, పుల్లలాగా బలహీనంగా ఉండేవాణ్ని. ఎత్తుపళ్లు. చింపిరిజుట్టు. ఆటల్లేవు. ఆబ్సెంట్ మైండెడ్-గా ఉండేవాణ్ని. ఎవరూ కలవనిచ్చేవారు కాదు. దాంతో ఏదో కలల్లో విహరించేవాణ్ని. పైగా మా నాన్న కరెంటు పనికి వెళ్లి, గంటలో ఏదైనా పనిచేసుకు వస్తేనే… ఇవ్వాళ తింటున్నాం, అని తెలిసేది. ఆ పరిస్థితులు నాకు నచ్చేవి కావు. ఆ బాధల్లో నేను ఉండగలిగేవాణ్ని కాదు. అసలు ఇంట్లో ‘ఉండటానికి’ ఇష్టపడేవాణ్ని కాదు. బంధువులు వస్తే ఇంటి సందులో దూరిపోయేవాణ్ని. మూడీ ఫెలో అనుకునేవారు. వీళ్లనుంచి పారిపోయి నాకు నేనే కొత్త ఆలోచనలు చేస్తూ అందులో పొద్దుపుచ్చేవాణ్ని. అంటే రాయడానికి, లేదా అందులో దాక్కోవడానికి అవసరమైన బేస్ అక్కడ పడివుంటుంది.

Qఇది ఇప్పటి అవగాహనతో చెప్తున్నారా? అప్పుడు కూడా ఇలా అనిపించేదా?

లేదు లేదు, ఇప్పటి అవగాహనే! (“కంటిన్యూ… కంటిన్యూ చేయండి… “) మేము కొత్తగా ఇల్లు కట్టుకుని హిందూ లొకాలిటీలోకి మారాం. వీళ్లు నాకు తగిన గౌరవం ఇచ్చేవాళ్లు కాదు. ఒంటరిగా ఉండిపోయేవాణ్ని. (“అంటే మతం దానికి కారణమా?”) చెప్పాగదా! నేను చూడ్డానికే నన్ను కలుపుకోవాలనిపించేట్టుగా ఉండను. ఈ స్నేహితులను నా చుట్టూ తిప్పుకోవాలంటే నేను ఏదో చేయాలి. అందుకని నవ్వించడానికి ప్రయత్నించేవాణ్ని. అప్పుడు అయస్కాంతంలాగా నా చుట్టూ తిరిగేవారు. నేను ఇప్పటికీ జోక్స్ బాగా కట్ చేస్తా. దీనివల్ల ప్రోజ్ ఈజ్ అయింది. అయితే ఇదే గుణం వల్ల పెద్దవాళ్ల దగ్గర కూడా ఇలాగే జోక్స్ వేసి నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనుకో!

Qఅంటే ఎట్లా?

మనం ఏదో అలవాటుకొద్దీ ఏదో సెటైర్ వేస్తే, అది బెడిసికొట్టి… ఇంకోరకంగా పొగరుబోతనో, మరోలాగానో ముద్ర పడిపోతుంది…

Qఓకే ఓకే… మీకు వాక్యం ఎలా పట్టుబడింది?

మొదటిది, చాలా చిన్నప్పుడే నేను పుస్తకాలకు కనెక్ట్ అయ్యాను. కచ్చితంగా చెప్పగలను, పదో ఏడులోనే నేను చందమామ లాంటి కథలు రాయడానికి ప్రయత్నించాను. పోతే, మా నాన్నమ్మ పాత పార్శీ కథలు బాగా చెప్పేది. చాలా అద్భుతంగా చెప్పేది. డైనింగ్ టేబుల్ మీద పడుకుని ఆమె చెప్పే కథలు వినేవాణ్ని.

Qడైనింగ్ టేబుల్ మీద పడుకోవడం; డైనింగ్ టేబుల్ కొంత సంపాదనాపరులకు గుర్తు కదా…

మేము ఇల్లు కట్టిచ్చినప్పుడు మిగిలిన కొయ్యతో ఈ డైనింగ్ టేబుల్ చేయించాడు మా నాన్న. బలంగా, మంచంలా ఉంటుంది. దానికి ఎప్పుడైనా కుర్చీలు చేయించాలనుకునేవాడు; చేయించలేదు. ఇప్పటికీ కుర్చీలు లేవు. అలా ఉండిపోయిందది!

Qఅచ్చులోకి రాకుండా ఎన్ని రచనలు ఉండిపోయినయ్? అంటే ఎంత రఫ్ వర్క్ ముందు చేసివుంటారు?

