‘నరు’ని అవతరణా ప్రపంచీకరణలో భాగమే

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి ముందు రాముడు పద్నాలుగు వేలమంది రాక్షసులను ఒంటరిగా చంపాడన్న చిత్రణే చూడండి. కావ్యశైలిలో అలాంటివి సహజమే కానీ, రామాయణం విశ్వాసంలో భాగం అవడం వల్ల వాటిని నిజమని నమ్మే సంప్రదాయం ఏర్పడింది.

రాముడు చారిత్రకపురుషుడా, పురాణపురుషుడా అన్న ప్రశ్నకూ ఇదే వర్తిస్తుంది. ఆయన చారిత్రక పురుషుడు కావడం అసంభవమేమీ కాదు; అదే సమయంలో పురాణపురుషుడు కూడా! చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడాను పాటించని దశలో అలా రెండూ కావడంలో వింత ఏమీలేదు. చరిత్ర, పురాణాల మధ్య తేడాను పాటించకపోవడం మన దగ్గరే కాక ప్రాచీన సమాజాలలో చాలా చోట్ల ఉంది. హోమర్ ను ఇంతకుముందు ఉదహరించుకున్నాం.

రాముడు నరుడనీ, పురుషోత్తముడనీ రామాయణం అడుగడుగునా నొక్కి చెబుతోంది. కాలగతిలో ఆ నరుడే దేవుడిగా మారడం మనకు తెలుసు.

ఇలా నిజానికీ, కల్పనకీ; చరిత్రకీ, పురాణానికీ; నరత్వానికీ, దైవత్వానికీ మధ్య వేలాడవలసిన ఓ త్రిశంకుస్థితి ఇది!  కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు మొదలైన మహాభారత పాత్రలకీ ఇదే వర్తిస్తుంది.  పురాణ, ఇతిహాసాలు వాస్తవికార్ధంలో చరిత్ర కావు, నిజమే. కానీ అవి చారిత్రకాంశాలను ప్రతిఫలిస్తాయి. అలా అనుకున్నప్పుడు త్రిశంకుస్థితి ఉండదు. ఈ సూత్రీకరణ నిజానికి సాహిత్యానికీ వర్తిస్తుంది. సాహిత్యంలో ఎంతో కల్పన ఉంటుంది. అయితే సాహిత్యం ప్రతిఫలించే సమాజమూ, ఆ సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తీ నిజాలు కనుక అందులో ఎంతో నిజమూ ఉంటుంది. ఆ విధంగా అందులో చారిత్రకాంశాల ప్రతిఫలనమూ ఉంటుంది.

మనకిప్పుడు తెలిసిన మానవ కాలమానం రీత్యా చూస్తే రామాయణం ఎప్పటిదో తెలియదు. కోశాంబీ తదితర ఆధునిక చరిత్రకారుల ఊహ ప్రకారం  మహాభారతకథ ఇప్పటికి మూడువేల ఏళ్ల క్రితం జరిగి ఉండచ్చు. అసలు ఋగ్వేదం చెబుతున్న దశరాజయుద్ధమే మహాభారతకథగా రూపొంది ఉండచ్చన్న అభిప్రాయమూ ఉంది(రాంభట్ల, జనకథ). కాలం గురించిన చర్చను అలా ఉంచితే రామాయణ, మహాభారతాలు రెండూ ‘నరు’డి గురించి చెబుతున్నాయి. నరుడే ఆ రెండింటిలోనూ నాయకుడు. రాముడు నరుడైతే, అర్జునుడు ఏకంగా ‘నరు’డనే పేరు కూడా ఉన్నవాడు. అందులోనూ రాముడు సూర్యవంశ క్షత్రియుడు, సౌరవీరుడు.

రాముడు, అర్జునుల చారిత్రకత స్పష్టంగా తెలియకపోయినా; స్పష్టమైన చారిత్రకత కలిగిన ఇద్దరు ముఖ్యులు మనకు తెలుస్తున్నారు. వారు కూడా రాముడు, అర్జునుడిలానే నరవీరులు. క్యాంప్ బెల్ మాటల్లో చెప్పాలంటే సౌరపుత్రులు (sons of light) సాధించిన విజయానికి ప్రతీకలు. తాత్వికార్ధంలో చెప్పాలంటే ఆ విజయం వెలుగు- చీకట్ల(చంద్రుడు)మిశ్రమమైన మాతృస్వామ్యంపై పితృస్వామికమైన వెలుగు(సూర్యుడు) సాధించిన విజయం. వారిలో మొదటివ్యక్తి సారగాన్. ఇతని కాలం క్రీ.పూ. 2350.  అగదకు చెందిన ఇతడు మెసొపొటేమియాను పాలించాడు. రెండోవ్యక్తి హమ్మురాబి. ఇతని కాలం క్రీ.పూ. 1728-1686. బాబిలోన్ కు చెందిన ఇతను కూడా మెసొపొటేమియాను పాలించాడు.hammurabi

