పనామా అడవుల్లో…పద్నాలుగు రోజుల నరకంలో…

 

స్లీమన్ కథ-7

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సెక్రామెంటో అతనికి నచ్చింది కానీ, అక్కడే ఉండిపోవాలని మాత్రం అనుకోవడంలేదు. భవిష్యత్తు గురించిన సందిగ్ధంలో గడుపుతూనే, తనఖా మీద  తక్కువ కాలపరిమితికి చిన్న చిన్న మొత్తాలను అప్పుగా ఇవ్వడం ప్రారంభించాడు.  తూర్పు దేశాలను చుట్టొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.  కొన్ని బలహీనక్షణాలలో అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలో బయలుదేరి పసిఫిక్ మీదుగా చైనా, భారత్, ఈజిప్టులకు వెళ్ళి; అక్కడినుంచి ఇటలీ మీదుగా రైల్లో జర్మనీ వెళ్లిపోదామా అనిపించింది.  క్రమంగా అలాంటి ఊహల నుంచీ, కొత్త చోటు కలిగించిన ఉత్సుకతనుంచీ బయటపడ్డాడు. సెక్రామెంటోలోనే ఉండి భారీ అదృష్టాన్ని మూటగట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు..

ఏప్రిల్, మే మాసాలు రెండూ అందుకు సంబంధించిన ప్రాథమిక ఆలోచనలతోనూ, సన్నాహాలతోనూ గడిచిపోయాయి. జూన్ కల్లా బంగారం రజను కొనుగోలుదారుగా అవతారమెత్తి, సెక్రామెంటోలో జే అండ్ ఫ్రంట్ స్ట్రీట్స్ లో ముఖ్యకార్యాలయాన్ని తెరిచాడు.

అదే నెలలో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి మెస్సర్స్ రోత్స్ చైల్డ్ ఏజంట్లతో, ఇతర వర్తకులతో సమావేశాలు జరిపాడు. ఓ రోజు పగలంతా ఇలాంటి సమావేశాలతో గడిపింతర్వాత హోటల్ గదికి వచ్చి విశ్రమించాడు. అంతలో ఉన్నట్టుండి నగరమంతా అగ్నిజ్వాలలు భగ్గుమన్నాయి. హోటల్ మంటల మధ్య చిక్కుకుంది. గంటల మోతకు మేలుకుని హడావుడిగా దుస్తులు వేసుకుని రోడ్డు మీదికి పరుగెత్తాడు.  ఓ వైపునుంచి గాలి వీస్తూ మంటల్ని ఎగదోస్తోంది. చుట్టూ ఉన్న ఇళ్ళు తన కళ్ల ముందే ఆహుతవడం చూశాడు. అక్కడినుంచి టెలిగ్రాఫ్ హిల్ కు పరుగెత్తాడు. “ ఆ అగ్నితుపాను హోరు, తుపాకీమందు పేలుళ్ళు, రాతిగోడలు బద్దలై కుప్పకూలుతున్న చప్పుళ్ళు, జనం ఆర్తనాదాలు, అంత పెద్ద నగరమూ తగలబడిపోతున్న ఆ దృశ్యమూ…ఓ మహావిలయాన్ని కళ్ళకు కట్టించా”యని మరునాడు డైరీలో రాసుకున్నాడు.

విదేశీ విద్రోహులెవరో ఆ చిచ్చు పెట్టారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో విదేశీయుల్ని, ముఖ్యంగా ఫ్రెంచివారిని శాన్ ఫ్రాన్సిస్కో జనం నరికి పోగులు పెట్టారని… అదేదో మామూలు విషయమన్నట్టు స్లీమన్ రాశాడు. ఓ పక్క మంటలు ఆరకుండానే, బూడిదకుప్పలు సెగలు కక్కుతుండగానే అమెరికన్లు ఏమీ జరగనట్టు నిర్లిప్తంగా నగర పునర్నిర్మాణంలో మునిగిపోవడం చూసి విస్తుపోయాడు. రాత్రంతా టెలిగ్రాఫ్ హిల్ మీదే గడిపి మరునాడు పొద్దుటే సెక్రామెంటోకు వెళ్లిపోయాడు.

అగ్నిప్రమాదానికి భయపడి, సెక్రామెంటోలో రాతితో, ఇనుముతో కట్టిన ఒకే ఒక భవంతికి తన కార్యాలయాన్ని మార్చుకున్నాడు. దొంగల భయంతో ఓ పెద్ద ఇనప్పెట్టెను కొనుక్కున్నాడు. ఉదయం ఆరునుంచి రాత్రి పదివరకూ దాని పక్కనే మఠం వేసుకుని కూర్చునేవాడు. ఇద్దరు గుమస్తాలను కుదుర్చుకున్నాడు; ఒకరు స్పానిష్, ఇంకొకరు అమెరికన్. ఆ రోజుల్లో బంగారు రజను వేటలో ప్రపంచం నలుమూలలనుంచీ జనం కాలిఫోర్నియాకు బారులుతీరేవారు. ఆవిధంగా ఒకే రోజున తనకు తెలిసిన ఎనిమిది భాషల్లోనూ మాట్లాడే అవకాశం స్లీమన్ కు లభిస్తూ ఉండేది. అప్పటికీ అతనికి రాని భాషలవాళ్ళూ ఎదురయ్యేవారు. శాండ్ విచ్ దీవుల్లోని స్థానికులు మాట్లాడే ‘కెనకా’ భాష వాటిల్లో ఒకటి. ఆ దీవి జనం సెక్రామెంటోకు ఎలా వచ్చారన్నది ఓ పెద్ద మిస్టరీ.

తనకు తీరిక దొరికిన అరుదైన క్షణాలలో అతను కాలిఫోర్నియా ఇండియన్లను పరిశీలిస్తూ ఉండేవాడు. “ఈ రాగి రంగు జనం చిన్నగా, పొట్టిగా, మురికి ఒడుతూ, సిఫిలిస్ తో తీసుకుంటూ మట్టికుప్పల మీద పాకే చీమల బారులా” అతనికి కనిపించారు.

శాక్ర మెంటో 1850

శాక్ర మెంటో 1850

అతను కలలుగన్న భాగ్యరాశి కొన్ని మాసాల్లోనే చేతికి అందింది. ఏకంగా 180 పౌండ్ల బరువైన బంగారం అతని ద్వారా చేతులు మారిన రోజులున్నాయి. రోజు రోజుకీ అతని సంపద ఎలా పెరిగిపోతూ వచ్చిందంటే, దాన్ని చూసి అతను భయపడ్డం ప్రారంభించాడు. గుమస్తాలూ, అతనూ ఎప్పుడూ కోల్ట్ రివాల్వర్ చేతిలో పట్టుకునే ఉండేవారు. తమ్ముడిలానే తను కూడా టైఫాయిడ్ వచ్చి చనిపోతానేమోనని అప్పుడప్పుడు అనిపించేది. అయితే ఆఫీసులో తన డెస్క్ దగ్గర గడిపే అన్ని గంటల సేపూ అతనిలో ఎలాంటి భయచిహ్నాలూ కనిపించేవి కావు.

అక్టోబర్ లో నిజంగానే పడకేసాడు. అదేపనిగా వాంతులు, సంధి ప్రేలాపనలు. ఒంటి మీద పసుపు మచ్చలు వచ్చాయి. డాక్టర్ క్వినైన్, కాలమెల్ ఇచ్చాడు. ఆరోజుల్లో యెల్లో ఫీవర్ కు ఇచ్చే మందులు అవే. అలాంటి సమయాల్లో గుమస్తాలే వ్యాపార వ్యవహారాలు చూస్తూ తనివితీరా కొల్లగొట్టేవారు. ఏ కొంచెమో కోలుకుని అతను తిరిగి డెస్క్ దగ్గరికి రాగానే సంపద గురించిన భయాలు మళ్ళీ పట్టుకునేవి. ఓ పెద్ద ఐశ్వర్యానికి వలేయడంలో ఉండే కష్టాలు, ఒంటరితనం ఎలాంటివో వర్ణిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు:

ఈ వారమంతా చచ్చే చావు అయింది. ఓ నల్లజాతి బానిస కూడా నేను పడ్డంత కష్టం పడడు. అయితే, బంగారం మూటల్ని, నగదును పక్కన పెట్టుకుని రాత్రిపూట ఒంటరిగా నిద్రించడంలో ఉండే ప్రమాదం ముందు శారీరకంగా పడే ఎంత కష్టమైనా దిగదుడుపే. నిండా తూటాలు నింపిన పిస్టల్స్ ను రెండు చేతుల్లో పట్టుకుని రాత్రంతా విపరీతమైన భయాందోళనలతో గడుపుతున్నాను. చీమ చిటుక్కుమన్నా వణికిపోతున్నాను. రోజూ ఒక్క పూటే, సాయంత్రం 6.30కు తినగలుగుతున్నాను. మిగతా కాలకృత్యాలను పూర్తిగా పక్కన పెట్టేయక తప్పడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కష్టం పగవాడికి కూడా వద్దు.

అస్వస్థత అతన్ని విడవకుండా వెంటాడుతోంది. కోలుకున్నాడనుకునే లోపల మళ్ళీ జ్వరం పట్టుకుంటోంది. అనారోగ్యం అతని సత్తువను పూర్తిగా తోడేసింది. స్వస్థత కోసం 1852 జనవరిలో శాంటక్లారా వ్యాలీకి వెళ్ళాడు. “నీ తమ్ముడి శరీరధర్మం, నీదీ ఒకటే. అతనిలానే నువ్వూ మరణించే ప్రమాదముం”దన్న డాక్టర్ హెచ్చరిక అతన్ని మరింత కుంగదీసింది.

అయినా అంతలోనే ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. తన జవసత్త్వాలెలాంటివో అతనికి తెలుసు. ఓ పెద్ద అదృష్టాన్ని మూటగట్టుకునితీరాలన్న దృఢసంకల్పమే అతనిలో తిరిగి ఎక్కడలేని శక్తినీ నింపింది. ఫిబ్రవరి ప్రారంభానికల్లా వచ్చి సెక్రామెంటోలోని తన కార్యాలయంలో వాలిపోయాడు. ఉదయం 5 గం.లకల్లా లేవడం, డెస్క్ దగ్గర కూర్చోవడం, బంగారం రజను తూచడం, బ్యాంకు డ్రాఫ్టులు రాయడం, ఎనిమిది భాషల్లో మాట్లాడడం…అన్నీ షరా మామూలే.

వ్యాపారలావాదేవీలప్పుడు అతను మహా బిర్రుగా ఉండేవాడు. మొహంలో చిన్న నవ్వు మొలక కూడా ఉండేది కాదు. అంతా పద్ధతిగానూ, తూచినట్టూ వ్యవహరించేవాడు. విచిత్రమైన కీచుగొంతుతో మాట్లాడేవాడు. సంపదకు సంబంధించిన అన్ని రహస్యాలనూ ఛేదించడానికి కంకణం కట్టుకున్న ఓ శాస్త్రవేత్తలానూ, ఏవో గొప్ప ప్రయోజనం కోసం దానిని పోగేయడానికి పూనుకున్నవాడిలానూ కనిపించేవాడు. అయితే ఎలాంటి  ప్రయోజనం కోసం అన్నది అతనికే తెలియదు.

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

తనను ఓ అమెరికన్ గానే పిలుచుకునేవాడు. “మన బంగారం భూములు”, “మన శ్మశానవాటిక” అని అంటుండేవాడు.  అమెరికాలోనే స్థిరపడి భావిజీవితాన్ని ఇక్కడే గడిపేయాలని ఒక్కోసారి అనిపించేది. అంతలోనే, జర్మనీకి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడుపుతున్నట్టు కలలు కనేవాడు.  రష్యా అయితే ఇప్పుడతని ఆలోచనల్లోంచి పూర్తిగా తప్పుకుంది. బంగారం మూటల పక్కన కూర్చుని తనకే తెలియని ఒక నిస్పృహలో, తనతో తనే విరోధిస్తూ గడుపుతున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం అతనిలో ఎలాంటి సందిగ్ధతా లేదు: తను ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోనైనా చేజిక్కించుకోవాలి, లేదా ఇక్కడే చావనైనా చావాలి!

మార్చి చివరినాటికి దాదాపు రెండోదే నిజమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఒంటి మీద పసుపుమచ్చలు వచ్చాయి. “నేనింక ఏమాత్రం వ్యాపార వ్యవహారాలు చూసుకోలేనని మీకు అనిపించినా వెంటనే నన్నో దుప్పట్లో చుట్టబెట్టి స్టీమర్ మీద శాన్ ఫ్రాన్సిస్కో పంపించేయం”డని గుమస్తాలకు చెప్పాడు.

అయితే, ఏదో అద్భుతం జరిగినట్టుగా కోలుకున్నాడు. అంతకుముందే అతను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రకారం, కోలుకున్న వెంటనే నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని రోత్స్ చైల్డ్ బ్యాంకుకు వెళ్ళాడు. తన ఆస్తుల బదిలీకీ, వ్యాపారం కట్టిపెట్టడానికీ ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్వాలేదు, తను డబ్బు సంచుల్ని బాగానే పోగేసాననుకుని సంతృప్తి చెందాడు. కొంతమంది కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఇంతకంటే భారీగానే సొమ్ము చేసుకుని ఉండచ్చు. కానీ తనంత వేగంగానూ, అతి తక్కువ రిస్కుతోనూ ఎవరూ సంపాదించి ఉండరు. కేవలం తొమ్మిది నెలల్లో తను సంపాదించిన మొత్తం 4 లక్షల డాలర్లు! ఇది ఎవరి కళ్ళకైనా మిరుమిట్లు గొలిపే మొత్తమే కానీ తనకు కాదు, తన శక్తియుక్తులకు ఇది ఏమాత్రం తులతూగదనుకున్నాడు.

అమెరికన్లను అతను ఇప్పటికీ మెచ్చుకుంటున్నాడు. కాకపోతే, వాళ్ళు మరీ మొరటువాళ్ళనీ, మంచీ మర్యాదా లేనివాళ్ళనీ ఇప్పుడతనికి అనిపిస్తోంది. ఇక్కడి ఆడవాళ్ళు బొత్తిగా ఆకర్షణ లేనివాళ్లని ముందే అనుకున్నాడు. విచిత్రంగా ఇప్పుడతనికి రష్యావైపు మళ్ళీ గాలి మళ్ళుతోంది. తన భావిజీవితాన్ని ఇంకెక్కడా కాదు, రష్యన్ల మధ్యే గడిపేస్తానన్న నిర్ణయానికి కూడా మరోసారి వచ్చేశాడు. ఎంతైనా రష్యన్లు మర్యాదస్తులనీ, వాళ్ళ ఆడవాళ్ళు ఇక్కడివాళ్లలా కాకుండా తనకు నచ్చే విధంగా బాధ్యతగా, ఒబ్బిడిగా ఉంటారనీ అనుకున్నాడు. ఇప్పుడు తను ఓ పెద్ద ఐశ్వర్యాన్ని వెంటబెట్టుకుని వెడుతున్నాడు కనుక మాస్కోలోనో, సెయింట్ పీటర్స్ బర్గ్ లోనో మరింత హుందాగా, వైభవంగా జీవించవచ్చు కూడా.

అందుకు తగ్గట్టే ఈసారి రష్యాకు మంచి పటాటోపంగా వెళ్లాలనుకున్నాడు. 600 డాలర్లు చెల్లించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పనామా వెళ్ళే స్టీమర్లో అన్ని హంగులూ ఉండే ఓ ప్రైవేట్ క్యాబిన్ ను బుక్ చేసుకున్నాడు. పనామా జలసంధిని దాటి, న్యూయార్క్ వెళ్ళే ఓడ అందుకుని, అక్కడినుంచి తీరుబడిగా రష్యా వెళ్లాలని అతని ఆలోచన.

అయితే, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన వారం రోజుల తర్వాత, టొవాంటెపెక్ గల్ఫ్ దగ్గర ఓడ తుపానులో చిక్కుకుంది. దాదాపు మునిగిపోయేంత పనైంది. ఆ గండం గడిచి పనామా నగరంలో అడుగుపెడితే మరో గండం ఎదురైంది. దొంగలు అతని సామాను కాజేయబోయారు. ఒకచేతిలో కోల్ట్ రివాల్వర్, మరో చేతిలో పొడవాటి బాకు పట్టుకుని స్లీమన్ రెప్పవాల్చకుండా కాపలా కాయాల్సివచ్చింది. అప్పటికి పనామా రైలురోడ్డు నిర్మాణం కొన్ని మైళ్ళ మేరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత కంచరగాడిదల మీద ప్రయాణం చేయాల్సిందే.

అంత జాగ్రత్తపరుడూ ఓ పెద్ద తప్పు చేశాడు. బొత్తిగా ప్రయాణానికి అనువు కాని సమయంలో బయలుదేరాడు. విడవకుండా వర్షం పడుతూనే ఉంది.  మీ చావు మీరు చావండని మార్గదర్శకులు మధ్యలో వదిలేశారు. తిండి లేదు. ఉడుముజాతి తొండల్ని చంపీ, తుపాకులతో కోతుల్ని వేటాడి వాటి చర్మం ఒలిచీ పచ్చిమాంసం తిన్నారు. తేళ్ళు, పొడపాములు దాడి చేశాయి. స్లీమన్ కాలికి గాయమై కుళ్లుపట్టింది. దాంతో నరాల్ని మెలిపెట్టేస్తున్నంత నొప్పి. మందులూ, బ్యాండేజీ లేవు. ఇంకోవైపు, ఇండియన్లు ఏ క్షణంలోనైనా దాడి చేస్తారన్న భయం…

చివరికి మ్యాపు సాయం కూడా లేని స్థితిలో ఆ అడవిదారి వెంట జీవచ్చవాల్లాంటి తమ దేహాలను తోసుకుంటూ వెళ్లారు. వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. దుర్భరమైన ఆ చలివాన వాళ్ళ మూలుగుల్ని కడంటా పీల్చిపారేసింది.  గమ్యస్థానమైన కోలన్ కు చేరతామన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. ఒకళ్లతో ఒకళ్ళు రేచుకుక్కల్లా కాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు. కొంతమంది జిగట విరేచనాలతో, మరికొందరు యెల్లో ఫీవర్ తో మధ్యలోనే కన్నుమూశారు. వాళ్ళ మృతదేహాలను అడవి జంతువుల భక్షణకు వదిలేసి మిగతావాళ్లు ముందుకు వెళ్లారు. సముద్రంలో మునిగిపోయినవాళ్ళు దాని అట్టడుగుకి వెళ్ళి దిక్కుతోచని స్థితిలో తిరిగినట్టుగా పద్నాలుగు రోజులపాటు సాగిన ప్రయాణభీభత్సం అది!

స్లీమన్ పరిస్థితి మరీ ఘోరం. అతను కనీసం కునుకు తీయడానికి కూడా లేదు. బాకూ, రివాల్వరూ పుచ్చుకుని తన సామానుకు కాపలా కాయక తప్పదు. అందులో బంగారం కడ్డీలు, రోత్స్ చైల్డ్ బ్యాంకు మీద తీసుకున్న డ్రాఫ్టులు, యూరప్ అంతటా ఉన్న వర్తకప్రముఖులకు ఉద్దేశించిన పరిచయలేఖలు ఉన్నాయి.

అతను తన భావోద్వేగాలను ఉన్నవున్నట్టు ప్రకటించిన సందర్భాలు చాలా అరుదు. వాటిలో ఇదొకటి. ఒళ్ళు జలదరింపజేసే ఈ అనుభవం గురించి ఒక చిన్న పేరాలో ఇలా రాసుకొచ్చాడు:

మృత్యువు మాకెంత మాలిమి అయిపోయిందంటే, దాన్ని చూసి అసలు భయపడ్డమే మానేశాం. పైగా దాన్ని ఇష్టపడడం ప్రారంభించాం. మా కళ్ళముందే కొంతమంది కళ్ళు తేలేస్తూ మృత్యుముఖంలోకి వెళ్లిపోతుంటే మాలో మేము నవ్వుకుంటూ వినోదించాం. ఒకరిపై ఒకరం ఘాతుకాలకు పాల్పడ్డాం. అవెంత దారుణమైనవంటే, ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే భయంతో నిలువునా గడ్డకట్టిపోతాను.

అవి ఎలాంటి ఘాతుకాలు, వాటిలో తను స్వయంగా పాల్గొన్నాడా అన్నది అతను ఏనాడూ వెల్లడించలేదు. మానభంగం, హత్య, నరమాంసభక్షణ…ఇలా ఊహించవలసిందే కానీ అవేమిటో తెలియదు. తదుపరి సంవత్సరాలలో తన జీవితం గురించి ఎప్పుడు రాసినా అమెరికాలో తను గడిపిన కాలాన్ని త్వర త్వరగా దాటేసేవాడు. పనామా జలసంధిపై తను చేసిన ప్రయాణం గురించైతే మళ్ళీ ఎక్కడా ప్రస్తావన కూడా చేయలేదు. ఆ పద్నాలుగు రోజుల భయానక అనుభవాన్ని మరచిపోవడానికే ప్రయత్నించాడు.

కాకపోతే ఆ తర్వాత అతను మరింత నిర్దాక్షిణ్యంగానూ, ఇతరుల పట్లే కాక తన పట్ల తనే మరింత కరకుగానూ     మారినట్టు కనిపిస్తుంది. నీది బొత్తిగా తడిలేని రాతిగుండె అనీ, ఎంతసేపూ స్వార్థమే తప్ప ప్రపంచం ఏమైపోతున్నా నీకు పట్టదనీ ముందునుంచీ తోబుట్టువులు నిష్టురమాడేవారు. ఇప్పుడు మరింత బండరాయిగానూ, కర్కశంగానూ మారాడు. డబ్బు పిచ్చి కూడా వెనకటి కంటే ముదిరిపోయింది.  రాను రాను అతను తన ఊహల లోతుల్లో నిద్రిస్తున్న గ్రీకు వీరుల్లా మారుతూ వచ్చాడు.  మెలికలు తిరుగుతూ మృత్యుముఖంలోకి వెడుతున్న వాళ్ళను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటూ వినోదిస్తూ గడిపినవాళ్లే. అతనిలానే సంపద వేటలో ఆటవికత అంచులు దాటినవాళ్ళే.

మొత్తానికి అతను యూరప్ కు తిరుగుముఖం పట్టాడు. కాలి గాయానికి కట్టు కట్టించుకునేంత సేపే            న్యూయార్క్ లో  ఆగాడు. లండన్ లో దిగి  గాయానికి కాల్పుల చికిత్స చేయించుకున్నాడు. మెక్లంబర్గ్ లో కొన్ని వారాలు ఆగి పాత పరిచయాలను పునరుద్ధరించుకున్నాడు. తన ధనబలాన్ని ఆడంబరంగా ప్రదర్శించుకున్నాడు. తండ్రికి, చిన్నాన్నకు, తోబుట్టువులకు ఖరీదైన కానుకలు ఇచ్చాడు. తీరా మెక్లంబర్గ్ వచ్చాక, వ్యవసాయదారుడిగా స్థిరపడాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పేశాడు. రష్యాకు వెళ్లిపోవాలనీ, అక్కడో పెద్ద భవంతిని, లేదా కనీసం ఓ పెద్ద అపార్ట్ మెంట్ ను కొనుక్కోవాలనీ; మంచి కుటుంబం నుంచి వచ్చిన ఓ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనీ, బహుశా కొంత కాలానికి తను రష్యన్ ప్రభువర్గంలో చేరే స్థాయికి ఎదుగుతాననీ అనుకుంటున్నాడు.

తన వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. భావిజీవితం బంగారు బాటపై సాగిపోగలిగినంత సంపదను ఇప్పటికే గడించుకున్నాడు. తనిప్పుడు ఎవరికీ, దేనికీ తలవంచాల్సిన అవసరం లేదు. స్లై మీద సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెడుతూ, ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడనుకున్నాడు. తను ఫస్టెన్ బర్గ్, ఏమ్ స్టడామ్ లలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజుల్లో; పుస్తకాలు, మద్యం, మగువ, పనివాళ్లు, ఇళ్లతో సహా పగటికలలు అనుకున్నవన్నీ ఇప్పుడు  చిటికెనవేలు ఆడిస్తే చాలు, రెట్టింపు లెక్కలో తన ముందు వాలిపోతాయనుకున్నాడు.

కానీ, గడిచిన పదిహేడేళ్ళ జీవితంలో డబ్బు తనకేనాడూ సుఖాన్నీ, సంతోషాన్నీ ఇవ్వలేదన్న సంగతిని అతను గమనించుకోలేకపోయాడు.

త్వరలోనే అతని జీవితకథలో కొత్తపుటలు చేరబోతున్నాయి.  ఎట్టకేలకు అతను ఒక ఇంటివాడు కాబోతున్నాడు….!

  (సశేషం)

 

అతని డైరీ రాతల్లో మానవ అనుభవాల పచ్చిదనం…

 

స్లీమన్ కథ-6

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తమ్ముడు మరణించిన వార్త స్లీమన్ కు చేరింది 1850 ఆగస్టులో…

ఆ ఏడాది మిగతా రోజుల్ని తన వ్యాపార పర్యవేక్షణలోనూ, ఏం చేయాలో తోచని అనిశ్చితస్థితిలోనూ గడిపేశాడు. తమ్ముడి మరణం అతన్ని చలింపజేసింది. మృత్యువు గురించిన ఊహ భయపెట్టింది. దుఃఖభారం తన మీద హఠాత్తుగా పడినట్టుగా కుటుంబ సభ్యుల మీద పడకూడదనుకుని ఒక విచిత్రమైన ఉత్తరం రాశాడు. తమ్ముడు చనిపోయినట్టు తనకు కల వచ్చిందనీ, ఈ ఇరవయ్యేళ్లలో ఎప్పుడూ ఏడవని తను ఆ కలను తలచుకుని మూడు రోజులపాటు దుఃఖించాననీ అందులో రాశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అసలు విషయం రాస్తూ, తమ్ముడు ఓ పెద్ద ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతిని కూడా తెలియజేశాడు.

ఏడాది చివరిలో అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తమ్ముడి ఆస్తిని సంరక్షించవలసిన బాధ్యత తనకు ఉంది. దాంతోపాటు అతని అడుగుజాడల్లో నడుస్తూ తను కూడా కాలిఫోర్నియా బంగారు భూముల దగ్గరకు వెళ్ళి అతని డబ్బుతోనే వ్యాపారం చేసి సెయింట్ పీటర్స్ బర్గ్ లో కన్నా వేగంగా కోట్లు సంపాదించచ్చు. అంతకన్నా ముందు తమ్ముడికి తగిన సమాధిని నిర్మించాలి. తనింక అమెరికాలోనే స్థిరపడిపోతాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో తనను కట్టి పడేసేవేమీ లేవు. కాకపోతే ఎకతెరీనా లిషిన్ ను తను ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆమెను తను పెళ్లి చేసుకుంటే మళ్ళీ రష్యా రావలసి ఉంటుంది. ఆమె పెళ్ళికి ఇష్టపడాలన్నా తను అమెరికా వెళ్ళి ఆమె కళ్ళకు జిగేలుమనిపించేటంత ఐశ్వర్యాన్ని గడించవలసిందే.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే జీవితాంతం పాతుకు పోవాలని ఇంతకుముందు అనుకున్నాడు. ఇప్పుడది పొరపాటు నిర్ణయం అనుకుంటున్నాడు. మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనీ, ఆగిన చోట ఆగకుండా మరోసారి సంచారజీవిగా మారాలనీ తలపోస్తున్నాడు.

1850 డిసెంబర్ 10న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన వర్తక మిత్రులకు చివరి విందు ఇచ్చి ఆ నగరానికి వీడ్కోలు చెప్పాడు. నేవా నది గడ్డకట్టి ఉంది. సెయింట్ ఇసాక్ స్క్వేర్ మీదుగా మంచు గాలులు వీస్తున్నాయి. మిత్రులు అతన్ని సాగనంపడానికి పోస్టాఫీస్ దాకా వచ్చారు. అక్కడినుంచే జర్మనీకి దూరప్రయాణం చేసే స్లై బళ్ళు బయలుదేరతాయి. అక్కడి వింటర్ ప్యాలెస్, నౌకాదళ భవనం, అశ్వాన్ని అధిష్టించి ఉన్న పీటర్ ది గ్రేట్ విగ్రహం పక్కగా వెడుతూ అదే చివరిసారి అన్నట్టు వాటికి శాల్యూట్ చేశాడు.

ప్రయాణంలో ఎప్పటిలానే డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ రాతలు చాలావరకూ టైమ్ టేబుల్ కు పొడిగింపే. వాటిలో రైళ్ల రాకపోకల వేళలు, ప్రయాణంలో తగిలిన రైల్వే స్టేషన్ల పేర్లు, తను బస చేసిన హోటల్ వివరాలు, ఆరో అంతస్తులో తను దిగిన గదికి చెల్లించిన కిరాయి, బ్యాంక్ లో తను మారకం చేసిన మొత్తం, తన అనుమతితో కలసుకున్న వర్తకుల పేర్లు వగైరాలు ఉంటాయి.

1850 డిసెంబర్ 15న డైరీలో ఇలా రాసుకున్నాడు:

ఉదయం 7గం. లకు ఎల్బింగ్ లో బ్రేక్ ఫాస్ట్ చేశాం. 11గం.లకు మేరియన్ బర్గ్ దాటాం. సాయంత్రం 4గం.లకు ఓ పెద్ద తేలుడు వంతెన మీంచి విష్టులా మీదుగా డిషావ్ చేరుకున్నాం. డిసెంబర్ 18న మధ్యాహ్నానికి ఓడెన్ బర్గ్ చేరాం. అక్కడ డిన్నర్ చాలా అధ్వాన్నంగా ఉంది. 1గం.కు రైల్లో బయలుదేరి సాయంత్రం 5.30గం.లకు స్టార్ గాడ్ మీదుగా స్టెటిన్ చేరాం. అక్కడినుంచి మళ్ళీ 6.30గం. లకు రైల్లో బయలుదేరి రాత్రి 9.30గం.లకు బెర్లిన్ చేరాం.

అదృష్టవశాత్తూ అతని డైరీ రచన ప్రతిసారీ ఇలాగే లేదు. తన అమెరికా ప్రయాణం డైరీని అతను ఇంగ్లీష్ లో రాశాడు.   అందులోని కొన్ని భాగాలు అతని అత్యుత్తమ రచనల్లో ఒకటిగా మిగిలిపోతాయి. ప్రచురణకూ, ఇంకొకళ్ళు చదవడానికీ ఉద్దేశించకపోయినా వాటినతను ఎంతో శ్రద్ధగా రాశాడు. కొన్నిచోట్ల కథనంలో గొప్ప నిజాయితీ, నిర్మొహమాటం ఉట్టిపడుతూ అతని అనుభవప్రపంచంలోకి మనల్ని ఇట్టే తీసుకుపోతాయి.

డైరీ తెరవగానే, ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోడానికి అంగలార్చుతూ బయలుదేరిన అసలుసిసలు వ్యాపారవేత్తగానే అతను కనిపిస్తాడు. తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోగల తన వ్యాపారపు మెళవకుల గురించిన డాంబికత; గురి తప్పని తన అంచనాల గురించిన ఆత్మవిశ్వాసమూ ఆ రాతల్లో వ్యక్తమవుతాయి. కానీ ముందుకు వెడుతున్నకొద్దీ అతన్ని మొదలంటా వణికింపజేసిన మానవ అనుభవాల పచ్చిదనం కనిపిస్తుంది. తుపాను, గాలివాన, అస్వస్థత అతనిలోని అతిశయపు గాలి తీసేసి అణిగి ఉండేలా చేశాయి. భయభీభత్సాల ముఖాన్ని అతి దగ్గరగా చూసి అతను  మామూలు మనిషయ్యాడు.

అతని డైరీ తొలి పుటల్ని తిరగేసేవారెవరూ, కాన్ రాడ్ రాసిన Heart of Darkness తో పోల్చదగిన ఒక మానవీయ అనుభవపత్రాన్ని ముందు ముందు చదవబోతున్నామని అనుకోలేరు

పనామా జలసంధిలో చాగరెస్ నది

పనామా జలసంధిలో చాగరెస్ నది

స్లీమన్ ఏమ్ స్టడామ్ చేరుకుని బి. హెచ్. ష్రోడర్ &కో ను సందర్శించాడు. అమెరికాలోని ఏజెన్సీలకు, బ్యాంకులకు పరిచయలేఖలు తీసుకున్నాడు. అక్కడినుంచి బయలుదేరి డిసెంబర్ 23న లండన్ చేరుకున్నాడు. “బ్లాక్ ఫ్రయర్స్ బ్రిడ్జి” దగ్గర, “రాయల్ హోటల్” లో బస చేశాడు.  తను సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తెచ్చుకున్న బిల్లులను నగదుగా మార్చుకున్నాడు. తన దగ్గరున్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు అమ్మేశాడు. మధ్యాహ్నం క్రిస్టల్ ప్యాలెస్ ను దర్శించి ఆనందించాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతికి అది కూడా ఒక తిరుగులేని ఉదాహరణగా కనిపించింది.

క్రిష్టమస్ రోజున వెస్ట్ మినిస్టర్ యాబేలో చర్చి సేవల్లో పాల్గొన్నాడు. అదే రోజున ప్రముఖ విషాదాంత నాటక నటుడు మెక్రాడే రంగస్థలంనుంచి విరమించుకునే ముందు నటించిన చివరి నాటకాన్ని చూశానని డైరీలో రాసుకున్నాడు. నిజానికి మెక్రాడే క్రిష్టమస్ రోజంతా పూర్తిగా తన కుటుంబంతో గడిపాడు తప్ప ముఖానికి రంగు వేసుకోలేదు. అతను చివరిసారి నటించింది అప్పటికి రెండు నెలల తర్వాత! 1851 ఫిబ్రవరి 26న ప్రిన్స్ థియేటర్ లో జరిగిన ఆ బ్రహ్మాండమైన ప్రదర్శనను తిలకించినవారిలో డికెన్స్, బుల్వర్-లిటన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. స్లీమన్ మరెవరి నాటకమో చూసి మెక్రాడేదిగా పొరబడి ఉంటాడు.

క్రిష్టమస్ మరునాడే రైల్లో లివర్ పూల్ చేరుకుని తను ఎప్పుడూ దిగే అతి పెద్ద హోటల్ అడెల్ఫీలో బసచేశాడు. 35 పౌండ్లు చెల్లించి న్యూయార్క్ ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రి వరకూ లివర్ పూల్ లో అక్కడా అక్కడా తిరిగాడు.

ss atlantic (1)

ఎస్.ఎస్. అట్లాంటిక్

3వేల టన్నుల బరువైన ఎస్.ఎస్. అట్లాంటిక్ ఆ మరునాడే న్యూయార్క్ కు బయలుదేరింది. ఆ రోజుల్లో అత్యంత వేగంగా ప్రయాణించే ఓడల్లో అదొకటి. బయలుదేరిన ఎనిమిది రోజులకు తుపానులో చిక్కుకుంది. ఓ పెద్ద అల ముందుచక్రాన్ని ధ్వంసం చేసి ప్రధాన స్తంభాన్ని విరిచేసింది. అలలు ఓడను తలోవైపుకీ విసిరేయడం ప్రారంభించాయి. ఇంజన్లు రెండూ పనిచేయడం మానేశాయి. అప్పటికి ఓడ లివర్ పూల్ నుంచి 1,800 మైళ్ళు ప్రయాణించి, న్యూయార్క్ కు 1,400 మైళ్ళ దూరంలో దాదాపు అట్లాంటిక్ నడి మధ్యలో ఉంది.

ఉధృతంగా వీస్తున్న పడమటి గాలిని ఆసరా చేసుకుని సముద్రానికి అడ్డంగా ప్రయాణించి అమెరికా తీరానికి చేరుకోవచ్చుననుకుని కెప్టెన్ ప్రధాన తెరచాపల్ని ఎగరేశాడు. “తెరచాపలు జేబురుమాళ్లను తలపించాయి” అని స్లీమన్ డైరీలో రాసుకున్నాడు. తుపాను గాలులకు అభిముఖంగా ప్రయాణించాలన్న కెప్టెన్ ఆలోచనను ప్రయాణీకులంతా వ్యతిరేకించారు. ఇంగ్లండ్ కు తిరిగి వెళ్ళడం మంచిదన్నారు. పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. చివరికి ప్రయాణీకుల ఒత్తిడికి తలవొగ్గి కెప్టెన్ ఓడను వెనక్కి తిప్పాడు.

సముద్రపు గాలి పడక స్లీమన్ అంతవరకూ అస్వస్థతతో ఉన్నాడు. తుపాను కలిగించిన ఉద్రిక్తత పుణ్యమా అని ఆ  అస్వస్థత మంత్రించినట్టు మాయమైపోయింది. పైగా అంతవరకూ లేనంత ఉల్లాసాన్ని తను పుంజుకోవడం గమనించి స్లీమన్ ఆశ్చర్యపోయాడు. ఘనత వహించిన ఆ ఓడ చీలికలు పీలికలైన తెరచాపలతో ఇంటిముఖం పడుతుంటే వింతగా చూస్తూ ఉండిపోయాడు.

పదహారు రోజుల తర్వాత క్వీన్స్ టౌన్ లో ఓడకు లంగరేశారు. స్లీమన్ వెంటనే బయలుదేరి డబ్లిన్ మీదుగా లివర్ పూల్ కు తిరిగి వచ్చాడు. అంతలో ఏమ్ స్టడామ్ లో ఓ ముఖ్యమైన వ్యాపారలావాదేవీకి తను అత్యవసరంగా హాజరు కావాలన్న కబురు అందింది. హడావుడిగా అక్కడికి వెళ్ళి ఫిబ్రవరి 1 కల్లా మళ్ళీ లివర్ పూల్ వచ్చి న్యూయార్క్ ప్రయాణానికి తిరిగి సిద్ధమైపోయాడు.

ఈసారి అతను ఎస్.ఎస్. ఆఫ్రికాలో ప్రయాణం చేశాడు. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయింది. అతనికి న్యూయార్క్ నచ్చింది. యూరోపియన్ రాజధానులతో పోల్చదగింది కాకపోయినా, “సొగసైన భారీ భవంతులతో ఓ పద్ధతిగా, చూడముచ్చటగా, శుభ్రంగా నిర్మించిన నగరం” అనుకున్నాడు. న్యూయార్క్ లోని ఆడవాళ్ళలో మాత్రం మెచ్చుకోదగింది ఏమీ అతనికి కనిపించలేదు. “16-18 ఏళ్ల వయసులో ఎంత అందంగా, కుదిమట్టంగా ఉంటారో, 22 ఏళ్ళు వచ్చేసరికి అంత వయసుమీరినవాళ్లలా, నలిగిపోయినట్టు కనిపిస్తారు” అని డైరీలో రాసుకున్నాడు. వినోదాలకు, పనికిమాలిన విషయాలకు వాళ్ళు వెంపర్లాడతారని కూడా అతనికి అనిపించింది.

అక్కడి రైలురోడ్లు కూడా అతనికి నచ్చలేదు. రైల్లో ఫిలడెల్ఫియాకు వెళ్లొచ్చిన తర్వాత, “అమెరికాలో రైలురోడ్లు కేవలం డబ్బు చేసుకోడానికే నిర్మించారు. ప్రయాణీకులకు అవసరమైన సదుపాయాలపై కనీసమైన దృష్టి కూడా పెట్టలేదు” అని రాశాడు. అలా అన్నవాడే ఆ తర్వాతి కాలంలో అమెరికా రైలు రోడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాడు.

వాషింగ్టన్ వెళ్ళి అధ్యక్షుడు ఫిల్ మోర్ ను కలసుకున్నాడు. “ఈ అందమైన పడమటి దేశాన్ని చూడడానికీ, దీనిని పాలించే మహనీయుల్ని పరిచయం చేసుకోడానికీ వచ్చా”నని అధ్యక్షుడితో చెప్పినట్టు రాశాడు. ఆ వెంటనే వైట్ హౌస్ లో జరిగిన ‘స్వయిరీ’(soiree: సాధారణంగా ఒక ప్రైవేట్ గృహంలో జరిగే సాయం విందు. దీనికి నిర్దిష్టమైన దుస్తులతో హాజరవుతారు)లో పాల్గొని, పనామా జలసంధి(Isthamus of Panama)కి దారితీసే ఓడ ఎక్కాడు. ఆ రోజుల్లో సుదూర పశ్చిమానికి వెళ్లడానికి అదొక్కటే దారి. అప్పటికింకా పనామా రైలురోడ్డు లేదు. జలసంధికి చేరుకున్నాక కంచర గాడిదల మీద ప్రయాణం చేసేవారు. ఆ ప్రాంతంలో యెల్లో ఫీవర్ లాంటి మన్య జ్వరాల బెడద ఎక్కువగా ఉండేది. చుట్టుపక్కల అడవుల్లో బందిపోట్ల సమస్యా ఉండేది.

స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు:

పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి ఆదివాసులు అచ్చంగా ఆదమ్, ఈవ్ ల వారసులే. నగ్నంగా తిరుగుతూ, ఇక్కడ విస్తారంగా లభించే పండ్ల మీద ఆధారపడుతూ తమ పూర్వీకుల పద్ధతులను, ఆచారాలను పూర్తిగా పాటిస్తున్నారు. వీళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించేది దారుణమైన సోమరితనం. వేరే ఏ పనీ చేయకుండా ఉయ్యాలలో పడుకుని తింటూ, తాగుతూ గడుపుతారు. మొత్తానికి అద్భుతమైనవాళ్ళు.

అద్భుతం అలా ఉంచి, వాళ్ళ సోమరితనాన్నీ, వాళ్ళనూ చూసి అతను భయపడ్డాడు. దారి పొడవునా ఇండియన్ల చేతుల్లో హతులైన బాటసారుల ఎముకల పోగులు కనిపించాయి. పనామా చేరాడు కానీ ఆ నగరం అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. అక్కడి స్పానిష్ జనం కూడా అతనికి “సోమరిపోతుల్లానూ; న్యూయార్క్ లోని ఆడవాళ్ళలానే  వినోదాలకు, పనికిమాలిన ఆసక్తులకు పాకులాడేవాళ్లుగానూ, పెద్దగా శీలసంపద లేనివాళ్ళుగానూ” కనిపించారు. ఇలా చూసీ చూడగానే మనుషుల మీద తొందరపాటు తీర్పులు ఇవ్వబోయాడే కానీ, ఉష్ణమండల ప్రాంతాలలో జనజీవితం చాలావరకూ ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందనీ, వారి ఆకాంక్షలకు అదే హద్దులు గీస్తుందన్న సంగతి అతనికి తట్టలేదు.

పనామాలో అతనికి ఏదీ నచ్చకపోయినా, విచిత్రంగా ఒకవిధమైన సంతృప్తినీ చెందాడు. ప్రయాణం దాదాపు ముగిసి, కాలిఫోర్నియా బంగారం చేతికి అందబోయే అవకాశం అతనిలో ఉత్సాహం నింపింది. అక్కడికి వెళ్ళే ఓడకు ఇంకా కొన్ని రోజుల వ్యవధి ఉంది కనుక ఈలోపల పనామా పాతనగరం చూద్దామని వెళ్ళాడు. మోర్గాన్, అతని సముద్రపు దొంగల ముఠా ధ్వంసం చేయడంతో సగం నగరం పాడుబడి ఓ పెద్ద అడవిలా తయారైంది.

అంకెర్షాగన్ విడిచిపెట్టాక అతను శిథిలాలను చూడడం ఇదే మొదటిసారి. ఆ దృశ్యం అతనికి పెద్దగా ఉత్తేజం కలిగించలేదు కానీ, ఆ పురాతనపు గోడల్లో చెట్ల వేళ్ళు ఎలా పాతుకున్నాయా అనుకుంటూ వింతగా వాటినే చూస్తూ ఉండిపోయాడు. పనామా పాతనగరం సందర్శనను పురావస్తు అన్వేషణలో అతని తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. తన వెంట వచ్చిన గైడ్ ఓ మొద్దావతారమనీ, ఆ శిథిలాల గురించి అతనికేమీ తెలియదనీ, సమయం వృథా అవడం తప్ప ఈ ప్రయాణంతో ఒరిగిందేమీ లేదనీ రాసుకున్నాడు.

1851 మార్చి 15న ఎస్.ఎస్. ఓరెగన్ మీద కాలిఫోర్నియాకు బయలుదేరాడు. ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ అసహ్యించుకున్నాడు. భోజనం పరమ రోతగా ఉందంటూ పళ్ళు నూరాడు. ఎంతసేపూ ఉప్పులో ఊరేసిన పందిమాంసం, గొడ్డు మాంసం తప్ప; ఐసుకానీ, తాజా మాంసంకానీ లేదు. సముద్రస్నానాన్ని మాత్రం చాలా ఇష్టపడ్డాడు. అయితే ఓడలోని పనివాళ్లు అందుకు సహకరించకపోవడం అతనికి విచిత్రంగా అనిపించింది.

వారం రోజుల తర్వాత ఓడ అకపుల్కో చేరింది. స్పానిష్ జనంపై అతనిలో ఏర్పడిన అవిశ్వాసం ఇప్పుడు మెక్సికన్లవైపు మళ్ళింది. వాళ్ళు వట్టి అబద్ధాలకోరులు, అజ్ఞానులు, పొగరుబోతులు అనుకున్నాడు. అకపుల్కో “ఓ ఆఫ్రికా గ్రామం”లా కిక్కిరిసిన గుడిసెల గుంపులా ఉందన్నాడు. పసుపురంగు సముద్రపు కలుపుతో నిండిన అఖాతం చుట్టూ కొన్ని చెక్కఇళ్ళు మాత్రమే ఉన్న కుగ్రామంగా శాన్ డియేగోను తీసిపారేశాడు. ఆ నేలను, తోటి ప్రయాణీకులను ఏవగించుకుంటూ, ఖగోళ గ్రంథాలు చదువుతూ, రాత్రిపూట గంటల తరబడి నక్షత్రాలను పరిశీలిస్తూ గడిపాడు. అతనిలో అసహనం ఎంత తారస్థాయికి వెళ్ళిందంటే, ఓడ గోల్డెన్ గేట్ (శాన్ ఫ్రాన్సిస్కోను మెరీన్ కౌంటీతో కలిపే జలమార్గాన్ని గోల్డెన్ గేట్ అంటారు. 1933లో అక్కడ గోల్డెన్ గేట్ వంతెన నిర్మించారు)కు చేరడం ఏ కొంచెం ఆలస్యమైనా భగ్గున పేలిపోయి ఉండేవాడు.

శాన్ ఫ్రానిస్కోను చూసి మాత్రం చాలా సంతోషించాడు. అయినా సమయం వృథా చేయడానికి లేదనుకుంటూ తమ్ముడి సమాధిని చూడడానికి వెంటనే సెక్రామెంటోకు దారితీశాడు. అప్పటికి సెక్రామెంటో ఇంకా బాల్యదశలోనే ఉంది. చెక్క గోడలతో నిర్మించిన ఇళ్లతో ఈ విచిత్రమైన పట్టణం, పొరుగునే ఉన్న బంగారు భూముల పుణ్యమా అని ఉనికిలోకి వచ్చింది. మొదటిసారి సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టినప్పుడు తనలోంచి ఆశ్చర్యకరమైన ఉధృతితో తోసుకొచ్చిన అనుభూతి లాంటిదే ఈ పట్టణంలో అడుగుపెట్టగానే అతనికి కలిగింది.  ఈ పట్టణ జనాభా కన్నా, ఇక్కడి శ్మశానంలోని సమాధులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అతను గమనించాడు.

తమ్ముడి సమాధిని చూశాడు. అక్కడ ఎలాంటి స్మారకచిహ్నాలూ లేవు. “ఒక చక్కని పాలరాతి సమాధి”ని నిర్మించమని చెప్పి ఓ శవవాహకుడికి 15 పౌండ్లు ఇచ్చాడు. తమ్ముడు విడిచి వెళ్ళిన సంపద గురించి వాకబు చేశాడు. అతని భాగస్వామి దాన్ని పుచ్చుకుని పారిపోయాడని అక్కడి వాళ్ళు చెప్పారు. పోలీసుల సాయంతో అతన్ని పట్టుకోవచ్చేమో నని కొంత భోగట్టా చేశాడు. చివరికి అదో వృథా ప్రయాస అన్న నిర్ణయానికి వచ్చి విరమించాడు. అలా తమ్ముడు సంపాదించానని చెప్పిన ముల్లె కాస్తా గాలిలో కలిసిపోయింది.

స్లీమన్ కు సెక్రామెంటో మామూలుగా నచ్చడం కాదు, మత్తెక్కించింది. కొత్తచోట ప్రతిసారీ చేసినట్టే చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ ఎలాంటి అవకాశాలుంటాయో పరిశీలించాడు. సటర్ విలాను, యుబా నది దగ్గరి బంగారు భూముల్ని, నెవాడా నగరాన్నీ దర్శించాడు. నెవాడా “చీదర పుట్టించే చిన్నపాటి ప్రదేశం”గా అతనికి కనిపించింది. ప్రయాణాల్లో తనలా బహుభాషా పరిచయం ఉన్నవాళ్లను గాలించి పట్టుకునే అలవాటు కూడా అతనికుంది. సొనోమా వ్యాలీలో అలాంటి వ్యక్తి తారసపడ్డాడు. అతను ప్రొఫెసర్ రీగర్. అతనికి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, డచ్చి భాషలు తెలుసు. ఒక భాషనుంచి ఇంకో భాషలోకి అవలీలగా లంఘించే ఆ అపరిచితునితో అర్థరాత్రి వరకూ కబుర్లాడుతూ స్లీమన్ ఆనందించాడు.

కొన్ని రోజులు అనిశ్చితంగా గడిపిన తర్వాత, బంగారం రజను(gold dust)కొనే వ్యాపారిగా అవతారమెత్తాడు. ఆ వ్యవహారంలోనే జూన్ లో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాడు. అగ్నిప్రమాదాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ నగరంలో అతను ఉన్నప్పుడే ఓ పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది…

                                                                                                                     (సశేషం)

 

 

 

 

 

 

 

వ్యాపార శిఖరంపై…ఒంటరితనం లోయలో…

 

స్లీమన్ కథ-5

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మిన్నాతో అతని పరిచయం పదహారేళ్ళ క్రితం. ఇన్నేళ్లలో వాళ్ళు కలసి తిరిగింది మాత్రం మూడు, నాలుగేళ్లే, అది కూడా బాల్యంలో!  కానీ ఇంతవరకూ అతని జీవితంలో మనసుకు దగ్గరైంది మిన్నా ఒక్కతే. అతని ఊహల్ని, కలల్ని పంచుకున్నదీ; అతనేం చెప్పినా ఆసక్తిగా, శ్రద్ధగా ఊకొడుతూ విన్నదీ ఆమె ఒక్కతే.

ఆమెకు దూరమైన ఈ పన్నెండేళ్లలోనూ ఎక్కువ కాలం, అతను పేదరికంతో ముఖాముఖి పోరాటంలోనే గడిపాడు. ఆ ప్రయత్నంలో మృత్యుముఖంలోకీ వెళ్ళి వచ్చాడు. అంతటి కష్టజీవితం కూడా అతన్ని మానసికంగా  ఏనాడూ కుంగదీయలేదు. కుంగదీయకపోగా అతనిలో పైకి ఎదగాలన్న పట్టుదలను, కార్యదీక్షను పెంచింది. మిన్నా సాహచర్యంలో తను గడపబోయే భావిజీవితం గురించిన ఊహ బతుకు పోరాటంలో అతను విజేతగా నిలవడానికి స్ఫూర్తి నిచ్చింది. మిన్నా తలపులతో అతను జీవనోత్సాహాన్ని పుంజుకోని రోజు ఈ పదహారేళ్లలో ఒక్కటీ లేదు. కడగండ్ల లోయలోంచి ఒక్కసారిగా అతను వైభవశిఖరాన్ని అందుకోగలిగాడంటే; దాని వెనుక మిన్నా అదృశ్యహస్తం తప్పనిసరిగా ఉంది.

తీరా జీవితంతోపాటు మిన్నాను కూడా గెలుచుకోగలిగిన దశలో ఆమె చేజారిపోయింది. తనదనుకున్న మిన్నా ఇంకొకరి సొత్తు అయిపోయింది. ఆమెకు పెళ్లి జరిగిపోయిందన్న చేదునిజం మొదటిసారి అతని మనసుకు పెనుగాయం చేసింది.  పంచుకునే మనిషి లేనప్పుడు ఈ డబ్బు, పలుకుబడి, ప్రతిష్టా దేనికన్న ప్రశ్న అతనికి మొదటిసారి ఎదురైంది. మిన్నాతో శాశ్వతవియోగ రూపంలో మనసులోకి నిశ్శబ్దంగా జారిన ఒక వెలితి ఒంటరితనంగా మారి క్రమంగా పెద్దదవుతూ అతని భావిజీవితం అంతా పరచుకుంటూ వచ్చింది. అతనిలో ఇప్పుడు విచారంతోపాటు అసహనం, చికాకు పెరుగుతున్నాయి.

పైకి మాత్రం ఒక వ్యాపారవేత్తగా అతని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి  ఏడాది తిరక్కుండానే ప్రథమ శ్రేణి(First Guild) వర్తకుల జాబితాలో అతని పేరు చేరింది. చిరకాలంగా పాతుకుపోయిన పెద్ద వర్తకుల్లానే ఇప్పుడతను బ్యాంకులనుంచి కావలసినంత రుణం పొందచ్చు. నెల నెలా జరిగే గిల్డ్ సమావేశానికి హాజరు కావచ్చు. కోట్లకు పడగెత్తిన వర్తకులతో సమాన ఫాయీలో మాటలు, మంతనాలు జరపచ్చు. విందు వినోదాల్లో పాల్గోవచ్చు.

తను జర్మన్ అయినా స్వచ్ఛమైన రష్యన్ లో అనర్గళంగా ప్రసంగించగలగడం అతని అదనపు ఆకర్షణ. అతన్ని గిల్డ్ క్లబ్ లోకి సాదరంగా ఆహ్వానించిన బడా వర్తకుల్లో పీటర్ అలెగ్జీఫ్ ఒకడు. అతనిది పది కోట్ల రూబుళ్ల విలువైన వ్యాపారం అదిగాక కోటి రూబుళ్లకు పైగా వ్యక్తిగత ఆస్తి ఉంది. పొనోమరెఫ్ ప్రముఖ చక్కెర, కలప వ్యాపారి. అతనికి స్లీమన్ వ్యాపారదక్షత మీద మంచి గురి కుదిరింది. తనతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే లక్ష సిల్వర్ రూబుళ్లు పెట్టుబడి పెడతానంటూ ముందుకొచ్చాడు. ఇక ఏమ్ స్టడామ్ లో తనకు పరిచయమైన  పాత మిత్రుడు జివాగో ఉండనే ఉన్నాడు. అతనిది కూడా కోట్ల విలువైన వ్యాపారం. స్లీమన్ రష్యా రావడానికి చాలావరకూ అతనే కారణం. మాస్కోలో అతనికి ఓ బ్రహ్మాండమైన భవంతి ఉంది. ఎప్పుడు మాస్కో వెళ్ళినా స్లీమన్ బస అక్కడే.

జివాగోకు పిల్లలు లేరు. మేనగోడలు ఎకెతెరీనా అతని దగ్గరే ఉంటోంది. వయసు పదహారేళ్లు. అందంలోనూ గుణంలోనూ  అచ్చం “దేవకన్యే”.  స్లీమన్ తో వ్యాపార భాగస్వామ్యాన్నే కాదు, మేనగోడలినిచ్చి అతనితో బంధుత్వం కూడా కలుపుకోవాలని జివాగో అనుకున్నట్టున్నాడు, స్లీమన్ తన ఇంటికి వచ్చినప్పుడల్లా బ్రహ్మరథం పట్టేవాడు. ఒకసారైతే మూడు, నాలుగు నెలలు ఇక్కడే ఉండిపొమ్మని కూడా పట్టుబట్టాడు.

స్లీమన్ అతని ఆలోచనల్ని పసిగట్టాడు. ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. “పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అసలు సమస్య. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు ఆడవాళ్ళలో గుణాలే కానీ లోపాలు కనిపించవు” అన్నాడు.

విదేశాల్లో ఉన్న తన ఏజెన్సీలనుంచి వ్యాపార నివేదిక అడిగినట్టుగా ఎకెతెరీనా మీద నివేదిక ఇమ్మని సోదరిని అడిగాడన్నమాట. పైగా తనింట్లో పెద్ద స్నానాల తొట్టెతో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయనీ, నువ్వు చాలా సుఖంగా గడపచ్చని కూడా రాశాడు.

ఎందుకోగానీ సోదరి నుంచి ఉలుకూ పలుకూ లేదు. స్లీమన్ హతాశుడయ్యాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప మిన్నా లాంటి అమ్మాయి తనకు భార్యగా లభించడం అసాధ్యమనుకున్నాడు. అయినా చూద్దామని బాగా డబ్బూ, ప్రతిష్టా ఉన్న వర్తకుల అమ్మాయిలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రతి ప్రయత్నం చివరికింత మనస్తాపాన్నో, అయోమయాన్నో మిగిల్చేది. చిటపటలకు, అసహనానికి తోడు తను చెప్పిందే వేదమనే స్వభావం అతనిది. శాసించి పనులు జరిపించుకోడానికి అతను అప్పటికే అలవాటు పడిపోయాడు. అయితే వ్యాపారరంగంలో కలిసొచ్చిన లక్షణాలు అమ్మాయిల దగ్గర పనికిరాలేదు. వాళ్ళు అతనికో పెద్ద పజిల్ గా మారారు. వాళ్ళే ఏమిటి, ఈ విషయానికి వచ్చేసరికి తనకు తానే ఓ పజిల్ గా మారాడు. అసలు తనకు ఏం కావాలో తనే నిర్ణయించుకోలేకపోయాడు. ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని ఊహ. కానీ అందమూ, నిరాడంబరతా, హుందాతనం రాశిపోసిన మిన్నా లాంటి అమ్మాయి అతనికి ఒక్కరూ దొరకలేదు.

మొత్తానికి మిన్నా దూరమవడం అతని వ్యక్తిగత జీవితాన్ని గాడి తప్పించింది…

అతని వృత్తి జీవితం మాత్రం ఎప్పటిలా నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. ష్రోడర్ తో తన సంబంధాలను కొనసాగిస్తూనే సొంత వ్యాపార సంస్థను ప్రారంభించాడు. అన్ని రకాల వ్యాపారాలను అందిపుచ్చుకుంటూ వెళ్ళాడు. ఎంతటి నష్టాలకైనా ఎదురొడ్డాడు. అగ్రశ్రేణి వర్తకులైతే తప్ప సరుకు అరువివ్వకపోవడం అతను అనుసరించిన ఒక పద్ధతి. తను రెక్కలు ముక్కలు చేసుకుని మీ సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్నాననీ, తనిప్పుడు ప్రపంచవ్యాప్తి కలిగిన ప్రముఖ వర్తకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాననీ, కనుక తనకు ఇంతవరకూ ఇస్తున్న అర్థ శాతం కమీషన్ కంటే ఎక్కువ ఇవ్వవలసిందనీ ష్రోడర్ కు ఉత్తరం రాశాడు. ష్రోడర్ వెంటనే కమీషన్ ను ఒక శాతానికి పెంచాడు. దాంతో తను అపారమైన సంపదను గడించే రోజు ఎంతో దూరంలో లేదని స్లీమన్ అనుకున్నాడు.

1848 చివరిలో స్లై మీద అతను అయిదోసారి మాస్కో వెళ్ళాడు. క్రిష్టమస్ ను, న్యూ ఇయర్ ను జివాగో కుటుంబంతో గడిపాడు. ఈ సందర్శన అతనిలో ఎంతో సంతోషాన్ని నింపింది. కానీ తిరుగు ప్రయాణంలో మంచు తుపాను ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇన్ఫ్లూయెంజాతో మంచం పట్టాడు. తను చనిపోతాడేమోనని కూడా అనిపించింది. నాలుగు మాసాల తర్వాత కాస్త ఆరోగ్యం చిక్కింది అనిపించగానే ఎప్పటిలానే ఊపిరి సలపనంత పనిలోకి దిగిపోయాడు. దాంతో జూన్ కల్లా మళ్ళీ కుప్పకూలాడు. కొన్నిరోజులు వ్యాపారాలు కట్టిపెట్టమని డాక్టర్లు గట్టిగా చెప్పి అతన్ని ఓ చీకటి గదికి పరిమితం చేశారు. వాళ్ళ మీద మొదట మండిపడ్డాడు కానీ, వారి కట్టడిలో న్యాయముందని త్వరలోనే అర్థం చేసుకున్నాడు.

ఎకతెరీనా లిషిన్

ఈసారి కోలుకునే సమయానికి  డాక్టర్ల పాఠం పూర్తిగా తలకెక్కింది. పని తగ్గించుకుని విందులు వినోదాలకు సమయం కేటాయించడం ప్రారంభించాడు. తను స్వయంగా వర్తకప్రముఖులను, వాళ్ళ అమ్మాయిలను ఆహ్వానించి పార్టీలు ఇచ్చాడు. అత్యుత్తమ మద్యాలతో అలరించాడు. ఈ క్రమంలోనే సోఫియా అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడిపోయాడు. ఆమె పెద్ద ఆస్తిపరురాలు కాదు, కానీ పొదుపరి. మూడు యూరోపియన్ భాషల్ని ధారాళంగా మాట్లాడుతుంది. తను కలలు గనే అమ్మాయి దొరికిందని వెంటనే తండ్రికి ఉత్తరం రాసేశాడు. ఆమెతో సంబంధం తెంచేసుకున్నానన్న ఉత్తరమూ ఆ వెంటనే తండ్రి చేతికి అందింది. ఇద్దరూ కలసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు ఆమె ఒక యువ అధికారిపై విపరీతమైన ఆసక్తిని చూపించడం అందుకు కారణం.

ఆమెను అంతటితో వదిలించుకున్నందుకు అతను సంతోషించాడు. ఈ అనుభవం ఎకెతెరీనా గురించి అతన్ని సరికొత్తగా ఆలోచింపజేసింది. ఈమె కన్నా ఆమె వెయ్యిరెట్లు నయమనిపించింది. పైగా జివాగో కుటుంబం తనను మాస్కో రమ్మని ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారీ నెత్తిన పెట్టుకుంటుంది. ఒక మాదిరి నిర్ణయంతో అతను 1850 ఫిబ్రవరిలో మరోసారి స్లై మీద మాస్కో వెళ్ళాడు. ఎప్పటిలా జివాగోల ఇంట్లో దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, నెలరోజులు గడిచాయోలేదో, అతను శరవేగంతో యూరప్ అంతా చుట్టబెట్టడం ప్రారంభించాడు. పీకల్లోతున వ్యాపార వ్యవహారాల్లో కూరుకుపోవడం తప్ప మరో ఊసులేదు. ఏ ఒక్క చోటా కొద్ది రోజులు మినహా ఆగింది లేదు. రాసిన ఉత్తరాలు అన్నింట్లో వ్యాపార విషయాలే తప్ప వ్యక్తిగత విషయాలు మచ్చుకైనా లేవు.

ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసులు వెంటాడుతున్న నేరస్తుడిలా ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కు జారుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇంగ్లండ్ లో కాస్త ఎక్కువ రోజులు గడిపాడు. ఎడింబరో, గ్లాస్గో, లివర్ పూల్, బాంగర్, చెస్టర్, లండన్ లను సందర్శించాడు. తను చూసిన ప్రతి దాని గురించీ నోట్సు రాసుకున్నాడు. రోజూ రాత్రి పడుకునేముందు డైరీ రాసుకునేవాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతి ఇప్పటికీ అతనికి ఆశ్చర్యం గొలుపుతూనే ఉంది.

కొన్ని వారాల తర్వాత అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. అతని జేబుల నిండా లెక్కలేనన్ని వ్యాపార ఒప్పందాలు. కానీ అతని వ్యక్తిగత జీవితం నిండా తీరని అశాంతి, అసంతృప్తి, దుర్భరమైన ఒంటరితనం. ఎన్ని ఉన్నా అతనికి ఆడతోడు లేదు. ప్రకృతి సహజమైన అనుభవానికి దూరమవడం నిశ్శబ్దంగా అతన్ని నిస్తేజం చేస్తోంది. దాంతో అతని వ్యక్తిగత జీవితం చుక్కాని లేని నావ అయింది. తను ఎంతగానో ఆకాశానికి ఎత్తిన సెయింట్ పీటర్స్ బర్గ్ లో నివసించడం కూడా ఉండి ఉండి అతనికి కంపరం కలిగిస్తోంది. మెక్లంబర్గ్ కు వెళ్ళిపోయి ఓ పేదింటి రైతు అమ్మాయిని పెళ్లిచేసుకుని వ్యవసాయం చేసుకుంటూ గడిపితే బాగుండు ననుకునే క్షణాలూ ఉంటున్నాయి.

కానీ ఎంతైనా తన అదృష్టానికి పునాది పడింది సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే. కనుక మరికొన్ని మాసాలు ఇక్కడే గడుపుదామనుకున్నాడు. మళ్ళీ పనిలోకి దిగిపోయాడు. పార్టీలకు వెడుతున్నాడు. ఈ మధ్యలో 1850 వేసవిలో కాబోలు, ఎకెతెరీనా లిషిన్ అనే అమ్మాయి అతనికి పరిచయమైంది. తను మరో స్నేహితుడికి దగ్గరి బంధువు. ఎత్తుగా తీర్చిదిద్దిన శిల్పంలా ఉంటుంది. కోలముఖం, నీలి కళ్ళు, ప్రవర్తనలో రాకుమారిని తలపించే హుందాతనం. స్లీమన్ కు ఆమె నచ్చింది. పెళ్లి మాటలు కూడా జరిగాయి. కానీ వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఆమెలోని మితిమీరిన ఆభిజాత్యం, పెద్దగా ఆస్తిపరురాలు కాకపోవడం  అతన్ని వెనక్కి లాగాయి.

వేసవి గడిచి ఆకురాలు కాలం అడుగుపెట్టింది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కానీ ఈ జీవితాన్నీ, చాలావరకూ నీలిమందు వ్యాపారంతో గడించిన ఈ సంపదనూ ఏం చేసుకోవాలన్న ప్రశ్న అతని ముందు వేలాడుతూనే ఉంది.

వ్యక్తిగత విషయాల్లో త్వరగా ఒక నిర్ణయానికి రాలేని అశక్తత అతన్ని వెంటాడుతోంది. మెక్లంబర్గ్ వాసుల్లో సహజంగా ఉండే మితిమీరిన జాగ్రత్త అది. దానికితోడు అతను ప్రపంచం తాలూకు కఠోర పార్స్వాన్ని అతి దగ్గరగా చూశాడు. పేదరికం, సంపద; ఆకలి, అన్నం… అన్నీ చవి చూశాడు. ఉజ్వలమైన నగరజీవితమూ, మారు మూల పల్లె జీవితమూ-రెండూ అతనికి తెలుసు.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ఆఫీసులో డెస్క్ దగ్గర నిలబడి నరాలు తెగిపోయేంత ఒత్తిడిని ఎదుర్కొంటూ యూరప్ అంతటా ఉన్న తన వర్తక ప్రతినిధులకు హడావుడిగా తంతి సందేశాలు పంపడం లాంటి అతని దినచర్యలో మార్పు లేదు. అయితే, ఇంతకన్నా తేలిక మార్గంలో సంపద గడించలేమా అన్న ప్రశ్నా మధ్య మధ్య అతన్ని ఆలోచనలో పడేస్తోంది.

అతని తమ్ముడు లుడ్విగ్ కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి చేరుకున్నట్టు 1850 ప్రారంభంలో సమాచారం అందింది. లుడ్విగ్ కొంతకాలంపాటు ఏమ్ స్టడామ్ లో అన్నకు వ్యాపారప్రతినిధిగా ఉన్నాడు. తెలివిలో అన్నకు సాటి కాకపోయినా స్వభావం అతనిదే. అదే తలబిరుసు, దుడుకుతనం. వివిధ భాషలు నేర్చుకోవడంలో కూడా అతను ముమ్మూర్తులా అన్నే. ఫ్రెంచి, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో అతను అన్నకు ఉత్తరాలు రాసేవాడు. అన్నకు ఉన్నట్టే ధనదాహం అతనికీ ఉంది.

california gold rush

ఓసారి అతను ఓ షాపు ప్రారంభిద్దామనుకుని తగినంత పెట్టుబడిని అప్పుగా ఇమ్మని అన్నను అడిగాడు. స్లీమన్ 500 టేలర్లు ఇవ్వజూపితే, నీకు మరీ ఇంత పిసినిగొట్టుతనం పనికిరాదంటూ తిరస్కరించాడు. ఇంకో సందర్భంలో, తనను సెయింట్ పీటర్స్ బర్గ్ లోని నీ వ్యాపారంలో చేర్చుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఉత్తరం రాసి రక్తంతో సంతకం పెట్టాడు. దానికి స్లీమన్ ఓ సుదీర్ఘమైన జవాబు రాశాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని జటిలమైన తన వ్యాపార వ్యవహారాల్లోకి ఓ భాగస్వామిని తీసుకురావడం అంత తేలికైన విషయం కాదన్నాడు. కాదూ కూడదూ నువ్వు వస్తానంటే, కొన్నేళ్లు తీసుకునే నీ శిక్షణ సమయంలో నీ పోషణ బాధ్యత నేను తీసుకోనని చెప్పాడు. రష్యన్ భాషను ఓ మోస్తరుగా నేర్చుకోడానికే నాలుగేళ్ళు పడుతుందన్నాడు. ఆపైన నువ్వు మంచి వ్యాపారవేత్తవు అవుతావన్న హామీ ఏమీ లేదనీ, నీలో అందుకు అవసరమైన చురుకుదనం లేదనీ అనేశాడు. చివరగా, “పదమూడేళ్ళపాటు ఒకరి ముందు చేయి చాచకుండా నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేశాను” అంటూ, నువ్వు కూడా నా ఒరవడినే అనుసరించాలని ముగించాడు.

నిస్పృహ, ఆగ్రహం ముసురుకున్న క్షణాలలో లుడ్విగ్ ఓ రోజున రోటర్ డామ్ లో  ఓ కాలువ ఒడ్డునే నడుస్తుండగా తక్షణమే ఓడ ఎక్కి అమెరికా వెళ్లిపోవాలన్న ఆలోచన వచ్చింది. న్యూయార్క్ చేరుకుని ఫ్రెంచ్ టీచర్ గా ఉంటూ ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తగినంత డబ్బు సమకూడగానే కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ వడ్డీవ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ఒక మోస్తరు సంపదను గడించాడు. అంతవరకూ అన్న నీడలో జీవించి పైకి వచ్చిన అందరూ తమ్ముళ్ళలానే తన ఘనతను గొప్పగా చెప్పుకుంటూ, మధ్య మధ్య ఎత్తిపొడుపులతో స్లీమన్ కు పెద్ద ఉత్తరం రాశాడు. ఆ పైన డబ్బు సంపాదనకు కాలిఫోర్నియాలో ఉన్నన్ని అవకాశాలు భూమ్మీద ఇంకెక్కడా లేవనీ, తన ఆస్తులన్నీ అమ్మేసుకుని వెంటనే సెక్రామెంటోకు రావలసిందనీ సలహా ఇచ్చాడు.

ఆ ఉత్తరం స్లీమన్ ను ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. అందులోని ఎత్తిపొడుపులతోపాటు, నీకన్నా నేనే గొప్ప అన్నట్టు తమ్ముడు విసిరిన సవాలు, కొన్ని మాసాల్లోనే పెద్ద ముల్లె మూటగట్టానని అతను అలవోకగా అనడం స్లీమన్ ను ఆలోచనలో పడేశాయి. తన నేర్పులో, క్రమశిక్షణలో, అంకితభావంలో పదోవంతు లేనివాళ్ళకు కూడా ఇలా ఆకస్మిక ధనయోగం పట్టిన ఉదాహరణలు అతనికి తెలుసు. ఇన్నేళ్లలో తను గడించినదానికన్నా ఎక్కువగా కొన్ని వారాల్లోనే తమ్ముడు గడించినట్టు అతనికి అర్థమైంది. దానికితోడు, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే పూర్తి బాధ్యత తనే తీసుకుంటాననే కాక; నీకు కూడా త్వరలోనే పెద్ద మొత్తం పంపాలని అనుకుంటున్నానన్న ఆ ఉత్తరంలోని వాక్యాలు   మరింత నొప్పించేలా ఉన్నాయి.

అతను చెప్పిన పెద్ద మొత్తం ఏదీ రాలేదు కానీ, సెక్రామెంటోలోని ఓ పత్రికలో ప్రచురితమైన ఒక వార్త తాలూకు కత్తిరింపు మాత్రం వచ్చింది. “న్యూయార్క్ లో ఉంటున్న లూయీ స్లీమన్ అనే పాతికేళ్ళ జర్మన్ యువకుడు 1850 మే 25వ తేదీన సెక్రామెంట్ నగరంలో టైఫాయిడ్ తో మరణించా”డని ఆ వార్త చెబుతోంది. దానికి జతపరచిన ఓ ఉత్తరం, లుడ్విగ్ ఓ పెద్ద ఎస్టేట్ ను విడిచివెళ్లాడని తెలియజేసింది.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

జోరుగా హుషారుగా జారిస్టు రష్యాలో…

స్లీమన్ కథ 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1844, మార్చి1…హైన్ రిచ్ స్లీమన్ 22వ పుట్టినరోజు…

ఇప్పటినుంచి అతన్ని ‘స్లీమన్’ అన్న ఇంటిపేరుతోనే పిలుచుకుందాం.

స్లీమన్ ఆరోజు హెర్ హైన్ రిచ్ ష్రోడర్ (మనదగ్గర శ్రీ లా జర్మన్ భాషలో ‘హెర్’ గౌరవవాచకం) కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. ఏమ్ స్టడామ్ లో పెద్ద ఎత్తున ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు సాగించే ఓ సంస్థకు ష్రోడర్ అధిపతి. స్లీమన్ ఓ ఉద్యోగానికి దరఖాస్తు ఇచ్చాడు. అందులో తన అర్హతలను పొందుపరిచాడు… ఏడు భాషలు తెలుసు. అంకెల్లో నేర్పు ఉంది, మెసెంజర్ బాయ్ గా రెండేళ్ళ అనుభవం…

వెంటనే అతన్నిఇంటర్వ్యూ చేశారు. ఈ కుర్రాడు తనకు బాగా పనికొస్తాడని ష్రోడర్ తొలి చూపులోనే గ్రహించాడు. ఇతను వ్యాపార సూక్ష్మాలను బాగా పట్టుకోగలడని కూడా ఆయనకు అనిపించింది. పైగా తన క్రిష్టియన్ పేరే అతనిది కూడా!

కొన్ని నిమిషాల్లోనే అతన్ని బుక్-కీపర్ గా నియమిస్తూ కాగితం ఇచ్చారు. జీతం నెలకు 600 గోడెన్లు. కొన్ని వారాల్లోనే జీతాన్ని1,000 గోడెన్లకు పెంచారు.

స్లీమన్ భాషల అధ్యయనాన్ని కొన్ని మాసాలపాటు పక్కన పెట్టాడు. దానికి బదులు తన బహుభాషా పరిచయాన్ని వినియోగంలోకి తేవడం ప్రారంభించాడు. అందులో త్వరత్వరగా దూసుకు వెళ్ళాడు కూడా. చూస్తుండగానే ఆ కార్యాలయంలోని ప్రధాన లేఖకుల్లో ఒకడైపోయాడు. ఇప్పుడతను ష్రోడర్ ఆంతరంగిక బృందంలో సభ్యుడు!

రష్యానుంచి తమ ఆఫీసుకు రష్యన్ భాషలో ఉత్తరాలు రావడం స్లీమన్ గమనించాడు.  తన భాషాధ్యయనం మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం అతనికి కనిపించింది. కొన్ని వారాల్లోనే రష్యన్ నేర్చుకుని ఆ భాషలోనే ఆ ఉత్తరాలకు సమాధానం రాస్తానని ఆఫీసులో ప్రకటించాడు. దాదాపు ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే రష్యన్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైనా, మరీ అవసరమనుకుంటే తప్ప వ్యాకరణం జోలికి వెళ్లకపోవడం అతను అనుసరించిన పద్ధతి.

ఫ్రెంచ్ రచయిత ఫినెలున్ రాసిన ఉలిసిస్ కొడుకు కథ(Les Aventures de Telemaque)కు పేలవమైన రష్యన్ అనువాదాన్ని సంపాదించాడు. అది  సుదీర్ఘమైన చుట్టుతిరుగుడు వాక్యాలతో ఉంది. ఓ నిఘంటువును, ఓ పాత గ్రామర్ ను కొనుక్కున్నాడు. నిఘంటువులో అర్థాలు చూసుకుంటూ మొదటిసారి కథంతా చదివాడు. ఆ అర్థాలను కూడబలుక్కుంటూ స్థూలంగా కథను అర్థంచేసుకున్నాడు. అతని జ్ఞాపకశక్తి ఎంత అమోఘమంటే, ఒక మాటకు నిఘంటువులొ ఒకసారి అర్థం చూసిన తర్వాత రెండోసారి చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.

అతను రష్యన్ నేర్పే ఒక ట్యూటర్ కోసం వెతికాడు. ఎవరూ దొరకలేదు. దాంతో పనిగట్టుకుని ఏమ్ స్టడామ్ లోని రష్యన్ కాన్సూల్ కు వెళ్ళి తనకు రష్యన్ నేర్పవలసిందిగా అక్కడి వైస్-కాన్సూల్ ను అర్థించాడు. నాకంత తీరిక లేదంటూ అతను నిరాకరించాడు. అయినాసరే, పట్టు వదలకుండా తను సొంతంగా నేర్చిన తప్పుల తడక రష్యన్ లోనే చిన్న కథలూ, వ్యాసాలూ రాస్తూ సాధనచేశాడు. ఫినెలున్ రచనను కంఠతా పట్టేశాడు. ఆ భాషలోని గాంభీర్యానికీ, శ్రావ్యతకూ అతనెంత ముగ్ధుడైపోయాడంటే, పేరాలకు పేరాలను బిగ్గరగా చదివి ఆనందించేవాడు.

తనకో శ్రోత కూడా ఉంటే మరీ బాగుంటుందనిపించింది. గంటకు నాలుగు ఫ్రాంకుల చొప్పున ఇచ్చేలా ఓ పేద యూదును శ్రోతగా కుదుర్చుకున్నాడు. రాత్రిపూట అతన్ని ఎదురుగా పెట్టుకుని రష్యన్ లో అనర్గళంగా దంచి మాట్లాడుతుంటే లాడ్జీ టొపారం లేచిపోయేది. లాడ్జీ లోని మిగతా వాళ్ళకు అది తీవ్ర అసౌకర్యంగానూ, నిద్రాభంగంగానూ ఉండేది. దాంతో వాళ్ళు యుద్ధానికి వచ్చేవాళ్లు. ఆ కారణంగా అతను రెండుసార్లు లాడ్జీ మారాల్సివచ్చింది.

ఆరువారాలు గడిచేసరికల్లా  అతను రష్యన్ లో తొలి ఉత్తరం రాశాడు. అది కూడా ఆ భాషకు చెందిన అన్ని మర్యాదలనూ పాటిస్తూ! వాసిలీ ప్లొట్నికోవ్ అనే అతనికి రాసిన ఉత్తరం అది. మాస్కోకు చెందిన ఓ అతిపెద్ద నీలిమందు వ్యాపారసంస్థకు ప్లొట్నికోవ్ లండన్ ఏజెంట్ గా ఉన్నాడు.

విచిత్రంగా ఆ ఉత్తరమే స్లీమన్ ఇరవయ్యేళ్ళ భావి జీవితానికి రూపునిచ్చింది.

ఆ రోజుల్లో భారత్, ఆగ్నేయాసియా దేశాలనుంచి నీలిమందును దిగుమతి చేసుకునేవారు. ఏమ్ స్టడామ్ అతి పెద్ద నీలిమందు వర్తకకేంద్రాలలో ఒకటిగా ఉండేది. ఆ నగరంలో తరచు నీలిమందు వేలం జరుగుతూ ఉండేది. స్లీమన్ కు ఎనిమిది భాషలు తెలుసు కనుక అతని కంపెనీ అతన్నే వేలానికి పంపించేది. రష్యాకు సంబంధించిన అన్ని విషయాలపై ఆసక్తి ఉన్న స్లీమన్ వేలానికి వచ్చిన రష్యన్ వర్తకులను పరిచయం చేసుకుని మాటామంతీ సాగించేవాడు. రష్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునేవాడు. అక్కడి వ్యాపార అవకాశాల గురించి వాకబు చేసేవాడు. తను మాస్కో వచ్చి ఓ రష్యన్ సంస్థ భాగస్వామ్యంతో దిగుమతుల వ్యాపారం  చేస్తే ఎలా ఉంటుందని అడిగేవాడు.

హాలెండ్ లో ఓ జర్మన్, తమతో తమ భాషలో మాట్లాడడం వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేది. క్రమంగా అతని మీద వాళ్ళకు ఇష్టం ఏర్పడింది.

అయితే, ఈ ఉద్యోగంలోకి వచ్చాక కూడా రెండేళ్లపాటు అతను ఇరుకిరుకు లాడ్జీ గదుల్లోనే గడిపాడు. ఇతర ఖర్చులు కూడా కనీసస్థాయికి తగ్గించుకుంటూ ఎప్పటిలానే డబ్బు కూడబెడుతూ వచ్చాడు.  చక్కెర ఎక్కువ వేసుకుని కప్పుల కొద్దీ టీ తాగే ‘దురలవాటు’ మాత్రం అతనికి ఉండేది. చక్కెర అతనిలో ఉండి ఉండి శక్తినీ, ఉత్తేజాన్నీ నింపేది. రాత్రిళ్ళు నిద్ర కాచుకుని చదువుకోడానికీ, ఆలోచించుకోడానికీ అందువల్ల వీలయ్యేది.

ఈరోజుల్లోనే వాళ్ళ నాన్నకు తరచు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. బాధ్యతగా నడచుకోమనీ, ప్రయోజనకరమైన జీవితం గడపమనీ ఆ ఉత్తరాల్లో తండ్రికి హితబోధ చేస్తూ తనే తండ్రి పాత్ర పోషించేవాడు. తనను చూసైనా నేర్చుకోమని చెప్పేవాడు. కుటుంబం నాశనమైపోకుండా కాపాడుకోవాలన్న తపన ఆ ఉత్తరాల్లో ఉండేది. మరోవైపు తండ్రికి రకరకాల కానుకలూ పంపిస్తూ ఉండేవాడు. తను పొదుపు చేసిన తొలి మొత్తాలతో రెండు పెట్టెల బార్డో వైన్ సీసాలు(Bordeaux: ఫ్రాన్స్ లోని ఓ నగరం. వైన్ పరిశ్రమకు ప్రపంచప్రసిద్ధి చెందింది), ఓ పెట్టెడు సిగార్లు తండ్రికి పంపించాడు.

ఆర్థికంగా స్థిమిత పడుతున్న కొద్దీ మిన్నాతో పెళ్లి తలపులు మళ్ళీ అతన్ని ముసురుకోవడం ప్రారంభించాయి. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ తో పెళ్లి చేసుకుని స్థిరపడడం ఇప్పుడతనికి ‘పగటికల’ కాదు. ‘బ్రదర్స్ ష్రోడర్’ స్థాయిని అందుకోబోయే వ్యాపారవేత్తగా కూడా తననిప్పుడు ఊహించుకుంటున్నాడు. ఎనిమిది భాషల్లో పరిజ్ఞానం తనకో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టబెట్టగలదని కూడా నమ్ముతున్నాడు.

నీలిమందు వేలానికి వెడుతున్న సందర్భంలోనే జివాగో అనే ఓ రష్యన్ దిగుమతుల వ్యాపారి అతనికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది.  కలసి వ్యాపారం  ప్రారంభించే దిశగా మంతనాలు మొదలుపెట్టారు. “జివాగో & స్లీమన్” అనే పేరుతో ఓ వ్యాపారసంస్థను ప్రారంభించడానికీ, లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకునే షరతు మీద తను 60 వేల సిల్వర్ రూబుళ్లను పెట్టుబడి పెట్టడానికీ జివాగో ముందుకొచ్చాడు.

ఈ సంగతి యజమాని హైన్ రిచ్ ష్రోడర్ చెవిదాకా పాకింది. పనికొస్తాడనే ఉద్దేశంతో మంచి జీతమిచ్చి తెచ్చుకున్న ఈ కుర్రాడు చేజారిపోతాడని ష్రోడర్ అనుకున్నాడు.  ఓ రోజున తన దగ్గరకు పిలిపించుకుని, “సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉంటూ రష్యాలో మన వ్యాపార లావాదేవీలు చూస్తావా?” అని అడిగాడు. దాంతోపాటు బ్రెమన్, ట్రియెస్ట్, స్మిర్నా, లె ఆఫ్రే, రియో డిజెనీరో లలోని మన కంపెనీ శాఖలకు కూడా నువ్వే ముఖ్యప్రతినిధిగా ఉంటావన్నాడు. ఆ ప్రతిపాదన స్లీమన్ కు ఎంతగానో నచ్చింది. వెంటనే ఆమోదం తెలిపాడు.

