పంజరం లో రంగుల ఆకాశం

బి. అనూరాధ

అరుణ్ ఫరేరా “సంకెళ్ళ సవ్వడి” పుస్తకానికి బి. అనురాధ రాసిన ముందుమాట నుంచి..

 

ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ దేశపు జైళ్లను చూడాలి అని ఎవరన్నారో కానీ అది అక్షరాలా నిజం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని పాలకులు నిస్సిగ్గుగా చాటుకొనే భారతదేశంలో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే జైళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జైళ్లను బయటనుండి సందర్శించేవారికి తెలిసే విషయాలు పెద్దగా ఏమీ ఉండవు. లోపల ఏంజరుగుతుందో బయట ప్రపంచానికి ఏమాత్రం అర్థంకాదు. అరుణ్‌ పుస్తకం మనకా ప్రపంచాన్ని చూపిస్తుంది.

ఈ పుస్తకం తెలుగు అనువాదానికి ముందుమాట రాయడానికి నాకున్న ఏకైక అర్హత నేను జైలు జీవితానికి ఒక ‘ఇన్‌సైడర్‌’ని కావడమే. ఒకేలాంటి రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నా, సామాజిక కార్యకర్తగా దాదాపు ఒకేకాలం లో రెండు దశాబ్దాలు పనిచేసినా, జైల్లో పడేవరకూ అరుణ్‌తో నాకు పరిచయం లేకుండింది. తాను మహారాష్ట్ర జైల్లోనూ నేను జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జైల్లోనూ ఉన్నప్పుడు, అక్కడున్న వేరే రాజకీయ ఖైదీలతో నాకు కలంస్నేహం ఉండింది. అప్పుడు నా ఉత్తరాలను వాళ్ళు సామూహికంగా చదువుకొనేవాళ్ళు. నా ఉత్తరాలు కొన్నిటికి తన బొమ్మలతో ప్రతిస్పందించేవాడు అరుణ్‌. అలా తాను మన కళ్ళముందించిన జైలు జీవితంలోని రంగులు కొన్నిటిని మాతోనూ పంచుకొని, మా నలుపుతెలుపుల జైలు జీవితానికి రంగులద్దే ప్రయత్నం చేశాడు. అలా పరిచయమైన అరుణ్‌ని విడుదలయ్యాకనే చూశాను. జైలు జీవితం నాకిచ్చిన ఒక మంచి స్నేహితుడు అరుణ్‌ అయితే, జైలు జీవితం వల్ల అరుణ్‌ మనకిచ్చిన మంచి కానుక ఈ పుస్తకం.

ఆ కాలంలో ఉత్తరాల కోసం మేము ఎంత ఉద్విగ్నతతో ఎదురు చూసేవాళ్లమంటే అన్నం సహించేది కాదు. అందువల్లే కావచ్చు అరుణ్‌ కూడా ఇందులో తాను చెప్పదలుచుకొన్న ప్రతి విషయాన్ని తాను బైటికి రాసిన ఉత్తరం తో మొదలుపెట్టాడు. తను ఎంచుకొన్న ఈ పద్ధతి వల్ల ఈ పుస్తకాన్ని కింద పెట్టకుండా చదివేస్తాం. అరుణ్‌ కేవలం బొమ్మలు వెయ్యడమే కాదు. తానొక కార్టూనిస్టు కూడా. కాబట్టి, తన బొమ్మల్లోనే కాకుండా తన రచనలో కూడా ఆ వ్యంగ్యం మనకి అడుగడునా కనిపిస్తుంది. ఇది తన శైలికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది.

చీకటి కొట్లులాగా పిలవబడే జైళ్ళలో అసలేం జరుగుతుంది? ఎలా గడుపుతారు అన్నన్ని యేళ్ళు? మనం ఎన్నడూ వినని ఒక కొత్త భాష. అది జైలు కే ప్రత్యేకం. అక్కడ మనం మనుషులం కాదు శాల్తీలం. ప్రతిరోజూ మూడు సార్లు లెక్కల్లో తేలాక, గిన్తీలు, తలాశీలు వంటి రొటీన్లతో, ములాకాత్‌లు, తారీఖ్‌ లు వంటి విశేషాలతో, ”గిరాదేంగే”, ”పీ.సీ.ఆర్‌ కరాదేంగే” వంటి ధమ్కీలతో ఆశ నిరాశల మధ్య ఉద్వేగాలు, అప్పుడప్పుడు కొన్ని ఉత్సాహాలు, ఎదురుచూపులు, అనేక దిగుళ్ళు ఎన్ని ఉన్నా ఖైదీని చివరవరకు నిలిపి ఉంచేది ‘ఆశ’ ఒక్కటే. వాటి తాలూకు రంగులన్నీ అరుణ్‌ పుస్తకంలో ప్రతి పేజీలోను కనపడతాయి.

