Archives for December 2015

ఇంతకీ క్లుప్తత అంటే ఏమిటి?

 

 

‘కథాయణం’ పరంపరకి కొనసాగింపుగా, అందులో స్పృశించకుండా వదిలేసిన అంశాలతో శీర్షికేదైనా రాస్తే బాగుంటుందన్న సారంగ సంపాదకులు అఫ్సర్ సూచనతో ఈ ‘కథన కుతూహలం’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ పేరు ‘కథాయణం’ కోసం అనుకున్నది; అప్పట్లో తప్పిపోయి ఈ రకంగా దాని కొనసాగింపుకి అమరింది.

‘కథాయణం’ విషయంలో – ఏమేం అంశాలపై ఏ క్రమంలో రాయాలో ముందే అనుకుని ఆ ప్రకారం రాసుకుపోయాను. ఈ సారి దానికి భిన్నంగా, సద్యోజనితంగా రాయాలని అనుకున్నాను. కాబట్టి ఈ ‘కథన కుతూహలం’ కథాయణానికి భిన్నంగా కనిపించొచ్చు. ఒక్కో భాగం ఒక్కోలా అనిపించొచ్చు కూడా. ఎలా కనిపించినా, ఇందులో ప్రధానాంశం మాత్రం కథనానికి సంబంధించిన సాంకేతికాంశాల వివరణ.

గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ కథ పరిచయంలో అది నన్ను ఆకట్టుకున్న కారణాల్లో ఒకటి ‘క్లుప్తత’ అన్నాను. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే –  పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు అనవసరమైన కొవ్వుని కరిగించేసి కథ సొగసు పెంచుతాయి కాబట్టి.

ఇంతకీ క్లుప్తత అంటే ఏమిటి? అది ఏమి కాదో చెప్పటం తేలిక. క్లుప్తత అంటే – కథలో వాక్యాలు ఎడాపెడా తెగ్గోసి పుటల సంఖ్య తగ్గించేయటం మాత్రం కాదు. కథ ఎంత పెద్దగా లేదా చిన్నగా ఉండాలనేది దాని కథాంశం నిర్దేశిస్తుంది. ముప్పై పేజీలకి పైగా సాగే కథలో క్లుప్తత దండిగా ఉండొచ్చు, మూడే పేజీల కథలో అది పూర్తిగా కొరవడనూవచ్చు. కాబట్టి వర్ధమాన కథకులు అర్ధం చేసుకోవలసిన మొట్టమొదటి విషయం: కథ పొడుగుకి, క్లుప్తతకి సంబంధం లేదు. పది పదాల్లో చెప్పగలిగే భావాన్ని పాతిక పదాలకి పెంచకుండా ఉండటం క్లుప్తత. అంతేకానీ, పొడుగు తగ్గించటం కోసం అవసరమైన దాన్ని సైతం కత్తెరేయటం కాదు.

“ఈ ఉత్తరం సుదీర్ఘంగా ఉన్నందుకు మన్నించు. సమయాభావం వల్ల ఇంతకన్నా కుదించలేకపోయాను” అన్నాడట పదిహేడో శతాబ్దపు శాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్. క్లుప్తీకరించటమనేది ఆషామాషీ వ్యవహారం కాదని ఆ వ్యాఖ్య తెలుపుతుంది. “కవితలు రాయలేని వారు కథలు, అవి కూడా రాయలేని వారు నవలలు రాస్తారు” అనే అతిశయభరిత వ్యంగ్యోక్తి కూడా క్లుప్తత సాధించటం ఎంత కష్టమో వివరించేదే. అయితే, అది కష్టం కావచ్చు కానీ అసాధ్యమైతే కాదు.

కథలో క్లుప్తత సాధించాలంటే కథకుడికి మొదటగా కావలసినది చెప్పదలచుకున్నదానిపై స్పష్టత. ఏం చెప్పాలో తెలీనప్పుడు దాన్ని ఎలా చెప్పాలో తెలిసే అవకాశమే లేదు. ఇలాంటప్పుడే పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచుతుంది. ఇక రెండోది, చెబుతున్న విషయమ్మీదనే దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి. ఇది కొరవడితే కథలోకి అనవసరమైన పాత్రలు, వాటిమధ్య సందర్భశుద్ధి లేని సంభాషణలు, వగైరా ప్రవేశిస్తాయి. ఈ రెండిటి తర్వాత ముఖ్యమైనది – తక్కువ పదాల్లో ఎక్కువ భావం పలికించగలగటం. ఇవేమీ బ్రహ్మవిద్యలు కావు. సాధనతో సమకూరే సుగుణాలే. కథాగమనానికి దోహద పడని వర్ణనలకి దూరంగా ఉండటం, పాత్రల సంఖ్య పరిమితం చేయటం, పునరుక్తులు పరిహరించటం, అనవసరమైన పాండితీ ప్రదర్శనకి పాల్పడకుండా నిగ్రహించుకోవటం … ఇలా చిన్న చిన్న చిట్కాలతోనే కథలో గొప్ప క్లుప్తత సాధించొచ్చు. వీటన్నింటికన్నా ముందు, క్లుప్తత కోసం ప్రయత్నించే కథకులు వదిలించుకోవాల్సిన దుర్గుణం ఒకటుంది. అది: పాఠకుల తెలివిపై చిన్నచూపు.

ఈ చివరిదానికి ఉదాహరణగా, ‘బ్రహ్మాండం’ అనువాదంలో అత్యుత్సాహంతో నేను చేసిన ఓ పొరపాటుని ప్రస్తావిస్తాను.

మూలకథలో చివరి వాక్యాలు ఇలా ఉంటాయి:

——–

“So the whole universe,” you said, “it’s just…”

“An egg.” I answered. “Now it’s time for you to move on to your next life.”

And I sent you on your way.

——–

ఆ వాక్యాలని క్రింది విధంగా తర్జుమా చేస్తే సరిపోయేది:

——–

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద …”

“అండం” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ఇక నీ మరు జన్మకి సమయమయ్యింది.”

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

——–

దానికి బదులు, నేను ఇలా తెనిగించ తెగించాను:

——–

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! ”

 

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది.”

 

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

——–

పైన రెండో వాక్యం రాసినప్పుడు పదాల పటాటోపం పైన మాత్రమే దృష్టి పెట్టి, ఓ లోపాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. ‘బ్రహ్మాండం’ అనే పదం ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు. అది కథ పేరులోనే ఉంది. మరో మారు నొక్కి వక్కాణించటం వల్ల అదనంగా వచ్చిపడ్డ విలువేం లేదు. “ఇలా ప్రత్యేకంగా గుర్తుచేయకపోతే – బ్రహ్మాండం అనే పేరుకి, ఈ కథకి ఉన్న సంబంధమేంటో కొందరు పాఠకులు తెలుసుకోలేకపోవచ్చేమో” అన్న అనుమానం నన్నలా రాసేలా చేసింది. మరోలా చెప్పాలంటే, పాఠకుల తెలివితేటలపై అపనమ్మకం! అరుదుగా జరిగినా, పొరపాటు పొరపాటే. ‘బ్రహ్మాండం’ అనే పదాన్ని కంటిన్యుటీ దెబ్బతినకుండా ఇరికించటం కోసం వాక్యాన్ని సాగదీయాల్సొచ్చింది. అలా ఈ కథలో ఓ పునరుక్తి దొర్లింది. ఆ మేరకి క్లుప్తత కుంటుపడింది.

‘అనవసరమైన పాండితీ ప్రదర్శనకి తెగబడకుండా ఉండటం’ అనేదానికి కూడా ఈ ‘బ్రహ్మాండం’ మూలకథ మంచి  ఉదాహరణ. దాని గొప్పదనమంతా, ఉన్నతమైన భావాన్ని అతి సరళమైన రోజువారీ పదాలతో వివరించటంలో ఉంది. ఆ కారణంగా అనువాదంలోనూ తేలిక పదాలే దొర్లేలా జాగ్రత్త పడ్డాను. అందుకు బదులు – సందు దొరికింది కదాని గంభీర పద విన్యాసాలతో వీరంగమేసినట్లైతే మూలకథలో ఉన్న అందమంతా అనువాదంలోంచి ఆవిరైపోయుండేదని నా నమ్మకం.

ఈ విషయంపై ఇంకా రాసుకుంటూ పోవచ్చు కానీ, ‘క్లుప్తత’ అనే అంశమ్మీద కొండవీటి చాంతాడంత వ్యాసం చదవాల్సిరావటం కన్నా పెద్ద ఐరనీ ఉండదు. కాబట్టి దీన్ని ఇంతటితో చాలిద్దాం.

*

స్టాండింగ్ టాల్

 

 

 

-అరుణ్ సాగర్

 

arun

 

 

 

 

 

తడిసిపోయినది

నానిపోయినది

నాచుపట్టి పాచిపట్టి

వక్షస్థలమంతా పచ్చిపచ్చగా

 

ఊరు ఒదిలిపెట్టి

-రానని మొరాయించే నాన్న వలె

ఎర్రెర్రని తడి ఇటుకలకింద

ఏళ్లకేళ్ల బతుకుపొరలను

గుండె బరువున అదిమిపెట్టి

 

బీటలువారిన రొమ్ము విరుచుకుని

-మహా మొండిగోడ ఒకటి

మునిగిపోయిన ఊరి నడుమ

పిడికిలి వలె శిరసునెత్తి

నలుదిశల వెతుకుతున్నది

ఆఖరి శ్వాసలోనూ

ఓటమినొల్లని మల్లుని వలె!

*

 

 

శాపగ్రస్తులు జర్నలిస్టులు!

 

ఈమధ్య ఓ జర్నలిస్టు మిత్రుడు అనారోగ్యంతో చనిపోయాడు. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి, అస్తవ్యస్తమైన biological clockకి గురైన ప్రాణం అలా కాక ఇంకెలా పోతుంది? అలానే పోయాడు శివకుమార్. ఓ మంచి జర్నలిస్టు, మంచి sense of humour వున్న వాడు, గొప్ప కొలీగ్. కంప్యూటర్లు, ఇంటర్నెట్ జర్నలిజంలో ఎలాటి విస్ఫోటనాలు సృష్టించబోతున్నాయో ఓ ఇరవై ఏళ్ల క్రితమే ఊహించగలిగినవాడు. టెక్నాలజీ నేర్చుకోకపోతే ఎంత పెద్ద జర్నలిస్టయినా మూలనపడాల్సిందే. “Technology and computers are going to be levelers,” అని చెప్పినవాడు.
(ఈ వ్యాసం మొత్తంలో ‘డు’ అని సౌలభ్యం కోసం మాత్రమే వాడేను. కానీ, ఇది జర్నలిస్టులైన మహిళలను కలుపుకుని రాసింది. నిజానికి, మహిళలు అదనంగా – పురుషస్వామ్యమనే పీడనని భరిస్తున్నారు. అది వాళ్లెవరైనా చెప్తే తప్ప ఆ తీవ్రతని వర్ణించడం కష్టం.)

అసహజ మరణాలు జర్నలిస్టులకు కొత్త కాదు. అసహజ మరణాలగురించి వాళ్ళు రాస్తారు, మంచి శీర్షికలతో ప్రచురిస్తారు. కానీ, వాళ్ళు కూడా అసహజ మరణాలకు, లేదా తీవ్ర అనారోగ్యాలతో మూలనపడతారు. అయితే, వీళ్ళు చాలా సందర్భాల్లో ఓ సింగిల్ కాలమ్ కి కూడా నోచుకోరు. ఓ దౌర్భాగ్య మరణం. దౌర్భాగ్య జీవితం.

జర్నలిస్టుల గురించి చాలా జోకులున్నాయి. నేను కూడా వేస్తాను. Quality of life వుండని జర్నలిజంలోకి పిల్లలు శలభాల్లా వచ్చి పడకూడదని అనిపిస్తూ వుంటుంది. కానీ, well-meaningగా ఆలోచించే వాళ్ళు జర్నలిజంలో లేకుంటే ఎలా అనికూడా అనిపిస్తూ వుంటుంది.
యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ ఓసారి క్లాస్ లో అన్నారు, ప్రపంచంలో ఎందుకూ పనికిరాని వాడు జర్నలిస్టు అవుతాడని. మేం పగలబడి నవ్వేం అప్పుడు. “అందుకూ పనికి రాకపోతే, జర్నలిజం టీచర్ అవుతాడని,” తనమీద తనే జోక్ చేసుకున్నారు కూడా.

“నువ్వు మనిషివా, జర్నలిస్టువా?” అనీ, ఇంకా ఎన్నో రకాలుగా జర్నలిస్టులు తమ మీద తామే జోకులు వేసుకున్న సందర్భాలున్నాయి.
జోకులు సరే, సమాజంలో జర్నలిస్టుల బాధ్యత గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మంచీ వుంది, చెడూ వుంది. చెడే ఎక్కువగా వుందన్న మాటకూడ వాస్తవమే. కానీ, మంచి జర్నలిస్టులు చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. తమకు వీలైనపుడు, లేదా తమకున్న కొంచెం spaceని తెలివిగా వాడుకుని ప్రజల సమస్యలకు చోటు కల్పించే, ప్రచారం కల్పించే జర్నలిస్టులు ఎందరో వున్నారు. నిశ్శబ్దంగా ఎంతో పనిచేస్తున్నారు మంచి జర్నలిస్టులు కొందరు. వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు. తెలియాలని అనుకోరు కూడా. ఓ గొప్ప వార్త రాసిన రిపోర్టరో, ఓ గొప్ప శీర్షిక పెట్టిన సబ్-ఎదిటరో ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఓ రోడ్డు మలుపు దగ్గరో కనిపించి వుంటాడు. కానీ, faceless జర్నలిస్టులు మనమధ్య తిరుగుతూ, మన సమస్యలు, మన సంతోషాలు గమనిస్తూ వుంటారు. (సీనియర్ జర్నలిస్టు శశాంక్ మోహన్ పెట్టేరొకసారి ఓ శీర్షిక – సరదా సరదా సిగిరెట్టూ, పైలోకానికి తొలిమెట్టు అని).

ఎంత మంచివాడైతే, ఎంత తెలివైన వాడైతే, ఎంత గొప్ప కొలీగైతే ఎవరికి లాభం? తనకి, తనకుటుంబానికి మాత్రం కాదు. అంటే, లక్షలు కోట్లు సంపాదించడంలేదని కాదు. తనమీద తాను పెట్టుకోగలిగిన, తన కుటుంబం మీద పెట్టుకోగలిగిన టైమ్ పెట్టుకోలేదు. ఏ సాయంత్రమూ, ఏ ఉదయమూ (రాత్రి లేటవడం వల్ల) పిల్లకు పెట్టలేడు. పిల్లల బాల్యంలో, చదువులో భాగస్వామ్యం వుండదు. కుటుంబంతో వెళ్లగలిగే సరదాలకు, సందర్భాలకు వెళ్లలేడు. వెళ్ళినా అందరూ వెళ్లిపోయాకనో, లేదా అక్కడ అందరికీ ఉత్సాహం అయిపోయాక, ఆ సందర్భం అయిపోయాక, కుటుంబ సభ్యులు చిన్నబోయాక.

(మెజారిటీ) జర్నలిస్టుల జీవితాలు దుర్భరం. బ్రోకర్లుగా మారి, పార్టీల కార్యకర్తలుగా మారి, పోలీసు దూతలుగా మారి, అవకాశవాదులుగా మారి డబ్బులు సంపాదించిన, సంపాదిస్తున్న జర్నలిస్టుల గురించి కాదు. ఆర్ధిక పరమైన దుర్భరత్వమే కాదు. మానసికంగా తీవ్ర వత్తిళ్ళకి గురై, ఆ వత్తిళ్లను తట్టుకోడానికి ఏదో ఒక అలవాటు చేసుకుని, అది వ్యసనమై చుట్టుకుని చతికిల పడ్డ జర్నలిస్టుల సంఖ్య చాలా ఎక్కువ.

తెలివితక్కువ లేదా అహంకారులైన ఎడిటర్ల బారిన పడి ఆరోగ్యాలు, ఉద్యోగాలు పొగుట్టుకున్న జర్నలిస్టులు ఎందరో. ఈ దుస్థితి తెలుగు జర్నలిజంలో మరీ ఎక్కువ. అవకాశాలు తక్కువగా వుండడం వల్ల, పేపర్లన్నీ బాధిత జర్నలిస్టుల పట్ల పత్రికా యాజమాన్యాలన్నీ మూకుమ్మడి నిషేధాన్ని విధిస్తాయి. ఎక్కడా వుద్యోగం రాదు. రాయడం తప్ప ఇంకే పనీ చేతకాని జర్నలిస్టులు ఎక్కడో అనామకంగా రోజులు వెళ్లదీస్తారు. ఎక్కడో అక్కడ ఏదో వుద్యోగం సంపాదించినా అదీ సజావుగా సాగదు.

ఇరవై ఏళ్ల క్రితం ‘ఉదయం’ మూతపడ్డాక ఉద్యోగాలు కోల్పోయి, ఇప్పటికీ సరైన జీవనోపాధిలేని జర్నలిస్టులు తెలుసు నాకు. ఎక్కడైనా బస్సులో వెళ్తున్నపుడో, రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నపుడో తారసపడతారు. మనసు చిపుక్కుమంటుంది.

అలాటివాళ్లూ, ఇంకా రిటైరైన వాళ్ళు ఎక్కడైనా కనిపించినపుడూ కనిపించినపుడు, “ఎలా వున్నారు? ఎలా గడుస్తుందీ,” అని అడగకుండా వుండలేను.
సరే, తిరగగలిగినపుడు వుద్యోగం వుంటే వుద్యోగం లేకపోతే ఇంకేదో పని చేసుకుంటూ బతుకుతారు. మరి ఆ తర్వాతో? ఉద్యోగం వున్నపుడు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని గొప్పలు పోయిన జర్నలిస్టులు, కింది ఉద్యోగులని నీచంగా చూసిన జర్నలిస్టులు, డెస్కు తప్ప లోకమే తెలీకుండా బతికిన జర్నలిస్టులు, పేపర్ గొప్పని పేపర్ యాజమాన్యం గొప్పని తమదిగా భావించి వూడిగం చేసిన జర్నలిస్టులు – వీళ్ళందరూ హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడ్డ ఉదాహరణలు ఎన్నో.

అందుకే, శాపగ్రస్తులు జర్నలిస్టులు. అంటే మిగతా వృత్తుల్లో వున్నవాళ్లు కాదని కాదు.
ఇది మా జీవితం.

*

 

 సగంమనిషి

 

-రవి బడుగు

~

photo2630‘సగంమనిషి’ నా రెండో కథ. మొదటికథ ‘వరదగూడు’ వంగూరి ఫౌండేషన్ ఉగాది కథలపోటీల్లో మొట్టమొదటి రచన విభాగంలో బహుమతి అందుకుంది. సినిమాల్లో చించేద్దామని వచ్చి.. ప్రస్తుతం సీనియర్ సబ్ ఎడిటర్ గా టీవీ 9లో పనిచేస్తున్నా. హెచ్ఎంటీవీ, జీ 24గంటలులో గతంలో పనిచేశా. సొంతూరు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం మూలవారిపల్లె. త్రిపుర, తిలక్, కేశవరెడ్డి అభిమానరచయితలు. 

*

టీకప్పులోంచి పొగలు. సాసర్ లోకి వంచా. మూసీలో మురికినీళ్లు గుర్తొచ్చాయి. తాగాలనిపించలేదు. సాసర్ ని పక్కకి నెట్టి బేరర్ ని పిలిచా. డబ్బులిచ్చేసి బ్యాగ్ తీసుకుని బైటకొస్తుంటే.. ప్రొప్రయిటర్ డెస్క్ లోంచి రెండు కలువలు. ఐ లైనర్ మధ్యలోంచి నవ్వుతున్నాయి. టీ తాగినట్టనిపించింది.

ఎటెళ్లాలి..?

హాస్టల్ కి వెళ్లే మూడ్ లేదు. మూసీ వైపు తీసుకెళ్లాయి కాళ్లు. బ్రిడ్జి అంచునకూర్చుని వచ్చీపోయే వాహనాలు చూస్తున్నా. మధ్యమధ్యలో కేఫ్ వైపు కూడా.

ఇంకెంత సేపు ఎదురుచూడాలో.?

తనొచ్చేదాకా తప్పదా..

అసలొస్తాడా.. ఆల్రెడీ వచ్చేశాడా.. మనుషుల మొఖాలన్నీ ఒకేలా ఉన్నాయి. వచ్చినా గుర్తు పట్టేదెలా..?

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బైట కొన్న పర్స్ తీసి చూసుకున్నా. ఐదొందల నోటు.. కొన్ని పదులు.. చిల్లర. సీన్ చివరికొచ్చేసింది. మళ్లీ జేబులో పెట్టుకున్నా.

కేఫ్ కి కాస్త దూరంలో ఉన్న హాస్టల్ వైపు చూశా. సిటీకొచ్చి వారం దాటింది. నిజానికి వచ్చినరోజే నరేంద్రని కలవాలి. వారం తర్వాత కలుస్తానన్నాడు.

బ్యాగ్ లోంచి సర్టిఫికెట్లు తీశా. మాస్టర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్. మాట్లాడ్డం రాకపోయినా డిగ్రీ వచ్చేసింది. జైలు నా జీవితాన్ని తినేసినా.. మాస్టర్ డిగ్రీ ఇచ్చింది.

ఫోన్ మోగడంతో సర్టిఫికెట్లు అలాగే బ్యాగ్ లోకి తోసి.. ఠక్కున పైకి లేచి కాల్ రిసీవ్ చేసుకున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. ‘ఒకే సార్’ అని చెప్పి.. కాసేపు అటూ ఇటూ రోమింగ్ చేశా. మళ్లీ వచ్చి బ్రిడ్జి అంచునే జారబడ్డా. టైమ్ పది దాటినా పెద్దగా ఎండ లేదు.. వానొచ్చేంత మబ్బుల్లేవు. వాతావరణం చిరాకులో ఉన్నట్టుంది.

కాసేపట్లో కేఫ్ దగ్గర హోండా సిటీ ఆగింది. లేచి వెళ్లా. విండో ఓపెన్ చేసి అటూ ఇటూ చూస్తున్నాడతను. నన్ను చూసి ఆగాడు. నా వైపు వేలు చూపించి..శివ.. అని అడిగాడు.

అవును సర్…

బ్యాక్ డోర్ ఓపెన్ చేయడంతో.. లోపలికెక్కి కూర్చున్నా.

తనేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. నా కంటే రెండు మూడేళ్లు ఎక్కువ వయసుండొచ్చు. కానీ అంతకంటే తక్కువగా కనిపిస్తున్నాడు. ఆ వయసుకే ఓ టీవీ చానల్ ఎండీ.

రేర్ వ్యూ మిర్రర్ లో నన్ను నేను చూసుకున్నా. ‘శిరీష’ గుర్తొచ్చింది. కారు వీండోలోంచి వెళ్లిపోతున్న దృశ్యాల్లా.. ఒంగోలులో ఉన్నరోజులు కళ్లముందుకొచ్చాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా శిరీషతో పరిచయం. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒంగోలులో ఓ ప్రైవేట్ జాబ్ లో చేరా. శిరీష వాళ్ల నాన్నని కలిస్తే.. పెళ్లి కుదరదన్నాడు. నిజం చెప్పాలంటే కులం కుదరలేదు. తనని నాతో తీసుకెళ్లిపోవాలనుకుని.. ఒకరోజు రాత్రి తనని కలవడానికి వెళ్లా. అంతకుముందు ఎన్నో సార్లు అలాగే కలుసుకున్నా తనని. ఆ రోజు అంతా రివర్సైంది. గోడ దూకేటప్పుడు.. పక్కింట్లోంచి ఒకాయన చూశాడు. దొంగా దొంగా అంటూ పట్టుకోబోతుంటే.. పక్కనే దొరికిన కర్రతో ఒక్కటిచ్చి పారిపోయాను.

మరుసటి రోజు సాయంత్రం పోలీసులు నేరుగా మా ఆఫీస్ కొచ్చారు. రాత్రి నేను కొట్టిన వ్యక్తి చనిపోయాడంట. ఒక్కరోజులో అంతా తల్లకిందులైపోయింది. దొంగతనానికొచ్చి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశానని కేసు. శిరీష వాళ్ల నాన్నే సాక్ష్యం చెప్పాడు. తను నన్ను చూశానని. ఆ కాలనీలోని వాళ్ల కులపోళ్లంతా నా కేసుని ఓ ఉద్యమంగా మార్చారు. వాళ్ల చేతిలోని మీడియా నన్నో నరరూపరాక్షసుడిగా రాసింది. కోర్టులో నేనేం మాట్లాడలేకపోయాను. కావాలని తనని చంపలేదని.. తప్పించుకోడానికి మాత్రమే కొట్టి పారిపోయానని మాత్రమే చెప్పగలిగాను. ఓ మనిషి ప్రాణం తీశానన్న బాధో, పోలీసులు కొట్టిన దెబ్బల భయమో అంతకుమించి నన్ను మాట్లాడనివ్వలేదు. వీటన్నిటి కంటే మా అమ్మ కన్నీళ్లు నన్ను మరింత మౌనంగా మార్చాయి.

కులపంచాయతీ ముగిసి చివరికి తీర్పొచ్చింది.

ఏడేళ్లు.. ఏడు యుగాలు..

జైల్లో నేరస్తుల మధ్య నన్నో హాఫ్ క్రిమినల్ గా చూసుకునేవాణ్ని. అక్కడున్నవాళ్లు చేసిన నేరాలు, వాళ్లనుభవిస్తున్న శిక్షలు విన్నప్పుడల్లా.. నేను చేసిన పని పదేపదే గుర్తొచ్చేది. కొన్ని సార్లు నాకు సరైన శిక్షే పడిందనిపించేది. మరికొన్ని సమయాల్లో అసలు నేను తప్పు చేశానా అనిపించేది. కోర్టులకు అసలు నేరస్తుల్ని శిక్షించేంత అర్హత ఉందా.. ఎలాంటి ప్రభావాలకూ లొంగకుండాతీర్పులిచ్చే న్యాయమూర్తులుంటారా.. జవాబుల్లేని ఇలాంటి ప్రశ్నలెన్నో..! నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ని. ఒక్కోసారి నా కేసులో తీర్పు మార్చేసి ఉరితీస్తున్నట్లు కలొచ్చేది. మరోసారి కేసు రద్దుచేసి విడుదల చేస్తున్నట్టు. రెండిట్లో ఏది జరిగినా బాగుండనిపించేది. రెండూ జరగలేదు.

‘పోరాడేశక్తి ఉన్నవాళ్లు పైకోర్టుల్లో బేరమాడుతున్నారు. బేరమాడే శక్తి ఉన్నవాళ్లు నాణ్యమైన తీర్పు, నచ్చిన తీర్పు వచ్చేవరకూ పోరాడుతున్నారు. కోర్టుల్నే కొనేవాళ్లు తీర్పుని జీవితకాలం వాయిదావేయించుకుంటున్నారు. నాలాంటి ఏ కొందరో తీర్పుకి తలొంచుతున్నారు’.

జైల్లో పరిచయం అయిన చాలామంది.. వాళ్లు విడుదలయ్యేటప్పుడు, బైటకొచ్చాక కలవమని అడ్రస్ లు, ఫోన్ నంబర్ లు ఇచ్చేవాళ్లు. తెలిసో తెలియకో ఓసారి ఈ ప్రపంచంలోకి వచ్చా.. మళ్లీ ఇటు రాకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నా. జైలు నుంచే డిస్టెన్స్ లో పీజీ చేశా. విడుదలవడానికి కొద్దిరోజుల ముందు యాదగిరితో పరిచయమైంది. స్మగ్లింగ్ కేసులో జైలుకొచ్చాడు. తనే నరేంద్ర గురించి చెప్పాడు. హైదరాబాద్లో ఓ టీవీ చానల్ నడుపుతున్నాడని.. వెళ్లి కలవమని ఫోన్ నంబర్ ఇచ్చాడు.

‘హలో..’ అన్న పిలుపుతో నేనెక్కడున్నానో గుర్తొచ్చింది.

చేతులతో ఏదో మాట్లాడుతున్నాడు.. దిగమన్నట్టు.

కారు ఓ ఫామ్ హౌస్ ముందు ఆగి ఉంది. తను ముందు వెళ్తుంటే ఫాలో అయ్యా. లోపలకెళ్లాక కూర్చోమని సోఫా చూపించాడు. కేఫ్ దగ్గర్నుంచి చూస్తున్నా.. తను నాతో నోటితో మాట్లాడ్డం లేదు. చేతులతోనే సైగలు చేస్తున్నాడు. నాస్థాయి చూపించాలనో.. తన హోదా చూపించుకోవాలనో తాపత్రయం. నన్ను ఆఫీస్ కు కాకుండా ఇంతదూరం ఎందుకు తీసుకొచ్చాడో అర్ధం కావడం లేదు. బ్యాగ్ తీసి ముందుపెట్టుకున్నా. సర్టిఫికెట్స్ కోసం జిప్ తీయబోతుంటే..

నరేంద్ర మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ‘యాదగిరితో మాట్లాడాను. నీ గురించి చెప్పాడు. అసలిది.. తనే చేయాల్సిన పని..’

బ్యాగ్ జిప్ తీయడం ఆపేశా.

‘నీకు తెలిసిన పనే’. ఒక్కక్షణం ఆగాడు.

‘కాకపోతే అప్పుడు ఒక్కరు.. ఇప్పుడు ఇద్దరు.. నిజానికి ఒకటిన్నరే..’ వేళ్లతో మళ్లీ సైగ.

తనని తొలిసారి స్పష్టంగా చూశా. ముఖంలో తోడేలు పోలికలు. నవ్వుతున్నాడు కానీ అదేదో వికృతంగా అనిపించింది.

నాలో ఏ భావమూ లేదు. అలా చూస్తుండిపోయా.

తనే మళ్లీ.. ‘పెద్ద కష్టమేం కాదు’. టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకున్నాడు.

‘డర్టీ బిచ్.. నన్నే మోసం చేస్తుందా..’ వాటర్ తాగి నావైపు చూశాడు. తన కళ్లలో ఎరుపుజీరలు. వెంటనే నవ్వు. లేచి అటూ ఇటూ రెండడుగులేసి.. ఓ స్లిప్ నాముందు పెట్టాడు.

‘నా ఇంటి అడ్రస్. కింద పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ బెడ్ రూమ్’.

నా కళ్లలోకి సూటిగా చూస్తూ.. ‘దొంగతనానికి వచ్చినట్టుండాలి.. పని జరిగిపోవాలి’.

అంటూ వేగంగా లోపలికెళ్లి వెంటనే తిరిగొచ్చాడు.

నా ముందున్న అడ్రస్ స్టిప్ పై.. రెండు ఐదువందల నోట్ల కట్టలు పెట్టాడు. లక్ష రూపాయలు.

‘అంతా ఓకే అయ్యాక మళ్లీ కనిపించు’.

ఒక్కసారి నరేంద్రవైపు చూశా. వెంటనే స్లిప్ తో పాటు నోట్లకట్టలు తీసుకున్నా.. బ్యాగు జిప్ తీసి సర్టిఫికెట్ల పక్కనే సర్దేశా.

ఏదో విరిగిపోతున్న చప్పుడు.. మనస్సు అనుకుంటా..!

తను మళ్లీ మాట్లాడలేదు. రెండు నిమిషాల తర్వాత మళ్లీ కారులో బయల్దేరాం. అరగంట తర్వాత కేఫ్ దగ్గర దించేశాడు. తనవైపు చూడకుండానే దిగేశా. వెంటనే కారెళ్లిపోయింది నామీదకి పొగచిమ్ముతూ..

టైమ్ మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. నేరుగా హాస్టల్ కెళ్లి నా గదిలో పడుకున్నా. రూమ్ మేట్స్ పేకాడుతున్నారు. ఒకతను మాత్రం స్క్రూడ్రైవర్ తీసుకుని సీపీయూతో కుస్తీ పడుతున్నాడు. కాసేపు పడుకుందామంటే నిద్రపట్టడం లేదు. అమ్మ గుర్తొచ్చింది.

‘జైలు నుంచి రిలీజయ్యాక నేరుగా ఇంటికెళ్లా. నెలకోసారి జైలుకొచ్చి చూసే అమ్మకి నేనేం కొత్తకాదు. నాకు మాత్రం ఆ వాతావరణం కొత్తగా అనిపించింది. రెండు రోజులు కూడా ఉండలేకపోయా. ఒకప్పుడు నాకు బాగా తెలిసిన మనుషులే.. నన్ను వింతగా చూస్తున్నారు. వాళ్లు నన్ను దూరం పెడ్తున్నారో.. నేనే దూరంగా ఉంటున్నానో అర్ధం కాలేదు. అక్కడ ఉండలేనని స్పష్టంగా అర్ధమయ్యాక.. హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నా. జాబ్ చూసుకున్నాక తననీ తీసుకెళ్తానని చెప్పా. నమ్మకం కనిపించలేదు అమ్మలో. ముభావంగానే వెళ్లిరమ్మంది. ఇక్కడికొచ్చాక తొలి ఫోన్ నరేంద్రకు చేశా. తను లేటవుతుందని చెప్పాక.. డిగ్రీలో నాక్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారని తెలిసి, వాళ్లని కలవడానికి ప్రయత్నించా. ఒకడు ఫోన్లో నా పేరు విన్నవింటనే కట్ చేశాడు. మరొకడు చాలాసేపటి తర్వాత గుర్తుపట్టాడు. ఆరోజే తనని కలిశా. జాబ్ అన్నమాట విన్నతర్వాత వాడి మాటతీరులో మార్పొచ్చింది. సరే చూస్తానన్నాడు కానీ, మరుసటిరోజే నంబర్ మార్చేశాడు’.

chinnakatha

నరేంద్ర ఇచ్చిన అడ్రస్ స్లిప్ చేతిలోకి తీసుకున్నా. ‘మనిషిని చంపగలనా నేను. అందులోనూ స్త్రీని. అసలు డబ్బుతో పారిపోతే. ఏం జరుగుతుందో తెలుసు. మళ్లీ జైలుకే’. ఇక నిద్ర రాదనిపించింది.

స్లిప్ పర్స్ లో పెట్టుకుని హాస్టల్ నుంచి బైటకొచ్చా. మరో రెండు గంటల్లో అడ్రస్ పట్టుకున్నా. తను చెప్పిన ఆనవాళ్లున్న బిల్డింగ్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టా. మనుషులెవరూ కనిపించలేదు. తిరిగి హాస్టల్ కొచ్చా.

రాత్రి పదకొండుదాటింది. గదిలో కంటే నాలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుంది. సీపీయూ పార్ట్స్ పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకున్నా. మరో గంటలో నరేంద్ర ఇంటిముందున్నా. వర్షం వస్తుందేమో అన్నట్టున్నవాతావరణం చీకటిని మరింత చిక్కగా చేస్తోంది.

మెయిన్ గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లా. ఫస్ట్ ఫ్లోర్ లో అడుగుపెట్టా. ఎడమవైపున్న గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. డోర్ తీసే ఉంది. చప్పుడు చేయకుండా లోపలకు అడుగుపెట్టా. ఇద్దరూ నిద్రపోతున్నారు. మొదట నా చూపు బెడ్ మీద నిద్రపోతున్న పాపపై పడింది. ఆరేళ్ల వయసుంటుందేమో. మసక వెలుతురులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకో దగ్గరనుంచి చూడాలనిపించి కిందికివంగా. అద్దంలో నన్ను చూసుకున్నట్టు అనిపించింది. రెండు క్షణాల తర్వాత తల పక్కకి తిప్పా. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతున్న సెన్సేషన్.

”శిరీష”

నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. కళ్లు తిరుగుతున్న భావం. వెంటనే వెనక్కి తిరిగా. గదిలోంచి వేగంగా బైటకొచ్చేశా. మరో ఆలోచన లేకుండా దూరంగా పారిపోవాలి. మెట్ల వైపు వెళ్లేంతలో.. ఎదురుగా నరేంద్ర. ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. మరుక్షణం నా చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ నరేంద్ర కణతలోకి దూసుకుపోయింది. అంతే వేగంతో స్క్రూడ్రైవర్ బైటకు లాగి పరుగులాంటి నడకతో మెట్లుదిగి బైటకొచ్చా. క్షణాల్లో చీకట్లో కలిసిపోయా. లోపల్నించి అరుపులు వినిపిస్తున్నాయి. బైట వర్షం మొదలైంది.

 

రెండునెలల తర్వాత మూసీనది పక్కనే ఉన్న ఓ పార్క్ లో..

దూరంగా బెంచ్ పై కూర్చునుంది శిరీష. ప్రపంచంతో సంబంధం లేకుండా పాప ఆడుకుంటోంది. తననే చూస్తుండిపోయా. చిన్నప్పుడు నేనెలా ఉండేవాడినో అమ్మ చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి..!

 

*స్టోరీ నెవర్ ఎండ్స్*

మనింటికి వుడ్‌హౌస్ వచ్చిన వేళా…

 

-దాసరి అమరేంద్ర

~

 

Dasari Amarendraవుడ్‌హౌస్  ఎవరూ?

రావుబహదూర్  సోమేశ్వరరావు  ఎవరూ?

మధ్యలో గబ్బిట కృష్ణమోహన్ ఎవరూ?

ఏవిటీ వీరి సంబంధం?

***

తొంభైమూడేళ్ళు జీవించి, అందులో డైబ్భైరెండేళ్ళపాటు రచనా వ్యాసంగం సాగించి 1975లో వెళ్ళిపోయిన  మహానుభావుడు  పి.జి. వుడ్‌హౌస్.

ఇంగ్లాండు మనిషి. అమెరికా అంటే అభిమానం.  “పన్ను” బాధల  పుణ్యమా  అని ఫ్రాన్సులో ఓ పదేళ్ళు  వున్నాడు.  రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్లకు చిక్కడిపోయి ఓ ఏడాదిపాటు వారి ఆతిధ్యం స్వీకరించాడు. పొరపాటునో, గ్రహపాటునో ఆ జర్మనీవారి రేడియోలో తన బాణీ ప్రసంగాలు  ఓ అరడజను చేసి తన స్వదేశీయల  అసహనానికీ, ఆగ్రహానికీ గురి అయ్యూడు. దాని పుణ్యమా  అని మళ్ళీ ఇంగ్లాడులో అడుగు పెట్టకుండా ఓ ముప్ఫై ఏళ్ళపాటు అమెరికాలో నివసించి, పౌరసత్వం పొంది  అక్కడే  తనువు చాలించాడు.  ఆగ్రహాలు సద్దుమణిగాక  మరణానికి కొద్దినెలలు వందు ఆంగ్లప్రభుత్వంవారి నైట్‌హుడ్ పొంది సర్ వుడ్‌హౌస్ అయ్యాడు.

***

వుడ్‌హౌస్ ఏమి రాశాడూ?

చాలా  రాశాడు. పుంఖానుపుంఖాలుగా రాశాడు. జబ్బసత్తువ వున్న రోజుల్లో మూడు నెలలకో  నవల రాశాడు. ఆ సత్తువ తగ్గినపుడు ఆరునెలలకో  నవల.

నవలలు, కథాసంకలనాలు కలిసి తొంభై రెండు పుస్తకాలు. నలభై మ్యూజికల్ కామెడీల లిరిక్సుకి సహరచయిత. ఇవికాక ఉత్తరాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు .. ఎన్నో రాశాడు. కానీ ఏది రాసినా – ఎంత వేగంగా రాసినా – కృషి చేసి రాశాడు. నాణ్యతను వదలలేదు. విజయవంతంగా రాశాడు. “మనకాలపు ఉత్తమ రచయిత’ అన్నాడో సమకాలీన రచయిత – 1930లో.

నిజానికి ఆయన ఏమి రాశాడూ?

సీరియస్ సాహిత్యం రాయలేదు. సామాజిక అంశాలతో రాయలేదు. వ్యంగ్య విమర్శకూ పూను కోలేదు. పోనీ హాస్యరచనలు అందామా – అదీకాదు. “ఫార్సు’ రాశాడు అని తేల్చారు విశ్లేషకులు. నా వరకూ నాకు ఆయన రాసినది రేలంగి, పద్మనాభంల బాణీల మేలు కలయిక అనిపిస్తుంది.

***

వుడ్‌హౌస్ రచనలు పాఠకులను ఆకట్టుకొన్నాయన్నది నిజం, వాస్తవం. రాసి వందేళ్ళు దాటినా, రాసినాయన వెళ్ళిపోయి  నలభై ఏళ్ళు దాటినా అతనిని చదివేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీషులోనే  గాకుండా తమతమ సొంత భాషలలో అనువదించుకుని చదివేవాళ్ళూ వేలకొద్దీ ఉన్నారు. మన తెలుగులో బాపూరమణల  దగ్గిర్నించి గబ్బిట కృష్ణమోహన్ వరకూ ఆయన అభిమానులు అసంఖ్యాకం.

ఊరికే అభిమానించి ఊరుకోకుండా వుడ్‌హౌస్‌ను అనుసృజించి పెడుతున్నారు గబ్బిట.

***

gabbita1

సరదాగా మరికొంతసేపు అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో “సినిమారంగం’కు చెందినవి నాలుగు.

వుడ్‌హౌస్  అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకొన్న “అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై’ అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో “సోంబాబాయి వలస కాపురం” గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా “అవతారం” ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్ళి ఇరవై పేజీలూ, ఒక గంటా వ్యవధిలో “తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని” అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.

మొదటి భాగంలోని ఏడు కథల్లో నాలుగింట శశిరేఖ ముఖ్యపాత్ర ధారి. ఆమె తల్లి మహారచయిత్రి ప్రసూనాంబ  విస్మరించలేని కథావ్యక్తి. పెరిగి పెద్దయ్యాక సోంబాబాయి అంత గొప్పమనిషిగా రూపొందగల ప్రామిస్ వున్న శశిరేఖ  తాను  ఇష్టపడే  నరహరిని  కాకుండా తల్లి  సూచించి బాధించే వర్ధమాన రాజకీయు నాయుకుడు ప్రసాద్, రచయితగా అపుడపుడే నిలదొక్కుకొంటున్న గంపా శేఖర్, ఏకపక్ష  ఆరాధకుడు దూడల దివాకర్, అవ్యాజ వ్యామోహి శేషగిరులను ఎంతో చాకచక్యంతో “తెల్లవారుఝాము పాలబండి”లు ఎక్కించిన వైనం కనిపిస్తుంది ఈ నాలుగు కధల్లో.

“విధి, “అదృష్టం” అన్న కథల్లో పాత్రలు వేరైనా వాటిల్లోని అనూరాధ, సరిత – శశిరేఖకు కజిన్లే. తండ్రి గోవర్ధనరావూ, జమీందారు నీలకంఠం – ఒకే తాను ముక్కలే. వెరసి ఈ రెండు కథలూ “తాత్విక దృష్టితో’ చూస్తే మిగిలిన నాలుగు కథలకు దగ్గరి బంధువులే.

సినిమారంగపు నాలుగు కథల్లో రెండింట నరసరాజు, రాగిణిల  ఉదంతాలు  కనిపిస్తాయి. మరో కథ “కోతిచేష్టలు’లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగోకథ “మీనా దేశ్‌పాండే తారాపథం’ మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.

***

పరిమితుల దృష్ట్యా చూస్తే  అనువాదం సొంత రచన కన్న కష్టమైనది.

అనుసృజన అనువాదం కన్న మరింత మరింత కష్టమైన పని.

వుడ్‌హౌస్  కథల నేపధ్యం ఇంగ్లీషు గ్రామసీమలకూ, పట్టణాలకూ చెందినది. ఆయా రచనలను ఆంగ్లంలోనే చదువుకునేవాళ్ళకి అది అవరోధం కాకపోవచ్చు. ఇంగ్లీషు రానివాళ్ళ కోసమే ఈ తెలుగు ప్రయత్నం అనుకుంటే – అలాంటి పాఠకులు ఆయా పేర్లూ, ప్రాంతాలూ, ఆచార వ్యవహారాలతో మమైకం అయ్యే అవకాశం దాదాపు పూజ్యం. అందులోనూ ఆయా రచనలు హాస్యమూ, ఫార్సూ, శబ్ద అర్థాలంకారమయం అయినపుడు వాటిల్ని చదివే వాళ్ళకు అవి ఆకాశ పంచాంగాలు అయితీరుతాయి.

మరి వాటిల్ని అభిమానించి, వాటిల్ని తెలుగు మాత్రమే వచ్చినవాళ్ళకు తెలియజెయ్యాలని తపించే వారికి ఏమన్నా మార్గాంతరం ఉందా?! ఉంది!!

అనుసృజన.

గబ్బిట కృష్ణమోహన్ గత ఐదారేళ్ళుగా ఈ మార్గాన వెడుతున్నారు. విజయయాత్ర చేస్తున్నారు. ఈ పరంపరలో సరికొత్త మైలురాయి “సరదాగా మరికొంతసేపు’.

సోమేశ్వరరావు, గోవర్ధనరావు, గంపా శేఖర్, దూడల దివాకర్, శశిరేఖ, బండారు ప్రసూనాంబ, శేషగిరి, బాబ్జీ, అనూరాధ, శ్రీహరి, సరిత, జమీందార్ నీలకంఠం, నరసరాజు, కనకరాజు,రాగిణి, సుభాషిణి, రాజమాణిక్యం-ఉరఫ్-మీనా దేశ్‌పాండే – వీళ్ళ మాతృపాత్రలు ఆంగ్లదేశపు నేలకు చెందినవి అయినా, వీళ్ళంతా పదహారణాలు  తెలుగు  మనుషులు. గబ్బిటగారు ప్రాణప్రతిష్ట చేసిన మన మనషులు.

కథల్లోని  “పానకుటీరాలు” మన సంస్కృతికి చెందినవి కాకపోయినా అనుసృజన నైపుణ్యమా అని పానకంలో యాలక పలుకుల్లానే ఉంటాయి.

“పెరట్లో హాయిగా కూర్చున్న  కోడిపెట్టల్ని అదిలిస్తే రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తినట్టు ఆడ వాళ్ళంతా బయటకి నడిచారు” (బుసబుసలు); “గుండెకు గాట్లుపడి ఆ గాట్లలోంచి గాలి బయట కొస్తున్నట్టుగా ప్రసూనాంబగారు నిట్టూర్చారు” (విశ్రాంతి చికిత్స); “అప్పుడే గుడ్డులోంచి బయటపడి వృత్తిలో ఓనమాలు దిద్దుకొంటోన్న వడ్రంగిపిట్ట చేసే చప్పుడులా ఉందది” (తల్లిగారి ఘనసత్కారం); “అది విని దివాకర్ చెట్లలోంచి దూసుకుపోయే గాలిలా మూలిగాడు” (తల్లిగారి ఘనసత్కారం) – ఇలాంటి అనే కానేక పదబంధాలూ, వాక్యాలూ అపురూపమైన దేశవాళీతనంతో గుబాళిస్తాయి. అనుసృజనకు అర్థాలు చెపుతాయి.

మూలభాషలో వుడ్‌హౌస్‌గారు ఏమని ఉంటారా అన్న కుతూహలం కలిగిస్తాయి.

ఇవన్నీ ఒక ఎత్తు – కృష్ణమోహన్ “తలాడించేవాడి కథ”లోనూ, “మిస్ మీనా దేశ్‌పాండే తారా పథం”లోనూ చూపించిన ప్రతిభ అమోఘం; అద్వితీయం.

తలాడించే భాగోతుల నరసరాజుకు ప్రేమాయణం గుంటదారుల్లో పడ్డప్పుడు మంచి కిక్కిచ్చే దానికోసం మనసు వెంపర్లాడినపుడు – అవి మద్యపాన నిషేధపు మంచిరోజులు – తనకు తెలిసిన ప్రదేశానికి వెళ్ళి తలుపు తట్టి “ఎవరికి ఎవరూ  కాపలా  బంధాలన్నీ  నీకేలా” అంటూ కోడ్ పాట పాడతాడు. తలుపు తీసిన మనిషి “ఏం సినిమా?” అని అడిగితే “ఇంటికి దీపం ఇల్లాలే” అని, “దాహమేస్తోంది” అంటాడు. ఇది చదివాక మన మనసుకు కిక్కూ  ఎక్కుతుంది. ఇంకా కావాలని దాహమూ వేస్తుంది.

ఏకచిత్ర అగ్రతార మీనా దేశ్‌పాండేగారి మాతృపాత్ర ఆంగ్లభాషలో ఏవేం పాటలు గానించిందో తెలియదుగానీ  మన  రాజమాణిక్యం (ఉరఫ్ మీనా దేశ్‌పాండే) – “పులకించని మది పులకించు” దగ్గర మొదలుపెట్టి  “కల నిజమాయెగా కోరిక తీరెగా” దాకా ఓప్పదీ ఇరవై పాటలు పాడేసి “భళిరా గబ్బిటా!” అని పాఠకులు వీరతాడు వేసేలా చేస్తుంది.

***

gabbita1వుడ్‌హౌస్ రాసినది సీరియుస్ సాహిత్యం గాకపోయినా దశాబ్దాల తరబడి, తరతరాల తరబడి పాఠకులను ఆకట్టుకొందన్న మాట నిజం.

ఏవిటా కారణం? ఏవిటా రహస్యం?

ఖచ్చితంగా చెప్పడం కష్టం.

ఎడ్వర్డియన్ యాసా, కవుల కొటేషన్లూ, అనేకానేక సాహితీ చమక్కులూ కలగలిపి తనదైన ఓ ప్రత్యేక భాషాశైలిని సృష్టించాడు వుడ్‌హౌస్. దాన్ని  కామిక్ పొయెట్రీ అన్న వాళ్ళున్నారు. మ్యూజికల్ ప్రోజ్ అన్న వాళ్ళున్నారు. ఏదేమైనా భాష విషయుంలో వుడ్‌హౌస్ రచనలు భాష పరిధుల్ని దాటుకుని వెళ్ళి కొత్త మైలురాళ్ళను పాతాయి అన్న విషయం దాదాపు అందరూ అంగీకరిస్తారు.

అయినా మూలప్రశ్న మరోరూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

హాస్య, వ్యంగ్య, ఫార్సు రచనలకు  కాలక్షేపమూ, ఉల్లాసమూ  గలిగించడాన్ని మించిన పరమావధి ఉంటుందా?

దానికి రేలంగి సమాధానం చెప్పగలడు – పద్మనాభం చెప్పలేకపోయినా.

ఛార్లీ చాప్లినయితే ఢంకా బజాయించి, గుండెలు బద్దలుకొట్టి చెపుతాడు.

కానీ ఒక్కమాట.

వుడ్‌హౌస్ గురించి మాట్లాడుతూ “సాహితీ ప్రయోజనం” అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయి తీరుతుంది.

అయిర పుస్తకపు శీర్షికే ఆహ్వానిస్తోంది గదా:

“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …

ఇక ఆలస్యం ఎందుకూ – గబ్బిట వుడ్‌హౌస్ దగ్గరికి వెళదాం ..

*

నాగరికతకి వెనకడుగు లేదు!

 

 

vinod anantojuపోయిన వ్యాసంలో మానవ సమాజం  అభివృద్ధి క్రమాన్ని పైపైన చూసాము. మీరు మళ్ళీ ఒకసారి ఆ వ్యాసంలోని Table ని చూడమని నా మనవి. వీలయితే Browser లో పక్క Tab లో open చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ Table గుర్తుంటేనే ఈ వ్యాసం అర్థమవుతుంది. ఈ వ్యాసంలో వీలయినన్ని ఉదాహరణలతో ఆ క్రమాన్ని మానవ ప్రపంచానికి అన్వయించి చూద్దాం.

ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు. అసలు మనం సమాధానం వెతుకుతున్న “దేవుని ఆయుధాల” ప్రశ్నకీ ఈ “మానవ సమాజ అభివృద్ధి క్రమానికీ” సంబంధం ఏమిటి?
నా ప్రశ్నని ఇద్దరు ముగ్గురిని అడిగాను. వాళ్ళ సమాధానాలు ఇలా ఉన్నాయి.
నేను: “దేవుళ్ల బొమ్మల చేతుల్లో కత్తులు, బాణాలు లాంటివి మాత్రమే ఉన్నాయి ఎందుకు? గన్నులు కనపడవు ఎందుకు?”
అతను: “ఎందుకంటే దేవుళ్ళు ఆ కాలం లోనే ఉన్నారు కాబట్టి. ఈ కాలం లో లేరు కాబట్టి. ఆ కాలంలో అలాంటి weapons ఏ వాడేవారు కాబట్టి.”
నేను: “దేవుళ్ళు ఆ కాలంలోనే ఎందుకు ఉన్నారు? ఈ కాలంలో ఎందుకు లేరు?”
అతను: “ఎందుకు లేరు అంటే.. అది మనం ఎలా చెప్పగలం.. దేవుడు ఎప్పుడు అవతారం ఎత్తుతాడో మనం చెప్పలేము కదా..”
నేను: “ పోనీ… దేవుళ్ళు కత్తులు, బాణాలు వాడే కాలం లో ఉన్నారు అని అన్నావు కదా.. అంటే దేవుళ్ళు Iron age లో ఉండేవారు అన్నమాట. మరి అంతకు ముందు Stone ageలో దేవుళ్ళు ఉండేవాళ్లు కాదా? ఒక వేళ ఉంటే ఎలా ఉండేవాళ్లు? రాతి ఆయుధాలు పట్టుకునేవారా? వాళ్ళ బొమ్మలు మనకి కనిపించడం లేదు ఎందుకు?
అతను: ఏం మాట్లాడుతున్నావు??

బహుశా అతనికి Iron age, Stone age ల గురించి తెలిసి ఉండకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోకుండా సరైన సమాధానం దొరకదు. మనకు కలిగిన ప్రశ్నకి ఎక్కడా రాజీ పడకుండా సమాధానం తెలుసుకోవడం కోసం కాలంలో చాలా వెనక్కి వెళ్లి Stone age దగ్గర మొదలు పెట్టి అధ్యయనం చెయ్యాలి.

మన ప్రశ్న “మతము – ఆయుధాలు – కళ” ఈ మూడు విషయాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూడు విషయాలూ మానవ సమాజంతో పెనవేసుకుని ఉన్న విషయాలు. మానవ జీవన పరిస్థితులలో మార్పులు వచ్చిన ప్రతి సారీ ఈ మూడు విషయాలు కూడా మార్పులకి లోనవుతూనే ఉన్నాయి. కాలంతో పాటు ఆయుధాలలో ఈ మార్పు మనం చాలా చక్కగా గమనించవచ్చు. కళలలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. మతంలో మార్పులు అంత బాహాటంగా కనిపించవు. ఈ మార్పులని అర్థం చేసుకోవడానికి మానవ సమాజంలో వచ్చే మార్పులని మనం లోతుగా చూడాలి.

కొండ గుర్తు 1 : యుగాల మధ్య ఖచ్చితమైన విభజన రేఖ ఉండదు.

సమాజ పరిణామ క్రమంలో యుగాల మధ్య ఖచ్చితమైన విభజనరేఖ ఉండదు. మానవ మేధస్సు వికసిస్తున్నా కొద్దీ, ప్రకృతి మీద అవగాహన పెరుగుతున్నా కొద్దీ ఒక యుగంలోంచి ఇంకొక యుగం క్రమక్రమంగా పుట్టుకొస్తుంది. అంటే “ఫలానా రోజున అనాగరిక యుగం అంతమయ్యి నాగరిక యుగం మొదలయ్యింది” అన్నట్టు జరగదు. ఒక యుగం క్రమంగా బలహీనపడుతూ ఉంటే, అందులోనే పురుడు పోసుకున్న ఇంకొక ఉన్నతమైన యుగం క్రమంగా బలపడుతూ ఉంటుంది. ఈ పరివర్తనా కాలం పూర్తవ్వడానికి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల దాకా పడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంచం కష్టమయిన విషయమే. ఒక ఉదాహరణతో చూస్తే తేలిక అవవచ్చు.

ఉదాహరణకి భాషలకి లిపి వాడుకలోకి వచ్చిన తరవాత కాలాన్ని నాగరిక యుగం అనీ, అంతకు ముందు కాలాన్ని అనాగరిక యుగం అనీ అంటున్నాము (Table చూడండి). ఏ భాషకయినా లిపి ఒక రోజులో తయారవ్వదు. ముందు చిన్న చిన్న గుర్తులు/బొమ్మలు మాటలకి సంకేతాలుగా ఉపయోగంలోకి వస్తాయి. ప్రజలు ఈ గుర్తులకి బాగా అలవాటయ్యే క్రమంలో ఇంకొన్ని సంకేతాలు పుడతాయి. ఇవే కాల క్రమంలో అక్షరాలుగా మారి ఒక సంపూర్ణమయిన లిపి తయారవుతుంది. ఇది ఒక క్రమం. ఇలా లిపి తయారవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు సులభంగా పడుతుంది. ఈ కాలం అంతా ఆ రెండు యుగాల మధ్య పరివర్తనా కాలం అన్నమాట.

ఈ కింది బొమ్మ కాలక్రమం లో వస్తువుల గుర్తుల నుంచి చైనీస్ అక్షరాలు ఎలా పుట్టాయో చూపిస్తుంది. చైనీస్ లిపి ఇప్పుడు ఉన్న రూపానికి రావడానికి 6000 సంవత్సరాలు పట్టిందని ఒక అంచనా.

vinod1

ఇంకో విధంగా చెప్పాలంటే, లిపి అనేది నాగరిక యుగ లక్షణం. గుర్తులని, బొమ్మలని మాటలకి సంకేతాలుగా వాడటం అనేది లిపి యొక్క ప్రాధమిక రూపం (బీజ రూపం – Seed). ఇది అనాగరిక యుగం మధ్య దశలోనే మొదలయ్యింది (Table చూడండి). అంటే నాగరిక యుగపు బీజాలు అనాగరిక యుగంలోనే పుట్టాయి అన్నమాట. ఇది అన్ని యుగాలకీ, అన్ని దశలకీ వర్తిస్తుంది. ప్రతి దశ యొక్క బీజాలు అంతకు ముందు దశలోనే పుట్టి ఉంటాయి.

ఈ కింది బొమ్మ అనాగరిక యుగం మధ్య దశ – ఎగువ దశల మధ్య పరివర్తనా కాలాన్ని చూపిస్తుంది. మనుషులు ఇనుముని అదుపులోకి తెచ్చుకున్న తరవాత కాలాన్ని “అనాగరిక యుగం ఎగువ-దశ” అని అంటున్నాము. అంతకు ముందు కాలాన్ని మధ్య-దశ అంటున్నాము. అంటే రాతి పనిముట్లు (Stone Tools) మధ్య-దశ లక్షణం, లోహపు పనిముట్లు (Metallic Tools) ఎగువ-దశ లక్షణం అన్నమాట.

vinod2

నిజానికి లోహాన్ని అనాగరిక యుగం మధ్య-దశలోనే మనిషి కనుగొన్నాడు. ఇది ఎగువ-దశ యొక్క బీజం. కానీ ఇనుము వంటి లోహాన్ని తనకి కావలసినట్టు కరిగించి మలచుకునే పరిజ్ఞానం సంపాదించడానికి మనిషికి అనేక వందల సంవత్సరాలు పట్టింది. ఈ కాలం అంతా ఆ రెండు దశల మధ్య పరివర్తనా కాలం అన్నమాట. లోహపు పనిముట్లు (కొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు వంటివి) రంగంలోకి రాకముందు మనుషులు రాతి పనిముట్లనే వాడేవారు. లోహపు పనిముట్లు రాతి పనిముట్ల కంటే ఉన్నతమైనవి (Better Technology). లోహపు పనిముట్లు రంగంలోకి వచ్చాక సహజంగానే రాతి పనిముట్ల వాడకం తగ్గుముఖం పడుతుంది. ఇది రాను రాను బాగా తగ్గిపోయి, కొన్ని పరిమితమయిన అవసరాలకి తప్ప మిగతా అన్నిటికీ లోహాన్నే వాడటం జరుగుతుంది. ఇలా మిగిలిపోవడాన్ని “అవశేషాలు” అంటాము. ఈ బొమ్మని జాగ్రత్తగా గమనించండి. మన “దేవుని లోహపు ఆయుధాల” ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

కొండ గుర్తు 2: అభివృద్ధి క్రమం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు.

మానవుడికి అనుభవం పెరుగుతున్నా కొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు, కల్పనలు చేస్తూ ఉంటాడు. పాత ఆవిష్కరణల నుంచి నేర్చుకున్న అనుభవంతో ఇంకొక ఉన్నతమైన ఆవిష్కరణ చేస్తాడు. ఈ క్రమం ఎప్పుడూ అభివృద్ధి వైపు ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు. ఉదాహరణకి క్రీ.పూ. 3500 లో బండి చక్రం కనిపెట్టారు. అంతకు ముందు కాలం అంతా చక్రాల వాహనాలు లేకుండానే గడిచిపోయింది. ఒకసారి చక్రాన్ని కనుగొని దాని ఉపయోగాలు అర్థమయ్యిన తర్వాత తిరిగి బండి చక్రం లేని సమాజంలోకి వెళ్ళడం అనేది ఏ పరిస్థితుల్లోనూ జరగదు. అలాగే నాగరికులుగా ఎదిగిన మనుషులు తిరిగి ఆటవికులుగా అవ్వడం అనేది జరగదు.

ఈ రెండు కొండ గుర్తులు బాగా గుర్తు పెట్టుకోండి. ఇవి మనకు తర్వాత బాగా ఉపయోగపడతాయి.

ఒక్కొక్క యుగానికి ఆ యుగంలోని మానవ జీవన పద్ధతులకు అవసరమైన, అనుగుణమైన ఆలోచనలు, ఆచారాలు, కుటుంబ వ్యవస్థలు, పాలనా వ్యవస్థలు తయారవుతాయి. యుగాలు పరివర్తన చెందుతున్నా కొద్దీ, మానవ అనుభవం పెరుగుతున్నా కొద్దీ ఈ ఆచారాలు, వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతూ వస్తాయి. పాత ఆచారాలు, వ్యవస్థలు బలహీనపడుతూ కొత్తవి బలపడుతూ వస్తాయి. అంతిమంగా మునుపటి యుగం నాటి అనేక విషయాలు సమాజంలో అవశేషాలుగా మిగిలిపోతాయి. కొంతకాలానికి పూర్తిగా అంతరించి పోతాయి. ఇదే సూత్రం ఈ మూడు యుగాలలోని అంతర్దశలకి కూడా వర్తిస్తుంది. ఒక ఉదాహరణతో చూస్తే బాగా అర్థమవుతుంది.

అనాగరిక యుగం ఎగువ-దశలో రాచరిక వ్యవస్థ (Feudal వ్యవస్థ) ఉద్భవించి, నాగరిక యుగం మధ్య-దశకి వచ్చేసరికి బాగా బలపడి ఉచ్ఛస్థితికి చేరింది (Table చూడండి). ఆ దశలలో ప్రజా పాలన అంతా రాజు కనుసన్నల్లో జరిగేది. ఆ రాచరిక వ్యవస్థకి ఉపయోగపడే చట్టాలు, ధర్మాలు అమలులో ఉండేవి. ఆ కాలంలో ఉన్న అన్ని కళలలో, కావ్యాలలో, ఆచారాలలో దాని ప్రభావం కనపడుతుంది. పురాణ ఇతిహాసాలు, జానపద కథలు అన్నీ సాధారణంగా రాజుల కథలే అయి ఉంటాయి. సరిగా గమనిస్తే, ఈ కథలు ప్రచారం చేసే ధర్మాలూ, విలువలూ అన్నీ రాచరిక వ్యవస్థని బలపరిచేవే. నాగరిక యుగం ఎగువ దశలో రాచరికాన్ని, దాని అరాచకాలని ఎదిరించి మానవ జాతి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలని నిర్మించుకున్నారు. నేడు రాచరిక వ్యవస్థ చాలా బలహీన పడింది. కానీ దాని అవశేషాలు ఇంకా సమాజంలో అంతరించలేదు. ఈనాటికీ అనేక దేశాలలో ఇంకా రాజులు పాలించడం గమనించవచ్చు. ప్రజాస్వామ్యం నిర్మించుకున్న మనలాంటి దేశాలలో కుడా కళలలోను, కథలలోనూ, ఇతిహాసాలలోను రాజుల గురించి, రాజ్యాల గురించి గొప్పగా చదువుకుంటూనే ఉన్నారు. ఇవి మధ్య-దశ యొక్క అవశేషాలు. ఇంకొంత కాలానికి ఈ అవశేషాలు కూడా అంతరిస్తాయి.

మానవ సమాజంలో వచ్చిన / వస్తున్న మార్పులన్నీ ఇలా క్రమానుగతంగా నెమ్మదిగా వచ్చిన మార్పులే. అన్ని మార్పుల వెనకా బలమయిన భౌతిక పరిస్థితుల పాత్ర మనకి కనపడుతుంది. ఏ మార్పూ గాలిలోంచి ఊడిపడదు. ఈ విషయాన్ని ముందు ముందు మరికొన్ని ఉదాహరణలతో చూస్తాము.

ఈ మొత్తం క్రమం లో మతం ఎప్పుడు పుట్టింది? మనుషుల సమాజం మారుతూ ఉంటే మతం లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి తెలిసిన మతాల కంటే పూర్వం ఎలాంటి మతాలు ఉండేవి? వాటి స్వరూపం ఎలా ఉండేది? వాటిలో దేవుడి రూపం ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకి సమాధానాలు వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*

తమిళతల్లి మేఖలాభరణం ‘మణిమేఖల’

 

 

– రాధ మండువ

~

photoతమిళ పంచకావ్యాలలో రెండవది ‘మణిమేఖల’. ఈ కావ్యాన్ని చేరదేశరాజైన చేరన్ చెంగట్టువన్ ఆస్థానకవి శీతలైశాత్తనార్ రచించాడు. ఈ కావ్యం క్రీ.శ రెండో శతాబ్దంలో రచింపబడినది. తమిళ పంచకావ్యాలలో మొదటిదైన ‘శిలప్పదిగారం’ కి ఈ మణిమేఖల కావ్యం పొడిగింపుగా చెప్పుకోవచ్చు. ఇది ఆ రోజుల్లోనే సంఘసంస్కరణని ప్రోత్సహించే దిశగా సాగిందనీ, సర్వమతాలూ ఒకటే అని చాటి చెప్పిందనీ అంటారు. అందుకే తమిళ పండితులు ఈ కావ్యాన్ని తమిళతల్లి నడుమున ధరించే మేఖలాభరణం (ఒడ్డాణం) గా అభివర్ణిస్తారుట.

తమిళ పంచకావ్యాల్లో మొదటిది సారంగ పాఠకులకి పరిచయం చేశాను. దానికి కొనసాగింపుగా ఉన్న ఈ కథని కూడా పరిచయం చేయాలనే అభిలాషతో దీన్ని క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. ఎమ్ ఎ తెలుగులో మా పాఠ్యాంశంగా ఉన్నదీ, నాకున్న తమిళ ఫ్రెండ్స్ ను అడిగీ, కొంత ఇంటర్నెట్ సాయంతోనూ ఈ కథని రాశాను. ఈ కథని తెలిసిన వారు వారి వారి అభిప్రాయాలనీ, ఇంకా ఇక్కడ తెలియచేయని విషయాలనూ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

కథాసంగ్రహం

1.

చోళ రాజ్యంలోని పూంపుహార్ పట్టణంలో కోవలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య కణ్ణగి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. చోళరాజు ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంద్రోత్సవాలలో మాధవి అనే వేశ్య నాట్యం చేసింది. అప్పుడు మాధవిని చూసిన కోవలుడు భార్యను పూర్తిగా విస్మరించి మాధవితో జీవించసాగాడు. మాధవి కూడా కోవలుడు అంటే ఎంతో ప్రేమగా ఉండేది. వారిద్దరికీ పుట్టిన పాపే మణిమేఖల. మాధవే లోకంగా జీవిస్తుండటంతో కోవలుడి వ్యాపారం పూర్తిగా నాశనమైంది. తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలతో సహా మాధవికి సమర్పించుకుని పేదవాడయ్యాడు. మాధవి అమ్మ చిత్రావతి కోవలుడిని వదిలించుకోవాలని అతన్ని నిందించడం, మాధవికి అతని మీద చెడు మాటలు చెప్పడం చేయసాగింది. ఫలితంగా – ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగింది.

భార్యని మోసం చేశాననే బాధతో, పాశ్చాత్తాప హృదయంతో మాధవిని వదిలి ఇంటికి చేరాడు కోవలుడు. పూలమ్ముకున్న చోట కట్టెలు కొట్టుకునే స్థితిలో ఉండలేక ధనం సంపాదించి తిరిగి తన ఊరికి రావాలని భార్యని తీసుకుని మధురైకి వెళ్ళాడు. అక్కడ దొంగతనం ఆరోపింపబడి హతుడయ్యాడు.

(చూడండి ఈ లింక్ )

కోవలుడు మరణించాడన్న వార్త విని మాధవి విపరీతమైన దు:ఖానికి లోనయింది. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తియై బౌద్ధ సన్యాసినిగా మారి తన బిడ్డ మణిమేఖలతో సహా ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

ఆ ఏడు చోళ రాజ్యంలో జరుగుతున్న ఇంద్రోత్సవంలో మాధవి పాల్గొనలేదని ఆమె తల్లి చిత్రావతికి అసంతృప్తిగా ఉంది. మాధవిని ఎలాగైనా మళ్ళీ వృత్తిలోనికి దించాలనే పన్నాగంతో “మాధవి నాట్యం చేయకపోవడం వలన పూహార్ పట్టణ ప్రజలంతా అసంతృప్తులై ఉన్నారని, దూషిస్తున్నారని తెలియచేసి మాధవిని పిలుచుకురా” అని మాధవి చెలికత్తె అయిన వసంతమాలని ఆశ్రమానికి పంపింది చిత్రావతి.

వసంతమాల ఆశ్రమానికి చేరి చిత్రావతి చెప్పమన్న మాటలు మాధవికి చెప్పింది. “కోవలుడు చనిపోయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మహాపతివ్రత అయిన మా అక్క కణ్ణగికి నేను చేసిన అన్యాయానికి ప్రతిఫలం ఇప్పటికే అనుభవిస్తున్నాను. ఈ మణిమేఖలని నా కూతురుగా కాదు. కణ్ణగి కూతురుగా పెంచదలచుకున్నాను. ఈ ఆశ్రమంలో ఉంటేనే అది సాధ్యం. ఇక్కడే బుద్దుడి పాదాలను ఆశ్రయించుకుని ఉంటామని, ఈ దు:ఖజలధిని దాటడానికి నాకిదే మార్గమని నా తల్లితో చెప్పు” అంది మాధవి ఏడుస్తూ.

అక్కడే కూర్చుని పూలమాలని కట్టుకుంటున్న మణిమేఖల తన తల్లి ఏడుస్తుంటే తనూ ఏడ్చింది. మాధవి మణిమేఖలని ఓదార్చింది. దు:ఖాన్నించి తేరుకున్న తర్వాత మాధవి మణిమేఖలను చూస్తూ “మన కన్నీటితో తడిచిన ఈ మాలని ఆ భగవంతుడికి సమర్పించరాదు. నువ్వు ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోసుకుని వచ్చి మరో మాల అల్లు” అంది.

మణిమేఖల ‘సరే’నని వెళుతుండగా ఆశ్రమంలో ఉండే సుతమతి అనే ఆవిడ “ఈ ఉత్సవాల సమయంలో యుక్తవయస్సుకి వచ్చినవారు ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళడం మంచిది కాదు. అలా వెళ్ళడం వల్ల నేను పూర్వ జీవితంలో చాలా దు:ఖానికి లోనయ్యాను. శీలాన్ని పోగొట్టుకున్నాను. నేను మణిమేఖలకి తోడుగా వెళతాను” అంది. మాధవి ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంది.

మణిమేఖల, సుతమతులిద్దరూ ‘బుద్ధుడి విగ్రహం ఉన్న ఉద్యానవనంలోకి వెళ్దామనీ, అదైతే సదా పుష్పాలతో అలరారుతుంటుంది కనుక త్వరగా పువ్వులు కోసుకుని రావొచ్చుననీ’ అనుకున్నారు.

వసంతోత్సవాల సందర్భంగా పట్టణంలో చేసిన ఏర్పాట్లను, ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజలను, గారడీ వాళ్ళు చేస్తున్న వివిధ విన్యాసాలను, వింతలను చూస్తూ ఇద్దరూ వీధిలో నడుస్తున్నారు. మణిమేఖలని గమనించిన ప్రజలు ఆమె అందానికి విస్తుపోయి నిలబడ్డారు. ఆమె ఎవరో తెలిసిన వారు ‘అయ్యో! ఇంత అందమైనదాన్ని, కోమలాంగిని తల్లి సన్యాసినిగా మార్చిందే’ అనుకోసాగారు. ఆ సమయంలో వీణని వాయించుకుంటున్న ఒకడు – కోవలుడుకి అతి సన్నిహితుడు మాధవిని చూసి “అయ్యో, కోవలా నీకు, నీ కూతురుకి ఎంత అన్యాయం జరిగిపోయింది?” అని ఏడవసాగాడు. ప్రజల మాటలని, ఆ ఏడుస్తున్న వాని బాధనీ విని తల మరింతగా భూమిలోకి దించుకుని నడిచి వెళ్ళసాగింది మణిమేఖల.

manimekalai-film

 

2.

ఉద్యానవనంలోని అందమైన పువ్వులను, పొదరిళ్ళను, మండపాలనూ చూస్తూ మణిమేఖల తన దు:ఖాన్ని మర్చిపోయింది. ప్రతి మొక్కనీ, పువ్వునీ పలకరిస్తూ సున్నితంగా కొన్ని పువ్వులని కోసుకుంది. వీళ్ళు ఉద్యానవనంలో ఉండగా బయట వీధిలో ఒక ఏనుగు – మావటి వాడికి కాని, సైనికులకి కాని లొంగకుండా – వీధుల్లో పరిగెత్తసాగింది. ప్రజలు భయకంపితులై అరుస్తూ పరిగెత్తుతున్నారు. విషయం తెలిసిన చోళరాజ కుమారుడైన ఉదయకుమారుడు తన రథంలో వేగంగా అక్కడకి వచ్చి ఏనుగుని అదుపులోకి తెచ్చాడు. ప్రజలందరూ జయజయధ్వానాలు చేస్తూ అతన్ని వీధుల్లో ఊరేగించారు. ఆ సమయంలో అక్కడ వీణని చేతిలో పట్టుకుని ఏడుస్తున్న కోవలుడి సన్నిహితుడిని చూసిన ఉదయుడు అతడిని దగ్గరకి పిలిచి అతని దు:ఖానికి కారణమేమిటని అడిగాడు.

“ఇప్పుడే ఈ వీధిలో నడిచి ఉద్యానవనానికి వెళుతున్న మణిమేఖలని చూశాను. ఆమె పరిస్థితిని చూసీ, నా స్నేహితుడు కోవలుడు గుర్తుకు వచ్చీ బాధతో ఏడుస్తున్నాను” అన్నాడు.

అది విన్న ఉదయకుమారుడు “మణిమేఖల ఆశ్రమం నుండి బయటకి వచ్చి ఈ దారిలో వెళ్ళిందా?” అని అత్రంగా అడిగాడు. ఇంతకు పూర్వమే ఉదయకుమారుడు ఆమెని చూశాడు. ఆమె సౌందర్యానికి దాసోహుడై ఆమెనే వివాహమాడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ‘ఔనంటూ’ వీణాధరుడు చెప్పింది విన్న ఉదయుడు ఆమెని ఇప్పుడు తనతో రాజమందిరానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం కలిగిందన్న సంతోషంతో తన రథాన్నెక్కి వాయువేగంతో ఉద్యానవనం వైపుకి సాగిపోయాడు.

అతడిని దూరం నుంచే గమనించిన మణిమేఖల సుతమతితో “ఉదయకుమారుడు నాపై ఆశలు పెట్టుకున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా! ఆశ్రమంలో ఉన్న నన్ను అతను చేరలేడు కాని ఇప్పుడు ఇక్కడ అతను నన్నేమైనా చేయగలడు. నేనిప్పుడు అతన్నించి తప్పించుకునే మార్గమేమిటో చెప్పి పుణ్యం కట్టుకో” అంది ఆందోళన పడుతూ.

వెంటనే సుతమతి ఆమెని ఉద్యానవనంలో ఉన్న బలిమండపం లోపల ఉంచి బయట తాళం వేసి ఏమీ తెలియనట్లు పువ్వులు కోయసాగింది. రథాన్ని బయట నిలిపి లోపలికొచ్చిన ఉదయుడు సుతమతితో “ఇక్కడకి మణిమేఖల వచ్చిందని విన్నాను, ఆమె ఎక్కడ ఉందో దయచేసి చెప్పు. ఆమెని వివాహమాడాలని తపించిపోతున్నాను. దయతో ఆమెని నాకు చూపించు” అని వేడుకున్నాడు.

“రాజకుమారా, ఆశ్రమవాసియైన మణిమేఖల నిన్ను చూడదు. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో” అంది.

అతను ఆమె మాటలను పట్టించుకోకుండా ఉద్యానవనం అంతా వెతుకుతూనే ఉన్నాడు. బలిమండపంలో ఉందేమోనన్న అనుమానంతో లోపల ప్రవేశించాలని ప్రయత్నించాడు కాని వెళ్ళే మార్గం తోచక మండపం చుట్టూ తిరగసాగాడు. ఇదంతా గమనిస్తున్న మణిమేఖల భయంతో మండపం లోపల స్పృహ తప్పి పడిపోయింది.

సుతమతి అతన్ని చేరి “ఉదయకుమారా, నీకు చెప్పేంతటి దాన్ని కాదు. మణిమేఖల తపశ్శక్తి సంపన్నురాలు. నిన్ను శపించగల సమర్థురాలు కూడా… ఆడదానికి ఇష్టం లేకుండా బలాత్కరించరాదు. ఆ సాహసం చేయడం కరికాళచోళుని వంశస్థుడివైన నీకు తగదు. దయచేసి నీ మనసు మార్చుకుని ఇక్కడ నుండి తక్షణమే బయటకి వెళ్ళు” అంది.

ఉదయకుమారుడికి ఆమె చెప్పిందేమీ తలకెక్కలేదు.

మణిమేఖలని ఎలాగైనా చూడాలనే మోహంతో ఉన్న ఉదయకుమారుడు సుతమతిని మాటల్లో పెట్టి మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలనుకుని “నువ్వు ఇంతకు ముందు జైన ఆశ్రమంలో ఉండేదానివి కదా! ఇప్పుడు బౌద్ధ ఆశ్రమానికి చేరావా? నీవెవరు? నీ వృత్తాంతమేమిటి?” అని అడిగాడు.

 

“ఉదయకుమారా, నా తల్లి చనిపోగానే నా తండ్రి నిత్యమూ వ్రతాలు చేస్తూ ఆశ్రమజీవితం గడిపేవాడు. ఒకసారి ఆయన పువ్వులు తెమ్మని నన్ను ఉద్యానవనానికి పంపాడు. విద్యాధరుడు అనేవాడు నన్ను చూసి మోహించి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు నన్ను అతని వద్ద ఉంచుకుని తర్వాత ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోయానో తెలియని మా నాన్న నన్ను వెతుకుతూ దేశాలు తిరగసాగాడు. చివరికి ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడానికి వచ్చి నన్ను చూసి నా వద్దకు పరుగున వచ్చాడు. ఇద్దరం జైన సంఘంలో ఉండసాగాం. అయితే ఒకరోజు ఒక ఎద్దు మా నాన్నని కడుపులో కుమ్మింది. స్పృహ కోల్పోయిన మా నాన్నని కాపాడమని జైన సంఘంలో ఉన్న వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమీ సహాయం చేయలేకపోయారు. అప్పుడు అదే దారిలో వెళుతూ మా దీనస్థితిని చూసిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మల్ని తన ఆశ్రమానికి చేర్చాడు. నాన్న ప్రాణాలని కాపాడాడు. ఆ విధంగా బౌద్ధ ఆశ్రమానికి చేరుకున్నాం” అంది.

తన మాటలు అన్యచిత్తుడై వింటూ బలిమండపం వైపే చూస్తున్న ఉదయునితో సుతమతి “దయచేసి నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో యువరాజా!” అంది. చెప్పిందే చెప్తూ అక్కడ నుండి తరుముతున్న సుతమతిని విసుగ్గా చూస్తూ “చిత్రావతి సహాయంతో మణిమేఖలని నా మందిరానికి రప్పించుకోనిదే నేను నిద్రపోను” అంటూ శపధం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఉదయుడు.

అప్పటికి బాగా చీకట్లు అలుముకున్నాయి. ఆ రాత్రికి అక్కడే నిద్రించి ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్ళాలనుకుని ఇద్దరూ బలిమండపంలోని బుద్ధుని విగ్రహానికి దగ్గరగా కూర్చున్నారు. “నాకు కూడా ఉదయకుమారునిపై మనస్సు పోతోంది. అతను ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్నా నాకు అతనిపై కోపం రావడం లేదు. నా హృదయంలో ఈ కోరిక నశించిపోవుగాక” అని మణిమేఖల బుద్ధునికి నమస్కరిస్తూ వేడుకుంది.

ఆ సమయంలో ఇంద్రోత్సవాలు చూడటానికని వచ్చిన ‘మణిమేఖలాదైవం’ (మాధవి, కోవలులు ఈ దేవత పేరే పెట్టుకున్నారు మణిమేఖలకి) తాపసి రూపంలో బలిమండపంలోకి వచ్చింది. బుద్ధునికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న సుతమతిని, మణిమేఖలని చూస్తూ “ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు?” అని అడిగింది. జరిగింది తెలుసుకుని “ఉదయకుమారుడు పోయిన జన్మలో నీకు భర్త. అప్పుడతని పేరు రాహులుడు. ఒకసారి మీ ఇద్దరూ ఉద్యానవనంలో ఉన్నారు. అతని పట్ల నువ్వు కోపంగా ఉన్నావు. రాహులుడు నిన్ను సముదాయిస్తూ నిన్ను కోపాన్ని వీడమని బ్రతిమాలుతున్నాడు. ఆ సమయంలో సాధుచక్రి అనే బౌద్ధబిక్షువు అక్కడకి వచ్చాడు. అతన్ని చూసి నువ్వు లేచి నమస్కరించావు కాని రాహులుడు అతన్ని విసుక్కున్నాడు.

ఆ తర్వాత నువ్వు ‘అలా కోప్పడకూడదు, పూజ్యులకి నమస్కరించాలి’ అని రాహులుడికి చెప్పావు అతను ఇష్టం లేకుండా, తప్పదన్నట్లు అతనికి అతిథి సత్కారం చేశాడు. ఆ రోజు ఆ బౌద్ధ బిక్షువుకి ఇచ్చిన ఆతిథ్యపుణ్యమే ఈ జన్మలో నువ్వు ఇలా బౌద్ధ ఆశ్రమవాసినిగా మారడానికి కారణం. లోకంలో ఉన్న దీనులకి నువ్వు ఆకలి బాధ తీర్చాల్సి ఉంది. నిన్ను మణిపల్లవంలోని బౌద్ధపీఠానికి చేరుస్తాను. అక్కడ నీకు అక్షయపాత్ర లభిస్తుంది. దానితో ప్రజల ఆకలి బాధను పోగొడుదువుగాని. నీకు పూర్వజన్మలో అక్కచెల్లెళ్ళు తారై, వీరై అని పేర్లు గల వారు – వాళ్ళే ఇప్పుడు మాధవి, సుతమతులు. వాళ్ళు ఈ జన్మలో కూడా నీ వెన్నంటే ఉండి ప్రజలకి సేవ చేసి తరిస్తారు” అంది.

 

తర్వాత సుతమతితో “మణిమేఖలని నేను మణిపల్లవం దీవిలో ఉన్న బౌద్ధపీఠానికి తీసుకువెళుతున్నాను. నువ్వెళ్ళి మాధవికి విషయం తెలియచేయి” అని ఆ దైవం సుతమతికి చెప్పి మణిమేఖలని తీసుకుని వెళ్ళిపోయింది.

మణిమేఖలని అక్కడ వదిలి “మణిమేఖలా, ఉదయకుమారుడు పోయిన జన్మలో నీ భర్త కనుక ఈ జన్మలో కూడా వ్యామోహాన్ని పెంచుకున్నాడు. నీ మనసు కూడా అతని పట్ల ఆకర్షణకి లోనవ్వడానికి కారణం అదే. నీలోని ఆ మోహం నశించడానికే నిన్ను ఇక్కడకి తీసుకువచ్చి బుద్ధభగవానుని పాదపీఠికను చూపించాను. నీ చేతికి అక్షయపాత్ర రాగానే నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. ఆశ్రమంలో ఉన్న అరవణముని నువ్వు తర్వాత చేయవలసిన విధులని తెలియచేస్తాడు” అని చెప్పి “అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడకి కావాలంటే అక్కడకి ఆకాశమార్గాన వెళ్ళవచ్చు, ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించవచ్చు” అంటూ మణిమేఖలకు ఆ శక్తులని ప్రసాదించింది.

ఆ తర్వాత మణిమేఖలాదైవం నేరుగా ఉదయకుమారుని దగ్గరకి వచ్చి “రాజకుమారా, రాజులు ధర్మమార్గాన ప్రవర్తించాలి. తపోదీక్షని స్వీకరించిన మణిమేఖల పట్ల వ్యామోహం పెంచుకుని ఆమెని బలవంతపెట్టడం నీకు మంచిది కాదు. ఆమె మీదున్న మోహాన్ని విడనాడు” అని చెప్పింది.

 

3.

 

మణిపల్లవంలో మణిమేఖల బుద్ధుని పాదపీఠానికి ప్రదక్షిణం చేస్తుండగానే ఆమె చేతికి అక్షయపాత్ర వచ్చింది. అది తీసుకుని ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆమెని చూసి మాధవి, సుతమతులు సంతోషించారు. అందరూ కలిసి ఆ పాత్రని తీసుకుని అరవణమునీశ్వరుల దగ్గరకి వెళ్ళారు. మణిమేఖల జరిగినదంతా మునీశ్వరునికి చెప్పింది.

ఆయన “మణిమేఖలా! దేశంలోని అనాథలకు, వృద్ధులకి – ఆకలిగొన్న ప్రతివారికీ ఈ అక్షయపాత్ర ద్వారా ఆకలి తీర్చగలవు. ఈ అక్షయపాత్ర నీకు అందించిన అపుత్రుడు అనే వాని గురించి చెప్తాను విను……

కాశీ నగరంలో అభంజికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాలి. భర్తకు తెలియకుండా తన ప్రియునితో కలవడం వల్ల గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక ఆమెలో పాశ్చాత్తాపం కలిగింది. భర్తకి ద్రోహం చేశాననే బాధతో ఇక అతని ముఖం చూడలేక, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక కన్యాకుమారి వైపు సాగిపోయింది. సముద్రతీరాన మగబిడ్డను ప్రసవించి ఆ బిడ్డని కనికరం అన్నా లేకుండా అక్కడే వదిలి ఎటో వెళ్ళిపోయింది.

ఏడుస్తున్న ఆ బిడ్డని చూసి ఓ ఆవు తన పొదుగునుండి పాలని స్రవించి ఆ బిడ్డడికి తాపించింది. అలా ఏడు రోజులపాటు ఆ బిడ్డని కాపాడింది. ఏడో రోజు అటు వైపుగా వెళుతున్న ఓ బ్రాహ్మణుడు ఏడుస్తున్న శిశువునీ, ఆ శిశువుకి పాలిస్తున్న ఆవును చూశాడు. ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళి ‘అపుత్రుడు’ అని పిలిచి, పెంచుకుని అన్ని వేదశాస్త్రాలలోనూ శిక్షణ ఇప్పించాడు.

ఒకరోజు అపుత్రుడు ఒక యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞానికి బలి ఇవ్వాలని వథశాలలో ఒక ఆవుని కట్టేసి ఉంచారు. ఆ ఆవు దయనీయంగా జాలికొలిపేట్లు అరుస్తోంది. అపుత్రుడు ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా వచ్చి ఆవుని విప్పి బయటకి తోలాడు. యజ్ఞశాల కాపలాదారులది చూసి అపుత్రుడిని పట్టుకుని బంధించారు. ‘నోరులేని పశువులను, అందునా కమ్మని పాలిచ్చే ఆవుని వధించడం ఎందుకు? దేవుడు తను పుట్టించిన బిడ్డలని తనకి బలివ్వమని ఎప్పటికీ కోరడు’ అన్నాడు అపుత్రుడు.

అందరూ అతని మాటలని గేలి చేశారు. ఇంతలో గుంపులో ఉన్న ఒకడు ‘ఈ అపుత్రుడు ఎవరో నాకు తెలుసు. శీలాన్ని కోల్పోయిన శాలి కొడుకు. ఇతను హీనుడు. హీనజాతికి చెందినవాడు. ఇతన్ని ఊళ్ళోంచే గెంటి వేయండి’ అన్నాడు.

ఆ మాటలు విన్న అపుత్రుడు ‘మీ కులం ఏమిటో, మీ కులాల పుట్టుక ఏమిటో మీకు తెలుసా? మూలాలు తోడితే అందరూ హీనజాతికి చెందినవారే, అందరూ ఉన్నతజాతికి చెందినవారే’ అన్నాడు. అక్కడున్న అందరికీ – ఆఖరికి అతన్ని పెంచుకున్నబ్రాహ్మణుడికి కూడా అపుత్రుడి వైఖరికి కోపం వచ్చింది.

అపుత్రుడు ఇక ఆ దేశాన్ని వదిలి మధురైకి చేరుకున్నాడు. అక్కడ బిక్షమెత్తుకుని తను తిని మిగిలినది చింతాదేవి ఆలయప్రాంతాల్లో ఉన్న గుడ్డివారికీ, నడవలేని వారికీ, వృద్ధులకి పంచేవాడు. ఆ ఆలయంలోనే నిద్రించేవాడు.

ఆ సమయంలో దేశం అంతా క్షామం వచ్చింది. తిండిలేక జనం అల్లల్లాడిపోతున్నారు. ఒకరోజు కొందరు బిక్షకుల గుంపు ఆకలికి తాళలేక అపుత్రుడున్న చింతాదేవి ఆలయానికి వచ్చి తమ ఆకలి తీర్చమని అడిగారు. ఏమీ చేయలేక ఆవేదనతో చింతాదేవి ముందుకి వెళ్ళి ఆపద గట్టెక్కించమని ఆమెని వేడుకున్నాడు. చింతాదేవి ప్రత్యక్షమై అతనికి ఒక బిక్షాపాత్రని ఇచ్చి ‘దీనితో అందరి ఆకలీ తీర్చు. ఇది ఎంతమంది ఆకలినైనా తీరుస్తుంది. ఎప్పటికీ వట్టిపోదు. క్షామం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించు’ అంది.

అప్పటి నుండి క్షామం పోయేంతవరకూ అపుత్రుడు ఎంతో మంది ఆకలి తీర్చాడు. తర్వాత దాన్ని మణిపల్లవంలో ఉంచాడు. అదే ఈ అక్షయపాత్ర” అని చెప్పి “మణిమేఖలా! నీ పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఇది నీ చేతికి వచ్చింది. నువ్వు కూడా ఈ పాత్ర సహాయంతో అన్నార్తులకి సహాయం చెయ్యి. ముందుగా ఎవరైనా సాధుగుణం కలిగిన స్తీ్ర చేతితో ఈ అక్షయపాత్రలో బిక్షని స్వీకరించు. తర్వాత దానిలోకి బిక్ష వస్తూనే ఉంటుంది” అన్నాడు అరవణుడు.

అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న కాయచండిక అనే ఆమె తనకి అలాంటి సాధుగుణం కలిగిన స్తీ్ర తెలుసని ఆమె పేరు అదిరై అని చెప్పింది.

ఈ కాయచండిక కంచి నగరానికి చెందినది. ఆమె భర్త పేరు కాంచనుడు. కాయచండిక ఒకసారి పొదిగై పర్వతప్రాంతాల్లో ఉన్న మునిపుంగవులని గేలి చేసి ‘ఎల్లప్పుడూ ఆకలితో బాధపడాలన్న’ శాపానికి గురై దేశాల వెంట తిరుగుతున్నది. అదిరై దగ్గర బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ పూంపుహార్ పట్టణంలో నివసిస్తోంది.

కాయచండికతో కలిసి మణిమేఖల అదిరై దగ్గరకి వెళ్ళి మొదటి బిక్ష స్వీకరించింది. అప్పటి నుండీ కాయచండిక మణిమేఖల వెన్నంటే ఉంటూ బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకున్నది. కొన్నాళ్ళు మణిమేఖల వెన్నంటే ఉండి ప్రజలందరికీ మణిమేఖల దగ్గరున్న మహాన్వితమైన అక్షయపాత్ర గురించి చెప్పింది. తర్వాత తపోధారియై వింధ్యపర్వతాలకి ప్రయాణమై వెళ్ళిపోయింది కాయచండిక.

Manimekalai_Indian_epic

4.

మాధవి, మణిమేఖలలు పూర్తి సాధువులుగా మారి చింతాదేవి ఆలయ ప్రాంతంలో ఉన్నారని, అక్షయపాత్రతో అందరికీ భోజనం పెడుతున్నారని తెలుసుకున్న చిత్రావతి దిగులు చెందింది. ఎలాగైనా వారిద్దరినీ ఇంటికి రప్పించి తమ పూర్వ వైభవాన్ని పొందాలనే తపనతో ఉదయకుమారుడిని కలుసుకుని విషయం చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉదయకుమారుడు చిత్రావతికి అనేక బహుమతులు ఇచ్చి మండపానికి వెళ్ళాడు. మణిమేఖలని కలుసుకుని ఆమెని అనేక విధాలుగా బలవంతపెట్టాడు. ఆమె అతనికి ఎంత చెప్పినా వినకుండా లాక్కుపోవడానికి యత్నించసాగాడు. ఆమె అతన్నించి తప్పించుకుని ఆలయంలోకి పరిగెత్తింది. సాయంత్రం వరకూ ఆమె కోసం ఆలయం బయటే వేచి ఉండి ఇక ఏమీ చేయలేక ‘తర్వాత రోజు వస్తాననీ, మనసు మార్చుకోమనీ’ చెప్తూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు నగరంలో చెరసాలలో ఉన్న వాళ్ళు ఆకలికి అలమటిస్తున్నారని తెలిసి మణిమేఖల చెరసాలకి ప్రయాణమైంది. అయితే ఉదయకుమారుడు ఆమెని చూస్తే వెంబడిస్తాడని తెలుసు కనుక కాయచండికలాగా రూపం మార్చుకుని నగరంలోకి వెళ్ళింది. చెరసాలలో ఉన్న వారితో మాట్లాడుతూ వాళ్ళ బాధలని వింటూ వాళ్ళకి అన్నం పెట్టింది. రాజు దగ్గరకి వెళ్ళి చెరసాలని ధర్మశాలగా మార్చమని కోరింది. ఆమె మృదుమధురమైన మాటలకి రాజుగారు ఎదురు చెప్పలేక ఆమె కోరిక ప్రకారం చెరసాలని ధర్మశాలగా మార్చారు.

ప్రతిరోజూ ఇలా ఏదో ఒక సమయంలో ఆమె కాయచండిక రూపంతో చెరసాలకి వెళ్ళి అక్కడున్న వారికి భోజనం వడ్డించసాగింది. మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలని కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల దగ్గరకి వచ్చి మాట్లాడుతున్నాడు ఉదయకుమారుడు. ఆమె అతనికి మంచి మాటలు బోధిస్తున్నది. ఆ సమయంలో కాయచండిక భర్త కాంచనుడు భార్యని వెతుక్కుంటూ అక్కడకి వచ్చి వారిని చూశాడు.

ఉదయకుమారుడితో ప్రేమగా మాట్లాడుతున్న మణిమేఖలని కాయచండికే అనుకున్నాడు. ‘ఆమెకి ఉదయకుమారుడితో మాటలేల? ఈతనితో ఏదో సంబంధం పెట్టుకున్నట్లుంది. అందువల్లనే శాపం తీరినా నా వద్దకు రాలేదు’ అనుకుని ఆమెని నిందించసాగాడు. కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల కాంచనుడితో “నువ్వు చింతాదేవి ఆలయానికి వెళ్ళు అక్కడ నీకు అన్ని విషయాలూ అవగతమవుతాయి, ఇప్పుడేమీ మాట్లాడవద్దు” అని చెప్పి పంపింది. మళ్ళీ ఉదయకుమారుని దగ్గరకి వెళ్ళి ‘ఈ భవబంధాలు అశాశ్వతమైనవనీ, మణిమేఖల పట్ల మోహాన్ని వదులుకోమనీ’ చెప్పింది.

ఆమె మాట్లాడుతుందేమిటో వినపడక అతనితో ఏదో గుసగుసలాడుతుందని భావించి కోపంగా చూస్తూ కాంచనుడు వెళ్ళిపోయాడు. కాసేపటికి మణిమేఖల కూడా మండపానికి చేరింది. ఆమె వెనుకనే దూరంగా వస్తున్న ఉదయకుమారుడిని గమనించి ఏం జరగబోతుందో చూడాలని కాంచనుడు ఆలయం బయట స్తంభం ప్రక్కన దాక్కున్నాడు. మోహోద్రిక్తుడైన ఉదయుడు మణిమేఖల కోసం కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖలని ఆమెకి తెలియకుండా దూరంగా అనుసరిస్తూ మండపానికి వచ్చాడు. చాటునుండి అంతా గమనిస్తున్న కాంచనుడు తన భార్య కోసమే ఈ చీకట్లో కూడా వచ్చాడని ఉదయకుమారుడి మీదకి దూకి తన కరవాలంతో అతని తలని నరికివేశాడు.

కాయచండిక రూపాన్ని వదిలేసి బయటకి వచ్చిన మణిమేఖల ఉదయుడి మృతదేహాన్ని చూసి ఏడుస్తూ ‘కాయచండిక రూపంలో ఉన్నది తనేనని, తొందరపాటుతో ఉదయకుమారుడిని చంపి మహాపాపం చేసావని’ కాంచనుడితో అంది. కొన్ని నెలల క్రితమే కాయచండిక వింధ్యపర్వతాలకి వెళ్ళిందని చెప్పింది. చేసిన పనికి కుమిలిపోతూ కాంచనుడు అక్కడ నుండి వింధ్యపర్వతాల వైపు సాగిపోయాడు.

తన బిడ్డ ఉదయకుమారుడిని చంపేసింది మణిమేఖలేనని తలచి రాజుగారు మణిమేఖలని బంధించి చెరసాలలో వేశారు. అరవణస్వామిని, సుతమతిని వెంటబెట్టుకుని మాధవి అంత:పురానికి వెళ్ళి రాణికి జరిగినదంతా చెప్పింది. అరవణులకి నమస్కరించిన మహారాణి మణిమేఖల తప్పేమీ లేదని తెలుసుకుని ఆమెని బంధవిముక్తురాలిని చేసింది.

ఆశ్రమానికి చేరిన మణిమేఖల “రాకుమారుని చంపిన స్తీ్ర’ అని నన్ను ఇక్కడ జనులు నిందిస్తూనే ఉంటారు. నేను వంజి నగరానికి వెళ్ళి కణ్ణగి అమ్మకి సేవ చేసుకుంటాను, వెళ్ళడానికి అనుమతినివ్వండి” అంది. వారు ముగ్గురూ ఆమెకి దు:ఖంతో వీడ్కోలు పలికారు.

వంజి నగరానికి చేరిన మణిమేఖల కణ్ణగి దేవాలయంలోనే ఉంటూ ఆ నగరంలోని వివిధ మతాచార్యులని కలుసుకుని అన్ని మతాలలోని సారాన్ని గ్రహించింది. అన్ని మతాలూ ఒకటే అని తెలుసుకుంది. అదే అందరికీ బోధిస్తూ తన అక్షయ పాత్రతో అన్నార్తుల క్షుద్బాధని తీరుస్తూ గడపసాగింది.

మణిపల్లవంలో ఉన్నట్లుగానే వంజి నగరంలో కూడా బుద్ధభగవానుని పాదపీఠికను, చుట్టూ దేవాలయాన్నీ నిర్మించింది. బుద్ధభగవానుని దయ వల్ల మణిమేఖల జనన మరణాల రహస్యాన్ని గ్రహించుకుని తపోదీక్షలో లీనమైంది.

కొన్నాళ్ళకి మాధవి, సుతమతులు, అరవణమునులు – ముగ్గురూ మణిమేఖల దగ్గరకి చేరుకున్నారు. ఆమె వారిని సంతోషంగా స్వాగతించి వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చింది. ఆ తర్వాత ఆమె తన జీవితమంతా బౌద్ధధర్మాలను బోధిస్తూ జీవితాన్ని ధన్యతగావించుకుని ముక్తినొందింది.

 

*****

 

 

 

 

 

ఒక్కో అక్షరానికి ఓ నెత్తుటి బొట్టూ ఇచ్చి…

02

– డా.పి.బి.డి.వి.ప్రసాద్ 

~

 

                      వృద్ధజగతి సమాధిపై సమధర్మం ప్రభవించును

                       నిద్దుల చీకటి వెలుపల వేకువ మెళకువ పుట్టును   

                                                                                                                                                    – ఆవంత్స సోమసుందర్

 

నిన్నటికి నిన్న ప్రసాదమూర్తి కవిత్వానికి ఆవంత్స సోమసుందర్ పురస్కారం లభించటం కవిత్వాభిమానులందరికీ సంతోషం కలిగించిన విషయం. శారీరకంగా దాదాపు తొంభై సంవత్సరాలు పైబడిన పితామహుడు, అనేకానేక కవిత్వ పంథాలధిగమించిన సాహితీ పరిణిత మనస్కుడు. మడిగట్టుకుని కూర్చుని పక్వాన్నాలు మాత్రమే భుజింపక కాలంతో నడిచిన సాహిత్య యుక్త వయస్కుడు శ్రీ ఆవంత్స .  ‘పూలండోయ్ పూలు’ ఆయన వయస్సును తగ్గించేసింది. మైమరచిపోయి త్రుళ్ళింతలతో కేరింతలతో ఆ సాహిత్య విహారం చేసి, సమీక్ష పేరిట ఏరిన పూలతో పెద్ద దండే కట్టేసి ప్రసాద మూర్తిని, కవిత్వాన్ని పాఠకులతో కలిపి అలంకరించాడాయన. ఈ పురస్కారంతో చక్కటి చిక్కటి కవిత్వాన్ని వర్థిల్లమని ఓ పెద్ద మనసు దీవించినట్లయ్యింది. కవిత్వానికి ప్రసాదమూర్తి పుష్పాభిషేకం చేస్తే, అదే కవిత్వానికి నేటికి నేడు 2015కి  ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం ప్రకటించటం సాహిత్యానికి మూర్దాభిషేకం చేసినట్లయ్యింది.