వీరికి చెందిన పూర్వరంగం ఇదీ: సమీపప్రాచ్యానికి చెందిన అమ్మవారి ఆరాధన అక్కడికి  ఉత్తరంగా ఉన్న పచ్చికభూముల్లోనూ, దక్షిణంగా ఉన్న సైరో-అరేబియా ఎడారుల్లోనూ నివసించే ఆటవిక జనంలోకి వ్యాపించింది. వీరు స్థిర వ్యవసాయదారులు కారు. అర్ధసంచారదశలో ఉన్న పశుపాలకులు. క్రీ.పూ. 3500 నాటికి వీరు వ్యవసాయగ్రామాలకు, పట్టణాలకు ప్రమాదకరంగా మారారు. హఠాత్తుగా దాడులు చేసి దోచుకుని వెళ్లిపోయేవారు. క్రీ.పూ. 300 నాటికి వీరు రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదిగారు. ఈవిధంగా మెసొపొటేమియా క్రీ.పూ. 2500 నాటికి సైరో-అరేబియా నుంచి వచ్చిన సెమెటిక్ జాతీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సారగాన్, హమ్మురాబి ఈ జాతికి చెందినవారే.

saraganసారగాన్ అమ్మవారి ఆరాధనకు చెందినవాడే అయినా, ఆమెతో అతనిది భిన్నమైన సంబంధం అంటారు క్యాంప్ బెల్. తన తండ్రి ఎవరో తెలియదనీ, నిమ్నవర్గానికి చెందిన తల్లి తనను కని ఒక బుట్టలో ఉంచి నదిలో విడిచిపెడితే అక్కు అనే సాగునీటిదారుకి దొరికాననీ, అతడు తనను పెంచి పెద్ద చేసి తోటమాలిని చేశాడని, అప్పుడు దేవత ఇష్టార్ తనను ప్రేమించడంతో రాజునయ్యాననీ సారగాన్ చెప్పుకుంటాడు. ఆదిమ పౌరాణికతకు చెందిన దేవత-ఆమె కొడుకు సంబంధం లాంటిదే ఇది కూడా. అయితే క్యాంప్ బెల్ వివరణ ప్రకారం, ఆదిమ పౌరాణికతలో ప్రాముఖ్యం దేవతదైతే ఇందులో కొడుకుది. ఈ కొడుకు దేవుడూ కాదు, బలి పశువూ కాదు; అనామకస్థితి నుంచి హఠాత్తుగా రాజకీయ ఉన్నతిని అందుకున్నవాడు. ఆదిమ పౌరాణికత అహాన్ని వదులుకుని దేవతతో తాదాత్మ్యం (mythic identification) కావడానికి సంబంధించినదైతే, సారగాన్ ఉదంతంలో జరిగింది దానికి వ్యతిరేకం. ఇందులో కొడుకు, అంటే రాజు అహాన్ని పెంచుకుని(mythic inflation) దేవుడి ప్రతిరూపం అవుతాడు. రాజు తనను దేవుడిగా చెప్పుకోవడానికి ఇదే ప్రారంభం. అంటే రాచరికాన్ని పూజారుల ఆధిపత్యం నుంచి, రాజ్యాన్ని మతాధిపత్యం నుంచి తప్పించి ఆనువంశిక రాజకీయవ్యవస్థను తీసుకురావడం.

