రెహ్మానుకి వేటూరి అందం!

ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా తెలుగుని ప్రేమించే వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన వేటూరి జయంతి కూడా జనవరిలోనే (జనవరి 29).  ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చక్కని పాటలని గుర్తుచేసుకుందాం.

వేటూరికి సంగీత దర్శకుడు రెహ్మాన్ తో సన్నిహితమైన అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. రెహ్మాన్ దిలీప్‌గా రాజ్-కోటి వంటి సంగీతదర్శకుల వద్ద సహాయకుడిగా ఉన్న రోజులనుంచే వారి పరిచయం మొదలైంది. ఒకసారి వేటూరి రెహ్మాన్‌కి ఎవరి గురించో చెప్తూ,  “ఆయన పక్కా జంటిల్మేన్!” అన్నారుట. రెహ్మాన్‌కి ఈ ఎక్ష్ప్రెషన్ చాలా నచ్చి, “గురూజీ, ఇది ఏదైనా పాటలో వాడండి!” అని అడగడం “సూపర్ పోలిస్” సినిమాలో వేటూరి “పక్కా జంటిల్మేన్ ని, చుట్టపక్కాలే లేనోణ్ణి, పట్టు పక్కే వేసి చక్కా వస్తావా?” అని పల్లవించి ఆ కోరిక తీర్చడం జరిగింది. ఇలా వారిద్దరి స్వర-పద మైత్రి గొప్పది! కొత్తపుంతలు తొక్కుతున్న రెహ్మాన్ సంగీతానికి తానూ గమ్మత్తైన తెలుగు పదాలను పొదిగానని వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” లో చెప్పుకున్నారు! అలా పుట్టినవే “విదియా తదియా వైనాలు”, “జంటతోకల సుందరి” వంటి ప్రయోగాలు!

రెహ్మాన్ పాటలని తెలుగులో వినడం కష్టం అనీ, లిరిక్స్ చెత్తగా ఉంటాయనీ, కాబట్టి తెలుగు గీతరచయితలకి (వేటూరితో సహా!) ఓ దణ్ణం పెట్టి, హిందీనో తమిళాన్నో నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం ఒకటి ఉంది! ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇది ముఖ్యంగా రెహ్మాన్ డబ్బింగ్ సినిమాలతో వచ్చే చిక్కు. “సూపర్ పోలీస్”, “గ్యాంగ్ మాస్టర్”, “నాని” వంటి రెహ్మాన్ తెలుగు సినిమాల్లో ఈ సమస్య అంత కనిపించదు.  అయితే రెహ్మాన్ – వేటూరి కాంబినేషన్‌లో చాలా చక్కని డబ్బింగ్ పాటలూ ఉన్నాయి.  కాస్త శ్రద్ధపెట్టి వింటే సాహిత్యాన్ని బాగా ఆస్వాదించొచ్చు. వేటూరిని స్మరించుకుంటూ, రెహ్మాన్ కి అభినందనలు తెలుపుకుంటూ మచ్చుకి ఓ మూడు పాటలు చూద్దాం!

మేఘాలు గాయపడితే మెరుపల్లే నవ్వుకుంటాయ్!

వేటూరి డబ్బింగ్ పాటలని కూడా గాఢత, కవిత్వం కలిగిన తనదైన శైలిలో రాశారు. బొంబాయి సినిమాలో “పూలకుంది కొమ్మ, పాపకుంది అమ్మ” అనే పల్లవితో వచ్చే పాటలో చాలా స్పందింపజేసే భావాలు ఉన్నాయి. పెద్దలనీ, సమాజాన్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్న యువజంట, తమ జీవితాన్ని ప్రేమతో, ఆశావహ దృక్పథంతో ఎలా దిద్దుకున్నారో వివరించే పాట ఇది. పాట మొదట్లోనే వచ్చే ముద్దొచ్చే వాక్యం –

నింగీ నేలా డీడిక్కి, నీకూ నాకూ ఈడెక్కి!

ఇది నేలనీ ఆకాశాన్నీ కలిపే ప్రణయతరంగమై ఎగసిన ఆ పడుచుజంట హృదయస్పందనని ఆవిష్కరించే వాక్యం. “డీడిక్కి” అనే పదం వాడడం, దానికి “ఈడెక్కి”తో ప్రాస చెయ్యడం అన్నది వేటూరిజం! సినిమా సందర్భంలో తన శ్రీమతి గర్భవతి అయ్యిందన్న ఆనందంలో ఆ భర్త ఉంటాడు కనుక పసిపిల్లలకి వాడే “డీడిక్కి” అనే పదాన్ని వేటూరి వాడారు!

గుండెలో ఆనందం, తలపులో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. ఆ జంట అచ్చంగా ఇలాగే ఉన్నారు. పువ్వులు నవ్వు లేకుండా దిగులుగా ఉండవు,  ఎగిరే గువ్వలు కన్నీళ్ళు పెట్టుకోవు అని చెబుతూ “సూర్యుడికి రాత్రి తెలీదు” అంటూ వచ్చే భావం గొప్పగా ఉంటుంది –

పున్నాగ పూలకేల దిగులు?

మిన్నేటి పక్షికేది కంటి జల్లు?

రవి ఎన్నడూ రాత్రి చూడలేదు

స్వర్గానికి హద్దూ పొద్దూ లేనే లేదు

జీవితమనే ప్రయాణం సుఖవంతంగా ఉండాలంటే లగేజీ తగ్గించుకోవాలి. “ఓటమి బరువు” మోసుకుంటూ వెళ్ళినవాళ్ళకి బ్రతుకంతా తరగని మోతే! మేఘాలు సైతం ఢీకొని గాయపడ్డాక మెరుపులా గలగలా నవ్వేసుకుని చకచకా సాగిపోవట్లేదూ? ఎంత బావుంటుందో ఈ ఎక్స్ప్రెషన్!

కవ్వించాలి కళ్ళు, కన్నెమబ్బు నీళ్ళు

మేఘాలు గాయపడితే మెరుపల్లెయ్ నవ్వుకుంటాయ్

ఓటమిని తీసెయ్ జీవితాన్ని మోసెయ్

వేదాలు జాతిమత భేదాలు లేవన్నాయ్

 

ఈ పాటలో వచ్చే ఇంకా కొన్ని లైనులు చాలా బావుంటాయి. “ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి” అనడంలో కవిత్వం, ఆశావహ దృక్పథం కనిపిస్తాయి. “అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు!” అనడం ఎంత గొప్ప భావం! ప్రేమమూర్తులకు ప్రకృతి సమస్తం ప్రణతులర్పించదూ?

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు – పూలకుంది కొమ్మ

 

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో!

ఇద్దరు సినిమా అనగానే “శశివదనే” పాట చప్పున గుర్తుకు వస్తుంది. కానీ అదే సినిమాలో ఉన్న “పూనగవే పూలది” పాట కూడా ఆణిముత్యమే. ఎంతో సున్నితంగా, అందంగా, స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యేలా ఒక అమ్మాయి తన మౌన ప్రణయారాధనని నివేదించుకునే పాట!  పల్లవిలో వినిపించే పదాలు ఎంతో లలితంగా, ట్యూన్‌కీ భావానికి తగ్గట్టు ఉంటాయి –

నగవే పూలది

లేనగవే వాగుది

మౌనముగా నవ్వనీ, నీ కౌగిలి పూజకి!

“మౌనంగా కౌగిలి పూజకి నవ్వడం” – ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్!  సుమబాల నవ్వునీ, సెలయేటి పాటనీ, (బైటపడలేని) చినదాని మౌన ప్రేమనీ గమనించే పురుషుడు ధన్యుడు!

ఇంతకీ ఆ అమ్మాయికి తను ప్రేమలో పడ్డానని ఎలా తెలిసింది? అతను చెంత ఉన్నప్పుడు విరబూసిన విరజాజై తన కన్నెతనం గుబాళించినప్పుడు, చేమంతుల పూరేకులు ప్రేమలేఖలై అతన్నే గుర్తుచేసినప్పుడు! ఎంత కవిత్వం! ఇంత ప్రేమ తనలో ఉన్నా గ్రహించని ప్రియునికి అభ్యర్ధనగా “ఒక్క సారి నన్ను చూడు, నువ్వే ఉసురై (ప్రాణమై) నా అణువణువూ నిండి ఉన్నావని తెలియక పోదు” అని జాలిగా అడగడం కదిలిస్తుంది –

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో

చేమంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే

ఒకనాడైనా శోధించవా అణువణువు ఉసురవుతాలే!

“నాలోని తీయని అనుభూతులన్నీ నీ వల్లనే!” అనడం నుంచి, “నువ్వు లేక నేను లేను” అంటూ తనలోని ప్రేమ తీవ్రతని కూడా ఎంతో అందంగా వ్యక్తీకరించడం రెండో చరణంలో కనిపిస్తుంది. తమిళ భావాన్ని ఎంత అందంగా వేటూరి తెలుగు చేశారో ఇక్కడ. “తొలిదిశకు తిలకమెలా” అనడంలో శబ్దంపై వేటూరి పట్టు తెలుస్తుంది. ఈ వాక్యమనే కాదు, మొత్తం పాటలోనే ఎంతో శబ్దసౌందర్యం కనిపిస్తుంది!

నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా?

సూర్యుడినే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా

నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు (50:30 నుంచి)  – పూనగవే పూలది

 

వానొస్తే నీవే దిక్కు!

దాశరథి రంగాచార్య గారు ఓ వ్యాసంలో ఒక అందమైన ఉర్దూ షాయరీ గురించి చెప్పారు.  ఇద్దరు ప్రేయసీ ప్రియులు రాత్రి రహస్యంగా కలుస్తారు. బైట వర్షం పడుతోంది. ప్రియుడు వర్షంలోకి వెళ్ళి తడిసి ఆనందిద్దామంటాడు. మగవాళ్ళింతే!  ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆడవాళ్ళకి స్పృహ ఉంటుంది కాస్త! సరసానికి గోప్యం ఉండద్దూ? అందుకే ప్రియురాలు అంటుంది – “వర్షం వర్షం అంటావ్. ఏముంది అక్కడ? నా కళ్ళలోకి చూడు – నీలి మేఘం ఉంది, మెరుపు ఉంది, తడి ఉంది. హాయిగా నా కళ్ళల్లో కొలువుండు! ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది?”

వేటూరికి (లేదా తమిళ రచయితకి) ఈ కవిత తెలుసో లేదో కానీ, రిథం సినిమాలోని “గాలే నా వాకిటకొచ్చె” పాట మొదటి చరణంలో పంక్తులు విన్నప్పుడల్లా ఆ ఉర్దూ కవితే గుర్తొస్తుంది నాకు!

 

అతడు: ఆషాఢ మాసం వచ్చి వానొస్తే నీవే దిక్కు

నీ ఓణీ గొడుగే పడతావా?

ఆమె: అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం

కన్నుల్లో క్షణమే నిలిపేవా?

ఈ పాటలో “గాలిని” ప్రేమగా వర్ణిస్తాడు కవి. గాలి మెల్లగా వచ్చి తలుపు తట్టిందిట. “ఎవరోయ్ నువ్వు?” అంటే “నేను ప్రేమని!” అందిట. “ఆహా! మరి నిన్నామొన్నా ఎక్కడున్నావ్? ఇన్నాళ్ళూ ఏమయ్యావ్?” అని అడిగితే – “నీ శ్వాసై ఉన్నది ఎవరనుకున్నావ్, నేనే!” అందిట. ఇదో చమత్కారం!

గాలే నా వాకిటకొచ్చె, మెల్లంగా తలుపే తెరిచె

ఐతే మరి పేరేదన్నా, లవ్వే అవునా?

నీవూ నిన్నెక్కడ ఉన్నావ్, గాలీ అది చెప్పాలంటే

శ్వాసై నువు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా?

 

తెమ్మెరలా హాయిగా సాగే ఈ ప్రేమపాటలో రెండో చరణంలో చక్కని శృంగారం కనిపిస్తుంది. ప్రియురాలు ముత్యంలా పదిలంగా దాచుకున్న సొగసుని పరికిస్తూ తన్మయుడై ఉబ్బితబ్బిబైపోతున్న ప్రియుని మనస్థితికి “ఎద నిండా మథనం జరిగినదే!” అంటూ ఎంత చక్కని అక్షరరూపం ఇస్తారో వేటూరి!

 

ఆమె: చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనే

నా వయసే తొణికిసలాడినదే!

అతడు: తెరచాటు నీ పరువాల తెరతీసే శోధనలో

ఎదనిండా మథనం జరిగినదే!

ఈ చరణం చివరలోనే వేటూరి చిలిపితనాన్ని చూపెట్టే ఓ రెండు వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలని ఎవరికి వారు అర్థం చేసుకుని ఆనందించాల్సిందే, వివరిస్తే బాగుండదు!

అతడు: కిర్రుమంచమడిగె కుర్ర ఊయలంటే సరియా సఖియా?

ఆమె: చిన్నపిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా!

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు – గాలే నా వాకిటకొచ్చె!

 

 

 

 

 

 

అన్నమయ్య చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠం!

 

-ఫణీంద్ర

~

 

ఉగాది కొత్త ఆశలకీ, శుభకామనలకీ ప్రతీక. మనని మనం సంస్కరించుకోవడం కంటే శుభకరమైనది ఏముంటుంది? అందుకే మనలోని జడత్వాన్ని పారద్రోలి కార్యోన్ముఖుల్ని చేసే “మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు” అన్న అన్నమయ్య గీతంతో ఉగాదికి స్వాగతం పలుకుదాం.

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు
సహజి వలె నుండి ఏమి సాధింపలేడు!

“ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి” అంటున్నాడు అన్నమయ్య. “ఉద్యోగి” అంటే నేటి అర్థంలో “ఉద్యోగం చేసేవాడు” అనుకుని “హమ్మయ్య! అన్నమయ్య ప్రాతిపదికకి సరితూగాను!” అని సంబరపడిపోకండి! అంత తేలిగ్గా మనని వదలడు అన్నమయ్య! ఇక్కడ “ఉద్యోగి” అంటే “ఉద్యమించే వాడు” (ప్రయత్నించే వాడు, పాటుపడే వాడు) అని అర్థం. నాకు చప్పున గుర్తొచ్చేది చిన్నప్పుడు సంస్కృత సుభాషితాల్లో నేర్చుకున్న శ్లోకం –

ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః

“ఉద్యమిస్తేనే పనులౌతాయి, కేవలం కోరిక ఉంటే సరిపోదు! సింహం నిద్రిస్తూ ఉంటే జింక నోట్లోకి వచ్చి వాలదు కదా!” ఆని భావం. ఎంత సింహమైనా వేటాడక తప్పదు, ఎంతటి ప్రతిభాసంపన్నుడైనా పరిశ్రమించక తప్పదు. శ్రీశ్రీ “తెలుగువీర లేవరా” పాటలో అన్నది కొంచెం మార్చుకుని “ప్రతి మనిషీ ఉద్యోగై, బద్ధకాన్ని తరిమికొట్టి సింహంలా గర్జించాలి” అని పాడుకుని ఉత్తేజం పొందాలి!

“సహజి లాగ ఉంటే ఏమీ సాధించలేడు” అని కూడా అంటున్నాడు అన్నమయ్య. “నేనింతేనండీ, నా నేచర్ అది” అంటూ ఉంటాం, సాధారణంగా ఓ సాకుగా! “మార్పు” అన్నది చాలా కష్టమైన విషయం ఎవరికైనా. “నేను మారను” అనే బదులు, “నా వల్ల కాదండీ! నేనిలాగే పుట్టాను” అనడం ఎంతైనా గౌరవప్రదంగా ఉంటుంది! ఈ ధోరణినే అన్నమయ్య తప్పుపడుతున్నాడు!

“నాకు సహజంగా పాడే టాలెంటు లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా ఎస్పీబీని కాలేను కదా? నాకు సహజంగా ఉన్న ప్రతిభ పైనే దృష్టి పెట్టాలి కదా?” అనే ప్రశ్న పుట్టొచ్చు ఇక్కడ. ఇది నిజమే! “మీకున్న సహజమైన బలాలపైనే దృష్టి కేంద్రీకరించండి, బలహీనతలపై కాదు!” అని పదేపదే నొక్కి వక్కాణించిన మేనేజ్మెంట్ గురువు “పీటర్ డ్రకర్” కూడా, “మీ సహజమైన బలాలు సార్థకమవ్వాలంటే మీరు కష్టపడాలి, ఆ బలాలని ఉపయోగించుకోవాలి” అని చెప్పాడు! ఇదే అన్నమయ్య చెప్తున్నది కూడా!

వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు
చెదరి మరచితే సృష్టి చీకటౌ!
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితే కాలము నిమిషమై తోచు!

నిజానికి ఇదొక ఆధ్యాత్మిక గీతం, పల్లవిలో తెలియట్లేదు కానీ. ఆధ్యాత్మిక సాధకుడికి “తనని తాను గెలుచుకోవడం” లక్షమైతే, ప్రాపంచిక సాధకుడికి “ప్రపంచాన్ని గెలవడం లక్ష్యం”. కాబట్టి అన్నమయ్య ఆధ్యాత్మిక సాధుకుడికి చేసిన ఉపదేశం ప్రపంచంలో మన విజయానికీ దోహదపడుతుంది.

“వెతికి తలుచుకుంటే విష్ణువుని చూడొచ్చు, చెదరి మరిచేవా అంతా అంధకారమే!” అంటున్నాడు. “చెదరి పోవడం” (losing focus) అన్నది ఆధునిక జీవితంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. మన ఎటెన్షన్ కోసం సెల్ఫోన్లూ, సవాలక్ష విషయాలూ ప్రయత్నిస్తూనే ఉంటాయి, మనని గెలుస్తూనే ఉంటాయ్! ఒక లక్ష్యాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని, అప్పుడప్పుడు కాస్త చలించినా చలనాన్ని మాత్రం ఆపకుండా, దారి తప్పకుండా, సాగే నేర్పరితనం మనదైతే కోరుకున్నది పొందడంలో కష్టమేముంది?

గొప్ప లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నా, ఎంతో సంకల్పం ఉన్నా, బండి ముందుకి కదలకపోవడం మనకి అనుభవమే. ఆలోచనని ఆచరణలోకి పెట్టడానికి ఎంతో శ్రమించాలి. బద్ధకం వదిలించుకోవాలి. కోరుకున్న గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా కనీసం ఒక అడుగైనా వెయ్యగలగాలి. ఆ అడుగుని నడకగా, తర్వాత గమనంగా మలచుకోవాలి. అందుకే అన్నమయ్య. “పొదలి నడిస్తే మొత్తం భూమినే చుట్టిరావొచ్చు!” అంటున్నాడు (పొదలి అంటే పెరిగి, వర్ధిల్లి అని అర్థం).

“చాలా టైం ఉందిలే!” అనుకున్నవాడికి తొందరా తాపత్రయం ఉండవు. ఒక “అర్జెన్సీ” రావాలి అంటే కాలాన్ని ఆషామాషీగా తీసుకోవడం మానెయ్యాలి. మనం ఏమరపాటుగా ఉంటే తెలియకుండానే జీవితం మొత్తం చేజారిపోతుంది. “నిదురిస్తూ ఉంటే కాలం ఓ నిమిషంలా మాయమైపోతుంది” అన్న అన్నమయ్య మాటలు సమయం విలువని తెలియజెప్పే స్ఫూర్తిదాయకమైన ప్రబోధాలు!

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను!
ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!

లక్ష్యాన్ని చేరడానికి మనని మనం ప్రేరేపించుకున్నాక, అడుగు ముందుకేశాక, ఆ లక్ష్యసాధనలో మనకి కావలసింది జ్ఞానం (knowledge). దీంతో పాటూ నైపుణ్యం కూడా. ఇవి శ్రద్ధగా, కుతూహలంతో సమకూర్చుకోవలసినవి కానీ కేవలం మొక్కుబడిగా ప్రయత్నిస్తే దక్కేవి కావు. అన్నమయ్య చెప్తున్నది ఇదే! వేడుక అంటే ఇక్కడ “కుతూహలం” అని అర్థం, “జాడ” అంటే “కేవలం నామమాత్రంగా” అని. “శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు” అంటున్నాడు.

అలాగే లక్ష్యసాధనలో కావలసిన ఇంకో ముఖ్యమైన లక్షణం ఓటములకి తల్లడిల్లకుండా ఉండగలగడం! ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేటప్పుడు ఎప్పుడూ పైపైకి ఎగబాకుతూనే ఉండడం కుదరక పోవచ్చు. అప్పుడప్పుడు కొంత కిందకి పడొచ్చు, కొన్ని సార్లు కిందకి దిగాల్సి రావొచ్చు కూడా. ఇలా కిందకి దిగినా మళ్ళీ పైకి చేర్చే మార్గాన్ని చూసుకుంటూ సాగడమే తెలివంటే. అన్నమయ్య “ఓటములకి తలవంచని తపసివైతే మహోన్నతుడివౌతావు” అంటున్నాడు. “తపస్సు” అనే మాటలో కష్టనష్టాలని తట్టుకునే స్థైర్యం, సడలని ఏకాగ్రత వంటి లక్షణాలు దాగి ఉన్నాయి. ఈ తపస్సు సాధ్యపడాలంటే మనలోని శక్తియుక్తులన్నీ “కూడబెట్టి” పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే “సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు” అంటున్నాడు!

మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెరగక ఉండితే వీరిడియౌను!
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంశయించితే పాషండుడౌను!

ఎంత పరితపించినా, ఎంత పరిశ్రమించినా కొన్నిసార్లు “ఫలితాలు” మన చేతిలో ఉండవు. గాఢంగా కోరుకున్నది దక్కనప్పుడు తీవ్ర నిరాశకి గురవుతాము. ఓటమి మన అసమర్థతనీ, అల్పత్వాన్నీ గుర్తుచేస్తుంది. అందుకే అన్నమయ్య మనకో చిట్కా (వెరవు) చెప్తున్నాడు. “నీ వంతు కర్తవ్యం నిర్వర్తించు, మిగిలినది దైవనిర్ణయం! బరువంతా నువ్వే మొయ్యడం ఎందుకు, నీ బండలని ఆ ఏడుకొండల వాడికి అర్పించు” అంటున్నాడు. ఇదే కర్మసిద్ధాంతం. ఇదే మోక్షాన్ని సాధించే మార్గం కూడా. “మోక్షసాధనకి నీ ప్రయత్నమే సరిపోదు, ఆ మురహరుని కరుణ ఉండాలి. ఈ ఉపాయం తెలియకపోతే నువ్వు ఒట్టి అవివేకిగా (వీరిడిగా) మిగులుతావు” అన్న అన్నమయ్య మాట ప్రాపంచిక సాధకులకి కూడా శిరోధార్యం.

ఆఖరుగా ఆణిముత్యం లాంటి వాక్యంతో ముగిస్తాడు అన్నమయ్య. “పరగ” అంటే “ఒప్పుకోలుగా” (agreeably) అని అర్థం. మన ప్రశ్నలు, సంశయాలు అన్నీ నిజాయితీ నిండినవైతే సత్యాన్ని చూపించే వెలుగురేఖలౌతాయి. కానీ చాలా సార్లు మన సంశయాలు మనం ముందుగా ఏర్పరుకున్న అభిప్రాయాలకీ, మన అహంకారానికీ దర్పణాలు మాత్రమే! . “ఇది సాధ్యమేనా?” అన్న ప్రశ్న నిజానికి “ఇది అసాధ్యం!” అని చెప్పడం మాత్రమే, నిజాయితీతో శోధించుకున్నది కాదు. దీనినే “ఒప్పుకోలుగా సంశయించడం” (పరగ సంశయించడం) అన్నాడు అన్నమయ్య. అలా సంశయించే వాడు సత్యాన్ని తెలుసుకోలేడు కానీ ప్రయత్నించానన్న భ్రమలో తనని తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. అలాంటివాడు ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోలేని పాషండుడు (వేదాలు చెప్పిన సత్యాన్ని అంగీకరించని వాడు) అవుతాడు. తన అహంకారాన్నీ, అభిప్రాయాలనీ విడిచి సత్యాన్ని శరణు కోరిన నిజమైన సత్యశోధకుడైనవాడు, వేదాలని కాదన్నా సత్యాన్ని పొందుతాడు! గెలుపుని కోరుకున్న వాడు ముందు తన మది తలుపులని తెరవాలి, పాతని పారద్రోలి కొత్తదనాన్ని ఆహ్వానించాలి!

ఈ అద్భుతమైన గీతాన్ని శోభారాజు గారు చాలా చక్కగా స్వరపరిచి గానం చేశారు. అది యూట్యూబులో ఇక్కడ వినొచ్చు.

*

బాజీరావ్ మస్తానీ – గీత్ సుహానీ!

 

-ఫణీంద్ర 

~

phaniడబ్బింగ్ సినిమా పాటలనగానే, అదీ హిందీ నుంచి అయితే, తెలుగుభాషా చిత్రవధకి శ్రోతలు సిద్ధపడి ఉంటారు! డబ్బింగ్ పాటల్లో తెలుగు అంత కృతకంగా ఉండడానికి సంగీత దర్శకుడూ, దర్శకుడూ వగైరా వాళ్ళ పాత్ర అంతో ఇంతో ఉన్నా నింద మాత్రం ఎప్పుడూ పాటల రచయితకే వస్తుంది! కొన్నిసార్లు తెలుగు అనువాదం అస్సలు సరిగ్గా కుదరనప్పుడు, శ్రోతలు రచయితకి ఓ దండం పెట్టి తమిళంలోనో హిందీలోనో ఉన్న ఒరిజినల్‌ని వింటూ సంతృప్తిపడతారు. అయితే డబ్బింగ్ పాటలో కూడా తెలుగులా వినిపిస్తున్న తెలుగుని విని, ఎంతో అందంగా ఉన్న భావాలకి పరవశించి, అంత అద్భుతంగా రాసిన రచయితకి నిజమైన గౌరవవందనాలు సమర్పించే సందర్భాలు అరుదుగా వస్తూ ఉంటాయి! అలాంటి గౌరవాన్ని “బాజీరావ్ మస్తానీ” చిత్రానికి రాసిన పాటలద్వారా రామజోగయ్య శాస్త్రి గారు దక్కించుకున్నారు. ఆ చిత్రంలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ వారం పలకరిద్దాం!
“బాజీరావ్ మస్తానీ” ఓ చారిత్రాత్మక కథకి చేసిన కల్పన. మరాఠా యోధుడు బాజీరావ్‌కి, మస్తానీకి మధ్య సినిమాలో చూపించిన ప్రేమకథ నిజంగా జరిగిందా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమని సినిమాలో ఎంత అందంగా, కళాత్మకంగా చూపించారో, ఈ పాటలో మస్తానీ తన హృదయాన్ని ఎంత ఆర్తిగా నివేదించుకుందో అన్నదే ముఖ్యమైన విషయం సాధారణ ప్రేక్షకుడికి. ఈ సినిమాకి ఎంతో ముఖ్యమైన ఇలాంటి పాటలో తన గీతరచనా ప్రతిభని సంపూర్ణంగా ప్రదర్శించి, ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి కలిగించిన ఘనత రామజోగయ్య శాస్త్రి గారికి దక్కుతుంది.
శాస్త్రిగారు ఈ సినిమాలోని అన్ని పాటలూ చాలా అందంగా రాసినా, ఈ పాటకంటే కవిత్వం ఎక్కువ ఉన్న పాటలు సినిమాలో ఉన్నా, ఈ పాటే ఆయనకి వన్నె తెచ్చేది. ఎందుకంటే ఈ పాట రాయడం అంత సులభమేమీ కాదు. ఒరిజినల్‌లో ముందు మరాఠీలో వచ్చే సాకీ, తర్వాత హిందీలో మధురంగా వినిపించే పల్లవీ చరణాలు, చివర్లో ఉర్దూలో వచ్చే ఖవ్వాలీ…ఇలా పాట నడకంతా విభిన్నంగా సాగుతుంది, ముగ్గురు గీతరచయితలు (హిందీ భాగాన్ని రాసిన జంటకవులు సిద్ధార్థ్ – గరిమలను ఒకరిగా పరిగణిస్తే) రాశారు ఆ పాటని. అలాంటి పాటని తానొక్కడే మొత్తం రాసి మెప్పించడం, క్లిష్టమైన మరాఠీ సాకీని కూడా తెలుగులో ఒప్పించేలా రాయగలగడం శాస్త్రి గారికే చెల్లింది!

