ఇష్టమైన నరకం…

 

 

-మధు  పెమ్మరాజు 

~

 

 ఉన్నట్టుండి ఓ రోజు తెలుగు సాహిత్యానికి నా అవసరం ఉందనిపించింది.  ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా అమెరికాలో తెలుగు మగవాళ్ళ పై (అంటే బేబీ షవర్ రోజు తలుపు చాటున దాక్కుని, తలుపు తెరుచుకోగానే  “సర్ప్రైస్” అని భయపెట్టే మగవాళ్లపై) బ్లాగు రాసి స్నేహితులకి పంపి అభిప్రాయం  అడిగాను, వారం దాకా ఏ సమాధానం రాలేదు, మనోభావాలు దెబ్బ తిన్నాయేమోనని ఫోన్ చేసి అడిగితే “అద్భుతం! నువ్వు మామూలు మనిషివి కాదు!” అని ఉత్తేజపరిచారు (తర్వాత చదవకుండా పొగిడారని తెలిసింది)

కానీ రైలు స్టేషన్ దాటేసింది. వారానికో బ్లాగు రాయడం, జనాలపై ఎక్కుపెట్టడం మొదలుపెట్టాను. నెట్లో నారద సంచారం చేస్తుంటే ఎందరో మంచి బ్లాగర్లు, రచయితలు తారసపడ్డారు. వారి పదునైన రచనలు చదివాకా నేను రాసింది ఏదైనా కావచ్చు కానీ సాహిత్యం మాత్రం కాదని, సాహిత్యానికి నా అవసరం లేదని తేలిపోయింది. అప్పటికే కొన్ని ప్రమాదాలు జరిగిపోయాయి – ”ఇంట్లో రచయితగా గౌరవిస్తున్నారు, యధేచ్ఛగా కంప్యూటర్ ముందు కూర్చోనిస్తున్నారు, పార్టీలకి వెళితే నా వీరు బ్లాగులు అవి రాస్తారని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు” ఇక ఇన్ని సదుపాయాలు, మర్యాదలు జరుగుతుంటే వదలాలని అనిపించలేదు.

అంతర్జాల పత్రికలలో కథలు, కవితలు చూసుకుని, లెక్కపెట్టుకుని మురిసిపోయేవాడిని. ఆ ముచ్చట వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది పోటీలలో బహుమతి రావడంతో ముగిసింది, ఏ బాదరబందీ లేకుండా హాయిగా బ్లాగులు రాసేవాడిని కాస్తా రాయడం సీరియస్ గా తీసుకోవడం అక్కడ మొదలయ్యింది. బ్లాగులు బాచిలర్ జీవితం లాంటిది (ఏ బాదరబందీ ఉండదు), కథలు కాపురం లాంటివి (బరువు, బాధ్యత, ఇష్టమైన నరకం).

మొదట్లో ఏది రాసినా చప్పగా అనిపించేది, కథలు పూర్తయినా నా లాప్టాప్ దాటేవి కావు, అంతా అస్పష్టత..అంతు పట్టని దారులు. అయినా నిరుత్సాహపడకుండా కథని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాను, ఆ క్రమంలో…

ఒక సగటు పాఠకుడు కథని ఎందుకు ఇష్టపడతారు? – పత్రిక చేతిలో పడగానే సగటు పాఠకుడు చూసే మొదటి శీర్షిక కథ. ఆ ఆకర్షణకి ముఖ్య కారణం పాఠకుడు పెట్టే అతి తక్కువ సమయానికి మానసిక ఉల్లాసం, తృప్తిని ఇవ్వగలిగే అవకాశమున్న ప్రక్రియ కాబట్టి (నా ఉద్దేశ్యం అన్ని కథలని కాదు, వేరే శీర్షికలు తక్కువ చెయ్యడం కాదు..ఎక్కువ అవకాశం ఉన్న శీర్షిక అని మాత్రమే).

పాఠకులు ఎలాంటి కథలు ఇష్టపడతారు? – తమ మనసుని తాకి, కదిలించే ఇతివృత్తాలకి పాఠకుడు స్పందిస్తాడు. నిజానికి కథలో తమని తాము వెతుక్కుంటాడని  అనిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు నచ్చే అంశాలు ఏమిటంటే- .

కథ సంపూర్ణ యాత్రలా (psychological journey) అనిపించాలి. మనని మనం పోగొట్టుకుంటూ, మళ్ళీ కలుసుంటూ వచన కవిత్వంలా సాగాలి.

నిదానంగా సాఫీగా, సాగినా ఆలోచింపజేయాలి, వెక్కిరించాలి, చుట్టూ ఉన్న పొరలని విప్పాలి.

పదాల గారడీలా కాకుండా వచనంలో నికరమైన యోగ్యత  ఉండాలి.    

చూసిందే, చదివిందే అనేలా చప్పగా అనిపించకూడదు

అంటే నేను ఆస్వాదించే స్థాయి (నా బేస్లైన్) వేరు, రాస్తున్న తీరు వేరు..ఈ రెంటి మధ్య దూరాన్ని  ఎలా తగ్గించాలి? నింగి అందనంత ఎత్తులో ఉందని చూస్తూ కూర్చుంటామా? ఇటుకలు పేరుస్తూ ఉంటాము, మెట్లు కడుతూనే ఉంటాము.

రాయడం ఏకాంత ప్రయత్నమయినా పెన్ను, పేపర్ ని తాకే లోపు ఎన్నో సందర్భాలు, వ్యక్తులు, పుస్తకాలు, సంభాషణలు మనలో జేరి అదృశ్య హస్తాలుగా రాయిస్తూ ఉంటాయి, కాబట్టి రాయడం ఒక సమావేశం.

అవకాశం వచ్చింది కాబట్టి నాకనిపించిన అదృశ్య హస్తాలు- సాహిత్య వాతావరణం, సంపాదకులు,  సాహితీవేత్తలు, పాఠకులు.

సాహిత్యం ఒక అవసరంలా అనిపించాలి, ఆదరించే వాతావరణం కావాలి. ఆ వేదిక చిట్టెన్ రాజు గారు అనే వ్యవస్థ ద్వారా లభించింది. కొన్ని దశాబ్దాలుగా బాషకి, సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. సాహితీ సదస్సులు, వెన్నెల వేడుకలు నిర్వహించడమే కాకుండా కొత్తవారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తారు. వారి పరిచయం వలన సాహిత్యంతో బలమైన, ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది.

కొత్త కథకులని వెలికి తీసి, వారిని ప్రోత్సహించే సహకార సాంప్రదాయం ఉండాలి. ఆ అంశంలో సంపాదకులు  కీలకమైన పాత్ర పోషిస్తారు. అంతర్జాలలో మనం రకరకాల పత్రికలని చూస్తుంటాము. రచన పంపగానే మాటామంతీ లేకుండా ప్రచురించే ‘పాసివ్’ పత్రికలు, అత్యున్నత ప్రమాణాల “కంచు కోట” పత్రికలు, రెండిటి వల్ల కొత్తవారికి పెద్ద ఉపయోగం లేదు.

కౌముది సంపాదకులు – కిరణ్ ప్రభ గారు, కవిత పంపినా, కథ పంపినా వెంటనే స్పందించి, అభిప్రాయం తెలిపేవారు. రచయిత దగ్గర స్పార్క్ ఉందని అనిపిస్తే విడిచిపెట్టకుండా ప్రోత్సహిస్తాను అని ఫోన్ లో మాట్లాడి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, తిరగ రాయించి పత్రికలో వేసేవారు.

తానా-సంపాదకులు-నారాయణస్వామి గారికి కొత్త కథలు పంపి అభిప్రాయం చెప్పమని అడిగేవాడిని, ఓపికగా ఫోన్లో విశ్లేషించే వారు. సవరణలు సూచించేవారు. గంటల, గంటల రైటర్ ల వర్క్ షాపులు కాదు. ఓ ఐదు, పది నిముషాల సంభాషణ, ఒకటి రెండు సూచనలు చాలు అల్లుకుపోవడానికి, నిండా ముంగిన వాడికి చిన్న తాడు చాలు.

సారంగ సంపాదకులు – అఫ్సర్ గారి ఆత్మీయ పలకరింపు, ఏదైనా రచన పంపమనే పిలుపు రచయితకి మంచి ఊతాన్ని ఇస్తాయి.

కథ పూర్తి చేసి, ఏదో ఒక పత్రికకి హడావిడిగా పంపి, అచ్చులో పేరు చూసుకునే తాపత్రయం కాస్తా నాకు నచ్చే వచనం రాయాలనే తపనగా మారింది.  ఓపికగా తిరగ రాయడం, మళ్ళీ రాయడం. – ప్రతీ పదం, వాక్యం, సంభాషణ మళ్ళీ మళ్ళీ చదువుకుని, పాఠకుడు ఎలా చదువుతాడో? స్పష్టత ఉందా? మనం అనుకున్న భావం ఇదేనా? అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ ముందుకి వెళ్ళడం అక్కడ నుండి  మొదలయ్యింది.

