‘జంట గొడ్డలి’ చెప్పే జగజ్జనని తత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

 నరుడే కదా ఈ పురాణ, ఇతిహాసకథలన్నీ చెబుతున్నది?! అలాంటిది తననుంచి తనను విడదీసుకుని, దేవతలు, రాక్షసులు, సిద్ధులు,సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య తనను ఎందుకు ఇరికించుకుంటున్నాడు?

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు,సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒకడుగా ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి ఈ ప్రశ్నను లేవనెత్తాను. కొన్ని వ్యాసాల క్రితం మరోసారి ముందుకు తెచ్చాను. ఇలా వెంటాడుతున్న ఈ ప్రశ్న, ఇప్పుడు సమాధానానికి ఏ కొంచెమైనా దగ్గరవుతుందేమో చూద్దాం.

అసలు ఈ ప్రశ్న తలెత్తడమే అపూర్వం అద్భుతం. ఇంత ముఖ్యమైన ప్రశ్న మన పురాణ, ఇతిహాస పండితులలో ఎందుకు పుట్టలేదో ఆశ్చర్యం. ఈ నరుడనే వాడికి పురాణ, ఇతిహాసాలలో గౌరవం లేదనీ, చులకనభావం ఉందనీ కూడా చెప్పుకున్నాం. మహాభారతంలోని ఈ  విచిత్రాన్నే చూడండి….’ఇతడు కేవల మర్త్యుడే’ అనడం చాలా చోట్ల వస్తుంటుంది.  ఉదాహరణకు, కర్ణుని గురించి దుర్యోధనుడు ఆ మాట అంటాడు. ధర్మరాజు గురించి అర్జునుడు అంటాడు. ఇక ద్రౌపది మానవమాత్రురాలు కాదు, అయోనిజ…

ఇదే సమయంలో ఇదే మహాభారతం, అర్జునుడికి ‘నరు’డనే నామాంతరాన్ని సృష్టిస్తోంది. అంతేకాదు, అతన్ని ‘నరవీరు’ణ్ణి చేస్తోంది. అప్పటికీ నరుడికి అంత ప్రాధాన్యం ఇవ్వడం మహాభారతకర్తకు ఇష్టం లేదు. కనుక అర్జునుని ‘నరు’డనే ఆదిముని అవతారంగా చిత్రిస్తున్నాడు. ఆపైన నారాయణుడనే దేవునితో అతణ్ణి కలిపి చెబుతున్నాడు. మహాభారతంలో నాయకుడంటూ ఒకరిని గుర్తించవలసివస్తే అది నరుడైన అర్జునుడే  అవుతాడు. అతడు నారాయణుడనే దేవుడి సాయంతో కురుక్షేత్రయుద్ధంలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నరుని వారసుడైన అభిమన్యుని కొడుకు పరీక్షిత్తే హస్తినాపురరాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు.

హోమర్ ‘ఒడిస్సీ’ లోని ఓడిసస్ లానే, మహాభారత నరుడు  స్త్రీ సూత్రాన్ని ఎలా జయించాడో చూడండి… కురుక్షేత్రయుద్దం సమీపిస్తున్న సమయంలో  పులోమ, కాలక అనే రాక్షసస్త్రీల కొడుకులైన పౌలోములను, కాలకేయులను చంపాడు. శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని, దేవలోకం వెళ్ళి ఇంద్రునినుంచి మరికొన్ని దివ్యాస్త్రాలను  పొందిన తర్వాత; ఊర్వశి అనే అప్సరస పన్నిన మోహపు ఉచ్చులో పడకుండా తప్పించుకున్నాడు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి ఇదీ అతను రచించుకున్న పూర్వరంగం! ఆ వెంటనే మరో ‘నరు’డైన నలుని చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ క్రమం, నరుని ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు కల్పించున్న ప్రణాళికను సూచిస్తూ ఉండచ్చు.

