గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్-4

 4 వ అధ్యాయం

[ Anne Of Green Gables by L.M.Montgomery ]

ఆన్ లేచేప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. కిటికీ లోంచి కురిసే  వెలుతురు పకపకా నవ్వుతోంది. అవతల నీలాకాశం, దాని మీంచి ఊగుతూ  మబ్బుల తెల్లటి రెక్కలు.

ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు.  ముందు ఉత్సాహం పొంగి వచ్చింది, ఆ వెంటనే దిగులు మూసేసింది. తను గ్రీన్ గేబుల్స్ లో ఉంది, కాని వీళ్ళకి తను అక్కర్లేదు , ఆడపిల్ల వద్దట.

ఐనా ఆ ఉదయపు వెలుగుకి  ఉత్సాహం ఆగలేదు .  గబగబా పరిగెత్తి కిటికీ చట్రాన్ని పైకి లేపింది. చాలా రోజులనుంచీ దాన్ని ఎవరూ కదిలించినట్లు లేదు, కిర్రు కిర్రుమని చప్పుడు చేసింది.

ఆన్ మోకాళ్ళ మీద కూలబడి ఆ జూన్ ప్రభాతం లోకి మెరిసే కళ్ళు పెట్టుకుని చూసింది. ఎంత అందమో …ఇక్కడే ఉండిపోతే బావుండును కదా ! పోనీ, ఉండిపోబోతున్నట్లు ఊహించుకుంటే ఏం పోతుంది…ఇక్కడ ఎంత ఊహకైనా చోటుంది.

కిటికీ బయట పెద్ద చెర్రీ చెట్టు , ఇంటికి ఆనుకుని. దాని కొమ్మలు లోపలికి తొంగి చూస్తున్నాయి. ఒక్క ఆకూ కనిపించనంత విరగబూసి ఉంది. ఇంటికి ఆ వైపున ఆపిల్ తోపు, ఈ వైపున చెర్రీ తోపు, అవి కూడా నిండుగా పూలతో. తోపుల్లో గడ్డి పైన డాండీలియాన్ పూలు. ఆ కిందన ఇంటి తోటలో  విచ్చిన ఊదారంగు లిలాక్ లు. వాటి సువాసన మత్తుగా గాలిలో తేలి లోపలికి వస్తోంది.

తోట కి దిగువన పచ్చగా ఒత్తుగా పెరిగిన క్లోవర్ గడ్డి , ఆ వాలు పక్కనే వాగు. తెల్లటి బర్చ్ చెట్లు పొగరుగా తలలెత్తి నిలుచున్నాయి. వాటి అడుగున ఫెర్న్ గుబుర్లు, మాస్ మొక్కలు…ఆ నీడల్లో దాగిఉన్న సంతోషం. వీటన్నిటికీ అవతల ఆ కొండ పైన పల్చగా స్ప్రూ స్, ఫర్ చెట్లు. వాటి మధ్యలోంచి బూడిదరంగులో ఇంటి కప్పు కొనదేలి కనిపిస్తోంది. ‘ ప్రకాశమాన సరోవరం ‘ ఒడ్డున ఆన్ చూసిన ఇల్లు అది.

ఎడమ వైపున పశువుల శాలలు, గడ్డి వాములు. వాటిని దాటి చూస్తే ఆకుపచ్చటి పొలాల అవతల మెరుస్తున్న నీలి రంగు సముద్రం.

may1

సౌందర్య పిపాసి ఐన ఆన్ కళ్ళు   ఆ దృశ్యాలన్నిటినీ ఆత్రంగా కావలించుకున్నాయి. పాపం..ఈ పసి పిల్ల తన చిన్న జీవితం లో అందపు లేమిని చాలా చూసింది. ఇక్కడ మాత్రం ఆమె కలలు కన్న సౌందర్యమంతా ఉంది.

ఆ ఏకాంతం లో మోకరిల్లి అలా ఉండిపోయింది..బుజం మీదొక చెయ్యి పడేవరకూ. మెరిల్లా వచ్చిన అలికిడి ఆన్ కి వినిపించనేలేదు.

” పద. తయారవు ” మెరిల్లా ముక్తసరిగా అంది.

నిజానికి మెరిల్లా కి ఆన్ తో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు, ఆ ఇబ్బందిలోంచి ఆమె మాట తీరు అనుకోకుండానే మొరటుగా, ముభావంగా ధ్వనిస్తోంది.