ఇక కథ పూర్తి అయ్యాకా అసలు కథ మొదలవుతుంది (optimization ఫేస్)  కొన్ని బాగా పండిన సంభాషణలు, వాక్యాలు  తొలగిస్తున్నపుడు చెయ్యో కాలో తీస్తున్నట్టు బాధ పడే వాడిని, రాను రాను పేషంట్ నుంచి సర్జెన్ పాత్ర పోషించడం నేర్చుకున్నాను.

నూటికొక ఐదో ఆరో గొప్ప కథలు దొరుకుతాయి. పతంజలి శాస్త్రి గారివి ఆ కోవకి చెందిన అరుదైన, అపురూపమైన కథలు. ‘వడ్ల చిలుకలు’ కథా సంపుటి నుండి ఈ మధ్యనే వచ్చిన ‘గేదె పై పిట్ట’ దాకా  అయిపోతాయేమోనని కొద్దికొద్దిగా చదువుకుంటాను, అయిపోయాకా మళ్ళీ చదువుతాను.

ఏ మాత్రం కష్టపెట్టని పదాలు, వచన కవిత్వం, వ్యంగ్యం, పాఠకుడితో తెలివైన, బరువైన, లోతైన..పొరల పొరల సంభాషణలు జరపడం వారికే సాధ్యం.  ఎప్పుడు కలిసినా చాయ్ తాగుదామా? అంటూ పలకరింపుతో మొదలయి రెండు, మూడు గంటల సరదా సంభాషణ సాగుతుంది. నేను కథల చిట్కాలు అడగను, సాహిత్యం అంటూ విసిగించను. ఆ మహా కథకుడి సమక్షంలో కాసేపు గడిపితే చాలు ప్రభావం మనతో నడిచొస్తుంది, మనలో నిలిచిపోతుంది.

కేవలం సాహిత్యాన్ని ప్రేమిస్తూ, పబ్లిసిటీకి దూరంగా ఉండే సాహితీవేత్తలు నన్ను అమితంగా ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి మిత్రుడు మెహర్.

రచనా శైలి, పద విన్యాసం, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చదివించే రిపీట్ వేల్యూ గల వ్యాసాలు, బ్లాగ్ గుళికలు, పుస్తక/రచయిత పరిచయాలు. రాయడం తపస్సులా సాధన చేసే వ్యక్తి. ఏమీ ఆశించకుండా సాహిత్యాన్ని ప్రేమించడడానికి / ఇష్టపడడానికి స్ఫూర్తి!! Inspiration for literary enthusiasm!!

ఈ మధ్యన ఒక పాఠకుడు మూడు పేజీల కథకి  నాలుగు పేజీల విమర్శ పంపాడు. కథని ఇంత సీరియస్ గా తీసుకుంటారని తెలియడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి అనుభవాలు రచయిత ఒద్దికైన ఇరుకుని వదుల్చుకునే అవకాశాలు. రచయిత కారైతే విమర్శ బ్రేక్ లాంటిది, ప్రశంస ఆక్సిలరెటార్ లాంటిది….రెండూ అవసరమే..

 

****

చీకటి నీడలు

 

-మధు పెమ్మరాజు

~

Madhuగడియారం చప్పుడు తప్ప వేరే అలికిడి లేదు, ఫ్లోర్లో అక్కడక్కడా వెలుతురు ఉండడంతో అంతా అస్పష్టంగా ఉంది. నా క్యూబ్ పైన బల్బు మొహమాటంగా వెలుగుతోంది. కదలికని బట్టి వెలగడాన్ని కంపెనీ ఆటోమేషన్ ఇన్నోవేషన్ అంటుంది, ఊపిరి తీసుకోవడం కదలిక కాబట్టి బల్బు వెలుగుతోందని నేను అనుకుంటాను. గత కొన్ని నెలలుగా అలసిన మొహాలు ఒక్కొక్కటీ మాయమయి, బెదురుగా చూసే లేత మొహాలు వస్తున్నాయి – కంపెనీ అవుట్సోర్చింగ్ అంటోంది. ఈ వెలుగు నీడల పరదాలో నేను అనామకుడిగా మారిపోయాను. అనేక భయాలకి ఇంకో కొత్త భయం జత చేరింది – టిక్..టిక్…మంటూ ముల్లు వేగం పెరిగే కొద్దీ బల్బు ఆరుతుందని భయమేస్తుంది, అప్పుడు ఓ రెండడుగులు వేసి కూర్చుంటాను.

రోజూ తలెత్తకుండా పని చేసేవాడిని ఏదో వెలితిగా అనిపించి కీబోర్డ్ పక్కన పెట్టాను, కాసేపటకి కంప్యూటర్ స్క్రీన్ సేవర్ కూడా కదలడం మానేసింది. పక్క క్యూబ్లపై ఆండ్రూ, జాక్, షెల్లీ, ఆలన్ పేర్లు ఇంకా అలానే ఉన్నాయి, వారి నేమ్ ప్లేట్లని ఆప్యాయంగా తడిమాను. నా పలకరింపు వారి దాకా చేరుతుందని భ్రమ. ముప్పై ఏళ్ళ స్నేహాలు వెంట, వెంటనే విడిపోయాకా మా ఫ్లోర్ పక్షులు లేని చెట్టుగా మారింది.

ఒకప్పుడు నా ఈ స్థావరం విశాలంగా, గుండెల నిండా ఊపిరి పీల్చుకునేలా ఉండేది. ఏళ్ళు గడిచిన కొద్దీ ఇరుకుతనం పెరిగింది, ఉద్యోగం నా అస్తిత్వం నుండి జీతం కోసం పని చేస్తున్నాను అనేదాకా చేరుకుంది. క్యూబ్ గోడలపై వెలిసిన నీలం రంగు గుడ్డ, టేబుల్ పై బరువైన నల్లటి ఫోను, పక్కన జెన్నీ పెళ్లినాటి ఫోటో.. జెన్నీ అన్నీ చూస్తున్నట్టుగా నవ్వుతోంది….నా పిచ్చి గానీ అంత దూరం నుంచి ఎలా చూస్తుంది? పక్కన బేస్బాల్ బాట్ పట్టుకుని రిచ్చీ, ఎంత ముద్దుగా ఉన్నాడో – చదువులు ముగించుకుని కాన్సస్ వెళ్ళిపోయాడు.

“బాబూ! నీ పాత ఫోటోలు చూసి, చూసి విసుగొస్తోంది. కాస్త మార్చు” అంటూ షెల్లీ ఆట పట్టించేది. షెల్లీకి చెప్పినా అర్ధం కాదు…జెన్నీ నవ్వు ఎన్ని సార్లు చూసినా మొదటిసారి చూసినట్టే ఉంటుంది. గోడ చుట్టూ ఫ్రేముల్లో కంపెనీ ఇచ్చిన సర్టిఫికేట్లు – ఓ రోజు జాక్ సర్టిఫికేట్లు లాక్కునంత పని చేసాడు, సొంత ఖర్చుతో అందమైన ఫ్రేములు కట్టించి – “విలువైన ప్రశంశా పత్రాలని గాలికి, ధూళికి వదిలేయకూడదు, అందంగా బంధించాలి” అన్నాడు.

chinnakatha
షెల్లీ ఒక్క సంపాదనతో పెద్ద సంసారాన్ని నెట్టుకొచ్చేది, వెళ్ళిపోతున్న రోజు “జో..పని ఒక గౌరవంగా, పరువుగా భావించాను, కంపనీ మరో కుటుంబం అనుకుని పనిచేసాను. ఈ రోజు వాళ్ళు నన్ను నగ్నంగా నిలబెట్టారు..” అని వెక్కి, వెక్కి ఏడ్చింది. ఓ రెండు పేపర్ టిష్యూలు ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను, వాచీ కేసి చూడబోతూ ఆగిపోయాను, గతం తలుచుకుంటే ముల్లు వేగం పెరుగుతుందా?

ప్రతి ప్రోడక్ట్ రిలీజ్ ఒక పండుగలా ఉండేది. అర్ధరాత్రి, అపరాత్రి అని చూసుకోకుండా నెలల తరబడి ఆఫీసులో మకాం వేసే వాళ్ళం- పిజ్జాలు, కాఫీలతో పాటు లెక్కలేనన్ని జోకులు భోంచేసేవాళ్ళం. రిలీజ్ ముగిసి, మా కాడ్ డ్రాయింగ్లకి రెక్కలొచ్చి ఎగురుతుంటే పిల్లాడు పుట్టినంత ఆనందంగా ఉండేది. ఆండ్రూ పదేళ్ళ పిల్లవాడిలా వచ్చి “జో.. చూడు.. టీవీలో చూడు..ఆ ఎగిరే విమానంపై మన సంతకం ఉంది” అని గోల చేసేవాడు. వెళ్ళే రోజు గోడపై ఇష్టంగా అతికించిన విమానాల పోస్టర్లని కోపంగా లాగి ముక్కలు, ముక్కలుగా చింపి చెత్త డబ్బాలో పడేసాడు. ఆ క్షణం మాట్లాడాలంటే భయం వేసింది.