పాట సాకీ అద్దాల మేడలోని కళామందిరానికి విచ్చేస్తున్న మస్తానీ అందాన్నీ, ఔన్నత్యాన్నీ కీర్తిస్తూ సాగుతుంది –

 

సాకీ:
దివినించి జారె జర జరా
కలికి అప్సర కలల తెమ్మెర!

 

కోరస్: జారే ఇలకు జారే దివినించి జారే

 

పగడాల సొగసు దొంతర
నచ్చిన కళ్ళలో విచ్చిన కెందామర!

 

కోరస్: జారే ఇలకు జారే

 

మరువాల పవనంలా
పరువాల దవనంలా

అరుదెంచెనీ వెన్నెల!

 

కోరస్: అరుదెంచే చూడు! అరుదెంచే చూడు! అరుదెంచే మహరాణీ!

 

Ramajogayya Sastry @ Rabhasa Movie Audio Launch Stills

ఆ అమ్మాయి అందంలో అప్సరసే! అయితే “కలికి” (చక్కనైన) అని శ్రేష్ఠమైన విశేషణాన్ని వాడి అందానికి హుందాతనాన్ని అద్దారు రచయిత. అటువంటి సుందరిని చూస్తే కలలు చల్లగాలిలా (తెమ్మెర) తాకవు మరి! సిగ్గెరుపో లేక మేనెరుపో మరి ఎర్రని పగడాల దొంతరలా ఉందట ఆమె సోయగం! ఎంత అందమైన ఊహ! ఆ అమ్మాయిపై మనసుపడ్డ వారి కళ్ళలో (నచ్చిన కళ్ళలో) ఆమెను చూసినప్పుడు ఎర్రకలువలు (కెందామరలు) విచ్చుకుంటాయట! ఆహా! ఆమె అందరికి కళ్ళకి అందే సోయగం కాదు, నచ్చిన, మనసిచ్చిన వారికే అందే అద్భుత దృశ్యం మరి! కేవలం కంటికే కాదు పంచేంద్రియాలకీ పులకింత ఆ సౌందర్యం! ఆమె వెంట మరువపు ఆకుల సుగంధం నడిచొస్తోంది. కాదు కాదు, పరువమే దవన పరిమళమై ఆమెను అంటిపెట్టుకుంటోంది (దవనము కూడా మరువము లానే సుగంధమూలిక). ఇలా పరువాల పున్నమిలా వచ్చి తన సోయగాల వెన్నెలని కురిపిస్తున్న ఆ సుందరి రాజసం చూస్తే మహరాణీ అని కీర్తించదూ జగమంతా?

మస్తానీ బాజీరావుకి ఆరాధనాపూర్వకంగా ఓ సైగచేసి పాట పాడడం మొదలుపెడుతుంది –
పల్లవి: (మస్తానీ)
కనులతో తీగలాగి పడేసావే మాయలో
వరంగా సోలిపోయా వలేసే హాయిలో!


బహుమానమై నీదానిగా తరించా ప్రేమలో
వద్దన్నా ప్రపంచం జన్మం నీకు సొంతం

 

అదో వెర్రి ప్రేమై నిన్నే చేరుకున్నా
కళ నీవే కాంతి నీవే మస్తానీ శ్వాసలో! 

 

ఈ ప్రేమ మాటగా వెలికిరానిది, మాటల్లో చెప్పలేనిది. అయితే అతని కళ్ళలో తనపై ఆరాధన కనిపిస్తూనే ఉంది. అతనిలో తన పిచ్చిప్రేమని చూసి నవ్వుకోకుండా అర్థం చేసుకునే ఓ హృదయాన్ని చూసింది. అందుకే అతనికి దాసోహమైంది. “నీ చూపులనే తీగలతో నన్ను మెల్లగా లాగి ఈ ప్రేమ మాయలో పడేశావు! నన్ను వలేసి మరీ లాగిన ఈ వరమైన హాయిలో ఉండిపోనీ” అంటోంది! ఈ భావం ట్యూన్‌లో ఎంతందంగా వినిపిస్తుందో (ముఖ్యంగా “వరంగా సోలిపోయా” అనే లైను)!

తన ప్రేమని లోకం ఒప్పుకోదని తెలుసు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అయినా, “నీ ప్రేమే నాకు బహుమానం! ఈ జన్మ నీకు సొంతం, ఎవరిని ఎదిరించైనా సరే నిన్ను చేరుకుని నీ ప్రేమలో తరిస్తాను” అంటోంది. నిజమైన ప్రేమకి ఉండే ధైర్యం అది. గుండెల్లో ప్రేమరూపాన్నీ, ఊపిరిలో ధైర్యాన్నీ నింపుకున్నది ప్రేమవుతుంది కానీ కేవలం కనులలో కలలు ఒంపుకున్నది కాదు! “నా బ్రతుకులో (శ్వాసలో) కళా కాంతీ అన్నీ నీ వల్లే! కలగన్నా, మెలకువలో ఉన్నా ప్రతి తలపూ నీదే” అనేంతగా అతనికి తనని తాను అంకితం చేసుకున్న పిచ్చిప్రేమ ఇది.

చరణం (మస్తానీ)
ప్రియం తీయనైన అపాయం
కోరస్: ఎదంతా లిఖించావు గాయం కవ్వించే చూపుగా!


వలపై చేసినావే సహాయం
కోరస్: తపించే వయారం శమించే మలామూ నీవేగా


నిజమున్నది నీ కమ్మని కలలో (2)
జగాలే వినేలా సగంలా

కోరస్: నీ పేరే నాదిరా

ప్రేమ ఎప్పుడూ అపాయమే! తీయని అపాయం, ప్రియమైన అపాయం! మస్తానీ విషయంలో నిజమైన అపాయం కూడా. ఐనా అన్నిటికీ తెగించిన ప్రేమ ఇది. ఈ అపాయం వలన కలిగేది గాయం. కవ్వించే చూపులతో మనసుపై చేసిన గాయం! అది జన్మంతా మాననిది. ఓ తీయని బాధగా, ఆహ్లాదమైన ఆరాటంగా మిగిలేది. అయితే దానివల్ల ఓ సహాయమూ దొరికింది. అదేమిటంటే తపించే వయ్యారానికి ఊరటనిచ్చే లేపనం (మలాము) కూడా ఈ ప్రేమేనట! ఎంత చిత్రమో కదా! గాయమూ తనవల్లే, సహాయమూ తనవల్లే! ఏమిటో ఈ ప్రేమ!

కల నిజం కాదు ఎప్పుడూ. కానీ కొన్ని కలలే నిజంకన్నా గొప్పగా అనిపిస్తాయి. నిజమైన జీవితాన్ని కలగా మారుస్తాయి. కలలోని జీవితాన్ని నిజం చేసేలా ప్రేరేపిస్తాయి. ఆ స్ఫూర్తితోనే సాగుతోంది మస్తానీ. “జగం వినేలా చాటి చెప్పనీ! నువ్వు నావాడివి! నేను నీలో సగం అయ్యి తీరుతాను” అని నిశ్చయంగా చెబుతోంది. నీ ప్రియురాలిగా ఉంటూ తీపిని మాత్రమే పంచుకోవడం కాదు, నీ ధర్మపత్నిగా మారి జీవితంలో కష్టసుఖాలను పంచుకోవాలన్నదే నా ఉద్దేశ్యమని చాటిచెప్తోంది!

 

ఖవ్వాలీ (బాజీరావ్):
చెలి పాలపుంతలా మెరిసావే
బ్రతుకంత జిగేలై కలగలిసావే

పులకింత నింపి మనసు బంతినెగరేసావే


నా సిరి నీవే, మాధురి నీవే
నేలంతా గెలిచాననిపించే కేరింతయ్యావే

 

బాజీరావ్ ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాడు పాటలో! ఒక అపురూప సౌందర్య రాశి, ఒక అద్భుత మానధన రాశి కళ్ళముందు మెరిస్తే మాటలెలా వస్తాయి! కానీ అతని గుండె స్పందిస్తోంది, మౌనంగా పాట పాడుతోంది. తన చెంత మెరిసిన పాలపుంత, బ్రతుకంతా జిగేలనిపించే ప్రేమ పులకింత అని తెలుసు! ఆ పులకింత నిండిన మనసు ఉండబట్టలేక బంతిలా ఎగిరెగెరి పడుతోందట! ఇప్పటి వరకూ యుద్ధాలు గెలవడం, రాజ్యాలు ఏలడమే జీవితం అనుకున్నాడు కానీ కాదు. సిరి అంటే మస్తానీ, జీవితంలో మాధుర్యం అంటే మస్తానీ. తన ప్రేమ ఉంటే చాలు ప్రపంచాన్నంతా జయించినట్టే. నిజమే కదా, ప్రేమలో సమస్తం దొరుకుతుంది, ప్రేమలో విశ్వం తనని తాను చూసుకుంటుంది!

ప్రేమ మహిమ తాకిన రెండు హృదయాలని రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా ఆవిష్కరించిన వైనాన్ని పాట వింటేనే కానీ పూర్తిగా తెలుసుకోలేం! “సంజయ్ లీలా బన్సాలీ” మధుర స్వరకల్పనలో, శ్రేయా ఘోషల్ మధురాతిమధురమైన గాత్రంలో ఈ పాటని ఇక్కడ విని కాసేపు ప్రేమ నీడలో సేద తీరండి!

*

 

వరిచేల మెరుపులా వచ్చె వలపంటివాడే!

 

-ఫణీంద్ర 

~

phaniతెలుగు సినిమాల్లో ఉన్న క్రీస్తు భక్తిగీతాల్లో ఒక ప్రత్యేకమైన గీతం “మెరుపు కలలు” చిత్రంలోని “అపరంజి మదనుడే” అన్నది. ఈ పాటకి ఎంతో మాధుర్యం, భక్తిభావం ఉట్టిపడేలా సంగీతాన్ని సమకూర్చడం రెహ్మాన్ గొప్పతనమైతే, క్రీస్తుని విన్నూత్నమైన పదప్రయోగాలతో వర్ణించి స్పందింపజెయ్యడం వేటూరి గొప్పతనం. క్రిస్మస్ సందర్భంగా ఈ పాటని పరికించి పులకిద్దాం.

వేటూరి అంతకమునుపే “క్రీస్తు గానసుధ” అనే ప్రైవేటు ఆల్బంకి అలతి పదాలతో జనరంజకమైన పాటలు రాసి మెప్పించారు. తమిళంలో వైరముత్తు సాహిత్యానికి తెలుగు అనుసృజన చేసిన ఈ పాటలో కూడా సరళమైన పదభావాలనే వాడినా క్రీస్తుని వర్ణించడానికి ఎవరూ సాధారణంగా ఎంచుకోని శబ్దాలను వాడి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగాలని అందరూ హర్షించకపోవచ్చు, కొందరు తప్పుపట్టొచ్చు కూడా! అయితే క్రీస్తుపట్ల తనకున్న నిష్కల్మషమైన భక్తిభావమూ, ప్రేమా తనదైన పద్ధతిలో ఆవిష్కరించుకునే ఓ భక్తురాలి ప్రార్థనే ఈ గీతం అని గ్రహించిన వారికి పాట పరమార్థం, వేటూరి హృదయం అర్థమౌతాయి. ఓ అద్భుతమైన ట్యూన్‌కి పవిత్రంగా పొదిగిన సాహిత్యానికి మనం స్పందించగలిగితే మనలోనూ ఓ భక్తిభావం అంకురిస్తుంది.

పాట పూర్తి సాహిత్యం ఇది (దురదృష్టవశాత్తూ రెహ్మాన్ చాలా తెలుగు పాటల్లానే ఈ పాటలో కూడా గాయని చాలా తప్పులు పాడింది. ఆ తప్పులని ఇక్కడ సరిజెయ్యడం జరిగింది):

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే  

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే 

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

 

అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

నిజానికి ఈ పాటా ఓ ప్రేమగీతమే! ఇక్కడ ప్రేమ భగవంతుని పట్ల ప్రేమ. అలనాడు బెత్లహాంలో పుట్టిన పసిబిడ్డడు, జనుల వెతలు తీర్చిన దేవుడై, శిలువనెక్కిన శాంతిదూతై, ఈనాటికీ ప్రపంచంలోని అత్యధికులకి చీకటిలోని వెలుగురేఖ అవుతున్నాడంటే అతనెంతటి మహనీయుడు! అటువంటి బాలఏసుని తలచుకుంటే నిలువెత్తు ప్రేమస్వరూపం గుర్తుకు రావాలి, తన సువార్త ద్వారా జీవితంలో అడుగడుగునా సఖుడైనట్టి దేవుడు కనిపించాలి. ఈ వాక్యాల్లో కనిపించే భావం అదే! అవును అతను “అపరంజి (బంగారు) మదనుడు (ప్రేమ స్వరూపుడు)”. అతని ప్రేమ స్వచ్ఛమైన బంగారపు తళతళ. జీవితంలోని ఎదురయ్యే సంఘర్షణల్లోనూ, సందిగ్ధాల్లోనూ అతని పట్ల విశ్వాసమే దారిచూపిస్తూ ఉంటే అతను కాక “తగిన స్నేహితుడు” (అనువైన సఖుడు, right companion) ఎవరు? ఇతని కంటే అందగాడు ఇంకెవ్వరు? ఇక్కడ అందం అంటే బాహ్యమైన అందం కాదు. అతని కరుణ నిండిన వీక్షణం అందం, అతని ప్రేమ నిండిన చిరునవ్వు అందం, అతని గుండె పలికిన ప్రతిపలుకూ అందం. అతనికంటే అందమైన వాళ్ళుంటారా?

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

క్రీస్తు జననం సాధారణ ప్రదేశంలో జరిగింది (పశువుల గొట్టంలోనని కొందరంటారు), ఏ రాజమహల్లోనో కాదు. ఆయన తొలుత సామాన్యులకీ, పేదలకీ దేవుడయ్యాడు కానీ అధికారులకీ, రాజులకీ కాదు. “వరిచేల మెరుపు” అనడం ద్వారా అప్పటి కాలంలోని ప్రధాన పంటైన వరిని, వరిచేలతో నిండిన ఆ నేలని ప్రస్తావించడం కన్నా, సామాన్యుల కోసం పుట్టిన అసామాన్యుడైన దైవస్వరూపంగా క్రీస్తుని కొలవడం కనిపిస్తుంది. చెక్కుచెదరని ధగధగ కాంతుల ప్రేమవజ్రం అతను. అతను ప్రపంచానికి వలపు సందేశం అందించడానికి అరుదెంచిన సర్వశ్రేష్టుడు (రత్నం; నవరత్నాల్లో వజ్రమూ ఒకటి. వజ్రాన్ని ముందే ప్రస్తావించాడు కాబట్టి ఇక్కడ రత్నాన్ని “అన్నిటి కన్నా శ్రేష్టమైన” అన్న అర్థంలో కవి వాడాడని అనుకోవడం సబబు)

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే

ఇంతటి అనంత విశ్వంలో  కేవలం భూమి మీదే జీవరాశి ఎందుకు ఉండాలి (మనకి తెలిసి)? కొన్ని కోట్ల ఏళ్ళ పరిణామ క్రమంలో ఈ జీవరాశుల్లోంచి ఓ మానవుడు అద్భుతంగా ఎందుకు రూపుదిద్దుకోవాలి? ఎంతో బుద్ధి కలిగిన ఈ మానవుడే మళ్ళీ తెలివితక్కువగా తన దుఃఖాన్నీ, వినాశనాన్నీ తనే ఎందుకు కొనితెచ్చుకోవాలి? అలా దారితప్పిన మానవుడికి త్రోవచూపడానికి ఓ దేవుడులాంటి మనిషి ఎందుకు దిగిరావాలి? ఎందుకు ఎందుకు? శాస్త్రజ్ఞులు, “అదంతే! కారణాలు ఉండవు!” అనొచ్చు. కానీ ఓ భక్తుడి దృష్టిలో ఇదంతా దేవుని కరుణ. ఆకాశంలో ఉండే సూర్యుడికి నిజానికి భూమితో ఏమీ పని లేదు, భూమిని పట్టించుకోనక్కరలేదు. కానీ సూర్యుడు లేకుంటే భూమిపైన జీవరాశే లేదు. అలా సూర్యుడిలా కేవలం తన ప్రేమ వల్ల జనులని రక్షించడానికి దిగివచ్చిన అపారకరుణామూర్తి క్రీస్తు! నేలపైన వెలిగిన సూర్యుడు! జనుల బాధలనీ, శోకాలనీ, కష్టాలనీ ఇలా అన్ని కన్నీళ్ళనీ తన చల్లని ప్రేమామృత స్పర్శతో కడిగిన దేవుడు. ఈ బాలకుడే కదా లోకపాలకుడు (శిశుపాలుడు)!

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే!

చరిత్ర చూడని వినాశనం లేదు. మనుషులు రాక్షసులై జరిపిన హింసాకాండలెన్నో. ఈ యుద్ధోన్మాదం మధ్య సుస్వర సంగీతంలా, ఎడారిలో విరిసిన పూదోటలా, తన ప్రేమసందేశంతో జగానికి శాశ్వత మార్గాన్ని చూపినవాడు క్రీస్తు. హింసని ప్రేమతో ఎదుర్కొని, చిరునవ్వుతో శిలువనెక్కి, మరణం లేని మహిమాన్వితుడిగా వెలిగిన చరితార్థుడు.

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

కల్వారి కొండ (Calvari Hill) అన్నది క్రీస్తుని శిలువ వేసిన ప్రదేశం. అంతటి కొండా భక్తుల గుండెల్లాగే శిలువనెక్కిన క్రీస్తుని చూసి కన్నీరైతే, ఆయన నమ్మిన వారిని రక్షించడానికి మరణాన్ని దాటి పునరుత్థానుడయ్యాడు. ఆ కొండపైన శిలువ వేయబడిన ఏసు ఆ కొండనే ఏలుతూ (మలనేలు – మలని + ఏలు, మల అంటే కొండ) స్వచ్చమైన తెల్లని ముత్యంలా మెరిశాడట! ఎంత అందమైన కల్పన!

ఈ “కలికి ముత్యపు రాయైన” క్రీస్తు భక్తులకి కన్నబిడ్డ లాంటివాడట! ఇందాకే బాలఏసు తండ్రి లాంటి పాలకుడయ్యాడు, ఇప్పుడు ఒడిలోన కన్నబిడ్డ అయ్యాడు! తండ్రీ బిడ్డా రెండూ ఆయనే. ఒడిలోని పసిపాపని చూసి ఓ తల్లికి కలిగే ఆనందం వర్ణనాతీతం. ఎంతటి బాధనైనా తక్షణం మటుమాయం చేసే గుణం పాప నవ్వుకి ఉంటుంది. “ఇంకేమీ లేదు, సమస్తమూ నా కన్నబిడ్డే” అనిపిస్తుంది. ఆ బిడ్డే దేవుడూ అయినప్పుడు కలిగే భరోసా “నూరేళ్ళ చీకటిని ఒక్క క్షణంలో పోగొట్టేదే” అవుతుంది!

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

ప్రేమే తెలియని కరకు, ఇరుకు గుండెలకి ప్రేమంటే తెలియజెప్పిన శాంతిదూత క్రీస్తు. ఇలకి దిగివచ్చిన ఈ బాల దేవుణ్ణి “అనురాగ మొలక” గా వర్ణించడం ఎంతో చక్కగా ఉంది.

ఇలా ప్రేమ మూర్తిగా, స్నేహితుడిగా, పాలకుడిగా, కన్నబిడ్డగా పలు విధాల క్రీస్తుని కొలుచుకోవచ్చు. భక్తుడి బాధ తీర్చే పెన్నిధీ ఆయనే, భక్తుడు ఆనందంలో చేసే కీర్తనా ఆయనే. చీకటనుండి చేయిపట్టి నడిపించే వెలుగురేఖా ఆయనే, అంతా వెలుగున్న వేళ మెరిసే ఇంధ్రధనుసూ ఆయనే. సర్వకాల సర్వావస్థల్లోనూ పూజకి పువ్వులా దొరికాడు కనుకే “ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే” అనడం. “ముక్కారు” అంటే “మూడు కాలాలు” అని అర్థం. అన్ని కాలాల్లోనూ, అన్ని కష్టాల్లోనూ తోడుండే దేవుడు ఆయనే!

ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు. ఇది కేవలం క్రైస్తవులకే చెందిన పాట కాదు. భక్తిలోని ఓ చిత్రం ఏమిటంటే, మొదట్లో భగవంతుడు, భక్తుడు, భక్తి అని వేరువేరుగా ఉన్నా, చివరకి కేవలం భక్తే మిగులుతుంది. ఆ స్థితిలో కృష్ణుడు, క్రీస్తు, అల్లా అని తేడాలుండవు. ఇలా ప్రేమని పెంచి, ఏకత్వాన్ని సాధించి జనులని నడిపించే భక్తి నిజమైన భక్తి అవుతుంది. అలాంటి భక్తి మాధుర్యం ఈ పాటలోనూ ఉంది.

*

 

 

 

 

కంచెలు తుంచే మనిషితనం!

 

-ఫణీంద్ర

~

phaniసిరివెన్నెల “కంచె” చిత్రానికి రాసిన రెండు అద్భుతమైన పాటలు పైకి యుద్ధోన్మాదాన్ని ప్రశ్నిస్తున్నట్టు కనిపించినా నిజానికవి నానాటికీ మనందరిలో కనుమరుగౌతున్న మనిషితనాన్ని తట్టిలేపడానికి పూరించిన చైతన్యశంఖాలు. ఇక్కడ “మనిషితనం” అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఓషో చెప్పిన ఓ కథ మనిషితనాన్ని చక్కగా విశదీకరిస్తుంది. ఓ ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున ఉన్నారు. ఇంతలో ఎవరో నదిలో మునిగిపోతూ – “రక్షించండి, రక్షించండి” అని అరిచారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి తలెత్తి చూశాడు. అతని విశ్వాసం ప్రకారం ప్రతి మనిషీ తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. పక్కవాడి కర్మలో మనం తలదూర్చడం కన్నా అవివేకం మరోటి లేదు. అంతా భగవదేచ్చ!  కాబట్టి ఇక్కడో మనిషి మునిగిపోతున్నాడంటే అదతని కర్మఫలమే! ఇందులో చెయ్యగలిగినది ఏమీ లేదు. ఇలా ఆలోచించి అతను ఏమీ పట్టనట్టు ఉండిపోతాడు. రెండో మనిషీ ఈ అరుపులు వింటాడు. ఇతని నమ్మకం ప్రకారం మనిషి పోయాక స్వర్గ-నరకాలు అంటూ ఉంటాయి. పుణ్యకర్మలు చెయ్యడం వలన దేవుని కృపకి పాత్రులమవుతాం, స్వర్గం సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడీ మునిగిపోతున్న మనిషిని రక్షించడమంటే స్వర్గప్రవేశాన్ని ఖాయం చేసుకోవడమే! ఇలా ఆలోచించి అతను వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కథలో నీతి ఏమిటంటే, మనం మనుషుల్లా స్పందించడం మరిచిపోయాం. ఏవో ఆలోచనలూ, సిద్ధాంతాలు, భావజాలాలూ తలలో నింపుకుని వాటి వలన మనుషులను రక్షించగలం, చంపగలం కూడా! ఇలా కాక మనిషిలా కరిగి, గుండెతో స్పందించే గుణం మనిషితనం అవుతుంది.

ఒక ఊరిలో రెండు వర్గాలు కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేక ఇంకేదో కారణం చేతనో విద్వేషంతో రగిలి తలలు తెగనరుక్కునే దాకా వస్తే, అది చూసిన మన స్పందన ఏమిటి?  ఇద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పుందీ, గతంలో ఎవరు ఎక్కువ దారుణాలు చేశారు, ఏ శక్తులు ఎవరికి సహాయపడుతున్నాయి, అవి మంచివా చెడ్డవా – ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు గానీ స్పందించలేకపోతే మనలో మనిషితనం చచ్చిపోయినట్టే లెక్క! ఒక మనిషిలా కనుక స్పందిస్తే, మన గుండె ద్రవించాలి, మనసు తల్లడిల్లిపోవాలి.యుద్ధం పేరుతో ఓ మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుకుంటున్నాడు? ఏమి సాధించడానికి? మృదువైన కోరికలూ, తీయని కలలలో తేలే మన హృదయ పావురాన్ని ఏ చీకటి బోయవాడు పాపపు బాణం వేసి నేలకూల్చాడు? హృదయాన్ని మరిచి, తెలివి మీరి, పగలతో సెగలతో రాక్షసులుగా మారిన మన మానవజాతిని చూసి పుడమి తల్లి గుండె తీవ్రమైన వేదనతో తల్లడిల్లిందే! ఆ తల్లి చేష్టలుడిగి నిస్సహయురాలై నిట్టూర్చిందే! ఆ తల్లి గుండెఘోషని చూస్తున్నామా, చూస్తే ఏమైనా చేస్తున్నామా? ఇంతటి మహా విషాద వృక్షాన్ని పెంచిన విషబీజాలేమిటి? పూలతోటల బదులు ముళ్ళచెట్లని పూయిస్తున్న ఆ ఆలోచనలేమిటి –

నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం

మృదు లాలస స్వప్నాలస హృత్ కపోత పాతం

పృథు వ్యథార్త పృథ్విమాత నిర్ఘోషిత చేతం

నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం

ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం?

ఈ మనసూ, హృదయస్పందనా, మనిషితనం లాంటివి వినడానికి బానే ఉంటాయి కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఒక మంచిని సాధించడానికి కొన్నిసార్లు దారుణాలు జరగక తప్పవని కొందరి భావన. ఉదాత్తమైన గమ్యం కోసం వక్రమార్గం పట్టినా ఫర్వాలేదు (The end justifies the means) అనే ఈ ఆలోచన చేసిన వినాశనానికి చరిత్రే సాక్ష్యం. తాను దుర్మార్గుణ్ణని విర్రవీగి విధ్వంసం సృష్టించిన వాడి కంటే, తానెంతో మంచివాణ్ణనీ, మహోన్నత ఆశయసాధనకే ప్రయత్నిస్తున్నాననీ నమ్మినవాడి వలన జరిగిన మారణహోమాలే ఎక్కువ! మనని మనం తగలబెట్టుకుంటే ఏ వెలుగూ రాదనీ, కత్తుల రెక్కలతో శాంతికపోతం ఎగరదనీ, నెత్తుటిజల్లులు ఏ పచ్చని బ్రతుకులూ పెంచవనీ ఇప్పటికైనా మనం నేర్వకపోతే మన భవిత అంధకారమే –

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో?

ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో?

ఏ పంటల రక్షణకీ కంచెల ముళ్ళు?

ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు?

ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు

ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు

ప్రాణమే పణమై ఆడుతున్న జూదం

ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు

చావులో విజయం వెతుకు ఈ వినోదం

పొందదే ఎపుడూ మేలుకొలుపు మేలుకొలుపు!

 

ఒకప్పుడు ఎంత స్నేహం, సౌభ్రాతృత్వం వర్ధిల్లినా మనసులో మొలకెత్తే ఒక విషబీజం చాలు ఆ చెలిమిని అంతా మరిచిపోవడానికి. ప్రచండ సూర్యుణ్ణి సైతం మబ్బు కప్పేసినట్టు, ద్వేషం, పగా దట్టంగా అలముకున్నప్పుడు ఏ వెలుగురేఖలూ పొడచూపవు. అపార్థాల వలన చెదిరిన అనుబంధాలకీ, స్వార్థం వలన సమసిన స్నేహాలకీ, ద్వేషం వలన దగ్ధమైన పూదోటలకీ లెక్క లేదు. ఈ పగలసెగల వలన ఏర్పడిన ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలాల్సిందేనా –

 

అంతరాలు అంతమై అంతా ఆనందమై

కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా

చెలిమి చినుకు కరువై, పగల సెగలు నెలవై

ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా!

