Archives for December 2015

గమనమే గమ్యం-29

img111

 

ఇది తెలిసి శారద ఆలోచనలో పడింది. . ఇంటింటికీ వెళ్ళి ఈ ప్రచారం  నీచమైనదని చెప్పటం వల్ల  సమయం వృధా  తప్ప ప్రయోజనం ఉండదు. అందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వాలి.  ముఖ్యంగా కాంగ్రెస్‌ పెద్దలకు. ఎలా? ఎక్కడ? ఎప్పుడు. శారద ఆలోచన తీవ్రత గుర్తించినట్లు ఆ సమయం రానే వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్‌ వాళ్ళు బహిరంగ సభ పెట్టారు. పెద్దా, చిన్నా  నాయకులంతా  వేదిక ఎక్కుతారని వాళ్ళు వేసిన కరపత్రం చూస్తూ తెలిసింది. శారదకు తన కర్తవ్యమేమిటో కూడా అర్థమైంది. హుషారుగా లేచింది. నవ్వుతూ వస్తున్న శారదను చూసి ప్రచారం చేయటానికి బయల్దేరుతున్న ఆడవాళ్ళంత ఆమె చుట్టూ చేరారు.

‘‘ఇవాళ సాయంత్రం మనం ఇంటింటి ప్రచారానికి వెళ్ళటం లేదోయ్‌. ప్రోగ్రాం మారింది’’.

‘‘ఎందుకు? ఏం మారింది? ఎక్కడ కి వెళ్తాం? ఏం చేద్దాం?’’ అందరూ కుతూహలంగా ఆత్రంగా అడిగారు.

‘‘కాంగ్రెస్‌ మీటింగుకోయ్‌’’ శారద ఉత్సాహంగా చెప్పిన మాటకు అందరూ విస్తుపోయారు.

‘‘కాంగ్రెస్‌ మీటింగ్‌కా? మనమా?’’

‘‘ఔను. మనమే. వెళ్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేం కంగారు పడకండి . అంతా నే చూసుకుంటాను. మీరు సభకు వస్తే చాలు “ శారద ఏదో మంచి ఆలోచనే చేసి ఉంటుందని అందరూ నమ్మారు. ధీమాగా తమ పనులకు తాము వెళ్ళిపోయారు. సాయంత్రం ఎంత తొందరగా వెళ్దామన్నా అందరూ తెమిలే సరికి ఆలస్యం అవనే అయింది.

‘‘అవతల మీటింగు మొదలయిందోయ్‌ రండి’’ అంటూ శారద ముందు నడిస్తే వెనకా అందరూ గుంపుగా నడిచారు. వీళ్ళు వెళ్ళేసరికి కాంగ్రెస్‌ నాయకుడొకడు గొంతు చించుకుంటున్నాడు.

‘‘ఆ శారదాంబ డాక్టరు కావచ్చు. కానీ ఆమె చేసిన పనేమిటి? కాంట్రాక్టు పెళ్ళి చేసుకుంది. మనం ఎప్పుడైన విన్నామా? మన సంప్రదాయమేనా ? అసలామెకు ఏ పెళ్ళయినా ఎందుకు? బెజవాడలో ఆవిడ ఇంటికి రాణి  మొగాడున్నాడా  వాళ్ళ పార్టీలో? అది ఇల్లా? సానికొంపా? బెజవాడలో ఎవరినైన అడగండి చెబుతారు. బెజవాడ ఒదిలి ఇపుడు ఏలూరుని ఉద్ధరిస్తానంటుంది. ఏలూరులో కూడా ఒక సానికొంప నడపాలనుకుంటుందా?’’

వింటున్న మహిళా సంఘం వాళ్ళ రక్తాలు  మరిగిపోయాయి. శారద వాళ్ళను ఒట్టి చేతుతో రావాలని  ఆజ్ఞాపించింది. లేకపోతే చేతిలో కర్రలుంటే వాళ్ళు ఆ కాంగ్రెస్‌ నాయకుడి  తల పగలగొట్టే వారే. శారద వాళ్ళ ఆగ్రహాన్ని గ్రహించినట్టు వెనక్కు తిరిగి నవ్వుతూ ‘‘వాళ్ళ మాటలకు కోపం తెచ్చుకుంటే వాళ్ళ బలం పెరుగుతుంది. నవ్వుతూ నవ్వుతూ సమాధానం చెప్పాలి. ఆ పని నే చేస్తాను. చూస్తూ ఉండండి ’’.

అంటూ వడి వడి గా నడుస్తూ వేదిక మీదికి ఎక్కేసింది. వేదిక మీది వాళ్ళంత విస్తుపోయి, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళేకే తెలియనితనంలో అందరూ లేచి నిలబడ్డారు. సభలో జనమూ నివ్వెరపోయి ఎక్కడ వాళ్ళక్కడ నిశ్శబ్దమైపోయారు.

శారద వేదిక మీది వాళ్ళను ఆజ్ఞాపిస్తున్నట్లు ‘‘కూచోండి ’’ అంది గర్జించినట్లే.

అందరూ టక్కున కుర్చీల్లో కూర్చున్నారు ఆ ఆజ్ఞకోసమే ఎదురు చూస్తున్న వాళ్ళలా.

మైకు దగ్గరి నాయకుడి ముఖంలో నెత్తురుచుక్క లేదు.

‘‘జరగండి – వెళ్ళి మీరూ కూచోండి ’’ ఆజ్ఞాపించింది శారద.

ఆయన అమ్మయ్య అనుకున్నట్లు పరుగు పరుగున వేదిక చివరనున్న తన కుర్చీలో పోయి పడ్డాడు.

‘‘కాంగ్రెస్‌ నాయకులను నేనొకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎన్నికల ప్రచారం కోసం సభ పెట్టారా ? శారదాంబ జీవితాన్ని గురించి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయటానికి సభ పెట్టాం ? మనవి వేరు వేరు పార్టీలు . వేరు వేరు ప్రణాళికలు. ఎన్నికలలో గెలిచి మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పటానికి సభలు  పెట్టుకోవాలి. ప్రజల  సమస్యలేమిటి, మన రాజకీయాలేమిటి అన్నది ప్రజకు వివరించాలి. కమ్యూనిస్టులతో మీకు విభేదాలెక్కడ ఉన్నాయో చెప్పండి . మీకు తప్పనిపించిన విధానాలను ఎంతైన విమర్శించండి . ఎన్నికల ప్రచారమంటే అది. ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు రేపు ప్రజలకు ఏం చేస్తారు? ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు  ఎలా ఉన్నాయో చూసి ప్రజలకు చెప్పుకుంటూ పోతారు?  ఒక స్త్రీని గౌరవించే సంస్కారం లేదు మీకు. రాజకీయాలలోకి వచ్చిన స్త్రీలను గురించి ఇట్లా మాట్లాడి వాళ్ళను వెనక్కు నెట్టడమా మీ ఉద్దేశం. మీ పార్టీ తరపున ఒక స్త్రీ పోటీ చేస్తోంది. ఆవిడంటే గిట్టనివారు నా ఎదురుగా ఆమెను కించపరిచేమాట ఒక్కటి మాట్లాడిన నేను సహించను. వాళ్ళ నోరు మూయిస్తాను. ఆమెను నా  సోదరిగా ఆలింగనం చేసుకుంటాను. కర్ణుడిని సూతపుత్రుడని అవమానించినట్లు నన్ను నా  ‘‘పెళ్ళి’’ పేరుతో అవమానించదల్చుకున్న వాళ్ళకు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను . కొత్తగా ఆవిర్భవిస్తున్న భారతదేశంలో కులాన్ని అణగదొక్కుతాం. శీలం, నీతి, అవినీతి, పెళ్ళి అయింది, కాలేదు అంటూ స్త్రీలను అవమానించేవారిని ఇంకెంతమాత్రం సహించం. మీ పాత నీతులు  పనికిరావు. స్త్రీలు  తమ గురించి, దేశం గురించి బాధ్యత తీసుకుంటారు. బెజవాడలో మా ఇల్లు  ఆపదలో ఉన్నవారికి ఆశ్రయమిచ్చేచోటు. అది నా ఇల్లు  కాదు. మీ అందరిదీ. మీరందరూ రావచ్చు. మా అమ్మ అన్నం పెడుతుంది. బెజవాడలో నా ఇల్లంటున్నారే ఆ ఇంట్లోనే కాదు. మద్రాసులో మా నాన్న రామారావు గారిల్లు  ఉండేది. భారతదేశంలో పండితుందరూ వచ్చి మా అమ్మ చేతి భోజనం చేసి మా నాన్నతో సంప్రదించి వెళ్ళేవారు. వీరేశలింగం గారు మా ఇంట్లో ఉండేవారు. ఔను – జీవితాన్నంత సమాజం కోసం ధారపోసిన ఆయననూ అవినీతిపరుడన్నారు. వయసు మీదబడి భార్యా  వియోగంతో కుంగిపోతున్న ఆయన మీద అవినీతి ఆరోపణలు  చేసింది మీ వాళ్ళే ` మీ టంగుటూరి ప్రకాశం గారే ప్లీడరుగా తన చమత్కారమంతా  చూపించి ఆయనను ముద్దాయిగా నిలబెట్టి దోషిగా నిరూపించాడు. మీరు ఆ సంస్కారాన్ని వదలండి .

స్త్రీలను గౌరవించటమంటే ఏంటో నేర్చుకోండి . ఆధునిక స్త్రీ, ఆధునిక మహిళ మీ కళ్ళు మిరుమిట్లు గొలిపి, మీరు కన్నెత్తి చూడలేనంతగా ఎదుగుతోంది. చరిత్ర నిర్మిస్తుంది. చరిత్ర తిరగరాస్తుంది. సిద్ధంగా ఉండండ ఆమెతో తలపడటానికి. ఎన్నికల్లో ఎవరైన గెలవొచ్చు. కానీ నైతికంగా ఇవాళ మీరు ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో తల ఎత్తుకోలేనంత ఘోరంగా ఓడిపోయారు. నేను ఘన విజయం సాధించాను.

ప్రజలారా – నేను నైతికంగా గెలిచి మీ ముందు ధీమాగా నిలబడ్డాను. వేదిక మీది ఈ పెద్దలు  ఓడిపోయి తలలు దించుకున్నారు. నమస్కారం. శలవు’’

ఒక నిర్మల గంభీర ప్రవాహంలా సాగిన శారద ఉపన్యాసం తర్వాత  అంత నిశ్శబ్దమై పోయింది. శారద వేదిక దిగి జనం మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చింది. జనం గౌరవంగా ఆమెకు దారి ఇచ్చారు . ఆ రోజుకి ఇక సభ జరిపే  ధైర్యం కాంగ్రెస్‌ నాయకులకూ, వినే మానసిక స్థితి ప్రజలకూ లేదు.

***

olga title

ఎన్నికలు  దగ్గరబడుతున్న కొద్దీ మహిళా సంఘ ప్రచారానికి ప్రజలు  ఆకర్షితువుతున్నారు. అది అవతలి పక్షం వారిని చాలా కలవరపెడుతోంది. ఏమైనా  సరే ఇక్కడ కమ్యూనిస్టులను గెలవనివ్వకూడదనే పంతం పెరిగి అది వారి విచక్షణా జ్ఞానాన్ని తినేసింది. మహిళా సంఘం వారిని భయపెట్టి ఏలూరు నుంచి తరిమేస్తే  సగం పీడా ఒదులుతుందన్నారెవరో –

‘‘ఎట్లా? వాళ్ళు రాక్షసులు . వాళ్ళను భయపెట్టటం కల్లో మాట. మనల్ని భయపెడతాయి ఆ దెయ్యాలు ’’ కసి తప్ప మరొకటి లేదా మాటల్లో. చివరకి మతిలేని, గతిలేని వీధి రౌడీలను ఆశ్రయించటం తప్ప మరో మార్గం కనిపించలేదు స్థానిక పెద్దలకు. వారికి కాస్త నోరూ, చేతులూ  తడిపి మహిళా సంఘం వాళ్ళు బస చేసిన  ఇళ్ళ మీదకు దాడి చేయమని అర్థరాత్రిపూట పంపారు.

వీధి రౌడీలు  ఆడవాళ్ళని అల్లరిపెట్టి  బెదిరించి యాగీ చేసి వద్దామని హంగామాతో బయల్దేరారు.

ముందు ఇళ్ళమీద రాళ్ళు వేశారు. పగలంత తిరిగీ తిరిగీ వచ్చి ఇంత తిని పడుకున్న ఆడవాళ్ళు అలజడి గా మేలుకున్నారు . వాళ్ళకు అర్థమైంది. ఒకరివంక ఒకరు అర్థవంతంగా చూసుకున్నారు. చీరలు  బిగించి కట్టారు. కొంగు నడుముల్లో దోపుకున్నారు. తలుపులు  దబదబ బాదగానే అవి తెరుచుకుని తమ నెత్తిన కర్రలు  విరుచుకుపడతాయని తెలియని రౌడీలు  లబోదిబోమన్నారు. తామూ నిలబడి కర్రలు తిప్పారు. అరగంట పాటు ఆ స్త్రీల కర్రసాము చూస్తూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు సబ్తులై నిలబడిపోయారు. రౌడీలు ఎటు పోయారో కూడా చూసే అవకాశం లేకుండా పారిపోయారు. ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా ఏర్పడినప్పుడు నేర్చుకున్న కర్రసాము ఇప్పటికి సార్థకమయిందని సంతోషపడుతూ ఆ రాత్రి మరి నిద్రపోలేదు ఆ స్త్రీలు . జోరుగా పాటలు  ఆటలతో సందడి చేశారు.

శారద మర్నాడు బెజవాడ నుండి వచ్చేసరికి అందరూ ఒకేసారి మాట్లాడి రాత్రి  జరిగిన యుద్ధాన్ని  సచిత్ర ప్రదర్శనలాగా చెప్పారు. తనను ఓడించటానికి కాంగ్రెస్‌ వాళ్ళు ఎలాంటి పనికైన తెగబడతారని అర్థమైంది శారదకు. అందరూ కలిసి ఒకటి లేదా రెండు జట్లుగా తిరగాలనీ, ఒకరిద్దరుగా ఎవరూ ఎక్కడకీ వెళ్ళొద్దని గట్టిగా చెప్పింది. ప్రచారాన్ని  ఎంత పద్ధతిగా సాగించాలో వారందరినీ కూర్చోబెట్టి వివరించింది. ఎన్నికల ప్రణాళిక అందరికీ కరతలామకమే. ఐతే ప్రతిచోటా శారదాంబ గారిది కాంట్రాక్టు పెళ్ళట – అదేంటి అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది.

చైతన్యంతో సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవతలి వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ మహిళా సంఘంలోకి అపుడపుడే వచ్చినవాళ్ళు, రాజకీయ ప్రచారం   సంగతి తెలియని వాళ్ళూ ఇచ్చే సమాధానాలు  సంజాయిషీలాగా

ఉండేవి. ‘డాక్టరు గారు చాలా గొప్ప మనిషి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదంతా  పట్టించుకోవాల్సింది కాదు.’ ఇట్లా మాట్లాడేవాళ్ళను ఉమ, రాజమ్మ రాత్రిపూట సరిదిద్దేవారు. అదంతా  శారద చెవిన పడుతూనే ఉండేది.

సంజాయిషీల్లాంటి ఆ వివరణలు  విన్న శారదకు నవ్వాలో, ఏడవాలో  తెలిసేది కాదు. జీవితమంత ఇలాంటి సంజాయిషీలు  తనో, తన తరపున మాట్లాడేవాళ్ళో  ఇవ్వాల్సిందేనా ?

ఇవ్వాల్సిందే. సమాజంలో ఉన్న భావాలు  వేరు.  ప్రేమ గురించి చం గారు ఎంత రాసిన ,  ప్రేమకు సంఘనీతి అడ్డం వస్తుందన్నా  సంఘనీతి మనుధర్మాల  మీద ఆధారపడ స్త్రీలకు తీరని అపకారం చేసేదనీ, దానిని కూకటివేళ్ళతో పెళ్ళగించి కొత్త పద్ధతులను జీవితంలోకి తెచ్చుకోవాలని ఎంత చెప్పినా  దానిని అర్థం చేసుకోవటం కష్టం. చాలా సంవత్సరాలే పట్టవచ్చు ఆడవాళ్ళ  ప్రేమను నీతి -అవినీతి అనే చట్రం నుంచి విడదీసి చూడటానికి.

ఆడవాళ్ళు చిన్న గీటు దాటినా  దానిని సమాజం సహించలేదు.  ప్రేమ అనేది తెలియక ముందే పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి. తర్వాత   ప్రేమవిలువ  తెలిసి కావానుకుంటే తెంచుకోలేని బంధాలు . సరైన విడాకుల  చట్టం లేనపుడు, పెళ్ళయిన వ్యక్తికి  ప్రేమించే హక్కు లేదు. హక్కు కోసం సమాజానికి విరుద్ధంగా పోయే వ్యక్తులున్నపుడే హక్కు అవసరం సమాజానికి అర్థమవుతుంది.

రావు కమిటి హిందూ కోడ్‌ బిల్లు  తయారు చేస్తోంది గానీ దానిలో  ప్రేమకు ఏం చోటుంటుంది?

విడిపోవటానికి  ప్రేమ లేకపోవటం అనే కారణం కాకుండా పరమ నికృష్టమైన  కారణాలు  ఉంటాయి. ఆస్తి, భరణం, వారసత్వం ఇవి ప్రధానమవుతాయి. కానీ ఆడవాళ్ళకు అది కూడా చాలా అవసరం. అంతకు మించి ఇప్పుడే ఎక్కువ ఆశించలేం.

భార్య మీద  ప్రేమ లేదు విడాకులివ్వండి అంటే ఎవరికీ అర్థం కాదు. నా  భార్య రోగిష్టిది. సంసార జీవితానికి పనికిరాదు అంటే విడాకులు  ఇవ్వమని అడగొచ్చని, పొందవచ్చని రావు కమిటి చెబుతుంది. జబ్బు పడిన భార్యను  ప్రేమగా చూసుకునే భర్తులుంటారు. రోజూ భార్య నుండి సంసార సుఖం పొందుతూనే వాళ్ళను ద్వేషించే భర్తులుంటారు. ఈ  ప్రేమ, ద్వేషాలు  భార్యాభర్తల  సంబంధాలో ఎట్లా ఉంటాయో, ఎట్లా పని చేస్తాయో ఆలోచించే చట్టాలు రావటం అసాధ్యం.

ప్రేమ పేరుతో మగవాళ్ళు మోసం చేసే  స్థితిలో ఉండటం – నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళుండటం వాళ్ళకి హక్కుల్ని లేకుండా చేస్తోంది. వాళ్ళకు, మనుషులు గా స్వతంత్ర వ్యక్తులు గా పనికొచ్చే హక్కు కాకుండా పరాధీనులుగా, బానిసలుగా, బాధితులుగా చూసే  హక్కు అడగగలిగిన పరిస్థితులే ఉన్నాయి. ముందు ఆడవాళ్ళ స్థాయి మారి సమానత్వం వస్తే తప్ప ‘ ప్రేమ’ ను అర్థం చేసుకోలేం. అపుడు పెళ్ళి ఉండదు.  ప్రేమే ఉంటుంది. ఎంగిల్స్‌ కుటుంబం వ్యక్తిగత ఆస్తిలో శారదకు చాలా ఇష్టమయిన వాక్యాలు  మనసులో మెదిలాయి.

ఎన్నికలు  ముగిసేనాటికి శారదకు ఫలితం ఏమిటో అర్థమైంది. ‘‘ఒక తరం మగవాళ్ళు తమ జీవిత కాంలో గానీ, ధనంతో గానీ, సామాజికాధికారంతో గానీ స్త్రీని లోబర్చుకునే సందర్భం ఎదురుకానపుడు, అదే విధంగా నిజమైన  ప్రేమతో తప్ప మరే కారణంతోనైన ఒక స్త్రీ మగవాని చెంత చేరవసిన అవసరం లేనపుడు, ఆర్థికపరమైన భయం చేత  ప్రేమికులు  కలియలేని పరిస్థితులు  తొలిగినపుడు, దానికి సమాధానం దొరుకుతుంది. ఆ మాదిరి జనం పుట్టాక, వారి ప్రవర్తన గురించి ఈనాడు మనం చెప్పే సలహాలకు వారు చిల్లిగవ్వవిలువ  కూడా ఇవ్వరు. తమ పద్ధతును తామే నిర్ణయించుకుంటారు. వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయాన్ని సృష్టించుకుంటారు’’.

ఇది ఎప్పుడు జరుగుతుంది? బహుశ తన జీవితకాంలోనే జరుగుతుందేమో `- వ్యక్తుల  ఆచరణకు అనుకూలంగా జనా భిప్రాయం సృష్టించుకోవటం మానేసి పాతబడిన జనాభిప్రాయాల  ప్రకారం వ్యక్తులను నడవమనే ధోరణే ఇంకా కమ్యూనిస్టు పార్టీలోనూ నడుస్తోంది. ఇది మారెదెప్పుడు. మార్చాలి . ఎన్నికల  కంటే అది ముఖ్యం. తను ఓడి పోతుంది. కాంగ్రెస్‌ ఎన్నిక నిబంధనలన్నీ ఉల్లంఘిస్తోంది. తన ఓటు వేసి బెజవాడ వచ్చి ఆ ఎన్నిక గురించి మర్చిపోదామనీ, కూతురితో ఆడుకుంటూ ఒక రోజన్నా  గడుపుదామనీ అనుకుంది. నటాషాకు నాలుగేళ్ళు నిండలేదింకా – మంది చేతుల  మీద పెరుగుతోంది. ఐన అమ్మను చూస్తే  అతుక్కు పోతుంది. చిన్నతనం నుంచీ శారద నవ్వు అందరినీ ఆకర్షించి సమ్మోహితుల్ని చేసేది. చిన్న నటాషాకి కూడా అమ్మ నవ్వంటే ఎంతో ఇష్టం. హాయిగా, మనసారా  , నిష్కల్మషంగా నవ్వే తల్లిని కళ్ళార్పకుండా చూసి ఆ బొమ్మను కళ్ళగుండా మెదడులో గట్టిగా ముద్రించు కుంటున్నట్టు చూసేది. నటాషాను గుండెకు హత్తుకుని ‘‘తొలి నే చేసిన పూజా ఫలమా’’ అంటూ త్యాగరాజ  కీర్తన అందుకునేది. తల్లి పాట వింటూ నటాషా నిద్రపోతుంటే శారద ఆ పాపని, తన  పేర్మ  ఫలాన్ని తనివిదీరా  చూసుకునేది. అట్లాంటి రోజు ఆ తల్లీ కూతుళ్ళకు అరుదే గానీ వాటిని శారద ఎంత అపురూపంగా చూసుకునేదో, ఎంత పరవశంతో అనుభూతి చెందేదో, ఎలాపులకించి పోయేదో శారదకే తెలుసు. నటాషాకి కూడా తెలియదు.

రాత్రి నటాషా పెందలాడే నిద్రపోయింది. మూర్తి ఇంకా ఎన్నిక గొడవల్లోంచి బైటపడలేదు. బహుశ ఫలితాలొచ్చే వరకూ ఏదో ఒక పని ఉంటుంది. శారద చాలా రోజుల  తర్వాత  సుబ్బమ్మతో కలిసి భోజనం చేసింది. సుబ్బమ్మ చాలా తక్కువ తింటోందనో, చిక్కిపోయిందనో అనిపించింది.

‘‘అమ్మా – నీ గురించి పట్టించుకోవటం లేదు. ఇంత చిక్కిపోయావేమిటి? అంత తక్కువ  తింటున్నావేంటి? కొంచెం  వడ్డిస్తానుండు’’ అంటూ హడావుడి  చేసింది.

‘‘నువ్వు నన్ను పట్టించుకునేదేంటి? ఆ పని నాది. నువ్వేమో నా  చేతికి చిక్కకుండా తిరుగుతున్నావు. . నాకు  వయసు మీద పడటం లేదా? తిండీ, నిద్రా తగ్గుతాయి. ఒళ్ళు తగ్గితే మంచిదే’’ సుబ్బమ్మ నవ్వుతూ తీసిపారేసింది శారద మాటల్ని.

‘‘మాట్లాడకుండా రేపు నాతో ఆస్పత్రికి రా  . అన్ని పరీక్షలూ  చేస్తాను’’ గట్టిగా అంది శారద.

‘‘అలాగే. రానంటే ఊరుకుంటావా  ? కాళ్ళూ చేతులూ  కట్టి పడేసైనా  లాక్కుపోత వు. అలాగే చెయ్యి నీ పరిక్షలు .’’

భోజనాలు  ముగించి ముంగిట్లో కాసేపు చల్ల గాలికి కూచుందామని వచ్చేసరికి గేటు తీసుకుని ఎవరో వస్తున్నారు.

***

 

చివరాఖరి ప్రశ్న

Art: Srujan Raj

Art: Srujan Raj

 

-కోడూరి విజయకుమార్

~

vijay

‘కొక్కొరోకో’ … మొబైల్ అలారం లెమ్మని అరుస్తోంది

నిద్ర పట్టని మహానగర రాత్రుల యాతనల నడుమ ఉదయమే లేవడమొక పెను సవాలు!

చిన్నతనంలో ఊరిలో కోడి కూతకు మేల్కొనే అలవాటు ఇంకా పోనందుకో లేక  కొట్టి మరీ నిద్ర లేపే లక్షణం వున్నందువల్లనో అతడు ఊళ్ళోని కోడికూతలా భ్రమింపజేసే ఈ విచిత్ర యంత్రశబ్దాన్ని ఎంచుకున్నాడు.

కొట్టి చెబితే కూడా మెలకువలోకి రాకుండాపోతోన్న జీవితాన్ని తల్చుకుని క్షణకాలం దిగులు పడ్డాడు.

ఇట్లా అప్పుడప్పుడూ జీవితాన్ని తలుచుకుని దిగులుపడే సున్నిత హృదయ శకలం ఒకటి ఏ మూలనో ఇంకా మిగిలి వున్నందుకు ఒకింత సంతోషించాడు కూడా !

‘సరే గానీ … దిగులు దేనికి ?’ ప్రశ్నించుకున్నాడు.

జబ్బులతో మంచాన పడిన తలిదండ్రులు జ్ఞాపకం వొచ్చారు.

‘వృద్ధాప్యం కదా … జబ్బులతో మంచాన పడడం మామూలే కదా’

సంసారంలో ఇబ్బందులు పడుతోన్న తన తోడబుట్టిన వాళ్ళు జ్ఞాపకం వొచ్చారు.

‘ఏ ఇబ్బందులూ,  గొడవలూ, మనస్పర్థలూ లేకుండా ఎవరి సంసారాలు వున్నాయి? చాలా అందంగా సాగుతున్నట్టుగా పైకి కనిపించే సంసారాలన్నీ నిజంగా అందంగానే సాగుతున్నాయా?’

సరే … సరే …. లోన లుంగలు చుట్టుకు పోతున్న ఈ దుఃఖం మాటేమిటి ?

అరచేతులనూ జుత్తు లోనికి జొనిపి,  కణతలను చిన్నగా రుద్దుకుంటూ, గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలాడు.

ప్రశ్నలు …. ప్రశ్నలు …. నిన్న సాయంత్రం నుండీ ఎడ తెరిపి లేని ప్రశ్నలు …  ఏవేవో సమాధానాలు దొరుకుతున్నాయి గానీ, అసలైన ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇంతా చేసి, ఆ ప్రశ్న వేసింది అప్పుడప్పుడూ ఆర్టీసీ చౌరస్తా దగ్గర తారసపడే పిచ్చివాడు.

రోజుల తరబడి స్నానం చేయక  పోగచూరినట్లు నల్లగా వుండే శరీరం … చీలికలు పేలికలుగా శరీరం పైన వున్న పొడవాటి షర్టు, పొట్ట దాకా పెరిగిన తెల్లటి గడ్డం, చింపిరి జుట్టు, గుంటలు పడి లోనకు పోయిన కళ్ళు!

‘ఎవరికీ పట్టని వాళ్ళు, ఎవరినీ పట్టించుకోని వాళ్ళు ఇట్లాగే వుంటారేమో?’ అనుకున్నాడు.

‘పిచ్చివాడు ‘ … ఆ మాట ఎందుకో ఒక క్షణం చిత్రంగా అనిపించింది!

ఫలానా విధంగా కనిపిస్తే, లేక ఫలానా విధంగా మాట్లాడితే‘పిచ్చివాడు’ అని ప్రమాణాలు నిర్ణయించింది ఎవరు?

ఒక చిన్న కారణంతో ఏళ్ల తరబడి దెబ్బలాడుకునే భార్యాభర్తలూ …. తిడితే తప్ప కింది వాళ్ళు పనిచేయరనే ఆలోచనలతో తిరిగే యజమానులూ…  అత్యంత రద్దీ సమయంలో  పొరపాటున దాష్  కొట్టిన స్కూటర్ వాడితో నడి రోడ్డు పైన పెద్ద గొడవకు దిగే కారు ఓనర్లు …. వీళ్ళందరూ ‘నార్మల్’ మనుషులేనా ?

కిటికీ పరదాని పక్కకు జరిపాడు

ఉదయం వెలుగు జొరబడి గది అంతా పరుచుకుంది.

‘గడిచిన రాత్రి నుండి బయట పడి, ఇట్లా ఈ కొత్త రోజు లోకి వచ్చాను కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ?’ ప్రశ్నించుకున్నాడు.

‘లేకపోతే ఏముంటుంది ? ఏదీ …. ఏ …. దీ వుండదు !’ ఎవరో గట్టిగా చెప్పినట్టు అనిపించింది.

తల తిప్పి చూసాడు –  కుండీలో మందార పువ్వు నవ్వుతోంది.

`ఈ బాధలు పడడం కన్నా, ఈ పువ్వులా పుట్టి వుంటే ఎంత బాగుండేది?’ నిట్టూర్చాడు.

‘పువ్వులా పుట్టకపోయినా పువ్వులా బతకొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నావా?’ కుండీ లోని పువ్వు గల గలా నవ్వినట్టు అనిపించింది.

కళ్ళు నులుముకుంటూ బెడ్ రూం లో నుండి బయటకు వచ్చాడు.

తను వంటగదిలో ఉన్నట్టుంది. పిల్లల అలికిడి లేదు.

బాబు ఉదయం నాలుగు గంటలకే ఐ ఐ టి కోచింగ్ కీ, పాప ఉదయం ఐదు గంటలకే మెడిసిన్ కోచింగ్ కీ వెళ్ళిపోతారు.

బాల్యం కోల్పోయారు … కౌమారం కోల్పోతున్నారు … రేపు యవ్వనం కూడా కోల్పోతారు …

ఇన్ని కోల్పోయిన తరువాత రేపు జీవితం కోల్పోకుండా ఉంటారా ?

కానీ, అది కోల్పోకుండా వుండడం కోసమే కదా ఈ తెల్లవారు ఝాము కోచింగులు !

ఏది కోల్పోకుండా వుండడం కోసం మరి దేనిని కోల్పోతున్నట్టు ?

Kadha-Saranga-2-300x268

స్కూలు రోజుల వరకూ అతడు చాలా పాటలు పాడేవాడు. ఎక్కడ  పాటల పోటీ జరిగినా మొదటి బహుమతి సాధించేవాడు. ఒక బాలమురళి లాగా, ఒక జేసుదాసు లాగా పాటలు పాడుకుంటూ బతికేయాలని అతడి అప్పటి కల!

శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానని తండ్రికి చెప్పినపుడు, ‘ముందు చదువు పైన శ్రద్ధపెట్టు’ అన్న సమాధానం వెనుక డబ్బులు కట్టలేని  తండ్రి బేలతనం వుందన్న రహస్యం అతడికి కొంత ఆలస్యంగా అర్థం అయింది. కాలేజీ రోజుల లోకి వచ్చేసరికి అతడికి కుటుంబ బాధ్యతల సెగ తగిలి, క్రమ క్రమంగా ఒకప్పుడు తాను అద్భుతంగా పాటలు పాడే వాడిని అన్న సంగతినే మర్చిపోయాడు.

చదువు … పోటీ పరీక్షలు … నెల తిరిగే సరికి కుటుంబం కాస్త ప్రశాంతంగా బతికేందుకు అవసరమైన సంపాదన తెచ్చే ఒక మంచి ఉద్యోగమే లక్ష్యం!

సరే … అదంతా గతం … ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి ?

పాప చక్కగా పాటలు పాడుతుంది … ఎంత తియ్యని గొంతు దానిది !

సంగీతం క్లాసులు మాన్పించి, మెడిసిన్ కోచింగ్ క్లాసులకు వెళ్ళమని చెప్పిన రోజున అన్నం తినకుండా అలిగి కూర్చుంది.

బుజ్జగించి, లేక, సంగీతాన్నే నమ్ముకుని ముందుకు వెళితే మిగిలే జీవితాన్ని బెదరగొట్టే రూపాలలో వర్ణించి, మొత్తంమీద పిల్లని సంగీతం నుండి దారి మళ్ళించాడు !

నేల పైన మొదలైన తన జీవితం ఇప్పుడు మేడ పైన కాస్త సౌకర్యవంతమైన స్థాయికి చేరిన దశలో అజాగ్రత్తగా వుంటే, రేపు పిల్లలు ఎక్కడ నేల పైకి జారి పడతారో అని ఒక భయానక అభద్రతా భావం … ఎవరు జొప్పించారు ఈ జీవితాల లోనికి ఇంత అభద్రతా భావాన్ని ?

‘ఎక్కడి నుండో ఇక్కడి ఈ లోకం లోకి విసిరి వేయబడి, ఇక్కడి ఈ సంచారంలో నిరంతరంగా ఒక భారాన్ని మోస్తూ, చివరన మళ్ళీ ఎక్కడికో తిరుగు ప్రయాణమై …’ తన ఊహలకు తానే నవ్వుకున్నాడు!

‘టేబుల్ పైన టిఫిన్ రెడీగా వుంది …. లంచ్ బాక్స్ అక్కడే పెట్టాను ‘ స్నానం చేసి వచ్చేసరికి, బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోస్తోన్న భార్య చెప్పింది.

‘భూమ్మీద పడి, తిరిగి వెళ్లి పోయేదాకా ఏమి తప్పినా వేళకు తిండి తినడమైతే తప్పదు గదా!’  తనలో తాను గొణుక్కున్నాడు.

‘అందమే ఆనందం …. ‘ వివిధ భారతి లో ఘంటసాల పాట తియ్యగా సాగుతోంది.

పాటలు వింటూ టిఫిన్ చేయడం అలవాటు అతడికి.

‘ఆనందమే జీవిత మకరందం’ వినడానికి ఎంత సరళంగా, ఎంత అందంగా వుంది?

ఇంత సరళమైన, ఇంత అందమైన ఈ అనుభూతి ఒక జ్ఞానం లాగ బయటే నిలబడి పోతున్నది తప్ప, గుండెలోకీ, రక్త నాళాలలోకీ, జీవితంలోకీ ఇంకడం లేదెందుకని ? పిచ్చివాడు వేసిన ప్రశ్న భయపెడుతున్నదా? … లేక, వాడికి దొరకిన జవాబు తనకు దొరకనందుకు దిగులుగా వున్నదా?

స్కూటర్ తీసుకుని ఆఫీస్ కు బయల్దేరాడు ….

గత వారం రోజులుగా ఆఫీస్ కి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంటోంది.

మధు … ఆఫీస్ లో వున్న సన్నిహిత మిత్రులలో ఒకడు ….. వారం కిందట క్యాన్సర్ తో పోయాడు.  మనిషి మృత్యువుకు చేరువ అయ్యేటప్పటి ప్రయాణం ఎంత భారంగా వుంటుందో దగ్గరగా చూసాడు. పరీక్షలు జరిపి చెప్పారు డాక్టర్లు – ‘ క్యాన్సర్ చివరి దశలో వుంది – సమయం లేదు’.

‘ఛ …. ఇంతేనా జీవితం ….ఎన్నెన్ని ఊహించుకుంటాము …. ఎన్నెన్ని కలలు కంటాము … అన్నీ దేహం లోపలి ఒక్క కుదుపుతో దూది పింజలలా తేలిపోవలసిందేనా?’ డాక్టర్ గది నుండి బయటకు వచ్చి స్నేహితుడు దుఖించిన రోజు ఇప్పటికీ వెంటాడుతూనే వుంది.

 

వీధులు దాటి, మెయిన్ రోడ్డు మీదకు చేరుకున్నాడు. రోడ్లు ఈనినట్లుగా జనం …. బస్సుల్లో, కార్లలో, ఆటోల్లో, బైకుల పైన ….ముందు వాడిని కదలమని వెనుక వాడూ, ఆ ముందు వాడిని మరింత త్వరగా వెళ్ళమని ఈ ముందు వాడూ …  అందరూ ఆదరా బాదరాగా పరిగెత్తడానికి సిద్ధంగా వుంటారు గానీ ఎవరూ టైంకి గమ్యానికి చేరే అవకాశం వుండదు. వాడెవడో భలే చెప్పాడు …. మహానగరంలో మనుషులు కాంక్రీటు బోనులలో బంధింపబడిన జంతువులు …. బయటికి వెళ్లి బతకలేరు … లోపలి ఉక్కపోతను భరించలేరు!

వి ఎస్ టి సెంటర్ దగ్గరకు చేరున్నాడు అతడు.  అర కిలోమీటరు మేర ట్రాఫిక్ వుంది. వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. పక్కనే పోలీసుల కాపలా మధ్య ఎర్ర జెండాల నీడలో, చేతులలో ప్లకార్డులతో  ఊరేగింపు కదులుతోంది.

‘భూటకపు ఎన్ కౌంటర్లు నశించాలి’

‘హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి’

అతడి పక్కనే కదులుతోన్న ఊరేగింపులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు –

‘ఇంజనీరింగ్ చదివే పిల్లలు … పేద ప్రజల పట్ల ఎంత కరుణా, ప్రేమా లేకపోతే బంగారం లాంటి జీవితాలని వొదులుకుని అట్లా అడవుల్లోకి వెళ్ళిపోతారు?’

అతడిని ఆ మాటలు కాసేపు సిగ్గు పడేలా చేసాయి.

తను … తన వాళ్ళు … తన బాధలు  … తన వాళ్ళ బాధలు …. ఈ కలుగు నుండి ఎప్పుడైనా బయటపడ్డాడా తను? మరి, ఆ యువకులు ? …. తమకు ఏమీ కాని పేద వాళ్ళ కోసం, గెలుస్తామన్న నమ్మకం ఇసుమంతైనా లేని యుద్ధం లోకి దూకి ప్రాణాలని తృణ ప్రాయంగా వొదిలి వేసారు.

జీవితమంటే ఇతరుల కోసం జీవించేదేనా ?

‘జీవితమంటే తెలిసిందా నీకు …. తెలిసిందా నీకు ? … హ్హ హ్హ హ్హ …. నాకు తెలిసింది …. నాకు తెలిసింది …. ఇదిగో ఈ గుప్పిట్లో దాచేసాను … హ్హ హ్హ హ్హ’

ఆర్ టి సి చౌరస్తా దగ్గర పడేసరికి, మూసిన గుప్పిలి చూపిస్తూ, నిన్న హటాత్తుగా తన స్కూటర్ కు అడ్డంగా వచ్చి ప్రశ్న వేసిన పిచ్చివాడు జ్ఞాపకం వచ్చాడు అతడికి.

ఇవాళ మళ్ళీ కనిపిస్తాడా ?

కనిపిస్తే బాగుండు …. ఆ గుప్పిట్లో ఏం దాచిపెట్టి, జీవితమంటే తెలిసిందని అంత ఆనందంగా  ప్రకటించాడు వాడు?  వాడిని కొంచెం మంచి చేసుకుని మాటల్లో పెట్టి తెలుసుకోవాలి! పిచ్చివాళ్ళు మహా మొండిగా ఉంటారని అంటారు – వాడు గుప్పిలి తెరిచి చూపిస్తాడంటావా ?

అయినా, పిచ్చి వాడి మాటలకు అర్థాలు వుంటాయా ?

ఇక్కడ జీవితాలకే అర్థం లేకుండా పోతోంది ….. అంటే, జీవితానికి అర్థం ఉంటుందా ? … ఉండాలనే నియమం ఏదైనా వుందా ?

ఆలోచనల నడుమ ఆర్ టి సి చౌరస్తా సిగ్నల్స్ దగ్గర ఆగాడు అతడు.

చుట్టూ చూసాడు – ఆ పిచ్చివాడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని. ఊహూ … కనిపించలేదు. అయినా, ఫలానా టైంకి, ఫలానా చోటులో వుండాలనే కాలనియమం పాటించడానికి వాడేమైనా మామూలు మనిషా?

‘సర్ … నిన్న సాయంత్రం ఇక్కడ ఒక పిచ్చివాడు వుండాలి ‘ మాటల్ని కూడబలుక్కుంటూ పక్కన నిలబడి వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని అడిగాడు అతడు.

‘ఏమైతడు నీకు? అట్ల రోడ్ల మీద వొదిలేసి పోతే ఎట్ల?’

‘అయ్యో …. అతడు నాకేం కాడు …. నాకేం కాడు’ తత్తర తత్తరగా అన్నాడు.

కానిస్టేబుల్ అతడిని తేరిపార చూసాడు.

అప్పుడే గ్రీన్ బల్బు వెలగడంతో ఇక కానిస్టేబుల్ మొహం చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు.

సుదర్శన్ టాకీస్ లో ఎవరో స్టార్ హీరో కొత్త సినిమా విడుదల ఉన్నట్టుంది. టాకీసు ముందు అభిమానుల కోలాహలం! ….అభిమాన హీరో సినిమా మొదటి రోజు, మొదటి ఆట చూడకపోతే జీవితానికి అర్థం లేదనుకునే జనం …. ఒక వేళ టికెట్ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడని సాహసులు!

అశోక్ నగర్ చౌరస్తా దాటి ఇందిరా పార్కు దగ్గరికి వచ్చేసరికి ఒక చోట జనం మూగి వున్నారు. గుంపు ముందర ఆర్ టీ సి బస్సు ఆగి వుంది.

ఎప్పట్లాగే, ఏమీ పట్టనట్టుగా ముందుకు సాగిపోతూ వుండగా పక్కన ఎవరిదో మాట వినిపించింది -‘ఎవరో పిచ్చివాడు …. బస్సుకు అడ్డంగా వెళ్లి, దాని కిందపడి చచ్చి పోయాడు’

స్కూటర్ సడెన్ బ్రేక్ వేసి, కొంచెం దూరంగా పార్క్ చేసి, గుంపుని చేరుకున్నాడు అతడు. గుంపులోకి దూరి, ఒకరిద్దరిని బలవంతంగా పక్కకు జరిపి రక్తం మడుగులో పడి వున్న పిచ్చివాడిని చూడగానే కొన్ని సెకన్ల పాటు అతడి ఒళ్ళు జలదరించింది.

రోడ్డు పైన నిర్జీవంగా పడి వున్న పిచ్చి వాడిని పరికించి చూసాడు.

ఏదో గొప్ప అలౌకిక ఆనంద స్థితిలో మరణించినట్లుగా వాడి పెదవుల పైన ఇంకా మెరుస్తోన్న నవ్వు! సరిగ్గా నిన్న సాయంత్రం అతడి స్కూటర్ కి అడ్డంగా వచ్చి, ‘జీవితమంటే నాకు తెలిసింది’ అని గొప్ప సంతోషంతో ప్రకటించినప్పుడు అతడి కళ్ళల్లో, పెదవుల పైన కన్పించిన మెరుపు నవ్వు లాంటి నవ్వు !

అతడు, అప్రయత్నంగా నిర్జీవంగా వెల్లకిలా పడి వున్న పిచ్చివాడి అరచేతుల వైపు చూసాడు.

అరచేతులు రెండూ తెరుచుకుని, ఆకాశం వైపు చూస్తున్నాయి.

మనసు వికలమై, అతడు గుంపులో నుండి బైటకు వచ్చాడు.

‘నారాయణగూడా సెంటర్ లో పెద్ద బట్టల దుకాణం వుండేది ఈ పిచ్చాయనకి … వ్యాపారంలో కొడుకే మోసం చేసే సరికి తట్టుకోలేక ఇట్ల అయిపోయిండు’ అక్కడ చేరిన వాళ్ళలో ఒకరు, మిగతా వాళ్లకు చెబుతున్నారు.

‘ఏముంటే మాత్రం ఏమున్నది బిడ్డా … పోయేటప్పుడు సంపాయించిన పైసలొస్తయా …. రక్తం పంచుకున్న బిడ్డలస్తరా?’  ముసలమ్మ ఒకావిడ అంటోంది!

అతడికి ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు. ఫోను చేసి చెప్పాడు రావడం లేదని.

స్కూటర్ వెనక్కి తిప్పి ఇంటి దారి పట్టాడు.

ఇంటికి చేరుకొని, గబ గబా బెడ్ రూమ్ లోకి చేరుకొని మంచం పైన వాలిపోయాడు.

‘ఏమయింది ఈ మనిషికి ఇవాళ ‘ అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది అతడి భార్య.

‘ ఆఫీస్ కు వెళ్ళ లేదా? ఏమైనా ప్రాబ్లంగా ఉందా ఒంట్లో?’

‘నో ప్రాబ్లం … ఐ యాం ఆల్ రైట్’ అంటూ తెరిచి వున్న కిటికీ వైపు చూసాడు అతడు. పొద్దున్న కన్పించిన మందార పువ్వు లేదక్కడ!

‘ఈ కుండీలో పొద్దున్న మందార పువ్వొకటి వుండాలి ‘ భార్యను అడిగాడు

‘ఓ అదా … పక్కింటి వాళ్ళ ఇంట్లో దేవుడి పూజ ఏదో వుందని కోసుకు పోయారు. హ్మ్ …. అయినా ఎప్పుడూ లేనిది ఇంట్లో కుండీలలో పూసే పూవుల గురించి అడుగుతున్నావు … ఒంట్లో బాగానే ఉందా అని అడిగితే నో ప్రాబ్లం అంటున్నావు’ కొంచెం కంగారుగా అడిగింది

.

* * * * *

 

                     

        

 

 

సామాన్యుడే నా సిటీ, నా పీపుల్, నా స్టడీ: రమేష్

 

 

అవును. ఈ ప్రపంచాన్ని సన్నిహితంగా దర్శించడానికి ఒక కన్నుచాలు.

లేదా ఒక సామాన్యుడి జీవన సాఫల్యాన్ని గమనించినా ఈ ప్రపంచ రీతి అర్థమగును.
ఛాయ మిత్రులు జనవరి మూడో తేదీన ఏర్పాటు చేస్తున్న “నేను వదులుకున్న పాఠాలు” కార్యక్రమం సందర్భంగా కందుకూరి రమేష్ బాబుతో  మోహన్ బాబు, అనిల్ బత్తుల ముఖాముఖి
ఇంట్రో…
కందుకూరి రమేష్ బాబు  కేవలం ఒక రచయిత అనుకుంటే  అతని  ఇంకా  అనేక  సగాలు  ఫక్కున  నవ్వుతాయి. పోనీ, కేవలం  ఫోటోగ్రాఫర్  అనుకుంటే  అసలు అతన్ని  గురించి మనకేమీ తెలియదనే! తనకి  తానే  ఒక  అందమైన  వలయం రమేష్. ఈ  వలయంలో  రమేష్  అనేక  పాత్రలుగా కనిపిస్తాడు, గిర్రు  గిర్రున తిరుగుతూ- చాలా సార్లు అతనొక  అబ్బురం! భిన్న అభిరుచుల  సంబురం!   
పాఠకులకు తెలుసు, ‘దృశ్యాదృశ్యం’తో కందుకూరి రమేష్ బాబు సంభాషించే విధానం. అలాగే ‘సామాన్యశాస్తం’ పేరుతో రమేష్  రచించిన పుస్తకాలూ చాలామందికి తెలుసు. తొలి పుస్తకం ‘కోళ్ల మంగారం మరికొందరు’. మలి పుస్తకం ‘గణితం అతడి వేళ్ల మీది సంగీతం’. ఆ ఒరవడిలో  పన్నెండు పుస్తకాలు రచించి ప్రచురించాడు. ఇటీవలే మొన్నటి బుక్ ఫేర్ లో ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం విడుదల చేశాడు. ‘శిఖరాలుగా ఎదగడం కాదు, మైదానాలుగా విస్తరించడం ఇందులోని ఇతివృత్తం’ అంటాడు. అయితే, తాను ఐదేళ్ల తర్వాత ఈ పుస్తకం తెచ్చాడుగానీ, ఇటీవలి కాలంలో సోషల్ మీడియంలో తాను ఫొటోగ్రాఫర్ గానూ సుపరిచితుడు. మరి ఆ రచయిత, ఫొటోగ్రాఫర్ తో ఈ ఆదివారం సాయంత్రం ‘ఛాయ’ తన ఎనిమిదవ నెలవారీ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో తన ప్రసంగాంశం’ నేను వదులుకున్న పాఠాలు.’  ఈ సందర్భంగా ఈ ముఖాముఖి సారంగకు పాఠకులకు ప్రత్యేకం.
 రచన, ఫొటొగ్రఫి, జర్నలిజం – మిమ్మల్ని వీటి వైపు నడిపించిన నేపధ్యం ఏమిటి? కళల వైపు పడిన మొదటి అడుగుల గురించి చెప్పండి?
 
– స్కూల్లో నేవూరి రాజిరెడ్డి సార్ “బళ్లున తెల్లారింది…పిల్లల్లారా లేవండి” అన్న మాట కవిత్వం అని నాకప్పుడు తెలియదు. శ్రీనివాసా చారి సార్ తెలుగు పాఠాలు చెబుతూ, మధ్యలో “నిన్నటిదాకా శిలనైనా’ అన్న పాట పాడుతున్నప్పుడు కూడా నాకు తెలియదు, అది సాహిత్యం అని. ఎం.ఎ. చదివే రోజుల్లో కూడా నాకు మిల్టన్ గుడ్డివాడనే తెలుసుగానీ, ప్యారడైజ్ లాస్ట్ రాసినవాడే మళ్లీ ప్యారడైజ్ రిగేయిన్డ్ కూడా రాసిన చూపున్నవాడని తెలియదు. ఇదంతా సాహిత్యం అని అంతగా తెలియదు. శిష్టా లక్ష్మీనారాయణ అన్న మా ఫ్రొఫెసర్ ‘మెగలో మానియా’ గురించి చెప్పేవాడు. డాక్టర్ ఫాస్టస్ గురించి వివరించేవాడు. ఆయన చెబుతుంటే ఊగిపోయేవాడు. కానీ, తర్వాత తెలిసింది, ఇతడు చెబుతున్నది మార్లో సాహిత్యం గురించే తప్ప ఇతడు స్వయంగా సాహిత్యం కాదని. అట్లా కవులు, కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లు…నాకు జీవితంలో ఎంతోమంది ఎదురయ్యారు. లేదా నేనే ఎదురెళ్లాను వాళ్లకు. కానీ, వాళ్లు మామూలు మనుషులు. మరొకరి అసామాన్యతో వీళ్లు మాన్యులుగా కనిపించేవారే తప్ప వాళ్లు వాళ్లు కానేకాదు.  కొందరు నిజంగా తామే సాహిత్యం అని భ్రమించేవారు ఉన్నారు. తామే ఫొటోగ్రఫీ అని గర్వించేవాళ్లూ ఉన్నారు. వీళ్లను, వాళ్ల వివిధాలనూ చూస్తుంటే రచన, ఫొటోగ్రఫి వైపు నేను నిదానంగా వేసిన అడుగులు సాహిత్యం వైపు కాదు, నిజ జీవితం వైపనిపిస్తోంది. సాహిత్యం పేరుతో చెలామణి అయ్యే మనుషుల్లోని డొల్లతనం నుంచి తప్పించుకుని అమిత శ్రద్ధతో నేను సహజ  మానవులను కలిశానని! తమ పాట తాము పాడుకునే చిల్లర దేవుళ్లను పూజించడం నేర్చుకున్నానని! అందులో భాగంగానే నేను ఫిక్షన్ కాకుండా  నాన్  ఫిక్షన్ రచయితగా మిగిలి బతికి పోయాను. లేకపోతే గొప్ప రచయితనై ఇప్పటికే మరణించేవాడిని. కళల వైపు నడవకుండా జీవకళ దగ్గరే ఆగి, అదే సత్యం, శివం, సుందరం అని నమ్మి, మామూలు ఫొటోగ్రాఫర్ ని అయ్యాను గానీ  లేకపోతే మహా గొప్ప ఫొటోగ్రాఫర్ ని అయి, నా చుట్టుముట్టున్నవాళ్లలో ఒకడినై విర్రవీగేవాడిని. ధాంక్స్ టు మై నాన్న, అమ్మా. వాళ్లు నా తులసికోట. భూమండలం అంతా తిరిగి ఇంట్లోనే వెతుక్కున్న సామాన్యతే నా కళకు జీవనాధారం.
నిజం.
ఒక్క మాటలో నేను నడిచింది మనిషి దగ్గరకు. నేనే రచించి చేరింది, వాస్తవికత దగ్గరకు. నేను ప్రతిబింబించింది సహజ జీవన చందస్సును. జీవన వ్యాకరణం చెంతకు.  ఇంతకన్నా ఏమీ లేదు. అయితే నేను సూక్ష్మ దర్శినిని. ప్రపంచాన్ని దర్శించడానికి రెండు కళ్లు అక్కర్లేదని తెలుసుకున్న వ్యూ ఫైండర్ ని. ఇక, మొన్న తెచ్చిన “మీరు సామాన్యులు కావడం ఎలా?” అన్న పుస్తకం వాస్తవిత నుంచి సత్యం వైపు తీసుకొచ్చిన నా తొట్టతొలి పుస్తకం. దీంట్లో నేను జీవితాన్నే కల్పనగా గ్రహించి రచించి సామాన్యత తాలూకు తాత్వికతను విభూతిగా ధరించి జేబులో పెన్నూ, భుజానికి కన్నూతో హాయిగా బతుకుతున్న క్షణాన్ని.
my portriat (1)
మీ బాల్యం గురించి చెప్పండి?
రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్

రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్

ఇప్పటికీ బాల్యంలోనే ఉన్నాను. చిన్నప్పుడు  మమ్మల్ని అన్నం తినకపోతే భయపెట్టడానికి చాకలి తొంట మల్లయ్యను పిలిచేవారు. పెద్ద పెద్ద మీసాలతో కనిపించే ఆయన నా దృష్టిపథంలో ముద్రపడిన మొదటి ఫొటో. తొలి ఛాయ. తర్వాత మళ్లీ అలాంటి ఛాయలను నేను ఎన్నో తీశాను. ఆయన్ని తప్ప. చిత్రమేమిటంటే నేను పేర్లను, వ్యక్తులను చిత్రించను. మనుషులను చిత్రిస్తాను. ఒక రకంగా మానవులను చిత్రిస్తాను. ఒక భయపెట్టే మనిషి నాలో ముద్ర పడ్డాక భయాన్ని ఆ మనుషుల్లో చిత్రిస్తాను. ఆనందపరిచే ఈస్తటిక్స్ ఉంటే ఆ ఆనంద సౌరభాన్ని చిత్రీకరిస్తూ పో్తాను. అందాన్ని, ఆనందాన్ని అభిమానాన్ని, ప్రేమను, వయ్యారాన్ని అన్నింటినీ, నలుపును విస్మరించి తెలుపును చిత్రిస్తూ ఉంటాను. ఒక రకంగా  బ్రైటర్ సైడ్ ను చిత్రీస్తూ ఉంటాను. డెత్ ను కూడా చేస్తాను.  మనిషి శ్వాసించే అంతిమ శ్వాస మృత్యువు. దాన్ని కూడా అందంగా చిత్రిస్తాను. అసలుకు నాకు నెగటివ్ అంటే పాజిటివ్ కు భూమిక అన్న ఎరుక చిన్నప్పటినుంచే ఉంది. ఎందుకంటే మా నాన్న ఫొటోగ్రాఫర్. మా చెల్లెండ్ల పేర్లమీద స్వాతి, జ్యోతి ఫొటో స్టూడియోలు ఉండేవి. ఇల్లే మాకు  చిత్రాలయం. నేను బాలకార్మికుడిని అంటే ద్వేషిస్తాను. బాల కళాకారుడిని. మా ఇల్లే నాకు తొలి స్టూడియో. ప్రపంచం మలి స్టూడియో. నాకు డూమ్స్ సూర్యుడే. నాకు అంబరిల్లాలు ఆకాశం పరుస్తుంది.

ఫొటోలు కడగడం అన్నది నాకు వచ్చు. కెమెకల్ స్వయంగా తయారు చేసుకోవడం తెలిసిన వాడిని. మల్లెసారే మాకు డార్క్ రూమ్. 120, 35ఎం.ఎం. రీళ్లను డెవలప్ చేసి, ప్రింట్లు వేసి డెలివరీ చేసిన దశాబ్దాల అనుభవం మాది. దాంతో నెగటివ్ అంటే నాకు నలపు కాదు, తెలుపు. పాజిటివ్ అంటే తెలపు కాదు, నలుపు. అందువల్లే తెల్ల కాగితంపై నల్ల అక్షరం ఎలాగో లస్టర్, గ్లాసీ పేపర్ పై ఫొటో ప్రింట్ అలాగా. నా దుస్తుల్లోకీ ఆ నలుపు తెలుపులు వచ్చాయంటే అది సహజాతం  ఎప్పుడూ చెప్పలేదుగానీ, నేను కవి, చిత్రకారుడిని కాకముందే ఫొటోగ్రాఫర్ ని. తర్వాత పాత్రికేయ రచయితను. అటు పిమ్మట తిరిగి ఫొటోగ్రాఫర్ ని . తిరిగి తిరిగి జీవితం ఒక్క చోటుకే వస్తుందని సూర్యోదయం చంద్రోదయం తెలిపినట్లు నేను తొలి గురువుల దగ్గరే మళ్లీ వికసించాను. అమ్మా…నాన్న. తర్వాత మిగతా వాళ్లు. అయితే, నేను పని చేయలేదు. ఏదీ భారం కాలేదు నాకు. దీనర్థం  జీవితం పని చేసిందని!. గడిపిన జీవితం వల్ల దుస్తులు మారుతాయి తప్పా కొంటే వచ్చేవి కాదు. అందుకే నేనొక నలుపూ తెలుపూ. అదీ సంగతండీ.
సరే,  ఇక నేను నడవడం అన్నారు. నా దృష్టిలో మనల్ని నడిపించడం అంటూ ఏదీ వుండదు. మనం నడవడమూ వుండదు. నడకలో నడకైతాము. ఒక యూనిట్ విశ్వాన్ని నిర్ణయించదు. ఎవరైనా విశ్వంలో అంశం అవుతాం. నేను సోల్ ఆఫ్ ది యూనివర్స్ అన్న మాట వాడటానికి ఇష్టపడతాను. నాది కళ కూడా కాదు, క్షణం. కళ శాశ్వతమైంది. నేను క్షణభంగురమైన జీవితం గురించి ఆలోచిస్తాను. వాటికి శాశ్వతత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శాశ్వతమైన వాటిని క్షణికం చేసే పనిలో కొందరుంటారు. ఆ పని నాకు రాదు. దైనందినాన్ని శాశ్వతం చేసుకునే సామాన్యుడే నా సిటీ. నా పీపుల్. నా స్టడీ.
తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.

తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.

అయితే, ఒక మాట. రచన, పాత్రికేయం రెండూ ఒకటే. పాత్రికేయం చరిత్రకు చిత్తు ప్రతి అనుకుంటే ఛాయా చిత్రణం అన్నది చరిత్రకు చిత్తరువు. పాత్రికేయం కన్నా రచన గొప్పదనుకునేవారుంటారు. కానీ, అన్ని రచనలూ ఇప్పడు పాత్రికేయంలో్కి ఒదిగిపోయి చాలా ఏళ్లయింది. అయితే మొత్తంగా రచన చరిత్రకు కోరస్. అందులో నువ్వూ నేనూ ఉన్నామనుకుంటాం కానీ, వుండం. అదృశ్యం అయిపోతాం.అందుకే దృశ్యాదృశ్యం రాస్తున్నాను సారంగలో.
మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటాను. ఉన్నది వేరొకటి. అయినా దృశ్యాదృశ్యంగా ఒకరికొకరం దగ్గరవుతూ దూరం అవుతాం. కావాలి కూడా.
 అయితే, ఫొటోగ్రఫి అన్నది కూడా రచనే. కాంతి రచనం.  అంతిమంగా ప్రతిబింబించడం అన్న సార్వజనీన లక్షణం నా ఇతివృత్తం. ఎలా జరిగిందో తెలియదు. కానీ, వీటన్నిటికీ మూలం మా నాన్న.  తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ టీచర్ గా కాకుండా బోధించడం కన్నా తెలియజేయడం, చూపడం, ప్రతిబింబించడం ప్రధానంగా పనిచేయడం వల్ల నాకు ఇంట్లోనే మాస్టర్ లభించాడు. ఆయన అద్భుతమైన ఫొటోగ్రాఫర్. ఎక్కడా కరెక్షన్ లేని మనిషి. ఎక్కడా పింక్, టచింగ్ చేయని మనిషి. యాజ్ ఇట్ ఈజ్ అన్నది తననుంచే నేను అందిపుచ్చుకున్నాను. అందువల్ల రచన, ఛాయా చిత్రలేఖనం నాకు మా ఇంట్లోనే మా నాన్న దగ్గర మా సొంత ఫొటో స్టూడియోల్లోంచే రూపొందిందని, నేను ఇంట గెలవడం అన్నది జరిగాకే బయట ఓడిపోవడం జరుగుతూ ఉందనీ అర్థం అవుతూ ఉన్నది నాలో నాకు.  అవును మరి. గ్రహించింది బయట ప్రాక్టీస్ చేయకపోవడం ఓటమి. నేను వదులుకున్న పాఠాలూ అన్నది కూడా ఇందుకే. బయట విజయాలు వదులుకుంటూ చిన్నప్పటినుంచీ సాధన చేసింది మళ్లీ ఒంటబట్టించుకుంటూ విస్తరిస్తున్నాను. ఆ మేరకు నేను నెగటివ్. పాజిటివ్ అర్థంలో. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలంగాణలో పెరగడం అన్నా అంతే కదా. ఇంటికి రావడం. మళ్లీ వికసించడం.
 సామాన్యశాస్త్రం పేరుతో మీరు చేస్తున్నరచనల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వీటిని రాయడానికి ప్రేరేపించిన అంశాలేమిటి?
 