1845 జనవరిలో, ఏమ్ స్టడామ్ లో తన చివరి రోజుల్ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను ప్రాతినిధ్యం వహించబోయే వ్యాపారసంస్థల అధిపతులతో మాట్లాడుతూ గడిపాడు. తన వ్యాపారదక్షత మీద అతనికి ఎంత నమ్మకం చిక్కిందంటే, మీకు లాభాలు చూపించేవరకూ నాకెలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళకు ఖండితంగా చెప్పాడు.

మిన్నా గురించి వాకబు చేయమనీ, తనిప్పుడు ఆమెను పెళ్లాడే స్థితిలో ఉన్నట్టు తెలియజేయమనీ కోరుతూ న్యూ స్ట్రెలిజ్ లో తనకు పరిచయమైన సంగీత విద్వాంసుడు హెర్ లవాకు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరేముందు ఉత్తరం రాద్దామనుకున్నాడు.  అంతలో, తనక్కడ స్థిరపడ్డాకే ఆ పని చేయచ్చనిపించి విరమించుకున్నాడు.  తనకు పట్టిన అదృష్టం గురించి వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు.  ఇది కూడా పట్టుదలతో, ఏకాగ్రతతో తను చేసిన కృషి ఫలితమనీ, “ఏ  అదృష్టమైనా  ఓ అనర్హుడిమీద ఆకాశం మీంచి ఊడిపడ”దనీ అందులో ఎత్తిపొడిచాడు.

ఓడ మునిగిపోయి, చావు బతుకుల మధ్య వేలాడుతూ అతను హాలెండ్ తీరానికి కొట్టుకొచ్చి అప్పటికి నాలుగేళ్లే అయింది. ఇప్పుడతను పాతికేళ్ళ యువకుడు. ఏమ్ స్టడామ్ లో చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేరు. ఆ నగరాన్ని విడిచి వెడుతున్నందుకు అతనేమంత బాధపడలేదు.  మొదట కోచ్ లోనూ, తర్వాత మంచు మీద నడిచే స్లై బండి మీదా పదహారు రోజులపాటు ఒళ్ళు హూనమయ్యే ప్రయాణం చేసి, ప్రపంచంలోని అతి పెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన ‘బ్రదర్స్ ష్రోడర్’ కు ముఖ్యప్రతినిధిగా 1845 ఫిబ్రవరి 1న సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టాడు.

***

సెయింట్ పీటర్స్ బర్గ్ అప్పటికింకా శైశవదశలోనే ఉంది. నికొలస్-I గద్దె మీద ఉన్నాడు. అతనిది కాఠిన్యం ఉట్టిపడే నలుచదరపు మొహం. ఆరడుగుల ఎత్తరి.  అంతకుముందు అతను ఆశ్విక దళాధికారిగా ఉండేవాడు.  దేవుడి దయవల్ల జార్ చక్రవర్తి కాగలిగిన ఓ ఆశ్విక దళాధికారిగానే తనను భావించుకునేవాడు. చక్రవర్తి పదవిని తుదికంటా అనుభవించే హక్కు తనకొక్కడికే ఉందని అతనికి అనిపించేది. దాంతో తన మంత్రుల్ని చూడగానే మొహం చిట్లించుకునే వాడు. తెల్లగా తళ తళా మెరిసిపోయే ఇటాలియన్ తరహా ప్రాసాదాలను వరసపెట్టి నిర్మింపజేయడం అతని ప్రధాన వ్యాపకాలలో ఒకటి. అతను తన ఆహార్యంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. ఒక ఆశ్వికదళాధికారికి తగినట్టుగా అతని ఛాతీ ఒద్దికగా నొక్కుకుపోయినట్టు ఉండేది. ఉచ్చనీచాలు లేకుండా అంతఃపుర స్త్రీలను అనుభవించేవాడు. అతన్ని చూడగానే దాదాపు అందరూ భయంతో వణికేవారు. ఎందుకంటే, అతని ఎడమకన్ను కుడి కన్ను కన్నా ఎక్కువ ఎర్రగా, చింతనిప్పుల్లా ఉండేది. అమానుషత్వం కరడుగట్టిన మనిషన్న భావన కలిగించేది. ఈ విషయంలో అతనికి అలెగ్జాండర్ ది గ్రేట్ తో పోలిక కుదిరింది. అలెగ్జాండర్ కళ్ళు కూడా భీకరంగా ఉండేవి. ఉక్కు పోతపోసినట్టు ఉండే సైనికులకు కూడా అతన్ని చూడగానే పాదాలు చల్లబడేవి.

జార్ చక్రవర్తి నికొలస్-1 (1796-1855)

నీకొలస్-I హయాంలో సెయింట్ పీటర్స్ బర్గ్ వైపరీత్యాలకు చిరునామాగా ఉండేది. వెడల్పాటి వీథులు, ఒకటీ అరా ఫ్యాక్టరీలు, లెక్కలేనన్ని ప్రాసాదాలూ, పేదల పూరిళ్లూ…రోడ్లమీద రద్దీ ఉండేదికాదు. అంత విశాలమైన వీథులూ పాడుపెట్టినట్టు నిర్మానుష్యంగా ఉండేవి. చిత్తడినేలల మీద పీటర్ ది గ్రేట్ నిర్మించిన ఈ నగరాన్ని పునర్నిర్మించే బాధ్యత తనకుందనీ, తను పీటర్ ది గ్రేట్ వారసుణ్ణనీ నికొలస్-I అనుకునేవాడు. శీతాకాలంలో నగరమంతా మంచు దుప్పటి కప్పినట్టుగా తెలుపు ఓడుతూ ఉంటుంది.

రాజోద్యోగులు ఆస్థానం తాలూకు అంతూపొంతూలేని పనికిమాలిన వ్యాపకాల్లోనూ వ్యవహారాల్లోనూ మునిగితేలుతూ ఉండేవారు. సేవకులు దుస్సహమైన పీడన కింద అణగారిపోయేవారు. విద్యార్థులు నిరంకుశ రాచరికాన్ని అంతమొందించే ఆలోచన అప్పటికే చేస్తున్నారు. ఆ ఏడాదే దోస్తోయెస్కీ రాసిన తొలి నవల Poor Folk వెలువడింది. పెట్రాషయెస్కీ వర్గంగా ప్రసిద్ధిలోకి వచ్చిన ఓ బృందం జార్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తోంది. యువకుడైన దోస్తోయెస్కీ కూడా అందులో సభ్యుడు. రష్యా అంతటా సామాజిక చైతన్యం క్రమంగా మేలుకుంటోంది. కట్టు బానిసల్లా బతుకుతున్న జనంలో ఆగ్రహావేశాలు రగలుకొంటున్నాయి.

స్లీమన్ మాత్రం పీటర్స్ బర్గ్ గురించి దీనికి పూర్తిగా విరుద్ధమైన ఊహల్లో మునిగితేలుతున్నాడు. ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ ప్రదేశంలో తాను నివసిస్తున్నాననుకుంటున్నాడు. అతని ఉద్దేశంలో పీటర్స్ బర్గ్ వాసయోగ్యమే కాక; వ్యాపారానికి బాగా అనువైన, సురక్షితమైన నగరం. అక్కడి ఇళ్ళు, వీథులు ఎంతో అందంగానూ, శుభ్రంగానూ, ఆహ్లాదకరంగానూ అతనికి కనిపించాయి. అతను రాసే ఉత్తరాల్లో కూడా జార్ నికొలస్ ను మంచి తెలివైన, వైభవోపేతుడైన చక్రవర్తిగా పొగడ్తలతో ముంచెత్తేవాడు. రష్యన్ వర్తకుల గురించి మాత్రం అతనికి ఎలాంటి భ్రమలూ లేవు. అందరు వర్తకుల్లానే వాళ్ళు కూడా వ్యాపారపు మెళకువలు బాగా తెలిసిన కొరకరాని కొయ్యలే. కాకపోతే వాళ్ళ మీద తను రెండాకులు ఎక్కువే చదివానని అతను అనుకుంటున్నాడు. ష్రోడర్ ముఖ్యప్రతినిధిగా తన గొంతు గట్టిగా వినిపించగల స్థితిలో కూడా ఉన్నాడు. దానికితోడు ఉరకలేసే ఉత్సాహం, అంతులేని దాహం…కాళ్లలో చక్రాలు ఉన్నాయా అన్నట్టుగా నిర్విరామంగా ఒకచోటి నుంచి ఒకటికి కదలి వెళ్లిపోతూ ఉండడమే.

పీటర్స్ బర్గ్ లో ఏడు రోజులున్నతర్వాత, తను లావాదేవీలు జరపబోయే సంస్థలతో సంబంధాలను కల్పించుకోడానికి స్లై మీద మాస్కో వెళ్లిపోయాడు. పెద్ద పెద్ద వర్తకప్రముఖులతో కూడా తేలిగ్గా కలసిపోయి, త్వరలోనే వాళ్ళ తలలో నాలుకలా మారిపోగల చాకచక్యం అతనికి ఉంది. పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టిన క్షణం నుంచే అంతర్జాతీయ వర్తక ప్రతినిధిగా తన పాత్రను విజయవంతంగా పోషించాడు. ష్రోడర్ తో పాటు మరో ఆరేడు సంస్థలకు అతను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ప్రారంభ సంవత్సరాలలో అతనికి కమీషన్ గా ఇచ్చింది అర్థశాతమే. తొలి ఏడాదిలోనే 1,500,000 గోడెన్ల వ్యాపారం జరిగి, ఆ అర్థశాతం కమీషన్ నుంచే అతనికి 7,500 గోడెన్ల ఆదాయం సమకూడింది. అప్పటికి రెండు మూడేళ్ళ క్రితం అతను కలలో కూడా ఊహించలేని రాబడి అది. పొద్దుట చీకటితోనే లేచి, దాదాపు అర్థరాత్రివరకూ తన డెస్క్ దగ్గర నిలబడి ప్రతి చిన్న వివరం మీదా దృష్టి పెట్టి, లాభం ఎక్కువా తక్కువా అని చూడకుండా దానిని సాధించే ప్రతి ఉపాయాన్నీ అనుసరిస్తూ పోయిన ఫలితమే ఈ విజయం.

Heinrich Schliemann. Portrait of Heinrich Schliemann (1822-90), German archaeologist and discoverer of the ruins of the legendary city of Troy. After finishing his formal education at 14, Schliemann went into business and made his fortune. In 1863 he reti

ఆ ఏడాదిలోనే అతను నాలుగుసార్లు మాస్కోకు వెళ్ళి వచ్చాడు. అక్టోబర్ నాటికి వ్యవహారాలు ఎంత సాఫీగా సాగిపోతూవచ్చాయంటే, వ్యాపార పర్యటనకు విహారయాత్రను కూడా జోడిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లను ఓసారి చుట్టివచ్చాడు. మధ్యలో కొన్ని గంటలు ఏమ్ స్టడామ్ లో ఆగి హైన్ రిచ్ ష్రోడర్ ను కలిసి తమ పాత సంబంధానికి కొత్త తళుకు నద్దాడు. ఆయన మీద అతనికి గాఢమైన కృతజ్ఞతాభావం ఉంది.

తన పర్యటనలో అతన్ని ఎక్కువ ఆకట్టుకున్నది పారిశ్రామిక అభివృద్ధి. రైళ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలు, టెలిగ్రాఫ్ వగైరాలతో యూరప్ నూతన పారిశ్రామిక శకంలోకి శరవేగంతో దూసుకువెడుతోందనీ, రష్యా మాత్రం వెనకబడిపోయిందనీ అనుకున్నాడు. తన దత్తత దేశానికి పారిశ్రామిక ప్రయోజనాలు తెచ్చిపెట్టడం కోసమే తనను ప్రత్యేకంగా ఎంచుకున్నారని కూడా అతనికి అనిపించేది. క్రమంగా తనను ఓ రష్యన్ గానే భావించుకోవడం ప్రారంభించాడు. జార్ గురించి మాట్లాడేటప్పుడు “మన జార్” అనీ; రష్యాను “మన రష్యా” అనీ అనేవాడు.

సంపదను అనుభవిస్తున్నా అతని పొదుపు అలవాటు పోలేదు. ప్రయాణాలలో అతను పెద్ద పెద్ద హోటళ్లలోనే దిగేవాడు. కానీ అతి తక్కువ కిరాయి ఉన్న గదినే ఎంచుకునేవాడు, అది కూడా సాధారణంగా చిట్టచివరి అంతస్తులో. సరిగ్గా పైకప్పు కింద ఉండడమే అతనికి ఇష్టంగా ఉండేది. ఏమ్ స్టడామ్ లో చవకబారు లాడ్జీలలో మిద్దె కింద ఉంటూ రెండేళ్లలో ఏడు భాషలు నేర్చుకున్నప్పటినుంచీ అతనికి కలిగిన ఇష్టం అది.

లండన్ అతనికి నచ్చింది. కాకపోతే అక్కడి విలక్షణమైన విక్టోరియన్ తరహా ఆదివారాలను గడపడం మాత్రం నచ్చలేదు. బ్రిటిష్ మ్యూజియం అంతా కలయ తిరిగి శవపేటికల్లోని మమ్మీలు; గ్రీకు, రోమన్ కళాత్మక కలశాల జాబితాను జాగ్రత్తగా రాసుకున్నాడు. మాంచెస్టర్ కు రైలు ప్రయాణం అతనికి చాలా ఆహ్లాదం కలిగించింది. యూరప్ మొత్తంలో అతి వేగంగా వెళ్ళే రైలు అదే. ఆ రోజుల్లో మాంచెస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం. ఎక్కడ చూసినా కణకణా మండే బొగ్గు కొలుముల, పొగ గొట్టాలతో ఫ్యాక్టరీల సందడే సందడి. జర్మనీకి పంపడం కోసం అక్కడ నిర్మిస్తున్న ఓ అతి పెద్ద రైలును, “ కాగితాన్ని కత్తిరించించినంత అవలీలగా” ఇనుమును కత్తిరించడాన్ని అతను విప్పారిన కళ్ళతో చూశాడు. ఆవిరి ఓడలు, ఓడ రేవులు, ఇనప కర్మాగారాలు, ఇంగ్లండ్ లో ఈ చివర దక్షిణం నుంచి, ఆ చివర ఉత్తరపు కొసన ఉన్న స్కాట్లాండ్ కు సందేశాన్ని పంపగలిగే టెలిగ్రాఫ్…ప్రతిదీ అతనికి ఆశ్చర్యానందాలు కలిగించాయి. నమ్మశక్యం కానంత అద్భుతంగా తోచాయి. ‘సృష్టికర్త’ చేసిన ఈ అమోఘమైన ఏర్పాట్లన్నీ వ్యాపారాభివృద్ధి కోసమే ననుకున్నాడు. పారిశ్రామిక విప్లవాన్ని అంత నిర్మలంగా ఎవరూ చూసి ఉండరు.

స్వస్థలమైన మెక్లంబర్గ్ లో ఆగకుండా లే అఫ్రే, పారిస్, బ్రస్సెల్స్, కొలోన్ , డుస్సేడార్ఫ్, హాంబర్గ్, బెర్లిన్ మీదుగా అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగివచ్చాడు. మెక్లంబర్గ్ కు వెళ్లకపోవడానికి ఓ కారణం ఉంది. మిన్నా గురించి వాకబు చేయమనీ, ఆమెను తను పెళ్లాడే స్థితిలో ఉన్నాననీ న్యూ స్ట్రెలిజ్ లోని హెర్ లవాకు ఆ ఏడాదిలోనే ఉత్తరం రాశాడు. అతని నుంచి వచ్చిన జవాబు అతనికి పిడుగుపాటు అయింది. ఆ ఆఘాతం అతనిని చంపినంత పని చేసింది.

అతనా ఉత్తరం రాయడానికి కొన్ని వారాల ముందే మిన్నా మెయింకేకు ఓ స్థానిక రైతుతో పెళ్లి జరిగిపోయింది!!!

                                                                                                                     (సశేషం)

 

 

 

 

చావు తప్పి జీవనతీరానికి…

 

స్లీమన్ కథ-3

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

డొరోతియా 1841 నవంబర్ 28న హాంబర్గ్ లో బయలుదేరింది. అప్పటికి వాతావరణం బాగుంది. గాలి అనుకూలంగా వీస్తోంది.

హైన్ రిచ్ అంతవరకూ ఓడ ప్రయాణం చేసి ఎరగడు. ఓడ గురించి ఏమీ తెలియదు. ఓడలో పద్దెనిమిదిమంది సిబ్బంది; ముగ్గురే ప్రయాణికులు- హైన్ రిచ్, ఓ వడ్రంగి, అతని కొడుకు. అంత అనుకూల వాతావరణంలో కూడా సముద్రప్రయాణం అతనికి పడలేదు. మూడు రోజుల తర్వాత కక్సావెన్ అనే చోట స్వల్పకాలం ఓడకు లంగరేసారు. అప్పటికే అతను అస్వస్థతతో ఉన్నాడు. అక్కడినుంచి ఓడ బయలుదేరి ఉత్తర సముద్రంలోకి అడుగుపెట్టింది. రెండురోజులకే గాలివాన మొదలైంది. ఓడలోకి నీరు ఎక్కసాగింది. సిబ్బంది అదేపనిగా తోడిపొయ్యడం ప్రారంభించారు.

హైన్ రిచ్ ఆకలితో నకనకలాడిపోతున్నాడు. ఓడలో ఇచ్చిన బిస్కట్లతో అతికష్టం మీద ఆకలి చల్లార్చుకుంటున్నాడు. ఓ బెంచీకి తనను కట్టేసుకుని స్పానిష్ గ్రామర్ సాయంతో ఆ భాష నేర్చుకుంటూ ఉండిపోయాడు. ఒక్కోసారి ఓడ కుదుపుకి వచ్చి డెక్ మీద పడిపోతున్నాడు.

తుపాను ప్రచండంగా ఉంది. అలలు ఓడ అంచుల్ని విరగ్గొడుతున్నాయి. ఓడ మునిగిపోయే ప్రమాదం భయపెడుతోంది. పెద్ద తెరచాప సాయంతో ఓడ దారితప్పకుండా మాత్రం కొంతసేపు కెప్టెన్ చూడగలిగాడు. కానీ డిసెంబర్ 10 సాయంత్రానికి ఓడ దారితప్పి దక్షిణం వైపుకి కొట్టుకుపోవడం ప్రారంభించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల తాకిడినుంచి ఓడను కాపాడడం కష్టమని అందరికీ అర్థమైపోయింది. ఇంకోవైపు మంచు భయంకరంగా కురుస్తోంది. సముద్రపు కొంగలు మందల కొద్దీ వచ్చి ఓడ చుట్టూ తిరగసాగాయి. అలా తిరగడం అపశకునం.

మరునాటి మధ్యాహ్నానికి తుపాను మరింత తీవ్రం అయింది. అలలు పర్వతప్రమాణంలో లేచి ఓడ మీద పడుతున్నాయి. అలలు అటూ ఇటూ ఎగరగొడుతుంటే ఓడ అక్షరాలా షటిల్ కాక్ లా మారిపోయింది. సాయంత్రానికల్లా పెద్ద తెరచాప విరిగిపోయింది. వెంటనే తుపాను తెరచాపను ఎగరేశారు. అదీ విరిగిపోయింది. అంతలో ఒక విచిత్రం జరిగింది. లిప్తకాలంపాటు మబ్బులు విడిపోయి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించాడు. మళ్ళీ వెంటనే మబ్బులు మూసేశాయి. సూర్యుణ్ణి చూడడం అదే కడసారి అవుతుందని అందరూ అనుకున్నారు.

ఆ సమయానికి హైన్ రిచ్ మృత్యువు గురించి కూడా ఆలోచించలేనంత అస్వస్థతతో ఉన్నాడు. వడ్రంగి భయంతో వణికిపోతూ ఏవేవో మాట్లాడుతుంటే అతనివైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వడ్రంగికి కలల మీద నమ్మకం ఎక్కువ. ముందురోజు రాత్రంతా దారుణమైన పీడకలలు. దానికితోడు రోజంతా పిల్లి శోకాలు పెడుతూనే ఉంది. కెప్టెన్ కుక్క మొరుగుతూనే ఉంది.

ఏడింటికి క్యాబిన్ బాయ్ టీ, బిస్కట్లు తీసుకొచ్చాడు. “ఇదే చివరిసారి, ఇంకెప్పుడూ ఏమీ తేలేను” అంటూ ఏడ్చేశాడు. మరి కాసేపటికి కెప్టెన్, అతని రెండో సహాయకుడు క్యాబిన్ లోకి వచ్చారు. దేనికైనా సిద్ధమవమని ఆ ముగ్గురికీ చెప్పారు. వారి మాటల్లో విషాద, గాంభీర్యాలు గూడుకట్టుకున్నాయి. అంతలో మొదటి సహాయకుడు వచ్చి దూరంగా రెండు దీపాలు కనిపించాయని కెప్టెన్ కు చెప్పాడు.  వెంటనే లంగర్లు దించమని కెప్టెన్ ఉత్తర్వు చేశాడు. దించిన క్షణాలలోనే అవి దారపు ముక్కలా తెగిపోయాయి. అప్పటికే సొమ్మసిల్లిపోయిన హైన్ రిచ్ దుస్తులు విప్పేసి పడుకుండిపోయాడు.

అర్థరాత్రివేళ క్యాబిన్ తలుపులు దడాలున తెరచుకున్నాయి. “అందరూ డెక్ మీదికి రండి. ఓడ మునిగిపోతోంది” అంటూ కెప్టెన్ పెద్ద పెట్టున అరిచాడు. మరుక్షణంలోనే ఓ బ్రహ్మాండమైన అల కిటికీలను ధ్వంసం చేసేసింది. క్యాబిన్ లోకి నీరు వరదెత్తింది.  ఓడ ఊగిపోతూ రేవు వైపు కొట్టుకుపోతోంది. హైన్ రిచ్ తన పడక మీంచి ఎగిరి పడ్డాడు. దుస్తులకోసం తడుముకున్నాడు. కనిపించలేదు. అలా నగ్నంగానే డెక్ మీదికి పరుగెత్తాడు. ఒంటి మీద గాయాలు. ఓడ అంచుల్ని ఎలాగో దొరకపుచ్చుకుని పై భాగం దాకా పాక్కుంటూ వెళ్ళి తాటి కొసల్ని పట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల్ని తలచుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.  మేరీ మాతను ఉద్దేశించి వడ్రంగి చేస్తున్న ఆర్తనాదాలు అతని చెవిన పడుతున్నాయి. సొరచేపల్ని చూసి అతనెక్కువ భయపడ్డాడు. తుపాను విరుచుకుపడగానే అవి పైకి వచ్చాయి. ఓడ గంట నిరంతరాయంగా మోగుతూనే ఉంది. అది మృత్యుఘంటలా వినిపిస్తోంది.

ఏమ్ స్టడామ్ లో ఇంగ్లీష్ చర్చి

ఆ ఏడాది మొత్తంలోనే అతి శీతలరాత్రి అది. అతను నగ్నంగా ఉన్నాడు. చుట్టూ మంచు ముంచెత్తుతోంది. ఆకాశం ఓ పెద్ద కాలమేఘంలా ఉంది. అతను మీద పడబోయే మృత్యువును నిరీక్షిస్తూ ఉండిపోయాడు. ఓడ మునిగిపోతోంది. లైఫ్ బోట్లలోకి జనాన్ని ఎక్కించమని కెప్టెన్ ఆదేశించాడు. ఒక లైఫ్ బోట్ నీళ్ళలో నిట్టనిలువుగా పడి కొట్టుకుపోయింది. రెండోది ఓడ పక్కభాగాన్ని ఢీకొని నుగ్గునుగ్గు అయిపోయింది, ఓ చిన్న బోటు మాత్రం మిగిలింది. సిబ్బంది దానిని నీళ్ళలోకి దింపే సాహసం చేయలేకపోయారు.

అలాగే రెండు గంటలు గడిచాయి. నీళ్ళతో నిండిపోయి మునుగుతూ మునుగుతూ ఉన్న ఓడ ఎట్టకేలకు ఓ పెద్ద కుదుపుతో రేవువైపు దొర్లుకుంటూ వెళ్ళి కూరుకుపోయింది.  అప్పటికే హైన్ రిచ్ నీళ్ళలోకి జారిపోయాడు, కానీ వెంటనే పైకి తేలాడు. అంతలో ఓ ఖాళీ పెట్టె అతనివైపు తేలుకుంటూ వచ్చింది. అతను దాని అంచుల్ని పట్టుకుని ఉండిపోయాడు.

అలా సగం రాత్రి వరకూ ఆకాశానికి, సముద్రానికీ మధ్య వేల్లాడాడు. ఆ తర్వాత మొదటి సహాయకుడు వచ్చి అతణ్ణి నీళ్ళలోంచి లాగి లైఫ్ బోటులోకి ఎక్కించాడు. తెడ్లు కూడా లేని ఆ బోటు పద్నాలుగుమందితో పొద్దుటివరకూ దారీ తెన్నూ లేకుండా కొట్టుకెళ్లి చివరికి డచ్చి తీరానికి దూరంగా టెక్సెల్ అనే దీవిలోని ఇసుకతిప్పల మీదికి వచ్చి ఆగింది.

అప్పటికి తుపాను నెమ్మదించింది. ఒడ్డువైపు తేలుకుంటూ వస్తున్న సరకుకోసం ఆ దీవిజనం బిలాబిల్లాడుతూ వచ్చి వాలిపోయారు. హైన్ రిచ్ గాయాల నొప్పులతో గిలగిల్లాడుతున్నాడు. అతని ముందు పళ్ళు మూడు ఊడిపోయాయి. ముఖం మీదా ఇతర శరీరభాగాలమీద లోతైన గాట్లు పడ్డాయి. పాదాలు వాచిపోయాయి. బతికున్న వాళ్ళు అందరూ రొప్పుతూ ఇసుకతిప్ప మీద వాలిపోయారు. అంతలో ఓ దయగల రైతు ఓ బండి తీసుకుని అక్కడికి వచ్చాడు. వాళ్లందరినీ తన పొలం ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు చలి కాచుకోడానికి పెద్ద మంట రాజేశాడు. వారికి వేడి వేడి కాఫీ, నల్ల రొట్టె అందించాడు. ఒంట్లో సత్తువను కూడదీసుకునేవరకూ మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు.

హైన్ రిచ్ కు కొయ్య బూట్లు, ఓ జత చినిగిపోయిన పంట్లాములూ, ఓ దుప్పటి, ఓ ఊలు టోపీ ఇచ్చారు. అతనికి ఆ రైతు మీద ఎంతో ఇష్టం కలిగింది. తన సముద్రపు పెట్టె ఒడ్డుకు కొట్టుకు రావడం అంతకంటే ఎక్కువ సంతోషం కలిగించింది. అందులో తన చొక్కాలు, స్టాకింగులు, పాకెట్ బుక్కు, లా గ్వైరా లో తన పరిచయస్తులకు హెర్ వెంట్ రాసిన సిఫారసు ఉత్తరం ఉన్నాయి. మిగతా అందరి పెట్టెలూ కొట్టుకుపోయి, హైన్ రిచ్ పెట్టె ఒక్కటే ఒడ్డుకు రావడంతో అతన్ని ‘జోనా’ అని పిలవడం ప్రారంభించారు(ఓల్డ్ టెస్టెమెంట్ ప్రకారం జోనా ఒక దేవదూత. అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోతుంది. అతన్ని ఓ తిమింగలం మింగేస్తుంది. మూడురోజుల తర్వాత అతను ప్రాణాలతో బయటపడతాడు). సరకుతో ఉన్న ఓ పెట్టె తనను చంపినంత పనిచేసి జీవితాన్ని మలుపు తిప్పింది, ఓ ఖాళీ పెట్టె తన ప్రాణాలు కాపాడింది, ఏదో అదృష్టం తన వెనక పనిచేస్తోందని అతను అనుకున్నాడు.

అతనక్కడ బోటు ఎక్కాడు. ముఖంలో అలసట, అస్వస్థత ఇంకా తాండవిస్తూనే ఉన్నాయి. బరువైన కొయ్య బూట్లతో, చంకలో పెట్టెతో అతను హాలెండ్ గడ్డ మీద అడుగుపెట్టాడు. బూటు పాలిష్ కుర్రాళ్ళు అతని వేషం చూసి తమ లాంటివాడే అనుకుని కేరింతలు కొడుతూ ఆహ్వానించారు.

మృత్యుముఖం నుంచి బయటపడడం, అస్వస్థత, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా దేశం కాని దేశంలో అడుగుపెట్టడం… ఆలోచించకొద్దీ తను బతికి ఉండడమే ఓ అద్భుతంగా అతనికి అనిపిస్తోంది.  హాంబర్గ్ లో చన్నీళ్ళ స్నానాలతో శరీరాన్ని గట్టి పరచుకోవడం వల్లనే ఓడ మునక వల్ల కలిగిన విపత్తునుంచి బయటపడ్డానని అనుకున్నాడు. మిగతావాళ్ళు తిరిగి హాంబర్గ్ కు బయలుదేరుతుంటే, తనను అంతులేని కష్టాల్లోకి నెట్టిన ఆ నగరానికి రానని చెప్పేశాడు. తన అదృష్టాన్ని హాలెండ్ లోనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.

ఎముకలు కొరికేసే ఆ చలిలో  చింకిపాతతో నేరుగా ఏమ్ స్టడామ్ లోని మెక్లంబర్గ్ కాన్సూల్ కు వెళ్ళాడు. హెర్ క్వాక్ అనే అతను కాన్సూల్ గా ఉన్నాడు. తలుపు తీసిన నౌకరు, బిచ్చగాడనుకుని అతని మొహం మీదే తలుపు మూసేశాడు. తను మెక్లంబర్గ్ పౌరుణ్ణనీ, సాయం కోసం వచ్చాననీ ఓ కాగితం మీద రాసి మళ్ళీ బెల్లుకొట్టాడు. ఈసారి  నౌకరు అతను రాసిన నోటు తీసుకెళ్లి హెర్ క్వాక్ కు ఇచ్చాడు. అది చూసి రెండు గోడెన్లను, అంటే యాభై సెంట్లను నౌకరు చేతికిచ్చి పంపించాడు. దాంతో అతను మళ్ళీ తన దగ్గరికి రాడనుకున్నాడు. ఆ మొత్తాన్ని చూసి విస్తుపోయిన హైన్ రిచ్ తో, “ఈ మాత్రమైనా ఇచ్చినందుకు సంతోషించు” అని ఎకసెక్కంగా అని నౌకరు తలుపు మూసేశాడు.

ఏమ్ స్టడామ్-1840లలో

హైన్ రిచ్ కోపంతో కుతకుత లాడిపోయాడు. అది పేదవాడి కోపమని అతనికి తెలుసు. ఏమ్ స్టడామ్ లో రామ్స్కో అనే చోట ఉన్న నావికుల లాడ్జీకి వెళ్ళాడు. గ్లామెన్ అనే ఓ వితంతువు దానిని నడుపుతోంది. అద్దె రోజుకు ఒక గోడెన్. తన దగ్గరున్న మొత్తంతో మహా అయితే ఒకరోజు గడుపుకోవచ్చు. కానీ రేపేలా? అంతలో అతనికో ఉపాయం తట్టింది. తను తీవ్ర అస్వస్థతో ఉన్నానని, ఆసుపత్రిలో చేర్చవలసిందని హెర్ క్వాక్ కు ఉత్తరం రాసి పంపాడు. ఆ దరిద్రుడు తనకు చేయగలిగిన సాయం ఇదే ననుకున్నాడు. అతని భారం తన మీద ఎక్కడ పడుతుందోనని భయపడ్డ గ్లామెన్ ఆ ఉత్తరాన్ని హెర్ క్వాక్ కు అందించే ఏర్పాటు చేసింది. ఆ ఉపాయం ఫలించింది. ఎనిమిదిరోజులు ఆసుపత్రిలో గడిపాడు.

ఈలోపున హాంబర్గ్ లో తనకు పరిచయమైన ఓడల దళారీ హెర్ వెంట్ కు ఉత్తరం రాశాడు. అందులో ఓడ మునక గురించి, తన ప్రస్తుత దుస్థితి గురించి వివరించాడు. అతని అదృష్టం కొద్దీ ఆ ఉత్తరం అందే సమయానికి హెర్ వెంట్ కొంతమంది అతిథులకు విందు ఇస్తున్నాడు. ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివాడు. అతనితోపాటు అతిథులందరూ అతని మీద జాలిపడ్డారు. అప్పటికప్పుడు 240 గోడెన్ల మొత్తం సమకూడింది. హెర్ వెంట్ ఆ మొత్తాన్నీ, అతనికి సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ప్రష్యా కాన్సూల్-జనరల్ కు రాసిన ఉత్తరాన్నీ హైన్ రిచ్ కు పంపాడు.

కొద్ది రోజులకే అతనికి ఎఫ్.సి. క్వెన్ & కొ లో అకౌంట్స్ విభాగంలో మెసెంజర్ బాయ్ గా ఉద్యోగం దొరికింది. డిమాండ్ డ్రాఫ్టులను స్టాంపింగ్ చేసి నగదుగా మార్చడం అతను చేయవలసిన పని. ఈ ఉద్యోగంతో పచారీ కొట్టు జీవితం నుంచి తను శాశ్వతంగా బయటపడ్డాడనీ, అదృష్టాన్ని వెతుక్కునే మార్గంలో తొలి అడుగు పడిందనీ అనుకున్నాడు.

అంతే…ఆ క్షణం నుంచి అతను మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు.

అపారమైన డబ్బు సంపాదించాలంటే, జీవితం మొత్తాన్ని అందుకు ధారపోయడం మినహా మరో మార్గం లేదని అతనికి అప్పటికే అర్థమైంది. తన తెలివితేటలకు మరింత సాన పట్టాడు. ఇదే తన జీవితం, ఇందుకు భిన్నంగా తను జీవించలేడని అనుకునే టంతగా తన లక్ష్యానికి అంకితమవడం అతనికి అలవడింది. ఖర్చును కనీస స్థాయికి తగ్గించుకున్నాడు. ఇప్పుడతని జీతం నెలకు 36 గోడెన్లు. అందులో ఎనిమిది గోడెన్లు లాడ్జీలో తనుంటున్న చవకబారు గది అద్దెకు పోతాయి. విందు వినోదాల ప్రశ్నే లేదు. సాయంత్రాలు ఊరంతా తిరగడం, గ్యాస్ దీపాల వెలుగులో జిగేలుమనే దుకాణాలను మెరిసే కళ్ళతో చూసి ఆనందించడం; లేదా రైల్వే స్టేషన్ కు వెళ్ళి, వచ్చిపోయే రైళ్లను చూస్తూ గడపడం…ఇవే అతని కాలక్షేపాలు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే, హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లలోని రంగు రంగుల మైనపు బొమ్మల్ని తనివితీరా చూసేవాడు. మిన్నాను తలచుకుంటూ ఉండేవాడు.

అతని దినచర్యలో ఉద్యోగం తర్వాత చదువుకే ప్రాధాన్యం. పుస్తకాలపైనా, తన చదువును ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కదానిపైనా ధారాళంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జర్మన్ అక్షరాలను దిద్దడంతో సహా మళ్ళీ కొత్తగా చదువు మొదలెట్టాడు. జర్మన్ లో తప్పులు లేకుండా ఒక మాదిరిగా రాయడమెలాగో ఇరవై పాఠాలతో నేర్చుకున్నాడు. ఆ తర్వాత డచ్చి, ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఓ ట్యూటర్ ను పెట్టుకున్నాడు. పదాలను, వాక్యాలను బిగ్గరగా ఉచ్చరించేవాడు. వ్యాసాలు రాసి ట్యూటర్ తో దిద్దించుకునేవాడు. ఆపైన ఇంగ్లీష్ పై పట్టు సంపాదించడానికి ప్రతి ఆదివారం రెండుసార్లు ఏమ్ స్టడామ్ లోని ఇంగ్లీష్ చర్చికి వెళ్ళేవాడు. అక్కడి పాస్టర్ పలికే ప్రతి మాటనూ పదే పదే ఉచ్చరించేవాడు. అంకెర్షగన్ చర్చిలో వాళ్ళ నాన్న పలికిన ప్రతి మాటనూ, అర్థం తెలియకపోయినా ఉన్నదున్నట్టు అద్భుతంగా వల్లించగలిగిన హాపింగ్ పీటర్ ఒరవడిలో-తనూ తెలియకుండానే వెళ్ళాడు.

రాత్రిళ్లు అతని బుర్ర పాదరసంలా పనిచేసేది. నిద్ర కాచుకుంటూ పుస్తకపఠనం సాగించేవాడు. దాంతో నిద్ర తక్కువై పాలిపోయి జబ్బుమనిషిలా కనిపించేవాడు.  ఆ పుస్తకాలు కూడా అంతవరకూ తనకు విపరీతమైన ఆసక్తి కలిగిస్తూ వచ్చిన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలకు సంబంధించినవి కావు. వ్యాపారరంగంలో తను పైకి రావడానికి సాయపడే భాషలకు సంబంధించినది. ఇప్పుడు డబ్బు యావలో పడిపోయి ట్రాయ్ ని, చివరికి మిన్నాతో పెళ్లి తలపులనూ కూడా పక్కన పెట్టేశాడు.

వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్, ఇవాన్ హొలను… అవి దాదాపు కంఠస్థమయ్యేవరకూ చదివిందే చదువుకుంటూ పోయేవాడు. అలా ఆరునెలల్లో ఇంగ్లీష్ అతనికి ఒంటబట్టేసింది. మరోవైపు తను చదివింది, విన్నది గుర్తుండిపోయేలా; బుర్రలో పడిన ఒక్క అంకె కూడా జారిపోని విధంగా తన జ్ఞాపకశక్తికి శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చాడు. నామవాచకాలు, క్రియాపదాలతో సహా అన్నీ వల్లె వేసుకుంటూ క్రమంగా ఓ జ్ఞాపక యంత్రంలా మారిపోయాడు.

ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే తర్వాతి ఆరునెలల్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అతనిలో ఏకాగ్రత ఎంత పదునెక్కిందంటే; డచ్చి, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్ భాషల్ని ఆశ్చర్యం గొలిపేటంత త్వరగా నేర్చేసుకున్నాడు. గట్టిగా దృష్టి పెట్టి ఈ భాషల్లో ధారాళంగా చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోడానికి నాకు ఆరువారాల్ని మించి పట్టలేదని అతను చెప్పుకున్నాడు. దీనిని సాధించడానికి అతను కఠోరమైన కాలనియమాన్ని పాటించాడు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా పొడవైన పదాల పట్టికను ఎదురుగా ఉంచుకుని అదేపనిగా వల్లించేవాడు. పోస్టాఫీస్ లో స్టాంపుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు పేరాలకు పేరాలను గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. ఈ విషయంలో ఒక్క క్షణం కూడా అతను రాజీపడలేదు.  ఈవిధంగా ఏమ్ స్టడామ్ లో తన చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచానికి దూరంగా తన ప్రపంచంలో తాను గడిపాడు.

ఏమ్ స్టడామ్ కు రావడానికి ముందు అతనికి జర్మన్…అది కూడా మెక్లంబర్గ్ మాండలికం, తగుమాత్రం లాటిన్ మాత్రమే తెలుసు. ఇప్పుడతను ఏడు భాషల్ని చదవగలడు, మాట్లాడగలడు, రాయగలడు; ఈ భాషల్లో వ్యాపార నివేదికలు తయారుచేయగలడు.

తనపై  తాను కఠిన క్రమశిక్షణను విధించుకుని చేసిన ఇంతటి కసరత్తుకూ త్వరలోనే తగిన ప్రతిఫలం ఉంటుందన్న  ఆత్మవిశ్వాసమూ అతనిలో ఉంది.

అతను ఊహించినట్టే మరోసారి అదృష్టం అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది…!!!

    (సశేషం)

 

 

 

 

బతుకు ‘బస్తా’ అయింది!

స్లీమన్ కథ-2

కల్లూరి భాస్కరం
కల్లూరి భాస్కరం

హైన్ రిచ్ తల్లి అప్పటికి చాలాకాలంగా అస్వస్థతతో ఉంది.  వంటమనిషిని ఉంచుకున్న భర్త ఆమెకు ఖరీదైన కానుకలు, నగలు, దుస్తులు, డబ్బు దోచి పెడుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. మనోవ్యథ ఆమె శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీసింది.

తను చనిపోవడానికి ముందు పెద్ద కూతురికి ఒక ఉత్తరం రాసింది. అది రక్తంతో రాసినట్టుగా కనిపించింది. దురదృష్టవంతురాలైన తల్లి మీద అంతకాలం చూపించిన ప్రేమకు అందులో కృతజ్ఞతలు చెప్పింది. తను జీవన్మరణ పోరాటం చేస్తున్నాననీ, తను చనిపోయినట్టు తెలిస్తే దుఃఖించవద్దనీ, ఎట్టకేలకు కష్టాలనుంచి విముక్తి లభించిందనుకుని సంతోషించమనీ కోరింది. ఇది కొంచెమైనా కనికరం లేని ప్రపంచమనీ; ఈ కడగండ్ల నుంచి తనను గట్టెక్కించమని రాత్రిళ్ళు నిశ్శబ్దంగా చేసిన ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించలేదనీ, తన ఓరిమి నిష్ఫలమైపోయిందనీ నిష్టురమాడింది…

ఇదే ఆమె రాసిన చివరి ఉత్తరం. కొన్ని వారాలకే ఓ కొడుకును కని ఆమె కన్నుమూసింది.

ఆమె మరణానికి భర్తే కారణమని గ్రామస్తులకు తెలుసు. అతని మీద కోపంతో రగిలిపోయారు. తగిన శాస్తి చేయాలనుకున్నారు. కానీ అది చివరికి పిల్లలకు శిక్షగా పరిణమించింది. వారిని బంధువుల ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. హైన్ రిచ్ ను కల్కోస్ట్ అనే ఊళ్ళో పాస్టర్ గా ఉన్న అతని చిన్నాన్న ఫ్రైడ్ రిచ్ స్లీమన్ ఇంటికి పంపడానికి నిర్ణయం జరిగింది.

ఆ ఏర్పాటు ఒక కొలిక్కి రావడానికి ముందు కొన్ని వారాలు అతడు అంకెర్షగన్ లోనే ఉండిపోయాడు. ఇప్పుడతనికి దెబ్బ మీద దెబ్బ. అతన్ని కలవకుండా మిన్నాను తల్లిదండ్రులు కట్టడి చేశారు. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు ఇంటికి వెళ్ళి, అచ్చం మిన్నా లానే ఉండే ఆమె తల్లి ఓల్గార్తా చిత్రపటం ముందు నిలబడి హైన్ రిచ్ నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవాడు. “మిన్నా ఎడబాటు అమ్మ మరణం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ బాధించింది. నా అనంతర జీవితంలో అనేక దేశాలు తిరిగి అంతులేని కష్టాలు పడ్డాను. కానీ, నా తొమ్మిదో ఏట మిన్నాకు దూరమై నేను అనుభవించిన దుఃఖానికి అవేవీ సాటిరావు” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

తన జీవితమంతా అతను మిన్నా సాహచర్యాన్ని కలలు కంటూనే గడిపాడు. ఎప్పటికైనా ఆమెను కలసుకుంటానన్న ఆశ అతనిలో నిరంతరం తళుకుమంటూనే ఉండేది. మిన్నా, ట్రాయ్…రెండూ అతని కలల ప్రపంచంలో ఒకేలా భాగమైపోయాయి.

కల్కోస్ట్ లో చిన్నాన్న అతన్ని స్కూల్లో చేర్చాడు. ఆ స్కూల్లో ఉన్న హోమర్ శిలా విగ్రహం హైన్ రిచ్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. చిన్నాన్న అతన్ని కన్నకొడుకులానే చూసుకున్నాడు. హైన్ రిచ్ చదువులో బాగా రాణిస్తున్నాడు. లాటిన్ అతనికి బాగా పట్టుబడుతోంది. లాటిన్ టీచర్ కార్ల్ ఆండ్రెస్ అది గుర్తించి అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అతనికి ఆసక్తి ఉన్న విషయాల మీద సొంతంగా లాటిన్ లో రాయిస్తూ, వ్యాకరణ దోషాలు దిద్దుతూ సానపట్టాడు. తండ్రి వల్ల తమ కుటుంబం చెదిరిపోవలసివచ్చినా హైన్ రిచ్ ఆయనను ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నాడు. 1832 క్రిస్టమస్ రోజున ట్రోజన్ యుద్ధాల పై లాటిన్ లో ఓ సుదీర్ఘ వ్యాసం రాసి తండ్రికి కానుకగా పంపాడు. అక్కడక్కడ దోషాలు ఉన్నా ఆ వ్యాసం తండ్రికి సంతృప్తి కలిగించింది.

చదువులో హైన్ రిచ్ తన ఈడు పిల్లలను మించిపోయాడు. దాంతో మరుసటేడు అతన్ని న్యూ స్ట్రెలిజ్ అనే ఊళ్ళోని జిమ్నాజియంలో మూడో తరగతిలో చేర్చారు. మిన్నా ఎడబాటు, కుటుంబ పరిస్థితులు ఒకపక్క కుంగదీస్తున్నా; పై పైకి ఎదగాలన్న తపన, అందుకు అవసరమైన పట్టుదల, శ్రమించే తత్వం అతనిలో నిలకడగా ఉన్నాయి. ఏ ఆటంకం లేకుండా చదువు సాగితే ఏ రోష్టాక్ యూనివర్సిటీలోనో ఉద్యోగం సంపాదించుకునేవాడు. రోష్టాక్ యూనివర్సిటీ జర్మనీలో అతి పురాతన, ప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటి.

కానీ జిమ్నాజియం చదువు మూడు నెల్ల ముచ్చటే అయింది. గ్రామస్తులు తన మీద కత్తి కట్టినా తీరు మార్చుకోని తండ్రే అందుకు కారణం. దాంతో గ్రామస్తులు అతన్ని పూర్తిగా పట్టి పల్లార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఇతర నిందలతోపాటు, చర్చి నిధులు దుర్వినియోగం చేశాడన్న అభియోగం తెచ్చారు. పాస్టర్ గా ఉండడానికి పనికిరాడని తేల్చారు. బిషప్ అతన్ని అభిశంసించి సస్పెండ్ చేశాడు. చర్చి నుంచే బహిష్కరిస్తామని హెచ్చరించాడు. రాబడి తగ్గిపోవడంతో కొడుకు జిమ్నాజియం చదువు అతనికి తలకు మించిన భారం అయింది.

హైన్ రిచ్ ఓ మామూలు స్కూలుకు మారాల్సి వచ్చింది. ఆ స్కూల్లో అతను మూడేళ్లు గడిపాడు. అక్కడా చక్కగా రాణించాడు. అంతలో మరో పిడుగుపాటు. ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయిన తండ్రి  ఆ స్కూలు ఫీజు కూడా కట్టలేనని చేతులెత్తేశాడు. అప్పటికి హైన్ రిచ్ కు పద్నాలుగేళ్లు. చదువు సంగతి దేవుడెరుగు, తిండికోసం వెతుక్కోవలసిన పరిస్థితి. ఆ వయసులో అతను చిన్నాన్న మీద ఆధారపడలేడు. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని తన బతుకును తన చేతుల్లోకి తీసుకోవలసిందే.

తక్షణ సమస్య తిండి గడవడం. కనుక ఎంత చిన్న ఉద్యోగమైనా చేయకతప్పదు.  ఏ పచారీ కొట్లోనో కుదురుకుంటే కనీసం తిండి కైనా లోటు ఉండదనుకున్నాడు. ఈష్టర్ సెలవులు కాగానే పొరుగునే ఉన్న ఫర్ష్టెన్ బర్గ్ గ్రామంలో ఓ పచారీ కొట్టును వెతుక్కోవాలనుకున్నాడు. అంతలో అనుకోని ఓ ఘటన జరిగింది. అతనో రోజున న్యూ స్ట్రెలిజ్ గ్రామంలోని ఓ సంగీతవిద్వాంసుడి ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం… అక్కడతనికి మిన్నా కనిపించింది!

నల్లని దుస్తులతో చాలా నిరాడంబరంగా ఉంది.  ఆ నిరాడంబరతే ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అతనిలానే ఆమెకూ పద్నాలుగేళ్లు. కానీ ఈడును మించి ఎదిగినట్టు కనిపించింది. ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయారు. నిస్సహాయంగా ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి చెక్కిళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కట్టాయి. ఎంత ప్రయత్నించినా ఒక్కరికీ మాట పెగల్లేడు. అంతలో మిన్నా తల్లిదండ్రులు వచ్చి వారిని బలవంతంగా విడదీశారు.

అయిదేళ్ల వియోగం తర్వాత ,అదే వాళ్ళు మొదటిసారి కలసుకోవడం. అతను దుర్భరమైన ఏకాంతాన్ని, క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆ అమ్మాయి మెరుపు తీగలా కనిపించి మాయమైంది. చెక్కిళ్లపై కన్నీరు జారుతుండగా ఆ సంగీత విద్వాంసుని ఇంట్లో ఆమె నిలబడి ఉన్న దృశ్యం అతనికి జీవితాంతం గుర్తుండిపోయింది. “మిన్నా ఇప్పటికీ నన్ను గాఢంగా ప్రేమిస్తోందన్న నమ్మకం నా ఆశలకు, ఆకాంక్షలకు గొప్ప ఇంధనం అందించింది. నాలో అంతులేనంత శక్తీ, ఉత్సాహం కట్టలు తెంచుకున్నాయి. అలుపెరుగని కృషితో జీవితంలో అన్నివిధాలా పైకి వచ్చి ఆమెకు తగిన వాడిగా నన్ను నేను నిరూపించుకోగలనన్న తిరుగులేని ఆత్మవిశ్వాసం నాలో నిండిపోయింది. నా కాళ్ళ మీద నేను నిలబడేవరకూ ఆమెకు పెళ్లి కాకుండా చూడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత అతను ఫర్ష్టెన్ బర్గ్ కు ప్రయాణం కట్టాడు. అక్కడ హేర్ హోట్జ్ అనే ఓ వ్యక్తికి చెందిన పచారీ కొట్టులో నౌకరీకి కుదిరాడు. ప్రొఫెసర్ కావాలనుకున్నవాడు కాస్తా అలా పచారీ కొట్టులో తేలాడు.

***

ఆ కొట్టూ, దానికి సంబంధించిన ప్రతిదీ అతనికి కంపరం కలిగించాయి. యజమాని తన పేరులానే ఓ కొయ్య మనిషి. పొద్దుటే అయిదింటికి లేచి కొట్టు తెరవాలి. తుడిచి శుభ్రం చేయాలి. కౌంటర్ల దుమ్ము దులపాలి. యజమాని బూట్లు పాలిష్ చేయాలి. రాత్రి పొద్దుపోయేవరకూ పనే పని. ఆ తర్వాత  అక్కడే నిద్ర. అప్పుడైనా  కాసేపు పుస్తకం పట్టుకుందామనుకుంటె అలసటతో కళ్ళు వాలిపోయేవి. స్కూల్లో బట్టీ పట్టించిన వర్జిల్ పంక్తుల్ని కూడా మరచిపోతున్నాడు. ఆ పచారీ కొట్టు లోపల చీకటిగా, చలి చలిగా, దుర్భరంగా ఉండేది. అతని ఊహలకు మేత వేసే ఎలాంటి కథలూ అక్కడ వినబడవు. తగలబడుతున్న ట్రాయ్ లాంటి పురాతన చిత్రాలు కనబడవు.

రోజంతా ఒళ్ళు హూనం చేసుకున్నా గిట్టేది నామమాత్రం. ఊరు పేదది. ఒక్కోసారి యజమానికి కూడా పూట గడవడం కష్టమయ్యేది. రోజు మొత్తం మీద 12 టేలర్లు, అంటే ఇంచుమించు 3 పౌండ్ల విలువైన సరుకు అమ్మితే, అక్కడికి అదృష్టవంతులే. ఏడాదిలో 3,000 టేలర్ల వ్యాపారం జరగడం కనాకష్టం. లాభాలు తక్కువ, పని గంటలు ఎక్కువ.  త్వరగా ధనవంతుడైపోయి మిన్నా సాహచర్యాన్ని గెలుచుకోవాలనుకుంటున్న హైన్ రిచ్ కు అంతూపొంతూ లేని ఆ వెట్టి చాకిరీనుంచి బయటపడే దారి కనిపించలేదు.

పొద్దుట లేవగానే ఏకాంతంగా గడిపే ఒకటి రెండు గంటలు మాత్రమే అతని సొంతం. ఎనిమిదింటికల్లా యజమాని వచ్చి   బస్తాడు ఆలుగడ్డల మోతతో డిస్టెలరీకి పంపించేవాడు. మెక్లంబర్గ్ లో అంతా ఆలుగడ్డలనుంచి తీసిన విస్కీయే తాగుతారు. ఆ వెంటనే పరుగు పరుగున వచ్చి కౌంటర్ దగ్గర నిలబడాలి. చేపలు, వెన్న, పాలు, ఉప్పు, కాఫీ, చక్కెర, నూనెలు, కొవ్వొత్తులు, ఆలుగడ్డల విస్కీ వగైరాలు అమ్ముతూ రాత్రి పదకొండు వరకూ అక్కడే వేల్లాడాలి. సరకుతో వచ్చిన బరువైన పెట్టెలను కొట్లోకి దొర్లించడం, చేపల కేసుల్ని లెక్కపెట్టడం, సరకు సర్దడం చేస్తూ ఉండాలి. చదువుకోడానికి సమయం చిక్కకపోగా, అంకెలతో బుర్ర అరణ్యంలా తయారయ్యేది. చేప నూనెతో చేతులు జిడ్డోడుతూ ఉండేవి. బట్టల నిండా రంపంపొడి అతుక్కుని ఉండేది. ఉన్నది ఒకటే జత. దానికి కూడా మాసికలు. వేసవైనా, చలికాలమైనా అదే గతి.

ఇంతటి దుస్సహ పరిస్థితుల మధ్య కూడా అతని కలల ప్రపంచం పదిలంగానే ఉంది. దానికి అతనే రారాజు. చదువులో తను ఉన్నతశిఖరాలను అధిరోహించినట్టు, విపరీతంగా డబ్బు సంపాదించినట్టు, మిన్నాను పెళ్లాడి ఆమెతో కలసి ప్రణయసామ్రాజ్యాన్ని ఏలుతున్నట్టు ప్రతిక్షణం ఊహించుకునేవాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం…డబ్బు, అంతులేనంత డబ్బు!

అరుదుగానైనా అతనిలో సంతోషాన్నీ, సంతృప్తినీ నింపిన క్షణాలు లేకపోలేదు. ఓ రోజు రాత్రి ఓ తాగుబోతు తూలుకుంటూ దుకాణానికి వచ్చాడు. చమురు దీపం ముందు నిలబడి హఠాత్తుగా హోమర్ నుంచి కొన్ని గ్రీకు పంక్తులు వల్లించడం ప్రారంభించాడు. హైన్ రిచ్ మంత్రముగ్ధుడై వింటూ ఉండిపోయాడు. అతను గ్రీకు చదవలేడు, అర్థంచేసుకోలేడు. కానీ ఆ భాషలోని లయ అతని హృదయతంత్రిని మీటింది. అలా ఆ తాగుబోతు వంద పంక్తులు పూర్తిచేశాడు. హైన్ రిచ్ మరోసారి …అప్పటికీ తనివి తీరక మూడోసారి అతని చేత వల్లింపజేసి విన్నాడు. సంతోషం పట్టలేక మూడు గ్లాసుల విస్కీ అతనికి ఉచితంగా తాగబొశాడు. దాని ఖరీదు, అంతవరకు తను పొదుపు చేసిన స్వల్పమొత్తంతో సమానం.

హైన్ రిచ్ ఆ తాగుబోతుతో పరిచయం పెంచుకున్నాడు. అతని కోసం రోజూ ఎదురుచూస్తూ ఉండేవాడు. అతని పేరు నీడర్ హోఫర్. వయసు ఇరవై నాలుగేళ్ళు. రోబెల్ కు చెందిన ఓ ప్రొటెస్టెంట్ పాస్టర్ కొడుకు. ఎందులోనూ రాణించలేకపోయాడు. చెడునడత కారణంగా అతన్ని స్కూలునుంచి బహిష్కరించారు. స్కూల్లో ఉండగా బట్టీ పట్టించిన ఆ వంద పంక్తులు మాత్రం అతనికి గుర్తుండిపోయాయి. వాటినే శ్రావ్యంగా వల్లిస్తూ ఉండేవాడు. ఆ పంక్తులు వింటున్నప్పుడు తన కళ్ల వెంట ఆనందబాష్పాలు జల జలా రాలాయనీ, తనకు గ్రీకు భాష తెలిసేలా చేయమని “ఆ క్షణం” నుంచే దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాననీ హైన్ రిచ్ ఆ తర్వాత రాసుకున్నాడు.

ఆ రోజుల్లోనే అతను అమెరికాకు పారిపోవాలని అనుకునేవాడు. అక్కడి వీథుల్ని బంగారంతో తాపడం చేశారనీ, ఆ దేశంలో కరువు తీరేలా కావలసినన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చనీ చెప్పుకుంటుండగా విన్నాడు. అప్పట్లో పడమటి భూములనుంచి వేల సంఖ్యలో జనం అమెరికాకు వలసపోతూ ఉండేవారు. కొంత ఖర్చు భరించే మేరకైనా తన దగ్గర డబ్బు సమకూడితే న్యూయార్క్ పంపే ఏర్పాటు చేసేలా ఒక ఏజెంట్ తో ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడతని వయసు పద్దెనిమిదేళ్లు. కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని తండ్రికి రాశాడు. ఆయన సమస్యల్లో ఆయనున్నాడు. ఒకామెను పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్యా ఎడతగని కీచులాట. చివరికి వ్యవహారం కోర్టువరకూ వెళ్లింది. తండ్రి నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో హైన్ రిచ్ తీవ్ర ఆశాభంగం చెందాడు. ఇక ఈ పచారీ కొట్టును, వెట్టి చాకిరీనీ తప్పించుకునే మార్గంలేదనుకున్నాడు. అంతలో అతని జీవిత గమనాన్నే మార్చేసే ఓ ఘటన జరిగింది.

heinrich

అతనో పెద్ద చికోరీ పెట్టెను దొర్లించబోయాడు. పెద్దదే కానీ మరీ అంత బరువైందేమీ కాదు. అదే అతనికి కష్టమై హఠాత్తుగా రక్తం కక్కుకున్నాడు. నేల మీద ఉన్న రంపంపొడి రక్తంతో ఎర్రబడిపోయింది. ఇంక తను ఆలుగడ్డల బస్తాలను, వెన్న చిలికే పెద్ద పెద్ద కవ్వాలను మోయగల స్థితిలో లేడని అతనికి అర్థమయింది. ఆ చీకటి కొట్లోనే తన జీవితం తెల్లారిపోతుందనుకుని భయపడ్డాడు.

వెంటనే హాంబర్గ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది సముద్రతీరంలో ఉంది కనుక అక్కడినుంచి అమెరికాకు తేలిగ్గా వెళ్లిపోవచ్చు. అప్పటికతను 30 ప్రష్యన్ డాలర్లను, అంటే దాదాపు 7 పౌండ్లను పొదుపు చేశాడు. ఆ డబ్బు తీసుకుని కట్టుబట్టలతో కాలినడకన రోష్టాక్ మీదుగా హాంబర్గ్ కు బయలుదేరాడు. రోష్టాక్ లో కొన్ని రోజులు ఆగి బుక్-కీపింగ్ నేర్చుకున్నాడు. సాధారణ విద్యార్థులకు ఏడాది నుంచి ఏణ్ణర్థం పట్టే ఆ కోర్సును కొన్ని రోజుల్లోనే పూర్తిచేశాడు.

రోష్టాక్ నుంచి హాంబర్గ్ కు బయలుదేరిన హైన్ రిచ్ కు చిన్నాన్న కూతురు సోఫీ స్లీమన్ వీడ్కోలు చెప్పింది. హాంబర్గ్ లోని అయిదు ఎత్తైన బురుజుల్ని దూరం నుంచే చూసి ముగ్ధుడయ్యాడు. నిజానికి అతను తన చరమ జీవితం అంతా ఎత్తైన కోట బురుజుల్ని చూస్తూ ముగ్ధుడవుతూనే గడిపాడు. శివార్లలో నిలబడి సెప్టెంబర్ ఆకాశపు గొడుగు కింద ఆ నగర దృశ్యాన్ని చూస్తూ “హాంబర్గ్…హాంబర్గ్’’ అని మాటి మాటికీ గొణుగుతూ ఉండిపోయాడు. ఒక నగరాన్ని చూడడం అదే అతనికి మొదటిసారి. అక్కడి విశాలమైన ఆవరణల మధ్య ఠీవి ఒలికే వర్తక ప్రాసాదాలు, ఎక్కడబడితే అక్కడ మార్కెట్లు, తీర్చి దిద్దిన రహదారుల మీద చప్పుడు చేసుకుంటూ సాగిపోయే బళ్ళు, గడియారపు మోతలు, ఎత్తైన చర్చి గోపురాలపై గంటల గలగలలు…ప్రతిదీ అతన్ని ఉత్తేజితుణ్ణి చేశాయి. చెవులు చిల్లులు పొడిచే ఆ రణగొణ ధ్వనుల మధ్య తనను తాను మరచిపోయాడు. తన కష్టాలను మరచిపోయాడు. నిద్రలో నడుస్తున్నట్టు నడిచాడు. ఇక్కడ తన అదృష్టాన్ని ఎలా పండించుకోవాలన్న ఆలోచన చేశాడు. “హాంబర్గ్ నన్ను ఆకాశానికి ఎత్తేసింది. నన్నో స్వాప్నికుడిగా మార్చేసిం”దని సోదరికి ఉత్తరం రాశాడు.

అదృష్టం పండించుకోవడం అలా ఉంచి, మాటి మాటికీ రక్తం కక్కుకుంటున్న ఈ జబ్బుమనిషికి పని దొరకడమే గగనమైపోయింది. ఎట్టకేలకు నెలకు 14 పౌండ్ల జీతం మీద ఓ పచారీ కొట్టులో పని దొరికింది. ఎనిమిది రోజులకే అది ఊడిపోయింది. ఆ తర్వాత బుక్-కీపర్ గా ఉద్యోగం వచ్చింది. అదీ వారం రోజులకే ముగిసింది. దాంతో క్లిష్టపరిస్థితిలోకి జారిపోయిన హైన్ రిచ్ క్రిష్టమస్ వరకు కాలక్షేపం చేయడానికి సరిపోయే మొత్తాన్ని అప్పుగా పంపమని ఓ బంధువుకి ఉత్తరం రాశాడు. అతను వెంటనే కొద్దిపాటి మొత్తాన్ని పంపుతూ, అంతగా అవసరం లేకపోతే  ఆ డబ్బు తిప్పి పంపమని ఉత్తరం రాశాడు. ఆ మాట హైన్ రిచ్ కు అవమానంగా తోచింది. ఏమైతేనేం, ఆ స్వల్పమొత్తం అతన్ని చావకుండా మాత్రం కాపాడింది. తనను అంత మంత్రముగ్ధం చేసిన హాంబర్గ్ ను క్రిష్టమస్ నాటికి శాశ్వతంగా విడిచిపెట్టేశాడు.

అదెలా జరిగిందంటే…అతని తల్లికి పరిచయస్తుడైన హెర్ వెంట్ అనే ఒక  ఓడల దళారీ అనుకోకుండా తారసపడ్డాడు. అతన్ని ‘డొరోతియా’ అనే ఓడ కెప్టెన్ కు పరిచయం చేశాడు. ఆ ఓడ వెనెజులా లోని లా గ్వైరా అనే చోటికి బయలుదేరబోతోంది. దక్షిణ అమెరికాపై అప్పటికే ఆసక్తి పెంచుకున్న హైన్ రిచ్ ఈ ప్రయాణం గురించి తెలియగానే ఎగిరి గంతేశాడు. అయితే అతని ఆరోగ్యం దెబ్బతినిపోయింది. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరికి ఒక దుప్పటి కొనుక్కోగల స్తోమత కూడా లేదు. అంతలో అతనికి తన వెండి వాచీ గుర్తొచ్చింది. దానిని మూడు డాలర్లకు అమ్మేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రెండు చొక్కాలు, ఒక కోటు, రెండు పంట్లాములూ, ఒక పరుపు, ఓ మాదిరి దుప్పటి కొనుక్కున్నాడు. ఓడ ఎక్కే సమయానికి జేబు ఖాళీ అయిపోయింది.

బయలుదేరిన కొన్ని రోజులకే ఓడ పెనుతుపానులో చిక్కుకుంది. హైన్ రిచ్ మరణం అంచులవరకూ వెళ్ళాడు…

                                                                                                               (సశేషం)

 

 

 

 

 

స్లీమన్ కథ:కలలు కంటూ…కథలు వింటూ…అతని బాల్యం!

కల్లూరి భాస్కరం 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మెక్లంబర్గ్…ఉత్తర జర్మనీలో ఒక చారిత్రక ప్రదేశం. పోలండ్ సరిహద్దులకు అది ఆట్టే దూరంలో లేదు. ఒకప్పుడు స్లావ్ లకు, ట్యూటన్లకు అక్కడో పెద్ద యుద్ధం జరిగింది. అయితే, పందొమ్మిదో శతాబ్ది ప్రారంభం నాటికి మెక్లంబర్గ్ ఎదుగూ బొదుగూ లేకుండా నిలవ నీటి తీరుగా  మిగిలిపోయింది.

మెక్లంబర్గీయుల గురించి బెర్లిన్ వాసుల్ని కదిపితే, “వాళ్ళా? శుద్ధ బుర్ర తక్కువ జనాలు” అని తీసిపారేస్తారు. కానీ అందులో వాస్తవం లేదు. ఈ ప్రాంతం కూడా చెప్పుకోదగిన కళాకారుల్ని, కవుల్ని అందించింది. అంతకన్నా ముఖ్యంగా  అన్నదాత అనిపించుకుంది. ఇక్కడి వాళ్ళలా భూమితో గాఢంగా పెనవేసుకున్న వాళ్ళు  జర్మనీ మొత్తంలోనే మరొకళ్ళు లేరు. వీరు అసలు సిసలు భూమిపుత్రులు.

ప్రధానంగా వీళ్ళు ఆలుగడ్డల్ని పండిస్తారు. పశువుల్ని పెంచుతారు. ఇక వీళ్ళ అలవాట్లకు వస్తే, విపరీతంగా తాగేస్తారు. . అట్టహాసంగా నవ్వుతారు. శీతాకాలపు దీర్ఘ సాయంత్రాలలో నెగడు చుట్టూ కూర్చుని కమ్మ కమ్మగా కథలు చెప్పుకుంటారు.

మెక్లంబర్గ్ లో న్యూ బకౌవ్ అనే ఓ కుగ్రామం. అక్కడో చర్చి. ఆ చర్చి ప్రాంగణంలోనే పాస్టర్ కుటుంబం నివసించే ఓ ఇల్లు. ఆ ఇంట్లో 1822, జనవరి 6న పుట్టాడు ఓ అబ్బాయి. అతనికి నలుగురు అక్కచెల్లెళ్ళు, ఒక అన్న. పుట్టిన ఏడాదికే అన్న చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం తమ్ముడికి అతని పేరే పెట్టారు. అతనే  హైన్ రిచ్ స్లీమన్!

హైన్ రిచ్ పుట్టిన రెండేళ్లకు అంకేర్షగన్ అనే గ్రామానికి తండ్రి పాస్టర్ గా వెళ్ళాడు. అదెంత అనామక గ్రామమంటే, మ్యాపు మీద దాని పేరు కనిపించదు. అక్కడో చిన్నపాటి చర్చి. అందులో చెర్రీ పండ్లతోట. ఆ ఊరికి గుర్తింపు లేకపోతేనేం, అక్కడి గాలి నిండా వింత వింత ఊసులూ; దెయ్యాలు, భూతాలు, గుప్తనిధుల కథలూనూ. అక్కడికి దగ్గరలోనే నిధులు పాతిపెట్టారనీ, అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయనీ చెప్పుకునేవారు. చర్చి తోటలో ఉన్న చిన్న ఇంట్లో నిమ్మచెట్టు కింద ఒక దెయ్యం ఉందట. హైన్ రిచ్ నాన్న ఎర్నెస్ట్ స్లీమన్ కు ముందు పాస్టర్ గా ఉన్న రుష్టార్బ్ దెయ్యం అది. చర్చికి ఇంకో పక్కన ఓ చెరువు. రోజూ అర్థరాత్రి వేళ ఓ అమ్మాయి చేతుల్లో వెండి పాత్ర ఉంచుకుని ఆ చెరువులోంచి పైకి వస్తుంది. అక్కడికి మైలు దూరంలో ఓ సమాధి ఉంది. చనిపోయిన ఓ శిశువును బంగారు ఊయెలలో ఉంచి పాతిపెట్టిన సమాధి అది.

ఆ ఊరి నడిమధ్యలో మధ్యయుగాల నాటి ఓ కోట. దాని అడుగున రహస్యమార్గాలు. ఒకప్పుడు ఆ కోట హెన్నింగ్ వాన్ హోస్టీన్ అనే ఓ బందిపోటు అధీనంలో ఉండేది. అలా ఉండగా, మెక్లంబర్గ్ డ్యూక్ అతని మీదికి యుద్ధానికి వచ్చాడు. హోస్టీన్ అతనితో సంధి రాయబారాలు జరుపుతూనే, అతన్ని చంపడానికి పథకం వేశాడు. ఓ గోవుల కాపరి దీనిని పసిగట్టి డ్యూక్ చెవిన వేశాడు. హోస్టీన్ ఆ గోవుల కాపరిని పట్టుకుని సజీవదహనం చేసి, అప్పటికీ కసి తీరక మృతదేహాన్ని ఒక్క తన్ను తన్నాడు. డ్యూక్ పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. తప్పించుకునే మార్గం దొరక్క హోస్టీన్ తన ఖజానా అంతటినీ ఓ శిథిల గోపురం కింద దాచి ఆత్మహత్య చేసుకున్నాడు.

చర్చి ప్రాంగణంలో పొడవైన రాళ్ళు పరచి ఉన్న చోటే అతని సమాధి. గోవుల కాపరిని తన్నిన అతని కాలు ఏటా ఒకసారి సమాధి లోంచి పొడుచు వస్తుందని, అదొక వింత పువ్వులా కనిపిస్తుందనీ చెప్పుకునేవారు. నల్లని సిల్కు తొడుగుతో ఉన్న ఆ కాలును నేనొకసారి చూశానని చర్చి పనివాడు చెప్పేవాడు. అతను తప్ప చూశామని చెప్పినవాళ్లు ఇంకెవరూ లేరు.

***

దెయ్యాలు, భూతాల కథలూ…మధ్యయుగాలనాటి కోటా…రహస్యమార్గాలలూ…గుప్తనిధులూ…!

హైన్ రిచ్ ఆసక్తులను, ఊహలను పుష్కలంగా పండించడానికి బాల్యంలోనే కావలసినంత ఎరువు.  అతనా కోటను చూశాడు. దాని ఉత్తరపు గోడ మీద, గుర్రమెక్కి యుద్ధానికి వెడుతున్న హోస్టీన్ చిత్రాన్ని చూశాడు. గోవుల కాపరిని సజీవ దహనం చేసిన ప్రదేశం చూశాడు. మెక్లంబర్గ్ డ్యూక్ ను హెచ్చరించడం కోసం గోవుల కాపరి కొండ మీద దాగి ఉన్న చోటు అతనికి తెలుసు. ఆ కోట అడుగున ఉన్న రహస్యమార్గాలను గాలించాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆ రహస్యమార్గాల తలెక్కడో, తోక ఎక్కడో తనకు తెలుసు ననుకునేవాడు. ఇక అతని బుర్ర నిండా గుప్తనిధుల గురించిన కథలే.

నిజానికి అంతవరకు హైన్ రిచ్ ఆ ఊళ్ళోంచి కాలు కదిపింది లేదు. ఆ చర్చి ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టిన సందర్భాలూ తక్కువే. కిటికీకి అతుక్కుపోయి మంచుపొగలోంచి బాహ్యప్రపంచాన్ని చూస్తూ, దానిని ఓ అద్భుతంగానూ, నిగూఢమైందిగానూ ఊహించుకుంటూ ఆనందంతో పులకించిపోయేవాడు. ఆ పసితనపు ఉత్కంఠ అతని జీవితాంతమూ అలాగే ఉండిపోయింది.

అతను ప్రతిచోటా దెయ్యాలు ఉన్న్తట్టు ఊహించుకునేవాడు. ప్రతి సందు మలుపులో ఏదో భయోత్పాతం కాచుకుని ఉన్నట్టు అనుకునేవాడు. రాత్రిపూట విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నట్టు, తోటలో దీపాలు కదిలి వెడుతున్నట్టు, హోస్టీన్ భూతం కోటలోంచి కిందికి దిగి వస్తున్నట్టు భావించుకునేవాడు. చెట్ల మీదా, బెంచీల మీదా, కిటికీ రెక్కల మీదా, చర్చి గోడల మీదా తన పేరు రాసి, ఉనికిని చాటుకునే అలవాటు అతనికి ఉండేది. యాభై ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్లినప్పుడు, చిన్నతనంలో చర్చి తోటలోని నిమ్మచెట్టు మీద తను చెక్కిన పేరు ఉందా లేదా అని చూసుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పేరు అలాగే ఉంది!

తన నలుగురు అక్కచెల్లెళ్లలోనూ డొరోతియా, విల్హెమైన్ లకు అతను ఎక్కువ మాలిమిగా ఉండేవాడు. వాళ్ళమ్మ ఓ మెజిస్ట్రేట్ కూతురు. చాలా నెమ్మదస్తురాలు. పెళ్లయేనాటికి ఆమెకు పదహారేళ్లు. భర్త ఎర్నెస్ట్ కన్నా పదమూడేళ్లు చిన్న. ఆమె దాంపత్యజీవితాన్ని ఏనాడూ ఆనందించలేదు. భర్త ఆమెను పురుగులా చూసేవాడు. పెత్తనం చేసేవాడు. పిల్లలకు మాత్రం తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె అల్లికలు, కుట్లు చేసేది. పియానో వాయించేది. డాబుసరి మనిషిగా ఊహించుకుని గ్రామస్తులు కూడా ఆమెపట్ల అయిష్టంగా ఉండేవారు. పెత్తందారీకి తోడు భర్త వంట మనుషులతో అక్రమసంబంధాలు పెట్టుకోవడంతో ఆమె మరింత కుంగిపోయింది.

తొంభయ్యేళ్లు జీవించిన ఎర్నెస్ట్  స్త్రీలోలుడిగా అపకీర్తినే మూటగట్టుకున్నాడు. పాస్టర్ కావడానికి ముందు అతను స్కూలు టీచర్ గా పనిచేశాడు. బోధన లో అతనికి మంచి నేర్పు ఉండేది. పిల్లలచేత తనే అక్షరాలు దిద్దించాడు. తన పుస్తకాలలోని చక్కని బొమ్మల్ని పిల్లలకు చూపించి ఆనందించేవాడు. ఓ రోజు అతను తమ పేదరికం మీద మండిపడ్డాడు. అప్పుడు, “ ఓ వెండి గిన్నెనో, బంగారు ఊయెలనో తవ్వి తీయచ్చుగా” అన్నాడు హైన్ రిచ్ అమాయకంగా. ఆ మాటకు తండ్రి నవ్వేశాడు.

ఎర్నెస్ట్ కళాకళల మనిషి. ఒక్కోసారి చాలా ఉదారంగా ఉండేవాడు. ఒక్కోసారి పిసినారిలా వ్యవహరించేవాడు. హఠాత్తుగా కాఠిన్యం తెచ్చుకునేవాడు. అది ఎదుటి వాళ్ళకు వింతగానూ, వినోదంగానూ ఉండేది. కథలు మాత్రం మహా రంజుగా చెప్పేవాడు. పిల్లల్ని ఊరి వెంట, పొలాల  వెంట షికారుకు తీసుకెళ్ళడం అతనికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. దారిలో ఎదురయ్యే ప్రదేశాలు, పొలాలు, కట్టడాల చరిత్రను వాళ్ళకు ఎంతో ఆసక్తిగా చెబుతూ ఉండేవాడు. ఆ చెప్పడంలో కూడా అప్పటికప్పుడు కథలు అల్లేవాడు.  ఆ అల్లిక రాను రాను హాస్యాస్పదంగా పరిణమించేది. అయినాసరే, పిల్లలకు అది నమ్మశక్యంగానే అనిపించేది. వారు ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టుకుని వింటుంటే ఉన్నట్టుండి పెద్ద పెట్టున నవ్వేసేవాడు. శీతాకాలపు సాయంత్రాలలో పిల్లలు అల్లరి చేయకుండా హోమర్ నుంచి కథలు చెప్పేవాడు. ఆ చిన్నపాటి చర్చి కాస్తా ట్రోజన్ యుద్ధారావాలతో కంపించిపోయేవరకూ ఆ కథనం సాగుతూ ఉండేది.

అతనికి గ్రీకు తెలియదు. హోమర్ రచనల మూలాన్ని ఎప్పుడూ చదవలేదు. అయినాసరే, ఇలియద్, ఒడిస్సేలపై అతని ఆసక్తికి అవి అడ్డురాలేదు. జర్మన్లు అందరికీ హోమర్ బాగా తెలుసు. గథే, షిల్లర్ లాంటి ఎందరో జర్మన్ కవులు హోమర్ ను అనుకరించారు, ఆరాధించారు, కవిగా ఆయనను ఆకాశానికి ఎత్తారు. హోమర్ రచనలకు జర్మన్ లో అద్భుతమైన అనువాదాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ ప్రసిద్ధమైనది జె. హెచ్, వాస్ అనువాదం. విశేషమేమిటంటే, వాస్ యువకుడిగా ఉన్నప్పుడు, హోస్టీన్ ఆ గోవుల కాపరిని సజీవదహనం చేసిన కోటలోనే  కొన్ని మాసాలపాటు ట్యూటర్ గా గడిపాడు.

ఆవిధంగా హోమర్ హీరోలను పిల్లలు సొంత ఆస్తిగా భావించుకునేవారు. అచియన్లకు, ట్రోజన్లకు మధ్య జరిగిన యుద్ధాల కథలను ఊపిరి బిగబెట్టి వింటుండేవారు. వాళ్ళ ఊహలో అంకెర్షగన్ కోటకు చెందిన శిథిలమైన బురుజులు, యుద్ధప్రదేశాలలోనే ట్రోజన్ యుద్ధం జరిగిపోతూ ఉండేది. అంకెర్షగనే  వాళ్ళ ట్రాయ్ నగరం. అలాగే ట్రాయ్ హీరోల జీవితాలు, వాళ్ళ జీవితాలు ఒకటిగా కలసిపోయేవి.

1829 క్రిస్టమస్ రోజున హైన్ రిచ్ కు వాళ్ళ నాన్న లుడ్విగ్ జెర్రర్ రాసిన సచిత్ర ప్రపంచ చరిత్ర(Illustrated History of the World)ను కానుకగా ఇచ్చాడు. అప్పటికి హైన్ రిచ్ కు ఏడేళ్లు. వెంటనే పేజీలు తిరగేస్తుంటే, ట్రాయ్ నగరం దగ్ధమైపోతున్న దృశ్యం కనిపించింది. తురాయితో ఉన్న శిరస్త్రాణాన్ని, కవచాన్ని ధరించిన ఇనియెస్; తండ్రి ఎంకైసిస్ ను వీపున మోస్తూ, కొడుకు అస్కేనియెస్ చేయి పట్టుకుని ఆ పొగలోంచీ, మంటల్లోంచీ ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ చిత్రం హైన్ రిచ్ ను ఎంతో ఆకట్టుకుంది. అందులోని ప్రతి వివరం అంకెర్షగన్ నే ట్రాయ్ గా ఊహించుకోడానికి అతనికి సాయపడింది. గుండ్రని బురుజులు, ఎత్తైన కోట గోడలు,  అతిపెద్ద సింహద్వారం-అన్నీ అంకెర్షగన్ లో ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతకు ముందున్న పాస్టర్ కు, ఇనియెస్ కు మధ్య పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించడం. ఎత్తైన నుదురు, విశాలమైన కళ్ళు, బండ ముక్కుతో ఇద్దరూ సరిగ్గా ఒకేలా ఉన్నారు. ఇనియెస్ తగలబడుతున్న ట్రాయ్ నుంచి భయంతో పారిపోతున్నవాడిలా లేడు. నెమ్మదిగా, ప్రశాంతంగా, వెనుదిరిగి చూడకుండా పొగ లోంచి బయటికి వస్తున్నవాడిలా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని చూడడం తన జీవితంలో ఒక మలుపు అంటాడు, పెద్దైన తర్వాత హైన్ రిచ్. భూమిలో కప్పడిపోయిన  ట్రాయ్ నగరాన్ని ఎప్పటికైనా తవ్వి తీయాలని, ఆ చిత్రాన్ని చూసిన క్షణంలోనే  అతను నిర్ణయించుకున్నాడు. నగరం తగలబడిపోయినా కోట గోడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని వాళ్ళ నాన్నతో అన్నాడు. బహుశా జెర్రర్ ఆ నగరాన్ని చూసి ఉంటాడని కూడా అన్నాడు.

“లేదు, లేదు. మొత్తం ట్రాయ్ అంతా తగలబడి బూడిదైపోయింది. నువ్వు చూసింది వట్టి ఊహాచిత్రం” అన్నాడు ఎర్నెస్ట్.

“కానీ ట్రాయ్ లో ఆ బొమ్మలో చూపిన గోడల్లాంటివే ఉండి ఉంటాయి” అన్నాడు అబ్బాయి.

“అవును”

“అంత పెద్ద పెద్ద గోడల్ని మంటలేం చేస్తాయి? వాటిలో కొన్నైనా మిగిలే ఉంటాయి”

“లేదు, మిగిలే అవకాశమే లే”దని తండ్రి ఖండితంగా అన్నాడు. కానీ అబ్బాయి మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడి ఉండిపోయాడు. ఏదో ఒక రోజున తను ట్రాయ్ కి వెళ్ళి జెర్రర్ తన పుస్తకంలో కళ్ళకు కట్టేలా వర్ణించిన గోడల్ని, బురుజుల్ని కనిపెట్టి తీరతానని అనుకున్నాడు.

యాభై ఏళ్ల తర్వాత ముక్క ముక్కలుగా తను రాసుకున్న ఆత్మకథలో హైన్ రిచ్ ఈ బాల్యస్మృతులను నెమరువేసుకున్నప్పుడు పండితులు కనుబొమలు ఎగరేశారు. తన ఏడో ఏట తండ్రితో జరిగినట్టు చెబుతున్న ఆ సంభాషణ ఆయనకు అంతగా గుర్తుండడం నమ్మశక్యంగా లేదన్నారు. ట్రాయ్ ని తవ్వి తీయడం గురించి తను కలలు కనని క్షణం, ఆలోచించని రోజు తన జీవితం మొత్తంలోనే లేవనీ; ఎత్తైన ట్రోజన్ గోడలపై విజయగర్వంతో నిలబడే రోజు కోసమే తన శక్తియుక్తులన్నీ వెచ్చించాననీ హైన్ రిచ్ సమాధానం చెప్పినప్పుడు కూడా పండితులు ఆయనను అనుమానంగా చూశారు. కానీ బాల్యం నుంచీ ఆయన ఆసక్తులను, జీవన గమనాన్ని పట్టి చూస్తే ఆయన మాటలు అతిశయోక్తులనిపించవు.

ఆ అబ్బాయి అలా కలలు కంటూనే స్కూలుకు వెళ్ళి వస్తున్నాడు. ఇంకా విచిత్రంగా తన ఏడో ఏటే అతను ప్రేమలో కూడా పడ్డాడు. ఆ అమ్మాయి పేరు మిన్నా మెయింక్. సరిగ్గా అతని వయసే. ఓ రైతు కూతురు. పసుపు రంగు జుట్టు, నీలి కళ్ళు-ఓ అందమైన బొమ్మలా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ డ్యాన్సింగ్ క్లాసులో కలసుకున్నారు. అప్పటినుంచీ విడదీయలేని జంటగా మారిపోయారు. హైన్ రిచ్ చెప్పే కథల్ని ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. ఓ రోజు మెయింక్ కుటుంబం అంతా చర్చికి వచ్చారు. దూరం నుంచి వాళ్ళను చూస్తూనే హైన్ రిచ్ అక్కడినుంచి మాయమైపోయాడు. సాధారణంగా చింపిరి జుట్టుతో ఉండేవాడు కాస్తా, సబ్బుతో నిగనిగలాడేలా మొహం తోముకుని, చక్కగా తల దువ్వుకుని, ఉన్నంతలో మంచి సూటు వేసుకుని పెళ్లికొడుకులా వాళ్ళ ముందుకు వచ్చాడు. ఇంట్లో వాళ్ళు అతన్ని వింతగా గుడ్లప్పగించి చూశారు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమే ఇంత వేషం కట్టాడని ఆ తర్వాత కానీ వాళ్ళకు తట్టలేదు.