 

ఇలా గుండె రగిలిన వేదనలోంచి ఓ వెలుగురేఖ ఉద్భవించి మనలోకి మనం తరచి చూడగలిగితే ఓ సత్యం బోధపడుతుంది. నేనూ, నా వాళ్ళు అని స్వార్థంతో గిరిగీసుకుని, నా వాళ్ళు కానివాళ్ళందరూ పరాయివాళ్ళనే అహంకారపు భావనే అన్ని సమస్యలకీ మూలకారణం అని. పక్కవాడు కూడా నాలాగే మనిషే, వాడికీ నాలాగే కన్నీళ్ళూ, కోపాలూ, ద్వేషాలూ, ప్రేమలూ ఉంటాయని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఈ స్వీయవినాశనానికి దారితీసే వైపరీత్యం నుంచి మనం బైటపడే వెసలుబాటు ఉంటుంది –

 

నీకు తెలియనిదా నేస్తమా?

చెంత చేరననే పంతమా?

నువ్వు నేననీ విడిగా లేమనీ

ఈ నా శ్వాసని నిన్ను నమ్మించనీ

sirivennela

మన హృదయస్పందనని పట్టుకుని, మనలోని మనిషితనాన్ని మేల్కొలిపి, నేనొక్కణ్ణీ వేరుకాదు మనమంతా ఒకటే అనే భావనని మొలకెత్తించగలిగినప్పుడు మనం యుద్ధం అనే సమస్యకి సామరస్యమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని దర్శించగలుగుతాం. మనమంతా మనుషులం, ఈ భూగోళం మనది! విద్వేషంతో పాలించే దేశాలూ, విధ్వంసంతో నిర్మించే స్వర్గాలు ఉండవు, ఉంటే అవి మనుషులవి కాబోవు అని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. యుద్ధం అంటే శత్రువుని సంహరించడం కాదు, మనలోని కర్కశత్వాన్ని అంతమొందించడం అని అర్థమైనప్పుడు మన ప్రతి అడుగూ ఒక మేలుకొలుపు అవుతుంది. సరిహద్దుల్ని చెరిపే సంకల్పం సిద్ధిస్తుంది –

 

విద్వేషం పాలించే దేశం ఉంటుందా?

విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?

ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?

అడిగావా భూగోళమా! నువ్వు చూశావా ఓ కాలమా?

 

రా ముందడుగేద్దాం.. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ

సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం!

 

ప్రేమ గురించి గొప్పగొప్ప కల్పనలు చెయ్యొచ్చు, ప్రేమే జీవితమనీ, ప్రేమే సమస్తమనీ ఆకాశానికెత్తెయ్యొచ్చు. ఇలా ఆలోచనల్లో భూమండలం మొత్తాన్ని ప్రేమించడం చాలా ఈజీ, కానీ మనకి నచ్చని మనిషి ఎదురుగా ఉంటే ప్రేమించడం చాలా కష్టం. యుద్ధంలో ఉండీ, చేతిలో ఆయుధం ఉండీ, ఎదురుగా ఉన్న శత్రువుని సంహరించగలిగే సామర్థ్యం ఉండీ, ఆ శత్రువూ సాటి మనిషే అని జాలి కలిగితే అప్పుడు మనం నిలువెత్తు ప్రేమకి నిదర్శనం అవుతాం. అలాంటి ప్రేమ బ్రహ్మాస్త్రం సైతం తాకలేని మనలోని అరిషడ్వర్గాలను నాశనం చెయ్యగలుగుతుంది. రాబందలు రెక్కల సడుల మధ్య సాగే మరుభూముల సేద్యం నుంచి మనని మరల్చి జీవనవేదాన్ని అందిస్తుంది.”రేపు” అనే పసిబిడ్డని గుండెకి పొదువుకుని తీపి కలలను పాలుగా పట్టే అమ్మతనానికి మనమంతా ప్రతినిధులమనీ, మనని మనమే నాశనం చేసుకునే ఈ ఉన్మాదం వలన భవితంతా ఆ పాలుదొరకని పసిబిడ్డడి ఏడ్పుల పాలౌతుందనీ గుర్తుచేస్తుంది –

 

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం!

రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?

సాధించేదేముంది ఈ వ్యర్థ వినోదం?

ఏ సస్యం పండించదు మరుభూముల సేద్యం!

రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం

ఈ పూటే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం!

 

ఇదంతా పాసిఫిజమనీ, ఐడియలిజమనీ, దుర్మార్గం ఎప్పుడూ ఉంటుందనీ, యుద్ధం తప్పదనీ కొందరు వాదించొచ్చు. కావొచ్చు. అయితే ఈ అందమైన భూలోకం మనదనీ, మనందరం దానికి వారసులమనీ, ఒకరు ఎక్కువనే ఆధిపత్యం చెల్లదనీ మనమంతా నమ్మినప్పుడు, అరిష్టాలపై అంతా కలిసికట్టుగా చేసే యుద్దం యొక్క లక్షణం వేరేగా ఉంటుంది. అప్పుడది పంటకి పట్టిన చీడని నిర్మూలించే ఔషదం అవుతుంది, పచ్చదనాన్ని పెకిలించే ఉన్మాదం అవ్వదు. అప్పుడు లోకకళ్యాణాల పేరుతో కల్లోలాలు జరగవు, మానవ సంక్షేమం కోసం మారణహోమాలు జరగవు. అప్పుడు మనం భౌగోళికంగా ఖండాలుగా, దేశదేశాలుగా విడిపోయినా మానసికంగా అఖండమైన మానవత్వానికి ప్రతినిధులమవుతాం. మన చొక్కాపై ఏ జెండాని తగిలించుకున్నా మన గుండెల్లో ప్రేమజెండానే ఎగరేస్తూ ఉంటాం. ఈ సదాశయమే నిజమైన గెలుపు, లోకానికి అసలైన వెలుగు –

 

అందరికీ సొంతం అందాల లోకం

కొందరికే ఉందా పొందే అధికారం?

మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం

గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం!

ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం

ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం

ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం

ఆ తలపే మన గెలుపని అందాం

 

“సిరివెన్నెల ఎంత అద్భుతంగా చెప్పారండీ! ఏం కవిత్వమండీ! నిజమే సుమండీ, లోకంలో హింసా ద్వేషం పెరిగిపోతున్నాయి! దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు!” అంటూ మనని మనమే మంచివాళ్ళ జాబితాలో వేసేసుకోకుండా, ఈ పాటని అద్దంగా వాడుకుని మనలోని లోపాలను మనం చూసుకోగలగాలి. ఎందుకంటే యుద్ధమంటే ఇరు దేశాల మధ్యో, ఇరు వర్గాల మధ్యో జరిగే మహాసంగ్రామమే కానక్కరలేదు. మన దైనందిన జీవితంలో, మన సంబంధ బాంధవ్యాలలో జరిగే సంఘర్షణలనీ యుద్ధాలే. అరిషడ్వర్గాల సైన్యంతో చీకటి మనపై దాడి చేసే యుద్ధంలో, మన తెలివితో మనిషితనాన్ని వెలిగించుకోవాలి, ప్రేమని గెలిపించుకోవాలి. ఆ యుద్ధంలో ఈ పాటని రథంగా, సిరివెన్నెలని రథసారధిగా వినియోగిస్తే జయం మనదే!

అనుబంధం:

  1. కంచె చిత్రంలోని ఈ రెండు పాటలనీ యూట్యూబ్‌లో ఇక్కడ వినొచ్చు – భగభగమని & నీకు తెలియనిదా
  2. ఈ పాటల గురించి సిరివెన్నెలే స్వయంగా వివరించిన వీడియో – సిరివెన్నెల వివరణ

*

 

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి…

 

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarప్రతిభావంతులైన గొప్పవాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. వొక్కోసారి  వారిపై  భక్తి భావమూ  పెంచుకొంటాం. ఆరాధిస్తాం. అభిమానిస్తాం. మనకే  తెలియకుండా  కొన్ని విషయాల్లో వారిని అనుకరిస్తాం. వాళ్ళ మాటల్నీ, చేతల్నీ ప్రమాణికంగా తీసుకుని మన జీవితంలోని కొన్ని సమయాలకి అన్వయించుకుంటాం. వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. వాళ్ళకి  సంభందించిన  ప్రతిదీ మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక్కోసారి  “ఈ గొప్ప మనిషి వివిధ సందర్భాల్లో ఎలా ఉంటాడు? నిద్రపోయి లేచినప్పుడు కూడా ఇంతే ఠీవితో ఉంటాడా? ఇరవైనాలుగు  గంటలూ ఈ వేషధారణలోనే ఉంటాడా?” అని ఊహల్లోకి జారిపోతాం. అలానే “ఈ పెద్ద మనిషి చిన్నతనంలో ఎలా ఉండేవాడూ ? అందరి పిల్లల్లాగే అల్లరి చేస్తుండేవాడా?” ఇలా మన మనసుకు తోచినట్టు పరిపరి విధాలుగా ఆలోచనల్లోకి వెళ్ళి అవి ఊహకి  అందక తిరిగొచ్చేస్తాం.

తెలివితేటలలోనూ, బల చాతుర్యాలలోనూ, మాయలలోనూ కీర్తికథలకు నాయకుడైన శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు అతని సతీమణులు. వాళ్ళకి  ”మనం ఆరాధించే ఈ కృష్ణుడు ఒక్క  రోజులోనే  ఇంత పెద్దవాడైపోయాడా? పుట్టటమే నాలుగు చేతులతోనే పుట్టాడా? అప్పుడే శంఖుచక్రాలు ధరించి వున్నాడా?” అనే  సందేహం వచ్చింది.   వారికి కలిగిన ఆ సందేహాన్ని కీర్తనగా రాశాడు అన్నమయ్య. వాస్తవానికి  ఈ ఆశ్చర్యం అన్నమయ్యదే.

ఈ కీర్తనని గోపికలో లేదా  శ్రీ కృష్ణుని సతీమణులో పాడుతున్నట్టు మనం  అనుకోవచ్చు.

 

AUDIO Link 1 :: గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ స్వరపరిచి పాడినది

AUDIO Link 2 :: ఎస్.జానకి గళం

AUDIO Link 3 

 

పల్లవి

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమిఁ

గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు

 

చరణం 1

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుఁడు

అట్టె కిరీటము నాభరణాలు ధరించి

యెట్టె నెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు

 

చరణం 2

వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను

యిచ్చగించి వినుచున్నాఁడీ కృష్ణుఁడు

ముచ్చటాడి దేవకితోడ ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుఁడు

 

చరణం 3

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదిగో తా బిడ్డఁడాయనీ కృష్ణుఁడు

అదన శ్రీవేంకటేషుఁడై యలమేల్మంగఁగూడి

యెదుటనే నిలుచున్నాఁడీ కృష్ణుఁడు

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 14 కీర్తన : 453

 

తాత్పర్యం (Explanation) :

సతులారా, గమనించండి ఈ రోజు శ్రావణ బహుళాష్టమి. నేడే ఆయన జన్మదినం. ఎన్నెన్నో కథల్లో నాయకుడైన ఈ కృష్ణుడు జన్మించినది ఇలాంటొక రోజున అర్థరాత్రిపూటే!

ఈ మోహనమూర్తికి పుట్టినప్పుడే నాలుగు చేతులు, చేత శంఖుచక్రాలు ఉండేవా?  అలా సాధ్యమా? కిరీటమూ, ఆభరణాలూ తొడుక్కున్న పసికందు చూడటానికి ఎలా ఉండేవాడో! ఈ కృష్ణుడేనా నాడు బాలుడిగా ఉన్నది? అని ఆశ్చర్యపోతున్నారు.

భవుడు, బ్రాహ్మాది దేవతలందరూ ఈయన వాకిట చేరి నిత్యం నుతించుతుంటే విని ఆస్వాదించే ఈ కృష్ణుడేనా నాడు చెరసాలలో పసిబాలుడిగా దేవకితో ముచ్చట్లాడింది? వసుదేవుడు ఆశ్చర్యపోయినది ఈ బాలుడి మహిమలుగనేనా?

సంతానం కొరత తీరుస్తూ యశోద-నందగోపుల ఇంట జన్మించిన పసిపాపడుగా చేరినాడు ఈ కృష్ణుడు. అలమేలుమంగను చేపట్టి వేంగటగిరిపైన దేవుడిగా వెలసినవాడుకూడా ఈ కృష్ణుడే!

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

బహుళాష్టమి = పౌర్ణమి తరువత వచ్చే ఎనిమిదవ తిథి

చతుర్భుజాలు = నాలుగు భుజములు/చేతులు
ఎట్ట = ఎలా

నుతించు = స్తోత్రముచేయు

ముంచి = అతిశయించి, ఆశ్చర్యమునొంది

హెచ్చిన = అత్యధికమైన,  మితిమీరిన

కొదదీర = కొరతతీరేట్టు

అదన = ఇప్పుడిలా (ఈ అదన పదాన్ని అన్నమయ్య కీర్తనలో తరచుగా చివరి చరణంలో వాడారు. ముఖ్యంగా శ్రీవేంకటేశుడన్న పదానికి ముందుగా)

 

* * *

వెంగలిమణులు నీ వేలిగోర బోలునా?

 

అవినేని  భాస్కర్ 

Avineni Bhaskarప్రపంచంలో మొట్టమొదటి కవిత స్త్రీ ప్రేమను పొందడానికో, లేదు స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికో పుట్టుంటుంది!

స్త్రీలు అలంకార ప్రియులు. ఎంత అందంగా ఉన్నా ఆభరణాలతో అలంకరించుకుంటారు. తమ అందాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు గమనించాలనీ, పొగడాలనీ అనుకుంటారు.

మామూలుగా మనం “అమ్మాయి అందంగా ఉంది” అని చెప్పడానికి “అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది” అనంటాం. మన భారతీయ సంస్కృతిలో మహాలక్ష్మి ముఖ్యమైన దేవతే కాదు, అందానికి మారుపేరుకూడా. అటువంటి మహాలక్ష్మికైనా ఇంకా అందంగా కనిపించాలనే తపన పడుతుంది. ఆభరణాలతో అలంకరించుకుంటుంది. ఇది గమనించిన ఆమె చెలికత్తెలు “సహజంగా అందగత్తెవు! ఎందుకు నీకు ఈ పై మెరుగులు?” అని ప్రశ్నిస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు.

ఈ సందర్భానికి అన్నమయ్య రాసిన కీర్తనిది.

AUDIO : గందము పూసేవేలే కమ్మని మేన
పాడినవారు : సుశీల, వాణిజయరాం
స్వరపరచినవారు : గుంతి నాగేశ్వర నాయుడు

 

పల్లవి

గందము పూసేవేలే కమ్మని మేన యీ –

గందము నీ మేనితావికంటె నెక్కుడా

 

చరణం 1

అద్దము చూచేవేలే అప్పటప్పటికిని

అద్దము నీ మోముకంటే నపురూపమా

ఒద్దిక తామరవిరివొత్తేవు కన్నుల నీ –

గద్దరి కన్నులకంటె కమలము ఘనమా

 

చరణం 2

బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా

బంగారు  నీ దనుకాంతి ప్రతివచ్చీనా

ఉంగరాలేఁటికినే వొడొకపువేళ్ళ

వెంగలిమణులు నీ వేలిగోరఁ బోలునా

 

చరణం 3

సవర మేఁటికినే జడియు నీ నెరులకు

సవరము నీ కొప్పుసరి వచ్చీనా

యివలఁ జవులు నీకునేలే వెంకటపతి –

సవరని కెమ్మోవి చవికంటేనా

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 5 కీర్తన : 2

annamayya

 

తాత్పర్యం (Explanation) :

ఓ పడతీ, ఒంటికి చందనం పూసుకుంటున్నావెందుకు? నీ మేనిలో సగజంగా ఉన్న సుగంధంకంటే ఈ గందపు వాసన ఏం గొప్పదనీ?

అద్దంలో ఏముందని పదేపదే చూసుకుంటున్నావు? అద్దంకంటే అపురూపమైనది నీ ముఖం. కళ్ళకి తామర పువ్వులొత్తుకుంటున్నావు. నేర్పెరిగిన నీ కన్నులతో పోలిస్తే తామరపువ్వులు ఏ కొసకీ సరిపోవు. అలాంటి వాటిని అద్దుకుంటే నీ కళ్ళల్లోని చల్లదనం తామరపువ్వులకి వెళ్తుందిగానీ? తామపువ్వులొత్తుకోవడం వల్ల కళ్ళకేం చల్లదనం వస్తుంది?

ఒంటిపైన బంగారు నగలను తొడుక్కుంటున్నావు. నిగనిగలాడే నీ ఒంటి కాంతికంటే ఈ నగల నిగనిగ దేనికి పనికొస్తుందనీ? సన్నగా, పొడవుగా, నాజూగ్గా ఉన్న నీ వేళ్ళకి ఉంగరాలవి అవసరమా? వేళ్ళ చివర్లో తెల్లగా మెరిసే నీ గోళ్ళకి సాటిరావు ఆ లేహపు ఉంగరాలు.

జుట్టు పలుచగా, పొట్టిగా ఉంటే సవరం కావాలేమోగానీ, పొడవుగా, ఒత్తుగా మెరిసే నీ జుట్టుకి సవరమెందుకు? అలికుంతలివి! సవరం చుట్టుకుంటే సహజమైన నీ కొప్పకి సరితూగుతుందా?వేంకటపతి ప్రేయసివి. అతని ఎర్రటి పెదవుల రుచి ఎరిగినదానివి! ఆ కెమ్మోవి రుచి ముందు ఇహలోకంలో ఏవీ రుచించవు.

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

గందము = చందనం (గంధము), సువాసన

ఏల, ఏలే = ఎందుకు, ఎందుకే

కమ్మని = తీయని పరిమళం

మేని = ఒళ్ళు

తావి = సువాసన

ఎక్కుడా = గొప్పదా, మేలైనదా

 

ఒద్దిక = పోలిక

గద్దరి = గడుసరి స్త్రీ, నేర్పరి

గద్దరికన్నులు = నేర్పెరిగిన కన్నులు

 

పడతి = స్త్రీ

మెయి = ఒళ్ళు, తనువు

ప్రతివచ్చీనా = సరితూగేనా

ఒడికపువేళ్ళు = సన్నగా పొడవుగా ఉండే నాజూకైన వేళ్ళు

వెంగలిమణులు = లోహములతో తయారు చేయబడిన నగలు

బోలునా = పోలిక ఉంటుందా?

 

జడియు = ఎక్కువయిన (పొడవైన అని అన్వయించుకోవచ్చు), ప్రసిద్ధమైన

నెరులు = కురులు, జుట్టు

ఈవల = ఇహలోకము, మామూలు, ఇక్కడ

చవులు = రుచులు

సవరని = అందమైన, చక్కని

కెమ్మోవి = ఎర్రని పెదవులు

చవి = రుచి, అనుభవం

 

విశ్లేషణ (Analysis) :

గందము అన్న పదం చదవగానే ఇదేదో అచ్చుతప్పేమో అనుకోనవసరం లేదు. గందము సరియే! సులువైన భాషలో, జానపద శైలీలో ఉన్న అన్నమయ్య కీర్తనల్లో సంస్కృత పదాలను అక్షరాలలో ఇలా ఒత్తులు తీసేసి వాడటబడటం తరచుగా కానవచ్చు. అలాగే ఆయన, కీర్తనలకు మేలైన నుడి అని దేన్నీ ఎన్నుకోలేదు. తాను తెలుసుకున్న పరతత్వాన్నీ, జీవితసారాన్నీ సమాజంలో అన్ని వర్గాల వారికీ అందించాలన్న రీతిలో కీర్తనలు రాశాడు. ప్రపంచంలోని ప్రతిదీ పరబ్రహ్మ రూపంగానే భావించాడు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది లేదన్నమయ్య దృష్టిలో.

అందుకే తాను చెప్పాలనుకున్న భావాన్ని పలు రకాల భాషల్లో చెప్పాడు. కొన్ని కీర్తనలు పూర్తిగా పామరుల భాషలోనే ఉంటాయి. కొన్నేమో అచ్చతెలుగు పదాలు. కొన్నేమో గ్రాంధికమైన తెలుగు. కొన్నేమో పూర్తి సంస్కృతం. మరికొన్నిట్లోనేమో అన్నిట్నీ కలిపి రాయడం. అన్నమయ్య కీర్తనల్ని ఏ కోణంలో చూసినా ఆయన సర్వసమతా దృష్టి అగుపిస్తుంది. భాషా పండితులు ఆయన కీర్తనల్లో ఎన్నోచోట్ల దుష్టసమాసాలు ఉన్నట్టూ, వ్యాకరణ దోషాలున్నట్టు చెప్తారు. అంటే ఆయన భాష చేతగాక, వ్యాకరణం తెలియక కాదు. చంధోబద్ధమైనవీ రాశాడు. కీర్తనల్లో ఆయన చెప్పాలనుకున్న భావానికి ప్రాధాన్యమిచ్చాడు.

యేల(ఎందుకు), యాడ(ఎక్కడ), ఏంది(ఏమిటి) వంటి పదాలు నేడు చిన్నచూపుకి లోనయ్యాయి! నిజానికి అవి ఎంత అందమైన తెలుగుపదాలో!

అత్తర్, సెంట్లు రాసుకోవడం, బ్యూటీ సలూన్ లలో చేసే ఫేస్‌ప్యాక్, బాడీప్యాక్ లు, కళ్ళకింద డార్క్ సర్కిల్స్ కి కీరకాయల ట్రీట్మెంట్ వంటివి ఆ రోజుల్లో కూడా ఉండేవని అన్నమయ్య కీర్తనలద్వారా తెలుసుకోవచ్చు. కళ్ళకి నేడు కీరకాయ ముక్కలు, నాడు తామర పువ్వులు! అంతే. ఇవి ఎప్పుడూ ఉన్నవే కాబోలు.

*

 

కొమ్మ సింగారములివి కొలది వెట్టగ రావు

అవినేని భాస్కర్

Avineni Bhaskarప్రకృతినీ, స్త్రీ సౌందర్యాన్నీ ఎందరు కవులు, ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోయే ఉంటుంది! స్త్రీ నఖశిఖ పర్యంత సౌందర్య సిరి. ఫెమింజం పులుముకున్న స్త్రీలను మినహాయిస్తే సహజంగా స్త్రీలు సౌందర్య వర్ణనని, ఆరాధననీ ఇష్టపడుతారు. అందమైన స్త్రీలను పురుషులేకాక స్త్రీలుకూడా అభినందిస్తారు, మెచ్చుకుంటారు.

“కొమ్మ సింగారములివి” అన్న ఈ కీర్తనలో అన్నమయ్య తనని ఒక చెలికత్తెగా ఊహించుకుని అలమేలుమంగ అందాలను సాటి చెలికత్తెలకు వివరించి ఆశ్చర్యానికి లోనౌతున్నాడు! దూరం, బరువు లాంటివాటిని కొలవడానికి కొలబద్దలుంటాయి. మరి సౌందర్యాన్ని కలవడానికేముంది? చూసి ఆశ్చర్యపోవడం, కవితల్లో వర్ణించదం. ఇవి తప్ప ఇంకేం చేస్తాడు కవి? ప్రకృతితో పోల్చి, ప్రకృతికంటే గొప్ప అందాలు అలమేలుమంగది అని చెలులకు చెప్తున్నాడు.

AUDIO Link : KOMMA SINGARAMULIVI

 

 

[ స్వరము, గళము : గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ ]
పల్లవి
కొమ్మ సింగారము లివి కొలఁది వెట్టఁగ రావు
పమ్మిన యీ సొబగులు భావించరే చెలులు
 
చరణాలు
చెలియ పెద్దతురుము చీఁకట్లు గాయఁగాను
యెలమి మోముకళలు యెండ గాయఁగా
బలిసి రాతిరియుఁ బగలు వెనకముందై
కలయ కొక్కట మించీఁ గంటిరటే చెలులు
 
పొందుగ నీకె చన్నులు పొడవులై పెరుగఁగా
నందమై నెన్నడుము బయలై వుండఁగా
ఇందునే కొండలు మిన్నుఁ గిందుమీఁదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు
 
శ్రీవేంకటేశువీఁపునఁ జేతు లీకెవి గప్పఁగా
యీవల నీతనిచేతు లీకెఁ గప్పఁగా
ఆవలఁ కొమ్మలుఁ దీగె ననలుఁ గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ
 
 

తాత్పర్యం (Explanation) :

ఈ అమ్మాయి అందాలు ఇన్ని అన్ని అని లెక్కబెట్టలేము, ఇంత అంత అని వర్ణించలేము. కనులను మురిపింపజేసే అపురూమైన ఈమె చక్కని సొగసులను ఎంచి చూడండి చెలులారా!

ఆమెకు  పొడవైన, ఒత్తనైన నల్లటి కురులున్నాయి. దువ్వి కొప్పు చుట్టింది. ఆమె జుట్టు నల్లగా నిగనిగలాడటంవలన రాతిరైపోయిందేమోనన్నట్టు చిక్కటి చీకట్లు కాస్తుంది. (విభుని రాకవలన) ఆనందంతో వికశిస్తున్న ఆమె మొఖం మెరిసిపోతుంది. ఆ ముఖ కాంతి ఎండకాస్తున్నట్లుగా ఉంది. ఎండా-చీకటీ ఒకే సమయంలో ఉండటం అన్నది అసాధ్యం! అలా ఉంటే అది అతిశయం! అంతటి అతిశయం ఇప్పుడీ అందగత్తె ముందూ, వెనుకలుగా ఒకేచోట, ఒకే సమయంలో ఉన్నాయి చూడండి చెలులారా!

ఈమె కుచగిరులు రెండూ సమానంగా, సమృద్ధిగా పెరిగినట్టు ఉన్నాయి. అందమైన నడుమేమో చన్నగా చిక్కిపోయి ఆకశంలాగా(బయలులా) ఉండీలేనట్టు ఉంది. మామూలుగా కొండలు కింద, ఆకాశం పైన ఉంటాయి. ఇక్కడేమో కొండలవంటి ఆమె కుచగిరులు పైనా, ఏమీ లేని శూన్యంవంటి నడుము కిందా ఉన్నాయి. ఎక్కడా కానని ఈ వింతని చూశారా చెలులారా!

ఇంతటి ఒయ్యారాలుగల సొగసులాడి అలమేలుమంగ శ్రీవేంకటపతిని కౌగిలించగా, తన చేతులను ఆయన వీపును పెనవేసింది. ఆయన చేతులు ఈమె వీపును అల్లుకున్నాయి. మామూలుగా తీగెలు కొమ్మలను చుట్టుకుని పెనవేసుకుంటాయి. అయితే అలమేలుమంగా, వేంకటేశుల కలయికని చూస్తుంటే కొమ్మా, తీగా రెండూ అల్లుకుని ఒకదాన్నొకటి పెనవేసుకుని పరిపూర్ణం చెందినట్టు కనిపిస్తుంది తిలకించండి చెలులూ!

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
కొమ్మ = అమ్మాయి,
సింగారములు = అందాలు
కొలది = కొలమానం
పమ్మిన = ప్రదర్శించబడుతున్న (ఈ సందర్భానికి సరిపోయే అర్థమిది),  ఆశ్చర్యం కలిగించే, అతిశయింపజేసే

తురుము = కొప్పు
కాయగాను = కాస్తు ఉంటే
యెలమి = వికశించుతున్న
మోముకళలు = ముఖములోని కళలు
బలిసి = ముదిరిన, దట్టమైన

పొందుగ = పొందికగా
ఈకె = ఈమె
చన్నులు = కుచములు, రొమ్ములు
పొడవు = పెద్ద
నెన్నడుము = చిక్కిన నడుము
బయలై = ఏమీలేనట్టు, శూన్యమై
ఇందు = కలిసి
కొండలు = పర్వతాలు
మిన్ను = ఆకాశము
ఒక్కచో = ఒకేచోట
చెంది = కలిగి

ఈవల/ఆవల = ఇవతల/అవతల వైపు
కొమ్మలు = కొమ్మలు
చేవదేరీని = పరిపూర్ణతచెందినది ( బలపడినది )

Image Courtesy : Sukanya Ramanathan
*

కడు చక్కనిది చిలికిన చల్ల!