ఆన్ లేచి నిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంది.

” ఇదంతా అద్భుతంగా లేదూ ? ” చెయ్యి తిప్పుతూ మొత్తాన్నీ చూపించింది.

మెరిల్లా అంది – ” ఆ. పెద్ద చెట్టే. బాగా పూస్తుంది కూడా. కాయలే, చిన్నవిగా నాసిగా కాస్తాయి ”

” అంటే, చెట్టొక్కటే కాదు, అంతా ! చెట్లూ తోటా, తోపులూ , వాగూ అడవీ..ఆ ప్రియమైన  ప్రపంచం మొత్తం ! ఇలాంటి ఉదయాల్లో ప్రపంచాన్ని ప్రేమిస్తున్నామనిపించదూ ?  ఆ వాగు నవ్వటం వినిపిస్తోంది నాకు. అసలు ఈ వాగులు మంచి సరదా ఐనవి కదండీ ?  ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. చలికాలం లో కూడా గడ్డ కట్టిన మంచుకిందనుంచి అవి నవ్వటం వినబడుతూనే ఉంటుంది నాకు. గ్రీన్ గేబుల్స్ పక్కనే వాగు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేనిక్కడెలాగూ ఉండబోవటం లేదు కదా, ఉంటేనేం లేకపోతేనేం అనుకోకండి. ఇక్కడ ఈ వాగు ఉందని నేనెప్పటికీ గుర్తు చేసుకుంటాను, మళ్ళీ దాన్ని చూడలేకపోయినా సరే. నేనివాళేమీ నిరాశ లో కూరుకుపోయి లేనండీ. ఇలాంటి ఉదయం లో నేను అస్సలు అలా ఉండలేను. ఉదయాలనేవి ఉండటం ఎంత గొప్ప సంగతో కదా ? కాని కొంచెం బాధగా మటుకు ఉంది. మీరు కావాలనుకున్నది నన్నేననీ ఇక్కడే ఎప్పటికీ ఉండిపోబోతున్నాననీ ఊహించుకుంటున్నా ఇందాక…ఊహించుకోవటం చాలా బావుంటుంది , అది నిజం కాదని తెలిసేప్పుడే బాధ ‘’

ఈ మాటల ప్రవాహం లో కాస్త సందు దొరకగానే మెరిల్లా అంది – ” నీ ఊహలు సరేగాని, త్వరగా తయారై కిందికి రా . బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంది. కాస్త మొహం కడుక్కుని తల దువ్వుకో. కిటికీ చట్రం కిందికి దించి దుప్పట్లు మడత పెట్టు. చేతయినంత పద్ధతిగా ఉండు ”

ఆన్ కి కాస్త పద్ధతిగా ఉండటం చేతయినట్లే ఉంది. పది నిమిషాల్లో కిందికి వచ్చేసరికి తల శుభ్రంగా దువ్వుకుని జడలు వేసుకుని ఉంది. మొహం కడుక్కుంది. మెరిల్లా చెప్పినవన్నీ చేసే వచ్చానని అనుకుంటోంది…నిజానికి దుప్పట్లు మడత పెట్టటం మర్చిపోయింది.

మెరిల్లా చూపించిన కుర్చీ లో కూర్చుంటూ ” నాకివాళ బాగా ఆకలేస్తోంది ” –  ప్రకటించింది ఆన్. ” ప్రపంచం రాత్రి అనిపించినంత గందరగోళం గా లేదెందుకో. మంచి ఎండ కాస్తోందిగా, అందుకేనేమో. పొద్దున్నే వాన పడినా నాకు ఇష్టమేననుకోండి.. పొద్దుటిపూట ఎలా ఐనా బావుంటుంది. ఆ రోజు ఏం జరగబోతుందో తెలీదుగా, ఎలా ఐనా ఊహించుకోవచ్చు. కాని ఇవాళ వాన పడకపోవటం మంచిదే ఐంది, నేను బోలెడంత భరించాలిగా, ఎండ కాస్తుంటే దేన్నైనా ఓర్చుకోవటం తేలిక .కష్టాలూ బాధలూ కథల్లో చదవటం బాగానే ఉంటుంది, నిజంగా ఐతే అంత బావుండదు ”

” కాసేపు నోరు మూసుకుంటావా ? చిన్న పిల్లకి ఇన్ని మాటలు !  ” మెరిల్లా కాస్త మెత్తగానే కసిరింది.