పెద్దగా లేవనే చెప్పాలి… ఇంటర్లోనే ‘స్వాతి’లో నా కథ అచ్చయింది. నేను ‘జాగృతి’కి కూడా రాశాను తెలుసా? దీపావళి పోటీకి…

Qకథ పేరేంటది?

ప్రాయశ్చిత్తం.

Qఇప్పుడు దొరుకుతాయా చదవడానికి?

అవెందకు చదవడం? అన్నీ పిచ్చి కథలు.

Qఎందుకు?

అంటే నేను ఖదీర్ బాబుగా ఓన్ చేసుకోలేనివి.

Qఅంటే ఒక్కటిగూడా లేదా, చదవదగ్గది?

ఒకటైతే బాగుంటుంది, నాకు బాగా ఇష్టం కూడా. పుష్పగుచ్ఛం అనీ 95లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది… జంపాల చౌదరి గారు కూడా పంపమని అడుగుతుంటారు…

Qమరి దాన్లో ఉన్న ఇబ్బందేమిటి?

ప్రోజ్ బాగుంటుంది… స్త్రీ పురుష సంబంధం… ‘చిక్కగా ఉన్న ఆమె పాలిండ్లపై అతడు తలపెట్టి’… ఇలా సాగిపోతుంది. రీడబుల్. కానీ నా దృక్పథం లేదు.

Qసరే, ప్రశ్నల ఆర్డర్లో వెళ్దాం… మన దురదృష్టంకొద్దే కావొచ్చు, భాషకూ మతానికీ లంకె పడిపోయింది. ఆ నేపథ్యంలో… ముస్లిం సమాజంలోంచి వచ్చిన మీకు ఇంత మంచి తెలుగు ఎలా అబ్బంది? అవసరంలోంచా? ప్రేమలోంచా?

మతానికీ భాషకూ లంకే లేదు. నా ఉద్దేశంలో ఇస్లామ్ ఎక్కడుంటే అదే దాని భాష. మలయాళంలో ముస్లింలుంటే వాళ్లు వేరే ఏదో ఎందుకు మాట్లాడుతారు? మలయాళంలోనే మాట్లాడాలి.

Qసాధారణంగా ఉర్దూను ముస్లింలకు జత చేస్తాం కదా!

అది ప్రజల భాష. ముస్లింలు ఎక్కువగా మాట్లాడితే మాట్లాడివుండొచ్చు…

Qమొన్న తెలంగాణ భాష అదీ నెట్ చర్చల్లో వచ్చినప్పుడు స్కై(బాబా)కి స్పందనగా, డానీగారు ‘ఉర్దూ గురించి పట్టించుకునేవాళ్లు లే’రని బాధపడ్డారు. ఆ లెక్కలో అడుగుతున్నా…

ఉర్దూను అందరూ కాపాడుకోవాలి. అదీ ఉర్దూ అని కాదు, ఏ భాషైనా కాపాడుకోవాలి. లేకపోతే ఆ భాషలో ఉన్న సౌందర్యమంతా మనకు దూరమైపోతుంది. ఉర్దూలో బర్కత్ అని ఒక మాటుంటుంది… ఈసారి పెద్ద బర్కత్ లేదంటాడు. తెలుగులో ఏ మాటపెట్టీ దానికి సమానార్థకం సాధించలేం… లాభదాయకత కూడా గాదు…

యాకూబ్: మనవైపు అంటాంగదా…
రాజి: అవునవును… ఈ యాడాది పంట బర్కతే లేదు… ఎంత సంపాయించినా ఇంట్ల బర్కతుంటలేదు…

Qమతం, భాష ప్రశ్న అడిగినందుకు నన్ను నిరసించడానికీ, నిరసించకపోవడానికీ కారణాలేమిటి?

నిరసించేది ఏమీ లేదు. మీరు చూస్తూవుండండి… ఈ హైదరాబాద్ పాతబస్తీ దీన్ని వదిలేస్తే వచ్చే పదేళ్లలో కోస్తా ముస్లింలు ఒక్క ఉర్దూ పదం కూడా ఉపయోగించని తెలుగు మాట్లాడుతారు. వాళ్ల దగ్గర చాలా పరిమితమైన వొకాబ్యులరీ ఉంది, హార్డ్లీ వెయ్యి పదాలు… దానితోనే ఏదో మేనేజ్ చేస్తున్నారు…

రాజి: నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఓసారి సంగీత్ థియేటర్లో ఐదు రూపాయల లైన్లో నిల్చున్నా… ఇద్దరు స్నేహితులు ముందుండి, మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ముస్లింలని కూడా చెప్పలేను. ఒకతను అంటున్నాడు: “నమ్మకం నై లగానారే, దొంగ ……” పదహారు పదిహేడేళ్లయిందిగానీ నాకు ఆ వాక్యం అలా గుర్తుండిపోయింది. మళ్లీ నాకు వాళ్ల ముఖాలు గుర్తులేవు, ఓన్లీ ఈ వాక్యమే!