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకంటికి కనిపించిన ప్రతి దృశ్యమూ, చుట్టూ జరిగే వివిధ ఘటనలు, పచ్చిక బయళ్ళు, కొండలు, రాళ్ళు-రప్పలు, చెట్లు-పుట్టలు, ప్రాణులు, కనుమలు, గొడవలు, మనస్తాపాలు, దౌర్జన్యాలు, వేలాకోలాలు ఏవీ కీర్తనకి అనర్హం కాదన్నట్టు శ్రీవేంకటేశునికి అన్వయం చేసి పాడిన ఘనత అన్నమయ్యది.

విజ్ఞానులూ పండితులేకారు, పామరులూ చోరులూ అల్పులూ కూడా శ్రీవేంకటపతిరూపులే అన్న సర్వసమతా దృష్టి అన్నమయ్యది. కలవారింటి స్త్రీలేకారు, వారికి సేవలు చేసే దాదులనూ దాసీమణులనుకూడా అలమేలుమంగ రూపాలుగానే భావించి కీర్తనలు రాశాడు. ఒళ్ళు అలసిపోయేట్టు కష్టజీవనం చేసుకునే స్త్రీలనే కాదు, ఒళ్ళమ్ముకునే వేశ్యలుకూడా వేంకటపతి భక్తులేనని వారినీ తన కీర్తనల్లోకి ఎక్కించాడు.

అన్నమయ్యకున్న సామాజిక స్పృహ ఈ కీర్తనలో కనవచ్చు. ఇందులోని నాయిక(లు) మజ్జిగమ్ముకునే గొల్లభామ(లు). ఎంత సమయం అయినా సరే తీసుకెళ్ళిన మజ్జిగంతా అమ్మితేగానీ ఇంటికి తిరిగిరాలేదు. అమ్మి నాలుగురాళ్ళు తెచ్చుకుంటేగానీ జీవనం గడవదు మరి ఆ పేదరాలుకి. ఆమెను చూసి జాలిపడుతున్నాడు అన్నమయ్య. ఆమె అమ్ముతున్న మజ్జిగ గొప్పతనమేంటో ప్రకటిస్తూ జనాలచేత కొనిపించే ప్రయత్నం చేస్తున్నాడు కవి!

ఆమె పేదరాలే అయినప్పటికీ సౌందర్యంలో, సొగసులో మాత్రం చాలా ధనికురాలే. ఆమె అందాలను వర్ణిస్తూ, మజ్జిగను అమ్మించే యుక్తిని చూస్తుంటే నేటి advertising techniques అన్నిటికీ తాత అన్నమయ్య అనాలనిపిస్తుంది.

కొన్ని కీర్తనల్లో పైనపైన కనిపించే భావమొకటుంటుంది, అంతరార్థం మరోటి ఉంటుంది. ఈ కీర్తనలో మరో అంతరార్థం ఉంది. అదేమిటో చివర్లో చూద్దాం.

గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరచి పాడిన ఈ కీర్తనని ఇక్కడ విన ఆస్వాదించండి.

AUDIO LINK : మూల మూలన అమ్ముడు చల్ల / mUlamUlana ammuDu challa

 

పల్లవి
మూలమూల నమ్ముడుఁజల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల

చరణాలు
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ –
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల

వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ –
రెడయకిపుడు గొనరే చల్ల

అంకులకరముల వొయ్యారొకతి కడు –
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల

కీర్తన మూలం : తితిదే అన్నమాచార్య సంకీర్తనల సంపుటం 5, పుట 231, రేకు 70, కీర్తన 229

తాత్పర్యం  :
వాడవాడకూ మూల మూలకూ, రాత్రనక పగలనక ఎత్తుకెళ్ళి అమ్మబడే మజ్జిగ ఇది, మీరందరు కొనుక్కుని తాగండి.

నిండైన చన్నులతో పసివయసులోనున్న అందమైన యువతి చిలికినది ఈ మజ్జిగని. ఎండలో వీధి వీధీ తిరుగడంవల్ల ఆ గొల్లభామ గుండెలపైన చెమటలు కారిపోతున్నాయి. ఈ మజ్జిగ వెనక ఇంత శ్రమ ఉంది. ఆలస్యం చేస్తే ఇలాంటి మజ్జిగ దొరకదు, త్వరపడి ఇప్పుడే కొనుక్కోండి.

తాపాన్ని వెదజల్లే అందమైన దేహంగల అందగత్తె ఒయ్యారంగా కదులుతు చిలికినది ఈ మజ్జిగని. దారిన వెళ్ళేవారిని తడబాటుకు లోనుచేసే కమ్మని సువాసనగల మజ్జిగ ఇది. దాటెళ్ళిపోకుండా కొనుక్కోండి.

చిగురుటాకులవంటి చేతులున్న వొయ్యారి భామ ఎంతో భయభక్తులతో చిలికినది ఈ మజ్జిగని. వేంకటగిరిపైనున్న స్వామిని పతిగా పొంది అతన్ని వేడుకలలో తేలించే యువతి ఇంకా అమ్ముతూ ఉంది. కాబట్టి జనులారా నమ్మి కొనుక్కోండి. (యింకానమ్మీ కొనరే చల్ల — ఇందులో నమ్మీ అన్నది శ్లేషగా తీసుకోవచ్చేమో)

నా విశ్లేషణ  :

మండేవేసవిలో దేహాన్ని చల్లార్చి ఎండకు ఉపశమనం కలిగించేందుకు ఈ రోజుల్లో పలు రకాల కూల్‌డ్రింకులు, వాటినమ్మే అంగళ్ళు అడుగడుగునా ఉన్నాయి. ఎవరి ప్రాడక్ట్ ను వారు అమ్ముకునేందుకు పోటీలు పడి వైవిద్యమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇన్ని artificial drinks లేవు. పానీయాలను నిలవుంఛే, చల్లబరిచే టెక్నాలజీలు లేదు. ప్రకృతి సిద్ధమైన మజ్జిగ, కొబ్బరి నీళ్ళవంటివి మాత్రమే ఉండేవి. నేటి పానీయాలను ధనవంతులు తయారు చేస్తున్నారు. ఆ రోజుల్లో మామూలు మధ్యతరగతి వాళ్ళు మజ్జిగ చిలికి అమ్మేవారు. వారికి అదే జీవనాధారం. కష్టజీవులు. వారు పడే శ్రమ, మజ్జిగమ్మే తీరు అన్నమయ్యలో కలిగించిన ప్రభావంతో ఎన్నెన్నో “చల్ల”టి కీర్తనలో రాయించింది. గొల్లభామలు, రేపల్లె, పాలు, పెరుగు, నవనీతం, మజ్జిగ, శ్రీకృష్ణుడు – ఇంకేం కావాలి యే వైష్ణవకవికైనా?

“పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకతి, కడు చక్కనిది చిలికిన చల్ల” అమ్మే చోట చిలికిన వనిత చన్నుల చక్కదనం గురించి ప్రస్తావన తీసుకురావడం, అమ్ముతున్న స్త్రీని వర్ణించడం ఇవన్నీ వినియోగదారులను ఊరించే వ్యాపారయుక్తులు. నేడు మగవాళ్ళ షేవింగు క్రీముల ప్రకటనల్లో ఆడవాళ్ళని చూపిస్తున్నట్టయితే కాదు.

వడచల్లు మేని జవ్వని అని అన్నమయ్య అనడంలోని ప్రత్యేక భావం ఏంటి? మజ్జిగ ఎవరు చిలికితేనేం? చల్లగానే ఉంటుందిగా? ఈ గొల్లెత అమ్మే మజ్జిగ ఇంకాస్త ఎక్కువ చల్లగా ఉంటుంది అని నొక్కి చెప్పే ఉద్దేశంతోనే “వడచల్లు మేని జవ్వని” అని చిలికిన యువతిని వర్ణించాడు. వడచల్లు మేని అన్నప్రయోగానికి ‘తాపమును చిమ్మే దేహం’ అనీ, ‘చల్లని దేహం’ అనీ రెండు అర్థాలున్నాయి. పాఠకులు మీ భావుకతకి తగినట్టు అన్వయించుకోండి.

“నువ్వమ్మే మజ్జిగ వేడిన తగ్గించుతుంది, నీ అందమేమో తాపాగ్నిని రగిలిస్తుంది” అని మజ్జిగమ్మే గొల్లభామతో సరసమాడాడు “కాళమేఘం” అనే ఒక ప్రాచీన అరవ కవి.

తడబడు కమ్మనితావులది – అటువైపుగా వెళ్ళేవారిని కమ్మని సువాసన ద్వారా ఆపిమరీ ఆకర్షిస్తుందిట. ఆ సువాసన మజ్జిగదైనా కావచ్చు, పరిమళ కస్తూరిని మేన రాసుకునే ఆ గొల్లెతదైనా కావచ్చు అన్నది కవిచమత్కారం!

“జడియుచుఁ జిలికిన”, “జంకెనలఁ జిలికిన” – ఈ రెండు ప్రయోగాల్లోనూ భయపడుతూ, తికమకపడుతూ చిలికింది ఆ యువతి అని రాశాడు. ఎందుకు అలా రాశాడు? ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది. పెరుగులో నీళ్ళు పోసి వెన్నకోసం కవ్వంతో చిలికితే మజ్జిగ మిగులుతుంది. నీళ్ళు పోసినకొద్ది మజ్జిగ మొత్తం(quantity) పెరుగుతుంది, అయితే పలచనైపోతుంది! నీళ్ళు తక్కువపోస్తే కుండ నిండదు. అందుకే ఆ వొయ్యారిభామ తికమకగా భయపడుతూ మజ్జిగ చిలుకుతుంది అని అన్నాడేమో అన్నమయ్య!

దైవకటాక్షం అనబడే మజ్జిగ రేయనక పగలనక, వాడవాడలా, మూలమూలలా వ్యాపించి ఉంది. శ్రీవేంకటేశ్వరుణ్ణి భక్తితో కొలిచి, మనస్పూర్తిగా నమ్మి మానవ జన్మ అనే మండుటెండనుండి ఉపశమనం పొందండి అని వైష్ణవులు ఈ కీర్తనని అన్వయించి తాత్విక అర్థం చెప్పవచ్చు. నేను మాత్రం అన్నమయ్య సామాజిక దృక్పథాన్నీ, కవి హృదయాన్ని చూస్తున్నాను ఈ కీర్తనలో!

కొన్నిపదాలకు అర్థాలు (Context based Meanings)

చల్ల = మజ్జిగ
రేలు = రాత్రి
పిక్కటిల్లు = పిగులు, ఉబుకు, పొంగు
చన్నులు = రొమ్ములు
గుబ్బెత = దిట్టమైన చన్నులున్న యువతి
అక్కున = రొమ్ములమీద, గుండెపైన
వడచల్లు మేను = తాపము చల్లేటి దేహం, చల్లని దేహం
జవ్వని = అందగత్తె
జడియు = కదులు, చలించు, భయపడు
కమ్మనితావు = కమ్మని సువాసన
నేడయక = వెళ్ళిపోకుండ, దూరమవ్వకుండ
అంకులకరములు = చిగురుపోలిన మెత్తని చేతులు, పల్లవపాణులు
జంకెన = భయపడుతు, తికమకపడుతు

*

పలచని చెమటల బాహుమూలముల…

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarజానపద శైలిలో, పామరుల వాడుక భాషలో, అచ్చ తెలుగులో అన్నమయ్య పలు కీర్తనలు రాశాడు. దంపుడు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జాజర పాటలు, వసంతాలాటల పాటలు (పసుపు నీళ్ళు చల్లుకునే పండుగ – హోలీ వంటిది), వెన్నెల్లో నృత్యం చేసుకుంటూ పాడే పాటలు, పెళ్ళి పాటలు, జలక్రీడా పాటలు ఇలా ఎన్నెన్నో జానపదాలు రచించాడు.

వెన్నెల్లో యువతీ యువకులు కోలాటం చేస్తూ పాడుకునే జానపదంగా “నెయ్యములు అల్లో నేరేళ్ళో” పాటని భావించవచ్చు. 

శ్రీవేంకటేశ్వరుడు-అలమేలుమంగలే యువతీ యువకులై నృత్యం చేస్తూ పాడుతున్నట్టు అన్వయించుకోవచ్చు. లేదా కోలాటం ఆడుతున్నవాళ్ళు పద్మావతి-పెరుమాళ్ళ సంగమాన్ని కీర్తిస్తున్నట్టూ అన్వయించుకోవచ్చు.
 
విరహంతో వేచి విభుణ్ణి చేరుకుంది తరుణి. ఆ దివ్య దంపతుల ప్రియసంగమమే ఈ కీర్తనలో పొందుపరిచిన భావం. ప్రణయ మూర్తులైన పద్మావతీ శ్రీవేంకటేశుల కలయికలో మనసులను మురిపించే ప్రేమ విలాసములు, తనువుల తపనలను తీర్చే శృంగార కేళీలు ఉన్నాయి. 
 
 
పల్లవి
నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో
 
చరణాలు
పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో
 
తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో
 
గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు(లే)
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుప గుగ్గిళ్ళో


తాత్పర్యం (Meaning):
అలమేలుమంగా-శ్రీనివాసుల పొందిక అల్లో నేరేడుపళ్ళలా తీయనిదా? “అబ్బా ఎంత అన్యోన్యమైన జంట!” అని ఉవ్వుళ్ళు ఊరించేటువంటిదా?
 
విరహంతో వేచియున్న ఆమె మేను చెమరించింది. అమె చంకలనుండి పలుచని చెమటలు కారిపోతున్నాయి. చెమటల ఊటలనిండిన ఆమె బాహుమూలములు కొలనులవలే అందంగా ఉన్నాయి. పైటంచులో ముత్యాలు పొదిగిన చీర కట్టుకుని ఉంది ఆమె. ఆ చీరచెంగుని తీసి విసనకర్రలా పట్టుకుని విసురుకుంది. చెంగులోని ముత్యాలు తళతళ మెరుస్తున్నాయి. విసిరిన జోరుకి చెమట చుక్కలు చిరుజల్లుల్లా రాలుతున్నాయి.
 
స్వామి వచ్చాడన్న తన్మయత్వంలో ఆమె కన్నులనుండి బాష్పాలు ఫళఫళమని రాలాయి. అప్పుడామె చిలిపి అలకలలు నటిస్తూ, పెదవుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంది. మర్రిపళ్ళలా ఎర్రగా ఉన్న ఆమె పెదవులు కవ్విస్తున్నాయి. అధరామృతం పంచే ఆ పెదవులు అతనిని గుటకలు వేయిస్తున్నాయి.
 
నానావిధ పరిమళములతో సింగారములొలికే శ్రీవేంకటేశుడి కౌగిలిలో కలిసిపోయింది ఆ శ్రీమహాలక్ష్మి. తాళలేని విరహాన్ని ఆ విభుని కలయిక చల్లారుస్తుంది. ఆ జంటయొక్క మోహం ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే… ఆ తాపవేళలో మోహానికి అధిపతియైన మన్మథుడు తన చెరకు విల్లునుండి వారి మీదకి పువ్వుల బాణాలు సంధించాడా లేక ఇనపగుగ్గిళ్ళు విసిరాడా అని సందేహం కలుగుతోంది. ఇనుపగుగ్గిళ్ళు విసిరాడా అన్న సందేహం ఎందుకు కలిగిందంటారా?  వారి నఖములూ, దంతములూ ఇరువురిమేనా చేస్తున్న గాయాలటువంటివి మరి?
 
విశ్లేషణ :
నెయ్యములల్లో నేరేళ్ళో = నెయ్యములు + అల్లో నేరేళ్ళు అని పదాలను అర్థం చేసుకోవాలి.
వెన్నెల రాత్రులెంత ఆహ్లాదకరమో అంత ఆహ్లాదకరం ఈ “అల్లోనేరేళ్ళో” అన్న నుడి. అంతకంటే ఆనందం పద్మావతీ-శ్రీనివాసులు ప్రణయం.
 
చమటలూరిన చంకలు అందంగా ఉన్నాయని వర్ణించడం ఏంటి అనిపించవచ్చు! మామూలుగా చెమట ఇంపైనది కాకపోయినా కోరికలవశమై మన్మథకేళికి సిద్ధమైనవేళ చంకల్లో కారే చెమటల్లో ఆకర్షించే పరిమళముంటుందట. అలసినప్పుడు ఒంటిపై కారే చెమటకీ, కామవశమైనప్పుడు చెమర్చే చమటకీ తేడాలుంటాయని నేటి పరిశోధనలు కూడా చెప్తున్నాయి. అన్నమయ్య కీర్తనల్లో పలుచోట్ల చంకల గురించి, చెమట గురించి వర్ణించబడియుంది. అన్నమయ్యే కాదు, మరి కొందరు కవులుకూడా చంకల చెమట గురించి అందంగా వర్ణించిన సందర్భాలున్నాయి. చంకల పరిమళాన్నిబట్టే హస్తిణి, చిత్తిణి, శంకిణి, పద్మిణి అని స్త్రీనలను గుర్తించేవారట. అన్నమయ్యే మరొక కీర్తనలో “కప్పులు తేరేటి కస్తూరి చంకల కొప్పెర గుబ్బల గొల్లెత” అని రాశాడు.
 
ఆమె విసనకర్రతో విసురుకుంది అని రాస్తే కవిత్వం ఎక్కడుంటుంది? పైట చెంగుతో విసురుకున్నట్టు రాయడంలోనే కవిహృదయం ఉంది. ఆ రోజుల్లో కూడా మగువలు “వర్క్ చీరలు” కట్టేవారు అన్నది మనం గమనించాలి.
 
ప్రణయంలో భావావేశాలు, మనోవికారాలూ, అలుకలూ, చిరుకోపాలూ, నవ్వులూ సహజం కదా? విరహంతో వేచి విసిగిపోయి ఉన్న నాయిక నాయకుని రాకతో వెంటనే ఆనందంలోకి జారిపోదు కదా? కోపం చూపుతుంది, నిందిస్తుంది, ఏడుస్తుంది, అలుగుతుంది. అతను ఆమె అలుక తీరిస్తేగానీ మనసు సహజ స్థితికి చేరుకోదు కదా?
 
శ్రీవేంకటేశుడు అలంకార ప్రియుడు. “గరగరికల వేంకటపతి” అట! వారి రతిలోని తీవ్రతని “మన్మథుడి పువ్వుల బాణాలు వారిని ఇనుప గుగ్గిళ్ళులా తాకాయి” అని సమర్థిస్తున్నాడు అన్నమయ్య.
 
ఈ కీర్తనని ఒకానొక సినిమాలో వాడుకున్నారు. బాలు పాడారు. స్వరపరచిన తీరువల్ల విన్నవారికి మరొక అర్థం స్ఫురించవచ్చు. కాబట్టి పైన ఇచ్చిన ఆడియోలు వినమని మనవి.
 
కొన్ని పదాలకు అర్థాలు (Meaning) :
నెయ్యము = స్నేహము, ప్రియము
అల్లోనేరేళ్ళో = ఆడపిల్లలు వెన్నెల రాత్రుల్లో ఆడుకునే ఒక ఆట, స్త్రీలుపాడే పాట (జానపదం)
ఒయ్యన = తిన్నగ, మెల్లగ, Gently, Softly
ఉవ్విళ్ళూ = తపనలు, తహతహలు, eagerness
 
పలచని చెమట = లేత చెమట, సన్నని చెమట
బాహుమూలములు = చంకలు, కక్షములు
చెలమలు = గుంటలు, pit, కొలనులు, పల్లము
చెలువము = అందము, సౌందర్యము
థళథళ = తళతళ
ముత్యపు = ముత్యాల
చెఱగు = చెంగు, చీర కొంగు, పైట
సురటి = విసనకఱ్ఱ
దులుపేటి = దులుపుతున్న
నీళ్ళా తుంపిళ్ళో = తుంపరలు, వాన చినుకులు
 
తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళు = అదురుతున్న కళ్ళనుండి రాలేటి కన్నీరు
(తొరిగేటి = రాలేటి)
చిటిపొటి యలుకలు = చిన్న చిన్న గొడవలు, చిలిపితగాదా, అల్పమైన , silly fights
చిరునగవే = చిరునవ్వులే
వటఫలంబు = మర్రిపండు
వన్నెల = సొభగు
మోవి = పెదవి
గుటక = ఒక్కసారి మింగగల
గుక్కిళ్ళు = గుటక మింగు శబ్ధము
 
గరగరికల = సింగారమైన, అలంకారములుగల, చక్కదనాలుగల
బచ్చనలు = కలయికలు, కూటములు, ఒదిగిపోవడము
మరునివింటి = మన్మథుడి చెరకు విల్లు
కమ్మని = కమ్మనైన
అంప విరులు = పువ్వుల బాణాలు / బాణాల పువ్వులు(!?)
గురి = లక్ష్యం
తాకు = తాకేటి
గుగ్గిళ్ళు = ఉడకబెట్టిన శనగలు

ఒకపరి కొకపరి కొయ్యారమై..

అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకొన్ని అనుభూతులు అనుభవించినకొద్ది ఆనందాన్నిస్తాయి. భార్య అలమేలుమంగని గుండెలపై పెట్టుకుని తిరుమల కొండపై నెలకొని ఉన్న వెంకన్న దర్శనం అలాంటిదే! మధురానుభూతిని కలిగించే దృశ్యం ఆ సౌందర్య మూర్తుల పొందు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరనిది వారి ఒద్దిక. ప్రతిసారీ కొత్తగానూ, కిందటిసారికంటే దివ్యానుభవంగానూ అనిపిస్తుంది. వారి కీర్తినే జీవితకాలం పాడిన కవి అన్నమయ్యకి కొడుకుగా జన్మించిన పెదతిరుమలయ్యకి ఆ దర్శనం కొత్తకాదు. తేజోవంతమైన జేగదేకపతి-జలజముఖి అందాన్ని తన కీర్తనలో పెదతిరుమలయ్య ఎలా వర్ణిస్తున్నాడో వినండి.
అయ్యవారికెన్ని అలంకరణలు చేసినా అందాన్ని ఇచ్చేది మాత్రం ఆమెవల్లేనట! అదే ఈ కీర్తనలో దాగున్న భావం.

పల్లవి :

ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున గళలెల్లా మొలచినట్లుండె


చరణం ౧
జగదేకపతిమేన జల్లిన కర్పూరధూళి

జిగిగొని నలువంక జిందగాను

మొగి జంద్రముఖి నురమున నిలిపెగనక

పొగరువెన్నెల దీగబోసినట్లుండె


చరణం ౨
పొరి మెఱుగు జెక్కుల బూసిన తట్టుపుణుగు

కరగి యిరుదెసల గారగాను

కరిగమన విభుడు గనుక మోహమదము

తొరిగి సామజసిరి దొలికినట్లుండె


చరణం ౩
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను

తఱచయిన సొమ్ములు ధరియించగా

మెఱుగుబోణి యలమేలుమంగయు దాను

మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె

 


తాత్పర్యం

కళలన్నీ ముఖములో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! (కారణమేమిటో చరణాల్లో వివరిస్తున్నారు పెదతిరుమలయ్య!)

అలంకరణకోసం దేవుడి ఒంటిపైన చల్లిన కర్పూరధూళీ కింద రాలుతుందట. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతు నలువైపులా రాలుతు ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటా అంటారా? కారణం ఉంది. అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనట!

భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుండి కారుతుందట. రెండుపక్కలా కారుతువున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా? అంటే ఏనుగువంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. కాబట్టి స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.

శ్రీవేంకటేశుడు బోలేడన్ని నగలు ఒంటిపైన ధరించుకుని, మెరిసిపోయే సొగుసుగల పద్మాసనితో(అలర్‌ మేల్‌ మంగై) కలిసి దర్శనమిచ్చే ఆ దృశ్యం ఎలా ఉందీ? మెఱుపు, మేఘము కలిసి మెఱినంత కాంతివంతంగా ఉందిట! (కారు మబ్బాయన రంగు, తళతళలాడే మెఱుపేమో ఆవిడ రంగు!)


ప్రతిపదార్థం :

ఒకపరి = ఒకసారి
ఒయ్యాం = అందం, సౌందర్యం

మేన = ఒంటిమీద
జల్లిన = చల్లిన
జిగికొని = వెలుగుతు, కాంతివంతమై
ఉరమున = గుండెలపైన, వక్షస్థలమున
పొగరు వెన్నెల = పూర్ణకాంతితో వెలుగుతున్న వెన్నెల, తట్టమైన వెన్నెల
దిగబోసినట్లు = కిందకి జారినట్టు, కురిసినట్టు

పొరిమెఱుగు =అత్యంతమెఱుగు
జెక్కుల/చెక్కుల = చెక్కిళ్ళు, బుగ్గలు
తట్టుపుణుగు = పునుగు (అలంకరణ పూసే వాసన ద్రవ్యం)
కరిగమన = ఏనుగులాంటి నడకగల
విభుడు = స్వామి, నాయకుడు

మదము = మదమెక్కిన ఏనుగుకళ్ళలో కారే నీరు
తొరిగి = కారు, స్రవించు
సామజసిరి = ఏనుగు
దొలికినట్లు = కారుతున్నట్టు

తఱచయిన = బోలెడన్ని
మెఱుగుబోణి = మెరిసేసొగసుగల యువతి

వాన రాత్రిలో…చీకటి దారిలో…మిగిలిపోయిన పాట…మన్నాడే!

Mannadey

 

మన్నా డే, తొంభై నాలుగేళ్ల పాటు ఒక పరిపూర్ణమైన జీవన యాత్రను కొనసాగించి ఇహలోకాన్ని వదలి వెళ్లి ఒక నెల  పైనే కావస్తోంది. “నాస్తి ఏషాం యశః కాయే, జరామరణజం భయం”, అన్న భర్త్రుహరి సుభాషితం, ఆయన నిష్క్రమణ వార్త వినంగానే, ఒక్క సారి కళ్ళ ముందు మెదిలింది.  భువనచంద్ర గారు ఆయనకి అశ్రునివాళిని ఈ పత్రికలోనే తమ వ్యాసంలో కొద్ది వారాల క్రిత్రమే ఎంతో హృద్యంగా అర్పించారు. దాదాపు అరవై ఏళ్ళ పాటు జరిగిన ఆయన  సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాల వాళ్ళు వివిధ దశల్లో ఆయనతో పాటు చేరి ఆ గంగలో అలా పరవశంతో తేలుతూనే ఉన్నారు. నాకు తెలిసిన నా మన్నాడే ని మీతో పంచుకొని ఆయన జీవితాన్నీ, సంగీతాన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొందామనే ఈ చిన్ని సాహసం!

ఊహ తెలిసిన దగ్గరనుంచీ కిషోర్ పాటలంటే ప్రాణం. భాష తెలియని రోజుల్లో కూడా హిందీ పాటలను వినాలనిపించేలా చేసిన ఆయన గళమే నాకు మన్నాడేని పరిచయం చేసింది. “షోలే” సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు ఒక వింత స్కూటర్ మీద వెళ్తూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ, “యే…దోస్తీ.. హమ్ నహీ తోడేంగే.. తోడేంగే దం మగర్ తేరా సాథ్ నా ఛోడేంగే” అంటూ వాళ్ళ స్నేహాన్ని మనకు పరిచయం చేస్తారు. హుషారైన కిషోర్ గొంతుతో ధర్మేంద్ర పాడుతూ ఉంటే, అంతే ఉత్సాహంతో అమితాబ్ కి పాడిన ఈ పాట ద్వారానే మన్నాడే పేరు, నాకు తెలిసింది.

