కాండీడ్

 

9వ అధ్యాయం

 

ఇసాకర్ హిబ్రూ తెగవాడు. కోపం ముక్కుమీదే ఉంటుంది. ఇజ్రాయెల్ ను బాబిలోనియా చెరపట్టినప్పట్నుంచి ఇజ్రాయెల్ లో అంతటి ముక్కోపి మరొకడు లేడని ప్రతీతి. క్యూనెగొండ్ పై తన శనివారపు హక్కును చలాయించుకోవడానికి లోనికి అడుగుపెట్టగానే పక్కపైన యువజంట సరసమాడుతూ కనిపించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

‘ఓసి.. రంకుముండా! ఆ మతపెద్దగాడితో నీ కామదాహం తీరలేదన్నమాట. ఇక నేను నిన్ను వీడితోనూ కలసి  పంచుకోవాలన్నమాట? ఈ గుంటవెధవకు తగిన బుద్ధి చెబుతాలే..’ అని రంకె వేశాడు.

అస్తమానం తెగ వేలాడేసుకుని తిరిగే బారెడు ఖడ్గాన్ని సర్రున ఒరలోంచి దూసి నిరాయుధుడైన కాండీడ్ పైకి ఉరికాడు. పరిస్థితి గమనించిన ముసలమ్మ చప్పున కాండీడ్ చేతికి అందమైన కరవాలంతోపాటు, ఒళ్లు కప్పుకోవడానికి బట్టలు కూడా అందించింది. సకల సద్గుణసంపన్నుడైన కాండీడ్ ఒక్క వేటుతో శత్రువును నేలకూల్చాడు. ఇసాకర్ అందాల క్యూనెగొండ్ కాళ్ల దగ్గర పడిపోయి ప్రాణాలు విడిచాడు.

‘అయ్యో, మేరీమాతా! ఇప్పుడు మాకేం మూడనుందో..! నా ఇంట్లో ఖూనీ జరిగిపోయింది. రక్షకభటులొస్తే ఇక మనపని ఖతం..’ అందగత్తె భయపడిపోయింది.

‘మన మహాతత్వవేత్త పాంగ్లాస్ ను ఉరితీయకుండా ఉండుంటే ఈ గడ్డు సమయంలో మనకు చక్కని సలహాలు ఇచ్చుండేవాడు కదా. ఆయన లేడు కనక ఈ ముసలమ్మను సలహా అడుగుదాం’ అన్నాడు కాండీడ్.

ములసమ్మ కూడా తెలివితేటలు గలదే. ముందుచూపున్నదే. పడచుజంటకు ఏం చెయ్యాలో చెప్పడం మొదలుపెట్టగానే రహస్య ద్వారం తెరచుకుంది. అప్పటికి అర్ధరాత్రి ఒంటిగంట దాటిపోయి అదివారం వచ్చేసింది కనక మతవిచారణాధికారి క్యూనెగొండ్ పై, ఆ ఇంటిపై తన హక్కును అనుభవించడానికి వచ్చాడు. తాను కొరడా దెబ్బలు కొట్టించిన యువకుడు చేతితో కత్తితో నిల్చుని ఉండడం, కింద చచ్చిపడున్న యూదు, కలవరపడుతున్న క్యూనెగొండ్, సలహాలిస్తున్న ముసలమ్మ కనిపించడంతో ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

ఆ విపత్కర పరిస్థితిలో కాండీడ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. ‘ఇప్పుడు వీడు ఇదంతా చూసి సాయం కోసం కేకలు వేస్తే.. తర్వాత నన్ను సజీవదహనం చేయించడం ఖాయం. క్యూనెగొండ్ కూ అదే గతి పడుతుంది. ఈ దుర్మార్గుడు నన్ను క్రూరంగా చావగొట్టించాడు కనక వీడు నాకు బద్ధశత్రువు. పైనా నేనిప్పుడు ఎలాగూ చంపడం మొదలుపెట్టాను కనక, ఆలోచించే వ్యవధి కూడా లేదు కనక.. ఏ రకంగా చూసినా వీణ్ని చంపిపారేయడమే ఉత్తమమని తోస్తోంది’ అనుకుంటూ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు.

