సముద్రానికి కోపం వచ్చింది!

 varavara.psd-1

సముద్రానికి కోపం వచ్చింది. నేను చాల ఇష్టపడే సముద్రానికి. నను ప్రేమించిన సముద్రానికి.

సముద్రానికి కోపం వచ్చింది. నీళ్లను ఆక్రమించినవాళ్ల మీద. తీరాన్ని దోచుకున్నవాళ్ల మీద. ఇసుక తోడుతున్నవాళ్ల మీద. చెట్లు కొట్టేసే మనుషుల మీద కోపం వచ్చి చెట్లన్నీ ఊడ్చేసింది. గాలికి తలుపులు మూసుకునే వాళ్ల తలుపులు విరగదన్నింది. మనుషుల్ని పెద్ద మనసుతో క్షమించి ఆస్తుల్ని ధ్వంసం చేసింది.

సముద్రానికి కోపం వచ్చింది. నేను నిష్కారణంగా నవయవ్వనం నుంచి ప్రేమిస్తున్న సముద్రానికి. నేను తనలో ప్రకృతినీ, మనిషినీ పోల్చుకుని ప్రేమించిన సముద్రానికి.

నేనింకా ఎం.ఎ. లో, తాను బి.ఎ. లో ఉండగా నేనూ నా ప్రాణస్నేహితుడు పిచ్చిరెడ్డీ జీవితంలో ముగ్గుర్ని చూడాలనుకున్నాం – చలం, శ్రీశ్రీ, సముద్రం. మా పిచ్చి భరించలేని స్నేహ బృందం మూడూ కలిసొచ్చేలా 1961లో మమ్మల్ని అరుణాచలం పంపించారు. అప్పుడు మొదటిసారి మద్రాసు సముద్రాన్ని చూసాం. శ్రీశ్రీని ఆయన ఇంట్లో చూసాం. చలాన్ని రమణస్థాన్ లో.

సముద్రాన్ని దాని సార్థక అర్థంలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో 1970లో విశాఖలో చూసాను. ఇంక అప్పటినుంచీ విశాఖ సముద్రం నన్ను ఆవహించింది. సీసాండ్స్, సిరిపురం క్వార్టర్స్, ఏరాడ కొండ, భీమ్లీ, విజయనగరం, శ్రీకాకుళం దాకా బీచ్ రోడు. హెమింగ్వే ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ ని తలపించే చలసాని ప్రసాద్ నలభై నిమిషాలు ఈదిన లాసన్ బే పాయింట్ భయం గొలిపే సుడిగుండం దరి. విరిగిపడుతున్న కెరటాల మధ్యన రాళ్లపై కూర్చొని ‘సముద్రం’ చదువుతూ దృశ్యీకరించుకోవాలని తీర్చుకున్న కోరిక.

సముద్రం ఒక భావన నుంచి నాలో అక్షరాకృతి దాల్చడం 1981లో ప్రారంభమైంది. కలకత్తా నుంచి వచ్చి విశాఖలో దిగి సీసాండ్స్ లో కృష్టక్కతో చెప్పి ఒక్కణ్నే సముద్రం దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం దాకా కూర్చున్నాను.

నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ

నా రక్తం ప్రతిధ్వనిస్తున్న సముద్ర నిశ్వాసాన్నీ

నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న సముద్ర విశ్వాసాన్నీ విను.

విచిత్రంగా రెండవసారి ఉస్మానియా రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ లో గుడిహాళం రఘునాథం రూంలో సముద్రం నన్ను ఆవహించింది. మా మేనల్లుడు కొండన్న (రామగోపాల్), ఇంకా కొందరు విద్యార్థులు కలిసి అర్ధరాత్రి గడిచాక తార్నాకకు వెళ్లి ఎప్పటివలెనే చాయ్ తాగి వస్తున్నాం. ఎబివిపి వాళ్లు చూపింది నన్నయితే, నా వెనుక బ్యాచ్ లో వస్తున్న రీసర్చ్ స్కాలర్ రామకృష్ణపై కత్తితో దాడి చేసారు దుండగులు. అది మాకు హాస్టల్ కు చేరాకగానీ తెలియలేదు. ఆ రాత్రంతా సంచలనం. హల్ చల్. నేను రఘునాథం రూంలో పడుకున్నాను. పడుకోలేదు.

గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే

కాళ్ల కింద నీళ్లు

సముద్రపు మంటలాగ కళ్లల్లో నీళ్లు

ప్రజాసముద్రపు బాధల్లాగ.

‘శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగ’ అని వాచ్యం అయిపోయావు అన్నాడు ఆ తర్వాత కాలంలో శివసాగర్. అది సముద్రం 2 ‘అగాథ సముద్రం’.

1982 ఆగస్టు నాటికి సముద్రం నన్ను మనిషయి ఆవహించింది.

‘సముద్రం నా వ్యసనమైంది.

సముద్రం నా గాయం, నా అవ్యక్త గేయం’ అయింది.

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో పులి అంజయ్య నాయకత్వంలో రాడికల్స్ కూ ఎబివిపికీ ఘర్షణలు. బయట నర్సంపేట, నల్లబెల్లిల నుంచి హనుమకొండ కుమార్ పెల్లి దాకా జన్ను చిన్నాలు స్ఫూర్తి కేంద్రంగా రాడికల్స్ కూ సిపిఎం వగైరా రాడికల్ వ్యతిరేక శక్తులకూ ఘర్షణల మధ్య నా కాలేజికి రాకపోకలు మాత్రమే కాదు, ఇంట్లో ఉండడం కూడ ఉద్రిక్తంగా మారిన రోజుల్లో రాసిన కవిత ‘సముద్రం నా తీరం.’

‘నేను సముద్రంలోనే ఉన్నాను’ కాని ‘నేనింకా సముద్రాన్ని కాలేకపోతున్నాను.’

భూమిహారులు నన్ను సముద్రంలో పోల్చుకున్నారు

యుద్ధం నేను ఏ పక్షమో తేల్చుకుంది

సముద్రం ఆటుపోట్లలోని

అలను నేను కలను నేను కలతను నేను

గొప్పశాంతి కోసం మహా సంక్షోభంలో

స్వేచ్ఛను కోల్పోయిన సముద్రాన్ని నేను

సముద్రం స్వేచ్ఛలో సత్యమైన స్వేచ్ఛలో

స్వేచ్ఛను వెతుక్కుంటున్న నీటి చుక్కను నేను (సముద్రం -5)

మళ్లీ అటువంటి మానసిక స్థితిలోనే ఇవ్వాళ నన్ను ‘సముద్రం’ ఆవహించింది.

