టర్కీ ప్రభుత్వంతో ‘ట్రోజన్ వార్’

 

స్లీమన్ కథ-18

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఎటు తిరిగినా అడ్డంకులే. మైసీనియా చుట్టుపక్కల బందిపోట్ల బెడద ఎక్కువగా ఉందన్న కారణం చూపించి అక్కడ తవ్వకాలకు గ్రీకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫ్రాంక్ కల్వర్ట్ ను చూస్తే, తీవ్ర అనారోగ్యంతో తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సాయం చేయగల స్థితిలో లేడు. సోఫియా ఇంకా అస్వస్థంగానే ఉంది.  స్లీమన్ ఈలోపల ట్రయాడ్ లో తన పది రోజుల సాహసం గురించి కొల్నిషో సైతూంగ్ కు రాశాడు. యజమానుల అనుమతి లేకుండానే ఆ దిబ్బ మీద తను తవ్వకాలు జరిపిన సంగతిని కూడా బయటపెట్టాడు. టర్కిష్ అధికారులు ఆ కథనాన్ని చదివారనీ, తన చర్యను తప్పు పట్టారనీ అతనికి తెలిసింది. ఎథెన్స్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం తప్ప ప్రస్తుతానికి చేయగలిగిందేమీ అతనికి కనిపించలేదు.

అతను అమితంగా ద్వేషించేది ఒక్కటే, పనీపాటా లేకుండా గడపడం. ఫ్రాంక్ కల్వర్ట్ ఎందుకిలా మొండికేసాడనుకుంటూ అసహనానికి లోనయ్యాడు. ఆ ఇద్దరు టర్కులకూ వంద పౌండ్లు చెల్లించి వాళ్ళ భూమిని కొనాలనుకున్నాడు. కానీ వాళ్ళు పడనివ్వలేదు. ఇంకో తెలివి తక్కువ ప్రతిపాదన కూడా చేశాడు. అంతకన్నా తక్కువకు బేరం కుదిర్చితే, ఆ మిగిలిన మొత్తాన్ని మీకు వదిలేస్తానని కల్వర్ట్ కు రాశాడు. ఆ భూమి ఎప్పుడైతే తన సొంతమైందో, అప్పుడు తవ్వకాలు నిరాటంకంగా జరుగుతాయనీ; ఏటా మూడు మాసాలు తను అక్కడే గడుపుతూ, అయిదేళ్లలో అక్కడి శిథిల నిర్మాణాల చుట్టూ ఉన్న చెత్తను తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడానికి కూడా తను సిద్ధపడగలననీ-ఏవేవో ఊహించుకున్నాడు.

అలా ఊహలతోనే రోజులు భారంగా గడుస్తున్నాయి. తీవ్ర నిరాశానిస్పృహలు స్లీమన్ ఉత్సాహాన్ని అణగదొక్కుతున్నాయి. కల్వర్ట్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పిస్తూ అదేపనిగా ఊదరగొడుతున్నాడు. టర్కిష్ ప్రభుత్వంతో మాట్లాడి పని జరిగేలా చూడమని ప్రాధేయపడుతున్నాడు. ప్రతి ఉత్తరాన్నీ, “మీరు దయతో అందించబోయే సానుకూల సమాచారం కోసం అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటా”నని ముగిస్తున్నాడు. అయితే, కల్వర్ట్ చేయగలిగిందేమీ లేదు, చేయాలన్న సుముఖతా ఆయనలో లేదు. తమ జాగాలో పెద్ద పెద్ద కందకాలు తవ్వించిన స్లీమన్ మీద ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతున్న టర్కులిద్దరూ సహకరించే స్థితిలో అసలే లేరు.