దీని తదుపరి పరిణామమే భూమి మీది రాజు నమూనాలో దేవతలకు కూడా ఒక రాజును సృష్టించడం! హమ్మురాబి ఉదంతం ఈ పరిణామాన్ని సూచిస్తుంది. మన దగ్గర ఇంద్రుడు దేవతలకు రాజు. ఇప్పటికీ ఆలయాలలో దేవుడికి జరిపే సేవలను ‘రాజో’పచారాలనే అంటాం. హమ్మురాబి మన మనువులా శిక్షాస్మృతిని రూపొందించిన రాజు.  అందులో అతను చెప్పుకున్న ప్రకారం, ఆకాశాన్ని ఏలే ‘అను’, స్వర్గాన్ని, భూమిని ఏలే ‘బెల్’ అనే దేవుళ్ళు  బాబిలోనియా నగరదేవుడు అయిన మర్డుక్ కు ప్రజలందరి మీదా సార్వభౌమత్వాన్ని అప్పగించారు. బాబిలోనియాను ప్రపంచంలోనే దుర్భేద్యంగా మార్చి అందులో మర్డుక్ కోసం పది కాలాలపాటు నిలిచే ఒక పటిష్టమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.  ఆ తర్వాత ఆ దేవుళ్ళు ఇద్దరూ ఎంతో పవిత్రత, దైవభక్తి కలిగిన తనను(హమ్మురాబీని) పిలిచి భూమి మీద ధార్మికమైన పాలనను చేపట్టమనీ, అధర్మాన్నీ, చెడును తుడిచిపెట్టమనీ, బలవంతుల అణచివేతనుంచి బలహీనులను కాపాడమనీ, మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింపమనీ, మానవాళి శ్రేయస్సుకు పాటుపడమనీ ఆదేశించారు.

తూర్పు దేశాలలో అప్పటికే ఏర్పడిన నిరంకుశ రాజ్యాల నమూనాకు ఈ వాక్యాలు అద్దంపడతాయని క్యాంప్ బెల్ అంటారు. అందులో మానవప్రయత్నంతో రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి, సృష్టికర్త సంకల్పానికి, అనుగ్రహానికి తను ప్రతినిధినని చెప్పుకుంటాడు. అతనిలోని పవిత్రత, న్యాయం, ప్రజాశ్రేయస్సు పట్ల తపన ధార్మికపాలనకు హామీ ఇస్తాయి. ఈ మాటలు వినగానే మనకు వెంటనే ‘రామరాజ్యం’ గుర్తుకువస్తుంది. రామాయణం, బాలకాండ, ప్రథమసర్గలోని మూడు ప్రారంభ  శ్లోకాలు రాముణ్ణి ఇటువంటి లక్షణాలు కలిగినవాడుగా పరిచయం చేస్తాయి. వాటి ప్రకారం రాముడు సకలసద్గుణవంతుడు, ఎలాంటి విపత్తులు ముంచెత్తినా తొణకనివాడు, గొప్ప కార్యశీలి, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు, దృఢనిశ్చయం కలిగినవాడు, ధైర్యశాలి, మహావీరుడు.

ఇంకా విశేషమేమిటంటే, ఈ రాచరిక నమూనాలో రాజును పోల్చవలసింది వృద్ధి, క్షయాలను; చీకటి, వెలుగులను సంకేతించే చంద్రుడితో కాదు; నిత్యం వెలుగునిచ్చే మండే సూర్యుడితో! ఈ సూర్యప్రతాపం ముందు అన్ని రకాల చీకట్లూ, అసురులూ, శత్రువులూ, సందిగ్ధాలూ పలాయనం చిత్తగించవలసిందే. ఈవిధంగా సూర్యభగవానుడు కేంద్రంగా నూతన యుగం ప్రారంభమైందని క్యాంప్ బెల్ అంటారు.  రాముడు ప్రధానంగా చేసింది రాక్షస సంహారమే. ఆయన సూర్యవంశ క్షత్రియుడే కాక, యుద్ధసమయంలో అగస్త్యుడు వచ్చి ‘ఆదిత్యహృదయం’ ఉపదేశించిన తర్వాతే  రావణుని చంపగలుగుతాడు. పైన పేర్కొన్న హమ్మురాబి శిక్షాస్మృతిలోని వాక్యాలలో కూడా “మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింప”మని హమ్మురాబీతో దేవతలు అనడం గమనించండి.

ఈ సూర్యయుగంతోనే పౌరాణిక ప్రపంచంలో ‘సౌరీకరణ'(solarization)గా పేర్కొనే ఒక ఆసక్తికరమైన పరిణామం అడుగుపెట్టిందని క్యాంప్ బెల్ అంటారు. అది, ఆదిమపౌరాణికతకు చెందిన మొత్తం ప్రతీకల వ్యవస్థను తలకిందులు చేయడం! ఎలాగంటే, దేవతా ప్రాధాన్యం కలిగిన ఆదిమ పౌరాణికతలో చంద్రుడు, చంద్రవృషభమూ ముఖ్య ప్రతీకలు అయితే; పురుషుడు, పురుషదేవుడు ప్రాధాన్యం వహించే నవీన పౌరాణికతలో సూర్యుడూ, సింహమూ ముఖ్యప్రతీకలయ్యాయి.

