శిల్పంపై దృష్టిపెట్టిన కవిత

 

padam.1575x580 (2)

 

సామాజికప్రయోజనమనేది ఒకటి కవిత్వానికి ప్రధాన లక్ష్యమయ్యాక సమాజంలో భిన్నవర్గాలలో ఉనికి సంబంధమైన పోరాటాలు మొదలయ్యాయి.ఈ మార్గంలో వస్తుగతంగా చైతన్యం వివిధమార్గాలలో కనిపిస్తుంది.ప్రాంతం ,జెండర్,సామాజిక మూలాల్లోంచి భిన్నమైన ఉనికి వ్యక్తిలో ఉండడం వలన కవితావస్తువుల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.ప్రధానంగా అణచి వేయబడుతున్న వర్గాలనుంచి ఇలాంటి కవిత్వం ఎక్కువ.మెర్సీ మార్గరేట్ కవిత కూడా ఇందుకు మినహాయింపు కాదు.వస్తుతః మెర్సీలో స్త్రీ సంబంధమైన గొంతు,సమస్యలు,సంఘర్షణ దాని తాలుకు సారం కనిపిస్తుంది.ఒకింత దళిత సామాజిక వర్గానికి చెందిన భావజాలమూ కొన్ని వాక్యాల్లో ఉంది.రూపం శిల్పం వీటి విషయంలో ప్రధానంగా పైరెండు మార్గాల్లో కనిపించే కవిత్వానికి ,మెర్సీ కవిత్వానికి మధ్య అభివ్యక్తిసంబంధమైన వైరుధ్యాలున్నాయి.సమస్య వస్తువుగా కన్నా,అది మనసు మీదవేసే ప్రతిఫలనాలమేరకు కలిగే సంవేదనా సారం కళాకృతిలో ఈ కవితలో  కనిపిస్తుంది.

 

అనేకమంది కవులు,రచయితలు ఉనికి పోరాటలనుంచి ధిక్కరిస్తున్నది అణచివేతనే.వస్తువు కేంద్రాన్ని బట్టి వీటి రూపాలు వేరు.ఈ ధిక్కారం స్థానంలో సున్నితమైన సంవేదనత్మక వచనంతో మెర్సీ స్వేచ్ఛను అన్వేషిస్తుంది.”అణచివేయబడ్డానికీ,జయించబడ్డానికి మధ్య(133పే)రియానేవ్ కోసం(127పే)సముద్రాంబర(123పే)లాంటివి ప్రధానంగా స్త్రీ స్వేఛ్చను ప్రశాంత జీవనాన్ని ప్రతిపాదించేకవితలు.స్వేఛ్ఛను అస్తిత్వ వాదులు మానవ వాస్తవికతగా చెప్పారు.ఇది దాని చుట్టు ఉండే వర్గాలు,పదార్థాలు మూసలను ఛేదించుకుని వస్తుంది.స్వేఛ్ఛ నిర్వచనానికి లొంగనిది.వాస్తవమూ కాదు యథాతథమూ కాదు.కాని అలా నిర్వచించుకోకపోతే అర్థం చేసుకోలేం. బేర్డియేవ్ స్వేఛ్ఛను ప్రాక్తన అహేతుక స్వేఛ్ఛ(లేని అణచివేతను ఊహించేదిగా)అంతిమ హేతుబద్ధ స్వేఛ్చ(సంఘటన ద్వారా అణచి వేతను ఎరుకలోనికి తెచ్చుకునేదిగా)చెప్పాడు.మెర్సీలో అణచివేతను ప్రత్యక్షంగా చెప్పడం తక్కువే.ఈ రెంటి ప్రతిఫలనాల సారాన్ని కవిత్వం చేయడం ఎక్కువ.

mercy1

1.”నీతల్లికి నువ్వు రాసిన ఉత్తరం మొలకెత్తింది/ఏడేళ్ళు నిన్ను ఇనుప ఊచలమధ్య నొక్కి పెట్టినా/చావే మనిషికి అంతం కాదు అని నువ్వన్న మాటలున్నాయే/ఆ మాటలు మనిషితనం ఉన్న ప్రతీచోట/మొలకెత్తుతున్నయ్/నువు చనిపోయాక మాట్లాడుతున్న నీ ఉనికిని/నేను అందరికీ చేర్చబోతున్నా”-(రియానేవ్ కోసం-127)

 

2.ఆపుకోలేని ఆగ్రహావేశాలను/కాళ్ళు,చేతులు దేహం మొత్తం ఆక్రమింపబడ్డ/అ వృక్షపు అధికార బల ప్రయోగం నుండి/విమోచింపబడ్డానికి/స్వేఛ్ఛా పోరాటం చేసి ప్రాణాలొదిలిన గాలిచేసిన ఆర్తనాదాలు విన్నాను”-(అణచివేయబడ్డానికి జయించబడ్డానికి మధ్య-133పే)

 

ఈ రెండు భావాంశాలు స్వేఛ్ఛను గురించి మాట్లాడినవే.నిర్మాణ గతంగా మొదటిది అఖ్యాన పద్ధతి(Narrative structure)లోని ఉద్దేశిత నిర్మాణం(intend structure)లో కనిపిస్తుంది.వాక్యాల్లో “నీ/రెహనాయ్”అనే సంబోధనలు కనిపించడం వల్ల ఈ నిర్మాణం కనిపిస్తుంది.”మొలకెత్తడం”ఈ భావనలోని ప్రధాన కేంద్రం(Focal point) గతంలోని అణచివేతను ఉద్దేశిస్తుంది.అందుకే భావంశంలో ఇది ముందుకు వెళ్ళింది.వస్తుగతంగా ఇది స్వేఛ్ఛను,అణచివేత మూలాల గురించి మాట్లాడింది.రెండవ భావాంశంలో ఉపవాక్యనిర్మాణం(Clausal structure)కనిపిస్తుంది.

వాక్యమంతా ఒకే వాక్యంలా కనిపించే కొన్ని ఉపవాక్యాలుగల వాక్యం.భావ ధార ఎక్కువగా ఉండటం వల్ల ,ఒకదానిపై ఒకటిగా అనుభవాలు సంలీనమవటం వల్ల అలాంటి వాక్యాలు వస్తాయి.ఈ గాఢాభినివేశం వల్ల కొన్ని వాక్యాలు ఒక వాక్యంగా రూపొందింపబడుతాయి.ఇలాంటి వాక్యాలు మెర్సిలో కొంత ఎక్కువగానే కనిపిస్తాయి.పై వాక్యంలో కర్మార్థకాలు ఎక్కువ.అందువల్ల పై వాక్యంలో “బడు”ప్రత్యయాలు కనిపిస్తాయి.పాత్రల స్థానాలను వాక్యరూపంలోకి ఊహించుకోవడంలో కొన్ని సార్లు ఇలాంటివి కలుగుతాయి.సాధనవల్ల అధిగమించడం కష్టం కాదుకూడా.మెర్సీలో ఒకింత పొడుగువాక్యాలు కనిపించడంలో కారణం ఇదే.

 

జీవితం నుంచి రాయడానికి ప్రేరేపించే వస్తువును,అంశం అదివేసిన ముద్రను కవిత్వం చేయడంకోసం మెర్సీపడే శ్రమ గమనించదగింది.సృజనసాంద్రత కోసం సంప్రదాయపద్ధతిలోనే సంకేతనిర్మాణం(encode structure)ఏర్పాటుచేసుకుంటుంది.ఈ క్రమంలో ప్రతీకను,ధ్వనిని నేర్పుగా ఉపయోగించుకోవడం కనిపిస్తుంది.

వృక్షం- పాతుకుపోయిన అధికారం(అణచివేతకు గురిచేసేది),గాలి-స్వేచ్ఛకు-సంకేతాలుగా కనిపిస్తాయి.అదేక్రమంలో ధ్వనిగత అర్థాన్ని సూచించే భాష(elliptical language)ను ఆధారం చేసుకుని నిర్మించిన వాక్యం-“కాళ్ళు,చేతులు,దేహం మొత్తం ఆక్రమింపబడ్డ”-లోకూడా స్త్రీని వ్యక్తం చేస్తాయి.

 

ఉద్వేగసంబంధంగా మాత్రమే కాక ఈ భావధార కళాసంబంధంగా కూడా దొంతరలు దొంతరగా వాక్యాలను రూపొందించడం కనిపిస్తుంది.ఒక అనుభవాన్ని,పలికోణాలను పలుమార్లు అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా వాక్యాల్లో ఈ విన్యాసం కనిపిస్తుంది.ఈ పునరవలోకనం (retrospection)ఒక సమానభావచ్ఛాయ గల వాక్యాలు రాసేందుకు ప్రేరేపిస్తుంది.

“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు/చిక్కులు చిక్కులుగా ఉండలుచుట్టిపడేఅసిన ఊలు దారాల్లాంటి ప్రశ్నలు/రాయడానికి వాడనందుకు జబ్బుచేసి సిరా కక్కుకున్న ప్రశ్నలు/వెలుతురును మింగేస్తూ /గాజులోనే బందీ చేస్తున్న చిమ్నీలాంటి ప్రశ్నలు/గాలికూడా రెపరేపలాడకుండా /జీవాన్ని ఆవిరిచేసుకుంటూ/శ్వాస పీల్చుకోలేక వ్రేలాడుతున్న క్యాలెండరులాంటి ప్రశ్నలు/తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే/కుళ్లిపోయి కంపుకొడుతున్న ప్రశ్నలు”-(ప్రశ్నల గది-)

 

ఇలా ఒక అనుభవంలో నిలబడి అనేక వాక్యాలను రాయడం అందులో ఉద్వేగాన్ని ,కళను ప్రసారం చేయడం కనిపిస్తుంది. కవిత్వీకరించడంలో కొన్ని పనులుమాత్రమే కాక మానసికంగా మెర్సీమార్గరేట్‌కు కొన్ని భావనాముద్రలున్నాయి”చీకటి”అలాంటిది.చీకటి అనేభావన చుట్టూ అనేక ఊహలు చేయడం కనిపిస్తుంది.చీకటి వరం(35పే)చీకటి దండెం(81పే)లాంటి కవితలు వాటి శీర్శికలతోపాటు ఉదయంవైపు నడక(47పే)వెంటిలేట్(106పే)చేతికంటికున్న మాటలు(87పే)దోసిలో నది(75పే)వీడ్కోలు(60పే)మొదలైనవి చీకటిని ప్రతిమలుగా ప్రతీకలుగా వాడుకున్న కవితలు

1.ఘనీభవించిన చీకటిపై జ్ఞాపకాల దారుల్లో నడిచొచ్చిన పాదముద్రలు

2.కనురెప్పల చీకటి-(106పే)

3.చీకటి అలలు(87పే)

4.రాత్రుళ్ళు చీకట్లో నిశ్శబ్దం నాట్యం చేసేది గోడలపై-(75పే)-ఇలాంటివి మరికొన్ని గమనించవచ్చు.కొత్తగా కవిత్వం రాసేవాళ్లకు సృజనశక్తి ఉండదనే అపోహ ఒకటుంటుంది.దాన్నుంచి తన కవితను తప్పించడానికి మెర్సీ బలమైన ప్రయత్నం చేసింది.వస్తువుతో పాటు శిల్పంపై దృష్టిపెట్టిన కవిత మెర్సీ మార్గరేట్”మాటల మడుగు”

 

(అనంత కవుల వేదిక-“చం”స్పందన-ఆత్మీయపురస్కారం పొందిన సందర్భంగా)

నిగ్గు తేల్చిన “మిగ్గు”

 photo-migguuuuu

దళిత కవిత్వం, దళితచైతన్యం ,దళిత స్పృహలాంటి పదాలతోబాటు “దళిత భాష”అనేపదం కూడా సాహిత్యంలోకి వచ్చి చాలా రోజులైంది.అనేకమైన చర్చలు కూడా జరిగాయి.ఉనికి సంబంధమైన ప్రశ్నలతో వచ్చిన దళిత కవిత ధిక్కార,తిరస్కారాలతో కనిపించినప్పటికీ ఈ ఉద్వేగంలోని అణచివేత వెనుక సన్నని దుఃఖపు జీర ఉంది..బహుశః ఈజీరనే భాష,కళాసౌందర్యం,ప్రతీకలులాంటి పదాల ఉనికిని దళితకవిత్వంలో మరింతపటిష్టం చేసింది.

ఏకాలంలో నైనా వస్తువు మారినంత తొందరగా దానిచుట్టూ ఉండే ఆర్థిక,రాజకీయ,సామాజిక చైతన్యాలు మారినంతగా శిల్పం, దాన్ని పెనవేసుకున్న భాష,కళాసంప్రదాయాలు మారవు.కాని ప్రయత్నాలకు మాత్రం పాదుపడుతుంది.ఈ మధ్యవచ్చిన సంపుటాలు ఈ మార్పును నిరూపిస్తాయి.దళితకవిత్వంలో తమదైన శైలి,భాష,కళ,ప్రతీకలు ఈ కాలంలో కనిపిస్తున్నాయి.తెలంగాణాలోని నల్లగొండప్రాంతం నుంచి వచ్చిన”మేమే””బహువచనం””మొగి”లాంటి సంకలనాలు ఈ మార్పుకు నిదర్శనంగానిలుస్తాయని పరిశీలకుల అభిప్రాయం.ఈ మార్గంలో తనదైన భాషావ్యూహంతో ,కళాత్మకంగావ్యక్తం చేస్తున్న కవి పొన్నాల బాలయ్య”మిగ్గు”అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కాలపు కవిత్వంలో పై అంశాలు నిలబడడానికి ఒకటి రెండు కారణాలను అంచనావేయవచ్చు.జీవితంపై అణచివేతను,దానికి కారణమైన వర్గాన్నే కాక తమదైన ఉనికిగల సాంస్కృతికతపై దృష్టి కలగడం.అందువల్ల తమవైన పదాలు,పదబంధాలు కులమాండలీకాలను కవిత్వంలోకి తేవడం.జీవితంలోని అణచివేత దాన్నానుకున్న దుఃఖపుజీరనుంచి సంఘర్షణ ప్రతిఫలించే భావ చిత్రాలను గీయడం.తొలిదశనుండివచ్చిన పురాణ ప్రతీకలతోబాటు,జీవితాన్ని సంపద్వంతం చేయగలకొత్తపోలికలను,ప్రతీకలను తెచ్చుకోడానికి కళాత్మకమైన ఊహలు చేయడం.

బాలయ్య కవిత్వం ఈ అంశాలకు ఉదాహరణగా నిలబడుతుంది.సమకాలీన కవిత్వంలో వస్తువుకేవలం ఒక వాతావరణానికి సంబంధించింది కాదు.రెండుకు మించిన వస్తువాతావరణాలుంటాయి.బాలయ్యలోనూ దళిత,తెలంగాణా,ప్రపంచీకరణ మొదలైన అంశాలకుసంబంధించిన వస్తువులున్నాయి.వీటన్నిటివెనుక జీవన సంబంధమైన  నీడకూడా స్పష్టాస్పష్టంగా కనిపిస్తుంది.బాలయ్య కవిత్వాన్ని చదువుతున్నప్పుడు మొదట చర్చకు వచ్చేది కవిత్వీకరణకోసం ఆయన వాడుకున్న భాష.తనదైన సంస్కృతినుంచి వారసత్వంగావచ్చిన భాషను మాత్రమే వాడుకోలేదు.సమకాలీన భాషామార్గాన్ని కలుపుకుని ఒక నిర్మాణ సూత్రాన్ని తయారు చేసుకున్నారు

సాంస్కృతికత,పలీయచేతన,వస్తుగతవాతావరణాన్నిప్రతిఫలించే సమకాలీన భాష.ఇవి బాలయ్య కవిత్వభాషలోని మూలకేంద్రాలు.

padam.1575x580 (2)

వత్తులేస్కొని దీపంతైంది కనుపాప/

పచ్చిప్రాణాల తడిపరిభ్రమిస్తుంది పాదాల చుట్టూ గోసగా/

కొంకులుతెగి కత్తులు బల్లాలు దిగి/

గోనె సంచుల్ల మాసపు ముద్దయి దుక్కిస్తున్న తుంగభద్రమ్మ

చుండూరు ఎదమీద ఎండిపక్కుగట్టిన/రక్తం మట్టిని పిడికిటబిగించి/దప్పులదండు ఎర్రకోటను ముట్టడిస్తది

-(పుండూరు-85)

 

నా తెలంగాణా పల్గిపోయిన పాతడప్పు//

తలమీద దీపం ఎత్తుకొని బాయిలపడ్డ బతుకమ్మ/

తలగొట్టిన తంగెడుపువ్వు త్యాగాల గుమ్మడిపువ్వు/

వాడిపోయిన బంతిపువ్వు రాలిపోయిన గునకరెమ్మ/

నీలికట్లపువ్వు నిరసనల కర్రెపొద్దు“-(పల్గిపోయిన పాతడప్పు-99)

 

కవిత్వంలో చిత్రణ ఒక ప్రధానమైన సృజన బిందువు.సంఘటన నుంచి తనహృదయంపొందిన అనుభవాన్ని చిత్రంగా ఆవిష్కరించడం మొదటి ఖండికాభాగంలో కనిపిస్తుంది.మొదటి కవిత్వాంశంలో దుఃఖాన్ని,రెండవదాంట్లో తిరస్కారాన్ని ఆవిష్కరించారు.అందులోనూ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని,ప్రాంతీయతను సమ్మేళనం చేసి ఒక భాషాగతమైన నిర్మాణాన్ని బాలయ్య సాధించుకున్నారు.”వొత్తులేస్కొని దీపంతైంది కనుపాప”లో కళావిష్కారమెలావుందో,పదాల్లో ప్రాంతీయముద్రకూదా ఆలాగే స్పష్టమైంది.”పచ్చిప్రాణాల తడిపరిభ్రమిస్తుంది పాదాలచుట్టూ గోసగా”లో”గోస”అనేపదం తప్ప మిగతాభాగం అంతాఅధునికభాష.మూడవ వాక్యంలో మళ్ళీ భాషాగతమైన ప్రాంతీయచేతన.చివరి వాక్యంలో కనిపించే తిరస్కారంకూడా ఇలాంటి ఆవిష్కారమే. రెండవ కవిత్వాంశంలో ఒక ప్రాంతీయస్పృహ,సాంస్కృతికస్పృహ తో ప్రాదేశికమైన దైన్యాన్ని ప్రసారం చేస్తున్నాయి.ఈవాక్యాలన్నీ వ్యాఖ్యానాత్మకమైనవే.అందుకోసం వాటుకున్న భాషకూడా సాంస్కృతిక వాతావరణాన్ని ప్రతిఫలించేది.