అంతలో వేసవి అడుగుపెట్టి, స్లీమన్ నిరీక్షణకు తాత్కాలికంగా తెరదించింది. తవ్వకాలకు అది ఎటూ అనువైన సమయం కాదు. స్లీమన్ తిరిగి పారిస్ వెళ్లిపోయి ఇతర వ్యవహారాలలో పడిపోయాడు. అక్కడ అతనికి విస్తారమైన ఆస్తులున్నాయి. అతను అద్దె కిచ్చిన భవనాలలో 200 మంది నివసిస్తున్నారు. మధ్య మధ్య తన ఆస్తి వ్యవహారాలను చూసుకోవడం అతనికి సంతృప్తితోపాటు కాలక్షేపాన్ని కలిగిస్తోంది. అలా ఉండగా, జూన్ మధ్యలో ఒకరోజున సెయింట్ పీటర్స్ బర్గ్ లోని కొడుకు సెర్గీనుంచి ఉత్తరం వచ్చింది. స్కూల్లో తన చదువు పెద్దగా ముందుకు సాగడంలేదని అతను రాశాడు.

దానికి స్లీమన్ ఫ్రెంచిలో జవాబు రాశాడు. అందులో తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు కానీ, నిజానికది అతనప్పుడున్న నైరాశ్యస్థితికే అద్దంపట్టింది:

నీ చదువు ముందుకు సాగడంలేదని రాయడం నాకు చాలా విచారం కలిగించింది. జీవితంలో ప్రతిఒకడూ నిరంతరం ముందుకు సాగుతూ ఉండవలసిందే. లేకపోతే నిరుత్సాహంతో కుంగిపోవలసివస్తుంది. బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగిన ఒక మనిషి ఎంత ఎత్తుకు వెళ్లగలడో, తను ఎక్కిన ప్రతి మెట్టులోనూ నిరూపించుకుంటూ వచ్చిన నీ తండ్రిని ఆదర్శంగా తీసుకో. 1842-1846 మధ్య ఏమ్ స్టడామ్ లో ఉన్న నాలుగేళ్లూ నేను అద్భుతాలు చేశాను. ఎవరూ చేయనివీ, చేయలేనివీ నేను చేశాను. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ లో వర్తకుడిగా ఎదిగి, ఇంతటి సాఫల్యం, ఇంతటి తెలివీ ఉన్న వర్తకుడు ఇంకొకడు లేడని నిరూపించుకున్నాను. ఆ తర్వాత యాత్రికుడిగా మారాను; మామూలు యాత్రికుడిగా కాదు, విశిష్ట ప్రావీణ్యాలు కలిగిన ఓ అద్భుతయాత్రికుడిగా! సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఏ వర్తకుడూ ఓ వైజ్ఞానికరచన చేయలేదు; నేను చేశాను. అది నాలుగు భాషల్లోకి అనువాదమై, ప్రపంచ ప్రశంసలు అందుకుంది. ఈరోజున నేనొక పురాతత్వశాస్త్రవేత్తను.  అన్ని దేశాలలోని పురాతత్వశాస్త్రవేత్తలూ రెండువేల ఏళ్లపాటు వెతికి వేసారిన ప్రాచీన నగరం ట్రాయ్ ని; యావత్ యూరప్, అమెరికాల కళ్ళు జిగేలుమనేలా  నేను కనిపెట్టాను…

ఈ గొప్పలు అతనప్పుడున్న నిస్సహాయతనుంచి పుట్టినవి. నైరాశ్యం నుంచీ, ఒంటరితనం నుంచీ పెల్లుబికినవి. తన జీవితానికి ఒక అర్థం వెతుక్కునే పెనుగులాటలో అతనున్నాడు. ఇతిహాసప్రసిద్ధమైన ట్రాయ్ ని తవ్వి తీయాలని తహతహలాడుతున్నాడు. కానీ, ఆ హిస్సాలిక్ దిబ్బ మీద గొర్రెల మందల్ని మేపుకునే ఇద్దరు అనామకులైన టర్కిష్ రైతులు, తనేదో మామూలు చొరబాటుదారైనట్టు, అడ్డుపడుతున్నారు. తక్షణం తమ జాగా నుంచి వెళ్లిపొమ్మని కళ్ళు ఉరుముతున్నారు. వాళ్ళకా హక్కు లేదు! తను, స్లీమన్ అనే తను, భూస్థాపితమైన ఆ నగరాన్ని వెలికి తీశాడు. కనుక ఆ నగరం మీద అన్ని హక్కులూ తనవి! ప్రపంచ విజ్ఞానానికి దోహదం అందించడం కోసం లక్ష ఫ్రాంకులు ఖర్చు పెట్టి తవ్వకాలు జరిపించడానికి తను సిద్ధమయ్యాడు. తనకు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. అలాంటిది, టర్కీలో ఓ మారుమూల ఉన్న చిన్న దిబ్బ తనకు కొరకరాని కొయ్య కావడమేమిటి? వంతెన కోసం ఆ పవిత్రమైన రాళ్ళను తీసుకుని తన నగరాన్ని అపవిత్రపరచడానికి ఆ టర్కు లిద్దరికీ ఎంత ధైర్యం! వాళ్ళ వదులు పంట్లాములూ(Baggy Trousers), వాళ్ళూ! తను హిస్సాలిక్ దిబ్బను విడిచిపెట్టి వచ్చేముందు, తను కలిగించిన నష్టానికి వంద పౌండ్లు ఇమ్మని వీళ్ళే అడిగారు. తను తిరస్కరించాడు.