ఆ ఏడేళ్ళ వయసులోనే మిన్నాపై అతనికి ఎంత అచంచలమైన ప్రేమంటే, ఎప్పుడూ ఆ అమ్మాయి పక్కనే ఉండేవాడు. స్కూలులో పక్కనే కూర్చునేవాడు.  కలసి డ్యాన్సింగ్ క్లాసుకు వెళ్ళేవాడు. ఇద్దరూ పుట్టలు, గుట్టలవెంట కలసి తిరిగేవారు. కోట దగ్గర, శ్మశానం దగ్గర వేళ్లాడుతూ ఉండేవారు. హెన్నింగ్ వన్ హోస్టీన్ కాలు రాళ్లనుంచి పొడుచుకొచ్చిన చోటు కూడా వాళ్ళు చూశారు. గోవుల కాపరిని సజీవదహనం చేసిన ప్రదేశాన్ని, రహస్యమార్గాలను జంటగా పరిశీలించారు. ఆ కోటలో హోస్టీన్ అనే బందిపోటు నిజంగా ఉండేవాడా అని కనిపించిన వాళ్ళ నందరినీ అడిగారు. ఏటా ఒకసారి అతని కాలు కనిపించేదనీ, ఈ మధ్యనే ఎవరో చెట్ల పండ్లు రాల్చడం కోసం దానిని ఊడబెరికాడనీ చర్చి పనివాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్ని వాళ్ళిద్దరూ నమ్మేశారు. ఆ ఊళ్ళో పీటర్ హప్పర్ట్ అనే దర్జీ ఉండేవాడు. అతనికి ఒకే కన్ను, ఒకే కాలు. దాంతో అతని నడక గెంతీనట్టుగా ఉండేది. అందరూ అతన్ని ‘గెంతుల పీటర్’ అనేవారు. మళ్ళీ కథలు చెప్పడంలో అంతటి మొనగాడు లేడు. దానికితోడు అతనిది అధ్బుతమైన జ్ఞాపకశక్తి. చాలామంది నిరక్షరాస్యుల్లానే అతను కూడా విన్నది ప్రతిదీ గుర్తుపెట్టుకునేవాడు. గడిచిన ఆదివారం పాస్టర్ స్లీమన్ చేసిన మొత్తం ప్రబోధాన్ని ఉన్నదున్నట్టు అప్పజెప్పేవాడు.

అతనో రోజున ఓ ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఊళ్లో వేసవిలో కనిపించే గూడకొంగలు శీతాకాలంలో ఎక్కడికి వెడతాయన్న సందేహం అతనికి కలిగిందట. చర్చి పనివాడి సాయంతో ఓ కొంగను పట్టుకున్నాడు. “వేసవిలో ఈ కొంగ షివేరిన్-మెక్లంబర్గ్ లోని అంకెర్షగన్ లో గూడుకట్టుకుంది. దీనిని చూసినవారు శీతాకాలంలో ఇది ఎక్కడ గడిపిందో దయచేసి తెలియజేయగలరు” అని ఒక తోలు కాగితం మీద రాసి, కొంగ కాలికి కట్టాడు. మరుసటి వేసవికి ఆ కొంగ తిరిగివచ్చింది. దాని కాలికి ఒక చర్మపత్రం కట్టి ఉంది. దాని మీద,  “మాకు షివేరిన్-మెక్లంబర్గ్ ఎక్కడుందో తెలియదు. ఈ కొంగ కనిపించిన ప్రదేశాన్ని సెయింట్ జాన్స్ లాండ్ అంటారు” అని చిత్రలిపిలో రాసిన వాక్యాలు ఉన్నాయి.

near ankershagen castle

“మేము పీటర్ మాటల్ని నమ్మాం . సెయింట్ జాన్స్ లాండ్ అనే ఆ మార్మిక ప్రదేశం ఎక్కడుందో కనిపెట్టడానికి మా జీవితకాలం మొత్తాన్ని ధారపోసి ఉండేవాళ్లం” అని ఆ తర్వాతి కాలంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు. బహుశా అది ట్రాయ్ కి మరో పేరు అయుంటుంది!

ఇక చర్చికి తిరిగొస్తే అక్కడా వింతలు, విశేషాలకు లోటులేదు. ఎప్పుడో చనిపోయినవారి పేర్లను నమోదు చేసిన పురాతన, భారీ రిజిస్టర్లు అందులో ఉన్నాయి. అవి బరువైన గోతిక్ రాతలో ఉన్నాయి. 1709-1799 మధ్యకాలంలో 90 ఏళ్లపాటు పాస్టర్లుగా ఉన్న జొహాన్ క్రిస్టియన్ వాన్ ష్రోడర్, అతని కొడుకు గాట్ ఫ్రైడ్ రిచ్ స్వహస్తాలతో రాసిన రిజిస్టర్లు అవి. పిల్లలు అప్పుడప్పుడు ఆ పేజీలు తిరగేసేవారు. వాటి సంరక్షణ హక్కు తనకు ఉన్నట్టు హైన్ రిచ్ కు అనిపించేది. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు 84 ఏళ్ల వయసులో అప్పటికింకా జీవించే ఉంది. పుట్టుకలు, పెళ్లిళ్లు, చావుల నమోదుతో అంతూపొంతూ లేకుండా సాగే ఆ రిజిస్టర్లను తిరగేసి అలసిపోయిన తర్వాత గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురింటికి వెళ్ళేవారు. ఆమెకు ఆ ఊరి గురించి, గ్రామస్తుల గురించి తెలియని దంటూ లేదు. పిల్లలకు తన పూర్వీకుల చిత్రపటాలు చూపిస్తూ ఉండేది. ప్రత్యేకించి వాళ్ళ అమ్మ ఓల్గార్తా క్రిస్టైన్ వాన్ ష్రోడర్ చిత్రం హైన్ రిచ్ కు ఎంతగానో నచ్చేసింది. ఆమె అచ్చం మిన్నా లానే ఉంది.

అలా హైన్ రిచ్, మిన్నాలు రెండేళ్లపాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలసి ఉండాలనుకున్నారు. అది కూడా అంకెర్షగన్ లోనే. అక్కడి ఎత్తైన చర్చి గోపురం, తోట, శ్మశానం, కొండ మీద పెద్ద కోట—ఇవే వాళ్ళకు తెలిసిన ఏకైక ప్రపంచం. తమ కలల్లో ఇంకొకరి జోక్యానికి ఒప్పుకోకూడదని కూడా ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు.

కానీ వారి కలలకు హఠాత్తుగా అంతరాయం కలిగింది. ఉన్నట్టుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఓ బూడిద కుప్పగా వారికి తోచింది…

  (సశేషం)

 

 

స్లీమన్ కథ: అతను తవ్విన దంతా బంగారం

 స్లీమన్ జీవితధారావాహిక

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మనకు వాల్మీకి, వ్యాసుడు ఎలాగో పాశ్చాత్యులకు హోమర్ అలాగ!

మనం… కనీసం మనలో అనేకమందిమి… రామాయణ, మహాభారత కథలను వింటూ, చదువుతూ, చూస్తూ, నెమరువేసుకుంటూ పెరుగుతాం. వాటిలోని పాత్రలు మన కుటుంబసభ్యులంత దగ్గరైపోతాయి. మనమే కాదు, ప్రతి దేశమూ, ప్రతి జాతీ తనకు చెందిన పురాగాథల వారసత్వాన్ని ఉగ్గుపాలతోపాటు అందుకుంటూనే పెరుగుతుంది. పాశ్చాత్యుల విషయానికి వస్తే, ఇలియడ్, ఒడిస్సేలు వారి ‘రామాయణ, భారతా’లు.

సంగతేమిటంటే, జర్మనీలో పుట్టిన ఓ కుర్రాడికి అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న వయసులో వాళ్ళ నాన్న హోమర్ ను పరిచయం చేశాడు. అప్పటినుంచీ హోమర్ ఆ అబ్బాయి హృదయస్పందనలో భాగమైపోయాడు. ఆ తర్వాత అతను తన జీవితమంతా హోమర్ తోనూ; అతని ఇలియడ్, ఒడిస్సేలతోనూ సహజీవనం చేశాడు.

అతని పేరు హైన్ రిచ్ స్లీమన్!

sliiman

ఇలియడ్ కథాస్థలి అయిన ట్రాయ్ లో, మైసీనియాలో తవ్వకాలు జరిపించి పురాచరిత్ర తాలూకు అద్భుత నిధి నిక్షేపాలను వెలికి తీసిన వ్యక్తిగా స్లీమన్(1822-1890) ప్రపంచప్రసిద్ధుడు. విచిత్రమైన మలుపులతో గొప్ప నాటకీయతను పండిస్తూ సాగిన అతని జీవితం కూడా అంతే అద్భుతం. ఆపైన అతని వ్యక్తిత్వంలోనూ, వృత్తిప్రవృత్తులలోనూ ఊహకందని  వైరుధ్యాలు. అవన్నీ కలసి ఒక ఆసక్తికరమైన ఒక ‘టైపు’గా కూడా అతణ్ణి మనకు పరిచయం చేస్తాయి.

***

రెండేళ్లపాటు ధారావాహికంగా సాగి రెండు వారాలు విరామం తీసుకున్న ‘పురా’గమనం కాలమ్ లో ముందు అనుకున్న అజెండాను పూర్తి చేయకుండానే మధ్యలో ఈ స్లీమన్ ముచ్చటేమిటనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమయ్యుంటుంది, ‘పురా’గమనం ఒక సుదీర్ఘయాత్ర.  వ్యక్తిగత కారణాలు అడ్డు రాకపోతే ఇంకో రెండేళ్ళు… ఇంకా అంతకంటె ఎక్కువ కాలమే కొనసాగగలిగిన సరుకు అందులో ఉంది. అయితే ఇది ఎలాగూ సుదీర్ఘయాత్ర కనుక స్లీమన్ అనే మజిలీ దగ్గర కొన్ని వారాలు ఆగితే ఎలా ఉంటుంది?!

quote

***

స్లీమన్ జీవితగాథ ‘పురా’గమనం శీర్షికలో ఒదిగిపోతుందన్న నమ్మకం కూడా ఈ కోరికకు ఒక కారణం. ఒక పక్క హోమర్ ను వింటూ, ఇంకో పక్క తన ఊళ్ళోని చారిత్రక శిథిలాల మధ్య తిరుగుతూ, వాటి గురించిన అద్భుతత్వ కథనాలకు ఆసక్తిగా చెవి యొగ్గుతూ బాల్యాన్ని గడిపాడు స్లీమన్.  ఇలియడ్, ఒడిస్సే లను కేవలం పురాణంగానో, ఇతిహాసంగానో కాకుండా; చరిత్రగా భావించుకోవడం ప్రారంభించాడు. ఆ చరిత్రను తవ్వి తీయాలని కలలు కన్నాడు. చివరికి ఆ కలల్ని నిజం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు.

excavations at troy

రామాయణ, మహాభారతాలలో పేర్కొన్న ప్రదేశాలలో తవ్వకాలు జరిపించి;  వాటిలోని పాత్రలు ఉపయోగించిన ఆయుధాలు, ధరించిన నగానట్రా వగైరాలను వెలికి తీసినప్పుడూ; నేటి భౌగోళిక పటం పై ఆ ప్రదేశాలను గుర్తించినప్పుడూ అది మనకు ఎంత అద్భుతంగా తోస్తుంది? స్లీమన్ అలాంటి అద్భుతత్వాన్నే అనుభవించాడు. ఇతరులను అనుభవింపజేశాడు.

“గతం తాలూకు అవశేషాలను తవ్వి తీయడాన్ని మించి మన జీవితాలలో సంతోషాన్ని నింపగలిగింది మరొకటి లే” దంటాడు స్లీమన్. ఇలా అనడం విపరీతంగా ధ్వనించే మాట నిజమే. అయితే అతని జీవితగాథలోకి వెడుతున్న కొద్దీ ఈ మాట పురాచరిత్రతో అతని తాదాత్మ్యాన్ని చెబుతుంది.  ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో ఒక అద్భుతంగా దర్శించే ఒక పసిమనసునూ బయటపెడుతుంది.

అలాంటి పసిమనసు కలిగిన వారందరినీ అతని జీవితగాథ ఆకట్టుకుంటుంది!

***

THE GOLD OF TROY  పేరుతో ROBERT PAYNE  చేసిన రచనే ఆ విశ్వాసానికి ప్రేరణ. ఆ రచన ఆధారంగా  చెప్పబోయే స్లీమన్ జీవితగాథతో అతిత్వరలోనే ‘పురా’గమనం తిరిగి కొనసాగుతుంది…

 

 

 

 

 

 

‘నరు’ని అవతరణా ప్రపంచీకరణలో భాగమే

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి ముందు రాముడు పద్నాలుగు వేలమంది రాక్షసులను ఒంటరిగా చంపాడన్న చిత్రణే చూడండి. కావ్యశైలిలో అలాంటివి సహజమే కానీ, రామాయణం విశ్వాసంలో భాగం అవడం వల్ల వాటిని నిజమని నమ్మే సంప్రదాయం ఏర్పడింది.

రాముడు చారిత్రకపురుషుడా, పురాణపురుషుడా అన్న ప్రశ్నకూ ఇదే వర్తిస్తుంది. ఆయన చారిత్రక పురుషుడు కావడం అసంభవమేమీ కాదు; అదే సమయంలో పురాణపురుషుడు కూడా! చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడాను పాటించని దశలో అలా రెండూ కావడంలో వింత ఏమీలేదు. చరిత్ర, పురాణాల మధ్య తేడాను పాటించకపోవడం మన దగ్గరే కాక ప్రాచీన సమాజాలలో చాలా చోట్ల ఉంది. హోమర్ ను ఇంతకుముందు ఉదహరించుకున్నాం.

రాముడు నరుడనీ, పురుషోత్తముడనీ రామాయణం అడుగడుగునా నొక్కి చెబుతోంది. కాలగతిలో ఆ నరుడే దేవుడిగా మారడం మనకు తెలుసు.

ఇలా నిజానికీ, కల్పనకీ; చరిత్రకీ, పురాణానికీ; నరత్వానికీ, దైవత్వానికీ మధ్య వేలాడవలసిన ఓ త్రిశంకుస్థితి ఇది!  కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు మొదలైన మహాభారత పాత్రలకీ ఇదే వర్తిస్తుంది.  పురాణ, ఇతిహాసాలు వాస్తవికార్ధంలో చరిత్ర కావు, నిజమే. కానీ అవి చారిత్రకాంశాలను ప్రతిఫలిస్తాయి. అలా అనుకున్నప్పుడు త్రిశంకుస్థితి ఉండదు. ఈ సూత్రీకరణ నిజానికి సాహిత్యానికీ వర్తిస్తుంది. సాహిత్యంలో ఎంతో కల్పన ఉంటుంది. అయితే సాహిత్యం ప్రతిఫలించే సమాజమూ, ఆ సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తీ నిజాలు కనుక అందులో ఎంతో నిజమూ ఉంటుంది. ఆ విధంగా అందులో చారిత్రకాంశాల ప్రతిఫలనమూ ఉంటుంది.

మనకిప్పుడు తెలిసిన మానవ కాలమానం రీత్యా చూస్తే రామాయణం ఎప్పటిదో తెలియదు. కోశాంబీ తదితర ఆధునిక చరిత్రకారుల ఊహ ప్రకారం  మహాభారతకథ ఇప్పటికి మూడువేల ఏళ్ల క్రితం జరిగి ఉండచ్చు. అసలు ఋగ్వేదం చెబుతున్న దశరాజయుద్ధమే మహాభారతకథగా రూపొంది ఉండచ్చన్న అభిప్రాయమూ ఉంది(రాంభట్ల, జనకథ). కాలం గురించిన చర్చను అలా ఉంచితే రామాయణ, మహాభారతాలు రెండూ ‘నరు’డి గురించి చెబుతున్నాయి. నరుడే ఆ రెండింటిలోనూ నాయకుడు. రాముడు నరుడైతే, అర్జునుడు ఏకంగా ‘నరు’డనే పేరు కూడా ఉన్నవాడు. అందులోనూ రాముడు సూర్యవంశ క్షత్రియుడు, సౌరవీరుడు.

రాముడు, అర్జునుల చారిత్రకత స్పష్టంగా తెలియకపోయినా; స్పష్టమైన చారిత్రకత కలిగిన ఇద్దరు ముఖ్యులు మనకు తెలుస్తున్నారు. వారు కూడా రాముడు, అర్జునుడిలానే నరవీరులు. క్యాంప్ బెల్ మాటల్లో చెప్పాలంటే సౌరపుత్రులు (sons of light) సాధించిన విజయానికి ప్రతీకలు. తాత్వికార్ధంలో చెప్పాలంటే ఆ విజయం వెలుగు- చీకట్ల(చంద్రుడు)మిశ్రమమైన మాతృస్వామ్యంపై పితృస్వామికమైన వెలుగు(సూర్యుడు) సాధించిన విజయం. వారిలో మొదటివ్యక్తి సారగాన్. ఇతని కాలం క్రీ.పూ. 2350.  అగదకు చెందిన ఇతడు మెసొపొటేమియాను పాలించాడు. రెండోవ్యక్తి హమ్మురాబి. ఇతని కాలం క్రీ.పూ. 1728-1686. బాబిలోన్ కు చెందిన ఇతను కూడా మెసొపొటేమియాను పాలించాడు.hammurabi

వీరికి చెందిన పూర్వరంగం ఇదీ: సమీపప్రాచ్యానికి చెందిన అమ్మవారి ఆరాధన అక్కడికి  ఉత్తరంగా ఉన్న పచ్చికభూముల్లోనూ, దక్షిణంగా ఉన్న సైరో-అరేబియా ఎడారుల్లోనూ నివసించే ఆటవిక జనంలోకి వ్యాపించింది. వీరు స్థిర వ్యవసాయదారులు కారు. అర్ధసంచారదశలో ఉన్న పశుపాలకులు. క్రీ.పూ. 3500 నాటికి వీరు వ్యవసాయగ్రామాలకు, పట్టణాలకు ప్రమాదకరంగా మారారు. హఠాత్తుగా దాడులు చేసి దోచుకుని వెళ్లిపోయేవారు. క్రీ.పూ. 300 నాటికి వీరు రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదిగారు. ఈవిధంగా మెసొపొటేమియా క్రీ.పూ. 2500 నాటికి సైరో-అరేబియా నుంచి వచ్చిన సెమెటిక్ జాతీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సారగాన్, హమ్మురాబి ఈ జాతికి చెందినవారే.

saraganసారగాన్ అమ్మవారి ఆరాధనకు చెందినవాడే అయినా, ఆమెతో అతనిది భిన్నమైన సంబంధం అంటారు క్యాంప్ బెల్. తన తండ్రి ఎవరో తెలియదనీ, నిమ్నవర్గానికి చెందిన తల్లి తనను కని ఒక బుట్టలో ఉంచి నదిలో విడిచిపెడితే అక్కు అనే సాగునీటిదారుకి దొరికాననీ, అతడు తనను పెంచి పెద్ద చేసి తోటమాలిని చేశాడని, అప్పుడు దేవత ఇష్టార్ తనను ప్రేమించడంతో రాజునయ్యాననీ సారగాన్ చెప్పుకుంటాడు. ఆదిమ పౌరాణికతకు చెందిన దేవత-ఆమె కొడుకు సంబంధం లాంటిదే ఇది కూడా. అయితే క్యాంప్ బెల్ వివరణ ప్రకారం, ఆదిమ పౌరాణికతలో ప్రాముఖ్యం దేవతదైతే ఇందులో కొడుకుది. ఈ కొడుకు దేవుడూ కాదు, బలి పశువూ కాదు; అనామకస్థితి నుంచి హఠాత్తుగా రాజకీయ ఉన్నతిని అందుకున్నవాడు. ఆదిమ పౌరాణికత అహాన్ని వదులుకుని దేవతతో తాదాత్మ్యం (mythic identification) కావడానికి సంబంధించినదైతే, సారగాన్ ఉదంతంలో జరిగింది దానికి వ్యతిరేకం. ఇందులో కొడుకు, అంటే రాజు అహాన్ని పెంచుకుని(mythic inflation) దేవుడి ప్రతిరూపం అవుతాడు. రాజు తనను దేవుడిగా చెప్పుకోవడానికి ఇదే ప్రారంభం. అంటే రాచరికాన్ని పూజారుల ఆధిపత్యం నుంచి, రాజ్యాన్ని మతాధిపత్యం నుంచి తప్పించి ఆనువంశిక రాజకీయవ్యవస్థను తీసుకురావడం.

దీని తదుపరి పరిణామమే భూమి మీది రాజు నమూనాలో దేవతలకు కూడా ఒక రాజును సృష్టించడం! హమ్మురాబి ఉదంతం ఈ పరిణామాన్ని సూచిస్తుంది. మన దగ్గర ఇంద్రుడు దేవతలకు రాజు. ఇప్పటికీ ఆలయాలలో దేవుడికి జరిపే సేవలను ‘రాజో’పచారాలనే అంటాం. హమ్మురాబి మన మనువులా శిక్షాస్మృతిని రూపొందించిన రాజు.  అందులో అతను చెప్పుకున్న ప్రకారం, ఆకాశాన్ని ఏలే ‘అను’, స్వర్గాన్ని, భూమిని ఏలే ‘బెల్’ అనే దేవుళ్ళు  బాబిలోనియా నగరదేవుడు అయిన మర్డుక్ కు ప్రజలందరి మీదా సార్వభౌమత్వాన్ని అప్పగించారు. బాబిలోనియాను ప్రపంచంలోనే దుర్భేద్యంగా మార్చి అందులో మర్డుక్ కోసం పది కాలాలపాటు నిలిచే ఒక పటిష్టమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.  ఆ తర్వాత ఆ దేవుళ్ళు ఇద్దరూ ఎంతో పవిత్రత, దైవభక్తి కలిగిన తనను(హమ్మురాబీని) పిలిచి భూమి మీద ధార్మికమైన పాలనను చేపట్టమనీ, అధర్మాన్నీ, చెడును తుడిచిపెట్టమనీ, బలవంతుల అణచివేతనుంచి బలహీనులను కాపాడమనీ, మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింపమనీ, మానవాళి శ్రేయస్సుకు పాటుపడమనీ ఆదేశించారు.

తూర్పు దేశాలలో అప్పటికే ఏర్పడిన నిరంకుశ రాజ్యాల నమూనాకు ఈ వాక్యాలు అద్దంపడతాయని క్యాంప్ బెల్ అంటారు. అందులో మానవప్రయత్నంతో రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి, సృష్టికర్త సంకల్పానికి, అనుగ్రహానికి తను ప్రతినిధినని చెప్పుకుంటాడు. అతనిలోని పవిత్రత, న్యాయం, ప్రజాశ్రేయస్సు పట్ల తపన ధార్మికపాలనకు హామీ ఇస్తాయి. ఈ మాటలు వినగానే మనకు వెంటనే ‘రామరాజ్యం’ గుర్తుకువస్తుంది. రామాయణం, బాలకాండ, ప్రథమసర్గలోని మూడు ప్రారంభ  శ్లోకాలు రాముణ్ణి ఇటువంటి లక్షణాలు కలిగినవాడుగా పరిచయం చేస్తాయి. వాటి ప్రకారం రాముడు సకలసద్గుణవంతుడు, ఎలాంటి విపత్తులు ముంచెత్తినా తొణకనివాడు, గొప్ప కార్యశీలి, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు, దృఢనిశ్చయం కలిగినవాడు, ధైర్యశాలి, మహావీరుడు.

ఇంకా విశేషమేమిటంటే, ఈ రాచరిక నమూనాలో రాజును పోల్చవలసింది వృద్ధి, క్షయాలను; చీకటి, వెలుగులను సంకేతించే చంద్రుడితో కాదు; నిత్యం వెలుగునిచ్చే మండే సూర్యుడితో! ఈ సూర్యప్రతాపం ముందు అన్ని రకాల చీకట్లూ, అసురులూ, శత్రువులూ, సందిగ్ధాలూ పలాయనం చిత్తగించవలసిందే. ఈవిధంగా సూర్యభగవానుడు కేంద్రంగా నూతన యుగం ప్రారంభమైందని క్యాంప్ బెల్ అంటారు.  రాముడు ప్రధానంగా చేసింది రాక్షస సంహారమే. ఆయన సూర్యవంశ క్షత్రియుడే కాక, యుద్ధసమయంలో అగస్త్యుడు వచ్చి ‘ఆదిత్యహృదయం’ ఉపదేశించిన తర్వాతే  రావణుని చంపగలుగుతాడు. పైన పేర్కొన్న హమ్మురాబి శిక్షాస్మృతిలోని వాక్యాలలో కూడా “మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింప”మని హమ్మురాబీతో దేవతలు అనడం గమనించండి.

ఈ సూర్యయుగంతోనే పౌరాణిక ప్రపంచంలో ‘సౌరీకరణ'(solarization)గా పేర్కొనే ఒక ఆసక్తికరమైన పరిణామం అడుగుపెట్టిందని క్యాంప్ బెల్ అంటారు. అది, ఆదిమపౌరాణికతకు చెందిన మొత్తం ప్రతీకల వ్యవస్థను తలకిందులు చేయడం! ఎలాగంటే, దేవతా ప్రాధాన్యం కలిగిన ఆదిమ పౌరాణికతలో చంద్రుడు, చంద్రవృషభమూ ముఖ్య ప్రతీకలు అయితే; పురుషుడు, పురుషదేవుడు ప్రాధాన్యం వహించే నవీన పౌరాణికతలో సూర్యుడూ, సింహమూ ముఖ్యప్రతీకలయ్యాయి.

రాజు అధిష్టించే ఆసనాన్ని ఇప్పటికీ ‘సింహాసన’మనే అంటాం. ఈ ‘సింహాసనం’ కేవలం మన రాచరిక సంప్రదాయానికి చెందిన దనుకుంటారేమో, కాదు. ప్రాచీన సమీప ప్రాచ్య దేశాల రాజులందరూ ‘సింహాసనా’న్నే అధిష్టించారు.

విషయానికి వస్తే, ఆదిమ పౌరాణికతకు చెందిన స్త్రీదేవతలపై రాక్షసులు, లేదా దుష్టశక్తులు అన్న ముద్రవేసి చంపడం; ఆ పౌరాణికతకు చెందిన ప్రతీకలను చిన్నబుచ్చడం లేదా పురుషదేవుళ్ళకు అన్వయించడం; మొత్తంగా స్త్రీ వెనకటి ప్రాధాన్యాన్ని కోల్పోవడం వంటివి ఈ సౌరయుగ పరిణామాలే. ఒక బాబిలోనియా పురాణకథలో జగజ్జనని అయిన తియామత్ అనే దేవత, రాక్షసస్వభావం కలిగిన దుష్టశక్తిగా మారిపోతుంది. ఆమెను మర్డుక్ అనే పురుషదేవుడు చంపుతాడు. అలాగే, రాముడు తాటకను చంపడం; హనుమంతుడు నాగమాతను, సింహిక అనే రాక్షసిని, లంకిణిని జయించడం; కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం, కాళీయుని మర్దించడం మనకు తెలిసిన మన ఉదాహరణలు. ఓడిసస్ సిర్సే, కలిప్సో అనే అప్సరసలను ఎలా లొంగదీసుకున్నాడో చెప్పుకున్నాం. మన పురాణాలలోని దేవాసురయుద్ధాలు కూడా సౌరయుగ పరిణామాలే.

ఇక్కడ ప్రత్యేకించి గమనించాల్సింది ఏమిటంటే, ఆదిమ పౌరాణికతతో మొదలుపెట్టి, నవీన పౌరాణికత వరకూ ఈ పరిణామక్రమం అంతా  ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తం. ఆపైన, చరిత్రకు అందని ఆదిమ కాలం నుంచి, నేటి ఆధునిక కాలం వరకూ ఈ పౌరాణికతా చరిత్ర అంతా ఒక క్రమగతిలో సాగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్యాంప్ బెల్ నే ఉటంకించుకుంటే, ప్రపంచంలోని ప్రధాన ఆస్తిక/మతవిశ్వాసాలకు  పునాదిగా ఉన్న సృష్టిగురించిన ఆలోచనాక్రమాన్ని ఇలా నాలుగు దశలలోకీ, నాలుగు వాక్యాలలోకీ కుదించుకోవచ్చు :

  1. (ఆదిమ పౌరాణికతలో) ఈ విశ్వమంతటినీ పురుష ప్రమేయం లేకుండా జగజ్జననే సృష్టించింది.
  2. పురుష ప్రమేయంతో జగజ్జనని (ఆది దంపతులు) ఈ విశ్వాన్ని సృష్టించింది.
  3. (నవీన పౌరాణికతలో)పురుషుడు, యోధుడు అయిన దేవుడు జగజ్జనని దేహం నుంచి ఈ విశ్వాన్ని సృష్టించాడు.
  4. ఈ విశ్వమంతటినీ స్త్రీ ప్రమేయం లేకుండా పురుషదేవుడు ఒక్కడే సృష్టించాడు.

సామాజికంగా చూస్తే ఇవే దశలు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లిన క్రమాన్నీ చెబుతాయి.

***

ప్రపంచీకరణపై ముమ్మరంగా చర్చ జరుగుతున్న రోజుల్లో ప్రముఖ ఆర్థికవేత్త మేఘ్ నాథ్ దేశాయి రాసిన ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది(Globalisation and Culture, The Little Magazine, Globalisation and its contents, Volume V: Issue 4&5, Editor: Antara Dev Sen).  ప్రపంచీకరణ ఇదే మొదటిసారి కాదనీ, రోమన్ సామ్రాజ్యంతో మొదలుపెట్టి అది అనేక అవతారాలలో సాగిందనీ ఆయన అంటారు. నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళి, చరిత్రపూర్వకాలంలోనే మత/ఆస్తిక రంగంలో ప్రపంచీకరణ జరిగిందని అంటాను. ఆదిమ పౌరాణికతలో జగజ్జనని ఆధిపత్యంలో ఉన్న పురుషుడు క్రమంగా ఆ సంకెళ్లనుంచి బయటపడుతూ నరుడిగా/వీరుడిగా/రాజుగా అవతరించి తన ఆధిపత్యాన్ని స్థాపించుకోవడం కూడా ప్రపంచీకృత పరిణామమే. మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం పాదుకోవడం దాని సామాజిక రూపం. భారతీయ, గ్రీకు పురాణ ఇతిహాసాలతో సహా అనేక పౌరాణికగాథలు ఈ ప్రపంచ పరిణామాన్నే చిత్రిస్తున్నాయి.

epic of gilgamesఇంతకీ నరవిముక్తి రూపంలో జగజ్జననిపై పురుషదేవుళ్లు మహత్తరవిజయం సాధించిన తర్వాత, నరుడి భవితవ్యం ఎలా పరిణమించిందని ప్రశ్నిస్తూ, గిల్గమేశ ఇతిహాసం(The Epic of Gilgames)లో దీనికి జవాబు దొరుకుతుందని క్యాంప్ బెల్ అంటారు. సంగ్రహంగా కథ చెప్పుకుంటే, సుమేరియా నగరమైన ఉరుక్ ను పాలించిన గిల్గమేశుడు ఇందులో నాయకుడు. ఇతనిలో మూడువంతులు దైవాంశ, ఒక వంతు మానవాంశ ఉంటాయి.  ఇతని చండశాసనాన్ని భరించలేక జనం ఇతనికి సమవుజ్జీని సృష్టించమని అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు స్వర్గదేవుడైన అను రూపాన్ని మనసులో తలచుకుని, (పార్వతి నలుగుపిండి నుంచి వినాయకుణ్ణి సృష్టించినట్టు) కాస్త మట్టి చేతుల్లోకి తీసుకుని దానినుంచి ఒక వీరుణ్ణి సృష్టిస్తుంది. అతని పేరు ఎంకిడు.

అడవిమనిషిగా పెరిగిన ఎంకిడుకి పశువులు తప్ప మనుషులు తెలియదు. అతని గురించి విన్న గిల్గమేశ్,(రామాయణంలోని ఋష్యశృంగుడి కథలోలా) అతన్నిఆకర్షించి నగరానికి తీసుకురమ్మని ఒక వేశ్యను పంపిస్తాడు.  ఆమె వలకు చిక్కుకున్న ఎంకిడు ఆమెతో నగరానికి వస్తాడు. గిల్గమేశ్ దేవత ఇష్టార్ పొందు కోసం వెడుతున్నప్పుడు ఎంకిడు అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరికీ యుద్ధం జరుగుతుంది. తనకు సమవుజ్జీ అని గ్రహించిన గిల్గమేశ్ అతనితో స్నేహం చేస్తాడు. కొంతకాలానికి ఎంకిడు మరణిస్తాడు. దుఃఖించిన గిల్గమేశ్ తను మరణాన్ని జయించాలనుకుంటాడు. అమరత్వం పొందే మార్గాన్ని అన్వేషిస్తూ (ఓడిసస్ లానే) సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అడ్డంకులను వీరోచితంగా ఎదుర్కొని అమరత్వాన్ని ఇచ్చే ఒక మూలిక గురించి తెలుసుకుంటాడు. విశ్వసముద్రం అడుగున ఉన్న ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తూ ఒక నది దగ్గర ఆగి మూలికను గట్టున ఉంచి స్నానానికి దిగుతాడు. అప్పుడు(మహాభారతంలో ఉదంకుని కుండలాలను తక్షకుడు అనే నాగరాజు అపహరించినట్టు) ఆ మూలిక వాసన పసిగట్టిన ఒక సర్పం నీళ్ళలోంచి పైకి వచ్చి దానిని మింగేసి కుబుసం విడిచిపెడుతుంది. గట్టు మీదికి వచ్చిన గిల్గమేశ్ మూలిక కనిపించకపోవడంతో కుప్పకూలి భోరున విలపిస్తాడు.

అమరత్వాన్నిఇచ్చే సర్పశక్తి(కుండలినీశక్తి) అంతవరకూ పురుషుడి ఆస్తిగా ఉందనీ, దానినిప్పుడు ‘దుష్ట’సర్పమూ, ‘ప్రతిష్ట కోల్పోయిన’ దేవతా తిరిగి తీసేసుకున్నాయనీ, దాంతో మనిషికి దుఃఖమూ, చావు భయమూ మిగిలాయనీ  ఈ కథ కు క్యాంప్ బెల్ వివరణ. క్రీ.పూ. 650 నాటి మట్టిపిడకలపై దొరికిన ఈ రచన హమ్మురాబి(క్రీ.పూ.1750)కాలానికి చెందినదిగా కనిపిస్తుందనీ, చాలామంది ఉద్దేశంలో మనిషి గురించి చెప్పే తొలి ఇతిహాసం ఇదేననీ ఆయన అంటారు.

***

నరుడితోనూ, నలదమయంతుల కథతోనూ మొదలై, ఓడిసస్ కథ మీదుగా వివిధ అంశాలను స్పృశిస్తూ సాగిన వ్యాసపరంపరలో ప్రస్తుతానికి ఇది చివరి వ్యాసమే తప్ప ముగింపు కాదు. వీటిలో చర్చించిన అనేక అంశాలకు పూర్తి న్యాయం చేశానని నేను అనుకోవడంలేదు. ‘నరు’డి అవతరణా, దానితో జమిలిగా అల్లుకున్న పితృస్వామికతలే పురాణఇతిహాసాలకు ప్రధాన ఇతివృత్తాన్ని అందిస్తున్నాయి కనుక, ఏవో కొన్ని వ్యాసాలతో వాటికి ముగింపు పలకడం సాధ్యమూ కాదు. అసలు పురాచరిత్ర అనే సముద్రంలో అవతలి ఒడ్డుకు చేరడం దేవుడెరుగు, నేను ఇంకా ఇవతలి ఒడ్డు దగ్గరే ఉన్నాను…

*

అలా ఉండగానే ‘పురా’గమనం శీర్షిక ప్రారంభించి నేటితో (జూన్ 19)తో సరిగ్గా రెండేళ్ళు గడిచిపోయాయి.  చివరి వాక్యం రాయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఈ క్షణాన నాకే అంచనా లేదు. దానిని కాలానికి విడిచిపెడితే…ఈ వ్యాసాలను ప్రచురిస్తున్న ‘సారంగ’ సంపాదకవర్గానికీ, మొదటినుంచీ ఈ వ్యాసాలపై అమితమైన ఆసక్తిని చూపుతూ ఉత్సాహకరమైన స్పందనను, సవిమర్శక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఎందరో పాఠకులకూ కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇదొక సందర్భం.

షరా మామూలుగా ఇప్పుడు మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరాను. దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలలో ఏ కొసను పట్టుకోవాలన్న విచికిత్సలోకి మరోసారి జారిపోయాను…

*

 

 

 

 

రాముడు, ఓడిసస్…ఇద్దరూ సౌరవీరులే!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తూర్పు, పడమరల మధ్య ఆశ్చర్యకరమైన అనేక పోలికల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే…

భాగవతం ప్రకారం; అపారమైన రక్తపాతం, విధ్వంసం నిండిన మహాభారతాన్ని చెప్పిన తర్వాత వ్యాసుడు తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరకు వచ్చి విష్ణుభక్తి ప్రధానమైన భాగవతాన్ని చెప్పమనీ, అప్పుడు నీ మనసుకు శాంతి కలుగుతుందనీ చెప్పాడు. వ్యాసుడు అలాగే చేసి శాంతి పొందాడు.

గ్రీకుల హోమర్ కూడా మొదట యుద్ధ ప్రధానమైన ‘ఇలియడ్’ ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ తర్వాత తత్వ ప్రధానమైన ‘ఒడిస్సే’ చెప్పాడు. ఈ రెండింటి కాలిక నేపథ్యం క్రీ.పూ. 1250-1150.  మూడు శతాబ్దాల తర్వాత, క్రీ.పూ. 850లో ఇలియడ్, క్రీ.పూ. 750లో ఒడిస్సే రూపొందాయి. వ్యాసుడు అనే పేరు కేవలం ఒక్క వ్యక్తిని కాక ఒక పదవిని సూచిస్తుందనీ, ఆ పదవిలో ఉన్నవారిని అందరినీ వ్యాసులనే అంటారనీ చెప్పే సంప్రదాయం మనకు ఉంది. హోమర్ విషయంలోనూ గ్రీకులలో అలాంటి సంప్రదాయమే ఉంది. ఇది వ్యాస, హోమర్ ల మధ్య ఇంకొక పోలిక.

మహాభారతానికీ, ఇలియడ్ కూ ఉన్న పోలికలు చూద్దాం.  కురు-పాండవ వీరులందరూ  దేవతాంశతో(దుర్యోధనుడు లాంటి కొంతమంది రాక్షసాంశతో లేదా కలిఅంశతో) పుట్టినట్టు మహాభారతం చెబుతోంది. ఇలియడ్ లోని వీరులు కూడా దేవతాంశ(“divine race of heroes”)కలిగినవారే. మహాభారతం ప్రధానంగా పితృస్వామిక వ్యవస్థను, అందులో ప్రాధాన్యం వహించే పురుషుడిలో ఉండవలసిన ఉత్తమగుణాలను నొక్కి చెబుతుంది. అతడు అధర్మాన్ని అణగదొక్కి ధర్మస్థాపన చేయవలసిన వీరుడు, సాహసి, కష్టసుఖాలను సమంగా తీసుకునే స్థిరచిత్తుడు, ప్రజలను చల్లగా చూసే పాలకుడు, మాట తప్పనివాడు, నీతిమంతుడు, గొప్ప సహనం, సంయమనం ఉన్నవాడు…ఇలాంటి ఇంకా అనేకానేక సుగుణాల రాశి.  స్థూలంగా ధర్మరాజు, అర్జునుడు తదితరులు ఈ సుగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తే; వీటికి విరుద్ధమైన గుణాలకు దుర్యోధనుడు, కొంతవరకు కర్ణుడు మొదలైనవారు  ప్రాతినిధ్యం వహిస్తారు.

ఈవిధంగా ధర్మం-అధర్మం, నీతి-అవినీతి, మంచి-చెడు అనే పరస్పర వ్యతిరేకమైన జంట పదాలూ; వాటికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, శక్తుల మధ్య సంఘర్షణా; ఆ సంఘర్షణలో ధర్మం, నీతి, మంచి విజయం సాధించడం అనే ఒక సూత్రం లేదా ఒక మూస క్రమంగా రూపొందింది.  ఇంతకుముందు చెప్పుకున్నది ‘స్త్రీసూత్రం’ అయితే, దీనిని ‘పురుషసూత్రం’ అందాం. ఇది పితృస్వామికం నుంచి రూపొందిన సూత్రం. ఎందుకంటే, మాతృస్వామికానికి చెందిన ఆదిమ పౌరాణికతలో ఇలాంటి ద్వంద్వాలు లేవు. ఈ విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగని నేటి కొలమానంలో చూసి, ధర్మానికీ, నీతికీ, మంచికీ చోటులేని వ్యవస్థగా దానిని భావించడం తొందరపాటు అవుతుంది. అది తనదైన, ప్రకృతిసిద్ధమైన ఒక ధర్మాన్ని అనుసరించిన వ్యవస్థగా కనిపిస్తుంది.  

ఇలియడ్ కు వస్తే, మహాభారతంలానే అది కూడా పైన చెప్పిన పితృస్వామిక పురుషుడిలో ఉండవలసిన ఉత్తమ లక్షణాలకు, పురుషోచిత కార్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలియడ్ లో ప్రధాన దైవం అపోలో. ఈయన వెలుగు నిచ్చే దేవుడు. అంటే సూర్యునిలాంటివాడు.  అలాగే, వీరత్వంలాంటి గుణాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లి పురుషుని పురుషోత్తముడిగా మలచేది ఈయనే. వీరరస ప్రధానమైన ఇలియడ్ లో మృత్యువు ఒక్కటే చరమసత్యం; అందులో భయాశ్చర్యాలకు తావు లేదు. ఆ మృత్యువుకు అవతల, దానిని దాటలేని నిస్సహాయత తప్ప మరే శక్తీ లేదు. జీవితం తాలూకు అందాలు, అత్యున్నత సాఫల్యాలు, ఉత్తమశ్రేణికి చెందిన అందగత్తెల ప్రేమ, పొందుతో సహా నిజమైన పురుషుడికి అర్హమైనవి ఎన్ని అనుభవించినప్పటికీ మృత్యువు అనే చెలియలికట్ట వాటన్నింటినీ నీటి బుడగలుగా మార్చివేస్తుంది. అంతిమంగా చూసుకుంటే మిగిలేది బూడిదే. ఈ విషాద ధ్వని ఇలియడ్ అంతటా పరచుకుని ఉంటుందని క్యాంప్ బెల్ అంటారు.

విచిత్రంగా మహాభారతానికీ ఇక్కడ చాలావరకూ పోలిక కుదురుతోంది. ప్రధానంగా ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు పురుషోత్తమత్వం అనే కొలమానానికి దగ్గరగా ఉంటారు(ప్రత్యేకించి కృష్ణుడికి పురుషోత్తముడు అనే పేరు ఉంది, దానిని అలా ఉంచుదాం). అర్జునుడు వీరుడే గాక, ఎందరో అందగత్తెల ప్రేమను, పొందును అందుకున్నవాడు. ఒక కోణం నుంచి చెప్పుకుంటే అర్జునుడే మహాభారతంలో నాయకుడు. శత్రువును చంపడం, లేదా శత్రువు చేతిలో చావడాన్ని మించిన ధర్మం వీరుడికి(క్షత్రియుడికి) మరొకటి లేదని మహాభారతం అడుగడుగునా చెబుతుంది. చివరికి కురుక్షేత్రయుద్ధ రూపంలో మృత్యుతాండవం విపరీతమైన రక్తపాతాన్ని, విధ్వంసాన్ని సృష్టించింది. తదుపరి మహాభారత కథలో చివరివరకు ఒక విషాదపు నీడ పరచుకుని ఉంటుంది. అంతటి ధర్మరాజు కూడా జనం మెప్పు పూర్తిగా పొందలేకపోయాడనీ, అర్జునుడంతటి మహావీరుడు కూడా దారిదోపిడీ దొంగల చేతిలో ఓడిపోయాడనీ మహాభారతమే చెబుతోంది. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశాలలోకి మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

ఇక విష్ణుభక్తిని, తత్వాన్ని ప్రతిపాదించే భాగవతం ఒకవిధంగా మహాభారతానికి తాత్వికమైన కొనసాగింపు అనుకుంటే,  ఇలియడ్ కు ఒడిస్సే తాత్వికమైన కొనసాగింపు.

ఒడిస్సే లో ప్రధానదైవం హెర్మెస్. ఆయన అధోజగత్తుకు, లేదా రహస్యజగత్తుకు  దారి చూపే దేవుడు. పునర్జన్మకు, మరణానంతర జ్ఞానానికీ, ఒకదానినొకటి పెనవేసుకున్న జంటపాముల ప్రతీకకు చెందినవాడు. విధిని నిర్దేశించే అఫ్రోడైట్, హేరా, ఎథెనే అనే దేవతాత్రయంతో సంబంధం కలిగిన పురుషదైవం. ఒకరకంగా మహాభారత యుద్ధానికి భూదేవి, ద్రౌపది కారణమైనట్టుగా ట్రోజన్ యుద్ధానికి ఈ ముగ్గురు దేవతలే కారణమవుతారు.

‘ఇలియడ్’ వీరత్వానికి చెందిన పురుషసూత్రం మీద ఆధారపడినదైతే, ‘ఒడిస్సే’ స్త్రీపై విజయాన్ని సూచించే స్త్రీసూత్రం మీద ఆధారపడిన రచన. ట్రోజన్ యుద్ధం పదేళ్లపాటు జరుగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్ మరో పదేళ్లపాటు స్త్రీ సూత్రానికి చెందిన అధోజగత్తులో లేదా రహస్యజగత్తులో సంచరిస్తాడు.  పురుషసూత్రానికి అనుగుణంగా స్త్రీ సృష్టించే అనేక ప్రతికూలతలను వీరోచితంగానూ, యుక్తితోనూ అధిగమిస్తాడు. అదే సమయంలో ఎంతో విధ్వంసాన్ని ఎదుర్కొని, సహచరులను నష్టపోతాడు. చివరికి ఒంటరిగా ఇంటికి చేరి భార్య పెనెలోప్ ను మరోసారి స్వయంవరంలో గెలుచుకుంటాడు. పెనెలోప్ అంతవరకూ అతనికోసం(పతివ్రతలా) నిరీక్షిస్తూనే ఉంటుంది. అది తన యాత్రలో ఓడిసస్ స్త్రీసూత్రంపై సాధించిన విజయానికి కొనసాగింపు.

పోలిక చూడండి. రామాయణంలో సీత కూడా లంకలో రాముడికోసం నిరీక్షిస్తూ ఉంటుంది. రాముడు యుద్ధం తర్వాత సీతను కలుసుకుంటాడు. ఆయన విధించిన శీలపరీక్షలో నెగ్గి సీత పాతివ్రత్యాన్ని స్థాపించుకుంటుంది. అలాగే దమయంతి కూడా(పతివ్రతాధర్మం) నలుని కోసం నిరీక్షిస్తుంది. అనేక ప్రతికూల పరిస్థితులతో పురుషోచితంగా పోరాడిన తర్వాత నలుడు చివరికి దమయంతిని కలసుకుంటాడు.

స్త్రీసూత్రాన్ని జయించడంలోనే కాక, సూర్యసంబంధంలోనూ మన కథలకు, ఓడిసస్ కథకు పోలిక ఉందని  వెనకటి వ్యాసాలలో చెప్పుకున్నాం. ఓడిసస్ సౌరద్వీపానికి వెళ్ళినతర్వాతే ఒంటరిగా మిగిలి తిరిగివస్తాడు. ఆవిధంగా అతడు సౌరవీరుడు. సూర్యవంశీకుడైన మన రాముడూ సౌరవీరుడే. మాతృస్వామ్యానికి చెందిన దేవత ప్రతీకలలో వెలుగు, చీకట్ల మిశ్రమమైన చంద్రుడు ముఖ్యుడైతే, పితృస్వామ్యంలో పూర్తిగా వెలుగునిచ్చే సూర్యుడు ముఖ్యప్రతీక అన్న సంగతి గుర్తుచేసుకుని ఇంకో ఉదాహరణ చూద్దాం.

చాంద్రమానం, సౌరమానం అనే రెండు కొలమానాలు మనకు తెలుసు. చాంద్రమానం ప్రకారం ఏడాదికి 12 నెలలు, 354 రోజులు+కొన్ని గంటలు ఉంటాయి. సౌరమానం ప్రకారం ఏడాదికి 364 రోజులు+కొన్ని గంటలు. గ్రీకు ఇతిహాసకాలంలో చాంద్ర, సౌరమానాలు రెంటినీ సమన్వయం చేసే ప్రయత్నం జరిగింది. దానిప్రకారం 19 ఏళ్ళకు ఒకసారి చంద్ర, సూర్యులు కలసుకుంటారు. ఇరవయ్యేళ్లు ఇంటికి, భార్యకు దూరంగా ఉన్న ఓడిసస్ 19వ ఏట చివరిరోజున ఇంటికి చేరుకుంటాడు. సరిగ్గా అదే రోజున వెలుగుకు అధిదేవత అయిన అపోలోకు చెందిన పండుగ, సూర్యుని పండుగ వస్తాయి. ఓడిసస్ అధోజగత్తులో పశ్చిమంగా ప్రయాణించి, అక్కడి పితృదేవతలను సందర్శించి(ఇది మరో పోలిక. పితృదేవతలను సందర్శించడం మన కథలలో కూడా ఉంది), తూర్పు కొసకు చేరుకుంటాడు. అది సూర్యుడు ఉదయించే ప్రదేశమే కాక, ఉషోదేవత నర్తించే ప్రదేశం కూడా. ఇంటి దగ్గర పెనెలోప్ చంద్రునిలా వస్త్రం అల్లుతూ, అల్లినది విప్పుతూ ఉంటుంది. నేతపనికి చంద్రుడికి సంబంధం ఉందని ఇంతకుముందు చెప్పుకున్నాం.

19, 20వ శతాబ్ది ప్రారంభ కాలానికి చెందిన పండితులకు ఈవిధంగా సూర్య, చంద్రులను ఆయా విషయాలకు అన్వయించడం పరిపాటిగా ఉండేదని క్యాంప్ బెల్ అంటారు. ప్రపంచ పౌరాణిక వారసత్వం తాలూకు భావచిత్రాలు చాలావరకూ కంచు యుగానికి చెందిన విశ్వసంబంధ(cosmological) ప్రతీకలనుంచి పుట్టినవి కావడమే అందుకు కారణం. క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్దికి వెడితే, మనసును లోపలికి తిప్పడంవల్ల , అంటే అంతర్ముఖత్వం వల్ల వ్యక్తి అనే సూక్ష్మరూపానికీ, విశ్వమనే బృహద్రూపానికీ తేడా లేదనే ఎరుక కలుగుతుందనే విశ్వాసం తూర్పు, పడమటి దేశాలకు చెందిన బహుళదేవతారాధకులు అందరిలోనూ ఉండేదని క్యాంప్ బెల్ అంటారు. ఆ ఎరుక సిద్ధించినప్పుడు నిత్యత్వమూ- కాలమూ; సూర్య- చంద్రులూ, స్త్రీ-పురుషులూ—ఇలా రెండుగా కనిపించేవి అన్నీ ఒకటిగా మారిపోతాయి. అలాగే, ఓడిసస్ కథలో సూర్య-చంద్రులు ఒకటవుతారు. ఇందులో సూర్యాస్తమయం అంతర్ముఖత్వానికీ, సూర్యోదయం పైన చెప్పిన ఎరుకకూ ప్రతీకలు.

ఇదే సందర్భంలో మన దగ్గర ఉన్న కుండలినీయోగాన్ని క్యాంప్ బెల్ ప్రస్తావిస్తారు. వెన్నెముకకు రెండువైపులా రెండు శక్తి మార్గాలు ఉంటాయి. మనసును, ఊపిరిని నియంత్రించడంద్వారా సర్పశక్తిని పైకి తీసుకువెళ్లే ఈ మార్గాలలో  ఒకదానిని చంద్రనాడి, రెండవ దానిని సూర్యనాడి అంటారు. సర్పం, సూర్యచంద్రులతో సహా వివిధ పౌరాణిక ప్రతీకలను పొందుపరచిన అనేక చిత్రాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. కంచుయుగానికి చెందిన ఈ ప్రతీకాత్మక చిత్రాలు ఏ ఒక్క సంస్కృతికో కాక, బహుళ సంస్కృతులకు చెందినవని కూడా అనుకున్నాం. ఇవి యూరప్, చైనా, జపాన్, అజ్టెక్ లకు కూడా తెలిసిన ప్రతీకాత్మకత అంటారు క్యాంప్ బెల్.

కనుక, ఇరవయ్యేళ్ళ తర్వాత, సూర్య-చంద్రులు కలసుకునే రోజున ఓడిసస్ తన భార్య పెనెలోప్ ను కలసుకోవడం వెనుక ఇంత  తాత్వికార్ధం ఉంది. అంతకుముందు పదేళ్లపాటు అధోజగత్తులో అతను ఎదుర్కొన్న అనుభవాలు; మాంత్రిక ప్రపంచానికి చెందిన సిర్సే, కలిప్సో, నౌసికాలతో అతని కలయికలు మానసిక శిక్షణను, సాహసాలను సూచిస్తాయి. ఒక్క పెనెలోప్ మాత్రమే ఈ కథలో మాంత్రికప్రపంచానికి చెందని సాధారణస్త్రీ.  అంటే పురుషుడు స్త్రీకి సంబంధించిన పై అనుభవాలను అన్నింటినీ పొందితేనే నిజ జీవితంలో స్త్రీని పరిపూర్ణంగా కలసుకోగలడని ఇందులోని ధ్వని. మన కథల్లో ఈ స్త్రీవిజయానికి సంబంధించి ఇప్పటికే ఇచ్చిన అనేక ఉదాహరణలను ఇక్కడ అన్వయించుకోవచ్చు.

***

ఈ పోలికలు యాదృచ్ఛికం కావనీ, వీటి వెనుక కంచుయుగానికి చెందిన ఉమ్మడి పౌరాణిక వారసత్వం ఉందనీ, అంతకంటే ముఖ్యంగా ఉమ్మడి చారిత్రకత ఉందనీ ఈపాటికి అర్థమై ఉండాలి. అంతేకాదు, అది ఒకనాటి ముఖ్య చారిత్రక పరిణామాన్ని కూడా సూచిస్తోంది. దాని గురించి చెప్పుకునే ముందు ఓడిసస్ కథ నేపథ్యంలో భారతీయ, గ్రీకు తాత్వికతల సారూప్యతనూ, తేడానూ కూడా చూపుతూ క్యాంప్ బెల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటితో ఎవరు ఎంతవరకు ఏకీభవిస్తారన్నది అలా ఉంచితే, భారతీయుల గురించిన పాశ్చాత్యుల ఆలోచనాసరళిని అవి పట్టి చూపుతాయి:

మొదటిది, ఓడిసస్ సౌరద్వీపం నుంచి ఏకాకిగా తిరిగిరావడం భారతీయ తాత్వికతలోని అంతిమ ఆదర్శమైన ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుందని ఆయన అంటారు. అదే ఓడిసస్ ఒక భారతీయ ఋషి అయుంటే సౌరద్వీపం వరకూ వెళ్ళినవాడు ఏకాకిగా మారి, సముద్రం మీద తేలుతూ ఇంటికి తిరిగివచ్చి భార్య కలసుకునేవాడు కాదనీ, సూర్యుడిలో ఐక్యమయ్యేవాడనీ; విరక్తి(disengagement)కీ, రక్తి(tragic engagement)కీ మధ్య ఉన్న ఆ అంతరమే భారతీయ, గ్రీకు తాత్వికతల మధ్య ఉందనీ ఆయన అంటారు.

రెండోది, సిర్సే మార్గదర్శనంలో ఓడిసస్ ఒకవైపు పితృలోకానికీ, ఇంకోవైపు సౌరద్వీపానికి వెళ్లడం; భారతీయ ఉపనిషత్తులు చెప్పే ధూమ(smoke), అగ్ని(fire)మార్గాలు రెంటినీ సూచిస్తుంది.  నిజానికి ఈ రెండు మార్గాల సంప్రదాయం భారతీయులదీ కాదు, గ్రీకులదీ కాదు; ఆదిమ పౌరాణికతనుంచి అందిన ఉమ్మడి సంప్రదాయం. కేనోపనిషత్తులోని ఒక కథప్రకారం ఈ సంప్రదాయాన్ని పితృస్వామిక దేవుళ్ళకు కాళికాదేవికి సాత్వికరూపమైన ఉమా హైమవతి బోధిస్తుంది.

మూడోది, గ్రీసు, భారతదేశాలలో పరస్పర విరుద్ధ వ్యవస్థలైన పితృస్వామ్య, మాతృస్వామ్య తాత్వికతల మధ్య సంభాషణకు, సమన్వయానికి అవకాశం ఏర్పడింది. కానీ బైబిల్ సంప్రదాయం పూర్తిగా పురుషుడివైపు మొగ్గుతూ ఉద్దేశపూర్వకంగా ఆ అవకాశాన్ని తుడిచిపెట్టింది. అయితే, భారత్, గ్రీసులలో మాతృస్వామ్య, పితృస్వామ్యతాత్వికతల  మధ్య సర్దుబాటు, సమన్వయం జరిగినా వాటి ఫలితాలు మాత్రం రెండు ప్రాంతాలలోనూ ఒకలాంటివి కావు. భారత్ లో అంతిమంగా అమ్మవారితాత్వికతే పై చేయిని సాధించి, ఆ మేరకు పురుష ఆహాన్ని, పురుషుడి చొరవను కుదించివేసింది. గ్రీసులో ఇందుకు భిన్నంగా పురుష సంకల్పమూ, అహమూ పై చేయిని సాధించడమే కాక; ఒక దశలో గ్రీసును ప్రపంచంలోనే అద్వితీయస్థానంలో నిలబెట్టాయి. జగత్తుకు చెందిన ప్రత్యక్షవాస్తవాలను హేతుబద్ధంగా పరిశీలిస్తూ, బాధ్యతాయుతంగా నిర్ధారణలు చేస్తూ; దేవుళ్ళను సేవించుకోవడం కాక, మనిషి అభివృద్ధిని, పరిణతిని అంతిమ లక్ష్యంగా చేసుకుంది. కార్ల్ కెరెన్యి మాటల్లో చెప్పాలంటే, “గ్రీకు ప్రపంచం ప్రధానంగా సూర్యరశ్మి నిండిన ప్రపంచం. అయితే దాని కేంద్రస్థానంలో ఉన్నది మాత్రం సూర్యుడు కాదు, మనిషి”.

తీగ కదిపితే డొంకంతా కదలడం అంటే ఇదే… ఈ తాత్విక అంతరాల తేడాలను పట్టుకుని  ఎంత దూరమైనా పోవచ్చు. చారిత్రకంగా చెప్పుకుంటే, సమీప ప్రాచ్యం నుంచి వ్యాపించిన దేవతా ప్రధానమైన ఆదిమ పౌరాణికతకు తూర్పు-పడమరలు రెండూ వారసులే ననుకున్నాం. విశేషమేమిటంటే, తూర్పు-పడమరల మధ్య పైన చెప్పిన తాత్వికమైన చీలికకు కూడా పుట్టిల్లు సమీప ప్రాచ్యమే. అందులోంచే వైయక్తిక ప్రాధాన్యం కలిగిన నరుడు పుట్టుకొచ్చాడు. తాత్వికమైన చీలిక అంటే ఇక్కడ ప్రాధాన్యాలలో తేడాగానే అర్థం చేసుకోవాలి కానీ, కత్తితో కోసినట్టు రెండు తాత్వికతలూ పూర్తిగా వేరయ్యాయని కాదు. అందుకే మన దేశంలో దేవతా ప్రాధాన్యం కలిగిన మాతృస్వామిక ఆదిమ పౌరాణికత, పితృస్వామిక పౌరాణికత రెండూ కొనసాగుతూ ఒక మిశ్రమ తాత్వికతను ముందుకు తెచ్చాయి. అలాగే పడమటి దేశాలలో పితృస్వామిక పౌరాణికత క్రమంగా మనిషి కేంద్రమైన వ్యక్తివాదానికి, వ్యక్తి చొరవకూ దారితీసినా; మాతృస్వామిక ఆదిమ పౌరాణిక ఛాయలు అంతర్లీనంగా కొనసాగుతూనే ఉన్నాయని క్యాంప్ బెల్ అంటారు.

నరుడితో మొదలుపెట్టి నలుడి గురించి చెప్పుకుని అక్కడినుంచి ఓడిసస్ మీదుగా అనేక విషయాలను చుట్టబెడుతూ సాగిన వ్యాసప్రస్థానం ఇక ముగింపునకు వస్తోంది…

 

 

 

 

 

 

 

నీలగిరి తోడాలు…చరిత్ర విడిచిన ఖాళీలు!

కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

వ్యక్తులతోనైనా, వస్తువులతోనైనా, మరి దేనితోనైనా  కానివ్వండి… చిరపరిచయం మన చూపులకు, ఆలోచనలకు సంకెళ్ళు వేస్తుంది. వాటి వైశాల్యాన్ని తగ్గించివేస్తుంది. అలాకాకుండా చిరపరిచయం నుంచి చూపును తప్పించి వివిధ కోణాలలోంచి నిశితంగానూ, కొత్తగానూ చూడడం ప్రారంభించామనుకోండి…ఆ చూపులోంచి కొత్త విశేషాలు, సరికొత్త ఆశ్చర్యాలు పుట్టుకొస్తాయి. అలా ఆ రెండు చూపుల మధ్యనే ఆశ్చర్యాల పుట్టుక!

దేవాలయాలనే తీసుకుందాం. మన దేశంలో అవి అసంఖ్యాకాలు. మనలో చాలామంది దగ్గరలో ఉన్న దేవాలయాలను తరచు సందర్శిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తీర్థ యాత్రల పేరుతో దూర దూర ఆలయాలను కూడా దర్శించి వస్తూ ఉంటారు. చిరపరిచయం వల్ల దేవాలయం ఫలానా విధంగా ఉంటుందన్న కల్పనకు మనం అలవాటు పడిపోతాం కనుక, ఫలానా విధంగా ఎందుకు ఉంది, అసలు దీని చరిత్ర ఏమిటి అనే ఆలోచన సర్వసాధారణంగా చేయం. చేసే వాళ్ళు అసలే ఉండరని కాదు.  వాళ్ళు మినహాయింపులు. నేను అంటున్నది జనసామాన్యం గురించి.

దేవాలయ నిర్మాణాన్నే కాస్త పట్టి చూడండి. దానికొక నిర్దిష్టత ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే, చిన్న చిన్న గుళ్ళు, మందిరాలను అలా ఉంచితే ఇంచు మించు ప్రతి దేవాలయానికీ చుట్టూ ప్రహరీగోడ ఉంటుంది. ఓ ప్రవేశద్వారం, లోపలికి వెళ్ళాక ఒక ధ్వజస్తంభం, ఆ తర్వాత ఎత్తుగా ఒక నలుచదరపు అరుగు, దానికి మెట్లు, ఆ అరుగు తర్వాత గర్భగుడి ఉంటాయి. గర్భగుడి పైన, పోను పోను సన్నబడే శిఖర నిర్మాణం ఉంటుంది. ప్రహరీ గోడకు, ప్రధాన నిర్మాణానికీ మధ్య నలువైపులా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. కొన్ని పెద్ద ఆలయాలలో అయితే వంటశాల ఉంటుంది. గోశాల కూడా ఉండచ్చు. అలాగే పూజారుల నివాసగృహాలు కూడా. స్థూలంగా నని ముందే అన్నాను కనుక  కొన్ని వివరాలు తప్పిపోవచ్చు.

చిరపరిచయం నుంచి చిరభావనలూ పుట్టుకొస్తాయి. ఇలాంటి ఈ దేవాలయ నిర్మాణం మన దేశానికే, మన సంస్కృతికే ప్రత్యేకమనీ, ఇంకెక్కడైనా ఉన్నా మన దగ్గరనుంచే వెళ్లిందనే భావన వాటిలో ఒకటి. కానీ పురాచరిత్రకారుల పరిశీలనలు ఈ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్(Oriental Mythology)నే ఉటంకించుకుంటే…

మెసొపొటేమియాలో దక్షిణంగా ఒబెయిద్(Obeid), ఉరుక్(Uruk), ఎరిడు(Eridu) అనే చోట్లా; మెసొపొటేమియాలోనే నేటి బాగ్దాద్ కు ఉత్తరంగా ఉన్న ఖఫజా(Khafajah), దక్షిణంగా ఉన్న ఉకైర్(Uqair) అనే చోట్లా; మెసొపొటేమియాకు దూరంగా తూర్పు సిరియాలో టెల్ బ్రాక్(Tel Brak) అనే చోటా జరిపిన తవ్వకాలలో మొత్తం ఆరు దేవాలయ సముదాయాలు బయటపడ్డాయి. ఇవి ఉజ్జాయింపుగా క్రీ. పూ. 4000-3500 ఏళ్ల నాటివని నిర్ణయించారు. సిరియాలో పుట్టిన మూలరూపమే ఇతర ప్రాంతాలకు విస్తరించినట్టు టెల్ బ్రాక్ ఆలయసముదాయం సూచిస్తోంది.

Near East

ఒబెయిద్ ఆలయంలో దేవత పేరు నిన్ హుర్ సగ్(Ninhursag). ఖపజాలో దేవత పేరు ఇనన్న(Inanna). మిగతా ఆలయాలలోని దేవతల పేర్లు తెలియవు. ఒబెయిద్, ఖఫజా, ఉకైర్ ఆలయ సముదాయాలు రెండు వైపులా ఎత్తైన ప్రహరీ గోడలతోనూ, అండాకారంలోనూ ఉండి యోని ఆకారాన్ని సూచిస్తూ ఉంటాయి. భారతదేశంలోని అమ్మవార్ల ఆలయంలో గర్భగుడిలో యోని ఆకారంలో ఉండే నిర్మాణంలానే ఇది కూడా ప్రకృతిలోని పునరుత్పాదక శక్తికి; అంటే సంతానాన్ని కని, పెంచి, పోషించే స్త్రీత్వానికి ప్రతీక.

ఈ ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణం పది నుంచి ఇరవై అడుగుల ఎత్తైన అరుగు మీద ఉంటుంది. ఆ అరుగుకు మెట్లు ఉంటాయి. అన్నీ ఇటుకతో కుదిమట్టంగా పెట్టె ఆకారంలో నిర్మితమై ‘ఆధునిక’ శైలిని తలపిస్తూ ఉంటాయి. మూలలు రంగు రంగుల నునుపు రాళ్ళతోనూ, రంగుల అద్దకాలతోనూ అలంకృతమై కనిపిస్తాయి. పూజారుల నివాసాలు, ఆలయసేవలకు ఉద్దేశించిన ఇతర ప్రదేశాలు, వంటశాలలు, ముఖ్యంగా పశువుల కొట్టాలు ఈ సముదాయంలో భాగాలు. ఒబెయిద్ శిథిలాలలో వివిధ రంగుల్లోని నునుపురాళ్ళు తాపడం చేసిన తావులు కనిపించాయి. పూజారుల బృందం అక్కడే పవిత్ర గోమాతల పాలు పితికి, నిల్వ చేసేవారని అవి సూచిస్తున్నాయి.  అనంతర కాలానికి చెందిన అసంఖ్యాక లిఖిత పత్రాల ప్రకారం, ఈ ఆలయసముదాయంలో కొలుపులు అందుకుంటూ వచ్చిన నిన్ హుర్ సగ్ జగజ్జనని.  మనుషులు, దేవతలు, పశువులతో సహా అందరికీ, అన్నింటికీ తల్లి.  ముఖ్యంగా రాజులకు సంపదను అందించి, వారి రక్షణకు బాధ్యత వహించేది ఆ తల్లే.  ఆమె తన క్షీరధారలతో అందరినీ పోషిస్తుంది. ఆలయ సముదాయంలోని గోమాతలే ఆమె ప్రతిరూపాలు. వాటి పాలే ఆమె ప్రసాదం.

భారతదేశంలో అమ్మవారి ఆలయాలలో ఇప్పటికీ అన్నం పాయసాన్నో, పాల ఉత్పత్తులతో చేసిన మరో పదార్ధాన్నో ప్రసాదంగా ఇస్తారని క్యాంప్ బెల్ అంటారు. సరే, ఆ సంగతి మనకూ తెలిసినదే. ఆయన అంతకంటే ఆసక్తికరమైన ప్రస్తావన చేశారు. అదేమిటంటే, దక్షిణభారతంలో(తమిళనాడులో)ని నీలగిరులలో ‘తోడా’లని పిలిచే ఒక నిగూఢమైన తెగ ఉంది. ఇరుగు పొరుగు వారితో ఈ తెగ వారికి జాతిపరమైన ఎలాంటి సంబంధాలు లేకపోవడమే ఆ నిగూఢతకు కారణం. పైన చెప్పిన మెసొపొటేమియా ఆలయ సముదాయాల్లానే వీరికి కూడా చిన్న చిన్న ఆలయసముదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పశువుల్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. లేగ దూడ వీరు బలి ఇచ్చే ప్రధాన జీవి. అమ్మవారి కుమారుడికి అది ప్రతీక. వీరి దేవత పేరు తోగోర్ష్. విశేషమేమిటంటే ఈ దేవతను ఉద్దేశించిన ప్రార్థనలో ‘నిన్ కుర్ షగ్’ అనే మాట కనిపిస్తుంది. ఆ మాటకు అర్థం వారికి తెలియదు. పైన చెప్పిన ఒబెయిద్ అమ్మవారు ‘నిన్ హుర్ సగ్’ కు, ఈ ‘నిన్ కుర్ షగ్’ అనే మాటకూ పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అంటే, ఇరాన్ కు తూర్పుగా వ్యవసాయ-పశుపాలక నాగరికత వ్యాపించడానికి పదిహేను వందల ఏళ్ల క్రితమే రాజు గారికి చెందిన పశువుల కొట్టాలు కూడా భాగమైన నిన్ హుర్ సగ్, ఇనన్న అమ్మవార్ల ఆలయాలలో గంటల గణగణలు, దీపాలను తిప్పడం వంటి అర్చనా సేవలూ, ప్రార్థనలూ, మంత్రాలు, బలులతో కూడిన పూర్వరంగం అంతా ఏర్పడిందనీ; ఈ తంతు భారతదేశంలోని అమ్మవారి వరకూ చేరుకుని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగుతోందనీ క్యాంప్ బెల్ అంటారు.

నీలగిరి ‘తోడా’ల గురించిన పై సమాచారంతో సహా ఈ మొత్తం వివరాలు ఎంతో విపులంగానూ, వివరంగానూ చెప్పుకోవలసిన మరో నిగూఢ చరిత్ర వాకిట మనల్ని నిలబెడుతున్నాయి. అయితే, ఆ వాకిలి దాటి మరింత లోపలికి వెళ్లడానికి నేనిప్పుడు సిద్ధంగా లేను కనుక ఒకటి రెండు అంశాలను మాత్రం ప్రస్తావించి ఆపేస్తాను:

ప్రముఖ చరిత్రకారుడు నీలకంఠశాస్త్రి తన A HISTORY OF SOUTH INDIA (Fourth Edition, Oxford India Paperbacks, 1995)లో, The earliest peoples and culture అనే అధ్యాయంలో నీలగిరుల గురించి కొంత స్పృశించారు. దాని ప్రకారం, అక్కడ చనిపోయినవారి స్మారకార్ధం నిలిపిన శిలాకృతులు(cairns), ముందు ఒక్క చక్రం మాత్రమే ఉండే చిన్న చిన్న తోపుడు బళ్ళు(barrows), కుండలు(pottery) మైదాన ప్రాంతాలలో వాటికంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి కంచు పాత్రలు ఊర్(Ur-మెసొపొటేమియా)లో దొరికిన బంగారు పాత్రను పోలి ఉంటాయి. ఇంకా మరికొన్ని అంశాలలో కూడా మెసొపొటేమియాకు, నీలగిరులకు ఉన్న అజ్ఞాత సంబంధాన్ని సూచించే సామ్యాలు  పురాతత్వశాస్త్రజ్ఞులకు దొరికాయి.

అదలా ఉంచితే, చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి సినిమా ‘మర్యాద రామన్న’ ఈ మధ్య టీవీలో వస్తుంటే యధాలాపంగా చూశాను. అందులో ఒక సన్నివేశం మెసొపొటేమియా, నీలగిరులలోని పశువుల కొట్టాలను గుర్తుచేసింది. రాయలసీమ ముఠా హత్యలు, గ్రామీణ నేపథ్యంతో తీసిన ఆ సినిమాలో ముఠా నాయకుడి విశాలమైన ఇంటి చావిడిలోనే పశువుల కొట్టం కూడా ఉంటుంది. అదేమిటని హీరో అడిగినప్పుడు, పశువులు మాకెంతో పూజనీయాలనీ, అందుకే ఇంట్లోనే ఉంచుకుని వాటితో మేము సహజీవనం చేస్తామనీ ముఠా నాయకుడు జవాబు చెబుతాడు. ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్న ఆ పురా చారిత్రక వారసత్వం తాలూకు ఆనవాయితీని(కాకపోతే పై ఉదాహరణలలో దేవాలయం అయితే, ఇక్కడ ఇల్లు అయింది) దర్శకుడు ఎక్కడి నుంచో తీసుకుని సినిమాలో వాడుకున్నారని అనిపించింది.

***

తొలి ఆలయ ఆవరణలు

తొలి ఆలయ ఆవరణలు

దేవాలయనిర్మాణమే కాదు; అనేక సాంస్కృతిక అంశాలు, మతవిశ్వాసాలు, ఆరాధనా పద్ధతులు, పురాణగాథలు, వ్యవసాయ-పశుపోషణలు, శాస్త్ర, సాంకేతిక విషయాలు సమీప ప్రాచ్యం నుంచే నేల నలుచెరగులకూ వ్యాపించాయని పురాచరిత్ర కారులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేటి ప్రపంచ భౌతిక, ఆధ్యాత్మిక జీవితపు నమూనాకు పుట్టిల్లు సమీప ప్రాచ్యం! ఏ ఒక్కరో కాదు; గార్డన్ చైల్డ్, సర్ జేమ్స్ ఫ్రేజర్, జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి రాక్స్ సహా ఎందరో అంటున్న మాట ఇది. క్యాంప్ బెల్ (Occidental Mythology) మాటల్లోనే చెప్పుకుంటే…

తూర్పు, పడమటి దేశాల పౌరాణిక చింతనకు సంబంధించిన అనేక మౌలిక అంశాలు కంచు యుగ వారసత్వాలే. అయితే ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నట్టు ఈ వారసత్వానికి పుట్టిల్లు భారతదేశమో, చైనాయో కాదు; సమీప ప్రాచ్యం, లెవెంట్. ఇందుకు సంబంధించిన పూర్వరంగం ఈ ప్రాంతంలో క్రీ.పూ. 7500 నాటికే ఏర్పడిందని ఇక్కడ జరిగిన పురాతత్వ పరిశోధనలు చెబుతున్నాయి. ఆ కాలానికే ఆసియా మైనర్, సిరియా, ఇరాక్ ఉత్తర ప్రాంతం, ఇరాన్ లలోని సురక్షిత స్థితిలో ఉన్న పర్వత లోయలలోనే వ్యవసాయ, పశుపోషణ నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి. ఇవే మనిషి అస్తిత్వంలోనూ, సామర్ధ్యాలలోనూ విప్లవాత్మకమైన పరివర్తన తీసుకొచ్చాయి. అప్పటివరకూ అనిశ్చితం, ప్రమాదకరం అయిన ఆహారసేకరణ(వేట, అటవీ ఉత్పత్తులు)పై ఆధారపడుతూ వచ్చిన మనిషి ఇప్పుడు వ్యవసాయదారుడిగా మారాడు. స్వయంపోషక గ్రామాలు అవతరించాయి. అవి క్రమంగా తమ సంఖ్యను పెంచుకుంటూ  క్రీ.పూ. 2500 నాటికి తూర్పు, పశ్చిమాలకు విస్తరించాయి.

ఈ మధ్యలో, క్రీ.పూ. 3500 లో ఈ అభివృద్ధికి కేంద్రమైన సమీప ప్రాచ్యంలోని మెసొపొటేమియాలో రెండవ విప్లవాత్మక పరివర్తన సంభవించింది. లిఖిత సంప్రదాయం, గణితం, నిర్మాణశైలులు, శాస్త్రీయ పద్ధతులలో ఖగోళ పరిశీలన, దేవాలయ నిర్మాణం; అన్నింటినీ మించి పరిపాలనా కళ అవతరించాయి. ఈ పరిజ్ఞానమూ, వీటి అనుసరణా క్రీ.పూ. 2850 నాటికి ఈజిప్టుకు, క్రీ.పూ. 2500 నాటికి క్రీటుద్వీపానికీ, సింధు లోయకూ, క్రీ.పూ. 1500 నాటికి చైనాకు, క్రీ.పూ. 1000-500 నాటికి మెక్సికో, పెరూ లకూ చేరుకున్నాయి.

భారతదేశాన్ని, ఈ దేశ సంస్కృతీ నాగరికతలను ఇప్పటి సరిహద్దుల మధ్య ఊహించుకోడానికి అలవాటు పడి, మొత్తం ప్రపంచ నాగరికతకు, అభివృద్ధికి పుట్టిల్లు ప్రాచీన భారతదేశమేనని భావించుకునేవారిని  పై వాక్యాలు నొప్పించి, కోపం తెప్పించే మాట నిజమే. వీటిని ఖండించే పటిష్టమైన వాదనను ఎవరు ముందుకు తెచ్చినా తెరచిన బుద్ధితో దానిని స్వీకరించవలసిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. పురా మానవుడి ప్రపంచానుభవం, నేటి మన ప్రపంచానుభవం ఒకలాంటివి కావు. నేడు మనం భావిస్తున్నట్టు; ఆయా  దేశాల సరిహద్దులు, సాంస్కృతిక, మత విభజనలు, జాతీయతలను స్థిరమైనవిగా భావించడం అతనికి తెలియదు. నాటి జీవన పరిస్థితులలో అందుకు అవకాశం కూడా లేదు. ఎప్పటికప్పుడు సరిహద్దులను చెరిపివేయడం, కొత్త సరిహద్దులను నిర్మించడం అతను చేస్తూ వచ్చిన పని. అలాగే అతను భిన్న భిన్న మత సంస్కృతులలో కలసిపోయాడు. ఇతరులకు తన మత సంస్కృతులను ఇచ్చి వారివి తను తీసుకున్నాడు. అలా మిశ్రమ మతసంస్కృతులను నిర్మించుకుంటూ వెళ్ళాడు. కనుక పురాకాలపు అభివృద్ధి, నాగరికతలతో సహా అన్నీ ఉమ్మడి సృష్టి. అందులో మన వాటా కచ్చితంగా ఉంది.

సమీప ప్రాచ్య వారసత్వం మనకు ఎలా అందిందో చెప్పుకోవలసింది చాలా ఉంది. దానిని మరో సందర్భానికి వాయిదా వేసి కొంత విలక్షణత కలిగిన క్రీటు ద్వీపం మీద అది ఎలా ప్రసరించిందో చెప్పడానికి ప్రస్తుతం పరిమితమవుతాను.

***

 

రాంభట్ల(జనకథ) ప్రకారం, పశ్చిమార్యుల లెక్కలో ప్రథమ ధర్మశాస్త్రకర్త పేరు మినోస్. ఆయన క్రీ.పూ. 15వ శతాబ్దికి చెందినవాడు, క్రీటు దీవిలోని నోసోస్ నగరపాలకుడు. ఆయన ధర్మశాస్త్రకర్త మాత్రమే కాదు, నౌకాదళ నిర్మాత కూడా. మనకు కూడా చిరపరిచితుడైన ఒక ధర్మశాస్త్రకర్త ఉన్నాడు. ఆయన పేరు మనువు. ఆయన జలప్రళయ సమయంలో ఓడను నిర్మించి జీవులను రక్షించా డంటుంది శతపథబ్రాహ్మణం. ఈవిధంగా మినోస్ కు, మనువుకు నామసామ్యం మాత్రమే కాదు; ధర్మశాస్త్ర కర్తృత్వం, నౌకా నిర్మాణంలో కూడా సామ్యం ఉంది.

అయితే, మనకు మనువులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మనువు వైవస్వత మనువు. నడుస్తున్నది వైవస్వతమన్వంతరం. 36 లక్షల సంవత్సరాలు ఒక చాతుర్యుగం అయితే, అలాంటి 71 చాతుర్యుగాలు ఒక మన్వంతరం అవుతుంది. కనుక మానవ కాలమానంలో మనువుల కాలాన్ని లెక్కగట్టడం అసాధ్యం. స్థూలంగా అతి ప్రాచీను డనుకుందాం. అలాగే, క్రీటు పాలకుడు మినోస్ కూడా ప్రాచీనుడై ఉండచ్చు.  మన దగ్గర చాలామంది మనువులు ఉన్నట్టే క్రీటులోనూ చాలామంది మినోస్ లు ఉండి ఉండచ్చు. మొదటి మినోస్ పేరే తర్వాతి పాలకులకు పదవీ నామంగా సంక్రమించి ఉండచ్చు. వీరిలో ఒకరు ధర్మశాస్త్రకర్త అయుండచ్చు.  క్రీటు నాగరికతా కాలాన్ని మినోస్ పేరిటే మూడు దశలుగానూ, మళ్ళీ ఒక్కొక్క దశను మూడు అంతర్దశలుగానూ విభజించారు. ఈ దశలు అన్నీ క్రీ.పూ. 2600తో ప్రారంభమై, క్రీ.పూ. 1100లతో గ్రీకుల ఆక్రమణతో ముగుస్తాయి. అక్కడ కొత్త రాతి యుగం ఇంకా ముందే క్రీ.పూ. 4000లో మొదలైంది.

క్రీటు నాగరికత గ్రీకు పితృస్వామిక నాగరికతకే కాక, ఈజిప్టు, మెసొపొటేమియా పూజారి నాగరికతకు కూడా కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటుంది. ఇది మాతృస్వామికం. దేవతకు, పూజారిణులకే ప్రాముఖ్యం. పురుషదేవుళ్లు చాలా తక్కువ. మతపరమైన తంతులు కూడా దేవతలకు, స్త్రీలకు చెందినవే. ఇంకా విశేషమేమిటంటే, ఈ తంతులలో లైంగిక సంబంధమైనవి లేవు. అలాగే లింగ చిహ్నాలు కనిపించవు. ఆ విధంగా క్రీటు నాగరికతలో ఇప్పుడు మనం చెప్పుకునే ‘సభ్యత’ ఉట్టిపడుతూ ఉంటుంది.

ఇక స్త్రీలు పురుషులకు అన్ని విధాలా సమానులు. హుందాగా, స్వేచ్ఛగా పురుషులతో కలసిపోయి సంచరించేవారు. వారి దుస్తులు కూడా ఆధునికమైన దుస్తుల్ని తలపిస్తాయి. వారు కూడా వృషభ యుద్ధాల(Bull Fights)లో పాల్గొనేవారు. ఎద్దు కొమ్ముల మీంచి, దాని పృష్ఠభాగం మీంచి పిల్లి మొగ్గలు వేసేవారు. అథ్లెటిక్ బెల్టులు ధరించేవారు. అంతటి స్త్రీ-పురుష సమానత్వం కలిగిన సభ్యనాగరికత తర్వాతి కాలంలో కనిపించదని క్యాంప్ బెల్ అంటారు.

ఇంకా విశేషమేమిటంటే, గ్రీకు ఆక్రమణదారులు అడుగుపెట్టేవరకూ క్రీటులో కోటల వంటి రక్షణలు లేవు. ఆయుధసంపద ఉన్నట్టు సాక్ష్యాలు లేవు. నోసోస్ నగరం తలుపులన్నీ తెరచి ఉంచిన ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు వాసులు అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ఈ వివరాలన్నీ, ధర్మం నాలుగు పాదాలతో నడిచినట్టు మన పురాణాలు చెప్పే ‘కృత’యుగాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ‘కృత’యుగం అనే మాటే ‘క్రీటు’యుగంలా ధ్వనిస్తున్నా ఆశ్చర్యంలేదు.

