పిచ్చుకలు 

       chinnakatha

దేవి నట్టింట్లో వేసి వున్న కుక్కి మంచం మీద పడుకుని వుంది . . ఆమె చూపు ఇంటి చూరుకి అంటుకుని వుంది . విపరీతమైన  నీరసం వారం నుండీ , దగ్గు .. దగ్గి దగ్గి లుంగ చుట్టుకుని  పోతుంది . ఈ మధ్యనంతా ఆమె చూపు ఇంటి చూరుని అంటుకుని వుంటుంది . దాదాపు నెల నెలన్నర క్రితం వాళ్ళ ఇంటికి వచ్చిందో పిచుకుల జంట . అన్యోన్యంగా పుల్లా పుడకా ఏరుకుని వచ్చి బూజు వేళ్ళాడుతున్న వాళ్ళ ఇంటి చూరులో గూడు కట్టుకున్నాయి . వీళ్ళకే తిండి లేదు  మనమెందుకు భారమనుకున్నాయో ఏమిటో ఎప్పుడూ ఇంట్లో మేత కోసం వెతకవు . ఎప్పుడైనా మగ పిచుక ఏదో పని వున్నట్లు దేవీ వాళ్ళ అమ్మ గెంజి వార్చిన గిన్నె దగ్గర కిచ కిచ మంటూ గెంతుతుంది . 

దేవీకి అవి ఇంటికొచ్చిన కొత్తల్లో ఆరోగ్యం కొంచం మెరుగ్గానే వుండేది . మరీ ఇంత చావు నీరసం ఉండేది కాదు .అందుకని మంచం మీద పడుకుని ఆసక్తిగా వాటినే గమనిస్తూ వుండేది . ఇప్పుడలా  గమనించడానికి కూడా ఆ పిల్లకి ఓపిక లేదు . కానీ చెవులకు మాత్రం మెత్తగా  వాటి పిల్లల కువ కువ వినిపిస్తూ వుంటుంది . ఎన్నిగుడ్లు పెట్టాయో అనుకుంది దేవి . అలా అనుకుంటూ వుండగా దేవీ తమ్ముల్లిద్దరూ బడి నుండి ఇంటికి వచ్చారు  ఒకరు , మూడు ఒకరు ఐదు తరగతులు చదువుతున్నారు . రాగానే అలవాటుగా ”అక్క అక్కా తినడానికేమయినా పెట్టవా”ఆన్నాడు చిన్నవాడు  . దేవి కళ్ళు తెరవలేదు . అది చూసి పెద్దోడు శివ ”రేయ్ అక్క కి బాలేదు కద, అక్క ఏం పెడతదిరా బుద్ధి లేని గాడిద”  అన్నాడు  చిన్నోడి నెత్తి మీద ఒక్క తట్టు తట్టి . అలా అనుకుంటూ అన్నా తమ్ముల్లిద్దరూ చిన్నక్క బుజ్జి దగ్గరకి పరుగు పెట్టారు .
బుజ్జి దేవీ కంటే ఏడేళ్లు  చిన్నది . వీళ్ళు ఉంటున్న వీధికి పై వీధిలో ఒక టీచర్ ఇంట్లో పని చేస్తుంది . మొన్న శుక్రవారం దానికి పదమూడో ఏడు పెట్టింది . అది పని చేస్తున్న ఇంటి వాళ్ళు దానికో చుడీదార్ కొనిచ్చారు . ఇన్నిరోజులూ గౌన్లె వేసుకునేది . ఆ చుడీదార్ వేసుకుని కొన్ని చాక్లెట్లు తీసుకుని పనంతా అయ్యాక ఇంటికొచ్చింది ఆ రోజు . బుజ్జికి ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం వుండదు . ఈ మురికి, అక్క రోగం ,ఒకే ఒక గది .. అదంతా దానికి అసయ్యం . ఇప్పుడు బుజ్జి పని చేస్తున్న ఇంట్లో ఇంతకు ముందు వాళ్ల  అమ్మ పని చేసేది . అమ్మతో పాటు టీవీ చూడటానికి వెళ్ళేది అలా అలా వాళ్ల ఇంట్లో వుండి  పోయింది . ఇప్పుడు పనంతా బుజ్జే చేస్తుంది కానీ , వాళ్ళేమీ దానికి జీతం ఇవ్వరు , అన్నీ మేమే జరుపుతున్నాం రేపు పెళ్లి కూడా మేమే చేస్తాం కదా అంటారు . ఆ ఇంటి వాళ్ళు తినడానికి ఏమైనా పెడితే , తనకు నచ్చక పోతేనో , ఎక్కువైతోనో , తమ్ముళ్ళకి ఇష్టం కదా అనిపిస్తేనో తీసి దాస్తుంది బుజ్జి . దానికోసమనే ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు బుజ్జి దగ్గరకి వచ్చింది .
