పోతే పోనీరా..

 

ల.లి.త.

~

    ల.లి.త.

డార్క్ కామెడీలు మన సినిమాల్లో చాలా తక్కువ.  ఒకే ఒక్కటి, “జానే భీ దో యారో”.  1983లో వచ్చిన మంచి డార్క్ చాక్లెట్ లాంటి ఆ సినిమాకి కొనసాగింపుగా 2010లో వచ్చిన ‘పీప్లీ లైవ్’ తప్ప మరోటి కనిపించదే! ‘జానే భీ దో యారో’ తీసిన కుందన్ షా కూడా మళ్ళీ అంత వాడిగా మరో సినిమా తియ్యలేకపోయాడెందుకో !

అనురాగ్ కాశ్యప్ ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ లో శుభ్రంగా తీసిన లంపెన్ కామెడీలో కొంచెం నల్లటి ఛాయలు తగిలినా, అతను చెప్పిన తరాల రక్తచరిత్రను పూర్తి హాస్య చిత్రం ‘జానే భీదో యారో’ తో పోల్చలేం. నల్ల కామెడీలో మన ప్రఖ్యాత ‘ముత్యాల ముగ్గు’ కాంట్రాక్టర్ ఎంత మాత్రమూ తీసిపోని ఘనుడే గానీ, ఆ కథ పూర్తిగా అతనిదైతే కాదు. ముత్యాల ముగ్గు “కుటుంబ కథా” చిత్రంలోని బూజు సెంటీ.. మ్మ్.. లాభం లేదు సెగట్రీ..

ఆవూ పులీ కథ చిన్నప్పుడు అందరం విన్నదే.. అడవిలో తప్పిపోయిన ఆవు పులికి దొరికిపోతుంది. దూడకి పాలిచ్చే టైం అయిందని పులిని వేడుకుని, ఆఖరుసారి పాలిచ్చి వచ్చేస్తానని ఒట్టేస్తుంది. ఆ నీళ్ళునిండిన నల్లకళ్ళ ఒట్టును నమ్మి, దొరికిన ఆహారాన్ని వదిలేయటం క్రూరపుకళ్ళ పులి నైజానికి పొసిగే పనేనా? దూడకు పాలిచ్చి పులికి ఆహారం అవటానికి ఆవు తిరిగిరావటం? రావచ్చేమో. బేలకళ్ళ అమాయకత్వంతో పుట్టిన జీవి కాబట్టి.. పులి కళ్ళనీళ్ళు పెట్టుకుని దాన్ని చంపకుండా వదిలిపెట్టటంతో మరీ అత్యాశావాదపు యుటోపియన్ కథైపోయింది. కలికాలం ధర్మం ఒంటికాల్తో నడుస్తుందని నమ్మే ధర్మాత్ములు కూడా ఈ కథని కృతయుగం కేటగిరీలోనే వేసేస్తారు.

దీనికి విరుద్ధంగా చిన్నప్పుడు అందరం వినే మరో పులీ మేకా కథ డార్క్ హ్యూమర్ కి సరిపోతుంది. మేక తనమానాన తాను నీటిపాయకు ఎగువన నీళ్ళు తాగుతుంటే దిగువవైపు నీళ్ళు తాగుతున్న పులి, మేకతో వాదానికి దిగుతుంది. ‘నువ్వు తాగి ఎంగిలి చేసిన నీళ్ళు నేను తాగాలా’ అని దెబ్బలాడి మరీ దాన్ని చంపేస్తుంది. మేకని చంపడానికి ఈపాటి కబుర్లు కూడా పులికి టైం వేస్టే. ఐనా తను ఎంత తెలివిగా మాట్లాడగలదో చూపించాలనే సరదా పుట్టి మాట్లాడుతుందంతే. నీటిపాయకు దిగువవైపు నీళ్ళు తాగినా మేక బతికేది లేదుగదా.  పులిన్యాయమే సృష్టిలో ఎక్కువగా అమలవుతుందని చెప్పేది డార్క్ హ్యూమర్.  (చదవండి రావిశాస్త్రిని). లోకంలోని చెడుని తేలిగ్గా హాస్యంగా ఎత్తి చూపించి, మంచి గెలిచి తీరుతుందనే నమ్మకాన్ని హేళన చేసే డార్క్ హ్యూమర్  సాహిత్యంలోనూ  సినిమాలోనూ కనబడే మంచి ప్రక్రియ. ఇవి రాసి, తీసి మెప్పించటం సులభంకాదు.  పేరుకే కామెడీగానీ ‘సత్యం వధ’ అనిచెప్పే ట్రాజెడీలివి.