(ఈ వాక్యాన్నియాకూబ్ రిపీట్ చేశాడు. “నమ్మకం నై లగానారే దొంగ… నమ్మకం తెలుగు, దొంగ.. తెలుగు… లగానారే అని ఒకటి మధ్యలో, సే అని చివర్లో… )
ఖదీర్: తెలివైన ముస్లిం ఎవరూ ఇది నా భాష అని చెప్పడు. చదువు, సాహిత్యం, పత్రికలు, అన్నీ తెలుగులోనే ఉన్నాయి. భాష అంటే ఒక ప్రాంతానికీ, మతానికీ ఆపాదిస్తాంగానీ ఒకవేళ ఒక భాష పోయిందంటే నష్టపోయేది అవి మాత్రమేకాదు. మొత్తం ప్రపంచమే నష్టపోతుంది.

Qముస్లింగా మీరు ఎప్పుడైనా అభద్రతకు లోనయ్యారా?

మతం ప్రాతిపదికన ఈ దేశం విడిపోయినప్పుడే ముస్లింలందరూ అభద్రతలోకి జారిపోయారు. ఇక్కడ వాళ్ల జీవితం శాశ్వతంగా ప్రమాదంలో పడింది.

Qఅంటే మీకు అలా అనిపిస్తుందా? ఏమైనా లోలోపల…

ఇలా అని ఉండదు. కానీ రాజకీయాల్లో మనవాళ్లు ఎందరున్నారు? డాక్టర్లలో మనవాళ్లు ఎందరున్నారు? టీచర్లలో ఎందరున్నారు? పోలీసుల్లో ఎందరున్నారు? వాడి ప్రాతినిధ్యం ఉండాలి. వాడి మాట చెల్లుబాటు కావాలి. అవుతుందంటే ఒక ధైర్యం. ‘నా  రక్తం ఎవరో ఒకరి అధికార పీఠానికి లేపనం’ అని ఖాదర్ అన్నాడు. ముస్లిం బూచీని చూపిస్తారు, ఆ బూచీని సీసాలో ఎవరూ బంధించరు…

Qఅంటే మళ్లీ విషయం అధికారం దగ్గరికే వెళ్తుంది…

నువ్వు పని చేసే సంస్థ నీవాళ్లది అంటే ఆ ఫీలింగ్ కచ్చితంగా వేరేగా ఉంటుంది. నీ పైనున్నవాడు నీవాడు అని ఒక నమ్మకం కలిగితే మనకు కొంత శాంతి ఉంటుంది.

Qఇది చెప్పండి. పాత్రికేయవృత్తిలోకి ఎందుకు రావాలనుకున్నారు?

కథలు అచ్చవుతాయని! లబ్బీపేట, విజయవాడ అని ఏదో మ్యాగజైన్లో అడ్రస్ చూసి కథ పంపిస్తే తిరిగి వచ్చేది. వెనక్కొచ్చిన కవర్-ను చూడాలంటే బాధ! వాళ్లకు ఫ్రెండ్సుంటారు, వాళ్లవే వేస్తారనేవాళ్లు. కాబట్టి జర్నలిజంగానీ నేను జర్నలిస్టునే కాదు. అది మేధావుల వృత్తి. సీరియస్ ప్రొఫెషన్. ఏబీకే, కె.రామచంద్రమూర్తి లాంటివాళ్లే దీనికి సూట్ అవుతారు.

Qపాత్రికేయుడిగా ఉండటం వల్ల గుర్తింపు విషయంలో రచయితలకు అడ్వాంటేజీ ఉంటుందా?

ఉండదు. అయితే ఉండటంవల్లే కొన్ని రాయగలం. వాక్యం సాఫీ అవుతుంది. సాధన ఉంటుంది కాబట్టి. కవర్ డిజైన్ ఎలా చేయించుకోవాలో తెలుస్తుంది. అంతవరకే!