జైళ్ళలోని అవసరాలు ఖైదీల్లోని సృజనని అద్భుతంగా బయటకు తీస్తాయి. అందుకు ఈ పుస్తకంలో కొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి. క్రికెట్‌ ఆడడానికి బంతి తయారుచెయ్యడంలో కావచ్చు, ఏకాంతంలో ఉంచినా ఒకరికొకరు సమాచారం పంపుకోవడంలో కావచ్చు, ఏ రకంగానూ రుచిలేని తిండిని బాగుచేసుకోవడంలో కావచ్చు, ఐదు నిమిషాల్లోనే బట్టలు ఉతుక్కొని, స్నానం చెయ్యగల నేర్పుని సంపాదించడంలో కావచ్చు, పెన్నుల్లో ఖాళీ అయిన రీఫిల్స్‌ ని ఉపయోగించి చెప్పుల్ని మరమ్మత్తు చెయ్యడంలో కావచ్చు – ఆ సృజనకి సాటిలేదు.

ఖైదీలకి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంచడం కారాగార వాసంలోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఆ ఖైదీలు రాజకీయ ఖైదీలైతే కనుక వాళ్ళు తాము ఎక్కడున్నా ప్రజల మధ్య ఉన్నామనే అనుకొంటారు కనుక వాళ్ళని మిగతా ఖైదీల నుంచి వేరు చేసి వంటరిగా ఉంచే ఏర్పాట్లు దేశంలోని అన్ని కేంద్రీయ కారాగారాల్లోనూ ప్రత్యేక శ్రధ్ధతో చేసింది. అవే అండా బ్యారక్‌ లు. అత్యంత భద్రత కలిగినవి రాజ్యం దృష్టిలో. అరుణ్‌ కూడా అటువంటి అండా బ్యారక్‌ లోనే తన జైలు జీవితం మొత్తాన్ని గడిపాడు. అందులో ఉండే ఒంటరి సెల్స్‌ గురించి అరుణ్‌ ఇలా అంటాడు.

”….ఈ సెల్స్‌లోకి కాంతి చొరబడదు. సెల్‌లో నుంచి మీకు బయట ఏమీ కనపడదు. ఒక ఆకుపచ్చని చెట్టులేదు. ఆకాశం ముక్క లేదు. ‘అండా’ కు మధ్యలో ఎత్తుగా ఒక కాపలా స్తంభం ఉంటుంది. ఆ స్తంభం పైకెక్కి చూస్తే ఈ మొత్తం ఆవరణ ఒక పెద్ద, గాలి చొరబడని సిమెంటు గుడ్డు లాగా కనపడుతుంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఈ గుడ్డును పగలగొట్టడం అసాధ్యం. బహుశా ఈ గుడ్డు లోపల ఉండే ఖైదీలే పగిలిపోవాలని దీన్ని తయారుచేశారేమో!!”

”…… అండా నిర్మాణంలోని ఈ పాశవికమైన ఊపిరిసలపనితనం కన్నా మనిషితో సంబంధం లేకపోవడమే మీ ఊపిరిని బిగదీస్తుంది” అంటాడు.

జైలు లో దేన్నయినా కటకటాల్లోనించే చూడాలి. ఎందుకంటే ఆ చీకటకొట్ల బయట

ఉండే ఆవరణ పై కప్పు ఖాళీగా ఉండకుండా ఇనుప జాలీ తో మూసివేసి ఉంటుంది.

”పిట్ట కూడా దూరలేదు” అని మనం కేవలం ఒక అలంకారం కోసం వాడే ప్రయోగం ఇక్కడ అక్షరాలా వాస్తవం. అలాగే బావి పైనా అంతే. ఇనుప జాలీతో మూత పెట్టినట్టు ఉండే బావిలోనుండి, సన్నగా పొడుగ్గా ఉండే డబ్బాల్లాంటి ప్రత్యేక బక్కెట్లతోనే నీళ్ళు తోడుకోవాలి. ఇలాంటివి ఒక ఎత్తయితే బయటి సమాజంలో ఏమాత్రం ఊహించలేని విపరీత పరిస్థితులు జైల్లో మనకి తారసపడుతుంటాయి.

మహిళల హక్కుల కోసం పోరాటంలో రెండు దశాబ్దాల కార్యాచరణలో ఎన్నో వరకట్న హత్యలకి వ్యతిరేకంగా పోరాడినందుకు నేనూ, వరకట్న హత్యలు చేసో, వాటికి ప్రేరేపించో జైలుకి వచ్చిన స్త్రీలూ ఒకేచోట సుదీర్ఘ కాలం కలిసిఉండాల్సిరావడం. జైలు జీవితంలో మాత్రమే ఉండే ఒక అసంబద్ధత ఇది. అలాంటి విపరీత పరిస్థితులను అరుణ్‌ కూడా ఎదుర్కొన్నాడు. నిజానికి అంతకంటే తీవ్రమైనది. ఖైర్లాంజీ హత్యాకాండలోని నిందితులతో, అరుణ్‌ ఫాసీయార్డులో ఉండాల్సి రావడం అటువంటిదే.

