సగంమనిషి

 

-రవి బడుగు

~

photo2630‘సగంమనిషి’ నా రెండో కథ. మొదటికథ ‘వరదగూడు’ వంగూరి ఫౌండేషన్ ఉగాది కథలపోటీల్లో మొట్టమొదటి రచన విభాగంలో బహుమతి అందుకుంది. సినిమాల్లో చించేద్దామని వచ్చి.. ప్రస్తుతం సీనియర్ సబ్ ఎడిటర్ గా టీవీ 9లో పనిచేస్తున్నా. హెచ్ఎంటీవీ, జీ 24గంటలులో గతంలో పనిచేశా. సొంతూరు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం మూలవారిపల్లె. త్రిపుర, తిలక్, కేశవరెడ్డి అభిమానరచయితలు. 

*

టీకప్పులోంచి పొగలు. సాసర్ లోకి వంచా. మూసీలో మురికినీళ్లు గుర్తొచ్చాయి. తాగాలనిపించలేదు. సాసర్ ని పక్కకి నెట్టి బేరర్ ని పిలిచా. డబ్బులిచ్చేసి బ్యాగ్ తీసుకుని బైటకొస్తుంటే.. ప్రొప్రయిటర్ డెస్క్ లోంచి రెండు కలువలు. ఐ లైనర్ మధ్యలోంచి నవ్వుతున్నాయి. టీ తాగినట్టనిపించింది.

ఎటెళ్లాలి..?

హాస్టల్ కి వెళ్లే మూడ్ లేదు. మూసీ వైపు తీసుకెళ్లాయి కాళ్లు. బ్రిడ్జి అంచునకూర్చుని వచ్చీపోయే వాహనాలు చూస్తున్నా. మధ్యమధ్యలో కేఫ్ వైపు కూడా.

ఇంకెంత సేపు ఎదురుచూడాలో.?

తనొచ్చేదాకా తప్పదా..

అసలొస్తాడా.. ఆల్రెడీ వచ్చేశాడా.. మనుషుల మొఖాలన్నీ ఒకేలా ఉన్నాయి. వచ్చినా గుర్తు పట్టేదెలా..?

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బైట కొన్న పర్స్ తీసి చూసుకున్నా. ఐదొందల నోటు.. కొన్ని పదులు.. చిల్లర. సీన్ చివరికొచ్చేసింది. మళ్లీ జేబులో పెట్టుకున్నా.

కేఫ్ కి కాస్త దూరంలో ఉన్న హాస్టల్ వైపు చూశా. సిటీకొచ్చి వారం దాటింది. నిజానికి వచ్చినరోజే నరేంద్రని కలవాలి. వారం తర్వాత కలుస్తానన్నాడు.

బ్యాగ్ లోంచి సర్టిఫికెట్లు తీశా. మాస్టర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్. మాట్లాడ్డం రాకపోయినా డిగ్రీ వచ్చేసింది. జైలు నా జీవితాన్ని తినేసినా.. మాస్టర్ డిగ్రీ ఇచ్చింది.

ఫోన్ మోగడంతో సర్టిఫికెట్లు అలాగే బ్యాగ్ లోకి తోసి.. ఠక్కున పైకి లేచి కాల్ రిసీవ్ చేసుకున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. ‘ఒకే సార్’ అని చెప్పి.. కాసేపు అటూ ఇటూ రోమింగ్ చేశా. మళ్లీ వచ్చి బ్రిడ్జి అంచునే జారబడ్డా. టైమ్ పది దాటినా పెద్దగా ఎండ లేదు.. వానొచ్చేంత మబ్బుల్లేవు. వాతావరణం చిరాకులో ఉన్నట్టుంది.

కాసేపట్లో కేఫ్ దగ్గర హోండా సిటీ ఆగింది. లేచి వెళ్లా. విండో ఓపెన్ చేసి అటూ ఇటూ చూస్తున్నాడతను. నన్ను చూసి ఆగాడు. నా వైపు వేలు చూపించి..శివ.. అని అడిగాడు.

అవును సర్…

బ్యాక్ డోర్ ఓపెన్ చేయడంతో.. లోపలికెక్కి కూర్చున్నా.

తనేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. నా కంటే రెండు మూడేళ్లు ఎక్కువ వయసుండొచ్చు. కానీ అంతకంటే తక్కువగా కనిపిస్తున్నాడు. ఆ వయసుకే ఓ టీవీ చానల్ ఎండీ.