యాకూబ్: ఇది అడుగు, కంజర్ కవిత్వం గురించి…

Q  ముందు మీరు కొంత కవిత్వం రాసినట్టున్నారు కదా!

ఖదీర్: 92-97 మధ్యకాలాన్ని కవిత్వం ఏలింది. ఉద్యమాలు, బీసీలు, మహిళలు… ఎవరైనా ఆ వాతావరణంలో ఇమ్మీడియట్గా నేర్చుకునేది పోయెట్రీయే. పిల్లలు అమ్మా నాన్న అని త్వరగా నేర్చుకున్నట్టు.

Qమరి కవిత్వం ఎందుకు విరమించుకున్నారు?

ఇది నా బాధ అనిపించినప్పుడు తనదగ్గరున్న వొకాబ్యులరీ, తన దగ్గరున్న ఎక్స్ ప్రెషన్తో కవిత చెబుతాడు. అమ్మానాన్న స్టేజ్ దాటిపోయాక… నాకెందుకు దెబ్బ తగిలింది? నాకే ఎందుకు దెబ్బ తగిలింది? దెబ్బ కొందరికి తగలడం ఎందుకు? కొందరికి తగలకపోవడం ఎందుకు? ఇవన్నీ చెప్పాలంటే కవిత్వాన్ని దాటి వెళ్లాలి.

Qఅందుకనే కథ వైపు వచ్చానంటారా?

అవును. కవిత్వం ఎమోషనల్. కథ మెచ్యూర్డ్ ఆర్ట్. ఈ సబ్జెక్టును డీల్ చేయడానికి అవసరమయ్యే పనిముట్లు వేరే!

Qమరి కవిత్వం రాస్తున్నవాళ్ల సంగతి?

జ్ఞానదంతం రాకుండా లోపలి బాలుణ్నికాపాడుకోవాలి. అప్పుడే కవి సజీవంగా ఉంటాడు. ఫ్రెష్షుగా. కానీ తొలి మాట, మలి మాట తర్వాత? కవిగా ఉండాలంటే, బాలుడయ్యే దురవస్థకు నిరంతరం లోనవుతుండాలి. అందుకే వదిలేశా!

Qఖదీర్ బాబును నిలబెట్టడంలో నామిని పాత్రేమిటి?

(వికటాట్టహాసం)… నామిని ‘పచ్చనాకు సాక్షిగా’ రాశాడు. అయిపోయిందా? సినబ్బ కతలు రాశాడు. మిట్టూరోడి కతలు రాశాడు. సుదీర్ఘమైన నిశ్శబ్దం! నాతో దర్గామిట్ట రాయించాడు. దర్గామిట్ట, పోలేరమ్మ తర్వాత ఆ ధోరణి, ఆ ఉత్సాహంలో కనీసం పదిహేనుమంది ఈ తరహా బాల్యపు కథలు రాసుకున్నారు. అది తెలుగు కథకు దర్గామిట్ట కాంట్రిబ్యూషన్. నేను అంతకుముందు దావత్, జమీన్ లాంటి కథలు ఎటూ రాశాను. కానీ ఏకధాటి వానగా కురిసే అవకాశం నాకు నామిని ఇచ్చాడు. ఒక చక్రవర్తి మాత్రమే చేయగలిగే దాతృత్వం అది. సుబేదార్లు అలా చేయలేరు. ఏలుకో గురూ అన్నట్టుగా.

Qనామిని కథల ప్రేరణతో కాకుండా మీవల్లే ఇన్ని సంకలనాలు వచ్చాయని తెలివిగా చెప్పేసుకుంటున్నారా?

పెన్నేటి కథలు(పి.రామకృష్ణ), మాదిగోడు కథలు (నాగప్పగారి సుందర్రాజు) దర్గామిట్ట కంటే ముందే వచ్చాయి. కానీ డికాషన్ ఎంత కలపాలో తెలియాలి. దానికన్నా ముఖ్యం, ‘ఖదీర్ గాడే రాశాడు, మనకేమి!’ అన్న ధైర్యాన్ని నేను ఇవ్వగలిగాను.

Qరచయితగా మీరు నామినికి ఎంత దగ్గరున్నారు? ఎంత దూరం జరిగారు?