”అంతటికీ కారణం సురేఖ భోట్‌మాంగే నే ……ఆమె మా మీద ఫిర్యాదు చేసె ధైర్యం చేసింది. మిగిలిన దళితులలాగా కాక ఎప్పుడూ బైటకి మాట్లాడు తుండేది. సాహసికంగా ఉండేది” అని వాళ్ళు అరుణ్‌తో చేసిన వాదనలు విన్నప్పుడు ‘డాటర్‌ ఆఫ్‌ ఇండియా’లో నిర్భయ పట్ల తమ చర్యలను సరిగ్గా ఇలాంటి వాదనలతోనే సమర్ధించుకొన్న ముఖేష్‌ సింగ్‌ గుర్తుకు వస్తాడు. ఇలాంటి వారితో కలిసి రోజంతా కలిసి ఉండాల్సిరావడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అలవాటుపడతాం. జనరల్‌ బ్యారక్‌ లలో కనీసం కొంతమంది నైనా దూరంగా పెట్టగల అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఫాసీయార్డు లాంటి చోట్ల మనుషులే కరువయిన ఒక వాతావరణంలో మాట్లాడాలన్నా ఉన్నది వాళ్ళే. కాసేపు ఉల్లాసం కోసం ఆటలాడుకోవాలన్నా ఉన్నది వాళ్ళే అయినప్పుడు, మనుషుల్లోని అమానుషత్వాన్ని, క్రూరత్వాన్ని తాత్కాలికంగా విస్మరించడం నేర్చుకొంటాం. అరుణ్‌ కూడా అలానే నేర్చుకొన్నాడు. ”సమాజంలో అతి అసహ్యానికి గురైన వారితో సుదీర్ఘ కాలం నిర్బంధంలో కలిసి ఉండడంలోని అనివార్యతలు ఇవి” అంటాడు.

ఈ పుస్తకంలో అరుణ్‌ కేవలం జైలు జీవితాన్ని గురించి మాత్రమే రాయలేదు. తాను జైలుకి వచ్చిన నేపథ్యం, తన రాజకీయ విశ్వాసాల గురించి కూడా రాశాడు. ఆ రకంగా జైలు జీవితానికి సంబందించిన ”సమయ సందర్భాలను” కూడా మనకి పరిచయం చేస్తాడు. అలాగే సమకాలీన రాజకీయాలను గురించి కూడా అవకాశమున్న ప్రతి సందర్భంలోనూ చర్చించాడు.

అరుణ్‌ 1990 ల మొదట్లో ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో విద్యార్థిగా ఉన్న కాలంలో అణగారిన ప్రజలకు సంక్షేమ చర్యలు అందించే శిబిరాలను గ్రామాలలో నడపటం ద్వారా సామాజిక కార్యాచరణ లోకి ప్రవేశించాడు. ఆ క్రమంలోనే భారత సమాజం స్వభావాన్ని గురించి కూడా తన కార్యాచరణనుంచే గ్రహించడం మొదలు పెట్టాడు. ”భారత సమాజం వర్గ, కుల అంతరాలతో ముక్కలైందనీ, అసంఖ్యాకమైన వైరుధ్యాలతో నిండి ఉన్నదనీ” గుర్తించాడు. ”వ్యవస్థలు మారకుండా దాతృత్వం ఎంత అర్థరహితమో” గ్రహించాడు.

బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పునరావాస చర్యలలో పాల్గొన్నాడు. కాలేజీ క్యాంటీన్‌ కార్మికుల జీవితాలను దగ్గరగా చూసి, వాళ్ళ హక్కుల కోసం జరిపే పోరాటాలలో సహాయపడుతున్న క్రమంలో విప్లవ విద్యార్థి సంస్థలలో ఒకటైన విద్యార్థి ప్రగతి సంఘటన్‌లో చేరాడు. కాలేజీ చదువు ముగిశాక ‘నవజవాన్‌ భారత్‌ సభ’ అనే యువజన సంస్థలో పనిచేశాడు. ఈ సంస్థలో పనిచేస్తూ ముంబయి లోని అట్టడుగు ప్రజల నివాస స్థలాలైన ”మురికివాడలను” తన నివాసంగా చేసుకొన్నాడు. శివసేన ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్డునపడ్డ బస్తీవాసులను సంఘటిత పరిచే ఆందోళనలు నిర్వహించడంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అలనాడు భగత్‌ సింగ్‌ నిర్మించిన సంస్థలాగే ఇదీ నిషేధానికి గురయ్యింది. ప్రపంచీకరణ వ్యతిరేక ఆందోళనల్లో తలమునకలుగా పాల్గొన్నాడు. ఇలాంటి రాజకీయ కార్యాచరణలో ఉన్నవారికి అరెస్టులు కొత్తకాదు. కాబట్టి తాను ఎప్పుడైనా అరెస్టు కావచ్చని అరుణ్‌ ఊహిస్తూనే ఉన్నాడు. ఊహించలేక పోయిన విషయం ఏమంటే తన అరెస్టు జరిగిన తీరు, ఆ తరవాత తనపైన జరిగిన అత్యాచారాలు, తనని, తనతో పాటుగా అరెస్టు కాకపోయినా అయ్యారని పోలీసులు అరెస్టు చూపిన ఇతర రాజకీయ కార్యకర్తలను ఎంత భయానక చిత్రహింసలకు గురిచేశారో చదువుతుంటే శరీరం గగుర్పొడుస్తుంది. అందుకే కస్టడీ మరణాలను అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రం మహారాష్ట్ర కావడం యాదృచ్ఛికం కాదంటాడు.

పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా పెట్టిన చిత్రహింసలు ఒక ఎత్తైతే కొన్ని నేరుగా చిత్రహింసలు పెట్టకుండానే అలాంటి పరిస్థితులను కల్పించి కష్టపెట్టడం మరొక ఎత్తు. ఉదాహరణకు పోలీసులు తన చెప్పులను ఎక్కడోపెట్టి మర్చిపోయి (?) తనని ఒట్ఠి కాళ్లతో జైలుకి పంపడం. ఎర్రని ఎండలో బొబ్బలెక్కించే తారురోడ్డు మీద జైలు గేటునుంచి కోర్టు వ్యాను వరకూ కాలిపోయే రోడ్డుమీద నడవలేక పరిగెత్తేవాడినని రాశాడు. రెండు నెలల వరకూ ఇదే పరిస్థితి.

ఇలాంటి పరిస్థితులని, నిరాశా నిస్పృహ కలిగించే జైలు వాతావరణాన్ని భరిస్తూ కూడా అరుణ్‌ కానీ, తన సహచర రాజకీయఖైదీలు కానీ తమ సెన్సాఫ్‌ హ్యూమర్‌ని ఏమాత్రం కోల్పోలేదు. అక్కడ జరిగే ఇటువంటి వాటికి కాలేజీ విద్యార్థుల్లాగా ముద్దు పేర్లు పెట్టుకోవడం… ఉదాహరణకు ఖైదీలకి మానవ హక్కులేంటని సుప్రీం కోర్టు తీర్పులపై విసుక్కొని, ఖైదీలకి ”బుద్ధి చెప్పడానికి” ఒక జైలర్‌ ఎంచుకొన్న భౌతిక హింసా కార్యక్రమానికి ”సాయంకాలం భజన” అని, ఆయన బదిలీ తరవాత చొక్కా చేతులు పైకి మడిచి సల్మాన్‌ స్టైల్‌ లో రుబాబ్‌ చేసే యువ జైలర్‌కి ”ధభంగ్‌” అని పేర్లు పెట్టడం వంటివి. అక్కడ జరిగే తతంగాలను వర్ణించేటప్పుడు కూడా ఆ హాస్యం, ఆ వర్ణనలు అంత బాధలోనూ నవ్వు తెప్పిస్తాయి. నిజానికి రాజకీయ ఖైదీలకి ఎప్పుడూ బలం అదే. ఎలాంటి పరిస్థితిలోనైనా నవ్వగలగడం. ముఖ్యంగా తానూ, తన సహచరులూ ఈ నవ్వులని తమకే పరిమితం చేసుకోకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న మాలాంటి వారికి కూడా ఉత్తరాల ద్వారా పంచారు. మా కలం స్నేహం వల్ల మేమంతా వేరు వేరు రాష్ట్రాల్లోని, వేరు వేరు కేంద్ర కారాగారాల్లో ఉన్నప్పటికి అందరం ఇంగ్లీష్‌ వార్తాపత్రికల్లో మొట్టమొదట చూసేది కాల్విన్‌ అండ్‌ హాబ్స్‌ కార్టూన్‌ అని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఎలాంటి నిరాశలో ఉన్నా కాల్విన్‌ మమ్మల్ని ఒక్కసారైనా మనసారా నవ్వించేవాడు.

తరవాత కాలంలో ముంబై నుండి బదిలీ అయి వచ్చిన వెర్నన్‌, శ్రీధర్‌ అనే మరో ఇద్దరు రాజకీయ ఖైదీలు జైల్లో ”వకీల్‌ అంకుల్స్‌”గా పేరు పొందారు. నిజంగా వకీళ్ళు కాకపోయినా అంతకంటే ఎక్కువగా న్యాయసహాయాన్ని జైల్లో ఉంటూనే

అందించారు. ఆ సహాయాన్ని అందుకొన్న వారిలో రాజకీయ ఖైదీలకన్నా చాలా

ఎక్కువ సంఖ్యలో సామాన్య ఖైదీలే ఉన్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ కేంద్ర

కారాగారంలోని ఎందరో మహిళలకి అటువంటి సహాయాన్ని నేను ”వకీల్‌ అంకుల్స్‌” సహాయంతోనే చెయ్యగలిగాను.

ఈ పుస్తకంలో అరుణ్‌ తాను చదివిన అనేక పుస్తకాల గురించి కూడా ప్రస్తావించాడు. జైలు జీవితంలో ఉన్నప్పుడు పుస్తకాలు ఒక ఆక్సిజన్‌లాగా పనిచేస్తాయి. అయితే అవి ఎప్పుడూ ఒక లగ్జరీనే. ఈ విషయంలో మాత్రం అరుణ్‌ ”అదృష్టవంతుడే”. వాళ్ళకి దొరికినట్టు అందరికీ ఒక అలెన్‌ వాటర్స్‌ దొరకాలిగా!! బ్రిటన్‌ దేశస్థుడైన ఆయనకి వాళ్ళ దేశం నుండి ఒక సంస్థ చేసిన సాయం వల్ల అది సాధ్యం అయ్యింది. అసలు జైల్లోని వాళ్ళకి పుస్తకాలు సరఫరా చెయ్యడానికే ఒక సంస్థ ఉండాలనిపిస్తుంది. అయితే పుస్తకాలను అనుమతించని జైళ్ళు అనేకం ఇంకా ఉన్నాయి. అయినా అది అడ్డంకి కాదు పోరాడి సాధించు కోవాల్సిందే. అరుణ్‌ జైల్లో ఉన్నప్పుడు అనేక చిత్రాలు గీశాడు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ‘కలర్స్‌

