రాజారాం గారి ఏకలవ్య శిష్యుడ్ని: డా. కేశవరెడ్డి

naanna2

( ఏప్రిల్ 1, మధురాంతకం రాజారాం గారి వర్థంతి సందర్భంగా )

“మునెమ్మ” నవలను చతుర మాస పత్రిక (అక్టోబర్ 2007)లో ప్రచురించినప్పుడు స్వపరిచయం రాస్తూ “మధురాంతకం రాజారాంగారి వద్ద ఏకలవ్య శిష్యరికం చేసి సాహిత్య ప్రస్థానం చేశాను”, అని పేర్కొన్నాను. నేను తెలుగు సాహిత్యంలో ఎంతో కొంత నిలదొక్కుకోగలిగినానంటే దానికి రాజారాంగారే కారణం. నేను మొట్టమొదట చూసిన, మాట్లాడిన రచయిత రాజారాంగారే. మొట్టమొదట చదివిన పాఠ్యేతర పుస్తకం రాజారాంగారి కథల పుస్తకాలే. వారిది మా పొరుగు గ్రామము కావడమే అందుకు కారణం.

రాజారాంగారిది, మా అమ్మగారు పుట్టిన ఊరు ఒకటే. అది చానా చిన్న పల్లెటూరు. నా చిన్నతనంలో మా అమ్మగారితో పాటు చాలా సార్లు ఆ ఊరికి వెళ్ళుతుండేవాడిని. మావాళ్లు చెప్పేవాళ్లు, “అద్దో ఆయనే రాజారాం అయ్యవారు. ఆయన కథలు రాస్తాడు,” అని. ఆయన ఆడ్డపంచ కట్టుకొని భుజంపైన కండువా వేసుకొని వీధి వెంబడి నడిచి వెళుతూ ఉంటే నేను పిట్టగోడమీద కూర్చొని చూస్తుండేవాడిని. అలా కొంతకాలం అయ్యాక, నాకొక ఐడియా వచ్చింది. ఇలా ఒక మారుమూల పల్లెటూల్లో పుట్టి పెరిగిన ఒక మనిషి కథలు రాయగా అదే నేపథ్యం కలిగిన నేను రాయలేనా? అని ఆలోచించాను.

ఇంతకీ ఆయన రచనలు ఎలా ఉంటాయి? వెంటనే వారి కథా సంపుటాలు రెండింటిని సంపాదించాను. తాను వెలిగించిన దీపాలు, కమ్మతెమ్మర అనే రెండు సంపుటాలను సంపాదించి చదివాను. అవే నేను మొట్టమొడట చదివిన పాఠ్యేతర పుస్తకాలు. ఒక్కొక్క కథను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చదివీ చదివీ వాటిలో ప్రతి వాఖ్యమూ కంఠతా వచ్చేసింది. ఆ కథల ద్వారా ఎంత ప్రభావితుడనయ్యానంటే నా తొలి రచనలలో రాజారాంగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అవే పదబంధాలు, అవే వాక్యనిర్మాణం. అలా కొన్ని కథలు రాసాను. ఆ తర్వాత నవలలు వ్రాయడం ప్రారంభించాను.

చదువుల నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, పాండిచ్చేరిలో గాని, నిజామాబాద్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్లినా రాజారాంగారిని కలవకుండా తిరిగి వచ్చేవాడిని కాదు. కల్సినప్పుడల్లా ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం, కాని సాహిత్య మర్మాలను గురించి నేను ఎప్పుడూ అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆయన నాకొక గొప్ప ప్రేరణ ఇచ్చారు. సాధకుడిని నేనే.

ఆనాడు ఏకలవ్యుడు చేసింది ఇదే. ఏకలవ్యుడు గొప్ప విలుకాడు. కాని ద్రోణాచార్యుడు అడివికి వెళ్ళి అతనికి విలువిద్య నేర్పలేదు. అతనొక ప్రేరణ ఇచ్చాడు. అంతే సాధకుడు ఏకలవ్యుడే. బమ్మెర పోతన “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట,” అన్నాడు. అతడు తన భక్తి పారవశ్యంలో అలా అని ఉండవచ్చు కాని.. రామభద్రుడు దిగివచ్చి ఒంటిమెట్ట గ్రామానికి వెళ్ళి పోతనకు వ్యాకరణము, ఛందస్సు నేర్పలేదు. అతడొక ప్రేరణ ఇచ్చాడు. సాధకుడు పోతనామాత్యుడే. సాహిత్యం అత్యంత బౌద్ధికమైన ప్రక్రియ. ఇదొక ముక్తి మార్గము. దీనిని ఎవరూ ఎవరికీ నేర్పించలేదు. ఎవరికి వారు సాధన చేసి నేర్చుకోవలసిందే. అయితే ప్రతి రచయితకు ఏదో ఒక దశలో ఒక వ్యక్తి ప్రేరణగా నిలుస్తాడు. అలా నాకు ప్రేరణ ఇచ్చిన మధురాంతకం రాజారాంగారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.