తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

  375px-Statue_of_Kannagi

తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన సోదరుడైన చేర రాజ్యపు రాజు చేరన్ సెంగట్టువన్, వారి ఆస్థాన కవి శీతలై శాత్తనార్ లతో కలిసి కొండ ప్రాంతానికి వాహ్యాళికి రాగా ఆ ప్రాంతపు గిరిజనులు ‘ఒక యువతి తన భర్తతో కలిసి విమానంలో ఆకాశమార్గాన వెళ్ళడం చూశామనీ, ఆ వింత వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలగజేసిందనీ, ఆమె ఎవరో మీకు తెలిస్తే చెప్పండనీ’ ఆసక్తిగా అడిగారు.  

మధురానగరంలో కణ్ణగికి జరిగిన అన్యాయాన్ని అప్పటికే చారులు ద్వారా విన్నాడేమో మహాకవి శీతలై శాత్తనార్ ఆ యువతి పేరు కణ్ణగి అనీ, ఆమె భర్త పేరు కోవలుడనీ తెలిపి వారి వృత్తాంతాన్ని అందరికీ వివరంగా చెప్పాడు. అది విన్న ఇళంగో వడిగళ్ కణ్ణగీకోవలుల చరిత్రని శిలప్పదిగారం పేరుతో కావ్యంగా రచించాడు.

ఇళంగో జైనుడు అయినప్పటికీ ఈ కావ్యంలో శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ చేసిన వర్ణనలు ఆళ్వారుల భక్తి గీతాలని పోలి ఉన్నాయనీ, కొన్ని గీతాలలో నిసర్గ భక్తి భావం కనిపిస్తుందనీ అంటారు.   ఈ కావ్యంలో చాలా వరకు జానపద గేయ ధర్మాలు కనిపిస్తాయట. అన్ని మతాలను గౌరవించిన వాడిగా ఈ కావ్యకర్తని గౌరవిస్తారు తమిళులు.

శిలంబు అంటే గజ్జె. (అందియ, మంజీరం). అదిగారం అంటే అధ్యాయం. కాలి అందియ వలననే ప్రాణాలు కోల్పోయిన ఆ భార్యాభర్తల జీవితం గురించిన కథ కనుక ఈ శీర్షిక ఎంతో సముచితమైనదని అందరూ భావిస్తారు. ఈ కావ్యం పుహార్ కాండం, మధురై కాండం, వంజి కాండం అని మూడు కాండాలుగా విభజింపబడి ఉందిట. ఈ కావ్యం క్రీ.శ రెండవ శతాబ్దానికి చెందినది. ఈ కథ చోళ, పాండ్య, చేర రాజ్యాలకి సంబంధించినది. చోళ రాజ్యంలో పుట్టి, పాండ్య రాజ్యంలో తన భర్త ప్రాణాలు కోల్పోగా చేర రాజ్యానికి చేరి అక్కడ తన భౌతిక కాయాన్ని త్యజించిన ఈ కావ్య నాయకి కణ్ణగి చరిత్ర పవిత్రమైనదిగా పేరొందింది.

ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎమ్ ఎ – తెలుగులో ఈ కావ్య చరిత్ర ని పాఠ్యాంశంగా చదువుకున్నప్పటినుండీ ఈ కథని చాలా మందికి చెప్పాను. ఈ కథని వినని సారంగ పాఠకులకు కూడా పరిచయం చేయాలనిపించి ఆ కథని సంగ్రహంగా రాశాను.   ఇప్పటికే చాలా మందికి ఈ కావ్య విశేషం, విశిష్టతల గురించి తెలిసి ఉండవచ్చు. వారు వారి అభిప్రాయాలని పంచుకోవలసిందిగా కోరుకుంటున్నాను.

                                                        కథాసంగ్రహం

1.

చోళ చక్రవర్తులలో గొప్పవాడైన కరికాలచోళుని రాజధాని పుహార్ పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రముఖ వ్యాపారి కుమార్తె కణ్ణగి. రూపంలో, గుణంలో ఈమెకి ఈమే సాటి. ఆమెకి పెళ్ళీడు రాగానే తల్లిదండ్రులు ఆమెకి తగిన వరుణ్ణి వెతకసాగారు. ఆ నగరంలోనే ఉన్న మరో వ్యాపారి కొడుకైన కోవలుడుని తన కుమార్తెకి తగిన వరుడిగా నిర్ణయించారు. ఓ శుభ ముహుర్తాన కన్నుల పండుగగా కణ్ణగిని కోవలునకిచ్చి వివాహం జరిపించారు. కణ్ణగీకోవలులు అన్యోన్యంగా జీవించసాగారు.

చోళ చక్రవర్తి అయిన కరికాలచోళునికి కళలంటే అత్యంతాసక్తి. ప్రతి ఏడాదీ చేసే ఇంద్రోత్సవాల్లో భాగంగా ఆ ఏడు ఆస్థాన నర్తకి మాధవి అనే అతిలోక సౌందర్యవతి నాట్య ప్రదర్శన ఇచ్చింది.

కరికాలచోళుడు ఆమె నాట్యానికి మెచ్చి ఆకుల హారాన్ని, బంగారు నాణాలని బహుకరించి సత్కరించాడు. ముందు వరుసలో కూర్చుని ఆమె నృత్యాన్ని తిలకిస్తున్న కోవలుడు ఆమె రూపానికి పరవశుడైనాడు. అతని మనసు పూర్తిగా ఆమె సౌందర్యానికి దాసోహమయిపోయింది. అతని మనసులో కణ్ణగిపై ఉన్న ప్రేమానురాగాలు మాయమై మాధవి పట్ల మోహంగా అవతరించాయి.   నాట్య ప్రదర్శనయ్యాక ఇంటికి బయలుదేరిన కోవలునకి ఒక ప్రకటన వినిపించింది.

“చక్రవర్తి గారు మాధవికిచ్చిన హారాన్ని వేలం వేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారో వారికి మాధవి ప్రియురాలవుతుంది” అన్నదే ఆ ప్రకటన. కామ పరవశత్వంతో ఒళ్ళెరగని కోవలుడు ఆ హారాన్ని కొని మాధవి ఇంటికి వెళతాడు. కణ్ణగిని మర్చిపోయి పూర్తిగా మాధవికి వశుడవుతాడు.

