సంకలనాలే ప్రమాణం కాదు : మధురాంతకం నరేంద్ర

 

1) 2016 లో వచ్చిన కథలు:-

పన్నెండేళ్ళపాటూ వార్షిక కథల్ని చదివిన అనుభవంతో చాలాకాలంగా సీరియస్‌గా చదువుతున్న పత్రికలు కొన్నే! మిగిలిన పత్రికలని చదవకపోయినా మంచి కథల్ని చదవకుండాపోయే ప్రమాదముండదని అనుభవంద్వారా నేర్చుకున్న పాఠం.

చదువుతున్న పత్రికలు:-

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం

పాలపిట్ట

చినుకు

యివిగాకుండా గతంలో మంచి కథల్ని జారిపోకుండా జాగ్రత్తపడటం కోసం మరికొన్ని పత్రికల్ని కూడ చదివేవాణ్ణి. యిప్పుడా అవసరం లేదు. “సాక్షి” ఆదివారం అనుబంధాల్లో కథలకిచ్చే ప్రాముఖ్యత బాగా తగ్గిపోవడంతో దాన్నీ చూడాల్సిన అవసరం తప్పిపోయింది. పైగా వాళ్ళు గొప్ప తెలుగు కథల్ని సంక్షిప్తీకరించి ప్రచురించే నేరాన్ని గూడా చేశారు. యిప్పుడు మామూలు పాఠకుడిగా చదివే అవకాశం దొరికింది. అందువల్ల గుర్తున్న కథల్ని గురించి మాత్రమే చెప్పగలను. వస్తుపరంగా చూసినప్పుడు పర్వాలేదనే చెప్పొచ్చు. కానీ శిల్పపరంగా అంటే యేం చెప్పాలి? “వస్తువే శిల్పాన్ని ఎన్నుకుంటుంది” అనేది పాతబడిన మాటే అయినా గుర్తుంచుకోవల్సింది గూడా! అయితే జీవితపు సంక్లిష్టతల్ని వివరించే వస్తువుల్ని యెన్నుకోవడానికీ, వాటిని అవసరమైన శిల్పరీతుల్లో ఆవిష్కరించడానికీ అనుకూలమైన పరిస్థితులు లేవు.

2015లో O’Henry Prize Storiesలో దాదాపు 80పేజీల కథ వచ్చింది. తెలుగులో యిప్పుడు 10పేజీల కథను పత్రిక లేనేలేదు (పాలపిట్ట, చినుకు మినహా). యీ ప్రమాదం నుంచీ రచయితల్ని కాపాడింది మాత్రం వెబ్ పత్రికలే! రెండు మూడు సంవత్సరాలుగా వెబ్ పత్రికలు (సారంగ, వాకిలి, విహంగ వంటివి) రావడంతో పరిస్థితి మెరుగుపడింది. అయితే యీ పత్రికలు మామూలు పత్రికల్లాగా సమయానికి తప్పకుండా వస్తున్నాయో లేదో తెలియదు. యీ పత్రికలన్నింటికి కలిపి వొక Web Index లాంటిది తయారై, అది facebookలాంటి చోట ప్రకటించబడుతూ వుంటే నాలాంటి పాఠకుడికి సౌలభ్యంగా వుంటుంది.

2) 2016లో నేను విడవకుండా చదివింది, లేక చదవడానికి ప్రయత్నించిందీ “ఆంధ్రప్రదేశ్” పత్రికనే! నాకు గుర్తున్న కథలన్నీ దాన్లోంచే వచ్చాయి. ఫిభ్రవరినెలలో రాణి శివశంకర శర్మ “ప్రొఫెసర్ అంతరంగం” అనే కథ రాశాడు. అలీగరీగా చెప్పదలచుకున్న అంశాన్ని బాగా చెప్పాడు. అయితే Browning ప్రసిద్ద కవిత, డ్రమటిక్ మొనలాగ్ “My Last Duchess” ప్రతిధ్వనులు వినిపించాయి. యేప్రెల్‌లో శ్రీవల్లీ రాధిక రాసిన “నాన్న దగ్గరికి” Mythను సమకాలీనంగా మలిచిన కథ.రచయిత్రికి సంప్రదాయంపైన వున్న ప్రగాడమైన విశ్వాసం, ఆస్తిక ధోరణీ కథ సగానికి చేరేసరికి ముందేం జరుగుతుందో, పాత్రలెవరో తేల్చేశాయి. ఆ suspenseను చివరివరకూ సాగనివ్వలేదామె. రచయిత్రి విశ్వాసాలతో పాఠకుడికి పని లేనప్పుడు కథ తేలిపోతుంది. విశ్వాసం వున్నప్పుడు పాఠకుడికి పరవశం కలుగుతుంది. రెండు విధాలా కథకు దెబ్బే తగులుతుంది.

మన్నం సింధుమాధురి డిసెంబరులో “తూరుపు కొండ” అనే చాలా మంచి కథ రాశారు. ఆవిడదైన శైలి యీ కథకు బాగా నప్పడంతోనూ, నిపుణతతో వాడిన శిల్పంతోనూ యీ కథ చాలా బాగా వచ్చింది. యీ కథలన్నింటినీ ప్రచురించడానికి దాని సంపాదకుడైన “నరేష్ నున్నా”ను అభినందించాలి. మంచి సంపాదకుల కొరత వల్లే మంచి కథలు రావడంలేదని గూడా గుర్తించాలి. పట్టుదలతోనూ, అభిరుచితోనూ కృషి చేస్తే మంచి కథానికల్ని రాయించి, ప్రచురించవచ్చునని ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులు నిరూపించి చూపెట్టారు. అలాగే “సారంగ” పత్రిక గూడా. సారంగలో వచ్చినవన్నీ సీరియస్ కథలే! అయితే కొన్ని మాత్రమే గుర్తున్నాయి.

యివిగాకుండా యీ యేడాదిలో చదివిన కథల్లో నాకు గుర్తున్న కథ, ఖదీర్ బాబు రాసిన “తేగలు”. మెట్రోకథల చట్రంలోకి యీ కథను దూర్చకపోవడంతోనే యిది మంచి కథయ్యింది. అయితే కథను చెబుతున్న వ్యక్తి భార్యపాత్ర చిత్రణలో కొంత వైరుధ్యం కనపడింది.

కథాసారంగలో వచ్చిన సింధుమాధురి గారి కథ “డేవిడ్” పెద్ద Romantic artificial కథగా తయారయ్యింది.

యిటీవలికాలంలో యువ రచయితలూ, రచయిత్రులూ ధైర్యంగా స్త్రీపురుష సంబంధాలను చిత్రిస్తున్నారుగానీ, యిందులో అనవసరపు అనౌచిత్యపు ధోరణులుండడం మంచి ధోరణి గాదు. సత్యం చెప్పడానికీ, extremities చెప్పడానికీ మధ్యనున్న తేడాను గుర్తించాలి.

బూతులు వాడటమే మాండలికమన్న అభిప్రాయమొకటి బలపడింది. నిజజీవితంలో వాడని బూతుల్నిగూడా కథలోకి జొప్పించి, cheap popularityకి పాకులాడడం గూడా జరుగుతోంది. కథకెంత అవసరమో అంత మోతాదులోనే యేదైనా వాడచ్చు. కానీ ఆ మోతాదు శృతిమించడం సంస్కారం గాదు. సాహిత్యం మానవుడి సంస్కారాన్ని పెంచేదిగానే వుండాలి.

3) యీ ప్రశ్నకు జవాబివ్వతగ్గంతగా నేను కథలన్నింటినీ చదవలేదు.

4) వొక ప్రక్రియగా తెలుగు కథ అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకుందా లేదా తెలుసుకోవాలంటే సమకాలీన విదేశీ సాహిత్యాన్ని గూడా చదవాలి. అందుబాటులో వున్న విదేశీకథల సంకలనాలు కొన్నే! వాటితో పోల్చి చూసినప్పుడు మనకథకు యెదగడానికి వీలయిన పరిస్థితులు లేవు.

యిన్ని మార్పులు వచ్చినా తమిళంలోనూ, కన్నడంలోనూ, మళయాళంలోనూ, ఒడిస్సాలోనూ సాహిత్య పత్రికలు కొన్ని వుండనే వున్నాయి. పాఠకులూ వున్నారు. కానీ తెలుగులో పత్రికలూ లేవు. మంచి పాథకుల సంఖ్యా క్రమంగా తగ్గిపోతోంది.

మిగిలిన భారతీయ భాషలతో పోలిస్తే కమర్షియల్ సినిమా వ్యాపారం పెచ్చుపెరిగి పోవడమూ, సాహిత్యం పట్ల అనురక్తి తగ్గడమూ గమనించాల్సిన విషయం.