– ‘ఈ జగత్తులో బతికిన మనుషులందరిపై ఒక లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయ వ్యాసం తప్పక ఉండాలి’ అన్న మాట ఒకానొక రోజు తట్టింది నాకు. పని మొదలు పెట్టాను. పరిచయ పత్రాలు రాశాను. విస్తరించి నవలల వంటివీ రాశాను. పన్నెండు పుస్తకాలు తెచ్చాను. ఇందులో ఉద్దేశ్యం ఏమీ లేదు. విరుద్దేశమే. ఏ ఉద్దేశంతో మిగతా వారు రాశారో అందులో సామాన్యుడు మిస్ అయ్యాడు. దరిద్రుడిగా, అభాగ్యుడిగా, అధో జగత్ సహోదరుడిగా కనిపించాడేగానీ సృజనశీలుడిగా, భాగ్యవంతుడిగా జవజీవాలతో సెలబ్రేట్ కాలేదు. జీవితం సమరంగా భావించి వచ్చిన రచనలేగానీ జీవితం సంబురంగా ఉందన్న మాట చెప్పిన సామాన్య రచయితలు లేకుండా పోయారు. అప్పుడనిపించింది. ఇది నా పని అని!
పిచ్చి పట్టినట్టు చేశాను ఓ పదేళ్లు. తర్వాత తెలంగాణ. అందులో బాధ్యత ఎరిగిన యువకుడిగా పనిచేశాను. బావుంది. ఇప్పుడు వ్యక్తమవుతున్నాను. సామాన్యంగా.
అయితే, పెద్దలను కలవడం మానేశాను మెలమెల్లగా. నేను నిర్వ్యాపారంగా  కనిపించే జీవన వ్యాపారానికి దగ్గరగా జీవించడం మొదలెట్టాను. సామాన్యావతారం ఈ యుగం లక్షణం అని ముందే గ్రహించి నిశ్శబ్దంగా నా పని చేసుకుంటూ వెళ్లడం ప్రారంభించాను.  ఈ యుగం శ్రీశ్రీ ది కాదు. సామాన్యుడిదని ఏ విప్లవాన్ని గ్రహించినా తేలిగ్గా అర్థమౌతుంది.
నాకూ అర్థమైంది. విప్లవించే శక్తులైనా, క్యాపిటల్  శక్తులైనా పిడికెడు. వీళ్లు నాయకత్వపు లౌల్యానికి గురైతుండగా సునాయాసంగా విప్లవాన్ని చేసే శక్తి సామాన్యులకు ఉంది. వారిని చైతన్యం చేయబూనడం కరక్టు కాదు. వారి చైతన్యానికి స్పందించే లక్షణం ప్రకృతికి ఉంది. ఆ పని జరిగిపోతూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన. అందరూ సామాన్యులై సకల జనులూ సాదించలేదా?సాధించాక ఎలా జరిగిందో అని వారే మళ్లీ  ముక్కుమీద వేలు వేసుకోలేదా? అది ఒక పాట వంటి సామాన్యత సాధించిన విశేషం. లాలిపాట వంటి తల్లి మహత్యం.
 ఇంతకీ  సామాన్యుడంటే మీ దృష్టిలో ఎవరు? 
– ఎవరైతే తనను తాను ప్రదర్శనకు పెట్టుకోడో అతడు. మరెవరైతే అజ్ఞాతంగా కాదు, అదృశ్యంగా ఉంటాడో వాడు. వాడు. ఆ వాడు ఏకవచనం. తాను మట్టిలో పరిమళం. గాలిలో స్పర్శ. నీటిలో రుచి. ఆకాశంలో శబ్దం. నిప్పులో ఆకలి. పంచభూతం. తాను సర్యాంతర్యామి. అడవిలో ఉంటాడు. మైదానంలో ఉంటాడు. రాజు వాడే, పేద వాడే. వర్గం కాదు. వర్ణం కాదు, లింగం కాదు. మనిషి. సామాన్యుడు. అసాధన తన తత్వం. అర్థం కావాలంటే ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ చదవండి.
హక్కుల గురించి మాట్లాడేవాడు కాదు, బాధ్యత గురించి మాట్లాడేవాడు సామాన్యుడు.
 మీరు సామాన్యులు కావడం ఎలా? అన్న తాజా పుస్తకంలో మీరేం చెప్పారు?
–  నిజానికి చెప్పలేదు. చూపాను. గుర్తు చేశాను. మీ జీవితాలు మీరు గడపడం ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలోచించుకోమని మననం చేశాను.  మీరు గాయకులు కావడమో లేదా శ్రోత కావడమో కాదు, మీరు స్వయంగా పాట అన్న విషయాన్ని గుర్తు చేశాను. ఆ గుర్తు చేయడం అన్నది సామాన్యంగా చేయలేదు. ఒక పాటను కంపోజ్ చేసినట్లు చేశాను. హృదయం ఉన్న వాళ్లకు నా పుస్తకం ఒక గీతాంజలి. బుద్దిగల వాళ్లకు ఫౌంటెన్ హెడ్. విప్లవశక్తులకు కమ్యూనిస్టు  మ్యానిఫెస్టో. దళిత బహుజనులకు అంబేద్కర్ పూలే. ఇవేవీ చదవని వాళ్లకు సామాన్యశాస్త్రం.
 సామాన్యులను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని శ్వాసించిన నేపథ్యంలో మీరేదైనా నవల రాస్తే బాగుంటుందేమో కదా?
– నాకు వేరే ఉద్దేశ్యాలున్నాయి. వార్తలు, సంఘటనలు, విశేషాలు, విశ్లేషణలు, చరిత్రాక ఘట్టాలపై నాకు ఆసక్తి లేదు. అందులో నేనుంటాను. కానీ, నేను చరిత్రను రచించను. ఆ దరిదాపుల్లోకి వెళ్లను. ఎందుకంటే, నాకు పండు కన్నా రసం ఇష్టం. అది బాగుందని చెప్పడం కన్నా ఆరగించి ఆస్వాదించడం ఇష్టం. నేను సామాన్యుడిని.
ఒక సామాన్య రచయితగా,  ఏది చదివితే ఇక మరొకటి చదవనక్కర్లేదో అది చెప్పడానికి నేను యోచిస్తుంటాను. సూక్ష్మంలో మోక్షం లభించే అంశాల గురించి ఆలోచిస్తాను. నా రచన చదివితే మీరు దూరపు కొండల నునుపు కాలికింది కంకరలో కనపడేలా చేస్తాను. దైనందినంలో ఎంత వైశాల్యముందో, లౌకికంలో ఎంత అలౌకికం ఉందో తెలియజెబుతాను. అంతేగానీ, వర్తమానాన్ని చూపడానికో గతాన్ని గుర్తు చేయడానికో, భవిష్యత్తును తీర్చిదిద్దడానికో కాదు. కాలం గురించిన స్పహ లేకుండానే కాలం చేసే మనిషిలా నా రచన సర్వసామాన్యంగా ఉండాలని ఎవరి దిష్టీ తాకకూడదని భావిస్తాను. అందుకే నా పన్నెండు పుస్తకాలూ సామాన్యులకు తప్పా ప్రసిద్దులకు చేర్చలేదు. పద్దెనిమిదేళ్ల ప్రయాణంలో ఒక పుష్కర కాలం శ్రద్దతో కూడిన సామాన్యశాస్త్రం వ్యాసంగానంతరం ఒకడొచ్చాడు. నీ పుస్తకం నేను వేస్తాను అని వచ్చాడు. వాడు క్రాంతి. అతడికి తెలిసింది, ఇది ఇవ్వాళ్టి పుస్తకం అని. అవసరం అని. ఇచ్చాను. ఇక ముందు నేను ఎక్కువ రాయాల్సిన పనిలేదు. రాసిందంతా బయటకు వస్తే చాలు. నిజం.
అయితే, నవల. అవును, కల్పనాత్మక నవల. దానికన్నా జీవితం కల్పనగా కానవచ్చే మానవ ఇతిహాసం నాకిష్టం.  ‘మీరు సామాన్యులు కావడం ఎలా? ‘ చదివారా? మూడుసార్లు చదవాలని మిత్రులు చెప్పారు. మూడు సార్లయినా కంట తడిపెట్టించిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆ పుస్తకం వందలాది మంది చేతుల్లోకి వెళ్లింది. రాత్రుల్లు వారు మేలుకుని జీవితంలోకి తొంగి చూస్తున్నారు. మెసేజ్ లుకాదు, మనుషులు వచ్చి కలుస్తున్నారు, సామాన్యంగా.
ఇలా రచనలైతే, నా ప్రయాణంలో బతికిన క్షణాలను నిక్షిప్తం చేయడం నా ఛాయా చిత్రణం. అదీ కల్పనే. నమ్మలేని గ్రామీణ జీవన జానపద ఔపోసనం నా ఛాయలు. సిటీలోనే తీస్తారా అని అడుగుతారు. తీస్తాను. ఇదంతా తెలంగాణ కాదా? నేనెక్కడికైనా పోయానా? ఇదంతా నవల కాదా? కొత్తగా లేదా? చూస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు గిర్రున తిరగడం లేదు?
మీరు సంప్రదాయ ప్రశ్నలు మానేయాలి. సమాధానాలు పురాతనంగా ఉంటాయి. ఒక మనోఫలకంపై ముద్రించిన ఛాయలా. నా ఛాయలు అవే. అందుకే ఒప్పుకున్నాను, ఛాయ నిర్వహించే సమావేశం నా జీవనఛాయలపై అంతే!
ramesh2
అయినా చెబుతాను. మరో మాటా పంచుకుంటాను. నిజానికి ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోని అంశం తెలంగాణ ఇరుసుగా జనించిందే. తెలంగాణ సమాజం అప్ వార్డ్ మొబిలిటీతో ఆక్రమిత దోపిడీకి గురై విలవిల్లాడి బయటపడ్డాకే ఈ బుక్కు వచ్చింది. ఒక రకంగా తెలంగాణ  సామాన్యతకు దగ్గరైనందువల్లే ఒక రాష్ట్రంగా ఏర్పడింది.  సకల జనుల కూడిక అంటే అదే. సాధారణాంశాలు, ప్రత్యేకాంశాలు ఒక ఈక్వలిబ్రియం లా ఒక్కచోటకు చేరడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అటు తర్వాత సాధారణత్వాన్ని, ప్రత్యేకాంశాలను ఈ స్థానిక జీవలాక్షాణికతతో వికసింపజేసుకోవాలి. ఆ పని పక్కకుపోతున్నదన్న భావంతోనే నేను ‘మీరు  సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. పొలిటికల్ సెన్స్ ఉన్న వారికి ఈ సంగతి తెలుస్తుంది. తెలియని వారికి నా పుస్తకం విజయానికి ఐదు మెట్లు వంటి పుస్తకాలకు భిన్నమైందని చదువుతారు. ఎలా అయినా నా ప్రయోజనం నెరవేరుతుంది. ఒక నావల్ ఎలిమెంట్ తో రాసిన పుస్తకం అది. విన్నవాళ్లకు విన్నంత పాట అది!
 ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్నది ఒక విత్తనమే.  వృక్షాన్ని విత్తాను, పుటల్లో. పుష్పాల్లోని సౌరభాన్ని అద్దాను అత్తరుగా. మై సిటీ మై పీపుల్ కూడా అంతే. అది మీ ముఖ పత్రం. ఫేస్ బుక్. పుటలు పుటలుగా మీరు వదులుకున్న బతికిన క్షణాలను నేను పరుస్తూ పోతాను, ఛాయలుగా, చిత్రాలుగా. అందుకే అవన్నీ నా ఫొటోలు కాదు. నేనూ ఫొటోగ్రాఫర్ నీ కాదు. అవన్నీ మీవైన జీవితాల్ని మీరు తీయలేనప్పటి ఫొటోగ్రాఫర్లు. మీవైన రచనల్ని మీరు చదవనప్పటి రైటర్లు.
అన్నట్టు, రచనల నుంచి మీ దృష్టి ఫొటోగ్రఫీ వైపు మళ్లడానికి బలమైన కారణాలే ఏమిటి?
–  నేను వేరేవాళ్ల రచనలు అచ్చువేసే పనిలో ఉన్నాను. ఉద్యోగరీత్యా అమిత శ్రద్దతో ‘బతుకమ్మ’ పత్రికను తీర్చిదిద్దాను. దాదాపు ఐదేళ్లుగా వేరే వాళ్ల రచనలు చదివి, అచ్చువేసే పనిలో నిమగ్నమయ్యాను. నన్ను ఫొటోగ్రఫిలో వుంచుకున్నాను. అదొక కారణం. అలాగే ఇంకో కారణం…అక్షరాస్యులు చాలా వాటిని చదవలేక పోతున్నారు. నిరక్షరాస్యులు చాలామంది అంధులవుతున్నారు. వారిద్దరి కళ్లూ తెరిపించాలని. నాతో సహా వారందరికీ మరింత అందమైన ప్రపంచాన్ని చూపాలని. మరింత విస్తారమైన జీవితాన్ని డైజెస్ట్ చేయించాలని. సూక్ష్మ నాళికలో జనజీవనాన్ని దాచి రాబోయే తరాలకు కానుకగా అందించాలని. ఒక మనిషి రెండు చేతులతో ఈ భూగోళాన్ని ఎత్తడం చాలా సులభం, భుజానికి కెమెరా వేసుకుని! నేను ఎత్తాను. మీకు తెలియదు. ఒక లక్షమంది మనుషులు నాతో సహజీవనం చేస్తున్నారు, మా ఇంట్లో. నా మూడు హార్డ్ డిస్కుల్లో. రేపటి తరానికి నా కానుక ఇది కనుకే ఇంత గట్టిగా సామాన్యంగా మాట్లాడటం. సామాన్యమే మరి.
అన్నింటికీ మించి, మనవల్ల ఈ ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే అంత మేలు చేయడానికి దేనికైనా వెనుకాడడు సామాన్యుడు. నేనూ సామాన్యుడినే. రచించి, చిత్రించి మిమ్మల్ని సామాన్యులను చేయడానికి నాకేదో వరం లభించినట్లుంది. అందుకే సామాన్యంగా ఉండవలసి వస్తోంది కూడా. అంటే మరేం లేదు. ఇతివృత్తం వదలకుండా అదే పనిలో నిరాటంకంగా ఉండటం.
 రఘురాయ్ తో కలిసి పనిచేయాలని మీకెందుకనిపించింది? 
– సామాన్యుల జీవితాలను అధ్యయనం చేసే సమయంలో నాకు  కొన్ని సమస్యలుండేవి. ఆయన వద్దకు వెళ్లి వాటిని తానెట్లా పరిష్కరించుకుంటారో అర్థం చేసుకున్నాను. ఈ దేశంలోని మనుషులను, స్థలాలను ఆయన దర్శించి చిత్రీకరించినంతగా మరెవరూ చేయలేదు. అంతేగాక సామాన్య మానవుడిని డిగ్నిటీతో చూపారాయన. అందువల్లే ఆయన్ని కలవాలనుకున్నాను, కలిశాను. ఒక రచన చేయాలనుకుని వెళ్లి తిరిగి ఫొటోగ్రాఫర్ ని కూడా అయ్యాను.
 రఘురాయ్ ని కలిశాక మీరొదులుకున్న పాఠాలేమిటి? అంతగా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి? 
– రఘురాయ్ గారిని కలిశాక నేను సామాన్యశాస్త్రం రచనలు చేయలేదు. ఐదేళ్లుగా నేను పుస్తకం ప్రచురించలేదు. మొన్ననే ఆయన బర్త్ డే మరునాడే అంటే డిసెంబర్ 19 న ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. కారణం ఏమిటంటే, ఆయన నా దృక్పథాన్ని సాపు చేశాడు. నా వైకల్యాన్ని సవరించాడు. ఫొటోగ్రఫి అంటే ఒక కెమెరా పనితనం కాదని చూపించాడు. ఒక వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్ కాకుండా మీరు ఉత్తమ రచయితా, ఫొటోగ్రాఫర్ కాలేమన్న సత్యాన్ని అవగతం చేశాడు. చిత్రమేమిటంటే నేను అదే.అద్భుతాన్ని. కానీ, వేరొకరి జీవితాలను రచించి చూపించడంలో సామాన్యతను కోల్పోయాను. ఆయన్ని కలిశాక అసలు సిసలు సామాన్యుడెవరో తెలిసింది. కార్యక్రమంలో లేనివాడు సామాన్యుడని అవగతం అయింది. నేను కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను. జీవించడం, ప్రతిబింబించడం. ఇంతే చేశాను. అందుకోసం నన్ను నేను చేరుకోవడానికి వేయిట్ చేశాను. ఆయన పుస్తకం రచన ఆపి మరీ ఆ పని చేశాను. ఐదేళ్లవుతోంది. ఈ క్రమంలో నన్ను నేను వదులుకున్నాను. ఒక బ్రాండ్ కు లొంగిపోకుండా నిలబడాలీ అనుకున్నాను. నాకు నేను బానిసను కాదల్చుకోలేదు. అన్నిటికన్నా మిన్నఅది ఎంత బాగున్నప్పటికీ వేరే వాళ్ల జీవితాలు గడపడం వదులకున్నాను. దీన్ని విడమర్చిచెప్పవలసి ఉందిగానీ, అది ఆదివారం రోజున ‘నేను వదులుకున్న పాఠాలు’ అన్న అంశంలో కొంచెం విడమరచి చెబుతాను. నిజానికి ఈ అంశాల సారాంశమే మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోనూ చర్చించాను.
రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం

రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం

 రఘురాయ్ తో మీరు పంచుకున్న కొన్ని మధురానుభూతుల్ని చెప్పగలరా? 
– లేదు. అవి చాలా విశిష్టమైనవి. వాటిని రాసి చూపిస్తాను. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భరతమాత ముద్దుబిడ్డ తనను తాను ఎంతగా అంకితమొనర్చి ఈ దేశాన్ని, ఇక్కడి స్థలాలను, మనుషులను పక్కపక్కనే…శతాబ్దాలకు శతాబ్దాలు నివసిస్తున్న  లౌకిక జీవన జన గణనని అపూర్వ పుస్తకంగా రచించి పంచుకుంటాను. అంతదాకా ఆయన్ని నాలో పొదగనీయండి. ఒక అందమైన అనుభవంలో ఉన్నాను. ఐదేళ్లయినా ఆసక్తి పోలేదంటే తప్పకుండా వారి పుస్తకం మీకు అందించడం ఖాయం. అయితే ఒకటి చెబుతాను. ఫొటోగ్రఫి ఈజ్ నాట్ ఫర్ ఆల్ ఫొటోగ్రాఫర్స్ అన్నారాయన. ఇంకో అద్భుతమైన సామాన్యతను చెప్పారాయన. జీవితం నువ్వు ఊహించని ఫలాన్ని ఇస్తుంది. నీకు ఫలానా కావాలనే ఉంటే నువ్వు చాలా మిస్ అవుతావు బాబూ అన్నాడు. నేను రఘురాయ్ పుస్తకం రచించడం నుంచి మెల్లగా తప్పుకున్నాను. అపుడు మీరు సామాన్యులు కావడం ఎలా అన్నపుస్తకం సునాయాసంగా వచ్చి నన్ను సఫలం చేసింది.
మీరు క్యాండిడ్ ఫొటోగ్రఫిని చేస్తుంటారు కదా? ఏదైనా ప్రత్యేక కారణాలున్నాయా?
– నిమగ్నం కావడమే. మనుషులు తమ ప్రకృతిలో తాము లీనం కావడంలో ఉన్న సత్యసంధత మరెక్కడా లేదు. అందుకే నా చిత్రాలు మీ వైపు చూడవు. నావైపూ చూడవు. తమలో తాముంటాయి. గడుపుతాయి జీవితాల్ని. ప్రదర్శించవు. నిజానికి క్యాండిడ్ ఫొటోగ్రఫి చేసేవాడు కూడా వేరేకాదు. వాడు కూడా జీవని. గడిపే మనిషి. వాళ్లను ఫొటో తీస్తూ  వాళ్ల పనిలో తాను పాటైతాడు. వాళ్ల పాటలో తాను బాటైతాడు. అందుకే అతడు తీసేవి చిత్రాలు కావు, రాసేవి రచనలూ కావు, జీవితాలు. నావి జీవితాలు సుమా.
అందుకే మొదలు అన్నాను. నా చిత్రాలు ఫొటోగ్రాఫర్లు. నా రచనలు రైటర్లు అని!
అవి వాళ్లవే. వాటిని చదువుతుంటే ఆయా పాత్రలు, వాటిని చూస్తుంటే ఆయా జీవితాలు మీతో సంభాషిస్తాయి. అందుకే అంటున్నాను. నేను వదులకున్న పాఠం ఏమిటంటే భగవంతుడి సంగతేమో గానీ, ఈ యుగంలో రచయిత మరణించాడు. మిగిలింది సామాన్యుడు. అతడితోటిదే నా వర్షిప్. అతడే నా సరస్వతి.
ఇది సామాన్య యుగం మరి.
 చివగా మరి రెండు ప్రశ్నలు. ఆగస్టులో మీరు నిర్వహించిన  సింగిల్ ఎగ్జిబిట్ ఛాయా చిత్ర ప్రదర్శనకి స్పందన ఎలా వుంది? భవిష్యత్ ప్రణాళికలేమిటి?
– ఫొటోగ్రఫిని జర్నలిజంలోకి తెచ్చి దాన్ని దెబ్బతీస్తున్నాం. నేను ఆ పని మున్ముందు చేయదల్చుకోలేదు. ఒక ఫొటో్గ్రాఫ్ చాలు, ప్రదర్శనకు అని నేను సాహసోపేతంగా ప్రదర్శించి  అభినందనలు అందుకున్నాను. ఒక్క చిత్రంతో సంభాషించగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగాను.
ఒక రచన మాదిరి కాదు ఫొటోగ్రఫి. అది ఒక లిప్త. క్షణ భంగురం. దాంట్లో సృష్టి స్తితి లయ అంతా ఉంటుంది. ఆ ఎరుక ఉన్నవాడికి విశ్వం ఆశీర్వదిస్తుంది. అది దేవాలయంలోని గర్భగుడిలోని దైవం అవుతుంది. ప్రదక్షణలు పూర్తయ్యాక రావలసింది మోకరిల్లడానికే. గర్భగుడిలోకే. నా సింగిల్ ఎగ్జిబిట్ కూడా అలాంటిదే. ఒక దర్శనం. అందుకే అంటాను, చూపు కాదు, దర్శనం వేరని! ఈ ప్రపంచాన్ని దర్శించడానికి ఒక కన్నుచాలని! కెమెరా కన్ను!
ఆ దర్శనం అన్నది దైవమే కానక్కర్లేదు,ఈ కాలానికి.
మనిషి చాలని! తనను తాను ప్రదర్శించుకోని సామాన్యుడే ఆ దైవం. ఇక, భవిష్యత్తు అంటారా? దానికి నాతో ఏం ప్రణాళిక ఉందో మీరే చూస్తారు. చూద్దాం.
కృతజ్ఞతలు.
*

దేహ భాష తో మౌనంపై యుద్ధం – “కప్లెట్”

 

-ఏ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

ఇద్దరు స్త్రీల మధ్య చోటుచేసుకొనే శృంగారానుభావాన్ని లైంగిక హక్కుల్లో భాగంగా ప్రతిపాదిస్తూ సాహిత్యీకరించడం  మన సమాజంలో సాహసమే.  స్థిరీకృత విలువల్నీ సాంప్రదాయిక ఆలోచనల్నీ వ్యవస్థీకృత భావనల్నీ ధ్వంసం చేసి కొత్త దృష్టికోణాన్ని ఆమోదయోగ్యం చేయడం అంత సులువేం కాదు. ఆ సాహసాన్ని యిష్టపూర్వకంగా చేయడానికి పూనుకొన్న రెంటాల కల్పన రాసిన కథ కప్లెట్. ఈ కథ రాయడానికి  వస్తు స్వీకరణ దశలోనే రచయిత సంఘర్షణ యెదుర్కొన్నట్టు తెలుస్తుంది. పాఠకులు అంగీకరిస్తారో లేదోనని సంకోచం వొకవైపు ,  లోతుగా పాతుకుపోయిన సామాజిక కట్టుబాట్లనీ బలమైన చట్టాల్నీ ప్రకటిత అప్రకటిత నిషేధాల్నీ అభేద్యమైన నిశ్చిత నిశ్చయాల్నీ అన్నిటికీ మించి ప్రాకృతిక నియమాల్నీ  సహజమైన సంబంధాల్నీ కాదని అతిక్రమించడానికి తన్నుతాను సంసిద్ధం చేసుకోవడం మరోవైపు , వీటిని బ్యాలన్స్ చేస్తూనే వొక నిర్దిష్ట దృక్కోణాన్ని ప్రతిపాదించే పనిలో కళాత్మక విలువలు దెబ్బతినకుండా కథని  తీర్చిదిద్దాల్సిన అవసరం యింకోవైపు  యిదంతా వొక ‘సోషియో లిటరరీ వార్’ లో భాగంగానే జరిగినట్టనిపిస్తుంది.

స్త్రీ పురుషుల శృంగారాన్ని ప్రణయ భక్తిగాథల మధ్య వర్ణించిన తెలుగు సాహిత్యంలో మాయ , వైష్ణవి మధ్య శృంగారానుభవం రాయటం రాసి మెప్పించటం , మెప్పించి లెస్బియన్ బంధం కూడా సక్రమ సంబంధమేనని ఒప్పించటం అంత సులువుగా ఏమీ జరగలేదు. నాకే తెలియకుండా నా లోపల ఉన్న అప్రకటిత సెన్సార్షిప్ ను ఎంతో కొంత వదిలించుకొన్నాకే ఈ కథ రాయగలిగాను … … … కప్లెట్ కథను ప్రచురించటానికి తెలుగు పత్రికలు ఇంకా సిద్ధంగా లేవు అని వెనక్కు తిప్పి పంపటం సమాజానికి , సాహిత్యానికి ఉన్న ఒక పెద్ద దూరాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

(కల్పనా రెంటాల : ‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’ (తెలుగు సాహిత్యంలో స్త్రీ పాత్రల పరిణామం)  20వ తానా సభలు – సాహిత్య సమావేశం,  జూలై 2 – 4 , 2015 లో చేసిన ప్రసంగ పాఠం నుంచి)

కల్పన చెప్పిన పై మాటలు చదివాకా కొత్త వస్తువుతో కొత్త కథ రాయడానికి రచయితకీ పాఠకులకీ మధ్య వున్న గోడల్ని అధిగమించడానికి రచయిత యెంత  వొత్తిడికి గురైందో తెలుస్తుంది. సాహిత్య వ్యవస్థ నిర్దేశించిన అలవాటయిన మార్గానికి భిన్నంగా కొత్త దారి పరుస్తూ  కప్లెట్ లాంటి కథ రాయడం , రాసి మెప్పించడం వొక యెత్తు అయితే తాను ప్రతిపాదించదల్చుకొన్న లెస్బియన్ సంబంధం ‘సక్రమమే’నని వొప్పించడం మరో ఛాలెంజ్. ఆ క్రమంలో కల్పన గుర్తించిన మరో అవరోధం సమాజానికీ సాహిత్యానికీ మధ్య వున్న దూరం , ఆ దూరాన్ని తొలగించాల్సిన పత్రికలు యింకా అందుకు పూర్తిగా సిద్ధంగా లేకపోవడం. ఇవన్నీ బయటికి కనిపించే  కారణాలైతే కనపడని లోపలి కారణం తనకు తాను విధించుకొన్న అప్రకటిత సెన్సార్ షిప్. ఏమైతేనేం వీటన్నినీ తెంచుకొని కథ మన ముందుకొచ్చింది.

మై బాడీ మై ఛాయిస్ అన్న భావనని  తెలుగు పాఠకులకి కల్పన మరీ కొత్తగా యేం పరిచయం చేయడం లేదు. స్త్రీ వాదం చేసిన ప్రయాణంలో యిదో మలుపేనన్న స్పృహ కూడా ఆమెకు వుంది. కాకుంటే స్త్రీల లైంగికతని ఆమె కేవలం  శరీర రాజకీయంగా మాత్రమే కాకుండా హక్కుల రాజకీయంగా కూడా  చూస్తుంది.

స్త్రీల శృంగారానుభవం గురించి ముద్దుపళని రాసిన రాధికాసాంత్వనం పుస్తకాన్ని నిషేధించి చదువుకున్న మేధావులు చేసిన కువిమర్శల దాడి మొదలుకొని ఇప్పటి వరకు స్త్రీలు లైంగికత్వం గురించి , లైంగికానుభావాల గురించి రాయటంలో ఎన్నో ఆటుపోట్లను , ఎదురు దెబ్బలను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణించారు. (‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’)

అయితే తన దృక్పథాన్ని కథీకరించడంలో చాలా జాగరూకత వహించాలనే వొక యెరుక ఆమెకు వుంది. ఆ యెరుకవల్ల  కథ  కళాత్మకంగా రూపొందింది. అలా తీర్చి దిద్దడానికి రచయిత చేసిన  కాన్షియస్ ప్రయత్నం కథ పొడవునా కనిపిస్తుంది. లేకుంటే యే సపరి ‘వార’ పత్రికలోనో సెంటర్ స్ప్రెడ్ స్టోరీ గా యెవరూ చూడకుండా రహస్యంగా చదువుకొనే  సరస శృంగార కథగా తయారయి వుండేది. సరైన దృక్పథాన్ని సరైన రీతిలో బట్వాడా చేయగల కథా నిర్మాణ నైపుణ్యం వొక్కటే అటువంటి ప్రమాదం నుంచి కాపాడగలదు. అందులో భాగంగానే రచయిత్రి పాత్రల నిర్మితిలో గొప్ప నేర్పు ప్రదర్శించింది. కథలోని పాత్రల బయటి లోపలి స్వరూప స్వభావ ఆవరణల్ని ఆవిష్కరించింది. భిన్న ప్రవర్తనలకీ వుద్వేగాలకీ  సంఘర్షణలకీ అనుగుణమైన భిన్న నేపథ్యాలు నిర్మించింది. దేశ కాలాలు పాత్రల మధ్య లోపల సంఘర్షణకి కారణమౌతాయి.

స్వలింగ సంపర్కం గురించి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వొకే విధమైన సామాజిక నియమాలూ నైతిక విలువలూ చట్ట నిబంధనలూ లేవు. యూరప్ అమెరికాల్లో చాలా మేరకు LGBT లకు చాలా వరకు స్నేహం – ప్రేమ – కలిసి జీవించడం – శారీరిక సంబంధం కల్గి వుండడం – గోప్యత అవసరం లేని స్వలింగ సంపర్కం- పెళ్లి చేసికోవడం – పిల్లల్ని పెంచుకోవడం  – సొంత కుటుంబం యేర్పరచుకోవడం వంటి స్వేచ్ఛ  వుంది. ఆసియా ఆఫ్రికా దేశాల్లో అవన్నీ నిషిద్ధాలు.  ఇండియాలోనే కాదు 80 శాతం కామన్వెల్త్ దేశాల్లో సైతం స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. కఠిన శిక్షకి కారణమయ్యే నేరం . ఒకే జెండర్ కి చెందినవారి మధ్య వైవాహిక హక్కులు లేవు. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని  చట్ట బద్ధం చేయమని పిటిషన్లు (నాజ్ ఫౌండేషన్), చట్టసభల్లో ప్రైవేటు బిల్లులు , కొండొకచో వీథి ప్రదర్శనలు , సెక్షన్ 377 (నిషేధ చట్టం) ని రద్దు చేయమని న్యాయస్థానాల్లో హక్కుల పోరాటం వంటివి ఇటీవలి పరిణామాలు. చట్టాలని సైతం పక్కన పెట్టి ఖాప్ పంచాయితీలు సగోత్రీకుల మధ్య పెళ్ళిళ్ళకి కులాంతర వివాహాలకు క్రూరమైన శిక్షలు పరువు హత్యలు అమలు జరిపే పరిస్థితుల మధ్యే  ఫైర్ నుంచీ అఫైర్ వరకూ సినిమాలు తయారవుతున్నాయి. ఈ సందర్భాన్నుంచే కప్లెట్ కథని చూడాలి .

వైష్ణవి సంప్రదాయ భారతీయ హిందూ కుటుంబానికి చెందినది. ఆమె బాల్యం పదమూడేళ్ళ వరకూ ఇండియాలోనే గడిచింది. ఆ తర్వాత అమెరికా వచ్చేసినా చిన్నప్పటినుంచీ అనేక ఆంక్షల మధ్య పెరిగింది. వయసు పెరుగుతోన్న కొద్దీ వాటికి యెదురు తిరగడం మొదలైంది. కూచిపూడి డాన్సర్. కూచిపూడినీ ప్రపంచంలోని యితర నృత్యరీతులనీ తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి  తల్లిదండ్రుల కట్టడి నుంచి బయటపడి వారికి దూరంగా ఆస్టీన్ వచ్చింది. అక్కడ  సొంత ఇంటిలో మొదటిసారి స్వేచ్ఛని అందులోని ఆనందాన్నీ అనుభవిస్తోంది.

మాయ మెక్సికన్ అమెరికన్ అమ్మాయి (1871నుంచే మెక్సికోలో  LGBT లకి ప్రత్యేక హక్కులు వున్నాయి. ఆ విషయంలో అమెరికాకన్నా ముందుంది).  చిన్నప్పటి నుంచే స్వేచ్ఛగా పెరిగింది. ‘మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన ఉంది. మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది.’ హైస్కూల్లోకి వచ్చాకా అబ్బాయిలతో డేటింగ్ చేసింది. ‘కానీ ఏనాడూ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది.’  ఎదిగే క్రమంలో ఫెమినిస్టు భావజాలాన్ని వొంటబట్టించుకొంది. ‘Woman’s Body-Feminism-Sculpture’  ని ప్రధానాంశంగా పరిశోధన చేయాలని ఆమె ఆకాంక్ష.

మాయా వైష్ణవీ ల అభిరుచులూ ఆసక్తులూ కలిసి అవసరాల రీత్యా యూనివర్సిటీ క్యాంపస్ కి దగ్గరగా వొకే యింటిని షేర్ చేసుకొంటారు. అదే విధంగా అభిప్రాయాల్నీ పంచుకొన్నారు. ఒకానొక సాయంత్రం  వొక ‘మోహపు ముద్దు’ వాళ్ళిద్దర్నీ శారీరికంగా దగ్గరచేసింది. చీరకట్టులో ‘సెక్సీ’ గా ‘స్పైసీ’ గా  వున్న వైష్ణవిని మాయ ‘ఆర్తిగా’ ముద్దు పెట్టుకొంటే వైష్ణవి ఆమెను ‘గట్టిగా అల్లుకుపోయింది’. ‘మాయ ముద్దు పెట్టుకున్నాప్పుడు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో అలాగే లేదా అంతకంటే ఎక్కువ ఫీల్ అయింది .’ అది మొదలు యెన్నోసార్లు   మాయ వైష్ణవి ‘దేహంలోకి ప్రవహించింది’.

ఆ కలయికల్లో కలిగే ‘అనేక అందమైన అనుభవపు అనుభూతుల సుగంధం’ వైష్ణవి మనసుకి యిష్టంగానూ సహజంగానూ వున్నప్పటికీ ఆమె పుట్టి పెరిగిన  కుటుంబ సమాజ నేపథ్యం కారణంగా ప్రతిసారీ  ‘మాయా మోహపు మంత్రజాలం నుండి బయటకు వచ్చాకా’ ఏదో తెలీని అపరాధభావనకి గురయ్యేది. కానీ మాయ ‘చేతుల్లోని మంత్ర దండానికో చూపుల్లోని శక్తిపాతానికో వద్దు వద్దు అనుకుంటూనే పసిపాపలా’ లొంగిపోయేది.

అయితే తమ సంబంధాన్నిబాహాటం చేయకుండా  యింటి నాలుగు గోడలవరకే వుంచాలని వైష్ణవి , వైష్ణవి పట్ల ఇష్టాన్ని, ప్రేమ ను కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చూపిస్తూ బయట తానెవరో పరాయి వ్యక్తి లాగా దూరం దూరం గా తిరగటానికి యిష్టపడని మాయ (‘ఇంట్లో ఒక లా, పబ్లిక్ లో మరోలా ఉండటం నాకు రావట్లేదు’ ) , యిద్దరి ఆలోచనల్లో  వున్న  యీ  వైరుధ్యమే సంఘర్షణకి కారణమౌతుంది . వైష్ణవికి లభించిన కొత్త మగ స్నేహం పట్ల కూడా మాయకి రిజర్వేషన్స్ వున్నాయి. వైష్ణవి తన చేజారిపోతుందేమోనని అనుమానం అభద్రతా ఆరాటం మాయని అసహనానికి గురిచేసాయి. దాంతో ఆరోపణలూ ప్రత్యారోపణల్తో యిద్దరి మధ్య మాటలు చురకత్తులయ్యాయి. ‘కలిసి ప్రేమనుపంచుకున్న ఇద్దరూ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కత్తులతో సమూలంగా రెండువైపులా నుంచి నరికేసుకున్నారు’. గొడవ తెగేదాకా (బ్రేకప్) సాగింది . ఆ సంబంధాన్ని నిలుపు కోవాలా వద్దా నిలుపుకోడానికి యే ఆలోచనలు ప్రేరేపించాయి అన్నదే మిగతా కథ.

ఒకే జెండర్ కి చెందిన యిద్దరు వ్యక్తులమధ్య యేర్పడే శారీరిక ఆకర్షణ మానసిక వైవిధ్యమా మానసిక వైకల్యమా అన్న ప్రశ్న లోతుల్లోకి వెళ్ళకుండా లింగ భేదం లేకుండా తమకు నచ్చిన వ్యక్తితో కలిసి వుండే స్వేచ్ఛ ప్రతి వొక్కరికీ వుండాలనే హక్కులకోణం నుంచి రాసిన కథ కావడంతో చర్చకి తెరలేపినట్టైంది.

ఇద్దరు స్త్రీలు కావొచ్చు యిద్దరు పురుషులు కావొచ్చు వారి మధ్య చోటు చేసుకొనే యిటువంటి సంబంధాలు కేవలం ప్రైవేటు వ్యవహారాలేనా ? వాటికి సామాజిక కోణాలు లేవా ? అన్నది వొక ప్రశ్న.

ప్రకృతి విరుద్ధం అసాధారణమైన (uncommon) వికృతమైన అనారోగ్యానికి దారితీసే సెక్సువల్ పద్ధతులన్నిటినీ వ్యక్తి స్వేచ్ఛ పేరున ఆమోదించగలమా? వావివరసలు అక్రమ సంబంధాలు మొదలైన పదాల అర్థాలు భిన్న దేశ కాలాల్లో మారేవే అయినప్పటికీ విధి నిషేధాలు మనిషి కల్పించుకోనేవే అయినప్పటికీ  మానవ హక్కుల పేరున ఉల్లంఘించగలమా?  తిరుగుబాటు కోసమే తిరుగుబాటు చేయాలా? అని మరో ప్రశ్న.

పిల్లల్ని కనడానికి స్త్రీ పురుషులు  అవసరం అవుతారు కానీ ప్రేమకీ స్నేహానికీ వొకే జెండర్ కి చెందిన వాళ్లైనంత మాత్రాన తప్పేంటి? ఒకవేళ పిల్లల్ని కావాలనుకొంటే కలిసి పెంచుకొంటారు. సమాజంలో యెవరికీ యిబ్బంది కల్గించని అటువంటి సంబంధం మానవ హక్కులకు భంగం కలిగించేది కాదు కదా! అన్నది యెదురు ప్రశ్న.

ఇటువంటి ప్రశ్నల్ని కథ బయటి విషయాలుగా కొట్టిపారేయొచ్చునేమోగానీ కథ లోపలి విషయాలు కూడా  కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

‘మనసుకి ఏ తొడుగు లేకుండా స్వేచ్ఛ’ గా వొకటైనప్పటికీ  మాయా వైష్ణవీల  మధ్య సైతం అసమ సంబంధమే యేర్పడినట్టు తోస్తుంది . వారిద్దరి భావాల్లో ఆలోచనల్లో వాటి వ్యక్తీకరణలో వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మాయ ప్రవర్తనలో పురుషాధిపత్య స్వభావం  , వైష్ణవి అనుభూతుల్లో స్త్రీ సౌకుమార్యం  గోచరిస్తుంది .  హోమో సెక్సువల్ రిలేషన్ లో కూడ వొకరికి   ఆధిపత్య స్వభావం  సహజమేనని అంగీకరించగలమా ?  ‘సమాన ఛందం’గా వుండాల్సిన ‘జంట’ (కప్లెట్ నానార్థాలు) సంబంధంలో సైతం యేర్పడే వైరుధ్యాల్ని పరిహరించే పరికరాలెలా యెక్కడ సమకూర్చుకోగలం?

మాయ స్థానంలో వైష్ణవి భర్త వుండి యింటో బయటో ఆమెకి ఇష్టం లేనప్పుడు దగ్గర కావడానికి ప్రయత్నిస్తే …. వేరే సంబంధంలోకి వెళ్తున్నావని అనుమానించి అవమానిస్తే … మరొకరితో ఆత్మీయంగా వున్నందుకు అసూయ పడితే … స్త్రీవాదులుగా మన స్పందన ఎలా వుంటుంది? గాఢమైన ప్రేమలో యివన్నీ సహజమేనని స్వీకరించగలమా?

వైష్ణవి కేవలం తనకు మాత్రమే చెందాలని ఆమె తన సొంత ఆస్తి అన్న విధంగానే మాయ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి (మాయ ఫెమినిస్టు అయినప్పటికీ వైష్ణవిపట్ల ఆమె ఆలోచనలూ స్పందనలూ మగవాడి ధోరణిలోనే వుండడం గమనించాలి)?

రాహుల్ తో వైష్ణవి సాన్నిహిత్యాన్ని స్నేహాన్ని అసూయతో చూసి అసహనానికి గురయ్యే కన్నా వైష్ణవి స్వభావంలోని ద్వంద్వాన్ని  బై సెక్సువాలిటీగా స్వీకరించవచ్చు కదా! లేదా మల్టిపుల్ రిలేషన్ ని గౌరవించి అంగీకరించ వచ్చు కదా!

మాయే వైష్ణవిని తన మాటలతోనూ చేతలతోనూ లోబరచుకొని చివరికి బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వచ్చిందన్న ఆలోచన కూడా పాఠకుల్లో కలుగుతుంది . అందువల్ల కామన్ రీడర్ మాయ మోహం నుంచి వైష్ణవి బయట పడాలని భావించే అవకాశం వుంది .

అదే సందర్భంలో వైష్ణవి మాయల  మధ్య బంధం శారీరిక అవసరాల రీత్యా ఏర్పడిందా  మానసిక అవసరాలకోసం ఏర్పడిందా అన్న ప్రశ్న కూడా వుత్పన్నమౌతుంది. పురుషాధిపత్యం పై నిరసనగా లేదా ధిక్కారంగా   ఫెమినిస్టులూ ,  గర్భధారణ సమస్య లేని సురక్షిత సంబంధమనీ టీనేజి ఆడపిల్లలూ భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్ల సంఖ్య పెరుగుతోందని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.  హాస్టల్ మేట్స్ జైల్ మేట్స్ మధ్య  నిర్బంధమో అనివార్య ఆవశ్యకతో బలవంతమో హోమో సెక్సువల్ రిలేషన్ యేర్పడటానికి  కారణాలౌతున్నాయి . అటువంటి ప్రత్యేక కారణాలు  లేకుండానే  మాయా వైష్ణవీ యిద్దరూ ‘సహజంగా యిష్టంగా’ దగ్గరయ్యారని రచయిత్రి వైష్ణవి ముఖత: ప్రస్తావించింది .

అంతే  కాదు; స్త్రీ పురుషులమధ్య మాత్రమే సెక్సువల్ సంబంధాన్ని అంగీకరించడం స్టుపిడ్ నెస్ అని మాయ నమ్మకం. అది సంప్రదాయ శృంఖలాలను తెంచుకోలేక పోవడం అనికూడా ఆమె వుద్దేశం. అందుకే తనతో వున్న సంబంధాన్ని బాహాటం చేయడానికి యిష్టపడని వైష్ణవిని జాతి మొత్తంతో కలిపి స్టుపిడ్ ఇండియన్స్ అని మాయ తిడుతుంది. మాయకి తన మనసుతో లోపలి ఘర్షణతో వ్యక్తం చేసిన భయ సంకోచాలతో ప్రమేయం లేదనీ  యేక పక్షం వ్యవహరిస్తోందనీ వైష్ణవి బాధ. వెరసి కథ మనస్సు – శరీరం – సమాజం – స్వేచ్ఛ అనే నాలుగు నాలుగు స్తంభాల చుట్టూ సంచలిస్తూ చివరికి రాజకీయ ప్రకటన దిశగా పయనిస్తుంది.

శరీరం అనే అడ్డుగోడని కూడా దాటిన ప్రేమబంధం ది కప్లెట్. సెక్సువాలిటీ అనేది ఇవాళ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక పర్సనల్ బెడ్ రూమ్ వ్యవహారంగా ఎందుకు మిగలలేదని ప్రశ్నిస్తుంది వైష్ణవి. మాయా ఈజ్ మై ఛాయిస్ అన్న అవగాహనకు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య మాత్రమే బంధాలను నియంత్రించే సామాజిక నియమాలను చట్టాలను ధిక్కరించే ఈ కథ లైంగిక హక్కుల అవగాహనకు ఒక ఉదాహరణ.(శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …)

kalpan.profile.photo.1

మాయా వైష్ణవీ ల మధ్య ప్రేమ శరీరాల్ని అధిగమించిందా? అన్నది ప్రధానమైన ప్రశ్న. కథలో వాళ్ళిద్దరి మానసికావసరాల గురించిన ప్రస్తావనలు లేవు. మగవాళ్ళతోగానీ ఆడవాళ్ళతోగానీ  అంతకు మునుపు వైష్ణవికి యెటువంటి సాన్నిహిత్యం లేదు , మాయకి మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన వుందనే విషయం గమనించాలి.

అందువల్లే మాయ దృష్టి ఎంత సేపూ వైష్ణవి శరీరం మీదే వుంది. వైష్ణవి అంగసౌష్టవం వంపు సొంపులే మాయని కవ్వించాయి. శిల్పకళ మీద పరిశోధన చేసే మాయని వైష్ణవి శారీరిక సౌందర్యమే ఆకర్షించింది. వైష్ణవి శరీరంతో ఆమె ఆడుకొంది. వైష్ణవికి స్నానం చేయించాలని ఆమె వుబలాటం. వైష్ణవి మనసుతో ఆమెకి పని వున్నట్టు కనిపించదు. నాట్యం చేసేటప్పుడు ‘ఎగిరెగిరిపడే’ ఆమె ‘వక్షోజాలూ’ , నాట్యం వల్ల చెమటతో తడిసిన దేహానికి అంటిపెట్టుకొన్న వస్త్రాలూ మాయలోనూ పాఠకుడిలోనూ కోరికలు వుద్దీప్తం కావడానికే దోహదం చేస్తాయి. చీర కట్టులో వైష్ణవినీ నల్లటి జలపాతం లాంటి ఆమె జుట్టునీ ‘శరీరాన్ని అంటిపెట్టుకున్న డిజైనర్ బ్లౌజ్ పైనా కిందా ఆమె అర్ధ నగ్నపు వీపునీ ఎడమవైపు నడుం వంపునీ’  చూసినప్పుడు ఆమె మీద మాయకి కంట్రోల్ చేసుకోలేని యేదో అలజడి అంటుకుంటుంది. ‘లోపలి నుంచి ఒక కాంక్ష మాయను నిలువెత్తునా ముంచెత్తుతోంది.’

అప్పుడే కాదు ప్రతి సందర్భంలోనూ మాయ వైష్ణవిని సెక్సువల్ ఆబ్జెక్ట్ గానే చూసింది.  రచయిత కూడా వైష్ణవిని మాయ దృష్టికోణం నుంచే చూపించింది. ‘వైషు  శిల్ప శరీరం’ పట్ల రచయిత్రికి కూడా మోహం పుట్టినట్టుంది. ఆమె దేహభాషతోనే ఆమె  చుట్టూనే కథ అనేకానేక వొంపులు తిరుగుతుంది. ‘దేహ తంత్రులు ఒకదానినొకటి కొనగోటితో మీటుకొనే,  కాంక్షలు అల్లరిగా ఆడుకొనే’   శృంగారానుభవ వర్ణన మగ రచయిత నుంచి వస్తే  మనం యెలా స్వీకరించే వాళ్ళం ? అన్న   ప్రశ్న పుడుతుంది. అయితే  వారిద్దరి పరస్పర స్పర్శలో ‘ఒకరికి ఊరట , సాంత్వన ; మరొకరికి ధైర్యం , నిశ్చింత అన్న వాక్యంతో  ఆ సన్నివేశం ముగిసింది . దాంతో  వారి సాన్నిహిత్యం శరీరాల్ని అధిగమించిందనీ సాంగత్య సౌరభం మనసుల లోతుల్ని తాకిందని వాచ్యంగానే తెలిపినట్టైంది.

రచయిత్రి ఆ సన్నివేశాన్ని వుద్వేగ భరితమైన సంఘటనకీ ఆలోచనాత్మకమైన సంఘర్షణ కీ మధ్య అల్లింది . ఆ విధంగా   ఇద్దరు స్త్రీల మధ్య శృంగారాన్ని బెడ్ రూమ్ నాలుగ్గోడల మధ్య జరిగే ‘ప్రవేటు వ్యవహారంగా’ చూడాల్సిన అవసరం వైపు ,  స్త్రీల లైంగిక స్వేచ్ఛకీ దాన్ని హరించే వ్యవస్థీకృత భావజాలానికీ మధ్య నెలకొన్న దూరాల్ని ఛేదించడానికి వ్యక్తిగా వైష్ణవి చేసే మానసిక యుద్ధంవైపు , తనకేం కావాలో తెలుసుకోలేక తాను స్ట్రైటో లెస్బియనో బైసెక్సువలో తేల్చుకోలేక తన్ను తాను assert చేసుకోలేక తల్లడిల్లే ఆమె అంతరంగ సంఘర్షణవైపు , ఆమె తనలోకి తాను  చూసుకొంటూ చేసే అస్తిత్వ అన్వేషణ వైపు , వ్యక్తి స్వేచ్ఛని నిరోధించే కౌటుంబిక సామాజిక శాసనాల వైపు , వాటి మధ్య వైరుధ్యాలవైపు , మాయా వైష్ణవిల మధ్య సంబంధంలో కూడా యెక్కడో తెలియకుండానే చోటుచేసుకొన్న అసమానతవైపు పాఠకుల దృష్టి మళ్లేలా చేసింది.

వైష్ణవి మనసులో సుళ్ళు తిరిగే సంఘర్షణే కథకి ఆయువుపట్టు. ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు బయట స్నేహితులు వాళ్ళ మధ్య తన పెర్సనల్ ‘ఇమేజి’ … అంతా లెస్బియన్ లేబుల్ అంటించి తనని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్టు భావిస్తుంది. హోమో సెక్సువాలిటీ పట్ల వ్యక్తుల లైంగిక హక్కుల పట్ల తన భావాల్ని వ్యక్తం చేయడానికి రచయిత్రి వైష్ణవినే తన కంఠస్వరంగా యెన్నుకొంది. అందుకే చివరికి వైష్ణవి అన్నిటినీ ఛేదించుకొని  తన మనశ్శరీరాలు కోరుకున్నదాని వైపే మొగ్గింది.

‘మృత దేహాల్ని మార్చురీలో పెట్టినట్లు నేను కూడా ఈ దేహాగ్నిని ఐస్ గడ్డల మధ్య చల్లర్చుకోనా’ అన్న వైష్ణవి ఆవేదనని నెపం చేసుకొని  ‘కొన్ని లక్షల మంది’ (ప్రపంచ బాధిత స్త్రీల సంఖ్యలో యిది చాలా తక్కువ శాతమే కావొచ్చు) గొంతుకలకు ప్రాతినిధ్యం వహిస్తూ శరీర రాజకీయాలనుంచీ  లైంగిక రాజకీయాల దాకా స్త్రీవాద ప్రస్థానాన్ని రచయిత్రి నిర్వచించదల్చుకొన్నట్టు స్పష్టమౌతుంది.

ఇలా వొక భావజాలాన్నిప్రాతిపదిక చేసుకొని నిర్మించే  కథలో పాత్రలు ఫ్లాట్ గా తయారయ్యే అవకాశం వుంది . కానీ కల్పన  మాయ  వైష్ణవి పాత్రల్ని రౌండ్ క్యారెక్టర్స్ గా మలచడంలో గొప్ప  నేర్పు చూపింది . వ్యక్తికీ సమాజానికీ వ్యక్తికీ వ్యక్తికీ  వ్యక్తి  లోపలి  ద్వంద్వాలకి మధ్య చోటుచేసుకున్న వైరుధ్యాలూ వాదోపవాదనలూ వేదనలూ వాటి మాధ్యమంగా  చిత్రితమైన  బలమైన సంఘర్షణతో   కథకి కావాల్సిన అన్ని హంగులూ సమకూరాయి. వర్తమానం నుంచి గతానికీ గతం నుంచీ వర్తమానానికీ – వంటి రోటీన్ కథన శిల్పం కూడా కల్పనా చేతిలో కొత్త శోభని సంతరించుకుంది.

కథలో వైష్ణవి అనుభవించే యాతన పట్ల పాఠకులకు సానుభూతి లేదా  సహానుభూతి – ఆమె అంతిమంగా తీసుకున్న నిర్ణయం పట్ల యేకీభావం కలుగుతాయో లేదో గానీ కథ చదువుతోన్నంత సేపూ పైన లేవనెత్తిన ప్రశ్నలేవీ నిజానికి అడ్డురావు . రచయిత  వొక వుత్కంఠ భరితమైన కథావరణంలోకి తీసుకుపోయి ‘మంత్రదండం’ వుపయోగించి కదలకుండా కట్టిపడేస్తుంది . బయటికి వచ్చాకా అంతా  వొక వైష్ణవ మాయ అనిపిస్తుంది. అంతిమంగా కథ లెస్బియన్ సంబంధానికి లెజిటమసీ సాధించడానికి తోడ్పడుతుందో లేదో గానీ మౌనాన్ని బద్దలుగొట్టి ఆలోచనల్ని తట్టిలేపడానికి దోహదం చేస్తుందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. తెలుగు కథలో వస్తు వైవిధ్యం కొరవడుతోందని ఆరోపించి బాధపడేవారికి యీ కథ  ఊరట , సాంత్వన , ధైర్యం , నిశ్చింత  కలగజేస్తుంది.

తాజా కలం   : కప్లెట్ కథ తర్వాత – ఇద్దరు స్త్రీల సహజీవనం చట్టబద్ధం కాకపోవడం వల్ల వాళ్ళిద్దరిలో వొకరు అకస్మాత్తుగా చనిపోతే రెండో వ్యక్తి యెదుర్కొనే  సామాజిక ఆర్ధిక అభద్రతని కేంద్రం చేసుకొని కుప్పిలి పద్మ రచించిన ‘మౌన’ కథ (  – చినుకు జూలై 2015 ప్రత్యేక సంచిక)  – లెస్బియన్ సంబంధం లోని మరో కోణాన్ని స్పృశించి యిదే వస్తువుకి  విస్తృతిని సాధించింది ; కానీ  గే ప్రేమని వస్తువుగా ఎండ్లూరి మానస రాసిన  ‘అదే ప్రేమ’ కథ   (సారంగ 24-9-15) మాత్రం చాపల్యంతో పనిగట్టుకు చేసిన ప్రయోగంలా అనిపించింది .

*

 

 

రాత్ భర్ : తనతో ,  దునియతో ,  నాతో నేను 

-సైఫ్ అలీ సయ్యద్ 
~
saif
1
తనతో :
ఎప్పుడూ
నీ స్వార్ధం నీ దే కదా
దియా జలాతే హై లేకిన్
హం కిసి కా దిల్ నహీ జలాతే బేషరం
అబ్ ఖుద్ రాత్ క దిల్ జల్ గయే థో హం క్యాకరే
నువ్వు నా మాట వినడం లేదని
కోట్ల మంది తెల్లగా నవ్వుతున్నారు
ఎన్నో ప్రశ్నల  చిప్పలు తీసుకొని
ఎంతో మంది తమ మొహాలతో నా ఎదురువస్తున్నారు
2
దునియా తో :
జబ్ జబ్ బహూత్ బార్
అంటే శానా సార్లు
సచ్చీ మే
శానా సార్లు
తనేం అనుకుంటదో అని
చాలా సార్లు అనుకుంటేనే
దియా ఒకటి అంగార్ పెట్టేసుకుంటూ
నా అవసరానికి .
రాత్రి తో రాత్ భర్ అని
ఓ కవిత రాసుకోవడానికి
 కోయి ఉస్ కో చెప్పండి
నిన్ను తాకడానికి
నీ కౌగిలిలో దూరడానికి
సూర్యుడితో చాలా గొడవే పెట్టుకుంటుంటాను దునియా తో
గొడవలంటే నాకు ఇష్టం లేదు
కానీ కొన్ని గోడలు కట్టుకోక తప్పడం లేదు
3
నాతో నేను   :
ఏదో ముజ్రా జరుగుతుంటది
ప్రతి రాత్రి ఎక్కడినుంచో  వినిపిస్తుంటది
బయటకు పారి పోకుండా పట్టేసి ఉంచుతున్నానో
ఎవరైనా లేపుకో పోతారని భయం తో దాచుకుంటున్నానో తెలవదు
బేషరం బాల్యాన్ని
నన్ను ఒక చల్తా ఫిర్తా గ్రంధం గా మార్చేసి
తను  చుప్ చాప్ లో లో న నవ్వుతూ ఉంటది నాకు తెలుసు
2
 తనతో :
ఆనే జానే వాలే హై అందరూ
ఆ సముద్రం లో ఎన్ని పడవలు చూడటం లేదు నువ్వు
ఆ ఆకాశం లో ఎన్ని మేఘాలు చూడడం లేదు
మనుషుల కళ్ళల్లో ఎంతమంది శరణార్ధులని చూడటం లేదు
నేను ఎక్కడుంటే అక్కడ కలుస్కుకోవడానికి
వస్తుంటావ్ యూని ఫాం ఒకటి ఒకటి వేసుకొని
బహోత్ అచ్చీ బాత్ హై లేకిన్
కాస్త తొందర పాటు మానుకో రాదు
నీకు నమ్మకం లేదు అని అనకు
కాకపోతే అది ఇక్కడ కాదు ఇంకెక్కడో ఉంది
2
దునియాతో :
ఏ శకం లో ఉన్నా కానీ కుచ్ కుచ్ హోతా రహ్తా హై డార్లింగ్
అని బుక్ షెల్ఫ్ లో ఇంకా దాక్కోని బతుకుతున్న
ఒక ఆగ్రా చిలిపి కుర్రోడు పుకార్ కే చేప్తుంటాడు
ఇన్షల్లాహ్ ఫిర్ మిల్తే హై అని తను వెళ్తుండగా
1
నాతో నేను
ఎప్పుడూ  అందరిలాగే
*

వెలిగే నీడ 

 

 
 -ఎం.ఎస్. నాయుడు
~
మచ్చలు
కన్నీటిలో 
ఏ కంటికీ అంటుకోవు 
 
జీవించే జైలులో నమ్మదగ్గ మౌనం దొరికేనా
నిస్సార మనసులో విచారించు విచారం విచారమేనా
 
కదలని కడలిని
కలవని కలలని 
కనికరించే కనులని 
క్షమిస్తే రమిస్తే ప్రాధేయపడితే 
నిశ్శబ్దమే నిరు(రూ)పయోగమై ఆక్రమిస్తుందా 
 
వెలిసిన వెలితితోనే వెలిగే నీడ 
పదాలే అరిపాదాలై 
అతితొందరలో చేరే స్థలంకై ఊగిసలాడుతున్నాయ్ 
 
మర్చిపోవాలనే 
గాలిచిగురులు ఎగిరే పెదవుల కన్నీళ్ళ కలలో 
 
ఖాళీ జ్వాల 
కీలుబొమ్మల దుఖం 
 
నిర్యాణ నిర్మాణం చేపట్టేనా విడిచిపెట్టేనా మర్చిపోయేనా 
అభావ అనుభవమా అనుభవ అభావమా 
 
చంచల ద్వారం 
నాలో ముడుచుకొని 

పరిచిత అపరిచితుడు

 

-పూడూరి రాజిరెడ్డి

~

rajireddi-1అతడిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. నిజానికి, ‘మొదటిసారి’ అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆ పరిచయం ఎంతో కొంత సాన్నిహిత్యానికి దారి తీసినప్పుడు కదా! కానీ ఇక్కడ సాన్నిహిత్యం అటుండనీ, కనీస పరిచయం కూడా లేదు. కాకపోతే ఎక్కువసార్లు తటస్థపడుతున్న వ్యక్తిగా ఇతడు నాకు ‘పరిచయం’. అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసేవుంటాను! కానీ, ఏదో ఒక ‘చూపు’లో- ‘ఈయన్ని నేను ఇంతకుముందు కూడా చూశాను,’ అని గుర్తు తెచ్చుకున్నాను.

అతడు మా కాలనీకి ఎగువవైపు ఉంటాడనుకుంటాను. నేను పొద్దున పిల్లల్ని స్కూలుకు తోలుకు పోయే సమయంలో, అతడు మెయిన్ రోడ్డు ఎక్కడానికి అడ్డరోడ్డు దాటాలి గనక, అలా దాటుతూ ఎదురుపడతాడు. ఒక్కోసారి నేను పిల్లల్ని స్కూల్లో ‘పడగొట్టాక’- తిరిగి మూలమలుపు తిరుగుతున్నప్పుడు, అతడు ఏటవాలు రోడ్డు మీద నడుస్తూ వస్తూంటాడు. ఆ జారుడు మీద కాలిని అదిమిపట్టడానికి వీలుగా మోకాళ్లను కాస్త వంచి నడవడం నాకు తెలుస్తూవుంటుంది.

అతడిది అటూయిటూగా నా వయసే అని సులభంగానే అర్థమవుతుంది. టక్ చేసుకుంటాడు. షూ వేసుకుంటాడు. ఇవి రెండూ నేను కొన్ని ‘సిద్ధాంత కారణాల’ వల్ల వదులుకున్నవి! సిద్ధాంత కారణాలు అంటే, మరీ గంభీరమైనవేం కావు. టక్ చేసుకున్నప్పుడు నా పృష్టభాగపు ఉనికి వెనకవారికి ఇట్టే తెలిసిపోతుందని నాకు తెలియడం; కాలికి రిలీఫ్ ఇవ్వగలిగే పనిలో ఉన్నవాడికి- షూ అనవసరపు ఉక్క అని అర్థం కావడం!

అతడు కూడా నాలాగే వేగంగా నడుస్తాడు. దాదాపుగా ప్రతిసారీ చేతిలో లంచ్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి, అతడు ఏ ఆఫీసుకో వెళ్తూవుండాలి!

ఈ ఆఫీసు ఆహార్యంలో కాకుండా, కొంత ‘స్పోర్టీ’గా అతడు ఒకట్రెండు సార్లు కాలనీలో ఉన్న చిన్న పార్కులో దాదాపుగా చీకటి పడే వేళలో ఎదురుపడ్డాడు. అప్పుడు అర్థమయ్యిందేమిటంటే, అతడికి పెళ్లయిందీ, నాలాగే ఇద్దరు పిల్లలూ! కాకపోతే ఇద్దరూ అబ్బాయిలే కాదు; ఒక పాప, ఒక బాబు.

ఇంకొకసారి, వచ్చిన అతిథిని కావొచ్చు, సాగనంపుతూ ఎదురయ్యాడు.

ఇన్నిసార్లలో ఏ కొన్నిసార్లయినా అతడి గమనింపులోకి నేను వెళ్లివుంటానని నాకు అర్థమవుతోంది. అయినా మేము పరిచయం కాబడటానికి ఇంకా ఏదో కావాలి. లేదా, మాకు పూర్తి భిన్నమైన స్థలంలో ఎదురుపడటమో జరగాలి. విచిత్రంగా, రెండు తెల్ల బొచ్చు కుక్కపిల్లలతో ఇలానే తరచూ ఎదురుపడే తెల్లజుట్టు పెద్దమనిషితో కూడా నాకు ఏ పరిచయమూ లేదు; కానీ కొన్నిసార్ల తటస్థత తర్వాత ఒక పలకరింపు నవ్వు అలవాటైపోయింది. బహుశా, పిల్లలు నా పక్కనుండటం ‘తాత’ వయసు ఆయనకు ఆ నవ్వును సలభతరం చేసివుంటుంది.  కానీ ‘అతడు’ దీనికి భిన్నం. అతడు నా ఈడువాడు. ఇంకా చెప్పాలంటే, దేనికోసమో తెలియని పోటీదారు!

కొంతకాలానికి అతడు నడకలో ఎదురుపడటం పోయి, బండిమీద కనబడటం మొదలైంది. బ్లాక్ రోడియో తీసుకున్నట్టు అర్థమైంది. దుమ్ము నుంచి రక్షణగా కావొచ్చు, నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇక్కడొక అపనమ్మకంగా కనబడే విషయం చెప్పాలి. ‘చూశావా, నేను బండి తీసుకున్నాను,’ అని చెప్పీ చెప్పనిదేదో, ఇంకా చెప్పాలంటే, నాపైన అతణ్ని ఒక పెమైట్టు మీద ఉంచుతున్న చిరుస్పర్థ లాంటిదేదో అతడు అనుభవిస్తున్నాడేమోనని నేను నిజంగా ఫీలయ్యాను. అదే అతణ్ని ‘పరిచిత’ అపరిచితుడిగా నిలబెడుతోంది.

దీనికి ముగింపేమిటో నాకు తెలియదు. ఈ పరిచయం ఎటో దారి తీయాలని నేనేమీ ప్రత్యేకంగా కోరుకోవడం లేదు. కానీ ఎటు దారితీస్తుందో చూడాలన్న కుతూహలం మాత్రం ఉంది.

* * *

నిజానికి మొదలుపెట్టిన అంశం పైనే ముగిసిపోయింది. కానీ ఇది ఊరికే అపరిచిత్వం భావనకు కొంచెం కొనసాగింపు. అది ఇంకా ఎన్ని రకాలుగా ఉండగలదు! మా ఎదురుగా ఉండే ఇంటిని కూల్చి, అపార్ట్‌మెంట్ కట్టారు. ముందుగా కనబడే వాచ్‌మన్ తప్ప, లోపల ఎవరుంటారో నాకు తెలియదు.

అంతెందుకు, మా ఆఫీసులో పనిచేసేవాళ్లు అనేది చాలా పెద్ద మాట, మా ఫ్లోర్లోనే ఉత్తరం వైపు పని చేసేవాళ్లలో చాలామంది నాకు తెలియదు. అంటే, ముఖాలుగా తెలుస్తారు; కానీ, ఆలోచనలుగా తెలియరు.

చూడండి గమ్మత్తు! ఎక్కడో ప్రారంభమై, ఎక్కడో చదివి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు మారి, తీరా ఒకే సంస్థలో ఒకే లిఫ్టు బటన్ నొక్కడమనే ఉమ్మడితనంలోకి ప్రవేశిస్తాం. అయినా అపరిచితులుగానే ఉండిపోతాం. బహుశా పండగల పరంగానో, సినిమాల పరంగానో, పుస్తకాల పరంగానో, రాజకీయాల పరంగానో, భావజాలాల పరంగానో ఏదో ఉమ్మడితనం అనుభవిస్తూనే ఉంటాం కావొచ్చు; అయినా అనుభవిస్తున్నట్టుగా తెలియకుండానే ఉండిపోతాం. అదే కదా పరిచయం కావడానికీ కాకపోవడానికీ మధ్య తేడా!

*

కట్టు బానిస రగిల్చిన కాగడా!

-నిశీధి 

~

విరిగిన మనుష్యులని అతకబెట్టె మరమ్మత్తుల పనులకన్నా  ఒక  బలమయిన కొత్త తరాన్ని  నిర్మించుకోవడం సులభం అన్న విషయం  Ac రూముల్లో కూర్చొనో ఇరానీ చాయిల మధ్య సిగార్ ధూపాల్లో రాలిన ఆకుల్లో  పచ్చదనాన్ని వెతుక్కొనే కవిత్వపు కళ్ళ సాహిత్యానికెలా తెలుస్తుంది ?