తన భర్త వేశ్య వలలో చిక్కుకున్నాడని తెలిసిన కణ్ణగి శోక మూర్తియై రోదించసాగింది.

imgNdKannagi_01

మాధవిని కోవలుడు, కోవలుడిని మాధవి ఒక్క నిమిషమైనా ఎడబాయకుండా ఉన్నారు. మాధవి వేశ్య అయినా కోవలుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. వారి ప్రేమానురాగాల ఫలితంగా వారికి ఒక అమ్మాయి జన్మించింది. కూతురికి మణిమేఖల అని పేరు పెట్టుకున్నారు. కోవలుడు వ్యాపారాన్ని విస్మరించి మాధవితోనే కాలం గడపడం వలన అతని వ్యాపారం దెబ్బతింది. కుమార్తె పుట్టేనాటికే అతనికి ఉన్నదంతా, ఆఖరికి తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వారిచ్చిన నగలతో సహా ఊడ్చిపెట్టుకుపోయింది.

కోవలుడి సంపదంతా ఎప్పుడైతే కరిగిపోయిందో అప్పుడు మాధవి తల్లి చిత్రావతి కోవలుడిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కూతురికి చెప్పుడు మాటలు చెప్పడం, కోవలుడిని నిందావాక్యాలతో బాధ పెట్టడం పనిగా పెట్టుకుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండటం వలన ఆమె మాటలు పట్టించుకునే వారు కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ ఏడు చోళ రాజ్యంలో జరుపుకునే ఇంద్రోత్సవం పండుగనాడు మాధవీ కోవలులు సముద్రస్నానానికి వెళ్ళారు. స్నానమయ్యాక ఇసుకతిన్నెల మీద సేద తీరుతూ విశ్రమించారు. చల్లని సముద్రపు గాలి వారి మేనులను సృశిస్తోంది. ఆ వెన్నెలలో మాధవి మనోహర రూపం కాంతులీనుతోంది. కోవలునకి ఆమెని ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు. ఆ సమయంలో మాధవి అతన్ని ఓ పాట పాడమని కోరింది.

“ప్రేయసీ! నీ రూపం నన్ను దహించి వేస్తుంది. నువ్వు నన్ను వరించకపోతే నేను ఈ విరహాగ్నికి ఆహుతినై పోవడం నిజం” అనే అర్థం వచ్చేట్లు ఓ విరహగీతాన్ని ఆలపించాడు.

‘అతను ఎవరి కోసం ఈ పాట పాడుతున్నాడు? ఎవరా ప్రేయసి?’ అన్న అనుమానం ఆమెని పట్టి పీడించసాగింది. అయితే ఆమె తన అనుమానాన్ని వ్యక్తపరచలేదు. కొంచెం సేపయాక కోవలుడు మాధవిని పాడమన్నాడు. అనుమానం తద్వారా అసూయాద్వేషం తో మండుతున్న ఆమె మనసుకి అతన్ని రెచ్చగొట్టాలనిపించింది. అతను పాడిన దానికంటే ఎన్నో రెట్లు ప్రేమని కురిపిస్తూ ‘తను పాత ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లూ, పూర్వం ఈ సైకత శ్రేణుల్లో ప్రియునితో కలిసిన రోజులను గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ ఆ మధురమైన క్షణాలు రావేమోనని దిగులు పడుతున్నట్లూ’ పాడింది.

ఆ పాటని విన్న కోవలుని హృదయం ఒక్కసారిగా బద్దలైనట్లనిపించింది. మాధవి తల్లి చిత్రావతి మాటలకి వేదనాభరితుడై ఉన్న కోవలుడు మాధవి పాడిన పాటతో తల్లడిల్లాడు. ‘ఈమెని నా దేవతగా ఆరాధించాను. ఈమె కోసం నన్నే నమ్ముకున్న నా భార్యని, నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని మరిచాను. వ్యాపారాన్ని నాశనం చేసుకుని బికారినైనాను’ అని అనుకోసాగాడు. ఆలోచించే కొద్దీ అతనిపై అతనికి అసహ్యం కలగసాగింది.

ఒక్క ఉదుటున కూర్చున్న చోటునుండి లేచి మాధవిని చీదరగా చూస్తూ అక్కడ నుండి నిష్క్రమించాడు. అతని కోపాన్ని, ఆవేశాన్ని, అసహ్యాన్ని కనిపెట్టిన మాధవి తను చేసిన పనికి పశ్చాత్తాప పడసాగింది. శోకతప్తహృదయినిగా మారింది.

3.

 

సౌందర్య దేవతగా ఉండే కణ్ణగిని శోకదేవతగా చూసిన కోవలుని హృదయం ద్రవించింది. ఆమెని పట్టుకుని విలపిస్తూ తన దైన్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. మాధవికి ఇవ్వడానికి ఏమీ లేదని విచారిస్తున్నాడనుకున్న కణ్ణగి “దిగులు పడకండి నా దగ్గరున్న ఈ మంజీరాలను తీసుకెళ్ళి ఆమెకివ్వండి” అంటూ తన కాలికున్న విలువైన అందెలను తీసి ఇవ్వబోయింది.

భార్య అన్న ఆ మాటలతో అతను మరింత సిగ్గుతో చితికిపోయాడు. భార్యకి క్షమాపణలు చెప్పుకుని “ధనవంతుడిగా బ్రతికిన ఈ రాజ్యంలో పేదవాడిగా ఉండలేను. మధురానగరానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనం సంపాదించి తల్లితండ్రులను, అత్తమామలను కలుసుకుంటాను. పద బయలుదేరు” అన్నాడు. భర్త మాటకు ఏనాడూ జవదాటని కణ్ణగి అతని మాటలకి ఆనందభరితురాలై ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. దారి మధ్యలో సత్రాల దగ్గర, ఆరామాల దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటూ మధురానగరం వైపుకి నడవసాగారు.

ఇక్కడ మాధవి కోవలుని కోసం రేయంబవళ్ళు విలపిస్తోంది.   రోజులు గడుస్తున్నా అతను రాకపోవడంతో తనని క్షమించమని కోరుతూ ఉత్తరం రాసి నమ్మకమైన బ్రాహ్మణునకిచ్చి కోవలునకి అందజేయమని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు కోవలుడు మధురానగరానికి బయలుదేరాడని తెలుసుకుని వేగంగా ప్రయాణించి మార్గమధ్యంలో కలుసుకుని ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరాన్ని చదువుకున్న కోవలుడు “బ్రాహ్మణోత్తమా! నా అవివేకంతో మాధవిని అనుమానించి బాధపెట్టాను. త్వరలో వస్తానని చెప్పండి. నా తల్లిదండ్రులకి కూడా ఈ విషయాన్ని చెప్పండి” అని ముందుకు సాగాడు.

దారిలో కౌంతి అనే జైన యోగిని ఆశ్రమంలో విశ్రాంతి కోసం ఆగారు. కౌంతి యోగిని వారి గురించి తెలుసుకుంది. వారికి సహాయం చేయాలని ఆమెకెందుకనిపించిందో మరి ‘ముందంతా దుర్గమమైన అరణ్యమనీ, మంచి మార్గం తనకి తెలుసనీ, తాను కూడా మధురానగరానికి తోడుగా వస్తాననీ’ అంది.   అడక్కుండానే ఆమె చేస్తున్న ఆ సహాయానికి కణ్ణగీకోవలులు అనేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రాత్రికి ఆమె ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు.