ఆఫ్‌ ది కేజ్‌’ అని ఇష్టంగా పిలుచుకొన్నారు. తరవాత తాను ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకానికి కూడా అదే పేరు పెట్టాడు. ఇంగ్లీషులో ఎంతో ఆసక్తికరంగా రాసిన ఈ పుస్తకాన్ని అద్భుతంగా అనువాదం చేసి వేణుగోపాల్‌ పూర్తి న్యాయం చేశాడు. ఇంగ్లీషు పుస్తకాన్ని ఎంత ఆసక్తిగా, ఉద్విగ్నంగా, కిందపెట్టకుండా చదువుతామో, అంతే బాగా అసలు తెలుగులోనే ఈ పుస్తకం రాశాడా అనిపించేలా అనువాదం నడిచింది. అందుకు వేణు చాలా అభినందనీయుడు.

ప్రస్తుత పరిస్థితిలో ఏటికి ఎదురీదడం ప్రతి ఒక్కరూ తమతమ జీవితాల్లో తప్పక చెయ్యవలిసి వస్తోంది. ఎలాంటి పరిస్థితిలోనైనా అలా ఈది చూపించిన జీవితం తన జైలు జీవితం. అరుణ్‌ వేసిన ‘ఆశ’ అనే చిత్రంలో లాగానే చీకటి కొట్టులాంటి జైలు జీవితం గురించీ, అందులో నుండి లాల్‌ గేట్‌ బయట పరుచుకొన్న రంగుల ప్రపంచం (అదీ ఒక పెద్ద జైలు లాంటిదే అయినప్పటికి) గురించీ మనతో పంచుకొన్నభావోద్వేగాలే సంకెళ్ళ సవ్వడి.

      ఒక ‘మావోయిస్ట్’ ఖైదీ జైలు అనుభవాలు

సంకెళ్ళ సవ్వడి

రచన: అరుణ్ ఫరేరా

తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్

మలుపు ప్రచురణ, హైదరాబాద్

వివరాలకు సందర్శిం చండి :

www.malupubooks.blogspot.com

చందమామని చూడని వెన్నెల

Chanda

రచయిత పరిచయం

రెండు దశాబ్దాలపాటు సామాజిక ఉద్యమాలలో పాల్గొని ఝార్ఖండ్ లోని హజారీబాగ్ లో ఉన్న కేంద్ర కారాగారం లో నాలుగేళ్ళు గడిపారు. జైలు జీవితం గురించి ఇప్పటివరకు 14 కథలు, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలలోనూ, మహిళామార్గం లోనూ, అరుణతార లోనూ ప్రచురితమయ్యాయి. ఇతర కథలు మహిళామార్గం పత్రికలలోనూ, సంకలనాలలోనూ ప్రచురితమయ్యాయి.

~

 

“నా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా. కొద్ది మంది నా సన్నిహిత మిత్రులు నిన్ను కలవాలనుకొంటున్నారు. ఎగ్గొట్టకు.”

స్వాతి నుంచి వచ్చిన ఆహ్వానం చూసి చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. చివరికి తాను ఫోన్ చేసి నా అంగీకారంకోసం అడిగితే ఇంక సరే అన్నాను.

నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను చూసి నవ్వి “పద. నీకో చిన్న సర్ ప్రైజ్” అంటూ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళింది. పైన శుభ్రం చేయించి కింద చాపల మీద పరుపులు వేసి దుప్పట్లు పరిచింది. ఆనుకోడానికి వీలుగా కొన్ని దిండ్లు. దూరంగా ఒక వైపు ఒక బల్ల మీద తిండి ఏర్పాట్లు కాబోలు గిన్నెల మీద మూతలు వేసి ఉన్నాయి. కొన్ని ఖాళీ ప్లేట్లు గ్లాసులు అన్నీ పెట్టి ఉన్నాయి. ఒక మూలగా చిన్నగా వెలుగుతున్న లైట్. దానిని తాత్కాలికంగా ఇప్పుడే ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ వెలుగు అంతగా రాని చోట పక్కలు వేసి ఉన్నాయి. చల్లగా కురుస్తున్న వెన్నెల. నాలుగైదు అంతస్తుల పైన కాబట్టి ట్రాఫిక్ గోల అంతగా వినబడడం లేదు.

“ఎంత ప్రయత్నం చేసినా డాబా ఇల్లు, కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోనించి చందమామని చూసే ఏర్పాటు చెయ్యలేకపోయాను. దీనితోనే అడ్జస్ట్ అయిపోవాలి” అంది. “పట్టణాల్లో కరెంటు తీగల మధ్యనుండి తప్ప కొబ్బరాకులెక్కడివిలే” అన్నారెవరో. అందరం నవ్వుకొన్నాం.

పరిచయాలయ్యాయి. అందులో కొందరు నాకు పేర్లు విని ఉన్న పరిచయం. కొందరు అస్సలు తెలియదు. కొద్ది మందిమే ఉన్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని ఆనందించడానికి వీలుగానే ఉంది.

ఆ రొమాంటిక్ వాతావరణం చూస్తుంటే వేరే ఏమీ మాట్లాడాలనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే స్వాతి మాట్లాడడం మొదలుపెట్టింది. మన పార్టీ లో మొదటి రౌండ్ అందరూ చందమామ మీద కానీ వెన్నెల మీద కానీ పాట పాడాలి.