‘పూలండోయ్ పూలు’ ప్రసాదమూర్తి నాలుగో కవితాసంపుటి. వీటికన్నా ముందు ప్రసాదమూర్తి పద్యకవి. సాహిత్యాభిమానంతోనే ఓరియంటల్ కాలేజీలో చేరిన వాడవ్వటం చేతనూ, సంస్కృతాంధ్ర ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేయడంతోనూ చదువుకుంటున్న రాయప్రోలు, కృష్ణశాస్త్రి, శేషేంద్ర, జాషువ, కరుణశ్రీ ల ప్రభావంతో, భావ కవితా పోకడలతో పుంఖానుపుంఖాలుగా పద్యాలు, ప్రేయసీ శతకాలు మోజుకొద్దీ అవధానాలు చేస్తున్న వాణ్ణి శ్రీశ్రీ కవిత్వం..వామపక్ష భావజాలం పూర్తిగా మార్చేసింది. బాల్య స్నేహితుడు  కూనపరాజు కుమార్ పరిచయంతో విశ్వసాహిత్యపు వినువీధుల్లో విహరించే అదృష్టం దక్కింది.  శ్రీశ్రీని చలాన్ని వామపక్షాలను అభిమానంగా చూస్తూ చదువంటే ఆసక్తి చూపని అమ్మానాన్నలకు సర్ది చెప్పి ఆంధ్రా యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. విశాఖ సౌందర్యం కవిత్వ పిపాసను మరింత పెంచింది.

విశాఖ సముద్రం, విశ్వవిద్యాలయంలో గుబురుగా పెరిగిన జీడిమామిడి చెట్లు, రాకాసి లైబ్రరీ, విశాలంధ్ర పుస్తకాలు, అత్తలూరు మాస్టారు, శిఖామణి, గాలినాసరరెడ్డి, రాజేశ్వరి, పిబిడివి ప్రసాద్, జగధాత్రి లాంటి సాహిత్య ప్రేమికుల సావాసాలు విశాఖలోనూ, కేంపస్ లోనూ చాలా తరచుగా కనపడే కారామాస్టారు, రావిశాస్త్రి, చందూగార్లు, ప్రక్కనే భీమిలి బీచ్ లో తడియారని చలం అడుగుజాడలు, యారాడ కొండ లైట్ హౌస్ వెలుగులు, మహారాణిపేట హాస్టల్ డౌన్ లో బీట్లు, శిఖామణి ప్రమూలను ఎంత శాసించాయో, ఏమి ఆశించాయో, మరేది ఆదేశించాయో తెలియదు గాని వీళ్ళిద్దరు కవిత్వాన్నే శ్వాసించటం మొదలుపెట్టారు. చిన్నాచితకా పత్రికలతో పాటు భారతి పత్రికలో చోటు సంపాదించారు.

భావజాలాన్ని కలానికి మాత్రమే పట్టించక తలకు కూడ ఎక్కించుకున్నవాడు కనుక ప్రసాదమూర్తి ఈ మధ్య కాలంలో బాగానే యుద్ధం చేశాడు. ఎంతో మందిని ఎదుర్కొని రాజేశ్వరిని కులాంతర వివాహం చేసుకోవటం. బీహార్ ప్రవాసాంధ్రోద్యోగ జీవితం గడపటం మార్క్సిజం కన్నా లోతైన అంబేద్కరిజం వైపు వచ్చి దళితవాదపు జండాను సమర్థిస్తూ ఎగరేయటం ఈ హీరోయిజాలన్నీ ప్రసాదమూర్తిలోని సహజాతమైన కవిత్వాన్ని సిద్ధాంత నిబిడీకృతం చేశాయి.

ఈ సందర్భంలో తాతకోనూలు పోగు కవిత గురించి చెప్పుకోవాలి. పత్రికలో ప్రచురితమైన ఈ కవిత ఎంతో మంది సాహిత్య విమర్శకుల నాకట్టుకొంది.  తెలుగు సాహిత్యంలో దళితవాద స్త్రీవాద అల్పసంఖ్యాక బహుజన వర్గాల సంఘర్షణల  అంతస్సూత్రాన్ని తీసుకుని, కవిత్వ వర్ణాలు అద్ది, కలనేసి, పడుగుపేకల మధ్య తల్లడిల్లతూ, గోతుల మధ్య మగ్గుతున్న తరాల నాటి దైన్యానికి కప్పిన వస్త్రం ప్రసాదమూర్తి తొలి కవితా సంపుటి కలనేత. అది 1999లో వచ్చింది.

DSC_0593

గుండెకి ఒక కొస నిప్పంటించుకుని

ఒక అక్షరానికి ఓ కన్నీటిచుక్క

ఒక అక్షరానికి ఓ నెత్తుటి బొట్టూ ఇచ్చి – ఒక వేదనగా మొదలై ప్రశ్నిస్తూ, సమాయత్తం చేస్తూ సమైక్య పరుస్తూ  కవిత్వపు రెపరెపలతో కలనేత వర్ణాలు ద్విగుణీకృతమయ్యాయి. సినారె, గోపి, శివారెడ్డి మొదలైన ప్రముఖుల ప్రశంసలే కాదు ఎందరో సాహితీ హితులను కలనేత ప్రసాదమూర్తికి సంపాదించిపెట్టింది.

తర్వాత ప్రమూ రెండో కవితా సంపుటి వెలువడటానికి మధ్య గల అంతరంలో మరో సంపుటి వచ్చి ఉండాల్సింది అని శివారెడ్డిగారు లాంటి కవులూ కవిత్వాభిమానులు అభిప్రాయపడినా, ఈ సమయంలో దళితవాద దృక్పథంతో వచ్చిన సాహిత్యాధ్యయనం చేసి దళిత కవిత్వం  మీద సిద్ధాంత గ్రంథం రాసి డాక్టరేట్ అందుకోవటం విశేషం. కారంచేడు ఘటన తర్వాత సుమారు పదేళ్ళు తెలుగునాట భూకంపం పుట్టించిన దళిత కవిత్వం మీద ప్రసాదమూర్తి రాసిన సిద్ధాంత గ్రంథం త్వరలో పుస్తక రూపంలో రాబోతోంది.

అధ్యయన అధ్యాపకత్వాల వ్యాపకత్వంతో అంతరాయాలేర్పడుతున్నప్పటికినీ, తన కవితా చలమల నుండి పెల్లుబుకుతున్న కవనధారలను కట్టడి చేసుకుంటూ కొంతకాలం పత్రికలకే పరిమితమైనా.. నిదానంగా మెత్తగా బత్తాయిపండు తొనలు విప్పినట్లు కవిత్వమూటని విప్పి వెలుగే కాని చీకటి లేని మాటలతో మాట్లాడుకోవాలన్నాడు.

అట్లా ఆవిష్కరించిన ‘మాట్లాడుకోవాలి’ కవిత్వం మాట్లాడుతూనే అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోతూ మనిషి మనిషికి మధ్య విస్తరించిన కారడవిలాంటి మౌనాన్ని చేధించింది. అగ్రరాజ్యాల నుండి సగటు మనిషి హృదయ సామ్రాజ్యం వరకు కొనసాగుతున్న దమన నీతులను నిరసించింది. 2007లో తీసుకొచ్చిన ఈ కావ్యం శివారెడ్డి అద్భతమైన ముందు మాటతో తెలుగు కవితా ప్రపంచంలో దుమ్ము రేపింది. ప్రసాదమూర్తిలో మరింత రాటుదేలిన వస్తుశిల్పాల ఐక్యతను ఈ సంకలనం చాటిచెప్పింది. ఎంత గంభీరమైన  సామాజికాంశమైనా దాన్ని కవిత్వం చేయడంలో ప్రసాదమూర్తి సాధించిన నేర్పును ఈ పుస్తకం పాఠకలోకానికి పరిచయం చేసింది. క్రమంగా ప్రసాదమూర్తి అభిమానుల ప్రపంచం కూడా విస్తరించింది.

కవిత్వమే ఊపిరైన తన ప్రవృత్తికి ఆటంకంగా మారిన ఉద్యోగానికి స్వస్తి చెప్పి జరుగుతున్న జగన్నాటకాన్ని చాలా దగ్గరుండి చూసే మీడియాలోకి వచ్చి అనివార్యంగా స్పందించే దినచర్యగా మారిన జీవితాన్ని అక్షరమయం రసవత్కవితామయం చేసుకున్నాడు ప్రసాదమూర్తి. అరుంధతీరాయ్ లాంటి  ఆధునిక విశ్లేషకులను  చదవటంతో సమస్య మూలాల్లోకి వెళ్ళే దారి దొరికింది. దాంతో తనలో ఎప్పటికప్పుడు తాజాగా ఉబుకుతున్న కవిత్వానికి ఏ రూపం ఇవ్వాలో తెలిసొచ్చింది. అది ముచ్చటగా మూడో సంపుటమై 2010లో   ‘నాన్న చెట్టు’ గా రూపం దాల్చింది.

ఈ పుస్తకానికే నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం లభించింది. అంతే కాదు. 2012లో ఢిల్లీ తెలుగు అకాడెమీ సాహితీ పురస్కారం కూడా అందుకున్నాడు ప్రసాదమూర్తి. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అంతలోనే  రెట్టించిన ఉత్సాహంతో ‘కవి నిద్రపోతాడా? నిద్రను కలలకు కాపలా పెడతాడు’ అంటూ మరింత నిబద్ధతతో వెలయించిన కవిత్వమే ‘పూలండోయ్ పూలు’. ఇందులో భావోహల మీదే కవిత్వాన్ని తిప్పుతూ కేవలం పూలవనాన్నే చూపించలేదు. రంగుల కలే సృష్టించలేదు. కవిగా తన భుజాల మీద కెత్తుకున్న సామాజికి బాధ్యతను నెరవేర్చే ప్రయత్నమే చేసాడు.

ఎంత సీరియస్ విషయాన్ని అయినా అసలు సిసలు కవిత్వం చేసే రసవిద్యను ప్రసాదమూర్తి పూర్తిగా సాధించాడని చెప్పడానికి పూలండోయ పూలు కావ్యం ఉదాహరణగా నిలుస్తుంది.  చదివిన వాళ్ళ విన్నవాళ్ళ గుండెల నిండా పూలజల్లు కురిపించే శీర్షిక కవిత పూలండోయ్ పూలు తలచుకుంటేనే సుగంధాన్ని వ్యాపింపజేసే కవిత.  కాగా.

‘హృదయం దొర్లుకుంటూ

ఏ లోయల్లోకో జారిపోయే’ టట్లు చేసే దయామయి. రైల్వేష్టేషనో గుడో ఏ మెట్ల మీంచో మనుషుల్ని రుతువుల్ని కదలని కనురెప్పల మధ్య నుంచి కనికరంగా చూస్తుంటుంది.

పాలకుల నిర్లిప్తతకు చురక అంగన్ వాడీల మీద రాసిన ‘సమరాంగనవాడి’. కొంగు నడుముకు చుట్టడమే కాదు. అవసరమైతే అసెంబ్లీ గొంతు చుట్టూ బిగించగలరనే హెచ్చరికని స్పష్టం చేస్తుంది. విడిపోయిన రెండు ప్రాంతాల మనుష్యుల్ని ఇక ప్రేమించుకుందాం  అంటూ మనసుల్లోంచి సమైక్య సంగీతం ఆలపిస్తూ అనటం ఒక సౌహార్ధ్రభావం.

ఇలా అనుభవించి పులకరించి పలవరించుకుంటూ, ప్రతి కవితనూ ఎంతైనా పరామర్శించుకోవచ్చు. ప్రసాదమూర్తి తనదైన శైలిని నిర్మించుకుంటూ మరింత పదునైన కవిత్వంతో ముందుకు వెళుతున్నాడని నిజాయితీగా ఎవరైనా ఇప్పుడు ఒప్పుకుంటారు.  రానున్న కవితా సంపుటి అందుకు పూర్తి తార్కాణగా నిలుస్తుందని ధీమాగా చెప్పొచ్చు.

కవిత్వరూపమే తానై నిత్యం తనని సమాజాన్ని ఆవిష్కరించుకుంటూ సాహిత్యయానం చేస్తున్న వానికి పురస్కారాలు కొలమానాలు కాదు కాని.. అతడు ఎంత దూరం వచ్చాడో ఏమి సాధించాడో ప్రజలు గుర్తించగలగడానికి అవి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం  ‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని మరింత పరిమళభరితం చేయటమే కాక నిఖార్సయిన కవిత్వానికి మెరుగులద్దినట్లయ్యింది.

*

 

సామాన్యుల గొంతుని వినిపించే ‘గడీలో దొరల పాలన’

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

డా. నారాయణ భట్టు మొగసాలె గారు కన్నడ భాషలో రచించిన “ఉల్లంఘన” నవల బంట్ కుటుంబంలోని ఐదు తరాల గాథ. బంట్ సముదాయం ఒకనాటి క్షత్రియులు. ప్రస్తుత కర్నాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ, కేరళ లోని కసర్‌గోడ్ జిల్లాల మధ్యలో వ్యాపించి ఉండిన “తుళునాడు”కు చెందిన భూస్వాములు బంట్ వంశీకులు. ఇటువంటి భూస్వాములు, వారి ఆస్థానాలు, పాలనా పద్ధతులు, పాలితులు, ఆచారవ్యవహారాలను నమోదు చేసిన విశిష్ట రచన ‘ఉల్లంఘన’.

తుళునాడులోని ప్రజల భాష తుళు. ఈ భాషకి లిపి లేదు. వ్రాయడానికి కన్నడ లిపినే ఉపయోగిస్తారు. తుళునాడు జనాలది విశిష్టమైన సంస్కృతి. 19వ, 20వ శతాబ్దాలలో ఈ సంస్కృతిలో వచ్చిన మార్పులు, ఈ ప్రాంతపు చరిత్రలో సంభవించిన ఘటనలను వివరిస్తుంది ఈ నవల. అటువంటి ప్రశస్తమైన నవలను “గడీలో దొరల పాలన” పేరిట తెలుగులోకి అనువదించారు శ్రీ శాఖమూరు రామగోపాల్. మూల రచన ‘ఉల్లంఘన’ ఇప్పటికే హింది, ఇంగ్లీషు, మరాఠి, మళయాళం, తమిళ భాషలలోకి అనువాదమైంది. 2008లో ప్రచురితమైన ఈ మూలకృతి కన్నడంలో ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టబడింది. మూల రచయిత డా. నారాయణ భట్టు మొగసాలె వృత్తిపరంగా వైద్యులైనా, ప్రవృత్తిపరంగా గొప్ప సాహితీవేత్త.

సుమారు నూటయాభై సంవత్సరాల కాలంలో తుళునాడునీ, దానిలోని గడీలను ప్రభావితం చేసిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తుందీ పుస్తకం. రాచరిక/భూస్వామ్య వ్యవస్థకి ప్రతిరూపాలైన బంట్లు కూడా గడీలను అధికార కేంద్రంగా చేసుకుని తమ అజమాయిషీ కొనసాగించారు. ఆస్థానం, సంస్థానం, కోట.. వంటి పదాలను గడీ అనే పదానికి సమానార్థాలుగా భావించవచ్చు. గడీల చరిత్ర పాలకులు – పాలితుల మధ్య ఉండే సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది. భూస్వాములు, రైతు కూలీలు, కౌలుదార్ల సామాజిక జీవనంలోని భిన్నకోణాలను ప్రతిబింబించింది ఈ నవల.

తుళునాడులో మాతృస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉంది. కుటుంబపు ఆస్తి వారసత్వంగా స్త్రీలకు దక్కుతుంది. పుట్టిన పిల్లలకు భార్య ఇంటిపేరునే పెట్టుకుంటారు. కుటుంబంలోని మగవాళ్ళు ఆస్తిపాస్తుల వ్యవహారాలను మేనేజర్లుగా నిర్వహిస్తుంటారు. ఇటువంటి గడీలలోని ఒకటైన సాంతేరుగడీ చరిత్ర ఇతివృత్తమే ఈ నవల కథాంశం. గడీ ఆధీనంలోని భూమిలో కొంతభాగాన్ని కౌలుదారులు సేద్యం చేస్తుండగా, మిగతా భూమిని వెట్టి కూలీలతో భూస్వాములే సాగు చేస్తారు. ఇటువంటి ఫ్యూడల్‌సమాజంలో కౌలుదారులకు, వెట్టి కూలీలకు; దొరసానికి (బళ్ళాల్ది), దొరకి (ఉళ్ళాయి) మధ్య ఉండే సంబంధాన్ని ఈ నవలలో దర్శించవచ్చు. వెంకప్ప, శీనప్ప, సంకప్ప, సుందర, ప్రశాంత్‌హెగ్డె గార్ల జీవితాలు; అలాగే తుంగక్క, శాంతక్క, అంబక్క, శారదక్క, ప్రజ్ఞల జీవితాలు ఈ నవలలో విస్తృతమైన కాన్వాస్‌పై అద్భుతంగా గోచరిస్తాయి

భుజించి దర్బారులోకి వచ్చి కూర్చున్న దొరవారితో, దోస్తుగా ఉన్న పావూరు గడీకి చెందిన పూంజగారు ‘సాంతేరుగడీలో అష్టమినాడు ఎందుకు చేసారు ఈ కోలాహలం విందును?’ అని ప్రశ్నించారు కుతూహలంగా. అందుకు దొరవారు ‘అష్టమి అముఖ్యం కాదు మాకు. మేము వ్యవాసాయం చేసేవాళ్ళం. అందుకే మాకు మేము పండించిన కొత్త బియ్యం వండి పండుగ లాగ తినేది ముఖ్యం అనేది గడీలో సాంప్రదాయంగా వృద్ధి చెంది వచ్చింది. గోకులాష్టమి, వినాయక చవితి, అమావాస్యలోని దీపావళి మొదలైన రోజుల కట్టుబాట్లలోని ఆచరణాలన్నీ గడీ భవంతిలో ఉన్నవి. అవన్నీ అక్కరలేదా మన సమాజంకు?’ అన్నారు.

పూంజగారికి సంతృప్తి అయ్యింది దొరవారి రైతు జ్ఞానం నుంచి. వారు, ‘ఔను, మన జాతులలో ప్రాదేశిక వ్యత్యాసాలకు అనుగుణంగా పండుగ పబ్బాలలో వివాహ, దినకర్మకాండలలో వ్యత్యాసం ఉండేది సహజమే’ అని ఒప్పుకున్నారు.

బ్రిటీషు వారి రాకతో దేశంలోని అన్ని ప్రాంతాలలో లాగానే తుళునాడులోనూ దొరల అధికారాలు క్షీణించి, పరిస్థితులు మారడాన్ని ఈ నవల చక్కగా వర్ణిస్తుంది. ఆంగ్ల పాలకులు చేసిన కొత్త చట్టాల వల్ల భూస్వాములు, కౌలుదార్లు, వెట్టికూలీల సంబంధాలలో వచ్చిన మార్పులనూ, మనుషులలో కలిగిన కొత్త ఆలోచనలను ఈ నవల ప్రతిబింబిస్తుంది.

స్వాంతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో ఈ ప్రాంతపు యువకులు పాల్గొన్న వైనాన్ని, గాంధీ గారి అనుచరులుగా మారిన జైళ్ళకు వెళ్ళిన వైనాన్ని తెలుపుతుంది ఈ నవల.

“ఆ రోజు గడీ భవంతి వర్ణించలేనట్లుగా సంబురపడింది. ఆ సంబురం ఒంబత్తుకెరె గ్రామంలోని కౌలుదార్ల నుంచి మొదలై కూలినాలి చేసి జీవించేవాళ్ళ ఇళ్ళ వరకూ వ్యాపించింది. యువకులు, వృద్ధులు అనకనే ఆబాలగోపాలం గడీ ప్రాంగణంకు ఒకరి వెనుక ఇంకొకరుగా వచ్చారు. సంకప్పకు వారందర్నీ చూసి ఎంతో సిగ్గైంది. ‘నేనేమి యుద్ధం గెల్చి వచ్చానేమి! ఉత్తిగనే ఎందుకు నన్ను చూసేందుకు వచ్చారు?’ అని అనాలని అన్పించింది అతనికి. ప్రతి యొకరు వచ్చి ‘ఎలాగున్నారు చిన్నపటేలా?’ అంటూ అడిగారు. జనం నొచ్చుకోవచ్చని అతను ప్రాంగణంలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు. వచ్చినోళ్ళందరితోనూ సంకప్ప ‘నేనేమి ఘనంగా దేశమాత సేవ చేయలేదు. గాంధీజీతో పాటు నేను ఉండివచ్చాను వివిధ చోట్ల అంతే మరి.’ అన్నాడు.

AuthorSakhamuru

స్వతంత్ర్యం వచ్చాకా ఎదురైన పరిస్థితులు ఏలాంటివి? గ్రామం తన స్వయంప్రతిపత్తిని పోగొట్టుకుని, పట్టణాల మీద ఎందుకు ఆధారపడింది? మాతృస్వామ్య వ్యవస్థ తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయిందో ఈ నవల వెల్లడిస్తుంది. కొత్త వ్యవస్థలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయించారు? ఆ యా మార్పులు ఎవరెవరిని ప్రభావితం చేసాయి? ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాలి.

సంకప్ప హెగ్డె గంభీరులయ్యారు. వారు ‘మన కర్నాటకలోని ఈ భూపరిమితి చట్టం లాంటి ప్రగతిపర మరియు విప్లవాత్మక … భూసంస్కరణల చట్టం… ఈ భరతభూమిలో మరే యితర రాష్ట్రంలో జారీ అయ్యింది లేదనేది నాకు గుర్తే! దాన్ని నేను వేరే వేరే మూలాల నుంచి చదివి తెల్సుకున్నాను. నిజంగా ఇది మంచి చట్టమే. అందులోనూ తీరప్రాంత జిల్లాల్లో, ముఖ్యంగా మన దక్షిణ కన్నడ జిల్లాలో ఇది అమలౌతున్న పద్ధతిలో, ఎన్నో అవాంతరాలు ఎదురౌతున్నవి. మనలో తండ్రి నుంచి సంతానంకు భూమి హక్కు వచ్చి కలిగే సంప్రదాయం ఎంతో తక్కువ. తల్లి నుంచి సంతానంకు హక్కు వచ్చే సాంప్రదాయమే ఎక్కువగా ఉంది. అయితే మారుతున్న వాతావరణంలో ప్రతీ కుటుంబం ఈ పురాతన పరంపరను ఇప్పుడు తోసి వేస్తోంది. కానూను ప్రకారం మాతృప్రధాన వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు! అందుచేత మన కర్నాటకలో ఈ భూపరిమితి చట్టం ఇక్కడ ఈ జిల్లాలో అమలు చేసేడప్పుడు ఎన్నెన్నో కుటుంబాలలో ఘర్షణలు ప్రారంభమైనవి. మనుష్య సంబంధాలన్నీ నాశనమైపోయే స్థితి వచ్చింది’ అని చెబుతూ ఒక నిమిషం మౌనం దాల్చారు.

ఉడుపి ప్రాంతంలోని కన్నడిగులు హోటల్ యజమానులుగా ఎలా ఎదిగారో, తమవారిని ఎలా వృద్ధిలోకి తెచ్చారో ఈ నవల రేఖామాత్రంగా తెలియజేస్తుంది.

ఎవరికి కావాలి ఈ పొలాలు, మడులు? కాడి నాగలి మోసుకుంటూ వాన ఎండా అది ఇదీ అని మూడొందల అరవై ఐదు రోజులూ మడిగట్టు మీద గోచి బిగించి చెమట్లు కురిపించుతూ శ్రమించేదానికన్నా ‘చుయ్’ అని రెండు మసాలా దోసెలు వేసి, ఒక ముక్కుళ్ళి (గుటక పరిమాణం) కాఫీనో చాయ్‍నో టేబుల్ మీద పెట్టి ‘రండి రండి గిరాకీదారులారా’ అంటే చాలు, నోట్ల కట్టే తలొంచి క్యాష్ బాక్స్ లోపలికి వచ్చి బుద్ధిగా కూర్చుంటందంటే అదెంత కుశాలో అని అంబక్కకి అప్పుడు నవ్వు వచ్చింది. అందుకే ఇంత జనం, ఉన్న ఊరు వద్దు అంటూ పట్టణాలకు వలస వెళ్తున్నారని చెప్పారు సంకప్పణ్ణ.

వ్యవసాయాధారితమైన కుటుంబాలు క్రమంగా వ్యాపారాలవైపు మొగ్గు చూపడాన్ని ఈ నవల చిత్రిస్తుంది.

ఆదంకుట్టి క్తెతే ఆకాశంలో ఉన్న స్వర్గమే చేతికి అంది వచ్చినట్లుగా అయ్యింది. అతను తన అంగడికి వచ్చి వెళ్ళే గిరాకీదారులందరికీ కలల బీజాల్ని విత్తసాగాడు. అటువంటోళ్ళంతా తమ ఇళ్ళలోనూ ఇటువంటి బంగారు కలల విత్తనాల్ని విత్తసాగారు. జాతీయ రహదారిని ప్రారంభించే కేంద్ర మరియు రాష్ట్ర రవాణాశాఖా సచివ మహోదయులు ఆ తర్వాత తమ వాహనాలలో కాసరగోడు దాకా పయనించేదాన్ని చూసేందుకు వేలసంఖ్యలో జనం ఉదయం నుంచే జాతీయ రహదారి అంచుకు చేరారు. అక్కడక్కడ లేచి నిలబడి నిరీక్షించసాగారు.

సంస్థానాలను కేవలం చారిత్రక దృక్పథంతో మాత్రమే పరిశీలించి వ్రాసే పుస్తకాలలో కథ ఉండదు. ప్రజల వ్యథ ఉండదు. సామాజిక చిత్రణ ఉండదు. సామాన్యుల ఘోష వినిపించదు. పాలకుల శౌర్యం, మగతనానికి ప్రతీకలుగా మాత్రమే నిలిచే చరిత్ర పుస్తకాలకు భిన్నంగా, ఉల్లంఘన నవలలో సామాన్యుల గొంతు ప్రబలంగా వినిపిస్తుంది.

తెలుగు అనువాదం బావుంది. అయితే అనువాదకులు ఉపయోగించిన తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. ఏదేమైనా శ్రీ శాఖమూరు రామగోపాల్‌ ఒక మంచి కన్నడ నవలను తెలుగువారికి అందించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పుస్తకం చివర్లో “కర్నాటకలో నా తిరుగాట” అనే పేరుతో వ్రాసిన వ్యాసంలో సుప్రసిద్ధ కన్నడ రచయిత శ్రీ తమ్మాజీరావుతో కలసి తాను చేసిన సాహితీయాత్రలను పాఠకులకు కుతూహలం కలిగించేలా వివరిస్తారు శ్రీ రామగోపాల్. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది.

అభిజాత తెలుగు – కన్నడ భాషా అనువాద (సంశోధన) కేంద్రం వారు ప్రచురించిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారి అన్ని శాఖలలోనూ లభిస్తుంది. 650 పేజీల పుస్తకం వెల రూ.600/-. ఈబుక్ కినిగెలో లభిస్తుంది.

 

రచయిత, ప్రచురణకర్త చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

కథ జీవితమంత విశాలం కావాలి!

 

-ఆరి సీతారామయ్య

~

సమాజానికి ఏది మంచిదో ఆలోచించడం, దాన్ని ప్రోత్సహించడం, తదనుగుణంగా ప్రవర్తించడం సామాజిక స్పృహ. సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించే శక్తులనూ భావజాలాన్నీ వ్యతిరేకించడం కూడా సామాజిక స్పృహే.

తన వర్గానికి ఏది మంచిదో, లేక తనకు ఇష్టమైన వర్గానికి ఏది మంచిదో  దాన్ని ప్రోత్సహించడం,  ఆ వర్గ పురోగమనాన్ని నిరోధించే శక్తులను  వ్యతిరేకించడం వర్గ చైతన్యం. అస్తిత్వ ఉద్యమాల పేరుతో జరుగుతున్న ప్రాంతీయ, వర్గ, కుల, మత పోరాటాలలో పాల్గొనడం, లేక వాటితో  సహకరించడం వర్గ చైతన్యం.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గురించి అభిప్రాయాలు ఏర్పరచు కోవటం, ఆ పరిణామాల వెనుక ఉన్న చోదక శక్తుల గురించి అవగాహన ఏర్పరచు కోవడం ప్రాపంచిక దృక్పథం.

సామాజిక స్పృహా, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం ఎంతో కొంత ప్రతి మనిషిలో ఉంటాయి. చైతన్యవంతుల్లో ఎక్కువే ఉంటాయి.

కథలు రాయదల్చుకున్న వారికి ఇవన్నీ ఉండటం మంచిదే. కాని తన సామాజిక స్పృహనీ, వర్గ చైతన్యాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్నీ కథలో జొప్పించకుండా, పాత్రల స్వభావాలను  తన వైపు తిప్పుకోకుండా, కథలో పాత్రలను వారివారి స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించే వారిగా సృష్టించ గలిగితే మంచి కథలు వస్తాయి. అదంతా అవసరం లేదు, కథ మన వర్గపోరాటానికి ఒక సాధనం మాత్రమే అనే వారున్నారు. అలాంటి అభిప్రాయం  ఉన్నవారుకూడా నేర్పూ ఓర్పూ ఉంటే సజీవమైన పాత్రలను సృష్టించగలరు, మంచి కథలు రాయగలరు. నేర్పూ ఓర్పూ లేని వారు వస్తువు బలంగా ఉంటే చాలు, రూపం అంత ముఖ్యం కాదు అని ప్రచారం చే స్తూ కథల్లో తమ సామాజిక స్పృహా, తమ వర్గ చైతన్యం, తమ ప్రాపంచిక దృక్పథాన్నే మళ్ళీ మళ్ళీ  పాత్రలకు అంటిస్తూ నిస్సారమైన పాత్రలతో ఉపన్యాసాలతో పాఠాలతో విసుగు  పుట్టిస్తుంటారు.

సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం గురించి ఆలోచించని  వారు మంచి కథలు రాయగలరా? రాయగలరు అని నా అభిప్రాయం. మంచి కథ అంటే ఏంటో ముందు చెప్పుకుందాం. ఒక భావోద్రేకానికి లోనయిన రచయిత, దాన్ని కథ ద్వారా పాఠకులకి అందించగలిగితే అది మంచి కథ. భావోద్రేకానికి కారణం కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. పాఠకులు ఆ భావోద్రేకాన్ని అనుభవించాలంటే రచయిత సజీవమైన పాత్రలను సృష్టించాలి. కథలో సన్నివేశాలూ సంఘటనలూ రోజువారీ జీవితంలో అందరికీ ఎదురయ్యేవిగా ఉండాలి. అప్పుడు కథ పండుతుంది.

తమచుట్టూ  సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం అని  గిరులు  గీసుకుని,  వీటి  పరిథిలోనే  కథలు  రాయాలి  అనుకునే  వారికి  ఇవి గుదిబండల్లాగా తయారవుతాయని నా అభిప్రాయం. సగటు  తెలుగు సినిమా ఎప్పుడూ పనికి మాలిన వారి ప్రేమకలాపాల చుట్టూ తిరుగుతున్నట్లు, తెలుగు  కథ ఎప్పుడూ సమస్యలూ, వాటి పరిష్కారాల చుట్టూ తిరుగుతుంటుంది. అందువల్ల కథలు ఎప్పుడూ ఒక చిన్న వలయంలో ఉన్న వస్తువుల గురించే వస్తుంటాయి. జీవితంలో ఉన్నంత వస్తువిస్తృతి, భావవిస్తృతి కథల్లో ఉండదు.

తెలుగు కథ సమస్యలకూ పరిష్కారాలకూ పరిమితం కావటానికి కారణం ఎవరు? వామపక్షం వారని చాలా మంది అభిప్రాయం. సాహిత్యంలో వామపక్షం వారి ప్రభావం ఎక్కువగా ఉండటం, సమాజాన్ని తమకు ఇష్టమైన దిశగా మార్చటానికి సాహిత్యం ఒక పనిముట్టు అని వారు  భావించటం, ఇప్పుడు ఆ  భావజాలాన్ని  అన్ని ‘అస్తిత్వ ఉద్యమాల’ వారూ పాటించటం, తెలుగు  కథ ప్రస్తుత పరిస్థితికి చేరటానికి కారణం అని  నా అభిప్రాయం.

కానీ ఇది వామపక్షం సృష్టించిన పరిస్థితికాదు. ఆధునిక కథాప్రక్రియకు ముందే మన దేశంలో నీతికథలు ఉండేవి. కథకు ముఖ్యోద్దేశం ఒక నీతిని పాఠకులకు చేర్చడం. ఈ ప్రభావం వల్లనే మనం కథ దేని గురించి? అసలు ఈ రచయిత ఈ కథ ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడూ? అని చాలా అనాలోచితంగా అడుగుతూ ఉంటాం. అంటే కథ ఏదో ఒక సమస్య గురించి  ఏదో ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అన్న మాట. మనకు చాలా కాలంగా ఉన్న ఈ  ఆచారాన్నే వామపక్షం వారు  బలోపేతం చేశారు. ఆ గోతిని ఇంకా లోతుగా తవ్వారు.

జీవితం సమస్యలకంటే, భావజాలాలకంటే, అస్తిత్వ ఉద్యమాలకంటే, రాజకీయాలకంటే విస్తృతమైంది. కథని ఒక పనిముట్టుగా వాడుకోవటం మానేసి, జీవితంలో ఉండే అన్ని కోణాల్నీ ప్రతిఫలించనివ్వాలి. అప్పుడు తెలుగు కథకు మంచి రోజులు వస్తాయని నా నమ్మకం.

*

 

చీకటి నీడలు

 

-మధు పెమ్మరాజు

~

Madhuగడియారం చప్పుడు తప్ప వేరే అలికిడి లేదు, ఫ్లోర్లో అక్కడక్కడా వెలుతురు ఉండడంతో అంతా అస్పష్టంగా ఉంది. నా క్యూబ్ పైన బల్బు మొహమాటంగా వెలుగుతోంది. కదలికని బట్టి వెలగడాన్ని కంపెనీ ఆటోమేషన్ ఇన్నోవేషన్ అంటుంది, ఊపిరి తీసుకోవడం కదలిక కాబట్టి బల్బు వెలుగుతోందని నేను అనుకుంటాను. గత కొన్ని నెలలుగా అలసిన మొహాలు ఒక్కొక్కటీ మాయమయి, బెదురుగా చూసే లేత మొహాలు వస్తున్నాయి – కంపెనీ అవుట్సోర్చింగ్ అంటోంది. ఈ వెలుగు నీడల పరదాలో నేను అనామకుడిగా మారిపోయాను. అనేక భయాలకి ఇంకో కొత్త భయం జత చేరింది – టిక్..టిక్…మంటూ ముల్లు వేగం పెరిగే కొద్దీ బల్బు ఆరుతుందని భయమేస్తుంది, అప్పుడు ఓ రెండడుగులు వేసి కూర్చుంటాను.

రోజూ తలెత్తకుండా పని చేసేవాడిని ఏదో వెలితిగా అనిపించి కీబోర్డ్ పక్కన పెట్టాను, కాసేపటకి కంప్యూటర్ స్క్రీన్ సేవర్ కూడా కదలడం మానేసింది. పక్క క్యూబ్లపై ఆండ్రూ, జాక్, షెల్లీ, ఆలన్ పేర్లు ఇంకా అలానే ఉన్నాయి, వారి నేమ్ ప్లేట్లని ఆప్యాయంగా తడిమాను. నా పలకరింపు వారి దాకా చేరుతుందని భ్రమ. ముప్పై ఏళ్ళ స్నేహాలు వెంట, వెంటనే విడిపోయాకా మా ఫ్లోర్ పక్షులు లేని చెట్టుగా మారింది.

ఒకప్పుడు నా ఈ స్థావరం విశాలంగా, గుండెల నిండా ఊపిరి పీల్చుకునేలా ఉండేది. ఏళ్ళు గడిచిన కొద్దీ ఇరుకుతనం పెరిగింది, ఉద్యోగం నా అస్తిత్వం నుండి జీతం కోసం పని చేస్తున్నాను అనేదాకా చేరుకుంది. క్యూబ్ గోడలపై వెలిసిన నీలం రంగు గుడ్డ, టేబుల్ పై బరువైన నల్లటి ఫోను, పక్కన జెన్నీ పెళ్లినాటి ఫోటో.. జెన్నీ అన్నీ చూస్తున్నట్టుగా నవ్వుతోంది….నా పిచ్చి గానీ అంత దూరం నుంచి ఎలా చూస్తుంది? పక్కన బేస్బాల్ బాట్ పట్టుకుని రిచ్చీ, ఎంత ముద్దుగా ఉన్నాడో – చదువులు ముగించుకుని కాన్సస్ వెళ్ళిపోయాడు.

“బాబూ! నీ పాత ఫోటోలు చూసి, చూసి విసుగొస్తోంది. కాస్త మార్చు” అంటూ షెల్లీ ఆట పట్టించేది. షెల్లీకి చెప్పినా అర్ధం కాదు…జెన్నీ నవ్వు ఎన్ని సార్లు చూసినా మొదటిసారి చూసినట్టే ఉంటుంది. గోడ చుట్టూ ఫ్రేముల్లో కంపెనీ ఇచ్చిన సర్టిఫికేట్లు – ఓ రోజు జాక్ సర్టిఫికేట్లు లాక్కునంత పని చేసాడు, సొంత ఖర్చుతో అందమైన ఫ్రేములు కట్టించి – “విలువైన ప్రశంశా పత్రాలని గాలికి, ధూళికి వదిలేయకూడదు, అందంగా బంధించాలి” అన్నాడు.

chinnakatha
షెల్లీ ఒక్క సంపాదనతో పెద్ద సంసారాన్ని నెట్టుకొచ్చేది, వెళ్ళిపోతున్న రోజు “జో..పని ఒక గౌరవంగా, పరువుగా భావించాను, కంపనీ మరో కుటుంబం అనుకుని పనిచేసాను. ఈ రోజు వాళ్ళు నన్ను నగ్నంగా నిలబెట్టారు..” అని వెక్కి, వెక్కి ఏడ్చింది. ఓ రెండు పేపర్ టిష్యూలు ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను, వాచీ కేసి చూడబోతూ ఆగిపోయాను, గతం తలుచుకుంటే ముల్లు వేగం పెరుగుతుందా?

ప్రతి ప్రోడక్ట్ రిలీజ్ ఒక పండుగలా ఉండేది. అర్ధరాత్రి, అపరాత్రి అని చూసుకోకుండా నెలల తరబడి ఆఫీసులో మకాం వేసే వాళ్ళం- పిజ్జాలు, కాఫీలతో పాటు లెక్కలేనన్ని జోకులు భోంచేసేవాళ్ళం. రిలీజ్ ముగిసి, మా కాడ్ డ్రాయింగ్లకి రెక్కలొచ్చి ఎగురుతుంటే పిల్లాడు పుట్టినంత ఆనందంగా ఉండేది. ఆండ్రూ పదేళ్ళ పిల్లవాడిలా వచ్చి “జో.. చూడు.. టీవీలో చూడు..ఆ ఎగిరే విమానంపై మన సంతకం ఉంది” అని గోల చేసేవాడు. వెళ్ళే రోజు గోడపై ఇష్టంగా అతికించిన విమానాల పోస్టర్లని కోపంగా లాగి ముక్కలు, ముక్కలుగా చింపి చెత్త డబ్బాలో పడేసాడు. ఆ క్షణం మాట్లాడాలంటే భయం వేసింది.

ఆలన్ స్వతహాగా కవి, ప్రపంచ కవిత్వం చదివినవాడు. నిరాశ, విషాదం నిండిన కవిత్వమంటే ఆసక్తి చూపేవాడు. “ఆల్! నిత్యం మనని వేధించే సమస్యలు సరిపోవా? అవేవో అరువు తెచ్చుకుని మరీ ఏడవాలా?” అని విరగబడి నవ్వితే, జవాబుగా చిరునవ్వు నవ్వేవాడు. వెళ్ళే రోజు హౌస్మన్ కవిత చదివి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు.

చింత రువ్వ చెయ్యి చుర్రుమనిపించిందని
చేతిని పదిసార్లు దులుపుకున్నాను
కాని ఒకటి మాత్రం నిజం, అది తీవ్రంగా బాధించినా
విషాదం ముంగిట నిలిచిన క్షణం
రంగు, రంగుల లోకం చూపక
చేదు సత్యాల్ని చూపి మేలే చేస్తుంది.
నువ్వు నా స్థితిలో ఉన్నప్పుడు
నీ మనసుకి సాంత్వననిస్తుంది.
ఆ ఉరుములు మెరుపుల కాళరాత్రి
నీకొక స్నేహహస్తాన్ని అందిస్తుంది

ఎవరి పాత్రలు వారు సక్రమంగా పోషించి నిష్క్రమించారు, నేను అవసరాల బరువు మోస్తూ ఇంకా తెర ఎదుట ఉన్నాను.

ఆ మధ్యన ఆండ్రూ ఆరోగ్యం బాగోలేదని షెల్లీ చెబితే క్షేమ సమాచారం తెలుసుకుందామని ఫోన్ చేసాను. ఆండ్రూ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, మాటలు నీరసంగా ఉన్నాయి. కాస్త తేలిక పరుద్దామని ““ఆండీ! మీ అందరి పుణ్యమా అని నా పూర్తి పేరు మర్చిపోయాను. ఈ మధ్యన కంపనీ పంపే ప్రతీ ఈమెయిలులో నా పూర్తి పేరు ప్రస్తావిస్తున్నారు. నీకు కారణం తెలుసా?” అని నవ్వుతూ అడిగాను. ఆండ్రూ ఏదో చెప్పబోతుంటే నా పక్కగా ఏదో కదలికలా అనిపించింది. చీకటి నీడల్లో పాత పరిచయస్తుడు, సెక్యూరిటీ ఆఫీసులో పని చేసే కీత్ నిలబడ్డాడు. అతని వాలకం చూస్తుంటే కొన్ని క్షణాల నుండి వేచి ఉన్నట్టు అనిపించింది.

ఫోన్ కింద పెట్టి “కీత్! ఏమిటి విషయం?” అని అడిగాను.

“ప్లీజ్ నాతో రండి” అన్నాడు.

విషయం అర్ధమయి జెన్నీ, రిచ్చీల ఫోటోలు బాగ్లో సర్దుకుని నిలబడ్డాను.

“దయ చేసి అవి టేబుల్ పై పెట్టేయండి” అని కాస్త కటవుగా అన్నాడు. మారు మాట్లాడకుండా ఫోటోలు టేబుల్ పై పెట్టి, అతని వెనకాల నడిచాను. కొన్ని అడుగులు దాటగానే క్యూబ్ పైనున్న బల్బు ఆరిపోయింది.

(To Jonathan)

పోతే పోనీరా..

 

ల.లి.త.

~

    ల.లి.త.

డార్క్ కామెడీలు మన సినిమాల్లో చాలా తక్కువ.  ఒకే ఒక్కటి, “జానే భీ దో యారో”.  1983లో వచ్చిన మంచి డార్క్ చాక్లెట్ లాంటి ఆ సినిమాకి కొనసాగింపుగా 2010లో వచ్చిన ‘పీప్లీ లైవ్’ తప్ప మరోటి కనిపించదే! ‘జానే భీ దో యారో’ తీసిన కుందన్ షా కూడా మళ్ళీ అంత వాడిగా మరో సినిమా తియ్యలేకపోయాడెందుకో !

అనురాగ్ కాశ్యప్ ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ లో శుభ్రంగా తీసిన లంపెన్ కామెడీలో కొంచెం నల్లటి ఛాయలు తగిలినా, అతను చెప్పిన తరాల రక్తచరిత్రను పూర్తి హాస్య చిత్రం ‘జానే భీదో యారో’ తో పోల్చలేం. నల్ల కామెడీలో మన ప్రఖ్యాత ‘ముత్యాల ముగ్గు’ కాంట్రాక్టర్ ఎంత మాత్రమూ తీసిపోని ఘనుడే గానీ, ఆ కథ పూర్తిగా అతనిదైతే కాదు. ముత్యాల ముగ్గు “కుటుంబ కథా” చిత్రంలోని బూజు సెంటీ.. మ్మ్.. లాభం లేదు సెగట్రీ..

ఆవూ పులీ కథ చిన్నప్పుడు అందరం విన్నదే.. అడవిలో తప్పిపోయిన ఆవు పులికి దొరికిపోతుంది. దూడకి పాలిచ్చే టైం అయిందని పులిని వేడుకుని, ఆఖరుసారి పాలిచ్చి వచ్చేస్తానని ఒట్టేస్తుంది. ఆ నీళ్ళునిండిన నల్లకళ్ళ ఒట్టును నమ్మి, దొరికిన ఆహారాన్ని వదిలేయటం క్రూరపుకళ్ళ పులి నైజానికి పొసిగే పనేనా? దూడకు పాలిచ్చి పులికి ఆహారం అవటానికి ఆవు తిరిగిరావటం? రావచ్చేమో. బేలకళ్ళ అమాయకత్వంతో పుట్టిన జీవి కాబట్టి.. పులి కళ్ళనీళ్ళు పెట్టుకుని దాన్ని చంపకుండా వదిలిపెట్టటంతో మరీ అత్యాశావాదపు యుటోపియన్ కథైపోయింది. కలికాలం ధర్మం ఒంటికాల్తో నడుస్తుందని నమ్మే ధర్మాత్ములు కూడా ఈ కథని కృతయుగం కేటగిరీలోనే వేసేస్తారు.

దీనికి విరుద్ధంగా చిన్నప్పుడు అందరం వినే మరో పులీ మేకా కథ డార్క్ హ్యూమర్ కి సరిపోతుంది. మేక తనమానాన తాను నీటిపాయకు ఎగువన నీళ్ళు తాగుతుంటే దిగువవైపు నీళ్ళు తాగుతున్న పులి, మేకతో వాదానికి దిగుతుంది. ‘నువ్వు తాగి ఎంగిలి చేసిన నీళ్ళు నేను తాగాలా’ అని దెబ్బలాడి మరీ దాన్ని చంపేస్తుంది. మేకని చంపడానికి ఈపాటి కబుర్లు కూడా పులికి టైం వేస్టే. ఐనా తను ఎంత తెలివిగా మాట్లాడగలదో చూపించాలనే సరదా పుట్టి మాట్లాడుతుందంతే. నీటిపాయకు దిగువవైపు నీళ్ళు తాగినా మేక బతికేది లేదుగదా.  పులిన్యాయమే సృష్టిలో ఎక్కువగా అమలవుతుందని చెప్పేది డార్క్ హ్యూమర్.  (చదవండి రావిశాస్త్రిని). లోకంలోని చెడుని తేలిగ్గా హాస్యంగా ఎత్తి చూపించి, మంచి గెలిచి తీరుతుందనే నమ్మకాన్ని హేళన చేసే డార్క్ హ్యూమర్  సాహిత్యంలోనూ  సినిమాలోనూ కనబడే మంచి ప్రక్రియ. ఇవి రాసి, తీసి మెప్పించటం సులభంకాదు.  పేరుకే కామెడీగానీ ‘సత్యం వధ’ అనిచెప్పే ట్రాజెడీలివి.

***

‘హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్’ అని స్ఫూర్తిగీతం పాడుకుంటూ తిరిగే రకాలు ఒక్క శ్రామికులూ మానవ హక్కులవాళ్ళే నేంటి? దేశభక్తులూ అయాన్ రాండ్ శిష్యులూ కూడా ఈ పాటని సొంతం చేసేసుకున్నారు, చేగువేరాని చొక్కాల కంపెనీలు లాక్కుపోయినట్టు.  ఈ ‘కామ్యాబ్’ గీతాన్ని నిజానికి ఫోటోగ్రఫీ వ్యాపారంకోసం, అందులోనూ ఫాషన్ ఫోటోగ్రఫీతో కూడా పైకెదిగి పోవాలన్న ఆశతో పాడుకున్నా, ‘జానే భీదో యారో’ నాయకులిద్దరూ పాపం గట్టి నైతికవిలువల ఫ్రేం లో ఉండిపోయే మనుషులే.  జేబులో డబ్బులు పోలీసు కొట్టేసినా సరే, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కడానికి బాధ పడేవాళ్ళే. అవినీతికి లొంగటంలోని సుఖంకంటే అవినీతిని బైటపెట్టటంలోని ఆనందమే ఎక్కువనుకునే జాతికి చెందినవాళ్ళే.

నసీరుద్దీన్షా మరియూ రవీ బస్వానీలు, ఫొటోగ్రఫీలో పేరూ డబ్బూ మూటగట్టేందుకు కలల వలల్ని భుజాలమీదేసుకుని  బొంబాయిలో ఓ ఫోటోగ్రఫీ దుకాణం తెరుస్తారు.  గుండెల్లో పూర్తి నమ్మకం నింపుకుని ‘హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్’ అనుకుంటూ తెరిచిన దుకాణంలో మూణ్ణెల్లయినా ఈగలు తోలేపని తప్ప ఇంకేం ఉండదు. ఇంతలో ‘ఖబడ్దార్’ పత్రిక ఎడిటర్ శోభా సేన్ (థియేటర్ నటి భక్తీ బార్వే అపూర్వంగా ఈ పాత్ర వేసింది) వీళ్ళకి ఓ పని అప్పజెప్తుంది.. మున్సిపల్ కమిషనర్ డిమెల్లో (సతీష్ షా)  కాంట్రాక్టర్ తర్నేజా (పంకజ్ కపూర్)ల అవినీతి లావాదేవీల ఫోటోలు రహస్యంగా తీసేపని. ఈ పనిని వీళ్ళు భక్తిశ్రద్ధలతో చేసి ఆమెకు సమర్పిస్తారు.  ఇక ఈ మేకల్ని వాడేసుకుని డిమెల్లో తర్నేజాల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కొట్టేసే వ్యూహంలో ఆమె మునిగి వుండగా… న.షా మరియూ ర.బ.లు గొప్ప అవినీతి వ్యూహాన్ని ఛేదించి దేశసేవ చేస్తున్న ఆనందంతో పొంగిన ఛాతీలతో దూసుకెళ్ళి డిమెల్లో, తర్నేజా మరో కాంట్రాక్టర్ అహూజా (ఓం పురీ)ల అమర్యాదకర, అవినీతికర ఎన్కౌంటర్స్ ని టేపుల్లో రికార్డు చేస్తూ ఫోటోలు తీస్తారు. శోభా సేన్ ఇచ్చిన పన్లో దేశసేవ తప్పించి పైసలేం కనబడవు. కడుపుకోసం డబ్బు సంపాదన తప్పదు కదా ఇంకేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళకి నగదుబహుమతులిచ్చే ఫోటోగ్రఫీ పోటీ ఒకటి దృష్టిలో పడుతుంది. ఆ పోటీకి పంపటం కోసం ఫోటోలు తీస్తుండగా అనుకోకుండా ఒక ఫోటోలో చేతిలో పిస్టల్ పట్టుకున్న ఆకారం కనిపిస్తుంది. ఆ ఫోటోని పెద్దది చేస్తే ఆ ఆకారం తర్నేజా దని తెలుస్తుంది. తర్వాత జరిగేవన్నీ మనల్ని బుగ్గలు సాగేంత నవ్వుల్తోనూ న.షా. మరియూ ర.బ.ల్ని మహా నిర్ఘాంతాల్తోనూ నింపేస్తాయి.  చివరకి అవినీతిపరులంతా రాజకీయనాయకుల్లాగే ‘కామ్యాబ్’ లయిపోతారు.  నిజాయితీగా సత్యశోధన చేసిన మన న.షా. మరియూ ర.బ.ల గతి ? … ‘సత్యం గెలుస్తుంది అన్యాయం ఓడిపోతుంది’ అని మంచివాళ్ళు నమ్మే సూత్రానికి సరిగ్గా విరుద్ధంగా ఏంకావాలో అదే అవుతుంది. (సస్పెన్స్ కూడా వున్న ‘జానే భీదో యారో’ యు ట్యూబ్ లో దొరుకుతోంది).

lalita2

తర్నేజా నేరాన్ని బైటపెట్టిన ఆ ఫోటోని వీళ్ళు ఒక పార్క్ లో తీస్తారు. ఆ పార్క్ కి Antonioni park అని పేరు పెట్టాడు కుందన్ షా.  Antonioni తీసిన ‘Blow Up” సినిమాలో కూడా ఫోటోగ్రాఫర్ ఒక పార్క్ లో తీసిన ఫోటోలో నేరాన్ని వెదుకుతాడు. ‘Blow Up’ సినిమాలోని తాత్వికత పూర్తిగా వేరు. అయినా ఆ చిన్న పోలికను గుర్తు తేవటం కోసం కుందన్ షా ‘Antonioni Park’ అనటం ఫిల్మ్ బఫ్స్ కి సరదా వేస్తుంది.

