కులానికో వీ/వేడుకోలు

Kadha-Saranga-2-300x268

శ్రీ –

ఇంతకు ముందు నీకు రాసిన ప్రతి ఉత్తరంలో నిన్ను ప్రియమైన శ్రీ అనో, ప్రియాతి ప్రియమైన శ్రీ అనో పిలుచుకునే దాన్ని కదూ! ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది. అందుకే ‘ఒట్టి శ్రీ’ వి అయ్యావు.

ఏమన్నావు నువ్వు నన్ను ఇవాళ మధ్యాహ్నం…. ఆఫీస్ నుంచి వచ్చి అలిసిపోయి సోఫాలో కూర్చుని అన్నం తింటున్నానని – ‘తక్కువ కులపు అలవాట్లు ఎక్కడకు పోతాయి?’ అన్నావు. ఎలా అన్నావు శ్రీ అలా… ఇంతకు ముందు మనం సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరం తినిపించుకోలేదా? దానికే కులం పేరుతో అవమానిస్తావా? కులం, అలవాట్లూ, ఆచారాలు – వీటన్నిటి గురించీ మనం ఆలోచించామా అసలు ఎప్పుడైనా? ఏమయింది మనిద్దరి మధ్య? ఎందుకిలా నా మీద మాటల బాణాలని వదులుతూ నా నుండి దూరంగా జరిగిపోతున్నావు?

ఎంత బావుండేవి ఆ రోజులు?

ఆకాశంలోని చందమామని నా కళ్ళల్లో కొన్నాళ్ళు, గుండెల్లో కొన్నాళ్ళు దాచుకుని నీకు వెన్నెల ఉత్తరాలు రాసేదాన్ని. నింగి అంచులు వంగి పుడమితో మాట్లాడే గుసగుసల ఛాయల్ని ఉత్తరాలకి పులిమేదాన్ని. నువ్వు నక్షత్రపు కాంతిని నా కళ్ళల్లో నింపాలని ఎంత తపన పడేవాడివి? అడవి అన్నా అడవిలోని అందాలన్నా నీకెంతో ఇష్టం – నీ ఉత్తరాల నిండా పచ్చని అడవి నిటారుగా తల ఎత్తి చుక్కలతో మాట్లాడే వెలుగు భాష ఉండేది.

నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నన్ను అపురూపంగా చూసుకోవాలనే ఆరాటమే నాకు కనపడేది. ‘పెళ్ళయ్యాక మన ఇంట్లో బియ్యం పప్పు ఉప్పు ఉన్నాయా అనుకునే స్థితిలో ఉండకూడదు – ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఏ లోటూ లేకుండా ఉండాలి’ అనే వాడివి.

‘కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి మీ ఊరు వస్తాను. సగర్వంగా అందరికీ చెప్పి నిన్ను పెళ్ళి చేసుకుంటాను – అంతవరకు నువ్వు నా కోసం ఆగుతావు కదూ?’ అని నన్ను అడిగావు. నా చేతిలో చెయ్యి వేశావు నీ చేతిలో నా చేత ఒట్టు వేయించుకున్నావు.

మా ఇళ్ళల్లో పద్దెనిమిదేళ్ళకే ‘ఎప్పుడు పిల్లకి పెళ్ళి?’ అని ముఖాన్నే అడుగుతారు ఇంట్లో ఆడపిల్లలుంటే – ‘నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి నన్ను పెళ్ళి చేసుకోకపోతే నా గతి ఏమిట’ని నేను అనుకోలేదు. అసలు నాకా ఆలోచనే రాలేదు. అందరికీ ధైర్యంగా, బాహాటంగా చెప్పాను ‘మన కులం కాని అబ్బాయిని ప్రేమించాను – అతన్నే పెళ్ళి చేసుకుంటాను’ అని.