ప్రపంచంలో అతి తక్కువ మంది గొప్ప రచయితల్లో ఆయనొకరు. ఒకటేదో కొత్తది చేశాడు. పథేర్ పాంచాలితో సత్యజిత్ రే చేసినట్టుగా. చూసింది రాస్తాడు. విన్నది రాస్తాడు. మాట్లాడేది రాస్తాడు. యూనిక్. నేను ఆయన సోల్-కు దగ్గరగా ఉండి, పర్ఫెక్షన్ విషయంలో, కంటెంట్ విషయంలో వేరే వేరే దారుల్లో నడవడానికి ప్రయత్నించాను. ఆయనకు రాక కాదు. రావద్దనుకున్నాడు. ఐ యామ్ బ్లెస్డ్ విత్ ప్రోజ్. సినిమా, రీ టెల్లింగ్, కాలమ్… వాక్యాన్ని మానిప్యులేట్ చేయగలను. శ్రీశ్రీనే తీసుకుంటే, కవిత్వమే రాయలేదు. కథలు, నాటికలు, అనువాదాలు, పజిల్స్, సినిమా పాటలు… ఎన్నో! చలం కూడా అంతే! తన దగ్గరున్న అక్షరాలతో రచయిత ఏం చేస్తున్నాడు? ఆత్మకథ, మరొకరి ఆత్మకథ, చరిత్ర…

Qదర్గామిట్ట కథల్లో నాన్నను బూతులు తిడతారు… అలాంటి తండ్రీకొడుకుల సంబంధాలు సహజమేనా?

అలాంటి మాటలు ఎక్కడా వినం. అవసరం లేదుకూడా. అయితే నష్లీ హరామ్ లాంటి మాటల్ని నేను తెలుగులో ముతకగా తర్జుమా చేశాను. ఎన్టీయార్ గురించి, ‘బాగా చేశాడు లంజాకొడుకు’ అంటాం. అంతా ప్రేమే! నోటినిండుగా అలా అనుకుంటే తృప్తి.

Qకేతు విశ్వనాథరెడ్డి కథ(అమ్మవారి నవ్వు)ను తిరగరాశారు. అది తొలి యవ్వనపు అహంకారమా?

ఆయన కథ చదవగానే రియాక్షన్గా మక్కా చంద్రుడు వచ్చింది. నా దాన్ని కథగా నేను ఇప్పుడు అంగీకరించను. అది దుందుడుకు చర్య. అంటే ఆ కథమీద నా స్పందన తప్పుకాదు. కానీ దాన్ని నేను వ్యాసంగానో, మరో రకంగానో చెప్పాల్సింది. కథగా మాత్రం కాదు. ఇప్పుడైతే అలా చేయను. కాకపోతే ఇట్లాంటివి బాగా చేశాను కాబట్టే నాకు పేరొచ్చింది. నెగెటివ్ పబ్లిసిటీ.

Qపేరు అంత అవసరమా?

ఒకవేళ ఈ పత్రికలు, రచనల సాహచర్యం దొరక్కపోయుంటే నేను ఏం చేసేవాణ్ని! బీఎస్సీ కంప్యూటర్ సైన్సు చేశాను కాబట్టి, ఊళ్లో ఏ వెయ్యో ఐదు వేలో సంపాదించే టీచర్ ఉద్యోగంలో కుదురుకునేవాణ్ని. నేనున్న పరిస్థితుల్లో పేదరికం లో సాహిత్యం ద్వారా రచయితగా ఈ గుర్తింపు రాకపోయుంటే డిప్రెషన్తో సూసైడ్ చేసుకునేవాణ్ని!

Qసీరియస్?

సీరియస్!

Qముగ్గురు మనుషులుండి, నాలుగు మిఠాయిలుంటే ఆ రెండోది మీకే కావాలనిపిస్తుందా?

కచ్చితంగా నేనే సాధిస్తా!

Qహైదరాబాద్ వచ్చిన కొత్తలో కొండచిలువలాంటి నగరమని ఏడ్చినట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు పూర్తిగా నాగరీకులైపోయారా? లేక మీరే అలవాటు పడిపోయారా?

కావలికి సముద్రం ఐదుకిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఉక్కపోత, చెమట, అపసోపాలు పడాలి. హైదరాబాద్ వచ్చాక మాత్రమే నాకు అసలైన వాతావరణం తెలిసింది. సిటీ ఆఫ్ జెర్కిన్స్ అంటారు దీన్ని. వెచ్చగా జెర్కిన్స్ వేసుకుని వెళ్తుంటారు. ఐ యామ్ వెరీమచ్ థాంక్ఫుల్ టు హైద్రాబాద్. ఏ రోజూ నన్ను నగరం పస్తు పెట్టలేదు. 21 ఏళ్లు కావలిలో ఉన్నానుగానీ ఇప్పుడు వెళ్తే అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను.