మళ్ళీ అమితాబ్ సినిమా జంజీర్ వల్లే, మన్నాడే పాటతో పరిచయం మరికొంత పెరిగింది. అందులో అమితాబ్ పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉంటాడు. పఠాన్ ప్రాణ్, “తేరీ హసీ కీ కీమత్ క్యా హై? యే..బతాదే తూ” అంటూ ప్రశ్నిస్తూ, అమితాబ్ ని నవ్వించటానికి ప్రయత్నం చేస్తూ, “యారీ హై…ఈమాన్ మేరా..యార్ మేరీ జిందగీ” అని పాట పాడతాడు. కొద్దిగా హై పిచ్ లో ఉంటుంది ఆ పాట. అయినా కానీ, మెలోడీ, ఆ గొంతు లోని తియ్యదనం,  ఏ మాత్రం తగ్గకుండా పాడిన మన్నాడే గాత్ర మాధుర్యాన్ని, అతని అద్భుతమైన కళనీ గుర్తించే వయసు కాదది. ఆ పాట అమితాబ్ కోసం పాడిన ప్రాణ్ పాట, అంతే!

రిషీ కపూర్, డింపుల్ కపాడియాల, రోమియో, జూలియాట్ల కథ, రాజ్ కపూర్ “బాబీ” సినిమా. రిషీ, అందులో తన కాబోయే మామగారిని (జాక్ బ్రిగాంజా – ప్రేమ్ నాథ్), తమ ఇంటికి ఆహ్వానించటానికి వచ్చినప్పుడు, ఆత్మాభిమానమే తప్ప మరో ధనం లేని, జాక్, చేతిలో విస్కీ బాటిల్ తో, గోవన్ డాన్సర్ల నేపథ్యంలో, “నా చాహు సోనా చాందీ..నా చాహు హీరా మోతీ…యే మేరే కిస్ కామ్ కే?” అంటూ పాటందుకుంటాడు. అదీ, రిషీ పాట, జాక్ బ్రిగాంజా పాట, లేదా రాజ్ కపూర్ పాట, తెర వెనుక గాత్రం మన్నాడేది.

మరింత ఊహ తెలిసిన తరవాత చూసిన సినిమా “పడోసన్”. కిషోర్ కుమార్ పిచ్చి పీక్స్ లో ఉన్నది కూడా ఆ సమయంలోనే. శాస్త్రీయ సంగీత నేపథ్యం లేకుండా, జన్మతః అబ్బిన ఒక అద్భుతమైన టాలెంట్ గల సింగర్ గా, తన నిజజీవితానికి అతిదగ్గరగా ఉండే పాత్రను, కిషోర్ దా, ఈ సినిమాలో పోషిస్తాడు. “పక్కింటి అమ్మాయి”ని పడవేసే ప్రయత్నంలో సునీల్ దత్ ఉంటే, ఆ అమ్మాయిని తన శాస్తీయ సంగీత విద్వత్తుతో బుట్టలో వేసేసుకుందామనే ఒక తమిళ కమీడియన్ పాత్ర మెహమూద్ ది. సునీల్ దత్ కి పాట రాక పోయినా, కిషోర్ ప్లేబ్యాక్ వాయిస్ తో (లిటరల్ గా), మెహమూద్ తో పోటీకి దిగుతాడు. “ఎక్ చతుర్ నార్ కర్ కే సింగార్” అంటూ సుశాస్తీయంగా మెహమూద్ పాటందుకుంటే, “ఎక్ చతుర్ నార్ బడి హోషియార్” అంటూ కిషోర్ కొంటెగా సమాధానం ఇస్తూ, స్వరాల్ని ఎడా పెదా మార్చేస్తూ, ఆ పాట పోటీలో నెగ్గుతాడు. ఆ పోటీ లో ఓడిన గళం  మన్నాడే దే. ఆ సమయంలో కిషోర్ గెలిచినందుకు ఎంత సంబరపడిపోయానో! అదే పాటని కాలేజి సమయంలో పాడటానికి ప్రయత్నించినప్పుడు తెలిసొచ్చింది, మన్నాడే పాడింది ఎంత కష్టతరమో! ఇప్పటికి కూడా ఆ పాట వినంగానే గుర్తుకొచ్చేది, కిషోర్, మెహమూద్ లే! ఈ సన్నివేశం మొత్తం ఈ క్రింది లింకులో చూడండి, మొత్తం సినిమా చూసేసినట్లే!

మన్నాడే పాటలని చెప్పి, ఆయన్ని వదిలేసి, ఆ సినిమాల గురించీ, సినిమాలో పాటానుసారం పెదాలాడించిన నటుల గురించే ఎక్కువ మాట్లాడేశాను కదా! ఒక “సినీ ప్లే బ్యాక్” సింగర్ అంటే, అసలు సిసలు నిర్వచనం అదేనెమో! ఒక పాట విన్నప్పుడల్లా, అది పాడిన వారు కనుమరుగైపోయి, తెర మీద కనిపించిన వారే కళ్ళెదుట మెదిలితే, అది నిస్సందేహంగా ఆ గాయకుడి ప్రజ్ఞే! తన గొంతుని, తెర పైన కనపడే పాత్ర భావావేశ ప్రకటన చేసే పాటకి  పూర్తిగా అంకితం చేసేసి, తాను కనుమరుగైపోవటం ఒక అత్యుత్తమ స్థాయికి చేరుకొన్న కళకు చిహ్నమేమో కూడా!

నిజానికి, రఫీ, కిషోర్, ముఖేష్, లతా, ఆషా లాంటి మహామహులందరి కంటే వయస్సులో, అనుభవంలో కూడా పెద్దవాడు, మన్నాడే. అందరి కంటే ముందర రంగప్రవేశం చేశారు కూడా. కానీ వాళ్ళ పాటలన్నీ వాళ్ళ పాటల్లానే ఈనాటికీ గుర్తింపబడితే, మన్నాడే పాటల్లో మాత్రం ఆయన “స్టాంపు” వెయ్యకుండా, తన గాత్రాన్ని ఒదిగించటం వల్ల, అవి ఆ సినిమా పాటలు గానో లేక ఆ నటుల పాటలు గానో మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం ఉండి పోయాయి.

1919లో కలకత్తా లో జన్మించిన మన్నాడే, 1942 లో బొంబాయి వచ్చి, “తమన్నా” అనే చిత్రం ద్వారా తన సినీసంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.  2012 వరకూ ఆయన పాడుతూనే ఉన్నారు. అంటే గత డెభ్భై సంవత్సరాలుగా మనకు సినిమా సంగీతంలో తెలిసిన (తెలియని) దాదాపు అందరితోనూ పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. హిందీ లోనే కాకుండా, తన మాతృభాష బెంగాలీలో, భోజపురీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ,ఒరియా, సింధీ, నేపాలీ భాషలలో నే కాకుండా, మళయాళంలో కూడా పాటలు పాడారు. ఒక్క హిందీలోనే దాదాపు వందకి పైగా సంగీత దర్శకులకు పాడారు. అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. 2007 లో భారతదేశపు అత్యుత్తమ సినీ పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు.

చిన్నప్పుడు హిందుస్తానీ సంగీతం నేర్చుకొని సినిమా పాటలు పాడటం ప్రారంభించినా, తన శాస్త్రీయ సంగీతాభ్యాసం మరి కొంత కాలం కొనసాగిస్తూనే వచ్చారు. మన్నాడే కి శాస్త్రీయ సంగీతం మీద ఉన్న పట్టు వల్లనే నేమో, “బిజు బావ్రా” సినిమాలో భరత్ భూషణ్కి, మొహమ్మద్ రఫీ కొన్ని అద్భుతమైన పాటలు అప్పటికే పాడి ఉన్నప్పటికీ, “బసంత్ బహార్” సినిమాలో ఒక సన్నివేశానికి మాత్రం, శంకర్ జైకిషన్, మన్నాడే నే ఎన్నుకున్నారు. ఆ సన్నివేశానుసారం, “బసంత్” రాగంలో ఒక విద్వాంసుడు పాట పాడుతూ ఉంటే, హీరో వచ్చి, అదే రాగం అందుకొని, ఆ పాటని కొనసాగించి ఆ విద్వాంసుడిని “ఓడించాలి”. ఆ విద్వాంసుడికి గాత్ర దానం చేసింది మరెవరో కాదు, అప్పటికే, హిందుస్తానీ సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజులా శోభిల్లుతున్న పండిత్ భీమసేన్ జోషీ. హీరోకి పాడటానికి మన్నాడే ని తీసుకొన్నారు సంగీత దర్శకులు. నిజానికి, అది ఒక పెద్ద దుస్సాహసమే! ఆ పాట రికార్డింగు పూర్తికాంగానే, మన్నాడే తనంతట తానుగా వెళ్లి పండిత్ జీకి పాదాభివందనం చేశారని ఆయనే తరవాత చెప్పుకొన్నారు. “కేతకీ గులాబ్ జుహీ చంపక్ వన ఫూలే” అన్న ఈ పాట అద్భుతః!

అలాగే దర్బారీ కానడ లో సాగే “ఝనక్ ఝనక్ తోరి బాజే పాయలియాన్..” పాట, “మేరే హుజూర్” సినిమా నుంచి. మన్నాడే, మేలోడీని తన తియ్యని గళంతో ఆ పాటంతా నింపి చిరకాలం నిలచిపోయేలా పాడితే, ఆ దర్శకుడు మాత్రం దాన్ని అతి ఘోరంగా చిత్రీకరించారు. హెడ్ఫోన్స్ తగిలించుకొని ఈ పాటని వింటూ మన్నాడే గాన మకరందాన్ని ఆస్వాదించుకోవచ్చు కానీ, కళ్ళు మాత్రం మూసుకోవలసిందే!

హిందుస్తానీ భైరవి (కర్నాటక తోడి) లో సాగే “లాగా చునరీ మే దాగ్..ఛుపావూ కైసే? ఘర్ జావూ కైసే?”, పాట మాత్రం “మన్నాడే పాట”. రాజ్ కపూర్ మారు వేషం వేసి తెర మీద పాడతాడు కాబట్టి, ఈ ఒక్క సారికీ ఇది ఆయన పాట కాకుండా పోయింది. “దిల్ హీ తో హై” సినిమా లోని ఈ పాట, 2113 లో జరగబోయే పాటల పోటీలలో కూడా ఎవరో ఒకరు పాడి తీరతారు, మనమెవ్వరూ చూడటానికి మిగలక పోయినా!

రాజ్ కపూర్ అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే గాయకుడు ముకేష్ అయినా, నా కిష్టమైన ఆయన పాటలు మాత్రం ఎక్కువ మన్నాడే వే. “దిల్ కా హాల్ సునే దిల్ వాలా..సీధీసీ బాత్ నా మిర్చి మసాలా..కేహకే రహేగా కేహనేవాలా”, “ముడ్ ముడ్ కే నా దేఖ్” “శ్రీ 420” పాటలు సతతహరితాలైతే, నా అభిప్రాయంలో “డ్యూయెట్ ఆఫ్ ది సెంచరీ”, “ప్యార్ హువా ఇక్రార్ హువా హై” పాటకి ఇచ్చెయ్యచ్చు. కాదంటారా? ఆ పాట ఇక్కడ చూసెయ్యండి, తరవాత చర్చిద్దాం.

అలాగే “చోరీ చోరీ” నుంచి, “యే రాత్ భీగీ భీగీ….”. అవిచి వి. మెయ్యప్పన్ (ఎ.వి.యమ్), ఆ చిత్ర నిర్మాత. ముకేష్ తప్ప వేరెవ్వరూ పాడటానికి వీల్లేదని పంతం పట్టుకు కూర్చున్నారట. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్లు, ఎలాగొలా ఒప్పించి మన్నాడే చేతే పాడించారు. ఎ.వి.యమ్ గారు, రికార్డింగ్ అవ్వంగానే ఆనందంతో మన్నాడే ని వాటేసుకున్నారని కథనం. “ఆజా సనమ్..మథుర్ చాందినీ మే హమ్”, అదే సినిమాలోని ఇంకొక మర్చిపోలేని యుగళగీతం.

రాజ్ కపూర్ లాంటి హీరోతో పాటుగా, హిందీలో చెప్పుకోదగ్గ అత్యంత శ్రేష్ఠ క్యారెక్టర్ ఆర్టిస్టులైనటువంటి బల్రాజ్ సహానీ, ప్రాణ్ లకి కూడా అజరామరమైనటువంటి పాటలు ఇచ్చారు మన్నాడే. “కాబులీవాలా” లోని “యే..మేరే ప్యారే వతన్, యే మేరె ఉజ్డే చమన్, తుమ్పే దిల్ ఖుర్బాన్” పాటలో “తూహీ మేరీ ఆర్జూ…తుహీ మేరీ ఆబరూ…” అని వేదనతో నిండిన మేలోడిక్ స్వరం విన్నప్పుడు, ఒక సారి రోమాలు నిక్కపోడుచుకుంటాయి. బల్రాజ్ సహానీ కే, “వక్త్” లో పాడిన “ఎ మేరె జోహ్ర జబీన్..” పాట మాత్రం ఎవరు మరువగలరు?

ప్రాణ్ కి పాడిన “యారీ హై…” పాట గురించి పైన చెప్పుకున్నాం. ప్రాణ్ అనంగానే గుర్తుకొచ్చే మరో “హాంటింగ్ మెలాంకొలిక్ మెలోడీ”,  “ఉప్కార్” చిత్రం నుంచి., “కస్మే వాదే ప్యార్ వఫా సబ్ బాతే హై…బాతోం కా క్యా?”.

డెభ్భైల్లోని సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అనంగానే కిషోర్ కుమార్ గుర్తుకొచ్చేస్తారు. కానీ మన్నాడే కూడా అడపా తడపా రాజేష్ ఖన్నాకి పాడారు. “బావర్చీ” లో శాస్త్రీయంగా సాగే “తుమ్ బిన్ జీవన్ కైసా జీవన్…” చాలా మధురంగా ఉంటుంది.

ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నా కోసం పాడిన “జిందగీ కైసీ యే హాయే పహేలీ హాయే..” పాట లోని లిరిక్స్ ఇలా ఉంటాయి.

“జిన్హోంనే సజాయే యహా మేలే … సుఖ్ దుఖ్ సంగ్ సంగ్ ఝేలే

వోహి చునకర్ ఖామోషీ…యూ చలే జాయే అకేలే కహా?”

మన్నాడే మౌనంగా ఒక్కరే ఏదో లోకాలకి వెళ్లిపోయి ఉండచ్చు, వారి సంగీత సంపద మాత్రం తరతరాలకీ తరగని విధంగా మనకి వదిలేశారు. మరిక బాధేల మిత్రమా?

“దునియా మే ఖుష్ రెహనా హోతో మానో మన్నాడే కీ బాత్”
“ఆవో ట్విస్ట్ కరే… జగ్ ఉఠా మౌసమ్!”

-శివ సోమయాజులు

Siva

 

కలలకే కలవరింతలు,రాగాలకే పులకింతలు!

Ramesh+Naidu+1292932446

“మురళీధరుడైన రాముడు, కోదండధరుడైన కృష్ణుడు, చక్రధరుడైన శివుడు, చంద్రధరుడైన విష్ణువు, బుధ్ధుడి సౌందర్య లహరి, ఆదిశంకరుడి ధర్మపథం, ఈక్వేటర్ లో హిమాలయాలు, ఉత్తర ధృవంలో హిందూ మహాసముద్రం – ఇవి కలుసుకొనే తీరాలు. కలలకే స్వప్నాలు – ఒక్క ముక్కలో చెప్పాలంటే అదృశ్యాలు, అసాధ్యాలు, కల్పనా బలం కొ్ద్దీ తలపెట్టే అఘాయిత్యాలు.

అయినా ఇవి సాధ్యాలే. కల్పనలు కూడా సత్యాలే. అటువంటి అభూతకల్పన అక్షరసత్యంగా మారిన అపురూప సంఘటన పేరే రమేష్ నాయుడు. ”

ఇవి రమేష్ నాయుడు  గురించి, వేటూరి తను రచించిన ” కొమ్మకొమ్మకో సన్నాయి ” పుస్తకంలో రాసిన పరిచయవాక్యాలు. ఇంతకు మించిన అతిశయోక్తులతో రమేష్ నాయుడు గారిని పొగడటం అసాధ్యమేనేమో!

వేటూరి తన పుస్తకంలో ఎవ్వరికీ ఇవ్వనంత గౌరవం రమేష్ గారికి ఇస్తూ రెండు అధ్యాయాలు ఆయనకి కేటాయించారు. కానీ నాకు మాత్రం, రమేష్ నాయుడు, అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే కవి, డా.సి.నారాయణ రెడ్డి గారే.

రమేష్ నాయుడు యాభైల్లో, అరవైల్లో అడపా దడపా తెలుగు సినిమాలకి సంగీతం సమకూర్చినా, డెభ్భై రెండులో, “అమ్మ మాట”, “తాతా మనవడు” చిత్రాలకి సంగీతం అందించటం ద్వారా పునఃప్రవేశం చేశారు.

“అమ్మ మాట” లో, “మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు” అని సినారె మొదలెడితే, “లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘ మాసం  ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే” అంటూ రమేష్ గారు పూర్తి చేసారని భోగట్టా. యల్.ఆర్. ఈశ్వరి గొంతులో ఈ ‘ఐటం సాంగు’ గత నలభై ఏళ్లుగా ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంది. ఈ బాణీని, ఈ పాటలోని కొన్ని పంక్తులనీ యధాతధంగా ‘దేవదాసు’ (2005) లో మళ్ళీ వాడుకున్నారు.

రమేష్ నాయుడు అనంగానే, సి.నా.రె గుర్తుకు రావటానికి ఈ పాట కారణం అనుకొనేరు. వారివురి కలయిక దీనితో ప్రారంభమైనా, ఆ తరువాత వీరు మన తెలుగు సినీ కవిత్వంలో కలకాలం గుర్తుండిపోయే సాహితీ సృష్టి జరిపారు.

“జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకీ

వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణీ

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా”

అంటూ ఒప్పెనలా పొంగుతున్న మోహావేశాన్ని ఒక ప్రియుడు తన నాయిక కోసం వ్యక్తపరచినా

“ఏ ఫలమాశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూసే పువ్వు తావి విరజిమ్మును
అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను”

అంటూ ఒక కళాపిపాసి లలితకళలకు నివాళులర్పించినా

“సరళ తరళ నీహార యవనికల .. మెరిసే సూర్య కళికా

మృదుల మృదుల నవ పవన వీచికల … కదిలే మదన లతికా

నీ లలిత చరణ పల్లవ చుంబనమున  పులకించును వసుధ జయసుధా…
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో .. ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో

ప్రణయ గగనమున ప్రథమ రేఖవో … రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో”

అంటూ తన ప్రేయసికి తాను చెప్పేది అర్థం అవుతోందా లేదా అన్న ధ్యాస లేకుండా ఓ ప్రియుడు తన చెలిని వర్ణించినా,

ఆ ఘనత, కవి గారితో పాటు రమేష్ నాయుడు గారికి కూడా చెందుతుంది. అంత చిక్కని సాహిత్యం పది మందికీ చేరిందీ అంటే, రాసిన ఆ క్లిష్ఠతరమైన పంక్తులకు ఒక సులువైన బాణీ కట్టటం నుంచీ, వాయిద్యపు హోరు ఆ పదధ్వనులను కప్పేయకుండా చూసుకోవటం, దానికి తోడు, శాస్త్రీయ సంగీత రాగాలలోనే నిబద్ధతతో స్వరపరచటం వరకూ, రమేష్ నాయుడు చూపించిన అసమాన ప్రతిభే కారణం.

అదే సి.నా.రె కవిత్వం, “ఆడవే మయూరి” పాటలో ఆ కట్టిన బాణీ (‘మామ’కి క్షమాపణలతో) వల్లనో, లేక ఆది పాడిన విధానం వల్లనో, అంతగా ఆస్వాదించలేమనిపిస్తుంది.

శాస్త్రీయ రాగాలు, వాయిద్యాల మాట వచ్చింది కాబట్టి ఇక్కడ రమేష్ నాయుడి గారి బాల్యకౌమార్యాల గురించి కొంత ప్రస్తావించుకోవాలి. 1933లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించిన రమేష్ నాయుడు చిన్న వయసు లోనే బొంబాయి కి పారిపోయి అక్కడ ఒక వాయిద్యాలు అమ్మే దుకాణంలో ఎన్నో సంవత్సరాలు పని చేసి, యుక్త వయసులోనే బెంగాలీ, మరాఠీ, హిందీ భాషలలో సినిమాలకి సంగీతాన్ని అందించారు.
ఆ వాయిద్యాల దుకాణంలో పని చేసిన అనుభవం వల్లనే నేమో, వాటిని ఎంతో సంయమనంతో, చాలా పొదుపుగా వాడేవారు, తన పాటల్లో. అలాగే, శాస్త్రీయ సంగీతం ఏ గురువు దగ్గరా నేర్చుకోకపోవటంవల్ల, ఆ రాగాలు వాడినప్పుడు ఎక్కువ ప్రయోగాలు చెయ్యకుండా, ఎంతో నిబద్ధతతో బాణీలు కట్టేవారు.  “ఎక్ తారా” ని ముఖ్య వాయిద్యంగా  ఉపయోగించి, కల్యాణి లో కట్టిన “జోరు మీదున్నావు తుమ్మెదా” పాట అజరామరం.

ఆయనకి కల్యాణి చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటనుకుంటాను. పైన చెప్పుకున్న సినారె పాటల్లో “లలిత కళారాధనలో”, “ప్రణయ కావ్యమున”, ఈ రాగంలో కట్టినవే.

వేటూరితో చేసిన పాటల దగ్గర కొచ్చేసరికి ఒక చిన్న పక్క దోవ పట్టి నా అనుభవం ఒకటి చెప్పుకోవాలి. నాగార్జున సాగర్ లో, ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజులవి. శనివారం రాత్రి టి.వి. లో వచ్చే తెలుగు సినిమా కోసం చాలా మంది వేచి చూసే వాళ్ళం. ఓ శనివారం “సువర్ణ సుందరి” అని సినిమా మొదలయ్యింది. చంద్రమోహన్ హీరో. కలలో ఎవరో సుందరి కనపడుతుంది. హీరో కవిత్వం చెప్పేస్తూ ఉంటాడు. హాలు మొత్తం ఖాళీ! నేను, నా మిత్రుడు ఒక్కడు మాత్రమే మిగిలాం. ఆ వయస్సుకి, ఆ కథా, కవి అయిన ఆ హీరో చెప్పే కవిత్వం అద్భుతంగా అనిపించాయి. ఇద్దరం సినిమా పూర్తయ్యే దాకా అస్సలు కదలలేదు.

ఆ తరువాత ఎన్నో ఏళ్ళకి గానీ  అది హిందీ సినిమా “నవరంగ్” కి రీమేక్, ఆ సినిమాలో మా ఇద్దరినీ కట్టి పడేసిన కవిత్వం వేటూరిదీ, సంగీతం రమేష్ నాయుడిదీ, అని తెలిసిరాలేదు. ఎక్కువగా ప్రాచుర్యం పొందక పోయినా కానీ, ఆ సినిమా పాటలు అలా గుర్తుండి పోయాయి.

“ఇది నా జీవితాలాపనా…ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో? ఎట దాగున్నదో! ఎన్నాళ్ళు ఈ వేదనా…?”

“ఊహవో ఊపిరివో..నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట..సువర్ణసుందరివో”

“మధువనాంతముల  మరు  వసంతములు  చిరు లతాంతములు వెదజల్లగా

దశ దిశాంతముల జత శకుంతములు గల  మరందములు ఎద జల్లగా”

వేటూరి ముందరే సమకూర్చిన స్టాకు బాణీల్లో పదాలు ఇరికించే కష్టం లేకుండా స్వేచ్చగా తన కలాన్ని కదిపితే ఎలా పాటలు వ్రాయగలరో ఈ సినిమాలోని పాటలే ఒక నిదర్శనం. ఇవి వినదలుచుకున్న వాళ్ళు ఈ క్రింది లింకులో ఆ పాటలు వినచ్చు.
http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=suvarna+sundari&sa=Go%21

డెభ్భైల తరవాత వచ్చిన సంగీత దర్శకులలో, కవి పాటను వ్రాసిన తరవాతే బాణీలు కట్టిన సంగీత దర్శకుడు, బహుశా రమేష్ నాయుడు ఒక్కళ్ళేనేమో! వేటూరికి అందువల్లనే రమేష్ నాయుడు అంత ప్రీతిపాత్రుడయ్యాడని నా అనుమానం.

“నవమి నాటి వెన్నెల నేను ..దశమి నాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతి రేయి.. కార్తీక పున్నమి రేయి..”

“మెరుపులా మెరిశావు… వలపులా కలిసావు

కనులు మూసి తెరిచేలోగా..నిన్నలలో నిలిచావూ… నిన్నలలో నిలిచావూ”

“సిగ్గూ పూబంతీ యిసిరే సీతా మాలచ్చీ
మొగ్గ సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ”

లాంటి మరవలేని పాటలెన్నో రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో వచ్చాయి.

రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన మొత్తం తెలుగు సినిమాలు వందకి మించవు. దానికి ఆయన పనిచేసిన విధానం ఒక కారణమేమో. రోజుకి అయిదారు పాటలు అవలీలగా “కొట్టి పారేసే” దిగద్దర్శకులున్నప్పుడు, వాళ్ళు కొట్టిన బాణీలకి అర్థం పర్థం లేకపోయినా, అర్థమేదో ఉన్నట్టుగానే ఉంది, అనిపించేటటువంటి కొత్త కొత్త  పద ప్రయోగాలు చేసి అంతే స్పీడులో పాట రాసి పారేసేందుకు సిద్ధమైన కవికోవుదులున్న వాతావరణంలో, రమేష్ నాయుడు చాదస్తం మనిషే!

రమేష్ నాయుడు బాణీ కట్టాలంటే ఆయనకి ఆ పాట సందర్భం, పాత్రల స్వభావం లాంటి వివరాలే కాకుండా, ఆ పాట పంక్తులు కూడా అతడికి స్పూర్తి నిచ్చేవి లాగా ఉండాలి. ఇన్ని సమకూరితే కానీ ఆయన బాణీ కట్టడానికి కూర్చోనే వాడు కాడట.

ఆయన ఆచారాలకి అలవాటు పడ్డ దర్శకులు మటుకూ ఆయనతోనే తమ సినిమాలకు సంగీతం చేయించేవారు. దాసరి నారాయణరావు గారు, తన తొలి చిత్రం “తాతా మనవడు” సినిమాతో మొదలైన రమేష్ నాయుడి సంగీత సాంగత్యాన్ని, తను నిర్మించిన దాదాపు అన్ని సినిమాలలోనూ కొనసాగించారు.

“అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం..

ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం”

ఈ సినిమాలోని ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పాట. దీని తరువాత వరుసగా “సంసారం సాగరం”, “బంట్రోతు భార్య”, “తూర్పు పడమర”, “రాధమ్మ పెళ్లి”,  “జయసుధ”, “శివరంజని”, “చిల్లరకొట్టు చిట్టెమ్మ”, “సుజాత” వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి.

Megha_Sandesham

“మేఘసందేశం” సినిమాతో తో వీరిద్దరూ తమ తమ కేరియర్స్ లోని శిఖరాగ్రాలకి చేరుకొన్నారు. ఇద్దరూ జాతీయ అవార్డులను అందుకొన్నారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ రోజుకి కూడా జాతీయ అవార్డును గెలుచుకొన్న ఏకైక తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు (మామ, రాజాలకు తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చినా, వారు తెలుగు వారు కారు).

దేవులపల్లి భావకవిత్వ ప్రేరణతో రమేష్ నాయుడు కట్టిన ఈ బాణీ కొన్ని శతాబ్దాలు నిలుస్తుందనటం అతిశయోక్తి కాదు.

“తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల… చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా… ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..

ఆకులో ఆకునై, పూవులో పూవునై… కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా”

http://www.youtube.com/watch?v=xBh2z9CWhkM

 

జయదేవుని అష్టపదులు “ప్రియే చారుశీలే”, “రాధికా, కృష్ణా రాధికా”, వేటూరి, “నిన్నటి దాకా శిలనైనా”, “పాడనా వాణి కల్యాణిగా”, ఇక దేవులపల్లి పద్యాలూ, పాటలూ, వెరసి, తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయి, ఈ సినిమా సంగీతం!