పూలన్ని బతుకమ్మలో భాగాలయినపూలు.వాటికి ముందు మానవగుణారోపణ చేస్తూ కొన్ని క్రియాపదాలను చేర్చడంద్వారా సాంద్రమైన సంవేదనాత్మకస్థితిని సాధించారు.చివరలో”నీలికట్లపువ్వు నిరసనల కర్రెపొద్దు”అనడంలో నీలిపువ్వును,కర్రెపొద్దు దళితస్పృహలోవాడినట్టుగా అర్థమవుతుంది.రంగుల గురించి కళాతత్వశాస్త్రం చాలా చర్చించింది.ఇందులో సంప్రదాయ,పాశ్చాత్యాంశాలతో పాటు మనోవైజ్ఞానికాంశాలు ఉన్నాయి.ఆ మార్గంలో “నలుపు”అనేక అంశాలను ప్రసారం చేస్తుంది.ఆధునిక కాలంలో కొన్ని రంగులు రాజకీయ మీమాంసలకు కూడా ప్రతీకలవుతున్నాయి.దళిత బహుజన కవిత్వంలో కనిపించే”నలుపు””నీలి”రంగులు.విప్లవ కవిత్వంలో కనిపించే ‘ఎరుపు”రాజకీయ మీమాసతో సంబంధం కలిగినవిగా కనిపిస్తాయి.తెలుపును శాంతికి,పచ్చదనానికి ఆకుపచ్చరంగుని ఈ కాలపు కవిత్వం ప్రతీకాత్మకంగా ప్రసారం చేస్తుంది.

వస్తుగతంగా పొన్నాల కవిత్వంలోదళిత జీవితం  ప్రధానంగాపరచుకుంది.తస్సలకూర(31)మిగ్గు(52)సోలుపోత(56)మజ్జెతి(58)సఫాయి(75)పుండూరు(84)కొంగవాలు కత్తి(86)గండదీపం(93)అశరఫ్(109)మేడారం జాతర(123)మొదలైన అనేక కవితలు దళితస్పృహలో రాసినవి.తెలంగాణా ఉద్యమ సందర్భంగారాసిన కవితలు.ఒకటిరెండు ఎలిజీలు ఉన్నప్పటికి ప్రధానస్వరం దళితగొంతుకే.

1.పుండ్లు పుండ్లైన కండ్లు కవిసే దుక్కపుపుర్రు

గాయపడిన పెయ్యిలందల మాగేసిన తంగెడుచెక్క సున్నంపూసిన బతుకును మంగకంపల మీద ఆరేస్కున్న-(మిగ్గు)

 

2.దోసిట్లనిండబంగారిపురుగుల ఆటలాడేబాలలకు

రాళ్లరప్పల కొండకోనలపొంటిపొడిసిన పసుపు బండారిపొద్దు

పరిగడుపున్నే పొట్తనింపే తీపిగూగెం సీతఫల్కపండు

 

3.సచ్చిన గంగావు గబ్బుగబ్బు వాసనను

తానుముక్కలు చెక్కలై లంద సుగంధంల కడిగి గాలిచ్చి

అతారలు సరిసె తోలుశుద్ధి కార్బన రసాయనం-(నెలవంకలమునుం)

 

ఈవాక్యాలన్నీ దళితజీవితాన్ని ప్రసారం చేస్తాయి.మొదటిది ప్రధానంగ దళిత జీవనవిధానంపై రాసినది.రెండవ,మూడవభాగాలు తెలంగాణా గురించి రాసినవి.అందులోనూ మూడవభాగం తిరిగి దళిత జీవితాన్నే ఆవిష్కరించింది.పొన్నాల కవిత్వం ప్రధానంగా దళితజీవితం,సంస్కృతి,భాషపై ఎక్కువ దృష్టిపెట్టినట్టుకనిపిస్తుంది.

భాషాముఖంగా దళిత కవిత్వం శిల్పంలో తెచ్చినమార్పుకు “మిగ్గు”నిదర్శనంగానిలబడుతుంది.తానుగా ఏర్పాటుజేసుకున్న సృజనసూత్రం బాలయ్యను ప్రత్యేకంగానిలబెడుతుంది.

*

గాయంలోపలి మనిషి!

ayo

 

ప్రాచీన కావ్యాలకాలం నాటికి పూర్వులు రాసిన పురాణకథలను వర్ణనలను పెంచి  బంధాలుగా,స్వతంత్రకావ్యాలుగా రాసిన వారున్నారు.ఆధునికంగా వచనకవితల్లో ఇలాంటివి అరుదే.ఎందుకంటే ఒక కవితకు, మరోకవితకు మధ్య సారూప్యతలు,సామీప్యతలు గమనించి ప్రేరణలను అర్థం చేసుకోవడం తక్కువ.రేణుకా అయోల “ఒక హిజ్రా ఆత్మకథ”నుంచి పొందిన ప్రేరణ,సహానుభూతిని ఒక దీర్ఘకవితగామలచారు.ఇప్పుడున్న కవిత్వవాతావరణంలో అనేక  వాతావరణాలున్నాయి.”పీడన””అణచివేత”అనే బిందువులు వీటికి మాతృకలు.అది కులం,వర్గం,ప్రాంతం,జెండర్ ఏదైనా ఈ సంఘర్షణ కనిపిస్తుంది.

ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో లైంగికత కారణంగా కనీసం మనుషులుగా కూడా తోటిసమాజం గుర్తించని హిజ్రాల ఆత్మఘోష ఈ దీర్ఘకవితలో ఉంది.పౌరసత్వాన్ని “పునరుత్పత్తి”నుంచి ఎవరూ నిర్వచించలేదుగాని..ఇంత ప్రజాస్వామ్యవ్యవస్థలో పౌరులు రెండురకాలు ఆడ,మగ అనేభావన మాత్రమే ఉంది.ఈ పాదునుంచే ఈ కొత్త సంఘర్షణ  దేశంలో చర్చకు వచ్చింది.ఇది కేవలం సంఘర్షణ,చర్చను మాత్రమే కాక మానవీయతకు సంబంధించిన అనేక ప్రశ్నలను సంధించింది.జెండర్ వరుసలో చూస్తే స్త్రీకి రెండవస్థానం ,పురుషునికి మొదటి స్థానం ఉంది.ఈ స్థితిలో హిజ్రాలకు స్థానం కష్టమే.పైగా ఏహ్యభావం.కొన్ని సంవత్సరాలనుంచి యుగాలనుంచి ఈ వాతావరణం కనిపిస్తుంది.ఇతిహాసాల్లో శిఖండిలాంటిపాత్రలో ఈ స్థితిలో కనిపిస్తాయి.

సామాజిక స్థితి,ఆర్థికస్థితి,రాజాకీయ స్థితి ఈ ఏ పరిధుల్లోకి రాని హిజ్రాల జీవన సంఘర్షణను “మూడవ మనిషి”చిత్రించింది.తెలుగులో వచనకథాకావ్యాలు రావాలని కుందుర్తి కోరుకున్నారు.ఈ కవిత అలాంటిదే.”మూడవ మనిషి”అనే శీర్శిక తీసుకున్నారుకాని ‘మూడవ మనిషి”అనేపదం,ఈ ఆత్మకథను రాసిన రేవతి”కాని,కవిత రాసిన అయోల కాని ఇష్టపడరు..ఈ ఉద్యమం ప్రతిపాదించింది కూడ ఇదే.

కాకి గూట్లోంచి కోడిపిల్లలా/

నెట్టివేయబడిన బతుకులని/

ఎచరో ఒకరుగా బతకనివ్వాలి/

స్త్రీగానో పురుషుడిగానో ఉండనివ్వాలి“-(47పే)

 

మామూలు మనుషులుగా గుర్తించాలి/

మూ జాతి నిర్మాణం ఆగిపోవాలి/

ఎలాంటి ముద్రలు లేని స్వాతంత్య్రం కావాలి“-(46పే)

padam.1575x580 (2)

అయోలా కవిత నిర్ణయించుకున్న లక్ష్యం,హిజ్రాల సంఘర్షణ నిర్దేశించుకున్నది కూడా ఇదే.మూడవ మనుషులుగా కాకుండా వాళ్ల ఇష్టాలకనుగుణంగాఉండాలని.ఏహ్యాభావానికి ఎగతాళికి గురౌతున్నది ఈ గుర్తింపునుంచే.ఈ అంశాన్ని ఆవిష్కరించడం పట్ల అయోలాకు ఈ ఉద్యమం పట్ల ఉండే అవగాహన అర్థమవుతుంది.రేణుకా ఆయోలా కవిత్వంలో ఒక స్వాభావికమైన స్త్రీ ముద్ర ఉన్నది.రేవతి ఆత్మకథతో సహానుభూతిపొంది ఆగొంతుతో రాసినా ,స్వాభావికంగా స్త్రీ పార్శ్వాలు అక్కడక్కడా కనిపిస్తాయి.

అసలు ఎందుకీ ముడవ వ్యక్తి ?/తేనె తుట్టకి పొగపెట్టినట్లు/మళ్ళీ ఒక జాతిని నిర్మించడం దేనికి/వివక్షకు కొత్త దేహాలెందుకు

 స్త్రీగా ఉండనిస్తే చాలు/మామూలు మనిషిగాస్త్రీలా/బాత్రూంల దగ్గర/ఉద్యోగాల దగ్గర గుర్తిస్తే చాలు“-(44పే)

మోసగించబడ్డ ముఖాలు/శిథిలమైన దేహాలు/ముఢనమ్మకాలు/వైధవ్యాలు/పెళ్ళిళ్ళు/అందరిదీ ఒకటే చరిత్ర/శరీర చరిత్ర“-(44పే)

మొదటివాక్యంలో మూడవవ్యక్తి అవసరం లేదనే భావన,రెండులో స్త్రీగా గుర్తించడం తో పాటు స్త్రీలు ఎలా వివక్షకు గురౌతున్నారో మూడవ భావాంశం చెబుతుంది.వీటిలో స్త్రీ సంబంధమైన గొంతుక పెనవేసుకుపోయి ఉంది.కవితకు మరింత బలాన్నిచ్చింది ఇదేనేమో.ఈ కవితలో మానసికాభిప్రాయాన్ని  కవిత్వం చేయడం,ఆ సంస్పందనలను రీకార్డు చేయడం ఎక్కువ.లోపలి స్త్రీత్వాన్ని,బాహ్యంగా ఉండే పురుషత్వానికి మధ్య జరిగే సంఘర్షణ కవిత్వం చేయడం కనిపిస్తుంది.పదిహేనుభాగాలుగా ఉన్న కవిత్వంలో మొదటిది ఆముఖం లాంటిది.రెండులో మగవాడుగా పుట్టి, స్త్రీత్వం తొంగిచూడ్డం,మూడులో ఇల్లు,కాలేజీల్లో సంఘర్షణ.నాలుగులో శరీరంలోని అసంపూర్ణ లైంగికత,ట్రాన్స్ జెండర్ గా మారడానికి కలిగే ప్రేరణ,హిజ్రాగామారటం,ఒక కొత్త ప్రపంచపు క్షణికానందం,దుఃఖం,కొత్త జీవితం పై సందేహం,వెకిలి తనం వల్ల కలిగే సంవేదన.ఇంట్లో తిరస్కారం,కోరుకున్న స్త్రీగా జీవించలేని సామాజిక స్థితి,బలవంతంగానైనా బతకడానికి తలవొగ్గడం.ఉద్యొగం గుర్తింపుకోసం న్యాయపోరాటం,దానికొన సాగింపు ఇలాఉరామరికగా ఇందులోని కథను అంశాత్మకంగా చూడవచ్చు.

మగవాడిగా పుట్టి అవయవాల్లో తేడావల్ల స్త్రీగాబతకాలనుకుని,విధిలేక మూడవమనిషిగా మారి స్త్రీలాబతికే హక్కులేక అణచివేతకు విలాసాలకు గురైన,బలైన “ఆత్మకథ””మూడవ మనిషి”

ఒక భారమైన కథను నడిపినప్పటికీ కవిత్వంలో కళాత్మకత కనిపిస్తుంది.అనేక సంవేదనల్లో రాసిన వాక్యాలేకాకుండా అనేక పదబంధాలు అనుభవాన్ని,సహానుభూతిని హృదయానికి ప్రసారం చేస్తాయి.

1.ఎండుటాకుల్లా ఎగిరిపోయే/ఆలోచనలను తెల్లకాగితం మీద పేర్చాలి-(3)

2.బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు/ఒక నిశ్శబ్దపు నీలివర్షం/నాచుట్టు పేరుకుంది“-(3)

3.చీరబొంతలో తమలపాకుల కట్టలానన్ను దాచి/సందేహంలో పడిపోయిన అమ్మ“-(5)

4.తెల్లటి గడ్డిపూవులా నిటారుగా నిలబడి/గాలికి రెక్కలిచ్చి ఆనందపడేఅది“-(15)

5.అందమైన జీవితంలా/నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని/రేపటి వెలుగులోకి చూస్తున్న ఒంటరి నక్షత్రాన్ని“-(21)

6.పాదాలు నడిచీ నడిచి/దూరాలు కొలిచి కొలిచి పుళ్లు పడేవి/నమ్మకాలు కత్తిరిస్తున్న కొమ్మల్లా విరిగిపడేవి(25)

7.అమ్మ ఊరు తొలి వర్షానికి రేగిన  మట్టివాసనలా గుర్తుకొచ్చేది(28)

 

ఈ వాక్యాలన్ని ఊహాత్మకతను,కళను దాచుకున్న వాక్యాలు.అయోలా ఎక్కువగా భారతీయ ఆలంకారిక సామాగ్రిని కళాచిత్రణకు ఉపయోగిస్తారు.”ఎండుటాకులా/తమలపాకుల కట్టలా/గడ్డిపూవులా/కొమ్మల్లా విరిగిపడేవిలాంటివాటిల్లో కనిపించే”లా”ఉపమావచకాన్ని చూపుతుంది.”ఊరు వర్షానికి రేగిన మట్టివాసనలా ఉందనటంతెల్లటి గడ్డిపూవు నిలబడటాన్ని చెప్పడం“ఇవన్నీ సౌందర్య పరిశీలనకు అద్దం పడుతాయి.ఇలాంటి వాక్యాలతో పాటు సమాసాల్లాకనిపించే పదబంధాల్లో కళాత్మకత బాగాకనిపిస్తుంది.

పసితనపు యుద్ధాలు(7)అయోమయాల లోయలు(7)ఇష్తాల రెక్కలు(6)ఆకుపచ్చని చీర(6)ఆడతనం చిగుళ్ళు తొడుక్కోవడం(6)నడక రెక్కలు(13)ధైర్యపు గొడుగు(14)గాయాలపొర(15)చీకటితలుపు(22)ఆకలి చూపులు(23)వెకిలితనం చేతులు(25)పగటి రంగులు(43)ఓదార్పుకాగితాలు(45)జీవిత విత్తనం(49)ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.ఈ సమాస బంధాలుకూడా భారతీయ ప్రాచ్యకళా సంప్రదాయానికి చెందినవే.ఇవన్నీ కవిత్వీకరణ శక్తిని చూపుతాయి.

తెలుగులో కవితాఖండికలుగా,కథలుగా హిజ్రాల జివితంపై సాహిత్యం వచ్చింది.దీర్ఘకవితగా ఈ కవితే మొదటిది.కథను చెబుతున్నప్పుడు కళాత్మకతకు అవకాశం తక్కువ.కాని అయోల కవిత సాధన దాన్ని సుసాధ్యం చేసింది.తెలుగులో దీర్ఘకవితలు రాసిన కవయిత్రులు తక్కువ.అలావచ్చిన తక్కువ కవితల్లో ఈ కవిత విభిన్నమైనదేకాదు.తనదైన కవితాత్మకతతో నిలబడగలిగేది కూడా.