వాళ్లు వెళ్లేసరికి బుజ్జి ,అన్న శీను తో ఫోన్లో మాట్లాడుతూ వుంది . బుజ్జికీ , దేవికీ మధ్యలో వాడు శీను . వాడిప్పుడు మద్రాసులో ఉంటాడు . వాళ్ళ నాన్న పెయింటు పని చేసే వాడు . అక్కడ ఆయనకి ఒకావిడతో  పరిచయమైంది . ఆవిడకి మొగుడు లేడు , బాగా ఎదిగిన కొడుకు ఒకడు వున్నాడు . ఆమె ఇక్కడ పని వదిలేసి మద్రాసుకు పోతుంటే ఆమెని వదిలి ఉండలేక దేవీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని , గంపెడు పిల్లల్నీ వదిలేసి ఆవిడతో ఎలిపోయాడు .మొదట్లో దేవీ వాళ్ళ అమ్మకి అతనెక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు . అప్పుడు దేవీ పన్నెండేండ్ల పిల్ల  , శీను పదేళ్ళ వాడు . మొగుడు ఎక్కడున్నాడో తెలిసాక శీను ని తీసుకుని మద్రాసుకి వెళ్ళింది  . ఆమె ఏడుపులూ ఆరుపులకి అతను  కొంచమైనా  చలించలేదు . నిరాశగా తిరిగి వస్తుంటే అతని ప్రేమికురాలు ”ఆ పిల్లాడిని వదిలేసి పో  , ఒకరి భారం తగ్గినా తగ్గినట్లే కదా ” అన్నది . అందుకు కూడా అతనేం మాట్లాడలేదు కానీ దేవీ వాళ్ళ అమ్మే ” ఏంరా వుంటావా ?” అన్నది శీను తో . శీనుకి ఏం చెప్పాలో తోచలేదు . అప్పుడు ఆ ప్రేమికురాలే శీనుని దగ్గరకి తీసుకుని ”వుంటాడు లే ” అన్నది . ఇప్పుడు శీను ఆవిడని  ” చినమ్మ ” అంటాడు . బాగా చూస్తుందని కూడా చెప్తాడు .అందుకే దేవీ వాళ్ళ అమ్మ ఎప్పుడైనా కష్టం తోచినప్పుడు మొగుడ్ని అనుకుంటుంది  కానీ ఆవిడని మాత్రం ఏమీ అనదు . ఎప్పుడైనా ఫోన్ చెయ్యాలనిపిస్తే శీను బుజ్జి పనిచేసే వాళ్ళ ఇంటికే చేస్తాడు . దేవి కి ఫోన్ వుంది కానీ వాడికెందుకో మొదటి నుండీ అక్కడికి చేయడమే అలవాటయింది .
మొగుడొదిలేసిన తరువాత , దేవికి వయసొచ్చే వరకు  దేవీ వాళ్ళమ్మ బిడ్డల్ని సాకలేక నానా కష్టాలూ పడింది ఇంటి బాడుగ కీ ,తిండీ తిప్పకి కటకటలాడి  పోయేది . వీళ్ళ గుడిసె పక్కన ఇంకో గుడిసెలో వుండేది .  దాంట్లో పవన కుమారి బాడుగకి వుండేది .ఇరవయ్యేల్ల పవన కుమారి ఎక్కడ నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ అక్కడా ఇక్కడా పని చేసేది ,అందంగా అలంకరించుకునేది ,బాగా ఖర్చు చేసేది . దేవీని బాగా దగ్గర తీసేది . పవన కోసం ఏమైనా కొనడానికి దుఖాణం కి వెళితే ఆ వీధి కుర్రకారు దేవీని చుట్టుముట్టే వారు పవన గురించి ఆసక్తిగా ఆరాలు తీసేవారు . అది దేవికి బాగా నచ్చేది . ఆ పిల్లకి శరీరానికి వయసు రాక మునుపే మనసుకు యౌవనం వచ్చేసింది .శరీరమూ,మనసూ పవన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశాయి . దేవీ మరి కొంచెం పెద్దదయ్యేసరికి పవన అక్కడి నుండి వేరే వూరికి వెళ్లి పోయింది
పదిహేనేల్లకి దేవీ ఆ ఊరికొచ్చిన సర్కస్ కంపెనీలో పనికి చేరింది . పవన చేసే పనుల గురించి తెలుసు కానీ అవేట్లా చేయాలో దేవీకి తెలియదు .  దేవీ వాళ్ళమ్మ ఎండు పూచిక పుల్లలాగా గాలి విసురుకి పడిపోయేటట్లు వుంటుంది .ఎవరి వైపు శరీరమో తెలియదు కానీ దేవీకి పెద్ద పెద్ద రోమ్ములోచ్చాయి .ఆ రొమ్ములు పవన లాగా ఉండాలనే ఆ పిల్ల కోరికని బ్రమ్హాండంగా సాధించి పెట్టాయి . మార్కెట్ లో ఆ పిల్లకి బాగా డిమాండ్ వచ్చింది . సాయంత్రమైతే ఆ లేత శేరీరానికి చీర కట్టి , మల్లె పూలు పెట్టుకుని ఇంటి ముందుకొచ్చిన ఆటో ఎక్కి పోయేది . ఎప్పుడూ ఉత్సాహంగా , నవ్వుతూ , చెవి దగ్గర ఫోన్ దించకుండా వుండేది . చిన్నగా ఆ పూరింట్లోకే కలర్ టీవీ , ఫ్రిజ్జూ , బీరువా తీసుకొచ్చింది , వాకిలికి కొత్తగా కర్టెన్ ఒకటి వచ్చి చేరింది .