అదలా ఉండగా, క్రీటులో కొత్త రాతి యుగ అవశేషాలు ఆసియా మైనర్ సంబంధాన్ని సూచిస్తాయి. నైరుతి అనటోలియా(టర్కీ)లో దొరికిన క్రీ.పూ. 5500 నాటి మృణ్మయ సామగ్రి క్రీటుకు చెందిన తొలినాటి అమ్మవారి ఆరాధన నేపథ్యాన్ని సూచిస్తాయి. వీటిలో దేవతల నగ్నరూపాలున్నాయి. ఆగ్నేయ అనటోలియాను ఆనుకుని ఉన్న ఉత్తర సిరియాలో క్రీ.పూ. 4500-3500 నాటి స్త్రీమూర్తులు విస్తారంగా దొరికాయి. ఇక్కడ దొరికిన ప్రతీకాత్మక మూర్తులలో అనేకం తర్వాతి కాలంలో క్రీటులో ప్రముఖంగా మారాయి. వాటిలో వృషభ శిరస్సు, జంటగొడ్డలి, తేనెతుట్ట సమాధి(beehive tomb), పావురాలు, గోవు, గొర్రె, మేక, పంది ఉన్నాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

చరిత్ర, అచరిత్రల మధ్య మనం!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రెండేళ్ళు పైనే అయింది…

ఏదో పని మీద నాకు బాగా పరిచయమున్న ఒక ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఫ్రాక్, పశ్చిమ సాహిత్యాలలో తాత్వికధోరణులలో లోతైన అధ్యయనం ఉన్నవారు. ఎన్నో పుస్తకాలు రచించినవారు. నేను ఎంతో గౌరవించే వ్యక్తి. అప్పటికి ఈ వ్యాసపరంపర ప్రారంభించకపోయినా వీటిలో చర్చకు వస్తున్న అనేక విషయాలను యధాలాపంగా ఆయనతో ముచ్చటించడం ప్రారంభించాను. ఆయన మధ్య మధ్య స్పందిస్తూ ఎంతో ఆసక్తితో వింటున్నట్టు కనిపించారు. అలా గంటన్నర కాలం దొర్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను.

వచ్చిన కాసేపటికి ఆయన ఫోన్ చేశారు. “మీరు మాట్లాడిన విషయాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా పుస్తకరూపంలోకి తేవాలి. అది మంచి పుస్తకం అవుతుంది” అన్నారు. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాను.

మూడు, నాలుగు రోజుల తర్వాత మరోసారి ఆయన ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన వేరే పని గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాను. ఆయన నన్ను సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చారు. నేను చెప్పులు వేసుకుంటుంటే, ఉన్నట్టుండి ఆయన, “మీరు నాతో కిందటిసారి మాట్లాడిన విషయాలు రాయకండి” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికి రెండు కారణాలు. మొదటిది, అంతకుముందు స్వయంగా ఫోన్ చేసి మరీ నన్ను అభినందించి, పుస్తకరూపంలోకి తేవాలని నొక్కి చెప్పి, అది మంచి పుస్తకం అవుతుందని అన్నవారే ఇంతలో అభిప్రాయం మార్చుకోవడం! రెండవది, అసలు రాయనే వద్దని అనడం!

ఈ మధ్యలో ఇంకో నిజం కూడా ఉంది. అది: నేను మాట్లాడిన విషయాల గురించే ఈ మూడు నాలుగురోజులుగా ఆయన ఆలోచిస్తూ, ఇంకా చెప్పాలంటే, మథనపడుతూ ఉండడం!

నేను ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి క్షణకాలం పట్టినట్టుంది. ఆపైన, “చరిత్ర…” అంటూ ఏదో అనబోయాను.

ఆయన వెంటనే తుంచేస్తూ, “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్నారు.

అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నేను బయటికి నడిచాను.

***

రెండేళ్ళు దాటిపోయినా అప్పటి ఆ సన్నివేశం నా జ్ఞాపకాలలో నిన్న మొన్నటి దన్నంత స్పష్టంగా ఇప్పటికీ ఉండిపోయింది. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆయన మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.  ఆ మాటల్ని తప్పుపట్టడానికో, విమర్శించడానికో నేనీ విషయం ప్రస్తావించడంలేదు. వాటిని వీలైనంత తటస్థంగా పరిశీలించడం నా ఉద్దేశం.

“మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆ వాక్యం వెనుక-ఆలోచించిన కొద్దీ- ఒక విలక్షణమైన భారతీయ మనస్తత్వం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మన రక్తంలో లోతుగా ఇంకిపోయిన ఒక తాత్వికత కూడా.  కాలాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తుగా విభజించడమే చూడండి. అది కేవలం వ్యావహారిక సౌలభ్యం కోసం. ఆవిధంగా అది ‘వ్యావహారిక సత్యం’ మాత్రమే. అయితే మన తాత్వికత ప్రధానంగా మూడు కాలాలకూ అతీతమైన సత్యానికి చెందినది. దానిని ‘పారమార్ధిక సత్యం’ అందాం. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అనే విభజన కుదరదు. అక్కడ కాలాన్ని అఖండంగా చూడవలసిందే.  అందులోకి వెళ్లినప్పుడు వ్యావహారిక సత్యం లానే వ్యావహారిక సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న కాలం కూడా మాయగా లేదా మిథ్యగా పరిణమిస్తుంది.

కనుక పారమార్థిక సత్యానికి భంగం కలగకుండా ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకే వ్యావహారిక కాలాన్ని వాడుకోవాలి తప్ప మరీ లోతుగా వెళ్లకూడదు. పురాణాలు కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలుగా కాలాన్ని విభజించి ఒక్కొక్క యుగానికీ లక్షలాది సంవత్సరాలను ఆపాదించడం, లక్షల సంవత్సరాల వ్యాప్తి ఉన్న మన్వంతరాలను కల్పించడం వ్యావహారిక కాలాన్ని అప్రధానంగా మార్చే ప్రయత్నంలో భాగమనే నేను అనుకుంటాను. దశరథమహారాజు అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడనీ, రాముడు పదివేల సంవత్సరాలు పరిపాలించాడనీ రామాయణం చెబుతోంది. వ్యావహారిక కాలానికి ప్రాధాన్యం లేదని– చెప్పకనే చెప్పడం ఇది.

తాత్విక స్థాయిలో కాలాన్ని అఖండంగా చూడడమంటే కాలానికి గల చలనశీల స్వభావాన్ని కూడా నిరాకరించడమే. అందులో కాలం స్థాణువుగా మారిపోతుంది. పారమార్థిక రంగానికి చెందిన ఆ స్థాణుత్వం అక్కడితో ఆగకుండా వ్యావహారిక రంగం మీదా; అంటే సమాజ, సాహిత్య, ఆర్థిక, రాజకీయాల మీదా ప్రభావం చూపుతుంది. అంటే అవి కూడా స్థాణుత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకు ఒక రచన ఒకానొక కాలంలో, సమాజంలో, చారిత్రక పూర్వాపరాల మధ్య అవతరిస్తుంది. కానీ అవతరించిన వెంటనే అది చలన శీలత కలిగిన కాలంతో సంబంధాన్ని తెంచుకుని ఒక కాలాతీత స్వతంత్ర అస్తిత్వాన్ని తెచ్చుకుంటుంది. ఆ రచనకు సంబంధించిన పఠనపాఠన వ్యాఖ్యాన సంప్రదాయమూ దానికి అనుగుణంగానే ఉంటుంది. రామాయణ, మహాభారతాలనే తీసుకుంటే; ఇప్పటికీ వాటిని వ్యాఖ్యానించేటప్పుడు సంప్రదాయ పండితులు వాటి పాఠాన్ని, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన సంప్రదాయాన్ని దాటి వాటి వెనుక ఉన్న సమాజమూ, చరిత్రలలోకి తొంగి చూసే సాహసం చేయరు. ఏ కాస్త స్వతంత్రించినా అది సంప్రదాయం అంగీకరించిన పరిధిలోనే. నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’(2006)లో కూడా దీని గురించి కొంత చర్చ చేశాను.

భారతదేశం ఇప్పటికీ క్రీస్తుపూర్వకాలంలోనే ఉందనీ, క్రీస్తుశకంలోకి రాలేదనీ ఈ వ్యాసపరంపరలో ఆయా సందర్భాలలో అంటూ వచ్చాను. అది పైన చెప్పిన స్థాణుత్వాన్ని సూచించడమే.

చరిత్ర విషయానికి వస్తే, అది చలనశీలత కలిగిన వ్యావహారిక కాలానికి చెందినది కనుక అందులోకి వెళ్ళడం; కాలాన్ని అఖండంగా చూసే తాత్వికతకు విరుద్ధం అవుతుంది. ఆ అఖండతా సూత్రం మీద ఆధారపడే రచనలకు అవాంఛనీయ వ్యాఖ్యానాలూ, వివరణలూ పుట్టుకొస్తాయి. దాంతో సంప్రదాయపాఠమే కాక మన విశ్వాసాలూ దెబ్బతింటాయి. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అని ప్రొఫెసర్ గారు అనడం వెనుక ఇంత లోచూపు ఉందని నేను అనుకుంటున్నాను.

సరే, కాలం గురించిన ఈ దృష్టిభేదం వల్ల, అనువుగా ఉన్నప్పుడు వ్యావహారిక కాలాన్ని, లేనప్పుడు పారమార్థిక కాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది కనుక దానిని దుర్వినియోగం చేసేవారూ ఉంటారు.

***

కొన్ని ఇతర పురాతన నాగరికతల పరిస్థితి వేరు. వాటితో పోల్చితే “మనకు చరిత్ర అవసరం లేదు” అన్న ప్రొఫెసర్ గారి వ్యాఖ్య ఎంత సనాతన సత్యమో; మనల్ని అది ఎంత విలక్షణ స్థితిలో నిలబెడుతుందో అర్థమవుతుంది. అవి తమ చరిత్రను పదిలపరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాయి. వాటికి చెందిన కనీసం నాలుగైదు వేల సంవత్సరాల నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు, యుద్ధాల వివరాలు, జామా ఖర్చులు, భూమి పంపకాలు, భూదానాలు, కూలీలకు ఇచ్చిన వేతనాలతో సహా అనేక లిఖిత ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక తవ్వకాలలో దొరికిన పురావస్తు ఆధారాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీటి ఆధారంగా ఈ నాగరికతలకు సంబంధించిన  చరిత్రరచన పెద్ద ఎత్తున జరిగింది.

Heinrich Schliemann

కొన్ని పురాతన లిపులను ఛేదించడానికి ఎందరో పండితులు ఒక జీవితకాల తపస్సుగా ఎంత కృషి చేశారో; ఎండనకా, కొండనకా శ్రమిస్తూ తవ్వకాలు జరిపించి పురా చరిత్ర ఖజానాను వెలికి తీయడానికి జీవితాలను ఎలా ధారపోశారో చెప్పే పుస్తకాలు కూడా వచ్చాయి. ప్రాచీన గ్రీసులో భూగర్భంలో సమాధి అయిన నగరాలను తవ్వి తీసిన Heinrich Schilemann పై Robert Payne రాసిన THE GOLD OF TROY, C.W. Ceram రాసిన THE SECRET OF THE HITTITES ఇప్పటికిప్పుడు నాకు గుర్తొస్తున్న రెండు పుస్తకాలు. ప్రాచీన సమీప ప్రాచ్యంలోని వివిధ దేశాలకు చెందిన పత్రాలు, ఆ దేశాల రాజుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వగైరాల ఇంగ్లీష్ అనువాదాన్ని పొందుపరచిన THE ANCIENT NEAR EAST(MARK W. CHAVALAS సంపాదకత్వంలో) లాంటి పుస్తకాలూ వచ్చాయి.THE SECRET OF THE HITTITES

అదే మన విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి  ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు గురించి నికరంగా మనకు తెలిసింది. దీనిపై రొమీలా థాపర్ (A HISTORY OF INDIA, Volume.one)ఇలా అంటారు:

Until a hundred years ago, Ashoka was merely one of the many kings mentioned in the Mauryan dynastic list included in the Puranas.  But in 1837, James Princep deciphered an inscription written in the earliest known Indian script, Brahmi. The inscription referred to a king called Devanamapiya Piyadassi(the beloved of gods, Piyadassi). The mysterious king Piyadassi remained a puzzle, since the name did not tally with any mentioned in the sources. Some years later the Buddhist chronicles of Ceylon were examined and were found to refer to a great and benevolent Mauryan king as Piyadassi. Slowly the clues were put together and seemed to make sense, but the final confirmation came in 1915 with the discovery of another inscription in which the author calls himself King Ashoka, Piyadassi. It was evident that Piyadassi was a second name used by Ashoka.

“మనకు చరిత్ర అవసరం లేదు” అనే నమ్మకాన్ని పట్టుకుని అలా ఉండిపోతే ఆ దారి వేరు. కానీ పాశ్చాత్య గవాక్షం నుంచి చరిత్ర కిరణాలు వేడి వేడిగా మన కళ్ల మీద పడి చురుక్కు మనిపించడం ప్రారంభం కాగానే ఒక విచిత్రమైన పరిస్థితిలోకి జారిపోయాం. మాకూ చరిత్ర ఉంది, మా దగ్గరా చరిత్ర రచనలు ఉన్నాయని చెప్పుకోడానికి పోటీ పడ్డాం. తీరా చూస్తే చరిత్ర లక్షణాలు బొత్తిగా లేని కల్హణుడి రాజతరంగిణి తప్ప మన దగ్గర నిక్కమైన చరిత్ర రచన ఒక్కటీ లేదు. ఇది కోశాంబీ మాట.  ఆయన (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇలా అంటారు:

India, for all its great literary heritage, has produced no historical writers comparable to Herodotus, Thucydides, Polybius, Livy, Tacitus. Many Indian kings of the middle ages were incomparably superior in their education and literary ability to contemporary rulers in Europe; they personally led great armies to victory in heavy warfare. Nevertheless, not one seems ever to have thought of composing a narrative like Caesar’s Commentaries or Xenophon’s Anabasis. The tradition was of graceful drama, an occasional hymn in praise of gods, or a witty epigram. There remains only one Indian chronicle worth the name, the Rajatarangini  by a Kasmiran named Kalhana, composed in Sanskrit verse during A.D. 1149-50, and continued by two successors. This chronicle suffers from all the mannered conventions of Sanskrit poetry, in particular the fatal double entendre that manages only to obscure whatever reality the author meant to portray. The period was of desperate struggle between the central power and feudal lords in Kasmir, but even the portion dealing with the actual time and place can hardly be compared in quality, depth, content to the account by Thucydides Peloponnesian war. For the rest of the country, till the Muslim period, we have nothing even as good as Kalhana,…

The sources for the older period survive as Puranas,  which in their present form, are only religious fables and cant, with whatever historical content the works once possessed heavily encrusted by myth, diluted with semi-religious legends, effaced during successive redactions copied by innumerable, careless scribes; so that one finds great difficulty in restoring as much as the king-lists. Cuneiform records, even the Sumerian, yield much more information, particularly about social conditions in their respective countries.

పై వాక్యాల సారాంశాన్ని చెప్పుకుంటే…గొప్ప సారస్వత వారసత్వం ఉండి కూడా భారతదేశం హెరొడోటస్ తదితరులతో పోల్చదగిన చరిత్రకారులని సృష్టించలేకపోయింది. మధ్యయుగాలనాటి మన రాజులు, తమ కాలం నాటి యూరప్ రాజులతో పోల్చితే విద్యలోనూ, సాహిత్య నైపుణ్యాలలోనూ మిన్న అయినప్పటికీ  సీజర్ కామెంటరీస్, క్జెనోఫోన్ అనబాసిస్ లాంటి రచనలను రూపొందించే ఆలోచన చేయలేదు. ఎంతోకొంత చరిత్రగా చెప్పదగిన కల్హణుని రాజతరంగిణి కూడా శ్లేషతో సహా సంస్కృత కావ్య మర్యాదలను పాటించడంవల్ల రచయిత చెప్పదలచుకున్న వాస్తవాలు కూడా వాటికింద కప్పడిపోయాయి. తూసిడైడ్స్ రచించిన ‘పెలోపొనేసియన్ వార్’ కు అది ఏవిధంగానూ సాటి కాలేకపోయింది. పురాణాలలో ఏ కొంచెం చరిత్ర ఉందనుకున్నా; మతపరమైన కథలు, పరిభాష, కల్పనలు వాటిలో విపరీతంగా పేరుకుపోవడం వల్లా ,లేఖకుల నిర్లక్ష్యం వల్లా  అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. వీటికి భిన్నంగా సుమేరియాకు చెందిన క్యూనీఫామ్ పత్రాలు ప్రత్యేకించి ఆయా దేశాలలోని సామాజిక పరిస్థితులతో సహా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి.

పై వాక్యాలను చూసినప్పుడు నాకు వెంటనే మహాభారతంలోని ఒక ముచ్చట గుర్తొస్తోంది. పాండవులు జూదంలో రాజ్యం కోల్పోయి వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వారిని చూడడానికి వెడతాడు. జూద సమయంలో తను ద్వారకలో లేననీ, ఆనర్తదేశంలో సాళ్వుడితో యుద్ధం చేస్తున్నాననీ, ఒకవేళ తనే ద్వారకలో ఉండి ఉంటే, దుర్యోధనుడు పిలవకపోయినా హస్తినాపురం వచ్చి జూదం ఆపించేవాడిననీ ధర్మరాజుతో అంటాడు. మహాభారత కథ నిజంగా జరిగిందా అన్న చర్చను అలా ఉంచితే, కృష్ణుడి ఈ మాటల్లో నాకు అరుదైన చరిత్రస్పర్శ తోచి ప్రాణం లేచొచ్చింది.

తీరా మహాభారతవ్యాఖ్యాత నీలకంఠాచార్యులు ఆ మాటలకు ఇచ్చిన వివరణ చూడగానే నీరుగారి పోయాను. దానికి ఆయన తాత్వికమైన అర్థం చెప్పి ఆ చరిత్రస్పర్శను కాస్తా తుడిచిపెట్టేశారు. ఆయన ప్రకారం, ఇక్కడ ద్వారక అంటే నవద్వారాలు కలిగిన దేహమనే నగరం. అంటున్నది ధర్మరాజుతో కనుక అది అతని దేహనగరం అన్నమాట. తను ద్వారకలో లేడంటే అర్థం, జూదమాడే సమయంలో ధర్మరాజు తనను తలచుకోలేదనీ, తలచుకుని ఉంటే వచ్చి జూదం ఆపించేవాడిననీ కృష్ణుడు చెబుతున్నాడు!

వ్యావహారిక కాలమానాన్ని అనుసరించే చరిత్ర మనకు లేకపోవడం, అది మనకు అలవాటులేని ఔపోసన కావడం; అయినా సరే మాకు చాలా చరిత్ర ఉందని చెప్పుకోవలసి రావడం మనల్ని చాలా గంద్రగోళం లోకీ, ఒక్కోసారి హాస్యాస్పద పరిస్థితులలోకీ నెడుతోంది. మరోవైపు మనది అన్నింటికంటే కూడా అతి పురాతన నాగరికత అని చెప్పుకునే అవకాశాన్నీ చరిత్ర లేమి ఇచ్చింది. అలాగే, మానవ కాలమానానికి లొంగకుండా  దివ్యకాలమానాన్ని అనుసరించే చరిత్రనే అసలు చరిత్రగా చెప్పుకోడానికీ దారి తీయించింది. దానికి మళ్ళీ మన జాతీయతా భావన, ఆత్మగౌరవం లాంటివి కూడా జతపడి దానినో భావోద్వేగ విషయంగానూ, రాజకీయ అంశంగానూ మార్చి వేశాయి.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే, పురా ప్రపంచంలో మన ఉనికి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రధానంగా ఇతర పురాతన నాగరికతలకు చెందిన ఆకరా(సోర్సులు)లే గతవుతున్నాయి. అవి ఒక్కోసారి మన గురించి మనం కల్పించుకున్న ఊహల్ని తలకిందులు చేసేలానూ ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే, మన దగ్గర ఉన్న అనేక మతవిశ్వాసాలు, ఆరాధనాపద్ధతులు, సాంస్కృతిక ధోరణులు వాస్తవానికి సమీపప్రాచ్యం(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు)నుంచి వ్యాపించినవని ఆధునిక పురాచరిత్రకారుల నిర్ధారణ. ఆ క్రమంలో అవి క్రీటులోకీ  ప్రసరించాయి.

దాని గురించి తర్వాత…

 

 

 

 

 

గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ప్రపంచ పురాచరిత్రలోకి వెడుతున్న కొద్దీ మత, తాత్విక, సాంస్కృతికరంగాలలో భారతీయ ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి మనం కల్పించుకునే ఊహలు మంచు బిందువుల్లా కరిగిపోయే మాట నిజమే.  అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు, సమాచార వినిమయ సదుపాయాలు లేని కాలంలో కూడా దాదాపు ప్రపంచం అంతా ఒకే రకమైన విశ్వాసాలను, తంతులను, తాత్వికతను పంచుకున్న తీరు ఆశ్చర్యచకితం చేసి, మన ఆలోచనావైశాల్యాన్ని అనేకరెట్లు పెంచుతుంది. మనకు పురాప్రపంచాన్ని వినూత్నంగా పరిచయం చేస్తుంది.

సుమేరు పురాణకథ ప్రకారం, మొదట అర్థనారీశ్వరులుగానూ, ‘అంకి’ అనే పర్వతరూపంలోనూ ఒకటిగా ఉన్న స్త్రీపురుషులను ‘ఎన్ లిల్’ అనే కొడుకు విడదీశాడని చెప్పుకున్నాం. బైబిల్ కథలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.  మొదట ఈవ్ కూడా ఆడమ్ లో భాగంగా ఉంది. అంటే అర్థనారీశ్వర రూపమన్నమాట. అప్పుడు యెహోవా ఆడమ్ నుంచి ఈవ్ ను వేరు చేశాడు.  వారు వేరు పడగానే సృష్టి ప్రారంభమైంది. ఈవ్ నిషిద్ధఫలాన్ని తినడం దీనికి నాంది. బైబిల్ పూర్తిగా సెమెటిక్ పితృస్వామిక పురాణం కనుక అందులో ఆడమ్ అనే పురుషుని నుంచే ఈవ్ అనే స్త్రీ పుట్టింది. మన పురాణకథలు మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య రాజీకీ, సమన్వయానికీ చెందినవి కనుక మొదట జగజ్జననే పురుషుణ్ణి సృష్టిస్తుంది. ఆ పురుషుడు మిగతా సృష్టి నంతటినీ చేస్తాడు.

అంకి, ఆడమ్ ల గురించిన పై వివరాలు వెంటనే మన పురాణకథను ఒకదానిని గుర్తుచేస్తాయి. అది, కుమారస్వామి పుట్టుక.  ‘కుమారసంభవం’ పేరుతో సంస్కృతంలో కాళిదాసు, తెలుగులో నన్నెచోడుడు ఈ కథను గొప్ప కావ్యాలుగా మలిచారు. శివపార్వతులు కూడా అర్థనారీశ్వరులు. పార్వతికి మరో రూపం సతీదేవి. ఆమె దక్షయజ్ఞ సందర్భంలో యోగాగ్నిని కల్పించుకుని అందులో ఆహుతవుతుంది. దాంతో శివుడు విరక్తుడై తపస్సులో మునుగుతాడు. సతీదేవి హిమవంతుడి కూతురుగా జన్మించి పార్వతి పేరుతో పెరుగుతుంది.  అంతలో, తారకుడనే రాక్షసుడి బాధలు పడలేకపోతున్న దేవతలు, శివపార్వతులకు జన్మించే కుమారుడే అతన్ని చంపగలడు కనుక వారిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. తపస్సులో ఉన్న శివుడిపై మన్మథుని ప్రయోగిస్తారు. శివుడు మూడో కన్ను తెరిచేసరికి మన్మథుడు బూడిదవుతాడు. అతని అర్థాంగి రతీదేవి శోకిస్తుంది. ఈలోపల అక్కడ పార్వతి కూడా శివుని పెళ్లాడడం కోసం తపస్సు ప్రారంభిస్తుంది. చివరికి శివుడు మెత్తబడతాడు. పార్వతి తపస్సు ఫలించి, శివపార్వతుల పెళ్లి జరుగుతుంది. మన్మథుడు మళ్ళీ పుడతాడు. కుమారుడు జన్మిస్తాడు.

ఈ కుమారసంభవ కథ కేవలం ఒక భారతీయ పురాణ ’కథ’ను మాత్రమే చెబుతోందనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, అది ప్రపంచమంతటా ఉన్న ఒకానొక ఆదిమ తాత్వికతను, దానిని అంటిపెట్టుకుని ఉన్న ఒక తంతును చెబుతోంది. అది కూడా వ్యవసాయసంస్కృతితో గాఢంగా అల్లుకున్న తంతు. సర్ జేమ్స్ ఫ్రేజర్ తన Golden Bough లో ఇందుకు సంబంధించి విస్తారంగా దండగుచ్చిన వివరాలన్నింటిలోకీ ఇప్పుడు వెళ్లలేం కానీ, ఒకటి చూద్దాం:

సుమేరుల మహాదేవుడు దుముజీ; ఇతర చోట్ల తమ్మూజ్, అడోనిస్, డయోనిసస్ అనే దేవుళ్లూ శివునికి ప్రతిరూపాలని చెప్పుకున్నాం. బాబిలోనియా, సిరియాలకు చెందిన సెమెటిక్ ప్రజలు అడోనిస్ ను పూజించేవారు. సెమెటిక్ భాషల్లో అడోన్ అంటే ప్రభువు అని అర్థం. ఆ దేవుని అసలు పేరు తమ్మూజ్. ప్రాచీన గ్రీకులు ఈ సెమెటిక్ దేవుడినే తాము కూడా పూజించడం ప్రారంభించి ‘ప్రభువు’ అనే ఆయన బిరుదునే అసలు పేరుగా మార్చుకున్నారు. బాబిలోనియా పురాణాలలో జగజ్జనని అయిన ఇష్టార్ కు తమ్మూజ్ ప్రియుడు, భర్త. ప్రకృతిలోని పునరుత్పాదక శక్తులకు ప్రతీక ఇష్టార్. అలా ఉండగా, తమ్మూజ్ ఏటా మరణించి అధోలోకానికి వెళ్ళిపోతాడు. అది దుమ్ము, ధూళీ నిండిన ఓ చీకటి గుయ్యారం. దాంతో ఇష్టార్ శోకంలో మునిగిపోయి ప్రియుణ్ణి వెతుకుతూ అధోలోకానికి వెడుతుంది.

ఆమె కనుమరుగవడంతో మనుషులు, పశువులన్న తేడా లేకుండా ప్రతిజీవిలోనూ పునరుత్పాదనకు అవసరమైన పరస్పర వాంఛ అంతరించిపోతుంది. ఫలితంగా సృష్టి స్తంభించిపోతుంది.  ఇష్టార్ అధోలోకంలో ఉన్నట్టు ‘ఈ’ అనే(మన బ్రహ్మదేవుడి లాంటివాడు)దేవదేవుడు తెలుసుకుని ఆమెను పైలోకానికి రప్పించడానికి వార్తాహరుని పంపిస్తాడు. అల్లతు లేదా ఎర్ష్-కిగల్ అనే రాణి అధోలోకాన్ని ఏలుతూ ఉంటుంది.  జీవజలంతో తమ్మూజ్ ను బతికించి ఇష్టార్ తనతో తీసుకువెళ్లడానికి రాణి అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ఇష్టార్ ప్రియుని వెంటబెట్టుకుని సంతోషంగా పైలోకానికి తిరిగివస్తుంది. ఇష్టార్ రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందుతుంది. స్త్రీపురుషులలో తిరిగి వలపులూ, మోహాలూ విజృంభిస్తాయి. సృష్టి యథావిధిగా సాగుతుంది.

తమ్మూజ్ మరణాన్ని సంకేతించే విషాదపూరితమైన తంతును ఏటా వేసవి మధ్యలో జరుపుతారు. ఆ సందర్భంలో స్త్రీ, పురుషులందరూ శోకాలు పెడతారు. బాబిలోనియా పురాణాలలో ఇలాంటి శోకగీతాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ సందర్భంలో తమ్మూజ్ బొమ్మను చేసి, దానిని నీటితో శుద్ధి చేసి, తైలంతో అభిషేకించి, ఎర్రని వస్త్రం చుట్టబెట్టి, దాని ముందు ధూపం వెలిగిస్తారు. ఒక ప్రస్తావన ప్రకారం, జెరూసలెం ఆలయం ఉత్తరద్వారం దగ్గర స్త్రీలు తమ్మూజ్ కోసం శోకాలు పెట్టేవారు.  తమ్మూజ్ మరణం వాడిపోయే మొక్కలకు ప్రతీక. ఆవిధంగా ఇది వ్యవసాయసంబంధమైన తంతు. తమ్మూజ్  బతికి ఇష్టార్ వెంట పైలోకానికి రావడం; వారి రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందడం పంటలకు, మొక్కలకు అనుకూలమైన పరిణామానికి సూచన. ఆవిధంగా అది సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం కూడా. అప్పుడిక జరగవలసిన తంతు, కళ్యాణం.

పై కుమారసంభవం కథకు, ఇష్టార్-తమ్మూజ్ ల కథకు మధ్య కొన్ని తేడాలు ఉన్నా పోలికలూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. కుమారసంభవం కథలో శివపార్వతులు, రతీమన్మథులు అనే రెండు జంటలు ఉంటే; ఇష్టార్-తమ్మూజ్ ల కథలో ఒక్క జంటే ఉంది.  తమ్మూజ్ ను వెతుక్కుంటూ ఇష్టార్ వెళ్లిపోవడంతో జీవుల్లో లైంగికేచ్ఛ అంతరించి పునరుత్పత్తి ఆగిపోయినట్టు సూటిగా ఉంటే, కుమారసంభవంలో సూచ్యంగా ఉంది. తారకాసురుణ్ణి చంపగల కొడుకును కనడం కోసమే అయినా, మొత్తం మీద దేవతల ప్రయత్నం శివునిలో శృంగారభావన రేకెత్తించి పార్వతిని పెళ్లాడేలా చూసి సృష్టికార్యానికి ఉన్ముఖణ్ణి చేయడమే. మొదట ఆ ప్రయత్నం బెడిసికొట్టి, అక్కడ తమ్మూజ్ మరణించినట్టే ఇక్కడ మన్మథుడు బూడిదయ్యాడు. అంటే, సృష్టి స్తంభించే ప్రమాదం తలెత్తిందన్నమాట. ఇక్కడ మన్మథుని మరణానికి రతీదేవి శోకించినట్టే, తమ్మూజ్ కోసం ఇష్టార్ శోకించింది.  తమ్మూజ్ ను ఇష్టార్ కోరుకున్నట్టే పార్వతి శివుని కోరి తపస్సు ప్రారంభించింది. చివరికి శివుడు మెత్తబడి పార్వతిని పెళ్లాడడానికి అంగీకరించాడు. దాని పర్యవసానంగా మన్మథుడు మళ్ళీ పుట్టాడు. ఈవిధంగా మన్మథుడు ఓడి గెలిస్తే, శివుడు గెలిచి ఓడాడు.

అక్కడ తమ్మూజ్ తిరిగి పుట్టడం, ఇష్టార్ తో కలసి పై లోకానికి రావడం ప్రకృతి పునరుజ్జీవనానికి సంకేతమైనట్టే; ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, మన్మథుని పునరుజ్జీవనం ప్రకృతి పునరుజ్జీవనానికి సూచనలు. ఇందులో జరిగింది ఏమిటంటే, వ్యవసాయ సంబంధమైన ఒక తంతుతోనూ, తాత్వికతతోనూ ముడిపడిన ఒక ఆదిమ పురాణ కథ పునాది మీదే శివపార్వతుల కళ్యాణమూ-కుమారస్వామి పుట్టుకా అనే కథను నిర్మించడం! అదలా ఉంచితే, కుమారస్వామి పార్వతికి పుట్టలేదని చెప్పే కథ కూడా ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళడం లేదు.

వ్యవసాయ సంబంధమంటే, భౌతిక వాస్తవికతతోనూ, ప్రయోజనంతోనూ ముడిపడినదన్నమాట. క్రమంగా ఆ భౌతికమైన పునాది నేలలో కప్పడిపోయి పై నిర్మాణం మాత్రం మిగిలింది. ఆ నిర్మాణం మీద మళ్ళీ రకరకాల తాత్విక భాష్యాలు అవతరించాయి. అవి భౌతికమైన పునాదితో ఎలాంటి సంబంధం లేని భాష్యాలు. ఇక కావ్యప్రియులకు ‘కుమార సంభవం’ అనగానే రసం, అలంకారం మొదలైన కావ్యసామగ్రి అంతా అమరిన ఒక గొప్ప కావ్యం మాత్రమే  గుర్తొస్తుంది.

ఇప్పుడొకసారి రాంభట్లగారిని పలకరించడం సందర్భోచితంగా ఉంటుంది. ఆదిమకాలంలో రసాలంకారా లనేవి మనిషి మనుగడనుంచి, అంటే భౌతికవాస్తవికత నుంచి ఎలా అవతరించాయో ఆయన(జనకథ)చాలా ఆసక్తికరంగా వివరిస్తారు. ఎలాగంటే, గణదశలో గుంపు మనువులు ఉండేవి. మనువుకు అర్హమైన గణంలోని ప్రతి మగవాడూ ‘గణపతి’. ప్రతి మగువా గణపత్ని. గణపతులలో శృంగార సామర్థ్యం కలిగిన ఒకరిని ప్రధాన గణపతిగా ఎన్నుకునేవారు. గణకన్యలు అతనిని పూలతో అలంకరించేవారు. తలపై శృంగ(కొమ్ము) కిరీటం పెట్టేవారు. ఈ ‘శృంగం’ అనే మాటనుంచే అలంకరించడం అనే అర్థంలో ‘శృంగారం’, ఆపైన రసరాజమైన శృంగారరసం పుట్టాయి. కొమ్ములు దర్పానికి, అంటే మగటిమికి చిహ్నాలు. మన్మథుడికి కందర్పుడనే పేరు ఉంది. దర్పకలీలకు శృంగారమని పేరు. గణపతికి గణకన్యలు జరిపే అలంకారం నుంచే ఇప్పుడు గుళ్లల్లో జరిపే నిత్య వార మాసాద్యలంకారాలు పుట్టాయని రాంభట్ల అంటారు.

BH-7-ISHTAR-&-TAMMUZ

ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. ‘అవమానించడం’ అనే అర్థంలో ‘శృంగభంగం’ అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. ఈ మూడూ మూల రసాలని రాంభట్ల అంటారు.

ఇప్పుడు వీటి పుట్టుకకుగల భౌతిక నేపథ్యాన్ని చూద్దాం.

మోర్గాన్ పురాచరిత్రను శావేజీ, బర్బర అనే రెండు దశాలుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క దశలో మూడు అంతర్దశలు ఉంటాయి. శావేజీ మహాదశ ముగిసి, బర్బర ప్రథమదశలోకి అడుగుపెట్టే నాటికి జనం స్థిరనివాసానికి అలవాటుపడి గ్రామాలు ఏర్పరచుకున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని ప్రారంభించేముందు పెరటిసాగు, కంచె పశుపాలన చేపట్టారు. గ్రామాలలో ప్రతి గణానికీ నివేశనస్థలంతోపాటు శ్మశానం కూడా ఉండేది. పురాతత్వ ఆధారాలను బట్టి మొదట్లో మృతదేహాలను పాతిపెట్టేవారు. దహనం చేయడం ఆ తర్వాత వచ్చింది.

గణ మానవుడికి ఇద్దరు తల్లులు. అతను ఒక తల్లి గర్భం నుంచి పుడతాడు. చనిపోయిన తర్వాత ఖననం చేస్తారు కనుక, మరో తల్లి గర్భంలోకి చేరతాడు. భూమి కూడా తల్లే. అందుకే భూమాత అంటాం. గణపతికి ‘ఇద్దరు తల్లులు కలిగినవాడా’(ద్వైమాతుర గణాధిపా) అన్న సంబోధన ప్రసిద్ధమే. ఇది జనన మరణ చక్రం. పుట్టుకకు ముందు శృంగారం, చావుకు తర్వాత కరుణ. ఇదీ ఆ రెండు రసాల పుట్టుక క్రమం. ఇవి రెండూ హాస్యం ద్వారా వ్యక్తమవుతాయని రాంభట్ల అంటారు.

దీనిని వ్యవసాయానికి అన్వయించండి. విత్తనాలను భూమిలో పాతి పెట్టడం చావుకు సూచన. కనుక అది శోకించవలసిన సందర్భం. అయితే అది నిజ శోకం కాదు, కల్లశోకం, లేదా భావశోకం. అది హాస్యం ద్వారా వ్యక్తమవుతుంది. అంటే, అది హాస్యకరుణ. మరణించి తల్లి గర్భం చేరిన విత్తనాలు తిరిగి ఆ తల్లి గర్భం నుంచే పుట్టాలి. అంటే వెంటనే శృంగార చర్యలు మొదలవాలన్నమాట. అది కూడా కల్ల శృంగారం లేదా భావశృంగారం. అదీ హాస్యం ద్వారానే వ్యక్తమవుతుంది కనుక హాస్యశృంగారం.

ఈవిధంగా కరుణశృంగారాల ప్రదర్శన నాడు గణాల మనుగడతో నేరుగా ముడిపడింది. ఎందుకంటే, పాతిపెట్టిన విత్తనాలు మొలకలై తిరిగి పుడతాయి. ఒక విత్తనం నుంచి వంద విత్తనాలు ఆవిర్భవిస్తాయి. ఈ ఎరుక ఆనాటి జనం చేత ఆనందతాండవం చేయించిందని రాంభట్ల అంటారు. ఇలా ఒక భౌతికచర్యతో ముడిపడి, ఒక ప్రయోజనం కోసం అనుకరణ, లేదా అభినయ రూపంలో పుట్టి, హాస్యం ద్వారా వ్యక్తమైనవే కరుణశృంగారాలు. అవే ఆ తర్వాత కావ్యరసాలుగా మారాయి.

ఈ కరుణ శృంగారాల అభినయమే ఆయా పంటల పండుగలకూ మూలమైంది. గణపతి విత్తనాలకు ప్రతిరూపమయ్యాడు. ఖననం స్థానంలో దహనం మొదలైనప్పుడు ఈ పండుగల్లో కామదహనమూ చేరింది. మనం హోలీ పేరుతో జరుపుకునేది అదే. కామదహనమప్పుడు బూడిద ఎత్తిపోసుకోవడం, రంగులు, నీళ్ళు చల్లుకోవడం శృంగార హాస్య కరుణాభినయాలలో ప్రధానాంశమయ్యాయి.

ఈ కామదహనం మన దగ్గరే కాక, యూరప్, మధ్యాసియాలలో కూడా ఉంది. యూరప్ లో ‘కార్నివాల్’ పేరుతో దీనిని జరుపుతారు. కార్నివాల్ అంటే పంటల పండుగ. కేవలం ఖననం చేయడమే ఆనవాయితీగా ఉన్న సెమెటిక్ జనంలో కరుణాభినయం మాత్రమే చేసే పండుగలు ఉన్నాయి. శృంగారం వారి సామాజిక నీతికి విరుద్ధం. ఇలా ప్రపంచమంతటా జరిగే ఈ పంటల పండుగల గురించి జేమ్స్ ఫ్రేజర్ విస్తారమైన సమాచారం ఇచ్చారు. అది భారతీయ విలక్షణత, విశిష్టత, ప్రత్యేకతల గురించి మనం కల్పించుకునే ఊహల్ని పటాపంచలు చేయడమే కాదు; ప్రపంచ మతసాంస్కృతిక రేఖాపటంలో మనల్ని భాగస్వామిని చేస్తుంది.

ఇలా చూసినప్పుడు కుమారసంభవకథకు  ఏ ఆదిమ భౌతికవాస్తవికత మూలమో అర్థమవుతుంది. అది కేవలం కు’మారు’ని పుట్టుక గురించి మాత్రమే కాక, ‘మారు’ని పుట్టుక గురించి కూడా చెబుతోంది. మారుడంటే మన్మథుడు. బహుశా ఇష్టార్-తమ్మూజ్ కథలో లానే ఇందులో కూడా మన్మథుడు మరణించడం, రతీదేవి శోకించడం, మన్మథుడు మళ్ళీ పుట్టడమే మూల కథ అయుంటుంది. ఆ మూల కథను అలా ఉంచుతూనే దాని మీద శివపార్వతుల కథను నిర్మించి, దానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే, మూలకథలో మన్మథుడితోపాటే ప్రకృతి పునరుజ్జీవనం పొందడం ప్రధానం కాగా; దానిని అప్రధానం చేసి, తారకాసురుణ్ణి చంపడం కోసం శివపార్వతులకు కుమారస్వామి పుట్టడాన్ని ప్రధానం చేసి ఉండచ్చు. భౌతికమూలాలనుంచి పురాణకథలను తప్పించి భావాంబరవీథిలో వాటిని ఎలా విహరింపజేశారో గ్రహించడానికి ఇదొక నిదర్శనమూ కావచ్చు.

***

మొదట అద్వైతస్థితిలో ఒకటిగా ఉండి; ఆ తర్వాత కొడుకు పుట్టడంతో ఇద్దరుగా విడిపోయిన స్త్రీ పురుషులను మళ్ళీ ఒకటి చేసే ప్రక్రియే ఏటా దేవీ దేవతలకు జరిపే కళ్యాణమని క్యాంప్ బెల్ అంటారు. ఈ అద్వైతస్థితిని, అర్థనారీశ్వర మూర్తిని పునర్నిర్మించడం రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిది, ధ్యానం ద్వారా భావన చేయడం. రెండవది, సౌభాగ్యవర్ధనంతో ముడిపడిన మాంత్రిక చర్యల ద్వారా ప్రకృతిని పునరుజ్జీవింప జేయడం. మరోవైపు కంటికి, బుద్ధికి రెండు(ద్వైతం)గా కనిపిస్తున్నా; ఒక అంతరవులో లేదా విధానంలో ఆదిమ అద్వైతస్థితినీ గుర్తించడం లేదా భావన చేయడం జరుగుతూనే ఉంటుంది.

ఇది ద్వైత-అద్వైతాల మధ్య నిరంతర ఘర్షణ. ఇదే పురాతన కంచుయుగానికి చెందిన తాత్వికత. నటరాజులోనూ, సుమేరు మట్టిపలక మీదా కనిపించేది ఇదే ననీ, తూర్పుదేశాలలో ఇది ఇప్పటికీ అస్తిత్వంలో ఉందనీ, దీని మూలాలు క్రీటు నాగరికతలో ఉన్నట్టు కనిపిస్తుందనీ క్యాంప్ బెల్ అంటారు.

దాని గురించి తర్వాత…

 

 

 

 

సుమేరులోనూ ఉన్నాడు శివుడు!

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చెప్పబోయే విషయం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నదే కానీ, మరోసారి గుర్తుచేసుకోవలసిన అవసరం వచ్చింది…

ఏదైనా ఒక రచనను– ఇద్దరో ముగ్గురో కలసి రాసినట్టు ప్రత్యేకంగా చెప్పకపోతే– ఒక్కరు రాసింది(ఏకకర్తృకం)గానే  అనుకుంటాం. నిజానికి ఏ రచనైనా అనేకమంది రాసినదే(బహుకర్తృకం) అవుతుంది కానీ, ఏకకర్తృకం కాదు.  ఆ అనేకమంది మరెవరో కాదు; పాఠకులే! ఆ పాఠకులలో మళ్ళీ వేర్వేరు అభిరుచులు, అవగాహన భేదాలు ఉన్నవాళ్ళు ఉంటారు. కనుక ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత దృష్టిలో కేవలం ఆ రచనావస్తువు మాత్రమే ఉండదు. వేర్వేరు అభిరుచులూ, అవగాహన భేదాలూ ఉన్న పాఠకులు కూడా ఉంటారు. తెరముందుకు వచ్చి రాస్తున్నది రచయితే అయినా, తెరవెనుక ఉండి ఆ రచన ఎలా ఉండాలో, తమకు ఎలా అందాలో నిర్దేశించేది ఈ వైవిధ్యం కలిగిన పాఠకులే. అందుకే రచయిత తన రచన ఎవరిని ఎలా తాకుతోందో నిరంతరం పరిశీలించుకుంటూనే ఉంటాడు. వారిని చేరేందుకు వీలైన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు అప్రయత్నంగా రచించుకుంటూనే ఉంటాడు. రచనలో అవి కూడా భాగమవుతాయి.

ఆ మాటకొస్తే జీవితంలో కానీ, రచనా జీవితంలో కానీ ప్రతిదీ ఒక వ్యూహాన్ని అనుసరించే వెడుతుంది. అసలు రచన అంటేనే ఒక వ్యూహం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం, లేదా సంభాషణ ఎప్పుడు ప్రారంభమవుతుందో  అప్పుడే వ్యూహం అడుగుపెడుతుంది. ఇక్కడ వ్యూహం అనే మాటను తటస్థార్థంలోనే తీసుకోవాలి తప్ప వ్యతిరేకార్థంలో కాదు.

ఈ బహుకర్తృత్వ సూత్రం సినిమా, నాటకం లాంటి దృశ్యరచనలకూ వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ పాఠకుల స్థానంలో ప్రేక్షకులు వస్తారు. ఇదే మౌఖిక వాఙ్మయంలోనూ, నాటకం వంటి దృశ్య కళా రూపాలలోనూ అయితే శ్రోతలు, లేదా ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఉండి కథకునీ, నటునీ, ఒక్కోసారి వస్తువునూ ప్రభావితం చేస్తారు. లిఖిత వాఙ్మయంలోనూ, సినిమా వంటి ఆధునిక దృశ్యకళారూపాలలోనూ పాఠకులు, ప్రేక్షకులు పరోక్షంగా ప్రభావితం చేస్తారు. అంతే తేడా!

తన రచన ఏయే పాఠకులను ఎలా తాకుతుందో, లేదా తాకాలని తను అనుకుంటున్నాడో చెప్పుకున్న కవి నాకు ఇప్పటికిప్పుడు ఒక్కరే గుర్తుకొస్తున్నారు. ఆయన, నన్నయభట్టు. పాఠకులను మూడు రకాలుగా వర్గీకరించుకుని ఆ మూడు రకాలవారినీ సంతృప్తి పరచేలా తన రచన ఉంటుందని, లేదా ఉండాలని ఆయన అనుకున్నారు. అంటే ‘వ్యూహ’ రచన ముందే చేసుకున్నారన్న మాట. ఆయన వర్గీకరణ ప్రకారం, కవీంద్రులు మొదటి రకం. వీరు తన రచనలోని ప్రసన్నకథతో కూడిన అర్థయుక్తిని లోతుగా చూసి మెచ్చుకుంటారు.  కవీంద్రులు కాకపోయినా శ్రావ్యతను ఆనందించేవారు రెండవ రకం. వీరు తన అక్షరరమ్యతను ఆదరిస్తారు. కవీంద్రులూ, శ్రావ్యతను ఆనందించేవారూ కాని ఇతరులు మూడవ రకం. చక్కని అర్థవంతమైన తన సూక్తులను వీరు ఇష్టపడతారు.

***

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికంటే, 21 వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభమై, అక్కడినుంచి ఓడిసస్ కథకు, ఆ తర్వాత అమ్మ తాత్వికతకు మళ్లిన ఈ వ్యాసాలు ఒక  పెద్ద గొలుసుకట్టు తంతుగా సాగిపోతున్నాయి. ఇది ఎక్కడ తెగుతుందో ఈ క్షణాన నాకు కూడా తెలియదు. అదలా ఉంచితే, ఈ వ్యాసపరంపర రాను రాను మరీ తాత్విక విషయాల్లోకి జారిపోవడమూ మీరు చూస్తూనే ఉన్నారు. దానికితోడు ఇంకా ‘అమ్మ తాత్వికత’ చుట్టూనే ఈ వ్యాసాలు తిరుగుతున్నాయి. ఇక్కడనుంచి  ‘అయ్య తాత్వికత’ లోకి వెళ్ళడం నా ప్రణాళిక. తీరా వెళ్ళిన తర్వాత అందులోంచి కూడా ఎప్పటికి పైకి తేలగలనో తెలియని పరిస్థితి. దాంతో ఇప్పుడు నేను కూడా పనిగట్టుకుని నన్నయభట్టులా పాఠకులను వర్గీకరించుకుని,  వీలైనంత ఎక్కువమందితో అనుసంధానం(connect) అవుతానో, లేదో చూసుకోవలసిన అగత్యంలో పడ్డాను(అంతటి వ్యక్తితో నన్ను పోల్చుకుంటున్నానని చటుక్కున అపార్థం చేసుకోవద్దు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితితో మాత్రమే ఈ పోలిక).

తాత్విక విషయాల మీద అందరికీ రుచి ఉండదని నాకు తెలుసు. ఎవరివరకో ఎందుకు, నాకు కూడా నేల విడిచి సాము చేసే శుద్ధతాత్వికత మీద గొప్ప రుచి ఉందని చెప్పలేను. నావరకు అది రుచికరం కావాలంటే, చరిత్ర అనే తాలింఫును జోడించాల్సిందే. అప్పటికీ తాత్విక విషయాలు పడని పాఠకులు ఉండిపోతారనుకుంటే బహుశా చరిత్రాంశాలు వారికి రుచి కలిగించవచ్చు. పోనీ అదీ కాదనుకుంటే మన పురాణకథలు, దేవీ దేవతలు, ప్రతీకలతో; ఇతర పురాణ కథలకు, దేవీ దేవతలకు, ప్రతీకలకు ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు ఆకట్టుకోవచ్చు. ఇలా పాఠకులను ఇంకా అనేక రకాలుగా వర్గీకరించుకునే అవకాశం ఉంది కానీ, దానిని మీ ఊహకే వదిలేసి ప్రస్తుతానికి ఒక ఆశ్చర్యకరమైన పోలికలోకి వెడతాను.

ఇంతకుముందు ఒక వ్యాసంలో ‘జంటగొడ్డలి చెప్పే జగజ్జనని తత్వం’ గురించి చెప్పుకున్నాం. జంటగొడ్డలి కాకపోయినా, గొడ్డలి ప్రస్తావన లలితాసహస్రనామాలలో రెండు చోట్ల వస్తుంది. ఒకచోట అమ్మవారు ‘భవారణ్య కుఠారిక’. అంటే, సంసారమనే అరణ్యానికి గొడ్డలి. ఇంకోచోట ‘మృత్యుదారు కుఠారిక’. అంటే, మృత్యువు అనే చెట్టుకు గొడ్డలి. ఈ గొడ్డలి  కాకతాళీయంగా చేసిన ఆలంకారిక ప్రయోగం కావడానికి ఎంత అవకాశం ఉందో, ‘జంట గొడ్డలి’ని సూచించే ప్రతీక కావడానికీ అంతే అవకాశం ఉంది. ఎలాగో ముందు ముందు స్పష్టం కావచ్చేమో చూద్దాం.

 ‘జంట గొడ్డలి’ క్రీటు(మినోవన్)మతానికి చెందిన ప్రతీకలలో ఒకటి. అలాగే స్తంభమూ, ఎద్దు కొమ్ములూ కూడా. క్రీటు మతంలో సర్పం, పావురం వగైరాలతో పాటు వృషభం కూడా ముఖ్యమైన జంతువు. పంది లానే వృషభం కూడా పురుషుడిలోని పునరుత్పాదక శక్తికి ప్రతీక. పశువుల మందకు ప్రభువుగా దానిని పశుపతి అని కూడా అనచ్చు.  మనదేశంతో సహా వివిధ పశుపాలక, వ్యవసాయ సమాజాలలో నేటికీ ఎద్దును, ఆవును పూజించడం ఉంది.  యూరప్ కు చెందిన నూతన శిలాయుగ అవశేషాలలో వృషభ మూర్తులు కనిపించడం, అక్కడ కూడా వృషభ ఆరాధన ఉండేదనడానికి సూచన.

ఇక స్తంభం పవిత్ర వృక్షానికి సంకేతం. ఆదిమ సమాజాలలో వంటచెరుకు కోసం గొడ్డలితో చెట్లు నరకడం స్త్రీలే చేసేవారనీ, ఆవిధంగా గొడ్డలికి పవిత్రత వచ్చి ఉండచ్చనీ జార్జి థాంప్సన్ అంటారు. నిజానికి అన్న ఉత్పాదనకు ఉపయోగించే ప్రతి సాధనమూ పవిత్రమే. చెట్లను కూల్చుతుంది కనుక గొడ్డలికి పిడుగుపాటుతో పోలిక కుదిరి, వర్షానికి సంబంధించిన మాంత్రిక చర్యలలో భాగమైంది. ఆ తర్వాత గొడ్డలి యుద్ధసాధనం అయింది. మనకు బాగా తెలిసిన పరశురాముడి ఆయుధం గొడ్డలి.  పరశురాముని పోలిన పాత్ర గ్రీకు పురాణాలలోనూ ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్లలేం. ‘పరశువు’ అంటే గొడ్డలి.  అది జంతువును బలి ఇవ్వడానికి ఉపయోగించే సాధనం కూడా. క్రీటు మతంలో బలి ఇచ్చే జంతువులలో ముఖ్యమైనది వృషభం. పవిత్ర వృషభ రక్తంతో స్పర్శ వల్ల గొడ్డలికి పవిత్రత సిద్ధించి దాని శక్తి మరింత పెరిగింది.

క్రీటు అమ్మవారి సేవలలో ప్రధానంగా పాల్గొనేది స్త్రీలే, అంటే పూజారిణులు. వీరికి సహకరించడమే పురుషులు చేయవలసిన పని. ఈ పూజారిణులు కొన్ని తంతులలో నృత్యం చేస్తారు. మైసీనియాలో దొరికిన ఒక బంగారు ఉంగరంపై ఉన్న చిత్రంలో ఒక పూజారిణి నృత్యం చేస్తుంటే, ఇంకొక పూజారిణి ఒక పీఠం మీద తలవాల్చి శోకిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఒక పురుష సేవకుడు వంగి ఒక చెట్టు ఫలాన్ని తెంపుతూ ఉంటాడు. సరే, మన పురాణాలలో శివుడు నటరాజు.

ఇప్పుడు మనం ఒకసారి క్రీ.పూ. 2500 నాటి సుమేరుకు వెడదాం. ఫిలడెల్ఫియా లోని యూనివర్సిటీ మ్యూజియంలో ఆ కాలానికి చెందిన ఒక మట్టిపలక ఉంది. దాని మీద ఒక చిత్రం ఉంది. దాని పేరు, Moon-Bull and Lion-Bird. అందులో మానవ ముఖం కలిగిన ఒక వృషభమూ, దానిని చంపుతున్న సింహముఖం కలిగిన ఒక గరుడపక్షీ కనిపిస్తాయి. అయినాసరే, వృషభ ముఖంలో ఒకవిధమైన ప్రశాంతతా, ఆనందమూ ఉట్టిపడుతూ ఉంటాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology) వివరణ ప్రకారం, చంద్ర సంబంధి అయిన వృషభం, చంద్రుడిలానే జనన మరణ చక్రానికి ప్రతీక. దానిని చంపుతున్న గరుడపక్షి సూర్య(సౌర) సంబంధి. ఆ వృషభం నాలుగు కాళ్లనుంచీ దివ్యశక్తి మెరుపులు జాలువారుతూ ఉంటాయి. దాని మానవ ముఖానికి నలుచదరపు ఆకారంలో గడ్డం ఉంటుంది. అది ప్రాచీన సుమేరు, ఈజిప్టులకు చెందిన చిత్రశైలిని సూచిస్తుంది. సర్పమూ, వృషభమూ లాంటి దేవతా సంబంధులకు ఇలాంటి గడ్డమే ఉంటుంది. భూమిలో విత్తనాలు నాటడానికి ఇది ప్రతీక.

ఈ వృషభం ముంగాలు ఒకటి ఒక గుట్ట మీద ఆని ఉంటుంది. ఈ గుట్ట పవిత్ర విశ్వపర్వత శిఖరానికీ, భూదేవి దేహానికీ ప్రతీక. కింది భాగంలో కొమ్ములు లాంటివి కనిపిస్తున్నాయి. అవి క్రీటుకు చెందిన పవిత్ర శృంగాలను పోలి ఉన్నాయి. వృషభదేవునికీ, భూదేవికీ మధ్య అనుసంధానం కలిగిస్తున్నవి ఈ కొమ్ములే. ఆ కొమ్ముల మధ్యలో వృషభం కాలు ఒకటి చొప్పించబడి ఉంది. రెండు కొమ్ముల మధ్య ఆ కాలు ఒక త్రిశూలాకారాన్ని కల్పిస్తోంది. వృద్ధి క్షయాలకు ప్రతీక అయిన ఈ వృషభచంద్రుడి నుంచే, చంద్రుడి నుంచి కురుస్తున్నట్టుగా, జీవుల పునరుత్థానానికి అవసరమైన మంచు, వాన కురుస్తున్నట్టు ఈ చిత్రం సూచిస్తుంది. మంచు, వాన అనేవి భూగర్భాన్ని ఫలవంతం చేసే వీర్యాలు.

క్యాంప్ బెల్ ప్రత్యేకించి చెప్పకపోయినా, సింహముఖం కలిగి, సూర్య సంబంధి అయిన గరుడపక్షి వృషభాన్ని కబళించడమంటే జీవిని కాలం కబళించడమే. మన పురాణాల ప్రకారం కూడా కాలానికి సూర్యుడే కారకుడు. కాలంలోనే చావు, పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి. ‘కాలుడు’ అనే పేరు కూడా కలిగిన యముడు సూర్యుని కొడుకే.

sun lion

మళ్ళీ క్యాంప్ బెల్ వివరణకు వెడితే, భూమి అడుగున నీరు ఉంది. క్రీటు-మైసీనియాకు చెందిన దేవుడు పోసెడియన్. అతని వాహనం వృషభం. అతను త్రిశూలం ధరిస్తాడు. సముద్రాలు, ఊటబావులు, పాతాళ జలాలు అతని నివాసాలు. అలాగే, భారతీయ దేవుడు శివుడి వాహనం కూడా వృషభమే. ఆయన చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. ఆయన అర్థాంగి పార్వతి పేరు పర్వత పుత్రిక అని సూచిస్తుంది. ఆమె వాహనం సింహం. శివుడు పార్వతితో కలసి కైలాసపర్వతం మీద ఉంటాడు. ఆయన ప్రధానంగా లింగరూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆయన పాతాళ జలాల నుంచి పైకి వచ్చే లింగమైతే, భూమి యోని.

శివుడు నటరాజు కూడా. ఆయన తన కుడి పాదాన్ని అజ్ఞానమనే మరుగుజ్జు మీద ఉంచి అణగదొక్కుతూ ఉంటాడు. ఎడమకాలిని కుడికాలికి అడ్డంగా పైకి ఎత్తుతాడు. కుడిపాదంతో జీవసృష్టికి అవసరమైన తన సృష్టిశక్తిని అందిస్తున్నాడనీ, ఎడమపాదంతో జీవులను జన్మ నుంచి విముక్తుల్ని చేస్తున్నాడనీ ఈ భంగిమ సూచిస్తుంది, ఆవిధంగా నటరాజమూర్తి జననమరణ చక్రానికి ప్రతీక. పై సుమేరు చిత్రంలోని వృషభం తన ముందు కాళ్లను చాపిన తీరు కూడా ఆ భంగిమనే సూచిస్తోంది.

నటరాజు గురించి మరికొన్ని వివరాలు చెప్పుకునే ముందు, ఇంకొకటి చూద్దాం. సుమేరు పట్టణమైన ఊర్(ఊరు)లోని రాచసమాధులలో షుబ్-అద్ అనే రాణిని సమాధి చేసిన చోట వెండితో చేసిన గోముఖం ఒకటి కనిపించింది. ఆమె భర్త అ-బర్-గి సమాధిలో బంగారు వృషభ ముఖం దొరికింది. దానికి కూడా నలుచదరపు గడ్డం ఉంది. దానిని చిన్న వీణమీద తాపడం చేశారు. ఈ వీణ వృషభచంద్రుని ఆహ్వానించే గీతికి ప్రతీక. అలాగే, తన ప్రియుడైన భర్తతో కలసి మృత్యులోకానికి రమ్మని రాణిని ఆహ్వానించడానికి కూడా ప్రతీక. రాణి తన పరివారంతో కలసి భర్తతో సహగమనం చేసినట్టు ఈ మొత్తం వివరాలు సూచిస్తాయని క్యాంప్ బెల్ అంటారు.

nataraju

మెసపొటేమియాకు చెందిన వేరొక ఉదంతం వృషభాన్ని ఎలా బలి ఇచ్చేవారో చెబుతుంది. ఢంకా, లేదా డమరుకాన్ని వృషభచర్మంతో తయారు చేస్తారు. ఇది వృషభం ప్రాముఖ్యాన్నే కాక, పురా ప్రపంచం తాలూకు తంతులలో కళా రూపాలకు, వాద్యాలకు గల ప్రాధాన్యాన్ని కూడా సూచిస్తుంది. ఒక దేవాలయంలో కొత్త డమరుకాన్ని తయారు చేసుకోవలసి వచ్చింది. అందుకు ముందుగా చేయవలసింది ఒక వృషభాన్ని బలి ఇవ్వడం. బలికి అన్ని వృషభాలూ పనికిరావు. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఉదాహరణకు, దానికి సంపూర్ణంగా రూపొందిన కొమ్ములు, మూపురం ఉండాలి. అది నల్లటిదై ఉండాలి. ఒంటి మీద ఎటువంటి గాయాల గుర్తులూ ఉండకూడదు.

నేలమీద దర్భలు పరచి వృషభాన్ని వాటి మీద ఉంచుతారు. మేక వెంట్రుకలతో పేనిన తాళ్ళతో దాని కాళ్ళు కట్టేస్తారు. వృషభ బలికి ముందు ఒక గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత వృషభం నోటిని నీటితో శుద్ధి చేసి దర్భలు పట్టుకుని దాని చెవిలో గుసగుసగా మంత్రాలు చదువుతారు.  తర్వాత దానిని దేవదారు చెట్టునుంచి స్రవించే జిగురు లాంటి ద్రవంతో సంప్రోక్షిస్తారు. ఆ తర్వాత నిప్పుల పాత్రతో, కొరకంచుతో ప్రతీకాత్మకంగా వృషభాన్ని మంత్రపూతం చేస్తారు. ఆ తర్వాత వృషభం చుట్టూ పిండితో ముగ్గు పెట్టి కత్తితో దానిని వధిస్తారు. గుండెను వేరు చేసి, దానిని పాత డమరుకం ముందు ఉంచి, ఒక ప్రత్యేక తరహాకు చెందిన పిండితో కలిపి దేవదారు, సైప్రెస్ కలపతో దగ్ధం చేస్తారు. దాని ఎడమ భుజం నుంచి స్నాయువులను(ఎముకతో కండరాన్ని అతికే తంతులు) తొలగించి, చర్మాన్ని ఒలిచి, మిగతా కళేబరాన్ని పశ్చిమ ముఖంగా ఉంచి సమాధి చేస్తారు. చర్మాన్ని ఒలవడానికి కూడా కొన్ని కచ్చితమైన నిర్దేశాలూ, పద్ధతులూ ఉంటాయి. ఆ చర్మాన్ని కొత్త డమరుకం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ బలి ఇచ్చే ప్రక్రియ అచ్చంగా మన వైదికమైన తంతును గుర్తు చేయడమే కాక, ఆదిమ సమాజాలలో ప్రతి చిన్న కర్మకూ (ఇక్కడ కొత్త డమరుకం చేయడానికి అవసరమైన ఎద్దు చర్మం కోసం) ముందు ఎంత పెద్ద తంతు జరిపేవారో కూడా చెబుతోంది.

ఇప్పుడు క్యాంప్ బెల్ వివరణలోకి మరోసారి వెడితే…

వృషభచంద్రుడు విశ్వంలోని లయ(rhythm)కు కర్త. అతని గీతికి అనుగుణంగా జీవులన్నీ జననమరణాల వలయంగా ఏర్పడి నృత్యం చేస్తూ ఉంటాయి. డమరుక ధ్వనులు, ఆలయంలోని ఇతర వాద్యధ్వనులు అందులో భాగమే. గరుడపక్షి కబళిస్తున్న వృషభం ముఖంలో కనిపించే ప్రశాంతత మరణానంతర జ్ఞానానికీ, కాలాతీత జ్ఞానానికీ సూచన. వృషభ మరణం నిజానికి మరణం కాదు. అది భూమిపైన జీవులకు సంజీవిని. అది పైకెత్తిన ముంగాలూ, క్రీటు పౌరాణిక చిహ్నమైన ఎడమ కొమ్మూ దీనినే సూచిస్తాయి. ఈ చిహ్నం భూమ్యాకాశాలకు; అంటే దేవీ, దేవుళ్ళ కలయికకు కూడా ప్రతీక. వీరు రెండుగా కనిపించినా, ఒక్కరే. అంటే, అర్థనారీశ్వరం. రెండుగా కనిపించడం ద్వైతం. ఒకరుగా కనిపించడం అద్వైతం.

ప్రాచీన సుమేరు పురాణ కథలో ‘అన్’ అంటే స్వర్గం. ‘కి’ అంటే భూమి. దానినే స్త్రీ పురుషులకు అన్వయిస్తే, స్వర్గం పురుషుడు. భూమి స్త్రీ. వీరు మొదట అవిభాజ్యంగా ‘అంకి’ అనే పర్వతరూపంలో ఉన్నారు. ఆ తర్వాత ‘ఎన్ లిల్’ అనే కొడుకు పుట్టి వీరిని రెండుగా విడదీశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పుకుని మిగతా వివరాలలోకి తర్వాత వెడదాం. అదేమిటంటే, ఈ సుమేరు ‘అంకి’ నుంచే ‘ఎంకి’, ‘వెంకి’, ‘వెంకటేశ్వరుడు’ అవతరించాడని రాంభట్ల అంటారు.

అదలా ఉంచితే, సుమేరు మట్టిపలక మీది వృషభంలో కనిపించే లక్షణాలే నటరాజులోనూ కనిపిస్తాయి. ఆయన ఒకచేతిలో డమరుకం పట్టుకుంటాడు. డమరుక ధ్వని కాలానికి సంకేతం. అది సృష్టిని సంకేతించే ధ్వని కూడా. ఇంకొక చేతిలో అగ్ని ఉంటుంది. అది మృత్యుంజయత్వాన్ని సూచించే జ్ఞానాగ్ని. అది జీవికి కాలంతో ఉండే ముడిని దహిస్తుంది. వృషభం తన నాలుగు కాళ్లనుంచి జ్వాలలు విరజిమ్ముతున్నట్టే, శివుడు కూడా విరజిమ్ముతుంటాడు. తన జటాజూటంలో మృత్యుసూచిక అయిన కపాలాన్ని, చావు పుట్టుకల సంకేతమైన చంద్రవంకను ఆభరణాలుగా ధరిస్తాడు. శివుడు పశుపతి. అలాగే సుమేరు మహాదేవుడైన దుముజి, ఇతర చోట్ల ఆయన ప్రతి రూపాలైన తమ్ముజ్, అడోనిస్ లు కూడా పశుపతులే. శివుడికి నందిలానే వీరి జంతువు కూడా వృషభమే. గ్రీకుదేవుడు డయోనిసస్ కూడా శివుడిలానే నటరాజు. వధిస్తున్న సింహమూ, వధింపబడుతున్న వృషభమూ కూడా ఆయన రూపాలే.

మన శివుడి ప్రతిరూపాలు, శివతత్వం దాదాపు ప్రపంచవ్యాప్తమని ఈ వివరాలు చెబుతున్నాయి.

మిగతా విశేషాలు తర్వాత….

 

 

 

 

గ్రీకు అమ్మవారు కూడా ‘కదంబ ప్రియే’!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మవారి స్తుతులలో ‘లలితా సహస్రనామాలు’ సుప్రసిద్ధాలు. అవి భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని వెల్లడించే అమ్మవారి తాత్వికతను చెబుతున్నాయని నాకు అనిపిస్తుంది.  వాటిలో అమ్మవారి ఆరాధనకు చెందిన చంద్రుడు, సర్పము మొదలైన ప్రతీకలు కూడా విస్తారంగా కనిపిస్తాయి. వాటిలోకి వెళ్ళకుండా ఇప్పుడు ఒక్క అంశానికి మాత్రమే పరిమితమవుతాను. అదేమిటంటే…

లలితా సహస్రనామాలలో పూవులు, వనాల ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. కొన్ని చెప్పాలంటే, అమ్మవారి కురులు చంపకా(సంపెంగ పూలు)లతోనూ, అశోకాలతోనూ, పున్నాగ పువ్వులతోనూ, సౌగంధికాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆమె మహాపద్మాల వనంలో ఉంటుంది. కదంబ(పొన్న)వనంలోనూ ఉంటుంది. కదంబ పూల గుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. కదంబ కుసుమాలే కాక; చాంపేయ (నాగకేసరి), పాటలీ(కలిగొట్టు) కుసుమాలు కూడా ఆమెకు  ప్రియమైనవి. ఆమె దానిమ్మ పువ్వు కాంతితో ఉంటుంది. పువ్వులు ఆమె బాణాలు…

ఈ ఆహ్లాదకరమైన పూల నేపథ్యం నుంచి ఒకసారి జార్జి థాంప్సన్ వైపు తొంగిచూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనకు మన లలితా సహస్రనామాలతో పరిచయం ఉందని చెప్పలేం. ఆయన తనకు బాగా తెలిసిన గ్రీకు అమ్మవార్ల గురించి చెప్పుకుంటూ వచ్చారు. విచిత్రంగా ఆ వివరాలు మన అమ్మవారి గురించే చెబుతున్నట్టు అనిపిస్తాయి. గ్రీకు అమ్మవార్లలో మన అమ్మవారి పోలికలు కనిపిస్తాయి.

ఆయన The Making of a Goddess అనే అధ్యాయంలో, Herbal Magic అనే ఉపశీర్షిక కింద, గ్రీకు దేవతా సమూహంలోని అధికారిక దేవతలైన అమ్మవార్ల ఆరాధనలో అంతర్లీనంగా ఉన్న ఆదిమ మాంత్రికతను చర్చిస్తారు. మొక్కలు, మూలికలు, పువ్వులకు(herbal)చెందిన మాంత్రికతపై ప్రతి చోటా స్త్రీలదే అధికారమని ఆయన అంటూ, వాలెంగే తెగ మహిళలపై అధ్యయనం జరిపిన మిస్ ఎర్తీ మాటల్ని ఉదహరిస్తారు:

“దాదాపు అన్ని చెట్లు, మొక్కలు మాంత్రిక విలువ ఉన్నవే. నేను ఎప్పుడైనా వృక్షజాతులను సేకరిస్తుంటే వాళ్ళలో ఒక్కసారిగా కుతూహలం రేగేది. మొక్కలంటే మాంత్రికతకు, మందులకు సంబంధించినవే నన్న భావన వాళ్ళలో జీర్ణించుకుపోవడమే అందుకు కారణం” అని ఆమె అంటారు.

ఈ సందర్భంలో థాంప్సన్ ఇంకొక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ప్రాచీన గ్రీకు వృక్షజాతుల గురించి డయోస్కరైడ్స్, ప్లినీ విస్తారమైన సమాచారం ఇచ్చారనీ, అయితే, గ్రీకు మతాన్ని అధ్యయనం చేసేవారు వాటిపై తగినంత దృష్టి పెట్టరని  ఆయన అంటారు. ఆదిమ కాలంలో మతపరమైన తంతులకూ, ప్రకృతి రూపంలోని భౌతికవాస్తవికతకూ ఉన్న పీటముడి ఆ తర్వాత తెగిపోయి; మతమూ, భౌతికవాస్తవికతా వేర్వేరు అయిపోయిన ఫలితమే ఇదని నాకు అనిపిస్తోంది. మన దగ్గర కూడా అదే జరిగింది. మన పౌరాణికులు, పండితులు కూడా మతాన్ని భౌతికవాస్తవికతనుంచి వీలైనంత దూరంగా తీసుకువెడతారు.

గ్రీకులకు చెందిన పూల రకాలలో ‘పియోని’(peony) అనే పువ్వు ఉంది. అది ఎర్రగా, మనకు తెలిసిన గులాబీ పువ్వులా ఉంటుంది. ఆ పువ్వు తొడిమెలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు.  దానిని ఋతుస్రావమప్పుడూ, పురిటి సమయంలోనూ ఉపయోగిస్తారు. ఈ ఔషధ గుణాలు చంద్రుని నుంచే సంక్రమించాయనే భావనతో ఈ పువ్వును ‘మెన్యన్’(menion) లేదా ‘సెలెనోగొనన్’(selenogonon) అని కూడా పిలుస్తారు. ‘మెన్’ అంటే చంద్రుడు. ‘సెలెనే’ అంటే చంద్రదేవత.

అలాగే, ‘డిక్తామ్నోస్’(diktamnos) అనే ఒక తరహా కూరాకును ప్రసవసమయంలో ఉపయోగిస్తారు. ఆ కూరాకులను దండగా గుచ్చి, ప్రసవదేవత అయిన ఎయిలీతియా(Eileithiia) మెడలో వేస్తారు. విశేషమేమిటంటే, కదంబం లేదా పొన్న(ఇక్కడ థాంప్సన్ ఉపయోగించిన myrtle అనే మాటకు కదంబమని, పొన్న అనీ నిఘంటువు అర్థం ఇచ్చింది) మన అమ్మవారికి ఎంత ప్రియమైనదో గ్రీకు అమ్మవారు అఫ్రోడైట్ కు కూడా అంతే ప్రియమైనది. ఇది గర్భాశయాన్ని మూసి ఉంచి నెలలు నిండకుండా ప్రసవం జరిగే అవకాశాన్ని నివారిస్తుంది. అలాగే కలువపువ్వు కూడా అఫ్రోడైట్ కు ప్రియమైనది. ఇది ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని నమ్మకం. దృఢంగానూ, వంచడానికి వీలుగానూ ఉండే ఒక తీగ జాతి(withy)కి చెందిన ‘లిగోస్’(lygos) కూడా ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని భావిస్తారు.

కదంబం

స్పార్టా లో అర్తెమిస్ అనే అమ్మవారిని ‘లిగోడెస్మా’ (Lygodesma) అని పిలుస్తారు. ఈ దేవత మూర్తి లిగోస్ తీగల మీద వెలియడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ తీగలతో చేసిన దండను దేవత మెడలో వేస్తారు.  సామోస్ అనే ప్రాంతానికి చెందిన హేరా అనే దేవత కూడా తన వనం లోని ఇలాంటి ఒక తీగ చెట్టు కిందే అవతరించింది. ప్రసవ సమయంలో గర్భం తెరచుకోవడం కష్టమైనప్పుడు ఒక రకమైన దుంప(galingale)తో కషాయం చేసి తాగిస్తారు. ఋతుస్రావంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక జాతికి చెందిన పసుపురంగు పువ్వుల(helichryse)ను ఉపయోగిస్తారు. స్పార్టాలోని అమ్మాయిలు ఈ పూలతో కిరీటం చేసి హేరాకు అలంకరిస్తారు. “తల్లీ! నీకు పసుపు పూల దండనూ, గలింగలే దండను సమర్పించుకుంటున్నాను. నన్ను కరుణించు” అని అమ్మాయిలు దేవతను ప్రార్థిస్తారు. హేరా, అర్తెమిస్, అఫ్రోడైట్లను గ్రీకులు ప్రసవదేవతలుగా కొలిచేవారు.

ప్రాచీన గ్రీకులకు బాగా తెలిసిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. డిమీటర్ అనే దేవత, చేతిలో గసగసాల (లేదా నల్లమందు) గుత్తినో, దానిమ్మ పండునో పట్టుకుని కనిపిస్తుంది. ఒక్కోసారి రెండూ పట్టుకుని ఉంటుంది. ఏథెన్స్ లో విజయచిహ్నంగా నిలబెట్టిన ఎథెనా అనే దేవత కుడి చేతిలో శిరస్త్రాణాన్ని, ఎడమ చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది. ఒలింపియాలో మిలన్ అనే ఒక అథ్లెట్ విగ్రహం దానిమ్మ పండును పట్టుకుని కనిపిస్తుంది. ఈ అథ్లెట్ హేరా అనే దేవతకు పూజారిణి. అర్గోస్ అనే చోట హేరా విగ్రహం ఒక చేతిలో రాజదండాన్ని, ఇంకో చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది,  “దానిమ్మ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఎందుకంటే, దానికి సంబంధించిన కథ ఓ రహ  స్యం” అని, పౌసానియా(క్రీ. శ. 110-180) అనే గ్రీకు యాత్రికుడూ, భౌగోళిక నిపుణుడూ అనడాన్ని ఈ సందర్భంలో థాంప్సన్ ప్రస్తావిస్తారు.

ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే, దానిమ్మ పండు ఎర్రటి రంగులో ఉంటుంది. అలాగే దాని గింజలు కూడా.  వాటిని గ్రీకు భాషలో ‘కొక్కోస్’(kokkos) అంటారు. దానిమ్మ పండు రక్తాన్ని సంకేతిస్తుంది. అది హింసాత్మక, లేదా బలవన్మరణానికి కూడా సంకేతం. టైటాన్ల చేతిలో మరణించిన డయోనిసస్ రక్తం నుంచి దానిమ్మ మొలకెత్తిందనే భావన గ్రీకు పురాణాలలో కనిపిస్తుంది. దానిమ్మ కలలో కనిపిస్తే గాయాల పాలవుతారనే నమ్మకం ఉండేది. అయితే ఇలాంటివి రెండో పక్షం. ప్రధానంగా దానిమ్మ రంగు ఒకరిని చంపినప్పుడో, గాయపరచినప్పుడో కారే రక్తానికి సూచన కాదు. అది ఋతురక్తానికి, పురిటి రక్తానికి సూచన. దానిమ్మను ఋతుస్రావమప్పుడు, ప్రసవమప్పుడు ఔషధంగా వాడతారు. గసగసాల గుత్తి కూడా సంతానసంబంధమైన ప్రతీకే. అందుకే డిమీటర్ చేతిలో దానిమ్మ, గసగసాల గుత్తి ఉంటాయి.

గ్రీకు అమ్మవార్లకే కాదు, బాబిలోనియా అమ్మవారు ఇష్టార్ కూ దానిమ్మ పండు ప్రియమైనదే. ఆమె దానిమ్మనే కాక యాపిల్ నూ ఇష్టపడుతుంది. ఇష్టార్ ప్రేమదేవత కూడా. స్త్రీ, పురుషులలో లైంగికవాంఛ రేకెత్తించేది ఈ దేవతే. మెసపొటేమియాలో దొరికిన వేలాది మట్టిపిడకలలో ఒకదానిపై ఇష్టార్ ను ఉద్దేశించిన ఒక మంత్రం ఉంది. యాపిల్ నో, దానిమ్మనో చేతిలో ఉంచుకుని మూడు సార్లు ఈ మంత్రాన్ని పఠించి తను ఇష్టపడిన స్త్రీ చేత దానిని కొరికిస్తే ఆమె వెంటనే వశమవుతుందని ఆ మట్టిపిడక మీది రాత చెబుతోంది.

 

డిమీటర్ కు స్త్రీలు కొన్ని రహస్యమైన తంతులు జరుపుతారు. వాటిలో ఒక తంతు పేరు ‘థెస్మొఫోరియా’(Thesmophoria).  ఈ తంతు జరిపే రోజుల్లో స్త్రీలు రాత్రిపూట ఒకరకమైన తీగలతో చేసిన పడక మీద పడుకోవాలి. లైంగికచర్యకు దూరంగా ఉండాలి. దానిమ్మ తినకూడదు. తీగలతో చేసిన పడక మీద పడుకోవడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. మొదటిది, లైంగిక స్పందనలను అది నివారిస్తుంది. రెండోది, పాముల్ని అది దూరంగా ఉంచుతుంది. దానిమ్మపై నిషేధానికి కారణం కూడా, అది లైంగిక ఉద్రేకాన్ని రెచ్చగొడుతుందన్న భావనే.

అమ్మవారికి సంబంధించిన వ్రతాలలో, పూజలలో మనదగ్గర కూడా స్త్రీలకు ఇలాంటి నియమాలు, నిషేధాలు ఉంటాయి కనుకనే వీటి గురించి ఈ ప్రస్తావన.

దానిని అలా ఉంచితే, ‘థెస్మొఫోరియా’లో ఇంకొకటి కూడా జరుగుతుంది. అది, స్త్రీలు పందులను బలి ఇవ్వడం! నిజానికి ఇది పంటల వృద్ధిని ఉద్దేశించిన తంతు. అంటే సౌభాగ్యవర్ధనానికి సంబంధించినదన్నమాట.  అలాంటప్పుడు ఈ తంతు జరిపే స్త్రీలు సౌభాగ్య సంబంధమైన లైంగికత్వానికి దూరంగా ఎందుకు ఉంటారని థాంప్సన్ ప్రశ్నిస్తూ, ఈ ఆదిమ కాలపు తంతులోని అసలు ఉద్దేశాన్ని మరచిపోవడం వల్లనే నంటారు.

ఈ తంతు ఏటా అక్టోబర్ చివరిలో జరుగుతుంది. స్త్రీలు డిమీటర్ కు నివేదించడం కోసం కొన్ని పందుల్ని బలి ఇచ్చి వాటి కళేబరాలను ఒక గుహలో భద్రపరుస్తారు. మూడు రోజుల తర్వాత పాములను తరమడానికి చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళి కుళ్ళుతున్న స్థితిలో ఉన్న పందుల అవశేషాలను తీసుకెళ్లి మరుసటి పంటకు ఉపయోగించే విత్తనాలలో కలుపుతారు. స్త్రీలకు చెందిన కుందేలు, పావురం మొదలైన వాటిలానే పంది కూడా ఎక్కువ సంతానాన్ని కంటుంది. ఆ విధంగా సంతాన వృద్ధికేకాక; మగవాడి పుట్టుకకు, పంటలకు కూడా పంది ప్రతీక. ఇంకా చెప్పాలంటే, థాంప్సన్ ప్రకారం పంది అంతకంటే కూడా ఎక్కువ. అది సాక్షాత్తూ స్త్రీకి ప్రత్యామ్నాయం!

ఎలాగంటే, ఋతు రక్తానికీ, ప్రసవరక్తానికీ పంటలను పోషించే లక్షణం ఉన్నట్టు భావించేవారని చెప్పుకున్నాం. మొదట్లో ఈ రెండు రకాల రక్తాలను రహస్యంగా భద్రపరచి, విత్తనాలలో కలిపేవారు. ఆ తర్వాత వాటి స్థానంలో  పంది రక్తాన్ని వాడడం ప్రారంభించారు. అప్పటినుంచే స్త్రీల లైంగికతకు సంబంధించిన చర్యలు సానుకూల విలువను కోల్పోవడం, వాటిని మైలగానూ, అపవిత్రాలుగానూ చూడడం మొదలైందని థాంప్సన్ వివరణ. లేదా, ఋతురక్తాన్ని, ప్రసవరక్తాన్ని మైలగానూ, అపవిత్రంగానూ చూడడం మొదలైన తర్వాత, వాటికి ప్రత్యామ్నాయంగా పంది రక్తాన్ని వాడుతూ వచ్చారనీ అనుకోవచ్చు.

స్త్రీకి పంది ప్రత్యామ్నాయం కావడం వల్ల స్త్రీపట్ల ఏర్పడిన అపవిత్రతా లేదా ఈసడింపు భావనే పంది మీదకు విస్తరించి అది కూడా నిందార్థకంగా మారిందని థాంప్సన్ అంటారు. విచిత్రంగా మన దగ్గర కూడా ‘పంది’ అనే మాట తిట్టుపదమే. అలాగే,  గ్రీకులో దానిమ్మ గింజలను సూచించే ‘కొక్కోస్’ అనే మాట కూడా అశ్లీలవాచకంగా మారింది. మనకు తెలిసిన కొక్కోకమనే కామశాస్త్రానికీ, ఈ మాటకూ ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియదు.

మన లలితా సహస్రనామాలలో ధాన్యాలు, రకరకాల అన్నాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. అలాగే, డిమీటర్ ప్రధానంగా తృణధాన్యాలకు చెందిన దేవత. అర్తెమిస్ అటవీభూములకు, చిత్తడి నేలలకు, పచ్చిక భూములకు చెందిన దేవత.  అర్తెమిస్ విల్లమ్ములు ధరించి కొండల మీద తిరుగుతూ ఉంటుంది. అడవిలోని అప్సరసలతో కలసి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక కథ ప్రకారం, లెట్రినోయి అనే చోట ‘అర్తెమిస్ అల్ఫియా’ అనే గుడి ఉంది. ఆ పక్కనే  ‘అల్ఫియాస్’ అనే నది ప్రవహిస్తోంది. ఆ నది అర్తెమిస్ ను ప్రేమించింది. అయితే, కన్యాత్వానికి అంకితమైన అర్తెమిస్ తన ప్రేమను అంగీకరించదనుకున్న అల్ఫియాస్, ఆమె అప్సరసలతో కలసి రాత్రంతా జరిగే ఒక జాతరకు వెళ్లినప్పుడు రహస్యంగా ఆమెను సమీపించాలనుకున్నాడు. అర్తెమిస్, ఆమె నేస్తాలు దీనిని పసిగట్టి అతను గుర్తు పట్టకుండా ముఖాలకు బురద పూసుకున్నారు.

పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు నదికి వెళ్ళి అందులోని బురదను ఒంటికి పూసుకోవడం ద్వారా నీటిలోని జీవశక్తిని సంగ్రహించే ఒక రహస్యమైన తంతును ఈ కథ వెల్లడిస్తుందని థాంప్సన్ అంటారు. బురదలో ఔషధగుణాలు ఉంటాయనీ, అల్ఫియాస్ అనే పేరు ఆ గుణాలనే సూచిస్తుందనీ ఆయన వివరణ. అల్ఫియాస్ నదీజలాలు కుష్టు లాంటి చర్మరోగాలను నివారిస్తుందని ప్రాచీన గ్రీకులు అనుకునేవారు. మన దగ్గర కూడా నదీజలాలకు ఇటువంటి ఔషధగుణాలను ఆపాదిస్తాం.

గ్రీకు పల్లె ప్రాంతాలలో ప్రతిచోటా ఊటబావులు, సెలయేళ్లు ఉన్నాయి. వాటిని ‘పార్థేనియా’ లేదా ‘పార్థెనోయిస్’ అని పిలుస్తారు. మతపరమైన ఉత్సవాలకు ముందు కన్యలు వాటిలో స్నానం చేసి పరిశుద్ధులవుతారు. పెళ్ళికి ముందు నదికి తీసుకువెళ్ళో, లేదా నదీజలాలను తెప్పించో వధువుకు స్నానం చేయించే ఆనవాయితీ అక్కడ ఉండేది. మన దగ్గర కూడా పెళ్ళికి ముందు మంగళస్నానం చేయించడం ఉంది.  థాంప్సన్ ప్రకారం, మొదటిసారి ఋతుమతి అయినప్పుడు నదిలో స్నానం చేసి శుద్ధి పొందే ఆచారమే పెళ్లికి విస్తరించింది. అంతేకాదు, పెళ్ళికి ముందు నదిలో స్నానం చేయడంవల్ల ఆమె సంతానయోగ్యం అవుతుందని భావించేవారు. నీటికి జీవం పోసే శక్తి ఉందనీ, నీటివల్లనే స్త్రీ గర్భం ధరిస్తుందనే విశ్వాసం గ్రీసులోనే కాక అనేక దేశాలలో ఉందని ఆయన అంటారు. స్నానానికి ముందు కన్యలు, “ఓ నదీదేవుడా! మా కన్యాత్వాన్ని హరించు” అని ప్రార్థించడమూ గ్రీసులో కొన్ని చోట్ల ఉంది. పెళ్ళికి ముందు నదీస్నానం చేసిన వధువులు ‘అప్సరస’(nymphs)లు అవుతారనీ, నదీ దేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వారికి వీరపుత్రులు కలుగుతారనీ నమ్మేవారు. గ్రీకు భాషలో వధువులను nimphai అంటారు.

సరే, మన పురాణ ఇతిహాసాల నిండా కనిపించే అప్సరసల గురించి చెప్పనే అవసరం లేదు. ‘అప్సు’ అంటే నీరుకనుక, అప్సరసకు, నదికి లేదా నీటికి ఉన్న సంబంధం స్పష్టమే. అదలా ఉంచితే, పై వివరాలు చదువుతున్నప్పుడు; ముఖ్యంగా నదీదేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వీరపుత్రులు కలుగుతారన్నప్పుడు మహాభారతంలోని కుంతికథ, గంగా-శంతనుల కథ చటుక్కున గుర్తొచ్చి ఉండాలి. కుంతి కన్యగా ఉన్నప్పుడే కర్ణుని కని నదిలో విడిచిపెట్టింది. కర్ణుడు వీరపుత్రుడే. అలాగే, గంగ అనే ‘నది’కి శంతనుని వల్ల కలిగిన భీష్ముడు కూడా మహావీరుడే. కాకపోతే, నదిని మనం స్త్రీ రూపంగా భావిస్తే, గ్రీకులు పురుషరూపంలో భావించారు. మెసొపొటేమియాను పాలించిన సారగాన్(క్రీ.పూ. 2350)ను అతని తల్లి రహస్యంగా కని, ఒక బుట్టలో ఉంచి దానిని తారుతో మూసి నదిలో విడిచిపెట్టింది. అతను కూడా వీరుడే. హిబ్రూ మోజెస్ పుట్టుక కూడా ఇలాంటిదే. ఇటువంటి పుట్టుకలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా ఉదంతాలు ఉన్నాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు.

కుంతికి ‘పృథ’ అనే పేరు, అర్జునుడికి ‘పార్థు’డనే పేరు ఉన్నట్టు మనకు తెలుసు. గ్రీసులో కన్యలు స్నానం చేసే ఊటబావులను, సెలెయేళ్లను ‘పార్థేనియా’ అంటారని చెప్పుకున్నాం. ఈ పేర్ల మధ్య సామ్యం కనిపించడం లేదా అని నేను అంటే, “ఇక ఆపండి. మరీ ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నా”రని మీరు అనచ్చు. కనుక ఆపేస్తాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

,

ఆఫ్రికా మహిళలూ కుంకుమ ‘భరిణె’లే!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఆదిమ సమాజాలలో ఋతుస్రావం చుట్టూ అల్లుకున్న ఊహలు, నిషేధాలు, మాంత్రిక చర్యల గురించి రాస్తున్నప్పుడే కాకతాళీయంగా ఒక టీవీ చానెల్ కు చెందిన వెబ్ మేగజైన్ లో ఒక వ్యాసం కనిపించింది. దాని శీర్షిక, ‘Dear Universities, Is Menstruation Unacceptable?’. రచయిత్రి, ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్ గా ఉన్న రుక్మిణీ భయా నాయర్.  

సందర్భం ఏమిటంటే, విద్యార్థినుల పట్ల చూపుతున్న వివక్షను నిరసిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థినులు శానిటరీ నేప్ కిన్స్ మీద వివిధ నినాదాలు రాసి శాంతియుత ప్రదర్శన జరిపారు. ఇది కోల్కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి కూడా పాకింది. శానిటరీ నేప్ కిన్స్ ను ప్రదర్శించడాన్ని రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలూ తప్పు పట్టాయి. జామియా మిలియా అయితే విద్యార్థినులకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. “ఇది సామాజిక ఆమోదం కలిగిన నిరసన మార్గం కాదు. దేనిని ప్రదర్శించవచ్చో, దేనిని ప్రదర్శించకూడదో మీరు తెలుసుకోవాలి” అని జాదవ్ పూర్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ అన్నారు. దానిపై, “దేనికి సామాజిక ఆమోదం లేదు? శానిటరీ నేప్ కిన్స్ కా, ఋతుస్రావానికా, లేక మొత్తం స్త్రీలకేనా?” అని ఒక విద్యార్థిని అడిగింది.

“మా నిరసన కేవలం శానిటరీ నేప్ కీన్స్ ను అధికధరకు అమ్మడం మీదా, క్యాంపస్ లో వాటిని అమ్మే దుకాణాలు లేకపోవడం మీదా కాదు. స్త్రీని న్యూనతతో చూసే ఇటువంటి విషయాల చుట్టూ అల్లుకున్న మౌనాన్ని బద్దలు కొట్టడం కోసం” అని ఇంకో విద్యార్థిని అంది.

దీనిపై అందరు బురోక్రాట్లూ చేస్తున్నట్టే వైస్-ఛాన్సలర్ కూడా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నారని వ్యాసరచయిత్రి అంటారు.

ఋతుస్రావం, ఋతుకాలం, ప్రసవకాలాలకు చెందిన తంతులు, నిషేధాలే తదుపరి తంతులకు, నిషేధాలకు మాతృకలనుకుంటే; ఆదిమ కాలం నుంచి నేటి అత్యాధునిక కాలంవరకూ అవి ఎలా నిరంతరాయంగా కొనసాగుతున్నాయో పై ఉదంతం ఆశ్చర్యకరంగా వెల్లడిస్తోంది. మనం ఆధునికతలోకి వచ్చామన్నది కేవలం భ్రమ మాత్రమే, ఇంకా ఆదిమ కాలంలోనే ఉన్నాం.

ఈ వ్యాసంలోనే, మనం నిషేధం అనే అర్థంలో వాడుతున్న ‘టేబూ’(Taboo) అనే మాట గురించి రచయిత్రి కొంత చర్చ చేశారు. ఇది టోగాన్-పొలినేసియన్ పదమనీ, ఇంగ్లీషు దానినే స్వీకరించిందనీ ఆమె అంటారు. రాంభట్ల గారినే ఉటంకించుకుంటే(జనకథ), ‘తప్పు’ అనే తెలుగు మాటే ‘టేబూ’ అయింది. లేదా ‘టేబూ’ అనే మాటే తెలుగులో ‘తప్పు’ అయిందనుకున్నా అనుకోవచ్చు. న్యూజీలాండ్ లోని మావోరీ తెగవారు సరిగ్గా తెలుగు ‘తప్పు’నే, అదే అర్థంలో వాడతారు. పోలినేసియన్లలో హవాయి దీవుల వాళ్ళు ‘తాపు’ అంటారు. మొత్తం మీద మన తెలుగు ‘తప్పు’ అతి పురాతన పదమే కాక, ఒకవిధంగా ప్రపంచభాషాపదం అన్నమాట.

వైరుధ్యం, అంతకన్నా విచిత్రం ఏమిటంటే; ఈ టేబూ అనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక అంచు ‘పవిత్రత’కు సూచన, ఇంకొక అంచు ‘అపవిత్రత’కు సూచన. ‘Sacra’ అనే రోమన్ మాటకు కూడా ఇలాగే రెండర్థాలున్నాయని కిందటి వ్యాసంలో అనుకున్నాం. అన్ని మతాలూ స్త్రీలను చూసే చూపులో కూడా ఇదే వైరుధ్యం ఉందని పై వ్యాసరచయిత్రి అంటారు. ఒక పక్క స్త్రీలకు అత్యంత గౌరవం ఇస్తామని చెబుతాం, ‘దేవత’గా భావిస్తాం; మరో పక్క ప్రకృతిధర్మంగా ఆమె శరీరంలో సంభవించే మార్పులను అశుభ్రంగానూ, అపవిత్రంగానూ చూస్తాం. స్త్రీ పట్ల ఉన్న ఈ చులకన భావానికీ, ఈసడింపుకు కొనసాగింపే ఆమెపై జరిపే హింస, అత్యాచారాలంటారు వ్యాస రచయిత్రి.

***

అదలా ఉంచితే, మన జ్ఞానశూన్యతకు ఎల్లలు లేవు. నెల నెలా మూడురోజులపాటు బయట చేరడం అనేది మనలోనే, అందులోనూ ఒకటి, రెండు పై కులాలలలోనే ఉందని అనుకుంటాం. కానీ ఇది దాదాపు ప్రపంచమంతటా అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే, మనకు తెలిసినదానికంటే కూడా కర్కశంగా, పట్టువిడుపులు లేనంతగా ఉండేది. కొన్ని చోట్ల మూడు రోజులు కాక, వారం, నెల, చివరికి ఏళ్ల తరబడి ‘బయట’ ఉంచేవారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.

సర్ జేమ్స్ ఫ్రేజర్ ‘The Golden Bough’ లో ఈ ఆచారం ఎక్కడెక్కడ ఉందో విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు. ఋతుమతులైన అమ్మాయిలు నేలను తాకరాదనీ, సూర్యుణ్ణి చూడరాదనే నిషేధం ప్రపంచంలో అనేక చోట్ల ఉందని ఆయన అంటారు. లొవాంగోలోని నల్ల జాతి అమ్మాయిలను ఋతుమతులు కాగానే విడిగా పూరిళ్లలో ఉంచుతారు. వారి శరీరం నేలకు తాకకూడదు. మన దగ్గర కూడా అమ్మాయిలను తాటాకు చాప మీద కూర్చోబెడతారు. దక్షిణాఫ్రికాలోని జులూ, తదితర తెగల్లో అమ్మాయిలు పగలు పని పాటలు చేసుకుంటున్నప్పుడు మొదటిసారి ఋతుసూచనలు కనిపిస్తే వెంటనే నది వైపో, చెరువు వైపో పరుగెత్తి, మగవాళ్ళ కంటబడకుండా పగలంతా పొదల్లో దాక్కుంటారు. తమపై సూర్యకాంతి పడకుండా శరీరాన్ని దుప్పటితో కప్పుకుంటారు. చీకటి పడిన తర్వాతే ఇంటికి వెళ్ళి వేరుగా కూర్చుంటారు. లేక్ న్యాసా అనే ప్రాంతానికి ఉత్తరం కొసన జీవించే అవాన్ కొండే అనే తెగలో అమ్మాయి ఋతుమతి అయినప్పుడు, మరికొందరు అమ్మాయిలతో కలిపి ఒక చీకటి గుయ్యారంలో, కింద అరిటాకులు పరచి కూర్చోబెడతారు.

న్యూ ఐర్లాండ్ లోని అమ్మాయిల పరిస్థితి నమ్మశక్యం కానంత ఘోరంగా ఉంటుంది. అమ్మాయిలను ఒక వయసు రాగానే పాతిక అడుగులు ఎత్తున వెదురుకర్రల మీద నిర్మించిన ఒక ఇంట్లో, ఒక్కో పంజరంలో ఉంచుతారు. ఆ పంజరం భూమిని తాకకుండా నాలుగు అడుగుల ఎత్తున, శంఖం ఆకారంలో ఉంటుంది. వెలుతురు, గాలి కొంచెమైనా చొరడానికి వీలు లేకుండా దగ్గరగా కుట్టిన దట్టమైన ఆకులతో దానిని నిర్మిస్తారు. అందులో కూర్చోడానికి, ముడుచుకుని పడుకోడానికి మాత్రమే చోటు ఉంటుంది. నేల మీద కాలు మోపకుండా, సూర్యరశ్మి సోకకుండా అమ్మాయిలు అలా రోజులు, వారాలు కాదు; ఏకంగా నాలుగైదేళ్లు గడపాలి! అన్నేళ్లూ వాళ్ళు మగపురుగును కూడా చూడడానికి వీల్లేదు. ఆ పంజరాల దగ్గర ఒక వృద్ధస్త్రీ కాపలా ఉంటుంది. కొస మెరుపు ఏమిటంటే, వేరే ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడికి ఈ వింత ఆచారం మీద ఆసక్తి కలిగి ఆ పంజరాలను, అందులోని అమ్మాయిలను చూడాలనుకున్నాడు. తెగ ముఖ్యుని అడిగితే అది కుదరదన్నాడు. అప్పుడా ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిలకు కొన్ని పూసల్ని కానుకగా ఇస్తాననే సరికి మెత్తబడ్డాడు. అతి కష్టం మీద ఆ వృద్ధస్త్రీ ఒప్పుకుని కింద దట్టమైన ఆకులు పరచి ఆ అమ్మాయిలను పంజరాల లోంచి బయటికి రప్పించిందట. అప్పుడా ఉపాధ్యాయుడు పంజరం లోపలికి తొంగి చూసేసరికి లోపల విపరీతమైన వేడిగానూ, ఉక్కపోతగానూ ఉందట. ఈ ఉపాధ్యాయుడే తనకు ఈ వివరాలు చెప్పాడని ఫ్రేజర్ అంటారు.

ఇలాంటి అజ్ఞానానికి అద్దం పట్టే దేశ దేశాల ఉదాహరణలను ఇంకా అనేకం ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు కానీ వాటన్నింటిలోకీ వెళ్లలేం. ఇప్పటి సంగతి ఏమో కానీ నిన్న మొన్నటి వరకూ మనదేశంలో పరిస్థితి ఏమంత భిన్నం కాదు. బాలెంతల విషయమే తీసుకుంటే, వారిని గాలీ, వెలుతురూ చొరని చీకటి కొట్టాలలో ఉంచి పుష్టికరమైన ఆహారం పెట్టకుండా మాడ్చే మూర్ఖత్వాన్ని—నాకు గుర్తున్నంతవరకూ—‘సత్యవతీ చరిత్రము’ అనే రచనలో కందుకూరి వీరేశలింగంగారే వదలగొట్టే ప్రయత్నం చేశారు.  పై ఉదంతంలో పూసల మీద ఆశపడి కట్టుబాటును సడలించినట్టుగా; స్త్రీల చదువూ, ఉద్యోగం, చిన్న కుటుంబాల అవసరం పెరగడంతో చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు కానీ, వెనకటి రోజులే అయితే ఇలాంటి పద్ధతులను మనవాళ్లు ఇప్పటికీ అమలు చేస్తూనే ఉండేవారు.

ఇప్పుడు మళ్ళీ జార్జి థాంప్సన్ దగ్గరికి వస్తే;

ఋతురక్తంలోనూ, ప్రసవరక్తంలోనూ ప్రాణం పోసే గుణం ఉందన్న నమ్మకం ప్రపంచమంతటా ఎంత బలంగా ఉండేదో, వాటి పట్ల భయమూ, వైముఖ్యమూ అంతే బలంగా ఉండేవని ఆయన అంటారు. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీని తాకడమంటే శవాన్ని తాకడంతో సమానం. వారిని కచ్చితంగా దూరంగా ఉంచవలసిందే. ఇటువంటి స్థితిలో ఉన్న స్త్రీని చూస్తే మగవాడు చనిపోతాడని నమ్మేవారు. వారి చెయ్యి కానీ, కాలు కానీ తగిలితే పంటలు మాడిపోతాయనీ, పశువులు అంగవైకల్యం చెందుతాయనీ అనుకునేవారు. బాలెంతను ఉంచిన చోటికి మంత్రసాని తప్ప ఇంకెవ్వరూ వెళ్లకూడదు. ఆ బందిఖానా పూర్తి కాగానే బాలెంత దుస్తులు, దుప్పట్లు, ఆమెకు వండి పెట్టడానికి వాడిన పాత్రలు, బొడ్డు తాడు, మాయ(placenta), రక్తపు మరకలతో సహా అన్నింటినీ జాగ్రత్తగా ధ్వంసం చేయడం, తుడిచిపెట్టడం చేయాలి. లేదా ఎవరూ తాకడానికి అవకాశం లేని చోట పారేయాలి. కొంతమంది రోడ్డు మీదో, నాలుగు రోడ్ల కూడలిలోనో పారేస్తారు. బాటసారులు ఆ మైలను మోసుకుపోతారని అందులో ఉద్దేశం. శుద్ధి స్నానమూ, ఆయా తంతులూ జరిగిన తర్వాతే బాలెంత తిరిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికీ మనదగ్గర ఇంచుమించు ఇలాంటివే జరుగుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

saffrongatherers

మొదటిసారి ఋతుమతి అయినప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు, తంతులు ఉంటాయి. అమ్మాయికి లైంగిక జీవితాన్ని పరిచయం చేయడం కూడా అందులో భాగం. ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలోని బంటూ తెగకు చెందిన  అమ్మాయి తను ఋతుమతి అయ్యే సమయం సమీపించినప్పుడు  పొరుగూరికి చెందిన ఒక వివాహితను పెంపుడు తల్లిగా ఎంచుకుంటుంది. ఆ రోజు రాగానే పెంపుడు తల్లి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి ఆమెతో కలసి శోకాలు పెడుతుంది. ఆ అమ్మాయిని  నెలరోజులు దూరంగా ఉంచుతారు. సాధారణంగా ముగ్గురు, నలుగురు అమ్మాయిలను కలిపి ఒక పూరిపాకలో ఉంచుతారు. ప్రతిరోజూ ఉదయమే వారు నదికో, కాలువకో వెళ్లి స్నానం చేస్తారు. వారి వెంట కొంతమంది మహిళలు అశ్లీలమైన పాటలు పాడుతూ వెడతారు.  మగవాళ్ళు ఎదురు పడకుండా అదిలించడానికి వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. మగవారు కనుక ఆ అమ్మాయిలను చూస్తే అప్పటికప్పుడు అంధులైపోతారని నమ్మకం. ఆ అమ్మాయిలు స్నానం చేసి తడిబట్టలతోనే వణకుతూ తిరిగి రావాల్సిందేకానీ, పొడి బట్టతో తుడుచుకోవడం కానీ, మంట దగ్గర చలి కాచుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. వెంట ఉన్న మహిళలు  అశ్లీలగీతాలు పాడుతూ, వారిని రక రకాలుగా అల్లరి పెడుతూ లైంగిక విషయాలలో శిక్షణ ఇస్తారు. ఋతుస్రావం గురించి మగవాడికి తెలియకూడదని ఆదేశిస్తారు. నెల రోజుల తర్వాత అమ్మాయిలు ఇంటికి చేరుకున్నాక తెగలో అందరికీ సమర్త భోజనం పెడతారు. ఋతుమతి అయినప్పుడు మన దగ్గర కూడా అచ్చంగా ఇలాంటిదే కాకపోయినా, పెద్ద తంతే జరుగుతుంది.

ప్రాచీన గ్రీసులో కూడా పురిటి మైలను, బహిష్టు మైలను కచ్చితంగా పాటించేవారు. ఆ స్థితిలో ఉన్న స్త్రీలు దేవాలయానికి వెళ్లకూడదు. నలుగురిలోకీ రాకూడదు. మన దేశంలో ఇప్పటికీ తగుమాత్రం మడీ, ఆచారం పాటించే కుటుంబాలలో ఇలాంటి నిషేధాలే ఉన్నాయి.

ఇదే సమయంలో, ఋతుస్రావానికీ, ప్రసవరక్తానికీ ప్రాణం పోసే లక్షణం ఉందన్న విశ్వాసం ఎలా వ్యక్తమయ్యేదో చెప్పుకుందాం. ఉత్తర అమెరికాలో మొక్కజొన్న పంటకు చీడ ఆశించినప్పుడు, ఋతుకాలంలో ఉన్న స్త్రీలు రాత్రిపూట నగ్నంగా పొలంలో తిరిగేవారు. ఇదే ఆచారం ఇప్పటికీ యూరప్ రైతాంగంలో ఉందని థాంప్సన్ అంటారు. పంటను విషక్రిములు ఆశించినప్పుడు ఋతుకాలంలో ఉన్న మహిళలు జుట్టు విరబోసుకుని, దుస్తులు పైకెత్తుకుని, చెప్పులు లేకుండా పొలంలో తిరగాలని ప్లినీ అంటాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఋతుకాలంలో ఉన్న స్త్రీలు చెప్పులు లేకుండా మూడుసార్లు పొలం చుట్టూ తిరగాలని డెమోక్రిటస్ అనే మరో పండితుడు అంటాడు. ఋతుకాలంలో స్త్రీలలో ఉండే ప్రాణశక్తి పంటకు అందుతుందని దీనివెనుక ఉద్దేశం. స్త్రీలు ఋతుకాలంలో ఉన్నా లేకపోయినా వారు నగ్నంగా పొలంలో తిరిగితే పంటలను చీడపీడలు అంటవన్న నమ్మకం దక్షిణాఫ్రికాలోని జులూ తెగవారిలో ఉంది.

***

ఇప్పుడిక పసుపు, కుంకుమల గురించి చూద్దాం. ఇవి మనదగ్గర మంగళ ద్రవ్యాలు. పవిత్రతకు సంకేతాలు. స్త్రీల జీవితంలో విడదీయలేని భాగాలు. పసుపు, కుంకుమల చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లకు అంతే ఉండదు. వివాహిత అయిన స్త్రీ పసుపు, కుంకుమలతో జీవించడం, ముత్తైదువగా మరణించడాన్నే గొప్ప వరంగా భావిస్తుంది. తన జీవితానికి అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనుకుంటుంది. పెళ్ళైన అమ్మాయికి పుట్టింటివారు ఇచ్చే తగుమాత్రం ఆస్తిపాస్తులను పసుపు, కుంకుమల కింద ఇచ్చినట్టు చెప్పుకోవడమూ కనిపిస్తుంది. సెంటిమెంటుకు ఇది ఆర్థిక వ్యక్తీకరణ.

అంతేకాదు; పసుపు, కుంకుమలు మన చారిత్రక జ్ఞానశూన్యతకు కూడా గొప్ప వ్యక్తీకరణలే. అవి స్త్రీ జీవితంతో గాఢంగా పెనవేసుకోవడమే కాక; పూజలు, ఇతర శుభకార్యాలలో ముఖ్యమైన సామగ్రి కావడం కేవలం మన మత,సంస్కృతులకే చెందిన విశిష్టతలని అనుకుంటాం. పసుపును అలా ఉంచి, కుంకుమనే తీసుకుంటే ఇదెంత అపోహో అర్థమవుతుంది.

కుంకుమ మంగళ ద్రవ్యం కావడం వెనుక ‘అమంగళ’మైన గతం ఉంది. ఎలాగంటే; ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత గర్భాశయంలో మిగిలిపోయే రక్తం నుంచే పిండం రూపొందుతుందని పురాతన, మధ్యయుగాలకు చెందిన అరిస్టాటిల్, ప్లినీ తదితర నేచురలిస్టులు భావించారని థాంప్సన్ అంటారు. అంటే, అది ప్రాణి పుట్టుకకు కారణమైన రక్తం. ఋతుకాలంలో, ప్రసవ కాలంలో ఉన్న స్త్రీల పట్ల నిషేధాలను అమలు చేయాలంటే; వారు ఆ స్థితిలో ఉన్నట్టు ఇతరులకు తెలియాలి. ఆ అవసరం రీత్యా రక్తాన్నో, లేదా రక్తం రంగులో ఉన్న మరో పదార్థాన్నో నుదుట అలదుకోవడం, ఒంటికి రాసుకోవడం అనే ఆనవాయితీ ప్రారంభమైంది. ఇలా చేయడంలో నిషేధానికి ఉన్న అనుకూల/ప్రతికూల లక్షణాలు రెండూ వ్యక్తమవుతాయని థాంప్సన్ అంటారు. ఎలాగంటే, రక్తధారణ లేదా రక్తం రంగులో ఉండే మరో ద్రవ్యాన్ని ధరించడం అనేవి ఒకవైపు పునరుజ్జీవన శక్తిని సంకేతిస్తూనే, మరోవైపు మైలను, అమంగళతను సంకేతిస్తాయి. ఋతుకాలంలోనో, ప్రసవ కాలంలోనో ఉన్న స్త్రీలు తమ శరీరానికి ఎరుపు రంగు పులుముకోవడం ప్రపంచమంతటా ఉన్న ఆచారం. అది మగవారిని వారినుంచి దూరంగా ఉంచుతూనే, సౌభాగ్యవర్ధనంగానూ ఉంటుంది,

ఈ ఆచారమే క్రమంగా ఇతర నిషేధాలకూ పాకింది. వివాహ సమయాల్లోనూ, వివాహం తర్వాతా వధువు లేదా వివాహిత నుదుట సిందూర ధారణ చేయడం అనేది రెండు సూచనలు చేస్తుందని థాంప్సన్ అంటారు: మొదటిది, ఆమె భర్తకు తప్ప ఇతర మగవాళ్ళకు నిషిద్ధం. రెండోది, ఆమె భర్తకు మాత్రమే సంతానం కంటుంది. ఈ సిందూర ధారణే అలంకరణ ద్రవ్యాలకు మూలం.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కుంకుమ, తిలకం వగైరాల రూపంలో ఎరుపు రంగును శరీరానికి అలదుకోవడం, నుదుట ధరించడం అనేవి కేవలం మన ప్రత్యేకతలు కాక; విశ్వజనీనం కావడం! మన స్త్రీల దగ్గర బొట్టు పెట్టె, కుంకుమ భరిణె ఉన్నట్టుగా, బంటు తెగకు చెందిన వాలెంగే మహిళల దగ్గర జేగురు రంగు పదార్థం కలిగిన కుండ ఉంటుంది. అది వారికి మంగళద్రవ్యం. ఉత్సవసమయాల్లో దానిని ఒంటికి అలదుకుంటారు. పురిటి మైల అయిన తర్వాత తల్లీ, బిడ్డలకు దానినే అలది స్నానం చేయిస్తారు.  మన దగ్గర కూడా ఇలాంటి తంతులే ఉన్నాయి.

ఇంకా వెనక్కి వెడితే, ఎరుపు రంగు పునరుజ్జీవనానికి సంకేతం అన్న భావన పాతరాతి యుగం నుంచీ ఉంది. అది కొత్త రాతి యుగంలోనూ కొనసాగింది. ఎరుపు రంగు అలదిన ఆ కాలపు ఎముకలు తవ్వకాలలో లభించడమే ఇందుకు నిదర్శనం.

తమాషా ఏమిటంటే, మన స్త్రీల జీవితంతో, మతసంస్కృతులతో గాఢంగా అల్లుకుపోయిన ‘కుంకుమ’ సంస్కృత భాషా పదం కానీ, ఇతర ప్రాంతీయ భాషా పదం కానీ కాదు. పండితుల నిర్ధారణ  ప్రకారం అది అన్యదేశ్యం. ఇంకా చెప్పాలంటే, Merriam-Webster నిఘంటువు ప్రకారం, అది సెమెటిక్ మూలం కలిగిన పదం. హిబ్రూలోని ‘కర్కోమ్’ అనే మాటతో తుల్యమైన మాట ఇది. ఈ మాట కుంకుమ పువ్వు(saffron)ను సూచిస్తుంది. కుంకుమపువ్వునే కొన్ని చోట్ల ‘కేసర్’ అంటున్నారు. కుంకుమపువ్వుకు జన్మస్థానాలు గ్రీసు, టర్కీ, పర్షియా తదితర మధ్యధరాతీరప్రాంతాలు.

మరికొన్ని విశేషాలు తర్వాత… 

 

అమ్మ భక్తుడు ఆదిశంకరుడు 

 కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నాకు తత్వశాస్త్రంతో పరిచయం తక్కువ. ఇతరేతర ఆసక్తులది పై చేయి అవడంవల్ల అందులోకి పెద్దగా తలదూర్చే అవకాశం కలగలేదు. కానీ ఈ వ్యాసాల క్రమంలో రేఖామాత్రంగానైనా తత్వశాస్త్ర అంశాలలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తూ వచ్చింది. పరిమిత పుస్తకజ్ఞానానికి  అనుభవజ్ఞానాన్ని జోడించి వీలైనంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా పొరపాట్లు దొర్లే అవకాశాన్ని కాదనలేను. దిద్దుబాటుకు జాగా కల్పించుకుంటూ విషయంలోకి వస్తాను.

మనకిప్పుడు స్థూలంగా రెండురకాల తాత్విక ధోరణులతో పరిచయం ఉంది. సందర్భాన్ని బట్టి వాటిని భౌతిక, భావవాదాలుగానూ; నిరీశ్వర, ఈశ్వరవాదాలుగానూ పిలుచుకుంటున్నాం. సగటు జనంలో ఒక అలవాటు ఉంది.  కాలగతిలో వారు ఎలాంటి గొప్ప నినాదాన్ని అయినా, భావనను అయినా చిలుక పలుకులుగా మార్చివేస్తారు. అవి ఏనుగు మింగిన వెలగ పండులా గుజ్జును కోల్పోయి డొల్లలుగా మారతాయి. ఇదో మానవసహజమైన అలవాటు కనుక తప్పు పట్టడానికి లేదు. తప్పు పట్టి ప్రయోజనమూ లేదు.

అలాగే, నిరీశ్వర, ఈశ్వరవాదాలు కూడా చిలుకపలుకుల్లా మారాయి. ఆ మారడంలో వాటిమధ్య ఉన్న అంతస్సంబంధం   తెగిపోయి అవి రెండూ భిన్నమైన విషయాలుగా పరిణమించాయి. ఒక పోలిక చెప్పాలంటే, మనం రెడీమేడ్ దుకాణానికి వెళ్ళి చొక్కా కొనుక్కోవాలనుకుంటాం.  దుకాణంలో మనకు నచ్చిన రంగులో ఉన్న చొక్కాలు, నచ్చని రంగులో ఉన్న చొక్కాలు ఉంటాయి. ఎంచుకునేటప్పుడు వాటిని వేర్వేరు రంగుల చొక్కాలుగానే చూసి, నచ్చిన రంగులో ఉన్న చొక్కాను కొనుక్కుంటాం. అంతేకానీ, ఆ వేర్వేరు రంగుల చొక్కాలు ఒకే ముడిసరకుతో తయారైనవనీ, వాటిని ఒక దర్జీయే కుట్టి ఉండవచ్చుననే ఊహ రాదు. ఆ క్షణంలో ఆ ఊహ రావాలని కూడా ఆశించలేం. ఒకవేళ ఆ ఊహే కనుక వస్తే, అప్పుడు రంగు చొక్కాల గురించిన మన అవగాహన భిన్నమైన మలుపు తీసుకుంటుంది.

ఇలా రెండు ధోరణుల మధ్య ఉన్న అంతస్సంబందాన్ని తెంచేసి, వాటిని వేర్వేరు రెడీమేడ్ వస్తువులుగా తయారు చేసి సగటు మనిషికి అందించడాన్నే మనం సంప్రదాయం అంటాం. ఆయా కాలాలలో అప్పటి అవసరాలను బట్టి జ్ఞానాన్ని గడ్డకట్టించి, శిలాశాసనాలను తయారు చేయడమే సంప్రదాయం పని.  పై రెండు ధోరణుల అంతస్సంబందాన్ని తెలుసుకోవాలంటే, సంప్రదాయమనే ఇనప తెరలను ఛేదించి లోపలికి తొంగి చూడడమే మార్గం. పురాచరిత్రలోకి వెళ్ళడం కూడా ఆ ఇనపతెరలను ఛేదించే సాధనాలలో ఒకటి.

నేనిప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి గారి ‘సొంతకథ’ నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వాక్యాలను ఉటంకిస్తాను. అవి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయంటే సాంప్రదాయికమైన ఊహను అవి పూర్తిగా తలకిందులు చేసి, షాకిస్తాయి. తీవ్రవివాదాస్పదంగానూ, చర్చనీయంగానూ కనిపిస్తాయి. ఆయన అంటారు:

“నేను నిరీశ్వరవాదిని, భౌతికవాదిని కూడా. ఈ రెండింటినీ ఒకరి నుంచే నేర్చాను. అతడే శంకరాచార్యుడు. అతడి తత్వం నాలుగు మహావాక్యాల్లో ఉందంటారు పెద్దలు. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి… ఇవీ ఆ మహావాక్యాలు. ఆయన వాదం నుంచే నేను మరో మహావాక్య చతుష్టయాన్ని ఎంచుకున్నాను. అవి: ఆవిద్య, భ్రాంతి, మాయ, మిథ్య. చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లేడు. క్రీస్తు శకం ప్రథమ సహస్రాబ్దిలోనే మనకు దేశవిజేతల ద్వారా దేవునితో పరిచయం కలిగింది.”

తను శంకరాచార్యుల నుంచే నిరీశ్వరవాదాన్ని, భౌతికవాదాన్ని నేర్చాననడం; శంకరాచార్యులు ఈశ్వరవాది అన్న  సాంప్రదాయిక ఊహను ఒక్కసారిగా తలకిందులు చేయడమే. అంటే, శంకరాచార్యులను నిరీశ్వరవాది అనీ, భౌతికవాది అనీ అనడమే. ‘చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లే’ డనడం కూడా అలాంటిదే.  ఇవి ఏదో అలవోకగా చెప్పుకుని వదిలేయవలసిన విషయాలు కావని తెలిసిపోతూనే ఉంది. నిజానికి చాలాకాలంగా నాలో కుతూహలాన్ని రేపుతున్న రాంభట్లగారి ఈ దృక్కోణం లోకి మరింత తీరుబడిగా, వివరంగా అడుగుపెట్టాలన్న ఉత్సాహం ఈక్షణాన ఉరకలేస్తున్నా;  దానిని మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

ఆయన ఇంకా ఇలా అంటారు:

“శంకరుడు నిర్వచించిన భౌతికవాదం ఏ రూపాన ఉంటుంది? అమ్మ రూపాన ఉంటుంది. లాటిన్లు అమ్మను ‘మాతర్’ అంటారు. ఇంగ్లీషు, జర్మన్ భాషల్లో ‘త’కారం లేదు. అందుకని వారు దాన్ని ‘మేటర్’ అంటారు. ఫారసీ ఆర్యభాషలో కూడా ‘త’కారం లేదు. అందుకని వారు ‘మాదర్’ అంటారు. ఆర్యభాషల్లో ‘మాతర్’ అంటే ‘పదార్థం’ అనే అర్థం ఉంది. అందుకని శంకరుడు దేవుని ‘అవిద్య’ అన్నాడు కానీ, దేవతను అనేకవిధాల స్తుతించాడు. దేవుడు అవిద్య కానీ దేవత  అవిద్య కాదు. అది కంటికి కనిపించే పదార్థం.”

భౌతికవాదాన్నే పదార్థవాదం అంటారని మనకు తెలుసు. దానినే ఇంగ్లీషులో ‘Materialism’ అంటున్నాం. ‘మాతర్, మాదర్, మేటర్, మదర్, సంస్కృతంలో మాతృ’ అనే పేర్లతో పదార్థాన్ని కూడా సంకేతిస్తున్న అమ్మవారినే శంకరాచార్యులు అనేకవిధాలుగా స్తుతిస్తున్నారు కనుక, ఆయన భౌతికవాది లేదా పదార్థవాది అని సారాంశం. అంటే, భౌతికవాస్తవికతపైనే మాంత్రిక వాస్తవికతను, తద్వారా దైవభావనను ఆపాదిస్తూ రెండింటి మధ్యా ఒక అభేదాన్ని స్థాపిస్తున్న ఆదిమపౌరాణికతకు చెందిన అమ్మతాత్వికతనే శంకరాచార్యులు ప్రతిపాదిస్తున్నారు. అమ్మ తాత్వికతలో భౌతిక, భావ వాదాల మధ్య తేడాలేదు. అవి పరస్పర ఆధారితాలు. రాంభట్లగారి అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటే, క్రీస్తుశకం ప్రథమ సహస్రాబ్దిలో దేశవిజేతల ద్వారా మన దేశానికి దేవుని పరిచయం కలిగిన తర్వాత, భౌతిక, భావవాదాలు వేరుపడ్డాయి. అంటే పైన చెప్పుకున్నట్టు వేర్వేరు రంగులు కలిగిన రెండు రెడీమేడ్ చొక్కాలు అయ్యాయి. ఆ రెండింటిలోనూ ఉన్న ముడిసరకు ఒక్కటేననీ, ఆ రెండింటినీ కుట్టిన దర్జీ ఒక్కడే ననీ చెప్పేది ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వం.

భౌతిక, భావవాదాలను గీత గీసినట్టు సంప్రదాయం ఎంత వేర్వేరు విషయాలుగా చెబుతుందంటే; దాని ప్రకారం రావణుడు భౌతికవాది, రాముడు భావవాది. వారు పరస్పర విరుద్ధ శక్తులు. రావణుడిపై రాముడు విజయం సాధించడం భౌతికవాదంపై భావవాదం విజయం సాధించడమే. ఆవిధంగా సంప్రదాయ బలం వల్ల భౌతికవాదం ఒక తిట్టు పదంగానూ, భావవాదం ఉత్తమగుణంగానూ మారాయి. మళ్ళీ సంప్రదాయం రావణుని నిరీశ్వరవాది అనదు. ఆవిధంగా చూసినప్పుడు భౌతికవాది అయిన రావణుడు ఈశ్వరవాది కూడా కనుక ఆదిమ పౌరాణికతకు దగ్గరగా ఉంటాడు. బహుశా అందుకే అతడు రాక్షసుడు అయ్యాడు. సరే, దీనిని ఇక్కడితో ఆపుదాం.

మళ్ళీ రాంభట్లగారిని పలకరిస్తే, ఆయన భౌతిక, భావవాద (లేదా ఆధ్యాత్మికవాద) చర్చను సాహిత్యంలోకి తీసుకొచ్చి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు:

“సామాజిక చైతన్యరూపమైన సాహిత్యం ఎవరు సృష్టించినా అందులో మూడు అంశాలు ఉండి తీరుతాయి. అవి, ఒకటి సౌందర్యం. రెండు వాస్తవికత. మూడు తాత్వికత. ఈ మూడూ పాఠకునికి విజ్ఞానదాయకాలు. అందులో సౌందర్యాంశ చదవాలన్న కోరికను కలిగిస్తుంది. వాస్తవికాంశం విజ్ఞానదాయకం. తాత్వికాంశం వివేకదాయకం. అంటే సాహిత్యం వల్ల ఆనందం, విజ్ఞానం, వివేకం కలుగుతుంది.

సంప్రదాయకవులు విజ్ఞాన, వివేకాంశాలను విస్మరించి కవిత్వలక్షణం ఆనందమొక్కటే అన్నారు. కావ్యంలో వాస్తవికతా, తాత్వికతా ఉన్నా వాటిని సంప్రదాయపండితులు గుర్తించలేకపోయారు. ఆలంకారికుల్లో క్షేమేంద్రుడు మాత్రం విజ్ఞానదాయకమైన వాస్తవికతను గుర్తించాడు. దానికి ఆయన ఔచిత్యం అని పేరుపెట్టాడు…సదృశాన్ని చిత్రిస్తే దాన్ని ఔచిత్యమంటారని క్షేమేంద్ర మతం.  వాస్తవమైనప్పుడే సదృశత్వం అలవడుతుంది. ఔచిత్యాన్నే నేను వాస్తవికత అంటాను.”

visvanatha

ఈ సందర్భంలోనే విశ్వనాథవారి ‘వేయి పడగలు’ నవలపై ఆయన ఇలా అంటారు:

“వాస్తవికత అధిభూతం. దాన్ని అనుసరిస్తే కవి ఆధ్యాత్మిక దృష్టికి విరుద్ధంగా తయారవుతుంది కావ్యం. విశ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగల్లో వాస్తవికతను అనుసరించారు. ఫలితం వేయిపడగలుగా విస్తరిల్లిన సాంప్రదాయిక కథలో ఒక్కొక్క పడగను పోగొట్టుకుని ధర్మారావు రూపంలో ఆఖరి పడగ ఒక్కటే మిగిలింది. అందుకనే ప్రాచీన కవులు వాస్తవికతను దూరంగా ఉంచుతారు. అభూతవర్ణనలతోనే కాలక్షేపం చేస్తారు కానీ వాస్తవికత జోలికి వెళ్ళే సాహసం చేయరు. వాస్తవికత అధిభూతం. వారి ఆధ్యాత్మికతకు విరుద్ధం. ఆ సంగతి పూర్వులకు తెలుసు.”

ఒకరికి నచ్చడం, నచ్చకపోవడం వేరే విషయం కానీ; సాహిత్య పరిశీలనలో ఇవి ఒక తరహా గీటురాళ్ళు. దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, చేతిలో దారాన్ని భద్రంగా పట్టుకుని గాలిపటాన్ని గాల్లోకి ఎగరేయడం భౌతిక, భావవాదాల అభేదాన్ని చెప్పే అమ్మ తాత్వికత. దారాన్ని వదిలేసినప్పుడు, లేదా దానంతట అదే తెగిపోయినప్పుడు గాలిపటం నేలకు పూర్తిగా దూరమైపోయి ఏటెటో కొట్టుకుపోవడం భౌతిక, భావవాదాలను వేర్వేరుగా, పరస్పర విరుద్ధాలుగా చెప్పే తాత్వికత.

***

చెప్పొచ్చేదేమిటంటే, ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వంలోకి తలదూర్చే ఏ పురా చరిత్రకారుడైనా అందులోని భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని గుర్తించక తప్పదు.  పైన చెప్పుకున్న రాంభట్ల గారైనా, జార్జి థాంప్సన్ అయినా, జోసెఫ్ క్యాంప్ బెల్ అయినా చేసింది అదే.

జార్జి థాంప్సన్ తన STUDIES IN ANCIENT GREEK SOCIETY, THE PREHISTORIC AEGEAN లో The Making of a Goddess అనే అధ్యాయాన్ని Childbirth and Menstruation అనే మొదటి ఉపశీర్షికతో ఇలా ప్రారంభిస్తారు:

మానవ సమాజపు తొలి దశలలో ఉమ్మడి శ్రమ అనేది జీవించడానికి ఒక షరతు. ఆహార సేకరణ, వేట అనేవి అప్పటికి ఇంకా అతి తక్కువ సాంకేతిక స్థాయిలో ఉండి, ఎక్కువ చేతులు అవసరమయ్యేవి. జనాభా పెరుగుదల అప్పుడో ప్రమాదకరమైన విషయం కాదు. జనాభా తక్కువైతే మాత్రం చావే.  కనుక ఏదైనా ఒక గుంపులో జనాభాను పెంచుకోవడం, జీవికకు అవసరమైన ఉత్పత్తి సాధనాలను సమకూర్చుకోవడంరెండూ ఒకటే. ఆహారోత్పత్తికి చెందిన సాంకేతికత అస్థిరంగానూ, అభద్రంగానూ ఉండడ మంటే; మనుషుల పునరుత్పత్తి కూడా ఉండడమే. ఆదిమ తెగలలో శిశుమరణాలు విపరీత స్థాయిలో ఉండేవి. ప్రతి చోటా శిశువు పుట్టుక చుట్టూ మాంత్రిక మైన తంతులు అల్లుకుపోవడానికి ఈ భౌతిక అవసరమే మూలం.

ఇలా భౌతిక పరిస్థితులతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించి , మాంత్రిక మైన తంతులకు మూలం భౌతిక అవసరమేనని చెప్పడం ద్వారా ఆదిమ పౌరాణికతలోని భౌతిక, భావ వాదాల అంతస్సంబంధాన్ని వివరించడానికి థాంప్సన్ శ్రుతి చేస్తున్నారు. ఈ తంతులు మనుషుల మనుగడ కోసం ఉద్దేశపూర్వకంగా కల్పించినవి కావనీ, కేవలం అమ్మతనానికి చెందిన స్పందనలకు భావనాత్మక(ideological) వ్యక్తీకరణలని కూడా ఆయన అంటారు.

ఆయన ప్రకారం ఇంకా చెప్పుకోవాలంటే, వ్యవసాయాన్ని కనిపెట్టాక పై పరిస్థితులే మరింత ఉన్నత ప్రమాణంలో పునరావృతమయ్యాయి. ఈ కొత్త సాంకేతికత ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు అడవుల్ని నరికి వ్యవసాయ యోగ్యం చేయడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం అవసరమయ్యేది. వ్యవసాయ జనావాసాల చుట్టూ అంటురోగాలు, అడవి జంతువులతో సహా రకరకాల అజ్ఞాత ప్రమాదాలు పొంచి ఉండేవి. వీటిని అన్నింటినీ ఎదుర్కొంటూ వ్యవసాయం చేయడం ఆరోజుల్లో సామాన్య విషయం కాదు. అందుకే జర్మానిక్ భాషల్లోనూ, సెమెటిక్ భాషల్లోనూ కూడా భూమిని దున్నడ మంటే, ఒక పెద్ద నిర్మాణం (to build) చేయడమే. ఎంతో ఆటవికంగా ఎదురు తిరిగే అడవిని లొంగదీసుకోవడం మాటలు కాదు. ఈ పరిస్థితులలో ఏ ఒక్క కుటుంబమో ఒంటరిగా అడవిలో స్థిరపడడం కష్టం. ఎక్కువ జనసంఖ్యలోనే భద్రత. ప్రారంభంలో స్త్రీలే పంటలు పండించడానికి చెమటోడ్చేవారు. పంటల ఉత్పత్తికి, సంతానం కనడానికి వారికి ఒక స్పష్టమైన పోలిక కనిపించేది. పంట పండినా, ఎండినా; కడుపుపంట బతికినా, మరణించినా ప్రసూతి దేవతే కారణమనుకునేవారు.

స్త్రీ ప్రసవం చుట్టూ అల్లుకున్న మాంత్రిక తంతులే అన్ని తంతులకూ మాతృకలైనట్టు కనిపిస్తాయి. అవే వ్యవసాయానికీ విస్తరించాయి. ప్రసవ కాలంలోనూ ఋతుకాలంలోనూ కూడా రక్తస్రావం జరుగుతుంది. ఆదిమ సమాజాల దృష్టిలో అది సాధారణ రక్త స్రావం కాదనీ, మరో జీవికి ప్రాణం పోసే స్త్రీలోని అంతర్గతశక్తికి వ్యక్తీకరణ అనీ థాంప్సన్ అంటారు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యాపాపం చుట్టుకుంటుందన్న విశ్వాసానికి మూలం ఇక్కడే ఉంది. దీని గురించి ఇంతకుముందు యయాతి-శర్మిష్టల కథలో చెప్పుకున్నాం. ఋతు, లేదా ప్రసవ రక్తం జీవిని పుట్టించే ఒక శక్తి వనరు అయినప్పుడు దానిని సక్రమంగా నియంత్రించడం అవసరం. లేకపోతె అది తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఆ నియంత్రణకు ఉద్దేశించినవే మాంత్రికమైన తంతులు.

ఈ మాంత్రికమైన తంతులతోపాటే అన్ని నిషేధాలకు మాతృక అయిన తొలి నిషేధం పుట్టిందని థాంప్సన్ అంటారు. అది, గర్భవతితో లేదా ఋతుకాలంలో ఉన్న స్త్రీతో లైంగిక క్రియ జరపకూడదన్న నిషేధం. అలాగే, కొత్తగా ఋతుమతి అయిన, ఆ తర్వాత నెల నెలా ఋతుకాలాన్ని ఎదుర్కొనే స్త్రీని శుద్ధి అయ్యేవరకూ పురుషుడు చూడకూడదనీ, ఎవరూ తాకకూడదనీ, దూరంగా ఉంచాలనే ఆనవాయితీ వచ్చింది.

విశేషమేమిటంటే, ఋతు సంబంధమైన ఇలాంటి కట్టడుల వెనుక రెండు పరస్పర విరుద్ధమైన దృష్టికోణాలు ఉన్నాయి. మొదటి కోణం ప్రకారం, ఋతు కాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ ఎవరూ తాకకూడని పవిత్రురాలు. ఎలాగంటే, దక్షిణాఫ్రికాలోని హెరేరే తెగలలో ఒక ఆచారం ఉంది. రోజూ పొద్దుటే పాలు పితికిన తర్వాత వాటిని తీసుకొచ్చి బాలెంతరాలు ముందు పెడతారు. ఆమె వాటిని తన పెదవులతో తాకి పవిత్రం చేస్తుంది. మరోకోణం ప్రకారం ఋతుకాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ అపవిత్రురాలు. రోమన్ భాషలో sacra అనే పదం ఆమెను పవిత్రురాలిగానూ, అపవిత్రురాలిగానూ కూడా చెబుతుంది. పితృస్వామిక సమాజంలో స్త్రీ మతం మీద ఆధిపత్యాన్ని కోల్పోయాక ఋతుకాలాన్ని, ప్రసవ కాలాన్ని అపవిత్రాలుగా వ్యతిరేక దృష్టితో చూడడం మొదలైందని థాంప్సన్ అంటారు. ఆ అపవిత్ర, వ్యతిరేక భావనలనే స్త్రీత్వానికి ఆపాదించి ఈసడించడమూ మొదలైంది. చెడు అంతటికీ మూలంగా, మంత్రగత్తెగా స్త్రీ పరిగణన పొందుతూ వచ్చింది.

ఇటువంటి భావాలు ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా పుట్టాయని థాంప్సన్ అనడాన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీ పట్ల వ్యవహరించే తీరులో ఉన్నంత ఏకీభావం మానవజీవితంలోని మరే ఇతర అంశంలోనూ కనిపించదని కూడా ఆయన అంటారు.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

పాంచాలి పెరటి సాగు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఒకసారి మహాభారతంలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది. అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలోని ఈ ఘట్టం చూడండి…

పాండవులు రాజ్యం కోల్పోయి, ద్రౌపదిని వెంటబెట్టుకుని అరణ్యవాసానికి బయలుదేరాడు. వారి వెంట కొంతదూరం పౌరులు కూడా వెళ్లారు. వారిని వెనక్కి పంపించివేసిన తర్వాత గంగాతీరానికి వెళ్ళి, ఒక పెద్ద మర్రిచెట్టుకింద ఆగి, గంగలో స్నానం చేసి, ఒక పగలూ, రాత్రీ  పాండవులు అక్కడే గడిపారు. అంతలో వారిని అభిమానించే బ్రాహ్మణులు అగ్నిహోత్రాలను, బంధువులను, శిష్యులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. మేము కూడా మీతో వనవాసం చేయడానికి నిర్ణయించుకున్నామని వారు ధర్మరాజుతో అన్నారు.

“ఘోరారణ్యంలో కందమూలాలు తింటూ గడపడం మాకు ఎలాగూ తప్పదు. మీ కెందుకీ కష్టం? క్రూరమృగాల మధ్య వనవాసం మీకు తగదు. దయచేసి  మీ ఇళ్లకు తిరిగివెళ్ళండి” అని ధర్మరాజు వారితో అన్నాడు.

అప్పుడు బ్రాహ్మణులు దుఃఖిస్తూ, “మీలాంటి ధార్మికులను విడిచి ఎలా వెడతాం? మేము మీకు ఆశ్రితులం, భక్తులం. మా పోషణ గురించి ఆలోచించవద్దు. మా కందమూలాలు మేమే సంపాదించుకుంటాం. జపాలు, హోమాలు మొదలైన పుణ్యకార్యాలు చేస్తూ మీ శ్రేయస్సుకు పాటుపడతాం. అంతే తప్ప మీకు అపకారం చేసిన ఆ ధార్తరాష్ట్రుల రాజ్యంలో మేము ఉండలేం” అన్నారు.

వారి ఇష్టాన్ని ధర్మరాజు కాదనలేకపోయాడు. అయితే, వీరు కందమూలాలు తింటుంటే తను ఎలా చూడగలననుకుని బాధపడ్డాడు. ఈ అడవిలో వీరికి ఆహారం సమకూర్చే మార్గం చెప్పమని పురోహితుడైన ధౌమ్యుని కోరాడు. అప్పుడు ధౌమ్యుడు,

“పూర్వం జీవులన్నీ పుట్టిన తర్వాత అవి ఆకలితో బాధపడుతుండడం చూసి సూర్యుడికి జాలి కలిగింది. తను ఉత్తరాయణంలో ఉన్నప్పుడు భూమిలోని రసాన్ని స్వీకరించి దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆ రసాన్ని మేఘాలలో నింపి, దాని ద్వారా ఓషధులను(ఆహారాన్ని ఇచ్చే మొక్కలను) పొందాడు. రాత్రి పూట చంద్ర కిరణాలనే అమృతంతో వాటిని పెరిగేలా చూసి వాటినుంచి అన్నం పుట్టించి జీవుల ప్రాణం నిలిపాడు. కనుక అన్నం నిండా ఉన్నది సూర్యుడే. భీముడు, వైన్యుడు, కార్తవీర్యుడు, నహుషుడు మొదలైన పూర్వ రాజులందరూ సూర్యుని ఆరాధించి, అన్నాన్ని సంపాదించి దానితో ప్రజలను పోషించారు. కనుక నువ్వు కూడా సూర్యుణ్ణి ప్రార్ధించు” అన్నాడు.

పౌరాణిక శైలిలో చెప్పిన ఈ మాటలు మనకు బాగా తెలిసిన ఒక భౌతికధర్మాన్ని చెబుతున్నాయి. ఉత్తరాయణంలో వచ్చే వేసవి కాలంలో సముద్రాలు, నదులలోని నీరు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. దక్షిణాయనంలో వచ్చే వర్షాకాలంలో ఆ మేఘాలు వర్షించి ఆహారపు పంటలను ఇస్తాయి. పైన చెప్పిన పూర్వపు రాజులందరూ సూర్యుని ఆరాధించి అన్నం సంపాదించి ప్రజలను పోషించారంటే అర్థం– వ్యవసాయం  ద్వారా ఆహారోత్పాదన చేశారనే. ఈవిధంగా ధౌమ్యుడి మాటల్ని మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేసుకుంటే, అవి వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సూర్యుణ్ణి ప్రార్థిస్తే ఆహారం లభిస్తుందనడం; సూర్యగమనంతో ముడిపడిన ఒక భౌతికధర్మంపైనా, వ్యవసాయమనే భౌతికచర్యపైనా పురుషభావారోపణ చేయడమే.  ఏతావతా ధౌమ్యుడు అంటున్నది ధర్మరాజును వ్యవసాయం చేయమనే!

అదలా ఉండగా, ధౌమ్యుడి మాటల్లో మనకు ప్రస్తుత విషయానికి అవసరమైన అదనపు వివరం, మేఘాల ద్వారా తను పొందిన ఓషధులను సూర్యుడు రాత్రిపూట చంద్రకిరణాలనే అమృతంతో తడిపి వాటిని పెరిగేలా చూశాడన్నది!

పురోహితుడు చెప్పినట్టే ధర్మరాజు సూర్యుని పువ్వులతో పూజించి, ఆ రోజు ఉపవాసముండి, భాగీరథీ జలాలలో నిలబడి ఇంద్రియాలను అదుపు చేసుకుని వివిధ సూర్యనామాలతో జపం చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. “(అరణ్యవాసం చేసే) ఈ పన్నెండేళ్లూ నీ వంటశాలలో ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అక్షయాలై, నాలుగు రకాల ఆహారాలు అవుతా”యన్నాడు.

పురాకాలంలో లౌకిక కర్మ, మత కర్మ అనే తేడాలు లేవనీ; ప్రతి లౌకిక కర్మా విధిగా మతపరమైన తంతుతో మొదలు కావలసినదేననీ గతంలో అనుకున్నాం. ఆ దృష్ట్యా చూసినప్పుడు, పురోహితుని సారథ్యంలో ధర్మరాజు మతపరమైన  తంతు జరిపి వ్యవసాయం ద్వారా ఆహార సంపాదనకు పూనుకున్నాడన్న ఒక సాధారణ విషయాన్నే పై ఘట్టం సూచిస్తోంది. కాకపొతే పౌరాణిక శైలికి అనుగుణంగా దానికి కొంత మాంత్రికతను జోడించి కథకుడు చెబుతున్నాడు. ఆ మాంత్రికతను మరింత ముందుకు తీసుకువెళ్లి, ధర్మరాజుకు సూర్యుడు ‘అక్షయపాత్ర’ను ఇచ్చాడనీ, దాని ప్రభావంతో ద్రౌపది అన్ని రకాల ఆహార పదార్థాలను సృష్టించి పూటపూటా ఎంతమందికైనా షడ్రసోపేతమైన భోజనం పెట్టేదనే ఊహకు రెక్కలు తొడిగారు.

గమనించండి…ధర్మరాజుకు సూర్యుడు అక్షయపాత్రను ఇచ్చినట్టు పై కథనంలో లేదు. ద్రౌపది సమకూర్చిన(‘ద్రుపదరాజపుత్రిచేత సాధితంబులై’- అని కవి ప్రయోగం) వన్యఫల మూలకాలే అక్షయాలు అవుతాయని మాత్రమే సూర్యుడు అన్నాడు. అంటే, మానవప్రయత్నంతోనే ఆహారం పండించుకోవాలని అర్థం. ఇంకా విశేషమేమిటంటే  ఇక్కడ ఆ మానవప్రయత్నం కూడా పాండవ సోదరులది కాదు; ద్రౌపదిది! వన్యఫల మూలకాలను సమకూర్చవలసింది ద్రౌపదే.

నా ఉద్దేశంలో, మహాభారతంలోని ఈ వివరం ఒక అపురూపమైన పురాచారిత్రక సత్యాన్ని చెబుతోంది. అది, వ్యవసాయం, పశుపాలన అనేవి పెద్ద ఎత్తున విస్తరించి పూర్తిగా పురుషుడి అధీనం కావడానికి ముందు స్త్రీల చేతుల్లో ఉండేవన్నది. పురుషుడు వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాక కూడా పరిమిత స్థాయి కలిగిన పెరటి సాగును, కంచె పశుపాలనను స్త్రీలే నిర్వహించేవారు. ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకా లన డంలో అదీ మర్మం.

మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు.  వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.

అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి ఉపక్రమించేముందు; ధర్మరాజు తమ్ముళ్లతో కలసి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. వాటి ప్రకారం, అజ్ఞాతవాసం ఏడాదీ తమ అగ్నిహోత్రాలను ధౌమ్యుడు సంరక్షించాలి. వంటలవారు, వారి అధిపతి(మహానసాధ్యక్షుడు), ద్రౌపది పరిచారికలు ద్రుపదపురానికి వెళ్ళాలి. ఇంద్రసేనుడు మొదలైన రథసారథులందరూ ద్వారకానగరానికి వెళ్ళాలి! ఆ సమయంలో ధర్మరాజు ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, “మా గురించి ఎవరైనా మిమ్మల్ని సమాచారం అడిగితే, ద్వైతవనంలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారనీ, ఆ తర్వాత వారి గురించి మాకు తెలియదనీ” చెప్పమంటాడు. అజ్ఞాతవాస కాలంలో తమ ఉనికిని శత్రువు కనిపెడితే,మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చేయవలసివస్తుంది.

పాండవులు ఇలా మందీ మార్బలంతో అరణ్యవాసం చేశారన్నప్పుడు, వారికి అడవే ఒక మోస్తరు రాజ్యంగానూ, వారున్న ప్రదేశమే తాత్కాలిక ‘రాజధాని’గానూ ఉండేదన్నమాట. ఇందుకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చే ఒక పోలిక, టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామా. 1959లో ఆయన టిబెట్ నుంచి శరణార్థిగా మన దేశానికి చేరుకున్న తర్వాత, ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ప్రవాస ప్రభుత్వా(Government in Exile)న్ని, ప్రవాస మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్న సంగతి మనకు తెలుసు.    

ప్రస్తుతానికి వస్తే,  ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకాలు’  ద్రౌపది స్వయంగా పండించినవి కాకపోవచ్చు. వాటి సాగుపై ద్రౌపది అజమాయిషీ వహించి ఉండచ్చు. అలాగే,  ద్రౌపదే స్వయంగా వండి పెట్టేదనడానికీ అవకాశం లేదు. అక్కడ కూడా ఆమెది పర్యవేక్షణ బాధ్యతే.

***

‘రాత్రి పూట చంద్రకిరణాలనే అమృతంతో ఓషధులు వృద్ధి పొందేలా (సూర్యుడు)చూడడం, ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అనే పై రెండు వివరాలను పట్టుకుని ఇప్పుడు జార్జి థాంప్సన్ ను పలకరిద్దాం:

పంటల వృద్ధికి కారణమైన తేమ చంద్రుడి నుంచే లభిస్తుందని గ్రీసులోనే కాక, ప్రతిచోటా విశ్వసిస్తారని ఆయన అంటారు. మంచు లేదా తుషారం పౌర్ణమి రోజునే ఎక్కువగా కురుస్తుందన్న ప్లూటార్క్ మాటను ఆయన ఉదహరిస్తారు. కవులు తుషారాన్ని చంద్రుని కుమార్తెగా చెబుతారు. మన సంస్కృతంలో కూడా చంద్రుడు ‘హిమ’కరుడు, ‘తుహిన’కరుడు! హిమమన్నా, తుహినమన్నా మంచే.  సిసిరో(క్రీ.పూ. 106), ప్లినీ(క్రీ.శ. 23) అనే రోమన్ పండితుల మాటలు, పైన పేర్కొన్న ధౌమ్యుడి మాటలకు ఇంకా దగ్గరగా ఉంటాయి. సిసిరో ప్రకారం, భూమిలోంచి పుట్టే ప్రతి ఒక్కటీ ఎదగడానికి అవసరమైన తేమ చంద్రుడి నుంచే ప్రవహిస్తుంది. ఇక, సూర్యుడు హరించే తేమను అంతటినీ చంద్రుడు మళ్ళీ ఉత్పత్తి చేస్తాడని ప్లినీ అంటాడు.

పైరు పంటలను వృద్ధి చెందించేవాడే కాదు, అన్ని రకాల జీవజలాలను అందించేవాడూ చంద్రుడే. ‘విత్తనాలకు, మొక్కలకు వాహకుడు’ చంద్రుడే నని భారతీయులు భావిస్తే, వృక్షజీవులన్నిటికీ అధిపతి చంద్రుడని బాబిలోనియన్లు విశ్వసించేవారని థాంప్సన్ అంటారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే ఒక మొక్కకు ‘సోమ’ అని చంద్రుడి పేరు పెడితే, ఉత్తరఅమెరికావాసులు మొక్కజొన్నను చంద్రసంబంధిగా భావించేవారని కూడా ఆయన అంటారు. ‘చంద్రుడు వృద్ధి చెందుతున్న కొద్దీ మొక్కలో రస స్రావం పుంజుకుంటూ ఉంటుం’దని –రియో గ్రాండే (అమెరికాలోని కొలరాడోలో ఉన్నఒక నదీ, దాని తీరప్రాంతం) లోని స్థానిక తెగలలో వ్యాప్తిలో ఉన్న నుడికారం.

చెట్ల నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థాలలో, ముఖ్యంగా ధూపం వేయడానికి ఉపయోగించే సువాసన గల వాటిలో, ఆ లక్షణాలకు కారణం చంద్రుడే. అలాగే తుమ్మచెట్టును స్త్రీ గానూ, దానినుంచి స్రవించే జిగురును గడ్డకట్టిన ఋతురక్తం గానూ కొన్ని చోట్ల భావిస్తారు. దానికి మహిమ ఉంటుందన్న నమ్మకంతో తాయెత్తుగా ధరిస్తారు.

నాట్లు వేయడానికి, మొక్కలు నాటడానికి , పెళ్లిళ్లకు యోగ్యమైన సమయం పౌర్ణమే నని గ్రీకులు భావించేవారు. అదే సూత్రాన్ని అనుసరించి పంట కోతకు, మొక్కలు, చెట్లు నరకడానికి, గొర్రెల ఉన్ని కత్తిరించడానికి, చివరికి కేశఖండనకు చంద్రుడు క్షీణదశలో ఉన్న రోజులు(కృష్ణపక్షం) మంచివని అనుకునేవారు, రోమన్ చక్రవర్తి టిబెరియస్ కేశఖండన విషయంలో ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేవాడు. మన దగ్గర కూడా సన్యాసులు, శ్రోత్రియులు కేశఖండనకు తిథి వారాలు చూసుకోవడంతో సహా ఇలాంటి నియమాలనే పాటిస్తారు. ఇక నూతన శిశువులను దాదులు ఆరుబయటకు తీసుకెళ్ళి చందమామకు చూపిస్తారని ప్లూటార్క్ అనడం ప్రత్యేకించి మనకు ఆసక్తికరం. మనదగ్గర అచ్చంగా ఇలాంటి ఆచారమే ఉందో లేదో కాని, పసిపిల్లలకు ‘చందమామరావే, జాబిల్లి రావే’ అంటూ చందమామను చూపించడం ఉంది. బహుశా పసిపిల్లలను చంద్రుడికి చూపించే ఆచారమే, పసిపిల్లలకు చంద్రుణ్ణి చూపించే అలవాటుగా మారిందేమో తెలియదు.

సంగతేమిటంటే, స్త్రీల లైంగిక జీవితంతో ముడిపడిన చంద్రుని ఆరాధననుంచే వారి సామాజిక విధులు కూడా పుట్టాయని థాంప్సన్ అంటారు. ఉదాహరణకు, నీళ్ళు తేవడం, మొక్కలను పెంచడం, మంచును, వర్షపు నీటిని సమీకరించడం ప్రధానంగా స్త్రీల బాధ్యతే. ఆవిధంగా పెరటి సాగు వారి చేతుల మీదుగానే జరిగేది. ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు’ అనే మాట ఆ పెరటి సాగునే సూచిస్తున్నాఆశ్చర్యంలేదు.

అలాగే, కంచె పశుపాలనను కూడా స్త్రీలు నిర్వహించేవారు. కంచె పశుపాలన అంటే ఇంటిదగ్గరే పశువుల పెంపకం. వేటకు వెళ్ళిన మగవాళ్ళు అక్కడ పట్టుకున్న చిన్న చిన్న జంతువులను ఇంటికి తీసుకొస్తే స్త్రీలు వాటిని పెంచేవారు. అలా కొన్ని జంతువులు మనిషికి మాలిమి అయ్యాయి. అదలా ఉంచితే, చంద్రుని ఆరాధనలో బలులు ఇవ్వడం కూడా ఉండేది. స్త్రీలు బలి ఇచ్చే జంతువులు కూడా ప్రతిచోటా చిన్నవిగానే ఉంటాయి. ఈ బలిచ్చే జంతువుల ఎంపిక ప్రతిచోటా ఒకేలా ఉండడం కొట్టొచ్చినట్టు కనిపించే విశేషమని థాంప్సన్ అంటారు.

selene-moon goddess

చంద్రునికి బలి ఇచ్చే జంతువులు ప్రధానంగా కుందేలు, మేక, పంది. నేడు క్షుద్రంగా భావించే నిన్నటి మాంత్రికచర్యలలో (witch craft) ప్రాముఖ్యం కలిగినవి ఇవే. సెమెటిక్ స్త్రీల తంతులలో పావురం కూడా ఇలాంటిదే. అలాగే, పిల్లి! పురాతన ఈజిప్టులో పిల్లిని పూజించేవారు. అది అనేక రంగుల్లో ఉండడం, రాత్రిళ్ళు  విలక్షణమైన అలవాట్లను కనబరచడం, అది పిల్లల్ని పెట్టే తీరు కూడా విలక్షణంగా ఉండడం చంద్రునికి అన్నివిధాలా సరిపోయే చిహ్నంగా దానిని చూపిస్తాయని ప్లూటార్క్ అంటాడు. అలాగే పిల్లి తన జీవిత కాలంలో మొత్తం 28 పిల్లల్ని పెడుతుంది. చాంద్రమానానికి చెందిన నెలకు కూడా 28 రోజులు. పౌర్ణమి రోజున పిల్లి కళ్ళు చాలా పెద్దవి గానూ, ప్రకాశవంతంగానూ ఉండి, చంద్రుని క్షీణదశలో చిన్నవిగానూ, కాంతిహీనంగానూ మారుతుంటాయి.

మన దగ్గర కూడా పిల్లి ఒక మార్మిక జీవిగానే కనిపిస్తుంది. దానికితోడు మనం పిల్లిని ఒక తరహా క్షుద్ర జంతువుగానే చూస్తాం. పిల్లి ఎదురవడాన్ని అపశకునంగా భావిస్తాం. మళ్ళీ, పిల్లిని చంపడం మహాపాపమన్న సెంటిమెంటూ మన దగ్గర కనిపిస్తుంది. స్త్రీ ప్రధానమైన పురాకాలపు మాంత్రిక తంత్రాలలో పిల్లికి పాత్ర ఉండడమే, దానిపట్ల మనలో అజ్ఞాతంగా గూడుకట్టుకున్న వ్యతిరేకతకు కారణమేమో తెలియదు. అదే సమయంలో పిల్లికి గల మార్మిక లక్షణం కూడా మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపి దానిని చంపడం పాపమన్న సెంటిమెంటుకు దారి తీయించి ఉండచ్చు.

మళ్ళీ చంద్రుడి విషయానికి వస్తే, చంద్రుడిలో ఉందనుకునే  పునరుజ్జీవకగుణమే రాళ్లలో, ముఖ్యంగా స్ఫటికాలలో, జాతిరాళ్లలో కూడా ఉంటుందనే విశ్వాసమూ చాలాచోట్ల ఉంది. అలాగే, మనిషి ఎముకల్లోనూ, కేశాలలోనూ కూడా. అందుకే ఆయా సంస్కారాలు జరిపేటప్పుడు పన్ను పీకించడం, జుట్టు తీయించడం చేస్తూ ఉంటారనీ, శరీరంలోని ఈ భాగాలకు స్వయం పునరుజ్జీవక లక్షణం ఉండడమే దీనికి కారణమని థాంప్సన్ అంటారు. మన దగ్గర అనేక తంతులలో కేశఖండనం జరుగుతుందన్న సంగతి తెలిసినదే.

ఇటువంటి అనేక ఆచారాలకు గల విశ్వజనీనతే ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసిన అంశం.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

 

 

 

ఇంకా తెలియని చందమామ కథలెన్నో!

                                                                                        కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పురా ప్రపంచపు లోలోపలికి వెడుతున్నకొద్దీ ఆ ప్రపంచమూ, నేడు మనం జీవిస్తున్న ప్రపంచమూ  రెండు వేర్వేరు గ్రహాలనిపిస్తాయి.  ఆవిధంగా ఈ వ్యాసాలలో నేను చేస్తున్నది గ్రహాంతరయానమే.

పురాప్రపంచం, భౌతికవాస్తవికతను మాంత్రికవాస్తవికత కప్పేసిన ప్రపంచం.  రెండూ ఒకదానితో ఒకటి తాదాత్మ్యం చెందిన ప్రపంచం. నేటి మన ప్రపంచం వేరు. ఇది పురాప్రపంచంతో నేటికీ వదులు వదులుగా నైనా అనుసంధానం కలిగిన ప్రపంచమే కానీ, ఆ సంగతి తెలియని అజ్ఞానం దానిది. అలాగే నేటి ప్రపంచం తనకు మాంత్రిక వాస్తవికత ఏమిటో, భౌతికవాస్తవికత ఏమిటో తెలుసుననుకుంటూ ఉంటుంది. అయితే రెండూ పాలూ, నీళ్లలా వేర్వేరు అనుకుంటుందే తప్ప; పాలూనీళ్లలా అవి కలసిపోయి ఉన్న పురాప్రపంచాన్ని అది పోల్చుకోలేదు….

ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు;  పురాకాలపు మాంత్రిక ప్రపంచం, దాదాపు ప్రపంచమంతా ఒకేలా పంచుకున్న ప్రపంచం!

ఈ సందర్భంలో పద్దెనిమిదేళ్ళ క్రితం వచ్చిన ‘నాగమండల’ అనే సినిమా గుర్తొస్తోంది.  మూడుసార్లైనా దానిని చూసి ఉంటాను. గుర్తొచ్చినప్పుడల్లా అందులోని కథా, చిత్రీకరణా, సన్నివేశాలూ, పాటలూ ఆవిష్కరించిన అద్భుత మాంత్రిక ప్రపంచం నా కళ్ళముందు ఇప్పటికీ పచ్చ పచ్చగా కదలాడుతూ ఉంటుంది. ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ అదే పేరుతో రాసిన కన్నడ నాటకానికి ఇది చిత్రానువాదం.

అప్పన్న ఒక మొరటోడు. అతనికో ఉంపుడుగత్తె. చనిపోయిన అతని తల్లి మీద అభిమానం కలిగిన ఒక ముసలామె అతనికి పెళ్లి చేయాలనుకుంటుంది. పొరుగూరికి వెళ్ళి ఒక సంబంధం ఖాయం చేసుకుని, అప్పన్నను ఒప్పించి పెళ్లి జరిపిస్తుంది. ముగ్ధత్వం, అమాయకత్వం, భయం నిండిన బాల్య కౌమార దశలను దాటి పూర్తిగా యవ్వనంలోకి రాని రాణి కాపురానికి వస్తుంది. ఇంట్లో తనూ, భర్తే. తొలిరేయి అప్పన్న భార్యతో మొరటుగా ప్రవర్తించేసరికి భయపడిపోయి అతన్ని నెట్టేస్తుంది. దాంతో కోపం వచ్చిన అప్పన్న అప్పటికప్పుడు ఇంటికి తాళం వేసి ఉంపుడుగత్తె దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి రోజూ అదే వరస.

ముసలామెకు ఇది తెలిసి ఒక మూలికను తెచ్చి రాణికి ఇచ్చి, దానితో కషాయం చేసి పాలల్లో కలిపి నీ మొగుడిచేత తాగిస్తే నీకు అతను లొంగుతాడని చెప్పింది. తీరా దానిని సిద్ధం చేసినా మొగుడికి ఇవ్వడానికి భయపడి రాణి ఒక పాము పుట్ట మీద పోస్తుంది. అందులోని పాము దానిని తాగి రాణిపై మరులుగొంటుంది. రోజూలా భర్త రాత్రి కాగానే ఇంటికి తాళం వేసి ఉంపుడుగత్తె ఇంటికి వెళ్ళగానే, ఆ పాము కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించి అప్పన్న రూపంలోకి మారిపోయి రాణితో సంభోగిస్తుంది.

olymias

కొంతకాలం తర్వాత రాణి గర్భవతి అవుతుంది. అప్పన్నకు అదెలా సాధ్యమో అర్థంకాలేదు. భార్య శీలాన్ని శంకించి పంచాయితీ పెడతాడు. “నా భర్తను, ఈ పామును తప్ప”  నేను మరో మగాణ్ణి తాకి ఎరగను అంటూ పాముపుట్టలోకి చేయి పెట్టి పామును తీసి పట్టుకుని రాణి ప్రమాణం చేస్తుంది. పాము ఆమెను ఏమీ చేయదు. ఆమె నిర్దోషి అని, అప్పన్నే అనవసరంగా భార్యమీద నిందవేస్తున్నాడని పంచాయితీ పెద్దలు నిర్ణయిస్తారు. చివరికి అతని ఉంపుడుగత్తెకు కూడా రాణిపై గౌరవం ఏర్పడి, అప్పన్నే అబద్ధమాడుతున్నాడని భావించి అతన్ని దూరంగా ఉంచుతుంది. అప్పటికీ సమాధానపడని అప్పన్న ఒకరోజు రాత్రి మాటువేసి, పాము తమ పడకగదిలోకి వెళ్ళడం, తన రూపంలోకి మారిపోవడం చూస్తాడు. పాము మీద పగ పెంచుకుని చివరికి దానిని సజీవదహనం చేస్తాడు. ఆ తర్వాత అతను రాజీపడి పామువల్ల భార్యకు కలిగిన కొడుకును తన కొడుకుగా గుర్తించడం, భార్యను ఏలుకోవడం ఈ కథకు ముగింపు.

ఈ సినిమాను చూసిన ప్రతిసారీ, ప్రతిక్షణం ఒక మాంత్రిక ప్రపంచంలో విహరిస్తున్నట్టు… ఒకే అనుభూతి! పరిసరాలు, సన్నివేశాల కల్పన, పాత్రల చిత్రణ, సంగీతం, పాటలలోని సాహిత్యంతో సహా అన్నింటిలోనూ మాంత్రికవాస్తవికత ఉట్టిపడేలా చేయడంలో దర్శకుడు (టి.ఎస్. నాగాభరణ)చూపిన స్పృహ, ప్రతిభ ఆశ్చర్యచకితం చేస్తాయి. అలాగే ఫోటోగ్రఫీ! అది భౌతిక ప్రపంచంపై పలచని తెర కప్పి మనల్ని పగలూ, రాత్రీ కానీ ఒక సంధిలో వేలాడదీస్తూ మన ముందు పూర్తిగా ఒక స్వాప్నిక, మార్మిక జగత్తును ఉంచుతుంది.

ప్రకృతీ, మనిషీ ఒక్కచోట ఒదిగిపోయి సహజీవనం చేయడాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఇందులోని ముసలామె ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే కాక, ఒక మంత్రగత్తెలా రూపుకడుతుంది. ఆమె ప్రకృతిలోని సౌకుమార్య, ముగ్ధత్వాలకూ; పురుషుడిలోని మొరటుదనంతో కూడిన లైంగికవిజృంభణకూ పెళ్లి చేయాలనుకుంటుంది.  ఆ రెండు విరుద్ధ లక్షణాల మధ్య జరిగే నిరంతర సంఘర్షణలోంచే పునరుత్పత్తి రూపంలో ప్రకృతి తనను తాను పొడిగించుకుంటూ ఉంటుంది.  ఆ మొరటోడి తల్లి మీద ఉన్న అభిమానంతో  అతని మీదా, పెళ్లీడు వచ్చిన ఆ అమ్మాయి మీదా కలిగిన ప్రేమవల్ల ముసలామె వాళ్ళిద్దరికీ ముడిపడేలా చూస్తుంది. ఒక జంటను కూర్చడమంటే తద్వారా జరిగే సృష్టికార్యాన్నీ, పునరుత్పత్తినీ ప్రకృతి ఉత్సవీకరించుకోవడమే. అతణ్ణి వశపరచుకునే ఉపాయాన్ని అమ్మాయికి ముసలామె ప్రకృతినుంచే అందిస్తుంది. ఆమెకు బిడ్డ కలగడంలో కూడా పాము రూపంలో ప్రకృతి భాగస్వామి అవుతుంది. అనివార్యమైన ప్రకృతిలోని పునరుత్పత్తి ధర్మానికి ఇది సూచన.

నేనిక్కడ నేల విడిచి ఏదో తాత్వికమైన సాము చేస్తున్నానని అనుకోవద్దు. ఆదిమ పౌరాణికతలో మనిషి జీవితం ప్రకృతితో, అందులోని భయబీభత్సాలతో సహా, ఎలా మమేకంగా అల్లుకుందో మరోసారి సూచించడమే ఉద్దేశం.

***

పాముతో ముడిపడిన జానపదవిశ్వాసం నుంచి పలుకుతున్న ఈ కథ మూలాలు మన దేశాన్ని దాటి ప్రపంచ పురాచరిత్రలోకి ఎలా విస్తరిస్తున్నాయో చూడండి…

ప్రాచీన గ్రీకు సమాజం గురించి రాస్తున్న జార్జి థాంప్సన్.  స్త్రీతో పాము సంభోగించడం అనేది చాలా తరచుగా ఎదురయ్యే ఇతివృత్తం అంటారు. గ్రీసులో ఎపిడారస్ అనే చోట సర్పవీరుడైన అస్క్లేపియస్ ఆలయం ఉంది. అందులో కొన్ని శాసనాలు ఉన్నాయి. ఒక శాసనంలోని ఇతివృత్తం ప్రకారం, సంతానం కలగని ఒక స్త్రీ  అప్పటి నమ్మకాన్ని బట్టి ఆ ఆలయానికి వెళ్ళి, ఒక రాత్రి అక్కడ గడిపింది. దేవుడు ఒక పామును తీసుకుని తన దగ్గరకు వచ్చినట్టు ఆమె కలగంది. ఆ పాము ఆమెతో సంభోగించింది. తొమ్మిది నెలల తర్వాత ఆమెకు మగ కవలలు కలిగారు. పాము పాత చర్మం విడిచి కొత్త చర్మం ధరించడం ద్వారా ఎప్పటికప్పుడు జీవితాన్ని, యవ్వనాన్ని పొడిగించుకుంటూ ఉండడమే దానికి ఇటువంటి మహిమను ఆపాదించడానికి మూలం.

పశ్చిమ ఆఫ్రికాలో పోంగ్వే స్త్రీలు రహస్య సమాజంగా ఏర్పడి పాముతో ముడిపడిన సౌభాగ్య తంత్రాలు జరుపుతూ ఉంటారు. అందుకోసం వాళ్ళు అడవిలో బాగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ తంతులు ఎంత రహస్యంగా జరుగుతాయంటే, ‘అమ్మ’(Mother) అని పిలిచే ఒక నాయకురాలు వారికి ఉంటుంది కానీ, ఆమె ఎవరో వాళ్ళకే తెలియదు. ప్రతి మహిళా మడఅడవి (mangrove) చెట్ల మూలంలో ఉండే చిన్న పామును పట్టుకోవాలి. ఆ తర్వాత వారు నగ్నంగా మారి పామును చేతిలో ఉంచుకుని అలసిపోయే వరకూ రాత్రంతా కాముకత్వం నిండిన పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ గడుపుతారు.

గ్రీసు ఉత్తరభాగంలోని మేసెడోనియాలో కూడా మహిళలు ఇలాంటి తంతులే జరుపుతూ ఉండేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మేసెడోనియాకు చెందినవాడే. ఈ ప్రాంతానికి రాజుగా ఉన్న రెండవ ఫిలిప్స్(క్రీ.పూ. 359-336)కు నాలుగవ భార్య ఒలింపియస్. ఆమె కొడుకే అలెగ్జాండర్.