1977లో దివిసీమలో ఉప్పెన వస్తే డాక్టర్ రామనాథం నాయకత్వంలో మేం వెళ్లాం. ఆయనతోపాటు వెళ్లిన మనుషుల, పశువుల డాక్టర్లు నెలరోజులపాటు అక్కడ శిబిరాలు నిర్వహించారు. ఆ వివరమైన రిపోర్ట్ ‘సృజన’ ప్రచురించింది.

అప్పటికి ప్రభుత్వానికి ‘కల్లోలిత ప్రాంతాలు’ ప్రకటించడం, ఎన్ కౌంటర్లు చేయడం, ఎమర్జెన్సీ పెట్టడం తెలిసినంతగా ఉప్పెనకూ తుపానుకూ మధ్య ఉండే తేడా ఏమిటో తెలియదు. అందువల్ల వేలాదిమంది మరణించారు. కాని మత్స్యకారులు సాహసోపేతంగా ఉప్పెనతో పోరాడి వందలాది మందిని బతికించారు. ప్రజలు పోరాడి హక్కులు సాధించుకున్నారు.

ఇప్పటి ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల నుంచి కోవర్టు హత్యల దాకా తెలివిమీరాయి. అప్రకటిత ఎమర్జెన్సీ అచిరకాలం అమలు చేయడం నేర్చుకున్నాయి. సముద్రంలో తాము సృష్టించిన సంక్షోభానికి ‘హుదూద్’ అని పేరు పెట్టి పక్షిమీదికి తోసేయడం నేర్చుకున్నాయి. మనుషుల్ని అప్రమత్తుల్ని చేసి కాపాడిన పొగడ్తలు తెచ్చుకున్నాయి.

అప్పుడూ ఇప్పుడూ మనుషులు, సామాన్య మానవులు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో పరస్పర స్నేహ సహకారాలతో తమను తాము సంరక్షించుకుంటున్నారు.

ఏమున్నది సముద్రం

నీళ్లూ ఉప్పూ ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం

చీమూ నెత్తురూ పోరాటం తప్ప.

– వరవరరావు

మనుషుల్ని చంపేస్తారు, మరి భూమిని?!

varavara.psd-1

అజంతా చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసాడు.

తాత్వికార్థంలో ప్రాణికోటి ప్రాణవాయుహరణమే చూసినట్లు. మనుషులు కూలుతున్న దృశ్యాన్నీ చూసినట్లే.

తెలుగు సమాజం, ముఖ్యంగా తెలంగాణ, వ్యవస్థాపరంగానూ రాజ్యపరంగానూ పోరాడుతున్న ప్రజలను, వాళ్లకు అండగా పోరాడుతున్న ప్రజాసేవకులను పందొమ్మిది వందల నలభైల కాలం నుంచే ఎంతమందిని కోల్పోయిందో. నా బాల్యంలో అటువంటి విషాదాలనూ చూసాను. మూడు వైపులా వాగులతో పరివృతమైన మా ఊళ్లో బరసనగడ్డ రోడ్డు మీద దిరిసెన పూలు, బొడ్డుమల్లె పూలు రాలిన అందమైన దృశ్యాలూ చూసాను.

ఇంక నక్సల్బరీ కాలం నుంచి చైతన్యం వలన కూలుతున్న మనుషులందరూ ఎక్కడో నా రెక్కల్లో డొక్కల్లో మసలుకున్న వాళ్లేననే మానసికతయే నన్ను ఆవరించింది. ఎనభైల ఆరంభం అమరుల జ్ఞాపకాలను కూడ నిర్దాక్షిణ్యంగా తుడిచే వ్యవస్థ క్రూరత్వంతో మొదలైంది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాదు తాలూకా గూడూరు అనే గ్రామంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్మించిన ఒక నవయువకుడు గోపగాని రవి చేతిలో బాంబు పేలి మరణించాడు. గ్రామస్తులు ఆయన కోసం ఆ ఊళ్లో కట్టుకున్న స్థూపాన్ని పోలీసులు కూల్చిన పద్ధతి నన్ను కలచివేసింది. స్థూపానికి అవసరమైన మట్టి, ఇటుకలు, రాళ్లు, సున్నం ఎవరు సమకూరిస్తే వాళ్లనే అవి తొలగించమని, ఎవరెవరు ఆ నిర్మాణంలో పాల్గొన్నారో వాళ్లనే అది కూల్చమని పోలీసులు ప్రజల్ని కూడేసి నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఇంక అప్పటినుంచీ అదొక నిర్బంధ పద్ధతి అయిపోయింది. అమరులైన విప్లవకారుల కోసం స్థూపాలు నిర్మించుకోవడం ప్రజల రాజకీయ, సాంస్కృతిక, నైతిక, సంఘటిత శక్తికి ఎట్లా ఒక సంకేతమైందో, ఆ స్థూపాలను కూల్చివేయడం రాజ్యానికట్లా ఆ అమరుల జ్ఞాపకాలను తుడిచేసే హింసా విధానమైంది.

1999 డిసెంబర్ 1న ఇది పరాకాష్ఠకు చేరుకున్నది. ఆరోజు నల్లా ఆదిరెడ్డి (శ్యాం), ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి (మహేశ్), శీలం నరేశ్ (మురళి) లను బెంగళూరులో అరెస్టు చేసి, కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవులకు తీసుకవచ్చి, లక్ష్మీరాజం అనే పశులకాపరితో కలిపి డిసెంబర్ 2న చంపేసి, ‘ఎన్ కౌంటర్’ అని ప్రకటించారు. ముగ్గురి మృతదేహాలను పెద్దపెల్లి ఆసుపత్రిలో పెట్టి రాష్ట్రవ్యాప్తంగా జనం తరలివస్తుంటే క్షణాల మీద పోలీసు వ్యాన్ లోనే శీలం నరేశ్ మృతదేహాన్ని జగిత్యాలకు తరలించి, జగిత్యాలను పోలీసు చక్రబంధంలో పెట్టి, తండ్రిని బెదరించి దహనక్రియలు చేయించారు. సంతోష్ రెడ్డి తల్లి అనసూయమ్మ హైకోర్టులో సవాల్ చేయడం వల్ల ఆయన మృతదేహాన్ని రీ పోస్ట్ మార్టమ్ కొరకు రామగుండం సింగరేణి కాలరీస్ ఆసుపత్రికి తరలించారు. నల్లా ఆదిరెడ్డి మృతదేహాన్ని మాత్రం అతని సోదరుడు కరీంనగర్ జిల్లా కొత్తగట్టుకు తెచ్చుకోగలిగాడు.

