అతని డైరీ రాతల్లో మానవ అనుభవాల పచ్చిదనం…

 

స్లీమన్ కథ-6

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తమ్ముడు మరణించిన వార్త స్లీమన్ కు చేరింది 1850 ఆగస్టులో…

ఆ ఏడాది మిగతా రోజుల్ని తన వ్యాపార పర్యవేక్షణలోనూ, ఏం చేయాలో తోచని అనిశ్చితస్థితిలోనూ గడిపేశాడు. తమ్ముడి మరణం అతన్ని చలింపజేసింది. మృత్యువు గురించిన ఊహ భయపెట్టింది. దుఃఖభారం తన మీద హఠాత్తుగా పడినట్టుగా కుటుంబ సభ్యుల మీద పడకూడదనుకుని ఒక విచిత్రమైన ఉత్తరం రాశాడు. తమ్ముడు చనిపోయినట్టు తనకు కల వచ్చిందనీ, ఈ ఇరవయ్యేళ్లలో ఎప్పుడూ ఏడవని తను ఆ కలను తలచుకుని మూడు రోజులపాటు దుఃఖించాననీ అందులో రాశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అసలు విషయం రాస్తూ, తమ్ముడు ఓ పెద్ద ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతిని కూడా తెలియజేశాడు.

ఏడాది చివరిలో అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తమ్ముడి ఆస్తిని సంరక్షించవలసిన బాధ్యత తనకు ఉంది. దాంతోపాటు అతని అడుగుజాడల్లో నడుస్తూ తను కూడా కాలిఫోర్నియా బంగారు భూముల దగ్గరకు వెళ్ళి అతని డబ్బుతోనే వ్యాపారం చేసి సెయింట్ పీటర్స్ బర్గ్ లో కన్నా వేగంగా కోట్లు సంపాదించచ్చు. అంతకన్నా ముందు తమ్ముడికి తగిన సమాధిని నిర్మించాలి. తనింక అమెరికాలోనే స్థిరపడిపోతాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో తనను కట్టి పడేసేవేమీ లేవు. కాకపోతే ఎకతెరీనా లిషిన్ ను తను ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆమెను తను పెళ్లి చేసుకుంటే మళ్ళీ రష్యా రావలసి ఉంటుంది. ఆమె పెళ్ళికి ఇష్టపడాలన్నా తను అమెరికా వెళ్ళి ఆమె కళ్ళకు జిగేలుమనిపించేటంత ఐశ్వర్యాన్ని గడించవలసిందే.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే జీవితాంతం పాతుకు పోవాలని ఇంతకుముందు అనుకున్నాడు. ఇప్పుడది పొరపాటు నిర్ణయం అనుకుంటున్నాడు. మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనీ, ఆగిన చోట ఆగకుండా మరోసారి సంచారజీవిగా మారాలనీ తలపోస్తున్నాడు.

1850 డిసెంబర్ 10న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన వర్తక మిత్రులకు చివరి విందు ఇచ్చి ఆ నగరానికి వీడ్కోలు చెప్పాడు. నేవా నది గడ్డకట్టి ఉంది. సెయింట్ ఇసాక్ స్క్వేర్ మీదుగా మంచు గాలులు వీస్తున్నాయి. మిత్రులు అతన్ని సాగనంపడానికి పోస్టాఫీస్ దాకా వచ్చారు. అక్కడినుంచే జర్మనీకి దూరప్రయాణం చేసే స్లై బళ్ళు బయలుదేరతాయి. అక్కడి వింటర్ ప్యాలెస్, నౌకాదళ భవనం, అశ్వాన్ని అధిష్టించి ఉన్న పీటర్ ది గ్రేట్ విగ్రహం పక్కగా వెడుతూ అదే చివరిసారి అన్నట్టు వాటికి శాల్యూట్ చేశాడు.

ప్రయాణంలో ఎప్పటిలానే డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ రాతలు చాలావరకూ టైమ్ టేబుల్ కు పొడిగింపే. వాటిలో రైళ్ల రాకపోకల వేళలు, ప్రయాణంలో తగిలిన రైల్వే స్టేషన్ల పేర్లు, తను బస చేసిన హోటల్ వివరాలు, ఆరో అంతస్తులో తను దిగిన గదికి చెల్లించిన కిరాయి, బ్యాంక్ లో తను మారకం చేసిన మొత్తం, తన అనుమతితో కలసుకున్న వర్తకుల పేర్లు వగైరాలు ఉంటాయి.

1850 డిసెంబర్ 15న డైరీలో ఇలా రాసుకున్నాడు:

ఉదయం 7గం. లకు ఎల్బింగ్ లో బ్రేక్ ఫాస్ట్ చేశాం. 11గం.లకు మేరియన్ బర్గ్ దాటాం. సాయంత్రం 4గం.లకు ఓ పెద్ద తేలుడు వంతెన మీంచి విష్టులా మీదుగా డిషావ్ చేరుకున్నాం. డిసెంబర్ 18న మధ్యాహ్నానికి ఓడెన్ బర్గ్ చేరాం. అక్కడ డిన్నర్ చాలా అధ్వాన్నంగా ఉంది. 1గం.కు రైల్లో బయలుదేరి సాయంత్రం 5.30గం.లకు స్టార్ గాడ్ మీదుగా స్టెటిన్ చేరాం. అక్కడినుంచి మళ్ళీ 6.30గం. లకు రైల్లో బయలుదేరి రాత్రి 9.30గం.లకు బెర్లిన్ చేరాం.

అదృష్టవశాత్తూ అతని డైరీ రచన ప్రతిసారీ ఇలాగే లేదు. తన అమెరికా ప్రయాణం డైరీని అతను ఇంగ్లీష్ లో రాశాడు.   అందులోని కొన్ని భాగాలు అతని అత్యుత్తమ రచనల్లో ఒకటిగా మిగిలిపోతాయి. ప్రచురణకూ, ఇంకొకళ్ళు చదవడానికీ ఉద్దేశించకపోయినా వాటినతను ఎంతో శ్రద్ధగా రాశాడు. కొన్నిచోట్ల కథనంలో గొప్ప నిజాయితీ, నిర్మొహమాటం ఉట్టిపడుతూ అతని అనుభవప్రపంచంలోకి మనల్ని ఇట్టే తీసుకుపోతాయి.

డైరీ తెరవగానే, ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోడానికి అంగలార్చుతూ బయలుదేరిన అసలుసిసలు వ్యాపారవేత్తగానే అతను కనిపిస్తాడు. తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోగల తన వ్యాపారపు మెళవకుల గురించిన డాంబికత; గురి తప్పని తన అంచనాల గురించిన ఆత్మవిశ్వాసమూ ఆ రాతల్లో వ్యక్తమవుతాయి. కానీ ముందుకు వెడుతున్నకొద్దీ అతన్ని మొదలంటా వణికింపజేసిన మానవ అనుభవాల పచ్చిదనం కనిపిస్తుంది. తుపాను, గాలివాన, అస్వస్థత అతనిలోని అతిశయపు గాలి తీసేసి అణిగి ఉండేలా చేశాయి. భయభీభత్సాల ముఖాన్ని అతి దగ్గరగా చూసి అతను  మామూలు మనిషయ్యాడు.

అతని డైరీ తొలి పుటల్ని తిరగేసేవారెవరూ, కాన్ రాడ్ రాసిన Heart of Darkness తో పోల్చదగిన ఒక మానవీయ అనుభవపత్రాన్ని ముందు ముందు చదవబోతున్నామని అనుకోలేరు