5) —-

6/7) కథావార్షికను 12సంవత్సరాల పాటూ ప్రచురించిన తర్వాత ఆపేశాను. యిందుకున్న కారణాల్ని గురించి సావధానంగా చెప్పాలి. దానిక్కాస్తా సమయం కావాలి. తరువాతెప్పుడైనా…

2016లో వచ్చిన కథ, ప్రాతినిథ్య సంకలనాలు సగం సగం చదివాను. కొన్ని కథలు బావున్నాయి. కొన్ని నచ్చలేదు.

యిలాంటి సంకలనాలు అన్ని పత్రికలూ చదవలేని పాఠకులకు బాగా వుపయోగపడతాయి. అయితే యీ సంకలనాలలోకి రాకుండాపోయిన మంచి కథల గురించే బాధంతా! యీ సంకలనాల ఆధారంగా అటువంటి మంచి కథల గురించి శోధన, చర్చ జరగడమే లేదు. అదొక గొప్ప విషాదం. మంచి కథలు వేయడం వల్ల వార్షిక సంకలనాలకు గౌరవం చేకూరుతుంది గానీ, వాటిలో వచ్చిన అన్ని కథలూ మంచివి కాలేవు. యిదంతా పెద్ద సాపేక్షికమైన వ్యవహారం.

వార్షిక కథాసంకలనాలు కథానికా ప్రక్రియ పెరుగుదలకు దోహదం చేయడంలో అనుమానమే గానీ, పాఠకుల దృష్ట్యా మాత్రం మంచే చేస్తున్నాయి, కొంతవరకూ… యీ ప్రయాణం సాగాలి యిలాగే… పరిపూర్ణత అన్నది సాపేక్షికమూ, అసాధ్యమూ అయినా దానికోసం చేసే కృషే సాహిత్యపు భూమిక అని గుర్తుంచుకోవాలి.

*

మధురాంతకం నరేంద్ర

విమర్శలను సహించలేని రచయితలు : పద్మవల్లి

నేను సాధారణంగా కథలు సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, ఈనాడు ఆన్లైన్ పత్రికలలోనూ, కొన్ని బ్లాగుల్లో వచ్చినవీ  చదువుతాను. అప్పుడప్పుడూ ఎవరైనా షేర్ చేసినపుడు నవ్య, ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైన ఆన్లైన్ పత్రికల్లోనూ చదువుతాను. నాకు ప్రింట్ పత్రికలు చదివే అవకాశం లేదు. అపరాధ పరిశోధనలు, హాస్యం, సైన్స్ ఫిక్షన్ నేను దూరంగా ఉండే అంశాలు కాబట్టి ఆ కథలు కూడా నేను చదివిన వాటిలో ఉండవు. నా ఈ అభిప్రాయాలు నేను చదివిన కొన్ని కథల మీద ఆధారపడి మాత్రమే తప్ప సంవత్సరం మొత్తంలో వచ్చిన కథలన్నిటి మీదా ఎంత మాత్రమూ కాదు. అలానే రచయితల మీద నా అభిప్రాయాలు కూడా అందరు రచయితలకూ చెందవు. నా అభిప్రాయాలు గత నాలుగైదేళ్ళుగా నేను గమనిస్తున్న వాటి మీద ఆధారపడినవి.

కథ అంటే సమాజానికి సందేశాన్నివ్వాలీ, సమస్యకి పరిష్కారం చూపించితీరాలీ లాంటి భ్రమలేమీ నాకు లేవు.  నేనో సాధారణ పాఠకురాలిని.  మంచి కథ అంటే నా దృష్టిలో, అది ముందు నన్ను పూర్తిగా చదివించగలగాలి. భాషా, శైలీ బావుండాలి. కథ పరిధులు దాటి వ్యాసాలుగా మారకూడదు. ఇవీ నాకు ఓ కథ నచ్చడానికి ఉండాల్సిన కనీస లక్షణాలు. ముఖ్యంగా చదివిన తరువాత అది చదవడానికి పెట్టిన నా సమయం వృధా అనిపించకూడదు.

1.       2016లో వచ్చిన కథల పై వస్తు పరంగాశిల్ప పరం గా మీ అభిప్రాయాలు

కథలు చాలానే ఉన్నా, చదివించగలివినవి గుప్పెడు కూడా లేవని చెప్పొచ్చు. మంచి కథ నాలుగు కాలాలు నిలుస్తుంది అనేవారు, అయితే వీటిలో చదివిన తరువాత నాలుగు రోజులు కూడా గుర్తుండే కథ ఏదీ లేదనే చెపుతాను. చాలామంది కొత్త రచయితలూ కనిపించారు. ఇప్పుడొస్తున్న కథల్లో ఏదో చెప్పాలన్న తాపత్రయం తప్ప, ఎలా చెప్పొచ్చో తెల్సినదనం తక్కువ.  చాలా కథలు వస్తుపరిధి దాటి విస్తరించి, వ్యాసాల్లా తయారయి పూర్తిగా చదివించకుండానే మిగిలిపోయాయి. కొన్నిటి  శైలి చిరాకు తెప్పిస్తే, కొన్నిటి కథాంశాలే విసుగెత్తించాయి. 

ముఖ్యంగా నేను గమనించిందీ, నన్ను బాగా విసిగించి చాలా కథలను పూర్తిగా చదవకుండా చేసినదీ భాష.  కథకు అవసరమున్నా లేకున్నా మాండలికం ఉపయోగించడం అనేది ఒక ఫాషన్ అయినట్టుంది. మాండలికం వాడటం తప్పు అని నేను అనడం లేదు, కానీ వ్రాస్తున్న దాని మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఒక పాత్ర చేత ఓ యాస మాట్లాడిస్తే, మొత్తం కథంతా అదే కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా హటాత్తుగా కొన్ని వాక్యాలు మామూలు భాషలో యాస లేకుండా మాట్లాడేస్తాయి. రచయిత నేరేట్ చేసే భాగాలలో కూడా అంతే. కొంతసేపు యాస, కొంత సేపు మామూలు భాష. చదువుతుంటే అయోమయం, అసహనం కలిగించాయి. కాస్త పేరున్న రచయితల నుండీ క్రొత్త రచయితల వరకూ ఇది సాగింది.  ఈ రకం కథల్లో శ్రద్ధగా వ్రాసినవి నాకు తెలిసి రెండు. ఒకటి జూపాక సుభద్ర ‘కంపనవడ్డ కాళ్ళు’, సాయి యోగి వ్రాసిన ‘ఖుష్బూ’. (ఇది ఈయన మొదటి కథ అని చెప్పుకున్నట్టు గుర్తు.)

చిరాకు కలిగించిన ఇంకో విషయం, చాలా కథలు ఎడిటింగ్ అంటూ ఒకటి ఉంటుందన్నసంగతి రచయితలు  మర్చిపోయినట్టు ఉండటం. వాక్యాల్లో తప్పులు, అర్ధం పొసగని వాక్యాలు. కనీసం ఓ రెండు సార్లయినా శ్రద్ధగా తన కథని చదువుకుంటే తమకే తెలిసే తప్పులు ఎన్నో. ఇలాంటివి కథను పూర్తిగా చదివించడంలో విఫలమవుతాయి.

మొత్తం మీద కథలు పెద్దగా సంతృప్తిని కలిగించలేదు.  మంచి కథలు రాయగలిగిన వారి నుండి కూడా ఈసారి వచ్చిన కథలు నిరాశనే మిగిల్చాయి.

2.      మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-

ఎన్నెలో ఎన్నెలా  – అట్టాడ అప్పలనాయుడు (సారంగ): రోహిత్ మరణం నేపథ్యంలో నేను చదివిన వాటిలో, అతి నాటకీయత లేకుండా, గాడి తప్పకుండా, నన్ను పూర్తిగా చదివించగలిగిన ఒకే ఒక్క కథ.

 బౌండరీ దాటిన బాలు – మధు పెమ్మరాజు (వాకిలి): ప్రతి ఒక్కరి బాల్యంలోనూ ఇలాంటి  సంఘటన కనీసం ఒకటయినా ఉండే ఉంటుంది. నాస్టాల్జిక్ కార్నర్స్ ని టచ్ చేసిన కథ. చక్కటి కథనం.

 ఏం జీవితం – చంద్ర కన్నెగంటి (ఈమాట): ఒక మనిషి జీవితంలోని వర్ణాలను, సరళమైన భాషలో, చక్కని వచనంతో చూపించిన కథ.