బానిసత్వపు  సంకెళ్ళని  వదిలించడానికి కాఫీ టేబుల్ పోయెట్రీ కాకుండా సూర్యుడి మొహాన  వదలని నెత్తుటి మరకలని స్వయంగా  తుడిచే ధైర్యం తో పాటు అసలు మరకెంత మరణమో తెలిసుండాలి. ఒక కట్టు బానిసకేమిటీ అసలు తెలివితేటలు ఏమిటీ అని ముక్కు మీద వేలేసుకొని నవ్వే ప్రపంచం ముందు వెలుగుతున్న కాగడాగా నిలబడి స్లేవరీ నుండి సెలెక్టెడ్ రీడింగ్స్ వరకు మిగిలిన ఒకే ఒక ఉదాహరణ ఫ్రెడెరిక్ డాగ్లస్ . చీలమండలు చినిగి రక్తాలోడేలా ఒక తోటి మనిషికి సంకెళ్ళేసే వ్యక్తి ఆ సంకెళ్ళ తాలూకు మరో అంచు అతని మెడకి ఎప్పుడో చుట్టుకుంటుంది అన్న నిజం తెలియకుండా ఉండడు అని తెలిసి మనుష్యులని   జంతువులకన్నా  హీనంగా  చూసే అసహ్యాల గురించి ఆటను రాసుకున్న  మాటలు  ఎంత నిజం కదా .

పరిస్థితుల్లో మార్పు రావాలంటే వెలుగు కాదు ఇపుడు కావాల్సింది ఏకంగా  కార్చిచ్చు . గాయాలకి లేపనమయ్యే చిరు జల్లులు కాదు  అసలు గాయాల ఉనికే కొట్టుకుపోయే సునామీలు తుఫానులు హోరుగాలులు  అని పద్దెనిమిదో శతాబ్దపు మొదట్లోనే ఫ్రెడరిక్ రాసాడు  అంటే , ఇప్పటి అసహన దినాలు లేదా టార్చర్ సెల్స్ లా  మారి  నోక్కకనే నొక్కుతున్న మనసుల మధ్య నెమ్మదిగా హృదయాన్ని బాధించకుండా మృదువయిన మాటలలో విప్లవం గురించి మార్పుల గురించి చెప్పాలండి అనే మితవాదులు ఏ చీకటి గూట్లో తల దాచుకుంటారో ఒకోసారి చూడాలనిపిస్తుంది .

అంతేనా జనం వాళ్ళు కోరుకున్న ప్రతిది వాళ్ళ వాళ్ళ పనుల ద్వారా పొందలేకపోవచ్చు కాని వాళ్ళిప్పుడు ఉన్న స్తితికి గతికి కారణమయిన పని పట్ల గౌరవం ఉండాల్సిందే పని చేస్తూ బ్రతకాల్సిందే అన్నాడు కూడా బాబు అంటే సడెన్గా అది సాహిత్యం అయినా ప్రజా యుద్ధం అయినా మాకు కావలసినంత గుర్తింపు రాలేదు కాబట్టి పని చేసే  ఇంట్రస్ట్ లేదు అని చెప్పే బద్ధకపు పని దొంగల సాంబార్ బుడ్డి ఎక్కడ గప్చుప్ అవుతుందో కూడా మరో తరానికి తెలియాలి . ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయాలో లాగి పెట్టి కొట్టినట్లు చెప్పిన ఈ ఒక్క మాట చాలు ఫ్రెడరిక్ మిమ్మల్ని ప్రేమించడానికి అని చెప్పాలి అనిపించదా ఆ  పెద్దాయన కనిపిస్తే మాత్రం ?

, రచయిత , వక్త , పరిపాలనకర్త . అన్నిటిని మించి కాపిటల్ పనిష్మెంట్ కింద అప్పట్లో బ్రతుకుకాలం పాటు బానిసగా బ్రతకమనే శిక్షని అబాలిష్ చేసిన వ్యక్తిగా Frederick Douglass ( 1818 – 1895) బానిస జీవితాల దుర్భారత్వాలని వివరిస్తూ రాసిన కొన్ని వాక్యాలు చదివితే గుడ్నే తడవ్వదా ? “ ఓపెన్ సీక్రెట్ ఏమిటంటే మా యజమానే నా తండ్రి అన్న విషయంలో రహస్యమెంతొ నిజమెంతో నాకెప్పుడు తెలియలేదు కాని రాత్రి చీకట్లో మాత్రమే నన్ను జోకొట్టి ఉదయం వెలుగుకల్లా మాయమయ్యే అమ్మతో గడిపిన జ్ఞాపకం బహుశ ఆ కొన్ని క్షణాలేనేమో “

పోనీ ఇది చదివితే అన్న ఏమన్నా కదలిక ఉంటుందా మనలో  , మనది కాని జీవితాల పట్ల మనకుండాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూస్తయినా పెరుగుతుందా ?

f2

స్వేచ్చ

 

ఈ అందమయిన భీభత్సపు  స్వేచ్చ

పీల్చే గాలంత అవసరం అయిన స్వేచ్చ

ఉపయోగపడే పచ్చని భూమంత స్వేచ్చ

పూర్తిగామనదైనప్పుడు

రాజకీయనాయకుల టక్కుటమార శుష్క వచనాల్లా కాకుండా

సంకోచవ్యాకోచాలు  అసంకల్పిత చర్యలంత సహజంగా

ఆలోచనలని ఆపలేని మెదడంత స్వేచ్చ మనం గెలిచినప్పుడు

ఈ మనిషి, ఈ డగ్లస్, ఈ పూర్వ బానిస,

మోకాళ్ళ విరిగేలా కొట్టబడ్డ  ఈ నీగ్రో

ఏ మనిషి గ్రహాంతరవాసికాని

ఎవరూ వేటాడబడని

వంటరవ్వని

ఒక కొత్త ప్రపంచాన్ని వీక్షించాలని కోరిక

ప్రేమ తారకం నిండిన ఈ మనిషి జ్ఞాపకాలు

గొప్ప వాక్పటిమ నిండిన కావ్యాల్లో

మూలమలుపుల్లో వంటరిగా నిలబడిన కంచి విగ్రహాలలో కాకుండా

తన బ్రతుకునుండి బ్రతుకై నిలిచే

తన కలలని రక్తమాంసాలలో అదుముకొనే

ముందు తరాలుగా చూడాలన్న కోరిక

*ఇది రాస్తున్నపుడు ఎందుకో ఒక్క క్షణం అంబేద్కర్ జ్ఞాపకం , ఒక వేళ బాబా సాహెబ్ ఈ కవిత రాసి ఉంటే ఇదే రాసేవారేమో కదా ? పూలుపళ్ళలో పలుకు చివర దండాలలో కాకుండా నన్ను నా భావజాలాన్ని  గుండెలలో నింపుకొండి అనేగా చెప్పేవారు ?

ఫ్రెడరిక్ రాసిన ఒరిజినల్ పోయెం

When it is finally ours, this freedom, this liberty, this beautiful

and terrible thing, needful to man as air,

usable as earth; when it belongs at last to all,

when it is truly instinct, brain matter, diastole, systole,

reflex action; when it is finally won; when it is more

than the gaudy mumbo jumbo of politicians:

this man, this Douglass, this former slave, this Negro

beaten to his knees, exiled, visioning a world

where none is lonely, none hunted, alien,

this man, superb in love and logic, this man

shall be remembered. Oh, not with statues’ rhetoric,

not with legends and poems and wreaths of bronze alone,

but with the lives grown out of his life, the lives

fleshing his dream of the beautiful, needful thing.

 

మరోసారి మరో ఉత్తేజంతో

బ్రెయిన్ డెడ్ !

 

 

 

 

నాగలక్ష్మి పాడిన “మేలు”కొలుపులు

 

వేకువ పాట ముఖ చిత్రం

 

-సువర్చల చింతల చెరువు 

~

వారణాసి నాగలక్ష్మిగారి “వేకువపాట” కథాసంపుటి, వేకువనే పాడవలసిన “మెలకువ పాట” లా అనర్ఘమైనది. వేకువన మాత్రమే వినిపించే పిట్టల కువకువలా ఆహ్లాదమైనది.

వెదురు చివుళ్ల కోసం ఎగిరొచ్చే గువ్వలు ఈ కథాసంపుటి ముఖచిత్రం. రచయిత్రి చిత్రకారిణికూడా కావటంతో పుస్తకానికి ఈ బొమ్మ మరింత భావస్ఫోరకంగా నిలిచింది.  వేకువనే చిన్ని విహంగాలు తమ కలకలారావాలతో జగతిని మేలుకొలుపుతాయి. వెదురు పొదలు ఆమాత్రం గాలులకే ఈలపాటలు వినిపిస్తాయి. ప్రకృతిలో మమేకమైన  ప్రతి చిన్న ప్రాణీ తన జీవనగీతాన్ని సక్రమంగా పాడుకుంటుంటే.. మానవులం, అన్ని తెలివితేటలూ ఉన్నవాళ్లం చేస్తున్నదేమిటీ అనే ప్రశ్నే ఈ వేకువపాట అని  సూచించారేమో ఈ రచయిత్రి అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఈ చిన్ని పక్షులే, ఈ  వెదురు వేణువులే మనకాదర్శం అని చెప్పినట్లు తోస్తుంది.

ఇందులో కథలన్నీ  బెల్లం,మిరియాలు కలిపిన పాలు. పౌష్టికతతోబాటు, ఔషధీకృతమైనవి. పాల మనసులకు, తీయని మనసులకు అవసరమైన ఘాటైన సత్యాలు లేదా పరిష్కారాలను సూచించేవి. తిండి కలిగితే కండ కలగి, కండ కలిగినవాడే మనిషి అయినట్లు, ఇలాంటి పాలను సేవిస్తే మానసిక ఆరోగ్యం!  దారుఢ్యం! ఈ కథలు  సమాజపు ఆధునిక రుగ్మతలను ఎదుర్కోటానికి ఉపకరించే ఔషధాలు. వీటిని సేవించిన పాఠకుడు మనసైన మార్గాన్ని కాకుండా మనసున్న మార్గాన్నిఅనుసరించగలుగుతాడు .

ఈ కథల్లో తమ జీవితానుభవాలతో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వాలను చూసి మన మెదళ్లు వికసిస్తాయి. ఇవి రచయిత్రి బోధించే నీతికథలు కాదు. జీవితాన్ని ఇష్టపడమని చెప్పే చేయూతలు! చదివించేతనం, మొదలుపెడితే చివరివరకూ ఆగనివ్వని తత్వం, మళ్లీ  చదివించే తీరు ఈ కథల్లోని ప్రత్యేకతలు.  ఈ సంపుటిలో ముందుమాటలో విశ్లేషించిన కథలను వదిలి మిగతా కథలను చర్చిస్తాను.

“ఆనాటి వానచినుకులు”: ఈ కథాసంపుటిలో విభిన్నమైనది “ఆనాటి వానచినుకులు” కథ. ఇది పచ్చకర్పూరం, కలకండ కలిపిన పాలలా..కమ్మని అనురాగగంధంతో ఘుమఘుమలాడింది. మితిమీరిన ఆశల, ఆశయాల సాధనలో పిచ్చిపరుగులు తీసిన జంట అలసిన తమ మనసులను తీపిసంగతుల భావుకతతో సేదతీర్చి మమేమకమైన ప్రేమకథ. ఏది అవసరమో అది తేల్చుకున్న గొప్ప కథ. ఎల్లలులేని వలపుల ఔన్నత్యాల విలువను తెలియచేసే  ఈ కథ ఈ కాలపు జంటలకో ఓ చక్కని వికాస బోధన!   కావ్యోపేతమైన ఈ కథలో ప్రతి ఒక్క పదం  వాసంత సమీరమే! మలయమారుత గమనమే! ఇది చదివినంతసేపూ ఒక ఆహ్లాదకరమైన లలితగీతం మనకు వినబడుతుంది.

పుష్యవిలాసం: పువ్వుల మాసం పుష్య మాసం  అంటూ మొదలయ్యే ఈ కథ పువ్వుల్లాంటి సుకుమారమైన హృదయాల వర్ణనతో  విలసితమైనదే! ఆటో నడిపే సూర్యారావు కి  కనువిప్పు కలిగించిన తల్లీకూతుళ్ల సంభాషణ, జీవితపు ఆవేశకావేషాలను, తొందరపాటు తనాలను ప్రశ్నిస్తుంది.   ఆటోలో కూతురు మాటాడే మాటలు ప్రేమలోని పౌరుషాన్ని చూపిస్తే, తల్లి మాటలు స్త్రీ అనుభవపు క్షమాగుణాన్ని చూపిస్తాయి.  అర్ధవంతంగా మలచిన సంభాషణలు, భాషతో ఊహాచిత్రాన్ని గీసిన  రచయిత్రి నేర్పు సౌందర్యభరితం!  ఈ కథ చదువుతున్నంతసేపూ ఏదో పునర్జీవనగీతం మనసుని తడుతూనే ఉంటుంది. కథన కౌశలం కమనీయం.

అమ్మా, నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ, సరళీస్వరాలు: ఒకటి పిల్లలు తెలుసుకోవాల్సినదైతే, మరోటి పెద్దలు గ్రహించాల్సినది. తల్లిదండ్రుల పట్ల, తమ చదువు, నడవడికల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, పిల్లల జీవితాన్ని తీర్చిదిద్ది, వారి జీవనరాగం అపశృతిలేకుండా చేయాలంటే తల్లిదండ్రులూ ముఖ్యాముఖ్యాలను దృష్టిలో ఉంచుకోవాలని, సరైన బాధ్యతాయుత  పెంపకం అదేనని రెండు కోణాలనూ విశదీకరిస్తూ, సమాజంలోని ఆకర్షణలు, రుగ్మతల గురించి ప్రస్తావిస్తారు ఈ రెండు కథలలో!  మానసిక విశ్లేషణతోబాటు ఓ సాంఘిక విశ్లేషణ అవసరాన్నీ సూచిస్తారు. కుటుంబ సంబంధాలను రచయిత్రి,  ముందే ఏర్పరుచుకున్న భావజాలంతో కాకుండా మన కళ్లముందు కనబడుతున్న సంఘటనల ఆధారంగా చిత్రిస్తారు. ఒకసారి,  మారిన వ్యవస్థలోని లొసుగులు మనముందు సున్నితంగా విప్పుతారు. మరోమారు,  కంటికి కనిపించే వ్యవస్థలో ఎవరికీ కనిపించని వాస్తవిక కోణాలను ఓసామాజిక విశ్లేషకురాలుగా తేటతెల్లంచేస్తారు. మానసిక విశ్లేషకులే ముక్కుమీదవేలేసుకునేంతగా, వారు చూడలేని లోతైన అంశాలను చెప్పిస్తారు. ఈరెండు కథలూ విద్యార్ధులకు పాఠ్యాంశాలు కాదగినవి.

“పాపాయి పుట్టినవేళ”  కథలో పాత ఆచారాలను మూఢాచారాలుగా కొట్టివేయకూడదన్న సత్యం తెలుస్తుంది. అంతేకాదు, చిన్న చిన్న సాయాలందించే ఆత్మీయహస్తం ఎంత విలువైనదో, అది తనవారికి మానసికంగా ఎంతటి ఊరటను అందిస్తుందో తెలియచేస్తుంది.   చాలారోజుల తర్వాత ఇంటికి వచ్చి ఆత్మీయంగా పెనవేసుకున్న బంధువులా అపురూపంగా అలరించే కథ ఇది

కొమ్మకొమ్మకో సన్నాయి : ప్రకృతికి, జీవితానికీ అన్వయంకూరుస్తారు ఎప్పుడూ రచయిత్రి అనిపిస్తుంది మనకు. ప్రకృతి నేర్పే పాఠాలను నిరంతరం ఓ భావుక హృదయంతో నేర్చుకోవాలని, ఋతువులకనుగుణంగా తమనితాము మార్చుకునే వృక్షరాజాలే మనకు ఆదర్శమనీ, ఒడిదుడుకులు ఎదురైనా ఉత్సాహంతో ముందుకు సాగే పరవళ్ల జలపాతాలే మనకు జీవనాడిని వినిపిస్తాయని  మృదువుగా హెచ్చరిస్తారు.

విముక్త : తల్లిదండ్రులను వదిలి తమ జీవితాలను విదేశాలలో కొనసాగించే పిల్లల్ని తప్పుబట్టకుండా, వారికోసం ఎదురుచూస్తూ నిరాశతో మనసుల్ని కృంగదీసుకోకుండా “నేనున్నాను, నన్ను స్మరించుకోండి, నాతో మాట్లాడండి” అంటూ పద్మశ్రీ శోభానాయుడుగారు కృష్ణుడిగా వేసిన కూచిపూడి నృత్యనాటికను చూసిన అనుభూతి కదిలింది  విముక్త కథ చదివాక. జీవితాలపై మోహం వద్దంటూనే జీవనాల్ని సమ్మోహనపరిచే కృష్ణతత్వం కనిపించిందీ కథలో.  ఎన్నో నేర్చుకోవాల్సినవి ఎప్పటికప్పుడు ఉంటూనే వుంటాయి. అతీతంగా జీవించాల్సిన సమయాన్ని గుర్తించి, గౌరవంగా ఆహ్వానించాలని చెప్పే ఈ కథంతా చదివాక గుండె బరువెక్కకమానదు.

పరిమళించే పూలు: మాలతి పాత్ర స్ఫూర్తినిచ్చేదిగా తోస్తుంది. ఈమెకి తన జీవితం పై చాలా స్పష్టత కనిపిస్తుంది. తనకేం కావాలో  ఖచ్చితంగా తెలిసిన పాత్ర ఇది. అలాగని స్వార్ధపరురాలుకాదు. తనపై నిందలువేసినవారిని సైతం జాలిపడి క్షమించి, మానసికంగా వారికి  చేయూతని అందించే మంచిమనసున్న అమ్మాయి. ఈ మాలతిలో రచయిత్రి మనసు కనిపిస్తుంది మనకు.

ఏ కథలోనూ, ఇబ్బందిపెట్టిన పాత్రలను   విమర్శచేయని విశాలదృక్పథం రచయిత్రిలో కనిపిస్తుంది.  కారణాలను విశ్లేషించుకోవాలేగానీ, అవే తమకు అడ్డంకులన్న సంకుచితత్వం వద్దని, తమనితాము మెరుగుపరుచుకోవాలేగానీ, పరదూషణ అత్యంత అనవసరమన్న విశాలతత్వం కనిపిస్తుంది.  ఈ  కథలలో కథానాయికలు పరిస్థితులకు బానిసలయినవారే కానీ బానిస మనస్కులు కారు.  ఆత్మాభిమానపు అస్తిత్వానికై తలపోసే సుమనస్కులు!  తమ గుర్తింపు తమకోసమే కానీ, ఇతరులకోసం కాదు అని, ఇతరులు తమని గుర్తించి చేయూతనందిస్తారని ఎదురుచూస్తూ, పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చోవద్దని, తామిలా ఉండటానికి కారణం తామే కాని మరెవరూ కాదన్న నిజాన్ని తెలుసుకుని, చీకటిలోంచి తమంత తాముగా వెలుగుదారి వెతుక్కోవలసిన  అవసరాన్ని తెలియచేస్తారు.

పూర్వపు విలువలను ఏమాత్రం వదలని ఈ కథలు ఆధునిక విశ్వాసాలకూ అత్యంత ప్రాముఖ్యాన్నీ ఇస్తాయి. ఇప్పటి సామాజిక సమస్యలనే మన ముందుకు తెచ్చి, ఈ కాలానికి అవసరమైన దిద్దుబాట్లనే సూచించి వర్తమానాన్ని సంక్లిష్టతలనుండి కాపాడుకొంటూ పరిపక్వ హృదయాలతో ముందుకు సాగేలా  ఉంటాయి. మాసిపోయిన సమస్యలని లేవనెత్తని ముందడుగు రచనలుగా ఇవి నిలుస్తాయి.  వారణాసి నాగలక్ష్మిగారికి ఎన్ని అభినందనలూ చాలవు!

*

 

అసంపూర్ణం….

 

-మేడి చైతన్య

~

chaitanya mediనేను ఏదైన విషయం చెబితే అది వెంటనే దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. అదే విషయాన్ని రాస్తే అప్పుడు కూడా అలాగే జరుగుతుంది, కాని కొన్ని వేళలలో దానికి కొత్త అర్ధం  విలువస్తుంది .

నిశ్శబ్దం రాజ్యమేలుతుండడంతో మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి.

ఒసే ఎక్కడున్నావే….వినిపిస్తుందా…ఏం చేస్తున్నావే?

అన్నంపెట్టవే…ఏయ్…నిన్నే?

ఎవరమ్మా?

ఇంకెవరురా…మీ పెదనాన్నే!

మంచంలో వెల్లకిలా పడుకొని అరుస్తున్నాడు. పెద్దమ్మేమో ఏమి పట్టనట్టుగా పొయ్యి రాజేసి ఆవెలుగులో తన చీకటిని కలిపివేస్తునట్టుంది.

ఎందాకని చేస్తుంది అది మాత్రం, ఈ రోజుల్లో మంచంలో ఏరుక్కుంటే శుభ్రంచేసే పెళ్ళాం లంజముండ ఎవత్తుంది చెప్పు? అన్నంపెడితే మళ్ళీ ఏమయ్యిద్దోని దాని భయం. ఐనా పెట్టింది తిని ఉండొచ్చు కదా,ఎందుకు ఊకే గొణగటం?

అమ్మమాటల్లో పెద్దమ్మ నిశ్చల ముఖమవతలి పార్శ్వం కనిపించింది.

మంచిగున్నప్పుడు రోజు కుల్లబొడిచేవాడు ఇప్పుడు తెలుస్తుంది అయ్యగారికి ఆమే విలువేంటో? మంచంలో నవిసి నవిసి చావొద్దూ! కోపంగా అనేసి నాన్న ఏమయిందో చూడ్డానికి వెళ్ళాడు.

“ముసలితనానికి అందరు ఇష్టమే నాన్న,నీవు కుడా దాని ప్రేమనుంచి తప్పించుకోలేవు.”

అయినా ఏముందిరా చిన్నోడా, డబ్బా?….పొలమా? రెక్కల మీద బతికేటోళ్ళు. పాపం పెద్దోడికి ఇద్దరు ఆడపిళ్ళలేనా, నడిపోడేమో లారీక్లీనరాయా (ఏదేశాలుతిరుగుతున్నాడో ఏంటో), ఆఖరోడేమో పని,పాట లేకుండా చెడు సావాసాలు.ఉన్న ఒక్కదాన్ని ఈయనే ఒక అయ్యచేతిలో పెట్టిండు. వాళ్ళడొక్కే నిండట్లేదు, ఇంకేవరు ఈయన్ని దవఖనకు తీస్కపోతరు చెప్పు?

కళ్ళ ముందు మనిషి చనిపోతుంటే ఏం చేయలేమా అమ్మ?

అందరం ఎలాగోలా బ్రతకాలనే కోరుకుంటం.మరణమే దిక్కయినపుడు,అదే తొందరగా రావాలని ఎదురుచూస్తున్నాం!

‘బతుకులోనే కాదు చావులో కుడా బాగుకోరవచ్చునేమో!’

చిన్నోడా ఎప్పుడొచ్చావురా, రెండు రుపాయిలుంటే ఇవ్వరా, బీడీలు కొనుక్కుంటా అని అడుగుతుంటే, చిన్నప్పుడు బొందలగడ్డల దగ్గర బొంగుపేలాలు ఇంకొన్ని పెట్టు పెదనాన్న అని బేలగానే పెట్టిన మొహమే నాకు ఇప్పుడు కనిపించింది.

ఐనా నేను కొనిచ్చే ఈ రెండు బీడీల వల్ల పెదనాన్న బాధతీరుతుందా?

నేనేం చేయలేనా? మనిషి పుట్టుకపుట్టినాక ఇంకొకమనిషికి సాయం చేయలేనా? అసలు నా జీవితానికి ఏమైనా అర్దం ఉందా? ఏమి చేయాలో తెలియని సందిగ్ధస్థితి?

తర్వాత చాల రోజులకు పెదనాన్న చనిపోయాడని చెప్తే, కాదు మీరే చంపేశారన్నా!నన్నెందుకు ఆ క్షణం మినహాయించుకున్నానో తెలీదు, బహుశా బీడీలు కొనిచ్చాననే భరోసా ఏమో?

ఆలోచనలలో పడి ఎప్పటిలాగే ఏమిపట్టనట్టుగా ఎటో చూస్తూ వర్షం వస్తోందనే సంగతే గమనించలేదు! కోపంగా నన్ను తిట్టుకొని కిటికి వేసేంతవరకు నా పక్కన ఒకతను కూర్చున్నాడనే గుర్తించలేదు.

చలికాలంలో వానేంటనే చెత్తప్రశ్నలడగకుండా, కిటీకిలోంచి ఆవల బస్టాండు వైపు చుశా.మూలగా బొంతేదో కదులుతున్నట్టుగా ఉంది. వానలో తడవకూడదని చాలా మంది బస్షెడ్డులోకి వస్తుంటే, తనుమాత్రం తలదాచుకుంటుదక్కడే అనుకుంటా!

రెండు మూడు రోజులు గమనించినా తనెవరో తెలియలేదు. తీరా ఒక రోజు తన మొహం కనిపించింది. ఆనందం, బాధ ఎరుగని అవ్యక్తభావమేదో ముఖంలో దాచుకున్నట్టుంది తను. బొంతే తన సర్వస్వమన్నట్టు దానిని విడిచిపెట్టదెప్పుడూ, అయినా వాళ్ళ కొడుకులని ఎలా విడిచిపెట్టిందో మరి!

ట్యూషన్డబ్బులొస్తే తనకేమయినా ఇవ్వాలనుకొని రెండు  నెలలు గడిచాయి.ఈ రోజు డబ్బులొస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొనిపోవాలని నిశ్చయించుకున్నా.

అరటిపళ్ళు తీసుకొని బస్సెక్కా. ఎలా ఇవ్వాలనే ఆలోచనలలో మునిగిపోయి, వేరే బస్టాప్లో దిగి, తను ఉన్న బస్టాండ్వరకు నడుచుకుంటూ వెళ్ళా!

ఎవరో ఇద్దరు ఏదో బస్కోసం ఎదురుచుస్తున్నారు. వాళ్ళుండగా ఇవ్వడానికి నాకెందుకో ధైర్యం సరిపోలేదు(ఎక్కడ చూసేస్తారేమోనని భయమనుకుంటనేమో!)

ఒక పావుగంట నా దేహాన్ని దోమలకు వదిలేసి, ఆకాశంలో నక్షత్రాలను లెక్కెట్టం మొదలెట్టా!

నేను తనే మిగిలాం! లోకమేమీ పట్టనట్టుగా నిద్రపోతూనే ఉందితను. ధైర్యం చేసుకొని సంచీ తన కాళ్ళ దగ్గర పెట్టేసి వెనక్కి తిరగకుండా వచ్చేశా!

అనందం ఏంటో తెలియకపోయినా, గుండెల్లో బరువేదో తగ్గినట్టుంది.

మర్నాడే తనేం చేస్తుందోనని ఆ బస్టాప్లో దిగి ఒక పక్కగా నిశ్శబ్దంగా కూర్చున్నా. పక్కన కూర్చున్న వాళ్ళెవ్వరు తననేమి పట్టించుకోకపోయినా ఏదో చెప్పుకుంటూ పోతూంది. రాత్రి క్రిస్మస్తాత తన దగ్గర కొచ్చి ఆకలి తీర్చాడని, తన్ను కంటికి రెప్పలా తనే కాపాడతాడని, ఇంకా అర్ధము కాని మాటలేవో చెప్పుకుంటూ పోతూంది.

ఇరవై  ఏళ్ళ నిన్ను అప్పుడే తాతని చేసేసిందని తన బొంత నన్ను వెక్కిరిస్తునట్టు చూస్తోంది. కన్నీటి చుక్కొకటి సమధానమయిందిదానికి………

తన బొంత బస్టాండు మీద వేలాడుతూ కనిపించింది తర్వాతిరోజు. వచ్చేటప్పుడు కుడా తను కనిపించలేదు. చాలా రోజుల వరకు తను కనిపించలేదు. చాలా సార్లు ఆ బొంతతో మాట్లాడాలని ప్రయత్నించా, తనెక్కడికి వెళ్ళిందో తెలుస్తుందేమోనని! బొంతకున్న చిరుగు నా ఆరాటాన్ని చూసి బహుశా నవ్వుకుందేమో!

ఇవాళ బస్సెక్కిన దగ్గరనుంచి ఆ చిరుగుల పడిన బొంతే కనిపిస్తుంది. తను ఏమైయుంటుందబ్బా అని ఆలోచించా. ఆశగా ఎదురుచూస్తున్న ఆబొంతను చూసి ఒక కథ రాసేద్దామనుకున్నా. మరుక్షణమే తన గురించి పట్టించుకోకుండా కథలు రాయాలన్న నా కమర్షియల్బుద్ధిని తిట్టుకొన్నా.

ఒకవేళ తను చనిపోయిందేమో?

నేను ఇంకేమైనా చేసి ఉండాల్సిందేమో?

పెదనాన్న చావుని ఏమి చేయలేని స్థితి అనే సాకుతో నన్ను దోషిగా ఊహించుకోలేదు ఇప్పుడు మాత్రం నేను తప్ప దోషిగా ఆ చిరుగుకి ఎవరూ కనిపించరేమో! బహుశా నా వల్లే తను చనిపోయిందేమో! అరడజను అరటికాయలిచ్చి నా జీవితానికి అర్ధం దొరికిందని సంబరపడ్డానేమో! నే చేసిన పనులన్ని అసంపూర్ణంగా ఇప్పుడనిపిస్తున్నాయి. నా జీవితమే అసంపూర్ణంగా తోస్తుంది నాకు.

మనిషికంటూ ఒక విలువుందని నమ్మేలోపు, ఆ విలువేదో ఈ జీవితంలో తనకు తానుగా తెలుసుకోలేడనే చేదు నిజం ఎదురవుతుంది. పరిపూర్ణతను ఎప్పుడు కాంక్షిస్తామో అప్పుడే జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. మనిషే అసంపూర్ణమేమో!

చేతనమున్న దేని విలువయినా దాని ఆంతర్యంలో దాగదు. దాని శరీరం, ఆలోచనలు చేరుకోలేనంత దూరంగా దాని విలువ దాగుంటుంది. జీవితానికే ఏదయినా విలువుంటే అది ఈ లోకపు సరిహద్దుల ఆవల ఉంటుంది. లోకపు ఎల్లల అవల గురించి మాట్లాడాలంటే మనం భాషా పరిమితులను దాటిపోవాల్సిందే! నిర్దిష్టమైన ఆధారమేది లేని ఆ భావన కోసం వెదుకులాడకుండా, ఎల్లల లోపలున్న జీవితాన్ని అంతర్ముఖంగా పరిశీలన చేసుకుంటే, జీవితం పట్ల విరక్తి పోతుందేమో!

దూరంగా మబ్బుల మీద చిరుగులబడిన బొంతేదో నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది.

అకస్మాత్తుగా బస్సెందుకో ఆగింది. కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా టికెట్ చెకింగ్ స్క్వాడ్ ఉంది.

అప్పుడు గుర్తొచ్చింది, నేను బస్సెక్కి చాలా సేపయిందని, జేబులో టికెట్టుకి సరిపడా చిల్లర తప్ప మరేమిలేవని!

కొన్ని యువ హృదయాలూ – వాటి కలలూ!

testament-of-youth

-భవాని ఫణి
~

bhavaniphaniఅనగనగా అవి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు రోజులు .

చదువే ప్రాణమైన ఓ బ్రిటిష్ అమ్మాయి .
రహస్యంగా వర్డ్స్ వర్త్ నీ,షెల్లీనీ,బైరన్ నీ చదువుకుంటూ, ఆ ప్రేరణతో తను రాసుకున్న కొద్దిపాటి రాతల్ని ఎవరికైనా చూపించడానికి కూడా మొహమాటపడి దాచుకునే ముత్యంలాంటి అమ్మాయి.
ఆత్మ విశ్వాసమే అలంకారంగా కలిగిన దృఢ మనస్విని.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం  ఆమె ఆశయం . స్వప్నం.
ఎంతో కృషితో, పట్టుదలతో అక్కడ అడ్మిషన్ సంపాదించుకున్న ఆనందం,సంబరాలని అంబరానికి తాకిస్తున్న ఓ మంచి తరుణంలో అనుకోకుండా యుద్ధమొచ్చింది. అంతా తలక్రిందులైంది.
అన్న,స్నేహితుడు, ప్రేమికుడు అందరూ సైనికులుగా మారి , యుద్ధంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటుంటే తనకి చేతనైనది తను కూడా చెయ్యాలన్న ఆశతో, కోరికతో, కలల సౌధమైన ఆక్స్ఫర్డ్ నీ, ఎంతో ఇష్టమైన చదువునీ కూడా వదిలిపెట్టి వార్ నర్స్ గా మారుతుంది ఆ ధైర్యశాలి.
పట్టుబడ్డ జర్మన్ సైనికులని ఉంచిన టెంట్ లో విధులు నిర్వహించే బాధ్యత ఆమెకి అప్పగించబడుతుంది.
అలా అక్కడ తీవ్రంగా కలిచివేసే పరిస్థితుల మధ్య,  గాయపడిన శత్రు సైనికులకి సేవలందిస్తుండగా అంతులేని శోకం వెతుక్కుంటూ వచ్చి ఆమె జీవితాన్ని మరింత అల్లకల్లోలం చేస్తుంది .
ముందుగా ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమికుడు , తర్వాత ప్రాణప్రదమైన నేస్తం , ఆ తర్వాత ఆరో ప్రాణం వంటి సోదరుడు ఇలా ఎంతో ప్రియమైన వారంతా ఒకరి తర్వాత ఒకరు రక్కసి యుద్ధపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే ఆ లేత మొగ్గ ఏమైపోవాలి? ఆ మారణ హోమానికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలి?
 ఈ యుద్ధాలూ , ఈ పోరాటాలూ  ఇవన్నీ ఎందుకని ,ఎవరికోసమని లోలోపల బాకుల్లా పొడిచే సందేహాల గాయాలకి ఎటువంటి సమాధానాల్ని లేపనంగా పూయాలి?
ప్రాణాలు శరీరాలని విడిచి గాల్లో కలిసిపోతున్నప్పుడు ఏ మనిషి బాధైనా ఒకటి కాదా ? మనమంతా మనుషులమైనప్పుడు , మనుషులంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒకర్నొకరు ఎందుకు చంపుకోవాలి? చంపుకుని ఏం సాధించాలి?
ఇటువంటి ప్రశ్నలు మాత్రమే చివరికి ఆ అమ్మాయి దగ్గర మిగిలినవి.
ఆప్తుల మరణం వల్లనా, ఎంతో క్షోభకి గురిచేసే యుద్ధ వాతావరణంలో పని చేసి ఉండటం వల్లనా ఆమె తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతుంది . ఒక స్నేహితురాలు అందించిన సహాయంతో ఆ క్రుంగుబాటు నుండి బయటపడి తన జీవితాన్ని ముందుకు నడుపుకున్నా తన వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని బలమైన నిర్ణయం తీసుకుని , చివరి రోజుల వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటుంది.
ఇదంతా వీరా మారీ బ్రిట్టైన్ అనే ఒక స్త్రీ వాది అయిన రచయిత్రి కథ . ఒక్కోసారి నిజ జీవితపు కథలు, కల్పన కంటే ఆసక్తికరంగా ఉండి హృదయానికి పట్టుకుంటాయి . ఎందుకంటే ఆ కథలోని పాత్రలు , మలుపులు ఎవరో ఏర్పరిస్తే ఏర్పడినవి కాదు .. అవి అలా జరిగిపోయినవి అంతే . అందుకే అవి ఎందుకు అలాగే జరిగాయని ఆలోచించి వాదించే  అవకాశం మనకి ఉండదు. వీరా కథలో అటువంటి ఆసక్తికరమైన మలుపులేవీ లేవు గానీ విధి ఆమెతో ఆడుకున్న విషాదకరమైన ఆట ఉంది .జీవిత కాలానికి సరిపడే దుఃఖమూ ఉంది . అవే ఆమెని యుద్ధ వ్యతిరేకిగా మారుస్తాయి. తర్వాతి  కాలంలో పాసిఫిస్ట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆమెని ప్రేరేపిస్తాయి.
వీరా బ్రిట్టైన్, తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని వివరిస్తూ రాసుకున్న “టెస్టమెంట్ అఫ్ యూత్” అనే పేరుగల ఆత్మకథ ఆధారంగా ఈ చలన చిత్రాన్ని నిర్మించారు. సరళంగా ఉన్న స్క్రీన్ ప్లే, కథ అర్థం చేసుకోవడంలో మనకి ఇబ్బంది కలిగించదు . ఏదో నిజంగా అక్కడే జరుగుతున్నట్టే ఈ దృశ్య ప్రవాహం కళ్ల ముందు నుండి అతి సాధారణంగా సాగిపోతుంది .ఈ ఆత్మకథలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ లోని సామాజిక పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపడం జరిగింది . అంతే కాక ఆత్మ విశ్వాసం , ధైర్యం మెండుగా కలిగిన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్త్రీ అయిన కారణంగా, వీరా తనకి ఇష్టమైన కెరీర్ ని ఎంచుకోవడం కోసం ఎంత ఘర్షణ పడాల్సి వచ్చిందో కూడా మనకి ఈ కథ వివరిస్తుంది.
ముఖ్య పాత్రధారిణి అయిన “అలీసియా వికండెర్” అత్యున్నతమైన నటనని కనబరిచి తన పాత్రకి సరైన న్యాయాన్ని చేకూర్చింది. ఉత్తమమైన ఆత్మకథల్లో ఒకటిగా పేరు సంపాదించిన ఈ వార్ టైం మెమోయిర్ ని అంతే ఉత్తమంగా తెరకెక్కించడంలో దర్శకుడు జేమ్స్ కెంట్ విజయం సాధించారు. కథలోని ఆత్మని పట్టుకుని దృశ్యంగా మలిచి మన కళ్ల ముందు నిలపగలిగారు.
*

మన చరిత్రలో చీకటీ వెలుగూ!

 

-రాణి శివశంకరశర్మ

~

 

Rani sarmaభారతీయులు కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోలేక చీకటిలో కూరుకు పోయారనే వాదం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కార్యకారణ సంబంధం, విశ్వాసం, వేరు వేరు.. ఈ రెండూ ఎక్కడా కలవవు అని వారు వాదించారు. భారతీయులు విశ్వాసమనే చీకటిలో కూరుకుపోయి, కార్యకారణ సంబంధాన్ని విస్మరించారు. క్రైస్తవ వలసవాదులు వాళ్ళ కళ్ళు తెరిపించారు. కార్యకారణ సంబంధం లోకి, హేతుబద్ధతలోకి వాళ్ళని మేల్కొలిపారు అని వీరి వాదన.

కన్నుగానని వస్తుతత్త్వము

కాంచగలుగుదురింగిలీజులు (గురజాడ)

కంటికి కనబడని వస్తుతత్త్వం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధమే!

కార్యకారణ సంబంధమే కాదు, దేవుడు కూడా కంటికి కనబడడు. దేవుడు కూడా కార్యకారణ సంబంధం నుంచే పుట్టాడు. దేవుడు మూఢవిశ్వాసమైతే, కార్యకారణ సంబంధం పట్ల ఆధునికులకు గల తిరుగులేని విశ్వాసం కూడా మూఢవిశ్వాసమే!

కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసమే సైన్సుకి మూలాధారం. అంటే కార్యకారణ సంబంధాన్ని పరిశీలించడం ద్వారా వస్తుతత్త్వాన్ని గుర్తెరగవచ్చనే విశ్వాసం అన్నమాట.

ఐతే కార్యకారణ సంబంధం గురించి మనుషులకే కాదు, జంతువులకీ పక్షులకీ చివరికి మొక్కలకి కూడా తెలుసు. పక్షి గూడుని నిర్మిస్తోందంటే ఈ కార్యకారణ సంబంధం తెలియడం వల్లే!

కాని కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసం మనిషిలో మాత్రమే వుంది. దీని నుంచే దేవుడూ సైన్సూ పుట్టుకొచ్చాయి. అంటే మతమూ సైన్సూ కూడా ఒకే మూలం నుంచి ఒకే రకమైన విశ్వాసం నుంచి పుట్టాయి. కుండకి కుమ్మరి నిమిత్త కారణం. అట్లాగే విశ్వానికి దేవుడు. యింత సింపుల్ లాజిక్ మీద ఆధారపడి దేవుడు పుట్టాడు. యిక్కడ కార్యకారణ సంబంధమే పనిచేసింది.

కుండ చేయడానికి కుమ్మరి ఉన్నాడు. అలాగే వివిధ వృత్తి పనులు చేయడానికి మనుషు లున్నారు. ప్రకృతిలో కూడా కార్యకారణ సంబంధం యిలా సహజంగా పనిచేస్తుండగా వేరే దేవుడెందుకు? అని ప్రశ్నించినవాడు కుమారిలుడు. ఈయన మీమాంసా శాస్త్రవేత్త, వైదికధర్మ వ్యాఖ్యాత. దేవుడు చనిపోయా డంటూ యూరప్ గగ్గోలు పెట్టింది కానీ, భారతదేశంలో దేవుడసలు పుట్టనే లేదు.

బుద్ధుడు కార్యకారణ శృంఖల అన్నాడు. కార్యకారణాలు గొలుసు లాంటివి. అంటే ఒకదాని మీద మరొకటి లింకై అనంతంగా ఉంటాయన్నమాట. ఈ ఆలోచనకు ప్రాచీన సాంఖ్యతత్త్వం మూలం. దేవుడనేవాడుంటే వాడికి కూడా మరొక కారణం వుండాలి అంది సాంఖ్యం. కార్యకారణ అభేదాన్ని చెప్పింది సాంఖ్యం. కారణంలోనే కార్యం వుంటుంది. విత్తులోనే చెట్టుంటుంది. అంటే కర్త క్రియ వేరు కాదు, రెండూ ఒకటే. యింక దేవుడు ఎక్కడ దొరుకుతాడు?

నిజానికి దేవుడు యూరప్ లో పుట్టాడు. క్రైస్తవంలో పుట్టాడు. యూరపియన్ క్రైస్తవంలో పుట్టాడు. నిజానికి మూల క్రైస్తవం గురించి మనకేం తెలుసు? బిగ్ బ్యాంగ్ థియరీకి, బైబిల్ విశ్వాసానికి సంబంధం వుంది. అందుకే రోమన్ చర్చి ఆ సిద్ధాంతాన్ని సమర్ధించింది. ఈమాట ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పనే చెప్పాడు. ఐతే విశ్వానికి మొదలు ఉంటేనే దేవుడు ఉండే అవకాశం ఉంది. కాని విశ్వం అనాది, అనంతం కనుక దేవుడు లేడు పొమ్మన్నాడు (బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం). భారతీయుల విశ్వాసాల ప్రకారం అంతా అనాది. యింక దేవుడెక్కడ?

ఆధునిక సైంటిస్టులు క్రమేపీ పాంథీయిజం వైపు ప్రయాణించారు. దేవుడే యీ విశ్వంగా రూపాంతరీకరించబడ్డాడనేదే పాంథీయిజం. అటువంటి విశ్వాసంలో మాత్రమే అనంతం అనేది సాధ్యమౌతుంది.

భారతీయులకి అనంతం అంటే ముద్దు. దాన్ని గ్రీకులు చీకటిగా భావించారు. అనంతంలో నామ రూపాలు ఏర్పడవనీ, పరిధి కల చోట మాత్రమే అవి ఏర్పడతాయని అరిస్టాటిల్ అన్నాడు. కాని హెగెల్ ‘అనంతం’ అనేది ఆధునిక కాలపు విప్లవంగా భావించాడు. ఎందుకంటే… గణితంలోనూ, భౌతికశాస్త్రంలోనూ, తత్త్వశాస్త్రంలోనూ అనంతం ఆవిష్కరించ బడుతూ వచ్చింది (రీజన్ ఇన్ రివోల్ట్).

గ్రీకులు చీకటిగా భావించిన ‘అనంతం’ అనే కాన్సెప్టులో భారతీయులు వీరవిహారం చేశారు. అనంతం అనేది అనంతుడైన పరమాత్మ వంటిది. పరమాత్మ కూడా జీవసృష్టి వల్లగానీ, లయము వల్లగానీ మార్పు చెందడు అంటాడు ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యులు (సిద్ధాంత శిరోమణి).

సృష్టి ప్రళయాలు కూడా తుదీ మొదలూ లేకుండా సాగుతాయి. అది అనంతమైన ప్రాసెస్. అందువల్ల సృష్టికర్త లేడు, ఉన్నా నామమాత్రుడు. మొదలూ తుదీ లేని చోట కర్తని ఎక్కడ నిలబెడతావు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం నిజమైతే, భారతీయ తత్త్వం ప్రకారం అనంతమైన బిగ్ బ్యాంగ్ ల గొలుసు మాత్రమే ఉంది. ఆ గొలుసుకి మొదలు లేదు. అదే బుద్ధుడు చెప్పిన కార్యకారణ శృంఖల. నిజానికి అనంతంలో యిది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ లో కాలమూ స్థలమూ కూడా కుదించబడతాయి. బిగ్ బ్యాంగ్ కీ దేవుడికీ గల అక్రమ సంబంధాన్ని గుర్తించిన కొందరు కమ్యూనిస్టులు యీ సిద్ధాంతాన్నే తిరస్కరించారు (Reason in Revolt-Marxist Philosophy and Modern Science by Alen Woods and Ted Grant).

అనంత విశ్వాలు ఉన్నాయన్నందుకే బ్రూనోని దహనం చేశారు. బ్రూనో పునర్జన్మపై విశ్వాసాన్ని కూడా ప్రకటించాడు. జన్మ పరంపర అనేది కూడా అనంతమే. అంటే విశ్వాన్ని గురించి, జన్మల గురించి అతని దృక్పథం క్రైస్తవానికి విరుద్ధం. బ్రూనో నాటికి ప్రసిద్ధంగా ఉన్న ‘టోలమీ నమూనా’ ప్రకారం విశ్వం పరిమితం, కాలం పరిమితం. దాన్ని బ్రూనో విశ్వాసాలు బద్దలు చేస్తుండడంవల్లనే ‘పేగన్’ అని ముద్ర వేసి చంపేశారు. యిది అనంతం అనే భావనపై వేటు.

నిజానికి ఆధునిక సైన్సుకి మూలాలు చాలావరకు క్రీస్తు పూర్వం లోనే ఉన్నాయని అనేకమంది మేధావులు భావించారు. సూర్యకేంద్రక సిద్ధాంతానికి ప్రేరణన్ గ్రీకుల సూర్యారాధనలో వుంది అన్నాడు బెర్ట్రాండ్ రసెల్. విశ్వం కొన్ని నియమిత సూత్రాల ప్రకారం పని చేస్తుందన్న సైన్సు నమ్మకానికి మూలం గ్రీకుల FATE లో ఉంది అని ఆయన చెప్పాడు (Is Science Superstitious).

ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే సైన్సూ విశ్వాసమూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయన్నది తప్పు. సైన్సు కూడా విశ్వాసాల పుట్ట. విశ్వాసం లేనిదే విశ్వం లేదు. అందుకే ఆస్ట్రానమి, ఆస్ట్రాలజీ కవలలు గా జన్మించాయి. రసవిద్య రసాయనిక శాస్త్రం కవలలు. తంత్రశాస్త్రం దేహంపై తీవ్ర విశ్వాసం కలిగింది కావడం వల్లే మెదడుకి గల ప్రాధాన్యాన్ని యేనాడో గుర్తించగలిగిందని దేవీప్రసాద్ చటోపాధ్యాయ అన్నారు (లోకాయత).

కనక సైన్సు కూడా విశ్వాసజనితమే. ఏమిటా విశ్వాసం? కార్యకారణ సంబంధం పై విశ్వాసం. యీ విశ్వాసం చేసిన పనేంటంటే … కాన్సెప్టులని సృష్టించడం. దేవుడిపై నమ్మకం మతాన్ని సృష్టిస్తే, కార్యకారణ సంబంధం పై తిరుగులేని నమ్మకం కాన్సెప్టులని సృష్టించింది. థియరీలని సృష్టించింది.

పక్షి గూడు కట్టుకుంటుంది. కాని ‘గూడు’ అనే భావాన్నీ కాన్సెప్టునీ అది సృష్టించలేదు. అందుకే ప్లేటో ‘భావాలే మూలం’ అన్నాడు. ఒక ఇమేజి, వొక కాన్సెప్టు, వొక భావం వీటిని మనిషి మాత్రమే సృష్టిస్తాడు. క్రిమి కీటకాలూ, పక్షులూ, జంతువులూ కూడా గూళ్ళు బోరియలు లాంటి వస్తువులను సృష్టించగలవు. కాని భావాలని కాన్సెప్టుల్ని మనిషి మాత్రమే సృష్టించగలడు. అంటే మనిషి ప్రాధమిక లక్ష్యం వస్తువుల్ని సృష్టించడం కాదు, భావాల్ని సృష్టించడం. యీ భావాల్ని సంస్కారాలుగా తర్వాతి తరానికి అందజేస్తాడు. ‘యద్భావం తద్భవతి’ అన్నది అందుకే. నువ్వెలా భావిస్తే, ఊహిస్తే అలా ఉంటుంది ప్రపంచం.

ఇల్లూ పక్షి గూడూ ఒకటి కాదు. రెండూ కార్యకారణ సంబంధం నుంచే పుట్టాయి. కాని ఇల్లు అనేది మనిషి సృజించిన భావం. అదొక వస్తువు కాదు. అదొక ఇమేజి, కాన్సెప్టు. అందుకే అది వినూత్న రూపాల్ని ధరిస్తుంది. మనుషుల ఊహలూ, భావాలూ ‘ఇల్లు’ అనే పదార్ధంలో తీవ్రమైన మార్పులు తెస్తాయి.

ఇల్లు ఎలా ఉండాలి? ఏది మంచి ఇల్లు, ఏ మోడల్ మంచిది అనేదాన్ని మనిషి సంస్కృతీ సంస్కారం నిర్ణయిస్తుంటాయి. అంటే సింపుల్ కార్యకారణ సంబంధం మనిషిలో స్మృతి పరంపరగా పదిలం చేయబడుతుంది.

యీ స్మృతులు ఆయా స్థలకాలాల్లో విభిన్నంగా ఉంటాయి. వీటినుంచి అక్కడి సంస్కృతి నిర్మించ బడుతుంది. ఈ సంస్కృతే లేకపోతే మనిషి లేడు. ఇంత వివరణ తర్వాత నేను సాహసించి ఒక ప్రశ్నని సంధిస్తాను. ఆధునిక సైన్సుని యూరోపీయ క్రైస్తవం శాసిస్తోందా? బిగ్ బ్యాంగ్ థియరీ వెనక క్రిస్టియన్ మోటివేషన్ ఉందా? అదే నిజమైతే కార్యకారణ సంబంధాన్ని సంస్కృతీ మతమూ శాసిస్తుందన్నమాట. అలాంటప్పుడు కార్యకారణ సంబంధం పై విశ్వాసం మతవిశ్వాసం కంటే నిష్పాక్షికమైనదని, పారదర్శక మైనదని యెలా చెప్పగలం!?

బిగ్ బ్యాంగ్ థియరీని అంటుకొని గాడ్ పార్టికిల్ కోసం చేసిన అన్వేషణను క్రైస్తవ అన్వేషణ అనొచ్చా? యీ మెగా సైంటిఫిక్ ప్రాజెక్టుల వెనక మతపరమైన పాక్షిక దృష్టి పనిచేయడం లేదని ఎలా చెప్పగలం? యద్భావం తద్భవతి. నువ్వలా చూడాలనుకొన్నావు గనక, ప్రపంచాన్ని నువ్వలా నిర్వచించాలనుకొన్నావు గనక నీకలా కనిపిస్తోందా?

మొత్తంగా సైన్సు చరిత్రని పరిశీలిస్తే దాని కార్యకారణ సంబంధం వెనక పాంథీయిజం, పేగనిజం, హెలెనిజం చాలావరకూ పనిచేశాయి. బ్రూనో లాంటి వాళ్ళ మీద దాడి నిజానికి సైన్సు మీద దాడి కాదు. యూరోపీయ క్రైస్తవ వ్యతిరేక భావాల మీద దాడి.

బిగ్ బ్యాంగ్ థియరీ విజయం ద్వారా యితర ప్రాపంచిక దృక్పథాల్ని క్రైస్తవ సైంటిస్టులు వెనక్కి నెట్టేశారు. సైన్సు పేరుతో జరిగిన క్రూసేడు యిది. ఈ క్రూసేడులో భరతఖండం కూడా బాధితురాలే. ఎందుకంటే, క్రైస్తవమత పూర్వపు యూరప్ కీ మనకీ పోలికలు ఉన్నాయి. ఆ ప్రాచీన గతం నుంచే బ్రూనో, గెలీలియో వంటి వారు స్ఫూర్తిని పొందారు. అలాంటి స్ఫూర్తిని వాళ్ళు ప్రాచ్యం నుంచి కూడా పొంది ఉండవచ్చు.

బ్రూనోని ఇటాలియన్ కాథలిక్ క్రైస్తవులు సజీవ దహనం చేసి అతని చితాభస్మాన్ని టైబర్ నదిలో కలుపు తున్నప్పుడు మనదేశంలో యమునా నది ఒడ్డున అక్బర్ చక్రవర్తి సర్వమత సమానత్వాన్ని పెంపొందింప జేయడానికి ప్రయత్నిస్తున్నాడు. విభేదాల్ని సంవాదాలుగా మార్చడానికి కృషి చేస్తున్నాడు.

యిక్కడ నేనొక ప్రాచీన కథని ఉటంకించకుండా  ఉండలేను. దేవదానవులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక్క సరస్వతీదేవి మాత్రం దూరంగా వుంది. ఆమెని దేవతలూ రాక్షసులూ కూడా తమవైపుండి పోరాడమని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి వారికి ఒక సత్యాన్ని బోధించింది. “యుద్ధానికి ముగింపు ఉండదు. సంవాదం చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోండి.” యిటీవల అసహనం చర్చనీయాంశమైన సందర్భంలో వొక కన్నడ రచయిత యీ కథని స్మరించాడు. అక్బర్ ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు. బ్రిటీష్ వాళ్ళు పూర్తిగా ఆధిపత్యం చెలాయించేంతవరకు సంవాద పద్ధతి కొనసాగిందని వెండీదోనిగర్ రాశారు (Hinduism – An alternative history).

క్రైస్తవవలసకు పూర్వం భారతదేశంలో ఉన్న స్థితిని చీకటియుగంగా భావించారు మన మేధావులు. ఇది లెఫ్టిస్టులకీ రైటిస్టులకీ కూడా చీకటిచరిత్రే. లెఫ్టిస్టు లేమంటారు? ఆకాలం కులతత్వపు చీకటితో నిండి ఉందంటారు. రైటిస్టులేమంటారు? అది ముస్లిం మతపు చీకటి అంటారు. ‘కసాయిబు’ల కాలం అంటారు. వీరిద్దరూ ఒకచోట కలుస్తారు. అది చీకటి. భారతీయులది చీకటి చరిత్ర.

భారతీయుల గతం చీకటి చరిత్రగా ఎందుకు కనిపించింది? దాని వెనక వున్న కార్యకారణ సంబంధం ఏమిటి?

మార్క్సు భారతీయుల గతం గురించి మూడు రకాలుగా చెప్పాడు. 1) నిరంతర ఓటమి 2) అంతులేని వైరుధ్యాల పుట్ట 3) అధమ మతం, ప్రకృతి ఆరాధనతో కూడిన పేగన్ మతం (ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం). వీటికి పరిష్కారం ఏమిటి? తిరిగి ఓటమి. బ్రిటిష్ చేతిలో ఓటమి. మార్క్సు మాటల్లో భారతీయులకు ఓటమి కొత్తేమీ కాదు. ఏ తురక చేతుల్లోనో కాకుండా బ్రిటిష్ వాడి చేతిలో ఓడిపోవడం మంచిదైంది. దీనికి కొనసాగింపే శ్రీ శ్రీ రాసిన దేశచరిత్రలు. ముస్లిం నియంతల పేర్లు తప్ప ఇంగ్లీషు నియంతల పేర్లు ఆ కవితలో కనబడవు. ఎందుకంటే భారతదేశాన్ని ఇంగ్లీషువాడు ఓడించడమే మంచిదైం దని మార్క్సు అన్నాడు కనుక. బంకించంద్ర చటర్జీది కూడా అదే పాట. ముస్లిం నియంతృత్వపు చీకటి నుంచి బ్రిటిష్ వాళ్ళు మనల్ని బయట పడేశారన్నాడు. జార్జి చక్రవర్తి హింసాత్మక విజయాన్ని గురజాడ కూడా శ్లాఘించాడు. ఈ ఆధునిక కవుల అభిప్రాయాలన్నీ ‘బ్రిటిష్ యుగం హింసాత్మకమైనప్పటికీ అది భారతదేశాన్ని గ్రామీణ చీకటి నుంచి విముక్తి చేసిన యుగం’ అన్న మార్క్సు మాటలకు ప్రతిధ్వనులే!

ఇప్పటికీ భారతీయ గతాన్ని మూడు రకాల చీకటిగా చూడడం జరిగింది. 1) గ్రామీణత 2) కులం 3) ముస్లిం సంస్కృతి. ఈ మూడూ విమర్శకుల దృష్టిలో చీకట్లే. విప్లవ మేధావి కెవిఆర్ బ్రిటిష్ పూర్వ యుగాన్ని ‘నిశీధిని’ అన్నాడు.

భారతదేశాన్ని చరిత్ర పూర్వ యుగంగా భావించాడు హెగెల్. అలాగే భావించాడు మార్క్సు. క్రైస్తవ పూర్వ సమాజంగా భావించారు క్రైస్తవులు. వీరి భావాలే కమ్యూనిస్టుల్నీ, ఆధునికుల్నీ, హిందూవాదుల్నీ ప్రభావితం చేశాయి. ఈ అన్ని దృక్పథాల వెనక కార్యకారణ సంబంధం పనిచేస్తోంది. అది క్రైస్తవ యూరోపీయ కార్యకారణ సంబంధం. దృష్టే సృష్టి.

అన్ సర్టైనిటి థియరీ, కేయాస్ థియరీ, క్వాంటం ఫిజిక్స్ ద్రష్టకి ప్రాధాన్యాన్ని పెంచాయి. దేవుడు పాచిక లాడడని ఐన్ స్టీన్ అన్నాడు. క్వాంటం ఫిజిక్స్ గురించి మాట్లాడే సందర్భంలో ఈ మాటలన్నాడు. భారతీయ దృక్పథం ప్రకారం ప్రపంచం దేవుడి లీల, క్రీడ మాత్రమే. అతనికి తోచుబడి కాక యీ క్రీడ మొదలు పెట్టాడు. మొదట తనని తాను రెండుగా స్త్రీ పురుషులుగా విభజించుకొన్నాడు. మైథునక్రీడ జరిపాడు. అప్పుడు సృష్టి మొదలైంది. దీన్ని సృష్టిక్రీడ లేక ఇంద్రజాలం అంటారు. క్రీడల్లో లాగే ఇంద్రజాలం సూత్రాలు కూడా కల్పితం. ఎవడా సూత్రాల్ని కల్పిస్తాడో, ఏ దృక్పథంతో కల్పిస్తాడో, ఆ రూపం ధరిస్తాయి. అటువంటి సూత్రాలు ఏర్పడతాయి. నువ్వు దేవుణ్ణి ఏరూపంలో చూడాలనుకొంటే ఆ రూపంలో కనబడతాడు. ప్రపంచం ఏరూపంలో కనబడాలనుకుంటావో అలా కనబడుతుంది. నిశ్చల సూత్రాలు లేవు. నువ్వు యూరోపీయ క్రైస్తవ దృక్పథంతో చూడాలనుకుంటే ప్రపంచం అలాగే కనబడుతుంది. భారతదేశానికి ఓటమి సహజాతం అని మార్క్సు అన్నాడు. అది అతని దృష్టి. అసలు ఓటమి అంటే ఏమిటి? భరతఖండ స్వరూప స్వభావాలు ఎటువంటివి? దీన్ని మనం తులనాత్మక పద్ధతిలో నిర్వచిద్దాం.

చైనా చాలాకాలం పాటు మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. ఒకే భాష ఒకే లిపి అందుకే అక్కడ సాధ్యమయ్యాయంటారు. బ్రిటిష్ వాళ్ళు మత్తు మందు యుద్దాలతో లొంగదీసేవరకు చైనా తన మానాన తాను బతికింది. అమెరికా సంగతి చెప్పక్కర్లేదు. సుదీర్ఘకాలం పాటు ఏకాంతంలో జీవించింది. యూరోపియన్ల ప్రవేశంతో వారితో వచ్చిన సూక్ష్మక్రిములు స్థానికుల్ని చంపేశాయి. మిగిలినవారిని గన్నులు వేటాడాయి. చరిత్ర లేని, బలమైన స్మృతులు లేని కొత్తజాతి పుట్టుకొచ్చింది.

భారతదేశానికొస్తే, యిక్కడ అడుగు పెట్టని జాతి లేదు. యిక్కడ దొరకని భాష లేదు. ముక్కోటి దేవతలు. యిక్కడ ఎవరు ఎవర్ని జయించారు, ఎవరు ఓడిపోయారు!? సుదీర్ఘమైన గతం. యింకా చదవబడని హరప్పా లిపి. భరతఖండం ఎప్పుడూ ఒంటరిగా లేదు. అతిధులు ఎక్కువ. అందుకే ఆతిధ్యం భారతీయుల ప్రత్యేకత అయ్యింది. నిజానికి అతిధుల్నీ స్థానికుల్నీ వేరు పరచడం అసాధ్యం. ఇది అతిధుల దేశం.

అందువల్లనే అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ఎందుకంటే అమెరికాకి చరిత్ర లేదు. ఇండియాకి గుర్తించగలిగే చరిత్ర లేకున్నా గాఢమైన స్మృతులున్నాయి. యిక్కడ చరిత్రని వెతికే వాడు మూర్ఖుడు. స్మృతుల్ని వెదికేవాడు ఋషి. ఆ స్మృతులు ఎక్కడుంటాయి. ప్రజల నాల్కల మీద ఉంటాయి. స్థానిక సంస్కృతుల్లో ఉంటాయి. ఎవరో మనకి అశోకుడి పుట్టు పూర్వోత్తరాలు తెలియవని బాధ పడ్డారు. కానీ మనకి సూఫీ గురువుల బోధలు తెలుసు. కబీర్ దోహేలు తెలుసు. వేమన పద్యాలు నోటికొస్తాయి. అతి ప్రాచీనమైన వేదాలు కంఠతా వచ్చు. ఇవి స్మృతులు, గాఢమైన స్మృతులు. ఈ స్మృతుల్ని అధ్యయనం చెయ్యడం వల్ల మనుషుల మధ్య అనుబంధాలు దృఢమౌతాయి. మనకి అశోకుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియకపోయినా, హరప్పా లిపి చదవలేకపోయినా, వర్తమానంలో మిగిలి ఉన్న సజీవ సంస్కృతులలో కులపురాణాలలో మన గత సంస్కృతి అందుతూనే ఉంది.

ఇంతకీ చరిత్ర మనకి ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని నేర్పింది. ఎప్పుడూ మనం ఓడిపోలేదు, ఎప్పుడూ గెలవనూ లేదు. భరతఖండానికి సంబంధించినంతవరకూ గెలుపోటములు వలస క్రైస్తవులు కనుగొన్న విషయాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మనలో ఒకరుగా ఉండదలుచుకోలేదు. దూరంగా ఉంటూ బిజినెస్సు చెయ్యదలుచుకున్నారు. అందుకని మనని ప్రాచీన ఆర్యుల దగ్గరినుంచి అందరూ ఓడిస్తూ వచ్చారని గెలుపు చరిత్ర మనకు లేదని నూరిపోశారు. ఆర్యుల దండయాత్ర కథ కట్టుకథ అని తేలిపోయినా మనం దానినే అంటిపెట్టుకొని ఉన్నాం. చరిత్ర దయ్యంలా మనల్ని వెంటాడుతోంది. చరిత్ర అంటే గెలుపు అని, ఒక జాతి మరొక జాతి మీద జెండా ఎగరెయ్యడమనీ బ్రిటిష్ వాడు మనకి నూరి పోశాడు. మన సంస్కృతినీ సంప్రదాయాల్నీ కళల్నీ మొత్తం మన జీవితాలనే తాను గెల్చుకున్నానని చాటాడు. యీ వలసవాద దృష్టితోనే భరతఖండాన్ని నిరంతరం వోడిపోయే దేశంగా మార్క్సు వర్ణించాడు.

తెల్లవాడు వచ్చాక తెల్లారింది. అంతకుముందు అంతా చీకటే. అందుకే మరో వందేళ్ళు మనదేశాన్ని ఇంగ్లీషు వాడు పాలిస్తే బాగుండునని కంచ ఐలయ్యగారు అన్నారు. యిటువంటి భావాలు పాశ్చాత్య క్రైస్తవ అభివృద్ధి నమూనాకీ, టెక్నాలజీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నాయి. వలసవాదుల గెలుపు భావన, రాజ్యాధికార భావన మనల్ని వెంటాడుతోంది. అందరూ రాజ్యాధికారమే తమ లక్ష్యమని ప్రకటించుకుంటున్నారు.

(రెండో భాగం వచ్చే గురు వారం)

ఉరితాడూ ఈ ముడి నువ్వయినా విప్పవూ?

 

 

           -బమ్మిడి జగదీశ్వర రావు

                                     ~

bammidi అయ్యా రంగనాథ్ గారూ..

మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!

మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?