1870 జూలై 19న నెపోలియన్-3 ప్రష్యాపై యుద్ధం ప్రకటించాడు. ఆ ఇద్దరు టర్కులపై ఆగ్రహంతో కుతకుతలాడుతూ అప్పటికి స్లీమన్ పారిస్ లోనే ఉన్నాడు. యుద్ధం ప్రకటించగానే బులోన్-సుర్-మేర్ కు చేరుకుని, అక్కడినుంచి ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.  ట్రాయ్ లో తను వెలికి తీసిన ప్రాసాదం గోడలకు చెందిన రాళ్ళు ఎవరూ ఎత్తుకు పోకుండా చూడవలసిందనీ, మూడు వేల ఏళ్ల నాటి ఆ నిక్షేపాలను ఆ రైతులిద్దరూ ధ్వంసం చేయకుండా చూడడానికి ఏదో ఒక మార్గం ఉండకుండా ఉండదనీ అందులో విన్నవించాడు.

ఆగస్టు చివరిలో, టర్కీ విద్యామంత్రి సఫ్వెట్ పాషాకు తన తవ్వకాల గురించి ఓ సుదీర్ఘమైన వేడికోలు ఉత్తరం రాశాడు. ఏవో నిధి నిక్షేపాలకోసం తను హిస్సాలిక్ దిబ్బను తవ్వలేదనీ, అవి దొరుకుతాయని తను అనుకోవడంలేదనీ, “శాస్త్రవిజ్ఞానం పట్ల నిస్వార్థ ప్రేమతోనే” తవ్వకాలు జరిపించాననీ, ఆ దిబ్బ అడుగున ట్రాయ్ నగరం ఉనికిని నిరూపించడమే తన ధ్యేయమనీ అందులో రాశాడు. తను రచించిన Ithaka, der Peloponnes and Troja  అనే పుస్తకం ప్రతిని ఆ ఉత్తరానికి జతపరిచాడు. టర్కిష్ ప్రభుత్వం దయాదాక్షిణ్యాల పైనే తను పూర్తిగా ఆధారపడుతున్నాననీ, తన పరిశోధనల ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం తప్పకుండా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాననీ అన్నాడు. హోమర్ పట్ల తనకున్న వల్లమాలిన ఆరాధనాభావమే హిస్సాలిక్ తవ్వకాలకు పురిగొల్పిందనీ, ఇంతాజేసి తను జరిపింది ఆషామాషీ తవ్వకాలే అయినా, ప్రియాం ప్రాసాదాన్ని, బ్రహ్మాండమైన ఆ నగర ప్రాకారాల ఉనికిని అది బయటపెట్టింది కనుక ప్రభుత్వం తన చర్యను తప్పు పట్టబోదని ఆశిస్తున్నా నన్నాడు.