 ద్వారబంధం – మైథిలి అబ్బరాజు (ఆంధ్రప్రదేశ్ పత్రిక):  ఫీల్ గుడ్ స్టోరీ అంటాను దీన్ని.  చక్కని వచనం మైథిలి గారి స్వంతం. ఈ కథ చదవగానే నాకెందుకో కళ్యాణ సుందరీ జగన్నాథ్ కథలు గుర్తుకు వచ్చాయి.

 హృదయం ఇక్కడే ఉంది – ఆర్. దమయంతి (ఈమాట): తప్పులు లేకుండా, మంచి శైలిలో, క్లుప్తంగా అవసరమైనంత వరకూ మాత్రమే చెప్పడం తెలిసిన వారిలో దమయంతి గారు ఒకరు.  ఇది ఇంకో ఫీల్ గుడ్ స్టోరీ.  

 డీహ్యూమనైజేషన్ – దేశరాజు (సారంగ): ఇది కూడా అతి తక్కువ నాటకీయతతో, ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద వచ్చిన సున్నితమైన సెటైర్.

 నచ్చిన ఇంకొన్ని కథలు – బ్లాక్ ఇంక్ – సాంత్వన చీమలమర్రి (సారంగ), కొన్ని ముగింపులు – చంద్ర కన్నెగంటి (సారంగ), సుచిత్ర చెప్పిన కథ – కొత్తావకాయ (బ్లాగ్), అద్భుతం – అరిపిరాల సత్యప్రసాద్ (వాకిలి), కంపనవడ్డ కాళ్ళు – జూపాక సుభద్ర (సారంగ), కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు  – ఉణుదుర్తి సుధాకర్ (సారంగ?), గంగమ్మే బెదరిపోయే – ఎండపల్లి భారతి (వాకిలి), సంసారంలో సరిగమలు – తమస్విని (కౌముది), డాక్టర్ చెప్పిన కథలు – చందు శైలజ (కౌముది)

3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు

మధు పెమ్మరాజు, సాంత్వన చీమలమర్రి, ఎండపల్లి భారతి.  సాంత్వన రచనా శైలి బావుంటుంది. భారతి గారు ‘మావూరి ముచ్చట’ శీర్షికన వాకిలిలో వ్రాసిన కథానికలు మంచి మాండలికంతో శ్రద్ధగా వ్రాసినట్టు ఉంటాయి. ఉణుదుర్తి సుధాకర్ గారి రెండు కథల్లో కూడా కథనం బావుంది. ఆయన పేరు వినడం ఇదే మొదటిసారి నాకు.

4.      తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయివ్యక్తిగతంగాసాంఘికంగాఅంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?

సమాజంలో వస్తున్న మార్పులని స్పృశించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే సమస్యకు సహజంగా స్పందించి కాకుండా, మేమూ ఏదో చెప్పాలన్న ఆత్రుతతో వ్రాస్తున్నట్టుగా ఉంటున్నాయి. మధ్యలో వాదాలూ, కులాలు ప్రాముఖ్యం సంపాదించుకుని, అసలు సమస్యను వదిలి ఎక్కడికో పోతాయి. వెరసి చాలావరకు విసుగు కలిగించే వ్యాసాలుగా మిగిలిపోతున్నాయి. నిజానికి ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే భయం వేస్తుంది, ఆ తర్వాత తెచ్చిపెట్టుకున్న ఉద్వేగాలతో వెల్లువలా వచ్చే పసలేని కథలూ, కవితలూ చూడాల్సి వస్తుందని. అసలు కష్టాన్ని మించిన కష్టం ఇది ఒక్కోసారి నాకు.

5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

ఇక్కడా అని చెప్పడం కష్టం. ప్రతీ చోటా నచ్చినవీ ఉంటున్నాయి, నచ్చనివీ ఉంటున్నాయి. అయితే ఎక్కువ నాసిరకపు కథలు ఈనాడులో వస్తున్నాయని మాత్రం అనిపిస్తుంది. 

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

కథా విమర్శా? అంటే ఏమిటీ, ఎక్కడుందీ అని అడగాలని ఉంది. నావరకూ నాకు మంచి కథలు రాకపోవడం కన్నా, మంచి విమర్శ లేకపోవడమే ఎక్కువ అసంతృప్తిగా ఉంటుంది. కథలను కాకుండా రచయితలను విమర్శించడం/పొగడటం రానూ రానూ ఎక్కువయి, నిజమైన విమర్శ అనేది మాయం అయిపోయింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఒకటో రెండో మంచి కథలు వ్రాయగానే, ఇక వాళ్ళు ఏం వ్రాసినా (అది ఎంత నాసిరకంగా ఉన్నప్పటికీ) అద్భుతంగా ఉందనీ, వాళ్లు తప్ప ఇంకొకరు అలా వ్రాయలేరనీ ఆకాశానికి ఎత్తెయ్యడం.  ఇక సోషల్ నెట్వర్క్ లో గ్రూపులు. గ్రూపులో ఒకరు ఏదైనా వ్రాస్తే, అది ఎలా ఉన్నా సరే మిగిలిన వాళ్ళు భట్రాజులను మించిపోతూ పొగడ్తలు. ఎవరి రాతలైనా నచ్చలేదని ఎవరైనా అన్నారో, అందరూ కలిసి సామూహకంగా అన్నవాళ్ళని టేస్ట్ తెలీని వాళ్ళనీ, అహంకారులనీ ముద్రలు వేసెయ్యడం. సోషల్ మీడియాలో రచయితల ఇన్వాల్వ్మెంట్ పెరిగాక ఈ ధోరణి  ఇంకా ఎక్కువయిపోయింది.

ఇప్పటి రచయితల్లో పొగడ్తలు తప్ప, విమర్శలు సమన్వయంతో తీసుకునే వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. పొగిడినంత సేపూ సంతోషం. ఎప్పుడన్నా ఎవరైనా ఒకటి నచ్చలేదు అంటే, అక్కడి నుండీ రాజకీయాలు మొదలు. తన కథలోని లోపాలను సహేతుకంగా చూపినందుకు ఒకరిని,  ‘వాచాలత్వం, ప్రేలుడూ, అహంకారం’ అంటూ రభస చేసిన వారొకరు. విశ్లేషణలో తన కథను తను అనుకున్నట్టుగా పొగిడి ఆకాశానికి ఎత్తకుండా విమర్శించినందుకు, వేరొకరు ఫేస్బుక్ లో నడిపిన నాటకాలూ, అస్మదీయుల ఓదార్పులూ. ఇలాంటివి చూస్తూ ఎవరైనా కూడా సరైన విమర్శ చెయ్యాలన్నా వెనుకాడతారు. కొద్దో గొప్పో రచనలు చేసిన వారి నుండి, చెయ్యి తిరిగిన రచయితలు అనిపించుకున్న వాళ్ళ వరకూ, దాదాపు అందరిలోనూ విమర్శల పట్ల ఇదే అసహనం.

అయితే ఈ సందర్భంలో చెప్పవల్సినది ఒకటి ఉంది. దీనికి భిన్నంగా ఓ రెండేళ్ళ క్రితం, ‘అపర్ణ తోట’ తన కథపై వాకిలిలో ఎంతో ఘాటైన  విమర్శలు వచ్చినా, సంయమనంతో, హుందాగా ప్రవర్తించడం అభినందనీయం.    

చాలాసార్లు కథ మీద చర్చలు పక్కదారి పట్టి, అస్తిత్వాలు, ఇజాలు, పరస్పర దూషణలతో నిండిపోతున్నాయి. కథకు సంబంధించి వాఖ్యానించడానికి కూడా ఇక మరెవరూ అక్కడ అడుగు పెట్టే సాహసం చెయ్యరు. ఇక విమర్శలు చెయ్యడానికి ఎవరు ముందుకొస్తారు?

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

నావరకూ కథల సంకలనాలు అవసరమనే అనిపిస్తుంది.  వాటిల్లో అన్నీ మంచి కథలే ఉంటాయని కాదు. వీటి వల్ల చదవని క్రొత్త కథలు చదివే అవకాశం వస్తుంది. అలానే ఎక్కడెక్కడో చదివిన కథలు మళ్ళీ మళ్ళీ కావల్సినపుడల్లా చదువుకునే వీలుంటుంది. కథాసాహితి సంకలనాల వల్ల నేను ఇంతకు ముందు చదవలేకపోయిన ఎన్నో మంచి కథలు చదవగలిగాను. మళ్ళీ మళ్ళీ చదువుకోగలుగుతున్నాను. అలాగే రచయితల కథల సంకలనాలు కూడా అవసరమనే అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా కథ నచ్చినపుడు ఆ రచయితవి మిగిలిన కథలు కూడా చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సంకలనాలే అక్కరకు వస్తాయి.