మతాధికారి ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే కాండీడ్ మెరుపు వేగంతో కదిలి అతణ్ని హతమార్చాడు. యూదు పీనుగ పక్కన మరో పీనుగ పడిపోయింది.

‘ఇంకో హత్యా? ఇక మనకు పూర్తిగా మూడినట్టే. ఇక మనల్ని ఎవరూ దయదల్చరు. చావు ముంచుకొచ్చినట్టే. కాండీడ్! నీ వంటి మంచిమనిషి రెండే రెండు నిమిషాల్లో రెండు ఖూనీలు చేయడమా?’ ప్రేయసి కలవరపడింది.

‘ఓసి నా ముద్దుగుమ్మా! ప్రేమోన్మాదం తలకెక్కినవాడు అసూయ, ఉద్వేగంతో ఏం చేస్తాడో అతనికే తెలియదు. మతవిచారణలో కొరడా దెబ్బలు కూడా తిని ఉంటే ఇక చెప్పక్కర్లేదు’ తన పనిని సమర్థించుకున్నాడు ప్రియుడు.

ముసలమ్మ తక్షణ కర్తవ్యం గుర్తుచేసింది.

‘కొట్టంలో మూడు జాతిగుర్రాలు జీన్లు, కళ్లేలు తగిలించి సిద్ధంగా ఉన్నాయి. వీరాధివీరుడైన మన కాండీడ్ వాటిని తీసుకురావాలి. అమ్మగారు నగలూ నాణేలూ మూటగట్టుకు రావాలి. తర్వాత మనం ముగ్గురం గుర్రాలెక్కి కేడిజ్ కు పోదాం. నేను ఈ నా ఒంటిపిర్రెపైనే తిప్పలుపడుతూ ఎలాగోలా దౌడు తీస్తాలే. పదండి త్వరగా వెళ్దాం. వాతావరణం హాయిగా ఉంది. ఈ చల్లని రాత్రివేళ ప్రయాణం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.’

కాండీడ్ వెంటనే గుర్రాలను సిద్ధం చేశాడు. ముగ్గురూ ఏకధాటిగా ముప్పై మైళ్లు ప్రయాణించారు. వాళ్లు శషభిషలు పడకుండా వెంటనే పారిపోవడం మంచిదే అయ్యింది. వాళ్లు అటు వెళ్లీ వెళ్లగానే మతపెద్ద సహచరులు, రక్షకభటులు ఇంట్లోకొచ్చారు. తమ ఉన్నతాధికారిని సుందరతరమైన చర్చిలో గౌరవప్రదంగా ఖననం చేసి, యూదును మాత్రం పెంటకుప్పపైన పడేశారు.

కాండీడ్, క్యూనెగొండ్, ముసలమ్మ.. సియెరా మోరేనా కొండల మధ్య ఉన్న అవసెనా అనే చిన్నపట్టణానికి చేరుకున్నారు. ఓ సత్రంలో గది తీసుకుని కబుర్లలో మునిగిపోయారు.

pic

 

10వ అధ్యాయం

 

‘నా నగలు, డబ్బులు ఏ దొంగముండాకొడుకు ఎత్తుకుపోయాడు? అయ్యో దేవుడా, ఇక మేమేం చేసేది? ఎట్టా బతికేది? అసలు బతకడం దేనికీ అంట? అలాంటి ఖరీదైన నగానట్రా ఇచ్చే మతపెద్దలు, యూదులు మళ్లీ నాకెక్కడ దొరుకుతారు?’ క్యూనెగొండ్ దీర్ఘాలు తీస్తూ, కన్నీళ్లు ధారలు కడుతూ ఏడుస్తోంది.

‘నిన్న రాత్రి మనం బడజాజ్ లో దిగిన సత్రంలో మనతోపాటే బస చేసిన సన్యాసే కాజేసి ఉంటాడనుకుంటాను. అయితే ఇలా తొందరపాటు నిర్ణయానికి రావద్దనుకోండి. కానీ, అతగాడు మన గదిలోకి రెండుసార్లు వచ్చి తచ్చాడి వెళ్లాడు. పైగా మనకంటే ముందుగానే వెళ్లిపోయాడు కూడా’ ముసలమ్మ అనుమానం వెళ్లగక్కింది.

‘అలాగా!  ఈ ప్రపంచంలోని వస్తువులు అందరూ పంచుకోవడానికే ఉన్నాయని, వాటిపై అందరికీ సమాన హక్కు ఉంటుందని మన పాంగ్లాస్ ఎన్నోసార్లు రుజువు చేశాడు. ఆ వాదన ప్రకారం ఆ దొంగసాధువు కూడా తనకు కావాల్సింది తీసుకుపోయి, మన ప్రయాణానికి అవసరమైంత డబ్బును మిగిల్చిపోయే ఉంటాడు. నీ దగ్గరి కొంచెం డబ్బు కూడా లేదా క్యూనెగొండ్?’ కాండీడ్ కారణలీలా విలాసాన్ని విశ్లేషించి అడిగాడు.

‘నాయాపైసా కూడా లేదు! ’ ప్రేయసి కస్సుమంది.

‘అయితే మనమిప్పుడు ఏం చెయ్యాలి?’ అడిగాడు.

‘ఇక చేసేదేముంది? ఒక గుర్రాన్ని అమ్మిపారెయ్యడమే! నేను అమ్మగారి గుర్రంపైన వెనక కూర్చుంటా. ఒంటి పిర్రెతోనే ఎలాగోలా తూలిపోకుండా సర్దుకుంటాను. ఎలాగైనా సరే ముందు మనం త్వరగా కేడిజ్ కు చేరాలి’ ముసలమ్మ సలహా ఇచ్చింది.

ఆ సత్రంలోనే బసచేసిన బెనెడిక్ట్ మతాధికారికి ఓ గుర్రాన్ని కారుచవగ్గా అమ్మేశారు. తర్వాత ఎలాగోలా లూసెనా, చిలాస్, లెబ్రిస్కాల మీదుగా కేడిజ్ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఓ సత్రంలో చిన్నపాటి స్పానిష్ సైనిక పటాలం తిష్టవేసింది. అది పరాగ్వేకు పోతోంది. పరాగ్వేలో శాన్ శాక్రమెంటో దగ్గర్లోని స్థానిక తెగను స్పెయిన్, పోర్చుగల్లు రాజులపై తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టిన జెస్యూట్లకు బుద్ధిచెప్పడానికి వెళ్తోంది. కాండీడ్ క్షణమాలస్యం చెయ్యకుండా దళాధిపతి వద్దకు వెళ్లి బల్గర్ల సైన్యంలో తాను నేర్చుకున్న కవాతూ గట్రా సైనిక విన్యాసాలను పొల్లుపోకుండా ప్రదర్శించాడు. అతని వేగం, చురుకుదనం, క్రమశిక్షణ, తెలివితేటలు, వినయవిధేయతలు చూసి దళాధిపతి అతణ్ని పదాతిదళ నాయకుడిగా నియమించాడు. కాండీడ్ కెప్టెన్ అయిపోయాడు! క్యూనెగొండ్ ను, ముసలమ్మను, ఇద్దరు సేవకులను, తన చేతిలో హతమైపోయిన లిస్బన్ మతపెద్దకు చెందిన రెండు జాతిగుర్రాలను వెంటబెట్టుకుని ఓడలో పయనమయ్యాడు.

ప్రయాణం సాంతం పాంగ్లాస్ సిద్ధాంతంపై చర్చోపచర్చలు సాగించారు.

‘మనం కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. అక్కడ ప్రతీదీ ముమ్మాటికీ సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మన ప్రపంచంలో కొనసాగుతున్న ప్రాపంచిక, నైతిక వ్యవహారాలు ఎవరికీ ఆమోదయోగ్యంగా లేవు కనక’ అన్నాడు కాండీడ్.