MythiliScaled

ఆన్ చాలా బుద్ధిగా  నోరు మూసుకుంది. మరీ  బొత్తిగా మాట్లాడకపోతేనూ  మెరిల్లాకి కంగారే వేసింది, అదేమీ సహజంగా లేదనిపించి. మాథ్యూ కూడా మౌనంగానే ఉన్నాడు, కాకపోతే అతనికి అదే సహజం. మొత్తం మీద ఉదయపు భోజన కార్యక్రమం నిశ్శబ్దంగా సాగింది.

ఆన్ మరీ మరీ పరధ్యానంగా ఐపోయింది. ఒక మరబొమ్మ లాగా తింటోంది అంతే . పెద్ద పెద్ద కళ్ళేసుకుని కిటికీ లోంచి ఆకాశాన్ని చూస్తున్నట్లే ఉందిగాని ఆ చూపు ఎక్కడో ఉంది. మెరిల్లాకి ఇంకా కంగారు గా అనిపించింది. ఈ విడ్డూరపు పిల్ల శరీరం ఇక్కడుందేగాని ఆమె ఆత్మ  ఎక్కడో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లుంది , ఊహల రెక్కలమీద. ఇలాంటి పిల్లని ఎవరు ఉంచుకుంటారు ???

కాని మాథ్యూ ఆమెని పెంచుకోవాలనుకుంటున్నాడు, మెరిల్లాకి ఆ విషయం అంతు పట్టటం లేదు. రాత్రికీ ఇప్పటికీ అతని నిర్ణయమేమీ మారినట్లు లేదు. మాథ్యూ అం తే, ఒకసారి అతని బుర్రలో ఎదైనా దూరిందా ఇక దాన్నే పట్టుకు వదలడు. మాట్లాడడు దాని గురించి, కాని ఆ మౌనమే పది రెట్లు బలంగా చెబుతుంది అతనేమనుకుంటున్నాడో.

భోజనం అయాక ఆన్ తన పరధ్యానం లోంచి బయటికి వచ్చి, గిన్నెలు కడగటం లో సాయం చెయ్యనా అని అడిగింది .

” నీకు కడగటం వచ్చా ? ” మెరిల్లా అపనమ్మకంగా అడిగింది.

ఆన్ – ” ఓ ! బాగా వచ్చుగా ! చిన్న పిల్లలని కనిపెట్టుకు ఉండటం ఇంకా బాగా వచ్చు. ఇక్కడెవరైనా చిన్న పిల్లలుంటే బావుండేది ”

మెరిల్లా ” ఇప్పుడు వాళ్ళొకరు తక్కువయ్యారు నా ప్రాణానికి  ! నీ సంగతి చూసేసరికే  నానా హైరానా గా ఉంది. నిన్ను ఏం చేయాలో తెలీటం లేదు..మాథ్యూ మరీ బుర్ర తక్కువ మనిషి ”

” ఆయన చా…లా మంచివారు ” –   ఆన్ దృఢంగా చెప్పింది. ” ఏం చెప్పినా ఎంత ఓపిగ్గా వింటారో ! ఎంత సేపు మాట్లాడినా ఏమీ అనరు. ఆయన్ని చూడగానే నాబోటివారేననుకున్నాను  ”

” ఆ. మీరిద్దరూ ఒకలాంటివారేలే, వింత మనుషులు ” మెరిల్లా విసుక్కుంది. ” సరే, గిన్నెలు కడుగు. బాగా వేడిగా ఉన్న నీళ్ళు తీసుకో కడగటానికి, కడిగాక బాగా ఆరబెట్టు. ఇవాళ నాకు చాలా పని ఉంది. వైట్ శాం డ్స్ కి వెళ్ళి  మిసెస్ స్పెన్సర్ దగ్గర నీ సంగతేమిటో తేల్చుకోవాలి. నువ్వూ నాతో రావాలి. ఆ గిన్నెల పని పూర్తవగానే పైకి వెళ్ళి నువ్వు పడుకున్న  పక్క సర్దు.”

ఆన్ మొహం వెలిగిపోయింది. ఉత్సాహంగా తలుపు వైపుకి పరిగెత్తి వెళ్ళి ఆగి, మళ్ళీ వెనక్కి వచ్చేసి బల్ల దగ్గర కుర్చీలో కూర్చుండిపోయింది. మొహం లో సంతోషం ఊదేసినట్లు మాయమైపోయింది.