Qస్వస్థలంలో ఉండలేకపోవడం ఏమిటి?

మాట్లాడేవాడు ఒక్కడు లేడు. థియేటర్లో ఎలుకలు పరుగెడతాయి. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. డీసెంట్ రెస్టారెంట్ ఉండదు. నాగరికత ఫ్రిజ్లో ఉంది. ఎంత ప్రేమించదలిచినా ప్రేమించలేకపోతున్నా!

Qనగరంలో స్థిరపడటం వల్ల మీరు పొందిన బాల్యం మీ పిల్లలు(ఒమర్, సిద్దిఖ్) కోల్పోతున్నారా? బాల్యపు కథకుడిగా బాల్యం మీద మీ అంతరంగం ఏమిటి?

గ్రామాల్లో ఏమంటే కులం, మతం అన్నీ వుంటాయి. సమస్య సృష్టిస్తారు వాళ్లే. సమస్య పరిష్కరిస్తారు వాళ్లే. ఇక్కడ ఆ చైతన్యం ఉండదు. సిటీలో ఉంటే సో కాల్డ్ ఇంగ్లీష్ వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. కానీ కామన్ సెన్స్ ఉండదు. మూడు సబ్బులు రెండ్రూపాయల పది పైసలని షాపువాడు చెప్తే, ‘ఆ పదిపైసలు తర్వాతిస్తాను,’ అని మెప్పించి తెచ్చే గడుసుదనం వీళ్లకు రాదు. నేను రూడ్గా చెప్తున్నాననుకోకపోతే ఆ మస్కా కొట్టడం తెలియదు. మానసికమైన ఆకలి ఉండదు. అయితే వీళ్ల పరిస్థితులను అనువుగా మార్చగలిగితే వీళ్లూ మూలాల్లోకి ప్రవేశించగలరు. ‘కింద నేల వుంది'(కథ) అదేగా!

Qనూరేళ్ల కథను పరిచయం చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?

ప్రేమ. తెలివిడి. నిష్ఠగా కథను సాధన చేస్తున్నవాణ్ని. కథ నడకను గమనిస్తున్నవాణ్ని. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం తెచ్చాడు. దానివల్లే ఆయన పేరు గుర్తుండిపోయింది. ఆయనకు ఏం అర్హత ఉంది?

Qనా ఉద్దేశం ఏమంటే, మల్లాది రామకృష్ణశాస్త్రి ఫలానా కథ(సర్వమంగళ) గురించి రాసినప్పుడు, మీరు ఆయన అన్ని కథలూ చదివి, అందులోంచి దీన్ని ఎంపిక చేసివుంటారని ఆశిస్తాం. అలా ఆయా రచయితల కథలన్నీ చదివారా?

అలా ఎవరు చదవగలరు? కమ్యూనిస్టులంతా మార్క్సును చదువుతారా? నేను చిత్తశుద్ధితో రాశాను. అయితే నిడివి వల్ల కొన్ని తీసుకోలేదు. త్రిపుర లాంటివాళ్ల కథ రీటెల్లింగుకు లొంగదు. కొందరిని గౌరవించినా ఇందులో చేర్చలేకపోయాను. పాపులర్ న్యూస్ పేపర్లో వచ్చిన కాలమ్ కాబట్టి, అన్నీ సీరియస్ కథలు రాస్తే పాఠకులు ఆపేస్తారనే భయంతో కొన్ని తేలికపాటివి కూడా తీసుకున్నా. అవి గొప్పవి కాకపోయినా తప్పక మంచివి.

Qమీ రీ టెల్లింగ్ ప్రక్రియ మీద నాకు ఏ విధమైన అభ్యంతరమూ లేదు. మీరు ఇలా ఎన్ని కథలైనా పరిచయం చేసుకుంటూ వెళ్లొచ్చు. కానీ దీన్ని నూరేళ్లకు ప్రాతినిధ్యంగా నూరు కథలంటూ సంకలనంగా ఎప్పుడు తెచ్చారో అప్పుడే దీనికి దోషం అంటింది!

గుడ్డిగానో, మెల్లగానో, తప్పుల తడకగానో రచయితలకు దండలు వేశాను. కథకు ఇంత ఉత్తేజకర వాతావరణం తేవడానికి గత 15 ఏళ్లలో దీనిలాగా ఏదీ ఉపయోగపడలేదు. మీరు వంద మంది కథల సంకలనం అని మళ్లీ చేసినా ఇందులోంచే కనీసం 85 మందిని తీసుకోవాలి. మనకు 150-200 మంది గొప్ప కథకులున్నారు. అందరినీ పరిచయం చేయాలనుకున్నా. తర్వాతి జనరేషన్ నా పనిని గుర్తిస్తుంది. పార్ట్ 2 రాయాలని మాత్రం ఉంది.