*

దృష్టీ సృష్టీ కలిస్తే బాబా కవిత్వం!

baba

 

 

జీవితంలో తారసపడే ఒక సందర్భమో,  సంఘటనో కవిత్వానికి ప్రేరణ. ఆ అనుభవమే కవితకు సృజన రూపం. అనుభవాన్ని నిర్వచించుకోవటం కొంతవరకు అసాధ్యమే. అనుభవానికి కూడా కొన్ని నిర్దిష్టమార్గాలున్నాయి. ఒక దృశ్యం నుంచి సామాజికానుభవాలు ఎదురైతే, సృజన ఆదిశలో రూపాన్ని పొందుతుంది. తాత్వికానుభవం పొందితే ఆ తాత్వికత కవిత్వమౌతుంది. దృశ్యంలో సౌందర్యం, మానవీయత, నైతికత లాంటివి కవిత్వమవటంలోనూ ఇదే ప్రధాన కారణం. ఈ అనుభవం సృజనరూపానికి తగిన భాషను కూడా ఇస్తుంది.

వ్యక్తీకరణ సిద్ధాంతాలు దాని పరిధులమేరకు బోధి,అనుభూతి,రూపం,పద్ధతి,ముగింపు అనే రూపాల్లో అవధారణను కలుగ చేస్తాయి” అంటాడు రూసో.

ధారణ మేరకు కలిగే బోధి సామాజిక, తాత్విక కళావిష్కరణలు వేటినైనా చేస్తుంది.ఇది ఆసక్తిని బట్టి ఉంటుంది.అది ఏ రూపంలో ప్రతిఫలిస్తుందనేదే ప్రధానం.అనుభూతి రూపం కళాసంబంధాలు. ఇవి కళావిష్కరణనే ప్రధానంగా చేస్తాయి.ఇందులోనూ అనుభూతి రస(aesthetic taste) సంబంధమైంది. రూపం ప్రతీక (symbol)సంబంధమైంది. ఈమూడు వ్యక్తీకరణ పద్ధతిని ,ముగింపును నిర్దేశిస్తాయి.

బొల్లోజు బాబా కవిత్వంలోఅనుభూతి ప్రధానమైన కవితలున్నాయి. మానసికంగా అనుభూతికో అనుభవానికో వచ్చిందాన్ని మార్దవంగా చెప్పడం తప్ప నిడివికోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయకపోవడం. మనసు వేసిన ముద్రను అంతే సౌందర్యాత్మకంగా అందించడం ఈవాక్యాల్లో కనిపిస్తుంది.ప్రధానంగా కవిత్వంలో ఒక ధ్యానం ఉంటుంది. ఈ ధ్యానం గొప్ప భావ చిత్రాలను గీసేలా చేస్తుంది.

 

1.చెట్ల ఆకులు ధ్యాన ముద్రలో ఉన్నాయి/కొలను అలలు కూడా వాటిని కలచ సాహసించడం లేదు/నీటిపొడలు నిశ్సబ్దంగా తొంగి చూస్తున్నాయి./పరిమళాలసంచారం నిలచిపోయింది“-(తపస్సు-1)

2.”క్రోటాన్ మొక్కలు ఇంద్ర ధనుస్సుని/పగల గొట్టుకుని/పంచుకున్నట్లున్నాయి/లేకపోతే మొజాయిక్ గచ్చులా/ఇన్ని రంగులెలా వస్తాయి“-(ప్రాగ్మెంట్స్-5)

3.”వేకువని/తలో ముక్కా పంచుకున్నాయి పక్షులు//కిరణాల్ని పేచీలేకుండా పత్రాల సంచుల్లో పంచుకున్నాయి తరువులు

ఇంద్ర ధనుస్సుని/పొరలు పొరలుగా ఒలుచుకుని/పంచుకున్నాయి పూలు“-(అసమానతలు-11)

4.సూర్యుని వేడి రక్తపు చుక్కలు/నెర్రలు తీసిన భూమి చర్మం

చలి చీకటితాగి/మెరుస్తున్న అకాశపుటిరుకు సందులు“-(దేహమూ నీడా-32)

5.నేలకోరిగిన తూనిగపై పూలవాన/అధ్భుత సమాధి/చుంబించుకున్న పెదాలు అదృశ్యమైనా/ఎప్పటికీ పరిమళించే ప్రేమలా“-(నువ్వుకాదు నేనే-40)

8.రాలిన పత్రాల్ని/లోనికి లాగేసుకుని/పూవులుగా అందిస్తాయి/తరువులు“-(ప్రాగ్మెంట్స్-71)

padam.1575x580 (2)

 

ఈ వాక్యాలన్నీ ధ్యానాన్ని చూపుతాయి. సౌందర్యాన్ని పట్టుకోవడానికి నైపుణ్యం కావాలి. “చూడగలిగిన కళ్ళు తారసపడినప్పుడు వస్తువులో సౌందర్యం రెండితలవుతుంద”న్నారు సంజీవదేవ్.ఈ అనుభవాన్నే శ్యామదేవుడు”కావ్యకర్మణీ కవేః సమాధిఃపరం వ్యాప్రియతే”-(కావ్యరచనలో కవికి సమాధి ఉపయోగపడుతుంది)అన్నాడు.ఈ రమ్యాలోకనను జపానీలు -జెన్ ఆచార్యులు “సతోరి”అన్నారు.పేరేదైనా ఈ ధ్యానాత్మక దర్శనంలోని అనుభవం పై వాక్యాలను అందించింది.

బాబా వాడుకునే భాష ప్రతీకల భాషగాదు.ఉహా మాత్రమైన అనుభూతితో భావచిత్రాలను గీస్తారు.వాస్తవికతకు మించి ఊహించడం వల్ల ఇది సాధ్యపడింది.ప్రధానంగా సౌందర్య చిత్రణలోని ఊహాత్మకత,భావన క్రియల్లో ఉంటుంది.”పరిమళాలు నిలచ్పోవడం””ఇంద్ర ధనస్సుని పగల గొట్టుకుని పంచుకోవడం””చీకటి తాగటం”ఇలాంటివి అందుకు నిదర్శనాలు. ఒక పద్ధతిని అనుసరించి ఊహలో సౌందర్యాన్ని సాధిస్తారనడానికి ఒకటి ,రెండు, మూడవ వాక్యాల్లోని రెండు వాక్యాల్లో “పంచుకోవడం “అనే క్రియ సాధారణ మవడం నిదర్శనం.రూపం,పద్ధతి అనే అంశాలు ఇక్కడ కనిపిస్తాయి.

కావ్యతత్వ విచారాన్ని ఆధునిక దర్శన శాస్త్రాలు వాస్తవ వివేచన,ప్రమాణ విచారణ,ప్రయోజన విచారణ అనే విభాగాలలో జరుగుతుందన్నాయి.ఇవి మీమాంస కాలానికి”ప్రకృతి స్వభావం,దాన్ని తెలుసుకుని సౌందర్యాత్మకం చేసిన పద్ధతులు,సిద్ధించిన ప్రకృతి జ్ఞానం ద్వారా జీవితలక్ష్యాల పరిశీలన”అనే అంశాలద్వారా తాత్విక స్థితికి చేరుతాయి.ఈ పరిక్రియల ద్వారా ప్రకృతి సౌందర్యానికి అక్కడినుండి జ్ఞానానికి ప్రయాణిస్తుంది.నాలుగులో “రక్తపు చుక్కలు,చర్మం “అనే పదాల వల్ల మానవస్వభావం చేరి తాత్విక స్థాయికి ఇలాంటి వాక్యాలు చేరుతాయి.ఇక్కడ మానవ గుణారోపణ చేయడం కనిపిస్తుంది.

ఈ కవిత్వంలో సౌందర్యఛాయ ప్రధానంగా కనిపిస్తుంది కాని సామాజిక సంబంధంగా అనేకమైన మానవీయకోణాలు ఇందులో కనిపిస్తాయి.తాత్విక దృష్టికి,జీవితాన్ని అన్వయం చేయడానికి “రెండు చింతలు”-(77పే)ఉదాహరణగా కనిపిస్తుంది.తాత్విక స్థితిని ప్రకృతికి చేర్చి వ్యాఖ్యానించడానికి బాబా మానవగుణారోపణ(Personification)పై ఆధారపడి తాత్వికంగా జీవితాన్ని సాధిస్తారు.

 

1.”భుజాలపై చేతులు వేసుకుని/నిలుచున్న మిత్రుల్లా ఉండేవి/రెండు చింతలూ

2.”నాలుగు తరాల్ని చూసుంటాయి/చివరకు రియల్ఎస్టేట్ రంపానికి/కట్టెలు కట్టెలుగా చిట్లిపోయాయి/వేళ్ళ పేగులు తెంపుకుని /రెండు చింతలునేలకొరిగాయి

3.”వృక్షం  నేలకూలితే పిట్టలు /కకావికలం అయినట్టు/హృదయం చుట్టూ చింతనలు

4.చిత్రంగా జీవితానికి కూడా/నిత్యం రెండు చింతలు/గతం భవిష్యత్తు/వర్తమాన రంపం/పరపరా కోస్తూంటుంది

అలవోకగానే రాసినా ఈ కవితలో ఒక తీరైన సరళి  (methodology) కనిపిస్తుంది. మొదటివాక్యాంశంలో నిర్వచించి, రెండులో మానవగుణారోపణతో ప్రధానంగా “చిట్లిపోవడం,పేగులు తెంపుకోవడం”లాంటి క్రియలతో తాత్విక సమన్వయం చేయడం, మూడులో మానసిక స్థితిని చెప్పడం. నాలుగులో ఏ అన్వయంలేని తాత్విక స్థితి వెళ్ళడం కనిపిస్తుంది.నిజానికి మూడులోని మానసిక స్థితినుంచే రెండుచింతలు ఉపమానాలు పరివర్తన చెందాయి.రెందవ వాక్యం దాకా ఇవి “వేళ్లపేగులు”లాంటి సమాసాలనుంచి ఉపమేయాలుగానే ఉన్నాయి.చలాకవితల్లో ఇలాంటి స్థితిని ఈ ప్రణాలికను గమనించవచ్చు.

ప్రకృతిని జీవితాన్ని సౌందర్యాత్మకంగా,తాత్వికంగా దర్శించడం,అనుభవించడం,అంతే కళాత్మక స్థితినుంచి పాఠకులకు ఇవ్వడం బొల్లోజు బాబా కవిత్వంలో కనిపిస్తుంది.నిజానికి సౌందర్యాన్ని చిత్రించే క్రమానికి అస్పష్టత పెద్ద అవరోధం దీన్ని అధిగమించడానికి అలంకారికతవైపు వెళ్ళడం, సమాసాలద్వార వాక్యాల్ని ఇవ్వడం కనిపిస్తుంది.పాఠకులకు అస్పష్టంగా ఉండకుండా ఇలాంటి శ్రద్ధతీసుకున్నారనిపిస్తుంది. ఇలాంటి వాక్యాల్ని పదబంధాల్ని చూసినప్పుడు. వర్తమాన కవిత్వం అనేక మార్గాల్లో ప్రవహిస్తున్నప్పుడు దృష్టిని సృష్టిని కాపాడుకుని తనదైన శైలితో కవిత్వమౌతున్నారు బాబా.

మడులన్నీ అన్నపు కుండలే!

 

padam.1575x580 (2)

కవులు రాసే కవిత్వంలో ఏ కాలంలో నైనా ఆయాకాలాల సమాకాలీన ప్రతిఫలనాలు కొన్ని ఉంటాయి.అలాగే తన దృష్టిని ప్రతిబింబించే దర్శనమూ.సమాజ చింతనా ఉంటాయి.అందువల్ల ప్రతీ కవీ,కవిత్వంలో సమాకాలీనత,వైయక్తికత,సామాజికత అనే మూడు అంశాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి.కాని ఒకటి లేదా రెండు మూడు సంపుటాలు వచ్చాక ఆ కవి సృజనలోని ప్రధాన మార్గం  ఏమిటనేది గుర్తించడానికి వీలవుతుంది.మట్టిపొత్తిళ్లనుంచి ‘రెండుదోసిళ్లకాలం”దాక రామోజు  హరగోపాల్లో ఈ ప్రతిఫలనాలన్నీ ఉన్నాయి. సమాకాలీనతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీటిని రెండురకాలుకా చూడవచ్చు. ఒకటి పారదర్శక సమకాలీనత.సుస్పష్టంగా వస్తువుయొక్క సందర్భం ,ప్రాంతం,కాలం కనిపిస్తాయి.రెండవది పారమార్థిక సమకాలీనత.ఇది ఒక వస్తువునిచ్చే సందర్భం,కాలం,ప్రాంతాలకు అతీతంగా వస్తువును విశ్వవ్యాప్తంగా ముడివేస్తుంది.అంటే అనేక కాలాలు,ప్రాంతాలు సందర్భాలలో ఈ అంశం యొక్క ఉనికి కవిత్వం లోకనిపిస్తుంది.వస్తువునానుకొని ఉండే సందర్భం, కాలం మొదలైనవి వొలిచి అందులోని సారాన్ని మాత్రమే కవిత్వం చేయడం ఇక్కడ కనిపిస్తుంది.

 

హరగోపాల్ కవిత్వంలో తొలిదశనుంచి కనిపించే విప్లవ కవితావస్తువు పారమార్థిక సమకాలీనతలో కనిపిస్తుంది.ఇందులోని సంఘటనలు ఆర్థమవుతాయి కాని అవి అన్నికాలాల,దేశాల,సందర్భాలను ఒక విశ్వాత్మతో వ్యక్తం చేస్తాయి.ఇవి కొన్ని అంశాల నుంచి ముడిపడి ఉండడాన్ని గమనించవచ్చు.1.వస్తువులో రాజకీయ అణచివేత,వైప్లవికధార కన్నా ఈ అంశాలనానుకొని ఉండే జీవితం పై ధ్యాస ఎక్కువ.2.ఉద్యమంలోనికి వెళ్ళిన పిల్లలకు సంబంధించి,మరణాలకు సంబంధించిన పలవరింత,మానసికమైన సంఘర్షణ ఎక్కువ.తెలంగాణా ఉద్యమ సంబంధమైన కవితలు,రైతులు,చేనేతలు మొదలైన వారిమరణాలపై రాసిన కవితలు పారదర్శకంగా స్థలకాలాలను వ్యక్తం చేసేవి.ఏరకమైన భౌతిక ప్రతిఫలనాలు లేకుండా రాసే కవిత కూడా ఒకటుంది.ఇందులో కనిపించేది సంకల్పవస్తువు అంటే ఒక అంశాన్ని గురించి రాయాలని రాసేది.రాజకీయంశాన్ని వస్తువుగా చేసుకున్న “ఏలినవారిదయ”(27.పే)అలాంటి కవిత.

ఐ.ఏ రిచర్డ్స్ “కవిత్వంలో వాక్యాలు దృక్పథాలను,అనుభవాలను వ్యక్తం చేయడానికి సాధనాలు ‘అన్నాడు.హరగోపాల్ దృక్పథం ప్రజాసంబంధమైన సామాజిక విలువలకు కట్టుబడింది.వైప్లవికమైంది.అనుభావాన్ని వ్యక్తం చేసే విషయంలో మిగతా విప్లవ వస్తువును కవిత్వం చేసే కవులకు హరగోపాల్‌కు మధ్య వైరుధ్యాలున్నాయి.హరగోపాల్ వాక్యాల్లో కళాత్మకత ఎక్కువ.సాధారణంగా వస్తువును కవిత్వం  చేస్తున్నప్పుడు రెండు ధర్మాలుంటాయి.ఒకటి విషయ గత ప్రయత్నం.వస్తువు సంబంధమైన సైద్ధాంతికత,చైతన్యం,ప్రేరణ వంటివాటిని ఇది ప్రసారం చేస్తుంది.మరొకటి కవిత్వీకరణ ప్రయత్నం..విషయాన్ని వస్తువును హృదయానికి చేరేట్టుగా కవిత్వీకరణకు విషయంతో పాటుగా విలువనిచ్చి ప్రయత్నించడం.హరగోపాల్ కవిత అంశాన్ని,తన దృష్టిని పాఠకుడి హృదయానికి చేర్చేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తుంది.అనుభూతి కవులను మరిపించే భావచిత్రాలు,కళాత్మక వాక్యాలు కనిపించడం ఈకారణంవల్లే.

ఒక భావనకు,అంశానికి  కళావ్యాఖ్యానం చేయాలన్నప్పుడు కొంత అస్పష్టత కలిగే అవకాశం ఉంది.పాఠకుడికి ఈ  కష్టంలేకుండా  ఉండడానికి హరగోపాల్ కొన్ని వ్యూహాలనుపాటిస్తారు.హరగోపాల్ కవిత్వభాషలో భావార్థకత,పరిసరాత్మకత రెండూ కనిపిస్తాయి.ఐ.ఏ .రీచర్డ్స్ భావార్థకభాష (Emotive language)గురించిరాసాడు- Emotive language is more massive, more   dense with association than referential language

(భావార్థక భాష సంకేతాత్మకమైన నిర్దేశ భాషతో పోల్చినప్పుడు చాలా స్థూలమైంది.సాంద్రమైంది)..ఈ భావార్థక భాష హరగోపాల్ గొంతులో కళావ్యాఖ్యానాన్ని ప్రోది చేస్తుంది.అదే సమయంలో తాను చెబుతున్న వాతావరణాన్ని తలపించే పరిసరాత్మకభాష (ambient language)ఒకటి ఇందులో కనిపిస్తుంది.