” మళ్ళీ ఏమైంది నీకు ? ” మెరిల్లా అడిగింది.

” నేను బయటికి రాలేనండీ ” – ఆన్ చెప్పుకుంది, ప్రాపంచిక సుఖాలన్నిటినీ త్యజిస్తున్న పరిత్యాగి లాగా. ” నేను ఇక్కడ ఉండబోవటం లేనప్పుడు గ్రీన్ గేబుల్స్ ని ప్రేమించి ఏం లాభం ? నేను మళ్ళీ ఆ చెట్లనీ పూలనీ వాగునీ చూస్తే వాటిని ప్రేమించకుండా ఉండలేను. ఇప్పటికే నాకు చాలా కష్టంగా ఉంది, ఇంకా పడలేను.  నాకు బయటికి వెళ్ళి తిరగాలని ఉంది- అవన్నీ ” ఆన్ ! ఆన్ ! రా, మా దగ్గరికి వచ్చెయ్యి. ఆడుకుందాం ” అని నన్ను పిలుస్తున్నట్లుంది..కానీ వద్దు, రాను. అన్నిటినీ వదిలేసి వెళ్ళబోతున్నప్పుడు ప్రేమించి ఏం లాభం ? ప్రేమించకుండా ఉండటం ఎంతో కష్టం కదండీ ? అందుకే ఇక్కడికొస్తున్నప్పుడు ఎంతో సంతోషం వేసింది నాకు. ప్రేమించేందుకు ఎన్ని ఉన్నాయో, ఎ వ్వ..రూ వద్దనరు ! కాని ఐపోయింది, ఆ కల కరిగిపోయింది. నా గతి ఇంతే అని నిబ్బరించుకుంటున్నాను, బయటికి వచ్చి అంతా చూస్తే ఆ నిబ్బరం పోతుంది కదా…అవునూ, ఆ కిటికీ లో ఉన్న జేరేనియం పూల మొక్క పేరేమిటండీ  ? ”

మెరిల్లా – ” అదా ! ఆపిల్ వాసన వేసే జెరేనియం అది ”

ఆన్ – ” అది కాదండీ ! అలాంటి పేరు కాదు. మీరు పెట్టిన పేరేమిటీ అని అడుగుతున్నా. ఏ పేరూ పెట్టలేదా ? పోనీ నేను పెట్టచ్చా? ‘ బోనీ ‘ – బావుందా ? ఇక్కడున్నంత సేపూ నన్ను అలా పిలవనివ్వరా ? ” వేడుకుంది.

” నీ తలకాయ ! జేరేనియం కి ఎవరైనా పేరు పెడతారా ? ” – మెరిల్లా .

” ఉండాలి. అన్ని..టికీ పేర్లుండాలి. అప్పుడు అవి మనలానే అనిపిస్తాయి. ఏ పేరూ పెట్టకుండా ఉత్తినే ‘ జేరేనియం ‘ అంటే అది నొచ్చుకోదూ పాపం ? మీకేమీ పేరు లేకుండా ఉత్తినే ‘ ఆవిడ ‘ అంటే మీకు బాధగా ఉండదూ ? నా కిటికీ పక్క చెర్రీ చెట్టుకి పేరు పెట్టాను…’ హిమరాణి ‘ అని…తెల్ల..గా పూసిందిగా ! ఎప్పుడూ పూసే ఉండదనుకోండీ, ఐనా అలా పిలుస్తూ పూసి ఉన్నట్లు ఊహించుకోవచ్చు ”

ఆ తర్వాత బంగాళా దుంపలు తెచ్చేందుకు నేలమాళిగ లోకి వెళ్తూ మెరిల్లా గొణుక్కుంది – ” నా జన్మలో ఇలాంటి పిల్లని చూడలేదు. మాథ్యూ చెప్పినట్లు భలే పిల్ల. తర్వాత ఏం చెప్తుందా అని ఎదురు చూడటం మొదలెడుతున్నానేమిటో ! మాథ్యూ కి వేసినట్లే నాకూ ఏదో మంత్రం వేసింది. మాథ్యూ పొలం వైపు వెళ్తూ నావైపు ఎలా చూశాడనీ…రాత్రి చెప్పిందీ సూచించిందీ అంతా మళ్ళీ ఆ చూపులో ఉంది. అందరు మగవాళ్ళకి మల్లే అతను గట్టిగా  మాట్లాడితే హాయిగా ఉండును..మాటలకైతే జవాబు చెప్పచ్చు, చూపులకి ఏం చెప్పాలి ? ”