Qమీ మీద కొందరికైనా కోపం ఉందా? ఉంటే ఎందుకు?

సాహిత్యం అనేది లాభసాటి వ్యవహారం కాదు. సృజన. పెయిన్ ఫుల్ జాబ్. ప్రాసెస్ ఎంత ఆనందాన్నిచ్చినా అది పెయినే! కొందరు ఎంతో ప్రభావవంతంగా సృజించినా, గూడ్స్ డెలివర్ బాగా చేసినా పేరు రాదు. అందువల్ల నేననగానే అంతరాంతరాళాల్లో ఇబ్బంది పడతారు. నేను భోరున, హోరున కురుస్తున్నప్పుడు వాళ్లకు ఏదో అన్ ఈజీగా ఉంటుంది. ఇదొకరకం. ‘మీ ఆశీస్సులు కోరుతూ…’ అని నేను ఎప్పుడూ పుస్తకం పంపలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే పిచ్చి. ఇదింకోరకం. మరోరకం. కొందరు నన్నుఒక్కసారి కూడా చూసివుండరు. మాట్లాడివుండరు. అయినా నా మీద కోపం ఉన్నట్టు తెలుస్తుంటుంది. ఇంకోరకం కథలతో వచ్చేది. అవతలి వైపు కేతా, వాసిరెడ్డి నవీనా, రాజిరెడ్డా అని ఆలోచించను. కథ గురించి మాత్రమే నా కన్సెర్న్. అయితే, నన్ను ఎవరైనా పూర్తిగా ద్వేషిస్తారనుకోను. లవ్ హేట్ రిలేషన్ షిప్.

Qగోపిని కరుణాకర్ మీద మీకు ఏ భావం ఉంది?

ఈ ప్రశ్న అవసరమా?

Qచెప్పండి, పాఠకులు ఆశిస్తారు…

సమకాలీకులం. ఒకే అవార్డు(‘కథ అవార్డు’) పంచుకున్నవాళ్లం. నేను అత్యంత ఇష్టపడే కథా రచయిత. తన కథలతో ఇన్ స్పైర్ అయ్యేవాణ్ని. ఆయనతో నాకు శత్రుత్వం ఏమీ లేదు. కానీ ఎవరో ఉడికించడం వల్ల నన్ను ఏదో అనేవాడు. ఒకసారి పొద్దున్నే పేపర్ చూస్తే నామీద ‘వివిధ’లో ఏదో ఉంది. నా రోజంతా పాడైపోయింది. అమాయకుడు. బతకడం రాదు. ఎక్స్ పాండ్ చేసుకోలేదు.

Qవర్తమానపు కష్టాలని మాత్రమే పట్టించగలిగే కథలు భవిష్యత్తుకు నిలబడగలవా?

నిలబడవు. ఇమ్మీడియట్ సమస్యలు రాసినవేవీ సార్వజనీన కథలు కావు. అంతర్జాతీయ ప్రమాణాలకు నిలబడాలి. అలాంటి కథనం మన తెలుగులోనే లేదు. ‘దూద్ బఖష్’లాంటి కథ తీసుకుంటే ఆ వాతావరణంలోకి పాఠకుడు రావడానికే సమయం పడుతుంది. ఇట్లాంటివి నిలవ్వు. వాడు కనెక్ట్ అయ్యేలోపునే పక్కకు పెట్టేస్తాడు.

Qమీ ‘ఒక వంతు’ కథ గురించి వివరణ(కాపీ అని) ఏమిటి? మీ కథా సంకలనంలో కూడా దీన్ని దాటవేశారు. ఏదైనా బలహీన క్షణమా?

బలహీన క్షణమూ లేదూ, పాడూ లేదు. ఒకసారి, విడిపోయిన శేఖర్ కపూర్, సుచిత్రా కృష్ణమూర్తి కలవబోతున్నారని పేపర్లో చదివాను. తర్వాతెప్పుడో ఇంటర్వ్యూలో ఆమె, ‘ఎ పార్ట్ ఇన్ మి ఈజ్ స్టిల్ లవింగ్ శేఖర్ కపూర్,’ అంది. నా వ్యక్తిగత జీవితంలో నాకూ అలాంటి చాలా ఫ్రెండ్ షిప్స్ తెలుసు. దీన్నే రాయాలనుకున్నా. ‘ఒక రోజు అతిథి'(నిర్మల్ వర్మ కథ) చదవడం లాభించివుంటుంది. అంతేగానీ అది మూలమూ కాదూ, బీజమూ కాదు. పైగా అది డిస్ట్రక్టివ్ కథ. దాన్ని నేను మెరుగు పరిచాను.