మీ అమ్మ జానకమ్మగారు మంచి గాయకురాలు. అంతేనా?, మించి తబలా విద్వాంసురాలు. మరి వీణలోనో.. యేకంగా గోల్డు మెడలిస్టు. అన్ని అర్హతలు వుండీ యిల్లాలయ్యాక  యింటి బరువు మోసాక తన కోరిక.. సినిమా నేపథ్యగాయని కావాలన్న తన ఆశని తీసి అటకా యెక్కించేసారు! సంసారమే సంగీతమయ్యాక దారి దొరక్క- గొంతుండీ పాడలేక – పిల్లల పెంపకం వీడలేక – కలని నెరవేర్చుకొనే తోవ లేక – వున్న ఒక్క జీవితాన్ని ముగించలేదు! మీలా వురి పోసుకోలేదు! వూపిరి పోశారు కలకి! కోరితే మీరు నీరు పోశారు! ఆ ఫలమే మీరు!!

మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!

అలాగే చైతన్య కుమారి జ్ఞాపకాల్ని ఆరేళ్లుగా ఆయువు పోస్తున్నారే.. ఆత్మ అన్నారు.. ఆజ్ఞాపకాల్నీ  మీ ఆత్మనీ మీరు వురితీసారని యెరుగుదురా?

మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!

హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?

అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!

జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!

ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే!

ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!

మందసా మహరాజ్ ఎస్టేట్ లో మీతాతగారు వైద్యులుగదా? ఆ మందసా మహారాజు యిప్పుడు యేo చేస్తుస్తున్నాడు? యింకా రాజుగానే వున్నాడా? లేదే.. ఆ ప్రాంతంలో కొందరు రాజులు పాలు అమ్ముకుంటూ బతుకుతూ వున్నారు తెలుసా? మందసా రాజుగారు కూడా వురిపోసుకు చావలేదు!

ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?

మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?

నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!

మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?

సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!

నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!

వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!

యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!

కన్నీళ్ళతో-

వొక ప్రేక్షకుడు

 

సామాన్యుడి దారి..

– అడివి శ్రీనివాస్
~

adiviమనకు జీవితంలో ఎంతోమంది తారసపడతారు. కొందరు ఇచ్చే వారుంటారు, కొందరు పుచ్చుకునే వారుంటారు. మరికొందరు ఇచ్చిపుచ్చుకునే వారూ ఉంటారు.
ఈ మూడో రకం మనుషుల్లో ఆ ‘క్రియ’ అద్భుతంగా ఉంటుంది.
ఆ అద్భుతం ‘సామాన్యమైందే.
మనం ఇరుగు పొరుగున నివసించే వాళ్లతో ‘ఇచ్చిపుచ్చుకోమా?’ అటువంటిదే అది
మరి, ఆ సామాన్యమైన అనుబంధాన్ని, అద్భుతాన్ని అలవోకగా నెరిపే వ్యక్తి కందుకూరి రమేష్ బాబు.
అతడు అన్నీ ఇస్తాడు. అన్నీ పుచ్చుకుంటాడు.

గౌరవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అతడు అన్నీ ఇస్తాడు.
మనకూ ఇవ్వాలనిపిస్తుంది. తాను పుచ్చుకుంటాడు.
ఇచ్చిపుచ్చుకోవడంలోని సామాన్యత ఆయన దగ్గర నాకు విశేషంగా కనిపించింది.

ఈ విషయం చెప్పకుండా ఆయన రాసిన ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ ప్రారంభిస్తే అది సామాన్యంగా అనిపించదు. అందుకే ముందు రచయిత స్వభావం గురించి రెండు మాటలు చెప్పి మరి నాలుగు మాటలు  పంచుకోవాలనుకుంటున్నాను.

+++

సత్యజిత్ రే సినిమాల్లో ఎక్కడా జూమ్ ఇన్ – జూమ్ అవుట్ కనిపించదు.
జీవితంలోని వాస్తవికతను ప్రతిబింబించాలనుకున్నప్పుడు దేన్నీ ఫోకస్ చేయడం వుండదు.
అందుకే సత్యజిత్ రే దేన్నీ జూమ్ చేయడు. జూమ్ ఔటూ చేయడు.
అయితే, టిల్ట్ అప్, టిల్ట్ డౌన్ ఉంటుంది. కెమెరా లెఫ్ట్ పాన్…రైట్ పాన్ అవుతూ ఉంటుంది.
కానీ, జూమ్ చేయడు. ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు యధాతధంగా జీవితాన్ని దర్శిస్తాడు.
వాస్తవికత, సహజత్వంలో లీనమై పోతాడు.
రచయితగా కందుకూరి రమేష్ బాబు ఈ పుస్తకంలో చేసింది అదే.
ఎక్కడా మనల్ని దగ్గరకు తీసుకెళ్లడు. దూరం చేయడు.
వాస్తవికతను రచించి అలా చూపిస్తాడు.

మరొక సంగతి.

టెక్నికల్ పరిభాషలో ‘ఫ్రేమింగ్’ అంటుంటాం.
ఒక ఫ్రేంలో ఏముండాలి? ఎంత వుండాలి? ఆ ఫ్రేం ఎలా పెట్టాలి? అని ఆలోచిస్తాం.
ఆ ఫ్రేంను ఎంత వరకు పెట్టాలో తెలియాలనీ అనుకుంటూ ఉంటాం.
ఈ రచయితకు దాని గురించి తెలుసు.

తనకి ఆ ఫ్రేం తెలుసు. తన ఫ్రేం తెలుసు.
దాన్ని ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడమూ తెలుసు.
ఆ ఫ్రేం పరిధి దాటిపోకుండా ఉండటమూ అతడికి తెలుసు.
ఒక్క మాటలో ఫ్రేమింగ్ తెలిసిన ఆల్కెమిస్ట్ రమేష్ బాబు.

ఆ ఫ్రేమ్ లో ‘సామాన్యతే’ కనిపిస్తుండటం ఈ పుస్తకం విశేషం. సామాన్యత.

జీవితంలో అయినా, రచనలో అయినా, ఫొటోగ్రఫిలో అయినా – ఆ ఫ్రేమింగ్ తెలిసిన అరుదైన మనిషి రమేష్ బాబు. అటువంటి వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు.

తాను ఈ పుస్తకం ప్రారంభంలోనే ఒక చోట రాస్తాడు. నలుపును విస్మరిస్తే తెలుపు భగవంతుడి లీల మాదిరిగా కనిపిస్తుందని! ‘ఫ్రేమింగ్’ అంటే ఇదే. దాన్ని అక్షరాలా నిజం చేసి చూపే రచన ఈ పుస్తకం.

+++

నేననుకుంటాను, ఉత్తమ రచనకు ఉండాల్సిన లక్షణం – ఏదైతే చదువుతున్నానో కాసేపు అదే నేనైపోవడం.
ఆ నేనైపోవడం ఈ పుస్తకంలో సామాన్యంగా జరిగిపోయింది.

E. M. Forster ఎ ప్యాసెజ్ టు ఇండియాలో అనుకుంటాను, ఒక చోట రాస్తాడు…’మనిషి జీవితంలో చాలా భాగం నిరాసక్తమైనదే. కానీ, కవులు, కళాకారులు తమ ఉనికి నిలుపుకునే ప్రయత్నంలో జీవితాన్ని అందంగా, అద్భుతంగా నిర్వచించారు, రచించారు. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాడెపుడూ మౌనంగానే ఉంటాడు.’

ఈ మాట కొంచెం వివాదస్పదమే.
కానీ, ఇక్కడ ఏ వివాదమూ లేదు.

kandukuri ramesh babuనాకనిపిస్తుంది! చాలాసార్లు సాహిత్యం చదువుతున్నప్పుడు ఒక్కోసారి భయమేస్తుంది.
రావిశాస్త్రి గారి ‘వర్షం’ కథలో – వర్షాన్ని సంపిడ్సిపెట్టే నూకరాజును చూస్తే భయమేస్తుంది.
వివినమూర్తి గారి ఏటిమార్గం కథలో రోడ్లు వేసే సంచార జాతికి చెందిన వ్యక్తి చెప్పే మాటలు…అవి గుర్తొస్తే బాధేస్తుంది.
ఆ కథలు గొప్ప కథలు.
ఆ కథలు చాలా సామాన్యుల కథలు.
ఆ కథల వంటి కథలు చాలా ఉన్నాయి.
ఆవి ఆయా రచయితల జీవితానుభవాల్లోంచో, వారికి పరిచయమైన వ్యక్తుల నుంచో వచ్చాయి.
వాటిని అద్భుతంగా మన ముందుంచారు.
అయితే ఈ రొమాంటిసైజ్ చేయడమనే లక్షణం ఈ పుస్తకంలో కనిపించలేదు.
నిజాయితీ, సహజత్వమేదో ఈ పుస్తకంలో ఉంది.
అందుకే ‘మీరు సామాన్యులు కావడం ఎలా’ అన్నఈ పుస్తకం జీవితంలా As it is లా ఉంది.
ఎలా కనిపిస్తే అలా…ఏది ఫీలైతే అలా…సహజంగా, సామాన్యంగా ఉంది.
అందుకే ఈ పుస్తకంలోని రైలు డ్రైవర్ ని చదివినప్పుడు…
అతడు తన విధులనుంచి తాను తప్పుకుంటున్నప్పుడు…
ఆ డ్రైవర్ ని నేనే అయిపోయాను.
ఇది చదువుతున్నంత సేపూ నేను సామాన్యుడినే అయ్యాను.

‘నేనొక సామాన్యుడిని’ అని మనల్ని మనం తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

+++

ఒక ఉదయం ఆర్.ఆర్. షిండే అన్న దర్శకుడితో నేను పంచుకున్న ఒక అనుభవం ఇక్కడ గుర్తు చేసుకోవాలనిపిస్తోంది.
ఆయన వేదాంతి వంటివాడు.
జీవితాన్ని రికామీగా ఫీలయ్యే వ్యక్తి.
ఆయన నాతో మాట్లాడుతూ, ‘జీవితంలో నేనేమీ పెద్దగా సంపాదించుకోలేదు శీనూ’ అన్నాడు.
‘ఒకే ఒకటి సంపాదించుకున్నాను. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకూ నేను నడిచి వెళ్తుంటే ఓ పది కార్లు వచ్చి ఆగుతాయి. ‘ఏంటి షిండే..నడిచి వెళుతున్నావు…రా…కారెక్కు’ అని ఓ పదిమంది అడుగుతారు. నేను జీవితంలో సంపాదించింది ఇది శీనూ…’ అని అన్నారాయన.

నాకెందుకో అప్పుడు తనని ఒక ప్రశ్న అడగాలనిపించింది.
ఇలా అడిగాను. ‘ఎవరూ ఎక్కించుకోకుండా వెళితే ఏం చేస్తారు? అని కుతూహలంగా అడిగాను.
ఆయన అన్నారు, ‘ఏముందయ్యా…నడుచుకుంటూ వెళ్తాను’ అన్నారు.
సామాన్యులు అంతే.
వాళ్లు మీ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు.
మనకు తెలియదు, వాళ్లు సామాన్యులని!
అలాంటి ఎంతోమంది సామాన్యులను రమేష్ బాబు ఇందులో పరిచయం చేశాడు.
సామాన్యతలోని సామాన్యతను ఈ పుస్తకంగా మలిచి చూపించాడు.

+++

ramesh1ముందు చెప్పినట్లు ఈ పుస్తకం చదివి నేనొక రైలు డ్రైవర్ ని అయ్యాను.
ఇంకా చాలా అయ్యాను.
నేనూ అయ్యాను.

మొత్తం పుస్తకంలో నాకు  బాగా నచ్చింది తానే పాట కావడం.
పాటై పోవడం!

మనం ఏదైతే అనుకుంటామో అది కావడం!

ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడట…
గురువు గారూ ‘enlightenment అయ్యాక ఇంకా ఏం జరుగుతుందీ?’ అని!
ఆ గురువు గారు చెప్పారు, ‘ఏం జరగదు. నీ పని నువ్వు చేసుకుంటావు. అంతే’ అన్నారట.
ఈ పుస్తకం పూర్తి చేశాక మనం మన పని మనం చేసుకుంటూ పోతాం.
వేరే వాళ్ల జీవితాలు గడపడం కాదు, మన జీవితాలు మనం గడపడానికి పూనుకుంటాం.
అది నిజమైన అభినందన.
అదే ఈ పుస్తకానికి, రచయితకు నిజమైన అభినందన.

ఇంత గొప్ప ఫిలాసఫినీ ఇంత సింపుల్ గా ఒక చిన్న పుస్తకంగా రాయగలగడం, దాన్ని అంగీకరింపజేయడం చాలా గొప్ప విషయం. అందుకు రమేష్ బాబుకు మనఃస్ఫూర్తిగా అభినందనలు.

*

కవి నిద్రపోయే అవకాశమే లేదు!

 

సిద్ధార్థ

సిద్ధార్థ

ఇది నేను బతికిన ఇరవై సంవత్సరాల కవిత్వం. రాజకీయ, సామాజిక వైయక్తిక ఆధ్యాత్మిక సృజనాత్మక… సుడులతో.. దిగులుతో, పొగిలిపోతూ ప్రత్యేక అస్తిత్వం కోసం అంగలారుస్తూ పొటెత్తుతూ… నన్ను క్షణవరతం ముంచేసిన కవిత్వం. రెండు దశాబ్దాల / నిద్ర పోనివ్వని రాత్రుల / జంగమ జాతరల / రంది రగడల కవిత్వం. ఈ వాక్యాలతో, ముచ్చట్లతో నాకు నాతో నాలోని మన నేనుతో తొట్టెలూగాను. ఈ తొట్టెలకు భూమి కేంద్రం నా ఊరు నా తెలంగాణ నా హైదరాబాద్. ఈ పదాల ప్రస్తారవలయం మాయమ్మ బొడ్డుతాడును మెడకు చుట్టుకుని వలయించింది. నా ఇంటి చుట్టూ గల్లీల చుట్టూ రాళ్ళ గుట్టల మొహలాల్ల చుట్టూ కూలిపోవడానికి సిద్ధంగా లేని కట్టడాల చుట్టూ దరువులేసుకుంటూ తిరిగింది నా ప్రదర్శన కవిత్వంగా. 

 
ఈ వాక్యాల కట్టడాల అంతస్సుల్లో మల్లా కొత్త జన్మనెత్తాలన్న ప్రాకృతిక వాంఛను నేను అనుభవిస్తున్నాను. ఔటర్ ఇన్నర్ రింగురోడ్ల కింద కుమిలే / మసలే పంట పొలాల ఆకుపచ్చని రక్తాల వాసనను నేను అనుభవిస్తున్నాను. 
 
రూపం … రూపం రాని తనం … రూప విధ్వంసం … రూప మోహం … రూపసార జంగమం నా కిష్టం. నేను నాకిష్టమై నచ్చిన బతుకే… నా కవిత్వంలో వర్తిస్తూ వచ్చింది. అసహనం, రాయకుండా ఉండలేని తనంతో లోపలి బొక్కల్ని, నరాల్నీ, బొక్కల్లోన్ని మూల్గునీ నుజ్జు నుజ్జు చేస్తున్న కవిత్వం ఇది. ఎక్కడివరకు తీసుకుపోతుందో తెలియదు. ఇది ఎక్కడిదాకా తీసుకోచ్చిందో అర్థం కాలేదు. ఇక్కడ  కనిపిస్తున్న కవితల్లో … సందర్భం పూర్తిగా తెలిసే అవకాశం పాఠకుడికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాని వాటిని చదువుతూ… తనకంటూ ఏర్పరుచుకున్న అనుభవ విభాగాల్లోకి ప్రాంతాల్లోకి పార్శ్వాల్లోకి ఇంటి మలుపుల గుమ్మాల కిటికీల సాయవానుల్లోకి పోయి కూర్చుంటాడు. అతనికి అర్థమైందంతా అతని అనుభవం తాలూకు ప్రతిఫలనమే. 
 
పుస్తకాల్లో – నాకు నచ్చిన వాక్యాలు తగిలినపుడు జ్వరమొచ్చి నీరసపడిపోయి వాటి మత్తులో  గంటల తరబడి tranceలో ఊగిపోయిన సందర్భాలు చాలా  వున్నాయి. 
 
నేను ప్రాధమికంగా పాఠకుడిని-పాఠకత్వంలో ఉన్న ఆనందం నాకు  దేంట్లోనూ దొరకలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిగా ఊగిపోవడం తప్ప ఏమీ చెయలేనివాన్ని. అందుకే కవిత్వం పాఠకుడిని మత్తులోకి జీవనలాలసలోకి, దైన్య ధైర్యంలోకి, తెగింపులోకి తీసుకుపోతుంది. అదే దాని శక్తి. అది మనలో రేపే తిరుగుబాటు అంతరిక భౌతిక సరిహద్దుల్ని దాటేస్తుంది. కొత్త మరణాల్లోకి అటు నుంచి కొత్త పుట్టుకల్లోకి జీవిని తీసుకుపోతుంది. కవిత్వం ద్వారా నేను చూసిన వాన మబ్బుల సౌందర్యంతో పాటు పంట సాళ్ళ పగుళ్ళ బతుకు భయ బీభత్స సౌందర్యం కూడా వుంది. తెలుపు నలుపులోని పలు వర్ణ సమ్మేళనాల రసాయనిక చిత్ చర్య వుంది. శబ్దభూమిలోని నిశ్శబ్ద రుద్రభూమి ఆనవాలు వుంది. ఏ కవినైనా కాలమే పుట్టించి అన్నం తినిపించి సేదతీర్చి తిట్టి కొట్టి గాయపరిచి గారంచేసి కేకపెట్టించి ముందుకు ఎగదోసి perform చేయిస్తూ తుదకు మృత్యువుపాలు చేస్తుంది. కవిగా నా విషయంలో కూడా కాలం అదే పనిలో గాడంగా పని చేస్తూనే వుంటుంది. 
 
Siddharta Book Coverకవిత్వం రాసేటోడికి వాని వునికి వానికి తెలిసిరావాలె కదా. మన ఇల్లు వాకిలి మన ఇంటోళ్ళ బతుకూ, బరువూ బలుపు, ఎతచిత, కులం/పొలం/జలం, పొయ్యికాడి దేవతా, తలపోతలోని గ్రామదేవుడూ, దయ్యం దాని శిగమూ తెలిసిరావాలె కదా, మన అమ్మలక్కల చీకటి గదుల అర్రల, చెప్పుకోలేని చింతల, వారి మాటల పనిముట్ల మాటలు మనం మోయాలె కదా. మనలో ఎప్పటికి పోరగాని తనమే తలనూపాలె కదా… 
 
గడిచిన రెండు దశాబ్దాలూ పూర్తిగా కల్లోల దశాబ్దాలు… ముఖ్యంగా కవికి. ఎటు జరిగినా వొక మూలనుంచి ముసురునుంచి ఏదో ఒక రాయి వచ్చి తగులుతుంది. రక్తస్రావం తప్పనిసరి. ఆధిపత్య పాలనకింద నలుగుతూ ధిక్కరిస్తూ పోటెత్తి, పోరెత్తిన కాలం. తెలంగాణ అస్తిత్వమే రుద్రభూమి. కొన్ని దశాబ్దాలుగా ఈ భూమి వలసాధిపత్య హింసలో భాగంగా సామాజిక హింసకు రాజకీయ హింసకు వైయక్తిక ఆధ్యాత్మిక హింసకు సృజనాత్మక హింసకూ చిక్కి నలిగిపోయింది. ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఇది ఎన్నో శక్తుల చెండాట. గతం కాళ్ళకింద చిక్కుకుపోయిన వర్తమానాన్ని ఎగతన్ని తల ముందుకు తీసుకురావాల్సిన చెండాట. 
 
చుట్టూవున్న ప్రపంచంతో నన్ను నేను sync చేసుకోవడానికి ప్రయత్నించాను. 
ఇందులోని ఏ  వస్తువులకవే నాతో మాట్లాడినయ్, సర్వజీవ నిర్జీవ చేతనల చింత నాలోనుంచి అవతలకు ప్రసరించి తిరిగి పునర్గమనం చేసింది నాలోకి, నేను వుండని నాలోకి. కవిత్వం వ్యాపకం కాదు … ప్రకృతి. ప్రతి ఒక్క పదమూ మెటఫరే. ప్రతి కదలికా సింబలే. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను. 
 
ఇదింకా అంతంకాలేదు. కంపన కొనసాగుతూనేవుంది. వాస్తవ యుద్ధం ఇంకా మొదలే కాలేదు. కవి నిద్రపోయే అవకాశమే లేదు. 
 
మార్గశిర మాసం, 2015

నయాగరాకి రంగులు అద్దితే…మన మోహన్!

 

(ప్రసిద్ధ చిత్రకారుడు మోహన్ కి పుట్టిన రోజు  శుభాకాంక్షలతో..)

-ప్రకాష్

~

 

prakashహృదయంలో ప్యూరిటీ- ఆలోచనలో క్లారిటీ- ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుంది గానీ, దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుకున్నా, చికాకు పడినా… రచయితలు… అర్టిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదే పదే చెబుతుంటాడు. మోహన్ అలాగే ఉండాడు.

మోహన్‌ కిప్పుడు అరవై ఐదేళ్లు. 1950 డిసెంబర్‌ 24న ఏలూరులో పుట్టాడు. తండ్రి తాడి అప్పల స్వామి అనే కమ్యూనిస్ట్ నాయకుడికీ తల్లి సూర్యావతికీ పుట్టిన మోహన్‌ని కమ్యూనిస్టు ఉద్యమమే ఎత్తుకుని పెంచి పోషించింది. అప్పల స్వామి ఆనాటికే బాగా చదువుకున్నాయన. ఇంగ్లీషు, హిందీ, సంస్కతం బాగా తెలిసినవాడు. చదువుకోవడమే, విద్యతో వెలిగిపోవడమే , జ్ఞానంతో రాణించడమే , పేద వాడి కోసం పోరాడడమే మానవుని విధి అని నమ్మేవాడాయన. అదే మోహన్‌కి అబ్బింది. మొదటి నుంచీ మోహన్‌ చదువరి. కథో, నవలో, పద్యమో, మార్క్సిస్టు సాహిత్యమో చదవడమే పని. ఆ చదువే ఆనందం. పధ్నాలుగు, పదిహేనేళ్ళకే బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు. రెండే వ్యాపకాలు చదవడం, బొమ్మలు వేయడం. మరొక్కటుంది, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చుట్టూ స్నేహితులే. మోహన్‌ చుట్టూ సంపాదకులు, జర్నలిస్టులు, రచయితలూ, ఆర్టిస్టులు, కవులు, ఉద్యమకారులు… ఎందరెందరో… కళాకారుడి కార్యాలయం పార్టీ ఆఫీసులాగే… టీలు… సిగరెట్లు… చర్చలు… ఎన్ని మాటలున్నా, జోకులున్నా, అందరి మధ్యలో మోహన్‌ బొమ్మలు వేస్తూనే వుంటాడు. నాజూకైన గీతలు. ఆడపిల్ల నడుం నుంచి అరచేయి దాకా వయ్యారపు ఒకే గీత. గీతాదత్‌ పాటలాగ. సర్రున మొగవాడి మోకాలి నుంచి చెయ్యెత్తి తుపాకీ పట్టే దాకా కత్తితో గీశాడేమో అనిపించే ఉద్యమగీత. పాబ్లోనెరూడా పోయిట్రీలా.

06

మోహన్‌ ఒక స్వచ్ఛమైన జలపాతం. అన్ని రంగులూ కలిస్తే తెలుపు అయినట్టుగా – అతను ఆర్టిస్టు, కమ్యూనిస్టు, కార్టూనిస్టు, జర్నలిస్టు, కవి, విమర్శకుడు, రచయిత, యానిమేటర్‌, మిత్రుడు, గురువు, డ్రీమర్‌, తండ్రి, నీ సగం సిగరెట్టు తీసుకొని తాగే సాదా సీదా సగటు ఒన్‌బైటూ చాయ్‌ గాడు. నీకెప్పుడూ అందుబాటులో వుండేవాడు. నీకెప్పటికీ అందనివాడు. కవిబాల గంగాధర తిలక్‌లాగా అందమైనవాడు. మనోహరమైన చిరునవ్వును ఆయుధంగా ధరించినవాడు. అడిగిన వాడికి లేదనకుండా బొమ్మగీసిచ్చేవాడు. వాడు ఐయ్యా, ఎమ్మా, ఎమ్మెల్లా, లిన్‌పియావో, పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జనశక్తి, ప్రతిఘటన, అతి నటన, మహిళ, బడుగు, బలహీన, ముస్లిం మైనార్టీ, దళిత, మాదిగ, డక్కిలి, లంబాడా, నంగరా, అస్తిత్వ, సుత్తిత్వ, పరమబోరిత్వ… ఎవరైనా మోహన్‌కి ఒక్కటే. బొమ్మవేసిస్తాడంతే. నచ్చడం నచ్చకపోవడం జాన్తానై. ఒక్కోడిదీ ఒక్కోరకం కమ్యూనిజం. ఒకడిది వర్గకసి. ఒకరిది ప్రేమదాహం. మరొకరిది విప్లవద్రోహం. మరొకామెది మగదురహంకార పదఘట్టన కింద నలిగిపోయే భూమిక. ఇంకొకడు మానవ హక్కుల్ని ప్రేమిస్తాడు. మరొకడు తెలంగాణా కోసం ఉద్యమిస్తాడు. మోహన్‌కి ఫిర్యాదుల్లేవు. గొడవలూ పెట్టుకోడు. నువ్వేం చెప్పు, శ్రద్ధగా వింటాడు. నీక్కావాల్సిన బొమ్మ, నువ్వు కోరుకున్న బొమ్మ బాగా వేసిస్తాడు. నీ అజ్ఞానం వల్ల, ఉపన్యాసాలిచ్చే దురలవాటువల్ల మంచి బొమ్మని మార్చి పిచ్చిబొమ్మ వేయమని మర్యాదగానే అడుగుతావు. నో కంప్లయింట్స్. నువ్వు కోరుకున్న మీడియోకర్‌ బొమ్మే నీకు దక్కుతుంది. ‘అదేంటి?’ అని ఎవరన్నా అడిగితే ‘‘ వాళ్ళకదే నచ్చుతుంది’’ అంటాడు. మారేజి బ్యూరో క్లయింట్‌ సర్వీసా? పవిత్రమైన ఆర్టా? అని ఎవరైనా కోప్పడితే ‘‘నువ్వు ప్రపంచాన్ని మారుస్తావా? నేనైతే అలాచేయలేను’’ అంటాడు మోహన్‌.

మోహన్‌ ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కాలేజీలో బి.ఎస్‌.సి. చదివి, 19 ఏళ్ళ వయసులో విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా చేరాడు. విశాలాంధ్ర లైబ్రరీ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ పుస్తకాలూ, అప్పటి సోవియెట్‌ సాహిత్యం మోహన్‌కి ఎప్పటికీ మరిచిపోలేని మంచి మిత్రులు. ఏటుకూరి బలరామ్మూర్తీ, రాఘవాచారీ, కంభపాటి సీనియర్లు తనని బాగా ప్రభావితం చేశారు. ఇంత రియలెస్టేటూ, స్టాక్‌మార్కెట్టూ, ఐటీ బూమూ, సెల్‌ఫోన్లు లేని బంగారం లాంటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజులవి. పుస్తకాలూ, పేపర్లూ, చదువూ, కవిత్వమూ చర్చలూ. అటు సొదుం రామ్మోహన్‌, ఇటు పెద్దిభొట్ల సుబ్బరామయ్య – సాయంత్రం అయితే కె.రాజేశ్వరరావు, గాంధీ, టీలు, సిగరెట్లు, అదృష్ట దీపక్‌, కవిరవి ఇతర స్నేహితులు. రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి లతో మాటకచేరీలు. సబెడిటర్‌ పని అంటే ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి అనువదించడం. అయ్యాక, ఓ రాజకీయ కార్టూన్‌ లాగించేవాడు. పబ్లిషింగ్‌ హౌస్‌కో కవర్‌ పేజీ వేసేవాడు. ఎవరి కవిత్వానికో ఓ బొమ్మ తగిలించేవాడు. జీవితంలో పెద్ద కోర్కెలేమీ లేనట్టుగానే బతికాడు. జెనీలియాలాగా కుదిరితే కప్పుకాఫీ, ఓ సిగరెట్టు. పుస్తకం ఎలాగో చేతిలో వుండేది. సింప్లీ, హి కెన్‌ కాల్‌ యిట్‌ ఎ డే.
చిన్న ఆనందాలు, గొప్ప అనుభవాలు (పైగా ఆ గురజాడ ఒకడు, జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును అని ఎగిరెగిరిపడుతూ)

ఎంటర్‌ హైదరాబాద్‌:

ఆంధప్రభలో అదే గొప్ప దిక్కుమాలిన కార్టూనిస్టు ఉద్యోగం కోసం మోహన్‌ 1980లో హైద్రాబాద్‌ వచ్చాడు, క్రోక్విల్‌ చెవిలో పెట్టుకొని. కార్టూన్లు పేలాయి. ఎబికె, వాకాటి పాండురంగారావు, దేవీప్రియ ఇంకా అనేకుల్‌, ‘‘ ఇరగదీస్తున్నావోయ్‌, రా చాయ్‌ తాగుదాం’’ అన్నారు లిబర్టీ సెంటర్లో. వో ఫర్లాంగు నడిస్తే, హిమాయత్‌ నగర్‌, అనగా మఖ్దూంభవన్‌ ఉండే చోటు. సి.పి.ఐ. నాయకులూ, స్నేహితులూ, అరివీర కామ్రేడరీ. ఆనక 1983లో ‘ఉదయం’ హడావిడి మొదలైంది. 1984 డిసెంబర్‌ 29 ‘ఉదయం’ దినపత్రిక మోహన్‌ కార్టూన్‌తో రిలీజైంది. మొదటిరోజు నుంచి ప్రతి ఉదయం కార్టూన్లు పేలాయి. బొమ్మల్ని జనం ప్రేమించారు. ఉదయంలో మోహన్‌ రోజుకి పది, యిరవై, పాతిక బొమ్మలు వేసిన రోజులున్నాయి. జనం మెచ్చినది మనం శాయడమే అనుకున్నాడో ఏమో! దారినపోయే దానయ్య నుంచి దాసరి నారాయణరావు దాకా ‘శెబ్బాష్‌ మోహన్‌’ అన్నారు. అండ్‌ ది రెస్ట్ ఈస్‌ కార్టూన్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధప్రదేశ్‌.

SHEET-1

మోహన్‌ చుట్టూ ఎప్పుడూ ప్రసిద్ధ కవులూ, కళాకారులూ, రచయితలూ, జర్నలిస్టులూ, మేధావులే. పురాణం సుబ్రమణ్య శర్మ నుంచి నామిని సుబ్రమణ్యం నాయుడు దాకా. గుడిహాళం రఘునాథం నుంచి గోరటి వెంకన్న దాకా. కేశవరెడ్డి నుంచి కె.ఎన్‌.వై.పతంజలి దాకా… సురవరం సుధాకరరెడ్డి, డాక్టర్‌ కె.నారాయణ మోహన్ని ఎంతగా అభిమానిస్తారో బాలగోపాల్‌, వరవరరావు అంతగా ప్రేమిస్తారు. ఎబికె ప్రసాద్‌, చేకూరి రామారావు ఎంత యిష్టపడతారో, వోల్గా నుంచి గద్దరు దాకా అంతే గౌరవిస్తారు. మన రాష్ట్రంలో అన్ని రకాల ప్రజా ఉద్యమాలలో అంతగా కలిసిపోయిన ఆర్టిస్టు మరొకరు కనిపించరు. మోహన్‌ యిదేమీ పట్టదన్నంత మౌనంగా, మయకోవస్కీ పుస్తకమో పట్టుకొని ‘‘అగ్గిపెట్టుందా?’’ అని అడిగి ప్రశాంతంగా చదువుకుంటూ నిద్రపోతాడు.

1990 తోసుకొచ్చింది. రాయటమూ, కార్టూన్లూ, కథలకి ఇలస్ట్రేషన్లూ, కవిత్వాలకు బొమ్మలూ, (ప్రపంచ పదులకి మోహన్‌ వేసిన బొమ్మలంటే సినారెకి ఎంత యిష్టమో) పోస్టర్లూ, కవర్‌ పేజీలూ చాలవన్నట్టు యానిమేషన్‌ మొదలుపెట్టాడు. యానిమేషన్‌ అంటే బొమ్మల్ని కదిలించడం కాదు, హృదయాల్ని కరిగించడం అన్నాడు. ఏళ్ళూ వూళ్ళూ గడిచిపోయాయి. ఇంకా హైద్రాబాద్‌కి మంచి కంప్యూటర్లు, స్కానర్లూ, హెచ్‌డి కేమెరాలు రాని కాలం అది. కాలం కంటే ముందు పరిగెత్తి అలసిపోయాడు. 17 సంవత్సరాలు గడిచి పోయాక ‘సాక్షి’ పేపర్‌ వచ్చింది. తర్వాత వాళ్ళు టీవీ ఛానల్‌ పెట్టారు. సజ్జెల రామకృష్ణా రెడ్డి, సువర్ణకుమార్‌ల పుణ్యాన అందులో మోహన్‌ యానిమేషన్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యాడు, వో పాతిక మంది టీమ్‌తో. తెలుగు ఛానళ్ళలో, ఆమాటకొస్తే ఏ జాతీయ ఛానల్లోనూ రాని అందమైన అపురూపమైన యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్లు చేసి చూపించాడు. జనం వెర్రెత్తిపోయారు. ఇన్‌స్టెంట్‌ హిట్‌.

జనరల్‌గా మోహన్ని ఆర్టిస్టుగానే చూస్తారు. అతనో మంచి రచయిత అని కొద్దిమందికే తెలుసు. మోహన్‌ ముందు జర్నలిస్టు. అనేక పుస్తకాలు తెలుగులోకి అనువదించాడు. కళమీదా, కార్టూన్లమీదా ఎన్నో వ్యాసాలు రాశాడు. ‘‘ఇతను ఎంత మంచి వచనం రాస్తున్నాడు’’ అని రచయితలూ, కవులే ముచ్చట పడ్డారు. ‘‘కార్టూన్‌ కబుర్లు’’ అనే మోహన్‌ వ్యాసాల పుస్తకం చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. ‘‘బాపూగారూ అందరూ మీరు అభిమానులు కదా, మీరు అభిమానించేదెవరిని?’’ అని ఒక సందర్భంలో ఆయన్ని అడిగినప్పుడు ‘‘ఇంకెవరు? మోహనే’’ అని బాపూ సమాధానం.

నవ్వులూ పూలూ చురకలూ మెరుపులూ అన్నీ కలిసి...

నవ్వులూ పూలూ చురకలూ మెరుపులూ “మేల్” కొల్పులు  అన్నీ కలిసి…

కార్టూన్లలో పొలిటికల్‌ కార్టూన్లు అనేవి మేలు జాతి పొట్టేళ్ళు లాంటివి. అవి వేయడంలో కొమ్ములు తిరిగిన వాడు మోహన్‌. ఎంకి ఏదంటే వెలుగునీడల వైపు వేలు చూపించినట్టుగా ఆంధప్రదేశ్‌లో పొలిటికల్‌ కార్టూన్‌ అంటే మోహన్‌ వైపే చూస్తారెవరైనా. మరో ఇంటరెస్టింగ్‌ సంగతి- మోహన్‌కి సంగీతం అంటే చాలా యిష్టం. పాత హిందీ సినిమా పాటలూ, తెలుగు పాటలూ, జానపదాలూ బాగా తెలిసినవాడు.

హేమంతకుమార్‌, సైగల్‌, సురయా, గీతాదత్‌, నూర్జహాన్‌ల పాటలంటే మరీ యిష్టం. సెర్జీ ఐజెన్‌ స్టీన్‌- ‘బేటిల్‌ షిప్‌ పొటెంకిన్‌’, కురొసొవా ‘సెవెన్‌ సమురాయ్‌’, ఇస్త్వాన్‌ జాబో ’కాన్ఫిడెన్స్’, పోలిష్‌ కీస్లెవయస్కీ, ‘త్రీకలర్స్ బ్లూ’ దాకా అన్నీ శ్రద్ధగా చూశాడు. ఎం.ఎస్‌.సత్యు, శాంతారాం, సత్యజిత్‌ రే నుంచి పట్టాభి సంస్కార మీదుగా శ్యాంబెనగల్‌ భూమిక దాకా భారతీయ సినిమాల గురించి సాధికారికంగా చర్చించగలడు. గురుదత్‌ సినిమాలన్నా, ప్యాసాలో వహీదా రెహమానన్నా చాలా చాలా మురిపెం మోహన్‌కి. టాల్‌స్టాయ్‌ వార్‌ అండ్‌ పీస్‌, అనాకెరినినా, షోలహోవ్‌ ‘అండ్‌ క్వయిట్‌ ఫ్లోస్‌ దిడాన్‌’ అన్నా అంతే ప్రేమ. రష్యా, చైనా, క్యూబా, వియత్నాం, లాటిన్‌ అమెరికా విప్లవోద్యమ చరిత్ర గురించి ఎన్ని గంటలైనా అలుపు లేకుండా మాట్లాడతాడు. చేగువేరా త్యాగమూ, హోచిమిన్‌ ఆదర్శమూ, నిరుపేదవాడి పోరాటమూ మోహన్ని కదిలిస్తాయి. గోబీ ఎడారిలో తూనీగల్లా పరిగెత్తే చంఘిజ్‌ ఖాన్‌ సేనల గుర్రాల నుంచి గుడిపాటి వెంకట చెలం మైదానం దాకా ఎన్ని కబుర్లయినా చెబుతాడు. నెరూడా జ్ఞాపకాల నుంచి మావ్‌సేటుంగ్‌ వ్యాపకాల దాకా ఎన్ని ముచ్చట్లో చెప్పలేం. విజయవాడ మారుతీనగర్‌లో మాయింటి పక్కయిల్లే విశ్వనాథ సత్యనారాయణ గారిదనీ, ‘విశాలాంధ్ర’కి వచ్చిన పుట్టపర్తి నారాయణా చార్యుల వారికి అరిటిపళ్ళు, టీ పట్టుకెళ్ళి యిచ్చేవాడిననీ, ఢిల్లీ పొలిటికల్‌ క్లాసుల్లో దేవీ ప్రసాద్‌ చటోపాధ్యాయ, గంగాధర అధికారి, డాంగే, నీలం రాజశేఖరరెడ్డి, మొహిత్‌ సేన్‌, సర్దేశాయ్‌ లాంటి మహామహుల దగ్గర మూడు నెలలు చదువుకున్నానని మహదానందంగా చెబుతాడు.

mohan2

ఇలా ఎన్ని చర్చలయినా, కబుర్లయినా, బొమ్మలు వేసివ్వడం అయినా బ్లాక్‌టీ తాగినంత హాయిగా, ఈజీగానే. భేషజానికో, పోజుకో తావేలేదు. ఇలా గత 40 సంవత్సరాలుగా నాన్‌ స్టాప్‌గా బొమ్మలు వేస్తూనే వున్నాడు. సాటి ఆర్టిస్టుల్ని ఎంతగా ఆదరించాడో అంతగానూ ప్రభావితం చేశాడు. విన్సెంట్‌వాంగో, పాల్‌గాగిన్‌, పికాసో బొమ్మలూ, బతుకులూ, ఎం.ఎఫ్‌,హుస్సేన్‌, సమీర్‌మండల్‌, సచిన్‌ జల్తారే, లక్ష్మాగౌడ్‌, వైకుంఠం బొమ్మల్లోని సౌందర్యమూ, తత్వాల గురించి మోహన్‌ చెబుతున్నప్పుడు వినితీరాలి. విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అలవోకగా, హాస్యానికి అణుమాత్రమూ కొదవలేకుండా చెప్పడంలో మోహన్‌ స్పెషలిస్టు. తెలుగు, భారతీయ ప్రాచీన చిత్రకళ మీద గట్టి అవగాహన వున్నవాడు. ‘శంకర్స్ వీక్లీ’ శంకర్‌ నుంచి డేవిడ్‌లో దాకా, అబూ అబ్రహాం నుంచి అమెరికన్‌ సూపర్‌స్టార్‌ సెర్గీ అరగాన్స్ దాకా జాతీయ అంతర్జాతీయ కార్టూన్‌ కళని బాగా అధ్యయనం చేసినవాడు. రాసినా, మాట్లాడినా, బొమ్మేసినా అతనికే చెల్లిందని అనిపించుకున్న అరుదైన గౌరవాన్ని పొందినవాడు మోహన్‌.

ఆర్టిస్టు మోహన్ని ‘జీనియస్‌’ అన్నాడు మణిశంకర్‌ అయ్యర్‌. ‘‘నీ గీతలో మేజిక్‌ వుంది మోహన్‌’’ అన్నాడు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మన గోవా ఆర్టిస్టు మారియో మిరాండా. ‘‘నీ గీతలు నాకిష్టం. నువ్వు రాసే అక్షరాల్లో మనోహరమైన చైనీయమైన కళవున్నది’’ అన్నారు లెజెండరీ ఆర్టిస్టు కొండపల్లి శేషగిరిరావు గారు.

చదువుకోవడమూ, బొమ్మలు వేయడం తప్ప తనకీ లోకంతో పనిలేనట్టుగానే వుంటాడు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి యానిమేషన్‌లో దృశ్య రూపం యివ్వాలని తపనపడుతున్నాడు. అన్నమయ్య పదాలనూ, గోరటి వెంకన్న పాటలనూ యానిమేట్‌ చేయాలని కలవరిస్తున్నాడు. కొన్ని అరుదైన, తన హృదయానికి దగ్గరైన యానిమేటెడ్‌ షార్ట్ ఫిలిమ్స్ తీసి దుమ్మురేపాలని ఆత్రంగా వున్నాడు. ఇప్పటివరకూ ఏమీ చేయనట్టు, ఇప్పుడు అపూర్వమైన మేజిక్‌ చేయడానికి చిన్న యానిమేషన్‌ స్టుడియో పెట్టి గుండెనూయిల నూగించే బొమ్మలెన్నో మనకి చూపెట్టాలని మోహన్‌ సరదాపడుతున్నాడు. ఒక చేత్తో పెన్సిలూ, మరో చేత్తో బ్రష్షూ పట్టుకుని, ఇంకో డజను చేతుల్తో స్నేహాన్నీ, ప్రేమనీ పంచి యిచ్చే మాంత్రికుణ్ణి మీరెప్పుడూ చూడలేదా?
అయితే మోహన్ని మీరింకా కలుసుకోనట్టే.

*

ఒక Enigma ఆత్మకథ..

 

-నరేష్ నున్నా

~

మోహన్‌కి అరవై ఐదేళ్లు! !

అందమైన వాక్యం (అన్న భ్రమ)లో చెప్పాలంటే… మోహన్‌కి అరవై ఐదు వసంతాలు!!

ఇంతకంటే విచిత్రమైన, విపరీతమైన, విడ్డూరమైన వాక్యంనా దృష్టిలో మరొకటి లేదు.

ఈ విరిగిన కుర్చీ పదేళ్ళుగా పడి ఉంది
నా పదవీ విరమణకి ఇంకా నాలుగు సంవత్సరాలు
ఆ కూలిన బ్రిడ్జి కట్టి గట్టిగా పుష్కరమైనా అయితేనా…
……. ఇలాంటివే కాదు మరికొన్ని అర్థవంతమైన వాక్యాల్నిచెవికెక్కించుకోగలను. ఇంకా జియాలజిస్టులు పళ్లూడిన రాళ్ళ వయసు, బోటనిస్టులు గూడు జారినచెట్ల ఆయుష్షు….. అన్నేళ్లు….ఇన్ని శిశిరాలు…అంటూ లెక్కలు కడుతుంటారు. అవేవీతప్పని, నేరమనీ అనిపించదు గానీ, మోహన్‌కి ఈడొచ్చిందనో, జోడుకు వయసొచ్చిందనో….అంటూంటే ఆశ్చర్యమేస్తుంది.

అక్కడెక్కడో మహాశూన్యంలోమన అగణిత బుర్రలకి ఊహకైనా అందని మహావేగంతో భూమండలం చేస్తున్న ఆత్మప్రదక్షణలకి, సూర్యచంద్రుల ఋజువర్తనా చమత్కారాల కనుగుణంగా ఎగిరే కాలం రెక్కలకి ఖగోళ గందరగోళాల లెక్కలు వేలాడదీశాం, మన దుర్భలత్వానికి చిహ్నంగా. ఆ లెక్కల జమాబందీ ఉచ్చుల్లో చిక్కుకుని, గడియారాలు పంచాంగాల్లో ఇరుక్కున్న ఏళ్ళూపూళ్లు, వారాలూ వర్జ్యాలు, ఘడియలు-విఘడియలతో ‘సమయా’నికి తగు ‘తాళం’ వేస్తుంటాం, మన దిక్కుతోచనితనానికి గుర్తుగా. అంతమాత్రం చేత ఎంత అల్పత్వాలున్నప్పటికీ, ‘తగుదునమ్మా’ అని మోహన్ వయో పరిమితుల్ని, ప్రాయ- చిత్తాల్ని కొలిచే యశః కాయకల్ప చికిత్సకి తెగబడతామా? ఏకాంతాన్ని భగ్నం చేసే,  చైతన్యాన్ని నిలువరించే, మధుమోహాల్ని రద్దుపరిచే వస్తువులు, స్థలాలు, రాళ్లురప్పలకి గానీ, అటువంటి జడపదార్థాల్లానే బతికేస్తున్న మనుషులకేమో గానీ,మోహన్ వంటి చైతన్యశీలికి వయస్సేమిటి?

ఆయన ‘కాలం’ మనకి తెలిసిన, అర్థమైన కాలం కాదు. ‘టైమ్’కి మాత్రమే కాదు, ఆయన ‘టెన్స్’కి కూడా సాధారణ వ్యాకరణార్థంలో తెలిసిన భూత, వర్తమాన, భవిష్యత్ అర్థాలు లేవు. చూరునుంచి ఒక్కొక్కటిగా జారి ఇసుకలో ఇంకిపోతున్న వానచుక్కని ఒంటరిగా పట్టి ‘కాలనాళిక ‘లో ఒకసారి పరీక్ష చేయాలి. అందులో కదలాడే ఆయన టెన్స్‌ ని. అది గతించిన గతమా? తళుక్కుమనే తక్షణమా? ఆగామి అగమ్య గోచరమా?ఈ మూడు కలగలిసిపోయిన  ఫోర్త్ పర్సన్ సింగ్యులర్‌లా, ఫోర్త్ డైమన్షన్ ఇన్విజిబుల్లాంటి హ్యుమన్ టెన్సా?

ఇసుక డొంకల్లో నగ్న పాదాల్తో చేతిలోని ఇప్పపూల దోనెతో పరుగులు తీస్తున్నప్పడు అందులోంచి చిందిపడే తేనేబిందువుల తుళ్లింతను పోలిన హ్యుమన్ టెన్స్‌ తో సంతులితమైన క్షణాలు. ఆ క్షణాల సమాహారమే మోహన్. అందుకే, 365 తేదీలుగా రద్దయిపోయే కేలండర్‌లో ‘డిసెంబరు 24’ అన్న ఒక్క రోజుమాత్రమే ‘పుట్టిన రోజు ‘ పేరిట ఆయనకి సంబంధించినదని అనడం విడ్డూరంగా ఉంటుంది.

mohan1

వ్యావహారిక పరిభాషలో మోహన్ ఒక చిత్రకారుడు, కార్టూనిస్టు, యానిమేటర్, ఇంకా మంచి రచయిత, చింతనాశీలి. ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఆర్టిస్టు గురించి రెండుముక్కలు రాయడానికైనా కొంత అర్హత అవసరం. రాత- గీత రంగాలలో పాత్రికేయ స్థాయి ఉపరితల అవగాహనైనా ఉండాలి. ఆంధ్ర దేశంలో ఆర్టు గురించి తెలిసిన అతిమైనారిటీ వర్గానికి చెందకపోయినా, అధిక సంఖ్యాకులకి ఉండే బండ బలమున్నా చాలు. పువ్వుల నేవళం గురించి తెలియకపోయినా, వాటిని గుదిగుచ్చిన దారాన్నివిడిచిపెట్టని మొండితనమున్నా చాలు. ఆ బండ, మొండితనంతోనే నా ఈ వ్యాసమనే ఉపరితల విన్యాసం: మోహన్ అనే ‘అసలు’గురించి కాదు, మోహనీయమనే ‘కొసరు’ గురించి. ‘మోహనీయమంటే మోహన్ తనమే,అదే దారం అనే motif!

సుమారు పాతికేళ్లు (మధ్య మధ్యలో విరామాలున్నప్పటికీ) దాదాపుగా ఆయనను రోజూ చూస్తూనే ఉన్నాను. అరికాళ్ల అంచున అలల ఘోష నిరంతరాయంగా ఉన్నా, కడుపులో చల్ల కదలనట్టుగా ప్రశాంతంగా తోచే సముద్ర గర్భాన్ని రోజూ చూసినా ఏం అర్థమవుతుంది? గుండుసూది కూడా దూరని రాతి ఒంపుల్లోకి ఉలిని పరుగులెత్తించి మలచిన మహాశిల్పాన్ని నిత్యం చూసినంత మాత్రాన ఏం తెలుసుకోగలం? అందులోనూ ఎన్ని పరిమళాల్తోను ఎదురొచ్చి ఆహ్వానించినా పరిచయమున్న పూలమొక్కంటే చులకన ఉన్నట్లు, పరిచయమైన కొద్దీ మనుషులుకూడా చవకవుతారు. అయినా ‘రోజూ చూస్తూ ఉండటం’ అనే బోడి క్వాలిఫికేషన్‌తోనే రాయక తప్పడం లేదు.

పైన ఇంతకుముందు ఏదో నాన్ సీరియస్ స్థితిలో, ఒక ఊపులో ‘చైతన్యశీలి ‘ అన్న విశేషణం వాడేశాను గానీ,మోహన్ ఎంతమాత్రం చైతన్యశీలికారు. ఒక సాధారణ అర్థంలో రక్తమాంసాలు, కామక్రోధాలు ఉన్న మనిషే కాదు. ఆయన ఒక phenomenon గామారిపోయారు కాబట్టి తరచి చూడకపోతే, ఆయనని పైకి స్థితప్రజ్ఞుడంటూనే జడుడని, enigmatic అంటూనే కొరకరానికొయ్యని అంటాం. పెదాల్తో నవ్వుతూ నొసట్లతో వెక్కిరించే అల్ప మానుషత్వంతోనే ఆయన స్నేహశీలిఅని, ఆపద్భాంధవుడని రకరకాల ముసుగు పేర్లతో శ్లాఘిస్తాం. మనఃశరీర సంబంధిత రాగద్వేషాల్లోనే రెండు కాళ్లునిలిపి, కుదుళ్ళుజొనిపి, మామూలుకంటికి కనిపించని సృజనాత్మక సౌందర్యం, తాత్విక సృజనావరణాల్లోకి తన మూర్తిమత్వపు శాఖోపశాఖల్నిచాపి విస్తరించిన మహావృక్షాన్ని పెరట్లో చెట్టులా చూస్తే అసలు రూపం ఎప్పటికీ బోధ పడదు.కుదుళ్ళకి, కొమ్మలకి ఉన్న బంధంలాంటి అంతర్నిహిత ప్రసారం ఒకటి ఆ వృక్షం లోపల జరుగుతుంటుంది. వేర్లలోని భౌతిక శక్తిని కొమ్మల్లోని ఆదిభౌతిక సత్తాలో అనుసంధానించడమనేది మోహన్‌లో నిరంతరం జరిగే ప్రక్రియ. అటువంటి మానవాతీతమైన అనుభవం వల్ల నిత్యమైన సృజనశీలిలో అన్నిభావోద్వేగాలు ఒక ఉచ్ఛస్థాయికి వెళ్లిపోతాయి. సుఖదుఃఖాలు, బాధానందాలు, వెలుగుచీకట్లు, నలుపుతెలుపుల వంటి ఎన్నోవిరోధాభాసలకి అందని ఒక ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాయి. అటువంటి ఆర్టిస్టులు ఏ ఉద్యమాల్నినడపరు; ‘ఎయిడ్స్ నుంచి రక్షణగా కండోమ్స్ వాడండ’ని జనాల్ని మేలుకొలపరు; ‘కల్లుమానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్’ అని పిలుపులివ్వరు; ఒక భార్య, ఒక జాణ, ఒకే బాణమని సుద్దులు చెప్పరు………దేనితో తలపడరు, దేనినీ మార్చరు. వాళ్లు చైతన్యశీలమైన ప్రవాహాలు కానే కాదు, ప్రవాహ గతిని మార్చే నిశ్చలమైన రెల్లు దుబ్బులు. సమాజాన్ని మార్పు దిశగా నడిపించే నాయకులకి స్ఫూర్తి దాతలు!

ఇటువంటివారు ముక్కుమూసుకుని ఏ గుహాంతర్భాగాల్లో ఉన్నా వారి ప్రభావం మాత్రం అమేయం. కానీ మోహన్ అలా అజ్ఞాతంగా, అజ్ఞేయంగా ఉండేవారేం కాదు. ఆయన మీద ప్రేమతో రకరకాల సందర్భాల్లోవ్యాసాలు రాసిన వారి ప్రకారం, మోహన్ ఒక గ్యాంగ్‌లీడర్. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన డెన్ ఎప్పడూ కోలాహలంగా ఉంటుంది. ఆయన తన పరివారం, బంధుగణం శిష్య ప్రశిష్యుల మధ్య పరివేష్టితులై ఉంటారు. ఈ నిత్యకృత్యం లాంటి దృశ్యంలో అబద్ధం లేదు, దృశ్యాల్ని అన్వయించుకోవడంలో తేడా ఉందేమో. నాతో సహా ఆయన బంధుమిత్ర సపరివారమంతా మోహరించి ఉన్నప్పడు, ఒక అనంతమైన విషాదం ఆ దృశ్యంమంతా పిగిలి పొర్లిపోతుంటుంది. ఈ ప్రపంచగతిని మార్చే నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్నిపుట్టించి, ఎగదోయగలిగిన ఆర్టిస్టు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చొన్న సాధారణ భంగిమలో మామూలు కంటికికన్పిస్తూనే, వేరే ఉన్నతపార్శ్వంలో యోగముద్రలో ఉన్నప్పడు ఆ టేబుల్‌కి ఇటుపక్కన ఆ planeకి ఏ మాత్రం సంబంధంలేని ఒక పోచుకోలు గుంపు ఉండటం-

– ఒక దుర్భర విషాద దృశ్యం!

మానుష స్థాయిలో మోహన్‌లోకొన్ని తెంపరి లక్షణాలు ఉన్నాయి (లేదా ఉన్నాయని నా పరిశీలనా ఫలితం). స్థిర, లేదా చర సంపదల పట్ల పూర్తి వైముఖ్యం, అధికారం, హోదాల పట్ల మహా నిర్లక్ష్యం, స్వోత్కర్ష ఏ రూపంలో లేకపోవడం, పొగడ్తల పట్ల చెడ్డ యావగింపు, …..ఇంకా వ్యక్తీకరణల్లోకి ఇమడని ప్రేమా బాధ్యతల్ని వర్షించడం, చదువుకి- జ్ఞానానికి వంతెనలు వేసుకునే బాల్య కౌమార తృష్ణల్నిసజీవంగా నిలుపుకోవడం మొదలైనవి మరెన్నో. ఇన్ని దశాబ్దాలుగా ఆయన చుట్టూ తిరిగే ఏ ఒక్కరికీఈ లక్షణాల్లో ఏ ఒక్కటి సావాసదోషంతోనైనా అంటుకోకపోవడం విచిత్రమైతే, అసలా లక్షణాల ఉనికే వారికితెలియక పోవడం మరోవిచిత్రం. దొంగ మర్యాదలు, కుర్చీని బట్టి గౌరవాలు, అవసరార్థం అరదండాలు….వంటి లౌకికనైచ్యాన్ని తన పరిసరాల్లోంచి పూర్తిగా నిషేధించాలని ఆయన చేసిన అకర్మక క్రియ వంటి అప్రయత్నప్రయత్నం మరోలా వికటించింది. అదేదో సినిమాలో ‘ఈ పూట మనం ఫ్రెండ్స్’ అని ప్రొఫెసర్ అన్న వెంటనే’సరే సోడా కలపరా’ అనికుర్ర స్టూడెంట్లు చనువుతీసుకున్నట్లు, భేషజాలు లేని వాతావరణం ఉండాలని మోహన్ ఆశిస్తే, ఆకాశమంత ఎత్తున ఉన్నఆయన భుజంమీద చెయ్యేసి, వారివారి స్థాయి ఊకదంపుడు ఉపన్యాసాలకి ఆయన్ని శ్రోతని చేసి,కోటలు దాటే ఆ కోతలతో అంతులేని  కాలహరణం చేస్తుంటారు.

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది- ఆయన అలిగి కూర్చున్నారేమోనని. అలిగిన వారిని బుజ్జగించడం అయిన వాళ్ళకి ఒక ముచ్చట, ఒక మురిపెం, అంతకు మించిన బాధ్యత. అయితే అలిగినట్లే అర్థంకాక పోవడం కంటే దురదృష్టం మరేముంది? ‘నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు…’ అని దిగులు పడటం కంటే మించిన దురదృష్టం. నాలుగు దశాబ్దాల పై చిలుకు ఆయన చేస్తున్న సంతకం ఆయనది కాకపోవడం, అది ఒట్టి ఫోర్జరీసంతకమని ఎవరికీ పట్టకపోవడం ఎంత అన్యాయం! నీకోసం, నా కోసం మరేదో జెండా కోసమో గీసినగీతలు కాకుండా, తనకోసం తాను గీసుకున్న బొమ్మలెన్నో, గీయాలనుకున్న బొమ్మలెన్నెన్నో! ఎగ్జిబిషన్ల పేరిటో, కేలండర్ల కిందనో తనవైన ఆ బొమ్మల్ని ప్రదర్శించుకోవడం చెడ్డ చిరాకు ఆయనకి. కే.సి.డే మధుర స్వరాన్ని పందుల గురగురలు, వాహనాల చీదుళ్ళ మధ్య వినడానికి చలం పడిన చికాకులాంటిదది. అంకార్ వాట్, రామప్ప దేవాలయం….ఇంకా ఎన్నో మహోన్నతమైన చిత్ర, శిల్పకళాఖండాల దిగువున ఏ సంతకాలున్నాయని ఎదురు దెబ్బలాడతారు మోహన్. సంతకం చేయకపోవడమే భారతీయత అంటారు. ఇది కాళిదాసు విరచితమని, కవి నృప జయదేవ కృతియని, ఇంకా ఎందరో కవులు పద్య, శ్లోక మకుటాల్లో చేసిన సంతకాల్నిచూపించి, ‘ఇవి భారతీయం కాదా మోహన్!’ అని దబాయించి, ఆయన దాచుకున్నవి బయటకు లాగొచ్చు, ఆయన చేత బలవంతాన నిశానిముద్రలేయిస్తూ.

అయితే అంత కంటే ముందు ఆ స్థాయి ఆర్టిస్టు ప్రతి ఒక్కరికీ తమని ఏకాంత పరిచే ఒక అనంగరాగాన్నివినే వెసులు బాటు కల్పించాలి. ఆ  labyrinth of solitude లో కళాకారుడు చిక్కుకుపోవాలి; అలా చిక్కుకుపోయే సావకాశం ఏర్పాటుచేయాలి- నిజమైన బంధుమిత్ర సపరివారం. అప్పడే సృజనకి అవకాశం. అలా లేనప్పడు ఏ కళాకారుడైనా మోహన్‌లానే అలుగుతాడు. ఆయన అలక తీర్చేవాళ్ళలో కాకుండా, దానికి కారణమైన గుంపులో నేనొక్కడ్నిఅయినందుకు నన్ను ఎంతో కక్షతో ఐనా క్షమించుకోగలనా?

*

స్పీడ్ ఇన్ టు టైమ్!

 

sidhareddiచీకటి .

ఇది ఎప్పటికీ ఇలానే ఉండిపోతే ఎంత బావుణ్ణో! ఈ చీకటిలో ఎవరూ లేరు. నేనూ లేను! అంతా శూన్యం. ఈ శూన్యం నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఎక్కడికో వెళ్లిపోవాలనే తీవ్రమైన కోరిక. అలా వెనక్కి వెనక్కి వెళ్లిపోతూ, బిగ్‍బ్యాంగ్ కంటే ముందు కి వెళ్లిపోతే ఇంకా బావుంటుందేమో. తను, నేను, ఈ విశ్వం, భూమి – అసలేమీ లేనప్పుటి రోజులకి.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వుయ్ ప్రౌడ్లీ ప్రెజ్ంట్ టు యూ…

వెలుగు.

ఫోకస్ లైట్ వచ్చి మీద పడింది. భరించలేని వెలుతురు. మోయలేని భారం. హాలు నిండా జనాలు. ఎవరు వీళ్లంతా? తండ్రి కి దూరమైన కొడుకు, ప్రియురాలిని పోగొట్టుకున్న ప్రియుడు, ప్రేమించడం చేతకాని అసమర్థుడు, ఓడిపోయి గెలవాలనుకునే తపనతో రగిలే యోధుడు, మోసగాడు, ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు, అన్నీ పోగొట్టుకున్న పనికిరాని వాడు – జీవితంతో పోరాటానికి దిగిన సైనికుల సమూహం.
…ది ఒన్ అండ్ ఓన్లీ , రఘురామ్.

చప్పట్లు. ఫ్లాష్ లైట్లు. జనాలు.

స్టేజ్ మధ్యలోకి నడిచాను. ఫోకస్ లైట్ నన్నే ఫాలో అయింది. రెండు చేతులెత్తి ఆడియన్స్ వైపు చూశాను. ట్రేడ్‍మార్క్ విన్యాసం. రేపు హెడ్‍లైన్స్ లో ఇదే ఫోటో. రఘు రాక్స్ ది టెక్నోకాన్ఫరెన్స్.

ఆడిటోరియంలో కూర్చుని ఎదురుచూస్తున్న జనాలు.

స్టేజ్ మీద నేను. నా జీవితం ఇంకెక్కడో నాకు సంబంధం లేకుండా గడిచిపోతోంది.. ప్రపంచంలో ఏదో మూల ఎవరో ఇప్పుడే కంప్యూటర్ ముందు కూర్చుని నా కంపెనీ షేర్స్ కొందామా వద్దా అని ఆలోచిస్తుంటారు. కొంటే నా మీద మరి కొంత భారం. ఇంత భారం నేనెలా మొయ్యాలి? మోయగలనా?

ఒక క్షణం కళ్లు మూసుకున్నాను. ఒక జ్ఞాపకం ఫ్లాష్ లా మెరిసింది. హాయిగా నిద్రపోతున్నట్టుగా బెడ్ రూంలో పడుకునొందొక ఆవిడ. పక్కనే డాక్టర్లు. వాళ్లని పట్టుకుని భోరున ఏడుస్తున్న ఒక పిల్లవాడు. అతని పక్కనే నిల్చుని వాడిని పట్టుకుని ఏడుస్తోన్న ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో బెడ్ పై పడుకుని ఫ్యాన్ వైపే చూస్తోన్న ఒక వ్యక్తి.

గొంతు సవరించుకున్నాను. ఆడిటోరియంలో మసగ్గా కనిపిస్తున్న ప్రేక్షకుల వైపోసారి చూశాను. ఎంతమంది జనాలు! నా పేరు రఘురామ్. అది అందరికీ తెలుసు. కానీ నేను ఎవ్వరికీ తెలియదు; చివరికి నాక్కూడా!

వీళ్లల్లో ఏ ఒక్కరికైనా నేను తెలిసుంటే ఈ వేషం తీసేస్తాను. ఈ జీవితం చాలించేస్తాను. ఎక్కిన మెట్లన్నీ దిగేసి, కాలం అద్దిన రంగులన్నీ కడిగేసి, వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లిపోతాను. బిగ్‍బ్యాంగ్ అంత వెనక్కి కాకపోయినా, యూనివర్శిటీ కారిడార్లో నా వైపు నడిచొస్తూ ఆమె చూసిన ఓర చూపులో కాలి బూడిదైపోతాను. ఆ బూడిదలోనుంచి ఏక కణ జీవిగా గా ఆవిర్భవిస్తాను. జీవితాన్ని మళ్లీ మొదట్లో ఆరంభిస్తాను.

మరి ఇన్నాళ్ల నీ కష్టం సంగతేంటి? – వెయ్యి గొంతుకలు ఒక్కసారే అడిగాయి.

పది సంవత్సరాల్లో మూడు స్టార్టప్స్. మల్టీ మిలియన్ డాలర్స్. క్లోజ్ టు బిలియన్.

సాధించింది కొండంత. కోల్పోయింది విశ్వమంత.

 

…టుడే ఇండియా హాజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఫ్రమ్ ధ్రీ ధౌజెండ్ స్టార్టప్స్ యాన్ ఇయర్ బ్యాక్, టు ఏ ప్రొజెక్టెడ్ ఫిఫ్టీన్ థౌజెండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్… ఏ న్యూ ఎరా ఫర్ స్టార్టప్స్ హాజ్ బిగన్.

స్పీచ్. అంతా ప్రిపేర్డ్. ఎవరో రాసిచ్చింది. ఇంతకుముందు ఇంకో దగ్గర మాట్లాడిందే!

మాట్లాడ్డం మొదలుపెట్టగానే తను నడిచొచ్చింది. ఎదురుగా కూర్చుంది. అంత ఎత్తులో ఎలా కూర్చుంది? ఎదురుగా మరొక స్టేజ్ ఉందా? బ్యాగ్ లోనుంచి ఫ్లాస్క్ తీసి బయట పెట్టింది. అందులో వేడి నీళ్లు. ఇంకో పక్కన రేడెల్ శృతి బాక్స్ పెట్టుకుంది.

నాకిప్పుడు ముప్ఫై ఐదు. తనింకా అప్పట్లానే ఉంది.

ఫరెవర్ ట్వంటీ వన్. పడి పడి లేచే వయసు.

తను పాడడం మొదలుపెట్టింది.

రాగం మోహనం. తాళం ఆది. రచన పూచి శ్రీనివాస అయ్యంగార్.

నిన్ను కోరి యున్నానురా,
నిఖిల లోక నాయకా.
నన్ను పాలింప సమయము రా.

నువ్వు తాళం సరిగ్గా వేయటం లేదు. ఎన్ని సార్లు చెప్పాలి. ఇంత సింపుల్ విషయం ఎందుకు అర్థం కాదు నీకు? పేరుకి పెద్ద మ్యాథ్స్ జీనియస్. ఇంకోసారి చెప్తాను. ఇదే లాస్ట్ టైం. సంగీతానికి శృతి, లయ ప్రధానం.
ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. అర్థమైందా? ఇది ఆది తాళం. ఏంటా తలూపడం? నీతో సమస్య ఏంటో తెలుసా? నువ్విక్కడ ఉండవు. ఉంటే గతంలో లేదా భవిష్యత్తులో. ప్లీజ్ బి విత్ మి. రైట్ హియర్. రైట్ నౌ.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్.

Kadha-Saranga-2-300x268

పోడియం మీద మెల్లగానే ట్యాప్ చేశాను. కానీ మైక్ క్యాచ్ చేసేసింది. చప్పట్లు కొడుతున్నారనుకున్నారో, చప్పట్లు కొట్టమని సిగ్నల్ చేస్తున్నాననుకున్నారో, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.

తను నన్నే చూస్తోంది. నవ్వుతోంది.

ఆ నవ్వులో ఎన్నో ప్రశ్నలు. విన్నావా? వింటున్నావా? ఈ చప్పట్లకోసమేగా నువ్వింత వేగంగా పరిగెత్తుకు వెళ్లిపోయింది? కానీ ఈ చప్పట్ల శబ్దం వెనుక ఏం వినిపిస్తోంది? ఔట్ ఆఫ్ ట్యూన్, ఔట్ ఆఫ్ పిచ్, ఔట్ ఆఫ్ రిథమ్ – అర్థమవుతోందా? అందుకే తాళం ఎలా పెట్టాలో ప్రాక్టీస్ చెయ్యమనేది. గుర్తుందా?

సంగీతానికే కాదు, జీవితానికి కూడా శృతి, లయ ఉండాలని తను నాకెందుకు చెప్పలేదో?

… రేపు లేదు. ఏదేమైనా, ఇవాళే మొదలు పెట్టండి. మీరు చెయ్యకపోతే ఇంకొకరు మీ అవకాశాన్ని దోచేస్తారు. ఎప్పుడూ లేనంత కాంపిటీటివ్ ప్రపంచం ఇది. స్టార్ట్ సమ్‍థింగ్ గుడ్. అండ్ లెట్ టుడే బి దట్ డే.

స్పీచ్ అయిపోయింది. స్టాండింగ్ ఒవేషన్.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. ఆది తాళం. తను నాకు నేర్పించిన మొదటి సంగీత పాఠం.

లైట్సాగిపోయాయి. తనూ చీకట్లో మాయమైంది. తన పాట మాత్రం ఆగలేదు.

తనిక్కడ లేదని తెలుసు. కానీ ఎక్కడ చూసినా తనే ఎందుకు ఉంది?

*****
సర్ వి హావ్ టు ఫ్లై టు చెన్నై, ఫ్రమ్ దేర్ టు అబుదాబీ అండ్ దెన్ టు జోహెనెస్‍బర్గ్.

చెన్నై?

యెస్ సర్. ఇక్కడ్నుంచి బిజినెస్ క్లాస్ దొరకలేదు. సో…, ఇబ్బందిగా చెప్పాడు మిస్టర్ శివరామ్.

ఇట్సాల్‍రైట్ అన్నాను.

నిజానికి ఇట్ ఈజ్ నాట్ ఆల్రైట్. చెన్నై. ఆ ఊరి పేరు వింటేనే పాత జ్ఞాపకాలేవో అలల్లా ఎగిసిపడతాయి. ఊపిరాడకుండా చేస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ట్రావెల్ ప్లాన్ మార్చడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే సరే అన్నాను. లండన్ టు బెంగుళూర్. ఒక రెండు గంటలు హోటల్లో నిద్ర. టెక్నోకాన్ఫరెన్స్. ఆఫ్టర్ పార్టీ. మరో గంట నిద్ర. ఇంకాసేపట్లో బెంగుళూర్ టు చెన్నై ఫ్లైట్. అక్కడ్నుంచి ఇంకో రెండు ఫ్లైట్స్.

48 గంటల్లో నాలుగు ఫ్లైట్స్. జీవితం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో? పగలు, రాత్రి తేడా తెలియకుండా ఉంది. క్యాబ్ లో వెనుక సీట్లో కూర్చుని కళ్లు మూసుకున్నాను.

ఒక పెద్ద సూట్‍కేస్ ని లాక్కుంటూ చెన్నై ఎయిర్‍పోర్ట్ దగ్గర త్రిశూలం రైల్వే స్టేషన్ లో దిగాడొక యువకుడు. మరో చేతిలో క్యాబిన్ బ్యాగేజ్. మోయలేని బరువు. అరకిలోమీటర్ దూరం. సబ్‍వే లో ఆ లగేజ్ లాక్కుని వచ్చేసరికి చెమటలు పట్టిపోయాయి. ఎయిర్‍పోర్ట్ లో జనాలు చాలామందే ఉన్నారు. ప్రయాణం చేసే వాళ్లకంటే వాళ్లని సాగనంపడానికి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మలు, నాన్నలు, అత్తలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు, పిల్లలు, పెద్దలు – తను మాత్రం ఒంటరిగా! ఏడుపొచ్చిందతనకి.

కళ్లు తెరిచాను. బెంగుళూర్ ఎయిర్‍పోర్ట్ ఎక్స్‌ప్రెస్‍వే మీద కారు వేగంగా వెళ్తోంది.

కళ్లు మూస్తే చాలు. ఏదో ఒక పాత జ్ఞాపకం వరదలా తడిపేస్తోంది. అసహనంగా సీట్లో కదిలాను.

శివరామ్ వెనక్కి తిరిగి, ఆర్యూ కంఫర్టబుల్ సర్? అన్నాడు.
ఐ యామ్ ఆల్రైట్ అని చెప్పి సీట్లో వెనక్కి వాలాను. బెంజ్ కార్లో ఏసి వేసుకుని కూర్చున్నా ఇబ్బందిగా కదుల్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ నా గురించి ఇతనికేం తెలుసు. పాపం అనుకున్నాను.

పదిహేనేళ్ల క్రితం. జనాలతో నిండిపోయిన నెల్లూరు స్టేషన్ లో ఒంటరిగా నేను. హౌరా ఎక్స్‌ప్రెస్. ఓ కొన్ని గంటలు లేటుగా వచ్చింది. దూసుకెళ్లే అలవాటు లేదు. అంతటి దూకుడూ లేదు. అందరికంటే వెనుక. కష్టపడి ఒక చేత్తో గేట్ దగ్గర ఒక కాలు పెట్టుకునేంత స్థలం. ఒక చేతిలో చిన్న సూట్‌కేస్. మరొక చేతిలో ప్రాణాలు. ఎంతసేపు అలా నిలబడ్డానో తెలియదు. కావలి చేరుకునే లోపలే ఎక్కదో దగ్గర పడిపోయి చచ్చిపోతానేమోనంత భయం. నాన్నంటే విపరీతమైన అసహ్యం వేసింది. ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లినంత సేపూ రిజర్వేషన్ కంపా‌ర్ట్‌మెంట్ లో కంఫర్టబుల్ కూర్చున్న వాళ్లు, తమని సాగనంపడానికి వచ్చిన వాళ్లకి టాటా చెప్తూనే ఉన్నారు.

రిజర్వేషన్ చేపించడానికి డబ్బులు లేవు. అమ్మని హాస్పిటల్ లో చూపించడానికి డబ్బులు లేవు. ఇంట్లో టీవి కొనడానికి డబ్బులు లేవు. నాకు సైకిల్ కొనడానికి డబ్బులు లేవు. ఎందుకో, నాన్న దగ్గర దేనికీ డబ్బులుండవు?

నీతో సమస్య ఏంటో తెలుసా?

నేనేదో చెప్దామనుకునే లోపలే తనే మళ్లీ మొదలుపెట్టింది. ఎందుకిలా కష్టపడి వేళ్లాడ్డం. చేతిలోని ఆ బరువు ని పడేసెయ్. కొంచెం ఈజీగా ఉంటుంది – అంది.

నాకున్నవి ఇవే బట్టలు. ఎలా పడెయ్యగలను?

భారమైనప్పుడు దేన్నైనా వదిలెయ్యడమే!

ట్రైన్ వేగంగా వెళ్తోంది.

నీకేం. ఎన్నైనా చెప్తావు. అసలు నువ్వు ఎలా గాల్లో ఎగరగలుగుతున్నావు?

బికాజ్ ఐ యామ్ ఫ్రీ.

తను ఎగిరిపోయింది. నేనింకా అక్కడే ఉన్నాను. పదిహేను సంవత్సరాల క్రిత్రం నేను పట్టుకుని వేలాడిన ట్రైన్ రాడ్ ఇంకా చేతిలోనే ఉంది. భుజాలు లాగేసే నొప్పి ఇప్పటికీ తెలుస్తుంది. చెమటలు పట్టి చెయ్యి జారిపోయి చచ్చిపోతానేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఎలాంటి సందర్భంలోనైనా జీవితం కంఫర్టబుల్ ఉండగలిగేంత డబ్బు సంపాదించాలన్న కసి ఇంకా రగులుతూనే ఉంది.

SpeedIntoTime (1)ఎక్స్‌ప్రెస్ వే మీద కారు ఆగింది. ముందెక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది. ట్రాఫిక్ జామ్. ఉదయం మూడు దాటింది. కారు కిటికీ అద్దాలను మంచు మసగ్గా కప్పేసింది. కారులో హోటల్ కాలిఫోర్నియా పాట ప్లే అవుతోంది.

Up ahead in the distance, I saw a shimmering light
My head grew heavy and my sight grew dim
I had to stop for the night
There she stood in the doorway;

ఆమె రోడ్ పక్కన నిలబడి ఉంది.

ఒక చేతిలో క్యాండిల్ లైట్. మా కారు దగ్గరకి నడిచొచ్చింది. ముందు సీట్లో క్యాండిల్ లైట్ వెలుతురులో ఎవరికోసమో చూసింది. ఆ వెలుగులో తనెవరో అర్థమైంది. మసక వెలుతురులోనూ ఆమె సన్నటి ముక్కు, పొడవాటి మొహాన్ని గుర్తుపట్టాను. నాకు మాత్రమే తెలిసిన తను, వెనక కిటికీ దగ్గరకొచ్చి ఆగింది. అద్దం పైకెత్తి ఆమెను చూడాలనిపించింది. కానీ ఆమె నా కళ్లల్లోకి చూడగానే బిగుసుకుపోయాను. ఆమె తన వేలితో కిటికీ అద్దం పై కప్పిన మంచులో వేలితో మెల్లగా ఏదో రాసింది. తన మరో చేతిలో ఉన్న క్యాండిల్ ని ఎత్తి ఆ అక్షరాలకు వెలుగు చూపించింది.
మైత్రేయి
*****
ఆమె చూపు, ఆమె జ్ఞాపకం చుట్టూ నా జీవితమంతా ఘనీభవించుకుపోయిందని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.

చెన్నై విజయ హాస్పిటల్ లో కారిడార్లో నిల్చుని ఉంది తను. వీసా పేపర్స్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాను. లాస్ట్ మినిట్ వరకూ ఏమీ తేలలేదు. రాత్రి ఫ్లైట్ కి బయల్దేరి వచ్చెయ్యమని లండన్ నుంచి ఆర్డర్స్.
ఇప్పుడెలా? అంది.

నేను వెళ్లాలి.

అంకుల్ ని ఈ పరిస్థుతుల్లో వదిలేసి?

నన్నేం చెయ్యమంటావు మైత్రేయి? ఎప్పుడూ ఇంతేనా! నా జీవితంలో అడుగడుగునా అడ్డంకులేనా. నన్ను ముందుకెళ్ళకుండా కాళ్లకు వేసుకున్న గుదిబండ నాన్న. ఎగరనీయకుండా రెక్కలు విరిచిన రాక్షసుడు నాన్న.

ఫర్ గాడ్ సేక్. హి హాడ్ ఏన్ హార్ట్ ఎటాక్. యూ కాన్ట్ స్పీక్ లైక్ దట్. హి ఈజ్ యువర్ ఫాదర్.

అద్దాల కిటికీలోనుంచి సాయంకాలపు ఎండ నా కళ్లల్లో పడుతోంది. ఏంటీ బంధాలు? వీటిని వదిలించుకోలేమా? కళ్లు మూసుకున్నాను. ఈ చీకటి నయం. ఇక్కడ ఎవరూ ఉండరు. రెండేళ్లు, పగలూ రాత్రి కష్టపడితే వచ్చిన ఆన్‍సైట్ ఆఫర్. నా కలల ప్రపంచంలోకి మొదటి మెట్టు. కానీ ఇదే ఆఖరి మెట్టు కాబోతోందా? భరించలేని బాధ. ఒక్కసారిగా గట్టిగా అరిచేశాను. కష్టపడడం, బాధపడడం తప్ప నాకింకేమీ తెలియదు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఏంటీ శాపం?

మా బంధువులంతా నన్నే చూస్తున్నారు. తను నన్ను దగ్గరకు తీసుకుంది. ఏంటి రఘు, చిన్న పిల్లాడిలా. నువ్వు బయల్దేరు. అంకుల్ ని నేను చూసుకుంటాను, అంది. థాంక్స్ చెప్పాలో, సారీ చెప్పాలో కూడా తెలియని దయనీయ స్థితి నాది. ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆమె చూపుకి అర్థం తెలియదు. ఐసియూ లో ఉన్న నాన్న మొహం కూడా చూడకుండా బయల్దేరాను. వెనక్కి తిరిగితే, వెనకడుగు వేస్తాననే భయం. పరుగులాంటి నడకతో హాస్పిటల్ నుంచి భయటపడ్డాను.

వీటన్నింటిని మర్చిపోవడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో! కాలంలోకి వేగంగా వెళ్లిపోతే దూరం పెరిగి ఈ జ్ఞాపకం కనుమరుగవుతుందనుకున్నాను. కానీ ఒక రాత్రి లండన్ లో అది ఎంత అబద్ధమో తెలిసి వచ్చింది.
*****
అమ్మకి ఒకటే కోరిక ఉండేది. మీ నాన్నను ఎప్పటికైనా ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించరా అని అడిగేది. ఏం నువ్వు ఎక్కవా? అని అడిగితే, అమ్మో నాకు భయం అనేది. అమ్మ అందరికంటే ముందే ఎగిరిపోయింది.
నా చిన్నప్పుడు, ఇందిరాగాంధీ, ఎలక్షన్ క్యాంపైన్ కి హెలికాప్టర్ లో నెల్లూరు వస్తుందని తెలిసి, నన్ను కూడా తీసుకెళ్లాడు నాన్న. అందరూ ఇందిరాగాంధీ ని చూడ్డానికి వెళ్తే నాన్న మాత్రం గ్రౌండ్ దగ్గర నిల్చుని, నన్ను భుజం మీద ఎక్కించుకుని చాలా సేపు నాకు హెలికాప్టర్ నే చూపించాడని చెప్పేది అమ్మ.

మరి ఎందుకు నాన్నా? ఎగిరిపోవాలనే నా ప్రతి ప్రయత్నానికీ అడ్డు తగిలావ్?

నాన్న నాకు ఎప్పటికీ అర్థం కాడు. బహుశా నేను కూడా నాన్నకు ఎప్పటికీ అర్థం కానేమో! టైం చూసుకున్నాను. ఐదున్నరైంది. ఫ్లైట్ చెన్నై చేరడానికి ఇంకో పదిహేను నిమిషాలు పడ్తుందేమో! ఎన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ చెన్నై లో అడుగుపెట్టడం? ఆ రోజు విజయ హాస్పిటల్ నుంచి బయల్దేరింది, మళ్లీ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇండియాకి చాలా సార్లే వచ్చాను. కానీ చెన్నై కి రావాలంటేనే ఏదో భయం.

నా భయం వృధా పోలేదు. చెన్నై లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై ఎయిర్‍పోర్ట్ రన్ వే మొత్తం నీటితో నిండిపోయింది. అతి కష్టం మీద ల్యాండింగ్ అయింది. వర్షంలో తడుస్తూనే అందరం ఎయిర్‍పోర్ట్ లౌంజ్ లోకి చేరుకున్నాం.

అన్ని ఫ్లైట్స్ లేట్ గా నడుస్తున్నాయని ప్రకటించారు. కొన్ని గంటల తర్వాత కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. బిజినెస్ క్లాస్ కాబట్టి మహారాజా లౌంజ్ లో మమ్మల్ని కూర్చోబెట్టారు. మెల్లిగా ఎయిర్‍పోర్ట్ లోపలకి కూడా నీళ్లు రావడం మొదలయింది. అప్పటివరకూ మమ్మల్ని సౌకర్యవంతంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న స్టాఫ్ కూడా కాసేపట్లో మొదటి ఫ్లోర్ లోకి చేరుకున్నారు. మమ్మల్నీ అక్కడికే వెళ్లమని సలహా ఇచ్చారు. కాసేపట్లో ఎయిర్‍పోర్ట్ లోని జనాలంతా ఒకే దగ్గరకు చేరుకున్నారు.

చాలా సేపటి వరకూ, వర్షమే కదా; సునామీ కాదు అనుకున్నాం అంతా! చిన్నప్పుడు కాగితం పడవలు నడిపించిన వర్షం, కాలేజ్ రోజుల్లో తడిసి ముద్దవుతూ కూడా గంతులేసిన వర్షం. వర్షం కూడా ఇంత విధ్వంసకరంగా ఉంటుందని చాలా రోజులకి గుర్తు చేసింది. గత వందేళ్లల్లో లేనంత వర్షం.

చెన్నై పరిసర ప్రాంతాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. అందరూ లౌంజ్ లో ఉన్న టివి ముందు కూర్చుని కళ్లార్పకుండా చూస్తున్నారు. అందరి మొహాల్లో టెన్షన్. నాకు మాత్రం నవ్వొచ్చింది. ఇంకో కొన్ని గంటల్లో నేను జోహెనెస్‍బర్గ్ లో లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. జీవితంలో నాకు ఏదీ ఈజీగా దొరకదేమో! ప్రతి దాని కోసం ఇలా తీవ్రమైన పోరాటం తప్పదేమో!

జీవితం నాతో ఆటలాడుతూనే ఉంది. నేను ఆడి గెలుస్తూనే ఉన్నాను.

కానీ మనుషులతో, మనసులతో పోరాడొచ్చు. ప్రకృతితో పోరాడడమెలా?

ఆమె పోరాడుతోంది. వరదలో చిక్కుకుపోయిన లక్షలమందిని కాపాడడానికి వేలమంది యువతీ యువకులు స్వచ్ఛంధంగా బయటకొచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తూనే ఉన్నారు. వాలంటీర్స్ లో ఒకరిగా టివిలో కనిపించింది మైత్రేయి.

పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆమెను చూడ్డానికి ఇన్ని దేశాలు తిరగాలా? ఇన్ని మిలియన్ డాలర్లు సంపాదించాలా? ఇన్ని కష్టనష్టాలకోర్చాలా? చివరికి టివిలో వార్తల్లో ఆమెను చూడాలా?

తను ఇప్పటికీ అలానే ఉంది. ఫరెవర్ యంగ్. ఫరెవర్ మైత్రేయి.

నేనే! ఎన్ని రంగులు మార్చాను. ఎన్ని డీల్స్ క్లోజ్ చేశాను.

లండన్ వెళ్లిన చాలా రోజుల వరకూ మైత్రేయి తో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాడిని. ఏదో ఒక రోజు తను కూడా నా దగ్గరకు వచ్చేస్తుందనే ధైర్యం. చాలా రోజుల వరకూ వస్తాననే చెప్పింది కూడా!

తనకి ఇష్టమని నేను ఉన్న ప్రతి ఇంట్లోనూ బెడ్ రూం కిటికీ తూర్పు దిక్కుగా ఉండేలా చూసుకున్నాను. ఆమె వస్తుందని, నన్ను హత్తుకుని పడుకుంటుందని, ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఆమె మొహం పై పడి అల్లరి చేస్తుంటే, నా చేతిని అడ్డు పెట్టి ఆపాలని…

ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా?

*****
ఎక్స్‌క్యూజ్ మీ. హలో, ఎక్స్‌క్యూజ్ మీ, అంటూ నా భుజం తట్టాడతను.

చాలా సేపట్నుంచే నన్ను పిలుస్తున్నట్టున్నాడు. మీరేం అనుకోకపోతే కొంచెం సేపు నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటానని అడిగాడు.

ప్లగ్ లోనుంచి నా ఛార్జర్ తీసి, ప్లీజ్ అన్నాను. అతను నా పక్కనే కూర్చున్నాడు. హై. ఐయామ్ క్రిస్ పుల్లిస్ అని చెయ్యందించాడు. నేను హలో అని హ్యాండ్ షేక్ చేశాను.

ఫోన్ స్విచాన్ చేశాను. ఫోన్ లో యాభై కి పైగా నోటిఫికేషన్స్. వాట్సాప్, మిస్డ్ కాల్స్, మెసెజేస్, మైల్స్, ఫేస్ బుక్.

దాదాపు చాలా వరకూ థియోదోరా నుంచే!

ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? జోహెనెస్‍బర్గ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చెప్పాలి వాళ్లకి? – అన్నీ ప్రశ్నలే. నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు. చెన్నై ఎయిర్‍పోర్ట్ లో ఇరుక్కుపోయున్నానని మెసేజ్ పంపిద్దామనుకున్నాను. ఆ విషయం కూడా తెలిసిపోయినట్టుంది. వాట్ ఈజ్ ది స్టేటస్ ఇన్ చెన్నై? అని మెసేజ్.

థియోదోరా. ముద్దుగా థియో. రొమేనియన్ అమ్మాయి. మై లివిన్ పార్టనర్ ఇన్ లండన్. నన్ను తట్టిలేపిన థియో!

*****

SpeedIntoTime (1)

లండన్ లో ఒక వారం క్రితం. థియో ఇంట్లో పార్టీ. చాలా రాత్రయిపోయింది. ఒక్కొక్కరూ వెళ్లిపోయాక ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మిగిలారు. వాళ్లకి నన్ను పరిచయం చేసింది.

మీట్ మిస్టర్ రఘు. ఎవ్రీధింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ హిమ్. బట్ హి ఈజ్ కైండ్ ఆఫ్ శ్యాడ్.

నాకర్థం కాలేదు. థియోకెలా తెలుసు? నేను ఆనందంగా లేనని నీకెలా తెలుసు, అని అడిగాను.

తెలుసు. నువ్వు నాకు ఏడేళ్లుగా పరిచయం. ఈ ఏడేళ్లలో నువ్వొక కన్నీటి బొట్టు రాల్చిందీ లేదు. మొహంలో ఏ ఒక్కసారైనా విషాదపు ఛాయలు తొణికిన ఆనవాళ్ళూ లేవు.
దట్స్ బీకాజ్ ఐ యామ్ హ్యాపీ.

నో. దట్స్ బికాజ్ యూ యార్ క్యారీయింగ్ ఏన్ ఓషన్ ఆఫ్ టియర్స్ ఇన్ యువర్ హార్ట్.

నిజమే. పాతవన్నీ ఉపేక్షిస్తూ వేగంగా ముందుకెళ్తుంటే, కాలం తనలో కలిపేసుకుని, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుందనుకున్నాను. భవిష్యత్తుకేసి మొహం పెట్టి గతాన్ని కాలగర్భంలో కలిసిపోనీ అని ముందుకు సాగాను. బట్ ఐ యామ్ రాంగ్. ఇటీజ్ ఆల్ హియర్. రైట్ హియర్.

ఆ రాత్రి. బహుశా, జీవితంలో అంత ఏడ్చింది ఎప్పుడూ లేదు. హఠాత్తుగా అమ్మ పోయినప్పుడు కూడా నేనంత ఏడవలేదు. నాన్నతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా నేనంత ఏడవలేదు. మైత్రేయి ని హాస్పిటల్ లో నాన్న దగ్గర వదిలి వెళ్లిపోయినప్పుడు కూడా అంత ఏడవలేదు. బహుశా చాలా ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నందుకో, లేక థియో అచేతనంగా ఉన్న నా చైతన్యమనే బావిలో రాయి విసిరి జ్ఞాపకాలను తరంగాలుగా రేకెత్తించినందుకో – ఏమో, ఎప్పుడో తెగిన తీగలేవో తిరిగి నన్ను చుట్టుముట్టి, ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీళ్లగా ఉబికివచ్చినట్టున్నాయి.

దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయాక థియో నన్ను దగ్గరకు తీసుకుంది. ఓదార్చింది. చూడు రఘు, తనని మర్చిపోమని నేను చెప్పటం లేదు. నన్ను గుర్తించు అని వేడుకుంటున్నాను అంది.

నా కోసం తెలుగు కూడా నేర్చుకుని, నాకు తెలుగులో కవితలు రాసే ఓ థియో! ఓ నా ఐరోపా సుందరీ! ఏడు సముద్రాలు దాటినా, ఓ కన్నీటి సముద్రాన్నే గుండెల్లో దాచుకున్నానని ఎందుకు గుర్తు చేశావు? తనకు చాలా చెప్పాలనుంది. గుండె లోపల అగ్ని పర్వతం బద్దలవుతోంది. లావా పొంగబోతోంది. కానీ ఏమీ మాట్లాడలేదు.

ఏం చెప్పగలను. ఎన్నని చెప్పగలను. నా మీద ప్రేమ పెంచుకున్నందుకు ఆమె సాన్నిహిత్యంలో కన్నీళ్లు మనసారా ప్రవహింపజేయగలను. కానీ యెదలోని ఈ రోదన ఆమెకు విప్పిజెప్పగలనా?

చిన్నివెన్నెల మూటను మరిచివచ్చితినేనాడో, నా తప్పటడుగులు తిరిగి నన్నచటికే గొనిపోయెనేడు. నేనేమి చెయ్యను థియో.
ప్రతి రోజూ ఆరుబయట పచ్చికలో నడవాల్సిన నా జీవితంలో, తను లేకుండా ప్రతి రోజూ అఫీస్ క్యాబిన్స్ లో గడిచిపోతుందని; ఏ దేశంలో ఏ కెఫెలో కాఫీ తాగుతున్నా, తను లేకుండా తాగిన ప్రతి కాఫీ రుచి ఎంత చేదుగా ఉంటుందోనని; ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించినా, తను లేకుండా ఖర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయికి కూడా విలువలేదని; ఎక్కడో ఆల్ప్స్ పర్వతాల్లో విహరిస్తున్నా, తను లేకుండా గాలి సైతం అలకబూనిందని; పున్నమి వెలుగులో చల్లని వాతావరణంలో కూర్చున్నా, తను లేదని వెన్నెలమ్మ కినుక బూని నిప్పులు చెరిగిస్తుందని- ఇవన్నీ చెప్పగలనా? తనే లేకపోతే నేను లేనని ఎలా చెప్పను. ఇంత ప్రేమ సాధ్యమా అని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నా కన్నీటి జడి వానలు, ఆ సెలయేట జారిన నా కలలూ – ఎవరికీ కనిపించవు. మూసుకుపోయిన నా హృదయ ద్వారాల లోపల ప్రతిధ్వనించే ఆర్తనాదాలూ, రోదన ధ్వనులూ ఎవరికీ వినిపించవు. తనులేకుండా భగ్నమైన కలలు నావి; తను లేకుండా ఆగిపోయిన కలం నాది. థియో, నువ్వు మళ్లీ గడ్డి పూలను కూర్చి, కలము చేసి, చేతికిచ్చి, జోల పాడి, నిద్ర పుచ్చి – మళ్లీ తనని గుర్తుకు తెచ్చి…

…మాటల్లోనూ చెప్పలేను. కవితల ముసుగుల్లోనూ కప్పలేను. నీ నుంచీ దాచలేను! నేను ఆమెని తప్ప వేరొకరని ప్రేమించలేను. తను లేకుండా నాకు పగలు లేదు, వెలుగు లేదు. రాత్రి లేదు, చీకటి లేదు. సముద్రం లేదు. అలలూ లేవు. శృతి లేదు, లయ లేదు.

నేను ఇండియా కి బయల్దేరుతుంటే ఎయిర్‍పోర్ట్ కి వచ్చింది థియో.

మళ్లీ తిరిగి వస్తావా? అని అడిగింది.

పిచ్చి ప్రశ్న అది. నా జీవితమంతా ఇక్కడే ఉంది. నా జీవితాన్ని పూర్తిగా ఇక్కడే నిర్మించుకున్నాను. ఇవన్నీ అంత సులభంగా వదిలేసుకోలేను. తప్పకుండా తిరిగివస్తానన్నాను.

థియోకిచ్చిన మాటను నిలబెట్టుకోగలనా?
*****
మిస్టర్ రఘు, హలో మిస్టర్ రఘు!

క్రిస్ మళ్లీ భుజం తట్టి నన్ను జ్ఞాపకాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. యూ కెన్ యూజ్ యువర్ ఛార్జర్ నౌ, అన్నాడు.
థ్యాంక్యూ అన్నాను.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. కానీ మీరు చాలా ప్రీ ఆక్యుపైడ్ గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అడిగాడు క్రిస్.

ఏం చెప్పాలి? పాపం అతనేం చేస్తాడు? నా మొహం చూస్తే చాలు, బాధలో ఉన్నానని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. కనీసం మాట సాయమైనా చేద్దామనుకుంటున్నాడు అతను. ఐ యామ్ ఆల్రైట్ అని చెప్దామనుకున్నాను. కానీ అతను నమ్మడు. అందుకే, జ్ఞాపకాల వరదలో తడిసి ముద్దవుతున్నానని చెప్పాను.

అవునా? కానీ అది చాలా ప్రమాదకరం కదా, అన్నాడు.

నాకర్థం కాలేదన్నట్టు తలూపాను.

కాఫీ తాగుతారా? అడిగాడు.

ఫర్వాలేదన్నాను.

కాఫీ డే కి వెళ్లి రెండు లాటే తీసుకొచ్చి, ఒకటి నా చేతిలో పెట్టాడు. థాంక్ గాడ్! ఫ్లైట్స్ లేకపోయినా కనీసం కాఫీ అయినా దొరుకుతోంది. మాటలు కలిపే ప్రయత్నం. నేను అడ్డు చెప్పలేదు. కానీ కాఫీ కోసం వెళ్లకముందు అతనన్న మాట నా చెవిలో మ్రోగుతూనే ఉంది. అందుకే అడిగాను – ఎందుకు జ్ఞాపకాలు ప్రమాదకరమన్నారు?

ఎందుకంటే, జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు, వాటిలో చిక్కుకుంటే అంతే!

నిజమే! ఇది ఇంకొకరు చెప్పక్కర్లేదు. నాకు ప్రత్యక్షంగానే అనుభవమవుతోంది.

కాఫీ తాగుతూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు క్రిస్. అయిష్టంగానే నేనూ అతను చెప్పేది వినడం మొదలుపెట్టాను. నిజానికి నాకూ వేరే పని లేదు. ఎయిర్‍పోర్ట్ లో ఉన్న వాళ్లకి సాయం అందడానికి మరో ఇరవై నాలుగు గంటలు పైనే పట్టవచ్చని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నేను ఫ్రాన్స్ నుంచి రెండేళ్ల క్రితం ఇండియా వచ్చాను. దాదాపుగా ఈ రెండేళ్లు అండమాన్స్ లో గడిపాను. మీకు తెలుసా? నేను ఎన్నో ఏళ్ల నుంచి, జ్ఞాపకాల యొక్క నిర్మాణాత్మక స్వభావం గురించి పరిశోధన చేస్తున్నాను. అందుకు సరైన శాంపిల్ కోసం నేను ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలు పర్యటించాను. కానీ అండమాన్ దీవుల్లోని తెగలకంటే సరైన నమూనా నాకెక్కడా దొరకలేదు. అందుకే గత రెండేళ్లుగా అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు క్రిస్‍మస్ హాలిడేస్ కోసం ఫ్రాన్స్ బయల్దేరాను – చెప్పుకొచ్చాడు క్రిస్.

జ్ఞాపకాల గురించి అతని పరిశోధన కోసం అండమాన్ వరకూ రావడమేంటో నాకర్థం కాలేదు. అదే విషయం అతన్ని అడిగాను. సర్ ఫ్రెడెరిక్ ఛార్ల్స్ బార్ట్లెట్ అని ఒక బ్రిటీష్ మానసిక శాస్త్రవేత్త గురించి చెప్పాడు క్రిస్. అతను చెప్పింది చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది.

మెమురీస్ ఆర్ డేంజరస్ బీయింగ్స్. దే హావ్ ఏ లైఫ్ ఆఫ్ దైర్ ఓన్. మనం ఏదైనా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి సారీ అది ఒక్కో రూపం సంతరించుకుంటుంది. మన గత జీవిత అనుభవాలు, పెంపొందించుకున్న జ్ఞానం, భవిష్యత్తు పట్ల అంచనాలు – వీటన్నింటి బట్టి ఆ జ్ఞాపకం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకే జన జీవన స్రవంతికి దూరంగా – మనకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ మరియు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అండమాన్ ఆదిమవాసులతో సహజీవనం చేస్తూ – ది కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఆఫ్ మెమరీ గురించి క్రిస్ పరిశోధనలు చేస్తున్నాడని చెప్తే ఆశ్చర్యం వేసింది.

జీవితం ఎవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో కదా అనిపించింది.

మెమురీస్ కి కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఉన్నట్టు, డిస్ట్రక్టివ్ నేచర్ కూడా ఉంటుందా? ఈ సారి నిజంగానే ఆసక్తిగా అడిగాను.

నిజం చెప్పాలంటే – జ్ఞాపకాలకు నిర్మాణాత్మక, విధ్వంసక స్వభావాలు ఉన్నాయనడంకంటే, పునర్నిర్మాణ స్వభావం ఉందని చెప్పడం కరెక్ట్, అన్నాడతను.

అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. మధ్యాహ్నం అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. అందరూ తిని మెల్లగా కుర్చీల్లో నడుం వాల్చారు. ఏ మూడింటికో నాకూ నిద్రపట్టింది.
*****
ఒక జ్ఞాపకం.

అదే ఇల్లు. ఒక బెడ్ రూం ఖాళీగా ఉంది. ఇప్పుడక్కడ డాక్టర్లు లేరు. వాళ్లని పట్టుకుని భోరున ఏడ్చిన పిల్లవాడు హాల్లో కూర్చుని ఆటలాడుకుంటున్నాడు. అతని పక్కనే కూర్చుని టివి చూస్తున్నారు ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో, బెడ్ మీద పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడొక వ్యక్తి. హాల్లో కూర్చున్న పిల్లవాడికి ఆ ఏడుపు వినిపించింది. మెల్లగా బెడ్ రూంలోకి నడిచాడు. ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నాడు. అతని తలపై చెయ్యి వేశాడు. పక్కనే కూర్చున్న తన కొడుకుని చూసుకున్నాడా వ్యక్తి. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకున్నాడు.

మరొక జ్ఞాపకం.

ఒక యువకుడు వేగంగా విజయా హాస్పిటల్ మిట్లు దిగి నడుస్తున్నాడు. అతనికి వెనక్కి తిరగాలనే ఉంది. కానీ చూడాలంటే ఏదో తెలియని భయం. ఇంకో రెండడగులు వేస్తే రోడ్డు మలుపు తిరుగుతుంది; హాస్పిటల్ కనుమరుగవుతుంది. ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంకో అడుగు ముందుకు వెయ్యబోతూ వెనక్కి తిరిగి చూశాడు. మూడో అంతస్థులో కిటికీలోనుంచి, అతనివైపే చూస్తూ, దుమ్ము పట్టిన కిటికీ అద్దం మీద పెద్ద లవ్ సింబల్ గీసిందొక అమ్మాయి.

ఇంకొక జ్ఞాపకం.

హౌరా ఎక్స్‌ప్రెస్ నెల్లూరు స్టేషన్ దాటి, పెన్నా నది బ్రిడ్జి మీద మెల్లగా సాగిపోతోంది. జనరల్ కంపార్ట్‌మెంట్ గేట్ దగ్గర ఒక చేత్తో రాడ్ పట్టుకుని వేలాడుతున్నాడొక యువకుడు. బాబూ, ఏం ఇంత కష్టపడి వేలాడకపోతే. ఎవరైనా ఈ సూట్‌కేస్ తీసుకోండి పాపం. లోపల్నుంచి ఎవరో సూట్ కేస్ తీసుకున్నారు. మరొకరు చెయ్యందించి కష్టపడి లోపలకి లాగారు. టాయిలెట్స్ పక్కనే న్యూస్ పేపర్ పరుచుకుని కూర్చున్న ఒకతను, రా బాబూ కూర్చో అని కొంచెం చోటిచ్చాడు.

మరింకొక జ్ఞాపకం.

ఒక యువకుడు చెమటలు కక్కుతూ, చెన్నై ఎయిర్‍పోర్ట్ లోకి పెద్ద సూట్‍కేస్ లాక్కుంటూ వచ్చాడు. దూరంగా ఒక ట్రావెల్ బ్యాగ్ మాత్రమే భుజానికి తగిలించుకున్న ఒక మధ్య వయస్కుడు, కొంచెం దూరంగా ఉన్న ట్రాలీ ని లాక్కొచ్చి లగేజ్ దాని మీద సర్దాడు. ఈజిట్ యువర్ ఫస్ట్ టైం అన్నాడు. సిగ్గుగా తలూపాడా యువకుడు. దేర్ ఈజ్ ఏ ఫస్ట్ టైం టు ఎవ్రీథింగ్ అన్నాడాయన. కమ్ లెట్స్ గో అని ఎయిర్‍పోర్ట్ లోపలకి తీసుకెళ్లాడు.

ఒకదాని వెనుక ఒకటి జ్ఞాపకాలు కొత్త రంగులద్దుకుంటున్నాయి.

*****

ఫోన్ మోగింది. నిద్ర లేచాను. టైం చూస్తే రాత్రి రెండయింది.

ఎయిర్ పోర్ట్ లో చాలా భాగం వరకూ చీకటి. పవర్ సప్లై కట్ అయిపోయిందన్నారు.

ఫోన్లో థియో.

జోహెనెస్‍బర్గ్ లో కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిందని, వచ్చే నెలలో తిరిగి ఏర్పాటు చేస్తారనీ చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి నాకు ధ్యాస లేదు. ఈ ముప్ఫై ఆరు గంటలు నాలో నేను, నాతో నేను గడిపిన క్షణాలు – గత పదేళ్లల్లో నాతో నేను ఇంత ఆప్యాయంగా గడిపిన క్షణాలు ఇవేనేమో! ఎన్నో గీతలు, ఎన్నో వ్యత్యాసాలు తొలిగిపోయి – ఏదో జీవిత సత్యం కనుగొన్న అనుభవం. ఒక్కోసారి మనిషి విచ్చలవిడి తనాన్ని అదుపులో పెట్టడానికే ప్రకృతి ఇలా మనపై తిరగపడుతుందేమో! కొత్త పాఠాలు నేర్పిస్తుందేమో!

థియో మాటలేవీ నాకు వినిపించడం లేదు.

చీకటి లోనుంచి మైత్రేయి నావైపే నడిచొస్తోంది.

నువ్విక్కడికెలా వచ్చావు?

దూరం తొలిగిపోయింది.

నాకర్థం కాలేదు.
మిస్టర్ జీనియస్. ప్రస్తుతం నువ్వు జీరో స్పీడ్ లో వెళ్తున్నావు. ఇండియాలో గడిపిన ఈ నలభై ఎనిమిది గంటలు, అందులో ఇక్కడ ఎయిర్‍పోర్ట్ లో గడిపిన ఇరవై నాలుగు గంటలు -దటీజ్ యువర్ టైం. చిన్నప్పుడు ఫిప్త్ క్లాస్ లో చదువుకోలేదా? స్పీడ్ ఇన్‍టూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని. ది డిస్టెన్స్ ఈజ్ జీరో నౌ. నువ్వు మళ్లీ బయల్దేరిన చోటికే చేరుకున్నావు. పద వెళ్దాం అంది.

*****
మేము తిరువాన్నమళై లో బస్ దిగాం. ఇదే అరుణగిరినాథర్ గుడి అని చూపించింది. అది చూసే లోపలే వేగంగా ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్లగానే ఇదే రమణ మహర్షి ఆశ్రమం అని చూపించింది. లోపలకి తొంగిచూడబోయాను. చలం చివరి రోజుల్లో గడిపిన ప్రదేశం. లోపల చాలామందే ఉన్నారు.

ఆగి చూద్దామంటే, తను నాకంటే కొంచెం ముందు నడుస్తోంది. నేను ఎప్పుడూ ఇంతే. చాలా వేగంగా ముందుకు వెళ్లిపోదామనే అనుకుంటాను, కానీ ఎప్పుడూ వెనకపడిపోతుంటాను . తను వెనక్కి తిరిగి చూసి, ఓ క్షణం పాటు ఆగి రమ్మన్నట్టు చెయ్యి అందించింది. ఇద్దరం అలా చాలా సేపు మౌనంగానే నడుస్తున్నాం. ఇది ఫలానా వాళ్ళు నడిపే స్కూల్, అది ఫలానా వాళ్లు పండించే పళ్లతోట – చూపిస్తూ ఆగకుండా వెళ్తూనే ఉంది.

కాసేపటికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ మాయమయ్యాయి. చుట్టూ పల్లెటూరిలా ఉంది. రోడ్ కి కొంచెం దూరంలో ఒక తోటలా ఉంది. తోట బయట ఒక ముసలి జంట చిక్కుడు కాయలు తెంపుతున్నారు. అంకుల్ ఈ తోటలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ లో హెల్ప్ చేస్తుంటారు అని అంది. లోపలకి వెళ్లి నాన్నను చూడాలనిపించింది. కానీ తను ఆగటం లేదు.

కొంచెం దూరం వెళ్లగానే ఒక దగ్గర పిల్లలు కొంతమంది వీధిలో ఆడుకుంటున్నారు. పక్కనే ఒక చిన్న బిల్డింగ్ ఉంది. ఈ స్కూల్ లోనే నేను సంగీతం నేర్పిస్తుంటాను అని ఆ బిల్డింగ్ వైపు చూపించింది. లోపలకి వెళ్దామా? అడిగాను. ఇప్పుడు కాదని చెప్పింది.

ఏం, అన్నాను? మళ్లీ వచ్చినపుడు అంది.

పిల్లలు కొంతమంది రోడ్ పక్కనే ఉన్న ఒక పంపు కింద నీళ్లు తాగుతున్నారు. నేను కూడా అక్కడికెళ్లి నీళ్లు తాగాను. తను నన్నే చూస్తోంది. ఆమె దగ్గరకు నడిచాను. మైత్రేయి, నీకో విషయం చెప్పాలి. చెప్పమని కళ్లతోనే సైగ చేసింది. ఇప్పుడు ఇక్కడ నీ చెయ్యి పట్టుకుని నిలబడి ఉంటే నాకేమనిపించిందో తెలుసా? అనంతమైన ఈ విశ్వంలో దుమ్ము ధూళి కి ఉన్న ప్రాముఖ్యత కూడా లేని నా జన్మకు సార్థకం కలిగింది నీ వల్లనే!

తను ఏమీ మాట్లాడలేదు. వెళ్దామా అన్నట్టు చెయ్యందించింది. నేనామె చెయ్యిపట్టుకుని ముందుకి నడుస్తున్నాను. నన్ను వెనక్కి తీసుకొచ్చి చెన్నై వెళ్లే బస్ ఎక్కించింది . నాకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పాని. నేనిక్కడే ఉండిపోతానని ప్రాథేయపడ్డాను .

బస్సు వెళ్లిపోతోంది.

The Sun had not yet risen. The doors are not yet open.

SpeedIntoTime (1)గుండె మీద చెయ్యి పెట్టి, యూ కెన్ కమ్ హియర్ వెన్ యూ ఆర్ రెడీ అంది.

హలో మిస్టర్ డ్రీమర్. మనమింక బయల్దేరవచ్చు. నిద్రలేపి చెప్పాడు క్రిస్.

నాకు తేరుకోడానికి ఒక్క నిమిషం పట్టింది. నేనింకా ఎయిర్‍పోర్ట్ లో లౌంజ్ లో కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాను.

ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చాయి. అర్జెంట్ గా వెళ్లాల్సిన వాళ్లని బెంగుళూరు కి ఎయిర్‍లిఫ్ట్ చేస్తున్నారు. మీరు కూడా వస్తున్నారా? అడిగాడు క్రిస్.

ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. గత పదేళ్లల్లో నాకు ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న ఎదురవ్వలేదు. వెన్ రఘు ఈజ్ హియర్ ఎవ్రీధింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. హి ఈజ్ ఏ ఫైర్ ఫైటర్. కానీ ఇప్పుడు ఏదీ నా కంట్రోల్ లో లేదు. వెళ్లిపోవచ్చు. వెళ్లాలి కూడా. లేకపోతే సౌత్‍ఆఫ్రికా డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఐదువందల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ అది ఇంకొకరికి ఇచ్చేసి ఉండొచ్చు. డీల్ క్యాన్సిల్ అయిందని న్యూస్ బయటకు వచ్చేసి ఉండొచ్చు. అల్రెడీ కంపెనీ షేర్ వాల్యూ పడిపోయి ఉండొచ్చు. ఏమైనా జరగొచ్చు.

ది పాజిబిలిటీస్ ఆర్ ఎండ్‍లెస్.
కానీ, ఒకటి మాత్రం నిజం. నేనిక్కడ్నుంచి బయటకు అడుగుపెడ్తే ఇంకే రోజూ ఈ కల మళ్లీ రాదు. అయినా ఆ కళ్లు దాని కోసం వెతుకుతూనే ఉంటాయి. అదే కలను తెచ్చే రాత్రికోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. కానీ నాకిప్పుడు కావాల్సింది కల కాదు. ఆ కలలను తెచ్చే రాత్రి కాదు. నిజం కావాలి. ఆ నిజాన్ని తీసుకొచ్చే వెలుగు కావాలి; నా మైత్రేయి నాకు కావాలి.

ఆర్యూ కమింగ్, అడిగాడు క్రిస్.

ఐ థింక్, ఐ విల్ వెయిట్, అన్నాను.

ఫర్ వాట్ అన్నాడు.

ఫర్ ది సన్ టు షైన్ అండ్ ది డోర్స్ టు ఓపెన్ అన్నాను.

ఏమనుకున్నాడో, ఏమో అతను తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు.

బయట వర్షం ఆగింది. ఆకాశంలో సూర్యుడు జాడ తెలుస్తోంది. ఒక్కొక్కరూ ఎయిర్‍పోర్ట్ లోనుంచి వెళ్లిపోతున్నారు. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను – ఆమె రాక కోసం ఎదురుచూస్తూ!

*

వరిచేల మెరుపులా వచ్చె వలపంటివాడే!

 

-ఫణీంద్ర 

~

phaniతెలుగు సినిమాల్లో ఉన్న క్రీస్తు భక్తిగీతాల్లో ఒక ప్రత్యేకమైన గీతం “మెరుపు కలలు” చిత్రంలోని “అపరంజి మదనుడే” అన్నది. ఈ పాటకి ఎంతో మాధుర్యం, భక్తిభావం ఉట్టిపడేలా సంగీతాన్ని సమకూర్చడం రెహ్మాన్ గొప్పతనమైతే, క్రీస్తుని విన్నూత్నమైన పదప్రయోగాలతో వర్ణించి స్పందింపజెయ్యడం వేటూరి గొప్పతనం. క్రిస్మస్ సందర్భంగా ఈ పాటని పరికించి పులకిద్దాం.

వేటూరి అంతకమునుపే “క్రీస్తు గానసుధ” అనే ప్రైవేటు ఆల్బంకి అలతి పదాలతో జనరంజకమైన పాటలు రాసి మెప్పించారు. తమిళంలో వైరముత్తు సాహిత్యానికి తెలుగు అనుసృజన చేసిన ఈ పాటలో కూడా సరళమైన పదభావాలనే వాడినా క్రీస్తుని వర్ణించడానికి ఎవరూ సాధారణంగా ఎంచుకోని శబ్దాలను వాడి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగాలని అందరూ హర్షించకపోవచ్చు, కొందరు తప్పుపట్టొచ్చు కూడా! అయితే క్రీస్తుపట్ల తనకున్న నిష్కల్మషమైన భక్తిభావమూ, ప్రేమా తనదైన పద్ధతిలో ఆవిష్కరించుకునే ఓ భక్తురాలి ప్రార్థనే ఈ గీతం అని గ్రహించిన వారికి పాట పరమార్థం, వేటూరి హృదయం అర్థమౌతాయి. ఓ అద్భుతమైన ట్యూన్‌కి పవిత్రంగా పొదిగిన సాహిత్యానికి మనం స్పందించగలిగితే మనలోనూ ఓ భక్తిభావం అంకురిస్తుంది.

పాట పూర్తి సాహిత్యం ఇది (దురదృష్టవశాత్తూ రెహ్మాన్ చాలా తెలుగు పాటల్లానే ఈ పాటలో కూడా గాయని చాలా తప్పులు పాడింది. ఆ తప్పులని ఇక్కడ సరిజెయ్యడం జరిగింది):

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే  

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే 

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

 

అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

నిజానికి ఈ పాటా ఓ ప్రేమగీతమే! ఇక్కడ ప్రేమ భగవంతుని పట్ల ప్రేమ. అలనాడు బెత్లహాంలో పుట్టిన పసిబిడ్డడు, జనుల వెతలు తీర్చిన దేవుడై, శిలువనెక్కిన శాంతిదూతై, ఈనాటికీ ప్రపంచంలోని అత్యధికులకి చీకటిలోని వెలుగురేఖ అవుతున్నాడంటే అతనెంతటి మహనీయుడు! అటువంటి బాలఏసుని తలచుకుంటే నిలువెత్తు ప్రేమస్వరూపం గుర్తుకు రావాలి, తన సువార్త ద్వారా జీవితంలో అడుగడుగునా సఖుడైనట్టి దేవుడు కనిపించాలి. ఈ వాక్యాల్లో కనిపించే భావం అదే! అవును అతను “అపరంజి (బంగారు) మదనుడు (ప్రేమ స్వరూపుడు)”. అతని ప్రేమ స్వచ్ఛమైన బంగారపు తళతళ. జీవితంలోని ఎదురయ్యే సంఘర్షణల్లోనూ, సందిగ్ధాల్లోనూ అతని పట్ల విశ్వాసమే దారిచూపిస్తూ ఉంటే అతను కాక “తగిన స్నేహితుడు” (అనువైన సఖుడు, right companion) ఎవరు? ఇతని కంటే అందగాడు ఇంకెవ్వరు? ఇక్కడ అందం అంటే బాహ్యమైన అందం కాదు. అతని కరుణ నిండిన వీక్షణం అందం, అతని ప్రేమ నిండిన చిరునవ్వు అందం, అతని గుండె పలికిన ప్రతిపలుకూ అందం. అతనికంటే అందమైన వాళ్ళుంటారా?

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

క్రీస్తు జననం సాధారణ ప్రదేశంలో జరిగింది (పశువుల గొట్టంలోనని కొందరంటారు), ఏ రాజమహల్లోనో కాదు. ఆయన తొలుత సామాన్యులకీ, పేదలకీ దేవుడయ్యాడు కానీ అధికారులకీ, రాజులకీ కాదు. “వరిచేల మెరుపు” అనడం ద్వారా అప్పటి కాలంలోని ప్రధాన పంటైన వరిని, వరిచేలతో నిండిన ఆ నేలని ప్రస్తావించడం కన్నా, సామాన్యుల కోసం పుట్టిన అసామాన్యుడైన దైవస్వరూపంగా క్రీస్తుని కొలవడం కనిపిస్తుంది. చెక్కుచెదరని ధగధగ కాంతుల ప్రేమవజ్రం అతను. అతను ప్రపంచానికి వలపు సందేశం అందించడానికి అరుదెంచిన సర్వశ్రేష్టుడు (రత్నం; నవరత్నాల్లో వజ్రమూ ఒకటి. వజ్రాన్ని ముందే ప్రస్తావించాడు కాబట్టి ఇక్కడ రత్నాన్ని “అన్నిటి కన్నా శ్రేష్టమైన” అన్న అర్థంలో కవి వాడాడని అనుకోవడం సబబు)

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే

ఇంతటి అనంత విశ్వంలో  కేవలం భూమి మీదే జీవరాశి ఎందుకు ఉండాలి (మనకి తెలిసి)? కొన్ని కోట్ల ఏళ్ళ పరిణామ క్రమంలో ఈ జీవరాశుల్లోంచి ఓ మానవుడు అద్భుతంగా ఎందుకు రూపుదిద్దుకోవాలి? ఎంతో బుద్ధి కలిగిన ఈ మానవుడే మళ్ళీ తెలివితక్కువగా తన దుఃఖాన్నీ, వినాశనాన్నీ తనే ఎందుకు కొనితెచ్చుకోవాలి? అలా దారితప్పిన మానవుడికి త్రోవచూపడానికి ఓ దేవుడులాంటి మనిషి ఎందుకు దిగిరావాలి? ఎందుకు ఎందుకు? శాస్త్రజ్ఞులు, “అదంతే! కారణాలు ఉండవు!” అనొచ్చు. కానీ ఓ భక్తుడి దృష్టిలో ఇదంతా దేవుని కరుణ. ఆకాశంలో ఉండే సూర్యుడికి నిజానికి భూమితో ఏమీ పని లేదు, భూమిని పట్టించుకోనక్కరలేదు. కానీ సూర్యుడు లేకుంటే భూమిపైన జీవరాశే లేదు. అలా సూర్యుడిలా కేవలం తన ప్రేమ వల్ల జనులని రక్షించడానికి దిగివచ్చిన అపారకరుణామూర్తి క్రీస్తు! నేలపైన వెలిగిన సూర్యుడు! జనుల బాధలనీ, శోకాలనీ, కష్టాలనీ ఇలా అన్ని కన్నీళ్ళనీ తన చల్లని ప్రేమామృత స్పర్శతో కడిగిన దేవుడు. ఈ బాలకుడే కదా లోకపాలకుడు (శిశుపాలుడు)!

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే!

చరిత్ర చూడని వినాశనం లేదు. మనుషులు రాక్షసులై జరిపిన హింసాకాండలెన్నో. ఈ యుద్ధోన్మాదం మధ్య సుస్వర సంగీతంలా, ఎడారిలో విరిసిన పూదోటలా, తన ప్రేమసందేశంతో జగానికి శాశ్వత మార్గాన్ని చూపినవాడు క్రీస్తు. హింసని ప్రేమతో ఎదుర్కొని, చిరునవ్వుతో శిలువనెక్కి, మరణం లేని మహిమాన్వితుడిగా వెలిగిన చరితార్థుడు.

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

కల్వారి కొండ (Calvari Hill) అన్నది క్రీస్తుని శిలువ వేసిన ప్రదేశం. అంతటి కొండా భక్తుల గుండెల్లాగే శిలువనెక్కిన క్రీస్తుని చూసి కన్నీరైతే, ఆయన నమ్మిన వారిని రక్షించడానికి మరణాన్ని దాటి పునరుత్థానుడయ్యాడు. ఆ కొండపైన శిలువ వేయబడిన ఏసు ఆ కొండనే ఏలుతూ (మలనేలు – మలని + ఏలు, మల అంటే కొండ) స్వచ్చమైన తెల్లని ముత్యంలా మెరిశాడట! ఎంత అందమైన కల్పన!

ఈ “కలికి ముత్యపు రాయైన” క్రీస్తు భక్తులకి కన్నబిడ్డ లాంటివాడట! ఇందాకే బాలఏసు తండ్రి లాంటి పాలకుడయ్యాడు, ఇప్పుడు ఒడిలోన కన్నబిడ్డ అయ్యాడు! తండ్రీ బిడ్డా రెండూ ఆయనే. ఒడిలోని పసిపాపని చూసి ఓ తల్లికి కలిగే ఆనందం వర్ణనాతీతం. ఎంతటి బాధనైనా తక్షణం మటుమాయం చేసే గుణం పాప నవ్వుకి ఉంటుంది. “ఇంకేమీ లేదు, సమస్తమూ నా కన్నబిడ్డే” అనిపిస్తుంది. ఆ బిడ్డే దేవుడూ అయినప్పుడు కలిగే భరోసా “నూరేళ్ళ చీకటిని ఒక్క క్షణంలో పోగొట్టేదే” అవుతుంది!

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

ప్రేమే తెలియని కరకు, ఇరుకు గుండెలకి ప్రేమంటే తెలియజెప్పిన శాంతిదూత క్రీస్తు. ఇలకి దిగివచ్చిన ఈ బాల దేవుణ్ణి “అనురాగ మొలక” గా వర్ణించడం ఎంతో చక్కగా ఉంది.

ఇలా ప్రేమ మూర్తిగా, స్నేహితుడిగా, పాలకుడిగా, కన్నబిడ్డగా పలు విధాల క్రీస్తుని కొలుచుకోవచ్చు. భక్తుడి బాధ తీర్చే పెన్నిధీ ఆయనే, భక్తుడు ఆనందంలో చేసే కీర్తనా ఆయనే. చీకటనుండి చేయిపట్టి నడిపించే వెలుగురేఖా ఆయనే, అంతా వెలుగున్న వేళ మెరిసే ఇంధ్రధనుసూ ఆయనే. సర్వకాల సర్వావస్థల్లోనూ పూజకి పువ్వులా దొరికాడు కనుకే “ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే” అనడం. “ముక్కారు” అంటే “మూడు కాలాలు” అని అర్థం. అన్ని కాలాల్లోనూ, అన్ని కష్టాల్లోనూ తోడుండే దేవుడు ఆయనే!

ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు. ఇది కేవలం క్రైస్తవులకే చెందిన పాట కాదు. భక్తిలోని ఓ చిత్రం ఏమిటంటే, మొదట్లో భగవంతుడు, భక్తుడు, భక్తి అని వేరువేరుగా ఉన్నా, చివరకి కేవలం భక్తే మిగులుతుంది. ఆ స్థితిలో కృష్ణుడు, క్రీస్తు, అల్లా అని తేడాలుండవు. ఇలా ప్రేమని పెంచి, ఏకత్వాన్ని సాధించి జనులని నడిపించే భక్తి నిజమైన భక్తి అవుతుంది. అలాంటి భక్తి మాధుర్యం ఈ పాటలోనూ ఉంది.

*

 

 

 

 

బాబన్న ప్రశ్న

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

–      సుధా కిరణ్

~

Sudha Kiran_Photo

ఎందుకోసమీ కవిత్వం?

విద్వేషం కసితో  కత్తిదూసిన ఆ రాత్రి కోసంఆ రోజు కోసం కాకుంటే

వీధి మలుపున హృదయం గాయపడిన మనిషి

చరమ ఘడియలకి చేరువౌతున్న

మలిసంధ్య క్షణాల కోసం కాకుంటే

ఎందుకోసమీ కవిత్వం?

 

రాత్రిఅన్నింటికీ పైన ఆకాశం

రాత్రిఆకాశంలోఅనంతకోటి నక్షత్రాలు

………

అదిగోఅక్కడ నెత్తురోడుతున్న కళ్ళులేని మనిషి

      పాబ్లో నెరూడా

1

‘ఎవరు వాళ్ళు?

ఎవరు వాళ్ళు ?

ఎవరి కోవకు చెందినోళ్ళు?

ఎవరికోసం వచ్చినోళ్ళు?’

కంజిరపై కలవరించే కాలం కవాతు

‘కళ్ళులేని మనిషి’ కంటిచూపు పాట.

వసంత మేఘమై, మెరుపు నినాదమై

చీకటి ఆకాశాన్ని వెలిగించిన

కబోది కలల కాగడా పాట.

2

ఒక ఆకాశం
ఎర్రజెండాయై ఒదిగి

ఒక భూమి
కన్నీటి గోళమై ఎగసి

ఒక నక్షత్రం
అగ్నికీలయై రగిలి

ఒక మేఘం
పెను విషాదమై పొగిలి

ఏం చూడగలడు కళ్ళులేని మనిషి?

ఎక్కుపెట్టిన ఆయుధంలో
ఎర్రని ద్వేషాన్నా?

చుట్టుముట్టిన చావులో
నల్లని చీకటినా?

ఏం చూస్తాడు కళ్ళులేని
మనిషి చరమ క్షణాలలో?

పాట  పెఠిల్లున పగిలిన
మౌనాన్నా?
చూపు చిటుక్కున చిట్లిన
నెత్తుటి దృశ్యాన్నా?

ఏం చూస్తారు కళ్ళున్న
కలలులేని మనుషులు?

కమురు వాసనలో కాలిపోయిన కలలనా?
బొట్టు బొట్టుగా నెత్తురు యింకిన
ఇసుక రేణువులలో ఎండిపోయిన వేసవి నదినా?

3

అవును, మనవాళ్ళే
మనకోవకు చెందినోళ్ళే, మనకోసం వచ్చినోళ్ళే!

కత్తి మనది
కత్తి వాదరకు తెగిపడిన కంఠమూ మనదే

నిప్పురవ్వ మనది
అస్థికలు మిగలని చితాభస్మమూ మనదే

కాలిబాట మనది
దారితప్పిన బాటసారులమూ మనమే

4

శవపేటికలతో ఖననం కాని
జీవిత రహస్యం

ఎగసిన చితిమంటలతో
దహనం కాని సత్యం

నెత్తుటి నదిలో మరుగుపడని జ్ఞాపకం .

తెగిపడిన గొంతులో ఆగిపోని పాట

5

కళ్ళులేని కలల మనిషి
ప్రశ్నిస్తాడు.

“అనంతాకాశంలో

కనిపించీ కనిపించని

అంతిమ నక్షత్రాలనెవరు చూస్తారు?

అమరత్వపు అరుణ పతాకపు రెపరెపలలో

భ్రాతృ హననాలని గుర్తు చేసుకునేదెవరు?

కలల వెలుగులో

ఒకానొక చీకటి రాత్రి పీడకలలాంటి

చావులనెవరు నెమరు వేసుకుంటారు?

‘నలుగురు కూచొని నవ్వే వేళల’

మాపేరొకపరి తలచేదెవరు?”

కళ్ళులేని కలల మనిషి ప్రశ్నిస్తాడు

“మా జ్ఞాపకం

తలుపులు శాశ్వతంగా మూసివేసిన

చీకటిగది అవుతుందా?”

*

babanna

  1. బాబన్న (తలసిల నాగభూషణం)వరంగల్ జిల్లా సిపిఐ(ఎం.ఎల్) విమోచన విప్లవ గ్రూపు రైతు కూలీ సంఘం నాయకుడు. కళ్ళు లేకున్నా అన్ని వుద్యమాలలో చురుకుగా పాల్గొనేవాడు. లెక్కలేనన్ని సార్లు అరెస్టులు, చిత్రహింసలకి గురయ్యాడు. ‘గుడ్డివాడా నిన్ను కాల్చిపారేస్తాం’ ‘అడివిలో వదిలి వేస్తా’మని పోలీసులు చాలాసార్లు బెదిరించేవాళ్ళు. విప్లవ గ్రూపుల చీలిక తగాదాలలో, ఏప్రిల్ 26, 1990 న ఖమ్మం  పగిడేరు దగ్గర బాబన్నలక్ష్మణ్భాస్కర్ఘంటసాల నాగేశ్వర రావులను మరొక గ్రూపు దళం కాల్చి చంపింది. బాబన్నని ఇసుకలో తలదూర్చి, తొక్కి, తర్వాత అత్యంత క్రూరంగా కాల్చి చంపారు. తనని చంపుతామని ఆ గ్రూపువాళ్ళు ప్రకటించిన తర్వాత, బాబన్న చావుకు మానసికంగా సిద్ధ పడ్డాడు. ‘రాజ్యం చేతిలో చనిపోయిన వాళ్ళని అమర వీరులుగా ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు. చీలిక ఘర్షణలలో చనిపోయే మాలాంటి వాళ్ళ సంగతేమిటి? ఇవాళ చీలిక ఘర్షణలలో మేం చనిపోతే, రేపు తిరిగి అందరూ ఐక్యమయ్యాక మమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా తలచుకుంటారా?’’ అని బాబన్న తన సహచరులని ప్రశ్నించాడు. తెలంగాణా, ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలలో వివిధ విప్లవ సంస్థల ఘర్షణలలో కనీసం వందమందికి పైగా చనిపోయి వుంటారు. ఘర్షణ పడి, పరస్పర హననాలకి పాల్పడిన తర్వాత, కొన్ని సంస్థలు తిరిగి ఐక్యం అయ్యాయి కూడా. బాబన్న ప్రశ్న విప్లవకారులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న.
  2. బాబన్న పాటలు పాడేవాడు.‘ఎవరు వాళ్ళు?/ఎవరు వాళ్ళు ?/ఎవరి కోవకు చెందినోళ్ళు?/ఎవరికోసం వచ్చినోళ్ళు?’ అనే జనసేన పాటని బాబన్న అన్ని సభలలో, సమావేశాలలో పాడేవాడు. 