“పాటలు రాని వాళ్ళు ఏం చెయ్యాలి?” అంది పావని.

“చదవాలి” అంది పద్మ.

“ఛ! ఎంత అన్ రొమాంటిక్ ఆలోచన?” ఒకేసారి స్వాతి, మాధవి అన్నారు.

“ఓకే! పాటలు రాని వాళ్ళు ఒక ప్రేమ కథ చెప్పాలి. నేనసలు దానిని సెకండ్ రౌండ్ కి అనుకొన్నా”. అని సమస్య పరిష్కారం చేసింది స్వాతి.

“మాధవితో షురూ చేద్దాం. అద్భుతంగా పాడుతుంది” అంది పావని. నిజంగానే మాధవి మొదలుపెట్టాక ఇక వంతుల విషయం మర్చిపోయి అది మీరు కోరిన పాటల రూపం తీసుకొంది. అడగడమే ఆలస్యంగా తాను అనేక పాటలు వెన్నెల మీద, చందమామ మీద పాడింది. తనకి తెలియకుండానే రాధిక తోడయ్యింది. కొన్ని పాటలు తను పాడాకా, కరుణ కొన్ని హిందీ పాటలు పాడింది. అందరం ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉన్నాం.

ఇప్పుడిక ప్రేమ కథల రౌండ్ అని స్వాతి ప్రకటించింది.

“నేను మా చానల్ కి స్టోరీ కోసం ఒక సారి చాలా దూరం నడవాల్సి వచ్చింది. అప్పుడు ఇలాగే వెన్నెల. ఆ వెన్నెల చూస్తే ప్రేమ కథలు వినాలని మహా సరదా పుట్టింది. నాతో పాటు వచ్చిన కొలీగ్ ని తన ప్రేమ కథ చెప్పమని మస్తు సతాయించాను. ఎంతయినా పక్కన వాళ్ళ ప్రేమ కథలు చెప్పడం సులువు” అని తను విన్న ఆ ప్రేమ కథ చెప్పింది పావని.

తరవాత నా వంతు వచ్చింది. మరో సందర్భంలోనయితే నేను పాటలు పాడడాన్నేఎంచుకొని ఉండేదాన్ని. కానీ అప్పుడు మాత్రం నాకు కథ చెప్పాలనిపించింది.

“నేను ఒక కథ చెప్పాలనుకొంటున్నా” అన్నాను.

“మరొక జైలు కథా?” అంది చప్పున రాధిక.

నేను నవ్వి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. “నేను థీమ్ ని మార్చడం లేదు. నేను చెప్పే కథ కూడా వెన్నెల గురించే. “చందమామని చూడని వెన్నెల గురించి.”

***                                           ***                                           ***

“చందమామ రావే..

జాబిల్లి రావే….”

ఏదో ఒక భాషలో ఈ పాట తెలియని మనుషులు, బహుశా ఉండరు. బహుశా అని ఎందుకన్నానంటే చందమామ మీద పాట లేని భాష ఏదన్నా ఉందేమో మనకేం తెలుసు? కానీ చందమామని చూడని పిల్లలెవరన్నా వుంటారా? క్షణం కూడా ఆలోచించకుండా జవాబు చెప్పగల ప్రశ్న.

“ఉండరు”

నేను రాజకీయ ఖైదీగా జైలు కి వెళ్ళక పోతే బహుశా నేను అదే జవాబుని తడుముకోకుండా చెప్పేదాన్ని. మనకి తెలిసిందే సర్వం కాదు. ఇప్పటి వరకూ… మనకు తెలిసిందే “పరమ సత్యం”. విశ్వంలోని ప్రతీదీ సాపేక్షికమే అనే విషయం తెలియదా, అంటే తెలుసు. కానీ, దానిని ప్రతి ఒక్కదానికి అన్వయించుకోలేని చేతకానితనం నాదని సవినయంగా వొప్పుకొంటున్నాను. కాబట్టి ఏమో ఉండచ్చు అని ఊహించలేకపోయాను. “ఉంటారు” అనేది ఈమధ్యనే తెలిసిన కరకు వాస్తవం.

ఆ పాప పేరు చాందినీ (వెన్నెల). ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసీ అమ్మకి ముసల్మాన్ నాన్నకి ప్రేమ గుర్తుగా పుట్టిన ఒక ముద్దులు మూటకట్టే పాప. వాళ్ళిద్దరూ విచారణలో వున్న ఖైదీలు.