రేర్ వ్యూ మిర్రర్ లో నన్ను నేను చూసుకున్నా. ‘శిరీష’ గుర్తొచ్చింది. కారు వీండోలోంచి వెళ్లిపోతున్న దృశ్యాల్లా.. ఒంగోలులో ఉన్నరోజులు కళ్లముందుకొచ్చాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా శిరీషతో పరిచయం. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒంగోలులో ఓ ప్రైవేట్ జాబ్ లో చేరా. శిరీష వాళ్ల నాన్నని కలిస్తే.. పెళ్లి కుదరదన్నాడు. నిజం చెప్పాలంటే కులం కుదరలేదు. తనని నాతో తీసుకెళ్లిపోవాలనుకుని.. ఒకరోజు రాత్రి తనని కలవడానికి వెళ్లా. అంతకుముందు ఎన్నో సార్లు అలాగే కలుసుకున్నా తనని. ఆ రోజు అంతా రివర్సైంది. గోడ దూకేటప్పుడు.. పక్కింట్లోంచి ఒకాయన చూశాడు. దొంగా దొంగా అంటూ పట్టుకోబోతుంటే.. పక్కనే దొరికిన కర్రతో ఒక్కటిచ్చి పారిపోయాను.

మరుసటి రోజు సాయంత్రం పోలీసులు నేరుగా మా ఆఫీస్ కొచ్చారు. రాత్రి నేను కొట్టిన వ్యక్తి చనిపోయాడంట. ఒక్కరోజులో అంతా తల్లకిందులైపోయింది. దొంగతనానికొచ్చి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశానని కేసు. శిరీష వాళ్ల నాన్నే సాక్ష్యం చెప్పాడు. తను నన్ను చూశానని. ఆ కాలనీలోని వాళ్ల కులపోళ్లంతా నా కేసుని ఓ ఉద్యమంగా మార్చారు. వాళ్ల చేతిలోని మీడియా నన్నో నరరూపరాక్షసుడిగా రాసింది. కోర్టులో నేనేం మాట్లాడలేకపోయాను. కావాలని తనని చంపలేదని.. తప్పించుకోడానికి మాత్రమే కొట్టి పారిపోయానని మాత్రమే చెప్పగలిగాను. ఓ మనిషి ప్రాణం తీశానన్న బాధో, పోలీసులు కొట్టిన దెబ్బల భయమో అంతకుమించి నన్ను మాట్లాడనివ్వలేదు. వీటన్నిటి కంటే మా అమ్మ కన్నీళ్లు నన్ను మరింత మౌనంగా మార్చాయి.

కులపంచాయతీ ముగిసి చివరికి తీర్పొచ్చింది.

ఏడేళ్లు.. ఏడు యుగాలు..

జైల్లో నేరస్తుల మధ్య నన్నో హాఫ్ క్రిమినల్ గా చూసుకునేవాణ్ని. అక్కడున్నవాళ్లు చేసిన నేరాలు, వాళ్లనుభవిస్తున్న శిక్షలు విన్నప్పుడల్లా.. నేను చేసిన పని పదేపదే గుర్తొచ్చేది. కొన్ని సార్లు నాకు సరైన శిక్షే పడిందనిపించేది. మరికొన్ని సమయాల్లో అసలు నేను తప్పు చేశానా అనిపించేది. కోర్టులకు అసలు నేరస్తుల్ని శిక్షించేంత అర్హత ఉందా.. ఎలాంటి ప్రభావాలకూ లొంగకుండాతీర్పులిచ్చే న్యాయమూర్తులుంటారా.. జవాబుల్లేని ఇలాంటి ప్రశ్నలెన్నో..! నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ని. ఒక్కోసారి నా కేసులో తీర్పు మార్చేసి ఉరితీస్తున్నట్లు కలొచ్చేది. మరోసారి కేసు రద్దుచేసి విడుదల చేస్తున్నట్టు. రెండిట్లో ఏది జరిగినా బాగుండనిపించేది. రెండూ జరగలేదు.

‘పోరాడేశక్తి ఉన్నవాళ్లు పైకోర్టుల్లో బేరమాడుతున్నారు. బేరమాడే శక్తి ఉన్నవాళ్లు నాణ్యమైన తీర్పు, నచ్చిన తీర్పు వచ్చేవరకూ పోరాడుతున్నారు. కోర్టుల్నే కొనేవాళ్లు తీర్పుని జీవితకాలం వాయిదావేయించుకుంటున్నారు. నాలాంటి ఏ కొందరో తీర్పుకి తలొంచుతున్నారు’.