ఆలన్ స్వతహాగా కవి, ప్రపంచ కవిత్వం చదివినవాడు. నిరాశ, విషాదం నిండిన కవిత్వమంటే ఆసక్తి చూపేవాడు. “ఆల్! నిత్యం మనని వేధించే సమస్యలు సరిపోవా? అవేవో అరువు తెచ్చుకుని మరీ ఏడవాలా?” అని విరగబడి నవ్వితే, జవాబుగా చిరునవ్వు నవ్వేవాడు. వెళ్ళే రోజు హౌస్మన్ కవిత చదివి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు.

చింత రువ్వ చెయ్యి చుర్రుమనిపించిందని
చేతిని పదిసార్లు దులుపుకున్నాను
కాని ఒకటి మాత్రం నిజం, అది తీవ్రంగా బాధించినా
విషాదం ముంగిట నిలిచిన క్షణం
రంగు, రంగుల లోకం చూపక
చేదు సత్యాల్ని చూపి మేలే చేస్తుంది.
నువ్వు నా స్థితిలో ఉన్నప్పుడు
నీ మనసుకి సాంత్వననిస్తుంది.
ఆ ఉరుములు మెరుపుల కాళరాత్రి
నీకొక స్నేహహస్తాన్ని అందిస్తుంది

ఎవరి పాత్రలు వారు సక్రమంగా పోషించి నిష్క్రమించారు, నేను అవసరాల బరువు మోస్తూ ఇంకా తెర ఎదుట ఉన్నాను.

ఆ మధ్యన ఆండ్రూ ఆరోగ్యం బాగోలేదని షెల్లీ చెబితే క్షేమ సమాచారం తెలుసుకుందామని ఫోన్ చేసాను. ఆండ్రూ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, మాటలు నీరసంగా ఉన్నాయి. కాస్త తేలిక పరుద్దామని ““ఆండీ! మీ అందరి పుణ్యమా అని నా పూర్తి పేరు మర్చిపోయాను. ఈ మధ్యన కంపనీ పంపే ప్రతీ ఈమెయిలులో నా పూర్తి పేరు ప్రస్తావిస్తున్నారు. నీకు కారణం తెలుసా?” అని నవ్వుతూ అడిగాను. ఆండ్రూ ఏదో చెప్పబోతుంటే నా పక్కగా ఏదో కదలికలా అనిపించింది. చీకటి నీడల్లో పాత పరిచయస్తుడు, సెక్యూరిటీ ఆఫీసులో పని చేసే కీత్ నిలబడ్డాడు. అతని వాలకం చూస్తుంటే కొన్ని క్షణాల నుండి వేచి ఉన్నట్టు అనిపించింది.

ఫోన్ కింద పెట్టి “కీత్! ఏమిటి విషయం?” అని అడిగాను.

“ప్లీజ్ నాతో రండి” అన్నాడు.

విషయం అర్ధమయి జెన్నీ, రిచ్చీల ఫోటోలు బాగ్లో సర్దుకుని నిలబడ్డాను.

“దయ చేసి అవి టేబుల్ పై పెట్టేయండి” అని కాస్త కటవుగా అన్నాడు. మారు మాట్లాడకుండా ఫోటోలు టేబుల్ పై పెట్టి, అతని వెనకాల నడిచాను. కొన్ని అడుగులు దాటగానే క్యూబ్ పైనున్న బల్బు ఆరిపోయింది.

(To Jonathan)

ఇసుక మేడలు      

Madhuఊరు టౌనుగా ఉన్నపుడు నిలకడగా నేలపై ఉండేది. కార్పోరేషన్గా మారగానే ఆకాశంలోకి పాకిపోయి ఊరి  స్వరూపాన్ని, నాగోజీ నుదిటి రాతలని మార్చేసింది. ఈ రోజు అయనకి ఘన సన్మానం.

ఆఫీసు కిటికీలోంచి సగం మొలచిన కట్టడాన్ని, రాసులుగా పోసున్న ఇసుకని చూస్తూ “అప్పిగా  ఏర్పాట్లేలా ఉన్నాయి” అని అడిగాడు నాగోజీ. “బెమ్మాండమండి, ఇందాక ఈర్రాజు ఫోన్సేసి ఊరంతా మీ పేరే అన్నాడండి…” మెలికలు తిరుగుతూ చెప్పాడు పీఏ అప్పారావు.

“ఎన్నేపారాలున్నా, మన పరపతి రోగంలా పాకిపోయినా… సమ్మానాల దారి ఏర్రా” అని ముక్తాయించాడు నాగోజీ.

“బాగా సెప్పారు” అని శ్రమ పడకుండా అన్నాడు పీఏ. గదిలోకొచ్చిన అసలు విషయం గుర్తొచ్చి “ఇసుక్కాంట్రాటర్… ఓ అరగంట నుంచి ఎయిటింగండి” అని చెప్పాడు

“ఆడవసరమా, మనవసరమా? కూర్చోనియ్యి….” అని విసురుగా చెప్పి ఏసీకెదురుగా కూర్చున్నాడు. గాలాడక్కాదు నాగోజీకి ఉత్సాహంతో ఊపిరి ఆడట్లేదు, పీఏకి విషయం అర్థమయి గది నుండి నిష్క్రమించాడు.

ఇంకో రెండు గంటల్లో స్టేజిపై సిల్క్ పంచె, లాల్చీ వేసుకుని ఉత్సవ విగ్రహంలా కూర్చుంటాడు, అసలే పసుప్పచ్చ శరీరమెమో ఫోకస్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. అర నిముషానికోసారి ఏడుకొండలు ఫోటో తీస్తాడు. వీర్రాజు శాలువాతో సత్కరిస్తాడు. సమితి కార్యవర్గం మూకుమ్మడిగా మీదపడి ‘జన బంధు’ బిరుదు ప్రధానం చేస్తుంది. ఇక పొగడ్తల పోటీలు  కాగానే మొహమాటం నటిస్తూ ‘పెజాసేవ నా బాద్యెత, కితం జన్మ సుకుతం’ అని ముగిస్తాడు.

భవిష్యత్తు దృశ్య రూపంలో కవ్విస్తుంటే ఆదుర్దాగా మురిసిపోయాడు.

ఓ పావుగంటకి బండ గొంతుతో “అన్నారం ఎల్లాలటండి” అంటూ పీఏ లోపలకి అడుగెట్టగానే దృశ్యం నొచ్చుకుని అదృశ్యమయ్యింది.

నాగోజీకి మాట్లాడే మూడ్ లేకపోయినా కాంట్రాక్టర్తో ఒప్పందం తప్పదు కాబట్టి “సరే ఎదవని రమ్మను” అని పెళుసుగా  అన్నాడు. ఓ నిముషానికి ఇసుక కాంట్రాక్టర్ అన్నవరం తప్పు చేసినవాడిలా నిలబడ్డాడు.

“ఏరా! అంతడావిడేంటి? ఓ ఇద్దర్ని బయపెట్టి, నాలుక్కాలవలు తవ్వేసరికి పెద్ద మనిషైపోయావా?” అని హుంకరించాడు.

“అది కాదండి, కొంతూరెల్లాలి సీకటటుద్దని ”

“కొత్త యెమ్ఆర్వో ని లొంగెయ్యాలా.. యెమ్.ఎల్.ఏని సాచిపెట్టి కొట్టాలా? నువ్వంటే సీకటి బయపడాలి గానీ…నీకు బయమెంటేహే?… ” అని వెటకారంగా నవ్వాడు.

“అయ్ బాబోయ్! అదేవీ లేదండి… ఓ రెండ్రూపాయలు ఎనకేసుకుంటే గిట్టనెధవలు ఇలేకరికి కబురెట్టి యాగీ సేసారండి”

Kadha-Saranga-2-300x268

“ఈ మద్యన ఇసక్కోసం కలెట్టర్ని కప్పెట్టెసారని సదివాను… అలాంటి.. ”

“లేదండి.. మనకెందుకండి పాపపు డబ్బు, నాయంగా సంపాయించుకుంటే నిలుద్దండి”

“మరే… ఆ ఇసయం నువ్వూ, నేను..చాగంటోరి పక్కన కూర్చుని జనాలకి సెప్పాలి” అని గది దద్దరిల్లేలా నవ్వాడు.

“మీకు మహా ఎటకారమండి…” అని గొంతు కలిపాడు అన్నవరం.

“అవునొరేయ్ మీ ఓడు పంపా, నువ్వు తాండవని కొబ్బరి చిప్పలా కోరేత్తునారంట” అని ఆరాగా అడిగాడు.