అక్కడికి వెళ్లకుండా ఎం ఎల్ పార్టీల నాయకులందరినీ, విరసం విమలను, నన్ను జమ్మికుంట పోలీసు స్టేషన్ లో నిర్బంధించారు. కొత్తగట్టు ఊరిని, ఆ ఊరికి హనుమకొండ, కరీంనగర్ ల నుంచి ఉండే మార్గాలను గ్రేహౌండ్స్ తో నింపేసారు. అయినా జనం పలు మార్గాలనుంచి చీమల దండువలె కదలి రాసాగింది. మమ్మల్ని కొత్తగట్టుకు వెళ్లగూడదనే ఉద్దేశంతో నలగొండ జిల్లా సరిహద్దుల్లో వదిలేస్తే ఆలేరులో బండ్రు నరసింహులు ఇంట్లో తలదాచుకున్నాం. ఆ అమ్మ నర్సమ్మ మా అందరికీ అర్ధరాత్రి వండి పెట్టింది. మర్నాడు ఉదయమే రాజమార్గం తప్పించి నన్ను, నా సహచరి హేమలతను కొత్తగట్టుకు తీసుకవెళ్లిన నా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ క్లాస్ మేట్ సి రాజిరెడ్డిని తలచుకోవాలి. అలా శ్యాం అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఆ కక్షనంతా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో 1990 వరకు జిల్లాలో అమరులైన 93 మంది విప్లవకారుల స్మృతిలో నిర్మించుకున్న 93 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నేలమట్టం చేసి తీర్చుకున్నారు పోలీసులు. ఇప్పటికీ అక్కడ నేల మీద గడ్డిలో ఆ ఎత్తైన స్థూపం మీంచి నేలమీద కూలిన సుత్తీకొడవలి లోహ చిహ్నం పడి ఉంది.

1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చిన సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీ వా థియాంగో ప్రత్యేకించి హుస్నాబాదుకు వెళ్లి ఈ స్థూపాన్ని చూసాడు. అందుకే ఆయనకీ విషయం రాసాను. అప్పుడాయన నాకు ఎంతో ఆశ్వాసాన్నిచ్చే మాటలు రాసాడు – మనుషుల్ని కూల్చేసినా, వాళ్ల స్మృతిలో నిర్మించిన స్థూపాలను కూల్చేసినా, మీకు మళ్లీ మనుషులు పోరాటంలోకి వస్తున్నారు. అమరులవుతున్న వాళ్ల చేతుల్లోంచి పోరాట జెండా అందుకుంటున్నారు. మీరు పోరాటంలోనే వాళ్ల స్మృతులను నిలుపుకుంటున్నారు. కాని మాకు 1952-62 మౌమౌ విప్లవోద్యమం ఒక స్మృతి – నాస్టాల్జియా మాత్రమే, అన్నాడు.

‘భూమికి భయపడి’ కవిత గిరాయిపల్లి విద్యార్థి అమరులు, జన్ను చిన్నాలు స్థూపాలు వరంగల్ జిల్లా పైడిపల్లిలో కూల్చేసిన వార్త, ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చేసిన వార్త జైల్లో విన్నపుడు రాసింది. ఆ కవిత కిందనే ఆ వివరణ ఉంది.

మనుషుల్ని కూల్చేస్తారు. స్మృతుల్ని చెరిపేస్తారు. స్మృతిలో వెలిగించిన దీపాల్ని మలిపేస్తారు. కాని మనుషులకి, వాళ్ల పోరాటాలకి, జ్ఞాపకాలకి భూమిక అయిన ఈ భూమిని ఏం చేయగలరు – అన్నదే వ్యవస్థను, రాజ్యాన్ని మనుషులు నిలదేసే సవాల్.

ఈ కవితను హిందీలోకి అనువదించినపుడు ‘వాళ్లు కలాలకు భయపడ్డారు’ అని నేను రాసిన చరణాన్ని ఇంకా పదను పెడుతూ సుప్రసిద్ధ హిందీ సాహిత్య విమర్శకుడు మేనేజర్ పాండే ‘వహ్ కలమ్ కె నూర్ సె (కలం మొనతో) డర్ గయా’ అని మార్చాడు. ఇదే శీర్షికతో హిందీలో ఈ కవితపై ఒక వ్యాసం రాసాడు.

‘సంకెల సవ్వడి’ పాటకు శ్రుతి కావడం గురించి మొదట ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసాడు. సికిందరాబాద్ కుట్రకేసులో జైలు నుంచి మమ్మల్ని కోర్టుకు తీసుకవెళ్లేప్పుడు చెరబండరాజు పాటలకు మా సంకెలలు వాద్యసాధనాలు కావడం ఇది రాస్తున్నప్పుడు నేను వినగలుగుతున్నాను. ఆ దృశ్యాలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చూడగలుగుతున్నాను.

-వరవరరావు

‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు!’

varavara.psd-1

మొదటిసారి 1973 అక్టోబర్ లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టయినపుడు వరంగల్ జైల్లోనే ఉన్నందువల్లనో, నేను రోజూ కాలేజికి పోతూ వస్తూ చూసే జైలు అయినందువల్లనో, నేనూహించుకున్నంత భయంకరంగానూ, ఇరుకుగానూ, మురికిగానూ జైలు లేనందువల్లనో, నాకేకాదు, నన్ను వారంలో కనీసం రెండుసార్లు కలవడానికి వచ్చే నా సహచరి హేమలతకు కూడ, ‘మీకిక్కడ కష్టంగా ఉందా’ అని అడగాలనిపించలేదు.

రెండవసారి, 1974 మే 18న అరెస్టయిన తీరే భయం గొలిపేదిగా ఉంది. ఉధృతంగా రైల్వే సమ్మె జరుగుతున్నది. అందులో కాజీపేట – డోర్నకల్ లైనంతా సమ్మె వెనుక సూరపనేని జనార్దన్ నాయకత్వంలోని విప్లవ విద్యార్థులు, రైల్వే కార్మికులు, విప్లవోద్యమాన్ని బలపరిచే అన్ని ప్రజాసంఘాలు, విరసం ఉన్నాయి. మా ఇంట్లో ‘జైళ్లు రైళ్లను నడపగలవా?’ కరపత్రాలు ఉన్నాయి. అప్పటికే సృజన ఆ శీర్షికతో ఒక రైల్వే కార్మికుని కవిత ప్రచురించి, అదే శీర్షికతో సంపాదకీయం రాసిన మేడే సంచిక వెలువడింది. కనుక అరెస్టు రైల్వే సమ్మె గురించే అనుకున్నాం.