పనామా జలసంధిలో చాగరెస్ నది

పనామా జలసంధిలో చాగరెస్ నది

స్లీమన్ ఏమ్ స్టడామ్ చేరుకుని బి. హెచ్. ష్రోడర్ &కో ను సందర్శించాడు. అమెరికాలోని ఏజెన్సీలకు, బ్యాంకులకు పరిచయలేఖలు తీసుకున్నాడు. అక్కడినుంచి బయలుదేరి డిసెంబర్ 23న లండన్ చేరుకున్నాడు. “బ్లాక్ ఫ్రయర్స్ బ్రిడ్జి” దగ్గర, “రాయల్ హోటల్” లో బస చేశాడు.  తను సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తెచ్చుకున్న బిల్లులను నగదుగా మార్చుకున్నాడు. తన దగ్గరున్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు అమ్మేశాడు. మధ్యాహ్నం క్రిస్టల్ ప్యాలెస్ ను దర్శించి ఆనందించాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతికి అది కూడా ఒక తిరుగులేని ఉదాహరణగా కనిపించింది.

క్రిష్టమస్ రోజున వెస్ట్ మినిస్టర్ యాబేలో చర్చి సేవల్లో పాల్గొన్నాడు. అదే రోజున ప్రముఖ విషాదాంత నాటక నటుడు మెక్రాడే రంగస్థలంనుంచి విరమించుకునే ముందు నటించిన చివరి నాటకాన్ని చూశానని డైరీలో రాసుకున్నాడు. నిజానికి మెక్రాడే క్రిష్టమస్ రోజంతా పూర్తిగా తన కుటుంబంతో గడిపాడు తప్ప ముఖానికి రంగు వేసుకోలేదు. అతను చివరిసారి నటించింది అప్పటికి రెండు నెలల తర్వాత! 1851 ఫిబ్రవరి 26న ప్రిన్స్ థియేటర్ లో జరిగిన ఆ బ్రహ్మాండమైన ప్రదర్శనను తిలకించినవారిలో డికెన్స్, బుల్వర్-లిటన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. స్లీమన్ మరెవరి నాటకమో చూసి మెక్రాడేదిగా పొరబడి ఉంటాడు.

క్రిష్టమస్ మరునాడే రైల్లో లివర్ పూల్ చేరుకుని తను ఎప్పుడూ దిగే అతి పెద్ద హోటల్ అడెల్ఫీలో బసచేశాడు. 35 పౌండ్లు చెల్లించి న్యూయార్క్ ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రి వరకూ లివర్ పూల్ లో అక్కడా అక్కడా తిరిగాడు.

ss atlantic (1)

ఎస్.ఎస్. అట్లాంటిక్

3వేల టన్నుల బరువైన ఎస్.ఎస్. అట్లాంటిక్ ఆ మరునాడే న్యూయార్క్ కు బయలుదేరింది. ఆ రోజుల్లో అత్యంత వేగంగా ప్రయాణించే ఓడల్లో అదొకటి. బయలుదేరిన ఎనిమిది రోజులకు తుపానులో చిక్కుకుంది. ఓ పెద్ద అల ముందుచక్రాన్ని ధ్వంసం చేసి ప్రధాన స్తంభాన్ని విరిచేసింది. అలలు ఓడను తలోవైపుకీ విసిరేయడం ప్రారంభించాయి. ఇంజన్లు రెండూ పనిచేయడం మానేశాయి. అప్పటికి ఓడ లివర్ పూల్ నుంచి 1,800 మైళ్ళు ప్రయాణించి, న్యూయార్క్ కు 1,400 మైళ్ళ దూరంలో దాదాపు అట్లాంటిక్ నడి మధ్యలో ఉంది.

ఉధృతంగా వీస్తున్న పడమటి గాలిని ఆసరా చేసుకుని సముద్రానికి అడ్డంగా ప్రయాణించి అమెరికా తీరానికి చేరుకోవచ్చుననుకుని కెప్టెన్ ప్రధాన తెరచాపల్ని ఎగరేశాడు. “తెరచాపలు జేబురుమాళ్లను తలపించాయి” అని స్లీమన్ డైరీలో రాసుకున్నాడు. తుపాను గాలులకు అభిముఖంగా ప్రయాణించాలన్న కెప్టెన్ ఆలోచనను ప్రయాణీకులంతా వ్యతిరేకించారు. ఇంగ్లండ్ కు తిరిగి వెళ్ళడం మంచిదన్నారు. పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. చివరికి ప్రయాణీకుల ఒత్తిడికి తలవొగ్గి కెప్టెన్ ఓడను వెనక్కి తిప్పాడు.