“గాలివానను కూడా లెక్క చేయకుండా వేసవిలోనా అన్నట్టుగా పనిచేశాను. రెండు పూటలా భోజనం చేసినట్టు ఊహల్లోనే తృప్తి పడుతూ, తిండీ తిప్పలు లేకుండా రోజంతా నడుం వంచాను. నేను వెలుగులోకి తెచ్చిన ప్రతి చిన్న మృణ్మయపాత్రా చరిత్రకు మరో పుటను జోడించిందని నేను నమ్ముతున్నాను” అన్నాడు. తను దుందుడుకుగా వ్యవహరించినందుకు ఏలినవారు క్షమించవలసిందనీ, తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి లభిస్తుందన్న ఆశ లేశమైనా కలిగితే, ఏలినవారిని దర్శించుకోడానికి ఏ క్షణంలోనైనా తను సిద్ధంగా ఉంటాననీ ఉత్తరం ముగించాడు.

అయితే, అటునుంచి సమాధానం లేదు. స్లీమన్ లానే ఆ మంత్రి కూడా గడుసుపిండమే. తనది నిస్వార్థ ప్రయత్నమని స్లీమన్ అంతగా నమ్మబలకడం, ‘మనిద్దరి ఆరాధ్యదేవతా శాస్త్రవిజ్ఞానమేననీ, శాస్త్రవిజ్ఞాన ప్రగతికోసమే ఇద్దరం జీవితాలను అంకితం చేశామనీ, ఇద్దరం దానిపట్ల ఒకేవిధమైన ఉత్సాహాన్ని నింపుకున్నవాళ్ళమే ననీ’ మంత్రిని ఉబ్బేయడం అతను ఆశించినదానికి సరిగ్గా వ్యతిరేకఫలితాన్ని ఇచ్చాయి. అతని ప్రయత్నమంతా అక్కడ పాతిపెట్టిన నిక్షేపాల కోసమే నని మంత్రి నిశ్చయానికి వచ్చాడు.

ఎట్టకేలకు స్లీమన్ డిసెంబర్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వచ్చి పడ్డాడు. మంత్రిని దర్శించుకున్నాడు. మంత్రి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన నుంచి ఎలాంటి సహాయమైనా అందుతుందని హామీ ఇచ్చాడు. శాస్త్రవిజ్ఞాన ప్రయోజనాలపట్ల తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. అయితే, ఇంకోవైపు తవ్వకాలను ఆపడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. గడుగ్గాయి అనిపించుకున్న అంతటి స్లీమన్ కూడా మంత్రి  పై మెరుగు మాటలకు బోల్తా పడిపోయి, కొద్ది రోజుల్లోనే తవ్వకాలను అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి తనకు ఫర్మానా అంది, హిస్సాలిక్ దిబ్బ తన అధీనంలోకి వస్తుందనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కాన్ స్టాంట్ నోపిల్ లో అతనలా ఎదురు తెన్నులు చూస్తుండగానే, ఆ సమస్యతోపాటు, పారిస్ ఏ క్షణంలోనైనా శత్రువుల చేజిక్కవచ్చునంటూ అందిన సమాచారం అతని ఆలోచనల్ని కమ్మేసింది. అంతలో, వెయ్యి ఫ్రాంకులకు తమ భూమిని అమ్మడానికి టర్కులిద్దరూ నోటి మాటగా ఒప్పుకున్నట్టు కల్వర్ట్ నుంచి సమాచారం అందింది. సరిగ్గా అప్పుడే, ఆసంతృప్తిని, నిస్పృహను ప్రకటిస్తూ భార్య రాసిన ఉత్తరమూ చేరింది. నీకు పట్టిన అదృష్టాలను ఒక్కొక్కటే లెక్కపెట్టుకుంటే, నువ్విలా నిస్పృహ చెందడానికి ఎలాంటి కారణమూ కనిపించదని, అతను కొంత పరుషంగానే  సమాధానం రాశాడు… నిన్ను ఆరాధించే భర్త ఉన్నాడు, జీవితంలో ఒక ఉన్నతస్థితికి చేరావు, ఎథెన్స్ లో నీకు ఒక ఇల్లు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే యోగ్యులైన పరివారం ఉన్నారు. అక్కడ ఫ్రాన్స్ లో, ఎలాంటి రక్షణా లేని తమ ఇళ్లపై శత్రువులు తూటాలు కురిపిస్తుంటే;  తినడానికి రొట్టె తునకకు కూడా గతి లేక, చలి కాచుకోడానికి చిన్నపాటి కట్టె పుల్ల కూడా కరవై ఆడా, మగా, పిల్లలు సహా ఇరవై లక్షల మంది ఆకలిచావులు చస్తున్నారు. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలపై నీ ఆలోచన మళ్లిస్తే నీకే అర్థమవుతుంది…

ఆ తర్వాత, తను సఫ్వెట్ పాషాను కలసుకున్నాననీ, తనను ఎంతో ఆదరంగా ఆహ్వానించాడనీ, ఎంతో కాలంగా తను ఎదురుచూస్తున్న ఫర్మానాను జారీ చేయడానికి హామీ ఇచ్చాడనీ, అది నేడో రేపో తన చేతికి వస్తుందనీ రాశాడు. అది అందగానే తను హిస్సాలిక్ కు వెళ్ళి, భూమి కొనుగోలు లావాదేవీ పూర్తిచేసుకుని, ఓసారి పారిస్ వెళ్ళి వస్తాననీ, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి లేనిపోనివి ఊహించుకుని ఆందోళన చెందవద్దనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

నువ్వు వెంటనే భగవంతుడి ముందు మోకరిల్లి నీకు ఆయన కట్టబెట్టిన అదృష్టా లన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకో. ఈరోజుల్లో నువ్వు పడుతున్న కష్టాన్నే తలచుకుంటూ నీపై ఆయన కురిపించిన కనకవర్షాన్ని మరచిపోయినందుకు క్షమాపణ అడుగు.

ఇంకోటి కూడా నువ్వు మరచిపోతావేమో…అనుకోకుండా నేనిక్కడ మకాం పెట్టిన ఈ పద్దెనిమిది రోజుల్లో టర్కిష్ నేర్చుకున్నాను. ధారాళంగా మాట్లాడడం, రాయడం కూడా చేస్తున్నాను. ఇప్పటికే 6వేల మాటలు నాకు పట్టుబడ్డాయి.

మరో వారం గడిచింది. అయినా సఫ్వెట్ పాషా నుంచి ఉలుకూ, పలుకూ లేదు. తవ్వకాలకు అనుమతి కోరుతూ 1871, జనవరి 8న స్లీమన్ లాంఛనంగా ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. పది రోజుల తర్వాత విద్యా మంత్రిత్వశాఖనుంచి అతనికి పిలుపు వచ్చింది. తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి మంజూరు చేస్తూనే, ఆ భూమిని మంత్రిత్వశాఖ తరపున కొనుగోలు చేయవలసిందిగా దర్దనెల్లెస్ గవర్నర్ కు సఫ్వెట్ పాషా తంతి పంపినట్టు అక్కడ తెలిసింది.

స్లీమన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. “అతని ప్రవర్తన ఎంత రోతగా ఉందో కుండబద్దలు కొట్టినట్టు ఎత్తి చూపి కడిగేశాను” అని ఆ తర్వాత రాసుకున్నాడు. ఆ భూమిని కొనడానికి రెండున్నర ఏళ్లపాటు తను చేయని ప్రయత్నం లేదని వివరించుకుంటూ వచ్చాడు. కేవలం వైజ్ఞానిక ఆసక్తితో ఈ భారం తలకెత్తుకున్నాననీ; ట్రోజన్ యుద్ధం కట్టుకథ కాదు, ట్రాయ్ ఉనికి వాస్తవమని నిరూపించడమే తన ఆశయమనీ మరోసారి వాదించాడు. అందుకు చేయవలసిందల్లా ఆ దిబ్బను తవ్వడం, దానికయ్యే విపరీతమైన ఖర్చును భరించడానికి తను సిద్ధపడ్డాడు, అలాంటిది, డబ్బు చెల్లించి ఆ చిన్న ముక్కను తను సొంతం చేసుకోడానికి అడ్డుపడడం దుస్సహం, దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డాడు.