“లేదండి పట్టా ఉన్న మేరకే తవ్వేవండి”

“ఇనాలె గానీ రోజంతా సొల్లు సెపుతావు… ఒచ్చిన ఇసయం సెప్పు”

“… అంటే ముప్పై కాడికి సేసుకుందారండి”

“ఇరవై”

“ఇంకో మాట సెప్పండి”

“తేరగా దొరికిందానికి పదిచ్చినా దండగే”

“అంత మాట అనేయ్యకండి, పై నుంచి కింద్దాకా ఇచ్చుకుంటూ రావాలి”

“సూర్రావు ఇరవై రెండన్నాడు”

“గిట్టదండి, పాటకి పాతిక, లోడు దింపడానికి మూడండి..రెండు కూడా మిగల్దు”

“నేనీ రోజు పుట్టలేదు….. తత్తి కబుర్లు సెప్పకు”

sarange.isuka meda

“మీ దగ్గర దాపరికం ఎందుకండి.. సూర్రావుది తొర్ర ఇసకండి, అంతా మట్టి.. తాండవ ఇనుమండి…మహా గట్టిసక”

“దగ్గరుండి పండించావా?”

“నిజమండి… పరాసికాలు కాదు”

“సరే నీ మాట అట్టుకుని సిమెంట్ ఆపిచ్చేత్తాను…  ఇసక, ఇటుక కలిపి ఇల్లు కట్టేయ్యచ్చు”

“అంటే… మన ఇల్లల్లో ఇసకెక్కువని టాకండి” అని గురి చూసి కొట్టాడు అన్నవరం.

ఆ మాటకి ఖంగు తిని నాగోజీ కాస్త వెనక్కి తగ్గాడు “ఏ ఎదవన్నాడు, కాల్లు సేతులు ఇరిసెయ్యగలను…అపాట్మెంట్టు కనికలా కట్టించాను… రాయిలాంటి ఇల్లు” ఉద్వేగంగా అన్నాడు నాగోజీ. .

“నేనూ పాడెదవలకి అదే సెప్పానండి” అని లోపల నవ్వుకున్నాడు.

లొసుగులు మనసు విప్పి చెప్పుకునేసరికి ఇద్దరికీ గౌరవం పుట్టుకొచ్చింది.

“ఈర్రాజు ఫోనండి.. హాల్ దగ్గరున్నాడు” అని పీఏ పిలవగానే బయటకి వెళ్ళాడు నాగోజీ.

రహస్యం మాట్లాడాలంటే వాళ్ళు పెట్టుకున్న కోడ్ పదం ‘ఫోను’. ముందే చేసిన లెక్కలు పీఏతో మరోసారి సరి చూసుకున్నాడు నాగోజీ. ఈ ప్రకారం బేరం కుదిరితే ఖర్చు పదహారుకు మించదని పక్కాగా తేల్చుకుని లోపలకి వచ్చాడు.

అన్నవరాన్ని కిటికేలోంచి బయటకి చూపిస్తూ “ఈ పక్కది కాకుండా మనవి మూడు కొత్తవొత్తాయి, అన్నింటికి నువ్వే ఇసుక తోలుకో, డబ్బు బదులు అపాట్మెంట్ రాసిత్తాను.. ఏమంటావ్” అన్నాడు నాగోజీ.

“అన్నారం…ఎటు చూసినా నీకే లాబం..ఉంచుకో…అమ్ముకో.. నీ ఇట్టం” అని యజమానిని సమర్ధించాడు పీఏ.

అన్నవరం ఊహించని ఒడంబడికకి కాస్త ఆశ్చర్యం, బోలెడు అనుమానం వేసింది.

“మావోడికి ఓ మాట సెప్తానండి” అని ఫోన్ తీసి బయటకెళ్ళాడు, కాసేపటకి లోపలకి వచ్చి “అంటే… మావోడు ఓ సారి సూసి రమ్మనాడండి” అని అన్నాడు.

“యాపారం నీ దగ్గర, మీఓడి  దగ్గర నేర్సుకోవాలి… ” మెచ్చుకోలుగా చురక పెట్టాడు నాగోజీ

పీఏ తొందరపడుతూ “తర్వాత సూపిద్దారండి… ఇంకో గంటలో సమ్మానం” అన్నాడు.

“పర్లేదేహే దార్లోనే కదా…” అని నిదానం నటించాడు నాగోజీ.

కారు అపార్ట్ మెంట్ దగ్గర ఆగగానే గోడపై సన్మానం తాలూకు పోస్టర్ కనపడింది. నాగోజీ దాని వంక గర్వంగా  చూసుకుంటూ కారు దిగాడు. కూలివాళ్ళు ఆ రోజు పనులు ముగించుకుని సామాన్లు సర్దుకుంటున్నారు, పీఏకి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు గుర్తొచ్చి ‘ఓ నివషంలో వచ్చేత్తాను” అని మేస్త్రీ దగ్గరికి పరిగెత్తాడు, మిగతా ఇద్దరు ముందుకెళ్ళారు.

వాచీ చూసుకుంటూ అన్నవరాన్ని అమ్ముడవ్వని నాలుగో అంతస్థు అపార్ట్మెంట్కి తీసుకొచ్చాడు నాగోజీ. గదులు, కిటికీలు, ఆకాశాన్ని చూపించి ‘ఏమంటావ్?” అనడిగాడు

ఓ రెండు గంటల తర్వాత…

హాల్ కిట, కిటలాడుతోంది. ఏసీ సరిగ్గా పనిచేయక జనాలు పేపర్లు విసురుకుంటూ, విసుక్కుంటూ స్టేజీ కేసి చూస్తున్నారు. ఓ గంట ఆలస్యంగా జనవాహిని కార్యదర్శి శ్రీ వీర్రాజు స్టేజీ పైకొచ్చి “మన నగరానికి గర్వకారణం…జనబంధు శ్రీ నాగోజీ గారు… ఈ రోజు అపార్ట్ మెంట్ కూలి మృతి చెందారు. వారి కుటుంబానికి జనవాహిని తీవ్ర సంతాపం తెలియజేస్తోంది…… ” అని ముగించాడు.
*****

రాత్ & దిన్

Painting: Julia Victor

Painting: Julia Victor

మధు పెమ్మరాజు

madhu_pic“ఇంత అర్ధరాత్రి ఏం చేస్తున్నావు” అని అడిగాడు.
“బస్సు కోసం ఎదురుచూస్తున్నాను” అని ఇబ్బందిగా చెప్పింది.
“నీ అర్ధరాత్రి పచార్లు వారం నుండి చూస్తున్నాను, నిజం చెప్పు” అని సుతిమెత్తగా రెట్టించాడు
వదిలేలా లేడని “రోజూ బస్టాప్ నుండి యూనివర్సిటీని చూస్తుంటాను” అని చెప్పింది.
“యూనివర్సిటీని చూస్తుంటావా… ?” ఆశ్చర్యంగా అడిగాడు
ఎదురుగా ఫ్లాష్ లైట్లు చుట్టుముట్టిన భవనాలని చూపిస్తూ “ఎవరో గొప్ప ఆర్కిటెక్ట్ విశాలమైన ఆలోచనలకి, అందమైన ఊహలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు, సింప్లీ గ్రేట్! ”
“ఇంత అర్ధరాత్రి..ఒంటరిగా….భవనాలని చూస్తున్నావా?” అని అడిగాడు
“అవును….”
“ఎందుకు?”
“నాకు ఆర్కిటెక్చరంటే చాలా ఇష్టం”
“ఎందుకు మంచి ఉద్యోగం వస్తుందనా?”
“అది మాత్రమే కాదు”
“మరి.. ?”
“అంతర్జాతీయ స్థాయి ప్రాంగణాలని డిజైన్ చెయ్యాలని, ప్రపంచం చుట్టి రావాలని… ..ఇలా ఎన్నో ఆశలు..”
“వినడానికి బానే ఉంది కానీ పగటి పూట రావచ్చు కదా?”
“ఒకప్పుడు అలాగే చేసేదాన్ని..”
“మరిప్పుడు….?”
“వెలుగంటే భయం”

student-art-abstract-buildings-h
“నీ మాటలు భలే వింతగా ఉన్నాయి, తెల్లారితే యూనివర్సిటీ ప్రాంగణం విద్యార్థులతో కళ, కళలాడుతుంది, అప్పుడు రా..”
“మీరు ఏ కాలానికి చెందినవారో తెలియదు……“
“ఎందుకు?”
“పగటి పూట వికృతాలు ముసుగు ధరించి తిరుగుతాయి”
“ఈ చీకటి కంటేనా?”
“చీకటి అమాయకమైనది, నలుపు తప్ప వేరే రంగు తెలియదు. తేటగా కనిపించే పగటి నిండా రంగు, రంగుల కపటాలు”
“నువ్వు టీవీ వార్తలు బాగా చూస్తావనుకుంటా?” నవ్వుతూ అన్నాడు.
“చూసే అవకాశం రాలేదు”
“నీ వయసుకింత అపనమ్మకం పనికిరాదు, యూనివర్సిటీలో చేరితే అంతా మంచే జరుగుతుంది”
“అంత నిక్కచ్చిగా ఎలా చెబుతున్నారు?”
“చూడు…అక్కడ బాగా చదివే వారికి తప్ప సీట్ రాదు. అంటే మంచి విద్యార్థులు, మంచి అధ్యాపకులు ఉంటారు”
“మంచి అంటే మనుషులనేగా మీ అర్ధం?”
“అవును అంతా మంచివాళ్ళే… అప్పుడిలా అర్ధరాత్రి, అపరాత్రి నిరీక్షణ అక్కర్లేదు ” అన్నాడు.
బాగ్లోంచి ఒక న్యూస్ పేపర్ తీసి అతనికిచ్చింది, వీధి దీపపు వెలుతురిలో దగ్గరకి తీసుకుని చదివాడు
“ఓ వెరీ గుడ్… మంచి రాంక్ తెచ్చుకున్నావు, మరింకేం.. తప్పక సీట్ వస్తుంది” అన్నాడు.
రెండో పేపర్ అతనికిచ్చి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ఎటు చూడాలో తెలీక…

తడుముకుంటూ ‘విద్యార్థిని ఆత్మహత్య’ అనే వార్త చదివాడు, తర్వాత చీకటిలోకి చూసాడు.