సముద్రపు గాలి పడక స్లీమన్ అంతవరకూ అస్వస్థతతో ఉన్నాడు. తుపాను కలిగించిన ఉద్రిక్తత పుణ్యమా అని ఆ  అస్వస్థత మంత్రించినట్టు మాయమైపోయింది. పైగా అంతవరకూ లేనంత ఉల్లాసాన్ని తను పుంజుకోవడం గమనించి స్లీమన్ ఆశ్చర్యపోయాడు. ఘనత వహించిన ఆ ఓడ చీలికలు పీలికలైన తెరచాపలతో ఇంటిముఖం పడుతుంటే వింతగా చూస్తూ ఉండిపోయాడు.

పదహారు రోజుల తర్వాత క్వీన్స్ టౌన్ లో ఓడకు లంగరేశారు. స్లీమన్ వెంటనే బయలుదేరి డబ్లిన్ మీదుగా లివర్ పూల్ కు తిరిగి వచ్చాడు. అంతలో ఏమ్ స్టడామ్ లో ఓ ముఖ్యమైన వ్యాపారలావాదేవీకి తను అత్యవసరంగా హాజరు కావాలన్న కబురు అందింది. హడావుడిగా అక్కడికి వెళ్ళి ఫిబ్రవరి 1 కల్లా మళ్ళీ లివర్ పూల్ వచ్చి న్యూయార్క్ ప్రయాణానికి తిరిగి సిద్ధమైపోయాడు.

ఈసారి అతను ఎస్.ఎస్. ఆఫ్రికాలో ప్రయాణం చేశాడు. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయింది. అతనికి న్యూయార్క్ నచ్చింది. యూరోపియన్ రాజధానులతో పోల్చదగింది కాకపోయినా, “సొగసైన భారీ భవంతులతో ఓ పద్ధతిగా, చూడముచ్చటగా, శుభ్రంగా నిర్మించిన నగరం” అనుకున్నాడు. న్యూయార్క్ లోని ఆడవాళ్ళలో మాత్రం మెచ్చుకోదగింది ఏమీ అతనికి కనిపించలేదు. “16-18 ఏళ్ల వయసులో ఎంత అందంగా, కుదిమట్టంగా ఉంటారో, 22 ఏళ్ళు వచ్చేసరికి అంత వయసుమీరినవాళ్లలా, నలిగిపోయినట్టు కనిపిస్తారు” అని డైరీలో రాసుకున్నాడు. వినోదాలకు, పనికిమాలిన విషయాలకు వాళ్ళు వెంపర్లాడతారని కూడా అతనికి అనిపించింది.

అక్కడి రైలురోడ్లు కూడా అతనికి నచ్చలేదు. రైల్లో ఫిలడెల్ఫియాకు వెళ్లొచ్చిన తర్వాత, “అమెరికాలో రైలురోడ్లు కేవలం డబ్బు చేసుకోడానికే నిర్మించారు. ప్రయాణీకులకు అవసరమైన సదుపాయాలపై కనీసమైన దృష్టి కూడా పెట్టలేదు” అని రాశాడు. అలా అన్నవాడే ఆ తర్వాతి కాలంలో అమెరికా రైలు రోడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాడు.

వాషింగ్టన్ వెళ్ళి అధ్యక్షుడు ఫిల్ మోర్ ను కలసుకున్నాడు. “ఈ అందమైన పడమటి దేశాన్ని చూడడానికీ, దీనిని పాలించే మహనీయుల్ని పరిచయం చేసుకోడానికీ వచ్చా”నని అధ్యక్షుడితో చెప్పినట్టు రాశాడు. ఆ వెంటనే వైట్ హౌస్ లో జరిగిన ‘స్వయిరీ’(soiree: సాధారణంగా ఒక ప్రైవేట్ గృహంలో జరిగే సాయం విందు. దీనికి నిర్దిష్టమైన దుస్తులతో హాజరవుతారు)లో పాల్గొని, పనామా జలసంధి(Isthamus of Panama)కి దారితీసే ఓడ ఎక్కాడు. ఆ రోజుల్లో సుదూర పశ్చిమానికి వెళ్లడానికి అదొక్కటే దారి. అప్పటికింకా పనామా రైలురోడ్డు లేదు. జలసంధికి చేరుకున్నాక కంచర గాడిదల మీద ప్రయాణం చేసేవారు. ఆ ప్రాంతంలో యెల్లో ఫీవర్ లాంటి మన్య జ్వరాల బెడద ఎక్కువగా ఉండేది. చుట్టుపక్కల అడవుల్లో బందిపోట్ల సమస్యా ఉండేది.

స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు:

పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి ఆదివాసులు అచ్చంగా ఆదమ్, ఈవ్ ల వారసులే. నగ్నంగా తిరుగుతూ, ఇక్కడ విస్తారంగా లభించే పండ్ల మీద ఆధారపడుతూ తమ పూర్వీకుల పద్ధతులను, ఆచారాలను పూర్తిగా పాటిస్తున్నారు. వీళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించేది దారుణమైన సోమరితనం. వేరే ఏ పనీ చేయకుండా ఉయ్యాలలో పడుకుని తింటూ, తాగుతూ గడుపుతారు. మొత్తానికి అద్భుతమైనవాళ్ళు.

అద్భుతం అలా ఉంచి, వాళ్ళ సోమరితనాన్నీ, వాళ్ళనూ చూసి అతను భయపడ్డాడు. దారి పొడవునా ఇండియన్ల చేతుల్లో హతులైన బాటసారుల ఎముకల పోగులు కనిపించాయి. పనామా చేరాడు కానీ ఆ నగరం అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. అక్కడి స్పానిష్ జనం కూడా అతనికి “సోమరిపోతుల్లానూ; న్యూయార్క్ లోని ఆడవాళ్ళలానే  వినోదాలకు, పనికిమాలిన ఆసక్తులకు పాకులాడేవాళ్లుగానూ, పెద్దగా శీలసంపద లేనివాళ్ళుగానూ” కనిపించారు. ఇలా చూసీ చూడగానే మనుషుల మీద తొందరపాటు తీర్పులు ఇవ్వబోయాడే కానీ, ఉష్ణమండల ప్రాంతాలలో జనజీవితం చాలావరకూ ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందనీ, వారి ఆకాంక్షలకు అదే హద్దులు గీస్తుందన్న సంగతి అతనికి తట్టలేదు.

పనామాలో అతనికి ఏదీ నచ్చకపోయినా, విచిత్రంగా ఒకవిధమైన సంతృప్తినీ చెందాడు. ప్రయాణం దాదాపు ముగిసి, కాలిఫోర్నియా బంగారం చేతికి అందబోయే అవకాశం అతనిలో ఉత్సాహం నింపింది. అక్కడికి వెళ్ళే ఓడకు ఇంకా కొన్ని రోజుల వ్యవధి ఉంది కనుక ఈలోపల పనామా పాతనగరం చూద్దామని వెళ్ళాడు. మోర్గాన్, అతని సముద్రపు దొంగల ముఠా ధ్వంసం చేయడంతో సగం నగరం పాడుబడి ఓ పెద్ద అడవిలా తయారైంది.

అంకెర్షాగన్ విడిచిపెట్టాక అతను శిథిలాలను చూడడం ఇదే మొదటిసారి. ఆ దృశ్యం అతనికి పెద్దగా ఉత్తేజం కలిగించలేదు కానీ, ఆ పురాతనపు గోడల్లో చెట్ల వేళ్ళు ఎలా పాతుకున్నాయా అనుకుంటూ వింతగా వాటినే చూస్తూ ఉండిపోయాడు. పనామా పాతనగరం సందర్శనను పురావస్తు అన్వేషణలో అతని తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. తన వెంట వచ్చిన గైడ్ ఓ మొద్దావతారమనీ, ఆ శిథిలాల గురించి అతనికేమీ తెలియదనీ, సమయం వృథా అవడం తప్ప ఈ ప్రయాణంతో ఒరిగిందేమీ లేదనీ రాసుకున్నాడు.