***

‘హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్’ అని స్ఫూర్తిగీతం పాడుకుంటూ తిరిగే రకాలు ఒక్క శ్రామికులూ మానవ హక్కులవాళ్ళే నేంటి? దేశభక్తులూ అయాన్ రాండ్ శిష్యులూ కూడా ఈ పాటని సొంతం చేసేసుకున్నారు, చేగువేరాని చొక్కాల కంపెనీలు లాక్కుపోయినట్టు.  ఈ ‘కామ్యాబ్’ గీతాన్ని నిజానికి ఫోటోగ్రఫీ వ్యాపారంకోసం, అందులోనూ ఫాషన్ ఫోటోగ్రఫీతో కూడా పైకెదిగి పోవాలన్న ఆశతో పాడుకున్నా, ‘జానే భీదో యారో’ నాయకులిద్దరూ పాపం గట్టి నైతికవిలువల ఫ్రేం లో ఉండిపోయే మనుషులే.  జేబులో డబ్బులు పోలీసు కొట్టేసినా సరే, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కడానికి బాధ పడేవాళ్ళే. అవినీతికి లొంగటంలోని సుఖంకంటే అవినీతిని బైటపెట్టటంలోని ఆనందమే ఎక్కువనుకునే జాతికి చెందినవాళ్ళే.

నసీరుద్దీన్షా మరియూ రవీ బస్వానీలు, ఫొటోగ్రఫీలో పేరూ డబ్బూ మూటగట్టేందుకు కలల వలల్ని భుజాలమీదేసుకుని  బొంబాయిలో ఓ ఫోటోగ్రఫీ దుకాణం తెరుస్తారు.  గుండెల్లో పూర్తి నమ్మకం నింపుకుని ‘హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్’ అనుకుంటూ తెరిచిన దుకాణంలో మూణ్ణెల్లయినా ఈగలు తోలేపని తప్ప ఇంకేం ఉండదు. ఇంతలో ‘ఖబడ్దార్’ పత్రిక ఎడిటర్ శోభా సేన్ (థియేటర్ నటి భక్తీ బార్వే అపూర్వంగా ఈ పాత్ర వేసింది) వీళ్ళకి ఓ పని అప్పజెప్తుంది.. మున్సిపల్ కమిషనర్ డిమెల్లో (సతీష్ షా)  కాంట్రాక్టర్ తర్నేజా (పంకజ్ కపూర్)ల అవినీతి లావాదేవీల ఫోటోలు రహస్యంగా తీసేపని. ఈ పనిని వీళ్ళు భక్తిశ్రద్ధలతో చేసి ఆమెకు సమర్పిస్తారు.  ఇక ఈ మేకల్ని వాడేసుకుని డిమెల్లో తర్నేజాల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కొట్టేసే వ్యూహంలో ఆమె మునిగి వుండగా… న.షా మరియూ ర.బ.లు గొప్ప అవినీతి వ్యూహాన్ని ఛేదించి దేశసేవ చేస్తున్న ఆనందంతో పొంగిన ఛాతీలతో దూసుకెళ్ళి డిమెల్లో, తర్నేజా మరో కాంట్రాక్టర్ అహూజా (ఓం పురీ)ల అమర్యాదకర, అవినీతికర ఎన్కౌంటర్స్ ని టేపుల్లో రికార్డు చేస్తూ ఫోటోలు తీస్తారు. శోభా సేన్ ఇచ్చిన పన్లో దేశసేవ తప్పించి పైసలేం కనబడవు. కడుపుకోసం డబ్బు సంపాదన తప్పదు కదా ఇంకేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళకి నగదుబహుమతులిచ్చే ఫోటోగ్రఫీ పోటీ ఒకటి దృష్టిలో పడుతుంది. ఆ పోటీకి పంపటం కోసం ఫోటోలు తీస్తుండగా అనుకోకుండా ఒక ఫోటోలో చేతిలో పిస్టల్ పట్టుకున్న ఆకారం కనిపిస్తుంది. ఆ ఫోటోని పెద్దది చేస్తే ఆ ఆకారం తర్నేజా దని తెలుస్తుంది. తర్వాత జరిగేవన్నీ మనల్ని బుగ్గలు సాగేంత నవ్వుల్తోనూ న.షా. మరియూ ర.బ.ల్ని మహా నిర్ఘాంతాల్తోనూ నింపేస్తాయి.  చివరకి అవినీతిపరులంతా రాజకీయనాయకుల్లాగే ‘కామ్యాబ్’ లయిపోతారు.  నిజాయితీగా సత్యశోధన చేసిన మన న.షా. మరియూ ర.బ.ల గతి ? … ‘సత్యం గెలుస్తుంది అన్యాయం ఓడిపోతుంది’ అని మంచివాళ్ళు నమ్మే సూత్రానికి సరిగ్గా విరుద్ధంగా ఏంకావాలో అదే అవుతుంది. (సస్పెన్స్ కూడా వున్న ‘జానే భీదో యారో’ యు ట్యూబ్ లో దొరుకుతోంది).

lalita2

తర్నేజా నేరాన్ని బైటపెట్టిన ఆ ఫోటోని వీళ్ళు ఒక పార్క్ లో తీస్తారు. ఆ పార్క్ కి Antonioni park అని పేరు పెట్టాడు కుందన్ షా.  Antonioni తీసిన ‘Blow Up” సినిమాలో కూడా ఫోటోగ్రాఫర్ ఒక పార్క్ లో తీసిన ఫోటోలో నేరాన్ని వెదుకుతాడు. ‘Blow Up’ సినిమాలోని తాత్వికత పూర్తిగా వేరు. అయినా ఆ చిన్న పోలికను గుర్తు తేవటం కోసం కుందన్ షా ‘Antonioni Park’ అనటం ఫిల్మ్ బఫ్స్ కి సరదా వేస్తుంది.

పత్రికల వాళ్ళు నేరాల్ని బైటపెట్టటం మానేసి రాజకీయనాయకులని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే కార్యక్రమాన్ని మొదట చిత్రీకరించిన సినిమా ‘జానే భీదో యారో’ నే అయి ఉండాలి. దీని తరువాత వచ్చిన ‘న్యూఢిల్లీ టైమ్స్’ కూడా మీడియా అవినీతిమీద ఫోకస్ చేసింది. వీటికంటే ముందు వచ్చిన సినిమాల్లో పత్రిక ఎడిటర్లు నిజం చెప్పి ఎన్నో కష్టాలు పడేవాళ్ళు.  జర్నలిస్టులంటే నిజాల్ని భుజాలమీద వేలాడే సంచుల్లో వేసుకు తిరిగేవాళ్ళని ఒకే ఒక అర్థం ఉండేది. తర్నేజా పైపైకి ఎదిగాడంటే ఎంతమందిని కిందకి తొక్కేశాడో చెప్పమని అతన్ని నిలదీసిన జర్నలిస్టులు కూడా ‘జానే భీదో యారో’లో ఒకసారి కనిపిస్తారు. ఎడిటర్ శోభా సేన్ ది వీళ్ళకి రెండో వైపున్న ముఖం. ‘పీప్లీ లైవ్’ లో జర్నలిస్టుల అన్ని ముఖాలూ దర్శనమిస్తాయి.

పేరున్న దర్శకుల సినిమాలు చూస్తే సినిమా ముఖ్యంగా దర్శకుడి మీడియం అనే అనిపిస్తుంది. వాళ్ళవి కొన్ని సినిమాలు చూస్తుంటే అవి అంత బాగా రావటానికి ఒక్క దర్శకుడే కారణమనికూడా అనలేం.  సత్యజిత్ రాయ్ లాంటి నిరంకుశుడైన దర్శకుడి విషయంలో జయం, అపజయం అన్నీ ఆయనవే.  ‘సత్య’ లాంటి సినిమాల్లో, తీసిన రాం గోపాల్ వర్మ కంటే  స్క్రీన్ ప్లే, మాటలూ అంత బాగా రాసిన అనురాగ్ కాశ్యప్ సౌరభ్ శుక్లాల వాటా ఎక్కువనిపిస్తుంది. ‘జానే భీ దో యారో’  వెనుక కుందన్షా తో పాటు స్క్రీన్ ప్లే రాసిన సుధీర్ మిశ్రా, మాటలు రాసిన సతీష్ కౌశిక్, రంజిత్ కపూర్లు ఉన్నారు. రేణూ సలూజా కూర్పు ఉంది. వనరాజ్ భాటియా సంగీతం ఉంది.

అమెరికానుంచి తిరిగొచ్చిన మున్సిపల్ కమిషనర్ డిమెల్లో అక్కడ తాగేనీళ్ళూ మురుగునీళ్ళూ వేరువేరుగా ఉంటాయని మురిసిపోతూ చెప్తాడు. అమెరికాలో తక్కువగా తిని ఎక్కువగా పారేస్తారు కాబట్టి స్విట్జర్లాండ్ కేక్ ని కొంచెం తిని మరింత ముక్కని బైటకి విసిరేస్తే మజాగా ఉంటుందని డిమెల్లోకి చెప్తాడు న.షా.  కిటికీ బయటున్న ర.బ. కి కేకు ముక్క అందాలని అతని ఉద్దేశ్యం. అమెరికా గొప్పలు మనం చెప్పుకోవటం అనే అనాది అలవాటుతో పాటే వాళ్ళ తిని పారేసే వినిమయతత్వాన్ని కూడా ఎత్తి చూపించే ఈ ముప్పై ఏళ్ల కిందటి మాటల్ని ఇప్పుడు వినటం మజాగానే ఉంటుంది.

స్క్రీన్ ప్లే వాస్తవికత మీద కంటే సెటైర్ మీదా ప్రహసనం మీదా గట్టిగా నిలబడింది. నటనను స్లాప్ స్టిక్ కామెడీలోకి ఎక్కువగా పోనీకుండా ప్రహసనం స్థాయిలో పట్టి ఉంచగల్గిన నటులు అందరూ ప్రతి ఒక్క పాత్రలో ఉన్నారు. వీళ్ళంతా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చినవాళ్ళవటంతో నాజూకుతనాన్ని తీసుకొచ్చారు. సినిమాలో ఎక్కువసేపు శవంగా జీవించిన సతీష్ షా ఒక అద్భుతం. కాఫిన్ లో ఉన్న ఆ శవంతో కబుర్లు చెప్పే తాగుబోతు అహూజా ప్రహసనం చూడాల్సిందే. శవం బోలెడన్ని మేకప్ లు వేసుకుంటుంది. చివరకు ద్రౌపది వేషంలో స్టేజ్ కూడా ఎక్కుతుంది. ద్రౌపది వేషంలోని శవంకోసం పాండవులూ కౌరవులూ అంతా పోట్లాడుకోవటం వింతైన ప్రత్యేక సన్నివేశం. దుర్యోధనుడు ద్రౌపదిని పొగిడి, వస్త్రాపహరణం ఐడియాని డ్రాప్ చేసేశానంటాడు. కృష్ణుడు రాకుండానే మిగతా అందరూ ద్రౌపదిని కీర్తిస్తూ మాన సంరక్షణ చేసి స్టేజ్ దాటించి తీసుకుపోదామని చూస్తారు.  దుశ్శాసన పాత్రధారి ఎంత ప్రయత్నించినా ద్రౌపదిమీద చెయ్యి వెయ్యలేక విఫలమైపోతాడు.  ద్రౌపదీవస్త్రాపహరణంలో మగ ద్రౌపదుల బట్టలూడిపోయిన మొరటు సీన్లు చాలా సినిమాల్లో మామూలే గానీ ‘జానే భీదో యారో’లోని ఈ సీన్లోని సున్నితమైన హాస్యం వేరు.

lalita3

‘జానేభీదో యారో’ నాటికీ ఇప్పటికీ జీడీపీ పాపంలా పెరిగిపోయింది. డిమెల్లోలు ఈరోజూ అవే ఆటలు ఆడుతున్నారు. శోభా సేన్లు మీడియాలో నిండిపోయారు.  మంత్రులు నేలని ఖనిజంముక్కలుగా బొగ్గుచెక్కలుగా అమ్ముకుంటున్నారు.  తర్నేజా అహూజాలు ఇంకా ఎదిగిపోయి ప్రభుత్వాలని మారుస్తూ దేశాన్ని పంచుకుంటున్నారు.  RTI బావిలో నిజాలు తవ్వుతున్న సత్యశోధకుల పీకలు తెగుతున్నాయ్. నవ్వుకోవటం మానేసి జనం ప్రతి చిన్నదానికి తామెవరో గుర్తు చేసుకుంటూ మనోభావాలను తెగ గాయపర్చుకుంటున్నారు. ఇప్పుడు డార్క్ కామెడీలకు ఎన్ని వస్తువులో!  ‘జానే భీ దో యారో’ అని తేలిగ్గా నవ్వుకునేలా ఉంటూనే ఆలోచనకు వీలిచ్చే లోతైన సినిమాలు రావాల్సిన సమయంలో మనకిప్పుడు దొరుకుతున్న సినిమాల్లో హాస్యం ఒట్టి గరం మసాలా. అదిలేకపోతే ఎవరూ చూడరు. ఉండి అది నెరవేర్చే ప్రయోజనమూ లేదు. తెలుగుసినిమాల్లో హీరోలకైతే పంచింగ్ బాగ్స్ లా కూడా ఉపయోగపడుతున్నారు హాస్యనటులు.