పరిసరాలను తలపించే భాష ద్వార వస్తువాతావరణం లోకి తీసుకువెళ్ళి .. కొన్ని రూపాలు,భావార్థాలనిచ్చే పదాలద్వార కవిత్వీకరణ చేయడం కనిపిస్తుంది.

1.నువ్వులేకుండా నేనెట్లుంటా/నువ్వు లేకుండా నేనెట్ల బతుకుత/నువ్వంటే నేనెత్తిన జెండా/నువ్వు నామదిలో మేనిఫెస్టో“-(తూకం)

 2″ఒక్కటంటే ఒక్కటి /వెన్నెలపాయి సెలయేరులాపారక ముందే/ వేట ఏమిటి/ఒక్కటంటే ఒక్కటి/వెలుగురేఖ కంటి నంటక ముందే/మాటుఏమిటి-(కొండవెన్నెల రాలిపోతుంది)

 3.పచ్చపచ్చని ఆలోచనలేవో/అడవుల్లో కొండవాగులై దుంకుతున్నై

కొమ్మలకు కట్టిన ఎర్రచీమలగూడు-(సభ పెట్టుకుందాం)

ఈవాక్యాల్లో “జెండా,మేనిఫెస్టో,వేట,మాటు,ఎర్రచీమలు“లాంటి పదాలు పరిసరాత్మక భాషకు సంబంధించినవి సాపేక్షంగా ఈ పదాలు విప్లవ ఉద్యమ వాతావరణాలను ప్రతిఫలిస్తాయి.-“వెన్నెలపాయి సెలయేరులా పారక ముందే..వెలుగురేఖ కంటి నంటకముందే”లో కనిపించే కళాత్మకత జీవినానికి సంబంధించినది.”వెన్నెల పాయి,వెలుగురేఖ”అనే పదబంధాలు స్థూలమైనవి,సాంద్రమైనవి.విప్లవపోరాటపు వికాసాన్ని ఇవి సంకేతిస్తాయి.”ఎర్రచీమలు”లోని వర్ణం..ప్రధానంగా చీమలు శ్రీకాకుళపోరాటం దగ్గర్నుంచి విప్లవ ప్రతీకలుకూడా.

దృష్టికి,సృష్టికీ మధ్య కవిత్వాన్ని కళగా నిలపడమే హరగోపాల్ కవిత్వం చేస్తున్నది.సాధారణంగా విప్లవభూమిక,ప్రగతిశీలత లేదా సామాజిక ప్రయోజనాలను ఆనుకుని రాసే కవిత్వం కళాత్మకత,అనుభూతికి దూరమనే మాట ఒకటుంది.హరగోపాల్ కవిత్వం ఇందుకు భిన్నంగా ఉంటుంది.అనేక వాక్యాల్లో మానసికమైన తన్మయీభావన (ecstacy conception),ధ్యానం ఉంటుంది.

dosilla

1.”రాలుతున్న నీటి చినుకుల్లో/ధాన్యపు గింజల రాసులూ

2.”నాట్లేసిన చేతులల్ల నారు పాపాయిలు

3.”మడులు మడులన్నీ అన్నపు కుండలే

4.”ఇన్ని పూలేరి తెచ్చుకుని /తోటలో మొక్కలన్నీ తలలో పెట్టుకున్నాయి

5.”అలసిపోయిన దారిని పాదాలకెత్తుకుని/ఇంటికి తీసుకెళ్తున్న మనుషుల కల లెక్కుంది రాత్రి

6.”రెండుకొమ్మలకు ఉయ్యాలకట్టి/వూగుతున్న ఆకాశం

 “మబ్బు దోసిళ్లలోని వాన చినుకుల్ని దోచుకుంటున్నది

7.”మెట్లు మెట్లుగా అడవుల్ని ఎక్కించుకున్న /గుట్టమీది కోనేరు మునకలేస్తున్నది

8.”బతుకు టెండలో తలకాలకుండ అమ్మకప్పిన కొంగులు చెట్లు

 

ఇలాంటి వాక్యాలు అడుగడుగునా కనిపిస్తాయి.వస్తువుని రూపాల్లోకి అనువదించుకోవటం వల్ల,పరికరాలుగా ప్రాంతీయముద్రగల భాషను వాడుకోవటం వల్ల ఉహాశక్తిని  కవితలో నిక్షిప్తం చేసే అవకాశం ఈ కవిత్వంలో కలిగింది.నిజానికి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కూడా ఇదే.మొదటి మూడు వాక్యాల్లో తన్మయీభావన ఉంది కాని వీటి మూలాలు వేరు.మొదటి దాంట్లో  ఊహ,రెండవ దాంట్లో అన్వయం చేయగలిగే జీవితాదర్శం,మూడులో చమత్కారం కనిపిస్తాయి.ఈ అంశాలే వస్తువును అనుభూతిగా చేయడానికి శక్తినిచ్చాయి.ఆరవ వాక్యంలో కనిపించేది కూడా ఇదే.నాలుగు ఐదు ఏడు వాక్యాలల్లో సౌందర్యాత్మకమైన ఊహ కనిపిస్తుంది.సౌందర్యాన్ని మానసికంగా అనుభవించడం మాత్రమే కాక ఆవిష్కారం వల్ల మాత్రమే అది కళగా మారుతుంది.అరవిందులు

“Beauty needs a manifestation to show it self”

hara

(సౌందర్యానికి ఆవిష్కారం అవసరం)అన్నారు.ఈ అవసరాన్ని కూర్చే శక్తులే పైన చెప్పుకున్న ఊహ,ధ్యానం,జీవితాన్వయం,చమత్కారాలు.

చమత్కృతిరానంద విశేషః సహృదయ హృదయ ప్రమాణకః“-(చమత్కారం ఆనందపు విశేషం,అది సహృదయుని హృదయానికి ప్రమాణం)అని ప్రాచీన కావ్య మీమాంస.పాశ్చాత్య దర్శన శాస్త్రం కళాతత్వ విచారం మూడు భాగాలలో సాగుతుందని చెప్పింది 1.ప్రకృతి స్వభావం, 2.దాన్నుంచి పొందిన జ్ఞానం,ఆ జ్ఞానం ద్వార జీవితాదర్శాల పరిశీలన. హరగోపాల్ వాక్యాల్లో కనిపించేదికూడా ఇదే.

ఈ అన్వయ శీలత వస్తువుని సాంకేతికంగా ధ్వనింపచేస్తుంది.అది జీవితం,విప్లవ చైతన్యంలోని ఉనికిని స్పష్టంగా ధ్వనిస్తుంది.

1.నీ ఇంటవాకిట అలుకు చల్లిన ఎర్రమట్టిపొద్దుని.

2.ఎన్ని తూటాలైనా ఆకుల్నేరాలుస్తాయ్,పత్ర హరితాన్ని కాదు.

3.నీవు వదిలేసిన పాటొకటి భూజాల మీద కప్పుకున్న.      

4.అడవి పచ్చటాకుల సైగలై నన్ను నిప్పుటేరులో నడిపింది తానే.

5.వాడకట్లన్నీ గుమ్మికట్లూడిన డప్పుల్లెక్క/ఒక్క సారికూడా సంతోషంగ మోగయి.

 

ఇలాంటి వాక్యాలు విప్లవాన్ని ధ్వనిస్తూనే,సౌందర్యాన్ని వ్యక్తం చేస్తాయి.అనేక పొరాటదశలను ఈవాక్యాలు సంకేతిస్తాయి.రెండవ వాక్యంలో వీరులు మరణిస్తారుకాని విప్లవ చైతన్యం కాదని, మూడు,నాలుగు వాక్యాలు  వీరునిమరణం ఇచ్చే ప్రేరణను.నాలగవది మరణం జరిగినప్పుడు ఊరు నిశ్శబ్దాన్ని మూగపోవడాన్ని ధ్వనిస్తుంది.హరగోపాల్ పట్టుకునే పరికరాలుకూడా ఒక పల్లెవాతావరణానికి చెందినవి.వాటి నిర్దిష్ట ప్రాంతాన్ని పరిశీలిస్తే ప్రాంతీయ భాషకు సంబంధించినవి.వీటినుంచి జీవితాన్ని, అనుభవాన్ని,పోరాటాన్ని హరగోపాల్ కవిత్వం చేస్తారు. ఈ కవిత్వం విప్లవ దృక్పథం,చైతన్యంలోని సౌందర్యస్పృహకు ప్రతినిధిగా నిలుస్తుంది.

బువ్వకుండ-ఒకానొక పురావర్తమాన గాథ

 

 

నూతన పారిశ్రామికవిధానాల తరువాత భారతదేశంలో కులవృత్తులుక్షీణించడం కనిపించినప్పటికి ఈ గుర్తింపు ప్రపంచీకరణ నాటికి ప్రధానంగాకనిపిస్తుంది.తెలుగుకవిత్వంలో దళితకవిత్వం వచ్చిననాటినుండే బహుజన,ముస్లిం మైనారిటీ స్పృహలున్నాయి.ఒక కాలంలో ఇవన్నీ మూకుమ్మడిచైతన్యాన్ని ఆసరా చేసుకుని నడిచాయి.ఇప్పటికి భావజాలంలో అంతగా వైరుధ్యాలు లేవనే అనాలి.జూలూరి గౌరీశంకర్”వెంటాడే కలాలు”,జ్వలితా దెంచనాల మిత్రులు తెచ్చిన “రుంజ”లాంటివి బహుజన స్పృహను సాహిత్యంలో పదిలం చేసాయి.ఇతరంగా కొందరు కవులు రాసిన కవితలు,సంపుటాలు,సంకలానాలుకూడా ఈ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

అన్నవరం దేవేందర్ “బువ్వకుండ” దీర్ఘ కవిత ఇలాంటి బహుజన తాత్వికతను ముడివేసుకుని వచ్చిన కవిత.ప్రధానంగా కుండయొక్క పురా చరిత్రను దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పటికీ,ఈ కవితలో ప్రపంచీకరణ,కులవృత్తుల విధ్వంసం,కుండ సాంస్కృతికంగా జీవితంలో నిలైపోయిన తీరు మొదలైన అంశాలను చిత్రించారు.మానవ నాగరికతలోనే కుండ తయారీకి ఒక ప్రధానమైన చారిత్రక భూమిక ఉంది.చరిత్రకు మానవశాస్త్రానికి ఉండే భూమిక గొప్పది.చరిత్రకారులు ఆసియా ప్రాంతపునవీన శిలాయుగాన్ని(Neo-Lithical period in Asia)మూడు సాంస్కృతిక దశలుగా చెప్పారు.1.ఆరంభ నవీన శిలాయుగం,2.కుమ్మరిపని తెలియని నవీన శిలాయుగం(Pre -Pottery Neo lithic).3.కుమ్మరిపని తెలిసిన నవీన శిలాయుగం(Pottery Neo lithic) ఈ కాలంలో కుమ్మరిపని తెయటమే ప్రధానం అందువల్ల కేవలం సంస్కృతిలోనే కాకుండా నాగరికతలోనే ఇది ప్రధానకేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ఈ కాలం కూడా సుమారు క్రీ.పూ.9000 నుండి 2000 గా చెబుతారు.”కెన్యా”లాంటిప్రాంతాలలో ప్రాచిన శిలాయుగానికి చెందిన కుండ పెంకులు కనిపించినా నవీన శిలాయుగంలోనే వీటి వాడకం ఎక్కువ.

అన్నవరం కవితలో ఏడు భాగాలున్నాయి.నాలుగైదుభాగాల్లో కుమ్మరి వృత్తికారుల పరిస్థితి,చివరిభాగాల్లో ప్రపంచీకరణ పరినామాలు వివిధకులవృత్తుల గురించి చిత్రించారు.కుమ్మరి వృత్తికి,కుండకు చారిత్రక భూమిక ఉన్నా అన్నవరం కవితలో వర్తమాన చారిత్రక,సాంస్కృతిక భాగాలున్నాయి.ఒకటి రెండుచోట్ల చారిత్రక,సాస్త్రీయ అంసాలు చిత్రించడం కనిపిస్తుంది.

 

మూడువేల సంవత్సరాలకింద/సింధూమేపొటేమియా సందుల/నేల తవ్వకాల కిందనే/ఈ కుండ ఆనవాలు దొరికింది”-(3.పే)

‘ పచ్చికుండను వాముల కాల్చి/బువ్వకుండను చేసిన శాస్త్రజ్ఞుడే/కుమ్మరి బ్రహ్మ”-(పే.3)

సారెచక్రం యంత్ర సాంకేతికతకు కేంద్రం/ప్రపంచగమనాన్ని,పనితనాన్ని/వేగిర పరచిన మహా సాధనం”-(7.పే)

మొదటివాక్యం చారిత్రకాంశాన్ని,రెండవది వైజ్ఞానికాంశాలను ప్రకటిస్తాయి.మట్టిని పామిన బుట్ట అనుకోకుందా కాలినప్పుడు కుండకు సంబంధించిన తయారీకి ఆలోచనలు వచ్చాయని శాస్త్రవేత్తల అంచనా.రెండవ వాక్యం కుండల తయారీలోని రెండవ దశను చిత్రించడం కనిపిస్తుంది.కుండల తయారీ వైజ్ఞానిక శాస్త్ర ఆరంభానికి ఉపయోగ పడిందన్న శాస్త్రవేత్తలు అందులోని రసాయనిక చర్యను  విశ్లేషించారు.తయారీకి ఊప్యోగించే మట్టిలో ఉన్న “హైడ్రేటెడ్ సిలికేట్ అఫ్ అల్యూమీనియం”(నిజానికి పలు చర్యల ద్వార మట్టిలో దీన్ని తయారుచేయడం కూడా కుమ్మరుల పనే)ను వేడిచేయడం ద్వారా నీటిని తొలగించడమే.చివరి వాక్యంలో సారె చక్రాన్ని(Potter wheel)గురించిన ప్రస్తావన ఉంది.కాల క్రమంలో బండి చక్రం అంతగా ఉందికాని,ప్రారంభదశలో దీని పరిమాణం చిన్నది.

 

అన్నవరం కవితలో ప్రధానంగా సంస్కృతి,ఆధునిక దశలు కనిపిస్తాయి.

 

1.”అన్నం వండే బువ్వ కుండ/అందరికీ తల్లి కూర అటికనే ఆది శక్తి”

2.”గరిగ బుడ్ది అయిరేండ్లు కూరాడి కుండలు/లగ్గం నాగెల్లి ఇండ్లల్ల దీవెనార్తుల ఆనవాళ్లు”-(పే.19)

3.”గాజుబొత్తలు దీపంతలు గోలాలు/లొట్లు బింకులు పూలకుండీలు”-(పే.19)

4.చావగానే అగ్గిపట్టేది మట్టిచిప్పలనే/అంతిమ యాత్ర ముందే అగ్గికుండ నడక/మన్నులోంచి మంటలో కలిసేదాకా/మట్టి పాత్రల మహత్మ్యమే ఇది”-(పే21)

 

5.”దీపావళికి దీపంతల పిలుపు/ఉగాదినడు వాకిలినిండా పచ్చటి పట్వల పంచాంగం/పెండ్లికుండలాకు పట్టిన వొల్లెడ ఒక కీర్తి/ఐరేణి కుండలమీద చిత్రకళలు”-(పే.27)

 

ఈవాక్యాలన్నిటిలో మట్టితోచేసిన ఆకృతులు,వాటి రూపంతో సంస్కృతికి ఉన్న సంబంధాలు కనిపిస్తాయి.మానవశాస్త్రంలో సంస్కృతి లక్షణం(Cultural trait) అనేపదాన్ని వాడుతారు.పైవాక్యాల్లో కుండ జీవితంలో అవసరాల్లోనే కాకుండా వివాహం నుంచి చావుదాకా ఎలా సంబంధం కలిగిందో చిత్రించడం కనిపిస్తుంది.

ఈవాక్యాల్లో కుండ సంస్కృతి విస్తరించిన సమగ్ర చిత్రం (Configuration)కనిపిస్తుంది.బెనడిక్ట్,మార్గరేట్ అనే శాస్త్రవేత్తలు సంస్కృతిలో వివిధ విభాగాలున్నాయని,అవి భిన్నమైన ప్రకార్యాలను నిర్వహిస్తాయని ‘విన్యాసవాదం”ను ప్రతిపాదించారు.అన్నవరం వాడుకున్న పదాలను గమనిస్తే “కూర అటిక”కూరాడు పేరుతో కులదేవత గా శుభకార్యాల్లో వాడే కుండ.ఐరేండ్లు-ఐరేణి ,ఐంద్రి లాంటి దేవతలకు ప్రతినిధులు.జీవన వ్యవహారంలో వంటపాత్రలుగ,నిలువకుండలుగా ఉపయోగం తగ్గిందిగాని,సంస్కృతిలో ఇంకా ప్రధాన భాగస్వామిగానే ఉంది.