8.      మీరు చదువుతున్న ఇతర భాషల కథలకుతెలుగు కథలకు తేడా కనిపిస్తోందాఅయితే అది ఎలాంటి తేడా?

నేను సాధారణంగా ఇంగ్లీష్, అదీ కూడా ఎక్కువగా నవలలే చదువుతాను. నవలకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది కథ కన్నా.  కాబట్టి వాటితో తెలుగు కథలను పోల్చలేను.  ఇతర భాషల కథల అనువాదాలు శారద గారు, కొల్లూరి సోమశంకర్ గారు, ఇంకొందరు చేసినవీ కొన్ని చదివాను, అయితే వాటి మూల కథలు ఎప్పుడో వ్రాసినవి కాబట్టి, వాటితో పోల్చడం కూడా సరైనది కాదు అనుకుంటున్నాను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, అవి ఎప్పటివైనా సరే వాటిలో క్లుప్తత, హద్దులు దాటని నాటకీయత, వస్తు వైవిధ్యం ఉన్నాయి. నీతిసూత్రాలు, ఉపన్యాసాలు దాదాపు లేవనే చెప్పాలి. 

*

పద్మవల్లి

వాస్తవ చిత్రణతో వస్తున్న కథలు : విజయలక్ష్మి పండిట్

1.2016 లొ వచ్చిన కథల పై వస్తుపరంగా శిల్ప పరంగా మీ అభిప్రాయం ?

పత్రికల సంఖ్య ,కథకుల సంఖ్య పెరిగి ఏటేటా కథలు కూడా అదే వేగంగా పెరిగిపొతున్న కాలంలో  అన్నీ కథలు చదవడం ఏ పాఠకుడికి వీలుకాదు.  నేను ఈనాడు ,సాక్షి ,వార్త ,అంద్రజ్యొతి ఆదివార అనుబందాలు ,చినుకు ,సాహితి స్రవంతి ,స్వాతి  చదువుతుంటాను. అప్పుడప్పుడు ప్రచురించే కథా సంపుటాలు కొని చదువుతాను .ఏ కథకయినా కథా వస్తువు ప్రాముఖ్యత వహిస్తుంది .ఎందుకంటే పాఠకులు సమకాలీన సమస్యల చిత్రణ ,పరిష్కారాల కొరకు కూడా కథనుఎన్నుకుంటారు .ఈ సంవత్సరంలొ కథా వస్తువులు – పిల్లల పెంపకం ,అస్తిత్వాల సంఘర్షణ ముఖ్యంగా ఆడపిల్లల ల్లో పెరుగుతున్న తమ జీవితాన్ని నిర్ణయించుకునే  స్వేచ్ఛా కాంక్ష ,సహజీవనం,ఆత్మహత్యలు ,gay& lesbianism, అవయవదానం,వస్తువులుగా గుర్తున్నాయి. ,సైన్స్‌ ఫిక్షన్‌ , హారర్‌ కథలు  కనిపించడం లెదు .అంటే… కల్పన కంటే వాస్తవజీవన ,మానసిక సంఘర్షణల వస్తువుల పైననే ఎక్కువ కథలు వస్తున్నాయి .ఎక్కువ కథలది సాధారణ శైలే .కట్టి పడేసే శైలి కొందరి కథకులదే సొంతమయినా, కథనం లో  మార్పు లు కనిపిస్తున్నాయి .

 2.మీకు నచ్చిన లేదా నచ్చని కథ గురించి కొంచం వివరంగా …

ఈ మధ్య వాకిలి అంతర్జాల పత్రికలొ “రహస్యలిపి ” అనే భైరవ్‌ రాసిన కథ చదివాను .

కథా వస్తువు ..ఒక ఆగంతకుని చేతిలొ కనిపించి మాయమైన “రహస్య లిపి “అనే పుస్తకం  కొసం వేట .తుదకు ఆ పుస్తకం ఒక university గ్రంధాలయంలొ ఒక అమ్మయి చేతిలొ చూస్తాడు .తానే రొజుకు ఆ పుస్తకం  నుండి వంద పదాలు చదివి వినిపిస్తానని , మధ్యలో  ఏ ప్రశ్న వెసినా రోజు వచ్చి చదవడం  మానేస్తా  నంటుంది ఆ అమ్మయి .ఆ ఒప్పందంతో వారి మధ్య కథ చదవడం ముగుస్తుంది .ఇంతకీ ఆ రహస్య లిపి ఎమిటొ అనే ఉత్కంట  .కథ ముగించినా ఆ రహస్యలిపి ఏమిటొ తెలియదు పాఠకునికి .కాని ….కథ  శీర్షిక ,కథా వస్తువు, కథ నడిపిన తీరు పట్టి చదివించెదిగా ఉంది .  రైలు station లో కనిపించి మాయమైన ఆ ముసలాయన ఎవరు ?ఆ అమ్మాయి ఆ ఆంక్షలు ఎందుకు పెట్టింది ? సందేహాలు గానే ఉండిపొతాయి . జానపద కథను తలపిస్తుంది .

 సారంగా లొ ప్రచురించిన తులసి చందు కథ  “రంగు రెక్కల వర్ణ పిశాచం” మొదలు పెట్టిన విధానం వ్యాసాన్ని  తలపించింది . ఆ రోజు నాకు బాగాగుర్తు…. బిగినింగ్ బాగుండేది ఉపొద్గాతం లెకుండా .కథ శీర్షిక కూడా వస్తువుకు సరిపొలేదెమో అనిపించింది   .  కథావస్తువు ,కథనం బాగున్నయి .

3. మీ దృస్టికి వచ్చిన కొత్త కథకులు ?

 ఎవరు ఎంత కొత్తనో తెలియదు .

సామాన్య (ఆరు వంకాయల దొంగ )

ఎం . ఎస్‌ . కె . క్రిష్ణజ్యొతి(నా నేల నాకు ఇడిసిపెట్టు సారు )

c.యమున (రెక్కలొచ్చాయి),

డి. సాయిప్రమొద్‌ (నో టు పొటు ) చందుతులసి ,(రంగు రెక్కల వర్ణ పిశాచం )

భైరవ్‌( రహస్యలిపి)

ఇంకా వెంపల్లి షరీఫ్‌,

రాధ మండువ గుర్తొచ్చారు.

 4. తెలుగు కథా సాహిత్యం లొ 2016 లొ వచ్చిన కథలు ఎలాంటి మార్పులు సూచి స్తున్నాయి? వ్యక్తిగతంగా ,సాంఘికంగా ,అంత ర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలే మైనా స్పృశించాయా ?

కాలానుగుణంగా ప్రపచీకరణ , అంతర్జాలం ,చరవాణి (mobile),facebook , విదేశి వలసల ప్రభావం వస్తువులుగా వచ్చిన కథలునాయి .అవయవ దానం పై కథ. అమెరికాలొ భర్తలు ( Indians)వంట,పిల్లల పెంపకంలొ భాగం పంచుకొనే కథ ఒకటి చదివాను. .కాలం గడుస్తున్న కొద్దీ ,  కథ పేరు మరిచినా కథావస్తువు గుర్తుంటుంది.

 5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు ?

 నిర్దిస్టంగా ఇక్కడ  అని చెప్పలేను కాని …కథా సంపుటాలు,సారంగా,వాకిలి మరికొన్ని అంతర్జాల పత్రికలు.అప్పుడప్పుడు స్వాతి వార పత్రిక ,

సాక్షి న్యూస్ పేపర్  లో ఖదీర్‌ మొహమ్మద్‌ మెట్రొ కథలు

 6. కథా విమర్శ –2016 మీకు తృప్తి నిచ్చిందా ?

కథా  విమర్శలపై నేను ఎక్కువ దృష్టి  పెట్టను .అలాంటి సంకలనం ఉన్నదేమో తెలియదు . ప్రతి కథలొ ఎదొ ఒక కథా సంధర్భం ,నీతి లేదా సమస్య పరిష్కారం , పరిష్కరించని ముగుంపులు …అన్ని వాస్తవ చిత్రాలే కదా ! చదివించే గుణం కొన్ని కథలకే ఉంటుంది .కథలను విమర్సించి నపుడు ఎందుకు, ఏ లోపాలో  ఎత్తిచూపడం కాకుండా ఎలా రాస్తే బాగుండేదొ చెప్పగలగాలి . అంత గొప్ప కథా విమర్శకులు తక్కువే.

 7. కథా సంకలనాలు తెలుగు  కథా ప్రయాణానికి ఏ విధంగా దోహద పడతాయి ?