జైల్లో పరిచయం అయిన చాలామంది.. వాళ్లు విడుదలయ్యేటప్పుడు, బైటకొచ్చాక కలవమని అడ్రస్ లు, ఫోన్ నంబర్ లు ఇచ్చేవాళ్లు. తెలిసో తెలియకో ఓసారి ఈ ప్రపంచంలోకి వచ్చా.. మళ్లీ ఇటు రాకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నా. జైలు నుంచే డిస్టెన్స్ లో పీజీ చేశా. విడుదలవడానికి కొద్దిరోజుల ముందు యాదగిరితో పరిచయమైంది. స్మగ్లింగ్ కేసులో జైలుకొచ్చాడు. తనే నరేంద్ర గురించి చెప్పాడు. హైదరాబాద్లో ఓ టీవీ చానల్ నడుపుతున్నాడని.. వెళ్లి కలవమని ఫోన్ నంబర్ ఇచ్చాడు.

‘హలో..’ అన్న పిలుపుతో నేనెక్కడున్నానో గుర్తొచ్చింది.

చేతులతో ఏదో మాట్లాడుతున్నాడు.. దిగమన్నట్టు.

కారు ఓ ఫామ్ హౌస్ ముందు ఆగి ఉంది. తను ముందు వెళ్తుంటే ఫాలో అయ్యా. లోపలకెళ్లాక కూర్చోమని సోఫా చూపించాడు. కేఫ్ దగ్గర్నుంచి చూస్తున్నా.. తను నాతో నోటితో మాట్లాడ్డం లేదు. చేతులతోనే సైగలు చేస్తున్నాడు. నాస్థాయి చూపించాలనో.. తన హోదా చూపించుకోవాలనో తాపత్రయం. నన్ను ఆఫీస్ కు కాకుండా ఇంతదూరం ఎందుకు తీసుకొచ్చాడో అర్ధం కావడం లేదు. బ్యాగ్ తీసి ముందుపెట్టుకున్నా. సర్టిఫికెట్స్ కోసం జిప్ తీయబోతుంటే..

నరేంద్ర మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ‘యాదగిరితో మాట్లాడాను. నీ గురించి చెప్పాడు. అసలిది.. తనే చేయాల్సిన పని..’

బ్యాగ్ జిప్ తీయడం ఆపేశా.

‘నీకు తెలిసిన పనే’. ఒక్కక్షణం ఆగాడు.

‘కాకపోతే అప్పుడు ఒక్కరు.. ఇప్పుడు ఇద్దరు.. నిజానికి ఒకటిన్నరే..’ వేళ్లతో మళ్లీ సైగ.

తనని తొలిసారి స్పష్టంగా చూశా. ముఖంలో తోడేలు పోలికలు. నవ్వుతున్నాడు కానీ అదేదో వికృతంగా అనిపించింది.

నాలో ఏ భావమూ లేదు. అలా చూస్తుండిపోయా.

తనే మళ్లీ.. ‘పెద్ద కష్టమేం కాదు’. టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకున్నాడు.

‘డర్టీ బిచ్.. నన్నే మోసం చేస్తుందా..’ వాటర్ తాగి నావైపు చూశాడు. తన కళ్లలో ఎరుపుజీరలు. వెంటనే నవ్వు. లేచి అటూ ఇటూ రెండడుగులేసి.. ఓ స్లిప్ నాముందు పెట్టాడు.

‘నా ఇంటి అడ్రస్. కింద పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ బెడ్ రూమ్’.

నా కళ్లలోకి సూటిగా చూస్తూ.. ‘దొంగతనానికి వచ్చినట్టుండాలి.. పని జరిగిపోవాలి’.

అంటూ వేగంగా లోపలికెళ్లి వెంటనే తిరిగొచ్చాడు.

నా ముందున్న అడ్రస్ స్టిప్ పై.. రెండు ఐదువందల నోట్ల కట్టలు పెట్టాడు. లక్ష రూపాయలు.

‘అంతా ఓకే అయ్యాక మళ్లీ కనిపించు’.

ఒక్కసారి నరేంద్రవైపు చూశా. వెంటనే స్లిప్ తో పాటు నోట్లకట్టలు తీసుకున్నా.. బ్యాగు జిప్ తీసి సర్టిఫికెట్ల పక్కనే సర్దేశా.

ఏదో విరిగిపోతున్న చప్పుడు.. మనస్సు అనుకుంటా..!

తను మళ్లీ మాట్లాడలేదు. రెండు నిమిషాల తర్వాత మళ్లీ కారులో బయల్దేరాం. అరగంట తర్వాత కేఫ్ దగ్గర దించేశాడు. తనవైపు చూడకుండానే దిగేశా. వెంటనే కారెళ్లిపోయింది నామీదకి పొగచిమ్ముతూ..