“ప్రపంచీకరణ మాయకన్నా ముందునుంచే/కులవృత్తులు కునారిల్లుడు మొదలైంది/గ్లోబలీకరణ డేగచూపులకు  అన్నివృత్తుల్లానే/కుండలు వానడం పురాగ ఆగిపోయింది”

“మట్టి మహిమ స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్/కుండల స్థానంలోకుకర్ విజిల్లు/మట్టినిలోహం పురాగ మింగింది”-(పే.29)

ఈవాక్యాలు విధ్వంసాన్ని చిత్రిస్తాయి.ఈ కవితలో “సల్ప,రౌతు,సున్నగంటు సలప,సారె,గుబ్బిగడ్డ,సారెకోల,”వంటి పదాలతోపాటు “”వానుడు”లాంటిపదాలను రికార్డుచేసారు.కులవృత్తులగురించి వచ్చిన కవితల్లో “బువ్వకుండ”తన స్థానాన్ని నిలబెట్టుకోడమే కాకుండా ఇంకా రావాల్సిన అవసరాన్ని చెబుతుంది.ఒక సుదీర్ఘ సృజనానుభవం తరువాత అన్నవరం దేవేందర్  నడకను ఈ కవిత ఒక మలుపుతిప్పిందనడం అతిశయోక్తి కాదు.

విరించి వెతుక్కున్న కొత్త దారి!

 

 padam.1575x580 (2)

 

సాహిత్యం ప్రస్తుతం అస్తిత్వ ప్రశ్నలదిశలో ఉంది.వేరువేరు కేంద్రాలు లక్ష్యాలతో ప్రవహిస్తున్నా వీటన్నిటి వాహకశక్తి ప్రశ్నలే. స్థూల లక్ష్యం సమసమాజ నిర్మాణం. కాని ప్రాతి పదికలక్ష్యాల వైపు ప్రాథమికంగా వెళ్లడం వలన సంఘర్షణలు కనిపిస్తాయి. నిజానికి ఈ సంఘర్షణలకు మూలమైన అస్తిత్వ ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా స్థూల లక్ష్యం గురించి ఊహ చేయటం కూడా కష్టమే.

ఇన్నాళ్ల కవిత్వగమనంలో ప్రశ్నలు వేస్తున్న వర్గాలకు సంఘీభావంగా రాసిన కవిత్వం ఇతరేతర వర్గాలనుంచి వచ్చింది గాని, ఒక ప్రాతిపదిక సమాధానం కనిపించదు.స్థూల లక్ష్యానికిసంబంధించిన ప్రేరణ వినిపించదు.అలాంటి లక్ష్యాన్ని ఒకదాన్ని సూచిస్తూ “రెండవ అధ్యాయానికి ముందుమాట”ను విరించి విరివింటి ఆవిష్కరిస్తున్నారు.సాధారణంగా కొత్తగారాస్తున్నవాళ్లు ప్రధానస్రవంతి మార్గాల్లో పడి నడుస్తారు.పూర్వలక్ష్యాలు గమనం ఈ కవిత్వంలో కనిపిస్తాయి.విరించి కవిత్వం దీనికి భిన్నం ఈ కవిత్వంలో కనిపించే ప్రతిపాదన,లక్ష్యం కొత్తవి. గమనం అంతే నిర్దిష్టమైంది.

ఒక రెండు మూడు సంవత్సరాల కాలం మధ్య కవిత్వం కాబట్టి ఇందులో భిన్నమైన వస్తువులున్నాయి.ప్రధానంగా స్త్రీలు మొదలైన వస్తువులపై రాసిన కవితలు ఎక్కువ.కాని పైన చెప్పిన అస్తిత్వమూలాలపై సమాధానంగా వచ్చిన కవితలు సుమారు పది కనిపిస్తాయి.  కంకర రాళ్ళు(31పే)మేలుకొలుపు(43(పే)పిడికిలి(47పే)చీకటి గుహ(49పే)పది అక్షరాలు(64పే)మూగ జంతువు(70పే.)మేలి మలుపు(73పే)రెండో అధ్యాయానికి ముందు మాట(143 పే)మొదలైన కవితలు ఇలాంటివి.

1.” ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు నేను బాగుం డాలని /రాముడిగుడిలో చేతులుజోడించి నేను నీవుబాగుం డాలని /కొరుకోవటమొకటే మనకు దేవుడిచ్చి ఉండకూడదనీ మనం కోరుకుందాం/మనరోజొకటి మనకోసం మనముందు వేచిఉంటుందని ఆశపడదాం“-(33 పే)

 virinci1

2.”నీ వసుధైక జీవనానికీ/విశ్వ ప్రళయానికీ నీ చైతన్యమే తేడా“-(పే.430

3.భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే/నడిరాతిరి నిదురను ప్రేమించేమనం/మనుషులందరూ కలిసిమెలిసి జీవించే/ఒక సుందర స్వప్నాన్నెందుకో ప్రేమించనేలేదు“-(47.పే)

4.మనమానవాత్మని మేల్కొల్పే/కొత్త చూపొకటి అక్కడ ఇరుక్కుని ఉంది/పలుగూ పారల్లాగా మనమిద్దరమూ ఇక పనిచెయ్యాలి“-(73.పే)

మొదటి వాక్యాంశం మనుషులమధ్య ఐక్యతను గూర్చి మాట్లాడుతుంది.రెండవది మనిషిలోని ఆవేశానికి,చైతన్యానికి మధ్య వైరుధ్యాన్ని చర్చిస్తుంది.స్వప్నం, ఉనికి అనే భావనలు ప్రయాణంలోని నిర్దిష్టతను చెబుతాయి.వీటన్నిటిలో సంఘర్షణ నుంచి బయటికి వచ్చి ఒక వైపుకు నడవాలనే ఆశంస కనిపిస్తుంది.

virinchi

వసుధైక జీవనమనే విశ్వభావన ప్రాచీనకాలం నాటిది.నారాయణ పండితుడు” ఉదార చరితాణాం తు వసుధైక కుటుంబకం”అన్నాడు.దిగంబర కవులు కూడా “జాతి మత దురహంకారాలను త్యజించి,నగర విసర్జనం చేసి,గంగా సింధూ నదీతీరాల్లో,వోల్గా నైలూనదుల సమీపాల్లో మానవులంతా కుటుంబాలుగా ఏర్పడాలని”ప్రకటించారు.ఈ భావనే అంచెలంచెలుగా ఈ కవిత్వం మోస్తుంది.విరించి కవిత్వం లో కొన్ని లక్షణాలున్నాయి.ఒక ఆకస్మిక ప్రారంభం ఉంటుంది.సాధారణంగా కవిత్వంలో వస్తువును, దృష్టిని ప్రతిపాదించే ప్రతిపాదక వాక్యాలతో కవిత మొదలవుతుది.ఈ కవిత్వంలో ప్రారంభవాక్యం నుంచే కవిత్వాంశాన్ని చర్చించడం కనిపిస్తుంది.విషయాన్ని,దాన్నానుకున్న వస్తువుగా గాకుండా అది మనసు మీద పడే ప్రభావాన్ని విరించి కవిత్వం చేస్తారు.వాక్యాన్ని గమనిస్తే తనలో తాను సంభాషించుకున్నట్టుగా ఉంటుంది.

నిర్మాణ దృష్ట్యా గమనిస్తే విరించి సాధన వాక్యాల్లో కనిపిస్తుంది.సమకాలీనత ఎక్కువగా కనిపిస్తుంది.ప్రతికవికి ప్రధానంగా కొత్తగా రాసేవాళ్లకు సమకాలీన వాక్యనిర్మాణాన్ని ,వ్యక్తీకరణలను గమనించడం అవసరం కూడా.ఇది కూడా సాధనలో ఒక భాగమే.వాక్యాల్లో సాధారనంగా కనిపించే సమవృత్తి సూత్రం విరించి కవిత్వంలో ఒక భావాంశం (Unit)రూపంలో కనిపిస్తుంది.కిటికీ(పే.50)కవిత అందుకు ఒక నిదర్శనం. కాదు,చేయాల్సింది,ఎగరాల్సింది,తేలాల్సింది లాంటి క్రియల్ని తీసుకుని ఈ కవితను నిర్మించడం కనిపిస్తుంది.కవిత్వపుటద్దం(పే.52)Equality condemned(పే.54)వంటి మరిన్ని కవితలు ఇలాంటి నిర్మాణంలో కనిపిస్తాయి.కవిత్వ రూపాన్ని సాధించడంలో ఉండే అవగాహన,శ్రద్ధ ఇందులో కనిపిస్తాయి.ఎక్కువగా వాక్య విన్యాసం మీద విరించి కవిత ఆధారపడుతుంది.సఫిర్ భాషను రూప సంబంధి,విన్యాస సంబంధి గా చెప్పారు.విరించిలో రెండవ పార్శ్వమే ఎక్కువ.నిజానికి కథానాత్మక కవితలో ఈ మార్గం ఎక్కువ.

చీకటివరం(పే.86)లాంటి కవితలు కొన్ని విరించి ప్రతీకలను,రూపాలను వాడుకునే విధానాన్ని చూపుతాయి.

పగలంతా ఎండలో దాగుడుమూతలాడి/అలసిపోయిన నక్షత్రాలపుడు/ముఖం కడుక్కుని/అలంకరించుకోవడం మొదలెడతాయి.”

విడిపోతున్న ప్రియురాలు వెనక్కితిరిగి చూస్తున్నట్లు/సూర్యుడొకదిగులుచూపు చూస్తుంటాడు

నా గదినంతా పరికించి చూసే/సాయంత్రపు నీరెండచూపులకు/గోడల చెక్కిళ్లమీద ఎర్రటి సిగ్గువాలి ఉంటుంది

ఈవాక్యాల్లోవాడుకున్న అంశం మానవ గుణారోపణ. సాయంకాలమవడాన్ని మొదటిరెండు భావాంశాలు చిత్రిస్తే,చివరిభాగం సమాగమంలో జరిగే మానసిక వికారాలను చిత్రిస్తుంది.”గోడలచెక్కిళ్ల మీద ఎర్రటి సిగ్గువాలి ఉంటుంది”అలసిన నక్షత్రాలపుడు ముఖం కడుక్కుని అలంకరించుకుంటాయి.”అనే వాక్యాలు ధ్వని మాత్రంగా కొన్ని సన్నాహాలను వ్యక్తం చేస్తాయి.రెండవభావాంశం మంచి భావ చిత్రం కూడా.

కెంపులు జారే పెదవులు/సీతాకోక చిలుకలు ఎగిరే నవ్వులు

ఈ వాక్యాల్లో దృశ్యాన్ని చిత్రించడం ఉంది.-ఈ కవితలో నిజానికి రెండు వస్తువులున్నాయి.ఒకటి జీవిత సంబంధమైన సౌందర్య స్పృహ,రెండవది సామాజికం.కవి సామాజికుడవ్వాలన్న ఆలోచన చివరివాక్యాలను రాయించి ఉంటుంది.

యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి/బంగారు తల్లీ చిట్టితల్లి వరాల తల్లీ అని/అమ్మ పిలిచే ముద్దు పేర్లు/అమాయకంగా అద్దంలోంచి చీకట్లోకి తొంగి చూస్తాయి

ఈ వాక్యాలు సామాజికమైనవి.కవిత ఒక విషాద భావనతో ముగుస్తుంది.కొత్తగా కవిత్వలోకానికి పరిచయమైనా విరించికి తనదైన దృష్టి ఒకటుంది.సృజనలోనూ గమనించాల్సిన పరిణతిఉంది.మరింతచిక్కగా రెండో అధ్యాయం మనముందుకు వస్తుందన్న వాగ్దానమూ ఈ “ రెండోఅధ్యాయానికి ముందు మాటే” చేస్తుంది.

*

ప్రాంతీయభాష -తెలంగాణ కవిత

 

 

జీవితం చిత్రించబడకుండా ఒక ప్రాంత సంస్కృతి పరిపూర్ణంగా చిత్రించబడుతుందా అంటే కాదనే అనాలి.చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం భాషవల్ల వ్యక్తమయిన సందర్భాలు చాలాఉన్నాయి.కాని ఒక ప్రాంతీయ సంస్కృతికి అనుబంధంగా ఉండే భాష తనపరిమితులకు లోబడే వ్యక్తమౌతుంది.తెలంగాణా ప్రాంతీయ ముద్రలో ప్రాంతీయభాష ,సంస్కృతి , వ్యక్తులు, వ్యక్తిత్వాలు వెలిగక్కిన కవిత రావడానికి ప్రాంతీయ కవిత కొన్ని మైలురాళ్ళు దాటింది.

Local color or regional literature is fiction and poetry that focuses on the characters, dialect, customs, topography, and other features particular to a specific region.

(స్థానీయవర్ణం లేదా ప్రాదేశిక సాహిత్యం అది కథ, కవిత ఏదైనా పాత్రలు, ప్రజా వ్యవహారంలోని భాష,వేష ధారణ,అయా నైసర్గిక ప్రకృతి చిత్రణ మొదలైన వాటిపై ప్రత్యేక ప్రాదేశిక పరిధిలో దృష్టి పెడుతుంది.)

ప్రాంతీయ కవిత్వం ఉత్పన్నమవడానికి సాంస్కృతిక మూలాలు ఎంత అవసరమో అక్కడి అణచివేతలుకూడా  అంతే కారణం.19వ శతాబ్దం మధ్య భాగాల్లో 20 వ శతాబ్దం మొదటిభాగాల్లో అమెరికాలో ప్రాదేశిక కవిత్వం వచ్చింది.” Donna M. Campbell లాంటి విశ్లేషకులు ఈ సాహిత్యాన్ని అనుశీలన చేసారు. సివిల్ వార్  తరువాత వచిన సాహిత్యంగా దీనిని చెప్పుకుంటారు. ఫిలిప్పిన్స్ సాహిత్యంలోనూ ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ప్రాదేశిక సాహిత్యం వచ్చింది.. ఈ మార్గంలో తెలంగాణా సాహిత్యం,కవిత్వం మినహాయింపుకాదు.

సాంస్కృతిక ,రాజకీయ అణచివేతల తరువాత బలమైన ప్రాదేశిక కవిత్వం రావడం సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ మార్గంలో మొదటి పరికరం భాష.ప్రాతిపదికంగా వర్తమానంలో ప్రవహంలో ఉన్న భాషను రూపగతంగా తిరస్కరించే పరికరం భాష మాత్రమే.తెలంగాణా కవులు కూడా భాషపై తొలిదశలోనే దృష్టి పెట్టారు. తమ ఉనికి వ్యక్తం చేయడానికి భాష ఒక ప్రధానపరికరం అన్న జ్ఞానం ఆనాడే కనిపిస్తుంది.అయితే ఈ కవిత్వం ఆనాటికి శబ్దముఖంగా ఉనికి వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది.

వస్తుగతంగా పల్లెను తీసుకుని అక్కడి వాతావరణాన్ని చిత్రించే ప్రయత్నం చేసింది.తొలి ఉద్యమ సందర్భంలో దేవరాజు మహారాజు “గుండె గుడిసె”, డా.ఎన్.గోపి “తంగేడు పూలు” ఇందుకు నిదర్శనం.

వైద్యుడు  ఉత్త పుణ్యానికిచ్చిన మందు

బతికి నట్టే జేస్తది “/”జలగ గునాలు బెట్కోని ఓఅ మన్శి/దేవతోలె మాటలిడుస్తడు“-(పే.35)

పేమ పజ్యాల వాయిజ్యాలు ఊకెవాగకు“-(పే.34)

ఈ కాలానికి తెలంగాణా ప్రాంతీయ కవితకు కొన్ని ప్రాతిపదికలైతే ఏర్పడ్దాయి. కాని పరిపూర్ణంగా రూపుదిద్దుకుందని అనలేం.దానికి కొన్ని కారణాలున్నాయి. భాషను పరికరంగా ఉపయోగించుకోవడంతో పాటు వస్తువును,అందులోని అంశాలను అనిర్దిష్టంగా ,ఊహాత్మకంగా ప్రతిపాదించడం.భాషా ముఖంగా తెలంగాణా ప్రాంతీయ ముద్ర ఈ పదాల్లో కనిపించినా “వైద్గుడు””పజ్యం””వాయిజ్యాలు”వంటి పదాల ఉనికి సృజనాత్మకమూ ఊహాత్మకమైందే.భాషా ముఖంగా వాడిన క్రియలు”జేస్తది””ఇస్తరు”వాటిలో ప్రాంతీయ ఉచ్చారణారూపం(Local oral form) దగ్గరగా ఉన్నది. డా. గోపి “తంగేడు పువ్వు”లాంటివి సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని(Cultural representation) ఇచ్చాయి. ఈ కవితలో ప్రాంతీయ ముద్ర(Local signet)ఉంది కాని కవితానిర్మాణంలో సాధారణ కవిత రూపమే కనిపిస్తుంది. డా.గోపి రాసిన “పల్లెల్లో మన పల్లెల్లో”కవితలో ప్రాంతీయభాష సజీవంగా కనిపిస్తుంది.అయితే ఈకోవవన్నీ పల్లీయకవిత్వం(Idyllic poetry)కి చెందుతాయి.ఈముద్రనుంచే కొన్ని కవితా శీర్శికలు,కొన్ని చోట్ల నామవాచకాలు. క్రియలు ఉపయోగించుకోవడం రెండవమలుపు. ఇవి ఊహాత్మకనుంచి, సాoస్కృతికత నుంచి వాస్తవికత దాకా ప్రాంతీయకవిత ప్రవహించిన ఆనవాళ్ళు.కాని వస్తు రూపంలో “ప్రాంతం”ప్రధానంగా వ్యక్త మవటం తక్కువ.