1851 మార్చి 15న ఎస్.ఎస్. ఓరెగన్ మీద కాలిఫోర్నియాకు బయలుదేరాడు. ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ అసహ్యించుకున్నాడు. భోజనం పరమ రోతగా ఉందంటూ పళ్ళు నూరాడు. ఎంతసేపూ ఉప్పులో ఊరేసిన పందిమాంసం, గొడ్డు మాంసం తప్ప; ఐసుకానీ, తాజా మాంసంకానీ లేదు. సముద్రస్నానాన్ని మాత్రం చాలా ఇష్టపడ్డాడు. అయితే ఓడలోని పనివాళ్లు అందుకు సహకరించకపోవడం అతనికి విచిత్రంగా అనిపించింది.

వారం రోజుల తర్వాత ఓడ అకపుల్కో చేరింది. స్పానిష్ జనంపై అతనిలో ఏర్పడిన అవిశ్వాసం ఇప్పుడు మెక్సికన్లవైపు మళ్ళింది. వాళ్ళు వట్టి అబద్ధాలకోరులు, అజ్ఞానులు, పొగరుబోతులు అనుకున్నాడు. అకపుల్కో “ఓ ఆఫ్రికా గ్రామం”లా కిక్కిరిసిన గుడిసెల గుంపులా ఉందన్నాడు. పసుపురంగు సముద్రపు కలుపుతో నిండిన అఖాతం చుట్టూ కొన్ని చెక్కఇళ్ళు మాత్రమే ఉన్న కుగ్రామంగా శాన్ డియేగోను తీసిపారేశాడు. ఆ నేలను, తోటి ప్రయాణీకులను ఏవగించుకుంటూ, ఖగోళ గ్రంథాలు చదువుతూ, రాత్రిపూట గంటల తరబడి నక్షత్రాలను పరిశీలిస్తూ గడిపాడు. అతనిలో అసహనం ఎంత తారస్థాయికి వెళ్ళిందంటే, ఓడ గోల్డెన్ గేట్ (శాన్ ఫ్రాన్సిస్కోను మెరీన్ కౌంటీతో కలిపే జలమార్గాన్ని గోల్డెన్ గేట్ అంటారు. 1933లో అక్కడ గోల్డెన్ గేట్ వంతెన నిర్మించారు)కు చేరడం ఏ కొంచెం ఆలస్యమైనా భగ్గున పేలిపోయి ఉండేవాడు.

శాన్ ఫ్రానిస్కోను చూసి మాత్రం చాలా సంతోషించాడు. అయినా సమయం వృథా చేయడానికి లేదనుకుంటూ తమ్ముడి సమాధిని చూడడానికి వెంటనే సెక్రామెంటోకు దారితీశాడు. అప్పటికి సెక్రామెంటో ఇంకా బాల్యదశలోనే ఉంది. చెక్క గోడలతో నిర్మించిన ఇళ్లతో ఈ విచిత్రమైన పట్టణం, పొరుగునే ఉన్న బంగారు భూముల పుణ్యమా అని ఉనికిలోకి వచ్చింది. మొదటిసారి సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టినప్పుడు తనలోంచి ఆశ్చర్యకరమైన ఉధృతితో తోసుకొచ్చిన అనుభూతి లాంటిదే ఈ పట్టణంలో అడుగుపెట్టగానే అతనికి కలిగింది.  ఈ పట్టణ జనాభా కన్నా, ఇక్కడి శ్మశానంలోని సమాధులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అతను గమనించాడు.