*****

తడి ఆరని ఉత్తరాలు

మధు పెమ్మరాజు

 

madhu_picగోడపై ఉన్న డెకరేషన్ ఫ్రేములో “A picture is worth a thousand words” అనే కొటేషన్ ఏళ్ళుగా చూస్తున్నాను, చదివిన ప్రతీసారి భలే గొప్ప భావనని అనిపించేది. తాతయ్య మాష్టారి మొదటి ఉత్తరం చదివాకా ఆ అభిప్రాయం శాశ్వతంగా చెరిగిపోయింది. ఆర్ద్రత నిండిన మనిషి కలం పడితే జాలువారేవి అక్షరాలు కావు.. తడి, తడిగా తాకే పద చిత్రాలు- మట్టి మనుషులు, దుమ్ము రేగుతున్న వీధులు, చీమిడి ముక్కు బడి పిల్లలు, నేలకొరిగిన సైనికుడు…అందుకేనేమో ఈ మధ్యన డెకరేషన్ ఫ్రేములో “A letter is worth countless pictures’ అని కనిపిస్తోంది.

వియత్నాం అంతర్గత సమస్యపై అమెరికా జోక్యాన్ని ఇతర దేశాలతో పాటు, అమెరికా వాసులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న రోజలు. ఆ సమయంలో మాష్టారు బోస్టన్ యునివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా పని చేసేవారు. స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం అంటూ ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా ద్వంద్వ వైఖరికి నిరసనగా విద్యార్థి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు, ఆ అధ్యాయం మాష్టారు గమనాన్ని మలుపు తిప్పిన మైలురాయి.

పల్లె జీవుల కష్టాలను కడ తీర్చడానికి వినోబా చేసిన కృషి మాష్టారుని ప్రభావితం చేసింది, వారి స్పూర్తితో మాతృదేశం తిరిగివచ్చి వెనుకబడ్డ ప్రాంతాల స్థితి గతులను అర్ధం చేసుకుందుకు రెండేళ్ళ పాటు దేశమంతటా కాలినడకన తిరిగారు. సమస్యల పట్ల అవగాహన ఏర్పడ్డాకా ఓ మారుమూల ప్రాంతంలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ రోజు నుండి విద్య, ఆర్ధిక ప్రతిపత్తి, పౌర హక్కులు వంటి ఎన్నో మౌలికమైన అంశాలపై ప్రజా పోరాటాలు శాంతియుతంగా జరిపి పీడిత వర్గాలను గెలిపింఛి, ‘ఆంధ్ర గాంధీ’ గా పేరు పొందారు.

ఒకసారి “మాష్టారు! ఈ ఏడాది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి, ఎలా తట్టుకుంటున్నారు?” అని యధాలాపంగా అడిగాను.

“బయట కొత్త తార్రోడ్డు వేస్తున్నారు. కొన్ని వారాలుగా కూలివాళ్ళు మండుటెండలో ఆగకుండా పని చేస్తున్నారు, ఫ్యాన్ కింద కూర్చుని వాళ్ళని చూస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టు ఉంది. లేచి కాస్త మంచి నీళ్ళు ఇవ్వడమో, కాసిన్ని కాలక్షేపం కబుర్లు చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. రోజు, రోజుకీ ఆ కాంట్రాక్టర్ మీద కోపం పెరిగిపోతోంది, కనికరం లేకుండా రక్తం మరిగే ఎండలో ఎలా పని చేయిస్తున్నాడో?…..కాస్త ఎండ తగ్గాకా లైట్లు పెట్టి పని చేయించచ్చు కదా? ఇలా కొనసాగితే పాపం ఏ వడదెబ్బో తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రభుత్వం కాస్త పూనుకుని ఇలాంటివి జరగకుండా లేబర్ లా మార్చాలి” అని జవాబిచ్చారు.

‘కూలివాడి ఎండ’ అనే పొసగని పదాలని మొదటిసారి విన్నాను. ఆ మొహం లేని మనుషులు రోడ్డు మరమత్తు చేస్తుంటే ఎన్నో సార్లు చూసాను, రద్దీలో నా సమయం వ్యర్ధమయిందని తిట్టుకుంటూ చూసాను. కొత్త తార్రోడ్డు పక్కన కూడా చూసాను, నున్నటి నల్లదనాన్ని తాకిన మత్తులో పడి పట్టించుకోలేదు. అయినా కనిపించని మొహాలని పట్టి, పట్టి పోల్చుకోవాలనే తాపత్రయం, తీరిక నాకు లేవు. నేను మెట్లెక్కే తొందరలో ఉన్నాను, దూరాలు దాటాలనే ఆత్రుతతో ఉన్నాను. కూలివాడికి ఎండా.. వానా తేడా తెలుస్తుందా? దుమ్ములో పుట్టి, ధూళిలో తిరిగి మట్టిలో కరిగిపోయే వారి కోసం వృధా ఆలోచనలు ఎందుకని సమర్ధించుకున్నాను.

నా కళ్ళకి ఎదురుగా కిట, కిట కిటికీలు – సూటు, స్టెతస్కోప్, నల్ల కోటు వేసుకున్నవాడు చూపులకి చిక్కుతాడు, ఆ పక్కనే పనిచేస్తున్న కూలివాడు కనబడడు. పనిని బట్టి మనిషి విలువని అంచనా కట్టే వారికి ‘కూలివాడి ఎండ’ అత్యవసరమైన పదం. మాష్టారు ఉత్తరాలు మరుగున పడిన మానవీయ విలువలు వెలికి తీసి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకునేలా చేస్తాయి.

నేను ఈ రోజు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఏ సంబంధం లేని ఈ ఊరుకి నలభై ఏళ్ళ క్రితం చేరుకున్నాను. ఒకసారి డిగ్రీ కాలేజీలో ప్రసంగించడానికి వెళ్ళినపుడు శేఖర్ పరిచయమయ్యాడు. అతనిది మగ దిక్కులేని పెద్ద, పేద కుటుంబం.

శేఖర్ డిగ్రీ పూర్తి కాగానే పట్టుదలగా చదివి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకు ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు నుండి కుటుంబ బరువు బాధ్యతలు ఇష్టంగా స్వీకరించాడు. ప్రమోషన్ అవకాశాలు ఎన్నొచ్చినా అన్నీ వద్దనుకుని ఉన్న ఊళ్లో క్లర్కుగా ఉండిపోయాడు. ఏడాది క్రితం ఆరోగ్యం బాగోలేదని డాక్టర్కి చూపించుకుంటే కాన్సర్ అని తేలింది. క్రమం, క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఈ నెల 18వ తారీఖున చనిపోయాడు. శేఖర్ మరణం నన్ను బాగా కృంగదీసింది. ఈ ఊరు వచ్చిన రోజు నుండి శేఖర్ నాకు కొండంత అండగా ఉండేవాడు. బాలబడి ప్రాజెక్టులు ముందుండి నడిపించేవాడు, రిక్షా కాలనీ పిల్లలకి పాఠాలు చెప్పడం, శోధన కార్యకలాపాలు చూసుకోవడం తప్ప వేరే జీవితం లేకుండా గడిపాడు.

శేఖర్ సంస్మరణార్ధం మొన్న ఆదివారం ఒక సభ ఏర్పాటు చేసాము, దాని తాలుకు ఫోటోలు నీకు పంపుతున్నాను.

పెరిగిన వేగం నైతిక విలువలని తిరగరాసింది. అవకాశాలు అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగేవాడు సమర్ధుడు. బంధాలకి, సమాజ బాధ్యతలకి కట్టుబడేవాడు చేతకానివాడు. అంతా రాచమార్గంపై అప్రమత్తంగా నడుస్తుంటే, అదే చూరుని వేళ్ళాడిన శేఖర్ ప్రాక్టికల్ మనిషి కాదు, అర్ధం లేని ఆశయాలకి ఉదాహరణ.