ఆ పిల్లని చూస్తే చాలు వాళ్ళమ్మకి సగం కడుపు నిండి పోయినట్లు వుండేది . నా బిడ్డ లక్షిం దేవత అనుకునేది . పిల్లకి పెళ్లి చేయడం వంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఆమె చిరాకు పడేది . చేసుకుని నేనేం వుద్దరించా బిడ్డల్ని  కనడం తప్పించి అని తుంచేసేది . కట్టుకున్నోడు కడదాకా మనతోనే ఉంటాడని గేరంటీ ఏందంట  అనేది  .
ఈ విధంగా అంతా బాగానే జరిగి పోతూ ఉండింది . ఇదిగో ఇలా దేవి జబ్బు పడే వరకు . దేవికి మాయదారి జబ్బోచ్చింది . ఒకటే నీరసం ,తల తిరుగుడు, దగ్గు  . ఎలాగో ఒకలా ఓపిక తెచ్చుకుందామంటే ఆ పిల్ల మీద అదేదో జబ్బని పుకారు కూడా పుట్టింది . దేవి అదంతా ఏమీ ఆలోచించదు . త్వరగా జబ్బు నయమై పోవాలి . మళ్ళీ ఆ రంగు రంగుల జీవితం లోకి వెళ్లి పోవాలి అనుకుంటుంది ,మల్లి పూలు , ఘమ ఘమ లాడే సెంటు వాసనలు , చేతిలో రెప రెపలాడే డబ్బులు ఆ పిల్లకి కళ్ళలో మెదులుతూ వుంటాయి . ఆ గూట్లో పిచుకల్లాగా గూడు కట్టుకోవడం , పిల్లల్ని కనడం ఆ అమ్మాయికి ఏమీ నచ్చదు కానీ ఈ మధ్య ఎందుకో ఆ గూట్లో కువకువలు మొదలయినప్పటి నుండీ నాన్న వున్నప్పుడు , సాయంత్రం నాన్న ఇంటికి వస్తూ తెచ్చే చిరు తిళ్లు , అమ్మ ముసి ముసి నవ్వులు సంతోషమూ అన్నీ గుర్తొస్తున్నాయి .నాన్న తమని వదిలి వెళ్ళకుండా ఉండుంటే  బాగుండేదేమో  అని కూడా అనిపిస్తుంది .
ఈ రోజు కూడా మగ పిచుక గెంజి దబర దగ్గర కిచ కిచలాడుతూ వుంది తండలకి అప్పిచ్చిన అబ్బాయి  వచ్చే ఆదివారానికంతా డబ్బు కట్టకపోతే బొచ్చేబోలూ వీధిలో ఉంటాయని చెప్పివెళ్తున్నాడు .  సంపాదించినదంతా డాక్టర్ల ఫీజుగా మారిపోయింది . దేవి ఆ పిల్లాడి మాటలు విని అటు నుండి ఇటు తిరిగి పడుకుంది .
                                                         *******
వచ్చే ఆదివారం వచ్చింది . గూట్లో నుండి ఏ రాత్రి వేళ  కింద పడిపోయిందో ఒక పిచుక పిల్ల కిందపడి చని పోయి వుంది . దాని చుట్టూ చీమలు చుట్టుకుని వున్నాయి . దేవీ వాళ్ళ అమ్మ నట్టింట్లో ఖాళీగా వున్న మంచాన్ని అటు జరిపి చచ్చిపోయిన  పిచుక పిల్లని చేటలోకి చిమ్ముతూ చెట్టుకి కాసిన కాయలన్నీ చెట్టుకే వుండి  పోతాయా  అని గొణుక్కున్నది.
-కణ్ణగి