మృగతృష్ణ

200px-Ranthambore_Tigerసరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు బందిపూర్ టైగర్ రిసర్వుకు చేరుకున్నాం.

కాటేజ్ తీసుకోవడానికి రిసెప్షన్ కు వస్తే — “ఇదిగో చూడండి.  భోజనాలు త్వరగా ముగించుకొని మళ్ళీ ఇక్కడికి 3.30కి చేరుకుంటే, టీ, కాఫీలు తీసుకుని 4.00 గంటలకు బయల్దెరుతాం. 6.30కి సఫారీ పూర్తవుతుంది.  స్నాక్స్ తీసుకున్న తర్వాత స్లైడ్ షో మొదలవుతుంది.  8.00 గంటలకి డిన్నర్,” అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్తున్నాడు రిసెప్షనిస్ట్.

గబగబా కాటేజ్ కు వెళ్ళి, సామానంతా పడేసి భోజనాలకెళ్లి వచ్చేసరికి 3.00 గంటలయ్యింది.  అటు నడుంవాల్చామో లేదో మూడున్నర కావస్తుంది.  కెమెరాలు, బైనాకులర్లు వగైరా సర్దుకుని పరుగో పరుగు. మా గ్రూప్ లో ఆరునుంచి, అరవై వరకూ వయసు వాళ్లు ఉన్నా ఉత్సాహంలో ఎవ్వరూ ఒకరికొకరు తీసిపోలేదు.

ఓపన్ టాప్ జీప్ లో పులివేటకు బయల్దేరాం.  దారిలో రకరకాల జింకలు, లేళ్ళు, దుప్పులు, ఆడ నెమళ్ళు, మగ నెమళ్ళు, అడవి పందులు, అడవి కోళ్ళు, ఏనుగులు, అనేక పక్షి జాతులు, నిరంతరంగా కనిపిస్తున్నాయి. కెమెరాలో బంధించే వాళ్ళు శక్తివంతమైన కెమెరాల్తో, మూవీ తీసుకునేవాళ్ళు రకరకాల మూవీ కెమెరాల్తో, బైనాకులర్లతో చూసేవాళ్ళు వివిధ సైజుల్లో ఉన్న బైనాకులర్లతో, కళ్ళతో చూసేవాళ్ళు సహజమైన ఆనందంతో పరవశించిపోతున్నారు.  ఇన్ని జంతువులు, పక్షి జాతులు కనిపిస్తున్నా అందరి చూపులూ కనిపించని పులిపైనే.

ఎంత వెతికినా దాని జాడైనా కనిపించదే! అంతులేని దాహం.  జంతువులు డిస్టర్బ్ కాకూడదని, సఫారీ సమయంలో మాట్లాడకూడదనే నిబంధనవల్ల ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు.  అలాగే కెమెరాలు ఫ్లాష్ కాకూడదు.   సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉంచాలి.  ప్రతి ఒక్కరూ పులి తమకే కనిపించాలని రహస్యంగా అనుకుంటున్నారు.  మా గ్రూప్ లోని డ్రైవర్, ఫోటోగ్రాఫర్ లకు, మిగతా గ్రూప్ ల డ్రైవర్, ఫోటోగ్రాఫర్ లకు ప్రకటించని పోటీ.  అయినా పులులు మాత్రం అందరి కళ్ళు కప్పి యధేచ్ఛగా తిరుగుతున్నాయి.

చీకటి పడబోతుంది.  అయినా వీళ్ళ పట్టుదల సడలడం లేదు.  అక్కడక్కడా, ముఖ్యంగా నీటి మడుగుల దగ్గర మరింత వెతుకులాట.  మీకు కనిపించిందా అంటే, మీకు కనిపించిందా అని ఒకరినొకరు డ్రైవర్లు, ఫోటోగ్రాఫర్లు పలకరించుకుంటున్నారేగానీ, తమకు కనిపించకపోయినా పరవాలేదు, మరెవ్వరికీ కనిపించకూడదనే దుర్బుద్ధి అందరిలో.

ఎడతెగని వేట.  చీకట్లు కమ్ముకొస్తున్నాయి.  అయినా స్పష్టమైన మృగతృష్ణ. తీరని దాహం.  “ఈ రోజుకు మిమ్మల్ని వదిలేస్తున్నా.  రేపు రండి.  చూసుకుందాం“ అని పులి సవాలు చేస్తున్నట్లనిపించింది.  పులివేట మరుసటిరోజుకు వాయిదా.

డిన్నర్ తర్వాత ప్రకటన: “రేప్పొద్దున 5.30 కు wakeup call. 6.00 గంటలకు కాఫీ, టీలు.  6.30 కు సఫారీ.“  రెండో రోజు. సరిగ్గా 5.30కే అందర్నీ తట్టి లేపారు.  కాలకృత్యాలు త్వరగా ముగించుకుని 6.00 గంటలకు రిసెప్షన్ వద్ద హాజరయ్యాం అందరం.  కాఫీ, టీల తర్వాత మృగయావినోదానికీ అంతా రెడీ.  ఉదయకాంతి ఇచ్చే అదనపు శక్తితో.  పట్టువీడని నూతనోత్సాహంతో.  ఎలాగైనా పులి ఫోటో నా screen saver  కావాలనే విక్రమార్కుని పట్టుదల.

మళ్ళీ అదే జీప్ లు, అదే గ్రూప్ లు, అదే డ్రైవర్ – ఫోటోగ్రాఫర్ జంటలు.  మా గ్రూప్ ఫోటోగ్రాఫర్ ను నేనడిగాను “మీరు పులిని చూచి ఇప్పటికెన్నిరోజులైంది“ అని.  సూటిగా సమాధానం చెప్పకుండా, మరో గ్రూప్ లోని ఫోటోగ్రాఫర్ ను చూపించి “అతనికి రెండ్రోజుల క్రితం కనిపించింది, నోటీస్ బోర్డులో అతను తీసిన ఫోటో కూడ ఉంది“ అన్నాడు.  ఆకాశంలో నిన్నటి రాత్రి చీకట్లను చీల్చుకుంటూ కొత్త వెలుగు సూర్యుడు.

కొత్త ఆశలు మాలో చిగురించాయి. దాదాపు అవే తోవలు.  అవే తావులు.  జంతువులు.  పక్షి జాతులు. పులుల జాడలు మాత్రం మృగ్యం.  ఇది పట్టుదలకు, కార్యదీక్షకు అగ్నిపరీక్ష.  రెండు గంటల బలపరీక్ష తర్వాత వట్టిచేతుల్తో ఎలా వెళ్ళడం!  ఇంతలో మట్టిలో పులి నడిచి వెళ్ళిన గుర్తులు. మళ్ళీ కొత్త ఆశలు.

కొంతదూరం తర్వాత అడుగులు మాయం.  వెంటాడే మృగతృష్ణ.  ఓడిపోయి యుద్ధంనుండి నిష్క్రమిస్తున్న యోధుల్లా మానవ బృందాలు.  వెళ్ళిపోయేముందు మళ్ళీ ప్రకటన.  స్విచ్ ఆఫ్ చేసుకున్న మొబైల్ ఫోన్లను ఆన్ చేసుకోవచ్చునని.  అందరి ఫోన్లలో ఒకటే SMS  వచ్చి ఉంది పులిరాజు వద్దనుంచి:

 

It’s time up for now.

Next time better luck!