మాట‌ల్ని మింగేస్తున్నాను 

 

-నామాడి శ్రీధర్

~

namadi sridhar

 

 

 

 

 

ఎవ‌రేమి చెబుతున్నా
బుద్ధిమంతుడి వ‌లె ఊకొడుతున్నాను
భ‌య‌మో సంశ‌య‌మో
అవును కాద‌నే గురిని మింగేస్తున్నాను

ఎక్క‌డేమి జ‌రుగుతున్నా
ప్రేక్ష‌కుడి మ‌ల్లే తేరిపార చూస్తున్నాను
ఉపేక్షా నిర్ల‌క్ష్య‌మా
నిజం అబ‌ద్ధ‌మ‌నే రుజువుని చ‌ప్ప‌రిస్తున్నాను

శ‌తాబ్దాల త‌ర‌బ‌డి
నెత్తురోడ్చే ఊరుల పేర్ల‌నీ
సాటి మ‌నుషులు హ‌త‌మారిన చిరునామాల్నీ
ఉచ్చ‌రించ‌కుండానే గ‌మ్మున గుట‌క‌లేస్తున్నాను

ఆ చిల్ల‌ర‌దొంగ వెంట‌బ‌డి
ఓ వీధికుక్క మొరుగుతుంది
ఖూనీకోరుల మ‌ధ్య నిల‌బ‌డిన నేను
ఒక్క పెనుకేక‌ని పుక్కిలించ‌లేక‌పోతున్నాను

విష‌గుళిక‌ల ప‌లుకుల్ని మింగీ మింగీ
చేదుబారిన గుండెలో జాగా మిగ‌ల‌లేదు
ఇప్పుడిక దాద్రి క‌ల‌బుర్గి నామధేయాలు
నిప్పు ముద్ద‌లై ఈ గొంతుక దిగ‌డం లేదు

*

ఒకే ఒక్క ఛాన్స్

 

 

Prajna-1“ఒకే ఒక్క ఛాన్స్ సర్, ప్లీజ్” భూమి అడుగుతోంది.

“చూడమ్మా, సినిమాలలో పాడటం అంటే అంత ఈజీ కాదు. ఈ కాలంలో మీడియా హెల్ప్ తో చాలా మంది ప్లే బాక్ సింగర్స్ అయిపోతున్నారు. నువ్వు కూడా అలాంటిదే ఏదో ఒక రియాలిటీ షో లో పాల్గొని, కొంచం ఫేమస్ అయి రా. అప్పుడు ఆలోచిద్దాము. ఇంతకన్నా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేను నీతో. సారీ” అని అనేసి, తన మేనేజర్ వైపు తిరిగి “ఇదిగో రావుగారు, ఎవరిని పడితే వాళ్ళని లోపలకి పంపకండి. కొంచం ఫిల్టర్ చెయ్యండి” అని డప్పు కృష్ణ అన్నాడు.

ఇంక చేసేదేమీ లేక భూమి రూం నుండి బయటకి వచ్చేసింది. ఆమె వెంటనే రావుగారు కూడా బయటకోచ్చేసారు.

“ఏంటి అంకుల్ ఇది? డప్పు కృష్ణ అందరిలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కాదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అని మీరు చెప్తేనే కదా నేను వచ్చింది? టాలెంట్ ఉందో లేదో కూడా చెక్ చేయకుండా ఆయన తరిమేసాడు. ఒక ఛాన్స్ ఇమ్మని బ్రతిమిలాడినా కూడా అసలు పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోతాను అంకుల్” భూమి కళ్ళలో నీళ్ళతో అంది.

“బాధపడకు తల్లీ. ఇతను మంచోడు అనుకున్నాను. అందుకే రికమండ్ చేశాను. నువ్వేమీ దిగులు చెందకు. నాకు ఇండస్ట్రీ లో ఇంకా చాలా నెట్వర్క్ ఉంది. ఏదోలా నీకో ఛాన్స్ ఇప్పిస్తాను లే” రావుగారు సర్ది చెప్తున్నాడు.

“రియాలిటీ షో తో ఫేమస్ అవ్వాలంట. నాకు తెలియదా మరి? నేను ట్రై చేయలేడనుకుంటున్నాడా? అక్కడ గెలవాలంటే టాలెంట్ తో పాటు ఎంత లక్ ఉండాలి! అందుకే నాకు ఇష్టం లేదు. నేను హార్డ్ వర్క్ ని నమ్మే దానిని. తెలుసా అంకుల్ నాకు 6 ఏళ్ళు ఉన్నపటి నుండి కర్నాటిక్ సంగీతం నేర్చుకున్నాను. రొజూ ప్రాక్టీసు చేస్తున్నాను”

“నాకు తెలుసు భూమి, నువ్వెంత కష్టపడుతున్నావో” ఏదో ఆలోచిస్తూ అన్నాడు రావు.

“ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ లలో ఫస్ట్ వచ్చాను. సినిమా సంగీతం కూడా బాగా ఇష్టం నాకు. కాని సరి అయిన ఛాన్స్ దొరకట్లేదు నా టాలెంట్ చూపించటానికి. నన్నేం చేయమంటారు?”

“పోర్ట్ లాండ్ ప్రయాణం కి సిద్ధమవమంటాను”

“అర్ధంకాలేదు”

“నేను చెప్తాగా”

“కెనడా నా?”

“కాదు. అమెరికా”

 

—-

“ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, శ్రుతిలయలు ఈ సారి అమెరికా లో. పసిఫిక్-భారత్ సంగీత అకాడమీ వాళ్ళు ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రోగ్రాం ఈ సారి అమెరికా లోని ఆరిగాన్ రాష్ట్రంలో పోర్ట్ లాండ్ నగరంలో. ఎన్నో ఆడంబరలతో, భారీ సెట్ తో ఈ కార్యక్రమం….”  అంటూ ఒక టీవీ చానల్, చెప్పిన న్యూస్ నే మళ్లీ మళ్లీ చెప్తోంది. అది టీవీ లో చూస్తూ భూమి గట్టిగా నిట్టూర్చింది. రావుగారు ఇచ్చిన సలహా అండ్ ప్రోత్సాహంతో, రెండు రోజుల క్రితమే ఆరిగాన్ చేరింది. అమెరికా రావటం మొదటి సారి. టికెట్ నుండి హోటల్ దాకా బుకింగ్, అన్ని ఎర్రెంజ్మెన్ట్స్ రావు గారు చేసారు. అమెరికా లో ఎలా ఉండాలో, ట్రావెల్ ఎలా చేయాలో అన్నీ చక్కగా వివరించారు. రెగ్యులర్ గా ఫోన్ లో మెసేజెస్ పంపిస్తూ, భూమికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. నెక్స్ట్ డే నుండి రిహార్సల్స్. ఇలాంటి ఒక అవకశం తన జీవితంలో వస్తుందని భూమి ఎన్నడూ అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది. అలాగే టెన్షన్ కూడా.

మరునాడు ఆరిగాన్ కన్వెన్షన్ సెంటర్ కి కాబ్ బుక్ చేసుకొని వెళ్ళింది. అప్పటికే అక్కడ చాలా మంది పాటలు, డాన్సు ప్రాక్టీస్ చేస్తున్నారు. రిహార్సల్స్ తో పాటు ఇక్కడే ఆసలు కార్యక్రమం కూడా. పనిచేసేవారు, పని చెప్పేవారు, మేనేజర్ లు, పార్తిసిపెంట్స్ – అందరూ భారతీయులే. ఎప్పుడూ సింగింగ్ కాన్సర్ట్స్ చేసే ‘వినోద్ బృందం’, ఆ గ్రూప్ లో ఎప్పుడూ పాడే ఫేమస్ ప్లేబాక్ గాయకులూ, గాయనీమణులు అందరూ అక్కడ నవ్వుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళకుండా, భూమి అక్కడి ఆఫీస్ లో ఈవెంట్ మేనేజర్ ని కలిసింది. ఆయన వెయిట్ చేయమంటే, అక్కడే లోన్జ్ లో కూర్చొని ఉంది. ఆకలి దంచుతోంది. మళ్లీ మేనేజర్ దగ్గరకెళ్ళి కాంటీన్ లాంటిది ఏమైనా ఉందా ఇక్కడ అని అడిగింది. తినటానికి అయితే బయటకి వెళ్ళాల్సిందే, కాఫీ మాత్రం ఇక్కడే వెండింగ్ మషీన్ లో తాగచ్చు అని చెప్పగా, వెళ్లి ఒక కప్ కాఫీ తెచ్చుకుంది. ముంబై లాంటి ఒక మహానగరంలో ఎంతో కాలం బ్రతికింది కాబట్టి ఇక్కడ మషీన్ లు కొత్తగా ఏమి కనపడట్లేదు. ఈ ఫ్లై ఓవర్లు, పెద్ద పెద్ద మాల్స్ ఇవేం కొత్తగా అనిపించడంలేదు. పైగా తన ఫోకస్ అంతా ప్రోగ్రాం మీదనే ఉంది. ఎన్నో ఆలోచనలతో కాఫీ తాగుతుండగా, మేనేజర్ వచ్చి “మాడమ్, సర్ హాస్ కమ్” అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాఫీ గ్లాస్ పక్కన పడేసి, గబగబా మేనేజర్ వెంట పరిగెత్తింది. గ్రే కలర్ సఫారీ సూట్ లో ఎంతో రేడియంట్ గా శ్రవణ్ కుమార్ కనిపించాడు.

శ్రవణ్ కుమార్ సౌత్ ఇండియా లో ఒక గొప్ప సింగర్. సింగర్ మాత్రమే కాదు. సంగీత దర్శకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటుడు కూడా! ఆయనకి ఇప్పుడు అరవై ఏళ్ళు. కాని ఎంతో సరదాగా, ప్రతి ఏజ్ గ్రూప్ తో కలిసిపోయి మాట్లాడుతాడు. సినీ జీవితంలో ఎంత ఫేమసో, నిజ జీవితంలో కూడా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. కొత్తవాళ్ళని ప్రోత్సహించడంలో అతనికి అతనే సాటి. ఎన్నో టీవీ చానెల్స్ ద్వారా సినిమా ప్రపంచానికి కొత్త గాయకులను, మ్యుజిషియన్ లను పరిచయం చేసాడు. ఇప్పుడు అతని బృందంలో పాడేందుకు భూమికి ఛాన్స్ దొరికింది. సాధారణంగా ఇలాంటివి భూమికి ఇష్టం ఉండవు. కాని రావుగారు ఎంతో అభిమానంతో, తన టాలెంట్ మీద నమ్మకంతో ఈ సహాయం చేస్తున్నారు. పైగా శ్రవణ్ కుమార్ లాంటి ప్రఖ్యాతి చెందిన గాయకులకి తన గాన ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది. దీనిని ఫుల్ గా సద్వినియోగం చేసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఆరిగాన్ వచ్చింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని  శ్రవణ్ కుమార్ దగ్గర కెళ్ళింది.

“హలో సర్, నా పేరు భూమి. రావుగారు ముంబై  నుండి పంపారు” అని నవ్వుతూ పలకరించింది.

“ఓహ్ భూమి అంటే నువ్వేనా? పరిచయాలు, కబుర్లు తరువాత.  అర్జెంట్ గా ఒక పాట పాడి వినిపించు. ఏదోకటి నీ ఇష్టం. శృతి అందించటానికి కీబోర్డ్ మీద ఉన్న సునీల్ ని అడుగు” శ్రవణ్ కుమార్ ఫటాఫట్ చెప్పేసాడు.

“నాకు శృతి వద్దండీ” అని తన బాగ్ పక్కన పెట్టి పాడటానికి సిద్ధం అన్నట్టు నించుంది భూమి.

“వెరీ వెల్, స్టార్ట్” అని అన్నాడు శ్రవణ్ కుమార్.

“అజీబ్ దాస్తా హే యే, కహా షురూ కహా ఖతమ్” అన్న లతా గారి పాటలోని పల్లవి, ఒక చరణం పాడింది భూమి.

“బాగుందమ్మా, చక్కగా ఉంది. హై పిచ్ ఓకే. తెలుగు పాట ఏదైనా పాడు. కొత్తది అయినా పరవాలేదు”

“సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి…  నా కథా” అని తన మైండ్ లో వచ్చిన ఫస్ట్ తెలుగు పాటని పాడింది.

పల్లవి అయిపోగానే ‘చాలు’ అన్నట్టు శ్రవణ్ కుమార్ చెయ్యి చూపాడు. హాల్ లో అప్పటిదాకా తన గొంతు మాత్రమే ఎకో లో వినిపించింది. ఇప్పుడు అంతా ఒకటే నిశబ్దం. అందరూ వారి వారి పనులు ఆపేసి భూమి వైపే చూస్తున్నారు. భూమికి టెన్షన్ ఆయన ఏమంటాడో అని.

“ఫన్టాస్టిక్” అని చెప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు శ్రవణ్ కుమార్. హాల్ లో మిగితా వాళ్ళు కూడా చేతులు కలిపారు. భూమి ఫైనల్ గా రిలాక్స్ అయ్యింది. ఈవెంట్ మేనేజర్ అక్కడ నుండి బయటకి పరిగెత్తాడు.

“చూడు భూమి. నీ గొంతు చాలా బావుంది. శృతి, లయ పర్ఫెక్ట్. శాస్త్రీయ సంగీతం వచ్చు కదా నీకు? రావు గారు నీ డీటెయిల్స్ ఇచ్చారు లే. ఆయన మాట అంటే నాకు నమ్మకం. కాని స్వయంగా వింటే కాని నాకు సంతృప్తి గా ఉండదు. సో, వెరీ వెల్. వినోద్ వాళ్ళతో బాగా ప్రాక్టీస్ చెయ్యి. పదిహేను రోజులు నీకు చాలు అనుకుంటాను. వాళ్ళు ఏదో పెర్ఫార్మన్స్ అంటారు, నాకు అవన్నీ తెలియవు. పాడటం ఒక్కటే తెలుసు. అవన్నీ వాళ్ళతో చూసుకో. పేమెంట్ డీటెయిల్స్ మేనేజర్ చెప్తాడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నీకు?” శ్రవణ్ కుమార్ అడిగాడు.

“లేవండి. నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను. నా లైఫ్ లో ఇప్పటిదాకా నా టాలెంట్ చూపించటానికి ఒకే ఒక్క ఛాన్స్ దొరికితే బాగుండు అని ఎన్నో సార్లు అనుకున్నాను సర్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ సర్” అని భూమి ఎంతో కృతజ్ఞతా భావంతో అంది.

“అల్ ది బెస్ట్” అని నవ్వేసి వెళ్ళిపోయాడు శ్రవణ్ కుమార్.

వినోద్ దగ్గర కెళ్ళింది భూమి. అక్కడి సింగర్స్ అందరూ చక్కగా మాట్లాడారు. భూమి వాళ్ళని టిప్స్ అడిగి తెలుసుకుంది. ఈ లోగా మేనేజర్ భూమి కోసమని ఒక శాండ్విచ్ తెచ్చి ఇచ్చాడు. భూమి చాలా గొప్ప సింగర్ అవుతుందని గుడ్ లక్ చెప్పాడు. శృతిలయలు గ్రాండ్ ప్రోగ్రాం లో వినోద్ బృందం మొత్తం 25 పాటలు పాడుతున్నారు. అందులో భూమి ఒక డ్యూయెట్, మూడు పాటలేమో ఖొరస్ లో పాడబోతోంది. కానీ సోలో గా ఛాన్స్ రాలేదు అని అప్సెట్ అయింది. పదిహేను రోజులు చాలా కఠినంగా ప్రాక్టిస్ చేసారు. అప్పుడప్పుడు శ్రవణ్ కుమార్ పర్యవేక్షణ లో వాళ్ళందరూ పాడేవారు. భూమి టాలెంట్ చూసి ఆమెకి ఒక సోలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ రోజు భూమి ఆనందానికి హద్దులు లేవు. ఇంతకీ తను పాడవలసిన  సోలో ‘ఆకాశం ఏ నాటిదో, అనురాగం ఆనాటిది’.  నిరీక్షణ సినిమాలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో జానకమ్మ పాడిన పాట, ఆ పాట కి నేషనల్ అవార్డు వచ్చింది – అంత అద్భుతమయిన కంపోజిషన్ అది. చాలా కష్టమైన పాట కూడా! భూమికి ఇదొక ఛాలెంజ్.

మొత్తానికి డి-డే రానే వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలు దాటింది. ఆరిగాన్ కన్వెన్షన్ సెంటర్ భారీ డెకరేషన్ లతో, లైట్స్ తో, శోభాయమానంగా వెలిగిపోతోంది. ఎవరి పనులలో, ఎవరి రిహార్సల్స్ లలో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు మగవారు సిల్క్ పంచలు, లాల్చీలు వేసుకొని ఉన్నారు.  ఆడవాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్ళికి వచ్చినట్లు సంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని, వాళ్ళ దగ్గరున్న నగలన్నీ వేసుకొని వచ్చినట్లున్నారు. భూమి మెడిటేట్ చేసింది కాసేపు. కాన్సంట్రేషన్ అంతా తన పాట మీద ఉండాలని. ఒక ఫైనల్ రిహార్సల్ అయింది. అందరూ దేవుడికి దణ్ణం పెట్టుకొన్నారు. ఆరింటికి అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది.

ముందుగా జ్యోతి వెలిగించి, వినాయకుడిని ప్రార్ధించి ప్రోగ్రాం మొదలు పెట్టారు. పసిఫిక్-భారత్ సంగీత అకాడమీ నిర్వాహకులు, మిగితా డిగ్నిటరీస్, ఇతర చీఫ్ గెస్ట్స్ అందరూ రెండు రెండు మాటలు చెప్పేసి కూర్చున్నాక శ్రవణ్ కుమార్ గురించిన ఒక ఎ-వి ప్లే చేసారు. శ్రవణ్ కుమార్ కి ఇటీవలే వచ్చిన పద్మశ్రీ గురించి, ఆయన గొప్పతనం, మంచితనం గురించి ఇంకా ఎన్నో విషయాలు ఆ ఎ-వి లో చెప్పారు. అది అయిన వెంటనే శ్రవణ్ కుమార్ ని వేదిక మీదకి ఆహ్వానించి, శాలువా కప్పి సన్మానించారు. శ్రవణ్ కుమార్ కి పేరు తెచ్చిన పాటతో లైవ్ కాన్సర్ట్ ప్రారంభమయింది. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న ఎందరో యువగాయనీ గాయకులతో డ్యూయెట్ లు, వాళ్ళ చేతనే కొన్ని సోలోలు పాడిస్తూ శ్రవణ్ కుమార్ ప్రోగ్రాం ని కండక్ట్ చేస్తున్నాడు. ఒకటే చెప్పట్లు, హర్షద్వానాలు. ఇది అమెరికానా, అమలాపురమా అని సందేహం వచ్చేట్టు కొన్ని ఫాస్ట్ సాంగ్స్ కి ఏకంగా ఈలలు వేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా కార్యక్రమం సాగుతుండగా,  భూమి ఖోరస్ సాంగ్స్ అయిపొయి, మిగిలిన ఇంకొక్క సోలో సాంగ్  టర్న్ వచ్చింది.

‘లలాలా లాలాలలా లలాలా లాలాలలా……’ అని ఆర్కెస్ట్రా లేకుండా మొదలుపెట్టింది భూమి.

అందరూ సైలెంట్ అయిపోయారు. భయం వల్ల వొణుకు కాళ్ళనుండి గొంతు వరకు పాకింది. ఒక్కసారి కళ్లుమూసుకుంది. బీట్ స్టార్ట్ అయిన వెంటనే కళ్ళు తెరిచి పాట స్టార్ట్ చేసింది. పల్లవి అయింది, చరణాలు అయ్యాయి. మొదటి చరణం లో పై స్థాయి లో పాడినప్పుడు చిన్నపాటి వొణుకు. కానీ వెంటనే అది సర్దేసుకొని, మిగితా పాట అంతా పాడేసింది. పాట ఇలా అయ్యిందో లేదో ‘వన్స్ మోర్’ అని ఒకటే కేకలు. చెప్పట్లు. ఒక అర నిముషం పాటు అక్కడే స్థాణువుగా నిల్చుండిపోయింది భూమి. కలా, నిజమా అని తనకి డౌట్ వచ్చింది. శ్రవణ్ కుమార్ భూమి దగ్గరకొచ్చి, మైక్ లో “ఈ అమ్మాయి భలే పాడింది కదండీ? ఇంకోసారి మీ ఆశీస్సులు అందివ్వండి” అంటూ ఆయన కూడా చెప్పట్లు కొట్టి, భూమి చెయ్యిని ఆయన చేతిలోకి తీసుకొని, వేదిక నుండి పక్కకి తీసుకెళ్ళారు.

భూమి ఎంతో సంతోషంతో “సర్ బాగా పాడానా? ఎలా పాడాను? నేను చాలా కాన్ఫిడెన్స్ తో పాడేసాను” అని ఉత్సాహంగా చెప్తోంది.

“ఎస్. కాని నీ పని అయిపోలేదు, మన ప్రోగ్రాం లో ఒక చిన్న మార్పు” శ్రవణ్ కుమార్ ఐపాడ్ లో ఏదో చెక్ చేస్తూ అన్నాడు.

“అర్ధంకాలేదు సర్” అయోమయంగా అడిగింది భూమి.

“ఒకే ఒక్క ఛాన్స్ అన్నావుగా? ”

“సర్ మీతో డ్యూయెటా?” నమ్మలేనట్టుగా అడిగింది.

“అవును, పాడతావా నాతో ఇప్పుడు?”

“నమ్మసఖ్యంగా లేదు సర్”

“వాటికి టైం లేదు. ఇంకొక పది నిముషాలు. ప్రాక్టీస్ చేసుకో. ఇదిగో లిరిక్స్. నీకు ఈ పాట తెలుసా?” అని శ్రవణ్ కుమార్ భూమి కి ఐపాడ్ అందించాడు.

భూమి పాట ఎంటా అని చూసింది. వెంటనే వెలిగిపోతున్న మొహంతో, “తెలుసు సర్. లిరిక్స్ తో సహా.  ప్రాక్టీస్ అక్కర్లేదు” అని ధీమాగా చెప్పింది.

“నీకెలా తెలుసు తల్లీ ఈ పాట? ముంబై లో ఉండి అన్నీ పాత పాటలు తెలుసా?” శ్రవణ్ కుమార్ ఐపాడ్ తిరిగి తీసుకుంటూ అడిగాడు.

“ముంబై లో ఉన్నా, అమెరికా లో పాడినా, నాకు ఇష్టమైన హీరో సర్ అతను” అని మురిసిపోతూ భూమి చెప్పింది.

“తరువాత పాట; కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో, రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా స్వయం కృషి నుండి. పాడుతున్న వారు – శ్రవణ్ కుమార్, భూమి. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోస్” అన్న అనౌన్స్మెంట్ విని భూమి, శ్రవణ్ కుమార్ వెంట నడుచుకుంటూ స్టేజ్ మీదకొచ్చారు.

“సిగ్గూ పూబంతి ఇసిరే సీతా మా లచ్చి” అంటూ ఇద్దరూ ఆ డ్యూయెట్ అద్భతంగా పాడారు. భూమి సోలో ఎంత బాగా పాడిందో, ఈ డ్యూయెట్ కూడా భలే పాడింది. ఇంకో రెండు పాటలతో వేరే సింగర్స్ పాటల ఈవెంట్ ముగించారు. వోట్ అఫ్ థాంక్స్ చెప్పటానికి వచ్చిన పసిఫిక్-భారత్ సంగీత అకాడమీ ప్రెసిడెంట్ డప్పు బలరాం, అక్కడే ఉన్న శ్రవణ్ కుమార్ దగ్గరకెళ్ళి, ఏదో మాట్లాడి మైక్ దగ్గరకొచ్చాడు. అందరికి పేరుపేరునా థాంక్స్ చెప్పి, ఇవ్వ వలసిన కొన్ని మెమెంటోలు ఇచ్చేసాడు.

“ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుక లో నేనొక విషయం అనౌన్స్ చెయ్యాలనుకుంటున్నాను. ఇవాళ నేనొక అద్భుతమైన గొంతు విన్నాను. అది వాయిస్ కాదు, అమృతం. భూమి, ఎక్కడున్నావ్ అమ్మా స్టేజ్ మీదకి రా” అని అటు ఇటు చూసి, భూమి అతని దగ్గరికి రావటం చూసి, “ఈ అమ్మాయి లో చాలా టాలెంట్ ఉంది. ఒక యునీక్ వాయిస్. శాస్త్రీయ సంగీతంని నమ్ముకున్న వారికి ఎప్పుడు మేలే జరుగుతుంది. సాధారణంగా శ్రవణ్ కుమార్ ఎవరినీ రికమండ్ చెయ్యరు. కానీ ఈ అమ్మాయి ప్రతిభని చూసి, ఇలాంటి వాయిస్ సినిమా ఇండస్ట్రీలో న భూతో న భవిష్యతి అన్నారు. ఆయనని సంప్రదించిన పిమ్మట నేనొక నిర్ణయం తీసుకున్నాను. మీ అందరికి తెలుసు. నా తమ్ముడు డప్పు కృష్ణ సౌత్ ఇండియాలో ఇప్పుడొక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. కృష్ణ నెక్స్ట్ సినిమాలో ఈ అమ్మాయి గొంతు రికార్డ్స్ లో వినిపించబోతోంది” అని గట్టిగా అంటూ భూమి చేతిని గాలిలోకి విజయోత్సవంగా ఊపాడు.

భూమికి అర్ధమయ్యీ అర్ధమవ్వనట్లు ఉంది. శ్రవణ్ కుమార్ వైపు తిరిగి చూసింది.

“ఒకే ఒక్క ఛాన్స్” అని శ్రవణ్ కుమార్ డ్రమాటిక్ గా కళ్లెగరేస్తూ  స్లో లిప్ మూవ్మెంట్ లో అని ఎంతో గర్వంగా, సంతోషంతో చెప్పట్లు కొట్టాడు.

 

***

గమనమే గమ్యం-28

 

 

volga‘‘శారదాంబకు ఈ ఉత్తరం ఇచ్చి రావమ్మా’’ అంటూ పార్టీ ఆఫీసుకి వచ్చిన కార్యకర్త ఒకాయన సత్యవతి చేతిలో ఒక కాగితం కట్టపెట్టాడు. ‘‘ఇది ఉత్తరమా’’ అనుకుని నవ్వుకుంటూ హుషారుగా బయల్దేరింది సత్యవతి. శారదాంబ ఇంటికి వెళ్ళటం అంటే సత్యవతికి చాలా ఇష్టం. శారదాంబ కనపడనంత సేపూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ కాసేపట్లోనే మనకు అండగా డాక్టరు గారున్నరనే భావాన్ని కలిగిస్తుంది. సుబ్బమ్మ గారు తినటానికి ఏదో ఒకటి పెడతారు. సుబ్బమ్మ మేనగోడలు పద్మ సరదాగా మాట్లాడుతుంది. మహిళా సంఘం ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ సంతోషం తొందర పెడుతుంటే వేగంగా నడుస్తూ వచ్చిన సత్యవతి ఇంటి ముందు ఆవరణలోనే ఆగిపోయింది. సెప్టెంబర్‌ నెలలో గులాబీలు ఇంత విరగబూస్తాయా అనుకుని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. ఇంటి ముందు తోటంత ఎర్రని, తెల్లని గులాబీ పంట పండినట్లుంది. గాలికి తలలు ఊపుతూ మనోహరంగా ఉన్నాయి. సత్యవతికి ఆ పూలన్నింటికీ అరచేయి వెడల్పులో, ఎర్రని ఎరుపు రంగులో ఉన్న రెండు గులాబీలను చూస్తె మనసాగలేదు. చేయి ఊరుకోలేదు. గబగబా వెళ్ళి వాటిని కోసింది. మహా అమూల్యమైన కానుక తీసుకెళ్తున్న భక్తురాలిలా లోపలికి వెళ్ళింది. శారద హాస్పిటల్‌కి వెళ్ళటానికి తయారై బయటకు వస్తూ సత్యవతిని చూస్తూ ‘‘ఏంటోయ్‌ ` పొద్దున్నే ఇలా వచ్చావు’’ అంటూ నవ్వుతూ భుజం మీద చేయి వేసి తట్టింది. సత్యవతి భగవంతుడికి సమర్పిస్తున్నట్లుగా ఆ గులాబీలను శారదాంబ కళ్ళముందుంచింది గర్వంగా. శారదాంబ ముఖంలో నవ్వు పోయి గంభీరమై ‘‘ఎక్కడవివి?’’ అంది. ‘‘మీ తోటలోవే’’ పెద్ద రహస్యం కనుక్కున్నట్లు చెప్పింది.
‘‘ఎందుకు కోశావు?’’
‘‘మీ కోసమే’’ ప్రేమగా చెప్పింది. ‘‘తల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుందని’’ .
శారద కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ ‘‘నా తల్లో ఎన్నడైన ఈ పూలు చూశావా? నేను పూు పెట్టుకోవటం చూశావా ? హాయిగా అందంగా చెట్టుమీద ఉండే పూలని కోసెయ్యటానికి నీకు మనసెట్లా ఒప్పింది? కొంచెం ఆలోచిస్తే తెలిసేదే `-చెట్టున ఉంటే నాలుగు రోజులు అందరి కళ్ళకూ పండగలాగా ఉంటుంది. నా తల్లో నీ తల్లో సాయంత్రానికి వడలి పోతాయి. ఇంకెప్పుడూ గులాబీలు కొయ్యవద్దు’’ ఎంత పొరపాటు చేసిన నవ్వుతూ నవ్వుతూ సరిదిద్దే డాక్టర్‌ గారికి ఇంత కోపం వచ్చిందంటే అది చెయ్యకూడని పనే అని సత్యవతికి రూఢీ అయింది.
‘‘ఇలా తిరుగు’’ అని సత్యవతిని వెనక్కి తిప్పి ఒక పువ్వు ఆమె జడలో పెట్టి ` ‘‘ఇది మా అమ్మకివ్వు. చిన్న గిన్నెలో నీళ్ళు పోసి పెడుతుంది. రెండు రోజులు ఇలాగే ఉంటుంది. ఇంతకూ నువ్వు వచ్చిన పనేంటి?’’ శారద చేతిలో తను తెచ్చిన కాగితాల కట్ట పెట్టింది సత్యవతి. అది తీసుకుని బైటికి వెళ్తున్న శారదకు ఇద్దరు కార్యకర్తు ఎదురొచ్చారు. సత్యవతి వాళ్ళనెప్పుడూ చూడలేదు. ఖద్దరు పంచలు కట్టుకుని, అరచేతుల చొక్కాతో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇద్దరి చేతుల్లో పచ్చని విచ్చీ విచ్చని పత్తి కాయలున్నాయి.
శారదాంబ కళ్లు వాటిమీద పడ్డాయి. వాటినీ వాళ్ళ ముఖాలనూ మార్చి మార్చి చూస్తున్న శారదను చూస్తుంటే సత్యవతికి ఏదో అర్థమైంది. ఇప్పుడేం జరగుతుందో చూద్దాం అనే కుతుహలంతో నాలుగడుగులు బైటికి వేసింది.
‘‘ఏంటా కాయలు ?’’ అనుమానంగా అడిగింది శారద.
‘‘పత్తి కాయలు డాక్టరు గారూ. పత్తి చేలకడ్డంబడి వచ్చాము లెండి . ఈ సంవత్సరం పత్తి బాగా అవుతుంది. చెట్టునిండా కాయలే `’’
‘‘ఏం లాభం రైతుకి రూపాయిండదుదు’’ శారద కఠినంగా అంది.
‘‘ఏం? ఏం? ఎందుకుండదు ?’’ ఆశ్చర్యంగా తమ చేతుల్లో బలంగా ఆరోగ్యంగా ఉన్న పత్తి కాయలను మార్చిమార్చి చూశారిద్దరూ.
‘‘పత్తి చేల మీద మీదుగా వచ్చిన ప్రతివాడ చేతులు దురద పెట్టి ఒక్కోడూ ఐదారు కాయలు కొస్తే ఇంకా పగిలి పత్తి ఇవ్వటానికి కాయలెక్కడుంటాయి. అమ్ముకోటానికి రైతుకి పత్తెక్కడుంటుంది? ఆ కాయలు ఎందుకైన పనికొస్తాయా? మీరు సరదాగా పట్టుకోటానికి తప్ప. కనీసం బాగా పగిలి పత్తి వస్తున్న కాయను కోసినా మీ ఇంట్లో వాళ్ళు ఆ పత్తిని దేనికైన ఉపయోగించుకుందురు. ఈ కాయలు ఎందుకు కోసినట్టూ’’
పాలిపోతున్న ఆ ఇద్దరు యువకుల ముఖాలు చూసి సత్యవతి ముఖంలో ‘‘బాగా అయ్యింది’’ అన్న తృప్తి, చిన్ననవ్వు, తన బాధ మర్చిపోయి ఎగురుతున్నట్టే లోపలికి పోయింది.
***
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఓడిపోవటం వల్ల బ్రిటీష్‌ వాళ్ళకు కలిగింది తాత్కాలిక ఉపశమనమే అయింది. యుద్ధం పేరుతో ఏదో ఒక రకంగా వలస దేశాల్లో ఉద్యమాల ఉద్రుతిని ఆపుకొంటూ వస్తున్న సామ్రాజ్యానికి అది ఇక కుదరని పని అయింది. ముఖ్యంగా భారతదేశంలో వారి పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. తిరగబడని వర్గమంటూ ఏదీ మిగలలేదు. దేశంలో ఎక్కడ చూసినా కార్మికులు , ప్రభుత్వోద్యోగులూ తిరగబడుతున్నారు. సమ్మెలు ముమ్మరమయ్యాయి.
సైనికులు , నావికులు కూడా తిరగబడితే ఏ సామ్రాజ్యం తట్టుకునిలబడ గలుగుతుంది?
కానీ చివరి క్షణం దాకా సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని సర్వ నాశనం చేసి గాని ఒదలకూడదనే పట్టుదలతో బ్రిటీష్‌ ప్రభుత్వం అన్ని రకాల ఉపాయాలను, వ్యూహాలను ఆశ్రయించి రోజులు పొడిగించుకోవాలని చూస్తున్నది.
ఆ వ్యూహాలలో ఒక భాగంగా ఎన్నికలను ప్రకటించింది. దేశం ఒదిలి వెళ్ళక ఎన్నికలు మీరు పెట్టేదేమిటని భారతీయులు అడగరనీ, కొత్తగా నేర్చుకున్న ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి వల్లమాలిన మోజనీ ప్రభుత్వానీ తెలుసు. ప్రొవెన్షియల్‌ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి.
బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా జరగాల్సిన సభలలో, స్వాతంత్ర్యానంతరం దేశ పునర్నిర్మాణం కోసం భిన్న రాజకీయాలలో ఉన్నవారి మధ్య జరగాల్సిన సభలలో కొన్నిటినైనా భారతీయులు తమకు తామే వ్యతిరేకంగా మాట్లాడుకోటానికీ, కొట్లాడుకోటానికీ మళ్ళించటం ప్రభుత్వ ఉద్దేశమైతే అది నెరవేరింది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పూనా ఒడంబడిక ప్రకారం హరిజన అభ్యర్థులకు ముందు ప్యానల్‌ ఎన్నికలు జరిగాయి. రామకృష్ణయ్య, శారద, ఈశ్వరరావు వంటి అగ్రశ్రేణి నాయకులు పని చేసి లక్షమందితో బహిరంగ సభ జరిపారు. ప్యానల్‌ ఎన్నికలలో గెలుస్తామనే గట్టి ఆశ కృష్ణాజిల్లా రిజర్వుడు స్థానం మీద, క్రైస్తవ రిజర్వుడు స్థానంలోనూ కమ్యూనిస్టులకు ఉంది. అలాంటి ఆశతోనే ఏలూరు నియోజకవర్గంలో శారదాంబను నిలబెట్టాని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా , గోదావరి జిల్లాలలో శారదంటే ప్రజలలో అభిమానం ఉంది. సమర్థురాలు. తప్పక గెలుస్తుందని అందరికి నమ్మకం ఉంది.
అందరూ ఉత్సాహం గా శారదను అభినందిస్తుంటే మూర్తి ముఖమే కొంచెం కళాహీనమైంది.
శారద అది గమనించింది.
‘‘మూర్తీ! నువ్వు ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటే నాకు సీటు వచ్చినట్టుందిగదోయ్‌’’ అంది నవ్వుతూనే.
‘‘నాకెందుకు సీటిస్తారు శారదా. నేనెవరిని? శారద భర్తను. ఆ కారణంగానే బెజవాడ వచ్చాను. వచ్చినవాడిని ఊరికే కూచోబెట్టటమెందుకని బాధ్యతప్పగించారు. అంతేగాని ఎన్నికల్లో సీటెందుకిస్తారు?’’ అన్నాడు పరిహాసంగానే ` నవ్వుతూనే.
‘‘నవ్వుతూ అంటున్నావా? నిజంగా నీ మనసులో ఏముంది మూర్తీ’’ శారదకు మనసులో ఏదో శంక మొదలైంది.
‘‘నా మనసులో ఏముందో గ్రహించలేనంతగా నాకు దూరమయ్యావా?’’ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మూర్తి.
శారదకు మూర్తి భావం అర్థం కాలేదు. అపార్థం చేసుకోబుద్ధి కాలేదు.
మూర్తిది అంత చిన్న మనసు అనుకోవటం అసాధ్యంగా ఉంది. కానీ కామేశ్వరరావుని ఇంట్లో ఉంచినపుడు అతని మానసిక స్థితి, అతను చేసిన పని గుర్తొస్తే – ఇప్పుడు కూడా అతన్ని పురుషాహంకారం వేధిస్తున్నదా అనే అనుమానమూ కలుగుతోంది. అహంకారం తలెత్తితే అంకురంలోనే తుంచివేయటం తప్ప మార్గం లేదు. తలెత్తకుండా ఉండేంతటి మహాత్ముడు కాదు మూర్తి. మగవాళ్ళను మహాత్ములుగా కాదు ముందు మగబుద్ధి ఒదిలించి మనుషులుగా మార్చుకోవాల్సిన పని కూడా ఆడవాళ్ళదే ` అబ్బా –ఆలోచిస్తేనే విసుగ్గా, అలసటగా ఉంది. కానీ తప్పదు – ఇది ముఖ్యమైన పని అనుకుంది శారద. ఆ పనికంటే ముందు ఎన్నికల పనులు వచ్చి మీద పడ్డాయి. మరి దేని గురించీ ఆలోచించే, పని చేసే వ్యవధానం లేదు.
***
ఎన్నికలంటే కోలాహలమే. ఏలూరు ఎన్నికలలో నిలబడుతున్నది ఇద్దరూ స్త్రీలే అవటం వల్ల మహిళా సంఘం అంత ఏలూరికి వచ్చేసింది. రెండు పెద్ద ఇళ్ళల్లో అందరికీ వసతి, భోజనం ఏర్పాట్లు చేయటంతో ప్రచార కార్యక్రమంలో అందరూ తలమునకలుగా ఉన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం. పేటల్లో మీటింగు. పదిరోజులకోసారి చొప్పున నెల రోజుల్లో మూడు బహిరంగ సభలు. శారదాంబ బృందమే పకడ్బందీగా ఎన్నికల ప్రచారం జరిగే పద్ధతంత ప్లాను చేసుకున్నారు. శారద అంటే మహిళా సంఘం వాళ్ళందరికీ గౌరవం. ప్రేమ. అందరినీ ‘ఏమోయ్‌’ అంటూ చనువుగా కలుపుకుపోయే శారదలో నాయకురాలు , స్నేహితురాలూ కూడా వాళ్ళకు కనిపించి ఆమెకు అతుక్కుపోయారు. పాటలు , నినాదాలు తయారై పోతున్నాయి అప్పటికప్పుడు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మహిళా సంఘం అంటూ ప్రత్యేకంగా లేదు. పెద్ద నాయకులు , మగవాళ్ళే ప్రచారంలో కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు చనువుగా ఇళ్ళల్లోకి వెళ్ళటం, మంచీ చెడ్డా మాట్లాడటం, పోషకాహారం గురించి చెప్పటం, శారద వెళ్ళిన చోట తల్లీ పిల్లా ఆరోగ్యం గురించి విచారించి సూచనలివ్వటం వీటన్నిటితో శారద గేకుపు ఖాయమని అందరికీ అనిపించింది. మొదట్నించీ కమ్యూనిస్టులంటే పడని ‘ముకో’ పత్రికకు ఇది కంటగింపయింది. వెంటనే ‘శారదాంబ కాంట్రాక్టు పెళ్ళి’ అంటూ ప్రత్యేక కథనమొకటి ప్రచురించింది. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు దానిని కరపత్రాలుగా మార్చి ఇంటింటికీ పంచి పెట్టారు.
రాజమ్మ, , రాజేశ్వరి, ఉమ, విమల మరో ఆరుగురూ కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఒక ఇంట్లో వాళ్ళు ఈ కరపత్రాలు చూపించి దీని సంగతేమిటి అనడిగేసరికి రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దమై పోయారు. ఉమ వెంటనే తేరుకుని ‘‘ఇట్లాంటి రాతలు డాక్టరు గారి గురించి రాసిన వాళ్ళకు మీరు ఓట్లెయ్యాలనుకుంటే వెయ్యండి . స్త్రీలను గౌరవించటం తెలియని పార్టీని ఎన్నుకోవాలంటే ఎన్నుకోండి . పుకార్లను నమ్మొద్ద’’ని చెబుతుంటే ఆ ఇంటావిడ ఉమను ఆపేసింది.
‘‘అదంతా తరవాత సంగతమ్మాయ్‌. పుకార్లని మీరంటున్నారు. నిజాలని కాంగ్రెస్‌ వాళ్ళు ఈ కరపత్రాలు పంచిపెట్టి వెళ్ళారు. నాకొక్కటే సమాధానం సూటిగా చెప్పండి . డాక్టరమ్మగారి భర్తకు అంతకు ముందే పెళ్ళయిందా లేదా? పిల్లలున్నారా లేదా?’’
నలుగురూ ముఖాముఖాలు చూసుకున్నారు.
రాజమ్మ ధైర్యంగా ఉన్న విషయం చెబుదామని నిర్ణయించుకుంది.
‘‘అంతవరకూ నిజమేనండి. డాక్టరు గారి భర్తకు అంతకు ముందే పెళ్ళయింది. అది చిన్నతనంలో జరిగిన పెళ్ళి ` ’’
రాజమ్మ మాటల్ని మధ్యలో ఆపేస్తూ ఇంటి యజమాని కాబోలు అడ్డు వచ్చాడు.
‘‘మేమందరం చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు నదురుగా ఇంకో మనిషి కనిపిస్తే పెళ్ళి చేసుకుంటే ఇదిగో ఈవిడేమైపోతుంది? అదట్లా ఉంచండి -కొందరు మగవాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవర్నయిన ఉంచుకుంటారు. అది వాళ్ళిష్టం. మీ డాక్టరమ్మ ఆ ప్లీడరు గారిని సంప్రదాయ ప్రకారం సప్తపది మంగళసూత్రధారణతో వివాహం చేసుకుందా? అట్లా జరిగి ఉంటే అందులో విడ్డూరం లేదనుకునేవాళ్ళం. ఈ కాంట్రాక్టు పెళ్ళేమిటి? కాగితాలు రాసుకుంటే సరిపోతుందా? అది మాకు అర్థం కావటం లేదు. అంతకంటే డాక్టరమ్మ గారిని మద్రాసు ప్లీడరొకాయన ఉంచుకున్నాడంటే బాగా అర్థమవుతుంది ` ’’
మహిళా సంఘం వాళ్ళ రక్తం ఉడికి పోయింది. ఉమ తన చేతిలో ఉన్న కాగితాల కట్టతో ఆ మగమనిషి భుజం మీద ఒక్కటి వేసి ‘‘రండే పోదాం – వీళ్ళతో మనకు మాటలేంటి’’ అని గిరుక్కున వెనక్కు తిరిగింది. మిగిలిన వాళ్ళూ ‘‘ఛీ! ఛీ! ఏం మనుషులు ’’ అంటూ బైటికి నడిచారు.
‘‘మీ అఘాయిత్యం గూలా! ఆడవాళ్ళేన మీరు. చెట్టంత మగాడి మీద చెయ్యి చేసుకుంటారా ’’ అంటూ ఇంట్లో వాళ్ళు చేస్తున్న గోల వెనక నుంచీ వినపడుతూనే ఉంది.
***

కొత్త రెక్కలు పుట్టాలె!

 

 

–కృష్ణ చైతన్య అల్లం

~

 

Krishna Chaitanya Allamకొత్త కథల పుస్తకం  ఎప్పుడన్న కొన్నప్పుడు సూచిక చూస్తం. కథ పేరు ఏదైనా కొత్తగ కనిపిస్తే అది ముందు చదవాలని అనిపిస్తది.

పెద్ద పెద్ద పేరాలు ఉన్న కథలని తరవాత చదువుదాం లె అనిపిస్తది.

కథలో పిల్లలుంటే కథనం ఉత్సాహభరితంగ ఉన్నట్టు అనిపిస్తది. పిల్లల ఉత్సాహం, ఎనర్జీ కథకు కూడా అన్వయించబడ్డట్టే ఉంటది.

చిన్న చిన్న వాక్యాలతో మొదలైన కథో, కథనమో, వ్యాసమో తొందరగా ముగించవచ్చునన్న భావన కలిగిస్తది.

మామూలుగా పిల్లల కథలు రాసేటప్పుడు ఈ రకమైన పద్దతులు పాటిస్తరు. మరి పిల్లల దగ్గర సఫలీకృతమైన ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది?

కాల్పనిక సాహిత్యం వయసు అవధులు దాటి బయటకు వచ్చే సరికి చాలా వరకు మన సాహిత్యంలో దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథో, హారర్ కథో అనే టాగ్ తో సాధారణీకరిస్తరు. రాసే పద్ధతిల కూడా చాలా వరకు సినిమా ధోరణి కనిపిస్తది. నా వరకు మధు బాబు నవలలు, షాడోలు లాంటి కవర్ పేజీలు చూసినపుడు ఈ పుస్తకం చదవాలే అని అనిపించలే ఒక్క సారి కూడా. ఎందుకంటే మామూలుగా పాటించే కథ తీరూ తెన్నులూ పాటిస్తయి ఈ ప్రక్రియలు. ఎట్టకేలకు అవన్నీ మళ్ళీ కలిసి మెలిసి కంచికి పోతై. ఊహించని ఘటన జరిగిన సన్నివేశం చదువుతున్నా కూడా అట్ల జరుగబోతుంది అనే మైండ్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుందన్న డీఫాల్ట్ కేటగిరీ. కొత్తగా ఆశిద్దాం అనుకునే ఆశ చూపెట్టడంలో విఫలం అయితై.

ఇగ రెండో పద్ధతి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఫిక్షన్ ఇంకా సోషియో ఫిక్షన్. ఇది ప్రపంచం అంతా అత్యధికంగా వాడే ప్రక్రియలు. మన దగ్గర మాత్రం ఎందుకో ఇది పిల్లల పుస్తకాలుగా మాత్రమె పరిగణింపబడే కళా ప్రక్రియ. పెద్ద పెద్ద కథలూ, నవలలూ, టీవీ సీరిస్, సినిమాలూ కోకొల్లలుగా ప్రపంచం అంతటా వాడబడింది. స్టీఫెన్ కింగ్ డ్రమాటిక్ కాల్పనికత, ఆర్ ఎల్ స్టైన్ అభూత కల్పనలు, జే జే అబ్రం గ్రహాంతర శక్తులు, ఆర్ ఆర్ మార్టిన్ కాల్పనిక పీరియడ్ డ్రామాలు, ఒక్కోల్లది ఒక్కో శైలి. కానీ బాల్యం నుండి ఈ ప్రక్రియ వేరు చేయబడినపుడు వీళ్ళ కథా ప్రమాణాలు మారిపోతయి. అనూహ్యమైన మలుపో, ఊహించని పరిణామమో కథని ఎలివేట్ చేస్తుంది. చదువుతున్నప్పుడు కంచికి పోవాల్సిన కథనం కొండలు గుట్టలు ఎక్కుతుంటే మనసు ఉరకలు వేస్తది. అందుకే అరవై డెబ్బై ఏళ్ళు మీద పడ్డ  మనుషులు కూడా స్టార్ వార్స్, స్టార్ ట్రెక్, గేం ఆఫ్ త్రోన్స్ అని ఉరకలు పెడుతరు.

తెలుగు ఫాంటసీ ఫిక్షన్ ఇంకా గండర గండని దగ్గరనుండి బయటకు రాలేదు. గండర గండడు ఇంకా బాల మిత్ర, బాల జ్యోతుల్లోనే ఉండిపోయిండు. ఎదిగి పెద్దవాడై గ్రహాంతర వాసులతో స్నేహం చేసి, సూపర్ మాన్ తో యుద్ధం చేసి, కాల బిలాలలో పయనించి, కాలాంతర ప్రయాణాలు చేసే కలల ప్రపంచంలో ఇంకా విహరించలేదు. ఒక వేళ వాలినా దానికి దైవిక శక్తి అనో, దయ్యం అనో  అని పేరు పెట్టి కోడి రామ కృష్ణలు ఎలాగోలా కథని మళ్ళీ కంచికి పంపుతరు.

కలల్లో వినీలాకాశాల్లో విహరించి మేఘాల్లో తేలిపోయిన మనసులని కథల్లో, కళా రూపాల్లో మాత్రం నేల దాటనియ్యరు.

ప్రఖ్యాత అభూత కల్పనల సృష్టికర్త ఆర్ ఎల్ స్టైన్ అంటాడు, తన కథలో మూడే భాగాలు ఉంటాయని. ఆరంభం, కథనం, మలుపు. మరి ముగింపు? అని అడిగితె, మలుపు మలిచే కథనమే ముగింపు అంటాడు.

గొప్ప ఫాంటసీకి అర్ధవంతమైన ముగింపు ఇయ్యడం కోసం దాన్ని దైవిక శక్తి అనో, భూతమో ప్రేతమో అని నమ్మింప చేసే ప్రయత్నంలో కథ ఆత్మని కోల్పోతది. సెన్స్ ఆఫ్ క్లోసర్(Sense of closure) అంటున్నం దీన్ని. క్లోస్ చేయాలె ఎట్లనో అట్ల. మొదలు పెట్టిన ప్రతీ బ్రాకెట్ క్లోజ్ అయితేనే కోడింగ్ కంప్లీట్. కలకూ, కళకూ ఎం కోడింగ్ ఉంటది. తెల్లారి లేచినంక సగంలో ఆగిపోయిన కల మళ్ళీ రమ్మంటే వస్తదా? వస్తే? దీని గురించి నాలో ఒకడు అని సిద్ధార్థ్ సినిమా ఒకటి వచ్చింది ఈ కాన్సెప్ట్ మీద ఈ మధ్య. కల మళ్ళీ కొనసాగించ బడుతది పడుకున్నపుడల్లా. ఆలోచన ఎంత అద్భుతం? దేవుడూ దయ్యం ఎమీ లేదు. మనిషితో మనిషి పడే సంఘర్షణ. మనిషి లోపల జరిగే సంఘర్షణ.

వాస్తవిక సాంఘీక జీవనం నుండి వేరు పడిన పిల్లల కథలు అమాంతం పెద్దవాళ్ళ జీవితాల్లోకి వస్తే, ఆఫీసుల డైనోసారో డ్రాగనో కనిపిస్తే, డాల్ఫిన్లు తిమింగలాలు ఆకాశంలో ఎగురుతూ పొతే, భూమి మీద కాకుండా ప్లూటో మీద జీవం ఉంటే, పొలాల్ల మొక్కలు, పెంపుడు ప్రాణులూ మనతోని మాట్లాడుతే.. అంతూ పొంతూ లేని కల్పనా శక్తి. కోరికలు మాత్రమే గుర్రాలై ఎందుకెగరాలె? కలలు, కలాలు, కళలు గుర్రాలై ఎగిరితే తప్పేముంది?

నిత్యం మనలో మనకు ఎన్నో సంఘర్షణలు. సమాధానాలు వెతికే స్వభావం. అన్నీటికి సమాధానాలు కావాలె.

అన్నింటికీ అర్ధం పరమార్ధం ఉండాలంటాడు. కానీ గమ్యం వేటలో ప్రయాణం తాలూకు అనుభూతులని మూటలు కట్టుకోవడం మరిచిపోతుంటడు. గమ్యం చేరుకున్న మనిషి కథ బాగానే ఉంటది. ప్రయాణం కూడా బాగానే ఉంటది. చివరికి ఒక గమ్యం ఆశిస్తున్నాం కాబట్టి. గమ్యం చేరని మనిషి ప్రస్తానం గూడా బాగనే ఉంటది. దారి పొడుగుతా ఎందరో మనుషులు, ఎన్నో అనుభవాలు. ఎన్నో ముచ్చట్లు. ప్రతీ మలుపూ గొప్ప కథే. మనిషి నిత్యశోధకుడు. అమితంగ కుతూహలం ఉన్నవాడు. అంతిమ గమ్యం ఉన్నవానికి తెలుసు దిశానిర్దేశాకత్వాలు. వాడు వాని శోధన గమ్యాన్ని కలిపి  రాస్తడు. గమ్యం లేని వాడు శోధన మాత్రమె రాస్తడు.

గమ్యాల నిర్దేశికత్వం గురించి మాట్లాడుకోవాలె. ఎందరో నడిచిన దారుల్ల పుస్తక రూపం దాల్చిన గమ్యాలు దిశా నిర్దేశాకత్వాలు. ఇటు పోతే ఇది వస్తది. గమ్యం అంటే అది ఇది వరకే నడిచిన దారి, గమ్యం లేకపోవడం కొత్త దారులని వెతుక్కోవడం. సమాజం, నాగరికత ఇది వరకే నడిచిన దారులని చూపిస్తది. ఇందులో ఉపాధి, మనుగడలు కూడా ఉంటయి. ఇవన్నీ సామూహిక ధోరణి కిందనే చెందుతయి. కొత్తగ పుట్టిన వారసులకు పాత దారులని అన్వయిస్తయి. నా కొడుకు డాక్టర్, బిడ్డ ఇంజనీర్ కావాలని కోరుకుంటరు కానీ, మానవీయ సమాజపు ప్రాథమిక సూత్రానుసారం అన్వేషి కావాలని అనుకోరు. సూత్రాల ధిక్కరించి వెలుగు రవ్వలు పుడుతూనే ఉంటై. చదువు కొలమానం కాదన్న సాధారణ  కలాంలు, సగటు మనుషులతో చదువుకునే అర్హత సంపాదించలేని ఐన్స్టీన్ లూ పుడుతూనే ఉంటరు. ఇమిడి పోవాలనుకునే స్వభావాన్ని సామాజిక సాధారనీకతగ చెప్పవచ్చు. సమాజం అంగీకారం కోసమో, మనుగడ కోసమో అన్వేషి జాతి స్వతహాగా తనకు అబ్బిన స్వభావాన్ని రాజీ పడి ధిక్కార స్వరాన్ని కోల్పోతడు. ఇముడ్చుకోవడాన్ని  ఇష్ట పడతాడు. Low Profile స్వభావాన్ని ఆపాదించుకుంటడు. ఎదిగిన కొద్దీ ఎదగాల్సిన స్వరాన్ని, తపననీ, మనసునీ, అన్వేషణనీ కట్టడి చేస్తడు. ఎగరలేని మనసు కలల్లో ఎగిరిస్తుంది. కలల్లో ఆకాశాన్ని అందుకున్నవా ఎపుడన్నా? దానర్ధం నువ్వు ఎగరాల్సిన చోట ఎగరడం లేదని. ఎగరాల్సిన సమయం వచ్చిందని.

*

 

 

సావిత్రి- ఎప్పటికీ ఒక అద్భుతం!

 

– కొత్తింటి సునంద 

~

FullSizeRender (1)1996 సంవత్సరానికి గాను ఆంగ్ల సాహిత్యానికి అత్యున్నత పురస్కారం నోబెల్‌ బహుమతి పొందిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ రచయిత్రి టోని మారిసన్ను ఇంటర్వ్యూ చేసిన పత్రిక విలేఖరి ‘‘మీరు ఆంగ్ల భాషను ఇంత అందంగా  ఎలా రాయగలరు’’ అని అడిగాడట. దానికావిడ ఆంగ్ల భాషలోకేవం 26 అక్షరాలు  మాత్రమే ఉన్నాయి. ప్రపంచమంతటా వ్యాపించిన ఆంగ్లభాషను వాడే వ్యక్తులు  కోట్ల సంఖ్యలో ఉంటారు. వీరందరు వాడి వాడి ఆ అక్షరాలు  అరిగి పోయుంటాయి. మకిలి పట్టుంటాయి. వాటిని మర పాలిష్‌ చేసి మెరుగుపెట్టి వాడాల్సి ఉంటుంది. నేనదే చేస్తానుఅందట. మనకందుబాటులో వున్న దానికి మెరుగు పెట్టడమనే సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది. అది కళారంగంలో మరీ ముఖ్యం. ఉదాహరణకు సప్తస్వరాను లయబద్ధంగా  పలికించడమే సంగీతానికి ఆయువుపట్టు. మనకు వేలాది మంది గాయకులు , గాయనీమణులున్నారు.అందరూ  ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి  స్థాయిని చేరుకోలేకపోయారు. సినీ నటనారంగంలో అత్యున్నత స్థాయిని చేరుకొన్న నటి సావిత్రి ఆ కోవకు చెందిందే. కొన్ని తరాలపాటు దక్షిణభారత సినీ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాణి లాగ ఏలిన నటి సావిత్రి..  తమిళులు ఆవిణ్ణి నటిగర్‌తిలకం అని, కలైమామణి అని అభిమానంగా పిలుచుకొన్నారు.

నటనకు ఆంగికం, వాచికం, ఆహార్యం అతిముఖ్యమైన హంగు. తమకున్న శరీరాకృతిని పాత్రోచితంగా  మలచుకోడం, దానికనుగుణంగా  నడుచుకోడం, ఆయా సంఘటన ప్రకారం తమ గొంతును సరిచేసుకోడం, రకరకాల  మాడ్యులేషన్‌తో సంభాషణను పలికించడం, భావ ప్రకటనచేయడం. తగిన దుస్తులు  ధరించడం ఇవన్ని ముఖ్యం. హీరోయిన్‌ నడుమిలాగ ఉండాలి, శరీరం ఇంత పొడవుండాలి అని కొలతలతో కూడిన శరీరాకృతి కాదు సావిత్రిది. మొదట్లో వేసిన కొన్ని సినిమాలలో తప్ప ఆవిడ దాదాపు అన్ని సినిమాలో లావుగానే ఉంది. మూగమనసుసినిమాలో రెండు పుస్తకాలు  చేతపట్టుకొని కాలేజి విద్యార్థిగా  ఎంతబాగా చెలామణి అయ్యిందో కదా అని మెచ్చుకొన్నారు శేఖర్‌ కమ్ముల. అదే లావుపాటి శరీరంతో డాక్టర్  చక్రవర్తి సినిమాలో “నీవు లేక వీణ” పాటకు అభినయించే సన్నివేశంలో మెట్లమీద వాలి ఆమె ఒలక బోసినవయ్యారం, కళ్ళలో పలికించిన విరహం ప్రతి మగవాడి గుండెల్లో గుబులు  పుట్టించి ఉంటుంది. ఆడవారిలో అసూయ రేకెత్తించి ఉంటుంది. “కలసి ఉంటే కలదు సుఖం” సినిమాలో గంప నెత్తికెత్తుకొని “అద్దమంటి  మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకంటే ఉండేదేందిచెప్పయ్యా ” అనే పాటకామె నడుము ఊపుతూ, వయ్యారంగా  నడిచే సన్నివేశాన్ని మనం మరవగలమా. హంసలా నడచి వచ్చే చిట్టెమ్మో అని హీరోగారామెకు కితాబివ్వనే ఇస్తాడు. గుండమ్మ కథలో “కోలు కోలోయన్న”  పాటలో కూడ మేల్ మేలో యన్న మేలో పెద్దమ్మి చిలకలాకులికేను బాలా అని మురిసి పోతాడు హీరో. కులకడానికి ఆమెకు తన లావు అడ్డం కాలేదు. ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు తమకున్న వనరునే అద్భుతంగా  వాడుకోడమనేదానికి ఇదొకమంచి ఉదాహరణ. అసలాపాట ఆ సినిమాకే హైలైటు. సాదా సీదా గెటప్పు. అందులో సావిత్రిముద్దుగా, గోముగా, మూతితిప్పినట్లుగా  ఇంకెవరైనా తిప్పగలరా అనిపిస్తుంది. మూతితో పాటు కళ్లను చక్రాల్లాగ తిప్పడం ఆమెకొక్కదానికే సాధ్యమనిపిస్తుంది.

ఒక వయ్యారమనే కాదు. ఆ బొద్దు శరీరంతో చెంగు చెంగుమని ఎగరడం, చలాకీగా  గెంతులేయడం, చకచకమని నడవడం ఎన్ని సినిమాలలో చూడలేదు మనం. “మంచి మనసులు ”  సినిమాలో ఏమండోయ్‌ శ్రీవారు పాట ఆవిడ ఎంత హుషారుగా , ఎంత ఉల్లాసంగా ,ఉత్సాహంగా అభినయించింది. అప్పుడామె వయస్సు గాని, లావు గాని మనకు గుర్తుకొచ్చాయా అదీ సావిత్రి నటనా చాతుర్యం.  ఇక మాయా బజారు సినిమాలో మాయా శశిరేఖగా  ఆమె చేసిన అల్లరి  అంతా ఇంతా కాదు. ఆ నటన గురించి, ఆ వన్నె చిన్నెల  గురించి ఒక వ్యాసమేరాయొచ్చు. అహ నా పెళ్ళంట పాట కామె చేసిన నాట్యం గాని, ప్రదర్శించిన హావభావాలు  గాని నభూతో నభవిష్యతి. నటనలో విశ్వరూపమే చూపిందావిడ. ఆ వేగమూ, ఆ విరుపు, మెరుపు, ఆ హోయలు  చాలా ప్రత్యేకం. అవన్ని ఒకెత్తు అప్పటికప్పుడు (ఆ పాటంతా ఒకే టేకులో తీసారంట – అదొక రికార్డు) వయ్యారి ముద్దుగుమ్మ కాస్త ఆజానుబాహుడైన ఘటోత్కచుడిగా  బారమైన అడుగు వేయడం, చిందు వేయడం, హుందాగ మగసిరిని ఒలకబోయడం, అంతలోనె గొంతు సవరించుకోడం, తడబడడం, గబగబ సర్దుకోడం, అల్లరిగా  నవ్వడం ` ఎన్ని కళలు! పరకాయ ప్రవేశం చేయడమంటే ఇదేనేమో. ఎన్నేళ్ళయింది చూసి ఆ సీను ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంది. ఆ షూటింగు చూస్తూ నిల బడిన కళాకారులు, టెక్నీషియన్స్‌ అప్పుడు ఆమెకి  స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చారట.  అదండి సావిత్రి తడాఖా. అసలా సినిమా విజయానికి సావిత్రి,ఎస్వి రంగారావులే ముఖ్య కారకులని చాలామంది అభిప్రాయం.

ఈ సందర్భంగా  మిత్రులొకరు చెప్పిన విషయం గుర్తొస్తున్నది. నటనకు, డైలాగు డెలివరికి మారుపేరని ఖ్యాతి గాంచిన ఎస్వీఆర్‌ తనకు సావిత్రితో షూటింగుంది అన్న రోజు ఇంట్లో చిరాకు పడి చిటపటలాడే వాడట. సావిత్రి నటన పక్కన తన నటన ఎక్కడ తేలిపోతుందోననిభయపడిపోయేవాడట. బాగా రిహార్సల్స్‌ చేసిగాని షూటింగుకి వెళ్ళే వాడు కాడట. ఎన్ని సినిమాలలో వారిద్దరు తండ్రికూతుళ్ళుగా  పోటీపడి నటించారో!  ఆ కాంబినేషన్లో సినిమాలు  చూసిన మనమెంత అదృష్టవంతులం!  తెలుగు  సినీ చరిత్రలో 50, 60, దశాబ్దాన్ని  స్వర్ణయుగమని పిలుస్తారు. దానికిగాను ఈ ఇద్దరూ   చేసిన దోహదం అంతా ఇంతా కాదు.

mayabazar

నాదీ ఆడజన్మేలో సావిత్రి ధరించిన పాత్ర చాలా ఛాలెంజింగ్‌ పాత్ర. అందము, ఆకర్షణ లేని నల్లని  రూపుతో వున్న స్త్రీ. అంతేకాదు చదువు సంధ్య లేని నిరక్షరకుక్షి. ఎవరి ప్రేమకు నోచని అభాగ్యురాలు. అయినా అందరి ఆనందం కోసం తాపత్రయపడే ఉత్తమ ఇల్లాలు.  ఆపాత్రలో సావిత్రి జీవించింది. అటువంటి పాత్రనంగీకరించడానికెంతో ధైర్యము, ఆత్మస్థైర్యము కావాలి. ఒకపక్క అందానికి పేరుపడ్డ ఎన్టీఆర్‌ పక్కన అందవిహీనంగా  కనపడడం, ఇంకొక పక్క నటనలో మేరునగధీర సమానుడైన ఎస్వీఆర్‌తో పోటీపడి నటించడం ఒక్క సావిత్రికే చెల్లు. మనిషికి అందము, ఆకర్షణ చదువు సంధ్యలే కాదు మనసు, మమత ముఖ్యమని ఆ సినిమా సందేశం. కుటుంబానికి ఆధారభరితమైన ఇల్లాలికవేవీ లేకపోయినా ఫరవా లేదనే ఆ సందేశాన్ని నూటికి నూరుపాళ్ళు ప్రజ మనసులోకి సూటిగా  తీసుకొని వెళ్ళగలిగింది సావిత్రి నటన.

ఎన్టీ రామారావు పక్కన ఎన్నో సినిమాలలో నటించి విజయఢంకా మోగించిన సావిత్రి రక్తసంబంధం సినిమాలో అతడికి చెల్లెలిగా  నటించింది. చాలామంది ప్రేక్షకులు  మిమ్మలని  అన్నా చెల్లెళ్ళగా  మెచ్చరు. మీరాపాత్ర ఒప్పుకోవద్దన్నారట. కాని వారిద్దరూ కూడ పక్కాప్రొఫెషనల్స్‌. తమ నటనాశక్తి మీద అపారమైన నమ్మకమున్నవారు. ఆ పాత్రలో వారు జీవించారు. నిజమైన అన్నా చెల్లెళ్ళేమో అన్నంత సహజంగా  నటించారు.

సినిమాలో చేరాలని సావిత్రి మద్రాసు చేరినప్పుడు ఆమెకు 15 ఏళ్ళ వయసు. సంసారం సినిమాలో హీరోయిన్‌గా  తీసుకోవాలనుకొన్నారు. ఏఎన్నారందులో హీరో. అతడిని విపరీతంగా  అభిమానించి అతడిని చూడాలనే కోరికతో విజయవాడలోని ఒక థియేటర్‌కెళ్లి ఆ తోపులాటలో కిందపడిన ఆ అమ్మాయికి ఏకంగ అతడి పక్కన హీరోయిన్‌గా వేషమేయడమంటే బెదరిపోయింది. బెంబేలు  పడింది.  ఈ అమ్మాయి హీరోయిన్‌ వేషానికి తగదని ఏదో ఒక చిన్న వేషమిచ్చి పంపారట. అటువంటి సావిత్రి మా పక్కన సావిత్రి కథానాయికగా ఉంటేగానిమేము నటించము అని హీరోలూ,  ఆమె లేకపోతే మా పిక్చర్‌ ఆడదని నిర్మాతలు  ఆమె కోసం పడిగాపులు  పడే స్థితికి చేరింది సావిత్రి. అది ఓవర్‌నైటు జరగలేదు. సినీ పాఠశాలలో చేరి అంచెలుగా ఎదిగి మహోన్నత స్థానం చేరుకొన్నది. నటనలో ఎంత పరిణతి చెందిందంటే తానుఎవరి పక్కన హీరోయిన్‌గా  పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు  చెప్పే స్థాయికి! నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పాటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వర్రావు. ఇది సుమంగళి సినిమా తీసేటప్పుడు జరిగింది. సినిమా షూటింగ్లోనే నేరుగ తెలుపలేని పాత్ర మనోగతాన్ని, మానసిక సంఘర్షణని గోడమీద పడే నీడ ద్వారా చిత్రీకరిస్తే బాగుంటుందని దర్శకుడికి సూచించింది. సినిమా కళనంతగా జీర్ణించుకొందప్పటికి.

సుమంగళి సినిమాలో ఆవిడ ధరించిన పాత్ర వైవిధ్యభరితమైనది. చాలా క్లిష్టమైనది. ప్రేమ పెళ్ళికి దారి తీసింది. ఇక దాంపత్య జీవనానికి నాంది పలికే శోభనం జరగడానికి ముందు జరిగిన ప్రమాదంలో భర్తకు వంద్యత్వం సంప్రాప్తిస్తుంది. అతడికి ఆ విషయం తెలపకూడదనికట్టడి. ఒక వంక వయసులో ఉన్న తనలో చెలరేగే కోరిక ఉధృతిని, తాపాన్ని చల్లబరచుకోవాలి. ఇంకొక వంక తమకంతో తన దరికి చేరుతున్న తన ప్రియుడిని కంట్రోల్ చేయాలి. మరొక వంక తన మీద నిఘాపెట్టిన అత్తకు అనుమానం రాకుండ మానేజి చేయాలి. వీటన్నిటి మధ్యనలిగిపోయే ఒక అసహాయమైన స్త్రీగా  సావిత్రి నటించిన తీరు అనన్య సామాన్యము. సినిమా మొత్తం కేవలం  తన చూపుతోటే నడిపిందంటే అతిశయోక్తి కాదేమో. అమితాబ్‌ బచ్చన్‌ కోసమె పాత్రను సృష్టించడం, ఆ పాత్రలతో సినిమాలు  తీయడం మనకు తెలుసు . అప్పట్లోనేసావిత్రిని దృష్టిలో పెట్టుకొని పాత్రను సృష్టించడం, సినిమాలు  తీయడం జరిగి ఉంటుంది. సందేహం లేదు. సావిత్రి వంటి నటి మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా మరి.

మనం మొదట్లో చెప్పుకొన్నాం ఆహార్యం గురించి. ఒంపు సొంపు గురించి. సావిత్రికి ఒంపుసొంపు లేవు. కాని మనకా సంగతే గుర్తు రాదు. ఆమె చందమామ లాంటి మోమును చూస్తూ మైమరచిపోతాము. చాలా అరుదైన అందమైన మొఖం సావిత్రిది. అందమైన సరస్సులోవిచ్చిన కమలాలు  ఆమె కళ్ళు. స్వచ్ఛమైన తటాకంలో ప్రతిబింబం ప్రతిఫలించినట్లే సావిత్రి కళ్ళలో ప్రతిఫలించని భావం లేదు. కళ్ళే ఆమె ఆభరణాలు. . కళ్ళే ఆమె ఆయుధాలు. అవి చల్లని  వెన్నెల  కురిపించ గలవు. నిప్పులూ  కురిపించగవు. చిలిపి నవ్వు రువ్వగలవు.చిరాకునూ ప్రదర్శించగవు. సావిత్రి ఏనాడూ అసూయ, ద్వేషాలున్న పాత్ర ధరించలేదు. ఉంటే కష్టాలు  కన్నీళ్ళు ఉంటాయి. లేదా బలిదానాలూ , త్యాగాలుం టాయి. లేదా చిలిపితనం, హుషారు ఉంటాయి. వాటిని ప్రదర్శించడం ఆమెకు బాయే హాత్‌కి ఖేల్‌ హై.

devadasu

బరువైన పాత్రలని సావిత్రి ఎంత అద్వితీయంగ పోషించగల దంటే, అటువంటి పాత్రను పోషించడంలో ప్రఖ్యాతి గాంచిన హిందీతార మీనాకుమారి మద్రాసుకొచ్చినప్పుడల్లా సావిత్రి సినిమాలు  చూసి, ఈ పాత్రను నేను ఇంతబాగా చేయగలనా అని ప్రశ్నించుకొనేదట. బాధాతప్తస్త్రీ వేదనని సావిత్రి ప్రజెంట్‌ చేయడంలో ఒక వరవడినే ఆమె సృష్టించింది. అంతకు ముందు కడవలతో కన్నీళ్ళు కార్చడమే దుఃఖాన్ని ప్రదర్శించే విధానం.  తాను కన్నీళ్ళే కార్చకుండ మన గుండె  పిండేసే విధంగ నటించడం సావిత్రి వంతు. అటువంటి పాత్రలు  పోషించడందేవదాసుతోనే మొదలు . అప్పటికామె వయసు పదహారో పదిహేడో, సాహిత్యంతో పెద్దగ పరిచయం లేని బ్యాగ్రౌండు. నటనానుభవము అంతంత మాత్రమే. ముందా పాత్రకి భానుమతిని గాని జానకిని గాని తీసుకోవాలను కొన్నారట. అయినప్పటికి ఆ పాత్రలో ఆమె జీవించింది.దేవదాసంటే నాగేశ్వర్రావే, పార్వతంటే సావిత్రే.. వారి స్థానంలో మరొకరిని ఊహించుకోలేము అన్నంత గొప్పగ వారిద్దరు నటించారందులో. ఆ సినిమా రికార్డు బద్దలు  కొట్టింది. అజరామరంగా నిచిపోయింది. పెద్ద నటనానుభవం లేకపోయినప్పటికీ  అంత చిన్న వయసులో అంతగాఢమైన భావాలనేలా  పలికించ గలిగిందో ఆశ్చర్యం కలు గుతుంది. కొన్ని సన్నివేశాలలో కళ్ళల్లో శూన్యభావాన్ని ప్రతిఫలింప చేయగలగడం మనకు కన్పిస్తుంది. అదెంత కష్టమో కదా. అంతేకాదు తన గొంతులో, డైలాగు పలికిన తీరులో నిరాశను, బాధను, వేదాంత సరళిని పలికించినతీరు కూడ గొప్పగ ఉంటాయి. మొహము, హావభావాలు  ఒకరివి – గొంతు,  డైలాగు డెలివరి మరొకరివి ఐన నేటి యుగంలో అన్ని కళలను తనలో ఇముడ్చుకొన్న సావిత్రి వంటి నటిని మళ్ళీ  చూడగమా అనిపిస్తుంది. అప్పట్లో అందరూ  తమ డబ్బింగు తామేచెప్పుకొనేవారేననుకోండి. అందులో ప్రత్యేకంగా  చెప్పుకొనే వారిలో ఎస్వీఆర్‌, జగ్గయ్య, ఎన్టీఆర్‌, సావిత్రి ముఖ్యులు.

ఇందాక కన్నీళ్లు కార్చడం గురించి అనుకొన్నాము కదా. అందులో సావిత్రి ప్రతిభ గురించి ఒక కథనముంది. మాయాబజార్‌ సినిమాలో “నీకోసమె నే జీవించునది” పాట చిత్రీకరిస్తున్నారట. “అమ్మాయ్‌ నీవిప్పుడు కన్నీరు కార్చాలి గ్లిసరిన్‌ తీసుకో”మన్నారట దర్శకు కె.వి.రెడ్డి. దానికి సావిత్రి “కన్నీరు కార్చడానికి నాకు గ్లిసరిన్‌ అవసరం లేదు. చెప్పండి మీరే కంటిలో కార్చమంటే ఆ కంటిలోనే కారుస్తా కుడికన్నా, ఎడమ కన్నా, అంతే కాదు ఎన్ని చుక్కలు  కార్చమంటే అన్ని చుక్కలే కారుస్తా”నందట. దర్శకుడికి పంతం కలిగి ఛాలెంజ్‌ చేసాడట.అప్పటికే ఆ యూనిట్‌ వాళ్ళంతా అక్కడ చేరారట. ఎవరు నెగ్గుతారో చూద్దామని. అందరిలో ఉత్కంఠ.  ఏ కన్ను కెమెరావైపున కనిపిస్తూ వుందో ఆ కంటినుండి మాత్రమే ముచ్చటగ మూడంటే మూడు కన్నీటి చుక్కలు  రాల్చిందట సావిత్రి. అటువైపున్న కంట్లో ఒక్కటంటే ఒక్క చుక్కరాల్చలేదట. ఆ అద్భుతాన్ని చూసి అందరూ అవాక్కై ఉంటారు. కాదంటారా!

ఇటువంటి చోద్యాలు  సావిత్రి నట జీవితంలో మరెన్ని జరిగాయో మనకేం తొలుసు. నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు  పట్టించిందని తెలుసుకొన్నాం కద. సావిత్రి నటనా దురంధరతను గూర్చి ఏఎన్‌ ఆర్‌ మరొక సందర్భంలో ఇలా అన్నారు. సావిత్రి నటనఆర్భాటంతో కూడినది కాదు. బహు సున్నితంగా, సూచన ప్రాయంగా  ఉంటుంది. ఆంగ్లంలో” సటిలిటి” అంటారు. అంటే అతి సూక్ష్మమైన భావాను సైతం నటనలో ప్రతిఫలింప చేయటమన్నమాట. సుచిత్రాసేన్‌ కథానాయికగా  బెంగాలి భాషలో 1959లో “దీప్‌ జ్వలే జాయె” అనేసినిమా తీసారు. 1960లో దానినే సావిత్రితో “చివరికి మిగిలేది” అనే సినిమాగా  తీసారు. 1968లో వహీదా రెహమాన్‌ హీరోయిన్‌గ హిందీలో “ఖామోషి” తీసారు. ముగ్గురూ అగ్ర శ్రేణి నటీమణులు.  తమ హావభావాను అతి సున్నితంగా  డైలాగు అవసరం లేకుండచూపుతోనే తెలుపగల దిట్టలు.  అది చాలా బరువైన పాత్ర..  వారు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలరనే నమ్మకంతో ఆయా నిర్మాతలు , దర్శకులు  వారిని ఆ పాత్ర పోషించడానికి ఎన్నుకోవడం జరిగింది. ఎవరిమట్టుకు వాఋ అత్యద్భుతంగా  నటించారు.. ఎవరికి వారేగొప్ప వారు. అయినప్పటికీ సావిత్రి చూపించిన “సటిలిటి” నీ  ప్రత్యేకంగా చెప్పుకోవసిన అవసరముంది. ఆ పాత్ర ఒక నర్సుది. ఒకానొక రోగికి పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా  నియమించబడినది. ఆ రోగి మానసిక స్థితి దుర్భరంగా   ఉండటం వలన అతడితో ప్రేమగా  ఉండమని,కంటికి రెప్పలాగ కాపాడవసిన అవసరముందని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఆ నర్సు నిజంగానే ఆ రోగి ప్రేమలో పడిపోతుంది. అతడికి శుశ్రూష చేయడం కేవలం  తన విధి మాత్రమే అనుకోదు. అది తన భాగ్యమనుకొంటుంది. అందులో లీనమై తానెవరో ఏమిటో మరచిపోయేస్థితికి చేరుకొంటుంది. ఆ రహస్యాన్ని మదిలోనే దాచుకొని ఉంటుంది. ఆమె చేసిన సేవల వలన ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుండి డిస్చార్జికి సిద్ధపడతాడు. దీనికంతటికి కారకురాలైన నర్సును పిలిచి అభినందిస్తాడు డాక్టరు.

నిజమేమిటో తెలియని అతడు నీవు గొప్పగ నటించావు.నీది నిజమైన ప్రేమ అని నమ్మిన రోగి బాగుపడ్డాడు. అంతే చాలని మెచ్చుకుంటాడు. ఆ మాటలు  విన్న ఆ నర్సు దుఃఖంతో తల్లడిల్లిపోతుంది. గద్గద స్వరంతో సావిత్రి ఆ వేదనను అభివ్యక్తీకరించిన విధానం అనన్యసామాన్యం. కపటనాటకం ఆడడం ఎలా, నటన నా వల్ల  కాదు’ అనిరోదించే సన్నివేశం మనని కదిలించి వేస్తుంది. ఆ సినిమా మొత్తం తన భుజస్కందాల మీద మోసింది సావిత్రి.. ఆ సినిమా కమర్షియల్గా  విజయవంతమయ్యిందో లేదో కాని అదొక క్లాసిక్‌గా మిగిలిపోయింది. పెద్ద హీరోల తోనే కాదు అంతగా ప్రాబల్యం లేని వారితోకలసి  నటించడానికావిడ వెనకాడలేదు. తనమీద తనకు, నిర్మాతకు ఆవిడ మీద ఉన్న నమ్మకమటువంటిది.

kanyasulkam

మన తెలుగు సాహితీ సౌరభాలను దశదిశలా వెదచల్లిన వారిలో ముఖ్యులు  గురజాడ. ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైన వంద కావ్యాలో కన్యాశుల్కం ఒకటి .  వంద గొప్పస్త్రీ పాత్రలలో  మధురవాణి ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఆ పాత్రను పోషించడానికి సావిత్రి కాక మరి ఎవరు తూగగలరు. మధురవాణి ఒక నెరజాణ. తన ఆటపాటలతో మగవారి మనసు రంజింప చేయడమే కాకుండ తన కబ్జాలో చిక్కిన వారిని జారిపోనీకుండా  ఒడిసి పట్టుకొనిఉండే చాకచక్యం కలిగిన  జాణ. ఇతరుల  నొప్పింపక తానొవ్వక తిరిగగలిగిన చమత్కారి మధురవాణి. వృత్తికి సానే కాని ప్రవృత్తి హుందాతనం, దయ, అంతఃకరుణ కలిగిన స్త్రీ రత్నం. తన తెలివితేటల తో లుబ్దావధాన్లతో, రామప్పంతులు వగైరాతో మాట్లాడే సమయంలో ఆడే మాటలోఎకసెక్కం, వెటకారం నిండి ఉంటాయి. పెదవులు  నవ్వుతుంటాయి. నొసలు వెక్కిరిస్తుంటుంది. సావిత్రి బుగ్గనటుఇటు ఆడిస్తుంది. బుగ్గను నొక్కుకొంటుంది. కళ్ళను వంకరగా  పెట్టి ఓరచూపు చూస్తుంది. కళ్ళను చికిలిస్తుంది. మాటతూటాల నొదులు తుంది. మాటను విరుస్తుంది.దీర్ఘాలు తీస్తుంది. ఎదుటి వారి ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. తన మనసులోని మాట బయటపడనీకుండా  ఎదుటి వారిని మాయలో ఉంచడానికి వారిని ఆనందింప చేస్తుంది. విసవిస నడుస్తుంది. రుస రుస లాడుతుంది. చిరుకోపం నటిస్తుంది. వారిని మోహావేశంలో ఉంచడానికిఅగ్గిపుల్ల వెలిగిస్తుంది. అదే కరటకశాస్త్రి, అతడి శిష్యుడిని చూసినప్పుడు మాత్రం అవ్యాజానురాగాలు  కురిపిస్తుంది. వారిని చూసే చూపే వేరు. మిస్సమ్మ సినిమా రిలీజయ్యేసరికి సావిత్రి అంతగా పేరు ప్రఖ్యాతి గాంచలేదు. అసలాపాత్రకి ముందు భానుమతిని ఎన్నిక చేశారట.హాస్యపాత్రను చేయడంలో ఆవిడ అందెవేసిన చేయి. మిస్సమ్మ ఆద్యంతం హాస్యభరితమైన సినిమా. భానుమతి మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేకూర్చగల దని వారి నమ్మకం. కొన్ని కారణాల వల్ల భానుమతి తప్పుకుంది . అదే పాత్రను సావిత్రి అద్భుతంగా పోషించడమూ . ఆసినిమా విజయ దుందుభి మోగించడమూ మనకు తెలుసు. బరువైన పాత్రలే కాదు హాస్యభరిత పాత్రను కూడ పోషించగల దని రుజువు చేసుకుంది సావిత్రి .  విజయా సంస్థ సావిత్రిని, సావిత్రి విజయా సంస్థను వదిలి పెట్టలేదు. ఎస్వీ రంగారావు, సావిత్రి కాంబినేషను అప్పటినుండేమొదలైందనుకుంటా.

ఇక మిస్సమ్మ  పాత్రను గురించి చెప్పుకుందాం. సావిత్రి చూసే చూపు, పడే చిరాకు మనం మరచిపోలేము. ఎన్టీఆర్‌ను కూడా ఒక పట్టాన నమ్మదు. గమనిస్తూ ఉంటుంది. పెళ్లికాని అమ్మాయి తీసుకోవలసిన జాగ్రత్తలు  తీసుకొంటూ  ఉంటుంది. ఆ ఇద్దరు కలసి  పండించినహాస్యం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీకు గుర్తుండే ఉంటుంది. కాలికి తగిలిన దెబ్బ ఉత్తుత్తిదని కట్టుతీసి అటూ ఇటూ చకచక తిరుగుతున్న అతడి వెంటపడి తిరిగే సావిత్రి కళ్లలో సంభ్రమాశ్చ ర్యాలులు చూడాల్సిందే కాని వర్ణించలేం. అతడి మీద నమ్మకం, ఇష్టం కలిగిన తరువాత ఆభావాల ను అవ్యక్తంగా వ్యక్తీకరించిన తీరు భేషుగ్గా  ఉంటుంది. “ఏమిటో నీ మాయా ఓ చ్లని రాజా ” పాటను ఎంత మధురంగా , ఎంత సున్నితంగా  అభివ్యక్తీకరించిందో గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ జమున ఎన్టీఆర్ ని  ఎగరేసుకొని పోతుందో నని భయపడడం, జమునని కసురుకోడం,రుసరుసలాడడం ఎంత సహజంగా  ఉన్నాయో, అసూయతో ఏఎన్నార్ని ఎగదోసే తీరు, అతడికి పాట నేర్పే సన్నివేశం తెలుగు  సినిమా చరిత్రలో హాస్య సన్నివేశాలో మకుటాయమానం. అందులో నటించిన ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, సావిత్రి, రేలంగి, బాలకృష్ణ, ఆ సన్నివేశాన్ని కల్పించినదర్శకుడు అజరామరంగా  నిలిచి ఉంటారు. శ్రీమంతం సీనులో కూడ ఆ తతంగాన్నంత విధిలేక భరిస్తున్నట్లు సావిత్ర మొహంలో కనబరిచే హావభావాలు  చూడముచ్చటగా ఉంటాయి. చివర్లో అందరూ తనవారే అని తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరుస్తు అందరినీ  అక్కున చేర్చుకొన్నతీరు అత్యంత సహజంగా ఉంటుంది. సావిత్రి తరువాత వచ్చిన నటీమణులకు ఏవేవో బిరుదులిచ్చారు ప్రేక్షకులు. నటనకే భాష్యం చెప్పగలిగిన సావిత్రినేమని పిలవగలరు మహానటి అని కాకుండా !.

సామాన్యజనం నుండి మేధావుల  వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే. ప్రజాకవి గద్దర్‌ ఆమెను గురించి ఇలా అన్నారు. మనసున్న మారాణి సావిత్రి. హీరోలు  రాజ్యమేలు తున్న తరుణంలో వారికి ధీటుగ నిలచిన సావిత్రి హీరోకు హీరో. తారలు  రావచ్చు తారలు  పోవచ్చు కానీ కలకాలం నిలిచే ధృవతార సావిత్రి. “సాము నలుపుదాన సక్కని దాన సల్లంగ ఉండాలె  సెల్లె నీవు” అని పాట కూడ రాశారు.

ఆనాడే సినిమాకి లక్ష  రెమ్యునరేషన్‌ తీసుకొన్న సత్తా కలిగిన తార సావిత్రి.. సినిమా ప్రపంచంలో ఉన్న ముగ్గురు శిల్పుల్లో  సావిత్రి ఒకరన్నారట శ్రీశ్రీ.  1960లో ఆవిడ కథానాయికగా  నటించిన 21 సినిమాలు  రిలీజయ్యాయట. అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్టులే. ఆంధ్రయువతీ మండలి వారు ఆమెను ఏనుగు అంబారీ మీద ఊరేగించారట. ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అంబారీకి ఎదురేగారట.  సావిత్రి తన తరువాత వచ్చిన నటీమణుందరికీ  నటనలో మార్గదర్శకురాలు . దాదాపు అందరూ ఆమెలా నటించాలని కోరుకొన్నవారే. ఆమెను అనుకరించినవారే.

( డిశంబర్ 26 సావిత్రి వర్ధంతి సందర్భంగా ) 

“మాటల మడుగు”తో మెర్సీ మరో అడుగు..

 

-అరణ్య కృష్ణ

~

“మేఘాల మీదుగా భూమిపైకి చూడటం నేర్చుకున్నప్పుడే
ఇంద్రధనుస్సు ఆకారం పరిపూర్ణంగా కనబడేది
వర్షంలో తడుస్తున్న భూమిని
కళ్ళారా నింపుకోగలిగేది”
మెర్సీ సరిగానే చెప్పారు.  జీవితాన్ని ఓ కవి అలానే చూడాలి.
మెర్సీ మార్గరెట్! ఎంతో అందమైన ఇంగ్లీష్ పేరు.  “మార్గరెట్ కవిత్వం చదివారా?” అని ఎవరైనా ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్ధినడిగితే “ఓ! బ్రహ్మాండంగా!” అంటాడేమో.  కానీ మెర్సీ మార్గరెట్ పదహారణాల తెలుగమ్మాయి.  వర్తమాన సమాజ బీభత్సాన్ని లలితమైన పదాలతోనే కవిత్వంగా తూర్పారపట్టిన తెలుగమ్మాయి.  ఒక దళితురాలిగా, మైనారిటీగా, స్త్రీగా ఎంతటి వివక్షతను, అశాంతిని అనుభవించాలో అంతటినీ మంజూరు చేసిన వర్తమాన సమాజాన్ని ఒకసారి ఆర్ద్రంగా, మరోసారి కసిగా నిలదీసిన పదహారణాల తెలుగు కవి మెర్సీ.  ఆ మూడు రకాల అస్తిత్వ మీమాంస మెర్సీ కవిత్వం లో కనబడుతుంది.  ఆధునిక కవిత్వం అంటే ప్రధానంగా భావానికి, భావాల సంఘర్షణని వ్యక్తీకరించటానికే  అన్న విషయాన్ని మెర్సీ కవిత్వం మరోమారు నిరూపించింది. వాడ్రేవు చినవీరభద్రుడు, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్ లాంటి ముగ్గురు ప్రసిద్ధుల నుండి ముందుమాటల ద్వారా కితాబులందుకున్న మెర్సీ “మాటలమడుగు” నిజానికి కవిత్వ సెలయేటిలో కొత్తపాయ.
         కవిత్వం కాల్పనిక భావోద్రేకాలకు చెల్లుచీటీ చెప్పాలని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది.  కవిత్వంలో ఏదో ఒక సామాజికాంశ లేకుండా చదవటానికి ఏ పాఠకుడూ సిద్ధంగా లేడు.  సామాజికాంశ అంటే సామాజిక వాస్తవికతే.  వైయుక్తిక స్థాయిలో వ్యక్తీకరించినప్పటికీ సాటి మనుషులతో పంచుకోతగిన ఆవేశమే కవిత్వం కాగలదు. లేకుంటే అదేదో గందరగోళంగానే మిగిలిపోతుంది.  అయితే కేవలం వాస్తవాల కోసమే అయితే ఒక వార్తాపత్రిక చదువుకోవచ్చుగా మరి అన్న ప్రశ్న వస్తుంది.  ఒక అత్యాచార వార్త చదవటం వేరు, దానిమీద కవిత చదవటం వేరు.  నిర్భయ మీద ఎన్నో కవితలొచ్చాయి. తెలిసిన విషయమే కదా. మరెందుకు చదివాం?  కవిత్వం మనలోని మనతనానికి అప్పీల్ చేస్తుంది.  మనం మనుషులుగా హృదయంతో స్పందింపచేస్తుంది.  కనుకే కవిత్వం అంటే వాస్తవికమైన అనుభవాన్నో, పరిశీలననో భాషా మాద్యమం ద్వారా హృదయం నుండి హృదయానికి ప్రయాణింపచేసే కళాత్మక ప్రక్రియ.  సరిగా మెర్సీ ఇక్కడే సఫలమయ్యారు.
అవాస్తవాలకు, అతిశయాలకు పోకుండా సరళంగా వ్యక్తీకరించిన నిండుకుండ లాంటిది మెర్సీ కవిత.  కోపగించుకున్నా, వెటకారం చేసినా, ప్రతీకాత్మకంగా వ్యక్తీకరించినా, మార్మికంగా గుసగుసలాడినా….ఎలా చెప్పినా మొత్తం మెర్సీ కవిత్వం వేదనాపూర్వక అనుభూతి ప్రధానమైనదే.    స్త్రీ లైంగిక స్వేచ్చ వంటి స్త్రీవాద కవిత్వం ప్రతిపాదించిన లోతైన వివాదాంశాల జోలికి వెళ్ళకుండానే స్త్రీ శరీరం మీద అమలయ్యే పురుషాధిక్య భావజాలాన్ని కవిత్వంలో ఎండగట్టడంలో మెర్సీ సఫలమయ్యారు.  ఆమెను ప్రధానంగా స్త్రీవాద కవిగా గుర్తించటం కష్టం.  స్త్రీవాద చాయలు కొంతమేరకు కనబడ్డా ఆమె ప్రధాన దృక్పధం కానీ, లక్ష్యం కానీ స్త్రీవాదం కాదు.  దళితుల మీద వివక్ష, మైనారిటీల వ్యధలు, స్త్రీగా ఎదుర్కునే ఆటంకాలతో పాటు కాలుష్యం, ప్రపంచీకరణ, యాంత్రీకరణ, యాంత్రిక జీవితం, కన్స్యూమరిజం వంటి సమకాలీన అంశాల మీద కూడా ఆమె కవితలు రాసారు.  ముఖ్యంగా చుట్టూ ఆవరించివున్న నిరాశాజనక పరిస్తితులు సృష్ఠించే మనోవైకల్యాల మీద ఒక కవితాత్మక నిరసనగా మెర్సీ కవిత్వాన్ని చెప్పొచ్చు.
     ఆధునిక కవిత్వంలో ఎటువంటి సీరియస్నెస్ నేను కోరుకుంటానో అది మెర్సీ కవిత్వంలో కనబడింది.  అది వస్తువుకి, శిల్పానికి రెండింటికీ సంబంధించినదే.  మెర్సీ కవిత్వం అత్యున్నత స్థాయి కవిత్వమని ఆకాశానికెత్తను కానీ మంచి కవిత్వమని, మంచి అనుభూతి కలగచెయ్యగలదని మాత్రం భరోసా ఇవ్వగలను.  ప్రతి కవిత మీద ఆమె మంచి శ్రద్ధ పెట్టిన విషయం తెలుస్తుంది.  ప్రతి కవితకి ఒక ఎత్తుగడ, నడక, ముగింపుల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించారావిడ. అందుకే మంచి ప్రామిసింగ్ గా కనిపించారు ఆవిడ.
        మనుషుల్తో మాట్లాడటం విఫలమైనప్పుడలా కవి కవిత్వాన్ని ఆశ్రయించటం జరుగుతుంది.  దీన్నే మెర్సీ కవిత్వం బలపరుస్తుంది.  తన పరిశీలన, తన అనుభవం లోకి వచ్చిన ప్రతి అంశాన్ని ఆమె కవిత్వం చేసారు.  ఎంతటి కర్కశమైన వాస్తవాన్నైనా ఒక మార్దవంతో, ఆర్తితోనే వ్యక్తీకరించారు.  ఆర్తి లేని కవిత్వం పత్రికా సంపాదకీయమే అవుతుంది.  ఈమె కవిత్వం లో మాటలు, ఆలోచనలు, అక్షరాలు అన్న పదాలు ప్రధానంగా కనబడతాయి.  దాన్నిబట్టే చెప్పగలం ఆమె తన కవిత్వం ఆలోచనాస్ఫోరకంగా ఉండాలని బలంగా కాంక్షించారని.   “కొట్టివేతల నుండి కొత్తగా పుట్టుకురావాలి” అన్న వినిర్మాణ (డీకన్స్ట్రక్షన్) స్పృహతో మొదలై సంకలనం చివర్లో చోటు చేసుకొని అన్ లెర్నింగ్ కోసం తపించిన “మైనస్లతో మైత్రి”  వరకు  ఆమె కవిత్వం తన ప్రస్థానమేంటో స్పష్ఠంగా చెబుతుంది.
“ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి
మాటలకు మొలకల వేళ్ళుండేవి
పచ్చగా మొలకెత్తేందుకు అవి
సారవంతమైన నేలలు వెతికేవి” (మాటలమడుగు) తప్పిపోతున్న మనిషిని మాటల్లేనితనం లోనే పట్టుకోగలం కదా!
ప్రతి మనిషిలో ఒక ప్రశ్నలగది వుంటుంది.  అందులోకి ప్రవేశించటానికి అందరికీ భయమే ఆ గదిలో
“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు
చిక్కులు చిక్కులు గా వుండలు చుట్టి పడేసిన ప్రశ్నలు
మసకబారిన చిమ్నీల్లాంటి ప్రశ్నలు
శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న క్యాలెండర్ లాంటి ప్రశ్నలు” తాండవమాడే అంతరంగ ప్రశ్నలగదిలోకి వెళ్ళాలని చెబుతారు కవి (ఫ్రశ్నల గది) ఎందుకంటే ప్రశ్న అంతరాత్మ మాతృభాష కదా మరి.
వర్ణాల్లో అందాలు చూసే వాళ్ళ పట్ల గొప్ప నిరశన “చీకటిదీపం”లో కనబడుతుంది.
“వర్ణాల బేధం లేకుండా పూలన్నిటినీ హత్తుకునే
చీకటి
ఎంతటి సహృదయ
నిశ్శబ్దాన్ని గుండెల నిండా నింపుకోడానికొచ్చే వారిని
దరిచేర్చుకునే వైద్యురాలు”
“హృదయపు మెతుకు” ఈ సంకలనంలోని ఉత్తమకవితల్లో ఒకటి. స్థూలకాయురాలైన భార్య వంటలో ప్రేమని కాక ఏదో ఒక రకంగా ఎత్తిపొడవటానికి వంకల్ని వెతుక్కునే భర్తల వైఖరిపై నిప్పుల్లాంటి కన్నీళ్ళు విసురుతుందామె.
“”బరువెక్కిన కాళ్ళు కళ్ళు  నదులై ప్రవహించేదాక
అన్నంలా ఉడుకుతుందామే
……………………..
ట్రెడ్ మిల్ పై చిననాటి తప్పటడుగుల్ని జ్ఞాపకం చేసుకుంటూ
తననెవరైనా గంజిలా వార్చమని
ఉబ్బినట్లున్న శరీరావయవాలను నిమురుకుంటుందామె
……………………….
“ఈ మధ్య నీ ధ్యాసెటుంటుది?
అన్నం పలుకుపలుకుంది
పాతబియామే కదా ఇంత లావెందుకున్నయని?”
అతడు చిదిమిన అన్నం మెతుకులో
ఆమె హృదయం కూడా ఉందని
అతడు చూసుకునే లేదు”
మెర్సీ ఊహాశక్తికి తార్కానంగా నిలువగల “కాదంబరి” “తలాష్” “వెన్నెల స్నేహితా” వంటి కవితలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. చెట్టులో మనిషితనపు అన్వేషణని ప్రతిబింబించే ‘చిప్కో”, వదిలివెళ్ళిన స్నేహాత్మ కోసం రాసిన “తనతోనే నేను”, విభిన్న జ్ఞాపకాల మీద రాసిన “చీకటిదండెం”, కాలానుగత మార్పులకు సాక్షీభూతమైన “మైలురాయి”, మృత్యువు మనిషి జీవితంలోని వ్యర్ధత్వాన్ని నిరూపించటం మీద వేదాంతంగా రాసిన “ఇంతేనా మనిషంటే”, తండ్రుల నియంతృత్వాన్ని ప్రశ్నించమనే “ఇంటికిరాని వెన్నెల”, స్నేహితురాలి ఆత్మహత్య మీద “గాజుమనసు”, లక్షింపేట మీద రాసిన “ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు” వంటికవితలు కూడా చదవించే కవితలే.
53 కవితలతో అందమైన ముద్రణతో “మాటలమడుగు” రూపొందించారు. మనం చదువుకోవాల్సిన కవిత్వం రాసిన మెర్సీ మనం ఆహ్వానించతగ్గ కవి.
“అక్షరాలు గుండెను చీలుకొని
బయటికొచ్చి పసిపిల్లల్లా నవ్వుతాయి
వాటిని దోసిట్లోకి తీసుకొని
నేను ఏడ్చేప్పుడు
కన్నీళ్ళ లాలపోసుకొని
కాగితపు ఊయల్లో నిద్దరోతాయి”
(“మాటలమడుగు” కవితల సంకలనం. రచన మెర్సీ మార్గరెట్.  వెల రూ.100.  ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలు. హౌ. నం. 1-4-61, రంగ నగర్, ముషీరాబాద్, హైదరాబాద్-500090.)

అప్పటి దేవుడి రూపం!

 vinod

3

 

గత  వారం రెండవ భాగం 

 

మానవ సమాజానికి సంబంధించిన ఏ ప్రశ్నకయినా సమాధానం తెలుసుకోవడం కోసం సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఏది ఎప్పుడు ఎందుకు పుట్టిందో, ఎలా మారుతూ వస్తోందో అర్థం చేసుకోవాలి. సమాజంలో వస్తున్న మార్పులని వీలైనంత కచ్చితత్వంతో అర్థం చేసుకోలేక పొతే మనకి సమస్యలూ అర్థం కావు, వాటికి పరిష్కారాలూ బోధపడవు.

గత వారం మనం మానవ సమాజంఅభివృద్ధి క్రమాన్ని ఉదాహరణలతో, కొండ గుర్తులతో చూసాము. ఆ మొత్తం క్రమం లో మతం ఎప్పుడు పుట్టింది? మనుషుల సమాజం మారుతూ ఉంటే మతం లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి తెలిసిన మతాల కంటే పూర్వం ఎలాంటి మతాలు ఉండేవి? వాటి స్వరూపం ఎలా ఉండేది? వాటిలో దేవుడి రూపం ఎలా ఉండేది?

“మతము”, “దేవుడు” అనే భావన మనిషికి ఎప్పుడు కలిగింది? మతం పుట్టుక ఆటవిక యుగం మధ్య దశ లోనే (సు. 1,20,000 – 60,000 సం|| పూర్వం) జరిగి ఉంటుంది అని అంచనా వెయ్యవచ్చు. మతం యొక్క పుట్టుకకి ఆధారాలేమిటి? చనిపోయిన వారిని ఉద్దేశపూర్వకంగా భూమిలో సమాధి చెయ్యడం, ఆ చనిపోయిన వ్యక్తితో పాటు అతని వస్తువులని సమాధిలో ఉంచడాన్ని మత ఆచారంగా గుర్తించవచ్చు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సమాధులలో అత్యంత పురాతనమయినది Israel లోని Qafzeh గుహలలో దొరికింది. అది సుమారు లక్ష సంవత్సరాల క్రితంది. (లక్ష సంవత్సరాలు – Imagine that figure !!). అందులోని ఎముకలకి ఎరుపు రంగు పూసి ఉంది. ఆ అస్థిపంజరం చేతిలో అడివి పంది దవడ ఎముక పెట్టి ఉంది. ఆ ప్రదేశంలో దొరికిన సమాధులు అన్నిటిలో ఇలాగే ఉంది. ఇది యాదృచ్చికంగా జరిగే విషయం కాదు. ఇలా చెయ్యడం ఆ కాలం నాటి ఆచారాలలో ఒకటి అయ్యి ఉండాలి. చనిపోయిన వ్యక్తుల శరీరాలకి ఒక క్రమ పద్ధతిలో అంత్యక్రియలు చెయ్యడం ఈనాటికీ ముఖ్యమయిన మత ఆచారం. దాని బీజాలు ఆటవిక యుగం మధ్య దశలోనే ఉన్నాయి అన్నమాట.

ఆ నాటి మతాలు చాలా అస్పష్టమయినవి. ఆ మతాలలో ఒక నిర్దిష్టమయిన దేవుడు ఉండే అవకాశం లేదు. ఆహారం కోసం, రక్షణ కోసం, ఉనికి కోసం ప్రకృతి మీద ఆధారపడిన ఆటవిక మానవులకి ఆ ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడం అవసరం. అందుకోసం ప్రకృతి శక్తులకి పూజలు చేసారు. జంతువులని, చెట్లని ఆరాధించారు. తాము పూజిస్తున్న ప్రకృతి శక్తులకి ఒక మానవ రూపాన్ని ఆపాదించడం ఆనాటి మానవుల ఊహకి అందని విషయం.

ఇలా జంతువులకి, వస్తువులకి, దేవతలకి (మనుషులు కాని వాటికి) మనుషుల గుణాల్ని ఆపాదించడాన్ని “Anthropomorphism” అంటారు. ఉదాహరణకి “రాజుగారి ఏడుగురు కొడుకుల” కథలో చీమ మాట్లాడుతుంది. మాట్లాడటం అనేది మనుషుల లక్షణం. దానిని చీమకి ఆపాదించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గుండ్రంగా ఉండే సూర్యుడికి మనిషి ఆకారాన్ని ఇచ్చి, ఏడు గుర్రాల రధాన్ని ఆపాదించడం ఇంకొక ఉదాహరణ. కేవలం రూపాన్ని మాత్రమే కాదు. మానవ సహజమైన ఉద్వేగాలని కూడా దేవతలకి ఆపాదించడం జరుగుతుంది. “శివుడు ముక్కోపి”. కోపం మానవ లక్షణం. దాన్ని శివుడు అనే దేవునికి ఆపాదించారు. వస్తువులకి, జంతువులకి, ప్రకృతి శక్తులకి కూడా తమకి ఉన్నట్టుగానే భావోద్వేగాలు ఉంటాయనే భ్రమ చాలా సహజంగా కలుగుతుంది. కానీ అవే వస్తువులకి, జంతువులకి, ప్రకృతి శక్తులకి వాటి సహజ రూపాన్ని కాక మానవరూపాన్ని ఇవ్వడానికి కొంత ఊహాశక్తి అవసరం. ఆ ఊహ ఎవరైనా చెయ్యగలిగినా, దాన్ని వర్ణించి చెప్పాలంటే తగినంత భాష కావాలి, బొమ్మ గీసి చూపించడానికి చిత్ర కళ కావాలి, శిల్పం చెక్కి చూపించడానికి శిల్పకళ (చెక్కడానికి కావలిసిన పనిముట్లు కూడా) కావాలి. ఇవన్నీ అప్పటికి ఇంకా శైశవ దశలోనే (initial stages) ఉన్నాయి.

ఆటవిక మతాల స్వరూపం

లక్ష సంవత్సరాల క్రితం ఉన్న మతాలు కచ్చితంగా ఇవ్వాళ మనం చూస్తున్న మతాల లాగా ఉండి ఉండవు. వాటి స్వరూపం, స్వభావం చాలా వేరుగా ఉండి ఉండాలి. ఆనాటికి మనిషి దేవుడు అనే భావనని కల్పించుకోగలిగాడా? ఒకవేళ కల్పించుకుని ఉంటే ఆ దేవుని రూపం ఎలా ఉండేది?

ఆటవిక యుగం మధ్య దశలో మానవులు ఇంకా అరణ్యాలలో, కొండ గుహలలో నివసిస్తున్న వారే. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా వారికి తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో జనాభా ఉండే చిన్న చిన్న గుంపులుగా (Bands) జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఈ ఆచారాలు, నమ్మకాలు అన్నిటిని కలిపి ఆ గుంపు యొక్క మతం అనవచ్చు. భౌగోళికంగా (Geographically) దగ్గరి ప్రదేశాలలో ఉండే గుంపుల మతాలలో కొన్ని సారూప్యతలు (similarities) ఉండవచ్చు.

vinod1

ఆటవిక యుగం ఎగువ దశ నాటి మానవులు – ఊహా చిత్రం

ఇలా ఏ గుంపు మతం ఆ గుంపులోనే ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందివ్వబడుతూ సజీవంగా ఉంటుంది. భౌతిక పరిస్థితులలో (Physical conditions) చెప్పుకోదగిన మార్పులు రానంతవరకూ ఎన్ని వేల సంవత్సరాలయినా ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక case study కావాలి.

 Andamanese Case Study

 తూర్పు బంగాళాఖాతంలోని అండమాన్ దీవులలో ఉండే “అండమానీస్” ఆటవిక జాతులు మన అధ్యయనానికి చాలా చక్కటి Case Study. వాళ్ళు ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నారు.

కొన్ని వేల సంవత్సరాల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండటం వలన వారు ఇప్పటికీ సహజమయిన పరిణామ క్రమంలో, తమ స్వంత అనుభవాలతో, చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వస్తున్నారు.

vinod3

 

1789లో మొదటి సారి అండమాన్ లో బ్రిటీష్ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు, అండమాన్ దీవులలో మొత్తం నాలుగు ఆటవిక జాతులు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న 200 పైగా దీవులలో “గ్రేట్ అండమానీస్”, మధ్య భాగంలో “జరవ”, దక్షిణాన ఉన్న ద్వీపంలో “ఒంగీ”, పశ్చిమాన దూరంగా ఉన్న ద్వీపంలో “సెంటినిలీస్” ఉన్నారు.

ఈ నాలుగు జాతుల వారూ ఆటవిక యుగం ఎగువ దశలో ఉన్నారు. వేటాడి ఆహారాన్ని సంపాదిస్తారు. విల్లు, బాణాలని వాడతారు. ఆకులని, పీచుని గోచీలుగా కట్టుకుంటారు. ఆకులని నేల మీద పరుచుకుని నిద్రపోతారు. మొక్కలు పెంచడం తెలియదు. మట్టితో పాత్రలు చెయ్యడం తెలియదు. ఎర్రమట్టితో శరీరం మీద రంగు పూసుకోవడం మాత్రమే వారికి తెలిసిన కళ. పాటలు పాడగలరు, కథలు చెప్పగలరు. వాళ్ళలో కొన్ని గుంపులకి నిప్పు యొక్క ఉపయోగాలు తెలుసు కానీ నిప్పుని తయారు చెయ్యడం తెలియదు. పిడుగుల వల్ల తగలబడిన చెట్ల యొక్క బొగ్గుని నిప్పు ఆరకుండా చెట్టు తొర్రల్లో పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీటిని బట్టి అభివృద్ధి క్రమంలో మిగతా ప్రపంచం కంటే వారు ఎంత వెనకపడి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

జరవ ఆటవిక జాతి ప్రజలు

అండమాన్ జాతుల మతాల గురించి కొంత చెప్పుకోవాలి. వాళ్ళ నమ్మకం ప్రకారం మనుషులు, ఆత్మలు (Spirits) కలిసి జీవిస్తారు. ఆత్మలు మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాయి. చనిపోయిన వారికి రెండు దఫాలుగా అంత్యక్రియలు ఒక పధ్ధతి ప్రకారం జరగాలి. అలా జరిగితే అవి మంచి ఆత్మలయ్యి సహాయం చేస్తాయి. అలా జరగకపోతే చెడ్డ ఆత్మలయ్యి హాని చేస్తాయి. మనుషులకి వచ్చే రోగాలు ఆత్మల వల్ల వస్తాయి. చెట్లకి, జంతువులకి అన్నిటికీ ఆత్మలుంటాయి అని నమ్ముతారు.

ప్రతి గుంపులో ఒక మంత్రగాడు ఉంటాడు. అతనికి ప్రత్యేకంగా ఆత్మలతో సంభాషించే శక్తి ఉందని నమ్ముతారు. ఏదైనా అవసరం, ఆపద వచ్చినప్పుడు ఇతను ఆత్మలనీ, చనిపోయిన వ్యక్తులని ఆవాహన చేసి వారితో మాట్లాడతాడు. సాధారణంగా నిప్పుని ఆరిపోకుండా చూసే బాధ్యతా, మూలికలతో వైద్యం చేసే బాధ్యతా ఈ మంత్రగాడే నిర్వహిస్తాడు. సాధారణంగా గుంపు కి ఒకడే మంత్రగాడు ఉంటాడు. వాళ్ళ దేవుని గురించి కథలు, పాటలు, ఆచార పద్ధతులు ఈ మంత్రగాడే బట్టీ పడతాడు. అతని తరవాత మంత్రగాడయ్యే వ్యక్తికి ఇవన్నీ నేర్పిస్తాడు. ఇలా మంత్రగాడు కేంద్రంగా నడిచే మత పద్ధతిని “Shamanism” అంటారు. మతం యొక్క ప్రాచీన రూపాలలో ఇది ఒకటి. దాదాపు అన్ని ఆటవిక జాతులలో దీని ఛాయలు మనం చూడవచ్చు.

vinod2

గ్రేట్ అండమానీస్ జాతిలోనే ఒక గుంపు నమ్మకం ప్రకారం – “శాడిల్” కొండ మీద “పులుగా” అనే దేవుడు ఉంటాడు. “భూమ్మీద” జరిగేవన్నీ ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి. పులుగా కి ఆగ్రహం వచ్చే పని ఏదీ చెయ్యకూడదు. పులుగాకి ఒక కొడుకు, అనేక మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఆగ్రహమొస్తే తన కూతుర్లైన అడవి, సముద్రాలకి చెప్పి హాని చేయిస్తాడు. సూర్యుడు చంద్రుడికి భార్య. నక్షత్రాలు వాళ్ళ పిల్లలు. అండమానీస్ మతంలో వేరే “లోకం” అంటూ ఏమీ లేదు. వారి ఊహ ఇంకా అంత ఎదగలేదు.

వాళ్ళ నమ్మకాలు వాళ్ళ జీవితంలో ఎంతలా మమేకమయిపోయాయంటే వాళ్ళు తమ మతానికి ఒక పేరు కూడా పెట్టుకోలేదు. వాళ్లకి “మతం” అనే పదానికి అర్థం కూడా తెలియదు. వాళ్ళు నమ్ముతున్నవన్నీ నిజాలే అని అనుకుంటారు. వాళ్ళ నమ్మకాలకీ వాస్తవ ప్రపంచానికీ ఉన్న తేడా వాళ్లింకా గుర్తించలేదు.

ఒక బయట వ్యక్తిగా గమనిస్తే మనకి ఆ ఆటవికుల అమాయకత్వం (అజ్ఞానం) చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో వారికి ఏర్పడిన భ్రమలని నిజం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకాల్లోనే వాళ్ళు అడవి, సముద్రాల నుంచి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. అందుకని పులుగా కి కోపం తెప్పించకుండా ఉంటారు. “పులుగా ఆజ్ఞ ప్రకారమే భూమ్మీద అన్నీ జరుగుతాయి” అని నమ్ముతారు. వారికి తెలిసిన భూమి ఎంత? ఆ నాలుగు ద్వీపాలు, సముద్రమే వాళ్లకి తెలిసిన భూమి!! ఆటవికులుగా వారి అజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇంకోవైపు అభివృద్ధి క్రమంలో అండమాన్ ఆటవికుల కంటే మిగతా ప్రపంచం దాదాపు 60,000 సంవత్సరాల ఎగువన ఉంది. ఇన్ని వేల సంవత్సరాల అభివృద్ధి తరవాత కూడా నేటి మతాలు ప్రచారం చేసేవి ఇలాంటి నమ్మకాలనే ! “దేవుడు ఫలానా కొండ మీద ఉంటాడు”, “ఫలానా దేవుడి ఆజ్ఞ ప్రకారం భూమ్మీద అన్నీ జరుగుతాయి”, “ఆత్మలు, శక్తులు, వగైరాలు”, “దేవుడికి ఆగ్రహం తెప్పిస్తే కీడు జరుగుతుంది” ఇలాంటి నమ్మకాలు ఈనాటికీ ప్రజల్లో బలంగా ఉన్నాయి. మతపరంగా మానవ జాతి ఆటవికుల స్థాయి కంటే ఏం ఎదిగినట్టు? ఇది ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యాల్సిన విషయం.

అండమాన్ లోని నాలుగు జాతుల వారికీ నాలుగు విభిన్నమయిన భాషలున్నాయి. ఏ జాతి వారికీ ఇంకొక జాతి వారి భాష తెలియదు. “సెంటినిలీస్” గురించి సామాచారం లేదు కానీ మిగతా మూడు జాతులకీ వారి వారి సొంత ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి.

ఆ దీవులకి మానవులు షుమారు 70,000 సంవత్సరాల క్రితం చేరుకున్నారు అని అంచనా. మొదట్లో ఈ నాలుగు జాతులూ ఒకే మూల జాతి నుంచి వేరుపడి వేరు వేరు ప్రదేశాలలో స్థిరపడి ఉండవచ్చు. కాల క్రమేణా ఇతర జాతులతో సంబంధాలు తెగిపోయి దేనికవే ఒక కొత్త జాతి లాగా రూపు తీసుకుని ఉంటాయి. ప్రతి జాతికీ దాని స్వంత భాషలు అభివృద్ధి చెందాయి. అన్ని వేల సంవత్సరాలుగా దగ్గరి దగ్గరి ద్వీపాలలో ఉంటున్నా ఆ జాతుల మధ్య మళ్ళీ కనీస సంబంధాలు కూడా ఏర్పడలేదు. కారణం?

ఆటవికులకు వేటే జీవనాధారం. వాళ్లకి ఆహారాన్ని భద్రపరుచుకునే పద్ధతులు తెలియవు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు వేటాడి తెచ్చుకోవాల్సిందే. వాళ్లకి నివసించడానికి ఇళ్ళు కూడా ఉండవు, వేటలో జరిగే జన నష్టం, ఎండలు, వానలు, రోగాల వల్ల కలిగే ప్రాణ నష్టాలని తట్టుకుంటూ జనాభాని కాపాడుకోవడానికి నిరంతరం ప్రకృతితో పోరాడాల్సి వస్తుంది.

మనుషులు ఆహారం కోసం వేట మీద ఆధారపడకుండా స్వంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని (వ్యవసాయం ద్వారా, జంతువులని మచ్చిక చేసుకోవడం ద్వారా), దాన్ని నిలవ చేసుకునే పరిజ్ఞానం సంపాదించుకున్నాక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆహారం పుష్కలంగా దొరుకుతుంటే జనాభా వృద్ధి అవుతుంది, పెరుగుతున్న జనాభా కోసం ఎక్కువ ప్రదేశం కావాలి. బయటి ప్రదేశాలకి విస్తరించాల్సిన అవసరం వస్తుంది. ఈ విస్తరణ క్రమంలో కొత్త జాతులతో సంబంధాలు ఏర్పడతాయి.

vinod4

జరవ ఆటవిక జాతి ప్రజలు

అండమాన్ దీవులలో దట్టమయిన అడవులు ఉన్నాయి. అక్కడ మచ్చిక చేసుకోగల జంతువులు పెద్దగా లేవు. పంటలు పండించేందుకు అనువైన భూమి కూడా పెద్దగా లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే అభివృద్ధికి అవసరమయిన భౌతిక పరిస్థితులు (physical conditions) అక్కడ లేవు. ఇన్ని ప్రతిబంధకాల వల్ల ఆ జాతుల వాళ్ళు ఇంకా ప్రకృతితో పోరాడుతూ ఆటవిక యుగంలోనే ఉండిపోయారు. వారి జనాభా కూడా ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉండింది. కాబట్టి అక్కడి జాతులకి వాళ్ళ ప్రాంతాలు దాటి బయట ప్రదేశాలకి విస్తరించాల్సిన అవకాశం కలగలేదు అని చెప్పవచ్చు. అందువల్ల ఆ నాలుగు జాతులు ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండానే జీవిస్తున్నాయి.

ఏవైనా తాత్కాలిక అవసరాల కోసం సంబంధాలు ఏర్పడినా భాషలు వేరు వేరుగా ఉండటం వలన అవి ఎక్కువ కాలం నిలబడవు. భాష ఇంకొక ప్రధాన ప్రతిబంధకం. సంబంధాలు ఏర్పడలేదు కాబట్టి ఒక జాతి యొక్క మతం ఇంకొక జాతిలోకి ప్రవేశించే అవకాశం లేదు. ఇలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఏ జాతి మతం ఆ జాతికే పరిమితమయిపోయింది. అలాగే ఉండనిస్తే ఇంకా అనేక వేల సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది.

అండమాన్ దీవులలోనే “జంగిల్” అనే జాతి ఆటవికులు కూడా ఉండేవారు. వారికి కూడా ప్రత్యేకమయిన భాష, మతము, దైవం ఉండేవి. 1920 నాటికి జంగిల్ జాతి పూర్తిగా అంతరించిపోయింది. వారితో పాటే వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు కూడా అంతరించిపోయాడు.

Andamanese Case study ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. మతం, దేవుడు అనే భావనలు మనుషులు ప్రకృతి ని అర్థం చేసుకునే క్రమంలో మనుషులు కల్పించుకున్న భావనలు. వాటి పెరుగుదల, తరుగుదల, వాటిలో వస్తున్న మార్పులూ, అన్నీ మాన సమాజంలోని భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి.

వచ్చే వారం వ్యాసంలో మతము, దేవుడు అనే భావనల అభివృద్ధి మీద ఎలాంటి భౌతిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది, వాటి ప్రభావం వల్ల మతం లో వచ్చే మార్పులు ఏమిటి అనేవి చర్చిద్దాం.

*

   ఓరి బ్రహ్మ దేవుడా..!

 

-బమ్మిడి జగదీశ్వర రావు

~    

bammidi

ఓరి బెమ్మ దేవుడా..!

నీకు రిమ్మ గాని లెగిసిందేట్రా.. యేట్రా.. ఆరాతేట్రా.. యే మొకం పెట్టుకొని రాసినావురా.. సేతికొచ్చింది గాని రాసేనావా యేటి? బెమ్మరాత యెవుడుకీ అర్థం కాదంతారు.. యిదేనేటి? యిలగేనేటి? రాత నీదైనా నుదుల్లు మావి గావేటి? యిష్టం వొచ్చినట్టు యెలాక్కలగ రాసీస్తే పడతామనుకుంతన్నావేటి? నువ్వు యిలాపింటోడివి కాబట్టే పూజకి నోసకుండ అయిపోనావు, సాల్దా? మనిసి పుట్టుక పుట్టు తెలుస్తాది.. కలవపువ్వు మీద సరస్పతీదేవి పక్కన పరాసికాలు ఆడుతూ కూకోడం కాదు, ఈ మట్టీమీదకి రా.. నువ్వు బగమంతుడివైనా బెమ్మదేవుడువైనా నువ్వీ మట్టీల మట్టీ కాకపోతే అడుగు.. నువ్వు యెలాగ అవుతారం సాలిస్తావో నీక్కూడా తెల్దు.. నిన్ను పుట్టించినోడికి కూడా తెల్దు..

అసలు నాకొక అగుమానం.. నీకు గాని పవర్లు పోయినాయేటో? నువ్వు రాసినట్టుగా యేది జరగడం లేదు.. అంతా తలా తోకా లేకండా జరగతంది.. నువ్వు తలకిందులుగా రాస్తావు గాని తలా తోకా లేకండా రాయవు. మరి యిదేటిది?

సావుపుట్టుకలు నీ సేతిలో వుంతాయంతారు. అది అబద్దము కాదేటి? యిప్పుడు నొప్పులొచ్చినప్పుడు యెవులు కంతన్నారు? యెక్కడ కంతన్నారు? మంచిరోజు సూసి.. మూర్తాలు తీసి.. యెలితే మనకు యెప్పుడు కావాలంతే అప్పుడు డాకటేరుకి యీలయినప్పుడు సిజేరియను సేసి పిల్లలని కోసి తీస్తన్నారు. కుట్లేస్తన్నారు. నువ్వేటి సేస్తన్నావు? నువ్వేటి సూస్తన్నావు? నీ నయినాలు తీసి యే గైనాన దోపుకున్నావు సామీ..

పుట్టుక సరే, సావో? నీ రాత సంతకెల్ల.. నువ్విలాటి సావులు మునుపు యెప్పుడైనా సూసినావా రాసినావా? నీకు నాలుగు జతల నయనాలున్నాయి.. యేల? కళ్ళు పెద్దవి.. సూపు మద్దిము అన్నట్టుగుంది నీయవ్వారం.. యిలగ అంతన్నానని యేటి అనుకోకు.. నీ రాత.. అదే మా తలరాత యేమి బాగోలేదు.. తిన్నగ నేదు.. ముప్పైమూడు వొంకర్లు అరవైయ్యారు సిత్రాలు తిరిగున్నాది..

ఆవుసు తక్కవ పుట్టక పుడితే యే పామో  గీమో పొడిసీసిందంటే కరమ్ము కాలిపోయింది అనుకోవచ్చును.. యిదేటిది యెలకలు కరిసీసి ముక్కలుతీసీసి పిల్లడు సచ్చిపోడమేటి? అదీ ఆస్పెట్లిలోట? పురిటికందుకీ గాచ్చారమేటి? యిది నరుడు రాసిన రాతా? నారాయుడు రాసిన రాతా? అసలిది రాతేనా?

అర్రే.. అయిదరాబాదు నీలోపర్రు ఆస్పెట్టిల్ల పంకాలు పడిపోయి పసిపిల్లలు సచ్చీజావులై పొడమేటి? సిమెంటు పెచ్చులు ముక్కముక్కలు వడగళ్ళ వానలాగా రాలడమేటి? ఏటీ యిడ్డూరం? ఆస్పెట్టిల్లు పేనాలు పొయ్యడాకో తియ్యడాకో దేనికో తెల్డంనేదు..!

మా కాలంల అడివిలోకి యెల్తే పులో బుట్రో వొచ్చి దాని బయ్యానికో గియ్యానికో గాండ్రమనుకొని మీద పడిపోయి సట్టలు సీరీసీది.. మరి యిదేటిది? యిచిత్రం కాదా.. యీదిలోకి యెల్తే పిల్లల్ని కుక్కలు సట్టలు సట్టలు సీరీడమేటో సంపీడమేటో యేటి తెల్డం నేదు..!

ఓరే.. యీలమ్మ కడుపు కాల.. యీల అత్తోరింట్ల పీనుగెల్ల.. యెక్కడికక్కడ కాలవలు తవ్వీసి ముయ్యకుండ వదిలిస్తే యేటవుతాది? యెనకటి కుల్లు కాలవల పడ్డ పిల్లాడు దొరకనేదు.. యింతల పిల్ల పడిపే.. వారం పోద్దోయికి దొరికింది.. సక్కన బడికెల్లి వొస్తున్న పిల్ల.. కాలవలన్నీ ములిగీ తేలీ తిరిగెల్లి సంద్రంల కలిసి కడకి పీనుగయి యింటికొచ్చింది..

అదేమి వూరు.. గేపకం నేదు, పేపర్లల్ల యేసినారు.. మా మనవడే సదివినాడు.. పిసరంత వోర్త.. పొటోవు యేసినారు.. ఊష్టమొచ్చి మంచాన పడితే బెల్లంకి సీమలు పట్టినట్టు మనిసికి సీమలు పట్టేనాయి.. ఒళ్ళు వొలుసుకు తినేనాయి.. సచ్చిపే.. ఊరిడి కాదు, వోడ వోర్త కదా.. అందరం మరిసేపోనాం..

సీమలు సరే, మరి దోమలో? కుడితే జొరాలు.. జబ్బులు.. బొంగో డెoగో.. కుడితే చావు.. ముడితే చావు.. అదేమి ప్లూ అనీసి బయపెడతన్నారు గానీ యిస జొరాలకి యేలమంది సప్పుడు సెయ్యకండా సచ్చిపోతన్నారు, తండాల్లో తట్టుకోలేక సచ్చిపోతన్నారు. గూడేల్లో గుట్టు సప్పుడు కాకండా సచ్చిపోతన్నారు. యిల్లిల్లూ పీనుగుల పెంటలే..

కలికాలం కాపోతే.. గురువే.. గురువమ్మే.. తల్లి తరవాత తల్లి.. దైవం తరవాత దైవం.. పెళ్ళంతో సాలలేక పేడకుప్పకి తన్నినట్టు పిల్లలకి తన్నీడిమేటో.. కొట్టి బెత్తంతో బాది సంపీడిమేటో.. పిల్లలు బడికెలతన్నారో కబేలాలకి యెలతన్నారో తెల్డం నేదు.. అదికాదు.. పిచ్చికి పిల్లంత సిన్న పిల్లమీద యెనుబోతు లాగా మేస్టు కన్నెయ్యిడమేటమ్మా.. కవుకులు యెట్టడమేటమ్మా.. కామంకి కల్లు నేవంతారు యిదేగావల్ల..?

యిక్కడ అమ్మా అయ్యిలకి కడుపులోటుoడగాన బడిలేసీయాల. పుట్టగాన బడిలేసీయాల. బొడ్డుతాడు కొయ్యక ముందే బడిలేసీయాల. కూసోడం నిల్సోడం రాకముందే బడిలేసీయాల. అడుగులెయ్యడం రాకముందే ఆడీయాల. మాటలాడడం రాకముందే పాటాలు నేర్సీయాల. యిలాటి అమ్మా అయ్యిలని యే బడిలెయ్యాలో? సదువు యాపారమయ్యాక కనికట్టు సేసినట్టు కనగాన బడిల పడీయాల. ఒడిల పడీసినట్టు కాదు. డబ్బుకు పడుసుకున్నోలు పిల్లల్ని గాలికిదిగో యిలగే వొదిలేసి పొతే.. లిప్టుల యిరకన తలలు రాలిపోవా? ఆల యాపారాలు దిబ్బయిపోను..

ఎక్కడా అలగే వుంది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు అంతారు.. పడ్డాయి కళ్ళు.. వొకరివికావు.. నలుగురివి.. పదమూడేళ్ళ పిల్లని సిటీ రోడ్డుల్లంట తిప్పుకుంటా సెరుసుకుంటా తిరిగినారట.. టీవీలల్ల సూపించినారు గదేటి? పోలీసు గండలు పొట్టలు పెంచుకోని యే మంత్రి యింటికాడ డూటీలు సేత్తన్నారో.. యెవులి ముడ్డి నాకతన్నారో.. అయినా ఆలేటి యిదమూ పదమూ వున్నోలా? లాకప్పుల్లోట వున్నోలిని సేరిసిన గనులేనా? మరేటే?

అందరు అలగే వున్నారు. కత్తి పదునుగుందని పీక కోసుకుంతామా? మన రత్తం.. మన కండ.. కండని కొండ సెయ్యల్సింది పోయి.. బతుకు కష్టముగుందని నూతిల తోసి పిల్లల్ని కాసిన అమ్మానాయినే సంపీడమేటో.. యెన్న ముద్ద లేదని యిసపు ముద్ద యెట్టి సంపీడమేటో.. యీల పిల్లల మీద యీలకి అక్కు వుంతాది నిజిమే, సంపీ అక్కు అక్కేనా? అన్నిం పున్నిం యెరగని యీ పిల్లలకేటమ్మా తల్లీ దండ్రీ ముచ్చు దేవతలైపోడమేటి?

ఏటిది? ఆపమంటే ఆపలేదని పోలీసోడు లాటీ యిసరడమెంత? బండి మీద పిల్లలు బొమ్మల్ల పడడమెంత? బుర్ర నేలకి గుద్దడమెంత? గుండె ఆగిపోవడమెంత?