అందమైన ప్రదేశాలను, ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలారావాలను, దారిలో కానవచ్చే పల్లెపడుచుల ఆదరాభిమానాలను, వారు పాడుతున్న పల్లెపదాలను చూస్తూ, వింటూ కౌంతి యోగిని దారి చూపుతుండగా ఆమెని అనుసరించసాగారు కణ్ణగీకోవలులు.

వైఘనదిని దాటుకుని కొన్నాళ్ళకి క్షేమంగా మధుర మీనాక్షి కొలువై ఉన్న మధురానగరానికి చేరుకున్నారు. కౌంతి యోగిని శిష్యురాలైన మాధురి ఇంట్లో బస చేశారు. మాధురి వీళ్ళను ఆదరంగా ఆహ్వానించి భార్యాభర్తలు ఉండటానికి తగిన ఇంటిని, కావలసిన సామగ్రిని ఇచ్చింది.

ఆరోజు చాన్నాళ్ళ తర్వాత తన భర్తకి తన చేతులతో వంట చేసి వడ్డించింది కణ్ణగి. కోవలుడు తృప్తిగా భోంచేశాడు. కోవలుడు మాధవికిచ్చి కాజేయగా మిగిలి ఉన్న కణ్ణగి కాలి అందెల్లో ఒక దాన్ని అమ్ముకుని, వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలని వారిద్దరూ సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రించారు.

మర్నాడు కౌంతి యోగినికి అనేక వందనాలు సమర్పించుకున్నాడు కోవలుడు. కణ్ణగి ఇచ్చిన మంజీరాన్ని తీసుకుని ఆమెకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.   భార్య దగ్గర సెలవు తీసుకునేప్పుడు ఎందుకో తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహించసాగాయి.   కణ్ణగి కూడా వీడ్కోలు పలుకుతూ దు:ఖానికి లోనయింది.   కోవలుడు తన వేదనని అణచుకుని భార్యని ఓదార్చాడు, ఆమెని వదలలేక వదలలేక వెళ్ళిపోయాడు.

పాపం ఆ రోజు అతను వెళ్ళకుండా ఉన్నట్లయితే అతని ప్రాణాలు నిలిచేవేమో!! కాని విధిని మార్చడం ఎవరి తరం!!?

temple

4.

పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలమది. పాండ్య రాజులు రాజ్యంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రాజుగారికి విన్నవించుకోవడానికి రాజస్థాన ప్రాంగణంలో ఒక గంటను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ గంటను మ్రోగిస్తే మహారాజే స్వయంగా వారికి జరిగిన అన్యాయాన్ని గురించి విచారించేవారు. దానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించేవారు.

ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ మహారాజు నెడుంజెళియన్ కే ఇప్పుడొక సమస్య వచ్చింది. రాణిగారి అంత:పుర మందిరంలోనే దొంగతనం జరిగింది. రాణి కొప్పెరుందేవి తన నగలని మెరుగు పెట్టించడానికి నగల పెట్టెను కొన్ని మాసాల క్రితం ఆస్థాన స్వర్ణకారుడికి ఇచ్చింది. ఆ స్వర్ణకారుడు నగలకి మెరుగు పెట్టి వెంటనే పెట్టెను తిరిగి ఆమెకి ఇచ్చాడు. ఆమె వాటిని పరిశీలించకుండా అలా ఉంచేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె కాళ్ళకి అందెలు ధరించాలని నగల పెట్టె తెరిచి చూడగా ఒక మంజీరం కనిపించలేదు. రాణిగారికి కంసాలి మీదే అనుమానంగా ఉంది. నిజంగానే ఆ మంజీరాన్ని స్వర్ణకారుడు కాజేసి వెంటనే అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. నెడుంజెళియన్ స్వర్ణకారుడిని పిలిపించి “వారం రోజులలో అందియని దొంగిలించిన దొంగ ఎవరో తెలియాలి లేకపోతే నిన్ను శిక్షించి నిజాన్ని బయటికి రాబట్టక తప్పదు” అంటూ హెచ్చరించాడు.

ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో కోవలుడు మధురానగరంలో స్వర్ణకారులుండే వీధికి వచ్చాడు. విధి వైపరీత్యం చూడండి ఎలా నడుస్తున్నదో!!! అదే సమయంలో ఆ ఆస్థాన స్వర్ణకారుడు తన అనుచరులతో కలిసి నడుస్తూ కోవలుడికి ఎదురు వచ్చాడు.

కోవలుడు ఆ కంసాలికి నమస్కరించి “నేను ఈ దేశానికి కొత్తవాడను. వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఈ నగరానికి వచ్చాను. నా దగ్గరొక విలువైన మంజీరమున్నది. దానికి వెలకట్టగలరా?” అని అడిగాడు. స్వర్ణకారుడు సరేననగానే కోవలుడు తన అంగీలోని మంజీరాన్ని తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే స్వర్ణకారుడి కళ్ళు మెరిసిపోయాయి. తన అదృష్టానికి అతని మనశ్శరీరాలు ఉప్పొంగిపోయాయి – కారణం – ఆ మంజీరం అచ్చంగా రాణి గారి మంజూషం లో నుండి తాను కాజేసిన మంజీరం లాగా ఉండటమే….

కోవలుడిని దోషిగా నిలబెట్టాలని మనసులో నిర్ణయించుకున్న కంసాలి కోవలుడిని తన ఇంట్లో కూర్చుండబెట్టి తన అనుచరులతో వెళ్ళి రాజుని కలుసుకున్నాడు. “ప్రభూ! దొంగ దొరికాడు. అతడు అంత:పురంలో చొరబడి మంజీరాన్ని కాజేశాడు. నాకే అమ్మజూపాడు. వీళ్ళంతా సాక్ష్యం” అన్నాడు అతని అనుచరులను చూపుతూ.

కోపోద్రేకుడైన రాజు సైనికులని పిలిపించి “అతనెవరో… అతని దగ్గరున్న మంజీరం రాణి గారిదేనా అని నిర్థరించుకుని, రాణి గారిదే అయితే ఆ దుర్మార్గుడిని వధించండి” అని ఆజ్ఞాపించాడు. సైనికులు కంసాలి ఇంటి వరండాలో కూర్చుని ఉన్న కోవలుని దగ్గరున్న మంజీరాన్ని తీసుకుని పరీక్షించారు. అది రాణిగారి మంజీరాన్ని పోలి ఉండటంతో అతన్నే దొంగగా నిర్ణయించి ఒక్క వేటుతో అతని తలని నరికారు. రక్తసిక్తమైన అతని శరీరం వీధిలో పడి ఉంది.

ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ జరిగిన విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆలయంలో పూజ చేసుకుని తిరిగి వస్తున్న మాధురికి సంగతి తెలిసింది.   చూసిన జనం వర్ణిస్తున్న దాన్ని బట్టి అతను కోవలుడేమోనన్న అనుమానంతో ఆ స్వర్ణకారులున్న వీధిలోకి వెళ్ళి చూసింది. విగతజీవుడై పడి ఉన్న కోవలుడుని చూడగానే దిగ్భా్రంతి చెంది పరుగు పరుగున ఇంటికి చేరి విషయాన్ని కణ్ణగికి తెలిపింది. “కోవలుడిని వధించారు” అన్న వార్త వినగానే కణ్ణగి స్పృహ కోల్పోయినట్లుగా కూలబడిపోయింది. కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. భర్తను తల్చుకుని దు:ఖిస్తున్న ఆమె తన భర్తపై అన్యాయంగా దొంగతనం మోపి వధించారన్న విషయం గుర్తొచ్చి కోపావేశంతో లేచింది. కళ్ళ నుండి అగ్ని కణాలను కురిపిస్తూ ఇంటి లోపలకి వెళ్ళి రెండవ మంజీరాన్ని చేతిలో ఉంచుకుని భూమి కదిలిపోయేట్లుగా నడుస్తూ నగరం వైపుకి సాగింది.   జనం గుంపులు గుంపులుగా ఆమెని అనుసరించసాగారు.

వీధిలో పడి ఉన్న భర్త శవాన్ని కౌగలించుకుని కణ్ణగి హృదయవిదారకంగా ఏడవసాగింది. అక్కడున్న జనం నిజమా, భ్రమా అని విభ్రమంతో చూస్తుండగా నిర్జీవుడై పడి ఉన్న కోవలుడు లేచి కూర్చుని భార్యని ఓదార్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. భర్త భౌతికకాయాన్ని అక్కడే విడిచి కణ్ణగి ఆవేశంతో ఊగిపోతూ రాజస్థానానికి బయలుదేరింది. అక్కడ జరిగిన మహిమని గమనించిన జనం ఆమెని వదలకుండా వెంబడించారు.

5.

కణ్ణగి నేరుగా వెళ్ళి సభామంటపం లోని గంటను మో్రగించింది. ఆ గంటను విన్న రాణి కొప్పెరుందేవి భయభ్రాంతురాలై పరుగున రాజు దగ్గరికి వచ్చి “స్వామీ! నిన్న ఆ మంజీరం నా మందిరం చేరినప్పటినుండీ నా మనస్సు కీడు శంకిస్తోంది. మన రాజ్యం నశించిపోయినట్లుగా రాత్రంతా పీడకలలు. ఇప్పుడే నా చెలికత్తెలు వార్తని మోసుకొచ్చారు. ఏం జరగబోతుందోనని నాకు భయంగా ఉంది” అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే సైనికుడొకడు వచ్చి “ప్రభూ! ఎవరో స్త్రీ. చేతిలో కాలి అందెను పట్టుకుని రౌద్ర రూపంతో ఉంది. ఆమె భర్తని అన్యాయంగా హత మార్చారని ఆరోపణ” అన్నాడు. ఆశ్చర్యపోయిన నెడుంజెళియన్ “ఆమెని ప్రవేశపెట్టండి!” అన్నాడు.

కణ్ణగి సభలోకి వచ్చింది. జుట్టు ముడి వీడి శిరోజాలు చిందరవందరగా భుజాల మీద పరుచుకుని ఉన్నాయి. కట్టుకున్న చీర మట్టిగొట్టుకుని ఉంది. ముఖమంతా కన్నీటి చారికలతో తడిసి ఉంది. ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టులా కళ్ళు ఎర్రగా మారి నిప్పుకణాలను వెదజల్లుతున్నాయి. దయార్థ్రహృదయుడైన నెడుంజెళియన్ ఆమెని చూసి ఆవేదన చెందాడు. “తల్లీ! నీవెవరు? నీకు జరిగిన అన్యాయమేమిటి?” అన్నాడు.

“నా పేరు కణ్ణగి. మాది చోళ దేశం లోని పుహార్ పట్టణం. వ్యాపారం చేసుకోవాలని ఈ దేశానికి వచ్చాం. పెట్టుబడికి డబ్బు కోసం నా పెళ్ళిలో నా తల్లిదండ్రులు నాకిచ్చిన మంజీరాలలోనొకదానిని నేను స్వయంగా నా భర్తకిచ్చాను. అన్యాయంగా దొంగ అని నింద వేసి నా భర్తని హత్యగావించిన నువ్వు దోషివి” అంది వేలెత్తి చూపుతూ. “సాక్ష్యాధారాలు దొరికాయి కనుకనే నీ భర్తకి దండన విధించాము” అన్నాడు రాజు.

“కాదు నా భర్త నిర్దోషి. నిరూపించడానికే వచ్చాను. ఇదిగో ఇది నా రెండవ కాలి మంజీరం. ఇప్పుడు చెప్పండి, మీ మంజీరం లోపల ఏమున్నాయి?” అంది కణ్ణగి ఆవేశంగా తన కుడి చేతిలో ఉన్న మంజీరాన్ని ఎత్తి చూపిస్తూ.

“మా మంజీరంలో ముత్యాలున్నాయి” అన్నాడు నెడుంజెళియన్.

“అయితే తెప్పించండి, నా భర్త నుంచి మీరు తీసుకున్న మంజీరాన్ని పరీక్షించండి. నా మంజీరంలో రత్నాలున్నాయి” అంది. రాజు అజ్ఞ మేరకు సేవకుడు మంజీరాన్ని తెచ్చాడు. దాన్ని చూడగానే అది తనదే అని గుర్తించిన కణ్ణగి మంటలా ప్రజ్వరిల్లుతూ “ఓ రాజా! ఇది నా మంజీరం.   కావాలంటే చూడండి, ప్రజలారా చూడండి” అంటూ మంజీరాన్ని లాక్కున్నట్లుగా తీసుకుని నేల మీదకి విసిరి బద్దలు కొట్టింది. మంజీరం పగిలి లోపల ఉన్న రత్నాలు చెల్లాచెదురుగా సభామంటపం అంతా పడ్డాయి. కొన్ని రత్నాలు నెడుంజెళియన్ ముఖాన, సభాసదుల ముఖాన పడ్డాయి.