థాంప్సన్ ఉటంకించిన ప్లూటార్క్ కథనం ప్రకారం, అతి పురాతనకాలం నుంచీ మేసెడోనియా మహిళలు ఆర్ఫిక్, డయోనిసస్ లకు చెందిన సామూహిక లైంగిక సర్ప తంత్రాలలో పాల్గొంటూ ఉండేవారు. ఇతరులను మించి ఒలింపియస్ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఈ తంతులను మరింత ఆటవికంగానూ, భయంగొలిపేలానూ మార్చింది. ఆమె నాయకత్వంలో మహిళలు  పెద్ద పెద్ద పెంపుడు సర్పాలను చేతిలో ఉంచుకుని నృత్యం చేసేవారు. వాళ్ళ చేతిలోని మంత్ర దండాలకు, వారి కిరీటాలకు భారీ సర్పాలు చుట్టుకుని ఉండేవి. అలెగ్జాండర్ పుట్టుకకు ముందు ఒలింపియస్ తన పక్కలో ఒక పామును ఉంచుకుని నిద్రపోతూ ఫిలిప్స్ కు కనిపించిందట. ఈ కథనాలలో అతిశయోక్తులు ఉండచ్చు కానీ, ఇక్కడ గమనించాల్సింది పాములతో కూడిన తంతుల విషయంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న పోలిక.  ఒలింపియస్, ఫిలిప్స్ లది కలతల కాపురం కావడం; ఫిలిప్స్ హత్యకు గురైనప్పుడు అందుకు బాధ్యురాలిగా ఒలింపియస్ ను అనుమానించడం వగైరాలు వేరే కథ.

asklepios

***

సర్పం తర్వాత, బహుశా సర్పం కన్నా ఎక్కువగా స్త్రీలతో ముడిపడిన ఆరాధనా రూపం చంద్రుడు. సర్పానికి ఉన్నట్టే, చంద్రుడికి కూడా పునరుజ్జీవన లక్షణం ఉందని చెప్పుకున్నాం. సర్పం విషయంలో ఉన్నట్టే, చంద్రుని విషయంలోనూ ఆయా ప్రాంతాల పురాణకథలు, విశ్వాసాల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలను కొన్నింటిని ఇప్పటికే గుర్తించాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు చూద్దాం:

స్త్రీలోని పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేది చంద్రుడేనని ప్రపంచమంతటా అనాదిగా ఉన్న విశ్వాసం. ఋతుస్రావానికి, చంద్రుడికి సంబంధం ఉందన్న ఆదిమ విశ్వాసం నుంచే చంద్రుడితో ముడిపడిన తంతులు పుట్టాయి. ఈ ఆదిమ కాలపు తంతులు మనిషి చైతన్యంపై ఎంత గాఢంగా ముద్రవేసుకున్నాయంటే, చంద్రుని ఆరాధనకు కాలదోషం పట్టినా ఇప్పటికీ జానపదుల స్థాయిలో, మూఢనమ్మకాల రూపంలో ఇవి చాలావరకూ మిగిలి ఉన్నాయని థాంప్సన్ అంటారు.

మాంత్రికత సూర్యుని కన్నా ప్రధానంగా చంద్రునే అల్లుకుని ఉంటుంది. ప్రపంచమంతటా కాలానికి తొలి కాపలాదారు చంద్రుడే. కేలెండర్ లో మొట్టమొదట ఏర్పడిన విభాగం, మాసం.  చంద్రుడి వల్లనే అది ఏర్పడింది. చంద్రుని ఆధారంగా జరిగే కాలగణనాన్ని చాంద్రమానమనీ, సూర్యుని ఆధారంగా జరిగేదాన్ని సౌరమానమనీ అన్నారు. చాంద్రమానంలో నెలకు 28 రోజులు. పదిహేను రోజులకు ఒకసారి వచ్చే పౌర్ణమి, అమావాస్యలనుబట్టి నెలను మళ్ళీ శుక్లపక్షమనీ, కృష్ణపక్షమనీ రెండు భాగాలు చేశారు. చంద్రుడు వృద్ధిని పొందే రోజులు శుక్లపక్షమైతే, క్షీణతను పొందే రోజులు కృష్ణపక్షం. చివరగా నెలను నాలుగు భాగాలు చేసి వారాలను ప్రవేశపెట్టింది బాబిలోనియన్లు. ఈ చాంద్ర, సౌర మానాలకు సంబంధించిన ఇతర అనేక వివరాలలోకి ఇప్పుడు వెళ్లలేం.

స్త్రీలలో ఋతుస్రావా(menstruation)నికి చంద్రుడే కారణమనుకున్నాం. చంద్రుడు ఒక యువకుడనీ, అతడు స్త్రీలపై లైంగిక చర్యకు పాల్పడి ఋతుస్రావానికి కారణమవుతాడనీ ముర్రే దీవుల్లోని ప్రజలు భావిస్తారు. ఋతురక్తం నుంచే పిండం రూపొందుతుందని విశ్వాసం కనుక, ఋతుస్రావాన్ని ఒకవిధమైన గర్భస్రావంగానూ భావిస్తారు. దానినుంచే ‘moon-calf’ అనే మాట పుట్టింది. అది అంగవైకల్యాన్ని సూచిస్తుంది, ఇలా చూసినప్పుడు స్త్రీ గర్భం ధరించడానికి కారణమూ చంద్రుడే. ఈవిధంగా ‘స్త్రీకి చంద్రుడే భర్త’ అన్న ఆదిమ విశ్వాసం పుట్టింది. మావోరీ తెగవారు స్త్రీకి చంద్రుడే అసలు భర్త అని నమ్ముతారు. స్త్రీ గర్భానికి పురుషుడు కారణమనే భావన, పితృత్వం సాంఘిక ప్రతిపత్తిని సంపాదించుకున్న తర్వాతే మొదలైందని థాంప్సన్ అంటారు. అంతవరకూ స్త్రీ గర్భానికి కారణం చంద్రుడే.

వ్యవస్థ మారినంత త్వరగా విశ్వాసమూ, చైతన్యమూ మారవు. కనుక ఆదిమ విశ్వాసాలు వివిధ రూపాలలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు, అనేక ఆదిమభాషలలోని పదాలు ఇప్పటికీ చంద్రుని పురుషుడిగానూ, స్త్రీలకు భర్తగానూ చెబుతాయి. గతంలో కెల్టిక్, గ్రీక్, లాటిన్ భాషల్లోనూ; నేటికీ స్లావోనిక్, జెర్మానిక్ భాషల్లోనూ చంద్రశబ్దం పురుషవాచకమే. చంద్రుని Men అనే పేరుతో పురుషునిగా పేర్కొంటూ వచ్చిన గ్రీకులు, ఆ తర్వాత స్త్రీని చేసి ‘సెలెనే’(selene) అన్నారు. men నుంచి పుట్టిన స్త్రీ వాచకం’mene’ కు selene పర్యాయపదం అయింది. ఈ mene అనే మాట monthకు పర్యాయపదంగా ఇప్పటికీ మిగిలింది.

మన దగ్గర సంస్కృతంలోనూ, తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లోనూ ఇప్పటికీ చంద్రుడు పురుషుడే. అంతేకాదు, స్త్రీకి చంద్రుడే అసలు భర్త, లేదా తొలి భర్త అన్న ఆదిమవిశ్వాసం ఇప్పటికీ మన వైదిక వివాహమంత్రాలలో మిగిలి ఉంది. ఉదాహరణకు, కన్యాదాత వధువును వరునికి అప్పగిస్తూ ‘సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః’’అంటాడు. ఈమె తొలి భర్త సోము(చంద్రు)డనీ, రెండో భర్త గంధర్వుడనీ, మూడవ భర్త అగ్ని అనీ, నాలుగవ భర్త మనుష్యుడనీ దీనికి అర్థం. సోమలతను నలగ్గొట్టి రసం పిండి, వడగొట్టి, కొయ్యతొట్టెల్లో నిల్వ చేసేపని కన్యాశాలల్లోనే జరిగేదనీ, ఈ పనిని చేసేవారినీ సోములు అనే వారనీ, “సోమః ప్రథమో వివిదే” అనే మాట వీరిని ఉద్దేశించినదే నని రాంభట్లగారు (జనకథ) అన్నప్పటికీ, చంద్రుడే స్త్రీకి అసలు భర్త అన్న ఆదిమ విశ్వాసాన్నీ ఇది సూచిస్తూ ఉండచ్చు.

చంద్రునివల్లనే స్త్రీ గర్భవతి అవుతుందన్న ఊహ నుంచే స్త్రీని చంద్రుడు ఆవహిస్తాడనీ, లేదా పూనతాడనే ఊహ పుట్టింది. అందుకే పూనకం, మూర్ఛ, మహిమలను ఆపాదించే ఇతర రుగ్మతలను చంద్రుడితో ముడిపెట్టడం సాంప్రదాయికంగా వస్తోంది. lunacy (ఉన్మాదం)కి, lunar (చంద్ర సంబంధమైన)కి ఉన్న సంబంధం స్పష్టమే.

ఈజిప్షియన్లు చంద్రదేవతను ‘నిట్’ అంటారు. వారి విశ్వాసం ప్రకారం మగ్గాన్ని ప్రవేశపెట్టింది ఈ దేవతే. యూరప్ జానపదాలలో ఇప్పటికీ నూలు వడికేది చంద్రుడే. ఇక్కడ ఆసక్తికరం ఏమిటంటే, చంద్రుడిలో ఒక ముసలమ్మ కూర్చుని నూలు వడుకుతూ ఉంటుందన్న కల్పన మన దగ్గర కూడా ఉంది. నూలు వడకడం ఒకప్పుడు స్త్రీల పని. అనేక ఆదిమ సంప్రదాయాలలో పిండి విసరడం, కుండలు చేయడం, వంట చేయడం మొదలైనవి చంద్రుడే చేస్తాడు.

అలాగే ఒకప్పుడు మంత్రవిద్య(మాంత్రికత) స్త్రీల చేతుల్లోనే ఉండేది. లైంగికక్రీడపై అది అత్యంత సమ్మోహనకరమైన ప్రభావాన్ని చూపుతూ ఉండేది. అయితే మంత్రవిద్య పురుషుడి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత స్త్రీల తంతులు చేతబడి వంటి క్షుద్రవిద్యలుగా తిరస్కృతికి గురవుతూ వచ్చాయని థాంప్సన్ అంటారు.

మరిన్ని విశేషాలు తర్వాత….

 

 

 

 

 

 

‘జంట గొడ్డలి’ చెప్పే జగజ్జనని తత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

 నరుడే కదా ఈ పురాణ, ఇతిహాసకథలన్నీ చెబుతున్నది?! అలాంటిది తననుంచి తనను విడదీసుకుని, దేవతలు, రాక్షసులు, సిద్ధులు,సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య తనను ఎందుకు ఇరికించుకుంటున్నాడు?

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు,సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒకడుగా ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి ఈ ప్రశ్నను లేవనెత్తాను. కొన్ని వ్యాసాల క్రితం మరోసారి ముందుకు తెచ్చాను. ఇలా వెంటాడుతున్న ఈ ప్రశ్న, ఇప్పుడు సమాధానానికి ఏ కొంచెమైనా దగ్గరవుతుందేమో చూద్దాం.

అసలు ఈ ప్రశ్న తలెత్తడమే అపూర్వం అద్భుతం. ఇంత ముఖ్యమైన ప్రశ్న మన పురాణ, ఇతిహాస పండితులలో ఎందుకు పుట్టలేదో ఆశ్చర్యం. ఈ నరుడనే వాడికి పురాణ, ఇతిహాసాలలో గౌరవం లేదనీ, చులకనభావం ఉందనీ కూడా చెప్పుకున్నాం. మహాభారతంలోని ఈ  విచిత్రాన్నే చూడండి….’ఇతడు కేవల మర్త్యుడే’ అనడం చాలా చోట్ల వస్తుంటుంది.  ఉదాహరణకు, కర్ణుని గురించి దుర్యోధనుడు ఆ మాట అంటాడు. ధర్మరాజు గురించి అర్జునుడు అంటాడు. ఇక ద్రౌపది మానవమాత్రురాలు కాదు, అయోనిజ…

ఇదే సమయంలో ఇదే మహాభారతం, అర్జునుడికి ‘నరు’డనే నామాంతరాన్ని సృష్టిస్తోంది. అంతేకాదు, అతన్ని ‘నరవీరు’ణ్ణి చేస్తోంది. అప్పటికీ నరుడికి అంత ప్రాధాన్యం ఇవ్వడం మహాభారతకర్తకు ఇష్టం లేదు. కనుక అర్జునుని ‘నరు’డనే ఆదిముని అవతారంగా చిత్రిస్తున్నాడు. ఆపైన నారాయణుడనే దేవునితో అతణ్ణి కలిపి చెబుతున్నాడు. మహాభారతంలో నాయకుడంటూ ఒకరిని గుర్తించవలసివస్తే అది నరుడైన అర్జునుడే  అవుతాడు. అతడు నారాయణుడనే దేవుడి సాయంతో కురుక్షేత్రయుద్ధంలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నరుని వారసుడైన అభిమన్యుని కొడుకు పరీక్షిత్తే హస్తినాపురరాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు.

హోమర్ ‘ఒడిస్సీ’ లోని ఓడిసస్ లానే, మహాభారత నరుడు  స్త్రీ సూత్రాన్ని ఎలా జయించాడో చూడండి… కురుక్షేత్రయుద్దం సమీపిస్తున్న సమయంలో  పులోమ, కాలక అనే రాక్షసస్త్రీల కొడుకులైన పౌలోములను, కాలకేయులను చంపాడు. శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని, దేవలోకం వెళ్ళి ఇంద్రునినుంచి మరికొన్ని దివ్యాస్త్రాలను  పొందిన తర్వాత; ఊర్వశి అనే అప్సరస పన్నిన మోహపు ఉచ్చులో పడకుండా తప్పించుకున్నాడు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి ఇదీ అతను రచించుకున్న పూర్వరంగం! ఆ వెంటనే మరో ‘నరు’డైన నలుని చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ క్రమం, నరుని ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు కల్పించున్న ప్రణాళికను సూచిస్తూ ఉండచ్చు.

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒక అల్పజీవిగా ఇరుక్కుని ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. క్రమంగా నరుడు వీరుడిగా మారి ఆ ప్రపంచంలోంచి తనను తాను విముక్తం చేసుకుని విశ్వరూపం ధరిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆదిమ పౌరాణికతకు భిన్నమైన తాత్వికతను, తాత్విక ప్రతీకలను సృష్టించాడు.  ఈ పరిణామం తరతమ భేదాలతో దాదాపు ప్రపంచమంతటా జరిగింది. మెసపొటేమియా, భారతదేశం, గ్రీసు మొదలైన చోట్ల ఇది ఐతిహాసిక యుగాన్ని స్థాపించింది. గిల్గమేశ్, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, అర్జునుడు, సారగాన్, హమ్మురాబి, అచెలూయెస్(ఇలియద్), ఓడిసస్ మొదలైన వీరులను సృష్టించింది. వీరిలో పలువురు ఇతిహాస నాయకులయ్యారు.  గిల్గమేశ ఇతిహాసం (ఎపిక్ ఆఫ్ గిల్గమేశ్), రామాయణం, మహాభారతం, ఇలియద్, ఒడిస్సే మొదలైనవి వీరిని కీర్తించాయి.

ఇక ఇప్పుడు ఆదిమ పౌరాణికత, నూతన పౌరాణికతల మధ్యనున్న తాత్విక భేదాలలోకి వెడదాం:

‘యెహోవా కూడా కాళియ మర్దనుడే’ అనే వ్యాసంలో పాములే శిరోజాలుగా ఉన్న మెడూసా అనే దేవత గురించి ప్రస్తావించుకున్నాం. ఆ దేవత చూపులే మగవారిని దహించివేస్తాయి. పెర్సియస్ అనే దేవుడు ఆమె తలను నరుకుతాడు. ఎథెనా అనే దేవత ఆదేశం పై అస్లేపియస్ అనే దేవవైద్యుడు మెడూసా కుడి, ఎడమ నరాల నుంచి రక్తం సంగ్రహిస్తాడు. కుడి నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికి, ఎడమ నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికి వినియోగిస్తాడు. అంటే ప్రాణం పోయడం, తీయడం అనే రెండు శక్తులూ ఈ దేవతలో సహజీవనం చేస్తున్నాయన్న మాట.

kali

ఇటువంటి మెడూసాను క్యాంప్ బెల్ మన కాళికాదేవితో పోలుస్తారు. కాళిక తన కుడి చేత్తో వరాలు ఇస్తుంది, ఎడమ చేతిలో కరవాలాన్ని ధరించి ఉంటుంది. కాళి విశ్వంలోని అన్ని జీవులకూ జన్మనిచ్చే జగజ్జనని, అమ్మల గన్న యమ్మ. అయినాసరే, రక్తదాహాన్ని చాటుతున్నట్టుగా ఆమె ఎర్రని నాలుక చాస్తుంది. కపాలాలనే  హారంగా ధరిస్తుంది. తెగిన చేతులు, కాళ్లనే వస్త్రంగా చుట్టుకుంటుంది.  కాళి అనే పేరు నలుపును, కాలాన్నీ కూడా సూచిస్తుంది. జనన మరణాలు అనేవి కాలంలోనే సంభవిస్తుంటాయి. అందుకే యముణ్ణి కాలుడు అన్నారు.  జీవుల జనన, మరణాలను శాసించే దేవత కాళి. విశ్వానికి గర్భమూ, సమాధీ కూడా ఆమెయే. ఆమె అద్వితీయమైన(ఇంకొకటి లేని)ఆదిమశక్తి. ప్రకృతి యొక్క చరమసత్యం. దేవుళ్ళు అందరూ ఆమె ఆదేశాలను పాటించవలసిన ఆమె ప్రతినిధులు మాత్రమే.

మన ‘దేవీ భాగవతం’ ఈ జగజ్జనని అద్వితీయతను, ఆధిక్యాన్ని చెబుతుంది. మన పురాణాలు సృష్టి, స్థితి, లయం అనే మూడు మాటల్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటాయి. ఇవి మూడు రకాల కార్యాలను సూచిస్తాయి. విడివిడిగా చెప్పుకుంటే; సృష్టి అంటే విశ్వాన్ని సృష్టించడం-ఇది బ్రహ్మదేవుడి పని. స్థితి అంటే విశ్వం సక్రమంగా నడిచేలా చూస్తూ దానిని పోషించడం-ఇది విష్ణువు పని. లయమంటే సృష్టిని అంతమొందించడం-ఇది శివుడు చేసే పని. కానీ ఆదిమ పౌరాణికతలో ఈ మూడింటినీ ఒక్క జగజ్జననే చేస్తుంది. ఈ శక్తులన్నీ ఆమెలోనే ఇమిడి ఉంటాయి. పైన చెప్పిన త్రిమూర్తులు కూడా ఆమె సంతానమే.

మన పురాణాలలో అత్రి మహాముని భార్య అనసూయ ఉదంతం పరోక్షంగా దీనినే చెబుతుంది. ఒకసారి త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలనుకున్నారు. ముగ్గురూ అతిథులుగా అత్రి ఆశ్రమానికి వెళ్లి, నువ్వు నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే ఆతిథ్యాన్ని స్వీకరిస్తామని అనసూయతో అన్నారు. ఆమె సరే నని  ముగ్గురినీ పసిపిల్లలను చేసి, తను నగ్నంగా మారి, వారి ముందు విస్తళ్ళు వేసి వడ్డించి, తను తిరిగి చీరకట్టుకుని వచ్చి వారిని పెద్దవాళ్ళుగా మార్చింది. ఆ తర్వాత వారిని మరోసారి పసిపిల్లలను చేసి తన దగ్గరే ఉంచుకుందని, అప్పుడు వారి భార్యలు వెతుక్కుంటూ వచ్చారని కథ.

మృత్యు, పునరుజ్జీవనాలు రెండింటికీ చెందిన దేవతారూపమూ, ఆ దేవతకు సంబంధించిన పురాణ కథలూ లెవంట్ (సైప్రస్, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, లెబనాన్, టర్కీలను లెవంట్ అంటారు) అంతటా నూతన శిలా యుగం నుంచి, దాని అనంతర యుగంవరకూ కొన్ని వేల సంవత్సరాలపాటు సుపరిచితాలు. క్రీ .పూ. 5,500కు చెందిన సమీపప్రాచ్యంతో మొదలుపెట్టి, క్రీ.శ. 1531కి చెందిన గౌదలూపే(Gaudalupe: స్పెయిన్, అమెరికా, బొలీవియా, పెరూ, కొలంబియా, మెక్సికో సహా స్పానిష్ భాష మాట్లాడే దేశాలలో కనిపించే ఒక ప్రాదేశిక నామం) వరకు ఈ దేవతామూర్తులు, ఆమెకు సంబంధించిన పురాణకథలలో ఒక అవిచ్ఛిన్నత కనిపిస్తుంది.  ఆసియా మైనర్, నైలు, గ్రీసు, సింధు లోయ సహా పురాతన ప్రపంచం అంతటా వివిధ వైఖరులకు చెందిన నగ్నస్త్రీ మూర్తులు విస్తారంగా కనిపించాయి. సృష్టిస్థితి లయాలతో సహా అన్నింటినీ సంకేతించే ఈ దేవతకు చెందిన ఒక రూపం తన రెండు చేతులతో స్తనద్వయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకో రూపం ఎడమ చేతితో జననేంద్రియాన్ని, కుడి చేతితో స్తనాన్ని చూపిస్తుంది. ఇంకొక రూపం మగశిశువుకు పాలిస్తూ కనిపిస్తుంది. వేరొక రూపం రెండు చేతులూ చాపి, వాటిలో పంటకు సంబంధించిన కంకులను, పువ్వులను, సర్పాలను, పావురాలను, ఇతర చిహ్నాలను పట్టుకుని పశువుల మధ్య నిలబడి కనిపిస్తుంది.

The Goddess of the Mountain

యూరప్ కు సంబంధించినంతవరకు అభివృద్ధి చెందిన తొలినాటి కంచుయుగ రూపాలు క్రీటుద్వీపంలో కనిపించాయి. ఈ ద్వీపంపై లెవంట్ ప్రభావం పడింది. క్రీ.పూ. 25౦౦-క్రీ.పూ. 12౦౦ ల మధ్యకాలంలో క్రీటు నాగరికత (మినోవన్ నాగరికత) ఉచ్ఛదశను చవిచూసింది. మన దేశంలో సింధు నాగరికతకు చెందిన హరప్పా-మొహెంజదారోల కాలం కూడా ఇదే.  క్రీటునగరం నోసోస్ లోని ప్రాసాదం శిథిలాలలో క్రీ.పూ. 1500 కు చెందిన ఒక సీలు దొరికింది. ఆ సీలు మీద ఒక దేవత బొమ్మ ఉంది. ఆమె జగత్ పర్వత దేవత(The Goddess of the World Mountain). ఆమె ఒక దండం లాంటిది పట్టుకుని కొండ మీద నిలబడి ఉంటుంది. రెండువైపులా రెండు సింహాలు ఉన్నాయి. ఆమె వెనకాల క్రీటు ఆలయరీతిని ప్రతిబింబించే ఒక భవనం ఉంది. ఆమె ఎదురుగా భక్తిని చాటే భంగిమలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు బహుశా చావు-పుట్టుకలను సూచించే ఆమె కొడుకు-భర్త; లేదా క్రీటు యువరాజు, లేదా ఒక భక్తుడు కావచ్చునని క్యాంప్ బెల్ అంటారు. ఒకవేళ అతను రాజే అయినప్పుడు, ఫ్రేజర్ చెప్పినదే నిజమైతే, ఎనిమిదేళ్ళ కోసారి శుక్ర-సూర్య ఆవృత్తి(Venus-solar cycle) పూర్తి అయినప్పుడల్లా రాజును నిజంగానో, ప్రతీకాత్మకంగానో బలి ఇచ్చేవారని కూడా ఆయన అంటారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్ధారణగా చెప్పలేకపోయినా, చావు-పునర్జన్మలను సంకేతించే యువకుని దేవతకు కొడుకుగా-భర్తగా స్పష్టంగా సూచించే దేవత చిత్రాలు అనేకం ఉన్నాయి. అలాగే రాజును బలి ఇవ్వడం గురించి చెప్పే చిత్రాలు, ఉదంతాలు కూడా.

వాటిని అలా ఉంచితే,  ఈమె పర్వతదేవత కావడం మన పురాణాలలోని పార్వతినీ; ఈమెకు రెండువైపులా సింహాలు ఉండడం –పార్వతికి మరో రూపమైన సింహవాహిని దుర్గను గుర్తుచేస్తాయి. పై దేవత పశువుల అధిదేవత(Lord of the Beasts)ను పోలి ఉందని పురావస్తు నిపుణులు అనడం గమనిస్తే, పశుపతి అయిన శివుడు వెంటనే గుర్తుకొస్తాడు. మొదట అమ్మవారి పాలనలో ఉన్న పశువులు, తర్వాత అయ్యవారి పాలనలోకి వెళ్ళాయన్నమాట.

The Goddess of the Double Axగ్రీసులోని క్రి.పూ. 2వ సహస్రాబ్దికి చెందిన పురాతన నాగరికతా ప్రాంతమైన మైసీనియాలో లభించిన ఒక గుండ్రని సీలు మీద ఒక చిత్రం ఉంది. ఆ చిత్రంలో ఉన్నది ‘జంట గొడ్డలి దేవత’(Goddess of the Double Ax). చిత్రంలో పైన సూర్యుడు, చంద్రవంక ఉన్నారు. చంద్రుడు క్షీణదశలో ఉండగా, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చంద్రుడి వెనకాల ఎడమ చేతిలో ఒక దండం పుచ్చుకుని చిన్న స్త్రీమూర్తి నిలబడి ఉంది. ఒక మైసీనియా డాలు ఆమెను కప్పుతోంది. మన మహిషాసురమర్దనిలా ఈ జంట గొడ్డలి దేవత యోధదేవత అనడానికి ఇది సూచన. అలాగే, దేవతకు చెందిన సంహార, లేదా మృత్యుదేవతా లక్షణానికి కూడా ఇది సూచన.(తాత్వికంగా చెబితే, ఈ సంహార కార్యాన్ని దుష్టశిక్షణ, శిష్టరక్షణగా అన్వయించడం తర్వాతి కాలంలో వచ్చింది. ఈ చిత్రం ప్రాతినిధ్యం వహించే ఆదిమ పౌరాణికకాలంలో ఆ అర్థం లేదు). ఈ చిన్న స్త్రీమూర్తి, బలి ఇచ్చిన ఆరు పశువుల శిరస్సులను తన కుడి చేతితో చూపుతోంది. దానికి సరిగ్గా అభిముఖంగా పుష్కలంగా పండిన పండ్లతో ఒక చెట్టు ఉంది. అది జీవవృక్షం(Tree of Life). ఒక చిన్న పిల్ల ఎగిరి పండ్లు కోసుకుంటోంది.

చిత్రం మధ్యలో కనిపిస్తున్నది, క్రీటుకు చెందిన జంట గొడ్డలి. దాని ఒక అంచు బలిని సూచిస్తోంది. రెండవ అంచు జీవవృక్షాన్ని సూచిస్తోంది. చెట్టు కింద కూర్చుని ఉన్నదే జంట గొడ్డలి దేవత. ఆమె ప్రసన్నవదనంతో ఉంది. ఆమె ఎదురుగా ఇద్దరు భక్తులు ఉన్నారు. ఆమె కుడి చేతితో ఒక పంట తాలూకు మూడు కంకులు వారికి ఇస్తూ, ఎడమ చేతితో తన స్తనం ఒకదానిని ఎత్తిచూపుతోంది. ఆమె పాదాల దగ్గర ఒక చిన్నపిల్ల ఉంది. కాళ్ళు లేని ఆ పిల్ల భూమిలోంచి పైకి వస్తున్నట్టు ఉంది. ఆ అమ్మాయి ఎడమచేతిలో చిన్న జంట గొడ్డలి, కుడి చేతిలో చెట్టుకొమ్మ ఉన్నాయి.

చిత్రంలో ఈ చివర, డాలుతో కప్పిన స్త్రీమూర్తి కిందికి దిగుతున్న భంగిమలో ఉండడం, ఆ చివర ఒక బాలిక పైకి ఎగిరి పండ్లు కోసుకుంటున్న భంగిమలో ఉండడం ఇందులోని తాత్విక సారాంశాన్ని వెల్లడిస్తాయి. కిందికి దిగుతున్నట్టు ఉన్న స్త్రీమూర్తి మృత్యువుకు, ఎగిరి జీవవృక్షం పండ్లు కోసుకుంటున్న బాలిక పునర్జన్మకు సంకేతాలు. అంటే చావు, పుట్టుకలు రెండింటికీ ఈ జంట గొడ్డలి జగజ్జననే అధిదేవత. జంట గొడ్డలి సంకేతించేది కూడా దానినే. ఒక్కోసారి చావు, పుట్టుకలను వేర్వేరు దేవతలతో సంకేతించినా వారు ఈ దేవత అంశలు మాత్రమే. పితృస్వామిక పురాణాలకు ముందు పౌరాణిక ఉద్యానవనమూ(Mythic Garden), స్వర్గమూ(Paradise) కూడా ఈ దేవతే. ఈమె కొడుకు దుముజి చంద్రుని క్షీణ, వృద్ధి దశలను సంకేతిస్తూ చావు-పుట్టుకల చక్రభ్రమణం సాగిస్తూ ఉంటాడు.

The Minoan Double Ax

పైన పేర్కొన్న జగత్ పర్వత దేవత చిత్రంలోని సింహాలు కూడా ఒకవైపు మృత్యుభయాన్ని, ఇంకోవైపు పునర్జన్మను లేదా అమరత్వాన్ని సూచిస్తాయి. అంటే భక్షణ, రక్షణ -రెండింటికీ ఇవి ప్రతీకలు. గ్రీకుదేవత మెడూసా, మన కాళికాదేవి సంకేతించేది కూడా సరిగ్గా ఇదే. అంటే జగజ్జనని ప్రపంచంలో చావు-పుట్టుక, భయమూ-నిర్భయమూ అనే ద్వంద్వాలు లేవు. ప్రకృతి నియతికి ప్రతిరూపంగా సాగే ఆ జీవనంలో మంచి-చెడు; వెలుగు-చీకటి, ధర్మమూ-అధర్మమూ అనేవి నేడు మనం భావించుకునే సరళిలో ఉండకపోవచ్చు. ద్వంద్వాలు అన్నీ ఒకదానిలో ఒకటి కలసిపోతున్న, ఒకదాని వెంట ఒకటిగా చక్రభ్రమణం సాగిస్తున్న ఒక అద్వితీయ ప్రపంచం అది. ప్రకృతిలో కూడా జరిగేది అదే. మొక్క మరణించి తన విత్తనంలోంచి తనే పునర్జన్మ ఎత్తుతూ ఉంటుంది. శిశిరంలో మోడువారిన చెట్టు వసంతం రాగానే చిగురిస్తుంది.  ప్రకృతికి ప్రతిబింబమే జగజ్జనని తాత్వికత కూడా.

ఈ ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, గుట్టలు, తోపులు, పక్షులు, పశువులు, సర్పాలు, చంద్రుడు, తారలతో సహా సమస్తమూ జగజ్జనని పరివారమే. వీటిలో మళ్ళీ కొన్ని ద్వంద్వాలకు తావులేని జగజ్జనని తాత్వికతకు అద్దంపట్టే ముఖ్యమైన ప్రతీకలు కూడా అయ్యాయి. వాటి గురించి కొంత ఇప్పటికే చెప్పుకున్నాం. మరికొన్ని విశేషాలు తర్వాత…

 ~

దాచేస్తే దాగని మాతృస్వామిక సత్యాలు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనకు తెలుసు…మన పురాణ కథలలో ప్రకృతి అంతా సమాన భాగస్వామి అవుతుంటుంది. ‘ప్రకృతి అంతా’ అన్నప్పుడు అక్షరాలా ప్రకృతి అంతా అనే! అందులో ఎలాంటి మినహాయింపూ లేదు. ఉదాహరణలను చెప్పుకుంటూ వెడితే అంతే ఉండదు. అయినా కొన్ని చెప్పుకుంటే, హిమవంతం ఒక కొండ, ఆ పర్వతరాజు కూతురు పార్వతి. శివుడు నాగాభరణుడు, వృషభవాహనుడు. విష్ణువు గరుడ(పక్షి)వాహనుడు. దుర్గ సింహవాహిని. వినాయకుడు మూషికవాహనుడు. కుమారస్వామి నెమలివాహనుడు. బ్రహ్మ కమలాసనుడు. మన్మథుని విల్లు చెరకుగడ. తుమ్మెదలు దానికి అల్లెతాడు. పువ్వులు ఆయన బాణాలు. చిలుక వాహనం…

ఒక కోణం నుంచి చూస్తే మన పురాణ, ఇతిహాస, కావ్యాలు మనిషి జీవితంలో ప్రకృతి ఎంత అవిభాజ్యమో, రెండింటి మధ్యా సామరస్యం ఎంత అవసరమో చెబుతున్నట్టు ఉంటాయి. ప్రకృతిలోని ప్రతి అందాన్ని, ప్రతి అద్భుతాన్ని రెండు దోసిళ్లతో అందుకుంటూ జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోమని బోధిస్తున్నట్టు ఉంటాయి. అడుగడుగునా ప్రకృతి సంబంధమైన పదజాలమూ, అలంకారాలతోపాటు అదనంగా ప్రకృతివర్ణనలు ఉంటాయి.

అసలు మొత్తం రామాయణ కథనే ప్రకృతి పరంగా అన్వయించుకోవచ్చు, అందులో గుహుడు, శబరి లాంటి గిరిజనులు లేదా వనచరులు ఉన్నారు. వానరాల వంటి తరుజునులు ఉన్నారు. సంపాతి, జటాయువు వంటి పక్షులు ఉన్నారు. చివరికి ఉడుత ప్రస్తావన కూడా ఉంది. అద్భుతమైన గుహలు, పర్వతాలు, చెట్లు, నదులు, సెలయేళ్లు, సముద్రాలతో కూడిన మొత్తం ప్రకృతి సన్నివేశం అంతా ఉంది. మామూలుగా ఉండడం కాకుండా రాముడు ప్రకృతిలోని వీటన్నింటితో సహజమైత్రితోనూ, సామరస్యంతోనూ ఉండడాన్ని కూడా రామాయణం ప్రత్యేకించి చెబుతోంది.

చివరిలో కూడా రామాయణం ప్రకృతి పరమైన ఒక సందేశాన్ని ఇస్తోంది. అదెలాగంటే, రావణవధ తర్వాత రాముడు పుష్పకవిమానం ఎక్కి సీతాలక్ష్మణులతో, వానరవీరులతో అయోధ్యకు తిరిగి వస్తూ మార్గమధ్యంలో భరద్వాజమహర్షిని సందర్శిస్తాడు. అప్పుడా మహర్షి ఏదైనా వరం కోరుకోమని రాముని అడుగుతాడు. చెట్లు అన్ని కాలాలలోనూ  పుష్కలంగా పండ్లు కాస్తూ ఉండేలా వరమివ్వమని రాముడు అడుగుతాడు. అందులో, చెట్లను విచక్షణారహితంగా నరకవద్దన్న సందేశం ఉంది. అడవుల పరిరక్షణ ఉంది. ఆవిధంగా పర్యావరణ ప్రబోధం ఉంది. వానరులకు చెట్లు ఆవాసాలు, ఫలాలు ఆహారమూ కనుక; తనకు ఎంతో సాయం అందించిన వానరుల పట్ల రాముడు కృతజ్ఞతను చాటుకోవడమూ ఉంది.

ప్రకృతి అంతా సమాన భాగస్వామి అవుతున్నది మన పురాణకథల్లోనేనా? కాదు, అనేక ప్రాంతాల పురాణకథల్లో! ఆ సంగతిని మరోసారి గుర్తుచేయడానికే పై ఉపోద్ఘాతం.

ముందుగా ఈ చిత్రాలు చూడండి…ఒకటి సరస్వతి చిత్రం. ఆమె పక్కన నెమలి ఉంది. కొన్ని చిత్రాలలో హంసలు ఉంటాయి. సరస్వతి హంస ఆసనం మీద కూర్చుని ఉన్న చిత్రాలూ కనిపిస్తాయి. రెండవది శృంగేరి శారదాదేవి చిత్రం. ఆమె నాలుగు చేతులలో ఒక చేతి మీద చిలుక వాలి ఉంది.

sarasvati

ఇంతకుముందు జియస్ మిలికోయిస్ అనే సర్పదేవుడికి కొందరు మొక్కుతున్న చిత్రం గురించీ, రాక్షసుడైన ఆ దేవునికి ఏటా పందులను బలి ఇవ్వడం గురించీ (‘యెహోవా కూడా కాళియమర్దనుడే’ అనే వ్యాసంలో)చెప్పుకున్నాం. తర్వాతి కాలానికి చెందిన ఒలింపియన్ తరహా తంతులకు భిన్నంగానూ, విపరీతంగానూ కనిపించే ఇలాంటి తంతులు ఒకవిధమైన ‘శైత్యాంధకారా’(chilly gloom)న్ని సూచిస్తూ ఉంటాయని లూసియన్ అనే ఒక గ్రీకు వ్యాఖ్యాత అంటారు. జోసెఫ్ క్యాంప్ బెల్ ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారు. కంచు యుగానికి చెందిన హోమర్ కు ముందునాటి గ్రీసు, మినోవన్, సైక్లాడిక్ దీవుల నాగరికతల వాతావరణం శైత్యాంధకారాన్ని తలపించేది కాదనీ; కాకపోగా అప్పటి కళాకృతులను గమనిస్తే, సృష్టి ప్రక్రియకు అనుగుణంగా సరసంగా, సమరసంగా జీవించే వాతావరణం వాటిలో కనిపిస్తుందనీ ఆయన అంటారు.

srungeri sarada

ఆ సందర్భంలోనే ఆయన ఇంకోటి కూడా అంటారు: (గ్రీకు)ఇతిహాసకాలంలో కూడా అమ్మవారు సర్పాలు, సింహాలు. చేపలు, చెరువులు, పావురాల గూళ్ళు, తాబేళ్ళు, పీతల్లాంటి అనేక కాళ్ళ సముద్రజీవులు, మేకలు, వృషభాలు మొదలైన సమస్త పరివారంతోనూ ఉంటుంది కానీ ఆమె ఎల్లప్పుడూ భయపెట్టేలా ఉండదు.

ఇక్కడ మనకు వెంటనే  గుర్తొచ్చే పోలిక, కాళికాదేవి.

 

గ్రీకు పురాణాలలో అఫ్రోడైట్ శృంగార, ప్రేమ, కామదేవత. మన లక్ష్మీదేవిలానే ఈమె సముద్రంలోంచి పుట్టింది.  మన మన్మథుడిలానే గొప్ప గొప్ప దేవుళ్ల మనసులలో సైతం శృంగార భావనలను రెచ్చగొట్టి అల్లరి పెట్టే చిలిపి దేవుడు ఈరోస్.  కొన్ని గ్రీకు పురాణ కథల ప్రకారం ఇతడు అఫ్రోడైట్ కొడుకు. హోమర్ ముందు కాలం నుంచీ, అంటే గ్రీకు ఇతిహాస కాలానికి ముందు నుంచీ ఉన్న శృంగార/ప్రేమ/కామాలను సంకేతించే దేవతారూపాలు వీరిద్దరూ. అయితే, అప్పట్లో అఫ్రోడైట్ ఆరాధనకు ఉన్న ప్రాచుర్యం ఈరోస్ ఆరాధనకు లేదు.

ప్రస్తుతానికి వస్తే, శారదాదేవి చేతి మీద చిలుక ఉన్నట్టే, అఫ్రోడైట్ చేతిలో పావురం ఉంది! మన సరస్వతిలా హంసలతోనూ, లేదా హంసవాహనం మీదా ఉన్న అఫ్రోడైట్ చిత్రాలు కూడా కనిపిస్తాయి.

ఈ పావురం ప్రతీకే ఒక క్రైస్తవ ఉదంతంలో కూడా కనిపిస్తుంది, దేవుడైన ‘హోలీ ఘోస్ట్’ ఒక పావురం రూపంలో మేరీ దగ్గరికి వస్తాడు. అయన ప్రభావంతో మేరీ తన చెవిలోంచి దేవుడి కుమారుని కంటుంది. అతను ఒక గుహలో పుడతాడు. ఈయన రొట్టె(bread)కూ, ద్రాక్షాసవా(wine)నికీ చెందిన వాడనీ, జననమరణాల చక్రంలో తిరుగుతూ ఉంటాడనీ ఈ ఉదంతం చెబుతుంది. దీనికి సంబంధించిన ఇతర అనేక వివరాలను అలా ఉంచితే,  క్యాంప్ బెల్ ప్రకారం, పావురం కూడా సర్పంలానే హోమర్ ముందు కాలానికి చెందిన జగజ్జనని పరివారంలో భాగం.

పై కథలాంటిదే గ్రీకు పురాణాలలోనూ కనిపిస్తుంది. దాని ప్రకారం, భూదేవత డిమీటర్, దేవతల నాయకుడు జియస్ ల కూతురు పెరెస్పోన్. డిమీటర్ కూతుర్ని క్రిటు ద్వీపంలోని ఒక గుహలో ఉంచి, తన రథాన్ని లాగే రెండు సర్పాలను దానికి కాపలా ఉంచుతుంది. వినడానికి దారుణంగానే ఉంటుంది కానీ, జియస్ సర్పరూపంలో ఆ గుహలోకి వెళ్లి పెరెస్పోన్ తో సంభోగిస్తాడు. ఇలాగే మన పురాణాలలో సరస్వతిని బ్రహ్మదేవుడికి కూతురిగానూ, భార్యగానూ కూడా చెప్పడం కనిపిస్తుంది.

వీటి వెనుక ఉండగల ఇతరేతర అన్వయాలలోకి ఇప్పుడు వెళ్ళలేం కనుక, ప్రస్తుతానికి వస్తే; మరో కథ ప్రకారం, పెరెస్పోన్ ప్రశాంతంగా గుహలో కూర్చుని విశ్వవస్త్రాన్ని నేస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి డిమీటర్ తన కూతురు జియస్ కంటబడేలా చేస్తుంది. జియస్ సర్పరూపంలో గుహలోకి ప్రవేశిస్తాడు. పెరెస్పోన్ డయోనిసస్ అనే కొడుకును కంటుంది. ఇతను కూడా పైన చెప్పుకున్న చావు పుట్టుకల దేవుడు. అంటే రొట్టెకు, ద్రాక్షాసవానికి చెందిన దేవుడన్నమాట.

మన అమ్మవారి పరివారంలో చిలుక, హంస మొదలైనవి భాగమైనట్టే; గ్రీకు పురాణాలలో అమ్మవారి పరివారంలో భాగమైన పావురం క్రైస్తవ కథలోకి కూడా ప్రవేశించిన వైనాన్ని పై ఉదాహరణలు చెబుతున్నాయి. అలాగే, పెరెస్పోన్, మేరీలకు గుహలో కొడుకు పుట్టడంలో కూడా పోలిక కుదిరింది. ఈ ఉదాహరణలు ఆయా ప్రాంతాల పురాణకథల పరస్పర ప్రభావాన్నే కాక వాటి నిరంతరాయతను కూడా సూచిస్తాయి.

aphrodite

ఈ కథలు సూచించే మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థ గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుని మాతృస్వామ్యంలో  అంతర్లీనంగా ఉన్న జగజ్జనని తాత్వికతలోకి వెడదాం.

ఇంతవరకు చెప్పుకున్న రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, జియస్, యెహోవా మొదలైన ఉదాహరణలలో మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థ ఎలా వ్యక్తమవుతోందో; మాతృస్వామ్య దేవతా రూపాలపైనా, తాత్వికతపైనా పితృస్వామ్యం పై చేయిని చాటుకోడానికి  ఎలా ప్రయత్నించిందో చూశాం. అయినాసరే, మాతృస్వామిక అవశేషాలు వీటిలో తొంగిచూస్తూనే ఉన్నాయి. గ్రీసు విషయానికే వస్తే, ఇక్కడి మాతృస్వామిక దేవతలను పితృస్వామిక దేవుళ్ళు రూపుమాపలేదనీ, వారిని వివాహమాడారనీ క్యాంప్ బెల్ అంటారు. మన దగ్గర కూడా సరిగ్గా అదే జరిగినట్టు కృష్ణుడి ఉదాహరణ ద్వారా చెప్పుకున్నాం. అమ్మవార్ల సమూహానికి ప్రతీక అయిన బృందను పెళ్లాడడం ద్వారా, కాత్యాయనిని (గోపికా వస్త్రాపహరణం కథలో)ఆరాధించేకంటే ముందు తనను ఆరాధించమని చెప్పడం ద్వారా కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిరాకరించకుండానే ద్వితీయస్థానానికి తరలించాడనీ అనుకున్నాం.

గ్రీకు-రోమన్ కథలతో పోల్చితే, పాత నిబంధన(Old Testament)లోని కథలు మాతృస్వామిక దేవతలపై పితృస్వామిక దేవతలు మరింత నిశ్చయాత్మకమైన విజయాన్ని సాధించినట్టు చెబుతాయని క్యాంప్ బెల్ అంటారు.  గ్రీకు-రోమన్ పురాణకథలలో వెనకటి దేవతలు, దేవుళ్ళ ప్రాధాన్యం తగ్గింది కానీ వారు అదృశ్యం కాలేదు. వారే కాకుండా, మాతృస్వామికతకు చెందిన వ్యవసాయపు తంతులు, స్త్రీల తంతులు, ముఖ్యంగా డిమీటర్, ఆర్ఫిక్స్ మార్మికతలు కూడా కొనసాగాయి. అంతేకాదు, Virgin and the Mass కు చెందిన కథలూ, తంతుల రూపంలో ఇవే తంతులు క్రైస్తవంలోకి కూడా వెళ్ళాయి.

మన అనుభవం ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. మాతృస్వామిక దేవతలే కాకుండా; ఆ కాలపు వ్యవసాయ, స్త్రీ సంబంధమైన తంతులు; మార్మికతను చాటే రకరకాల తాంత్రిక పద్ధతులూ నేటికీ మన దగ్గర సజీవాలు.

ఇంకా విశేషం ఏమిటంటే, బైబిల్ పౌరాణికత మాతృస్వామిక దేవతలను రూపుమాపినట్టు కనిపించినా; మాతృస్వామ్య కాలానికి చెందిన సౌభాగ్య తంత్రాలను ఇజ్రాయెల్ పొడవునా జనం ఆదరిస్తూ, గౌరవిస్తూ వచ్చారని Samuel and Kings లోని ప్రతి అధ్యాయమూ చెబుతుందని క్యాంప్ బెల్ అంటారు. సాంప్రదాయిక బైబిల్ పండితులు మోజెస్ రాసినట్టు విశ్వసించే పెంటాట్యూక్ (Pentateuch: బైబిల్ లోని మొదటి అయిదు పుస్తకాలను పెంటాట్యూక్ అంటారు. ఇది గ్రీకు పదం. ‘పెంటా’ అంటే అయిదు అనీ, ‘ట్యూక్’ అంటే లిఖితపత్రమనీ అర్థం. ఆ అయిదు పుస్తకాలు: జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యుటెరానమి. వీటిని Laws of Moses అనీ; హిబ్రూ భాషలో ‘ధర్మశాస్త్రం’ అని అర్థమిచ్చే ‘తోరా’ అనీ పిలుస్తారు)లోకి కూడా పురాతన భూమాతకు, ఆమె సర్పభర్తకు సంబంధించిన సంకేతాలు ప్రతీకల రూపంలో నిశ్శబ్దంగా అడుగుపెట్టాయి.

ఉదాహరణకు, నిషిద్ధఫలాన్ని తిన్నప్పుడు, ‘ఎందుకు ఈ పని చేశా’వని స్త్రీని యెహోవా అడుగుతాడు. సర్పం వంచనతో నన్ను తినిపించిందని స్త్రీ చెబుతుంది. అప్పుడు సర్పంతో యెహోవా, ‘నువ్వు ఈ తప్పు చేశావు కనుక, నిన్ను శపిస్తున్నాను. ఇక నుంచి పొట్టతో నేలమీద పాకుతూ, బతికినంతకాలం దుమ్ము తింటూ బతుకు. నీకూ, ఈమెకూ మధ్య; నీ సంతానానికీ, ఈమె సంతానానికీ మధ్య శత్రుత్వాన్ని కల్పిస్తున్నాను. అతను (ఆమె సంతానం)నీ పడగ మీద కొడతాడు, నువ్వు అతని పాదాన్ని కాటేస్తావు’అంటాడు.

అలాగే, ‘నీ భర్త అయిన సర్పానికి నువ్వు అణగిమణగి ఉండుగాక’ అని స్త్రీని శపిస్తాడు. ఇది నూతనయుగం మీద పితృస్వామికపు సీలు వేస్తున్న మాట అని క్యాంప్ బెల్ అంటారు.  ఆ తర్వాత, ‘స్త్రీ ఇచ్చిన ఫలాన్ని తిన్నావు కనుక, ఏ మట్టిలోంచి పుట్టావో ఆ మట్టిలో కలసిపోయే దాకా నీ ఆహారాన్ని శ్రమించి చెమటోడ్చి సంపాదించుకో’ అని పురుషునితో యెహోవా అంటాడు.

ఈ స్త్రీ పురుషులు పుట్టిన ఆ మట్టి మరేదో కాదు; భూమాతే! కాకపోతే యెహోవా మాటలు ఈ భూదేవతకు అంతవరకు ఉన్న పురుషభావారోప(anthropomorphic) లక్షణాలను తొలగించివేస్తున్నాయి. అంటే, భూదేవతను మామూలు మట్టిగా మార్చివేస్తున్నాయి. అయితే, తన నూతన భర్త యెహోవా కూడా తన ఊపిరిని ఊది మట్టి నుంచే సంతానాన్ని సృష్టించాడు కనుక భూమాత , అంటే స్త్రీ, సంతాన సంబంధమైన తన ప్రాథమిక లక్షణాన్నిఅలాగే నిలుపుకుంది. ఒకవైపు యెహోవా రూపంలో పురుషుడు సంతాన ప్రక్రియలోకి వేలు పెట్టి అది తన ద్వారానే జరుగుతున్నట్టు భ్రమింపచేయడానికి కృత్రిమంగా ఎంత ప్రయత్నించినప్పటికీ, మరోవైపు సంతానం కనడంలో స్త్రీకి గల సహజసిద్ధమైన పాత్రను ఈ కథనం మరుగుపుచ్చలేకపోయింది. మట్టినుంచి, అంటే భూమాతనుంచి పుట్టిన సంతానం చనిపోయిన తర్వాత కూడా మట్టిలోనే చేరుతున్నారు తప్ప తండ్రిని చేరడంలేదు.

పైన యెహోవా సృష్టికర్త అయినట్టే, మనదగ్గర కూడా మాతృస్వామిక పురాణకథలను పితృస్వామికంగా మార్చిన ఫలితంగా బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. అయితే, మాతృస్వామిక పురాణకథలు కూడా మన దగ్గర ప్రాచుర్యంలో ఉన్నాయి కనుక, వాటిలో అమ్మవారే సృష్టికి మూలం అవుతుంది. చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఆమె సృష్టే అవుతాడు.

పై విధంగా చూసినప్పుడు, పాత విశ్వాసప్రపంచానికి చెందిన టైటాన్ల లానే, పితృస్వామ్యపు సీలుతో పుట్టిన కొత్త విశ్వాసప్రపంచానికి చెందిన ఆదం, ఈవ్ లు కూడా భూమాత సంతానమే. మొదట వీరిద్దరూ ఒకటిగానే ఉన్నారు. ఆ తర్వాత రెండయ్యారు. యెహోవా శాపానికి దీటుగా స్పందించడంలో ఆదంలో వెనకటి టైటాన్ స్వభావమూ వ్యక్తమవుతుంది. ‘సమస్త ప్రాణులకూ తల్లి’ అనే అర్థంలోనే తన భార్యను అతడు ఈవ్ అని పిలుస్తాడు. ఈవిధంగా భూమాత కోల్పోయిన పురుషభావారోప లక్షణం ఈవ్ కు సంక్రమిస్తోంది. అలా చూసినప్పుడు, ఆదం ఆమెకు భర్తే కాక, కొడుకు కూడా అవుతాడు. అంతకుముందు యెహోవా మొదట మట్టిలోంచి పురుషుణ్ణి సృష్టిస్తాడు. అది స్త్రీకి కంటె పురుషునికి ప్రాధాన్యం ఇవ్వడానికి సూచన. ఆ తర్వాత ఆ పురుషుడి పక్కటెముకనుంచి స్త్రీని సృష్టిస్తాడు. స్త్రీ సంబంధం లేకుండా పురుషుడే సంతోనోత్పత్తి చేయగలడని చెప్పడం అది.

మహాభారతంలో ద్రోణుని ఓడించే కొడుకు కోసం ద్రుపదుడు యజ్ఞం చేసిన ఘట్టంలో  స్త్రీ సంబంధమైన శోణితమే కాక, పురుష సంబంధమైన శుక్రం కూడా లేకుండా మంత్రశక్తితోనే సంతానం కలిగిస్తామని యాజుడు అనడం (సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగుస్థానమే-వ్యాసం) ఇలాంటిదే. అయితే, మాతృస్వామ్యంలోకి పితృస్వామిక ఆధిక్యతను చొప్పించడానికి ఇంత పెద్ద కసరత్తు చేసినప్పటికీ మాతృస్వామిక లక్షణాలు పురుషుడి రాజకీయాన్ని, ఆధిపత్యాన్ని అధిగమించి పురాణాలలో తమ ఉనికిని కాపాడుకుంటూ ఉండడం ఇక్కడ గమనించవలసిన విశేషం.

ఇంకా విశేషం ఏమిటంటే, కంచుయుగపు తొలినాటి సీళ్ళ ప్రకారం యెహోవా కూడా సర్పశక్తికి ప్రాతినిధ్యం వహించేవాడే. ఆవిధంగా భూమాతకు సర్పభర్త అవుతాడు. ఉదాహరణకు, మోజెస్ (ఈజిప్టు)ఫారోను మాంత్రిక సర్పదండంతో బెదిరించినప్పుడు, ‘నీ చేతిలో ఉన్నది ఏమి’టని మోజెస్ ను యెహోవా అడుగుతాడు. ‘ఇదొక దండ’మని మోజెస్ జవాబు చెబుతాడు. ‘దానిని నేల మీద ఉంచు’ అని యెహోవా అంటాడు. మోజెస్ దానిని నేల మీద ఉంచగానే అది సర్పంగా మారిపోతుంది. దానిని చూసి మోజెస్ పారిపోతాడు. అప్పుడు యెహోవా ‘దాని తోకపుచ్చుకొని పైకి తీయ’మని చెబుతాడు. మోజెస్ అలా చేయగానే అది తిరిగి దండంగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ మాంత్రిక సర్పదండమే ఎడారిలో ఒక రాతినుంచి నీటిని సృష్టిస్తుంది. ఎడారి జనం యెహోవాకు వ్యతిరేకంగా గుసగుస లాడుకుంటున్నప్పుడు యెహోవా వారి మధ్యకు భయంకరమైన పాములను పంపిస్తాడు.

భయంగొలిపే ఒక పాము బొమ్మను తయారుచేయించి దానిని ఒక స్తంభం మీద నిలపమనీ, పాముకాటుకు గురైనవారు దానిని చూసినప్పుడు వారికి ప్రాణభయం ఉండదనీ మోజెస్ కు యెహోవా చెబుతాడు. మోజెస్ అలాగే ఒక కంచు సర్పాన్ని చేయించి దానిని ఒక స్తంభంపై నిలుపుతాడు. రాజు హెజెకియ్య కాలం వరకూ(క్రీ.పూ.719-691) జెరూసలెంలో ఉన్న ఆ కంచుసర్పాన్ని అందరూ భక్తితో సందర్శించుకునేవారు. దాని ముందు ధూపం వేసేవారు. దానికి ‘నెహుస్తాన్’ అని పేరు. అయితే, హెజెకియ్య ఆ కంచుసర్పాన్ని ధ్వంసం చేయించాడు.

క్యాంప్ బెల్ ఇంకో సంగతిని కూడా ప్రస్తావిస్తారు. యెహోవాను ప్రధానంగా ఆరాధించే పూజారితెగ పేరు ‘లెవీ’. యెహోవా జయించిన సర్పం పేరు ‘లెవియథాన్’. అలాగే సర్పపాదాలతో ఉన్న యెహోవా చిత్రాలు కూడా ఉన్నాయని ఆయన అంటారు. పై ఉదాహరణలన్నీ మాతృస్వామికరూపమైన సర్పంతో పితృస్వామిక యెహోవాకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి.

అదలా ఉండగా, పాముకాటుకు గురైనవారు జెరూసలెంలోని స్తంభం మీద ఉన్న కంచుసర్పాన్ని దర్శించుకునేవారు అన్నప్పుడు; కంచిలో వరదరాజస్వామి ఆలయంలోని బంగారు, వెండి బల్లులు; వాటిని తాకితే బల్లిపాటు వల్ల కలిగే అనర్థాలు ఉండవన్న విశ్వాసం గుర్తుకొచ్చి ఉండాలి.

మిగతా తర్వాత….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్త్రీని ‘జయించా’కే సీత జాడ తెలిసింది!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రామాయణంలో సీతాన్వేషణ ఒక ముఖ్యమైన ఘట్టం. వానరరాజు సుగ్రీవుడు సీత జాడ కనిపెట్టడానికి వానరబృందాలను అన్ని దిక్కులకూ పంపుతాడు. దక్షిణ దిశకు పంపిన బృందంలో హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైనవారు ఉన్నారు.  సుగ్రీవుడు చండశాసనుడు. అందుకే ‘సుగ్రీవాజ్ఞ’ అనే నానుడి వచ్చింది. వానరబృందాలను పంపుతూ అతడు గడువు విధిస్తాడు. గడువులోపల తిరిగి రాకపోతే మరణదండన తప్పదు.

అయితే, హనుమంతుడి బృందం స్వయంప్రభ బిలంలో ఉండగానే సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోయింది, దాంతో ఆ బృందంలో ఉన్నవారందరికీ ప్రాణభయం పట్టుకుంది. అక్కడే ఉండిపోయి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెట్టడానికి యువరాజు అంగదుడు నిర్ణయించుకుంటాడు. హనుమంతుడు ఎంత నచ్చచెప్పినా నిర్ణయం మార్చుకోడు. అంతలో జటాయువు అన్న అయిన సంపాతి కనిపించి లంకను పాలించే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి చెప్పి, లంక ఎక్కడుందో చెబుతాడు. అప్పుడు సముద్రాన్ని దాటి వందయోజనాల దూరంలో ఉన్న లంకకు వెళ్ళి, సీత జాడ కనిపెట్టే బాధ్యతను హనుమంతుడు స్వీకరిస్తాడు.  ఆ ఘట్టాన్ని ‘సుందరకాండ’ పేరుతో వాల్మీకి ప్రత్యేకంగా చిత్రించాడు.

ఈ కాండలో హనుమంతుడే నాయకుడు. వాల్మీకి ప్రకారం, అతను బుద్ధికుశలత కలిగిన వారందరిలోనూ ఉన్నతుడు. మంచి మాట నేర్పు ఉన్నవాడు. వానరవీరులలో ముఖ్యుడు. బ్రహ్మచారి, అంటే స్త్రీ సంబంధం లేనివాడు. గొప్ప కార్యసాధకుడు. ఇవన్నీ ‘పురుష’ప్రయత్నాన్ని, ‘వీర’త్వాన్ని నొక్కిచెప్పే గుణాలు. సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళి సీత ఉనికిని కనిపెట్టడం అనే మహత్కార్యం సాధించాలంటే, హనుమంతుడిలో ఈ గుణాలు అన్నీ ఉండాలి.

అయితే, అతనిలో ఈ గుణాలు ఉన్నట్టు నిరూపణ ఎలా? దానికి అతి ముఖ్యమైన గీటురాయి, అతను ‘స్త్రీ సూత్రా’(female principle)న్ని అధిగమించగలగడం! ఈ ఘట్టంలో కథకుడు ఒకరిని కాదు, ఏకంగా ముగ్గురు స్త్రీలను ప్రవేశపెట్టి హనుమంతుడు తన బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ వారిని ఎలా జయించాడో చెప్పాడు. దుర్భేద్యమైన రావణాసురుని నగరంలోకి అడుగుపెట్టి సీత జాడ కనిపెట్టాలంటే, ఒక స్త్రీని జయిస్తే సరిపోదు, ముగ్గురు స్త్రీలను జయించినట్టు చెప్పాలి.

ఆ ముగ్గురిలో మొదటి స్త్రీ, ‘నాగమాత’ అయిన సురస; రెండవ స్త్రీ, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి; మూడవ స్త్రీ లంకానగరానికి అధిదేవత అయిన లంకిణి.

హనుమంతుడు సముద్రం మీద పయనిస్తుండగా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అతని బలపరాక్రమాలను, బుద్ధికుశలతను తెలుసుకోవాలని ముచ్చట పడ్డారు. “నువ్వు భయంకరమైన కోరలతో, పచ్చని కళ్ళతో, ఆకాశమంత నోటితో, పర్వతంలాంటి రాక్షసరూపం ధరించి క్షణకాలం అతనికి విఘ్నం కలిగించు” అని నాగమాత అయిన సురసను కోరారు. సురస వారు కోరిన రూపంలో సముద్రమధ్యంలోంచి  వెళ్ళి హనుమంతుని అడ్డగించింది. నిన్ను తినేస్తానంది. “నేను సీతను చూసొచ్చి రామునికి ఆమె కుశలం చెప్పిన తర్వాత నీలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు వెళ్ళనివ్వు’’ అని హనుమంతుడు అన్నాడు. సురస అంగీకరించకుండా తన నోటి వైశాల్యాన్ని పెంచుకుంటూ పోయింది.  హనుమంతుడు అంతకంటే ఎక్కువ ప్రమాణానికి తన దేహాన్ని పెంచుకుంటూ వెళ్ళి, హఠాత్తుగా బొటనవేలంత రూపం ధరించి సురస నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటికి వచ్చేశాడు. ఈవిధంగా ఉపాయంతో, స్త్రీ రూపంలో ఎదురైన మొదటి అడ్డంకిని దాటాడు.

కొంతదూరం వెళ్ళిన తర్వాత, సింహిక అనే రాక్షసి అతన్ని చూసింది.  ఇంతకాలానికి తినడానికి మహాజంతువు ఒకటి దొరికిందనుకుంది. హనుమంతుని నీడను పట్టుకుని కిందికి లాగడం ప్రారంభించింది. ఒక్కసారిగా తన వేగమూ, బలమూ సన్నగిల్లడంతో హనుమంతుడు ఆశ్చర్యంగా అన్నివైపులా చూశాడు. మహాశక్తిమంతమైన సింహిక కనిపించింది. తనను మింగడానికి తెరచిన సింహిక నోట్లోకి ప్రవేశించి వాడిగోళ్లతో ఆయువు పట్లను చీల్చి చెండాడాడు. సింహిక ఆర్తనాదం చేస్తూ కుప్పకూలింది. “ఈ మహాప్రాణిని చంపి నువ్వు అద్భుతకార్యం సాధించా”వంటూ దేవతలు, గంధర్వులు మొదలైనవాళ్లు హనుమంతుని అభినందించారు.

చివరికి త్రికూటపర్వతం మీద ఉన్న లంకానగరాన్ని చూశాడు. పైనుంచి అతనికి అది ‘నాగులతో నిండిన’ పాతాళ నగరం భోగవతిలా కనిపించింది. నగరంలోకి ప్రవేశించబోతుండగా భయంకరరూపం కలిగిన లంక అధిదేవత లంకిణి అతన్ని అడ్డగించింది. నన్ను జయించి కానీ నువ్వు లోపలికి వెళ్లలేవంటూ అరచేతితో అతన్ని బలంగా కొట్టింది. హనుమంతుడు ఆమెను పిడికిలి బిగించి కొట్టేసరికి ఆర్తనాదం చేస్తూ నేలకొరిగి, శరణు వేడి దారి ఇచ్చింది.

ఈవిధంగా అతను లంకలోకి ప్రవేశించడం, సీతను చూడడం, పలువురు రాక్షసులను చంపడం, రావణుని కలసుకుని రాముడు యుద్ధసన్నద్ధుడై వస్తున్నట్టు చెప్పడం, లంకా దహనం చేయడం తదుపరి పరిణామాలు.

హనుమంతుడు ‘నాగమాత’ సురసను జయించడమే చూడండి…దానర్థం, మాతృస్వామిక ఆరాధన రూపమైన సర్పాన్ని జయించడమే! ఈ విధంగా అతనికి భాగవత కృష్ణుడితోనూ, బైబిల్ యెహోవాతొనూ సామ్యం కుదురుతోంది. నాగులతో నిండిన పాతాళంలా లంక అతనికి కనిపించిందనడంలో కూడా నాగుల ప్రస్తావన ఉంది. అంతేకాదు, వాటితోపాటు లంకలోని రాక్షసులను కూడా ఈ సందర్భంలో కథకుడు ప్రస్తావించాడు.  లంకా నగరం నరులకు, వానరులకు కూడా భిన్నమైన జీవనవిధానమూ, విశ్వాసాలూ ఉన్న ప్రదేశమని ఈ రెండు ప్రస్తావనలూ సూచిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాక్షసత్వాన్ని ఆపాదనగా పరిగణించి, నాగుల ప్రస్తావనలను గమనంలో ఉంచుకుంటే లంకానగరం మాతృస్వామిక అవశేషాలు కలిగిన ప్రాంతం అనుకోవాలా?! ప్రస్తుతానికి దీనిని సందేహార్థకంగానే వదిలేద్దాం.

అలాగే, హనుమంతుడికి, ఓడిసస్ కు కూడా ఒక పోలిక కుదురుతోంది. హనుమంతుడు సముద్రం మీద లంఘిస్తే, ఓడిసస్ సముద్రయానం చేశాడు. ఇద్దరూ వీరులే. హనుమంతుడు తన ప్రయాణంలో ఒక ప్రతికూల స్త్రీ( సింహిక), ఇద్దరు అనుకూల (సురస, లంకిణి) స్త్రీల రూపంలో ‘స్త్రీ సూత్రా’న్ని ఎదుర్కొన్నట్టే; ఓడిసస్ కూడా నీళ్ళు పట్టుకునే ఒక అందమైన యువతి, సిర్సే, కలిప్సే అనే ఇద్దరు అప్సరసలు—మొత్తం ముగ్గురు స్త్రీల రూపంలో స్త్రీ సూత్రాన్ని ఎదుర్కొంటాడు. అందమైన యువతి పట్ల సమ్మోహితు డైనందుకు పదకొండు ఓడలను, పెద్ద సంఖ్యలో సహచరులను కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకుంటాడు. తర్వాత సిర్సే అనే ప్రతికూలశక్తిని దైవ సహాయంతో లొంగదీసుకుని, ఆ తర్వాత కలిప్సే అనే అనుకూలశక్తితో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. వీటికంటె ముందు పోలిఫెమస్ అనే ఒంటికన్ను రాక్షసుని ఉపాయంతో జయిస్తాడు. ఈ విధంగా హనుమంతుడి లానే ఓడిసస్ కూడా స్త్రీ సూత్రాన్ని అధిగమించడంలో బుద్ధిబలాన్ని, భుజబలాన్ని, ధైర్యసాహసాలను ప్రదర్శిస్తాడు. ఇద్దరికీ దేవతల సహాయమో, ఆశీస్సులో లభిస్తాయి.

ఆ మాటకొస్తే,  హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి ముందే వానరులందరికీ స్వయంప్రభ బిలం రూపంలో ‘స్త్రీ సూత్రం’ ఎదురైందని అనుకోవచ్చు. అద్భుతత్వమూ, ఆకర్షణా ఉట్టిపడే అలాంటి బిలం ఆ పరిసరాలలో ఉంటుందని వారు ఊహించలేదు. అక్కడే వారు నెలరోజులు ఉండిపోయారని కథకుడు చెబుతున్నాడు. అంటే దాని ఆకర్షణకు లొంగి వారు తమ మీద ఉన్న కార్యభారాన్ని విస్మరించారన్నమాట. అలా వారు అక్కడ ఉండగానే సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోవడంతో వారికి మృత్యుభయం పట్టుకుంది. కలిప్సే మోహజాలంలో చిక్కుకుని ఎనిమిదేళ్లు ఆమెతోనే ఉండిపోయి యాత్రాలక్ష్యాన్ని విస్మరించిన ఓడిసస్ ను ఇది గుర్తుచేస్తుంది. స్త్రీ సూత్రం కార్యసాధనకు అడ్డంకి అని ఇందులోని ధ్వని.

స్త్రీవధ విషయానికి వస్తే, తాటకను చంపిన రాముడు, పూతనను లొంగదీసుకున్న/చంపిన కృష్ణుడి పక్కనే  హనుమంతుడు కూడా చేరుతున్నాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం కూడా ఇలాంటిదే. ఒక బాబిలోనియా పురాణకథలో తియామత్ అనే జగజ్జనని లాంటి దేవతను మర్దుక్ అనే దేవుడు చంపుతాడు. సిర్సేను చంపడానికి ఓడిసస్ కత్తి దూస్తాడు.  స్త్రీవధను ‘వీరత్వా’నికి సూచనగానే ఇవన్నీ చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాక, భిన్నప్రాంతాలకు చెందినవన్న సంగతిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, వీటిమధ్య ఉన్న పోలికలు కేవలం యాదృచ్చికాలని కాకుండా, వీటి వెనుక ఒక కచ్చితమైన సరళి ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక పరిణామాన్ని ఇవి చెబుతున్నాయి. అది:  మాతృస్వామ్యంపై పితృస్వామ్యస్థాపన! అంటే, స్త్రీ ఆధిపత్యం నుంచి పురుషుడు బయటపడి ‘క్రియాశీలి’ కావడం!

hanuma

పురుషుడు స్త్రీపై ఆధిపత్యం సాధించిన తర్వాత, స్త్రీవధ వీరత్వానికి నిరూపణ కావలసిన అవసరం ఇక లేదు. అందుకు భిన్నంగా అది భీరత్వాన్ని సూచిస్తుంది.  స్త్రీని చంపడం మహాపాపంగా, హింసించడం అనాగరికంగానే కాక, అసలు స్త్రీతో యుద్ధం చేయడమే పురుషుడికి నామోషిగా పరిణమిస్తుంది. భీష్ముడి ఉదాహరణ అదే చెబుతుంది. శిఖండిని చూడగానే అయన అస్త్ర్రసన్యాసం చేస్తాడు.

తాటకను చంపబోయే ముందు రాముడు స్త్రీవధ తగునా అన్న ద్వైధీభావానికి లోనవుతాడు. అయినా చంపుతాడు. అంటే కథకుడు స్త్రీవధ తగదన్న సమకాలీన స్పృహను ప్రకటిస్తూనే, అది  ‘వీరోచితం’ అన్న ఒకనాటి సంగతినీ చెబుతున్నాడు. అలాగే, సింహికను చంపిన హనుమంతుడు, లంకిణి విషయానికి వచ్చేసరికి స్త్రీవధ తగదనుకుంటాడు.

అయితే, స్త్రీ ఏ ఉగ్రవాదో అయి ఆయుధంతో దాడి చేసినప్పుడో; ఆత్మరక్షణ అనివార్యమైనప్పుడో కూడా స్త్రీవధ కూడదా అన్న సందేహం ఇక్కడ కలుగుతుంది. అదే సమయంలో, వివిధ ప్రాంతాలకు చెందిన పురాణ, ఇతిహాస కథల మధ్య ఉన్న పోలికల వెనుక ఒక సరళి ఉన్నప్పుడు, అవి సాముదాయికంగా ఒకే విషయాన్ని చెబుతున్నప్పుడు; వాటి వస్తువులో ఒక ఐక్యత ఉన్నప్పుడు స్త్రీ వధను చెదురుమదురు ఘటనగా చూడాలా, లేక చరిత్రకోణంనుంచీ, వ్యవస్థా కోణంనుంచీ అన్వయించుకోవాలా అన్న ప్రశ్న కూడా వస్తుంది. నా పరిశీలన రెండోదానికే మొగ్గు చూపుతోంది.

అదలా ఉంచితే, లంకిణిని లంకానగర అధిదేవత అనడం, దేవత కేంద్రంగా నిర్మించుకున్న ఒకనాటి నగరరాజ్యాలను సూచిస్తూ ఉండచ్చు.

***

మన పురాణ కథలతో ఇతర పురాణకథలకు ఉన్న మరికొన్ని ఆసక్తికరమైన పోలికలను చూద్దాం:

భూదేవత అయిన గియా కడగొట్టు కొడుకు టైఫాన్ పై గ్రీకు దేవుడు జియస్ విజయం సాధించి ఒలింపస్ పర్వతంపై దేవతల ఆధిపత్యాన్ని నెలకొల్పాడని చెప్పుకున్నాం. సగం మనిషి రూపంలో, సగం సర్పరూపంలో ఉండే టైఫాన్ తల నక్షత్రాలను తాకేలా ఉంటుందనీ, అతని చేతులు సూర్యోదయ ప్రదేశం నుంచి సూర్యాస్తమయ ప్రదేశం వరకు విస్తరించి ఉంటాయనీ కూడా చెప్పుకున్నాం. అతని భుజాల నుంచి వంద మహాసర్పాలు పడగవిప్పి వేలాడుతూ ఉంటాయి. అవి భయంకరంగా నాలుకలు చాపి ఉంటాయి. వాటి అనేక నేత్రాలు మంటలు చిమ్ముతూ ఉంటాయి. వాటి నుంచి వెలువడే  ఎడ్ల రంకెలతో, సింహగర్జనలతో, కుక్కల అరుపులతో, పాముల బుసబుసలతో పర్వతాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. టైఫాన్ ను జియస్ ఎదుర్కొని అంతమొందించకపోతే అతను సృష్టి అంతటికీ అధిపతి అయ్యేవాడట.

జియస్ అతని మీదికి యుద్ధానికి వెడుతుండగా భూమి బాధతో మూలిగింది. అతని చేతిలోని వజ్రాయుధం నుంచి వ్యాపించే జ్వాలలు; టైఫాన్ కళ్లనుంచి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనుంచి జాలువారే మంటలు సముద్రాన్ని మండించసాగాయి. సముద్రం సలసల మరగడం ప్రారంభించింది. ఉవ్వెత్తున లేచిన అలలు తీరంలోని కొండలను, గుట్టలను మహోధృతంగా ఢీకొనసాగాయి. భూకంపాలు పుట్టాయి. మృత్యుదేవుడైన హేడ్స్ గడగడా వణకిపోయాడు.

ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే, టైఫాన్ ను ఎదుర్కోవడంలో కొద్దిసేపు ధైర్యం సన్నగిల్లి జియస్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడట! కాసేపటికి బలాన్ని కూడదీసుకుని వజ్రాయుధాన్ని విసిరి ఆ మహాసర్పాల పడగలను దగ్ధం చేశాడు. టైఫాన్ కుప్పకూలిపోయాడు. అతని బరువుకి తల్లి అయిన భూదేవి గిలగిలలాడిపోయింది.

టైఫాన్ తో యుద్ధంలో కాసేపు ధైర్య సన్నగిల్లి జియస్ దిక్కుతోచని స్థితిలో పడిపోవడమే ఇక్కడ ప్రదానంగా గమనించవలసిన అంశం. మన పురాణఇతిహాస కథలలోని ఇలాంటి ఉదాహరణలు రెండు ఇప్పటికిప్పుడు నాకు  గుర్తుకొస్తున్నాయి. మొదటిది, రామరావణయుద్ధం; రెండవది, విష్ణువు-మధుకైటభుల యుద్ధం.

రాముడు రావణుని తలను ఛేదించగానే దాని స్థానంలో ఇంకొక తల పుట్టుకురాసాగింది. ఇలా కొంతసేపు గడిచింది. రాముడికి ఏం చేయాలో తోచలేదు. అతని నిస్సహాయతను గమనించిన రథసారథి మాతలి, “నువ్వు సాధారణమానవునిలా వ్యవహరిస్తున్నావు. బ్రహ్మాస్త్రం ప్రయోగించు” అని సలహా ఇచ్చాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అందుకుని రావణుని వక్షస్థలానికి గురిపెట్టి ప్రయోగించాడు. దాంతో రావణుడు నేలకొరిగాడు.

దేవీ భాగవతం ప్రకారం… విష్ణువు మధుకైటభులనే రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. వారిని చంపడం అసాధ్యమని ఒకదశలో ఆయనకు అనిపించింది. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు దేవిని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఎట్టకేలకు మధుకైటభులను చంపాడు.

ఇలా రాక్షసునితో జరుగుతున్న యుద్ధంలో జియస్, రాముడు, విష్ణువు ఒక దశలో నిస్సహాయస్థితిలోకి జారిపోవడంలో ఉన్న ఒక్క పోలికను మాత్రమే విశేషంగా చూపడం ఇక్కడ ఉద్దేశం కాదు. అంతకంటే ముఖ్యంగా దీని వెనుక ఒక ఉమ్మడి అంతస్సూత్రం లేదా తాత్విక సూక్ష్మం ఉంది. అది: సర్ప, రాక్షసశక్తుల అజేయతకు సంబంధించినది.

మన పురాణ, ఇతిహాస కథలలోని రాక్షసుల గురించే చూడండి…హిరణ్యకశిపుడు, రావణుడు, భస్మాసురుడు మొదలైన రాక్షసులందరూ తపస్సు చేసి తమకు అజేయ బలాన్ని ప్రసాదించమనీ, ఏవిదంగానూ మరణం లేకుండా వరమివ్వమనీ  సాధారణంగా బ్రహ్మదేవునో, ఒక్కోసారి శివునో ప్రార్థిస్తారు. మరణం అనివార్యమని బ్రహ్మ అంటూనే చాలా అరుదైన, అసాధారణమైన పద్ధతిలో వారికి మరణం సంభవించే వెసులుబాటు కల్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు తనకు దేవతల వల్లనే కాక; భూమిమీద, నీటిమీద, నరుల వల్ల, జంతువుల వల్ల కూడా మరణం రాకుండా వరం కోరుకుంటాడు. అప్పుడు విష్ణువు నరసింహావతారం ఎత్తి అతణ్ణి తన తొడల మీద ఉంచి గోళ్ళతో గుండెను చీల్చి చంపుతాడు. అలాగే, రావణుడు ఎవరెవరి వల్లనో తనకు మరణం రాకూడదని అడుగుతాడు కాని, నరుని  విస్మరిస్తాడు. దాంతో విష్ణువు నరుడైన రామునిగా అవతారమెత్తి అతణ్ణి చంపుతాడు.

అలాగే, మధ్య మధ్య పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరించే సర్పం కూడా అజేయశక్తికి ప్రతీక. అంతేకాదు, జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం కూడా, ఈ చావులేని సర్పమూ, రాక్షసులూ మొదట్లో విశ్వవ్యవస్థ (cosmic order)కు, కాలానికి సంబంధించిన అంతుబట్టని నిగూఢత(dark mystery of time)కు ప్రతీకలు. ఈ శక్తులతో వీరుడు లేదా నరుడు తలపడ్డాడు. ఈ నరవీరుని రాకతో పాత విశ్వాసవ్యవస్థ , నాగరికత పతనమయ్యాయి. మినోవన్ క్రిటుసామ్రాజ్యం, భారతదేశంలో హరప్పా, మొహంజదారో నాగరికత విచ్చిన్నమయ్యాయి.

అయితే, పాతవిశ్వాస ప్రపంచం నుంచి కొత్త విశ్వాసప్రపంచంలోకి రావడంలో భారతదేశానికి, పశ్చిమదేశాలకీ మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉందని క్యాంప్ బెల్ అంటారు. దాని గురించి, ఇతర మరికొన్ని అంశాల గురించి తర్వాత….

*

యెహోవా కూడా ‘కాళియ’ మర్దనుడే!

 

మొదటి దశలో విస్తారంగా దొరికిన నగ్నస్త్రీమూర్తులు, మూడవ దశకు వచ్చేసరికి అదృశ్యమయ్యాయనీ; మూడవ దశలో పురుషాధిక్యాన్ని చాటే పశుపాలన, యుద్ధాలు అడుగుపెట్టడమే అందుకు కారణమనీ — మధ్యయూరప్ నేపథ్యం నుంచి చెప్పుకున్నాం.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology)ను ఉటంకించుకుంటూ దానినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే:

కంచు యుగం(క్రీ.పూ. 3300-1200) చివరిలో, ఇనప యుగం(క్రీ.పూ. 1200-500) ప్రారంభంలో ఒక చారిత్రక ఘటన జరిగింది. పశువులను మేపుకుంటూ సంచార జీవితం గడిపే ఆర్యులు ఉత్తరం నుంచీ; గొర్రెలను, మేకలను కాచుకునే సెమెటిక్ జనాలు దక్షిణం నుంచీ పురాతన ప్రపంచంలోకి హింసాత్మకంగా అడుగుపెట్టారు. అక్కడ అప్పటికి పాత ఆరాధనా పద్ధతులు కొనసాగుతున్నాయి.  అక్కడి జీవనవిధానం తమ జీవనవిధానానికి పూర్తి భిన్నంగా కనిపించింది.  ప్రకృతిలో కలసిపోయి చెట్లు చేమల మధ్య చాలా సహజంగా, సామరస్యంగా, భౌతిక అవసరాలు తీర్చుకుంటూ సాగే జీవనవిధానం పాతప్రపంచానిది. అందులో ‘వీరోచిత’మైనది ఏదీలేదు.

కానీ ఆర్యులూ, సెమెటిక్ జనమూ అలాంటివారు కాదు. సింహంలా మంచి గుండె దిటవు ఉన్నవారు. ఆయుధోపజీవులు, యుద్ధప్రియులు. కష్టించి ఆహారాన్ని సంపాదించుకోవడం మీద వారికి చులకనభావం. ఎక్కడ సంపదా, సుఖమూ కనిపించినా మీదపడి దోచుకోవడమే వారికి ఇష్టం. కనుక పాత ప్రపంచ జనాల జీవనవిధానం వారికి రోత పుట్టించింది. అలా ఉభయుల జీవనవిధానాలు, తాత్వికతల మధ్య ఘర్షణ ప్రారంభమైంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవల్సింది ఏమిటంటే, ఈ పరిణామం ఏ ఒక్క చోటో కాక; యూరప్, సమీపప్రాచ్యం, పశ్చిమాసియా, భారత్ తో సహా పలు చోట్ల జరిగింది. ఆర్యులకు సంబంధించి కోశాంబీ(AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY)ని ఉదహరించుకుంటే:

చరిత్రపరంగా ఆర్యులు ఒక గొప్ప ఫలితాన్ని సాధించారు. అంతవరకూ అనేక ఆదిమ, సాంప్రదాయిక, వ్యవసాయ సమాజాలు వేటికవి విడివిడిగా తమ పురాతన పరికరాలతో, విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ ఉండేవి. ఆర్యులు ఆ సమాజాల మధ్య ఉన్న అడ్డుగోడలను బద్దలు కొట్టారు. ఈ సమాజాలలో  సాంప్రదాయిక ధోరణులు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వాటి కారణంగా అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఉదాహరణకు మృతసముద్రం సమీపంలోని ఘాసూలియన్లూ, విసిరేసినట్టు ఉండే అలాంటి మరికొన్ని చిన్న చిన్న సమూహాలూ సంక్లిష్టమైన అలంకరణలకు ప్రసిద్ధులు. ఇక బ్రిటన్, ఐబేరియా, దక్షిణభారతాల జనం ఇంకా పెద్ద స్థాయిలో భారీ శిలా నిర్మాణాలు సాగించేవారు, వీరంతా తమ వద్ద ఉన్న కొద్దిపాటి మిగులునూ సమాజ పురోగతికి ఏమాత్రం తోడ్పడని పితృకర్మలకు వాడేశారు. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రమైన దీవి. వర్తకం ద్వారా గడించిన సంపదను అంతటినీ అది మతపరమైన తంతులకు ఖర్చు పెట్టేసింది. చివరికి ఆ దీవిలో ఎక్కడబడితే అక్కడ అలంకృత అస్థి కలశాలు మాత్రమే దొరికాయి. మెసపొటేమియా, సింధు లోయలు కూడా ఈ ప్రక్రియను మరింత ఎత్తులకు తీసుకువెళ్లి చివరికి ఎదుగూబొదుగూ లేని స్థితికి చేరుకున్నాయి.

మరింత అభివృద్ధి చెందిన ఆహారోత్పాదక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ సింధు లోయలోని నగర నిర్మాతలు వాటిని ఎలా ఉపయోగించుకోలేకపోయారో ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈజిప్టు తన మిగులును అంతటినీ, వాచీలు తయారు చేసేవారు కనబరిచేటంత సునిశితత్వంతో బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి వెచ్చించింది. పితృకర్మలు, పూజారి వ్యవస్థ క్రమంగా ఆ దేశాన్ని తినేశాయి. ఈ దశలో, చెల్లా చెదురుగా ఉన్న అనేక ఆదిమ సమూహాలను, వారి విశ్వాసాలను ఆర్యులు అణగదొక్కి వాటి అవశేషాలపై ఒక నూతన సమాజం ఆవిర్భవించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించారు. ఇది వారు ఉద్దేశపూర్వకంగానో, ఈ సమాజాల శ్రేయస్సును కోరో చేసింది కాదు. తక్షణ లాభం కొసం, తమ పద్ధతిలో క్రూరమైన దాడులు చేస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, దోపిడీలు సాగిస్తూ పోయారు.

ఒక సమూహాన్ని, పూర్తిగా భిన్నమైన వేరొక సమూహం లోబరచుకుని వారి ప్రదేశాలను ఆక్రమించుకున్నప్పుడు అక్కడి జీవన పద్ధతులు, సంస్కృతి, మత విశ్వాసాలు, ఆరాధనారూపాలు, తంతులు ఉన్నపళంగా అదృశ్యమైపోవు. ఉభయులు అనేక అంశాలను ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పర విలీనం జరుగుతుంటాయి. ఓడిపోయిన గుంపు కంటె గెలిచిన గుంపు నాగరికతలో, సంస్కృతిలో వెనకబడినదైనప్పుడు, ఈ ఆదానప్రదానాలలో  ఓడిపోయినవారిదే తరచు పై చేయి అవుతుంది. ఆర్యుల విషయంలో అదే జరిగింది. వారు తాము లోబరచుకున్న జనాల నుంచే ఎన్నో నేర్చుకున్నారు. మనదేశంలోని సింధు ప్రజలతో ఆర్యుల అనుభవమూ అదే.