Qసాహిత్యంతో మీ వ్యక్తిగత జీవితానికి ఎంత దగ్గరితనం ఉంది? ఎంత దూరపుతనం ఉంది?

మరక అంటని శిశువుగా ఉంటాం మొదట. తర్వాత పిన్నీసు గుచ్చుకుంటుంది. మలం అంటుకుంటుంది. బాలుణ్ని కాపాడుకోవడం అసాధ్యం. నెమ్మదిగా ఎవరైనా కరప్ట్ అయిపోతారు. నిజాయితీగా ఉండటం సాధ్యమా? అమలినమైన పవిత్రమైన ఆలోచనేదో రచనలో ఇస్తాం. ‘న్యూ బాంబే టైలర్స్'(కథ) రాసినవాడిగా నేను అసలు రెడీమేడ్ చొక్కాలే వేసుకోకూడదు. కానీ నేను వేసుకునేవి అన్నీ అవే!

Q‘ఓనమాలు'(ఆ చిత్రానికి మాటల రచయిత) తర్వాత ఏం చేస్తున్నారు?

రాయనుకదా! అదృష్టవశాత్తూ మంచి సినిమా వచ్చింది. రాశాను. దీనితో సాహిత్యానికి దూరమయ్యాను. మళ్లీ సాహిత్యం పేజీ(సాక్షి)తో దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఇదే ఇప్పుడు…

Qపతంజలిగారి మరణం అప్పుడు నవల రాస్తానని వాగ్దానం చేశారు. ఏమైనా మొదలుపెట్టారా?

రాస్తాను.

Qరాయడం అంటే ఏంటి మీకు?

రాయడం అనేది దైవదత్తం. ఏ కళైనా దైవదత్తమే. పోతన, ‘నేను రాశానా దేవుడే రాయించాడు,’ అంటాడు. వ్యాసుడికి వినాయకుడు రాసిపెడతాడు. అది ఒక మెటఫర్. కళ అనేది దేవుణ్నుంచి వచ్చేదని చెప్పడానికి అలా చెప్పారు. రాసేవి మార్మిక క్షణాలు.

Qచివరి ప్రశ్న. దీనితో ముగించేద్దాం. మీ అభిమాన రచయితలు ఎవరు?

వరుసగా చెప్తాను. శ్రీపాద. నామిని. పతంజలి. సి.రామచంద్రరావు. ఆర్.వసుంధరాదేవి. కాట్రగడ్డ దయానంద్. పాలగుమ్మి పద్మరాజు. శ్రీరమణ. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు.

ఒళ్లు విరుచుకుంటుండగా-

ఖదీర్: గురూ, ఈ ప్రశ్నొకటి నా తరఫున యాడ్ చేసుకో!

రాజి: చెప్పండి.
ఖదీర్ : “ఇప్పుడు కొత్తగా రాస్తున్నవాళ్లలో బాగా రాస్తున్నవాళ్లెవరు?”

రాజి: “సరే చెప్పండి, మీ ఉద్దేశంలో కొత్తవాళ్లలో ఎవరు బాగా రాస్తున్నారు?”

ఖదీర్ : “నాకు వాళ్లు రాసే కంటెంట్ ఏదైనాగానీ… వాక్యం శుభ్రంగా ఉండాలి. వచనాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా రాస్తున్నవాళ్లలో చెప్పాల్సివస్తే ముందువరుసలో సామాన్య ఉంటారు. తర్వాత, పూడూరి రాజిరెడ్డి. మెహర్. భానుకిరణ్. అనిల్ రాయల్.

యాకూబ్: ఎదురుగా ఉన్నాడని రాజిరెడ్డి పేరు చెబుతున్నారా?

ఖదీర్ : లేదు లేదు, నాకు చింతకింది మల్లయ్యప్పట్నుంచే ఇష్టం!

“ఇంతకీ ఈ బిల్లు సారంగవాళ్లే ఇస్తారా?”

ఇంటర్వ్యూ : పూడూరి రాజిరెడ్డి