రాజు అధిష్టించే ఆసనాన్ని ఇప్పటికీ ‘సింహాసన’మనే అంటాం. ఈ ‘సింహాసనం’ కేవలం మన రాచరిక సంప్రదాయానికి చెందిన దనుకుంటారేమో, కాదు. ప్రాచీన సమీప ప్రాచ్య దేశాల రాజులందరూ ‘సింహాసనా’న్నే అధిష్టించారు.

విషయానికి వస్తే, ఆదిమ పౌరాణికతకు చెందిన స్త్రీదేవతలపై రాక్షసులు, లేదా దుష్టశక్తులు అన్న ముద్రవేసి చంపడం; ఆ పౌరాణికతకు చెందిన ప్రతీకలను చిన్నబుచ్చడం లేదా పురుషదేవుళ్ళకు అన్వయించడం; మొత్తంగా స్త్రీ వెనకటి ప్రాధాన్యాన్ని కోల్పోవడం వంటివి ఈ సౌరయుగ పరిణామాలే. ఒక బాబిలోనియా పురాణకథలో జగజ్జనని అయిన తియామత్ అనే దేవత, రాక్షసస్వభావం కలిగిన దుష్టశక్తిగా మారిపోతుంది. ఆమెను మర్డుక్ అనే పురుషదేవుడు చంపుతాడు. అలాగే, రాముడు తాటకను చంపడం; హనుమంతుడు నాగమాతను, సింహిక అనే రాక్షసిని, లంకిణిని జయించడం; కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం, కాళీయుని మర్దించడం మనకు తెలిసిన మన ఉదాహరణలు. ఓడిసస్ సిర్సే, కలిప్సో అనే అప్సరసలను ఎలా లొంగదీసుకున్నాడో చెప్పుకున్నాం. మన పురాణాలలోని దేవాసురయుద్ధాలు కూడా సౌరయుగ పరిణామాలే.

ఇక్కడ ప్రత్యేకించి గమనించాల్సింది ఏమిటంటే, ఆదిమ పౌరాణికతతో మొదలుపెట్టి, నవీన పౌరాణికత వరకూ ఈ పరిణామక్రమం అంతా  ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తం. ఆపైన, చరిత్రకు అందని ఆదిమ కాలం నుంచి, నేటి ఆధునిక కాలం వరకూ ఈ పౌరాణికతా చరిత్ర అంతా ఒక క్రమగతిలో సాగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్యాంప్ బెల్ నే ఉటంకించుకుంటే, ప్రపంచంలోని ప్రధాన ఆస్తిక/మతవిశ్వాసాలకు  పునాదిగా ఉన్న సృష్టిగురించిన ఆలోచనాక్రమాన్ని ఇలా నాలుగు దశలలోకీ, నాలుగు వాక్యాలలోకీ కుదించుకోవచ్చు :

  1. (ఆదిమ పౌరాణికతలో) ఈ విశ్వమంతటినీ పురుష ప్రమేయం లేకుండా జగజ్జననే సృష్టించింది.
  2. పురుష ప్రమేయంతో జగజ్జనని (ఆది దంపతులు) ఈ విశ్వాన్ని సృష్టించింది.
  3. (నవీన పౌరాణికతలో)పురుషుడు, యోధుడు అయిన దేవుడు జగజ్జనని దేహం నుంచి ఈ విశ్వాన్ని సృష్టించాడు.
  4. ఈ విశ్వమంతటినీ స్త్రీ ప్రమేయం లేకుండా పురుషదేవుడు ఒక్కడే సృష్టించాడు.

సామాజికంగా చూస్తే ఇవే దశలు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లిన క్రమాన్నీ చెబుతాయి.

***

ప్రపంచీకరణపై ముమ్మరంగా చర్చ జరుగుతున్న రోజుల్లో ప్రముఖ ఆర్థికవేత్త మేఘ్ నాథ్ దేశాయి రాసిన ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది(Globalisation and Culture, The Little Magazine, Globalisation and its contents, Volume V: Issue 4&5, Editor: Antara Dev Sen).  ప్రపంచీకరణ ఇదే మొదటిసారి కాదనీ, రోమన్ సామ్రాజ్యంతో మొదలుపెట్టి అది అనేక అవతారాలలో సాగిందనీ ఆయన అంటారు. నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళి, చరిత్రపూర్వకాలంలోనే మత/ఆస్తిక రంగంలో ప్రపంచీకరణ జరిగిందని అంటాను. ఆదిమ పౌరాణికతలో జగజ్జనని ఆధిపత్యంలో ఉన్న పురుషుడు క్రమంగా ఆ సంకెళ్లనుంచి బయటపడుతూ నరుడిగా/వీరుడిగా/రాజుగా అవతరించి తన ఆధిపత్యాన్ని స్థాపించుకోవడం కూడా ప్రపంచీకృత పరిణామమే. మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం పాదుకోవడం దాని సామాజిక రూపం. భారతీయ, గ్రీకు పురాణ ఇతిహాసాలతో సహా అనేక పౌరాణికగాథలు ఈ ప్రపంచ పరిణామాన్నే చిత్రిస్తున్నాయి.

epic of gilgamesఇంతకీ నరవిముక్తి రూపంలో జగజ్జననిపై పురుషదేవుళ్లు మహత్తరవిజయం సాధించిన తర్వాత, నరుడి భవితవ్యం ఎలా పరిణమించిందని ప్రశ్నిస్తూ, గిల్గమేశ ఇతిహాసం(The Epic of Gilgames)లో దీనికి జవాబు దొరుకుతుందని క్యాంప్ బెల్ అంటారు. సంగ్రహంగా కథ చెప్పుకుంటే, సుమేరియా నగరమైన ఉరుక్ ను పాలించిన గిల్గమేశుడు ఇందులో నాయకుడు. ఇతనిలో మూడువంతులు దైవాంశ, ఒక వంతు మానవాంశ ఉంటాయి.  ఇతని చండశాసనాన్ని భరించలేక జనం ఇతనికి సమవుజ్జీని సృష్టించమని అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు స్వర్గదేవుడైన అను రూపాన్ని మనసులో తలచుకుని, (పార్వతి నలుగుపిండి నుంచి వినాయకుణ్ణి సృష్టించినట్టు) కాస్త మట్టి చేతుల్లోకి తీసుకుని దానినుంచి ఒక వీరుణ్ణి సృష్టిస్తుంది. అతని పేరు ఎంకిడు.

అడవిమనిషిగా పెరిగిన ఎంకిడుకి పశువులు తప్ప మనుషులు తెలియదు. అతని గురించి విన్న గిల్గమేశ్,(రామాయణంలోని ఋష్యశృంగుడి కథలోలా) అతన్నిఆకర్షించి నగరానికి తీసుకురమ్మని ఒక వేశ్యను పంపిస్తాడు.  ఆమె వలకు చిక్కుకున్న ఎంకిడు ఆమెతో నగరానికి వస్తాడు. గిల్గమేశ్ దేవత ఇష్టార్ పొందు కోసం వెడుతున్నప్పుడు ఎంకిడు అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరికీ యుద్ధం జరుగుతుంది. తనకు సమవుజ్జీ అని గ్రహించిన గిల్గమేశ్ అతనితో స్నేహం చేస్తాడు. కొంతకాలానికి ఎంకిడు మరణిస్తాడు. దుఃఖించిన గిల్గమేశ్ తను మరణాన్ని జయించాలనుకుంటాడు. అమరత్వం పొందే మార్గాన్ని అన్వేషిస్తూ (ఓడిసస్ లానే) సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అడ్డంకులను వీరోచితంగా ఎదుర్కొని అమరత్వాన్ని ఇచ్చే ఒక మూలిక గురించి తెలుసుకుంటాడు. విశ్వసముద్రం అడుగున ఉన్న ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తూ ఒక నది దగ్గర ఆగి మూలికను గట్టున ఉంచి స్నానానికి దిగుతాడు. అప్పుడు(మహాభారతంలో ఉదంకుని కుండలాలను తక్షకుడు అనే నాగరాజు అపహరించినట్టు) ఆ మూలిక వాసన పసిగట్టిన ఒక సర్పం నీళ్ళలోంచి పైకి వచ్చి దానిని మింగేసి కుబుసం విడిచిపెడుతుంది. గట్టు మీదికి వచ్చిన గిల్గమేశ్ మూలిక కనిపించకపోవడంతో కుప్పకూలి భోరున విలపిస్తాడు.

అమరత్వాన్నిఇచ్చే సర్పశక్తి(కుండలినీశక్తి) అంతవరకూ పురుషుడి ఆస్తిగా ఉందనీ, దానినిప్పుడు ‘దుష్ట’సర్పమూ, ‘ప్రతిష్ట కోల్పోయిన’ దేవతా తిరిగి తీసేసుకున్నాయనీ, దాంతో మనిషికి దుఃఖమూ, చావు భయమూ మిగిలాయనీ  ఈ కథ కు క్యాంప్ బెల్ వివరణ. క్రీ.పూ. 650 నాటి మట్టిపిడకలపై దొరికిన ఈ రచన హమ్మురాబి(క్రీ.పూ.1750)కాలానికి చెందినదిగా కనిపిస్తుందనీ, చాలామంది ఉద్దేశంలో మనిషి గురించి చెప్పే తొలి ఇతిహాసం ఇదేననీ ఆయన అంటారు.

***

నరుడితోనూ, నలదమయంతుల కథతోనూ మొదలై, ఓడిసస్ కథ మీదుగా వివిధ అంశాలను స్పృశిస్తూ సాగిన వ్యాసపరంపరలో ప్రస్తుతానికి ఇది చివరి వ్యాసమే తప్ప ముగింపు కాదు. వీటిలో చర్చించిన అనేక అంశాలకు పూర్తి న్యాయం చేశానని నేను అనుకోవడంలేదు. ‘నరు’డి అవతరణా, దానితో జమిలిగా అల్లుకున్న పితృస్వామికతలే పురాణఇతిహాసాలకు ప్రధాన ఇతివృత్తాన్ని అందిస్తున్నాయి కనుక, ఏవో కొన్ని వ్యాసాలతో వాటికి ముగింపు పలకడం సాధ్యమూ కాదు. అసలు పురాచరిత్ర అనే సముద్రంలో అవతలి ఒడ్డుకు చేరడం దేవుడెరుగు, నేను ఇంకా ఇవతలి ఒడ్డు దగ్గరే ఉన్నాను…

*

అలా ఉండగానే ‘పురా’గమనం శీర్షిక ప్రారంభించి నేటితో (జూన్ 19)తో సరిగ్గా రెండేళ్ళు గడిచిపోయాయి.  చివరి వాక్యం రాయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఈ క్షణాన నాకే అంచనా లేదు. దానిని కాలానికి విడిచిపెడితే…ఈ వ్యాసాలను ప్రచురిస్తున్న ‘సారంగ’ సంపాదకవర్గానికీ, మొదటినుంచీ ఈ వ్యాసాలపై అమితమైన ఆసక్తిని చూపుతూ ఉత్సాహకరమైన స్పందనను, సవిమర్శక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఎందరో పాఠకులకూ కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇదొక సందర్భం.

షరా మామూలుగా ఇప్పుడు మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరాను. దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలలో ఏ కొసను పట్టుకోవాలన్న విచికిత్సలోకి మరోసారి జారిపోయాను…

*

 

 

 

 

మీ మాటలు

  1. కల్లూరి భాస్కరం says:

    చిన్న సవరణ. “వీరికి చెందిన పూర్వరంగం ఇదీ:” అని ప్రారంభమైన పేరాలో, “క్రీ.పూ. 300 నాటికి వీరు రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదిగారు.” అనే వాక్యంలో పొరపాటు దొర్లింది. క్రీ.పూ. 300 అని కాక, క్రీ.పూ. 3000 అని గ్రహించగలరు.

  2. N Venugopal says:

    భాస్కరం గారూ,

    ఎప్పట్లాగే బాగుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాల ఆసక్తికరంగా ఉంది. రెండు చిన్న విషయాలు: 1. మెసపొటేమియా గురించి రాస్తూ “సమీప ప్రాచ్యం” అని వాడారు. అది అమెరికన్లకూ యూరపియన్లకూ సమీప ప్రాచ్యం గాని తెలుగు వాళ్లకూ భారతీయులకూ కాదు గద. 2. మెక్సికో లో కూడ సూర్య చంద్రుల చిహ్నాలూ పూజలూ ఉన్నాయి. బహుశా మయన్ నాగరికతలో కూడ ఉన్నాయేమో. ఈ వ్యాసానికి అదేమన్నా అదనంగా ఉపయోగపడుతుందా?