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒక అల్పజీవిగా ఇరుక్కుని ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. క్రమంగా నరుడు వీరుడిగా మారి ఆ ప్రపంచంలోంచి తనను తాను విముక్తం చేసుకుని విశ్వరూపం ధరిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆదిమ పౌరాణికతకు భిన్నమైన తాత్వికతను, తాత్విక ప్రతీకలను సృష్టించాడు.  ఈ పరిణామం తరతమ భేదాలతో దాదాపు ప్రపంచమంతటా జరిగింది. మెసపొటేమియా, భారతదేశం, గ్రీసు మొదలైన చోట్ల ఇది ఐతిహాసిక యుగాన్ని స్థాపించింది. గిల్గమేశ్, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, అర్జునుడు, సారగాన్, హమ్మురాబి, అచెలూయెస్(ఇలియద్), ఓడిసస్ మొదలైన వీరులను సృష్టించింది. వీరిలో పలువురు ఇతిహాస నాయకులయ్యారు.  గిల్గమేశ ఇతిహాసం (ఎపిక్ ఆఫ్ గిల్గమేశ్), రామాయణం, మహాభారతం, ఇలియద్, ఒడిస్సే మొదలైనవి వీరిని కీర్తించాయి.

ఇక ఇప్పుడు ఆదిమ పౌరాణికత, నూతన పౌరాణికతల మధ్యనున్న తాత్విక భేదాలలోకి వెడదాం:

‘యెహోవా కూడా కాళియ మర్దనుడే’ అనే వ్యాసంలో పాములే శిరోజాలుగా ఉన్న మెడూసా అనే దేవత గురించి ప్రస్తావించుకున్నాం. ఆ దేవత చూపులే మగవారిని దహించివేస్తాయి. పెర్సియస్ అనే దేవుడు ఆమె తలను నరుకుతాడు. ఎథెనా అనే దేవత ఆదేశం పై అస్లేపియస్ అనే దేవవైద్యుడు మెడూసా కుడి, ఎడమ నరాల నుంచి రక్తం సంగ్రహిస్తాడు. కుడి నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికి, ఎడమ నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికి వినియోగిస్తాడు. అంటే ప్రాణం పోయడం, తీయడం అనే రెండు శక్తులూ ఈ దేవతలో సహజీవనం చేస్తున్నాయన్న మాట.

kali

ఇటువంటి మెడూసాను క్యాంప్ బెల్ మన కాళికాదేవితో పోలుస్తారు. కాళిక తన కుడి చేత్తో వరాలు ఇస్తుంది, ఎడమ చేతిలో కరవాలాన్ని ధరించి ఉంటుంది. కాళి విశ్వంలోని అన్ని జీవులకూ జన్మనిచ్చే జగజ్జనని, అమ్మల గన్న యమ్మ. అయినాసరే, రక్తదాహాన్ని చాటుతున్నట్టుగా ఆమె ఎర్రని నాలుక చాస్తుంది. కపాలాలనే  హారంగా ధరిస్తుంది. తెగిన చేతులు, కాళ్లనే వస్త్రంగా చుట్టుకుంటుంది.  కాళి అనే పేరు నలుపును, కాలాన్నీ కూడా సూచిస్తుంది. జనన మరణాలు అనేవి కాలంలోనే సంభవిస్తుంటాయి. అందుకే యముణ్ణి కాలుడు అన్నారు.  జీవుల జనన, మరణాలను శాసించే దేవత కాళి. విశ్వానికి గర్భమూ, సమాధీ కూడా ఆమెయే. ఆమె అద్వితీయమైన(ఇంకొకటి లేని)ఆదిమశక్తి. ప్రకృతి యొక్క చరమసత్యం. దేవుళ్ళు అందరూ ఆమె ఆదేశాలను పాటించవలసిన ఆమె ప్రతినిధులు మాత్రమే.

మన ‘దేవీ భాగవతం’ ఈ జగజ్జనని అద్వితీయతను, ఆధిక్యాన్ని చెబుతుంది. మన పురాణాలు సృష్టి, స్థితి, లయం అనే మూడు మాటల్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటాయి. ఇవి మూడు రకాల కార్యాలను సూచిస్తాయి. విడివిడిగా చెప్పుకుంటే; సృష్టి అంటే విశ్వాన్ని సృష్టించడం-ఇది బ్రహ్మదేవుడి పని. స్థితి అంటే విశ్వం సక్రమంగా నడిచేలా చూస్తూ దానిని పోషించడం-ఇది విష్ణువు పని. లయమంటే సృష్టిని అంతమొందించడం-ఇది శివుడు చేసే పని. కానీ ఆదిమ పౌరాణికతలో ఈ మూడింటినీ ఒక్క జగజ్జననే చేస్తుంది. ఈ శక్తులన్నీ ఆమెలోనే ఇమిడి ఉంటాయి. పైన చెప్పిన త్రిమూర్తులు కూడా ఆమె సంతానమే.