‘It’s my fault’ అంటూ రేప్ గురించి తీసిన ఈ చిన్న సెటైర్ లోని డార్క్ హ్యూమర్ని చూడండి…

*

 

 

 

 

 

మీ మాటలు

  1. ఎప్పట్లాగే మీ విశ్లేషణ అద్భుతం. మీరు చెప్పినట్టు “ఇట్స్ యువర్ ఫాల్ట్” వీడియో డార్క్ కామెడీకి గొప్ప ఉదాహరణ. ఏం మాట్లాడినా తప్పైపోతున్న రోజుల్లో ఇలా మన తప్పుని మనం హాస్యభరితంగా ఒప్పేసుకుంటే చాలా మంది ఇగోలు సంతృప్తి చెందుతాయి . thanks for letting us know about this video

  2. అసురుడు says:

    అద్భత: మేడం చాలా బాగా రాశారు. మంచి సినిమా పరిచయం చేస్తున్నారు. ఇంతకు ముందు వ్యాసంలో మీరు దిశ సినిమా చూశాను. చాలా బావుంది. విషయ వివరణ చాలా బావుంది. సున్నితమైన యాంగిల్స్ ను చాలా బాగా చెప్తున్నారు. ఇంకా మంచి మంచి విషయాలు మీరు రాయాలి…మేము చదవాలి….నమస్తే ల.లి.త గారు.

  3. The article is very good. But there are many black comedies I like in Indian cinemas. For example:
    Pushpaka Vimana, 7 Khoon Maaf, Sankat City, Phas Gaye Re Obama,Tere Bin Laden,Dedh Ishqiya, Johnny Sharma and may south indian films like Panchathantiram, Aaranya Kaandam, Pizza, Jigarthanda, Mankatha, Moodar Koodam, Neram, Sathuranga Vettai, Soodhu Kavvum, Trivandrum Lodge. even our own Money and money are also black comedies.

    • చివరకు వచ్చేసరికి కూడా చెడు గెలుస్తూ సినిమా అంతా హాస్యం ఉండటాన్ని నేను పూర్తి బ్లాక్ కామెడీగా దృష్టిలో పెట్టుకున్నాను. మీరు చెప్పినట్టు ‘పుష్పక్’ చాలా మంచి పూర్తి స్థాయి బ్లాక్ కామెడీ. అంత ముఖ్యమైన సినిమాను మర్చిపోయాను. గుర్తు చేసినందుకు థాంక్స్. పంచతంత్రం, మనీ సినిమాలు ఈ కేటగిరీ లోకి వస్తాయా అనేది అనుమానం.

  4. పార్క్ లో తీసిన ఫోటోలో నేరం అంటే Enemy of the state గుర్తొస్తోంది.

  5. కె.కె. రామయ్య says:

    “డిమెల్లోలు ఈరోజూ అవే ఆటలు ఆడుతున్నారు. శోభా సేన్లు మీడియాలో నిండిపోయారు. మంత్రులు నేలని ఖనిజంముక్కలుగా బొగ్గుచెక్కలుగా అమ్ముకుంటున్నారు. తర్నేజా అహూజాలు ఇంకా ఎదిగిపోయి ప్రభుత్వాలని మారుస్తూ దేశాన్ని పంచుకుంటున్నారు. RTI బావిలో నిజాలు తవ్వుతున్న సత్యశోధకుల పీకలు తెగుతున్నాయ్. నవ్వుకోవటం మానేసి జనం ప్రతి చిన్నదానికి తామెవరో గుర్తు చేసుకుంటూ మనోభావాలను తెగ గాయపర్చుకుంటున్నారు.” జానే భీ దో యారో.

    ఇంత అద్భుతమైన విశ్లేషణ చేస్తున్న మీరు, రామిండ్రి సిన్నయ్యగోరు దాట్ల లలిత గారి పేరుకి పోటీ రాకుండా ఏ అరుణక్కో అని పేరుమార్చుకోవడానికి కురదరేవో కదా.

    ‘ ఖోస్లా కా ఘోస్లా ‘ హిందీ సినిమాని కాని ‘మాభూమి’ తెలుగు సినిమాని కాని పరిచయం చెయ్యవలసినదిగా ప్రార్ధన.

  6. p v vijay kumar says:

    Superb write up. Thanq

మీ మాటలు

*