ఇంటర్ లోనే ప్రేమ వెలగబెట్టిందా? చూడు ఎలా చెప్తుందో సిగ్గూ ఎగ్గూ రెండూ లేకుండా – వాడెవడో పెద్ద కులపోడంట మోసం చేసి పోతాడు గాని దీన్ని చేసుకోవడానికి వస్తాడా? వాడు రాకపోతే ఎవడు చేసుకుంటాడనైనా ఉండొద్దూ! కాళ్ళు విరగ్గొట్టి నోరు మూపించడానికి తండ్రి లేకపోయా పాపం ఆ తల్లి ఏం చేస్తుంది’ లాంటి మాటలు ఎన్ని పడ్డానో! – కాని నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని – నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాట్లాడితే ఏంలే అనుకున్నాను.

మీ అమ్మానాన్నలని ఎలా ఒప్పించావో నువ్వెన్ని మాటలు పడ్డావో కాని ఆరేళ్ళ వియోగం తర్వాత నువ్వు నా కోసం వచ్చావు చేతిలో అప్పాయింట్ మెంట్ ఆర్డర్ పట్టుకుని.

ఆ రోజుని నేనెన్నటికీ మర్చిపోలేను శ్రీ – ‘నీ బరువంతటినీ మోయడానికి, నా హృదయాంతరాళంలో నిన్ను దాచుకోవడానికి వచ్చాన’ని అన్నావు. నిన్ను చూసి నా గురించి అంత వరకూ ఏవేవో మాట్లాడిన వాళ్ళ ముఖాల్లో అసూయ, అపనమ్మకం – కాసేపటికే ఆఁ చూద్దాంలే ఈ కాపరం ఎంత కాలమో నన్న హేళనగా మారుతుంటే ‘ఆఁ చూద్దాం’ అని నేనూ అనుకున్నాను. అంతరాంతరాల్లో నా కంత నమ్మకం నీ మీద – నీ ప్రేమ మీద.

పెళ్ళయిన తర్వాత నీకిష్టమైనట్లే మారాను. నీకిష్టమైనవే వండాను. నీకు పనికిరానివి తినడం మానుకున్నాను. నువ్వే నా ప్రపంచం, నీ మాటలే నాకు సంగీతం, నన్ను అపురూపంగా చూసుకోవడమే నీ ప్రత్యేకత, నువ్వు నాకు, నేను నీకు ప్రేమతో అర్పించుకున్నపుడు పొంగిపొర్లే మాధుర్యం జీవితాంతమూ చవి చూడటమే మన లక్ష్యం – అలా ఉన్నాం కదా మనం మొన్నమొన్నటి వరకూ.

రిజర్వేషన్ కోటాలో నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుండీ నువ్వు మారిపోయావు. పోనీ నీకు ఇష్టం లేదా అంటే అదేం కాదు. ఆ ఉద్యోగం ఇచ్చే అధికారం, తెచ్చే డబ్బూ కావాలి నీకు. ‘సంపాదిస్తున్నావులే కులం పేరు చెప్పుకుని’ అంటావు అదేమంటే.

ఆ రోజు మీ కులపు స్నేహితుల ముందు కాఫీ తేవడం ఆలశ్యమయిందని ‘మన పద్ధతులు తెలియవు… చూసి అన్నా నేర్చుకోదు’ అంటున్నావు. వాళ్ళకి తెలుసా పద్ధతులు? మనింటికొచ్చి వండింది శుభ్రంగా తింటూ ‘మీ ఇళ్ళల్లో బీరకాయ పప్పు ఎలా చేస్తారు? వెల్లుల్లి వేస్తే మేం తినలేం బాబూ’ అనడమా పద్ధతి అంటే!!?

మీరు మేము అంటూ వాళ్ళు వేరు చేసి మాట్లాడుతుంటే వాళ్ళ ముందు నువ్వు నవ్వుతూ కూర్చున్నావు. నేను లేచి తినే తినే ప్లేట్ సింక్ లో పడేసి గదిలోకి వచ్చానని వాళ్ళు వెళ్ళాక ‘మర్యాద తెలియదు’ అని నన్ననడానికి నీకు మనసెలా ఒప్పిందో అర్థం కాక విస్తుపోయాను. ఏదైనా వాదిస్తే ‘ ఇలాంటి వాదనలు వస్తాయనే జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలని పెద్దలు అంటార’ని అంటావు.