మన పురాణాలలో అత్రి మహాముని భార్య అనసూయ ఉదంతం పరోక్షంగా దీనినే చెబుతుంది. ఒకసారి త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలనుకున్నారు. ముగ్గురూ అతిథులుగా అత్రి ఆశ్రమానికి వెళ్లి, నువ్వు నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే ఆతిథ్యాన్ని స్వీకరిస్తామని అనసూయతో అన్నారు. ఆమె సరే నని  ముగ్గురినీ పసిపిల్లలను చేసి, తను నగ్నంగా మారి, వారి ముందు విస్తళ్ళు వేసి వడ్డించి, తను తిరిగి చీరకట్టుకుని వచ్చి వారిని పెద్దవాళ్ళుగా మార్చింది. ఆ తర్వాత వారిని మరోసారి పసిపిల్లలను చేసి తన దగ్గరే ఉంచుకుందని, అప్పుడు వారి భార్యలు వెతుక్కుంటూ వచ్చారని కథ.

మృత్యు, పునరుజ్జీవనాలు రెండింటికీ చెందిన దేవతారూపమూ, ఆ దేవతకు సంబంధించిన పురాణ కథలూ లెవంట్ (సైప్రస్, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, లెబనాన్, టర్కీలను లెవంట్ అంటారు) అంతటా నూతన శిలా యుగం నుంచి, దాని అనంతర యుగంవరకూ కొన్ని వేల సంవత్సరాలపాటు సుపరిచితాలు. క్రీ .పూ. 5,500కు చెందిన సమీపప్రాచ్యంతో మొదలుపెట్టి, క్రీ.శ. 1531కి చెందిన గౌదలూపే(Gaudalupe: స్పెయిన్, అమెరికా, బొలీవియా, పెరూ, కొలంబియా, మెక్సికో సహా స్పానిష్ భాష మాట్లాడే దేశాలలో కనిపించే ఒక ప్రాదేశిక నామం) వరకు ఈ దేవతామూర్తులు, ఆమెకు సంబంధించిన పురాణకథలలో ఒక అవిచ్ఛిన్నత కనిపిస్తుంది.  ఆసియా మైనర్, నైలు, గ్రీసు, సింధు లోయ సహా పురాతన ప్రపంచం అంతటా వివిధ వైఖరులకు చెందిన నగ్నస్త్రీ మూర్తులు విస్తారంగా కనిపించాయి. సృష్టిస్థితి లయాలతో సహా అన్నింటినీ సంకేతించే ఈ దేవతకు చెందిన ఒక రూపం తన రెండు చేతులతో స్తనద్వయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకో రూపం ఎడమ చేతితో జననేంద్రియాన్ని, కుడి చేతితో స్తనాన్ని చూపిస్తుంది. ఇంకొక రూపం మగశిశువుకు పాలిస్తూ కనిపిస్తుంది. వేరొక రూపం రెండు చేతులూ చాపి, వాటిలో పంటకు సంబంధించిన కంకులను, పువ్వులను, సర్పాలను, పావురాలను, ఇతర చిహ్నాలను పట్టుకుని పశువుల మధ్య నిలబడి కనిపిస్తుంది.

The Goddess of the Mountain

యూరప్ కు సంబంధించినంతవరకు అభివృద్ధి చెందిన తొలినాటి కంచుయుగ రూపాలు క్రీటుద్వీపంలో కనిపించాయి. ఈ ద్వీపంపై లెవంట్ ప్రభావం పడింది. క్రీ.పూ. 25౦౦-క్రీ.పూ. 12౦౦ ల మధ్యకాలంలో క్రీటు నాగరికత (మినోవన్ నాగరికత) ఉచ్ఛదశను చవిచూసింది. మన దేశంలో సింధు నాగరికతకు చెందిన హరప్పా-మొహెంజదారోల కాలం కూడా ఇదే.  క్రీటునగరం నోసోస్ లోని ప్రాసాదం శిథిలాలలో క్రీ.పూ. 1500 కు చెందిన ఒక సీలు దొరికింది. ఆ సీలు మీద ఒక దేవత బొమ్మ ఉంది. ఆమె జగత్ పర్వత దేవత(The Goddess of the World Mountain). ఆమె ఒక దండం లాంటిది పట్టుకుని కొండ మీద నిలబడి ఉంటుంది. రెండువైపులా రెండు సింహాలు ఉన్నాయి. ఆమె వెనకాల క్రీటు ఆలయరీతిని ప్రతిబింబించే ఒక భవనం ఉంది. ఆమె ఎదురుగా భక్తిని చాటే భంగిమలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు బహుశా చావు-పుట్టుకలను సూచించే ఆమె కొడుకు-భర్త; లేదా క్రీటు యువరాజు, లేదా ఒక భక్తుడు కావచ్చునని క్యాంప్ బెల్ అంటారు. ఒకవేళ అతను రాజే అయినప్పుడు, ఫ్రేజర్ చెప్పినదే నిజమైతే, ఎనిమిదేళ్ళ కోసారి శుక్ర-సూర్య ఆవృత్తి(Venus-solar cycle) పూర్తి అయినప్పుడల్లా రాజును నిజంగానో, ప్రతీకాత్మకంగానో బలి ఇచ్చేవారని కూడా ఆయన అంటారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్ధారణగా చెప్పలేకపోయినా, చావు-పునర్జన్మలను సంకేతించే యువకుని దేవతకు కొడుకుగా-భర్తగా స్పష్టంగా సూచించే దేవత చిత్రాలు అనేకం ఉన్నాయి. అలాగే రాజును బలి ఇవ్వడం గురించి చెప్పే చిత్రాలు, ఉదంతాలు కూడా.