‘కాండీడ్.. ప్రియతమా! నిన్ను మనసారా ప్రేమిస్తున్నా.. అయితే నేను చూసిన, అనుభవించిన దారుణాలు గుర్తుకొస్తే చాలు ఒళ్లు జలదరించిపోతోంది సుమా..’ క్యూనెగొండ్ వణికింది.

‘భయపడకు. అంతా చక్కబడుతుందిలే! ఈ కొత్త ప్రపంచం చుట్టూ ఉన్నఈ సముద్రాన్ని చూడు. మన యూరప్ సముద్రంకంటే ఎంతో బావుంది కదూ! అలలూ, గాలులూ తేడా లేకుండా మౌనంగా ప్రశాంతంగా. సందేహం లేదు. ఇది నిజంగా నవలోకమే! సృష్టిలోని ప్రపంచాల్లో ఇదే సర్వోత్తమ ప్రపంచం!’ సముదాయించాడు ఆశాజీవి.

‘భగవంతుడి దయవల్ల అలాగే సాగని. కానీ నేనెంత దుదరదృష్టవంతురాలిని, ఒక్కటీ సవ్యంగా జరగలేదు కదా! నా ఆశలన్నీ అడుగంటి పోయాయి’ నిట్టూర్చింది జవరాలు.

అంతా విని ముసలమ్మ అందుకుంది.

‘మీ కష్టనష్టాలు విన్నాక, అవి నేను అనుభవించిన వాటికంటే పెద్దవేం కాదనిపిస్తోంది’ అంది.

ఆమె తనకంటే దౌర్భాగ్యురాలినన్నట్టు చెప్పడం క్యూనెగొండ్ కు తమామాషా అనిపించి, నవ్వు తెప్పించింది.

‘చాల్చేలేవమ్మా, పెద్ద చెప్పొచ్చావుగాని! నిన్ను ఇద్దరు బల్గర్ సైనికులు చెరిచేసి, నీ కడుపులో కత్తితో రెండు తీవ్రగాయాలు చేసి, పల్లెలోని నీ రెండు భవంతులను కూల్చేసి, నీ తల్లిదండ్రులను నీ కళ్లముందే ఖండఖండాలుగా నరికేసి, నువ్వు ప్రేమించిన ఇద్దరిని బలిజాతరలో కొరడాలతో నెత్తురుకారేలా చావగొట్టి ఉంటేనే తప్ప, నువ్వు నాకంటే దుదృష్టవంతురాలివి కాబోవు! పైగా నేను తొంభై తొమ్మిది అవిచ్ఛిన్న తరాల వంశంలో, జమీందారు ఇంట్లో పుట్టి వంటలక్కగా బానిస బతుకూ బతికానాయె.. ’ క్యూనెగొండ్ ఏకధాటిగా మాట్లాడి, ముసలమ్మను ఎగతాళి చేసింది.

 ‘అమ్మా! మీకు నా పుట్టుపూర్వోత్తరాలు బొత్తిగా తెలియవు. నా వీపుకింది భాగాన్ని మీకు చూపిస్తే, మీరిలా ఎగతాళి చెయ్యరు. పైగా ఇలా మాట్లాడినందుకు ఎంతో నొచ్చుకుంటారు కూడా’ అంది ముసలమ్మ.

పడచుజంటకు ఆమె మాటలు ఆసక్తి రేకెత్తించాయి. ముసలమ్మ తన గాథ మొదలుపెట్టింది.

 

(సశేషం)

( ఈ నవలను ఈ వారంతో ఆపేస్తున్నాం. ఇది ఇకపై http://kalasahiti.blogspot.in/ లో కొనసాగుతుంది.)

మీ మాటలు

  1. చందు - తులసి says:

    మోహన్ గారూ…కథ మంచి ఆసక్తికరంగా సాగుతోంది. ఇక్కడ పాఠకులకు సశేషం అంటేనే కోపం వస్తుంది. అలాంటిది మీరు నవలనే ఆపేయడం న్యాయమా. సరే ఇక నుంచి ఆ బ్లాగ్ లోనే చదువుతాము. థాంక్యూ.

మీ మాటలు

*