  3. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ…
    1. సమీప ప్రాచ్యం: మీరు అనే దాకా ఈ మాట యూరప్ సెంట్రిక్ అన్న విషయం నాకు తట్టలేదు. వికీపీడియాలోకి వెడితే దీనికి చాలా చరిత్ర ఉన్నట్టు అర్థమైంది. భారతీయులు సమీప ప్రాచ్యాన్ని ఏమనేవారో పరిశీలించాలి. అయితే ప్రామాణికమైన మాట దొరుకుతుందో లేదో చెప్పలేం. మధ్యప్రాచ్యం అనే మాట దీనికి సరిపోయే మాట అని వికీపీడియా చెబుతోంది. అది యూరప్ సెంట్రిక్ కాకపోవచ్చు.
    2. మెక్సికోలో కూడా సూర్య, చంద్ర చిహ్నాలూ, పూజలూ ఉన్నాయి: పురాణగాథలూ, పూజాచిహ్నాల గురించి రెండు వాదాలు ఉన్నాయి. మొదటిది, యాదృచ్చికతా వాదం. రెండవది, విస్తరణవాదం. ఈ విస్తరణవాదం వైపే ఎక్కువ మొగ్గు ఉన్నట్టు కనిపిస్తుంది. దీని ప్రకారం పురాణగాథలూ, పూజాచిహ్నాలతో సహా అనేకం సమీప, లేదా మధ్యప్రాచ్యం నుంచే అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. అలాగే మెక్సికోకూ(క్రీ.పూ. 1000 ప్రాంతంలో)వ్యాపించాయి. ఇవన్నీ చాలా వివరంగా చెప్పుకోవలసినవి. అందుకే పురాచరిత్ర అనే సముద్రంలో ఇంకా ఇవతలి ఒడ్డునే ఉన్నానన్నాను.

  4. N Venugopal says:

    భాస్కరం గారూ,

    మధ్య ప్రాచ్యం కూడ యూరపియన్ / అమెరికన్ మాటే. ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, నియర్ ఈస్ట్ మూడూ వాళ్లకు దూరాలూ దగ్గరల నుంచే. నేనయితే మనం ఉన్న స్థానాన్ని బట్టి తూర్పు ఆసియా, పశ్చిమాసియా అనాలనుకుంటాను. అరబ్ దేశాల మీద నేను రాసిన డజన్ల కొద్దీ వ్యాసాలలో, అనువాదాలలో మిడిల్ ఈస్ట్ అని ఉన్నచోటల్లా పశ్చిమాసియా అనో, గల్ఫ్ అనో వాడాను. అయితే, మీరు రాస్తున్న కాలానికి ఆ ప్రాంతాలను ఏమనేవారో పరిశీలించవలసిందే.

    • కల్లూరి భాస్కరం says:

      వేణుగోపాల్ గారూ…
      సమీప ప్రాచ్యం, మధ్య ప్రాచ్యం అనే మాటలకు ‘పశ్చిమాసియా’ సరైన ప్రత్యామ్నాయంగానే కనిపిస్తోంది. అయితే గల్ఫ్ అన్నప్పుడు సమీప ప్రాచ్యం లేదా పశ్చిమాసియాకు చెందిన టర్కీ రావడం లేదు. పురాచరిత్రలో టర్కీ చాలా ముఖ్యమైన ప్రాంతం. మధ్య ప్రాచ్యం అనే మాటను యూరప్ రూపొందించి ఉండచ్చు కానీ యూరప్/అమెరికా సెంట్రిక్ అవుతుందా అన్నది నా సందేహం. వికీపీడియాలో ఇంకొకటి కూడా చూశాను. ఆర్కియాలజీలోనూ, పురాచరిత్రలోనూ సమీప ప్రాచ్యం అనే మాటను వాడడమే పరిపాటిగా మారిందని అది చెబుతోంది. అసోసియేటెడ్ ప్రెస్ స్టైల్ బుక్ ప్రకారం మూలకథనంలో సమీప ప్రాచ్యం అని వాడితే దానిని అలాగే వాడాలి. లేకపోతే మధ్యప్రాచ్యం అనచ్చు.

  5. V.V.Satyanarayana Setty says:

    రాముడు chaari traka పురుషుడే. శాపాలు ,వరాలు మాయలు అన్నీ కల్పనలే

మీ మాటలు

*