వాటిని అలా ఉంచితే,  ఈమె పర్వతదేవత కావడం మన పురాణాలలోని పార్వతినీ; ఈమెకు రెండువైపులా సింహాలు ఉండడం –పార్వతికి మరో రూపమైన సింహవాహిని దుర్గను గుర్తుచేస్తాయి. పై దేవత పశువుల అధిదేవత(Lord of the Beasts)ను పోలి ఉందని పురావస్తు నిపుణులు అనడం గమనిస్తే, పశుపతి అయిన శివుడు వెంటనే గుర్తుకొస్తాడు. మొదట అమ్మవారి పాలనలో ఉన్న పశువులు, తర్వాత అయ్యవారి పాలనలోకి వెళ్ళాయన్నమాట.

The Goddess of the Double Axగ్రీసులోని క్రి.పూ. 2వ సహస్రాబ్దికి చెందిన పురాతన నాగరికతా ప్రాంతమైన మైసీనియాలో లభించిన ఒక గుండ్రని సీలు మీద ఒక చిత్రం ఉంది. ఆ చిత్రంలో ఉన్నది ‘జంట గొడ్డలి దేవత’(Goddess of the Double Ax). చిత్రంలో పైన సూర్యుడు, చంద్రవంక ఉన్నారు. చంద్రుడు క్షీణదశలో ఉండగా, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చంద్రుడి వెనకాల ఎడమ చేతిలో ఒక దండం పుచ్చుకుని చిన్న స్త్రీమూర్తి నిలబడి ఉంది. ఒక మైసీనియా డాలు ఆమెను కప్పుతోంది. మన మహిషాసురమర్దనిలా ఈ జంట గొడ్డలి దేవత యోధదేవత అనడానికి ఇది సూచన. అలాగే, దేవతకు చెందిన సంహార, లేదా మృత్యుదేవతా లక్షణానికి కూడా ఇది సూచన.(తాత్వికంగా చెబితే, ఈ సంహార కార్యాన్ని దుష్టశిక్షణ, శిష్టరక్షణగా అన్వయించడం తర్వాతి కాలంలో వచ్చింది. ఈ చిత్రం ప్రాతినిధ్యం వహించే ఆదిమ పౌరాణికకాలంలో ఆ అర్థం లేదు). ఈ చిన్న స్త్రీమూర్తి, బలి ఇచ్చిన ఆరు పశువుల శిరస్సులను తన కుడి చేతితో చూపుతోంది. దానికి సరిగ్గా అభిముఖంగా పుష్కలంగా పండిన పండ్లతో ఒక చెట్టు ఉంది. అది జీవవృక్షం(Tree of Life). ఒక చిన్న పిల్ల ఎగిరి పండ్లు కోసుకుంటోంది.

చిత్రం మధ్యలో కనిపిస్తున్నది, క్రీటుకు చెందిన జంట గొడ్డలి. దాని ఒక అంచు బలిని సూచిస్తోంది. రెండవ అంచు జీవవృక్షాన్ని సూచిస్తోంది. చెట్టు కింద కూర్చుని ఉన్నదే జంట గొడ్డలి దేవత. ఆమె ప్రసన్నవదనంతో ఉంది. ఆమె ఎదురుగా ఇద్దరు భక్తులు ఉన్నారు. ఆమె కుడి చేతితో ఒక పంట తాలూకు మూడు కంకులు వారికి ఇస్తూ, ఎడమ చేతితో తన స్తనం ఒకదానిని ఎత్తిచూపుతోంది. ఆమె పాదాల దగ్గర ఒక చిన్నపిల్ల ఉంది. కాళ్ళు లేని ఆ పిల్ల భూమిలోంచి పైకి వస్తున్నట్టు ఉంది. ఆ అమ్మాయి ఎడమచేతిలో చిన్న జంట గొడ్డలి, కుడి చేతిలో చెట్టుకొమ్మ ఉన్నాయి.

చిత్రంలో ఈ చివర, డాలుతో కప్పిన స్త్రీమూర్తి కిందికి దిగుతున్న భంగిమలో ఉండడం, ఆ చివర ఒక బాలిక పైకి ఎగిరి పండ్లు కోసుకుంటున్న భంగిమలో ఉండడం ఇందులోని తాత్విక సారాంశాన్ని వెల్లడిస్తాయి. కిందికి దిగుతున్నట్టు ఉన్న స్త్రీమూర్తి మృత్యువుకు, ఎగిరి జీవవృక్షం పండ్లు కోసుకుంటున్న బాలిక పునర్జన్మకు సంకేతాలు. అంటే చావు, పుట్టుకలు రెండింటికీ ఈ జంట గొడ్డలి జగజ్జననే అధిదేవత. జంట గొడ్డలి సంకేతించేది కూడా దానినే. ఒక్కోసారి చావు, పుట్టుకలను వేర్వేరు దేవతలతో సంకేతించినా వారు ఈ దేవత అంశలు మాత్రమే. పితృస్వామిక పురాణాలకు ముందు పౌరాణిక ఉద్యానవనమూ(Mythic Garden), స్వర్గమూ(Paradise) కూడా ఈ దేవతే. ఈమె కొడుకు దుముజి చంద్రుని క్షీణ, వృద్ధి దశలను సంకేతిస్తూ చావు-పుట్టుకల చక్రభ్రమణం సాగిస్తూ ఉంటాడు.

The Minoan Double Ax

పైన పేర్కొన్న జగత్ పర్వత దేవత చిత్రంలోని సింహాలు కూడా ఒకవైపు మృత్యుభయాన్ని, ఇంకోవైపు పునర్జన్మను లేదా అమరత్వాన్ని సూచిస్తాయి. అంటే భక్షణ, రక్షణ -రెండింటికీ ఇవి ప్రతీకలు. గ్రీకుదేవత మెడూసా, మన కాళికాదేవి సంకేతించేది కూడా సరిగ్గా ఇదే. అంటే జగజ్జనని ప్రపంచంలో చావు-పుట్టుక, భయమూ-నిర్భయమూ అనే ద్వంద్వాలు లేవు. ప్రకృతి నియతికి ప్రతిరూపంగా సాగే ఆ జీవనంలో మంచి-చెడు; వెలుగు-చీకటి, ధర్మమూ-అధర్మమూ అనేవి నేడు మనం భావించుకునే సరళిలో ఉండకపోవచ్చు. ద్వంద్వాలు అన్నీ ఒకదానిలో ఒకటి కలసిపోతున్న, ఒకదాని వెంట ఒకటిగా చక్రభ్రమణం సాగిస్తున్న ఒక అద్వితీయ ప్రపంచం అది. ప్రకృతిలో కూడా జరిగేది అదే. మొక్క మరణించి తన విత్తనంలోంచి తనే పునర్జన్మ ఎత్తుతూ ఉంటుంది. శిశిరంలో మోడువారిన చెట్టు వసంతం రాగానే చిగురిస్తుంది.  ప్రకృతికి ప్రతిబింబమే జగజ్జనని తాత్వికత కూడా.

ఈ ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, గుట్టలు, తోపులు, పక్షులు, పశువులు, సర్పాలు, చంద్రుడు, తారలతో సహా సమస్తమూ జగజ్జనని పరివారమే. వీటిలో మళ్ళీ కొన్ని ద్వంద్వాలకు తావులేని జగజ్జనని తాత్వికతకు అద్దంపట్టే ముఖ్యమైన ప్రతీకలు కూడా అయ్యాయి. వాటి గురించి కొంత ఇప్పటికే చెప్పుకున్నాం. మరికొన్ని విశేషాలు తర్వాత…

 ~

మీ మాటలు

*