Zeus of Meilichois

గ్రీసులో పిరయూస్(Piraeus) అనే చోట దొరికిన ఒక మట్టి పిడక (అతి పురాతన కాలంలో బంకమట్టితో చేసిన పిడకల మీద తుంగకాడతో రాసేవారు. దీనిని కీల లిపి అనేవారు. ఈ పిడకలపై చిత్రాలు కూడా గీసేవారు) మీద ఒక చిత్రం ఉంది. అందులో ఒక సర్పదేవుడికి కొందరు మొక్కుతూ ఉంటారు. ఈ సర్పదేవుడి పేరు ‘జియస్ మిలికోయిస్’. జియస్ నిజానికి విజేతలైన ఆర్యుల దేవుడు. సర్పం, ఓడిపోయిన పాత ప్రపంచానికి చెందిన ఆరాధనారూపం. సర్పాకారంలో ఉన్నది మిలికోయిస్ అనే ఒక రాక్షసుడు. అతడు భూమాతకు కొడుకూ, భర్తా కూడా. ఈ స్థానిక సర్పరూప రాక్షసుడు ‘జియస్ మిలికోయిస్’ ఎలా అయ్యాడంటే, ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆర్యులు స్థానికుల ఆరాధనాస్థలాలను కూడా ఆక్రమించుకుని వాటికి తమ దేవుళ్ల పేరు పెట్టుకున్నారన్నమాట.

కాలక్రమంలో రాక్షసుడనే పేరును ఆర్యులు నిందార్ధకంగా మార్చారు. అప్పుడలా నిందార్ధకంగా మారిన రాక్షస శబ్దం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సర్పరూప రాక్షసుడికి ఏటా వసంతకాలంలో పందులను బలి ఇవ్వడం ఆనవాయితీ. పందులను బలి ఇవ్వడం పురాతన ప్రపంచంలోని మాతృస్వామ్యానికి చెందిన తంతు.

భూదేవికి ఒక రాక్షసుని కొడుకుగా చిత్రించడం మన పురాణాలలోనూ ఉంది. ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న ఉదాహరణ, నరకాసురుడు.

జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రస్తావించిన ఇంకొక ఉదంతం చూద్దాం. క్రీ.శ. 222 కి చెందిన అయీలియన్ అనే రోమన్ రచయిత ఎపిరస్ (Epirus) అనే చోట ఉన్న ఒక పాముల తోపు గురించి రాశాడు. అతని కాలానికి వచ్చేసరికి అది అపోలో అనే గ్రీకు, ఆర్యదేవుడి ఆరాధనాస్థలంగా మారిపోయింది కానీ; నిజానికి ఇది కూడా పురాతన మాతృస్వామిక ప్రపంచానికి చెందిన అవశేషమే. ఏటా ఒకరోజున ఈ అపోలో దేవుడికి ఘనంగా నైవేద్యాలు అర్పిస్తారు. ఈ వనంలో ఒక వలయాకారంలోని రక్షితప్రదేశంలో పాములు ఉండేవి. వాటికీ కూడా నివేదనం జరిగేది. అయితే ఆ నివేదనం పురుషులు చేయడానికి వీలులేదు. స్త్రీ, అందులోనూ కన్యాపూజారిణి మాత్రమే చేయాలి. పైగా నగ్నంగా వెళ్లి మరీ నివేదనం ఇవ్వాలి. పాములు శాంతంగా ఉండి, ఆ నివేదనాన్ని స్వీకరిస్తే ఆ ఏడాది సుభిక్షంగా, రోగాలు రొష్టులు లేకుండా గడుస్తుందనీ, ఒకవేళ నివేదనాన్ని తిరస్కరించి పూజారిణిని భయపెడితే దుర్భిక్షం, రోగాలు సంభవిస్తాయనీ నమ్మేవారు.

Tree of the Hesperides

The tree of the Hesperides అనే చిత్రంలో ఒక పెద్దపాము చెట్టును చుట్టుకుని ఉంది. ఈ చెట్టు మొదట్లో ఉన్న గుహలోంచి నీటి ఊటలు ఉబుకుతున్నాయి. చెట్టు చుట్టూ ముగ్గురు అప్సరసలు (Hesperides) ఉన్నారు. మన పురాణ, ఇతిహాసాలలోనూ అప్సరసలు ఉన్న సంగతి తెలిసినదే. ‘అప్సరస’ అనే మాటే నీటి సంబంధాన్ని(సంస్కృతంలో అప్సు అంటే నీరు) చెబుతుంది. గ్రీకు చిత్రంలోని అప్సరసలు తండ్రి లేకుండా, నిశాదేవతకు పుట్టినవారు. తండ్రి లేకుండా పుట్టారన్న మాటకు; తండ్రి ఎవరో తెలియని వారు, లేదా తండ్రికి ప్రాధాన్యంలేని వ్యవస్థకు చెందినవారు అన్న అర్థం చెప్పుకుంటే అది మాతృస్వామ్య లక్షణాన్ని సూచిస్తుంది. ఈ దృశ్యం ఈడెన్ తోటను తలపిస్తుందని, ఈడెన్ తోట ఆ తర్వాత పితృస్వామ్యానికి చెందిన ప్రజాపతి (పేట్రియార్క్) జాగీరు అయిందనీ క్యాంప్ బెల్ అంటారు.

Medusa

ఇంకో చిత్రంలో కనిపించే దేవత పేరు, మెడూసా. ఈమె గురించి గ్రీకు ఇతిహాసకాలానికి చెందిన ఒలింపియన్ పితృస్వామిక కోణం నుంచి చెబుతారు కానీ, అందులో పురాతన ప్రపంచానికి చెందిన మాతృస్వామిక లక్షణాలూ ధ్వనిస్తూనే ఉంటాయి. మెడూసా గార్గాన్స్ రాణి. బుసకొట్టే పాములు ఆమె శిరోజాలు. ఆమె చూపులు మగవారిని శిలగా మార్చివేస్తాయి. పెర్సియస్(Perseus) అనే దేవుడు ఆమె తల నరికి, దానిని తీసుకుని పారిపోతాడు.  ఎథెనే అనే దేవత ఆ తలను తన డాలుకు అతికించుకుంటుంది. పోసిడియన్ అనే దేవుడు, తెగిన మెడూసా మెడ నుంచి పెగాసెస్ అనే రెక్కల గుర్రాన్ని సృష్టిస్తాడు. ఆ గుర్రాన్ని జియస్ రథానికి కడతారు. ఎథెనే ఆదేశంతో దేవవైద్యుడైన అస్లేపియస్(Asclepius) మెడూసా ఎడమవైపు, కుడివైపు ఉన్న నరాలనుంచి రక్తం సంగ్రహిస్తాడు. ఎడమవైపునుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికీ, కుడివైపునుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికీ ఉపయోగిస్తాడు.

ఈ వివరాలన్నీ మనకు బీభత్సంగా అనిపిస్తాయి. సరే, అది మన పురాణాలలోనూ కనిపించే అద్బుతత్వ, ప్రతీకాత్మక  శైలి అనుకుందాం. ఇందులో దేవవైద్యుడైన అస్లేపియస్ పేరు వినగానే, మన పురాణాలలోని దేవవైద్యులైన అశ్వినీదేవతలు గుర్తుకొచ్చి ఉండాలి.  ముఖ్యంగా గమనించవలసింది, ఇందులోని తాత్వికత. క్యాంప్ బెల్ మనకు బాగా తెలిసిన కాళికతో మెడూసాను పోల్చుతారు. అందులోకి వెళ్ళేముందు మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థను వెల్లడించే మరికొన్ని ఉదంతాలను, భారతీయ పురాణకథలతో వాటికి ఉన్న పోలికలను చూద్దాం:

గ్రీకు పురాణాల ప్రకారం ‘టైటాన్లు’ (భారీ ఆకారంతో రాక్షసంగా కనిపించేవారు) జగజ్జనని(Great Goddess Mother) సంతానం. టైటాన్ సగం మానవరూపంలో, సగం సర్పరూపంలో ఉంటాడు. అతని తల నక్షత్రాలను తాకుతూ ఉంటుంది.  సూర్యుడు ఉదయించే ప్రదేశం నుంచి, అస్తమించే ప్రదేశం వరకు చేతులు విస్తరించి ఉంటాయి. యురేనస్ అనే ఆకాశదేవుడికీ, జగజ్జనని రూపమైన గియా(Gaea) అనే భూదేవతకూ పుట్టిన ఈ టైటాన్లకు స్వర్గాన్ని లేదా ఆకాశాన్ని పరిపాలించే అధికారం ఇచ్చారు. ఆర్యులైన గ్రీకుల దేవుడు జియస్, గియా కడగొట్టు కొడుకైన టైఫాన్ పై విజయం సాధించి మౌంట్ ఒలింపస్ పై పితృస్వామిక దేవుళ్ళ ఆధిపత్యం నెలకొల్పుతాడు. మన పురాణాలలో మేరుపర్వతం దేవతల ఆవాసం అయినట్టే, మౌంట్ ఒలింపస్ గ్రీకు దేవతలకు ఆవాసం.

మాతృస్వామిక చిహ్నంతో పొరాడి విజయం సాధించిన ఉదంతం బైబిల్ లో కూడా ఉంది. యెహోవా విశ్వ సముద్ర సర్పమైన ‘లెవియథాన్’ పై విజయం సాధిస్తాడు.

ఇక మన పురాణాలకు వస్తే ఇలాంటి ఉదంతాలు అనేకం. రాముడు తాటకను చంపడం గురించి, కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. పైన చెప్పిన  టైటాన్స్ లానే తాటకను, పూతనను కూడా భారీ ఆకారాలతో భయం గొలిపే రాక్షసులుగానే మన కథలు చిత్రించాయి. సినిమాలు, హరికథలు, పురాణశ్రవణం ద్వారా మాత్రమే పురాణకథలతో అరకొర పరిచయం ఉన్నవారు నిజంగానే ఒకప్పుడు రాక్షసులనే జాతి ఉండేదని భ్రమిస్తూ ఉంటారు. నిజానికి రాక్షసత్వం అనేది మామూలు మనుషులపై ఆపాదనే తప్ప మరొకటి కాదన్న సంగతి రామాయణం, బాలకాండలో ఉన్న తాటక వృత్తాంతమే స్పష్టంగా చెబుతుంది. ‘వాల్మీకి నిజం దాచడు, అబద్ధం చెప్పడు’ అనేవారు రాంభట్ల. తాటక ఉదంతం ఆయన అన్నది ఎంత యధార్థమో చెబుతుంది.

తాటక ఒక యక్షిణి అంటుంది రామాయణం. అంటే, యక్షుల తెగకు చెందినది. యక్షులు చారిత్రకత కలిగిన తెగ. తెలుగులో ‘జక్కులు’ అనే మాట, యక్షశబ్దానికి వికృతి. ‘జక్క పురంధ్రి’ అనే ప్రయోగం ‘క్రీడాభిరామం’లో కాబోలు, ఉంది. యక్షప్రశ్నలు అనే మాట యక్షులనుంచే పుట్టింది. అడవిని ఆశ్రయించుకుని ఉండే యక్షులు దారినపోయేవారిని అటకాయించి, యక్షప్రశ్నలు వేసి, వారు జవాబు చెప్పలేకపోతే బలి ఇచ్చేవారట. బుద్ధుడు ఇలాగే తనకు తారసపడిన యక్షులలో ఉపదేశం ద్వారా పరివర్తన తెచ్చి ఆ దురాచారాన్ని మాన్పించాడని కోశాంబీ రాస్తారు. యక్షులకు సంబంధించిన ఈ చారిత్రక వివరం; యక్షుడికీ, ధర్మరాజుకీ మధ్య ప్రశ్నోత్తరాల రూపంలో మహాభారతానికి ఎక్కింది.

తాటక సుకేతు డనే మహాయక్షుని కూతురనీ, వేయి ఏనుగుల బలంతో పుట్టిన కామరూపిణి అనీ విశ్వామిత్రుడు రాముడికి చెబుతాడు. ‘యక్షులు అంత బలవంతులు కారని ప్రతీతి కదా! తాటకకు వేయి ఏనుగుల బలం ఎలా వచ్చింద’ని  రాముడు అడుగుతాడు.  విశ్వామిత్రుడు సమాధానం చెబుతూ, సుకేతుడు సంతానం కోసం తపస్సు చేయగా బ్రహ్మ కొడుకును ఇవ్వకుండా ఒక్క కూతురినే ఇచ్చాడనీ, ఆమెకే వేయి ఏనుగుల బలం ఉండేలా వరమిచ్చాడనీ అంటాడు.

అలాగే, తాటక మొదట్లో మంచి రూపవతి. ఆమెను సుందు డనే అతనికిచ్చి పెళ్లి చేశారు. వారికి మారీచుడనే కొడుకు పుట్టాడు. సుందుడు అగస్త్యుని శాపం వల్ల రాక్షసుడై, అతని వల్లనే మరణించగా; తాటక, మారీచుడు అగస్త్యుని చంపబోయారనీ, అప్పుడు వారిని కూడా రాక్షసులు కమ్మని అగస్త్యుడు శపించాడనీ రామాయణం చెబుతోంది. ఒక సాధారణ యక్షస్త్రీకి, ఆమె భర్తకు, కుమారుడికీ రాక్షసత్వాన్ని ఆపాదించిన సంగతిని ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.  స్త్రీని చంపడానికి రాముడు మొదట సందేహించినా విశ్వామిత్రుడు చెప్పడంతో ఆమెను చంపుతాడు.

మాతృస్వామ్య కోణం నుంచి తాటక కథను అన్వయించడానికి కనీసం రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మొదటిది, సుకేతుడికి బ్రహ్మదేవుడు కొడుకును ఇవ్వకుండా కూతురినే ఇవ్వడం, ఆ కూతురు వేయి ఏనుగుల బలంతో పుట్టడం అనేవి– కొడుకు కంటే కూతురికీ; పురుషుడి కంటే స్త్రీకీ ఆధిక్యాన్నీ, బలాన్నీ కల్పించే మాతృస్వామ్య లక్షణాన్ని పరోక్షంగా సూచిస్తు ఉండచ్చు.  రెండోది, తాటక ఉండే ప్రదేశాన్ని విశ్వామిత్రుడు ‘తాటకవనం’గా పేర్కొనడం అమ్మవారి వనానికి సూచన కావచ్చు.

విశ్వామిత్రుడికి తాటకతోనూ; అగస్త్యుడికి సుందుడు, తాటక, మారీచులతోనూ ఉన్న శత్రుత్వం మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య స్పర్థ ఫలితం కావచ్చు.

బైబిల్ లోని యెహోవా, లెవియథాన్ అనే సర్పంతో పొరాడి విజయం సాధించినట్టే, మన దగ్గర కృష్ణుడు యమునానదిలోని కాళీయుడనే సర్పాన్ని మర్దించి తరిమేసిన కథ ఉంది. కృష్ణుడు బృందావనంలోని అమ్మవార్ల సమూహ దేవత అయిన బృందను పెళ్లాడడం ద్వారా అమ్మవార్లను లొంగదీసుకోవడం గురించి, అమ్మవారి ఆరాధన స్థానంలో తన ఆరాధనను ప్రతిష్టించడం గురించి ‘బృందావన కృష్ణుడు…సోషల్ ఇంజనీరింగ్’ అనే వ్యాసంలో చెప్పుకున్నాం. బృందావనం ఉన్నది యమున ఒడ్డునే. కనుక మాతృస్వామ్య ఆరాధనారూపమైన కాళీయుడనే సర్పాన్ని కృష్ణుడు మర్దించి తరిమేయడం బృందావనంలో ఆయన చేసినదానికి కొనసాగింపే.

మొత్తంమీద బైబిల్ యెహోవా, భాగవత కృష్ణుడు చేసింది ఒకటే…అది, మాతృస్వామిక ఆరాధనారూపంతో పోరాడి విజయం సాధించడం!

స్త్రీని చంపిన, లేదా శిక్షించిన చరిత్ర హనుమంతుడికీ ఉంది. దాని గురించీ, భారతీయ పురాణకథలతో ఇతర పురాణ కథలకు ఉన్న మరికొన్ని పోలికల గురించీ; వీటి వెనుక ఉన్న తాత్వికత గురించీ తర్వాత…

 -కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) 

‘అమ్మ’ను పుట్టించిన బొమ్మ

 

ముందుగా ఒకటి రెండు విషయాలు…

ఈ వ్యాసపరంపరలో మొదటినుంచీ ఒకటి జరుగుతోంది. అది ఇంతకుముందు చెప్పుకున్నదే. అదేమిటంటే, ఒక విషయాన్ని ఎత్తుకుంటే, అది తరచు అనేక మలుపులు తిరుగుతూపోతోంది. కనుక ఎక్కడ మొదలెట్టామో మధ్య మధ్య గుర్తు చేసుకోకతప్పదు. పన్నెండు వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభించి ఓడిసస్ కథ చెప్పుకుంటూ ఇంత దూరం వచ్చాం.

ఇంకోటి కూడా గమనించే ఉంటారు…అనేక వ్యాసాలుగా  మాతృస్వామ్య/పితృస్వామ్యాల గురించిన ప్రస్తావన దండలో దారంలా వస్తోంది. ఇక ముందు కూడా వస్తుంది.  బహుశా ప్రస్తుతానికి అదే ప్రధాన ఇతివృత్తం.

నేనిక్కడ గ్రీకు, బైబిలు పురాణ కథల గురించి, వాటిలోని దేవతల గురించి అదే పనిగా ప్రస్తావిస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు. అయితే, కేవలం వాటి గురించే చెప్పడం నా ప్రణాళిక కాదు. పైన చెప్పిన ప్రధాన ఇతివృత్తంలో భాగంగా చేస్తున్న ఈ ప్రస్తావనల ద్వారా  భారతీయ పురాణ కథలకు, వాటికి ఉన్న పోలికలను కూడా ముందుకు తెస్తున్నాను.

అలా తేవడంలో ఇంకోటి కూడా చేస్తున్నాను. “మన  దేవతలు, మన తాత్వికత కేవలం మనవే; మనకే ప్రత్యేకం; మనది మాత్రమే పుణ్యభూమి, కర్మభూమి’’ అంటూ పౌరాణికులవారు ఎంత గట్టిగా నొక్కి చెప్పినా అందులో ఆత్మస్తుతి ఉన్నంతగా నిజం లేదని, సవినయంగా మనవి చేస్తున్నాను.

నేను తాత్వికతలోకి, తాత్విక ప్రతీకల్లోకి, తాంత్రికతలోకి మరీ లోతుగా వెడుతున్నానన్న అభిప్రాయం మీకు కలిగి ఉండవచ్చు. అందులో బొత్తిగా నిజం లేదని అనను కానీ, వాస్తవంగా నేను చేయదలచుకున్నది చరిత్ర అద్దంలో వాటిని చూపించడమే!

***

చరిత్రలో ఏం జరిగిందంటే…

కొన్ని ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ఈ మూర్తులు పదకొండు సెంటీమీటర్లు ఎత్తుంటాయి. ఈ స్త్రీమూర్తి  రొమ్ములపై రెండుచేతులూ ముడుచుకుని ఉంటుంది.  ఈ మూర్తిని విల్లెన్ డార్ఫ్ వీనస్ (Venus of Willendorf) అంటారు.  అయితే,  వీనస్ అన్నారు కదా అని, ఈ మూర్తి  ఫ్రాన్స్ లోని లౌరే మ్యూజియంలో ఉన్న Venus of Milo లా అందంగా, ఆకర్షణీయంగా ఉండదనీ, స్థూల కాయంతో, బలిష్టమైన కటిప్రదేశంతో ఉంటుందనీ జార్జి థాంప్సన్ అంటారు.

venus of willendorf

venus of Willendorf

 

మధ్య యూరప్, మధ్యధరా ప్రాంతం, సమీప ప్రాచ్యానికి చెందిన కొత్త రాతియుగ(క్రీ.పూ. 10,020), రాగి యుగ(క్రీ.పూ. 5,500)నిక్షేపాలలో ఇలాంటి నగ్నస్త్రీ మూర్తులు వందల సంఖ్యలో దొరికాయి. ఇవి ఎక్కువగా కాల్చిన మట్టితో(టెర్రకోట) చేసినవే కానీ, కొన్ని శిలపై చెక్కినవీ ఉన్నాయి. పురుషమూర్తులు ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ. అలాగే జంతు రూపాలు కూడా కనిపించాయి.

యూరప్ కు చెందిన డాన్యూబ్ నదీసంస్కృతి(క్రీ.పూ. 5,000)మొదటి దశలో ఇలాంటి స్త్రీమూర్తులు స్వల్పసంఖ్యలో కనిపించాయి. రెండో దశకు వచ్చేసరికి ఇవి ఎక్కువ సంఖ్యలో కనిపించి, మూడవ దశలో అదృశ్యమైపోయాయి. ఈ మూడవ దశ నాటికి పశుపాలన, యుద్ధాలు మొదలయ్యాయి.

అలాగే, రుమేనియాకు చెందిన గుమెల్నిటా(Gumelnita) సంస్కృతి(క్రీ.పూ. 5,000) మొదటి దశలో స్త్రీమూర్తులు విస్తారంగా కనిపించాయి. రెండో దశలో కూడా కొనసాగాయి కానీ, ఈసారి పురుషమూర్తులూ, కాల్చిన మట్టితో చేసిన పురుషాంగాలూ కనిపించాయి. మూడవ దశకు వచ్చేసరికి చెకుముకిరాయితో చేసిన బాణపు మొనలు, యుద్ధాలలో ఉపయోగించే గొడ్డళ్ళు కనిపించాయి. స్త్రీమూర్తులు అదృశ్యమయ్యాయి.

గ్రీసులోని థెసలేకు చెందిన కొత్తరాతియుగ నిక్షేపాలలో కూడా ఇదే కనిపిస్తుంది. థెసలే రెండవ దశను ‘దిమిని సంస్కృతి’(క్రీ.పూ. 5,000) అంటారు. ఈ సంస్కృతికి చెందిన మూర్తులలో కొత్తగా రెండు నమూనాలు అడుగుపెట్టాయి. మొదటిది, పసిబిడ్డను చేతుల్లో ఉంచుకుని కూర్చుని ఉన్న స్త్రీమూర్తి; రెండవది, మోకాళ్ళ మీద చేతులు ఆనించి కూర్చుని ఉన్న ithyphallic(erect phallus) పురుషమూర్తి. అయితే, ఈ దశకు వచ్చేసరికి వెనకటి దశలో కంటే మూర్తుల సంఖ్య, వాటి నాణ్యతా కూడా తగ్గాయి.  థెసలే మూడవదశలో కూడా ఈ క్షీణత కొనసాగి, ఆ తర్వాత పూర్తిగా అదృశ్యమయ్యాయి.

పై యూరప్ మూడు ప్రాంతాలకు చెందిన మూడు దశల గురించి ఈమాత్రం వివరంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇవి ఒక ముఖ్యమైన సామాజిక పరిణామాన్ని చెబుతున్నాయి. మొదటి దశలో ప్రారంభించి రెండవ దశ వరకూ పురుషమూర్తులు స్వల్పసంఖ్యలోనూ, స్త్రీమూర్తులు  ఎక్కువ సంఖ్యలోనూ  కనిపిస్తూవచ్చాయి.  కానీ, మూడవదశకు వచ్చేసరికి స్త్రీమూర్తులు అదృశ్యమయ్యాయి.  ఆ దశలో పశుపాలనకు, యుద్ధాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా కనిపించాయి.  అంటే ఏం జరిగిందన్నమాట…స్త్రీ ప్రాధాన్యం పోయి, పురుషప్రాధాన్యం అడుగుపెట్టింది! వ్యవస్థాపరంగా చెబితే, మాతృస్వామ్యం స్థానంలో పురుషస్వామ్యం అడుగుపెట్టింది.

ఇంకా వెనక్కి, క్రీటుకు చెందిన మినోవన్ సంస్కృతి(క్రీ.పూ. 2700-1450)కి వెడదాం. అక్కడి తవ్వకాలలో కూడా పురుషమూర్తుల కంటే స్త్రీమూర్తులే ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. ఇవి పొట్టిగా, బలిష్టమైన పిరుదులతో, కూర్చుని కనిపిస్తాయి. ఈ తరహా మూర్తులే యూఫ్రటిస్ మధ్యతీరంతో సహా ఆసియాలోని సెమెటిక్ భూములు అంతటా కనిపించాయి. బాబిలోనియాలోని నిప్పూరులో దొరికిన క్రీ.పూ. 2700 నాటి మూర్తి ఒక ఉదాహరణ. ఈ మూర్తిని బాబిలోనియా అమ్మవారు(mother-goddess)గా గుర్తించారు. ఈవిధంగా స్త్రీమూర్తుల విషయంలో ఆగ్నేయ యూరప్ కు, నైరుతి ఆసియాకు మధ్య ఒక సంబంధం కనిపిస్తుంది. ఈ ప్రాంతాలు అన్నింటా స్త్రీ ప్రాధాన్యం కలిగిన మాతృస్వామ్యం ఉండేదనడానికి అది సూచన. మన దేశానికి చెందిన సింధు సంస్కృతి కూడా మినోవన్, బాబిలోనియా కాలానికి చెందినదే.

ఇంతకీ ఈ స్త్రీమూర్తులు ఎలాంటివో, వీటినుంచి ఆశించిన ప్రయోజనం ఏమిటో చూద్దాం:

జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY: THE PREHISTORIC AEGEAN) The making of the Goddess అనే అధ్యాయంలో దీనిగురించి చర్చించారు. దాని సారాంశాన్ని చెప్పుకుంటే, ఈ స్త్రీ మూర్తులే వివిధ ప్రాంతాలలోని అమ్మవారి రూపానికి మాతృకలు. విచిత్రం ఏమిటంటే, అమ్మవారి రూపాన్ని సృష్టించడానికి మూలమైన ఈ మూర్తులే క్రమంగా అమ్మవారికి మొక్కుగా అర్పించే మూర్తులు అయ్యాయి. అమ్మవారి ఆరాధన జరిగే అనేక ప్రాంతాలలో గుడులలోనూ, తోపులలోనూ ఈ మూర్తులు వందల సంఖ్యలో దొరకడం ఇందుకు నిదర్శనం.

venus of milo

venus of milo

 

అలాగే, ఈ మూర్తులు మొదట్లో ఆరాధనారూపాలు కావు, మాంత్రికత(magic)లో భాగమైన బొమ్మలు. అది కూడా ప్రారంభంలో  ఋతుస్రావానికి, ప్రసవానికి మాత్రమే సంబంధించినవి.  వాటి భంగిమలు దానినే సూచిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మూర్తులు  స్త్రీ-పురుష సంపర్కానీకీ, గర్భం ధరించడానికీ సంబంధం ఉన్నట్టు తెలియని కాలానికి చెందినవి. ఇప్పటికీ మరీ ఆదిమ దశలో ఉన్న జాతులవారికి ఈ రెండింటి సంబంధం తెలియదు. నేటి ఆస్ట్రేలియా ఆదిమ తెగలలో ‘కన్య’ అనే భావన లేదని థాంప్సన్ అంటారు.  పురుష సంబంధం, తద్వారా గర్భం ధరించే అవకాశం లేని స్త్రీని కన్య అనీ, ఆ రెండూ ఉన్న స్త్రీని గృహిణి అనీ అంటాం. పురుష సంపర్కానికి, గర్భధారణకు సంబంధం ఉందని తెలియనప్పుడు ఆ విభజనకు అవకాశమే లేదు. ఇంతకుముందు ఇదే వ్యాసపరంపరలోని ‘ఋతుమతీ పునః కన్యా’ మొదలైన వ్యాసాలలో కూడా కన్య గురించి కొంత చర్చ జరిగింది.

ఒకవేళ పురుషసంపర్కానికి, గర్భధారణకు సంబంధం ఉందని తెలిసినా; గర్బధారణకు ఏదో మంత్రమో, మహిమో, దేవుడో కారణంగా చెప్పుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. అంటే ఈ విశ్వాసం మూలాలు వేల సంవత్సరాల గతంలో ఉన్నాయన్నమాట.

మొదట్లో ఋతుస్రావానికీ, ప్రసవానికీ, సౌభాగ్య తంత్రానికీ సంబంధించిన ఈ మాంత్రిక మూర్తులు క్రమంగా పెళ్లి, చావు, రోగమూ, రొష్టుతో సహా అన్ని జీవన సందర్భాలకూ విస్తరించాయి. జీవితంలోని ప్రతి ఒక్క ఘట్టంలోనూ, సంక్షోభంలోనూ పునరుత్పాదక శక్తినీ, పునరుజ్జీవనాన్నీ నింపడానికే మాంత్రికతా ప్రయోగం.

క్రమంగా పురుషసంబంధానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెలిసిన ఫలితమే, అనంతరకాలపు నిక్షేపాలలో పురుషమూర్తులతోపాటు, పురుషాంగాలు బయటపడడం! ఇంతకుముందు ఒక వ్యాసంలో(‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య) చెప్పుకున్న దక్షిణాఫ్రికాలోని వాలెంగే కన్యల శిక్షణ తంతు ఈ దశకు చెందినది. ఈ దశలో కూడా మూర్తులను, స్త్రీ పురుష జననాంగాల రూపాలను తయారు చేసేది స్త్రీలే. అయితే అవి లైంగిక చర్యను బోధించే సామగ్రి మాత్రమే. మాంత్రికమైన తంతును మినహాయిస్తే, ఇవి నేడు స్కూళ్లలోనూ, కాలేజీలలోనూ శరీర నిర్మాణాన్ని బోధించడంలో ఉపయోగించే సామగ్రి లాంటివన్న మాట.

dimini figurine

Dimini Figurine

 

మూడవ దశకు వచ్చేసరికి మరో కీలక పరిణామం జరిగింది. స్త్రీ-పురుష జననాంగాలపై పురుషభావారోపణ (anthropomorphism) జరిగి, అవి దేవతారూపాలు తీసుకున్నాయి. మనదగ్గర పానవట్టం-లింగం ఒక ఉదాహరణ. అలాగే, ఈ దశలోనే పురాతన మూర్తులు వివిధ ఇతర దేవతారూపాలకు మాతృకలయ్యాయి.

ఇలా మనిషి రూపాలతో ముడిపడిన తంతులు ఏదో ఒక ప్రాంతానికో, లేదా గతానికో పరిమితం కావు. దిగువ పాతరాతి యుగం నుంచి ఇనప యుగం వరకు నిరంతరాయంగా కనిపిస్తున్న ఈ మూర్తులు ఈ మధ్యలోని వివిధ కాలాలలో వివిధ ప్రయోజనాలకు సాధనమయ్యాయని థాంప్సన్ అంటారు. మొత్తం మాంత్రికత చరిత్ర అంతా ఈమధ్యలోనే ఇమిడిపోయిందని కూడా ఆయన అంటారు. ఈ మూర్తులలో చాలావరకూ సమాధులలో దొరికాయి. తదుపరి కాలంలో మొక్కు చెల్లింపు రూపంలో తోపులలో దొరికాయి. ఆ తర్వాత దేవతా మూర్తులకు రూపమిచ్చాయి. మధ్య, దిగువ మినోవన్ సంస్కృతులలో ఈ మూడు రకాలవీ కనిపిస్తాయి. ఇలా పురావస్తు ఆధారాలు ఈ మూర్తులకు సంబంధించిన వేల సంవత్సరాల పరిణామ చరిత్రను చెబుతున్నాయి.

ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. అనంతరకాలపు నిక్షేపాలలో మొక్కు చెల్లింపు రూపంలోని మూర్తులు ఎక్కువ సంఖ్యలో దొరికినా అన్నీ అలాంటివే కావని థాంప్సన్ అంటారు. దేవతకు చెల్లింపులు(offerings) జరపడం అనే ఆనవాయితీ ఇంకా అడుగుపెట్టని కాలానికి చెందినవి కూడా వాటిలో ఉన్నాయి.  ఆ దశలో ఆ మూర్తులు మాంత్రికశక్తిని నిక్షేపించిన మతపరమైన ఆస్తులు మాత్రమే. వాటిని స్త్రీల రహస్యప్రపంచమైన తోపులలో భద్రపరచడం మాత్రమే చేసేవారు. అవి మాంత్రికమైనవి కనుక వాటి వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల వాటికి నష్టం జరగకుండా నివారించడమే అందులోని ఉద్దేశం. అయితే దేవతాభావన ఒక రూపం దిద్దుకున్న తర్వాత ఈ మూర్తులను దేవతకు చెందినవిగానూ, ఆ దేవత నుంచే అవి మహిమను పుంజుకుంటున్నవిగానూ భావించడం ప్రారంభించారు. అప్పటినుంచీ ఈ మూర్తులు  కేవలం మతపరమైన సామగ్రిగా కాక, దేవతకు, లేదా ఆమె భక్తులకు ప్రతిరూపాలుగా గుర్తింపు పొందడం ప్రారంభించాయి.

దేవతకు మొక్కు కోవడం, మొక్కు చెల్లించడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కోరుకున్నది నెరవేరిన తర్వాతో, నెరవేరడానికి ముందో మొక్కు చెల్లింపు జరగచ్చు. ఇప్పుడు ఇదొక  ‘మొక్కుబడి’గా మారింది కానీ, దీనికి కూడా వేల సంవత్సరాల గతం ఉంది. అంతే కాదు, ఈ మొక్కు చెల్లింపు మన దేశంలోనే కాదు; అనేక చోట్ల ఉంది. వాటి మధ్య పోలికలు కూడా ఉన్నాయి.  ఉదాహరణకు గ్రీసులో రైతు తన ఎద్దో మరో పశువో జబ్బు పడితే పేడతో దాని ప్రతిరూపం తయారు చేసి దేవతకు అర్పించేవాడు.  మన దేశంలోనూ దేవుడికో, దేవతకో మొక్కు కింద ప్రతిరూపాలను అర్పించే ఆనవాయితీ అనేక ఆలయాలలో కనిపిస్తుంది.

ఇంకో విశేషం ఏమిటంటే, ఇలా బొమ్మలను ఉపయోగించడం క్షుద్ర పూజల్లోనూ ఉంది. శత్రువు బాగుపడుతుంటే చూడలేక మైనంతో అతని బొమ్మను చేసి తగలబెట్టడం గురించి థాంప్సన్ ప్రస్తావిస్తారు. కానీ ఇప్పుడు మొక్కుకు, క్షుద్ర పూజలకు ఉన్న సంబంధం మరుగున పడిపోయింది. ఈ రెండూ అత్యంత ఆదిమ దశలో ఒకే కుదుట్లో పుట్టిన తంతులు. వాస్తవానికి అవి పుట్టినవి మాంత్రికతనుంచి! జబ్బు పడిన పశువు ఆరోగ్యాన్ని పుంజుకోడానికి జరిపే అభినయ మాంత్రికత(mimetic magic)లో భాగమే, ఆ పశువు బొమ్మను చేయడం. ఆ దశలో దానిని దేవతకు అర్పించడం అనేది లేదు. అది తర్వాతి కాలంలో వచ్చింది. ఆ బొమ్మ మంత్రపూతమైంది కనుక దానిని భద్రమైన ప్రదేశంలో ఉంచవలసిన అవసరం నుంచి, దేవతకు అర్పించడం అనే భావన పుట్టింది.

చనిపోయిన రాజకీయ నాయకులకు, ఇతర ప్రముఖులకు విగ్రహాలు స్థాపించడం వెనుక కూడా అత్యంత ఆదిమ దశకు చెందిన మాంత్రిక వారసత్వం ఉందంటే ఆశ్చర్యం కలగచ్చు. అతి పురాతన కాలానికి వెడితే, గ్రీసుపై పర్షియన్లు దండయాత్ర చేసినప్పుడు; ట్రోయిజెన్ పౌసానియస్ అనే చోట స్త్రీలను, పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అందుకు కృతజ్ఞతగా అక్కడ ఆ స్త్రీలు, పిల్లల విగ్రహాలను స్థాపించారు. అలాగే, తప్పి పోయిన, లేదా దేశాంతరానికి వెళ్ళి తిరిగి రాని వారి విగ్రహాలను స్థాపించేవారు. వారు సురక్షితంగా తిరిగి రావడం దాని వెనుక ఉద్దేశం. చనిపోయినవారి విగ్రహాలను స్థాపించడం, వారిని ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోవడం కోసమే నని ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ మొదట్లో ఆశించినది అది కాదు; పరలోకంలో వారు సుఖంగా ఉండాలన్న భావనే ఈ ఆనవాయితీకి మూలం.

వెనకటి కాలంలో గ్రీసు అంతటా, అథ్లెటిక్స్ విజేతలకు, పదవీ కాలం ముగిసిన పూజారులకు, పూజారిణులకు విగ్రహాలు స్థాపించేవారు. వీరిని దేవుళ్ళుగా లేదా దేవతలుగానే భావించేవారు.  మన దగ్గర ఇప్పటికీ దివంగత  రాజకీయనాయకులకు, సినీనటులు వగైరాలకు విగ్రహాలను స్థాపిస్తుండడం తెలిసినదే. అభిమానం వికటించి బతికి ఉండగానే విగ్రహాలను స్థాపించడమూ చూస్తూ ఉంటాం.

మొత్తానికి తంతు మిగిలింది. దాని చరిత్రా, దాని వెనుక అసలు కారణమూ మరుగున పడిపోయాయి!

మరికొన్ని విశేషాలు తర్వాత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

 

 

 

 

మార్మిక ఊహలు రేపే గుహలు, సొరంగాలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ తలుపు, తాళం బాగా తుప్పు పట్టాయి. మా అమ్మే చెప్పిందో, ఇంకెవరైనా చెప్పారో గుర్తులేదు కానీ, అది కాశీకి వెళ్ళే సొరంగమార్గమట! ఒకప్పుడు సాధువులు, సన్యాసులు ఆ మార్గంలో కాశీకి వెళ్ళేవారట! అది ప్రమాదకర మార్గం కావడంతో తర్వాత తాళం వేసేసారట!

పైగా ఆ తుప్పు పట్టిన తలుపు, తాళం చూస్తే అది నిజమేననిపించేది.

ఆశ్చర్యంగా, కుతూహలంగా ఆ సొరంగం వైపే చూస్తూ ఉండిపోయేవాణ్ణి. అందు లోంచి వెడితే ఎంతో దూరంలో ఉన్న కాశీకి చేరుకుంటామన్న ఊహ అంత చిన్నప్పుడే నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది. ఆ తర్వాత కూడా కనకదుర్గ గుడికి ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా ఆ సొరంగం దగ్గరకు వెళ్లి దానివైపే చూస్తూ ఉండేవాడిని, అక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్లడాన్ని రకరకాలుగా ఊహించుకునేవాణ్ణి. ఆ సొరంగం ముచ్చట నా మీద ఎంతగా ముద్ర వేసిందంటే, పెద్దైన తర్వాత కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ సొరంగం దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అది అలాగే ఉందా అన్నది నాకు తెలియదు. నేను చివరిసారి వెళ్లి చాలా ఏళ్ళు అయింది.

లోకజ్ఞానం పెరిగిన కొద్దీ, ఆ సొరంగం లోంచి వెడితే కాశీలో తేలతామనడంలో ఆవగింజంత కూడా నిజం లేదని మనకు తెలుస్తూనే ఉంటుంది. కాని, ఇంకోవైపు అది నిజం ఎందుకు కాకూడదని కూడా అనిపిస్తుంది. నిజానికీ కల్పనకీ మధ్య అదో రకమైన డోలాయమాన స్థితి. సంగతేమిటంటే, వాస్తవికతను అంటిపెట్టుకునే నిగూఢతా ఉంటుంది. ఒక కోణంలో చూస్తే, వాస్తవికత ఎంత వాస్తవమో, నిగూఢతా అంతే వాస్తవం. ప్రకృతిలోనూ, మానవప్రకృతిలోనూ ఈ రెండూ అంతర్భాగాలు, బొమ్మా బొరుసూ లాంటివి. నమ్మకానికీ, అపనమ్మకానికీ కూడా ఇదే వర్తిస్తుంది. మనిషి జీవితం ఏదో ఒక రూపంలో ఈ రెంటి మధ్యా పయనిస్తూనే ఉంటుంది.
ఇలా అన్నానని నేనేదో తాత్విక చర్చలోకి వెడుతున్నాననో, తాడూ బొంగరం లేని ఊహల్ని సమర్థిస్తున్నాననో అనుకుంటున్నారేమో, అదేం లేదు. మానవపరిణామచరిత్రలోకి వెడితే ఈ నిగూఢత, రహస్యం, లేదా మిస్టరీ అనేవి మనిషి జీవితంలో ప్రముఖపాత్ర పోషించాయని మనకు తెలుసు. సొరంగాలు, లేదా గుహలు; ఇంతకు ముందు చెప్పుకున్న అమ్మవారి తోపులు వగైరాలు ఆ నిగూఢతను అంటిపెట్టుకుని ఉన్నవే. నిగూఢమైన తంతులలో అవి భాగాలు. వాటిని ఒక మార్మికత ఆవరించి ఉంటుంది.

ఉండవల్లి గుహాలయాలు

ఉండవల్లి గుహాలయాలు

సొరంగాలు, గుహలు, తోపుల చుట్టూ అల్లుకున్న మార్మికత ఎన్ని వేల సంవత్సరాలుగా మనిషి ఊహల్లో జీర్ణించుకుని ఉందో! కనకదుర్గగుడిలోని ఆ సొరంగాన్ని చూడగానే, అది ఒకప్పుడు కాశీకి రహస్య మార్గం అన్న ఊహ పుట్టడం వెనుక ఇంత చరిత్ర ఉందన్న మాట.

సొరంగాలు, గుహలు చీకటి గుయ్యారాలుగా; లోపల ఏముందో అంతుబట్టనివిగా, ఎంత దూరం వ్యాపించాయో తెలియనివిగా ఉంటాయి. భూమి అడుగున అలాంటి ఒక అజ్ఞాతప్రపంచాన్ని మనిషి ఊహ సృష్టించి, దానికి ఒక పేరు పెట్టింది: అదే, పాతాళం! పాతాళం స్వర్గంలా ఆనందం, ఆహ్లాదం గొలిపే ప్రపంచం కాదు. భయ, బీభత్సాలను కలిగించేది. అక్కడ ఉండేది దేవతలు కాదు; కాలకూట విషాన్ని పుక్కిలించే మహాసర్పాలు. పాతాళం మన భాషల్లో ఒక న్యూనార్థకం, నిందార్థకం. పాతాళానికి సమానార్థకమైన under world కూడా అలాంటిదే. స్మగ్లర్లు, ఇతర నేరాలు చేసేవాళ్ళు ఉండే ప్రపంచం అది. పాతాళానికి తోక్కేయడం అనే నుడికారం మన భాషల్లో కనిపిస్తుంది. వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు.

మన దగ్గరే కాదు, పాతాళం ఇతర పురాణకథల్లోనూ ఇలాంటి న్యూనార్థంలోనే కనిపిస్తుంది. గ్రీకుపురాణకథల్లోని పాతాళ ప్రస్తావనలను ఉదహరించుకునే సందర్భం ముందు రావచ్చు. అదలా ఉంచితే, మార్మికత, మాంత్రికత నిండిన పురా మానవ జీవితంలో గుహలు, పాతాళం ఒక ముఖ్యపాత్ర పోషిస్తూవచ్చాయి. మనదేశంలో అజంతా, ఎల్లోరా గుహల గురించి మనకు తెలుసు. అమరనాథ్ గుహ గురించి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇలాంటివే ఇంకా దేశంలో చాలా ఉన్నాయి. ఇవి కాక కొన్ని ప్రాచీన ఆలయాలలో విడిగా గుహాలయాలు, భూగర్భ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. భూగర్భ ఆలయాలలోని దేవుడి పేరుముందు ‘పాతాళ’ అనే మాట చేర్చి చెబుతుంటారు. ఉదాహరణకు, శ్రీకాళహస్తిలో పాతాళ విఘ్నేశ్వరుని గుడి ఉంది. అందులోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అలాగే, కొండలను గుహలుగా తొలచి ఏర్పాటు చేసిన గుడులు అనేకచోట్ల కనిపిస్తాయి.

అన్నట్టు, కొందరు ఉగ్రదేవతల గుడులు పాతాళంలో ఉంటాయి. ‘పాతాళ భైరవి’ అనే సినిమా పేరులోనే పాతాళం ఉంది. ఆ ఉగ్రదేవతలను ఆరాధించే మాంత్రికుల నివాసం కూడా పాతాళంలోనే ఉంటుంది. అందుకే వారి ఉనికిని గుర్తించడం కష్టమవుతుంది. దాని నుంచే ‘సప్తసముద్రాలు-దానికి ఆవల ఓ మర్రిచెట్టు-దాని తొర్రలో చిలుక- ఆ చిలుకలో మాంత్రికుని ప్రాణం…’వగైరా అద్భుత కల్పనలు, మహిమలు పుట్టాయి.

అలవాటు వల్ల వీటిని యాంత్రికంగా తీసుకుంటాం. ఇందులో కొత్త ఏముందని అనుకుంటాం. కానీ చరిత్ర క్రమంలో వీటిని పెట్టి చూడండి…ఇవి కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తాయి. చరిత్రకోణం నుంచి చూసినప్పుడు ఆసక్తికరం కాని దేదీ ఉండదనిపిస్తుంది.

గుహల విషయానికి వెడితే, ఆదికాలపు గుడులు గుహలే ననీ; గ్రీకు సంప్రదాయమూ, పురావస్తు ఆధారాలు దానినే నిరూపిస్తున్నాయనీ థాంప్సన్ అంటారు. మన సంప్రదాయం కూడా అదే నని పైన చెప్పుకున్న గుహాలయాలు, పాతాళ ఆలయాలు చెబుతూనే ఉన్నాయి. గ్రీకు పురాణాలలోని డిమీటర్, పెరెస్పోన్ అనే అమ్మవార్లకు చెందిన పవిత్రగుహలను మెగరాన్ (megaron) అంటారు. హోమర్ కాలం నాటికి ఆ మాట ఇంటికీ, ప్రాసాదానికీ కూడా పర్యాయపదమైంది. హేడ్స్ అనే పాతాళదేవుడు, పెరెస్పోన్ అనే దేవకన్యను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేస్తాడు. అది జరిగిన చోటే మెగరాన్. థాంప్సన్ ప్రకారం పాతరాతియుగంలో గుహలే ఆలయాలుగానూ, నివాస స్థలాలు గానూ ఉండేవి. కొత్తరాతి యుగానికి వచ్చేసరికి గుహలలో నివసించడం ఆగిపోయింది. వాటిని ఆలయాలుగా, సమాధులుగా, ధాన్యాగారాలుగా ఉపయోగించడం మాత్రం కొనసాగింది.

అమరనాథ్ గుహాలయం

అమరనాథ్ గుహాలయం

గ్రీసులోని గుహాలయాలలో అనేకం ప్రాచీన క్రీటు ద్వీపానికి చెందినవి. క్రీటు రాజధాని నోసోస్ కు దగ్గరలోని ప్రముఖ గుహాలయమైన అమ్నిసోస్ ను హోమర్ కావ్యం ఒడిస్సీ కూడా ప్రస్తావించింది. ప్రాచీన గ్రీసుపై మాతృస్వామ్యానికి చెందిన క్రీటు సంస్కృతి ప్రభావం చాలా ఉంది. క్రీటులో నేల తొలిచి, చుట్టూ బండరాళ్ళు పేర్చి కృత్రిమ గుహలను కూడా కల్పించేవారు. అవే క్రమంగా చనిపోయినవారిని పూడ్చిపెట్టే సమాధుల నిర్మాణానికి దారితీసాయి.

అనటోలియా(నేటి టర్కీ)లో ఫ్రిజియన్లు, బహుశా వారికి ముందు హిట్టైట్లు సహజసిద్ధమైన గుట్టలలో గోతులు తవ్వి, ఎండా, చలి తగలకుండా వాటికి కలపతో రక్షణ కల్పించేవారు. ఇలాంటి గోతులనే కపడోసియా(టర్కీ మధ్యప్రాంతం), ఆర్మేనియా, ఇటలీ, జర్మనీ, లిబియా, స్పెయిన్ లలో ధాన్యాగారాలుగా లేదా గాదెలుగా ఉపయోగించేవారు. విశేషమేమిటంటే, ఈ గాదెల్లో తృణధాన్యాలను జాగ్రత్తగా భద్రపరిస్తే అవి ఎంతకాలమైనా చెడకుండా ఉండేవట. ఉదాహరణకు, గోధుమలు యాభై ఏళ్లపాటు; జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు నూరేళ్ళకు పైగా నిల్వ ఉండేవట.

రోమ్ లో ఇటువంటి నిర్మాణాలను ‘ముండస్’(mundus) అనేవారు. ఏదైనా నగరనిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు, మధ్యలో ఒక గొయ్యి తవ్వేవారు. అందులో ప్రథమఫలా(first-fruits)న్ని, అంటే కొత్తపంటలో కొంత భాగాన్ని అర్పించేవారు. ఈ ప్రథమఫలం గురించి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, ఏటా కొత్త పంట రాగానే, ఆగస్టు 24న ప్రథమ ఫలాలను అర్పించే తంతు జరిగేది. తిరిగి నవంబర్ 8న దాని మూత తెరిచి అందులోంచే మరో పంటకు విత్తనాలు తీసుకునేవారు. ఆ మూత తెరవడం మతపరమైన తంతుగా శాస్త్రోక్తంగా జరిగేది. తలుపు తెరచి ప్రేతాత్మలను బయటికి రప్పించే పద్ధతిలో అది ఉండేది. ఎందుకంటే, ఆ ధాన్యాగారం కోశాగారాన్నీ, గిడ్డంగినే కాక సమాధినీ తలపించేలా ఉండేది. అంటే, ప్రేతాత్మలు, విత్తనాలు అందులో సహజీవనం చేసేవన్నమాట.

అలాగే, ఎల్యూసిస్ అనే చోట ఉన్న డిమీటర్ అనే దేవతకు గ్రీకు రాజ్యాలు అనేకం ప్రథమఫలాలను పంపించడం ఆనవాయితీగా ఉండేది. ఆకురాలు కాలం వరకు వాటిని నిల్వ ఉంచి, ఆ తర్వాత రైతులకు విక్రయించేవారు. రైతులు వాటిని మిగతా విత్తనధాన్యంలో కలిపి కొత్తపంటకు ఉపయోగించేవారు. ఇవన్నీ లౌకికమైన చర్యలే కానీ వీటిని మతపరమైన తంతుగా జరపడం తప్పనిసరి. ఆదిమకాలంలో లౌకికమైన చర్యకు, మతపరమైన తంతుకు తేడా ఉండేది కాదని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం.

మొదట్లో ఆలయాలుగా, నివాసాలుగా ఉపయోగపడిన గుహలు, పాతాళగృహాలు క్రమంగా సమాధులు, ధాన్యాగారాల నిర్మాణానికి నమూనాను అందించినట్టు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒకరకంగా ఆయా నిర్మాణాల తాలూకు పరిణామక్రమాన్ని, చరిత్రనే చెబుతుంది. ఇలా చూసినప్పుడు, అలవాటు పడిపోవడం వల్ల అంత విశేషంగా తీసుకోని గుహాలయాలు, పాతాళమందిరాలు పురాచారిత్రకు సాక్ష్యాలుగా సరికొత్త రూపంలో కనిపించి ఆసక్తిని రేపుతాయి.

అందులోనూ మన రామాయణం, మహాభారతం లాంటి ప్రాచీన సాహిత్యంలో పురామానవ చరిత్ర తాలూకు ఆనవాళ్ళను పట్టుకోవడం మరింత ఆసక్తికరం. గుహలు అనేటప్పటికి నాకు రామాయణం, కిష్కింధకాండలోని ఒక ఘట్టం చటుక్కున గుర్తుకొచ్చింది. అది ఇలా సాగుతుంది:

సుగ్రీవుడి ఆజ్ఞపై సీతను వెతకడానికి దక్షిణదిశకు వెళ్ళిన వానర వీరులలో హనుమంతుడు, అంగదుడు మొదలైనవారు ఉన్నారు. వారు సీతను వెతుకుతూ వింధ్యపర్వతం దాకా వెళ్ళారు. మొదట పర్వతం లోతట్టున ఉన్నగుహలను, అడవులను గాలించారు. గుట్టలు, గుబురులు శోధించారు. తర్వాత వింధ్యపర్వతం పై భాగం మీదికి వెళ్ళారు. అక్కడ ఇంకా పెద్ద గుహలు కనిపించాయి. వాటిలో అన్నింటికంటే పెద్దదైన ఒక బిలం వాళ్లను ఆకర్షించింది. దానిపేరు ఋక్షబిలం. అంటే, ఎలుగుబంట్ల బిలం. చెట్లూ, వాటికి దట్టంగా తీగలు అల్లుకోవడంతో దాని ముఖద్వారం సరిగా కనిపించడం లేదు. అంతలో లోపలి నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురుపక్షులు ఎగురుతూ వచ్చాయి. అవి నీటిలో తడిసి ఉన్నాయి. దప్పికతో ఉన్న వానరులు లోపల నీటి జాడ ఉన్నట్టు తెలిసి సంతోషించారు. అతికష్టం మీద లోపలికి ప్రవేశించారు. లోపల చాలాదూరం చిమ్మ చీకటి వ్యాపించి ఉంది. క్రమంగా వెలుగు కనబడింది. సింహాలు, ఇతర మృగాలు తిరుగుతూ కనిపించాయి.

కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంత వనం కనిపించింది. అందులో రకరకాల పూలమొక్కలు ఉన్నాయి. బంగారాన్ని, వెండిని తాపడం చేసిన భవనాలు ఉన్నాయి. ఆ వనంలో ముందుకు వెళ్ళిన తర్వాత జింకచర్మాన్ని వస్త్రంగా ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె గొప్ప తేజస్సుతో దివ్యస్త్రీలా కనిపిస్తోంది. పరస్పరం పరిచయం చేసుకున్నారు. తన పేరు స్వయంప్రభ అనీ, తను మేరుసావర్ణి కూతురినని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ బిలం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది:
ఈ బిలంలోని భవంతులను, వనాలను మయుడనే దానవుడు సృష్టించాడు. అతడు హేమ అనే అప్సరసను మోహించాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మండిపడ్డాడు. అతణ్ణి చంపేసాడు. అప్పుడు బ్రహ్మ ఆ బిలంలోని వనాన్ని, బంగారు గృహాలను హేమకే కానుకగా ఇచ్చేసాడు. తన ప్రియసఖి అయిన హేమ ఈ వనాన్ని, భవనాలను సంరక్షించే బాధ్యతను తనకు అప్పగించింది.

ఇంతా చెప్పిన తర్వాత, “ఈ బిలంలోకి ప్రవేశించినవారు ప్రాణాలతో బయటపడడం కష్టమే. మీరు ఎలా బయటకు వెడతా’రని వానరులను అడిగింది. నువ్వే మిమ్మల్ని బయటపడేయాలని వారు ఆమెను ప్రార్థించారు. చివరికి ఆమె సాయంతో అందులోంచి బయటపడ్డారు.

ఉజ్జయిని లోని భూగర్భ ఆలయం

ఉజ్జయిని లోని భూగర్భ ఆలయం

ఒక నిర్జన పర్వత ప్రాంతంలో, ఎవరికీ అంత తేలికగా చొరడానికి వీలు కాని ఒక మహాబిలంలో, సింహాల వంటి క్రూర జంతువుల మధ్య, మగతోడు లేకుండా స్వయంప్రభ అనే స్త్రీ ఒంటరిగా నివసిస్తుండడమే చూడండి…ఇది లీలగా ఒకనాటి మాతృస్వామ్యాన్ని సూచిస్తోందా? పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని మరోలా అన్వయించుకోవడం కష్టమే. అలాగే, ఇది చదువుతున్నప్పుడే, ఓడిసస్ కథలో చెప్పుకున్న గ్రీకు అప్సరస సిర్సే గుర్తుకొచ్చి ఉండాలి. సిర్సే కూడా ఒక దీవిలోని అడవిలో నునుపు రాళ్ళతో కట్టిన ఒక భవనంలో ఒంటరిగానే ఉంటూ ఓడిసస్ సహచరులకు కనిపించింది. స్వయంప్రభ ఉన్న బిలంలో వానరులకు సింహాలు, ఇతర మృగాలు కనిపించినట్టే; సిర్సే భవంతికి అన్నివైపులా సింహాలు, తోడేళ్ళు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి మందు పెట్టడం వల్ల అవి సాధుజంతువులుగా మారిపోయాయని కథకుడు చెబుతున్నాడు.
సిర్సే లానే ఋక్షబిలం యజమానురాలు హేమ కూడా అప్సరసే. ఆమెను మోహించిన నేరానికి ఇంద్రుడు మయుని చంపాడు సరే, మయునికి చెందిన వనాన్ని, బంగారు గృహాలను హేమకు బ్రహ్మ కానుకగా ఇవ్వడమేమిటి? ఇందులో ఎలాంటి అర్థమూ కనిపించదు. అలాకాక, హేమకు, మయునికి ఏదో ఒక సంబంధం ఉందనుకుంటేనే అతని సంపద ఆమెకు లభించడంలో అర్థం ఉంటుంది. ఆ సంబంధం సిర్సేకు, ఓడిసస్ కు ఉన్న సంబంధం లాంటిదా?

సిర్సే తన భవంతి దగ్గరకు వచ్చిన ఓడిసస్ సహచరులను లోపలికి ఆహ్వానించి వారిని పందులుగా మార్చివేసింది. ఇది తెలిసి ఓడిసస్ ఆమెపై ప్రతీకారానికి బయలుదేరినప్పుడు హెర్మన్ అనే దేవుడు ఎదురై, ఆమెను లొంగదీసుకునే ఉపాయం చెప్పాడు. ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. దాంతో ఆమె లొంగిపోయింది. అలా జరిగి ఉండకపోతే తన సహచరులకు పట్టిన గతే అతనికీ పట్టి ఉండేది.

ఇదే కథను మయునికి, హేమకు అన్వయించి చూస్తే, సిర్సే వల్ల ఎదురయ్యే ప్రమాదం నుంచి ఓడిసస్ బయటపడగా; మయుడు బయటపడలేకపోయాడనుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, హోమర్ ఓడిసస్ కథకు, వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టానికీ ఉన్న పోలిక!

ఇంకో స్పష్టమైన పోలిక చూడండి…’ఈ బిలంలోకి ప్రవేశించినవారు ఎవరైనా ప్రాణాలతో బయటపడడం కష్టం. మీరెలా బయటపడతా’రని వానరులను స్వయంప్రభ అడుగుతుంది. సిర్సే భవంతిలో ఓడిసస్ సహచరులకు, ఓడిసస్ కు ఎదురైన పరిస్థితి దాదాపు అదే.

ఇంతకీ రామాయణంలోని ఈ ఋక్షబిలం ఉదంతం, పురాకాలంలో గుహలే మానవ ఆవాసాలన్న చారిత్రక వివరాన్ని నమోదు చేస్తోందా?! అవుననే అనిపిస్తోంది. రామాయణంలో పురా చారిత్రక సమాచారం లభించడం ఎంత అపురూపం, ఎంత అద్భుతం!!

మరికొన్ని విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం 

బృందావన కృష్ణుడు… సోషల్ ఇంజనీరింగ్!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)బుద్ధుడు (క్రీ.పూ. 6వ శతాబ్ది) జన్మించింది కూడా అమ్మవారి వనంలోనే!

బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు. శాక్యులు నేటి భారత-నేపాల్ సరిహద్దులకు ఇరువైపులా నివసించేవారు. అదో వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో సాలవృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. సాలవృక్షం శాక్యులకు పూజనీయం(టోటెమ్). విక్రమార్కుని కథలోని సాలభంజికలు ఈ చెట్టు కలపతో చేసినవే.

అక్కడో సాలవనం ఉంది. అది అమ్మవారి వనం. అందులోని అమ్మవారి పేరు లుంబిని. బుద్ధుడి తల్లి మాయాదేవి దగ్గరలోని శాక్యులకు చెందిన ఒక పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి వనంలోకి వెళ్ళి అమ్మవారిని కొలిచింది. అప్పుడే నొప్పులు వచ్చి ఆ వనంలోనే బుద్ధుని ప్రసవించింది.

బుద్ధుణ్ణి మరచిపోయి ఉండచ్చుకానీ ఆ ప్రాంత జనం ఇప్పటికీ ఆ వనంలోని అమ్మవారిని పూజిస్తూ ఉంటారని కోశాంబీ అంటారు. కాకపోతే లుంబిని కాస్తా ఇప్పుడు ‘రుమ్మిందీ’ అయింది. ఆచారాలు ఎంత బలీయమైనవో, కాలాన్ని జయించి అవి ఎలా కొనసాగుతాయో ఇది చెబుతుంది.

ఇప్పుడు మళ్ళీ పురాణకథల్లోకి ఒకసారి వెడదాం:

ఉత్తరప్రదేశ్ లో కృష్ణుడి జన్మస్థానమైన మధుర, దానికి దగ్గరలో ఉన్న బృందావనం, గోకులం నేటికీ ప్రసిద్ధపుణ్యక్షేత్రాలు. ఈ మూడింటినీ కలిపి ‘వ్రజభూమి’ అంటారు. బృందావనం అమ్మవారివనమే. ‘బృంద’ కొందరు అమ్మవార్ల గుంపు (బృందం) ను సూచించే ఉమ్మడి పేరనీ, ఆ అమ్మవార్ల వనమే బృందావనమనీ కోశాంబీ వివరణ. తులసి రూపంలో ఈ దేవతను పూజిస్తారు. కంసుని వల్ల కృష్ణునికి ప్రాణభయం ఉండడంతో అతని పెంపుడు తల్లిదండ్రులైన యశోదా నందులు గోకులాన్ని బృందావనానికి తరలించారు. బృంద దేవతకు ఏటా జరిగే ఉత్సవాలలో నరబలి కూడా ఉండేదనీ, కృష్ణుడు దీనిని మాన్పించాడనీ కోశాంబీ అంటారు. దీని గురించి Myth and Reality లో మరింత సమాచారం ఉంది కానీ ఇప్పుడు అందులోకి వెళ్లలేం.

కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDIA in Historical Outline) అంటారు. ఉషస్సనే స్త్రీని ఇంద్రుడు చంపాడని చెబుతున్నా, ఆమె బతికి బయటపడినట్టుగా; పూతనను కృష్ణుడు చంపాడని అన్నా ఆమె చావలేదనీ, మధుర ప్రాంతంలో ఇప్పటికీ పిల్లలకు పూతన పేరు పెడతారనీ ఆయన వివరణ.

‘బహుశా’ అని కోశాంబీ ఎందుకు అన్నారో కానీ, పూతన అమ్మవారే ననడానికి, భాగవతం, దశమస్కంధంలోని పూతన వధ ఘట్టంలోనే స్పష్టమైన సాక్ష్యం ఉంది. గోపికలు కృష్ణుడికి రక్ష పెడుతూ, “నిన్ను తలచుకున్నవారికి వృద్ధ, బాల గ్రహాల వల్ల , భూతప్రేత పిశాచాల వల్ల ఎలాంటి భయమూ ఉండదనీ, పూతనాది మాతృకా గణాలు నశిస్తాయనీ” అంటారు. మాతృకా గణాలంటే అమ్మవార్లే. కుమారస్వామి కథలో కూడా ఈ మాతృకా గణాల ప్రస్తావన వస్తుంది. ఇక్కడ ‘గణాలు’ అనే మాట ‘సమూహాలు’ అనే అర్థంలో వాడినట్టు కనిపించవచ్చు కానీ, పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ మాట ఒకనాటి గణవ్యవస్థనే సూచిస్తూ ఉండవచ్చు. ఒకప్పుడు నిర్దిష్టార్ధంలో ఉపయోగించిన మాటలు కాలగతిలో నిర్దిష్టార్ధం కోల్పోయి సామాన్యార్ధం తెచ్చుకోవడం పరిపాటే. గ్రీకు పురాచరిత్ర సందర్భంలో జార్జి థాంప్సన్ కూడా ఇలాంటి ఉదాహరణలను కొన్నింటిని ప్రస్తావించారు.

వాస్తవంగా ఏం జరిగి ఉండచ్చంటే, పూతనను కృష్ణుడు చంపలేదు, లొంగదీసుకున్నాడు! అంటే, మాతృకాగణాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే, అమ్మవార్ల ఆరాధనకంటే ఉన్నతస్థానంలో, తన రూపంలోని పురుషదేవుడి ఆరాధనను స్థాపించడానికి ప్రయత్నించాడు. అమ్మవారి ఆరాధన అంతరించలేదు కానీ, ద్వితీయస్థానానికి జారిపోయింది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న భారతదేశ ప్రత్యేకతను వెల్లడిస్తుంది. ఇక్కడ ఏదీ ఒకదానినొకటి అంతరింపజేయదు. భిన్నత్వాల మధ్య సర్దుబాటు జరుగుతుంది. కృష్ణుడు చేసినదానిని సామాజికార్థంలో తీసుకుంటే, మాతృస్వామ్యంపై పితృస్వామ్యాన్ని స్థాపించడంలో ఆయన ఒక పాత్ర నిర్వహించాడన్నమాట.

sacred grove in vrindavan

బృందావనం కథ కూడా అమ్మవార్లపై కృష్ణుడు తన ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రక్రియలో భాగమే. బృందను కృష్ణుడు పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంటే, బృందారాధన(అమ్మవార్ల ఆరాధన)ద్వితీయస్థానానికి జారిపోవడమూ; కృష్ణారాధన, బృందారాధనల మధ్య సర్దుబాటూ జరిగాయన్నమాట. కృష్ణుడు నరబలిని మాన్పించడం ద్వారా బృందారాధనను సంస్కరించడానికి ప్రయత్నించాడు. కృష్ణుడి భార్యల సంఖ్య 16,108కి చేరుకోవడంలోని రహస్యం, ఆయన అమ్మవార్లను పెళ్లాడి (పైన చెప్పిన సర్దుబాటు అర్థంలో), అప్సరసలతో రాసక్రీడలు జరపడమే. అప్సరసలే గోపికలుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవార్లతోపాటు అప్సరసలు కూడా ఇంతకుముందు చెప్పుకున్న స్త్రీ సూత్రం (female principle)లో భాగాలే. ‘ఎలుగుబంటి’ తెగకు నాయకుడైన జాంబవంతుడి కూతురు జాంబవతి, అప్పటికింకా ఆటవిక దశలోనే ఉన్న భోజకుల ఆడబడుచు రుక్మిణి మొదలైనవారిని కృష్ణుడు పెళ్లాడడం; భిన్న భిన్న తెగలలోకి కృష్ణారాధనను శాంతియుతంగా చొప్పించే ప్రయత్నమేనని కోశాంబీ అంటారు. కృష్ణుడి వివాహాలు మాతృస్వామ్యానికి చెందిన కొన్ని అనార్య తెగలను ఆర్యుల పితృస్వామిక వ్యవస్థలో విలీనం చేసే ప్రక్రియలో కీలకమైన ముందడుగుగా ఆయన వర్ణిస్తారు. నేడు మనం చెప్పుకునే ‘సోషల్ ఇంజనీరింగ్’ కు ఇది చక్కని ఉదాహరణ.

ఇలా కృష్ణుడు పితృస్వామ్య స్థాపనలో కీలక పాత్ర వహించాడనీ, లేదా పితృస్వామ్య స్థాపనలో భాగంగా కృష్ణుడి పాత్రను నిర్మించారనీ అనుకుంటే ఆయన దశావతారాలలో ఎందుకు చేరాడో అర్థమవుతుంది. అమ్మవార్ల ఆరాధనలోకి, లేదా మాతృస్వామిక రూపాలలోకి కృష్ణుడు తన ఆరాధనను చొప్పించిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. గోపికావస్త్రాపహరణం ఒక కీలక ఉదాహరణ.

పోతన భాగవతం, దశమస్కంధంలోని ఆ కథ ఇలా సాగుతుంది:

హేమంత ఋతువులో మొదటి నెల తొలిదినాలలో నందుని మందలో ఉన్న గోపికలంతా పొద్దుటే లేచి కాళిందీనదికి వెళ్ళి స్నానం చేశారు. నది ఒడ్డున ఇసుకతో కాత్యాయినీరూపం చేసి, పువ్వులు,గంధంతో, ధూపదీపాలతో పూజించి నైవేద్యాలు పెట్టారు. కృష్ణుడిని తమకు పతిని చేయమని అమ్మవారిని ప్రార్థించారు. ఇలా నెలరోజులపాటు కాత్యాయనీ వ్రతం చేశారు.

ఆ నెలరోజుల్లోనే ఒకరోజున కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ యమునా తీరానికి వెళ్లారు. ఒక నిర్జన ప్రదేశంలో చీరలు విప్పి గట్టున పెట్టి నదిలోకి దిగారు. దూరం నుంచే కృష్ణుడు ఇది చూసి, తన తోటి గోపకులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వారిని కదలకుండా అక్కడే ఉండమని చెప్పి తను పొదల మాటునుంచి చప్పుడు చేయకుండా వెళ్ళి గట్టున ఉన్న చీరలను ఎత్తుకు వెళ్ళి ఓ చెట్టెక్కి కూర్చున్నాడు.

గోపికలు చూశారు. ‘’మా మాన మెందుకు హరిస్తావు? మా చీరలు మాకు ఇచ్చేయి అని అనేకరకాలుగా ప్రార్థించారు. ‘’నీళ్ళలోంచి బయటకు వచ్చి మీ చీరలు తీసుకొండని కృష్ణుడు అన్నాడు. గోపికలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, “ఆడవాళ్ళు స్నానం చేసే చోటికి మగవాళ్ళు రావచ్చా? వచ్చినా ఇలాంటి పనులు చేయచ్చా? నీకు దాసులమవుతాం. నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం. ఏమైనా ఇస్తాం. ఇప్పుడు మాత్రం దయచేసి మా చీరలు మాకు ఇచ్చేయి” అన్నారు.

‘’ఇంతకీ ఎవరు మొగుడు కావాలని వ్రతం చేస్తున్నారు? మీకు ఎవరి మీద వలపు కలిగింది?’’ అని కృష్ణుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు హృదయంలో మన్మథుడు సందడి చేస్తుండగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గోపికలు మౌనంగా ఉండిపోయారు.

‘’నా ఇంటికి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటామంటే మీ చీరలు మీకిస్తాను. నీళ్ళలోంచి బయటకు రండి’’ అన్నాడు కృష్ణుడు.

చలికి నీళ్ళలో ఉండలేక, బయటకు రాలేక గోపికలు సతమతమయ్యారు. ఏమైతే అయింది, వెడదామని కొందరు అన్నారు. వెడితే కృష్ణుడు మన సిగ్గు తీస్తాడని కొందరు అన్నారు. చివరికి ఎలాగో మనసు గట్టి చేసుకుని, అరచేతితో మానం కప్పుకుంటూ వరసకట్టి నీళ్ళలోంచి బయటకు వచ్చారు.

‘’ఎందుకు సిగ్గు పడతారు? నాకు తెలియని మీ రహస్యం ఏముంది? వ్రతనిష్టలో ఉండి ఇలా చీరలు విప్పేసి స్నానం చేయచ్చా? వ్రతఫలం దక్కాలంటే చేతులెత్తి మొక్కి చీరలు తీసుకొండని’’ డని కృష్ణుడు అన్నాడు.

వ్రతాలు చేసేటప్పుడు ఎవరిని తలచుకుంటే వ్రతభంగం ఉండదో ఆ దేవుణ్ణే తాము చూస్తున్నప్పటికీ, ‘అయ్యో చీరలు విప్పి ఈరోజు వ్రతభంగం చేశామే’ అనుకుంటూ గోపికలు రెండు చేతులూ ఎత్తి కృష్ణుడికి మొక్కారు. కృష్ణుడు చీరలు ఇచ్చేశాడు. “ చీరలు దొంగిలించి కృష్ణుడు మన సిగ్గు తీస్తే తీశాడు కానీ వ్రతంలో లోపం జరగకుండా మొక్కించి కాపాడాడు” అని అనుకుంటూ గోపికలు కృష్ణుని స్తుతించారు. చీరలు కట్టుకున్నారు.

అప్పుడు కృష్ణుడు వాళ్ళతో, ‘’సిగ్గుపడి మీ రహస్యం చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. నన్ను కొలవాలనే మీరు అనుకున్నారు. మీ నోము ఫలించేది నావల్లనే. నన్ను కొలిస్తేనే మీకు ముక్తి. ఆ తర్వాత అమ్మవారిని కొలిచి రాత్రిళ్ళు మీరు నన్ను పొందవచ్చు’’ అన్నాడు.

brundaavanamlo raadhaakrushnulu

ఈ ఘట్టానికే కాక, ఇలాంటి అనేక ఘట్టాలకు సంబంధించి సంప్రదాయం బోధించే ఆధ్యాత్మికఅన్వయాలు, రహస్యాలు వేరే ఉన్నాయి. అవి నా పరిశీలన పరిధిలోకి రావు కనుక వాటిలోకి వెళ్లను. పురాచరిత్ర కోణం నుంచి చూస్తే, గోపికలు కాళిందిలో స్నానం చేసి, ఇసుకతో కాత్యాయనీదేవి రూపం చేసి పూజించిన ప్రాంతంలో అమ్మవారి వనం ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ వివరాన్ని అందించడం కథకునికి అంత ముఖ్యంగా తోచి ఉండకపోవచ్చు. అతను ప్రధానంగా కృష్ణుడనే పురుషదేవుని పరంగా కథ చెబుతున్నాడు. అలాగే, గోపికలు యమునా నదికి వెళ్లి, చీరలు విప్పి స్నానం చేసిన ప్రదేశం స్త్రీలకు మాత్రమే ఉద్దేశించిన రహస్య ప్రదేశం కావచ్చు. అక్కడ అమ్మవారి వనమూ ఉండవచ్చు.

స్త్రీల రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కృష్ణుడు యథేచ్చగా ఉల్లంఘించాడన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్న గ్రీకు కథలతోనూ, దేవీభాగవతంలోని సుద్యుమ్నుని కథతోనూ దీనిని పోల్చి చూడండి. అర్తెమిస్ అనే గ్రీకు దేవత ఒక అడవిలోని కన్యాసరోవరంలో స్నానం చేస్తుండగా అక్కడికి వెళ్ళిన అక్తయాన్ అనే పురుషుణ్ణి అర్తెమిస్ లేడిగా మార్చివేసింది. దాంతో అతని వెంట ఉన్న వేటకుక్కలు లేడి రూపంలోని అక్తయాన్ పై దాడి చేసి చంపేసాయి. మరో కథలో డఫ్నే అనే యువతిని ప్రేమించిన ల్యుకప్పస్ అనే యువకుడు స్త్రీ వేషంలో వెళ్లి ఆమెతో స్నేహం చేశాడు. ఒకరోజున ఇతర చెలికత్తెలతో కలసి డఫ్నే దుస్తులు విప్పి జలక్రీడలాడడానికి సిద్ధమైనప్పుడు ల్యుకప్పస్ మగవాడని తెలిసి అతణ్ణి చంపేస్తుంది. దేవీభాగవతం కథలో అమ్మవారి వనంలోకి తెలియక ప్రవేశించిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. జగదేకవీరుని కథలో దేవకన్యలు స్నానం చేస్తుండగా చూసిన రాకుమారుని ఇంద్రకుమారి శిలగా మార్చివేస్తుంది.

కానీ, గోపికలు స్నానం చేస్తున్న రహస్యప్రదేశంలోకి కృష్ణుడు ప్రవేశించినా అతనికి ఏమీకాలేదు. పైగా, నగ్నంగా అతని ముందు నిలబడి గోపికలే శిక్షను ఎదుర్కొన్నారు. పై కథలలోని స్త్రీలకు, గోపికలకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. పై కథల్లోని స్త్రీలు తమ రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కచ్చితంగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేశారు. తమ రహస్యప్రపంచ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు. అందుకు భిన్నంగా గోపికలు బేలలుగా మారి తమ రహస్య ప్రపంచ ఆధిపత్యాన్ని పురుషుడికి ధారపోసేసారు. కృష్ణుడికి, వారికి జరిగిన సంభాషణ– వారు పురుషుడికి పూర్తిగా దాసోహమవడాన్నే వెల్లడిస్తుంది. ‘’నీకు దాసులమవుతాం, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం, ఏమి కోరినా ఇస్తాం, ఇప్పుడు మాత్రం చీరలు ఇచ్చేయ’’ మని వేడుకుంటారు. ఇది స్త్రీ అధికార పతనానికి కచ్చితమైన సూచన.

కృష్ణుడు కూడా వారిపై దాస్యాన్ని విధించడానికి ఏమాత్రం మొహమాటపడలేదు. ‘’మీరు నా ఇంటి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటేనే చీరలు ఇస్తాను’’ అన్నాడు. గోపికలు అరచేత మానాన్ని కప్పుకుంటూ కృష్ణుడి ముందుకు వెళ్ళినా వారికి చీరలు దక్కలేదు. రెండు చేతులూ ఎత్తి మొక్కిన తర్వాతే దక్కాయి.

ఆ తర్వాత కృష్ణుడు గోపికలకు చేసిన ఉపదేశంలో, ‘’మీరు (ప్రధానంగా) మొక్క వలసింది అమ్మవారి( కాత్యాయని)కి కాదు, నాకు’’ అన్న సూచన స్పష్టంగా ఉంది. ‘’మీకు ముక్తిని ఇవ్వవలసింది నేనే (అమ్మవారు కాదు)’’ అన్న సూచనా అంతే స్పష్టంగా ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిషేధించలేదు. ‘’నన్ను కొలిచిన తర్వాత అమ్మవారిని కొలిచి నన్ను పొందండి’’ అన్నాడు. అంటే అమ్మవారి ఆరాధన ద్వితీయస్థానానికి జారిపోయింది. విశ్వాసరంగంలో ఇదీ భారతదేశ ప్రత్యేకత.

పురాచరిత్ర దృష్టి నుంచి చూస్తే, కృష్ణలీలను అర్థం చేసుకోవడంలో మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడం అనేది ఒక కీలకమైన దృక్కోణం.

***

జార్జి థాంప్సన్ ప్రకారం(Studies in Ancient Greek Society-The Prehistoric Aegean), ప్రాచీన గ్రీసులోనూ అమ్మవారి వనాలు ఉండేవి. అట్టికా అనే ప్రాంతంలో, ఒకే తెగకు చెందినవారు నివసించే స్థానిక స్వపరిపాలనా విభాగాలు (demes) 200 వరకు ఉండగా, వాటిలో ఒక చెట్టు పేరో, మొక్క పేరో పెట్టిన విభాగాలు 25 వరకూ ఉన్నాయి. అంటే, ప్రాచీన గ్రీసు అంతటా ఆయా తెగలలో వనమూలికల సంబంధమైన మాంత్రిక పద్ధతులు, చెట్లను పూజించడం ఉండేవనడానికి ఇది సూచన. Orgie అనే మాటకు విశృంఖల కామకేళి అని అర్థం. ఇది గ్రీకు పదం. ఈ పదానికి చెందినదే Orgas అనే మరో పదం. దున్నిన లేదా దున్నని ఒక పవిత్రక్షేత్రాన్ని(వనాన్ని) ఇది సూచిస్తుంది. ఇక్కడ Orgia అని పిలిచే రహస్య తంతులు జరుగుతాయి. ఇథికా అనే పట్టణం బయట ఉన్న పవిత్ర రావిచెట్ల వనం లాంటిదే ఈ పవిత్ర క్షేత్రం కూడా నని థాంప్సన్ అంటారు. ఇలాంటి వనాలే అయోనియన్ దీవుల్లోనూ ఉన్నాయనీ; యూరప్, ఆసియా గ్రామాలు అన్నిటా ఇవి కనిపిస్తాయనీ, భారతదేశంలో అయితే ఇప్పటికీ ఈ వనాలలో అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుందనీ ఆయన అంటారు.

పవిత్ర వనాలే కాదు, గుహలు కూడా ఆదికాలపు గుడులే!

దాని గురించి తర్వాత…

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

ఆదికాలపు గుడులు అమ్మవారి తోపులే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”

అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. డిమీటర్ అనే గ్రీకుదేవతగురించిన సందర్భంలో క్యాంప్ బెల్ The Great Goddess of the Universe అనడం గురించి గత వ్యాసంలో చెప్పుకున్నాం. వేరే భాషలో అన్నప్పటికీ ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.

ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.

Hekateఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. జార్జి థాంప్సన్ ప్రకారం, ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత కూడా. హెకటే, అర్తెమిస్ ఒకరే ననీ, ఈమె ప్రసూతి దేవత అనీ అంటారు. హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

ప్రతినెలా కృష్ణపక్షంలో పాడ్యమి రోజున, అంటే పౌర్ణమి మరునాడు స్త్రీలు గుండ్రని అప్పచ్చులు చేసి వాటి మీద కొవ్వొత్తి లాంటి దీపాలు గుచ్చి మూడు మార్గాల కూడలిలో ఉండే హెకటేకు నివేదనం చేస్తారు. ఇది చంద్రుడికి సంబంధించిన తంతు. మూడు మార్గాలు, చంద్రుడికి గల మూడు దశలను సూచిస్తాయి. నివేదనగా అర్పించే దీపాలను ప్రకాశికలు (shiners) అంటారు. చంద్రకాంతిని సంరక్షించడం వీటి వెనుక ఉద్దేశం.

మన దగ్గర కూడా స్త్రీలు శ్రావణమాసంలోనూ, కార్తీక పౌర్ణమి రోజునా వరిపిండి, బెల్లం కలిపి చలిమిడి ముద్దల్లా తయారుచేసి వాటి మీద వత్తి వేసి వెలిగించి పూజిస్తారు. ఇది కూడా చంద్ర సంబంధమైన తంతే.

నాకీ సందర్భంలో శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలోని ఒక తంతుపై కోశాంబి తన Myth and Reality లో చేసిన విశ్లేషణ గుర్తొస్తోంది. నాటకం తొలి అంకంలోనే ఒక కృష్ణపక్షం రోజున, నాయకుడైన చారుదత్తుడు సాయం సంధ్యాదికాలు చేసుకుని, గృహదేవతలకు నివేదన (బలి) సమర్పిస్తాడు. తర్వాత తన మిత్రుడైన మైత్రేయుని పిలిచి, కృతో మయా గృహదేవతాభ్యో బలిః, గచ్ఛ త్వం అపి చతుష్పథే మాతృభ్యో బలిం ఉపహార అని చెబుతాడు. “నేను గృహదేవతలకు బలి సమర్పించాను. నువ్వు చతుష్పథానికి, అంటే నాలుగు మార్గాల కూడలికి బలి తీసుకుని వెళ్లి అమ్మవార్లకు సమర్పించు” అని దీని అర్థం. సరిగ్గా అప్పుడే నాయిక వసంతసేన తన వెంటబడిన శకారుని తప్పించుకుంటూ చారుదత్తుని ఇంటికి వస్తుంది. అదే వారి తొలి కలయిక.

మార్గాల కూడలిలో బలి సమర్పించడంలో పైన చెప్పిన గ్రీకు తంతుకు, ఈ తంతుకు ఉన్న పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాకపొతే, గ్రీకు తంతు మూడు మార్గాల కూడలిలో జరిగేదైతే, మృచ్ఛకటికంలో పేర్కొన్నది నాలుగు మార్గాల కూడలిలో జరిగేది. అందులో స్త్రీలు అయితే, ఇందులో పురుషులు. ఈ తంతు కృష్ణపక్షంలో షష్ఠినాడు(ఆరవ రోజున), పట్టణశివార్లలో రాజమార్గం కూడలిలో జరిపేదిగా కోశాంబి గుర్తించారు. గుప్తుల కాలానికి (క్రీ.శ. ౩౦౦-5౦౦) ముందు నుంచే ఈ తంతు ఉండేదనీ, ఇది జనసామాన్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న తంతుగా కనిపిస్తుందనీ కోశాంబి అంటారు. గృహసంబంధమైన అన్ని తంతులను పూసగుచ్చినట్టు పొందుపరచిన బ్రాహ్మణ గ్రంథాలు దీనిని పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందంటారు. అలాగే, పి.వి. కాణే తన History of Dharmasastra లో సాయంకాలం ఇచ్చే ఇతర బలుల వివరాలు అన్నీ ఇచ్చి పై తంతు గురించి ఇవ్వకపోవడం, మొత్తంగా అమ్మవారికి జరిపే నివేదనల గురించి ముక్తసరిగా తేల్చివేయడంపై కూడా కోశాంబి విస్మయం వ్యక్తంచేస్తారు. పురామానవ పరిణామ శాస్త్రంపై బొత్తిగా లక్ష్యం లేకపోవడానికి ఇది నిదర్శనం అంటారు.