టైమ్ మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. నేరుగా హాస్టల్ కెళ్లి నా గదిలో పడుకున్నా. రూమ్ మేట్స్ పేకాడుతున్నారు. ఒకతను మాత్రం స్క్రూడ్రైవర్ తీసుకుని సీపీయూతో కుస్తీ పడుతున్నాడు. కాసేపు పడుకుందామంటే నిద్రపట్టడం లేదు. అమ్మ గుర్తొచ్చింది.

‘జైలు నుంచి రిలీజయ్యాక నేరుగా ఇంటికెళ్లా. నెలకోసారి జైలుకొచ్చి చూసే అమ్మకి నేనేం కొత్తకాదు. నాకు మాత్రం ఆ వాతావరణం కొత్తగా అనిపించింది. రెండు రోజులు కూడా ఉండలేకపోయా. ఒకప్పుడు నాకు బాగా తెలిసిన మనుషులే.. నన్ను వింతగా చూస్తున్నారు. వాళ్లు నన్ను దూరం పెడ్తున్నారో.. నేనే దూరంగా ఉంటున్నానో అర్ధం కాలేదు. అక్కడ ఉండలేనని స్పష్టంగా అర్ధమయ్యాక.. హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నా. జాబ్ చూసుకున్నాక తననీ తీసుకెళ్తానని చెప్పా. నమ్మకం కనిపించలేదు అమ్మలో. ముభావంగానే వెళ్లిరమ్మంది. ఇక్కడికొచ్చాక తొలి ఫోన్ నరేంద్రకు చేశా. తను లేటవుతుందని చెప్పాక.. డిగ్రీలో నాక్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారని తెలిసి, వాళ్లని కలవడానికి ప్రయత్నించా. ఒకడు ఫోన్లో నా పేరు విన్నవింటనే కట్ చేశాడు. మరొకడు చాలాసేపటి తర్వాత గుర్తుపట్టాడు. ఆరోజే తనని కలిశా. జాబ్ అన్నమాట విన్నతర్వాత వాడి మాటతీరులో మార్పొచ్చింది. సరే చూస్తానన్నాడు కానీ, మరుసటిరోజే నంబర్ మార్చేశాడు’.

chinnakatha

నరేంద్ర ఇచ్చిన అడ్రస్ స్లిప్ చేతిలోకి తీసుకున్నా. ‘మనిషిని చంపగలనా నేను. అందులోనూ స్త్రీని. అసలు డబ్బుతో పారిపోతే. ఏం జరుగుతుందో తెలుసు. మళ్లీ జైలుకే’. ఇక నిద్ర రాదనిపించింది.

స్లిప్ పర్స్ లో పెట్టుకుని హాస్టల్ నుంచి బైటకొచ్చా. మరో రెండు గంటల్లో అడ్రస్ పట్టుకున్నా. తను చెప్పిన ఆనవాళ్లున్న బిల్డింగ్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టా. మనుషులెవరూ కనిపించలేదు. తిరిగి హాస్టల్ కొచ్చా.

రాత్రి పదకొండుదాటింది. గదిలో కంటే నాలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుంది. సీపీయూ పార్ట్స్ పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకున్నా. మరో గంటలో నరేంద్ర ఇంటిముందున్నా. వర్షం వస్తుందేమో అన్నట్టున్నవాతావరణం చీకటిని మరింత చిక్కగా చేస్తోంది.

మెయిన్ గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లా. ఫస్ట్ ఫ్లోర్ లో అడుగుపెట్టా. ఎడమవైపున్న గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. డోర్ తీసే ఉంది. చప్పుడు చేయకుండా లోపలకు అడుగుపెట్టా. ఇద్దరూ నిద్రపోతున్నారు. మొదట నా చూపు బెడ్ మీద నిద్రపోతున్న పాపపై పడింది. ఆరేళ్ల వయసుంటుందేమో. మసక వెలుతురులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకో దగ్గరనుంచి చూడాలనిపించి కిందికివంగా. అద్దంలో నన్ను చూసుకున్నట్టు అనిపించింది. రెండు క్షణాల తర్వాత తల పక్కకి తిప్పా. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతున్న సెన్సేషన్.

”శిరీష”

నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. కళ్లు తిరుగుతున్న భావం. వెంటనే వెనక్కి తిరిగా. గదిలోంచి వేగంగా బైటకొచ్చేశా. మరో ఆలోచన లేకుండా దూరంగా పారిపోవాలి. మెట్ల వైపు వెళ్లేంతలో.. ఎదురుగా నరేంద్ర. ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. మరుక్షణం నా చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ నరేంద్ర కణతలోకి దూసుకుపోయింది. అంతే వేగంతో స్క్రూడ్రైవర్ బైటకు లాగి పరుగులాంటి నడకతో మెట్లుదిగి బైటకొచ్చా. క్షణాల్లో చీకట్లో కలిసిపోయా. లోపల్నించి అరుపులు వినిపిస్తున్నాయి. బైట వర్షం మొదలైంది.

 

రెండునెలల తర్వాత మూసీనది పక్కనే ఉన్న ఓ పార్క్ లో..

దూరంగా బెంచ్ పై కూర్చునుంది శిరీష. ప్రపంచంతో సంబంధం లేకుండా పాప ఆడుకుంటోంది. తననే చూస్తుండిపోయా. చిన్నప్పుడు నేనెలా ఉండేవాడినో అమ్మ చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి..!

 

*స్టోరీ నెవర్ ఎండ్స్*

మీ మాటలు

  1. Mula brahmaiah says:

    Good

  2. P.Jayaprakasa Raju. says:

    “పోరాడేశక్తి ఉన్నవాళ్లు పైకోర్టుల్లో బేరమాడుతున్నారు. బేరమాడే శక్తి ఉన్నవాళ్లు నాణ్యమైన తీర్పు, నచ్చిన తీర్పు వచ్చేవరకూ పోరాడుతున్నారు. కోర్టుల్నే కొనేవాళ్లు తీర్పుని జీవితకాలం వాయిదావేయించుకుంటున్నారు. ”

  3. చాలా బాగుందిర టైటిలె అదిరింది సమాజం గుడ్డిది మనిషికిహోదా డబ్భుని, కులాన్నీ బట్టి మాత్రమేఇస్తుంది. కాని నిజమైన విలువలు అవికావని తెలియదు. “సగంమనిషి”

  4. Y RAJYALAKSHMI says:

    ‘పోరాడేశక్తి ఉన్నవాళ్లు పైకోర్టుల్లో బేరమాడుతున్నారు. బేరమాడే శక్తి ఉన్నవాళ్లు నాణ్యమైన తీర్పు, నచ్చిన తీర్పు వచ్చేవరకూ పోరాడుతున్నారు. కోర్టుల్నే కొనేవాళ్లు తీర్పుని జీవితకాలం వాయిదావేయించుకుంటున్నారు. నాలాంటి ఏ కొందరో తీర్పుకి తలొంచుతున్నారు’. – నైస్

  5. నరేష్ నందం says:

    సమాజం దృష్టిలో నిందితుడెప్పుడూ నేరస్తుడే! ఏ నేరం చేశాడని దూరం పెడుతుందో.. సరిగ్గా అలాంటి అవసరమే తనకు కలగగానే ఆ వ్యక్తిని వెదుక్కుంటూ వస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. ఎక్కువ ప్రయోజనం ఆశ చూపి అదే నేరాన్ని మళ్ళీ మళ్ళీ చేయమని ప్రోత్సహిస్తుంది.

    సమాజంలో సగం మనుషులే ఉంటారు. మిగిలిన వాళ్లు ఆ సగం మనుషుల దృష్టిలో ఐడెంటిటీ లేని వ్యక్తులు. నేరస్తులు!

  6. కథా , కథనం బాగున్నాయి

  7. రవి బడుగు says:

    నా కథను ప్రచురించి ప్రోత్సహించిన సారంగ నిర్వాహకులకు, కథ చదివి అభిప్రాయాలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. కథకు మంచి చిత్రం గీసిన రఫీ గారికి స్పెషల్ థ్యాంక్స్.

  8. వనజ తాతినేని says:

    బావుంది. బాగా వ్రాసారు .

  9. subrahmanyam says:

    చాలా బాగుంది. స‌స్పెన్స్ బాగుంది

  10. Krishna Prasad says:

    కధనం బాగుంది .నిజానికి ఆ స్క్రూ డ్రైవర్ శివ కణతలో దిగాల్సింది .నరేంద్ర కణతలో దిగడమే బాధాకరం.

  11. Krishna Prasad says:

    కధనం బాగుంది.నిజానికి ఆ స్క్రూ డ్రైవర్ శివ కణతలో దిగాల్సింది.నరేంద్ర కణతలో దిగడం బాధాకరం.

  12. Hemalata.Ayyagari says:

    మంచి కధ.కధ చెప్పిన తీరు బాగుంది .

  13. Hemalata.Ayyagari says:

    మంచి కధ.చెప్పినతీరు చాలా బాగుంది

మీ మాటలు

*