కథా సంకలనాలు కథా వస్తు శైలి ,నిర్మాణం పధ్ధతి లో  భూత , వర్తమాన ,భవిస్యత్‌ కాలాల లొ మార్పులను , మనిషి జీవితం పై ఆ స్థల ,కాలాలలో ఆకథల ప్రభావం అనే అంశాల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి .  ఏరికూర్చిన కథలు ఒకే గుచ్ఛమ్గా  లభ్యమవడం పాఠకులు (నేను )ఆహ్వానిస్తారు , అన్ని పత్రికలలొ అచ్చయిన కథలను అందరూ చదవలేరు కదా !

  8. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు ,తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా ? అయితే అది  ఎలాంటి తేడ ?

 ఇతర భాషల నుండి తెలుగు లొకి తర్జుమా  అయిన కథలు కొన్ని చదివాను .  ,ఇస్మత్‌ చుగ్తాయి (రుద్దుడా? గుద్దుడా ?) ,సాదత్‌ హసన్‌ మంటొ ( బంగారు ఉంగరం )ఎచ్‌. ఎచ్‌మ  న్రో (కిటికి) , డొరిస్‌ లెస్సింగ్‌ ( చికాకు) ,ఇజక్‌ బషేవిస్‌ సింగర్‌ ( గడ్డం) మొదలయిన పది మంది ఇతర భాషల కథకుల కథల సేకరణ కె. బి . గొపాలం ( అమెరికా కొడుకు మరిన్ని కథలు )అనే శీర్షికతొ వచ్చిన సంకలనం , కె. బి . లక్ష్మి అనువాదకథలు సంకలనం చదివాను.ఇతర భాషల కథకుల సంస్క్రితి ,సంప్రదాయాలు ,యాసలు నుడికారాలు ఆ కథలలొ దర్సనమివ్వడమె కాకుండా ఆ కథకులు ఎన్నుకొనే కథా వస్తువులొ, కథ నిర్మాణంలొ ,కథనంలొ వైవిధ్యం కనిపిస్తుంది .తెలుగు కథా రచయితలు అనువాద కథలు చదవడం వల్ల వారి కథలొ కొత్తదనాన్ని నింపడానికి అవకాశముంది .

డా. విజయలక్ష్మి పండిట్

 

 

 

కథా నిర్మాణంపై శ్రద్ధ తక్కువ – సాయి బ్రహ్మానందం గొర్తి

కొత్త సంవత్సరం వస్తోందంటే గడచిన ఏడాదిలో జరిగిన సంఘటనలూ, నిర్ణయాలూ, సంతోషాలూ, బాధలూ అవలోకనం చేసుకోవడం చాలామందికి ఒక రివాజు. ఒకరకంగా రాబోయే ఏడాదికి అవి పాఠాలు కావచ్చు; మంచైనా, చెడయినా. సాహిత్యం కూడా జీవితంలో భాగం కాబట్టి ఈ రివాజు దానికీ వర్తిస్తుంది.  డిసెంబరు ఆఖరి వారంలో 2015లో వచ్చిన తెలుగు కథల మీద చెప్పమని ఎనిమిది ప్రశ్నలు పంపించారు సారంగ సంపాదకులు.
రాయాలా, వద్దా అన్న మీమాంసలో పడ్డాను. ఏటా  వెయ్యికి పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమవుతాయి.  నేను అన్ని కథలూ చదవలేదు. చదవడం అసాధ్యం కూడా. అలా అని చదవకుండానూ లేను. నా దృష్టికి వచ్చినవన్నీ చదివాను. కనుక ఈ ప్రశ్నలు వారివే అయినా ఇవి నా పరిశీలనలే తప్ప కథా విమర్శ కాదు.
 
నేను చదివినదాంట్లో కొన్ని కథలు గురించి ప్రస్తావిస్తాను. అంతకు ముందు ఏడాదితో (2015) పోలిస్తే గడచిన సంవత్సరంలో(2016) వచ్చిన కథలు వస్తుపరంగా, నాణ్యత పరంగా చాలా తక్కువగా వున్నాయి. నాణ్యత అంటే కథా వస్తువు కొత్తదై వుండాలి. నిర్మాణమూ, కథనమూ బావుండాలి. ముఖ్యంగా వాటిలో వాడిన భాష. సహజంగా ఉండాలి. చివర వరకూ పాఠకుల జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి చదివించాలి. ఇవీ నేనెంచుకున్న కొలమానాలు. 
 
1) 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు
 
ఇక్కడొక విషయం చెప్పాలి. చాలా కథలు వస్తువు చుట్టూతానే తిరుగుతున్నాయి. కథనం, భాష, నేపథ్యం వంటి విషయాలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంతో ఇబ్బంది పెడుతున్న అంశం ఒకటుంది. అది – కథల్లో వాడే భాష. అసంపూర్తి వాక్యాలూ, అసంబద్ధ ప్రయోగాలూ చికాకు తెప్పిస్తున్నాయి. 
 
2. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-
 
బావున్న కథలు:
 
బౌండరీ దాటిన బాలు (వాకిలి) – మధు పెమ్మరాజు
భేతాళుడితో శైలజ (ఆంధ్ర జ్యోతి) – పి.వి.సునీల్ కుమార్
రాక్షస గీతం (సారంగ) – అనిల్ రాయల్
వలపల గిలక (కొత్తావకాయ ఘాటుగా బ్లాగు) – రచయిత్రి
ఆమ్మ (ఆంధ్రజ్యోతి) – కె.వి.గిరిధర రావు
ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి – (ఆంధ్రజ్యోతి) – నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ
కస్తూరి పూలు (ఆంధ్ర జ్యోతి) – వెంకట్ సిద్ధారెడ్డి
ఒరాంగుటాన్ (వాకిలి) – మెహర్ 
సెల్ఫీ – మెట్రో కథలు – (సాక్షి) – ఖదీర్‌బాబు
అతనో అద్భుతం – (స్వాతి) – వంశీ
దుర్గారావు -(స్వాతి) – వంశీ 
రిసరక్షన్ – (సాక్షి) – వెంకట్ సిద్ధారెడ్డి (వస్తువు బర్నింగ్ ఇష్యూ అయినా కట్టిపడేసే కథనం ఉంది.)
 
 
ఎత్తుగడ బావుండి నిరాశ పరిచిన కథలు:
 
ఒక తలుపు వెనుక – అంధ్రజ్యోతి – అఫ్సర్
అశోకం – ఆంధ్రజ్యోతి – ఓల్గా
కొన్ని ముగింపులు – (సారంగ) – చంద్ర కన్నెగంటి 
 
 
నచ్చిన కొన్ని అనువాద కథలు: 
 
కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్ – (సారంగ) – శాంతసుందరి 
కాపరి భార్య – (ఈమాట) – శారద
మా చిన్న చెల్లెలు – (సారంగ) – ఆరి సీతారామయ్య
(మల్లాది వేంకట కృష్ణ మూర్తి ఒక కథ అనువాదం చేసారు. ఆంధ్రభూమిలో వచ్చింది. పేరు గుర్తుకు రావడం లేదు.)  
 
3. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
 
అపర్ణ తోట, చందు తులసి, మానస ఎండ్లూరి ఈ మధ్యనే కనిపించే రచయితలు. వీళ్ళకి రాయగలిగిన సత్తా ఉంది. 
 
కానీ వేరే అంశాలపైన శ్రద్ధ పెట్టడం వలన చెప్పదల్చుకున్న విషయం, ముఖ్యంగా కథా ప్రక్రియలో, ఇమడడం లేదు. 
 
ఎవరైనా సీనియర్ రచయితలు మార్గదర్శకం చూపిస్తే వీళ్ళు మంచి కథలు రాస్తారన్న ఆశ అయితే ఉంది. 
 
4. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
 
పైన చెప్పినట్లు వస్తువుని దాటి కథ ముందుకెళ్ళడం లేదు. ఆ వస్తువుకి ప్రేరణ కూడా వార్తా కథనాలే. 
ఇవి దాటి సమాజంపైనా, జీవితాలపైనా పరిశీలన అన్నది కనిపించడం లేదు.   
ఇంగ్లీషుకథల్లో – ముఖ్యంగా అమెరికాలో – కథ చెప్పే పద్ధతి చాలా మారింది. వైవిధ్యమైన రీతుల్లో కథలు వస్తున్నాయి. ఉదాహరణకి పెంపుడు కుక్క ఇంట్లో వాళ్ళ కథ చెబుతుంది, తనదైన కోణంలో. అమెరికన్ కథతో తెలుగు కథని పోల్చడం కష్టం. 
 