may3

నేలమాళిగ సందర్శనం పూర్తయి మెరిల్లా వచ్చేసరికి ఆన్ అక్కడే కూర్చుని ఉంది… అరచేతుల్లో గడ్డం ఆనించుకుని ఆకాశం కేసి చూస్తూ, ఆలోచనలో మునిగి .   మధ్యాహ్నం భోజనానికి వేళయేవరకూ మెరిల్లా ఆమెని అలాగే ఉండనిచ్చింది.

” ఇవాళ బండినీ గుర్రాన్నీ నేను తీసుకెళ్ళచ్చా ? ” మాథ్యూని అడిగింది మెరిల్లా.

మాథ్యూ తలఊపి ఆన్ వైపు జాలిగా చూశాడు. మెరిల్లా పెళుసుగా చెప్పింది.  ” వైట్ శాండ్స్ కి వెళ్ళాలి నేను.  ఆన్ ని కూడా తీసుకుపోతాను. మిసెస్ స్పెన్సర్ తో మాట్లాడి ఈమెని నోవా స్కోటియా కి వెనక్కి పంపించెయ్యాలిగా ! నీకు టీ , ఫలహారం బల్ల మీద పెట్టి వెళ్తాలే. సాయంకాలం ఆవులకి పాలు తీసే వేళకి వచ్చేస్తాను ”

అప్పటికీ మాథ్యూ ఏమీ మాట్లాడలేదు. మెరిల్లాకి చిర్రెత్తుకొచ్చింది. ఊపిరి బిగబట్టి అనేసిన మాటలన్నీ వృధా ఐపోయాయి.

మాథ్యూ నిదానంగా గుర్రాన్నీ బండినీ సిద్ధం చేసి తెచ్చాడు. మెరిల్లా, ఆన్ ఎక్కి బయల్దేరారు. బండి కదిలాక, గేట్ తెరిచి, అప్పుడు- ఎవరికో చెబుతున్నట్లు చెప్పాడు మాథ్యూ- ” పొద్దున్నే జెర్రీ బ్యుయోట్ వచ్చాడు. ఈ వేసంకాలం అతన్ని  పొలం పనికి పెట్టుకుంటానని చెప్పేశాను ”

మెరిల్లా ఏమీ జవాబు చెప్పలేదు. ఒక్కసారి కొరడాతో గుర్రం వీపు మీద చరిచింది. అలాంటి దెబ్బ ఎప్పుడూ పడిఉండని గుర్రం , దౌడు లంకించుకుంది. ఆఘమేఘాలమీద బండి బయల్దేరింది. మలుపు తిరగబోతుంటే మెరిల్లా వెనక్కి చూసింది. మాథ్యూ గేట్ కి ఆనుకుని నిలబడి దిగులు దిగులుగా చూస్తూనే ఉన్నాడు.

[ ఇంకా ఉంది ]

మీ మాటలు

  1. ‘ ఆన్ ‘ లాగా ప్రకృతిని పరిసరాల్ని మురిపెంగా చూసే ఆ మనసుకూ అంత అద్భుతంగా ఆవిష్కరించిన మీకూ బోలెడన్ని అభినందనలు, కృతఙ్ఞతలు .’ ఆన్ ‘ ఎలాగైనా ఇక్కడే ఉండిపోతే బాగుండు :(

  2. “సౌందర్య పిపాసి ఐన ఆన్ కళ్ళు ఆ దృశ్యాలన్నిటినీ ఆత్రంగా కావలించుకున్నాయి. పాపం..ఈ పసి పిల్ల తన చిన్న జీవితం లో అందపు లేమిని చాలా చూసింది. ఇక్కడ మాత్రం ఆమె కలలు కన్న సౌందర్యమంతా ఉంది.”
    ‘అందపు లేమి’ ఈ మాట బలే ఉంది!
    కాని మైథిలి గారి రచన లో ఈ లేమి కి తావులేదు.

  3. Mythili abbaraju says:

    ధన్యవాదాలండి

  4. అలా చెట్టుకి, పరిసరాలకి పేర్లు పెట్టడం చాలా బావుంది. క్యూట్ “ఇ ‘ అక్షరం ఉన్న ఆన్”

మీ మాటలు

*