తమ్ముడి సమాధిని చూశాడు. అక్కడ ఎలాంటి స్మారకచిహ్నాలూ లేవు. “ఒక చక్కని పాలరాతి సమాధి”ని నిర్మించమని చెప్పి ఓ శవవాహకుడికి 15 పౌండ్లు ఇచ్చాడు. తమ్ముడు విడిచి వెళ్ళిన సంపద గురించి వాకబు చేశాడు. అతని భాగస్వామి దాన్ని పుచ్చుకుని పారిపోయాడని అక్కడి వాళ్ళు చెప్పారు. పోలీసుల సాయంతో అతన్ని పట్టుకోవచ్చేమో నని కొంత భోగట్టా చేశాడు. చివరికి అదో వృథా ప్రయాస అన్న నిర్ణయానికి వచ్చి విరమించాడు. అలా తమ్ముడు సంపాదించానని చెప్పిన ముల్లె కాస్తా గాలిలో కలిసిపోయింది.

స్లీమన్ కు సెక్రామెంటో మామూలుగా నచ్చడం కాదు, మత్తెక్కించింది. కొత్తచోట ప్రతిసారీ చేసినట్టే చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ ఎలాంటి అవకాశాలుంటాయో పరిశీలించాడు. సటర్ విలాను, యుబా నది దగ్గరి బంగారు భూముల్ని, నెవాడా నగరాన్నీ దర్శించాడు. నెవాడా “చీదర పుట్టించే చిన్నపాటి ప్రదేశం”గా అతనికి కనిపించింది. ప్రయాణాల్లో తనలా బహుభాషా పరిచయం ఉన్నవాళ్లను గాలించి పట్టుకునే అలవాటు కూడా అతనికుంది. సొనోమా వ్యాలీలో అలాంటి వ్యక్తి తారసపడ్డాడు. అతను ప్రొఫెసర్ రీగర్. అతనికి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, డచ్చి భాషలు తెలుసు. ఒక భాషనుంచి ఇంకో భాషలోకి అవలీలగా లంఘించే ఆ అపరిచితునితో అర్థరాత్రి వరకూ కబుర్లాడుతూ స్లీమన్ ఆనందించాడు.

కొన్ని రోజులు అనిశ్చితంగా గడిపిన తర్వాత, బంగారం రజను(gold dust)కొనే వ్యాపారిగా అవతారమెత్తాడు. ఆ వ్యవహారంలోనే జూన్ లో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాడు. అగ్నిప్రమాదాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ నగరంలో అతను ఉన్నప్పుడే ఓ పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది…

                                                                                                                     (సశేషం)

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. కథ చాలా బాగుంది. వ్యాఖ్యానంగా కాకుండా యధాతథ అనువాదంగా ఉంటే బాగుండేది. ప్రయాణం ఇంత బాగుంటుందా అనిపించింది.

    • కల్లూరి భాస్కరం says:

      అజిత్ కుమార్ గారూ.. ఇది మామూలు కథగా చదువుకోవలసిన రచన కాదు. ఒక వ్యక్తి జీవితకథ. ఒక వ్యక్తి యొక్క బాహ్య, అంతరిక జీవితానికి సంబంధించిన అన్ని పార్స్వాలను పరిచయం చేసే ప్రయత్నంలో మధ్య మధ్య రచయిత తన గొంతు వినిపిస్తూ ఉంటాడు. దీనిని జీవిత కథ లేదా జీవితచరిత్ర అనే ప్రత్యేకమైన ప్రక్రియగా చదువుకోవాలి. తెలుగులో ఇలాంటి ప్రక్రియ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. తెలుగు ‘వ్యాకరణ దీపం’ లానే తెలుగు ప్రక్రియా దీపం కూడా చిన్నదే. ఇది నా మాట కాదు, ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివగారు అన్న మాట. ఇందుకు భిన్నంగా మరాఠీ తదితర భారతీయ సాహిత్యాలలో జీవిత చరిత్రా రచన ఒక సాహితీ ప్రక్రియగా ఎలా అభివృద్ధి చెందిందో సోదాహరణంగా చాలా ఏళ్లక్రితం ఆంధ్రప్రభలో రాశారు. ROBERT PAYNE రాసిన స్లీమన్ జీవితచరిత్ర కూడా ఆ కోవలోకి వచ్చే రచన. నేను రాస్తున్నది దానికి అనుసృజన.

మీ మాటలు

*