తొలిదశ తెలంగాణా ఉద్యమం మలిదశకు మధ్య కాలంలో తెలంగాణా  కవులు వివిధ సామాజిక,రాజకీయ ఉద్యమాలను మోయవలసి రావడం అందువల్ల వస్తువుగా తెలంగాణాను  ప్రధానంగా వ్యక్తం చేయవలసిన అవసరాన్నుంచి దూరం చేసింది.ఎమర్జెన్సీ,సాయుధ పోరాటాలు,రైతాంగ పోరాటాలు,తొలిదశ రాజకీయ ఆకాంక్ష ఇవన్నీ వస్తువులుగా తెలంగాణా  కవుల కవితలను ఆక్రమించాయి.మలిదశకు కొంత ముందుభాగాల్లో ఉన్న ప్రపంచీకరణ, పారిశ్రామిక విధానాలు,పట్టనీకరణ మొదలైనవీ ఇందుకు మినహాయింపు కాదు.

ఈ సమయంలోనే అస్తిత్వ ఉద్యమాలు పెరిగి తెలంగాణా ప్రాంతీయకవిత (Topographical poem)రావడానికి మార్గాలేర్పడ్దాయి.దళిత కవిత,బహుజన కవిత,ముస్లిం మైనారిటీ కవిత అందుకు దోహద పడ్దాయి.ముద్రనుంచి జీవితాన్ని చిత్రించడం ఇక్కడినుండే ప్రారంభమయింది.అందువల్ల సాంస్కృతిక క్షేత్రం,వ్యక్తులు,వ్యక్తిత్వాలు,భాష నిర్దిష్టంగా వెలుగులోకి వచ్చింది.ఈ పై వాదాల కాలంలో కవిత్వం ,కవితలు ప్రాంతీయ లక్షాన్ని కలిగి లేవు.అస్తిత్వ ప్రశ్నలను లక్షంగాచేసుకున్నవి.

తెలంగాణా మలిదశ ఉద్యమ సందర్భంలో ఈ మార్గాలన్నిటినీ కూర్చుకొని బలమైన ప్రాంతీయ కవిత ముందుకొచ్చింది. తెలంగాణా వచన కవిత్వంలో వేముల ఎల్లయ్య,గ్యార యాదయ్య,చిత్తం ప్రసాద్,ఎం.వెంకట్,భూతం ముత్యాలు,అన్నవరం దేవేందర్,పొన్నాల బాలయ్య,జూపాక సుభద్ర,జాజుల గౌరి,సిద్ధార్థ మొదలైన అనేకమంది కవులు దళిత,బహుజన జీవితాలను వ్యక్తం చేసారు. “మేమే'”బహువచనం”లాంటి సంకలనాలు.కొన్ని కవుల వ్యక్తిగత సంపుటాలు.ఇలాంటి కవిత్వానికి అద్దం పడుతాయి. వీటిలో వస్తువు,జీవితం,భాష అన్ని సమగ్రంగా తెలంగాణా ప్రాంతీయ కవితను వ్యక్తం చేసాయి.ఈ తాత్వికతనే మలిదశ ఉద్యమకవితలో వ్యక్తమయింది. కేవలం ఉద్యమ సంబంధమైన గొంతును కూర్చుకుని జీవితం,సంస్కృతి,ఆచారాలు మొదలైన వాటినుంచి కవిత్వం  వచ్చింది. ఈ కాలంలోనూ తెలంగాణా నుంచి వచ్చిన మొత్తం కవిత్వం అంతా ప్రాంతీయ  ముద్ర ఉన్న కవిత్వం కాదు. ప్రాంతీయోద్యమ కవిత్వం కూడా ఆధునిక రూపంలో వచ్చింది.కాని భాషను మూల పరికరంగా ఉపయోగించుకున్న కవిత గతానికంటే చాలా ఎక్కువ.

నిజానికి ఈ కాలంలో తెలంగాణా కవిత రెండు మార్గాల్లో వ్యక్తమయింది.1.ఆధునిక వచన రూపంలో ఆధునిక కవితా రూపాలతో వర్తమాన వ్యవహారంలో ఉండే భాష తో తెలంగాణ  సంస్కృతి,వ్యక్తులు,వ్యక్తిత్వాలతో వ్యక్తమైన కవిత.2.ప్రాంతీయ సంస్కృతి, భాష, వ్యక్తులు వ్యక్తిత్వాలతో వ్యక్తమైన కవిత.వర్తమానంలోనూ ఈరెండు మార్గాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో నే ఆధునిక  తెలంగాణా కవితా రూపాన్ని,తెలంగాణా ప్రాంతీయ కవితా రూపాన్ని రెంటినీ వేర్వేరుగా గుర్తించవచ్చు.

 

1.”మావ్వ దిగూట్లె దీపం గాదు/ఆకాశం గొంగట్ల ఆగమైనపొద్దు/నేలమ్మ కొంగున అంగిటబుట్టిన ఆకలి

   -(దుక్కాల్ని దున్ని పోసుకున్న తొక్కుడుబండ మా అవ్వజూపాక సుభద్ర)

2.”ముని మబ్బులలేసే/తల్లికోడిలెక్క /అడవిల తిరుగాడే/మినుగురులెక్క

అరిచేతిల ముగ్గునుబట్టి/పంచలకు అదునుగ జారిడిసి/సరళరేఖలు గీసే మాయమ్మ/అయ్యలేసిన యాల/తూర్పుదిక్కువెలుగులువిరజిమ్మే తొలిపొద్దుపొడుపైతది

      -(మాయమ్మజాజులగౌరి)

3.ఇరిగిన బండిగీర విలవిలకొట్టుకుంటూ/మొండిగా మొట్టుకారుమీదిమొర/చుట్ట ఆరెలు కమ్మలు సొప్పబెండ్లరథమోలెకూలినయి“-(ఔగోలిత్తున్నంపొన్నాలబాలయ్య)

4.”గలగల నదులనిండా నీళ్లదోప్కం

  ముల్లెమూటల మీన్నే మానిగురాన్

 “మనోళ్లకొలువులల్ల మన్ను దుబ్బ

మారు మాట్లాడకుండ నోటినిండా బెల్లం గడ్ద

        -(అన్నవరం దేవేందర్పదవి)

 

మొదటి రెండు వాక్యాలు వరుసగా ప్రాంతీయ పాత్రలను,వ్యక్తిత్వాలను చిత్రిస్తాయి.రెండు ఖండికాభాగాలుకూడా తల్లిపాత్రను చిత్రించినవే.ఇందులో దలిత ఈస్తటిక్స్ కనిపిస్తాయి.ప్రతీకలను తమదైన జీవితంలోంచి తీసుకుని సృజించడం ఈ వాక్యాల్లో కనిపిస్తుంది.దళిత బహుజన జీవితాలతోపాటుగా ఆవాదాల స్ఫూర్తితో బాటుగా ఇందులో స్త్రీవాద గొంతుక కూడా కనిపిస్తుంది. మూడో వాక్యం ప్రపంచీకరణ సందర్భంలో కుదేలైన కులవృత్తులను చిత్రించినవాక్యాలు.నాలుగో ఖండికాభాగం రాజకీయాంశది. మొదటి రెండు వాక్యాల్లో  ఈస్తటిక్స్ ఉన్నట్లుగానే చివరి రెండు వాక్యాల్లో వ్యంగ్యం కనిపిస్తుంది.ఒక ఉద్వేగ పరిస్థితుల్లో తెలంగాణాభాషలో నిసర్గమైన వ్యంగ్యం ధ్వనిస్తుంది.వాక్యాల్లో ఉండే సమవృత్తి సూత్రం ఈ అంశాలను పటం కడుతుంది కూడా. వరుసగా వీటిని గమనిస్తే ఈనాలుగు దశల్లో సమగ్రమైన ప్రాంతీయ కవిత ఎలా రూపుదిద్దుకుందో అర్థమవుతుంది.

ఈవాక్యాలన్నీ రాజకీయ స్పృహను,సాంస్కృతిక స్పృహను,ఆర్థికస్పృహను కలిగిఉంటూనే ప్రాంతీయభాషను పరికరంగా తీసుకొచ్చాయి.కళాత్మక వాక్యాలనిర్మాణాన్ని చేయగలిగాయి.ఇవన్నీ తెలంగాణా ప్రాంతీయకవిత బలపడిన సందర్భాలను ప్రతిబింబిస్తాయి.నిజానికి ఉద్యమ సందర్భంలో వచ్చిన కవితలు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తీకరణ సంప్రదాయాలను కవిత్వంలో నిర్మించాయి.వీటిని గూర్చిన విశ్లేషణలు ఇంకా రావాల్సిఉంది.

*

కాలాంతరజీవి ఆత్మ సంభాషణ..

 

 

సమకాలీనంగా వస్తున్న కవిత్వంతో పోలిస్తే బొమ్మలబాయిలోని సిద్ధార్థ కవిత్వం విలక్షణమైంది. దానికి కారణం సమకాలీన వైఖరికి భిన్నంగా కవిత్వాన్ని చెప్పేందుకు ఆయన ఎంచుకున్న తీరు. దానికి మూలమైన జీవితం. ప్రధానంగా ఈ రెండు అంశాలను ప్రోది చేసుకున్న ఒకానొక సాంస్కృతిక క్షేత్రం. ఒక జీవితాన్ని సిద్ధాంత సారంగా తీసుకుని వ్యక్తం చేయడానికి,కొన్ని అస్తిత్వ కోణాలను ఆశ్రయించి వ్యక్తం చేయడానికి, జీవితం లోని అణువణువుణు తనలో సంలీనం చేసుకుని ఆయా ఆత్మలతో , ఆ గొంతుకలతో వ్యక్తం చేయడానికి మధ్య వైరుధ్యాలున్నాయి. సిద్ధార్థచేస్తున్నది మూడవ వైపు పద్ధతి. ఒక వర్గపు జీవితాన్ని వ్యక్తం చేయడంలా కనిపించడం వల్ల కొన్ని అస్తిత్వ రూపాలు,ఆ అస్తిత్వ రూపాలను ఆనుకొని చెప్పడం వల్ల సిద్ధాంతాలు కనిపించినా ప్రధానంగా వ్యక్తమౌతున్నది ఇదే. బహుశః సిద్ధార్థ తానుంటున్న కాలాన్ని త్యజించి,ఇంకా చెబితే తనను కూడా త్యజించి కొన్ని జీవితాలను తనలోకి అవలోఢనం చేసుకుని ఒక ఆధునిక దృష్టి నిండిన వచనంతో వ్యక్త మౌతున్నారు.

1
ప్రాకృతంలో “లీలావతీ కథ”ఉంది.అందులో నాయిక ఒక మాటంటుంది.
భణీయంచ పీయతమాయే పియయమ ! కిం తేణ సద్ద సత్థేణ!జేణ సుహాసి మగ్గో భగ్గో అమ్మారిజణస్స,ఉవలబ్బయి జేణ పుఢం అత్థో కయిత్థి ఏణ హయ యేణ,సో చేయ పరో సద్దో ఇఠో కిం  

 లఖ్ఖ ణేణమ్హా?”

(చెప్పు ప్రియతమా !నీశబ్దశాస్త్రం తో పనేముంది.దేనివల్ల అర్థం విష్దం గానూ,దాపరికం లేకేని హృదయాలతో వ్యక్తం అవుతుందో-అదే మాపాలిటి శబ్దం.ఇంకా ఈ శబ్ద శాస్త్రాలతో పనే ముంది.”)

సిద్ధార్థ ఉపయోగించుకుంటున్న భాష ఒక ప్రధాన పరికరం.లక్షణేతరమైన ప్రజామూలం లోని భాషను ఆయన ఉపయోగిస్తున్నారు.ఈ భాష లక్షణేతరమైన మూలద్రవ్యం.వాక్యాలు చాలా పొట్టిగా ఉండటం.పునరుక్తి ఎక్కువగా ఉండటం.ఇవన్నీ ఆనాటి లక్షణాలే.
మల్ల మాపోచారం కుంతలమ్మ గునిగే/అంగజపు మొక్కయ్యిందీ-(పే.69)
పానం బోన మెత్తాలె/తానం జేయించాలే//దొమ్మీకి ముందు గూల్చిన ఇండ్లను జూడు/పగులగొట్టిన బండ మైసమ్మగుండ్లను ను జూడు/గుంబజ్ను జూడు“-(పే.70)
ఉదాహరణలను ఎత్తిపోయాలనుకుంటే ప్రతీవాక్యంలో ఈ దేశీ మెరుపులున్నాయి. ఒక కోణంలో తనుగా వాడుకున్న భాష ఆపాదమస్తకం దేశీలానే కనిపిస్తుంది. జీవితమూ దేశీనే.ప్రాకృత శబ్దానుశాసన వృత్తిలో త్రివిక్రముని అభిప్రాయాన్ని గానీ,దేశీ నామ మాలలోదిగా చెప్పబడే హేమచంద్రుని వాక్యాన్ని పరిశీస్తే ఈ విషయం అర్థ మవుతుంది.-“దేస విదేస పసిది /భణ్ణా మాణా అనంతయా హుంతి/తమ్హా అదాఇ పా ఇతి/పయట్టభాసా విసేస దేసీ“-(దేశ విదేశప్రసిద్ధమైన భాషలు ఎన్నో ఉంటాయి. అనాది ప్రకృతి ప్రవృత్తమే దేశీ)

sidha

సిద్ధార్థలో కనిపించే పదాల్లో దేశీపదాలు ఎక్కువ. ప్రకృతిగతంగా రూపొందించిన పదాలనిర్మాణం ఎక్కువ.ఒక్కోసారి ఈ విషయాలను తానుగా చెప్పిన సందర్భాలూ లేకపోలేదు

పాదాపాదాలు లక్షలు/అదుముకుంటూ తొక్కుకుంటూ/భాషనంతా దులుపుకుంటున్నాను/అతివాస్తవ కాంతిలో జాతరలూగుతున్నాను//అంతటా /నేనొఖ్ఖ ఇద్దరినే కొంత వేల యుగాల దాన్ని/ముడు వేసుకుంటున్నాను జన్మాంగాల్ని/శివసత్తునంటు“(పే.84)

తాను కోరుకుంటున్న భాష ఎక్కడ వుందో సిద్ధార్థకు తెలుసు.దానిజాడనూ తానే చెప్పిన సందర్భాలూ లేకపోలేదు.

కుతి..కుతి..రాతల కుతి/లేని వచనంలో /నేనులేని కథనంలో వాంతి/గోడలింకా రంగుల్లో రెపరెపలాడుతున్నాయ్/తాకగానే మొలుస్తున్నాయ్/ఇంటెనకాలకి పో్ంర్రి బిడ్డా/పిలగాండ్ల దగ్గరికి పో్ంర్రి/పొద్దుగూకినాంక తారాడే ఆడోల్ల/ముచ్చట్ల దగ్గరికి పో్ంర్రి“-(పే.38)

 

అచ్చమైన ప్రకృతిగతమైన భాష,అమ్మభాష అక్కడే దొరుకుతుంది. ఈ వాక్యాన్ని చూసినపుడు ప్రాచీన జైన గ్రంథాలన్నీ ప్రాకృతంలో రాయడం ,ఆసందర్భంలో ఒక జైన ముని చెప్పిన వాక్యం గుర్తుకొస్తుంది. అందులోనూ స్త్రీలు,పిల్లలు ఉదహరింపబడటం కాకతాళీయం కాదేమో.

మత్తూణ దిట్ఠి వాయుం కాలీయ ఉక్కలియంగ సిద్ధంతం

థీభాలవా యణత్తం పాయియ మయియం జీవరేయిం

(దృష్టి వాదాన్ని వదిలేసి కాలిక -ఉక్కాలికాంగ సిద్ధాంతాలు స్త్రీలు,పిల్లలు చదివే నిమిత్తం జైనాచార్యులు ప్రాకృతంలోనే చెప్పారు)

నిజానికి ప్రాకృత కాలానికి కథల్లో పురుష సంబంధం లేదు. ఆనాటి కథలను మానుషీ కథ,దివ్య మానుషీ కథ,దివ్యకథ అనే విభజన కనిపిస్తుంది. మానుషీ అనే స్త్రీ వాచకమే కాదు చెప్పుకున్న కథలు కూడా ఇలాంటివే.మళ్ళీ లీలావతీ కథలోకే వెళ్లొద్దాం

ఏమేయ సుదజుయ ఇమ్మణోహరం పాయియాయి భాసాయే

పవిరళదేసిసులఖ్ఖం కహసు దివ్వమాణుసియం

(పరిశుభ్రమైన విప్పారిన హృదయం గల ఇంపైన కథను విస్తారంగా దేశీమార్గంలో ఒప్పేటట్టు.దివ్య మానుషిలకు చెందే టట్టు చెప్పు)

సిద్ధార్థ చెబుతున్న కవిత్వం కూడా ఈ దివ్య మానుషులకు చెందిందే. “ఆదివాసీ -సంచారదేవతా”-(పే.85),”సంగెం-(పే.39)”మొసాంబ్రం”-(పే.37)”పదసమ్మర్థం”-(పే.33)”లోరీ-దఖ్ఖనీ జోలకథ”-(పే.23)ఇలాంటి కవితలు ఎన్నో ఈ స్పృహకు,అందులోని జీవితానికి నిదర్శనాలుగా ఉంటాయి.