రొట్టి గొంతుల అడ్డంపడి వొకలు.. యిడ్లీ ముక్క యిరుక్కొని వొకలు.. నీళ్ళ టేంకులపడి మరొకలు.. వుయ్యాట్ల నైలాను సీర సుట్టుకొని యింకొకలు.. ఆకులు రాలినట్టు రాలిపోతన్నారు.. పచ్చాకప్పుడే రాలిపోతన్నారు. నాలాటి పండుటాకుని తీసికేలిపోతే యెవులు వద్దంతన్నారు?

ఆకలికి సచ్చిపోతన్నారు. అన్నానికి సచ్చిపోతన్నారు. రోగాలకి సచ్చిపోతన్నారు. మందులకి సచ్చిపోతన్నారు. వయిద్దిం అందక సచ్చిపోతన్నారు.

సచ్చిందాక సావులు తప్ప బతుకు సూడనా? నా కళ్ళు గుడ్డయిపోయినా బాగున్ను.. నా ఆవుసు తీసుకో.. పిల్లలకి పొయ్యి దేవుడా..

దేవుడా.. నువ్వు అమురుతం తాగు. మాకు నీల్లియ్యి.. అన్నమియ్యి.. ఆవుసియ్యి.. మొగ్గలోన తెమ్పీకు.. మొగ్గలీడిన దాక వుంచు.. పువ్వులు పూసిన దాక వుంచు.. రేకులురాలినట్టు మీము రాలిపోతాము గానీ నీలాగ వుండిపోయి వుట్టిగట్టుకు వూరేగాలని మాకెవరికీ లేదు..

యిది నీ రాత కాదు, నువ్వు రాసింది కాదు, నీకు పెతినిదిగా పెట్టుకున్నాము గాదా.. ఆగండలు సేసిందిది.. మా నీడర్లనంతే వొప్పుతారా? జైల్లెట్టించీరా? దేవుడా.. నీవంతే మూగోడివి! మాగోడిది అని మొరెట్టుకున్నా నీకే! మొట్లెట్టుకున్నా నీకే! నువ్వంతే పడతావు.. అందుకే నీ మీద పడ్డాను.. వొక్క మాట.. పిల్లలకి యీలు కాని రాజ్యం పిశాచాలకి నెలవంతారు.. మమ్మల్ని యేలతున్న పిశాచాల పీక నువ్వయినా నొక్కవా..?

బెమ్మ దేవుడా! నీ రాత బాగుండాల. మాబతుకు బాగుంటాది. రూళ్ళ బుక్కు తెచ్చి వొరవడి రాస్తావో.. యేటి సేస్తావో.. నీ రాత కుదురుండాల. మా జీవితాలు కుదురుండాల. పిల్లల్లోన దాగున్న బగమంతుడూ బాగుండాల..

యింతే సంగతులు.. సిత్తగించవలెను..

యిట్లు

మీ దాసాను దాసురాలు

కలలో మనుషులు

 

-అల్లం వంశీ

~

 

allam-vamsi“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”  ఆరో తరగతి చదివే కొడుక్కు అన్నం తినిపించుకుంట అన్నడు రాజన్న..

ఏంది బాపూ, ఎప్పుడేదడిగిన గిట్లనే అంటవ్..!! మూతి చిన్నగ చేస్కోని అన్నడు సతీషు..

నాకు తెలుస్తె చెప్పనారా? నిజంగనే నాకెర్కలేదు నాయినా..

ఏ పో బాపూ.. ఊకె గిట్లనే అంటవ్.. ఇంకోసారి నిన్నేదడగద్దు..

అరే.. అన్నీటికి గట్ల అలుగుతె ఎట్లరా??  ఇంగో ఈ బుక్క తిను.. బడికి ఆలిశమైతాంది, మళ్ల బస్సెళ్లిపోతది..

సతీష్ బుక్క నోట్ల పెట్టుకోకుండ “వద్దన్నట్టు” తలకాయి అడ్డం తిప్పిండు..

రాజన్న “ఇగ ఏదన్నొకటి చెప్పకపోతె వాడు తిండి తినడని” తనకు తోచిందేదో చెప్తాండు-

గాందీతాత అంటె…. గాంధీతాత అప్పట్ల, ఎనుకట ఉండేటోడు.. అప్పటికింక మీం పుట్టలే కావచ్చు!

ఇగో ఈ బుక్క తిను… చెప్తానగారా.. తినుకుంట ఇను.. ఇగో.. ఆ.. ఆ… అని సతీషు నోట్లోబుక్కపెట్టి-

అప్పట్ల మనకాడ తెల్లోల్లుంటుండేనట..

తెల్లోల్లంటే?

తెల్లోలంటె తెల్లోల్లేరా.. గీ.. మనా… గీళ్లను సూళ్ళేదా.. టీవీ ల అప్పుడప్పుడత్తరు సూశినవా?? గిట్ల ఇంగిలీషుల మాట్లాడుతరు సూడు.. గాళ్లు.. ఇంగో.. బుక్క వెట్టుకో..

ఆ..

రాజన్న ఇంకో బుక్క వెట్టి-

ఆ.. ఆళ్లున్నప్పుడు మరి ఈనె మనకు మంత్రో.. మరోటో ఉంటుండే గావచ్చురా..

ఎవలు.. గాంధితాతా?

ఆ.. ప్రెదాన మంత్రో.. ముక్యమంత్రో… మొత్తానికైతే ఏదో ఓటి ఉంటుండెనట…

ఆ..

అప్పుడు సొతత్రం అదీ ఇదని పెద్ద లొల్లుంటుండెనట.. ఇంగో బుక్కవెట్టుకో..

సొతంత్రం అంటే??

సొంతంత్రం అంటె…

సొతంత్రం అంటే సొతంత్రమే ఇగ.. మొన్నటిదాంక తెలంగాణ లడాయి లేకుండెనా?

ఆ..

అట్లనే అప్పుడు దేశం కోసం సొతంత్రం లడాయుండెనన్నట్టు.. ఇoగో ఈంత బుక్క వెట్టుకో…

ఆ.. లడాయైతుంటె??

అయినా, అయన్ని మనకెట్ల తెలుత్తయిరా.. ఇప్పటివేరం అప్పుడేమన్న పేపర్లా? టీవీలా?? అసలప్పుడు మనూరు మొత్తం కలిపి రెండిండ్లే ఎరికేనా??

మీ చిన్నప్పుడు టీవీల్లెవ్వా బాపూ??

టీవీలా?? టీవీలు కాదు నాయినా.. మాకసలు సైకిలంటెనే ఎర్కలేకుండే… అప్పుడు గియన్నెక్కడియిరా…..  అనుకుంట ఇంకో బుక్క పెట్టబోతే సతీష్ “కడుపు నిండిందన్నట్టు” అంగీలేపి బొత్త సూయించిండు… మిగిలిన రెండు బుక్కలూ రాజన్న నోట్లేసుకోని ఖాళీ కంచం బాయికాడ బోర్లేశిండు…

ఇంతలనే సతీషు జబ్బకు సంచేసుకోని బడికి తయారైండు… వాళ్లమ్మ పాత స్ప్రైట్ సీసను మంచిగ కడిగి నీళ్లు పోశిచ్చింది.. ఆమెకు టాటా చెప్పి తండ్రికొడుకులిద్దరు సైకిల్ మీద మొండయ్య హోటల్ కాడికి బయలెల్లిన్లు..

తొవ్వపొంటి రికామనేదే లేకుంట కొన్ని వందల ప్రశ్నలు అడుగుతనే ఉన్నడు సతీషు..

హోటలుకాడికి పొయ్యేపోవుడుతోనే “పల్లె వెలుగు” బస్సు రానే వచ్చింది…  అది మండల్ హెడ్ క్వార్టరుకు పొయ్యే బస్సు.. ఇక్కడికి పది కిలో మీటర్లు దూరం.. సతీష్ తోని పాటే ఇంకో నలుగురైదుగురు పిల్లలు బస్సెక్కిన్లు….

వాళ్లందరు సదివేది ఒక్క బల్లెనే.. సర్కార్ బడి.. ఆ హెడ్ క్వార్టర్లనే ఉంటదది..  వీళ్ల లెక్కనే చుట్టుపక్కల ఉన్న ఓ పది పన్నెండు ఊళ్లకేంచి చానమంది పిల్లలు ఇట్లనే రోజు బస్సులెక్కో, సైకిల్లు తొక్కో అదే బడికి వస్తుంటరు…

లోకలోల్లకూ,  ప్రైవేటు స్కూలు పిల్లలకు ఈ బాదుండదు, మంచిగ పొద్దుపొద్దుగాల్నే స్కూల్ బస్ ఇంటి గల్మలకే అచ్చి ఎక్కించుకుంటది, మళ్ళ పొద్దూకంగ అదే గల్మల పడగొట్టిపోతది… సతీషులాంటోళ్లకు అసొంటి బడికి పోవుడనేది ఎడారిల “ఒయాసిస్సే”… అదటుంచుతే సర్కార్ బల్లె అయితే ‘మాపటీలి తిండి’ ఉంటదికదా…!!!

******

అరేయ్… గాంధీతాత గురించి నేర్సుకచ్చుకొమ్మన్నగారా.. నేర్సుకచ్చుకున్నరా?? సార్ అడిగిండు..

ఈ సార్ మొన్న మొన్ననే జిల్లా హెడ్ క్వార్టరు కాంచెళ్లి ఈ బడికి ట్రాన్స్ ఫర్ అయి అచ్చిండు..

ఏందిరా?? ఎవ్వలు సప్పుడు చేస్తలేరు?? నేర్సుకచ్చుకున్నరా లేదా??

“నేర్సుకచ్చుకున్నం సార్” అని కొందరు.. “నేర్సుకచ్చుకోలేద్ సార్” కొందరు అంటున్నరు..

ఏందిరా?? నపరొక మాటoటాన్లు?  అసల్ నేర్సుకచ్చుకున్నారా లేదా?? గొంతు పెంచి అడిగిండు సారు..

గుంపుల గోవిందలెక్క ఈసారి అందరు గట్టిగ “నేర్సుకచ్చుకున్నం సార్” అన్నరు తలకాయలూపుకుంట.. అనుడైతె అన్నరుకని “నన్నెక్కడ లేపి అడుగుతడో” అని ప్రతి ఒక్కరికి లోపట లోపట గజ్జుమంటాంది.

“మందల గొర్ల వేరం అందరు తలకాయలూపుడు కాదురా,  ఒక్కొక్కన్ని లేపి అడుగుతె అప్పుడు బయట్వడ్తయ్  మీ యవ్వారాలన్ని..”  అనుకుంట క్లాసు రూం మొత్తం కలె చూస్తూ బేంచిల మద్యలనుంచెళ్లి లాష్టుబేంచిల దిక్కు నడిశిండు  సారు..

ఆ మాట వినంగనే అప్పటిదాంక మంచిగ సాఫ్ సీదా ఉన్న పిల్లల నడుములు ఒక్కసారిగ వంగి, గూని అయినయ్!

అట్ల వంగి కూసుంటే సార్ కు కనిపియ్యమని వాళ్ల నమ్మకం.. తలకాయలుకూడ నేల చూపులు చూస్తున్నయి… ఎవలకువాళ్లు మనసుల- “సార్ నన్ను లేపద్దు.. సార్ నన్ను లేపద్దు” అనుకుంటాన్లు…

అరే.. నారిగా.. లే రా…

లాస్టు బేంచిల అటునుంచి ఫష్టుకు కూసున్న నరేషు భయం భయంగ లేశినిలుసున్నడు..

చెప్పురా.. గాంధితాత ఎవరూ? ఆయినె దేశానికేం చేశిండు??

సార్.. అంటే.. అదీ.. సార్.. అని మాటలు నములుతాండు తప్పితే నోట్లెకేంచి కూతెల్తలేదు నరేషుకు..

ఏందిరా?? నేర్సుకచ్చుకోలే?? మీరు పుస్తకాలెట్లా తియ్యరు.. కనీసం ఇంట్లోల్లను అడిగన్న తెల్సుకచ్చుకొమ్మని చెప్పిన గారా.. అని సట్ట సట్ట రెండు మొట్టికాయలు కొట్టిండు సారు..

అబా… అద్దు సార్ అద్దుసార్.. నిన్న ఆణ్నే బొడుసులేశింది సార్.. అద్దు సార్.. అద్దుసార్ అని నెత్తి రుద్దుకుంటూ బతిమాలిండు నరేషు…

అరే రాజుగా నువ్వు చెప్పురా…

సార్.. అదీ.. సార్.. నిన్న మా అవ్వ పత్తేరవొయ్యింది సార్… ఇంటికి రాంగనే ఈ ముచ్చట్నే అడుగుదామనుకున్న సార్.. కని అచ్చేవరకే బాగ నెరివండుండే సార్.. అందుకే….

అందుకే అడగలేదంటవ్?? సాప్ మట్టల్ సాప్..

“ఫాట్”.. “ఫాట్”… సదువు రాదుకని సాకులు మాత్రం అచ్చు.. దినాం కొత్త సాకు.. సాపు..

“ఫాట్”.. “ఫాట్”…

ష్ష్ .. అబ్బా.. అద్దు సార్ అద్దు సార్ అనుకుంట మట్టలను జాడించిండు రాజు…

మీ లాష్ట్ బేంచి బతుకులెప్పుడు గింతేరా.. గిట్లనే గంగల కలుత్తయ్ మీ బతుకులు…. అని పక్కకున్న ఇంకిద్దరిని కూడ తలో నాలుగు దెబ్బలు సరిశి ముందుకు అచ్చుడచ్చుడే-

అరే సత్తీ… లేరా… చెప్పూ.. గాంధి తాత ఎవరూ? ఆయినేం జేశిండు??

గట్టిగ చెప్పు.. అందరికినవడాలే..

ఫస్ట్ బేంచిల కూసున్నవాళ్ళకు అన్నీ తెలుస్తయని సారు నమ్మకం.. నమ్మకానికి తగ్గట్టే, సతీష్ సుత ఏ మాత్రం భయపడకుండ ఠక్కున లేశి చేతులు కట్టుకోని చెప్పుడు వెట్టిండు..

సార్.. గాంధి తాతా.. అప్పట్ల… తెల్లోల్లున్నప్పుడు… మన మంత్రి ఉండేటోడు…

ఏందీ???

మంత్రి సార్.. మినిష్టర్..

ఏం మినిష్టర్ రా???

సార్ మాటల వ్యంగ్యం సతీష్ కు అర్థంకాక ఇంకింత ఉత్సాహంగ-

ప్రధాన మంత్రో, ముఖ్య మంత్రో ఉంటుండే సార్.. ఏదో తెల్వదు కని ఈ రెండీట్ల ఏదో ఓటుంటుండె సార్..

సార్ మొఖం ఎర్రగ అయింది…

“గాంధి తాతా మంత్రారా?? ఆయినె ముఖ్యమంత్రని నీకు మీ నాయిన చెప్పిండారా?” అనుకుంట  గిబ్బ గిబ్బ రెండు గుద్దులు గుద్దిండు సారు….

కాద్సార్ కాద్సార్.. ప్రెధాన మంత్రి సార్.. ప్రెధానమంత్రి సార్..

“మీ నాయినే చేశిండట్నారా ప్రధానమంత్రిని? ఆ??”                        వెన్నుబొక్క మీద ఇంకో రెండు గుద్దులు..

మా బాపు చెప్పింది చెప్పినట్టే అప్పచెప్పినా సుత సార్ కొడ్తుండేందని సతీషుకు మస్తు దుఃఖమస్తాంది కని ఆపుకుంటాండు.. ఎంత ఆపుకున్నాగని గుడ్లెంబడి నీళ్లు రానే అచ్చినయ్..

ఇంకో ఇద్దరు ముగ్గురు ఫష్టు బేంచోళ్ళను లేపి అడుగుతెసుత అసొంటి జవాబులే వచ్చినయ్.. గాంధి తాత గరీబోడూ, బట్టలుసుత లేకుండెనట అని ఒకరు చెప్తే, గాంధితాత ఉన్నోడేగని, ఉన్నది మొత్తం గరీబోల్లకు దానమిచ్చి అట్లయిండని ఇంకోడు చెప్పిండు.. ఇవన్ని వింటున్న సారుకు బీపీ పెరిగింది..

వాళ్ళ వేల్ల మధ్యలో చాక్ పీసు పెట్టి వొత్తిండు..

వాళ్లు “వావ్వో.. వావ్వో అద్దుసార్ అద్దుసార్” అని మొత్తుకుంటున్నా సార్ కు వినపడ్తలేదూ , విడిచిపెట్టబుద్ధైతలేదు.!

“థూ.. ఏం పోరగాన్లురా మీరు?? దునియాల గాంధి తాత గురించి ఎర్కలేనోడు ఉంటడారా?? ఓడు మినిష్టరంటడు, ఓడు గరీబోడంటడు, ఓడు అదంటడు ఇంకోడు ఇదంటడు..!! ఏడికెల్లి దాపురించిన్లురా ఇసంటి సంతంత!!! తినున్లిరా అంటె గిద్దెడు తింటరు ఒక్కొక్కడు.. సదువు మాత్రం సున్నా.. ఎందుకస్తర్రా ఇసొంటి గాడిదికొడుకులు మా పానం తినడానికి?  థూ..” నాలుక కొస్సకు ఇంక చాన మాటలున్నయి.. కని ఆపుతున్నడు..

పిల్లలందరూ తప్పు చేసినట్టు తలలు కిందికి వేస్కున్నరు..

మీకు తెల్వకపోతె తెల్వదు.. కనీసం మీ ఇంట్లోల్లనన్న అడిగి తెల్సుకోని రావద్దారా? ఆ? మీ నాయిన్నో, అవ్వనో.. ఎవరో ఒకల్ని అడిగి నేర్సుకోని రావద్దా??

నీన్ అడిగిన సార్..  సతీషు మెల్లగ అన్నడు..

మాద్దండి అడుగుడడిగినవ్ పో.. అదే చెప్పిండార మీ నాయిన?? గాంది తాత.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రని??

ఔన్ సార్..

“ఎవడ్రా మీ అయ్యకు సదువుచెప్పినోడు? గాంధీజీ మన ముఖ్య మంత్రా?? ఆ?? చెప్పూ.. ముఖ్యమంత్రా??” చెవు మెలివెట్టిండు సారు..

ఆ.. ఆ.. ఎమ్మో సార్.. కాద్సార్.. కాద్సార్..

మీ అయ్య ఊళ్లె ఉంటాండా?? అడివిల ఉంటాండారా?? ఆ?? గాంధితాత ఎర్కలేదారా మీ అయ్యకు??

అని మళ్ళ క్లాస్ అంత కలెతిరిగి చూస్తూ- సరే వీళ్ల నాయినకు ఎరుకలేదట.. మరి మీ అందరి సంగతేందిరా??

మావోళ్లుసుత ఎర్కలేదన్నరు సార్.. అందరు మళ్ల గుంపుగ జవాబిచ్చిన్లు..

ఎవడన్న వింటె ముడ్డితోని నవ్విపోతడు ఎర్కేనా? మీ వొళ్లంత ఊళ్ళె ఉంటాన్లా జంగిల్ల జంతువుల్తోటి ఉంటాన్లా? గాంధి తాత గురించి తెల్వదనుడేందిరా? మీ నకరాలు గాపోతె…. ఇట్ల కాదుకని ఇయ్యాల మీ సంగతి చూశినంకనే ఇంకో పని..

ఒక్కొక్కడు లేశి మీ నాయినలేం జేత్తరో చెప్పున్లిరా… మీ ఈపులు మొత్తం సాఫ్ చేశే పోత ఇయ్యాల…  చెప్పుర సంతు మీ నాయినేం జేత్తడ్రా…

సార్… మా బాపు.. మా బాపు చాపల వడ్తడు సార్..

ఏందీ?

ఔ సార్.. మా బాపు చాపల వడ్తడు.. మా బాపు గాలమేత్తె కం సె కం కిలకు తక్కువ చాప వడదు సార్.. ఇగ వలేత్తెనైతె వశపడదు సార్..

సార్.. మా బాపు ఉట్టి చేతుల్తోటిసుత చాపలు పడ్తడు సర్..

ఆ..!!

మా బాపు నీళ్లల్లకు దిగిండంటే  చాపలే ఆయినకు ఎదురత్తయంటరు సార్ మా ఊరోళ్ళు..

ఇంకా??

Kadha-Saranga-2-300x268

“మా బాపు ఎవుసాయం జేత్తడు సార్… నారు వోశిన కాంచి అడ్లు కొలిశేదాక మొత్తం అన్ని చేత్తడు సార్ మా బాపు..” ఓదెలు అందుకున్నడు.

ఆ..

అడ్లను ఒక్కచేత్తోనే గుప్పిట్ల ఇట్ల వట్టుకోని ఆటిని నలిపి బియ్యం తీత్తడు సార్ మా నాన.. బియ్యం నలుపుతె పిండి పిండి అయితసార్ నిజంగా…

అచ్చా.. ఇంకా..

మా నాయిన పడువ తోల్తడు సార్.. మనూరోల్లు శివారానికి, ఏలాలకు పోవాల్నన్నా, ఆ ఊళ్ళోల్లు మనూళ్ళెకు రావాల్నన్నా మా నాయిన పడువొక్కటే సార్…

అచ్చా!!

నిరుడు హోళి అప్పుడు ముగ్గురు పోరగాన్లు కయ్యలల్ల వడి మునుగుతాంటె ఆళ్లను మీదికిగ్గింది మా నాయినే సార్.. ఇప్పటిదాంక అట్ల బొచ్చెడుమందిని బచాయించిండుసార్ మా నాయిన..

ఆ..!!

సార్.. మన జిల్లా మొత్తమ్మీన ఆనా కాలం, గంగ ఇటొడ్డు కాంచి అటొడ్డుకు ఈత కొట్టే మొగోడు మా నాయినొక్కడే అట సార్.. మా కాక చెప్తడు..

ఇంకా..??

సారు విసుగుతో, వ్యంగ్యంతో అంటున్న “ఇంకా” అనే మాట ఆ పిల్లల కు చాన పాజిటివ్ గ అనిపించింది… మా సార్ మా నాయినలు గురించి తెల్సుకోవాల్నని అడుగుతున్నడు అనుకోని ఇంకింత ఉత్సాహంతో తమ తమ తండ్రుల గురించి చెప్పుడు షురూ చేశిన్లు ఒక్కొక్కరు..

మా అయ్య అమాలి పనికి పోతడు సార్… మొత్తం లారెడు లోడు ఒక్కన్ని ఎక్కియ్యమన్నా ఎక్కిత్తడు సార్, మళ్ల దించుమంటె సుత అప్పటికప్పుడు దించుతడు సార్ మా అయ్యా..  రవి చెప్తున్నడు..

ఆ..

పేనేడాది గా బుచ్చన్నోళ్లు, కచ్చరమ్మీద అడ్ల బస్తాలు చేరగొడ్తాంటే జొడెడ్లల్ల ఒక ఎద్దు తొవ్వల్నే సచ్చిపేంది సార్.. అప్పటికే ఆయిటిపూని ఎప్పుడు వానకొట్టేది ఎర్కలేకుంటున్నది.. కచ్చరంల పదిహేను కింటాల్ల అడ్లున్నయట సార్, కప్పుటానికి బర్కాల్ సుత లెవ్వు.. సరిగ్గ అదే టయానికి మా అయ్య అటుకేంచి పోతాంటె సమ్మన్నా జర సాయం పట్టరాదే అన్నరట సార్.. గంతే.. కనీ వట్టుకోని కచ్చురాన్ని అమాంతం లేపి జబ్బ మీదికెత్తుకున్నడట సార్.. కనీకి ఓ దిక్కు ఎద్దు ఇంకో దిక్కు మా నాయిన… అట్ల ఆరు కిలమీటర్లు ఇగ్గుకచ్చి అడ్లు ఇంటికి చేరగొట్టిండు సార్… మా బుచ్చన్నమామ ఇప్పటికి చెప్తడు…

ఆహా..! ఇంకా?

సార్… మా నాయిన కోళ్లు పెంచి అమ్ముతడుగని ఆయినెకు పామ్మంత్రం, తేలు మంత్రం ఎరికెసార్… షరీఫు లేశి అన్నడు.

ఆ..

నా అంతున్నప్పుడే మా నాయిన నాగుంబాములు ఉట్టి చేత్తోటి వట్టిండట సార్.. నాగుంబాం కుట్టినా, కట్లపాం గుట్టినా, చిడుగువడ్డా.. మా నాయినకాడ మొత్తం అన్నీటికి మందున్నది సార్… అసల్ ఇప్పటిదాంక ఒక్కర్నిసుత సచ్చిపోనియ్యలేసార్ మా నాయిన..

“ఇదెక్కడి లొల్లిరా బాబు..” సార్ మనసులోనే అనుకుంటాండు..

సార్ మా బాపు కల్లు గీత్తడు సార్.. తాళ్లుంటయి గద సార్.. పొద్దుగాల పదింటికి దాని నీడ ఏడి దాక వడ్తదో ఎర్కెగద సార్??  అగో.. ఆ నీడ మీద మనం ఇటుకేంచి అటు నడిశి, మళ్ల అటుకేంచి ఇటూ ఎనుకకు మర్రచ్చేంతల మా బాపు ఆ తాడెక్కి లొట్లుసుత వట్టుకోని దిగుతడు సార్.. గంత జెప్పన ఇంకెవలెక్కర్ సార్.. పవన్ చాతి ఉబ్బించి మరీ చెప్పిండు.

మాట మాటకు సారుకు విసుగు పెరిగిపోతాంది…

సార్..  మా నాన బట్టల్ కుడ్తడు సార్… అంగీలు, లాగులు, ప్యాంట్లు, బనీన్లు మొత్తం అన్ని కుడ్తడు సార్… అసల్ చేతుల టేపు వట్టకుండ, కొల్తలు తియ్యకుంట ఉట్టిగ మనిషిని చూత్తె సాల్ సార్, బరాబ్బర్ ఎవలి సైజుల వాళ్ళకు బట్టలు కుట్టిత్తడు సార్ మా నాన… చెప్పిండు రమేషు..

సార్ మా నాయిన సాకలోడు సార్.. సార్ మా బాపు పాలమ్ముతడు.. మా బాపు మంగలాయినె సార్… మా నాయిన కట్టెలమ్ముతడు.. మేస్త్రి పని చేత్తడూ..  చాయి బండి.. సాలె మగ్గం.. కుమ్మరి కుండలు.. ఇస్తిరి డబ్బా… పాతినుపసామాన్… అని ఒక్కొక్కరు మస్తు సంబురంగ సార్ సార్ అనుకుంట తమ తండ్రుల గురించి చెపుతున్నరు.. క్లాస్ అంతా పిల్లల ఉత్సాహంతోని నిండిపోయి.. మంచి ఆహ్లాదకరంగా మారిపోయింది..

కాని ఇంతలనే “నీ యావ్… ఇగ సాలు ఆపున్లిరా…” అన్న మాట ఆ గదిల ప్రతిధ్వనించింది..

పులిని చూశి భయపడ్డట్టు పిల్లలందరు ఒక్కసారి గజ్జున వణికిన్లు సార్ కోపం చూసి..

చెప్పుమన్నకదా అని ఒక్కొక్కడు మా అయ్య మినిస్టరు, మా అయ్య కలెక్టరు అన్న లెవల్ల చెప్తాన్లేందిరా??

అసలొక్కటన్న మంచి పని ఉన్నదార మీరు చెప్పిన దాంట్ల?? నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..

పిల్లల మొఖాలు మాడిపొయినయ్..

ఓడు పాలమ్ముతడట.. ఓడు చాపల్ వడ్తడట.. గివ్వారా పనులంటే? ఆ?? గివ్వేనా??

పిల్లల పానం సల్లవడుతాంది, సారుకు మాత్రం ఒళ్లంత మంట వెట్టినట్టయితాంది..

మూటలు మోశుడూ, బర్ల ముడ్లుకడుగుడూ ఇయ్యారా పనులు? ఆ??

నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..  ఊరోళ్లూ.. ఊరి కథలు… నీ.. యవ్.. మిమ్ముల గాదుర నన్నీడికి ట్రాన్స్ ఫర్ చేశినోన్ని అనాలె ముందుగాల.. థూ.. ఇసొంటి మనుషుల్ని నీనేడ సూల్లేదవ్వా… ఓ సదువులేదు ఓ తెలివి లేదు..

గాంధీజి ముఖ్యమంత్రట.. చత్.. మరీ గింత అనాగరికంగ ఎట్లుంటర్రా మనుషులు?? ఎసొంటోల్లత్తర్రా మా పానాల మీదికి?? అని ఇంకేదో అంటున్నంతలనే అన్నం బెల్లు కొట్టిన్లు..

పొట్ట చీరుతె అక్షరం ముక్క రాదుగని, టైముకు తిండి మాత్రం పెట్టాలె మీకు!! నాన్ సెన్స్ అని నాన్ సెన్స్.. చత్… ఏం రాజా బతుకురా మీది!!  అనుకుంటూ తొవ్వలున్న కుర్చీని కోపంగ పక్కకు నూకి బయటికి నడిచిండు సారు…

మాములుగ బెల్లుకాంగనే “మధ్యానం భోజనానికి” కంచాలువట్టుకోని గ్రౌండుకాడికి ఉరికే పిల్లలు ఇయ్యాల మాత్రం కూసున్న కాంచెల్లి లేవలే..

ఇన్ని రోజులు వాళ్ళు తమ తండ్రులు చేసే పనులు మహ మహా అద్భుతాలనుకున్నరు.. కని సార్ మాత్రం ఇంకో తీరంగ అంటున్నడు.. ఎందుకట్లన్నడనేదే వాళ్లకు సమజైతలేదు..

ఎవ్వరికి అన్నానికి లేవ బుద్దైతలేదుకని ఆ రోజు ఉడ్కవెట్టిన కోడిగుడ్డు ఇచ్చే రోజు.. వారానికి ఇచ్చేదే రెండ్లు గుడ్లు..  అందుకే గుడ్డు మీద ఆశకొద్ది పాపం అందరు కంచాలు వట్టుకోని బయటికి నడిశిన్లు…

******

సాయంత్రం ఏడింటికి..

“సార్” వాళ్ళింట్ల టీవీ చూస్కుంట ఫోన్ మాట్లాడుతున్నడు..

“ఎక్కడ బావా!! రూపాయి దొర్కుతె ఒట్టు…  మాదేమన్న మీలెక్క రెవెన్యూ డిపార్టుమెంటా చెప్పు? మీరు కుక్కను తంతె పైసల్ రాల్తయ్.. మా ముచ్చట అట్లకాదుకదా.. అందుకేగదా ఇయన్ని యవ్వారాలు..”

అవతలి మనిషి ఏదో అన్నడు..

vamshi

వంశీ కథాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా…

అయన్ని కాదు కని బావా నువు కొంటానవా లేదా ఒకటే ముచ్చట చెప్పు.. బయటోళ్లకైతె నాలుగ్గుంటలు పదికిత్తా అంటున్నరు, నువ్వు మనోనివి కాబట్టి నీకు ఆరుకు ఇప్పిస్త.. సరేనా?? నా కమిషన్ టెన్ పర్సెంట్ లెక్క అలగ్ మల్ల…

డ్యాడ్….. “సార్” కొడుకు వరుణ్, తండ్రిని పిలిచిండు..

“డ్యాడ్” కొడుకును పట్టించుకోకుండ ఫోన్ ల మాట్లాడుతనే ఉన్నడు..

ట్రాన్స్ ఫర్ అంటే ఉట్టిగనే అయితదా బావా? ఎన్ని చేతులు తడుపాల్నో నీకెర్కలేదా! అందుకేగా ఇన్ని తిప్పలు.. ఫైవ్ పర్సెంట్ అంటె కాదుగని ఎనిమిది చేస్కో బావా నువ్ కాబట్టి లాష్ట్ ఇంక…

డ్యా…..డీ…. ‘కుర్ కురే’ నములుకుంటూ కొంచం గట్టిగ పిలిచిండు కొడుకు.

వాట్ బేటా??

ఐ హ్యావ్ అ డౌట్ డ్యాడ్…

యా??

వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ “పండిత పుత్ర పరమశుంఠా”??

అతనికి తన కొడుకేమంటుండో ఒక్క నిమిషం అర్థంకాలేదు..

వ్వాట్?? వ్వాట్ బేటా??

వాట్…. ఈస్…. ద…. మీనింగ్…. ఆఫ్…. “పండిత పుత్ర పరమశుంట??”..

అప్పటిదాక పక్కకుపెట్టి పట్టుకున్న ఫోన్ లో “నీన్ మళ్లీ ఫోన్ చేస్త బావ..” అని చెప్పి కాల్ కట్ చేసి.. కొడుకును దగ్గరికి రమ్మన్నడు ” డ్యాడ్”..

కొడుకు కుర్ కురే ముక్కను నోట్లె సిగరెట్ ముక్కలెక్క పెట్టుకోని తండ్రిని ఇమిటేట్ చేస్కుంట చాన క్యాజువల్ గా వచ్చి “డ్యాడ్” పక్కన కూచున్నడు..

నౌ, టెల్ మీ వాట్ హ్యాపెండ్??  అసల్ ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా నీకు??

నథింగ్ డ్యాడ్.. మా సర్ ఇవ్వాల నన్నామాట అన్నడు..

ఎందుకు?? ఎందుకట్లన్నడు??

వాడు వట్టి వేస్ట్ ఫెలో డ్యాడ్…

వరుణ్.. టెల్ మి అంటున్న కదా..

అదంత పెద్ద స్టోరీ డ్యాడ్.. లైట్ తీస్కో.. దానికి మీనింగ్ చెప్పు చాలు…

రేయ్.. మంచిగ అడుగుతున్నకదా.. చెప్పు.. అసల్ ఆ మాటెందుకన్నడు వాడు?

అరే.. ఈసీ డ్యాడ్.. ఇవ్వాల లంచ్ అవర్ లో బాక్స్ ఓపెన్ చేస్తే అందులో మళ్లీ బాయిల్డ్ ఎగ్గ్ కర్రీనే ఉండే.. మమ్మీ కి పొద్దున్నే ఫ్రై కర్రి చెయ్యమని చెప్పినాకుడ వినకుండా మళ్లీ అదే బోరింగ్ బాయిల్డ్ ఎగ్స్, టొమాటో కరీ వేసి పెట్టింది డ్యాడ్.. అందుకే మమ్మీ మీద కోపమొచ్చి బాక్స్ విసిరి కొట్టిన… బట్ అన్ ఫార్చునేట్లీ ఎగ్సాక్ట్  అదే టైం కి మా మ్యాక్స్ సర్ గాడు అక్కడికొచ్చిండు..

ఆ?? వస్తే??

వొచ్చి.. ఈ బాక్స్ ఎవరిది అన్నడు… ఐ సెడ్ ఇట్స్ మైన్… బట్ వాడు “ఎందుకు విసిరికొట్టినవ్..” అదీ ఇదీ అని పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసాడు డ్యాడ్…

అంటే?? నువ్ ఇవ్వాల కూడ లంచ్ చెయ్యలేదా వరుణ్? పక్కనే టీవీ చూస్తున్న వాళ్ల మమ్మీ అడిగింది..

గీతా.. ప్లీస్ డోంట్ చేంజ్ ద టాపిక్.. చెప్పు వరుణ్ తర్వాతేమైంది??

నతింగ్ డ్యాడ్.. నా లంచ్ నా ఇష్టం అని నేన్ కూడా ఫుల్ ఆర్గ్యూ చేసిన….

ఆ??

ఆ వేస్ట్ గాడు అక్కడో పెద్ద సీన్ చేసి నాకు క్లాస్ పీకాడు..

ఆ?

అప్పుడు  ఫైనల్ గా వాడొకటన్నాడు డ్యాడ్.. “అన్నం విలువ తెలిస్తె నువ్విట్ల చెయ్యవ్ వరుణ్” అని.. నాకు ఫుల్ కోపమొచ్చింది.. నాకు తెల్సు అన్న.. కని వాడు ఇంక ఎక్స్ట్రా చేస్తూ “అసల్ నువ్ తినే అన్నానికి బియ్యం ఎక్కన్నుంచి వొస్తాయో చెప్పు” అన్నడు..

నేన్ బియ్యం- “బియ్యం చెట్లకు” కాస్తయని చెప్పిన…

అంతే డ్యాడ్, ఆ వేస్ట్ గాడు నాతో ఇంక ఆర్గ్యూ చెయ్యలేక “పండిత పుత్రా పరమ శుంఠా” అని సాన్స్ క్రిట్ లో ఏదో అనుకుంటూ అక్కణ్నించి ఎస్కేప్ అయిండు… అసల్ ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఏంది డ్యాడ్??

“దానికి మీనింగ్ కాదురా.. అసల్ ఆ మాటన్న సార్ గాడెవడో చెప్పు.. వాని తోలు ఒలిచి పారేస్తా..

వానికెంత బలుపుంటె ఆ మాటంటడు వాడు నా కొడుకును? ఆఫ్ట్రాల్ ప్రైవేట్ టీచర్ గానికి గంతగనం మోరనా?? వాని…  లక్షల్ లక్షల్ ఫీజులు కట్టేది గిందుకోసమేనా? లంజొడుకు… నోటికి ఏదస్తె అదనుడేనా సాలెగాడు!!అసల్ ఏం అనుకుంటాండ్రా వాడు??  రేపైతె తెల్లారని.. వాన్ని డిస్మిస్ చేయించి పారేస్త స్కూల్లకెల్లి.. … …. నాన్సెన్స్ అని నాన్సెన్స్..”

******

రాత్రి ఎనిమిదయితుంది..

సతీషు అన్నం తింటలేడని వాళ్ల బాపు బతిమాలుతాండు..

“తిను నాయినా.. దా.. ఒక్క బుక్క.. దా దా.. మా సత్తి మంచోడుగదా.. దా.. ఒక్క బుక్క తిను రా నాయినా.. దా..” అనుకుంట అన్నం బుక్క నోటిముంగటే పెట్టినా సతీషు మాత్రం నోరు తెరుస్తలేడు..

“నా బంగారం కదా.. దా బిడ్డా.. ఒక్క బుక్క.. ఒక్కటంటె ఒక్కటే బుక్క.. దా నాయినా… నెరివడ్తవ్ రా రా..” అమ్మసుత మస్తు బతిమాలుతాంది కని సతిషు మాత్రం నోరు తెరుస్తలేడు..

అసల్ ఎందుకలిగినవ్ రా? ఏవలన్న ఏమన్న అన్నరా??

సత్తి మాట్లాడలేదు..

చెప్పు కొడుకా.. ఏమైందిరా??  బిస్కిటు పొడ తేవాల్నా, “ఛా”ల ముంచుకోని తినేవు??

ఉహూ..

పోని చాకిలేట్లు తేవాల్నా??

సత్తి వద్దన్నట్టు తల అడ్డంగ ఊపిండు..

మరేంగావాల్నో చెప్పురా?? ఉట్టిగనే అట్ల మా మీద అలుగుతె ఎట్లరా మరి…  దా… మా బుజ్జి కదా.. ఒక్క బుక్క తిను.. దా నాయినా..

“నాకద్దు పో.. నీన్ తినా అని చెప్పిన కదా… ఊకె ఎందుకట్ల సతాయిస్తున్లు.. నాకద్దు.. నీన్ తిన..”

సత్తి గొంతుల కోపం కన్నా దుఃఖం ఎక్కువున్నదని ఆ తల్లిదండ్రులకు ఉట్టిగనే అర్థమైంది..

ఏమైందిరా?? ఏవలన్న ఏమన్న అన్నరా??

బల్లె సారు గిట్ల కొట్టిండారా??

సత్తి కండ్లల్ల ఒక్కసారిగా నీళ్ళు ఊరుకచ్చినయ్.. ఠక్కున అమ్మ ఒడిల వాలి పొయ్యి చీర కొంగును మొఖం మీదికెళ్లి ఏసుకున్నడు..

వాడి కన్నీళ్ల వెచ్చదనం ఆ తల్లిదండ్రుల మనసుకు తెలుస్తనే ఉంది…

ఊకో నాయినా.. ఊకో రా.. దా దా దా.. అనుకుంట చేతులున్న కంచం పక్కకువెట్టి కొడుకును ఎత్తుకున్నడు బాపు..

ఎవల్రా?? మీ సారు కొట్టిండా??

మ్మ్… సత్తి ముక్కు చీదుకుంట అన్నడు..

అమ్మ ఊకో బిడ్డా ఊకో అనుకుంట కొంగుతోని కండ్లు తుడుస్తాంది..

అరెరే.. అందుకు అలిగినవా కొడుకా?? ఊకో.. ఊకో..  బాగ కొట్టిండారా సారు??

మ్మ్..  మస్తు కొట్టిండు బాపూ.. ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు.. అనుకుంట బనీను లేపి చూపించిండు..

అమ్మ కండ్లల్ల నిళ్ళచ్చినయ్ కని కొడుక్కు కనపడకుండ వెనకనే నిలుచుని అతని వెన్నును చేత్తో రుద్దుతోంది… సత్తికిసుత మళ్ల కండ్లల్ల నీళ్లస్తున్నయ్..

అరే.. ఊకో నాయినా.. నీను అటెప్పుడన్నచ్చినపుడు “మావోన్ని కొట్టద్దని” మీ సారుకు చెప్త సరేనా?? ఆ.. ఇంగో..

నోరు తెరువు… ఇగో.. ఆ.. ఆ.. ఈ బుక్క తిను… రేపు బడికిపోంగ నీకు ఉప్పు బిస్కిటుపొడ కొనిస్త సరేనా?? అనుకుంట  నోట్లో బుక్క పెట్టిండు బాపు..

సతీషు బుక్క నములుతూ- నీను రేపటి కాంచి బడికి పోను బాపూ.. మా సార్ ఉట్టుట్టిగనే మస్తు కొడ్తాండు.. మా దోస్తులుసుత బడి బంజేత్తా అంటున్లు..

లె ల్లే.. తప్పు కొడుకా అట్లనద్దు.. మీకు సదువు మంచిగ రావల్ననేగారా మీ సార్లు కొట్టేది..  గాయింత దానికే సారుమీద అలుగుతరా చెప్పు..

అట్లకాదు బాపూ.. ఆయినే మాదండోడు..

సదువు చెప్పే సారును అట్లనద్దురా.. తప్పు నాయినా.. ఇంగో బుక్క వెట్టుకో..

మీరందరు మంచిగ సదువుకోని రేప్పొద్దుగాల మంచి మంచి నౌకర్లు చేత్తె ఆ సారుకు ఏమన్నత్తదా చెప్పు?? మీ బతుకే మంచిగైతది కదా?? సార్లు ఓ మాటన్నా, ఓ దెబ్బ కొట్టినా అదంత మీరు మంచిగుండాల్ననేకని మిమ్ముల కొట్టుడు వాళ్లకేమన్న ఖాయిషా కొడుకా??  ఇంగో బుక్క తిను…  ఇంకెప్పుడు సదువు చెప్పే సార్లను అట్లనకు సరేనా..

సరే..

చెంపలేస్కో..

చెంపలు వేస్కుంటూ… “చిన్న చిన్న బుక్కలు వెట్టు బాపు” అన్నడు సత్తి..

నాయిన బుక్కను సగంచేసి పెట్టిండు.. అది నములుకుంటూ సత్తి అన్నడు- “అయినా.. ఇయ్యాల నువ్వు చెయ్యవట్టికే మా సార్ నన్ను కొట్టిండు బాపూ..”

నీన్ చెయ్యవట్టా?? నీనేం చేశిన్రా??

పొద్దుగాల “గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

******

తండ్రికొడుకులిద్దరు రాత్రి కల్లం కాడికి కావలిపొయ్యి, చిన్నపాటి గడంచెల నడుం వాల్శిన్లు.. సత్తి, బాపు చెయ్యిమీద తల పెట్టుకోని…. బొత్త మీద కాలూ-చెయ్యి ఏశి గట్టిగ పట్టుకోని పడుకున్నడు..

“బాపు” కండ్లు మూసుకున్నడు కని నిద్రపడ్తలేదు… కొడుకన్న మాటలే చెవులల్ల మళ్ల మళ్ల వినపడుతున్నయ్..

“గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

“పాపం..  నీన్ చెయ్యవట్టే నా బిడ్డ దెబ్బలు తిన్నడియ్యాల.. పాపం.. కొడుకు…” అనుకుంట కొడుకు తలను, ఎన్నునూ ప్రేమగ నిమిరిండు బాపు.. అతని కండ్లల్ల కన్నీళ్ళు..

పిలగానికి ‘జో’ కొడుతూ కొడుతూ ఏ రాత్రో తనూ నిద్రలకు జారుకున్నడు..

చిమ్మ చీకటి…

చిక్కటి నిశ్శబ్దం…

పైన చుక్కలూ..

కింద చుట్టూ.. చెట్లూ చేమల మధ్యల…  చల్లటి గాలి జోలపాటకు, కన్నంటుకోవల్సిన ఆ “అనాగరికులు”..

కలత నిద్రలో…

ఒకే కలవరింపు…

“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”

*

“విముక్త” పోరాటం ఎంత వరకు?!

 

(ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా  సాహిత్య అకాడెమి అవార్డు అందుకుంటున్న సందర్భంగా…)

-కల్పనా రెంటాల

~

 

అప్పటికే ప్రాచుర్యంలో వున్న కావ్యాలనూ, అందులో పాత్రలనూ, సన్నివేశాలను తిరగ రాయడం తెలుగు సాహిత్యంలో కొత్త కాకపోవచ్చు. అదే పనిని అనేక మంది రచయితలు వేర్వేరు కోణాల నుంచి చేశారు. మధ్య యుగాల కావ్య సాంప్రదాయంలో అచ్చ తెలుగు కావ్యాలు చాలా వరకు రామాయణ, మహాభారతాల పునర్లేఖనమే! ఆధునిక యుగంలో విశ్వనాథ, త్రిపురనేని రామస్వామి, పఠాభి, చలం, రంగనాయకమ్మ లాంటి రచయితలు వివిధ కోణాల నించి రామాయణాన్ని తిరగ రాశారు. అలా రాసేటప్పుడు ఆయా రచయితలు కేవలం తిరగ రాయడానికే పరిమితం కాలేదని వాటిని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయా కావ్యాలను కొత్త దృష్టితో చదవాల్సి వుంటుందన్న అవసరాన్ని  కూడా ఈ పునర్లిఖిత కావ్య ప్రయోగం నొక్కి చెబుతుంది.

రామాయణాల్ని ప్రశ్నించే అదే ప్రయోగ ధోరణిని ఇంకా ముందుకు తీసుకువెళ్లి, అందులోని పాత్రలను ఈ కాలపు సందర్భంలోకీ సంభాషణలోకీ పునప్రవేశ పెట్టి, ఇంకో ప్రయోగం చేశారు ఓల్గా. “విముక్త” కథలు దీనికి బలమయిన ఉదాహరణ అయితే, ఆ ‘విముక్త” చుట్టూ ఓల్గా నిర్మించిన పురాణ విముక్త భిన్న సందర్భానికి సాధనాలుగా అమరిన కొన్ని విషయాల్ని చర్చించడం ఇవాళ అవసరం. ‘ విముక్త ‘ లో కొత్తగా ఓల్గా చేసిన దేమిటి? ప్రతిపాదించినదేమిటి? పఠాభి, చలం, కొ.కు.లాంటి వారు పురాణ పాత్రలని తిరగ రాసే పని ఎప్పుడో చేశారు. అయితే ఓల్గా వారి కంటే కొత్తగా, భిన్నంగా చేసినదేమిటి? ఎందుకలా చేసింది? అని ఆలోచించినప్పుడు , విముక్త లోని కథలన్నీ ఒకే సారి మళ్ళీ ఒక చోట ఓ సమాహారం గా చదివినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఓల్గా ముందు తరం రచయితల కంటే ఒక స్త్రీ వాద రచయిత్రి గా ఎంత భిన్నమైందో అర్థమవుతుంది.

పాత్రలు కావు, భావనలు!

ఇంతకు ముందు పురాణ పాత్రల మీద వ్యాఖ్యాన రచనల చేసిన వారు ఆ పాత్రలను కేవలం పురాణ పాత్రలుగా నే చూశారు. పాత్రల వరకే పరిమితమై చూశారు . ఓల్గా చేసిన విభిన్నమైన, విశిష్టమైన పని ఏమిటంటే సీతనో, శూర్పణఖ నో, అహల్యానో, ఊర్మిళ నో, రేణుకనో, చివరికి రాముడి ని కూడా కేవలం ఒక పాత్రలు గా కాకుండా కొన్ని భావనలుగా చూసింది. ఒక భావనగా చూపించేటప్పుడు పురాణ పాత్రల మౌలిక స్వభావాలను మార్చటం అనివార్యమవుతుంది. అలా ఆ భావనలను ఎందుకు మార్చటం అంటే కొత్త భావనల రూపకల్పన కోసం అని చెప్పవచ్చు.  రామాయణం లో శూర్పణఖ అసురీ స్వభావం కల వనిత. అయితే సమాగమం లోని శూర్పణఖ అసూయపరురాలు, రాక్షసి కాదు. అంతఃసౌందర్యంతో విలసిల్లే ధీరోధాత్త.

సీత  ఈ కథలన్నింటి లోనూ కనిపించే ఒక ప్రధాన భావన. ఈ మూల భావన తో ఇతర పాత్రలు ఇంకొన్ని భావనలుగా కలుస్తాయి. అలాంటి కొత్త భావనల సమాగమ సమాహారం విముక్త. సమాగమం లోనో, ఇతర కథల్లోనో కేవలం సీత  శూర్పణఖ నో, అహల్య నో కలవటమే కథ కాదు. పాత్రలుగా కలవటం కాదు అది. వాళ్ళను కలుపుతోంది ఒక భావన. ఒక ఐడియా. ఒక కోణం. రచయిత్రీ ఈ పాత్రలను ఏ భావనాలకు సంకేతంగా తీసుకుంది, వాటిని ఏ భావనలతో కలుపుతోంది, వాటి కలయిక ద్వారా రచయిత్రి చెప్తున్న కొత్త భావనలు ఏమిటి? అన్నది చూస్తే ‘ విముక్త’ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో అర్థమవుతుంది.

రామాయణం లో సీత ప్రధాన పాత్ర కాకపోయినా రెండో ప్రధాన పాత్ర. కానీ  విముక్త  కథలన్నింటిలో సీత ప్రధాన పాత్ర గా కనిపిస్తుంది కానీ,  పక్క పాత్రలుగా కనిపించే శూర్పణఖ, అహల్య, రేణుకా, ఊర్మిళ ప్రధాన పాత్రలుగా నిలుస్తారు. ఆ రకంగా పక్క పాత్రలను ప్రధాన పాత్రలుగా చూపిస్తూ, వారి నుంచి సత్యాలను, జ్నానాన్ని సీత పొందటం ద్వారా చివరికి సీత, అహల్య, ఊర్మిళ, రేణుకా అందరూ కలిసి ఒకే భావన గా మారిపోతారు. అయిదు కథలు చదవటం పూర్తి అయ్యాక మనకు అన్నీ పాత్రలు కలిసి ఒక సీత గా , ఒకే ఒక్క భావనగా మిగులుతుంది. ఆ సీత లో శూర్పణఖ ఉంది, ఆ సీత లో అహల్య ఉంది. ఆ సీత లో రేణుకా ఉంది. ఆ సీత లో ఊర్మిళా ఉంది.  ఆ సీత లో రాముడు కూడా వున్నాడు. ఈ కథలన్నింటి లో రాముడి కథ మిగతా వాటి కంటే విభిన్నమైనది.    స్త్రీ పాత్రల వైపు నుంచి మిగతా కథలు నడవగా,  ‘బంధితుడు’ కథ ఒక్కటి  రాముడి వైపు నుంచి సాగుతుంది. ఆ కథ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో  అర్థమయితే  ఒకింత ఆశ్చర్యం తో పాటు ఆనందం కూడా కలుగుతుంది.

సీత కాలం నాటి సమస్యలే ఆధునిక వేషం ధరించి ఇప్పుడు కూడా వీర విహారం చేస్తున్నాయి. కొత్త సమస్యలను పురాణ పాత్రల ద్వారా కొత్త చూపుతో విశ్లేషిస్తోంది. అందుకు స్త్రీ వాదాన్ని ఒక సాధనంగా వాడుతోంది.  ఓల్గా కేవలం సాహిత్య సృజన మాత్రమే చేయదల్చుకుంటే, స్టీవాదాన్ని కేవలం సాహిత్య పరిధి లో మాత్రమే వుంచి చూడాలనుకుంటే ఒక ” సమాగమం’ కథ సరిపోయేది. మిగతా కథలు రాయాల్సిన పని లేదు. అయితే యాక్టివిస్ట్ గా ఓల్గా ఒక పరిమితి లో , ఒక పరిధి లో ఆగిపోదల్చుకోలేదు.  సాహిత్యపరిధి నుంచి, సృజనాత్మక పరిధి నుంచి స్త్రీవాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఆ  ప్రణాళిక లో భాగంగానే ఇన్ని కథలు రాయటం అవసరమయింది.

పాతివ్రత్యం అనే పురాణ భావన ని  బద్దలు చేసిన కథ “సైకత కుంభం”. ఇందుకు ఓల్గా ఎంచుకున్న పాత్ర రేణుకాదేవి. జమదగ్ని మహర్షి భార్య గా, పరశురాముడి తల్లి గా లోకానికి తెలిసిన రేణుకా దేవి  ఓ అపురూప శిల్పకారిణిగా ,  విశిష్టమైన సైకత కుంభాలను తయారు చేయగలిగే కళాకారిణిగా  ఈ కథ ద్వారా అర్థమవుతుంది.  ఆర్య ధర్మం లో ప్రధానమైన పితృ వాక్య పరిపాలనకు రాముడు ఒక కోణం అయితే, పరశురాముడు రెండో కోణం.   ఈ రెండు కోణాలు ఇద్దరు స్త్రీలకు ఏం మిగిల్చాయో చెప్పే కథ ఇది.

పాత్రివ్రత్యం , మాతృత్వ భావనల  చుట్టూ స్త్రీల జీవితాలను ఓ ఉచ్చులో బిగించిన పురుషస్వామ్య సంస్కృతి లోని కుట్ర ను, డొల్ల తనాన్ని బయటపెడుతుంది రేణుక. భర్త గురించి,కుమారుల గురించి తనకు తెలిసినంత గా మరెవ్వరికీ తెలియదని రేణుక చెప్పినప్పుడు  మీకు అలా జరిగింది కాబట్టి ప్రపంచం లో భర్తలు, కుమారులు అందరూ ఆలాగే వుంటారని అనుకోవడం న్యాయం కాదని అంటుంది సీత. కానీ రేణుక హెచ్చరించిన సందర్భాలు రెండూ సీత జీవితం లో కూడా ఎదురయ్యాయి.

” భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు. నిజమే. కానీ ఏదో ఒక రోజు భర్త తన ప్రపంచం లో నీకు చోటు లేదంటాడు. అపుడు మనకు ఏ ఆధారం  ఉంది? పుత్రులకు జన్మనివ్వటమే జీవిత గమ్యమనుకుంటాము. ఆ పుత్రులు పురుషుల వంశాకురాలై మనం గ్రహించే లోపే మన చేయి వదిలి తండ్రి ఆధీనం లోకి వెళ్తారు. వారి అజ్నాబద్ధులవుతారు. లేదా వారే మన జీవితాలకు శాసనకర్తలవుతారు. ఎందుకు ఆ పిల్లలను కనటం- ఇది నాకు అనుభవమైనంత కఠోరంగా మరింకెవరికీ అవదు. కఠోర సత్యం తెలిశాక చెప్పటం నా విధి కదా-”

రేణుక చెప్పిన మాటలు సహజంగానే సీత కు రుచించలేదు.  ఎందుకంటే రేణుక చెప్తున్నలాంటి సందర్భాలు అప్పటికి ఇంకా సీత జీవితం లో ఎదురవలేదు. కళ్లెదుట కనిపిస్తున్నా, తన భర్త, రేపెప్పుడో తనకు పుట్టబోయే బిడ్డలు అలాంటి వారు కారనే ప్రతి స్త్రీ నమ్ముతుంది. ఆ నమ్మకం లోనే, ఆ భ్రమ లోనే బతకాలనుకుంటుంది తప్ప వాస్తవాన్ని గుర్తించాలనిపించదు.  జీవితమనే ప్రయాగశాల లో  రేణుక లాంటి కొందరు స్త్రీలు నేర్చుకున్న అనుభవ పాఠాలు ఎవరైనా చెప్పినా మనకు వాటిని స్వీకరించా లనిపించదు.  దాన్ని సత్యం గా అంగీకరించాలనిపించదు. అందుకే సీత కూడా ” మీ మాటలు నా కర్థం కావటం లేదు. అవి స్త్రీలకు హాని చేస్తాయనిపిస్తోంది” అంటుంది.

తాను తెలుసుకున్న సత్యాన్ని  ఇతర స్త్రీలకు చెప్పటం, తన అనుభవాలను వారితో పంచుకోవటం వల్ల స్త్రీలుగా, బాధితులుగా , అవమానితులు గా   తామంతా ఒక్కరమేనని , ఒకే సమూహానికి చెందిన వారమన్న అనుభూతినిస్తుంది.  ఈ స్త్రీవాద భావన లోంచి చూసినప్పుడు ఓల్గా ఈ కథలను ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం రాసినట్టు స్పష్టం గా తెలుస్తుంది.

స్త్రీలకు తమ మనసు ల మీద, తమ శరీరాల మీద కూడా ఎలాంటి హక్కు లేదని చెప్పే ఆర్య సంస్కృతి పై రేణుక ద్వారా  సైకత కుంభాల సాక్షిగా ఓల్గా తన తిరుగుబాటు ను ప్రకటిస్తోంది.  ఆర్య సంస్కృతి పరిరక్షణ లో భాగంగా పితృస్వామ్యం పెంచి పోషించిన పాతివ్రత్యం, మాతృత్వమే స్త్రీల పరమార్థం లాంటి స్థిర భావనలను సమూలంగా ఈ కథల ద్వారా వోల్గా చర్చకు పెట్టి వాటిని కూకటి వ్రేళ్లతో పెకిలించి వేసి కొత్త భావనలను స్తిరపరుస్తోంది.

vimukta

ఓల్గా రాసిన ‘ విముక్త ‘ కథ లో పద్నాలుగేళ్ళు వనవాసం చేసి వచ్చిన సీత ఊర్మిళ ను చూడటానికి వెళ్లినప్పుడు చెప్పిన మాట ఇది. తనను ఒక మనిషి గానైనా గుర్తించకుండా, కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అన్నా వదినల వెంట లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఊర్మిళ మొదట కోపంతో రగిలిపోయింది.  ఆరని నిప్పుగా మారింది.  తన నిస్సహాయ ఆగ్రహాన్ని ఊర్మిళ సత్యాగ్రహం గా మార్చుకుంది.   నెమ్మదిగా ఆ కోపం తగ్గాక, ఆ ఆవేశం చల్లారాక ఆమె తన దుఃఖానికి, కోపానికి కారణాలు వెతకటం మొదలుపెట్టింది.  తనను నిలువునా దహించి వేస్తున్న ఆ కోపానికి మూల కారణం కనిపెట్టాలని తన అన్వేషణ మొదలుపెట్టింది. కోపం, దుఃఖం, ఆనందం లాంటి ఉద్వేగాలకు , కోపానికి వున్న మూలసంబంధాన్ని విశ్లేషించటం మొదలుపెట్టింది. అందుకు ఆమెకు ఏకాంతం అవసరమయింది. ఊర్మిళ  ఒంటరి తనం లో కూరుకుపోలేదు. ఏకాంతాన్ని కౌగిలించుకొని తన లోపల తాను గా, తనలో తాను గా  ఆ పద్నాలుగేళ్ళు గడిపింది.  తనకు ఇతరులతో వున్న సంబంధాన్ని పొరలు పొరలుగా తీసి లోతుకి వెళ్ళి చూసింది. ఈ అనుబంధాల మూలాలను కనుగోనె క్రమం లో ఊర్మిళ తనతో తాను పెద్ద యుద్ధమే చేసింది. రక్తపాతం, హింస లేని ఆ ఆత్మ యుద్ధం తో ఆమెకు గొప్ప శాంతి, ఆనందం లభించాయి.

స్త్రీ పురుష సంబంధాల్లో ప్రధాన సమస్య అధికారం. ఎవరికి ఎవరి మీద అధికారం ఉంది? ఎంత వరకూ ఉంది? ఎవరి చేయి పైన, ఎవరి చేయి కింద అన్నదే వారి మధ్య అన్నీ పోట్లాటలకు మూల కారణం. ఆ సమస్య ను ఊర్మిళ తన అన్వేషణతో జయించింది.   అధికార చట్రాలలో పడి నలిగిపోతూ విముక్తమయ్యే దారి, తెన్నూ తెలియక అశాంతి తో, ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళకు ఊర్మిళ తన శాంతి రహస్యాన్ని, తన ఏకాంతం లోని గుట్టు ని విప్పి చెప్దామనే అనుకుంది.  ఊర్మిళ జీవన సత్యాన్వేషణ లో తనతో తాను యుద్ధం చేస్తోందని తెలుసుకోలేని వారు ఆమె దీర్ఘ నిద్ర లో మునిగి ఉందని బాధపడ్డారు.

తాను చెప్పినది సీత కు అర్థమయిందని తెలిసాక  ఊర్మిళ మరో ముందస్తు హెచ్చరిక చేసింది.

” నీ జీవితం లో నా కొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలు తనం లోకి,మురికి లోకి నెట్టకుండా, ద్వేషంతో , ఆగ్రహం తో నిన్ను దహించకుండా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీధ అధికారాన్ని నువ్వే తీసుకో. ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు.మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా “.

ఊర్మిళా చెప్పిన ఆ మాటల్లోని అంతరార్థం ఆ తర్వాత ఆమెకు రాముడు అరణ్యాల్లో ఒంటరిగా వదిలి వేయించినప్పుడు గుర్తొచ్చాయి. రాముడి మీద ప్రేమ ను, అనురాగాన్ని వదులుకొని ఎలా విముక్తం కావాలో , అందుకు మార్గమేమిటో ఊర్మిళా చెప్పిన మాటల నుంచి గ్రహించింది.  ఊర్మిళ చేసినట్లే ఇప్పుడు తాను కూడా తనతో తాను యుద్ధం చేసుకొని ఆ అధికారాన్ని వదులుకునే ప్రయత్నం మొదలుపెట్టాలని, అదే తన కర్తవ్యమని బోధపడింది.

రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడన్న వార్తా సీత కు చేరగానే ఆమె ను కలవటానికి ఊర్మిళ వాల్మీకీ ఆశ్రమానికి వచ్చింది.

సహధర్మచారిణి గా తాను పక్కన లేకుండా రాముడు అశ్వమేధ యాగం ఎలా చేస్తాడని సీత సందేహపడినప్పుడు ” ఈ ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రామునికి రావాలి? ” అన్నది ఊర్మిళ. ఆ సమస్య సీత ది కాదు, రాముడి ది.  రాముడి సమస్య ను సీత పరిష్కరించలేదు. పరిష్కరించనక్కరలేదు కూడా.

అనవసరమైన ప్రశ్నలతో అశాంతి పడటం అవివేకమని, అలా నిన్ను నువ్వు హింసించుకోవద్దని  సున్నితంగా హెచ్చరించింది. ” నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి” అని ఆమెకు కర్తవ్య బోధ చేసింది ఊర్మిళ.

” ప్రతి పరీక్ష నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చేయి. తపస్సు చేయి. లోపలికి చూడు. నీవనే యథార్థం కనపడేదాకా చూడు” .

రాముడి నుంచి సీత విముక్తం కావాలంటే ఆ యుద్ధమేదో సీత చేయాలి.ఊర్మిళ యుద్ధం చేయాల్సిన అవసరాన్ని, ఆ మార్గాన్ని మాత్రమే సూచించగలదు. ఊర్మిళ అదే పని చేసింది. ఆ యుద్ధం తో పోలిస్తే అగ్ని పరీక్ష చాలా చిన్నది.  ఆ యుద్ధం చేశాక , తనను తాను రాముడి నుంచి సీత విముక్తం చేసుకున్నాక  మళ్ళీ వెళ్ళి సభలో తన నిర్దోషిత్వమ్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సీత కు తెలుసు. అందుకే రాముడు పంపిన ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించి తన గమ్యం వైపు కి సాగిపోయింది.

ఊర్మిళా, సీత  తమతో తాము సంఘర్షించుకొని చేసిన యుద్ధం ద్వారా తెలుసుకున్న సత్యం ఒక్కటే. ” అధికారాన్ని పొందాలి. వదులుకోవాలి కూడా”. ఆ సత్యమే వారిని  పితృస్వామ్య సంకెళ్ళ నుండి విముక్తం చేసింది. ఆధునిక స్త్రీ ది కూడా అదే మార్గం.  అధికారం అనేది ఎలా వదులుకోవాలో? ఎందుకు వదులుకోవాలో తెలిస్తేనే స్త్రీలకు విముక్తి లభిస్తుంది. నిజమైన శాంతి, ఆనందం దక్కుతాయి. స్త్రీ జాతి విముక్తి ని మనసారా కాంక్షిస్తూ  అందుకు అవసరమైన సత్యాలను, అవి గ్రహించే మార్గాలను కూడా మనకు ఈ కథల ద్వారా అందించింది. మార్గం తెలిసింది. యుద్ధం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో కూడా తెలిసింది. ఇప్పుడు ఆ యుద్ధం చేయాల్సిన బాధ్యత, విముక్తం కావల్సిన అవసరం ఆధునిక స్త్రీ దే.

*

 

ఓల్గా తో సారంగ ముఖాముఖి ఇక్కడ: