వ్యాపార శిఖరంపై…ఒంటరితనం లోయలో…

 

స్లీమన్ కథ-5

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మిన్నాతో అతని పరిచయం పదహారేళ్ళ క్రితం. ఇన్నేళ్లలో వాళ్ళు కలసి తిరిగింది మాత్రం మూడు, నాలుగేళ్లే, అది కూడా బాల్యంలో!  కానీ ఇంతవరకూ అతని జీవితంలో మనసుకు దగ్గరైంది మిన్నా ఒక్కతే. అతని ఊహల్ని, కలల్ని పంచుకున్నదీ; అతనేం చెప్పినా ఆసక్తిగా, శ్రద్ధగా ఊకొడుతూ విన్నదీ ఆమె ఒక్కతే.

ఆమెకు దూరమైన ఈ పన్నెండేళ్లలోనూ ఎక్కువ కాలం, అతను పేదరికంతో ముఖాముఖి పోరాటంలోనే గడిపాడు. ఆ ప్రయత్నంలో మృత్యుముఖంలోకీ వెళ్ళి వచ్చాడు. అంతటి కష్టజీవితం కూడా అతన్ని మానసికంగా  ఏనాడూ కుంగదీయలేదు. కుంగదీయకపోగా అతనిలో పైకి ఎదగాలన్న పట్టుదలను, కార్యదీక్షను పెంచింది. మిన్నా సాహచర్యంలో తను గడపబోయే భావిజీవితం గురించిన ఊహ బతుకు పోరాటంలో అతను విజేతగా నిలవడానికి స్ఫూర్తి నిచ్చింది. మిన్నా తలపులతో అతను జీవనోత్సాహాన్ని పుంజుకోని రోజు ఈ పదహారేళ్లలో ఒక్కటీ లేదు. కడగండ్ల లోయలోంచి ఒక్కసారిగా అతను వైభవశిఖరాన్ని అందుకోగలిగాడంటే; దాని వెనుక మిన్నా అదృశ్యహస్తం తప్పనిసరిగా ఉంది.

తీరా జీవితంతోపాటు మిన్నాను కూడా గెలుచుకోగలిగిన దశలో ఆమె చేజారిపోయింది. తనదనుకున్న మిన్నా ఇంకొకరి సొత్తు అయిపోయింది. ఆమెకు పెళ్లి జరిగిపోయిందన్న చేదునిజం మొదటిసారి అతని మనసుకు పెనుగాయం చేసింది.  పంచుకునే మనిషి లేనప్పుడు ఈ డబ్బు, పలుకుబడి, ప్రతిష్టా దేనికన్న ప్రశ్న అతనికి మొదటిసారి ఎదురైంది. మిన్నాతో శాశ్వతవియోగ రూపంలో మనసులోకి నిశ్శబ్దంగా జారిన ఒక వెలితి ఒంటరితనంగా మారి క్రమంగా పెద్దదవుతూ అతని భావిజీవితం అంతా పరచుకుంటూ వచ్చింది. అతనిలో ఇప్పుడు విచారంతోపాటు అసహనం, చికాకు పెరుగుతున్నాయి.

పైకి మాత్రం ఒక వ్యాపారవేత్తగా అతని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి  ఏడాది తిరక్కుండానే ప్రథమ శ్రేణి(First Guild) వర్తకుల జాబితాలో అతని పేరు చేరింది. చిరకాలంగా పాతుకుపోయిన పెద్ద వర్తకుల్లానే ఇప్పుడతను బ్యాంకులనుంచి కావలసినంత రుణం పొందచ్చు. నెల నెలా జరిగే గిల్డ్ సమావేశానికి హాజరు కావచ్చు. కోట్లకు పడగెత్తిన వర్తకులతో సమాన ఫాయీలో మాటలు, మంతనాలు జరపచ్చు. విందు వినోదాల్లో పాల్గోవచ్చు.

తను జర్మన్ అయినా స్వచ్ఛమైన రష్యన్ లో అనర్గళంగా ప్రసంగించగలగడం అతని అదనపు ఆకర్షణ. అతన్ని గిల్డ్ క్లబ్ లోకి సాదరంగా ఆహ్వానించిన బడా వర్తకుల్లో పీటర్ అలెగ్జీఫ్ ఒకడు. అతనిది పది కోట్ల రూబుళ్ల విలువైన వ్యాపారం అదిగాక కోటి రూబుళ్లకు పైగా వ్యక్తిగత ఆస్తి ఉంది. పొనోమరెఫ్ ప్రముఖ చక్కెర, కలప వ్యాపారి. అతనికి స్లీమన్ వ్యాపారదక్షత మీద మంచి గురి కుదిరింది. తనతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే లక్ష సిల్వర్ రూబుళ్లు పెట్టుబడి పెడతానంటూ ముందుకొచ్చాడు. ఇక ఏమ్ స్టడామ్ లో తనకు పరిచయమైన  పాత మిత్రుడు జివాగో ఉండనే ఉన్నాడు. అతనిది కూడా కోట్ల విలువైన వ్యాపారం. స్లీమన్ రష్యా రావడానికి చాలావరకూ అతనే కారణం. మాస్కోలో అతనికి ఓ బ్రహ్మాండమైన భవంతి ఉంది. ఎప్పుడు మాస్కో వెళ్ళినా స్లీమన్ బస అక్కడే.

జివాగోకు పిల్లలు లేరు. మేనగోడలు ఎకెతెరీనా అతని దగ్గరే ఉంటోంది. వయసు పదహారేళ్లు. అందంలోనూ గుణంలోనూ  అచ్చం “దేవకన్యే”.  స్లీమన్ తో వ్యాపార భాగస్వామ్యాన్నే కాదు, మేనగోడలినిచ్చి అతనితో బంధుత్వం కూడా కలుపుకోవాలని జివాగో అనుకున్నట్టున్నాడు, స్లీమన్ తన ఇంటికి వచ్చినప్పుడల్లా బ్రహ్మరథం పట్టేవాడు. ఒకసారైతే మూడు, నాలుగు నెలలు ఇక్కడే ఉండిపొమ్మని కూడా పట్టుబట్టాడు.

స్లీమన్ అతని ఆలోచనల్ని పసిగట్టాడు. ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. “పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అసలు సమస్య. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు ఆడవాళ్ళలో గుణాలే కానీ లోపాలు కనిపించవు” అన్నాడు.

విదేశాల్లో ఉన్న తన ఏజెన్సీలనుంచి వ్యాపార నివేదిక అడిగినట్టుగా ఎకెతెరీనా మీద నివేదిక ఇమ్మని సోదరిని అడిగాడన్నమాట. పైగా తనింట్లో పెద్ద స్నానాల తొట్టెతో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయనీ, నువ్వు చాలా సుఖంగా గడపచ్చని కూడా రాశాడు.

ఎందుకోగానీ సోదరి నుంచి ఉలుకూ పలుకూ లేదు. స్లీమన్ హతాశుడయ్యాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప మిన్నా లాంటి అమ్మాయి తనకు భార్యగా లభించడం అసాధ్యమనుకున్నాడు. అయినా చూద్దామని బాగా డబ్బూ, ప్రతిష్టా ఉన్న వర్తకుల అమ్మాయిలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రతి ప్రయత్నం చివరికింత మనస్తాపాన్నో, అయోమయాన్నో మిగిల్చేది. చిటపటలకు, అసహనానికి తోడు తను చెప్పిందే వేదమనే స్వభావం అతనిది. శాసించి పనులు జరిపించుకోడానికి అతను అప్పటికే అలవాటు పడిపోయాడు. అయితే వ్యాపారరంగంలో కలిసొచ్చిన లక్షణాలు అమ్మాయిల దగ్గర పనికిరాలేదు. వాళ్ళు అతనికో పెద్ద పజిల్ గా మారారు. వాళ్ళే ఏమిటి, ఈ విషయానికి వచ్చేసరికి తనకు తానే ఓ పజిల్ గా మారాడు. అసలు తనకు ఏం కావాలో తనే నిర్ణయించుకోలేకపోయాడు. ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని ఊహ. కానీ అందమూ, నిరాడంబరతా, హుందాతనం రాశిపోసిన మిన్నా లాంటి అమ్మాయి అతనికి ఒక్కరూ దొరకలేదు.

మొత్తానికి మిన్నా దూరమవడం అతని వ్యక్తిగత జీవితాన్ని గాడి తప్పించింది…

అతని వృత్తి జీవితం మాత్రం ఎప్పటిలా నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. ష్రోడర్ తో తన సంబంధాలను కొనసాగిస్తూనే సొంత వ్యాపార సంస్థను ప్రారంభించాడు. అన్ని రకాల వ్యాపారాలను అందిపుచ్చుకుంటూ వెళ్ళాడు. ఎంతటి నష్టాలకైనా ఎదురొడ్డాడు. అగ్రశ్రేణి వర్తకులైతే తప్ప సరుకు అరువివ్వకపోవడం అతను అనుసరించిన ఒక పద్ధతి. తను రెక్కలు ముక్కలు చేసుకుని మీ సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్నాననీ, తనిప్పుడు ప్రపంచవ్యాప్తి కలిగిన ప్రముఖ వర్తకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాననీ, కనుక తనకు ఇంతవరకూ ఇస్తున్న అర్థ శాతం కమీషన్ కంటే ఎక్కువ ఇవ్వవలసిందనీ ష్రోడర్ కు ఉత్తరం రాశాడు. ష్రోడర్ వెంటనే కమీషన్ ను ఒక శాతానికి పెంచాడు. దాంతో తను అపారమైన సంపదను గడించే రోజు ఎంతో దూరంలో లేదని స్లీమన్ అనుకున్నాడు.

1848 చివరిలో స్లై మీద అతను అయిదోసారి మాస్కో వెళ్ళాడు. క్రిష్టమస్ ను, న్యూ ఇయర్ ను జివాగో కుటుంబంతో గడిపాడు. ఈ సందర్శన అతనిలో ఎంతో సంతోషాన్ని నింపింది. కానీ తిరుగు ప్రయాణంలో మంచు తుపాను ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇన్ఫ్లూయెంజాతో మంచం పట్టాడు. తను చనిపోతాడేమోనని కూడా అనిపించింది. నాలుగు మాసాల తర్వాత కాస్త ఆరోగ్యం చిక్కింది అనిపించగానే ఎప్పటిలానే ఊపిరి సలపనంత పనిలోకి దిగిపోయాడు. దాంతో జూన్ కల్లా మళ్ళీ కుప్పకూలాడు. కొన్నిరోజులు వ్యాపారాలు కట్టిపెట్టమని డాక్టర్లు గట్టిగా చెప్పి అతన్ని ఓ చీకటి గదికి పరిమితం చేశారు. వాళ్ళ మీద మొదట మండిపడ్డాడు కానీ, వారి కట్టడిలో న్యాయముందని త్వరలోనే అర్థం చేసుకున్నాడు.

ఎకతెరీనా లిషిన్

ఈసారి కోలుకునే సమయానికి  డాక్టర్ల పాఠం పూర్తిగా తలకెక్కింది. పని తగ్గించుకుని విందులు వినోదాలకు సమయం కేటాయించడం ప్రారంభించాడు. తను స్వయంగా వర్తకప్రముఖులను, వాళ్ళ అమ్మాయిలను ఆహ్వానించి పార్టీలు ఇచ్చాడు. అత్యుత్తమ మద్యాలతో అలరించాడు. ఈ క్రమంలోనే సోఫియా అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడిపోయాడు. ఆమె పెద్ద ఆస్తిపరురాలు కాదు, కానీ పొదుపరి. మూడు యూరోపియన్ భాషల్ని ధారాళంగా మాట్లాడుతుంది. తను కలలు గనే అమ్మాయి దొరికిందని వెంటనే తండ్రికి ఉత్తరం రాసేశాడు. ఆమెతో సంబంధం తెంచేసుకున్నానన్న ఉత్తరమూ ఆ వెంటనే తండ్రి చేతికి అందింది. ఇద్దరూ కలసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు ఆమె ఒక యువ అధికారిపై విపరీతమైన ఆసక్తిని చూపించడం అందుకు కారణం.

ఆమెను అంతటితో వదిలించుకున్నందుకు అతను సంతోషించాడు. ఈ అనుభవం ఎకెతెరీనా గురించి అతన్ని సరికొత్తగా ఆలోచింపజేసింది. ఈమె కన్నా ఆమె వెయ్యిరెట్లు నయమనిపించింది. పైగా జివాగో కుటుంబం తనను మాస్కో రమ్మని ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారీ నెత్తిన పెట్టుకుంటుంది. ఒక మాదిరి నిర్ణయంతో అతను 1850 ఫిబ్రవరిలో మరోసారి స్లై మీద మాస్కో వెళ్ళాడు. ఎప్పటిలా జివాగోల ఇంట్లో దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, నెలరోజులు గడిచాయోలేదో, అతను శరవేగంతో యూరప్ అంతా చుట్టబెట్టడం ప్రారంభించాడు. పీకల్లోతున వ్యాపార వ్యవహారాల్లో కూరుకుపోవడం తప్ప మరో ఊసులేదు. ఏ ఒక్క చోటా కొద్ది రోజులు మినహా ఆగింది లేదు. రాసిన ఉత్తరాలు అన్నింట్లో వ్యాపార విషయాలే తప్ప వ్యక్తిగత విషయాలు మచ్చుకైనా లేవు.

ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసులు వెంటాడుతున్న నేరస్తుడిలా ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కు జారుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇంగ్లండ్ లో కాస్త ఎక్కువ రోజులు గడిపాడు. ఎడింబరో, గ్లాస్గో, లివర్ పూల్, బాంగర్, చెస్టర్, లండన్ లను సందర్శించాడు. తను చూసిన ప్రతి దాని గురించీ నోట్సు రాసుకున్నాడు. రోజూ రాత్రి పడుకునేముందు డైరీ రాసుకునేవాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతి ఇప్పటికీ అతనికి ఆశ్చర్యం గొలుపుతూనే ఉంది.

కొన్ని వారాల తర్వాత అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. అతని జేబుల నిండా లెక్కలేనన్ని వ్యాపార ఒప్పందాలు. కానీ అతని వ్యక్తిగత జీవితం నిండా తీరని అశాంతి, అసంతృప్తి, దుర్భరమైన ఒంటరితనం. ఎన్ని ఉన్నా అతనికి ఆడతోడు లేదు. ప్రకృతి సహజమైన అనుభవానికి దూరమవడం నిశ్శబ్దంగా అతన్ని నిస్తేజం చేస్తోంది. దాంతో అతని వ్యక్తిగత జీవితం చుక్కాని లేని నావ అయింది. తను ఎంతగానో ఆకాశానికి ఎత్తిన సెయింట్ పీటర్స్ బర్గ్ లో నివసించడం కూడా ఉండి ఉండి అతనికి కంపరం కలిగిస్తోంది. మెక్లంబర్గ్ కు వెళ్ళిపోయి ఓ పేదింటి రైతు అమ్మాయిని పెళ్లిచేసుకుని వ్యవసాయం చేసుకుంటూ గడిపితే బాగుండు ననుకునే క్షణాలూ ఉంటున్నాయి.

కానీ ఎంతైనా తన అదృష్టానికి పునాది పడింది సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే. కనుక మరికొన్ని మాసాలు ఇక్కడే గడుపుదామనుకున్నాడు. మళ్ళీ పనిలోకి దిగిపోయాడు. పార్టీలకు వెడుతున్నాడు. ఈ మధ్యలో 1850 వేసవిలో కాబోలు, ఎకెతెరీనా లిషిన్ అనే అమ్మాయి అతనికి పరిచయమైంది. తను మరో స్నేహితుడికి దగ్గరి బంధువు. ఎత్తుగా తీర్చిదిద్దిన శిల్పంలా ఉంటుంది. కోలముఖం, నీలి కళ్ళు, ప్రవర్తనలో రాకుమారిని తలపించే హుందాతనం. స్లీమన్ కు ఆమె నచ్చింది. పెళ్లి మాటలు కూడా జరిగాయి. కానీ వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఆమెలోని మితిమీరిన ఆభిజాత్యం, పెద్దగా ఆస్తిపరురాలు కాకపోవడం  అతన్ని వెనక్కి లాగాయి.

వేసవి గడిచి ఆకురాలు కాలం అడుగుపెట్టింది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కానీ ఈ జీవితాన్నీ, చాలావరకూ నీలిమందు వ్యాపారంతో గడించిన ఈ సంపదనూ ఏం చేసుకోవాలన్న ప్రశ్న అతని ముందు వేలాడుతూనే ఉంది.

వ్యక్తిగత విషయాల్లో త్వరగా ఒక నిర్ణయానికి రాలేని అశక్తత అతన్ని వెంటాడుతోంది. మెక్లంబర్గ్ వాసుల్లో సహజంగా ఉండే మితిమీరిన జాగ్రత్త అది. దానికితోడు అతను ప్రపంచం తాలూకు కఠోర పార్స్వాన్ని అతి దగ్గరగా చూశాడు. పేదరికం, సంపద; ఆకలి, అన్నం… అన్నీ చవి చూశాడు. ఉజ్వలమైన నగరజీవితమూ, మారు మూల పల్లె జీవితమూ-రెండూ అతనికి తెలుసు.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ఆఫీసులో డెస్క్ దగ్గర నిలబడి నరాలు తెగిపోయేంత ఒత్తిడిని ఎదుర్కొంటూ యూరప్ అంతటా ఉన్న తన వర్తక ప్రతినిధులకు హడావుడిగా తంతి సందేశాలు పంపడం లాంటి అతని దినచర్యలో మార్పు లేదు. అయితే, ఇంతకన్నా తేలిక మార్గంలో సంపద గడించలేమా అన్న ప్రశ్నా మధ్య మధ్య అతన్ని ఆలోచనలో పడేస్తోంది.

అతని తమ్ముడు లుడ్విగ్ కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి చేరుకున్నట్టు 1850 ప్రారంభంలో సమాచారం అందింది. లుడ్విగ్ కొంతకాలంపాటు ఏమ్ స్టడామ్ లో అన్నకు వ్యాపారప్రతినిధిగా ఉన్నాడు. తెలివిలో అన్నకు సాటి కాకపోయినా స్వభావం అతనిదే. అదే తలబిరుసు, దుడుకుతనం. వివిధ భాషలు నేర్చుకోవడంలో కూడా అతను ముమ్మూర్తులా అన్నే. ఫ్రెంచి, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో అతను అన్నకు ఉత్తరాలు రాసేవాడు. అన్నకు ఉన్నట్టే ధనదాహం అతనికీ ఉంది.

california gold rush

ఓసారి అతను ఓ షాపు ప్రారంభిద్దామనుకుని తగినంత పెట్టుబడిని అప్పుగా ఇమ్మని అన్నను అడిగాడు. స్లీమన్ 500 టేలర్లు ఇవ్వజూపితే, నీకు మరీ ఇంత పిసినిగొట్టుతనం పనికిరాదంటూ తిరస్కరించాడు. ఇంకో సందర్భంలో, తనను సెయింట్ పీటర్స్ బర్గ్ లోని నీ వ్యాపారంలో చేర్చుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఉత్తరం రాసి రక్తంతో సంతకం పెట్టాడు. దానికి స్లీమన్ ఓ సుదీర్ఘమైన జవాబు రాశాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని జటిలమైన తన వ్యాపార వ్యవహారాల్లోకి ఓ భాగస్వామిని తీసుకురావడం అంత తేలికైన విషయం కాదన్నాడు. కాదూ కూడదూ నువ్వు వస్తానంటే, కొన్నేళ్లు తీసుకునే నీ శిక్షణ సమయంలో నీ పోషణ బాధ్యత నేను తీసుకోనని చెప్పాడు. రష్యన్ భాషను ఓ మోస్తరుగా నేర్చుకోడానికే నాలుగేళ్ళు పడుతుందన్నాడు. ఆపైన నువ్వు మంచి వ్యాపారవేత్తవు అవుతావన్న హామీ ఏమీ లేదనీ, నీలో అందుకు అవసరమైన చురుకుదనం లేదనీ అనేశాడు. చివరగా, “పదమూడేళ్ళపాటు ఒకరి ముందు చేయి చాచకుండా నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేశాను” అంటూ, నువ్వు కూడా నా ఒరవడినే అనుసరించాలని ముగించాడు.

నిస్పృహ, ఆగ్రహం ముసురుకున్న క్షణాలలో లుడ్విగ్ ఓ రోజున రోటర్ డామ్ లో  ఓ కాలువ ఒడ్డునే నడుస్తుండగా తక్షణమే ఓడ ఎక్కి అమెరికా వెళ్లిపోవాలన్న ఆలోచన వచ్చింది. న్యూయార్క్ చేరుకుని ఫ్రెంచ్ టీచర్ గా ఉంటూ ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తగినంత డబ్బు సమకూడగానే కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ వడ్డీవ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ఒక మోస్తరు సంపదను గడించాడు. అంతవరకూ అన్న నీడలో జీవించి పైకి వచ్చిన అందరూ తమ్ముళ్ళలానే తన ఘనతను గొప్పగా చెప్పుకుంటూ, మధ్య మధ్య ఎత్తిపొడుపులతో స్లీమన్ కు పెద్ద ఉత్తరం రాశాడు. ఆ పైన డబ్బు సంపాదనకు కాలిఫోర్నియాలో ఉన్నన్ని అవకాశాలు భూమ్మీద ఇంకెక్కడా లేవనీ, తన ఆస్తులన్నీ అమ్మేసుకుని వెంటనే సెక్రామెంటోకు రావలసిందనీ సలహా ఇచ్చాడు.

ఆ ఉత్తరం స్లీమన్ ను ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. అందులోని ఎత్తిపొడుపులతోపాటు, నీకన్నా నేనే గొప్ప అన్నట్టు తమ్ముడు విసిరిన సవాలు, కొన్ని మాసాల్లోనే పెద్ద ముల్లె మూటగట్టానని అతను అలవోకగా అనడం స్లీమన్ ను ఆలోచనలో పడేశాయి. తన నేర్పులో, క్రమశిక్షణలో, అంకితభావంలో పదోవంతు లేనివాళ్ళకు కూడా ఇలా ఆకస్మిక ధనయోగం పట్టిన ఉదాహరణలు అతనికి తెలుసు. ఇన్నేళ్లలో తను గడించినదానికన్నా ఎక్కువగా కొన్ని వారాల్లోనే తమ్ముడు గడించినట్టు అతనికి అర్థమైంది. దానికితోడు, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే పూర్తి బాధ్యత తనే తీసుకుంటాననే కాక; నీకు కూడా త్వరలోనే పెద్ద మొత్తం పంపాలని అనుకుంటున్నానన్న ఆ ఉత్తరంలోని వాక్యాలు   మరింత నొప్పించేలా ఉన్నాయి.

అతను చెప్పిన పెద్ద మొత్తం ఏదీ రాలేదు కానీ, సెక్రామెంటోలోని ఓ పత్రికలో ప్రచురితమైన ఒక వార్త తాలూకు కత్తిరింపు మాత్రం వచ్చింది. “న్యూయార్క్ లో ఉంటున్న లూయీ స్లీమన్ అనే పాతికేళ్ళ జర్మన్ యువకుడు 1850 మే 25వ తేదీన సెక్రామెంట్ నగరంలో టైఫాయిడ్ తో మరణించా”డని ఆ వార్త చెబుతోంది. దానికి జతపరచిన ఓ ఉత్తరం, లుడ్విగ్ ఓ పెద్ద ఎస్టేట్ ను విడిచివెళ్లాడని తెలియజేసింది.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

మీ మాటలు

*