పెద్దపిన్నమ్మలను/చిన్న పిన్నమ్మలను/మేల్పిన్నమ్మలను /పాలిబెట్టి సాకవోసి/బొందలకాడ దీపాలను బెట్టి/పూజలర్పించినాము“(పే.75)

ఎలిసిపోయిండ్రమ్మామ్మలక్కలు/చిలుమెక్కింది బలగమంతా/తోపులబట్టీ..లోయతిరాజమ్మా../ఏడున్నరే.. తోడుకోరేందే..”

దఖ్ఖనీ పీఠమంతా/బొమ్మలబాయిగదనే..చిన్నీ..పెద్దక్కా/దీని కిటికీ తెరుసుకోవాలె/కొత్తగాలి వీయాలె../తాటాకమ్మ చిగురించాలె“-(పే.191/192)

‘నా సమస్త జాతుల పెనురక్త చాపమే ఈ కవిత్వం”ఆ రక్త స్పర్శలో తనలో కలిసిన బొమ్మల ఉనికే సిద్ధార్థ కవిత్వం.  ఇలా సిద్ధార్థ కవిత్వంలో కొన్ని వేల సంవత్సరాల జీవితముంది. లోకముంది.. ఆధునికతదాకా,నాగరికత దాకా పెనుగులాడిన దుఃఖ సంవేదనుంది. ఈ క్రమంలో సిద్ధార్థలో అనాదినుండి ప్రపంచీకరణదాకా తనను తాను కోల్పోయిన అంశాలు కనిపిస్తాయి.

 

2

ఒక అనాది కాలానికే పరిమితమైతే సిద్ధార్థ కవిత కొంత వెనకబడేది. జీవితాన్ని, కోల్పోయినదాన్ని వెదుక్కునే విషయంలో ఎంత అనాది కాలానికి,పురా జ్ఞాపకాలకు వెళ్లారో,అంతే నిక్కచ్చిగా అత్యంత ఆధునికుడుగా కూడా నిలబడ్దారు.దీన్ని ఆయన కవిత్వీకరించిన తీరు,వ్యక్తికరణ మార్గాలు చెబుతాయి.మనోవైజ్ఞానిక శాస్త్రంలో టోల్  మన్ సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని(Cognitive psychology)ని పరిచయం చేసాడు.ఇది సంవేదన,ఆలోచన,ప్రత్యక్ష్యం,జ్ఞాపకంలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.ఈసిద్ధాంతం ప్రవర్తనను వివరించడంలో కేంద్రప్రక్రియలకు (Central processes)ప్రాముఖ్యతనిచ్చే సామాన్య అభివిన్యాసం(Orientation)ను చర్చించింది.తనలో ని ఆలోచనను సంవేదనను,ఉద్వేగాన్ని వ్యక్తం చేసేందుకు సిద్ధార్థ ఎన్నుకున్న కొన్ని మార్గాలు ఉన్నాయి.అయనకుండే కళాత్మకదర్శనం(Aesthetic Perspective),నాటకీయ స్వగతం (Dramatic monologue),వాక్యాలను తీర్చి దిద్దే తీరు(Verse design)గమనించదగ్గవి. యాకోబ్‌సన్(Roman jokobson)కవిత్వభాషను అధిభాష(Meta lingual)అన్నాడు.సిద్ధార్థలో అనేకకాలాలను ముడివేసే ఒక అధిభాష ఉంది.ఇందులో మూడు భాగాలను ఉరామరికగా గుర్తుంచవచ్చు.1.తాను చెప్పాలనుకున్న సాంస్కృతిక క్షేత్రాన్ని ప్రసారం చేసేభాష.పైన చెప్పుకున్న దేశీ పదజాలం ఇలాంటిదే.2.నాటకీయ మైన సంభాషణ;సంవేదనను చెప్పడానికి ఆ ఉద్వేగాన్ని ప్రసారం చేయడానికి ఒక నిర్దిష్ట నాటకీయభాషను సిద్ధార్థ వాడుకుంటారు.ఒక ఊహాహాత్మక పాత్రను దృష్టిలో ఉంచుకుని మాట్లాడటం,ఆకస్మిక ప్రారంభం(Abrupt beginning)అనేకమైన సంబోధనలను చేర్చి చెప్పటం. అనేక భాషలకు హింది,ఉర్దూ,తెలుగు,ఒక్కోసారి సంస్కృతం మొదలైన పదాలను గంభీరత కోసం చెప్పడం ఇవన్నీ అలాంటివి.3.కళాత్మకత అందమైన పద చిత్రాలను,భావ చిత్రాలను నిర్మించడం.వీల్ రైట్ కవితా భాషను బిగుతైన  భాష(Tensive language)అన్నాడు. అనేకాకోణాలలో భాష కుండే శక్తి సామర్థ్యాలను బాగా ఉపయోగించుకోవడం వల్ల ఈ కవిత్వంలో ఆ బిగువు కనిపిస్తుంది.

 

స్నిగ్ధ శీతలంగా/స్పర్శాపూరితంగా /మాట్లాడాలనే ఉంది“-(పే.106)

చెకుముకి వానా కమ్మిందిక/వొక్కపాటనొక్కిన జలదరింపులో/చాల్చాలు నిలబడలేను“-(పే.133)

లేత జాబిలి కిటికీ వెనుక అతని గుసగుసలేనా-(పే.159)

ఇలాంటి వాక్యాలన్నీ ఆకస్మికంగా ఎలాంటిప్రతిపాదనలు లేకుండా ప్రారంభమవుతాయి…ప్రారంభానికి ముందే గతాన్ని ధరించడం,ఆగతం తాలుకు ఆవేశ సంవేదనలను ప్రసారం చేయడం ఆకస్మికతకు నిదర్శనం.ఈ వాక్యాలు ఎంత ఆకస్మికాలో అంతే కళాత్మకాలు కూడా.వాక్యాల్లో ధ్వనించే గంభీర్యత,దాని తాలూకు రూపాన్ని మోసే పదాలు ఇందులో కనిపిస్తాయి.

సిద్ధార్థ వచనంలో ఎక్కువగా నాటకీయ సాంద్రతను కూర్చేది అనుకరణ(Mimeses)..సాధారణంగా సంభాషణకు నాటకీయ సంభాషణకు ఇక్కడే తేడా కనిపిస్తుంది.

 

అల్లా అలలల్లా..లల్లా/రావేయమ్మా“-(పే.85)

ల్లొల్లొల్లొల్లొల్లో..అంటూ/పాటలు పాడాము“-(పే.75)

ఢిల్లం భల్లం/ఢిల్లం భల్లం/ఢిల్లం భల్లం“-(పే.64)

అన్ని పురుగులు నేనే నేన్నేన్నేన్నేనే..-(పే.24)

 

అనుకరణల్లో అంతర్గతవచనం ఎక్కువ.అందులోనూ అనిర్దిష్టత కొన్నీటీలో కనిపిస్తుంది.పై శబ్దాల్లో చివరిదాంట్లో ఉద్వేగ సంబంధమైన మానసిక ప్రకంపనలు(psychic vibrations)కనిపిస్తాయి.మిగతావాక్యాలు కూడా ధ్వనిగతంగా అనుకరణలా,ఉపయోగ గతంగా నాటకీయంగా కనిపిస్తాయి. నిజానికి ఈవాక్యాలను చూస్తే నాటకాల్లో వచనశైలి(Diction)లో చెప్పే Imply Attitude(సూచనా ప్రవర్తన..?అనవచ్చేమో..?)కు సమాంతరంగా కనిపిఒస్తుంది..తన స్థితిని,అనుభవాన్ని.వ్యక్తం చేయడానికి సిద్ధార్థ ఇలాంటి నాటకీయ పద్ధతులను బాగావాడుకుంటారు.నాటక విమర్శ “డిక్షన్”లో Revel character(ప్రకటనాపాత్ర)Convey action (ప్రసార చేష్ట) Identify Themes(గుర్తింపు ప్రసంగాలు)లాంటివాటిని గమనిస్తుంది.

సిద్ధార్థ (సుమారుగా)ప్రతీకవితలో తనదైన వర్గాన్ని పాత్రను గుర్తించే సంబోధనలు చెప్పడం..ఆ మాధ్యమంలో చేష్టలు(Gesture) చేయడం..”పసుపు పూసిన గుండ్లు”లాంటి సంకేతాలనివ్వడం మొదలైన వన్నీ నాటకీయతను పట్టుకొని చూపుతాయి..ఒక దశలో ఈ వాక్యాలన్నీ దృశ్యాన్ని (అందులోని రస స్థితి ని)ప్రసారం చేస్తాయి.ప్రధానంగా తనతో తాను ,తన వర్గంతో తానుగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉండే ఏకాత్మ సంభాషణ/ఏ కాంత సంభాషణ..అనేక కవితల్లో కనిపిస్తుంది.జర్మన్ నవలా రచయిత ఫ్రైటగ్ (Gustav Freytag)నాటకంలోని అంశాల నిర్మాణాన్ని ఒక పిరమిడ్ ద్వారా సూచించాడు.బొమ్మల బాయిలోని కవితల్లోకూడా ఒక వ్యాఖ్యానం తో మొదలయి కొన్ని అంశాలను ముడి వేయటం లాంటి చేష్ట(Gesture)లను అనుసరించి ఈ లక్షణాలను  విశ్లెషించుకోవచ్చు..

దళిత, బహుజన, ఆదివాసీ జీవితాలను దీనికి ప్రాదేశికంగా తెలంగాణాను ,దాని ఉద్వేగాన్నీ,రూపంగా ఆధునిక కవితానిర్మాణాలను,శిల్పంలో నాటకీయతను ,ప్రసరణ రూపంగా వేదాంతం ధ్వనించే బైరాగుల తత్వ జిజ్ఞాసను పొదవిపట్టుకున్న కవిత సిద్ధార్థ బొమ్మలబాయి.ఇది ఒక కాలాంతరజీవినిశ్చల తపస్సులోని ఆత్మసంభాషణ.

*

 

వేదనలోంచి మొలకెత్తిన కవిత

 

 

 

షాజహానా దర్దీ చదువుతున్నప్పుడు సమకాలీన సాహిత్య స్పృహతో మైనారిటీ వాదాన్ని మోస్తున్న బలమైన గొంతుక ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది.తన అస్తిత్వాన్ని ఆ గొంతుక ఎంతగా నొక్కి చెబుతుందో,అదే సమయంలో సమకాలీన సమాజంలోని ప్రధాన తాత్వికాంశను ఉమ్మడి చేతనలోకి తీసుకున్నారని అర్థమవుతుంది.దానికి కారణం బౌద్ధికంగా అనేక వాతావరణాలు నిండి ఉండడం.లేదా ఆ వాతావరణాల చైతన్యం ఉమ్మడిదవటం.

తెలుగులో అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక సమాజాన్ని భిన్నకోణాలనుండి అంశాత్మకంగా పరిశీలించే అవకాశం కలిగింది.బహుశఃకాలిక స్పృహ వల్లనేమో..ఒక అనుశీలనలో ఈవాదాలు ధోరణులన్నీ ఉమ్మడినిర్మాణాన్ని వ్యష్టిగా కలిగి ఉన్నాయనిపిస్తుంది.ఒక ప్రాతిపదిక దశలో అన్నీ ఒక ఉమ్మడి చేతనకు లోబడడమే అందుకు కారణం.
షాజహానా కవిత్వం సుస్పష్టంగా ముస్లిం స్త్రీల వైపు నిలబడింది.అదే సమయంలో ఈ వాతావరణం చుట్టూ ఉన్న స్త్రీ వాద భూమికనూ అర్థం చేసుకోవాలి.-” చమ్కీ,అబ్‌నార్మల్ పెయిన్,జమానత్,దేశాంతర దుఃఖం”మొదలైనవన్నీ ముస్లిం స్త్రీ జీవితాన్ని మోసాయి. ఈ కవిత్వంలో వర్తమానమే అధికం.నిజానికి తెలుగులో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు గతితార్కిక సిద్ధాంతాలపై ఆధారపడ్డాయి. గతంలోని చారిత్రక అణచివేతను ప్రశ్నించాయి.చాలావరకు అస్తిత్వ వాద దార్శనికతను,ఒకింత వైప్లవిక భావనను మోస్తున్న కవిత్వాన్ని వస్తు సంబంధంగా మాత్రమే గుర్తించడం కనిపిస్తుంది.దానికి కారణం ప్రత్యేక రాజకీయ.సాంస్కృతిక,సామాజిక లక్ష్యాలుండటమే.షాజహానా స్వరం రీత్యా వర్తమానాన్ని,అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ,కవిత్వీకరణపై దృష్టిసారించారు.ఆమె కవితల్లో హృదయాన్ని కదిలించే బలమైన వ్యక్తీకరణలే అందుకు సాక్ష్యం.

1.ఉరుములు మెరుపులతో ఆకాశం / అచ్చం అమ్మలా బాధతో మెలితిరిగిపోతున్నప్పుడు/కుండపోతగా కన్నీరు కళ్లలోనూ పైనుంచి/గుడిసె చూరునుంచి/అబ్బా మనసునుంచి ఏకధాటిగా కన్నీళ్ళు“-(మాదిగ బుచ్చమ్మ-63పే.)

2.దుఃఖం గడ్దకట్టిన మంచు శిల్పం పై/చిక్కని చీకటి వంకర్లు తిరిగిన గిరిజాల జుట్టు“-(దేశాంతర దుఃఖం-57 పే.)
3.
కుబుసం విడవని పాముల్లా /సూర్య కాంతిలో లోహం ప్రవహిస్తున్నట్టు సన్నని గీతలుగా నదులు“-(ప్రాణవాయువు-56.పే.)
4.
రేగ్గంపలో చిక్కుకున్న ఓణీలా/ఎక్కడ తట్టుకుని ఉండిపోయాం“-(కఠ్ఠామిఠ్ఠా దోస్తానా-69)

 

 

పదిలంగా జీవన తాత్వికతను అన్వయిస్తూ,దృశ్యాలను కవిత్వం చేయడం కనిపిస్తుంది.సందర్భం,వ్యక్తి,ప్రకృతి,ఉనికి అనే అంశాలు ఈ వాక్యాల్లో కనిపిస్తాయి.మొదటిరెండువాక్యాల్లోని కళ,మూడవ వాక్యంలోని ప్రకృతి క్రియాశీలక సూత్రాన్ని కప్పేస్తున్నాయి.నాలుగవ వాక్యంలో ఈ క్రియాశీలత స్పష్టంగా ఉంది.కొన్ని పద సంయోజనాలనుంచి వేరుచేసి చూస్తే సాధారణ స్త్రీ కవితకూ ఇవి దూరం కాదు.ఆ పద సంయోజనాలే ఈ అస్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతాయి.

సాధారణంగా భాషకు రస భావ వ్యంజక శక్తి ఒకటుంటుంది.దీన్ని సాధించడానికి కవి భాషను అలంకారికంగా వాడుతాడు.ఐ.ఏ .రీచర్డ్స్(I.A.Richards)భాషకు నాలుగు వృత్తులుంటాయన్నాడు.1.అర్థం (Sence) 2.అనుభూతి(Feeling) 3.ధోరణి(Tone) ఉద్దేశ్యం(Intention) ఇంకాస్తా లోతుకు వెళితే ఉద్దేశ్యంలోనూ కొన్ని అంశాలను చూడవచ్చు.1.వస్తుగత ఉద్దేశ్యం  2.కళా సంబంధ ఉద్దేశ్యం.మొదటిదానిలో ఉద్దేశ్యం వస్తువుపై ఆధారపడితే,రెండవదాంట్లో కళ ఆధారపడుతుంది.షాజహానా వాక్యాల్లో వస్తుగతమైనవి,కళాగతమైఅనవి ఎక్కువ.సాధారణంగా అస్తిత్వ సాహిత్యంలో వస్తుగత సంబంధాలే ఎక్కువ.దళితవాదం కళా,సమాజ జ్ఞానంతో కొంత భాషను సృష్టించుకుంది.తన ఉనికిలోంచి ఉపయోగించుకుంది.ప్రాంతీయ చేతనతో వచ్చిన కవిత్వంకూడా తన ఉనికిలోని నిసర్గ సౌందర్యాన్ని ఆధారం చేసుకుంది.

షాజహానాలోనూ ముస్లిం మైనారిటీ ముద్ర కనిపించే భాషా సంయోజనం ఉంది.పదాల అర్థక్షేత్రం (Semitic field)వల్ల స్త్రీ కనిపిస్తుంది.వైఖరి పరంగా స్త్రీ,మిగతా అంశాలలో మైనారిటీ గొంతుక కనిపిస్తుంది.”దేశాంతర దుఃఖం” లాంటి కవితలను గమనిస్తే సాధారణ జీవితానికి,ముస్లీం మైనారిటీ జీవితానికి మధ్య ఉండే వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

 shajahana

కొన్ని సార్లు లక్ష్యాన్ని గురించి మాట్లాడుకుంటే ఇందులో కొంత మార్క్సిస్టు ఊహలు,వైప్లవికమైన ఉద్వేగాలు కనిపిస్తాయి.”జమానత్””బుషాడా గో బ్యాక్”లాంటి కవితలు ఆ ధోరణిలో కనిపిస్తాయి.ఈ కవితల్లో బలమైఅన రాజకీయ దృష్టి ఉంది.ఇందులోనూ వైఖరి సారవంత మైన జీవితాన్నే ఆవిష్కరిస్తుంది.