రమేష్ నాయుడి చెయ్యి విడువక నడచిన దర్శకులలో దాసరి తరవాత చెప్పుకోవలసిన వారు విజయనిర్మల. వారి కాంబినేషన్ లో కూడా ఎన్నో సినిమాలు, గుర్తుండి పోయే పాటలు.
నాకు అన్నిటి లోకి ఇష్టమైన పాట “మీనా” చిత్రంలోని “శ్రీరామ నామాలు శత కోటి, ఒక్కొక్క పేరూ, బహుతీపి”. ఆ నామాల్లోని తియ్యదనం రామభక్తులకే అనుభవసాధ్యమేమో కానీ, ఆ పాటలోని రమేష్ నాయుడు గారు జొప్పించిన తియ్యదనం, నిస్సందేహంగా అందరూ ఆస్వాదించవచ్చు.  “మల్లె తీగ వంటిది మగువ జీవితం..”, “పెళ్ళంటే నూరేళ్ళ పంట” అదే సినిమాలో  ఆ రోజుల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు.

వీరిరువురి కాంబినేషన్ లో “ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ…” (దేవుడే గెలిచాడు), “అరవైలో ఇరవై వచ్చిందీ..” (భోగిమంటలు), “ఏ ఊరు, ఏ వాడ అందగాడా, మా ఊరు వచ్చావు సందకాడ” (హేమాహేమీలు) లాంటి కొన్ని గుర్తుపెట్టుకోదగ్గ పాటలతో బాటు,  కొన్ని మర్చిపోదగ్గ ఫక్తు కమర్షియల్ బీట్ పాటలూ ఉన్నాయి.

ఆయన ఘన విజయాలతో పాటు కొన్ని అపజయాల గురించి కూడా చెప్పుకోవాలి. విజయనిర్మల, రమేష్ నాయుడు కాంబినేషన్ లో వచ్చిన “స్పెక్టాక్యులర్ ఫైల్యూర్”, “దేవదాసు”. నిజానికి “సుబ్బరామన్-ఘంటసాల-సముద్రాల” పాత దేవదాసు పాటలు మన మనస్సులో ఎంతగానో అల్లుకుపోయిన నేపథ్యంలో, మళ్ళీ ఆ సినిమా రీమేక్ చేయ్యలనుకోవటం, దానికి రమేష్ నాయుడు సంగీతం అందించటం, ఒక పెద్ద దుస్సాహసం.

ఓ “పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో..” పాటని ఎంత “మేఘాల మీద సాగాలి” అనిపించినా అందుకోవటం సాధ్యమా! ఈ సినిమా పాటల పైన ఇంకా అంత కంటే పునరావలోకనం అనవసరం.

విజయనిర్మల తరవాత, జంధ్యాల రమేష్ నాయుడు గారితో కలిసి పనిచేసి మరి కొన్ని ఆణిముత్యాలు అందించారు.

Mudha-Mandharam

“ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్ద మందారం…” అంటూ 1981 లో మొదలైన వీరి సాహచర్యం, రమేష్ నాయడు 1987లో తుది శ్వాస తీసుకొనే వరకూ కొనసాగింది.  “అలివేణీ ఆణిముత్యమా..”, “నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి” పాటలు కూడా వారి తొలి చిత్రం (కాంబినేషన్ లో)  “ముద్దమందారం” లోనివే.

“మల్లెపందిరి” కింద  “ఓ సతీ నా గతీ.. ఓహో నా శ్రీమతీ ఆహా సౌభాగ్యవతీ” అంటూ, “రెండు జళ్ళ సీత” తో  “కొబ్బరి నీళ్ళ జలకాలాడి”, “తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు..” అంటూ “శ్రీవారికి ప్రేమ లేఖ”  వ్రాసి, కొన్ని మధుర జ్ఞాపకాలు మిగిల్చారు.

“మనసా త్రుళ్ళి పడకే..అతిగా ఆశ పడకే

అతడికి నీవు నచ్చావో లేదో..ఆ శుభ ఘడియ వచ్చెనో రాదో

తొందర పడితే అలుసే తెలుసా.. మనసా త్రుళ్ళి పడకే”

పెళ్లి చూపుల తరువాత, రిజల్టు కోసం ఎదురు చూసే ఆ కన్నె మనసుని వేటూరి ఎంత అందంగా వర్ణించారో, అంత సున్నితంగానూ, రమేష్ నాయుడు దానికి బాణీ కట్టారు. పూర్తి తెలుగుదనం ఉట్టి పడే పాట ఇది.
http://www.youtube.com/watch?v=7_YMMsNXNl4

Srivariki Premalekha

 

“మేఘసందేశానికి” తన  సంగీతాన్ని జతచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్న రమేష్ నాయుడు ఆనందభైరవి తో తన స్థానాన్ని అక్కడే పదిలం చేసుకున్నాడు.

అమృతవర్షిణి రాగంలో కట్టిన “చైత్రము కుసుమాంజలి” పాట, నాకు ఆ సినిమా పాటలన్నిటిలోకీ ఇష్టమైన పాట. ఆ పాట సాహిత్యం వేటూరి రాగ జ్ఞానానికి కూడా ఒక ప్రతీక. ఆ రాగంలోని స్వరాలనే పాట సాహిత్యంలో జొప్పించి చక్కటి ప్రయోగం చేశారు.

“పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం..”,  “బ్రహ్మాంజలీ..”, “కొలువైతివా రంగశాయి” లాంటి పాటల సృష్టీ ఈ సినిమాలోనే జరిగింది. కానీ 1983 తెలుగు సినీసంగీతంలో ఒక స్వర్ణ సంవత్సరం. “సాగర సంగమం”, “మేఘసందేశం” కూడా అదే సంవత్సరం లో విడుదల అవ్వటంతో, ఈ సినిమా పాటలకి దక్కాల్సిన అవార్డులు దక్కలేదేమోననిపిస్తుంది.

రమేష్ నాయుడు గారి ఆఖరి సినిమా, “స్వయంకృషి”. ఆ సినిమా విడుదల ఒక్క రోజు ముందు ఆయన దివంగతులయ్యారు. అందులోని ప్రతి పాటా బాగుంటుంది. “పారా హుషార్”, “హల్లో హల్లో డార్లింగ్…” లాంటి సరదా పాటలతో పాటు ““సిన్నీ సిన్నీ కోరికలడగ” వంటి కలకాలం నిలిచిపోయే పాటలూ ఉన్నాయి.

రమేష్ నాయుడు, “కల్యాణి” రాగం చాలా విరివిగా వాడారని ముందర చెప్పుకున్నాం. పైన ప్రస్తావించిన చాలా పాటలు ఈ రాగం లోనివే. అయితే “శివరంజని”లో కూడా చాలా చక్కని పాటలు కట్టారు. “శివరంజనీ, నవరాగిణీ”, అని “తూర్పు పడమర” చిత్రం లో కడితే, “అభినవ తారవో.. నా అభిమాన తారవో” అంటూ “శివరంజని” సినిమాలో ఆ రాగాన్ని వాడారు.

అదే రాగానికి, జేసుదాసు గాత్రం, వేటూరి సాహిత్యం కలిసినప్పుడు, రమేష్ నాయుడు కట్టిన బాణీకి, ఆయనకూ, జేసుదాసుకూ కూడా నేషనల్ అవార్డులొచ్చాయి. ఆ “ఆకాశ దేశాన మెరిసేటి మేఘం” పసుపులేటి రమేష్ నాయుడు నేడు మన మధ్య లేకపోయినా, ఆయన కట్టిన స్వరహారాలు, స్వయంప్రకాశంతో ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి!

http://www.youtube.com/watch?v=59h1_ZDnfcA

వేటూరి పరిచయవాక్యాలతో ప్రారంభించిన ఈ వ్యాసాన్ని,  ఆయన రమేష్ నాయుడుకి నివాళులర్పిస్తూ రాసిన చివరి మాటలతోనే ముగిస్తాను.

“నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దురమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది.

ఏటి పాప శాపమ్మ ఎగసి.. తాను సూసింది
ఏడి నావోడంటే ఏటిలోన మునిగింది

శాప మునిగిన కాడ శతకోటి సున్నాలు

శాపమైన గుండెలోని సెప్పలేని సుడిగుండాలు

ఏరెల్లిపోతున్నా నీరుండి పోనాది
నీటిమీద రాతరాసి నావెల్లిపోనాది”

 

(కృతజ్ఞతలు: ఉమా ఏలూరి. అడగంగానే, అర్థరాత్రి, “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకం లోని, రమేష్ నాయుడి అధ్యాయాలని, ఓపిగ్గా తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి పంపించినందుకు.)

Siva_336x190_scaled_cropp –యాజి

 

కనసలూ నీనె – మనసలూ నీనె!

“యే…జీవన్ హై..ఇస్ జీవన్ కా”, “రజనీగంధా ఫూల్ తుమ్హారే…”, “జానేమన్, జానేమన్, తేరే దో నయన్”, “తుమ్ కో దేఖా..తొ యే ఖయాల్ ఆయా”, “ఎ తేరా ఘర్..ఎ మేరా ఘర్” లాంటి హిందీ పాటలు విన్నప్పుడల్లా, నాకు వాటన్నిటిలో ఒక కామన్ థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. చక్కటి “మధ్యతరగతి మెలోడీ!” ఉన్న వర్గీకరణలతోటే తికమకగా ఉంటే, మళ్ళీ ఇదొకటేమిటనుకుంటున్నారా? అంత కంటే అతికే పదబంధం నాకు దొరకలేదు మరి. కళ్ళు మూసుకొని కనక ఈ పాటలు వింటుంటే, అందమైన మెలోడీ తో పాటు ఎవరో మధ్యతరగతి ప్రేయసీప్రియులు పాటలాడుకొనేటటువంటి దృశ్యాలు కళ్ళ ముందు కదలాడతాయి!

అసలీ కన్నడ శీర్షికేమిటీ, హిందీ పాటల గోలేమిటి, దేని గురించి ఈ వ్యాసం, అని అనుకుంటున్నారు కదూ? అక్కడికే వస్తున్నా. ఈ పాటలన్నీ కూడా డెభ్భైల్లో వచ్చినవే. తెలుగులో కూడా, ఈ తరహాలో, పాటలు అదే సమయంలో వచ్చాయా అని చూసుకుంటే, కొన్ని అద్భుతమైన మెలోడీలు తగిలాయి. వాటిల్లో చాలా వాటికి స్వరకర్తలు రాజన్-నాగేంద్ర సోదరద్వయమే! వారి “మధ్యతరగతి మెలోడీ” పాటల గురించే ఈ సారి కమామీషంతా.

 

rajan

 

మీకు వికీని గూగ్లించే శ్రమ లేకుండా, వారి పూర్వాపరాల గురించి టూకీగా చెప్పేసుకుంటే, తర్వాత వారి స్వరధారల్లో తడిసి ఆటలాడేసుకోవచ్చు. చిన్నప్పుడే, కర్ణాటక రాష్ట్రంలో సంగీత కాలేజిలో విద్యనభ్యసించిన  ఈ ఇరువురు సోదరులూ, 1953 లో కన్నడ సినిమా రంగంలోనూ,  1960 లో తెలుగు సినిమా రంగంలోనూ, జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల ద్వారా రంగప్రవేశం చేశారు. కన్నడ సినిమా రంగంలో అగ్రతారలైనటువంటి రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలకి సంగీతాన్ని అందిస్తూ ఆ రంగంలో బిజీగా ఉన్న వీరికి, తెలుగులో అడపాదడపా తప్ప ఎక్కువగా అవకాశాలు రాలేదు. 1975 లో కన్నడ సినిమా “ಎರಡು ಕನಸು” తెలుగు రీమేక్ “పూజ” ద్వారా వీరి పునఃప్రవేశం జరిగింది. ఆ తర్వాత జరిగినది, “హిస్టరీ” అని చెప్పేసి సులువుగా తప్పుకొనే అవకాశం లేదిక్కడ. కలకాలం గుర్తుండి పోయే మేలోడీలు అందించిన వీళ్ళు, ఆ తరువాత సంగీతం అందించిన తెలుగు చిత్రాల సంఖ్య ఇరవైకి మించదు!

 

“పూజ” చిత్రం నుంచే  “పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను..తియ్యరా తలుపులనూ రామా..” అంటూ మృదుమధురంగా వాణీజయరాం గళంనించి జాలువారిన ఈ గీతాన్ని, ఇప్పటికీ ఎంతో మంది గాయకురాళ్లు పాటల పోటీలలో పాడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. “ఎన్నెన్నో జన్మల బంధం..నీది నాది”, ఎవరగ్రీన్ పాట. దాదాపు ఒక పదిహేడేళ్ళ తరవాత హిందీలో, ఆనంద్ మిలింద్, ఎక్కువ మొహమాట పడకుండా, అదే ట్యూన్ ని, “జాన్ సే ప్యారా” అనే సినిమాలో మక్కీకి మక్కీ దించేశారు. మూడు భాషలలోనూ యీ సతతహరిత పాటని ఇక్కడ చూడచ్చు!

 

కన్నడ: http://www.youtube.com/watch?v=TwKVyj9hf7k

తెలుగు: http://www.youtube.com/watch?v=GfCnYnXhyIw

హిందీ: http://www.youtube.com/watch?v=knPnX5G3PAU

 

1977: తెలుగు సినీ రంగం ఎన్నో మలుపులు తిరిగిన సంవత్సరం. అడవిరాముడు తో అన్నగారు తన మాస్ ఇమేజ్ ని సోషల్ సినిమాలలో సుస్థాపితం చేసుకుంటే, వేటూరి ఒక ప్రభంజనం లా చెలరేగి, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ…”, “అమ్మ తోడు, అబ్బ తోడు, నీ తోడు, నా తోడు…” లాంటి లిరిక్స్ తో, ఒక కొత్త మాస్ తెలుగు పాటకి శ్రీకారం చుడితే, తన లేత గళంతో అప్పటికే అందరినీ అలరిస్తున్న బాలూ, తన స్వరవైవిధ్యంతో అన్ని వర్గాల శ్రోతల గుండెల్లో తిష్ఠ వేసుకున్న సంవత్సరం. అదే సంవత్సరంలో నవతా వారు నిర్మించిన “పంతులమ్మ” చిత్రం లోని పాటలు, అటు సాహిత్యపరం గానూ, ఇటు సంగీత పరంగానూ అనేక ప్రశంశలందుకున్నాయి.

 

రాజన్-నాగేంద్రలకు ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారం తో పాటు, వేటూరి “మానస వీణా….” మధుగీతానికి కూడా ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందించాయి ఈ సినిమా పాటలు. యాధృచ్చికమో, సాంగత్య బలమో తెలియదు కానీ, రాజన్-నాగేంద్రలు స్వరపరచిన మెలోడీలకి, వేటూరి పేర్చిన మాటలతో మరపురాని మధురగీతాల్లా రూపు దిద్దుకొని, ఒకరినొకరు మరింత ప్రకాశింపజేసేందుకు పూనుకున్నారా అనిపించక తప్పదు.

“ఎరిగిన వారికి ఎదలో ఉన్నాదు..

ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు…

శబరీ ఎంగిలి గంగ తానమాడిన పేరు…

హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు..

మనసెరిగిన వాడు మా దేవుడు .. శ్రీ రాముడు

మధుర మధుర తర శుభ నాముడు … గుణ ధాముడు “

 

త్యాగయ్య తరవాత రామభక్తిని అంత అందంగా, అంత సరళంగా వర్ణించటం, వేటూరి వారికే సాధ్యమేమో అనిపిస్తుంది ఈ పాట వింటుంటే. ఎప్పటిలా కన్నడ పాటనుండి కాకుండా, నేరుగా తెలుగు పాటకే బాణీ కట్టారనుకుంటా, అద్భుత:!

 

“ఏ రాగమో ఏమో మన అనురాగం..వలపు వసంతాన హృదయ పరాగం..

ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాల దశదిశంతాల సుమ సుగంధాల…భ్రమరనాదాల కుసుమించు నీ అందమే

విరిసింది అరవిందమై..కురిసింది మకరందమై..

 

మానసవీణా మధుగీతం…మన సంసారం సంగీతం”

 

మన సంసారాలలో ఉన్న సంగీతసారాన్ని ఇంత అందంగా ఆవిష్కరించిన వేటూరి, రాజన్-నాగేంద్రలకు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవలసిందే!

 

http://www.youtube.com/watch?v=5HPwgaRoV8w

 

ఇక్కడ మన గాన గాంధర్వుడి గురించి కూడా కొంత చెప్పుకోవాలి. “ఏ దివిలో విరిసిన పారిజాతమో” లాంటి మంచి మెలోడీ పాటలు అప్పటికే ఒకటీ అరా పాడి ఉన్నా, ఇంకా తన ప్రతిభకు తగ్గ గుర్తింపు అతడికి దక్కలేదు. రాజన్-నాగేంద్రలు కట్టిన బాణీలతో పాడిన బాలూ పాటలకు అవార్డులు రాకపోయినా, చిరకాలం మన మదిలో నిలచిపోయే మంచి మెలోడీ పాటలుగా మాత్రం అతడి ఖాతాలో జమైపోయాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని, బాలూ పాడిన అన్ని వేల పాటలలో, మంచి మెలోడీ పాటలు, గబుక్కున గుర్తుకొచ్చేవాటిల్లో చాలా వరకూ డెభ్భైల్లో వచ్చినవే. బాలూ-వేటూరి-రాజన్-నాగేంద్ర కాంబో పాటలు, ఈ కోవలో కొచ్చేవే.

 

“సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటే నీవే, ఎన్నెల్లు తేవే, ఎద మీటి పోవే…”

ఇది మొదట కన్నడలో కట్టిన బాణీనే. కన్నడలో య.స్.జానకి పాడిన పాటని తెలుగులో బాలూ చేత పాడించటం ఒక విశేషం. అప్పటికి, అనుభవంలో చిన్నవాడైనా, బాలూ అంత చక్కగానూ తెలుగులో పాడారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=R58a5Ht4-Ok

తెలుగు: http://www.youtube.com/watch?v=RxF-jon6LNg

 

“మల్లెలు పూసే, వెన్నెల కాసే, ఈ రేయి సాక్షిగా” – ఇంకొక “మధ్యతరగతి మెలోడీ”, కన్నడ, తెలుగు భాషలలో బాలునే పాడారు.

 

“మల్లె తీగ వాడి పోగా, మరల పూలు పూయునా?” – ఈ పాటని కన్నడలో పి.బి.శ్రీనివాస్ పాడితే, తెలుగులో బాలునే. పెద్దాయనకి క్షమాపణలతో, నాకు బాలూ వర్షన్ ఈ రెంటిలోను బాగుందనిపిస్తుంది.

 

“వీణ వేణువైన మధురిమ కన్నావా…” హిందోళంలో ఇంత మెలోడీ ఉన్న డ్యూయెట్ దీని తరవాత మరొకటి రాలేదేమో! కన్నడలో మొదట వచ్చిన ఈ పాట, తరువాత తెలుగులోనూ, తమిళంలో కూడా వచ్చి, అందరినీ డోలలూగించింది. ఇంత హాయిగా సాగిపోయే ఈ మెలోడీని ఇప్పటికి కూడా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంతలా స్వరపరిచారు ఈ సంగీత ద్వయం! డ్యూయెట్ గా సాగే ఈ పాట తమిళం లో మాత్రం సోలోగా జానకి గారి చేతే పాడించారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=qyDb7bag9YI

తెలుగు: http://www.youtube.com/watch?v=QebPpYEBJ-w

తమిళం: http://www.youtube.com/watch?v=hd5NfjYfD1Y

ఆ తరువాత వచ్చిన “నాగమల్లివో…తీగ మల్లివో” అనే మరో అందమైన మెలోడీతో ఎనభైల్లోకి అడుగు పెట్టారు రాజన్-నాగేంద్రలు. “ఆకాశం నీ హద్దు రా…అవకాశం వదలద్దురా” అంటూ బీట్ పాట ఇచ్చినా, అందులో కూడా, తమ బ్రాండు మెలోడీని జొప్పించి, తమ ముద్ర మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నారు వీరు.

వరుసగా ఇన్ని పాటల గురించి చెప్పుకున్నాం కదా అని, ఆ సినిమాలు వెళ్ళ మీద లెక్కెట్టుకుంటే, ఒక్క చెయ్యి సరిపోతుంది. పూజ, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, నాగమల్లి, ఇంతే!

 

అంత తక్కువగా అవకాశాలు లభించినా వీరి పాటలు ఇలా గుర్తుండి పోవటానికి కారణం, అది వారి పాటల్లో స్వరస్వరానా ఇంకిపోయున్న మెలోడీనే. అలా అని, వీరు అన్నీ గుర్తుండిపోయే పాటలే చేసారని కాదు. వీరు వందకు పైబడి కన్నడ చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చారు. కానీ మన తెలుగు సినిమాల వద్దకు వచ్చేసరికి, వారి వంద చిత్రాల సంగీత సారాన్ని ఈ అరడజను చిత్రాలలో పొందుపరిచి ఇచ్చేశారని అనిపిస్తుంది! వీటికి తోడు, వేటూరి వారి సినీప్రస్థానప్రారంభం, బాలూ పతాకస్థాయిని చేర్కొనే దిశలో ఉండటం కూడా వారి పాటలను అజరామరంగా ఉండటానికి దోహద పడ్డాయనిపిస్తుంది.

 

ఎనభైలలో కూడా వీరు జంధ్యాల వారికీ, మరి కొద్ది దర్శకుల సినిమాలకీ సంగీతాన్ని అందించారు. “నాలుగు స్తంభాలాట” చిత్రం లోని ఈ సెన్సేషనల్ పాట రెండు సార్లు తెలుగులో రావటమే కాకుండా, హిందీలో కూడా ఒక పదేళ్ళ తరవాత స్వేచ్ఛగా వాడుకున్నారు. “బయలు దారి” అనే 1978 లో విడుదలైన కన్నడ చిత్రానికి కట్టిన ఈ బాణీ, “కనసలూ నీనె…మనసులూ నీనె” అనే పల్లవితో మొదలవుతుంది. దీని తెలుగు అనువాదం “కలలో నీవె..మనసులో నీవే” అని. ఐదేళ్ళ తరవాత 1982 లో,  జంధ్యాల గారి చిత్రం “నాలుగు స్థంభాలాట”కి, వేటూరి ఆ బాణీ విని వ్రాసిన పాట ఇది!

 

“చినుకులా రాలి

నదులుగా సాగి

వరదలై పోయి

కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ

నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరచి పోబోకుమా మమత నీవే సుమా!”

 

ఈ పాట వింటున్నప్పుడల్లా ఎదో ఒక ప్రవాహంలో కొట్టుకు పోతున్నటువంటి అనుభూతి కలుగుతుంది నాకు. ఆ పాట ఎంత “ఎవరగ్రీన్” అంటే, దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత అదే లిరిక్స్ తో “అహ నా పెళ్ళంట” అనే సినిమాకి రఘు కుంచె దానిని రీమిక్స్ చేసి మన కందించారు. హిందీలో మెలోడీ కింగ్స్ నదీం-శ్రావణ్ లు కూడా ఇదే బాణీని యధాతధంగా “ఐసి దీవానగీ…దేఖి నహీ కహీ” అని వాడుకున్నారు.

కన్నడ: http://www.youtube.com/watch?v=y1ntRcP_et4

తెలుగు: http://www.youtube.com/watch?v=2Tw7v5R2700

హిందీ: http://www.youtube.com/watch?v=m-vIYe_KY34

తెలుగు2: http://www.youtube.com/watch?v=_wbYsNwR4IU

 

ఈ సంగీత సోదరుల్లో చిన్నవాడైన నాగేంద్రగారు 2000 సంవత్సరంలో పరమపదించారు. వారి పాటలు మాత్రం మరెన్నో తరాల నోళ్ళలో నానుతూ ఉంటాయన్నది మాత్రం చాలా ఈజీ ప్రెడిక్షన్! కన్నడ సినీ రంగంలో అగ్ర సంగీత దర్శకులుగా తమ పేరును సుస్థిరపరుచుకున్న వీరు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పైన చిత్రీకరించిన “గంధద గుడి” అనే చిత్రం లోని ఈ టైటిల్ సాంగ్ ను గుర్తుకుచేసుకుంటూ ముగిస్తున్నాను.

 

http://www.youtube.com/watch?v=d4vqbRonJgU

 

 

 

 

రెహ్మాన్ తుఝే సలాం!

AR-Rahman_1290837c

ఓ జనవరి మాసంలో, కాలేజి హాస్టల్లో, బయట కొంకర్లు పోయే చలినుండి తప్పించుకొనే ప్రయత్నంలో, రజాయి క్రింద పూర్తిగా దూరిపోయి నిద్ర పోతున్న ఓ ఉదయాన, హటాత్తుగా, నా రూం గోడలు కంపించటం ప్రారంభించాయి. విపరీతమైన “బేస్” తో, హార్డ్ రాక్ మెటల్ మ్యూజిక్ పెట్టి నన్ను తెగ చికాకు పెట్టే వింగ్ చివరి పామ్ గాడి పనయ్యుంటుందని ఊహించి, రజాయిని ఇంకా గట్టిగా కాళ్ళతో నొక్కి పట్టి బిగించా. పాట మొదలయ్యింది.

.

“కొంజెం నిళవు… కొంజెం నెరుప్పు…ఒండ్రాయి సీంతాల్ ఎందం దేహం..” ఒక్క సారి నిద్ర వదిలిపోయింది. ఎంత మంది తమిళులతో సావాసం చేసినా, అంతుబట్టని ఆ భాషను విసుక్కుంటూనే చెవులను రిక్కించా. మన పాటలలో పెద్దగా వినపడని ఏవో శబ్దాలతో నేపథ్య సంగీతం హోరెత్తిస్తోంది.

“కొంజెం నంజు…కొంజెం అముతం…కొంజెం మిరుగం..కొంజెం కడువల్…” ఆ బీట్ కి ఇంకా ఆగలేక రజాయి పూర్తిగా లాగి పారేశా. “చంద్రలేఖా……”, గబుక్కున మంచం మీద నుంచి దూకి, రూం డోర్ తీసి ఆ శబ్దం వస్తున్న దిశ వైపు వడిగా నడిచా. వింగ్ చివరి పామ్ గాడే! వాడి లైఫ్ లో, ఇంగ్లీషు పాటలు తప్పించి ఇంకే భాషా సంగీతం వినటం నేను చూడలేదు!
వాడి రూమ్ తలుపు నెమ్మదిగా నెట్టి లోపలికి తొంగి చుస్తే, అయిదారుగురు “ఛోమ్స్” (మా కాలేజి లింగోలో నార్త్ ఇండియన్స్ ని సంబోధించే తీరు), గాలి గిటార్లు కొడుతూ తన్మయత్వంతో ఊగిపోతున్నారు. వాళ్లనలాగే చూస్తూ పాట పుర్తయ్యేవరకూ ఆగి లోపలికెళ్ళా. అదేదీ కొత్త రాక్ బ్యాండ్ కాదు, “తిరుడా తిరుడా” అనే తమిళ్ సినిమాలో, రహ్మాన్ పాటని తెలిసి విస్తూపోయా. భాష ఏ మాత్రం తెలియని జనాలని కుడా తన సంగీతంతో ఉర్రూతలూగించగలిగిన ఈ మాంత్రికుడితో ఒక సుదీర్ఘప్రయాణం మొదలవ్వబోతోందన్న విషయం, అప్పట్లో తట్టలా.