పాండ్య చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. భీతి శరీరంలో చేరి కడుపును దోసిళ్ళతో దేవినట్లయింది. అతనికి భరించలేని వేదన మూలుగు రూపంలో హృదయం నుండి మెదడుకి ప్రాకి మతి చలించింది. “అయ్యో! పాండ్య వంశానికే కళంకం కలిగింది. అపరాధిని నేనపరాధిని” అని పలవరిస్తూ సింహాసనం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు. కాళికలాగా ఉన్న కణ్ణగి స్వరూపాన్ని చూస్తూ నిశ్శేష్టురాలైన కొప్పెరుందేవి తన భర్త ప్రాణాలు కోల్పోగానే కణ్ణగి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. భర్త శవం పై పడి రోదించి రోదించి కొంత సేపటికి తన ప్రాణాలను కూడా వదిలివేసింది. రాజు, రాణి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలందరూ దు:ఖసాగరంలో మునిగిపోయారు.

కణ్ణగికి మాత్రం తన ఆవేశం చల్లారలేదు. తనను తాను శిక్షించుకోవడానికేమో తన ఎడమరొమ్ముని నరుక్కుని   మీదికి విసిరి “నేను పతివ్రతనే అయితే దుష్టరాజు పరిపాలించిన ఈ మధురానగరం తగులపడిపోవాలి” అని శపించింది.

మరుక్షణం రాజభవనంలో మంటలు వ్యాపించాయి. నగరం తగలపడసాగింది. ప్రజలు భయంతో మీనాక్షి అమ్మవారి ఆలయానికి పరుగులు తీశారు. మధురకి తల్లి అయిన మీనాక్షీదేవి కణ్ణగి ఎదుట ప్రత్యక్షమై “కణ్ణగీ! పాండ్యరాజులు ధర్మస్వరూపులు. నెడుంజెళియన్ ఉత్తముడు. నీ భర్తకి ఈ గతి పట్టడానికి కారణం పూర్వజన్మఫలం. శాంతించు. అగ్నిని ఉపసంహరించుకో. ఇప్పటినుండి సరిగ్గా పదునాలుగు దినాల్లో నువ్వు నీ భర్తని దివ్యలోకాల్లో కలుసుకుంటావు” అని పలికింది. ఆ దేవి ఆజ్ఞ ప్రకారం కణ్ణగి అగ్నిదేవుడిని ప్రార్థంచి అగ్నిని ఉపసంహరించుకోమని కోరింది కాని ఆమెకి మనశ్శాంతి కలగలేదు. ఆవేదన తీరలేదు.

వేశ్యావలలో చిక్కుకున్న భర్త కోసం ఏళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తన దగ్గరకి చేరుకున్న భర్తతో సుఖంగా ఉందామనుకుని ఎంతో ఆశ పడ్డ ఆమె భాధని వర్ణించడం ఎవరి తరం?

6.

ఇక ఆ నగరంలో ఉండలేక వైఘనదీ తీరాన్ని వెంబడిస్తూ పడమరగా ప్రయాణించింది కణ్ణగి. ఆమెకి ఆకలిదప్పులు లేవు. పగలేదో రాత్రేదో తెలియలేదు. అవిశ్రాంతంగా అలా ప్రయాణించిన ఆమె పద్నాలుగో రోజుకి చేర దేశానికి చేరింది.   పర్వతప్రాంతాలలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోనికి వెళ్ళి స్వామికి నమస్కరించింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నేరేడు చెట్టు మొదట్లో కూలబడింది.

ఆ ప్రాంతపు గిరిజనులు పొలం పనులకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆకాశంలో నుండి మిరుమిట్లు గొలుపుతూ దేవ విమానం కిందికి దిగింది. ఆ విమానంలో నుండి సుందరాకారుడైన యువకుడు చేయినందివ్వగా నేరేడు చెట్టు కింద నిలబడిన యువతి అతనే చేయందుకుని విమానమెక్కింది. విమానం గాలిలోకి లేచి మెల్లమెల్లగా అదృశ్యమైపోయింది. అది చూసిన ఆ గిరిజనులు అబ్బురపడ్డారు. ఆ దృశ్యాన్ని వర్ణించి వర్ణించి చెప్పుకోసాగారు. ఆ సమయంలోనే చేర రాజు అక్కడకి రావడంతో గిరిజనులు రాజుని దర్శించుకుని జరిగిన వింతని తెలియపరిచారు. మహాకవి శాత్తనార్ కణ్ణగీకోవలుల చరిత్రని చేర రాజుకి, ఆ గిరిజనులకి చెప్పి, ఇళంగో వడిగళ్ ని ఆ కథని కావ్యంగా రచించమని అడిగాడు.

ఆ పతివ్రతా శిరోమణి కథను విన్న సెంగట్టువన్ ఆమెకి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తనే స్వయంగా హిమాలయాలనుండి శిలను తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని తయారు చేయించాడు. వంజి నగరంలో దేవాలయాన్ని నిర్మించి మంత్రి సామంతులు, బంధుమిత్రులతో కూడి పురోహితులు మంత్రోచ్ఛారణ జరుపుతుండగా శాస్త్రోస్తకంగా ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. చోళ, పాండ్య, చేర రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. దివ్యభూషణమనోహరాకారంతో కణ్ణగి అక్కడున్న వారి ముందు సాక్షాత్కరించి అందరినీ దీవించింది.

ఆమెను దర్శించుకున్న వాళ్ళకి, ఆమె కథని విన్న వాళ్ళకి సుఖ సంతోష ఆయరారోగ్యాలు కలుగుతాయని పురోహితులు ఆశీర్వచనాలు పలికారు.

 

-రాధ మండువ

12513_1465986130323886_882400752089238785_n

 

 

 

 

 

Tamil Arts. Silapathikaram – Beautiful sculptures of Poombukar Art Gallery, Tamil Nadu, India. కింద లింక్ లో చూడండి. మొత్తం కథని చదివినట్లే ఉంటుంది.

మీ మాటలు

 1. N Venugopal says:

  శిలప్పదిగారం తెలుగులోకి రెండు మూడు అనువాదాలు వచ్చాయి. వాటిలో సుప్రసిద్ధమైనది కళ్యాణ మంజీరాలు పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1980-81ల్లో ప్రచురించింది. నిజానికి అంతకు ముందే కౌముది గారు (అఫ్సర్ తండ్రి) ఆ తమిళ నవలకు హిందీ అనువాదం ఆధారంగా స్వతంత్రంగా తెలుగులో ఒక నవల రచించారు. దాని పేరు కళంకిని అని గుర్తు.

 2. అఫ్సర్ గారు అన్నారు వేణుగోపాల్ గారూ కళ్యాణమంజీరాల పేరుతో న్బ్ట్ వాళ్ళు వేశారని. HBT వాళ్ళేమోనని మరోకరు అనడంతో ఫోన్ చేసి అడిగాము. స్టాక్ లేదన్నారట. పబ్లిక్ లైబ్రరీలో దొరుకుతుందేమో వెతికితే….. నెటలో చాలా విషయం దొరికింది. చాలా కష్టమే అయింది నాకు ఇది రాయడానికి.