పత్రికల వాళ్ళు నేరాల్ని బైటపెట్టటం మానేసి రాజకీయనాయకులని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే కార్యక్రమాన్ని మొదట చిత్రీకరించిన సినిమా ‘జానే భీదో యారో’ నే అయి ఉండాలి. దీని తరువాత వచ్చిన ‘న్యూఢిల్లీ టైమ్స్’ కూడా మీడియా అవినీతిమీద ఫోకస్ చేసింది. వీటికంటే ముందు వచ్చిన సినిమాల్లో పత్రిక ఎడిటర్లు నిజం చెప్పి ఎన్నో కష్టాలు పడేవాళ్ళు.  జర్నలిస్టులంటే నిజాల్ని భుజాలమీద వేలాడే సంచుల్లో వేసుకు తిరిగేవాళ్ళని ఒకే ఒక అర్థం ఉండేది. తర్నేజా పైపైకి ఎదిగాడంటే ఎంతమందిని కిందకి తొక్కేశాడో చెప్పమని అతన్ని నిలదీసిన జర్నలిస్టులు కూడా ‘జానే భీదో యారో’లో ఒకసారి కనిపిస్తారు. ఎడిటర్ శోభా సేన్ ది వీళ్ళకి రెండో వైపున్న ముఖం. ‘పీప్లీ లైవ్’ లో జర్నలిస్టుల అన్ని ముఖాలూ దర్శనమిస్తాయి.

పేరున్న దర్శకుల సినిమాలు చూస్తే సినిమా ముఖ్యంగా దర్శకుడి మీడియం అనే అనిపిస్తుంది. వాళ్ళవి కొన్ని సినిమాలు చూస్తుంటే అవి అంత బాగా రావటానికి ఒక్క దర్శకుడే కారణమనికూడా అనలేం.  సత్యజిత్ రాయ్ లాంటి నిరంకుశుడైన దర్శకుడి విషయంలో జయం, అపజయం అన్నీ ఆయనవే.  ‘సత్య’ లాంటి సినిమాల్లో, తీసిన రాం గోపాల్ వర్మ కంటే  స్క్రీన్ ప్లే, మాటలూ అంత బాగా రాసిన అనురాగ్ కాశ్యప్ సౌరభ్ శుక్లాల వాటా ఎక్కువనిపిస్తుంది. ‘జానే భీ దో యారో’  వెనుక కుందన్షా తో పాటు స్క్రీన్ ప్లే రాసిన సుధీర్ మిశ్రా, మాటలు రాసిన సతీష్ కౌశిక్, రంజిత్ కపూర్లు ఉన్నారు. రేణూ సలూజా కూర్పు ఉంది. వనరాజ్ భాటియా సంగీతం ఉంది.

అమెరికానుంచి తిరిగొచ్చిన మున్సిపల్ కమిషనర్ డిమెల్లో అక్కడ తాగేనీళ్ళూ మురుగునీళ్ళూ వేరువేరుగా ఉంటాయని మురిసిపోతూ చెప్తాడు. అమెరికాలో తక్కువగా తిని ఎక్కువగా పారేస్తారు కాబట్టి స్విట్జర్లాండ్ కేక్ ని కొంచెం తిని మరింత ముక్కని బైటకి విసిరేస్తే మజాగా ఉంటుందని డిమెల్లోకి చెప్తాడు న.షా.  కిటికీ బయటున్న ర.బ. కి కేకు ముక్క అందాలని అతని ఉద్దేశ్యం. అమెరికా గొప్పలు మనం చెప్పుకోవటం అనే అనాది అలవాటుతో పాటే వాళ్ళ తిని పారేసే వినిమయతత్వాన్ని కూడా ఎత్తి చూపించే ఈ ముప్పై ఏళ్ల కిందటి మాటల్ని ఇప్పుడు వినటం మజాగానే ఉంటుంది.

స్క్రీన్ ప్లే వాస్తవికత మీద కంటే సెటైర్ మీదా ప్రహసనం మీదా గట్టిగా నిలబడింది. నటనను స్లాప్ స్టిక్ కామెడీలోకి ఎక్కువగా పోనీకుండా ప్రహసనం స్థాయిలో పట్టి ఉంచగల్గిన నటులు అందరూ ప్రతి ఒక్క పాత్రలో ఉన్నారు. వీళ్ళంతా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చినవాళ్ళవటంతో నాజూకుతనాన్ని తీసుకొచ్చారు. సినిమాలో ఎక్కువసేపు శవంగా జీవించిన సతీష్ షా ఒక అద్భుతం. కాఫిన్ లో ఉన్న ఆ శవంతో కబుర్లు చెప్పే తాగుబోతు అహూజా ప్రహసనం చూడాల్సిందే. శవం బోలెడన్ని మేకప్ లు వేసుకుంటుంది. చివరకు ద్రౌపది వేషంలో స్టేజ్ కూడా ఎక్కుతుంది. ద్రౌపది వేషంలోని శవంకోసం పాండవులూ కౌరవులూ అంతా పోట్లాడుకోవటం వింతైన ప్రత్యేక సన్నివేశం. దుర్యోధనుడు ద్రౌపదిని పొగిడి, వస్త్రాపహరణం ఐడియాని డ్రాప్ చేసేశానంటాడు. కృష్ణుడు రాకుండానే మిగతా అందరూ ద్రౌపదిని కీర్తిస్తూ మాన సంరక్షణ చేసి స్టేజ్ దాటించి తీసుకుపోదామని చూస్తారు.  దుశ్శాసన పాత్రధారి ఎంత ప్రయత్నించినా ద్రౌపదిమీద చెయ్యి వెయ్యలేక విఫలమైపోతాడు.  ద్రౌపదీవస్త్రాపహరణంలో మగ ద్రౌపదుల బట్టలూడిపోయిన మొరటు సీన్లు చాలా సినిమాల్లో మామూలే గానీ ‘జానే భీదో యారో’లోని ఈ సీన్లోని సున్నితమైన హాస్యం వేరు.

lalita3

‘జానేభీదో యారో’ నాటికీ ఇప్పటికీ జీడీపీ పాపంలా పెరిగిపోయింది. డిమెల్లోలు ఈరోజూ అవే ఆటలు ఆడుతున్నారు. శోభా సేన్లు మీడియాలో నిండిపోయారు.  మంత్రులు నేలని ఖనిజంముక్కలుగా బొగ్గుచెక్కలుగా అమ్ముకుంటున్నారు.  తర్నేజా అహూజాలు ఇంకా ఎదిగిపోయి ప్రభుత్వాలని మారుస్తూ దేశాన్ని పంచుకుంటున్నారు.  RTI బావిలో నిజాలు తవ్వుతున్న సత్యశోధకుల పీకలు తెగుతున్నాయ్. నవ్వుకోవటం మానేసి జనం ప్రతి చిన్నదానికి తామెవరో గుర్తు చేసుకుంటూ మనోభావాలను తెగ గాయపర్చుకుంటున్నారు. ఇప్పుడు డార్క్ కామెడీలకు ఎన్ని వస్తువులో!  ‘జానే భీ దో యారో’ అని తేలిగ్గా నవ్వుకునేలా ఉంటూనే ఆలోచనకు వీలిచ్చే లోతైన సినిమాలు రావాల్సిన సమయంలో మనకిప్పుడు దొరుకుతున్న సినిమాల్లో హాస్యం ఒట్టి గరం మసాలా. అదిలేకపోతే ఎవరూ చూడరు. ఉండి అది నెరవేర్చే ప్రయోజనమూ లేదు. తెలుగుసినిమాల్లో హీరోలకైతే పంచింగ్ బాగ్స్ లా కూడా ఉపయోగపడుతున్నారు హాస్యనటులు.

‘It’s my fault’ అంటూ రేప్ గురించి తీసిన ఈ చిన్న సెటైర్ లోని డార్క్ హ్యూమర్ని చూడండి…

*

 

 

 

 

 

అంతా అనుకున్నట్టే 

 

అంతా అనుకున్నట్టే

(ఉపశీర్షికతోసహా)

 

-స్వాతి కుమారి బండ్లమూడి 

~

 

ఇంతాచేసి మనక్కావల్సింది కొన్ని వాక్యాలేగా?

రాసుకుంటావా చెప్తాను?

 

నిప్పు కన్నుల నీవు- నగ్నమైన చూపుల అగ్నికీలవు

గాలి కౌగిళ్ళ నీవు- దగ్ధమైన రాత్రుల భగ్నకాంక్షవు

వెన్ ఐ కిస్ యూ, ఐ డోంట్ జస్ట్ కిస్ యూ!

– మధ్యలో ఎక్కడో “ఉప్పులేని తరగల సాగరానివి”, “పడగ విప్పు పెదవుల ప్రాప్త క్షణానివి”, “పచ్చబొట్టు స్పర్శల పరవశానివి” ఇట్లాంటివి చేర్చుకోవచ్చు. అసలు మాట విను “you are just another pair of legs” అని మాత్రం హన్నన్నా… రాసేస్తావా ఏంటి కొంపతీసి?

చుట్టుతా ఉన్నది శూన్యం అసలే కాదు. రాలటానికీ పూయటానికీ మధ్య దుఃఖానికి వ్యవధి లేదు. రాత్రుళ్ళు గదిలో జ్ఞాపకాలు పచార్లు చేస్తున్నాయని, నిద్రంతా నీటిపాలౌతుందనీ అదే అదే సూడో రొమాంటిక్ లాఫింగ్  స్టఫ్- ప్లీజ్… ఇకపై వద్దు. హృదయం మధుపాత్ర కాదు, కనీసం డిస్పోసబుల్ టీకప్ కుడా కాదు. పింగాణీ ప్లేటో, పులిస్తరాకో తేల్చుకోవాల్సినంత సీనేం లేదు. నేను హిపోక్రాట్ ని కావచ్చు కానీ మానిప్యులేటర్ ని కాదు. నేను పిచ్చికుక్కని కావచ్చు కానీ కోడిపెట్టని కానందుకు క్షమించొచ్చు.

నీ సంగతంటావా? నాటకం నడిచేటప్పుడు నువ్వు తెర బయట చెమ్కీ దండవి కావచ్చు, వేషగాడి మొహంమీద చెమటకి కారిపోయే రంగువో, హార్మనీ పెట్టె మీది క్రీచుమన్న మొరటు చప్పుడువో.. ఏం ఎందుక్కాకూడదు?

అన్నంముద్దకై ఆత్మలు నశించు నేలమీద వెన్నెల గురించీ, వర్షానందాల గురించీ వీరేమి వదరుచున్నారు?

సుఖతల్ప శయన మధ్యమున- విషాదమనీ, వేదన అనీ ఎంచేత ప్రేలుచున్నారు?

సరస్వత్తోడు- ఉభయకుశలోపరి.

 

P.S- తోవ తప్పించే పన్లు మాత్రం ఆల్కెమిస్ట్ గాడు మహా తొందరపడి చేసి పెడతాడు.

 

అన్వీక్షణ

 

 

-బి. హరిత

చిత్రం: సృజన్ రాజ్ 

~

 

Picture (1)పరిచయం:

హైదరాబాద్  సెంట్రల్   యూనివర్సిటీలో  ఎం.ఫిల్. చేస్తున్నాను. 
పుట్టింది విజయనగరం, ఇప్పుడు ఉంటున్నది హైదరాబాదు.
సాహిత్య ప్రవేశం అంటే, టూకీగా చెప్పాలంటే, సాంకేతిక విద్యలో డిగ్రీ అయ్యాక, తెలుగు మీద మమకారంతో ఎమ్మే చేశాను, ఆ ఇష్టంతో ఇప్పుడు పరిశోధనలోకి అడుగుపెట్టాను.
 
*

“ఎవరు నువ్వు?”

“నన్నే ఎరుగవా? నువ్వు నిరంతరం ఎవరి గురించి ధ్యానిస్తున్నావో అవ్వారిని నేనే!”

“అంటే నువ్వు.. నువ్వు దేవుడివా?”

“సందేహమా?”

“నేనేం నీ గురించి ధ్యానించటం లేదే!”

“లేదా? నువ్వు గత కొన్ని రోజులుగా రాత్రింబవళ్ళు నాగురించే ఆలోచిస్తున్నట్టు తోస్తేను, ఏదో నిన్ను పలకరించి పోదామని వచ్చాను. పోనిలే! వెళతాను”

“ఆగాగు! దొరక్క దొరక్క దొరికావు. నిన్నంత తేలిగ్గా పోనిస్తానా? నిన్ను చాలా చాలా అడగాలి. నా బుర్రంతా సందేహాలతో వేడెక్కిపోతోంది”

“అందుకేగా వచ్చాను. ఇక నీదే ఆలస్యం! అడుగు మరి”

“ఈ ప్రపంచానికంతటికీ నువ్వొక్కడివే దేవుడివా? నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?”

“నేనే వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాను”

“ఎందుకలా? నువ్వు ఉన్నవాడివి ఉన్నట్టుగా కనిపిస్తే తీరిపోదా? అన్ని రూపాల్లో కనిపిస్తూ జనాలను తికమక పెట్టి వాళ్ళ మధ్య తగువులు సృష్టించి తమాషా చూడడం నీకు సరదానా?”

“మీ ఇంట్లో ఎంతమంది?”

“నేనే మడిగాను? నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా మా ఇంట్లో ఎంత మంది ఉన్నారో నీకు తెలియదా?”

“తెలియకేం! నీ నోట విందామని..”

“నలుగురం – నేను, చెల్లి, అమ్మ, నాన్న”

“నీకే కూర ఇష్టం?”

“వంకాయ”

“మీ చెల్లికి?”

“బెండకాయ”

“అమ్మా నాన్నలకు?”

“అబ్బబ్బ! విసిగిస్తున్నావు!”

“చెబుదూ”

“అమ్మకు ఏదీ ప్రత్యేకంగా ఇష్టం ఉన్నట్టు కనపడదు. అన్నీ ఒకేలా తింటుంది. నాన్న బీరకాయను ఎక్కువగా ఇష్టపడతారు”srujan1

“ఒక కుటుంబంలో ఉన్న నలుగురు మనుష్యులకే, ఇప్పుడు తింటే మరి కాసేపట్లో అరిగిపోయే తిండి విషయంలోనే ఇన్ని ఇష్టాలున్నాయే, మరి ఈ విశాల ప్రపంచంలో ఉండే కోటానుకోట్ల మనుషుల అభిరుచులలో తేడాలుండవా? ఏ ప్రాంతం వారి అభిరుచులకు తగ్గట్టు వారికి కనిపిస్తాను.  ఇక వారి మధ్య గొడవలంటావా? అవి నేను పెట్టినవి కావు. నీకు వంకాయ ఇష్టమని మీ చెల్లిని కూడా అదే ఇష్టపడమనడంలో అర్థముందా? ‘De gustibus non est disputandum’ అని లాటిన్ లో ఒక సామెతుంది. అంటే..”

“తెలుసు! అభిరుచుల విషయంలో వాదోపవాదాలకు తావు లేదని. నీకు లాటిన్ కూడా తెలుసా?”

“అదేం ప్రశ్న! మీకు తెలిసినవన్నీ నాకూ తెలుసు. మీకు తెలియనిదేదీ నాకూ తెలియదు. ముందు చెప్పింది విను. ఎవరి ఇష్టం వారిదని పక్కవాడి ఇష్టాలను గౌరవిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఎపుడైతే మన ఇష్టాలను పక్కవాడి మీద రుద్దాలని ప్రయత్నిస్తామో అప్పుడే ఘర్షణ మొదలవుతుంది. అది మీరు గ్రహించిననాడు మీ ప్రపంచం శాంతిమయం అవుతుంది”

“అయితే ఈ విషయంలో నీ తప్పేమీ లేదంటావు!?”

“సరే! నీ కర్థమయ్యేలా చిన్న ఉదాహరణ చెబుతాను. మీ నాన్న నిన్ను, మీ చెల్లినీ చిన్నప్పటి నుండీ ఒకేలా చూశాడు. ఒకే సౌకర్యాలు కల్పించాడు. ఒకే స్కూల్లో చేర్పించాడు. అవునా?”

“ఔను!”

“మరి నువ్వు బాగా చదివి ఫస్టు మార్కులు తెచ్చుకున్నావు. కాని మీ చెల్లి చదువెప్పుడూ అంతంతమాత్రమే! దీనికి కారణం మీ చెల్లా? లేక మీ నాన్నా?”

“మా నాన్నెలా అవుతాడు. మా చెల్లే! అదెప్పుడూ టీ.వీ. ముందు కూర్చుంటే మార్కులెలా వస్తాయి?”

“కదా! మరి నేనూ మీ అందరికీ బుద్ధినిచ్చాను. అది వాడి బాగుపడమన్నాను. మరి మీలో కొందరు రవీంద్రులు, నరేంద్రులు అవుతున్నారు. విశ్వశాంతిని బోధిస్తున్నారు. మరికొందరు మతం పేరిట మారణహోమం సృష్టిస్తున్నారు. ఇది మీ తప్పా? నా తప్పా? మీకు నేను బుద్ధిని, తార్కిక శక్తిని ఇచ్చానంటే ఉపయోగించుకోమనే కదా! ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే బాధ్యత మీదే!”

“మరి నీ పేరుతో చెలామణీ అయ్యే ఆచారాలు? వ్యవహారాలు?”

“నువ్వాలోచించి చెప్పు, చూద్దాం!”

“హ్మ్!!….అవి ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న బుద్ధి జీవులు అక్కడి ప్రజల మంచి కోసం, సమాజంలో ఒక కట్టడి కోసం, నీ పేరిట ఏర్పరిచిన నియమాలు. అంతేనా?”

“శభాష్! నువ్వన్నట్టు ఒకప్పటి కాలంలో ప్రజలకు అవి అవసరమని జ్ఞానులు అవి ఏర్పరిచారు. అన్నీ కాదు కాని వాటిలో కొన్ని కాలపరీక్షకు నిలబడలేవు. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పోవాలి. కాని ఆచారం పేరిట మీరు వాటినే పట్టుకు వేలాడుతున్నారు”

“నిజం!  రాత్రి పూట ఇల్లు ఊడిచినా చెత్త ఎత్తి ఆవల పడెయ్యకూడదంటుంది అమ్మ. ఎందుకో అమ్మకూ తెలియదు. అమ్మమ్మ చెప్పిందంటుంది. ఆలోచించగా నాకు ఒక్కటే తోచింది. ఇంతకు ముందైతే గుడ్డి దీపాల వెలుతురులోనే రాత్రుళ్ళు పని చేసే వాళ్ళు. పొరపాటున విలువైనదేదో పడిపోతే చీకటిలో అవతలికి పడేస్తారేమోనని ఆ నియమం పెట్టి ఉంటారు. ఇప్పటి విద్యుద్దీపాల వెలుగులో కూడా దాన్నే పాటించడం తెలివితక్కువతనం. అలాగే సత్యన్నారాయణ స్వామి వ్రత కథ. వ్రతం చేసిన ఆవిడ, చనిపోయాడనుకున్న భర్త తిరిగి వచ్చిన ఆనందంలో, ప్రసాదం తినడం మరిచిపోయి భర్తను చూడడానికి పరిగెడితే, ఆమె భర్త ఉన్న ఓడను అక్కడికక్కడే సముద్రంలో ముంచేశావట. నువ్వింత శాడిస్టువా అని అప్పట్లో ఎంత తిట్టుకున్నానో!”

“బాగుంది! ఈ వ్రతకథలూ అవీ రాసేది మీరు. చెడ్డపేరు మాత్రం నాకా?”

“మరి నువ్వు నేరుగా కనిపించి ఈ విషయాలన్నిటిగురించి మాకు చెప్పొచ్చు కదా!”

“నన్ను చూడాలని బలంగా కోరుకునేవారికి తప్ప అందరికీ నేను కనిపించను. అయినా నేను చెప్పకపోతే ఏం? ఎప్పటికప్పుడు జ్ఞానుల చేత చెప్పిస్తూనే ఉన్నాను. అయినా మీరు వింటేగా? వోల్టేర్ అని మీ వాడే ఒకడు చెప్పాడులే, ‘It is difficult to free fools from the chains they revere’ అని”

“సరే కానీ, ఇంకొక పెద్ద సందేహం ఎప్పటినుండో ఉండిపోయింది. నిన్ను అడిగి తేల్చుకోవాలి. మా అమ్మ సీతమ్మను అడవిలో వదిలెయ్యడంలో ఏమైనా న్యాయముందా? నీకు సీతమ్మ కంటే రాజ్యమే ఎక్కువైపోయిందా? అది అధికారదాహం కాదా?”

“ఆబ్బో! ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయే! సరే! సమాధానం చెబుతాను. సావధానంగా విను. మొదటిగా సీతమ్మను వదిలేసింది నేను కాదు. రాముడు!”

“అదేమిటి? నువ్వే రాముడిగా అవతారం దాల్చలేదా? రాముడూ నువ్వూ వేరు వేరా?”

“వేరు కాదు! రాముడు నా అంశే! రాముడే కాదు మీరందరూ నా అంశలే! నా అవతారాలే! కాని రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వంటి కొందరు మాత్రం తమ బుద్ధిని అత్యున్నత స్థాయిలో వికసింపజేసుకుని, ధర్మమార్గంలో నడిచి, తమలోని దైవాంశను ఆవిష్కరింపజేసుకున్నారు. మహనీయులయ్యారు. మీ అందరికీ ఆరాధనీయులయ్యారు. ఆ విధంగా రాముడు నా అభిమాన అవతారం.
ఇక రెండవది అతడిపై నీ ఆరోపణ! దానికి జవాబు చెప్పే ముందుగా నీ జీవితంగా జరిగిన సంఘటనొకదాన్నిగురించి నేను ప్రస్తావిస్తాను. నువ్వు డిగ్రీ చదివే రోజుల్లో నువ్వు, ఉపాస్య అనే నీ స్నేహితురాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు; బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళి చేసుకోవాలని కలలు కన్నారు. అవునా? మరిప్పు డేమయింది? జీవితాంతం కలిసి ఉంటామని ఒట్లు పెట్టుకున్న మీరెందుకు విడిపోయారు? నువ్వెందుకామెను వదిలేశావు?”

“నేనేం ఆమెను వదిలెయ్యలేదు! మేం..మేం పరస్పర అంగీకారంతో విడిపోయాము. మేం ప్రేమించుకుంటున్న రోజుల్లో పదవ తరగతి చదువుతున్న నా చెల్లి చదువూ సంధ్య లేని ఒక పనికిమాలిన వెధవతో తిరగడం చూసి ఆమెను ప్రశ్నించాను. ‘నువ్వు ప్రేమించగా లేనిది నేను ప్రేమిస్తే తప్పా’ అని అడిగింది. తనది తెలిసీ తెలియని వయసని నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. వినలేదు. ‘నువ్వు నీ ప్రేమను వదులుకుంటే నేను నా ప్రేమను వదులుకుంటా. లేదంటే నా విషయంలో మాట్లాడకు’ అంది. గత్యంతరం లేని పరిస్థితిలో తన క్షేమం కోరి, తన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించి, ఉపాస్యతో చర్చించి, రాసిపెట్టి ఉంటే మళ్ళీ కలుద్దామనుకొని, అప్పటికి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఏం తప్పా?”

srujan1“కానే కాదు! ఎంతో చక్కటి నిర్ణయం తీసుకున్నావు. నీ చెల్లెలిది పరిపక్వత లేని వయస్సు. బాధ్యత కల అన్నగా నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించావు. మరి నీ చెల్లిని నువ్వు ఎంత ప్రేమించావో, అంతకంటే ఎక్కువగా రాముడు తన ప్రజలను ప్రేమించాడు. అతని ప్రజలూ బుద్ధిహీనులే! నువ్వు నీ చెల్లికోసం నీ ప్రేమను త్యాగం చేస్తే, రాముడు తన ప్రజలకోసం ప్రాణంతో సమానమైన తన భార్యను త్యాగం చేశాడు. మీ నాన్న నీ త్యాగానికి ఎంతగా సంతోషపడ్డాడో నేను రాముడి త్యాగానికి అంతగానూ గర్వపడ్డాను.”

“కాని రాముడు రాజ్యాన్ని తన తమ్ములకు వదిలి సీతతో అడవులకు వెళ్ళి ఉండవచ్చు కదా?”

“రాముడు చేసిన మొదటి ఆలోచన అదే! కాని అతని తమ్ములు రాజ్యభారాన్ని వహించడానికి సిద్ధపడలేదు. అరాచకమైన రాజ్యంలో ధర్మం నశిస్తుంది. ప్రజలంతా భ్రష్టుపట్టిపోతారు. ఇద్దరు వ్యక్తుల సుఖంకోసం సమాజాన్ని బలి పెట్టడం సరి కాదనుకున్నాడు రాముడు. తన అర్థాంగిని – తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. సీత అడవిలో ఉంది. రాముడు రాజభవనంలో ఉన్నాడు. కాని సీత లేని ఇంద్రభవనం కూడా రాముడికి అంధకార కూపమే. సీతకూ అంతే! రాముడు లేనిది ఏ చోటైనా ఆమెకు ఒకటే! అయితే నువ్వు చేసినట్లే రాముడు కూడా సీతతో చెప్పి పంపాల్సింది. ఆమె ఆనందంగా ఒప్పుకునేది. కాని దారుణ నరకబాధను అనుభవించడానికి సిద్ధపడ్డ రాముడు తను ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యను పిలిచి, ‘నిన్ను విడిచిపెడుతున్నాను’ అని చెప్పే ధైర్యం చేయలేకపోయాడు”

“హ్మ్!…..”

“మరి నేను వెళ్ళనా?”

“ఉండుండు! మరొక్క ప్రశ్న! పూజలూ, వ్రతాలు, ఉపవాసాలు చేసి నిరంతరం నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు కొందరు. అసలు నువ్వున్నావో లేవో అని డోలాయమానంలో ఉండేవారు ఇంకొందరు. నిన్నస్సలు పట్టించుకోని వారు మరికొందరు.  వీరందరిపట్ల నీ దృక్పథం ఎలా ఉంటుంది?”

“మీ నమ్మకమే నా ఊపిరి. నమ్మినవారికి ఉన్నాను. నమ్మని వారికి లేను. అందరూ నాకు సమానులే!”

“అసలిదంతా..మన మధ్య జరుగుతున్న ఈ సంభాషణంతా నిజమా? నా భ్రమా?”

“యద్భావం తద్భవతి! నువ్వు నమ్మినదే నిజం!”

“కానీ..”

“చెప్పవలసిందంతా చెప్పాను. ఇక నీ మెదడుకు పదును పెట్టి ప్రశ్నలకు జవాబులు అన్వేషించవలసింది నీవే. ఇక వెళ్ళొస్తా! మరొక భక్తుడికి నాతో పని పడింది”

*

ఒక్కో క్షణాన్నీ ఈదుతూ…

 

– జయశ్రీ నాయుడు
~

jayasri

 

 

 

 

 

చిక్కటి చీకటిని జోలపాటల్లో కలుపుతూ
ఒక వల తనను తాను పేనుకుంటుంది
అడుగులు ఆనని భూమిలోతుల్ని పరుచుకుంటూ
ఒక సముద్రం ఆరంభం
చుక్కల్లా మినుకుమనే అలల నీడలు
ఆ వెలుగులో కొన్న్ని ధైర్యాల క్రీడలు
పంటి బిగువున లోలోని వాదాల తుఫాన్లు కుదిపేస్తున్న
ఒక్కో క్షణాన్నీ ఈదుతూ ఓ ఈత ఆరంభం
తెలియనితనాల్లా దాటిపోతున్న నావలు
ఏది నాదో తెలియని సమయాలు
ఏ తెరచాప నీడ ఓ స్థిమితపు కునుకు దాచుకుందొ
ఎవరూ చెప్పలేని అవిశ్రాంత ప్రయాణం ఆరంభం
అంతం వెతకని ఆరంభాలే జీవించడం నేర్పేది
నావ కాదు ఈతే గమ్యం
చెళ్ళుమని వెన్ను చరిచే అలలే సావాసం
బారలు చాపుతూ వేలి చివరికంటా లాక్కునే శక్తి
దేహమంతటా నిరంతరం ప్రవహిస్తూ ఓ అనుభూతి

ఎక్కడ కొత్త చూపు ఆరంభమో
అదే పాతకు అంతం
వలలను చీల్చుకు సాగేందుకు
చిరుచేపలకు సైతం
ఈత నేర్పే జీవన పోరాటం!

*

గమనమే గమ్యం-27

img549

-ఓల్గా

~

olgaఆ రోజు సాయంత్రం పని ముగించుకుని డాక్టర్‌ రంగనాయకమ్మ గారి హాస్పిటల్‌కు వెళ్ళింది శారద. ఆమె దగ్గర ఎప్పుడూ ఒకరిద్దరు అనాథ స్త్రీలు  నర్సుగా శిక్షణ పొందుతూ బతుకుతుంటారు. ఎవరినైన తన దగ్గరకు పంపితే వాళ్ళు కాస్త తెలివైన వాళ్ళయితే సుభద్ర లేని లోటు తీరుతుంది. లేకపోతే తనకు హాస్పిటల్‌లో చాలా కష్టమవుతుంది.

రంగనాయకమ్మ గారికి కాన్పు కేసు ఉండి లేబర్‌ రూంలో ఉండటంతో. శారద చనువుగా ఇంట్లోకి వెళ్ళింది. చలంగారు, పద్మావతిగారు, ఇంకొంతమంది కూర్చుని ఉన్నారు.

శారదను పద్మావతి గుర్తుపట్టి లేచి వచ్చింది.

‘‘బాగున్నారా డాక్టర్‌’’ అంటూ కావలించుకుంది. మద్రాసులో రెండు కుటుంబాల  మధ్యా స్నేహం ఉండేది. శారదను ‘అక్కా’ అని పిల్చేది పద్మావతి.

‘‘నువ్వెంత బాగున్నావు పద్మా – చాలా అందంగా ఉన్నావు” అంది శారద.

‘‘అందుకే సినిమావాళ్ళు వెంటపడుతున్నారు’’ చలంగారు చురక వేశారు.

‘‘మీ స్నేహితురాలుండేది – ఏం పేరు? గుర్తురావటం లేదు. వాళ్ళమ్మ ఇంకో అమ్మాయిని చేరదీసింది. రాజ్యం  అని. ఆ పిల్ల  ఇపుడు సినిమా ప్రపంచానికి రాణి . చాలా అందమైనదిలే. నటన కూడా తెలుసు. మీ స్నహితురాలేం చేస్తోంది’’.

‘‘డిల్లీలో ఉందనుకుంటా. మంచి ఉద్యోగం, భర్త,పిల్లలు , సంసారంలో పడి పోయింది’’.

‘‘మంచి పని చేసింది. నాకు ఇల్లు, నాటక  కళా రెండూ కావాలని  కష్టపడుతున్నాను. నువ్వు రాజకీయాలు , వైద్యం, ఇల్లు  ఎట్లా చూసుకుంటున్నావక్కా ? ’’

‘‘రాజకీయాు ఆయన చూసిపెడతాడు. ఇల్లు  వాళ్ళమ్మ చూసిపెడుతుంది. వైద్యం మాత్రం ఆమే చూసుకుంటుంది. మన వొయ్యి లాగానే’’ అన్నారు  చలం .

డాక్టర్‌ రంగనాయకమ్మను కుటుంబంలో అందరూ వొయ్యి అంటారు.

శారద ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. ఆయన అన్ని మాటలు  తన గురించి మాట్లాడటం అదే మొదటిసారి.

శారదకు ఒక్కక్షణం ఆయనకు తన బాధ చెబుదామా అనిపించింది. మరుక్షణంలో ఆ ఆలోచనని తుడిచేసింది. తన సమస్య తనే పరిష్కరించుకోవాలి. మరెవరికీ ఆ శక్తి ఉండదు. తను సమర్థురాలని ముందు తను నమ్మాలి. ‘‘నా రాజకీయాలు  నేనే చూసుకుంటాను. నా  పనులు  నావే.  ఇల్లంటావా ? ఇల్లు  ఇంకా ఫ్యూడల్‌ దశలోనే ఉంది కాబట్టి మా అమ్మ దానిని పట్టుకుని ఒదటం లేదు. ఒదిలిన రోజు దానిని నేననుకున్నట్లు ఒక సామాజిక ప్రదేశంగా చేసేస్తాను. వైద్యం నేనే చేస్తానని మీరే ఒప్పుకున్నారు. గాబట్టి పేచీ లేదు’’ అని గలగలా నవ్వింది శారద.

‘‘నీ నవ్వు వల్ల  నీ మాటలు  నమ్ముతున్నాను’’. అన్నారు  చలం  శారదను మెచ్చుకోలుగా చూస్తూ

‘‘శారద గురించి నీకు తెలిసింది తక్కువ. ఎక్కువ మాట్లాడొద్దు. ఆమెలాంటి మనుషులుండరు’’ అంది పద్మావతి.

‘‘తక్కువ కాదు. అసలు  మాట్లాడను’’ అంటూ మౌనంలోకి వెళ్ళిపోయారాయాన. పద్మావతి సుబ్బమ్మ గారెలా ఉన్నారని  అడిగింది.

‘‘ఒకసారి ఒచ్చి చూడరాదూ ` అమ్మ సంతోషిస్తుంది. నీ గురించి ఎప్పుడూ తల్చుకుంటుంది. మీరు వేసిన నాటకాలు  వంటివి పద్మావతి కూడా వేయరాదా  అని గొణుగుతుంటుంది’’.

పద్మావతి నవ్వేసింది ‘‘ఏదో ఒక  నాటకాలు  వెయ్యమనే అమ్మ ఉంది నీకు. అదృష్టవంతురాలివి .

‘‘మీ ఆయనేమంటున్నారు? ఎలా ఉన్నాడు?’’

‘‘ఎప్పుడూ అనేదే. కొత్త ఏముంది. ఆయన సహకారం లేనిదే నా  కళారాధన కుదురుతుందా?’’

శారద నవ్వుతూ ‘‘వెళ్ళేలోగా మా ఇంటికొక్కసారి రండి  ’’ అంటుండగా రంగనాయకమ్మ ఒచ్చింది.

‘‘ఏంటి శారదా ? నీకు మా ఇంటికొచ్చేంత తీరికెలా దొరికింది’’

‘‘తీరికుండి కాదు. పనుండి వచ్చాను’’.

శారద తనొచ్చినదెందుకో చెప్పింది. రంగనాయకమ్మ లేచి ‘‘రా హాస్పిటల్‌కి వెళ్దాం. ఒకమ్మాయిని చూపిస్తా. నీకు నచ్చితే తీసుకుపోదువు గానీ ` ’’ ఇద్దరూ లేచి హాస్పిటల్‌కు వెళ్ళారు.

శారదకు క్ష్మిల బాగా నచ్చింది. అంత బాగా నచ్చకపోయినా  తీసుకునేదే. రంగనాయకమ్మకు థాంక్స్‌ చెప్పి లక్ష్మిని రెండు రోజుల్లో తన దగ్గరకు రమ్మని చెప్పింది. క్ష్మిల కొత్తచోటు ఎలా ఉంటుందోనని భయపడుతుంటే ‘‘ఈ దేశంలోనే ఆమెకంటే మంచి మనిషి ఉండదు. హాయిగా వెళ్ళు. మళ్ళీ నేనిటు రమ్మన్నా రానంటావు “అంది రంగనాయకమ్మ.

క్ష్మిల ఆశ్చర్యంగా చూస్తుంటే ‘‘నే చెప్పింది నిజమే. ఆమెలాంటివాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. నీ జీవితానికి మంచి దారి చూపిస్తుంది’’ అన్నది. క్ష్మిల భర్తనొదిలేసి వచ్చి రంగనాయకమ్మని ఆశ్రయించింది. ఆమె పడ్డ బాధలన్నీ విని డాక్టర్‌గా అన్ని రకాలు  వైద్యాలు  చేసి, తన దగ్గరే ఉంచుకుంది. అలా వాళ్ళింట్లో ఎప్పుడూ నలుగురైదుగురు ఉండేవారు. కొందరు పిల్లలని  డాక్టర్‌ గారి దగ్గర ఒదిలేసేవారు. వాళ్ళు ఆ ఇంట్లో పిల్లలతో  పాటు పెరిగే వారు. డాక్టర్‌గా ఆమెవారిని చేరదీస్తే , చలం  తన పిల్లలతో  పాటు వారికీ  ప్రేమాభిమానాలు  పంచేవాడు. అదొక సామాజిక కుటుంబంగా చూసే వారికి  కొత్తగా, వింతగా, కొందరికి రోతగా అనిపించేది.

img111

రెండు మూడు రోజులు  మూర్తి, శారద మధ్య ముభావంగా గడిచిపోయాయి. ఇద్దరికీ మాట్లాడాలని ఉంది గానీ ఎవరూ చొరవ తీసుకోలేదు. మూర్తికి ఇంతలో మద్రాసు వెళ్ళాల్సిన పనిబడింది.

‘‘నువ్వూ రారాదు ?  ’’ అని అడ గాడు.

‘‘రాను . నాకు చాలా పనులున్నాయి “ . అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

మూర్తి వెళ్ళాక ఒక రోజంతా  ఆస్పత్రి పనులతో తీరిక లేకుండా గడిచింది. చాలా రోజు నుండీ చేయించాల్సిన చిన్న చిన్న రిపేర్లు – పాతబడిన వస్తువులు  తీసెయ్యటం. కొత్తవి తెచ్చి సర్దటం – అందరితో కలిసి శారద కూడా పని చేసింది. సంక్రాంతి నెల. కాన్పు కోసం తప్ప ఆస్పత్రికి ఎక్కువ మంది రారు. కాస్త తీరిక దొరికింది.

మహిళా సంఘం మీటింగులతో మరో రెండు రోజులు  గడచిపోయాయి. అనేక నిర్ణయాలు  తీసుకున్నారు. శారద కూడా అదనపు బాధ్యతలు తీసుకోక తప్పలేదు. సుభద్రతో స్నేహంగా మాట్లాడి  ఆమె బెరుకు పోగొట్టింది. రెండు రోజుల పాటు అంతమంది స్త్రీలతో గడిపి అందరి సమస్యలూ  పంచుకునేసరికి శారద మనసు కూడా ఉల్లాసంగా మారింది. ముఖ్యంగా సుభద్ర తను పూర్తికాలం  పార్టీ కార్యకర్త అయినందుకు పడే సంతోషం, గర్వం చూశాక, పార్టీ అంటే ఆమెకున్న అంకితభావం చూశాక శారదకు మూర్తి చేసిన పని సబబుగానే తోచింది.

‘తనతో చెప్పలేదే’ అన్నదొక్కటే కలుక్కుమంటోంది మనసులో. ఆ సాయంత్రం మీటింగు ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. మెల్లీ మాత్రం మిగిలింది.

‘‘నువ్వేమిటో బాధ పడుతున్నావు చెప్ప’’ మని ఒత్తిడి చేసింది. మెల్లీ తనను అంతగా పరిశీలించి అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపడుతూ అంతా చెప్పింది శారద.

మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి –

‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు గదా. అతనికి కోపం వస్తే  అది నీ నిర్ణయమన్నావు కదా ` అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతను దానికి బదులు  తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు  కలిసి నిర్ణయించుకోవాల్సి  వస్తుంది.

ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమేఅడిగే మామూలు  గృహిణివి కాదు నువ్వు. నీకో కొత్త చీరె కొని నగలు  చేయించి లోబరుచుకునే మామూలు  భర్త కాదు అతను. మీరు మీ హద్దులు  స్పష్టంగా గుర్తించాలి. ఎవరి ప్రాంతం ఏది?  ఎక్కడకి ఎవరు చొచ్చుకురాకూడదు. ఎక్కడ కి ఇతరును రానీయకూడదు `- ఈ విషయాల్లో గందరగోళ పడితే చాలా బాధలొచ్చి పడతాయి. మీరు కూచుని శాంతంగా మాట్లాడుకోండి ’’.

శారద మౌనంగా ఉండి పోయింది.

‘‘శారదా –  నీకు రాజకీయాలు, ఇల్లు, ఆస్పత్రి చాలా బాధ్యతలు. అంత బాధ్యతతో మూడింటినీ నడపాలి. నడుపుతున్నావు.  ఆ నీ సామర్థ్యం చూసి మూర్తి భరించలేకపోతున్నాడు. మగవాళ్ళకు చాల  అహం ఉంటుంది. కమ్యూనిస్టులైనంత మాత్రానా  అది పోదు. వాళ్ళు మగ కమ్యనిస్టులుగానే ఉంటారు. భార్యలను భార్యలుగానే చూస్తుంటారు. వాళ్ళను మనం మార్చాలి. . దానికి చాలా ఓపిక కావాలి. మీ ఇద్దరి మధ్యా ఉన్న  ప్రేమ  నీకు ఆ ఓపికను ఇవ్వాలి . ఇస్తుంది’’.

మెల్లీ మాటలకు శారదాంబ మనసు కొంత కొంత మెత్త బడింది .

olga title

‘‘మీతో మూర్తి ఈ విషయాలు మాట్లాడాడా?’’

‘‘మాట్లాడాడు. ఒక మగవాడ లాగానే మాట్లాడాడు. నేను చెప్పినది విన్నాడు  గానీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అనుమానమే. ఎందుకంటే అతన్ని మార్చే శక్తి నీ దగ్గర తప్ప మరెవరి దగ్గం ఉండదు. మా అందరితో పని చేసేటపుడు అడ్డం రాని అహం నీ దగ్గరే వస్తుంది. నువ్వు భార్యవి కాబట్టి. అది చాలా సంప్రదాయ సంబంధం. దానిని మార్చాలి  మనం. ఆలోచిస్తే  నీకే తెలుస్తుంది. రాజీ పడొద్దు. కానీ మాట్లాడు. వివరించు. మూర్తి గ్రహించేలా చెయ్యి. ఎవరి చోటు వారు  నిర్ణయించుకోండి  . ఒకరి చోటునింకొకరు దురాక్రమణ చేయకండి . మొండితనం, పంతాలు  ఎవరికీ మంచివి కావు. వాటిని మీ మధ్యకు రానీయకు. మాట్లాడు. అదొక్కటే మార్గం’’. మెల్లీ మాటలు  మననం చేసుకుంటూ అంది శారద.

‘‘నేను అతని భార్యను కాను. సంప్రదాయం ప్రకారం అసలు  కాను. నన్నతను భార్యలా చూడటం నేనూ భరించలేకపోతున్నాను’’.

‘‘సంప్రదాయం ప్రకారం భార్యవు కాదు – నిజమే. కానీ మూర్తి నిన్నలాగే చూస్తున్నాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళూ అలాగే చూస్తున్నారు. దానిని నువ్వర్థం చేసుకోవ లి. నువ్వు కోటి మందిలో ఒకతివి. కోటిమంది నిన్నర్థం చేసుకోవటం మాటలు  కాదు. నువ్వు కత్తి మీద సాము చెయ్యాలని నాకు తెలుసు. కానీ తప్పదు’’

మెల్లీ మెల్లిగా శారదననునయిస్తూ మాట్లాడింది. శారద తనలోకి తను చూసుకుంటున్నట్టు మెల్లీకి చెప్పింది. ‘‘నేనూ మా ఇద్దరి సంబంధాన్నీ చాలా  ఉన్నతంగా అనుకున్నాను. ‘భార్య’గా ఉండాలని నాకు  లేకపోయినా  లోకమంతా  నన్ను మూర్తి భార్యగానే చూస్తోంది. భార్యగా కొందరూ, ఇంకో విధంగా కొందరూ మొత్తానికి  మూర్తికి నా  మీద మరెవరికీ లేని అధికారం ఉందని చెప్తున్నారు . నేను దానిని అంగీకరించటానికి సిద్ధంగా లేను. మూర్తితో ఆ విషయం స్పష్టంగా చెప్తాను. మేం  ప్రేమికులం . కలిసి బతుకుతున్నాం. ఇద్దరు మనుషులు  కలిసి బతుకుతున్నపుడు ఏవో గొడవలు, అహంకారాలు, అభిప్రాయ బేధాలు  వస్తాయి. వాటి  గురించి మాట్లాడి  ఒకరినొకరు అర్థం చేసుకోగల  పరిణితి మా మధ్యలో ఉంటేనే మా సంబంధం నిలబడుతుంది. అలా కాకుండా తరతరాలుగా  భార్యాభర్తల  మధ్య ఉన్న అధికార సంబంధాన్ని మా మధ్యకు మూర్తి తెచ్చాడా? ఒక్క క్షణం ఆ బంధం నిలవదు. ఆ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. నన్ను నేను పోగొట్టుకోలేను.’’

శారద చేతిని తన చేతిలోకి తీసుకుని  ప్రేమగా నొక్కింది మెల్లీ.

‘‘ముందు నువ్వు ఏమిటో అది తెలుసుకో’’.

శారద గలగలా నవ్వేసింది.

‘‘నేనేమిటో నాకు తెలుసు మెల్లీ – నేను ఆధునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని  తపనపడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకల  సంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు – నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది – ఒక సంకెల  తెగితే మరొకటి వచ్చి పడుతోంది. నేను పోరాడుతున్నాను . జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్‌గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ మెల్లీ, ఎన్ని పరీక్షలు , ఎన్ని విజయాలు , ఎన్ని అపజయాలు  ఐనా  ఆనందంగా ఉంది. నేను నేనైనందుకు ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధతతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నామో  కదా మనందరం’’

వెలుగుతున్న శారద ముఖంలోకి చూస్తూ ఉండి పోయింది మెల్లీ.

***

కరుణా టీచర్ చెప్పిన ఉపాయం

 

 

సాయంకాలం క్లాసులకి పెద్ద పిల్లలు క్రమంగా మళ్లీ రావడంమొదలు పెట్టేరు. నాకు సంతోషంగా అనిపించింది. ఇంకా కొందరు రావలసి ఉంది. నాకు తెలుసు. రోజూ అటెండెన్స్ తీసుకుంటూ వాళ్లరాక కోసం ఎదురుచూస్తున్నాను.

ఒక వారం తరువాత క్లాసు అయి ఇంటికి బయలు దేరుతుంటే ఒకతను, ’మేష్టరమ్మగారూ , మీతో మాట్లాడాలి’ అన్నాడు. మిగిలిన పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే , వాళ్లని పంపించేసి, చెప్పమన్నాను. ఇతన్ని ముందెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు.

‘ మేష్టరమ్మగారూ, నేను ఇక్కడే గూడెంలోనే ఉండేది. లారీ మీద పని,దేశం మొత్తం తిరుగుతూంటాను. నెలకి ఒకటీ రెండు సార్లు ఇంటికి వస్తావుంటాను. మొన్న మీకు దెబ్బలు తగిలేయంటగా, తెలిసింది. ఎవరో పెద్ద క్లాసు సదూతున్న పిలగాళ్లు ఈ పని సేసేరని సెప్పుకుంటున్నారు. మా ఇంట్లో కూడా ఎన్మిది సదూతున్న పిల్లోడున్నాడు. ఈ పని సేసింది వోడు కానీ అయితే సెప్పండి. మా వోడు మాట వినడం లేదని, అల్లరి ఎక్కువైందని మా ఇంటామె సెబుతోందీ మద్దెన.’

‘ మనం ఇంక ఆ సంగతి మర్చిపోదామండి,’అన్నాను ముందుకు కదులుతూ.

‘ నాకు ఒక్క అవకాశమివ్వండి. మీకు మళ్లీ ఇట్టాటి ఇబ్బంది రాకుండా నేను సూసుకుంటాను.’ అతను రెట్టించాడు.

అతని మాటలు వింటున్నప్పుడు ఆ మాట తీరు ఎవరినో స్ఫురింపచేసింది.

‘ నాకు ఇబ్బంది ఏమీ లేదులెండి. మళ్లీ ఇలాటి విషయం జరగదని నా నమ్మకం’ అని నడక మొదలు పెట్టేను. అతను కొంచెం దూరం వెనుకే రావడం తెలుస్తోంది.

‘ సరే మేష్టరమ్మగారూ, మావోడు అనీలు, మీకు తెలిసే ఉంటుంది, ఎనిమిది సదువుతున్నాడు. ఆణ్ని మీ దగ్గర కూర్సోబెట్టుకుని రోజూ సదివించండి…….’ అతను వెనక్కి మళ్లాడు.

అవును. నా సంశయం నిజమే.! ఆ పిల్లవాడి తండ్రే ఇతను.ఆ విషయాన్ని ఎంత ప్రక్కకి తోసేస్తున్నా మళ్లీ మళ్లీ గూడెంవాళ్లు తిరగ తోడుతూనే ఉన్నారు.

ఆ రాత్రి భోజనం చేసి, స్కూలు పని ఉందని చేసుకుంటూ కూర్చున్నాను. పని పూర్తై నిద్ర పోబోతే నిద్ర రాదు. ఏదో దిగులుగా అనిపించింది. అమ్మ వచ్చి వెళ్లటం బావుంది. కానీ ఆ పదిరోజులూ అమ్మ ఇంట్లో తిరిగిన అలికిడి జ్ఞాపకం వస్తే……మనసు బలహీనమవుతోంది. కాని వెళ్లేప్పుడు నామీద కోపంతో వెళ్లింది. అమ్మకి గూడెం అంటే కూడా కోపంగా ఉందని నాకు అర్థమైంది.

అసలు అమ్మ కాదూ నాకు రోల్ మోడల్! ఆవిడ తన ఉద్యోగంతో పాటు ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకోవటం తను చూస్తూనే ఉంది చిన్నప్పటినుండి. అమ్మకి గూడేన్ని పూర్తిగా పరిచయం చెయ్యనేలేదు. ప్చ్….అమ్మకి వివరంగా ఇప్పుడు పరిచయం చేస్తాను…అవును, నిద్ర ఎలాగూ రావటం లేదు. మంచంమీద నుండి లేచి ల్యాప్ టాప్  తెచ్చుకుని అమ్మకి ఉత్తరం టైపు చెయ్యటం మొదలుపెట్టేను………………

************

‘ అమ్మా, నా మీద అలకతో ఉన్నావు కదూ. నాకథ పూర్తిగా విను , అప్పుడు నువ్వు నన్నూ, నా గూడేన్ని, నాపిల్లలని చూసేందుకు పరుగెత్తుకువస్తావు………………….

ఇక్కడి గవర్నమెంటు బడికి ఉద్యోగ రీత్యా వచ్చినప్పుడు పిల్లలని చూసి ఆశ్చర్యపోయాను . సమాజంలో అడుగువర్గాలనుండి వచ్చిన పిల్లలే ఇక్కడంతా. చదువు అవసరం వీళ్లకి ఎక్కువగా ఉంది.

కాని చదువు పట్ల వాళ్ల అనాసక్తి…..అనాసక్తి కూడా కాదేమో, ఉదాశీనత! ఎందుకో నాకు అర్ధం కాలేదు.

ఇన్నాళ్ళుగా కార్పొరేట్ స్కూలులో పాఠాలు చెప్పిన అనుభవం! అక్కడి డిసిప్లిన్ మాత్రమే చూసేను. చదువుకున్న తల్లిదండ్రులు తీసుకునే శ్రధ్ధ స్పష్టంగా చూసేను.

ఇక్కడ కనీసం పదిశాతం మంది పిల్లలు కూడా చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. పుస్తకాల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్న ఆలోచన లేకపోవటం చూస్తే, చదువుని తేలిగ్గా తీసుకుంటున్నారనిపిస్తుంది.క్లాసులో చెప్పినప్పుడు శ్రధ్దగా వినేవాళ్లు తక్కువే . ఒకటికి నాలుగుసార్లు చెప్పి, ఇంట్లో చదవమని కొద్దిపాటి హోంవర్క్ ఇచ్చినా ఏనాడూ పూర్తిగా చేసుకొచ్చిన వాళ్లు లేనే లేరు .

కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల నిరంకుశత్వం నుండి బయటపడి సంతోషంగా వచ్చి గవర్నమెంటు బడిలో చేరేను కాని  ఇక్కడ పిల్లల వైఖరికి అసంతృప్తి మొదలైంది. నా  బాధ్యత సరిగా నెరవేర్చటంలేదేమో అని నా మీద నాకే అపనమ్మకం మొదలైంది.

వీళ్లని ఎలా మలుచుకోవాలి, అదీ ఒక్కరో , ఇద్దరో కాదు. అందరూ కాకపోయినా చాలా మంది పిల్లలు చదువులో బాగా వెనకబడే ఉన్నారు.  పిల్లలు మాత్రం ఎంతో చురుగ్గా ఉన్నారు. ఏ కార్పొరేట్ స్కూల్ పిల్లలకీ తీసిపోరు.

ఎప్పటిలాగే స్కూల్లో పాఠంచెప్పటం అయిపోయేక , ఇంటికి వెళ్లి చదవమని చెప్పి, కొంత హోమ్ వర్క్ ఇచ్చేను .

నీరజ లేచి చెప్పింది, ‘టీచర్ , ఇంటికెళ్లేక చదవటానికి మామూలుగానే చాలా తక్కువ సమయం ఉంటుంది, కానీ ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బావులేదు , ఇంట్లో పని మొత్తం నా బాధ్యతే. …………….అదికాకుండా………..’ఒక్కక్షణం ఆగింది. అంతలోనే మెల్లిగా నావైపు నడిచి వచ్చి రహస్యంగా చెప్పింది, ‘టీచర్, మా అమ్మ పని చేసే ఇళ్లకి వెళ్లి పని చేసిరావాలి. అమ్మ లేవటం లేదు, ఒక్కరోజు, రెండు రోజులకంటే ఎక్కువ మానేస్తే జీతం కోత పెడతారు……’

తలవాల్చుకుని చెబుతున్న నీరజని వింటుంటే ఆశ్చర్యం….. మిగతా పిల్లలు వింటే ఏడిపిస్తారేమో అన్న దిగులు ఆ గొంతులో. అయినా ఎవరికి తెలియనిదనీ, వెంటనే భవాని అంటోంది, ‘ నీరజ స్కూలు నుండి వెళ్లేక ,పనికెళ్లాలి టీచర్, ఆమెకి టైమే ఉండదు’ భవాని మాటలకి క్లాసు మొత్తం నీరజ వైపు తిరిగేరు.

నీరజని వెళ్లి కూర్చోమని చెప్పి ఆ విషయాన్ని అంతటితో ముగించాను. ఇలాటి ఒక విషయం ఉంటుందని ఎప్పుడైనా తెలుసా నాకు?ఈ పిల్లలని ఇంకొంచెం శ్రధ్ధగా పట్టించుకోవలసిన అవసరం ఉందని మాత్రం అర్థమైంది.

స్కూలు వదిలేక పిల్లలంతా ఎవరిదారిన వాళ్లు ఇళ్ల దారి పట్టేరు . భవాని నా వైపుగా నడుస్తూ మాటలు కలిపింది.

‘ టీచర్, నీరజకి ఇంట్లో బోలెడు పని ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ల అమ్మ కూడా లేవట్లేదు, ఇప్పుడు ఆ  పనులూ నీరజవే. వాళ్ల నాన్న ఇంటిని అస్సలు పట్టించుకోడు.  ఇంట్లోకి ఒక్క పైసా ఇవ్వడంట . సంపాదించటం వరకూ సంపాదిస్తాడు,కానీ డబ్బంతా తాగుడికే ఖర్చు పెడతాడంట. ‘

పన్నెండేళ్ల భవాని ఆరిందాలా చెబుతోంది. ఇంకా ఏమి చెబుతుందో కానీ, ‘ఆలస్యం అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్లు’ అంటూ ఇంటి దారి పట్టేను.

ఆ తర్వాత నాలుగైదు రోజులు నీరజ స్కూలుకి రాలేదు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో , ఒక్కసారి వెళ్లి చూసి వస్తే…….ఏమో , ఏమనుకుంటారో………..  వాళ్ళ విషయాల్లో నేను ఎక్కువగా తలదూరుస్తున్నానని అనుకుంటే…………ఎవరిని అడగాలి, భవాని ని అడిగితే చెబుతుంది , కానీ వేరొకరి విషయాలు ఆమె దగ్గర ప్రస్తావించటం సరి అయిన పని కాదు.

స్టాఫ్ రూమ్ లో మిగిలిన టీచర్లతో అదేమాట చెబితే,

‘ క్రొత్తగా చేరేవు కదూ, నువ్వు కొన్నాళ్లపాటు పిల్లలు, చదువులు అంటు దిగులు పడటం సహజమేలే. మేమూ నీలాగే ఉండేవాళ్లం. రానురాను అదే అలవాటైపోతుందిలే. వాళ్లంతే. వాళ్లకి చదువులక్కర్లేదు. స్కూలుకి రావడం, వెళ్లడం ….అంతవరకే. అదీ వచ్చినన్నాళ్లే ’ శ్యామల మాటలు బాధనిపించాయి.

కరుణా టీచర్ మాత్రం కొంచెం సానుభూతితో చెప్పింది.

‘ దీపికా, వాళ్ల గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్లందరూ రోజువారీ కూలి పనులకి వెళ్లే వాళ్ల పిల్లలే చాలావరకూ. తెల్లవారి లేస్తే పనికోసం పరుగెత్తాలి. పని దొరికితే సరే. ఇల్లు చేరేసరికి చీకటి పడిపోతుంది. ఆ పూటకి కావలసిన సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం …అంతే ఆ రోజు గడిచిపోయినట్లే. ఇక పిల్లల చదువులు పట్టించుకునే తీరికెక్కడిది? పిల్లలు ఏం చదువుతున్నారో అర్థం చేసుకునే చదువులు వాళ్లకి లేనేలేవు’

‘ మరి వీళ్లు చదువుకోకపోతే వీళ్ల భవిష్యత్తు ఏంకావాలి కరుణగారూ?’ నా ప్రశ్నకి ఆవిడ నవ్వింది. కరుణ టీచర్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంది. ఎంతో ఓర్పుగా నా ప్రశ్నకి జవాబు చెప్పింది.

‘ ఆసక్తి ఉన్నవాళ్లని సాయంత్రం మీ ఇంటికి రమ్మని నువ్వు కొంత ప్రోత్సాహం ఇవ్వచ్చు. అదైనా ఎంత మంది వస్తారో చెప్పడం కష్టమే.’

ఆవిడ చెప్పిన ఆలోచన నచ్చింది నాకు.

‘అర్థం కాని పాఠాలు చెప్పించుకుందుకు సాయంత్రం ఇంటికి రండమ్మా ‘ అంటే, సంబరపడుతూ అయిదారు మంది పిల్లలు రావడం మొదలు పెట్టేరు. అది ఒక్క నాల్గు రోజులే. ఆ తర్వాత రావడం మానేసేరు. ఏమైందంటే….

‘ ఇంటికెళ్లేసరికి ఆలస్యం అయిపోతోంది టీచర్. మా అమ్మ పనిలోంచి వచ్చేసరికి ఇంటి పనంతా చెయ్యాలి. వంట కూడా చెయ్యాలి. నిన్న, మొన్న కూడా పనులు అవక వంట ఆలస్యం అయింది. తమ్ముడు, చెల్లెలు ఏడుపు. మా నాన్న నన్ను పది దాకా చదివిస్తా అనేవాడు . కాని ఇప్పుడు చదువు వద్దు, స్కూలు మానేసి ఇంటిపట్టున ఉండు’ అంటున్నాడు టీచర్’ నందిని బావురుమంది.

సుగుణ చెబుతోంది,’ మా అమ్మకి గుండె జబ్బు టీచర్. నాలుగు రోజులు పనిలోకి వెళ్తే నాలుగు రోజులు ఇంట్లోనే ఉండిపోతుంది. నేను బాగా చదువుకుని , మంచి ఉద్యోగం చెయ్యాలని చెబుతుంది. నేను చదువుకోవాలని అమ్మకి ఆశ’ కళ్లనీళ్లు తిరుగుతుంటే ముఖం తిప్పుకుంది.

 

దేవుని చేతిలో గన్నులు ఎందుకు లేవు-1

 

-వినోద్ అనంతోజు

~

vinodముందు మాట:

ప్రశ్న ఒక Chain Reaction. ఏ ప్రశ్నకి అయినా సమాధానం వెతికే క్రమంలో ఎన్నో ఇతర ప్రశ్నలు పుడతాయి. వాటికి సమాధానం వెతికేటప్పుడు ఇంకొన్ని ప్రశ్నలు పుడతాయి. ఇలా అంతు లేకుండా ఒక Chain Reaction లా సాగిపోతుంది. ప్రశ్న ఏదయినా దానికి ఒక సమాధానం ఉండి తీరుతుంది. ఒక్క చిన్న ప్రశ్నతో మొత్తం విశ్వంలోని అన్ని విషయాలనీ అన్వేషించవచ్చు. మనకి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే గానీ “ఆకలి ఎందుకు వేస్తుంది?” అనే చిన్ని ప్రశ్న నుంచి అటు బయాలజీని, ఇటు సోషియాలజీని అంతుల దాకా అన్వేషించవచ్చు. ఈ శీర్షికలోని వ్యాసాలు ఇలాంటి ఆసక్తి ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి నేను Anthropology, History, Metallurgy, Religion, Arts, ఇలా ఎన్నో సబ్జెక్టుల్లోకి వెళ్లాను. కొన్ని సార్లు అసలు ప్రశ్నని వదిలేసి మిగతా ప్రశ్నలకి సమాధానం వెతికే పనిలో పడ్డాను. ఈ వ్యాసాలని బాగా అర్థం చేసుకోవడానికి మీరు కూడా కొంత శ్రమ చెయ్యక తప్పదు. నాతో కలిసి మీరు కూడా ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు కూడా ఆ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉండాలి.

***

ప్రపంచంలో దాదాపు 4,500 మతాలు ఉన్నాయి. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు ఉన్నాడు. కొన్ని మతాలలో అయితే లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నారు. అతి పురాతన మతాల నుంచి అత్యాధునిక మతాల దాకా, అన్నిటిలో కొన్ని అంశాలు ఒకేలా ఉంటాయి. అనేక సందర్భాలలో వేరు వేరు మతాల దేవుళ్ళ మధ్య కూడా చాలా సారూప్యతలు కనిపిస్తాయి.
ఈ మధ్య ఒక మిత్రుడి ఇంటిలో ఒక అద్భుతమైన తైలవర్ణ చిత్రపటం (oil painting) చూసాను. విశ్వరూపంలో ఉన్న విష్ణుమూర్తి painting అది. చిత్రకారుడి పనితనంతో పాటు విష్ణుమూర్తి చేతిలో ఉన్న గద, గొడ్డలి, విల్లు, బాణాలు, ఖడ్గం వగైరాలు నా దృష్టిని ఆకర్షించాయి. ఇవన్నీ మానవులు ఒకానొక కాలంలో వాడిన రకరకాల “ఆయుధాలు” కదా. అంతకు ముందు కాలంలో రాతి ఆయుధాలు వాడారు. ఆ తరవాత గన్నులు, బాంబులు వాడుతున్నారు. మరి దేవుళ్ల బొమ్మలు కేవలం ఆ particular కాలంలో మానవులు వాడిన ఆయుధాలు మాత్రమే ధరించినట్టు కనపడుతున్నాయి ఎందుకు? ఏ ఒక్క దేవుని బొమ్మ అటు రాతి ఆయుధాలు గానీ, ఇటు గన్నులు గానీ పట్టుకుని కనిపించడం లేదు ఎందుకని? కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక మతాలలో ఇదే కనిపిస్తోంది. గ్రీకు, రోమను, ఈజిప్షియన్ దేవుళ్ళు కుడా త్రిశూలాలు, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. దీనికి కారణం ఏమయి ఉంటుంది?

vinod1

మామూలుగా చూస్తే ఇది చాలా సిల్లీ ప్రశ్న లాగా కనిపిస్తుంది కానీ ఈ ప్రశ్నకి ఎక్కడా రాజీ పడకుండా సరైన సమాధానం తెలుసుకోవడం కోసం కొంత అధ్యయనం చెయ్యక తప్పలేదు. ఈ ప్రశ్న “మతం – ఆయుధాలు – కళ”లతో సంబంధం కలిగి ఉంది.
“మతం”, “దేవుడు” అనే భావనలు అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. మనం చూస్తున్న దేవుని బొమ్మల యొక్క రూపం కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కల్పించబడినది. ఆ ఆయుధాలు కూడా అప్పటివే.
మరి మొదటి నుంచీ దేవుళ్ల రూపాలు ఇలా ఉండేవి కావా? ఒకవేళ ఇలా కాకపొతే, అంతకు ముందు కాలంలో దేవుళ్ల రూపాలు ఎలా ఉండేవి? వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకునేవారు? అసలు దేవుళ్ళకి ఈ రూపాలు ఎవరు కల్పించారు? ఏ కాలంలో కల్పించారు? మన అసలు ప్రశ్నతో పాటు ఇలాంటి ప్రశ్నలు అనేకం పుడతాయి. ప్రశ్న ఏదైనా సమాధానం తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం మనకు కింద చెప్పిన నాలుగు విషయాలు కొంతయినా తెలిసి ఉండాలి.
1. మానవ సమాజం అభివృద్ధి క్రమం
2. మతం – దాని పుట్టుక, అభివృద్ధి క్రమం
3. ఆయుధాలు – కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులు
4. కళల  అభివృద్ధి క్రమం

 

మానవ సమాజం అభివృద్ధి క్రమం

మతము, ఆయుధాలు, కళలు – ఈ మూడూ కూడా మానవ సమాజంలోని భాగాలే. వాటి అభివృద్ధీ, వాటిలో వచ్చే మార్పులూ మానవ సమాజంలో వచ్చే మార్పులతో చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. వాటన్నిటి మధ్య connection అర్థం చేసుకోవాలంటే మనకి మానవ సమాజం యొక్క అభివృద్ధి క్రమం తెలిసి ఉండాలి.
ఇవ్వాళ ఉన్న మానవ సమాజం అన్ని రంగాలలోనూ చాలా అభివృద్ధి చెందినది. ఇది ఒక్క రోజులో ఆవిర్భవించింది కాదు. ఒకప్పుడు మనుషులు జంతువుల స్థాయి నుంచి మొదలుపెట్టిన వారే. మనం తయారు చేసుకున్న ప్రతి వస్తువు వెనక, ఏర్పరుచుకున్న ప్రతి వ్యవస్థ వెనుక ఎన్నో వేల సంవత్సరాల మానవానుభవం ఉంది.

మానవానుభావం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక సహస్రాబ్ది (1000 సంవత్సరాల) క్రితం ప్రపంచంలో అత్యధిక భాగంలో రాచరిక వ్యవస్థే నడుస్తోంది. అప్పటి మానవులకి ఇంకా “ప్రజాస్వామ్యం” అంటే ఏమిటో తెలియదు. ఇంకో విధంగా చెప్పాలంటే, “ప్రజాస్వామ్యం” లాంటి వ్యవస్థ సమాజంలో పుట్టి, నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవం ఆయా సమాజాలు అప్పటికి ఇంకా సంపాదించుకోలేదు అన్నమాట. కొన్ని శతాబ్దాల పాటు రాచరిక వ్యవస్థని అనుభవించిన తరవాత మాత్రమే, సమాజం ఆ వ్యవస్థ యొక్క లోపాలని గుర్తించగలిగింది. అంతకంటే ఉత్తమమయిన వ్యవస్థ యొక్క అవసరాన్ని గుర్తించగలిగింది. రాచరిక వ్యవస్థ నడిచిన కాలంలో నేర్చుకున్న అనుభవాలు, గుణపాఠాలు తరవాతి కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్మించుకోవడంలో ఉపయోగపడ్డాయి. ఇది ఒక అభివృద్ధి క్రమం.

vinod2

మనం నేడు చూస్తున్న సమాజంలోని ప్రతి అంశమూ ఇలా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినదే. జంతువుతో సామానమయిన స్థాయి నుంచి మొదలయిన మానవ ప్రస్థానం నేడు ప్రకృతిని తన వశంలోకి తెచ్చుకునే స్థాయికి చేరింది. ఇది సమాజం యొక్క పరిణామ క్రమం. ఈ క్రమం మొదలయ్యి లక్షన్నర సంవత్సరాలు పైనే అయ్యింది. ఈ మొత్తం అభివృద్ధి జరిగిన క్రమాన్ని/కాలాన్ని మన అధ్యయనం కోసం మూడు యుగాలు గా విభజించవచ్చు.

1. ఆటవిక యుగం – మానవ జాతి ఆవిర్భవించిన కాలం నుంచి మనుషులు కుండలు వంటి మట్టి పాత్రలు తయారు చెయ్యడంలో నైపుణ్యం సంపాదించిన కాలం వరకు ఆటవిక యుగంగా చెప్పవచ్చు. ఈ యుగం సుమారు 1,60,000 సంవత్సరాలు నడిచింది. ఈ యుగంలోనే మానవులు రాళ్ళని పనిముట్లుగా మలచుకునే నైపుణ్యం సంపాదించారు. నిప్పుని కనుగొన్నారు, చేపలు తినడం అలవాటు చేసుకున్నారు, విల్లు, రాతి గొడ్డళ్ళు వంటి ఆదిమ ఆయుధాలు తయారు చేసుకున్నారు. అప్పటికి లోహం (metal) ఒకటి ఉంటుందని మానవులకి తెలియదు.

2. అనాగరిక యుగం – కుండలు తయారు చేసే పరిజ్ఞానం సంపాదించిన కాలం దగ్గర్నుంచి నుంచి భాషలకి లిపి తయారు చేసుకునే కాలం వరకు అనాగరిక యుగం అనవచ్చు. అనాగరిక యుగం సుమారు 35,000 సంవత్సరాలు నడిచింది. అంటే మట్టితో కుండలు చేసే స్థాయి నుంచి మాటలని అక్షరాలుగా రాసే తెలివితేటలు సంపాదించుకోవడానికి మనుషులకి 35,000 సంవత్సరాల పైనే పట్టింది అన్నమాట. అనాగరిక యుగంలోనే మనుషులు పశుపాలన, వ్యవసాయం, ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం, రాగి, కాంస్యం, ఇనుములని కరిగించి వస్తువులు తయారుచెయ్యడం నేర్చుకున్నారు. భాషలని అభివృద్ధి చేసుకున్నారు.

3. నాగరిక యుగం – భాషలకి లిపి తయారు చేసుకున్న కాలం నుంచి నేటి వరకు సుమారు 5000 సంవత్సరాల కాలం ఇది. మనకు తెలిసిన రాజులు, రాజ్యాలు, కళలు, అన్ని ఆధునిక పరికరాలు, శాస్త్రాలు, రాతపూర్వక కావ్యాలు, ప్రజాస్వామ్యం ఈ యుగంలోనే మానవులు తయారు చేసుకున్నారు.

గమనిక: ఇవన్నీ పురావస్తు పరిశోధనలని (Archeological studies) ఆధారం చేసుకుని వేసిన లెక్కలు. ఈ యుగాలకీ హిందూ పురాణాలలోని యుగాలకీ (కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం..) ఎటువంటి సంబంధమూ లేదు.
ఈ విభజన కోసం “లూయిస్ హెన్రీ మోర్గాన్” తన జీవిత కాలం వెచ్చించి పరిశోధించి రాసిన “పురాతన సమాజం” పుస్తకం మీద ఆధార పడ్డాను. ఆయన ఆ పుస్తకం రాసే కాలంలో (1870’s) లభ్యంగా ఉన్న ఆధారాల ప్రకారం ఒక విభజన చేసారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన అనేక ఆధారాలను పరిగణలోకి తీసుకుని నేను ఈ విభజనలో కొన్ని మార్పులు చేర్పులు చేసాను. మన అధ్యయనం కోసం ఈ మూడు యుగాలని ఒక్కొక్క దాన్ని మూడు అంతర్దశలుగా విభజించవచ్చు.
ఈ విభజనని సంవత్సరాల వారీగా ఒక పట్టికలో (Table) చేర్చాను. ఈ పట్టికని పై నుంచి కిందకి చదివితే తేలిగ్గా అర్థమవుతుంది. అంటే ఆటవిక యుగం దిగువ దశ నుంచి మొదలుపెట్టి కిందకి చదువుతూ వెళ్ళాలి అన్నమాట. ప్రతి యుగంలోనూ మూడు అంతర్దశలు ఉంటాయి (దిగువ-మధ్య-ఎగువ). పట్టికలో ప్రతి దశలోనూ ఆ దశలో జరిగిన ముఖ్యమయిన విషయాలు, మానవులు సాధించిన ముఖ్యమైన అభివృద్ధి చూడవచ్చు.

ఈ వ్యాసంలోని అనేక విషయాలని అర్థం చేసుకోవడానికి ఈ పట్టిక మీకు ఉపయోగపడుతుంది. ముందు ముందు చదవబోయే వాటిలో ఎక్కడ confusion వచ్చినా ఈ పట్టికని చూడండి.
ఈ పట్టికలో సంవత్సరాల లెక్కలు చూపించడం జరిగింది. దాని అర్థం మొత్తం ప్రపంచంలోని అన్ని సమాజాలలో ఆ సంవత్సరాల లోనే ఆ మార్పులు వచ్చాయని కాదు. ఈ పరిణామం ప్రపంచంలోని అన్ని సమాజాలలో ఒకే సమయంలో జరగలేదు. భౌతిక పరిస్థితులని (Physical Conditions) బట్టి కొన్ని సమాజాలు వేగంగా అభివృద్ధి చెందాయి. కొన్ని వెనకబడ్డాయి. ఈనాటి నాగరిక ప్రపంచంలో కూడా అక్కడక్కడా అనేక ఆటవిక, అనాగరిక జాతులు కనపడతాయి. అంటే ఆ జాతుల అభివృద్ధి క్రమం చాలా నెమ్మదిగా నడుస్తోంది అన్నమాట. మిగతా ప్రపంచం అంతా నాగరిక యుగంలోకి ప్రవేశించింది. కానీ ఆ జాతులు మాత్రం ఆటవిక, అనాగరిక యుగాలలో ఉన్నాయి. అభివృద్ధి చెందే వేగంలో హెచ్చుతగ్గులున్నా, అభివృద్ధి చెందే క్రమం మాత్రం ఇలాగే ఉంటుంది. రాబోయే వ్యాసంలో దీనిని ఇంకొంచం వివరంగా చూస్తాము. పై పట్టికలో చూపించిన సంవత్సరాలు ప్రపంచంలో వివిధ సమాజాలలో వచ్చిన అభివృద్ధి కాలాలను average చేసి, సుమారుగా రాయబడినవి.
సాధారణంగా ఎవరైనా “ప్రాచీన కాలం” అని అంటే మనం మూడు వేలో, నాలుగు వేలో సంవత్సరాల పూర్వం అని అనుకుంటాం. మనం మాట్లాడుకునే “చరిత్ర” కూడా ఈ కాలం నుంచే మొదలవుతుంది. కానీ అంతకు ఒకటిన్నర లక్షల సంవత్సరాల ముందు నుంచే మానవులు ఉన్నారు. జంతువు నుంచి ఆటవికులుగా, ఆటవికుల నుంచి అనాగరికులుగా, అనాగరికుల నుంచి నాగరికులుగా ఎదగడంలో వారు వెచ్చించిన శక్తి, శ్రమ, బుద్ధి అసామాన్యమయినవి. నిరంతరం ప్రకృతితో పోరాడుతూ, ఎదురు దెబ్బలు తింటూ, స్వంత అనుభవంతో చిన్న చిన్న విజయాలు సాధించుకుంటూ ఇంత దూరం వచ్చారు. ప్రకృతిలో ఏ ఇతర ప్రాణీ సాధించలేని అభివృద్ధి మానవులు సాధించారు. “మన పూర్వీకులు” అనగానే కిరీటాలు పెట్టుకున్న రాజులో, వేదాలు చదివే మునులో మనకి గుర్తు వస్తారు. ఇది కొంతవరకే నిజం. మన పూర్వీకులు ఆటవికులుగా దిగంబరంగా అడవులలో తిరిగిన వారే. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. వారు లక్ష సంవత్సరాలు పాటు కష్టపడి సాధించిన అభివృద్ధి శిఖరాగ్రాన (Peak Point మీద) నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మనం మర్చిపోకూడదు.
రాబోయే వ్యాసాలలో మానవ సమాజంలో ఏ కారణాల చేత మార్పులు వస్తాయో, వాటి వల్ల మనుషుల జీవన విధానంలో, మతంలో, ఆచారాలలో మార్పులు ఎలా వస్తాయో చర్చిద్దాం.

(వచ్చే  వారం )
*

కాండీడ్

 

9వ అధ్యాయం

 

ఇసాకర్ హిబ్రూ తెగవాడు. కోపం ముక్కుమీదే ఉంటుంది. ఇజ్రాయెల్ ను బాబిలోనియా చెరపట్టినప్పట్నుంచి ఇజ్రాయెల్ లో అంతటి ముక్కోపి మరొకడు లేడని ప్రతీతి. క్యూనెగొండ్ పై తన శనివారపు హక్కును చలాయించుకోవడానికి లోనికి అడుగుపెట్టగానే పక్కపైన యువజంట సరసమాడుతూ కనిపించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

‘ఓసి.. రంకుముండా! ఆ మతపెద్దగాడితో నీ కామదాహం తీరలేదన్నమాట. ఇక నేను నిన్ను వీడితోనూ కలసి  పంచుకోవాలన్నమాట? ఈ గుంటవెధవకు తగిన బుద్ధి చెబుతాలే..’ అని రంకె వేశాడు.

అస్తమానం తెగ వేలాడేసుకుని తిరిగే బారెడు ఖడ్గాన్ని సర్రున ఒరలోంచి దూసి నిరాయుధుడైన కాండీడ్ పైకి ఉరికాడు. పరిస్థితి గమనించిన ముసలమ్మ చప్పున కాండీడ్ చేతికి అందమైన కరవాలంతోపాటు, ఒళ్లు కప్పుకోవడానికి బట్టలు కూడా అందించింది. సకల సద్గుణసంపన్నుడైన కాండీడ్ ఒక్క వేటుతో శత్రువును నేలకూల్చాడు. ఇసాకర్ అందాల క్యూనెగొండ్ కాళ్ల దగ్గర పడిపోయి ప్రాణాలు విడిచాడు.

‘అయ్యో, మేరీమాతా! ఇప్పుడు మాకేం మూడనుందో..! నా ఇంట్లో ఖూనీ జరిగిపోయింది. రక్షకభటులొస్తే ఇక మనపని ఖతం..’ అందగత్తె భయపడిపోయింది.

‘మన మహాతత్వవేత్త పాంగ్లాస్ ను ఉరితీయకుండా ఉండుంటే ఈ గడ్డు సమయంలో మనకు చక్కని సలహాలు ఇచ్చుండేవాడు కదా. ఆయన లేడు కనక ఈ ముసలమ్మను సలహా అడుగుదాం’ అన్నాడు కాండీడ్.

ములసమ్మ కూడా తెలివితేటలు గలదే. ముందుచూపున్నదే. పడచుజంటకు ఏం చెయ్యాలో చెప్పడం మొదలుపెట్టగానే రహస్య ద్వారం తెరచుకుంది. అప్పటికి అర్ధరాత్రి ఒంటిగంట దాటిపోయి అదివారం వచ్చేసింది కనక మతవిచారణాధికారి క్యూనెగొండ్ పై, ఆ ఇంటిపై తన హక్కును అనుభవించడానికి వచ్చాడు. తాను కొరడా దెబ్బలు కొట్టించిన యువకుడు చేతితో కత్తితో నిల్చుని ఉండడం, కింద చచ్చిపడున్న యూదు, కలవరపడుతున్న క్యూనెగొండ్, సలహాలిస్తున్న ముసలమ్మ కనిపించడంతో ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

ఆ విపత్కర పరిస్థితిలో కాండీడ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. ‘ఇప్పుడు వీడు ఇదంతా చూసి సాయం కోసం కేకలు వేస్తే.. తర్వాత నన్ను సజీవదహనం చేయించడం ఖాయం. క్యూనెగొండ్ కూ అదే గతి పడుతుంది. ఈ దుర్మార్గుడు నన్ను క్రూరంగా చావగొట్టించాడు కనక వీడు నాకు బద్ధశత్రువు. పైనా నేనిప్పుడు ఎలాగూ చంపడం మొదలుపెట్టాను కనక, ఆలోచించే వ్యవధి కూడా లేదు కనక.. ఏ రకంగా చూసినా వీణ్ని చంపిపారేయడమే ఉత్తమమని తోస్తోంది’ అనుకుంటూ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు.

మతాధికారి ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే కాండీడ్ మెరుపు వేగంతో కదిలి అతణ్ని హతమార్చాడు. యూదు పీనుగ పక్కన మరో పీనుగ పడిపోయింది.

‘ఇంకో హత్యా? ఇక మనకు పూర్తిగా మూడినట్టే. ఇక మనల్ని ఎవరూ దయదల్చరు. చావు ముంచుకొచ్చినట్టే. కాండీడ్! నీ వంటి మంచిమనిషి రెండే రెండు నిమిషాల్లో రెండు ఖూనీలు చేయడమా?’ ప్రేయసి కలవరపడింది.

‘ఓసి నా ముద్దుగుమ్మా! ప్రేమోన్మాదం తలకెక్కినవాడు అసూయ, ఉద్వేగంతో ఏం చేస్తాడో అతనికే తెలియదు. మతవిచారణలో కొరడా దెబ్బలు కూడా తిని ఉంటే ఇక చెప్పక్కర్లేదు’ తన పనిని సమర్థించుకున్నాడు ప్రియుడు.

ముసలమ్మ తక్షణ కర్తవ్యం గుర్తుచేసింది.

‘కొట్టంలో మూడు జాతిగుర్రాలు జీన్లు, కళ్లేలు తగిలించి సిద్ధంగా ఉన్నాయి. వీరాధివీరుడైన మన కాండీడ్ వాటిని తీసుకురావాలి. అమ్మగారు నగలూ నాణేలూ మూటగట్టుకు రావాలి. తర్వాత మనం ముగ్గురం గుర్రాలెక్కి కేడిజ్ కు పోదాం. నేను ఈ నా ఒంటిపిర్రెపైనే తిప్పలుపడుతూ ఎలాగోలా దౌడు తీస్తాలే. పదండి త్వరగా వెళ్దాం. వాతావరణం హాయిగా ఉంది. ఈ చల్లని రాత్రివేళ ప్రయాణం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.’

కాండీడ్ వెంటనే గుర్రాలను సిద్ధం చేశాడు. ముగ్గురూ ఏకధాటిగా ముప్పై మైళ్లు ప్రయాణించారు. వాళ్లు శషభిషలు పడకుండా వెంటనే పారిపోవడం మంచిదే అయ్యింది. వాళ్లు అటు వెళ్లీ వెళ్లగానే మతపెద్ద సహచరులు, రక్షకభటులు ఇంట్లోకొచ్చారు. తమ ఉన్నతాధికారిని సుందరతరమైన చర్చిలో గౌరవప్రదంగా ఖననం చేసి, యూదును మాత్రం పెంటకుప్పపైన పడేశారు.

కాండీడ్, క్యూనెగొండ్, ముసలమ్మ.. సియెరా మోరేనా కొండల మధ్య ఉన్న అవసెనా అనే చిన్నపట్టణానికి చేరుకున్నారు. ఓ సత్రంలో గది తీసుకుని కబుర్లలో మునిగిపోయారు.

pic

 

10వ అధ్యాయం

 

‘నా నగలు, డబ్బులు ఏ దొంగముండాకొడుకు ఎత్తుకుపోయాడు? అయ్యో దేవుడా, ఇక మేమేం చేసేది? ఎట్టా బతికేది? అసలు బతకడం దేనికీ అంట? అలాంటి ఖరీదైన నగానట్రా ఇచ్చే మతపెద్దలు, యూదులు మళ్లీ నాకెక్కడ దొరుకుతారు?’ క్యూనెగొండ్ దీర్ఘాలు తీస్తూ, కన్నీళ్లు ధారలు కడుతూ ఏడుస్తోంది.

‘నిన్న రాత్రి మనం బడజాజ్ లో దిగిన సత్రంలో మనతోపాటే బస చేసిన సన్యాసే కాజేసి ఉంటాడనుకుంటాను. అయితే ఇలా తొందరపాటు నిర్ణయానికి రావద్దనుకోండి. కానీ, అతగాడు మన గదిలోకి రెండుసార్లు వచ్చి తచ్చాడి వెళ్లాడు. పైగా మనకంటే ముందుగానే వెళ్లిపోయాడు కూడా’ ముసలమ్మ అనుమానం వెళ్లగక్కింది.

‘అలాగా!  ఈ ప్రపంచంలోని వస్తువులు అందరూ పంచుకోవడానికే ఉన్నాయని, వాటిపై అందరికీ సమాన హక్కు ఉంటుందని మన పాంగ్లాస్ ఎన్నోసార్లు రుజువు చేశాడు. ఆ వాదన ప్రకారం ఆ దొంగసాధువు కూడా తనకు కావాల్సింది తీసుకుపోయి, మన ప్రయాణానికి అవసరమైంత డబ్బును మిగిల్చిపోయే ఉంటాడు. నీ దగ్గరి కొంచెం డబ్బు కూడా లేదా క్యూనెగొండ్?’ కాండీడ్ కారణలీలా విలాసాన్ని విశ్లేషించి అడిగాడు.

‘నాయాపైసా కూడా లేదు! ’ ప్రేయసి కస్సుమంది.

‘అయితే మనమిప్పుడు ఏం చెయ్యాలి?’ అడిగాడు.

‘ఇక చేసేదేముంది? ఒక గుర్రాన్ని అమ్మిపారెయ్యడమే! నేను అమ్మగారి గుర్రంపైన వెనక కూర్చుంటా. ఒంటి పిర్రెతోనే ఎలాగోలా తూలిపోకుండా సర్దుకుంటాను. ఎలాగైనా సరే ముందు మనం త్వరగా కేడిజ్ కు చేరాలి’ ముసలమ్మ సలహా ఇచ్చింది.

ఆ సత్రంలోనే బసచేసిన బెనెడిక్ట్ మతాధికారికి ఓ గుర్రాన్ని కారుచవగ్గా అమ్మేశారు. తర్వాత ఎలాగోలా లూసెనా, చిలాస్, లెబ్రిస్కాల మీదుగా కేడిజ్ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఓ సత్రంలో చిన్నపాటి స్పానిష్ సైనిక పటాలం తిష్టవేసింది. అది పరాగ్వేకు పోతోంది. పరాగ్వేలో శాన్ శాక్రమెంటో దగ్గర్లోని స్థానిక తెగను స్పెయిన్, పోర్చుగల్లు రాజులపై తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టిన జెస్యూట్లకు బుద్ధిచెప్పడానికి వెళ్తోంది. కాండీడ్ క్షణమాలస్యం చెయ్యకుండా దళాధిపతి వద్దకు వెళ్లి బల్గర్ల సైన్యంలో తాను నేర్చుకున్న కవాతూ గట్రా సైనిక విన్యాసాలను పొల్లుపోకుండా ప్రదర్శించాడు. అతని వేగం, చురుకుదనం, క్రమశిక్షణ, తెలివితేటలు, వినయవిధేయతలు చూసి దళాధిపతి అతణ్ని పదాతిదళ నాయకుడిగా నియమించాడు. కాండీడ్ కెప్టెన్ అయిపోయాడు! క్యూనెగొండ్ ను, ముసలమ్మను, ఇద్దరు సేవకులను, తన చేతిలో హతమైపోయిన లిస్బన్ మతపెద్దకు చెందిన రెండు జాతిగుర్రాలను వెంటబెట్టుకుని ఓడలో పయనమయ్యాడు.

ప్రయాణం సాంతం పాంగ్లాస్ సిద్ధాంతంపై చర్చోపచర్చలు సాగించారు.

‘మనం కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. అక్కడ ప్రతీదీ ముమ్మాటికీ సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మన ప్రపంచంలో కొనసాగుతున్న ప్రాపంచిక, నైతిక వ్యవహారాలు ఎవరికీ ఆమోదయోగ్యంగా లేవు కనక’ అన్నాడు కాండీడ్.

‘కాండీడ్.. ప్రియతమా! నిన్ను మనసారా ప్రేమిస్తున్నా.. అయితే నేను చూసిన, అనుభవించిన దారుణాలు గుర్తుకొస్తే చాలు ఒళ్లు జలదరించిపోతోంది సుమా..’ క్యూనెగొండ్ వణికింది.

‘భయపడకు. అంతా చక్కబడుతుందిలే! ఈ కొత్త ప్రపంచం చుట్టూ ఉన్నఈ సముద్రాన్ని చూడు. మన యూరప్ సముద్రంకంటే ఎంతో బావుంది కదూ! అలలూ, గాలులూ తేడా లేకుండా మౌనంగా ప్రశాంతంగా. సందేహం లేదు. ఇది నిజంగా నవలోకమే! సృష్టిలోని ప్రపంచాల్లో ఇదే సర్వోత్తమ ప్రపంచం!’ సముదాయించాడు ఆశాజీవి.

‘భగవంతుడి దయవల్ల అలాగే సాగని. కానీ నేనెంత దుదరదృష్టవంతురాలిని, ఒక్కటీ సవ్యంగా జరగలేదు కదా! నా ఆశలన్నీ అడుగంటి పోయాయి’ నిట్టూర్చింది జవరాలు.

అంతా విని ముసలమ్మ అందుకుంది.

‘మీ కష్టనష్టాలు విన్నాక, అవి నేను అనుభవించిన వాటికంటే పెద్దవేం కాదనిపిస్తోంది’ అంది.

ఆమె తనకంటే దౌర్భాగ్యురాలినన్నట్టు చెప్పడం క్యూనెగొండ్ కు తమామాషా అనిపించి, నవ్వు తెప్పించింది.

‘చాల్చేలేవమ్మా, పెద్ద చెప్పొచ్చావుగాని! నిన్ను ఇద్దరు బల్గర్ సైనికులు చెరిచేసి, నీ కడుపులో కత్తితో రెండు తీవ్రగాయాలు చేసి, పల్లెలోని నీ రెండు భవంతులను కూల్చేసి, నీ తల్లిదండ్రులను నీ కళ్లముందే ఖండఖండాలుగా నరికేసి, నువ్వు ప్రేమించిన ఇద్దరిని బలిజాతరలో కొరడాలతో నెత్తురుకారేలా చావగొట్టి ఉంటేనే తప్ప, నువ్వు నాకంటే దుదృష్టవంతురాలివి కాబోవు! పైగా నేను తొంభై తొమ్మిది అవిచ్ఛిన్న తరాల వంశంలో, జమీందారు ఇంట్లో పుట్టి వంటలక్కగా బానిస బతుకూ బతికానాయె.. ’ క్యూనెగొండ్ ఏకధాటిగా మాట్లాడి, ముసలమ్మను ఎగతాళి చేసింది.

 ‘అమ్మా! మీకు నా పుట్టుపూర్వోత్తరాలు బొత్తిగా తెలియవు. నా వీపుకింది భాగాన్ని మీకు చూపిస్తే, మీరిలా ఎగతాళి చెయ్యరు. పైగా ఇలా మాట్లాడినందుకు ఎంతో నొచ్చుకుంటారు కూడా’ అంది ముసలమ్మ.

పడచుజంటకు ఆమె మాటలు ఆసక్తి రేకెత్తించాయి. ముసలమ్మ తన గాథ మొదలుపెట్టింది.

 

(సశేషం)

( ఈ నవలను ఈ వారంతో ఆపేస్తున్నాం. ఇది ఇకపై http://kalasahiti.blogspot.in/ లో కొనసాగుతుంది.)

టర్కీ ప్రభుత్వంతో ‘ట్రోజన్ వార్’

 

స్లీమన్ కథ-18

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఎటు తిరిగినా అడ్డంకులే. మైసీనియా చుట్టుపక్కల బందిపోట్ల బెడద ఎక్కువగా ఉందన్న కారణం చూపించి అక్కడ తవ్వకాలకు గ్రీకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫ్రాంక్ కల్వర్ట్ ను చూస్తే, తీవ్ర అనారోగ్యంతో తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సాయం చేయగల స్థితిలో లేడు. సోఫియా ఇంకా అస్వస్థంగానే ఉంది.  స్లీమన్ ఈలోపల ట్రయాడ్ లో తన పది రోజుల సాహసం గురించి కొల్నిషో సైతూంగ్ కు రాశాడు. యజమానుల అనుమతి లేకుండానే ఆ దిబ్బ మీద తను తవ్వకాలు జరిపిన సంగతిని కూడా బయటపెట్టాడు. టర్కిష్ అధికారులు ఆ కథనాన్ని చదివారనీ, తన చర్యను తప్పు పట్టారనీ అతనికి తెలిసింది. ఎథెన్స్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం తప్ప ప్రస్తుతానికి చేయగలిగిందేమీ అతనికి కనిపించలేదు.

అతను అమితంగా ద్వేషించేది ఒక్కటే, పనీపాటా లేకుండా గడపడం. ఫ్రాంక్ కల్వర్ట్ ఎందుకిలా మొండికేసాడనుకుంటూ అసహనానికి లోనయ్యాడు. ఆ ఇద్దరు టర్కులకూ వంద పౌండ్లు చెల్లించి వాళ్ళ భూమిని కొనాలనుకున్నాడు. కానీ వాళ్ళు పడనివ్వలేదు. ఇంకో తెలివి తక్కువ ప్రతిపాదన కూడా చేశాడు. అంతకన్నా తక్కువకు బేరం కుదిర్చితే, ఆ మిగిలిన మొత్తాన్ని మీకు వదిలేస్తానని కల్వర్ట్ కు రాశాడు. ఆ భూమి ఎప్పుడైతే తన సొంతమైందో, అప్పుడు తవ్వకాలు నిరాటంకంగా జరుగుతాయనీ; ఏటా మూడు మాసాలు తను అక్కడే గడుపుతూ, అయిదేళ్లలో అక్కడి శిథిల నిర్మాణాల చుట్టూ ఉన్న చెత్తను తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడానికి కూడా తను సిద్ధపడగలననీ-ఏవేవో ఊహించుకున్నాడు.

అలా ఊహలతోనే రోజులు భారంగా గడుస్తున్నాయి. తీవ్ర నిరాశానిస్పృహలు స్లీమన్ ఉత్సాహాన్ని అణగదొక్కుతున్నాయి. కల్వర్ట్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పిస్తూ అదేపనిగా ఊదరగొడుతున్నాడు. టర్కిష్ ప్రభుత్వంతో మాట్లాడి పని జరిగేలా చూడమని ప్రాధేయపడుతున్నాడు. ప్రతి ఉత్తరాన్నీ, “మీరు దయతో అందించబోయే సానుకూల సమాచారం కోసం అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటా”నని ముగిస్తున్నాడు. అయితే, కల్వర్ట్ చేయగలిగిందేమీ లేదు, చేయాలన్న సుముఖతా ఆయనలో లేదు. తమ జాగాలో పెద్ద పెద్ద కందకాలు తవ్వించిన స్లీమన్ మీద ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతున్న టర్కులిద్దరూ సహకరించే స్థితిలో అసలే లేరు.

అంతలో వేసవి అడుగుపెట్టి, స్లీమన్ నిరీక్షణకు తాత్కాలికంగా తెరదించింది. తవ్వకాలకు అది ఎటూ అనువైన సమయం కాదు. స్లీమన్ తిరిగి పారిస్ వెళ్లిపోయి ఇతర వ్యవహారాలలో పడిపోయాడు. అక్కడ అతనికి విస్తారమైన ఆస్తులున్నాయి. అతను అద్దె కిచ్చిన భవనాలలో 200 మంది నివసిస్తున్నారు. మధ్య మధ్య తన ఆస్తి వ్యవహారాలను చూసుకోవడం అతనికి సంతృప్తితోపాటు కాలక్షేపాన్ని కలిగిస్తోంది. అలా ఉండగా, జూన్ మధ్యలో ఒకరోజున సెయింట్ పీటర్స్ బర్గ్ లోని కొడుకు సెర్గీనుంచి ఉత్తరం వచ్చింది. స్కూల్లో తన చదువు పెద్దగా ముందుకు సాగడంలేదని అతను రాశాడు.

దానికి స్లీమన్ ఫ్రెంచిలో జవాబు రాశాడు. అందులో తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు కానీ, నిజానికది అతనప్పుడున్న నైరాశ్యస్థితికే అద్దంపట్టింది:

నీ చదువు ముందుకు సాగడంలేదని రాయడం నాకు చాలా విచారం కలిగించింది. జీవితంలో ప్రతిఒకడూ నిరంతరం ముందుకు సాగుతూ ఉండవలసిందే. లేకపోతే నిరుత్సాహంతో కుంగిపోవలసివస్తుంది. బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగిన ఒక మనిషి ఎంత ఎత్తుకు వెళ్లగలడో, తను ఎక్కిన ప్రతి మెట్టులోనూ నిరూపించుకుంటూ వచ్చిన నీ తండ్రిని ఆదర్శంగా తీసుకో. 1842-1846 మధ్య ఏమ్ స్టడామ్ లో ఉన్న నాలుగేళ్లూ నేను అద్భుతాలు చేశాను. ఎవరూ చేయనివీ, చేయలేనివీ నేను చేశాను. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ లో వర్తకుడిగా ఎదిగి, ఇంతటి సాఫల్యం, ఇంతటి తెలివీ ఉన్న వర్తకుడు ఇంకొకడు లేడని నిరూపించుకున్నాను. ఆ తర్వాత యాత్రికుడిగా మారాను; మామూలు యాత్రికుడిగా కాదు, విశిష్ట ప్రావీణ్యాలు కలిగిన ఓ అద్భుతయాత్రికుడిగా! సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఏ వర్తకుడూ ఓ వైజ్ఞానికరచన చేయలేదు; నేను చేశాను. అది నాలుగు భాషల్లోకి అనువాదమై, ప్రపంచ ప్రశంసలు అందుకుంది. ఈరోజున నేనొక పురాతత్వశాస్త్రవేత్తను.  అన్ని దేశాలలోని పురాతత్వశాస్త్రవేత్తలూ రెండువేల ఏళ్లపాటు వెతికి వేసారిన ప్రాచీన నగరం ట్రాయ్ ని; యావత్ యూరప్, అమెరికాల కళ్ళు జిగేలుమనేలా  నేను కనిపెట్టాను…

ఈ గొప్పలు అతనప్పుడున్న నిస్సహాయతనుంచి పుట్టినవి. నైరాశ్యం నుంచీ, ఒంటరితనం నుంచీ పెల్లుబికినవి. తన జీవితానికి ఒక అర్థం వెతుక్కునే పెనుగులాటలో అతనున్నాడు. ఇతిహాసప్రసిద్ధమైన ట్రాయ్ ని తవ్వి తీయాలని తహతహలాడుతున్నాడు. కానీ, ఆ హిస్సాలిక్ దిబ్బ మీద గొర్రెల మందల్ని మేపుకునే ఇద్దరు అనామకులైన టర్కిష్ రైతులు, తనేదో మామూలు చొరబాటుదారైనట్టు, అడ్డుపడుతున్నారు. తక్షణం తమ జాగా నుంచి వెళ్లిపొమ్మని కళ్ళు ఉరుముతున్నారు. వాళ్ళకా హక్కు లేదు! తను, స్లీమన్ అనే తను, భూస్థాపితమైన ఆ నగరాన్ని వెలికి తీశాడు. కనుక ఆ నగరం మీద అన్ని హక్కులూ తనవి! ప్రపంచ విజ్ఞానానికి దోహదం అందించడం కోసం లక్ష ఫ్రాంకులు ఖర్చు పెట్టి తవ్వకాలు జరిపించడానికి తను సిద్ధమయ్యాడు. తనకు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. అలాంటిది, టర్కీలో ఓ మారుమూల ఉన్న చిన్న దిబ్బ తనకు కొరకరాని కొయ్య కావడమేమిటి? వంతెన కోసం ఆ పవిత్రమైన రాళ్ళను తీసుకుని తన నగరాన్ని అపవిత్రపరచడానికి ఆ టర్కు లిద్దరికీ ఎంత ధైర్యం! వాళ్ళ వదులు పంట్లాములూ(Baggy Trousers), వాళ్ళూ! తను హిస్సాలిక్ దిబ్బను విడిచిపెట్టి వచ్చేముందు, తను కలిగించిన నష్టానికి వంద పౌండ్లు ఇమ్మని వీళ్ళే అడిగారు. తను తిరస్కరించాడు.

1870 జూలై 19న నెపోలియన్-3 ప్రష్యాపై యుద్ధం ప్రకటించాడు. ఆ ఇద్దరు టర్కులపై ఆగ్రహంతో కుతకుతలాడుతూ అప్పటికి స్లీమన్ పారిస్ లోనే ఉన్నాడు. యుద్ధం ప్రకటించగానే బులోన్-సుర్-మేర్ కు చేరుకుని, అక్కడినుంచి ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.  ట్రాయ్ లో తను వెలికి తీసిన ప్రాసాదం గోడలకు చెందిన రాళ్ళు ఎవరూ ఎత్తుకు పోకుండా చూడవలసిందనీ, మూడు వేల ఏళ్ల నాటి ఆ నిక్షేపాలను ఆ రైతులిద్దరూ ధ్వంసం చేయకుండా చూడడానికి ఏదో ఒక మార్గం ఉండకుండా ఉండదనీ అందులో విన్నవించాడు.

ఆగస్టు చివరిలో, టర్కీ విద్యామంత్రి సఫ్వెట్ పాషాకు తన తవ్వకాల గురించి ఓ సుదీర్ఘమైన వేడికోలు ఉత్తరం రాశాడు. ఏవో నిధి నిక్షేపాలకోసం తను హిస్సాలిక్ దిబ్బను తవ్వలేదనీ, అవి దొరుకుతాయని తను అనుకోవడంలేదనీ, “శాస్త్రవిజ్ఞానం పట్ల నిస్వార్థ ప్రేమతోనే” తవ్వకాలు జరిపించాననీ, ఆ దిబ్బ అడుగున ట్రాయ్ నగరం ఉనికిని నిరూపించడమే తన ధ్యేయమనీ అందులో రాశాడు. తను రచించిన Ithaka, der Peloponnes and Troja  అనే పుస్తకం ప్రతిని ఆ ఉత్తరానికి జతపరిచాడు. టర్కిష్ ప్రభుత్వం దయాదాక్షిణ్యాల పైనే తను పూర్తిగా ఆధారపడుతున్నాననీ, తన పరిశోధనల ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం తప్పకుండా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాననీ అన్నాడు. హోమర్ పట్ల తనకున్న వల్లమాలిన ఆరాధనాభావమే హిస్సాలిక్ తవ్వకాలకు పురిగొల్పిందనీ, ఇంతాజేసి తను జరిపింది ఆషామాషీ తవ్వకాలే అయినా, ప్రియాం ప్రాసాదాన్ని, బ్రహ్మాండమైన ఆ నగర ప్రాకారాల ఉనికిని అది బయటపెట్టింది కనుక ప్రభుత్వం తన చర్యను తప్పు పట్టబోదని ఆశిస్తున్నా నన్నాడు.

“గాలివానను కూడా లెక్క చేయకుండా వేసవిలోనా అన్నట్టుగా పనిచేశాను. రెండు పూటలా భోజనం చేసినట్టు ఊహల్లోనే తృప్తి పడుతూ, తిండీ తిప్పలు లేకుండా రోజంతా నడుం వంచాను. నేను వెలుగులోకి తెచ్చిన ప్రతి చిన్న మృణ్మయపాత్రా చరిత్రకు మరో పుటను జోడించిందని నేను నమ్ముతున్నాను” అన్నాడు. తను దుందుడుకుగా వ్యవహరించినందుకు ఏలినవారు క్షమించవలసిందనీ, తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి లభిస్తుందన్న ఆశ లేశమైనా కలిగితే, ఏలినవారిని దర్శించుకోడానికి ఏ క్షణంలోనైనా తను సిద్ధంగా ఉంటాననీ ఉత్తరం ముగించాడు.

అయితే, అటునుంచి సమాధానం లేదు. స్లీమన్ లానే ఆ మంత్రి కూడా గడుసుపిండమే. తనది నిస్వార్థ ప్రయత్నమని స్లీమన్ అంతగా నమ్మబలకడం, ‘మనిద్దరి ఆరాధ్యదేవతా శాస్త్రవిజ్ఞానమేననీ, శాస్త్రవిజ్ఞాన ప్రగతికోసమే ఇద్దరం జీవితాలను అంకితం చేశామనీ, ఇద్దరం దానిపట్ల ఒకేవిధమైన ఉత్సాహాన్ని నింపుకున్నవాళ్ళమే ననీ’ మంత్రిని ఉబ్బేయడం అతను ఆశించినదానికి సరిగ్గా వ్యతిరేకఫలితాన్ని ఇచ్చాయి. అతని ప్రయత్నమంతా అక్కడ పాతిపెట్టిన నిక్షేపాల కోసమే నని మంత్రి నిశ్చయానికి వచ్చాడు.

ఎట్టకేలకు స్లీమన్ డిసెంబర్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వచ్చి పడ్డాడు. మంత్రిని దర్శించుకున్నాడు. మంత్రి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన నుంచి ఎలాంటి సహాయమైనా అందుతుందని హామీ ఇచ్చాడు. శాస్త్రవిజ్ఞాన ప్రయోజనాలపట్ల తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. అయితే, ఇంకోవైపు తవ్వకాలను ఆపడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. గడుగ్గాయి అనిపించుకున్న అంతటి స్లీమన్ కూడా మంత్రి  పై మెరుగు మాటలకు బోల్తా పడిపోయి, కొద్ది రోజుల్లోనే తవ్వకాలను అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి తనకు ఫర్మానా అంది, హిస్సాలిక్ దిబ్బ తన అధీనంలోకి వస్తుందనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కాన్ స్టాంట్ నోపిల్ లో అతనలా ఎదురు తెన్నులు చూస్తుండగానే, ఆ సమస్యతోపాటు, పారిస్ ఏ క్షణంలోనైనా శత్రువుల చేజిక్కవచ్చునంటూ అందిన సమాచారం అతని ఆలోచనల్ని కమ్మేసింది. అంతలో, వెయ్యి ఫ్రాంకులకు తమ భూమిని అమ్మడానికి టర్కులిద్దరూ నోటి మాటగా ఒప్పుకున్నట్టు కల్వర్ట్ నుంచి సమాచారం అందింది. సరిగ్గా అప్పుడే, ఆసంతృప్తిని, నిస్పృహను ప్రకటిస్తూ భార్య రాసిన ఉత్తరమూ చేరింది. నీకు పట్టిన అదృష్టాలను ఒక్కొక్కటే లెక్కపెట్టుకుంటే, నువ్విలా నిస్పృహ చెందడానికి ఎలాంటి కారణమూ కనిపించదని, అతను కొంత పరుషంగానే  సమాధానం రాశాడు… నిన్ను ఆరాధించే భర్త ఉన్నాడు, జీవితంలో ఒక ఉన్నతస్థితికి చేరావు, ఎథెన్స్ లో నీకు ఒక ఇల్లు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే యోగ్యులైన పరివారం ఉన్నారు. అక్కడ ఫ్రాన్స్ లో, ఎలాంటి రక్షణా లేని తమ ఇళ్లపై శత్రువులు తూటాలు కురిపిస్తుంటే;  తినడానికి రొట్టె తునకకు కూడా గతి లేక, చలి కాచుకోడానికి చిన్నపాటి కట్టె పుల్ల కూడా కరవై ఆడా, మగా, పిల్లలు సహా ఇరవై లక్షల మంది ఆకలిచావులు చస్తున్నారు. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలపై నీ ఆలోచన మళ్లిస్తే నీకే అర్థమవుతుంది…

ఆ తర్వాత, తను సఫ్వెట్ పాషాను కలసుకున్నాననీ, తనను ఎంతో ఆదరంగా ఆహ్వానించాడనీ, ఎంతో కాలంగా తను ఎదురుచూస్తున్న ఫర్మానాను జారీ చేయడానికి హామీ ఇచ్చాడనీ, అది నేడో రేపో తన చేతికి వస్తుందనీ రాశాడు. అది అందగానే తను హిస్సాలిక్ కు వెళ్ళి, భూమి కొనుగోలు లావాదేవీ పూర్తిచేసుకుని, ఓసారి పారిస్ వెళ్ళి వస్తాననీ, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి లేనిపోనివి ఊహించుకుని ఆందోళన చెందవద్దనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

నువ్వు వెంటనే భగవంతుడి ముందు మోకరిల్లి నీకు ఆయన కట్టబెట్టిన అదృష్టా లన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకో. ఈరోజుల్లో నువ్వు పడుతున్న కష్టాన్నే తలచుకుంటూ నీపై ఆయన కురిపించిన కనకవర్షాన్ని మరచిపోయినందుకు క్షమాపణ అడుగు.

ఇంకోటి కూడా నువ్వు మరచిపోతావేమో…అనుకోకుండా నేనిక్కడ మకాం పెట్టిన ఈ పద్దెనిమిది రోజుల్లో టర్కిష్ నేర్చుకున్నాను. ధారాళంగా మాట్లాడడం, రాయడం కూడా చేస్తున్నాను. ఇప్పటికే 6వేల మాటలు నాకు పట్టుబడ్డాయి.

మరో వారం గడిచింది. అయినా సఫ్వెట్ పాషా నుంచి ఉలుకూ, పలుకూ లేదు. తవ్వకాలకు అనుమతి కోరుతూ 1871, జనవరి 8న స్లీమన్ లాంఛనంగా ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. పది రోజుల తర్వాత విద్యా మంత్రిత్వశాఖనుంచి అతనికి పిలుపు వచ్చింది. తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి మంజూరు చేస్తూనే, ఆ భూమిని మంత్రిత్వశాఖ తరపున కొనుగోలు చేయవలసిందిగా దర్దనెల్లెస్ గవర్నర్ కు సఫ్వెట్ పాషా తంతి పంపినట్టు అక్కడ తెలిసింది.

స్లీమన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. “అతని ప్రవర్తన ఎంత రోతగా ఉందో కుండబద్దలు కొట్టినట్టు ఎత్తి చూపి కడిగేశాను” అని ఆ తర్వాత రాసుకున్నాడు. ఆ భూమిని కొనడానికి రెండున్నర ఏళ్లపాటు తను చేయని ప్రయత్నం లేదని వివరించుకుంటూ వచ్చాడు. కేవలం వైజ్ఞానిక ఆసక్తితో ఈ భారం తలకెత్తుకున్నాననీ; ట్రోజన్ యుద్ధం కట్టుకథ కాదు, ట్రాయ్ ఉనికి వాస్తవమని నిరూపించడమే తన ఆశయమనీ మరోసారి వాదించాడు. అందుకు చేయవలసిందల్లా ఆ దిబ్బను తవ్వడం, దానికయ్యే విపరీతమైన ఖర్చును భరించడానికి తను సిద్ధపడ్డాడు, అలాంటిది, డబ్బు చెల్లించి ఆ చిన్న ముక్కను తను సొంతం చేసుకోడానికి అడ్డుపడడం దుస్సహం, దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డాడు.

ఈ మాటలు జరుగుతున్న సమయంలో, నేషనల్ మ్యూజియం డైరక్టర్ గా ఉన్న ఒక ఆంగ్లేయుడు మంత్రి దగ్గర కూర్చుని ఉన్నాడు. స్లీమన్ విజృంభణకు సఫ్వెట్ పాషా తెల్లబోయాడు. తలవంపుగా కూడా అనిపించినట్టుంది. కానీ, అంతలోనే తేరుకుని, అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ అతన్ని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. మీరు నిరభ్యంతరంగా హిస్సాలిక్ కు వెళ్లచ్చు, భూమిని కొనుక్కోవచ్చు, తవ్వకాలు కొనసాగించవచ్చు. “నిధినిక్షేపాలు ఏవైనా బయటపడిన పక్షంలో ఒట్టోమన్ సామ్రాజ్య నియమనిబంధనలను పాటించినంతవరకూ” మీకు ఎవరినుంచీ ఎలాంటి ఆటంకమూ రాదన్నాడు.

చర్చ ఈ కొత్త మలుపు తిరిగేసరికి స్లీమన్ కృతజ్ఞతాభావంతో తలమునకలైపోయాడు. తను కోరినవన్నీ మంజూరైనట్టు ఊహించుకున్నాడు. మంత్రికి ధన్యవాదాలు చెప్పాడు. ట్రాయ్ తవ్వకాలపై తను రాయబోయే పుస్తకంలో మీ పేరు ప్రస్తావిస్తానని వాగ్దానం చేశాడు. మంత్రి మాటల్లోని మతలబు ఆ తర్వాత అతనికి తెలిసొచ్చింది. లేదా అప్పుడే తెలిసినా కావాలనే వాటిని తనకు అనుకూలంగా అన్వయించుకునీ ఉండచ్చు.

మూడు రోజుల తర్వాత, భోరున వర్షం పడుతుండగా, ట్రోజన్ మైదానంలోని కుమ్ కేల్ అనే ఓ చిన్న గ్రామానికి చేరుకున్నాడు. వర్షంలో పూర్తిగా నానిపోయాడు, ఆపైన ప్రయాణం బడలిక. ఆ భూమి కొనుగోలుకు మంత్రి జనవరి 10న తంతి ఉత్తర్వులు ఇచ్చాడనీ, రెండు రోజుల తర్వాత ఆ భూమి యాజమాన్య హక్కు మంత్రికి బదిలీ అయిందని తెలిసింది. స్లీమన్ హుటాహుటిన దర్దనెల్లెస్ గవర్నర్ ను కలసుకున్నాడు. మంత్రి తన వెనకటి ఉత్తర్వును రద్దు చేయలేదా అని అడిగాడు. “లేదు, ఆ ఉత్తర్వే అమలులో ఉంది” అని గవర్నర్ సమాధానం చెప్పాడు. మోసగించారని భావించిన స్లీమన్ కోపంతో రగిలిపోతూ ఎథెన్స్ కు చేరుకున్నాడు.

అతనంత తేలిగ్గా మడమ తిప్పే మనిషి కాదు. ఆ భూమిపై పురావస్తు తవ్వకాలు ప్రారంభించి దానిపై తనదైన చెరగని ముద్ర వేశాడు కనుక, అది తనకే చెందాలని ఎప్పుడో నిర్ణయానికి వచ్చాడు. మంత్రి ఆ భూమిని 600 ఫ్రాంకులకు కొన్నట్టు తెలిసింది. కానీ తను 1,000 ఫ్రాంకులు ఇవ్వజూపాడు. ఆవిధంగా చూసినా భూమి తనకే దక్కాలి. అయినా తనకు ఆ హక్కును నిరాకరించారంటే,  వైజ్ఞానిక పరిశోధనలపై వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు బొత్తిగా అనాగరికులు. పురాతత్వవేత్తగా తను కీర్తిశిఖరాలను అందుకోవడం, తన పేరు యూరప్ అంతా మారుమోగుతుండడం  చూసి వాళ్ళు భయపడ్డారు. ఇలా వాళ్ళను తిప్పికొట్టే ప్రయత్నంలో అన్ని రకాల వాదనలనూ, అన్ని స్థాయిలలోనూ ముందుకు తేవడానికి; అన్ని వైపుల నుంచీ దాడి చేయడానికి  సిద్ధమైపోయాడు.

(సశేషం)

 

 

గమనమే గమ్యం-26

img549

 

olgaశారద ఇంట్లో టెలిఫోను హాల్లో కాకుండా గదిలో ఉంటుంది. శారద ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకోవాలంటే వీలుగా  ఉంటుందనీ, హాల్లో అందరి ముందూ పార్టీకి సంబంధించిన విషయాలు  మాట్లాడటం మంచిది కాదనీ అలాంటి ఏర్పాటు   చేశారు. ఒకరోజు ఉదయం శారద ఆ గదిలోకి వెళ్లేసరికి మూర్తి మాట్లాడుతున్నాడు.

‘‘శారద ఉంది. విషయం ఏమిటో చెప్పండి . ఔనా ? అలాగా? మంచిది. కాముద్ని ఇక్కడ ఉంచటం కంటే మద్రాసు లో  ఉంచటం మంచిది. మానసిక రోగులకు మద్రాసులో మంచి హాస్పిటల్‌ ఉందిగా’’

శారద ఒక్క అంగలో ఫోను దగ్గరకు వెళ్ళి మూర్తి చేతిలో ఫోను తీసుకుంది.

‘‘హాల్లో – జోగయ్యా – చెప్పు. కామేశ్వరరావు కేమయింది’’.

ఐదారు నిమిషాలు  అవతల వ్యక్తి చెప్పేది  శ్రద్ధగా విని

‘‘కామేశ్వరరావుని ఇక్కడ కే తీసుకురండి . ఇక్కడ మా ఇంట్లోనే ఉంటాడు. అతని వైద్యం నేను చూసుకుంటాను. ఏం ఫరవాలేదు. ఇబ్బంది ఉంటే నేను చెప్పనా ?’’ ఫోను పెట్టేసి మూర్తి వైపు చూస్తే  అతనికి ముఖం అవమానంతో తెల్లబోవాలో , కోపంతో ఎర్రబడాలో తెలియనితనంతో తెలుపెరుపుల కలగలుపుతో  ఉంది.

‘‘మూర్తీ –  నా  తరఫున నువ్వు మాట్లాడాల్సిన పని పెట్టుకోకు. అది మనిద్దరికీ మంచిది కాదు. ముఖ్యంగా పార్టీ పనుల  విషయాలు . మన సంబంధం ఎంత దగ్గరిదైనా  నేను పార్టీలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సభ్యురాలిని’’.

అక్కడ నుంచి వెళ్ళిపోతూ ‘‘కామేశ్వరరావుకి పైన మేడమీది గది సిద్ధం చేయమని అమ్మతో చెప్తాను. మనం కొన్ని రోజులు  కింద గదిలోకి మారదాం’’ అంది.

‘‘నీ ఇష్టం’’ మూర్తి కోపాన్ని అణుచుకోటానికి ప్రయత్నిస్తున్నాడు.

శారద అది గమనించినా  గమనించనట్లు బైటికి వెళ్ళిపోయింది.

కామేశ్వరరావు బెంగాల్‌లో కరువు ప్రాంతాలను చూడటానికి వెళ్ళిన ఆంధ్ర బృందంతో  పాటు వెళ్ళాడు. అక్కడ పరిస్థితులను చూసి తట్టుకోలేక మతిస్థిమితం తప్పింది. ఈ కబురు ఈ ఫోన్‌ రాకముందే తెలిసింది. అతన్ని తన ఇంట్లో ఉంచుకుని నయం చేసి పంపాలని శారద అనుకుంది. మూర్తితో చెప్పింది. మూర్తి విని ఊరుకున్నాడు. మూర్తికి అభ్యంతరం ఉంటుందని శారదకు కాస్త కూడా సందేహం  లేదు.

ఇప్పుడు అతన్ని మద్రాసు పంపమనే సలహా ధారాళంగా ఇస్తున్న మూర్తిని చూస్తే కోపం వచ్చింది.

నాలుగైదు రోజులు  ఇద్దరిమధ్యా ముభావంగా, ముక్తసరి మాటలతో నడిచాక  మూర్తి భరించలేక పోయాడు.

‘‘శారదా – ఇది ఇల్లు – హాస్పిటల్‌ కాదు. కామేశ్వరరావుని ఆస్పత్రిలో ఉంచటం మంచిదని నాకనిపించింది. అందులో తప్పేముందో  నా  కర్థం కావటం లేదు’’. శారదకు మూర్తిని చూస్తె  జాలేసింది. ఇన్నేళ్ళుగా తన ఇంటికి సంబంధించిన నిర్ణయాన్నీ తనే తీసుకునే అలవాటున్న వాడు . ఆడవాళ్ళు అమాయకులు , అజ్ఞానులు , బలహీనులు  అనే ఆలోచన బాగానే ఒంటబట్టి ఉంటుంది. తను తీసుకునే తప్పు నిర్ణయాలు  సరిదిద్ది తన ఇంటిని, జీవితాన్ని  చక్కదిద్దాననుకుంటున్నాడు. సున్నితంగా తెలియజెప్పాలి.

‘‘తప్పేంలేదులేవోయ్‌. ఆ విషయం గురించి మనిద్దరికీ వేరు వేరు అభిప్రాయాలున్నపుడు ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సింది. అలా చెయ్యకపోవటం ఇద్దరి తప్పూనూ – మనకిది కాక చెయ్యటానికి చాలా పనులున్నాయి. రేపు కాముడొస్తున్నాడు కూడా – అదుగో అలా ముఖం ఎర్రగా చేసుకోకు. ముద్దొస్తావు’’ అంటూ మూర్తి నుదుటిన ఒక ముద్దు పెట్టి వెళ్ళింది శారద. మూర్తి కాస్త చల్లబడ్డాడు.

మర్నాడు  కామేశ్వరరావు వచ్చాడు . ఇల్లంతా  సందడయింది. అతన్ని చూడటానికి ఎంతమందో వస్తున్నారు. అందరిలో శారద కొందరిని మాత్రమే అతని దగ్గరకు పంపిస్తోంది. అది చాలామందికి కోపం తెప్పించింది.

కామేశ్వరం వున్న స్థితిలో అందరినీ ఒక్కసారి చూడటం ప్రమాదం అని ఎంత చెప్పినా  ముఖం గంటుపెట్టుకునే వెళ్తున్నారు.

శారద హాస్పిటల్‌ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించుకుని కామేశ్వరరావు దగ్గరకొచ్చి కూర్చుంటోంది.

మందుతో పాటు మాట్లాడటం, అతనిచేత మాట్లాడించటం కూడా అవసరం.

మెల్లిగా కామేశ్వరరావు బెంగాల్‌లో తను చూసిన బీభత్సం గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు.

శారద ఆ భీభత్సం వెనకా ఉన్న మానవ క్రూరత్వాన్ని  గురించి, ఆర్థిక కారణాల  గురించి వివరించి చెబుతోంది.

మూర్తికి పార్టీ పనులతోనే సరిపోతోంది. మనసంతా  అసంతృప్తితో నిండి పోతోంది. పార్టీ పనులలో అతనికి సహాయం చేసేవాళ్ళు  తక్కువవుతున్నారు. స్థానిక సమస్యలు  తెలియని వాడు పైనుంచి వచ్చాడని  అసహనం తెలియకుండానే అందరి మనసుల్లో తిష్టవేసుకుంది.

శారదకు పార్టీ పనులు  అసలు  లేవని కాదు గానీ అవి ఆమెకు నల్లేరు మీద నడక. ముఖ్యంగా మహిళా సంఘం పనులు  ఆమె చక్కబెట్టాలి. శారదంటే మహిళా సంఘంలో అందరికీ గౌరవమే. పనులు  చకచకా జరిగిపోతున్నాయి. హాస్పిటల్‌లో శారద ఉందంటే రోగులందరికీ ధైర్యం. గర్భీణీ స్త్రీలకు, ప్రసవానికొచ్చిన స్త్రీలకైతే అదొక ఆటవిడుపులా ఉండేది. శారద నవ్వుతూ, నవ్విస్తూ, గలగలా మాట్లాడుతూ హాస్పిటల్‌ని విశ్రాంతి మందిరంలా చేసేది. శారద లేనపుడు సుభద్రమ్మ ఇంకో పద్ధతిలో వాళ్ళను బాధ్యతగా చూసుకునేది.

ఇంట్లో వంట బాధ్యతలన్నీ సుబ్బమ్మ గారివే. శారదకు ఆ బాధ్యత ఎన్నడూ లేదు. వచ్చేపోయే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు  పరిష్కరించి పంపటమే. పార్టీ నాయకులు  తరచు వచ్చేవారు. శారద అవసరమైతేనే వారితో కూచునేది. లేకపోతే పలకరించి తన పనుల  మీద తాను వెళ్ళేది. ఇంటి ఖర్చుల  వివరాలు  మాత్రం కనుక్కుని డబ్బు ఎంత కావాలో  అంత ఉండేలా చూసేది.

ఇంటికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా  వారి ఆకలి తీరాల్సిందే. మర్యాదలు  జరగాల్సిందే.

మూర్తి ప్రాక్టీసు ఒదిలి వచ్చాడు . అతని ఆస్తి పాస్తులన్నీ మద్రాసులో కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసేందుకు  వీలైనట్టు చేసి వచ్చాడు . అలా చేసేదాకా శారద ఊరుకోలేదు. తరచు మద్రాసు వెళ్ళి రమ్మని మరీ మరీ చెప్పేది .

ఇక్కడ అతనికి ఏ లోటూ లేదు. శారద పేదవారికి  ఉచితంగా వైద్యం చేస్తూ ఇవ్వగలిగిన వారినుంచి వారిచ్చినంత తీసుకునేది. సంపన్న కుటుంబాల  వాళ్ళకు శారద హస్తవాసి మీద నమ్మకం. ధారాళంగానే ఇచ్చేవారు. వాళ్ళింటో పొల్లాలో పండే సమస్త పదార్ధాలు పంపేవారు.

ఇల్లు , హాస్పిటలూ, పార్టీ పనులు  అన్నిటినీ సమర్థతతో శారద నిర్వహిస్తున్న తీరు చూస్తె  మూర్తికి ఒకవైపు సంతోషం. ఇంకోవైపు ఆశ్చర్యం. మరోవైపు తెలియని బాధ. వీటిలో ఎప్పుడు దేనిది పై చేయి అవుతుందో అతనికే తెలిసేది కాదు. దానితో మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. శారద దానినంత గమనించలేదు.

కామేశ్వరరావు ఉన్నన్ని రోజులూ  శారదకు మరో విషయం ఆలోచించటానికి కూడా తీరిక లేకపోయింది. ఒకోరోజు హాస్పిటల్‌కి కూడా వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళూ అతనితో మాట్లాడుతూ కూర్చోవాల్సి  వచ్చేది.

olga title

మూర్తి ఒంటరితనం భరించలేకపోయాడు. శారద తన భార్య అనే విషయం పదే పదే గుర్తొచ్చేది. గుండెలో అహం తన్నుకొచ్చేది. కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు.

ఒకసారి నాలుగు  రోజులు  వరసగా హాస్పిటల్‌కి వెళ్ళలేదు శారద. మూర్తి పైకి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ఉండలేని స్థితికి వచ్చాడు . మూర్తి మేడ మెట్లెక్కి వస్తుంటే శారద మెట్లు దిగి వస్తోంది.

‘‘ఇవాళ కూడా హాస్పిటల్‌కి వెళ్ళవా ?’’

‘‘ఓపిక లేదు మూర్తీ! రాత్రంతా  కాముడు నిద్రపోనివ్వ లేదు. ఇప్పుడే అతను నిద్రపోయాడు. నాకూ  కాసేపు పడుకుంటే గాని ఓపిక రాదు’’.

‘‘కానీ ఇన్ని రోజులు  వెళ్ళకపోతే హాస్పిటల్‌ ఎలా నడుస్తుంది’’.

‘‘ఏం ఫరవ లేదు. సుభద్ర ఉందిగా. పాపం తనకి డిగ్రీ లేదనే గానీ చాలా అనుభవం. తెలివైనది. నేను చేసినంత తనూ చెయ్యగదు. ఈ నాలుగు  రోజుల్నించీ రోజుకిద్దరు ప్రసవం అయ్యారట. కంగారేం లేదని కబురు చేసింది. నేను సాయంత్రం వెళ్తాను. సుభద్ర నాకు  కుడ భుజం అంటారే అలాంటిది. హాస్పిటల్‌ గురించి నువ్వేం కంగారు పడకు. కాముడు మరో నెల రోజుల్లో మామూలవుత డు. పాపం ఒకటే ఏడుస్తాడు. ఏమన్నా  తినమంటే  ఆకలికి చచ్చినవాళ్ళను తిన్నట్టుందంటాడు. మాటల్లో పెట్టి, చిన్నపిల్లాడి కి చెప్పినట్లు కథలు  చెప్పి తినిపించాలి. నిద్ర పెద్ద సమస్యయింది. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయతనికి’’ మాట్లాడుతూనే తన గదిలోకి వెళ్ళి పడుకుంది శారద.

మూర్తికి శారద ప్రతిమాటా తప్పుగానే అర్థమైంది.

సుభద్ర హాస్పిటల్‌ చూడటమేంటి? ఆమె పార్టీ మనిషి. పార్టీలో కూడా చాలా బాధ్యతగా పని చేస్తుంది. కానీ ఆమెకు హాస్పిటల్‌ అప్పగించి శారద ఈ పిచ్చివాడి కి అన్నం తినిపించి, నిద్రపుచ్చే అల్పమైన  పనులు  చేయటమేంటి ?

ఇలా దీనిని సాగనియ్య కూడదు. ఇవాళ కాముడు. రేపింకొకడు -ఇప్పటికే బైట గుసగుసలు  వినిపిస్తున్నాయి. మేడమీది గదిలో కామేశ్వరరావు, డాక్టరమ్మ ఉంటుంటే మూర్తిగారు కింద ఉంటున్నారని . తనకు శారద సంగతి తెలుసు. ఊళ్ళో అందరికీ ఏం తెలుసు?

భర్త ఇంట్లో ఉండగా తను వేరే మగాడితో వేరే గదిలో రాత్రింబగళ్ళూ గడుపుతుందంటే ఏమనుకుంటారు? అది శారదకెందుకు అర్థం కాదు. దీనిని ఎక్కడో ఒకచోట ఆపాలి.

ఇల్లూ , ఊరూ అంత హడావుడిగా ఉంది. బెంగాల్‌ కరువు గురించి సభ్యులు , నాటక ప్రదర్శనలు , బుర్ర కథలు …

ఈ హడావుడి  కొంత తగ్గాక ఒకరోజు మూర్తి సుభద్రను పార్టీ ఆఫీసుకి రమ్మని కబురు చేశాడు.

సుభద్ర పార్టీ ఆఫీసు నుంచి పిలుపు  అనగానే కాళ్ళు తొక్కుకుంటూ వచ్చింది. తీరా మూర్తి చెప్పింది వినగానే ఆమెకు చాలా సంతోషమనిపించింది.

‘‘ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి పూర్తి కాలం  పార్టీ కార్యకర్తగా పనిచేయటానికి వచ్చెయ్యాలి’’.

సుభద్రకు పార్టీ అంటే ప్రాణం కన్నా  ఎక్కువ. పార్టీ కోసం ఏం చెయ్యటానికైన ఆమె సిద్ధమే. అలాంటిది పార్టీనే లోకంగా బతకటమంటే సుభద్రకు అంత కంటే కావలసింది ఏముంది. కానీ ఆస్పత్రి పనీ ఇష్టమే. అక్కడా తను అవసరం. అందువల్ల  తటపటాయించింది.

‘‘డాక్టరు గారితో ఒక్కమాట చెప్తాను. తర్వాత  నిర్ణయం తీసుకుంటా. మా ఆయనతో కూడా చెప్పాలనుకోండి . కానీ ఆయన కాదనరని నా  నమ్మకం’’. ఒక రకమైన ఉద్వేగంలో ఉంది సుభద్ర.

‘‘చూడమ్మా. డాక్టరుగారు కూడా పార్టీ ఆదేశానికి కట్టుబడి  ఉండాల్సిందే. నేను ఆమె భర్తనే కాదు. జిల్లా పార్టీ  నాయకుడనని నీకు తెలియదా? నేను నిర్ణయించి చెప్తున్నాను. నువ్వింకెవరినీ అడగక్కరలేదు. ఎవరి అనుమతీ తీసుకోనవసరం లేదు. పార్టీ నిర్ణయం. ఔనంటావా ? కాదని పార్టీని ధిక్కరిస్తావా ?’’

సుభద్ర కంగారుపడి పోయింది. పార్టీ ఆదేశం ధిక్కరించటమే! ప్రాణం పోయినా  తనా  పని చెయ్యదు.

‘‘నాకు ఇష్టమే నండీ. మీరే పని ఇస్తే అది చేస్తాను.’’

మూర్తి ఆమెకు ఆ క్షణం నుంచే పని చెప్పాడు. ఇట్నించి ఇటే ఆమె మహిళా సంఘానికి సంబంధించిన పని కోసం వెళ్ళాలి. ఆస్పత్రికి గానీ, ఇంటికి గానీ వెళ్ళే అవకాశం లేదు. పని పూర్తి చేసుకుని రాత్రికి ఇల్లు  చేరుకోవచ్చు. సుభద్ర వెళ్ళిపోయాక మూర్తి బాధ, భయం, సంతృప్తి , ఉపశమనం ఇన్ని కలిసిన మనసుతో ఏ పనీ చెయ్యలేక పుస్తకం తీసి మనసు లగ్నం చేయటానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాడు.

సాయంత్రం హాస్పిటల్‌కు వచ్చిన శారద అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. ఇద్దరు స్త్రీలు  నొప్పులు పడుతున్నారు. పట్టించుకునేవాళ్ళు లేరు. ఉన్న ముగ్గురు నర్సులు  ప్రసవానికి సంబంధించిన అనుభవం ఉన్నవ ళ్ళు కాదు. మరో ఆలోచన లేకుండా వాళ్ళిద్దరినీ లేబర్‌ రూం చేర్పించింది. ఇద్దరినీ హుషారు చేస్తూ, అనునయిస్తూ ప్రసవం స్త్రీ శరీరంలో చేయగల ఎంత గొప్ప కార్యమో బోధిస్తూ వారి నుదుటి మీద ముద్దు పెడుతూ వారిని సిద్ధం చేసింది.

ఇద్దరూ కనేసరికి దాదాపు మూడు గంటలు  పట్టింది. ఒక్కతే అక్కడ పనంత సంబాళించుకునే సరికి మరో గంట పట్టింది.

బైటికి వచ్చి చూస్తె  ఆ రోజు డాక్టరు గారి దగ్గర చూపించుకోటానికి వచ్చిన వాళ్ళతో హాలు , వరండా కిటకిటలాడ పోతున్నాయి.

చక, చకా ఒక్కొక్కరినే నవ్వుతూ పలకరిస్తూ ‘‘అలా చేస్తే  ఎలాగోయ్‌ నీ ఆరోగ్యం గురించి నువ్వే పట్టించుకోకపోతే ఎవరికి పడుతుంది. వేరే ఏమీ చెయ్యొద్దు. రోజూ అన్నంలో ఆకుకూర పప్పో, పచ్చడో చేసుకు తిను. సాయంత్రం ఒక వేరుశనగ పప్పుండ తిను. నెల రోజుల్లో నీరసం, గీరసం ఎగిరిపోతుంది. రక్తం పట్టాలోయ్‌ నీకు’’.

‘‘మా ఆయన ఆకుకూర ఇంట్లోకి రానివ్వడు’’.

‘‘నువ్వు తిను. ఆయనకు పెట్టకు’’.

‘‘అలా ఎలా కుదురుతుంది డాక్టరు గారూ ` ’’

‘‘ఎందుకు కుదరదు. గుప్పెడు కూర నీ కోసం నువ్వొండుకోలేవా ? ఇంటిల్లిపాదికీ వంట చేస్తావు. ఈ స్వతంత్రం లేదా ` మీ ఇల్లెక్కడ?’’

‘‘మీ ఇంటి దగ్గరేనండి ’’

‘‘ఇంకేం రోజూ పన్నెందింటికి మా ఇంటికి – ఎవర్నయిన పంపు. నీకు కావసిన ఆకుకూర మా అమ్మ చేయించి పెడుతుంది. అట్లాగే ఒక పప్పుండ ఇస్తుంది. సరేనా ?’’

వెంకమ్మ లేచి శారద రెండు కాళ్ళూ పట్టుకుంది.

‘‘ఛీ! ఛీ! అదేం పనోయ్‌. నువ్వు వెళ్ళు. బైట ఎంత మందున్నారో చూశావుగా’’.

వెంకమ్మ లాంటి ఎందరికో శారద అంటే పిచ్చి ఆరాధన. పనంతా  ముగించుకుని చిన్న నర్సు సరస్వతిని అడిగింది.

‘‘సుభద్రమ్మకి ఏమయింది? ఒంట్లో బాగాలేక ఇంటికెళ్ళిందా?’’

‘‘తెలియదమ్మా. మధ్యాహ్నం ఎవరో వచ్చి పిల్చుకెళ్ళారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నాను. అరగంటలో వస్తానంది. మళ్ళీ రాలేదు.’’

దానిని గురించి శారద పెద్దగా ఆలోచించలేదు. ఇంత సమయం పడుతుందనుకుంటే ఎవరో ఒకరి చేత తనకు కబురు

చేసే పని గదా అనుకుని ‘‘ఒకోసారి అదీ కుదరదు. అందరం ఎంత కష్టపడుతున్నాం. ఇల్లు, పని, పార్టీ పని, సుభద్రకు పిల్లలు  కూడా. ఎంత ఓపికగా అన్నీ చక్కదిద్దుకుని వస్తుందో. తనకు ఇంట్లో అమ్మ ఎంత అండగానో ఉంది కాబట్టి గానీ ` ’’ అనుకుంటూ ఒకసారి హాస్పిటల్‌లో ప్రసవమయ్యి ఉన్న వారినీ, ప్రసవానికని వచ్చి చేరిన వారినీ పకరించి, వారిని నవ్వించి ఇంటికి బయల్దేరింది.

ఇల్లు  చేరేసరికి అలసట కమ్ముకొచ్చింది. అన్నం కూడా తినకుండా నిద్రపోవాలనిపించింది. కానీ మూర్తీ సుబ్బమ్మ ఊరుకోలేదు. మూర్తి మరీ మరీ బుజ్జగించి తినిపిస్తుంటే సుబ్బమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ అవతల గదిలో కూచుంది. కడుపు నిండేసరికి శారదకు ఉత్సాహం  వచ్చింది. గబగబా లేచి తాంబూలం  చుడుతూ

‘నను పాలింప నడచి వచ్చితివో  నా  ప్రాణ నాధ’ అంటూ త్యాగరాజ కృతి  అందుకుంది. మూర్తి గొంతు కలిపాడు.

‘వనజనయన మోమును జూచుట జీ

వనమని నెనరున ` మనసు మర్మము దెసి’

అని అతను పాడితే ` మళ్ళీ పల్లవి  శారద అందుకుంది.

ఇద్దరి మనసుల్లో పట్టరాని  ప్రేమ. మూర్తి శారద చుట్టూ చేతులు  వేసి నడిపిస్తూంటే శారద ఒళ్ళూ, మనసూ పులకరించింది.

‘‘మూర్తి  ప్రేమ  ఉంటే చాలు . ఎంత పనైన చేసేస్తా’’ అనుకుంది. అతని కౌగిలిలో నిశ్చింతగా నిద్రపోయింది.

మర్నాడు  ఇద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటూ ఉన్నారు.

‘‘నిన్న ఎంత అలిసిపోయానో – సుభద్ర లేదు. పనిమీద వెళ్తున్నానని  నాకు  కబురు చెయ్యనూ లేదు. రెండు కాన్పులు . యాభై మందికి పైగా జనం. నువ్వు చేసిన ఉపచారం వల్ల గానీ లేకపోతే ఇవాళింత హుషారుగా లేవలేకపోయేదాన్ని’’.

‘‘ఉపచారము చేసే వారున్నారని  మరువకుమా’’ అన్నాడు  మూర్తి.

‘‘మరువకురా – త్యాగరాజు  కీర్తనలో ఒక్కక్షరం కూడా మనం మార్చకూడదు’’. సీరియస్‌గా అంది శారద.

‘‘సరేం ’’ అన్నాడు  మూర్తి సరదాగా. ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు. వరసగా రెండు రోజు సుభద్ర  రాలేదు. శారదాంబ ఇక ఊరుకోలేక సుభద్ర ఇంటికి వెళ్ళింది.

ఇంట్లో సుభద్ర లేదు. ఆయన పిల్లలకు  ఒండి పెడుతున్నాడు. శారదను చూసి హడావుడి  పడుతూ ఏం చెయ్యాలో తెలియనట్టు నుంచున్నాడు.

‘‘సుభద్ర లేదా?’’

‘‘లేదు. పార్టీ పనిమీద మచిలీపట్నం వెళ్ళింది.’’

‘‘పార్టీ పని మీదా ` ’’

‘‘ఔనమ్మా. ఇప్పుడామె కూడా నాలాగే పూర్తికాలం  కార్యకర్త కదా. ఇద్దరం అవస్థ పడుతున్నాం . కానీ అలవాటవుతుందిలే ` ’’

‘‘నాకు  చెప్పనే లేదు’’.

‘‘ఎక్కడమ్మా – మూడ్రోజుల నాడు  పార్టీ ఆఫీసు నుంచి వచ్చి రెండు చీరలు  సంచీలో పెట్టుకు వెళ్ళింది. రేపు పొద్దున వస్తుంది. నాకే  ఏ సంగతీ సరిగా తెలియదు. పిల్లకు  ఆమెనొదిలి ఉండటం అలవాటులేక తిప్పలు  పెడుతున్నారు.’’

శారదకు మనసంత చేదయింది. ఇదంత మూర్తికి తెలుసు . తెలియటమేమిటి అతనే చేసి ఉండాలి. ఒక్కమాట తనకు చెప్పలేదు. చెప్పే  వ్యవధానం సుభద్రకు ఇవ్వలేదు.

‘‘రేపొకసారి సుభద్రను రమ్మన్నానని చెప్పండ ’’ అంటూ బైటికి నడిచింది. మూర్తితో ఈ విషయం మాట్లాడాలని కూడా అనిపించలేదు శారదకు. మనసు ఎడారయినట్లయింది.

అతనింత పని చేసి ఆ రోజు రాత్రి తనతో –

కళ్ళల్లోకి నీళ్ళు చిమ్ముకొచ్చాయి. తమాయించుకుంటూ ఆస్పత్రికి వెళ్ళింది. వెళ్ళేలోపే  గుండె దిటవు చేసుకుంది. సుభద్ర తనకు కుడి  భుజమే – కానీ తను ఎడం చేతితో ఎక్కువ పనులు  చేస్తుంది. చేసుకోగలుగుతుంది. ప్రాక్టీసు పెట్టిన దగ్గర నుంచీ ఉన్న సుభద్రకు అన్నీ తతెలుసు. పోన్లే – పార్టీలో ఎదుగుతుంది – సుభద్ర గురించి కాదు – మూర్తి సంగతేమిటి?

***

ఆగ్రహం నగ్నముని కవిత్వ వ్యాకరణం!

-అఫ్సర్

~

[డిసెంబర్ 6 హైదరాబాద్ లో  యాభయ్యేళ్ళ దిగంబర కవిత్వం సందర్భంగా  “ఛాయ” ఏర్పాటు చేస్తున్న  నగ్నమునితో సంభాషణ సందర్భంగా…

 

సామాజిక సాహిత్య రూపాల పరస్పర సంబంధం 1955 పరిణామాల తర్వాత స్పష్టమయింది. సాహిత్య రూపాలపై క్రమంగా మధ్యతరగతి పట్టు  పెరగటం వల్ల వచన కవిత్వం బాగా విస్తరించింది. చాలా కొద్ది కాలంలోనే వచన కవిత్వానికి కూడా రూపపరంగా వొక ఫార్ములా యేర్పడిపోయింది. రాజకీయ, సామాజిక రంగల్లో వున్న స్తబ్దతా, మధ్య తరగతిలో కళారూపాల పట్ల ఏర్పడుతున్న పరాన్ముఖతా వచన కవిత్వంలోని ఈ ఫార్ములాని కొంతకాలం నిరాటంకంగా సాగ నిచ్చాయి.  ఈ నమూనాని చేధించి, మొత్తంగా కాకపోయినా శకలాలుగానైనా జీవన వాస్తవికతకి దగ్గరగా వెళ్లాలనే ప్రయత్నం ఆరుద్ర, అజంతా, నగ్నముని,  బైరాగి, వజీర్ రెహ్మాన్, ఇస్మాయిల్  లాంటి కవులు చేస్తూ వచ్చారు.

’60 ల మొదటి దశలో నగ్నముని ‘ఉదయించని ఉదయాలు’ వెలువడేనాటికి అదొక ప్రత్యేకమైన గొంతు. అంత్యప్రాసలకి అంత్యక్రియలు చేసి,  కొత్త నిర్మాణ వ్యూహాలతో నగ్నముని వొక కెరటంలాగా తెలుగు కవిత్వాల పొడి  వాతావరణంలోకి దూసుకొచ్చాడు. “అంతా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి, ఏదో పనిలో తమని తాము పోగొట్టుకుంటున్న”స్తబ్ధస్థితిలో మనిషిని, మనసులోని కొత్తగోళాల వైపు నడిపించడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. బహుశా, నగ్నముని ఈ దశలో చేసింది. కొత్త సంపన్నుల వరసలో చేరాలని తపించే మధ్యతరగతిపై నిరసన ప్రకటించడం.

“గుద్దేసి వెళ్ళిపోయిన కారు కింద పడ్డ మనిషి చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు. తిరిగి అంతా అతన్ని వదిలేసి మాట్నీకి వెళ్లిపోతున్నారు….

మధ్యతరగతి తన చుట్టూ   జరుగుతున్న వాటి గురించి కావాలని పెంచుకుంటున్న Alienation, కందమూలాలు ఏరుకోడంలో జీవితం అయిపోతున్నా,  కోర్టుల్లో కాలం ఉరి తీయబడుతున్న అక్షరాలు అర్ధాలు కోల్పోతున్నా, అంతా బావున్నారులే అకాశం కింద –

వాస్తవికతకి దూరంగా పారిపోతే తప్ప, మధ్యతరగతి తన ఊహాప్రపంచాన్ని పకడ్బందీగా నిర్మించుకోలేదు. చుట్టూ ఏమీ జరగడం లేదనుకోవాలి. అంతా బాగుందనుకోవాలి. తను తప్ప సమాజమంతా సుఖంగా వుందనుకోవాలి. ఇలా ఎండుటాకుల మీద చప్పుడు కాకుండా నడవాలనుకునే ఈ ధోరణిని నగ్నముని ఎండకట్టాడు.

2006021617180301_996062e

నగ్నముని మొదటినుంచీ చాలా Conscious poet. తనదేదో ఒక వింత దంత గోపురాన్ని నిర్మించుకొని అక్కణ్నించి దిగి రాకూడదని భీష్మించు కూర్చోడు. నేలమీద నిటారుగా నిల్చొని సూటిగా సూర్యుడి వైపు ప్రయాణించాలనుకుంటాడు. అందుకే నగ్నముని తనదైన ఒక ఏకాంత  స్వప్నాన్వేషణలో తడబడు గొంతుకతో మట్లాడలేదు. స్పుటంగా  పలకడం అతనిలోని శాబ్దిక బలం వల్ల కాదు. తాత్విక బలం వల్ల వచ్చిన లక్షణం. నిశబ్దంలో నిశ్శబ్ధ భావాల్ని పలికేటప్పుడు కూడా నగ్నముని బాహ్య జీవితాన్ని గురించి నిష్కర్షగా చెప్పగలడనడానికి ‘మార్లిన్ మన్రో కోసం’ రాసిన కవితే నిదర్శనం.

దిగంబర కవిగా అవతరించిన తర్వాత నగ్నముని యధాతథ వ్యవస్థ మీద కత్తి కట్టినట్టు కవిత్వం రాశాడు. వ్యవస్థని వెనక్కి నెట్టే లేదా ఎక్కడికక్కడే స్తబింపజేసే ఏ శక్తినీ నగ్నముని క్షమించలేకపోయాడు. ప్రతిఘటన, ఆగ్రహం తన కవిత్వానికి పర్యాయపదాలుగా మార్చుకున్నాడు. కవిత్వంలో  కప్పలా బెక బెక మంటున్న,  మేకలా మే మే అంటున్న   అసహాయపు కీచురాయి గొంతుని దగ్గరికి రానివ్వలేదు. అవకాశవాదమే జీవిత విధానంగా అన్ని విలువల్నీ వంచిస్తున్న నకిలీ వ్యక్తిత్వంపై నగ్నముని రెండో ఆలోచన లేకుండా కొరడా ఝళిపించాడు. ఇలాంటి కవితల్లో నగ్నముని సాధ్యమైనంత Satirical heights కి వెళ్లిపోతాడు. ఉదాహరణ: దేశభక్తి కవిత.

ఆధునిక జీవితానికి సంబంధించిన కొత్త కోణాలెన్నింటినో దిగంబర కవిత్వం వస్తువుగా తీసుకుంది. అయితే, 70లలో విప్లవోద్యమం వచ్చినప్పుడు నగ్నముని దృష్టి ‘తూర్పుగాలి’  వైపు మళ్లింది. దిగంబర కవిగా నగ్నముని అసహన, ఆగ్రహ ప్రకటనకే పూర్తిగా పరిమితం కాలేదు గానీ, ‘తూర్పుగాలి’ లో ఆ కోపానికో దిక్కు దొరికింది. దేన్ని కోప్పడాలి, ఎందుకు కోప్పడాలి అనేది ‘తూర్పుగాలి’ లో నగ్నమునికి సూటిగా తెలిసిపోయిందని పాఠకుడికి కూడా ఇట్టే తెలిసిపోతుంది.

మనిషిగా వర్గ చైతన్యంతో మనం ముందుకు వెడదాం అంటున్న నగ్నముని దిగంబర కవికాదు. వర్గచైతన్యం అనే పదం నగ్నముని  నిఘంటువులో కొత్తది. ఈ దశలో ఈ నగ్నముని నీలోనూ నాలోనూ  వున్నవాడు. మననుండి విప్లవాల్నీ, త్యాగాల్నీ నిరీక్షిస్తున్నవాడు.

విప్లవ కవిగామారిన తర్వాత నగ్నముని గొంతులో ఒక బాలెన్స్ వచ్చినట్టనిపిస్తుంది. భావాల్ని ఆవేశం స్థాయిలో కాకుండా ఆలోచన ప్రమాణంగా వ్యక్తం చేస్తున్నాడనిపిస్తుంది.

01-nagnamuni

విప్లవ కవిత్వం తరవాతి  దశకూడా నగ్నముని కవితల్లో కనిపిస్తుంది. “కొయ్య గుర్రం” ముగింపు వాక్యాల్లో కనిపించేది. మళ్ళీ కొత్త నగ్నమునే నమ్మాల్సిన వాటినన్నింటినీ నమ్మి, మోసపోయిన తర్వాత వుండే నిర్లిప్తతతో, జీవితాన్ని పునః ప్రారంభించాలనే అమాయక తపన కనిపిస్తాయి. అయితే, నగ్నమునిలో రకరకాల రూపాల్లో బహిర్గతమయ్యే సంఘర్షణా, అలజడీ అంత తేలిగ్గా దేనికీ లొంగవు. అంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు నిప్పులు కురిపిస్తాడు. అంతా మౌనంగా వున్నప్పుడు శబ్దాల్ని వర్షిస్తాడు. ఈ నిశ్శబ్దం, ఈ మౌనం రెండు ఆయనకి భయంకరమైన ఉపద్రవాల్లా, శత్రువుల్లా కనిపిస్తాయి. అందుకే ఉద్యమాలు తగ్గుముఖం పట్టి, పోరాట పటిమ బలహీనపడిందని భావించి స్తబ్ద వాతావరణాన్ని వేలెత్తి చూపించాడు. విప్లవ నినాదం కాక, ఈ సమాజాన్ని కదిలించాల్సిన కొత్త శక్తి ఏదో కావాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య గొంతుకని సవరించుకున్నాడు. ఈ రెండు నినాదాల్లోనూ, వివాదాల్లోనూ నగ్నముని రాజీలేని తనమే కనిపిస్తుంది.

బాహ్య, అంతర్లోకాల సరిహద్దులు స్పష్టంగా గుర్తెరిగిన వాడవడంతో నగ్నముని కవిత్వరూపం సర్రియలిజంకి దగ్గిరగా వెళ్లిందనిపిస్తుంది. చాలా మామూలు మాటలూ, వాక్య నిర్మాణంలోనే ఎలాంటి ప్రయాసా పడకుండా అసాధారణ శైలిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధోరణి ‘ఉదయించని ఉదయాల్లో’  కాస్త తక్కువగా, దిగంబర కవిత్వంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ‘ఉదయించని ఉదయాల్లో’  లాండ్ స్కేప్ లాంటి కవితతో Para-linguistic features కనిపిస్తాయి. అంత్య ప్రాసల వచన కవిత్వ శైలి ప్రధానంగా వున్నప్పుడు దాన్ని ధిక్కరించి ‘దిక్’ల వైపు సాగే ప్రయత్నం ‘లాండ్ స్కేప్’లోనే కనిపిస్తుంది. ఈ Para-linguistic రూపాన్ని తర్వాత్తరవాత వజీర్ రెహ్మాన్,  స్మైల్ ఇంకా బలంగా, అర్ధవంతంగా వుపయోగించగలిగారు. ఇలా అత్యాధునిక కవిత్వ రూపానికి సంబంధించిన కొన్ని నమూనాల్ని నగ్నముని తన కవితల ద్వారా చూపించాడని చెప్పవచ్చు.

సాధారణ వచన కవిత్వ శైలిలో ఎంతకాదన్నా శబ్దం పంటికింద రాయిలా తగుల్తుంది. పైగా  అంత్య ప్రాసలవల్ల కవిత్వ వాతావరణం కొంత అసహజంగా వుంటుంది. ఈ రెండింటినీ నిరాకరించినది అత్యాధునిక కవిత్వ రూపం. ఈ రూపంలో భాష వొక వాహికగా వుంటుంది తప్ప తనే కవిత్వంగా మారదు. తిలక్ తరహా అలంకారిక శైలిని అత్యాధునిక కవిత్వంగా  కనీసం ఊహించలేం. అలాగే కుందుర్తి తరహా అంత్యప్రాసల అసహజ ప్రయాస కొత్త రూపంలో కనిపించదు.

8215_front_cover

ఈ కొత్త ధోరణికి చెందినవాడవడం వల్ల నగ్నముని కవిత్వంలో భాష కనిపించదు. అంతర్వాహినిలా వొక ఆధునిక మానవుడి సంభాషణ వినిపిస్తుంది. ఈ సంభాషణా శైలీ వ్యూహాన్ని నగ్నముని చాలా యాంత్రికంగా ప్రవేశపెట్టాడని అనుకోడానికి లేదు. తర్వాత్తర్వాత నగ్నముని కవిత్వరూపంలో ఎన్ని మార్పులొచ్చినా, మౌలిక నిర్మాణ ప్రాతిపదిక ఈ సంభాషణా వ్యూహమే. ఈ సంభాషణకి వొక క్రమం వుంది. నగ్నముని ప్రతి కవితలోనూ రెండు పాత్రలు కనిపిస్తాయి. ఒకటి కవి. రెండు తను లక్ష్యంగా వ్యక్తి లేదా వ్యక్తి ప్రతీకగా వున్న వ్యవస్థ. ఈ రెండు పాత్రల మధ్య సంభాషణలో గట్టి తర్కం వుంటుంది. నిర్మొహమాటంగా సాగే భావాల మార్పిడి వుంటుంది. ఒకే అంశాన్ని అనేక కోణాలనుంచి పరీక్షించి వీక్షించే వైరుధ్యమూ, విశాలత్వమూ వుంటాయి. ఇది (Monologue)గా మిగలదు. కచ్చితంగా (Dialogue) రూపంలో సాగుతుంది.

మొట్టమొదట , చిట్టచివరి కొమ్మన మనసు దిగంబరం కావాలి  – అని నగ్నముని చెప్పింది వ్యక్తీకరణ సమస్యే. ఈ దశలో నగ్నముని కవిత్వ శైలిలో అక్కడక్కడా అశ్లీలం పలకడం కూడా ఆశ్చర్యమేమీ కాదు. నగ్న సంభాషణలో శీలం, పాతివ్రత్యం, అశ్లీలం అంటూ ఏవీ మిగలవు. మాటల మీది ముసుగుని తొలగించడమే ఇక్కడ కవిత్వం పని. ఈ దిశగా నగ్నముని సాధించింది ఎంతో మిగిలింది. ఎన్ని వాదాలూ, అపవాదాలూ చేసినా అది ఖనిజం లాంటి నిజం

[నగ్నముని కవిత్వం మీద  1992లో తెనాలి పొయెట్రీ ఫోరం వారు “సంతకాలు” కవిత్వ పత్రిక నగ్నముని ప్రత్యేక సంచికకి  రాసిన గెస్ట్ ఎడిటోరియల్ ని ప్రచురిస్తున్నాం. ఈ రచనని ఇన్నేళ్ళ పాటు భద్ర పరచి మాకు పంపించిన పసుపులేటి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు]

~

సంభాషణల్లోంచి కథనం!

 

~

ఒక చిన్న ఊహని తీసుకుని కేవలం సంభాషణల ఊతంతో గొప్ప కథగా ఎలా మలచవచ్చో చూపిన కథ ‘బ్రహ్మాండం’.

ఈ కథ రాసింది ఆండీ వెయిర్ (Andy Weir). ఆ పేరు చెబితే వెంటనే అందరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఇటీవలే విడుదలై విజయాన్నందుకున్న హాలీవుడ్ సినిమా ‘ది మార్షియన్’కి ఆధారమైన, అదే పేరుతో వచ్చిన నవలా రచయిత అంటే చాలామందికి తెలియవచ్చు. అంతగా గుర్తింపులేని కాలంలో అతను రాసిన ‘The Egg’ అనే కథకి అనువాదం ఈ ‘బ్రహ్మాండం’.

andy

ఈ కథలో వర్ణనల్లేవు, అనవసరమైన వివరాల్లేవు, ఎక్కువ పాత్రల్లేవు, ఉన్న రెండు పాత్రలకీ పేర్లు లేవు, ఆ పాత్రల హావభావ వివరణా విన్యాసాల్లేవు, వాతావరణ నివేదికల్లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే – చిట్టి కథకి అనవసరమైనవేవీ ఇందులో లేవు. అత్యవసరమైనదొకటి మాత్రం దండిగా ఉంది: క్లుప్తత. ఇంకా, చెప్పదలచుకున్న విషయమ్మీద గొప్ప స్పష్టత. దాన్ని సూటిగా చెప్పిన పద్ధతి. ఆ రెంటికీ అతి సరళమైన వచనంతో వడివడిగా సాగే కథనం జోడై అక్షరాల వెంట పాఠకుల కళ్లు పరుగులు తీసేలా చేస్తుంది.

‘బ్రహ్మాండం’లో ఎస్టాబ్లిష్‌మెంట్ గట్రా శషభిషలేవీ పెట్టుకోకుండా రచయిత ఎకాయెకీ కథలోకి దూకేస్తాడు. ఎత్తుగడలోనే ఉత్సుకత రేపెడతాడు. ఉత్కంఠభరితంగా కాకపోయినా, చివరికేమౌతుందోననో ఆసక్తి ఆఖరిదాకా నిలుపుతూ కథని ముగిస్తాడు. ‘మీ దృష్టిలో మంచి కథ ఏది’ అని ఆ మధ్య వేంపల్లి షరీఫ్ అడిగితే, ‘చదివించగలిగేది ఏదైనా మంచి కథే’ అన్నాను. అలా చదివించాలంటే దానిలో ఉన్న ‘విషయమే’ కాక దాని నిర్మాణ చాతుర్యమూ ఆకట్టుకోవాలి. అలాంటి చాతుర్యంతో రాయబడ్డ కథ ఇది. చదవండి.

అన్నట్లు – ఈ కథలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా కథలు ఉత్తమ పురుష (first person) లేదా ప్రధమ పురుష (third person) దృక్కోణంలో సాగుతాయి. అత్యంత అరుదుగా మాత్రమే మధ్యమ పురుష (second person) దృక్కోణంలో రాయబడ్డ కథలు కనిపిస్తుంటాయి. ఈ కథ ఆ అరుదైన దృక్కోణంలో రాయబడింది. ఈ కథకి అదే సరైన విధానమని మీరే ఒప్పుకుంటారు, చూడండి.

ఈ అనువాదంలోనూ ఓ చిన్న విశేషముంది: ఆంగ్ల మూలకథని ఒక్క ఆంగ్ల పదమూ దొర్లకుండా తెనిగించటం.

*

 

 

andy1బ్రహ్మాండం

(Andy Weir ఆంగ్ల కథ  ‘The Egg’ కి మూల కథకుడి అనుమతితో తెలుగుసేత )

~

నువ్వు ఇంటికి వెళుతుండగా జరిగిందది.

రహదారి ప్రమాదం.

అందులో పెద్ద విశేషమేమీ లేదు – నువ్వు చనిపోవటం తప్ప.

పెద్దగా బాధపడకుండానే పోయావు. ఒక భార్యని, ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాట్టానికి వైద్యులు శక్తికొద్దీ ప్రయత్నించారు. కానీ నీ శరీరం ఎంతగా నుజ్జైపోయిందంటే – నువ్వు బతికుండటం కన్నా ఇదే మెరుగంటే నమ్ము.

అలా కలిశావు నువ్వు నన్ను. అదే మొదటిసారి కాదనుకో. కానీ ఆ సంగతి అప్పటికి నీకింకా తెలీదు.

“ఏం జరిగింది?”. నీ తొలి ప్రశ్న. “ఎక్కడున్నా నేను?”. రెండోది.

“చచ్చిపోయావు,” వెంటనే చెప్పేశాను. నాన్చుడు నాకు తెలీదు.

“పెద్ద వాహనమేదో వచ్చి నన్ను ఢీకొంది …”

“అవును”

“నేను … పోయానా!?!”

“అవును. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరూ పోయేవాళ్లే ఏదో నాటికి”

నువ్వు చుట్టూ చూశావు. ఏమీ లేదక్కడ. ఉంది మనమిద్దరమే.

“ఎక్కడున్నాం మనం? పరలోకమా?” అన్నావు.

“అలాంటిదే”

“నువ్వు … దేవుడివా?”

“అలా కూడా పిలవొచ్చు”

“నా భార్య, పిల్లలు …” అంటూ ఆగిపోయావు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

“వాళ్లకేమవుతుందిప్పుడు?” అన్నావు.

“ఏమో, చూద్దాం”, అన్నాను. “నీ విషయానికొస్తే – చనిపోయిన వెంటనే వాళ్లని తలచుకుని బాధపడుతున్నావు. మంచి గుణమే”

అప్పటికి కాస్త తేరుకున్నావు. నన్ను తేరిపారా చూశావు. నీకు నేనో దేవుడిలా కనబడలేదు. ఓ సాధారణ మానవ రూపంలో కనబడ్డాను. అది పురుషుడో లేక స్త్రీనో కూడా తేల్చుకోలేకపోయావు.

“బాధ పడొద్దు,” నేను కొనసాగించాను. “నీ పిల్లలు నిన్నెప్పటికీ ఓ మంచి తండ్రిగా గుర్తుంచుకుంటారు. వాళ్లకంటూ వ్యక్తిత్వాలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఏర్పడకముందే పోవటం నీ అదృష్టం. ఇక నీ భార్య – లోకం కోసం ఏడ్చినా లోలోపల నీ పీడ వదిలిందనుకుంటోంది. మీ మధ్యన అంత గొప్ప అనుబంధమేమీ లేదు కదా”

“ఓహ్,” అన్నావు నువ్వు ఆశ్చర్యపోతున్నట్లు. వెంటనే సర్దుకున్నావు. “అయితే, ఇప్పుడేమవుతుంది? నేను స్వర్గానికో, నరకానికో పోతానా?”

“లేదు. మళ్లీ పుడతావు”

“ఓహ్,” మళ్లీ ఆశ్చర్యపోయావు. “అంటే, హిందువులు చెప్పేది నిజమేనన్న మాట!”

“అన్ని మతాలు చెప్పేదీ నిజమే,” అంటూ నడక ప్రారంభించాను. నువ్వు అనుసరించావు, “ఎక్కడికి?” అంటూ.

“ఎక్కడకూ లేదు. మనమున్న ఈ చోట ఎంత నడచినా ఎక్కడకూ వెళ్లం”

“మరి నడవటం ఎందుకు?”

“ఊరికే. నడుస్తూ మాట్లాడుకోటం బాగుంటుంది కాబట్టి”

కాసేపు మౌనంగా నన్ను అనుసరించాక నోరు విప్పావు.

“మళ్లీ పుట్టటం వల్ల ప్రయోజనమేంటి? ఈ జన్మలో నేను నేర్చుకున్నదంతా వదిలేసి మళ్లీ కొత్తగా మొదలెట్టటం … అంత అర్ధవంతంగా లేదు”

“లేదు. నీ గత జన్మల జ్ఞానం ప్రతి జన్మలోనూ నీ తోడుంటుంది. ప్రస్తుతానికి అదంతా నీకు గుర్తు లేదంతే,” అంటూ ఆగాను. నువ్వు కూడా ఆగిపోయావు.

నీకేసి తిరిగి, నీ భుజాలు పట్టుకుని కుదుపుతూ కొనసాగించాను. “ప్రస్తుత జన్మలో నలభయ్యేళ్లే నువ్వు మానవ రూపంలో ఉన్నావు. గత జన్మల సారాన్నంతటినీ అనుభూతించేంత సమయం నీకు దొరకలేదు, అంతటి వివేకం నీకింకా కలగలేదు”

నా మాటలు అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ కాసేపు నిశ్చలంగా ఉండిపోయావు. తర్వాత అడిగావు.

“నాకెన్ని గత జన్మలున్నాయి?”

“లెక్కలేనన్ని. ఒక్కో సారీ ఒక్కో రకం జీవితం”

“రాబోయే జన్మలో నేనెవర్ని?”

“క్రీ. శ. 540, చైనా దేశంలో ఒక గ్రామీణ పడుచువు”

“ఏమిటీ!” అంటూ నిర్ఘాంతపోయావు. “కాలంలో వెనక్కి పంపుతున్నావా నన్ను??”

“సాంకేతికంగా చెప్పాలంటే అంతే. ఈ ‘కాలం’ అనేది నువ్వెరిగిన విశ్వానికి మాత్రమే వర్తించే లక్షణం. నేనొచ్చిన విశ్వంలో విషయాలు వేరుగా ఉంటాయి”

“ఎక్కడ నుండొచ్చావు నువ్వు?” అడిగావు.

“ఎక్కడ నుండో. నాలాంటి వాళ్లు మరిందరూ ఉన్నారు. వాళ్లూ ఎక్కడెక్కడ నుండో వచ్చారు. నీకా విషయాలన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అవన్నీ నీకర్ధమయ్యేవి కాదు కాబట్టి వాటినలా వదిలేద్దాం”

“ఓహ్,” నిరాశగా నిట్టూర్చావు. అంతలోనే నీకో అనుమానమొచ్చింది. “అవునూ, నేనిలా కాలంలో ముందుకీ వెనక్కీ గెంతుతూ పునర్జన్మలెత్తుతుంటే ఎప్పుడో ఓ సారి నా అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడవా?”

“అది తరచూ జరిగేదే. నీ అవతారాలు తన ప్రస్తుత జన్మని మాత్రమే గుర్తుంచుకుంటాయి కాబట్టి ఒకదాన్నొకటి గుర్తుపట్టవు”

“ఇదంతా దేనికోసం?”

“నువ్వు ఎదగటం కోసం. నీ ప్రతి జన్మ పరమార్ధమూ నువ్వు గత జన్మలోకంటే కొంత మెరుగుపడటం. అంతే. అందుకోసం ఓ విశ్వాన్నే సృష్టించాను – నీ ఒక్కడి కోసం”

“నా ఒక్కడి కోసం!?! మరి, మిగతా వాళ్ల సంగతేంటి?”

“మిగతా వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికీ ఉన్నది నువ్వొక్కడివి, నీకు తోడుగా నేను”

నువ్వు భావరహితంగా నాకేసి చూశావు. “మరి, భూమ్మీది ప్రజలందరూ …”

“వాళ్లంతా నీ వేర్వేరు అవతారాలే”

“ఏంటీ!! అందరూ నేనేనా?”

“అవును. ఇప్పటికి తత్వం బోధపడింది నీకు,” అన్నా నేను అభినందనపూర్వకంగా నీ వీపు తడుతూ.

“భూమ్మీద పుట్టిన, గిట్టిన ప్రతి మనిషీ నేనేనా?”

“పుట్టబోయే ప్రతి మనిషి కూడా నువ్వే”

“మహాత్మా గాంధీని కూడా నేనే?”

“నాధూరామ్ గాడ్సేవీ నువ్వే”

“అడాల్స్ హిట్లర్‌ని నేనే?”

“అతను ఉసురు తీసిన లక్షలాది మందివీ నువ్వే”

“ఏసు క్రీస్తుని నేనే?”

“క్రీస్తుని నమ్మిన కోట్లాది భక్తులూ నువ్వే”

నువ్వు మ్రాన్పడిపోయావు.

నేను చెప్పటం ప్రారంభించాను. “నువ్వొకరిని బాధ పెట్టిన ప్రతిసారీ నువ్వే బాధ పడ్డావు. నువ్వు పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యమూ నువ్వే. కర్తవి నువ్వే. కర్మవీ నువ్వే”

నువ్వు దీర్ఘాలోచనా నిమగ్నుడివయ్యావు. అందులోనుండి బయటపడ్డాక అడిగావు.

“ఎందుకిందంతా చేస్తున్నావు?”

“ఏదో ఒక రోజు నువ్వు నాలా మారతావు కాబట్టి; నువ్వు నా బిడ్డవి కాబట్టి”

“అంటే … నేను … దేవుడినా??”

“అప్పుడేనా? ప్రస్తుతానికి నువ్వింకా పిండం దశలోనే ఉన్నావు. మెల్లిగా ఎదుగుతున్నావు. సర్వకాలాల్లోనూ వ్యాపించిన మానవ జన్మలన్నిట్నీ సంపూర్ణంగా అనుభవించాక, మనిషిగా పరిపూర్ణుడివయ్యాక, అప్పటికి – నువ్వు నీ అసలు అవతారమెత్తటానికి సిద్ధమౌతావు”

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! ”

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది”.

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కథ కళారూపమే, కానీ…!

 

artwork: Srujan

artwork: Srujan

దగ్గుమాటి పద్మాకర్
~

daggumatiతెలుగు రచయితలు పాఠకుల స్థాయిని తక్కువచేసి చూడడం ద్వారా తక్కువస్థాయిరచనలు వస్తున్నాయని ఒక ఆరోపణా; సమాజాన్నో, వ్యక్తులనొ మార్చాలన్న తపన వల్ల  కథ కళారూపమన్న విషయం మరుగున పడిపోతున్నదన్న ఆరోపణ మరొకటి గతవారం అమెరికానుంచి వచ్చిన కన్నెగంటి చంద్రగారు చేశారు. ఈరెండు ఆరోపణలు చేసిన కన్నెగంటి చంద్ర గారు కానీ, ఇతర అమెరికా నుంచి సాహితీవ్యాసంగం నిర్వహించే మిత్రులు గానీ ఒక విషయం అర్ధం చేసుకోవాలి.

వారు ఏదైనా ఒక కథను లేదా పదికథలను విమర్శకు స్వీకరించి ఎంత తీవ్రంగా అయినా విమర్శించ వచ్చు! అలాకాకుండా ఈతెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం.సాహిత్య కళారంగాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్యంగా ఉన్నప్పుడేతమజీవనం, సంస్కృతి, సాహిత్యం, భాష వంటి అంశాల మీద  ఆంధ్రుల దృక్పథాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించి నిలదీశారు అన్నది గమనించాలి. అందుకని ఇక్కడి తెలుగుసమాజం, రచయితలు, సామాజిక నేపథ్యం గురించి అమెరికా మిత్రులకు రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది.

సాధారణంగా ఒక రచయిత దాదాపు నాలుగైదు కథలు రాస్తేగాని కొన్ని కథాంగాలు,నైపుణ్యాలపై స్పష్టత రాదు. కొందరికి ఈసంఖ్య పది కథలుబ్కూడా కావచ్చు.సమాజంలో రచయితల సంఖ్య పెరిగే కొద్దీ ఈ కొత్తవారి కథలు అనేకం వస్తూఉంటాయి. అనేక పత్రికలు, అనేక కారణాలవల్ల ఈతరహా కథలని ప్రచురిస్తాయి. అలాంటి కథలు సమాజంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సమాజంలోని పేదరికమో,అన్యాయాలో, అస్తవ్యస్త పరిస్తితులో, ఇతర అపసవ్యతలో…. తనని కలిచి వేయడంవల్ల సాధారణంగా ఎవరైనా రచనలు ప్రారంభిస్తారు. అది యవ్వనప్రాయంలోనిసామాజిక సంక్షోభానికి ప్రతీక. అంతెందుకు…. ఎంతగొప్ప రచయితలు అయినా తనమొదటి రచనలు చూసి అప్పటి అవగాహనా రాహిత్యంపై కాస్త సిగ్గుపడతారు. తమలోపాలు తాము గమనించుకునే మెచ్యూరిటీ రానంతవరకు వారి రచన వారికి ముద్దే! అదొక పరిణామ క్రమానికి సంబంధించిన విషయం.

ఎక్కువగా అలాంటి కథలుకనిపిస్తున్నాయంటే దాని అర్ధం కొత్త రచయితల సంఖ్య పెరుగుతుందని కూడాఅర్ధం చేసుకోవచ్చు. ఏరచయిత అయినా ప్రారంభంలో తాను  పనిగట్టుకుని ఈ సమాజానికి ఏదైనా చెప్పాలనే ఆకాంక్షతోనే రాయడం ప్రారంభిస్తాడనేది వాస్తవం. ఇది రచయితల వ్యక్తిగత కోణం.

ఇకపోతే సామాజిక కోణంలో కథల్లోని నీతి, లేదా సందేశం అనే వాటిని చూద్దాం. ఈ సమస్యపై కంప్లయింట్స్ ఎక్కువగా అమెరికా మిత్రుల నుండే వస్తున్నాయి. ( ఈతరహా విమర్శ మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం అనే ఆత్మ విమర్శ కూడా చేసుకోలేనంతగా వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.) అమెరికా జీవన విధానం క్రమబద్దంగా, సాఫీగా జరిగిపోయే విధంగా ఏర్పాటు చేసుకోబడిన ఒక ఆధునికదేశం. అక్కడి జీవన విధానానికి అలవాటైనా కారణంగానో, అక్కడ అందుబాటులోవున్న వివిధ భాషల సాహిత్యాన్ని చదువుతున్న కారణంగా అక్కడి మిత్రులుతెలుగు సాహిత్య సమాజంలోని కథలని చూసి పెదవి విరుస్తున్నారు!

ఇదెలావుంటుందంటే, తండ్రిని షేవింగ్ చేసుకోవడం చూసిన పిల్లవాడు తానుకూడాఅనుకరిస్తూ గడ్డం చేసుకోవాలని ఉబలాట పడడంలా ఉంటుంది! కానీ గడ్డం రావాలి కదా! వర్ధమాన దేశాలకీ, భారత దేశానికీ మధ్యన టెక్నాలజీ కారణంగా సాధారణ సమాచారమార్పిడి క్షణాల్లో జరుగుతుంది.  కానీ అందులో లక్షవంతు భాగం కూడా ఇక్కడ సామాజిక మార్పులు ముందుకు పోవడం లేదు. ఇక్కడ సామాజిక పరిపాలన అంతా మోసాలతో కుట్రలతో జరుగుతుంది. (అక్కడ జరుగుతాయా లేదా అన్నది అసందర్భం) అస్సలు జవాబుతారీ తనం లేని పరిపాలన ఈనేలపై సాగుతుంది. ఈ కారణంగా రచయితల  కళ్ళముందు సగటు జనాభా అట్టడుగు జీవితాలు తప్ప మరొక వస్తువు కనపడనిస్తితి.

మరో పక్కన వేల కోట్ల దోపిడీని పథకాల పేరుతో, ప్రజా ప్రయోజనాల పేరుతోవరల్డ్ బ్యాంక్ మేధావుల సూచనలు ఎత్తుగడలతో ‘కడుపునెప్పితో ఆసుపత్రికిపోతే  దొంగతనంగా కిడ్నీ తొలగించినట్టు’ దేశ వనరులని అమ్మేస్తున్నారు. మహాశయులారా! ఇక్కడి సమస్యలకి స్పందించే తెలుగు ప్రాంతంలోని రచయితలు తమకుతోచిన వస్తువులతో తమ స్థాయిలో రచనలు చేస్తు ప్రజా సమస్యలని, ఆకాంక్షలనీ వెలుగులోకి తేవడం వారి బాధ్యతగా గుర్తిస్తున్నారు.

మీడియాని సైతం పాలకులు కొనేసిన నేపథ్యంలో వారి అక్రమాలకు బలవుతున్న ప్రజల సమస్యలవైపుకనీస ప్రత్యామ్నాయంగా ఉండడం రచయితలు తమ బాధ్యతగా గుర్తిస్తున్నారు. ఇంతగాటెక్నాలజీ డెవలప్ అయినా కనీసం చెక్పోస్టుల అవినీతిని దశాబ్దాలుగాప్రభుత్వాలు ఆపడం లేదు! అంతా కుమ్మక్కు! పదిమంది గొంతెత్తబట్టే బాక్సైట్గనుల జీవోపై ప్రభుత్వం వెన్నక్కి తగ్గింది. ఎవరు ఎలా గొంతెత్తారు అనేది అనవసరం.

రాగయుక్తంగా పాడలేనంత మాత్రాన తల్లి పాడేది లాలిపాట కాకుండా పోదు! బిడ్డ ఏడుపుకు ఎలాగోలా పాడడం తల్లికి ఒక అనివార్యత అని గుర్తించమని మనవి! పైన చెప్పినదంతా తెలుగు ప్రాంతపు సామాజిక నేపథ్యం. ఇకపోతే;వస్తువులోగానీ, శైలిలో గానీ, రచనా నైపుణ్యం గానీ సాహిత్యంపై సమాజంపై వారివారి దృక్పథాన్ని అభిరుచినీ బట్టి రచయితలు తమని తాము మెరుగు పరుచుకునేప్రయత్నం చేస్తారు.  ఆక్రమంలోనే  కొందరినుంచి మనం  అప్పుడప్పుడు గర్వంగాచెప్పుకోగలిగే మంచి కథలూ కొన్ని వస్తున్నాయి. అక్కడ నుండి రాస్తున్నకథకులు అక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకున్నట్టే; ఇక్కడి కథకులుఇక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకుంటారు! పేదరికం వస్తువైనప్పుడు ఆ కథలు త్రీస్టార్ హోటల్ కస్టమర్లకు బిచ్చగాళ్ళలా కనిపించి చిరాకుపరుస్తున్నాయేమో గమనించాలి!   అది త్రీస్టార్ హోటల్ కావడం వల్ల చిరాకుమాత్రమే! అదే గుడిముందు అయితే అంత చిరాకు ఉండక పోవచ్చు!

ఇలాంటి రచనలవల్ల  కళకి ఏదో అన్యాయం జరుగుతుందన్న పేరుతో విమర్శించే అమెరికా మిత్రులు ఇందుకు అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలనీ ఇక్కడ అవసరమైన రచయితలకు అందించేరీతిలో సాహిత్య పాఠశాలలు నిరంతరం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తే తెలుగుసమాజానికి మేలుచేసిన వారు అవుతారు.

*

మనసు పలికే మాట కోసం “రిఫిటి”!

 

 

And must thy lyre, so long divine,

Degenerate into hands like mine?

 

–Lord Byron, in his “The Isles of Greece”

 

తొమ్మిదేళ్ళ కిందట ఎమ్మెస్  రామారావు గారి “చెంగూల అల మీద...” పాటని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసాక కలిగిన అంతర్మధనం తరవాత ఈ రిఫిటి ఆలోచనకి బీజం పడింది. ఆ అనువాదం నాకు అంత తృప్తినివ్వలేదు. మరీ సందేశంలా అనిపించింది, మూలంలోని కవిత్వమంతా కరిగిపోయి-

తెలుగు మాత్రమే కాదు, చాలా భాషలు మాట మీద బతుకుతాయి. మాటలోని జీవం మీదా, తీయదనం మీద బతుకుతాయి. మనం కీబోర్డు ముందు కూర్చుని ఆ భాషని ఉపయోగిస్తున్నప్పుడు వాటిలోని ఆ జీవమంతా రాలిపోతుంది. మాటకి వుండే అందమంతా పోతుంది. మాట ఒక తీర్పరి వాక్యంలాగా మొద్దుబారిపోతుంది. మాటలు పెళుసు అయిపోతాయి.

నిజానికి, రోజు వారీ జీవితంలో మాటలు అంత పెళుసుగా వుండవ్. తమ అనుభవాలు చెప్తున్నప్పుడు మనుషులు వాటికి వేర్వేరు అర్థచ్చాయలు ఇస్తారు,  thesaurus లో మాదిరిగా- ఇన్ని అనేకార్ధాలని ఎలా చేరుకుంటాం? కేవలం కళలూ సాహిత్యం ద్వారా మాత్రమే! కాని, ఇప్పటి మన ఆన్ లైన్ ప్రపంచంలోకి వెళ్తే, మన దృష్టి మారిపోతుందని తేలికగానే అర్థమైపోతుంది. ఎంత గొప్ప  భావమైనా, ఒక YouTube సినిమా పాట లింక్ దగ్గిర  ఆగిపోతున్నట్టు అనిపిస్తోంది. నిజానికి మాటలోంచి పుట్టి, మాటలో పెరిగిన మనం ఇంతకంటే ఇంకో మెట్టు ఎక్కవచ్చు. మన ఈ లిఖిత సంభాషణల ప్రపంచానికి spoken word ని మళ్ళీ కేంద్రంగా మారిస్తే ఎలా వుంటుంది ఆలోచించండి. ఇప్పుడు మనకి అందుబాటులో వున్న ఈ సమస్త టెక్నాలజీకీ  ఆ spoken wordకీ ముడి కలిపితే ఎలా వుంటుంది? ఈ ఆలోచనల ఫలితమే: Riffiti mobile app.

Riffiti ఇప్పుడు Android and iPhone మీద ఉచితం! దీన్ని మీరు ఓపెన్ చేసినప్పుడు, మీ ముందు భిన్న ప్రపంచాలు-  Worlds-  దొరలిపోతాయి. ఒక్క ప్రపంచం ఒక టాపిక్ లోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. మాటలు కలుపుతుంది. మీతో మాట్లాడిస్తుంది.  ఆ మాటకొస్తే మీరే ఒక World ని సృష్టించవచ్చు. ఆ World లో విడదీయలేని భాగం కావచ్చు. కేవలం ఇరవై సెకండ్లలో మీకూ మీ బాహ్య ప్రపంచానికీ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరైనా ప్రశ్నలు అడగవచ్చు, ఎవరైనా సమాధానాలు ఇవ్వచ్చు. అయితే, ప్రశ్నల దగ్గిరే ఆగిపోవాలనీ లేదు. ఇక్కడ మాటకి ఆకాశమే హద్దు. Riffiti  ని మీరు ఎలా మలచుకుంటారన్నది మీ ఇష్టం, మీ స్వేచ్చ! ఇందులో వున్న గొప్ప సౌందర్యం ఏమిటంటే: ఇక్కడ మాటలన్నిటికీ spoken word మాత్రమే హద్దు. సుదీర్ఘమైన సందేశాలు అక్కర్లేదు. చక్కగా మీరు ఎలా వుంటే అలా మాట్లాడండి. మీ మాటే వినిపిస్తుంది, మీరే కనిపిస్తారు,  తెలుగు పలుకులోని తీయదనంలా, జీవంలా- మహాకవి బైరన్ అన్నట్టు ఆ – divine lyre- వినిపించనివ్వండి.

మన కళలూ మన సాహిత్యంలోకి కొత్త వెలుగులు ప్రసరించే నది స్వచ్చంగా స్వేచ్చగా ప్రవహించడానికి Riffiti ఒక మూలం అవుతుందని నా నమ్మకం. రచయితలూ, కవులూ, యాత్రా చరిత్రల రచయితలూ, నాటికలూ, స్కిట్స్ రచయితలూ- వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరికీ Riffiti అందమైన అనుభవమే! అందులోకి అడుగు పెట్టండి, మరిన్ని అడుగులు కలుస్తాయి, ఇక వెనకడుగు అన్నదే లేదు!

iPhone FREE app link: https://itunes.apple.com/us/app/riffiti/id970498462

Android FREE app link: https://play.google.com/store/apps/details?id=com.riffiti

​ఈ విషయంలో ఏమైనా మాట్లాడాలీ అనుకుంటే:  raj@riffiti.com కి రాయండి. సంతోషంగా సమాధానమిస్తాను.

 

  • రాజ్ కారంచేడు 

 

 

 

 

 

 

That is how I feel about our spoken languages, especially my Telugu language. The lyre that the sound of Telugu is, is degenerating, literally, into the quick, coarse and judgmental hands on online keyboards. About nine years ago when I tried to translate this M.S. Ramarao song, “Chengoola Alameeda…” into English. The outcome was pedantic, and less than honorable. I think that was when the seeds for Riffiti were sown in my head.

 

“Oral tradition is antifragile,” said Nassim Taleb. People’s varieties of experiences are like entries in a thesaurus. They give us access to degrees of meaning. How do we access these shades of meanings? Arts and literature of course, is the answer. But as we move to online worlds, our attention spans are dwindling. The best we are able to do is to link to some YouTube movie song link. But we can do better. What if we make spoken word the center of our online interactions? What if we bring back the oral tradition with the clever use of technology? The result is Riffiti mobile app.

 

When you open Riffiti (a free app both on Android and iPhone), you will see Worlds, which are topic/interest focused. Anyone can create or join a World. In a Riffiti World people can interact by speaking into mobile video for 20-seconds maximum. Moreover, anyone can ask questions by typing them in. But such interactions do not have to be questions. It’s all up to how we want to use Riffiti. The beauty of Riffiti is all interaction takes place via spoken word. No need to write lengthy texts. We made it this way because showing one’s face and speaking in one’s own words is a powerful way to keep the divine lyre of Telugu singing!

 

I am convinced that Riffiti will be a place where a river of insight from literary and art world will flow freely in spoken words. Writers, poets, journalists, travel lovers, playwrights, skit and comedy artists, young men and women, practically everyone with something to say, will find Riffiti a place they love to check in, and no reason to leave!

 

Here are the download links for the free Riffiti app:

 

iPhone FREE app link: https://itunes.apple.com/us/app/riffiti/id970498462

Android FREE app link: https://play.google.com/store/apps/details?id=com.riffiti

 

​Please send email to raj@riffiti.com for any questions, I will answer them personally. ​

 

మైనారిటీ వాదం మత వాదమా ?

 

-పి. విక్టర్  విజయ్ కుమార్

~

‘ చమ్కీ పూల కథ ‘ అని నేను ‘ చమ్కీ  పూల గుర్రం ‘ కథ పై రివ్యూ రాసాక, కొంత మంది మితృలు నాతో ఒక ప్రశ్న లేవనెత్తారు ‘ ముస్లిములను సపోర్ట్ చేయడం అంటే ( ముస్లిం ) మతాన్ని సపోర్ట్ చేసినట్టు ఉండదా ? ‘  అని. ‘ మైనారిటీ మత ప్రజలను సపోర్ట్ చేయడమంటే , వాళ్ళ మతాన్ని కూడా సపోర్ట్ చేయడం అవ్వదా ? ‘ అని. అటు తిరిగి, ఇటు తిరిగి – ఇది చాలా మంది బుర్రల్లోనే, పైగా మార్క్సిజం నమ్మిన వాళ్ళలో కూడా, ఉన్న ప్రశ్న అని చాలా ఆలస్యంగా గమనించాక, ఒక   detailed explanation    ఇచ్చి చర్చిస్తే ,   probably   ఈ చర్చలకు ఒక లంగరు దొరుకుతుందేమోనని ఉద్దేశ్యం తో ఈ వ్యాసం.

వంద ఏళ్లకు పైగా మార్క్సిస్టు చరిత్ర ఉన్న దేశం మనది. అంత అనుభవం ముందు –  ఇది నిజానికి చాలా చిన్న ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే  preliminary question  . ఐతే ఇప్పుడిప్పుడే ప్రగతి వాద రాజకీయాలు నేర్చుకుంటున్న వారికి, సిన్సియర్ కమిట్ మెంట్ ఉండి  progressive dilemma   ఉన్న వాళ్లకు ఈ వ్యాసం ఉపయోగ పడవచ్చని సాధ్యమైనంత సాధారణ భాషలోనే ఇది రాయడం అయినది.

మతం  superstructure  అని మార్క్సిజం చెప్తుంది. ఆర్థిక ప్రాతిపదిక   base   గా ఉండడం వలన , మతం ఇప్పుడున్న ఆర్థిక అసమానతలు కొన సాగినంత కాలం మతం కొన సాగుతుంది అన్నది   dialectical interpretation  . మరి అంత వరకు మతం మాయమయ్యేంత వరకు, మెజారిటీ మత వాదులు మైనారిటీ మతస్తులపైన చూపించే   prejudices   ను   hostility   ని ఎలా ఎదుర్కోవాలి ? ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోదల్చుకోవాల్సిందేమంటే – ఇది    prejudices    ను రూపు మాపే పోరాటం. అణగారిన వరుసల్లో ఉన్న మైనారిటీల సాంస్కృతిక సమస్యను ఎదుర్కోవడం. మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం , లెదా అందుకు సంబంధించి రచనలు చేయడం అంటే ఆయా   prejudices  ను వ్యతిరేకించడం. అంతేకాని  మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం అంటే – మైనారిటీ మతం   Vs  మెజారిటీ మతం అని అర్థం కాదు. అంతే కాక సెక్యులరిస్ట్ ఉద్యమాలు  మత పరమైన యుద్ధాలు కాదు, లేదా కేవలం మత విశ్వాసాల గొప్ప తనానికి సంబంధించిన పోటీ కూడా  కాదు.

మన దేశం లో మైనారిటీ మతస్తులు – ప్రధానంగా కార్మికులు,   unskilled workers , నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళెవరూ అధికారం లో భాగస్తులుగా లేరు. అక్కడక్కడ  tokenism  కనిపిస్తుంది గాని ( సినిమా స్టార్స్, పఠాన్, రాజ వంశస్తులు )  , అత్యధిక పేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళే.  నిజానికి  75 శాతం   death row convicts   ముస్లిములే మరి !   ఇక దళిత క్రిస్టియన్స్ సంగతి తెలియంది కాదు. వీల్లందరు సమస్యలున్నా ఇంకా అంతో ఇంతో మనశ్శాంతిగా, కొంత  జీవితం పట్ల confidence  తో  బతుకుతున్నారు అంటే – దానికి కారణం వారి మత విశ్వాసం. బ్రాహ్మినిజానికి వ్యతిరేకంగా వీరిని , పెట్టుబడి దారీ ఫ్యూడల్ వాదులకు, రాజ్యానికి వ్యతిరేకంగా కూడగట్టాలనుకున్నప్పుడు , నాస్తిక వాదం ను ముందు పెట్టి పోరాటం చేయడం మొదలు పెడితే – ఇక్కడో   friction   అనివార్యం అవుతుంది.  ఐతే   marxism   అన్నది   scientific socialism  ను చెప్తుంది . మతాన్ని నిర్ద్వందంగా  వ్యతిరేకిస్తుంది. అలాంటి సమయం లో – మైనారిటీ మత విశ్వాసాన్ని , తమ నాస్తిక వాదం తో దూషిస్తూ పోతే – శ్రామిక వర్గం లో పాతుకుపోయిన (మూఢ ) విశ్వాసాలను   hurt  చేయడం జరుగుతుంది. అందువలన , వాళ్ళు ప్రగతి వాదం , సెక్యులరిజం వేపు మొగ్గడం పోయి, తిరిగి మత వాద పార్టీల చేతిలో కీలు బొమ్మలై , కుల , వర్గ పాలన చట్రం లోనే ఇరుక్కుపోతారు. మరెలా ? వీరి సంస్కృతిని , వీరిని విస్మరించాలా ?   Communal violence   తో పాటు, వారిని ఆర్థికంగా, సాంఘిక, సాంస్కృతికంగా  అణగదొక్కే పరిస్థితి తో ఇలా గడపవలసిందేనా ?

ఇంతకు ముందు మనం అనుకున్నట్టు – మైనారిటీ హక్కుల పోరాటం –  institutional and individual prejudices   కు వ్యతిరేకంగా జరిగే పోరాటం. అంతే కాని మత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదు. మరి మత విశ్వాసాలను అలాగే అంగీకరించి మిన్నకుండి పోవాలా ? అందుకే   dialectics   చూస్తే క్లియర్ గా , వర్గ పోరాటాలను ( సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలు కూడా భాగమే ) ఉధృతం చేసి ఆ క్రమం లో, మైనారిటీలను కూడా గట్టుకోవాలి తప్ప వారి విశ్వాసాల పై పోరాటాన్ని   prioritise   చేస్తే, మొత్తంగా వర్గ పోరాటాన్ని పక్కకు పట్టించాల్సి వస్తుంది అని అర్థమౌతుంది.

రష్యా అనుభవం చూస్తే – లెనిన్ అధికారం లో వచ్చిన వెంటనే మతం వ్యక్తిగత వ్యవహారం అందుకు ఎటువంటి    state support   ఉండదు అని ప్రకటించాడు. అంతే కాక ఆయా వ్యక్తిగత విశ్వాసాలను ప్రకటించుకోడానికి పూర్తి స్వేచ్చ ఉందని కూడా ప్రకటించాడు. ఇది ఇక్కడ   paradox  . శ్రామిక వర్గ ప్రగతి నిరోధకమైన మత విశ్వాసాల ప్రచారం కొనసాగించడం దేనికి ? ( కేంద్రీయ) నియంతృత్వ విధానాన్ని అనుసరించి ఒకే వేటులో దీనిని ఎందుకు తొక్కేయలేదు ?  ఇంకొక అడుగు ముందుకేసి – పార్టీలో ఏ వ్యక్తిగత విశ్వాసం ఉన్న వారైనా చేరవచ్చు ఐతే వాళ్ళు పార్టీలో ఉన్న   collective opinion  కు కట్టుబడి ఉండాలి అనే విధానం ప్రకటించాడు. ఇంకా పరిశీలిస్తే – చర్చ్ ఫాదర్స్ ను కూడా సోషలిస్ట్ పార్టీలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఇదంతా చూస్తే – సైంటిఫిక్ సోషలిజం, మతాన్ని మత్తు మందుగా ప్రకటించిన మార్క్సిజం, మతం మీద ఒక   lenient view    తీసుకుందని అనిపిస్తుంది. ఐతే, నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో పరిశీలిస్తే   pluralism   మరియు  multiculturalism  తో సోషలిస్ట్ దృక్పథాని ఎలా ముందు తీసుకెళ్ళాలో లెనిన్ ఒక అద్భుత ఉదాహరణ ముందుంచాడని చెప్పుకోవచ్చు. సోషలిస్ట్ పార్టీ ఇటువంటి  stand   తీసుకోవడం గురించి లెనిన్ మాటల్లోనే గమనించండి.

lenin

(  in his writing – The Attitude of Workers’ Party to Religion )

To draw a hard-and-fastline between the theoretical propaganda of atheism, i. e., the destruction of religious beliefs among certain sections of the proletariat, and the success, the progress and the conditions of the class struggle of these sections, is to reason undialectically, to transform a shifting and relative boundary into an absolute boundary; it is forcibly to disconnect what is indissolubly connected in real life. Let us take an example. The proletariat in a particular region and in a particular industry is divided, let us assume, into an advanced section of fairly class-conscious Social-Democrats, who are of course atheists, and rather backward workers who are still connected with the countryside and with the peasantry, and who believe in God, go to church, or are even under the direct influence of the local priest—who, let us suppose, is organising a Christian labour union. Let us assume furthermore that the economic struggle in this locality has resulted in a strike. It is the duty of a Marxist to place the success of the strike movement above everything else, vigorously to counteract the division of the workers in this struggle into atheists and Christians, vigorously to oppose any such division. Atheist propaganda in such circumstances may be both unnecessary and harmful—not from the philistine fear of scaring away the backward sections, of losing a seat in the elections, and so on, but out of consideration for the real progress of the class struggle, which in the conditions of modern capitalist society will convert Christian workers to Social-Democracy and to atheism a hundred times better than bald atheist propaganda.

So,    ప్రధానంగా ఈ కింది పాయింట్స్ మనం గమనించాలి :

(1) శ్రామిక వర్గాల్లో ఉన్న మత విశ్వాసాలను ధ్వంసం చేయడం అది   undialectical   అవుతుంది . ఇది సమస్యను   relative boundary   నుండి  absolute boundary   కి షిఫ్ట్ చేసి తప్పిదం చేసినట్టౌతుంది ( కింద పేరాల్లో దీని కంప్లీట్ మీనింగ్ దానితో పాటు దీన్ని  అంబేద్కర్ ఎలా డీల్ చేసాడో చూద్దాం )

(2)   Country side   శ్రామికులు తమకున్న విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ  ( అంటే మనకు పీర్ల దేవుళ్ళు, బతుకమ్మలు, సమ్మక్క సారక్క లకు మల్లే ) ఏదన్నా ఒక ఆర్థిక పోరాటం చేస్తున్నప్పుడు , వాళ్ళను కూడగట్టుకుని పోరాటాన్ని ముందు తీసుకు పోవాలంటే నాస్తిక వాదాన్ని ఉపయోగించడం   వర్గ పోరాటానికి అనవసరం మరియు హాని కారకం  కూడా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉద్యమ లక్ష్యం పక్క దారి పట్ట రాదు మరియు ఉద్యమ లక్ష్యమే అన్నిటికన్నా ఉన్నతమైనది కాబట్టి.

(3) ఈ విధంగా చేయడం వలన శ్రామికులు మత విశ్వాసం నుండి   social democracy   లోకి మారడం జరిగి తద్వారా క్రమేపీ నాస్తిక వాదం లోకి మారడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష నాస్తిక వాద  ప్రచారం కన్నా వంద రెట్లు మేలు.

లెనిన్ ఎంత క్లియర్ గా చెప్పాడు ఇందులో ? చెప్పడమే కాక, మతం మన జీవితాల్లో నుండి మాయమవ్వడం కోసం కొన్ని దశాబ్దాల కృషి కావాలని తెలిసాక,  మైనారిటీ మత విశ్వాసాలను అధికార వర్గ భావజాలమైన  majoritarianism  కు వ్యతిరేకంగా  organise  చేసి శ్రామిక వర్గాన్ని కూడగట్టమని చెబుతున్నాడు. అంతే కాక, ఈ మైనారిటీ విశ్వాసాలను పని గట్టుకుని దెబ్బ తీస్తూ ప్రవర్తిస్తే , ఈ వర్గాలు మరింతగా కుంచించుకుపోయి మరింతగా  rigid   అయిపోయి ప్రగతి వాద ఉద్యమాల వేపు ఆకర్షించబడకుండా , తమను మతం గోతిలో పాతి పెట్టే తమ శతృవు గుప్పిట్లోకే వెళ్ళిపోతారు. ఇదే అదను తీసుకుని అధికార వర్గం ( బ్రాహ్మిణిజం) , ఈ ఉద్యమాలను తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టంగా తెలియ జేసాడు. ఆపై ఏంగెల్స్ ఏ మతాన్ని అయినా పిడివాదం తో గుడ్డిగా వ్యతిరేకించడం గురించి ఏమన్నాడో చూడండి ” మతం పై ప్రత్యక్ష యుద్ధం చేయడం మూర్ఖత్వం. అటువంటి యుద్ధం మతాన్ని పునరుద్ధరిస్తుంది తప్ప ఫలితం ఉండదు.  నిజానికి ఈ యుద్ధం మతాన్ని మరణించకుండా నిరోధిస్తుంది తప్ప ఎటువంటి దోహదం చేయలేదు   ”

పైన చెప్పిన  relative boundary  మరియు   absolute boundary   అన్నవి చాలా  important concepts . అసలు దేవుడే లేదు అన్నది  absolute boundary .   ‘ దేవుడున్నాడా లేదు అన్నది ప్రధానం కాదు ప్రస్తుతానికి, ఆయా వర్గాల ప్రజలను ప్రజాస్వామికంగా కూడగడుతున్నామా లేదా ‘ అన్నది  relative boundary .  సమస్యను  absolute boundary   కి  షిఫ్ట్ చేసే మార్క్సిస్టులను లెనిన్   Anarchists  గా వర్ణించాడు ( మన యాంత్రిక పిడివాద ఇండియన్ మార్క్సిస్టులు చేస్తున్నదిదే. శ్రామిక వర్గ పక్షపాతం ఉండాల్సిన వాళ్ళకు మైనారిటీ పక్షపాతం ఎందుకుండదో అర్థమవ్వదు. ) . ( మరి ఇదే  anarchist  ల   analogy  ప్రకారం చూస్తే Uniform Civil Code  ను సమర్థించే బ్రాహ్మణియ వాదులు కరెక్ట్ అయిపోవాలన్న మాట )

అంబేద్కర్ , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా నాస్తిక వాదాన్ని ప్రోత్సాహించకుండా , బుద్దిజం ను ఎందుకు పుచ్చుకున్నట్టు ? అంబేద్కర్ ఎప్పుడూ దేవుడిని నమ్మ లేదు . తన దృష్టిలో మతం అంటే ”  no god, no dieties, no rituals and no customs  ” అని ప్రకటించాడు. అలాంటప్పుడు ఇక అసలు మతం దేనికి ? అంబేద్కర్ బ్రాహ్మిణిజానికి ఒక ప్రత్యమ్నాయ వ్యవస్థను సృష్టించాలనుకున్నాడు ( ఇదే   relative boundary   ) అంటే – సాపేక్ష విలువను ఒకటి సృష్టించి బ్రాహ్మిణిజం ను ఆ విలువతో  పోల్చి బ్రాహ్మిణిజం ఘాతుకాన్ని ఎండగట్టడం. దీనికి బదులు,  rationalism  మరియు  education  హీనంగా ఉన్న కాలం లో,  నాస్తిక వాదం ముందుకు తీసుకుపోయి ఉంటే  ఏం జరిగేది ? శూన్యం లో శతృవు పేరు చెప్పి కరవాలం తిప్పినట్టు ఉండేది. ఎందుకంటే అలా చేస్తే ఏ శతృవు తలలు ఎగరవు. కాని వట్టి కరవాలం మాత్రం తెగ వేగంగా కదుల్తూ ఉంటుంది !

ఒక బైబిల్ పిట్ట కథ ఒక ఉదాహరణగా చెప్తాను ఇక్కడ ( దయ చేసి ఇదో ఉదహరణగా మాత్రమే పరిగణించమని మనవి ).  యేసు క్రీస్తు ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని( సాతాను) వదల గొట్టి ‘ అక్కడున్న పందులలోకి వెళ్ళిపో ‘ అని దెయ్యాన్ని ఆదేశిస్తాడు.  అప్పుడు ఆ దెయ్యము  అక్కడున్న పందుల లోకి వెళ్ళిన వెంటనే, ఆ పందులు అడ్డగోలుగా పరిగెట్టి దగ్గరున్న సముద్రం లో పడి చనిపోతాయి. ఇక్కడ చూడాల్సిందేమంటే – ఏం దెయ్యాన్ని ఉత్తిగా వెళ్ళిపొమ్మని చెప్పొచ్చుగా అని ? ఐతే దానికి ఆయనిచ్చిన వివరణ ” ఆ దెయ్యం ఎటువంటి వైపరీత్యాన్ని కలుగ జేస్తుందో , ఎటువంటి ఘాతుకానికి పూనుకుంటుందో , అది వెళ్ళిపోవడం వలన ఎంత మేలు జరిగిందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించాలి కాబట్టి “. ఇదో పిట్ట కథ అంతే. శూన్యం లోకి దెయ్యాన్ని వదలగొట్టడం అంటే – నాస్తిక వాదం తో మైనారిటి మత విశ్వాసాలను దెబ్బ తీయడం. పందుల్లోకి పంపి దెయ్యాన్ని నాశనం చేయడం అంటే – ఒక  relative bench mark   సృష్టించి  systematic  గా దెయ్యాన్ని  expose  చేసి, దెయ్యాన్ని తరిమి వేయడం. అంటే దెయ్యం వైపరీత్యాన్ని ప్రజాస్వామికంగా నిరూపిస్తూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఉద్యమ లక్ష్యం కోసం కూడా గట్టుకోవడం అన్న మాట.

కాబట్టి, సెక్యులరిజాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఎంతో అవసరమున్న ఈ కాలం లో, మతమనే దెయ్యాన్ని నాస్తిక వాదం తో మాత్రమే కాక, ప్రజాస్వామిక పోరాటాల్లో మైనారిటీ మత విశ్వాసాలను , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా కూడ గట్టి ఆయా పోరాట క్రమం లో మతం అనే దెయ్యాన్ని వదల గొట్టాలి. ఎందుకంటే మనకు మైనారిటీ మత విశ్వాసానికి మించిన సమస్య కంటే , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా సాంస్కృతికంగా , సాహితీ పరంగా కూడా గట్టడమే ప్రధాన లక్ష్యం కాబట్టి. అందునా అసహనం ఒక సిద్ధాంతంగా , ఒక తాత్వికతతో బల పడుతున్న ఈ రోజుల్లో – మెజారిటీ మత వాద బ్రాహ్మిణిజాన్ని ఓడించడం ప్రధాన లక్ష్యం కావాలి కాబట్టి.  ఈ క్రమం లో – మైనారిటిలను ప్రజాస్వామిక ఆలోచన విధానం వేపు, సెక్యులరిస్ట్ జీవన విధానం వేపు కూడగట్టుకుంటే , వారి మత విశ్వాసాలు క్రమేపీ నాస్తిక రూపం లోకి మారకుండా ఉండే   option  ఇంకా ఏం మిగిలుంటుంది ? ఉత్తి నాస్తిక వాదానికి ప్రజలను కూడగట్టే దమ్ముంటే , మనకు ఇక ఏ ప్రగతి వాద సిద్ధాంతాలైనా అవసరం ఎందుకు ఉండేది ?   లెనిన్, అంబేద్కర్ లు చూపిన మార్గాన్ని మించి, ఇంతకంటే ఉన్నతంగా ప్రజాస్వామిక బద్దంగా మతాన్ని కూలగొట్టడం ఎలా సాధ్య పడుతుంది ?