“రోజా” చిత్రం తో అప్పటికే పరిచయమైన రెహ్మాన్ అంటే ఒక రకమైన నిరసన భావం ఉండేది. దానికి కారణం, ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు నే.  రోజా పాటలు దక్షిణభారతమంతా మారుమోగిపోతున్న సమయంలో, “రెహ్మాన్ బాగా టాలెన్టెడ్. క్రొద్ది రోజులలో నే ఇళయరాజా ని మించిపోతాడు” అన్న అతగాడి మాటలు చదివి  నాకు చిరాకు తో మిళితమైన ఆవేశం వచ్చింది. అప్పటి వరకూ వచ్చిన మణిరత్నం సినిమాలన్నిటికీ అద్భుతమైన సంగీతాన్ని అందించిన రాజా ని, కేవలం ఒక్క సినిమా కి పాటలు కొట్టిన రెహ్మాన్ తో పోల్చటమే కాకుండా, అతడిని దాటి వెళ్తాడు అనేసరికి, రాజా వీరాభిమనినైన నాకు కాలదు, మరీ!

కానీ, ఒక ఆర్టిస్టు లోని ప్రతిభను అంత లోతుగా గుర్తించి, ఇంకా ఏమీ సాధించని ఆ జూనియర్ మీద అంత ధైర్యం గా జోస్యం చెప్పగలగటం, మణిరత్నం యొక్క గొప్పతనం అని నాకర్ధమయ్యింది, నా 20/20 వెనకచూపుతోనే.

“తిరుడా తిరుడా” పాటలలో రెహ్మాన్ చేసిన పెద్ద ప్రయోగం, పరిచయమున్న గొంతులను (మనోను మినహాయించి) ఏ పాటలకూ వాడకపోవటం. ఆ ప్రయోగం, మున్ముందు, అగ్ర సంగీత దర్శకులలో  రెహ్మాన్ యొక్క స్థానాన్ని మరింత పటిష్టపరుస్తుందన్న విషయం, బహుశా అతడు కుడా ఊహించిఉండకపోవచ్చునేమో! అతని “చలవ” వల్లనే, చాలా మందికి ఇప్పటికీ ఆ పాటలు పాడిన గాయనీ గాయకుల పేర్లు తెలియవు. ఆ పాటలన్నీ రెహ్మాన్ పాటలు! అంతవరకూ పాటలన్నీ చాలా వరకూ వాటిని పాడిన వారి గళాలతో తో ముడిపెట్టి గుర్తించేవారు.

రెహ్మాన్ తెలుగులో ఇప్పటి వరకూ డైరెక్టుగా చేసిన సినిమాల్లోని పాటలేవీ అంత గుర్తుపెట్టుకోదగ్గవి కావు. “సూపర్ పోలిస్”, “గ్యాంగ్ మాస్టర్” నించి రెండేళ్ళ క్రితం విడుదలైన “కొమరం పులి” వరకూ ఏవో ఒకటీ, అరా జనాదరణ పొందినా, తమిళం లో, హిందీలో చూపించిన చిత్తశుద్ది తెలుగులో చూపించలేదేమోనన్న అనుమానం రాక తప్పదు, కారణాలేవైనా. అతడి డబ్బింగు పాటలు మాత్రం, ఆ లిరిక్స్ ఎంత అతకనివైనా, విపరీతమైన జనాదరణ పొందాయి. జంటిల్మెన్ చికుబుకులూ, ఇండియన్ టెలిఫోన్ ధ్వనిలో నవ్వటాలూ, ప్రేమికుడు పేట ర్యాప్ లు, ప్రేమ దేశం ముస్తఫ్ఫాలూ, ఇలా సరదా పాటలతో నా రెండేళ్ళ జీవితం గడచిపోయింది.  మణిరత్నంతో చేసిన బోంబే పాటలు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా రెహ్మాన్ లోని దాగున్న ఆ

“జీనియస్” ని, ఛాయామాత్రంగానైనా చూపించాయి.

“మెరుపు కలలు” పాటలు మార్కెట్ లోకి విడుదలైనంతనే వెళ్లి క్యాసెట్ కొనుకొచ్చి పాటలన్నీ ఒకసారి వినేశా. ఏ ఒక్కటీ నచ్చలేదు. అప్పటికీ రాజా పిచ్చ వదలని నేను, అదే సమయం లో విడుదలైన “చిన్నబ్బాయి” పాటల క్యాసెట్ కుడా కొన్నా. విన్న వెంటనే, ఒకటి రెండు పాటలు నోట్లో ఆడటం ప్రారంభించాయి. “ఎంతైనా రాజా రాజానే” అనుకొని తృప్తిపడిపోయి, ఆ రెండూ పక్కన పడేశా. కానీ ఆ సమయంలో బెంగుళూరులో ఉంటున్న నాకు, ఎక్కడికి వెళ్ళినా ఆ “మెరుపు కలలు” పాటలే తమిళం లో వినిపించేవి. విన్న ప్రతిసారీ అంతకు మునుపు కంటే ఇంకా ఎక్కువగా నచ్చటం ప్రారంభించాయి. ఆ పాటలు ఆ తరువాత ఎన్ని వందల సార్లు విన్నానో నాకు గుర్తు లేదు. కానీ రెహ్మాన్ సంగీతంలో ఒక నిశ్చితమైన మార్పుని గమనించింది మాత్రం ఈ సినిమా పాటలతోనే! ఆ పాటల తరువాత అతని ఆల్బమ్స్ అన్నిటిలోనూ దాదాపుగా అదే వైఖరి నాకు కనిపించింది. చాలా పాటలు విన్న వెంటనే నచ్చెయ్యవు; కొద్ది సార్లు విన్న తరువాత మాత్రం ఆ పాటలను వదలిపెట్టలేం; ఎన్నో ఏళ్ళు వెంటాడతాయి. “వెన్నెలవే వెన్నలవే”, “అపరంజి మదనుడే, అనువైన సఖుడులే” అవే కోవలోకొస్తాయి.

అదే సమయంలో నేను అమెరికా వచ్చెయ్యటం జరిగింది. ఎన్నో సార్లు “అపరంజి మదనుడే” అని పాడుకొని, “ఆహా ఎంత మధురమైన  ప్రేమ గీతం! ఒక ప్రియురాలు తన ప్రియుడిని ఎంత చక్కగా వర్ణిస్తోంది” అని నా మందమతి మురిసిపోయేది, ఆ తరువాత వచ్చే లిరిక్స్ ఏమీ పెద్దగా అర్థం కాకపోయినా. అప్పటికే రంగీలా పాటలతో ముదిరిపోయిన నా రెహ్మాన్ పిచ్చిని గుర్తించిన నా స్నేహితురాలొకావిడ, “సప్నే” క్యాసెట్ ను నాకు ఇండియా నించి పంపించింది.

మొదటి పాట: “రోషన్ హుయీ రాత్, ఓ ఆస్మా సే జమీ పె ఆయా.. రోషన్ హుయీ రాత్, మరియం కా బేటా ముహొబ్బత్ కా సందేస్ లాయా”. ఆ క్షణంలో నాకు రెహ్మాన్ తెలుగు పాటంటే కలిగిన విరక్తి, నా అభిమాన గీత రచయిత వేటూరి చేసిన అరాచకం పైన నాకు కలిగిన ఆగ్రహం, నన్ను పూర్తిగా రెహ్మాన్ హిందీ పాటల వైపుకి త్రోసేసాయి. ఎంతగా అంటే, “విశ్వవిధాత” అనే హిందీ సినిమాకి రెహ్మాన్ సంగీతం అందించాడని తెలిసి, ఒక డెభ్భై అయిదు మైళ్ళు, ఆదివారం రాత్రి డ్రైవ్ చేసుకెళ్ళి, క్యాసెట్ కొనుక్కొని వినేంతగా!

అదే సంవత్సరం విడుదలైన “ఇరువర్” లోని “శశివదనే శశివదనే, స్వరనీలాంబరి నీవా”, రెహ్మాన్ సంగీతంలోని ఒక కొత్త పార్శ్వాన్ని నాకు పరిచయం చేసింది. “ఓ చెలియా నా ప్రియ సఖియా” లాంటి పాటలు అడపా దడపా రెహ్మాన్ సంగీతంలో వినిపించినా, ఆతని పాటల్లో దాగున్న కర్నాటక రాగాల పోకడల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. “ఇద్దరు” సినిమాలోని ఆ పాటలో మాత్రం ఆ రాగాలతో ఒక కొత్త ప్రయోగమే చేసాడు. ఆ పాటలో  వినిపించిన రెండు మూడు రాగాలు సాంప్రదాయ రాగమాలిక లాగా కట్టలేదు. మగ గొంతుక ఒక రాగం, ఆడ గొంతుక దాదాపుగా అదే రాగమైనా, కొద్ది పాటి తేడాలు, చరణం కొంత భాగం ఇంకొక రాగం, ఇలా అన్నమాట. శాస్త్రీయ సంగీత నేపథ్యం పెద్దగా లేకపోవటం వల్ల అవేమిటోకొన్ని ఏళ్ల తరవాత గానీ గుర్తు పట్టలేదు, అదీ గూగుల్ దయ వల్లే. కానీ రెహ్మాన్ ఈ రాగాల తో చేస్తున్న విన్యాసాలను కొంచెం జాగర్తగా గమనించాలి, ఇక ముందు, అని మాత్రం అనిపించింది, ఈ పాట తరువాతనే.

రెహ్మాన్, మణిరత్నం కలిసినప్పుడల్లా మాత్రం ఒక సంచలనమే సృష్టించారు. “దిల్ సే” ఆల్బం రెహ్మాన్ ని జాతీయస్థాయి లోని అగ్రసంగీత దర్శకుళ్ళలో చేర్చేసింది. సుఖవిందర్ సింగ్ “ఛయ్య ఛయ్య” తో దేశాన్ని ఒక ఊపు ఊపితే, “ఏ అజ్నబీ”, “జియా జలే, జాన్ జలే”, “దిల్ సే రే” పాటలు ఇప్పటికీ పాటల రియాలిటీ షోలలో తరచుగా వినపడుతూనే ఉంటాయి. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా ఈ పాటలు సూపర్ హిట్టై, మన భారతదేశమే గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన మణిరత్నం ప్రకాశాన్ని కూడా, రెహ్మాన్ వెలుగులో కప్పేశాయి. ఒక దక్షిణభారతీయుడిగా, ఒక్కసారిగా నాకు చెప్పలేని, ఆనందం, గర్వం కలిగింది, ఈ పాటలు దేశమంతటా ప్రాచుర్యం పొందగానే. ఒక ఘంటసాల, ఒక ఇళయరాజా దాటుకెళ్ళలేని ఉత్తర, దక్షిణదేశాల మధ్య ఉన్న అడ్డుగోడ అవలీలగా దాటేసి,  “యూనివర్సల్” ఆమోదాన్ని ఇతగాడు సాధించగలిగాడన్న ఆనందం అసలు కారణమేమో!

స్వతంత్ర భారతం యాభై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రెహ్మాన్ “వందేమాతరం” ఆల్బం చెయ్యబోతున్నాడన్న వార్త వినగానే, నా ఆశలు ఆకాశాన్నంటాయి. ఎదో, ఒక్క రోజు పని, మీద న్యూయార్క్ వెళ్ళాల్సివచ్చినప్పుడు, అక్కడ చుడాల్సినవి ఎన్నో ఉన్నా, తిరుగు  ఫ్లైటు ఎక్కటానికి ముందు మిగిలున్న నాలుగు గంటలు మాత్రం నేను ఒకే పనికి అంకితం చెయ్యాలని నిశ్చయించేసుకొన్నా.  “జాక్సన్ హైట్స్” కి వెళ్లి అక్కడ ఆ రోజే విడుదలైన ఆ ఆల్బం కొందామని. సి.డి. కొన్నప్పటినుంచీ ఎప్పుడెప్పుడు విందామా అని తెగ ఆరాటపడిపోయా. పిట్స్బర్గ్ లో ఫ్లైట్ లాండ్ అయిన ఇరవై నిమిషాలకి ఆ అవకాశం దొరికింది.

కారులోని ప్లేయర్ లోకి, సి.డి.ని తోసేసి, హైవే ఎక్కంగానే సిస్టం ఆన్ చేశా. ఆరు స్పీకర్లనించి మొదలయ్యింది, “మా తుఝే సలాం” అంటూ హై పిచ్ లో రెహ్మాన్ పాట.  ఒళ్ళు ఒక్కసారి గుగుర్పొడిచి శరీరంలో  ఒక కంపన మొదలయ్యింది. ఒక రకమైన ఆవేశంతో, ఒళ్ళు తూలిపోతూ, కారు వశం తప్పి ప్రమాదం జరుగుతుందేమో అనిపించేంతలా, కదిలించేసింది, ఆ పాట. “వందేమాతరం” అన్న రెహ్మాన్ చేసిన నినాదం తలుచుకుంటూ౦టే ఇప్పటికీ అది నా చెవుల్లో, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఏ మూలో, నిస్తేజంగా పడిఉన్న దేశభక్తిని ఒక్కసారి ఉవ్వెత్తున లేపినందుకేనేమో, ఆ పాట అంటే అంత మోహం!

“ఇస్క్”బినా అంటూ మొదటి పాటతో బాగా ఇరిటేట్ చేసినా, “తాల్” చిత్రంలో రెహ్మాన్ పాటలలో చూపించిన నేర్పు, వైవిధ్యం, సామాన్యమైనది కాదు. “రాంఝణావే, సోణియావే, మాహియావే” అంటూ పక్కా పంజాబీ పాట, “కరియేనా, కరియేనా కోయి వాదా కిసిసే కరియేనా” అంటూ ఒక యూ.పి. పల్లె పాట, సింఫనీ స్టైల్లో టైటిల్ పాట ఇలా, ఏ పాట కా పాటే అద్భుతంగా స్వరపరిచారు, రెహ్మాన్. ఈ ఆల్బమ్ తో ఇక హిందీలో కూడా ఎవ్వరూ పట్టించుకోనంత (చేరుకొనే శక్తి లేదని గ్రహించుకొని) ఎత్తుకు ఎదిగిపోయాడు, అతడు.

ఇక “లగాన్” పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ సినిమా ఆస్కర్ అవార్డులకి ఎంపిక అవ్వటంతో, రెహ్మాన్ పరిచయం బయట ప్రపంచానికి కూడా తెలిసిపోయింది. ఆండ్రూ ల్లాయాడ్ వెబ్బర్ సారధ్యంలో, “బోంబే డ్రీమ్స్”, మ్యూజికల్ కి రహ్మాన్ పెద్ద కష్టపడకుండా సంగీతం అందించి, అంతర్జాతీయ మ్యూజిక్ సీన్ లో తనకొక ఐడెంటిటీ ని ఏర్పర్చుకున్నాడు. ఆఫీసు పని మీద లండన్ వెళ్ళిన నేను, ఆ షో ముందరి వరస సీటు కోసం ఎక్కువ ధర చెల్లించి, నా వంతు దక్షిణని నేను సమర్పించుకున్నాను.
“స్వదేశ్” సినిమాలోని “యే జొ దేశ్ హై తేరా..”, ఇంకొక వీడని నీడ లాగా వెంటాడే పాట.

నేను అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చిన ఆల్బం ఇది. ఈ పాట వింటున్నప్పుడల్లా, నా దేశ పౌరసత్వాన్ని కోల్పోబోతున్నానే, అని గుండె ఎక్కడో కలుక్కుమనేది. ఆ పాట నా నిర్ణయాన్ని మార్చలేదు కానీ,  నా భారతీయ ఉనికికి నేను మరింత కట్టుబడి ఉండటానికి ఎంతో కొంత దోహదపడింది. అలాగే “లెజెండ్ అఫ్ భగత్ సింగ్” లోని “సర్ఫరోష్ కి తమన్నా అబ్ హమరే దిల్ మే హై!” తీసుకున్నా, అదే సినిమాలోని “మాయే..రంగ్ దే బసంతి ఛోలా”, “రంగ్ దే బసంతి”  సినిమాటైటిల్ సాంగ్ తీసుకున్నా, ఆ పాటలు మనలో కలగజేసే అనుభూతులతో, రోమాలు నిక్కబోడుచుకోక మానవు!

భక్తి పాటలు తీసుకున్నా కూడా, రెహ్మాన్ చాలా గుర్తుండిపోయేవి అందించారు. సూఫీ శైలిలో, “పియా హాజీ అలీ”, “ఖ్వాజా మేరె ఖ్వాజా”, భజన ఫక్కీలో “ఓ పాలన్ హారే”, “మన్ మోహనా” అని శాస్త్రీయంగానూ తన ముద్ర వేస్తూనే అందరి ఆమోదాన్ని పొందగలిగారు. శాస్త్రీయ సంగీత రాగాలతో రెహ్మాన్ చేసిన ప్రయోగాలు కుడా కోకొల్లలు. “మామ” రాగాలకు ఎంతో నిబద్ధుడై తన పాటలను స్వరపరిస్తే, “రాజా” అదే రాగాలను జనాలకు బాగా తాకే రీతిలో సులువైన బాణీలు కట్టి తన వైదుష్యాన్ని ప్రదర్శించారు. రెహ్మాన్ ఆ రాగాలకే క్లిష్ఠతరమైన బాణీలు తనదైన శైలిలో కూర్చటంతో, ఎంతో పరిజ్ఞానం ఉంటే గానీ ఆ ప్రయోగాలని గుర్తించటం కష్టం. నేను రెహ్మాన్ ఆల్బమ్లు విడుదల అవ్వంగానే మన తమిళ సోదరులు ఆ పాటలలోని రాగాలను చీల్చి, విశ్లేషించి వ్రాసే బ్లాగుల కోసం ఎదురు చూసేవాడిని.
ఎంత చెప్పుకున్నా తరగదు అనిపించేలా ఉన్న  రెహ్మాన్ ఖజానా లోని పాటలను నిజంగా లెక్కెట్టి చూసి, తన సమకాలీన దర్శకులతో పోలిస్తే, ఆ సంఖ్య తక్కువే. “క్వాంటిటీ” కంటే “క్వాలిటీ” ముఖ్యమనుకొని, ప్రతి పాటనూ ఎంతో ప్రయాసతో శ్రద్ధగా చెక్కుతూ ఎక్కువ సమయం తీసుకోవటం ఒక కారణమైతే, అన్ని చెత్త సినిమాలకూ తన సంగీతాన్ని అందించటం ఇష్టం లేక, తన పని కి ఒక “ప్రీమియం” ఛార్జి చేస్తూ, అనేక “పాట్ బాయిలర్” సినిమాలకు అందుబాటు లో లేకుండా ఉండటం మరొక కారణం. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సందర్భంగా వ్రాసిన తన బ్లాగులో రాం గోపాల్ వర్మ, రెహ్మాన్ పని తీరుపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దానిలో నాకు బాగా గుర్తుండి పోయిన వాక్యాన్ని ఇక్కడ యధాతధంగా కోట్ చేస్తున్నాను.
“I’ve decided that whatever goes from here has to be good”. He said it with neither arrogance nor extreme confidence.”

రెహ్మాన్ సంగీతం, కొంచెం ఎక్స్త్రాపోలేట్ చేస్తే అతని వ్యక్తిత్వం వెనకనున్న ఫిలాసఫీ, పైనున్న ఆ ఒక్క వాక్యం లో ప్రకటితమవుతుందనిపిస్తుంది.

నేను ఇంతగా అభిమానించే రెహ్మాన్ చికాగో కాన్సర్ట్ ఇవ్వటానికి వస్తున్నాడని తెలియంగానే, నేనే కాకుండా నాకు తెలిసిన వారందరి చేతా టికెట్లు కొనిపించి తీసుకెళ్లా. 2007 లో జరిగిన ఈ ప్రోగ్రాం, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పుడే విడుదలైన “గురు” సినిమా లోని “జాగే హై దేర్ తక్ హమే..కుచ్ ఔర్ సోనే దో”, ఒక శ్లోకం స్టైల్లో సాగే పాటతో ప్రారంభమైన ఆ ప్రోగ్రాం, “వందేమాతరం” తో పతాకస్థాయికి చేరింది. కార్యక్రమం ముగిసింది అని తెలిసినా కూడా, కొద్ది నిమిషాల పాటు ఎవ్వరూ కదలకుండా మౌనంగా ఉండిపోయారు. మరికొద్ది నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగి పోయిన ఆ స్టేడియం నించి బయటపడేడప్పుడు కూడా, ఎదో అసంతృప్తి, అప్పుడే అయిపోయిందే అని.

“జై హో!” – ఆస్కార్ వచ్చినా, విమర్శలు ఎన్నో, “అసలా స్థాయి పాటేనా అది!” అని. తొంభై తొమ్మిది పరుగులు ఎంతో లాఘవంగా సాధించిన బ్యాట్స్మన్, అ వందో పరుగుని, సుందరమైన స్క్వేర్ కట్ ద్వారా సాధించాడా, లేక, స్లిప్పుల లోంచి నిక్ చేసి కొట్టాడా అని విశ్లేషణ చేస్తూ కూర్చుంటే, పాయింట్ పూర్తిగా మిస్ అయినట్టే. ఎన్నో ఏళ్ళు అద్భుతమైన సంగీతాన్ని అందించటం వల్లే రెహ్మాన్ కి ఒక ఆస్కార్ స్థాయి సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది, దాని కోసం స్వరపరచిన పాటలకూ, ఆ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది. కాబట్టి, “నిక్” చేసిన వందో పరుగు లాంటి “జైహో” ని గుర్తించి అవార్డు ఇచ్చినా, నేను ఆ అవార్డుకు పాత్రుడైన ఒక గొప్ప సంగీతకారుడికిచ్చి  గౌరవించారనే సరిపెట్టుకుంటాను.

గత నాలుగైదేళ్ళలో, రెహ్మాన్ చేసిన చాలా ఆల్బమ్లు నాకు నచ్చలేదు. “యవరాజ్”, “గజని”, “బ్లూ”, “రావణ్”, “పులి”, “రోబో”, “ఝూటా హీ సహీ”, “జబ్ తక్ హైన్ జాన్” లాంటివన్న మాట. కానీ మధ్యలో ఒకటి, రెండు మెరుపు తీగలు, “ఏ మాయ చేశావే!”, “ఢిల్లీ-6” లాంటివి వచ్చి, “లేదు, పాత రెహ్మాన్ ఇంకా మిగిలున్నాడు” అని గుర్తు చేస్తాయి.  ఎందుకిలా అని ఆలోచించినప్పుడు నన్ను సంతృప్తిపరచిన సమాధానం, మన సినీ సంగీతంలో ఎక్కాల్సిన శిఖరాలన్నీ ఎక్కేసి, ఒక రకంగా ఒంటరి వాడిపోయిన రెహ్మాన్ ని, మోటివేట్ చేసే సినిమాలు, ఫిల్మ్ మేకర్స్ మన దేశంలో కరువై ఈ పరిస్థితి ఏర్పడిందని. ఇక ముందు ప్రపంచ సంగీత పటంలో ఇంకెన్ని విజయకేతనాలు ఎగరెయ్యనున్నాడో నేను జోస్యం చెప్పలేను గానీ, ఇంతవరకూ అందించిన తన సంగీతవర్షధార చాలు, తను నా మనసులో ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోవటానికి.

రెహ్మాన్ తుఝే సలాం!

రఫీ – ఘంటసాల: ఇద్దరూ ఇద్దరేనా?

“రఫీ, ఘంటసాల – వీళ్లిద్దరిలో నీకెవరెక్కువిష్టం?” ఇదొక క్లిష్ఠమైన ప్రశ్న. దీనికి సమాధానం గత ముప్ఫై ఏళ్లలో కనీసం మూడు నాలుగు సార్లన్నా మారింది, వాళ్ళ పాటలు పది కాలాలు అలాగే నిలబడి ఉన్నా. “నాకిద్దరూ ఇష్టమే” అని చెప్పి చల్లగా తప్పించుకోవటం ఈ మధ్య అబ్బిన డిప్లోమసీ గానీ, “అన్నీ తెలిసిన” రోజుల్లో బీభత్సం గా  వాదోపవాదాలు జరిపిన ఉదంతాలున్నాయి.

“అసలీ పోలికలెందుకు” అంటారా? ఎప్పుడో పుట్టిన బ్రాడ్ మ్యాన్ ని, సదాబాలుడైనటువంటి టెండూల్కర్ ని, పోల్చి, పోల్చి, మన సచిన్ కే ప్రధమస్థానాన్ని అంటకట్టేసి తృప్తి పడిపోయాం కదా. అలాంటప్పుడు, సమకాలీకులు అయిన ఈ ఇద్దరు మహాగాయకులను పోల్చటాన్ని ప్రశ్నించటం, కొంత వింతగానే ఉన్నా, సమాధానం మాత్రం,  వారిద్దరి పాటలను మరల గుర్తు చేసుకొని తూగిపోవటానికేనని! పన్లో పని, ఎవరు కాస్త ఎక్కువ గొప్పో తేల్చేసుకుంటే, ఓ పక్కన పడి ఉంటుంది, మళ్ళీ మనసు మారే దాకా.

తెలుగుదేశంలో పుట్టి, ఘంటసాల పాటలతో పరిచయం గురించి ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈయన పాటలు వింటూ పెరిగాం. ఆ రోజుల్లో, రేడియోలో “భూలే బిశ్రే గీత్”, ఢిల్లీ దూరదర్శన్ వారు ప్రసారం చేసే చిత్రహార్ పుణ్యమా అని అనేక హిందీ పాటలు కుడా వినే అవకాశం ఉండేది. కానీ “యోడేలే..యోడేలే యోహూ…” అంటూ పాడే కిషోర్ కుమార్ పాటలు క్యాచ్ చేసినంత త్వరగా, రఫీ పాటలు తలకెక్కేవి కావు. కటీ పతంగ్, ఆరాధనా, ఇలా రాజేష్ ఖన్నా, కిషోర్ కలయికలో వచ్చిన పాటలంటే పిచ్చ క్రేజ్ ఉండేది.

ఆ నేపధ్యంలో, ఇంజనీరింగ్ చదువుతున్న నా మావయ్య ఓ వేసవి శలవల కోసం ఇంటికి వచ్చాడు. “క్యా హువా? తేరా వాదా!” అంటూ రఫీ పాటను తను హమ్ చేస్తుంటే, నా ప్రతిభ చూపించుకోటానికి, కిషోర్ పాటలు హై వాల్యూం లో పాడేస్తూ, అతడెంత గొప్పవాడో అని, తెగ పొగిడేశాను. “ఆరాధనా పాటల్లో నీకు అన్నిటి కంటే బాగా నచ్చిన పాట ఎంటో చెప్పు” అని మావయ్య అడగటంతో, ఆలోచనలో పడిపోయా. నాకసలు “మేరె సప్నోంకి రాణీ కబ్ ఆయేగీ తు” తప్ప ఏ పాటా తెలియదు, ఆ సినిమా నుంచి. మావయ్యే ఒక క్యాసెట్ ఇచ్చి, విని, మర్నాడు చెప్పు అన్నాడు.

మరుసటి రోజు నేను గర్వంగా మా మావయ్య ముందుకొచ్చి “గున్ గునా రహే హై భవర్…ఖిల్ రహి హై కలి కలీ” అంటూ పడేశా. నీకెందుకా పాట నచ్చిందని ప్రశ్నిస్తే, “ఆ పాట వింటూ ఉంటే, నిజంగానే ఎదో తుమ్మెద మెలమెల్లగా తోటలో పువ్వుల మీద ఎగురుతున్నట్లుగా కళ్ళ ముందు కనిపించింది” అని చెప్పినట్లు గుర్తు. ఆ తరువాత అది పాడింది రఫీ అని తెలియటం, ఇంకా అనేకమైన రఫీ పాటలు విని, కేవలం కిషోర్ పాటల్నే వినాలనే యావ, తగ్గటం జరిగిపోయాయి.

రఫీ-ఘంటసాల పోలిక మాత్రం ఇంజనీరింగ్ చదువుకై పిలానీ లో ప్రవేశించిన తరువాతే మొదలయ్యింది. మా వింగ్ లో ఉన్న నార్త్ ఇండియన్లకి ఘంటసాల అంటే ఎవరో, అస్సలు తెలియకపోవటం చూసి బాధేసింది. ఘంటసాల అనే మహా గాయకుడు ఒకాయన సౌత్ లో అనేక పాటలు రఫీ కి దీటుగా, కొన్ని పాటలు రఫీ కంటే అద్భుతంగా పాడేశారని చెప్తే, అనుమాదాస్పద లుక్స్ ఇస్తూ పెదవి విరిచెయ్యటం చూసిన నాకు, ఘంటసాలని వాళ్ళ ముందు ప్రూవ్ చేసేద్దాం అని పట్టుదల పెరిగిపోయింది. ఫలితంగా ఎన్నో వాదాలు, వివాదాలు, దెప్పిపోడుపులతో, చాలా  సెమిస్టర్ల రాత్రులు గడచిపోయాయి. ఆ గిల్లికజ్జాలని ఇప్పుడు గుర్తుకు చేసుకొని నవ్వుకున్నా, ఆ పాటలు మాత్రం అలాగే గుర్తుండిపోయాయి.