 3. కొండంత కావ్యాన్ని అందమైన మణిగా మలిచారండి. ఎంతో ప్రయాసతోకూడిన పనిని అతిశ్రద్దగా తెలుగులో కథగా రాసినందుకు జోహార్లు!

  తమిళ పంచకావ్యాలలో ప్రధానమైన శిలప్పదిగారం నాకు పదేళ్ళప్పుడు వీధి నాటక రూపంలో పరిచయం అయింది. పదకొండో తరగతిలో శిలప్పదిగారంలోని కొన్ని పద్యాలు పాఠ్య పుస్తకంలో చదివాను. ఇలంగో పద్య సౌందర్యం నన్ను ఆకట్టుకోగా లైబ్రరీనుండి శిలప్పదిగారం తెచ్చుకుని కావ్యమంతా చదివాను. టీవీలో సీరియల్ గా వచ్చినప్పుడు చూశాను. మాజీ ముఖ్యయమంత్రి కరుణానిధి రాసిన పూంబుహార్ పుస్తకం, మరియూ సినిమా చూశాను.

  శిలప్పదిగారంలోని పద్యసంపద మాటల్లో చెప్పలేనిది.

  Hats to your effort !! _/\_

  • ఆహా! అదృష్టవంతులు మీరు భాస్కర్ గారూ… చదివారు. నేను నెట్ లో చూసి, మా పాఠాలల్లో చదివి రాశాను. అయితే చాలా కష్టపడ్డాను లెండి. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

 4. Whenever we go to Madurai, Kannagi haunts me.Can we get Kalyaana Manjeeraalu now?very good write up Radhagaru.

  • దొరికితే అంతకంటే కావలసినదేముందు ఇందిర గారు… లైబ్రరీల్లో వెతకాలి

 5. శిలప్పదిగారం కథా పరిచయం బాగుందండి,. దీనిలో వేంకటశ్వర స్వామి గురించి గీతాలు లేవండి. విష్ణుమూర్తి(తిరుమాల్ ) కాళీకాదేవి, శ్రీకృష్ణుడు, గురించి వున్నాయి.అంతే కాకుండా బెస్తవారి పాటలు, దంపుళ్లపాట, బంతిపాట, అచ్చనగాయల పాట, రైతుల పాటలు( విత్తు చల్లేవి, కలుపు తీతలు, కోతపాటలు) ఇలాంటివన్ని వున్నాయి. జైనాన్ని స్తుతించడం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఒక్క బౌద్దం గురించి మాత్రమే ప్రస్తవన వుండదు., దీనికి జంట కావ్యంగా చెప్పే మణి మేఖల పూర్తిగా బౌద్దాన్ని కీర్తిస్తుంది. ఈ పంచ మహా కావ్యాలలో రెండు బౌద్దాన్ని(మణి మేఖల, కుండలకేశి), రెండు జైనాన్ని ( జీవక చింతామణి, వళ్లై యా పతి) సమర్థిస్తూ సాగుతాయి. శిలప్పదిగారం ఒక్క దానిలోనే మనకు హిందూ భావజాలం కనిపిస్తుంది. ఇవి తరువాత ఏమన్నా చేరాయేమో మరి.
  కణ్ణకి కథ విన్న చేర రాజు, భర్త కోసం వెంటనే ప్రాణాలు వదిలిన పాండ్య రాణి, భర్త కోసం మధురైని నాశనం చేయబోయిన కణ్ణకిలలో ఎవరు గొప్ప వారు అని తన భార్యను ప్రశ్నిస్తే, ఆమె కణ్ణకి యే గొప్పది అని చెప్పడంతో ఆమెకు ఆలయం నిర్మిస్తాడు.
  కవి ఇళంగో అడిగళ్ కణ్ణకి గురించి కావ్యం రాస్తే, ఇతని అన్న(చేర రాజు) ఆమె పేర కావ్యదేవాలయం నిర్మిస్తాడు. నిజానికి ఇళంగో అతని అన్నకి రాజ్యాధికారం కోసమే జైన సన్యాసి గా మారతాడట.
  ఈ కథలో కణ్ణకి ధరించేవి బంగారు మంజీరాలు కావడం చేత, ఇక ఆ తరువాత ఆ ప్రాంతంలో (ఇప్పుడు మన రాష్ట్రాలలోనైనా) బంగారంతో చేసిన గజ్జెలు ధరించడం నిషిద్దంగా మారిపోయిందటారు. అంతే కాకుండా కణ్ణకి మధురైని శపించిన శుక్రవారం ఆడవారు గుడికి వెళ్లే ఆచారం మొదలైందట.
  కణ్ణకీకోవలులు వర్తక కుటుంబానికి చెందటం వలన ఈ గాథ వారికి అత్యంత పవిత్రమైనదిగా మారిందంటారు( వాసవీ కన్యకా పరమేశ్వరి లా)
  మాధవి ఆస్థాన నర్తకి కాదు, తన అరంగేట్రం జరిగిన సందర్భంగా (రంగాధిరోహణోత్సవము) మొదటి సారి కోవలుడు తనను చూస్తాడు.

  • చాలా సంతోషం భాస్కర్ గారూ, మీ దగ్గర కళ్యాణమంజీరాలు నవల ఉందా? మీరు జెరాక్స్ తీసి పంపగలరా ప్లీజ్? చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు

 6. బాగుందండి. శిలప్పదిగారం కధ. పసుపులేటి కన్నంబా గారు కన్నగిగా నటించిన తమిళ సిని మా చూశాను. కళ్యాణ మంజీరాలు నవలగా చదివాను. ఈ నవల స్ర్తీ వాద దృక్పదంతో రాసింది. రచయిత ఎవరో గుర్తులేదు. అందులో మాధవి కోవలన్‌ భార్య అంతస్థు కోసం నిరంతరం తాపత్రాయ పడుతుంది. అమె ఎంత ఘర్షణ పడినా చివరికి అమె వేశ్యగానే మిగిలి పోతుంది. నవల పూర్తిగా మాదవి కోణం నుండే రాయ బడింది. మీరు పూర్తి కధ తెలిపినందుకు ధన్య వాదాలు.

 7. Thank you తిరుపాలు గారు

 8. ఫ్రెండ్స్ – ఈ వ్యాసంలో ఒక స్పెల్లింగ్ తప్పు దొర్లింది – నిశ్చేష్టురాలయ్యింది ఉండాలి …. >>నిశ్శేష్టురాలు>> అని పడింది. క్షమాపణలు

 9. శిలప్పదికారం, మణిమేఖల రెండిటికీ పూతలపట్టు వారు చాలా గొప్ప అనువాదాలు వ్రాశారు. మొదట తెలుగు అనువాదాలు ఆయనవే అనుకుంటా!