మరొకవైపు మా మూడవ పాప పుట్టి ఇరవై రోజులయింది. తల్లి 104 డిగ్రీల జ్వరంతో మంచంపై ఉంది. నన్ను కాజీపేట పోలీసు లాకప్ లో పెట్టి, ఆ ఊళ్లో టీచర్ గా పనిచేస్తున్న మా రాగవులన్నయ్య అన్నంతెస్తే ఇవ్వడానికి నిరాకరించి ఎస్ ఐ ఆయననూ నన్నూ బండబూతులు తిట్టాడు. అంతకుముందే ఎస్పీ నన్ను అరెస్టు చేసి తన ఇంటికి తీసుకరమ్మని, షార్ట్స్ వేసుకొని, చేతిలో హంటర్ తో, రెండు ఆల్సేషియన్ కుక్కలను పెట్టుకొని, నన్ను నిలబెట్టి చాల అవమానకరంగా మాట్లాడి ఉన్నాడు. అక్కడినుంచి ఆ రాత్రే ఇంకో ముక్కు మొహం తెలియని మనిషితో కలిపి హైదరాబాదు సిసిఎస్ కు తెచ్చారు. మే 20వ తేదీన సికిందరాబాదు పదవ మెజిస్ట్రీట్ కోర్టులో మా ఇద్దరినే కాకుండా సిసిఎస్ లో మాతోపాటు కలిపి ఉంచిన చెరబండరాజు, ఎంటి ఖాన్, ఎం రంగనాథంలను, తిరుపతి నుంచి తెచ్చిన త్రిపురనేని మధుసూదనరావును హాజరుపరచినప్పుడు గానీ తెలియలేదు – మామీదనే కాదు కెవి రమణారెడ్డితో పాటు కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి మొదలైన వారితో కలిపి మామీద సికిందరాబాదు కుట్రకేసు పెట్టారని, నాతో తెచ్చిన వ్యక్తి పేరు గోపాల రెడ్డి – ఊరు రామాయంపేట అని. కెవి రమణారెడ్డి గారు అప్పుడు మద్రాసులో ఉన్నారు గనుక అరెస్టు కాలేదు.

కోర్టు నుంచి ముషీరాబాదు జైలుగా పిలవబడే సికిందరాబాదు జైలుకు పంపించారు. మొదటిసారి వలె ఇది ముందస్తు డిటెన్షన్ కాదు. కనుక రాజకీయ ఖైదీలకుండే వసతులుండవు. పైగా బెయిల్ పిటిషన్ వేస్తే జస్టిస్ చెన్నకేశవరెడ్డి అనే హైకోర్టు జడ్జి ‘వీళ్లమీద ఉరిశిక్షలు వేయదగిన, లేదా ప్రవాసం పంపించదగిన రాజద్రోహం, చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చే నేరపూరిత కుట్ర, రాజ్యంపై యుద్ధం, పేలే ఆయుధాలు కలిగి ఉండడం, హత్య, హత్యాప్రయత్నం వంటి సెక్షన్లు ఉన్నాయి గనుక ఇవ్వన’ని బెయిల్ నిరాకరించాడు. పత్రికలు ఇవి ప్రముఖంగా ప్రచురించాయి. సహజంగానే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసారు.

ఈ స్థితిలో నన్ను మొదటిసారి చూడడానికే నా సహచరి నలభై రోజుల తర్వాత రాగలిగింది. అందుకని మొదటి ప్రశ్న ‘ఇక్కడ కష్టంగా ఉందా?’ అని. నేనేమో వసతి, సౌకర్యాలు పట్టనంత విప్లవ సహచర సాంగత్యంలో ఉన్నాను. సాహిత్యం, రాజకీయాలు, చర్చోపచర్చలు జరిపి, పాడి, హాస్యాలాడుకొని విప్లవ స్వప్నాల్లో మునిగిపోతాం. రోజులెట్లా గడిచిపోతున్నాయో తెలియడం లేదన్నాను. ‘అయితే మీకిక్కడ సుఖంగా ఉందా?’ అని అడిగింది. రెండు నెలల పసిపాపను వేసుకొని బస్సులో పడివచ్చిన తన అసహాయ నిష్ఠురం అందులో ఉంది. ఆరోజు 1974 జూన్ 27 రాత్రి రాసిన కవిత ఇది.

ఇందులోని ‘కవిమిత్రుడు’ మేమంతా ఖాన్ సాబ్ గా పిలుచుకునే ఎంటి ఖాన్. కుటుంబాలతో ఇంటర్వ్యూలు జరిగిన రాత్రి ఖైదీలెవరైనా అన్యమనస్కంగా తమ ప్రపంచంలో ఉంటుంటారు. ఆ రాత్రి నిద్రపట్టదు. అది తెలిసిన పెద్దమనసు ఖాన్ సాబ్ ది. మనసు మళ్లించడానికి, ఆహ్లాదపరచడానికి ‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు. మనం నయం. ఆయనైతే ముళ్లతీగల్లో చిక్కుకొని ఉన్నాడు’ అని తేలికపరచే ప్రయత్నం చేసాడు. జైళ్ల లైవ్ వైర్ల (ప్రాణాంతక తీగెల) మీద శాంతి కపోతాలు చిక్కుపడతాయి. నిద్రకూ ఆశ్రయానికీ వెలియైన పేద పోలీసులు జైళ్లను కాపలా కాస్తుంటారు. అయినా గంటగంటకూ ఆవులిస్తూ ‘సబ్ ఠీక్ హై’ అని ఒంటరి సెంట్రీ ప్రకటిస్తుంటాడు.