‘చేసుకుంది మహా పెళ్ళి – అంటానే ఉన్నాంగా ఇది ఎన్నాళ్ళ సంబడమో అని’ అంటూ మా వాళ్ళు ఎగతాళి చేస్తారని నీ మాటలకు ఓర్చుకుంటున్నానా? అనిపిస్తోంది ఈ మధ్య. అదే నిజమైతే మన ప్రేమకి అర్థం లేదా!? ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని మనం సహజీవనం చేస్తున్నామా!!? ఈ ఆలోచన వణికించడం లేదూ!!!?

నిన్న టి వి లో ఏదో సినిమాలోనో, సీరియల్ లోనో టీనేజ్ ప్రేమ జంటని చూసి ‘ఇది ప్రేమ కాదు ఆకర్షణ’ అంటున్నావు వ్యంగ్యంగా నన్ను చూస్తూ – అంటే మనది ప్రేమ కాదు ఆకర్షణ అని చెప్తున్నావా?

శ్రీ – మన పెళ్ళయి రెండేళ్ళు కూడా కాకుండానే నా అడవి పిట్ట పాటలు పాడటం ఆపేస్తుందని, నా గుండెల్లోని చందమామ మసకబారుతుందని, నక్షత్రాలు వెలగాల్సిన నా కన్నుల్లో చీకటి చేరుతుందని నేను అస్సలు ఊహించలేదు.

నాకు తెలుసు – ఈ ఉత్తరం చదివి ‘ఏమన్నాను నిన్ను అంటావు అమాయకంగా – అదేంటో మరి మర్చిపోయే గుణాన్ని కూడా మీకే ఇచ్చాడు భగవంతుడు శారీరక బలంతో పాటు. నువ్వు పొడుస్తున్న మాటల తూట్లకి నాలోని సున్నితత్వం నశించి ఎత్తిపొడుపులూ, కన్నీళ్ళూ, అసూయాద్వేషాలతో బ్రతుకు మొద్దు బారిన నాడు కూడా నువ్వు నన్నే అంటావేమో ‘గయ్యాళి’ అని…… అలా మారడానికి కారణం నువ్వేనన్న విషయం మర్చిపోయి.

రోజులు గడిచిపోతాయి ఏ మాధుర్యమూ లేకుండా – మనం కోరుకున్న జీవితానికి విరుద్ధంగా. ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటాం తప్పకుండా… అప్పుడనిపిస్తుంది – మన తోటలో పూచే అందమైన గులాబీ మొగ్గని మనమే సంకుచితమైపోయి నలిపేసుకున్నామని…. నిర్వేదంగా శ్రుతి తప్పి పోయిన గీతాన్ని ఆలపిస్తున్నామని…

అయ్యో అనుకుంటూ అల్పమైన ఆ జీవనయానాన్ని సరి చేసుకోవానికి ప్రయత్నిస్తామేమో కాని అప్పటికే మనలోని అమృతభాండం మాటల తూట్లతో ఒలికిపోయి ఉంటుంది. అంత దూరం రాకూడదనే ఈ ఉత్తరం….

ప్రేమతో

నీ సృజన

పి.ఎస్: చిన్న కవిత నీ కోసం.

నల్లగా మారుతున్న మేఘాలని అర్థిస్తున్నాను –
వానలో తడిసి స్వచ్ఛమైన రంగుతో వెలగమని

హోరుగాలికి నిశ్శబ్దంగా చెప్తున్నాను –
నెమ్మదిస్తేనే ఆర్థ్రత నిన్ను తాకుతుందని

నేను నువ్వుగా మారి తొలిపొద్దులోకి చూస్తున్నాను –
నులివెచ్చని వెలుగురేఖల ఆలంబన కావాలని

ఉదయకిరణాలు విచ్చుకోగానే చీకటి తొలుగుతుంది.
నీ మృదుస్పర్శ నా నుదుటిని తాకుతుంది

చల్లని, మెల్లని గొంతుకతో నువ్వు నన్ను మేల్కొలుపుతావు
మాటల బాణాలు గద్దల్ని తరుముతూ ఎగిరిపోతాయి
మధురస్మ్రతులు సీతాకోకచిలుకల్లా మారి నా వనంలోకి వస్తాయి

కదూ…

-మండువ రాధ

10530819_1465912403664592_9069952599408129952_n