  శిలప్పదికారం కి “అందియకత” అని అందమైన పేరు పెట్టారు. మణిమేఖలని అదే పేరుతో వ్రాశారు.

  నా చిన్నప్పుడు, “ఉపాసన” పేరుతో దూరదర్శన్ లో సీరియల్ వచ్చేది. అది ఈ రెండు కథలూ కలిపి తీశారు….

  • కౌటిల్య గారూ, మీ దగ్గర కాపీలు ఉన్నాయా?

   • ఉన్నాయండీ! పీడీఎఫ్ కూడా ఉన్నాయి. అందియకత 1952 లో వ్రాశారు శ్రీరాములుగారు. 1957 లో తితిదే వాళ్ళు మొదటి ముద్రణ వేశారు.

 10. N Venugopal says:

  కళ్యాణ మంజీరాలు తెలుగు ప్రతి దొరికిందండీ. అది అమృత్ లాల్ నాగర్ హిందీలో రాసిన సుహాగ్ కె నూపుర్ కు కౌముది తెలుగు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1983 లో ప్రచురించింది

  • సార్, సార్, దాన్ని నాకు జెరాక్స్ చేసి పంపగలరా ప్లీజ్ నా అడ్రస్ – రాధ మండువ, రిషీవ్యాలీ స్కూల్, రిషీవ్యాలీ స్కూల్ విలేజ్ పోస్ట్, మదనపల్లి, చిత్తూరు జిల్లా, పిన్ – 517352.. మీరు vpp ద్వారా పంపితే నేను మనీ పే చేసి తీసుకుంటాను వేణుగోపాల్ గారూ…. ధన్యవాదాలు

   • N Venugopal says:

    రాధ గారూ,

    రేపు ఒక సభ కోసం పలమనేరు వస్తున్నాను. అక్కడికి మదనపల్లి నుంచి ఎవరో ఒకరు వస్తారు గదా, పుస్తకమే తెచ్చి వాళ్లకిస్తాను. లేదా పలమనేరు బాలాజీకి ఇస్తాను, మీకు ఎలాగో చేరుస్తాడు. మీరు చదివాక పంపుదురు గాని.

 11. ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ..

 12. కల్లూరి భాస్కరం says:

  కథ అద్భుతంగా చెప్పారు రాధగారూ…చాలా ఏళ్ల క్రితం దూర దర్శన్ కోసం తను తీసిన భారత్ ఎక్ ఖోజ్ లో శ్యాం బెనెగల్ ఈ ఘట్టాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. ఆ సీరియల్ ప్రసారమైనప్పుడల్లా ఆ ఘట్టాన్ని కన్నార్పకుండా చూసేవాణ్ణి. సాధారణంగా నాకు నటుల పేర్లు గుర్తుండవు. కాని కణ్ణగి పాత్ర వేసిన పల్లవి జోషి పేరు గుర్తుండి పోయింది. ఆమె ముఖం కూడా ఇప్పటికీ నా కళ్ళముందు కదులుతోంది. కోవలన్ పాత్ర వేసిన నటుడు కూడా అంతే ముచ్చట గొలుపుతాడు. మీ కథనం కూడా ఇంచుమించు బెనెగల్ చిత్రీకరణకు దీటుగా ఉందనిపించింది. ఈ కథ ఆద్యంతం ఏదో విషాదం ఆవరించి ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతోపాటు ఏదో నిసర్గ సౌందర్యం కూడా. క్రీస్తుశకం తొలి శతాబ్దాల సాహిత్యాన్ని ప్రత్యేకంగా చూడాలి. అనంతర కాలపు సంస్కృత సాహిత్య సంప్రదాయాలకు భిన్నంగా ఆ సాహిత్యం ఉంటుంది.
  చూడగానే వ్యాసం పేరే కొంచెం తికమక పెట్టింది. శిలప్పదికారం పంచ కావ్యాలలో ఒకటనచ్చు కానీ పంచ కావ్యం అనకూడదేమో!

 13. శిలప్పదిగారం పరిచయం చాలా బావుందండి

 14. కళ్యాణ మంజీరాలు 1990 లో చదివాను. తిరుపాలు గారు చెప్పినట్లు అది స్త్రీ వాద దృక్పధంతో రాసింది. అందులో కణ్ణగి పాత్ర కు అంత ప్రాముఖ్యత లేదు, మాధవి కున్నంతగా. ఒకే విషయాన్ని చూసే చూపులో ఎంత తేడా ఉందో చూడండి.

  • వేణుగోపాల్ గారు పుస్తకం పంపించారండీ… చదువుతాను రమాసుందరి గారూ…. స్పందించినందుకు ధన్యవాదాలు

 15. Syamala Kallury says:

  నైస్ and

 16. Syamala Kallury says:

  చాలా బాగుంది. సమగ్రం గా ఉంది. దిన్ని ఆంగ్ల్ంలోకి ప్రో. ఆర్ పార్థసారథి గారు పద్యానువాదం చేసారు. గ్రీకు భాష లో వచ్చిన ఆన్తిగోనె చదివితే చాలా పోలికలు కనిపిస్తాయి ఆ సమయంలో దాదాపు ఒకే సమయంలో వచ్చిన ఐ రెండూ స్త్రీ ప్రధానమైన, సామాజిక స్పృహ కలిగిన నాన్ రిలీజియస్ గ్రంధాలు. తనకిజరిగిన అన్యానికి ఆమె కోపానికి ఎంత నైతికబలముందో తెలిపే గ్రంధం ధన్యవాదాలు రాధగారు.

 17. Chimata Rajendra Prasad says:

  1964 -65 లో 12 తరగతి చదివేటప్పుడు మాకు తెలుగులో నాన్ డిటైల్డ్ టెక్స్ట్ బుక్ గా మంజీర గాథ పేరుతో ఈ పుస్తకం చదివాము. రచన ఎవరో గుర్తు లేదు.

 18. గోర్ల says:

  రాధ గారు చాలా బాగా రాశారు. గత కాలపు జానపద గీతాలు, అప్పటి సామాజిక స్థితి గతులు ఎట్లా ఉన్నాయో పద్యాల ద్వారా తెలుసుకునే ఛాన్సు ఉంది ఈ బుక్కు ద్వారా.

  • అవును సార్, తమిళులు దీని గురించి, దీనిలోని విశేషాలు గురించి రాసే ఉంటారు. తమిళం, తెలుగు రెండూ తెలిసిన వాళ్ళు ఈ కథను వివరంగా రాస్తే బావుండు కదా! మీకు నమస్కారాలు మరియు ధన్యవాదాలు

 19. S. Narayanaswamy says:

  కొండని అద్దంలో చూపించడానికి కొండ ముందు అద్దం పట్టుకుని నిలబడితే సరిపోతుంది, కానీ ఒక మహా కావ్యాన్ని, అందులోనూ వేరే భాష కావ్యాన్ని సంక్షిప్తంగా, హత్తుకునేట్టు చెప్పడం అంత సులభమైన పని కాదు. చాలా చక్కగా రాశారు. వ్యాఖ్యలు కూడా బహు చక్కగా ఉన్నాయి,

  • నారాయణస్వామి గారూ, అయ్యో, మీరు చదివారనుకున్నాను సార్. ఫేస్ బుక్ లో నా వాల్ మీద చాలా మంచి వివరణలు ఇచ్చారు మన భాస్కర్ గారు. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

 20. msk krishnajyothi says:

  ఫైన్ వర్క్ అక్కా

 21. శ్రీ వరిగొండ సత్యనారయణ మూర్తి అనువదించిన ‘కోవలన్-కన్నకి ‘ పుస్తకం నా దగ్గర ఉంది. దీన్ని 1954 లో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించారు. ఇది రెండవ ముద్రణ. మొదటి ముద్రణ సం.1941. దీనికి ముందు మాట రాసిన ఏ .యస్ .పి.అయ్యర్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తి కరంగా ఉంది. ”నాటక కర్త పాశ్చాత్యుడై ఉండినచో కథ విషాదాంతముగా ముగిసియుండెడిది. అసలు మన భారత దేశమున మానవ జీవితము శోకపూరితము. ఖేదాంతములగు నాటకములు దుశ్చేష్టల కభ్యుదయ మిచ్చి దిద్రుక్షువులను ధుఃఖసాగరమున ముంచును. కర్తకు రచనాకౌశల్యము చాలమింపజేసియే, కథను విషాదముతో నంతమొందింపవలసి వచ్చినదని జనులు తలంపసాగిరి. అది కారణముగ నీకథ శుభాంతముగ ముగింపబడినది”.

  • రాధ మండువ says:

   Thank you బోల్డ్ బాలు గారూ.. నేను ఇన్నిరోజులూ ఈ కామెంట్స్ చూసుకోలేదు సారీ… డౌన్ లోడ్ చేసుకుని పుస్తకం చదువుతాను. థాంక్ యు సో మచ్.

 22. eng translation is also available. The Silappadikaram V R Ramachandra Dikshitar
  http://www.dli.gov.in/

 23. పాండిచేరి లో చదువుకొనే రోజుల్లో కణ్ణగి గాధ గురించి తెలుసుకొన్నాను. ఎంతగా గుర్తుండి పోయిందంటే మా అమ్మాయికి మణిమేఖల అని పేరు పెడదామనేంత. (కోరిక తీరలేదనుకోండి అది వేరే విషయం)
  చాలా బాగా వ్రాసారు మేడమ్. ధన్యవాదాలు

  • రాధ మండువ says:

   థాంక్ యు సార్, కామెంట్ చూసుకోలేదు నేను. చాలా సంతోషంగా ఉంది మీ స్పందనకి. ఇంతకీ పాప పేరు ఏం పెట్టారు? :)

 24. శిల‌ప్ప‌దిగారం ను గూడ‌వ‌ల్లి రామ‌బ్ర‌హ్మం సినిమాగా తీశారు. సినిమా పేరు ప‌త్ని. 1942లో విడుద‌లైన‌ది. అంత‌కు ముందే అది త‌మిళంలో వ‌చ్చింది. మూకీల కాలంలోనే శిల‌ప్ప‌దికారం తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి.
  రాధ‌గారు రాసిన ప్ర‌కారం కోవ‌లుణ్ణి త‌ల న‌రికి చంపుతారు. ప‌త్ని సినిమాలో దాన్ని మార్చి ఉరి తీసిన‌ట్టు తీశారు. సామాజిక చైత‌న్యం ఉన్న గూడ‌వ‌ల్లికి ఈ పాయింటు న‌చ్చింది. ఓ అమాయ‌కుణ్ణి నిర‌ప‌రాధిని అన్యాయంగా ఉరితీయ‌డం అనేది క‌నెక్ట్ అయ్యి సినిమా తీసేశారు. కోవ‌ల‌న్ గా ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి ఆ త‌ర్వాత రోజుల్లో ప్రేమ‌న‌గ‌ర్ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలు తీసిన కె.ఎస్ ప్ర‌కాశ‌రావు న‌టించారు.
  క‌ణ్ణ‌గిగా ఋష్యేంద్ర‌మ‌ణి న‌టించింది. ఋష్యేంద్ర‌మ‌ణి ముక్కు చాలా ఫెమినిస్టిక్ గా ఉంటుందండి. ఆత్మ‌విశ్వాసం క‌నిపించేలా ఉంటుందా ముక్కు. మాయాబ‌జార్ లో ఘ‌టోత్క‌చుడి మీదకు విల్లెక్కు పెట్టే స‌మ‌యంలో ఋష్యేంద్ర‌మ‌ణిని చూడండి… అవ‌త‌ల వాడు ఎవ‌డైనా స‌రే యు హౌమ‌చ్ అన్న‌ట్టుంటుంది. మ‌రి భ‌ర్త‌ను అన్యాయంగా చంపిన వారి మీదకు క‌ద‌లిన‌ప్పుడు ఋష్యేంద్ర‌మ‌ణి న‌ట‌న ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.
  అనుకొన్న‌దే త‌డ‌వుగా నిర‌ప‌రాధుల్ని ఉరులు తీయ‌డం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వ వ‌ర్గాలు త‌మ‌కు వ్య‌తిరేక వాద‌న‌ను ముందుకు తెచ్చే వారిని ర‌క‌ర‌కాల పేర్ల‌తో హ‌త‌మార్చ‌డంగానే దీన్ని చూడ‌చ్చు. ఏది ఏమైనా శిల‌ప్ప‌దికారం ప‌రిచ‌యం చేసినందుకున్నూ, ఫేసుబుక్కు ద్వారా న‌న్ను ఇక్క‌డ‌కు పంపినందుకున్నూ రాధ గారికి ధ‌న్య‌వాదాలు.

 25. రాధ మండువ says:

  థాంక్ యు భరద్వాజ గారూ… ఈ పత్ని సినిమా ఆన్ లైన్లో కాని యు ట్యూబ్ లో కాని దొరకడం లేదండి. తమిళ సినిమా మాత్రం ఉంది. మీ స్పందన చాలా సంతోషం కలిగించింది. కృతజ్ఞతలు

మీ మాటలు

*