–          వరవరరావు

-సెప్టెంబర్ 1, 2014

సైకిలూ – మూడు కవిసమయాలు

varavara.psd-1

‘చలినెగళ్లు’ (1968) తో మొదలుపెట్టి ‘జీవనాడి’ (1972), ‘ఊరేగింపు’ (1974) ల నుంచి ఒక్కొక్క కవిత తీసుకుని నేపథ్యం చెపుతున్నాను గనుక నేను నా కవితా పరిణామక్రమాన్ని వివరిస్తున్నానని పాఠకులు గ్రహించే ఉంటారు. ఈ సారికి ఆ పద్ధతి నుంచి వైదొలగి ఒక్కసారే 2006లోకి మిమ్ములను తీసుకపోతాను. అయితే అది 1975 ఎమర్జెన్సీని కూడ జ్ఞాపకం చేస్తుంది.

2014 జూలై 27 ఆదివారం సాయంత్రం హైదరాబాదు ఆబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్ లో ‘కవి సంగమం’ లో అఫ్సర్ తన కవిత్వం వినిపించాడు. అందులో మొదటి తన కవితా సంకలనం  రక్తస్పర్శ (2006) లోని సర్వేశ్వర్ దయాల్ మరణం గురించి కవిత చదవడంతో నా మనసు ఆ రోజుల్లోకి వెళిపోయింది.

images

సర్వేశ్వర్ దయాల్ సక్సేనా నా అభిమాన హిందీ కవి. ‘తోడేలు వెంటపడితే పరుగెత్తకు. నిలబడి ఒక అగ్గిపుల్ల గియ్. తోక ముడిచి వెళిపోతుంది….’, ‘నీ ఇంట్లో శవం కుళ్లి వాసనేస్తున్నదంటే ఇంకెంత మాత్రమూ అది నీ వ్యక్తిగత సమస్య కాదు’ వంటి ఆయన కవితాచరణాలు ఎనభైలలో తెలుగు కవివేనన్నంతగా ప్రచారం పొందాయి. 1982 జూలై 2న చెరబండరాజు చనిపోయాక ఆయనపై సర్వేశ్వర్ దయాల్ ఒక మంచి ఎలిజీ రాసాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా పనిచేసిన సురా (సి వి సుబ్బారావు) ద్వారా ఆయనతో పరోక్ష పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగానే ఆయన 1983లో మేము ఢిల్లీలో తలపెట్టిన ఎ ఐ ఎల్ ఆర్ సి (ఆలిండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్ – అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి) ఆవిర్భావసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. అట్లా ఆయన ఇటు కెవిఆర్ తోనూ, నాతోనూ ఉత్తరప్రత్యుత్తరాల్లో ఉండేవాడు. తీరా, 1983 అక్టోబర్ లో ఆవిర్భావ సభలు జరగడానికన్న ముందే ఆయన ఆకస్మికంగా మరణించాడు. అఫ్సర్ కవిత సరిగ్గా ఆ మరణం గురించే. ఒకరాత్రి పుస్తకం చదువుతూ గుండెల మీద పరచుకుని ఆ కవి శాశ్వతనిద్రలోకి వెళిపోయాడు. ఆయనను మేము చూడనే లేకపోయాం.

AU_2012033006_34_53

సర్వేశ్వర దయాల్ సక్సేనా న్యూఢిల్లీ సాకేత్ లో జర్నలిస్టు ఎంక్లేవ్ లో ఉండేవాడు. ఆయన బాల్కనీ నుంచి ఎదురుగా మిలిటరీ కంటోన్మెంట్ పార్కు. ఆ పార్కుకి రోజూ సాయంత్రం ఒక యువకుడు ఎర్ర సైకిల్ పై వచ్చి చేతిలో ఏదో పొట్లం పట్టుకుని లోనికి పోయేవాడు. కాని ఎమర్జెన్సీలో ఒక సాయంత్రం తర్వాత ఆ యువకుడు కవికి కనిపించలేదు.

‘కొత్త ఢిల్లీలో

మిలిటరీ ఇనుపకంచె బయట

ఒక ఎర్ర సైకిలూ

ఇనుపముళ్లలో చిక్కుకపోయిన

ప్రియురాలికివ్వడానికి తెచ్చిన

గోరింటాకు

రోజూ అట్లా చూస్తూ ఉండే కవి

సర్వేశ్వర్ దయాల్ సక్సేనాకు

యవ్వనస్వప్నాలను

ఎమర్జెన్సీ ఏంచేసిందో

ఎవరూ చెప్పక్కర్లేకపోయింది.’

అయితే సృజనకు, విప్లవోద్యమానికి, సాహిత్యానికి ఎమర్జెన్సీ ఆరంభమూ కాదు, చివరా కాదు. 1968లో ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో రా….’ అని పిలుపు ఇచ్చిన దగ్గర్నుంచీ ఇవ్వాటిదాకా మాకు అప్రకటిత ఎమర్జెన్సీయే. అది ‘తననెప్పుడూ నిరాశపరచని మిత్రుడు’ సైకిల్ నుంచి లోచన్ ను వేరుచేసి రెండువారాలు పాకాల క్యాంపులో పెట్టి జైలుకు పంపింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విప్లవ విద్యార్థులు ఎర్ర జెండాలు అందించుకున్నట్లుగా ఒకరి నుంచి ఒకరు పోరాట వారసత్వంగా పొందిన సైకిల్ నుంచి ఆజాద్ ను, ప్రసాద్ ను, రజితను దూరం చేసి ‘ఎన్ కౌంటర్’ చేసింది.

 

2006 ఆగస్టులో సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ (చిన్నయ్య) తో పాటు ‘ఎన్ కౌంటర్’ అయిన ఏడుగురిలో రజిత ఒకరు. ఆ ఏడుగురూ చిత్రహింసల వల్ల ఎంత మాంసం ముద్దలయ్యారంటే ఆమె కాలివేళ్ల పోలికతో మాత్రమే ఆమె సోదరి ఆమెను గుర్తుపట్టగలిగింది. రజిత విద్యార్థి ఉద్యమంలోనే కాకుండా మహిళా ఉద్యమంలో కూడ ఎంతో క్రియాశీలంగా పనిచెసింది. సంక్షేమ పథకాలను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు 1996లో పూనుకున్నప్పుడు, 2000 లో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు పోరాటంలోను, సహాయ కార్యక్రమాలలోను అప్పటికింకా విద్యార్థిగా ఉన్న కాశీం ను రజిత తన సైకిల్ పై ఎక్కించుకుని తిప్పేదని చెప్పాడు.

          వరవరరావు

ఆగస్ట్ 12, 2014

 

 

రక్తంలో డ్రమ్స్ మోగించే ఊరేగింపు!

Vv_writing

“ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ లో అక్టోబర్ 1970 దసరా రోజు సాగిన విప్లవ రచయితల సంఘం ఊరేగింపు యీనాటికీ నాకు కళ్లకు కట్టినట్లుగా రక్తంలో డ్రమ్స్ ను మోగిస్తుంది… ఒక చిన్న పోరాట రూపంగా ఊరేగింపు నాకనిపిస్తుంది.

ఉపన్యాసాలు మనిషిని వేదికి మీదికి తీసుకపోతే ఊరేగింపులు మనుషుల్లోకి తెస్తాయి. సంకోచం, బెట్టు, సిగ్గు, పోజ్, ఇన్హిబిషన్స్, కాంప్లెక్సులన్నీ పటాపంచలు చేసి పెటీబూర్జువా వయ్యక్తిక ఆలోచనల నుంచి గుంపు మనస్తత్వంలోకి, మంది ఆలోచనల్లోకి తెచ్చే డీక్లాసిఫయింగ్ లక్షణం ఊరేగింపుకు ఉన్నది.”

1974 జనవరిలో నా మూడవ కవితా సంకలనం ‘ఊరేగింపు’ వెలువడినపుడు నేను రాసుకున్న మాటలివి. ఇవ్వాళ ఖమ్మం వర్తక సంఘం హాల్ – వర్తక సంఘం హాల్ గానే మిగిలిందో, ఇంకా రూప సారాలు మార్చుకున్నదేమో గాని ఆనాడు మాకు అది పాణిగ్రాహినగరే. నీరుకొండ హనుమంతరావు రూపుకట్టిన పాణిగ్రాహి నగర్. నేనింకా ఆ హాల్ ముందు ఆయనతోనూ, రావెళ్ల వెంకటరామారావు తోనూ, ‘కౌముది’తోనూ ఊరేగింపు ముగిసిన శరద్రుతు సంధ్యాకాలం అస్తమిస్తున్న అరుణకాంతుల్లో ఉద్వేగంగా పరిచయం చేసుకుంటున్న జ్ఞాపకం.

అంతకుముందు నేనేమైనా ఊరేగింపుల్లో పాల్గొన్నానా? 1952-53లో ముల్కీ ఉద్యమం రోజుల్లో హనుమకొండ మర్కజీ విద్యార్థిగా మొదటిసారి క్లాసు బాయ్ కాట్ చేసి పాల్గొన్నాను. కనుక వ్యక్తిత్వం వికసించే క్రమంలో కలిగే తొలి అనుభవం ఏదైనా హృదయానికి హత్తుకుని ఎన్నటికీ చెరగని ముద్ర వేసినట్లుగా ఖమ్మం ఊరేగింపు ఎప్పుడూ నా జ్ఞాపకాల్లో కదం తొక్కుతూనే ఉంటుంది.

అప్పటికిప్పటికి వందల వేల ఊరేగింపుల్లో పాల్గొని ఉంటాను. ఒక అనుభవం – అధిక ధరలకు వ్యతిరేకంగా 1973 ఆగస్టులో వరంగల్ పోచమ్మ మైదానం నుంచి సుబేదారి కలెక్టరాఫీసుకు సాగిన వేలాది మంది ఊరేగింపు. మా ఊరేగింపులో మఫ్టీలో పాల్గొని, మాకన్న ఆవేశపూరితమైన నినాదాలిచ్చి, డిఐజి ఆఫీసు ముందుకు రాగానే మమ్మల్ని ఎంచుకొని లాఠీ చార్జ్ రూపంలో చితుకబాది పడేసిన అనుభవం.

varavara.psd-1

మరొక మరపురాని ఊరేగింపు కరీంనగర్ లో రైతుకూలీ సంఘం రెండవ మహాసభల సందర్భంగా 1983లో సాగిన ఊరేగింపు నాతో ‘భవిష్యత్తు చిత్రపటం’ రాయించింది. అంతకన్న చరిత్రాత్మకమైనది 1990 మే 6 న వరంగల్ జగదీశ్ నగర్ నుంచి కాజీపేట దగ్గు రాయలింగు, గోపగాని ఐలయ్య నగర్ దాకా సాగిన సుదీర్ఘమైన లక్షలాది మంది ఊరేగింపు. సందర్భం రైతుకూలీ సంఘం మహాసభలు. పద్నాలుగు లక్షల మంది పాల్గొన్న సభలు. ఊరేగింపు నక్కలగుట్ట దాకా వచ్చిన తర్వాత నేను, చలసాని ప్రసాద్ వచ్చి మిమ్మల్ని తీసుకపోతాం – అని కాళోజీకి మాట ఇచ్చాం. కాని ఆ ఊరేగింపు నుంచి ఎంత ప్రయత్నించీ బయటికి వెళ్లలేకపోయాం. అంత గొప్ప అవకాశం మావల్ల కోల్పోయినందుకు కాళోజీ కన్ను మూసేదాకా ఆ విషయం గుర్తుకు వస్తే మమ్ములను తిట్టేవాడు.

హైదరాబాదులో చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా టిడిపి తప్ప మిగతా పార్టీలు, ప్రజాసంఘాలు అన్నీ కలిసి చేసిన ఊరేగింపులో విరసం క్రియాశీలంగా పాల్గొన్నది. బషీర్ బాగ్ చౌరస్తాలో నేను, విమల మొదలైన సభ్యులం చూస్తుండగానే మా కళ్లముందే పోలీసు ఫైరింగ్ జరిగి ఊరేగింపు చెల్లాచెదరైంది. కళ్లల్లో నిండిన గంధకధూమం పొగలు, కసి, కన్నీళ్లతో బయటపడడమే కష్టమైపోయింది.

ఇంక కాళోజీ శతజయంతి, విరసం 44వ మహాసభల సందర్భంగా 2014 జనవరి 11న హనుమకొండ అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియం దాకా ఊరేగింపు బీటలు వారిన నేల పులపుల మొలకెత్తిన అనుభవం. నమ్మలేని పునరాగమనం. ప్రతి అడుగూ అమరుల నెత్తుటితో తడిసిన బాట.

–          వరవరరావు

 

ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తు…

varavara.psd-1

‘రాత్రి’ కవితా సంకలనానికి తర్వాత, ‘దిగంబర కవులు’ కు ముందు, 1965లో రాసిన కవిత జీవనాడి.

‘రాత్రి’ కవితా సంకలనాన్ని ‘దిగంబర కవులు’కు కర్టెన్ రైజర్ అంటాడు చలసాని ప్రసాద్. ఇపుడాలోచిస్తే 1962 నుంచి 1965 దాకా దేశం రెండు యుద్ధాలు చూసింది – భారత-చైనా యుద్ధం, భారత – పాకిస్తాన్ యుద్ధం. మొదటిది మనం ఎన్నడూ గెలవలేమని తెలిసి తెచ్చిపెట్టుకున్నది. రెండవది ఎపుడయినా సరే గెలుస్తామనే గీరతో చేసింది. ఈ రెండూ దేశంలో మధ్యతరగతి, బుద్ధిజీవులను కవులతో సహా దేశభక్తి పూనకలో పడేసినవి. తెలుగు కవుల్లో కె. వి. రమణారెడ్డి, సి. విజయలక్ష్మి తప్ప ఎవరూ మినహాయింపు కారు. ‘స్వప్నలిపి’ లోనే కవిత్వాన్ని అనుభవించే అజంతా కూడ చైనా యుద్ధ సందర్భంలో ‘జెండాలకు కన్నీళ్లు లేవు’ అని ఫక్తు రాజకీయ కవిత రాశాడు. ఆ వాతావరణంలో కమ్యూనిస్టు పార్టీ చీలిక (1964) ఒక కుదుపుకు కారణమైంది. అటు శ్రామికవర్గంలోను, ఇటు యువతరంలోను ఒక అశాంతి నుంచి ఒక ఆన్వేషణ ప్రారంభమైంది. అది వ్యవస్థ మీద, ఎస్టాబ్లిష్ మెంట్ మీద, రివిజనిజం మీద అసహనం నుంచి, ఆగ్రహం నుంచి ఒక ఆశావాదంతో మానవావిష్కరణ కోసం తెగుతున్న సంకెళ్ల స్వరం.

కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు ‘అగ్నిశిఖలు -మంచుజడులు’, కేశవరావు ‘ఉదయించని ఉదయాలు’, ఎ రాఘవాచారి ‘మానవుడా’ దీర్ఘకవిత ఇంచుమించు వెనుకా ముందుగా ఇదేకాలంలో వచ్చాయి. వీళ్లే తర్వాతి కాలంలో మహాస్వప్న, నగ్నముని, జ్వాలాముఖి పేర్లతో ‘దిగంబరకవులు’లో చేరారు.

హైదరాబాదులొ దిగంబరకవులు, వరంగల్ లో ‘తిరుగబడు’ కవులు, విశాఖపట్నంలో సాగర గ్రంథమాల, యజ్ఞం, తిరుపతిలో రాడికల్స్ తలెత్తడానికి ముందుకాలం. శ్రీకాకుళం గిరిజనుల్లో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, రాములు అనే మరో టీచర్ తో కలిసి గిరిజన సంఘాలు పెదుతున్న కాలం. నవత కవిత్వ పత్రిక ఆగిపోతూ సృజన కోసం వరంగల్ మిత్రమండలి లోని సాహితీమిత్రులు నలుగురు కవి తిలక్ తో కలిసి ఆధునిక దృక్పథం, ప్రయోగం, సామాజిక చైతన్యం కోసం సాహిత్య పత్రిక పెట్టాలని కలలు కంటున్న రోజులు.

Vv_writing

‘నా యుగస్వరానికి’ నా తరం గాయకుణ్నని అందుకే ప్రకటించి ఉంటుంది. ‘రేపటి వెలుగులపై విశ్వాసం వీడ’కుండా నా తరం అశాంతిని పలుకుతూ, నాలో దాగి ఉన్న సుప్తాగ్నిని వెతుకుతున్న కాలం. ఎంత అస్పష్టమైందయినా, ఎంత అపరిపక్వమైందయినా అప్పటికది యుగవాణి. ఆ స్పష్టత, ఆ పరిపక్వత – ప్రపంచ స్థాయిలో చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (1966) తో, దేశంలో నక్సల్బరీ (1967) తో వచ్చిందని ఇపుడు స్పష్టంగా చెప్పగలను. అందుకే, ‘ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తును నేను’.

అవి ప్రపంచమంతా వియత్నామ్ యుద్ధంతో ఉత్తేజం పొందుతున్న రోజులు కూడ. అమెరికాలో బుద్ధిజీవులు, యువతరం, వియత్నామ్ ప్రజల పక్షం వహించి, వాళ్లకు సంఘీభావంగా విశ్వవిద్యాలయాల్లో, సాహిత్యరంగంలో నల్లజాతి ప్రజల పోరాటాలు నిర్మిస్తున్నకాలం. అందుకే రష్యాలో తలెత్తిన రివిజనిజం ‘రాకెట్టుతో చంద్రునిపై విజయాన్ని’ రాయించిన వైజ్ఞానికప్రగతితో గర్వపడుతుంటే ‘వియత్నామ్ ప్రజల విజయాన్ని మానవజాతి విజయం’గా యువతరం భావిస్తున్న కాలమది. ఇటువంటి స్పష్టత అప్పతికింకా నాకు ఏర్పడనప్పతికీ విప్లవమే, అంతే వర్గపోరాటం ద్వారా శ్రామికవర్గం సాధించే విజయమే మానవజాతిని దోపిడీ, పీడనల నుంచి విముక్తం చేస్తుందన్న ఆకాంక్ష హృదయంలో స్పందించి వెలువడినవే ‘జీవనాడి’ సంపుటం లోని ‘జీవనాడి’, ‘రేపు’ మొదలైన కవితలు.

‘1970-71లో రాస్తే ఈ కవిత్వం ఇట్లా ఉండేది కాదేమో.. కానీ నా వ్యక్తిత్వాన్ని తీర్చిందీ మార్గాన్ని పేర్చిందీ ఈ జీవనాడే అని నమ్ముతాను’ అని ‘జీవనాడి’ చరిత్రలో (15 మార్చ్ 1971) ఆనాడే రాసుకున్నాను.

–          వరవరరావు

మే 28, 2014

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ…ఈ కవిత!

varavara.psd-1

అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ని. వాళ్లింట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. వాడ కుక్కల్లోనే ఒక కుక్కను మచ్చిక చేసుకొని పెంచుకున్నారు. దానితో ఆడుకోవడం, దానికి బిస్కెట్లు పెట్టడం, అది మా రాక కోసం ఎదురుచూడడం.

అకస్మాత్తుగా ఒకరోజు ఆ కుక్కపిల్ల చచ్చిపోయింది. అంటే దాని చావును గానీ, చనిపోయిన ఆ కుక్కపిల్లను గానీ నేను చూడలేదు. ఆరోజు, ఆ తర్వాత ఆ ఇంట్లో అది కనిపించలేదు. పెద్దమ్మ కళ్లనీళ్లు పెట్టుకొని కుక్కపిల్ల చనిపోయిందని చెప్పింది.

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ. వెలితి. చేతులు ఏదో వెతుక్కున్నట్లు. వెతుకులాట మనసుకు. ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ కవిత ఆ వేదననుంచి వచ్చింది.

11hymrl01-RDF_G_HY_1235147e

అప్పటికే నాకు కవిగా కొంచెం గుర్తింపు వచ్చింది. 1950లలో ‘భారతి’లో కవిత్వం అచ్చయితే కవి. ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయితే ఆధునిక కవిగా గుర్తింపు వచ్చినట్లే. రష్యా రోదసిలోకి స్పుత్నిక్ లో లైకా అనే కుక్కపిల్లను పంపించినపుడు నేను రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ (1957) ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయింది. ఆ తర్వాత ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’, ‘శిశిరోషస్సు’. ‘హిమయవనిక’ అనే కవితలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన వచనకవిత్వ పోటీల్లో, ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో బహుమతులు వచ్చి సాహిత్య విద్యార్థులు మొదలు సి నారాయణరెడ్డి గారి దాకా అభిమానం చూరగొన్నవి.

varavara_rao.gif

‘భళ్లున తెల్లవారునింక భయం లేదు. కుళ్లు నల్లదని తెలుస్తుంది నయంగదా’, ‘ఇనుని అరుణ నయనాలు’ వంటి పాఠ్యపుస్తకాల ప్రభావం ఎక్కువే ఉన్నా, ‘వానిలో ఎన్నిపాళ్లు ఎర్రదనం, ఎన్నిపాళ్లు ఉడుకుదనం ఉందో రేపు కొలుస్తాను, రేపు మంచిరోజు ఎర్రని ఎండ కాస్తుంది, రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది’ వంటి ఆశావహ ఆత్మవిశ్వాస ప్రకటనలతో నాకు ‘ఫ్రీవర్స్ కవులలో సామాజిక ప్రగతివాద’ ప్రతినిధిగా ఒక గుర్తింపు వచ్చింది.

శకటరేఫాలు మొదలు ప్రబంధ కవిత్వ భాష, వర్ణనలు, ఊహలు, ఉత్ప్రేక్షలు, ఇమేజరీ ఉన్నా ప్రగతివాద భావజాలానికి చెందిన కవిగా నాకొక ఇమేజ్ ఈ కవితలతో ఏర్పడింది. రాత్రి, మంచు వంటి సంకేతాలతో స్తబ్దతను, భయాందోళనలను, సూర్యుడు, ఉషస్సు వంటి సంకేతాలతో భవిష్యదాశావహ ఆకాంక్షను వ్యక్తం చేసే కాల్పనిక ఆశావాదం అట్లా మొదలై 1968 తర్వాత ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంగా స్థిరపడింది. అట్లా చూసినప్పుడు కవితాసామగ్రి, భాష, వ్యక్తీకరణలకు సంబంధించినంతవరకు ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ ఒక డిపార్చర్. ఒక ప్రయోగం. పై నాలుగు కవితల్లో ఊహ, బుద్ధి, రచనా శక్తిసామర్థ్యాల ప్రదర్శన ఉంటే ఇందులో ఫీలింగ్స్ సాధారణ వ్యక్తీకరణ ఉంటుంది.

‘నా రెక్కల్లో ఆడుకునే కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?’ మనుషులు వెళిపోతారంటే నమ్మగలను. వాళ్లకోసం, అందులోనూ మగవాళ్ల కోసం ఒక స్వర్గలోకం ఉంది. అందుకని వాళ్లు ఇహంలో అన్ని అనుబంధాలూ వదులుకొని వెళ్లగలరు. ‘కాని కుక్కపిల్ల వెళిపోవడమేమిటి?’‘అంత నమ్మకమైన జీవం ఎక్కడికని వెళ్లగలదు? ‘ఎవడో స్వార్థంకై, నేను లేనపుడు ఏమిటో దొంగిలించడానికి వస్తే మొరుగుతూ తరమడానికి వెళ్లి ఉంటుంది. ప్రలోభాలు నిండిన వాళ్లను ఆ లోకందాకా తరిమి తెలవారేవరకు తెప్పలా ఇలు వాకిట్లో వాలుతుంది.’

అయినా దానికా స్వర్గంలో ఏముంది గనుక

అక్కడుంటుంది?

స్వర్గంలోని వర్గకలహాలు

రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను’.

నేను సికెఎం కాలేజిలో పనిచేస్తున్నపుడు 1969లో పి జి సెంటర్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఉన్న మిత్రుడు పార్థసారథి ఈ కవితను హిందీలోకి అనువదించగా, జ్ఞానపీఠ్ సాహిత్య పత్రికలో అచ్చయింది. నండూరి రామమోహనరావుగారు ‘మహాసంకల్పం’ కవితాసంకలనం వేసినపుడు ఈ కవిత ఇవ్వమని కోరాడు. ఏ కవిత ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి గానీ, మీరు నిర్ణయిస్తే ఎట్లా అని నిరాకరించాను. సంపాదకునికి, సాహిత్య విమర్శకునికి కవి కవితల్లో తనకు ఇష్టమైనవి ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆలస్యంగా గుర్తించి ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాను. అట్లని నేను 1964లో నెహ్రూ మీద రాసిందో, 65లో పాకిస్తాన్ తో యుద్ధం గురించి రాసిందో ఇపుడు ఆ భావాల ప్రచారానికి ఎవరైనా వాడుకుంటే అది మిస్చిఫ్ అవుతుంది.

ఇప్పుడు అఫ్సర్ ‘సారంగ’లో నా కవితలను నేనే ఎంచుకుని పరిచయం చేయాలని కోరినపుడు నా ఇమేజ్ కు కొండగుర్తులుగా నిలిచిన కవితలు కాకుండా తాత్విక స్థాయిలో, కవి హృదయాన్ని పట్టి ఇవ్వగల కవితగా కూడ ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ నే ఎంచుకోవాలనిపించింది.

–          వరవరరావు

-ఏప్రిల్ 30, 2014