వాళ్ళమ్మ చాందినీకి చాలా ఇష్టంగా ఆ పేరు పెట్టింది. ఆదివాసీ జీవితాల్లో ప్రకృతి ఒక భాగం. వాళ్ళ పేర్లయినా, పండగలయినా రోజువారీ జీవితమయినా అంతా ప్రకృతి తోనే ముడిపడి ఉంటుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి పాటల పోటీల్లో ఒకబ్బాయి వెన్నెల మీద పాడిన పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అతను చాలా అద్భుతంగా పాడాడు. కానీ ఆ పాట ఏమిటో తెలుసా? “కాని చోట కాసావే వెన్నెలా? కారడవుల కాసావే వెన్నెలా!” దానిభావంలోని అసంబద్దత గురించి అర్థం అయ్యే వయసు కాదది. అది అర్థం కావడానికి మరో దశాబ్దం పట్టింది నాకు. అడవుల్లోనూ మనుషులుంటారు. అడివిలోనే పుట్టి పెరిగి అడవినే ఇళ్లుగా చేసుకొన్నవాళ్ళు. వాళ్ళకి మనలాగా ఎలక్ట్రిక్ దీపాలు అవసరం లేదు. ఏదైనా చల్లని ఆ మసక మసక వెన్నెల లోనే. మనుషులు లేని అడవి లోనయినా ఎన్నో జీవాలు, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు? సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే స్వాంతన కలగ చేసే చందమామ మీద హక్కు ఏ ఒక్కరిదో ఎలా అవుతుంది? బహుశా ప్రతి ఒక్కరూ తమదే అనుకొంటారు. ఎంత అన్యాయమైన పాట కదా అది. ఆ పాట రచయిత ఒక వెన్నెల రాత్రి కారడవిలో గానీ గడిపితే, ఆ పాట రాసినందుకు గుండెలు బాదుకొంటాడు. అడవి కాచిన వెన్నెల అని ఎవరన్నా సామెత వాడితే ఇప్పుడు కేవలం జాలి పడగలం అంతే.

చాందినీని కనక ముందు వాళ్ళమ్మ కూడా అలా వెన్నెల్లో ఆడుకొన్న అడవి పిల్లే. బతుకు తెరువు ఆమెని ఇళ్ళల్లో పని చేసుకొని బతకడానికి ఢిల్లీ చేర్చితే ఆమె మొదటి సారిగా వెన్నెల్లో తాజ్ మహల్ ని చూసింది. షాజహాన్ ప్రేమకథ గురించి మొదటిసారి విన్నది. తాను పని చేసే ఇంటివాళ్ళు ముంబయ్ కి బదిలీ అయితే అక్కడ అదే ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జమాలుద్దీన్ ని ప్రేమించింది. నేనిప్పుడు చెప్పబోయేది వాళ్ళ ప్రేమ కథ కాదు. కానీ వాళ్ళ ప్రేమ కథ కి సాక్ష్యం మాత్రం వెన్నెలనే. అలా అడివిలో వెన్నెల దగ్గర మొదలయిన జీవితం వెన్నెల్లో తాజ్ మహల్ సమక్షంలో కొత్త జీవితానికి బాసలు చేసుకొనేవరకూ వెళ్లింది. అమాయకంగా ఒకరికి సాయపడబోయి వాళ్ళిద్దరూ జైలు పాలయ్యారు. జైలులోకి ప్రవేశించాక కానీ తాను తల్లిని కాబోతున్నానని ఆమెకు తెలీలేదు. వెన్నెలతో అల్లుకు పోయిన తన జీవితానికి కొత్త వెలుగు లాంటి ఆ పసిదానికి ప్రేమగా చాందిని అని పేరుపెట్టుకొంది. జైలులో కళ్ళు తెరిచిన ఆ చిన్నారికి చాలా అసహజమైన వాతావరణంలో జీవితం మొదలయ్యింది.

జైలులో సాయంత్రం చీకటి ఇంకా పడుతూ ఉండగానే లాకప్ చేసేస్తారు. సరిగ్గా పక్షులు గూటికి చేరేవేళ. ఆ సుందర దృశ్యాలేవీ కళ్ల నిండుగా చూడకుండానే అందరం ఎత్తైన గోడల వెనుక రాతి కట్టడంలో ఏ వైపునుండీ పొరపాటున కూడా చందమామ కనపడే అవకాశం లేని చోటులో లాకప్ అయిపోతాం. కిటికీలు వుంటాయి. కానీ దానిలోనుండి ఎప్పుడూ కనపడేది కాదు. “చందమామ దూర్ కీ…. పువ్వే పకాయే గూడ్ కీ” అని వాళ్ళమ్మ హిందీలో చాందినీకి పాటలు నేర్పుతోంది. చాందినీ ముద్దుముద్దుగా పాడుతోంది కూడా.

మేమున్న హజారీబాగ్ సెంట్రల్ జైల్లో టీవి వుంది. అయితే చాలా రాష్ట్రాల్లో జైల్లో కేవలం దూరదర్శన్ మాత్రమే వస్తుంది. ఆదివారంపూట వచ్చే హిందీ పాటల కార్యక్రమం రంగోలిని సాధారణంగా మిస్ అయ్యేవాళ్ళం కాదు. పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముందు వరసలో కూర్చుని కళ్ళు ఆర్పకుండా చూసేస్తుంటారు. ఖైదీల పిల్లలు 5 యేళ్ళ వయసు వచ్చేవరకు తల్లులతో పాటు ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడూ జైల్లో 20-25 మంది పిల్లలు ఉంటూనే వుంటారు. వాళ్ళందరికీ రింగ్ లీడర్ డాలో. చాందినీ వాళ్ళమ్మ, డాలో వాళ్ళమ్మ స్నేహితులు. కాబట్టి డాలో ఎప్పుడూ చాందినీ ని ఎత్తుకొని తిరుగుతూ వుండేది. చాందినీని ఎత్తుకోవడానికీ అందరూ పోటీలు పడేవారు. ఆమె ఎప్పుడు ఎవర్ని కరుణిస్తే వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. అలా డాలో చాందినీని వొళ్ళో కూర్చుపెట్టుకొని టీవి చూస్తుండగా ఒక చందమామ పాట వచ్చింది. చూడు చూడమని పిల్లలందరూ పోటీలుపడి మరీ చందమామని చూపించారు. అప్పటికి తనకి వివిధ వస్తువులు చూపించి మాటలు నేర్పిస్తావున్నారు. ఫేనేది? బల్బేది? పిల్లేది? అంటే కిలకిలా నవ్వుతూ చూపించేది. చందమామేది? అంటే టీవి కేసి చూపేది. అందరూ నవ్వేవాళ్ళం. వాళ్ళమ్మ కూడా నవ్వేది. కానీ అప్పుడప్పుడు నవ్వుతో పాటు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేవి.

చాందినీకి రెండేళ్ల వయసు వచ్చేసింది. అనేకసార్లు చందమామని టీవీ లో చూడగానే గుర్తు పట్టి చప్పట్లు కొట్టి నవ్వి మరీ చెప్తోంది. కానీ ఆకాశంలో మాత్రం చూడనే లేదు. అలాంటి సందర్భంలో హోలీ పండగ వచ్చింది. జార్ఖండ్ లో హోలీ ని చాలా ధూంధాం గా జరుపుకొంటారు. జైల్లో కూడా! ఆ సందర్భంగా ఖైదీలకు ఒక రోజు మీట్ కూడా ఇస్తారు. ఆసారి ఏదో కారణం వల్ల కూర వండడం ఆలస్యం అయ్యింది. పైగా ప్రతి ఒక్కరికీ 100గ్రాముల చొప్పున తూచి ఇస్తారు. కాబట్టి లాకప్ చేసి ఇవ్వడం కుదరదు కనక మహిళా వార్డు లోని మూడు బ్యారక్ లు తెరిచే వున్నాయి. వార్డు ఎప్పుడూ మూసే వుంటుంది. లోపల బ్యారక్లు మాత్రమే తెరిచి వుంచుతారు. ఆరోజు ఎప్పటిలా 5.30 కి కాకుండా 7 గంటల వరకూ పంపకాలు పూర్తికాక కిందా మీదా అవుతున్నారు. అలాంటి సమయంలో అంత అరుదుగా దొరికిన అవకాశంలో కూర కోసం లైన్లో నిలబడడం ఏంటని! చాలా మందిమి ఖుషీగా వెన్నెల్లో చేతులు పట్టుకొని ఒకటే ఎగిరాం. అదిగో అప్పుడు చూసింది చాందినీ. అదీ ‘పున్నమి’ చంద్రుడిని. ఆ రోజు సాయంత్రం “స్వేచ్ఛ” గా ఆవరణలో తిరుగుతుంటే లేత నారింజరంగులోంచి మెల్లగా లేత పసుపులోకి….మారుతూ పైకి ఎగుస్తూ ఆకాశంలోకి ఎగబాకుతున్న చందమామని అందరికన్నా ముందు గుర్తుపట్టింది చాందినీనే! అప్పటినుండి ఎప్పుడడిగినా ఆకాశం వైపు చూపించి విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి, చిట్టి చిట్టి చేతులు అందంగా తిప్పుతూ “గాయెబ్” (మాయమయిపోయాడు) అనేది. అదొక్కటే సారి తను చందమామని చూడడం. కానీ ఆ తరవాత ఎప్పుడూ మళ్ళీ తను చందమామ ఏదని అడిగితే టీవీ కేసి చూపలేదు.

చాలా తొందరగా చాందినీకి మాటలు వచ్చాయి. ఏదంటే అది తిప్పి అనేసేది. తనని ఒకటే వాగించి మేము నవ్వినవ్వి వినోదించేవాళ్ళం. ఒక రోజు నేను కమానీ ఘర్ లో కూర్చుని కాగితాలు వెలిగించి ఆ మంట మీద మేగీ చేస్తున్నా. చాందినీ నేను కమాని ఘర్లోకి వెళ్ళడం చూసి నా వెనకాలే వచ్చింది. మూడు రాళ్ళ పొయ్యి వెలిగించగానే పరిగెత్తి గిన్నె తెచ్చుకొంది. “దేనా”…(ఇవ్వా?)అంటూ ముద్దుగా అడుగుతుంటే ఏడిపించబుద్దయ్యి…”నేను ఇవ్వను ఫో!” అన్నాను.

అప్పుడు చాందినీ… “ఉఠాకే ఫేక్ దెంగే తో చందమామా కె పాస్ చల్ జాయెగీ” (ఎత్తి విసిరేశానంటేనా చందమామ దగ్గరికెళ్లి పడతావ్!) అంది.

ఇంత అందంగా ఇప్పటివరకూ నన్నెవ్వరూ తిట్టలేదు. చందమామ అలా అంత బుజ్జి బుజ్జి మనసులని కూడా ఎలా దోచేస్తాడో అని నివ్వెరపోతూ చాందినీని ముద్దుల్లో ముంచెత్తాను.

పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో మౌనంగా కథ విన్న అందరి మనసుల్లోనూ ఇప్పుడు వెన్నెల స్థానంలో “చాందినీ”

నిండిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు కదా.                                                                       ***

 

-బి.అనూరాధ

కథా చిత్రం: మహీ పల్లవ్