ఫోటోలలో జనసందోహాన్ని చూస్తుంటే శేఖర్ ఓడిపోయిన మనిషిలా అనిపించలేదు, గెలుపు, ఓటములకి దూరంగా అందనంత ఎత్తులో ఎగురుతున్న విహంగంలా అనిపించాడు. వయసు మనిషి జీవితానికి కొలమానం కాదు. సార్ధకతతో జీవించే మనిషి, ప్రతి క్షణం నూరేళ్ళు జీవించినట్లే! శేఖర్ విద్యార్థులలో ఒక శాతం మంది అతని స్ఫూర్తి పొందినా అతను ఆశించిన లక్ష్యం చేరుకున్నట్లే…

క్రితం సారి నువ్వు, నాన్నగారు చాకలిపేట బాలబడికి వచ్చారు గుర్తుందా? అప్పట్లో అది పాకలో ఉండేది, మొన్నీ మధ్యనే కొత్త బిల్డింగ్లోకి మారింది. రాబోయే ఆగష్టు 15 పండుగ కొత్త బడిలో జరుపుకుంటాము. నువ్వు, నాన్నగారు తప్పకుండా రావాలి.

నిరుపేద పిల్లలకి చదువు పట్ల ఆసక్తిని పెంచాలి, కూలి పనులు చేసుకునే తల్లి, తండ్రులకి భారం కాకుండా పౌష్టిక ఆహారం అందించాలి, డ్రాప్ ఔట్లు తగ్గించాలి అనే ఆశయంతో ‘బాలబడి’ని రూపుదిద్దారు. సహజ అభ్యాసన వాతావరణంలో, ఉత్తేజపరిచే ఆటపాటల ఆదర్శ విద్యా విధానంగా దేశమంతటా మన్ననలు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం శోధన సంస్థ ఆధ్వర్యంలో 18 జిల్లాలలో బాలబడులను విజయవంతంగా నిర్వహిస్తోంది.

మాష్టారు మితబాషి, మాట్లాడినా పెద్దగా హావభావాలు చూపించరు. బాలబడి పాక నుండి సిమెంట్ గదిలో స్థిరపడిందనే వార్త పంచుకునేటపుడు మాత్రం చిన్న పిల్లల ఉత్సాహం చూపిస్తారు. వారి నేతృత్వంలో ఎన్నో పాకలు, ఆశయాలు స్థిరత్వాన్ని పొందాయి. ఉక్కు సంకల్పం గల వారి మనసులు వెన్నలా సున్నితంగా ఉంటాయని ఎక్కడో చదివాను, మాష్టారులో ఆ గుణాన్ని ప్రత్యక్షంగా చూసాను.

నీకు కధలంటే ఇష్టం కదూ.. మొన్న రాజేష్ సొంత దస్తూరీతో ఒక కధ పంపాడు, అది నీకు పంపుతున్నాను, వీలున్నపుడు చదువు. అసలు రాజేష్ ఎవరో చెప్పనేలేదు కదూ? రాజేష్ IIT మద్రాస్లో ఇంజనీరింగ్ చేసాడు. కాలేజీ రోజుల నుండి ఆహార భద్రత అనే అంశం అతన్ని తొలుస్తూ ఉండేది. ఎప్పుడు మాట్లాడినా అదే అంశంపై సుదీర్ఘంగా చర్చించేవాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధికి వ్యవసాయం, పర్యావరణం లాంటి సంబంధంలేని విషయాల పట్ల ఆసక్తి ఎలా కలిగిందా అని?

ప్రపంచంలో బీడుగా మారుతున్న నేల నిముష, నిముషానికి పెరిగిపోతోంది. మరో వైపు జనాభా పెరుగుదల, ఆహార అవసరాలు అదుపు తప్పాయి. ఇదొక విపత్కర పరిస్థితి!!. ఎవరో ఒకరు పూనుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందనేవాడు. ఈ జటిలమైన సమస్యలను అధిగమించాలంటే రెండే రెండు మార్గాలు – అడవులను చదును చెయ్యడం లేక బీడు భూములని సేద్యానికి పనికొచ్చేలా చెయ్యడం. రెండవ, మెరుగైన మార్గాన్ని తన జీవితాశయంగా మార్చుకుని ఉన్నత చదువులు, అమెరికా ఉద్యోగావకాశాలు వద్దనుకుని, పెళ్లి మానుకుని కర్ణాటకలోని మారు మూల బీడు ప్రాంతాలలో ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. పనికిరాని నేలని పచ్చగా మార్చి హరిత విప్లవం సాధించాడు.

మేధావులు ప్రపంచానికి చాలా అవసరం. వారి తెలివి తేటలు మారు మూల ప్రాంతాలకి కుదువ పెడితే మనం రెండు రకాల నష్టాలు చూడవలసివస్తుంది- వారు ఎదగరు, దేశాన్ని ముందుకి నడపరు. అంతగా సహాయం చెయ్యాలంటే విరాళాలు రూపంలోనో, సలహాలు రూపంలోనో పరోక్షంగా సహాయం చెయ్యొచ్చు కదా?

దేశాన్ని పీడిస్తున్న సమస్యలు నిత్య యవ్వనంతో, నవనవలాడుతూ ఉంటాయి. చాలా మటుకు ప్రజలు శాంతి కాముకులు వార్తా పత్రికలలో మొహం దాచుకుంటారు తప్ప సమస్యల జోలికి రారు. కొందరు మేధావులు వాటిని విడమర్చి, విశ్లేషించి, విభేదించి తమ తర్కాన్ని, పరిజ్ఞానాన్ని పది మందికి ప్రదర్శిస్తూ ఉంటారు, వారికి సమస్య ఒక ఆట వస్తువు. భావుకత, విప్లవ భావాలు కలగలిసిన బహు కొద్దిమంది పట్టు వదలక కవితో, వ్యాసమో రాసి, అది పత్రికలో అచ్చు పడగానే తమ బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. ఎక్కడో రాజేష్ లాంటి వారు తమ జీవితాలని ఇంధనంగా మార్చి సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. వారు రాతల కంటే, మాటల కంటే, చేతలని నమ్ముకుని అహర్నిశలు నిశ్సబ్దంగా శ్రమిస్తూ ఉంటారు. అసలు వారి వల్లే ప్రకృతిలో ఇంకా పచ్చదనం మిగిలి ఉందేమో?

మాష్టారు! నెల జీతం చేతికి రాకపోతే వణికిపోతాను. మీరు అంత మంచి ఉద్యోగం, విదేశీ అవకాశం తేలిగ్గా ఎలా వదిలేసారు? మీరు జీవితాన్ని పేద ప్రజలకి అంకితం చెయ్యడం చాలా గొప్ప విషయం

ఒక మనిషి పుట్టి పెరుగుతున్నపుడు కొన్ని ముఖ్య సంఘటనలు ఆ వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తుంటాయి. ఆ సంఘటనలను మానవాతీత శక్తి నిర్దేశిస్తుందేమో? ఆ సంఘటనలు జరగకపోతే అ జీవి ప్రయాణంలో విచిత్ర మలుపులు వచ్చేవి కావేమో? ఈ ప్రశ్నలకి నాకు జవాబులు ఇంకా దొరకలేదు.

మనిషి తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తన పరిమితమైన ఆలోచనా పరిధిలో తీసుకోవడం సరైన విషయం కాదేమో అనిపిస్తుంది. అతని స్పృహలోకి రాని అంతర్గత ఎరుకకి అవకాశం ఇవ్వాలెమో? అలా జరిగితే ఒక శుభోదయాన సూర్యుడు కొత్త వెలుగుతో కనిపిస్తాడు. ఆ వెలుగులో తన పాత జీవితాన్ని పక్కన పెట్టి, కొత్త వెలుగులోకి పయనమై వెళ్ళిపోతాడు. పాత జీవితపు చాయలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా బంధాలుగా ఉండవు. అప్పుడు అతడు లోకం కోసం, బంధువర్గం కోసం జీవించడు. ‘తన’ కోసమే జీవిస్తాడు. ఇది అర్ధం కాని మనుషులు అతను పరులు కోసం త్యాగం చేశాడనో, పరులపై ప్రేమతో జీవిస్తున్నాడో అనుకోవచ్చు. అది పెద్ద భ్రమ.
మాష్టారూ! తోటమాలి కలం పడితే ఆ రాతలకి మట్టి వాసన, నేల స్వచ్చత, వేర్ల లోతు ఉంటుంది, అందుకే మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. మీ ఉత్తరాలలో వ్యక్తులు అక్షరాలు దిద్దిస్తూ, ఆత్మ స్థైర్యం పెంచుతూ ఎడారిలో గులాబీలు పూయిస్తున్నారు. నేను నావైపు సూటిగా నడిచే అంకెల మనిషిని- జీతమిచ్చే కంపెనీ లాభాలు పెంచాలనో, ఖర్చులు తగ్గించాలనో సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు రాయిస్తూ ఉంటాను, ఒక్కోసారి అవే ఖర్చుల లెక్కలు చురకత్తులుగా మారి వేటు వేస్తే కొత్త కత్తి వెతుక్కుంటాను తప్ప చుట్టూ చూడను, చూసినా నా చుట్టూ నేనే కనపడతాను.