సంగీత దర్శకుడు నౌషద్ తన పాటలకి హిందుస్తానీ సంగీతం లోని రాగాలను ఆధారం చేసుకొని బాణీలు కట్టేవారు. అవి పాడాలంటే రఫీ వల్లే సాధ్యం అనుకొనేవాళ్ళుట ఆ రోజుల్లో. ”బిజు బావరా” లోని ప్రతి పాటా బాగుంటుంది. అన్నిటిలోకి ప్రాచుర్యం పొందిన పాట “ఓ..దునియా కే రఖ్ వాలే”. దర్బారీ (కర్నాటక సంగీతం లో దర్బారీ కానడ) రాగంలో కట్టిన ఈ పాటని, రఫీ పదిహేను రోజుల పాటు ప్రాక్టీసు చేసిన తరువాత  కానీ రికార్డు చెయ్యలేదట. ఇది చాలా క్లిష్ఠమైన రాగం, దానికి తోడు నౌషద్ గారు దీనికి ఎనుకున్న శ్రుతి కూడా హెచ్చు గానే ఉంటుంది. ఈ పాట చివర్లో “రఖ్ వాలే” అంటూ తారాస్థాయిలో రఫీ గళం వింటుంటే, శ్రోతలుగా మనకే భయం వేస్తుంది, ఆయన గొంతు పగిలిపోతుందేమోనని.
http://www.youtube.com/watch?v=FIZ3EHG15co

మన ఉత్తర భారత మిత్రులు రఫీ గాన సౌరభాన్ని కొనియాడాలంటే విరివిగా ఉదహరించేది ఈ పాటనే. అదే రాగంలో ఘంటసాల వారు పాడిన పాట “శివశంకరి, శివానంద లహరి”, “జగదేకవీరుని కధ” నించి. కానీ ఈ అమరగాయకుని గొప్పతనం ఈ పాటలో ఏమిటంటే, ఆ రాగం లోని క్లిష్ఠతని, ఆ పాటలో ఆయన ఇటు మందర స్థాయి నించీ అటు తార స్థాయి లో స్వరాలను తాకిన రేంజ్ ని కానీ ఎక్కడా కష్టపడినట్లుగా కాకుండా అవలీలగా పాడినట్లుగా శ్రోతల అనుకొనేలా చెయ్యటమే. సినిమాలో, ఆ పాటకి పరవశించి, రాయి కరగటం అతిశయోక్తే అయినా, ఆ పాట విని ద్రవించని హృదయం ఉంటుందా?
http://www.youtube.com/watch?v=Atr2iOXvzaQ

ఈ రెండు పాటల ఆధారంగా నచ్చిన గాయకుడికి ఓటు వెయ్యమంటే మాత్రం, నా ఓటు నిస్సందేహంగా ఘంటసాల వారికే!

అలాగే తెలుగులో “కులదైవం”, హిందీలో “భాభీ” సినిమాలలో, ఇంచిమించు ఒకటే సమయంలో పాడిన, “పయనించే ఓ చిలుకా…”, “చల్..ఉడ్ జా రే పంఛీ” పాటలని తీసుకుందాం. ఈ రెండూ, హిందుస్తానీ పహాడీ రాగం ఆధారంగా కట్టిన బాణీలైనా, ఆ శాస్త్రీయ పోకడలు పెద్దగా కనపడవు. పాటలోని ఉదాస భావ వ్యక్తీకరణకే పెద్ద పీట. ఈ రెంటినీ ఒకటే లింకులో క్రింద చూడచ్చు.
http://www.youtube.com/watch?v=TvO3MYzdOqA

ఈ పాటలో ఇద్దరూ దానిలోని  మాధుర్యాన్ని చక్కగా అందిస్తూ, తమ గాత్ర మాడ్యులేషన్ ద్వారా భావాన్ని అంతే అద్భుతంగా వ్యక్త పరిచారనిపిస్తుంది. కానీ కణత మీద గన్ను పెట్టి, ఏదన్నా ఒక్క గాయకుడినే ఎంచుకోవాలంటే మటుకు, తప్పని సరి పరిస్థితుల్లో రఫీ కి నా ఓటు వేసేస్తా. పాట చివరిలోని ఆలాపనలో, ఓ పిసరంత  న్యాయం రఫీ ఎక్కువ చేశారేమోనన్న చిన్న సందేహం వల్ల.

ఒక సినిమాని, రీమేక్ చేసినప్పుడు, చాలా సార్లు సిట్యుయేషన్ ఒకటే అయినప్పటికీ, పాటలకి వేర్వేరు బాణీలు ఉంటాయి, ముఖ్యంగా సంగీత దర్శకులు వేరైనప్పుడు. “గుడిగంటలు” సినిమా లోని “జన్మమెత్తితిరా అనుభవించితిరా…”, “ఆద్మీ” సినిమా లోని “ఆజ్ పురానీ రాహోం సే..” పాటలు ఈ కోవలోకే వస్తాయి. రెంటిలోని సారూప్యం, ఆ పాటల చలనంలో కనిపిస్తుంది. కానీ, ఈ పాటల్లో కుడా భావ ప్రకటనకే ఎక్కువ ప్రాముఖ్యత కనపడుతుంది. ఎవ్వరి పాట మనల్ని ఎక్కువగా కదిలిస్తుంది అని నిజాయితీగా పరిశీలిస్తే మాత్రం మనం ఏ ఒక్క దాన్నీ ఎంచుకోలేకపోవచ్చు.

రఫీ పాట లింకు: https://www.youtube.com/watch?v=ekqWt98qaWc
ఘంటసాల పాట లింకు: https://www.youtube.com/watch?v=Lz7-toTMMQw

జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయి, తన గతంలోని  అంధకారాన్ని గుర్తు చేసుకుంటూ, చివరికి వెలుగుని చూసిన ఒక వ్యక్తి వ్యధే, ఈ పాటలో మనకు వినిపించేది. ఇద్దరి గళాలలోను ఆ పాత్ర యొక్క ఆవేదననూ, పశ్చాత్తాపాన్నీ, వెలుగు చూసిన ఆనందాన్నీ, ఒలకటాన్ని మనం గమనించవచ్చు. ఈ సారి గన్ను పెట్టినా, కాల్చుకో అని కళ్ళు మూసుకుంటానే తప్ప ఏ ఒక్కరినీ ఎంచుకోలేనేమో అనిపిస్తుంది.

వీరిద్దరి మధ్యా నా ఉహాలోకంలో చిత్రీకరించుకున్నటువంటి సంగీత సమరంలోని ఆఖరి అస్త్రం సువర్ణసుందరి సినిమా నుంచి. ఆ సినిమా పేరు వినంగానే మనకు గబుక్కున గుర్తుకు వచ్చే పాట “హాయి హాయి గా ఆమని సాగే..ఊగిపోవు మది ఉయ్యాలగా~~~~~~ జంపాలగా~~~~~~”. ఈ సినిమాని అదే పేరుతో అదే తారాగణంతో తెలుగులోనూ హిందీలోను నిర్మించటం తో పాటు, ఒకే సంగీత దర్శకుడు ఒకే బాణీని తెలుగులో ఘంటసాల, జిక్కీ, హిందీలో రఫీ, లతా లతో పాడించటంతో, ఆ ఇద్దరూ మహాగాయకుల్నీ తూచటానికి, ఇంతకన్నా మంచి అవకాశం మనకి దొరకదేమో!

కుహూ కుహూ: https://www.youtube.com/watch?v=WCRaxeEe2IU
హాయి హాయి గా: https://www.youtube.com/watch?v=O5ajXn9j1bM

సంగీత దర్శకుడు ఆదినారాయణరావుగారు, రాగమాలిక కట్టి, హంసానందీ, కానడ, జువన్ పురి, యమన్ కళ్యాణ్ లాంటి కర్నాటక, హిందుస్తానీ రాగాల సమ్మేళనంలో ఈ పాటను అజరామరంగా స్వరపరిచారు. కానీ హిందీ, తెలుగూ వర్షన్ లలో ఒక తేడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. హిందీలో, తెలుగులో కంటే కొంచెం హెచ్చు శృతిని ఎంచుకున్నారు దర్శకులు. దీనికి  కారణం, రఫీ బేస్ శృతి హెచ్చుగా ఉండటం కావచ్చు. రఫీ పాటలను మనం కనక పాడే ప్రయత్నం చేస్తే మనకే తెలిసిపోతుంది, రఫీ తారా స్థాయిని మనం అందుకోవటం కష్టమని.

ఈ పాట శాస్త్రీయసంగీతం ఆధారంగా చేసిన పాటలు పాడటంలో గల రఫీ యొక్క “లిమిటేషన్సు” ని తేటతెల్లం చేస్తుంది. ఘంటసాల వారు, ఎంతో అవలీలగా, హాయిగా, తమ స్వరలహరిలో మనను డోలలూగిస్తే, రఫీ మాత్రం చాలా కష్టపడ్డట్టుగా కనిపిస్తారు. ఇది గమనించటానికి పెద్ద సంగీతజ్ఞానం అవసరంలేదు. ఒక్క సారి కళ్ళు మూసుకొని ఆ రెండు పాటలనూ వింటే చాలు!

కానీ, వింత ఏమిటంటే, జాతీయస్థాయిలో తెలుగు పాటకు అంత గుర్తింపు రాకపోగా, రఫీకి నేషనల్ అవార్డు రావటం! ఈ ఒక్క పాట విని ఘంటసాల, రఫీలలో ఎవరు కొంచెం ఎక్కువ గొప్పో ఎంచుకోమంటే, ఒక్క క్షణం ఆలోచించకుండా ఘంటసాలకి బ్రహ్మరధం పట్టేయ్యచ్చు.

ఇప్పుడు చర్చించుకున్న నాలుగు పాటల ప్రకారం ఘంటసాలకి రఫీ కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి, ఘంటసాల వారే కొంచెం ఎక్కువ గొప్పని డిసైడ్ అయిపోదామా? మరి అక్కడే వచ్చింది అసలు చిక్కంతా!

వీటిలో చాలా పాటలు శాస్త్రీయ సంగీతానికి దగ్గరగా ఉండే పాటలు. కేవలం వీటిని బట్టి ఎవరు ఎక్కువ గొప్పో నిర్ణయించటం సబబేనా? సినిమా సంగీతంలో అత్యధిక శాతం వినపడేది లలిత సంగీతం. ఎక్కువ సంగతులూ, గమకాలూ లేకుండా, అనేక రసాలనూ, భావాలనూ తమ గాత్ర వైవిధ్యం ద్వారా పలికించటమే, ఈ సంగీతానికి కావాల్సిన ముఖ్య క్వాలిఫికేషన్. మరి ఈ కోణం నించి ఒక సారి రఫీని, ఘంటసాలని పరిశీలించినట్లైతే, పరిణామం వేరుగా ఉండచ్చేమో?

ఒక సాఫ్ట్ రొమాంటిక్ జానర్ ని గనక మనం తీసుకొంటే, రఫీని మించిన వారు లేరనిపిస్తుంది. “పుకార్ తా చాలా హు మెయిన్…”  అంటూ పట్టు లాగా జారి పోయే గళం తో పాడినా,  “దీవాన హువా బాదల్…సావన్ కి ఘటా ఛాయీ” అంటూ ఒక విరుపు విరిచినా, “చాహే ముఝె కోయి జంగ్లీ కహే…యాహూ” అంటూ ఆనందావేశంతో అరిచేసినా, “బహారోం ఫూల్ బర్సావో…మేరె మెహబూబ్ ఆయా హై” అంటూ తేనెలోలికే స్వరంతో ప్రియురాలికి స్వాగతం పలికినా, రఫీ ని మించిన సింగర్ లేడేమో అన్న అనుమారం రాక తప్పదు. ఘంటసాల వారికి రొమాంటిక్ గీతాలు లేవని కాదు, ఆ భావాలు పలకాలంటే రఫీ గారి గళానికే కొంచెం ఎక్కువ నప్పుతుందని నా నమ్మిక.

భక్తిరసాన్ని తీసుకుంటే ఘంటసాల వారిదే నిర్ద్వందంగా పై చేయి. “హే కృష్ణా ముకుందా…” అంటూ గళమెత్తి ఆ గోవిందుదిని సంబోధించినా, “నీలకంధరా దేవా..దీన బాంధవా రావా” అంటూ ఆ పరమశివుడిని బ్రతిమాలినా, “దినకరా…శుభకరా” అంటూ సూర్యభగవానుడికి స్వాగతం పలికినా, “శేషశైలావాస..శ్రీ వేంకటేశా” అంటూ శ్రీపతికి మేలుకొలుపు పాడినా, గీతాగానం చేసినా, ఆయన కలిగించే భాక్తిభావావేశం బహుశా ఇంకెవ్వరూ కలిగించలేరేమోననుకోవటం, అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

మొదట్లో చెప్పాను, ఇద్దరిలో ఎవరెక్కువ ఇష్టం అనే దానికి సమాధానం మూడు నాలుగు సార్లైనా మారిందని. దానికి కారణాన్ని కనుక పరిశీలించుకొని చూస్తే, అది మన మానసిక పరిస్థితి, జీవితం లో మనం ఉన్న మైలురాయి, ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉండవచ్చనిపిస్తుంది.

రొమాంటిక్ పాటలు మాత్రమే వినాలనిపించేటటువంటి మూడ్ లో కానీ వయస్సులో కానీ, రఫీ వైపు కొంచెం ఎక్కువ మనసు లాగినా, శాస్త్రీయ సంగీతాన్ని సినిమా సంగీతంలో వెతుక్కుందామనో, లేక భక్తి సంగీతాన్ని ఆస్వాదిద్దమానో అనిపించినప్పుడు మాత్రం ఘంటసాల వారి వైపు, మన ధ్యాస మళ్ళటం అనివార్యమనిపిస్తుంది.

ఇలా వివిధ కోణాల నించి ఈ ఇద్దరు మహాగాయకుల్నీ చూసిన తరువాత మాత్రం, నాకు లభించిన సమాధానం: “ఘంటసాల, రఫీ, ఇద్దరూ సమానమే, ఘంటసాల మన తెలుగు వాళ్లకు కొంచెం ఎక్కువ సమానం!” మరి, మీకో?

“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

Siva_3అఫ్సర్ గారు, “మీకు సినిమా సంగీతం, అదే.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు, అరవం, కరవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే…మీరు వాటి గురించి ఎందుకు రాయకూడదు,? ” అని అడిగినప్పుడు, “నేనెప్పుడూ రాయలేదండీ..అయినా ప్రయత్నిస్తాను,” అని చెప్పాను. నాలో నేను అనుకున్నాను, “నేను మెలకువగా ఉన్నంత సేపూ ఏదో ఒక సినిమా పాటని ఖూని రాగం చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి రాయలేకపోతానా,” అని.

వ్రాద్దామని కుర్చొంటే అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం ఏంటో! ఇది టి.వి లో ఎన్నో ఏళ్లుగా టెన్నిస్ చూసాం కదా, దాని పైన బుక్కు రాయటం ఏం పెద్ద పనా అని అనుకొని ప్రయత్నించటం లాంటిదని.

బుర్ర బ్లాకై పోయింది. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ పాటలు వాన తుంపర్ల లాగా ఎడతెరిపి లేకుండా కురవసాగాయి. ”నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి,” అంటూ అమరగాయకుడు ఘంటసాల వారిని తలచుకొని ముందుకు సాగుదామనీ, ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని, ఏకాగ్రతతో, కలానికి పని చెబుదామనీ, కూర్చొన్నా.

“మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నల డోలలూగెనే….కొమ్మల గువ్వలు గుస గుస మనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, నీవు వచ్చేవని,” అంటూ మంద్రస్థాయిలో మృదు మధురంగా భానుమతి గళం ఎక్కడి నించో వినిపించి ఇబ్బంది పెట్టేస్తోంది. ఒక సారి తల విదిలించుకొని, “ఫోకస్..ఫోకస్”, అని నాలో నేనే అనుకొని, కలం కదిపే లోపు, మళ్ళీ అదే గొంతు, “పిలచిన బిగువటరా? అవురవుర! చెలువలు తామే వలచి వచ్చినా” అని   మందలింపు. లెంపలేసుకొని, స్ఫూర్తి కోసం, కొన్ని భానుమతి పాటలు హమ్ చేస్తుండగా, “సడి సేయకో గాలి, సడి సేయ బోకే” అని లాలిత్యం ఉట్టిపడుతూ లీల సున్నితంగా నా పాట నాపేసి, ఏదో మత్తు లోకి తోసింది. “లాలీ..లాలీ..లాలీ..లాలీ.. వట పాత్ర శాయికీ వరహాల లాలీ” అంటూ సుశీలమ్మ నన్ను మరింత నిద్ర లోకి నెట్టే లోపల, “ఘల్లు ఘల్లునా గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్లి పడ్డది,” అంటూ గుర్రపు డెక్కల తాళం లో జానకమ్మ నన్ను మొట్టి లేపింది.

మనస్సు పరిగెత్తినంత వేగంగా నా కలం పరిగెడితే ఈ పాటికి పది పేజీల కాలమ్ పూర్తయ్యేది అన్న ఆలోచన పూర్తయ్యేలోపే  మరొక ఆలోచన  నా వ్రాతకు ఆనకట్ట వేసింది.

“కొత్త పాటల తుంపరలు ఒక్కటీ నా మీద ఇంకా పడలేదేమిటబ్బా!  ఏ పార్టీ జరిగినా మా ఇంట్లో మ్రోగేవి, నేను రెండు గ్లాసుల వైన్ తాగిన తరువాత గెంతేవి ఆ పాటలకే కదా! ఇప్పుడేమిటీ పాటల గురించి వ్రాద్దామని కూర్చొంటే మాత్రం ఒక్కటీ నోట్లో ఆడట్లేదు? నేను మరీ ముసలాడినైపోతున్నానా? చాదస్తంగా ఓల్డంతా గోల్డేనని పాతవే పట్టుకు వేళ్ళాడుతున్నానా?” అంటూ కొన్ని నిమిషాల పాటు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండిపోయా. “కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అంటూ శ్రీశ్రీ నా చెవిలో దూరి అరుస్తున్నా సరే, ఆ నెగటివ్ ఆలోచనలను పక్కకు నెట్టి మళ్ళీ పన్లో పడిపోయా.

“మీకిష్టమైన పాటలేంటి?” అని ఎవరైనా అడిగితే, చటుక్కున నేను పుట్టకముందు పుట్టిన సినిమా పాటలే గుర్తుకొస్తాయి. ఒకసారి ఉండబట్టలేక, మా ఫ్రెండు ఒకడు కడిగేసాడు. నువ్వింకా “కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది” అని ఇక్ష్వాకుల కాలం నాటి పాటలు పాడుకుంటూ ఉంటే, రేపు మీ మనవళ్ళ కాలం వచ్చేనాటికి అంతే తాదాత్మ్యతతో, “సార్..రొస్తా రొస్తారా రొస్తా రొస్తా రొస్తా రా..” అనో “మై లవ్ ఇస్ గాన్.. మై లవ్ ఇస్ గాన్” అనో పాడుకుంటావా అని.

వాడెంత చురకేసినా నేను మాత్రం సీరియస్ గానే చెప్పా, శంకరాభరణం శంకరశాస్త్రి నన్ను ఆవహించినట్లుగా. “బాల్య, కౌమార్య, యౌవన, వృద్ధాప్యాలు పాటలు పాడేవాళ్ళకీ, శ్రోతలకీ ఉంటాయేమో కానీ, పాటలకు కాదురా! ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం దైవాంశసంభూతులైన కొందరి వ్యక్తుల భక్త్యావేశాలు ఒక ప్రవాహమై, శబ్ద రూపేణ ప్రాణం పోసుకొంటే, ఆ ధ్వనులేరా సాంప్రదాయ సంగీతమై, కొన్ని కోట్ల గళాలలో ప్రతిధ్వనిస్తూ, మన సంస్కృతి ఉమ్మడి ఆస్థిలా తరతరాలకూ సంక్రమిస్తూ, శాస్త్రీయబద్ధమైన కర్నాటక సంగీతంలా పక్వత చెంది, లలిత సంగీతంలా సరళీకృతమై,  పాశ్చాత్య రీతులతో సంగమించి, కొంత ప్రకాశించి, మరింత కృశించిన, నేటి మన తెలుగు పాట!”

ఏనాడో రచించిన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజు, శ్యామశాస్త్రి పాడిన కృతులు ఈనాటికీ  పాడుకుంటున్నాం. కనుక నా మనవళ్ళకు నేను వినిపించపోయే పాటల గురించి నువ్వు జోక్ చెయ్యకు. ఇంకొక వంద  ఏళ్ళు గడచినా “జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా” అని పాడేవాళ్ళు, అది విని ఆనందావేశాలలో తూలిపోయేవాళ్ళు, ఉంటూనే ఉంటారు”, అని నేను ఏకబిగిన ఇచ్చిన ఉపన్యాసానికి అలసిపోయి ఆగిపోయాను.

“అదే మరి, సంగీత రాజా ఇళయరాజా అత్యద్భుతంగా స్వరపరిస్తే అమృతం జాలువారే గాత్రాలతో బాలూ, శ్రేయా ఘోసాల్ పాడిన పాటేగా…నేను నా కార్లో ఎప్పుడూ అదే వింటూ ఉంటా” అంటూ తన సంగీతజ్ఞాన ప్రదర్శన చెయ్యటంతో నా బి.పి తార స్థాయిలోని నిషాదాని కంటింది.

“స్వరబధిరుడా (టోన్ డెఫ్), త్యాగరాజు, పల్లవి, అనుపల్లవి, పది చరణాలతో, వెయ్యేళ్ళు నిలిచిపోయేలా, నట రాగంలో చేసిన రామ సంకీర్తన గురించి నేను ప్రస్తావిస్తే, నువ్వు వేరే రాగం కూస్తావా,” అని విరుచుకు పడ్డాను. “ఇంతకు ముందు వీడి పాటే భరించలేమనుకున్నాం, వీడి మాట కుడా కర్ణ కఠోరం,” అని నాకు వినబడేలా  విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను? అదే నా పాత పాటల పైత్యం గురించి కదూ అసలిదంతా మొదలయ్యింది. పాత పాటలంటే ఏదో కొత్తగా అబ్బిన అభిరుచి గానీ, పెరిగిందీ, ఏళ్ల తరబడి ఆస్వాదించింది “కొత్త” పాటలనే. కొత్తవంటే ఏదో శాస్త్రీయ సంగీతం, ఉదాత్త సాహిత్యం, సింగినాదం అని ప్రాకులాడే కళాతపస్వి సినిమాల్లో పాటలే కాదు, “వినదగు నెవ్వరు కొట్టిన” అని అన్నిరకాల పాటలకూ, తలకాయ అడ్డంగా కొన్నిసార్లు, నిలువుగా మరిన్ని సార్లు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తూనే పెరిగాను. అయినా మరీ దారుణం కాకపోతే, “సంగీతాన్ని కొట్ట్టటం” ఏమిటో! లావుపాటి బెత్తాలతో విపరీతంగా బాదే వెస్టర్న్ డ్రమ్ముల ప్రయోగం మన పాటలలో ప్రారంభించిన దగ్గరనించీ పాట కట్టటం నించి కొట్టటం అయ్యిందేమోనని నా వెధవనుమానం.

ఇలా కొత్త పాటల మేఘాలు కమ్ముకున్నాయో లేదో, తుంపర్లు కాదు, ఏకంగా వడగళ్ళే పడటం మొదలెట్టాయి, గానగాంధర్వ గళంలో. గత నలభై ఏళ్ళలో, నలభైవేల పై చిలుకు పాటలు పాడిన బాలు స్వర తరంగాలు చేరని చెవులు తెలుగు దేశం లో అస్సలు ఉండే ఛాన్సే లేదు. అన్ని పాటలున్నందుకేనెమో, ఓ పట్టాన గబుక్కున ఏదీ మనసుకు తట్టక పోయినా, ఒక సారి మొదలయ్యిందంటే మాత్రం తుఫానే.

“ఏ దివిలో విరిసిన పారిజాతమో…” అని అబ్బురపడ్డా, “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..” అంటూ పాఠాలు చెప్పినా,  “ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా?” అంటూ అన్నగారి గొంతుతో వదినెమ్మను కవ్వించినా, తన గాత్ర వైవిధ్యంతో, అన్ని వర్గాల శ్రోతలని ఆకట్టుకోవటం, బాలూ కే చెల్లింది. అద్గదీ, దొరికింది నేను వ్రాయటానికి టాపిక్. “ఈ ఒక్కాయన కోటు తోకలు పట్టేసుకొని మన సినిమా పాటల సంద్రాన్ని అవలీలగా ఈదెయ్యచ్చు,” అనుకున్నానో లేదో, ఫుల్ వాల్యూం లో “సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది” అంటూ “చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం” అకంపెనీమెంట్ తో, వినిపించే సరికి మళ్ళీ తెలివిలోకొచ్చా.

సినిమా పాటంటే, ఓన్లీ గాయకులేనా గుర్తుకొచ్చేది? “పాటల గురించి వ్రాద్దామని కూర్చోన్నావు, పాటలు వ్రాసేవాళ్ళ నేల మరచితివీవు?” అంటూ మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నుండి, వేటూరి, సీతారామశాస్త్రి గార్ల వరకూ కళ్ళ ముందుకొచ్చి కళ్ళెర్ర చేసినట్లుగా అనిపించింది.

స్వరకర్తల సంగతేమీటంటూ సాలూరి, పెండ్యాల నుండి కోటి, తమన్ వరకూ నిలదీసి ఇరుకున పడేశారు. వారందరికీ స్ఫూర్తినిచ్చి వాళ్ళ నించి అంత గొప్ప వర్క్ ని రాబట్టుకున్న యల్.వి.ప్రసాద్, ఆదుర్తి, విశ్వనాథ్ లాంటి దిగద్దర్శకులు మాత్రం మందహాసాలతో మాటల్లేకుండా నన్ను అయోమయంలోకి నెడుతుంటే, “ఏ తావున రా? నిలకడ నీకు?” అంటూ భానుమతి పాటే మళ్ళీ రియాలిటీ లోకి లాక్కొచ్చి పడేసింది.

“అసలు వీళ్ళందరి గురించి వ్రాయడానికి నీ కున్న అర్హతేంటి? పెద్ద పెద్ద పరిశోధనా గ్రంధాలే వచ్చాయి. మరిక నువ్వు కొత్తగా చెప్పొచ్చేదేంటి?” అంటూ సీరియల్ సెల్ఫ్ డౌట్ చుట్టేసింది.

“ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు” అన్న పాట కూడా  ఇప్పుడే గుర్తుకురావాలా! అసలు ఇంత ఆలోచన అవసరమా? నేను వ్రాయబోయేది చదివేది కూడా నాలాంటి సగటు పాట ప్రేమికులే కదా. నా కోసం, నా మూడ్ బట్టీ, నాకు నచ్చిన ఏ పాట(ల) నైనా, నాది చేసుకొని, నా భావాలను, అనుభవాలను, అనుభూతులను శ్రుతి మించకుండా వ్యక్తపరిస్తే, నచ్చి ఆదరిస్తారేమో! ఒక కొత్త ఆశ చిగురించినా, అఫ్సర్ గారికి ఏమీ వ్రాయలేదనీ, ఆలోచనలతోనే సమయం అంతా గడిపేశాననీ, ఎలా చెప్పాలా అన్న చిన్న విచారంతో నా కలానికి మూత బిగించా.