*

పారిస్ పై ద్వేష గీతం

 

 

 

-దేశరాజు

~

దేశరాజు

“To forgive the terrorists is up to God

but to send them to him is up to me”

-Vladimir Putin, President of Russia

 

వాడికి కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి,

వాళ్లు దేవుడ్ని వెతుక్కుంటూనే అక్కడకు వచ్చారని.

ప్రపంచ పౌరులారా, రండి

ఇప్పుడు మనం దేవుడ్ని ద్వేషిస్తూ ప్రార్థన చేద్దాం

***

ప్రేమ నగరమే కావచ్చుగానీ,

ద్వేషం మరకపడిన పారిస్ నిప్పుడు ముద్దాడలేను-

ఎక్కడెక్కడో నాటిన ద్వేషాన్ని దాచిపెట్టడానికేనంటూ..

పారిస్ పొడుపు కథను విప్పేశాక ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వలేను-

 

రండి మిత్రులారా, ఇప్పటికైనా మనల్ని మనం క్షమించుకుందాం

పారిస్ పై పడిన నెత్తుటి మరకలో మనవంతు మాలిన్యాన్ని కడిగేసుకుందాం-

మనందరికీ తెలియని బహిరంగ రహస్యాన్ని..

గుసగుసగానైనా ఒప్పుకుందాం-

 

రాక్ బ్యాండ్లూ, ఫుట్ బాల్ మ్యాచ్ లతో ఉల్లాసంగా గడిపే..

అనేకానేక రాత్రుల్లో, కేవలం ఒకేఒక్క రాత్రి మాత్రమే కాళరాత్రి-

ఇక అప్పటి నుంచీ వెంటాడేవన్నీ పీడకలలు కాదు..

పీడకుల కలలని మరొక్కసారైనా, నిజాయితీగా ఒప్పుకుందాం-

 

సిరియాతో చేదు మింగించి, అనుభవాలన్నిటినీ ఆవిరిజేసి..

ఉల్లాసమనే మాటను వారి భాషలోంచే తుడిచేస్తున్న..

అగ్ర నేతల అతి తెలివిని ఫేక్ ఐడీతోనైనా ట్వీట్ చేద్దాం-

 

రివల్యూషన్ రెక్కలు విరిచేసి నిశ్శబ్ధంగా ఎగురుకుంటూపోయిన..

లోహవిహంగాలు కురిపించిన బాంబుల

భయంకర ధ్వనులు విందాం-

ఈ తుపాకుల చప్పుళ్లు వాటి ప్రతిధ్వనులేనని చాటిచెబుదాం.

 

రంగురంగుల అందంలేకపోయినా,

ఎవడి చెమటతో పెట్టుకున్న పుట్ట-వాడికొక ఈఫిల్ టవర్ కదా

వారి పుట్టల గుండెల్లో హలెండే వేలుపెట్టినప్పుడు,

పెల్లుబికిన హాహాకారాలను కూడా ఒకింత ఆలకిద్దాం-

 

దిక్కులు ధ్వంసించబడిన దేశాలను,

మృతదేహాల దిబ్బలైన ఊళ్లను చూసి కూడా..

మారని మన ప్రొఫైల్ పిక్ ను తలచుకుని కాసింత సిగ్గుపడదాం-

***

ప్రపంచ మిత్రులారా, రండి

ఎన్నాళ్లగానో దాచిపెట్టబడుతున్న

చెమట, నెత్తురు, కన్నీళ్లను పుక్కిలించి ఉమ్మేద్దాం,

పారిస్ నే కాదు, కొందరి స్వప్నాలకే సాక్ష్యాలుగా నిలిచే..

మహా నగరాలను మనమే కూల్చేద్దాం-

ఫ్లయింగ్ కిస్ లకు బాయ్ చెప్పి ఓ ఫ్రెంచ్ కిస్సిద్దాం.

-దేశరాజు

త్రిశంకు స్వప్నం

 

srujan1

Image: Srujan

               

– ఎమ్వీ రామిరెడ్డి

~

ASR_0357పదిహేనేళ్ల క్రితం… నవంబరు నెల…

మా ఊళ్లో బస్సు దిగాను. నాలుగు రోడ్లు కలిసే ఆ కూడలిలో ఓ పక్క చిన్న బడ్డీకొట్టు, మరోపక్క టీ దుకాణం. అప్పుడే తెల్లవారుతోంది. బడ్డీకొట్టు దగ్గర నిలబడి ఉన్న కూసం మధు ”ఇదేనా రావడం?” అని ప్రశ్నించాడు నవ్వుతూ.

అవునన్నట్లు తలూపాను.

”అంతా కుశలమేనా! ఉద్యోగం ఎలా ఉంది?” మళ్లీ అడిగాడు. ఆయన అదునెరిగి వ్యవసాయం చేస్తాడు. కష్టజీవి.

”బాగుంది. అంతా హ్యాపీ బాబాయ్‌” బదులిస్తూ ముందుకు సాగాను.

మావయ్య గారింట్లో అడుగు పెట్టగానే, రాగిచెంబు నిండా మంచినీళ్లు తెచ్చిచ్చింది అత్తయ్య.

”మావయ్యేడీ?” మంచినీళ్లు తాగి, చెంబు తిరిగిస్తూ అడిగాను.

”మేత కోసుకు రాబొయ్యాడు” చెప్పింది అత్తయ్య.

నేను గడ్డం చేసుకుని, స్నానం చేసేసరికి అత్తయ్య టిఫిన్‌ రెడీ చేసింది. వేడివేడి గుంటపునుగులు నెయ్యి వేసిన కారప్పొడిలో నంజుకు తింటుంటే నాలుక మీది గ్రంథులు నాట్యం చేశాయి. స్కూల్లో చదువుకునే రోజుల్లో పొగపొయ్యి కింద పత్తిమోళ్లు ఎగదోస్తూ, నల్లటి పెనం మీద అమ్మ అట్లు పోసిపెట్టేది. అయిదారు తిన్నా కడుపు నిండినట్లు అనిపించేది కాదు.

హైదరాబాదులో ఉద్యోగంలో చేరాక, నేనీ ఊరికి రావడం ఇది రెండోసారి.

బయటికి బయల్దేరబోతుంటే, సైకిలు మీద జొన్నమోపుతో వచ్చాడు మావయ్య. అంత పెద్ద మోపును ఎలా బ్యాలెన్స్‌ చేస్తాడో నాకెప్పటికీ ప్రహేళికే. డెబ్భై అయిదు కిలోల వడ్లబస్తాను కూడా అలాగే సైకిలు క్యారేజీ మీద మిల్లుకు తీసుకెళ్లేవాడు. పైగా దారిలో ఎవరైనా ఎదురైతే, బ్రేకులు వేసి, ఓ కాలు నేలపై ఆనించి, తాపీగా కబుర్లు చెప్పి మరీ కదిలేవాడు.

ఆయనతో కాసేపు మాట్లాడి, ఎనిమిది కావస్తుండగా బజాట్లోకి వచ్చాను. ఊరికి పడమటి పక్కనున్న చెరువు నుంచి కొందరు కావిళ్లతో, మరికొందరు సైకిళ్ల మీద మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. జీవనది మాకు పది కిలోమీటర్లలోపే ఉన్నా దశాబ్దాల తరబడి మా ఊరు మంచినీటి సదుపాయానికి నోచుకోలేదు. చిన్నప్పుడు నేను ఓ బిందె నెత్తిన పెట్టికొని తెచ్చేవాణ్ని.

పెదనాన్న గారింటికి వెళ్లాను. నేను నాలుగో తరగతి చదివేటప్పుడు ఓ ప్రమాదంలో నాన్న మరణించినప్పటి నుంచీ ఆయనే మా మార్గదర్శి. నవారు మంచంమీద కూచుని ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా, పెద్దమ్మ పాలు తెచ్చిచ్చింది.

”బాబూ బాగున్నావా?” వెంకాయమ్మ, నాగరత్నం ఒకే గొంతుతో అడిగారు. వాళ్లిద్దరూ అప్పచెల్లెళ్లు. పెదనాన్న గారింటి పక్క ఇల్లు. వెంకాయమ్మ కలవారింటి కోడలయింది. తెనాలిలో కాపురం. భర్త ఇల్లరికం రావడంతో నాగరత్నానికి పుట్టిల్లే మెట్టినిల్లయింది. కట్నం కింద వెంకాయమ్మకు ఇచ్చిన రెండెకరాలు కూడా భర్తతో కలిసి నాగరత్నమే సాగు చేస్తుంది. చెల్లెలి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏనాడూ కౌలు కూడా తీసుకునేది కాదు వెంకాయమ్మ. ఆమె భర్త కూడా ”ఆ పొలం మహా అయితే లక్షో రెండు లక్షలో చేస్తుంది. మీ చెల్లినే ఉంచుకోమను” అనేవాడు.

”మీరెప్పుడొచ్చారత్తా?” వెంకాయమ్మను అడిగాను, ఊళ్లో చాలామందిని ఏదో ఒక వరసతో పిలవడం చిన్నప్పట్నుంచీ అలవాటు.

”నిన్ననే వచ్చా. ఇప్పుడు బయల్దేరుతున్నా. బాబాయికి చెప్పి వెళ్దామని వచ్చా” చెప్పిందామె.

పెదనాన్నతో కాసేపు మాట్లాడి, వేణు ఇంటికి బయల్దేరాను. నాకంటే రెండేళ్లు పెద్దవాడైనా, మున్నంగి వేణుతో మంచి స్నేహం ఉండేది. ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. స్కూలుకు సెలవులు వస్తే, తనతోపాటు పొలం పనులకు తీసుకెళ్లేవాడు. కలుపు తియ్యటం, పత్తి తియ్యటం, జొన్న కొయ్యటం, పత్తిమోళ్లు పీకటం వంటి పనులన్నీ తనే నేర్పించాడు.

నేను వెళ్లేసరికి, వేణు అన్నం తింటున్నాడు. వాళ్ల తమ్ముడు హర్ష, నన్ను చూడగానే ఎదురొచ్చి కరచాలనం చేశాడు. అతను నా కన్నా చిన్నవాడు. మా ఊరినుంచి ఐఐటీ చదివిన మొదటి వ్యక్తి.

”ఎప్పుడొచ్చావు హర్షా?” నవ్వుతూ పలకరించాను.

”మూడు రోజులవుతుంది. సాయంత్రం బయల్దేరుతున్నాను” అతను ముంబైలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు.

వాళ్ల నాన్న పాతికెకరాల రైతు. ఒక్కడే చూసుకోవడం కష్టమైపోవటంతో వేణును పదో తరగతితో చదువు మాన్పించేసి, తనకు చేదోడుగా పొలం తీసుకెళ్లాడు. హర్షను మాత్రం బాగా చదివించాడు. తమ్ముడి కోసం వేణు చాలానే త్యాగం చేయాల్సి వచ్చినా తను ఏనాడూ అలా భావించేవాడు కాదు. హర్ష కూడా అన్న పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు.

కాసేపటి తర్వాత ”చేనికెళ్లి పత్తిగోతాలు తీసుకురావాలి ట్రాక్టరు మీద. రాగలవా?” ఇప్పుడు నేను ఫ్యాను కింద       ఉద్యోగంలో ఉన్నందున ఎండంటే భయపడతానేమోనని వేణు అనుమానం.

”ఇంకా సుఖానికి అలవాటు పడలేదులే బావా. పద, వెళ్దాం” అంటూ లేచాను.

బొమ్మలు దాటాక, తూర్పువైపున ఉన్న ఓ కట్ట ఎక్కి దిగుతుంటే నాకు భయం వేసింది. వేణు మాత్రం తనకు బాగా అలవాటైనట్లు అలవోకగా నడిపాడు ట్రాక్టర్ని. సరాసరి చేలోకి తీసుకెళ్లి ఆపాడు. నేను ట్రాక్టరు మీంచి కిందికి దూకాను.

 

చాలాకాలం తర్వాత విశాలమైన నేలతల్లి ఒడిలో అడుగు పెట్టిన ఆనందం నాలో పొంగులు వారుతోంది. విత్తనాలు వెదబెడుతూ, కలుపులు తీస్తూ, కళ్లాలు చేస్తూ… ఏవేవో జ్ఞాపకాలు పక్షుల్లా ఎగిరొచ్చి, గుండెల మీద వాలుతున్నాయి.

నాలుగెకరాల చేలో పత్తిగుబ్బలు బాగా పగిలి, చేనంతా తెల్లటి వస్త్రం పరిచినట్లు కనిపిస్తోంది. పదిహేను మంది కూలీలు వంచెలు కట్టుకుని పత్తి తీస్తున్నారు. గట్టుకు రాగానే వంచెల్లోని పత్తిని గోతాల్లో నింపుతున్నారు.

ట్రక్కును పత్తిచేను పక్కనే ఉన్న జొన్నచేలో ఆపి, కొడవలితో జొన్న కొయ్యటం మొదలుపెట్టాడు వేణు. నేను సరదాగా ఓ మునుం పట్టి, పత్తి తియ్యటంలోని అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నాను. కూలీలు చిత్రంగా చూస్తున్నారు.

ఆ చేనుకు ఉత్తరంగా ఉండేది మా రెండెకరాల పొలం. అక్క పెళ్లికోసం ఎకరం పద్దెనిమిది వేలకు అమ్మేశాం.

గంట తర్వాత వేణు, ట్రాక్టర్ని తీసుకొచ్చి, పత్తిగోతాల దగ్గర ఆపాడు. ఇద్దరు కూలీలు వెళ్లి పత్తిగోతాల్ని ట్రక్కులోకి ఎక్కిస్తుంటే, వేణు వాటిని జొన్నగడ్డి మీద సర్దుతున్నాడు. నేను గట్టుమీద నిలబడి పచ్చటి ప్రపంచాన్ని చూస్తున్నాను.

వేణు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయగానే, నేనూ ట్రాక్టరెక్కి, అతని పక్కనే కూచున్నాను. నల్లటి మట్టిని నమిలి ఊస్తున్నట్లుగా టైర్లు భారంగా ముందుకు తిరుగుతున్నాయి. ట్ట్రారు కట్ట దగ్గరకు చేరుకోగానే, గేరు మార్చి, ఎక్స్‌లేటర్‌ను తొక్కి పట్టాడు.  ముందు టైర్లు రెండూ గభాల్నపైకిలేచి, మళ్లీ నేలమీద వాలాయి. కట్టను ఎక్కుతుండగా, ట్రక్కు కొద్దిగా ఊగి, అమాంతం బోల్తా పడింది. వేణు, నేను కిందికి దూకాం. ట్రక్కులోని పత్తిగోతాలు, జొన్నగడ్డి చెల్లాచెదురుగా చేలోకి పడిపోయాయి.

Kadha-Saranga-2-300x268

దూరం నుంచి చూస్తున్న కూలీలు పరుగున చేరుకున్నారు. ట్రాక్టరు నుంచి ట్రక్కును విడదీశారు.

పత్తిగోతాలు, జొన్నగడ్డి మళ్లీ ట్రక్కులోకి ఎత్తేసరికి ఒంటిగంట అయింది.

కూలీలు పట్టుబట్టడంతో వేణు, నేను జమ్మిచెట్టు కిందికి చేరుకున్నాం. అందరూ వచ్చి సద్దిమూటలు విప్పారు. ఒకామె సత్తు టిపినీలోనే అన్నంలో పప్పు, బీరకాయ పచ్చడి కలిపి, తలా ఒక ముద్ద పెట్టింది. నా దోసిట్లో ఉన్న పచ్చడిముద్ద నుంచి కమ్మటి వాసన విడుదలైంది. నోట్లో పెట్టుకుంటే, వెన్నలా కరిగిపోయింది. ఆమె అలా పెడుతూనే ఉంది. పెరుగన్నం తినటం పూర్తయ్యాక, చేతులు కడుక్కున్నాం. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్న భావన.

ఈసారి వేణు చాలా జాగ్రత్తగా కట్టను దాటించి, రోడ్డు మీదికి ఎక్కించాడు.

మూడు దాటుతుండగా ఇంటికి చేరుకున్నాం. వేణుకు చెప్పి, అక్కడి నుంచి కదిలాను.

నడిచి వెళ్తుంటే ఆ రోడ్డు పొడవునా ఎన్నో జ్ఞాపకాలు. కర్ర-బిళ్ల, నేల-బండ, వంగుడుదూకుళ్లు, చిత్తుపేకలు, బచ్చాలాట, గోళీకాయలు, చెడుగుడు, కోతికొమ్మచ్చి… ఎండను సైతం లెక్క చెయ్యకుండా ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్లమో!

మావయ్య గారింటికి చేరుకున్నాక మొలకు కండువా కట్టుకుని పెరట్లోకి వెళ్లాను. బావిలోంచి కడవతో నీళ్లు తోడుకుని, నెత్తిమీద పోసుకుంటే, హాయిగా అనిపించింది. తల తుడుచుకుంటూ, వెనకవైపు చూస్తే, ఓ మిద్దె కనిపిస్తోంది. తొలి ఏకాదశి పండక్కి పిల్లలందరం నోటినిండా పేలపిండి పోసుకుని, ఆ మిద్దె మీదికెక్కి గాలికి అభిముఖంగా నిలబడి ”పు..సు..లూ..రు..” అని అరిచేవాళ్లం. నోట్లోని పిండి అంతా జల్లులా బయటకు పడిపోతుంటే, పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాళ్లం.

అయిదున్నరకు వేణు వచ్చాడు. ఇద్దరం మేం చదువుకున్న సెయింట్‌ మేరీస్‌ హైస్కూలుకు వెళ్లాం. పేదపిల్లల విద్యాభివృద్ధి కోసం ఒక ట్రస్టు ప్రారంభించాలనుకుంటున్న విషయమై ఫాదర్‌తో చర్చించాం. ఆయన పొంగిపోయాడు. మా పేర్లతో ప్రార్థన చేసి, ఆశీర్వదించాడు.

రాత్రి ఏడుగంటలకు వినాయకుడి గుడికి చేరుకున్నాం. అక్కడ గుడితోపాటు కళామందిరం ఉంటుంది. ఆ వేదిక మీదే నేను ఎన్నో నాటికలూ నాటకాలూ చూశాను. గుడి ఎదుట గల ఖాళీస్థలంలో యాభై మందికి పైగా యువకులు వృత్తాకారంలో నిలబడి, చెక్కభజన చేస్తున్నారు. రామాలయంలో ఏటా సప్తాహం చేసేవారు. రాత్రిపూట హరికథలు, బుర్రకథలు చెప్పేవాళ్లు. ఆ కళారూపాల ద్వారా బాల్యంలో విన్న విషయాలు ఇప్పటికీ నా గుండెల్లో చెక్కు చెదరలేదు.

”అరే, వెంకట్‌, ఎప్పుడు రావటం?” ఎక్కడినుంచి చూశాడో, పరిగెత్తుకుంటూ వచ్చి, కౌగిలించుకున్నాడు అయూబ్‌ఖాన్‌. వాడు, నేను పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం.

పిచ్చాపాటి అయ్యాక ”చలో, మా ఇంటికి డిన్నర్‌కు వెళ్దాం” ఆహ్వానించాడు అయూబ్‌. నేను మరోసారి వస్తానన్నా వాడు వినలేదు. ఆరోజు తన కొడుకు జన్మదినం కావడంతో రావాల్సిందేనని పట్టుబట్టాడు.

వేణుతో కలిసి వెళ్లాను. మటన్‌ బిర్యానీ అంటే నాకున్న అయిష్టం ఆరోజుతో తుడిచిపెట్టుకు పోయింది. సేమ్యాతో చేసిన స్వీటు కూడా అద్భుతం.

భోజనం పూర్తిచేసి, అయూబ్‌ఖాన్‌ కొడుకుని ముద్దాడి, వాడి చేతుల్లో వంద రూపాయలుంచి, వీడ్కోలు తీసుకున్నాను.

ఆ రాత్రి కంటినిండా నిద్రపోయాను. ఉదయం ఏడింటికిగానీ మెలకువ రాలేదు. రాత్రంతా జోరుగా కురిసిన వర్షం ఇంకా సన్నటి జల్లు రూపంలో ఉనికిని చాటుకుంటూనే ఉంది.

ఎనిమిది కావస్తుండగా వేణు వచ్చాడు, గొడుగు వేసుకుని. ఇడ్లీ తిని, కబుర్లు చెప్పుకొంటుండగా… ఓ కుర్రాడు యూరియా గోతాన్ని గొంగళిలా కప్పుకొని, పరిగెత్తుతూ వచ్చాడు.

”వేణు పెదనాన్నా… నాన్న యెండ్రిన్‌ తాగాడు. రాజు డాక్టరు దగ్గరికి తీసుకొచ్చాం. అమ్మ నిన్నర్జెంటుగా రమ్మంటంది” గస పెడుతూ చెప్పేసి, వేణు సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయాడా కుర్రాడు.

”ఎవరు?” అడిగాను.

”ఛత్‌… వాడే… అక్కల కిట్టయ్యగాడు…” విసుగ్గా చెప్పాడు వేణు. కిట్టయ్య ఆరో తరగతి వరకూ నా క్లాస్‌మేట్‌. చదువు మానేసి, తల్లికి అండగా వ్యవసాయంలోకి దిగాడు.

వేణుతోపాటు నేనూ బయల్దేరాను. ఇద్దరం గొడుగు సాయంతో ఆరెంపీ డాక్టరు గారింటికి చేరుకున్నాం.

కిట్టయ్యను బల్ల మీద పడుకోబెట్టి, కడుపులోకి గొట్టం వేసి, కక్కిస్తున్నారు. ఓ చేతికి సెలైన్‌ ఎక్కిస్తున్నారు.

 

ఇద్దరం ఓ పక్కగా నిలబడ్డాం. చూస్తుండగానే జనం పోగయ్యారు. తలా ఒక రకంగా చర్చించుకుంటున్నారు. కిట్టయ్య భార్య గుండెలవిసేలా ఏడుస్తోంది.

”అసలేం జరిగింది?” వేణుకు కారణం తెలిసే ఉంటుందని అడిగా.

”ఏముంది, వరసగా మూడోయేడు పచ్చపురుగు పత్తిని కాటేసింది… అది ఈణ్ని కాటేసింది…”

ఎనభైల తర్వాత మా ఊళ్లోకి పత్తి ప్రవేశించింది. శివాలెత్తినట్లు రైతులందరూ తెల్లబంగారం కోసం అర్రులు చాచారు. మొదట్లో బాగానే పండింది. ప్రతి ఇంట్లో ఒక పత్తిమండె వెలిసింది. రైతులు నాలుగు డబ్బులు కళ్లజూశారు. రాన్రాను రకరకాల తెగుళ్లు, పచ్చపురుగుల బెడద అధికమైంది. పెట్టుబడులు పెరిగిపోయాయి. క్రిమిసంహారక మందుల వాడకం యథేచ్ఛగా పెరిగింది. వానలు వెనకంజ వేశాయి. నష్టాలు మొదలయ్యాయి. ఆ దశకంలోనే మొదటిసారిగా మా ఊళ్లో పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచీ ఆ చావులు సర్వసాధారణమయ్యాయి, రకరకాల కారణాలతో.

అరగంట తర్వాత ఆరెంపీ డాక్టరు పెదవి విరిచాడు. అర్జెంటుగా గుంటూరు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.

అప్పటికప్పుడు కిట్టయ్యను నులకమంచం మీద పడుకోబెట్టుకుని, నలుగురు మోసుకుంటూ బస్‌స్టాండుకు తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత బస్సు వచ్చింది. కండక్టరును బతిమాలి, కిట్టయ్యను మెల్లగా బస్సులోకి చేర్చి, ఓ సీటులో పడుకోబెట్టారు. వేణు, కిట్టయ్య భార్య, మరో ఇద్దరు వెంట వెళ్లారు.

నేను భారమైన మనసుతో అక్కణ్నుంచి కదిలాను.

++++++++++++

srujan1పది రోజుల క్రితం… ఆగస్టు నెల… మధ్యాహ్నం మూడు దాటుతోంది…

ఖరీదైన నా కారులో మా ఊరికి చేరుకున్నాను. సెంటర్‌ చాలా హడావుడిగా ఉంది. మంగళగిరి వెళ్లే రోడ్డులో రెండు హోటళ్లు, అమరావతి వెళ్లే వైపు ఫ్యాన్సీ షాపులు, తుళ్లూరు వెళ్లే దారిపక్క రెండు వైన్‌ షాపులు, తాడికొండ వైపు ఐరన్‌, సిమెంటు రిటైల్‌, హోల్‌సేల్‌ షాపులు… సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఈ హడావుడేమీ లేదు.

పది మీటర్లు కూడా పోకముందే, కూసం మధు కారాపాడు.

”ఇప్పుడేనా రాటం… నువ్వు ముందు కారు దిగు, ఇయ్యాల నాతో కలిసి కాఫీ తాగాల్సిందే” బలవంతం చేశాడు.

కారు దిగక తప్పింది కాదు. హోటల్‌ బయటే నుంచున్నాం. ఆయన కాఫీ ఆర్డరిచ్చాడు. మా చుట్టుపక్కల పదీ పదిహేను మంది టీలూ కాఫీలూ తాగుతూ కబుర్లు తింటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్‌ ఫోన్లున్నాయి.

”రేయ్‌, నిన్న తొట్టికాడ రామయ్య పొలాన్ని ఒకటీ ఇరవైకి అడిగారంట. ఈయనేమో ఒకటిన్నరకు తగ్గనన్నాడంట…”

”యాడుందిరా అంత రేటు? సుబ్బరంగా ఇచ్చెయ్యాల్సింది…”

”ఇయ్యాల నాకో పార్టీ వస్తంది వైజాగ్‌ నించి, దాసిరెడ్డి గారి నాలుగెకరాల బిట్టు చూట్టానికి! ఒకటీ అరవై చెబుతున్నాం. ఇదిగానీ ఓకే అయితే నా పంట పండినట్టే…”

”ఆశకి అంతుండాల్రా. ప్రత్యేక హోదా గురించి అతీగతీ లేదు. ఖజానా ఖాళీ అయి రాష్ట్ర ప్రభుత్వం లబోదిబోమంటంది. అసలు డెవలప్‌మెంటు మీద జనాలకి అనుమానాలు మొదలయ్యాయి…”

”అదేం లేదు. రేపు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చెయ్యనీ, రేట్లు మళ్లీ రయ్యిన లెగుస్తాయి…”

”అవున్రా, బుర్రముక్కు రాజారావుగాడు అడ్వాన్సు తీసుకుని కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చెయ్యనంటున్నాడంటగా… పాపం ఆ పార్టీ నిన్న మా అన్న దగ్గరికొచ్చి, ఒకటే మయాన మొత్తుకుంటంది…”

నేను కాఫీ తాగినంతసేపూ మరో అంశం చర్చకు రాలేదు. మధ్యమధ్య సెల్‌ఫోన్లు మోగుతున్నాయి. ఫోన్లో కూడా బేరసారాల సంభాషణలే.

రోడ్డుకవతల ఫ్యాన్సీ షాపు పక్కనే ”శివప్రియ రియల్‌ ఎస్టేట్స్‌” అనే బోర్డును గమనించాను.

”ఏమిటి బాబాయ్‌, మనూళ్లో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసా?” ఆశ్చర్యంగా అడిగాను.

”అయ్యో, ఇదేం జూశావ్‌! ఇలాంటివి ఊళ్లో ఇరవై దాకా వెలిశాయి” నా ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేశాడు.

కాఫీ తాగాక, కారెక్కి మావయ్య గారింటికి చేరుకున్నాను.

”ఇప్పుడేనా రాటం” ఫ్రిజ్‌లోంచి తీసిన వాటర్‌బాటిల్‌ చేతికందిస్తూ అడిగింది అత్తయ్య.

”అవునత్తయ్యా, మావయ్యేడీ?”

”నిన్న మాటెపూట జొన్నలగడ్డ పొయ్యాడు. రేట్లొచ్చినయ్యిగా, నాకిచ్చిన పొలం అమ్మాలని సూత్తన్నాం”.

మొహం కడుక్కోవడానికి వాష్‌రూముకు వెళ్లాను. ట్యాప్‌ తిప్పితే, నీళ్లు పచ్చగా వచ్చాయి. ఈ మధ్యే ఓ స్వచ్ఛందసంస్ధలో పనిజేసే ఫ్రెండొకడు ఈ నీళ్లను ల్యాబ్‌కు పంపి టెస్ట్‌ చేయించాడు. తాగడం సంగతి అటుంచి, కనీసం వాడుకోవడానిక్కూడా వీల్లేనంతగా బ్యాక్టీరియా పేరుకుపోయి ఉందట. ఈ విషయాన్ని నేను గ్రామ సర్పంచికి ఫోన్జేసి చెబితే, ఆయన ”ఏళ్ల తరబడి నేనియ్యే పోసుకుంటన్నా. నాకేం కాలేదే” అన్నాడు, పరిష్కారం గురించి పల్లెత్తు మాట అనకుండా.

అత్తయ్య పెట్టిన స్నాక్స్‌ తిని, వేణు సెల్‌కు ఫోన్జేశాను.

”కొంచెం ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఓ గంట తర్వాత కలుస్తా”నన్నాడు.

కారు ఇంటిదగ్గరే వదిలేసి, కాలినడకన బయల్దేరాను. రోడ్డు మీద ఓ కుళాయి దగ్గర జనం ఎగబడి మంచినీళ్లు పట్టుకోవడం కనిపించింది. మా ఊరి మీదగా పైపులైను వేసుకుని మరీ తాడికొండకు నీళ్లు తీసుకెళ్లగలిగారు. అధికారులు దయదలచి, ఆ లైనుకు రెండుచోట్ల ట్యాపులు బిగించారు. ఊరు మొత్తానికీ ఆ కుళాయిలే ఆధారం.

 

పెదనాన్న గారింటికి వెళ్లేసరికి ఆయన వరండాలోనే ఎవరితోనో సీరియస్‌గా ఫోన్లో మాట్లాడుతున్నాడు.

నేను లోపలి గదిలోకి వెళ్లాను. పెద్దమ్మ వచ్చి, ఏసీ ఆన్‌ చేసి, ఓ గాజుగ్లాసులో కోకోకోలా తెచ్చిచ్చింది. తాగుతుండగా, పెదనాన్న లోపలికొచ్చి, సోఫాలో కూచున్నారు.

”మాట్టాడారా బాబాయ్‌…” ఆత్రంగా అడిగింది నాగరత్నం. ఆమె ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లనిపించింది.

”ఆఆ… తన బాధ తనది…” పెదనాన్న చెప్పింది ఆమెకు అర్థమైనట్లుంది.

”ఏం బాద బాబాయ్‌? తనకేం తక్కువ జేశామని? ఆమె సొమ్మేదో మేం అప్పనంగా అనబగించినట్టు మాట్టాడతంది… ఉప్పు, పప్పు, బియ్యం, మిరపగాయలు… ఎన్ని పంపేవాళ్లం? సన్నాసి పొలం మనకెందుకు అని మా బావ గూడా ఇన్నిసార్లు అన్నాడు. ఆ మాటకొత్తే అయినింటి సమ్మందమని దానికి ఎకరా ఎక్కువిచ్చారు. ఉప్పుడు నేనూ అడుగుతా అందులో వాటా… ఇత్తారా…” ఆక్రోశంగా అడిగిందామె.

”నువ్వు ఎక్కువగా ఆలోచించమాకు. రేపొస్తానంది. నేను మాట్లాడతాగా. ఏది న్యాయమైతే అట్లా పోదాం” సర్దిచెప్పారు పెదనాన్న. నాగరత్నం విసవిసా వెళ్లిపోయింది.

నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించాక, ఆ ఊరికి అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరిలో రాత్రికి రాత్రి ఇన్ని పరిణామాలు నేను కలలో కూడా ఊహించనివి.

”మనూరి పొలానికి బాగా రేట్లొచ్చినట్లున్నాయి…” పెదనాన్నతో అన్నాను.

”బాగా ఏంటి, ఎందుకూ పనికిరాని పొలం కూడా ఎకరం కోటి పలుకుతోంది” చెప్పారాయన.

”ఈ మజ్జెనే మేం గూడా ఓ ఎకరం కోటీ నలభైకి అమ్మాం బాబూ. అప్పుడు అమ్ముకోడమే శానా మంచిదైంది. ఇప్పుడది కోటికి పడిపోయింది” పెద్దమ్మ చెప్పింది సంతోషంగా.

వేణు వాళ్లింటికి బయల్దేరాను. రోడ్డుమీద నడుస్తుండగా హఠాత్తుగా నా పక్కన ‘డస్టర్‌’ కారు వచ్చి ఆగింది. ఊళ్లో చాలామంది ఖరీదైన కార్లు వాడటం గమనించాను. అద్దం కిందికి దించి తల బయటకు పెట్టాడు అక్కల కిట్టయ్య.

”ఏరా, బానే సంపాయించావంటగా. ఓ ఎకరం కొనరాదూ, చాలా తక్కువలో వస్తంది” అన్నాడు. నేను వద్దన్నట్లు తలూపాను. మారుమాట్లాడకుండా ముందుకెళ్లిపోయాడు. బస్టాండ్‌ సెంటర్‌లో తెరిచిన రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు కిట్టయ్యదే. మృత్యుముఖం నుంచి బయటపడి, ఇప్పుడు కమీషన్ల రూపంలో దండిగా సంపాదిస్తున్నాడని మధు బాబాయ్‌ చెప్పాడు.

సిమెంటురోడ్డు వంతెన మీద దాసరి పిచ్చయ్య దిగులుగా కూచొని ఉన్నాడు. పలకరిస్తే, బావురుమన్నాడు.

”దిగులు పడక ఏంజెయ్యమంటావు బాబూ! ఉన్న ఎకరంన్నర పొలం ల్యాండు పూలింగులో పొయ్యింది. ఆ కాస్త నేల ఆధారంతోనే పిల్లల్ని చదివించాను. ఇప్పుడు పిల్ల పెళ్లికుంది. యాడదెచ్చి జెయ్యాలి?”

”బదులుగా ఇంటిప్లాటు, కమర్షియల్‌ ప్లాటు ఇస్తుందటగా ప్రభుత్వం?”

”నా తలకాయ. అది ఎప్పుడిస్తదో, ఎక్కడిస్తదో ఎవరికెరుక? ఇచ్చినా అది మా సేతికొచ్చేదెప్పుడు, మేం తినేదెప్పుడు?” పిచ్చయ్యలో నిర్వేదం తారస్థాయిలో కనిపించింది.

నేను భుజం తట్టి, అక్కణ్నుంచి వేణు వాళ్లింటికి వెళ్లాను.

ఆ ఇంటి వాతావరణం నాకు వింతగా తోచింది. అప్పటిదాకా ఏదో యుద్ధం జరిగినట్లు, తుపాను వచ్చి వెలిసినట్లు అనిపించింది. వేణు, హర్ష చెరో కుర్చీలో; వాళ్ల నాన్న దివాన్‌ కాట్‌ మీద యమా సీరియస్‌గా కూచొని ఉన్నారు. వేణు భార్య, వాళ్లమ్మ వంటగది దర్వాజాకు చెరోపక్కా నిలబడి ఉన్నారు. నన్ను చూసి, ఏ ఒక్కరూ కనీసం పలకరింపుగానైనా నవ్వలేదు.

వేణు విసురుగా లేచి, ”మనం బయటికెళ్లి మాట్లాడుకుందాం రా” అంటూ నన్ను గేటులోంచే వెనక్కి మలిపాడు.

ఇద్దరం మెయిన్‌ రోడ్డు మీదకొచ్చి హోటల్‌ పక్కనే నిలబడ్డాం.

”ఏం జరిగింది వేణూ?” మెల్లగా అడిగాను.

”ఛత్‌, మరీ అధ్వానంగా తయారయ్యారు. వాడంటే మూర్ఖుడు. మొదట్నుంచీ అంతే. ఈయనకి ముడ్డి కిందికి డెబ్భై ఏళ్లొచ్చాయి. ఈయన బుద్ధేమైంది?” అసహనంగా అన్నాడు.

”అసలేం జరిగింది?”

”వాడి కోసం చదువు మానుకున్నా. గొడ్డులా చాకిరీ చేశా. ముంబైలో ఉద్యోగంలో చేరాకైనా ఏనాడూ పైసా పంపిన పాపాన పోలేదు. పైగా వాడి పొలం మందం రూపాయి తక్కువ కాకుండా నా దగ్గర్నుంచీ కౌళ్లు వసూలు చేసేవాడు. బదులుగా, నా భాగంలో రెండెకరాలు ఎక్కువ వచ్చేట్టు లక్షసార్లు అనుకున్నాం. ఇవ్వాళొచ్చి, సమానభాగం కావాలని నోరేస్కుని అరుస్తున్నాడు, ఎదవ…” వేణులో అంత కోపం నేనెప్పుడూ చూళ్లేదు.

”పోన్లే వేణు, నువ్వు బతకలేని స్థితిలో లేవుగదా. రెండెకరాలదేముంది, వదిలేసెయ్‌” అనునయించాను.

”వదిలెయ్యక, కట్టుకుపోతానా. రెండెకరాల గురించి కాదు బాధ. మాట మారుస్తున్నందుకు…” కొద్దిగా శాంతించాడు.

నేను బస్టాండు వైపు చూశాను. పాతికపైగా కార్లు వరసగా ఆగి ఉన్నాయి.

”ఇదేమిటి వేణు, ఇన్ని కార్లా!” అది మా ఊరి సెంటరేనన్న విషయం నాకో పట్టాన నమ్మబుద్ధి కావడం లేదు.

”బేరగాళ్లు. హైదరాబాదు, వైజాగ్‌, నెల్లూరు, తిరుపతి, మద్రాసు, బెంగుళూరు… అన్ని ప్రాంతాల నుంచీ వస్తున్నారు.  ఇక్కడేం జూశావ్‌? పొలాల దగ్గరకెళ్తే, నీకు కళ్లు తిరుగుతయ్‌. ఈ రెణ్నెల్ల నుంచీ తాకిడి తగ్గింది. రాజధాని నిర్మాణం నిజంగా మొదలైతేగానీ అసలు సినిమా కనబడదు” తాపీగా చెప్పాడు.

”బాప్‌రే. పోన్లే, మన ట్రస్టు పొలం దాకా వెళ్లొద్దామా” అడిగాను. తను సరేనన్నాడు. కాలినడకనే బయల్దేరాం.

srujan1

సెంటర్‌లో ఆగిన కార్లను, గుంపులవారీ జనాల కబుర్లను దాటుకుంటూ మంగళగిరి రోడ్డులోకి చేరుకున్నాం. ఆ రోడ్డులో ఎడమపక్కన ఉన్న కాలనీ దాటగానే ఓ ఎకరం పొలాన్ని రెండేళ్ల క్రితం పదిహేడు లక్షలకు కొన్నాను. ట్రస్టు తరఫున వృద్ధాశ్రమం నిర్మించాలని నా కల. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను.

ఊరింకా దాటనే లేదు. ఇళ్లింకా కనుమరుగు కాలేదు. రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన కారణంగా దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. ఊరు దాటగానే మెయిన్‌రోడ్డు నుంచి మా పొలంలోకి దిగుతుంటే ”జాగ్రత్త, నిప్పులుంటాయ్‌. చూసి దిగు” అన్నాడు వేణు పెద్దగా నవ్వుతూ.

”ఇదేంటి వేణు, కాలనీలో ఇంతమందికి మరుగుదొడ్లు లేవా?” ఆశ్చర్యంగా అడిగాను.

”హహ్హహ్హా… మా గ్రామసీమను అలా అవమానించకు. ప్రపంచం ముక్కున వేలేసుకునే స్థాయిలో నిర్మితం కాబోతున్న రాజధానిలో ఈ ఊరు అంతర్భాగం కాబోతోంది” అన్నాడు నాటకీయంగా.

ఆ ఎకరం స్థలంలో యాభై ట్రక్కుల ఇసుక, కొన్ని రాళ్లు పడి ఉన్నాయి.

”పర్మిషన్‌కు ఇంకెన్నాళ్లు పడుతుంది?” అడిగాడు వేణు, ఇసుక మీద కూచుంటూ.

”ఫైల్‌ మూవ్‌ అయిందట. ఈ నెలలోనే రావచ్చు” చెప్పాను నేను కూడా వేణు పక్కన చతికిలబడుతూ.

”అవును వేణూ, మన స్కూలెలా ఉంది?” అడిగాను దూరంగా కనిపిస్తున్న పత్తిచేను వైపు చూస్తూ.

”ఏం స్కూల్లే, తిప్పితిప్పి కొడితే వంద మంది లేరు. ఊళ్లో ఆరు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు వెలిశాయి” వేణు చెప్పాడు బాధగా. గతంలో ఆ స్కూల్లో అయిదారు వందల మంది విద్యార్థులుండేవారు.

కాసేపు కూచొని, మళ్లీ రోడ్డెక్కాం. నీరుకొండ పొలం నుంచి వస్తున్నట్లున్నాడు, భాష్యం రాము నాకు దగ్గరగా వచ్చి ”అరే, నీ మంచి కోరి చెబుతున్నాను. ఇప్పుడీ ఎకరం రెండు కోట్లు పలుకుద్ది. హాయిగా అమ్మేసుకుని, దూరంగా ఎక్కడైనా కట్టుకో నీ ఆశ్రమం” అన్నాడు. ఊళ్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికి పాతిక ముప్ఫై మంది ఇదే సలహా ఇచ్చారు నాకు.

నేను నవ్వి ఊరుకున్నాను.

వేణు, నేను బస్టాండ్‌ సెంటరుకు చేరుకున్నాం. తుళ్లూరు రోడ్డులో ఉన్న మద్యం షాపుల ముందు జనం కిక్కిరిసి ఉన్నారు. ఎట్నుంచి వచ్చాడో, నన్ను వాటేసుకుని ఏడవటం మొదలు పెట్టాడు అయూబ్‌ఖాన్‌.

”అరే వెంకట్‌, ఇద్దరాడ పిల్లలకీ పెళ్లిళ్లు చెయ్యడానికి ఉన్న రెండెకరాలూ అమ్మేశాను. నాలుగేళ్ల నించి కూలీపనులు చేసుకు బతుకుతున్నా. ఇప్పుడిదంతా కాంక్రీటు జంగిల్‌ అయితదంట. రేపట్నుంచీ ఆ కూలీ కూడా దొరికేట్టు లేదు” వాడి నోటినుంచి మద్యం వాసన గుప్పుమంటోంది. నాకు తెలిసి అంతకుముందు అయూబ్‌కు తాగుడు అలవాటు లేదు.

వాడికేదో నచ్చజెప్పి, ఇంకొంచెం ముందుకు నడిచాం.

సైరన్‌ మోగించుకుంటూ రెండు పోలీసుజీపులు వినాయకుడి గుడి వైపు దూసుకెళ్లాయి.

 

ఉన్నట్టుండీ ఒక్కసారిగా ఊరి వాతావరణంలో ఏదో మార్పు. జరగరానిదేదో జరిగిపోయినట్టు, జనం గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. గుడివైపు నుంచి నడిచివస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని ‘ఏం జరిగింది’ అని అడిగాడు వేణు.

”అదేరా, ఆస్తుల గురించి కోర్టుకెక్కి కొట్టుకుంటున్నారే కృష్ణమూర్తి కొడుకులు… వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. ఆవేశంలో గొడ్డలి తీసుకుని తమ్ముణ్ని నరికి చంపాడు అన్న…”

నా ఒళ్లు జలదరించింది. తల దించుకుని, కాళ్లకింద మట్టిని తీక్షణంగా చూస్తూండిపోయాను.

మట్టి… మనుషుల్ని నమిలి ఊస్తున్నట్లుగా ఉంది.

అక్కడక్కడా సిగరెట్‌ పీకలు, బీరుసీసాల మూతలు…

ముందు చక్రాలు గాల్లోకి లేచి, ట్రక్కు తిరగబడుతున్నట్లు… ఏదో భయం!

ఈసారి పక్కకు దూకగలమో.. లేదో…

సేద తీరడానికి చెట్టునీడ ఉంటుందో… లేదో…

కూలితల్లి తెరిచే సత్తు టిపినీలో సద్దన్నం, బీరపచ్చడి ఆనవాళ్లు మిగులుతాయో… లేదో…

———–

 

ఆమె లాంటి ఒకరు …యింకొకరు

 

అరుణ్ బ‌వేరా
…………………
గడ్డి పరకల మీద
పాదాల అలికిడికి తలలత్తే పుష్పాలకు మల్లే
ఆకు ఆకునా విచ్చుకున్న చూపులతో …
ఆమె
ఆమె లాంటి ఈమె
ఈమె లాంటి మరొకరు యింకొకరు
నీ ఆకలిగా,దాహంగా
నీ సోమరి కళ్ల వెనుక దాగిన మైకంగా
అలసి, మురిసే లోగా
నువ్వొస్తావు
నువ్వే వస్తావు …
పారిజాతం కోసుకువెళ్లిపోయే స్వేచ్ఛగా వస్తావు
రాత్రి నదిలో ఈదినన్నిసార్లూ వచ్చే అలసటగా ,
ఒక ఆఖరి ప్రయత్నం లాంటి కోరికేదో నీలో  తమకంగా తెల్లారుతుంది.
దేహం మీద సుఖమైన ద్రోహమేదో సాగిపోతుంది
బహుశా, చెక్కిలి మీద నుంచి నీటి చుక్క రాలినంత పొడిగా ..

 

నమ్మకంగా లేచి వెళ్లిపోయే ముగింపులో,
తడిసిన రెక్కలారబెట్టుకుని ఎగిరిపోవడమెల్లాగో తెలిసిపోతుంది.
యిక-ఏ కలా నిన్ను వెంటాడదు
ఏ కాటుకా నిన్ను అంటుకోదు.
వేళ్ల సందుల్లోంచి యిసుక జారినంత సులభంగా జారిపోవచ్చు.
నీ తలపుల్లో తెల్లవార్లూ తలుపులు తెరచుకునే
ఆమె
ఆమె లాంటి ఈమె
ఈమె లాంటి మరొకరు  యింకొకరు
కాలమంతా నిన్ను శూన్య హస్తాల్లో మోసుకు తిరుగుతారు.
మంచులా గడ్డకట్టుకున్న మౌనమేదో నీ చుట్టూ కంచె కడుతుంది.
నీ రసోద్రేక ప్రపంచం రోజుకో రంగు మారుస్తుంది.
నువ్వు మాట్లాడవు –
నువ్వు మాట్లాడని జీవితంలో  రోజుకో  మోసం  పడగ విప్పుతుంది.
కానీ,అప్పుడప్పుడు –
నేను మాట్లాడతాను
నీ నాటకీయమైన ప్రేమలో గాయపడ్డ తారకను పోలిన కంఠధ్వనితో -నేను మాట్లాడతాను
నేను మాత్రమే మాట్లాడతాను.
*

ఒక కవి- ఒక భరోసా!

-బద్రి నర్సన్

~

        narsan పూట గడవడమే గండంగా బతుకును నరకప్రాయంగా వెళ్లదీస్తున్న బడుగు జీవులకు ఎంత ధీమాగా కవి ప్రసాదమూర్తి చెప్పారు వారికి బాసటగా కవులున్నారని. కవులు తప్ప ఎవరూ లేరని పలకడం ఎంత సాహసం. కవి గణం నుండి వకాల్తా తీసుకున్నట్లు మేమున్నమని భరోసా మాట ఇవ్వడానికి ఎంత మనోధైర్యం కూడకట్టుకోవాలి.

       కవిత ముగింపుగా కనబడే  “కవులు తప్ప” చదవడానికి ఐదు అక్షరాలే కాని పంచ భూతాల సాక్షిగా పలికిన వాగ్దానమది. పిల్లాడి కన్నీరు తుడవడానికి అమ్మ ఉన్నట్లు, ఆస్తికుడికైతే దేవుడే దిక్కన్నట్లు ఎంత బాధ్యతాయుతమైన తీర్పు ఈ మాట.
       ప్రసాదమూర్తి ప్రజల కష్టాలను కవిత్వీకరించిన తీరు కన్నీటి పర్యంతమానం. పైన ఆకాశం లేక కింద నేల కూడా లేని వాళ్లకు కవులే తోడూ నీడా అన్నప్పుడు కవులు జడుసుకోవలసిందే.
    ‘రోడ్డు పక్కన దేహాలను అమ్మకానికి నిలబెట్టినవారికి,
    కుప్పితొట్టి ఉయ్యాలలో నక్షత్రగోళాలు పాడే జోలపాట వింటూ ఏడుస్తూ నిద్రపోయే అభాగ్య శిశువుకు,
    మట్టి మీద తమను పాతుకొని నాగటి కర్రుకు నెత్తుటి సంతకమై వేలాడే మట్టి మనుషులకు,
    కన్నీటి కాందిశీకులకు ఎవరున్నారు’ అనడం కవిగా తాను వేసిన ఎన్నో అడుగుల్లో ఇది మాత్రం తనకుతాను పునర్ ప్రమాణం చేసే సరికొత్త అడుగు.
       ఎవరున్నా లేకున్నా బాధితులకు తోడుగా నిలబడి అక్షరాలా అక్షరాల ఊరడింపునందించి, వెంటుండి బతుకు బండిని సవరించే బాధ్యత కవులకుందని ఈ కవి ఘంటాపథంగా ప్రకటిస్తున్నాడు.
       మరి కవులంటే ఎవరు? అడగ్గానే చేతులెత్తి నిలబడడానికి చాలా మందే ఉంటారు.  ఫేస్బుక్కు ఖాతాలోకి కిటికీలోంచి నాలుగు పదాలు విసిరేసేవాళ్లకూ కొదువ లేదు. నిందారోపణ కానేకాదు. ‘కవులు తప్ప’  అన్నాక కూడా ధీర్ఘంగా ఆలోచించకుండా ఉంటే ఎలా? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లకు మేమున్నమని ఆశ్వాసం కలిగించడానికి కవులు సాహసోపేతంగానే వ్యవహరించాలి. కవులు ఎవరి కాలువలో వారు ఈదినట్లుకాక సముద్ర అలల ధాటిని తట్టుకోవాలి.
     “రచయితలారా మీరెటువైపు?” అని ప్రశ్నించినపుడు సాహితీ లోకం కంపించినట్లు కష్టాలకు భుజం తోడు ఇచ్చినవాడే కవి అన్నప్పుడు కూడా నేటి కవులు తాము పోషించవలసిన పాత్రను స్థిరీకరించుకోవలసిందే. ఈ గడ్డు కాలంలో కలం పట్టడమే ఓ సాహసిక చర్య,  జీవన్మరణ పరిస్థితి.            
     కత్తి గొప్పదా! కలం గొప్పదా! అన్నప్పుడు కలమే గొప్పదని సోదాహరణంగా చదువుకునే రోజుల్లోనే వాదించాం. శబాష్ అనిపించుకున్నాం. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అని నమ్మినాము కదా. ఇవన్నీ నిరూపించుకోకపోతే ఎలా! 
      వీరులకే వీరగంధం దక్కినట్లు కవిగా నిరూపించుకునే పరీక్షకు సిద్ధపడాలి. అవసరమైతే కాలం కడుపులోకి చొచ్చి కవులుగా మళ్లీ జన్మించాలి.  ప్రసాదమూర్తి మాట దక్కించాలి.      
*