నిజానికి అంకెలకందని మీలాంటి వ్యక్తులు నాకు అర్ధం కారు. అందుకే మీ ఉత్తరాలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను, ఎన్నిసార్లు చదివినా బావుంటాయి తప్ప అర్ధం కావు, భాష వస్తే సరిపోదు కద… భావన నిండాలంటే అనుభవం కావాలి. ఏసీ గదులకి అలవాటైన నాజూకు శరీరం నడిరోడ్డుపై నిలబడదు, ఇక అనుభవం ఎలా వస్తుంది? అందుకే విశాలమైన పంజరంలో వెచ్చగా ఒదిగి ఎగిరే మెళుకువల గురించి కలలు కంటూ ఉంటాను, కలలు వాటంతట అవే నిజమవుతాయని కొత్త కలలు కంటూ ఉంటాను…

***

ఐటెం సాంగ్స్…కెవ్వు కేక..మా టెల్గూ ఈవెంట్!

మధు పెమ్మరాజు 

madhu_picఓ ఆదివారం సాయంత్రం స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గుడి ఆడిటోరియంలో ఏర్పాటు చేసారు. అప్పుడప్పుడు తెలుగుదనాన్ని దగ్గరగా చూసే అవకాశం, పాత కొత్త పరిచయాల పలకరింపులు, e-పిలుపులో ‘ముప్పై రకాల పిండి వంటలని సంకేతాత్మకంగా నిండు అరిటాకు’ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు..బోలేడు ఊరించే ప్రయోజనాలు తట్టడంతో వేడుక స్థలానికి కాస్త కంగారుగా, అరగంట ముందుగా చేరుకున్నాను.

ఆడిటోరియం గుమ్మంపై తళ, తళా మెరుస్తున్న ‘తెలుగు సాంస్కృతిక సమితి సిల్వర్ జూబ్లీ’ బానరు, ప్రవేశ ద్వారం వద్ద తెలుగింటి ఆడపడుచులు, కుర్తా బ్రదర్లు సాంప్రదాయంగా ఆహ్వానిస్తున్నారు. అదే రోజు సమితి ఎన్నికలు కూడా ఉండడంతో నవ్వులు మామూలు కంటే కాస్త ఎక్కువగా పూస్తున్నాయి. టికెట్ కొని లోపలకి అడుగు పెట్టానో లేదో జిగేల్మనిపిస్తున్న స్టేజి అలంకరణ, పట్టు బట్టల పరుగులు, వేడుక కోలాహలం నా అంచనాలని అంచలంచలుగా పెంచేస్తుంటే కాస్త నిలదొక్కుకుని, ఓ పాత పరిచయం పక్కన సెటిలయ్యాను.

తెర దించగానే అందంగా ముస్తాబయిన, అందమైన యెమ్.సీ ప్రేక్షకులకి, స్పాన్సర్లకి, కార్యవర్గానికి ధన్యవాదాలు చెప్పి, రాబోయే అంశాలతో పాటు ఇండియా నుంచి విచ్చేసిన ఆహ్వానిత అతిధిని సభకి పరిచయం చేసింది. ప్రేక్షకుల మొహంలో “యెమ్.సీ అంతా బానే చెప్పింది కానీ భోజనాల బ్రేకెప్పుడో చెప్పలేదు” అన్న సందేహం కొట్టొచ్చినట్టు కనపడింది. మొట్టమొదట పిల్లల ప్రార్ధనా గీతం, సమితి ప్రెసిడెంట్ ప్రారంభ ఉపన్యాసంతో వేడుక పద్దతిగానే ప్రారంభమయ్యింది.

“మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…” అని యెమ్.సీ ప్రకటించడం ఆలస్యం పది, పన్నెండేళ్ళ పిల్లలు స్టేజిని “సారొత్తారొత్తారా.. రొత్తారా.?” అని ప్రశ్నిస్తూ స్టేజీని దున్నేయడం మొదలుపెట్టారు. తల్లితండ్రులు మంత్ర ముగ్దులై, పిల్లల్ని గర్వంగా వీడియోలలో, ఫోటోలలో బంధిస్తున్నారు. ఆకాశం వంటి వెండి తెర స్టెప్పులని నేలపైకి తెచ్చిన బాల భగీరధుల నైపుణ్యానికి ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పాట పూర్తి కాగానే చప్పట్లతో ఆడిటోరియం పైకప్పు సగం లేచిపోయింది. తర్వాత సామాజిక స్పృహ నిండిన పాట “పువాయ్ పువాయ్యాంటాడు ఆటో అప్పారావు..స్కూటర్ సుబ్బారావు..“ అంటూ పదిహేనేళ్ళ పిల్లలు గురువులు నేర్పిన స్టెప్పులు వరుస తప్పకుండా వేస్తుంటే ప్రేక్షకుల టెంపో తారాస్థాయికి చేరి ఆడిటోరియం కప్పు లేని సాసర్లా మిగిలింది.

నా పక్కనే కూర్చున్న పరిచయాన్ని “సంస్కృతి అంటూ ఈ రికార్డింగ్ డాన్సులు ఏమిటి సార్?” అనడిగాను

“పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారండి? కల్చరంటూ హరికధలు, బుర్రకధలు, లలిత సంగీతం మొదలెడితే చేతకాని కార్యవర్గం అంటూ ఆ వచ్చే పది మంది కూడా రారు. ఏ అసోసిఏషనయినా జనాలని ఆకర్షించడం మొదటి ఉద్దేశ్యం కదండి?” అన్నారు.

“మరి ఈ ఐటెం సాంగ్స్ పెడితే పేరెంట్స్ కి అభ్యంతరంగా ఉండదా?”

ఆయన మొదటిసారి నా మొహంలోకి మొహం పెట్టి చూసారు, నేను మర్చిపోలేని చూపు “మీరు ఇప్పుడే పుట్టినట్టున్నారే.. ఒక్కసారి తెలుగు చానళ్ళు పెట్టి చూడండి, ఇండియా చక్కర్ కొట్టి రండి….కోచింగ్ సెంటర్లు పెట్టి మరీ పిల్లలకి నేర్పుతున్నారు” అని చిరాగ్గా తల తిప్పుకున్నారు.

ఈ లోపు భరత నాట్యం అని అనౌన్స్ చెయ్యగానే ఆ పాల్గొనే పిల్లల తల్లి, తండ్రులు సెల్ ఫోనులు పట్టుకుని స్టేజిపైకి దండయాత్రకి వెళ్లారు. మిగిలిన వారికి కాస్త ఆటవిడుపు లభించి పక్క వారి చీరలని, నగలని, మేకప్పుని ఆపాదమస్తకం స్కాన్ చేసే సరికి.. ఆ చూపులు మాటలుగా మారి గదంతా వ్యాపించాయి. ఇక మిగిలిన వారు… అంటే మగవారు.. ప్రాజెక్ట్ కష్టాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్లంటూ తమ వంతు సాయం చేస్తూ డెసిబెల్ లెవెల్ రెట్టింపు చేసేసారు. ఇవేవీ పట్టని పిల్లలు డాన్స్ క్లాసుకొచ్చినట్టు తమ పని తాము సక్రమంగా పూర్తి చేసి ప్రశాంతంగా స్టేజి దిగిపోయారు.

అంతదాకా ముందు వరసలో ఉగ్గ బెట్టుకుని కూర్చున్న ఆహ్వానిత అతిధి, అదేనండి… ఇండియా నుండి విచ్చేసిన ప్రముఖ నేపధ్య గాయకుడికి తిక్క రేగింది. స్టేజి పైకొచ్చి పెద్ద గొంతుతో ప్రేక్షకులని గొంతు తగ్గించుకోమని… పిల్లల్ని, ముఖ్యంగా తనని ప్రోత్సహించమని హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన పాడినవన్నీ హిట్ సినిమా పాటలు అవ్వడంతో జనం పెద్ద మనసుతో క్షమించి, హుషారుగా హం చేసారు. ఊపొచ్చిన పెద్దలు ‘ఊకనే గూకోలేక’ స్టెప్స్ వేస్తూ స్టేజి పైదాకా వెళ్ళిపోయారు.

పాటలు, డాన్సులు మాత్రమేనా అని నిరుత్సాహ పడుతుంటే, యెమ్.సీ నాటకాలు రాబోతున్నాయని అనౌన్స్ చేసింది. “అబ్బో! ఇవి కూడా ఉన్నాయి, మరింకేం” అనుకుని ఓపిక అరువు తెచ్చుకున్నాను.

మొదటి నాటకం “వీడు ఆరడుగుల బుల్లెట్… “ తో మొదలు పెట్టారు, “అన్నానికి అరిటాకు..” అనే పాట రాగానే భోజనాల బ్రేకేమోనని అంతా భోజనశాల వైపు ఆశగా చూసారు. యెమ్.సీ “అమ్మా! ఆశ, దోశ … ” అని రెండవ నాటకం అనౌన్స్ చేసింది.

రెండవ నాటకంలో పెదరాయుడు గెటప్లో ఒక మోహన్బాబు, లయన్ గెటప్లో ఇంకో బాలకృష్ణ…. ఇలా వింత, వింత గెటప్పులతో మిగతా పాత్రధారులు స్టేజిపైకి వచ్చారు. “మీలో ఎవరు కోటీశ్వరుడు… “ అనే హిట్ టీవీ షోకి అనుకరణ. ఇందులో ప్రధానమయిన విశేషాలు విచిత్ర వేషాలు, ప్రీ-రికార్డు చేసిన మిమిక్రీ గొంతులు. జనాలు ఇవి నాటకాలా? అని డౌట్ పడకుండా సర్దుకుపోయి ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. .

“మీరేంటి సార్! అంత విసుక్కుంటూ చూస్తున్నారు, సినిమాలంటే మీకు అలెర్జీనా?”

“సినిమా అంటే అలెర్జీ ఏమీ లేదు సార్! ఈ వెండి తెర వ్యామోహం, అనుకరణ కాలుష్యం చూస్తుంటే స్టవ్ మీద కూర్చునట్టుంది. మనం సొంతంగా ఏమీ చెయ్యలేమా? మనకి వెన్నెముక లేదా? అనేది నా ప్రశ్న” అని జవాబు చెప్పాను.

“మీలా సీట్లలో సుఖంగా కూర్చుని ఆశించడం బానే ఉంటుంది, అక్కడ స్టేజిపై ఉన్న వారికి తెలుస్తుంది కష్టం. సొంతంగా చెయ్యడానికి వారు ప్రొఫెషనల్స్ కాదు. పోనీ కిందా, మీదా పడి చేద్దామన్నా అంత ఖాళీ సమయం ఎవ్వరికీ లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా జనాలు సినిమాలకి ఇట్టే కనెక్ట్ అవుతారు” అన్నారు.

“బాగా చెప్పారు, కనెక్ట్ అవ్వాలంటే సినిమాలు తప్ప తెలుగు వారికి వేరే మార్గం లేదన్న మాట” అని బయటకి నడుస్తూ బానర్ కేసి మరోసారి పట్టి, పట్టి చూసాను “తెలుగు సాంస్కృతిక సమితి.. “ బానర్ మెరుస్తూ కనిపించింది.

సినిమా ఇంత బలంగా, లోతుగా మనలో ఎందుకు పాతుకుపోయిందని ఆలోచిస్తే- తెలుగు పత్రికలు, టీవీ చానళ్ళు, ఫేస్బుక్, వెబ్సైట్లు, ఆఖరికి మిత్రులతో పిచ్చాపాటీ… ఇలా ప్రతి ఇంటరాక్షన్ సినిమా ఓవర్ఆక్షన్తో నిండిపోయింది.

షాంపూని రూపాయి సాషేలలో అందించి ఘన విజయం సాధించినట్టు పత్రికలు, సినిమా వార్తలని తెలివిగా ప్రతి పేజిలో చిన్న డబ్బాలలో అందిస్తూ ఉంటారు- పలానా సినీ తార బాయ్ ఫ్రెండ్తో బ్రేక్ అప్ అయ్యింది- (పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టమోచ్చిందో?), రజనీకాంత్ నిర్మాతకి డబ్బులు మళ్ళీ తిరిగిచ్చాడు- (పాపం ఎంత మంచివాడో), ఒక సూపర్ స్టార్ శరీరం తగ్గించుకుందుకు ఓట్ మీల్ తినడం మొదలు పెట్టాడు (ఇక అతని ఫాన్స్ కూడా సన్నపడతారు).

ముఖపుస్తకం (పేస్బుక్) తెరిచి చూడగానే ఒక సోషల్ నెట్వర్కింగ్ స్టార్, దేశంలో ఏ సమస్యా మిగలనట్టు సినిమాలు ఉద్దరించడానికి పూనుకున్నాడు. తనని, తాను ఫిల్మ్ ఆక్టివిస్ట్ అని ప్రమోట్ చేసుకుంటాడు. ప్రముఖ సినీ కుటుంబాలు పరిశ్రమని మొనోపలైజ్ చేసి చిన్న నిర్మాతలని, బుల్లి హీరోలని నల్లిలా నలిపేస్తున్నారు, టాలెంట్ని అణగదోక్కేస్తున్నారు అని ఫేస్బుక్లో అంతర్మధనం చెందుతూ ఉంటాడు. ఎలాగైనా సినిమాని కబంధ హస్తాల నుండి విడిపించడం ఇతని జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా ఫేస్బుక్ అనే మాధ్యమాన్ని వాడుకుంటూ, లెక్క లేనంత మంది సినీ వ్యసనపరుల్ని ఫాలోయర్స్ గా కూడ గట్టుకున్నాడు. ఈ మధ్యనే “మాడిన దోశ” అనే “క్రౌడ్ ఫండింగ్” సినిమాని (బిలో) మామూలు ఫార్ములాతో తీసి చేతులు….కాదు, కాదు.. వేరే వాళ్ళ వేళ్ళకి వాత పెట్టాడు.

ఈ కాలుష్యానికి కొత్త పార్శం ఆడియో ఫంక్షన్లు, ఒక్కొక్కటీ నాలుగ్గంటల నాణ్యమైన న్యూసెన్స్. పబ్లిక్ సొమ్ము దుర్వినియోగం చేస్తే చట్టం దాన్ని నేరంగా పరిగణిస్తుంది. మరి మన దేశ భవిష్యత్తు (యువతరం) విలువైన సమయాన్ని ధీమాగా వృధా చేయిస్తున్న మనుషలకి ఏ శిక్ష వేయాలి? ఇటువంటి దుస్థితి వేరే రాష్ట్రాలలో ఉందా? లేక తెలుగు వారికేనా ఈ శాపం? అని కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు మనం వేసుకోవాలి.

క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చూడడం అంటే అర్ధం పర్ధం ఉంది. ఇక సినీ తారలు, వారి పిల్లల వివాహాలని ప్రత్యక్షంగా చూపించడం ఏమిటో? పెళ్ళంటే ఒకరి వ్యక్తిగత వ్యవహారం దానిని వాణిజ్య ప్రకటనలు అమ్ముకునే వీధి బాగోతంగా ఎప్పుడు మారిందో? పెళ్ళికొచ్చిన వారి నగలు, చీరలు, హంగులని చూసే సగటు మనిషి కలల్లోకి జారిపోతాడు.

సామెతల స్థానంలో పంచ్ డైలాగ్లు వాడతాం. ‘చాలా బావుంది’ అనాలంటే ‘కెవ్వు కేక’ అంటాం, ‘అంత స్థోమత/అర్హత లేదు’ అనడానికి ‘అంత సీన్ లేదు’ అంటాం. సినీ సంభాషణలు తప్ప మనకి సొంత భావజాలం మిగల్లేదు.

అసలు వీళ్ళు ఎవరు? వారి మొహాన్న టికెట్ డబ్బులు పడేస్తే తెరపైకొచ్చి తైతక్కలాడి, రంజింపచేసి, నిష్క్రమించే మామూలు మనుషులు. సినిమా ఒక కొనుగోలుదారుడికి, నటనతో (వస్తే) వినోదాన్ని అమ్ముకునే విక్రేతకి మధ్య జరిగే లావాదేవి మాత్రమే. మన కళలని, బాషని, సాహిత్యాన్ని, సంగీతాన్ని ధ్వంసం చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? అప్రమత్తంగా ఉండడం శ్రమతో కూడుకున్న పని, అందుకు సులువైన వినోదాన్ని, వెకిలితనాన్ని ఎంచుకుంటాం, వారికి సింహాసనంపై కూర్చోపెడతాం. ఈ passive, negligent encouragement వాడుకోవడం వాళ్ళకి తెలుసు కాబట్టి, వారు మనని పూర్తిగా ఆవహించారు.

వీరి లక్ష్యం ఒకటే- మన బుర్రలో ఒక శాశ్వతమైన గూడు కట్టుకోవాలి, ఆ గూడు సైజు పెంచుకుంటూ పోవాలి. తోచినా, తోచకున్నా, వేడుక జరుపుకున్నా, విషాదంలో మునిగి తేలుతున్నా సినిమా చూడాలి. సినిమా should be our only expression, culture, language, art…

జీవ నదులు సముద్రంలో కలిసి పనికిరాని ఉప్పు నీరుగా మారుతాయి. బాష, సంస్కృతి, సంగీతం సినిమా కాలుష్యంలో కలిసి అస్థిత్వాన్ని ఎప్పుడో కోల్పోయాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమ ఇతర ఆలోచనలని ఎదగనివ్వకుండా ఉక్కు వేర్లతో పెనవేసి, గొంతు నొక్కేసిన మర్రి చెట్టు. ఆ నిజానికి దర్పణం నేను చూసిన “తెలుగు సాంస్కృతిక సమితి…” కార్యక్రమం.

*****