5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
ఇక్కడా అక్కడా అని లేదు.  ఎక్కడ కథ పడితే అక్కడే.
ఈ పత్రికలోనే మంచి కథలు వస్తాయి అన్న నమ్మకం ఎప్పుడూ లేదు. బ్లాగులో కూడా మంచి కథలు రావచ్చు.
పేరున్న పత్రికల్లో కూడా చెత్త కథలు వచ్చాయి. 
 
6.  కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?
తెలుగులో  కథా విమర్శ దాదాపుగా మృగ్యం. ఎవరైనా చెప్పాలనుకున్నా వినడానికి రచయితలు సిద్ధంగా లేరు. 
కథల బాగోగులు చెప్పే అలవాటు మనకి లేదు. వెబ్ పత్రికలు వచ్చాక కథకుడికీ, పాఠకుడుకీ తేడా పోయింది. 
వెబ్ పత్రికల్లో పాఠకులకంటే రచయితల కామెంట్లే ఎక్కువుగా ఉంటున్నాయి. 
రచయితలకి కామెంట్ల వ్యాధి సోకినట్లుంది. 
 
7.  కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?
రచయితల దృష్టంతా వీటిపైనే. తమ కథకూడా ఈ సంకలనాల్లో రావాలన్న తహతహ అయితే రచయిత్ల్లో బాగా కనిపిస్తోంది. 
అందులోకి ఎక్కడానికే అన్నట్లు కథా వస్తువులు కూడా ఎంచుకుంటున్నారు. కథా సంకలనాల్లో అచ్చైన కథల బాగోగులు 
ఏటా అచ్చేసే వారే చెప్పరు. అందులో వస్తే చాలు తమ కథ గొప్పది అన్న ధోరణికి ఈ సంకలనాలు నాంది పలుకుతున్నాయి. 
 
8.  మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా? 
నేను ఎక్కువగా ఇంగ్లీషు కథలు చదువుతాను. అమెరికన్ కథలకీ, మన కథలకీ చాలా వ్యత్యాసం ఉంది. 
ఉదాహరణకి – కథని ఒక దృశ్యంలా చూపిస్తూ రాస్తారు తప్ప, ఎక్కడా రచయిత పాత్రల్లోకి చొరబడడు. 
అనవసరమైన వర్ణనలూ, కవితాత్మకంగా వాక్యాలు రాయడం వంటివి ఉండవు. 
అలాగే కథల్లో వాడే భాష కూడా ఎంతో సరళంగా ఉంటుంది. భాషా పటాటోపం కనిపించదు.  
కథ చెప్పడానికి ఎన్నుకున్న కాన్వాసు కూడా ఎంతో మారింది. 

కథలు కావవి వ్యాసాలు –ల.లి.త.

2.మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా
లక్షరూపాయల కథ – దగ్గుమాటి పద్మాకర్.  కులం ఇప్పుడు ముసుగులూ మొహమాటాలూ తొలగించుకుని గర్వంగా తనని తాను ప్రదర్శించుకుంటున్నది. కులగర్వాలు ఎక్కడ లేని దర్జాలూ ఒలకబోస్తున్న ఈ రోజుల్లో పాపం ఒక బక్క చిక్కిన అభ్యుదయ రచయిత ధనబలం ఉన్న రెడ్డిగారి కళ్ళలో పడ్డాడు. ఆయనకి  ఈ రచయిత చక్కగా పేరుచివర రెడ్డి అని ప్రదర్శించుకుంటే మనకులంలోనూ ఒక మంచి రచయిత ఉన్నాడని చెప్పుకోవచ్చుగా అని సరదా పుట్టింది. అలా కులంతోక తగిలించుకుంటే లక్షరూపాయలు ఇస్తానంటాడు.  రెడ్డిగారి కుల ధన బలప్రదర్శన ముందు రచయిత అభ్యుదయం రెపరెపలాడి ఆరిపోయింది.
కథ రాయటంలో పద్మాకర్ sharpness గురించి కొత్తగా చెప్పేదేముంది?  ఈ కథని మరో యాభై ఏళ్ల తరువాత మన తరువాతివాళ్ళు assess చేశారనుకోండి.  కులంకొండ ముందు అభ్యుదయం తలవంచుకున్న ఇప్పటి పరిస్థితులు అతిశయోక్తులూ అభూతకల్పనలూ లేకుండా సరిగ్గా అర్థం అవుతాయి. మన కాలాన్ని సరిగ్గా ప్రతిబింబించిన కథ. నిలిచేకథ అని నా ఉద్దేశ్యం.
 సవారీ జడుపు –  చింతకింది శ్రీనివాసరావు.  రాజెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవరో చూడమని శ్రీశ్రీ అంటే, మోసిన బోయీలు సరే, పెట్టెసవారీలో వెన్నువంగి నరాలు కుంగిన రాచపడుచును చూడమంటున్నారు శ్రీనివాసరావు. ఆమె పెట్టె పల్లకీలోకి ఎక్కిందంటే ‘ఎనిమిది గజాల చీరని అగ్గిపెట్టెలో దోపినట్టే’ నట.అన్ని అవయవాలూ బంధించుకుని గంటలతరబడి గాలాడని పల్లకిలో ప్రయాణించే ఒక రాజులమ్మాయి కష్టమిది. విషయం కొత్తది.  ఆ కుటుంబాల్లోని ఆడవాళ్ళకు  తప్ప ఇంకెవరికీ తెలియని కష్టం. శ్రీనివాసరావు వ్యంగ్యం, కథ చెప్పే నేర్పు, రెండూ కలిసి, కథ ఆగకుండా చదివిస్తుంది.
 2016 లో నాకు నచ్చని కథ..
 
బేతాళుడితో శైలజ – పి.వి. సునీల్ కుమార్.
సునీల్ కుమార్ కథలంటే వెంటనే చదవాలని అనిపిస్తుంది. కథ చెప్పటంలో కొత్తదనం, తెలివీ, వ్యంగ్యం, పరిశీలనా ఉండి రెండు మూడు మంచికథలు ఇప్పటికే బాగ్ లో వేసేసుకున్న రచయిత.  ‘బేతాళుడితో శైలజ’ కథ ఎంతో ఆసక్తికరంగా మొదలౌతుంది. శైలజ గోదావరి జిల్లాలోని తన పల్లెటూరు వెళ్తుంది. అక్కడ ఆడవాళ్ళ ప్రైవేట్ జీవితాలమీద మిగతా ఆడవాళ్ళు చేసే కామెంట్స్ ని భరించలేక తన బిజినెస్ మేనేజ్మెంట్  చదువు నేర్పిన తెలివితో ప్రశ్నలు అడిగినవాళ్ళకే తిరిగి దెబ్బకొట్టేలా మాట్లాడుతుంది. అక్కడితో కథ ఆగినా బాగుండును.  వ్యవస్థ మీద పెద్దపెద్ద ప్రశ్నలు వెయ్యకుండా వీళ్ళంతా ఇలా ఏమిటని శైలజ విసుగు. రచయితకీ విసుగే. ఊర్లలో ఉండేవాళ్ళ తెలివినీ హ్యూమర్ నీ మాట చాతుర్యాన్నీ గుర్తించకుండా సిటీల్లో ఉండి ఆలోచించి  తీర్పు చెప్పటం వల్ల ఈ కథ తేలిపోయింది.  నామిని పల్లెటూరి గాసిప్స్, చతుర్లమీద రాసిన చక్కని కథ ‘కుచ్చుంటే కత లేస్తే కత’ గుర్తొచ్చింది. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళలో ఆ చతుర్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళూ రాజకీయాలు బాగానే మాట్లాడగలరు. సునీల్ కుమార్ నుంచి ఈ కథ రావటం నిరాశ కలిగించింది.
 3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
.  Topical issues మీద కథల పేరుతో మామూలు వ్యాసాల్లాంటివి వచ్చేస్తున్నాయి. విషయాలమీద సరైన అవగాహన లేకుండా,  ‘ఏదో చెప్పేయాలి, మరేదో అన్యాయాన్ని ఖండించాలి’ అన్న గొడవే తప్ప, చదివేవాళ్ళ తెలివిని తక్కువ అంచనా వేస్తున్నామన్న స్పృహ లోపిస్తోంది. వీటిమధ్యలో ఎస్. జి. జిజ్ఞాస  రాసిన ‘కలకంఠి కంట కన్నీరేదీ’, ‘దుర్ముఖం’  (రెండూ ఆంధ్రజ్యోతిలోనే) కథలు భిన్నంగా ఉన్నాయి. రెండూ topical issues మీదే.  కథనవిధానం పాతదైనా (కలకంఠి.. లో యముడూ ఆధునిక సావిత్రీ సంవాదం,  ‘దుర్ముఖం’ లో జంతువుల మీటింగ్ లో చర్చలు) sharpness ఉన్న కథలు.
4.  తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
వ్యక్తిగత, సాంఘిక, అంతర్జాతీయ మార్పులను స్పృశించే ప్రయత్నం తెలుగుకథ చేస్తూనే ఉంది. ఇంటర్నెట్ విప్లవం వల్ల ఎవరికి  తెలిసిన సమాచారం వాళ్ళు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివన్నీ కథలేనా అంటే చెప్పలేం. చాలామందికి  కథ రాసి దాన్ని తిరిగి చూసుకునే టైం కూడా ఉన్నట్టు కనిపించటం లేదు. మొత్తంగా తెలుగు కథ పల్చబడుతున్నట్టు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా వస్తున్న మార్పులని చెప్పటానికి ఎక్కువ ప్రయత్నం జరుగుతోంది. వాదాలు నెత్తినవేసుకున్న కథలు మిల్లు చీరల్లా వేగంగా తయారైపోతున్నాయి. కాస్త సమయం పెట్టి చక్కటి కథలను నేయగలిగేవారు కథారంగంలో తగ్గిపోతున్నట్టుగా ఉంది.
5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
 ఆంధ్రజ్యోతి.

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

 కధావిమర్శ ఇప్పుడు తెలుగులో నిల్.

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

కథాసంకలనాలు చాలా అవసరం. కథాసాహితి ప్రచురణ పాతికేళ్ళ తెలుగుకథ చాలా మంచి సంకలనం. అది చదువుతుంటే సమాజంలో వస్తున్న మార్పులేమిటో, వాటిని అనుసరిస్తూ తెలుగుకథ  తొంభైల నుంచీ ఇప్పటివరకూ ఎలాంటి పోకడలు పోతోందో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా సంకలనాలు రావటం చాలా మంచిది. రచయితల కృషిని అంచనా వేసేందుకూ రకరకాల పత్రికల్లో వచ్చే మనం మిస్ అయిన కథలు చదివేందుకూ కథా సంకలనాలు మంచి అవకాశం.
–ల.లి.త.

నాలుగు కాలాలు నిలిచే కథ రాలేదు — అనిల్ ఎస్. రాయల్

  1. 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు?

అభిప్రాయాలు చెప్పేముందో విషయం స్పష్టం చేయాలి. తెలుగులో ఏటేటా వెయ్యికి పైగా కథలు వెలువడతాయని ఓ అంచనా. వాటిలో – 2016లో వచ్చిన కథల్లో – నేనొక వంద చదివి ఉంటానేమో. మిగిలిన వాటిలో మంచివి, గొప్పవి ఉన్నా వాటి ప్రస్తావన నేనిక్కడ తెచ్చే అవకాశం లేదు.

2016లో అమరావతి, ఆత్మహత్య, అసహనం మొదలైన సీజనల్ అంశాల మీద కొన్ని కథలొచ్చాయి. అన్నిట్లోనూ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అస్థిత్వవాదాల కథలూ ఎప్పట్లానే చాలా వచ్చాయి. నాలుక్కాలాలు నిలబడేవి వీటిలోనూ దాదాపు లేవు. నాకిష్టమైన సైన్స్ ఫిక్షన్ విభాగంలో మధు చిత్తర్వుగారు రాసినవి రెండు (వాటిలో ఒకటి తర్జుమా కథ) కనబడ్డాయి. ఇక సస్పెన్స్, హారర్, క్రైమ్, డిటెక్టివ్, హాస్యం మొదలైన విభాగాలు అన్నీ కలిపినా ఐదారు కథలకన్నా లేవు. చరిత్ర నేపధ్యంలో ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ అనే కథొకటి కనబడింది. మొత్తమ్మీద ఈ ఏడాది వస్తుపరంగా పెద్దగా వైవిధ్యం కనిపించలేదు.

ఇక శిల్పం. వస్తువుతో సంబంధం లేకుండా – పూర్తిగా చదివించగలిగే కథలన్నీ శిల్ప పరంగా నాణ్యమైనవే అనుకుంటే, అలాంటివి నాకు వేళ్లమీద లెక్కబెట్టేటన్ని మాత్రమే తగిలాయి. ఏం చెప్పాలనేదాని మీద పెట్టే శ్రద్ధ ఎలా చెప్పాలనేదానిమీద పెట్టకపోయే అలవాటు ఈ ఏడాదీ కొనసాగింది. ‘Well crafted story’ అనగలిగేది – నేను చదివినవాటిలో – ఒకే ఒకటి తగిలింది.

  1. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా –

ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి కథ ‘నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ’ ఈ ఏడాది చదివిన కథల్లో నాకు బాగా నచ్చినది. ఇందాక ‘well crafted story’ అన్నాను కదా. ఇదే అది. షరీఫ్ వేంపల్లి ‘దారి తప్పిన కల’ కూడా నచ్చింది.

ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు’ కొలకలూరి ఇనాక్ ‘తల లేనోడు’ని గుర్తుకు తెచ్చింది. మంచి కథ. ఇదే రచయిత మరో కథ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ తెలిసిన విషయాలే చెప్పినా పూర్తిగా చదివించింది.

ఇంకా – మెహర్ ‘ఒరాంగుటాన్’, మధు పెమ్మరాజు ‘బౌండరీ దాటిన బాలు’, వెంకట్ సిద్దారెడ్డి ‘కస్తూరి నీడలు’, మన్నె ఏలియా ‘శ్రీమంతుడు’ కూడా బాగున్నాయనిపించిన కథలు. జూపాక సుభద్ర ‘కంపనపడ్డ కాళ్లు’ రొటీన్ కథాంశమే అయినా ఫర్వాలేదనిపించింది.

పైవన్నీ నచ్చిన కథలు అనుకుంటే, తక్కినవన్నీ నచ్చలేదన్నట్లు. వాటి గురించి ప్రత్యేకించి ప్రస్తావించటం అనవసరం.

  1. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు?

కొత్తో పాతో తెలీదు కానీ – ఉణుదుర్తి సుధాకర్, ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి మరియు వెంకట్ సిద్ధారెడ్డి నుండి భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు ఆశించవచ్చు. సరైన కథాంశాలు ఎంచుకుంటే సాంత్వన చీమలమర్రి కూడా మంచి కథలు రాయగలుగుతుంది.

  1. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ గలిగాయా?

మీరడిగిన మార్పుల్ని ఏదో ఓ స్థాయిలో స్పృశించే కథలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ ఏడాదీ అంతే. వాటిలో ఎన్ని పాఠకుల్ని స్పృశించగలుగుతున్నాయి అనేది ప్రశ్న. వాటిలో ఎన్ని మరో ఏడాది తర్వాతా గుర్తుంటాయి అనేది ఇంకా పెద్ద ప్రశ్న. సమాధానాలు అంత సంతోషకరంగా లేవు.

నా వరకూ నేను అస్థిత్వవాదాలు, సీజనల్ టాపిక్స్, మొదలైన ‘అజెండా’ కథలే కాకుండా ఇతర విభాగాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో కథలెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను. ఆ మార్పు ఈ ఏడాదీ కనపడలేదు.

  1. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

తెలుగునాట వెలువడే అచ్చు పత్రికలు చదివే అవకాశం నాకు లేదు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్నవే నేను చదవగలిగేది. ఆంధ్రజ్యోతి, సాక్షి, సారంగ – ఇవి మూడూ తరచూ చదువుతాను. వాటిలో వచ్చేవన్నీ మంచి కథలనలేను కానీ , ఉన్నంతలో ఈ పత్రికల్లో కథల స్థాయి మెరుగ్గా ఉంటుందని నా అభిప్రాయం. కినిగె పత్రిక – మూతపడక ముందు – కొన్ని మంచి కథలు ప్రచురించింది. ఇతర పత్రికల్లోనూ అడపాదడపా మంచి కథలొస్తుంటాయి. అవి ఎవరన్నా రికమెండ్ చేసి లంకెలు పంపిస్తే చదువుతుంటాను.

  1. కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

తెలుగులో నిఖార్సైన విమర్శకులు కరువైపోయినట్లుగా ఉంది. కథకులే విమర్శకుల అవతారాలు ఎత్తటంతో పరస్పర ప్రయోజనాలు అడ్డొచ్చి ఎలాంటి కథకైనా పొగడ్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని వదిలేస్తే, విమర్శల పరిస్థితి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుంది. గొప్ప కథలుంటేనే గొప్ప విమర్శలొస్తాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్నట్లే ఈ ఏడాది కూడా – ముఖ్యంగా ‘వాగు స్వాతంత్రం’ ఎక్కువైన వెబ్ పత్రికల్లో – కథల మీద చర్చలకన్నా రచ్చలు ఎక్కువగా జరిగాయి. ఏదైనా నచ్చటం, నచ్చకపోవటం అనేది సబ్జెక్టివ్. కానీ ఓ కథ బాగోలేదనిపిస్తే ఏం బాగోలేదో చెప్పాలి. అది విమర్శ. ఇంకెలా రాస్తే బాగుండేదో కూడా చెబితే అది సద్విమర్శ. వెబ్ కథా చర్చల్లో వ్యాఖ్యాతల మధ్య యుద్ధాలు ఎక్కువగానూ, అసలు సిసలు విమర్శలు అరుదుగానూ కనిపించాయి.

  1. కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

సంకలనాల్లో ఉన్నవన్నీ గొప్ప కథలు కాకపోయినా, మరీ చెత్త కథలయితే ఉండవు. ఏటేటా వేల సంఖ్యలో కథలొస్తున్నప్పుడు అన్నీ చదవటం ఎంతటి వీర కథాభిమాని తరమూ కాదు. ఏడాదిలో వచ్చిన కథలన్నిట్నీ వడకట్టి ఓ పదో పదిహేనో మంచివిగా ఎంచి కూర్చిన సంకలనంలో అన్నీ కాకపోయినా అధికం పాఠకులకి నచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా పాఠకులకి ఈ సంకలనాలు చాలా సమయం ఆదా చేస్తున్నాయి అనుకోవచ్చు. ఓ పత్రికలో అచ్చైన కథ జీవిత కాలం ఒక వారమో నెల రోజులో అనుకుంటే, సంకలనాలు పది కాలాలు పదిలంగా దాచుకునేవి కాబట్టి వాటిలో ఉన్న కథల జీవితం చిరకాలం. అలా – సంకలనాలు పాఠకులకే కాక కథకులకీ మేలు చేస్తున్నాయి.

  1. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

నాకొచ్చిన ఇతర భాష ఆంగ్లం మాత్రమే. ఆ భాషలో- అడపాదడపా చదివే పాత క్లాసిక్ కథలు వదిలేస్తే – వర్తమాన కథలకన్నా సైన్స్, హిస్టరీ అంశాల్లో వచ్చే నాన్ ఫిక్షన్ రచనలు ఎక్కువగా చదువుతాను. కాబట్టి ప్రస్తుతం వస్తోన్న ఆంగ్ల కథల గురించి పెద్దగా తెలీదు. అందుచేత వాటితో తెలుగు కథల్ని పోల్చలేను. అయితే మన కథల్లో వైవిధ్యం తక్కువ అని మాత్రం చెప్పగలను.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ సంగతి చెబుతాను. ఈ మధ్య కథాభిమాని, విమర్శకుడు, సంకలనకర్త ఐన ఒక ప్రముఖునితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా “తెలుగు కథల్లో వైవిధ్యం తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?” అనే ప్రశ్న వచ్చింది. దానికాయన సమాధానం:

“అమెరికన్లవి, ఆంగ్లేయులవి కడుపు నిండిన జీవితాలు. అందువల్ల వాళ్లు సాహిత్యంలో ఆకలిమంటల్నే కాకుండా అన్ని రకాల అంశాలనీ స్పృశించగలిగే వెసులుబాటు ఉంది. మన భారతీయ సమాజం – ముఖ్యంగా తెలుగు సమాజం – ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇక్కడ సమస్యలెక్కువ. కాబట్టి ఎక్కువ కథలు వాటి చుట్టూనే తిరుగుతుంటాయి”.

నాకా సమాధానం సంతృప్తికరంగా అనిపించలేదు. 1945 – 1989 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితుల్లో అంతులేని అణచివేతకి, అశాంతికి నిలయంగా మారిన పోలండ్ దేశం నుండి, మన తెలుగుతో పోలిస్తే సగం మంది మాత్రమే మాట్లాడే పోలిష్ భాషలో, అరవయ్యేళ్ల క్రితమే ప్రపంచ సైన్స్ ఫిక్షన్ సాహిత్యమ్మీద బలమైన ముద్ర వేసిన Stanislaw Lem వంటి మహా రచయిత రాగలిగినప్పుడు – చుట్టూ ఉన్న సమస్యల కారణంగా ఇతర విభాగాలపైకి కథకుల దృష్టి పోవటం లేదు అనేది సహేతుకమైన కారణం అని నేను ఒప్పుకోలేను.

—-అనిల్ రాయల్ , కథకుడు

తెలుగు కథ-2016: మీరేమంటారు?!

 

రో కథా సంవత్సరం ముగిసింది. ఏడాది కి ఒక్కో వార పత్రిక అచ్చు లోనైనా, ఆన్ లో నైనా దాదాపు 50 కు పైగా కథలు ప్రచురిస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వార్త, నవ్య వీక్లీ, స్వాతి వీక్లీ, పాలపిట్ట, చినుకు, ఆంధ్రప్రదేశ్, సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, సుజనరంజని,మధురవాణి ఇంకా మాకు తెలియని, గుర్తు రాని పత్రికలు ( వెబ్ లేదా అచ్చు). ఏడాదికి ఎలా లెక్కేసుకున్నా దాదాపు మూడు వందల యాభైకి   పైగా తెలుగు కథలు ప్రచురితమవుతున్నాయి. ఎంత కథా ప్రియులైనా అన్నీ కథలు చదవటం సాధ్యం కాదు. అన్నీ మంచి కథలే అచ్చయి ఉండాలనుకోవటం అత్యాశే. కథా సంకలనాలు వేసే వారికి ప్రతి ఏడాది అగ్ని పరీక్షే. చాలా సార్లు పేరున్న రచయితల కథలకు వచ్చిన గుర్తింపు కొత్త గా కథలు రాసేవాళ్ళకు రాకపోవచ్చు. ఆ పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగవుతూ వస్తోంది. కథా సంకలనాల్లో కొత్త కథకులకు స్థానం లభిస్తోంది. కథా విమర్శ మీద కాలమ్స్ వస్తున్నాయి. మాకు నచ్చిన కథ , నచ్చని కథ అంటూ వ్యాసాలూ వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగు కథ తీరూ తెన్నూలు అర్థం కావటం లేదు అంత సులభంగా.

2016 లో మీరు చదివిన కథల నుండి (అవి ఎన్ని అయినా సరే) మీకు నచ్చిన కథ ఏమిటి? ఎందుకు నచ్చింది అంటే కొంత ఆలోచనలో పడతారు ఎవరైనా. మాకు అందుబాటు లో ఉన్న కథకులు, విమర్శకులు, పాఠకులను గత సంవత్సరం వచ్చిన కథల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాము.  మా ప్రశ్నలు కానీ, ఈ సమాధానాలు కానీ, అభిప్రాయలు కానీ సంపూర్ణం కాదని మాకు తెలుసు. నచ్చిన కథ ఏమిటి అని అడగటం కొంత ఇబ్బంది కరం చాలా మందికి. పేరు లేకుండా, పేరు చెప్పకుండా కథల మీద అభిప్రాయం చెప్తామన్నారు కొందరు.

ఒక కథ చదివి, దాని మీద ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారు చాలా మంది, కారణాలు ఏమైనా. కొన్ని కథలు, కొందరి కథలు విపరీతమైన చర్చలకు గురవుతుంటే, కొన్ని కథలు అసలు ఎలాంటి సద్విమర్శ కు నోచుకోకుండా అజ్ఞాతం లోకి వెళ్ళిపోతున్నాయి. రచయితలు ముఖ్యంగా తోటి రచయితల కథలను ఒక్క చూపుతో విసిరేస్తున్నారు అన్న ఆరోపణ బలంగా ఉంది. ఒక కథ బాగుంటే, లేదా బాగోలేకపోతే, రచయిత పేరు తోనో, స్నేహంతోనో, శత్రుత్వం తోనో కాకుండా కథ ను కథగా విశ్లేషించటం , లేదా అభిప్రాయాన్ని చెప్పటం అనేదిపూర్తిగా కనుమరుగై పోతోంది. . ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే ‘సారంగ’ అతి మామూలు ప్రశ్నలు కొన్నింటిని  అడుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరైనా రాయొచ్చు.  ఒక ఆరోగ్యకరమైన చర్చ కు “ సారంగ” ఆహ్వానం పలుకుతోంది. మీదే ఆలస్యం!

1.       2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు

2.      మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-

3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-

4.      తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?

5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

8.      మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?