ఈ మాటలు జరుగుతున్న సమయంలో, నేషనల్ మ్యూజియం డైరక్టర్ గా ఉన్న ఒక ఆంగ్లేయుడు మంత్రి దగ్గర కూర్చుని ఉన్నాడు. స్లీమన్ విజృంభణకు సఫ్వెట్ పాషా తెల్లబోయాడు. తలవంపుగా కూడా అనిపించినట్టుంది. కానీ, అంతలోనే తేరుకుని, అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ అతన్ని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. మీరు నిరభ్యంతరంగా హిస్సాలిక్ కు వెళ్లచ్చు, భూమిని కొనుక్కోవచ్చు, తవ్వకాలు కొనసాగించవచ్చు. “నిధినిక్షేపాలు ఏవైనా బయటపడిన పక్షంలో ఒట్టోమన్ సామ్రాజ్య నియమనిబంధనలను పాటించినంతవరకూ” మీకు ఎవరినుంచీ ఎలాంటి ఆటంకమూ రాదన్నాడు.

చర్చ ఈ కొత్త మలుపు తిరిగేసరికి స్లీమన్ కృతజ్ఞతాభావంతో తలమునకలైపోయాడు. తను కోరినవన్నీ మంజూరైనట్టు ఊహించుకున్నాడు. మంత్రికి ధన్యవాదాలు చెప్పాడు. ట్రాయ్ తవ్వకాలపై తను రాయబోయే పుస్తకంలో మీ పేరు ప్రస్తావిస్తానని వాగ్దానం చేశాడు. మంత్రి మాటల్లోని మతలబు ఆ తర్వాత అతనికి తెలిసొచ్చింది. లేదా అప్పుడే తెలిసినా కావాలనే వాటిని తనకు అనుకూలంగా అన్వయించుకునీ ఉండచ్చు.

మూడు రోజుల తర్వాత, భోరున వర్షం పడుతుండగా, ట్రోజన్ మైదానంలోని కుమ్ కేల్ అనే ఓ చిన్న గ్రామానికి చేరుకున్నాడు. వర్షంలో పూర్తిగా నానిపోయాడు, ఆపైన ప్రయాణం బడలిక. ఆ భూమి కొనుగోలుకు మంత్రి జనవరి 10న తంతి ఉత్తర్వులు ఇచ్చాడనీ, రెండు రోజుల తర్వాత ఆ భూమి యాజమాన్య హక్కు మంత్రికి బదిలీ అయిందని తెలిసింది. స్లీమన్ హుటాహుటిన దర్దనెల్లెస్ గవర్నర్ ను కలసుకున్నాడు. మంత్రి తన వెనకటి ఉత్తర్వును రద్దు చేయలేదా అని అడిగాడు. “లేదు, ఆ ఉత్తర్వే అమలులో ఉంది” అని గవర్నర్ సమాధానం చెప్పాడు. మోసగించారని భావించిన స్లీమన్ కోపంతో రగిలిపోతూ ఎథెన్స్ కు చేరుకున్నాడు.

అతనంత తేలిగ్గా మడమ తిప్పే మనిషి కాదు. ఆ భూమిపై పురావస్తు తవ్వకాలు ప్రారంభించి దానిపై తనదైన చెరగని ముద్ర వేశాడు కనుక, అది తనకే చెందాలని ఎప్పుడో నిర్ణయానికి వచ్చాడు. మంత్రి ఆ భూమిని 600 ఫ్రాంకులకు కొన్నట్టు తెలిసింది. కానీ తను 1,000 ఫ్రాంకులు ఇవ్వజూపాడు. ఆవిధంగా చూసినా భూమి తనకే దక్కాలి. అయినా తనకు ఆ హక్కును నిరాకరించారంటే,  వైజ్ఞానిక పరిశోధనలపై వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు బొత్తిగా అనాగరికులు. పురాతత్వవేత్తగా తను కీర్తిశిఖరాలను అందుకోవడం, తన పేరు యూరప్ అంతా మారుమోగుతుండడం  చూసి వాళ్ళు భయపడ్డారు. ఇలా వాళ్ళను తిప్పికొట్టే ప్రయత్నంలో అన్ని రకాల వాదనలనూ, అన్ని స్థాయిలలోనూ ముందుకు తేవడానికి; అన్ని వైపుల నుంచీ దాడి చేయడానికి  సిద్ధమైపోయాడు.

(సశేషం)

 

 

మీ మాటలు

*