రాక్షస రెక్కలతో తల్లుల్నీ తండ్రుల్నీ
ఎత్తుకెళ్ళిన నరహంతకుడని తెలిసాక
చందమామ కథలెట్లా చెప్పుకుంటారు ?
తెగిన చేతుల్నే /ఆయుధాలుచెయ్యకుండా ఎలా ఉంటారు.”-(పే-77)

పాలస్తీనా ఆఫ్గన్ ఇరాక్ /వాడు ఒక్కొక్క దేశాన్నే/
మింగుతూ వస్తున్న అనకొండ“-(పే.77)
వాడొస్తున్నాడంటే/మాగంజి నీళ్ల మీద గద్ద తిరుగాడు తున్నట్లుంది“-(బుషాడా గో బ్యాక్పే.79)

ఊహ తెలిసాక మసీదు కూల్చబడింది/కులాలు మతాలు రాజకీయాలు /నా బాల్యం తెల్లటి మస్తిష్కపు తెరమీద బొమ్మలాడాయి/భూగోలం గుండ్రంగా పరచుకున్న చుట్టీస్ అండ్ లాడర్స్ పటం/యవ్వనం దూకింది మతం గోడలమీదుగా /డోక్కుపోయిన అనుభూతులు“-(జమానత్-37.పే.)

ఈ కవిత్వం చదివాక కొన్ని అంశాలను గమనించవచ్చు.పరికరాలు,లక్ష్యం మొదలైఅనవాటివిషయంలో షాజహానాకు ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి.అనేక సార్లు స్త్రీల అణచివేతను గురించి మాట్లాడటం వల్ల స్త్రీగొంతుక,నిర్దిష్ట పాత్రలు,ప్రత్యేక వర్గ దృక్పథం వల్ల మైఅనారిటీ గొంతుక వినిపిస్తాయి. కార్ల్ గూస్టాఫ్ యూంగ్ ఉమ్మడి అచేతన(Collective unconsciousness)ను గురించి చెప్పాడు. జాతి అనుభవ జనితాలైన భావనలు ఉమ్మడి అచేతనలు.షాజహానా కవితలో స్త్రీ,ముసిలిం అనే భావనలు ఉమ్మడి అచేతన లోనివే.ఇందులోని పాత్రల్లోకూడ ఈ ఉమ్మడి ప్రతిమ(Collective image)కనిపిస్తుంది. ఆధునిక కవితా మాధ్యమంలో “బుష్”ఒక చారిత్రక పాత్రగా ఊహించడం,స్త్రీ దుఃఖాన్ని “దేశాంతర దుఃఖం ‘గా ఊహించడంలోనే ఈ ఉమ్మడి అచేతన కనిపిస్తుంది.ఇతిహాస చారిత్రక సామాజిక భావనలనుండి ప్రతిమను ఊహించడాన్ని (Collective imagination)అంటారు.ఇలాంటి మనోవైజ్ఞానిక లక్షనాలు కూదా ఈ కవిత్వంలో కనిపిస్తాయి.అనేక ఉమ్మడి భావనలకు లోనవుతూనే “దర్దీ”తనదైన సామాజిక,వర్గ సంఘర్షణను వెలిగక్కింది.

*

మానసిక తర్కంతో అరుణ కవిత్వం!

-ఎం. నారాయణ శర్మ 

~

ఎం. నారాయణ శర్మ

వస్తుశిల్పాల క్రియాశీలక సమన్వయం కవిత్వం. ఏ వస్తువును వ్యక్తం చేస్తున్నారు, వ్యక్తం చేయడంలో వాడుకున్న పరికరాలేమిటీ అనేదాన్ని బట్టే కవుల, కవయిత్రుల వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయి. కాలంలో మానసికశీలం పరిణతను సాధిస్తుంది. ఇది వస్తువును చూసే విధానం, అర్థం చేసుకున్న తీరు, దాన్ని తాత్వికదృక్పథంతో సమన్వయం చేసిన తీరు,  ఆమార్గంలో వ్యక్తం చేసిన తీరు ఇందులో పరిణత దశలు.

ఎన్.అరుణ కవిత్వం “కొన్ని తీగలు కొన్నిరాగాలు“ఒక పరిణత తాత్వికదర్శనాన్ని వ్యక్తం చేస్తుంది. ఏకవి, కవయిత్రయినా తనుచూసినదానికి  అనుభవించినదానికి వ్యతిరేకంగా స్పందించడం కనిపించదు. ప్రతికవి తీర్పువెనుక అంతఃకరణ సూత్రం (subjective principle)తోపాటు, అది విశ్వాత్మలో చెల్లుబాటయ్యేలా ఉంటుందని సృజనకారులు అలాంటి పారమార్థికసూత్రం(transcendental principle)నిర్మిస్తారని కాంట్ అంటాడు. ఎన్.అరుణ కవిత్వంలో కనిపించేది ఇదే.

ఇందులో ప్రతీ అంశాన్ని తాత్వికదృష్టితో ప్రతీకాత్మకం(symbolize)చేయటం కనిపిస్తుంది. ఈ ప్రతీకాత్మకసూత్రం నుంచే అనేకచోట్ల జీవితాన్ని,అందులోని సంఘర్షణను వ్యక్తం చేస్తారు. వస్తుగతంగా ఇందులో గతజీవితం-వర్తమానానికి మధ్య వైరుధ్యాలను అర్థం చేసుకుని కవిత్వం చేయడం  ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతీ అంశాన్ని చిత్రించడానికి ప్రాతిపదికగా బాల్యం, యవ్వనం నుంచి దృష్టిని సమగ్రంగా ప్రసారం చేయటంవల్ల ఇవి జ్ఞాపకాలుగా కనిపిస్తాయిగాని, బాల్య యవ్వనాలు నిర్దిష్టంగావ్యక్తం గావు. ఆయాదశల్లోని సారం తాత్వికంగా కవిత్వం చేయబడుతుంది. ప్రజ్ఞావార్థక్యపు భౌతికపరిస్థితుల మానసికతర్కం ఈ కవిత్వంలో ఎక్కువగాకనిపిస్తుంది. అదీ ప్రతీకాత్మకమైన కళాగంథాన్ని అల్లుకుని.

 

దుఃఖమేదో సంతోషమేదో

ఇప్పటికీ అంతుపట్టదు/దేనిలోంచి ఏది ఉబికివస్తుందో తెలియదు./కంటికి కనపడని నైలాన్ దారం/రెంటినీ విడదీస్తుంది“-(కొన్నిసార్లు-పే.20)

ఏటిలోకి వంగిన/కొమ్మమీదవాలిన పిట్టలు/

అలల అద్దాలవైపు కదులుతున్నాయి“-(అందం ఒక అనుభవం-పే.43)

జీవితం/హఠాత్తుగా ఆకాశం నుంచి/ఊడిపడదు/

ఒక్కొక్కవర్ణం మొలుస్తూ ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుంది-(అవునుజ్ఞాపకాలే-పే.47)

అన్వయంలేని కవిత్వంలా/ఉండీ ఉండీ కురుస్తుంది వాన“(దర్శనం-పే.53)

 

ఎప్పుడో సుడిగాలో వీచి/ చెట్టుకో తట్టుతుందా/జీవితం విలవిల్లాడిపోతుంది/ఆకాశంలో ఏర్పరచుకున్న/దారులకు గమ్యం స్పష్టం కాదు_(దిశాగీతం-పే.13)

 

ఈవాక్యాలన్నీ అనిర్దిష్టంగా విషయ, విషయీ సంబంధాలలో తాత్వికసూత్రాన్ని అల్లుకుని ఉన్నాయి. జీవనప్రవాహంలోని సంఘర్షణలను ఇవి వ్యక్తం చేస్తున్నాయి. అరుణ గారి కవిత్వంలో అనిర్దిష్టత ఎక్కువ. నిర్దిష్టవస్తువు ప్రత్యక్షంగా వ్యక్తంగాక, ప్రతీకలోని సారభూతమైన తాత్వికతతో వ్యక్తమౌతుంది. నిర్దిష్ట సందర్భాలు, స్థలాలు, వ్యక్తులు ఈ వాక్యాల్లో కనిపించడం తక్కువ. తాత్వికంగా, కళాత్మకంగా వ్యక్తం చేయడమే ఎక్కువ. శీర్షికలు చూసినా ఈవిషయం అర్థమవుతుంది. రూపాన్ని సాధించేవిషయంలో రష్యన్ రూపవాదులు “అపరిచయీకరణం”(Alienation)ను పరిచయం చేసారు. దీనిని రష్యన్ భాషలో “ఓస్త్రానిన్యా”(Ostraninja)అనేవారు. మనచుట్టూ ఉండేప్రపంచాన్ని కప్పి ఉన్న అతిపరిచయం అన్న తెరను తొలగించి మనకు పరిచయమైన వస్తువులను, లేదా ప్రపంచాన్ని కొత్తకోణంలో వినూత్నదర్శనంలో ప్రదర్శించడం అపరిచయీకరణం. ఈ కవిత్వం జీవితాన్ని సత్యదర్శనం ద్వారా , సాంకేతికతర్కం ద్వారా ఆవిష్కరించింది. ఏ కవితనైనా కళాత్మకంగా, తార్కికంగా, తాత్వికంగా సాధించి వ్యక్తం చేసే తీరు గమనించదగింది.-“మల్లెచెట్టు-కాలభరిణె-గడప-దిశాగీతం”లాంటి అనేక కవితలు ఇలాంటి నిర్మాణ సాధనకు నిదర్శనం. ఇవన్నీ సాంకేతికంగా స్త్రీజీవితాన్ని ధ్వనిస్తాయి.ఈ క్రమoలో అరుణ గారికవిత్వానికి ఒక సృజనసూత్రాన్ని గమనించవచ్చు.

 N. Aruna కాలం +జీవిత సంఘర్షణ +తాత్వికప్రతీక =>సృజనసూత్రం

“గడప”అనే కవితను పరిశీలిస్తే భాష సంబంధించిన తాత్విక, సాంకేతిక తర్కాలను అరుణ గారు ఎలా ఉపయోగించుకున్నారో అర్థమవుతుంది. రోమన్‌ యాకోబ్ సన్(Roman Jakobson) అనే రష్యాపండితుడు భాషా సంబంధంగా “బలవత్తరలక్షణం”(The Dominant) అనే అంశాన్ని ప్రస్తావించాడు. కవితాధ్యయనం (Poetics) భాషాశాస్త్రంలో ఒక అంతర్భాగమని ప్రస్తావిస్తూ  ఆయన”Closing statement; Linguistics and Poetics”- అనే గ్రంథాన్ని రాసారు. ఒక అంశాన్ని ప్రస్తావించాల్సిన తప్పనిసరి అవసరం బలవత్తర లక్షణం. ఈ అంశానికి మయకోవ్‌స్కీ ప్రతిపాదించిన ప్రత్యేకకేంద్రీకరణ(Foregrounding)ఆధారమని విశ్లేషకులు చెబుతారు. కవిత్వంలో చెప్పదలచుకున్న ప్రధానవిషయమే ప్రత్యేక కేంద్రీకరణ.-“గడప”లో ఈ సంకేతం నుంచే వ్యక్తమయ్యే స్త్రీ జీవితం ప్రత్యేక కేంద్రీకరణగా కనిపిస్తుంది.కేవలం స్త్రీ జీవితంకాకుండా దాన్ని పెనవేసుకున్న గత వర్తమానాలసారం ఇక్కడ ప్రధానాంశం.దీన్ని ప్రస్తావించాల్సిన సందర్భమే బలవత్తరలక్షణం.

   తగిలినప్పుడు తెలిసింది అక్కడ/అక్కడ గడప ఉందని/

 అంతవరకు దాని ఉనికి పట్టించుకున్న పాపానపోలేదు/మౌనకోపం అంటే ఇదేనేమో

-“తగిలినప్పుడుతెలవడం””మౌనంగాఉండడం”స్త్రీనేకాకుండా,స్త్రీ జీవిస్తున్న స్థితిని ఈ ఎత్తుగడ(move of poem)ప్రతీకాత్మకం (symbolize)చేస్తుంది.ఈ పదాలే గతవర్తమానాలను రికార్డు చేస్తాయి.యాకోబ్‌సన్-టిన్యునోవ్ అన్నమాటలను ఇక్కడ గమనించాలి.

Pure synchrony proves to be an illusion, every synchronic system has its past and its future as inseparable structural elements of its system

(శుద్ధమైన వర్ణన కేవలం భ్రాంతి.ప్రతీ వర్ణవ్యవస్థకు గతం,భవిష్యత్తు ఉంటాయి. అవి ఆవ్యవస్థలో విడదీయరాని మూలకాలుగా ఉంటాయి)

“మౌనకోపం””లో”మౌనం”గతాన్ని”కోపం”భవిష్యత్తును క్రియాశీలకంగా వ్యక్తం చేస్తాయి. భాషలో వ్యక్తమయ్యే భావప్రకటనావ్యాపారాన్ని”భాషాసన్నివేశం(speech event)లో విశ్లేషించవచ్చు.దీనికి సంబంధించి ఆరు భాషా కారకాలు(speech factors)ఆరు భాషా కార్యాలు(speech functions) ఉన్నాయి.పై ఎత్తుగడలో కారకాలను విశ్లేషించుకోవచ్చు.

స్త్రీ ఉనికి చెప్పడం సందర్భం(context) స్త్రీగా ఉండటం వక్తృస్థానం (addressor)-రిచర్డ్స్ప్రస్తావించిన గొంతుక(Tone)దీనిని నిర్ణయిస్తుంది.సందేశం(message)-ఇక్కడ విచారణ (phatic)రూపంలో ఉంది. ఈ ముఖంగా ఇది జీవితాన్నిచర్చించింది. మిగతావాక్యాలలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.

aruna photo

2.”ఇంటికీ వాకిలికీ /గడప సరిహద్దు/

 వెలుపలి ప్రపంచం పెద్దదా/లోపెలి లోకం పెద్దదా అంటే/ ఇల్లునుమించిన విస్తీర్ణం దేనికీ లేదంటాను

3.”ఇల్లు/మనస్సంత విశాలం /కాలమంత అనంతం/

ఇంతచిన్న జీవితాన్ని /ఒక బృహత్కథగామలచిన తపోవాటి

భాషాగతంగా ఈ వాక్యాల్లో చేసింది రెండుపనులు.ఒకటికి గడపను స్త్రీకి బలమైన ప్రతీకగా పునః పునః అన్వయించడం.దాన్నించి జీవితాన్ని వ్యక్తం చేయడం.వాక్యాలు విచారణలో భాగాలు.మొదటివాక్యంలోని మొదటి అంశం ఇల్లు,వాకిలి పేరుతో స్త్రీ జీవితానికిగల గృహ,సామాజికజీవితాలను సంకేతిస్తుంది.ఇది సామాన్యభాషకు భిన్నమయ్యింది కాదు.రెండవ అంశం వాక్యాలన్ని కవితార్థంగా ఇవ్వాల్సిన సందేశాన్ని సారాంశంగా అందిస్తాయి. యాకోబ్ సన్ ప్రకారం ప్రతి కారకం ఒక భాషా కార్యానికి కేంద్రబిందువవుతుంది.ఇందులో ఈభాగాలన్నీ కనిపిస్తాయి.

4.”కోపంతో అడుగు బయట పెట్టబోతుంటే/బాధ్యతగా ఆపిందీ గడపే/అదొక అందమైఅన లక్ష్మణరేఖ

5.”నీళ్ళతోనే కాదు/దానిని కన్నీళ్ళతోనూ కడిగిన సందర్భాలున్నాయి

నాలుగవ వాక్యంలో భావావేశస్థ్తి తి (emotive) కనిపిస్తుంది. అనేక సందర్భాల ప్రస్తావన(referential), చివరివాక్యంలో నీళ్ళు,కన్నీళ్ళు- కడగటం అనే ఒకే క్రియకు దగ్గరగా ఉండటం. సాధారణ అసాధారణ స్థితులను వ్యక్తం చేస్తాయి. కన్నీళ్ళతో కడగటం వల్ల భాషకు అధి భాషా(meta lingual)స్థాయి లభించింది. స్త్రీ అనేపదం ప్రత్యక్షంగా కనిపించదు కాని ప్రతివాక్యంలో ప్రాణశక్తిలాప్రవహిస్తునే ఉంటుంది. ఈ కవితలో గడప స్త్రీ అనే జీవితాన్ని వ్యక్తం చేయడానికి మాధ్యం(code)స్త్రీని వ్యక్తం చేసిన సందర్భం, గడప మాధ్యమంగా ఇంటా,బయట అనేక్రమాల్లో ప్రస్తావించడం. స్త్రీగా భావావేశస్థాయి చెప్పినపుడు కవిత్వార్థంగా అణచివేతను వ్యక్తం చేయడం. ఇవన్నీ సాంకేతికంగా ఈకవిత సాధించిన పరిణతులు.

అరుణగారి కవిత్వంలో నిర్మాణమార్గంలో సాంకేతికాంశం,దర్శనంలో తాత్వికాంశం రెండూ ఒక లక్షం వైపు నడుస్తాయి.ఈ ప్రయాణమే కవిత్వాన్ని సారవంతం చేస్తుంది.

                                                             *