ఇక మనుస్మృతి (3-81-92) రోజూ నిర్వహించవలసిన ఒక తంతు గురించి చెబుతుంది. దాని పేరు వైశ్వదేవం. పిండాలు చేసి మొదట పితృదేవతలకు సమర్పించి, ఆ తర్వాత కుక్కలు మొదలైన జీవులకు, ‘అంటరాని’వారికి, రోగగ్రస్తులకు పెట్టడం ఈ తంతు. ఇందులో అమ్మవార్లకు నివేదనం ఇవ్వడం గురించి కానీ, చతుష్పథ ప్రస్తావన కానీ లేకపోవడాన్ని కోశాంబి ఎత్తిచూపుతారు. అమ్మవార్లకు బలి ఇవ్వడం మాతృస్వామికమైన తంతు అనీ, మనుస్మృతి పితృస్వామికానికి చెందినది కనుక అందులో అమ్మవారికి జరిపే తంతును పేర్కొనలేదనీ దీనినిబట్టి అనుకోవాలి. మృచ్ఛకటికం రచించిన శూద్రకుడు క్రీ.పూ. 2- క్రీ.శ. 4శతాబ్దాల మధ్య కాలానికి చెందివాడు కావచ్చని ఊహ. ఒకవేళ క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవాడనుకుంటే, అప్పటికి మాతృస్వామిక తంతులు కొనసాగుతున్నాయనీ, మనుస్మృతి అనంతర కాలంలో, బహుశా గుప్తుల కాలంలో సంకలనం అయిందనీ అనుకోవాలి. శూద్రకుని పేరు బ్రాహ్మణేతరుని సూచిస్తోంది కనుక, తనకు బాగా తెలిసిన బ్రాహ్మణేతరమైన తంతు గురించి ఆయన రాసి ఉండచ్చు.

అదలా ఉంచితే, గ్రీసులో జరిగే పండుగలలో, నిగూఢమైన తంతులలో హోమర్ పురాణగాధలకు ముందునాటి అవశేషాలు కనిపిస్తాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు. వాటిలో పురుష దేవుళ్ళకు కాక, స్త్రీ దేవతకే ప్రముఖస్థానం. ఆ దేవత కొలుపులు జరిగేది, మనకిప్పుడు బాగా తెలిసిన దేవాలయాలలో కాదు; మసకచీకటి(twilight) నిండిన తోపులు, లేదా వనాలలోనూ, పొలాలలోనూ, కందకాలలోనూ!

వనాలు, పొలాలలో అమ్మవారి కొలుపులు జరగడం అనేది గ్రీసులోనే కాదు, మొత్తం యూరఫ్ లోనూ, మనదేశంలోనూ, బహుశా ప్రపంచమంతటా ఉండేది. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉండి ఉండచ్చు. ఇందుకు సంబంధించిన అనేక ప్రస్తావనలలో కొన్నైనా ఉటంకించుకోవలసిన అవసరం కనిపిస్తోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘సొంత కథ’ లో రాసిన వాక్యాలతో ప్రారంభిద్దాం:

ఊరికి ఒక మూల అమ్మవారి వనం ఉంది. ఒక విషముష్టి చెట్టు, నాలుగు ఊడుగు చెట్లు, కొన్ని బర్రెంక చెట్లు ఉన్నాయా వనంలో. వ్యవసాయ సమాజాన ఈ అమ్మవారి వనాలు ప్రపంచమంతటా ఉండేవి. అమ్మవారు సౌభాగ్యదేవత. ఈ వనాలు ఆమె ఆవాసం. ఈ వనంలో చెట్లు అల్లె కట్టినట్లు ఉంటాయి. అల్లి మధ్య ఏమీ ఉండదు. వనంలోని చెట్ల నెవరూ కొట్టరు. ఇప్పుడు పురుషాధిక్యాన్ని, పురుషదేవతలను ఆరాధించే దేశాల్లో ఒకప్పుడు జనం అంతా ఈ స్త్రీదేవతలనే, అంటే అమ్మవారినే ఆరాధించేవారని చరిత్రకారులంటున్నారు. గ్రామదేవత పేరు ఏదైనా కావచ్చు. ఆమె సౌభాగ్య దేవత. ఆమెనంతా గౌరి అంటారు.

గౌరికి ప్రాచీనకాలం నుంచీ వనాలే దేవాలయాలు- ఆమెకు ప్రత్యేకం గుళ్ళు ఉండవు. వ్యవసాయ కేంద్రాలైన పల్లెల్లో తప్ప వర్తక కేంద్రాలైన పట్నాల్లో గౌరి ఆరాధనలు కానరావు. రామాయణంలో గౌరీదేవి నివేశనం మిథిలానగరానికి ఆవల ఉండేదని వాల్మీకి అంటాడు. పెళ్ళికి ముందు తన సౌభాగ్యవర్ధనం కోసం చెలికత్తెలతో సీత గౌరీపూజకు వెళ్లింది. ఊరి చివరనే వసతి కల్పించుకున్న రాముడు ఆ సందర్భంలోనే సీతను చూశాడంటాడు వాల్మీకి. పెళ్ళికి ముందు కన్యలు గౌరీపూజ చేయడం ఆచారం. ఈ ఆచారం తెలుగునాట సంప్రదాయం పాటించేవారిలో నేటికీ కానవస్తుంది.

స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి, అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి పురుషులు ప్రవేశించకూడదనీ, ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం. మన దేవీభాగవతం లో కూడా అలాంటి కథే ఒకటుంది:

వివస్వంతుడనే రాజుకు శ్రాద్ధదేవుడనే కొడుకు ఉన్నాడు. అతనికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు. మగపిల్లవాడి కోసం వశిష్టుని సలహాపై పుత్రకామేష్టి జరిపాడు. అయితే అతని భార్య శ్రద్ధాదేవి ఆడపిల్ల కోసం హోమం చేయించింది. కొంతకాలానికి ఆమె గర్భవతై ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ‘ఇల’ అని పేరుపెట్టారు. ఆడపిల్ల పుట్టినందుకు నిరుత్సాహం చెందిన భర్త ఈశ్వరుని ప్రార్థించాడు. ఈశ్వరుడు అనుగ్రహించడంతో ఇల కాస్తా పురుషుడుగా మారిపోయింది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.

సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒకరోజున వేటకు వెళ్ళి ఒక మహావనంలో ప్రవేశించాడు. వెంటనే స్త్రీగా, అంటే ఇలగా మారిపోయాడు. దాని వెనుక కథ ఏమిటంటే, ఒకప్పుడు ఆ వనంలో శివపార్వతులు క్రీడిస్తుండగా మునులు ఆ సంగతి తెలియక ఆ వనంలోకి ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. శివుడికి కోపం వచ్చి, పురుషులెవరైనా ఈ వనంలోకి అడుగుపెడితే స్త్రీగా మారిపోతారని శపించాడు.

సుద్యుమ్నుడే కాక అతని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అతను ఏం చేయాలో తెలియక అడవిలో తిరుగుతూ చంద్రుడి కొడుకైన బుధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. వారికి పురూరవుడు జన్మించాడు. తర్వాత శివుని ప్రార్థించిన సుద్యుమ్నుడు ఒక నెల పురుషుడిగానూ, ఒక నెల స్త్రీగానూ ఉండేలా వరం పొందాడు. అందుకు కూడా సంతృప్తి చెందక ఈసారి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు అతనికి ఎప్పుడూ పురుషుడిగానే ఉండేలా వరమిచ్చింది.

ఇది అంతిమంగా అయ్యవారి(శివుడు) మహిమ కంటే అమ్మవారి మహిమదే పై చేయి అని చెబుతున్న ఒక పురాణకథే కానీ, మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య పోటీని సూచించే ఒక చారిత్రకదశనూ ఇది ప్రతిఫలిస్తూ ఉండచ్చు. భర్త మగపిల్లవాడిని కోరితే భార్య ఆడపిల్లను కోరుకోవడమే చూడండి. కానీ ఆ ఆడపిల్లను మగపిల్లవాడిగా మార్చివేయడం ద్వారా భర్త తన ఆధిక్యాన్ని చాటుకున్నాడు. కానీ శివుని శాపం వల్ల ఆ అబ్బాయే మళ్ళీ స్త్రీగా మారిపోవడం, మధ్యేమార్గంగా నెల రోజులు స్త్రీగానూ, నెలరోజులు పురుషునిగానూ ఉండవలసి రావడం; తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల పూర్తికాలం పురుషుడిగా మారిపోవడం సంభవించాయి. ఇందులోని మాతృస్వామిక/పితృస్వామిక స్పర్థకు సంబంధించిన కోణాన్ని మరీ సాగదీయకుండా మీ ఊహకే వదిలేస్తాను.

దేవీభాగవతంలోనే ఇలాంటి కథ మరొకటి ఉంది:

ఒకసారి నారదుడు విష్ణుమాయ ఎలాంటిదో చెప్పమని విష్ణువును కోరాడు. విష్ణువు సరేనని దగ్గరలో ఉన్న ఒక కొలను చూపించి అందులో మునగమన్నాడు. మునిగి బయటికివచ్చేసరికి నారదుడు స్త్రీగా మారిపోయాడు. ఆమెను తాళధ్వజుడనే రాజు చూసి మోహించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి కొడుకులు కలిగారు. కొంతకాలానికి శత్రువులు రాజ్యంపై దండెత్తి కొడుకుల్ని చంపేశారు. అప్పుడు స్త్రీరూపంలో ఉన్న నారదుడు దుఃఖిస్తుండగా విష్ణువు ప్రత్యక్షమై ఎవరూ శాశ్వతం కాదని బోధించి మళ్ళీ వెనకటి కొలనులో మునగమన్నాడు. నారదుడు అందులో మునిగి మళ్ళీ పురుషుడిగా మారిపోయాడు.

కొంచెం విషయాంతరంలా కనిపించినా పై పురాణకథలతో ఉన్న పోలిక దృష్ట్యా ఒక గ్రీకు పురాణ కథనూ ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది:

జియస్ దేవతల నాయకుడు(మన బ్రహ్మదేవుడి లాంటివాడనుకుందాం). అతని అర్థాంగి హేరా. ఓసారి ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు, “సంభోగంలో మీ ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు” అన్నాడు జియస్ భార్యతో నవ్వులాటగా. హేరా “అది అబద్ధం” అంది. కాసేపు వాదించుకున్న తర్వాత, టెరేసియస్ అనే ఒక మునిని పిలిపించి తమిద్దరిలో ఎవరిది నిజమో చెప్పమని కోరారు.

అతన్నే అడగడానికి కారణం ఏమిటంటే, అతనోసారి అడవిలో తిరుగుతూ, సంభోగిస్తున్న పాముజంటను చూశాడు. కర్రతో వాటిని కొట్టాడు. వెంటనే స్త్రీగా మారిపోయాడు. అలా ఏడేళ్లపాటు స్త్రీగా ఉండిపోయాడు. ఎనిమిదో ఏట మళ్ళీ అదే అడవికి వెళ్లినప్పుడు ఆ పాముజంటే మళ్ళీ సంభోగిస్తూ కనిపించింది. కిందటిసారి కర్రతో కొట్టినప్పుడు స్త్రీగా మారిపోయాడు కనుక, ఈసారి కొడితే పురుషుడిగా మారిపోవచ్చుననుకుని అలాగే చేశాడు. పురుషుడిగా మారిపోయాడు. ఈవిధంగా అతనికి స్త్రీ గానూ, పురుషుడిగానూ జీవించిన అనుభవం ఉంది. అదీ అతన్ని తీర్పు చెప్పమనడానికి కారణం.

జియస్ చెప్పిందే నిజమని టెరేసియస్ అన్నాడు. దాంతో హేరాకు కోపం వచ్చింది. అంధుడివి కమ్మని శపించింది. అప్పుడు జియస్ జోక్యం చేసుకుని ఆ శాపానికి పరిహారంగా అతని భవిష్యత్తును చెప్పగల శక్తిని ఇచ్చాడు.

ఈ కథకు మన ప్రస్తుతాంశానికి అవసరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. మళ్ళీ అమ్మవారి వనాల దగ్గరికి వెడితే…

Golden Bough

Golden Bough

ఇంగ్లీష్ రొమాంటిసిస్ట్ చిత్రకారుడు జోసెఫ్ మల్లార్డ్ విలియం టర్నర్(1775-1851) గీసిన The Golden Bough చిత్రం ప్రసిద్ధం. ‘బంగారు కొమ్మ’అని ఆ మాటకు అర్థం. సర్ జేమ్స్ ఫ్రేజర్(1854-1941) మాంత్రికత, మతం పై తను రాసిన ప్రఖ్యాత రచనకు ఆ పేరే పెట్టి, ముఖచిత్రంగా ఆ చిత్రాన్నే వాడుకున్నారు.

ఇటలీలో ఇప్పుడు నేమి అనే గ్రామం ఉన్నచోట ఒక చెట్ల తోపు, నేమి అనే పేరుతోనే ఒక సరస్సు ఉన్నాయి. ఆ సరస్సులోని నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉంటాయంటే, ఆ సరస్సు అనే అద్దంలో అక్కడి దేవత డయానా తన ప్రతిబింబాన్ని చూసుకుంటుందనేవారు. ఆ సరోవర తీరంలోనే నిద్రపోతున్నట్టు ఉండే రెండు ఇటలీ గ్రామాలతో సహా ఎంతో ప్రశాంతత ఉట్టిపడే ఆ పరిసరాలను ఒకసారి చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరని ఫ్రేజర్ అంటారు. టర్నర్ చిత్రం స్వర్ణకాంతులనీనుతూ, ఒక స్వాప్నిక దృశ్యంలా ఉంటుందని అంటూ -ఆ చిత్ర పరిచయంతోనే తన రచన ప్రారంభిస్తారు.

ఇంతకీ విషయమేమిటంటే, ఆ సరోవరాన్ని అనుకుని ఉన్న చెట్ల తోపు, దేవత డయానాకు చెందిన ఒక పవిత్రవనం(Sacred Grove)! దాని గురించి ఆ తర్వాతి పేరాలోనే ఫ్రేజర్ ఇచ్చిన వివరాలు పై ఆహ్లాదకర చిత్రణకు భిన్నంగా విషాదాన్ని, భయాన్ని, గగుర్పాటును కలిగించేలా ఉంటాయి. ఈ పవిత్రవనంలో ఒక చెట్టు దగ్గర పగలంతా, రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఒక వ్యక్తి వేటగాడిలా పొంచి ఉంటాడు. అతని చేతిలో సంధించిన కరవాలం ఉంటుంది. అతని ముఖం క్రూరంగా భయంగొలుపుతూ ఉంటుంది. అతను ఆనుక్షణం వెయ్యి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. అతను ఒక పూజారి, రాజూ కూడా. రెండు వ్యవస్థలూ ఒకరి కిందే ఉన్న కాలం అది. అయితే ఆ పూజారి-రాజు పదవి అతను మరణించిన తర్వాత అతని వారసులకో, మరొకరికో అనాయాసంగా అందేది కాదు. అతణ్ణి చంపి మరొకరు దానిని చేజిక్కించుకోవలసిందే. అందుకే ఆ వ్యక్తి ప్రతి క్షణం ప్రాణగండాన్ని, పదవీగండాన్ని ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండవలసిందే. అయినాసరే, ఏ క్షణంలోనైనా పదవితోపాటు, ప్రాణమూ పోకతప్పదు.

పూజారిత్వానికి సంబంధించిన ఈ విచిత్రమైన నిబంధనతో పొల్చదగినదేదీ ప్రాచీన ఇతిహాసకాలంలో కనిపించదనీ, దీనిని అర్థం చేసుకోవాలంటే ఇంకా ప్రాచీనతలోకి వెళ్లాలని ఫ్రేజర్ అంటారు. అంటే, స్త్రీ దేవతే ప్రాధాన్యం వహించిన మాతృస్వామ్యంలోకి వెళ్ళాలన్నమాట.

అదలా ఉంచితే, ‘దేవాలయం’ అనే మాటకు జర్మన్ భాషలో ఉన్న పర్యాయపదాలను పరిశిలిస్తే, జర్మన్ల అతి పురాతన ఆరాధనాప్రదేశాలు అడవులు, లేదా వనాలే నని అర్థమవుతుందని ఫ్రేజర్ అంటారు. ఆయన ప్రకారం, యూరప్ కు చెందిన ఆర్య తెగలు అన్నిటా చెట్లను పూజించడం ఉంది. కెల్టులలో ఆరాధనా ప్రదేశాన్ని సూచించే పురాతన పదం వ్యుత్పత్తిలో, అర్థంలో లాటిన్ పదం ‘నెమస్’ (nemus)కు తుల్యంగా ఉంటుంది. దానికి వనం లేదా తోపు అనే అర్థం. పైన పేర్కొన్న ‘నేమి’కి, లాటిన్ ‘నెమస్’ కు ఉన్న సంబంధం తెలుస్తూనే ఉంది. ప్రాచీన జర్మన్లలో పవిత్ర వనాలు సర్వసాధారణమే కాక, అందులోని చెట్లను నరికినా, బెరడు తీసినా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ప్రాచీన స్వీడన్ లోనూ, 14వ శతాబ్దిలో క్రైస్తవంలోకి మారేవరకు లిథుయేనియాలోనూ పవిత్రవనాలు సర్వ సామాన్యం. యూరప్ లోని ఫిన్నిష్-ఉగ్రియాన్, ఓల్గా తెగలకు చెందిన పవిత్రవనాలలోకి స్త్రీల ప్రవేశం నిషిద్ధం.

వ్యవస్థ మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే, పవిత్ర వనాలలో ప్రవేశంపై ఉండే నిషేధమూ తారు మారు అయిందంటూ కోశాంబి (The Culture and Civilisation of ANCIENT INDIA in Historical Outline) ఇలా అంటారు:

కొన్ని చోట్ల (కొలీనా అని పిలిచే వ్యక్తి) స్త్రీ దుస్తులు ధరించి హోలీ మంట దగ్గర జరిగే నృత్యంలో పాల్గొంటాడు. బెంగళూరు లో ఏటా జరిగే కరగ ఉత్సవంలో పాల్గొనే ముఖ్య వ్యక్తి స్త్రీ దుస్తులు ధరిస్తాడు. పశ్చిమభారతంలోని పార్థీలు జరిపే సౌభాగ్యతంత్రాలలో కూడా పురుషులు స్త్రీ దుస్తులు ధరిస్తారు. ఈ తంతులు, ఉత్సవాలు అన్నీ మొదట్లో స్త్రీలకు చెందినవి. ఆ తర్వాత పురుషులు వాటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

అలాగే, బ్రాహ్మణ పురాణాలు అమ్మవారికి చెందిన పవిత్ర వనాలను ప్రస్తావిస్తున్నాయి. ఇలాంటి వనాలు ఇప్పటికీ గ్రామాలలో రహదారికి దూరంగా కనిపిస్తాయి. అయితే, వలసవచ్చిన వ్యవసాయదారుల చేతుల్లోకి పూజారిత్వం పోకుండా, స్థానిక తెగ చేతుల్లో ఉంటే తప్ప; సాధారణంగా ఈ వనాలలోకి ఇప్పుడు స్త్రీల ప్రవేశం నిషిద్ధం. మొదట్లో ఈ నిషేధం పురుషులపై ఉండేది. సమాజం మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే పూజారిత్వమూ, తంతులూ కూడా చేతులు మారాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత….

 

 

 

 

 

 

 

 

“చూడుమా చందమామా…అటు చూడుమా…”

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.స.న. సమాఖ్య అనే ప్రసిద్ధ నాటక సంస్థ ఉండేది. రెడ్డిగారే కాక ఎందరో ప్రసిద్ధనటులు అందులో సభ్యులుగా ఉండేవారు. నటులు కనుక రెడ్డిగారు మాటలో, నడకలో, ఆహార్యంలో మంచి స్టైల్ గా ఉండేవారు.

విషయమేమిటంటే, రెడ్డిగారి క్లాసు చాలా సరదాగా, నవ్వులు, తుళ్ళింతలతో సాగిపోయేది. కౌమారదశకదా… మగ, ఆడపిల్లల్ని గిలిగింతలు పెడుతూ సిగ్గుల దొంతర్లలో ముంచెత్తే సరసమైన జోకులు అప్రయత్నంగా ఆయన నోట జాలువారుతూ ఉండేవి. మధ్య మధ్య సినిమాల ముచ్చట్లూ దొర్లేవి. ఆయన అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. “మీరు ఏ సినిమా చూడండి…చందమామ ఒక్కసారైనా కనిపించకుండా ఉండడు” అనేవారాయన. అప్పటినుంచి ఏ సినిమా చూస్తున్నా పనిగట్టుకుని చందమామ ఉన్నాడా లేదా అన్నది చూడడం నాకు పరిపాటి అయిపోయింది. ప్రతిసారీ, రెడ్డిగారు చెప్పింది నిజమే సుమా అనుకుని ఆశ్చర్యపోయేవాణ్ణి.

ఆకాశమూ, చంద్రుడు, తారలు, వెన్నెల, పువ్వులు సినీ జగత్తుకే కాక కావ్యజగత్తుకూ తప్పనిసరి నేపథ్యాలు. కవిసమయాలుగా అలంకారశాస్త్రాలలో చోటుచేసుకున్నవి కూడా. కావ్యాలు, ప్రబంధాలలో ప్రకృతివర్ణనలు, విరహంలో ఉన్న ప్రేయసీప్రియులు చంద్రోపాలంభన పేరిట చంద్రుని ఆడిపోసుకోవడాలు సర్వసాధారణం. చాలా సినిమాల్లో చంద్రుని ఉద్దేశించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేయసీప్రియులు ఒకరిపై ఒకరి అనురక్తిని, కోపతాపాలను, ఫిర్యాదులను చెప్పుకోడానికి చంద్రుడే దిక్కవుతూ ఉంటాడు.

ఈ సందర్భంలో నాకు ఎంతో ఇష్టమైన రెండు పాటలు గుర్తొస్తున్నాయి. మొదటిది, ‘సువర్ణసుందరి’ సినిమాలోది. ఆ పాట సముద్రాల పేరుతో ఉన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసారంటారు. “హాయి హాయిగా ఆమని సాగే” అనేది ఈ పాట పల్లవి. అందులో ఒక చరణంలో “చూడుమా చందమామా, అటు చూడుమా చందమామా” అని ప్రేయసి అంటుంది. “కనుమా వయారి శారదయామిని కవ్వించే ప్రేమా” అని ప్రియుడు అంటాడు. “వగల తూలే విరహిణుల మనసున మోహము రేపు నగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా” అని ప్రేయసి అంటుంది. “కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా” అని ప్రియుడు అంటాడు. చంద్రుడు, శారదయామిని(శరత్కాలపు వెన్నెల రాత్రి) విరహిణులు, మోహము, చంద్రోదయంతో కలువలు విరియడం-ఇలా కవితా సామగ్రి అంతా ఇందులో అమిరింది.

రెండో పాట ‘వాగ్దానం’ సినిమాలోది. దాశరథిగారు రాసిందనుకుంటాను. “నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’ అని ప్రేయసి కోరడం ఈ పాట పల్లవి. “ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో, జాబిలి వెలిగేను మనకోసమే” నని ప్రేయసి అంటుంది. “ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా” అని ప్రియుడు అంటాడు. “మేఘాలలో వలపు రాగాలలో దూరదూరాల స్వర్గాలు చేరుదమా” అని ప్రేయసి అంటుంది. ఆ తర్వాత తనే “ఈ పూలదారులూ ఆ నీలితారలూ తీయని స్వప్నాల తేలించగా” అంటుంది.

కేవలం ఈ రెండు పాటలను ఉదహరించి కవితాజగత్తులో చంద్రుడికి, తారలకు, పూవులకు, వెన్నెలకు ఉన్న ప్రాముఖ్యానికి పూర్తి న్యాయం చేయలేనని నాకు తెలుసు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, జార్జి థాంప్సన్ ను, జోసెఫ్ క్యాంప్ బెల్ ను చదివిన అనుభవం నుంచి ఇలాంటి పాటలు వింటున్నప్పుడు, కావ్యాలలోని చంద్రోదయ, చంద్రోపాలంభనలతో సహా ప్రకృతివర్ణనలు గుర్తొచ్చినప్పుడు వీటి మూలాలు ఏ ఆదిమ అస్తిత్వంలోకి వ్యాపించి ఉన్నాయో, వాటి పురాచరిత్ర ఎలాంటిదో, వాటి విశ్వజనీన స్వభావం ఎలాంటిదో స్ఫురించి విచిత్రమైన రహస్యానుభూతికి లోనవుతుంటాను.

ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రుడికి, పువ్వులకు, వెన్నెలకు కావ్యజగత్తులో ఎంత ప్రాధాన్యం ఉందో పురామానవ పరిణామ చరిత్రలోనూ అంతే ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యం బహుశా పురామానవఅస్తిత్వ చరిత్రనుంచే కావ్యజగత్తుకు విస్తరించింది.

ఈ మాటలు రాస్తున్నప్పుడు ఉన్నపళంగా జార్జి థాంప్సన్ అనే సముద్రంలోకి లంఘించాలని నాకు అనిపిస్తోంది కానీ, నాకు ఎంతో అపురూపం అనిపించే ఆ విషయంలోకి పూర్తిస్థాయిలో వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం కనుక వాయిదా వేస్తాను.

***

నలదమయంతులు/ఓడిసస్ కథల నేపథ్యంలో జోసెఫ్ క్యాంప్ బెల్ పేర్కొన్న female principle గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. దానిని ‘స్త్రీ సూత్రం’గా తర్జుమా చేసుకుందామని కూడా అనుకున్నాం. ఈ స్త్రీ సూత్రంలో భాగంగానే స్త్రీల మార్మిక లేదా మాంత్రిక ప్రపంచం గురించీ; ఆ ప్రపంచంలో చంద్రుడికీ, సర్పానికీ, పంటకీ ఉన్న ప్రాముఖ్యం గురించీ చెప్పుకున్నాం. అందులోకి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెడదాం:

ఆదిమ, పురాతన, ప్రాచ్య పురాణగాథలన్నీ ప్రధానంగా దేవత గురించే చెబుతాయి. దేవతతో ముడిపడి ఉన్న ఒక ప్రధాన ఆరాధనారూపం, సర్పం. దేవతకు సర్పం భర్త కూడా. ఇప్పుడు సైప్రస్, ఇజ్రాయిల్, సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనాలు ఉన్న ప్రాంతాన్ని ‘లెవంట్’ అని పిలుస్తారు. ఇప్పటికి పదివేల సంవత్సరాల క్రితమే లెవంట్ లో నాగదేవతను పూజించేవారు. పారిస్ లోని లౌరే మ్యూజియంలో సబ్బు రాయితో చేసిన ఒక ఆకుపచ్చని కలశం ఉంది. సుమేరులోని లగాష్ అనే నగరరాజ్యాన్ని పాలించే గుడియా అనే రాజు క్రీ.పూ. 2౦25 లో దేవత భర్త అయిన సర్పానికి ఈ కలశాన్ని సమర్పించాడు. దాని మీద ఒక చిత్రం ఉంది. అందులో మధ్యలో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న రెండు పాములు ఒక దండాన్ని చుట్టుకుని ఉంటాయి. డానికి అటూ, ఇటూ రెక్కలున్న జంతురూప రాక్షసులు నిలబడి ఉంటారు. పెనవేసుకున్న పాములు గ్రీకు దేవుడు హెర్మెస్ చేతిలోని దండాన్ని లేదా పాశాన్ని పోలి ఉంటాయి. హెర్మెస్ మార్మిక జ్ఞానానికి, పునర్జన్మకు చెందిన దేవుడు. ఓడిసస్ కథలో హెర్మెస్ ప్రస్తావన వచ్చింది. ఇతడు ఓడిసస్ కు అనుకూల దేవుడు.
the sepent lord

సర్పానికి పాతచర్మం వదిలేసి కొత్త చర్మం ధరించడం ద్వారా తిరిగి నవ యవ్వనాన్ని సంతరించుకునే అద్భుత సామర్థ్యం ఉందని చెప్పుకున్నాం. ఆ విధంగా సర్పం పునర్జన్మకు, మృత్యువు మీద గెలుపుకు ప్రతీకగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. వృద్ధి, క్షయాల రూపంలో ఇలాంటి సర్పలక్షణమే చంద్రుడికీ ఉంది. చంద్రుడు నీడ లేదా చీకటి అనే పాతచర్మం వదిలేసి, వెన్నెల అనే కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటాడు. స్త్రీ ఋతుక్రమానికీ, జీవిని పుట్టించే స్త్రీ గర్భానికీ తద్వారా కాలానికీ చంద్రుడు అధిష్టాన దైవం, కొలమానం కూడా. కాలంలోనే పుట్టుక, మరణం సంభవిస్తూ ఉంటాయి. ఆ విధంగా చంద్రుడు చావు-పుట్టుకల రహస్యానికి అధిదైవం. నిజానికి చావు-పుట్టుకలనేవి ఒకే నాణేనికి బొమ్మా-బొరుసు లాంటివి. చంద్రుడు సముద్రపు ఆటుపోట్లకు; పైరుపంటలకు కారణమైన రాత్రి కురిసే మంచుబిందువులకు కూడా ప్రభువు.

ఇక సర్పం జలాధిదేవత. అది నీటిలోనూ, భూమి మీదా కూడా ఉంటుంది. నీటి మీద అలల్లా అది పయనిస్తుంది, చెట్టు కొమ్మల మీంచి వేలాడుతూ ఉంటుంది. అప్పుడది మృత్యుఫలంలా కనిపిస్తుంది. సర్పం ఆకారం స్త్రీ(నోరు) పురుష(మిగతా శరీరం)జననేంద్రియాలను రెంటినీ గుర్తుచేస్తుంది. అలాగే, పాము కాటు అగ్నికీ, నీటికీ సూచన.

the serpent lord enthroned

సుమేరియాలో అక్కాడియన్ల కాలానికి (క్రీ.పూ. 2350-2150) చెందిన ఒక సీలు మీద ఒక పురుషదేవుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అతని ముందు అగ్నివేదిక ఉంటుంది. అతని చేతిలో అమరత్వాన్ని సూచించే ఒక పాత్ర ఉంటుంది. దాని పైన చంద్రవంక ఉంటుంది. ఆ దేవుడి వెనక పాములు పెనవేసుకున్న చిత్రం ఉంటుంది. ఆ దేవుడి ముందు కిరీటం ధరించిన భక్తుడు నిలబడి ఉంటాడు. అతనే ఆ సీలు జారీ చేసినవాడు. అతని వెనక తల మీదనుంచి పాము వేలాడుతున్న వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత్ర ఉంది, అతను ఆ దేవుడి ద్వారపాలకుడు.

The garden of immortality

The Garden of Immortality అనే మరో చిత్రంలో అందరూ స్త్రీలే ఉన్నారు. ఇది కూడా సుమేరియాకు చెందిన చిత్రం. ఇందులో చంద్రవంక, దాని కింద నైవేద్యంగా సమర్పించే ఒక ఫలమూ, చెట్టు ఉన్నాయి. ఓ పండ్ల కొమ్మను పట్టుకుని ఆ ఫలాన్ని స్వీకరిస్తున్న భక్తురాలు ఉంది. మిగిలిన ఇద్దరు స్త్రీలు అధోజగత్తులో ఉండే గుల-బావు అనే దేవత ద్వంద్వఅంశలు. వీరే అనంతరకాలానికి చెందిన గ్రీకు ఐతిహాసిక యుగంలో డిమీటర్, పెరెస్పోన్ అనే దేవతలయ్యారు.

కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడానికి జోసెఫ్ క్యాంప్ బెల్ ఈ చిత్రాలను ఉదహరించారు. అవేమిటంటే, ఈ చిత్రాలు సమీప ప్రాచ్యా(Near East)నికి చెందిన ఆదిమ పౌరాణిక వ్యవస్థకు సంబంధించినవి. వీటిలో పురుషదేవుడు, స్త్రీ దేవతా కూడా ఉన్నారు. అయితే ఈ దేవతలు నామరూపాలకు అతీతమైన ఒక సూత్రానికి లేదా తాత్వికతకు ముసుగులు మాత్రమే. ఇక్కడ ఆ తాత్వికతే ప్రధానం,

బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా తలకిందు లయిందో క్యాంప్ బెల్ వివరిస్తారు. పైన చెప్పిన వాటి ప్రతిరూపాలు అన్నీ బైబిల్ లోనూ కనిపిస్తాయి. అయితే, అవి పురాతన విశ్వాసాలకు భిన్నమైన వాదాన్ని ముందుకు తెస్తాయి. ఉదాహరణకు ఈవ్ కు సంబంధించిన చెట్టు సన్నివేశంలో కూడా ఒక సర్పం ఈవ్ తో సంభాషిస్తుంది. కానీ ఆ సర్పం అప్పటికి వేల సంవత్సరాలుగా పూజ లందుకుంటున్న దేవత అనే సూచన అందులో ఉండదు. పైగా ఈడెన్ తోటలోని చెట్టుకు వేలాడుతున్న జ్ఞానఫలాన్ని ఆదాము తిన్నట్టు తెలిసాక యెహోవా సర్పాన్ని శపిస్తాడు. ఆ తర్వాత ఆదామును తోటనుంచి బహిష్కరించి నేల దున్నుకుని బతకమని చెబుతాడు. ఈడెన్ తోటలోని జీవవృక్షానికి రక్షణగా, రెక్కలున్న పక్షి రూపంలోని సింహాలను, మంటలు చిమ్ముతూ అన్ని వైపులకూ తిరిగే కరవాలాన్ని తోటకు తూర్పున ప్రతిష్టిస్తాడు.

అంటే, పై చిత్రాలు అద్దంపట్టే ఆదిమపౌరాణిక వ్యవస్థలో లేని తప్పు, దైవాగ్రహం, ప్రమాదం, తోటనుంచి బహిష్కరణ, జీవవృక్షానికి కాపలా అనేవి బైబిల్ లో ప్రవేశించాయన్నమాట. ఆదిమ పౌరాణిక వ్యవస్థలో అపరాధభావన అనేది లేకపోవడమేకాక, జ్ఞానవృక్షఫలాన్ని ఎవరైనా అందుకోవచ్చు. అయితే అందుకు తగిన సంకల్పం, సంసిద్ధత ఉండాలి.

The Goddess of the Tree

The Goddess of the Tree అనే చిత్రంలో ఒక సర్పము, దానికి ముందు ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎదురుగా చంద్రవంకరూపంలో కొమ్ము కిరీటాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తారు. వారి మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు, దానికి రెండు ఫలాలు కనిపిస్తాయి. ఆ స్త్రీ సుమేరియన్ దేవత గుల-బావు; ఆ పురుషుడు ఆమె కొడుకు-భర్త అయిన దుముజి. ఆ ఫలాలలో ఒకటి జ్ఞానఫలం, రెండోది, అమరత్వఫలం. ఇది కంచు యుగానికి చెందిన చిత్రం. ప్రయత్నించి ఎవరైనా ఆ రెండు ఫలాలు పొందవచ్చు. బైబిల్ కథలో ఉన్నట్టు ఇందులో ఎలాంటి తప్పు, నిషేధమూ లేవు. ఇది బైబిల్ కు పూర్వపు చిత్రం.

Demeter and Plutus

దీనితో పోల్చగల గ్రీసు-రోమన్ చిత్రాలూ కనిపిస్తాయి. Demeter అనే చిత్రంలో కనిపించే ఈ స్త్రీ ఎల్యూసీనియన్ రహస్యాల దేవత అయిన డిమీటర్. ఆమె ఎదురుగా ఉన్న బాలుడు ఆమె కొడుకు ప్లుటూస్. ఒక సూచన ప్రకారం ప్లుటూస్ భూసంపదకు ప్రతిరూపం. ఇంకో విస్తృతార్థంలో నిగూఢత్వ దైవమైన డయోనిసస్ కు ప్రతిరూపం. ఆదిమ పౌరాణికతలోనూ, ప్రాచ్య పౌరాణికతలోనూ ఇటువంటి దేవుళ్ళు చాలామంది కనిపిస్తారు. వీరు విశ్వదేవత(The Great Goddess of the Universe) భర్తలు, కొడుకులు కూడా అవుతారు. చావు రూపంలోనో, లేదా మరో కల్పన ప్రకారం, వివాహ రూపంలోనో వీరు దేవత అక్కున చేరుతూ ఉంటారు. చంద్రుడి వృద్ధి క్షయాలలా, సర్పం పాతచర్మాన్ని విడిచేసి కొత్త చర్మాన్ని ధరించినట్టుగా వీరు చావు-పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇందుకు సంబంధించిన దీక్షా తంతులో భాగంగా ఈ మాతృ దేవత ఆరాధకులు తమ ఐహిక జీవితానికి చెందిన కష్ట సుఖాల నుంచి నిర్లిప్తత చెంది రహస్యాధిదేవత అయిన ఆ దేవతను ధ్యానిస్తారు. అనేక జీవుల రూపాలలో మళ్ళీ మళ్ళీ జన్మించే మూల జీవం ఏదైతే ఉందో దానితో మమేకం కావడానికి ప్రయత్నిస్తారు. శోకమూ, మృత్యువూ మాత్రమే తాండవించే ఈ లౌకిక ప్రపంచంలో సమాధిస్థితిని అమరత్వ ప్రతీకగా గుర్తిస్తారు.

స్పష్టత కోసం పైన చెప్పుకున్న వాటి సారాంశాన్ని ఇలా క్రోడీకరిస్తాను:

  1. చంద్రుడు, సర్పము, చెట్టు, ఫలాలు మొదలైనవి ఆదిమ పౌరాణికతకు చెందిన తాత్వికతలో ముఖ్యమైన ప్రతీకలు. ఇవి స్త్రీ సూత్రానికి చెందినవి.
  2. తర్వాత రూపొందిన బైబిల్ కూడా వీటిలో కొన్ని ప్రతీకలను స్వీకరించింది. అయితే ఆదిమ పౌరాణికతకు భిన్నమైన అర్థంలో వాటిని చిత్రించింది. ఆదిమ పౌరాణికతలో లేని తప్పు, నిషేధమూ, శిక్ష ఇందులో అడుగుపెట్టాయి.
  3. ఆదిమ పౌరాణికతకు చెందిన ప్రతీకలు, తాత్వికత తర్వాతి కాలపు గ్రీసు-రోమన్ చిత్రాలలోకి కూడా విస్తరించాయి. అయితే దేవతల పేర్లు మారాయి. ఇవే ప్రాచ్య పౌరాణికతలో కూడా కనిపిస్తాయి. ఇందులో స్త్రీ సూత్రం ఉంది. Demeter చిత్రం గురించిన వివరణలో మనదేశంలో నేటికీ ఉన్న అమ్మవారి ఆరాధన లక్షణాలను గమనించవచ్చు.

క్యాంప్ బెల్ ప్రకారం చారిత్రకంగా జరిగింది ఏమిటంటే, క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్ది నాటికి, మాతృస్వామ్యానికి చెందిన నూతన శిలా యుగ, కంచు యుగ నాగరికతలు వర్ధిల్లుతున్న భూముల్ని ఇనప యుగానికి చెందిన పితృస్వామిక హిబ్రూలు ఆక్రమించుకున్నారు. వారు మాతృస్వామిక పురాణగాథల్నే తీసుకుని వాటిపై పితృస్వామికతను ఆపాదిస్తూ తలకిందులు చేశారు. అందుకే వాటికి ఎంత గట్టిగా పితృస్వామికతను అన్వయించి చెప్పినా, బైబిల్ లోని మౌలిక ప్రతీకల అన్వయంలో అంతర్గతంగా ఉన్న అస్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రరూపంలో అవి హృదయానికి ఒక అర్థాన్ని అందిస్తుంటే, వాక్య రూపంలో మెదడుకు సరిగ్గా దానికి వ్యతిరేకమైన అర్థాన్ని అందిస్తుంటాయి. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం మూడూ పాత నిబంధన వారసత్వాన్ని పంచుకుంటున్నవే కనుక మూడింటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు.

ఒక్క బైబిల్ లోనే కాదు, ఇలా అర్థం తలకిందులు కావడం గ్రీసు పౌరాణికతలోనూ కనిపిస్తుందంటారాయన. బహుశా ఈ ఛాయలు మన దగ్గరా కనిపిస్తాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం 

‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

స్త్రీ ప్రపంచం రహస్యమే కాదు, మాంత్రికం కూడా!

ఈమధ్య దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి అయినప్పుడు, అబ్బాయిని పెళ్లికొడుకును చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. అక్కడ జరుగుతున్న తంతూ, కనిపించిన సన్నివేశాలూ కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. మామూలుగా అయితే పెళ్లికొడుకును, పెళ్లికూతురును చేయడం తంతు అబ్బాయి, అమ్మాయిల ఇళ్ళల్లో విడివిడిగా జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమంలో పెళ్లికూతురు, ఆమె తరపువారు కూడా పాల్గొన్నారు.

పెళ్లికొడుకును చేయడం పూర్తయింది. ఆ తర్వాత పెళ్లికూతురును తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టారు. ఇక ఆడవాళ్ళ హడావుడి ప్రారంభమైంది. ‘చందనబ్బొమ్మ…చందనబ్బొమ్మ’ అంటూ ఓ పెద్దావిడ తొందరపెట్టింది. పెళ్లి వస్తువుల్లోంచి ఓ చెక్కబొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. కొందరు ఆడవాళ్ళు కలసి వధూవరుల ముందు ఒక చీర ఉయ్యాల కట్టారు. అందులో బొమ్మను ఉంచి పెళ్లికూతురు, పెళ్ళికొడుకు చేత ఊపించారు.

పద్ధతుల్లో తేడా ఉండచ్చు కానీ, అన్ని ప్రాంతాల పెళ్లితంతుల్లోనూ ఈ చందనబ్బొమ్మ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.  శోభనం రోజున వధూవరుల మధ్య గంధర్వుడు తిష్టవేశాడని సంకేతిస్తూ ఓ చందనబ్బొమ్మను ఉంచుతారని ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. దాని అంతరార్థాన్ని సూచించే రాంభట్ల, తిరుమల రామచంద్ర గార్ల వాక్యాలను, కొన్ని పెళ్లిమంత్రాలను ప్రస్తావించుకున్నాం. ‘చందన’బ్బొమ్మ పేరులోనే ‘గంధ’ర్వ సూచన ఉంది.

అయితే,  పైన జరిపిన తంతు మరో రకం. అది పెళ్లి అయిన తర్వాత బిడ్డ పుట్టడాన్ని సూచించే తంతు. ఇక్కడ చందనబ్బొమ్మ అన్నా, దానిని ఓ కొయ్యబొమ్మగానే తీసుకుందాం. ఇందులో విచిత్రం ఏమిటంటే, పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టడం తంతును జరిపించేయడం!

పెళ్లి తంతు నిజంగానే ‘తంతు’గా మిగిలిపోయిందనిపించింది, ఇది చూడగానే!  పద్ధతులు, ముందు వెనకలు పాటించకపోయినా తంతు జరిపించామనిపిస్తే చాలు! చెక్కబొమ్మ అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ బొమ్మతోనే పని జరిపించేస్తున్నారు. అదలా ఉంచితే, ఏ తంతు ఎందుకు జరుపుతున్నారో, దాని చరిత్ర ఏమిటో, ఎన్ని వేల సంవత్సరాలుగా అది తరం వెంట తరానికి సంక్రమిస్తూ వస్తోందో, మనకు తెలియకుండానే దానికి మనం ఎలా వాహికలమవుతున్నామో, కనిపించని ఓ పురాతన వృక్షపు వేళ్ళలా; మానవ అస్తిత్వపు వేళ్ళు అందులో ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో-అక్కడున్నవాళ్ళలో ఎవరికైనా తెలుసా అనిపించింది.

ఒక్క మాటలో చెప్పాలంటే,  ఆయా తంతుల రూపంలో మనం (ముఖ్యంగా ఆడవాళ్ళు) మనిషి అస్తిత్వ చరిత్రను అవిచ్ఛిన్నం చేస్తున్నాం. వేల సంవత్సరాల గతానికీ, వర్తమానానికీ మధ్య వారధి అవుతున్నాం. చరిత్రను అస్థిపంజర ప్రాయంగానే అయినా భద్రంగా మోసుకొస్తున్నాం. అయితే అలా మోసుకొస్తున్న విషయం మనకు తెలియదు!!

తెలియకపోగా మనం ఇంకొకటి కూడా చేస్తున్నాం. ఇలాంటి తంతు వెనుక తర్కాన్ని, హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నాం. మూఢాచారాలుగా కొట్టిపారేస్తున్నాం. నవ్వుకుంటున్నాం. వయసొచ్చిన ఇద్దరు యువతీ యువకులు ఒకటవడానికి ఇంత తంతు జరపాలా అంటున్నాం. ఒక కోణం నుంచి చూస్తే, నిజమే కదా అనిపిస్తుంది.

కానీ ఇంకో కోణం నుంచి చూడండి…ఈ తంతు పూర్తిగా అదృశ్యమైపోయిన పరిస్థితిని ఊహించుకుంటే భయమూ, దిగులూ కలగచ్చు. పెళ్లి తంతు, ఆ మాటకొస్తే ఏ తంతు అయినా అదృశ్యమైపోవడమంటే ఏమిటి? దాంతోపాటు అది మోసుకొచ్చే చరిత్ర కూడా అదృశ్యమైపోవడమా? గతంతో మనకు ఉన్న ముడి అదృశ్యమైపోవడమా? వేళ్ళు తెగిన చెట్టులా మనం నిర్జీవంగా శూన్యంలో వేలాడవలసి రావడమా?…

పశ్చిమదేశాల్లో చాలావరకూ జరిగింది ఇదే. ఇప్పుడిప్పుడు కీళ్ళు సడలుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ  మనదేశంలో వేళ్ళు ఎంతో కొంత పదిలంగానే ఉన్నాయి. మనదగ్గర గణవ్యవస్థ తాలూకు లక్షణాలు ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ ఆ సంగతి మనకు తెలియదు!

మన తెలియనితనం ఇంకా వేనవేల రూపాల్లో వ్యక్తమవుతూ ఉండచ్చు.  మనం ఆయా తంతులను మతవిశ్వాసంగా, అందులోనూ మన మతానికి మాత్రమే చెందిన విశ్వాసంగా అపోహ పడుతూ ఉంటాం. కానీ ఇలాంటి తంతులే దాదాపు ప్రపంచమంతటా ఉన్నాయి, లేదా ఉండేవి. అలాగే, మతానికి, సంస్కృతికి ఉన్న తేడా మనలో చాలామందికి  తెలియదు. ఉమ్మనీటితోపాటు పసికందునూ పారబోసినట్టుగా మతవిశ్వాసంతోపాటు సంస్కృతినీ పారబోస్తున్నామా?

ఇందులో నేను వ్యక్తిగతంగా ఒక దాన్ని సమర్థించడం, ఇంకో దాన్ని వ్యతిరేకించడం అన్నది లేదు. ఇది బహిరంగంగా సాగించే ఆలోచనల కలబోత మాత్రమే. కాలంలో, ప్రకృతిలో సంభవించే ఏ పరిణామాన్నీ ఆపలేనంత చిన్నది మనిషి పిడికిలి. అందులో దేనిని బంధించాలని చూసినా అది వేళ్ళ సందుల్లోంచి తప్పించుకుంటూనే ఉంటుంది.

***

పెళ్లి తంతు ఇప్పుడొక వేడుకగా, ఆచారంగా; చందనబ్బొమ్మ ఒక బొమ్మగా కనిపించవచ్చు. కానీ పురామానవుడి విషయంలో ఆ తంతు కేవలం ఒక వేడుకా కాదు, ఆ బొమ్మ ఒక బొమ్మా కాదు. అతని జీవితంతో పూర్తిగా పెనవేసుకున్న మాంత్రికతలో అవి భాగాలు. ఆ తంతు మొత్తం మంత్రపూతమైన ప్రక్రియ. చందనబ్బొమ్మ మంత్రపూతమైన వస్తువు. ఉయ్యాలలో బొమ్మను ఉంచి వధూవరులు ఊపడం అనేది, భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా భౌతికవాస్తవికతను ప్రభావితం చేసి, రేపు బిడ్డ అనే ఫలితాన్ని పొందడం కోసమే. అంటే రేపటి ఫలితానికి అది రిహార్సల్. పురామానవుడి దృష్టిలో అసలుకు, రిహార్సల్ కు ఎలాంటి తేడా లేదు. ఉయ్యాల్లో ఊపిన ఆ బొమ్మ అతని దృష్టిలో ఆ క్షణంలో ఒక సజీవమైన పసిపాపే.

బొమ్మ ఒకటే కాదు; రాయి, రప్ప, కొండ, గుట్ట, చెట్టు, పుట్టతో సహా ప్రకృతిలో ప్రతిదీ పురామానవుడి దృష్టిలో మాంత్రికతకు అర్హమైనవే. అంతవరకూ ఒక రాయి అనుకున్నది హఠాత్తుగా దేవతగా మారిపోవచ్చు. అలాగే ఒక చెట్టు, ఒక పుట్ట…ఈ క్రమంలో మనిషి ఉపయోగించే శిలాసాధనాలు, లోహసాధనాలూ కూడా మాంత్రిక సామగ్రిగా మారిపోతాయి.

sindhu

శిలాసాధనాలకే వస్తే, రుబ్బురోలు-పొత్రం ఒక ఉదాహరణ. రాతియుగం చివరిలో, వ్యవసాయం ప్రారంభమైన తొలినాళ్లలో వాడుకలోకి వచ్చిన సాధనాలలో ఇదొకటి. వేల సంవత్సరాలుగా కాలంతోపాటు కలసి ప్రయాణిస్తూ వచ్చిన, మన్నికైన ఆదిమ సాంకేతిక పరికరం ఇది. మనదేశంలో అన్ని తరగతులవారిలొనూ  నిన్నమొన్నటివరకూ ఇది ఉపయోగంలో ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో వాడుకలో ఉంది. ఈ రుబ్బురోలు-పొత్రం గురించి కోశాంబి (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా ఉంటుంది.

రుబ్బురోలు-పొత్రం ఆనవాళ్ళు ప్రపంచమంతటా పురావస్తు తవ్వకాల్లో దొరికాయి. కాలగతిలో ఈ సాధనం భిన్నరూపాలు తీసుకుంటూ వచ్చింది.. మొదట్లో ఇది చిత్రంలో చూపిన ఆకారంలో ఉండేది. సింధులోయలో ఇలాంటివే దొరికాయి. అన్నింటి కన్నా ఆంద్ర ప్రాంతంలో ఉపయోగించే రుబ్బురోలు-పొత్రం మరింత సమర్ధమైన రూపం అంటారు కోశాంబి. పొత్రం రోట్లో దాదాపు పూర్తిగా నిండిపోతుంది. ఈ సాధనాన్ని వాడడంలో మళ్ళీ ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాల తేడాలు కూడా ఉన్నాయి. ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్ళు ఉపయోగించే విధానం సులువుగా ఉంటే,  నిమ్నవర్గాలవారు ఉపయోగించే విధానంలో శ్రమ ఎక్కువ.  ఇందులో ప్రాంతాల తేడాలు కూడా ఉన్నాయి. సులువైన విధానం ఉత్తరభారతీయులది. కాస్త శ్రమతో కూడింది దక్షిణభారతీయులది. రోలు-పొత్రము దక్షిణభారతానికి తదుపరి కాలంలో పరిచయమవడం కూడా ఒక కారణం. వాడడంలో ఉన్న తేడాలను బట్టి దక్షిణభారతంలోని బ్రాహ్మణులు ఉత్తరభారతంనుంచి వచ్చారని భావించడమూ ఉంది.

అదలా ఉంచితే, ఎప్పుడో ఊహకు అందని కాలంనాటి వ్యవసాయ ప్రారంభదశకు చెందిన ఈ సాధనం ఒక తంతులో భాగమైంది. శిశువుకు బారసాల జరిగే రోజున లేదా, డానికి ముందు పొత్రానికి ఒక కొత్త బట్టను టోపీలా తొడిగి, పసుపు, కుంకుమ అద్ది, ఒక ఆభరణం అలంకరించి ఉయ్యాలలో శిశువు చుట్టూ తిప్పుతారు. ఆ తర్వాత డానిని శిశువు పాదాల దగ్గర ఉంచుతారు. ఆ పొత్రంలానే శిశువు కూడా దృఢంగా ఉండాలనీ, ఆరోగ్యంగా ఎదగాలని కోరుకోవడం ఈ తంతులోని అంతరార్ధం. అలాగే ఆ పొత్రం, డానికి చేసిన అలంకరణ అమ్మవారికి కూడా ప్రతీక. శిశువుకు అమ్మవారి ఆశీస్సులు లభించాలన్న కోరిక అందులో ఇమిడి ఉంటుంది. ప్రస్తుతం మనకు అవసరమైన ముఖ్య సమాచారం ఏమిటంటే, ఈ తంతులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. పిల్లలుగల ఒక ముత్తైదువ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇదీ, ఇంకా ఇలాంటి అనేక తంతులూ ఋషులు చెప్పినట్టు పేర్కొనే ప్రామాణిక గ్రంథాలలో ఉండవనీ, అయినాసరే బ్రాహ్మణులు కూడా వీటిని పాటిస్తారనీ కోశాంబి అంటారు.

అంటే, అజ్ఞాతకాలంనుంచీ ఆనవాయితీగా కొనసాగుతున్న ఇలాంటి తంతులను స్త్రీలే కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట. మామూలుగా కాదు, అతి రహస్యంగా! ఒకే కప్పు కింద ఉంటున్నా తల్లులు కొడుకులకు తెలియకుండా కూతుళ్ళకు ఈ రహస్యవారసత్వాన్ని భద్రంగా బదిలీ చేసే తీరు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కొబ్బరికాయలోకి నీరు చేరినట్టుగా; తమను ఏమార్చి తమ కళ్ళ ముందే  అక్కలు, చెల్లెళ్ళు ఈ గుప్తవారసత్వాన్ని అందుకుని ఆరిందలుగా మారిపోతుండడం మగవాణ్ణి ఎప్పుడూ ఆశ్చర్యచకితం చేస్తూనే ఉంటుంది. ఈ తంతులపై ప్రత్యేకంగా స్త్రీముద్ర ఉండడానికి కారణం ఉహించలేనిదికాదు. ఇవి వారు మార్మికప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసించినరోజులనుంచీ వస్తున్న తంతులు.

ఆ తర్వాత ఆ అధికారం స్త్రీ చేతుల్లోంచి పురుషుడి చేతుల్లోకి బదిలీ అయ్యాక పురుషుడి ముద్ర గల తంతులు మొదలయ్యాయి. అవి స్త్రీముద్ర గల తంతులతో పోల్చితే మరింత అభివృద్ధి రూపాన్నీ, ప్రామాణికతనూ తెచ్చుకుంటూ వ్యవస్థీకృతం అవుతూవచ్చాయి. క్రమంగా గ్రంథరూపం ధరించడమూ ప్రారంభించాయి. స్త్రీ తంతులకు  ఆ గ్రంథాలలో చోటివ్వకుండా పురుషుడు జాగ్రత్తపడ్డాడు. అయినాసరే, మౌఖికంగానే తరం వెంట తరానికి అందుతూ కాలాన్ని ప్రతిఘటించి అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే, ఆ మేరకు పురుషుడు రాజీపడ్డాడన్నమాట.

ఇది మన అనుభవం. కానీ, పాశ్చాత్య, ఇస్లామిక్ ప్రపంచాలలో స్త్రీ మార్మిక ప్రపంచాన్ని పనిగట్టుకుని అంతమొందించినట్టు కనిపిస్తుంది, ఆ క్రమంలోనే స్త్రీ ‘మంత్రగత్తె’ అయింది.

***

మనమిప్పుడు ఓసారి  జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AEGEAN)ను పలకరిద్దాం. స్త్రీ మార్మిక ప్రపంచం విశ్వవ్యాప్తం అనే కాక, ఆ ప్రపంచంలో ‘బొమ్మ’లకు ఎంతో ప్రాధాన్యం ఉందంటాడాయన. ఆయన ప్రకారం:

నేటి మన పిల్లలలానే ఆటవిక దశలోని పిల్లలు కూడా బొమ్మలతో ఆడుకునేవారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా బొమ్మలతో ఆడుకునేది ప్రధానంగా ఆడపిల్లలే. అలా బొమ్మలతో ఆడుకోవడం అనేది రేపు వారు పోషించబోయే  అమ్మపాత్రకు రిహార్సల్ మాత్రమే. అయితే ఈ ఆట, ఆధునిక కాలంలో కంటే ఆటవిక కాలంలో మరింత గంభీరమైన వ్యవహారం. దురదృష్టవశాత్తూ దాని గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఆటవిక పురుషుడు ఈ బొమ్మలాటలోకి తొంగి చూడకూడదు. చూస్తే తప్పవుతుంది.

అలాగే, పురుష మానవపరిణామ శాస్త్రవేత్త కూడా.  భర్తలకు తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్న తమ రహస్యాలను స్త్రీలు తెల్లతోలు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అసలే చెప్పరు.  మహిళల సామాజిక స్థాయి, మానవపరిణామశాస్త్ర అధ్యయనానికి వారిని ప్రోత్సహించదు. అందుకే స్త్రీల ఆదిమజీవితం గురించిన సగం చరిత్ర నమోదు కాకుండా పోయింది. ఈ పరిస్థితిలో మిస్ ఎర్తీకి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమె దక్షిణాఫ్రికా వాలెంగ్ బాలికలను అమ్మపాత్రకు సిద్ధం చేసే తంతును పూసగుచ్చినట్టు రాశారు.

ఆ ఏడాదిలో పెద్దమనుషులైన ఆడపిల్ల లందరినీ ఒకచోట చేర్చమని వసంతం ఆరంభంలో తెగ నాయకుడు చాటింపు వేయిస్తాడు. అందరినీ ఒకచోట చేర్చిన తర్వాత వారికి తర్ఫీదు ఇచ్చే తంతు నెలరోజులపాటు జరుగుతుంది. ఈ శిక్షణ తంతును ‘న్యంబుత్సి’ అని పిలిచే ఒక మహిళ పర్యవేక్షిస్తుంది. తల్లినుంచి కూతురికి సంక్రమించే హోదా అది. అలాగే ఒక ప్రత్యేకమైన బుట్ట కూడా తల్లినుంచి కూతురికి వారసత్వంగా అందుతూ ఉంటుంది. అందులో ఒక డోలు(drum), ఒక కొమ్ము(horn), స్త్రీ, పురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీ, పురుషుల కొయ్యబొమ్మలు ఉంటాయి. ఈ పరికరాలు అన్నింటికీ ఎర్రని రంగు పూస్తారు.

మొదటి రోజున న్యంబుత్సి పర్యవేక్షణలో ఆడపిల్లలందరూ డోలు వాద్యానికి అనుగుణంగా నగ్నంగా నృత్యం చేస్తారు. డోలు స్త్రీగర్భానికి ప్రతీక. మొదట్లో ఆడపిల్లలు భయంతో ఏడుపు మొదలుపెడతారు. సాయంత్రం వరకు అలా నృత్యం జరిగిన తర్వాత ‘పవిత్రమైన కొమ్ము’తో ఒక్కొక్క ఆడపిల్ల కన్నెపొర తొలగిస్తారు.

మరునాడు, లైంగికజీవితం గురించి ఒక పద్ధతిగా వారికి బోధిస్తారు. బుట్టలో ఉన్న స్త్రీపురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీపురుషుల బొమ్మలు అందుకే.  తమ పూర్వీకుల ఆత్మలు ఆవహించి ఉంటాయన్న భావనతో వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ తర్ఫీదులో భాగంగానే ఆడపిల్లలకు ఒక గుప్తభాషను బోధిస్తారు. ఒకరి వస్తువులు ఒకరు దొంగిలించమని కూడా ప్రోత్సహిస్తారు. మొదటి రోజున చేసిన నృత్యమే చివరిరోజున కూడా చేస్తారు. ఈసారి ఒంటినిండా ఎరుపురంగు పులుముకుంటారు. ఇప్పుడిక ఏ ఆడపిల్లా భయంతో ఏడవడు. చివరిసారి బుట్ట తెరచి అందులోని వస్తువులను చూపించమని న్యంబుత్సిని బతిమాలతారు. ఆమె అలాగే చేస్తుంది. ఆ వస్తువుల చుట్టూ వాళ్ళు ఆనందంతో చప్పట్లు చరుస్తూ, పాట పాడుతూ నృత్యం చేస్తారు. ఆ పాట శిశువులను ఆహ్వానిస్తున్నట్టు  ఉంటుంది.

శిక్షణ అయిపోతుంది. న్యంబుత్సి తన బుట్ట సర్దుకుంటుంది. ఆడపిల్లలు ఇంటికి చేరుకుంటారు. తమ ఒంటి మీది అలంకరణలను తీసేస్తారు. తల్లి ఎంతో మురిపెంగా వాటిని తీసుకెళ్లి ఒక రహస్యప్రదేశంలో దాస్తుంది.

ఆదిమసమాజాల్లో నిర్బంధ లైంగిక విద్య ఉండేదని ఈ తంతు చెబుతోంది.

మిగతా విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం 

 

 

రహస్యప్రపంచ రారాణి… స్త్రీ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పిల్లలు Fairy Tales ఎంతో ఇష్టపడతారు. ఒకటి, రెండు తరాల వెనకటి తెలుగు బాలలు చందమామకథలతోనూ, విఠలాచార్య మార్కు సినిమాలతోనూ పెరిగినట్టే; ప్రతి దేశంలోనూ బాలలు వాళ్ళ వాళ్ళ వెర్షన్లకు చెందిన Fairy Tales మధ్య పెరుగుతారు. Fairy Tales అంటే ‘పిల్లల కథలు’ అనే నిఘంటువు నిర్వచిస్తోంది. ఈ మాటకు తెలుగులో కచ్చితమైన సమానార్థకం నాకు వెంటనే స్ఫురించడం లేదు. ‘అద్భుత కథలు’ అనుకుందాం. ఈ అద్భుత కథల గురించి నేనిప్పుడు మీతో ఒక అద్భుతాన్ని పంచుకోబోతున్నాను.

నిజానికి ‘అద్భుత కథలు’, మనం అనుకునేంత అమాయకమైన కథలు కావు. అవి కేవలం పిల్లల కథలూ కావు. ఆ కథల వెనుక ఒక చరిత్ర ఉంది. అంతకంటే ముఖ్యంగా పెద్దల మర్మమూ, పెద్ద తత్వమూ ఉన్నాయి. ఇలా అని పిల్లలకు ఉన్న కథలు కూడా లేకుండా చేస్తున్నానని మీకు అనిపిస్తే మన్నించాలి.

ఇంతకు ముందు మనం ఓడిసస్ అనే వీరుడి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఒక సినిమాలోని వీరుడి కథ చూద్దాం. ఆ సినిమా పేరులోనే వీరుడు ఉన్నాడు. దాని పేరు ‘జగదేకవీరుని కథ’. విజయావారు తీసిన ఈ సినిమా అరవై దశకం ప్రారంభంలో వచ్చింది. అప్పుడప్పుడే ఊహ వస్తున్న రోజుల్లో విజయవాడ, దుర్గాకళామందిరంలో కాబోలు చూశాను. ఆ తర్వాత కూడా టీవీలో అప్పుడప్పుడు చూశాను. కానీ ఆ చూడడం వేరు, ఇప్పుడు చూస్తున్న తీరు వేరు. జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి థాంప్సన్ లను చదివేవరకూ, ఈ సినిమా, ఇంకా ఇలాంటి సినిమాల అసలు మర్మం నాకు బోధపడలేదు.

జగదేకవీరునికథకు ఒక తమిళ మాతృక ఉందని, అది కూడా గొప్ప హిట్ సినిమా అని ఇది రాస్తున్నప్పుడే తెలిసింది. దాని పేరు ‘జగదల ప్రతాపన్’. 1944లో వచ్చిన సినిమా అది. మీకు తెలిసిన, లేదా తెలుసుకునే అవకాశం ఉన్న కథే అయినా ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు జగదేకవీరుని కథ క్లుప్తంగా చెబుతాను.

అనగనగా ఒక రాజుగారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రతాప్. అతనొక రోజు తండ్రితో మాట్లాడుతూ తనకు దేవకన్యలను పెళ్ళాడాలని ఉందంటాడు. దాంతో తండ్రికి కోపం వస్తుంది. అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ప్రతాప్ ఒక మిత్రునితో కలసి దేవకన్యలను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అడవిలో ఒకచోట ఇంద్రకుమారి, అగ్నికుమారి, వరుణకుమారి, నాగకుమారి జలకాలాడుతూ కనిపిస్తారు. ఇంద్రకుమారి ప్రతాప్ ను చూసి శపిస్తుంది. అతను శిలగా మారిపోతాడు. అతని తల్లి అమ్మవారి భక్తురాలు. కొడుకు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మవారు అవ్వ రూపంలో వచ్చి ప్రతాప్ కు శాపవిమోచనం కలిగిస్తుంది. అతనికి, అతని మిత్రునికి ఆశ్రయం ఇస్తుంది. ఇంద్రకుమారి జలకాలాడుతున్నప్పుడు ఆమె చీర ఎత్తుకు వస్తే ఆమె నీదవుతుందని ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ అలాగే చేస్తాడు.

ఈలోపల ఇంద్రకుమారి చేసిన ఒక తప్పుకు కోపించిన ఓ ముని, మానవమాత్రుడితో నీకు వివాహం అవుగాక అని శపిస్తాడు. అతను దొంగిలించిన నీ వస్త్రం నీకు లభించగానే శాపవిమోచనం అవుతుందంటాడు. ఇంద్రకుమారి ప్రతాప్ ను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలసుకుంటుంది. ఇద్దరికీ వివాహం అవుతుంది. వాళ్ళు ఒక రాజ్యానికి చేరుకుంటారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఇంద్రకుమారి పొందు కోరుకుని, తన రోగానికి మందు తీసుకువచ్చే వంకతో ప్రతాప్ ను నాగలోకానికి, వరుణ లోకానికీ పంపిస్తాడు. అతను ఆ లోకాలకు వెళ్ళి నాగకుమారిని, వరుణకుమారినే కాక, అగ్నికుమారిని కూడా వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఈ లోపల తమ్ముడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ప్రతాప్ లేనప్పుడు నలుగురు దేవతాస్త్రీలూ కలసి అతని తల్లిని మోసగించి ఆమె దగ్గర ప్రతాప్ దాచిన ఇంద్రకుమారి వస్త్రాన్ని అపహరిస్తారు. ఇంద్రకుమారి దానిని ధరించగానే శాపవిమోచనం కలుగుతుంది. నలుగురు దేవతాస్త్రీలూ దేవలోకానికి వెళ్లిపోతారు. అయినా ప్రతాప్ ను మరచిపోలేక పోతారు. ప్రతాప్ దేవలోకానికి కూడా వెళ్ళి ఇంద్రుని మెప్పించి నలుగురు భార్యలనూ వెంటబెట్టుకుని మానవలోకానికి వస్తాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

ఓడిసస్ కథకు, ఈ కథకు ఉన్న పోలికలు చూడండి. ఓడిసస్ లానే ప్రతాప్ కూడా మానవమాత్రుడు, వీరుడు. అతని లానే సాహసయాత్ర చేస్తాడు. ఓడిసస్ కు ఎదురైనట్టే ప్రతాప్ కూ అనేక పరీక్షలు, కష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి గట్టెక్కడానికి ఓడిసస్ కు లానే దేవత(అమ్మవారు) సాయం లభిస్తుంది. ఓడిసస్ కు సిర్సే, కలిప్సో అనే అప్సరసలతో సంబంధం కలిగినట్టే ప్రతాప్ కు దేవకన్యలతో సంబంధం కలుగుతుంది. ఓడిసస్ ఒక దేవుడి సలహాతో సిర్సేను లొంగదీసుకుని ఆమెతో పడకసుఖాన్ని పొందుతాడు. అలాగే ప్రతాప్ అమ్మవారి సలహాతో ఇంద్రకుమారిని లొంగదీసుకుని పెళ్లిచేసుకుంటాడు. చివరగా ఓడిసస్ మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి పెనెలోప్ పునస్స్వయంవరంలో వీరత్వం చాటుకుని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు. అలాగే ప్రతాప్ కూడా మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

రెండు కథలూ పురుషప్రయత్నాన్నీ, పురుషుడిలోనీ వీరత్వాన్నీ, అతను ప్రతికూల స్త్రీని సైతం అనుకూలంగా మార్చుకోవడాన్నీ చెబుతూనే; ఆ పురుష ప్రయత్నానికి దైవసహాయం కూడా అవసరమని చెబుతున్నాయి. జగదేకవీరుని కథలో ప్రతాప్ పురుషప్రయత్నానికి ప్రతీక అయితే, అతని తల్లి దైవసహాయానికి ప్రతీక. ఆపైన రెండు కథలూ దైవసహాయం, పురుషప్రయత్నాల మధ్య సమతూకాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒకవిధంగా మానవుడి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే.

వివరాలలో తేడా ఉండచ్చు, స్థూలంగా ఫార్ములా ఒకటే. ఒకటి గ్రీకు కథ, ఇంకొకటి భారతీయ కథ అనే సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అద్భుత కథల ఖజానాలోకి తొంగి చూస్తే ఇలాంటి ఫార్ములా కథలు ఇంకా మరెన్నో కనిపిస్తాయి. ఆయా దేశాలకు చెందిన ఇలాంటి అనేక కథలలోని వస్తువును, నిర్మాణ రీతులను ఎవరైనా లోతుగా పరిశీలించి, ఉమ్మడి అంశాలను గుర్తించారా అన్నది నాకు తెలియదు. నేను అందులోకి వెళ్లలేదు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ పోలికలను చూసినప్పుడు Fairy Tales అనేవి ప్రపంచంలో ఒకచోటినుంచి ఇంకోచోటికి వ్యాపిస్తూ వచ్చాయని కూడా అర్థమవుతుంది. Fairy Tales ప్రపంచవ్యాప్తం అవడమంటే, వాటి వెనుక ఉన్న ఒకే తత్వం కూడా ప్రపంచవ్యాప్తం అయిందన్నమాట.

The garden of immortality

The garden of immortality: ఈ సుమేరియన్ చిత్రంలో ముగ్గురు స్త్రీలు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు కనిపిస్తాయి

 

అందులోకి వెళ్లబోయేముందు ఇంకొక సూక్ష్మమైన పోలికను చెప్పుకోవాలి. ఓడిసస్, నలదమయంతుల కథలో ఉన్నట్టే జగదేకవీరునికథాగమనంలో కూడా వస్త్రం(వస్త్రం అన్నప్పుడు నగ్నత్వ సూచన కూడా అందులో గర్భితంగా ఉంటుంది)ఒక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి ఈ కథలో వస్త్రానిది మరింత స్పష్టంగా కనిపించే కీలకపాత్ర కూడా. ఇంద్రకుమారి నీకు లొంగాలంటే ఆమె వస్త్రం అపహరించుకురావాలని అవ్వ వేషంలో ఉన్న అమ్మవారు ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ ఇంద్రకుమారి వస్త్రం అపహరించడమంటే ఆమెను నగ్నంగా మార్చడమే. కాకపోతే, ఓడిసస్, నలదమయంతుల కథలో నగ్నత్వం పురుషుడిదైతే ఇక్కడ స్త్రీది. పక్షులు ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి తనకు లభించి, దానిని ధరించగానే బాహుకుడు నలుడిగా మారిపోతాడు. నగ్నంగా ఉన్న తనకు నౌసికా అనే రాచబాలిక ఇచ్చిన వస్త్రం ధరించిన తర్వాత ఓడిసస్ కు ఫేషియన్ల సాయం లభించి అతడు స్వస్థలానికి వెళ్లగలుగుతాడు. అలాగే ప్రతాప్ ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి పొందిన తర్వాత ఇంద్రకుమారి దేవకన్యగా మారి దేవలోకానికి వెళ్లిపోతుంది.

***

ఇప్పుడు విజయావారిదే ఇంకో ప్రసిద్ధ సినిమా చూద్దాం. అది, ‘పాతాళభైరవి’(1951). ఈ కథ కూర్పులో అనుసరించిన ఫార్ములా కూడా పై కథలోలానే ఉంటుంది. తోటరాముడు ఇందులో హీరో. అతి సామాన్యుడైన అతను ఉజ్జయిని రాకుమారిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. నా తాహతుకు తగినంత సంపదను సాధించుకువస్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేస్తానని రాజు షరతు పెడతాడు. తోటరాముడు స్నేహితునితో కలసి సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అతనికి పాతాళభైరవిని కొలిచే ఒక నేపాళమాంత్రికుడు తారసపడతాడు. ఒక వీరుని బలి ఇచ్చి శక్తులు పొందే ఆలోచనలో ఉన్న మాంత్రికుడు అతనికి సాయపడుతున్నట్టు నటిస్తూ అతనిచేత అనేక సాహసాలు చేయించి వీరుడే నని ధ్రువీకరించుకుంటాడు. అతని పన్నాగాన్ని తెలుసుకున్న తోటరాముడే మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహం పొంది అన్ని సంపదలూ సాధిస్తాడు. అంతలో మాంత్రికుని శిష్యుడు సంజీవిని సాయంతో గురువును బతికిస్తాడు. రాకుమారిని పెళ్లాడాలనుకున్న రాజుగారి బావమరిది తోటరాముని అడ్డు తొలగించుకోవాలనుకుని అతని దగ్గర ఉన్న పాతాళభైరవి శక్తిని అపహరించి మాంత్రికుడికి అందిస్తాడు. మాంత్రికుడు తోటరాముని సంపదను అంతటినీ మాయం చేసేసి, పెళ్లి పీటల మీంచి రాకుమారిని అదృశ్యం చేస్తాడు. అప్పుడు తోటరాముడు మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని చంపి రాకుమారిని, సంపదనూ కూడా తిరిగి దక్కించుకుంటాడు. అంటే, పైన చెప్పిన ఆయా కథల్లోలానే మంత్రతంత్రాలు, మహిమలతో కూడిన మార్మికప్రపంచంలోకి సాహసయాత్ర జరిపివచ్చిన తర్వాతే, తోటరాముడు వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి రాకుమారితోపాటు రాజ్యాన్నీ పొందాడన్నమాట.

ఇప్పుడిక పై రెండు సినిమా కథల తాత్విక మూలంలోకి వెడదాం:

రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత; పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని నేపాళమాంత్రికుడు ఉగ్రరూపంలోని అమ్మవారి భక్తుడు. దేవత రూపాలూ, పూజించే పద్ధతులు వేరైనా ఆశించే ఫలితం ఒక్కటే. ఉగ్రపూజలో బలులు, తన అవయవాలను తనే నరుక్కోడాలూ, రక్తతర్పణాలూ ఉంటాయి. అయితే, నరుక్కున్న అవయవం, పోయిన ప్రాణం తిరిగి వస్తాయి! పాతాళభైరవిలోనే చూడండి…మాంత్రికుడు భైరవి ముందు చేతిని నరుక్కుంటాడు. తెగిన చోట సంజీవినీ మూలికను రాయగానే చేయి మళ్ళీ వస్తుంది. మాంత్రికుని తోటరాముడు బలి ఇచ్చినప్పుడు శిష్యుడు సంజీవినితో మాంత్రికుని బతికిస్తాడు.

సాత్విక పూజ బహిరంగం. ఉగ్రపూజ రహస్యం. అది ఏ పాతాళ గుహల్లోనో, నరసంచారం అంతగా లేని వనాలు, లేదా తోపుల్లోనో జరుగుతుంది. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ఆవాసం పాతాళగుహే. అంతేకాదు, సాత్విక పూజ కంటే ఉగ్రపూజ పురాతనం, ఆదిమం.

ఈ ఉగ్ర, సాత్విక పూజా ప్రక్రియలు రెండూ ఒక తాత్విక సూత్రాన్ని చెబుతాయి: సాత్వికత లేదా ప్రసన్నత అనేది జీవం, జీవించడం, లేదా వెలుగు! ఉగ్రత అనేది హింస, ఆత్మహింస, చావు, కష్టాలు, చీకటి! మళ్ళీ ఈ సాత్వికత, ఉగ్రత అనేవి రెండూ ఒకే బొమ్మకు రెండు పక్కలే తప్ప వేర్వేరు కావు. ఎలాగంటే, జీవం నుంచి చావు పుడుతుంది. చావునుంచి జీవం పుడుతుంది. విత్తనాన్ని భూమిలో పాతి పెట్టడం చావు. దాని నుంచి మొక్క రావడం జీవం. కష్టసుఖాలు, చీకటి వెలుగులు ఇదే చక్రభ్రమణాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రాణాన్ని, లేదా పునరుజ్జీవనాన్ని పొందాలంటే చావును ఎదుర్కోవాలి. సుఖాలను అందుకోవాలంటే కష్టాల కారడవిలోకి(నలుడు, జగదేకవీరుడు, తోటరాముడు), కడగండ్ల సముద్రంలోకి(ఓడిసస్) సాహసోపేతంగా అడుగుపెట్టాలి. వెలుగులోకి రావాలంటే చీకటిలోకి పయనించాలి.

ఈ చక్రభ్రమణానికి అద్దంపట్టే భౌతికరూపాలు కొన్ని ఉన్నాయి. అవి: చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క మొదలైనవి. చంద్రునికి వృద్ధి, క్షయాలు ఉంటాయి. వృద్ధి అంటే జీవవికాసం, క్షయమంటే చావు. అలాగే వృద్ధి అనేది వెలుగు, క్షయమనేది చీకటి. సర్పం పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటుంది. దాన్నే కుబుసం విడవడం అంటాం. పాత చర్మాన్ని వదిలేయడం చావు. కొత్త చర్మాన్ని ధరించడం పునర్జన్మ. ఒక కాలంలో మోడువారిన చెట్టు ఇంకోకాలంలో చిగురిస్తుంది. ఇందులోనూ చావు-పుట్టుకల క్రమం ఉంది. అలాగే, ఒక విత్తనాన్ని భూమిలో సమాధి చేస్తే(చావు) దాని లోంచి మొక్క పుట్టి అనేక విత్తనాలను ఇస్తోంది.

images1

అర్తెమిస్-అక్తియాన్…అక్తియాన్ పై వేటకుక్కలు దాడి చేస్తున్న దృశ్యం

ఇలా చంద్రుడికీ, సర్పానికీ, మొక్కకూ కూడా తనకు ఉన్నట్టే చావు-పుట్టుకల లక్షణం ఉండడం మనిషిని ఆకర్షించింది. అయితే మనిషికి భిన్నంగా చంద్రుడు, సర్పము, మొక్క మళ్ళీ మళ్ళీ చచ్చి, మళ్ళీ మళ్ళీ పుట్టడం ప్రత్యేకించి మనిషిలో ఆలోచనను, ఆశను రేకెత్తించింది. తనకూ అలాగే పునర్జన్మ, బహుశా ఇప్పటికంటే మెరుగైన జన్మ ఉంటుందనిపించింది. అలా మనిషిలో ఒక ఆదిమ తాత్వికత అంకురించింది. ఆ తాత్వికతకు అనుగుణమైన ఆచారకాండ రూపొందింది. చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క గొప్ప తాత్విక ప్రతీకలు అయ్యాయి. ఆ అవడం ఏదో ఒక్క చోట కాదు, ప్రపంచంలో అనేక చోట్ల అయింది. ఒకచోట పుట్టిన ఈ తాత్వికతే ఇతర చోట్లకు విస్తరించిందన్న వాదమూ ఉంది.

మన దేవీ దేవులతోనూ, ఆరాధనా రూపాలతోనూ చంద్రుడికీ, సర్పానికీ, పంటకు లేదా మొక్కకూ ఉన్న ముడి తెలిసినదే. శివుని శిరసు మీద, అమ్మవారి శిరసు మీదా కూడా చంద్రవంక ఉంటుంది. శివుని మెడలో సర్పముంటుంది. సర్పాన్ని, చెట్టును పూజించడం మన దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఉంది. అమ్మవారి చేతిలో చెరుకుగడో లేదా మరో రకమైన పంటరూపమో ఉంటుంది. ఇవే ప్రతీకలు ఇతర పురాతన మత విశ్వాసాలలో, ఆరాధనా ప్రక్రియలలో కూడా ఎలా ఉన్నాయో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ ఆదిమ తాత్విక సూత్రంలోనూ, ప్రక్రియలోనూ కీలకభూమిక పురుషదేవుడిదీ, పురుషుడిదీ కాదు; స్త్రీ దేవతదీ, స్త్రీదీ!

ఆదిమకాలంలో స్త్రీ శాసించిన ఆ మతవిశ్వాసరంగం ఓ రహస్యప్రపంచం. ఆ రహస్యప్రపంచానికి స్త్రీ రారాణి. అది చీకటివెలుగులు, భయనిర్భయాలు, కష్టసుఖాలు, చావుపుట్టుకలు అన్నీ కలగలసిన ప్రపంచం. అక్కడి దేవతలోని ఒక అంశ ఉగ్రకాళిగా, మృత్యుదేవతగా, రక్తపిపాసిగా కనిపించి భయపెడుతుంది. అంతర్లీనంగా ఉండే ఆ దేవత మరో అంశ, ప్రసన్నత, సాత్వికత. అది బతుకునీ, సుఖాన్నీ, వెలుగునూ ఇచ్చి నిర్భయుణ్ణి చేస్తుంది. గుహలు, తోపులు,వనాలు ఈ రహస్యప్రపంచ స్థావరాలు. ఆదిమకాలంలో అవే దేవతాలయాలు.

మన పురాణ, ఇతిహాసాలలో ఈ గుహలు, తోపులు, వనాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, వీటి ప్రస్తావన ఇతర పురాణ, ఇతిహాసకథల్లోనూ రావడం! స్త్రీ రహస్యప్రపంచంలోకి మగవాడు అన్నివేళల్లోనూ ప్రవేశించడానికి వీల్లేదు. ప్రవేశిస్తే శిక్ష తప్పదు. అది మరణశిక్ష కూడా కావచ్చు. ఇప్పటికిప్పుడు స్ఫురించే ఒక కథలో నారదుడు స్త్రీల రహస్యప్రదేశంలోకి అడుగుపెట్టి స్త్రీగా మారిపోతాడు. ఇంకో కథలో పార్వతి తన ఒంటి నలుగుపిండితో గణపతిని చేసి, అతన్ని కాపలా ఉంచి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ప్రవేశించబోతాడు. గణపతి అడ్డుపడతాడు. శివుడు అతని శిరసును ఛేదిస్తాడు. ఆ తర్వాత ఒక ఏనుగు తలను అతనికి తగిలిస్తాడు. ఇది కూడా స్త్రీ రహస్యప్రపంచాన్ని సంకేతిస్తూ ఉండచ్చు. దేవీభాగవతం వంటి అమ్మవారికి సంబంధించిన పురాణాలలో మరిన్ని ఉదాహరణలు లభించవచ్చు.

ఇందుకు సంబంధించిన కథలు మన దగ్గరే కాక, ఇతర ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రీకు పురాణ కథ ఇలా ఉంటుంది: ఓ నడివేసవి రోజున అర్తెమిస్ అనే దేవత ఒక కీకారణ్యపు లోయలో వేటాడి అలసిపోతుంది. కన్యా కూపం(Maiden’s Well), లేదా కన్యా సరోవరంలో జలకాలాడుతూ ఉంటుంది. ఆమెలానే వేటకు వచ్చిన అక్తయాన్ అనే పురుషుడు తన వేటకుక్కల వెంట సరిగ్గా అదే ప్రదేశానికి వచ్చి ఆమెను చూస్తాడు. అతను తను చూసింది ఇంకొకరికి చెప్పకుండా నివారించడానికి అర్తెమిస్ అతన్ని ఒక లేడిగా మార్చివేస్తుంది. అతనితో ఉన్న వేటకుక్కలు లేడి రూపంలో ఉన్న అతని మీద పడి తినేస్తాయి.

జగదేకవీరుని కథలో దేవకన్యలు జలకాలాడుతుండగా చూసిన ప్రతాప్ శిలగా మారిపోతాడు!

ఇంకో గ్రీకు కథలో లూకిపస్ అనే యువకుడు డఫ్నే అనే యువతిని ప్రేమిస్తాడు. స్త్రీ వేషంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సన్నిహిత నేస్తాలలో ఒకడిగా అయిపోతాడు. మిగతా నేస్తాలతోపాటు ఆమె వెంట వేటకు వెడుతుంటాడు. ఒకరోజున యువతులందరూ దుస్తులువిప్పి లాడన్ అనే సరోవరంలో జలకాలాడాలనుకుంటారు. లూకిపస్ అందుకు నిరాకరిస్తాడు. దాంతో వాళ్ళకు అనుమానం వస్తుంది. బలవంతంగా అతని చేత దుస్తులు విప్పించి, పురుషుడన్న సంగతి తెలుసుకుంటారు. అప్పటికప్పుడు అతన్ని కత్తితో పొడిచి చంపేస్తారు.

మన దేశంలో స్త్రీ రహస్యప్రపంచపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. చాలా వ్యాసాల క్రితం ఒక వ్యాసంలో దీని గురించి రాశాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం